అల్లాహ్ కారుణ్య చాయలోకి ఆ ఏడుగురు! https://youtu.be/Fp0v2wzd9M0 [13 నిముషాలు] షేక్ హబీబుర్రహ్మాన్ జామయి (హఫిజహుల్లాహ్)
ఈ ప్రసంగంలో, ప్రళయ దినం యొక్క భయంకరమైన స్వభావం గురించి మరియు ఆ కఠినమైన రోజున అల్లాహ్ యొక్క కారుణ్య ఛాయలో (అర్ష్ నీడలో) ఆశ్రయం పొందే ఏడుగురు వ్యక్తుల గురించి వివరించబడింది. ఆ రోజు యొక్క తీవ్రత ఖుర్ఆన్ ఆయతుల ద్వారా వర్ణించబడింది. ఆ ఏడుగురు అదృష్టవంతులు: 1. న్యాయమైన పాలకుడు, 2. అల్లాహ్ ఆరాధనలో యవ్వనాన్ని గడిపిన యువకుడు, 3. హృదయం మస్జిద్‌లకు అంటిపెట్టుకుని ఉండే వ్యక్తి, 4. అల్లాహ్ కొరకు ఒకరినొకరు ప్రేమించుకుని, ఆయన కొరకే కలిసి, ఆయన కొరకే విడిపోయే ఇద్దరు వ్యక్తులు, 5. ఉన్నతమైన మరియు అందమైన స్త్రీ పాపానికి ఆహ్వానించినప్పుడు “నేను అల్లాహ్‌కు భయపడుతున్నాను” అని చెప్పే వ్యక్తి, 6. కుడి చేత్తో చేసిన దానం ఎడమ చేతికి కూడా తెలియకుండా గోప్యంగా దానం చేసే వ్యక్తి, 7. ఏకాంతంలో అల్లాహ్‌ను స్మరించుకుని కన్నీరు కార్చే వ్యక్తి.
అభిమాన సోదరులారా! కారుణ్య వర్షిణి రమదాన్ అనే ఈ కార్యక్రమంలోకి మీ అందరినీ ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను.
أَلسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ ٱللَّٰهِ وَبَرَكَاتُهُ (అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు)
ఈరోజు మనం ప్రళయ భీభత్సం, ఆ రోజున అల్లాహ్ కారుణ్య ఛాయలో ఉంచబడే ఆ ఏడుగురి గురించి క్లుప్తంగా తెలుసుకుందాం.
ప్రళయ దిన భీభత్సం
ప్రియ వీక్షకుల్లారా! ప్రళయం అనేది ఒక భయంకరమైన విషయం. అది చాలా కఠినమైన రోజు. ఆ రోజు సర్వాధిపతి అయిన అల్లాహ్ సమక్షములో ప్రతి ఒక్కరూ హాజరు కావలసి ఉన్నది. ఆ విషయం గురించి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూరతుల్ ముతఫ్ఫిఫీన్‌లో ఇలా తెలియజేశాడు,
لِيَوْمٍ عَظِيمٍ (లి యౌమిన్ అజీమ్) ఒక మహాదినాన… (83:5)
يَوْمَ يَقُومُ النَّاسُ لِرَبِّ الْعَالَمِينَ (యౌమ యఖూమున్నాసు లి రబ్బిల్ ఆలమీన్) ఆ రోజు జనులంతా సర్వలోకాల ప్రభువు ముందు నిలబడతారు. (83:6)
ప్రజలందరూ సర్వలోకాలకు ప్రభువైన అల్లాహ్ సమక్షంలో హాజరుపడతారు. ఆ ప్రళయం గురించి, ఆ రోజు ఏ విధంగా భయంకరమైనదిగా ఉంటుంది, ఎంత కఠినంగా ఉంటుంది, ప్రజలు వారి మానసిక స్థితి ఎలా ఉంటుంది, శారీరక స్థితి ఎలా ఉంటుంది, ఎటువంటి భయాందోళనలకు గురిఅయి ఉంటారు అనేది అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రళయం యొక్క కఠినత గురించి సూరతుల్ హజ్‌లో తెలియజేశాడు.
يَا أَيُّهَا النَّاسُ اتَّقُوا رَبَّكُمْ (యా అయ్యుహన్నాసుత్తఖూ రబ్బకుమ్) ఓ ప్రజలారా! మీ ప్రభువుకు భయపడండి. (22:1)
إِنَّ زَلْزَلَةَ السَّاعَةِ شَيْءٌ عَظِيمٌ (ఇన్న జల్ జలతస్సా’అతి షై ఉన్ అజీమ్) నిశ్చయంగా ప్రళయ సమయాన జరిగే ప్రకంపనం మహా (భీకర) విషయం.(22:1)
يَوْمَ تَرَوْنَهَا تَذْهَلُ كُلُّ مُرْضِعَةٍ عَمَّا أَرْضَعَتْ (యౌమ తరౌనహా తద్ హలు కుల్లు ముర్ది’అతిన్ అమ్మా అర్ద’అత్) ఆనాడు మీరు దాన్ని చూస్తారు… పాలుపట్టే ప్రతి తల్లీ పాలు త్రాగే తన పసికందును మరచిపోతుంది. (22:2)
وَتَرَى النَّاسَ سُكَارَىٰ وَمَا هُم بِسُكَارَىٰ وَلَٰكِنَّ عَذَابَ اللَّهِ شَدِيدٌ (వ తరన్నాస సుకారా వమాహుమ్ బి సుకారా వలాకిన్న అదాబల్లాహి షదీద్) ప్రజలు మైకంలో తూలుతున్నట్లు నీకు కనిపిస్తారు. వాస్తవానికి వారు మైకంలో ఉండరు. అయితే అల్లాహ్ (తరఫున వచ్చిపడిన) విపత్తు అత్యంత తీవ్రంగా ఉంటుంది. (22:2)
ఈ ఆయత్‌లో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రళయం యొక్క భయంకరమైన ఆ స్థితిని తెలియపరిచాడు. అంటే, ఆ రోజు ఎటువంటి భయంకరమైన రోజు అంటే తల్లి తన బిడ్డను, పాలు తాగే బిడ్డను, పసికందును మరిచిపోతుంది అంటే ఆ రోజు ఎంత భయంకరంగా ఉంటుంది. అలాగే గర్భిణి యొక్క గర్భం పోతుంది అంటే ఆ భయం ఏ విధంగా ఉంటుంది. మానవులు మత్తులో ఉన్నట్లు కనిపిస్తారు అంటే వారు ఏమైనా మద్యం సేవించారా? లేదు. కానీ ఆ భయం వలన వారి స్థితి, వారి ముఖాలు, వారి శరీరం ఎలా ఉంటుంది అంటే వారు మత్తులో ఉన్నారు అనిపిస్తుంది కానీ, వాస్తవానికి వారు మత్తులో ఉండరు, అల్లాహ్ యొక్క శిక్ష చాలా కఠినమైనది.
అభిమాన సోదరులారా, అటువంటి ప్రళయం రోజు, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ పర్వతాలను ఎగరేస్తాడు. గుట్టలు, వృక్షాలు, చెట్లు, భవనాలు, ఇళ్లు ఏవీ ఉండవు. మరి నీడ? నీడ ఉండదు. ఈరోజు మనం ఒక మంచి ఇంట్లో ఉంటూ, కరెంట్ ఉంటూ, కేవలం ఫ్యాన్ ఉంటే సరిపోవటం లేదు, ఏసీ కావాలి. కాకపోతే ఆ రోజు ఇల్లు లేదు. ఎటువంటి నీడా ఉండదు. అల్లాహ్ కారుణ్య నీడ తప్ప. అల్లాహ్ అర్ష్ నీడ తప్ప. ఏ నీడా ఉండదు. మరి ఆ నీడ, అల్లాహ్ యొక్క కారుణ్య ఛాయలో ఎవరు ఉంటారు? ఆ నీడ ఎవరికి దక్కుతుంది? అనే విషయం గురించి అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక హదీసులో సెలవిచ్చారు. అది బుఖారీ మరియు ముస్లిం గ్రంథంలో ఉంది.
అల్లాహ్ నీడలో ఆశ్రయం పొందే ఏడుగురు
سَبْعَةٌ يُظِلُّهُمُ اللَّهُ فِي ظِلِّهِ يَوْمَ لا ظِلَّ إِلا ظِلُّهُ (సబ్’అతున్ యుదిల్లు హుముల్లాహు ఫీ దిల్లిహి యౌమ లా దిల్లా ఇల్లా దిల్లుహు) ఆ రోజున, ఆయన నీడ తప్ప మరే నీడ లేని రోజున ఏడు రకాల మనుషులకు అల్లాహ్ తన కారుణ్య ఛాయలో నీడను ప్రసాదిస్తాడు.
కేవలం ఏడు రకాల కోవకు చెందిన వారు మాత్రమే ప్రళయ దినాన, ఆ భయంకర రోజున, ఎటువంటి నీడ ఉండదు అల్లాహ్ నీడ తప్ప, ఆ అల్లాహ్ యొక్క నీడలో ఏడు రకాల మనుషులకు ఆ నీడ దక్కుతుంది. ఆ అదృష్టవంతులు ఎవరు? తెలుసుకుందాం.
న్యాయమైన పాలకుడు
إِمَامٌ عَادِلٌ (ఇమామున్ ఆదిలున్) న్యాయం చేసే నాయకుడు
న్యాయం చేసే పరిపాలకుడు, న్యాయం చేసే నాయకుడు. దేశానికి నాయకుడు కావచ్చు, రాజు కావచ్చు. అలాగే ప్రతి ఒక్కరూ తన తమ పరిధిలో ఇది వర్తిస్తుంది న్యాయం చేసేది. అమ్మ, తల్లి అనేది తన పరిధిలో, నాన్న అనేవాడు తన పరిధిలో, ప్రిన్సిపాల్ తన పరిధిలో, యాజమాన్యం తన పరిధిలో ప్రతి ఒక్కరూ తమ తమ పరిధిలో ఈ దీనికి వర్తిస్తారు, న్యాయం చేసేవారు. న్యాయం చేసే వారిని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా రేపు ప్రళయ దినాన తన కారుణ్య ఛాయలో ఉంచుతాడు. మొదటి వారు.
ఏ యువకుడైతే తన యవ్వనాన్ని అల్లాహ్ ఆరాధనలో గడిపాడో, అటువంటి యువకులకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా రేపు ప్రళయ దినాన తన కారుణ్య ఛాయలో ఉంచుతాడు. వృద్ధాప్యంలో మనిషికి కోరికలు ఎక్కువగా ఉండవు, ఎముకలు బలహీనమైపోతాయి, దాదాపు ఆ వయసులో ఎక్కువ కాంక్షలు ఉండవు కాబట్టి అది ఏదీ గొప్పతనం కాదు వృద్ధాప్యంలో ఎక్కువగా పుణ్యాలు చేయటము. మంచి విషయమే, అది గొప్ప విషయం కాదు యువకులతో పోల్చుకుంటే. అందుకు ప్రత్యేకంగా యువకుల గురించి అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేశారు, యవ్వనాన్ని అల్లాహ్ మార్గంలో, యవ్వనాన్ని అల్లాహ్ ఆరాధనలో గడపాలి. అటువంటి యువకులకు ప్రళయ దినాన అల్లాహ్ యొక్క కారుణ్య ఛాయ దక్కుతుంది.
హృదయం మస్జిద్‌లకు అంటిపెట్టుకుని ఉండే వ్యక్తి
وَرَجُلٌ قَلْبُهُ مُعَلَّقٌ فِي الْمَسَاجِدِ (వ రజులున్ ఖల్బుహు ము’అల్లఖున్ ఫిల్ మసాజిద్) మనసంతా మస్జిద్‌లోనే ఉండే వ్యక్తి.
మనసంతా మస్జిద్‌లోనే ఉండే వ్యక్తి అంటే దానికి అర్థము, పనులు, ఉద్యోగాలు వదిలేసి, భార్య పిల్లలను వదిలేసి మస్జిద్‌లోనే ఉండిపోవాలా అని కాదు. మనసంతా మస్జిద్‌లోనే ఉండే మనిషి అంటే, వ్యాపారం చేస్తూ, వ్యవసాయం చేస్తూ, ఉద్యోగాలు చేస్తూ మనసు మాత్రం ఒక నమాజ్ తర్వాత ఇంకో నమాజ్ గురించి ఆలోచనలో ఉంటుంది. మనసు ఏముంటుంది? అసర్ నమాజ్ ఎప్పుడు అవుతుంది? అసర్ నమాజ్ చేసుకుంటే మగ్రిబ్ నమాజ్ సమయం గురించి, మగ్రిబ్ అయిపోతే ఇషా గురించి. ఈ విధంగా ఒక నమాజ్ అయిన తర్వాత ఇంకో నమాజ్ గురించి ఎదురు చూస్తాడు. మనసులో అదే ఆలోచన ఉంటుంది. ఇది దానికి అర్థం, మనసంతా మస్జిద్‌లో ఉండే మనిషి.
అల్లాహ్ కొరకు ప్రేమించుకునే ఇద్దరు వ్యక్తులు
وَرَجُلانِ تَحَابَّا فِي اللَّهِ اجْتَمَعَا عَلَيْهِ وَتَفَرَّقَا عَلَيْهِ (రజులాని తహాబ్బా ఫిల్లాహిజ్తమ’ఆ అలైహి వ తఫర్రఖా అలైهِ) ఇద్దరు వ్యక్తులు కలుసుకుంటే, పరస్పరం కలుసుకుంటే అల్లాహ్ కోసమే కలుసుకుంటారు. వారిద్దరూ విడిపోతే అల్లాహ్ కోసమే విడిపోతారు.
అంటే స్వార్థం ఉండదు. స్వార్థం లేకుండా కేవలం అల్లాహ్ ప్రసన్నత కోసం. కలిసినా అల్లాహ్ ప్రసన్నత, విడిపోయినా అల్లాహ్ ప్రసన్నత.
పాపానికి ఆహ్వానిస్తే తిరస్కరించే వ్యక్తి
అందం, అంతస్తు గల స్త్రీ చెడు వైపుకి ఆహ్వానిస్తే:
إِنِّي أَخَافُ اللَّهَ رَبَّ الْعَالَمِينَ (ఇన్నీ అఖఫుల్లాహ రబ్బల్ ఆలమీన్) “నేను సకల లోకాలకు ప్రభువైన అల్లాహ్‌కు భయపడుతున్నాను” అని చెప్పేవాడు.
ఈ చెడు కార్యానికి పాల్పడను, వ్యభిచారం చేయను, నాకు అల్లాహ్ భయం ఉంది అని చెప్పేవాడు. ఇంత అవకాశం వచ్చాక, అందం, అంతస్తు రెండూ ఉన్న స్త్రీ, ఒకవైపు అందం ఉంది, ఇంకోవైపు అంతస్తు ఉంది, అటువంటి స్త్రీ స్వయంగా ఆహ్వానిస్తుంది చెడు వైపుకి. అటువంటి సమయంలో, “ఇన్నీ అఖాఫుల్లాహ్, నేను అల్లాహ్‌కు భయపడుతున్నాను” అనే చెప్పే వ్యక్తికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా రేపు ప్రళయ దినాన తన కారుణ్య ఛాయలో నీడను ప్రసాదిస్తాడు.
గోప్యంగా దానం చేసే వ్యక్తి
رَجُلٌ تَصَدَّقَ بِصَدَقَةٍ فَأَخْفَاهَا حَتَّى لا تَعْلَمَ شِمَالُهُ مَا تُنْفِقُ يَمِينُهُ (రజులున్ తసద్దఖ బి సదఖతిన్ ఫ అఖ్ఫాహా హత్తా లా త’అలమ షిమాలుహు మా తున్ఫిఖు యమీనుహు) గోప్యంగా దానం చేసేవాడు. కుడి చేత్తో చేసిన దానం ఎడమ చేతికి కూడా తెలియదు.
అంత రహస్యంగా, గోప్యంగా దానం చేసే వ్యక్తికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా రేపు ప్రళయ దినాన తన కారుణ్య ఛాయలో నీడను ప్రసాదిస్తాడు. కారుణ్య ఛాయ దక్కుతుంది. అంటే, ప్రదర్శనా బుద్ధితో కాకుండా, ప్రజల మెప్పు కోసం కాకుండా, కేవలం అల్లాహ్ ప్రసన్నత కోసం మాత్రమే దానం చేసే వారికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రళయ దినాన తన నీడను ప్రసాదిస్తాడు.
ఏకాంతంలో అల్లాహ్‌ను స్మరించి ఏడ్చే వ్యక్తి
وَرَجُلٌ ذَكَرَ اللَّهَ خَالِيًا فَفَاضَتْ عَيْنَاهُ (రజులున్ దకరల్లాహ ఖాలియన్ ఫ ఫాదత్ ఐనాహు) ఏకాంతములో అల్లాహ్‌ను గుర్తు చేసుకుని కన్నీరు కార్చే వ్యక్తి.
ఏకాంతంలో ఉన్నారు, అతను ఎవరికీ చూడటం లేదు, ఎవరూ అతనికీ చూడటం లేదు, ఆ స్థితే లేదు. ఏకాంతంలో ఉన్నాడు, అల్లాహ్ గుర్తుకు వచ్చాడు. అల్లాహ్ శిక్ష గుర్తుకు వచ్చింది, అల్లాహ్ వరాలు గుర్తుకు వచ్చాయి, తన వాస్తవం ఏమిటో తెలుసుకున్నాడు, కుమిలిపోతూ ఏడుస్తున్నాడు, కన్నీరు కారుస్తున్నాడు, అటువంటి వ్యక్తికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా రేపు ప్రళయ దినాన తన కారుణ్య ఛాయలో నీడను ప్రసాదిస్తాడు.
ప్రియ వీక్షకుల్లారా, చివర్లో దుఆ చేస్తున్నాను. అల్లాహ్ మనల్ని ప్రళయ దినాన ఈ ఏడుగురిలో మనకి కూడా చేర్పించు గాక. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరినీ ఇహపరలోకాలలో సాఫల్యాన్ని ప్రసాదించు గాక. ఆమీన్.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
A Day with the Prophet (sallallahu alaihi wasallam) (Telugu) దైవప్రవక్త ముహమ్మద్ (సల్లలాహు అలైహి వ సల్లం) జీవితంలో ఒక రోజు రచయిత: అహ్మద్ వాన్ డిన్ఫర్ తెలుగు అనువాదం: ముహమ్మద్ అహ్మద్ అలీ శాంతిమార్గం పబ్లికేషన్ ట్రస్ట్, హైదరాబాద్
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రబోధించారని అబూ మూసా అష్ అరి (రదియల్లాహు అన్హు) చెప్పారు: “దానం ఇవ్వటం ప్రతి ముస్లింకు తప్పనిసరి.” సహచరులు అడిగారు – ‘ఒకవేళ అతని వద్ద లేకుంటే?!’ ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) అన్నారు :’అతను తన స్వహస్తాలతో శ్రమించి సంపాదించాలి. (దాంతో) తన స్వయానికి ప్రయోజనం చేకూర్చాలి మరియు దానం ఇవ్వాలి.’ సహచరులు సందేహంగా అడిగారు – ‘ఒకవేళ అలా చేయలేకపోతే? లేదా చేయకపోతే?’ ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రబోధించారు: ‘దయనీయ స్థితిలో ఉన్న అగత్యపరునికి సహాయపడాలి.’ సహచరులు అడిగారు – ‘ఒకవేళ అలా చేయకపోతేనో?’ ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) బదులిచ్చారు ‘మంచిని ఆజ్ఞాపించాలి’. సహచరులు మళ్ళీ అడిగారు ‘ఒకవేళ అది కూడా చేయలేకపోతే?!’ ఆయన(సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పారు : ‘(పరులను) నొప్పించకుండా జాగ్రత్త పడాలి. ఇది కూడా అతని పాలిట దానమే.” (బుఖారి)
తాత్పర్యం :
“దానం ఇవ్వటం ప్రతి ముస్లింకు తప్పనిసరి.” ముస్నద్ తియాసి ఉల్లేఖనంలో “ప్రతిరోజు” అనే పదం అదనంగా ఉంది. ఈ దానం శక్తిమేరకు ప్రతి ఒక్కరిపైతప్పనిసరి అవుతుంది. అంటే ప్రతి ముస్లిం నైజంలో, అతని ప్రవర్తనలో సదకా (దానం) ఒక భాగం కావాలన్నది దీని పరమార్థం. అతను ఏ స్థితిలో ఉన్నా – కలిమిలో ఉన్నా లేమి తాండవిస్తున్నా – అతనిలో దాతృ స్వభావం మాత్రం ఉండాల్సిందే అన్నది పై వాక్యం ఉద్దేశ్యం.
‘ఒకవేళ అతని వద్ద లేకపోతే’ అని ప్రవక్త గారి ప్రియ సహచరులు ప్రశ్నించారు.’దానం’ అనే ప్రస్తావన రాగానే ధన ధాన్యాదుల ద్వారా చేసే సహాయం మాత్రమేనని అసలు సహచరులు తలపోశారు. అయితే ఈ “పదం”కు ఉన్న భావం ఎంతో విస్తృతమయిందని, ఆపదలో ఉన్న ఒక వ్యక్తిని మృదువుగా పలకరించి అతన్ని ఓదార్చటం, అతని ఆపదను కడతేర్చే సంకల్పంతో తరుణోపాయం సూచించటం కూడా “సదకా” కోవలోకే వస్తుందని మహనీయ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) విశ్లేషించారు.
ఈ నేపథ్యంలో ఇబ్నె అబీ హంజా ఇలా అభిప్రాయపడ్డారు :
“దాన ధర్మాలు చేయడం కేవలం శ్రీమంతులకే పరిమితం కాదని, డబ్బుఖర్చుపెట్టకుండా కూడా దానధర్మాలు చేయవచ్చని ఈ హదీసు ద్వారా ఆధారంలభిస్తున్నది.”
“అతను తన స్వహస్తాలతో శ్రమించి సంపాయించాలి.” అన్న ప్రవక్త గారి పలుకు గమనించదగినది. కష్టపడి ఉపాధిని సంపాయించటం చాలా ముఖ్యం అని దీని ద్వారా విదితమవుతుంది. కష్టపడి సంపాయించ గలిగినప్పుడే ఏ మనిషయినా తన స్వయానికై ఖర్చుచేసుకుని ఇతరుల కేదైనా సహాయం చెయ్యగలుగుతాడు. శ్రమించి సంపాదించుకుంటేనే, ఎదుటివారి ముందు చేతులు చాచి యాచించే దురవస్థ రాకుండా జాగ్రత్త పడగలుగుతాడు. పైపెచ్చు సమాజంలో గౌరవప్రదంగా జీవిస్తూ, ఆత్మాభిమానాన్ని కాపాడుకుంటూ, వీలయినంత ఎక్కువగా నిరాధారులనుఆదుకోగలుగుతాడు.
“దయనీయ స్థితిలో ఉన్న అగత్యపరునికి సహాయపడాలి” అనేది హదీసు లోని మరో వాక్యం. అటువంటి సహాయం నోటి ద్వారా కావచ్చు. చేతల ద్వారా కూడా కావచ్చు. మరోవిధంగా కూడా కావచ్చు. సహాయపడే తీరు ఎన్నో రకాలు.
“మంచిని గురించి ఆజ్ఞాపించాలి” అనేది మరో వాక్యం. వేరొక ఉల్లేఖనంలో “చెడులనుండి ఆపాలి” అని కూడా ఉంది. మంచిని ఆజ్ఞాపించటంలోనే “చెడుల నుండి ఆపటం” అనే భావం ఇమిడి ఉంది. ఖుర్ఆన్ హదీసుల వెలుగులో సమ్మతమయిన ప్రతిదీ ‘మంచి’గానే పరిగణించబడుతుంది. అలాగే ఖుర్ఆన్, హదీసులలో ఏవేవైతే ‘కూడదు’ అని అనబడ్డాయో అవి చెడుగానే పరిగణింపబడతాయి. వాటి జోలికి ప్రజలను పోనివ్వకుండా చూడటం కూడా గొప్ప సత్కార్యమే.
“(పరుల మనసు) నొప్పించకుండా జాగ్రత్త పడాలి.” నోటి ద్వారా నయినా, చేతలద్వారా నయినా లేక ఆ రెండింటి ద్వారానయినా ఎదుటివారు నొచ్చుకునేలా ప్రవర్తించరాదు. ఎట్టి పరిస్థితిలోనూ దైవ ప్రసన్నత చూరగొనటమే దీని వెనుక అసలు ప్రేరణ అయివుంటే తప్పకుండా ఇది సయితం పుణ్యకార్యంగానే పరిగణించబడుతుంది. దైవదాసులకు బాధ కలగకుండా మసలు కోవటం ఒక నిజమైన ముస్లిం యొక్క చిహ్నం. హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించిన హదీసు ద్వారా ఇదే భావం వ్యక్తమవుతోంది. ఆయన ఉల్లేఖించిన ప్రవచనం ఇలా ఉంది : “నిజమైన ముస్లిం అతనే – ఎవరి నోటి మరియు చేతుల బారి నుండి ముస్లింలుసురక్షితంగా ఉండగలరో.”
“ఒకవేళ అలా చెయ్యలేకపోతే,” ప్రవక్త సహచరులు పలు కోణాల నుంచి ఒకవిషయం యొక్క లోతుపాతులను తెలుసుకునేవారు. వారలా అడగటం వల్లనే “విషయం” ప్రాముఖ్యతను సంతరించుకుంది. సదకా (దానం) యొక్క విస్తృత భావం కూడా తెలిసివచ్చింది. దానధర్మాలు చేయటం, అవసరం ఉన్న వారిని ఆదుకోవటం, మంచిని గురించి ఆజ్ఞాపించటం, చెడుల నుండి ఆపటం ఇవన్నీ చెయ్యవలసిన ముఖ్య పనులేనని, వీటికిగాను దైవసన్నిధిలో ప్రతిఫలం కూడా అపారమని తెలియవచ్చింది.
ఈ హదీసు ద్వారా స్పష్టమయిన మరో విషయం ఏమిటంటే, సత్కార్యాలు వాటి ప్రాముఖ్యత, ప్రతిఫలాల దృష్ట్యా ఎన్నో స్థాయిలను కలిగి ఉంటాయి. అయితే వీటిలో అన్నిటిక న్నా ఉత్తమమయినది, మనిషి తన ధనాన్ని ఇతరులకు దానం చేయటం. ఒక ముస్లిం ఫకీరు భిక్షకుడు – దైవమార్గంలో ఖర్చు పెట్టలేకపోతే అతను, అది మినహా మిగతా సత్కార్యాలపై చొరవ చూపాలి. అల్లాహ్ ఏ ప్రాణి పైనా అతని శక్తికి మించిన భారం మోపడు. మనిషి, తాను ఏ సత్కార్యమూ చేయలేకపోతే, అతను కనీసం చెడుల బారిన పడకుండా జాగ్రత్త వహించాలి.
ఈ హదీసు ద్వారా విదితమయ్యే మరో విషయం ఏమిటంటే, షరీఅత్ ఆదేశాలు -స్థితిగతుల దృష్ట్యా – స్వల్పమయిన వ్యత్యాసంతో వర్తిస్తాయి. ప్రవక్త మహనీయులు (సల్లల్లాహు అలైహి వసల్లం), ప్రతి ముస్లిం దానం ఇవ్వటం తప్పనిసరి అని ఖరారు చేశారు. అయితే ప్రతి ముస్లిం దానధర్మాలు చెయ్యలేడు. పైగా కొంతమందైతే దానాలు పుచ్చుకోవటం తప్ప మరో గత్యంతరం లేని స్థితిలో ఉంటారు. అటువంటప్పుడు పుచ్చుకోవడం వారి కొరకు సమంజసమే అవుతుంది. విషయాన్ని కూలంకషంగా అర్థం చేసుకునే ఉద్దేశ్యంతో మాటిమాటికీ విద్వాంసుని అడగవచ్చు అని కూడా ఈ హదీసు ద్వారా తెలియవస్తోంది. అదేవిధంగా కష్టపడి చెమటోడ్చి సంపాయించడం శ్రేష్ఠతతో కూడుకున్న విషయమని అలా సంపాయించే వాడే తనను ఆదుకోవటంతో పాటు ఇతరులను కూడా ఆదుకోగలుగుతాడని అవగతమవుతోంది.
ఈ హదీసును ఉల్లేఖించిన వారు అబూ మూసా అష్ అరి (రదియల్లాహు అన్హు) హిజ్రత్ కు ముందే ఈయన మక్కా వచ్చి ఇస్లాంను స్వీకరించారు. తరువాత తన జాతి వారి వైపునకు మరలి వెళ్ళారు. కొంత కాలం గడిచిన తరువాత ఆయన తన దేశం నుండి ఓడలో బయలుదేరారు. మార్గమధ్యంలో గాలి దిశ మారిపోవటం వల్ల ఈయన ఆఫ్రికాకు చేరుకోవలసి వచ్చింది. అక్కడ ఆయన జాఫర్ బిన్ అబీ తాలిబ్ (రదియల్లాహు అన్హు)వద్ద ఆగారు. ఆ తరువాత ఆయనతో పాటే హిజీ 6 వ సంవత్సరం మదీనా వచ్చారు. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈయన్ని యమన్లోని కొన్ని ప్రాంతాలకు అధికారిగా నియమించారు. ఖలీఫా హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) హయాంలో ఈయన బస్రా గవర్నర్ గా నియమితులయ్యారు. హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు అన్హు) కాలంలో కూఫా గవర్నర్ పదవి లభించింది. ఉమర్ గారి కాలంలో ఈయన ‘అహ్వాన్’, ‘అస్ బహాన్’లను జయించారు. ఈయనగారి కంఠస్వరం మృదు మధురమైనది. తనను కలుసుకున్నప్పుడల్లా ఖుర్ఆన్ను చదివి వినిపించమని హజ్రత్ ఉమర్ ఈయన్ని కోరేవారు. ఖలీఫా కోరిక మేరకు ఈయన ఖుర్ఆన్ పఠించి వినిపించేవారు. బస్రా ప్రజల్లో ఈయన ఖుర్ఆన్ మరియు సత్యధర్మాన్ని వ్యాపింపజేశారు. దాదాపు హిజ్రీ శకం 50వ ఏట ఈయన కాలధర్మం చెందారు – అప్పటికి ఈయన వయస్సు రమారమి 63 సంవత్సరాలు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
1- దానం చేసిన వారికి ఎన్ని రెట్లు ఎక్కువ ప్రతి ఫలం ఇస్తానని అల్లాహ్ వాగ్దానం చేశాడు ? 2- దానం చేసిన వారికి, ప్రపంచంలో ఏమి ప్రయోజనం కలుగుతుంది? సమాధిలో ఏమి ప్రయోజనం కలుగుతుంది ? పరలోకంలో ఏమి ఫలితం దక్కుతుంది ? 3- దానం చేసే వారి కోసం దైవ దూతలు ఏమని దుఆ చేస్తారు ? 4- దానం చేస్తే ధనం తరుగుతుందా ? పెరుగుతుందా ? 5- ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఎంత గొప్పగా దానం చేసే వారో ఒక ఉదాహరణ చెప్పండి ? 6- ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కుటుంబీకులు ఎలా దానం చేసే వారో ఒక ఉదాహరణ చెప్పండి ? 7- సహాబాలు (రదియల్లాహు అన్హుమ్) ఎలా దానం చేసే వారో కొన్ని ఉదాహరణలు చెప్పండి ? 8- దాన ధర్మాలు చేయుటకు కొన్ని మంచి మార్గాలు ఏమిటి ? 9- మరణించిన వారి తరుపున వారసులు దానం చేయవచ్చా ? 10- దాన ధర్మాలు చేయు వారు ఏమి జాగ్రత్తలు తీసుకోవాలి ?
ఈ ప్రసంగంలో, ఇస్లాం ధర్మంలో దాన ధర్మాల యొక్క విశిష్టత మరియు ప్రాముఖ్యత గురించి ఖురాన్ మరియు హదీసుల వెలుగులో వివరించబడింది. దానధర్మాలు చేయడం ద్వారా లభించే అనేక ప్రయోజనాలు, అవి సంపదను తగ్గించకపోగా పెంచుతాయని, అల్లాహ్ ఆగ్రహాన్ని చల్లార్చి చెడ్డ చావు నుండి కాపాడుతాయని, సమాధిలో మరియు తీర్పు దినాన రక్షణ కల్పిస్తాయని పేర్కొనబడింది. ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం), ఆయన కుటుంబ సభ్యులు మరియు సహచరుల జీవితాల నుండి దానశీలతకు సంబంధించిన ఉదాహరణలు ఇవ్వబడ్డాయి. చివరగా, ఉత్తమమైన దానధర్మాలు చేసే మార్గాలు, దానం చేసేటప్పుడు పాటించవలసిన నియమాలు మరియు జాగ్రత్తలను కూడా ఈ ప్రసంగం స్పష్టం చేస్తుంది.
అల్హమ్దులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్. అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీదనూ, ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వప్రవక్తల నాయకుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించు గాక, ఆమీన్.
సోదర సోదరీమణులారా, మిమ్మల్ని అందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను, అస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు.
ఇస్లాం ధర్మంలో దాన ధర్మాల విశిష్టత
ఈనాటి ప్రసంగంలో మనం ఇస్లాం ధర్మంలో దాన ధర్మాల విశిష్టత అనే అంశం గురించి కొన్ని విషయాలు తెలుసుకోబోతున్నాం. ముందుగా ఖురాన్ మరియు హదీసు గ్రంథాల వెలుగులో దాన ధర్మాల విశిష్టత ఏమిటో తెలుసుకుందాం.
చూడండి, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా విశ్వాసులకు దానధర్మాలు చేయాలని ఆదేశిస్తూ ఉన్నాడు. ఖురాన్ గ్రంథం, రెండవ అధ్యాయము, 254వ వాక్యంలో మనం చూచినట్లయితే అల్లాహ్ ఈ విధంగా ఆదేశించాడు:
يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا أَنفِقُوا مِمَّا رَزَقْنَاكُم ఓ విశ్వాసులారా! మేము మీకు ప్రసాదించిన దానిలో నుంచి ఖర్చు చేయండి.
అల్లాహ్ ఇచ్చిన సొమ్ములో నుంచి అల్లాహ్ మార్గంలో దానధర్మాలు చేయాలన్న ఆదేశము ఈ వాక్యంలో ఉంది. అయితే దానధర్మాలు చేస్తే కలిగే ప్రయోజనాలు, ఘనత ఏమిటంటే, ఎవరైతే దానధర్మాలు చేస్తారో వారు నిజమైన విశ్వాసులు అని అల్లాహ్ పొగిడి ఉన్నాడు.
ఖురాన్ గ్రంథం ఎనిమిదవ అధ్యాయము, మూడు మరియు నాలుగు వాక్యాలలో అల్లాహ్ తెలియజేశాడు:
వారు నమాజును నెలకొల్పుతారు. మేము వారికి ప్రసాదించిన దానిలో నుంచి మా మార్గంలో ఖర్చు పెడతారు. నిజమైన విశ్వాసులంటే వీరే
అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టేవారు నిజమైన విశ్వాసులు అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ ఆయతులో, ఈ వాక్యంలో పొగిడి ఉన్నాడు.
అలాగే ఎవరైతే అల్లాహ్ మార్గంలో దానధర్మాలు చేస్తారో వారికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా 700 రెట్లు ఎక్కువ ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు అని ఉదాహరించి మరీ తెలియజేసి ఉన్నాడు. ఖురాన్ గ్రంథం, రెండవ అధ్యాయము, 261వ వాక్యాన్ని చూడండి:
అల్లాహ్ మార్గంలో తమ ధనాన్ని ఖర్చు చేసే వారి ఉపమానం ఇలా ఉంటుంది: ఒక విత్తనాన్ని నాటగా, అది మొలకెత్తి అందులో నుంచి ఏడు వెన్నులు పుట్టుకు వస్తాయి. ప్రతి వెన్నులోనూ నూరేసి గింజలు ఉంటాయి. ఇదే విధంగా అల్లాహ్ తాను కోరిన వారికి సమృద్ధి వొసగుతాడు. అల్లాహ్ పుష్కలంగా ప్రసాదించేవాడు, ప్రతీదీ తెలిసినవాడు.
మనిషి ఒక్క గింజ భూమిలో నాటితే అందులో నుంచి ఒక చెట్టు పుడుతుంది. ఆ చెట్టుకు ఏడు కొమ్మలు ఉంటాయి. ప్రతి కొమ్మకు ఒక్కొక్క వెన్నుగా, ఏడు కొమ్మలకు ఏడు వెన్నులు ఉంటాయి. ప్రతి వెన్నులో వందేసి గింజలు ఉంటాయి అంటే ఏడు వెన్నులకు 700 గింజలు ఆ మనిషికి దక్కుతాయి. నాటింది ఒక్క గింజ కానీ పొందింది 700 గింజలు. ఆ ప్రకారంగా ఎవరైతే అల్లాహ్ మార్గంలో ఒక్క దీనారు గానీ, ఒక్క దిర్హము గానీ, ఒక్క రియాలు గానీ, ఒక్క రూపాయి గానీ చిత్తశుద్ధితో దానము చేస్తాడో, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అతని దానాన్ని మెచ్చుకొని అతనికి 700 రెట్లు ప్రతిఫలము ప్రసాదిస్తాడు అన్నమాట ఈ వాక్యంలో తెలియజేయడం జరిగింది.
దానధర్మాలు చేసే వారికి కలిగే మరొక గొప్ప విశిష్టత ఏమిటంటే, ఎవరైతే దానధర్మాలు చేస్తారో వారి సమస్యలు పరిష్కరించబడటానికి అల్లాహ్ సులభమైన మార్గాలు తెరుస్తాడని తెలియజేసి ఉన్నాడు. ఖురాన్ గ్రంథం, 92వ అధ్యాయము ఐదు నుండి ఏడు వరకు ఉన్న వాక్యాలను ఒకసారి మనము చూచినట్లయితే:
فَأَمَّا مَنْ أَعْطَىٰ وَاتَّقَىٰ وَصَدَّقَ بِالْحُسْنَىٰ فَسَنُيَسِّرُهُ لِلْيُسْرَىٰ ఎవరైతే దైవ మార్గంలో ఇచ్చాడో, తన ప్రభువుకు భయపడుతూ ఉన్నాడో ఇంకా సత్ఫలితాన్ని సత్యమని ధ్రువపరిచాడో, అతనికి మేము సులువైన మార్గపు సౌకర్యము వొసగుతాము.
సమస్యల పరిష్కారము కోసము ప్రజలు టెన్షన్ పడుతూ ఎక్కడెక్కడికో తిరుగుతూ చాలా అగచాట్లు పడుతూ ఉంటారు. అల్లాహ్ మార్గంలో దానధర్మాలు చేస్తే సమస్యల పరిష్కారము కోసము అల్లాహ్ సులభమైన మార్గాలు తెరుస్తాడు అని వాగ్దానం చేసి ఉన్నాడు కాబట్టి, సమస్యలు పరిష్కరించబడాలంటే దానధర్మాలు చేసుకోవాలన్న విషయం ఇక్కడ మనకు బోధపడింది.
అలాగే దానధర్మాలు చేసే వారికి లభించే మరొక విశిష్టత ఏమిటంటే మరణించిన తర్వాత సమాధిలో అగ్ని వేడి నుండి వారిని కాపాడటం జరుగుతుంది. మనం సమాధి సంగతులు అన్న ప్రసంగంలో వివరంగా విని ఉన్నాం. ఈ సమాధి ఎలాంటిది అంటే కొంతమంది కోసము అది స్వర్గపు లోయలాగా ఉంటుంది. వారు అక్కడ ప్రశాంతంగా పడుకుంటారు. అదే సమాధి మరికొంతమందికి నరక బావి లాగా మారిపోతుంది. వారు అక్కడ కఠినమైన శిక్షలు పొందుతూ ఉంటారు. ఇదంతా వివరంగా మనము సమాధి సంగతులు అనే ప్రసంగంలో విని ఉన్నాం. కాకపోతే ఇక్కడ మన అంశానికి సంబంధించిన విషయం ఏమిటంటే, అల్లాహ్ మార్గంలో దానధర్మాలు చేసిన వారిని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తన దయా కృపతో సమాధి అగ్ని వేడి నుండి రక్షిస్తాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉల్లేఖనం అస్సహీహా గ్రంథంలోనిది, ప్రవక్త వారు ఈ విధంగా తెలియజేశారు:
إن الصدقة لتطفئ عن أهلها حر القبور (ఇన్న స్సదఖత లతుత్ఫిఉ అన్ అహ్లిహా హర్రల్ ఖుబూర్) నిశ్చయంగా దానధర్మాలు, దానధర్మాలు చేసే వారి కొరకు సమాధి అగ్నిని చల్లార్చి వేస్తుంది.
అంటే దానధర్మాలు చేసిన వారు సమాధిలోని అగ్ని వేడి నుండి రక్షించబడతాడు అన్నమాట.
దానధర్మాలు చేసే వారికి కలిగే మరొక ప్రయోజనం ఏమిటంటే, లెక్కింపు రోజున హషర్ మైదానంలో వారికి నీడ కల్పించడం జరుగుతుంది. పరలోకం అన్న ప్రసంగంలో మనం విని ఉన్నాం వివరంగా. లెక్కింపు రోజున హషర్ మైదానంలో ప్రజలందరినీ ప్రోగు చేయడం జరుగుతుంది. సూర్యుడు చాలా సమీపంలో ఉంటాడు. వేడి తీవ్రతతో ప్రజలు అల్లాడుతూ ఉంటారు. చెమటలో కొంతమంది మునుగుతూ ఉంటారు. అక్కడ చెట్టు నీడ గానీ, భవనం నీడ గానీ, పర్వతం నీడ గానీ ఉండదు. కేవలం అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సింహాసనం నీడ మాత్రమే ఉంటుంది. అయితే అక్కడ నీడ కొంతమందికి ప్రసాదించబడుతుంది. వారిలో ఒకరు ఎవరంటే ఎవరైతే ప్రపంచంలో దానధర్మాలు చేస్తారో. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉల్లేఖనం సహీ అల్ జామే గ్రంథంలోనిది. ప్రవక్త వారు ఈ విధంగా తెలియజేశారు:
كل امرئ في ظل صدقته حتى يقضى بين الناس (కుల్లుమ్ రిఇన్ ఫీ జిల్లి సదఖతిహీ హత్తా యుఖ్జా బైనన్నాస్) ప్రజల మధ్య తీర్పు జరిగేంత వరకు మనిషి తాను చేసిన దానధర్మం యొక్క నీడలో ఉంచబడతాడు.
అంటే ప్రజల మధ్య తీర్పు జరిగేంత వరకు అతను ప్రశాంతంగా, అతను ప్రపంచంలో చేసుకున్న దానధర్మాలకు బదులుగా నీడ కల్పించబడి అతను అక్కడ ప్రశాంతంగా ఉంటాడు అన్నమాట.
అలాగే మిత్రులారా, దానధర్మాలు చేయటం వల్ల అల్లాహ్ ఆగ్రహము చల్లబడుతుంది మరియు దానధర్మాలు చేసే వారు చెడ్డ చావు నుండి రక్షించబడతారు అని ప్రవక్త వారు శుభవార్త తెలియజేసి ఉన్నారు. ఇబ్నె హిబ్బాన్ మరియు తబరానీ గ్రంథాలలోని ఉల్లేఖనంలో ప్రవక్త వారు తెలియజేశారు:
إن الصدقة لتطفئ غضب الرب وتدفع ميتة السوء (ఇన్న స్సదఖత లతుత్ఫిఉ గజబర్రబ్బి వతద్ఫఉ మీతతస్సూ) నిశ్చయంగా దానధర్మాలు అల్లాహ్ ఆగ్రహాన్ని చల్లార్చి వేస్తాయి మరియు చెడ్డ చావు నుండి రక్షిస్తాయి.
మనం చూస్తూ ఉన్నాం, వార్తల్లో చూస్తూ ఉన్నాం, పేపర్లలో చదువుతూ ఉన్నాం, ప్రజలు భయంకరమైన చావు చస్తూ ఉన్నారు. దానధర్మాలు చేసే వారిని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా భయంకరమైన చావు నుండి కాపాడుతాడు. దానధర్మాలు చేస్తే అల్లాహ్ ఆగ్రహము చల్లబడుతుంది మిత్రులారా.
దానధర్మాలకు ఉన్న మరొక గొప్ప విశిష్టత ఏమిటంటే, దానధర్మాలు చేసే వారి కోసం దైవదూతలు, ఇద్దరు దైవదూతలు దుఆ చేస్తారు, ప్రార్థన చేస్తారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసిన ఉల్లేఖనం సహీ అత్తర్గీబ్ గ్రంథంలోనిది, ఈ విధంగా ప్రవక్త వారు తెలియజేశారు:
ملكان يناديان (మలకాని యునాదియాని) ఇద్దరు దైవదూతలు పుకారిస్తూ ఉంటారు.
అంటే ఇద్దరు దైవదూతలు వేడుకుంటూ ఉంటారు, అల్లాహ్ తో దుఆ చేస్తూ ఉంటారు. ఏమని?
اللهم أعط منفقا خلفا (అల్లాహుమ్మ ఆతి మున్ఫిఖన్ ఖలఫన్) ఖర్చు పెట్టే వానికి, ఓ అల్లాహ్! నువ్వు వెంటనే ప్రతిఫలం ప్రసాదించు అని వేడుకుంటూ ఉంటారు.
దైవదూతలు ఆ భక్తుని కోసము దుఆ చేయటం అంటే ఇది గొప్ప విశిష్టత కలిగిన విషయం మిత్రులారా.
ఇక్కడ ఒక ప్రశ్న తలెత్తుతుంది. అదేమిటంటే విశ్వాస బలహీనత కలిగిన కొంతమంది దానధర్మాలు చేసుకుంటూ పోతే సొమ్ము, ధనము తరిగిపోతుంది కదా అని అనుకుంటూ ఉంటారు. వాస్తవం అది కాదు. నిజం ఏమిటంటే దానధర్మాలు చేయటం వలన మనిషి యొక్క ధనము పెరుగుతుంది, తరగదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉల్లేఖనం ముస్లిం గ్రంథంలో ఉంది. ప్రవక్త వారు సూటిగా తెలియజేశారు:
ما نقصت صدقة من مال (మా నఖసత్ సదఖతుమ్ మిమ్మాల్) దానధర్మం వల్ల ఏ భక్తుని సొమ్ము, ధనము తరగదు.
తరగదు అంటే పెరుగుతుంది తప్పనిసరిగా అని అర్థం. ఇదే విషయం బుఖారీ గ్రంథంలోని ఉల్లేఖనంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రవక్త వారి నోట తెలియజేశాడు:
قال الله: أنفق يا ابن آدم أنفق عليك (ఖాలల్లాహ్: అన్ఫిఖ్ యా ఇబ్న ఆదమ్ ఉన్ఫిఖ్ అలైక్) ఓ ఆదమ్ కుమారుడా (మానవుడా) నువ్వు ఖర్చు చేయి, నేను నీకు ప్రసాదిస్తాను అన్నాడు.
ఇంతకుముందు కూడా మనం విని ఉన్నాం, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మార్గంలో మనం ఒకటి ఇస్తే 700 రెట్లు అల్లాహ్ పెంచి మాకు ఇస్తాడని. ఇక్కడ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మీరు నా మార్గంలో దానధర్మాలు చేయండి నేను మీకు ఇస్తాను అంటున్నాడు కాబట్టి మనం కొంచెం ఇస్తే అల్లాహ్ మాకు ఎక్కువగా ఇస్తాడు కాబట్టి, కొంచెం ఇచ్చి ఎక్కువ పొందుతున్నాము కదా? ఆ ప్రకారంగా మన సొమ్ము తరుగుతూ ఉందా, పెరుగుతూ ఉందా? పెరుగుతూ ఉంది. కాబట్టి అదే ప్రవక్త వారు తెలియజేశారు, దానధర్మాల వల్ల సొమ్ము తరగదు గానీ పెరుగుతుంది. చూడండి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇస్తాను అని వాగ్దానం చేశాడు కాబట్టి అల్లాహ్ ఎక్కువ ఇస్తాడు అన్నమాట.
అందుకోసమే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు శిష్యులకు, మీరు అల్లాహ్ మార్గంలో నిర్భయంగా దానధర్మాలు చేయండి, ఖర్చు పెట్టండి అని ఆదేశించేవారు. ముఖ్యంగా బిలాల్ రజియల్లాహు అన్హు వారి గురించి చూచినట్లయితే, బిలాల్ రజియల్లాహు అన్హు వారికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆదేశించారు, మిష్కాత్ గ్రంథంలోని ఉల్లేఖనంలో, ప్రవక్త వారు అంటున్నారు:
أَنْفِقْ يَا بِلَالُ، وَلَا تَخْشَ مِنْ ذِي الْعَرْشِ إِقْلَالًا (అన్ఫిఖ్ యా బిలాల్, వలా తఖ్ష మిన్ జిల్ అర్షి ఇఖ్లాలా) ఓ బిలాల్, అల్లాహ్ మార్గంలో నువ్వు ఖర్చు చేసుకుంటూ వెళ్ళిపో, ఆ సింహాసనం మీద ఉన్న అల్లాహ్ పట్ల నువ్వు లేమికి భయపడకు.
అంటే నేను ఇచ్చుకుంటూ పోతే నాకు అల్లాహ్ ఇస్తాడో లేదో అని నువ్వు భయపడవద్దు, నిర్భయంగా నువ్వు అల్లాహ్ మీద నమ్మకంతో దానధర్మాలు చేసుకుంటూ ముందుకు సాగిపో అని ప్రవక్త వారు శిష్యులకు బోధించారు.
మిత్రులారా, ఇప్పటివరకు మనము తెలుసుకున్న విషయం ఏమిటంటే ఖురాన్ మరియు హదీసు గ్రంథాల ప్రకారంగా అల్లాహ్ మార్గంలో దానధర్మాలు చేయడం వలన ప్రపంచంలోనూ, పరలోకంలోనూ అనేక అనుగ్రహాలు భక్తులు పొందుతారు.
దానశీలురైన భక్తుల ఉదాహరణలు
ఇక రండి, దానధర్మాలు చేసిన కొంతమంది భక్తుల ఉదాహరణలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రపంచంలోనే గొప్ప భక్తులు ఎవరంటే మన అందరి ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఆయన చేసిన దానధర్మాలలో ఒక రెండు ఉదాహరణలు మీ ముందర ఉంచుతూ ఉన్నాను.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితకాలంలో హునైన్ సంగ్రామం జరిగినప్పుడు ప్రవక్త వారి చేతికి 6,000 బానిసలు, 24,000 ఒంటెలు, 1,000 గొర్రెలు, 125 kg ల వెండి వచ్చింది. ఆ పూర్తి సొమ్ము ప్రవక్త వారు వినియోగించుకోవడానికి అవకాశము ఉంది. కానీ ప్రవక్త వారు ఏం చేశారంటే, ప్రజల మధ్య 6,000 బానిసలు, 24,000 ఒంటెలు, 100 గొర్రెలు, 125 kg ల వెండి మొత్తం పంచేశారు. ఒక్క బానిసను గాని వెంట తీసుకెళ్లలేదు, ఒక్క ఒంటెను గాని, ఒక్క గొర్రెను గాని వెంట తీసుకెళ్లలేదు. అంతెందుకు, ఒక్క వెండి నాణెము కూడా ప్రవక్త వారు చేతిలో పెట్టుకొని తీసుకెళ్లలేదు. మొత్తం పంచేసి ఒట్టి చేతులతో ఇంటికి తిరిగి వెళ్లిపోయారు. చూశారా? ప్రవక్త వారు ఎంతగా దానధర్మాలు చేసేవారు, ప్రజలకు పంచిపెట్టేవారో.
మరొక ఉదాహరణ చూచినట్లయితే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు ఒక వ్యక్తి వచ్చి సహాయం చేయండి అని అడిగాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు, “అల్లాహ్ మార్గం చూపిస్తాడు, కూర్చోండి” అని కూర్చోబెట్టుకున్నారు. కొద్దిసేపటి తర్వాత మరొక వ్యక్తి వచ్చి సహాయం చేయండి అన్నారు. అతన్ని కూడా ప్రవక్త వారు కూర్చోబెట్టుకున్నారు. ఆ తర్వాత మరొక వ్యక్తి వచ్చాడు, అతన్ని కూడా ప్రవక్త వారు కూర్చోబెట్టుకున్నారు. ముగ్గురు వచ్చారు, ముగ్గురిని కూడా ప్రవక్త వారు కూర్చోబెట్టుకున్నారు. కొద్దిసేపు గడిచింది, ఒక శిష్యుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి నాలుగు వెండి నాణేలు బహుమానంగా, హదియాగా ఇచ్చి వెళ్ళాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చేశారంటే అక్కడ కూర్చొని ఉన్న ముగ్గురికి ఒక్కొక్క నాణెము, ఒక్కొక్క నాణెము ఇచ్చేయగా వారు సంతోషంగా తిరిగి వెళ్లిపోయారు. ప్రవక్త వారి వద్ద ఒక్క నాణెం మిగిలిపోయింది. ఎవరైనా వస్తారేమో, అవసరార్థులు వచ్చి అడుగుతారేమో ఇద్దాము అని ఎదురుచూశారు గాని ఎవరూ రాలేదు. ఇంటికి వెళ్లిపోయారు. రాత్రి సమయంలో ప్రవక్త వారికి నిద్ర పట్టట్లేదు. లేస్తున్నారు, నమాజ్ ఆచరిస్తున్నారు, మళ్లీ పడుకునే ప్రయత్నం చేస్తున్నారు, నిద్ర పట్టట్లేదు, మళ్లీ లేస్తున్నారు నమాజ్ ఆచరిస్తున్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సతీమణి ఆయిషా రజియల్లాహు తాలా అన్హా వారు చూసి ప్రవక్త వారితో ప్రశ్నించారు: “ఓ దైవ ప్రవక్తా, ఏమైందండి? మీరు చాలా కంగారు పడుతూ ఉన్నారు. కొత్త నిబంధనలు ఏమైనా వచ్చాయా? కొత్త రూల్స్ ఏమైనా వచ్చాయా? వాటిని తలుచుకొని మీరు ఏమైనా కంగారు పడుతూ ఉన్నారా?” అని అడిగితే, ప్రవక్త వారు ఆ ఒక్క వెండి నాణెము తీసి, “ఇదిగో, ఈ వెండి నాణెం వల్ల నేను కంగారు పడుతూ ఉన్నాను. దీన్ని నేను దానం చేయకముందే ఒకవేళ మరణిస్తే, అల్లాహ్ నాకు ఈ ఒక్క నాణెం గురించి అడిగితే నేను ఏమి సమాధానం చెప్పాలి? అది నాకు అర్థం కావట్లేదు కాబట్టి నేను కంగారు పడుతున్నాను” అన్నారు. అల్లాహు అక్బర్! ఒక్క వెండి నాణెము అల్లాహ్ మార్గంలో దానం చేయకపోతే నాకేం గతి పడుతుందో అని ప్రవక్త వారు అంతగా భయపడుతూ ఉన్నారు. ఎప్పుడెప్పుడు దాన్ని దానం చేసేయాలని ఎదురుచూస్తున్నారంటే, ప్రవక్త వారు ఎంతగా దానం చేసేవారో చూడండి మిత్రులారా. అందుకోసమే చూసిన వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి ఇచ్చిన సాక్ష్యం ఏమిటంటే, ప్రవక్త వారు చాలా అమితంగా, పరిమితి లేకుండా దానధర్మాలు చేసేవారు. ముఖ్యంగా రమజాన్ మాసంలో అయితే గట్టిగా వీస్తున్న గాలి కంటే వేగంగా దానధర్మాలు చేసేవారు అని చూసిన వారు సాక్ష్యం ఇచ్చి ఉన్నారు.
ఇక ప్రవక్త వారి కుటుంబీకులను గురించి మనం చూచినట్లయితే, ప్రవక్త వారి మరణానంతరం, ప్రవక్త వారి సతీమణి, విశ్వాసుల మాత ఆయిషా రజియల్లాహు తాలా అన్హా వారి వద్దకు లక్ష దిర్హములు వచ్చాయి కానుకగా. ఆయిషా రజియల్లాహు తాలా అన్హా వారు ఆ రోజు ఉపవాసంతో ఉన్నారు. ఆ లక్ష దిర్హములు కూడా ఆ విశ్వాసుల మాతృమూర్తి ఆయిషా రజియల్లాహు తాలా అన్హా వారు ప్రజల మధ్య పంచేశారు. మొత్తం పంచేసి ఇంట్లోకి ఎప్పుడైతే వెళ్లారో, సేవకురాలు ఆయిషా రజియల్లాహు తాలా అన్హా వారితో అడుగుతూ ఉన్నారు: “ఏమమ్మా, ఆ దిర్హములలో నుంచి, అనగా ఆ లక్ష దిర్హములలో నుంచి ఏమైనా మిగుల్చుకున్నారా? ఎందుకంటే ఈ రోజు ఇంట్లో ఉపవాస విరమణ చేయటానికి, ఇఫ్తారీ చేయటానికి కూడా ఏమీ లేదు” అన్నారు. ఆయిషా రజియల్లాహు తాలా అన్హా వారు అన్నారు, “నేను ఒక్క దిర్హము కూడా మిగుల్చుకోలేదు, మొత్తం పంచేశాను” అని చెప్పారు. అల్లాహు అక్బర్! ఇంట్లో ఉపవాస విరమణ చేయటానికి కూడా ఏమీ లేని పరిస్థితిలో కూడా వారు నిర్భయంగా, ఎంత విశాలమైన హృదయంతో ప్రజలకు దానధర్మాలు చేసేవారో చూడండి ప్రవక్త వారి కుటుంబీకులు.
ఇక ప్రవక్త వారి శిష్యుల గురించి మనం చూచినట్లయితే, ఉమర్ రజియల్లాహు తాలా అన్హు వారు తబూక్ యుద్ధ సమయంలో ఇంట్లోని సగం సామాగ్రి తీసుకొని వచ్చి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ముందర ఉంచేశారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అడిగారు, “ఏమయ్యా, ఇంట్లో ఏమి మిగిల్చావు?” అంటే, “సగం సామాగ్రి మిగిల్చి, మిగతా సగం తీసుకొని వచ్చి మీ ముందర ఉంచేశాను, ఓ దైవ ప్రవక్తా” అన్నారు. తర్వాత అబూబకర్ రజియల్లాహు అన్హు వారు తీసుకొని వచ్చి సామాగ్రి ప్రవక్త వారి ముందర ఉంచారు. ఆయనతో కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అడిగారు, “ఏమండీ, ఇంట్లో ఏమి మిగిల్చి వచ్చారు?” అంటే అబూబకర్ రజియల్లాహు అన్హు వారు అన్నారు, “ఓ దైవ ప్రవక్తా, అల్లాహ్ మరియు ప్రవక్త వారి మీద ఉన్న విశ్వాసము, అభిమానము మాత్రమే ఇంట్లో ఉంచి, మిగతా సొమ్ము మొత్తం పట్టుకొని వచ్చి మీ ముందర ఉంచేశానండి” అని చెప్పారు. అల్లాహు అక్బర్! ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి శిష్యుల్లో ఇద్దరి గురించి చెప్పడం జరిగింది.
మరొక శిష్యుని గురించి మనం చూచినట్లయితే ఉస్మాన్ రజియల్లాహు తాలా అన్హు వారు. ప్రవక్త వారి మరణానంతరం అబూబకర్ రజియల్లాహు అన్హు వారు ఖలీఫాగా పరిపాలన చేస్తున్న రోజుల్లో మదీనాలో ఒకసారి కరువు ఏర్పడింది. ప్రజలు వచ్చి అబూబకర్ రజియల్లాహు అన్హు వారితో, “ధాన్యము లేక ప్రజలు ఆకలితో ఉన్నారు, వారి సమస్యను పరిష్కరించండి” అని కోరినప్పుడు, అబూబకర్ రజియల్లాహు అన్హు వారు అన్నారు, “ఒక్క రోజు మీరు ఓపిక పట్టండి, రేపు మీ సమస్య తీరిపోతుంది” అన్నారు. మరుసటి రోజు ఉదయాన్నే ఉస్మాన్ రజియల్లాహు అన్హు వారి ఒంటెలు సిరియా దేశము నుండి ధాన్యం మోసుకొని మదీనాకు చేరాయి. ఆ రోజుల్లో ట్రక్కులు, లారీలు, గూడ్స్ రైళ్లు ఇవన్నీ లేవు కదండీ. ఒంటెల మీద, గుర్రాల మీద సామానులు, ధాన్యము వచ్చేది. ఉస్మాన్ రజియల్లాహు అన్హు వారి ఒంటెల మీద సిరియా దేశం నుంచి ధాన్యము మదీనాకు చేరింది. వ్యాపారవేత్తలు ఏం చేశారంటే పరుగెత్తుకుంటూ ఉస్మాన్ రజియల్లాహు అన్హు వారి వద్దకు వచ్చి, “ఏమండీ, ఈ ధాన్యము మాకు అమ్మండి, మేము మీకు లాభం ఇస్తాము” అన్నారు. ఉస్మాన్ రజియల్లాహు అన్హు వారు వారిని అడిగారు, “ఎంత ఇస్తారు మీరు?” అని. ఆ వ్యాపారవేత్తలు ఏమన్నారంటే, “మీరు పదికి కొన్న దాన్ని పదమూడు ఇచ్చి తీసుకుంటాము” అన్నారు. ఉస్మాన్ రజియల్లాహు అన్హు వారు అన్నారు, “నాకు ఇంతకంటే ఎక్కువ ఇచ్చేవారు ఉన్నారు” అన్నారు. వ్యాపారవేత్తలు కొద్దిసేపు ఆలోచించుకొని, “సరేనండి, మీరు పదికి కొన్న దాన్ని పదిహేను ఇచ్చి మేము కొంటాము, మాకు ఇచ్చేయండి” అన్నారు. ఉస్మాన్ రజియల్లాహు అన్హు వారు మళ్ళీ అదే మాట అన్నారు, “నాకు ఇంతకంటే ఎక్కువ ఇచ్చేవారు ఉన్నారండి” అన్నారు. వ్యాపారవేత్తలు ఆశ్చర్యపోయారు. “మదీనాలో మేమే పెద్ద వ్యాపారవేత్తలము, మాకంటే ఎక్కువ లాభము మీకు ఇచ్చి ఈ ధాన్యం కొనుగోలు చేసేవాడు ఎవడు ఉన్నాడు, చెప్పండి?” అని అడిగారు. అప్పుడు ఉస్మాన్ రజియల్లాహు అన్హు వారు ఈ విధంగా ప్రకటించారు: “చూడండి, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆయన మార్గంలో ఒకటి ఇస్తే 700 రెట్లు ఎక్కువగా ఇస్తాను అని వాగ్దానము చేసి ఉన్నాడు కాబట్టి, మీరందరూ సాక్షిగా ఉండండి, ఈ ఒంటెల మీద ఉన్న పూర్తి ధాన్యాన్ని నేను మదీనా వాసుల కోసము దానం చేసేస్తూ ఉన్నాను, అల్లాహ్ కోసము” అని దానం చేసేశారు. అల్లాహు అక్బర్! చూశారా? ఇది ఉస్మాన్ రజియల్లాహు అన్హు వారి యొక్క ఉదాహరణ.
అలాగే అబూ దహ్దా రజియల్లాహు అన్హు అని ఒక సహాబీ ఉండేవారు. ఎప్పుడైతే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్ గ్రంథంలోని రెండవ అధ్యాయము 245వ వాక్యాన్ని అవతరింపజేశాడో:
مَّن ذَا الَّذِي يُقْرِضُ اللَّهَ قَرْضًا حَسَنًا فَيُضَاعِفَهُ لَهُ أَضْعَافًا كَثِيرَةً అల్లాహ్‌కు మంచి రుణం ఇచ్చేవారు మీలో ఎవరైనా ఉన్నారా? దాన్ని ఆయన ఎన్నోరెట్లు పెంచి తిరిగి ఇస్తాడు.
ఎవరు అల్లాహ్ మార్గంలో ఖర్చు చేసి అల్లాహ్ కు అప్పు ఇస్తాడో, దాన్ని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తన వద్ద పెంచి పోషించి పెద్దదిగా చేసేస్తాడు, భక్తుడు మరణించి అల్లాహ్ వద్దకు చేరినప్పుడు పెద్ద ప్రతిఫల రూపంలో అతనికి అది ఇవ్వబడుతుంది” అని ఆ వాక్యంలో తెలియజేయబడింది.
కాబట్టి ఆ వాక్యాన్ని విన్న తర్వాత ఆ సహాబీ అబూ దహ్దా రజియల్లాహు తాలా అన్హు వారు ప్రవక్త వారి వద్దకు వచ్చి, “ఓ దైవ ప్రవక్తా, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ విధంగా ప్రకటించి ఉన్నాడు కాబట్టి, మీరు సాక్షిగా ఉండండి, మదీనాలో నాకు 600 ఖర్జూరపు చెట్లు కలిగిన ఒక తోట ఉంది. ఆ తోటను నేను అల్లాహ్ మార్గంలో దానం చేసేస్తున్నాను, అల్లాహ్ కు అప్పు ఇచ్చేస్తూ ఉన్నాను” అని ప్రకటించేశారు. తర్వాత ఆ తోట వద్దకు వెళ్లి తోట లోపల అడుగు కూడా పెట్టకుండా బయట నుంచే నిలబడిపోయి, కుటుంబ సభ్యులు తోట లోపల ఉంటే, “ఏమండీ, మీరందరూ బయటికి వచ్చేయండి, నేను అల్లాహ్ మార్గంలో ఈ తోటను దానం చేసేశాను” అని చెప్పగా కుటుంబ సభ్యులు అందరూ బయటికి వచ్చేసారు. అల్లాహు అక్బర్! ఇవన్నీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క శిష్యులు, సహాబాలు చేసిన దానధర్మాలకు కొన్ని నిదర్శనాలు.
ఇక అలనాటి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంనాటి కొంతమంది మహిళల గురించి మనం చూచినట్లయితే, ఇంతకుముందు మనం ఆయిషా రజియల్లాహు తాలా అన్హా వారి గురించి విన్నాం. మిగతా వేరే సహాబియాత్ ల గురించి, మహిళల గురించి మనం చూచినట్లయితే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒకసారి మహిళల మధ్య వెళ్లి ప్రసంగించారు. ప్రసంగించిన తర్వాత దానధర్మాలు చేసుకొని మిమ్మల్ని మీరు నరకాగ్ని నుండి కాపాడుకోండి అని చెప్పినప్పుడు, మహిళలు దానధర్మాలు చేశారు. చూసిన వారు ఇచ్చిన సాక్ష్యం ఏమిటంటే, అక్కడ ఉన్న మహిళల్లో కొంతమంది వారు తొడుగుతూ ఉన్న, ధరిస్తూ ఉన్న నగలు సైతము దానం చేసేశారు అని చెప్పారు. ఇవన్నీ కొంతమంది భక్తులు చేసిన దానధర్మాల ఉదాహరణలు మిత్రులారా.
దానధర్మాలు చేసే ఉత్తమ మార్గాలు
అయితే ఖురాన్ మరియు హదీసులలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎలాంటి దానధర్మాలు చేసుకోవటం మంచిది అని విశిష్టతలు తెలియజేసి ఉన్నారు? రండి ఇప్పుడు మనము కొన్ని ఉత్తమమైన దానధర్మాలు చేసే మార్గాలను తెలుసుకుందాం.
మొదటి మార్గం: సదకా జారియా అని అరబీలో అంటారు. నిరంతరం పుణ్యం లభిస్తూ ఉండే మార్గం అని తెలుగులో దాన్ని అనువాదం చేస్తారు. నిరంతరం పుణ్యం లభిస్తూ ఉండే మార్గం ఏమిటి అంటే ఒక రెండు మూడు విషయాలు మీ ముందర ఉంచుతున్నాను చూడండి.
ఒక వ్యక్తి ఒక మస్జిద్ నిర్మించాడు. ఆ మస్జిద్ నిర్మించిన తర్వాత అతను మరణించినా, ప్రపంచంలో ఆ మస్జిద్ మిగిలి ఉన్నన్ని రోజులు, ప్రజలు అందులో నమాజ్ ఆచరిస్తున్నన్ని రోజులు, మస్జిద్ నిర్మించిన ఆ వ్యక్తి సమాధిలో ఉన్నా గాని అతనికి నిరంతరము పుణ్యము చేరుతూనే ఉంటుంది.
అలాగే ఒక వ్యక్తి ప్రజల దాహం తీర్చడానికి నీటి బావి తవ్వించాడు. తర్వాత అందులో నీళ్లు ప్రజలు తీసుకోవటం కోసము సౌకర్యాలు కల్పించాడు. ఆ తర్వాత అతను మరణించాడు. అతను మరణించి సమాధిలోకి వెళ్లిపోయినా, ఈ బావి ఉన్నన్ని రోజులు, ఆ బావి నీళ్లు ప్రజలు వాడినన్ని రోజులు ఆ వ్యక్తికి నిరంతరం పుణ్యము సరఫరా అవుతూనే ఉంటుంది, చేరుతూనే ఉంటుంది. ఇలాంటి చాలా ఉదాహరణలు ఉన్నాయండి.
అలాగే ధార్మిక విద్య ఉంది. ఒక గురువుగారు శిష్యులకు ధార్మిక విద్య నేర్పించారు. గురువుగారు మరణించి సమాధిలోకి వెళ్లిపోయినా, శిష్యులు ప్రపంచంలో గురువు వద్ద నేర్చుకున్న విద్యను వారు ఎన్ని రోజులు అయితే అమలుపరుస్తూ ఉంటారో, ఇతరులకు బోధిస్తూ ఉంటారో ఆయనకు నిరంతరము, ఎలాంటి విరామం లేకుండా పుణ్యము సరఫరా అవుతూనే ఉంటుంది మిత్రులారా. ఇవి సదకా జారియాకు కొన్ని ఉదాహరణలు. ఇలాంటి సదకా జారియా చేసుకోవాలి. ఇది మొదటి మార్గం.
మరొక మార్గం ఏమిటంటే అనాథలను పోషించాలి. తల్లిదండ్రులు మరణించిన తర్వాత అనాథలు ఎవరైతే ఉంటారో వారిని పోషించటము కూడా గొప్ప పుణ్యకార్యం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు:
أنا وكافل اليتيم كهاتين في الجنة وأشار بالسبابة والوسطى (అనా వకాఫిలుల్ యతీమి కహాతైని ఫిల్ జన్న వ అషార బిస్సబ్బాబతి వల్ వుస్తా) నేను మరియు అనాథ బిడ్డకు పోషించే వ్యక్తి ఇద్దరము స్వర్గంలో పక్కపక్కనే ఉంటాము అని చూపుడు వేలు మరియు మధ్య వేలు ఇలా చూపించారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. (అహ్మద్ గ్రంథంలోని ఉల్లేఖనం)
ఎంత గొప్ప విషయం అండి! ప్రవక్త వారి పొరుగులో మనము ఉండవచ్చు. అల్లాహు అక్బర్! కాబట్టి మనం చేసే దానధర్మాలలో ఒక మంచి మార్గం ఏది అంటే అనాథలను పోషించటం.
అలాగే దానధర్మాలు చేసుకోవటానికి మరొక గొప్ప మార్గం, ప్రజల ఆకలి తీర్చటం, ప్రజల దాహము తీర్చటం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసి ఉన్నారు, అబూ దావూద్ గ్రంథంలోని ఉల్లేఖనం సారాంశం ఏమిటంటే: “ఎవరైతే విశ్వాసులలో ఆకలితో ఉన్న వారిని అన్నం పెట్టి వారి ఆకలి తీరుస్తాడో, విశ్వాసులలో నీళ్ల కోసము తపిస్తూ ఉన్న విశ్వాసుల దాహాన్ని తీరుస్తాడో, అలాంటి వ్యక్తికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా స్వర్గంలోని పండ్లు, ఫలాలు తినిపిస్తాడు, స్వర్గంలోని నదుల నుండి త్రాపిస్తాడు” అని చెప్పారు. అల్లాహు అక్బర్! ఆకలితో ఉన్నవారి ఆకలి తీరిస్తే, దాహంతో ఉన్న వారి దాహము తీరిస్తే ప్రతిఫలంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా స్వర్గపు పళ్ళ ఫలాలు, స్వర్గపు నదుల నీరు త్రాపిస్తాడు, ప్రసాదిస్తాడు మిత్రులారా.
అలాగే ఎవరైతే నిరుపేదలు, సరైన బట్టలు లేవు, నగ్నంగా ఉంటూ ఉన్నారు, అలాంటి వారికి బట్టలు తొడిగించడం కూడా గొప్ప సత్కార్యము, దానధర్మాలు చూసుకోవడానికి ఇది కూడా ఒక ఉత్తమమైన మార్గం. ప్రవక్త వారు తెలియజేశారు:
أَيُّمَا مُسْلِمٍ كَسَا مُسْلِمًا ثَوْبًا عَلَى عُرْيٍ كَسَاهُ اللَّهُ مِنْ خُضْرِ الْجَنَّةِ (అయ్యుమా ముస్లిమ్ కసా ముస్లిమన్ సౌబన్ అలా ఉరన్ కసాహుల్లాహు మిన్ ఖుజ్రిల్ జన్న) ఏ భక్తుడైతే నగ్నంగా ఉన్న వారికి బట్టలు తొడిగిస్తాడో, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అతనికి ప్రతిఫలంగా స్వర్గంలోని పచ్చని దుస్తులు ధరింపజేస్తాడు అన్నారు. ( అబూ దావూద్ గ్రంథంలోని ఉల్లేఖనం)
అల్లాహు అక్బర్! స్వర్గంలోని మంచి బట్టలు, ఉత్తమమైన బట్టలు, పచ్చని బట్టలు అల్లాహ్ ఆ భక్తునికి ఇస్తాడని ప్రవక్త వారు తెలియజేసి ఉన్నారు.
అలాగే దానధర్మాలు చేసుకోవటం కోసము మరొక సౌకర్యవంతమైన విషయం ఏమిటంటే, తల్లిదండ్రుల తరఫున, వారు మరణించిన తర్వాత వారి బిడ్డలు దానధర్మాలు చేసుకోవచ్చు. చూడండి దీనికి ఉదాహరణగా తిర్మిజీ గ్రంథంలోని ఉల్లేఖనం ప్రామాణికమైనది. సాద్ రజియల్లాహు తాలా అన్హు వారు, ఒక సహాబీ, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి అడుగుతూ ఉన్నారు:
يا رسول الله إن أمي توفيت أفينفعها إن تصدقت عنها (యా రసూలల్లాహ్ ఇన్న ఉమ్మీ తువఫియత్ అఫయన్ఫఉహా ఇన్ తసద్దఖ్తు అన్హా) ఓ దైవ ప్రవక్తా! నా తల్లి మరణించింది. నేను ఆవిడ తరపున సదఖా చేస్తే, దానధర్మాలు చేస్తే ఆవిడకు ప్రయోజనము చేకూరుతుందా? అని అడిగారు.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, “నఅమ్. అవును, తప్పనిసరిగా ఆవిడ పేరున నువ్వు దానధర్మాలు చేసుకోవచ్చు, ఆవిడకు ప్రయోజనము చేకూరుతుంది” అని అనుమతి ఇచ్చేశారు. అప్పుడు ఆయన ఏం చేశారంటే ఆయన వద్ద ఒక తోట ఉండింది, ఆ తోటను ఆయన వారి తల్లి పేరు మీద దానం చేసేశారు. అల్లాహు అక్బర్! ఈ ఉల్లేఖనం ప్రకారంగా మనకు స్పష్టమైన విషయం ఏమిటంటే మన తల్లిదండ్రుల్లో ఎవరు మరణించి ఉన్నా వారి బిడ్డలుగా మనము ప్రపంచంలో వారి పేరు మీద దానధర్మాలు చేయవచ్చు, వారికి పుణ్యము దక్కేలాగా ప్రయత్నించవచ్చు.
ఎప్పుడు దానధర్మాలు చేయాలి?
ఇక దానధర్మాలు ఎప్పుడు చేసుకోవాలి అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు:
أن تصدق وأنت صحيح شحيح تخشى الفقر وتأمل الغنى (అన్ తసద్దఖ వఅన్త సహీహున్ షహీహున్ తఖ్ షల్ ఫఖర వతఅమలుల్ గినా)
నువ్వు యవ్వనంగా ఉన్నప్పుడు, బలంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు, నాకు ఏమైనా ఇంకా తక్కువ పడుతుందేమో అన్న భయము కలుగుతూ ఉన్నప్పుడు, నాకు ఇంకా డబ్బు కావాలి ధనము కావాలి అని ఆశిస్తున్నప్పుడు, నువ్వు దానధర్మము చేస్తే అది నీ కొరకు ఉత్తమమైన సందర్భము అన్నారు. (బుఖారీ గ్రంథంలోని ఉల్లేఖనం)
ఎప్పుడైతే మనిషి యవ్వనంగా ఉన్నప్పుడు ఎక్కువ సొమ్ము కావాలి అని అతనికి ఎక్కువ కోరికలు ఉంటాయి కాబట్టి ఎక్కువ సొమ్ము కావాలని కోరుకుంటాడు. చాలా అవసరాలు ఉంటాయి, ఆస్తులు కావాలి, ఇల్లు నిర్మించుకోవాలి, భార్య బిడ్డలకు నగలు తొడిగించుకోవాలి, ఇలా రకరకాల కోరికలు ఉంటాయి. అప్పుడు సొమ్ము కూడా ఎక్కువగా అవసరం ఉంటుంది. అలాంటి సందర్భంలో మనిషి తన అవసరాలను అన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటూ కూడా అల్లాహ్ మార్గంలో దానం చేసినట్లయితే అది ఉత్తమమైన సందర్భం అని ప్రవక్త వారు తెలియజేశారు. అదే ముసలివారు అయిపోయిన తర్వాత, చావు దగ్గరికి వచ్చేసిన తర్వాత మనిషి ఏం చేస్తాడండి? ఎలాంటి కోరికలు ఉండవు. ఇంక ఎలాగూ ప్రపంచం వదిలేసి వెళ్ళిపోతున్నాము కదా, వెంట తీసుకొని వెళ్ళము కదా అని అప్పుడు దానం చేయటం కంటే కూడా అవసరాలు ఎక్కువగా ఉన్నప్పుడు, కోరికలు ఎక్కువగా ఉన్నప్పుడు ఆ సందర్భంలో దానధర్మాలు చేస్తే అది ఎక్కువ ప్రయోజనం కల్పించే విషయం అని ప్రవక్త వారు అన్నారు.
దానధర్మాలలో పాటించవలసిన జాగ్రత్తలు
ఇక చివర్లో, దానధర్మాలు చేసే వారికి కొన్ని జాగ్రత్తలు పాటించవలసిన అవసరం ఉంది. ఏంటి ఆ జాగ్రత్తలు అంటే, మొదటి విషయం, దానధర్మాలు చేసే వారు ధర్మసమ్మతమైన, హలాల్ సంపాదనతో మాత్రమే దానధర్మాలు చేయాలి. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, నిసాయి గ్రంథంలోని ఉల్లేఖనం:
إن الله عز وجل لا يقبل صلاة بغير طهور ولا صدقة من غلول (ఇన్నల్లాహ అజ్జవజల్ లా యఖ్బలు సలాతన్ బిగైరి తహూరిన్ వలా సదఖతన్ మిన్ గలూలిన్) ఉజూ లేకుండా నమాజు చేస్తే అలాంటి నమాజు అల్లాహ్ ఆమోదించడు, హరామ్ సంపాదనతో దానధర్మాలు చేస్తే అలాంటి దానధర్మాలను కూడా అల్లాహ్ ఆమోదించడు అన్నారు.
కాబట్టి హరామ్ సంపాదనతో కాదు, హలాల్ సంపాదన, ధర్మసమ్మతమైన సంపాదనతో దానధర్మాలు చేసుకోవాలి.
రెండవ సూచన ఏమిటంటే, దానధర్మాలు చేసే వారు ప్రదర్శనా బుద్ధితో దానధర్మాలు చేయకూడదు. కేవలం అల్లాహ్ చిత్తం కోసం మాత్రమే దానధర్మాలు చేయాలి. చాలా బాధాకరమైన విషయం ఏమిటంటే నేడు ప్రజలు ఏం చేస్తారంటే, డబ్బు లేదా ఇతర వస్తువులు ఇతరులకు దానం చేస్తూ ఉన్నారంటే ఎన్ని సెల్ఫీలు, ఎన్ని ఫోటోలు, ఎన్ని వీడియోలు తీసుకుంటారంటే ఇక దాన్ని సోషల్ మీడియాలో, ప్రతి ప్లాట్‌ఫామ్‌లో, స్టేటస్‌లలో వేరే వేరే చోట ప్రచారం చేసుకుంటూ ఉంటారు. ప్రపంచంలో నాకంటే గొప్ప దానకర్త ఎవరైనా ఉన్నారో లేదో చూడండి అని చూపిస్తూ ఉంటారు. ఇది కాదండి కావాల్సింది. ప్రపంచానికి చూపించటం, స్టేటస్‌లలో పెట్టుకోవడం కాదు, అల్లాహ్ కు నచ్చాలి. దాని కోసం మనం దానధర్మం చేయాలి. ప్రజలకు చూపించటానికి, ప్రజల దృష్టిలో నేను దాతను అనిపించుకోవడానికి కాదండి. అల్లాహ్ మెచ్చుకోవాలన్న ఉద్దేశంతో చేయాలి. ప్రదర్శనా బుద్ధితో దానం చేస్తే దాని పుణ్యం వృధా అయిపోతుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, అహ్మద్ గ్రంథంలోని ఉల్లేఖనం:
ومن تصدق يرائي فقد أشرك (వమన్ తసద్దఖ యురాయీ ఫఖద్ అష్రక) ఎవరైతే ప్రదర్శనా బుద్ధితో, చూపించటానికి దానధర్మాలు చేస్తాడో, అతను బహుదైవారాధనకు పాల్పడినట్లు అవుతుంది అన్నారు.
అల్లాహు అక్బర్! కాబట్టి ప్రదర్శనా బుద్ధితో దానధర్మాలు చేయకూడదు.
మూడవ విషయం, దానధర్మాలు చేసిన తర్వాత ఉపకారము చాటకూడదు. దెప్పి పొడవటం అంటారు కదండీ. ఉపకారము చాటకూడదు. ఇచ్చిన తర్వాత నేను నీకు ఇచ్చాను కదా, అది ఇచ్చాను కదా, ఇది ఇచ్చాను కదా అని కొంతమంది వారి మీద ఉపకారం చాటుతూ ఉంటారు. అలా చేస్తే ఏమవుతుందంటే చేసిన ఆ దానధర్మాల పుణ్యం మొత్తం వృధా అయిపోతుంది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసి ఉన్నారు.
ఇక చివర్లో ముఖ్యమైన విషయం ఏమిటంటే, దానం ఇచ్చేసిన తర్వాత దాన్ని మళ్ళీ తిరిగి తీసుకోకూడదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చాలా కఠినంగా హెచ్చరించారు. బుఖారీ గ్రంథంలోని ఉల్లేఖనం, “ఎవరైతే దానం ఇచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకుంటారో వారు కక్కిన దాన్ని మళ్ళీ నోట్లో వేసుకున్న దానికి సమానం అన్నారు”. అల్లాహు అక్బర్!
ఇవి దానధర్మాలు చేసుకోవటానికి, దానధర్మాలు చేసే వారికి కొన్ని ముఖ్యమైన సూచనలు. నేను చివర్లో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తో దుఆ చేస్తూ ఉన్నాను. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మన అందరికీ అన్న, విన్న మాటల మీద ఆచరించే భాగ్యం ప్రసాదించు గాక. ఆమీన్. వ జజాకుముల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
పిసినారితనం నుండి మిమ్మల్ని కాపాడుకోండి | బులూగుల్ మరాం | హదీసు 1280 https://youtu.be/K3wcOKsHcp8 [ 9 నిముషాలు ] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
1280. హజ్రత్ జాబిర్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రభోదించారు:
“అన్యాయానికి దూరంగా ఉండండి ఎందుకంటే అన్యాయం ప్రళయదినాన తమస్సుకు, చిమ్మచీకట్లకు కారణభూత మవుతుంది. ఇంకా పిసినారితనం నుండి నుండి మిమ్మల్ని కాపాడుకోండి. మీకు పూర్వం గతించినవారు దీని (పిసినిగొట్టు తనం) మూలంగానే నాశనమయ్యారు.”
సారాంశం:
ఈ హదీసులో అన్యాయంతో పాటు, పీనాసితనం పట్ల అప్రమత్తంగా ఉండాలని తాకీదు చేయబడింది. ‘అన్యాయం’ తీర్పుదినాన అన్యాయం చేసిన మనిషి పాలిట అంధకారబంధురంగా పరిణమిస్తుంది. అతనికి వెలుతురు , కాంతి కావలసిన తరుణంలో దట్టమైన చీకట్లు అతన్ని అలుముకుంటాయి పిసినారితనం కూడా ఒక దుర్గుణమే. పేరాశకు లోనైనవాడు, పిసినిగొట్టుగా తయారైన వాడు సమాజానికి మేలు చేకూర్చకపోగా, సమాజంలో అత్యంత హీనుడుగా భావించబడతాడు. పిసినారితనం నిత్యం మనస్పర్థలకు, కాఠిన్యానికి కారణభూతమవుతుంది, దుష్పరిణామాలకు దారితీస్తుంది.
—
ఈ ప్రసంగంలో, హదీథ్ నంబర్ 1280 ఆధారంగా ‘జుల్మ్’ (అణచివేత) మరియు ‘షుహ్’ (తీవ్రమైన పిసినారితనం లేదా దురాశ) అనే రెండు వినాశకరమైన పాపాల గురించి వివరించబడింది. ప్రళయదినాన అణచివేత చీకట్లుగా మారుతుందని, మరియు ‘షుహ్’ పూర్వపు జాతులను నాశనం చేసిందని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హెచ్చరించారు. సాధారణ పిసినారితనం ‘బుఖుల్’ కు మరియు తీవ్రమైన దురాశ ‘షుహ్’ కు మధ్య ఉన్న వ్యత్యాసం స్పష్టం చేయబడింది. ‘షుహ్’ అనేది కేవలం తన వద్ద ఉన్నదాన్ని ఖర్చు చేయకపోవడమే కాక, ఇతరుల సంపదను అక్రమంగా పొందాలనే కోరికను కూడా కలిగి ఉంటుందని, ఇది హత్యలు, పాపాలు మరియు బంధుత్వాలను తెంచడం వంటి ఘోరాలకు దారితీస్తుందని వివరించబడింది. చివరగా, సూరత్ అల్-హష్ర్ లోని ఒక ఆయత్ ను ఉటంకిస్తూ, ఎవరైతే తమ ఆత్మల పిసినారితనం నుండి కాపాడబడతారో వారే నిజమైన సాఫల్యం పొందుతారని నొక్కి చెప్పబడింది.
హదీథ్ వివరణ: అణచివేత (జుల్మ్) మరియు పిసినారితనం (షుహ్)
హజ్రత్ జాబిర్ రజియల్లాహు త’ఆలా అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రబోధించారు, జుల్మ్ కీ దూరంగా ఉండండి. ఎందుకంటే జుల్మ్ ప్రళయ దినాన తమస్సుకు, చిమ్మ చీకట్లకు కారణభూతమవుతుంది. ఇంకా షుహ్, పిసినారితనం నుండి మిమ్మల్ని కాపాడుకోండి. మీకు పూర్వం గతించిన వారు దీనిని, అంటే పిసినిగొట్టుతనం మూలంగానే నాశనమయ్యారు. అల్లాహు అక్బర్. అల్లాహు అక్బర్. ఏ విషయంలో వినాశనం ఉన్నదో దాని నుండి మనం దూరం కాకపోతే మనమే చాలా ఘోరమైన నష్టంలో పడిపోతాము.
ఈ హదీథ్ లో జుల్మ్ గురించి వచ్చింది. ఇంతకుముందే మనం హదీథ్ నంబర్ 1279 లో దాని వివరాలు తెలుసుకున్నాం. అయితే ఇందులో మరొక విషయం ఏముంది? వత్తఖుష్షుహ్. షుహ్.
షుహ్ (الشُّحّ) మరియు బుఖుల్ (بخل) మధ్య వ్యత్యాసం
షుహ్, ఒక ఒత్తి ఉన్నది ఈ పదం, మరొకటి ఉన్నది బుఖుల్. బుఖుల్ అంటే కంజూసీతనం, పిసినారితనం. చేతిలో డబ్బులు ఉన్నాయి, అల్లాహ్ మార్గంలో, అవసరం ఉన్నవారికి, పేదవారికి దానం చేయకుండా, ఇవ్వకుండా స్వయం తన భార్యాపిల్లలపై, తల్లిదండ్రులపై ఏ మధ్య రకంలో ఖర్చు పెట్టాలో పెట్టకుండా పిసినారితనం వహించడం. ఇదేమిటి? బుఖుల్.
ఇక్కడ హదీథ్ లో వచ్చిన పదం ఏంటి? షుహ్. ధర్మవేత్తలు ఏమంటున్నారంటే, ఈ బుఖుల్ అనేది ఎప్పుడైతే మనిషిలో మితిమీరిపోతుందో, చివరికి అతడు ఖర్చు పెట్టే విషయంలోనే కాదు, డబ్బు, ధనం యొక్క పిశాచి ఎంతగా అయ్యాడంటే ఉన్నదానిని ఖర్చు పెట్టకుండా ఆపుకొని ఉంచుకుంటున్నాడు, అంతే కాదు, ఇంకా కావాలి, కావాలి, కావాలి అన్నటువంటి ఈ పెరాశ అనేది అక్రమంగా సంపాదించడంలో కూడా అతన్ని పడవేస్తుంది. ఇంతటి ఘోర స్థితికి ఎదిగిన వారిని అతడు షుహ్ లో పడ్డాడు అని అంటారు.
అర్థమైంది కదా? అయితే బుఖుల్ అనేది ఏదైతే ఉందో పిసినారితనం, అందులో మరింత ఓ నాలుగు అడుగులు ముందుగా ఉండడం దీనిని షుహ్ అంటారు.
మరొక భావం దీని గురించి కొందరు ధర్మవేత్తలు ఏం చెప్పారంటే, షుహ్ అన్నది మనసుతో. అటు లేనిదాన్ని పొందడానికి ఎన్నో ప్రయత్నాలు, అందులో అడ్డమార్గాలు తొక్కవలసి వచ్చినా, పాపం చేయవలసి వచ్చినా ఏ భయం లేకుండా చేసి సంపాదించడం మరియు ఖర్చు చేసే విషయంలో అంటే ప్రాక్టికల్ గా ఖర్చు చేసే విషయంలో బఖీల్, ఆపుకొని ఉంచడం, దీన్ని బుఖుల్, ముందు దాన్ని షుహ్ అని అంటారు.
పిసినారితనం (షుహ్) యొక్క వినాశకరమైన పరిణామాలు
కానీ ఇక్కడ గమనించండి, ప్రవక్త వారు ఏమంటున్నారు? ఇలాంటి ఈ పిసినారితనాన్ని మీరు వదులుకోండి. ఇలాంటి ఈ పిసినారితనం మీలో రాకుండా జాగ్రత్తపడండి. ఎందుకు? ఇంతకుముందు జాతి వారి వినాశనానికి ఇది కారణమైంది. అల్లాహు అక్బర్. అల్లాహు అక్బర్.
ఎలా అండి ఇది? ఎలా అంటే, గమనించండి. ఈ రోజుల్లో కూడా మనం కుబేరులను చూస్తున్నాము. మిలియనీర్, బిలియనీర్, కోట్లాధిపతులను కూడా చూస్తూ ఉన్నాము. ఎప్పుడైతే మనిషిలో ఈ పిసినారితనం చోటు చేసుకుంటుందో, ఏం చేస్తాడు? బంధుత్వాలను లెక్క కట్టడు. ఈ విధంగా మాట్లాడతాడు.
ఇస్లాం ధర్మం పేరుతో ఎందరికీ ఎలర్జీగా ఉంది. ఏ మానవత్వం ముందండి అని అంటారు. కానీ ఇలాంటి పిసినారులు మన సమాజంలో ఎంతోమంది కనబడతారు. మానవత్వత్వం ముందు అన్న వాళ్ళు డబ్బు విషయం వచ్చేసరికి బంధుత్వాలను, స్వయం మానవులను మరిచిపోయి దానికే ఎంత ప్రాధాన్యతను ఇస్తారంటే, చివరికి హత్యలు, ఘోరమైన పాపాలు, నేరాలు చేయవలసి వచ్చినా నాలుగు పైసల కొరకు అవన్నీ చేయడానికి కూడా సిద్ధమవుతారు. ఈ విధంగా ఇంతకుముందు జాతి వారిని వినాశనానికి గురిచేసింది.
ఈ ఇంతకుముందు జాతి వారిని వినాశనానికి గురిచేసింది అంటే ఇహలోకంలో ఇప్పుడు చెప్పిన రీతిలో. ఇది పరలోకంలో కూడా వినాశనం. ఎందుకంటే మనిషి ఎప్పుడైతే డబ్బును, ధనాన్ని, ప్రజలకు అవసరమున్న విషయాలను, వస్తువులను ఆపుకొని స్వయం లాభం పొందుతూ, కొన్ని సందర్భాలలోనైతే పిసినారితనం ఎంతగా ఉంటుందంటే స్వయం కూడా లాభం పొందడు. స్వయం కూడా లాభం పొందకుండా డబ్బు సంపాదించడంలో ఎంత ముందుకు వెళుగుతారంటే వారి వద్ద దొంగతనం, అక్రమ సంపాదన, హత్య చేయడం మరియు మోసంతో డబ్బు కాజేసుకోవడం ఇవన్నీ ఎలాంటి పాపంగా భావించరు. ఇంకా దానిపై బంధుత్వాలను తెంచడం, ఇవన్నీ పాపాలకు గురి అవుతారు. చివరికి ఏమవుతుంది? ఈ పాపాలన్నీ కూడా పరలోకంలో అతన్ని నష్టంలో పడవేస్తాయి.
అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (రజియల్లాహు అన్హు) గారి వివరణ
ఒకసారి అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ రజియల్లాహు త’ఆలా అన్హు తన శిష్యులతో, తన దగ్గర కూర్చున్న వారితో అడిగారు, “అయ్యుహుమా అషద్ద్, అల్-బుఖుల్ అవిష్-షుహ్?” (ఈ రెండిటిలో ఏది తీవ్రమైనది, బుఖుల్ ఆ లేక షుహ్ ఆ?). నేను ఇంతకుముందే చెప్పాను కదా రెండు పదాలు ఉన్నాయని. అల్-బుఖుల్, దీని యొక్క అసలైన భావం పిసినారితనం. దానిపై మరొకటి షుహ్. ఈ రెండిటిలో చాలా చెడ్డది ఏమిటి? అని అడిగారు.
అయితే అక్కడ ఉన్నవారు విభేదాల్లో పడ్డారు. కొందరు ఇలా అంటుంటే, కొందరు అది అంటున్నారు. అప్పుడు అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ అన్నారు, “అష్-షుహ్హు అషద్దు మినల్-బుఖుల్” (షుహ్ అనేది బుఖుల్ కంటే తీవ్రమైనది). షుహ్ అన్నది బుఖుల్ కంటే చాలా చెడ్డది. “లిఅన్నష్-షహీహ యషుహ్హు అలా మా ఫీ యదైహి ఫయహ్బిసుహూ, వ యషుహ్హు అలా మా ఫీ ఐదిన్-నాసి హత్తా య’ఖుజహూ. వ అమ్మల్-బఖీలు ఫహువ యబ్ఖలు అలా మా ఫీ యదైహి” (ఎందుకంటే ‘షహీహ్’ (షుహ్ గుణం ఉన్నవాడు) తన చేతిలో ఉన్న దానిపై పిసినారితనం చూపి దాన్ని బంధిస్తాడు, మరియు ప్రజల చేతుల్లో ఉన్న దానిపై కూడా దురాశ పడతాడు, దాన్ని తీసుకునేంత వరకు. అయితే ‘బఖీల్’ (బుఖుల్ గుణం ఉన్నవాడు) కేవలం తన చేతిలో ఉన్న దానిపై మాత్రమే పిసినారితనం చూపిస్తాడు).
షుహ్ ఉన్న వ్యక్తి తన చేతిలో ఉన్నదానిని ఆపేస్తాడు, ఇతరులకు ఇవ్వకుండా. అంతేకాదు, ప్రజల చేతుల్లో ఉన్నదాన్ని కూడా మంచి మనసుతో చూడడు, ఎప్పుడు నా చేతిలోకి వచ్చి పడుతుందో, ఎప్పుడు నా దగ్గరికి వచ్చేస్తుందో అని. కానీ బఖీల్ కేవలం తన వద్ద ఉన్నదానిని ఇతరులకు ఖర్చు చేయకుండా ఆపుకునేవాడు. అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ రజియల్లాహు త’ఆలా అన్హు ఈ విధంగా దీనిని, ఈ రెండు పదాలను వివరించారు.
ఖురాన్ సూచన
అయితే ఖురాన్ సూరతుల్-హష్ర్, 28వ ఖండంలో ఉంది, ఆయత్ నంబర్ తొమ్మిదిని గనక మనం చూస్తే, షుహ్ అన్నది ఎన్నో ఇతర పాపాలకు కారణమవుతుంది అని కూడా తెలుస్తుంది. అందుకొరకే దాని నుండి దూరం ఉన్నవాడే సాఫల్యం పొందుతాడని అల్లాహ్ అక్కడ మనకు తెలియజేస్తున్నాడు.
وَمَن يُوقَ شُحَّ نَفْسِهِ فَأُولَٰئِكَ هُمُ الْمُفْلِحُونَ ఎవరైతే తమ ఆత్మల పిసినారితనం నుండి కాపాడబడ్డారో, అట్టివారే సాఫల్యం పొందేవారు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
అల్లాహ్ కు దగ్గర కావాలనుకుంటున్నారా? అల్లాహ్ ప్రేమించేవారిలో, ఇష్టపడేవారిలో చేరాలనుకుంటున్నారా? మరి అల్లాహ్ సామీప్యం పొందడానికి మార్గాలు ఏమిటి? అల్లాహ్ సామీప్యం పొందితే కలిగితే గొప్ప ప్రయోజనాలు ఏమిటి? తప్పక విని ప్రయోజనం పొందండి. మరియు మీ బంధుమిత్రులకు షేర్ చెయ్యండి ఇన్ షా అల్లాహ్
ఈ ప్రసంగంలో, అల్లాహ్ సామీప్యాన్ని (వసీలా) ఎలా పొందాలో ఖురాన్ మరియు హదీసుల వెలుగులో వివరించబడింది. ప్రసంగం ప్రారంభంలో, విశ్వాసులు అల్లాహ్ సామీప్యాన్ని అన్వేషించాలని సూచించే ఖురాన్ ఆయతును ఉదహరించారు. అల్లాహ్ సామీప్యం పొందడానికి పది ముఖ్యమైన మార్గాలు వివరించబడ్డాయి: సమయానికి నమాజ్ చేయడం, ఫర్జ్ నమాజులతో పాటు సున్నత్ మరియు నఫిల్ నమాజులు అధికంగా చేయడం, అల్లాహ్ పట్ల విధేయత చూపడంలో ఉత్సాహం కలిగి ఉండటం, ఎల్లప్పుడూ అల్లాహ్ ను స్మరించడం (జిక్ర్), అల్లాహ్ ప్రసన్నత కోసం ఉపవాసం ఉండటం, చేసిన పాపాల పట్ల పశ్చాత్తాపం చెందడం, ఖురాన్ ను పారాయణం చేయడం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై దరూద్ పంపడం, సజ్జనులతో స్నేహం చేయడం, మరియు పేదవారికి దానం చేయడం. ఈ మార్గాలను అనుసరించడం ద్వారా ఒక వ్యక్తి అల్లాహ్ కు ప్రియమైన వాడిగా మారి, అతని ప్రార్థనలు అంగీకరించబడతాయని మరియు ఇహపరలోకాలలో సాఫల్యం పొందుతాడని నొక్కి చెప్పబడింది.
అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వల్ ఆఖిబతు లిల్ ముత్తఖీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్, వ అలా ఆలిహి వ సహ్బిహి అజ్మయీన్, అమ్మా బ’అద్.
سُبْحَٰنَكَ لَا عِلْمَ لَنَآ إِلَّا مَا عَلَّمْتَنَآ ۖ إِنَّكَ أَنتَ ٱلْعَلِيمُ ٱلْحَكِيمُ (సుబ్ హానక లా ఇల్మ లనా ఇల్లా మా అల్లమ్తనా ఇన్నక అన్తల్ అలీముల్ హకీమ్) “(ఓ అల్లాహ్!) నీవు అత్యంత పవిత్రుడవు. నీవు మాకు తెలియజేసినది తప్ప ఇంకేమీ మాకు తెలియదు. నిశ్చయంగా అన్నీ తెలిసినవాడవు, వివేకవంతుడవూ నీవే!” (2:32)
వ ఖాలల్లాహు తబారక వ త’ఆలా
يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوا۟ ٱتَّقُوا۟ ٱللَّهَ وَٱبْتَغُوٓا۟ إِلَيْهِ ٱلْوَسِيلَةَ (యా అయ్యుహల్లజీన ఆమనుత్తఖుల్లాహ వబ్తగూ ఇలైహిల్ వసీలహ్) విశ్వసించిన ఓ ప్రజలారా! అల్లాహ్‌కు భయపడుతూ ఉండండి. ఆయన సామీప్యాన్ని పొందే సాధనం వెతకండి. (5:35)
ప్రియమైన సోదరులారా! సోదరీమణులారా! అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ యొక్క కృతజ్ఞత, ఆయన దయతో ఈరోజు మనమంతా ఒక కొత్త అంశాన్ని తీసుకొని సమావేశమై ఉన్నాము. అల్లాహ్ తో దుఆ ఏమనగా, ఖురాన్ మరియు హదీసుల ప్రకారం ఏవైతే వాక్యాలు మనకు వినబడతాయో వాటిని అమలుపరిచే భాగ్యాన్ని అల్లాహ్ త’ఆలా మాకు ప్రసాదించు గాక. ఆమీన్. అలాగే ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి అందరినీ ఒకేచోట సమావేశపరుస్తున్న వారందరికీ అల్లాహ్ త’ఆలా మంచి ఫలితాన్ని ఇహపరలోకాలలో ప్రసాదించు గాక. ఆమీన్.
అల్లాహ్ సామీప్య మార్గాలు
ప్రియమైన మిత్రులారా! ఖురాన్ గ్రంథంలోని ఒక ఆయత్.
يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوا۟ ٱتَّقُوا۟ ٱللَّهَ وَٱبْتَغُوٓا۟ إِلَيْهِ ٱلْوَسِيلَةَ (యా అయ్యుహల్లజీన ఆమనుత్తఖుల్లాహ వబ్తగూ ఇలైహిల్ వసీలహ్) విశ్వసించిన ఓ ప్రజలారా! అల్లాహ్‌కు భయపడుతూ ఉండండి. ఆయన సామీప్యాన్ని పొందే సాధనం వెతకండి. (5:35)
ఓ విశ్వాసులారా! అల్లాహ్ యొక్క సామీప్యాన్ని మీరు అన్వేషించండి అని అల్లాహ్ త’ఆలా ఖురాన్ గ్రంథంలో సెలవిచ్చాడు.
ఈరోజు మన అంశం ఏమిటంటే, అల్లాహ్ యొక్క సామీప్య మార్గాలు. అల్లాహ్ సామీప్యం ఎలా పొందగలము? వాటి యొక్క మార్గాలు ఏమిటి? దాని ఫలితంగా మనకు అల్లాహ్ త’ఆలా కల్పించే భాగ్యాలు ఏమిటి? దీనిపై ఈరోజు సవివరంగా మీ ముందు ఉంచబోతున్నాను.
సర్వ సృష్టికర్త అయిన అల్లాహ్ తబారక వ త’ఆలా మనల్ని అందరినీ సృష్టించారు. సరైన మార్గం కూడా అల్లాహ్ తబారక వ త’ఆలా మాకు సూచించాడు. సర్వ జనుల్లో అనేకమంది అనేక అభిప్రాయాలు, అనేక ఆలోచనలతో జీవిస్తున్నారు. కొంతమందికి కొన్ని విషయాల వల్ల ప్రేమ, మరి కొంతమందికి కొన్ని విషయాల పట్ల ఆకర్షణ, మరికొంతమందికి కొన్ని విషయాల పట్ల సంతుష్టి ఉంటుంది. అయితే ఖురాన్ గ్రంథంలో అల్లాహ్ తబారక వ త’ఆలా ఏమి చెబుతున్నాడంటే, ఓ విశ్వాసులారా! నా యొక్క సామీప్యాన్ని మీరు అన్వేషించండి.
అల్లాహ్ యొక్క సామీప్యం ఎంతో ఉన్నతమైన స్థానం. విలువైన స్థానం. ఆ ఉన్నతమైన స్థానానికి, ఆ విలువైన స్థానానికి మనిషి చేరుకోగలిగితే, ఇక అక్కడి నుంచి అల్లాహ్ తబారక వ త’ఆలా ను ఆ మనిషి ఏది కోరుకుంటాడో, ఆ దాసుడు ఏది కోరుకుంటాడో దాన్ని అల్లాహ్ త’ఆలా ప్రసాదిస్తాడు. ఆ విలువైన స్థానం, ఆ విలువైన సామీప్యాన్ని పొందడానికి మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అనేక విషయాలు సూచించారు. ఆ సామీప్యం మనిషికి దొరికినట్లయితే ఆ మనిషి యొక్క విలువ కూడా పెరిగిపోతుంది. అతని భక్తి కూడా పెరిగిపోతుంది. అల్లాహ్ వద్ద ఉన్నత స్థానాల్లో ఉంటాడు.
అయితే ఆ సామీప్యం మనకు ఎలా లభిస్తుంది? దాని కోసం మనం ఎన్నుకోవలసిన మార్గాలు ఏమిటి? ఇది మీరు, మేము చెప్పుకుంటే వచ్చేది కాదు. మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు ఒక వ్యక్తి వచ్చి, ప్రవక్తా! మీకు ఏ దేవుడైతే, ఏ అల్లాహ్ అయితే మీకు ప్రవక్తగా చేసి పంపించాడో అతని సాక్షిగా నేను చెబుతున్నాను. అల్లాహ్ తబారక వ త’ఆలా మీకు అందజేసిన సందేశం ఏమిటో నాకు వివరించండి.
అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు, “షహాదతైన్, లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్.” దాన్ని “అష్ హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహ్, వ అష్ హదు అన్న ముహమ్మదర్ రసూలుల్లాహ్.” నేను సాక్ష్యమిస్తున్నాను అల్లాహ్ తప్ప మరి నిజమైన ఏ దేవుడు లేడు. అలాగే నేను సాక్ష్యమిస్తున్నాను మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క ప్రవక్త అని. దీని తర్వాతే మిగతా విషయాలన్నీ అక్కడ వస్తాయి. ఆ వ్యక్తి దాన్ని విశ్వసించేవాడు. ఆ వ్యక్తి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తో అంటున్నాడు, రేయింబవళ్ళలో అల్లాహ్ తబారక వ త’ఆలా మాపై విధించిన విషయాలు ఏమిటో చెప్పండి.
మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఆదేశించారు. రేయింబవళ్ళలో అల్లాహ్ తబారక వ త’ఆలా మనపై విధించిన విషయం ఏమిటంటే, ఐదు పూటల నమాజు విధిగా అల్లాహ్ తబారక వ త’ఆలా చేశాడు. ఆ వ్యక్తి అన్నాడు, ప్రవక్తా! ఇంకేమైనా ఉందా? అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఐదు పూటల నమాజు తర్వాత నీకిష్టమైతే ఇంకా ఎక్కువైనా చదువుకోవచ్చు. ఆ తర్వాత ఆ వ్యక్తి అన్నాడు, ప్రవక్తా! అల్లాహ్ తబారక వ త’ఆలా మీకు అందజేసిన సందేశంలో ఇంకేమైనా చేయవలసి ఉంటే అది కూడా చెప్పండి. మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, రమజాన్ మాసములో ఉపవాసాలు ఉండుట, పూర్తి మాసంలో ఉపవాసాలు ఉండుట. ఆ వ్యక్తి అన్నాడు, ఇంకేమైనా ఉందా? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు, ఆ పూర్తి మాసం తర్వాత నీకు ఇష్టమైతే మిగతా రోజుల్లో కూడా నువ్వు ఉపవాసాలు ఉండవచ్చు.
మీకు అందజేసిన ఆదేశాల్లో ఇంకేమైనా ఉందా అని అడిగాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, జకాత్ చెల్లించటం, సంవత్సరానికి ఒకసారి జకాత్ చెల్లించటం. ఈ విధంగా ఒక్కొక్క విషయాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వాళ్ళు చాలా క్లుప్తంగా వివరించారు. అన్ని విషయాలు విన్న ఆ వ్యక్తి మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అన్నాడు, ఓ ప్రవక్తా! ఏవైతే మీరు నాకు వినిపించారో, ఏవైతే సందేశం నాకు ఇచ్చారో ఆ సందేశంలో నేను రవ్వంత కూడా ఎక్కువ చేయను, రవ్వంత కూడా తగ్గించను. ఏదైతే నేను నాపై విధిగా ఉందో అది మాత్రమే నేను చేస్తాను. ఇంకా ఎక్కువ చేయను, ఇంకా తక్కువ చేయను అని ఆ వ్యక్తి పలకరించి మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నుండి వెళ్తుండగా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఏదైతే ఈ మనిషి అన్నాడో, ఏదైతే ఈ మనిషి వాంగ్మూలం ఇచ్చాడో దాన్ని సరిగ్గా నెరవేరిస్తే ఇతను తప్పకుండా స్వర్గంలో ప్రవేశిస్తాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు శుభవార్తను ఇచ్చారు.
ప్రియమైన సోదరులారా, సోదరీమణులారా! ఇది బుఖారీ, ముస్లింలో ఉంది, ఈ ఒక్క హదీస్ ద్వారా మనకు అర్థమయ్యేది ఏమిటంటే అల్లాహ్ సామీప్యం పొందటం చాలా సులువు. కానీ మనం కాస్త గ్రహించట్లేదు. ఒకవేళ మనం గ్రహిస్తే అల్లాహ్ సామీప్యం పొందటం చాలా సులువైన విషయం. ఎందుకంటే ఆ వ్యక్తి అడిగిన విషయాల్లో ఏవైతే అల్లాహ్ తబారక వ త’ఆలా విధిగా చేశాడో అవి మాత్రమే నేను చేస్తాను అని చెప్పాడు. దానికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు శుభవార్త వినిపించారు, ఈ వ్యక్తి స్వర్గంలో ప్రవేశిస్తాడు అని. అల్లాహ్ యొక్క సామీప్యాన్ని పొందటానికి మనిషికి కావలసినది ఏమిటంటే, అత్యంత విలువైన, అల్లాహ్ తబారక వ త’ఆలా ఏదైతే అతనిపై విధిగా చేశాడో దాన్ని అమలు పరచటం. అల్లాహ్ త’ఆలా విధిగా చేయనిది మనము ఎంత చేసుకున్నా అది విధికి సమానంగా ఉండదు. ధార్మిక పండితులు, ధార్మిక విద్వాంసులు అనేక విషయాలు దీనికి సంబంధించి చెప్పారు. అందులో కొన్ని విషయాలు మీ ముందు ఉంచుతాను. అవి అల్లాహ్ యొక్క సామీప్యాన్ని పొందడానికి మార్గాలు అన్నమాట.
1. మొట్టమొదటిది: సమయానికి నమాజ్ చేయడం
మొట్టమొదటిదిగా అల్లాహ్ యొక్క సామీప్యాన్ని పొందటానికి కావలసింది ఏమిటంటే, ‘అదావుస్ సలాతి ఫీ అవ్ఖాతిహా’. నమాజుని దాని యొక్క సమయంలో ఆచరించటం.
ఫజర్ నమాజ్ ఫజర్ సమయంలో, జోహర్ నమాజ్ జోహర్ సమయంలో, అసర్ నమాజ్ అసర్ సమయంలో, మగ్రిబ్ నమాజ్ మగ్రిబ్ సమయంలో, ఇషా నమాజ్ ఇషా సమయంలో. ఏ నమాజ్ ఏ సమయంలో అల్లాహ్ తబారక వ త’ఆలా విధిగా చేశాడో ఆ నమాజ్ ని ఆ సమయంలో విధిగా భావించి ఆచరించాలి. కొంతమంది ఫజర్ నమాజ్ ని హాయిగా పడుకొని జోహర్ నమాజ్ తో కలిపి చదువుతారు. ఇది అల్లాహ్ తబారక వ త’ఆలాకి నచ్చదు. సమయాన్ని తప్పించి నమాజ్ ఆచరించటం అనేది విధిగా అల్లాహ్ తబారక వ త’ఆలా చేయలేదు. కనుక అల్లాహ్ యొక్క సామీప్యం పొందాలంటే ఏదైతే అల్లాహ్ తబారక వ త’ఆలా విధిగా చేశాడో, ఎప్పుడు చేశాడో దాన్ని ఆ ప్రకారంగానే అమలు చేయటం. ఇస్లాం ధర్మంలో రెండో మౌలిక విధి నమాజ్ ది ఉంది. మొదటిది షహాదతైన్, ఆ తరువాత నమాజ్ అన్నమాట. నమాజ్ ని దాని సమయంలో పాటించటం, ఆచరించటం ఉత్తమం.
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉపదేశించారు, మనిషి చనిపోయిన తర్వాత అన్నిటికంటే ముందు అల్లాహ్ వద్ద అతనితో ప్రశ్నించబడేది నమాజే. నమాజ్ గురించి అతను సమాధానం ఇవ్వగలిగితే మిగతా విషయాల్లో అతను విజయం, సాఫల్యం పొందుతాడు. కనుక ఇది గుర్తుపెట్టుకోవాలి. అల్లాహ్ సామీప్యం పొందడానికి కావలసినది విధిగా చేసి ఉన్న నమాజులని సమయం ప్రకారం ఆచరించటం, పాటించటం.
2. సున్నత్ మరియు నఫిల్ నమాజులు
ఇక రెండోది, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి ఒక వ్యక్తి, ప్రవక్తా! స్వర్గంలో నేను మీతో ఉండాలనుకుంటున్నాను. అప్పుడు మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, అయితే నువ్వు ఎక్కువగా నమాజ్ ఆచరించు. విధిగా ఉన్న నమాజులని ఆచరించిన తర్వాత సున్నత్ నమాజులను, నఫిల్ నమాజులను ఇలాంటి నమాజులను ఎక్కువగా ఆచరించటం వలన అల్లాహ్ యొక్క సామీప్యం మనకు లభిస్తుంది. ఎంతవరకు అయితే మనిషి అల్లాహ్ యొక్క భక్తిని తన హృదయంలో, తన మనసులో పెంపొందించుకుంటాడో, అల్లాహ్ తబారక వ త’ఆలా అతనికి తన సామీప్యానికి దరికి తీసుకుంటాడు. కనుక సున్నత్ నమాజులను, నఫిల్ నమాజులను, అలాగే రాత్రిపూట ఏకాంతంలో చదివే తహజ్జుద్ నమాజులను కూడా వదలకూడదు. ఈ నమాజులు మన స్థాయిని పెంచుతాయి. అల్లాహ్ సన్నిధిలో మన యొక్క విలువ పెరుగుతుంది.
3. అల్లాహ్ పట్ల విధేయత
ఆ తర్వాత మూడో మార్గం ఏమిటంటే అల్లాహ్ యొక్క విధేయతను పాటించడంలో ఎప్పుడూ ఎల్లప్పుడూ ఆశతో ఉండాలి. విధేయత అంటే ఇతాఅత్. ఏదైతే అల్లాహ్ తబారక వ త’ఆలా ఈ పని చేయమని, ఆ పని చేయమని అల్లాహ్ త’ఆలా మాకు ఆజ్ఞాపిస్తాడో ఆ ఆజ్ఞను శిరసా వహించటానికి ఇతాఅత్ అంటాము. ఆ ఇతాఅత్ చేయటానికి మనము ఎల్లప్పుడూ ఆశ కలిగి ఉండాలి. ఉత్సాహం కలిగి ఉండాలి. ఉత్సాహం లేకుండా ఏదీ మనిషి చేయలేడు, ఇష్టం లేకుండా ఏది మనిషి చేయలేడు. అల్లాహ్ విధేయత పట్ల మనిషి ఉత్సాహం కలిగి ఉంటే ఆ విశ్వాసంలో కలిగే రుచే వేరుగా ఉంటుంది. ఇది మూడో మార్గం అన్నమాట.
4. అల్లాహ్ ను స్మరించడం (జిక్ర్)
ఇక నాలుగో మార్గం ఏమిటంటే అల్లాహ్ తబారక వ త’ఆలాని ఎల్లప్పుడూ స్మరిస్తూ ఉండాలి. అంటే జిక్ర్. జిక్ర్ అంటే అల్లాహ్ తబారక వ త’ఆలా యొక్క నామము యొక్క జపము. మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అనేక దుఆలతో నామాలతో, జపాలతో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సూచించారు. మనిషి కూర్చొని ఉన్నా, నమాజ్ తర్వాత అయినా, ఏదైనా వస్తువు మన చేతి నుండి కింద పడిపోయినా, ఏదైనా వస్తువు మనకు ఆకర్షణను కలిగించినా, అనేక విధాలుగా అల్లాహ్ తబారక వ త’ఆలా యొక్క నామాన్ని మనం స్మరిస్తూ ఉండాలి. సుబ్ హా నల్లాహ్, అల్హమ్దులిల్లాహ్, అల్లాహు అక్బర్, మాషాఅల్లాహ్. ఈ విధంగా అల్లాహ్ తబారక వ త’ఆలా యొక్క నామాలను స్మరిస్తూ ఉండాలి. దీని ద్వారా మన యొక్క విశ్వాసం పెరుగుతూ ఉంటుంది, తద్వారా అల్లాహ్ తబారక వ త’ఆలా యొక్క సామీప్యం మనకు లభిస్తుంది.
5. ఉపవాసం
ఇక ఐదోది ఏమిటంటే, అల్లాహ్ ప్రసన్నత కోసం ఉపవాసం ఉండుట. ఉపవాసం అనేది ఎవరికీ కానవచ్చేది కాదు. అల్లాహ్ ప్రసన్నత కోసం మనిషి ఉపవాసం ఉంటాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమి చెప్పారంటే, ఎవరైతే అల్లాహ్ ప్రసన్నత కోసం ఒక రోజు ఉపవాసం ఉండినట్లయితే, అల్లాహ్ తబారక వ త’ఆలా అతని యొక్క ముఖాన్ని 70 సంవత్సరాల దూరంగా నరకాగ్ని నుండి ఉంచుతాడు. ఇది కేవలం ఒక రోజు ఉపవాసం ఉంటే అల్లాహ్ తబారక వ త’ఆలా అతని ముఖాన్ని నరకాగ్ని నుండి 70 సంవత్సరాల దూరం వరకు తప్పిస్తాడు. ఆ విధంగా అల్లాహ్ ప్రసన్నత కోసం ఎన్ని ఉపవాసాలు ఉన్నా కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అనేక ఉపవాసాలు చూపించారు. వారంలో రెండు రోజులు ఉపవాసం ఉండుట, ఒక మాసములో, ఒక నెలలో మూడు రోజులు, 13, 14, 15 వ తేదీలలో ఉపవాసాలు ఉండుట. అలాగే అరఫా రోజున ఉపవాసం ఉండుట, ముహర్రం రోజులో 9, 10 ఈ రెండు రోజులు ఉపవాసాలు ఉండుట. రమజాన్ మాసములో విధిగా చేయబడిన ఒక నెల ఉపవాసాలు ఉండుట. ఈ విధంగా అనేక ఉపవాసాలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకు ఉపదేశించారు. ఈ ఉపవాసాల ద్వారా మనిషిలో విశ్వాసము, ఈమాన్ పెరుగుతుంది. దాని మూలంగా అతను అల్లాహ్ యొక్క సామీప్యాన్ని పొందగలుగుతాడు.
6. పశ్చాత్తాపం (తౌబా)
ఇక ఆరోది ఏమిటంటే పశ్చాత్తాపం, ‘అత్తౌబతు అనిల్ మ’ఆసీ’. పశ్చాత్తాపం. ఏవైతే మనము చెడు కర్మలు చేసి ఉన్నామో, నేరాలు చేసి ఉన్నామో, దాని పట్ల పశ్చాత్తాపం చెందుతూ ఉండాలి. అల్లాహ్ త’ఆలాతో ఇస్తిగ్ఫార్ చేస్తూ ఉండాలి. అల్లాహ్ త’ఆలా వైపు మరలుతూ ఉండాలి. ఎల్లప్పుడూ అల్లాహ్ త’ఆలాతో క్షమాపణ, మన్నింపు కోరుతూ ఉండాలి. దీని మూలంగా మన యొక్క పాపాలు అల్లాహ్ తబారక వ త’ఆలా తుడిచి పెడతాడు. దాని ద్వారా మన యొక్క ఈమాన్ పెరుగుతుంది, అల్లాహ్ యొక్క సామీప్యం మనకు కలుగుతుంది. మనిషి ఏ సమయంలో ఎలాంటి పాపం చేస్తాడో అతనికే తెలుసు. కొన్ని సందర్భాలు ఇలాంటివి కూడా ఉంటాయి, అతను పాపాలు చేస్తాడు, ఆ పాపాలు అతనికి గుర్తు ఉండవు. కనుక అల్లాహ్ తబారక వ త’ఆలాతో దుఆ ఏమని చేయాలంటే, ఏ పాపాలైతే నేను తెలిసి చేశానో, తెలియక చేశానో అన్నిటినీ నువ్వు క్షమించు అని అల్లాహ్ త’ఆలాతో మన్నింపు కోరుతూ ఉండాలి.
పశ్చాత్తాపం చేయటానికి, క్షమాపణ కోరటానికి, మన్నింపు కోరటానికి గడువు తీసుకోకూడదు. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చెప్పారంటే, రాత్రిళ్ళలో ఎవరైతే పాపాలు చేస్తారో, నేరాలు చేస్తారో అతని కోసం అల్లాహ్ తబారక వ త’ఆలా పగలు తన రెండు హస్తాలను చాచి, ఓ నా భక్తులారా! ఎవరైతే రాత్రిళ్ళలో మీరు పాపాలు చేసి ఉన్నారో, నేరాలు చేసి ఉన్నారో, నేను మిమ్మల్ని క్షమిస్తాను, రండి. ఆ సమయంలో ఎవరైతే అల్లాహ్ తబారక వ త’ఆలాతో పశ్చాత్తాపం కోరుతారో, అల్లాహ్ త’ఆలా వారిని క్షమిస్తాడు, మన్నించి వేస్తాడు. అదే విధంగా పగటి పూట ఎవరైతే పాపాలు చేస్తూ ఉంటారో, వారి కోసం అల్లాహ్ తబారక వ త’ఆలా రాత్రి తన హస్తాలు చాచి, ఓ నా దాసులారా! మీరు పగటిపూట ఏమైనా నేరాలు చేసి ఉంటే, పాపాలు చేసి ఉంటే, రండి, క్షమాపణ కోరండి, మీ పాపాలను నేను తుడిచి వేస్తాను, మన్నించి వేస్తాను. కానీ మనిషి ఆలోచన ఎలా ఉంటుందంటే, నేను ఇప్పుడు పాపం పట్ల పశ్చాత్తాపం చెందితే మళ్ళీ బహుశా నాతో పాపం జరిగే అవకాశం ఉంది. కనుక ఇప్పుడే పశ్చాత్తాపం చెందకూడదు. జీవితంలో చివరి కాలంలో, శేష జీవితంలో నేను పాపాల నుండి విముక్తి పొందటానికి అల్లాహ్ త’ఆలాతో పశ్చాత్తాపం కోరాలి అనే భావన అతనిలో కలిగి ఉంటుంది. ఇది ముమ్మాటికీ తప్పు, పొరపాటు. మనిషి అన్న తర్వాత చిన్న పాపాలు గాని, పెద్ద పాపాలు గాని, ఏదో ఒకటి జరుగుతూనే ఉంటాయి. కానీ అల్లాహ్ తబారక వ త’ఆలా క్షమిస్తూనే ఉంటాడు. గఫూరుర్ రహీం. ఆయన కరుణించేవాడు, క్షమించేవాడు, అమితంగా క్షమించేవాడు, కరుణించేవాడు. ఎల్లప్పుడూ తమ పాపాల పట్ల అల్లాహ్ త’ఆలాతో పశ్చాత్తాపం కోరుతూ ఉండాలి.
7. ఖురాన్ పారాయణం
ఇక ఏడో మార్గం ఏమిటంటే, అల్లాహ్ తబారక వ త’ఆలా అవతరింపజేసిన ఖురాన్ గ్రంథాన్ని ఎల్లప్పుడూ పారాయణం చేస్తూ ఉండాలి, కంఠస్థం చేస్తూ ఉండాలి, చదువుతూ ఉండాలి. అల్లాహ్ తబారక వ త’ఆలా మహత్తరమైన గ్రంథాన్ని అవతరింపజేశాడు. మన సాఫల్యం కోసం, పరలోకంలో మనం విజయం సాధించాలనే ఉద్దేశ్యముతో అల్లాహ్ త’ఆలా మన కోసం ఖురాన్ గ్రంథాన్ని అవతరింపజేశాడు. ఈనాడు మన స్థితి కాస్త గ్రహించినట్లయితే మనకు అర్థమవుతుంది, అదేమిటంటే ఖురాన్ చదవటం వచ్చిన వాళ్ళు అయినా సరే, ఖురాన్ చదవటం రాని వాళ్ళు అయినా సరే సమానమయ్యారు. ఖురాన్ చదవటానికి వారి వద్ద సమయం లేదు. ఖురాన్ నేర్చుకోవడానికి వారి వద్ద సమయం లేదు. ఇది అంతిమ దైవ గ్రంథం. నిజమైన గ్రంథం. ఈ భూమండలంలో ఏదైనా నిజమైన గ్రంథం, అల్లాహ్ యొక్క దైవ గ్రంథం ఉండినట్లయితే అది కేవలం ఖురాన్ గ్రంథం మాత్రమే. అసలైన స్థితిలో అలాగే భద్రంగా ఉంది.
ఎంత అభాగ్యులు వారు, ఎవరైతే ఈ గ్రంథాన్ని విడిచిపెట్టి తన జీవితాన్ని సాగిస్తున్నారో. చాలా దురదృష్టవంతులు. అల్లాహ్ యొక్క గ్రంథం ఈ భూమండలం మీద ఉన్నప్పుడు మనలో విశ్వాసం దాన్ని చదవడానికి, దాన్ని పారాయణం చేయడానికి, కంఠస్థం చేయడానికి ఎలా తహతహలాడాలంటే అంత ఉత్సాహంతో ఉండాలి. ఖురాన్ గ్రంథం పట్ల ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పి ఉన్నారు, ఎవరైతే ఒక అక్షరం చదువుతాడో దానికి బదులుగా అల్లాహ్ తబారక వ త’ఆలా పది పుణ్యాలు లభింపజేస్తాడు. ఖురాన్ గ్రంథంలో వాక్యాలు, పదాలు అనేక అక్షరాలతో కూడి ఉన్నాయి. అది చదవంగానే అల్లాహ్ తబారక వ త’ఆలా వారికి ఎంతో విలువైన పుణ్యాన్ని ప్రసాదిస్తాడు. దాని మూలంగా వారి యొక్క విశ్వాసం పెరుగుతుంది, అల్లాహ్ యొక్క సామీప్యం వారికి లభిస్తుంది. కనుక ఖురాన్ గ్రంథాన్ని ఎల్లప్పుడూ పారాయణం చేస్తూ ఉండాలి. ఏదైతే మనకు వస్తుందో, ఒక సూరా వచ్చినా, మొత్తం ఖురాన్ వచ్చినా, నిరంతరంగా చదువుతూ ఉండాలి.
అల్లాహ్ తబారక వ త’ఆలా సూరె ఫుర్ఖాన్ లో ఈ విధంగా చెప్తున్నాడు, ప్రళయ దినం నాడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాహ్ సన్నిధిలో అంటారు, “యా రబ్బీ ఇన్న హాజల్ కౌమీత్తఖజూ ఖురాన మహ్జూరా”. ఓ నా ప్రభువా! ఈ నా జాతి వారు ఖురాన్ గ్రంథాన్ని చదవటం విడిచిపెట్టారు. కనుక ఈ స్థితి రాకుండా మనం ఏం చేయాలంటే, ఖురాన్ గ్రంథాన్ని ఎల్లప్పుడూ పారాయణం చేస్తూ ఉండాలి, చదువుతూ ఉండాలి. దాని దాని కారణంగా మనకు మేలు జరుగుతుంది, అల్లాహ్ యొక్క సామీప్యం దొరుకుతుంది.
8. దరూద్
ఎనిమిదో మార్గం ఏమిటంటే, మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అల్లాహ్ తబారక వ త’ఆలా మన సన్మార్గం కోసం పంపించాడు. ఆయన్ని ప్రవక్తగా చేసిన అల్లాహ్ తబారక వ త’ఆలా మనపై పెద్ద ఉపకారమే చేశాడు. ఆయన చెప్పకపోతే, ఆయన మార్గాన్ని సూచించకపోతే నిజమైన మార్గం మనకు దొరికేది కాదు. అర్థమయ్యేది కాదు. కనుక మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై అత్యధికంగా దరూద్ చదువుతూ ఉండాలి.
అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మద్, కమా సల్లయిత అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుమ్ మజీద్. అల్లాహుమ్మ బారిక్ అలా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మద్, కమా బారక్త అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుమ్ మజీద్.
ఇది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై చదివే దరూద్, పంపే దరూద్ అన్నమాట. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉపదేశించి ఉన్నారు, మీలో ఎవరైతే నాపై ఎక్కువ దరూద్ పంపుతారో, చదువుతారో అతను నాకు సమీపంగా ఉంటాడు. అల్లాహ్ సామీప్యం పొందడానికి ఈ దరూద్ కూడా మనకు తోడ్పాటు అవుతుంది.
9. మంచివారితో స్నేహం
అలాగే తొమ్మిదో మార్గం ఏమిటంటే, మంచి వ్యక్తులతో స్నేహం కలిగి ఉండాలి. స్నేహం అన్నది కేవలం ప్రపంచంలో మనం చెప్పుకుంటా స్నేహం కాదు. సద్వర్తుల స్నేహం. ఎవరైతే అల్లాహ్ పట్ల విశ్వాసం కలిగి ఉంటాడో, ఎల్లప్పుడూ అల్లాహ్ ని గుర్తు చేస్తూ ఉంటాడో, అల్లాహ్ యొక్క విధేయతను పాటిస్తూ ఉంటాడో, అల్లాహ్ తో ఎవరైతే భయపడుతూ ఉంటారో వారి యొక్క స్నేహాన్ని మనము చేసుకోవాలి. మనము ఇటువంటి వారిని స్నేహించము. మన జీవిత కాలంలో మనకున్న స్నేహాలు, స్నేహితులు వేరు. అల్లాహ్ తబారక వ త’ఆలా ఏదైతే సూచిస్తున్నాడో అది వేరు. కనుక గుర్తుంచుకోవాలి, స్నేహం చేసేటప్పుడు మనలో ఉన్న గుణం ఏమిటి, అది మన స్నేహం ద్వారా వ్యక్తమవుతుంది. ఒక మంచి మనిషి అల్లాహ్ తో భయపడేవాడు, అల్లాహ్ పట్ల సంతుష్టుడయ్యేవాడు, అల్లాహ్ యొక్క దాసులతో ప్రేమిస్తాడు, స్నేహం చేస్తాడు. కనుక మంచి స్నేహితులని ఎన్నుకోవాలి. దాని మూలంగా వారు చేస్తున్న ఆచారాలు, వారు చేస్తున్న కర్మలు మనకు కూడా ఉత్సాహాన్ని కలిగిస్తాయి. దాని ద్వారా మన విశ్వాసం కూడా, ఈమాన్ కూడా పెరుగుతుంది. తద్వారా అల్లాహ్ సన్నిధిలో మనము కూడా ఒక సామీప్యాన్ని పొందగలుగుతాం.
10. దానం చేయడం
పదోది ఏమిటంటే, దానము చేయటం, పేదవారిపై దానము చేయటం. దానం చేయడాన్ని అల్లాహ్ తబారక వ త’ఆలా ఎంతో మెచ్చుకుంటాడు. అల్లాహ్ త’ఆలా ఖురాన్ గ్రంథంలో ఈ విధంగా చెప్పి ఉన్నాడు, ఏదైతే మీకు నేను ప్రసాదించి ఉన్నానో అందులో నుంచి మీరు ఖర్చు పెట్టండి పేదవారిపై. ఇక్కడ చెప్పవలసిన విషయం ఏమిటంటే, మన దగ్గర ఎంత ఉంది అనేది కాదు, ఏదైతే అల్లాహ్ త’ఆలా మనకు ప్రసాదించి ఉన్నాడో, అది కొంత అయినా ఎంతైనా సరే, అందులో నుంచి ఖర్చు పెట్టి అల్లాహ్ ప్రసన్నత కోరటం అనేది ఇక్కడ మాట. ఎల్లప్పుడూ అల్లాహ్ తబారక వ త’ఆలా కోసం, అల్లాహ్ యొక్క ప్రసన్నత కోసం మనము దానధర్మాలు చేస్తూ ఉండాలి. దీని మూలంగా అల్లాహ్ యొక్క సామీప్యం మనకు దొరుకుతుంది.
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క అనుచరులు, సహాబాలు ఎంతో శ్రమపడి అల్లాహ్ తబారక వ త’ఆలా యొక్క ప్రసన్నత కోరేవారు. ఒక సందర్భంలో హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు త’ఆలా అన్హు ఆయన వద్ద ఉన్న అన్ని వస్తువులు తీసుకొచ్చి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ముందు ప్రవేశపెట్టారు. వారి స్థితిని గమనించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు త’ఆలా అన్హు తో అన్నారు, ఓ అబూబకర్! ఇవన్నీ ఇక్కడికి తీసుకువచ్చావు, ఇంట్లో ఏమి పెట్టుకున్నావు? ఆయన అన్నారు, ప్రవక్తా! నేను ఇంట్లో అల్లాహ్ మరియు ప్రవక్తను వదిలేసి వచ్చాను.
ఈ విషయం ఎందుకు చెప్తున్నామంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి అనుచరులు అల్లాహ్ ప్రసన్నత కోసం అనేక విధాలుగా ఖర్చు పెట్టేవారు. అల్లాహ్ యొక్క ప్రసన్నతను పొందాలని.
ఈ పది సూత్రాలు, పది మార్గాలు ఉన్నాయి అల్లాహ్ యొక్క సామీప్యం పొందడానికి.
అల్లాహ్ సామీప్యం యొక్క ఫలితం
అయితే ఇప్పుడు చెప్పవలసిన విషయం ఏమిటంటే, అల్లాహ్ యొక్క సామీప్యం మనం పొందినట్లయితే, అప్పుడు అల్లాహ్ తబారక వ త’ఆలా మా యొక్క ప్రతి మాటను వింటూ ఉంటాడు, మేము కోరేదానికి అల్లాహ్ తబారక వ త’ఆలా ప్రసాదిస్తూ ఉంటాడు. ఒక హదీస్ లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చెప్పారంటే, ‘లవ్ అఖ్సమ అలల్లాహి ల అబర్రహ్’. అల్లాహ్ సామీప్యం పొందినవాడు ఎప్పుడైనా అల్లాహ్ మీద ప్రమాణం చేస్తే అల్లాహ్ తబారక వ త’ఆలా అతని యొక్క ప్రమాణాన్ని పూర్తి చేస్తాడు.
అదే విధంగా మరో హదీస్ లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చెప్పారంటే, అల్లాహ్ తబారక వ త’ఆలా యొక్క సామీప్యం పొందినవాడు అల్లాహ్ యొక్క స్నేహితుడు అవుతాడు, వలీ అవుతాడు. ఎవరైతే అల్లాహ్ యొక్క వలీతో ఏదైనా విషయం పట్ల హాని కలిగించినట్లయితే అల్లాహ్ తబారక వ త’ఆలా అంటున్నాడు, అతను తోనే అతనితో నేను యుద్ధం చేయడానికి సిద్ధమై ఉన్నాను. అల్లాహ్ మిత్రుల పట్ల, అల్లాహ్ యొక్క సామీప్యం పొందిన వారి పట్ల అల్లాహ్ తబారక వ త’ఆలా ఏం చెప్తున్నాడంటే, అతనిని నేను మెచ్చుకుంటాను, అతనిని నేను ఇష్టపడతాను, అతను ఏ చేతిలోనైతే పట్టుకుంటుంటాడో ఆ చేతిని నేను అయిపోతాను. ఏ కాలి ద్వారా అయితే అతను నడుస్తూ ఉంటాడో ఆ కాలును నేను అయిపోతాను. ఏ కళ్ళ ద్వారా అతను చూస్తూ ఉంటాడో ఆ కళ్ళు నేను అయిపోతాను. అని ఎంతో ప్రేమతో, ఎంతో ప్రసన్నతతో అల్లాహ్ తబారక వ త’ఆలా చెప్తున్నాడు.
అల్లాహ్ యొక్క సామీప్యం మనం పొందినట్లయితే మన యొక్క ప్రతి మాట అల్లాహ్ తబారక వ త’ఆలా వింటాడు. మేము ఏది కోరితే అల్లాహ్ తబారక వ త’ఆలా అది మాకు ప్రసాదిస్తాడు.
కనుక చివరిగా అల్లాహ్ తబారక వ త’ఆలా తో దుఆ ఏమనగా, ఏవైతే మనం విన్నామో ఆ మాటలని గుర్తించి సరైన మార్గంపై నడిచే భాగ్యాన్ని అల్లాహ్ తబారక వ త’ఆలా మాకు ప్రసాదించు గాక. అల్లాహ్ తబారక వ త’ఆలా ఏవైతే విధిగా చేసి ఉన్నాడో వాటిని ఆచరించి అల్లాహ్ యొక్క సామీప్యాన్ని పొందే భాగ్యాన్ని అల్లాహ్ త’ఆలా మనకు ప్రసాదించు గాక. ఆమీన్.
వ ఆఖిరు ద’అవానా అనిల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దాన ధర్మాలలో ఒక విషయానికి పూర్తిగా సహాయం చేయలేకపోయినా , మీకు చేయగలిగినంత అది కొంచెమైనా చేయండి. చిన్న సహాయమైనా తక్కువ చేసి చూడకండి.
[2:43 నిముషాలు ] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
సత్కార్య వనాలు – తృతీయవనం అంశాల నుండి : ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, జుల్ఫీ (Zulfi, Saudi Arabia) అనువాదం : అబూ అనస్ ముహమ్మద్ నసీరుద్దీన్ (Abu Anas Muhammad Naseeruddeen)
అల్లాహ్ మార్గంలో దానధర్మాలు చేయుట
ప్రియ సోదరా! దైవ వాగ్దానాలు, అప్పులిచ్చేవారికి రెండితలు లభించే పుణ్యాలు, ఉత్తమ ఫలితాలు, ఎల్లకాలం ఉండే ఫలాలు, నీడలు గల స్వర్గాలు. ఎవరికీ? మనో తృప్తితో, ఆత్మసంతోషంతో, ఉదార గుణంతో దానం చేసేవారికి. అతని ముందు ఉత్తమ వాగ్దాన ఖుర్ఆన్ ఆయతులు అట్లే వచ్చేస్తాయి:
అల్లాహ్ కు రుణం ఇచ్చేవాడెవడైనా ఉన్నాడా?మేలైన రుణం: అటువంటి వానికి అల్లాహ్ దానిని ఎన్నో రెట్లు పెంచి తిరిగి ఇస్తాడు. అతనికి ఎంతో శ్రేష్ఠమైన ప్రతిఫలం లభిస్తుంది. (హదీద్ 57: 11).
తమసంపదనురేయింబవళ్ళుబహిరంగంగానూ,రహస్యంగానూ ఖర్చు చేసే వారు తమ ప్రతిఫలాన్ని తమ ప్రభువు వద్ద పొందుతారు. (బఖర 2: 274).
దానధర్మాలు ఐశ్వర్యవంతమైన చెలమ. దాని ప్రవాహంతో జీవిత పాపాలు, కష్టాలన్నీ కొట్టుకపోతాయి. మంచి విషయాల్లో ఖర్చు పెట్టుట ఎన్నో పెద్ద రోగాలకు బల్సమ్ చికిత్స లాంటిది. గుప్తంగా ఖర్చు పెట్టుట వలన ధనంలో అభివృద్ధి, శుభాలు కలుగుతాయి. భూమ్యాకాశాల ప్రభువు వీటి వాగ్దానం చేశాడు.
ఇలాచెప్పండి:నా ప్రభువు తన దాసులలో తన కిష్టమైన వారికి విస్తృతమైన ఉపాధిని ఇస్తాడు. తన కిష్టమైన వారికి ఆచితూచి ఇస్తాడు.మీరు దేనిని ఖర్చు చేసినప్పటికీ దాని స్థానంలో ఆయనే మీకు మరింత ఇస్తాడు. ఆయనే సర్వశ్రేష్ఠుడైన జీవనోపాధిప్రదాత. (సబా 34: 39).
ఔదార్యుడా! నీవు చేసే దానం ఒక బీజం లాంటిది. ఈ నేలపై కాలు మోపిన అతి ఉత్తమమైనవారు; అంటే ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) దాని బీజం నాటారు. “వాస్తవానికి దానధర్మాలు చేయడంలోఆయన(సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రభంజనం కన్నా చురుకుగా ఉండేవారు“. (బుఖారి 6, ముస్లిం 2308).
ఈ వనంలోని పూవుల్లో ఒక పూవును సమీపించడానికి ఈ పేజిలో ఈ సంఘటన చదువుదాము.
తెల్ల జాతివారి ఇంట్లోని ఓ వ్యక్తి మధ్యలో ఉన్న మంచం మీద సంపూర్ణ జడత్వానికి (కోమా) గురి అయిఉన్నాడు. అతని ప్రక్కనే ఉన్న నాడిమితి (Pulsimeter), శ్వాసను కంట్రోల్ చేసే యంత్రం మరియు మెడికల్ సొల్యూషన్ ట్యూబుల గురించి అతనికి ఏమీ తెలియదు.
సంవత్సరం పైగా ఎడతెగ కుండా ప్రతి రోజు అతని భార్య మరియు 14 సంవత్సరాల ఓ కొడుకు అతని వద్దకు వచ్చి, ప్రేమ, వాత్సల్యంతో అతని వైపు చూసి, అతనికి బట్టలు మార్చి, అతని క్షేమ విషయాలు తెలుసుకుంటూ, అతని గురించి డాక్టర్ తో కూడా మరిన్ని వివరాలు తెలుసుకుంటూ ఉండేవారు. అతనిలో ఏ కొత్త మార్పు లేకుండా, ఎక్కువ తక్కువ కాకుండా అదే ఆరోగ్య స్థితిలో సంపూర్ణ జడత్వం (Coma)లో ఉన్నాడు. అల్లాహ్ తప్ప అతని స్వస్థత ఆశ ఎక్కడా లేకుండా అయిపోయింది. కాని ఓర్పుగల స్త్రీ మరియు యవ్వనారంభదశలో ఉన్న అబ్బాయి ఇద్దరూ వినయ నమ్రతతో తమ చేతులు అల్లాహ్ వైపు ఎత్తి అతని స్వస్తత, ఆరోగ్యం గురించి దుఆ చేయనిదే అక్కడి నుండి వెళ్ళేవారు కారు.
అదే రోజు మళ్ళీ తిరిగి రావడానికి హాస్పిటల్ నుండి వెళ్ళిపోయేవారు. ఇలా ఎడతెగకుండా చికాకు, అలసట లేకుండా ప్రతి రోజు వస్తూ ఉండేవారు. హృదయాలు ప్రేమతో ఏకమైనాయి, సత్యంతో కలసిపోయాయి, కష్టాల్లో ఓర్పు, సానుభూతి, జాలి లాంటి పూర్ణసౌందర్య పుష్పాలు పుష్పించాయి.
ఏ కొత్త మార్పు లేని ఈ శవం లాంటి రోగి దర్శనానికి వస్తున్న స్త్రీ మరియు అబ్బాయిని చూసి పేషెంట్లు, నర్సులు, డాక్టర్లే ఆశ్చర్యపోయేవారు. అల్లాహ్! అల్లాహ్!! ఎంతటి విచిత్రమైన సందర్భం! తన ప్రక్కన ఏముందో తెలియని రోగి దర్శనం రోజుకు రెండు సార్లా? డాక్టర్లు మరియు వారి అసిస్టెంటులు వారిద్దరిపై జాలి, దయ చూపుతూ “అతని దర్శనమవసరం లేదు. వారంలో ఒకసారి రండి చాలు” అని స్పష్టం చేశారు. అప్పుడు “అల్లాహుల్ ముస్తఆన్, అల్లాహుల్ ముస్తఆన్” (సహాయం కోసం అర్థింపదగిన వాడు అల్లాహ్ మాత్రమే) అన్న పదాలే ఆ శ్రేయోభిలాష గుణం గల ఆడపడచు నోట వెళ్లేవి.
ఒకరోజు … భార్య, కొడుకుల దర్శానినికి కొంచెం ముందు ప్రభావితమైన ఓ వింత సంఘటన సంభవించింది; కోమాలో ఉన్న మనిషి తన మంచంలో కదులుతున్నాడు, ప్రక్క మార్చుతున్నాడు, క్షణాలు గడవక ముందే కళ్ళూ తెరుస్తున్నాడు, ఆక్సిజన్ యంత్రాన్ని తన నుండి దూరం జేస్తూ, సరిగ్గా కూర్చుంటున్నాడు, నర్సును పిలుస్తూ ఓ కేక వేస్తున్నాడు. ఆమె బిత్తరపోయి వెంటనే హాజరయింది. అతడు ఆమెతో వైద్య యంత్రాలన్నిటి (Medical equipments)ని తీయమని కోరాడు. ఆమె నిరాకరించి వెంటనే డాక్టర్ ను పిలిచింది. అతడు దిగ్భ్రాంతి చెందాడు. వెంటనే ఎన్నో రకాల చెకప్ లు చేశాడు. కాని ఆ మనిషి సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాడు. అప్పుడు డాక్టర్ అవును ఈ యంత్రాలన్నిటిని తీసేసి అతని శరీరాన్ని శుభ్రపరచండని ఆదేశించాడు.
నిష్ఠగల భార్య దర్శన సమయం సమీపించింది. భార్య మరియు కొడుకు తమ ప్రియమైనవారి వద్దకు వచ్చారు. నేను ఏ విధంగా ఆ దయార్థ క్షణాలను వర్ణించాలో, ఏ పదాలను కూర్చి నీ ముందు ఉంచాలో, వాస్తవానికి (వర్ణనాతీతమైన ఘడియ అది) చూపులు చూపులను కౌగలించుకుంటున్నాయి, అశ్రువులు అశ్రువుల్లో మిశ్రమం అయిపోతున్నాయి. చిరునవ్వులు పెదవులపై నివ్వెర పరుస్తున్నాయి. అనుభూతులు నోరుమూతపడవేశాయి. కేవలం అమిత దయాలుడు, మహోపకారుడైన అల్లాహ్ స్తోత్రములు తప్ప. ఆయనే ఆమె భర్తకు స్వస్థత వరం ప్రసాదించాడు.
ఓ పుణ్యాత్ములారా ఈ సంఘటన ఇక్కడికే అంతం కాలేదు. ఇందులో ఓ గొప్ప రహస్యం ఉంది. అది స్పష్టమయ్యే వరకు డాక్టర్ కే ఓపిక లేదు. వెంటనే అతని భార్యను ‘నీవెప్పుడైనా ఇతడ్ని ఈ స్థితిలో చూడగలుతావని ఆశించావా?’ అని ప్రశ్నించాడు. ఆమె చెప్పింది: ‘అవును, అల్లాహ్ సాక్షిగా! ఒక రోజు తప్పక రానుంది ఆయన మా రాక గురించి కూర్చుండీ వేచిస్తారు’ అని నేను ఆశించాను’.
డాక్టర్ చెప్పాడు: అతను ఈ స్థితికి రావడానికి ఎదో విషయముంది. అందులో వైద్యశాలకే గాని లేదా వైద్యులకే గాని ఏ ప్రమేయం, ఏ పాత్ర లేదు. అల్లాహ్ సాక్షిగా అడుగుతున్నాను నీవు తప్పక చెప్పే తీరాలి. అవును? రోజుకు రెండేసి సార్లు నీవు ఎందుకని వస్తూ ఉంటివి? నీవు ఏమి చేస్తూ ఉంటివి?
ఆమె చెప్పింది: నీవు నాపై అల్లాహ్ పేరున ప్రమాణం చేసి అడగావు గనక చెబుతున్నాను: నేను మొదటి దర్శనానికి ఆయన తృప్తి మరియు ఆయన గురించి దుఆ చేయుటకు వచ్చేదానిని. మళ్ళీ నేను, నా కొడుకు అల్లాహ్ సామీప్యం కోరుతూ, అల్లాహ్ ఆయనకు స్వస్థత ప్రసాదించాలని బీదవాళ్ళ మరియు నిరుపేదల వద్దకు వెళ్ళి దానధర్మాలు చేసేవాళ్ళము.
అల్లాహ్ ఆమె ఆశను, దుఆను నిరాశగా చేయలేదు. ఆమె చివరి దర్శనానికి వచ్చి, ఆయన రాక కొరకు వేచిస్తూ ఉన్న ఆమె, ఆయన్ని తన వెంట తీసుకువెళ్ళసాగింది. ఆమె, ఆమె ఇంటి వారి కొరకు చిరునవ్వులు, సంతోషాలు తిరిగి రాసాగాయి.
తమసంపదనురేయింబవళ్ళుబహిరంగంగానూ,రహస్యంగానూ ఖర్చు చేసేవారు తమ ప్రతిఫలాన్ని తమ ప్రభువు వద్ద పొందుతారు. వారికి ఏ విధమైన భయంగాని, దు:ఖంగాని కలిగే అవకాశం లేదు. (బఖర 2: 274).
ఈ సంఘటనను గౌరవనీయులైన అధ్యాపకులు అహ్మద్ సాలిమ్ బా దువైలాన్ “లా తయ్అస్” అన్న తన రచనలో పేర్కొన్నారు. అల్లాహ్ వారికి మరింత సద్భాగ్యం ప్రసాదించుగాక. మరియు మా వైపున ఉత్తమ ఫలితం నొసంగుగాక.
మీరు అమితంగా ప్రేమించే వస్తువులను (అల్లాహ్ మార్గంలో) ఖర్చు పెట్టనంత వరకు మీరు సత్కార్య స్థాయికి చేరుకోలేరు. (ఆలిఇమ్రాన్ 3: 92).
దానధర్మాలు ఏ చోట చేస్తే చాలా మేలు ఉందో వెతకాలి. అయితే అన్నిట్లో కెల్లా అతిఉత్తమమైన స్థానం అల్లాహ్ వద్ద అతి చేరువ స్థానం పొందుటకు ఇల్లాలు, పిల్లలకు మరియు బంధువులపై ఖర్చు చేయాలి.
ఉమ్మె సల్మా (రదియల్లాహు అన్హా) ప్రవక్త ﷺ వద్దకు వచ్చి ‘ప్రవక్తా! నేను అబూ సలమ సంతానం కొరకు ఖర్చు చేస్తే నాకు పుణ్యం లభిస్తుందా? నేను వారిని (దీన స్థితిలో చూస్తూ) వదలలేను. వాళ్ళు కూడా నా పిల్లలే కదా?’ అని అడిగింది. దానికి ప్రవక్త ﷺ చెప్పారుః “అవును, నీవు వారి కొరకు ఖర్చు చేస్తున్నదాని ప్రతిఫలం నీకు తప్పక లభిస్తుంది“. (బుఖారి 5369, ముస్లిం 1001).
మనం మన భార్యపిల్లలపై ఖర్చు చేయని రోజంటు ఏదైనా ఉంటుందా? కావలసిందేమిటంటే మనం సర్వ లోకాల ప్రభువైన అల్లాహ్ తో పుణ్యాన్ని ఆశించాలి. ప్రవక్త ﷺ ఇలా సెలవిచ్చారు:
“నీవు అల్లాహ్ ప్రసన్నత కోరుతూ ఖర్చు చేసే ప్రతీదానికి నీకు తప్పకుండాపుణ్యంలభిస్తుంది. చివరికి నీవు నీ భార్య నోటికందించే దాని(ముద్ద, గుటక)పై కూడా నీకు పుణ్యం దొరుకుతుంది“. (బుఖారి 56, ముస్లిం 1628).
అల్లాహ్ నీ ఉపాధిలో వృద్ధి చేసి ఉంటే నీవు స్వయం నీపై మరియు దేశ, విదేశాల్లో ఉన్న నీ సోదరులపై ఎక్కువైనా, తక్కువైనా శుభప్రదమైన ఖర్చు చేస్తూ ఉండడంలో పిసినారితనం వహించకు.
తక్కువ దానం, దాని ఉదాహరణ ఒక మస్జిద్ ఇమాం ఇలా ప్రస్తావించాడు: మస్జిద్ శుభ్రపరిచే పనిమనుషుల్లో ఒకరి విషయం చాలా గొప్పగా ఉంది; అల్లాహ్ మార్గంలో ఖర్చు చేయుటకు ఎప్పుడు చెప్పినా వెంటనే అంగీకరించి, తాను స్వయంగా ఆర్థికంగా బలహీనుడు, దీనుడయినప్పటికీ వెనకాడకుండా అతని శక్తి ప్రకారంగా అర్థ రూపాయి దానం చేసేవాడు. కేవలం అర్థ రూపాయి!! జాగ్రత్త! చాలా తక్కువే కదా అన్న హీనభావం నీలో కలగకూడదు. నిశ్చయంగా అల్లాహ్ వద్ద దాని విలువ చాలా గొప్పగా ఉంది. ఎందుకో నీకు తెలుసా? ఎందుకనగా, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వస్లలం) ఇలా చెప్పారు:
“అల్లాహ్ ధర్మసమ్మతమైన సంపాదన (నుండి ఇచ్చే దానాల్ని) మాత్రమేస్వీకరిస్తాడు.అందుకేఎవరైనా ధర్మసమ్మతమైన సంపాదన నుండి ఖర్జూరపుటంత వస్తువేదైనా దానం చేస్తాడో అల్లాహ్ దానిని కుడి చేత్తో అందుకొని మీరు గుర్రపు పిల్లను పెంచి పెద్ద చేసినట్లుగా దానిని దానం చేసినవాడి కోసం పెంచుతాడు. అలా పెరుగుతూ చివరకు అది పర్వతమంత పెద్దదిగా అయిపోతుంది“. (బుఖారి 1410).
అది అర్థ రూపాయి మాత్రమే.. కాని అల్లాహ్ ఆజ్ఞతో నరకాగ్ని నుండి రక్షణకై గొప్ప కారణం కావచ్చు. నాతో పాటు మీరు కూడా ప్రవక్త ఈ ప్రవచనం గుర్తు చేసుకోలేరా?
اتَّقُوا النَّارَ وَلَوْ بِشِقِّ تَمْرَةٍ
“మిమ్మల్ని మీరు నరకం నుండి కాపాడుకోండి, ఒక ఖర్జూరపు ముక్క (దానం)తో నైనా సరే“. (బుఖారి 1417).
మనం నింపాదిగా అడుగులు ముందుకేస్తూ ఒక స్వచ్ఛంద సేవ సంస్థ వైపుకెళ్దాము, అక్కడ ఓ దాతృత్వ దృశ్యాన్ని వీక్షిద్దాము: పండుగకు ఒకరోజు ముందు రాత్రి వేళ అక్కడి ఒక అధికారి వద్దకు పది సంవత్సరాలు కూడా దాటని ఒక అబ్బాయి వచ్చి సుమారు రెండు వందల రూపాలు దానం చేస్తాడు. ఎంతో ఆశ్చర్యంతో ‘నీకీ డబ్బలు ఎక్కడివి, మేము వీటిని ఏమి చేయాలి’ అని అతను అడుగుతాడు. అబ్బాయి ఇలా సమాధానమిస్తాడు: ఈ డబ్బులు నాకు నా తండ్రి పండుగ కొరకు బట్టలు కొనుక్కోమని ఇచ్చాడు. అయితే ఈ డబ్బులతో అనాధ అబ్బాయి ఎవరైనా పండుగ సందర్భంగా తన కొరకు కొత్త బట్టలు కొన్నుకుంటే బాగుంటుందని నా కోరిక. ఇక పోతే నాకు నా శరీరంపై ఉన్న ఈ బట్టలే చాలు అని అన్నాడు.
అల్లాహ్ మరింత సద్భాగ్యం ప్రసాదించుగాక ఆ ఇంటివారికి ఎందులోనైతే నీవు పెరుగుతున్నావో ఎవరి ఒడిలో నీవు పెద్దగవుతున్నావో! అల్లాహ్ ఇహపరాల్లో నిన్ను వారి కళ్ళకు చల్లదనంగా చేయుగాక.
ప్రియపాఠకుడా! ఒకవేళ నీవు ఎక్కువ ధనం గలవాడివై ఉంటే అనస్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించిన సంఘటనను గుర్తు చేసుకో:
మదీనాలోని అన్సార్ ముస్లిములలో అందరికంటే ఎక్కవ ఖర్జూరపు తోటల సంపద కలిగి ఉన్న వ్యక్తి అబూ తల్హాయే ఉండిరి. తన సంపదలో ఆయనకు ‘బైరుహా’ అనే తోటంటే చాలా ఇష్టం. అది మస్జిదె నబవికి ఎదురుగా ఉండింది. ప్రవక్త ﷺ కూడా ఆ తోటలోకి వెళ్తుండేవారు. అక్కడ లభించే మంచి నీళ్ళు త్రాగేవారు. “మీకు అత్యంత ప్రీతికరమైన దానిని మీరు దానం చేయనంత వరకు మీరు పుణ్య స్థాయికి చేరుకోలేరు” అనే అల్లాహ్ ఆయతు అవతరించినప్పుడు అబూ తల్హా లేచి, ‘ప్రవక్తా! “మీకు అత్యంత ప్రీతికరమైన దానిని మీరు దానం చేయనంత వరకు మీరు పుణ్య స్థాయికి చేరుకోలేరు” అనే ఆయతు అల్లాహ్ మీపై అవతరింప జేశాడు. నా సంపద మొత్తంలో ‘బైరుహా’ తోట నాకు అత్యంత ప్రీతికరమైనది. అందుకు నేను దానిని అల్లాహ్ కోసం దానం చేస్తున్నాను. దానిపై నాకు పుణ్యం లభిస్తుందని, అల్లాహ్ వద్ద అది నిలువచేసి ఉంచబడుతుందని ఆశిస్తున్నాను. కనుక ప్రవక్తా! మీరు దీనిని అల్లాహ్ మీకు చూపిన పద్దుల్లో వినియోగించండి’ అని అన్నారు. అప్పుడు ప్రవక్త ﷺ “ఓహో! ఇదెంతో లాభదాయకమైన సంపద, నిజంగా ఇది ఎంతో లాభదాయకమైన సంపద. ఇప్పుడు నువ్వన్న మాటలన్నీ నేను విన్నాను. అయితే నీవు దానినినీ బంధువుల్లో పంచిపెడితే బాగుంటుందని నేను భావిస్తున్నాను” అని అన్నారు. దానికి అబూ తల్హా ‘నేను అలాగే చేస్తాను ప్రవక్తా!’ అని అన్నారు. అన్న ప్రకారమే ఆయన దానిని తన బంధువులకు, పెద్దనాన్న, చిన్నాన్న పిల్లలకు పంచిపెట్టారు”. (బుఖారి 1461).
ప్రియసోదరా! దైవదూతలు ఎవరి కొరకు దుఆ చేస్తారో వారిలో ఒక్కనివి నీవు అయిపో:
اللَّهُمَّ أَعْطِ مُنْفِقًا خَلَفًا
“ఓ అల్లాహ్! నీ (మార్గంలో) దానం చేసేవారికి నీవు వెంటనే మరింత ప్రసాదించు“. (బుఖారి 1442, ముస్లిం 1010).
ప్రియసోదరా! అల్లాహ్ ఎవరిపై ఖర్చు చేస్తాడో వారిలో ఒకనివి నీవు ఐపో, ఆయనే స్వయంగా ఒక హదీసె ఖుదుసిలో ఇలా చెప్పాడు:
أَنْفِقْ يَا ابْنَ آدَمَ أُنْفِقْ عَلَيْكَ
“ఆదము కుమారా నీవు ఖర్చు చేయి నేను నీపై ఖర్చు చేస్తాను“. (బుఖారి 5352).
ప్రియసోదరా! నీవు దానం చేసిందే నీ కొరకు మిగిలి ఉండేది. అది అంతం అయ్యేది కాదు. ఏదైతే నీవు ఖర్చు చేయకుండా ఆపి ఉంచుతావో అదే నిజానికి నీకు కానిది అని నమ్ము.
ఆయిషా (రదియల్లాహు అన్హా) ఉల్లేఖనం ప్రకారం: వారు ఓ మేకను కోశారు. (దాని మాంసంలో చాలా భాగం ప్రజలకు పంచి పెట్టారు). ఆ సందర్భంగా ప్రవక్త ﷺ ఆయిషా (రదియల్లాహు అన్హా)తో “ఆ మాంసంలో ఇంకా ఎంత మిగిలిఉంది?“ అని అడిగారు. ‘అంతా అయిపోయింది, ఒక్క భుజ భాగం మాత్రమే మిగిలి ఉంది అని చెప్పారామె. దానికాయన “(కాదు) ఆ భుజ భాగం తప్ప తతిమ్మా మాంసమంతా మిగిలి ఉంది” అని చెప్పారు. (ఇమాం తిర్మిజి దీనిని ఉల్లేఖించి ఇది సహీ హదీసు అని చెప్పారు).
అంతే కాదు..మనం దానం చేసింది మిగిలి ఉండడమే కాదు. అది పెరుగుతూ ఉంటుంది. ప్రవక్త ﷺ చెప్పారుః
مَا نَقَصَتْ صَدَقَةٌ مِنْ مَالٍ
“దానధర్మాలు ఎప్పుడూ సంపదలో లోటు ఏర్పరచవు“. (ముస్లిం 2588).
ధర్మప్రచారంలో ఉన్న నా సోదరుడు డా. ఖాలిద్ బిన్ సఊద్ అల్ హులైబీ తెలిపాడు: దాతృత గుణంగల ఒక పెద్ద వ్యాపారి అహ్ సా పట్టణంలోని గొప్ప ధనవంతుల్లోని ఒకరు షేఖ్ అబ్దుల్లాహ్ బిన్ అబ్దుల్ అజీజ్ అన్నుఐమ్ ~ ఇలా చెప్పేవారు: నేను అల్లాహ్ మార్గంలో ఏది ఖర్చు చేసినా, దాని ఘనత వల్ల అందులో చాలా శుభం నా కళ్ళార చూసేవాడిని.
ఈ హదీసుపై శ్రద్ధ వహించు, ఇది ఈ సుందర వనం ఫలాల్లోని ఓ ఫలాన్ని నీకు అతి చేరువుగా చేస్తుంది:
ప్రవక్త ﷺ తెలిపారని అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “ఒక వ్యక్తి ఓ మైదానం గుండా వెళ్తుండగా ఏదో ఓ మేఘం నుంచి “ఫలానా వ్యక్తి తోటలో వర్షం కురిపించు” అన్న శబ్దం వినపడింది. మళ్ళీ ఆ మేఘం పక్కకు జరిగి ఓ నల్లని రాతి నేలపై కురిసింది. (దాంతో చిన్న చిన్న కాల్వలు ఏర్పడ్డాయి) చివరకు ఒక (పెద్ద) కాలువ మిగతా కాలువలన్నిటిని తనలో కలుపుకొని ప్రవహించసాగింది. ఆయన కూడా ఆ ప్రవాహం వెంట నడవసాగాడు. అటు ఓ మనిషి పారతో తన తోటకు నీళ్ళు కడుతున్నాడు. ‘ఓ దైవ దాసుడా! నీ పేరేమిటి అని అతడ్ని అడిగాడు. ఫలాన పేరు అని ఇతను మేఘంలో విన్నపేరే అతడు చెప్పాడు. ‘ఓ దైవదాసుడా! నా పేరెందుకు అడుగుతున్నావు‘ అని అతడడిగాడు. ఇతడన్నాడుః నీవు చెప్పిన పేరే చెబుతూ ఫలాన తోటలో వర్షం కురిపించు అని నేను ఏ మేఘంలో విన్నానో దాని నీళ్ళే ఇవి. అయితే అసలు నీవు చేస్తున్న పనేమిటి?అతడన్నాడుః నీవు అడిగావు గనక చెబుతున్నానుః పంట పండిన తర్వాత నేను దాని అంచనా వేసుకొని, మూడో వంతు భాగం దానం చేస్తాను. మరో మూడో వంతు నేను, నా ఆలుబిడ్డలు తినడానికి (ఉంచుకుంటాను). మరో మూడో వంతు తిరిగి విత్తనంగా వేయుటకు ఉపయోగిస్తాను“. మరో ఉల్లేఖనంలో ఉందిః “నేను మూడో వంతును పేదవాళ్ళల్లో, అడిగేవారిలో మరియు బాటసారుల్లో దానం చేస్తాను“. (ముస్లిం 2984).
దానధర్మాలు చేయడం కూడా ఓ సద్గుణమే. ఎక్కడైతే అవసరం, బీదరికం ఉందో అక్కడ దాని అందం మరీ పెరుగుతుంది. అందులో దాతృత్వం మరియు ప్రాధాన్యత గుణాలు కలసి ఏకమవుతాయి. అత్యంత దాతృతుడు, మహోపకారుడైన అల్లాహ్ స్వయంగా ఆశ్చర్య(సంతోష)పడ్డాడన్న హదీసు ఒకటి శ్రద్ధగా చదువు: అబూ హురైరా (రదియల్లాహు అన్హు) దానిని ఉల్లేఖించారు:
ఒక వ్యక్తి ప్రవక్త ﷺ వద్దకు వచ్చి ‘నేను తిండి లేక పరితపిస్తున్నాను’ అని చెప్పాడు. అందుకు ప్రవక్త ﷺ తమ ఒక భార్యకు ఈ వార్త పంపారు. ‘మిమ్మల్ని సత్య ధర్మం ఇచ్చిపంపిన అల్లాహ్ సాక్షిగా! నా దగ్గర నీళ్ళు తప్ప మరేమీ లేదు” అని ఆమె చెప్పంపింది. తర్వాత మరో భార్య వద్దకు పంపారు. ఆమె కూడా అలాగే జవాబు చెప్పింది. చివరికి ఆయన భార్యలందరూ “మిమ్మల్ని సత్యధర్మం తో పంపిన అల్లాహ్ సాక్షిగా! నా దగ్గర నీళ్ళు తప్ప మరేమీ లేదు” అనే చెప్పారు. అప్పుడు ప్రవక్త ﷺ తమ సహచరులనుద్దేశించి “ఈ రాత్రి ఇతనికి ఆతిథ్యమిచ్చే వారెవరైనా మీలో ఉన్నారా” అని అడిగారు. ఒక అన్సార్ వ్యక్తి లేచి, నేను ఇస్తాను ప్రవక్తా! అని అన్నారు. ఆయన అతడ్ని తనింటికి తీసుకెళ్ళాడు. తన భార్యతో ‘ఇతను ప్రవక్తగారి అతిథి, ఇతనికి మంచి ఆతిథ్యమివ్వాలి’ అని చెప్పాడు. మరో ఉల్లేఖనంలో ఉంది: ‘ఇంట్లో భోజనానికి ఏదైనా ఉందా’ అని తన భార్యను అడిగారు. దానికి ఆమె ‘పిల్లలకు సరిపోయేంత మాత్రమే ఉంది’ అని చెప్పింది. అప్పుడాయన చెప్పారు: రాత్రి భోజనం నుండి పిల్లవాళ్ళ మనస్సు మళ్ళించు. ఎప్పుడు వారు రాత్రి భోజనం కోరుతారో అప్పుడు వారిని పడుకోబెట్టు. ఇక అతిథి ఇంట్లోకి రాగానే (అన్నం వడ్డించి, తినేముందు) దీపం ఆర్పెయ్యి. ఆయన ముందు మనం కూడా అన్నం తిన్నట్లు నటిద్దాం. అందరూ భోజనానికి కూర్చున్నారు. (ఆమె దీపం ఆర్పేసింది) వచ్చిన అతిథి (కడుపునిండా) భోజనం చేశాడు. కాని ఆ దంపతులు మాత్రం పస్తుండిపోయారు. ఆ అన్సార్ సహచరుడు మరునాడు ఉదయం ప్రవక్త ﷺ వద్దకు వెళ్ళగా ఆయన ﷺ ఇలా చెప్పారు:
“నిశ్చయంగా రాత్రి మీరు మీ అతిథికి చేసిన సేవ చూసి అల్లాహ్ చాలా సంతోషించాడు“. (ముస్లిం 2054).
ఈ సమాజం ప్రవక్త ﷺ చూపిన సద్గుణాలపై శిక్షణపొందిన, స్వచ్చమైన చెలమ నుండి ఆస్వాదించిన సమాజం. అహం, స్వార్థం అంటే తెలియని సమాజం. ఇదిగో; సమాజంలో ఒక రకమైన సమాజాన్ని వారిలో ఉన్న ఆదర్శవంతమైన ఉత్తమ గుణాన్ని ప్రవక్త ﷺ ప్రశంసించారు. ఆ మనుగడపై గనక నేటి అనుచర సంఘం నడిచి ఉంటే వారిలో ఒక్క బీదవాడు అంటూ ఉండడు. వారు అష్అరీ తెగకు చెందినవారు. వారి గురించే ప్రవక్త ﷺ ఇలా ప్రవచించారుః
“అష్అరీ తెగవాళ్ళు యుద్ధరంగంలో ఉన్నప్పుడు వారి ఆహార పదార్థాలు అయిపోవస్తే లేదా (స్వస్థలం) మదీనాలో ఉన్నప్పుడు తమ ఆలుబిడ్డల ఆహారపదార్థాల్లో కొరత ఏర్పడితే ఎవరి వద్ద ఏ కొంత ఆహారం ఉన్నా వారు దాన్ని ఒక వస్త్రంలో పోగుచేస్తారు. మళ్ళీ ఒక పాత్రతో అందరూ సమానంగా వాటిని పంచుకుంటారు. అందుకే వారు నాతో పాటు ఉన్నారు. నేను వారితో పాటు ఉన్నాను“. (బుఖారి 2486, ముస్లిం 2500).
జాగ్రత్తా! ఓ ఉదారుడా! నిరాశ నిస్పృహలు నీపై తిష్టవేయకుండా జాగ్రత్తగా ఉండు. ఇప్పటికీ ఈ అనుచర సంఘంలో ప్రవక్త అడుగుజాడల్లో, పూర్వపు పుణ్యపురుషుల బాటలో నడిచే ఉపకారులున్నారు. ప్రతి చోట మన బలహీన సోదరుల కొరకు విరాళాల మరియు దానాల ఉద్యమాలు మనం ఎన్నటికీ మరవలేము. విరాళాల, దానాల ఈ రకాల్ని చూసి మనస్సు సంతోషిస్తుంది, హృదయం ఆనందిస్తుంది. వీటిని చూసేవాడు, వాస్తవానికి ఇవి భూమ్మీద ఓ మంచి రక్షక విధానం అని మరియు భూవాసుల శాంతి క్షేమాల రహస్యమని గ్రహించగలుగుతాడు. అల్లాహ్ కే సర్వ స్తోత్రాలు, కృతజ్ఞతలు.
రెండు సంఘటనలు నన్ను చాలా ఆశ్చర్యపరచాయి. వాటిని షేఖ్ అలీ తంతావీ ~ “జిక్రయాత్” అన్న తన రచనలోని భూమికలో ప్రస్తావించాడు: మా తండ్రిగారి అధ్యాపకులు షేఖ్ సలీమ్ అల్ మసూతీ ~ స్వయంగా ఎంతో బీదవారైనప్పటికీ ఏ ఒక్క బీదవాడిని ఎప్పుడూ నెట్టలేదు. అతను ఓ చొక్కా ధరించి బైటికి వెళ్ళేవారు, దారిలో చలితో వణికిపోతున్న ఓ మనిషిని చూసి ఆ చొక్కా అతనికి ఇచ్చేసి, తాను కేవలం లాగు మీద ఇంటికి తిరిగి వచ్చేవారు. ఒక్కోసారి తన ఆలుబిడ్డలతో కలసి భోజనం చేస్తుండగా వారు తింటూ ఉన్న ఆహారపదార్థాలు తీసి ఇంటి ముందు వచ్చిన భిక్షకునికి ఇచ్చేవారు. ఒకసారి రమజానులో ఇఫ్తార్ గురించి తినుత్రాగు పదార్థాలు (దస్తర్ ఖ్వాన్ మీద) పెట్టి సైరన్ గురించి వేచిస్తుండగా ఒక భిక్షకుడు వచ్చి తనకు తన ఆలుబిడ్డలకు తినడానికి ఏమీ లేదు అని ప్రమాణాలు చేశాడు. షేఖ్ తన ఆవిడ అశ్రద్ధను గమనించి ఇఫ్తార్ గురించి వడ్డించిన మొత్తం ఆహారం అతనికిచ్చేశారు. కాని ఆవిడ చూసి అరవడం, విలపించడం మొదలెట్టి, నీ దగ్గరే కూర్చోను పో! అని ప్రమాణం చేసింది. ఆయన గారు మౌనంగా ఉన్నారు. అర్థ గంట కూడా గడవక ముందే ఎవరో తలుపు తట్టుతున్న శబ్దం విన్నారు. చూసే సరికి ఒక వ్యక్తి పెద్ద పళ్ళం ఎత్తుకువస్తున్నాడు. అందులో ఎన్నో రకాల తినుభంఢారాలు, స్వీట్లు, ఫలాలున్నాయి. ఏమిటి? అని అడిగితే, ఇక్కడి మన నగర పాలకుడు కొంతమంది పెద్దమనుషులను ఆహ్వానించాడు. వారు రానట్లుగా విన్నవించుకోగా, ఆయన కోపంతో నేనూ తినను అని ప్రమాణం చేసి ఇదంతా షేఖ్ సలీం అల్ మసూతీ ఇంటికి తరలించండని ఆదేశించాడు అని వారు చెప్పారు.
రెండవ సంఘటన: ఒక ఆడపడచు సంఘటన. ఆమె కొడుకు ఏదో ప్రయాణానికి వెళ్ళాడు. ఒకరోజు ఆమె తినడానికి కూర్చుంది. ఆమె ముందు ఓ రొట్టె ముక్క, దానికి సరిపడు కొంత కూర ఉంది. అంతలోనే ఒక భిక్షకుడు వచ్చాడు. అందుకు ఆమె తన నోట్లోకి తీసుకుపోయే ముద్దను ఆపేసి, అతనికిచ్చేసింది. తాను పస్తుండి పోయింది. ఆమె కొడుకు ప్రయాణం నుండి తిరిగి వచ్చాక ప్రయాణంలో చూసిన విషయాల్ని చెప్పసాగాడు. అన్నిట్లోకెల్ల చాలా ఆశ్చర్యకరమైన సంఘటన ఒకటేమిటంటే: ఒక దారిలో ఓ పులి నన్ను ఒంటరిగా చూసి వెంబడించింది. నేను పరుగులు తీశాను. ఒక్కసారి కొంచెం దగ్గరున్నప్పుడు అమాంతం దూకి నా మీద పడింది. ఇక నేను దాని నోట్లో పోయానని భావిస్తున్న వేళ ఒక మనిషి తెల్లని దుస్తుల్లో నా ముందుకు వచ్చి నన్ను పులి నుండి విడిపించి “ముద్దకు బదులు ముద్ద” అన్నాడు. కాని ఏమిటుద్దేశ్యం నాకు అర్థం కాలేదు. అప్పుడే అతని తల్లి సంఘటన జరిగిన రోజు, సమయం అడిగింది. అదే సమయానికి ఇక్కడ తల్లి బీదవానికి దానం చేసిన వేళ. తన నోట్లోకి పోయే ముద్దను వెనక్కి తీసుకొని అల్లాహ్ మార్గంలో దానం చేసింది. ఇలా తన కొడుకు పులి నోట్లో నుండి బయటికి తీయబడ్డాడు. ఇక్కడికి షేఖ్ తంతావీ మాట సమాప్తమయింది.
ఓ! ఇంతనా పిసినారితనం? పిసినారితనం, పిసినారిని అవమానం, అవహేళన పాలు జేస్తుంది. దాని పర్యవసానం వినాశకరం. దాని వాసన దుర్గంధమైనది. వ్యక్తిగతంగాగాని, జాతియపరంగాగాని అది వినాశనం పాలుజేస్తుంది. సత్యసంధులైన ప్రవక్త మహానీయ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు:
“పిసినారితనానికి బహుదూరంగా ఉండండి. ఈ పిసినారితనమే మీకు పూర్వం గతించినవారిని సర్వనాశనం చేసింది. తమవారి రక్తం చిందించేందుకు, నిషిద్ధ విషయాల్ని ధర్మసమ్మతం(హలాల్) గా చేసుకోవడానికి ప్రేరేపించింది“. (ముస్లిం 2578).
ఈ పోస్ట్ క్రింది పుస్తకం నుండి తీసుకోబడింది. క్రింద ఇచ్చిన లింక్ క్లిక్ చేసి పూర్తి పుస్తకం చదవండి.
సత్కార్య వనాలు (Hadayiq)
అంశాల నుండి : ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, జుల్ఫీ (Zulfi, Saudi Arabia) అనువాదం : అబూ అనస్ ముహమ్మద్ నసీరుద్దీన్ (Abu Anas Muhammad Naseeruddeen)
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ప్రియసోదరా సదఖా చేయి! ఇప్పుడు లేకుంటే మరెప్పుడు చేస్తావు! ప్రజలు లాక్ డౌన్ లో చిక్కుకొని ఉఫాధిని కోల్పోయారు. చిన్నచితక వ్యాపారులు కూడా తీవ్రమైన బాదల్లో ఉన్నారు. కొందరు నోరు తేరచి చేయిచాచారు. మరికొందరూ అవమానంతో చేయిని చాచక అలాగే ఉండిపోయారు. మరికొందరు ఆకలిమంటల్లో చిక్కుకొని అల్లాడిపోతున్నారు.
ప్రియసోదరా! సదఖా చేయడానికి ఇదే సరైన సమయం. ప్రభుత్వం సహాయం చేస్తుందిలే… అని అనుకోకుండా, ఇది నా సామాజిక బాధ్యతగా భావించి సహాయ సహకార్యాలలో పాలుపంచుకో!!
ప్రియసోదరా! అల్లాహ్ ఇచ్చిన శక్తి సామర్ధ్యాల మేరకు సదఖా, ధానదర్మాలు చేయండి.
ప్రియసోదరా! దైవదూతలు ఎవరి కొరకు దుఆ చేస్తారో వారిలో ఒక్కనివి నీవు అయిపో;
اللَّهُمَّ أَعْطِ مُنْفِقًا خَلَفًا
“ఓ అల్లాహ్! నీ (మార్గంలో) దానం చేసేవారికి నీవు వెంటనే మరింత ప్రసాదించు“.
(బుఖారి 1442, ముస్లిం 1010).
ప్రియసోదరా! అల్లాహ్ ఎవరిపై ఖర్చు చేస్తాడో వారిలో ఒకనివి నీవు ఐపో, ఆయనే స్వయంగా ఒక హదీసె ఖుదుసిలో ఇలా చెప్పాడు:
أَنْفِقْ يَا ابْنَ آدَمَ أُنْفِقْ عَلَيْكَ “ఆదము కుమారా నీవు ఖర్చు చేయి నేను నీపై ఖర్చు చేస్తాను”. (బుఖారి 5352).
ప్రియసోదరా! నీవు దానం చేసిందే నీ కొరకు మిగిలి ఉండేది. అది అంతం అయ్యేది కాదు. ఏదైతే నీవు ఖర్చు చేయకుండా ఆపి ఉంచుతావో అదే నిజానికి నీకు కానిది అని నమ్ము.
ఆయిషా ఉల్లేఖనం ప్రకారం: వారు ఓ మేకను కోశారు. (దాని మాంసంలో చాలా భాగం ప్రజలకు పంచి పెట్టారు). ఆ సందర్భంగా ప్రవక్త ﷺ ఆయిషా తో “ఆ మాంసంలో ఇంకా ఎంత మిగిలి ఉంది?” అని అడిగారు. ‘అంతా అయిపోయింది, ఒక్క భుజ భాగం మాత్రమే మిగిలి ఉంది అని చెప్పారామె. దానికాయన “(కాదు) ఆ భుజ భాగం తప్ప తతిమ్మా మాంసమంతా మిగిలి ఉంది” అని చెప్పారు. (ఇమాం తిర్మిజి దీనిని ఉల్లేఖించి ఇది సహీ హదీసు అని చెప్పారు).
కాదు.. మనం దానం చేసింది మిగిలి ఉండడమే కాదు. అది పెరుగుతూ ఉంటుంది.
అల్లాహ్ మనందరికి ధానదర్మాలు చేసే వారిలో ఉంచు. అల్లాహ్ మా అందరికి ధానదర్మాలు ఇచ్చే శక్తిని ప్రసాధించు! ఆమీన్ యా రబ్!! అల్లాహ్ మనందరికీ సధ్బుధ్ధిని మరియు సంపూర్ణ ఇస్లామ్ ఙ్ఞానాన్ని మరియు దాని ప్రకారం జీవించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్!!.
మరిన్ని సందేశాల కొరకు దైవగ్రంధం ఖుర్ఆన్ మరియు సహీ హదీసులను చదవండి ఇహాపరలోకాల్లో సాఫల్యం పొందండి.
అనువాదం: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
You must be logged in to post a comment.