ఇస్లామీయ ప్రవర్తన [పుస్తకం & ఆడియో]

బిస్మిల్లాహ్

అఖ్లాఖ్, ఉత్తమ నడవడిక, గుడ్ క్యారెక్టర్, సత్ప్రవర్తన, Character, Manners
[ఇక్కడ పుస్తకం చదవండి లేదా డౌన్లోడ్ చేసుకోండి]
[PDF] [29పేజీలు ]
సంకలనం: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
పబ్లిషర్స్: జుల్ఫీ ధర్మప్రచార విభాగం (సౌదీ అరేబియా)

ఇస్లామీయ సత్ప్రవర్తన, నైతిక ప్రవర్తన (గుడ్ క్యారెక్టర్) – వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
https://youtu.be/heqzqooCHzY [42 నిముషాలు]
ఆడియోలో క్రింది విషయాలు వివరించబడ్డాయి:
[1] ఇస్లాంలో సత్ప్రవర్తన (ఉత్తమ నడవడిక ) కు ఎలాంటి విలువ ఉన్నది?
[2] సత్ప్రవర్తన (అఖ్లాఖ్) వలంబిస్తే మనకు ఇహపర లోకాల్లో ఏమి లాభాలు కలుగుతాయి?
[3] సత్ప్రవర్తన ఎవరి పట్ల ఎలా అవలంబించాలి?
[4] సత్ప్రవర్తన రావాలంటే ఎలాంటి సాధనాలను ఉపయోగించాలి?

విషయ సూచిక:

  • ఇస్లామీయ ప్రవర్తన 
  • సద్వర్తన నిదర్శనాలు 
  • దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రవర్తన 
  • కొన్ని సద్గుణాలు : సత్యత, అమానతు,  వినయము, సిగ్గు, బిడియం,లజ్జ
  • కొన్ని దుర్గుణాలు: జుల్మ్ (అత్యాచారం),ఈర్ష్య, మోసం,  దుష్గర్వం
  • నైతిక గుణాలు ఆర్జించు మార్గాలు 
    1. విశ్వాస శుద్ధి 
    2. దుఆ 
    3. ముజాహదా (ప్రయత్నం,కృషి)
    4. ముహాసబ (ఆత్మ విమర్శ)
    5. సద్వర్తన వాళ్ళ వచ్చే  ప్రయాజనాలను ఆలోచించుట 
    6. దుర్గుణాల దుష్ఫలితాల గురుంచి యోచించుట 
    7. సంపూర్ణ ఆత్మ శుద్ధి కోసం ప్రయత్నించుట 
    8. మందహాసం,చిరునవ్వు 
    9. చూసి చూడనట్లు ఉండుట 
    10. సంయమనం,సహనం 
    11. మూర్ఖుల జోలికి పోకుండా ఉండుట 
    12. దూషించకుండా ఉండుట 
    13. బాధని మరిచిపోవాలి 
    14. మన్నింపు వైఖరి 
    15. దాతృత్వం 
    16. అల్లాహ్ వద్ద ప్రతిఫలం పొందే నమ్మకం 
    17. కోపం నుండి దూరముండుట 
    18. నిర్మాణాత్మక మైన విమర్శను స్వీకరించుట 
    19. పనిని సంపూర్ణంగా చేయుట 
    20. తప్పు జరిగితే ఒప్పుకోవుట 
    21. సత్యం ఆవశ్యకమైనది 
    22. సద్గుణులతో స్నేహం చేయుట 
    23. పరస్పర సంభాషణ, సమావేశ పద్ధతులు పాటించుట 
    24. ప్రవక్త మరియు సహచరుల జీవిత చరిత్ర చదువుట 
    25. సద్గుణాలకు సంబంధించిన రచనలు చదువుట 

[పూర్తి పుస్తకం క్రింద చదవండి]

 అల్ హందులిల్లాహ్, వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్, అమ్మా బఅద్!

సర్వ స్తోత్రములకు అర్హుడు అల్లాహ్ మాత్రమే. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై శాంతి, కరుణ కురియుగాక!

అల్లాహ్ మనకు ఇస్లాం వరాన్ని అనుగ్రహించినందుకు, సద్గుణాలు అవలంభించా లని ప్రోత్సహించినందుకు, సద్గుణ సంపన్నులకు గొప్ప ప్రతిఫలం సిద్ధపరచినందుకు మనం ఆయనకు అనేకానేక స్తోత్రములు పఠించాలి.

సద్గుణ సంపన్నులైయుండుట ప్రవక్తల, పుణ్యాత్ముల గుణం. సద్గుణాల వల్ల ఉన్నత స్థానాలు లభించును. అల్లాహ్ ఒకే ఒక ఆయతులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఎలా ప్రశంసించాడంటే, అందులో ఆయన సర్వ సద్గుణాలు ఇమిడియున్నాయి: చూడండి: ఖలం (68:4)

[وَإِنَّكَ لَعَلَىٰ خُلُقٍ عَظِيمٍ]

“నిస్సందేహంగా నీవు నైతికంగా అత్యున్నత స్థానంలో ఉన్నావు”.

సద్గుణాల ద్వారా ప్రేమ, అప్యాయతలు జనిస్తాయి. దుర్గుణాల వల్ల ద్వేషం, ఈర్ష్యలు పుడతాయి. సద్గుణ సంపన్నులకు సత్ఫలితం, వారి పర్యవసానం ఇహపరాల్లో స్పష్టమయి ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సద్గుణాన్ని దైవభయభీతితో కలిపి తెలిపారు:

عَنْ أَبِي هُرَيْرَةَ قَالَ: سُئِلَ رَسُولُ اللهِ عَنْ أَكْثَرِ مَا يُدْخِلُ النَّاسَ الجَنَّةَ، فَقَالَ: «تَقْوَى اللهِ وَحُسْنُ الخُلُقِ»

అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు, అనేక మందిని స్వర్గంలో ప్రవేశింపజేయునది ఏమిటని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను అడిగినప్పుడు, ఆయన చెప్పారు: “అల్లాహ్ భయభీతి మరియు సద్వర్తన”. (తిర్మిజి 2004, సహీహా 977, సహీహుత్ తర్గీబ్ 1723).

సద్వర్తన అంటే: నగుమోముతో ఉండుట, మంచి చేయుట, ప్రజలకు అవస్త కలిగించకుండా ఉండుట, ఇంకా మృదువుగా మాట్లాడుట, కోపాన్ని దిగమింగుట, కోపం వ్యక్తపరచకుండా ఉండుట, ఇతరుల బాధ భరించుట. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించారు:

«إِنَّمَا بُعِثْتُ لِأُتَمِّمَ مَكَارِمَ الْأَخْلَاقِ»

“సద్గుణాలను సంపూర్ణం చేయుటకు నన్ను పంపడం జరిగింది”. (ముస్నద్ బజ్జార్ 8949, ముస్నద్ అహ్మద్ 8952, సహీహా 45).

ఉఖ్బా రజియల్లాహు అన్హుతో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు:

«أَلَا أُخْبِرُكَ بِأَفْضَلِ أَخْلَاقِ أَهْلِ الدُّنْيَا وَأَهْلِ الْآخِرَةِ؟ تَصِلُ مَنْ قَطَعَكَ، وَتُعْطِي مَنْ حَرَمَكَ، وَتَعْفُو عَمَّنْ ظَلَمَكَ»

“ఇహపరవాసుల అత్యుతమ నడవడిక గురించి నీకు తెలుపనా? నీతో సంబంధం తెంచుకున్న వానితో నీవు సంబంధం పెంచుకో, నీకు ఇవ్వనివానికి నీవు ఇవ్వు, నీ పట్ల దౌర్జన్యం చేసినవానిని నీవు మన్నించు”. (మకారిముల్ అఖ్లాక్: ఇబ్ను అబిద్ దున్యా 19, ముస్నద్ అహ్మద్ 17334, సహీహా 891).

సోదరా! ఈ ప్రశంసనీయమైన సద్గుణం యొక్క లెక్కలేనన్ని పుణ్యాలను, గొప్ప సత్ఫలితాలను గమనించు; ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు. అబూ దావూద్ 4798, సహీహా 794లో ఉంది:

«إِنَّ الْمُؤْمِنَ لَيُدْرِكُ بِحُسْنِ خُلُقِهِ دَرَجَةَ الصَّائِمِ الْقَائِمِ»

“విశ్వాసి తన నైతిక గుణాల వల్ల ఉపవాసమున్న వారి మరియు తహజ్జుద్ నమాజ్ చేయువారంత స్థానం పొందుతాడు”.

అంతేకాదు, సద్గుణాలు సంపూర్ణ విశ్వాసానికి గొప్ప సబబు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం శుభవార్త ఇచ్చారు:

«أَكْمَلُ الْمُؤْمِنِينَ إِيمَانًا أَحْسَنُهُمْ خُلُقًا»

“విశ్వాసులలో సంపూర్ణ విశ్వాసం గలవాడు వారిలో అందరికన్నా ఎక్కువగా సద్వర్తన గలవాడు”. (అబూ దావూద్ 4682, సహీహా 284).

సోదరా! ప్రవక్తగారి ఈ ప్రవచనంపై శ్రద్ధ వహించు:

«أَحَبُّ النَّاسِ إِلَى اللَّهِ أَنْفَعُهُمْ لِلنَّاسِ، وَأَحَبُّ الْأَعْمَالِ إِلَى اللَّهِ سُرُورٌ تُدْخِلُهُ عَلَى مُسْلِمٍ، أَوْ تَكْشِفُ عَنْهُ كُرْبَةً ، أَوْ تَقْضِي عَنْهُ دَيْنًا ، أَوْ تَطْرُدُ عَنْهُ جُوعًا، وَلَئِنْ أَمْشِي مَعَ أَخٍ لِي فِي حَاجَةٍ أَحَبُّ إِلَيَّ مِنْ أَنْ أَعْتَكِفَ فِي هَذَا الْمَسْجِدِ شَهْرًا»

“అల్లాహ్ కు అత్యంత ప్రియుడు ప్రజలకు అత్యంత ప్రయోజనకరుడు. అల్లాహ్ కు సత్కార్యాల్లో అత్యంత ప్రియమైనవి; ముస్లింకు సంతోషం కలిగించడం, అతని ఓ కష్టాన్ని తొలగించడం, అతని అప్పు చెల్లించటం, అతని ఆకలి భాధను తీర్చటం. నేను నా ముస్లిం సోదరుని వెంట అతని ఓ అవసరాన్ని తీర్చుటకు నడవడం నా మస్జిదు (మస్జిదె నబవీ)లో ఒక నెల ఏతికాఫ్ చేయడం కంటే ఎంతో ప్రియమైనది”. (తబ్రానీ సగీర్ 861, సహీహుత్ తర్గీబ్ 2623).

ముస్లిం సోదరా! మృదువుగా, ప్రేమగా ఓ మాట నీవు మాట్లాడినా అందులో నీకు పుణ్యం ఉంది, అది నీ కొరకు ఒక దానం లాంటిది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:

«وَالكَلِمَةُ الطَّيِّبَةُ صَدَقَةٌ»

“మంచి మాట ఒక దానం వంటిది”. (బుఖారీ 2989, ముస్లిం 1009).

మంచిమాటకు ఈ ఘనత ఎందుకు లభించినది? ఎందుకనగా; అందులో ప్రశంసనీయమైన ప్రభావం ఉంది. అది హృదయాలను చేరువుగా చేస్తుంది, మనస్సును ప్రేమతో నింపుతుంది, ద్వేషాలను దూరం చేస్తుంది.

ఇతరుల నుండి బాధ భరించి అయినా సద్వర్తన కలిగి ఉండడం గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రోత్సహించిన సందర్భాలు అనేకం, వాటిలో ఒకటి:

«اتَّقِ اللهِ حَيْثُمَا كُنْتَ، وَأَتْبِعِ السَّيِّئَةَ الحَسَنَةَ تَمْحُهَا، وَخَالِقِ النَّاسَ بِخُلُقٍ حَسَنٍ»

“ఎక్కడ ఉన్నా అల్లాహ్ తో భయపడు, పాపం జరిగిన వెంటనే పుణ్యం చెయ్యి, దాని వల్ల పాపం తుడుచుకుపోవును, ప్రజల ఎడల సద్వర్తనతో మెలుగు”. (తిర్మిజి 1987, సహీహుత్ తర్గీబ్ 2655).

ప్రతీ సమయ, సందర్భంలో ముస్లిం ఈ సద్గుణాలను అలవర్చుకొని ఉంటాడు, అందుకు అతను ప్రజలకు ప్రియుడయి ఉంటాడు. ఏ దారి గుండా నడిచినా, ఏ చోటకి వెళ్ళినా వారికి సన్నిహితుడవుతాడు, చివరికి తన భార్యకు ఓ అన్నం ముద్ద తినిపించినా, అతనికి ఇస్లాంలో సత్ఫలితం లభిస్తుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:

«وَإِنَّكَ مَهْمَا أَنْفَقْتَ مِنْ نَفَقَةٍ، فَإِنَّهَا صَدَقَةٌ، حَتَّى اللُّقْمَةُ الَّتِي تَرْفَعُهَا إِلَى فِي امْرَأَتِكَ»

నీవు ఖర్చు చేసే ఒక్కో దానికి బదులుగా నీకు సదఖ చేసినంత పుణ్యం, చివరికి నీవు నీ భార్య నోట్లో పెట్టే ఓ అన్నం ముద్దకు బదులుగా కూడా పుణ్యం లభిస్తుంది. (బుఖారీ 2742).

ప్రియ సోదరా! విశ్వాసులు పరస్పరం సహోదరులు, విశ్వాసి తన కొరకు ఇష్టపడినదే తన సోదరుని కొరకు ఇష్టపడాలి. కనుక నీకిష్టమైనదేదో చూసుకొని అదే, అలాంటిదే నీ సోదరునికీ ఇవ్వు. నీకు ఇష్టం లేనిది అతని నుండి దూరంగానే ఉంచు. జాగ్రాత్త! అల్లాహ్ ను తన ప్రభువుగా, ఇస్లాంను తన ధర్మంగా, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని తన ప్రవక్తగా విశ్వసించినవారిని చిన్నచూపుతో చూడకు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా హెచ్చరించారు:

«بِحَسْبِ امْرِئٍ مِنَ الشَّرِّ أَنْ يَحْقِرَ أَخَاهُ الْمُسْلِمَ»

“తన ముస్లిం సోదరుడ్ని కించపరచడం, చిన్న- చూపుతో చూడడం స్వయం తాను చెడ్డవాడు అనడానికి గొప్ప చిహ్నం”. (ముస్లిం 2564).

ముస్లిం సోదరా! అన్ని వేళల్లో సుగమమైన మార్గం, సులభమైన ఆరాధన సద్వర్తన అవలం- బించండం. అవును, దీని సత్ఫలితం ఇంతా అంతా కాదు, రాత్రంతా తహజ్జుద్ చేసే, పగలంతా ఉపవాసం పాటించే వారితో సమానం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇదే శుభవార్త ఇచ్చారు:

«إِنَّ الْمُؤْمِنَ لَيُدْرِكُ بِحُسْنِ خُلُقِهِ دَرَجَةَ الصَّائِمِ الْقَائِمِ»

“విశ్వాసి తన సద్వర్తన ద్వారా (నఫిల్) ఉపవాసాలు, తహజ్జుద్ నమాజులు పాటించేవారి స్థానాన్ని చేరుకుంటాడు”. (అబూ దావూద్ 4798, సహీ తర్గీబ్ 2643).

సద్వర్తన చిహ్నాలు

సద్గుణాలంటే కొన్ని మంచి గుణాల కలయిక (సమూహం). వాటిలో కొన్ని దిగువ తెలుసు- కుందాము, పాటించే ప్రయత్నం చేద్దాము:

మనిషి ఎక్కువగా బిడియం గలవాడై ఉండాలి. ఇతరులకు బాధ కలిగించకుండా ఉండాలి. అధికంగా సంస్కరణకర్త అయి, సత్యవంతుడై ఉండాలి. తక్కువ మాట్లాడాలి. ఎక్కువ పని చేయాలి. వృధా వాటికి దూరంగా ఉండాలి. ప్రతి మంచిలో ముందంజ వేయాలి. బంధుత్వాన్ని పెంచుకుంటూ ఉండాలి. సహనశీలుడై, కృతజ్ఞుడై, సంతృప్తి పడేవాడై, ఓర్పుగలవాడై, మృదువైఖరి అవలంబించేవాడై ఉండాలి. సౌశీల్యుడై కనికరుడై ఉండాలి. శపించువాడు, దూషించువాడు, చాడీలు చెప్పేవాడు, పరోక్షంగా నిందించేవాడు, తొందరుపాటు పడేవాడు, కపటం గలవాడు, పిసినారి, ఈర్షాపరుడై ఉండకూడదు. సంతోషంగా, ఉల్లాసంగా ఉండాలి. అల్లాహ్ కొరకే ప్రేమించాలి. అల్లాహ్ కొరకే ఇష్టపడాలి. అల్లాహ్ కొరకే కోపంగా ఉండాలి.

సద్వర్తన గల మనిషి ప్రజల బాధను సహిస్తాడు, ఎల్లప్పుడు వారి నుండి జరిగే పొరపాట్లకు ఏదైనా సాకు వెతుకుతాడు, వారి తప్పులెన్నడం, వారి లోటుపాట్లను వెతకడం నుండి ఆమడ దూరమే ఉంటాడు. విశ్వాసి ఏ స్థితిలో, సందర్భంలో దుర్గుణుడు, దుష్ప్రవర్తన గలవాడు కాడు.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అనేక సందర్భాలలో సద్వర్తన ప్రాముఖ్యతను, సద్గుణ సంపన్నడు పొందే గొప్ప సత్ఫలితాన్ని ఎంతో నొక్కి చెప్పారు. ఉసామా బిన్ షరీక్ ఉల్లేఖించారు, మేము ప్రవక్త వద్ద కూర్చొని ఉండగా, కొంత మంది వచ్చి ఇలా అడిగారు:

فَمَنْ أَحَبُّ عِبَادِ اللَّهِ إِلَى اللَّهِ؟ قَالَ: «أَحْسَنُهُمْ خُلُقًا»

అల్లాహ్ కు తన దాసుల్లో అత్యంత ప్రియులెవరూ?

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం  చెప్పారు: “వారిలో అత్యంత సద్గుణ సంపన్నుడు”. (తబ్రానీ ఔసత్ 6380, సహీహా 432).

అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖించారు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పగా విన్నారు:

«أَلَا أُخْبِرُكُمْ بِأَحَبِّكُمْ إِلَيَّ وَأَقْرَبِكُمْ مِنِّي مَجْلِسًا يَوْمَ الْقِيَامَةِ؟» قَالُوا: نَعَمْ يَا رَسُولَ اللَّهِ، قَالَ: «أَحْسَنُكُمْ خُلُقًا»

“మీలో నాకు అత్యంత ప్రియుడు మరియు ప్రళయదినాన నా సమావేశంలో నాకు అత్యంత సమీపంలో కూర్చునేవాడు ఎవరో మీకు తెలుపనా?”, అవును తెలుపండి ప్రవక్తా! అని సహచరులు విన్నవించుకున్నారు: “మీలో అందరికన్నా ఎక్కువ సద్గుణాలు గలవాడు”. (ముస్నద్ అహ్మద్ 6735, సహీహుత్ తర్గీబ్ 2649).

అబూ దర్దా రజియ్లలాహు అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు:

«مَا شَيْءٌ أَثْقَلُ فِي مِيزَانِ الْمُؤْمِنِ يَوْمَ القِيَامَةِ مِنْ خُلُقٍ حَسَنٍ»

“ప్రళయదినాన విశ్వాసుని త్రాసులో సద్వర్తన కంటే బరువైనది మరేదీ ఉండదు”. (తిర్మిజి 2002, సహీహా 876).

ప్రవక్త సద్వర్తన

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ సహాబాలను ఏ సద్వర్తన అలవర్చుకోటానికి ఆహ్వానించేవారో వాటిలో ఆయన అత్యుత్తమ గొప్ప ఆదర్శంగా ఉండేవారు. ప్రవక్త తమ సహచరుల మదిలో అత్యున్నత సద్గుణాలు ఉపదేశాలతో, వివేచనాపరమైన మాటలతో నాటేకి ముందు తమ ఆచరణతో నాటేవారు.

عَنْ أَنَسِ بْنِ مَالِكٍ ﷜، قَالَ: خَدَمْتُ رَسُولَ اللهِ عَشْرَ سِنِينَ، وَاللهِ مَا قَالَ لِي: أُفًّ قَطُّ، وَلَا قَالَ لِي لِشَيْءٍ: لِمَ فَعَلْتَ كَذَا؟ وَهَلَّا فَعَلْتَ كَذَا؟

అనస్ రజియల్లాహు అన్హు తెలిపారు: నేను పది సంవత్సరాలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సేవలో ఉన్నాను, అల్లాహ్ సాక్షిగా! ఆయన ఏ ఒక్కసారి కూడా నన్ను కసురుకోలేదు, ఇంకా ఈ పని ఎందుకు చేశావు, ఈ పని ఎందుకు చేయలేదు అని కూడా అనలేదు. (బుఖారీ 6038, ముస్లిం 2309).

عَنْ أَنَسِ بْنِ مَالِكٍ ﷜، قَالَ: كُنْتُ أَمْشِي مَعَ النَّبِيِّ وَعَلَيْهِ بُرْدٌ نَجْرَانِيٌّ غَلِيظُ الحَاشِيَةِ، فَأَدْرَكَهُ أَعْرَابِيٌّ فَجَذَبَهُ جَذْبَةً شَدِيدَةً، حَتَّى نَظَرْتُ إِلَى صَفْحَةِ عَاتِقِ النَّبِيِّ قَدْ أَثَّرَتْ بِهِ حَاشِيَةُ الرِّدَاءِ مِنْ شِدَّةِ جَذْبَتِهِ، ثُمَّ قَالَ: مُرْ لِي مِنْ مَالِ اللَّهِ الَّذِي عِنْدَكَ، فَالْتَفَتَ إِلَيْهِ فَضَحِكَ، ثُمَّ «أَمَرَ لَهُ بِعَطَاءٍ»

“అనస్  రదియల్లాహు అన్హు తెలిపారు: ఒక సారి నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వెంట నడుస్తుండగా -అప్పుడు ఆయన నజ్రాన్‌లో తయారైన మందమైన అంచుగల ఒక దుప్పటి ధరించి ఉన్నారు- ఒక గ్రామీణుడు వచ్చి దుప్పటిని వడిగా లాగాడు. దాని వలన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మెడ భుజానికి దగ్గర మచ్చ ఏర్పడింది నేను స్వయంగా చూశాను. మళ్ళీ  అతను ఇలా అడిగాడు. ముహమ్మద్‌! నీ  వద్ద ఉన్న అల్లాహ్ ధనం నాకింత ఇప్పించండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతని వంక తిరిగి చూస్తూ నవ్వారు. మళ్ళీ అతనికి కొంత ఇవ్వవలసినదిగా ఆదేశించారు. (బుఖారీ 3149, ముస్లిం 1057).

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంట్లో ఏమి చేసేవారని ఆయిషా రజియల్లాహు అన్హాను ప్రశ్నించినప్పుడు, ఆమె ఇలా చెప్పారు:

كَانَ يَكُونُ فِي مِهْنَةِ –خِدْمَةَ- أَهْلِهِ فَإِذَا حَضَرَتِ الصَّلاَةُ خَرَجَ إِلَى الصَّلاَةِ

ఆయన ఇంటి పనుల్లో తమ ఇల్లాలికి సహకరిస్తూ ఉండేవారు. నమాజ్‌ సమయమయిన వెంటనే నమాజ్‌ కొరకు వెళ్ళేవారు. (బుఖారీ 676).

అబ్దుల్లాహ్  బిన్‌ హారిస్ రజియల్లాహు అన్హు చెప్పారు:

مَا رَأَيْتُ أَحَدًا أَكْثَرَ تَبَسُّمًا مِنْ رَسُولِ اللهِ .

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కంటే ఎక్కువ చిరునవ్వు నవ్వేవారిని నేను చూడలేదు. (తిర్మిజీ 3641, ఇది హసన్ హదీస్).

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గుణవిశేష- ణాల్లో; ఆయన దాత, ఎన్నడూ పిసినారితనం వహించలేదు. శూరుడు, సత్యం నుండి ఎన్నడూ వెనక్కి తిరగలేదు. న్యాయశీలి, ఎన్నడూ తీర్పు చేయడంలో అన్యాయం చేయలేదు. పూర్తి జీవితంలో సత్యవంతుడు, విశ్వసనీయుడు అనే ప్రఖ్యాతి చెందారు.

జాబిర్‌ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎవరైనా ఏదయినా అడిగితే, “లేదు” అని ఎన్నడూ అనలేదు. (బుఖారి 6034, ముస్లిం 2311).

ఆయన తమ సహచరులతో పరిహాసమాడేవారు. (ధనికపేద బేధం లేకుండా) అందరితో కలసి ఉండేవారు. పిల్లవాళ్ళను తమ వడిలో కూర్చోబెట్టి ఆటలాడే వారు. ఆహ్వానాన్ని అంగీకరించేవారు. వ్యాధిగ్రస్తుల్ని పరామర్శిం చేవారు. అపరాధుల సాకును ఒప్పుకునేవారు.

తమ సహచరులను వారికి నచ్చిన మంచి పేర్లతో సంబొధించేవారు. మాట్లాడుతుండేవారి మాట మధ్య అభ్యంతరం కలిగించేవారుకారు.

అబూ ఖతాద రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు: ఒక సారి నజ్జాషి రాయబార బృందం ఒకటి ప్రవక్త వద్దకు వచ్చినప్పుడు స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సేవ చేస్తున్నది చూసి, ఆయన సహచరులు ప్రవక్తా! మీరు ఉండండి. మేము వారికి సేవ చేస్తాము అని విన్నవించుకోగా. ఆయన “వారు మా సహచరులతో మంచి విధంగా ప్రవర్తించారు. ప్రతీకగా వారి ఆతిథ్యం స్వయంగా నేనూ మంచి విధంగా చేయాలను- కుంటున్నాను” అని అన్నారు. (దలాఇలున్ నుబువ్వ 2/307, సీరతుబ్ని కసీర్ 2/31).

ఇంకా  ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అనేవారు: “నేను ఒక దాసున్ని, దాసుడు ఎలా తింటాడో అలాగే నేను తింటాను. అతను ఎలా కూర్చుంటాడో అలా నేను కూర్చుంటాను”. ఆయన గాడిదపై స్వారీ చేసేవారు, నిరుపేదలను పరామర్శించేవారు, బీదవాళ్ళతో కలసి కూర్చుండేవారు.

సత్యం

 నిశ్చయంగా విశ్వాసుడు తన ప్రభువు పట్ల సత్యవంతుడు. ప్రజల ఎడల సత్యవంతుడు. అన్ని వేళల్లో, స్థితుల్లో తన మాటల్లో, చేష్టల్లో సత్యవంతుడుగానే ఉంటాడు. అల్లాహ్ ఆదేశం గమనించండి:

 [يَاأَيُّهَا الَّذِينَ آمَنُوا اتَّقُوا اللَّهَ وَكُونُوا مَعَ الصَّادِقِينَ] (التوبة: 119)

విశ్వసించిన ప్రజలారా! అల్లాహ్ కు భయపడండి. సత్యవంతులకు తోడుగా ఉండండి. (తౌబా 9:119).

مَا كَانَ خُلُقٌ أَبْغَضَ إِلَى رَسُولِ اللَّهِ مِنَ الْكَذِبِ

ఆయిషా రజియల్లాహు అన్హా చెప్పారు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నింటికంటే ఎక్కువగా అబద్దాన్ని అసహ్యించుకునేవారు. (సహీ ఇబ్ను హిబ్బాన్ 5736, బైహఖీ షుఅబ్ 4475లో).

ఇస్లాం ధర్మం పై అబద్దం చెప్పడం అతి చెడ్డ విషయం, పాపాల్లో అతిఘోరమైనది. అలాంటివారికి నరకమే శిక్ష. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా హెచ్చరించారు:

«مَنْ كَذَبَ عَلَيَّ مُتَعَمِّدًا، فَلْيَتَبَوَّأْ مَقْعَدَهُ مِنَ النَّارِ»

“ఎవరైతే ఉద్దేశ్య పూర్వకంగా నాపై అబద్దాన్ని మోపుతాడో అతడు తన నివాసం నరకంలో నిర్మించుకోవలసి ఉంటుంది”. (బుఖారి 1291, ముస్లిం 3).

బాలల మనుస్సులో సైతం సత్యాన్ని నాటాలని, వారు ఆ మనుగడను అనుసరిస్తూ పెరగాలని ఇస్లాం ప్రోత్సహిస్తుంది. అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:

«مَنْ قَالَ لِصَبِيٍّ: تَعَالَ هَاكَ، ثُمَّ لَمْ يُعْطِهِ فَهِيَ كَذْبَةٌ»

“ఇదిగో, తీసుకో అని ఎవరైతే ఒక పిల్లవాణ్ణి పిలిచి అతనికి ఏమీ ఇవ్వకుంటే అది కూడా ఒక అబద్ధం” (అహ్మద్‌ 9836, సహీహా 748).

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పరిహాసాని- కైనా, నవ్వించుటకయినా అబద్దం విడనాడాలని అనుచర సంఘాన్ని ప్రోత్సహించారు.

«أَنَا زَعِيمٌ بِبَيْتٍ فِي وَسَطِ الْجَنَّةِ لِمَنْ تَرَكَ الْكَذِبَ وَإِنْ كَانَ مَازِحًا»

అబూ ఉమామ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా శుభవార్త ఇచ్చారు: “పరిహాసానికయినా అసత్యము చెప్పని వ్యక్తి కోసం స్వర్గం మధ్యలో నివాసం లభిస్తుందని నేను హామీ ఇస్తున్నాను. (అబూ దావూద్ 4800, సహీహా 273)

వ్యాపారి తన సరుకు అమ్మడానికి అబద్దం చెబుతాడు. అయితే ప్రవక్త  ఈ హెచ్చరికను వినలేదా, చదవలేదా? “అల్లాహ్ ప్రళయదినాన ముగ్గురితో మాట్లాడడు, వారి వైపు చూడడు, వారిని శుద్ధిపరచడు” అని ప్రవక్త హెచ్చరించి- నప్పుడు, వారెవరు ప్రవక్తా! వారైతే నాశనమై- పోయారు, నష్టములో పడ్డారు అని అబూ జర్ర్ రజియల్లాహు అన్హు అడిగారు. అప్పుడు ప్రవక్త చెప్పారు: “చీలమండలానికి క్రింద దుస్తులు ధరించేవారు, ఉపకారం చేసి దెప్పిపొడిచేవాడు మరియు అసత్య ప్రమాణాలతో తమ సరుకును విక్రయించేవారు”. (ముస్లిం 106).

ఉఖ్బా బిన్ ఆమిర్ చెప్పారు: “ఒక ముస్లిం ఓ సరుకును అమ్మేటప్పుడు అందులో ఉన్న లోపం తెలిసి కూడా దాన్ని (కొనేవారికి) చెప్పకపోవుట ధర్మ సమ్మతంకాదు”. (బుఖారీలో 2079కి ముందు హదీసు).

అమానతు

ఇస్లాం తన అనుచరులకు (విశ్వాసులకు) అమానతులను హక్కుదారులకు అప్పగించాలని ఆదేశిస్తుంది. ప్రతి వ్యక్తి తాను చేసే పని చిన్నదైనా, పెద్దదయినా తన ప్రభువు తనను చూస్తున్నాడు అనే విషయం తెలుసుకోవాలి. ఇది కూడా అమానతే.

ముస్లిం తనపై అల్లాహ్ విధించిన విషయాల్ని నెరవేర్చడములో విశ్వసనీయుడు. ప్రజల ఎడల ప్రవర్తించడంలో సయితం విశ్వసనీయుడు.

 అమానతు అంటే: మనషి తనకు అప్పగించబడిన బాధ్యతను సంపూర్ణంగా నెరవేర్చడానికి కృషి చేయడం. అల్లాహ్ ఆదేశం:

[إِنَّ اللَّهَ يَأْمُرُكُمْ أَن تُؤَدُّوا الْأَمَانَاتِ إِلَىٰ أَهْلِهَا وَإِذَا

حَكَمْتُم بَيْنَ النَّاسِ أَن تَحْكُمُوا بِالْعَدْلِ ۚ]

“ఎవరి అమానతులను వారికి అప్పగించండి. ప్రజల మధ్య తీర్పులు చేసేటప్పుడు న్యాయంగా తీర్పు చేయండి” అని అల్లాహ్‌ మిమ్మల్ని ఆదేశిస్తున్నాడు. (నిసా 4:58).

మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారని, అనస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు:

«لَا إِيمَانَ لِمَنْ لَا أَمَانَةَ لَهُ»

“ఎవరిలోనయితే అమానతు లేదో వారిలో ఈమాన్‌ (విశ్వాసం) లేదు”. (అహ్మద్ 12383, ఇది హసన్ హదీస్).

అమానతు అంటే ఈ రోజుల్లో కొందరు అనుకునే విధంగా “ఒకరి వస్తువును భద్రంగా కాపాడి తను అడిగినప్పుడు తిరిగి ఇవ్వడం” మాత్రమే కాదు. అంతకంటే విశాలమైన భావాలు (విషయాలు) అందులో వస్తాయి. అమానతు అదా చేయడం, అప్పగించడం అంటే: ఒక వ్యక్తి ఏ పని, లేక విధి అతనికి అప్పగించబడినదో, అది ధర్మపరమైనది గాని లేక ప్రాపాంచికమైనది గాని అన్నిటినీ మనఃపూర్వకంగా, సరియైన రీతిలో నెరవేర్చాలి. తన వైపు నుండి ఏ రవ్వంత కొరత లేకుండా నెరవేర్చాలి.

వినయము

ముస్లిం  అవమానానికి గురి కాకుండా వినయ వినమ్రత పాటిస్తాడు.. గర్వాహంకారాలు ముస్లింకు వాంఛనీయం కావు. అల్లాహ్ ఆదేశం:

[وَاخْفِضْ جَنَاحَكَ لِمَنِ اتَّبَعَكَ مِنَ الْمُؤْمِنِينَ]

“విశ్వసించి, నిన్ను అనుసరించేవారి పట్ల మృదువుగా మసలుకో”. (షుఅరా 26:215). ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచనం:

«وَمَا تَوَاضَعَ أَحَدٌ لِلَّهِ إِلَّا رَفَعَهُ اللهُ»

“ఎవరయితే అల్లాహ్ కొరకు వినమ్రుడవుతాడో అల్లాహ్ అతన్ని ఉన్నతునిగా చేస్తాడు”. (ముస్లిం 2588). మరో చోట ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించారు:

«وَإِنَّ اللهَ أَوْحَى إِلَيَّ أَنْ تَوَاضَعُوا حَتَّى لَا يَفْخَرَ أَحَدٌ

عَلَى أَحَدٍ، وَلَا يَبْغِي أَحَدٌ عَلَى أَحَدٍ»

“మీరు వినయ, వినమ్రత పాటించండి అని అల్లాహ్ నాకు వహీ (సందేశం) పంపాడు. ఎంతవరకు అనగా మీలో ఒక వ్యక్తి మరో వ్యక్తిపై గర్వాహంకారినికి ఒడికట్టకూడదు. ఒక వ్యక్తి మరో వ్యక్తిపై దౌర్జన్యం చేయకూడదు”. (ముస్లిం 2865).

వినయవినమ్రత యొక్క ప్రత్యక్ష రూపాలు: బీద, నిరుపేదలతో కూర్చుండుట. కలియ గలుపుగా ఉండుట. వారిపై పెత్తనం చలాయించ కుండా, గర్వించకుండా, ప్రజల మధ్య మందహాసముతో ఉండుట. ఇతరుల కంటే తనే ఉన్నతుడు, గొప్పవాడు అన్న భావన మనిషికి ఉండకపోవుట.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మహాప్రవక్త అయినప్పటికీ ఇంటిని శుభ్రపరిచేవారు (ఇల్లు ఊడిచేవారు). మేకపాలు పిండేవారు. బట్టలకు అతుకులు వేసి కుట్టుకునేవారు. తమ బానిసతో కలసి తినేవారు. మార్కెట్‌ (బజారు) నుండి స్వయంగా ఖరీదు చేసేవారు. విశ్వాసులైన చిన్న, పెద్ద, ధనిక, పేద బేధం లేకుండా అందరితో కలిసేవారు. ముసాఫహా (కరచాలనం) చేసేవారు.

లజ్జ

లజ్జా, బిడియం విశ్వాస భాగాల్లో ఓ భాగం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశానుసారం: “లజ్జా గుణం వలన మేలుతప్ప మరేమి చేకూరదు”. (బుఖారి 6117, ముస్లిం 37).

విశ్వాసునికి ఈ మహోన్నత గుణంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గొప్ప ఆదర్శం, ఆయన మహాలజ్జ గుణం గలవారు. అబూ సఈద్‌ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు ఏదైనా విషయం అసహ్యం కలిగించిందంటే, అది మేము ఆయన ముఖము చూసి తెలుసుకునే వారము. (బుఖారీ 6102).

సిగ్గు, బిడియం గుణాలు ముస్లింను సత్యమైన మాట పలకడం, విద్య అభ్యసించడం, మంచిని ఆదేశించడం, చెడును నివారించడం నుండి ఆపదు. ఉదా: ఈ గుణం ఉమ్మె సులైమ్ రజియల్లాహు అన్హాను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో ఇలా ప్రశ్నించడానికి అడ్డుపడలేదు: ప్రవక్తా! అల్లాహ్ హఖ్‌ (ధర్మ) విషయం అడిగితె సిగ్గుపడడు కదా!. స్త్రీలకు స్వప్న స్ఖలనమైనచో స్నానం చేయుట తప్పనిసరియా? అని ప్రశ్నించింది. అందుకు ప్రవక్త “అవును స్వప్న స్ఖలనం అయినట్టు తెలిసి, తడి చూసినచో స్నానం చేయాలి” అని సమాదానమిచ్చారు. (బుఖారి 282).

 కాని ఈ లజ్జగుణం ముస్లింకు, దుష్కార్యాలు చేయునప్పుడు, అతనిపై విధించబడినదానిని సంపూర్ణంగా నిర్వర్థించకుండా ఉన్నప్పుడు. ఒకరి లోపాల్ని బహిర్గతం చేసేటప్పుడు. ఎవరికైనా నష్టం చేయాలని పూనుకున్నప్పుడు తప్పకుండా అడ్డు పడాలి.

 అల్లాహ్ పట్ల లజ్జగుణంతో మెలగడం అత్యంత ప్రధాన హక్కు. విశ్వాసి తన సృష్టికర్త అయిన అల్లాహ్ పట్ల సిగ్గుపడాలి. ఆయనే అతనికి ఉనికి ప్రసాదించి, అనేక వరాలు నొసంగాడు. కనుక ఆయన విధేయతలో, వరాల కృతజ్ఞత తెలుపుటలో అశ్రద్ధ చూపుటకు సిగ్గుపడాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఆదేశించారు: “సిగ్గుపడటానికి ప్రజలకంటే అల్లాహ్ ఎక్కువ అర్హతగలవాడు”. (బుఖారి).

దుర్గుణాలు

జుల్మ్‌ – (అన్యాయం, దౌర్జన్యం)

 నిజమైన ముస్లిం తరపున ఎన్నడూ ఏ ఒకరి పట్ల “జుల్మ్‌” జరగదు. ఎందుకనగా ఇస్లాంలో “జుల్మ్‌” కు పాల్పడుట నిషిద్ధం. అల్లాహ్ ఆదేశం:

[وَمَنْ يَظْلِمْ مِنْكُمْ نُذِقْهُ عَذَابًا كَبِيرًا] {الفرقان:19}

“మీలో ఎవడు “జుల్మ్‌”కి పాల్పడుతాడో, అతనికి మేము కఠిన శిక్షను రుచి చూపిస్తాము”. (ఫుర్‌ఖాన్‌ 25:19).

అల్లాహ్ ఇలా ఆదేశించాడని, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు:

«يَا عِبَادِي إِنِّي حَرَّمْتُ الظُّلْمَ عَلَى نَفْسِي، وَجَعَلْتُهُ بَيْنَكُمْ مُحَرَّمًا، فَلَا تَظَالَمُوا»

“ఓ నా దాసులారా! నేను దౌర్జన్యాన్ని నిషేధిస్తున్నాను. మీరు కూడా ఒకరి పై నొకరు దౌర్జన్యం చేయడం నిషిద్ధం అని భావించండి, అలాగే ఆచరించండి”. (ముస్లిం).

జుల్మ్‌” మూడు రకాలు:

1. మొదటి రకం: మానవుడు తన ప్రభువు పట్ల చేసే “జుల్మ్‌”. అనగా తన ప్రభువు పట్ల అవిశ్వాసానికి పాల్పడటం. అల్లాహ్ ఆదేశం:

[وَالكَافِرُونَ هُمُ الظَّالِمُونَ] {البقرة:254}

“అవిశ్వాస మార్గం అవలంభించేవారే “జుల్మ్‌” చేయువారు (జాలిములు)” (బఖర 2:254).

ఆరాధనలో అల్లాహ్ తో పాటు ఇతరుల్ని భాగస్వామి చేయడం ద్వారా మనిషి ఈ “జుల్మ్‌” కి పాల్పడతాడు. అంటే ఆరాధనల్లో కొన్నిటిని అల్లాహ్ యేతరుల కొరకు చేయుట. అల్లాహ్ ఆదేశం:

[إِنَّ الشِّرْكَ لَظُلْمٌ عَظِيمٌ] {لقمان:13}

“నిశ్చయంగా ఇతరుల్ని అల్లాహ్ కు భాగస్వాము-

లుగా చేర్చటం ఘోరమైన “జుల్మ్‌” (పరమ దుర్మార్గం) (లుఖ్మాన్‌ 31:13).

2. రెండవ రకం: ఒక వ్యక్తి తన తోటి మానవులపై చేసే “జుల్మ్‌”. అది వారి శీలమానాల్లో జోక్యం చేసుకొని బాధించడం, లేక వారిని శారీరకంగా బాధించడం, లేక అధర్మంగా వారి సొమ్మును కాజేసి బాధించడం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించారు:

«كُلُّ الْمُسْلِمِ عَلَى الْمُسْلِمِ حَرَامٌ، دَمُهُ، وَمَالُهُ، وَعِرْضُهُ»

ఒక ముస్లిం యొక్క ధన, మాన, ప్రాణము మరొక ముస్లింపై నిషిద్ధం”. (ముస్లిం 2564).

మరో సందర్భంలో ప్రవక్త ఇలా హెచ్చరించారు:

«مَنْ كَانَتْ لَهُ مَظْلَمَةٌ لِأَخِيهِ مِنْ عِرْضِهِ أَوْ شَيْءٍ، فَلْيَتَحَلَّلْهُ مِنْهُ اليَوْمَ، قَبْلَ أَنْ لاَ يَكُونَ دِينَارٌ وَلاَ دِرْهَمٌ، إِنْ كَانَ لَهُ عَمَلٌ صَالِحٌ أُخِذَ مِنْهُ بِقَدْرِ مَظْلَمَتِهِ، وَإِنْ لَمْ تَكُنْ لَهُ حَسَنَاتٌ أُخِذَ مِنْ سَيِّئَاتِ صَاحِبِهِ فَحُمِلَ عَلَيْهِ»

ఎవరైనా తన సోదరున్ని అవమాన పరచి లేదా మరే విధమైన “జుల్మ్‌” చేసి బాధించినచో, దిర్‌హమ్  దీనార్‌ (డబ్బు ధనం) చెల్లని ఆ రోజు రాక ముందు ఈ రోజే (క్షమాపణ కోరి లేక వారి హక్కు ఇచ్చేసి) తొలిగిపోవాలి. (లేదా) ఆ రోజు, తాను చేసిన “జుల్మ్‌”కి పరిమాణంలో అతని పుణ్యాలు తీసుకొని (బాధితునికివ్వబడతాయి). అతని వద్ద పుణ్యాలు లేనిచో బాధితుని పాపాలు తీసుకొని అతనిపై వేయబడతాయి. (బుఖారి 6534).

3- మూడవ రకం: మనిషి తన ఆత్మపై చేసుకునే “జుల్మ్‌”. అదేమిటనగా మనిషి నిషిద్ధ విషయాలకు పాల్పడుట. అల్లాహ్ ఆదేశం:

وَمَا ظَلَمُونَا وَلَكِنْ كَانُوا أَنْفُسَهُمْ يَظْلِمُونَ (57)

“వారు మాపై ఏ మాత్రం “జుల్మ్‌” చేయలేదు. వారు తమకు తామే “జుల్మ్‌” చేసుకున్నారు. (2: ఒఖర: 57).

నిషిద్ధ కార్యాలకు పాల్పడుట మనిషి తన ఆత్మపై చేసుకునే “జుల్మ్‌”. ఎందుకనగా అతని ఈ పాపం అతను అల్లాహ్ శిక్షకు గురికావడానికి కారణమవుతుంది.

అసూయ

అసూయ దుర్గుణాల్లో ఓ గుణం. ముస్లిం దాని నుండి దూరంగా ఉండడం తప్పనిసరి. ఎందుకనగా, అల్లాహ్ తన దాసులకు పంచిన దానిలో ఆక్షేపించినట్లగును. అల్లాహ్ ఆదేశం గమించండి:

[أَمْ يَحْسُدُونَ النَّاسَ عَلَى مَا آتَاهُمُ اللَّهُ مِنْ فَضْلِهِ] {النساء 54}

“ఇతరులను చూసి వారు అసూయపడటానికి కారణం అల్లాహ్ వారికి తన అనుగ్రహాన్ని ప్రసాదించాడనా?”. (నిసా 4:54).

అసూయ రెండు రకాలు:

1. మనిషి ఒక వ్యక్తి వద్ద ఉన్న ధనం, లేక విద్య లేక అధికారం లాంటి వరం నశించిపోయి తనకు లభించాలని కాంక్షించడం.

2. ఒకరి వద్ద ఉన్న ఓ అనుగ్రహం అది అతనికి లభించకున్నా ఆ వ్యక్తి వద్ద ఉండకుండా నశించిపోవాలని కోరడం. ఇవి రెండూ నిషిద్ధం.

ముఖ్య గమనిక:  ఒక వ్యక్తి వద్ద ఉన్న అనుగ్రహం నశించిపోవాలని కాంక్షించకుండా తనకు కూడా అలాంటిదే కావాలని కోరడం అసూయ అనబడదు.

మోసం

ముస్లిం తన సోదరుల పట్ల మంచి చేయువాడు, అందుకు అతను ఏ ఒక్కరికీ మోసం చేయడు. తనకిష్టమైనది తన సోదరుని కొరకు ఇష్టపడతాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు.

«مَنْ غَشَّنَا فَلَيْسَ مِنَّا»

మోసము చేయువాడు మాలోని వాడు కాడు”. (ముస్లిం 101).

أَنَّ رَسُولَ اللهِ مَرَّ عَلَى صُبْرَةِ طَعَامٍ فَأَدْخَلَ يَدَهُ فِيهَا، فَنَالَتْ أَصَابِعُهُ بَلَلًا فَقَالَ: «مَا هَذَا يَا صَاحِبَ الطَّعَامِ؟» قَالَ أَصَابَتْهُ السَّمَاءُ يَا رَسُولَ اللهِ، قَالَ: «أَفَلَا جَعَلْتَهُ فَوْقَ الطَّعَامِ كَيْ يَرَاهُ النَّاسُ، مَنْ غَشَّ فَلَيْسَ مِنِّي»

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి ఓ ధాన్యముల కుప్ప నుండి దాటుతూ అందులో చెయ్యి వేశారు. వేళ్లకు తడి అంటింది. “ఇదేమిటి ఓ వ్యాపారి?” అని అడిగారు. ‘వర్షము కురిసినందు వలన తడిసినవి (అయితె వాటిని నేను క్రింద ఉంచాను) ప్రవక్తా’ అని జవాబిచ్చాడు ఆ ధాన్యాల యజమాని. “అదే పైన ఎందుకు ఉంచలేదు, ప్రజలకు తెలిసేది కదా. మోసము చేయువారు మాలోని వారు కారు”. అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హెచ్చరించారు. (ముస్లిం 102).

గర్వం

మానవుడు తనకున్న విద్యకారణంగా ఒక్కోసారి గర్వానికి గురి అవుతాడు. ఇక ఇతరులపై, లేక విజ్ఞానులపై పెత్తనం చూపుతూ, వారిని చిన్న చూపుతో చూస్తాడు.

ఒక్కో వ్యక్తి తనకు ఉన్న ఆస్తి, సంపదల కారణంగా గర్వానికి లోనయి, ఈ మూలంగా ప్రజల ఎడల అహంకారభావంతో మసులుకుంటాడు.

ఒక్కో మనిషి తనకున్న బలం, శక్తి లేక తాను చేసే ఆరాధన లాంటి పనులతో గర్వానికి గురవుతాడు.

కాని నిజమైన ముస్లిం గర్వహాంకారాలకు గురికాకుండా దాని నుండి దూరంగా, జాగ్రత్తగా ఉంటాడు. ఇబ్లీసును స్వర్గం నుంచి వైదొలిగించింది అతని గర్వం, అహంకారమేనన్న విషయం ముస్లిం గుర్తించాలి. ఆదం అలైహిస్సలాంకు సజ్దా చేయి అని అల్లాహ్  అతన్ని ఆదేశించినప్పుడు అతడు: “నేను అతడికంటే శ్రేష్ఠుణ్ణి. నీవు నన్ను అగ్నితో సృష్టించావు. అతన్ని మట్టితో” అని అన్నాడు. అల్లాహ్ కారుణ్యం నుండి అతను దూరం కావడానికి ఇదేకారణం అయింది.

గర్వం, అహంకారభావం చికిత్స ఏమిటనగా ప్రతి వ్యకి తనకు అల్లాహ్ నొసంగిన అనుగ్రహాల్లో అది; విద్య, లేక ధనం, లేక ఆరోగ్యం మొదలయినవి ఏవైనా, అల్లాహ్ ఏ క్షణంలోనైనా తిరిగి తన నుంచి తీసుకునే శక్తిగలవాడు అని తెలుసుకోవాలి.

నైతిక గుణాలు ఆర్జించు మార్గాలు

 మనిషి ఏ గుణాలపై స్థిరపడ్డాడో వాటిని మార్చడం మానవ నైజానికే అతికష్టం అనడంలో సందేహం ఏ మాత్రం లేదు. అయినా అది అసాధ్యం, అసంభవం కాదు. కొన్ని సాధనాలు, వివిధ మార్గాలున్నాయి వాటి ఆధారంగా మనిషి సద్గుణాలు ఆర్జించవచ్చును. వాటిలో:

1- సలామతుల్‌ అఖీద (విశ్వాస శుద్ది): విశ్వాసం మహోత్తరమైన విషయం. సర్వసాధారణంగా మనిషి నడవడిక, స్వభావం, అతని ఆలోచనకు, విశ్వాసానికి, అతను అవలంభించిన ధర్మానికి ప్రత్యక్ష రూపంగా ఉంటుంది. విశ్వాసులలో అత్యుత్తమ సద్వర్తనగలవాడే వారిలో సంపూర్ణ విశ్వాసం గలవాడు. విశ్వాసం సరిగ్గా ఉంటే ప్రవర్తన కూడా చక్కగా ఉంటుంది. సరియైన విశ్వాసంగల వ్యక్తికి అతని ఆ విశ్వాసం సత్యత, దాతృత్వం, సంయమనం, శూరత్వం సద్గుణాలను ప్రోత్సహిస్తుంది. అదే విధంగా అబద్ధం, పిసినారితనం, కోపం. అజ్ఞానం మొదలయిన దుర్గుణాల నుండి హెచ్చరిస్తుంది.

2 దుఆ: అది గొప్ప ద్వారం. ఒక దాసుని కొరకు అది తెరువబడుతే అల్లాహ్ వైపు నుండి దాతృత్వం, మేళ్ళు, శుభాలు కురుస్తునే ఉంటాయి. సద్గుణ సంపన్నుడవ్వాలని, దుర్గుణాలకు దూరంగా ఉండాలని కోరువారు అల్లాహ్ సన్నిధిలోకి చేరుకొని, ఆయనతో మొరపెట్టుకోవాలి. అల్లాహ్ అతనికి సద్గుణాలు ప్రసాదించాలని, దుర్గుణాల నుండి దూరముంచాలని. ఈ విషయంలో మరియు ఇతర విషయాల్లో దుఆ చాల ప్రయోజన కరమైనది. అందుకే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వినయ, వినమ్రతతో అల్లాహ్ ను చాలా వేడుకునే, అర్థించేవారు. తక్బీరే తహ్రీమ తరువాత చదివే దుఆలలో అప్పుడప్పుడు ఇలా కూడా దుఆ చేసేవారు.

اَللَّهُمَّ اهْدِنِي لِأَحْسَنِ الْأَخْلَاقِ لَا يَهْدِي لِأَحْسَنِهَا إِلَّا أَنْتَ، وَاصْرِفْ عَنِّي سَيِّئَهَا لَا يَصْرِفْ عَنِّي سَيِّئَهَا إِلَّا أَنْتَ

అల్లాహుమ్మహ్ దినీ  లిఅహ్ సనిల్‌ అఖ్‌లాఖి, లా యహ్ దీ లిఅహ్ సనిహా ఇల్లా అన్‌త, వస్రిఫ్ అన్నీ సయ్యిఅహా, లా యస్రిఫ్ అన్నీ సయ్యిఅహా ఇల్లా అన్‌ “. (ముస్లిం 771).

భావం: ఓ అల్లాహ్! నీవు నాకు సద్గుణాలు ప్రసాదించు. నీవు తప్ప మరెవ్వడూ సద్గుణాలు ప్రసాదించ లేడు. ఓ అల్లాహ్! నన్ను దుర్గుణాల నుండి దూరముంచు, నీవు తప్ప మరెవ్వరూ దుర్గుణాల నుండి దూరముంచలేడు.

3- ముజాహద: (ప్రయత్నం, కృషి) ఈ ప్రక్రియలో “ముజాహద” చాల ప్రయోజనకరంగా ఉంటుంది. ఎవడు సద్గుణాలు అలవర్పుకోటానికి దుర్గుణాలను వదులుకోడానికి ముజాహద చేస్తాడో అతనికి అనేక మేళ్ళు లభించును. భయంకరమైన కీడు అతని నుండి దూరమగును. కొన్ని గుణాలు సహజమైనవి. మరికొన్ని ఆర్జించవలసి యుంటాయి. అవి శిక్షణ, అభ్యాసముతో వస్తాయి.

మనిషి “ముజాహద” ఒక సారి, రెండు సార్లు లేక కొంచెం ఎక్కువసార్లు చేసి విడనాడకూడదు. జీవితాంతం చేస్తునే ఉండాలి. ఎందుకనగ ఈ “ముజాహద” ఆరాధనలో లెక్కిచబడుతుంది. అల్లాహ్ ఆదేశం చదవండి:

[وَاعْبُدْ رَبَّكَ حَتَّى يَأْتِيَكَ الْيَقِينُ]

“తప్పకుండా చివరి గడియ వచ్చే వరకు నీ ప్రభువు దాస్యం చేస్తూవుండు”. (హిజ్ర్‌ 15:99)

4: “ముహాసబ”:  చెడ్డ పని చేసినప్పుడు తన ఆత్మను విమర్శించి, మరోసారి ఆ చెడ్డపనికి అది పాల్పడకుండా ఉంచే ప్రయత్నం చెయ్యాలి.

5: సద్వర్తన వల్ల సంభవించే ప్రభావాలను యోచించాలి. ఏ విషయం యొక్క ఫలితం ఎలా ఉంటుందో తెలుసుకుంటే, వాటి సత్పలితాల్ని గ్రహిస్తే, అవి చేయుట మరియు చేయుటకు ప్రయత్నించుట సులభమగును.

6: దుర్గుణాల దుష్పలితం పట్ల చింతన చేయాలి. దుర్గుణం వల్ల కలిగే శాశ్వత బాధ, విడదీయని రోధ, పశ్చాత్తాపం, అనుతాపం, ప్రజల మనస్సుల్లో ద్వేషాలు పెరగటం లాంటి విషయాల్ని గమనించాలి (ఇలా దుర్గుణాల నుండి దూరముండ గలుగుతాడు).

7 ఆత్మశుద్ధి చేసుకోలేననే నిరాశకు గురికాకూడదు. విశ్వాసి నిరాశచెందుట మంచి విషయం కాదు. ఎన్నటికీ అది అతనికి తగనిది. తన సంకల్పాన్ని దృఢపరుచుకొని, సంపూర్ణంగా ఆత్మశుద్ధి చేయుటకు ప్రయత్నం చేయాలి. దానిలో ఉన్న లోపాల్ని లేకుండా చేసే ప్రయత్నం చేయాలి.

8: మందహాసము, చిరునవ్వుతో ఉండాలి. ముఖము చిట్లించి, మాడ్పు ముఖముతో ఉండకూడదు. ఒక వ్యక్తి తన ముస్లిం సోదరున్ని కలిసినప్పుడు చిరునవ్వు నవ్వుట “సదఖా” చేసినంత సమానం. దానిపై అతనికి పుణ్యం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా శుభవార్త ఇచ్చారు.

«تَبَسُّمُكَ فِي وَجْهِ أَخِيكَ لَكَ صَدَقَةٌ»

“నీ సోదరున్ని కలిసి చిరునవ్వునవ్వుట నీకు “సదఖా” చేసినంత సమానం”. (తిర్మిజి 1956).

మరో సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారు.

«لَا تَحْقِرَنَّ مِنَ الْمَعْرُوفِ شَيْئًا، وَلَوْ أَنْ تَلْقَى أَخَاكَ بِوَجْهٍ طَلْقٍ»

“ఏ ఒక చిన్న సత్కార్యాన్ని చిన్నచూపుతో చూడకు. అది నీ సోదరున్ని మందహాసముతో కలియుట అయినా సరే”. (ముస్లిం 2626).

9: చూచి చూడనట్లు ఉండాలి. ఇది మహాపురుషుల గుణం. ఈ గుణం వలన ప్రేమ ఎక్కువకాలం ఉంటుంది, (ప్రేమ లేని వారిలో ప్రేమ) కుదిరింపజేస్తుంది. శతృత్వాన్ని నశింపజేస్తుంది.

10: సంయమనం, సహనం: అది సద్గుణాల్లో అతి గొప్పది. జ్ఞానుల ఉన్నతమైన గుణం. సంయమనం అంటే ఆగ్రహం కలిగినప్పుడు దాన్ని దిగమింగుట. సంయమనం అంటే ఆ గుణంగల వ్యక్తికి కోపం రాకూడదు అని కాదు. ఆగ్రహం పెంచే కారణాల ఊబిలో చిక్కుకొని తీవ్రకోపానికి గురైనప్పుడు తనను తాను ఓదార్చుకోవాలి. ఒక వ్యక్తిలో సంయమనం గుణం చోటు చేసుకుందంటే  అతన్ని ప్రేమించేవారి సంఖ్య పెరుగుతుంది. అతన్ని ద్వేషించేవారి సంఖ్య తరుగుతుంది. అతని స్థానం ఉన్నతం అవుతుంది.

11.మూర్ఖుల తెరువుకు పోకుండ ఉండుట: మూర్ఖుల జోలికి పోనివాడు తన మానాన్ని కాపాడుకుంటాడు. తనకు తాను తృప్తిగా ఉంటాడు. వారి నుండి బాధాకరమైన  మాటలు వినకుండా శాంతిపొందుతాడు. అల్లాహ్ ఇలా ఆదేశించాడు.

[خُذِ الْعَفْوَ وَأْمُرْ بِالْعُرْفِ وَأَعْرِضْ عَنِ الْجَاهِلِينَ]

“మృదుత్వం, మన్నింపుల వైఖరిని అవలంబించు. మంచిని ప్రబోధించు. మూర్ఖులతో వాదానికి దిగకు” (వారి తెరువుకు పోకు) (ఆరాఫ్ 7:19).

12: దూషించవద్దు: తిట్లు, దుషణాలకు అతి దూరంగా ఉండాలి.

13: బాధను మరచిపోవాలి: నీకు ఎవరైనా బాధ కలిగిస్తే దాన్ని మరచిపో. అతని పట్ల నీ మనుస్సులో కల్మషం లేకుండా ఉండు. అతనితో భయపడకుండా ఉండు. తమ సోదరుల తరపు నుండి కలిగిన బాధను మరువకుండా గుర్తుంచుకునేవారిలో, వారి పట్ల ప్రేమ ఉండదు. అలా మరువనివారు వారితో కలిసి జీవితం గడుపలేరు. ఎంత మరువగలుగుతావో అంత బాధను మరచిపో.

14: మన్నింపు వైఖరి అవలంబించుకో: చెడు చేసినవారికి ప్రతీకారంగా మంచి  చేయాలి. స్థానాలు ఉన్నతం కావడానికి ఇది ఒక సబబు (కారణం). అందులో శాంతి ఉంది. ప్రతీకారంతో తృప్తిపడే మనస్సుకు (ఆ అవకాశము ఇవ్వకుండా) నిరోధించినట్లగును.

15: దాతృత్వం: దాతృత్వం ప్రశంసనీయమైనది. పిసినారితనం నిందార్హమైనది. దాతృత్వం ప్రేమను ఆకర్షిస్తుంది. శతృత్వాన్ని దూరం చేస్తుంది. మంచి ప్రస్తావన సంపాదించి, తప్పిదాలను, లోటుపాట్లను కప్పిఉంచుతుంది.

16: అల్లాహ్ వద్ద ప్రతిఫలం పొందే నమ్మకం ఉండాలి. మహోన్నతమైన గుణాలు ఆర్జించడానికి సహాయపడే విషయాల్లో ఇది అతి గొప్పది. ఓపిక, ముజాహద, ప్రజల నుండి బాధలు, కష్టాలు భరించుటకు కూడా ఇది సహాయ పడుతుంది. విశ్వాసునికి తన సద్గుణాలకు, ఆత్మను అదుపులో ఉంచు కున్నందుకు అల్లాహ్ ప్రతిఫలం ఇచ్చేవాడున్నాడని విశ్వసించినప్పుడు మరింత ఎక్కువ సద్గుణాలు ఆర్జించడానికి ప్రయత్నిస్తాడు. ఈ దారిలో ఎదురయ్యే కష్టాలు కూడా తేలికగా ఏర్పడుతాయి.

17: కోపం నుండి దూరముండాలి. కోపం ఒక అగ్ని. అది గుండెల్లో మంటలు లేపుతుంది. దౌర్జన్యం చేయాలని, ప్రతీకారం తీసుకోవాలని, తృప్తి పొందాలని ప్రోత్సహిస్తుంది. మనిషి తనకు కోపం వచ్చినప్పుడు తన మనుస్సును అదుపులో ఉంచుకుంటే తన మానాన్ని, గౌరవాన్ని కాపాడుకోగలుగుతాడు. తర్వాత హీనమైన సాకులు చెప్పే పరిస్థితికి, పశ్చాత్తాపానికి దూరంగా ఉంటాడు. (కోపం ఎంత చెడ్డదో క్రింది హదీసు ద్వారా తెలుస్తుంది).

أَنَّ رَجُلًا قَالَ لِلنَّبِيِّ : أَوْصِنِي، قَالَ: «لاَ تَغْضَبْ» فَرَدَّدَ مِرَارًا، قَالَ: «لاَ تَغْضَبْ»

అబూ హూరైరా రజియల్లాహు అన్హు కథనం: ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి ‘నాకు ఏదైనా ఉపదేశించండి’ అని అర్ధించాడు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం “కోపగించుకోకు” అని బోధించారు. ఆ వ్యక్తి దాని తరువాత కూడా మాటిమాటికి ‘ఉపదేశించండి’ అని అర్ధించసాగాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రతీసారి “కోపగించుకోకు” అని మాత్రమే బోధించారు. (బుఖారి 6116).

18- ఉద్దేశ్యపూర్వకమైన ఉపదేశాన్ని, నిర్మాణాత్మకమైన విమర్శనను స్వీకరించాలి. తనలో ఉన్న లోపం అతనికి తెలుపబడుతే దాన్ని స్వీకరించి దాన్ని దూరం చేసుకోవాలి. తన లోపాల పట్ల తాను తెలిసి తెలియనట్లు ఉండిపోతే. ఆత్మశుద్ధి సంపూర్ణంగా చేయలేడు.

19: ఒక మనిషికి ఏ పని చేయాలని నిర్ణయంచబడిందో దాన్ని అతడు పరిపూర్ణముగా చెయ్యాలి. అలా తను చీవాట్లకు, ఎత్తిపొడుపులకు, గద్ధింపులకు, నీచమైన సాకులు చెప్పుట నుండి దూరముంటాడు.

20: తప్పు జరిగితే దాన్ని ఒప్పుకోవాలి. బొంకులాడకుండా జాగ్రత్త  పడాలి. ఇది సద్గుణానికి ఒక చిహ్నం. ఎలాంటి అబద్దం చెప్పకుండ ఉండాలి. తప్పును ఒప్పుకొనుట ఘనతగల విషయం. అలా ఆ వ్యక్తి ప్రఖ్యాతి ఇనుమడింపజేయబడుతుంది.

21: సత్యం ఆవశ్యకమైనది. దాని ప్రభావం ప్రశంసనీయమైనది. సత్యం వలన మనిషి గౌరవం, మర్యాద, స్థానం పెరుగుతుంది. అది అసత్య కసటు, వ్యాకులం, పరితాపం, హీనత్వ సాకుల నుండి కాపాడుతుంది. ప్రజలు అతనికి చేసే కీడు నుండి, అతడు నమ్మకద్రోహి కాకుండా రక్షిస్తుంది. అతనిలో గౌరవం, ధైర్యం ఆత్మ విశ్వాసం (సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌) తెఛ్చిపెడుతుంది.

22: చెడు చేసినవారిని మాటిమాటికి చీవాట్లు పెట్టుట, ఎత్తిపొడుచుట మానుకోవాలి. ఆ దుర్గుణం ఆగ్రహాన్ని ఆహ్వానిస్తుంది. శతృత్వానికి కారణభూతమవుతుంది. కష్టతరమయిన విషయాలు వినవలసి వస్తుంది. జ్ఞానుడు, బుద్ధిమంతుడు ప్రతి చిన్న పెద్ద విషయంపై తన సోదరుల్ని చీవాట్లు పెట్టడు. తాను ఓ హేతువు వెతుకుతాడు. ఒక వేళ చీవాట్లు పెట్టవలసి ఉంటే అది మృదువుగా, మంచి విధంగా ఉండాలి.

23: సద్గుణులు, మంచివాళ్ళకు తోడు (దోస్తాన) ఉండాలి. సద్గుణ సంపన్నుడుగా మార్చే విషయాల్లో ఇది అతిగొప్పది. మంచిని మనుస్సులో నాటుకొని యుండుటకు ముఖ్యకారణం అవుతుంది.

24: పరస్పర సంభాషణ, సమావేశ పద్దతులను పాటించాలి. ఆ పద్దతులు ఇవి: మాట్లాడే వ్యక్తి మాట శ్రద్ధతో వినాలి. మధ్యలో మాట ఆపవద్దు. అబద్దం చెబుతున్నాడని (నిందించవద్దు). హేళన చేయవద్దు. మాట పూర్తి కాక ముందు సమావేశం నుండి వెళ్ళ వద్దు.

ఇంకా: సలాం చేస్తూ సమావేశంలో పాల్గొనాలి. సలాం చేస్తూ బైటికి రావాలి. సమావేశాల్లో ఇతరులకు చోటు కల్పించాలి. కూర్చున్న వ్యక్తిని లేపి అతని చోట కూర్చోవద్దు. కలసి కూర్చున్న ఇద్దరిలో వారి అనుమతి లేకుండా విడదీయ వద్దు. ఒక్కరిని వదలి ఇద్దరు పరస్పరం రహస్యంగా మాట్లాడుకోవద్దు.

25: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) జీవిత చరిత్ర చదువుతూ ఉండాలి. అది దాన్ని చదివేవారి ముందు మానవత ఎరిగిన దానికంటే ఒక గొప్ప ఆదర్శాన్నిచూపుతుంది. మానవ జీవిత సరళిలో ఒక సంపూర్ణ మార్గం ఉంచుతుంది

26: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సహచరుల చరిత్రను కూడా చదువుతూ ఉండాలి.

27: సద్గుణాలకు సంబంధించిన రచనలు చదవాలి. అవి సద్గుణాలను బోధిస్తూ, వాటి ఘనత తెలుపుతాయి. వాటిని ఆర్జించటానికి సహాయ పడుతాయి. దుర్గుణాల నుండి హెచ్చరిస్తాయి. వాటి దుష్ఫలితాన్ని, వాటి నుండి దూరముండే విధానాన్ని తెలుపుతాయి.

%d bloggers like this: