సూరహ్ పరిచయం
ఈ సూరా మక్కా కాలానికి చెందినది. ఇందులో ౩ ఆయతులు ఉన్నాయి. ప్రవక్త ముహమ్మద్ (సల్లలాహు అలైహి వ సల్లం)కు అల్లాహ్ ప్రసాదించిన అనుగ్రహాలను ఈ సూరాలో ముఖ్యంగా ప్రస్తావించడం జరిగింది. మొదటి ఆయతులో వచ్చిన ‘కౌసర్‘ (సమృద్ధి) అన్న పదాన్నే ఈ సూరాకు పేరుగా పెట్టడం జరిగింది. ప్రవక్త ముహమ్మద్ (సల్లలాహు అలైహి వ సల్లం)కు ప్రసాదించబడిన అసంఖ్యాక అనుగ్రహాలను ప్రస్తావిస్తూ, అల్లాహ్ను కొనియాడాలని, ఆయనకు కృతజ్ఞత చూపాలని బోధించడం జరిగింది. అవిశ్వాసుల వైరం, వారి గర్వం ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం)ను ఏమాత్రం నష్టపరచలేవని హామీ ఇవ్వడం జరిగింది.
ఇక్కడ వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి (38 నిముషాలు)
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
సూరతుల్ కౌసర్ – 108
ఇది మక్కాలో అవతరించినది. దీనిలో మూడు ఆయతులున్నాయి. [1]
అనంత కరుణామయుడూ, అపార కృపాశీలుడూ అయిన అల్లాహ్ పేరుతో … | బిస్మిల్లా హిర్రహ్మానిర్రహీమ్ | بِسْمِ اللهِ الرَّحْمَنِ الرَّحِيمِ |
1. (ప్రవక్తా) మేము నీకు కౌసర్ (సరస్సు) [2] ను ప్రసాదించాము. | ఇన్నా అఅతైనా కల్ కౌసర్ | إِنَّا أَعْطَيْنَاكَ الكَوْثَرَ |
2. కనుక నీవు నీ ప్రభువు కొరకు నమాజు చెయ్యి మరియు ఖుర్బానీ చెయ్యి.[3] | ఫశల్లి లి రబ్బిక వన్ హర్ | فَصَلِّ لِرَبِّكَ وَانْحَرْ |
3. నిస్సందేహంగా నీ శత్రువే నామరూపాలు లేకుండా నశించిపోతాడు.[4] | ఇన్న షానిఅక హువల్ అబ్తర్ | إِنَّ شَانِئَكَ هُوَ الأَبْتَرُ |
క్రింద నోట్స్ అహ్సనుల్ బయాన్ నుండి :
[1] ఈ సూరాను సూరత్ అన్ నహ్ర్ గా కూడా వ్యవహరిస్తారు.
[2] కౌసర్ అనే పదం బహుళార్ధకాలకు సంకేతం. దీని అర్ధాలు కూడా అనేకం. ఇబ్నె కసీర్ గారు “అత్యధిక శుభాలు” అన్న అర్దానికి ప్రాధాన్యత ఇచ్చారు. ఎందుకంటే ఇతరత్రా అర్దాలు కూడా ఈ పదంలో ఇమిడి ఉన్నాయి. ఉదాహరణకు ప్రామాణిక హదీసులలో వచ్చిన వివరాల ప్రకారం కౌసర్ అనేది స్వర్గంలో మహాప్రవక్త ముహమ్మద్ (సల్లలాహు అలైహి వ సల్లం)కు వొసగబడే ఒక కాలువ. మరికొన్ని హదీసులలో కౌసర్ అనేది ఒక సరస్సు అని, విశ్వాసులు స్వర్గంలో ప్రవేశించేముందు మహాప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) చేతుల మీదుగా ఆ సరస్సు నీరును త్రాగుతారని, ఆ సరస్సులోకి వచ్చే నీరు కూడా స్వర్గంలోని ఆ కాలువకే చెందింది అయి ఉంటుందని తెలుపబడింది. అలాగే ఇహలోకంలో మహాప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) వారికి లభించిన విజయాలు, కీర్తి ప్రతిష్టలు, పరలోకంలోని పుణ్యఫలాలు – ఇవన్నీ ఈ “అత్యధిక శుభాలు” లోకి వచ్చేస్తాయి. (ఇబ్నె కసీర్).
[3] అంటే నమాజు కూడా కేవలం ఒక్కడైన అల్లాహ్ కొరకే చేయాలి. ఖుర్బానీ కూడా ఒక్కడైన ఆ అల్లాహ్ పేరిటే ఇవ్వాలి. బహుదైవారాధకుల మాదిరిగా ఈ ఖుర్బానీలో ఇతరులను భాగస్వాములుగా చేర్చరాదు. ‘నహ్ర్‘ అంటే ఒంటె గొంతుపై ఈటెతోగానీ, కత్తితోగానీ కొట్టి, ఆ తరువాత దానిని ‘జిబహ్‘ చేయటం అని అసలు అర్థం. అయితే ఇతర పశువులను మాత్రం నేలపై పరుండబెట్టి గొంతు కోయటాన్ని ‘జిబహ్’గా వ్యవహరిస్తారు. కాని ఈ ఆయతులో ‘నహ్ర్’ అంటే అసలు సిసలు అర్థం ఖుర్బానీ. ఇక ఇతరత్రా దానధర్మాలుగా పశువును ఖుర్బానీ చేయటం, హజ్ సందర్భంగా “మినా” పర్వత లోయలో పశువును ఖుర్బానీ చేయటం, బక్రీద్ పండుగ సందర్భంగా ఖుర్బానీ ఇవ్వటం – ఇవన్నీ ఇందులో అంతర్భాగాలే.
[4] “అబ్తర్‘ అంటే తోక తెగటం అని అసలు అర్ధం. ఒకరి వంశపరంపర ముందుకు సాగకుండా ఆగిపోయిన వారిని, పేరు కూడా ప్రస్తావించకుండా వదిలివేసిన అనామకులను ‘అబ్తర్’గా వ్యవహరిస్తారు. మహాప్రవక్త ముహమ్మద్ (సల్లలాహు అలైహి వ సల్లం) వారి మగపిల్లలు చనిపోవటం గమనించిన కొంతమంది అవిశ్వాసులు ఆయన్ని ‘అబ్తర్’గా అవహేళన చేయసాగారు. అప్పుడు అల్లాహ్ ఆయన్ని (సల్లలాహు అలైహి వ సల్లం) ఓదారుస్తూ ఈ వాక్యాలను అవతరింపజేశాడు –
“ఓ ముహమ్మద్ (సల్లలాహు అలైహి వ సల్లం) నీవు అనామకుడవు కావు. నీ విరోధులే అనామకులవుతారు” అని ధైర్యం చెప్పాడు. మహాప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఆడపిల్లల ద్వారానే అల్లాహ్ ఆయన సంతతికి ప్రపంచంలో గొప్ప కీర్తి ప్రతిష్టల్ని ప్రసాదించాడు. ఒకవిధంగా చెప్పాలంటే ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం) అనుచర సమాజమంతా ఆయన బిడ్డల్లాంటివారే. వారి సంఖ్యాబలంపై ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం) ప్రళయదినాన గర్వపడతారు. అదీగాక ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం) గౌరవమర్యాదలను అల్లాహ్ ఎంతగానో పెంచాడు. లోకమంతా నేడు ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం) పేరును ఎంతో భక్తితో, వినయంతో ప్రస్తావిస్తుంది. ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం)పై శాంతీశుభాలు కురవాలని లోకవాసులంతా ప్రార్థిస్తారు. అదే సమయంలో మహాప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) శత్రువులు చరిత్రపుటలకే పరిమితం అయిపోయారు. ఒకవేళ ఎవరయినా వారి ఊసు ఎత్తినా వారిని దుష్టులుగానే చూస్తారుగాని మంచివారుగా చూడరు.
You must be logged in to post a comment.