సర్వనాశనం చేసే ఘోరాతి ఘోరమైన ఏడు పాపాలు

56. హజ్రత్ అబూ హురైరా (రధి అల్లాహు అన్హు) కధనం :- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అనుచరుల్ని ఉద్దేశించి,

” మిమ్మల్ని సర్వనాశనం చేసే పనులకు దూరంగా ఉండండని” హెచ్చరించారు. ” ఆ పనులేమిటి ధైవప్రవక్తా?” అని అడిగారు అనుచరులు. అప్పుడాయన ఇలా సెలవిచ్చారు –

(1) అల్లాహ్ కి సాటి కల్పించటం;
(2) చేతబడి చేయటం;
(3) ధర్మయుక్తంగా తప్ప అల్లాహ్ హతమార్చకూడదని నిషేధించిన ప్రాణిని హతమార్చడం;
(4) వడ్డీ సొమ్ము తినడం;
(5) అనాధ సొమ్మును హరించి వేయడం;
(6) ధర్మయుద్దంలో వెన్నుజూపి పారిపోవడం;
(7) ఏ పాపమెరుగని అమాయక ముస్లిం స్త్రీలపై అపనిందలు మోపడం.

[సహీహ్ బుఖారీ : 55 వ ప్రకరణం – అల్ వసాయా, 23 వ అధ్యాయం – ఖౌలిల్లాహ్ …. ఇన్నల్లజీనయాకులూన అమ్వాలల్ యతామాజుల్మా]

విశ్వాస ప్రకరణం : 36 వ అధ్యాయం – ఘోరపాపాలు, ఘోరాతి ఘోరమైన పాపాలు
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) Vol. 1
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

Read English Version of this Hadeeth

సజ్జనులతో సహవాసం చేయడం, దుర్జనులకు దూరంగా ఉండటం

1687. హజ్రత్ అబూ మూసా అష్ అరీ (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు :-

మంచి మిత్రుడ్ని – చెడ్డ స్నేహితుడ్ని, కస్తూరి అమ్మే వాడితో – కొలిమి ఊదే వాడితో పోల్చవచ్చు. కస్తూరీ అమ్మేవాడునీకు కస్తూరీని కానుకగానయినా ఇస్తాడు లేదా నీవతని దగ్గర దాన్ని కొననయినా కొంటావు. లేదా కనీసం అతని దగ్గర్నుంచి నీకు సువాసనయినా వస్తుంది. కాని కొలిమి ఊదేవాడు (నిప్పు రవ్వలు ఎగరేసి) నీ బట్టలను  కాలుస్తాడు లేదా అతని దగ్గర్నుంచి నీకు దుర్వాసన అయినా వస్తుంది (నీ స్నేహితుల సంగతి కూడా అంతే).

[సహీహ్ బుఖారీ : 72 వ ప్రకరణం – అజ్జిబాయి వస్సైద్, 31 వ అధ్యాయం – అల్ మిస్క్]

సామాజిక మర్యాదల ప్రకరణం – 45 వ అధ్యాయం
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-2
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

Read English Version of this Hadeeth

ఆవులించడం మంచిది కాదు

1885. హజ్రత్ అబూ హురైరా (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు :-

ఆవులింత షైతాన్ తరఫు నుండి వస్తుంది. కనుక మీలో ఎవరికైనా ఆవులింత వస్తే అతను వీలైనంత వరకు దాన్ని ఆపుకోవడానికి ప్రయత్నించాలి.(*)

(*) ఆవులింత షైతాన్ తరుఫు నుండి వస్తుంది అంటే, మనిషి విలువైన ఆహారాన్ని హద్దు మీరి తినడం వల్ల ఉదర భారంతో ఆవులిస్తాడు. ఇక్కడ హద్దు మీరి తినడాన్ని షైతాన్ చేష్ట గా వర్ణించటం జరిగింది. ఆవులింత అవసరానికి మించి తినడాన్ని సూచిస్తుంది. ఆవులింతను ఆపడం అంటే, ఆవులింతకు కారణభూతమయ్యే పనులను మానుకోవాలని అర్ధం. ఉదాహరణకు మితిమీరి తినడం, అతిగా విశ్రాంతికి అలవడటం ఇత్యాదివి. వీలైనంతవరకు ఆవులింత రాకుండా ఆపుకోవడం అని కూడా అర్ధం వస్తుంది. ఒకవేళ ఆవులింత ఆగకపోతే ఆ సమయంలో షైతాన్ ఆశయం నెరవేరకుండా, అంటే వాడు నోట్లో దూరి మనిషి ముఖాన్ని చెడగొట్టనీకుండా నోటి మీద చెయ్యి పెట్టుకోవాలి. (సంకలన కర్త)

[సహీహ్ బుఖారీ : 59 వ ప్రకరణం – బదయిల్ ఖల్ఖ్ , 11 వ అధ్యాయం – సిఫతి ఇబ్లీస వ జునూదిహీ]

ప్రేమైక వచనాల ప్రకరణం : 9 వ అధ్యాయం
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-2
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

Read English Version of this Hadeeth

అల్లాహ్ ని కలుసుకోగోరిన వ్యక్తిని అల్లాహ్ కూడా కలుసుకోగోరుతాడు

1719. హజ్రత్ ఉబాదా బిన్ సామిత్ (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు :-

ఎవరైతే అల్లాహ్ ని కలుసుకోవడానికి ఇష్టపడతాడో అతడ్ని కలుసుకోవడానికి అల్లాహ్ కూడా ఇష్టపడతాడు. అలాగే ఎవరు అల్లాహ్ ని కలుసుకోవడానికి ఇష్టపడడో  అతడ్ని కలుసుకోవడానికి అల్లాహ్ కూడా ఇష్టపడడు.

[సహీహ్ బుఖారీ : 81 వ ప్రకరణం – అర్రిఖాఖ్, 41 వ అధ్యాయం – మన్ అహబ్బలిఖా అల్లాహి అహబ్బల్లాహ లిఖాఅహు]

ప్రాయశ్చిత్త ప్రకరణం : 5 వ అధ్యాయం
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-2
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

Read English Version of this Hadeeth

సామూహిక నమాజులో ఒక్క రకాతు లభించినా అది సామూహిక నమాజే

353. హజ్రత్ అబూ హురైరా (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు :-

ఎవరికైనా (సామూహిక) నమాజులో ఒక్క రకాతు లభించినా సరే అతని నమాజు మొత్తం సామూహిక నమాజుగా పరిగణించబడుతుంది.

[సహీహ్ బుఖారీ : 9 వ ప్రకరణం – అల్ మవాకియతుస్సలాత్, 29 వ అధ్యాయం – మన్ అద్రక మినస్సలాతి రక అతన్]

ప్రార్ధనా స్థలాల ప్రకరణం – 30 వ అధ్యాయం
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-1
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

Read English Version of this Hadeeth

కర్మల బలంతో కాదు అల్లాహ్ దయతోనే స్వర్గాన్ని పొందగలరు

1793. హజ్రత్ అబూ హురైరా (రధి అల్లాహు అన్హు) కధనం :- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఉద్బోధిస్తూ

” మీలో ఏ ఒక్కడూ కేవలం తన కర్మల బలంతో మోక్షం పొందలేడు” అని అన్నారు. అనుచరులు ఈ మాట విని “ధైవప్రవక్తా! మీరు కూడానా?” అని అడిగారు. “ఔను, నేను కూడా కర్మల బలంతో మోక్షం పొందలేను. మోక్షం పొందడానికి ఒకే ఒక మార్గం ఉంది. అది, దేవుడు నన్ను తన కారుణ్య ఛాయలోకి తీసుకోవాలి. కనుక మీరు సరయిన రుజుమార్గంలో నడవండి (ముక్తి విషయాన్ని దైవానుగ్రహం పై వదలి పెట్టండి)” అన్నారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం).

[సహీహ్ బుఖారీ – 81 వ ప్రకరణం – అర్రిఖాఖ్, 18 వ అధ్యాయం – అల్ ఖస్ది వల్ ముదావమతి అలల్ అమల్]

కపట విశ్వాసుల ప్రకరణం – 17 వ అధ్యాయం – కేవలం ఆచరణ వల్ల ఎవరూ స్వర్గానికి పోలేరు, దైవానుగ్రహం ఉండాలి
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) Vol. 2
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

Read English Version of this Hadeeth

దైవమార్గంలో పోరాడుతూ ఒకరోజు ఉపవాసం పాటించే వ్యక్తి

709. హజ్రత్ అబూ సయీద్ ఖుధరీ (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు :-

దైవమార్గంలో పోరాడుతూ ఒకరోజు ఉపవాసం పాటించే వ్యక్తిని దేవుడు నరకానికి డెభ్భై యేండ్ల (ప్రయాణం) మేరకు దూరంగా ఉంచుతాడు.

[సహీహ్ బుఖారీ : 56 వ ప్రకరణం – జిహాద్ వస్సైర్, 36 వ అధ్యాయం – ఫజ్లుస్సౌమి ఫీసబీలిల్లాహ్]

ఉపవాస ప్రకరణం – 31 వ ప్రకరణం – ధైవయోధుని ఉపవాసం ఘనత
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు (Al-Loolu Wal Marjan ) vol-1
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

English Version of the Hadeeth: Whosoever observes Saum (fast) for one day for Allaah’s Cause ..

మనిషి వృద్ధుడైపోతూ ఉంటే అతనిలో పెరిగే రెండు కోరికలు

621. హజ్రత్ అనస్ (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రభోధించారు:-

మానవుడు ఒకవైపు వృద్ధుడైపోతూ ఉంటే, మరోవైపు అతనిలో రెండు విషయాలు అధికమవుతూ ఉంటాయి.
ఒకటి : ధన వ్యామోహం, రెండు: దీర్ఘాయుష్షు పట్ల కోరిక.

[సహీహ్ బుఖారీ : 81 వ ప్రకరణం – రిఖాఖ్, 5 వ అధ్యాయం – మన్ బలగ సిత్తీన సనతా…]

జకాత్ ప్రకరణం : 38 వ అధ్యాయం – ప్రాపంచిక వ్యామోహం గర్హనీయం
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-1
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

Read English Version of this Hadeeth

సమాధులపై మస్జిద్ నిర్మించరాదు

308. హజ్రత్ అయిషా (రధి అల్లాహు అన్హ), హజ్రత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ (రధి అల్లాహు అన్హు) ల కధనం:-

ధైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కు మరణసమయం ఆసన్నమయినపుడు ఆయన పరిస్థితి చాలా  దుర్భరంగా మారిపోయింది. ఒక్కోసారి ఆయన తన దుప్పటిని ముఖం మీదికి లాగుకునేవారు. కాస్సేపటికి ఊపిరి ఆడకపోవడంతో ముఖం మీది దుప్పటిని తొలగించి వేసేవారు. అలాంటి స్థితిలో సయితం ఆయన (సమాధి పూజలను శపిస్తూ) “యూదులు, క్రైస్తవులు తమ ప్రవక్తల సమాధుల్ని ప్రార్ధనా స్థలాలుగా చేసుకున్నారు. దేవుడు వారిని శపించుగాక!” అని అన్నారు. ఈ విధంగా ప్రవచించి ఆయన ముస్లింలను ఇలాంటి చర్యలకు పాల్పడకూడదని పరోక్షంగా హెచ్చరించారు.

[సహీహ్ బుఖారీ : 8 వ ప్రకరణం – సలాత్, 55 వ అధ్యాయం – హద్దసనా అబూయమాన్]

ప్రార్ధనా స్థలాల ప్రకరణం – 3 వ అధ్యాయం
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-1
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

Read English Version of this Hadeeth

అజాన్ చెప్పడంలో మరియు సామూహిక నమాజు చేయటంలో గల పుణ్యాలు

251. హజ్రత్ అబూ హురైరా (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు:-

అజాన్ చెప్పడంలో, మొదటి పంక్తిలో చేరడంలో ఎంత పుణ్యం ఉందో ప్రజలకు గనక తెలిస్తే, ఆ అవకాశాలు లాటరీ పద్ధతి ద్వారా మాత్రమే లభిస్తాయని తెలిస్తే, మీరు తప్పకుండా పరస్పరం లాటరీ వేసుకుంటారు. అలాగే వేళ కాగానే తొలి సమయంలో నమాజు చేయడంలో ఎంత పుణ్యం ఉందో తెలిస్తే, అందులో కూడా ప్రజలు ఒకర్నొకరు మించిపోవడానికి పోటీ పడతారు. అదే విధంగా ఇషా, ఫజ్ర్ (సామూహిక) నమాజులు చేయడంలో ఎంత పుణ్యం ఉందో తెలిస్తే, వాటికోసం కాళ్ళీడ్చుకుంటూ నడవ వలసి వచ్చినా సరే వారు పరస్పరం పోటీపడి వస్తారు.

[సహీహ్ బుఖారీ : 10 వ ప్రకరణం – అజాన్, 9 వ అధ్యాయం – అల్ ఇస్తిహామి ఫిల్ అజాన్]

నమాజు ప్రకరణం – 28 వ అధ్యాయం – పంక్తులను వంకరటింకరగా లేకుండా తిన్నగా ఉంచాలి
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-1
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

Read English Version of this Hadeeth