స్వర్గంలోకి ప్రవేశించేవారు నాలుగు రకాలు
హబీబుర్రహ్మాన్ జామయి (హఫిజహుల్లాహ్)
https://youtu.be/O0rxrJs_Nms [22 నిముషాలు]
ఈ ప్రసంగంలో, స్వర్గంలో ప్రవేశించే వారి గురించి వివరించబడింది. ముఖ్యంగా నాలుగు రకాల స్వర్గవాసుల గురించి చర్చించబడింది. మొదటి రకం వారు విచారణ లేకుండా స్వర్గానికి వెళ్లేవారు, వీరిలో 70,000 మంది ఉంటారని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు. వీరి లక్షణాలు: ఇతరులను మంత్రించమని కోరరు, అపశకునాలు నమ్మరు, వాతలు పెట్టించుకోరు మరియు పూర్తిగా అల్లాహ్ పైనే నమ్మకం ఉంచుతారు. రెండవ రకం వారు విచారణ తర్వాత స్వర్గానికి వెళ్లేవారు. మూడవ రకం అస్ హాబుల్ ఆరాఫ్, వీరి పుణ్యాలు పాపాలు సమానంగా ఉంటాయి, వీరు కొంతకాలం ఆగి అల్లాహ్ దయతో స్వర్గానికి వెళ్తారు. నాల్గవ రకం వారు పాపాల కారణంగా నరకంలో శిక్ష అనుభవించిన తర్వాత, వారి ఈమాన్ కారణంగా స్వర్గానికి వెళ్లేవారు. పెద్ద పాపాలు చేసిన వారు కూడా చిత్తశుద్ధితో పశ్చాత్తాపం చెందితే (తౌబా), విచారణ లేకుండా స్వర్గానికి వెళ్లే అవకాశం ఉందని ఖుర్ఆన్ ఆయత్ ల ద్వారా స్పష్టం చేయబడింది. సహాబాల జీవితాల నుండి ఉదాహరణలు, ముఖ్యంగా ఉక్కాషా బిన్ మెహ్సన్ మరియు మూర్ఛ రోగంతో బాధపడిన స్త్రీ ఉదంతాలు, స్వర్గం పట్ల వారికున్న ఆకాంక్షను మరియు అల్లాహ్ పై వారికున్న ప్రగాఢ విశ్వాసాన్ని వివరిస్తాయి.
أَعُوذُ بِاللَّهِ مِنْ شُرُورِ أَنْفُسِنَا وَمِنْ سَيِّئَاتِ أَعْمَالِنَا
[అవూదు బిల్లాహి మిన్ షురూరి అన్ఫుసినా వ మిన్ సయ్యిఆతి అఅ్మాలినా]
మేము మా ఆత్మల చెడు నుండి మరియు మా చెడు పనుల నుండి అల్లాహ్ తో శరణు వేడుకుంటున్నాము.
مَنْ يَهْدِهِ اللَّهُ فَلَا مُضِلَّ لَهُ، وَمَنْ يُضْلِلْ فَلَا هَادِيَ لَهُ
[మన్ యహ్దిహిల్లాహు ఫలా ముదిల్ల లహు, వ మన్ యుద్లిల్ ఫలా హాదియ లహు]
అల్లాహ్ ఎవరికి మార్గనిర్దేశం చేస్తాడో, అతడిని ఎవరూ దారి తప్పించలేరు. మరియు ఆయన ఎవరిని దారి తప్పిస్తాడో, అతనికి ఎవరూ మార్గనిర్దేశం చేయలేరు.
وَأَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللَّهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ
[వ అష్హదు అల్ లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహు లా షరీక లహు]
మరియు అల్లాహ్ తప్ప మరెవరూ ఆరాధనకు అర్హులు కారని నేను సాక్ష్యమిస్తున్నాను, ఆయన ఒక్కడే, ఆయనకు భాగస్వామి ఎవరూ లేరు.
وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ
[వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు]
మరియు ముహమ్మద్ ఆయన దాసుడు మరియు ఆయన ప్రవక్త అని నేను సాక్ష్యమిస్తున్నాను.
أَمَّا بَعْدُ، فَإِنَّ خَيْرَ الْحَدِيثِ كِتَابُ اللَّهِ
[అమ్మా బఅదు ఫఇన్న ఖైరల్ హదీసి కితాబుల్లాహ్]
ఇక తర్వాత, నిశ్చయంగా, ఉత్తమమైన మాట అల్లాహ్ గ్రంథం (ఖుర్ఆన్).
وَخَيْرُ الْهَدْيِ هَدْيُ مُحَمَّدٍ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ
[వ ఖైరల్ హద్యి హద్యు ముహమ్మదిన్ సల్లల్లాహు అలైహి వసల్లం]
మరియు ఉత్తమమైన మార్గదర్శకత్వం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క మార్గదర్శకత్వం.
وَشَرُّ الْأُمُورِ مُحْدَثَاتُهَا، وَكُلُّ مُحْدَثَةٍ بِدْعَةٌ، وَكُلُّ بِدْعَةٍ ضَلَالَةٌ، وَكُلُّ ضَلَالَةٍ فِي النَّارِ
[వ షర్రల్ ఉమూరి ముహ్దసాతుహా, వ కుల్ల ముహ్దసతిన్ బిద్అతున్, వ కుల్ల బిద్అతిన్ దలాలతున్, వ కుల్ల దలాలతిన్ ఫిన్నార్]
మరియు చెడ్డ విషయాలు (ధర్మంలో) కొత్తగా కల్పించబడినవి, మరియు ప్రతి కొత్తగా కల్పించబడిన విషయం ఒక బిద్అత్ (, మరియు ప్రతి బిద్అత్ ఒక మార్గభ్రష్టత్వం, మరియు ప్రతి మార్గభ్రష్టత్వం నరకాగ్నికి దారితీస్తుంది.
సర్వ స్తోత్రాలు, అన్ని విధాల పొగడ్తలు, సర్వలోక ప్రభువైన, పాలకుడైన, సృష్టికర్త అయిన అల్లాహ్ కే శోభిస్తాయి. అనంత కరుణా శుభాలు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, ఆయన కుటుంబీకులపై, ఆయన ప్రియ సహచరులపై అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తన అనుగ్రహాలను వర్షింపజేయుగాక.
అభిమాన సోదరులారా, హమ్ద్ మరియు సనా తర్వాత స్వర్గములో ప్రవేశించే వారి గురించి కొన్ని విషయాలు తెలుసుకోబోతున్నాం.
స్వర్గంలో ప్రవేశించే నాలుగు రకాల వారు
స్వర్గములో ప్రవేశించే వారు నాలుగు రకాలు. అల్లాహ్ దయ, ఆయన కరుణ మూలంగా ఎవరైతే స్వర్గములో ప్రవేశిస్తారో, స్వర్గ ప్రవేశం ఎవరికి జరుగుతుందో వారు నాలుగు రకాలు.
మొదటి రకం: విచారణ లేకుండా, అతను చేసిన కర్మల లెక్క తీసుకోకుండా స్వర్గ ప్రవేశం జరుగుతుంది. అదృష్టవంతులు వారు, ఎటువంటి లెక్క లేదు, విచారణ లేదు. విచారణ లేకుండా స్వర్గ ప్రవేశం. ఇది మొదటి రకం.
రెండవ రకం: విచారణ తర్వాత స్వర్గ ప్రవేశం. నిలబడాలి, పుస్తకం ఇవ్వబడుతుంది, ఖుర్ఆన్ మరియు హదీస్ లో చెప్పబడిన విధంగా ప్రతి విషయం గురించి లెక్క తీసుకోవడం జరుగుతుంది. ఎలా సంపాదించావు? ఎలా ఖర్చు పెట్టావు? జీవితం ఎలా గడిచింది? వయసు, యవ్వనం, ప్రతి విషయం గురించి, ప్రతి చిన్న ప్రతి పెద్ద. అల్లాహ్ హక్కులు పూర్తి చేశావా లేదా? దాసుల హక్కులు పూర్తి చేశావా లేదా? ఫర్జ్ విషయాలు, ఆదేశాలు పాటించావా లేదా? ప్రతి విషయం గురించి అడగడం జరుగుతుంది. పరీక్ష తర్వాత, విచారణ తర్వాత స్వర్గ ప్రవేశం. రెండవ రకం.
మూడవ రకం: వారు నరకానికి పోరు, కానీ స్వర్గ ప్రవేశానికి నిర్ణీత సమయం వరకు ఆపబడతారు. వారు నరకానికి ఏ మాత్రం పోరు స్వర్గానికే పోతారు, కాకపోతే నిర్ణీత సమయం వరకు స్వర్గానికి పోకుండా ఆపబడతారు. వారినే అస్ హాబుల్ ఆరాఫ్ అంటారు, వారి ప్రస్తావన సూర నెంబర్ 7, సూర ఆరాఫ్ లో ఉంది. ఆరాఫ్ వారు నిర్నీత సమయం వరకు స్వర్గం పోకుండా ఆపబడతారు, తర్వాత స్వర్గానికి పోతారు. ఇది మూడవ రకం.
నాల్గవ రకం: వారి పాపాల మూలంగా నరకానికి పోతారు. శిక్ష ముగిసిన తర్వాత వారి ఈమాన్ మూలంగా చివరికి అల్లాహ్ తన దయతో స్వర్గానికి పంపిస్తాడు.
ఈ నాలుగు రకాలు స్వర్గానికి పోయేవారు.
విచారణ లేకుండా స్వర్గానికి వెళ్ళేవారు
వారిలో మొదటి వారు ఎవరు? విచారణ లేకుండా, ఎటువంటి లెక్క తీసుకోకుండా స్వర్గానికి పోయేవారు. వారి గురించి బుఖారీలో ఒక హదీస్ ఉంది అది తెలుసుకుందాం.
అబ్దుల్లాహ్ ఇబ్నె అబ్బాస్ రదియల్లాహు అన్హుమా కథనం. ఈయన ఎవరు? మన ప్రవక్త గారి పినతండ్రి అబ్బాస్ బిన్ అబ్దుల్ ముత్తలిబ్ కుమారులు. పెద్ద సహాబీ. ఖుర్ఆన్ జ్ఞానం కలిగిన వారు. ముఫస్సిర్ సహాబీ. ఆయన కోసం ప్రవక్త గారు దుఆ చేశారు. అందుకే ఖుర్ఆన్ యొక్క ఆయతుల పరమార్థం, అర్థం బాగా తెలిసిన వారు అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ రదియల్లాహు అన్హు. ఆయన అంటున్నారు, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు, ఏమని? “నాకు గత సమాజాలను చూపించడం జరిగింది”. మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కి గత సమాజాలు చూపించడం జరిగింది. తద్వారా నేను చూసింది ఏమిటంటే, (లక్షా ఇరవై నాలుగు వేల ప్రవక్తలలో) ఒక ప్రవక్తతో కేవలం కొంతమంది మాత్రమే ఉన్నారు, అంటే స్వర్గానికి పోయేవారు, పాస్ అయిన వారు, ఆయన్ని అల్లాహ్ ని విశ్వసించిన వారు విశ్వాసులు, మూమినీన్లు కొంతమంది మాత్రమే ఉన్నారు, కొంతమంది అంటే పది కంటే తక్కువ మంది. ఇంకో ప్రవక్తను చూశాను, ఆయనతో కేవలం ఒకే ఒక్క వ్యక్తి ఉన్నాడు. ఇంకో ప్రవక్తను చూశాను, ఆయన ఒక్కరే ఉన్నారు, ఆయనతో పాటు ఎవరూ లేరు. అంటే ఆ ప్రవక్తకి విశ్వసించిన వారు ఒక్కరు కూడా లేరు.
ఆ తర్వాత, అకస్మాత్తుగా నాకు పెద్ద సమూహం గోచరించింది. బహుశా ఇది నా అనుచర సమాజం అని అనుకున్నాను. కానీ ఇది మూసా అలైహిస్సలాం, ఆయన అనుచర సమాజం. ఆ తర్వాత, ఇటువైపు చూడండి అని నన్ను చెప్పటం జరిగింది, నేను చూశాను, పెద్ద సమూహం. ఎక్కడ వరకు చూస్తున్నానో అక్కడ వరకు ఉంది జనాలు, పెద్ద సమూహం. మరోవైపు చూడండి అని చెప్పడం జరిగింది, మరోవైపు చూశాను, పెద్ద సమూహం కనపడింది.
అప్పుడు, ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఇది మీ అనుచర సమాజం. వీరిలో డెబ్బై వేల మంది కర్మల విచారణ లేకుండానే స్వర్గములో ప్రవేశిస్తారు అని మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చి తమ గృహంలోకి వెళ్ళిపోయారు. ఇది విన్న సహాబాలు వారి మనసులో రకరకాల ఆలోచనలు, వారు ఎవరై ఉంటారు? విచారణ లేకుండా, లెక్క లేకుండా, డైరెక్ట్ స్వర్గ ప్రవేశం. సుబ్ హా నల్లాహ్! ఎంత అదృష్టవంతులు! వారెవరు? బహుశా ఇస్లాం స్థితిలోనే జన్మించి షిర్క్ దరిదాపులకి కూడా పోని వారు ఉండవచ్చు అని రకరకాల ఆలోచనలు, మాటలు మాట్లాడుకుంటున్నారు. అటువంటి వారు అయ్యి ఉండవచ్చు, ఇటువంటి వారు అయ్యి ఉండవచ్చు అని మాట్లాడుతూ ఉండగా, అంతలో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బయటకు వచ్చారు. వచ్చిన తర్వాత ఆ సహాబాల మాటలు విని, మీరు ఏమి మాట్లాడుకుంటున్నారు అని అడిగితే, ఓ దైవ ప్రవక్త! ఆ డెబ్బై వేల మంది ఎవరు? విచారణ లేకుండా, కర్మల లెక్క లేకుండా డైరెక్ట్ స్వర్గం, వారు ఎవరు దైవ ప్రవక్త అంటే దానికి సమాధానంగా మహా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన మాట ఏమిటంటే:
هُمُ الَّذِينَ لاَ يَرْقُونَ وَلاَ يَسْتَرْقُونَ وَلاَ يَتَطَيَّرُونَ وَعَلَى رَبِّهِمْ يَتَوَكَّلُونَ
[హుముల్లదీన లా యర్కూన వలా యస్తర్కూన వలా యతతయ్యరూన వఅలా రబ్బిహిమ్ యతవక్కలూన]
“వారు స్వయంగా మంత్రించి ఊదుకోరు, ఇతరులతో మంత్రించి ఊదించుకోరు, అపశకునం పాటించరు, కేవలం తమ ప్రభువు అనగా అల్లాహ్ పైనే నమ్మకం కలిగి ఉంటారు.”
ఈ నాలుగు లక్షణాలు, గుణాలు కలిగిన వారు. వారెవరు? వారు స్వయంగా మంత్రించి ఊదుకోరు, ఇతరులతో మంత్రించి ఊదించుకోరు, అపశకునం పాటించరు, కేవలం తమ ప్రభువు అనగా అల్లాహ్ పైనే నమ్మకం కలిగి ఉంటారు అని చెప్పారు, మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం.
ఒక సహాబీ, ఆయన పేరు ఉక్కాషా బిన్ మెహ్సన్ రదియల్లాహు అన్హు, ఆయన ఇది విని వెంటనే, ఓ దైవ ప్రవక్త, విచారణ లేకుండా, కర్మల లెక్క లేకుండా, డైరెక్ట్ స్వర్గంలో ప్రవేశించే వారిలో నేను కూడా ఉండాలని దుఆ చేయండి అల్లాహ్ తో అని విన్నవించుకున్నారు. ఎవరు? ఉక్కాషా బిన్ మెహ్సన్ రదియల్లాహు అన్హు. మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, దుఆ చేసే అవసరం లేదు, నువ్వు వారిలో ఉన్నావు అని శుభవార్త చెప్పేశారు. “పో ఉక్కాషా, నువ్వు వారిలో ఉన్నావు. ఎవరికైతే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా విచారణ లేకుండా, లెక్కల అది లెక్కలు లేకుండా డైరెక్ట్ గా స్వర్గం పంపుతారో, నువ్వు వారిలో ఉన్నావు” అని చెప్పారు. సుబ్ హా నల్లాహ్! ఈ భాగ్యం ఉక్కాషా బిన్ మెహ్సన్ కి ఖచ్చితంగా తెలిసిపోయింది. అల్ హమ్దులిల్లాహ్. ఇది విని ఇంకో సహాబీ లేచారు. ఓ దైవ ప్రవక్త, నా కోసం కూడా దుఆ చేయండి, నేను కూడా ఆ సమూహంలో ఉండాలి అని. దానికి మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, “సబకక బిహా ఉక్కాషా” అన్నారు. అంటే, ఉక్కాషా నీకన్నా ముందుకి వెళ్ళిపోయాడు, ఆ భాగ్యాన్ని ఆయన నోచుకున్నాడు అని చెప్పేశారు మహా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. ఈ హదీస్ బుఖారీలోనే మూడు చోట్ల ఉంది.
ఇదే హదీస్ ముస్లిం గ్రంథంలో కొంచెం తేడాతో ఇలా ఉంటుంది.
هُمُ الَّذِينَ لاَ يَسْتَرْقُونَ وَلاَ يَتَطَيَّرُونَ وَلاَ يَكْتَوُونَ وَعَلَى رَبِّهِمْ يَتَوَكَّلُونَ
[హుముల్లదీన లా యస్తర్కూన వలా యతతయ్యరూన వలా యక్తవూన వఅలా రబ్బిహిమ్ యతవక్కలూన]
“వారు ఇతరులతో మంత్రించి ఊదించుకోరు, అపశకునాలు పాటించరు, (వ్యాధి నివారణకు) వాతలు పెట్టించుకోరు మరియు తమ ప్రభువు పైనే నమ్మకం కలిగి ఉంటారు.”
వారు ఎవరంటే, వారు మంత్రించి ఊదించుకోరు. రెండవది, అపశకునం పాటించరు. ఈ అపశకునం గురించి రెండు వారాల ముందు మనం తెలుసుకున్నాం జుమా ప్రసంగంలోనే అపశకునం అంటే ఏమిటి అనేది. మూడవది, శరీరాన్ని అగ్నితో వాతలు పెట్టుకోరు. నాలుగవది, కేవలం అల్లాహ్ పైనే నమ్మకం కలిగి ఉంటారు. ఇది పూర్తి హదీస్, విచారణ లేకుండా స్వర్గానికి పోయే వారి గురించి.
దీనికి సంబంధించిన సహాబియాత్ లలో, సహాబాలలో అనేక ఉదాహరణలు మనకు కనబడతాయి, వారి జీవిత చరిత్ర మనము చదివితే. ప్రపంచ సమస్యలను, ప్రపంచ బాధలను పట్టించుకోకుండా, వారు ప్రాధాన్యత ఇచ్చింది పరలోకానికి. వారిలో ప్రతి ఒక్కరూ నేను విచారణ లేకుండా స్వర్గానికి పోయే వారిలో ఉండాలని ప్రయత్నం చేసేవారు. దానికి ఉదాహరణ ఒక హదీస్ ఉంది అది తెలుసుకుందాం. ఈ హదీస్ కూడా బుఖారీలో ఉంది, ముస్లింలో కూడా ఉంది. ఇది ఏమిటి?
అతా బిన్ అబూ రిబాహ్ అంటున్నారు, నాకు అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ రదియల్లాహు అన్హుమా పిలిచి, నేను నీకు ఒక స్వర్గ స్త్రీని, స్వర్గ మహిళని చూపించనా అని అడిగారు. “ఖుల్తు బలా”, తప్పనిసరిగా చూపించండి, స్వర్గ మహిళ! అంటే ప్రతి ఒక్కరికి గ్యారెంటీ లేదు కదా. మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పరమపదించిన తర్వాత ఎవరు స్వర్గానికి పోతారో ఖచ్చితంగా చెప్పగలమా? కానీ ఎవరెవరికైతే మన ప్రవక్త గారు ముందే చెప్పి పోయారో వారు ఖచ్చితం గ్యారెంటీ. ఆ విషయం ఇది. అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ అంటున్నారు “ఓ అతా బిన్ అబూ రిబాహ్, స్వర్గ మహిళకి చూపించినా?” చూపించండి అన్నారు. అప్పుడు ఆయన అంటున్నారు ఇదిగో ఆ నల్ల రంగు గల స్త్రీ.
ఆవిడ ఒకసారి మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి వచ్చి, ఓ దైవ ప్రవక్త, నాకు మూర్ఛ రోగం ఉంది. ఆ రోగం వచ్చినప్పుడు, ఆ స్థితిలో నేను నగ్నంగా అయిపోతాను, నా శరీరంలో బట్టలు లేచిపోతాయి, ఎగిరిపోతాయి. స్వస్థత కోసం దుఆ చేయండి దైవ ప్రవక్త అన్నారు.
ఇది విని మహా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆవిడకి రెండు ఆప్షన్లు ఇచ్చారు. అది ఏమిటి?
إِنْ شِئْتِ صَبَرْتِ وَلَكِ الْجَنَّةُ، وَإِنْ شِئْتِ دَعَوْتُ اللَّهَ أَنْ يُعَافِيَكِ
[ఇన్ షి’తి సబర్తి వలకిల్ జన్నతు, వ ఇన్ షి’తి దఅవుతుల్లాహ అన్ యుఆఫియకి]
“నువ్వు తలచుకుంటే సహనం వహించు, నీకు స్వర్గం ఉంది. లేదా నువ్వు కోరుకుంటే నేను అల్లాహ్ తో దుఆ చేస్తాను, ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు.”
ఆ స్వర్గ మహిళ మొదటి ఆప్షన్ ఎన్నుకున్నది. నేను సహనం వహిస్తాను ఓ దైవ ప్రవక్త, ఎందుకంటే నాకు స్వర్గం లభిస్తుంది, చెప్పారు కదా, స్వర్గం గ్యారెంటీ ఇస్తున్నారు కదా. నాకు ఈ రోగం ఉన్నా పర్వాలేదు, నేను సహనం వహిస్తాను, కాకపోతే ఒక్క విన్నపం. ఆ రోగం వచ్చినప్పుడు, ఆ స్థితిలో నా శరీరం నుంచి నా బట్టలు ఎగరకుండా ఉండాలి, నేను నగ్నం అవ్వకూడదు, దాని కోసం ప్రార్థించండి అన్నారు. దాని కోసం మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రార్థన చేశారు.
అభిమాన సోదరులారా, ఇది సహాబాల ప్రయత్నం, వారి కృషి, ఏ విధంగా నేను స్వర్గానికి పోవాలి, అది కూడా విచారణ లేకుండా స్వర్గానికి పోవాలి అనేది.
పాపాలు చేసి పశ్చాత్తాపం చెందిన వారు
ఒక ప్రశ్న, అది ఏమిటంటే, కొందరు చిన్న చిన్న ఏదో పాపాలు చేస్తారు, పెద్ద పాపాలు కూడా చేస్తారు, కాకపోతే బుఖారీ హదీస్ లో చెప్పబడిన ఈ నాలుగు లక్షణాలు ఉన్నాయి కదా అవి ఉండవు. అపశకునం పాటించరు. షిర్క్ చేయరు. మంత్రించి ఊదించుకోరు. అల్లాహ్ పై నమ్మకం ఉంది. ఈ నాలుగు లక్షణాలు ఉన్నాయి, వేరే పాపాలు చేస్తున్నారు. అటువంటి వారు కర్మల విచారణ లేకుండా స్వర్గానికి పోతారా? ఈ ప్రశ్న షేఖ్ ముహమ్మద్ సాలెహ్ అల్-మునజ్జిద్ తో అడగడం జరిగింది. ఆయన సమాధానం ఇచ్చారు, చిన్న పెద్ద పాపాలకి పాల్పడిన వాడు కూడా కర్మల విచారణ లేకుండా స్వర్గానికి పోయే అవకాశం ఉంది అని చెప్పి ఆయన సూర ఫుర్ఖాన్ లోని ఈ ఆయత్ ను పఠించారు. ఆయత్ ఏమిటి?
وَالَّذِينَ لَا يَدْعُونَ مَعَ اللَّهِ إِلَٰهًا آخَرَ وَلَا يَقْتُلُونَ النَّفْسَ الَّتِي حَرَّمَ اللَّهُ إِلَّا بِالْحَقِّ وَلَا يَزْنُونَ
వారు అల్లాహ్‌తోపాటు మరో దైవాన్ని మొరపెట్టుకోరు. న్యాయబద్ధంగా తప్ప – అల్లాహ్ ఏ ప్రాణిని హత్య చేయటాన్ని నిషేధించాడో దానిని హతమార్చరు. వారు వ్యభిచారానికి పాల్పడరు. (25:68)
అంటే, వారు అల్లాహ్ తో పాటు మరే దైవాన్ని మొరపెట్టుకోరు అంటే షిర్క్ చేయరు. న్యాయబద్ధంగా తప్ప అల్లాహ్ ఏ ప్రాణిని హత్య చేయటాన్ని నిషేధించాడో దానిని హతమార్చరు, అంటే హత్య చేయరు. వారు వ్యభిచారానికి పాల్పడరు, వ్యభిచారం చేయరు. మూడు విషయాలు, షిర్క్ చేయరు, హత్య చేయరు, వ్యభిచారం చేయరు. ఈ చేష్టలకు ఒడగట్టిన వారు, చేస్తే? హత్య చేశారు, లేదా వ్యభిచారం చేశారు, లేదా షిర్క్ చేశారు. ఇలా చేస్తే, పాప ఫలాన్ని పొంది తీరుతాడు. అంతేకాకుండా:
يُضَاعَفْ لَهُ الْعَذَابُ يَوْمَ الْقِيَامَةِ وَيَخْلُدْ فِيهِ مُهَانًا
ప్రళయదినాన అతనికి రెట్టింపు శిక్ష వడ్డించబడుతుంది. వాడు పరాభవంపాలై, అత్యంత నికృష్టస్థితిలో కలకాలం అందులో పడి ఉంటాడు. (25:69)
ఇక మూడోవ ఆయత్.
إِلَّا مَنْ تَابَ وَآمَنَ وَعَمِلَ عَمَلًا صَالِحًا فَأُولَٰئِكَ يُبَدِّلُ اللَّهُ سَيِّئَاتِهِمْ حَسَنَاتٍ ۗ وَكَانَ اللَّهُ غَفُورًا رَحِيمًا
అయితే (ఈ పాప కార్యాల తరువాత) ఎవరు పశ్చాత్తాపం చెంది, విశ్వసిస్తారో, సదాచరణ చేస్తారో అలాంటి వారి పాపాలను అల్లాహ్ పుణ్యాలుగా మార్చి వేస్తాడు. అల్లాహ్ క్షమాభిక్ష పెట్టేవాడు, కరుణాకరుడు.(25:70)
అయితే, ఈ పాప కార్యాల తర్వాత, పాపం చేసిన తర్వాత కుమిలిపోయి, పశ్చాత్తాపం చెంది, కన్నీళ్లు కార్చి, అంటే ఇక్కడ పశ్చాత్తాపం అంటే జోక్ కాదు, సీరియస్. ఏ పశ్చాత్తాపం గురించి అల్లాహ్ చెప్పాడో, “యా అయ్యుహల్లదీన ఆమనూ తూబూ ఇలల్లాహి తౌబతన్ నసూహా”. తౌబయే నసూహా. ఏ విధంగా ఖుర్ఆన్ లో హదీస్ లో తౌబా అంటే ఏమిటి, ఆ విధంగా తౌబా పశ్చాత్తాపం చెంది, కుమిలిపోయి పశ్చాత్తాపం చెందారో, విశ్వసిస్తారో, సదాచరణ చేస్తారో, అలాంటి వారి పాపాలను అల్లాహ్ పుణ్యాలుగా మార్చేస్తాడు. సుబ్ హా నల్లాహ్! వారు చేసిన పాపాలు పుణ్యాలుగా మార్చివేయబడతాయి. అల్లాహ్ క్షమాపశీలి, కరుణామయుడు. అంటే ఈ ప్రశ్నకు సమాధానం ఏమిటి? తౌబా చేసుకుంటే, ఆ నాలుగు లక్షణాలు ఉంటే, షిర్క్ చేయని వారు, మంత్రించి ఊదుకోని వారు, అపశకునం పాటించని వారు, అల్లాహ్ పై నమ్మకం వేసిన వారు, వేరే పాపాలు చేసిన తర్వాత పూర్తి నమ్మకంతో, సంపూర్ణ విశ్వాసంతో, దృఢ సంకల్పంతో కుమిలిపోతూ నిజమైన తౌబా చేసుకుంటే వారికి కూడా విచారణ లేకుండా స్వర్గ ప్రవేశానికి అవకాశం ఉంది.
మూడవ రకం వారు – అస్ హాబుల్ ఆరాఫ్
ఇక వారు ఎవరు? మూడవ వర్గం, నరకానికి పోరు, నిర్నీత సమయం వరకు ఆరాఫ్ పైన, ఆరాఫ్ అది స్థలం అక్కడ పరలోకములో. ఆరాఫ్ అంటే ఒక స్థలం పేరు, గోడ పేరు. ఆరాఫ్ పైన చాలామంది ఉంటారు, వారు ప్రతి ఒక్కరినీ వారి చిహ్నాలను బట్టి గుర్తుపడతారు. అంటే ఆరాఫ్ పైన ఉన్న మనుషులు స్వర్గానికి పోయేవారు ఎవరు, నరకానికి పోయేవారు ఎవరు, వారి ఆనవాలను బట్టి గుర్తుపట్టేస్తారు వాళ్ళు, ఆరాఫ్ వాళ్ళు, ఆ గోడ పైన ఉన్నవారు. వారు స్వర్గవాసులను పిలిచి “అస్సలాము అలైకుమ్”, మీపై శాంతి కలుగుగాక అని అంటారు. ఈ ఆరాఫ్ వారు అప్పటికీ ఇంకా స్వర్గంలో ప్రవేశించి ఉండరు. అయితే స్వర్గం లభిస్తుందన్న ఆశతో వారు ఉంటారు. అసలు వీళ్ళు ఎవరు? వీరి గురించి అత్యధిక ధర్మ పండితుల అభిప్రాయం ఏమిటంటే, ఆరాఫ్ వాళ్ళు, వారి సత్కర్మలు, దుష్కర్మలు, పుణ్యాలు, పాపాలు సరిసమానంగా ఉంటాయి. వారి సత్కర్మలు వారిని నరకంలో పోకుండా ఆపుతాయి, వారి దుష్కర్మలు స్వర్గానికి పోకుండా ఆపుతాయి. అందుకు నిర్నీత సమయం వరకు వారు వేచి ఉంటారు, స్వర్గానికి పోకుండా ఆపబడి ఉంటారు, ఆ తర్వాత అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తన దయతో వారిని స్వర్గానికి పంపిస్తాడు. వీరు మూడవ రకం వారు.
అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరినీ విచారణ లేకుండా స్వర్గంలో ప్రవేశించే ఆ సమూహంలో చేరిపించు గాక. ఆమీన్. మనందరికీ ఇహపరలోకాల సాఫల్యం ప్రసాదించుగాక. ఆమీన్. వా ఆఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.
You must be logged in to post a comment.