ఉపవాసం పాటించే వారు ఎందరో? కానీ పుణ్యాలు పొందే వారు కొందరే! ఎందుకో తెలుసుకోండి [వీడియో క్లిప్]

ఉపవాసం పాటించే వారు ఎందరో? కానీ పుణ్యాలు పొందే వారు కొందరే! ఎందుకో తెలుసుకోండి [వీడియో క్లిప్]
https://youtu.be/JC8rwimqiyw [1 నిముషం]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

మండుటెండల్లో ఉపవాసాల ప్రాముఖ్యత [ఆడియో]

బిస్మిల్లాహ్

[19:20 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

ఎండ తీవ్రత పెరిగిన రోజుల్లో ఉపవాసం ఉండడం ఎంతో సహన స్థైర్యాలతో కూడిన పని.

సహనం మూడు రకాలుగా ఉంటుంది:

  • (1) అల్లాహ్ ఆరాధన ఉద్దేశంతో ఉపవాసం పాటిస్తూ సహనం.
  • (2) అల్లాహ్ ఉపవాస స్థితిలో నిషేధించిన వాటికి దూరంగా ఉంటూ సహనం.
  • (3) ఉపవాస స్థితిలో ఆకలి దప్పులను మరియు మనోవాంఛల్ని అదుపులో పెట్టకోడానికి సహనం.

ఈ మూడు రకాలు ఉపవాసములో ఉన్నాయి. అందుకే సహనం యొక్క సత్ఫలితం లెక్కలేనంత లభించునని అల్లాహ్ శుభవార్త ఇచ్చి యున్నాడు.

إِنَّمَا يُوَفَّى الصَّابِرُونَ أَجْرَهُم بِغَيْرِ حِسَابٍ

సహనం వహించేవారికి లెక్కలేనంత పుణ్యఫలం ప్రసాదించబడుతుంది. (జుమర్ 39:10)

తీవ్ర ఎండకాలంలో ఉపవాసం పాటించడం మన సహాబాల సదాచారం:

హజ్రత్ అబూ బక్ర్ సిద్దీఖ్ (రజియల్లాహు అన్హు) తీవ్ర ఎండకాలంలో నఫిల్ ఉపవాసాలు ఉండేవారు.

ముఆజ్ (రజియల్లాహు అన్హు) తన మరణ సమయంలో అన్నారు: “చావు వల్ల బాధ లేదు, ప్రతి ఒక్కరికీ రానుందే, కాని ఆ ఎండ తాపాన్ని భరిస్తూ ఉండే ఉపవాసాలు ఇక ఉండలేను కదా అని బాధ.”

ఉమర్ (రజియల్లాహు అన్హు) మరణించే ముందు తన సుకుమారుడైన అబ్దుల్లాహ్ కు చేసిన వసియ్యత్: “నీవు విశ్వాస ఉత్తమ గుణాల్ని అవలంభించు: వాటిలో మొదటిది తీవ్ర ఎండకాలంలో ఉపవాసాలు పాటించు” అని చెప్పారు.

ఆయిషా (రజియల్లాహు అన్హా) ఎండకాలంలో ఉపావాసాలుండేవారు.

ప్రియపాఠకుల్లారా! పైన సహాబాల కొన్ని ఉదారహణలు ఏవైతే తెలిపానో అవి వారి నఫిల్ ఉపవాసాల విషయం. రమజాను యొక్క ఫర్జ్ ఉపవాసాలైతే ఎలాగైనా ఉండేవారు. ఈ రోజుల్లో మనలో అనేక మంది రమజాను ఉపవాసాలకు ఎండలు బాగున్నాయి కదా అని, ఉండకూడని సాకులు వెతుకుతారు. కాని సహాబాలు ప్రయాణాలు చేసుకుంటూ, అంతే కాదు తీవ్ర ఎండకాలంలో యుద్ధాలు చేసుకుంటూ కూడా ఉపవాసాలు పాటించారు. తబూక్ యుద్ధం ఏ కాలంలో ఏ పరిస్థితుల్లో జరిగిందో తెలుసా? మండుతున్న ఎండలు, పండుతున్న ఖర్జూరాలు, కోతకు వచ్చిన ఖర్జూరాలు గనక చేతులో చిల్లి గవ్వ లేని పరిస్థితి ఎందరిదో! అప్పుడు కొంతమంది కపటవిశ్వాసులు తప్పించుకునే ఉద్దేశంతో ఈ తీవ్ర ఎండల్లో ఎలా బయలుదేరాలి అని సాకులు చెబుతూ,[لَا تَنفِرُوا فِي الْحَرِّ] (ఇంత తీవ్రమైన ఎండ వేడిలో బయలుదేరకండి) అని ఇతరులను ఆపే ప్రయత్నం చేశారు, అప్పుడు అల్లాహ్ తెలిపాడు:

قُلْ نَارُ جَهَنَّمَ أَشَدُّ حَرًّا لَّوْ كَانُوا يَفْقَهُونَ

“నరకాగ్ని ఇంతకన్నా ఎక్కువ వేడిగా ఉంటుంది” అని వారికి చెప్పు. ఆ సంగతిని వారు గ్రహిస్తే ఎంత బావుండు!” (తౌబా 9:81).

హజ్జాజ్ ఒక ప్రయాణంలో మక్కా మదీనాల మధ్య నీళ్ళున్న చోట మజలీ చేశాడు, పగటి భోజనం తీసుకరమ్మని చెప్పాడు, సమీపంలో ఓ ఎడారివాసి (బద్దూ) కనబడగా అతడ్ని పగటి భోజనానికి ఆహ్వానించాడు, అతడన్నాడు: నీకంటే మేలైనవాడు నన్ను ఆహ్వానిస్తే నేను అతని ఆహ్వానాన్ని స్వీకరించాను. అతడెవుడు అని హజ్జాజ్ అడిగాడు, బద్దూ చెప్పాడు: అల్లాహ్! ఉపవాసముండమని చెప్పాడు, నేను ఉపవాసమున్నాను. ఈ మండుతున్న ఎండలోనా ఉపవాసం అని హజ్జాజ్ ఆశ్చర్యంగా అడిగాడు, అతడన్నాడు: “అవును, దీనికంటే మరీ విపరీతమైన ప్రళయం నాటి ఆ వేడి నుండి రక్షణ కొరకు ఉపవాసమున్నాను” అని చెప్పాడు. ఈ సమాధానం విని హజ్జాజ్ చెప్పాడు: “నఫిల్ ఉపవాసమే గనక ఈనాటి ఉపవాసం వదులుకో, నాతో కలసి భోజనం చేయి, రేపటి రోజు ఉపవాసం ఉండు”. అప్పుడు ఆ ఎడారివాసి “రేపటి రోజు వరకు నేను బ్రతికుంటానని జమానతు (గ్యారంటీ) ఇవ్వగలవా” అని అడిగాడు. ఆ జమానతు నేనివ్వలేనని హజ్జాజ్ చెప్పాడు.

గమనించారా పాఠకుల్లారా! మనిషి విశ్వాసపరంగా ఎంత బలంగా ఉండునో, మనస్థైర్యం ఎంత దృఢంగా ఉండునో అంతే ఎండల్ని ఓర్చుకోనైనా ఉపవాసాలు ఉండగలుగుతాడు.

మండుటెండల్లో ఉపవాసం యొక్క మాటే వేరు. దాని రుచి, దాని అనూన్యమైన ఆహ్లాదం సౌభాగ్యులకు, అదృష్టవంతులకే లభిస్తుంది. చెప్పుకుంటు పోతే సలఫె సాలిహీన్ లో ఇలాంటి ఎన్నో సంఘటనలు ఉన్నాయి.

కాని చివరిలో ఒకే ఒక విషయం గుర్తు చేస్తాను, శ్రద్ధగా బుద్ధిపూర్వకంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి: అదేమిటంటే: ప్రళయం నాడు సూర్యుడు అతి సమీపంలో ఉంటాడో, 50 వేల సంవత్సరాలకంటే దీర్ఘకాలం అది, ప్రతి ఒక్కడు తన పాదాన్ని కదిలించలేని స్థితిలో ఉంటాడు, ప్రతి ఒక్కడు తన పాపాల పరిమాణంలో తన చెమటలో మునిగి ఉంటాడు, ఛాయ ఎక్కడా ఉండదు, కేవలం అల్లాహ్ అర్ష్ ఛాయ తప్ప. ఇన్నీ ఘోరమైన పరిస్థితులను ఎదురుకునే శక్తి నీలో ఏమైనా ఉందా? లేదు, ముమ్మాటికీ లేదు!!!

ఇక దేనికి ఆలస్యం ఉపవాసం ఉండడంలో.


కూర్పు: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ
ZFGO జుల్ఫీ దావా సెంటర్ – సౌది అరేబియా

%d bloggers like this: