నమాజు కోసం మస్జిదుకు వెళ్ళే వారికి అడుగడుగునా పుణ్యమే

388. హజ్రత్ అబూ మూసా (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు:-

“మస్జిద్ కు అందరికంటే ఎక్కువ దూరముండే వ్యక్తి నమాజు కోసం అందరికంటే ఎక్కువ దూరం నడవ వలసి వస్తుంది. అందువల్ల అతనికే అందరికన్నా ఎక్కువ నమాజు పుణ్యం లభిస్తుంది. అలాగే (ఇషా) నమాజు తొందరగా చేసి పడుకునే వ్యక్తి కంటే ఇమామ్ వెనుక సామూహిక నమాజు కోసం ఎదురు చూసే వ్యక్తికి ఎక్కువ పుణ్యం లభిస్తుంది.”

[సహీహ్ బుఖారీ : 10 వ ప్రకరణం – అజాన్, 31 వ అధ్యాయం – సలాతిల్ ఫజ్రి ఫీజమాఅత్]

ప్రార్ధనా స్థలాల ప్రకరణం – 50 వ అధ్యాయం
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-2
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

నమాజు చేయకుండా తెల్లవారే దాకా పడుకునే వ్యక్తి

444. హజ్రత్ అబూ హురైరా (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు:-

“మనిషి రాత్రివేళ పడుకున్న తరువాత షైతాన్ అతని ముచ్చిలి గుంటపై మూడు ముళ్ళు వేస్తాడు. ప్రతిముడి మీద ‘రాత్రి ఇంకా చాలా ఉంది, హాయిగా పడుకో’ అంటూ మంత్రించి ఊదుతాడు. అప్పుడు మనిషి మేల్కొని దేవుడ్ని స్మరించగానే ఒక ముడి ఊడిపోతుంది.తరువాత వుజూ చేస్తే రెండవ ముడి ఊడిపోతుంది. ఆ తరువాత నమాజు చేస్తే మూడవ ముడి కూడా ఊడిపోతుంది. దాంతో ఆ వ్యక్తి తెల్లవారుజామున ఎంతో ఉత్సాహంతో, సంతోషంతో లేస్తాడు. అలా చేయకపోతే వళ్ళు బరువయి బద్ధకంగా లేస్తాడు”

[సహీహ్ బుఖారీ : 19 వ ప్రకరణం – తహజ్జుద్, 12 వ అధ్యాయం – అఖ్దషైతాని అలా ఖాఫియాతిర్రాస్]

ప్రయాణీకుల నమాజ్ ప్రకరణం – 28 వ అధ్యాయం
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-2
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

నమాజు కోసం పరుగెత్తరాదు, నింపాదిగా నడవాలి

351. హజ్రత్ అబూ ఖతాదా (రధి అల్లాహు అన్హు) కధనం:-

మేమంతా  ఓ రోజు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తొ కలిసి నమాజు చేస్తుంటే, కొందరు పరిగెత్తుకొస్తున్న అడుగుల చప్పుడు  దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కు విన్పించింది. నమాజు ముగిసిన తరువాత ఆయన వారిని ఉద్దేశించి
“ఏమిటీ, ఏమయింది మీకు అలా పరిగెత్తుకు వచ్చారు?”
అని అడిగారు. దానికి వారు

“మేము త్వరగా జమాఅత్ (సామూహిక నమాజు)లో కలవడానికి పరిగెత్తాము”
అని విన్నవించుకున్నారు.

అప్పుడు  దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) హితవు చేస్తూ
“ఇక నుండి అలా చేయకండి. నమాజు చేయడానికి వచ్చినప్పుడల్లా హుందాగా, నింపాదిగా నడచి రండి. సామూహిక నమాజులో ఎంత భాగం లభిస్తే అంతే చేయండి. మిగిలిన భాగాన్ని మీరంతగా మీరు (వ్యక్తిగతంగా) చేసి నమాజును పూర్తి చేసుకోండి”
అని అన్నారు.

[సహీహ్ బుఖారీ : 10 వ ప్రకరణం – అజాన్, 20  వ అధ్యాయం – ఖౌలిర్రజులి ఫఅతతుసస్సలాత్]

ప్రార్ధనా స్థలాల ప్రకరణం – 28 వ అధ్యాయం
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-2
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

కపట విశ్వాసి లక్షణాలు

37. హజ్రత్ అబ్దుల్లాబిన్ అమ్ర్ (రధి అల్లాహు అన్హు) కధనం:-

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా తెలిపారు – “కపట విశ్వాసిలో నాలుగు దుర్లక్షణాలు ఉంటాయి.

  1. భద్రపరచమని ఏదైనా వస్తువు అప్పగిస్తే దాని పట్ల అతను నమ్మక ద్రోహానికి పాల్పడతాడు.
  2. నోరు విప్పితే అబద్ధమే పలుకుతాడు.
  3. వాగ్దానం చేస్తే దాన్ని భంగపరుస్తాడు.
  4. ఎవరితోనైనా జగడం పెట్టుకుంటే దుర్భాషకు దిగుతాడు.

ఈ నాలుగు లక్షణాలు ఎవరిలోనైనా ఉంటే అతను పచ్చి కపట విశ్వాసిగా పరిగణించబడతాడు. ఒకవేళ ఈ నాలుగు లక్షణాలలో ఒక లక్షణం ఉంటే, దాన్ని విడనాడనంత వరకు అతనిలో కపట విశ్వానికి సంబంధించిన ఒక లక్షణం ఉన్నట్లే లెక్క.”

[సహీహ్ బుఖారీ : 2 వ ప్రకరణం – ఈమాన్, 24 వ అధ్యాయం – అలా మతుల్ మునాఫిఖ్]

విశ్వాస ప్రకరణం : 23 వ అధ్యాయం
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-2
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

ముఖ్తదీలు (నమాజులో) ఇమామ్ ని విధిగా అనుకరించాలి

232. హజ్రత్ అనస్ (రధి అల్లాహు అన్హు) కధనం:-

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఓ సారి గుర్రం మీద నుండి పడిపోయారు. దానివల్ల ఆయన శరీరం కుడి భాగం దోక్కుని పోయింది. మేము ఆయన్ని పరామర్శించడానికి వెళ్ళాం. మేము ఆయన సన్నిధికి వెళ్ళేటప్పటికి నమాజు వేళ అయింది. ఆయన మాకు కూర్చునే నమాజు చేయించారు. మేము కూడా ఆయన వెనుక కూర్చునే నమాజు చేశాము. ఆయన నమాజు ముగించిన తరువాత

“ఇమామ్ నియామకం ఆయన్ని (ముఖ్తదీలు) అనుకరించడానికే జరుగుతుంది. అందువల్ల అతను (అల్లాహు అక్బర్ అని) తక్బీర్ పలికితే మీరు తక్బీర్ పలకండి. ఆయన రుకూ చేస్తే మీరూ రుకూ చేయండి.ఆయన రుకూ నుండి పైకి లేస్తే మీరు లేవండి. అప్పుడు ఇమామ్ ‘సమిఅల్లాహులిమన్ హమిదా’ అంటే మీరు ‘రబ్బనా! వలకల్ హమ్ద్’ అనండి. (ఆ తరువాత) అతను సజ్దా చేస్తే మీరు సజ్దా చేయండి”

అని ప్రభోధించారు.

[సహీహ్ బుఖారీ :  10 వ ప్రకరణం – అజాన్, 128 వ అధ్యాయం – యహ్ వీ బిత్తక్బీరి హీన యస్జుద్]

నమాజుప్రకరణం  – 19 వ అధ్యాయం
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-2
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

రాత్రి చివరి జామున జిక్ర్, దుఆ చేయడం

434. హజ్రత్ అబూ హురైరా (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు:-

మహొన్నతుడు, శుభదాయకుడు అయిన మన ప్రభువు ప్రతిరోజు రాత్రి చివరి మూడోజామున మొదటి ఆకాశం పై అవతరించి (మానవుల్ని సంబోధిస్తూ)

“నన్ను మొర పెట్టుకునే వారెవరైనా ఉన్నారా? (ఈ సమయంలో) నేను వారి మొరలను ఆలకిస్తాను. నన్ను పిలిచే వారెవరైనా ఉన్నారా? నేను వారి పిలుపుకు సమాధానమిస్తాను. నన్ను క్షమాపణ కోరే వారెవరైనా ఉన్నారా? నేను వారిని క్షమిస్తాను”

అని అంటాడు.

[సహీహ్ బుఖారీ : 19 వ ప్రకరణం – తహజ్జుద్, 14 వ అధ్యాయం – అద్దుఆఇవస్సలాతి మిన్ ఆఖిరిల్లైల్]

ప్రయాణీకుల నమాజ్ ప్రకరణం – 24 వ అధ్యాయం
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-2
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

ధర్మం, విజ్ఞతా వివేచనల దృష్ట్యా స్త్రీలు పురుషుల కన్నా తక్కువ

49. హజ్రత్ అబూ సయీద్ ఖుదరీ (రధి అల్లాహు అన్హు) కధనం:-

ఈదుల్ అజ్హా లేక ఈదుల్ ఫిత్ర్ (పండగ) దినాన దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈద్గాహ్ లో మహిళా భక్తుల ముందు నుంచి పోతూ”మహిళల్లారా! నరకంలో మీ సంఖ్య అధికంగా ఉన్నట్లు నాకు ‘మేరాజ్’ రాత్రిన చూపడం జరిగింది. అందువల్ల మీరు (వీలైనంత ఎక్కువగా) దానం చేస్తూ ఉండండి” అని బోధించారు. స్త్రీలు ఈ మాటలు విని “దానిక్కారణం ఏమిటి ధైవప్రవక్తా?” అని అడిగారు.

“మీరు తరచుగా నోరు పారేసుకుంటారు; భర్తల పట్ల కృతజ్ఞులయి ఉండరు. ధర్మం, విజ్ఞతా వివేచనల దృష్ట్యా మీరు పురుషుల కన్నా తక్కువ అయినప్పటికీ పురుషుల్ని లోబరచుకుంటున్నారు”

అన్నారు  దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం).

“ధర్మం, విజ్ఞతా వివేచనల దృష్ట్యా మేము పురుషుల కన్నా తక్కువ ఎలా అయ్యాము ధైవప్రవక్తా?” అని అడిగారు స్త్రీలు.

దానికి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “స్త్రీ సాక్ష్యం పురుష సాక్ష్యంలో సగానికి సమానం (అంటే ఒక పురుషుని సాక్ష్యం ఇద్దరు స్త్రీల సాక్ష్యంతో సమానం) కాదా?” అన్నారు. స్త్రీలు ‘ఔను, నిజమే’అన్నారు. “స్త్రీలలో విజ్ఞతా వివేచనలు తక్కువ అనడానికి ఇదే నిదర్శనం. అలాగే స్త్రీలు రుతు సమయంలో నమాజ్ చేయలేరు కదా? ఉపవాసాలు పాటించలేరు కదా?” అన్నారు  దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం). దానికి స్త్రీలు ‘ఔను, నిజమే’ అన్నారు. “కనుక ధర్మం దృష్ట్యా స్త్రీలు పురుషుల కన్నా తక్కువ అనడానికి ఇదొక నిదర్శనం” అన్నారు  దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం).

[సహీహ్ బుఖారీ : 6 వ ప్రకరణం – హైజ్, 6 వ అధ్యాయం – తర్కిల్ హాయిజిస్సౌమ్]

విశ్వాస ప్రకరణం – 32 వ అధ్యాయం – ఆరాధనలు, ఆజ్ఞా పాలనల్లో ఉపేక్షా భావం విశ్వాసాన్ని బలహీనపరుస్తుంది
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-2
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

ఆరోగ్య స్థితిలో ఎక్కువ ధనాశ కలిగి ఉన్నప్పుడు చేసే దానమే అత్యంత శ్రేష్ఠమైనది

611. హజ్రత్ అబూ హురైరా (రధి అల్లాహు అన్హు) కధనం:-

ఒకతను దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధికి వచ్చి “ధైవప్రవక్తా! ఎవరి దానధర్మాల పుణ్యఫలం అందరికంటే అధికంగా ఉంటుంది?” అని అడిగాడు. దానికి  దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సమాధానమిచ్చారు.

“నీవు ఆరోగ్యంగా ఉండి, అత్యధిక ధనాశ కలిగి ఉన్న రోజుల్లో (ఖర్చు చేస్తే) పేదవాడిని అయి పోతానన్న భయంతో పాటు ధనికుడయి పోవాలన్న కోరిక కలిగి ఉన్నప్పటికీ చేసే దానం అత్యంత శ్రేష్ఠమైనది. కనుక దానం చేయడంలో నీవు అంత్యకాలం దాపురించే దాకా వేచి ఉండకు. ప్రాణం కంఠంలోకి వచ్చి కోన ఊపిరితోకొట్టుకునే స్థితి వచ్చినప్పుడు నేను ఫలానా వ్యక్తికి అంతిస్తాను, ఫలానా వ్యక్తికి ఇంతిస్తాను అని చెబితే ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఇప్పుడది ఫలానా,ఫలానా వారిదయిపోయినట్లే (నీవిచ్చేదేమీ లేదు).”

[సహీహ్ బుఖారీ : 24 వ ప్రకరణం – జకాత్, 11 వ అధ్యాయం – అయ్ అస్సదఖ అఫ్జల్]

31 వ అధ్యాయం – ఆరోగ్య స్థితిలో ఎక్కువ ధనాశ కలిగి ఉన్నప్పుడు చేసే దానమే అత్యంత శ్రేష్ఠమైనది
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-2
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

ఇద్దరు తప్ప ఇతర వ్యక్తుల పట్ల అసూయ చెందడం ధర్మసమ్మతం కాదు

466. హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రధి అల్లాహు అన్హు) ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు:-

ఇద్దరు తప్ప ఇతర వ్యక్తుల పట్ల అసూయ చెందడం ధర్మసమ్మతం కాదు. ఒకరు, దేవుడు ఖుర్ఆన్ విద్యప్రసాదించగా దాన్ని రేయింబవళ్ళు చదవడంలో, చదివించడంలో నిమగ్నుడయి ఉండే వ్యక్తి. రెండోవాడు, దేవుడు సిరిసంపదలు అనుగ్రహించగా వాటిని రేయింబవళ్ళు (సత్కార్యాలలో) వినియోగించే వ్యక్తి. “(ఇలాంటి వారి పట్ల అసూయ చెందడంలో తప్పులేదు).

[సహీహ్ బుఖారీ : 97 వ ప్రకరణం – తౌహీద్, 45 వ అధ్యాయం – ఖౌలిన్నబియ్యి (స) రజులున్ అతాహుల్లాహుల్ ఖుర్ఆని ఫహువ యఖూము బిహీ]

ప్రయాణీకుల నమాజ్ ప్రకరణం
47 వ అధ్యాయం – ఖుర్ఆన్ విద్య నేర్చుకొని ఇతరులకు నేర్పే వ్యక్తి ఔన్నత్యం
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-2
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

ధర్మసంపాదన నుండి తీసిన దానం దిన దినాభివృద్ధి అవుతుంది

595. హజ్రత్ అబూహురైరా (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు:-

“దేవుని దగ్గరకు పవిత్ర వస్తువు మాత్రమే చేరుతుంది. అందువల్ల ఎవరైనా తన పవిత్ర సంపాదన నుండి ఒక ఖర్జూరపుటంత దానం చేసినా సరే దేవుడు దాన్ని కుడిచేత్తో స్వీకరిస్తాడు. ఆ తర్వాత మీరు గుర్రపు పిల్లను పెంచి పెద్ద చేసినట్లు ఆయన ఆ దానాన్ని వృద్ధి పరుస్తాడు. అలా వృద్ధి చెందుతూ చివరికది పర్వతం మాదిరిగా పెరిగిపోతుంది.”

[సహీహ్ బుఖారీ : 97 వ ప్రకరణం – తౌహీద్, 23 వ అధ్యాయం – ఖౌలిల్లాహి తాలా – తారుజుల్ మలాయికతు వర్రూహు ఇలై]

19 వ అధ్యాయం – ధర్మసంపాదన నుండి తీసిన దానం దిన దినాభివృద్ధి అవుతుంది
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-2
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

%d bloggers like this: