దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దైవప్రవక్త యేసు (ఆయనపై అల్లాహ్ శాంతి వర్షించుగాక) జీవిత గాధ Life History of Prophet Esa (alaihissalam) (Telugu) ఆధారం : ఖుర్ఆన్ కథామాలిక కూర్పు : రచన అనువాద విభాగం, శాంతిమార్గం పబ్లికేషన్స్ శాంతిమార్గం పబ్లికేషన్స్ ట్రస్ట్, హైదరాబాద్
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
A Day with the Prophet (sallallahu alaihi wasallam) (Telugu) దైవప్రవక్త ముహమ్మద్ (సల్లలాహు అలైహి వ సల్లం) జీవితంలో ఒక రోజు రచయిత: అహ్మద్ వాన్ డిన్ఫర్ తెలుగు అనువాదం: ముహమ్మద్ అహ్మద్ అలీ శాంతిమార్గం పబ్లికేషన్ ట్రస్ట్, హైదరాబాద్
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
[క్రింది విషయం ఖురాన్ కథామాలిక అనే పుస్తకం నుండి తీసుకోబడింది]
“ఆ సోదరులు నిద్ర పోతుండగానే నీ ప్రభువు తరఫున ఒక ఆపద వారి తోటను చుట్టుముట్టి పోయింది. అంతే! తెల్లవారే సరికల్లా ఆ తోట కోత కోసిన చేను మాదిరిగా అయిపోయింది.(ఖుర్ఆన్ 68 : 19 – 20)
ఒ క రోజు ప్రాతఃకాలం, నలు దిశలా ప్రశాంత వాతావరణం అలుముకుని ఉంది. రాతి నేలపై చేతికర్రతో కొడుతూ ఎవరో నడుస్తున్న శబ్దం వినిపిస్తోంది. మధ్యమధ్యలో ఆ వ్యక్తి ఆయాసంతో దీర్ఘశ్వాస విడువడం కూడా చెవులకు సోకుతోంది. ఆ వ్యక్తి ఒక ముసలివాడు.ఆయన తన తోట వద్దకు వెళుతున్నాడు.ఆ తోటలో అనేక పండ్ల చెట్లు ఉన్నాయి. చెట్లన్నీ విరగకాసాయి. తోట మధ్యలో ఒక సెలయేరు ప్రవహిస్తోంది. అనేక పూల వాసనతో అక్కడ గాలి మధురంగా గుబాళిస్తోంది. ప్రాతఃకాలం మసకమసక వెలుతురు నెమ్మదిగా ప్రకాశ మానం అవుతోంది. పక్షులు ప్రపంచాన్ని నిద్రలేపడానికి కిలకిలరావాలు ప్రారంభించాయి. కాని ఈ ప్రకృతి సౌందర్యం ఆ ముసలి వ్యక్తి ధ్యాసను మరల్చలేదు. విశ్వప్రభువు అనుగ్రహాలను అన్వేషించే విషయంలో ఆయన ఏమాత్రం నిర్లక్ష్యంచేయదలచుకోలేదు. ఆయన సమయం కాగానే అల్లాహ్ ను స్మరిస్తూ నమాజు చేసి అల్లాహ్ అనుగ్రహాలకు కృతజ్ఞతలు చెల్లించాడు.
తన తోటలోకి ఆయన అందరినీ అనుమతించేవాడు. అక్కడి ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించే అవకాశం కల్పించేవాడు. అయితే ఎవరూ తన తోటను నాశనం చేయకుండా జాగ్రత్తగా ఉండేవాడు. తోటలో పండ్లను దించేటప్పుడు బీదలను పిలిచి వారికి ఉదారంగా తన ఫలసాయం నుంచి పంచి పెట్టేవాడు. అంతేకాదు, తోటలో దించకుండా మిగిలిపోయిన పండ్లను దించుకునే అనుమతి బీదలకు ఇచ్చేవాడు.
ముగ్గురు కుమారులు
ఆ ముసలి వ్యక్తికి ముగ్గురు కుమారులు. అందులో ఇద్దరు తమ తండ్రికి పూర్తి విరుద్ధమైన స్వభావం కలిగిన వారు. తమ తండ్రి ఉదారంగా చేసే దానధర్మాలు వారికి సహించేవి కావు. వారిలో ఒకడు తండ్రితో, “మీరు బీదలకు అంతా పంచి పెట్టి మాకు రావలసిన వాటా తగ్గిపోయేలా చేస్తున్నారు” అని కూడా అన్నాడు. రెండవ కుమారుడు మరింత ముందుకు పోయి, ”మీ దానధర్మాలు చివరకు మనల్ని కూడా బిచ్చగాళ్ళయ్యేలా చేస్తాయి” అన్నాడు. ఇది విన్న మూడవ కుమారుడు జవాబు చెప్పబోయాడు. కాని తండ్రి అతడిని వారించాడు. ఆ ముసలి వ్యక్తి తన కుమారులను విచారంగా చూస్తూ, “పిల్లల్లారా! నేను దానధర్మాలు చేయడం వల్ల మనం బీదవాళ్ళమై పోతామని మీరనుకోవడం చాలా పొరపాటు. ఇది స్వార్థపూరితమైన ఆలోచన. మీరు కోరుతున్న ఈ సంపద నిజానికి మీది కాదు, నాది కాదు. ఈ సంపద అల్లాహ్ ది. నేను కేవలం ఈ సంపదకు పర్యవేక్షకుడిని మాత్రమే. ఈ సంపదను కేవలం నా స్వంతానికి మాత్రమే ఖర్చు చేసుకునే అనుమతి నాకు లేదు. అల్లాహ్ సృష్టించిన మిగిలిన వారికి కూడా దీనిలో భాగం ఉంది. ముఖ్యంగా బీదలకు, బాటసారులకు, అవసరార్థులకు ఇందులో భాగం ఉంది. పక్షులు, క్రిమి కీటకాలకు కూడా ఇందులో భాగం ఉంది. ఎందుకంటే, అవి కూడా అల్లాహ్ సృష్టిలోనివే. ఆ తర్వాత మిగిలినదే మనది. ఆ విధం గానే మనిషి తన సంపదను పరిశుద్ధం చేసుకోగలడు. సౌభాగ్యాన్ని, సంపదలో వృద్ధిని పొందగలడు. నేను ఈ విధానాన్ని నా యవ్వనం నుంచి అనుసరిస్తూ వస్తున్నాను. మరణించే వరకు ఈ పద్ధతికే కట్టుబడి ఉంటాను.
ఇప్పుడు నేను ముసలివాడినై పోయాను. నా శరీరం వ్యాధులతో క్రుంగిపోయింది. నా చావు ఇక ఎంతో దూరంలో లేదు. కాబట్టి ఇదంతా మీరు స్వంతంచేసుకునే రోజు పెద్ద దూరంలో లేదు. అప్పుడు మీ ముందు రెండు దారులుంటాయి. మీరు కూడా నా మాదిరిగా మీ సంపదను అల్లాహ్ మార్గంలో ఖర్చుచేస్తే అల్లాహ్ మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. కాని మీరు స్వార్థపరులై సంపదనుఅల్లాహ్ మార్గంలో ఖర్చు చేయకపోతే మీరు ఆయన అనుగ్రహాలను కోల్పోవడమేకాదు, చివరకు ఉత్త చేతులతో మిగులుతారు. కాబట్టి కుమారులారా! అల్లాహ్మనల్ని ఇలా ఉండాలని ఆదేశిస్తున్నాడు” అని చెప్పాడు.
ఈ సంభాషణ జరిగిన కొంత కాలానికే ఆ ముసలి వ్యక్తి మరణించాడు.తర్వాత తోటలో పండ్లు దించే సమయం వచ్చినప్పుడు బీదలు ఎప్పటి మాదిరిగా అక్కడకు వచ్చి తమకు కూడా ఇవ్వడం జరుగుతుందని ఎదురు చూడసాగారు.కాని ఇప్పుడు ఆ తోటకు యజమానులు కుమారులు. వాళ్ళు బీదలకు తోటలోలభించే పండ్లలో ఏదీ ఇవ్వరాదని, బాటసారులు తోటలో ప్రవేశించే అనుమతి ఇవ్వరాదని నిర్ణయించుకున్నారు. కాని మూడవ కుమారుడు తండ్రిని పోలినవాడు. అతను తన సోదరులతో, “మీరు చెప్పే మాటలు దుర్మార్గంతో కూడుకున్నవి. దుర్మార్గం చెడును కొనితెస్తుంది. బీదలను కాదనడం ద్వారా మనం ప్రయోజనాలు పొందలేం. పైగా మనం స్వయంగా ఇబ్బందులకు గురికావచ్చు. కాబట్టి అల్లాహ్ ప్రసాదించిన ఈ సంపద మన తండ్రి వద్ద ఉన్నప్పుడు ఆయన ఎలా ఇచ్చేవారో అలాగే ఇవ్వడం మంచిది” అన్నాడు. కాని సోదరులు ఈమాటలకు ఆగ్రహించి, “నీకు సంబంధంలేని వ్యవహారాల్లో మాకు సలహాలు ఇవ్వవద్దు. నాన్న బ్రతికి ఉన్నప్పుడు చాలా సలహాలు తీసుకున్నాం” అన్నారు.కాని మూడవ కుమారుడు తన పట్టు వదల్లేదు. ”మనం అల్లాహ్ ను ప్రార్థించి అల్లాహ్ మార్గదర్శనాన్ని కోరుకుందాం.. ప్రార్థన మనిషిని చెడు నుంచి కాపాడుతుంది” అన్నాడు. కాని సోదరులు అతని మాటలను ఏమాత్రం లక్ష్యపెట్టలేదు.
మరుసటి రోజు తెల్లవారుజామున లేచి తోటలోని పండ్లను దించి తామేపంచుకోవాలని వారు నిర్ణయించుకున్నారు. అలాగే మరుసటి రోజు తెల్లవారుజామున తోటకు వెళ్ళారు. కాని అక్కడ కనబడిన దృశ్యం చూసి నిర్ఘాంతపోయారు. వారి తోట పరిస్థితే మారిపోయింది. అంతా నాశనమై పోయింది.అసలు గుర్తుపట్టడానికి కూడా వీల్లేకుండా మారిపోయింది.
ఈ వార్త మూడవ కుమారునికి తెలిసి, “మీ దుర్మార్గపు ఆలోచనల వల్లఏమయ్యిందో చూడండి” అని వ్యాఖ్యానించాడు. ఇద్దరు సోదరులు తమ తప్పు తెలుసుకుని అల్లాహ్ ను క్షమాభిక్ష కోరారు. “మా ప్రభువు పరిశుద్ధుడు.. నిజంగానే మేము పాపాత్ములం… మన ప్రభువు దీనికి బదులు దీనికన్నా మెరుగైన తోటను మనకు ప్రసాదించడం అసంభవమేమీ కాదు” అన్నారు.(చదవండి దివ్యఖుర్ఆన్ : 68:17-33)
గ్రహించవలసిన పాఠాలు
అల్లాహ్ మనకు సంపదను ఒక బాధ్యతగా అప్పగిస్తాడు. దానితో మనం ఏం చేస్తామో పరీక్షిస్తాడు. ఆ సంపదలో బీదలకు, అవసరార్థులకు, బాటసారులకు ఇవ్వడానికి నిరాకరిస్తే అల్లాహ్ సంపదను తీసుకుని అనేక విధాలుగా శిక్షిస్తాడు. మనం చేసిన తప్పుకు చిత్తశుద్ధితో పశ్చాత్తాప పడితే, అల్లాహ్ తాను తీసుకున్న దానికన్నా మెరుగైనది ప్రసాదిస్తాడు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
మీరు రాజులు అన్న విషయం గమనించారా? https://youtu.be/EzI9yoArZEM [15 నిముషాలు] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
మరియు మూసా తన జాతి ప్రజలతో ఇలా అన్నది (జ్ఞాపకం చేసుకోండి): “నా జాతి ప్రజలారా! అల్లాహ్ మీకు చేసిన అనుగ్రహాలను జ్ఞాపకం చేసుకోండి; ఆయన మీలో నుండి ప్రవక్తలను ఆవిర్భవింపజేశాడు మరియు మిమ్మల్ని సార్వభౌములుగా చేశాడు. మరియు (ఆ కాలంలో) ప్రపంచంలో ఎవ్వరికీ ప్రసాదించని వాటిని (అనుగ్రహాలను) మీకు ప్రసాదించాడు.” (Al-Ma’idah 5:20)
అబూ ‘అబ్దుర్రహ్మాన్ ‘హుబ్‌లీ కథనం: నేను ‘అబ్దు ల్లాహ్ బిన్ ‘అమ్ర్ ద్వారా ఇలా విన్నాను:
”అతన్ని మేము పేద ముహాజిరీన్లు కామా?” అంటే మమ్మల్ని పేద ముహాజిరీన్లుగా పరిగణించరా? అని ప్రశ్నించడం జరిగింది. దానికి ‘అబ్దుల్లాహ్ వారితో, ”నీ భార్య ఉందా?” అని అడిగారు. ఆ వ్యక్తి, ‘అవును,’ అన్నాడు. ‘నీ దగ్గర నివసించడానికి ఇల్లు ఉందా?’ అని అడిగారు, దానికి ఆ వ్యక్తి, ‘అవును,’ అని అన్నాడు. అప్పుడు ‘అబ్దుల్లాహ్, ‘అయితే నీవు ధనవంతుడవు, పేదవాడవు కావు,’ అని అన్నారు. ఆ వ్యక్తి, ‘నా దగ్గర సేవకుడు కూడా ఉన్నాడు,’ అని అన్నాడు. దానికి ‘అబ్దుల్లాహ్ మరయితే నీవు రాజుల్లో ఒకడివి.’ ‘అబ్దుర్రహ్మాన్ ఇలా అన్నారు, ”ముగ్గురు వ్యక్తులు ‘అబ్దుల్లాహ్ బిన్ ‘అమ్ర్ వద్దకు వచ్చారు. అప్పుడు నేను అక్కడే కూర్చుని ఉన్నాను. ఆ ముగ్గురు వ్యక్తులు ‘అబ్దుల్లాహ్‌తో అతని కునియత్ అబూ ము’హమ్మద్. అందువల్ల, ‘ఓ అబూ ము’హమ్మద్! మా దగ్గర డబ్బూ లేదు, వాహనమూ లేదు, జీవిత సామగ్రిలేదు.’ ‘అబ్దుల్లాహ్ వారితో, ‘మీరేమంటారు,’ అని అన్నారు. అంటే ఏం కావాలి అని అన్నారు. మీరు కోరితే ఇప్పుడు వెళ్ళిపోండి, మా దగ్గర ఇప్పుడు ఏమీ లేదు. అల్లాహ్ మీకోసం ఏదైనా అనుగ్రహిస్తే రండి, ఉన్నవరకు ఇవ్వగలను. ఒకవేళ మీరు కోరితే మీ విషయాన్ని రాజుగారి ముందు పెడతాను. అతను కోరింది మీకు ఇస్తాడు. ఒకవేళ మీరు కోరితే సహనం పాటించండి. ఎందుకంటే, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను ఇలా ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను. ”పేద ముహాజిరీన్లు ధనవంతులకంటే 40 సంవత్సరాలు ముందు స్వర్గంలో ప్రవేశిస్తారు,” అని అన్నారు. అప్పుడు వారు మేము సహనం పాటిస్తాం, ఎవరినీ ఏమీ అడగం అని అన్నారు. (ముస్లిమ్: 2979)
”క్షేమంగా, ఆరోగ్యంగా ఉదయం లేచి, అతని వద్ద ఒక్క రోజుకు సరిపడే ఆహారం ఉంటే, అతని కోసం ప్రాపంచిక అనుగ్రహాలన్నీ చేర్చటం జరిగింది, ధన సంపదలన్ని అతని కోసం కూడబెట్టడం జరిగింది.” (తిర్మిజి: 2346, సహీహ్)
వీరు అల్లాహ్ అనుగ్రహాలను గుర్తించి కూడా నిరాకరిస్తున్నారు. పైగా వారిలో చాలా మంది చేసిన మేలును మరిచేవారే. (An-Nahl 16:83)
తరువాత అతడు తన వైభవంతో తన జాతి వారి ఎదుటకు వచ్చాడు. ఇహలోక జీవితపు సుఖాలు కోరేవారు ఇలా అన్నారు: “అయ్యో! మా దౌర్భాగ్యం! ఖారూన్ కు లభించినటు వంటివి (ధనసంపత్తులు) మాకు కూడా లభించి ఉంటే ఎంత బాగుండేది? నిశ్చయంగా అతడు ఎంతో అదృష్టవంతుడు!” కాని జ్ఞానసంపన్నులు అన్నారు: “మీ దౌర్భాగ్యం! అల్లాహ్ ఇచ్చే ప్రతిఫలమే, విశ్వసించి సత్కార్యాలు చేసేవారికి ఎంతో శ్రేష్ఠమైనది. మరియు ఈ మహాభాగ్యం, సహనం వహించే వారికి తప్ప ఇతరులకు లభించదు.”ఆ పిదప మేము అతనిని, అతని గృహంతో సహా భూమిలోకి అణగద్రొక్కాము. అతడిని, అల్లాహ్ (శిక్ష) నుండి తప్పించగల, అతడి తెగవారు ఎవ్వరూ లేకపోయారు మరియు అతడు కూడా తనను తాను కాపాడు కోలేకపోయాడు. (Al-Qasas 28:79-81)
మరియు అల్లాహ్ ఒక నగరపు ఉపమానం ఇస్తున్నాడు: మొదట అది (ఆ నగరం) శాంతి భద్రతలతో నిండి ఉండేది. దానికి (దాని ప్రజలకు) ప్రతి దిక్కునుండి జీవనోపాధి పుష్కలంగా లభిస్తూ ఉండేది. తరువాత (ఆ నగరం) వారు అల్లాహ్ అనుగ్రహాలను తిరస్కరించారు (కృతఘ్నులయ్యారు), కావున అల్లాహ్ వారి చర్యలకు బదులుగా వారికి ఆకలీ, భయమూ వంటి ఆపదల రుచి చూపించాడు. (An-Nahl 16:112)
కావున వారు ఆ ఆలయ (కాబా) ప్రభువు (అల్లాహ్)ను మాత్రమే ఆరాధించాలి! వారు ఆకలితో ఉన్నప్పుడు ఆయనే వారికి ఆహారమిచ్చాడు మరియు ఆయనే వారిని భయం (ప్రమాదం) నుండి కాపాడాడు. (Quraish 106:3-4)
అబూ హురైరహ్ (రజియల్లాహు అన్హు) కథనం: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచనం:
”తీర్పుదినం నాడు అన్నిటికంటే ముందు అనుగ్రహాల గురించి ప్రశ్నించటం జరుగుతుంది, ‘మేము నీకు ఆరోగ్యం ప్రసాదించలేదా, త్రాగటానికి చల్లని నీరు ప్రసాదించ లేదా’ ” అని ప్రశ్నించటం జరుగుతుంది. (తిర్మిజి: 3358, సహీహ్)
”ఇస్లామ్ స్వీకరించి, ముస్లిమ్ అయి, తగినంత ఉపాధి ఇవ్వబడిన వాడు అంటే అల్లాహ్ (తఆలా) ఇచ్చిన దానితో తృప్తి చెందినవాడు సాఫల్యం పొందాడు.” (ముస్లిమ్: 1054)
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
[క్రింది విషయం ఖురాన్ కథామాలిక అనే పుస్తకం నుండి తీసుకోబడింది]
హునైన్ యుద్ధం జరిగిన రోజున అల్లాహ్ మిమ్మల్ని ఆదుకున్నాడు. ఆ సందర్భంగా మీరు మీ అధిక సంఖ్యపై గర్వపడ్డారు. కాని ఆ సంఖ్యాబలం మీకే విధంగానూ ప్రయోజనం కలిగించలేదు. భూమి విశాలంగా ఉండి కూడా మీకోసం ఇరుకై పోయింది. అప్పుడు మీరు వెన్ను చూపి మరలిపోయారు. ఆ తరువాత అల్లాహ్ తన ప్రవక్తపై, విశ్వాసులపై తన తరపు నుంచి స్థిమితాన్ని అవతరింపజేశాడు. మీకు కానరాని సేనలను పంపించాడు. సత్య తిరస్కారులను శిక్షించాడు. (9:25,26)
తాయిఫ్ నగరానికి మాజీ నాయ కుడు జురైజ్. ఆయన వయోవృద్ధుడు, అంధుడు. యుద్ధతంత్రాల గురించి ఆయనకు బాగా తెలుసు. ఆయన, ఒక ఒంటె మీద కూర్చొని ఉన్నాడు. సేవకుడు ఒంటె తోలుకొని వెళ్తున్నాడు. ప్రస్తుతం తాము ఏ ప్రదేశంలో ఉన్నామని ఆయన తన సేవకుణ్ణి అడిగాడు. అది ఔతాస్ ప్రదేశమని సేవకుడు చెప్పాడు. అక్కడే విడిది చేయమని జురైజ్ తన ప్రజలకు సలహా ఇచ్చాడు. ఆ ప్రదేశం కొండలేవీ లేకుండా, మరీ సమతలంగాను కాకుండా చాలా అనుకూలంగా ఉంది.
అక్కడికి కొద్దిదూరంలో ఆయనకు స్త్రీల, పిల్లల శబ్దాలు, జంతువుల అరుపులు వినిపించాయి. అక్కడ ఎవరున్నారని ఆయన తన సేవకుల్ని అడిగాడు. “మన కొత్త నాయకుడు మాలిక్ ప్రజలను యుద్ధానికి సమాయత్తం చేస్తున్నాడు. ధనసంపదల్ని, భార్యాబిడ్డల్ని సైతం వెంటబెట్టు కొని ఒక చోట సమావేశం అవమని ఆయన ప్రజలకు ఆదేశించాడు” అని సేవకులు జురైజ్ కు తెలిపారు. తనను ఆ కొత్త నాయకుని వద్దకు తీసుకువెళ్ళమని జురైజ్ సేవకుల్ని కోరాడు. సేవకులు ఆయన్ని మాలిక్ దగ్గరికి తీసుకు వెళ్ళారు. జురైజ్, మాలిక్ ను “ఏం జరుగుతుందిక్కడ?” అని అడిగాడు. దానికి మాలిక్ బదులిస్తూ, “ముహమ్మద్ ఎటువంటి ప్రతిఘటన ఎదురుకాకుండానే నిక్షేపంగా మక్కాలోకి ప్రవేశించాడు. మక్కా తర్వాత పెద్ద నగరం మాదే. కనుక భవిష్యత్తులో ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) మనపై కూడా దాడి చేయవచ్చు. హవాజిన్, నస్ర్, జుషామ్, సఖీఫ్ మొదలగు తాయిఫ్ తెగలన్నీ కూడా ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) మీద మెరుపుదాడి చేయాలని నిశ్చయించాయి” అని చెప్పాడు. అది విని జురైజ్, “మరయితే ఇక్కడ పశువుల అరుపులు, చిన్న పిల్లల ఏడుపులు ఎందుకు వినపడుతున్నాయి?” అని అడిగాడు. దానికి సమాధానమిస్తూ మాలిక్, “మనవాళ్లు ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) సైన్యాన్ని చూసి బెదిరిపోయి యుద్ధం చేయకుండా ఉంటారేమోనని నాకు భయంగా ఉంది. అందుకని నేను వారి స్త్రీలను, పిల్లలను యుద్ధ మైదానానికి వెంట తీసుకొచ్చాను. తమ భార్యాబిడ్డల్ని, సిరిసంపదల్ని కాపాడుకోవటానికి అయినా మన సైనికులు తప్పకుండా యుద్ధం చేయవలసి ఉంటుంది” అని చెప్పుకొచ్చాడు. దానికి జురైజ్ తల అడ్డంగా ఆడిస్తూ, “ఈ విషయంలో నేను నీతో ఏకీభవించలేను. మీరు ఓడిపోతే మీ భార్యాబిడ్డల ముందే అవమానం పాలవుతారు. కాబట్టి వీళ్లను యుద్ధమైదానం నుంచి పంపేయండి” అని సలహా ఇచ్చాడు. కాని మాలిక్ మాత్రం తల పొగరుతో, “నీవు ముసలోడివై పోయావు. యుద్ధ తంత్రాలకు సంబంధించి నీ విద్యలకు కాలం చెల్లింది. ఈ విషయాలను నువ్వు పట్టించుకోకు. ‘నీ కన్నా సమర్థవంతులే ఈ వ్యవహారా లను పర్యవేక్షిస్తున్నారు” అన్నాడు.
మొత్తానికి వారు ముస్లింలపై మెరుపుదాడి చేయటానికి గట్టిగా నిశ్చయించుకున్నారు.
ఓటమి తీరంలో…
మక్కాను జయించి మదీనాకు బయలుదేరారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం). మార్గ మధ్యంలో ఆయనకు కొన్ని తెగలు తమ మీద దాడి చేయటానికి పూనుకున్నాయన్న వార్త అందింది. మదీనాకు చేరుకున్న తర్వాత ఆయన ముస్లింలకు, ఆయుధాలు దింపవద్దని ఆదేశించారు. ప్రస్తుతం విశ్రాంతి తీసుకోవటానికి అవకాశం లేదని చెప్పారు. అరేబియాలో అవిశ్వాసులకు గట్టి పట్టు ఉన్న చివరి ప్రాంతం తాయిఫ్. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ముస్లిం సైన్యాలను అటు వైపు నడిపించారు. తన తెల్లటి కంచర గాడిదపై స్వారీ చేస్తూ ఉన్నారాయన.
దాని పేరు దుల్ దుల్. ముస్లింలు సూర్యాస్తమయానికి ముందే తాయిఫ్ నగరానికి దగ్గర్లోని హునైన్ పర్వతాల వద్దకు చేరుకున్నారు. అయితే హఠాత్తుగా అవిశ్వాసులు అన్ని వైపుల నుంచి ముస్లింలపై దాడి చేశారు. ఆ హఠాత్పరిణామానికి ముస్లింలు కకావికలయ్యారు. ముస్లిం సైన్యం ఛిన్నాభిన్నమైపోయింది. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆందోళనకు గురయ్యారు. కలసికట్టుగా పోరాడమని ముస్లింలను పిలిచారు. కాని ఆ స్థితిలో ఆయన మాటల్ని ఎవరూ పట్టించుకోలేదు. వెనక్కి తిరిగి చూస్తే అబూబక్ర్, ఉమర్, అలీ, అబూ సుఫ్యాన్, ఇంకా తన వంశస్తులు మరికొంత మంది మాత్రమే ఆయనకు కనిపించారు. అబూ సుఫ్యాన్ (రదియల్లాహు అన్హు) తన భావాలను అణచుకోలేకపోయారు. బిగ్గరగా అరుస్తూ, “అల్లాహ్ సాక్షి! ఇక మనం ఓడిపోయినట్లే. అవిశ్వాస సైన్యాలను సముద్ర కెరటాలే ఆపగల్గుతాయి” అన్నారు.
అటు శత్రువుల వైపు నుంచి హంబల్ కుమారుడు కలాదా గట్టిగా అరుస్తూ, “నేటితో ముహమ్మద్ మంత్రజాలం అంతమైపోతుంది” అన్నాడు. అన్సార్లనందరినీ తిరిగి కూడగట్టమని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అబ్బాస్ (రదియల్లాహు అన్హు)కు ఆదేశించారు. అబ్బాస్ (రదియల్లాహు అన్హు), “ఓ అన్సార్లారా!, దైవప్రవక్త కోసం ప్రాణార్పణకు సిద్ధపడ్డ వీరుల్లారా!, శత్రువులకు వ్యతిరేకంగా తనకు సహాయపడమని ఆయన మిమ్మల్ని పిలుస్తున్నారు” అని ఎలుగెత్తి ప్రకటించారు. అబ్బాస్ (రదియల్లాహు అన్హు) పిలుపు తమ కర్ణపుటాలకు తాకగానే అన్సార్ యోధులు, పారిపోతున్న వారల్లా వెనక్కి తిరిగి, “లబ్బైక్ యా రసూలల్లాహ్, లబ్బైక్ (దైవప్రవక్తా! వచ్చేస్తున్నాం)” అంటూ పరుగెత్తుకొచ్చారు. క్షణాల్లో ముస్లిం సైన్యం బారులు తీరింది. దృఢచిత్తులైన యోధులతో ముస్లిం సైన్యం అవిశ్వాసులపై ఉవ్వెత్తున ఎగిసిపడింది. ముస్లింల ధైర్యం అవిశ్వాసులకు సముద్రంలో తుఫానులా అగుపించింది. భయంతో ప్రాణాలు అరచేతిలో పట్టుకొని, వెంటతెచ్చిన సామగ్రినంతటిని వదలి పెట్టేసి, యుద్ధమైదానం నుంచి పలాయనం చిత్తగించారు అవిశ్వాసులు. (చదవండి, ఖుర్ఆన్ 9: 25)
తాయిఫ్ ముట్టడి
హునైన్ యుద్ధమైదానం నుంచి పారిపోయిన బనూ సఖీఫ్ తెగ తాయిఫ్ నగరంలోకి జొరబడింది. ఈ నగరంలో పటిష్టమైన కోటలెన్నో ఉన్నాయి. రక్షణ నిమిత్తం నగరం చుట్టూ ఎన్నో ప్రాకారాలు నిర్మించబడి ఉన్నాయి.
ముస్లిం సైనికులు వారిని వెంబడించారు, కాని వారు అప్పటికే తమ కోటల్లోకి వెళ్ళి దాక్కున్నారు. ఒక యేడాదికి సరిపోయే ఆహారం కూడా వారు ముందే కోటలో సమకూర్చుకొని పెట్టుకున్నారు. ముస్లిం సైనికులు సాహసం చేసి ప్రహరీ గోడలు దూకి లోనికి ప్రవేశించారు. కాని అవిశ్వాసులు పైనుంచి వారిపై ధారాపాతంగా బాణాల వర్షం కురిపించారు. దాని వల్ల ఎంతో మంది ముస్లింలు ప్రాణాలు కోల్పోయారు. అయినా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ముట్టడిని ఆపలేదు. పగలు, రేయి ఇరవై రోజుల వరకూ ఈ యుద్ధం కొనసాగింది.
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఒక చెక్క ట్యాంకును తయారు చేసి దాన్ని బండి చక్రాలపై బిగించారు. ప్రపంచంలో మొట్టమొదటి యుద్ధ ట్యాంకుగా దీన్ని చెప్పుకోవచ్చు. కొంత మంది సైనికులు ఆ ట్యాంకులో కూర్చున్నారు. తర్వాత ఆ ట్యాంకును ప్రాకారంలోనికి నెట్టటం జరిగింది. అయితే ప్రతిఘటించేవారు కూడా బాగా తెలివైనవారే. ఇనుమును బాగా కాల్చి మండుతున్న ఆ ఇనుప ముక్కల్ని వారు చెక్క ట్యాంకులపై విసరివేయసాగారు. కాలుతున్న చెక్క ట్యాంకుల నుంచి బయటపడి, పారిపోతూ వున్న ముస్లిం సైనికుల్ని శత్రువులు బాణాలతో ఏరివేయటం ప్రారంభించారు.
ఖర్జూర చెట్లను, ద్రాక్ష తోటల్ని నరికివేస్తామని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కోటలోని వారిని బెదిరించారు. దాని వల్ల మరుసటి యేడు శత్రువులకు ధాన్యపు గింజలు ఉండవు. అందుకు భయపడి శత్రువులు లొంగిపోతారేమోనని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆశించారు. అయితే బనూ సఖీఫ్ తెగవారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వద్దకు రాయబారం పంపించారు. చెట్లు రాతి నేలలో నాటబడి ఉన్నందున వాటిని గనక ఒకసారి ధ్వంసం చేస్తే మళ్లీ ఆ నేలలో చెట్లు పెరగవనీ, అలా చేయకుండా కేవలం పంట వరకు తీసుకోవలసిందని వారు దైవప్రవక్తను కోరారు. చెట్లు నరకటం వల్ల శాశ్వత నష్టం వాటిల్లుతుందని గ్రహించిన దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆ నిర్ణయం మానుకున్నారు.
తర్వాత దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మరో పద్ధతిలో దాడి చేయాలని నిర్ణయించారు. కోటపై నిప్పుల బాణాలు కురిపించి, మెరుపుదాడుల్లో తర్ఫీదైన సైనికుల్ని కోట పైకి వదలాలని అనుకున్నారు అయితే అంతలో ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు ఆ నగరంతో ప్రగాఢమైన అనుబంధం ఉంది, తాను ఒక నిస్సహాయ అనాధునిగా ఉన్నప్పుడు తనను పెంచి పోషించిన హలీమా దాది ఆ నగరంలోనే నివసించేవారు. ఆ విషయం గుర్తుకు రాగానే ఆయన మనసు ద్రవించిపోయింది.
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం), ఆయన సహచరులు ఇండ్ల నుంచి బయలుదేరి అప్పటికి రెండు మాసాలు గడిచిపోయాయి. త్వరలో జుల్ ఖాదా నెల కూడా ప్రారంభం కానుంది. ఆ నెలలో యుద్ధం చేయటం నిషిద్దం. అందుకని దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఒక నిర్ణయానికి వచ్చారు. శత్రువులకు ఓ సందేశం పంపిస్తూ తాము తాయిఫ్ ముట్టడిని ఎత్తివేస్తున్నామనీ, ఈ విషయమై చర్చించటానికి ఒక ప్రతినిధి బృందాన్ని పంపమని ఆ సందేశంలో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) శత్రువులను కోశారు. అక్కణ్ణుంచి బయలుదేరే ముందు శత్రువుల నగరంపై శాపం పెట్టమని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను సహచరులు కోరారు. కాని ఆయన మాత్రం, తాయిఫ్ వాసులకు సత్యాన్ని గ్రహించే సద్బుద్ధిని ప్రసాదించమని అల్లాహ్ ను ప్రార్థించారు.
ముస్లింలు మరుసటి సంవత్సరం తిరిగొచ్చి తమ చెట్లను నరికివేశారంటే ఇక తమకు చావు తప్పదని గ్రహించిన శత్రువులు, ముస్లింలపై దాడి చేయటం, వారిని ఎదిరించటం సముచితం కాదని భావించారు. ఇరువర్గాల మధ్య ఒక ఒప్పందం తీసుకువచ్చే విషయమై చర్చించేందుకు తమ ప్రతినిధి బృందాన్ని మదీనా పంపించారు. వారి రాక గురించి తెలుసుకొని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఎంతో సంతోషించారు.
బనూ సఖీఫ్ బృందం మదీనా నగరానికి చేరుకుంది. చూస్తే అక్కడి ప్రజలందరూ ముస్లింలుగా మారి ఉన్నారు. వారి మొండితనం మెత్తబడింది. ఇప్పుడిక తాము ముస్లింల ముందు లొంగిపోవటమే సముచిత మని భావించారు వారు. కాని ఒక షరతు మీద ఇస్లాంలోకి ప్రవేశించాలని వారు భావించారు. మూడు సంవత్సరాల వరకు తమ విగ్రహాలను పూజించుకోవటానికి అనుమతి ఇవ్వాలని వారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను కోరారు. కాని దైవప్రభక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారి ఈ షరతును అంగీకరించలేదు. కనీసం ఒక్క సంవత్సరమైనా పూజించు కోనివ్వాలని వారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను బ్రతిమాలారు. కాని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ససేమిరా అన్నారు. కనీసం ఆరు నెలల కోసమైనా అనుమతించండి దైవప్రవక్తా! అని విన్నవించుకున్నారు. అప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం), తౌహీద్ (ఏకదైవారాధన) విషయంలో ఎట్టి పరిస్థితిలోనూ తాను రాజీపడేదిలేదని, ఖరాకండిగా చెప్పేశారు. ఎట్టకేలకు తాయిఫ్ వాసులు లొంగిపోయారు.
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తాయిఫ్ వాసుల పట్ల ఎంతో కరుణావాత్సల్యాలతో వ్యవహరించారు. హునైన్ యుద్ధంలో పట్టుబడిన వారి బందీలను విడుదల చేశారు. ఒకప్పుడు తాయిఫ్ వాసులు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను రాళ్లతో కొట్టి ఆయన రక్తం కళ్లచూశారు. తనకు సహాయం చేయమని కోరటానికి వెళితే అత్యంత పరాభవ స్థితిలో నగరం నుంచి వెడలగొట్టారు. అయినా కూడా ప్రస్తుతం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అవేవీ పట్టించుకోలేదు, బేషరతుగా వారి బందీలను విడిచి పెట్టారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అవలంబించిన ఉదార వైఖరి వారి మనసుల్ని చాలా ప్రభావితం చేసింది. వారి మనసులు ఇస్లాం వైపు మొగ్గాయి. వారందరూ దృఢమైన ముస్లింలుగా మారిపోయారు.
గ్రహించవలసిన పాఠాలు
విధ్వంసంతో కూడిన విజయం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆశయం కాదు. యుద్ధ సమయంలో ఆయన మనుషులనే కాదు, వృక్షజాతి సంక్షేమాన్ని కూడా దృష్టిలో పెట్టుకున్నారు. తాయిఫ్ నగరాన్ని చూడగానే ఆయనకు తన బాల్యం గుర్తుకు వచ్చింది. చిన్నతనంలో తనను అల్లారుముద్దుగా పెంచిన ‘హలీమా అమ్మ’ ఆ నగరంలోనే నివసించేదని గుర్తుకురాగానే ఆయన హృదయం ద్రవించిపోయింది. వెంటనే ఆయన యుద్ధ తంత్రంలో మార్పులు చేసుకున్నారు.
ప్రాణ శత్రువులను సైతం శపించకుండా, వారు సన్మార్గంపైకి రావాలని ప్రార్ధించటం ఆయన ఔదార్యాన్ని చాటిచెబుతోంది.
తౌహీద్ విషయంలో ఎన్నటికీ రాజీపడకూడదు.
శత్రువులు వ్యక్తిగతంగా తనను ఎంతో బాధపెట్టారు. అయినప్పటికీ దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారి మీద ప్రతీకారం తీర్చుకోలేదు. పైగా వారిపట్ల కరుణా వాత్సల్యాలతోనే వ్యవహరించారు. ఫలితంగా ప్రాణశత్రువులు సైతం ప్రాణ మిత్రులుగా మారి ఇస్లాంలో దృఢవిశ్వాసులుగా రాణించారు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
“చివరికి మేము ఖారూన్ ను, అతని నివాసాన్ని నేలలో కూర్చివేశాము. అప్పుడు అల్లాహ్ బారి నుంచి అతన్ని ఆదుకోవటానికి ఏ సమూహమూ లేకపోయింది. మరి వాడు సయితం తనకు ఏ సాయమూ చేసుకోలేకపోయాడు.” ( సూరా అల్ ఖసస్ 28: 81)
ఖారూన్, ప్రవక్త మూసా (అలైహిస్సలాం) వంశానికి చెందినవాడు. చాలా సంపన్నుడు. ఒక మహా ప్రాసాదంలో భోగభాగ్యాలతో జీవించేవాడు. అత్యంత ఖరీదైన దుస్తులు ధరించేవాడు. అసంఖ్యాక బానిసలు ఎల్లప్పుడూ అతని సేవకు సిద్ధంగా ఉండేవారు. అన్ని రకాల సుఖవిలాసాలతో ఆడంబరంగా జీవితం గడిపేవాడు. అపారమైన ధన సంపత్తులు అతనిలో గర్వాన్ని పెంచాయి. అహంకారంతో విర్రవీగేవాడు.
ఖారూన్ బీదలను చూసి అసహ్యించుకునేవాడు. తెలివితేటలు లేకపోవడం వల్లనే వారు బీదరికంలో మగ్గుతున్నారని ఈసడించుకునేవాడు. తన తెలివితేటలు, వ్యాపార నైపుణ్యం వల్లనే తనకు అపార సంపద లభించిం దాని మిడిసిపడేవాడు.
జకాత్* చెల్లించవలసిందిగా ప్రవక్త మూసా (అలైహిస్సలాం) అతడికి చెప్పారు. జకాత్ అన్నది బీదలకు ఒక హక్కుగా సంపన్నులు చెల్లించవలసిన నిర్ధారిత వాటా. విశ్వాసులందరూ తప్పనిసరిగా జకాత్ చెల్లించాలని అల్లాహ్ ఆదేశించాడు. కాని ఈ సలహా విన్న ఖారూన్ కోపంతో మండిపడ్డాడు. తనపై అల్లాహ్ అనుగ్రహం వర్షిస్తుందని, తన ధన సంపదలే అందుకు నిదర్శనమని ప్రవక్త మూసా (అలైహిస్సలాం)తో చెప్పాడు. తన జీవిత విధానాన్నిఆమోదించినందు వల్లనే అల్లాహ్ తన సంపదను అనునిత్యం పెంచుతున్నాడని వాదించాడు. ప్రవక్త మూసా (అలైహిస్సలాం) అతడికి నచ్చ జెప్పారు. దుర్మార్గపు ఆలోచనల పరిణామాలు నష్టదాయకంగా ఉంటాయని హెచ్చరించారు.
* జకాత్ అంటే పేదల కోసం, సమాజ శ్రేయస్సు కోసం అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్ట వలసిన సొమ్ము
చివరకు ఖారూన్ తన సంపదపై జకాత్ లెక్కించాడు. జకాత్ను లెక్కిస్తే తాను చెల్లించవలసిన మొత్తం అతడికి చాలా ఎక్కువగా కనబడింది. అంత మొత్తం చెల్లించాలంటే ప్రాణాలు పోయినట్లనిపించింది. జకాత్ చెల్లించేది లేదని తిరస్కరించడమే కాదు, ప్రవక్త మూసా (అలైహిస్సలాం) తన స్వార్థప్రయోజనాల కోసం జకాత్ చట్టం తీసుకొచ్చారని ప్రచారం మొదలుపెట్టాడు. ప్రవక్త మూసా (అస)కు వ్యతిరేకంగా ప్రజల అభిప్రాయాన్ని కూడగట్టడానికి కొంతమందికి లంచాలు కూడా ఇచ్చాడు. ప్రవక్త మూసా (అలైహిస్సలాం) గురించి నానావిధాల పుకార్లు వ్యాపించేలా చేశాడు.
ఖారూన్ కుట్రల గురించి అల్లాహ్, ప్రవక్త మూసా (అలైహిస్సలాం)ను హెచ్చరించాడు. ఖారూన్ పిసినారితనానికి, అల్లాహ్ చట్టాల పట్ల అతని తిరస్కారానికిగాను అతడిని శిక్షించాలని ప్రవక్త మూసా (అలైహిస్సలాం) అల్లాహ్ ను ప్రార్దించారు. అల్లాహ్ ఆగ్రహం ఖారూన్ పై విరుచుకుపడింది. భూమి ఒక్కసారిగా పగులుబారి ఖారూన్ సహా అతడి భవనాన్ని, యావత్తు సంపదను తనలో కలిపేసుకుంది. ఖారూన్ అనేవాడు ఒకప్పుడు ఉండేవాడన్న చిహ్నాలు కూడా లేకుండా అతడు తుడిచిపెట్టుకు పోయాడు. ఖారూన్ సంఘటన మూసా (అలైహిస్సలాం) జాతి ప్రజలకు ఒక గుణపాఠంగా మిగిలి పోయింది.
ఈ విషయమై దివ్య ఖుర్ఆన్లో ఇంకా ఏముందంటే, ఖారూన్ సంపదను చూసి ఈర్ష్యపడిన వారు, అప్పటి వరకు ఖారూనను కీర్తించడమే ఘనకార్యంగా భావించిన వారు ఈ సంఘటన తర్వాత, “అల్లాహ్ ఎవరికి తలచుకుంటే వారికి సంపద ఇస్తాడు. ఎవరికి తలచుకుంటే వారికి నిరాకరిస్తాడు. మనపై అల్లాహ్ అనుగ్రహం లేనట్లయితే మనల్ని కూడా భూమి మ్రింగేసి ఉండేది. అల్లాహ్ ను తిరస్కరించేవారు పురోభివృద్ధి సాధించలేరు. ఈ ప్రపంచంలో ఔన్నత్యాన్ని కోరుకోని వారికి, దుర్మార్గానికి పాల్పడని వారికి మాత్రమే పరలోక స్వర్గవనాలు లభిస్తాయి” అనడం ప్రారంభించారు.
గ్రహించవలసిన పాఠాలు
ఖారూన్ వంటి వారు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. కొంతమంది నడమంత్రపు సిరి పొంది తమ పాత రోజులను, అప్పటి కష్టాలను మరచి పోతారు. తాము కష్టపడి, శ్రమించి తమ తెలివితేటలతో సంపాదించిందే అంతా అనుకుంటారు. అందులో అల్లాహ్ కారుణ్యం లేదని భావిస్తారు. అల్లాహ్ పట్ల ఏలాంటి కృతజ్ఞత చూపించరు. అల్లాహ్ ఆదేశాలను విస్మరిస్తారు. బీదసాదలకు ఏలాంటి సహాయం అందించడం వారికి ఇష్టం ఉండదు. పైగా తమ సంపదను పెద్ద భవనాలు కట్టడం ద్వారా సంపన్నులకు గొప్ప విందులు ఇవ్వడం ద్వారా, అనవసరమైన ఆడంబరాల ద్వారా, ఖరీదైన దుస్తులు, వాహనాల ద్వారా ప్రదర్శిస్తూ విర్రవీగు తుంటారు. మరికొందరు ఇందుకు విరుద్ధంగా అత్యంత పిసినారులుగా మారిపోతారు. పిల్లికి బిచ్చమెత్తని ధోరణి ప్రదర్శిస్తారు. స్వంతం కోసం, తమ కుటుంబం కోసం ఖర్చుపెట్టడానికి కూడా వెనుకాడుతారు. సంపద పోగుచేయడంలోనే మునిగిపోతారు. కాని ఇలాంటి వారు తాము ఈ ప్రపంచంలో కేవలం కొంత సమయం గడిపి వెళ్ళడానికి వచ్చామన్న వాస్తవాన్ని మరచిపోతుంటారు.
అల్లాహ్ నిర్దేశించిన వాటాను బీదలకు చెల్లించడం ద్వారా మనిషి తన సంపదను పరిశుద్ధం చేసుకుంటాడు. లేనట్లయితే సంపద కలుషితమై పోతుంది. సంపద ఒక శాపంగా మారిపోతుంది. తన మార్గంలో ఖర్చు చేసిన సంపదను అనేక రెట్లు పెంచి ఇస్తానని అల్లాహ్ వాగ్దానం చేస్తున్నాడు. దాన ధర్మాలకు ఖర్చు చేసినది తనకు ఇచ్చిన ఉత్తమమైన రుణంగా అల్లాహ్ అభివర్ణిస్తున్నాడు. అల్లాహ్ కు రుణం ఇచ్చి ఆయన నుంచి తిరిగి పొందడం అన్నది మనిషికి ఎంత గౌరవప్రదం! ఎంత శుభప్రదం!!
అల్లాహ్ మనిషికి ధనసంపదలను ఒక పరీక్షగా అప్పగిస్తాడు (అమానత్-అంటే ఏదన్నా వస్తువును జాగ్రత్తగా ఉంచమని ఎవరికైనా అప్పగించడం), ధనసంపదలు కూడా అల్లాహ్ మనిషికి అప్పగించిన అమానత్ (అప్పగింత). తాను ఇచ్చిన ధనసంపదలతో ఎవరు ఏం చేస్తారన్నది చూడడానికి అల్లాహ్ వాటిని ప్రసాదిస్తాడు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
[క్రింది విషయం ఖురాన్ కథామాలిక అనే పుస్తకం నుండి తీసుకోబడింది]
మంచికైనా చెడుకైనా మనిషి నాలుక, హృదయాలే మూలమని చెప్పిన మహానుభావుడు లుక్మాన్
లుక్మాన్ (అలైహిస్సలాం) ఆఫ్రికా ఖండంలో జన్మించారు. ఆయన అడవుల్లో పెరిగి పెద్దయ్యారు. అడవుల్లో కాలికి చెప్పులు కూడా లేకుండా తిరిగేవారు. కేవలం ఒక వస్త్రాన్ని చుట్టుకుని అడవుల్లో వన్య మృగాలతో పాటు ఉండేవారు. అడవిలో జీవితం, రోజూ అడవి మృగాలతో తల పడడం – ఈ విధంగా ఆయన కఠిన మైన జీవితాన్ని గడిపేవారు. భయం అంటే ఎరుగని వ్యక్తిత్వాన్ని సంతరిం చుకున్నారు. తన చుట్టూ ఉన్న ప్రకృతి గురించి దీర్ఘంగా ఆలోచించేవారు. ఈ ఆలోచనల వల్ల అనేక కొత్త విషయా లను ఆయన తెలుసుకున్నారు.
బానిసత్వం
ఆఫ్రికాపై దండెత్తిన బానిస వ్యాపారులు ఆయన్ను నిర్బంధించారు. ఆయన్ను ఒక బానిసగా అమ్మివేశారు. తన స్వేచ్ఛా స్వాతంత్రయాలు కోల్పోయా రాయన. స్వేచ్ఛగా తిరగడానికి లేదు, మాట్లాడడానికి లేదు. జీవితంలో ఎదు రైన ఈ కష్టాన్ని ఆయన భరించారు, సహనం వహించారు. అల్లాహ్ అనుగ్రహం కోసం ఎదురుచూడసాగారు.
ఆయన్ను కొనుక్కున్న వ్యక్తి మంచి మనిషి. తెలివి, వివేకం కలిగినవాడు. అతను లుక్మాన్ను దయగా చూసేవాడు. లుక్మాన్ (అలైహిస్సలాం) సాధారణమైన వ్యక్తి కాదని అతను గుర్తించాడు.
లుక్మాన్ వివేకానికి ఒక పరీక్ష పెట్టాలనుకున్నాడు. ఒక రోజు లుక్మాన్ను పిలిచి గొర్రెను కోసి అందులో అత్యంత చెడ్డ భాగాలు తన వద్దకు తీసుకురమ్మన్నాడు. లుక్మాన్ (అలైహిస్సలాం) ఒక గొర్రెను కోసి దాని గుండె, నాలుకలను తీసుకుని యజమాని వద్దకు వెళ్ళారు. లుక్మాన్ తీసుకొచ్చిన వాటిని చూసి యజమాని మెచ్చుకోలుగా చిరు నవ్వు నవ్వాడు. శరీరంలో అత్యంత చెడ్డ భాగాలుగా గుండె, నాలుకలను తీసుకు వచ్చిన ఎన్నిక ఆయనకు నచ్చింది. లుక్మాన్ (అలైహిస్సలాం) చాలా లోతయిన విషయాన్ని ఈ విధంగా చెప్పారని అతను అర్ధం చేసుకున్నాడు. అప్పటి నుంచి యజమాని లుక్మాన్ (అలైహిస్సలాం) పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపడం ప్రారంభించాడు. ఆయన్ను మరింత ఆదరంగా చూడసాగాడు.
కొన్ని రోజుల తర్వాత యజమాని లుక్మాన్ను మళ్ళీ పిలిచి ఈసారి గొర్రెను కోసి దానిలో అత్యంత ఉత్తమమైన అవయవాలు తీసుకురమ్మన్నాడు. లుక్మాన్ యజమాని చెప్పినట్టు చేశారు. కాని విచిత్రంగా ఈసారి కూడా గొర్రె గుండె, నాలుకలే తీసుకువచ్చారు. యజమాని వాటిని చూసి శరీరంలో అత్యంత చెడ్డ భాగాలు, మంచి భాగాలు రెండు కూడా ఇవే ఎలా అవుతాయని ప్రశ్నించాడు. లుక్మాన్ (అలైహిస్సలాం) యజమానికి సమాధానమిస్తూ, “మనిషి మంచివాడైతే అతని గుండె, నాలుకలు చాలా ఉత్తమమైన భాగాలు, మనిషి చెడ్డవాడైతే అతని గుండె, నాలుకలు అత్యంత చెడ్డ భాగాలు” అన్నారు. ఈ సంఘటన తర్వాతి నుంచి యజమాని లుక్మాన్ పట్ల అత్యంత గౌరవాదరాలు చూపడం ప్రారంభించాడు. చాలామంది లుక్మాన్ వద్దకు సలహా కోసం కూడా వచ్చేవారు. ఆయన వివేక విచక్షణలు, తెలివితేటలు యావత్తు రాజ్యంలో మారు మోగిపోసాగాయి.
స్వేచ్ఛ
యజమాని తన కుటుంబ సభ్యులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాడు. తన మరణానంతరం లుక్మాన్ (అలైహిస్సలాం)కు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని చెప్పాడు. యజమాని మరణించిన తర్వాత లుక్మాన్ (అలైహిస్సలాం)కు స్వాతంత్ర్యం లభించింది. ఆయన (అలైహిస్సలాం) అక్కడి నుంచి బయలుదేరి చాలా ప్రాంతాలు తిరిగి చివరకు బనీ ఇస్రాయీల్ వద్ద స్థిరపడ్డారు. దావూద్ (అలైహిస్సలాం) పాలనా కాలంలో ఆయన న్యాయమూర్తిగా నియమించబడ్డారు. మహావివేకంతో, విచక్షణతో, నిష్పక్షపాతంగా ఆయన ఇచ్చే తీర్పులు చాలా ప్రసిద్ధి పొందాయి. అక్కడే ఆయన పెళ్ళి చేసుకుని సంసార జీవితాన్ని గడిపారు.
లుక్మాన్ తన కుమారుడికి చేసిన బోధ దివ్యఖుర్ఆన్ ఇలా ప్రస్తావించబడింది:
మరి మేము మానవునికి అతని తల్లిదండ్రుల విషయంలో గట్టిగా తాకీదు చేశాము- అతని తల్లి అతన్ని ప్రయాసపై ప్రయాసకు ఓర్చుకుంటూ తన గర్భంలో మోసింది. మరి అతని పాలను విడిపించటానికి రెండు సంవత్సరాలు పట్టింది. (కనుక ఓ మానవుడా!) నువ్వు నాకూ, నీ తల్లిదండ్రులకూ కృతజ్ఞుడవై ఉండు. (ఎట్టకేలకు మీరంతా) మరలి రావలసింది నా వద్దకే.
ఒకవేళ నీకు తెలియని వారినెవరినైనా నాకు భాగస్వాములుగా నిలబెట్టమని వారిద్దరూ నీపై ఒత్తిడి తీసుకువస్తే మటుకు నువ్వు వారి మాట వినకు. ప్రపంచంలో మాత్రం వారి యెడల ఉత్తమరీతిలో మసలుకో. అయితే (మార్గానుసరణ విషయంలో మాత్రం) నా వైపు మరలి ఉన్న వానినే ఆదర్శంగా తీసుకో. ఆ తరువాత మీరంతా నా వైపుకే మరలి రావలసి ఉంటుంది. అప్పుడు నేను మీకు, మీరు చేస్తూ ఉండిన కర్మలన్నింటినీ తెలియపరుస్తాను.”
(లుఖ్మాన్ తన కుమారునికి ఇలా బోధపరిచాడు) “నాయనా! ఏదైనా వస్తువు ఆవగింజంత ఉన్నా, అది ఏదైనా రాతి బండలో ఉన్నా, లేక అది ఆకాశాలలో ఉన్నా లేదా భూమిలో ఉన్నా దాన్ని అల్లాహ్ తప్పకుండా తీసుకువస్తాడు. నిశ్చయంగా అల్లాహ్ సూక్ష్మ విషయాలను ఎరిగినవాడు, అన్నీ తెలిసినవాడు.
“ఓ (ప్రియమైన) కుమారా! నువ్వు నమాజును నెలకొల్పుతూ ఉండు. సత్కార్యాల గురించి ఆజ్ఞాపిస్తూ ఉండు. చెడు పనుల నుంచి వారిస్తూ ఉండు. ఏ ఆపద వచ్చిపడినా సహనం పాటించు. నిశ్చయంగా ఇవి ఎంతో గట్టిగా ఆజ్ఞాపించబడిన పనులు.
“నీ నడకలో మధ్యేమార్గం అవలంబించు. నీ కంఠ స్వరాన్ని కాస్త తగ్గించు. నిశ్చయంగా స్వరాలన్నింటిలోకీ అత్యంత కఠోరమైనది గాడిదల స్వరం.”
(దివ్యఖుర్ఆన్ 31 : 13-19)
గ్రహించవలసిన పాఠాలు
మనిషి మంచివాడు లేదా చెడ్డవాడన్నది అతని హృదయం, నాలుకల వల్ల తెలుస్తుంది. ఈ రెండు అవయవాలను ఎలా వాడాలన్నది మనిషి చేతుల్లో ఉంది.
మంచి యజమాని తన వద్ద ఉన్న వివేకవంతులైన నౌకర్లను గౌరవించాలి.
లుక్మాన్ తన కుమారునికి ఇచ్చిన సలహాను అల్లాహ్ దివ్యఖుర్ఆన్లో ప్రస్తావించి మానవాళికి ఒక ఉదాహరణగా చూపించాడు. ఈ సలహాను యావత్తు మానవాళి మార్గదర్శక సూత్రంగా అనుసరించవలసి ఉంది.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
1) లాభనష్టాల అధికారం కలవాడు ఎవరు? 2) సఫర్ మాసం వగైరా లలో దుశ్శకునం పాటించడం. 3) నక్షత్రాల ద్వారా (గ్రహాల ద్వారా) అదృష్టాన్ని తెలుసుకోవడం. 4) మాంత్రికుల వద్దకు వెళ్ళడం. 5) విచారణ లేకుండానే స్వర్గంలోకి ప్రవేశించే వారి గుణగణాలు
మొదటి ఖుత్బా
ఇస్లామీయ సోదరులారా!
లాభనష్టాల అధికారం కేవలం అల్లాహ్ కు వుందని ప్రతి ముస్లిం మనస్ఫూర్తిగా విశ్వసించాలి. అతనికి తప్ప మరెవరికీ ఈ అధికారం లేదు. ఏ ‘వలీ‘ దగ్గరా లేదు, ఏ ‘బుజుర్గ్‘ దగ్గరా లేదు. ఏ ‘పీర్‘, ‘ముర్షద్‘ దగ్గరా లేదు. ఏ ప్రవక్త దగ్గరా లేదు. చివరికి ప్రవక్తలలో శ్రేష్ఠులు, ఆదమ్ సంతతికి నాయకులు మరియు ప్రవక్తల ఇమామ్ అయిన ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు కూడా. ఇతరులకు లాభనష్టాలు చేకూర్చడం అటుంచి, స్వయానా తమకు కలిగే లాభనష్టాలపై సయితం వారు అధికారం కలిగిలేరు.
(ఓ ప్రవక్తా! వారికి) చెప్పు: “అల్లాహ్ తలచినంత మాత్రమే తప్ప నేను సయితం నా కోసం లాభంగానీ, నష్టంగానీ చేకూర్చుకునే అధికారం నాకు లేదు. నాకే గనక అగోచర విషయాలు తెలిసివుంటే నేనెన్నో ప్రయోజనాలు పొంది ఉండేవాణ్ణి. ఏ నష్టమూ నాకు వాటిల్లేది కాదు. నిజానికి నేను విశ్వసించే వారికి హెచ్చరించేవాణ్ణి, శుభవార్తలు అందజేసేవాణ్ణి మాత్రమే.” (ఆరాఫ్ 7: 188)
ఈ ఆయతుపై దృష్టి సారిస్తే తెలిసేదేమిటంటే స్వయానా ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) తనకు కలిగే లాభనష్టాలపై అధికారం కలిగి లేకపోతే మరి ఆయన కన్నా తక్కువ స్థాయి గల వలీ గానీ, బుజుర్గ్ గానీ, పీర్ గానీ- ఎవరి సమాధులనయితే ప్రజలు గట్టిగా నమ్మి సందర్శిస్తుంటారో ఈ అధికారాన్ని ఎలా కలిగి వుంటారు? తమకు ప్రయోజనం చేకూర్చే మరియు నష్టాన్ని కలిగించే వారుగా ప్రజలు తలపోసే వారి గురించి అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
ఆకాశాలను, భూమిని సృష్టించిన వాడెవడు? అని నువ్వు గనక వారిని అడిగితే, “అల్లాహ్” అని వారు తప్పకుండా చెబుతారు. వారితో చెప్పు : “సరే! చూడండి. మీరు అల్లాహ్‌ను వదలి ఎవరెవరిని పిలుస్తున్నారో వారు, అల్లాహ్ నాకేదన్నా కీడు చేయదలిస్తే, ఆ కీడును తొలగించగలరా? పోనీ, అల్లాహ్ నన్ను కటాక్షించదలిస్తే, వారు ఆయన కృపను అడ్డుకోగలరా?” ఇలా అను: “నాకు అల్లాహ్ చాలు. నమ్మేవారు ఆయన్నే నమ్ముకుంటారు.” (జుమర్ 39 : 38)
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
[క్రింది విషయం ఖురాన్ కథామాలిక అనే పుస్తకం నుండి తీసుకోబడింది]
బనీ ఇస్రాయీల్ ప్రజల్లో ఒక పుణ్యాత్ముడు నివసించేవాడు. అతను చాలా బీదవాడు. అయినప్పటికీ తన సంపాదన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండేవాడు. నీతిగా, నిజాయితీగా సంపాదించే వాడు. అతను చేసిన ప్రతి పనీ అల్లాహ్ ప్రసన్నత పొందడానికే చేశాడు. ఎన్నడూ స్వార్థంకోసం, తన అభీష్టాల ప్రకారం నడుచుకోలేదు.
ఆ వ్యక్తి చనిపోతున్నప్పుడు అతని చివరి పలుకులు, “అల్లాహ్! నా భార్యను, పసివాడైన నా కుమారుడిని, నా ఆస్తి అయిన ఆవుదూడను నీ సంరక్షణలో వదులుతున్నాను”. ఈ మాటలు పలికిన ఆ వ్యక్తి విచిత్రంగా తన భార్యతో, “ఆవుదూడను తీసుకువెళ్ళి అడవిలో వదిలేసి రమ్మన్నాడు.” అతను అలా చెప్పడానికి కారణం లేకపోలేదు. ఇస్రాయీల్ ప్రజల నడవడి గురించి తెలిసిన ఆ వ్యక్తి వారిని నమ్మదలచుకోలేదు. వారు స్వార్థం, అత్యాశ నిండిన జనం అన్న విషయం అతనికి బాగా తెలుసు.
కొన్ని సంవత్సరాలు గడచిపోయాయి. ఆ పిల్లవాడు పెరిగి పెద్దయ్యాడు. అప్పుడు అతని తల్లి కుమారుడితో, “మీ నాన్నగారు ఒక ఆవు దూడను అడవిలో వదలివేయమని చెప్పారు. అల్లాహ్ పై భారమేసి వదిలేశాను. ఈ పాటికి ఆ దూడ పుష్టిగా ఎదిగి ఉంటుంది” అని చెప్పింది. ఆ కుమారుడు కాస్త ఆశ్చర్యంగా ఆ ఆవుదూడ ఎక్కడ ఉందని తల్లిని ప్రశ్నించాడు. తల్లి అతడితో, “మీ నాన్న గారి అడుగు జాడల్లో నడవడానికి ప్రయత్నించు. అల్లాహ్ ను విశ్వసిస్తున్నానని చెప్పు. అల్లాహ్ పై భారం వేసి ఆ ఆవుదూడను వెదుకు” అని చెప్పింది. ఆ కుమారుడు ఒక తాడును తీసుకుని అడవికి బయలుదేరాడు. అడవికి చేరుకున్న తర్వాత అల్లాహ్ సన్నిధిలో సాష్టాంగపడి, “అల్లాహ్! ఇబ్రాహీమ్, యాఖుబ్ ల ప్రభువా! నా తండ్రి అప్పగించిన దానిని నాకు తిరిగి అప్పగించు” అని ప్రార్థించాడు. అతను తన చేతిని ఎత్తిన వెంటనే అతనికి ఒక ఆవు తన వైపు వస్తున్నట్లు కనబడింది. ఆ ఆవు అతని వద్దకు వచ్చి మచ్చికైన ఆవు మాదిరిగా నిలబడింది. ఆ ఆవు మెడకు ఒక తాడు కట్టి అతను తనతో ఇంటికి తీసుకువచ్చాడు. ఆ ఆవు కూడా ఆ కుర్రాడిని తప్ప మరెవ్వరినీ తన వద్దకు రానిచ్చేది కాదు.
ఆ కుర్రవాడు కూడా తన తండ్రి మాదిరి పుణ్యాత్ముడు. సన్మార్గాన్ని అవలంబించేవాడు. కట్టెలు కొట్టడం ద్వారా జీవనోపాధి పొందేవాడు. తాను సంపాదించిన దానిని మూడు సమానభాగాలు చేసేవాడు. ఒక భాగాన్ని తన తల్లికి ఇచ్చేవాడు. ఒక భాగాన్ని తన సొంతం కోసం ఉపయోగించుకునేవాడు. ఒక భాగాన్ని దానధర్మాలకు ఉపయోగించేవాడు. రాత్రి సమయాన్ని మూడు భాగాలుగా విభజించుకునేవాడు. రాత్రి ప్రథమ భాగంలో తన తల్లికి సహాయపడే వాడు. తర్వాతి భాగం ఆరాధనలో గడిపేవాడు. ఆ తర్వాతి సమయం నిద్రకు కేటాయించేవాడు.
వారసుని హత్య
ఈ కాలంలో ఒక సంపన్నుడు మరణించాడు. అతనికి ఒకే ఒక్క కుమారుడు. తండ్రి యావదాస్తి ఆ కుమారునికి లభించింది. కాని అతని బంధువులకు కొందరికి కన్నుకుట్టింది. రహస్యంగా ఆ యువకుడిని హత్య చేశారు. ఆ విధంగా ఆ యావదాస్తిని తాము కాజేయాలనుకున్నారు. మరణించిన ఆ యువకుని బంధువుల్లో ఈ హత్యతో ప్రమేయం లేనివారు ప్రవక్త మూసా (అలైహిస్సలాం) వద్దకు వచ్చారు. హంతకుణ్ణి కనుగొనడానికి సహాయపడమని కోరారు. మూసా (అలైహిస్సలాం) వారికి సలహా ఇస్తూ, ఒక ఆవును కోసి దాని నాలుకను ఆ యువకుడి శరీరంపై ఉంచాలని చెప్పారు. ఆ నాలుక హంతకుని గురించి తెలుపుతుందని అన్నారు. మూసా (అలైహిస్సలాం) పరిహాసమాడుతున్నారని వాళ్ళు ఆయన్ను నిందించారు. మూసా (అలైహిస్సలాం) వారికి జవాబిస్తూ, “అల్లాహ్ శరణు! నేను అవివేకంగా వ్యవహరించను” అన్నారు. ఎలాంటి ఆవును కోయాలని వాళ్ళు ఆయన్ను ప్రశ్నించారు. మూసా (అలైహిస్సలాం) వారికి జవాబిస్తూ, మరీ లేగదూడ కారాదు. అలా అని పూర్తిగా ఎదిగిన ఆవు కూడా కారాదు అన్నారు. మధ్యస్థంగా ఉన్న దానిని కోయాలని చెప్పారు. కాని వాళ్ళు ఆయన సలహాను పాటించే బదులు, ఆ ఆవు ఎలా ఉండాలని మరిన్ని వివరాలు అడగడం ప్రారంభించారు. “ఆ ఆవు రంగు ఎలా ఉండాలి?” అని అడిగారు. “పసుపు రంగు కలిగినదై ఉండాలి” అన్నారు మూసా (అలైహిస్సలాం). అయినా వారికి తృప్తి కలుగలేదు. మరిన్ని వివరాలు చెప్పమని అడిగారు. “ఆ ఆవు దుక్కి దున్నినది కారాదు. కాడి లాగినది కారాదు. నీళ్ళు తోడడానికి ఉపయోగించినది కారాదు. ఎలాంటి మచ్చలు ఉండరాదు” అన్నారు మూసా (అలైహిస్సలాం).
అలాంటి ఆవు కోసం వాళ్ళు వెదుకుతూ బయలుదేరారు. ఈ లక్షణాలన్నీ ఉన్న ఆవు ఒకే ఒక్కటి దొరికింది. ఆ ఆవు అనాధ యువకుడి వద్ద ఉన్న ఆవు. వాళ్ళు అతని వద్దకు వెళ్ళి ఆ ఆవును ఎంతకు అమ్ముతావని ప్రశ్నించారు. ఆ యువకుడు తన తల్లితో అడిగి చెబుతానని అన్నాడు. వారంతా కలసి అతని ఇంటికి వచ్చి అతని తల్లితో మాట్లాడారు. ఆ ఆవుకు బదులుగా మూడు బంగారు నాణేలు ఇస్తామన్నారు. కాని ఆమె ఆ ప్రతిపాదనకు తిరస్కరించింది. వాళ్ళు ఆ ఆవు ధర పెంచుతూ పోయారు. కాని ఆమె అంగీకరించలేదు. చివరకు వాళ్ళు ఆమెను ఒప్పించమని యువకుడిని కోరారు. కాని అతడు అందుకు ఒప్పుకోలేదు. “నా తల్లి ఒప్పుకోకపోతే ఆవును అమ్మేది లేదు.. మీరు ఆవు ఎత్తు బంగారం ఇచ్చినా అమ్మను” అన్నాడు. ఈ మాటలు విన్న అతడి తల్లి చిరునవ్వుతో, “అంత సొమ్ము ఇవ్వండి.. ఆవు ఎత్తు బంగారం ఇచ్చి అవును తీసుకువెళ్ళండి” అంది. చివరకు వాళ్ళు ఆ గుర్తులన్నీ ఉన్న ఆవు అదొక్కటే కాబట్టి ఆవు ఎత్తు బంగారం ఇచ్చి కొనుక్కున్నారు. (2: 67-74)
గ్రహించవలసిన పాఠాలు
అల్లాహ్, ఆ యువకుడి తండ్రి తనకు అప్పగించిన దానిని తల్లి పట్ల సేవా భావం, దానగుణం కలిగి ఉన్న ఆ యువకునికి అనుగ్రహించాడు. అల్లాహ్ ను విశ్వసించాలని కుమారుడికి బోధించిన ఆ తల్లినీ అనుగ్రహించాడు. ఈ పూర్తి వృత్తాంతం – దైవవిశ్వాసం విషయంలో ఇస్రాయీల్ ప్రజలకు, మూసా ప్రవక్తకు ఒక పాఠంగా నిలిచింది.
మరో ముఖ్యమైన పాఠం ఏమంటే, మూసా (అలైహిస్సలాం) వారికి ఒక అవును కోయాలని చెప్పారు. ప్రత్యేకమైన ఆవు అని చెప్పలేదు. కాని వాళ్ళు ఇంకా వివరాలు కావాలని ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు. అనవసరమైన ప్రశ్నలు వేశారు. వాళ్ళు ఈ రంధ్రాన్వేషణ చేయకుండా చెప్పిన విధంగా ఒక ఆవును కోసి ఉన్నట్లయితే వారికి ఎలాంటి సమస్యా ఉండేది కాదు. కాని అనవసరమైన ప్రశ్నల వర్షం వల్ల వారికి ఆ ఆవు చాలా ఖరీదైన ఆవుగా మారింది.
(నీతి: గుచ్చిగుచ్చి అడగడం అన్నది చాలా ఇబ్బందులకు గురిచేస్తుంది)
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
You must be logged in to post a comment.