నమాజ్ పాఠాలు 4: వాజిబ్, రుకున్, సజ్దా సహ్వ్ [వీడియో]

బిస్మిల్లాహ్

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia

నమాజ్ యొక్క వాజిబులు:

1- మొదటి తక్బీరె తహ్రీమ తప్ప మిగిత అన్ని తక్బీర్లు.

2- రుకూలో కనీసం ఒక్కసారైనా సూబ్ హాన రబ్బియల్ అజీం అనడం.

3- రుకూ నుండి లేస్తూ ఇమాం మరియు ఒంటరి నమాజి సమిఅల్లాహు లిమన్ హమిదహ్ అనడం.

4- రుకూ నుండి నిలబడి రబ్బనా వలకల్ హంద్ అనడం.

5- సజ్దాలో కనీసం ఒక్కసారైనా సుబ్ హాన రబ్బియల్ అఅలా అనడం.

6- రెండు సజ్దాల మధ్యలో రబ్బిగ్ ఫిర్లీ అనడం.

7- మొదటి తషహ్హుద్ చదవడం.

8- మొదటి తషహ్హుద్ చదవడానికి కూర్చోవడం.

నమాజ్ యొక్క రుకున్ లు:

1- ఫర్జ్ నమాజులో శక్తి ఉన్నప్పుడు నిలబడటం. నఫిల్ నమాజులో నిలబడటం తప్పనిసరి కాదు. కాని కూర్చుండి నమాజు చేసేవారికి, నిలబడి చేసేవారికంటే సగం పుణ్యం లభిస్తుంది.

2- తక్బీరె తహ్రీమ.

3- ప్రతి రకాతులో సూరె ఫాతిహ పఠించడం.

4- ప్రతీ రకాతులో రుకూ చేయడం.

5- రుకూ నుండి లేచి నిటారుగా నిలబడటం.

6- ప్రతీ రకాతులో రెండు సార్లు ఏడు అంగములపై సజ్దా చేయడం.

7- రెండు సజ్దాల మధ్య కూర్చోవడం.

8- నమాజులోని రుకూ, సజ్దా మొదలైన అంశాలన్నిటినీ నింపాదిగా, శాంతిగా నెరవేర్చడం.

9- చివరి తషహ్హుద్.

10- తషహ్హుద్ కొరకు కోర్చోవడం.

11- దరరూదె షరీఫ్ (అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మది…..)

12- సలాం తింపడం.

13- ప్రతి రుకున్ నెరవేర్చడంలో క్రమ పద్దతిని పాటించడం

నమాజులో మరచిపోవుట:

ఎవరైనా నమాజులో మరచిపోతే, అంటే; నమాజులో ఏదైనా అదనపు కార్యం లేదా ఏదైనా కొరత జరుగుతే, లేదా అలాంటి అనుమానం ఏదైనా కలుగుతే నమాజు చివరిలో రెండు సజ్దాలు చేయాలి. వీటిని సహ్ వ్ సజ్దా అంటారు.

మరచిపోయి నమాజులో ఏదైనా హెచ్చింపు జరిగినప్పుడు, అంటే; ఖియాం, లేదా రుకూ, లేదా సజ్దా లాంటిదేదైనా ఎక్కువ చేసినప్పుడు సలాం త్రిప్పిన తరువాత రెండు సహ్ వ్ సజ్దాలు చేయాలి.

ఒకవేళ మరచిపోయి నమాజులో ఏదైనా కొరత జరిగినప్పుడు అంటే; నమాజులో చేయవలసిన ఏదైనా కార్యం చేయక, చదవ వలసినది ఏదైనా చదవక కొరత జరుగుట. ఒకవేళ అది ‘రుకున్’ అయితే, దాని రెండు స్థితులు: ఆ ‘రుకున్’ ఏ రకాతులో మరచిపోయాడో దాని తర్వాత రకాతు ఆరంభానికి ముందు ఆ విషయం గుర్తుకు వస్తే, వెంటనే ఆ ‘రుకున్’ నెరవేరుస్తూ, ఆ రకాతులో దాని తరువాత ఉన్నవాటిని పూర్తి చేయాలి([1]). సలాం తింపేకి ముందు సజ్దా సహ్ వ్ చేయాలి. ఆ ‘రుకున్’ ఏ రకాతులో మరచిపోయాడో దాని తరువాత రకాతు ఆరంభానికి ముందు ఆ విషయం గుర్తుకు రాకుంటే ఆ రకాత్ కానట్లే లెక్క. ఇప్పుడు చేస్తున్న రకాతే దాని స్థానం తీసుకుంటుంది([2]).

మరచిపోయిన రుకున్ సలాం తరువాత కొద్ది క్షణాలకే గుర్తుకు వస్తే, పూర్తి ఒక రకాత్ చేసి, సలాంకు ముందు సజ్దా సహ్ వ్ చేయాలి. తొందరగా గుర్తుకు రాక, ఆలస్యంగా గుర్తుకు వస్తే, లేదా వుజూ భంగమయితే తిరిగి పూర్తి నమాజు చేయాలి.

ఏదైనా వాజిబ్ ఉదాహరణకు మొదటి తషహ్హుద్, మరచిపోతే సలాంకు ముందు సజ్దా సహ్ వ్ చేస్తే సరిపోతుంది.

ఇక అనుమాన స్థితికి గురైనప్పుడు; ఈ అనుమానం రకాతుల సంఖ్యలో ఉంటే, ఉదా: రెండు రకాతులు చదివానా లేదా మూడా? అని సందేహం కల్గితే, తక్కువ సంఖ్యపై నమ్మకం ఉంచుకొని, మిగిత రకాతులు పూర్తి చేసుకోవాలి. సలాంకు ముందు సజ్దా సహ్ వ్ చేయాలి. ఒకవేళ రుకున్ విషయంలో సందేహం కలుగుతే, దాన్ని చేయలేని కింద లెక్క కట్టి, దాన్ని నెరవేర్చాలి. దాని తరువాత రకాతులు చేసుకోవాలి. సజ్దా సహ్ వ్ చేయాలి.

వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు

[1] దీని ఉదాహరణః ఒక వ్యక్తి మొదటి రకాతులో ఖిరాత్ తర్వతా రుకూ మరచిపోయి రెండు సజ్దాలు కూడా చేశాడనుకుందాము. రుకూ నమాజు ‘రుకున్’లలో ఒకటి. ఇక అతడు రెండవ రకాతు కొరకు నిలబడ్డాడు కాని ఖిరాత్ ఆరంభానికి ముందే అతనికి మరచిపోయిన రుకూ విషయం గుర్తొచ్చింది. అప్పుడు అతను రుకూ చేయాలి, రెండు సజ్దాలు చేయాలి. మళ్ళీ రెండవ రకాతు కొరకు నిలబడి యథా ప్రకారంగా నమాజు పూర్తి చేయాలి.

[2] దీని ఉదాహరణః ఒక వ్యక్తి మొదటి రకాతులో ఖిరాత్ తర్వతా రుకూ మరచిపోయి రెండు సజ్దాలు కూడా చేశాడనుకుందాము. రుకూ నమాజు ‘రుకున్’లలో ఒకటి. ఇక అతడు రెండవ రకాతు కొరకు నిలబడి, ఖిరాత్ ఆరంభించిన తర్వాత గుర్తుకు వస్తే అతని ఆ రకాతు, ఎందులో అతను రుకూ మరచిపోయాడో అది కానట్లే. అందుకు ఈ రెండవ రకాతు మొదటి రకాతు స్థానంలో ఉంటుంది.

%d bloggers like this: