3వ అధ్యాయం
తౌహీదు యొక్క నిర్ధారణ చేసినవారు విచారణ లేకుండా స్వర్గంలో చేరుతారు
అల్ ఖవ్లుల్ సదీద్ షర్హ్ కితాబ్ అత్ తౌహీద్ – ఇమామ్ అస్-సాదీ
The famous commentary of Shaykh as-Sa’di of the book Kitab at-Tawhid of Muhammad ibn Abdul Wahhab.
إِنَّ إِبْرَاهِيمَ كَانَ أُمَّةً قَانِتًا لِّلَّهِ حَنِيفًا وَلَمْ يَكُ مِنَ الْمُشْرِكِينَ
అల్లాహ్ (త’ఆలా) ఆదేశం: “నిజానికి ఇబ్రాహీమ్ తనకు తానే ఒక సంఘం (ఉమ్మహ్). అల్లాహ్ కు పరమ విధేయుడు. ఆయన యందే మనస్సు నిలిపినవాడు. అతను ఎన్నడూ ముష్రిక్ గా ఉండలేదు?” (సూరహ్ నహ్ల్ 16:120).
وَالَّذِينَ هُم بِرَبِّهِمْ لَا يُشْرِكُونَ
“… మరియు ఎవరు తమ ప్రభువునకు ఇతరులను భాగస్వామ్యులుగా చేయరో (వారే మేళ్ళ వైపునకు పరుగులు తీసేవారు)“ (సూరహ్ మూ’మినూన్ 23:59).
హుసైన్ బిన్ అబ్దుర్ రహ్మాన్ కథనం: నేను సఈద్ బిన్ జుబైర్ వద్ద ఉండగా “నిన్న రాత్రి రాలి పడిన నక్షత్ర చుక్కను ఎవరు చూశారు?” అని అడిగారాయన. “నేను చూశాను. అప్పుడు నేను నమాజులో లేను, కాని విషపురుగు కాటేసినందున బాధతో ఉన్నాను”. అని చెప్పాను. “అయితే నీవు ఏమి చేశావు ?” అని ఆయన ప్రశ్నించారు. “రుఖ్యా (మంత్రం) చదివాను” అని జవాబిచ్చాను. “ఎందుకు అలా చేశావు?” అని ఆయనడిగారు. “షాతబి మాకు ఒక హదీసు వినివించారు (దాని ఆధారంగా నేను చదివాను)” అనిచెప్పాను. “ఆయన ఏ హదీసు మీకు వినిపించారు” అని ఆయన అడిగారు. నేను చెప్పాను: “బురైద బిన్ హుసయ్యిబ్ ఉల్లేఖించిన ఒక హదీసు మాకు వినిపించారు. ఆయన చెప్పారు: “దిష్టి తగిలితే మరియు విషపురుగు కాటేస్తే తప్ప మంత్రించకూడదు” అని. “ఎవరు విన్న హదీసుపై ఆచరించారో వారు మంచి పని చేశారు” అని సఈద్ చెప్పి. మాకు ఇబ్నె అబ్బాసు (రది అల్లాహు అన్హు) ఈ హదీసు వినిపించారు ” అన్నారు. ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు: “నాకు వివిధ అనుచర సమాజాలను చూపించడం జరిగింది. (వారికి సారథ్యం వహిస్తూ) ప్రవక్తలు నా ముందు నుంచి వెళ్ళసాగారు. అప్పుడు కొందరు ప్రవక్తల వెనక ఓ చిన్న సమూహం ఉంది. కొందరు ప్రవక్తల వెనక ఒక్కొక్క వ్యక్తి మాత్రమే ఉంటే, మరికొందరి ప్రవక్తల వెనక ఇద్దరేసి వ్యక్తులు ఉండేవారు. అసలు ఒక్క మనిషి కూడా తమ వెనుక లేని ప్రవక్తలు కూడా వారిలో ఉన్నారు. ఆ తరువాత నాకు ఒక పెద్ద జన సమూహము కన్పించింది. అది నా అనుచర సమాజం కావచ్చని భావించాను. కాని ఆ సమూహం హజ్రత్ మూసా (అలైహిస్సలాం), ఆయన అనుచర సమాజమని నాకు తెలియజేయబడింది. ఆ తరువాత జన సమూహం మరొకటి చూశాను. అప్పుడు ఈ జన సమూహం మీ అనుచర సమాజమే. వీరిలో డెబ్బయ్ వేల మంది ఎలాంటి విచారణ, శిక్ష లేకుండానే స్వర్గంలో ప్రవేశిస్తారు” అని తెలుపబడింది.
ఆ తరువాత ప్రవక్త లేచి వెళ్ళిపోయారు. (డెబ్బై వేల మంది ఎవరయి ఉంటారో) అని కొందరు అనుచరులు పరస్పరం మాట్లాడుకుంటూ “బహుశ వారు ప్రవక్త మైత్రిత్వం (స్నేహం) పొందిన వారు కావచ్చు” అన్నారు. మరి కొందరు “వారు ఇస్లాంలోనే పుట్టి ఏ మాత్రం షిర్క్ చేయని వారు కావచ్చు” అని అన్నారు. ఇలా చర్చించూకుంటూ ఉండగా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వచ్చేశారు. వారందరూ చర్చించుకున్న విషయాలను ప్రవక్తకు తెలిపారు. అప్పుడు ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) “వారు మంత్రాలు చేయించుకునేవారు కారు, దుశ్శకునాలను పాటించరు, వాతలతో చికిత్స చేయించుకోరు. వారు తమ ప్రభువును మాత్రమే నమ్ముకొని (ఏ కష్టమొచ్చినా) ఆయన మీదే ఆధారపడతారు” అని విశదీకరించారు.
ప్రవక్త అనుచరుల్లో ఉక్కాషా బిన్ మిహ్సన్ లేచి నిలబడి “ప్రవక్తా! నేను వారిలో ఒకరిని కావాలని మీరు దుఆ చేయండి” అని కోరాడు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) చెప్పారు: “నీవు వారిలో ఒకడివి”. ఇది చూసి మరో వ్యక్తి లేచి “ప్రవక్తా! నేను వారిలో ఒకరిని కావాలని మీరు దుఆ చేయండి” అన అడిగాడు. ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) చెప్పారు: “ఉక్కాషా నీ కంటే ముందు ఈ సదవకాశాన్ని ఉపంయోగించుకున్నాడు”. (బుఖారి, ముస్లిం).
ముఖ్యాంశాలు:
1. తౌహీద్ విషయంలో ప్రజల స్థానాల్లో వ్యత్యాసం గలదు.
2. తౌహీద్ యొక్క భావం స్పష్టమయింది.
3. ప్రవక్త ఇబ్రాహీం ముష్రికులలోని వారు కారు అని అల్లాహ్ వారిని ప్రశంసించాడు.
4. షిర్క్ నుండి దూరమున్న ఔలియా అల్లాహ్ లను (అల్లాహ్ భక్తులను) ప్రశంసించబడింది.
5. మంత్రం చేయించుట, వాతలు వేయించుటను మానుకొనుట “తౌహీద్ యొక్క తహ్ఖీఖ్” చేసినట్టగును.
6. పై హదీసులో వచ్చిన గుణాలు అలవరచుకొనుట అల్లాహ్ పై “భరోసా” (నమ్మకం, ఆధారం) చాలా ఉన్నట్టు
7. ఈ హదీసు ద్వారా ప్రవక్త సహచరుల అపారవిద్య తెలుస్తుంది. (ఆ డెబ్బై వేల మంది అల్లాహ్ దయ తరువాత) వారి సత్కార్యాలతోనే (విచారణ, శిక్ష లేకుండా) స్వర్గ ప్రవేశానికి అర్హులవుతారు.
8. సహాబీలు మంచి విషయాల్లో మున్ముందుగా ఉండడానికి ఎంతగా కాంక్షించేవారో తెలుస్తుంది.
9. ముహమ్మద్ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) “ఉమ్మతీలు” (అనుచర సమాజం) ఉన్నత స్థానంలో, సంఖ్యలో ఇతర ప్రవక్తల “ఉమ్మతీల” (అనుచరుల) కంటే ఎక్కువగా, శ్రేష్ఠులుగా ఉన్నట్టు తెలుస్తుంది.
10. ప్రవక్త మూసా (అలైహిస్సలాం) “ఉమ్మతీల” ఘనత కూడ తెలుస్తుంది.
11. ప్రవక్త ఎదుట గత “ఉమ్మతీలందరు” ప్రత్యక్షమయ్యారు.
12. ప్రతీ “ఉమ్మత్” తమ ప్రవక్త వెంట వచ్చును.
13. ప్రవక్తలను అనుసరించిన ప్రజలు అల్ప సంఖ్యాకులు అని తెలుస్తుంది.
14. ఏ ప్రవక్తను విశ్వసించిన వారు ఎవరూ ఉండరో, ఆ ప్రవక్త ఒంటరిగా వచ్చును.
15. దీని వల్ల తెలిసిందేమిటంటే: మెజారిటి ఉన్నప్పుడు విర్రవీగ వద్దు. మైనారిటిగా ఉన్నప్పుడు చింతించవద్దు.
16. విష పురుగు కాటు వేసినా, దిష్టి తగిలినా (రుఖ్యా) మంత్రం చేయించుట ధర్మసమ్మతం.
17. సఈద్ బిన్ జుబైర్ “ఎవరు విన్న హదీసుపై ఆచరించాలో వారు మంచి పని చేశారు” అని అన్న పదంతో పూర్వీకులు విద్యలో ఎంత ఆరితేరిన వారో తెలుస్తుంది. ఇంకా; వీరు చెప్పిన హదీసు మరియు హుసైన్ బిన్ అబ్దుర్ రహ్మాన్ చెప్పిన హదీసులో తేడా ఏ మాత్రం లేదు.
18. పూర్వ పండితులు అనవసర ప్రశంసల నుండి దూరంగా ఉుండేవారు.
19. ఉక్కాషాకు “నీవు వారిలో ఒకడివి అని ప్రవక్త చెప్పడం ప్రవక్త పదవి గుర్తుల్లో ఒకటి.
20. ఉక్కాషా ఘనత (అతడు స్వర్గవాసి అని తెలుపబడుట).
21. ఉక్కాషా తరువాత వ్యక్తికి ప్రవక్త చెప్పిన మాటల ద్వారా సందర్భాన్ని బట్టి స్పష్టంగా కాకుండా సైగల ద్వారా సంక్షిప్తంగా మాట్లాడడం యోగ్యం అని తెలుస్తుంది.
22. ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) నీతి, సత్ప్రవర్తన కూడా ఈ హదీసులో ఉట్టిపడుతుంది.
తాత్పర్యం: (అల్లామా అల్ సాదీ)
ఈ అధ్యాయం దీనికంటే ముందు అధ్యాయాన్ని సంపూర్ణ పరుస్తుంది. ఇది దానికి సంబంధించినదే.
తౌహీద్ యొక్క “నిర్ధారణ” అంటే: పెద్ద షిర్క్, చిన్న షిర్క్ నుండి, వాక్కులోనూ, విశ్వాసంలోనూ, కర్మలలోనూ అన్ని బిద్‌అత్ (కల్పిత ఆచారా)ల నుండి, పాపాల నుండి తౌహీద్‌ను కాపాడుట, శుద్ది పరుచుట. ఇవన్నియు కేవలం అల్లాహ్ ప్రీతి కొరకు మాత్రమే చేయుట. ఎందుకనగా అత్యధికమైన షిర్క్ తౌహీద్‌కు విరుద్ధమైనది. అత్యల్పమైన షిర్క్ సంపూర్ణ తౌహీద్‌కు విరుద్దమైనది. బిద్‌అత్ , పాపాలు తౌహీద్‌ను కలుషితం చేసి, దాని సంపూర్ణత్వానికి అడ్డుపడతాయి. దాని లాభాల నుండి దూరం చేస్తాయి.
తౌహీద్ యొక్క నిర్ధారణ చేసిన వాని హృదయం విశ్వాసం, తౌహీద్, ఇఖ్లాస్ (సంకల్పశుద్ది)తో నిండిపోతుంది. తన ఆచరణ దాన్ని సత్యపరుస్తుంది. అది ఏ విధంగా అనగా: అల్లాహ్ యొక్క సమస్త ఆదేశాలకు అతడు శిరసావహిస్తాడు. అవిధేయతకు పాల్పడి విశ్వాసాన్ని నష్టపరుచుకోడు. అలాంటివాడే స్వర్గంలో విచారణ లేకుండా వెళ్లేవాడు. అందులో ప్రవేశించే మొదటి వ్యక్తి అయ్యేవాడు.
అల్లాహ్ కు పూర్ణ విధేయుడై, అల్లాహ్ పై ధృడమైన నమ్మకం ఉంచి, ఏ ఒక్క విషయంంలో కూడా అల్లాహ్ ను వదలి మానవుల వైపు మరలకుండా, వారిని అడగకుండా ఉండి, అతని బాహ్యం, ఆంతర్యం, మాటలు, చేష్టలు, ప్రేమ, ద్వేషం అన్నియు కేవలం అల్లాహ్ ప్రీతి కొరకే చేయుట , ప్రవక్త అడుగుజాడల్లో నడుచుట తౌహిద్ యొక్క నిర్దారణకు ప్రత్యేక నిదర్శనం.
ఇక్కడ ప్రజల స్థానాల్లో వ్యత్యాసం గలదు. “ప్రతి వ్యక్తి స్థానం అతడు చేసే పనులకు అనుగుణంగా ఉంటుంది.” (6: 132).
ఆశలతో, వాస్తవం లేని మాటలతో తౌహీద్ యొక్క నిర్ధారణ కాదు. మనస్సులో స్థిరమైన విశ్వాసం, ఇహ్సాన్ (ఆరాధనా సౌందర్యం) వాస్తవికతలతో, దానికి తోడుపడే సత్ప్రవర్తన, సత్కార్యాలతో అవుతుంది.
ఈ విధంగా తౌహీద్ యొక్క నిర్ధారణ చేసినవారు ఈ అధ్యాయంలో చెప్పబడిన ఘనతలకు అర్హులవుతారు.
నుండి: ఏకత్వపు బాటకు సత్యమైన మాట (అల్ ఖవ్లుల్ సదీద్ షర్హ్ కితాబ్ అత్ తౌహీద్) – ఇమామ్ అస్-సాదీ [పుస్తకం]