వర్షం

బిస్మిల్లాహ్

రచయిత : ముహమ్మద్ నసీరుద్దీన్ ( హఫిజహుల్లాహ్)

అల్లాహ్ కారుణ్యానికి ఒక చిహ్నమైన వర్షం కురువకపోవడానికి కారణాలు?

వర్షాలు కురువక, అనావృష్టి దాపురించడానికి ముఖ్య కారణమేమిటో ఈ క్రింది హదీథ్ లో తెలుపబడింది. దీనిని శ్రద్ధగా చదివి, ఒకవేళ తనలో గనక అలాంటివి ఉంటే, వాటిని వెనువెంటనే దూరం చేసుకొనుటకు ప్రయత్నించాలి. ‘నేను ఒక్కడినే అలా చేస్తే ప్రయోజనం ఏమిటి?’ అన్న దురాలోచనను మీలో రానివ్వవద్దు. అల్లాహ్ నిన్ను – నీ గురించే ప్రశ్నిస్తాడు తప్ప, మరొకరి గురించి కాదు. ఇక అసలు విషయానికొద్దాం –

హదీథ్: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మా వైపు తిరిగి ఇలా బోధించారని హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖించారుః

“ఓ ముహాజిరులారా! ఐదు విషయాలకు మీరు గురి అయ్యారంటే మీపై (శిక్షలు, విపత్తులు) విరుచుకుపడతాయి. మీరు వాటికి గురి కాకూడదని నేను అల్లాహ్ ను శరణు వేడుకుంటున్నానుః

  1. సమాజంలో వ్యభిచారం విచ్చలవిడిగా, బహిరంగంగా ప్రబలిపోతుందో వారిలో ప్లేగు మరియు పూర్వ కాలాల్లో లేని రోగాలు అధికమవుతాయి.
  2. కొలతలు, తూనికలలో తగ్గించి ఇచ్చేవారిపై కరువుకాటకాలు వస్తాయి, వారి కష్టాలు అధికమవుతాయి, దౌర్జన్యపరులైన పరిపాలకులు వారిపై నియమించబడతారు.
  3. తమ ధన,ధాన్యాలలో నుండి ఇవ్వవలసిన జకాత్ (విధిదానం) ఇవ్వకుండా ఉంటే ఆకాశం నుండి వర్షం కురవదు. ఒకవేళ (అక్కడ) పశుపక్షాదులు గనక లేకుంటే (వారు అసలు) వర్షానికే నోచుకోరు.
  4. అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తతో చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోకుంటే అల్లాహ్ వారిపై వారి శత్రువులకు ఆధిపత్యం ఇచ్చేస్తాడు, వారు వీరి వద్ద ఉన్నదంతా దోచుకువెళతారు.
  5. పరిపాలకులు అల్లాహ్ గ్రంథం మరియు ఆయన అవతరింపజేసిన వాటి (సహీహ్ హదీథుల) ప్రకారం  తమ ప్రభుత్వాలు తీర్పు చేయకుంటే అల్లాహ్ వారి మధ్య అంతర్యుధ్ధం రగిలిస్తాడు.

పై హదీథు ద్వారా తెలిసిందేమిటి? ఎవరికైనా ఏదైనా కొలచి లేదా తూకం చేసి ఇచ్చేటప్పుడు తగ్గించి ఇచ్చే నైతిక రుగ్మత అనేది అనావృష్టి, ఆహారపదార్థాల కొరత, పరిపాలకుల దౌర్జన్యాలకు కారణమవుతుంది. ఈ కష్టాలు ఇలా ఉండగా సిరిసంపద గలవారు కూడా పిసినారితనానికి దిగజారి, విధిగా చెల్లించవలసిన దానం (జకాత్) సయితం చెల్లించనట్లయితే ఆకాశం నుండి వర్షాలు కురువడం ఆగిపోతాయి. ప్రజలు పాపాలు చేస్తున్నప్పటికీ అక్కడ వర్షాలు కురుస్తున్నాయంటే అది పశువులకై అల్లాహ్ యొక్క కారుణ్యం అని తెలుసుకోవాలి.

ఇమాం బుఖారి రహిమహుల్లాహ్ సహీ బుఖారిలోని ‘కితాబుల్ ఇస్తిస్ కా’ అనే ప్రకరణంలోని ఒక అధ్యాయములో (బాబ్) ఇలా ఖరారు చేశారుః ‘ఇంతికాముర్ రబ్బి -అజ్జవజల్ల- మిన్ ఖల్కిహీ బిల్ ఖకహ్ తి ఇజంతుహికత్ మహారిముహు’ అంటే ‘ప్రజలు అల్లాహ్ నిషేధాజ్ఞలను నిర్లక్ష్యం చేసినప్పుడు ఆయన వారిని అనావృష్టికి గురి చేసి శిక్షిస్తాడు’.

సూరె బఖర (2)లోని 159వ ఆయతు చివరి భాగం ….వారిని అల్లాహ్ శపిస్తాడు, ఇంకా వేరే శపించేవారు కూడా వారిని శపిస్తారుఅనే ఆయతు వ్యాఖ్యానంలో ప్రఖ్యాత వ్యాఖ్యానకర్త ముజాహిద్ ఇలా చెప్పారుః ‘భూమి ఎండిపోయి (పంటలు పండించలే) నప్పుడు పశువులు ఇలా అంటాయి: ఆదం సంతతిలో పాపానికి ఒడిగట్టిన వారి కారణంగా ఇలాంటి గడ్డు పరిస్థితి వచ్చింది. ఇలాంటి వారిపై అల్లాహ్ శాపం కురువుగాక’.

ప్రజలు విశ్వాస మార్గాన్ని అవలంభించి, పాపాలను విడనాడి, అల్లాహ్ ఆదేశాలు తూ.ఛ. తప్పకుండా పాటించారంటే అది శుభాలు, వరాలు పొందడానికి గొప్ప కారణమవుతుంది. చదవండి ఈ ఖుర్ఆను ఆయతులుః

ఒకవేళ నగరవాసులు విశ్వసించి, భయభక్తులతో మెలగి ఉన్నట్లయితే మేము భూమ్యాకాశాల శుభాల (ద్వారాల)ను తెరచేవాళ్ళం. కాని వారు ధిక్కారానికి పాల్పడ్డారు. అందువల్ల వారి (చెడు) సంపాదనకు కారణంగా మేము వారిని పట్టుకున్నాము. ఏమిటీ? నగరవాసులు రాత్రి వేళ నిద్రపోతున్నప్పుడు తమపై మా శిక్ష వచ్చిపడదని నిశ్చింతగా ఉన్నారా? ఏమిటీ? ప్రొద్దెక్కుతుండగా, ప్రొద్దెక్కినప్పుడు తాము ఆటపాటల్లో నిమగ్నులై ఉండగా వచ్చిపడే మా శిక్ష నుండి నిశ్చింతగా ఉన్నారా? వారు అల్లాహ్ యుక్తి వ్యూహం (శిక్ష) నుండి నిర్భయంగా ఉన్నారా? నష్టపోయేవారు తప్ప మరెవరూ అల్లాహ్ యుక్తి వ్యూహం నుండి నిర్భయంగా ఉండరు”. (ఆరాఫ్ 7:96-99).

మానవులపై ఏ ఆపద వచ్చి పడ్డా, అది వారి ఏదో ఒక తప్పిదం వల్లనే కావచ్చు. అయినా అల్లాహు తఆలా చిన్న పెద్దా తప్పులన్నిటినీ పట్టించుకోడు. తన దయ, కరుణతో ఎన్నో తప్పిదాల్ని మన్నిస్తూ ఉంటాడు. మీపై ఆపదలొచ్చిపడినా, అవి మీ చేజేతులా చేసుకున్న చేష్టల (పాపాల) ఫలమే. ఆయనైతే (వాటిలో) ఎన్నో విషయాలను మన్నిస్తూ ఉంటాడు”. (షూరా 42:30).

పై వాక్యాలలో వర్షాలు కురువకపోవడానికి కారణాలు తెలుసుకున్నాము. ఇక ఇప్పుడు మరో విషయం తెలుసుకుందాము రండిః

ఒక్కోసారి నీళ్లతో నిండి ఉన్నవి అని మనం భావించే మేఘాలే నీళ్ళు కాకుండా మరేమైన కురిపించవచ్చు. సస్యశ్యామలం, పచ్చని పైర్లు పండించ గలదు అని మనం అనుకున్న వర్షమే మనలోని కొంత మందిని తన పొట్టలో పెట్టుకుపోవచ్చు. అందుకే ఖుర్ఆన్ లో ప్రస్తావించబడిన వర్షాల చరిత్రను ఒకసారి పరిశీలిస్దాము. తద్వార గుణపాఠం నేర్చుకునే ప్రయత్నం చేస్దాము.

ప్రవక్త నూహ్ (నోవా) అలైహిస్సలాం 950 సంవత్సరాలు తమ జాతివారికి ఏకైక అల్లాహ్ ను (సృష్టకర్తను) మాత్రమే పూజించాలి, ఆయనకు ఎవరినీ భాగస్వామిగా నిలబెట్టవద్దు అని బోధించారు. (వివరాలకై ఖుర్ఆన్ గ్రంథం చదవండిః (అధ్యాయం:ఆయత్) 7:59, 10:71, 11:25, 21:76, 23:23, 26:105, 29:14, 37:75, 54:9, 71:1). ఎప్పుడైతే వారికి బోధచేసే గడువు సమాప్తమయిందో, వారే స్వయంగా అల్లాహ్ శిక్షను కోరడం మొదలుపెట్టారో, అప్పుడు వారిపై అల్లాహ్ శిక్ష విరుచుకుపడింది. ఆ శిక్ష ఏమిటీ? ఆకాశం మరియు భూమిలో ఉన్నటువంటి జలద్వారాలన్ని త్రెంచుకుపడ్డాయి. ఎడతెగకుండా పై నుండి వర్షం, క్రింది నుండి భూజలం అంతా ఒక్కటయి ఏకదైవారాధన మార్గాన్ని అవలంభించని వారందరూ మునిగిపోయారు. ఆయన ఓ గొప్ప ప్రవక్త అయినప్పటికీ విశ్వసించని తన కుమారుడిని కూడా మునగకుండా కాపాడుకోలేకపోయాడని 11:42,43లో ఉందిః

ప్రవక్త షోఐబ్ అలైహిస్సలాం తమ జాతి వారికి ఏకదైవారాధన వైపునకు పిలిచారు. కొలత మరియు తూకములలో న్యాయం పాటించమని బోధించారు. అయినా వారు ఏ మాత్రం ఆయన బోధనకు చెవి మ్రొగ్గకుండా ధిక్కారణ ధోరణి అవలంభించారు. (వారి వివరాలు చదవండిః 7:85, 11:84, 26:177, 29:36). చివరికి వారిపై వచ్చిపడిన శిక్ష ఇలా ఉండింది.  ఏడు రోజుల వరకు వారిపై తీవ్రమైన ఎండ కాచింది. ఆ తరువాత ఆకాశంలో ఒక మబ్బు తునక వచ్చింది. వారంతా ఎండవేడి నుంచి కాపాడుకోడానికి ఆ మబ్బు తునక క్రిందికి వచ్చి చేరారు. కొన్ని నిమిషాలు చల్లదనాన్ని ఆస్వాదించారు.  కాని మరికొద్ది సేపటికే ఆ మబ్బు తునక నిప్పుల వర్షం కురిపించసాగింది. మరో వైపు నుంచి భూమి ప్రకంపించింది. ఒక భయంకరమైన అరుపు వారిని శాశ్వితంగా మృత్యు ఒడిలోకి చేర్చేసింది. (ఏమిటీ? ఇందులో మనకు గుణపాఠం లేదా???).

