ఉమర్‌ బిన్‌ ఖత్తాబ్‌ ఇస్లాం స్వీకరణ వృత్తాంతం

బిస్మిల్లాహ్

ఉమర్‌ (రజియల్లాహు అన్హు) గారి ఇస్లాం స్వీకరణ వల్ల కూడా ముస్లిములకు గట్టి బలం, పటిష్టము లభించింది. హంజా (రజియల్లాహు అన్హు) ఇస్లాం స్వీకరణకు మూడు రోజుల తర్వాత ఇతను ఇస్లాం స్వీకరించారు. అది ఎలా అనగా: ఉమర్‌ (రజియల్దాహు అన్హు) ఓ రోజు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారిని హతమార్చే ఉద్దేశ్యంతో వెళ్ళాడు. దారిలో ఒక వ్యక్తి కలసి ‘ఎటు వెళ్ళుచున్నావు ఉమర్‌!’ అని అడిగాడు. దానికి అతడు ‘ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వస్లలం)ను హతమార్చుటకు వెళ్ళుచున్నాను’ అని సమాధానమిచ్చాడు. దానిపై అతడన్నాడు: ‘నీవు ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం)ను హతమారుస్తే బనూ హాషిం మరియు బనూ జుహా నిన్ను క్షేమంగా వదులుతారా?’ ఉమర్‌ అన్నాడు: ‘నీవు నీ తాతముత్తాతల మతాన్ని వదలి కొత్త మతాన్ని స్వీకరించినట్లున్నావు’? అతడన్నాడు: ‘దీనికంటే మరీ విచిత్రమైన విషయం చెప్పాలా ఉమర్‌! నీ చెల్లి మరియు బావ ఇద్దరూ ఇస్లాం స్వీకరించారు. తాతముత్తాతల మతాన్ని వదిలేశారు’.

ఉమర్‌ అక్కడి నుండి చాలా కోపంగా వెళ్ళి చెల్లిలి ఇంటికి వచ్చాడు. అప్పుడు ఖబ్బాబ్‌ బిన్‌ అరత్త్‌ (రజియల్లాహు అన్హు) వారింట్లో ఉన్నాడు. ఖుర్‌ఆన్‌ లోని సూర తాహా వ్రాసిఉన్న పత్రం అతని వద్ద ఉంది. అతను వారికి ఆ సురా నేర్పుతున్నాడు. ఉమర్‌ వస్తున్నది గమనించిన ఖబ్బాబ్‌ (రజియల్లాహు అన్హు) ఇంట్లో ఓ మూలకు దాగిపోయాడు. ఉమర్‌ చెల్లి ఫాతిమా ఆ పత్రాన్ని దాచిపెట్టింది. ఉమర్‌ ఇంటికి సమీపంలో చేరినప్పుడే ఖబ్బాబ్‌ (రజియల్లాహు అన్హు) ఖుర్‌ఆన్‌ పారాయణాన్ని విన్నాడు. లోనికి ప్రవేశించిన వెంటనే ‘నేను మీ ఇంట్లో విన్నదేమిటి? అని అడిగాడు. ‘ఏమి లేదు, అట్లే మాట్లాడుకుంటూ ఉంటిమి’ అని వారిద్దరు అన్నారు. ఉమర్‌ అన్నాడు: బహుశా మీరిద్దరు పాత మతాన్ని విడనాడి కొత్త ధర్మం స్వీకరించారు కదూ? బావ చెప్పాడు: ‘ఉమర్‌! ఒకవేళ సత్వం అన్నది నీ మతంలో కాకుండా వేరే ధర్మంలో ఉంటే ఏమిటి మీ ఆలోచనా?’ దానిపై ఉమర్‌ అతడ్ని చాలా చితకబాదాడు. అంతలోనే చెల్లి వచ్చి ఉమర్‌ ను భర్త మీది నుండి పక్కకు జరపబోయింది. ఉమర్‌ ఆమెను సయితం కొట్టి రక్తసిక్తం చేసేశాడు. ఆమె ముఖం ద్వారా రక్తం కారడం మొదలయింది. అదే కోపంలో ఆమె ఇలా అంది: “అష్‌హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్‌, వ అష్‌ హదు అన్న ముహమ్మదర్‌ రసూలుల్లాహ్‌“. అంటే సత్య ఆరాధ్యుడు అల్లాహ్‌ తప్ప ఎవడు కాడని మరియు ముహమ్మద్‌ అల్లాహ్‌ యొక్క సత్య ప్రవక్త అని సాక్ష్యమిచ్చుచున్నాను.

ఉమర్‌ రక్తసిక్తమైన చెల్లిని చూసి చాలా సిగ్గు పడ్డాడు. ‘మీ వద్ద ఉన్న పుస్తకం ఏది? ఇవ్వండి’ అని అడిగాడు. చెల్లి చెప్పింది: నీవు అపరిశుద్దునివి, దీని పరిశుద్ధులు ముట్టుకుంటారు’ లేచి స్నానం చేసుకో’. ఉమర్‌ లేచి, స్నానం చేసి, పుస్తకం తీసుకొని బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీం చదివి ‘చాలా మంచి పేర్లున్నాయి’ అని చెప్పాడు. మళ్ళి సూర తాహా మొదటి నుండి 14వ ఆయతు (నిశ్చయంగా, నేనే అల్లాహ్‌ను! నేను తప్ప మరొక ఆరాధ్య దేవుడు లేడు, కావున నన్నే ఆరాధించు మరియు నన్ను స్మరించడానికి నమాజును స్థాపించు) వరకు చదివి, ఈ మాట ఎంత బావుంది మరెంత గౌరవప్రదంగా ఉంది, ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఎక్కుడున్నాడో దారి చూపండి’ అని అన్నాడు.

ఉమర్‌ యొక్క ఈ మాటను విన్న ఖబ్బాబ్‌ (రజియల్లాహు అన్హు) లోపలి నుండి బైటికి వచ్చి “సంతోషించు ఉమర్‌! “అల్లాహ్‌! ఉమర్‌ బిన్‌ ఖత్తాబ్‌ లేదా అబూ జహల్‌ బిన్‌ హిషామ్‌ ద్వారా ఇస్లాంను బలపరుచు” అని ప్రవక్త చేసిన దుఆ అంగీకరించబడిందని ఆశిస్తున్నాను’ అని అన్నాడు.

ఆ తర్వాత ఉమర్‌ (రజియల్లాహు అన్హు) తన కరవాలాన్ని తీసుకొని ప్రవక్త వైపునకు బయలుదేరాడు. తలుపును తట్టాడు. ఒక వ్యక్తి తలుపు సందుల్లో నుండి చూశాడు. ఉమర్‌ కరవాలం ధరించి ఉండడాన్ని గమనించి, లోపలున్న ప్రజలకు తెలిపాడు. వారు దిగ్భ్రాంతి చెందారు. అప్పుడు ప్రవక్త లోపలి గదిలో ఉన్నారు. అక్కడే దగ్గర ఉన్న హంజా (రజియల్లాహు అన్హు) ప్రజలను గమనించి ఏమిటి సంగతి? అని అడిగాడు. ఉమర్‌ అని వారన్నారు. అప్పుడు హంజా (రజియల్లాహు అన్హు) అన్నారు: ‘అతని కొరకు ద్వారం తెరవండి. అతను సదుద్దేశ్యంతో వచ్చాడా అది అతనికి లభించుటకు సహాయపడదాము. ఒకవేళ ఏదైనా దురుద్దేశ్యంతో వచ్చాడా అతని కరవాలంతో అతడ్ని హతమార్చుదాము’. ఉమర్‌ లోనికి ప్రవేశించి ఇస్లాం స్వీకరించానని చాటి చెప్పాడు. వెంటనే అక్కడ ఉన్నవారందరూ ఏకంగా మరియు పెద్ద శబ్దముతో అల్లాహు అక్బర్‌ అని అన్నారు. ఆ శబ్దాన్ని మస్జిదె హరాంలో ఉన్నవారు విన్నారు.

సుహైబ్‌ రూమి (రజియల్లాహు అన్హు) ఇలా తెలిపారు: ‘ఉమర్‌ (రజియల్లాహు అన్హు) ఇస్లాంలో ప్రవేశించినప్పటి నుండి ఇస్లాం బలంగా, గౌరవంగా ఉంది. దాని వైవు బహిరంగంగా పిలవడం జరిగింది. మేము కాబా వద్ద కూర్చోగలిగాము మరియు దాని ప్రదక్షిణం (తవాఫ్‌) చేయగలిగాము’.

అబ్దుల్లాహ్ బిన్‌ మస్‌ఊద్‌ రజియల్లాహు అన్హు ఇలా తెలిపారు? ‘ఉమర్‌ (రజియల్లాహు అన్హు) ఇస్లాం స్వీకరించినప్పటి నుండి మేము గౌరవంగా జీవించగలిగాము’.


ఇది క్రింది పుస్తకం నుండి తీసుకోబడింది:

ముహమ్మద్ – అంతిమ ప్రవక్త (Muhammad, the final Prophet)
అంశాల నుండి : ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, జుల్ఫీ (Zulfi, Saudi Arabia)
అనువాదం : అబూ అనస్ ముహమ్మద్ నసీరుద్దీన్ (Abu Anas Muhammad Naseeruddeen)

నాకు అత్యంత ప్రియుడు మరియు ప్రళయదినాన నా సమావేశంలో నాకు అత్యంత సమీపంలో కూర్చునేవాడు

good character

ఇస్లామీయ ప్రవర్తన [పుస్తకం]

ఇస్లామీయ ప్రవర్తన [పుస్తకం & ఆడియో]

బిస్మిల్లాహ్

అఖ్లాఖ్, ఉత్తమ నడవడిక, గుడ్ క్యారెక్టర్, సత్ప్రవర్తన, Character, Manners
[ఇక్కడ పుస్తకం చదవండి లేదా డౌన్లోడ్ చేసుకోండి]
[PDF] [29పేజీలు ]
సంకలనం: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
పబ్లిషర్స్: జుల్ఫీ ధర్మప్రచార విభాగం (సౌదీ అరేబియా)

ఇస్లామీయ సత్ప్రవర్తన, నైతిక ప్రవర్తన (గుడ్ క్యారెక్టర్) – వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
https://youtu.be/heqzqooCHzY [42 నిముషాలు]
ఆడియోలో క్రింది విషయాలు వివరించబడ్డాయి:
[1] ఇస్లాంలో సత్ప్రవర్తన (ఉత్తమ నడవడిక ) కు ఎలాంటి విలువ ఉన్నది?
[2] సత్ప్రవర్తన (అఖ్లాఖ్) వలంబిస్తే మనకు ఇహపర లోకాల్లో ఏమి లాభాలు కలుగుతాయి?
[3] సత్ప్రవర్తన ఎవరి పట్ల ఎలా అవలంబించాలి?
[4] సత్ప్రవర్తన రావాలంటే ఎలాంటి సాధనాలను ఉపయోగించాలి?

విషయ సూచిక:

  • ఇస్లామీయ ప్రవర్తన 
  • సద్వర్తన నిదర్శనాలు 
  • దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రవర్తన 
  • కొన్ని సద్గుణాలు : సత్యత, అమానతు,  వినయము, సిగ్గు, బిడియం,లజ్జ
  • కొన్ని దుర్గుణాలు: జుల్మ్ (అత్యాచారం),ఈర్ష్య, మోసం,  దుష్గర్వం
  • నైతిక గుణాలు ఆర్జించు మార్గాలు 
    1. విశ్వాస శుద్ధి 
    2. దుఆ 
    3. ముజాహదా (ప్రయత్నం,కృషి)
    4. ముహాసబ (ఆత్మ విమర్శ)
    5. సద్వర్తన వాళ్ళ వచ్చే  ప్రయాజనాలను ఆలోచించుట 
    6. దుర్గుణాల దుష్ఫలితాల గురుంచి యోచించుట 
    7. సంపూర్ణ ఆత్మ శుద్ధి కోసం ప్రయత్నించుట 
    8. మందహాసం,చిరునవ్వు 
    9. చూసి చూడనట్లు ఉండుట 
    10. సంయమనం,సహనం 
    11. మూర్ఖుల జోలికి పోకుండా ఉండుట 
    12. దూషించకుండా ఉండుట 
    13. బాధని మరిచిపోవాలి 
    14. మన్నింపు వైఖరి 
    15. దాతృత్వం 
    16. అల్లాహ్ వద్ద ప్రతిఫలం పొందే నమ్మకం 
    17. కోపం నుండి దూరముండుట 
    18. నిర్మాణాత్మక మైన విమర్శను స్వీకరించుట 
    19. పనిని సంపూర్ణంగా చేయుట 
    20. తప్పు జరిగితే ఒప్పుకోవుట 
    21. సత్యం ఆవశ్యకమైనది 
    22. సద్గుణులతో స్నేహం చేయుట 
    23. పరస్పర సంభాషణ, సమావేశ పద్ధతులు పాటించుట 
    24. ప్రవక్త మరియు సహచరుల జీవిత చరిత్ర చదువుట 
    25. సద్గుణాలకు సంబంధించిన రచనలు చదువుట 

[పూర్తి పుస్తకం క్రింద చదవండి]

 అల్ హందులిల్లాహ్, వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్, అమ్మా బఅద్!

సర్వ స్తోత్రములకు అర్హుడు అల్లాహ్ మాత్రమే. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై శాంతి, కరుణ కురియుగాక!

అల్లాహ్ మనకు ఇస్లాం వరాన్ని అనుగ్రహించినందుకు, సద్గుణాలు అవలంభించా లని ప్రోత్సహించినందుకు, సద్గుణ సంపన్నులకు గొప్ప ప్రతిఫలం సిద్ధపరచినందుకు మనం ఆయనకు అనేకానేక స్తోత్రములు పఠించాలి.

సద్గుణ సంపన్నులైయుండుట ప్రవక్తల, పుణ్యాత్ముల గుణం. సద్గుణాల వల్ల ఉన్నత స్థానాలు లభించును. అల్లాహ్ ఒకే ఒక ఆయతులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఎలా ప్రశంసించాడంటే, అందులో ఆయన సర్వ సద్గుణాలు ఇమిడియున్నాయి: చూడండి: ఖలం (68:4)

[وَإِنَّكَ لَعَلَىٰ خُلُقٍ عَظِيمٍ]

“నిస్సందేహంగా నీవు నైతికంగా అత్యున్నత స్థానంలో ఉన్నావు”.

సద్గుణాల ద్వారా ప్రేమ, అప్యాయతలు జనిస్తాయి. దుర్గుణాల వల్ల ద్వేషం, ఈర్ష్యలు పుడతాయి. సద్గుణ సంపన్నులకు సత్ఫలితం, వారి పర్యవసానం ఇహపరాల్లో స్పష్టమయి ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సద్గుణాన్ని దైవభయభీతితో కలిపి తెలిపారు:

عَنْ أَبِي هُرَيْرَةَ قَالَ: سُئِلَ رَسُولُ اللهِ عَنْ أَكْثَرِ مَا يُدْخِلُ النَّاسَ الجَنَّةَ، فَقَالَ: «تَقْوَى اللهِ وَحُسْنُ الخُلُقِ»

అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు, అనేక మందిని స్వర్గంలో ప్రవేశింపజేయునది ఏమిటని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను అడిగినప్పుడు, ఆయన చెప్పారు: “అల్లాహ్ భయభీతి మరియు సద్వర్తన”. (తిర్మిజి 2004, సహీహా 977, సహీహుత్ తర్గీబ్ 1723).

సద్వర్తన అంటే: నగుమోముతో ఉండుట, మంచి చేయుట, ప్రజలకు అవస్త కలిగించకుండా ఉండుట, ఇంకా మృదువుగా మాట్లాడుట, కోపాన్ని దిగమింగుట, కోపం వ్యక్తపరచకుండా ఉండుట, ఇతరుల బాధ భరించుట. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించారు:

«إِنَّمَا بُعِثْتُ لِأُتَمِّمَ مَكَارِمَ الْأَخْلَاقِ»

“సద్గుణాలను సంపూర్ణం చేయుటకు నన్ను పంపడం జరిగింది”. (ముస్నద్ బజ్జార్ 8949, ముస్నద్ అహ్మద్ 8952, సహీహా 45).

ఉఖ్బా రజియల్లాహు అన్హుతో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు:

«أَلَا أُخْبِرُكَ بِأَفْضَلِ أَخْلَاقِ أَهْلِ الدُّنْيَا وَأَهْلِ الْآخِرَةِ؟ تَصِلُ مَنْ قَطَعَكَ، وَتُعْطِي مَنْ حَرَمَكَ، وَتَعْفُو عَمَّنْ ظَلَمَكَ»

“ఇహపరవాసుల అత్యుతమ నడవడిక గురించి నీకు తెలుపనా? నీతో సంబంధం తెంచుకున్న వానితో నీవు సంబంధం పెంచుకో, నీకు ఇవ్వనివానికి నీవు ఇవ్వు, నీ పట్ల దౌర్జన్యం చేసినవానిని నీవు మన్నించు”. (మకారిముల్ అఖ్లాక్: ఇబ్ను అబిద్ దున్యా 19, ముస్నద్ అహ్మద్ 17334, సహీహా 891).

సోదరా! ఈ ప్రశంసనీయమైన సద్గుణం యొక్క లెక్కలేనన్ని పుణ్యాలను, గొప్ప సత్ఫలితాలను గమనించు; ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు. అబూ దావూద్ 4798, సహీహా 794లో ఉంది:

«إِنَّ الْمُؤْمِنَ لَيُدْرِكُ بِحُسْنِ خُلُقِهِ دَرَجَةَ الصَّائِمِ الْقَائِمِ»

“విశ్వాసి తన నైతిక గుణాల వల్ల ఉపవాసమున్న వారి మరియు తహజ్జుద్ నమాజ్ చేయువారంత స్థానం పొందుతాడు”.

అంతేకాదు, సద్గుణాలు సంపూర్ణ విశ్వాసానికి గొప్ప సబబు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం శుభవార్త ఇచ్చారు:

«أَكْمَلُ الْمُؤْمِنِينَ إِيمَانًا أَحْسَنُهُمْ خُلُقًا»

“విశ్వాసులలో సంపూర్ణ విశ్వాసం గలవాడు వారిలో అందరికన్నా ఎక్కువగా సద్వర్తన గలవాడు”. (అబూ దావూద్ 4682, సహీహా 284).

సోదరా! ప్రవక్తగారి ఈ ప్రవచనంపై శ్రద్ధ వహించు:

«أَحَبُّ النَّاسِ إِلَى اللَّهِ أَنْفَعُهُمْ لِلنَّاسِ، وَأَحَبُّ الْأَعْمَالِ إِلَى اللَّهِ سُرُورٌ تُدْخِلُهُ عَلَى مُسْلِمٍ، أَوْ تَكْشِفُ عَنْهُ كُرْبَةً ، أَوْ تَقْضِي عَنْهُ دَيْنًا ، أَوْ تَطْرُدُ عَنْهُ جُوعًا، وَلَئِنْ أَمْشِي مَعَ أَخٍ لِي فِي حَاجَةٍ أَحَبُّ إِلَيَّ مِنْ أَنْ أَعْتَكِفَ فِي هَذَا الْمَسْجِدِ شَهْرًا»

“అల్లాహ్ కు అత్యంత ప్రియుడు ప్రజలకు అత్యంత ప్రయోజనకరుడు. అల్లాహ్ కు సత్కార్యాల్లో అత్యంత ప్రియమైనవి; ముస్లింకు సంతోషం కలిగించడం, అతని ఓ కష్టాన్ని తొలగించడం, అతని అప్పు చెల్లించటం, అతని ఆకలి భాధను తీర్చటం. నేను నా ముస్లిం సోదరుని వెంట అతని ఓ అవసరాన్ని తీర్చుటకు నడవడం నా మస్జిదు (మస్జిదె నబవీ)లో ఒక నెల ఏతికాఫ్ చేయడం కంటే ఎంతో ప్రియమైనది”. (తబ్రానీ సగీర్ 861, సహీహుత్ తర్గీబ్ 2623).

ముస్లిం సోదరా! మృదువుగా, ప్రేమగా ఓ మాట నీవు మాట్లాడినా అందులో నీకు పుణ్యం ఉంది, అది నీ కొరకు ఒక దానం లాంటిది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:

«وَالكَلِمَةُ الطَّيِّبَةُ صَدَقَةٌ»

“మంచి మాట ఒక దానం వంటిది”. (బుఖారీ 2989, ముస్లిం 1009).

మంచిమాటకు ఈ ఘనత ఎందుకు లభించినది? ఎందుకనగా; అందులో ప్రశంసనీయమైన ప్రభావం ఉంది. అది హృదయాలను చేరువుగా చేస్తుంది, మనస్సును ప్రేమతో నింపుతుంది, ద్వేషాలను దూరం చేస్తుంది.

ఇతరుల నుండి బాధ భరించి అయినా సద్వర్తన కలిగి ఉండడం గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రోత్సహించిన సందర్భాలు అనేకం, వాటిలో ఒకటి:

«اتَّقِ اللهِ حَيْثُمَا كُنْتَ، وَأَتْبِعِ السَّيِّئَةَ الحَسَنَةَ تَمْحُهَا، وَخَالِقِ النَّاسَ بِخُلُقٍ حَسَنٍ»

“ఎక్కడ ఉన్నా అల్లాహ్ తో భయపడు, పాపం జరిగిన వెంటనే పుణ్యం చెయ్యి, దాని వల్ల పాపం తుడుచుకుపోవును, ప్రజల ఎడల సద్వర్తనతో మెలుగు”. (తిర్మిజి 1987, సహీహుత్ తర్గీబ్ 2655).

ప్రతీ సమయ, సందర్భంలో ముస్లిం ఈ సద్గుణాలను అలవర్చుకొని ఉంటాడు, అందుకు అతను ప్రజలకు ప్రియుడయి ఉంటాడు. ఏ దారి గుండా నడిచినా, ఏ చోటకి వెళ్ళినా వారికి సన్నిహితుడవుతాడు, చివరికి తన భార్యకు ఓ అన్నం ముద్ద తినిపించినా, అతనికి ఇస్లాంలో సత్ఫలితం లభిస్తుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:

«وَإِنَّكَ مَهْمَا أَنْفَقْتَ مِنْ نَفَقَةٍ، فَإِنَّهَا صَدَقَةٌ، حَتَّى اللُّقْمَةُ الَّتِي تَرْفَعُهَا إِلَى فِي امْرَأَتِكَ»

నీవు ఖర్చు చేసే ఒక్కో దానికి బదులుగా నీకు సదఖ చేసినంత పుణ్యం, చివరికి నీవు నీ భార్య నోట్లో పెట్టే ఓ అన్నం ముద్దకు బదులుగా కూడా పుణ్యం లభిస్తుంది. (బుఖారీ 2742).

ప్రియ సోదరా! విశ్వాసులు పరస్పరం సహోదరులు, విశ్వాసి తన కొరకు ఇష్టపడినదే తన సోదరుని కొరకు ఇష్టపడాలి. కనుక నీకిష్టమైనదేదో చూసుకొని అదే, అలాంటిదే నీ సోదరునికీ ఇవ్వు. నీకు ఇష్టం లేనిది అతని నుండి దూరంగానే ఉంచు. జాగ్రాత్త! అల్లాహ్ ను తన ప్రభువుగా, ఇస్లాంను తన ధర్మంగా, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని తన ప్రవక్తగా విశ్వసించినవారిని చిన్నచూపుతో చూడకు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా హెచ్చరించారు:

«بِحَسْبِ امْرِئٍ مِنَ الشَّرِّ أَنْ يَحْقِرَ أَخَاهُ الْمُسْلِمَ»

“తన ముస్లిం సోదరుడ్ని కించపరచడం, చిన్న- చూపుతో చూడడం స్వయం తాను చెడ్డవాడు అనడానికి గొప్ప చిహ్నం”. (ముస్లిం 2564).

ముస్లిం సోదరా! అన్ని వేళల్లో సుగమమైన మార్గం, సులభమైన ఆరాధన సద్వర్తన అవలం- బించండం. అవును, దీని సత్ఫలితం ఇంతా అంతా కాదు, రాత్రంతా తహజ్జుద్ చేసే, పగలంతా ఉపవాసం పాటించే వారితో సమానం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇదే శుభవార్త ఇచ్చారు:

«إِنَّ الْمُؤْمِنَ لَيُدْرِكُ بِحُسْنِ خُلُقِهِ دَرَجَةَ الصَّائِمِ الْقَائِمِ»

“విశ్వాసి తన సద్వర్తన ద్వారా (నఫిల్) ఉపవాసాలు, తహజ్జుద్ నమాజులు పాటించేవారి స్థానాన్ని చేరుకుంటాడు”. (అబూ దావూద్ 4798, సహీ తర్గీబ్ 2643).

సద్వర్తన చిహ్నాలు

సద్గుణాలంటే కొన్ని మంచి గుణాల కలయిక (సమూహం). వాటిలో కొన్ని దిగువ తెలుసు- కుందాము, పాటించే ప్రయత్నం చేద్దాము:

మనిషి ఎక్కువగా బిడియం గలవాడై ఉండాలి. ఇతరులకు బాధ కలిగించకుండా ఉండాలి. అధికంగా సంస్కరణకర్త అయి, సత్యవంతుడై ఉండాలి. తక్కువ మాట్లాడాలి. ఎక్కువ పని చేయాలి. వృధా వాటికి దూరంగా ఉండాలి. ప్రతి మంచిలో ముందంజ వేయాలి. బంధుత్వాన్ని పెంచుకుంటూ ఉండాలి. సహనశీలుడై, కృతజ్ఞుడై, సంతృప్తి పడేవాడై, ఓర్పుగలవాడై, మృదువైఖరి అవలంబించేవాడై ఉండాలి. సౌశీల్యుడై కనికరుడై ఉండాలి. శపించువాడు, దూషించువాడు, చాడీలు చెప్పేవాడు, పరోక్షంగా నిందించేవాడు, తొందరుపాటు పడేవాడు, కపటం గలవాడు, పిసినారి, ఈర్షాపరుడై ఉండకూడదు. సంతోషంగా, ఉల్లాసంగా ఉండాలి. అల్లాహ్ కొరకే ప్రేమించాలి. అల్లాహ్ కొరకే ఇష్టపడాలి. అల్లాహ్ కొరకే కోపంగా ఉండాలి.

సద్వర్తన గల మనిషి ప్రజల బాధను సహిస్తాడు, ఎల్లప్పుడు వారి నుండి జరిగే పొరపాట్లకు ఏదైనా సాకు వెతుకుతాడు, వారి తప్పులెన్నడం, వారి లోటుపాట్లను వెతకడం నుండి ఆమడ దూరమే ఉంటాడు. విశ్వాసి ఏ స్థితిలో, సందర్భంలో దుర్గుణుడు, దుష్ప్రవర్తన గలవాడు కాడు.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అనేక సందర్భాలలో సద్వర్తన ప్రాముఖ్యతను, సద్గుణ సంపన్నడు పొందే గొప్ప సత్ఫలితాన్ని ఎంతో నొక్కి చెప్పారు. ఉసామా బిన్ షరీక్ ఉల్లేఖించారు, మేము ప్రవక్త వద్ద కూర్చొని ఉండగా, కొంత మంది వచ్చి ఇలా అడిగారు:

فَمَنْ أَحَبُّ عِبَادِ اللَّهِ إِلَى اللَّهِ؟ قَالَ: «أَحْسَنُهُمْ خُلُقًا»

అల్లాహ్ కు తన దాసుల్లో అత్యంత ప్రియులెవరూ?

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం  చెప్పారు: “వారిలో అత్యంత సద్గుణ సంపన్నుడు”. (తబ్రానీ ఔసత్ 6380, సహీహా 432).

అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖించారు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పగా విన్నారు:

«أَلَا أُخْبِرُكُمْ بِأَحَبِّكُمْ إِلَيَّ وَأَقْرَبِكُمْ مِنِّي مَجْلِسًا يَوْمَ الْقِيَامَةِ؟» قَالُوا: نَعَمْ يَا رَسُولَ اللَّهِ، قَالَ: «أَحْسَنُكُمْ خُلُقًا»

“మీలో నాకు అత్యంత ప్రియుడు మరియు ప్రళయదినాన నా సమావేశంలో నాకు అత్యంత సమీపంలో కూర్చునేవాడు ఎవరో మీకు తెలుపనా?”, అవును తెలుపండి ప్రవక్తా! అని సహచరులు విన్నవించుకున్నారు: “మీలో అందరికన్నా ఎక్కువ సద్గుణాలు గలవాడు”. (ముస్నద్ అహ్మద్ 6735, సహీహుత్ తర్గీబ్ 2649).

అబూ దర్దా రజియ్లలాహు అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు:

«مَا شَيْءٌ أَثْقَلُ فِي مِيزَانِ الْمُؤْمِنِ يَوْمَ القِيَامَةِ مِنْ خُلُقٍ حَسَنٍ»

“ప్రళయదినాన విశ్వాసుని త్రాసులో సద్వర్తన కంటే బరువైనది మరేదీ ఉండదు”. (తిర్మిజి 2002, సహీహా 876).

ప్రవక్త సద్వర్తన

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ సహాబాలను ఏ సద్వర్తన అలవర్చుకోటానికి ఆహ్వానించేవారో వాటిలో ఆయన అత్యుత్తమ గొప్ప ఆదర్శంగా ఉండేవారు. ప్రవక్త తమ సహచరుల మదిలో అత్యున్నత సద్గుణాలు ఉపదేశాలతో, వివేచనాపరమైన మాటలతో నాటేకి ముందు తమ ఆచరణతో నాటేవారు.

عَنْ أَنَسِ بْنِ مَالِكٍ ﷜، قَالَ: خَدَمْتُ رَسُولَ اللهِ عَشْرَ سِنِينَ، وَاللهِ مَا قَالَ لِي: أُفًّ قَطُّ، وَلَا قَالَ لِي لِشَيْءٍ: لِمَ فَعَلْتَ كَذَا؟ وَهَلَّا فَعَلْتَ كَذَا؟

అనస్ రజియల్లాహు అన్హు తెలిపారు: నేను పది సంవత్సరాలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సేవలో ఉన్నాను, అల్లాహ్ సాక్షిగా! ఆయన ఏ ఒక్కసారి కూడా నన్ను కసురుకోలేదు, ఇంకా ఈ పని ఎందుకు చేశావు, ఈ పని ఎందుకు చేయలేదు అని కూడా అనలేదు. (బుఖారీ 6038, ముస్లిం 2309).

عَنْ أَنَسِ بْنِ مَالِكٍ ﷜، قَالَ: كُنْتُ أَمْشِي مَعَ النَّبِيِّ وَعَلَيْهِ بُرْدٌ نَجْرَانِيٌّ غَلِيظُ الحَاشِيَةِ، فَأَدْرَكَهُ أَعْرَابِيٌّ فَجَذَبَهُ جَذْبَةً شَدِيدَةً، حَتَّى نَظَرْتُ إِلَى صَفْحَةِ عَاتِقِ النَّبِيِّ قَدْ أَثَّرَتْ بِهِ حَاشِيَةُ الرِّدَاءِ مِنْ شِدَّةِ جَذْبَتِهِ، ثُمَّ قَالَ: مُرْ لِي مِنْ مَالِ اللَّهِ الَّذِي عِنْدَكَ، فَالْتَفَتَ إِلَيْهِ فَضَحِكَ، ثُمَّ «أَمَرَ لَهُ بِعَطَاءٍ»

“అనస్  రదియల్లాహు అన్హు తెలిపారు: ఒక సారి నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వెంట నడుస్తుండగా -అప్పుడు ఆయన నజ్రాన్‌లో తయారైన మందమైన అంచుగల ఒక దుప్పటి ధరించి ఉన్నారు- ఒక గ్రామీణుడు వచ్చి దుప్పటిని వడిగా లాగాడు. దాని వలన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మెడ భుజానికి దగ్గర మచ్చ ఏర్పడింది నేను స్వయంగా చూశాను. మళ్ళీ  అతను ఇలా అడిగాడు. ముహమ్మద్‌! నీ  వద్ద ఉన్న అల్లాహ్ ధనం నాకింత ఇప్పించండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతని వంక తిరిగి చూస్తూ నవ్వారు. మళ్ళీ అతనికి కొంత ఇవ్వవలసినదిగా ఆదేశించారు. (బుఖారీ 3149, ముస్లిం 1057).

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంట్లో ఏమి చేసేవారని ఆయిషా రజియల్లాహు అన్హాను ప్రశ్నించినప్పుడు, ఆమె ఇలా చెప్పారు:

كَانَ يَكُونُ فِي مِهْنَةِ –خِدْمَةَ- أَهْلِهِ فَإِذَا حَضَرَتِ الصَّلاَةُ خَرَجَ إِلَى الصَّلاَةِ

ఆయన ఇంటి పనుల్లో తమ ఇల్లాలికి సహకరిస్తూ ఉండేవారు. నమాజ్‌ సమయమయిన వెంటనే నమాజ్‌ కొరకు వెళ్ళేవారు. (బుఖారీ 676).

అబ్దుల్లాహ్  బిన్‌ హారిస్ రజియల్లాహు అన్హు చెప్పారు:

مَا رَأَيْتُ أَحَدًا أَكْثَرَ تَبَسُّمًا مِنْ رَسُولِ اللهِ .

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కంటే ఎక్కువ చిరునవ్వు నవ్వేవారిని నేను చూడలేదు. (తిర్మిజీ 3641, ఇది హసన్ హదీస్).

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గుణవిశేష- ణాల్లో; ఆయన దాత, ఎన్నడూ పిసినారితనం వహించలేదు. శూరుడు, సత్యం నుండి ఎన్నడూ వెనక్కి తిరగలేదు. న్యాయశీలి, ఎన్నడూ తీర్పు చేయడంలో అన్యాయం చేయలేదు. పూర్తి జీవితంలో సత్యవంతుడు, విశ్వసనీయుడు అనే ప్రఖ్యాతి చెందారు.

జాబిర్‌ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎవరైనా ఏదయినా అడిగితే, “లేదు” అని ఎన్నడూ అనలేదు. (బుఖారి 6034, ముస్లిం 2311).

ఆయన తమ సహచరులతో పరిహాసమాడేవారు. (ధనికపేద బేధం లేకుండా) అందరితో కలసి ఉండేవారు. పిల్లవాళ్ళను తమ వడిలో కూర్చోబెట్టి ఆటలాడే వారు. ఆహ్వానాన్ని అంగీకరించేవారు. వ్యాధిగ్రస్తుల్ని పరామర్శిం చేవారు. అపరాధుల సాకును ఒప్పుకునేవారు.

తమ సహచరులను వారికి నచ్చిన మంచి పేర్లతో సంబొధించేవారు. మాట్లాడుతుండేవారి మాట మధ్య అభ్యంతరం కలిగించేవారుకారు.

అబూ ఖతాద రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు: ఒక సారి నజ్జాషి రాయబార బృందం ఒకటి ప్రవక్త వద్దకు వచ్చినప్పుడు స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సేవ చేస్తున్నది చూసి, ఆయన సహచరులు ప్రవక్తా! మీరు ఉండండి. మేము వారికి సేవ చేస్తాము అని విన్నవించుకోగా. ఆయన “వారు మా సహచరులతో మంచి విధంగా ప్రవర్తించారు. ప్రతీకగా వారి ఆతిథ్యం స్వయంగా నేనూ మంచి విధంగా చేయాలను- కుంటున్నాను” అని అన్నారు. (దలాఇలున్ నుబువ్వ 2/307, సీరతుబ్ని కసీర్ 2/31).

ఇంకా  ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అనేవారు: “నేను ఒక దాసున్ని, దాసుడు ఎలా తింటాడో అలాగే నేను తింటాను. అతను ఎలా కూర్చుంటాడో అలా నేను కూర్చుంటాను”. ఆయన గాడిదపై స్వారీ చేసేవారు, నిరుపేదలను పరామర్శించేవారు, బీదవాళ్ళతో కలసి కూర్చుండేవారు.

సత్యం

 నిశ్చయంగా విశ్వాసుడు తన ప్రభువు పట్ల సత్యవంతుడు. ప్రజల ఎడల సత్యవంతుడు. అన్ని వేళల్లో, స్థితుల్లో తన మాటల్లో, చేష్టల్లో సత్యవంతుడుగానే ఉంటాడు. అల్లాహ్ ఆదేశం గమనించండి:

 [يَاأَيُّهَا الَّذِينَ آمَنُوا اتَّقُوا اللَّهَ وَكُونُوا مَعَ الصَّادِقِينَ] (التوبة: 119)

విశ్వసించిన ప్రజలారా! అల్లాహ్ కు భయపడండి. సత్యవంతులకు తోడుగా ఉండండి. (తౌబా 9:119).

مَا كَانَ خُلُقٌ أَبْغَضَ إِلَى رَسُولِ اللَّهِ مِنَ الْكَذِبِ

ఆయిషా రజియల్లాహు అన్హా చెప్పారు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నింటికంటే ఎక్కువగా అబద్దాన్ని అసహ్యించుకునేవారు. (సహీ ఇబ్ను హిబ్బాన్ 5736, బైహఖీ షుఅబ్ 4475లో).

ఇస్లాం ధర్మం పై అబద్దం చెప్పడం అతి చెడ్డ విషయం, పాపాల్లో అతిఘోరమైనది. అలాంటివారికి నరకమే శిక్ష. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా హెచ్చరించారు:

«مَنْ كَذَبَ عَلَيَّ مُتَعَمِّدًا، فَلْيَتَبَوَّأْ مَقْعَدَهُ مِنَ النَّارِ»

“ఎవరైతే ఉద్దేశ్య పూర్వకంగా నాపై అబద్దాన్ని మోపుతాడో అతడు తన నివాసం నరకంలో నిర్మించుకోవలసి ఉంటుంది”. (బుఖారి 1291, ముస్లిం 3).

బాలల మనుస్సులో సైతం సత్యాన్ని నాటాలని, వారు ఆ మనుగడను అనుసరిస్తూ పెరగాలని ఇస్లాం ప్రోత్సహిస్తుంది. అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:

«مَنْ قَالَ لِصَبِيٍّ: تَعَالَ هَاكَ، ثُمَّ لَمْ يُعْطِهِ فَهِيَ كَذْبَةٌ»

“ఇదిగో, తీసుకో అని ఎవరైతే ఒక పిల్లవాణ్ణి పిలిచి అతనికి ఏమీ ఇవ్వకుంటే అది కూడా ఒక అబద్ధం” (అహ్మద్‌ 9836, సహీహా 748).

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పరిహాసాని- కైనా, నవ్వించుటకయినా అబద్దం విడనాడాలని అనుచర సంఘాన్ని ప్రోత్సహించారు.

«أَنَا زَعِيمٌ بِبَيْتٍ فِي وَسَطِ الْجَنَّةِ لِمَنْ تَرَكَ الْكَذِبَ وَإِنْ كَانَ مَازِحًا»

అబూ ఉమామ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా శుభవార్త ఇచ్చారు: “పరిహాసానికయినా అసత్యము చెప్పని వ్యక్తి కోసం స్వర్గం మధ్యలో నివాసం లభిస్తుందని నేను హామీ ఇస్తున్నాను. (అబూ దావూద్ 4800, సహీహా 273)

వ్యాపారి తన సరుకు అమ్మడానికి అబద్దం చెబుతాడు. అయితే ప్రవక్త  ఈ హెచ్చరికను వినలేదా, చదవలేదా? “అల్లాహ్ ప్రళయదినాన ముగ్గురితో మాట్లాడడు, వారి వైపు చూడడు, వారిని శుద్ధిపరచడు” అని ప్రవక్త హెచ్చరించి- నప్పుడు, వారెవరు ప్రవక్తా! వారైతే నాశనమై- పోయారు, నష్టములో పడ్డారు అని అబూ జర్ర్ రజియల్లాహు అన్హు అడిగారు. అప్పుడు ప్రవక్త చెప్పారు: “చీలమండలానికి క్రింద దుస్తులు ధరించేవారు, ఉపకారం చేసి దెప్పిపొడిచేవాడు మరియు అసత్య ప్రమాణాలతో తమ సరుకును విక్రయించేవారు”. (ముస్లిం 106).

ఉఖ్బా బిన్ ఆమిర్ చెప్పారు: “ఒక ముస్లిం ఓ సరుకును అమ్మేటప్పుడు అందులో ఉన్న లోపం తెలిసి కూడా దాన్ని (కొనేవారికి) చెప్పకపోవుట ధర్మ సమ్మతంకాదు”. (బుఖారీలో 2079కి ముందు హదీసు).

అమానతు

ఇస్లాం తన అనుచరులకు (విశ్వాసులకు) అమానతులను హక్కుదారులకు అప్పగించాలని ఆదేశిస్తుంది. ప్రతి వ్యక్తి తాను చేసే పని చిన్నదైనా, పెద్దదయినా తన ప్రభువు తనను చూస్తున్నాడు అనే విషయం తెలుసుకోవాలి. ఇది కూడా అమానతే.

ముస్లిం తనపై అల్లాహ్ విధించిన విషయాల్ని నెరవేర్చడములో విశ్వసనీయుడు. ప్రజల ఎడల ప్రవర్తించడంలో సయితం విశ్వసనీయుడు.

 అమానతు అంటే: మనషి తనకు అప్పగించబడిన బాధ్యతను సంపూర్ణంగా నెరవేర్చడానికి కృషి చేయడం. అల్లాహ్ ఆదేశం:

[إِنَّ اللَّهَ يَأْمُرُكُمْ أَن تُؤَدُّوا الْأَمَانَاتِ إِلَىٰ أَهْلِهَا وَإِذَا

حَكَمْتُم بَيْنَ النَّاسِ أَن تَحْكُمُوا بِالْعَدْلِ ۚ]

“ఎవరి అమానతులను వారికి అప్పగించండి. ప్రజల మధ్య తీర్పులు చేసేటప్పుడు న్యాయంగా తీర్పు చేయండి” అని అల్లాహ్‌ మిమ్మల్ని ఆదేశిస్తున్నాడు. (నిసా 4:58).

మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారని, అనస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు:

«لَا إِيمَانَ لِمَنْ لَا أَمَانَةَ لَهُ»

“ఎవరిలోనయితే అమానతు లేదో వారిలో ఈమాన్‌ (విశ్వాసం) లేదు”. (అహ్మద్ 12383, ఇది హసన్ హదీస్).

అమానతు అంటే ఈ రోజుల్లో కొందరు అనుకునే విధంగా “ఒకరి వస్తువును భద్రంగా కాపాడి తను అడిగినప్పుడు తిరిగి ఇవ్వడం” మాత్రమే కాదు. అంతకంటే విశాలమైన భావాలు (విషయాలు) అందులో వస్తాయి. అమానతు అదా చేయడం, అప్పగించడం అంటే: ఒక వ్యక్తి ఏ పని, లేక విధి అతనికి అప్పగించబడినదో, అది ధర్మపరమైనది గాని లేక ప్రాపాంచికమైనది గాని అన్నిటినీ మనఃపూర్వకంగా, సరియైన రీతిలో నెరవేర్చాలి. తన వైపు నుండి ఏ రవ్వంత కొరత లేకుండా నెరవేర్చాలి.

వినయము

ముస్లిం  అవమానానికి గురి కాకుండా వినయ వినమ్రత పాటిస్తాడు.. గర్వాహంకారాలు ముస్లింకు వాంఛనీయం కావు. అల్లాహ్ ఆదేశం:

[وَاخْفِضْ جَنَاحَكَ لِمَنِ اتَّبَعَكَ مِنَ الْمُؤْمِنِينَ]

“విశ్వసించి, నిన్ను అనుసరించేవారి పట్ల మృదువుగా మసలుకో”. (షుఅరా 26:215). ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచనం:

«وَمَا تَوَاضَعَ أَحَدٌ لِلَّهِ إِلَّا رَفَعَهُ اللهُ»

“ఎవరయితే అల్లాహ్ కొరకు వినమ్రుడవుతాడో అల్లాహ్ అతన్ని ఉన్నతునిగా చేస్తాడు”. (ముస్లిం 2588). మరో చోట ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించారు:

«وَإِنَّ اللهَ أَوْحَى إِلَيَّ أَنْ تَوَاضَعُوا حَتَّى لَا يَفْخَرَ أَحَدٌ

عَلَى أَحَدٍ، وَلَا يَبْغِي أَحَدٌ عَلَى أَحَدٍ»

“మీరు వినయ, వినమ్రత పాటించండి అని అల్లాహ్ నాకు వహీ (సందేశం) పంపాడు. ఎంతవరకు అనగా మీలో ఒక వ్యక్తి మరో వ్యక్తిపై గర్వాహంకారినికి ఒడికట్టకూడదు. ఒక వ్యక్తి మరో వ్యక్తిపై దౌర్జన్యం చేయకూడదు”. (ముస్లిం 2865).

వినయవినమ్రత యొక్క ప్రత్యక్ష రూపాలు: బీద, నిరుపేదలతో కూర్చుండుట. కలియ గలుపుగా ఉండుట. వారిపై పెత్తనం చలాయించ కుండా, గర్వించకుండా, ప్రజల మధ్య మందహాసముతో ఉండుట. ఇతరుల కంటే తనే ఉన్నతుడు, గొప్పవాడు అన్న భావన మనిషికి ఉండకపోవుట.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మహాప్రవక్త అయినప్పటికీ ఇంటిని శుభ్రపరిచేవారు (ఇల్లు ఊడిచేవారు). మేకపాలు పిండేవారు. బట్టలకు అతుకులు వేసి కుట్టుకునేవారు. తమ బానిసతో కలసి తినేవారు. మార్కెట్‌ (బజారు) నుండి స్వయంగా ఖరీదు చేసేవారు. విశ్వాసులైన చిన్న, పెద్ద, ధనిక, పేద బేధం లేకుండా అందరితో కలిసేవారు. ముసాఫహా (కరచాలనం) చేసేవారు.

లజ్జ

లజ్జా, బిడియం విశ్వాస భాగాల్లో ఓ భాగం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశానుసారం: “లజ్జా గుణం వలన మేలుతప్ప మరేమి చేకూరదు”. (బుఖారి 6117, ముస్లిం 37).

విశ్వాసునికి ఈ మహోన్నత గుణంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గొప్ప ఆదర్శం, ఆయన మహాలజ్జ గుణం గలవారు. అబూ సఈద్‌ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు ఏదైనా విషయం అసహ్యం కలిగించిందంటే, అది మేము ఆయన ముఖము చూసి తెలుసుకునే వారము. (బుఖారీ 6102).

సిగ్గు, బిడియం గుణాలు ముస్లింను సత్యమైన మాట పలకడం, విద్య అభ్యసించడం, మంచిని ఆదేశించడం, చెడును నివారించడం నుండి ఆపదు. ఉదా: ఈ గుణం ఉమ్మె సులైమ్ రజియల్లాహు అన్హాను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో ఇలా ప్రశ్నించడానికి అడ్డుపడలేదు: ప్రవక్తా! అల్లాహ్ హఖ్‌ (ధర్మ) విషయం అడిగితె సిగ్గుపడడు కదా!. స్త్రీలకు స్వప్న స్ఖలనమైనచో స్నానం చేయుట తప్పనిసరియా? అని ప్రశ్నించింది. అందుకు ప్రవక్త “అవును స్వప్న స్ఖలనం అయినట్టు తెలిసి, తడి చూసినచో స్నానం చేయాలి” అని సమాదానమిచ్చారు. (బుఖారి 282).

 కాని ఈ లజ్జగుణం ముస్లింకు, దుష్కార్యాలు చేయునప్పుడు, అతనిపై విధించబడినదానిని సంపూర్ణంగా నిర్వర్థించకుండా ఉన్నప్పుడు. ఒకరి లోపాల్ని బహిర్గతం చేసేటప్పుడు. ఎవరికైనా నష్టం చేయాలని పూనుకున్నప్పుడు తప్పకుండా అడ్డు పడాలి.

 అల్లాహ్ పట్ల లజ్జగుణంతో మెలగడం అత్యంత ప్రధాన హక్కు. విశ్వాసి తన సృష్టికర్త అయిన అల్లాహ్ పట్ల సిగ్గుపడాలి. ఆయనే అతనికి ఉనికి ప్రసాదించి, అనేక వరాలు నొసంగాడు. కనుక ఆయన విధేయతలో, వరాల కృతజ్ఞత తెలుపుటలో అశ్రద్ధ చూపుటకు సిగ్గుపడాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఆదేశించారు: “సిగ్గుపడటానికి ప్రజలకంటే అల్లాహ్ ఎక్కువ అర్హతగలవాడు”. (బుఖారి).

దుర్గుణాలు

జుల్మ్‌ – (అన్యాయం, దౌర్జన్యం)

 నిజమైన ముస్లిం తరపున ఎన్నడూ ఏ ఒకరి పట్ల “జుల్మ్‌” జరగదు. ఎందుకనగా ఇస్లాంలో “జుల్మ్‌” కు పాల్పడుట నిషిద్ధం. అల్లాహ్ ఆదేశం:

[وَمَنْ يَظْلِمْ مِنْكُمْ نُذِقْهُ عَذَابًا كَبِيرًا] {الفرقان:19}

“మీలో ఎవడు “జుల్మ్‌”కి పాల్పడుతాడో, అతనికి మేము కఠిన శిక్షను రుచి చూపిస్తాము”. (ఫుర్‌ఖాన్‌ 25:19).

అల్లాహ్ ఇలా ఆదేశించాడని, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు:

«يَا عِبَادِي إِنِّي حَرَّمْتُ الظُّلْمَ عَلَى نَفْسِي، وَجَعَلْتُهُ بَيْنَكُمْ مُحَرَّمًا، فَلَا تَظَالَمُوا»

“ఓ నా దాసులారా! నేను దౌర్జన్యాన్ని నిషేధిస్తున్నాను. మీరు కూడా ఒకరి పై నొకరు దౌర్జన్యం చేయడం నిషిద్ధం అని భావించండి, అలాగే ఆచరించండి”. (ముస్లిం).

జుల్మ్‌” మూడు రకాలు:

1. మొదటి రకం: మానవుడు తన ప్రభువు పట్ల చేసే “జుల్మ్‌”. అనగా తన ప్రభువు పట్ల అవిశ్వాసానికి పాల్పడటం. అల్లాహ్ ఆదేశం:

[وَالكَافِرُونَ هُمُ الظَّالِمُونَ] {البقرة:254}

“అవిశ్వాస మార్గం అవలంభించేవారే “జుల్మ్‌” చేయువారు (జాలిములు)” (బఖర 2:254).

ఆరాధనలో అల్లాహ్ తో పాటు ఇతరుల్ని భాగస్వామి చేయడం ద్వారా మనిషి ఈ “జుల్మ్‌” కి పాల్పడతాడు. అంటే ఆరాధనల్లో కొన్నిటిని అల్లాహ్ యేతరుల కొరకు చేయుట. అల్లాహ్ ఆదేశం:

[إِنَّ الشِّرْكَ لَظُلْمٌ عَظِيمٌ] {لقمان:13}

“నిశ్చయంగా ఇతరుల్ని అల్లాహ్ కు భాగస్వాము-

లుగా చేర్చటం ఘోరమైన “జుల్మ్‌” (పరమ దుర్మార్గం) (లుఖ్మాన్‌ 31:13).

2. రెండవ రకం: ఒక వ్యక్తి తన తోటి మానవులపై చేసే “జుల్మ్‌”. అది వారి శీలమానాల్లో జోక్యం చేసుకొని బాధించడం, లేక వారిని శారీరకంగా బాధించడం, లేక అధర్మంగా వారి సొమ్మును కాజేసి బాధించడం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించారు:

«كُلُّ الْمُسْلِمِ عَلَى الْمُسْلِمِ حَرَامٌ، دَمُهُ، وَمَالُهُ، وَعِرْضُهُ»

ఒక ముస్లిం యొక్క ధన, మాన, ప్రాణము మరొక ముస్లింపై నిషిద్ధం”. (ముస్లిం 2564).

మరో సందర్భంలో ప్రవక్త ఇలా హెచ్చరించారు:

«مَنْ كَانَتْ لَهُ مَظْلَمَةٌ لِأَخِيهِ مِنْ عِرْضِهِ أَوْ شَيْءٍ، فَلْيَتَحَلَّلْهُ مِنْهُ اليَوْمَ، قَبْلَ أَنْ لاَ يَكُونَ دِينَارٌ وَلاَ دِرْهَمٌ، إِنْ كَانَ لَهُ عَمَلٌ صَالِحٌ أُخِذَ مِنْهُ بِقَدْرِ مَظْلَمَتِهِ، وَإِنْ لَمْ تَكُنْ لَهُ حَسَنَاتٌ أُخِذَ مِنْ سَيِّئَاتِ صَاحِبِهِ فَحُمِلَ عَلَيْهِ»

ఎవరైనా తన సోదరున్ని అవమాన పరచి లేదా మరే విధమైన “జుల్మ్‌” చేసి బాధించినచో, దిర్‌హమ్  దీనార్‌ (డబ్బు ధనం) చెల్లని ఆ రోజు రాక ముందు ఈ రోజే (క్షమాపణ కోరి లేక వారి హక్కు ఇచ్చేసి) తొలిగిపోవాలి. (లేదా) ఆ రోజు, తాను చేసిన “జుల్మ్‌”కి పరిమాణంలో అతని పుణ్యాలు తీసుకొని (బాధితునికివ్వబడతాయి). అతని వద్ద పుణ్యాలు లేనిచో బాధితుని పాపాలు తీసుకొని అతనిపై వేయబడతాయి. (బుఖారి 6534).

3- మూడవ రకం: మనిషి తన ఆత్మపై చేసుకునే “జుల్మ్‌”. అదేమిటనగా మనిషి నిషిద్ధ విషయాలకు పాల్పడుట. అల్లాహ్ ఆదేశం:

وَمَا ظَلَمُونَا وَلَكِنْ كَانُوا أَنْفُسَهُمْ يَظْلِمُونَ (57)

“వారు మాపై ఏ మాత్రం “జుల్మ్‌” చేయలేదు. వారు తమకు తామే “జుల్మ్‌” చేసుకున్నారు. (2: ఒఖర: 57).

నిషిద్ధ కార్యాలకు పాల్పడుట మనిషి తన ఆత్మపై చేసుకునే “జుల్మ్‌”. ఎందుకనగా అతని ఈ పాపం అతను అల్లాహ్ శిక్షకు గురికావడానికి కారణమవుతుంది.

అసూయ

అసూయ దుర్గుణాల్లో ఓ గుణం. ముస్లిం దాని నుండి దూరంగా ఉండడం తప్పనిసరి. ఎందుకనగా, అల్లాహ్ తన దాసులకు పంచిన దానిలో ఆక్షేపించినట్లగును. అల్లాహ్ ఆదేశం గమించండి:

[أَمْ يَحْسُدُونَ النَّاسَ عَلَى مَا آتَاهُمُ اللَّهُ مِنْ فَضْلِهِ] {النساء 54}

“ఇతరులను చూసి వారు అసూయపడటానికి కారణం అల్లాహ్ వారికి తన అనుగ్రహాన్ని ప్రసాదించాడనా?”. (నిసా 4:54).

అసూయ రెండు రకాలు:

1. మనిషి ఒక వ్యక్తి వద్ద ఉన్న ధనం, లేక విద్య లేక అధికారం లాంటి వరం నశించిపోయి తనకు లభించాలని కాంక్షించడం.

2. ఒకరి వద్ద ఉన్న ఓ అనుగ్రహం అది అతనికి లభించకున్నా ఆ వ్యక్తి వద్ద ఉండకుండా నశించిపోవాలని కోరడం. ఇవి రెండూ నిషిద్ధం.

ముఖ్య గమనిక:  ఒక వ్యక్తి వద్ద ఉన్న అనుగ్రహం నశించిపోవాలని కాంక్షించకుండా తనకు కూడా అలాంటిదే కావాలని కోరడం అసూయ అనబడదు.

మోసం

ముస్లిం తన సోదరుల పట్ల మంచి చేయువాడు, అందుకు అతను ఏ ఒక్కరికీ మోసం చేయడు. తనకిష్టమైనది తన సోదరుని కొరకు ఇష్టపడతాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు.

«مَنْ غَشَّنَا فَلَيْسَ مِنَّا»

మోసము చేయువాడు మాలోని వాడు కాడు”. (ముస్లిం 101).

أَنَّ رَسُولَ اللهِ مَرَّ عَلَى صُبْرَةِ طَعَامٍ فَأَدْخَلَ يَدَهُ فِيهَا، فَنَالَتْ أَصَابِعُهُ بَلَلًا فَقَالَ: «مَا هَذَا يَا صَاحِبَ الطَّعَامِ؟» قَالَ أَصَابَتْهُ السَّمَاءُ يَا رَسُولَ اللهِ، قَالَ: «أَفَلَا جَعَلْتَهُ فَوْقَ الطَّعَامِ كَيْ يَرَاهُ النَّاسُ، مَنْ غَشَّ فَلَيْسَ مِنِّي»

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి ఓ ధాన్యముల కుప్ప నుండి దాటుతూ అందులో చెయ్యి వేశారు. వేళ్లకు తడి అంటింది. “ఇదేమిటి ఓ వ్యాపారి?” అని అడిగారు. ‘వర్షము కురిసినందు వలన తడిసినవి (అయితె వాటిని నేను క్రింద ఉంచాను) ప్రవక్తా’ అని జవాబిచ్చాడు ఆ ధాన్యాల యజమాని. “అదే పైన ఎందుకు ఉంచలేదు, ప్రజలకు తెలిసేది కదా. మోసము చేయువారు మాలోని వారు కారు”. అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హెచ్చరించారు. (ముస్లిం 102).

గర్వం

మానవుడు తనకున్న విద్యకారణంగా ఒక్కోసారి గర్వానికి గురి అవుతాడు. ఇక ఇతరులపై, లేక విజ్ఞానులపై పెత్తనం చూపుతూ, వారిని చిన్న చూపుతో చూస్తాడు.

ఒక్కో వ్యక్తి తనకు ఉన్న ఆస్తి, సంపదల కారణంగా గర్వానికి లోనయి, ఈ మూలంగా ప్రజల ఎడల అహంకారభావంతో మసులుకుంటాడు.

ఒక్కో మనిషి తనకున్న బలం, శక్తి లేక తాను చేసే ఆరాధన లాంటి పనులతో గర్వానికి గురవుతాడు.

కాని నిజమైన ముస్లిం గర్వహాంకారాలకు గురికాకుండా దాని నుండి దూరంగా, జాగ్రత్తగా ఉంటాడు. ఇబ్లీసును స్వర్గం నుంచి వైదొలిగించింది అతని గర్వం, అహంకారమేనన్న విషయం ముస్లిం గుర్తించాలి. ఆదం అలైహిస్సలాంకు సజ్దా చేయి అని అల్లాహ్  అతన్ని ఆదేశించినప్పుడు అతడు: “నేను అతడికంటే శ్రేష్ఠుణ్ణి. నీవు నన్ను అగ్నితో సృష్టించావు. అతన్ని మట్టితో” అని అన్నాడు. అల్లాహ్ కారుణ్యం నుండి అతను దూరం కావడానికి ఇదేకారణం అయింది.

గర్వం, అహంకారభావం చికిత్స ఏమిటనగా ప్రతి వ్యకి తనకు అల్లాహ్ నొసంగిన అనుగ్రహాల్లో అది; విద్య, లేక ధనం, లేక ఆరోగ్యం మొదలయినవి ఏవైనా, అల్లాహ్ ఏ క్షణంలోనైనా తిరిగి తన నుంచి తీసుకునే శక్తిగలవాడు అని తెలుసుకోవాలి.

నైతిక గుణాలు ఆర్జించు మార్గాలు

 మనిషి ఏ గుణాలపై స్థిరపడ్డాడో వాటిని మార్చడం మానవ నైజానికే అతికష్టం అనడంలో సందేహం ఏ మాత్రం లేదు. అయినా అది అసాధ్యం, అసంభవం కాదు. కొన్ని సాధనాలు, వివిధ మార్గాలున్నాయి వాటి ఆధారంగా మనిషి సద్గుణాలు ఆర్జించవచ్చును. వాటిలో:

1- సలామతుల్‌ అఖీద (విశ్వాస శుద్ది): విశ్వాసం మహోత్తరమైన విషయం. సర్వసాధారణంగా మనిషి నడవడిక, స్వభావం, అతని ఆలోచనకు, విశ్వాసానికి, అతను అవలంభించిన ధర్మానికి ప్రత్యక్ష రూపంగా ఉంటుంది. విశ్వాసులలో అత్యుత్తమ సద్వర్తనగలవాడే వారిలో సంపూర్ణ విశ్వాసం గలవాడు. విశ్వాసం సరిగ్గా ఉంటే ప్రవర్తన కూడా చక్కగా ఉంటుంది. సరియైన విశ్వాసంగల వ్యక్తికి అతని ఆ విశ్వాసం సత్యత, దాతృత్వం, సంయమనం, శూరత్వం సద్గుణాలను ప్రోత్సహిస్తుంది. అదే విధంగా అబద్ధం, పిసినారితనం, కోపం. అజ్ఞానం మొదలయిన దుర్గుణాల నుండి హెచ్చరిస్తుంది.

2 దుఆ: అది గొప్ప ద్వారం. ఒక దాసుని కొరకు అది తెరువబడుతే అల్లాహ్ వైపు నుండి దాతృత్వం, మేళ్ళు, శుభాలు కురుస్తునే ఉంటాయి. సద్గుణ సంపన్నుడవ్వాలని, దుర్గుణాలకు దూరంగా ఉండాలని కోరువారు అల్లాహ్ సన్నిధిలోకి చేరుకొని, ఆయనతో మొరపెట్టుకోవాలి. అల్లాహ్ అతనికి సద్గుణాలు ప్రసాదించాలని, దుర్గుణాల నుండి దూరముంచాలని. ఈ విషయంలో మరియు ఇతర విషయాల్లో దుఆ చాల ప్రయోజన కరమైనది. అందుకే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వినయ, వినమ్రతతో అల్లాహ్ ను చాలా వేడుకునే, అర్థించేవారు. తక్బీరే తహ్రీమ తరువాత చదివే దుఆలలో అప్పుడప్పుడు ఇలా కూడా దుఆ చేసేవారు.

اَللَّهُمَّ اهْدِنِي لِأَحْسَنِ الْأَخْلَاقِ لَا يَهْدِي لِأَحْسَنِهَا إِلَّا أَنْتَ، وَاصْرِفْ عَنِّي سَيِّئَهَا لَا يَصْرِفْ عَنِّي سَيِّئَهَا إِلَّا أَنْتَ

అల్లాహుమ్మహ్ దినీ  లిఅహ్ సనిల్‌ అఖ్‌లాఖి, లా యహ్ దీ లిఅహ్ సనిహా ఇల్లా అన్‌త, వస్రిఫ్ అన్నీ సయ్యిఅహా, లా యస్రిఫ్ అన్నీ సయ్యిఅహా ఇల్లా అన్‌ “. (ముస్లిం 771).

భావం: ఓ అల్లాహ్! నీవు నాకు సద్గుణాలు ప్రసాదించు. నీవు తప్ప మరెవ్వడూ సద్గుణాలు ప్రసాదించ లేడు. ఓ అల్లాహ్! నన్ను దుర్గుణాల నుండి దూరముంచు, నీవు తప్ప మరెవ్వరూ దుర్గుణాల నుండి దూరముంచలేడు.

3- ముజాహద: (ప్రయత్నం, కృషి) ఈ ప్రక్రియలో “ముజాహద” చాల ప్రయోజనకరంగా ఉంటుంది. ఎవడు సద్గుణాలు అలవర్పుకోటానికి దుర్గుణాలను వదులుకోడానికి ముజాహద చేస్తాడో అతనికి అనేక మేళ్ళు లభించును. భయంకరమైన కీడు అతని నుండి దూరమగును. కొన్ని గుణాలు సహజమైనవి. మరికొన్ని ఆర్జించవలసి యుంటాయి. అవి శిక్షణ, అభ్యాసముతో వస్తాయి.

మనిషి “ముజాహద” ఒక సారి, రెండు సార్లు లేక కొంచెం ఎక్కువసార్లు చేసి విడనాడకూడదు. జీవితాంతం చేస్తునే ఉండాలి. ఎందుకనగ ఈ “ముజాహద” ఆరాధనలో లెక్కిచబడుతుంది. అల్లాహ్ ఆదేశం చదవండి:

[وَاعْبُدْ رَبَّكَ حَتَّى يَأْتِيَكَ الْيَقِينُ]

“తప్పకుండా చివరి గడియ వచ్చే వరకు నీ ప్రభువు దాస్యం చేస్తూవుండు”. (హిజ్ర్‌ 15:99)

4: “ముహాసబ”:  చెడ్డ పని చేసినప్పుడు తన ఆత్మను విమర్శించి, మరోసారి ఆ చెడ్డపనికి అది పాల్పడకుండా ఉంచే ప్రయత్నం చెయ్యాలి.

5: సద్వర్తన వల్ల సంభవించే ప్రభావాలను యోచించాలి. ఏ విషయం యొక్క ఫలితం ఎలా ఉంటుందో తెలుసుకుంటే, వాటి సత్పలితాల్ని గ్రహిస్తే, అవి చేయుట మరియు చేయుటకు ప్రయత్నించుట సులభమగును.

6: దుర్గుణాల దుష్పలితం పట్ల చింతన చేయాలి. దుర్గుణం వల్ల కలిగే శాశ్వత బాధ, విడదీయని రోధ, పశ్చాత్తాపం, అనుతాపం, ప్రజల మనస్సుల్లో ద్వేషాలు పెరగటం లాంటి విషయాల్ని గమనించాలి (ఇలా దుర్గుణాల నుండి దూరముండ గలుగుతాడు).

7 ఆత్మశుద్ధి చేసుకోలేననే నిరాశకు గురికాకూడదు. విశ్వాసి నిరాశచెందుట మంచి విషయం కాదు. ఎన్నటికీ అది అతనికి తగనిది. తన సంకల్పాన్ని దృఢపరుచుకొని, సంపూర్ణంగా ఆత్మశుద్ధి చేయుటకు ప్రయత్నం చేయాలి. దానిలో ఉన్న లోపాల్ని లేకుండా చేసే ప్రయత్నం చేయాలి.

8: మందహాసము, చిరునవ్వుతో ఉండాలి. ముఖము చిట్లించి, మాడ్పు ముఖముతో ఉండకూడదు. ఒక వ్యక్తి తన ముస్లిం సోదరున్ని కలిసినప్పుడు చిరునవ్వు నవ్వుట “సదఖా” చేసినంత సమానం. దానిపై అతనికి పుణ్యం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా శుభవార్త ఇచ్చారు.

«تَبَسُّمُكَ فِي وَجْهِ أَخِيكَ لَكَ صَدَقَةٌ»

“నీ సోదరున్ని కలిసి చిరునవ్వునవ్వుట నీకు “సదఖా” చేసినంత సమానం”. (తిర్మిజి 1956).

మరో సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారు.

«لَا تَحْقِرَنَّ مِنَ الْمَعْرُوفِ شَيْئًا، وَلَوْ أَنْ تَلْقَى أَخَاكَ بِوَجْهٍ طَلْقٍ»

“ఏ ఒక చిన్న సత్కార్యాన్ని చిన్నచూపుతో చూడకు. అది నీ సోదరున్ని మందహాసముతో కలియుట అయినా సరే”. (ముస్లిం 2626).

9: చూచి చూడనట్లు ఉండాలి. ఇది మహాపురుషుల గుణం. ఈ గుణం వలన ప్రేమ ఎక్కువకాలం ఉంటుంది, (ప్రేమ లేని వారిలో ప్రేమ) కుదిరింపజేస్తుంది. శతృత్వాన్ని నశింపజేస్తుంది.

10: సంయమనం, సహనం: అది సద్గుణాల్లో అతి గొప్పది. జ్ఞానుల ఉన్నతమైన గుణం. సంయమనం అంటే ఆగ్రహం కలిగినప్పుడు దాన్ని దిగమింగుట. సంయమనం అంటే ఆ గుణంగల వ్యక్తికి కోపం రాకూడదు అని కాదు. ఆగ్రహం పెంచే కారణాల ఊబిలో చిక్కుకొని తీవ్రకోపానికి గురైనప్పుడు తనను తాను ఓదార్చుకోవాలి. ఒక వ్యక్తిలో సంయమనం గుణం చోటు చేసుకుందంటే  అతన్ని ప్రేమించేవారి సంఖ్య పెరుగుతుంది. అతన్ని ద్వేషించేవారి సంఖ్య తరుగుతుంది. అతని స్థానం ఉన్నతం అవుతుంది.

11.మూర్ఖుల తెరువుకు పోకుండ ఉండుట: మూర్ఖుల జోలికి పోనివాడు తన మానాన్ని కాపాడుకుంటాడు. తనకు తాను తృప్తిగా ఉంటాడు. వారి నుండి బాధాకరమైన  మాటలు వినకుండా శాంతిపొందుతాడు. అల్లాహ్ ఇలా ఆదేశించాడు.

[خُذِ الْعَفْوَ وَأْمُرْ بِالْعُرْفِ وَأَعْرِضْ عَنِ الْجَاهِلِينَ]

“మృదుత్వం, మన్నింపుల వైఖరిని అవలంబించు. మంచిని ప్రబోధించు. మూర్ఖులతో వాదానికి దిగకు” (వారి తెరువుకు పోకు) (ఆరాఫ్ 7:19).

12: దూషించవద్దు: తిట్లు, దుషణాలకు అతి దూరంగా ఉండాలి.

13: బాధను మరచిపోవాలి: నీకు ఎవరైనా బాధ కలిగిస్తే దాన్ని మరచిపో. అతని పట్ల నీ మనుస్సులో కల్మషం లేకుండా ఉండు. అతనితో భయపడకుండా ఉండు. తమ సోదరుల తరపు నుండి కలిగిన బాధను మరువకుండా గుర్తుంచుకునేవారిలో, వారి పట్ల ప్రేమ ఉండదు. అలా మరువనివారు వారితో కలిసి జీవితం గడుపలేరు. ఎంత మరువగలుగుతావో అంత బాధను మరచిపో.

14: మన్నింపు వైఖరి అవలంబించుకో: చెడు చేసినవారికి ప్రతీకారంగా మంచి  చేయాలి. స్థానాలు ఉన్నతం కావడానికి ఇది ఒక సబబు (కారణం). అందులో శాంతి ఉంది. ప్రతీకారంతో తృప్తిపడే మనస్సుకు (ఆ అవకాశము ఇవ్వకుండా) నిరోధించినట్లగును.

15: దాతృత్వం: దాతృత్వం ప్రశంసనీయమైనది. పిసినారితనం నిందార్హమైనది. దాతృత్వం ప్రేమను ఆకర్షిస్తుంది. శతృత్వాన్ని దూరం చేస్తుంది. మంచి ప్రస్తావన సంపాదించి, తప్పిదాలను, లోటుపాట్లను కప్పిఉంచుతుంది.

16: అల్లాహ్ వద్ద ప్రతిఫలం పొందే నమ్మకం ఉండాలి. మహోన్నతమైన గుణాలు ఆర్జించడానికి సహాయపడే విషయాల్లో ఇది అతి గొప్పది. ఓపిక, ముజాహద, ప్రజల నుండి బాధలు, కష్టాలు భరించుటకు కూడా ఇది సహాయ పడుతుంది. విశ్వాసునికి తన సద్గుణాలకు, ఆత్మను అదుపులో ఉంచు కున్నందుకు అల్లాహ్ ప్రతిఫలం ఇచ్చేవాడున్నాడని విశ్వసించినప్పుడు మరింత ఎక్కువ సద్గుణాలు ఆర్జించడానికి ప్రయత్నిస్తాడు. ఈ దారిలో ఎదురయ్యే కష్టాలు కూడా తేలికగా ఏర్పడుతాయి.

17: కోపం నుండి దూరముండాలి. కోపం ఒక అగ్ని. అది గుండెల్లో మంటలు లేపుతుంది. దౌర్జన్యం చేయాలని, ప్రతీకారం తీసుకోవాలని, తృప్తి పొందాలని ప్రోత్సహిస్తుంది. మనిషి తనకు కోపం వచ్చినప్పుడు తన మనుస్సును అదుపులో ఉంచుకుంటే తన మానాన్ని, గౌరవాన్ని కాపాడుకోగలుగుతాడు. తర్వాత హీనమైన సాకులు చెప్పే పరిస్థితికి, పశ్చాత్తాపానికి దూరంగా ఉంటాడు. (కోపం ఎంత చెడ్డదో క్రింది హదీసు ద్వారా తెలుస్తుంది).

أَنَّ رَجُلًا قَالَ لِلنَّبِيِّ : أَوْصِنِي، قَالَ: «لاَ تَغْضَبْ» فَرَدَّدَ مِرَارًا، قَالَ: «لاَ تَغْضَبْ»

అబూ హూరైరా రజియల్లాహు అన్హు కథనం: ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి ‘నాకు ఏదైనా ఉపదేశించండి’ అని అర్ధించాడు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం “కోపగించుకోకు” అని బోధించారు. ఆ వ్యక్తి దాని తరువాత కూడా మాటిమాటికి ‘ఉపదేశించండి’ అని అర్ధించసాగాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రతీసారి “కోపగించుకోకు” అని మాత్రమే బోధించారు. (బుఖారి 6116).

18- ఉద్దేశ్యపూర్వకమైన ఉపదేశాన్ని, నిర్మాణాత్మకమైన విమర్శనను స్వీకరించాలి. తనలో ఉన్న లోపం అతనికి తెలుపబడుతే దాన్ని స్వీకరించి దాన్ని దూరం చేసుకోవాలి. తన లోపాల పట్ల తాను తెలిసి తెలియనట్లు ఉండిపోతే. ఆత్మశుద్ధి సంపూర్ణంగా చేయలేడు.

19: ఒక మనిషికి ఏ పని చేయాలని నిర్ణయంచబడిందో దాన్ని అతడు పరిపూర్ణముగా చెయ్యాలి. అలా తను చీవాట్లకు, ఎత్తిపొడుపులకు, గద్ధింపులకు, నీచమైన సాకులు చెప్పుట నుండి దూరముంటాడు.

20: తప్పు జరిగితే దాన్ని ఒప్పుకోవాలి. బొంకులాడకుండా జాగ్రత్త  పడాలి. ఇది సద్గుణానికి ఒక చిహ్నం. ఎలాంటి అబద్దం చెప్పకుండ ఉండాలి. తప్పును ఒప్పుకొనుట ఘనతగల విషయం. అలా ఆ వ్యక్తి ప్రఖ్యాతి ఇనుమడింపజేయబడుతుంది.

21: సత్యం ఆవశ్యకమైనది. దాని ప్రభావం ప్రశంసనీయమైనది. సత్యం వలన మనిషి గౌరవం, మర్యాద, స్థానం పెరుగుతుంది. అది అసత్య కసటు, వ్యాకులం, పరితాపం, హీనత్వ సాకుల నుండి కాపాడుతుంది. ప్రజలు అతనికి చేసే కీడు నుండి, అతడు నమ్మకద్రోహి కాకుండా రక్షిస్తుంది. అతనిలో గౌరవం, ధైర్యం ఆత్మ విశ్వాసం (సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌) తెఛ్చిపెడుతుంది.

22: చెడు చేసినవారిని మాటిమాటికి చీవాట్లు పెట్టుట, ఎత్తిపొడుచుట మానుకోవాలి. ఆ దుర్గుణం ఆగ్రహాన్ని ఆహ్వానిస్తుంది. శతృత్వానికి కారణభూతమవుతుంది. కష్టతరమయిన విషయాలు వినవలసి వస్తుంది. జ్ఞానుడు, బుద్ధిమంతుడు ప్రతి చిన్న పెద్ద విషయంపై తన సోదరుల్ని చీవాట్లు పెట్టడు. తాను ఓ హేతువు వెతుకుతాడు. ఒక వేళ చీవాట్లు పెట్టవలసి ఉంటే అది మృదువుగా, మంచి విధంగా ఉండాలి.

23: సద్గుణులు, మంచివాళ్ళకు తోడు (దోస్తాన) ఉండాలి. సద్గుణ సంపన్నుడుగా మార్చే విషయాల్లో ఇది అతిగొప్పది. మంచిని మనుస్సులో నాటుకొని యుండుటకు ముఖ్యకారణం అవుతుంది.

24: పరస్పర సంభాషణ, సమావేశ పద్దతులను పాటించాలి. ఆ పద్దతులు ఇవి: మాట్లాడే వ్యక్తి మాట శ్రద్ధతో వినాలి. మధ్యలో మాట ఆపవద్దు. అబద్దం చెబుతున్నాడని (నిందించవద్దు). హేళన చేయవద్దు. మాట పూర్తి కాక ముందు సమావేశం నుండి వెళ్ళ వద్దు.

ఇంకా: సలాం చేస్తూ సమావేశంలో పాల్గొనాలి. సలాం చేస్తూ బైటికి రావాలి. సమావేశాల్లో ఇతరులకు చోటు కల్పించాలి. కూర్చున్న వ్యక్తిని లేపి అతని చోట కూర్చోవద్దు. కలసి కూర్చున్న ఇద్దరిలో వారి అనుమతి లేకుండా విడదీయ వద్దు. ఒక్కరిని వదలి ఇద్దరు పరస్పరం రహస్యంగా మాట్లాడుకోవద్దు.

25: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) జీవిత చరిత్ర చదువుతూ ఉండాలి. అది దాన్ని చదివేవారి ముందు మానవత ఎరిగిన దానికంటే ఒక గొప్ప ఆదర్శాన్నిచూపుతుంది. మానవ జీవిత సరళిలో ఒక సంపూర్ణ మార్గం ఉంచుతుంది

26: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సహచరుల చరిత్రను కూడా చదువుతూ ఉండాలి.

27: సద్గుణాలకు సంబంధించిన రచనలు చదవాలి. అవి సద్గుణాలను బోధిస్తూ, వాటి ఘనత తెలుపుతాయి. వాటిని ఆర్జించటానికి సహాయ పడుతాయి. దుర్గుణాల నుండి హెచ్చరిస్తాయి. వాటి దుష్ఫలితాన్ని, వాటి నుండి దూరముండే విధానాన్ని తెలుపుతాయి.

సహనం, ఓర్పు – రియాదుస్ సాలిహీన్ [ఆడియో సిరీస్]

బిస్మిల్లాహ్

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్ ) – ఇమామ్ నవవి
మూడవ అధ్యాయం – సహనం , ఓర్పు
హదీసులు # 25 – 52

రియాదుస్సాలిహీన్ (హదీసు కిరణాలు) [అన్నీ వీడియో పాఠాలు]
https://teluguislam.net/2021/01/28/riyad-us-saliheen-hadeeth-lessons

సహనం, ఓర్పు – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV3RjoZaSlju7cCMlRuCMNco

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia


క్రింద ఇచ్చిన లింకుల మీద క్లిక్ చేసి ఆడియో వినండి:

భాగం 01 (ఖుర్’ఆన్ అయతులు)  (29 నిముషాలు)

భాగం 02 (హదీసు #25) (34 నిముషాలు)

భాగం 03 (హదీసు #26,27) (29 నిముషాలు)

భాగం 04 (హదీసు #28,29) (25 నిముషాలు)

భాగం 05 (హదీసు #30) (25 నిముషాలు)

భాగం 06 (హదీసు #31 – 35) (29 నిముషాలు)

భాగం 07 (హదీసు #36 – 40) (25 నిముషాలు)

భాగం 08 (హదీసు #41) (36 నిముషాలు)

భాగం 09 (హదీసు #42,43) (27 నిముషాలు)

భాగం 10 (హదీసు #44) (27 నిముషాలు)

భాగం 11 (హదీసు #45-49) (23 నిముషాలు)

భాగం 12 (హదీసు #50-53) (36:22 నిముషాలు)


హదీసులు క్రింద ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి చదవండి:
సహనం , ఓర్పు [PDF]

అల్లాహ్ అంటే ఎవరు? ఇస్లాం అంటే ఏమిటి? [ఆడియో & టెక్స్ట్]

అల్లాహ్ అంటే ఎవరు? ఇస్లాం అంటే ఏమిటి?
https://youtu.be/e6YALKM5wwU [33 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, అల్లాహ్ యొక్క ఏకత్వం, ఆయన గుణగణాలు మరియు సృష్టిలో ఆయన పాత్ర గురించి వివరించబడింది. అల్లాహ్ యే ఈ సృష్టి అంతటికీ మూలాధారుడని, ఆయనే జీవన్మరణాలకు అధిపతి అని మరియు సర్వ మానవాళికి ఉపాధిని ప్రసాదించేవాడని ఖురాన్ ఆయతుల ద్వారా స్పష్టం చేయబడింది. మానవులకు మార్గదర్శకత్వం కోసం అల్లాహ్ ప్రవక్తలను పంపాడని, వారిలో చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అని చెప్పబడింది. ఇస్లాం అంటే అల్లాహ్ కు లొంగిపోవడమని, ఇది కేవలం ఒక మతవర్గానికి చెందినది కాదని, సర్వ మానవాళికి చెందిన సత్య ధర్మమని నొక్కి చెప్పబడింది. భారతదేశంలో ఇస్లాం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలోనే ప్రవేశించిందని, ఆది మానవుడు ఆదం అలైహిస్సలాం కూడా భారత ఖండంలోనే అవతరించారని చారిత్రక ఆధారాలతో వివరించబడింది. చివరగా, ఇస్లాంను కాదని మరో మార్గాన్ని అనుసరించేవారు పరలోకంలో నష్టపోతారని ఖురాన్ హెచ్చరికతో ప్రసంగం ముగించబడింది.

అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్, నబియ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహి వ సహ్బిహి అజ్మయీన్, అమ్మా బాద్.

అల్లాహ్ త’ఆలా ఈ సృష్టి అంతటికీ మూలాధారుడు. ఆది నుండి ఉన్నవాడు, అంతము వరకు ఉండేవాడు. సర్వ ప్రాణి, సర్వ సృష్టికి సమాప్తము, వినాశనము అనేది ఉంటుంది. కానీ అల్లాహ్, అతనికి ఎలాంటి మరణము గానీ, ఎలాంటి సమాప్తము గానీ లేదు.

అల్లాహ్, ఏ అస్తిత్వాన్ని, ఎవరినైతే మనం అల్లాహ్ అని అంటామో ఆయన గురించి ఖురాన్ దివ్య గ్రంథంలో ఎన్నో ఆయతులలో ఆయన యొక్క పరిచయం చాలా వివరంగా ఉంది.

اللَّهُ الَّذِي خَلَقَكُمْ ثُمَّ رَزَقَكُمْ ثُمَّ يُمِيتُكُمْ ثُمَّ يُحْيِيكُمْ
(అల్లాహుల్లదీ ఖలకకుమ్, సుమ్మ రజఖకుమ్, సుమ్మ యుమీతుకుమ్, సుమ్మ యుహ్యీకుమ్)
ఆయనే మిమ్మల్ని సృష్టించినవాడు. అల్లాహ్ ఆయనే మీ అందరికీ ఆహారం ప్రసాదించేవాడు. ఆ అల్లాహ్ యే మీ అందరికీ మరణం ప్రసాదిస్తాడు మరియు ఆ తర్వాత మరోసారి మిమ్మల్ని బ్రతికిస్తాడు, తిరిగి లేపుతాడు. (30:40)

ఈ విధంగా చూసుకుంటూ పోతే అల్లాహ్ గురించి ఖురాన్ గ్రంథంలో ప్రత్యేకంగా సూర రూమ్, ఇంకా వేరే కొన్ని సూరాలలో చాలా స్పష్టంగా ఆయతులు ఉన్నాయి. ఉదాహరణకు సూర ఆరాఫ్, ఆయత్ నంబర్ 54.

إِنَّ رَبَّكُمُ اللَّهُ الَّذِي خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ فِي سِتَّةِ أَيَّامٍ ثُمَّ اسْتَوَىٰ عَلَى الْعَرْشِ يُغْشِي اللَّيْلَ النَّهَارَ يَطْلُبُهُ حَثِيثًا وَالشَّمْسَ وَالْقَمَرَ وَالنُّجُومَ مُسَخَّرَاتٍ بِأَمْرِهِ ۗ أَلَا لَهُ الْخَلْقُ وَالْأَمْرُ ۗ تَبَارَكَ اللَّهُ رَبُّ الْعَالَمِينَ
నిస్సందేహంగా అల్లాహ్‌యే మీ ప్రభువు. ఆయన ఆకాశాలను, భూమిని ఆరు రోజులలో సృష్టించాడు. ఆ తరువాత సింహాసనంపై (అర్ష్‌పై) ఆసీనుడయ్యాడు. ఆయన రాత్రిని పగటిపై కప్పివేస్తాడు. అది దాన్ని వేగంగా వెంబడిస్తూ వస్తుంది. ఇంకా ఆయన సూర్యచంద్రులను, నక్షత్రాలను తన ఆజ్ఞకు కట్టుబడి ఉండే విధంగా సృష్టించాడు. వినండి! సృష్టి ప్రక్రియ ఆయన స్వంతం. ఆజ్ఞాపన ఆయన సొత్తు. సకల లోకాల ప్రభువైన అల్లాహ్‌ అపారమైన శుభాలు కలవాడు.(7:54)

ఆయనే రాత్రిని పగటిపై కప్పుతున్నాడు. మరియు ఈ పగలు అనేది రాత్రి వెంట పడుతుంది. మరియు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నీ కూడా ఆయన ఆజ్ఞకు లోబడి ఉన్నాయి. వినండి, ఈ లోకంలో ఆదేశం చెల్లేది, ఆజ్ఞ పాలన జరిగేది అల్లాహ్ ది మాత్రమే. సృష్టి ఆయనదే గనక ఆజ్ఞా పాలన కూడా ఆయనదే జరుగును. ఆ అల్లాహ్ సర్వ విశ్వ విశ్వాసాలకు, ఈ సర్వ లోకాలకు ప్రభువు, చాలా శుభము కలవాడు.

ఇంకా ఖురాన్ గ్రంథంలో మనం చూసినట్లయితే,

اللَّهُ الَّذِي رَفَعَ السَّمَاوَاتِ بِغَيْرِ عَمَدٍ تَرَوْنَهَا
(అల్లాహుల్లదీ రఫ అస్సమావాత్ బిగైరి అమదిన్ తరౌనహా)
స్తంభాలు లేకుండా (నే) ఆకాశాలను అంతేసి ఎత్తుకు లేపిన వాడే అల్లాహ్‌. దీన్ని మీరు చూస్తూనే ఉన్నారు. (13:2)

ఆ ఆకాశాలను ఎలాంటి పిల్లర్ లేకుండా ఏ ఒక్క పిల్లర్ లేకుండా పైకి లేపి నిలిపాడు, తరౌనహా, దీనికి ఏ ఒక్క పిల్లర్ లేని విషయం మీరు చూస్తున్నారు. మరోచోట సూర ఇబ్రాహీంలో,

اللَّهِ الَّذِي لَهُ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ
(అల్లాహుల్లదీ లహూ మా ఫిస్సమావాతి వ మా ఫిల్ అర్ద్)
ఆకాశాలలో, భూమిలో ఉన్న సమస్తమూ ఆ అల్లాహ్‌దే. (14:2)

وَوَيْلٌ لِلْكَافِرِينَ مِنْ عَذَابٍ شَدِيدٍ
(వ వైలున్ లిల్ కాఫిరీన మిన్ అదాబిన్ షదీద్)
తిరస్కారుల కొరకు కఠిన శిక్ష మూలంగా వినాశం ఉంది. (14:2)

మరి ఎవరైతే సత్యాన్ని తిరస్కరిస్తున్నారో, అల్లాహ్ ను తిరస్కరిస్తున్నారో అలాంటి వారికి వినాశనం ఉంది మరియు చాలా భయంకరమైన శిక్ష ఉంది. ఇంకా ఈ రకంగా చూసుకుంటే ఎన్నో ఆయతులు ఉన్నాయి. ఉదాహరణకు సూర ఇబ్రాహీం.

اللَّهُ الَّذِي خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ وَأَنزَلَ مِنَ السَّمَاءِ مَاءً فَأَخْرَجَ بِهِ مِنَ الثَّمَرَاتِ رِزْقًا لَّكُمْ ۖ وَسَخَّرَ لَكُمُ الْفُلْكَ لِتَجْرِيَ فِي الْبَحْرِ بِأَمْرِهِ ۖ وَسَخَّرَ لَكُمُ الْأَنْهَارَ
భూమ్యాకాశాలను సృష్టించి, ఆకాశాల నుండి వర్షాన్ని కురిపించి, తద్వారా మీ ఆహారం కోసం పండ్లు ఫలాలను ఉత్పన్నం చేసినవాడే అల్లాహ్‌. ఆయనే తన ఆజ్ఞతో సముద్రంలో నౌకలు నడవటానికి వాటిని మీకు లోబరచాడు. ఆయనే నదీ నదాలను మీ అధీనంలో ఉంచాడు. (14:32)

అయితే అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్, ఆ సృష్టికర్త, పోషణకర్త, జీవన్మరణాల ప్రధాత, ఈ సర్వ సృష్టికి మూలం ఆయనే. అయితే సర్వ సృష్టిని మన సేవ కొరకు, మనం వాటి ద్వారా లాభం పొందడానికి సృష్టించాడు. సూర బఖరాలోని మూడవ రుకూలో,

هُوَ الَّذِي خَلَقَ لَكُمْ مَا فِي الْأَرْضِ جَمِيعًا
(అల్లదీ ఖలక లకుమ్ మా ఫిల్ అర్ది జమీఆ)
భూమిలో ఉన్న సమస్తాన్ని మీ కొరకే సృష్టించినవాడు ఆయనే. (2:29)

ఆ అల్లాహు త’ఆలా ఈ భూమిలో ఉన్న సమస్తాన్ని, ఖలక లకుమ్ మా ఫిల్ అర్ది జమీఆ, సమస్తాన్ని మీ కొరకు పుట్టించాడు. కానీ మనల్ని కేవలం ఆయన్ని ఆరాధించుటకే పుట్టించాడు. ఆయన్ను ఎలా ఆరాధించాలి? అందుకొరకు ఆయన స్వయంగా ఏదైనా అవతారం ఎత్తి ఈ లోకంలో రాలేదు. ఎలాగైతే వేరే కొందరు తప్పుడు మార్గాల్లో ఉన్నారో, కొందరు ఏమనుకుంటారు, స్వయంగా అల్లాహ్ లేదా వారి వారి భాషల్లో వారు అల్లాహ్ ను దేవుడు అని, ఈశ్వరుడు అని ఏదైతే అనుకుంటారో వారి యొక్క తప్పుడు విశ్వాస ప్రకారం, ఆ సృష్టికర్త మానవులకు మార్గం చూపడానికి అవతారం ఎత్తి వస్తాడు అని, లేదా ఇద్దరు ముగ్గురు కలిసి ఒక దేవుడై వారిలో ఒకరిని మానవులకు మార్గం చూపడానికి పంపాడు అని, ఇవన్నీ కూడా తప్పుడు విశ్వాసాలు.

ఆ సృష్టికర్త అయిన అల్లాహ్ ఏం చేశాడు? ఆయన మానవుల్లోనే అతి ఉత్తమ నడవడిక గల మరియు మానవుల్లోనే అందరికీ తెలిసి ఉన్న ఒక మంచి వ్యక్తిని తనకు మరియు తన దాసులకు మధ్య ప్రవక్తగా, ఒక సందేశ దూతగా ఎన్నుకున్నాడు.

اللَّهُ يَصْطَفِي مِنَ الْمَلَائِكَةِ رُسُلًا وَمِنَ النَّاسِ
(అల్లాహు యస్తఫీ మినల్ మలాఇకతి రుసులన్ వ మినన్నాస్)
అల్లాహ్ తన సందేశహరులుగా దైవదూతలలో నుండి, మానవులలో నుండి ఎన్నుకుంటాడు. (22:75)

అల్లాహు త’ఆలా దైవదూతల్లో కూడా సందేశ దూతలను ఎన్నుకుంటాడు, అలాగే మానవుల్లో కూడా అల్లాహు త’ఆలా తనకిష్టమైన వారిని ప్రవక్తగా ఎన్నుకుంటాడు. ఎన్నుకొని అతని వద్దకు తన దూత ద్వారా గాని లేదా డైరెక్ట్ అతని హృదయ ఫలకం మీద తన యొక్క సందేశాన్ని అవతరింపజేస్తాడు. ఆ ప్రవక్త అల్లాహ్ యొక్క ఆ సందేశాన్ని తీసుకొని, స్వీకరించి, నేర్చుకొని, తర్వాత ప్రజలకు వినిపిస్తారు.

ఈ విధంగా ఖురాన్ లో అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ ఎన్నో సందర్భాల్లో ఈ విషయం తెలిపి ఉన్నాడు. అల్లాహు త’ఆలా తనకిష్టమైన ప్రజల్లోని ఒక వ్యక్తిని ఎన్నుకున్న తర్వాత ఆ ప్రవక్తగా చేసిన తర్వాత అతని వద్దకు దైవదూతను పంపి గానీ, అతని వద్దకు దివ్యవాణి పంపి గానీ, వహీ. మరి లేదా ఏదైనా పర్దా, హిజాబ్ అడ్డులో ఉండి మాట్లాడి గానీ అల్లాహు త’ఆలా తన యొక్క సందేశాన్ని అతని వద్దకు చేర్పిస్తాడు. ఈ విధంగా మానవులు ఎలా అల్లాహ్ ను ఆరాధించాలి, ఆ ఆరాధన మార్గాన్ని తన ప్రవక్తల ద్వారా వారికి నేర్పుతాడు.

ఇక ఎవరైతే వక్రమార్గంలో పడి, స్వాభావిక వారి యొక్క ఫిత్రత్, స్వాభావికం, ప్రకృతి విధానాన్ని వదిలేసి తప్పుడు ఆచారాల్లో, దురాచారాల్లో పడి ఉంటారో, వారు ఏమంటారు, ఈ మాలాంటి ఒక మనిషి మమ్మల్ని ఎందుకు మంచి గురించి చెప్పాలి? ఎందరో ప్రవక్త కాలాల్లో ప్రవక్తను తిరస్కరించినవారు,

أَبَشَرٌ يَهْدُونَنَا
(అ బషరున్ యహ్దూననా)
‘ఏమిటి, సాటి మానవులు మాకు మార్గదర్శకత్వం చేస్తారా?!’ (64:6)

మాలాంటి మనిషే కదా ఇతను, ఇతని మీదనే అల్లాహు త’ఆలా ఎందుకు వహీ పంపాడు? ఇతన్నే ప్రవక్తగా ఎందుకు ఎన్నుకున్నాడు? మాలో ఇంకా వేరే ఎవరు లేకుండేనా? అంటే దీని భావం ఏంటి? ఈ విధంగా వ్యతిరేకించడం మనిషిలో ఈ వ్యతిరేక గుణం మొదలైంది అంటే, ప్రతి దాన్ని, స్వయంగా తన తండ్రిని అనవచ్చు. నువ్వే నాకు ఎందుకు తండ్రిగా అయినావు? వేరే ఒకడు ఎందుకు కాలేదు? నువ్వే నాకు ఎందుకు తల్లిగా అయినావు? వేరే ఒకడు ఎందుకు కాలేదు? నువ్వే మాకు ఎందుకు రాజుగా ఉన్నావు? వేరే ఒకడు ఎందుకు కాలేదు? ఇతడే ఎందుకు మాకు ప్రవక్తగా వచ్చాడు అన్న విషయం, దాని గురించి అల్లాహు త’ఆలా ఒక సమాధానం ఏమి చెప్పాడు? అల్లాహ్ అతనిదే సృష్టి, అతనిదే ఆజ్ఞా పాలన జరుగును. అతడు తాను కోరిన వారిని ప్రవక్తగా ఎన్నుకుంటాడు. అల్లాహ్ యొక్క సృష్టిలో అల్లాహ్ ఎందుకు ఇలా చేస్తున్నాడు అని అడిగే హక్కు ఎవరికీ లేదు. ఎందుకంటే అల్లాహ్ చేసేది మానవుల మేలు కొరకు, అది ప్రకృతి సిద్ధంగా ఉంటుంది. కానీ ఎవరైతే ఇలాంటి అడ్డ ప్రశ్నలు వేస్తారో వారు ప్రకృతి సిద్ధాంతాలకు దూరమై వక్రమార్గంలో నడుస్తూ ఉంటారు.

మరికొందరు ఏమన్నారు? సరే, మాకు సన్మార్గం చూపడానికి అల్లాహ్ యొక్క ఇష్టం ఉండేది ఉంటే, ఏదైనా దైవదూతలను పంపే, పంపకపోయేదా? దైవదూతలను ఎందుకు పంపలేదు? అయితే సూర అన్ఆమ్ లో దాని యొక్క సమాధానం కూడా ఇవ్వడం జరిగింది. వలౌ జఅల్నాహు మలకన్, ఒకవేళ దైవదూతలను మేము వారి మధ్యలో ప్రవక్తగా చేసి పంపినా, వారిని ఆ దైవదూత రూపంలో ఉంచలేము. వారిని ఒక మనిషిగా చేసి వారికి ఎందుకంటే గమనించండి, మానవుల అవసరాలు దైవదూతల అవసరాలకు భిన్నంగా ఉంటాయి. అయితే మానవులకు సన్మార్గం చూపడానికి మానవుల్లోనే ఒక జ్ఞానం ఉన్న, మంచి నడవడిక గల, ఇతరులకు ఆదర్శంగా ఉండగలిగే అటువంటి వారినే అల్లాహు త’ఆలా ఎన్నుకుంటాడు.

అయితే సోదరులారా, చెప్పే విషయం ఏంటంటే, అల్లాహ్, ఆయన ఎలాంటి అవతారం ఎత్తడు. ఆయన ఒకరి ఏదైనా వేషంలో ఇహలోకంలోకి రాడు, మానవులకు మార్గం చూపడానికి. ఆయన సిద్ధాంతం ఏంటి? ఇంతకుముందు గ్రంథాల్లో కూడా ఆ విషయాల్ని తెలియబరిచాడు. చిట్టచివరి గ్రంథం ఖురాన్ లో కూడా స్పష్టపరిచాడు. అయితే మానవులకు మార్గం చూపడానికి అల్లాహు త’ఆలా ప్రవక్తల పరంపర ఏదైతే మొదలుపెట్టాడో ఆదం అలైహిస్సలాం నుండి, చిట్టచివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వరకు ఈ పరంపర సాగుతూ వచ్చింది. ముహమ్మద్ ప్రవక్త ద్వారా ఈ ప్రవక్తల పరంపరను అల్లాహు త’ఆలా అంతం చేశాడు. ఆయనను చివరి ప్రవక్తగా పంపాడు. మరియు ప్రళయం సంభవించే వరకు ఆ ప్రవక్తనే మనం ఆదర్శంగా, మనం అంటే సర్వ మానవులం, ఆదర్శంగా చేసుకొని అల్లాహ్ ఆయనపై పంపినటువంటి దివ్య ఖురాన్ గ్రంథాన్ని అర్థం చేసుకొని, ఆ దివ్య ఖురాన్ ను ప్రవక్త ముహమ్మద్ వారు ఎలా ఆచరించారో అలా ఆచరించే ప్రయత్నం చేయాలి అని అల్లాహ్ మనకు ఆదేశించాడు. అందు గురించి సూర ఇబ్రాహీం గానీ ఇంకా వేరే సూరాలు మనం చూసేది ఉంటే,

كِتَابٌ أَنْزَلْنَاهُ إِلَيْكَ لِتُخْرِجَ النَّاسَ مِنَ الظُّلُمَاتِ إِلَى النُّورِ
(కితాబున్ అన్జల్నాహు ఇలైక లితుఖ్రిజన్నాస మినజ్జులుమాతి ఇలన్నూర్)
(ఇది) ఒక గ్రంథం. దీనిని మేము నీపై అవతరింపజేశాము – నీవు ప్రజలను వారి ప్రభువు అనుమతితో చీకట్లలో నుంచి వెలుగులోకి తీసుకురావటానికి. (14:1)

సర్వ ప్రజల్ని మీరు చీకట్లలో నుండి తీసి వెలుతురులోకి, ప్రకాశంలోకి తీసుకురావాలి అని. అయితే ఈ రోజుల్లో ఎంతోమంది ఎవరైతే ఇస్లాం ధర్మాన్ని అర్థం చేసుకోలేదో, వారు ఏమనుకుంటారు, ఇస్లాం ధర్మం అన్నది ప్రవక్త ముహమ్మద్ ది. ఇది కేవలం ముస్లింల ప్రవక్త, కేవలం ముస్లింల ధర్మం మరియు ఖురాన్ ఇది కేవలం ముస్లింల ధర్మం. కానీ ఇది నిజమైన మాట కాదు.

స్వయంగా ఒకవేళ మనం ఖురాన్ లో చూసి ఉంటే, ఇక్కడ ఎన్నో సందర్భాల్లో అల్లాహు త’ఆలా ఖురాన్ గురించి, ప్రవక్త ముహమ్మద్ గురించి, ఇస్లాం ధర్మం గురించి, అల్లాహ్ గురించి, అల్లాహ్ అంటే అల్లాహ్ స్వయంగా తన గురించి, అల్లాహ్ అనే అతను ముస్లింల దేవుడే కాదు. సర్వ మానవుల దేవుడు. అందు గురించి ఖురాన్ స్టార్టింగ్ లోనే మొట్టమొదటి ఆదేశం అని అనబడుతుంది. రెండో రుకూ పూర్తయిన తర్వాత మూడో రుకూ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో,

يَا أَيُّهَا النَّاسُ اعْبُدُوا رَبَّكُمُ الَّذِي خَلَقَكُمْ وَالَّذِينَ مِنْ قَبْلِكُمْ لَعَلَّكُمْ تَتَّقُونَ
(యా అయ్యుహన్నాస్ ఉ’బుదూ రబ్బకుమ్)
ఓ ప్రజలారా! మిమ్మల్ని, మీకు పూర్వం గడిచిన వారిని సృష్టించిన మీ ప్రభువును ఆరాధించండి. తద్వారా మీరు దైవభీతిపరులు కాగలరు. (2:21)

ఓ ప్రజలారా, ముస్లింలారా, అరబ్బులారా, ఈ విధంగా అనబడలేదు. యా అయ్యుహన్నాస్, ఓ ప్రజలారా, ఉ’బుదూ రబ్బకుమ్, మీ ప్రభువుని మీరు ఆరాధించండి. ఎవరు ఆ ప్రభువు? అల్లదీ ఖలకకుమ్, ఎవరైతే మిమ్మల్ని పుట్టించాడో, వల్లదీన మిన్ కబ్లికుమ్, మీ కంటే ముందు ఉన్న వారిని, ముందు గతించిన వారిని పుట్టించాడో. లఅల్లకుమ్ తత్తకూన్, ఈ విధంగా మీరు నరకం నుండి తమకు తాము రక్షించుకోవచ్చు.

అయితే ఇక్కడ సర్వ ప్రజల్ని అల్లాహ్ ఉద్దేశించి కేవలం ఆ ఏకైక సృష్టికర్తను, అల్లాహ్ ను మాత్రమే పూజించాలి అని చెప్పడం జరుగుతుంది. అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి కూడా,

يَا أَيُّهَا النَّاسُ إِنِّي رَسُولُ اللَّهِ إِلَيْكُمْ جَمِيعًا
(యా అయ్యుహన్నాస్ ఇన్నీ రసూలుల్లాహి ఇలైకుం జమీఆ)
“ఓ మానవులారా! నేను మీ అందరి వైపునకు అల్లాహ్ పంపిన ప్రవక్తను.” (7:158)

ఓ జనులారా, ఓ మానవులారా, నేను మీ అందరి వైపునకు ప్రవక్తగా చేసి పంపబడ్డాను. నేను మీ అందరి వైపునకు ప్రవక్తగా చేసి పంపబడ్డాను. సందేశ దూతగా పంపబడ్డాను. ఎవరి వైపు నుండి? ఆ అల్లాహ్ వైపు నుండి,

الَّذِي لَهُ مُلْكُ السَّمَاوَاتِ وَالْأَرْضِ
(లహూ ముల్కుస్సమావాతి వల్ అర్ద్)
భూమ్యాకాశాల సామ్రాజ్యం ఆయనదే. (7:158)

ఈ సర్వ ఆకాశాల మరియు భూమిలో ఉన్న సర్వానికి అధికారి ఆయన మాత్రమే.

ఇక ఖురాన్ గ్రంథం, ఇంతకుముందు నేను సూర ఇబ్రాహీం ఒక ఆయత్ మీకు ముందు చదివాను, కితాబున్ అన్జల్నాహు ఇలైక లితుఖ్రిజన్నాస్. ఈ గ్రంథం ఏదైతే మీపై అవతరింపజేశామో, దీని ద్వారా మీరు ప్రజలను, అరబ్బులను అని అనలేదు, ప్రజలను మిమ్మల్ని చీకట్ల నుండి వెలుతురు వైపునకు తీయడానికి పంపాము. అంతేకాకుండా ఒక చాలా ప్రఖ్యాతి గాంచిన ఆయత్, సర్వసామాన్యంగా ఎందరో హిందువులకు కూడా ఇది తెలిసి ఉంటుంది కావచ్చు.

شَهْرُ رَمَضَانَ الَّذِي أُنْزِلَ فِيهِ الْقُرْآنُ هُدًى لِلنَّاسِ
(షహ్రు రమదాన్ అల్లదీ ఉన్జిల ఫీహిల్ ఖుర్ఆన్, హుదల్లిన్నాస్)
రమజాను నెల – ఆ నెలలోనే ఖుర్ఆన్ అవతరించింది. అది మానవులందరికీ మార్గదర్శకత్వం వహించేది. (2:185)

రమదాన్ మాసంలో ఖురాన్ అవతరించింది, హుదల్లిన్నాస్, ఈ ఖురాన్ సర్వ మానవాళికి మార్గదర్శకత్వం.

అయితే సోదరులారా, ఈ రోజుల్లో సర్వ మానవులు కేవలం అల్లాహ్ ను మాత్రమే విశ్వసించాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ని విశ్వసించాలి, ఖురాన్ గ్రంథాన్ని విశ్వసించాలి, తమ జీవితం అల్లాహ్ పంపిన ఈ గ్రంథం, అల్లాహ్ పంపిన చిట్టచివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆదర్శ ప్రకారంగానే గడపాలి.

కానీ, మన, సామాన్యంగా మనం, మన తెలుగు దేశంలో అనండి, తెలుగుదేశం అంటున్నాను, అంటే పార్టీ అనట్లే నేను, ఆంధ్ర, తెలంగాణ అని ఇక రెండు పేర్లు చెప్పేదానికి బదులుగా, లేక మొత్తం భారతదేశంలో అనండి, సామాన్యంగా ఏమంటారు, ఈ ఇస్లాం దేశం ఒక 700 సంవత్సరాల క్రితం, 1000 సంవత్సరాల క్రితం మన ఇండియాలోకి వచ్చింది. అంతకుముందు ఇస్లాం అనేది లేదు. అందు గురించి మధ్యంతరంలో పుట్టుకొచ్చిన విషయం ఇది, దీన్ని ఎందుకు మనం స్వీకరించాలి? మన తాత ముత్తాతలు పాతకాలం నుండి ఏ ఆచారం మీద ఉన్నారో, ఏ ధర్మం మీద ఉన్నారో అలాగే ఉండాలి అని ఒక మాట అంటారు. విన్నారు కదా ఎన్నోసార్లు.

అయితే దీంతో మనకు గొడవ అవసరం లేదు. ప్రేమపూర్వకంగా, బుద్ధిపూర్వకంగా, గ్రంథాల ఆధారంతో మీరు సత్యాన్ని తెలుసుకోండి అని వారికి నచ్చచెబుదాము. దానికి మనం ఏ పద్ధతిలో వారికి నచ్చ చెప్పాలి? మొట్టమొదటి విషయం ఏంటంటే, ఇస్లాం అంటే ఏంటి? దాని అర్థం, దాని భావం ఏంటో నచ్చచెప్పాలి. ఇస్లాం అంటే ఏదో కొత్త ధర్మం కాదు. ఇస్లాం అంటే ఒకరికి ఏదైనా శత్రుత్వం వహించే లేదా ఒకరి గురించి ఏదైనా చెడు చూపించేటువంటి విషయం కాదు. ఇస్లాం అన్నదానికి భావం, మనం మన సృష్టికర్తకు లొంగబడి ఆయన ముందు తలవంచి ఆయన ఇష్ట ప్రకారం జీవితం గడపడం. ఇంకా నేను వివరంలో లోతుగా వెళ్ళలేను, సలము నుండి ఒక భావం దీని గురించి లొంగిపోవట అని వస్తుంది. శాంతిని పొందుట అని కూడా వస్తుంది. ఈ రెండిటినీ కలిపితే, మీరు మీ సృష్టికర్తకు లొంగిపోయి ఇహపరలోకాల్లో శాంతిని పొందండి.

ఈ రకంగా చూసుకుంటే, సీన్, లామ్, మీమ్ అన్న ఈ మూడు అక్షరాలు మూల పదం ఏదైతే ఉందో ఇస్లాంకి, దానికి అనుగుణంగా ఈ పదం ఎన్నో రకాలుగా ఏదైతే వాడబడుతుందో, అస్లమ, యుస్లిము, యుస్లిమూన, ముస్లిమూన, ఈ విధంగా ఖురాన్ లో మీరు చూసి ఉంటే, ఒక సందర్భంలో అల్లాహ్ త’ఆలా ఏం చెప్పాడో గమనించండి.

أَفَغَيْرَ دِينِ اللَّهِ يَبْغُونَ
(అఫగైర దీనిల్లాహి యబ్గూన్)
ఏమిటి, వీరు అల్లాహ్ ధర్మాన్ని కాకుండా మరో ధర్మాన్ని అన్వేషిస్తున్నారా? (3:83)

ఏమైంది ఈ ప్రజలకు? అల్లాహ్ పంపినటువంటి సత్య ధర్మాన్ని మాకు వద్దు, మేము ఈ సత్య ధర్మాన్ని స్వీకరించమని అంటున్నారా, తిరస్కరిస్తున్నారా, ఇష్టం లేదు అని అంటున్నారా?

وَلَهُ أَسْلَمَ مَنْ فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ طَوْعًا وَكَرْهًا
(వలహూ అస్లమ మన్ ఫిస్సమావాతి వల్ అర్ది తౌఅన్ వ కర్హా)
వాస్తవానికి భూమ్యాకాశాలలోని సమస్త వస్తువులు – ఇష్టపూర్వకంగా గానీ, అయిష్టంగా గానీ – ఆయనకే విధేయత చూపుతున్నాయి. (3:83)

మీరు మానవులు, ఐదు ఫిట్ల మనిషి, నాలుగున్నర ఫిట్ల మనిషి, మీ సంగతేంటి? మీకంటే పెద్ద పెద్ద సృష్టి రాశులు, ఆకాశం, ఆకాశాల్లో ఉన్న సర్వము, భూమి, భూమిలో ఉన్న సర్వము, అవన్నీ కూడా అస్లమ, లొంగిపోయి ఉన్నాయి. విధేయత పాటిస్తున్నాయి. అల్లాహ్ ఆజ్ఞా పాలన చేస్తున్నాయి, వారికి ఇష్టమైనా, ఇష్టం కాకపోయినా. అస్లమ, వారందరూ ఇస్లాంలోకి వచ్చారు, అంటే ఏంటిది? ఈ సర్వ సృష్టి మనం చూస్తున్నాము, సూర్యుడిని అల్లాహ్ పుట్టించినప్పటి నుండి ఒక్కసారైనా దైవం, అంటే అల్లాహ్ యొక్క నిర్ణయం, అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ ఆ సూర్యుని గురించి నిర్ణయించిన దారిని, మార్గాన్ని ధిక్కరించి, వ్యతిరేకించి నడుస్తుందా? నడుస్తున్నాడా? అలా అయితే ఇప్పటివరకు ఎప్పుడో నాశనం అయిపోయేది.

సోదరులారా, ఈ ఒక్క విషయం చెప్పాను సూర్యుడని. ఇస్లాం ధర్మం అంటే ఏంటిది? ఇది ఏదో కొత్త 400 సంవత్సరాల క్రితం, 1400 సంవత్సరాల క్రితం, 700 సంవత్సరాల క్రితం వచ్చిన ధర్మం కాదు. ఆది మానవుడి నుండే కాదు, అంతకు ముందు నుండి ఉంది. ప్రతి సృష్టి అల్లాహ్ కు లొంగి ఉన్నది. అయితే మానవులను కూడా అల్లాహ్ పుట్టించింది ఆయన ఆదేశం పాటించి, ఆయనను మాత్రమే ఆరాధించుటకు.

అయితే చివరిగా ఈ సందేశం సంపూర్ణం చేయబడింది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద. అందుగురించే ఇప్పుడు ఇదియే ఇస్లాం, అంటే ఖురాన్, అల్లాహ్, ముహమ్మద్ ప్రవక్త. వీటిని ఈ ముగ్గురిని, మూడింటిని మనం స్వీకరించడం, అంగీకరించడం, ఒప్పుకోవడం ప్రకారంగా జీవితం గడపడం తప్పనిసరి.

ఇక ఏదైతే పుకారు ఉందో, వెయ్యి సంవత్సరాల క్రితమని, ఇది కూడా తప్పు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా నగరంలో ఉన్నప్పుడే భారత ఖండంలో ఇస్లాం ప్రవేశించింది. ఇస్లాం అంటే ఇక్కడ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క పరిచయం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తీసుకొచ్చిన సత్య ధర్మం అప్పుడే ఇండియాలో చేరింది. ఇప్పటికీ దాని యొక్క గుర్తులు, దాని యొక్క చిహ్నాలు కేరళ రాష్ట్రంలో ఉన్నాయి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరించిన సహాబాలు, వారిలో ఇద్దరి సమాధులు ఇప్పటికీ ఇండియాలో ఉన్నాయి. కానీ చరిత్ర నుండి కూడా దూరమై, కళ్ళు మూసుకొని లేదా తెలిసినప్పటికీ వాటి మీద ముసుగు వేసి సత్యాన్ని స్వీకరించకపోతే అది వేరే విషయం.

మరొక చారిత్రక విషయం, దాని గురించి ఖురాన్ లో, హదీస్ లో ఎలాంటి ప్రూఫ్ అనేది లేదు, కానీ చారిత్రకంగా ఒక విషయం చాలా ప్రఖ్యాతి గాంచి ఉంది. అదేమిటంటే ఆది మానవుడు అని ఎవరినైతే అనడం జరుగుతుందో, అంటే ఆదం అలైహిస్సలాం మరియు ఆయన యొక్క భార్య హవ్వా అలైహిస్సలాం, వీరిద్దరినీ అల్లాహు త’ఆలా స్వర్గం నుండి ఏదైతే దించాడో అప్పుడు ఆదం అలైహిస్సలాం ఆ కాలంలో ఇండియా, ఇప్పుడు ఉన్న ఇండియా, శ్రీలంక ఇదంతా కలిసి ఉండే, అయితే సరాందీప్ అనే ప్రాంతంలో వచ్చారు, దిగారు, తర్వాత అక్కడి నుండి నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్లి మక్కాలో చేరుకున్నారు అని కూడా చారిత్రకంగా ఒక మాట ఉంది. దీన్ని నిరాకరించడానికి ఇంతకంటే బలమైన ఏదైనా విషయం ఉండేది ఉంటే అది వేరే విషయం. కానీ ఈ మాట నేను ఎందుకు చెప్తున్నాను? అయితే మన భారత ఖండంలోనే ఆది మానవుడు అవతరించాడు. ఆ ఆది మానవుడు అల్లాహ్ యొక్క దాసుడు. అతను ముస్లిం. అతని నుండి వచ్చిన సర్వ సంతానము ఇస్లాం ధర్మ ప్రకారంగానే ఉంటుంది. అల్లాహ్ ఖురాన్ లో ఏమి చెప్పాడు?

فِطْرَتَ اللَّهِ الَّتِي فَطَرَ النَّاسَ عَلَيْهَا
(ఫిత్ రతల్లాహిల్లతీ ఫతరన్నాస అలైహా)
అల్లాహ్ మానవులను ఏ ప్రకృతిపై పుట్టించాడో దానినే అవలంబించు. (30:30)

మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, “కుల్లు మౌలూదిన్ యూలదు అలల్ ఫిత్రా.” పుట్టే ప్రతి పిల్లవాడు ఫిత్రత్, ప్రకృతి ధర్మం, స్వాభావిక ధర్మంపై పుడతాడు. కానీ అతనికి మాటలు రావు, ఇంకా ఏమీ అనుభవం ఉండదు గనక, ఫ అబవాహు యుహవ్విదానిహి. అతని యొక్క తల్లిదండ్రి యూదులైతే, అబ్బాయిని కూడా యూదునిగా చేసేస్తారు. తల్లిదండ్రులు ఒకవేళ అగ్ని పూజారులైతే, ఆ పిల్లవాడు కూడా అలాగే మారిపోతాడు. కానీ ఎప్పుడైతే అతడు పెరుగుతాడో, బుద్ధి జ్ఞానం గలవాడైతాడో, సత్యాన్ని తెలుసుకుంటాడో, ధర్మాన్ని వెతుకుతాడో, అతనికి సత్యం అనేది తెలిసి రావచ్చు. ఒకవేళ ఇహలోక ఏదైనా ఆశలు, ఇహలోక ఏవైనా భయాలు, లేదా హోదా, అంతస్తుల దురాశలు, ఇలాంటివి ఏవీ అడ్డు రాకుంటే, తప్పకుండా మనిషి సత్యం విన్న తర్వాత, అతనికి మాట అర్థమవుతుంది, స్వీకరించగలడు. ఎందుకంటే ఇహలోకంలో నేనే రాజుని అని కాదు, నేనే మీ ప్రభువుని, నా ముందే మీరు తలవంచాలి అన్నటువంటి గర్వానికి గురియై ఎంతో గర్వంతో విర్రవీగుతూ కొంతకాలం ప్రజల్ని తన ముందు, తమ ముందు వంచించుకున్న అలాంటి పెద్ద పెద్ద నాయకులు స్వయంగా వారి ప్రాణం పోయే సందర్భంలో ఏమన్నారు? ఫిరౌన్, అతని కంటే దుర్మార్గుడు, దౌర్జన్యుడు బహుశా ఇంకా వేరే ఒకడు రాలేదు. అతడు కూడా ఏమన్నాడు? మూసా మరియు హారూన్ ల యొక్క ప్రభువు ఎవరైతే ఉన్నారో, ఆ ప్రభువుని నేను విశ్వసిస్తున్నాను అన్నాడు.

మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంతిమ ప్రవక్త. ఆయన కాలంలో ఎవరైతే ప్రవక్తకు వ్యతిరేకంగా నాయకత్వం వహించారో, వారిలో ఒకరి పేరు అబూ జహల్. ప్రవక్త అతని గురించి ఏమన్నాడు ఒకసారి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అబూ జహల్ గురించి ఒకసారి ఏమన్నారు? ఈ అబూ జహల్ ఈ కాలానికి ఫిరౌన్ లాంటివాడు. కానీ అంతటి ఆ దుర్మార్గుడు దొంగచాటుగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఖురాన్ పఠించేటప్పుడు వినేవాడు. విన్నాడు. విని, సత్యం అతనికి తెలిసింది. అతని యొక్క దగ్గరి స్నేహితుడు, ప్రాణ స్నేహితుడు లాంటి వాడు, అతన్ని అడిగాడు కూడా, రాత్రి నేను కూడా ఖురాన్ విన్నాను, నువ్వు కూడా దొంగచాటుగా విన్నావు అంటే నేను వినలేదు అని ముందు అన్నాడు. తర్వాత చెప్పాడు, చెప్పే మాట అతనిది బాగానే అనిపిస్తుంది, కానీ ఇతడి వంశం, అబూ జహల్ యొక్క వంశం ముత్తాతల్లో ఒకరి వైపు నుండి వస్తుంది, మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అబ్దే మునాఫ్ నుండి వస్తారు. వీరి యొక్క వంశంలో వారు ఎలాంటి అన్ని మంచి కార్యాలు చేసుకుంటూ వచ్చారో, మనం కూడా చేసుకుంటూ వచ్చాము. కానీ ఈరోజు ఇతడు కొత్త ఏదో మాట మొదలు పెట్టాడు కదా, అలాంటి హోదా అంతస్తు మనకు దొరకదు కదా. అంటే కేవలం ప్రపంచ దురాశలకు లోనై సత్యాన్ని తిరస్కరించలేదు.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మదీనా వచ్చిన తర్వాత, మదీనా వలస వచ్చిన తర్వాత అక్కడ ప్రవక్తకు శత్రువుల్లో చాలా కఠినంగా వ్యతిరేకించిన వారిలో ఒకతని పేరు హుయై బిన్ అఖ్తబ్, యూదుడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క భార్యల్లో ఒక భార్య ఎవరు? సఫియ్యా రదియల్లాహు అన్హా. ఆ నాయకుని యొక్క కుమార్తె. ఆమె ఇస్లాం స్వీకరించింది. ప్రవక్తకు భార్యగా అయింది. ఆమె ఒక సందర్భంలో చెప్తుంది, నేను ఇంకా చాలా నా చిన్న వయసు నాది. ప్రవక్త ఆ రోజుల్లో మదీనాలో వచ్చే సందర్భంలో మా నాన్న మరియు మా చిన్న తండ్రి, చాచా, ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, అతడు వచ్చేసాడు మదీనాలో అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి. మరి ఏంటి ఉద్దేశం? అతని గురించి మన గ్రంథాల్లో కూడా వచ్చింది ఉంది కదా, చిట్టచివరి ప్రవక్త అని. ఇద్దరు ఆ సత్య విషయాలన్నీ తెలుసు వారికి. ఎందుకంటే యూద గ్రంథాల్లో కూడా ప్రవక్త ముహమ్మద్ గురించి వచ్చింది ఉంది ప్రస్తావన. కానీ వారు ఏమన్నారు? లేదు, లేదు, లేదు, మనం ప్రాణం ఉన్నంతవరకు అతన్ని వ్యతిరేకించి, అతనికి తిరుగుబాటుగా, ఎదురుగానే మనం ఉండాలి, అంటే ఈ రోజుల్లో ఏమనవచ్చు మనం, అపోజిషన్ పార్టీలోనే ఉండాలి, ఎప్పుడు కూడా వారితో కలవవద్దు.

అయితే ప్రపంచ దురాశాలకు గురై కూడా ఎందరో ఇలాంటి సత్యాన్ని తిరస్కరించిన వారు ఉన్నారు. అందు గురించి సోదరులారా, ఇవన్నీ మనకు ఇహలోకంలో కొద్ది రోజులు మాత్రమే పనికి వస్తే రావచ్చు, అందరికీ కూడా రావు. కానీ చివరికి చనిపోయే సందర్భంలో కూడా సత్యాన్ని తిరస్కరించడం, ధర్మాన్ని వ్యతిరేకించడం, ఏ మాట మనకు తెలిసిందో అల్లాహ్ మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వైపు నుండి దాన్ని అమలు చేయనందుకు, అమలు పరచనందుకు, తప్పకుండా దీని గురించి ప్రశ్నించబడుతుంది మరియు పరలోకంలోనైతే చాలా నష్టపోతాము. అందు గురించి ఖురాన్ లో అల్లాహ్ త’ఆలా ఏం చెప్పాడు?

وَمَنْ يَبْتَغِ غَيْرَ الْإِسْلَامِ دِينًا فَلَنْ يُقْبَلَ مِنْهُ وَهُوَ فِي الْآخِرَةِ مِنَ الْخَاسِرِينَ
(వ మన్ యబ్తగి గైరల్ ఇస్లామి దీనన్ ఫలన్ యుఖ్బల మిన్హు)
ఎవడైనా ఇస్లాంను కాదని మరో ధర్మాన్ని అవలంబించదలిస్తే, అది అతని నుండి ఎంతమాత్రం స్వీకరించబడదు. మరి అతను పరలోకంలో నష్టపోయే వారిలో చేరతాడు. (3:85)

ఎవరైతే ఇస్లాం ధర్మాన్ని కాకుండా మరో ధర్మాన్ని తనకు ధర్మంగా ఒప్పుకుంటాడో, దాన్ని స్వీకరించి బ్రతుకుతాడో, ఫలన్ యుఖ్బల మిన్హ్, అది అతని నుండి ఎన్నటికీ స్వీకరించబడదు. వహువ ఫిల్ ఆఖిరతి, ఇక్కడ ఒక విషయం గమనించండి. అల్లాహ్ ఏమంటున్నాడు? వహువ ఫిల్ ఆఖిరతి మినల్ ఖాసిరీన్. అతడు పరలోకంలో చాలా నష్టపోయే వారిలో కలుస్తాడు. ఇహలోకం గురించి చెప్పలేదు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో కొందరు తప్పుడు మార్గంలో ఉన్నప్పటికీ అల్లాహ్ తొందరగా పట్టి శిక్షించడు. కొంత వెసులుబాటుని ఇస్తూ ఉంటాడు. అందు గురించి ఇలాంటి వెసులుబాటుని పొంది తప్పుడు భావంలో పడకూడదు. అల్లాహు త’ఆలా మనందరికీ సన్మార్గం చూపుగాక. ఇస్లాం ధర్మం స్వయంగా అర్థం చేసుకొని ఇతరులకు దానిని అర్థం మంచిగా నచ్చచెప్పే భాగ్యం ప్రసాదించుగాక.

జజాకుముల్లాహు ఖైరన్, వస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహ్.

సూరహ్ అల్ కౌసర్: అనువాదం, వ్యాఖ్యానం [ఆడియో]

బిస్మిల్లాహ్

సూరహ్ పరిచయం

ఈ సూరా మక్కా కాలానికి చెందినది. ఇందులో ౩ ఆయతులు ఉన్నాయి. ప్రవక్త ముహమ్మద్‌ (సల్లలాహు అలైహి వ సల్లం)కు అల్లాహ్‌ ప్రసాదించిన అనుగ్రహాలను ఈ సూరాలో ముఖ్యంగా ప్రస్తావించడం జరిగింది. మొదటి ఆయతులో వచ్చిన ‘కౌసర్‌‘ (సమృద్ధి) అన్న పదాన్నే ఈ సూరాకు పేరుగా పెట్టడం జరిగింది. ప్రవక్త ముహమ్మద్‌ (సల్లలాహు అలైహి వ సల్లం)కు ప్రసాదించబడిన అసంఖ్యాక అనుగ్రహాలను ప్రస్తావిస్తూ, అల్లాహ్‌ను కొనియాడాలని, ఆయనకు కృతజ్ఞత చూపాలని బోధించడం జరిగింది. అవిశ్వాసుల వైరం, వారి గర్వం ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం)ను ఏమాత్రం నష్టపరచలేవని హామీ ఇవ్వడం జరిగింది.

[అహ్సనుల్ బయాన్ నుండి]


ఇక్కడ వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి (38 నిముషాలు)

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా


సూరతుల్ కౌసర్ – 108 

ఇది మక్కాలో అవతరించినది. దీనిలో మూడు ఆయతులున్నాయి. [1]

అనంత  కరుణామయుడూ, అపార కృపాశీలుడూ అయిన అల్లాహ్ పేరుతో … బిస్మిల్లా హిర్రహ్మానిర్రహీమ్ بِسْمِ اللهِ الرَّحْمَنِ الرَّحِيمِ
1. (ప్రవక్తా) మేము నీకు కౌసర్ (సరస్సు) [2] ను ప్రసాదించాము. ఇన్నా  అఅతైనా కల్ కౌసర్ إِنَّا أَعْطَيْنَاكَ الكَوْثَرَ
2. కనుక నీవు నీ ప్రభువు కొరకు నమాజు చెయ్యి మరియు ఖుర్బానీ చెయ్యి.[3] ఫశల్లి లి రబ్బిక వన్ హర్ فَصَلِّ لِرَبِّكَ وَانْحَرْ
3. నిస్సందేహంగా నీ శత్రువే నామరూపాలు లేకుండా నశించిపోతాడు.[4] ఇన్న షానిఅక హువల్ అబ్తర్ إِنَّ شَانِئَكَ هُوَ الأَبْتَرُ

క్రింద నోట్స్ అహ్సనుల్ బయాన్ నుండి :

[1] ఈ సూరాను సూరత్ అన్ నహ్ర్ గా కూడా వ్యవహరిస్తారు.

[2] కౌసర్ అనే పదం బహుళార్ధకాలకు సంకేతం. దీని అర్ధాలు కూడా అనేకం. ఇబ్నె కసీర్‌ గారు “అత్యధిక శుభాలు” అన్న అర్దానికి ప్రాధాన్యత ఇచ్చారు. ఎందుకంటే ఇతరత్రా అర్దాలు కూడా ఈ పదంలో ఇమిడి ఉన్నాయి. ఉదాహరణకు ప్రామాణిక హదీసులలో వచ్చిన వివరాల ప్రకారం కౌసర్‌ అనేది స్వర్గంలో మహాప్రవక్త ముహమ్మద్‌ (సల్లలాహు అలైహి వ సల్లం)కు వొసగబడే ఒక కాలువ. మరికొన్ని హదీసులలో కౌసర్‌ అనేది ఒక సరస్సు అని, విశ్వాసులు స్వర్గంలో ప్రవేశించేముందు మహాప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) చేతుల మీదుగా ఆ సరస్సు నీరును త్రాగుతారని, ఆ సరస్సులోకి వచ్చే నీరు కూడా స్వర్గంలోని ఆ కాలువకే చెందింది అయి ఉంటుందని తెలుపబడింది. అలాగే ఇహలోకంలో మహాప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) వారికి లభించిన విజయాలు, కీర్తి ప్రతిష్టలు, పరలోకంలోని పుణ్యఫలాలు – ఇవన్నీ ఈ “అత్యధిక శుభాలు” లోకి వచ్చేస్తాయి. (ఇబ్నె కసీర్‌).

[3] అంటే నమాజు కూడా కేవలం ఒక్కడైన అల్లాహ్‌ కొరకే చేయాలి. ఖుర్బానీ కూడా ఒక్కడైన ఆ అల్లాహ్‌ పేరిటే ఇవ్వాలి. బహుదైవారాధకుల మాదిరిగా ఈ ఖుర్బానీలో ఇతరులను భాగస్వాములుగా చేర్చరాదు. ‘నహ్ర్‘ అంటే ఒంటె గొంతుపై ఈటెతోగానీ, కత్తితోగానీ కొట్టి, ఆ తరువాత దానిని ‘జిబహ్‌‘ చేయటం అని అసలు అర్థం. అయితే ఇతర పశువులను మాత్రం నేలపై పరుండబెట్టి గొంతు కోయటాన్ని ‘జిబహ్‌’గా వ్యవహరిస్తారు. కాని ఈ ఆయతులో ‘నహ్ర్’ అంటే అసలు సిసలు అర్థం ఖుర్బానీ. ఇక ఇతరత్రా దానధర్మాలుగా పశువును ఖుర్బానీ చేయటం, హజ్‌ సందర్భంగా “మినా” పర్వత లోయలో పశువును ఖుర్బానీ చేయటం, బక్రీద్‌ పండుగ సందర్భంగా ఖుర్బానీ ఇవ్వటం – ఇవన్నీ ఇందులో అంతర్భాగాలే.

[4]అబ్‌తర్‌‘ అంటే తోక తెగటం అని అసలు అర్ధం. ఒకరి వంశపరంపర ముందుకు సాగకుండా ఆగిపోయిన వారిని, పేరు కూడా ప్రస్తావించకుండా వదిలివేసిన అనామకులను ‘అబ్‌తర్‌’గా వ్యవహరిస్తారు. మహాప్రవక్త ముహమ్మద్ (సల్లలాహు అలైహి వ సల్లం) వారి మగపిల్లలు చనిపోవటం గమనించిన కొంతమంది అవిశ్వాసులు ఆయన్ని ‘అబ్‌తర్‌’గా అవహేళన చేయసాగారు. అప్పుడు అల్లాహ్ ఆయన్ని (సల్లలాహు అలైహి వ సల్లం) ఓదారుస్తూ ఈ వాక్యాలను అవతరింపజేశాడు –

ఓ ముహమ్మద్‌ (సల్లలాహు అలైహి వ సల్లం) నీవు అనామకుడవు కావు. నీ విరోధులే అనామకులవుతారు” అని ధైర్యం చెప్పాడు. మహాప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఆడపిల్లల ద్వారానే అల్లాహ్ ఆయన సంతతికి ప్రపంచంలో గొప్ప కీర్తి ప్రతిష్టల్ని ప్రసాదించాడు. ఒకవిధంగా చెప్పాలంటే ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం) అనుచర సమాజమంతా ఆయన బిడ్డల్లాంటివారే. వారి సంఖ్యాబలంపై ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం) ప్రళయదినాన గర్వపడతారు. అదీగాక ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం) గౌరవమర్యాదలను అల్లాహ్ ఎంతగానో పెంచాడు. లోకమంతా నేడు ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం) పేరును ఎంతో భక్తితో, వినయంతో ప్రస్తావిస్తుంది. ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం)పై శాంతీశుభాలు కురవాలని లోకవాసులంతా ప్రార్థిస్తారు. అదే సమయంలో మహాప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) శత్రువులు చరిత్రపుటలకే పరిమితం అయిపోయారు. ఒకవేళ ఎవరయినా వారి ఊసు ఎత్తినా వారిని దుష్టులుగానే చూస్తారుగాని మంచివారుగా చూడరు.

తౌహీదు యొక్క నిర్ధారణ చేసినవారు విచారణ లేకుండా స్వర్గంలో ప్రవేశిస్తారు | ఏకత్వపు బాటకు సత్యమైన మాట [వీడియో]

బిస్మిల్లాహ్

3వ అధ్యాయం
తౌహీదు యొక్క నిర్ధారణ చేసినవారు విచారణ లేకుండా స్వర్గంలో చేరుతారు
అల్ ఖవ్లుల్ సదీద్ షర్హ్ కితాబ్ అత్ తౌహీద్ – ఇమామ్ అస్-సాదీ
The famous commentary of Shaykh as-Sa’di of the book Kitab at-Tawhid of Muhammad ibn Abdul Wahhab.


إِنَّ إِبْرَاهِيمَ كَانَ أُمَّةً قَانِتًا لِّلَّهِ حَنِيفًا وَلَمْ يَكُ مِنَ الْمُشْرِكِينَ

అల్లాహ్ (త’ఆలా) ఆదేశం: “నిజానికి ఇబ్రాహీమ్‌ తనకు తానే ఒక సంఘం (ఉమ్మహ్). అల్లాహ్ కు పరమ విధేయుడు. ఆయన యందే మనస్సు నిలిపినవాడు. అతను ఎన్నడూ ముష్రిక్  గా ఉండలేదు?” (సూరహ్ నహ్ల్ 16:120).

وَالَّذِينَ هُم بِرَبِّهِمْ لَا يُشْرِكُونَ

“… మరియు ఎవరు తమ ప్రభువునకు ఇతరులను భాగస్వామ్యులుగా చేయరో (వారే మేళ్ళ వైపునకు పరుగులు తీసేవారు) (సూరహ్ మూ’మినూన్‌ 23:59).

హుసైన్‌ బిన్‌ అబ్దుర్ రహ్మాన్‌ కథనం: నేను సఈద్‌ బిన్‌ జుబైర్‌ వద్ద ఉండగా “నిన్న రాత్రి రాలి పడిన నక్షత్ర చుక్కను ఎవరు చూశారు?” అని అడిగారాయన. “నేను చూశాను. అప్పుడు నేను నమాజులో లేను, కాని విషపురుగు కాటేసినందున బాధతో ఉన్నాను”. అని చెప్పాను. “అయితే నీవు ఏమి చేశావు ?” అని ఆయన ప్రశ్నించారు. “రుఖ్యా (మంత్రం) చదివాను” అని జవాబిచ్చాను. “ఎందుకు అలా చేశావు?” అని ఆయనడిగారు. “షాతబి మాకు ఒక హదీసు వినివించారు (దాని ఆధారంగా నేను చదివాను)” అనిచెప్పాను. “ఆయన ఏ హదీసు మీకు వినిపించారు” అని ఆయన అడిగారు. నేను చెప్పాను: “బురైద బిన్‌ హుసయ్యిబ్‌ ఉల్లేఖించిన ఒక హదీసు మాకు వినిపించారు. ఆయన చెప్పారు: “దిష్టి  తగిలితే మరియు విషపురుగు కాటేస్తే తప్ప మంత్రించకూడదు” అని. “ఎవరు విన్న హదీసుపై ఆచరించారో   వారు మంచి పని చేశారు” అని సఈద్‌ చెప్పి. మాకు ఇబ్నె అబ్బాసు (రది అల్లాహు అన్హు) ఈ హదీసు వినిపించారు ” అన్నారు. ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు: “నాకు వివిధ అనుచర సమాజాలను చూపించడం జరిగింది. (వారికి సారథ్యం వహిస్తూ) ప్రవక్తలు నా ముందు నుంచి వెళ్ళసాగారు. అప్పుడు కొందరు ప్రవక్తల వెనక ఓ చిన్న సమూహం ఉంది. కొందరు ప్రవక్తల వెనక ఒక్కొక్క వ్యక్తి మాత్రమే ఉంటే, మరికొందరి ప్రవక్తల వెనక ఇద్దరేసి వ్యక్తులు ఉండేవారు. అసలు ఒక్క మనిషి కూడా తమ వెనుక లేని ప్రవక్తలు కూడా వారిలో ఉన్నారు. ఆ తరువాత నాకు ఒక పెద్ద జన సమూహము కన్పించింది. అది నా అనుచర సమాజం కావచ్చని భావించాను. కాని ఆ సమూహం హజ్రత్‌ మూసా (అలైహిస్సలాం), ఆయన అనుచర సమాజమని నాకు తెలియజేయబడింది. ఆ తరువాత జన సమూహం మరొకటి చూశాను. అప్పుడు ఈ జన సమూహం మీ అనుచర సమాజమే. వీరిలో డెబ్బయ్ వేల మంది ఎలాంటి విచారణ, శిక్ష లేకుండానే స్వర్గంలో ప్రవేశిస్తారు” అని తెలుపబడింది.

ఆ తరువాత ప్రవక్త లేచి వెళ్ళిపోయారు. (డెబ్బై వేల మంది ఎవరయి ఉంటారో) అని కొందరు అనుచరులు పరస్పరం మాట్లాడుకుంటూ “బహుశ వారు ప్రవక్త మైత్రిత్వం (స్నేహం) పొందిన వారు కావచ్చు” అన్నారు. మరి కొందరు “వారు ఇస్లాంలోనే పుట్టి ఏ మాత్రం షిర్క్‌ చేయని వారు కావచ్చు” అని అన్నారు. ఇలా చర్చించూకుంటూ ఉండగా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వచ్చేశారు. వారందరూ చర్చించుకున్న విషయాలను ప్రవక్తకు తెలిపారు. అప్పుడు ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) “వారు మంత్రాలు చేయించుకునేవారు కారు, దుశ్శకునాలను పాటించరు, వాతలతో చికిత్స చేయించుకోరు. వారు తమ ప్రభువును మాత్రమే నమ్ముకొని (ఏ కష్టమొచ్చినా) ఆయన మీదే ఆధారపడతారు” అని విశదీకరించారు.

ప్రవక్త అనుచరుల్లో ఉక్కాషా బిన్‌ మిహ్సన్‌ లేచి నిలబడి “ప్రవక్తా! నేను వారిలో ఒకరిని కావాలని మీరు దుఆ చేయండి” అని కోరాడు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) చెప్పారు: “నీవు వారిలో ఒకడివి”. ఇది చూసి మరో వ్యక్తి లేచి “ప్రవక్తా! నేను వారిలో ఒకరిని కావాలని మీరు దుఆ చేయండి” అన అడిగాడు. ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) చెప్పారు: “ఉక్కాషా నీ  కంటే ముందు ఈ సదవకాశాన్ని ఉపంయోగించుకున్నాడు”. (బుఖారి, ముస్లిం).

ముఖ్యాంశాలు:

1. తౌహీద్‌  విషయంలో ప్రజల స్థానాల్లో వ్యత్యాసం గలదు.

2. తౌహీద్‌ యొక్క భావం స్పష్టమయింది.

3. ప్రవక్త ఇబ్రాహీం ముష్రికులలోని వారు కారు అని అల్లాహ్ వారిని ప్రశంసించాడు.

4. షిర్క్‌ నుండి దూరమున్న ఔలియా అల్లాహ్ లను (అల్లాహ్  భక్తులను) ప్రశంసించబడింది.

5. మంత్రం చేయించుట, వాతలు వేయించుటను మానుకొనుట “తౌహీద్ యొక్క తహ్ఖీఖ్‌” చేసినట్టగును.

6. పై హదీసులో వచ్చిన గుణాలు అలవరచుకొనుట అల్లాహ్ పై “భరోసా” (నమ్మకం, ఆధారం) చాలా ఉన్నట్టు

7. ఈ హదీసు ద్వారా ప్రవక్త సహచరుల అపారవిద్య తెలుస్తుంది. (ఆ డెబ్బై వేల మంది అల్లాహ్ దయ తరువాత) వారి సత్కార్యాలతోనే (విచారణ, శిక్ష లేకుండా) స్వర్గ ప్రవేశానికి అర్హులవుతారు.

8. సహాబీలు మంచి విషయాల్లో మున్ముందుగా ఉండడానికి ఎంతగా కాంక్షించేవారో తెలుస్తుంది.

9. ముహమ్మద్‌ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) “ఉమ్మతీలు” (అనుచర సమాజం) ఉన్నత స్థానంలో, సంఖ్యలో ఇతర ప్రవక్తల “ఉమ్మతీల” (అనుచరుల) కంటే ఎక్కువగా, శ్రేష్ఠులుగా ఉన్నట్టు తెలుస్తుంది.

10. ప్రవక్త మూసా (అలైహిస్సలాం) “ఉమ్మతీల” ఘనత కూడ తెలుస్తుంది.

11. ప్రవక్త ఎదుట గత “ఉమ్మతీలందరు” ప్రత్యక్షమయ్యారు.

12. ప్రతీ “ఉమ్మత్‌” తమ ప్రవక్త వెంట వచ్చును.

13. ప్రవక్తలను అనుసరించిన ప్రజలు అల్ప సంఖ్యాకులు అని తెలుస్తుంది.

14. ఏ ప్రవక్తను విశ్వసించిన వారు ఎవరూ ఉండరో, ఆ ప్రవక్త ఒంటరిగా వచ్చును.

15. దీని వల్ల తెలిసిందేమిటంటే: మెజారిటి ఉన్నప్పుడు విర్రవీగ వద్దు. మైనారిటిగా ఉన్నప్పుడు చింతించవద్దు.

16. విష పురుగు కాటు వేసినా, దిష్టి తగిలినా (రుఖ్యా) మంత్రం చేయించుట ధర్మసమ్మతం.

17. సఈద్ బిన్‌ జుబైర్‌ “ఎవరు విన్న హదీసుపై ఆచరించాలో వారు మంచి పని చేశారు” అని అన్న పదంతో పూర్వీకులు విద్యలో ఎంత ఆరితేరిన వారో తెలుస్తుంది. ఇంకా; వీరు చెప్పిన హదీసు మరియు హుసైన్‌ బిన్‌ అబ్దుర్  రహ్మాన్‌ చెప్పిన హదీసులో తేడా ఏ మాత్రం లేదు.

18. పూర్వ పండితులు అనవసర ప్రశంసల నుండి దూరంగా ఉుండేవారు.

19. ఉక్కాషాకు “నీవు వారిలో ఒకడివి అని ప్రవక్త చెప్పడం ప్రవక్త పదవి గుర్తుల్లో ఒకటి.

20. ఉక్కాషా ఘనత (అతడు స్వర్గవాసి అని తెలుపబడుట).

21. ఉక్కాషా తరువాత వ్యక్తికి ప్రవక్త చెప్పిన మాటల ద్వారా సందర్భాన్ని బట్టి స్పష్టంగా కాకుండా సైగల ద్వారా సంక్షిప్తంగా మాట్లాడడం యోగ్యం అని తెలుస్తుంది.

22. ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) నీతి, సత్ప్రవర్తన కూడా ఈ హదీసులో ఉట్టిపడుతుంది.

తాత్పర్యం: (అల్లామా అల్ సాదీ) 

ఈ అధ్యాయం దీనికంటే ముందు అధ్యాయాన్ని సంపూర్ణ పరుస్తుంది. ఇది దానికి సంబంధించినదే.

తౌహీద్‌ యొక్క “నిర్ధారణ” అంటే: పెద్ద షిర్క్‌, చిన్న షిర్క్‌ నుండి, వాక్కులోనూ, విశ్వాసంలోనూ, కర్మలలోనూ అన్ని బిద్‌అత్‌ (కల్పిత ఆచారా)ల నుండి, పాపాల నుండి తౌహీద్‌ను కాపాడుట, శుద్ది పరుచుట. ఇవన్నియు కేవలం అల్లాహ్ ప్రీతి కొరకు మాత్రమే చేయుట. ఎందుకనగా అత్యధికమైన షిర్క్‌ తౌహీద్‌కు విరుద్ధమైనది. అత్యల్పమైన షిర్క్‌ సంపూర్ణ తౌహీద్‌కు విరుద్దమైనది. బిద్‌అత్ , పాపాలు తౌహీద్‌ను కలుషితం చేసి, దాని సంపూర్ణత్వానికి అడ్డుపడతాయి. దాని లాభాల నుండి దూరం చేస్తాయి.

తౌహీద్‌ యొక్క నిర్ధారణ చేసిన వాని హృదయం విశ్వాసం, తౌహీద్‌, ఇఖ్లాస్ (సంకల్పశుద్ది)తో నిండిపోతుంది. తన ఆచరణ దాన్ని సత్యపరుస్తుంది. అది ఏ విధంగా అనగా: అల్లాహ్ యొక్క సమస్త ఆదేశాలకు అతడు శిరసావహిస్తాడు. అవిధేయతకు పాల్పడి విశ్వాసాన్ని నష్టపరుచుకోడు. అలాంటివాడే స్వర్గంలో విచారణ లేకుండా వెళ్లేవాడు. అందులో ప్రవేశించే మొదటి వ్యక్తి అయ్యేవాడు.

అల్లాహ్ కు పూర్ణ విధేయుడై, అల్లాహ్ పై ధృడమైన నమ్మకం ఉంచి, ఏ ఒక్క విషయంంలో కూడా అల్లాహ్ ను వదలి మానవుల వైపు మరలకుండా, వారిని అడగకుండా ఉండి, అతని బాహ్యం, ఆంతర్యం, మాటలు, చేష్టలు, ప్రేమ, ద్వేషం అన్నియు కేవలం అల్లాహ్ ప్రీతి కొరకే చేయుట , ప్రవక్త అడుగుజాడల్లో నడుచుట తౌహిద్‌ యొక్క నిర్దారణకు ప్రత్యేక నిదర్శనం.

ఇక్కడ ప్రజల స్థానాల్లో వ్యత్యాసం గలదు. “ప్రతి వ్యక్తి స్థానం అతడు చేసే పనులకు అనుగుణంగా ఉంటుంది.” (6: 132).

ఆశలతో, వాస్తవం లేని మాటలతో తౌహీద్‌ యొక్క నిర్ధారణ కాదు. మనస్సులో స్థిరమైన విశ్వాసం, ఇహ్సాన్‌ (ఆరాధనా సౌందర్యం) వాస్తవికతలతో, దానికి తోడుపడే సత్ప్రవర్తన, సత్కార్యాలతో అవుతుంది.

ఈ విధంగా తౌహీద్‌ యొక్క నిర్ధారణ చేసినవారు ఈ అధ్యాయంలో చెప్పబడిన ఘనతలకు అర్హులవుతారు.


నుండి: ఏకత్వపు బాటకు సత్యమైన మాట (అల్ ఖవ్లుల్ సదీద్ షర్హ్ కితాబ్ అత్ తౌహీద్)  – ఇమామ్ అస్-సాదీ [పుస్తకం]  

సహనం, తృప్తి, నిరపేక్షాభావం అలవరచుకొని పరుల ముందు చేయి చాపకుండా ఆత్మ గౌరవంతో బతకండి

26. హజ్రత్‌ అబూ సయీద్‌ సాద్‌ బిన్‌ సినాన్‌ ఖుద్రీ (రది అల్లాహు అన్హు ) కథనం :

కొంత మంది అన్సారులు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను యాచించారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారడిగింది ఇచ్చారు. వాళ్ళు మళ్ళీ యాచించారు. అప్పుడు కూడా ఆయన వారికి (ఎంతోకొంత) ఇచ్చారు. ఆఖరికి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) దగ్గర ఉన్నదంతా అయిపోయింది. తన చేతిలో ఉన్నదంతా అయిపోయిన తరువాత ఆయన వారితో ఇలా అన్నారు:

నా వద్దకు ఏ కొంత ధనమొచ్చినా నేను దాన్ని నిల్వ చేసి ఉంచుకోను. ఎవడైతే యాచించకుండా ఉండటానికి ప్రయత్నిస్తాడో అల్లాహ్‌ అతన్ని కాపాడుతాడు. నిరపేక్షాభావం అలవరచుకోవాలనుకున్న వ్యక్తిని అల్లాహ్‌ నిరపేక్షాపరునిగా చేస్తాడు. సహనం కోరే వ్యక్తికి అల్లాహ్‌ సహనం వహించే సద్బుద్దిని ప్రసాదిస్తాడు. మనిషికి ఇవ్వబడిన కానుకల్లో ఓర్పును మించిన మేలైన, విశాలమైన కానుక మరొకటి లేదు. “

(బుఖారీ – ముస్లిం). (సహీహ్ బుఖారీలోని జకాత్‌ ప్రకరణం. సహీహ్ ముస్లింలోని జకాత్‌ ప్రకరణం)

ముఖ్యాంశాలు:

ఈ హదీసులో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)గారి దాతృత్వం, ఉదాత్త గుణం, హృదయ విశాలత మరియు ఉన్నత నైతికపు విలువలను గురించి ప్రస్తావించడం జరిగింది. అంతేగాకుండా సహనం, తృప్తి, నిరపేక్షాభావం మొదలగు సుగుణాలను అలవరచుకొని పరుల ముందు చేయి చాపకుండా ఆత్మ గౌరవంతో బతకాలని కూడా ఈ హదీసులో చెప్పబడింది.

నుండిసహనం , ఓర్పు –  హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్ ) – ఇమామ్ నవవి (Riyadh-us-Saaliheen)

జుమా నమాజును వదలడం పాపమా? [ఆడియో, టెక్స్ట్]

[5 నిముషాలు]
https://youtu.be/J8IAEgfxvtk
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

జూమా నమాజ్ వదిలివేయడం ఘోరమైన పాపాలలో ఒకటి మరియు కబీరా గునా (పెద్ద పాపం). దీనికి సాధారణ పుణ్యాలు ప్రాయశ్చిత్తం కావు, ప్రత్యేకమైన తౌబా (పశ్చిత్తాపం) అవసరం. ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) జూమాను విడిచిపెట్టిన వారి ఇళ్లను తగలబెట్టాలని తీవ్రంగా ఆకాంక్షించారు, ఇది ఈ పాపం యొక్క తీవ్రతను సూచిస్తుంది. సరైన కారణం లేకుండా ఉద్దేశపూర్వకంగా వరుసగా మూడు జూమా నమాజ్‌లను వదిలివేసే వారి హృదయాలపై అల్లాహ్ ముద్ర వేస్తాడని మరియు వారు ఏమరుపాటులో పడినవారిలో కలిసిపోతారని కూడా ఆయన హెచ్చరించారు.అందువల్ల, ప్రతి ముస్లిం జూమా నమాజ్‌ను తప్పనిసరిగా పాటించాలి మరియు దానిని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టకూడదు.

అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హందులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్ అమ్మా బాద్.

జూమా నమాజ్‌ను వదలడం పాపమా?

సోదర మహాశయులారా, ఈ రోజుల్లో మనిషి ప్రాపంచిక జీవితంలో లీనమైపోయి మరియు పరలోకాన్ని మరిచిపోయి, ఐదు పూటల నమాజ్‌లను విలువ లేకుండా, ఎలాంటి భయం లేకుండా వదిలేస్తున్నాడంటే, జూమా నమాజ్‌లను కూడా ఎంతోమంది ఎన్నో సాకులు చెప్పుకుంటూ వదిలేస్తున్నారు.

అయితే, నేను ఎక్కువ సమయం తీసుకోకుండా కేవలం ఒక విషయం, రెండు హదీసులను మీకు వినిపిస్తాను. దీని ద్వారా మీరు గుణపాఠం నేర్చుకొని ఇక నుండి ఏ ఒక్క రోజు కూడా జూమా వదలకుండా ఉండడానికి జాగ్రత్త పడండి.

ఒక విషయం ఏంటి? సోదర మహాశయులారా, జూమా నమాజ్‌ను వదలడం చిన్న పాపం కాదు. సరైన కారణం లేకుండా జూమా నమాజ్‌ను వదలడం ఘోరమైన పాపాల్లో ఒకటి, ‘కబీరా గునా’ అని ఏదైతే అంటారో. మరియు సామాన్యంగా ఖురాన్ ఆయతులు మరియు హదీసుల ద్వారా మనకు ఏం తెలుస్తుంది?

إِن تَجْتَنِبُوا كَبَائِرَ مَا تُنْهَوْنَ عَنْهُ نُكَفِّرْ عَنكُمْ سَيِّئَاتِكُمْ
(ఇన్ తజ్తనిబూ కబాయిర మా తున్‌హౌన అన్‌హు నుకఫ్ఫిర్ అన్‌కుం సయ్యిఆతికుమ్)
మీకు నిషేధించబడిన ఘోరమైన పాపాలను మీరు వదిలివేస్తే, మేము మీ చెడులను మీ నుండి తొలగిస్తాము.

ఇంకా వేరే ఇలాంటి ఆయతులు ఈ భావంలో హదీసులు ఉన్నాయి. అంటే ఈ కబీరా గునా, ఘోరమైన పాపాలు అట్లే క్షమింపబడవు. దాని గురించి ప్రత్యేకమైన తౌబా (పశ్చిత్తాపం) అవసరం. కొన్ని సందర్భాల్లో కొన్ని పుణ్యాలు చేసుకుంటే పాపాలు తొలగిపోతాయని మనం వింటాము కదా? అలాంటి పాపాల్లో ఈ జుమాను వదలడం రాదు. అందు గురించి భయపడండి.

అంతేకాదు, ప్రవక్త మహానీయ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) జూమా నమాజ్‌కు ఎంత గొప్ప విలువ ఇచ్చారో గమనించండి. సహీ ముస్లిం షరీఫ్‌లోని హదీస్, హదీస్ నెంబర్ 652.

హజ్రత్ అబ్దుల్లా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారు:

قَالَ لِقَوْمٍ يَتَخَلَّفُونَ عَنِ الْجُمُعَةِ: لَقَدْ هَمَمْتُ أَنْ آمُرَ رَجُلاً يُصَلِّي بِالنَّاسِ، ثُمَّ أُحَرِّقَ عَلَى رِجَالٍ يَتَخَلَّفُونَ عَنِ الْجُمُعَةِ بُيُوتَهُمْ.
(ఖాల లిఖౌమిన్ యతఖల్లఫూన అనిల్-జుముఅతి: లఖద్ హమమ్తు అన్ ఆముర రజులన్ యుసల్లీ బిన్నాసి, సుమ్మ ఉహర్రిక అలా రిజాలిన్ యతఖల్లఫూన అనిల్-జుముఅతి బుయూతహుమ్)

జూమా నమాజ్ నుండి వెనుక ఉండిపోయే ప్రజల గురించి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు: “ప్రజలకు నమాజ్ చేయించడానికి నేను ఒక వ్యక్తిని ఆదేశించి, ఆ తర్వాత జూమాకు రాకుండా తమ ఇళ్లలో ఉండిపోయిన వారి ఇళ్లను తగలబెట్టాలని నేను నిశ్చయించుకున్నాను.”

వారి ఇండ్లకు మంట పెట్టాలి అన్నటువంటి కాంక్ష ఉంది. కానీ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అలా చేయలేదు. సోదర మహాశయులారా, ప్రవక్త ఇంత భయంకరమైన శిక్ష వారికి తమ జీవిత కాలంలో ఇవ్వాలని, వారు బ్రతికి ఉన్నప్పుడే వారి ఇండ్లను కాలబెట్టాలని కోరారంటే, ఈ పాపం చిన్న పాపమా సోదరులారా?

మరొక హదీసును విన్నారంటే, ఇంకా భయకంపితలు అయిపోవాలి. జుమా ఇక ఎన్నడూ వదలకుండా ఉండడానికి అన్ని రకాల మనం సంసిద్ధతలు ముందే చేసుకొని ఉండాలి. ఈ హదీస్ కూడా సహీ ముస్లింలో ఉంది, హదీస్ నెంబర్ 865.

హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ మరియు హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హుమా) ఉల్లేఖించారు, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పగా మేము విన్నాము అని అంటున్నారు. ఏం చెప్పారు ప్రవక్త?

لَيَنْتَهِيَنَّ أَقْوَامٌ عَنْ وَدْعِهِمُ الْجُمُعَاتِ، أَوْ لَيَخْتِمَنَّ اللَّهُ عَلَى قُلُوبِهِمْ، ثُمَّ لَيَكُونُنَّ مِنَ الْغَافِلِينَ.
(లయన్‌తహియన్న అఖ్వామున్ అన్ వద్ఇహిముల్-జుముఆతి, అవ్ లయఖ్తిమన్నల్లాహు అలా ఖులూబిహిమ్, సుమ్మ లయకూనున్న మినల్-గాఫిలీన్)

“ప్రజలు జూమా నమాజ్‌లను వదిలివేయడం మానుకోవాలి, లేకపోతే అల్లాహ్ వారి హృదయాలపై ముద్ర వేస్తాడు, అప్పుడు వారు ఏమరుపాటులో పడినవారిలో కలిసిపోతారు.”

ఎవరి హృదయాలపై ముద్ర పడిపోతుందో వారు ఏమరుపాటులో గురి అయిన వారిలో కలిసిపోతారు. అల్లాహ్ ఇలాంటి వారి నుండి మనల్ని కాపాడుగాక. ఖురాన్‌లో ‘గఫ్లా’ (ఏమరుపాటు), ‘గాఫిలీన్’ (ఏమరుపాటులో పడినవారు) అన్న పదం ఎక్కడెక్కడ వచ్చిందో చూసి, దాని అనువాదం, దాని వెనకా ముందు ఉన్నటువంటి శిక్షలు చదివి చూడండి.

జుమాలను వదిలినందుకు రెండు శిక్షలు ఇక్కడ ఇవ్వబడుతున్నాయి చూడండి. ఒకటి ఈ హదీసులో మనం ఇప్పుడు తెలుసుకున్న హదీసులో: ఒకటి, అల్లాహ్ ముద్ర వేసేస్తాడు. రెండవది, ఏమరుపాటిలో గురి అయిన వారిలో మనం కలిసిపోతామంటే, భయంకరమైన శిక్ష కాదా?

అల్లాహు తఆలా మనందరికీ హిదాయత్ ఇవ్వుగాక. ఇకనైనా భయపడండి. ఇన్ని రోజుల జీవితం ఇహలోకంలో. అల్లాహ్ యొక్క ఆదేశాల ప్రకారం జీవితం గడిపి, మనం భక్తుల్లో, నరకం నుండి ముక్తి పొందే వారిలో, సత్పురుషుల్లో చేరే ప్రయత్నం చేద్దాము.

అల్లాహ్ మనందరికీ స్వర్గంలో చేర్పించేటువంటి ప్రతి సత్కార్యం చేసే సద్భాగ్యం ప్రసాదించుగాక. వ ఆఖిరు దావాన అనిల్-హందులిల్లాహ్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.

జుము’ఆ (శుక్రవారం) రోజున మన బాధ్యతలు, పుణ్య మార్గాలు. ఇక్కడ ఆడియో వీడియో ఆర్టికల్స్ పొందుతారు ఇన్ షా అల్లాహ్. తప్పక ఈ పేజీని దర్శించండి, ఫార్వర్డ్ చేయండి
https://teluguislam.net/five-pillars/salah-namaz-prayer/friday/

జుమా (శుక్ర వారం) నమాజ్ కు ముందు తరువాత ఎన్ని సున్నతులు? [ఆడియో]

బిస్మిల్లాహ్

ఇక్కడ వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి [5:51 నిముషాలు]

ఇక్కడ వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి [3 నిముషాలు]

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా


1126. ఇంతకు ముందు ఇబ్నె ఉమర్‌ (రది అల్లాహు అన్హు) వివరించిన “దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వెంట నేను జుమా తర్వాత రెండు రకాతుల నమాజ్‌ చేశానన్న” (బుఖారీ- ముస్లిం) హదీసు ఈ అధ్యాయానికి కూడా వర్తిస్తుంది.

ముఖ్యాంశాలు

గ్రంథకర్త ఇమామ్‌ నవవీ (రహిమహుల్లాహ్) ఈ అధ్యాయంలో జుమా తర్వాత ఎన్ని రకాతుల నమాజ్‌ చేయాలనే విషయం గురించి వివరిస్తున్నారు. రాబోవు రెండు హదీసుల్లో దానిగురించి ఇంకా వివరంగా విశదీకరిస్తారు. ఇకపోతే జుమాకు ముందు ఎన్ని రకాతులు చేయాలి? అనే విషయమై హదీసుల ద్వారా బోధపడేదేమిటంటే, జుమా నమాజ్‌ కోసం మస్జిద్ కు వచ్చే వ్యక్తి రెండు రకాతులు చేసిన తర్వాతగాని కూర్చోకూడదు. ఆఖరికి ఖుత్బా (ప్రసంగం) సమయంలో వచ్చినాసరే, సంక్షిప్తంగానయినా రెండు రకాతులు చేసుకోవాలని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆదేశించారు. అయితే ప్రసంగానికి ముందు రెండు రకాతుల తహియ్యతుల్‌ మస్జిద్ నమాజ్‌ తర్వాత రెండేసి రకాతుల చొప్పున నఫిల్‌ నమాజు ఎన్ని రకాతులైనా చేసుకోవచ్చు.

1127. హజ్రత్‌ అబూహురైరా (రది అల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ విధంగా ప్రవచించారు:

“మీలో ఎవరయినా జుమా తర్వాత నాలుగు రకాతుల నమాజ్‌ చేసుకోవాలి”. (ముస్లిం)

(సహీహ్‌ ముస్లింలోని జుమా ప్రకరణం)

1128. హజ్రత్‌ ఇబ్నె ఉమర్‌ (రది అల్లాహు అన్హు) కథనం: “దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)  జుమా తరువాత (మస్జిద్ లో) ఎలాంటి నమాజ్ చేసేవారు కాదు. మస్జిద్ నుండి తిరిగి  వెళ్ళిన తర్వాతే ఇంట్లో రెండు రకాతులు చేసేవారు.” (ముస్లిం)

(సహీహ్ ముస్లింలోని జుమా వ్రకరణం)

ముఖ్యాంశాలు:

ఒక హదీసులో జుమా తర్వాత నాలుగు రకాతులు చేయాలనీ, మరో హదీసులో రెండు రకాతులు చేయాలని చెప్పబడింది. దీనిద్వారా రెండు పద్ధతులూ సరైనవేనని బోధపడుతోంది. కొంతమంది పండితులు ఈ రెండు హదీనుల్ని సమన్వయ పరచటానికి ప్రయత్నించారు. జుమా తర్వాత మస్జిద్ లోనే నమాజ్‌ చేయదలచుకునేవారు నాలుగు రకాతులు చేయాలనీ, ఇంట్లో చేసేవారు రెండు రకాతులు చేసుకుంటే సరిపోతుందని అభిప్రాయపడ్డారు.

ఇకపోతే నాలుగు రకాతుల నమాజును ఏ విధంగా చేయాలి? ఈ విషయంలో కూడా రెండు అభిప్రాయాలున్నాయి. ఒక విధానం నాలుగు రకాతులు ఒకే సలాంతో చేయాలనీ, మరొక విధానం రెండేసి రకాతుల చొప్పున చేయాలని. రెండు పద్ధతులూ సమ్మతమైనవే. అయితే రెండేసి రకాతుల చొప్పున చేసుకోవటమే ఉత్తమం. ఎందుకంటే ఒక ప్రామాణిక హదీసులో రాత్రి మరియు పగటిపూట నఫిల్‌ నమాజులు రెండేసి రకాతులు చేయాలని చెప్పబడింది. ఇమామ్‌ బుఖారీ (రహిమహుల్లాహ్) కూడా తన గ్రంథంలో “రాత్రి మరియు పగటి పూట (నఫిల్‌) నమాజులు రెండేసి రకాతులే” అనే శీర్షికతో ఒక అధ్యాయాన్ని ఏర్పరచారు.

జుమా నమాజ్ వేళ చేయబడే సున్నత్ లు – హదీసులు – హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్ )


364. హజ్రత్‌ జాబిర్‌ (రది అల్లాహు అన్హు) ఇలా తెలిపారు: జుమా రోజున ఒక వ్యక్తి మస్జిద్ లో ప్రవేశించాడు. ఆ సమయంలో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రసంగిస్తున్నారు. వచ్చిన వ్యక్తి నుద్దేశించి ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం), “నమాజ్‌ చేశావా?” అని దర్యాప్తు చేశారు. “లేదు’ అని అన్నాడా వ్యక్తి. “మరయితే లే. రెండు రకతుల నమాజ్‌ చెయ్యి” అని ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) చెప్పారు. (బుఖారీ, ముస్లిం)

సారాంశం:

జుమా ప్రసంగం జరుగుతుండగా రెండు రకతుల నమాజ్‌ చేయవచ్చునని ఈ హదీసు ద్వారా అవగతమవుతున్నది. ప్రసంగ కర్త మటుకు అవసరం మేరకు మాట్లాడగలడనీ, మస్జిద్ కు వచ్చే నమాజీలకు రెండు రకాతులు నెరవేర్చమని చెప్పగలడని కూడా దీనిద్వారా స్పష్టమవుతున్నది.

367. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రబోధించారని హజ్రత్‌ అబూ హురైర (రది అల్లాహు అన్హు) తెలిపారు : “మీలో ఎవరయినా జుమా నమాజ్‌ చేస్తే ఆ తరువాత నాలుగు రకాతులు చదవండి.”  (ముస్లిం)

[జుమా నమాజ్ – హదీసులు – హదీసు మకరందం (బులూఘ్-అల్–మరామ్) నుండి ]

ఇతరములు: