ప్రళయదినాన ఆ పశువులు ఒకదాని తరువాత మరొకటి వరుసగా ఆ వ్యక్తిని కొమ్ములతో పొడిచి కాళ్ళతో తోక్కివేస్తాయి

576. హజ్రత్ అబూజర్ గిఫ్ఫారి (రధి అల్లాహు అన్హు) కధనం :-

నేను (ఓసారి) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధికి వెళ్తే సరిగ్గా అదే సమయంలో ఆయన “నా ప్రాణం ఎవరి అధీనంలో ఉందో ఆ శక్తి స్వరూపుని సాక్షి!” అంటూ లేక “తాను తప్ప వేరే ఆరాధ్యుడు లేనటువంటి శక్తి స్వరూపుని సాక్షి” అంటూ లేక మొత్తం మీద ఆయన ఏదో ఓ రకంగా ప్రమాణం చేస్తూ ఇలా అన్నారు. “ఒంటెలు, ఆవులు లేదా మేకలు కలిగి వున్న వ్యక్తి వాటి హక్కు (అంటే జకాత్) గనక నెరవేర్చకపోతే ప్రళయదినాన ఆ పశువులు బాగా పెరిగి బలసిపోయేలా చేసి తీసుకురాబడతాయి. తర్వాత అవి ఒకదాని తరువాత మరొకటి వరుసగా ఆ వ్యక్తిని కొమ్ములతో పొడిచి కాళ్ళతో తోక్కివేస్తాయి. చివరి పశువు కూడా పొడిచి, తొక్కి వేసిన తరువాత తిరిగి మొదటి పశువు వచ్చేస్తుంది. ఈ విధంగా ఈ యాతన యావత్తు మానవులను గురించి (పరలోక) తీర్పు ముగిసే దాకా కొనసాగుతుంది.”

[సహీహ్ బుఖారీ : 24 వ ప్రకరణం – జకాత్, 43 వ అధ్యాయం – జకాతిల్ బఖర]

జకాత్ ప్రకరణం : 8 వ అధ్యాయం – జకాత్ చెల్లించని వారు కఠినాతి కఠిన శిక్ష చవి చూడవలసి వస్తుంది
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-1
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

Read English Version of this Hadeeth

బొమ్మలను వేసే (తయారు చేసే) వాడ్ని అల్లాహ్ ప్రళయదినాన శిక్షిస్తాడు

1366. హజ్రత్ ఆయిషా (రధి అల్లాహు అన్హ) కధనం :-

నేనొక దిండు (లేక తలగడ) కొన్నాను. దాని మీద బొమ్మలు వేసి ఉన్నాయి. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) బయటి నుంచి వచ్చి దాన్ని చూడగానే తలుపు దగ్గరే ఆగిపోయారు. ఇంట్లోకి ప్రవేశించలేదు. నేనాయన ముఖంలో ఆగ్రహ చిహ్నాలు చూసి ‘దైవప్రవక్తా! నేను దేవుని ముందు, ఆయన ప్రవక్త ముందు పశ్చాత్తాపపడుతున్నాను (క్షమాపణ కోరుకుంటున్నాను). నేను చేసిన తప్పేమిటో సెలవియ్యండి” అని అన్నాను. దానికి ఆయన “ఈ దిండేమిటి?” అని అడిగారు. “ఈ దిండు మీరు ఆనుకొని కూర్చుంటారన్న ఉద్దేశ్యంతో కొన్నాను” అని చెప్పాను నేను. అప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “బొమ్మలను వేసే (తయారు చేసే) వాడ్ని అల్లాహ్ ప్రళయదినాన శిక్షిస్తాడు. ‘నీవు సృష్టించిన దీనికి ప్రాణం పొయ్యి అంటాడు అల్లాహ్ అతనితో (అతనా పని చేయలేడు)” అని అన్నారు. ఆ తరువాత “బొమ్మలు ఉండే ఇంట్లో దైవదూతలు ప్రవేశించరు” అని చెప్పారు ఆయన.

[సహీహ్ బుఖారీ : 34 వ ప్రకరణం – అల్ బుయూ, 40 వ అధ్యాయం – అత్తిజారతి ఫీమా యుక్రహు లుబ్సుహూ లిర్రిజాలి వన్నిసా]

వస్త్రధారణ, అలంకరణల ప్రకరణం : 26 వ అధ్యాయం – కుక్క, (ప్రాణుల) చిత్రాలుండే ఇంట్లో దైవదూతలు ప్రవేశించరు.
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-2
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

Read English Version of this Hadeeth