అయ్యూబ్ (అలైహిస్సలాం) జీవితచరిత్ర
https://youtu.be/t27mDKl4w3E
ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)
[క్రింది విషయం ఖురాన్ కథామాలిక అనే పుస్తకం నుండి తీసుకోబడింది]
ప్రవక్త అయ్యూబ్ (అలైహిస్సలాం) – సహనశీలికి ఎదురైన పరీక్షలు
وَأَيُّوبَ إِذْ نَادَىٰ رَبَّهُ أَنِّي مَسَّنِيَ الضُّرُّ وَأَنتَ أَرْحَمُ الرَّاحِمِينَ فَاسْتَجَبْنَا لَهُ فَكَشَفْنَا مَا بِهِ مِن ضُرٍّ
మరి అయ్యూబు (స్థితిని గురించి కూడా ఓసారి మననం చేసుకోండి). అతను “నాకు ఈ వ్యాధి సోకింది. నువ్వు కరుణించే వారందరిలోకీ అపారంగా కరుణించే వాడవు” అని తన ప్రభువును మొరపెట్టుకున్నప్పుడు, మేము అతని ప్రార్థనను ఆలకించి, ఆమోదించాము. అతని బాధను దూరం చేశాము. (ఖుర్ ఆన్ 21: 83, 84)
కొందరు దైవదూతలు అల్లాహ్ సృష్టి లోని కొన్ని ప్రాణుల గురించి మాట్లాడు కోసాగారు. విధేయత చూపి అల్లాహ్ ప్రసన్నతను పొందిన వారి గురించి వారు చర్చించుకోసాగారు. అలాగే అహంభావంతో విర్రవీగి అల్లాహ్ ఆగ్రహాన్ని కొని తెచ్చుకున్న వారి గురించి సంభాషిస్తుండగా ఒక దైవదూత, “ప్రస్తుతం భూమిపై ఉన్న వారిలో అత్యుత్తముడు అయ్యూబ్. ఆయన ఉన్నత వ్యక్తిత్వం కలిగినవాడు. గొప్ప సహనశీలి. ఎల్లప్పుడూ అపార కరుణా మయుడైన విశ్వప్రభువును స్మరిస్తూ ఉంటాడు. అల్లాహ్ ను ఆరాధించే వారికి ఆయన గొప్ప ఆదర్శం. అందుకు ప్రతిఫలంగా అల్లాహ్ ఆయనకు దీర్ఘాయుష్షు ప్రసాదించాడు. అపార సంపదలు ఇచ్చాడు. అయ్యూబ్ ఎన్నడూ అహంభావానికి పాల్పడలేదు. స్వార్థం ఆయనలో లేనేలేదు. ఆయన కుటుంబం, ఆయన సేవకులు, అవసరార్థులు, బీదలు అందరూ ఆయన సంపదలో భాగం పొందుతున్నారు. ఆయన బీదలకు అన్నం పెడతారు. వారికి దుస్తులు ఇస్తారు. బానిసలకు స్వేచ్ఛ ప్రసాదించడం కోసం వారిని కొంటారు. తన నుంచి దానధర్మాలు పొందేవారు తనకు ఉపకారం చేస్తున్నట్లుగా ఆయన వ్యవహరిస్తారు. ఆయన చాలా ఉదార స్వభావి, చాలా మంచి వాడు” అంటూ ప్రశంసించారు.
ఇబ్లీస్ పగ
ఈ మాటలను ఇబ్లీస్ విన్నాడు. వాడికి చాలా కోపం వచ్చింది. అయ్యూబ్ (అలైహిస్సలాం)ను ఎలాగైనా ప్రలోభపెట్టి ఆయన ధార్మిక విశ్వాసాన్ని దెబ్బతీయాలని, ఆయన్ను పతనం చేయాలని భావించాడు. వెంటనే ఆయన వద్దకు పోయాడు. ఆయన ప్రార్థనలను చెడగొట్టడానికి ప్రయత్నించాడు. ప్రపంచంలోని సుఖభోగాల గురించి ఆయనలో భావాలను రేకెత్తించడానికి చూశాడు. కాని అయ్యూబ్ నిజమైన విశ్వాసి. చెడు భావాలు తనను వశపరచుకోకుండా ఆయన జాగ్రత్త పడ్డారు. ఇది చూసి ఇబ్లీస్ మరింత అసహనానికి లోనయ్యాడు. అయ్యూబ్ అంటే వాడిలో మరింత ద్వేషం పెరిగింది. *
ఇబ్లీస్ ఒక పథకం వేశాడు. అల్లాహ్ కు అయ్యూబ్ (అలైహిస్సలాం) గురించి ఫిర్యాదు చేశాడు. అయ్యూబ్ నిరంతరం అల్లాహ్ ను స్మరిస్తున్నప్పటికీ అదంతా స్వార్ధంతో చేస్తున్నదేననీ, ఆయన నిజాయితీగా దైవస్మరణ చేయడంలేదని, అల్లాహ్ తనకిచ్చిన సంపదను వెనక్కి తీసుకుంటాడన్న భయంతో మాత్రమే ఆయన దైవ స్మరణ చేస్తున్నాడని, ఆయనదంతా ప్రదర్శన మాత్రమేనని, దురాశతో అల్లాహ్ ను నమ్మించడానికి ప్రదర్శిస్తున్న దైవభక్తి మాత్రమేనని అన్నాడు. “మీరు గనుక అయ్యూబ్ కిచ్చిన సంపద వెనక్కి తీసుకుంటే, ఇక మీ నామస్మరణ చేయడు. నమాజులు మానేస్తాడు” అని అల్లాహ్ తో అన్నాడు ఇబ్లీస్.
అయ్యూబ్ నిజాయితీ కలిగిన దైవభక్తుడనీ, కేవలం సంపద కోసం తనను ఆరాధించే వ్యక్తి కాదని, అయ్యూబ్ హృదయపూర్వకంగా తన పట్ల భక్తివిశ్వాసాలు కలిగిన వ్యక్తి అనీ, భౌతిక సంపదలకు ఆయనగారి భక్తివిశ్వాసాలకు ఎలాంటి సంబంధం లేదని అల్లాహ్ సెలవిచ్చాడు. అయ్యూబ్ ప్రవక్త భక్తివిశ్వాసాలు, ఆయన సహనశీలం గురించి ఇబ్లీస్ కు అర్థమయ్యేలా చేయడానికి అల్లాహ్ నిర్ణయించు కున్నాడు. ఇబ్లీస్, “నువ్వు, నీ సహాయకులు అయ్యూబ్ సంపద విషయంలో మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి” అని స్వేచ్ఛ ఇచ్చాడు.
* ఆదమ్ (అలైహిస్సలాం) విషయంలో ఇబ్లీస్ ఎలా వ్యవహరించాడో, ఏ విధంగా తిరస్కారానికి పాల్పడి అల్లాహ్ ఆగ్రహానికి గురయ్యాడో, ఎలా స్వర్గం నుంచి బహిష్కరించబడ్డాడో పాఠకులు ఇంతకు ముందు చదివారు. ఇబ్లీస్ కు తీర్పుదినం వరకు అల్లాహ్ వ్యవధిని ఇచ్చాడు. అప్పటి వరకు వాడు తన ఇష్టం వచ్చినట్లు వ్యవహరించే స్వేచ్ఛను కలిగి ఉన్నాడు.
మొదటి పరీక్ష
ఇబ్లీస్ చాలా ఆనందించాడు. తన సహాయకులందరినీ ప్రోగుచేసుకున్నాడు. అయ్యూబ్ (అలైహిస్సలాం) గారి పశుసంపదను, పొలాలను, సేవకులను, భోగభాగ్యాలన్నీ నాశనం చేసి ఆయన వద్ద చిల్లిగవ్వ లేకుండా చేయడానికి బయలుదేరాడు. సంతోషంతో అయ్యూబ్ వద్దకు వచ్చాడు. ఒక వృద్ధజ్ఞాని రూపంలో అయ్యూబ్ ముందు హాజరయ్యాడు. ఆయనతో, “నీ సంపద మొత్తం పోయింది. నువ్వు దానధర్మాలకు చాలా ఖర్చు చేస్తావు కాబట్టి, అల్లాహ్ ను ప్రార్థిస్తూ నీ సమయాన్నంతా వ్యర్థం చేస్తున్నందువల్ల నీ సంపద నాశన మయ్యిందని కొందరు చెబుతున్నారు. నీ శత్రువులకు ఆనందం కలిగించడానికే అల్లాహ్ ఇదంతా చేశాడని మరికొందరు అంటున్నారు. నష్టం కలుగకుండా కాపాడే శక్తి అల్లాహ్ కు ఉన్నట్లయితే నీ సంపదను ఆయన కాపాడి ఉండేవాడు” అన్నాడు. కాని అయ్యూబ్ (అలైహిస్సలాం) నిజమైన విశ్వాసి. ఆయన జవాబిస్తూ, “నా నుంచి అల్లాహ్ తీసుకున్నదంతా నిజానికి అల్లాహ్ కు చెందినదే. నాకు కేవలం కొంతకాలానికి మాత్రమే ఆ సంపద అధీనం చేయబడింది. అల్లాహ్ తనకు ఇష్టం వచ్చిన వారికి ఇస్తాడు, తనకు ఇష్టం వచ్చిన వారి నుంచి తీసుకుంటాడు” అని చెప్పి ఆయన అల్లాహ్ సన్నిధిలో సాష్టాంగపడ్డారు.
ఇదంతా చూసిన ఇబ్లీస్ చాలా నిరాశకు గురయ్యాడు. మళ్ళీ అల్లాహ్ తో, “నేను అయ్యూబ్ సంపద అంతా నాశనం చేశాను. అయినా ఆయన మీ పట్ల విశ్వాసంగా ఉన్నాడు. కాని నిజానికి అతను తన నిరాశను దాచుకుంటున్నాడు. ఎందుకంటే, అతనికి చాలామంది సంతానం ఉన్నారు. వారి ద్వారా మళ్ళీ సంపద పొందాలని ఆశిస్తున్నాడు. కాబట్టి అతని సంతానంపై నాకు అధికారాన్ని ప్రసాదించాలని కోరుతున్నాను. తండ్రికి సంతానం వల్లనే నిజమైన పరీక్ష ఎదురవుతుంది. అప్పుడు అయ్యూబ్ ఎలా తిరస్కారానికి పాల్పడుతాడో మీరే చూస్తారు” అన్నాడు.
అల్లాహ్ ఇబ్లీస్ కు అతడు కోరిన అధికారాన్ని ఇచ్చాడు. నువ్వేం చేసినా అయ్యూబ్ (అలైహిస్సలాం)లో భక్తివిశ్వాసాలను ఇసుమంత కూడా తగ్గించలేవని హెచ్చరించాడు.
రెండవ పరీక్ష
ఇబ్లీస్ తన సహాయకులందరితో మళ్ళీ అయ్యూబ్ (అలైహిస్సలాం)పై కుట్రలు అమలు చేశాడు. అయ్యూబ్ (అలైహిస్సలాం) సంతానం నివసిస్తున్న ఇంటి పునాదులను కుదిపేశాడు. ఇల్లు కుప్పకూలింది. పిల్లలందరూ మరణించారు. ఆ పిదప అయ్యూబ్ వద్దకు పెద్ద సానుభూతిపరునివలే నటిస్తూ వెళ్ళాడు. ఆయన్ను ఓదారుస్తున్నట్లు నటిస్తూ, “మీ పిల్లలు మరణించిన పరిస్థితులు చాలా విచారకరమైనవి. నిజంగా మీరు ప్రార్థిస్తున్న దేవుడు మీ ప్రార్థనలకు సరయిన ప్రతిఫలం ఇవ్వడం లేదు” అన్నాడు. ఈ మాటలు చెప్పి అయ్యూబ్ (అలైహిస్సలాం) ఏమంటారో అని ఆత్రుతగా ఎదురుచూడసాగాడు. ఇక ఇప్పుడు అయ్యూబ్ (అస) నిజంగా అల్లాహ్ ను తిరస్కరిస్తూ మాట్లాడుతారని వాడి ఆశ. కాని అయ్యూబ్ (అలైహిస్సలాం) జవాబు వాడిని మరింత నిరాశకు గురిచేసింది. ఆయన వాడికి జవాబిస్తూ, “ఇచ్చేవాడు అల్లాహ్ యే .. ఆయన తానిచ్చినది కొన్నిసార్లు తీసుకుంటాడు. అల్లాహ్ కొన్నిసార్లు ప్రసన్నుడవుతాడు, కొన్నిసార్లు ఆగ్రహిస్తాడు. అంతా మన ఆచరణలను బట్టి ఉంటుంది. నాకు మంచి జరిగినా, చెడు జరిగినా ఏం జరిగినా నేను మాత్రం అల్లాహ్ పట్ల నా విశ్వాసం విషయంలో స్థిరంగా ఉంటాను. సృష్టికర్తకు ఎల్లప్పుడూ కృతజ్ఞుడనై ఉంటాను” అన్నారు. ఈ మాటలు చెప్పి ఆయన అల్లాహ్ సన్నిధిలో సాష్టాంగపడ్డారు. ఇదంతా చూసిన ఇబ్లీస్ చాలా నిరాశకు గురయ్యాడు.
మూడవ పరీక్ష
ఇబ్లీస్ మళ్ళీ అల్లాహ్ తో, “ప్రభూ! అయ్యూబ్ సంపద అంతా పోయింది. అతని సంతానం అందరూ మరణించారు. కాని అతను శారీరకంగా చాలా ఆరో గ్యంగా ఉన్నాడు. అతను మంచి ఆరోగ్యంతో ఉన్నంత కాలం మిమ్మల్ని ఆరాధిస్తునే ఉంటాడు. ఆ విధంగా తన సంపదను, సంతానాన్ని మళ్ళీ పొందాలని ప్రయత్నిస్తాడు. కాబట్టి నాకు అతని శరీరంపై అధికారాన్ని ఇవ్వండి. నేను అతని శరీరాన్ని బలహీనం చేసివేస్తాను. అప్పుడు మీరే చూస్తారు, అతను ఏ విధంగా తిరస్కారానికి పాల్పడుతాడో!” అన్నాడు. ఇబ్లీస్ కు ఒక గుణపాఠం గరపాలని అల్లాహ్ నిర్ణయించుకున్నాడు. అయ్యూబ్ నిజమైన భక్తివిశ్వాసాలు కలిగిన వారని వాడికి స్పష్టంగా తెలియజేయాలని భావించాడు. అందువల్ల ఇబ్లీస్ కు అతడి మూడవ కోరికను కూడా మన్నించాడు. అయితే ఒక షరతు పెట్టాడు. “అతని శరీరంపై నీకు అధికారం ఇస్తాను. కాని అతని ఆత్మపై, అతని మనోమస్తిష్కాలపై మాత్రం కాదు. ఎందుకంటే, ఈ ప్రదేశాల్లో నాకు సంబంధించిన జ్ఞానం, నా ధర్మం ఉంటాయి” అన్నాడు.
ఇబ్లీస్ తనకు లభించిన కొత్త అధికారంతో అయ్యూబ్ (అలైహిస్సలాం) శరీరంపై దాడి చేసి దానిని అనేక వ్యాధులకు గురయ్యేలా చేశాడు. చివరకు ఆయన శరీరం కేవలం ఎముకల గూడుగా మిగిలింది. అస్థిపంజరానికి చర్మం తొడిగిన మాదిరిగా తయారయ్యింది. అనేక శారీరక బాధలతో ఆయన అలమటించడం ప్రారంభమయ్యింది. కాని ఈ బాధలన్నింటినీ ఆయన భరించారు. ఎల్లప్పుడూ అల్లాహ్ పట్ల తన విశ్వాసంలో పటిష్టంగా నిలబడ్డారు. ఈ కష్టాలు, బాధలను సహనంతో భరించడమే కాదు, ఏ విధంగానూ ఆయన ఫిర్యాదు చేయలేదు. అల్లాహ్ దాసులు కష్టాల్లో సహాయం కోసం ఇతరుల వైపు చూడరు. అల్లాహ్ కారుణ్యం పట్ల ఎల్లప్పుడూ ఆశావాదులుగా ఉంటారు. చివరకు అయ్యూబ్ దగ్గరి బంధువులు, మిత్రులు కూడా ఆయన్ను వదిలేశారు. ఆయన్ను అమితంగా ప్రేమించే ఆయన భార్య మాత్రమే ఆయనతో మిగిలారు. ఆయనకు కష్టాల్లో ఆమె వెంట ఉన్నారు. ప్రేమాభిమానాలతో ఆయన్ను చూసుకున్నారు. అనేక సంవత్సరాలుగా ఆయన అనుభవించిన సుదీర్ఘకష్టాల ప్రయాణంలో ఆమె ఆయనకు తోడుగా వెంట నడిచింది.
ఇప్పుడు ఇబ్లీస్ మరింత కలతకు గురయ్యాడు. తన సహాయకులందరినీ సలహాలు అడిగాడు. కాని ఎవరూ అతనికి సలహా ఇవ్వలేకపోయారు. ఇబ్లీస్ నే వాళ్ళు నిలదీస్తూ, “నీ జిత్తులమారితనం అయ్యూబ్ ముందు విఫలమయ్యిం దేంటి? మానవులకు పితామహుడైన ఆదమ్ ను ప్రలోభపెట్టడంలో నువ్వు సఫలమయ్యావు కదా… ఇక్కడ విఫలమయ్యావేంటి?” అన్నారు.
నాలుగవ పరీక్ష
ఇబ్లీస్ అయ్యూబ్ ప్రవక్త భార్య వద్దకు వెళ్ళాడు. ఒక మనిషి రూపంలో ఆమె వద్దకు వెళ్ళి, “మీ భర్త ఎక్కడ ఉన్నారు?” అని ప్రశ్నించాడు. ఆమె తన వేలితో మంచంపై నిర్జీవ కళేబరం మాదిరిగా పడి ఉన్న తన భర్తను చూపించింది. “అక్కడ ఉన్నారు. చూడండి, చావుకు బ్రతుకుకు మధ్య ఉన్నారు” అని జవాబిచ్చింది. ఇబ్లీస్ ఆమె పట్ల సానుభూతి చూపుతున్నట్లు నటిస్తూ, ఆమె భర్తతో గడిపిన మంచి రోజులను గుర్తు చేశాడు. అయ్యూబ్ (అలైహిస్సలాం) ఆరోగ్యంగా ఉన్నప్పుడు, వారి వద్ద పుష్కలంగా సంపద, సంతానం ఉన్నప్పటి రోజులను గుర్తు చేశాడు. ఆమె కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. ప్రస్తుతం అనుభవిస్తున్న కష్టాలు తలచుకుని ఆమె రోదించింది. దుఃఖంతో అయ్యూబ్ (అలైహిస్సలాం) వద్దకు వెళ్ళి, “మన ప్రభువు విధిస్తున్న ఈ కష్టాలను ఎంత కాలం భరిస్తారు? మనం ఇలాగే సంపద, సంతానం, మిత్రులు ఎవరూ లేకుండా గడుపవలసిందేనా? ఈ కష్టాలను తొలగించాలని మీరు అల్లాహ్ ను ఎందుకు ప్రార్థించడం లేదు?” అనడిగింది.
అయ్యూబ్ (అలైహిస్సలాం) నిట్టూర్చుతూ… బలహీన స్వరంతో జవాబిచ్చారు. “ఇబ్లీస్ నీలో ఇలాంటి భావాలు రేకెత్తించి ఉంటాడు. అందువల్లనే నీవు అసంతృప్తికి గురయ్యావు. ఒక విషయం చెప్పు, ఎంతకాలం నేను ఆరోగ్యం, సంపదలను అనుభవించాను?” అని ప్రశ్నించారు. ఆమె జవాబిస్తూ, “ఎనభై సంవత్సరాలు” అంది. మళ్ళీ అయ్యూబ్ (అలైహిస్సలాం) ఆమెను ప్రశ్నిస్తూ, “మనం ఎంతకాలంగా కష్టాలను అనుభవిస్తున్నాం?” అనడిగారు. ఆమె జవాబిస్తూ, “ఏడేళ్ళుగా” అని అంది. అప్పుడు అయ్యూబ్ (అలైహిస్సలాం) ఆమెకు జవాబిస్తూ, “అలా అయితే ఈ కష్టాలను తొలగించాలని అప్పుడే నా ప్రభువును కోరడం నాకు సిగ్గుచేటు. ఎందుకంటే నేను ఆరోగ్యం, ఐశ్వర్యాలు అనుభవించినంత కాలం కష్టాలను అనుభవించలేదు. నీ విశ్వాసం బలహీనమైనట్లుంది. నువ్వు అల్లాహ్ సంకల్పం పట్ల అసంతృప్తికి గురయ్యావు. నాకు మళ్ళీ ఆరోగ్యం చేకూరితే, నిన్ను వంద దెబ్బలతో శిక్షిస్తాను. ఈ రోజు నుంచి నీ చేతి నుంచి ఆహారం కాని, పానీయం కాని తీసుకోనని ప్రమాణం చేస్తున్నాను. నన్ను నా మానాన వదిలేయ్. నా ప్రభువు అభీష్టం ఎలా ఉంటే అలా జరుగుతుంది” అన్నారు. ఆమె హృదయ విదారకంగా దుఃఖిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆమెకు ఇక వెళ్ళక తప్పలేదు. వేరెక్కడయినా ఆశ్రయం వెతుక్కోక తప్పలేదు.
తొలగిన కష్టాలు
ఈ నిస్సహాయ స్థితిలో అయ్యూబ్ ప్రవక్త (అలైహిస్సలాం) అల్లాహ్ ప్రార్థనల్లో గడిపారు. దైవకారుణ్యం కోసం వేడుకున్నారు. అంతేకాని ఎలాంటి ఫిర్యాదులు చేయలేదు. “ప్రభూ! నేను ఈ వ్యాధితో చాలా కాలంగా బాధపడుతున్నాను. నీవు పరమ కరుణామయుడివి” అని ప్రార్థిస్తూ గడిపారు. అల్లాహ్ ఆయన ప్రార్ధనలకు ప్రతిస్పందించాడు. ఆయనకు జవాబిస్తూ, “నీ కాలితో నేలను కొట్టు, అక్కడి నుంచి నీటి ఊట ఉబికివస్తుంది. ఆ నీటిని త్రాగి, దానితో స్నానం చేయ్” అని అల్లాహ్ సూచించాడు. అయ్యూబ్ (అలైహిస్సలాం) అలాగే చేశారు. ఆ వెంటనే ఆయన ఆరోగ్యం కుదుటపడింది.
ఈలోగా అయ్యూబ్ ప్రవక్త భార్య తన భర్తను వదలి ఎక్కువ రోజులు ఉండలేకపోయారు. ఆయన వద్దకు క్షమాపణ కోరుకోవడానికి వచ్చారు. ఆయన సేవలో గడుపడానికి వచ్చారు. కాని ఇంటిలోకి వచ్చి అక్కడి మార్పును చూసి ఆమె ఆశ్చర్యపోయారు. అయ్యూబ్ (అలైహిస్సలాం) పూర్తి ఆరోగ్యంతో ఉన్నారు. ఆమె ఆశ్చర్యంతో, ఆనందంతో ఆయన్ను కౌగిలించుకుని, అల్లాహ్ కు కృతజ్ఞతలు చెల్లించింది.
ప్రతిజ్ఞ
ఇప్పుడు అయ్యూబ్ (అలైహిస్సలాం) మరింత ఆందోళనకు గురయ్యారు. తనకు ఆరోగ్యం చేకూరితే తన భార్యను వంద దెబ్బలతో శిక్షిస్తానని ప్రమాణం చేసి ఉన్నారు. కాని ఆమెను బాధించే ఉద్దేశ్యం ఆయనకు ఎంతమాత్రం లేదు. కాని తన ప్రమాణం ప్రకారం చేయకపోతే అల్లాహ్ పై చేసిన ప్రమాణం భంగపరచిన వారవుతారు. ఈ సంకటాన్ని అల్లాహ్ స్వయంగా తొలగించాడు. అల్లాహ్ ఆయ నకు సలహా ఇచ్చాడు. “వంద గడ్డిపోచలు కలిపి ఒక కట్టగా చేయ్.. నీ భార్య శరీరానికి ఆ కట్టను ఒకసారి తాకించు. ఆ విధంగా నీ బాధ్యత పూర్తవుతుంది. నీ కష్టకాలంలో నీ వెంట ఉన్న నిజాయితీ కలిగిన నీ భార్య పట్ల సానుభూతి, దయలను ప్రదర్శించినట్లవుతుంది” అన్న సలహాను ఆయన అమలు చేశారు. (38:41-44, 21:83-84, 6:84)
గ్రహించవలసిన పాఠాలు
(1) ప్రవక్తలకు కూడా పరీక్షలు, కష్టాలు తప్పవు. మనిషిని అతని విశ్వాస స్థాయికి అనుగుణంగా పరీక్షించడం జరుగుతుందని అంటారు. మనిషి బలమైన విశ్వాసం కలిగినవాడయితే కఠినమైన పరీక్షలకు గురిచేయడం జరుగుతుంది. ఈ విధంగా అల్లాహ్ మనిషి విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. ఈ పరీక్షల్లో సహనం వహించినవారికి తన కారుణ్యంతో ప్రతిఫలం ప్రసాదిస్తాడు. అల్లాహ్ ఈ విధంగానే అయ్యూబ్ ప్రవక్తను పరీక్షించాడు. ఆయన సహనానికి మారు పేరుగా నిలిచారు. అయ్యూబ్ (అలైహిస్సలాం) వంటి సహనం కలిగిన వ్యక్తిగా ఎవరినైనా ప్రశంసించడమంటే భావం అత్యంత ఉత్తమ స్థాయి సహనం కలిగినవాడని చెప్పడమే.
(2) సబ్ర్ (సహనం) గురించి డెబ్బయిసార్ల కన్నా అధికంగా దివ్యఖుర్ఆన్ ప్రస్తావించింది. మిగిలిన సద్గుణాలకన్నా సహనాన్ని అల్లాహ్ అధికంగా ప్రశంసించాడు.
(3) భార్యతో ఎలా వ్యవహరించాలన్నది అయ్యూబ్ ప్రవక్త ఆచరణల్లో తెలుస్తుంది. అయ్యూబ్ ప్రవక్త కష్టాల్లో ఉన్నప్పుడు ఇబ్లీస్ ఆయన భార్యను ప్రలోభానికి గురిచేశాడు. అందువల్ల ఆయన తన భార్యను శిక్షిస్తానని ప్రమాణపూర్వకంగా చెప్పారు. కాని ఆమె ఆయన పట్ల చాలా విశ్వాసంగా ఉన్న మహిళ, అందువల్ల ఆమె పట్ల ఉదారంగా వ్యవహరించవలసి ఉంది. ఈ సమస్యను పరిష్కరించడానికి అల్లాహ్ ఒక చక్కని మార్గాన్ని ఆయనకు చూపించాడు.
(4) వంద గడ్డిపోచల కట్టతో భార్యను తాకాలని చూపించిన పద్ధతి నిజానికి అల్లాహ్ నేర్పిన ఒక పాఠం. మాటలకు, వాస్తవాలకు మధ్య ఉన్న భేదాన్ని గుర్తించవలసిన అవసరాన్ని ఈ పద్ధతి తెలుపుతుంది. బహిరంగంగా విధించే సాధారణమైన శిక్ష కూడా మనిషికి సరిపోతుంది.
(5) అనాలోచితంగా ప్రమాణాలు చేయరాదని దివ్యఖుర్ఆన్ బోధిస్తుంది.
ఇతర ముఖ్యమైన లింకులు
- ప్రవక్తలు (మెయిన్ పేజీ):
https://teluguislam.net/prophets - ప్రవక్తల జీవిత చరిత్ర (యూట్యూబ్ ప్లే లిస్ట్)
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV2_iYX30U89yPwY5LPGtir8