వివాదం తలెత్తినప్పుడు ఏం చెయ్యాలి? – హబీబురహ్మాన్ జామయి [వీడియో & టెక్స్ట్]

వివాదం తలెత్తినప్పుడు ఏం చెయ్యాలి?
https://youtu.be/xd6M9eObBtY [7 నిముషాలు]
వక్త: షేక్ హబీబుర్రహ్మాన్ జామయి (హఫిజహుల్లాహ్)

విశ్వాసుల మధ్య ఏదైనా వివాదం తలెత్తినప్పుడు ఏమి చేయాలి? ఈ ప్రసంగం ఖురాన్ మరియు ప్రామాణిక హదీసుల వెలుగులో ఈ ప్రశ్నకు సమాధానం ఇస్తుంది. సూరా నిసాలోని 59వ ఆయతును ఉటంకిస్తూ, ఏ విషయంలోనైనా అభిప్రాయ భేదం వస్తే దాని పరిష్కారం కోసం అల్లాహ్ (ఖురాన్) మరియు ఆయన ప్రవక్త (సున్నత్) వైపు మరలాలని స్పష్టం చేస్తుంది. మూడవ వ్యక్తిని లేదా ఒక నిర్దిష్ట పండితుడిని (తఖ్లీద్) గుడ్డిగా అనుసరించడం ఈ ఖురానీయ సూత్రానికి విరుద్ధమని, ఇది ముస్లిం సమాజంలో అనైక్యతకు దారితీస్తుందని వివరిస్తుంది. అంతిమంగా, ఖురాన్ మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సంప్రదాయాన్ని గట్టిగా పట్టుకున్నంత కాలం ముస్లింలు మార్గభ్రష్టత్వానికి గురికారని ప్రవక్త చేసిన హితోపదేశంతో ప్రసంగం ముగుస్తుంది.

ఇన్నల్ హమ్దలిల్లాహి వహ్దహ్, వస్సలాతు వస్సలాము అలా మల్లా నబియ్య బాఅదహ్, అమ్మా బాద్.
అభిమాన సోదరులారా! ధర్మ అవగాహనం అనే ఈ కార్యక్రమంలోకి మీ అందరికీ స్వాగతం. నా ఇస్లామీయ అభివాదం, అస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహ్.

వివాదం తలెత్తినప్పుడు మనం ఏమి చేయాలి? ఈ ప్రశ్నకు సమాధానం ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఏ విషయంలోనైనా వివాదం తలెత్తినప్పుడు మనం ఏమి చేయాలి? ఖురాన్ మరియు ప్రామాణిక హదీసుల్లో దాని పరిష్కారం వెతకాలి.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్ లో ఇలా సెలవిచ్చాడు, సూరా నిసా, ఆయత్ నెంబర్ 59:

فَإِن تَنَٰزَعْتُمْ فِى شَىْءٍ فَرُدُّوهُ إِلَى ٱللَّهِ وَٱلرَّسُولِ
(ఫ ఇన్ తనాజా’తుమ్ ఫీ షైఇన్ ఫరుద్దూహు ఇలల్లాహి వర్రసూల్)
మీ మధ్య వివాదం తలెత్తితే దాన్ని అల్లాహ్‌ మరియు ప్రవక్త వైపుకు మరల్చండి.” (4:59)

ఏ విషయంలోనైనా మీ మధ్య వివాదం తలెత్తితే దాన్ని అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త వైపుకు మరల్చండి. వివాదాస్పదమైన విషయాన్ని అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త వైపుకు మరల్చటం అంటే, నేటి ధార్మిక పరిభాషలో అర్థం, ఖురాన్ మరియు ప్రామాణికమైన హదీసుల వైపుకు మరలటం అన్నమాట. అభిప్రాయ భేదాలను, వివాదాలను పరిష్కరించటానికి ఇది అత్యుత్తమమైన మార్గదర్శక సూత్రం.

ఈ సూత్రం ద్వారా అర్థమయ్యేది ఏమిటంటే, మరో మూడో వ్యక్తిని అనుసరించవలసిన అగత్యం లేదు. అనుసరించాలంటే, అల్లాహ్ ఆయన ప్రవక్త ఆదేశాలను పాటించాలంటే, అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తను అనుసరించటం. మూడో వ్యక్తిని అనుసరించవలసిన అగత్యం లేదన్నమాట. ఈ విషయం బాగా మనం గ్రహించాలి.

ఒకానొక నిర్ణీత పండితున్ని అనుసరించటం, దీనిని తఖ్లీదె ముఅయ్యన అంటారు. అంటే ఒకానొక నిర్ణీత పండితున్ని అనుసరించటం తఖ్లీదె ముఅయ్యన, తఖ్లీదె ముఅయ్యన్ లేక తఖ్లీదె షఖ్సీ తప్పనిసరి అని చెప్పేవారు, అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తతో పాటు మూడో వ్యక్తి అనుసరణను తప్పనిసరిగా ఖరారు చేశారు. దీనికి రూఢీ లేదు.

ఈ దివ్య ఖురాన్ లోని ఈ ఆయతుకు పూర్తిగా విరుద్ధమైన ఈ మూడో వ్యక్తి అనుసరణ, ముస్లింలకు ఐక్య సమాజం, ఉమ్మతె ముత్తహిద కాకుండా, అనైక్య సమాజం, ఉమ్మతె ముంతషిరగా, ఇంకా చెప్పాలంటే, ముస్లిం సమాజ ఐక్యతను దాదాపు దుస్సాధ్యంగా మార్చివేసింది ఈ తఖ్లీదె ముఅయ్యన్, ఈ తఖ్లీదె షఖ్సీ.

కానీ మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం సెలవిచ్చారు?

ఇమాం మాలిక్ రహమతుల్లాహి అలైహి ‘ముఅత్తా’లో ఈ హదీసును ప్రస్తావించారు: మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రవచనం ఇది:

تَرَكْتُ فِيكُمْ أَمْرَيْنِ لَنْ تَضِلُّوا مَا تَمَسَّكْتُمْ بِهِمَا كِتَابَ اللَّهِ وَسُنَّةَ نَبِيِّهِ
(తరక్తు ఫీకుమ్ అమ్రైన్, లన్ తదిల్లూ మా తమస్సక్తుమ్ బిహిమా, కితాబల్లాహి వ సున్నత నబియ్యిహి)

“నేను, మీ మధ్య రెండు వస్తువులను వదలిపోతున్నాను. మీరు ఆ రెండు వస్తువులను గట్టిగా పట్టుకొని ఉన్నంతకాలం సన్మార్గం తప్పరు. సన్మార్గంలోనే ఉంటారు.అవేమంటే, ఒకటి అల్లాహ్ గ్రంథం ఖురాన్. రెండోది, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సంప్రదాయం, సున్నత్.

అంటే, సారాంశం ఏమనగా, వివాదం తలెత్తినప్పుడు మనం మన వివాదాలను అల్లాహ్ మరియు ప్రవక్త వైపుకు మరల్చాలి అన్నమాట. స్వయంగా మనము ఏదీ కూడా కల్పించకూడదు. స్వయంగా ఊహించుకొని నిర్ణయాలు తీసుకోకూడదు. మూడో వ్యక్తికి, నాలుగో వ్యక్తికి ప్రాధాన్యత ఇవ్వకూడదు.

ఏదైనా ధర్మం విషయంలో, న్యాయం చేసే విషయంలో, ఏదైనా ఆరాధనలో, ఏదైనా సరే అల్లాహ్ ను, ఆయన ప్రవక్తను పాటించే విషయంలో, అనుసరించే విషయంలో ఏదైనా వివాదం తలెత్తితే ఏం చేయాలి?

فَإِن تَنَٰزَعْتُمْ فِى شَىْءٍ فَرُدُّوهُ إِلَى ٱللَّهِ وَٱلرَّسُولِ
(ఫ ఇన్ తనాజా’తుమ్ ఫీ షైఇన్ ఫరుద్దూహు ఇలల్లాహి వర్రసూల్)
“ఏ విషయంలోనైనా మీ మధ్య వివాదం తలెత్తితే దాన్ని అల్లాహ్ మరియు ప్రవక్త వైపుకు మరల్చాలి.”

అంటే ఖురాన్ మరియు ప్రవక్త గారి ప్రామాణికమైన హదీసుల వెలుగులో దానికి మనము పరిష్కారం చూపాలి. అదే విషయం మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధించారు: “నేను మీ మధ్య రెండు విషయాలు వదిలిపోతున్నాను. మీరు ఆ రెండు విషయాలను గట్టిగా పట్టుకున్నంతవరకు మార్గం తప్పరు. మార్గభ్రష్టులు అవ్వరు. సన్మార్గంలోనే ఉంటారు, సత్యంలోనే ఉంటారు, న్యాయంలోనే ఉంటారు, ధర్మంలోనే ఉంటారు. ఆ రెండింటిలో ఏ ఒక్కటి వదిలేసినా, ఏ ఒక్క దానిపైన కూడా నిర్లక్ష్యం చూపినా మార్గం తప్పుతారు. ఆ రెండు, ఖురాన్ మరియు మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సున్నత్.”

వ ఆఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహ్.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=43693

ముస్లింలు దేన్ని తమ గీటురాయిగా తీసుకోవాలి? – హబీబుర్రహ్మాన్ జామయి [వీడియో & టెక్స్ట్]

ముస్లింలు దేన్ని తమ గీటురాయిగా తీసుకోవాలి?
వక్త: హబీబుర్రహ్మాన్ జామయి (హఫిజహుల్లాహ్)
https://youtu.be/7wdS1-T5Pkg [15 నిముషాలు]

ఈ ప్రసంగంలో, ముస్లింలు తమ జీవితంలోని ప్రతి విషయంలోనూ, ప్రతి సమస్యలోనూ అంతిమ గీటురాయిగా దైవగ్రంథమైన ఖుర్ఆన్ మరియు ప్రామాణికమైన ప్రవక్త ప్రవచనాలను (హదీసులను) మాత్రమే స్వీకరించాలని వక్త నొక్కి చెప్పారు. పూర్వీకుల ఆచారాలు, వ్యక్తిగత కోరికలు లేదా ఇతరుల అభిప్రాయాలు ఈ రెండు మూలాలకు విరుద్ధంగా ఉంటే వాటిని అనుసరించవద్దని హెచ్చరించారు. అల్లాహ్ అవతరింపజేసిన దాని ప్రకారం తీర్పు చేయకపోవడం యొక్క తీవ్రమైన పరిణామాలను వివరించడానికి సూరహ్ మాయిదాలోని వాక్యాలను ఉదహరించారు. అలాంటి చర్యలను అవిశ్వాసం (కుఫ్ర్), దుర్మార్గం (జుల్మ్), మరియు అవిధేయత (ఫిస్ఖ్)గా వర్గీకరించారు. అల్లాహ్ చట్టం కంటే తమ చట్టం గొప్పదని భావించి తీర్పు ఇవ్వడం (పెద్ద కుఫ్ర్) మరియు అల్లాహ్ చట్టం యొక్క ఆధిక్యతను విశ్వసిస్తూనే ప్రాపంచిక కోరికల కారణంగా దానిని ఉల్లంఘించడం (చిన్న కుఫ్ర్) మధ్య ఉన్న వ్యత్యాసాన్ని స్పష్టం చేశారు. సమాజంలోని వివాదాలు మరియు తగాదాలకు దైవిక చట్టాన్ని ప్రమాణంగా విడిచిపెట్టడమే కారణమని ఒక హదీసుతో ప్రసంగాన్ని ముగించారు.

అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వల్ ఆఖిబతు లిల్ ముత్తఖీన్ వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ అంబియాయి వల్ ముర్సలీన్ వమన్ తబిఅహుమ్ బి ఇహ్సానిన్ ఇలా యౌమిద్దీన్ అమ్మా బాద్.

అభిమాన సోదరులారా, ధర్మ అవగాహనం అనే ఈ కార్యక్రమంలోకి మీ అందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు.

ఈ రోజు మనం ముస్లిములు దేనిని తమ గీటురాయిగా తీసుకోవాలి అనే విషయం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.

ప్రియ వీక్షకులారా, సాధారణంగా మనం మన సమాజంలో చూసేది ఏమిటి? ఏదైనా తీర్పు ఇవ్వాలన్నా, ఏదైనా సమస్యకి పరిష్కారం చూపించాలన్నా, నిర్ణయించాలన్నా, ఈ ఆచారం మా తాత ముత్తాతల నుంచి వస్తా ఉంది, మా అమ్మానాన్న ఇలాగే నేర్పించారు, మా గురువులు ఇలాగే చేసేవారు, అది న్యాయమైనా, అన్యాయమైనా, సత్యమైనా, అసత్యమైనా, ఇది పక్కన పెట్టి, న్యాయం-అన్యాయం, సత్యం-అసత్యం, మంచి విధానం, చెడు విధానం, కరెక్టా కాదా ఇవి పక్కన పెట్టి, ముందు నుంచి వస్తా ఉంది కాబట్టి కొనసాగిస్తున్నారు. కాకపోతే ఇస్లాంలో అలా చెల్లదు.

ముస్లిములు దైవగ్రంథమైన ఖుర్ఆన్ మరియు అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రవచనాలు అంటే ప్రామాణికమైన హదీసులను గీటురాయిగా తీసుకోవడం తప్పనిసరి, విధి అని మనం తెలుసుకోవాలి. అమ్మానాన్నతో నేర్చుకోవాలి, కాకపోతే అమ్మానాన్న, తల్లిదండ్రులు దేనిని గీటురాయిగా తీసుకుని నేర్పించారు? గురువులతో తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. కానీ ఆ గురువులు దేనిని గీటురాయిగా తీసుకుని మనకి నేర్పించారు? విజ్ఞులతో, జ్ఞానులతో, పండితులతో తెలుసుకోవాలి. కాకపోతే వారు దేనిని గీటురాయిగా తీసుకుని మనల్ని నేర్పించారు అనేది ముఖ్యమైన విషయం, తెలుసుకోవలసిన విషయం.

అభిమాన సోదరులారా, ప్రతి విషయంలో, అమ్మానాన్న విషయంలో, భార్యాపిల్లల విషయంలో, ఇరుగుపొరుగు వారి విషయంలో, బంధుమిత్రుల విషయంలో, స్నేహితుల విషయంలో, అనాథల విషయంలో, వితంతువుల విషయంలో, ఇరుగుపొరుగు వారి విషయంలో, అది వ్యాపారమైనా, వ్యవసాయమైనా, ఉద్యోగమైనా, రాజకీయపరమైనా, ఏ రంగంలోనైనా సరే ఒక తీర్పు ఇస్తే, ఒక పరిష్కారం చేస్తే అది అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా యొక్క ఆదేశాలు మరియు అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క విధానం ప్రకారంగానే ఉండాలి. ఖుర్ఆన్ మరియు హదీసులు మాత్రమే గీటురాయిగా మనం తీసుకోవాలి, చేసుకోవాలి.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూరహ్ మాయిదా, ఆయత్ 49లో ఇలా సెలవిచ్చాడు:

وَاَنِ احْكُمْ بَيْنَهُمْ بِمَاۤ اَنْزَلَ اللّٰهُ وَلَا تَتَّبِعْ اَهْوَاۤءَهُمْ
(వ అనిహ్కుమ్ బైనహుమ్ బిమా అన్జలల్లాహు వలా తత్తబిఅ అహ్వాఅహుమ్)

(ఓ ప్రవక్తా!) అల్లాహ్‌ అవతరింపజేసిన దానికనుగుణంగానే నీవు వారి మధ్య తీర్పు చేయి. వాళ్ళ కోరికలను ఎంత మాత్రం అనుసరించకు.”  (5:49)

అంటే, నీవు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పంపిన చట్టం ప్రకారం ప్రజల వ్యవహారాలను పరిష్కరించు. ఏదైనా తీర్పు ఇస్తే, ఏదైనా సమస్యకి పరిష్కారం చూపిస్తే అది అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా యొక్క ఆదేశం ప్రకారం ఉండాలి, అల్లాహ్ యొక్క చట్ట ప్రకారం ఉండాలి, అల్లాహ్ యొక్క ఆజ్ఞ పరంగా ఉండాలి.

وَلَا تَتَّبِعْ اَهْوَاۤءَهُمْ
(వలా తత్తబిఅ అహ్వాఅహుమ్)
వారి కోరికలను ఎంత మాత్రం అనుసరించకు.

వారు బంధువులని, స్నేహితులని, మిత్రులని, తెలిసిన వారని, లేకపోతే వారు సమాజంలో వారు హోదాలో మంచి హోదాలో, మంచి పొజిషన్‌లో ఉన్నారని, ఆ ఉద్దేశంతో తీర్పు చేయకూడదు. వారు ఎవ్వరైనా సరే, అమ్మ, నాన్న, భార్య, పిల్లలు, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు, ఇరుగుపొరుగు వారు, స్నేహితులు, గురువులు, తెలిసిన వారు, తెలియని వారు ఎవ్వరైనా సరే. ధనవంతులు, పేదవారు, ఉన్నవారు, లేనివారు ఎవ్వరైనా సరే అందరికీ ఒకటే ధర్మం, అందరికీ ఒకటే న్యాయం, అందరికీ ఒకటే విధానం.

وَاَنِ احْكُمْ بَيْنَهُمْ بِمَاۤ اَنْزَلَ اللّٰهُ
(వ అనిహ్కుమ్ బైనహుమ్ బిమా అన్జలల్లాహ్)
(ఓ ప్రవక్తా!) అల్లాహ్‌ అవతరింపజేసిన దానికనుగుణంగానే నీవు వారి మధ్య తీర్పు చేయి.”

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా చట్టం ఏమిటి? అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా యొక్క ఆదేశం ఏమిటి? ఆయన యొక్క ఆజ్ఞ ఏమిటి? ఆయన ఏ విధంగా మనకు సెలవిచ్చాడు? మరియు దానికి అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ విషయంలో ఆయన ప్రవచనం ఏమిటి? ఆయన విధానం ఏమిటి? ఇది మనకు తప్పనిసరి.

ఇదే ఆయత్‌లో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా చివరి భాగంలో ఇలా సెలవిచ్చాడు:

وَاِنَّ كَثِيْرًا مِّنَ النَّاسِ لَفٰسِقُوْنَ
(వ ఇన్న కసీరమ్ మినన్నాసి లఫాసిఖూన్)
 “ప్రజల్లో చాలా మంది అవిధేయులే ఉంటారు.“(5:49)

ఫాసిఖ్ అంటే అవిధేయుడు, కరప్ట్, దురాచారి. అంటే ప్రజలలో చాలా మంది అల్లాహ్ ఆజ్ఞలకు, ఆదేశాలకు విరుద్ధంగా తీర్పుని ఇస్తున్నారన్నమాట. పట్టించుకోవటం లేదు. నేను ఎవరిని నమ్ముతున్నాను? ఎవరి పట్ల నేను విశ్వాసం కలిగి ఉన్నాను? ఎవరి కలిమా నేను చదువుతున్నాను? ఎవరి విధేయత నేను చూపాలి? ఎవరిని నేను ఆదర్శంగా తీసుకున్నాను? ఇవి కాకుండా, మనోమస్తిష్కాలకు గురై, ప్రపంచ వ్యామోహానికి గురై, ఏదో ఒక కారణంగా అల్లాహ్ ఆదేశాలను, అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రవచనాలను పక్కన పెట్టి, మన కోరికల పరంగా, లేకపోతే వారు బంధువులని, తెలిసిన వారని, ఉన్న వారని, ఏదో ఒక సాకుతో వారికి అనుగుణంగా, వారి కోరికలకు సమానంగా తీర్పు ఇవ్వకూడదు అన్నమాట.

అభిమాన సోదరులారా, ఈ వాక్యంలో అల్లాహ్ ఏం తెలియజేశాడు? ఎవరైతే అల్లాహ్ ఆదేశాలను కాకుండా, అల్లాహ్ చట్టపరంగా కాకుండా, దానికి విరుద్ధంగా తీర్పునిస్తే వారు ఫాసిఖ్, అవిధేయులు, కరప్టెడ్, దురాచారులు అని అల్లాహ్ తెలియజేశాడు. అలాగే, అదే సూరహ్, సూరహ్ మాయిదా వాక్యం 45లో అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

وَمَنْ لَّمْ يَحْكُمْ بِمَاۤ اَنْزَلَ اللّٰهُ فَاُولٰٓئِكَ هُمُ الظّٰلِمُوْنَ
(వమల్లమ్ యహ్కుమ్ బిమా అన్జలల్లాహు ఫ ఉలాఇక హుముజ్జాలిమూన్)
అల్లాహ్‌ అవతరింపజేసిన దానికనుగుణంగా తీర్పు ఇవ్వనివారే దుర్మార్గులు.” (5:45)

ఎవరైతే అల్లాహ్ ఆదేశం ప్రకారం, అల్లాహ్ చట్టం ప్రకారం తీర్పు ఇవ్వకపోతే, వారు దుర్మార్గులు. అంటే అల్లాహ్ చట్టం ప్రకారం తీర్పు ఇవ్వని వారే దుర్మార్గులు, దౌర్జన్యులు అని అల్లాహ్ సెలవిచ్చాడు. అంటే, అల్లాహ్ చట్టం ప్రకారం, అల్లాహ్ ఆదేశం ప్రకారం, అనగా ఖుర్ఆన్ మరియు హదీసుల పరంగా తీర్పు ఇవ్వకపోతే, వారు జాలిమీన్, దుర్మార్గులు, దౌర్జన్యపరులు అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సెలవిచ్చాడు. అలాగే అదే సూరహ్, ఆయత్ 44 లో ఇలా సెలవిచ్చాడు:

وَمَنْ لَّمْ يَحْكُمْ بِمَاۤ اَنْزَلَ اللّٰهُ فَاُولٰٓئِكَ هُمُ الْكٰفِرُوْنَ
(వమల్లమ్ యహ్కుమ్ బిమా అన్జలల్లాహు ఫ ఉలాఇక హుముల్ కాఫిరూన్)
ఎవరు అల్లాహ్‌ అవతరింపజేసిన వహీ ప్రకారం తీర్పు చెయ్యరో వారే (కరడుగట్టిన) అవిశ్వాసులు.” (5:44)

అభిమాన సోదరులారా, ఈ విషయం మనం బాగా గమనించాలి. ఒకే సూరహ్ లో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వాక్యం 44, అదే సూరహ్ వాక్యం 45, అదే సూరహ్ వాక్యం 49లో, అల్లాహ్ చట్టం ప్రకారం, అల్లాహ్ ఆదేశాల ప్రకారం తీర్పు ఇవ్వకపోతే, ఒక ఆయతులో ఫాసిఖీన్ అన్నాడు, వారు ఫాసిఖులు, దౌర్జన్యపరులు, దురాచారులు అన్నారు. ఇంకో ఆయతులో జాలిమూన్ అన్నాడు, దౌర్జన్యపరులు, దుర్మార్గులు అన్నాడు. ఇంకో ఆయతులో కాఫిరూన్ అన్నాడు, అంటే వారు అవిశ్వాసులు.

అంటే ఇంత గమనించే విషయం ఇది. మనము జీవితానికి సంబంధించిన అది విశ్వాసం అయినా, ఆరాధన అయినా, వ్యాపారం అయినా, వ్యవసాయం అయినా, రాజకీయం అయినా, నడవడిక అయినా, ఏదైనా సరే, ఏ విషయంలోనైనా సరే మనము తీర్పు ఇవ్వాలంటే గీటురాయిగా తీసుకోవాలంటే అది అల్లాహ్ ఆదేశం, అంతిమ దైవప్రవక్త యొక్క ప్రవచనం.

అభిమాన సోదరులారా, అలా చేయకపోతే ఇస్లాంకు వ్యతిరేకమైన చట్టాలను అమలు చేయడాన్ని ధర్మ సమ్మతంగా భావించడం, ఇస్లాంకు వ్యతిరేకంగా, ఖుర్ఆన్‌కి వ్యతిరేకంగా, అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రవచనాలకు వ్యతిరేకంగా అమలు చేయడాన్ని ఇది కరెక్టే, సమ్మతమే అని భావించడం కుఫ్ర్ అక్బర్ అవుతుంది. పెద్ద అవిశ్వాసం. అంటే ఆ వ్యక్తి ఇస్లాం నుంచి తొలగిపోతాడు.

ఇబ్నె బాజ్ రహమతుల్లాహి అలైహి ఇలా సెలవిచ్చారు, ఎవరైనా తీర్పు ఇస్తే, అది రెండు రకాలుగా ఉంటుంది అన్నారు.

మొదటి రకం ఏమిటి? (ఇదా హకమ బిగైరి మా అన్జలల్లాహ్) అల్లాహ్ చట్టం ప్రకారం కాకుండా, అల్లాహ్ యొక్క ఆదేశాలకు విరుద్ధంగా తీర్పు ఇస్తే, ఎందుకు ఇస్తున్నాడు ఆ తీర్పు ఆ వ్యక్తి? (యఅతఖిదు హల్ల దాలిక్), అతని ఉద్దేశం ఏమిటి? నేను ఇచ్చే తీర్పు, దీంట్లో పరిష్కారం ఉంది ఆ సమస్యకి. అల్లాహ్ ఆదేశంలో ఆ పరిష్కారం లేదు, నా తీర్పులో ఆ పరిష్కారం ఉంది అని భావించి ఆ తీర్పు ఇస్తే, లేదా (అవ అన్న దాలిక అఫ్దల్), నా తీర్పు, నా నిర్ణయం, నా న్యాయం అల్లాహ్ ఆదేశం కంటే గొప్పది, మేలైనది అని భావిస్తే, (అవ్ అన్నహు యుసావి లిష్షరిఅ), లేకపోతే నా తీర్పు కూడా అల్లాహ్ తీర్పుకి సమానంగానే ఉంది, షరిఅత్‌కి సమానంగానే ఉంది అనే ఉద్దేశంతో తీర్పు ఇస్తే, (కాన కాఫిరన్ ముర్తద్దన్), ఆ వ్యక్తి కాఫిర్ అయిపోతాడు, ముర్తద్ అయిపోతాడు. అంటే ఇస్లాం నుంచి తొలగిపోతాడు.

ఏ ఉద్దేశంతో? నేను ఇచ్చే న్యాయం తీర్పు, నేను చేసే న్యాయం, నేను అవలంబించే విధానం ఇది అల్లాహ్ ఆదేశం కంటే గొప్పది లేదా దానికి సరైనది, సమానంగా ఉంది అని ఆ ఉద్దేశంతో భావించి తీర్పు ఇస్తే, అటువంటి న్యాయం, అటువంటి తీర్పు, అటువంటి వ్యక్తి ఇస్లాం నుంచి తొలగిపోతారు, కాఫిర్ అవిశ్వాసి అయిపోతారు, ముర్తద్ అయిపోతారు.

రెండో రకమైన తీర్పు ఏమిటి? (అమ్మా ఇదా హకమ బిగైరి మా అన్జలల్లాహ్), అల్లాహ్ చట్టానికి విరుద్ధంగా, అల్లాహ్ ఆదేశానికి విరుద్ధంగా తీర్పు ఇస్తున్నాడు, ఉద్దేశం ఏమిటి? (లిహవా), తన కోరికలకి అనుగుణంగా, కోరికలకి బానిసైపోయి ఇస్తున్నాడు, కోరికలను పూర్తి చేసుకోవటానికి. (అవ్ లిమకాసిద్ సయ్యిఅ) చెడు ఉద్దేశం కోసం, చెడు కారణాల కోసం. (అవ్ లితమఇన్), లేకపోతే ఏదో ఒక ఆశించి. (అవ్ లిర్రిశ్వా) లంచం కోసం. నేను అల్లాహ్ యొక్క ఆదేశానికి విరుద్ధంగా తీర్పు ఇస్తే నాకు ఇంత డబ్బు వస్తుంది, లంచం వస్తుంది, ధనం వస్తుంది, ఈ ఉద్దేశంతో తీర్పు ఇస్తే, అంటే అతని మనసులో అతని విశ్వాసం, అతని నమ్మకం ఏమిటి? నా తీర్పు అల్లాహ్ ఆదేశానికి విరుద్ధంగా ఉంది, ఇది తప్పే. కాకపోతే నేను ఈ విధంగా తీర్పు ఇస్తే నాకు ప్రపంచపరంగా, ఆర్థికపరంగా నాకు డబ్బు వస్తుంది, ధనం వస్తుంది, నా కోరికలు పూర్తి అవుతాయి అని ఈ దురుద్దేశంతో తీర్పు ఇస్తున్నాడు. మనసులో మాత్రం అల్లాహ్ తీర్పే గొప్పది అని నమ్మకం ఉంది. అటువంటి వ్యక్తి ఘోరమైన పాపాత్ముడు అవుతాడు. దీనిని చిన్న షిర్క్ అంటారు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరినీ ప్రతి చిన్న, పెద్ద కుఫ్ర్ నుండి, షిర్క్ నుండి రక్షించుగాక, కాపాడుగాక.

అంటే, నా నిర్ణయం, నా తీర్పు అల్లాహ్ ఆదేశానికి విరుద్ధంగా ఉన్నా నాదే గొప్పది అని భావించి ఇస్తే, అతను పెద్ద కుఫ్ర్, ముర్తద్ అయిపోతాడు. మనోవాంఛలకు, డబ్బుకి ఆశించి, కోరికలకి లోనై తీర్పు ఇస్తే పాపాత్ముడు అవుతాడు, చిన్న కుఫ్ర్ అవుతుంది, చిన్న అవిశ్వాసం అవుతుంది.

అభిమాన సోదరులారా, చివర్లో ఒక్క హదీస్ చెప్పి నేను నా ఈ మాటని ముగిస్తాను. అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు: “వారి నాయకులు దైవగ్రంథం ప్రకారం తీర్పు చేయకుంటే, అల్లాహ్ అవతరింపజేసిన చట్టాన్ని ఎన్నుకోకుంటే, అల్లాహ్ వారి మధ్యన వివాదాలను, తగాదాలను సృష్టిస్తాడు.” ఈ హదీస్ ఇబ్నె మాజాలో ఉంది.

ఇప్పుడు పూర్తి సమాజంలో, ప్రపంచంలో మన పరిస్థితి ఏమిటి? మనకి అర్థమవుతుంది. మనం ఎందుకు ఈ విధంగా వివాదాలకు గురై ఉన్నాము, తగాదాలకు గురై ఉన్నాము అంటే, మన తీర్పులు, మన వ్యవహారాలు, మనం చేసే విధానము, మనం తీసుకున్న గీటురాయి అది ఖుర్ఆన్ మరియు హదీస్ కాదు. మనం తీసుకున్న గీటురాయి అది అల్లాహ్ ఆదేశాలు, అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రవచనాలు కాదు.

ఎప్పుడైతే మనం అల్లాహ్ ఆదేశాల పరంగా తీర్పు ఇవ్వమో, అల్లాహ్ ఆదేశాలను, అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రవచనాలను గీటురాయిగా తీసుకోమో, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మన మధ్య వివాదాలను, తగాదాలను సృష్టిస్తాడు. అది ఇప్పుడు మనము కళ్ళారా చూస్తున్నాము.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరినీ ఖుర్ఆన్ మరియు ప్రామాణికమైన హదీసులను గీటురాయిగా తీసుకునే సద్బుద్ధిని ప్రసాదించుగాక. ప్రతి విషయంలో, ప్రతి సమస్యలో, ప్రతి సమయంలో అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త యొక్క ఆదేశాలను గీటురాయిగా తీసుకొని తీర్పునిచ్చే సద్బుద్ధిని అల్లాహ్ మనందరినీ ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరినీ ఇహపరలోకాలలో సాఫల్యం ప్రసాదించుగాక.

వ ఆఖిరు దఅవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు.


ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=43352

సూరతు ఖురైష్ తఫ్సీర్ (వ్యాఖ్యానం) – నసీరుద్దీన్ జామిఈ

ఈ తఫ్సీర్ తయారు చేయడంలో మద్ధతు లభించినది:

1. షేఖ్ మఖ్సూదుల్ హసన్ ఫైజీ హఫిజహుల్లాహ్ వీడియో ద్వారా.
2. షేఖ్ అబ్దుస్ సలాం భుట్వీ రహిమహుల్లాహ్ వారి తఫ్సీర్ ద్వారా.
3. ప్రఖ్యాతిగాంచిన [ఇబ్ను కసీర్] ద్వారా.

الحمد لله رب العالمين والصلاة والسلام على رسول الله، أما بعد!

لِإِيلَافِ قُرَيْشٍ ۝ إِيلَافِهِمْ رِحْلَةَ الشِّتَاءِ وَالصَّيْفِ ۝ فَلْيَعْبُدُوا رَبَّ هَذَا الْبَيْتِ ۝ الَّذِي أَطْعَمَهُم مِّن جُوعٍ وَآَمَنَهُم مِّنْ خَوْفٍ

ఖురైషులను అలవాటు చేసిన కారణంగా, (అంటే) చలికాలపు, ఎండాకాలపు ప్రయాణాలకు వారిని అలవాటు చేసిన కారణంగా, వారు ఈ (కాబా) గృహం యెక్క ప్రభువునే ఆరాధించాలి. ఆయనే వారికి ఆకలిగొన్నప్పుడు అన్నం పెట్టాడు. భయాందోళనల స్థితిలో భద్రత కల్పించాడు.

ఇది ‘సూరా ఖురైష్’ పేరుతో పిలువబడుతుంది. ఈ సూరా మొదటి ఆయత్ లోనే ‘ఖురైష్’ అనే పదం వచ్చింది. మరియు ప్రత్యేకంగా ఈ సూరా ‘ఖురైష్’ (మక్కాలోని తెగ) వారి గురించి అవతరించింది. అల్లాహ్ ఈ సూరాలో, ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పై విశ్వాసం తీసుకురావాలని మరియు వారు కాబా గృహం పట్ల గౌరవం చూపాలని ఖురైష్ లకు ఆదేశించాడు.

నిజానికి, ఈ పూర్తి సూరా ఖురైష్ గురించే అవతరించింది. ఇమామ్ బైహకీ (రహిమహుల్లాహ్) తన పుస్తకం ‘అల్-ఖిలాఫియాత్’ లో మరియు అల్లామా అల్బానీ (రహిమహుల్లాహ్) తన ‘అస్-సహీహా’ లో ఉల్లేఖించిన హదీసు ప్రకారం, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు:

فَضَّلَ اللَّهُ قُرَيْشًا بِسَبْعِ خِلَالٍ: أَنِّي فِيهِمْ، وَأَنَّ النُّبُوَّةَ فِيهِمْ، وَالْحِجَابَةَ، وَالسِّقَايَةَ فِيهِمْ، وَأَنَّ اللَّهَ نَصَرَهُمْ عَلَى الْفِيلِ، وَأَنَّهُمْ عَبَدُوا اللَّهَ عَشْرَ سِنِينَ لَا يَعْبُدُهُ غَيْرُهُمْ، وَأَنَّ اللَّهَ أَنْزَلَ فِيهِمْ سُورَةً مِنَ الْقُرْآنِ

“అల్లాహ్ ఖురైష్ కు ఏడు ప్రత్యేకతలను ఇచ్చాడు, అవి మరే తెగకు ఇవ్వలేదు: నేను (ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం) ఖురైష్ వంశానికి చెందినవాడిని. వారిలో నుండే అల్లాహ్ ప్రవక్తలను ఎన్నుకున్నాడు. అల్లాహ్ తన పవిత్ర గృహం (బైతుల్లాహ్ – కాబా) సేవ కోసం, హాజీలకు నీరు త్రాగించడం కోసం వీరినే ఎంపిక చేశాడు. అల్లాహ్ ఏనుగుల సైన్యం (అసహబె ఫీల్) పై, అంటే అబ్రహా మరియు అతని సైన్యం పై, ఖురైష్ లకు అద్భుతమైన రీతిలో సహాయం చేశాడు (వారిని కాపాడాడు).ప్రవక్త పదవికి ముందు, పది సంవత్సరాల పాటు వీరు మాత్రమే అల్లాహ్ ను ఆరాధించేవారు, వీరితో పాటు వేరెవరూ లేరు. అల్లాహ్ వారి గౌరవార్థం ఒక పూర్తి సూరాను అవతరింపజేశాడు, అదే ‘సూరా ఖురైష్’. (అల్ ఖిలాఫియాత్: బైహఖీ 1517, సహీహా 1944).

ఈ సూరాలో అల్లాహ్ మక్కా వాసులకు, ప్రత్యేకంగా ఖురైష్ కు తన అనుగ్రహాలను గుర్తు చేశాడు. ఆ అనుగ్రహాలను అర్థం చేసుకోవడానికి, ఖురైష్ ల పరిస్థితి ఎలా ఉండేదో ఒక్కసారి చూడాలి. హజ్రత్ ఇబ్రహీం (అలైహిస్సలాం) తన కుమారుడు ఇస్మాయిల్ (అలైహిస్సలాం) ను మక్కాలో వదిలినప్పుడు, అక్కడ బనూ జుర్హుమ్ అనే తెగ యెమెన్ నుండి వచ్చి వారితో పాటు స్థిరపడింది. హజ్రత్ ఇస్మాయిల్ (అలైహిస్సలాం) వారిలోనే వివాహం చేసుకున్నారు, అలా వారంతా కలిసిపోయారు.

కాలం గడిచేకొద్దీ, హజ్రత్ ఇస్మాయిల్ (అలైహిస్సలాం) మరియు హజ్రత్ ఇబ్రహీం (అలైహిస్సలాం) బోధనలు మరుగున పడిపోయాయి. వారిలో కుఫ్ర్ (అవిశ్వాసం) మరియు షిర్క్ (బహుదైవారాధన) తో పాటు అన్యాయం కూడా పెరిగిపోయింది. అల్లాహ్ కు అన్యాయం నచ్చదు. అల్లాహ్ [సూరా అల్-హజ్: 25]లో ఇలా తెలిపాడడు:

وَمَن يُرِدْ فِيهِ بِإِلْحَادٍ بِظُلْمٍ نُذِقْهُ مِنْ عَذَابٍ أَلِيمٍ

{మరియు ఎవరైతే ఇందులో (మక్కాలో) అన్యాయంతో కూడిన చెడును తలపెడతారో, వారికి మేము బాధాకరమైన శిక్షను రుచి చూపిస్తాము.}

వారిలో ఈ చెడులు పెరగడంతో, బనూ ఖుజా అనే మరో తెగ వచ్చి వారిపై దాడి చేసి, వారిని ఓడించి మక్కా నుండి తరిమికొట్టింది. జుర్హుమ్ తెగ వారు పారిపోతూ జమ్ జమ్ బావిని పూడ్చివేశారు. అలా మక్కా బనూ ఖుజా చేతిలోకి వెళ్ళింది. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ముత్తాత ఖుసయ్ ఇబ్న్ కిలాబ్ వచ్చే వరకు పరిస్థితి ఇలాగే ఉంది. ఖుసయ్ తన బలాన్ని కూడగట్టుకుని, బనూ ఖుజాను ఓడించి, మక్కాపై తిరిగి ఆధిపత్యం సాధించాడు. ఖురైష్ తెగ చెల్లాచెదురుగా ఉన్నప్పుడు, వారిని ఏకం చేసి మక్కాలో మళ్ళీ స్థిరపరిచాడు. అందుకే ఈ కలయికను ‘ఈలాఫ్‘ (ఐక్యమత్యం/అలవాటు చేయడం) అన్నారు. ‘ఈలాఫ్’ అంటే ఉల్ఫత్ (ప్రేమ/కలయిక) నుండి వచ్చింది. అంటే ఒకే ఆలోచన కలిగిన వారిని ఒక చోట చేర్చడం. అందుకే పుస్తకం వ్రాయడాన్ని ‘తాలీఫ్‘ అంటారు (విషయాలను ఒక చోట చేర్చడం).

ఖురైష్ వారు ఒకే తెగ, ఒకే కుటుంబం కాబట్టి అల్లాహ్ వారిని మళ్ళీ ఏకం చేయడాన్ని ‘ఈలాఫ్’ అన్నాడు. ఇది అల్లాహ్ వారిపై చూపిన గొప్ప దయ. వారు మక్కా నుండి దూరమై, పరాయివారైపోయిన తర్వాత, అల్లాహ్ వారిని మళ్ళీ ఇక్కడ చేర్చాడు.

అల్లాహ్ ఈ సూరాలో ఇలా అంటున్నాడు:

ఇక్కడ ‘లి’ (لِ) అనే అక్షరానికి రెండు అర్థాలు ఉన్నాయి.

ఒక అర్థం: ఇది మునుపటి సూరా ‘అలమ్ తర కైఫ’ (సూరా ఫీల్) కు కొనసాగింపు. అందుకే కొంతమంది పారాయణంలో ‘బిస్మిల్లాహ్’ లేకుండా దీనిని చదువుతారు (అంటే రెండు సూరాలను కలిపి). అంటే అల్లాహ్ ఏనుగుల సైన్యాన్ని ఎందుకు నాశనం చేశాడంటే – ఖురైష్ లకు రక్షణ కల్పించి, వారిని ఏకం చేయడానికి.

రెండవ అర్థం: ‘ఆశ్చర్యం’ (తఅజ్జుబ్) వ్యక్తం చేయడం. అంటే ఖురైష్ ల పరిస్థితి చూసి ఆశ్చర్యం కలగాలి. అల్లాహ్ వారిని ఇంతగా కరుణించి, వారికి రక్షణ కల్పిస్తే, వారు అల్లాహ్ ను వదిలి విగ్రహాలను ఆరాధిస్తున్నారు.

ఇక్కడ మరొక విషయం ఉంది. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తాత హాషిమ్, ఖుసయ్ యొక్క మనవడు. ఇతను చాలా తెలివైనవాడు. అప్పట్లో మక్కా వాసులకు వ్యాపారం తప్ప వేరే ఆధారం లేదు. హాషిమ్ ఆలోచించి, వాణిజ్య యాత్రలను (Trade Journeys) ప్రారంభించాడు. అతను యెమెన్, ఇరాక్, సిరియా (షామ్), మరియు హబషా (ఇథియోపియా) రాజులతో మాట్లాడి ఒప్పందాలు కుదుర్చుకున్నాడు. దీని వల్ల మక్కా వాసులు సురక్షితంగా వ్యాపారం చేసుకోగలిగారు.

సంవత్సరంలో రెండు ప్రధాన ప్రయాణాలు ఉండేవి:

(1) శీతాకాలం (Winter): యెమెన్ వైపు వెళ్ళేవారు (ఎందుకంటే అక్కడ ఆ సమయంలో వాతావరణం వెచ్చగా ఉండేది).
(2) వేసవికాలం (Summer): సిరియా (షామ్) వైపు వెళ్ళేవారు (అక్కడ చల్లగా ఉండేది).

ఈ ప్రయాణాల ద్వారా మక్కా వాసులు ధనవంతులయ్యారు, వారి ఆకలి తీరింది. అల్లాహ్ వారిపై చేసిన ఈ ఉపకారాన్ని గుర్తు చేస్తున్నాడు.

మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, అబ్రహా (ఏనుగుల సైన్యం) మక్కాపై దాడి చేయడానికి వచ్చినప్పుడు, అల్లాహ్ అద్భుతమైన రీతిలో పక్షులతో వారిని నాశనం చేశాడు. దీంతో అరబ్బులందరిలో ఖురైష్ ల పట్ల గౌరవం పెరిగింది. “వీరు అల్లాహ్ ఇంటి రక్షకులు, అల్లాహ్ వీరికి సహాయం చేశాడు” అని అందరూ వీరిని గౌరవించేవారు. ఎంతగా అంటే, వీరి వాణిజ్య బిడారులు (Caravans) ఎక్కడికి వెళ్ళినా ఎవరూ వీరిని దోచుకునేవారు కాదు. మిగతా వారిని దారి దోపిడి దొంగలు దోచుకునేవారు, కానీ ఖురైష్ లను మాత్రం ఎవరూ ముట్టుకునేవారు కాదు. పైగా వీరి రక్షణ కోసం ఒప్పందాలు కూడా ఉండేవి.

అందుకే అల్లాహ్ అంటున్నాడు:

لِإِيلَافِ قُرَيْشٍ ۝ إِيلَافِهِمْ رِحْلَةَ الشِّتَاءِ وَالصَّيْفِ
ఖురైష్ లకు శీతాకాల మరియు వేసవికాల ప్రయాణాలు సులభం చేసి, వాటిని అలవాటు చేసినందుకు (వారు కృతజ్ఞత చూపాలి)

వారు ఈ ప్రయాణాలను ఎంత ధైర్యంగా, నిశ్చింతగా చేసేవారంటే, వారికి దారిలో ఎలాంటి భయం ఉండేది కాదు. అల్లాహ్ వారికి ఇచ్చిన ఈ భద్రత, ఈ ఐక్యత చూసి ఆశ్చర్యం కలుగుతుంది, అయినప్పటికీ వారు అల్లాహ్ ను ఆరాధించడం లేదు.

వారికి ఈ భద్రత రావడానికి కారణం ఈ ఇల్లు (కాబా). అల్లాహ్ మరో చోట [సూర అన్ కబూత్ 29:67]లో ఇలా తెలిపాడు:

أَوَلَمْ يَرَوْا أَنَّا جَعَلْنَا حَرَمًا آمِنًا وَيُتَخَطَّفُ النَّاسُ مِنْ حَوْلِهِمْ

ఏమిటీ, మేము హరమ్‌ను (మక్కా పుణ్యక్షేత్రాన్ని) సురక్షితమైన క్షేత్రంగా చేయటాన్ని వారు చూడటం లేదా? మరి (చూడబోతే) వారి చుట్టుప్రక్కల ఉన్న ప్రజలు ఎగరేసుకుపోబడుతున్నారు (దోచుకోబడుతున్నారు).

చుట్టూ ఉన్నవారిని దోచుకుంటున్నారు, చంపుతున్నారు, కానీ మక్కాలో ఉన్నవారికి మాత్రం పూర్తి రక్షణ ఉంది. అయినా వారు అసత్య దైవాలను నమ్ముతారా? అల్లాహ్ అనుగ్రహాన్ని కాదంటారా?

అల్లాహ్ ను వదలి ఇతరులను ఆరాధిస్తారా. చదవండి అల్లాహ్ ఆదేశం:

إِنَّمَا أُمِرْتُ أَنْ أَعْبُدَ رَبَّ هَٰذِهِ الْبَلْدَةِ الَّذِي حَرَّمَهَا وَلَهُ كُلُّ شَيْءٍ ۖ وَأُمِرْتُ أَنْ أَكُونَ مِنَ الْمُسْلِمِينَ

నేను ఈ నగరం (మక్కా) ప్రభువును మాత్రమే ఆరాధిస్తూ ఉండాలని నాకు ఆదేశించబడింది. ఆయన దీన్ని పవిత్రమైనదిగా (హరమ్) చేశాడు. అన్నింటికీ ఆయనే యజమాని. నేను విధేయులలో ఒకడిగా ఉండాలని కూడా నాకు ఆజ్ఞాపించబడింది. (నమ్ల్ 27:91) [ఇబ్ను కసీర్].

మక్కాలో ఏ పంటలు పండవు, ఏ పండ్ల తోటలు లేవు. అది రాళ్ళతో నిండిన లోయ (వాది గైరి జీ జరా). అయినా అక్కడ ప్రపంచంలోని అన్ని రకాల పండ్లు, ఆహార పదార్థాలు వస్తున్నాయి. అల్లాహ్ వారికి ఆకలి తీరుస్తున్నాడు.

చుట్టుపక్కల అందరూ భయంతో బ్రతుకుతుంటే, ఖురైష్ లకు మాత్రం అల్లాహ్ ఏ భయం లేకుండా చేశాడు. మక్కాలో ఉన్నప్పుడు భయం లేదు, బయట ప్రయాణాల్లో ఉన్నప్పుడు కూడా భయం లేదు.

ముగింపు: దీని సారాంశం ఏమిటంటే, అల్లాహు తఆలా ఖురైష్ కు, మరియు మనందరికీ ఒక పాఠం నేర్పుతున్నాడు. అల్లాహ్ మనకు ఇచ్చిన రెండు గొప్ప వరాలు: 1. ఆకలి నుండి విముక్తి (ఆహారం), 2. భయం నుండి విముక్తి (శాంతి/భద్రత). ఎవరికైతే ఈ రెండు ఉన్నాయో, వారు అల్లాహ్ కు కృతజ్ఞతగా ఆయనను మాత్రమే ఆరాధించాలి.

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఒక హదీసులో ఇలా అన్నారు:

مَنْ أَصْبَحَ مِنْكُمْ آمِنًا فِي سِرْبِهِ، مُعَافًى فِي جَسَدِهِ، عِنْدَهُ قُوتُ يَوْمِهِ، فَكَأَنَّمَا حِيزَتْ لَهُ الدُّنْيَا

మీలో ఎవరైతే ఉదయం లేచేసరికి తన కుటుంబంలో (లేదా తన గూటిలో) సురక్షితంగా ఉంటారో, శరీర ఆరోగ్యంతో ఉంటారో, మరియు ఆ రోజుకు సరిపడా ఆహారం వారి దగ్గర ఉంటుందో – వారికి ప్రపంచం మొత్తం ఇవ్వబడినట్లే. [సునన్ తిర్మిదీ: 2346. షేఖ్ అల్బానీ రహిమహుల్లాహ్ హసన్ అన్నారు].

కాబట్టి, మనకు ఆరోగ్యం, భద్రత, మరియు ఆహారం ఉన్నప్పుడు, మనం మన సమయాన్ని అల్లాహ్ ఆరాధనలో గడపాలి. కేవలం ప్రపంచం వెనుక పరుగెత్తకూడదు. ఎవరైతే అల్లాహ్ ను ఆరాధిస్తారో, అల్లాహ్ వారికి ఇహలోకంలోనూ, పరలోకంలోనూ భద్రతను మరియు ఆహారాన్ని ప్రసాదిస్తాడు.

అల్లాహ్ మనందరికీ తన అనుగ్రహాలను గుర్తించి, ఆయనకు కృతజ్ఞతలు తెలిపే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ మనకు ఆకలి మరియు భయం నుండి రక్షణ కల్పించుగాక. ఆమీన్.

వస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.

* మౌలానా అబ్దుస్ సలాం భుట్వీ రహిమహుల్లాహ్ వారి తఫ్సీర్ లోని కొన్ని విషయాలు చదవండి:

మొదటి ఉపకారం ఏమిటంటే, వారి హృదయాలలో ప్రయాణం పట్ల ప్రేమను కలిగించాడు. వారికి చలికాలం ప్రయాణంలో గానీ, వేసవికాలం ప్రయాణంలో గానీ ఎలాంటి కష్టం అనిపించేది కాదు. మరియు ప్రపంచంలో ప్రయాణమే విజయానికి మార్గం. ఒకవేళ అల్లాహు తఆలా వారి హృదయాలను ప్రయాణానికి అలవాటు చేసి ఉండకపోతే, వారు కూడా తమ ఇళ్లలోనే కూర్చుని ఉండేవారు. ప్రయాణం వల్ల లభించే సిరిసంపదలు, అనుభవం, జ్ఞానం మరియు ప్రపంచంలోని ప్రజలతో, ప్రాంతాలతో ఏర్పడే పరిచయం వారికి ఎప్పటికీ లభించేవి కావు.

ప్రయాణానికి అలవాటు పడటమనే ఈ వరమే ఖురైషీలకు ఆ తర్వాత హిజ్రత్ (వలస) ప్రయాణంలో ఉపయోగపడింది. ఆ తర్వాత అవిశ్వాసులతో యుద్ధంలోనూ, దాని తర్వాత రోమ్ మరియు షామ్, ఇరాక్ మరియు పర్షియా, హింద్ మరియు సింధ్, ఈజిప్ట్ మరియు ఆఫ్రికా, ఇంకా తూర్పు పడమరల విజయాలలో కూడా ఉపయోగపడింది. వాస్తవం ఏమిటంటే, ముస్లిం జాతి ప్రపంచంపై ఆధిపత్యం సాధించడానికి మరియు గెలిచి నిలబడటానికి మొదటి అడుగు ఏమిటంటే, వారు ప్రయాణాలంటే భయపడకూడదు మరియు బయలుదేరే అవకాశం వచ్చినప్పుడు భూమిని పట్టుకుని (ఇక్కడే) ఉండిపోకూడదు. ఇప్పుడు మనం చూస్తున్నాము, అవిశ్వాస జాతులే నేల, నీరు మరియు ఆకాశ మార్గ ప్రయాణాలపై గుత్తాధిపత్యం కలిగి ఉన్నాయి. ముస్లింలు చాలా వరకు ఈ పాఠాన్ని మర్చిపోయారు.

రెండవ ఉపకారం ఏమిటంటే, ఆ సమయంలో అరేబియా అంతటా తీవ్రమైన అశాంతి ఉండేది. ఎవరిపై ఎప్పుడు దాడి జరుగుతుందో, ఎవరిని చంపేస్తారో, లేదా ఎత్తుకెళ్తారో, లేదా ఆస్తిని దోచుకుంటారో మరియు స్త్రీలను, పిల్లలను బానిసలుగా చేసుకుంటారో ఎవరికీ తెలిసేది కాదు. ఇలాంటి పరిస్థితులలో కేవలం మక్కా వాసులకు మాత్రమే ఈ శాంతి (భద్రత) లభించింది, వారి వైపు ఎవరూ కన్నెత్తి కూడా చూసేవారు కాదు. అల్లాహ్ సెలవిచ్చినట్లుగా:

أَوَلَمْ يَرَوْا أَنَّا جَعَلْنَا حَرَمًا آمِنًا وَيُتَخَطَّفُ النَّاسُ مِنْ حَوْلِهِمْ

ఏమిటీ, మేము హరమ్‌ను (మక్కా పుణ్యక్షేత్రాన్ని) సురక్షితమైన క్షేత్రంగా చేయటాన్ని వారు చూడటం లేదా? మరి (చూడబోతే) వారి చుట్టుప్రక్కల ఉన్న ప్రజలు ఎగరేసుకుపోబడుతున్నారు (దోచుకోబడుతున్నారు). [అన్ కబూత్ 29:67]

మూడవ ఉపకారం ఏమిటంటే, హరమ్ (మక్కా) వాసులైనందున వ్యాపార ప్రయాణాలలో ఎవరూ వారి బిడారు (కాఫిలా)ను దోచుకునేవారు కాదు. ప్రతి తెగ మరియు ప్రతి జాతి తమ ప్రాంతం గుండా వెళ్ళే వారి నుండి తీసుకునే పన్నులు వీరి నుండి తీసుకునేవారు కాదు. మరియు వీరిని ఎక్కడికి వెళ్ళకుండా ఆపేవారు కాదు.

నాలుగవది ఏమిటంటే, ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు హజ్ మరియు ఉమ్రా కోసం మక్కాకు వచ్చేవారు మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యాపార సరుకులు ఇక్కడికి చేరేవి. ఇవే కాకుండా, ఇబ్రహీం (అలైహిస్సలాం) ప్రార్థన ఫలితంగా అన్ని రకాల పండ్లు ఇక్కడికి చేరేవి. అల్లాహ్ సెలవిచ్చాడు:

أَوَلَمْ نُمَكِّن لَّهُمْ حَرَمًا آمِنًا يُجْبَىٰ إِلَيْهِ ثَمَرَاتُ كُلِّ شَيْءٍ رِّزْقًا مِّن لَّدُنَّا وَلَٰكِنَّ أَكْثَرَهُمْ لَا يَعْلَمُونَ

ఏమిటి? మేము వారికి సురక్షితమైన, పవిత్రమైన చోట స్థిరనివాసం కల్పించలేదా? అక్కడ వారికి అన్ని రకాల పండ్లు ఫలాలు ఉపాధి రూపంలో మావద్ద నుంచి సరఫరా చేయబడలేదా? కాని వారిలోని చాలా మంది (ఈ యదార్థాన్ని) తెలుసుకోరు. (ఖసస్ 28:57).

ఇబ్రాహీం అలైహిస్సలాం చేసిన దుఆ ప్రస్తావన సూర బఖర (2:126), సూర ఇబ్రాహీం (14:37)లో చూడవచ్చును. [mnj],

ఈ వ్యాపార ప్రయాణాలు మరియు మక్కా వ్యాపారానికి యజమానులైనందున ఖురైషీలు అత్యంత ధనవంతులుగా ఉండేవారు. మరియు హరమ్ యొక్క శుభం (బర్కత్) వల్ల శాంతి భద్రతలను కూడా పొంది ఉండేవారు. స్పష్టంగా ఈ వరాలన్నీ అల్లాహ్ ఇంటి బర్కత్ వల్లనే లభించాయి మరియు కేవలం ప్రభువు ప్రసాదించినవి మాత్రమే. అలాంటప్పుడు, ఈ వరాలన్నీ ఈ ఇంటి యజమాని ఇచ్చినప్పుడు, మీరు ఆ ఒక్కడినే ఎందుకు ఆరాధించరు? మరియు ఇతరులను ఆయనకు సాటిగా కల్పించి వారి ముందు ఎందుకు సాష్టాంగ (సజ్దా) పడుతున్నారు? వారి ఆస్థానాల వద్ద ఎందుకు మొక్కుబడులు చెల్లిస్తున్నారు మరియు కానుకలు సమర్పిస్తున్నారు?

* “లి ఈలాఫి ఖురైష్” (ఖురైషీల హృదయంలో ప్రేమను కలిగించినందువల్ల) ఒకవేళ ఈ ఇతర అసంఖ్యాకమైన వరాల కారణంగా వీరు ఒక్క అల్లాహు తఆలాను ఆరాధించకపోయినా, కనీసం ఈ ఇంటి ప్రభువు అయినందువల్లనైనా ఆయనను ఆరాధించాలి. ఏ ఇంటి బర్కత్ వల్లనైతే వారికి చలి మరియు వేసవిలో ప్రయాణించే అవకాశం, శాశ్వత శాంతి భద్రతలు మరియు సమృద్ధిగా ఉపాధి వరాలు లభిస్తున్నాయో.

ఏ ప్రదేశంలోనైనా శాంతి ఉండటం అల్లాహు తఆలా యొక్క చాలా గొప్ప వరం. మనం కూడా ఉపాధిలో విశాలత మరియు శాంతి లాంటి వరంపై అల్లాహ్ కు కృతజ్ఞతలు తెలుపుకోవాలి మరియు ఆయననే ఆరాధించాలి. అల్లాహ్ కాని వారి ఆరాధన మరియు షిర్క్ (బహుదైవారాధన) నుండి దూరంగా ఉండాలి. షిర్క్ కేంద్రాలను నిర్మించడం మరియు అభివృద్ధి చేయడానికి బదులుగా, తౌహీద్ (ఏక దైవారాధన) కేంద్రాలను నిర్మించి, అభివృద్ధి చేయాలి. ఒకవేళ మనం అలా చేయకపోతే, ఉపాధిలో సంకుచితత్వం మరియు అశాంతి, కల్లోలాలను ఎదుర్కోవాల్సి వస్తుంది, ప్రస్తుతం ఎదుర్కొంటున్నట్లుగా.

దీనికి ఆధారం చూడండి సూరతున్ నహ్ల్ (16:112)లో:

وَضَرَبَ اللَّهُ مَثَلا قَرْيَةً كَانَتْ آمِنَةً مُطْمَئِنَّةً يَأْتِيهَا رِزْقُهَا رَغَدًا مِنْ كُلِّ مَكَانٍ فَكَفَرَتْ بِأَنْعُمِ اللَّهِ فَأَذَاقَهَا اللَّهُ لِبَاسَ الْجُوعِ وَالْخَوْفِ بِمَا كَانُوا يَصْنَعُونَ

అల్లాహ్‌ ఒక పట్నం ఉదాహరణను ఇస్తున్నాడు. ఆ పట్నం ఎంతో ప్రశాంతంగా, తృప్తిగా ఉండేది. దానికి అన్ని వైపుల నుంచీ పుష్కలంగా జీవనోపాధి లభించేది. మరి ఆ పట్నవాసులు అల్లాహ్‌ అనుగ్రహాలపై కృతఘ్నత చూపగా, అల్లాహ్‌ వారి స్వయంకృతాలకు బదులుగా వారికి ఆకలి, భయాందోళనల రుచి చూపించాడు. [ఇబ్ను కసీర్].

సూరహ్ ఇఖ్లాస్ ప్రాముఖ్యత & ఏయే సందర్భాలలో చదవాలి? [వీడియో & టెక్స్ట్]

సూరహ్ ఇఖ్లాస్ ప్రాముఖ్యత & ఏయే సందర్భాలలో చదవాలి?
https://www.youtube.com/watch?v=Ja2OyufkHDQ [3 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో వక్త సూరా అల్-ఇఖ్లాస్ యొక్క గొప్పతనాన్ని మరియు వివిధ సందర్భాలలో దానిని పఠించడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఫజర్, మగ్రిబ్, విత్ర్ మరియు తవాఫ్ నమాజులలో ఈ సూరాను పఠించేవారని తెలిపారు. నిద్రపోయే ముందు ఈ సూరాను మువ్వజతైన్ (సూరా ఫలక్, సూరా నాస్)లతో కలిపి మూడు సార్లు చదివి శరీరంపై తుడుచుకోవడం వల్ల కీడుల నుండి రక్షణ లభిస్తుందని పేర్కొన్నారు. ఉదయం మరియు సాయంత్రం అజ్కార్‌లలో, అలాగే ప్రతి ఫర్జ్ నమాజు తర్వాత దీనిని పఠించడం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ, రోజుకు సుమారు 14 సార్లు ఈ సూరాను పఠించడం ద్వారా అల్లాహ్ ప్రసన్నతను పొందవచ్చని సూచించారు.

ఈ సూరాకు ఇంత గొప్ప ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఏదైతే ఉందో, దాని కారణంగానే ఒక్క రోజులోనే అనేక సందర్భాల్లో చదవడానికి చెప్పడం జరిగింది. ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఫజర్ నమాజులోని రెండవ రకాతు సున్నత్ లో ఈ సూరా చదివేవారు. తవాఫ్ చేసిన తర్వాత రెండు రకాతులు చేస్తారు కదా, అందులో రెండవ రకాతు సున్నత్ తర్వాత చదివేవారు. కొన్ని సందర్భాల్లో మగ్రిబ్ నమాజు లోని రెండవ రకాతులో కూడా చదివేవారు. విత్ర్ నమాజు లోని మూడవ రకాతులో కూడా ఈ సూరా చదువుతూ ఉండేవారు. ఇంకా అనేక సందర్భాలు ఉన్నాయి.

అలాగే ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ యొక్క సూరా ప్రతి ముస్లిం పడుకునే ముందు మూడు సార్లు చదవాలి. దీనితో పాటు సూరతుల్ ఫలక్ మరియు సూరతుల్ నాస్ కూడా చదవాలి అని చెప్పారు. ఇది మనం చదివి ఊదుకున్నామంటే, ఎక్కడి వరకు మన చెయ్యి చేరుతుందో తల పై నుండి, ముఖము మరియు శరీర భాగము, అక్కడ వరకు స్పర్శ చేసుకుంటూ, తుడుచుకుంటూ వెళ్ళాలి, మసాహ్ చేసుకుంటూ. ఈ విధంగా అన్ని రకాల చెడుల నుండి, కీడుల నుండి మనం కాపాడబడతాము అన్నటువంటి శుభవార్త కూడా మనకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు.

అలాగే ప్రతి ఫర్జ్ నమాజు తర్వాత ఒక్కసారి ఈ సూరా మరియు రెండు సూరాలు (ఫలక్, నాస్) కూడా చదవాలని చెప్పడం జరిగింది. అలాగే ఉదయం అజ్కార్ ఏవైతే ఉన్నాయో వాటిలో మూడేసి సార్లు, సాయంకాలం అజ్కార్ ఏవైతే ఉన్నాయో వాటిలో మూడేసి సార్లు చదవాలి. అబూ దావూద్ యొక్క సహీహ్ హదీథ్, “తక్ఫీక మిన్ కుల్లి షై” (నీవు ఉదయం, సాయంత్రం మూడేసి సార్లు ఈ మూడు సూరాలు చదివావంటే, అది నీకు అన్ని రకాల కీడుల నుండి కాపాడడానికి సరిపోతుంది).

ఈ విధంగా మీరు ఆలోచించండి, ఈ సూరా యొక్క ఘనత ఇంత గొప్పగా ఉంది గనక అల్హమ్దులిల్లాహ్, సుమ్మ అల్హమ్దులిల్లాహ్ ఇన్ని సార్లు… టోటల్ ఎన్ని సార్లు అయిందో ఒకసారి ఆలోచించారా మీరు. ప్రతి ఫర్జ్ నమాజు తర్వాత ఒక్కసారి (ఐదు), ఉదయం మూడు సార్లు, సాయంకాలం మూడు సార్లు, రాత్రి పడుకునే ముందు మూడు సార్లు. తొమ్మిది ప్లస్ ఐదు, పద్నాలుగు సార్లు ఈ సూరా మనం చదువుతున్నామా? మనలో ఎవరైనా చదువుతలేరంటే వారు ఎన్ని మేళ్లను కోల్పోతున్నారు? ఎన్ని రకాల శుభాలను కోల్పోతున్నారు? స్వయంగా వారే ఆలోచించుకోవాలి.

అల్లాహ్ యే మనందరికీ ఈ సూరా యొక్క ఘనతను, గొప్పతనాన్ని అర్థం చేసుకొని, దాని యొక్క అర్థ భావాలను మంచి రీతిలో అవగాహన చేసుకొని, దాని ప్రకారంగా మన విశ్వాసాన్ని దృఢపరచుకొని, ఆచరణకు సంబంధించిన విషయాలను సంపూర్ణంగా అల్లాహ్ యొక్క ప్రసన్నత కొరకు ఆచరించే అటువంటి సద్భాగ్యం ప్రసాదించుగాక. మరియు

قُلْ هُوَ اللَّهُ أَحَدٌ
[ఖుల్ హువల్లాహు అహద్]
(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు: “ఆయనే అల్లాహ్, అద్వితీయుడు (ఏకైకుడు).” (112:1)

చెప్పండి అని అల్లాహ్ ఏదైతే ఆదేశించాడో, అందరికీ చెప్పే, తెలియజేసే, ప్రచారం చేసే అటువంటి భాగ్యం కూడా అల్లాహ్ మనకు ప్రసాదించుగాక. ఆమీన్.

వ ఆఖిరు దఅవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.

సూరహ్ ఇఖ్లాస్ (Suratul Ikhlas) – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV3dePHBnlkeXpCe1NBDiPaA

ఖుర్ఆన్ హక్కులు: ఖుర్ఆన్ పై విశ్వాసం – హబీబుర్రహ్మాన్ జామిఈ [వీడియో | టెక్స్ట్]

ఖుర్ఆన్ హక్కులు: ఖుర్ఆన్ పై విశ్వాసం 
Rights of the Quran: Belief in the Quran
https://www.youtube.com/watch?v=oJlAj6X5D2I [9 నిముషాలు]
హబీబుర్రహ్మాన్ జామిఈ (హఫిజహుల్లాహ్) 

ఈ ప్రసంగం ఇస్లాంలో పవిత్ర ఖురాన్ యొక్క ప్రాముఖ్యతను వివరిస్తుంది. వక్త ఖురాన్‌ను ఒక దైవిక గ్రంథంగా మరియు కేవలం ఒక నిర్దిష్ట సమూహానికి మాత్రమే కాకుండా, యావత్ మానవాళికి మార్గదర్శక గ్రంథంగా పరిచయం చేస్తున్నారు. ఇది అల్లాహ్ యొక్క గొప్ప ఆశీర్వాదాలలో ఒకటిగా చెప్పబడింది. విశ్వాసులపై ఖురాన్‌కు ఉన్న హక్కులు ఈ ప్రసంగం యొక్క ప్రధాన అంశం, ప్రత్యేకించి మొదటి హక్కు అయిన దానిపై పూర్తి మరియు అచంచలమైన విశ్వాసం (ఈమాన్) కలిగి ఉండటంపై దృష్టి పెడుతుంది. ఈ విశ్వాసం, ఖురాన్ అల్లాహ్ యొక్క కల్తీ లేని వాక్యమని, జిబ్రయీల్ దూత ద్వారా అంతిమ ప్రవక్త అయిన ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పై అవతరింపజేయబడిందని నమ్మడాన్ని కలిగి ఉంటుంది. అంతేకాక, అల్లాహ్ స్వయంగా ఖురాన్‌ను ఎలాంటి మార్పుల నుండి అయినా సంరక్షిస్తానని హామీ ఇచ్చాడని, ఆ వాగ్దానం 1400 సంవత్సరాలకు పైగా నిజమని నిరూపించబడిందని ఈ ప్రసంగం నొక్కి చెబుతుంది.


إِنَّ الْحَمْدَ لِلَّهِ وَحْدَهُ
(ఇన్నల్ హమ్ దలిల్లాహి వహ్ దహు)
وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى مَنْ لَا نَبِيَّ بَعْدَهُ
(వస్సలాతు వస్సలాము అలా మల్లా నబియ్య బ అ దహు)
أَمَّا بَعْدُ
(అమ్మా బ అద్)

అభిమాన సోదరులారా, కారుణ్య కడలి, రమదాన్ అనే ఈ కార్యక్రమంలోకి మీ అందరికీ స్వాగతం. నా ఇస్లామీయ అభివాదం, అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.

ఈరోజు మనం ఖుర్ఆన్ హక్కులలోని ఒక హక్కు గురించి తెలుసుకోబోతున్నాం. ఇస్లాం మౌలిక విశ్వాసాలకి ముఖ్యమైన ఆధారాలలో ఖుర్ఆన్ గ్రంథం ప్రధానమైనది. ఈ గ్రంథం పూర్తిగా దివ్య సందేశం. ఈ గ్రంథం సర్వ మానవాళికి మార్గదర్శకత్వం.

సర్వలోకాలకు ప్రభువైన అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలాకు తన దాసులపై అమితమైన ప్రేమ. అందుకే అసంఖ్యాకమైన తన వరాలను వారిపై కురిపించాడు.ఆ వరాలలో, అంటే అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మనపైన కురిపించిన వరాలలో అత్యంత మహోన్నత వరం దివ్య ఖుర్ఆన్. ఈ గ్రంథం సులభమైనది. స్వార్థపరులు ఎంత ప్రయత్నించినా మార్పులు చేర్పులకు సాధ్యం కాని విధంగా పంపబడిన గ్రంథం ఖుర్ఆన్ గ్రంథం.

మానవులు మరచిపోయిన ధర్మాన్ని పునర్జీవింపజేయడానికే ఖుర్ఆన్ అవతరించింది. ఖుర్ఆన్ గ్రంథం ఏదో ఒక జాతికో, ఒక వర్గానికో చెందినది ఎంత మాత్రం కాదు. దీనిపై అధికార పెత్తనాలు చెలాయించే హక్కు ఏ వర్గానికీ లేదు. ఇది మనుషులందరి ఉమ్మడి సొత్తు. ఇది మానవులందరికీ మార్గదర్శకం. కనుక ఖుర్ఆన్ గ్రంథాన్ని అనుసరించేవారు తమ నిజ ప్రభువు ఆజ్ఞలను అనుసరిస్తున్నట్లే.ఇది క్లుప్తంగా నేను ఖుర్ఆన్ యొక్క పరిచయం చేశాను

మనపై ఖుర్ఆన్ కొన్ని హక్కులు కలిగి ఉంది. ఖుర్ఆన్ కొన్ని హక్కులు కలిగి ఉంది. అవేమిటో మనం తెలుసుకుందాం. కానీ ఖుర్ఆన్ యొక్క హక్కులలో ఈరోజు మనం మొదటి హక్కు, అనగా ఖుర్ఆన్ పై విశ్వాసం గురించి మాత్రమే తెలుసుకోబోతున్నాం. మిగతావి తర్వాత తెలుసుకుందాం.

ఖుర్ఆన్ యొక్క మొదటి హక్కు ఏమిటంటే, ఖుర్ఆన్ పై విశ్వాసం. మనపై ఖుర్ఆన్ కు గల మొదటి హక్కు, దానిని మనం విశ్వసించాలి. మనస్ఫూర్తిగా నమ్మి, అంగీకరించి విశ్వసించాలి. ఖుర్ఆన్ ను విశ్వసించడం అంటే ఈ గ్రంథం, ఈ ఖుర్ఆన్ గ్రంథం, జిబ్రయీల్ దైవదూత ద్వారా అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరించిందని నోటితో అంగీకరించి మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా నమ్మి, తన వాక్కాయ కర్మలతో ఆచరించాలి.

అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఇలా సెలవిచ్చాడు.

وَإِنَّهُ لَتَنزِيلُ رَبِّ الْعَالَمِينَ
(వ ఇన్నహు ల తన్జీలు రబ్బిల్ ఆలమీన్)
نَزَلَ بِهِ الرُّوحُ الْأَمِينُ
(నజల బిహిర్ రూహుల్ అమీన్)
عَلَىٰ قَلْبِكَ لِتَكُونَ مِنَ الْمُنذِرِينَ
(అలా ఖల్బిక లితకూన మినల్ మున్దిరీన్)
بِلِسَانٍ عَرَبِيٍّ مُّبِينٍ
(బి లిసానిన్ అరబియ్యిమ్ ముబీన్)

నిశ్చయంగా ఇది (ఈ ఖుర్‌ఆన్‌) సకల లోకాల ప్రభువు అవతరింపజేసినది. విశ్వసనీయుడైన దైవదూత దీన్ని తీసుకువచ్చాడు. (ఓ ముహమ్మద్‌ – సఅసం!) నువ్వు హెచ్చరించే వారిలోని వాడవు కావటానికి ఇది నీ హృదయంపై అవతరించింది.(ఇది) సుస్పష్టమైన అరబీ భాషలో ఉంది. (అష్-షుఅరా 26:192-195)

దీని సారాంశం ఏమిటి? అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఖుర్ఆన్ గ్రంథాన్ని అవతరింపజేశాడు. జిబ్రయీల్ దైవదూత ద్వారా ఖుర్ఆన్ గ్రంథం వచ్చింది. మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పైన ఖుర్ఆన్ వచ్చింది. సర్వ మానవుల కొరకు ఖుర్ఆన్ గ్రంథం వచ్చింది.

అభిమాన సోదరులారా, అంటే ఈ గ్రంథం ముమ్మాటికీ సర్వలోక ప్రభువైన అల్లాహ్ తరఫున పంపబడిన గ్రంథం. దీన్ని విశ్వసనీయుడైన దైవదూత జిబ్రయీల్ అలైహిస్సలాం తీసుకుని వచ్చారు. మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరించింది. సర్వ లోకాల, సర్వ మానవుల సన్మార్గం కోసం ఖుర్ఆన్ గ్రంథం అవతరింపబడినది.

ఖుర్ఆన్ ను విశ్వసించడం అంటే ఖుర్ఆన్ లో ఎటువంటి మార్పులు జరగలేదు, ఎటువంటి మార్పులు చేర్పులు లేకుండా సురక్షితంగా ఉందని నమ్మాలి. ఖుర్ఆన్ గ్రంథంలో ఎటువంటి మార్పులు జరగలేదు, జరగవు కూడా. సురక్షితంగా ఉందని నమ్మాలి. అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఖుర్ఆన్ గ్రంథంలో ఇలా సెలవిచ్చాడు:

إِنَّا نَحْنُ نَزَّلْنَا الذِّكْرَ وَإِنَّا لَهُ لَحَافِظُونَ
(ఇన్నా నహ్ను నజ్జల్ నజ్జిక్ర వ ఇన్నా లహూ లహాఫిజూన్)
నిశ్చయంగా ఈ హితోపదేశాన్ని (ఖుర్‌ఆన్‌ను) మేమే అవతరింపజేశాము. మరి మేమే దీనిని పరిరక్షిస్తాము. (అల్-హిజ్ర్ 15:9)

మేము ఈ ఖుర్ఆన్ ను అవతరింపజేశాము. మరి మేమే దీనిని రక్షిస్తాము. కావున దివ్య ఖుర్ఆన్ స్వార్థపరుల కుయుక్తుల నుండి, అలాగే ప్రక్షిప్తాల బారి నుండి, మార్పులు చేర్పుల నుంచి కాపాడి స్వచ్ఛంగా ఉంచే బాధ్యతను మేము స్వయంగా తీసుకున్నామని అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా సెలవిచ్చాడు.

అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా చెప్పిన ఈ వాక్కు, ఈ ఆయత్ సత్యమని గత 1442 సంవత్సరాలుగా రూఢి అవుతూనే ఉంది.

సూరహ్ బఖరాలోనే రెండవ ఆయత్:

ذَٰلِكَ الْكِتَابُ لَا رَيْبَ ۛ فِيهِ ۛ هُدًى لِّلْمُتَّقِينَ
(జాలికల్ కితాబు లా రైబ ఫీహి, హుదల్ లిల్ ముత్తఖీన్)
ఈ గ్రంథం అల్లాహ్ గ్రంథం అన్న విషయంలో ఎంత మాత్రం సందేహం లేదు. భయభక్తులు కలవారికి ఇది సన్మార్గం చూపుతుంది. (అల్-బఖర 2:2)

అభిమాన సోదరులారా, సారాంశం ఏమనగా ఖుర్ఆన్ అల్లాహ్ పంపిన గ్రంథం. ఖుర్ఆన్ జిబ్రయీల్ దైవదూత ద్వారా పంపబడిన గ్రంథం. ఖుర్ఆన్ మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరించిన గ్రంథం. ఖుర్ఆన్ సర్వమానవులకు సన్మార్గం చూపటానికి పంపబడిన గ్రంథం. ఖుర్ఆన్ ఒక జాతికో, ఒక వర్గానికో చెందినది ఎంత మాత్రం కాదు. ఇది మానవులందరి ఉమ్మడి సొత్తు. అలాగే ఖుర్ఆన్ స్పష్టమైన అరబీ భాషలో అవతరించింది. ఖుర్ఆన్ లో ఎటువంటి మార్పులకి, చేర్పులకి తావు లేదు. మార్పులు చేర్పులు జరగలేదు, జరగవు. దానిని కాపాడే బాధ్యత స్వయంగా అల్లాహ్ తీసుకున్నాడు.

కావున, ఖుర్ఆన్ యొక్క హక్కులలో, మనపై ఖుర్ఆన్ కు గల హక్కులలో మొదటి హక్కు ఏమిటి? ఖుర్ఆన్ ను విశ్వసించడం. దానిని మనము విశ్వసించాలి. కేవలం విశ్వసిస్తే సరిపోతుందా? సరిపోదు. ఇంకా విశ్వసించటమే కాకుండా ఇంకా అనేక హక్కులు ఉన్నాయి. అవి ఇన్ షా అల్లాహ్ మనం వచ్చే ఎపిసోడ్ లో తెలుసుకుందాం. అప్పటి వరకు సెలవు.

వ ఆఖిరు ద అ వానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.

పవిత్ర ఖుర్ఆన్ పరిచయం – హబీబుర్రహ్మాన్ జామిఈ [వీడియో | టెక్స్ట్]

పవిత్ర ఖుర్ఆన్ పరిచయం – హబీబుర్రహ్మాన్ జామిఈ
https://youtu.be/ztbp2wtF5do [6 min]

ఈ ప్రసంగంలో ఖురాన్ గురించి వివరించబడింది. ఖురాన్ అంటే అల్లాహ్ వాక్యం, యావత్ మానవాళికి మార్గదర్శకం, సత్యాసత్యాలను వేరుపరిచే స్పష్టమైన నిదర్శనం అని నిర్వచించబడింది. ఇది అల్లాహ్ తరఫున జిబ్రయీల్ దూత ద్వారా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై 23 సంవత్సరాల వ్యవధిలో అవతరింపజేయబడింది. ‘ఖురాన్’ అనే పదానికి ‘ఎక్కువగా పఠించబడేది’ అని అర్థం. రమజాన్ మాసంలో ఖురాన్ అవతరణ ప్రారంభమైందని, అందుకే ఈ మాసానికి, ఖురాన్‌కు మధ్య బలమైన సంబంధం ఉందని సూరహ్ బఖర మరియు సూరహ్ జుమర్ వాక్యాల ఆధారంగా వివరించబడింది.

ఇన్నల్ హమ్ దలిల్లాహి వహ్ దహు, వస్సలాతు వస్సలాము అలా మల్లా నబియ్య బ’అద అమ్మా బ’అద్.
అభిమాన సోదరులారా, కారుణ్య వర్షిణి రమదాన్ అనే ఈ కార్యక్రమంలోకి మీ అందరినీ ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను.

‎اَلسَلامُ عَلَيْكُم وَرَحْمَةُ اَللهِ وَبَرَكاتُهُ
(అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు)
మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక.

ప్రియ వీక్షకులారా! ఈరోజు మనం ఖురాన్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.

‎قُرْآن كَلَامُ الله
(ఖురాన్ కలాముల్లాహ్)
ఖురాన్, అల్లాహ్ యొక్క వాక్కు.

ఖురాన్ అల్లాహ్ వాక్యం. ఖురాన్ మానవులందరికీ మార్గదర్శకం. ఖురాన్ సత్య అసత్యాలను వేరుపరిచే స్పష్టమైన నిదర్శనం. ఖురాన్ అల్లాహ్ గ్రంథం. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ ఖురాన్ గ్రంథాన్ని జిబ్రయీల్ దూత ద్వారా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై సర్వ మానవుల కొరకు అవతరింపజేశాడు.

అభిమాన సోదరులారా! ఈ ఖురాన్ గ్రంథం ధర్మ పండితులు రాసుకున్న పుస్తకం కాదు. ఈ ఖురాన్ గ్రంథం అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన స్వయంగా చెప్పిన మాటలు కావు. ఖురాన్ గ్రంథం అల్లాహ్ వాక్యం.

జిబ్రయీల్ దైవదూత ద్వారా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్ గ్రంథాన్ని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరింపజేశాడు. ఎవరికోసం అవతరింపజేశాడు? సర్వమానవుల సన్మార్గం కొరకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అవతరింపజేశాడు.

అలాగే ఈ ఖురాన్ గ్రంథం అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై 23 సంవత్సరాల వ్యవధిలో అవతరింపజేయబడినది. 13 సంవత్సరాలు మక్కాలో, 10 సంవత్సరాలు మదీనాలో. మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క వయసు 63 సంవత్సరాలు. 40 సంవత్సరాల వయసులో అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకి ప్రవక్త పదవి లభించింది. అంటే, 63 సంవత్సరాలలో 40 తీసేస్తే మిగిలింది 23 సంవత్సరాలు. 13 సంవత్సరాలు మక్కాలో, 10 సంవత్సరాలు మదీనాలో. ఈ 23 సంవత్సరాల వ్యవధిలో ఖురాన్ అవతరింపజేయబడినది.

ఖురాన్ అనే పదానికి శాబ్దిక అర్థం, ఎక్కువగా పఠించబడేది. ప్రపంచంలోనే ఎక్కువగా చదవబడే, పఠించబడే గ్రంథం ఖురాన్.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూరతుజ్ జుమర్‌లో ఇలా తెలియజేశాడు:

‎تَنْزِيْلُ الْكِتٰبِ مِنَ اللّٰهِ الْعَزِيْزِ الْحَكِيْمِ
(తన్ జీలుల్ కితాబి మినల్లాహిల్ అజీజిల్ హకీమ్)
ఈ గ్రంథావతరణ సర్వాధిక్యుడైన, వివేకవంతుడైన అల్లాహ్‌ తరఫున జరిగింది. (39:1)

ఈ ఖురాన్ ఎవరి తరఫున జరిగింది? అల్లాహ్ తరఫున. ఈ గ్రంథావతరణ, ‘తన్ జీలుల్ కితాబి మినల్లాహిల్ అజీజిల్ హకీమ్‘ – ఈ గ్రంథావతరణ సర్వాధికుడైన, వివేకవంతుడైన అల్లాహ్ తరఫున జరిగింది.

అభిమాన సోదరులారా, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూర బఖరాలో ఇలా తెలియజేశాడు, సూరా నెంబర్ రెండు:

‎شَهْرُ رَمَضَانَ الَّذِيْٓ اُنْزِلَ فِيْهِ الْقُرْاٰنُ هُدًى لِّلنَّاسِ وَ بَيِّنٰتٍ مِّنَ الْهُدٰى وَالْفُرْقَانِ
రమజాను నెల – మానవులందరికీ మార్గదర్శకమైన ఖుర్ఆన్ అవతరింపజేయబడిన నెల అది. అందులో సన్మార్గంతోపాటు సత్యాసత్యాలను వేరుపరిచే స్పష్టమైన నిదర్శనాలున్నాయి. (2:185)

రమదాన్ నెల, ఖురాన్ అవతరింపజేయబడిన నెల. అది మానవులందరికీ మార్గదర్శకం, అందులో సన్మార్గంతో పాటు సత్య అసత్యాలను వేరుపరిచే స్పష్టమైన నిదర్శనాలు ఉన్నాయి. అంటే, రమజాన్ ఖురాన్ అవతరింపజేయబడిన నెల, అంటే రమజాన్ మాసంలో ఖురాన్ అవతరింపజేయబడినది.

ఇంతకుముందు ఒక మాట విన్నాం, 23 సంవత్సరాల వ్యవధిలో ఖురాన్ వచ్చింది, మరి ఇది రమజాన్ నెలలో ఖురాన్ అవతరించింది అంటే, దీనికి రెండు అర్థాలు ఉన్నాయి. మొదటి అర్థం ఏమిటి? అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా రమజాన్ మాసంలో తొలి ఆకాశంలో బైతుల్ ఇజ్జత్ అనే ప్రదేశంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పూర్తి ఖురాన్ రమజాన్ మాసంలోనే పెట్టాడు. అక్కడ నుండి ఈ భూమండలంలోకి అవసరానుసారం, సందర్భం ప్రకారం అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వాక్యాలు పంపిస్తూ ఉన్నాడు. రెండో అర్థం, అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జబల్ నూర్, హిరా గుహలో ఉన్నప్పుడు మొదటి దైవవాణి, ఖురాన్ అవతరణ ప్రారంభం అయ్యింది రమజాన్ మాసంలో.

ఈ విధంగా ఖురాన్ ప్రారంభం అయ్యింది అది రమజాన్ మాసంలోనే. కావున ఈ రమజాన్ మాసం, ఖురాన్ మాసం. అభిమాన సోదరులారా, ఇన్ షా అల్లాహ్, ఖురాన్ గురించి మరిన్ని విషయాలు వచ్చే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. అప్పటివరకు సెలవు.

‎وَآخِرُ دَعْوَانَا أَنِ الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ
(వ ఆఖిరు ద’అవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్)
మా ఆఖరి మాట ఇదే, సర్వలోకాల ప్రభువైన అల్లాహ్‌కే సర్వస్తోత్రాలు.

‎وَالسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ
(వస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు)
మీపై కూడా అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక.

ఇస్రాయీల్ జాతివారు ‘సబ్త్’ (సబ్బత్) నియమాన్ని అతిక్రమించడం – ఖురాన్ కథామాలిక

[క్రింది విషయం ఖురాన్ కథామాలిక అనే పుస్తకం నుండి తీసుకోబడింది]

وَاسْأَلْهُمْ عَنِ الْقَرْيَةِ الَّتِي كَانَتْ حَاضِرَةَ الْبَحْرِ إِذْ يَعْدُونَ فِي السَّبْتِ إِذْ تَأْتِيهِمْ حِيتَانُهُمْ يَوْمَ سَبْتِهِمْ شُرَّعًا وَيَوْمَ لَا يَسْبِتُونَ ۙ لَا تَأْتِيهِمْ ۚ كَذَٰلِكَ نَبْلُوهُم بِمَا كَانُوا يَفْسُقُونَ

“(ఇస్రాయీల్ జాతివారు) శనివారం నాటి విషయంలో హద్దుమీరి ప్రవర్తించేవారు. మరి ఆ శనివారం నాడే చేపలు పైపైకి తేలియాడుతూ వారి ముందుకు వచ్చేవి. శనివారం కాని దినాలలో అవి వారి ముందుకు వచ్చేని కావు, వారి అవిధేయత మూలంగా మేము వారిని ఈ విధంగా పరీక్షకు గురి చేసేవారము.” (7:163)

ఇస్రాయీల్ ప్రజలు వారంలో ఒక రోజు తమ పనులన్నింటినీ మానుకోవాలని ప్రవక్త మూసా (అలైహిస్సలాం) బోధించారు. అలా పనులన్నింటినీ మానుకునే రోజును ‘సబ్బత్’ అంటారు. సబ్బత్ రోజున అన్ని పనులు మానుకుని కేవలం అల్లాహ్ ను ఆరాధించవలసి ఉంది. అల్లాహ్ తమపై కురిపించిన అనుగ్రహాలకు కృతజ్ఞతలు చెల్లించవలసి ఉంది. ఈ విధంగా చేయడం వల్ల వారి హృదయాలు పరిశుద్ధమవుతాయని ఆయన బోధించారు. యూదులు శనివారాన్ని తమ సబ్బత్ రోజుగా ఎన్నుకున్నారు. ఈ సంప్రదాయాన్ని అనేక తరాలు ఆచరించాయి.

ప్రవక్త దావూద్ (అలైహిస్సలాం) కాలంలో ఎలాత్ ప్రాంతంలో కొందరు ఇస్రాయీల్ ప్రజలు నివసించేవారు. ఎలాత్ ఎర్ర సముద్ర తీరాన ఉన్న ఒక పట్టణం. వారంతా చేపలు పట్టే జాలర్లు. సబ్బత్ రోజున సముద్రంలో చేపలు రెండు శిలల మధ్య గుమిగూడి గుంపులు గుంపులుగా కనబడడాన్ని వాళ్ళు చూశారు.

సబ్బత్ రోజున జాలర్ల వలలు తమను ఏమీ చేయవన్న విషయం వాటికి తెలిసినట్లు, ఆ రోజునే అవి తీరానికి వచ్చి ఊరించేవి. వాటిని చూసి కొందరు జాలర్లు నిగ్రహాన్ని కోల్పోయారు. అత్యా శతో చివరకు వాళ్ళు సబ్బత్ నియమాన్ని అతిక్రమించాలని నిర్ణయించుకున్నారు.

అయ్యూబ్ (అలైహిస్సలాం) జీవితచరిత్ర – ఖురాన్ కథామాలిక

అయ్యూబ్ (అలైహిస్సలాం) జీవితచరిత్ర
https://youtu.be/t27mDKl4w3E
ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)

[క్రింది విషయం ఖురాన్ కథామాలిక అనే పుస్తకం నుండి తీసుకోబడింది]

 وَأَيُّوبَ إِذْ نَادَىٰ رَبَّهُ أَنِّي مَسَّنِيَ الضُّرُّ وَأَنتَ أَرْحَمُ الرَّاحِمِينَ فَاسْتَجَبْنَا لَهُ فَكَشَفْنَا مَا بِهِ مِن ضُرٍّ

మరి అయ్యూబు (స్థితిని గురించి కూడా ఓసారి మననం చేసుకోండి). అతను “నాకు ఈ వ్యాధి సోకింది. నువ్వు కరుణించే వారందరిలోకీ అపారంగా కరుణించే వాడవు” అని తన ప్రభువును మొరపెట్టుకున్నప్పుడు, మేము అతని ప్రార్థనను ఆలకించి, ఆమోదించాము. అతని బాధను దూరం చేశాము. (ఖుర్ ఆన్  21: 83, 84)

కొందరు  దైవదూతలు అల్లాహ్ సృష్టి లోని కొన్ని ప్రాణుల గురించి మాట్లాడు కోసాగారు. విధేయత చూపి అల్లాహ్ ప్రసన్నతను పొందిన వారి గురించి వారు చర్చించుకోసాగారు. అలాగే అహంభావంతో విర్రవీగి అల్లాహ్ ఆగ్రహాన్ని కొని తెచ్చుకున్న వారి గురించి సంభాషిస్తుండగా ఒక దైవదూత, “ప్రస్తుతం భూమిపై ఉన్న వారిలో అత్యుత్తముడు అయ్యూబ్. ఆయన ఉన్నత వ్యక్తిత్వం కలిగినవాడు. గొప్ప సహనశీలి. ఎల్లప్పుడూ అపార కరుణా మయుడైన విశ్వప్రభువును స్మరిస్తూ ఉంటాడు. అల్లాహ్ ను ఆరాధించే వారికి ఆయన గొప్ప ఆదర్శం. అందుకు ప్రతిఫలంగా అల్లాహ్ ఆయనకు దీర్ఘాయుష్షు ప్రసాదించాడు. అపార సంపదలు ఇచ్చాడు. అయ్యూబ్ ఎన్నడూ అహంభావానికి పాల్పడలేదు. స్వార్థం ఆయనలో లేనేలేదు. ఆయన కుటుంబం, ఆయన సేవకులు, అవసరార్థులు, బీదలు అందరూ ఆయన సంపదలో భాగం పొందుతున్నారు. ఆయన బీదలకు అన్నం పెడతారు. వారికి దుస్తులు ఇస్తారు. బానిసలకు స్వేచ్ఛ ప్రసాదించడం కోసం వారిని కొంటారు. తన నుంచి దానధర్మాలు పొందేవారు తనకు ఉపకారం చేస్తున్నట్లుగా ఆయన వ్యవహరిస్తారు. ఆయన చాలా ఉదార స్వభావి, చాలా మంచి వాడు” అంటూ ప్రశంసించారు.

ప్రవక్త మూసా (అలైహిస్సలాం) జీవిత చరిత్ర – ఖురాన్ కథామాలిక

ప్రవక్త మూసా (అలైహిస్సలాం) – విమోచనకర్త
(కాలం : క్రీ.పూ. 1400-1250, లుక్మాన్ (అలైహిస్సలాం) కాలం వరకు)

(దివ్యఖుర్ఆన్లో ఉన్న ప్రవక్తల కథలలో ఇది అతిపెద్ద కథ. అనేక విభాగాలుగా ప్రస్తావనకు వచ్చింది.)

ప్రవక్త మూసా (అలైహిస్సలాం) జీవిత చరిత్ర – యూట్యూబ్ ప్లే లిస్ట్ (4 వీడియోలు)
ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0EZFhe8vMUqsqZOUxW93R3

[క్రింది విషయం ఖురాన్ కథామాలిక అనే పుస్తకం నుండి తీసుకోబడింది]

ఈజిప్టును పరిపాలించిన ఫిరౌన్ పరమ నియంత. యాకూబ్ (అలైహిస్సలాం) సంతానంపై (అంటే బనీ ఇస్రాయీల్ పై) ఫిరౌన్ అతి దారుణంగా అణచివేతలు, అత్యాచారాలకు పాల్పడ్డాడు. వారిని పరాభవించడానికి, వారిని అన్ని విధాలుగా త్రొక్కి వేయడానికి అతడు అన్ని మార్గాలన్నింటినీ ఉపయోగించాడు. వారిని బానిసలుగా చేసుకున్నాడు. నామ మాత్రంగా జీతభత్యాలు ఇస్తూ, కొన్ని సందర్భాల్లో అస్సలు ఏమీ ఇవ్వకుండా వారితో బండచాకిరి చేయించుకునే వాడు. ఫిరౌన్ ఒంటరిగా ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడడం సాధ్యం కాదు, అతడితోపాటు అతని అనుచరులు అనేక మంది ఈ దౌర్జన్యాలలో పాలు పంచుకునేవారు. వీరంతా కలసి అణగారిన బనీ ఇస్రాయీల్ ప్రజల పై దౌర్జన్యాల పరంపర కొనసాగించే వారు.

ప్రవక్త మూసా (అలైహిస్సలాం) & మార్గదర్శి ఖిజర్ (అలైహిస్సలాం) – ఖురాన్ కథామాలిక

[క్రింది విషయం ఖురాన్ కథామాలిక అనే పుస్తకం నుండి తీసుకోబడింది]

فَانطَلَقَا حَتَّىٰ إِذَا رَكِبَا فِي السَّفِينَةِ خَرَقَهَا ۖ قَالَ أَخَرَقْتَهَا لِتُغْرِقَ أَهْلَهَا لَقَدْ جِئْتَ شَيْئًا إِمْرًا

మూసా, ఖిజర్ లు బయలు దేరారు. చివరకు ఒక పడవలో పయనమైనప్పుడు అతను (ఖిజరు) దాని చెక్క పలకలను పగుల గొట్టారు. దానికి మూసా, “ఇదేమిటీ, పడవ ప్రయాణీకులందరి ముంచేయటానికా వీటిని పగులగొట్టారు? మీరు చాలా ఘోరమైన పనికి ఒడిగట్టారు” అని చెప్పనే చెప్పేశాడు. (సూరా అల్ కహఫ్ 18: 71)

ఒ క రోజు, మూసా (అలైహిస్సలాం) ప్రజల్లో చైతన్యాన్ని రగిలించే ఒక ప్రభావవంతమైన ప్రసంగం చేశారు. ఆ ప్రసంగం వారిపై తీవ్రమైన ప్రభావం వేసింది. ప్రజల్లో ఒక వ్యక్తి, “దైవప్రవక్తా! భూమిపై మీకన్నా ఎక్కువ జ్ఞానం కలిగిన వ్యక్తి ఉన్నాడా?” అని ప్రశ్నించాడు. అల్లాహ్ తనకు మహత్యాలు ప్రదర్శించే శక్తి ఇచ్చాడు, తౌరాత్ గ్రంథాన్ని ప్రసాదించాడు కాబట్టి తానే అందరికన్నా ఎక్కువ జ్ఞానం కలిగిన వాడినని భావిస్తూ మూసా (అలైహిస్సలాం) ఆ వ్యక్తితో, “లేడు” అని జవాబిచ్చారు. కాని తెలుసుకోవలసినదంతా తెలుసుకున్న వ్యక్తి ఎవరూ లేరని, సంపూర్ణ జ్ఞానానికి ఒకే దైవప్రవక్త కేంద్రం కావడం కూడా జరగదని, ఒక వ్యక్తికి తెలియని విషయాలు తెలిసిన మరో వ్యక్తి ఎల్లప్పుడు ఉంటాడని అల్లాహ్ ఆయనకు తెలియజేశాడు. అప్పుడు మూసా (అలైహిస్సలాం) అల్లాహ్ తో, “ప్రభూ! ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నారు? నేను ఆయన్ను కలుసుకుని ఆయన నుంచి విద్య నేర్చు కోవాలని భావిస్తున్నాను” అన్నారు. ఆ వ్యక్తిని గుర్తించడానికి గుర్తు చెప్పమని కూడా అల్లాహ్ ను కోరారు.

అల్లాహ్ ఆయనకు మార్గం చూపుతూ, నీటితో నిండిన ఒక పాత్రలో ఓ చేపను తీసుకుని బయలుదేరాలని, ఆ చేప పాత్ర నుంచి మాయమైన ప్రదేశంలో ఆ వ్యక్తి కనబడతాడని చెప్పాడు. మూసా (అలైహిస్సలాం) ఆ వ్యక్తిని కలుసుకోవడానికి బయలుదేరారు. ఆయన వెంట ఒక అనుచరుడు చేపవున్న నీటిపాత్రను పట్టుకుని రాసాగాడు. వారిద్దరు రెండు నదులు కలసిన సంగమ ప్రదేశానికి చేరు కున్నారు. అక్కడ విశ్రాంతి తీసుకోవాలని భావించారు. మూసా (అలైహిస్సలాం) అక్కడ నిద్రలోకి జారుకున్నారు.

ఆయన నిద్రపోతున్నప్పుడు, నీటి పాత్రలోని చేప ఎగిరి నదిలో దూకడాన్ని ఆయన అనుచరుడు చూశాడు. కాని అతడు ఈ సంఘటన గురించి మూసా (అలైహిస్సలాం)కు చెప్పడం మరచిపోయాడు. మూసా (అలైహిస్సలాం) లేచిన తర్వాత ఇద్దరూ ప్రయాణం కొనసాగించారు. వారు బాగా అలసిపోయారు, చాలా ఆకలితో ఉన్నారు. మూసా(అలైహిస్సలాం) తన అనుచరునితో ఆహారం గురించి అడిగారు. అప్పుడు అనుచరునికి నీటి పాత్రలోని చేప నదిలో దూకి వెళ్ళిపోయిన విషయం గుర్తుకువచ్చింది. ఆ విషయాన్ని మూసా (అలైహిస్సలాం)కు తెలియజేశాడు. మూసా (అలైహిస్సలాం), “అర్రర్రె.. మనం వెదుకుతున్న ప్రదేశం అదే” అన్నారు. వారు త్వరత్వరగా వెనక్కి వచ్చారు. రెండు నదులు కలసిన ప్రదేశానికి, చేప నదిలో దూకి ఈదుకుంటూ వెళ్ళిపోయిన ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడ వారికి ఒక వ్యక్తి కనిపించాడు. అతని ముఖం సగ భాగాన్ని ఒక వస్త్రం కప్పిఉంది. ఆయనే ఖిజర్ (అలైహిస్సలాం)… మార్గదర్శి!

మూసా (అలైహిస్సలాం) ఆయనకు అభివాదం చేశారు. “అస్సలాము అలైకుమ్ (మీపై శాంతి కలుగుగాక!)” అన్నారు. ఆ వ్యక్తి తన ముఖంపై ఉన్న వస్త్రాన్ని తప్పించి వారిని చూశారు. “మీరు నాకు శాంతి కలగాలని అభివాదం చేశారు. కాని ఈ దేశంలో శాంతి ఉందా? అసలు మీరెవరు?” అని ప్రశ్నించారు. మూసా (అలైహిస్సలాం) జవాబిస్తూ, “నేను ఇస్రాయీల్ వారి ప్రవక్తను” అన్నారు. ఆ వ్యక్తి తిరిగి, “మీకు బోధనలు ఎవరు చేశారు? ఎవరు మిమ్మల్ని ఇక్కడకు పంపించారు?” అనడిగారు. మూసా (అలైహిస్సలాం) జరిగిన విషయాన్ని ఆయనకు వివరించారు. చాలా మర్యాదగా, “నేను మీతో రావచ్చా.. ఆ విధంగా మీరు మీ వద్ద ఉన్న జ్ఞానాన్ని నాకు బోధించగలరు. మిమ్మల్ని కలవడానికి నేను చాలా ప్రయాసపడి ఇక్కడకు వచ్చాను. నేను మీకు అవిధేయత చూపను” అన్నారు. ఖిజర్ (అలైహిస్సలాం) ఆయనకు జవాబిస్తూ, “మీరు నన్ను భరిస్తారని నేను అనుకోవడంలేదు. ఎందుకంటే మీరు అనేక విచిత్రమైన విషయాలను చూడవచ్చు. చాలా విచిత్రమైన వాటిని చూసి మీరు నన్ను విమర్శించకుండా ఉండలేరు. ఎందుకంటే మీ అవగాహన పరిమితమైనది. అందువల్ల మీరు వాదనకు దిగుతారు” అన్నారు. మూసా (అలైహిస్సలాం) చాలా నిజాయితీగా, “అల్లాహ్ తలిస్తే… నేను సహనంతో ఉంటాను. మీ పట్ల అవిధేయత చూపను” అన్నారు. చివరకు ఖిజర్ (అలైహిస్సలాం) ఆయన్ను వెంట తీసుకువెళ్లడానికి అంగీకరిస్తూ ఒక షరతు పెట్టారు. తాను ఏం చేసినా ప్రశ్నించరాదని అన్నారు. మూసా (అలైహిస్సలాం) తన అనుచరుడిని వెనక్కు పంపి తాను ఖిజర్ (అలైహిస్సలాం)తో పాటు బయలుదేరారు.

వారు ఒక నది వద్దకు చేరుకున్నారు. ఇద్దరూ ఒక పడవలోకి ఎక్కారు. ఆ పడవ యజమాని వారిద్దరి పట్ల ఒక విధమైన అభిమానాన్ని చూపించాడు. వారిద్దరిని అభిమానంగా పడవలోకి ఆహ్వానించాడు. పడవలోకి ఎక్కిన తర్వాత ఖిజర్ (అలైహిస్సలాం) చాలా వింతగా వ్యవహరించారు. పడవ ప్రక్కల బిగించి ఉన్న కొన్ని చెక్కలను పీకిపారేశారు. దాని వల్ల పడవకు ఒకవైపు పెద్ద రంధ్రంలా ఏర్పడింది. ఈ విచిత్ర ప్రవర్తనను చూసి నిర్ఘాంతపోయిన మూసా (అలైహిస్సలాం), “అరె, ఎందుకు పడవను నాశనం చేస్తున్నారు? మన పట్ల అభిమానంగా ఆహ్వానించిన పడవ యజమానికి ఇదా మనం ఇచ్చే ప్రతిఫలం? పైగా మనమంతా మునిగిపోయే ప్రమాదం కూడా ఉందని మీరు గ్రహించడం లేదా? మీరు చేసిన పని చాలా అనుచితమైనది” అన్నారు.

ఖిజర్ (అలైహిస్సలాం) ఆయనకు తమ మధ్య కుదిరిన అంగీకారాన్ని గుర్తుచేశారు. మూసా (అలైహిస్సలాం)కు వెంటనే తాను చేసిన పొరపాటు గుర్తుకువచ్చింది. ఆయన్ను క్షమాపణలు కోరుకున్నారు. “నా మతిమరుపుకు కోపం తెచ్చుకోవద్దు, నా బలహీనత విషయంలో కఠినంగా వ్యవహరించవద్దు. మీతో రాకుండా నివారించవద్దు. నేను నా మాటకు కట్టుబడి ఉండడానికి ఈసారి పూర్తిగా ప్రయత్నం చేస్తాను” అన్నారు. అందుకు అంగీకరించి ఖిజర్ (అలైహిస్సలాం) ఆయన్ను వెంటతీసుకుని బయలుదేరారు.

దారిలో వారికి ఒక పిల్లవాడు తన మిత్రులతో ఆడుకుంటూ కనబడ్డాడు. ఖిజర్ (అలైహిస్సలాం) ఆ పిల్లవాడిని మిత్రబృందం నుంచి వేరు చేసి ఒక ప్రక్కకు తీసుకు వెళ్ళి హతమార్చారు. ఈ అఘాయిత్యం చూసి మూసా (అలైహిస్సలాం) నిర్ఘాంతపోయారు. “మీరు ఒక అమాయక పిల్లవాడిని చంపేశారు. ఇది నిజంగా అమానుషం” అని అరిచారు. ఖిజర్ (అలైహిస్సలాం) ఆయన వైపు తీక్షణంగా చూసి తమ మధ్య కుదిరిన అంగీకారాన్ని గుర్తుచేశారు. తన పనులను మరోసారి ప్రశ్నిస్తే ఇక తనతో రావడం ఉండదని హెచ్చరించారు. మూసా (అలైహిస్సలాం) మళ్ళీ క్షమాపణ కోరుకున్నారు. “నేను మరోసారి ఈ పొరపాటు చేస్తే నన్ను మీ వెంట రాకుండా చేయండి” అన్నారు. ఖిజర్ (అలైహిస్సలాం) ఆయన్ను మన్నించారు.

వారిద్దరు ఒక గ్రామానికి చేరుకున్నారు. అక్కడి గ్రామస్తులతో వారు ఆశ్రయాన్ని, ఆహారాన్ని కోరారు. కాని పిసినారి ప్రజలు వారికి ఏదీ ఇవ్వలేదు. అందువల్ల వాళ్ళిద్దరూ అలాగే ప్రయాణం కొనసాగించవలసి వచ్చింది. వారిద్దరూ వెడుతున్నప్పుడు ఒక చోట ఒక గోడ కూలడానికి సిద్ధంగా ఉండడాన్ని వాళ్ళు చూశారు. వెంటనే ఖిజర్ (అలైహిస్సలాం) ఆ గోడను మరమ్మత్తు చేయడానికి పూను కున్నారు. ఇది చూసిన మూసా (అలైహిస్సలాం) ఉండబట్టలేక, “మీరు భలే విచిత్రమైన మనిషి. ఈ స్వార్థపరుల పట్ల మీరు సానుభూతి చూపుతున్నారు. పైగా మీరు చేస్తున్న కష్టానికి ప్రతిఫలం కూడా కోరడం లేదు. మనం చేసిన కష్టానికి వారి నుంచి ప్రతిఫలం తీసుకుని మన ప్రయాణానికి కొద్దిగా ఆహారాన్ని సమకూర్చుకో గలిగే వాళ్ళం” అన్నారు. తన పనులకు తగిన వివరణ ఇచ్చే వరకు వాటిని మూసా (అలైహిస్సలాం) భరించలేరని ఖిజర్ (అలైహిస్సలాం)కు అర్థమయ్యింది. “ఇక చాలు… ఇక మనం ఎవరి దారి వారు వేరవ్వడం మంచిది. మీకు సహనం లేదు. అయితే మనం వేరయ్యే ముందు నేను చేసిన పనులకు కారణాలు వివరిస్తాను” అన్నారు. మూసా సిగ్గుపడుతూ తల వంచుకున్నారు.

1. నేను నష్టపరచిన పడవను కిరాయికి నడుపుకుని ఆ పడవ యజమాని, అతని భార్య బ్రతుకుతున్నారు. నేను ఆ పడవను ఎందుకు నష్టపరిచానంటే, వారి రాజు పడవలను స్వాధీనం చేసుకుని పెద్ద నౌకాదళాన్ని తయారు చేయాలని చూస్తున్నాడు. ఈ పడవను నష్టపరచడం వల్ల దీన్ని చూసినా కూడా పనికిరానిదిగా భావించి రాజు దాన్ని వదలివేస్తాడు. మూసా! నేను చేసిన పని చూడడానికి బాధ్యత లేని పనిగా కనబడినా… నేను నిజానికి ఆ పడవను కాపాడడానికి, పడవ యజమానిపై సానుభూతితో చేసిన పని.

2. నేను చంపిన పిల్లవాడి తల్లిదండ్రులు నిజమైన విశ్వాసులు. కాని ఆ పిల్లవాడిలో ఉన్న దుర్మార్గం గురించి నాకు తెలిసింది. కన్నకొడుకు కాబట్టి ఆ తల్లి దండ్రులు అతడి దుర్మార్గాన్ని భరిస్తారు. కాని, చివరకు వాడి దుర్మార్గాలు ఆ తల్లిదండ్రులను కూడా ప్రభావితం చేస్తాయని నేను గ్రహించాను. అతడిని చంపి నేను వారి విశ్వాసాన్ని కాపాడాను. అల్లాహ్ వారికి మంచి సంతానాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను.

3. నేను ఆ గోడను నిర్మించినది స్వార్థపరులైన గ్రామస్తుల కోసం కాదు, ఆ గోడ ఇద్దరు అనాధలైన బాలలది. ఆ గోడ క్రింద గుప్తనిధి ఉందని అల్లాహ్ నాకు తెలియజేశాడు. ఆ పిల్లల తండ్రి పుణ్యాత్ముడు, దానధర్మాలు చేసేవాడు. ఆ పిల్లలు పెరిగి పెద్దయ్యే వరకు ఆ గుప్తనిధి రహస్యంగా ఉండడం చాలా అవసరం. వారు పెద్దయిన తర్వాత అల్లాహ్ వారికి ఆ నిధిని చూపిస్తాడు. ఆ గోడ పడిపోతే స్వార్థపరులైన గ్రామస్తులు ఆ నిధిని దోచుకుంటారు. కాబట్టి నేను చేసిన ప్రతీ పని నా ప్రభువు కారుణ్యం వల్ల చేసిన పని. నేను ఏ పనీ నా స్వంతంగా చేయలేదు. ఈ మాటలు చెప్పి ఖిజర్ (అలైహిస్సలాం) వేగంగా నడుచుకుంటూ వెళ్ళిపోయారు.

(చదవండి దివ్యఖుర్ఆన్: 18:60-82)

జ్ఞానం పొందిన వ్యక్తి తానొక్కడే కాదన్న విషయం తెలిసిన వెంటనే మూసా (అలైహిస్సలాం) మరింత జ్ఞానం సంపాదించడానికి కష్టసాధ్యమైన ప్రయాణానికి పూనుకున్నారు. జ్ఞానం సులభసాధ్యంగా లభించేది కాదు. జీవితంలో విజయం సాధించాలంటే మనిషి కష్టపడి పనిచేయవలసి ఉంటుంది.

అల్లాహ్ ఆదేశాల మర్మాలన్నింటినీ మనం అర్థం చేసుకోలేము. మనకు తప్పుగా కనబడుతున్న విషయం నిజానికి ఒక అనుగ్రహం కావచ్చు. “తాను చేసేది అల్లాహ్ కు బాగా తెలుసు”.

సూరతుల్ కహఫ్ తఫ్సీర్: ఆయతులు 60 – 82 : మూసా & ఖిజరు యొక్క వృత్తాంతము [5 వీడియోలు]
https://teluguislam.net/2020/12/26/tafseer-suratul-kahf-18/

సూరతుల్ కహఫ్ తఫ్సీర్ (వ్యాఖ్యానం) – మెయిన్ పేజీ. (అన్నీ పాఠాల కోసం)
https://teluguislam.net/tafsir-kahf/

ఖురాన్ మెయిన్ పేజీ
https://teluguislam.net/quran