ప్రవక్త లూత్ అలైహిస్సలాం జాతివారు మానవ చరిత్రలోనే తొలిసారిగా ఓ మహా చెడ్డ కార్యాన్ని మొదలుపెట్టారు. అల్లాహ్ వారిని దాని నుండి వారించుటకు, ఏకదైవారధన వైపునకు పిలుచుటకు ప్రవక్త లూత్ అలైహిస్సలాంను పంపాడు. ఎన్నో సంత్సరాలు ఎన్నో మంచి విధాలుగా వారికి నచ్చజెప్పినా వారు పట్టించుకోలేదు. చివరికి వారి వినాశ కాలం సమీపించింది. అల్లాహ్ వారిని ఎలా అంతమొందించాడు ఈ ఆయతులో తెలిపాడుః “మా తీర్పుసమయం రాగానే ఆ బస్తీని తల క్రిందులుగా చేసేసి, వారిపై నిరాఘాటంగా గుళకరాళ్ళను కురిపించాము. అవి నీ ప్రభువు తరఫున గుర్తు వేయబడినవి”. (11: 82,83). మరో చోట ఇలా తెలిపాడుః “మేము వారిపై ఒక ప్రత్యేకమైన (రాళ్ళ) వర్షం కురిపించాము. హెచ్చరించబడిన వారిపై కురిసిన ఆ వర్షం చాలా చెడ్డది”. (షూరా 26:173). (ఇంకా వివరాలకు చూడండిః 7:80, 11:77, 15:58, 21:74, 26:160, 27:54, 29:28, 37:133, 54:33).

అవిశ్వాసానికి, దుష్చేష్టలకు ఒడిగట్టినవారిలో కొందరికి ఇవ్వబడిన శిక్ష వర్షం రూపంలో ఉండినది అని తెలిశాక, వర్షం, దానికి ముందు, దాని మధ్యలో కనవినబడే పిడుగులు, ఉరుములు వీటి గురించి ఖుర్ఆన్, హదీసులు ఏమంటున్నాయో తెలుసుకుందాము రండిః

“ఆయన సూచనలలో ఏమిటంటే; ఆయన మిమ్మల్ని భయపెట్టటానికి, ఆశపెట్టటానికి మెరుపును చూపిస్తున్నాడు. ఆకాశం నుంచి వర్షం కురిపిస్తున్నాడు. మరి దాని ద్వారా మృతభూమికి జీవం పోస్తున్నాడు. ఇందులో బుద్ధిజీవుల కోసం ఎన్నో నిదర్శనాలున్నాయి”.  మరో చోట ఇలా తెలిపాడుః “ఆయనే మీకు మెరుపులను చూపిస్తున్నాడు. వాటివల్ల మీకు భయం కలగటంతో పాటు, మీలో ఆశలు కూడా చిగురిస్తున్నాయి. ఇంకా (ఆయనే) బరువైన మబ్బులను సృజిస్తున్నాడు. ఉరుము సయితం ఆయన పవిత్రతను కొనియాడుతోంది, ఆయననే ప్రశంసిస్తోంది. దూతలు కూడా ఆయన భీతివల్ల ఆయన్ని స్తుతిస్తున్నారు. ఆయనే పిడుగులను పంపి, తాను కోరినవారిపై పడవేస్తున్నాడు. అవిశ్వాసులు అల్లాహ్ విషయంలో పిడివాదానికి దిగుతున్నారు! ఆయన మహా శక్తిమంతుడు (యుక్తిపరుడు)”. (రఅద్ 13:12,13).

పై ఆయతులో తెలిసిందేమిటంటేః అల్లాహ్ వర్షానికి సూచనగా పంపే ఉరుములు, మెరుపుల్లో కేవలం వర్షం కురుస్తుందన్న ‘ఆశ’యే కాదు. ‘భయం’ కూడా ఉంది. ఈ క్రింది హదీథ్ సులు శ్రద్ధగా చదవండిః

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి సహచరులైన హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ జుబైర్ రదియల్లాహు అన్హు ఉరుములు విన్నప్పుడు మాట ముచ్చట వదిలేసి “ఉరుములు మరియు దైవదూతలు భీతి వల్ల ఎవని స్తోత్రములతో పాటు పవిత్రతను కొనియాడుతున్నాయో ఆ అల్లాహ్ ఎంతో పరిశుద్ధుడు” అని అనేవారు. ఇంకా ఇలా అనేవారుః “నిశ్చయంగా ఇది భూవాసులకు ఓ గట్టి హెచ్చరిక”. (అదబుల్ ముఫ్రద్ లిల్ బుఖారి 723. ఇమాం అల్బానీ సహీ అని చెప్పారు).

హజ్రత్ అబూ సఈద్ ఖుద్రీ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పారుః “ప్రళయానికి సమీపాన పిడుగులు చాలా పడుతాయి. మనిషి తన జాతివారిలోకి వచ్చి నిన్న పిడుగు పడి ఎవరు చనిపోయారు అని అడుగిడుతే, ఫలానా, ఫలానా వారు చనిపోయారు అని వారు సమాధానమిస్తారు”. (ముస్నద్ అహ్మద్ 3/64. ఇది సహీ హదీథ్).

మబ్బులు, ఉరుములు చూసినప్పుడు స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి పరిస్థితి ఏమిటనేది మనకు హజ్రత్ ఆయిషా రదియల్లాహు అన్హా విశదపరుస్తున్నారు. శ్రద్ధగా పఠించండిః

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆకాశంలో ఏదైనా అసాధారణ వస్తువు చూస్తే, ఉదాహరణకు మబ్బు లేక మెరుపు చూస్తే ఆయన ముఖ కవళికలు మారిపోతాయి, (ఎంతో ఆందోళన చెందుతూ) ఒకసారి ముందుకు, మరొకసారి వెనక్కి అడుగువేస్తారు. ఒకసారి లోపలికి, మరొకసారి బయటికి నడుస్తారు. అయితే వర్షం కురవగానే, ఆయన భయాందోళనలు దూరమయిపోతాయి. ఒకసారి హజ్రత్ ఆయిషా రదియల్లాహు అన్హా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఈ పరిస్థితి చూసి కారణం ఏమిటని అడిగితే ఆయన ఇలా సమాధానమిచ్చారుః “ఆద్ జాతి గురించి దివ్యఖుర్ఆన్ లో వచ్చినట్లు మన మీద కూడా అలాంటి విపత్తు ఏదైనా వస్తుందేమోనని నేను భయపడుతున్నాను”. (ఖుర్ఆన్ లో ఆ సంఘటన ఇలా ప్రస్తావించబడిందిః) “వారు ఆ విపత్తును కారు మేఘం రూపంలో తమ లోయల వైపునకు రావటం చూసి, ‘ఇది మాపై వర్షాన్ని కురిపించే మబ్బు తునక’ అని చెప్పుకోసాగారు. కాదు, నిజానికది మీరు తొందరపెట్టిన (విపత్కర) మేఘం. అదొక పెనుగాలి. అందులో వ్యధాభరితమైన శిక్ష ఉంది”. (అహ్ ఖాఫ్ 46:24).

సామాన్యంగా సర్వమానవులకు, ప్రత్యేకంగా విశ్వాసులకు ఆదర్శవంతమైన మహానీయ దయామయ దైవప్రవక్త విధానం కూడా మన ముందు స్పష్టమయ్యాక ఇకనైనా మనలో మార్పు తెచ్చుకుందామా? లేక మేము విద్యారంగంలో చాలా ముందుకు దూసుకుపోయిన వాళ్ళం, అన్నిట్లో పురాతణ పద్ధతులను పాటించే అవసరం లేదు, ఇది సైన్స్, టెక్నాలజీ యుగం అన్న పొకడలో పడి వినాశాన్ని మన చేతులారా కొని తెచ్చుకుందామా? అవును, నేను వెర్రిగా చెప్పడం లేదు, ప్రస్తుత ఆధునిక యుగంలో ఉండి, అల్లాహ్ తన అపార జ్ఞానంలో నుంచి మనకు ప్రసాదించిన స్వల్పజ్ఞానంతో తయారు చేసుకున్న యంత్రాల అనుభవాన్ని ఎరిగి మాట్లాడుతున్నాను. నంబర్ వన్ దేశాలు అని, వృద్ధి చెందిన దేశాలు అని పేరు గాంచిన ప్రాంతాల్లో పైన తెలుపబడిన ప్రకారం విపత్తులు కురుస్తున్నాయే, మన యంత్రాలు ఏ ప్రయోజనానికి మిగులుతున్నాయి. లక్షలు, కోట్లు ఖర్చు పెట్టి అడ్వాన్స్ గా సూచనలు అందించే యంత్రాలు తయారు చేస్తున్నాము. అయినా అవి భూకంప నష్టాల నుండి, అగ్నిపర్వతాల పేలుడు వల్ల లేచే పొగలు అందులో రాకపోకలు స్తంభించిపోవడం అందువల్ల బిలియన్ల నష్టాల నుండి ఇంకా ఇలాంటి నూతన విపత్తుల నుండి ఎందుకు మననికు మనం కాపాడుకోలేకపోతున్నాం?

వాస్తవమేమిటంటే అల్లాహ్ కు ఎదురుగా ఏ శక్తి, యుక్తి, ఉపాయం పనికి రాదు. పనికి వచ్చేటివి కేవలం ఆయనను నమ్ముకోవడం, వేడుకోవడం, మన అశక్తతను అంగీకరించి, తప్పిదాలను ఒప్పుకొని ఆయన దయ, కరుణ, క్షమాపణ, మన్నింపును కోరడం. అల్లాహ్ మనందరికి సద్భాగ్యం ప్రసాదించు గాక! ఇహపరాల నష్టాల నుండి కాపాడుగాక! ఆమీన్!!

వర్షం కొరకు అల్లాహ్ వద్ద ప్రత్యేక వేడుకోలు

అల్లాహ్ వరాల్లో ఓ గొప్ప వరం “నీరు”. అది లేనిదే ఏ జీవి యొక్క జీవితం ముందుకు సాగదు. దివ్య ఖుర్ఆనులోని ఈ ఆయతు నీటి విలువను తెలియజేస్తుందిః

మేము ప్రతి ప్రాణినీ నీటి నుండి పుట్టించాం. అయినా వారు విశ్వసించరా?(అంబియా 21:30)

మానవులు, పశుపక్షాదులు త్రాగుటకు ఉపయోగించే నీటి మూలాధారాల్లో ఒక మూలాధారం వర్షం. అది అల్లాహ్ ఆజ్ఞతో, ఆయన కోరిన చోట, ఆయన తలచిన సమయంలోనే కురుస్తుంది. ఒకసారి ఈ ఖుర్ఆన్ ఆయతులను గమనించండిః

మీరు త్రాగే మంచినీరు గురించి ఎన్నడైనా ఆలోచించారా? దానిని మేఘాల నుంచి మీరు కురిపిస్తున్నారా? లేక దానిని కురిపించేది మేమా? మేమే గనక తలచుకుంటే దానిని చేదునీరుగా మార్చేయగలం. మరలాంటప్పుడు మీరు ఎందుకు కృతజ్ఞత చూపరు?”. (వాఖియ 56:68-70)

వారిని ఇలా అడుగుః మీరు త్రాగే నీరు గనక భూమిలో ఇంకిపోతే (అడుగుభాగంలోకి దిగిపోతే) మీ కొరకు నీటి ఊటను బయటికి తెచ్చేదెవరో చెప్పండి”. (అల్ ముల్క్ 67:30)

 సోదరులారా! ఇస్లాం ధర్మంలో అల్లాహు తఆలా ప్రతి సమస్యకు పరిష్కారం చూపాడు. అజ్ఞాన కాలంలో వర్షాలు కురువకపోవటం వలన అనావృష్టి దాపురించినపుడు, ప్రజలు రకారకాల అజ్ఞాన కార్యాలకు పాల్పడేవారు, వాటిలో ఒకటిః ఎల్లప్పుడూ నిండుగా నీరు పారే నది ఒకవేళ ఎండి పోతే, దానిలో ఒక యువతిని బలి చేయటం ద్వారా అందులో మరల నీరు పొంగి పొరలుతాయని గుడ్డిగా విశ్వసించేవారు. అయితే ఆ మూఢాచారాలను రూపుమాపుతూ, ఇస్లాం దాని కొరకు సరైన పరిష్కారాన్ని బోధించినది.

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కు పూర్వం ప్రవక్త మూసా మరియు సులైమాన్ అలైహిస్సలాములు కూడా వర్షం గురించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రవక్త సులైమాన్ అలైహిస్సలాం సంఘటన ముస్నద్ అహ్మద్ అను హదీథ్ సు గ్రంథంలో ఇలా ఉందిః “హజ్రత్ సులైమాన్ అలైహిస్సలాం వర్షాన్ని అర్థించటానికి బయటికి వచ్చారు. ఆ సమయంలో ఒక చీమ తన వెనుకటి కాళ్ళను ఆకాశం వైపునకు ఎత్తి దైవాన్ని వేడుకోవటం ఆయన గమనించారు. ఆ చీమ ఇలా వేడుకోసాగిందిః ‘“దేవా! నీవు సృష్టించిన ఇతర ప్రాణుల మాదిరిగానే మేము నీ ప్రాణులం. నీ వర్షపు నీరు లేకుండా మేము కూడా మనజాలము’”. ఇది విన్నంతనే హజ్రత్ సులైమాన్ అలైహిస్సలాం “వెనుతిరిగి, ‘మరలిపోదాం పదండి, ఇతర జీవాల ప్రార్థనా ఫలంగా మీపై వర్షం కురిసినట్లే”’ అని వ్యాఖ్యానించారు.” ఆ పద్ధతి ఏమిటో క్లుప్తంగా ఇక్కడ తెలుసుకుందాము మరియు దానిని ఆచరణలోకి తీసుకొద్దాము.

శుభమైన వర్షం కురిపించమని అల్లాహ్ ను వేడుకోవాలి. సాధారణంగా చేస్తూ ఉండే నమాజులలోనూ, ప్రతి నమాజు తర్వాతనూ, జుమా ఖుత్బాలోనూ (ప్రసంగంలోనూ) దుఆ చేయవచ్చు. వీటన్నింటితో పాటు ప్రజలందరు ప్రత్యేకంగా ఊరి బయట (ఉదాః పండుగ నమాజు చేసే స్థలంలో) సామూహికంగా పండుగ నమాజు చేసినట్లు రెండు రకాతుల నమాజు చేయాలి. అది సంభవం కాకుంటే జుమా మస్జిదులోనే చేయాలి. దీనినే ‘సలాతుల్ ఇస్తిస్ కా’ అంటారు. దీని కొరకు అదాన్ మరియు ఇఖామత్ ఇవ్వబడదు.

ఆ తర్వాత ఇమాం ప్రజలనుద్దేశించి ఉపన్యాసించాలి (ఖుత్బా ఇవ్వాలి). అందులో ప్రత్యేకంగా అల్లాహ్ ఏకత్వాన్ని ప్రజలు మనసా, వాచ, కర్మ అంగీకరించి, తమ నిత్యజీవితంలో ఆచరిస్తూ, పాపాల నుండి బయటపడి, పుణ్యకార్యాలు చేయుటకు ప్రోత్సహించాలి. చిన్న పెద్ద అన్ని రకాల పాపాల నుండి తౌబా, ఇస్తిగ్ఫార్ చేయాలని,  అంటే అల్లాహ్ వైపునకు మరలి, పశ్చాత్తాపంతో క్షమాపణ కోరాలని, ‘ఓ అల్లాహ్! నీవు మన్నించు’ అని వేడుకోవాలని బోధించాలి. బంధవులతో సత్సంబంధాలు పెంచుకోమని ఆదేశించాలి. అలాగే ఎవరి మీదైనా ఇతరులది ఏదైనా హక్కు ఉంటే దానిని త్వరగా  ఇచ్చివేయాలని తెలియజేయాలి.

ఖుత్బాలో ఈ క్రింద తెలుపబడే ఖుర్ఆన్ ఆయతు ఇంకా పాపాల క్షమాభిక్ష కోరండని ప్రోత్సహించే ఇలాంటి ఆయతులను వాటి పూర్తి అర్థభావాలతో తెలుపడం మరీ మంచిదిః

క్షమాపణకై మీ ప్రభువును వేడుకోండి, నిశ్చయంగా ఆయన ఎంతో క్షమాశీలుడు. ఆయన ఆకాశం నుంచి మీపై ధారాపాతంగా వర్షం కురిపిస్తాడు, మీ సిరిసంపదల్లోనూ సంతానంలోనూ పురోభివృద్ధిని వొసగుతాడు, మీ కొరకు తోటల్ని ఉత్పత్తి చేస్తాడు, ఇంకా మీ కొరకు నదీనదాలను, కాలువలను ప్రవహింపజేస్తాడు”. (నూహ్ 71:10-12).

సలాతుల్ ఇస్తిస్ కా గురించి వెళ్ళేటప్పుడు చాలా సాధారణ (నిరాడంబరమైన) వస్త్రాలు ధరించి, ఎంతో వినయవినమ్రత, అణుకువతో వెళ్ళాలి.

రెండు చేతులు ఎత్తి దుఆ వర్షం అడుగుతూ దుఆ చేయాలి. ప్రత్యేకంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నేర్పిన దుఆ తప్పకుండా చదవాలి. (ఈ దుఆ చివరి పేజిలో చూడండి)

మీద ధరించి ఉన్న రూమాలు, టోపి, జుబ్బ లాంటి వస్త్రాలు తిరగవేసుకోవాలి.

చాలా సేపు దీధీనంగా అల్లాహ్ ను వర్షం కొరకు వేడుకొని, తిరిగి తమ ఇళ్ళలకు రావాలి. ఆ తర్వాత వర్షం కురిస్తే అల్ హందులిల్లాహ్ అని పలకాలి, వర్షం కురువకపోతే, మరోసారి అలాంటి నమాజే చేయాలి.

తొలి వర్షం నీళ్ళలో కొంత వరకు తడుడిస్తే మంచిదే, అప్పుడు ఈ దుఆ చదవాలి. అల్లాహుమ్మ సయ్యిబన్ నాఫిఅ (ఓ అల్లాహ్ ప్రయోజనకరమైన వర్షం కురిపించు). ఇంకా ఇలా అనాలిః ముతిర్నా బి ఫజ్లిల్లాహి వ రహ్మతిహీ (అల్లాహ్ దయ, కారుణ్యంతోనే మాకు వర్షం కురిసింది).

ఒక వేళ వర్షం అవసరానికి మించి, లేదా నష్టం ఏర్పడినట్లు కురిస్తే ఈ దుఆ చేచదవాలిః అల్లాహుమ్మ హవాలైనా వలా అలైనా అల్లాహుమ్మ అలజ్జరాబి వల్ ఆకామి వ బతూనిల్ ఔదియతి వ మనాబితిష్ షజర్ (ఓ అల్లాహ్ మాచుట్టుప్రక్కల్లో వర్షం కురిపించు, మాపై వద్దు, ఓ అల్లాహ్ కొండల్లో, లోయల్లో, చెట్లు చేమలు ఉన్నచోట).

వర్షం కొరకు ప్రత్యేక దుఆ

الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ الرَّحْمَنِ الرَّحِيمِ مَلِكِ يَوْمِ الدِّينِ لَا إِلَهَ إِلَّا اللَّهُ يَفْعَلُ مَا يُرِيدُ

اللَّهُمَّ أَنْتَ اللَّهُ لَا إِلَهَ إِلَّا أَنْتَ أنتَ الْغَنِيُّ وَنَحْنُ الْفُقَرَاءُ

أَنْزِلْ عَلَيْنَا الْغَيْثَ وَاجْعَلْ مَا أَنْزَلْتَ لَنَا قُوَّةً وَبَلَاغًا إِلَى حِينٍ

అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, అర్రహ్మానిర్రహీం, మాలికి యౌమిద్దీన్, లాఇలాహ ఇల్లల్లాహు యఫ్అలు మా యురీద్, అల్లాహుమ్మ అంతల్లాహు లా ఇలాహ ఇల్లా అంత, అంతల్ ఘనియ్యు నహ్ నుల్ ఫుఖరా, అంజిల్ అలైనల్ ఘైసథ వజ్అల్ మా అంజల్ లనా ఖువ్వతన్ బలాగన్ ఇలా హీన్

اللَّهُمَّ اسْقِ عِبَادَكَ وَبَهَائِمَكَ وَانْشُرْ رَحْمَتَكَ وَأَحْيِ بَلَدَكَ الْمَيِّتَ

అల్లాహుమ్మస్ కి ఇబాదక బహాఇమక వన్షుర్ రహ్మతక వఅహ్ యి బలదకల్ మయ్యిత్

اللَّهُمَّ اسْقِنَا غَيْثًا مُغِيثًا مَرِيعًا مَرِيئًا طَبَقًا غَدَقًا عَاجِلًا غَيْرَ آجِلا نَافِعًا غَيْرَ ضَارٍّ

అల్లాహుమ్మస్ కినా ఘైసథమ్ ముగీసథ, మరీఅమ్ మరీఆ తబకన్ గదకన్ఆజిలన్ ఘైర ఆజిలిన్ నాఫిఅన్ ఘైర జార్ర్

జుమా ఖుత్బా సందర్భంలో దుఆ చేస్తున్నప్పుడు కూడా పై దుఆలు చదవవచ్చును. ఏదైన సందర్భంలో సంక్షిప్తంగా దుఆ చేయదలుచుకనే వారు కేవలం అల్లాహుమ్మస్ కినా అల్లాహుమ్మస్ కినా అల్లాహుమ్మస్ కినా అని కూడా అనవచ్చును.

సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు జీవిత చరిత్ర – సలీం జామిఈ [ఆడియో, టెక్స్ట్]

సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు జీవిత చరిత్ర
https://youtu.be/6wNGPCoz60I [30 నిముషాలు]
సలీం జామిఈ హఫిజహుల్లాహ్

ఈ జుమా ప్రసంగంలో వక్త, ప్రముఖ సహచరుడు హజ్రత్ సల్మాన్ ఫార్సీ (రజియల్లాహు అన్హు) గారి జీవిత చరిత్ర మరియు సత్యం కోసం వారు చేసిన సుదీర్ఘ ప్రయాణాన్ని వివరించారు. అల్లాహ్ మానవులకు ప్రసాదించిన అత్యున్నత వరమైన ‘ఇస్లాం’ విలువను వివరిస్తూ, సల్మాన్ ఫార్సీ (రజియల్లాహు అన్హు) పర్షియాలో అగ్ని ఆరాధకుడిగా ఉండి, సత్యధర్మాన్ని అన్వేషిస్తూ క్రైస్తవ మత గురువుల వద్దకు చేరి, చివరికి ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి రాక గురించి తెలుసుకున్న తీరును కళ్లకు కట్టినట్లు చెప్పారు. బానిసత్వాన్ని అనుభవించి, మదీనాలో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారిని కలుసుకొని, ప్రవక్తత సూచనలను (సదఖాను తినకపోవడం, బహుమానాన్ని స్వీకరించడం, ప్రవక్తతా ముద్ర) స్వయంగా పరీక్షించి ఇస్లాంను స్వీకరించిన వైనాన్ని, ఆ తర్వాత తన స్వేచ్ఛ కోసం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చేసిన అద్భుత సహకారాన్ని ఈ ప్రసంగం వివరిస్తుంది.

ప్రశంసలన్నీ, పొగడ్తలన్నీ సర్వ లోకాల సృష్టికర్త పాలకుడు, పోషకుడు, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పరలోక దినానికి యజమాని, మహోన్నత పీఠానికి అధిపతి, అన్ని రకాల పూజలకు ఏకైక అర్హుడైన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా కు మాత్రమే శోభిస్తాయి.

ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించుగాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించుగాక, ఆమీన్.

గౌరవనీయులైన పెద్దలు మరియు ఇస్లామీయ సహోదరులారా! ఈనాటి జుమా ప్రసంగంలో సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు గారి జీవిత చరిత్రను మనం తెలుసుకుందాం.

అభిమాన సోదరులారా! మానవునికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ ప్రపంచంలో ఎన్నో అనుగ్రహాలను ప్రసాదించాడు. అల్లాహ్ మానవులకిచ్చిన అనుగ్రహాలను లెక్కచేయలేనన్నివి ఉన్నాయి అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు. నిజమే, అయితే అల్లాహ్ మానవులకు ప్రసాదించిన అనుగ్రహాలలో గొప్ప అనుగ్రహం ఏది అంటే, అది దైవ ధర్మ ఆచరణ.

అభిమాన సోదరులారా! ఒక్కసారి ఆలోచించి చూడండి, మనకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ముస్లింలుగా, ఇస్లాం ధర్మాన్ని ఆచరించే వారిగా పుట్టించాడు, ఇస్లాం ధర్మాన్ని ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించాడు. ఇది ఎంత గొప్ప వరమో ఒక్కసారి ఆలోచించండి. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్ లో తెలియజేశాడు:

إِنَّ الدِّينَ عِندَ اللَّهِ الْإِسْلَامُ
[ఇన్నద్దీన ఇందల్లాహిల్ ఇస్లాం]
నిశ్చయంగా అల్లాహ్ వద్ద ధర్మం (ఒక్క) ఇస్లాం మాత్రమే. (3:19)

మరోచోట అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా స్పష్టంగా తెలియజేశాడు:

وَمَن يَبْتَغِ غَيْرَ الْإِسْلَامِ دِينًا فَلَن يُقْبَلَ مِنْهُ وَهُوَ فِي الْآخِرَةِ مِنَ الْخَاسِرِينَ
[వమన్ యబ్ తగి గైరల్ ఇస్లామి దీనన్ ఫలన్ యుక్ బల మిన్హు వహువ ఫిల్ ఆఖిరతి మినల్ ఖాసిరీన్]
ఎవరయినా ఇస్లాంను కాకుండా మరో ధర్మాన్ని అన్వేషిస్తే అతని ధర్మం స్వీకరించబడదు. అలాంటి వ్యక్తి పరలోకంలో నష్టపోయినవారిలో చేరిపోతాడు. (3:85)

కావున అభిమాన సోదరులారా! మనం ముస్లింలుగా, ఇస్లాం ధర్మాన్ని ఆచరిస్తూ ఏ చిన్న కార్యము చేస్తున్నా, ఏ పెద్ద కార్యము చేస్తున్నా దానికి రేపు ఇన్షా అల్లాహ్ విలువ ఉంటుంది. అయితే ఈ ఇస్లాం ధర్మాన్ని మనం ఎలా పొందాము? అల్లాహ్ దయవల్ల ఎలాంటి శ్రమ లేకుండా, ఎలాంటి కృషి లేకుండా, ఎలాంటి కష్టము లేకుండా, ఎలాంటి బాధ లేకుండా, ఎలాంటి పరీక్ష లేకుండా మనకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ అనుగ్రహాన్ని అలాగే బహుమానంగా ఉచితంగా ఇచ్చేశాడు.

అయితే అప్పటి నుండి ఇప్పటి వరకు చాలా మందికి ఈ ఇస్లాం ధర్మ స్వీకరణ భాగ్యం ఉచితంగా దొరకలేదు. వారు ఈ ఇస్లాం ధర్మాన్ని స్వీకరించడానికి, ఈ ఇస్లాం ధర్మాన్ని ఆచరించడానికి ఎన్నో బాధలు పడ్డారు, ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు, ఎన్నో పరీక్షల్నీ ఎదుర్కొన్నారు అభిమాన సోదరులారా. అలా అల్లాహ్ ను అర్థం చేసుకోవడానికి, ఇస్లాం ధర్మాన్ని స్వీకరించడానికి కష్టపడిన, పరీక్షలు ఎదుర్కొన్న ఒక వ్యక్తి సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు. రండి, ఈనాడు ఆ సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు గారి యొక్క జీవిత చరిత్రను ఇన్షా అల్లాహ్ క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

అభిమాన సోదరులారా! సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు ఇరాన్ దేశానికి చెందిన అస్బహాన్ నగరంలో పుట్టారు. వారి తండ్రి ఆ నగరానికి ఒక గురువు, మత గురువు, పెద్ద. సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు పుట్టినప్పటి నుండి తండ్రి వద్దనే మత విషయాలు నేర్చుకున్నారు. ఆ రోజుల్లో ‘మజూసీ’ ధర్మాన్ని అక్కడ సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు ఆచరించారు. మజూసీ ధర్మంలో ప్రజలు అగ్నిని పూజించేవారు. సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారి తండ్రి కూడా అగ్నిని పూజించేవాడు, తన కుమారుణ్ణి కూడా అగ్నిని పూజించేటట్టుగా నేర్పించాడు.

చివరికి సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారికి తండ్రి అగ్ని పూజ కొరకు ఎంతగా పరిమితం చేసేసాడంటే, ఎలాగైతే ఒక మహిళను ఇంట్లోనే ఉంచేస్తారో ఆ విధంగా సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారిని కూడా వారి తండ్రి అగ్ని వద్దనే ఒక కుటుంబ.. ఒక ఇంటిలోనే ఉంచేశాడు. బయటి ప్రపంచం గురించి ఆయనకు ఎక్కువగా తెలియదు.

అయితే అభిమాన సోదరులారా, ఒకరోజు ఏదో ఒక ముఖ్య.. ఒక ముఖ్యమైన పని మీద తండ్రి సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారిని బయటకు పంపించారు. సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు బయట ప్రపంచం గురించి ఎక్కువగా తెలియని వారు, ఆ పని మీద బయటకు వెళ్ళారు. వీధుల్లో నుంచి వెళుతూ ఉంటే ఒకచోట చర్చి ఉండింది, ఆ చర్చి లోపల నుంచి శబ్దాలు వస్తుండటాన్ని ఆయన గమనించారు. ఆ శబ్దాన్ని గమనించిన సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు ఏముందో చూద్దామని లోపలికి ప్రవేశించారు. వెళ్లి చూస్తే అక్కడ ప్రజలందరూ కలిసి పూజ చేస్తున్నారు. ఆయనకు చాలా నచ్చింది. నచ్చిన కారణంగా ఆయన అక్కడే చూస్తూ కూర్చుండిపోయాడు. సమయం గడిచిపోయింది. చీకటి అయిపోయింది కానీ ఆయన వచ్చిన పనిని మర్చిపోయాడు.

తర్వాత తండ్రి, సల్మాన్ ఫార్సీ వెళ్లి ఇంతవరకు రాలేదే అని వెతకటానికి వేరే మనుషుల్ని పంపించాడు. రాత్రి అయిన తర్వాత, చీకటి పడిన తర్వాత సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు తిరిగి నాన్న దగ్గరికి వెళ్ళారు. అప్పుడు నాన్నగారు సల్మాన్.. సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారి మీద కోపగించుకున్నారు. “నేను నీకు పంపించిన పని ఏమిటి? నువ్వు ఇంతవరకు ఎక్కడున్నావు? త్వరగా ఎందుకు రాలేదు? నువ్వు రాని కారణంగా ఇక్కడ అగ్ని ఆరిపోయింది. ఇక్కడ అగ్ని ఆరిపోకూడదు, ఆరిపోకుండా చూసుకోవలసిన బాధ్యత నీది” అని కోపగించుకున్నప్పుడు, సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు నాన్నగారితో అన్నారు: “నాన్నగారు, ఈరోజు నేను ఒక వింత విషయాన్ని చూశాను, అది నాకు చాలా నచ్చింది. ఒకచోట నేను కొంతమందిని చూశాను, వారు దేవుణ్ణి మరో రకంగా పూజిస్తున్నారు, వారి పూజా పద్ధతి నాకు చాలా నచ్చిందండి” అన్నారు.

అప్పుడు నాన్నగారికి చాలా కోపం వచ్చింది. “అరే! నీవు, నీ తండ్రులు, నీ తాతలు ఏ ధర్మాన్ని అయితే ఆచరిస్తున్నారో ఆ ధర్మము నువ్వు చూసిన వారి ధర్మము కంటే గొప్పది రా, దీన్నే నువ్వు ఆచరించాలి” అన్నారు.

సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు అన్నారు: “లేదండి నాన్నగారు, మనం చేసేది నాకు నచ్చట్లేదు. మన చేతులతో మనము కాల్చిన అగ్నిని మళ్ళీ మనం పూజించడం ఏందండి? కొద్దిసేపు మనము అక్కడ కట్టెలు వేయకపోతే ఆ అగ్ని చల్లారిపోతుంది. దాన్ని మనము దేవుడని పూజించడం ఇది నాకు నచ్చలేదండి. చర్చిలో వాళ్ళు చేస్తున్న విషయం నాకు చాలా నచ్చిందండి, అదే నాకు మంచిదనిపిస్తోందండి” అన్నారు.

నాన్నగారికి విషయం అర్థమైపోయింది. బిడ్డ చేయి జారిపోతున్నాడని గమనించిన నాన్నగారు వెంటనే సంకెళ్లు వేసేసి ఆయనకు ఇంటిలోనే బంధించేశారు. బంధించేసిన తర్వాత సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు ఒక వ్యక్తి ద్వారా ఆ క్రైస్తవుల వద్దకు సందేశాన్ని పంపించారు. “ఏమండీ! మీరు ఏ ధర్మాన్ని అయితే ఆచరిస్తున్నారో, ఈ ధర్మం ఎక్కడ పుట్టింది? ఈ ధర్మం యొక్క పునాదులు ఎక్కడున్నాయి? ఆ ప్రదేశం గురించి నాకు తెలియజేయండి” అన్నారు. ఆ వ్యక్తి అక్కడినుండి సమాధానం తీసుకొచ్చాడు, “ఈ ధర్మము ‘షామ’లో (అంటే షామ్ అంటే: ఫలస్తీన్, లబ్నాన్, జోర్డాన్ [ఉర్దున్] మరియు సిరియా.. ఈ పూర్తి భాగాన్ని ఆ రోజుల్లో ‘షామ్’ అనేవారు, తర్వాత దాన్ని నాలుగు ముక్కలుగా విభజించేశారు), ఆ షామ్.. ఆ షామ్ దేశంలో ఆ ధర్మం పుట్టింది, దాని యొక్క పునాదులు అక్కడే ఉన్నాయి” అని సమాధానం వచ్చింది. అప్పుడు సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారన్నారు: “ఎవరైనా ఆ దేశస్తులు మన దేశానికి వస్తే నాకు కబురు పంపించండి” అన్నారు.

అలాగే కొద్ది రోజుల తర్వాత కొంతమంది ఈ షామ్ దేశము నుండి ఈ ఇరాన్ దేశానికి వ్యాపారం నిమిత్తం వచ్చారు. అప్పుడు కొంతమంది వెళ్లి సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారికి, “మీరు కోరుకున్నట్లుగానే షామ్ దేశస్తులు కొంతమంది వ్యాపారం నిమిత్తం ఇక్కడికి వచ్చి ఉన్నారు, మీరు వారితో కలవాలంటే కలవచ్చు” అన్నారు. అప్పుడు సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారు ఏమన్నారంటే: “నేను ఇప్పుడు రాలేను, కలవలేను. వాళ్ళు మళ్లీ తిరిగి ప్రయాణం చేసేటప్పుడు నాకు కబురు పంపించండి” అన్నారు.

అలాగే వాళ్ళు తిరిగి మళ్ళీ వారి దేశానికి వెళుతున్నప్పుడు సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారికి కబురు పంపించగా, ఆయన ఏదో ఒకలాగా సంకెళ్లను తుంచుకుని వారితో పాటు కలిసి ఆ ఇరాన్ దేశము నుండి షామ్ దేశానికి ఆ వ్యాపారానికి వచ్చిన వ్యక్తులతో పాటు కలిసి వెళ్లిపోయారు. షామ్ వెళ్లిన తర్వాత అక్కడ ప్రజలతో చర్చించారు, “ఇక్కడ గొప్ప భక్తుడు అంటే ఎవరు? ఉత్తమమైన వ్యక్తి అంటే ఎవరు? వాని గురించి నాకు చెప్పండి, నేను ఆయన దగ్గరికి వెళ్లి శిష్యరికం చేరుకోవాలనుకుంటున్నాను” అన్నారు. అక్కడ ఒక పెద్ద చర్చి ఉంటే, ఆ చర్చిలో ఉన్న ఒక ఫాదర్ గురించి ఆయనకు తెలియజేయగా, ఆయన వెంటనే ఆ ఫాదర్ దగ్గరికి వెళ్లి: “అయ్యా, నేను ఫలానా దేశస్తుణ్ణి, నాకు అక్కడ ఉన్న విషయాలు నచ్చక మీ ధర్మాన్ని నేను ఇష్టపడి వచ్చాను కాబట్టి, నేను మీ దగ్గర శిష్యునిగా చేరాలనుకుంటున్నాను, అనుమతి ఉందా?” అని అడగ్గా, అతను “సరే బాబు నా దగ్గర నీవు శిష్యునిగా ఉండు” అని ఉంచుకున్నాడు.

ఆయన దగ్గర ఉండి సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు ఆయన నేర్పిన విధంగానే ధార్మిక విషయాలు నేర్చుకుని ఆచరిస్తూ ఉన్నారు. అయితే ఆ పాదరి.. ఆ ఫాదర్ వద్ద ఒక చెడు అలవాటు ఉండేది, అది ఆయనకు నచ్చలేదు. ఆ అలవాటు ఏంటంటే, ఆయన ప్రజలకు దానధర్మాలు చేయండి అని చెప్పి బోధించేవాడు. ఆయన మాటలు విని ప్రజలు దానధర్మాలు తీసుకొని వచ్చి ఆయన చేతికి ఇస్తే, ఆ దానధర్మాల సొమ్ముని తీసుకొని వెళ్లి పేదలకు పంచకుండా అతను ప్రోగు చేసుకుని దాచుకునేవాడు. అది సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారికి నచ్చలేదు.

కొద్ది రోజుల తర్వాత అతని మరణం సంభవించింది. మరణం సంభవించక ముందు అతను దాచుకున్న సొమ్ము గురించి ఎవ్వరికీ చెప్పలేదు. ఒక్క సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారికి మాత్రమే తెలుసు. అతను మరణించిన తర్వాత ప్రజలందరూ ప్రోగయితే, అప్పుడు సల్మాన్ రజియల్లాహు అన్హు వారందరి ముందర కుండబద్దలు కొట్టేశారు. అదేమన్నారంటే: “అయ్యా, ఎవరినైతే మీరు గొప్ప వ్యక్తి అనుకుంటున్నారో, అతని యొక్క లక్షణం ఏమిటంటే మీరు ఇచ్చే సొమ్ముని ఆయన దాచుకున్నాడు. రండి చూపిస్తాను” అని చెప్పేసి ఆయన దాచుకున్న సొమ్ము మొత్తాన్ని చూపించేశారు. అప్పుడు ప్రజలకు పట్టరాని కోపం వచ్చింది. “ఎవరినైతే మేము గొప్ప వ్యక్తి అనుకున్నామో అతను ఇలాంటి మూర్ఖుడా” అని చెప్పి చాలా కోపగించుకున్నారు.

సరే, ఆ తర్వాత అతని స్థానంలో మరొక ఫాదర్ ని తీసుకొని వచ్చి అక్కడ ఉంచారు. ఆ ఫాదర్ చాలా గొప్ప వ్యక్తి, చాలా భక్తుడు. సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు అతని వద్ద శిష్యునిగా ఉండి దైవభక్తి, అలాగే దైవ ఆరాధనలో నిమగ్నమైపోయారు. రోజులు గడిచాయి. సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు ఆ ఫాదర్ వద్ద చాలా విషయాలు నేర్చుకున్నారు, ఆ ఫాదర్ ని చాలా ఇష్టపడ్డారు. అతనిలో ఎలాంటి తప్పులు ఆయన గమనించలేదు.

చివరికి కొద్ది రోజుల తర్వాత ఆయన మరణం సంభవించినప్పుడు, మరణానికి ముందు సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు అతని వద్ద వెళ్లి: “ఏమండీ, నేను ఫలానా దేశస్తుడిని, అక్కడి నుండి ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు మీరు మరణిస్తున్నారు, మీ తర్వాత నేను ఎవరి దగ్గర వెళ్లి ఈ విషయాలు నేర్చుకోవాలి? దైవ ధర్మ ఆచరణ చేయాలి? మీరు చెప్పిన వ్యక్తి వద్ద నేను వెళతాను, ఎవరి దగ్గర వెళ్లాలో చెప్పండి” అన్నారు. అప్పుడు ఆయన ఏమన్నారంటే: “చూడు నాయనా! నీవు ఒక మంచి వ్యక్తివి అనిపిస్తున్నావు కాబట్టి, నాలాంటి వ్యక్తి నీకు ఈ నగరంలో దొరకడు. నీవు ‘మోసుల్’ అనే నగరానికి వెళ్ళిపో, అక్కడ ఫలానా పేరు చెప్పు, ఆ వ్యక్తి వద్ద వెళ్లి నీవు శిష్యరికం చేయి, అతను కూడా మంచి వ్యక్తి” అన్నారు.

చూడండి, సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు మళ్లీ అక్కడి నుండి మోసుల్ నగరానికి వెళ్ళారు. ఆ వ్యక్తి గురించి తెలుసుకున్నారు, ఆయన దగ్గర వెళ్లి జరిగిన విషయాలన్నీ చెప్పి: “అయ్యా, నాకు ఫలానా వ్యక్తి మీ వద్దకు పంపించాడు. నేను మీ వద్ద వచ్చి దైవ విషయాలు, దైవ భక్తి విషయాలు నేర్చుకోవాలనుకుంటున్నాను, అనుమతి ఉందా?” అంటే ఆయన సంతోషంగా పిలుచుకున్నాడు. అతని వద్ద శిష్యరికం చేశారు. అతను కూడా చాలా గొప్ప భక్తుడు. అతని వద్ద కూడా సల్మాన్ రజియల్లాహు అన్హు కొద్ది రోజులు శిష్యరికం చేసిన తర్వాత, చూడండి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఎలాంటి పరీక్షలకు గురి చేస్తున్నాడో సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారికి, కొద్ది రోజుల తర్వాత ఆ వ్యక్తికి కూడా మరణం సంభవించింది. మరణానికి ముందు ఆ వ్యక్తితో సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు జరిగిన విషయం అంతా చెప్పారు. “అయ్యా నేను ఇరాన్ దేశస్తుడిని, అక్కడి నుంచి మళ్ళీ షామ్ వచ్చాను, షామ్ నుంచి ఫలానా వ్యక్తి నాకు మీ దగ్గరికి పంపించాడు. ఇప్పుడు మీరు కూడా మరణిస్తున్నారు, నేను దైవ విషయాలు భక్తి విషయాలు నేర్చుకోవాలనుకుంటున్నాను కాబట్టి మీ తర్వాత నేను ఎవరి దగ్గర వెళ్లి ఈ విషయాలు నేర్చుకోవాలి?” అని అడగ్గా, ఆయన ఏం చెప్పారంటే: “‘నసీబైన్’ అనే ఒక నగరం ఉంది, ఆ నగరంలో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్లండి, అతనికంటే గొప్ప వ్యక్తి నా దృష్టిలో ఎవడూ లేడు” అన్నారు.

మళ్ళీ నసీబైన్ లో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళారు, ఆయన దగ్గర శిష్యరికం చేశారు. ఆయన కూడా చనిపోతూ ఉంటే ఆయన దగ్గర కూడా: “అయ్యా, మీ తర్వాత నేను ఎవరి దగ్గర వెళ్ళాలి?” అంటే, అప్పుడు ఆయన చెప్పాడు: “‘అమ్మూరియా’ అనే ఒక ప్రదేశం ఉంది అక్కడికి వెళ్లండి” అన్నారు. సరే అమ్మూరియా ప్రదేశానికి వెళ్ళారు, అక్కడ శిష్యరికం చేశారు. ఆయన కూడా చనిపోయే సమయం వచ్చింది. అల్లాహు అక్బర్! ఎన్ని చోట్ల చూడండి.. ఇరాన్ నుండి సిరియాకు, సిరియా నుండి మళ్ళీ మోసుల్ కు, మోసుల్ నుండి నసీబైన్ కు, నసీబైన్ నుండి మళ్ళీ అమ్మూరియాకు. ఇన్ని చోట్ల తిరుగుతున్నారు ఎవరి కోసమండి? డబ్బు కోసమా? ధనం కోసమా? ఆస్తి కోసమా? కేవలం భక్తి కోసం ఇన్ని చోట్ల తిరుగుతున్నారు అభిమాన సోదరులారా.

అమ్మూరియాలో వెళ్ళిన తర్వాత, అప్పుడు అక్కడున్న ఫాదర్ మరణించేటప్పుడు: “అయ్యా, నేను తిరుగుతూనే ఉన్నాను, మీ తర్వాత ఇక నేను ఎక్కడికి వెళ్లాలో చెప్పండి” అని చెప్పగా, అప్పుడు ఆయన ఒక్క మాట చెప్పాడు. గమనించండి అభిమాన సోదరులారా, ఇక్కడి నుంచి టర్నింగ్ పాయింట్ తీసుకుంటుంది విషయం. ఆయన ఏం చెప్పాడంటే: “నాయనా, నేడు ప్రపంచంలో పరిస్థితుల్ని చూస్తూ ఉంటే చివరి ప్రవక్త వచ్చే సమయం వచ్చేసింది అనిపిస్తుంది. చివరి ప్రవక్త గురించి నాకు తెలిసిన జ్ఞానం ఏమిటంటే, అతను అరబ్బు దేశస్తుడై ఉంటాడు.” ఎవరు చెప్తున్నారండి? ఒక చర్చికి గురువైన ఫాదర్ గారు చెప్తున్నారు. ఎవరికి చెప్తున్నారు? వారి శిష్యునికే చెప్తున్నారు. ఏమంటున్నారంటే: “చివరి ప్రవక్త వచ్చే సమయం వచ్చేసింది అని నాకు అనిపిస్తుంది, అతను అరబ్బు దేశస్తుడై ఉంటాడు” – మొదటి విషయం.

రెండవ విషయం ఏమిటంటే: “అతను పుట్టిన నగరము నుండి ప్రయాణము చేసి, రెండు పర్వతాల మధ్య ఒక నగరం ఉంటుంది, ఆ నగరంలో ఖర్జూర చెట్లు ఉంటాయి, ఆ నగరానికి వలస ప్రయాణం చేస్తాడు.” రెండు విషయాలు. మూడో విషయం ఏమిటంటే: “అతను ‘సదఖ’ (దానధర్మాలు) తినడు.” నాలుగో విషయం ఏమిటంటే: “‘హదియా’ – బహుమానంగా ఇచ్చిన విషయాలను తీసుకుంటాడు, తింటాడు.” ఐదవ విషయం ఏమిటంటే: “అతని రెండు భుజాల మధ్య అల్లాహ్ తరపు నుంచి ఒక స్టాంప్ ఉంటుంది, దాన్నే ‘మొహ్రె నబువత్’ (ప్రవక్త పదవికి సూచనగా) ఒక స్టాంప్ లాంటిది ఉంటుంది” అన్నారు. ఈ ఐదు సూచనలు చెప్పాడు ఆయన.

అయితే అభిమాన సోదరులారా! సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు అమ్మూరియాలో ఉన్నప్పుడు కొంచెం కష్టపడి కొన్ని ఆవులను కూడా సంపాదించుకొని పెంచుకున్నారు. ఇక వెయిట్ చేస్తున్నారు. అరబ్బు దేశం నుంచి ఎవరైనా వ్యాపారం కోసం ఇక్కడికి వస్తారేమో అని వెయిట్ చేస్తున్నారు, ఎదురుచూస్తున్నారు. కొద్ది రోజుల తర్వాత కొంతమంది అరబ్బు దేశస్తులు ఆ ప్రదేశానికి వ్యాపారానికి వెళ్లారు. అప్పుడు ఆయన వెంటనే వారి దగ్గరికి వెళ్లి: “ఏమండీ నేను కూడా మీతో పాటు అరబ్బు దేశానికి వచ్చేస్తాను. కావాలంటే నా దగ్గర ఉన్న ఈ ఆవులన్నీ మీకు ఇచ్చేస్తాను. దయచేసి నన్ను మీరు మీతో పాటు అరబ్బు దేశానికి తీసుకెళ్లండి” అని విన్నవించుకున్నారు.

అప్పుడు సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారి విన్నపాన్ని తీసుకున్న వాళ్ళు, ఆవులని తీసుకొని, సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారిని కూడా తీసుకొని అక్కడి నుంచి తిరిగి ప్రయాణం చేసుకుంటూ వచ్చారు. వచ్చిన వాళ్ళు మోసం చేశారు. ఆవులని లాక్కున్నారు, సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారిని మదీనాకి సమీపంలో ‘వాది అల్ ఖురా’ (ఇప్పుడు అది మదీనాలో కలిసిపోయింది, ఆ రోజుల్లో వాది అల్ ఖురా) అనే చోట తీసుకొని వచ్చి ఒక యూదుని చేతికి బానిసగా అమ్మేశారు. “అయ్యో నేను బానిసను కాదు” అని ఆయన మొత్తుకున్నా బలవంతంగా ఆయనను అమ్మేశారు.

అయితే ఆ యూదుడు సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారిని తన వద్ద బానిసగా, ఖర్జూరపు తోటకు కాపలాదారిగా ఉంచుకున్నాడు. ఆయన అక్కడ ఉంటూనే రెండు పర్వతాల మధ్య కనిపిస్తున్న ఖర్జూర చెట్ల మధ్య కనిపిస్తున్న నగరాన్ని చూసుకున్నాడు. “అరే! నా గురువుగారు చెప్పిన నగరం లాగే ఈ నగరం కనిపిస్తా ఉంది” అని ఆయన మనసులో ఒక తపన, కోరిక కలిగింది. ఇక ప్రవక్త కోసం ఆయన తపిస్తున్నారు. ఆయన చెప్పినట్టుగా ప్రవక్త ఈ ప్రదేశానికే వస్తాడు అనే ఆలోచనలో ఆయన తపిస్తూ ఉన్నాడు.

మరి కొద్ది రోజులు గడిచిన తర్వాత ఆ యూదుడు ఏం చేశాడంటే, మదీనా నగరంలో ఉండే ఒక బంధువుకి అతనిని అమ్మేశాడు. సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు ఇక మదీనా నగరంలోనే ‘బనూ ఖురైజా’ అనే చోటికి వచ్చేశారు. అక్కడికి వచ్చేసిన తర్వాత ఆయనకు నమ్మకం కుదిరింది, ఆయన చెప్పినట్లుగానే ఇక్కడ ఖర్జూర చెట్లు ఉన్నాయి, రెండు పర్వతాల మధ్య ఈ నగరం ఉంది. ఇక ప్రవక్త రావడమే తరువాయి. “ప్రవక్త గారు ఎప్పుడు వస్తారు? ప్రవక్త గారు ఎప్పుడు వస్తారు? నా కోరిక ఎప్పుడు తీరుతుంది?” అని చెప్పి ఆయన ఎదురుచూస్తున్నారు, తపిస్తూ ఉన్నారు అభిమాన సోదరులారా.

రోజులు గడిచాయి. అక్కడ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మక్కాలో ప్రవక్త పదవి ఇచ్చిన తర్వాత, 13 సంవత్సరాల తర్వాత ఎప్పుడైతే ఆయనను చంపాలని ప్రయత్నం చేశారో, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రవక్త వారికి మక్కా నుండి మదీనాకు వెళ్లిపోమని ఆదేశించినప్పుడు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా నుండి మదీనాకు వెళుతూ వెళుతూ ముందు ఎక్కడ దిగారండి? ‘ఖుబా’లో దిగారు.

ఖుబాలో దిగినప్పుడు సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు ఖర్జూరపు చెట్టు మీద నిలబడి ఉంటే, ఆయన యజమాని వద్ద ఒక బంధువు వచ్చి: “ఏమండీ! మీకు తెలుసా? కొంతమంది ఖుబాకు వెళుతున్నారు. అక్కడ ఎవడో మక్కా నుంచి ఒకడు వచ్చాడంట. ఆయన గురించి అందరూ ‘ప్రవక్త ప్రవక్త’ అని చెప్పుకుంటున్నారు” అని చెప్పేశాడు. సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారి చెవులు ఆ మాట పడగానే కాళ్ళు చేతులు వణకడం ప్రారంభించాయి. ఎంతగా ఆయన సంతోషించాడంటే, ఇక కళ్ళు తిరిగి పడిపోతారేమో అని అనిపించింది. ఆ తర్వాత “ఏమైంది? ఎవరు? ఎవరు?” అని చెప్పేసి దగ్గరికి వచ్చి అడగ్గానే, యజమాని కోపంతో, “బానిస నువ్వయ్యి మా మధ్యలో వస్తావా? మా మాటల్లో మాట కలుపుతావా?” అని చెప్పేసి గట్టిగా గుద్దాడు. “వెళ్లి పని చూసుకో” అన్నాడు.

సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు సాయంత్రం వరకు వేచి చూసి, ఆయన దగ్గర ఉన్న కొద్ది మొత్తం తినే పదార్థాన్ని తీసుకొని, ఖుబాలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉన్న చోటికి వచ్చేశారు. వచ్చేసిన తర్వాత ఇప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఆయన ఎలా పరీక్షిస్తున్నారో చూడండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సన్నిధికి వచ్చేసి, ఆ తినే పదార్థాన్ని ఆయన చేతికి ఇస్తూ ఏమంటున్నారంటే: “అయ్యా, మీరు గొప్ప భక్తుల్లాగా అనిపిస్తున్నారు. మీతో పాటు ఉన్న మీ శిష్యులు కూడా చాలా ఆకలితో ఉన్నట్టు అనిపిస్తోంది. కాబట్టి ఇది నా తరపు నుంచి ‘సదఖ’ – తీసుకోండి” అన్నారు.

‘సదఖ తీసుకోండి’ అని చెప్పగానే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తీసుకొని శిష్యులకు ఇచ్చేశారు. శిష్యులు తిన్నారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తినలేదు. అది గమనించిన సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు కన్ఫర్మ్ చేసుకున్నారు, “ఆ! ఈయన సదఖ తినట్లేదు.” ఒక విషయం కన్ఫర్మ్ అయిపోయింది.

మళ్ళీ ఇంటికి వెళ్లారు. కొద్ది రోజుల తర్వాత ఆయన దగ్గర ఉన్న మరీ కొన్ని పదార్థాలను తీసుకొని.. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మదీనాలో ఉంటే మళ్ళీ మదీనాకు వెళ్లారు. మదీనాలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం శిష్యులతో పాటు కూర్చొని ఉంటే, “అయ్యా, ఇది నా తరపు నుండి ‘హదియా’ – బహుమానం” అని చెప్పారు. చెప్పగానే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తీసుకొని, తానూ తిన్నారు, శిష్యులకు తినిపించారు. రెండో విషయం కన్ఫర్మ్ అయిపోయింది. సదఖ తినట్లేదు, హదియా తింటున్నారు.

ఆ తర్వాత మళ్ళీ కొద్ది రోజుల తర్వాత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక జనాజా వెంబడి వెళుతూ ఉంటే, సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు ఆయన వెంటవెంట వెళ్లి అటు ఇటు అటు ఇటు ఎదురుచూస్తున్నారు. “ఎప్పుడెప్పుడు ఆయన బట్ట జారుతుంది, ఆ రెండు భుజాల మధ్య ఉన్న ఆ గుర్తుని నేను చూడాలి” అని వెనక వెనకే వెనక వెనకే ఆయన కదులుతూ ఉంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గమనించేశారు. ఇతను వెనుక నుంచి ఏదో కోరుకుంటున్నాడు అని అర్థం చేసుకున్న ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, వెంటనే బట్టను అక్కడి నుంచి పక్కకు జరపగా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వీపు మీద ఉన్న ఆ ముద్రను చూసి సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు ముద్దు పెట్టుకొని: “ఓ దైవ ప్రవక్త! నేను మీకోసం ఇంతగా తపించాను, ఫలానా దేశం నుండి ప్రయాణం చేశాను, ఫలానా ఫలానా ఫలానా చోటికి నేను తిరిగాను, మీకోసం ఎదురు చూశాను, చివరికి బానిసగా మారిపోయాను, ఇక్కడ నన్ను బానిసగా చేసేసారు, మీకోసం నేను ఎదురుచూస్తున్నాను ఓ దైవ ప్రవక్త” అని చెప్పేసి ఏడ్చారు.

అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం: “ఓ సల్మాన్! వెనుక నుండి ముందుకు రా” అని చెప్పి, ముందర కూర్చోబెట్టి జరిగిన పూర్తి కథను విన్నారు.

ఆ తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సల్మాన్ తో అన్నారు: “ఓ సల్మాన్! నీవు ఒక మంచి సమయాన్ని చూసుకొని, నీ యజమానితో ‘నేను పరిహారం చెల్లించేస్తాను నన్ను స్వతంత్రుడ్ని చేసేయ్’ అని అడుగు. అతను ఏం కోరతాడో అది ఇచ్చేద్దాం” అన్నారు. సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వెళ్లారు. సమయం కోసం ఎదురుచూశారు. సమయం కోసం ఎదురుచూసిన తర్వాత ఒకరోజు యజమానితో చెప్పారు: “అయ్యా, మీకు ఏం కావాలో చెప్పండి నేను చెల్లించేస్తాను, నాకు మాత్రం విముక్తుడిని చేసేయండి ఈ బానిస నుండి” అన్నాడు.

అప్పుడు ఆయన ఏమన్నాడంటే: “నాకు మూడు వందలు లేదా ఐదు వందల ఖర్జూరపు చెట్లు నాటి ఇవ్వు. ఆ తర్వాత 400 ల బంగారు నాణాలు ఇవ్వు” అని షరతు పెట్టాడు. సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సన్నిధికి వచ్చి: “ఓ దైవ ప్రవక్త! నా యజమాని ఈ విధంగా షరతు పెట్టాడండి” అని చెప్పారు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహాబాలతో అన్నారు: “ఏమండీ! మీ సోదరుడిని ఆదుకోండి” అన్నారు. అప్పుడు సహాబాలందరూ కలిసి, ఒక్కొక్కరు 10 చెట్లు, 20 చెట్లు, 30 చెట్లు, 40 చెట్లు.. ఆ విధంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఎవరికి ఎంత శక్తి ఇచ్చాడో అన్ని ఖర్జూరపు చెట్లు తీసుకొని వెళ్లి అక్కడ 500 ల ఖర్జూరపు చెట్లు నాటేశారు.

నాటే ముందు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక మాట చెప్పారు, అదేమిటంటే: “గుంతలు తవ్వండి. నాటే ముందు నన్ను పిలవండి, నేను వచ్చి ప్రారంభిస్తాను” అన్నారు. గుంతలు తవ్వారు. ఖర్జూరపు చెట్లు సిద్ధంగా ఉంచారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి పిలవగా, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వెళ్లి అక్కడ ‘బిస్మిల్లాహ్’ అని చెప్పి ఖర్జూరపు చెట్లు నాటడం ప్రారంభించిన తర్వాత, సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారు చెప్పారు: “అక్కడ నాటిన 500 ల చెట్లలో ఏ ఒక్క చెట్టు కూడా మరణించలేదు, అన్నీ బ్రతుక్కున్నాయి.” అన్నీ బ్రతికిన తర్వాత, యజమానితో: “ఏమండీ మీరు చెప్పినట్లుగానే 500 ల ఖర్జూరపు చెట్లు నాటేశాము, ఇక బంగారు నాణాలు మాత్రమే ఇవ్వవలసి ఉంది.”

కొద్ది రోజుల తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సన్నిధికి కొంచం బంగారం వచ్చింది. ఆ బంగారాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారి చేతికి ఇచ్చి: “ఓ సల్మాన్! ఇది తీసుకొని వెళ్లి నిను యజమానికి ఇచ్చేయ్” అన్నారు. అప్పుడు సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు ఆ బంగారాన్ని తీసుకొని వెళ్లి యజమానికి ఇవ్వగా, అతను తూచాడు. తూచితే 400 ల బంగారు నాణాలకు సమానంగా అది ఉండింది. అప్పుడు సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారికి అతను బానిసత్వం నుండి విముక్తిని ఇస్తూ స్వతంత్రుడ్ని చేసేసాడు.

అభిమాన సోదరులారా! ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మదీనాకు వచ్చిన తర్వాత బదర్ సంగ్రామం జరిగింది, అప్పుడు సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారు అందులో పాల్గొనలేదు, ఎందుకంటే ఆయన బానిసగా ఉన్నారు. ఆ తర్వాత ఉహద్ సంగ్రామం జరిగింది, ఆ సంగ్రామంలో కూడా సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారు పాల్గొనలేదు. కారణం ఏమిటంటే ఆయన బానిసగా అక్కడ ఉండిపోయారు.

ఆ తర్వాత ఐదవ సంవత్సరంలో ఎప్పుడైతే మక్కా వాసులు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మరియు ముస్లింలను ఇస్లాం ధర్మాన్ని అణచివేయాలని వచ్చారో, అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చాలా కంగారు పడ్డారు. ఎందుకంటే పేద పరిస్థితి, ఆపైన కరువు. ఈ రెండు విషయాల వల్ల మళ్లీ శత్రువును ఎదుర్కోవాలంటే చాలా భయంకరమైన పరిస్థితి ఉండింది కాబట్టి, అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సహాబాలను కూర్చోబెట్టి: “ఏమి చేయాలి? ఎలా శత్రువుని ఎదుర్కోవాలి?” అని ప్రశ్నించినప్పుడు, సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సలహా ఇచ్చారు. అదేమిటంటే: “ఓ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం! మనం మదీనాకు నలువైపుల నుండి కందకాన్ని తవ్వేద్దాం. మా దేశంలో, ఇరాన్ లో ఇలాగే చేస్తాం” అన్నారు.

అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఆయన ఇచ్చిన సలహా నచ్చింది. వెంటనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చేశారంటే, సహాబాలకు ఆదేశించారు, అక్కడ కందకం తవ్వేశారు. అయితే అభిమాన సోదరులారా, సమయం ఎక్కువైపోయింది. చివరిగా రెండు మాటలు చెప్పి ముగిస్తున్నాను. అదేమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సన్నిధికి చేరుకున్న తర్వాత, సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్ద శిష్యునిగా ఉండి, ఎంతో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఇష్టపడ్డారు, అభిమాన పడ్డారు. దైవ ధర్మాన్ని బాగా నేర్చుకున్నారు. అల్లాహ్ ఆరాధన నేర్చుకుని, అల్లాహ్ మార్గంలో ఆయన ప్రతిచోట ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సహకరించారు.

ఒకసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ముందర ఆయన అన్నారు: “ఓ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం! మీరు కందకంలో ఒకచోట గొడ్డలితో కొడుతూ ఉంటే అక్కడ తెల్లటి మెరుపు నేను చూశాను, అదేంటి?” అని అడిగారు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు: “దాన్ని నువ్వు చూశావా?” అంటే సల్మాన్ ఫార్సీ, “అవునండి నేను చూశాను” అన్నారు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు: “ఆ మెరుపులో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా నాకు ఇరాన్ మరియు ఇరాన్ లో ఉన్న నగరాలన్నింటిని చూపించాడు. ఆ నగరాలన్నింటి చోట నా ధర్మము చేరిపోతుంది” అన్నారు. అల్లాహు అక్బర్!

అది విన్న ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి నోట ఆ మాట విన్న తర్వాత సల్మాన్ ఫార్సీ అన్నారు: “ఓ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం! అక్కడ దైవ ధర్మం చేరే సమయానికి నేను కూడా అందులో పాల్గొనాలనే దువా చేయండి” అన్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన కోసం దువా చేశారు. అలాగే సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు బ్రతికి ఉండగానే ఆయన దేశానికి ఇస్లాం ధర్మం చేరిపోయింది.

ఆ తర్వాత సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు దైవాన్ని ఆరాధిస్తూ, దైవ ధర్మ సేవ కొరకు పోరాడుతూ ఆయన ఈ ప్రపంచం నుంచి తనువు చాలించారు. అల్లాహ్ తో నేను దువా చేస్తున్నాను, అల్లాహ్ మనందరికీ ఇస్లాం ధర్మం మీద నిలకడగా నడుచుకునే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనకు ఇస్లాం ఆచరించే మార్గంలో ఎలాంటి కష్టాలు నష్టాలు లేకుండా, సులభంగా ఇస్లాం ధర్మాన్ని ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. పరీక్షల్లో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మమ్మల్ని నెగ్గించుగాక.

అకూలు కౌలి హాజా, అస్తగ్ఫిరుల్లాహ లి వలకుమ్ వ లిసాయరిల్ ముస్లిమీన ఫస్తగ్ఫిరూహు ఇన్నహు హువల్ గఫూరుర్ రహీమ్.


సహాబా (రదియల్లాహు అన్హుమ్) – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV1KN6AyXdv30x30ykoVkyVt

ప్రవక్తల జీవిత చరిత్ర (యూట్యూబ్ ప్లే లిస్ట్)
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV2_iYX30U89yPwY5LPGtir8

బిలాల్ (రదియల్లాహు అన్హు) జీవిత చరిత్ర – సలీం జామిఈ [ఆడియో & టెక్స్ట్]

బిస్మిల్లాహ్

బిలాల్ (రదియల్లాహు అన్హు) జీవిత చరిత్ర – సలీం జామిఈ [ఆడియో & టెక్స్ట్]
https://youtu.be/-deXYNu670Q [23 నిముషాలు]
సలీం జామిఈ హఫిజహుల్లాహ్

ఈ ప్రసంగం ఇస్లాం యొక్క మొట్టమొదటి ముఅజ్జిన్ అయిన హజ్రత్ బిలాల్ ఇబ్న్ రబాహ్ రదియల్లాహు అన్హు యొక్క స్ఫూర్తిదాయకమైన జీవితాన్ని వివరిస్తుంది. అబిసీనియా (ఇథియోపియా) నుండి వచ్చిన ఒక బానిసగా, బిలాల్ గారు ఇస్లాంను స్వీకరించినందుకు తన యజమాని ఉమయ్య బిన్ ఖల్ఫ్ చేత ఎదుర్కొన్న భయంకరమైన హింసను మరియు అతని అచంచలమైన విశ్వాసాన్ని ఇది వివరిస్తుంది. అబూబకర్ సిద్దీక్ రదియల్లాహు అన్హు గారి ద్వారా విముక్తి పొందిన బిలాల్ గారు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి అత్యంత ప్రియమైన సహచరుడిగా మారి, మక్కా విజయం రోజున కాబా పై నిలబడి అజాన్ ఇచ్చే గౌరవాన్ని పొందారు. ప్రవక్త గారి పట్ల బిలాల్ గారికి ఉన్న అపారమైన ప్రేమను, ఆయన మరణానంతరం బిలాల్ పడిన వేదనను మరియు స్వర్గంలో ఆయనకు దక్కిన ఉన్నత స్థానాన్ని ఈ ప్రసంగం కళ్లకు కట్టినట్లు వివరిస్తుంది.

ప్రశంసలన్నీ, పొగడ్తలన్నీ సర్వలోకాల ప్రభువు, సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పరలోక దినానికి యజమాని, మహోన్నత పీఠానికి అధిపతి, అన్ని రకాల పూజలకు ఏకైక అర్హుడైన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి.

ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించు గాక, ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించు గాక, ఆమీన్.

గౌరవనీయులైన పెద్దలు మరియు ఇస్లామీయ సోదరులారా, ఈనాటి జుమా ప్రసంగంలో ఒక వ్యక్తి గురించి తెలుసుకుందాం. ఆయన వాస్తవానికి అబిసీనియా అనగా ఇథియోపియా దేశస్థుడు. బానిసగా అరబ్బు దేశంలో జీవితం గడిపేవాడు. రంగు పరంగా చూస్తే నల్ల జాతి వాడు. కానీ ఆయన ఘనత ఏమిటంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన అడుగుల చప్పుడు స్వర్గంలో చూశారు. ఆయనను ప్రపంచం ముఅజ్జినే రసూల్, ప్రియ ప్రవక్త వారి ముఅజ్జిన్ అనే బిరుదుతో గుర్తిస్తుంది. ఇస్లాం గురించి ఏ కొద్ది జ్ఞానం ఉన్న వారికైనా సరే మీరు ముఅజ్జినే రసూల్ అంటే ఎవరండి అని ప్రశ్నించండి, టక్కున ఆయన నోటి నుండి ఒకటే సమాధానం వస్తుంది – ఆయన మరెవరో కాదు మన ప్రియ ప్రవక్త వారి ప్రియ సహచరుడు బిలాల్ రదియల్లాహు అన్హు.

అభిమాన సోదరులారా, ఈనాటి జుమా ప్రసంగంలో బిలాల్ రదియల్లాహు అన్హు వారి గురించి తెలుసుకుందాం. ఆయన పేరు బిలాల్. తల్లి పేరు హమామా. తండ్రి పేరు రబాహ్. ఆయనను ముఅజ్జినే రసూల్ అనే బిరుదుతో ప్రపంచం గుర్తిస్తుంది. ఆయన మక్కాలో జన్మించారు. బానిస కుటుంబంలో జన్మించారు, బానిసగానే పెరిగారు. ఆయనగారి యజమాని ఉమయ్య బిన్ ఖల్ఫ్.

ఎప్పుడైతే బిలాల్ రదియల్లాహు అన్హు వారు పెరిగి పెద్దవారయ్యారో, ఆ రోజుల్లో ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ప్రవక్త పదవి లభించిన తర్వాత, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ముందు రహస్యంగా కొద్దిమంది ప్రజలతో కలిసి ఇస్లాం సందేశాన్ని వినిపించారు. ప్రారంభంలో ఇస్లాం స్వీకరించిన వారిలో బిలాల్ రదియల్లాహు అన్హు వారు కూడా ఉన్నారు. ప్రారంభంలో చాలా తక్కువ మంది, పది ఇరవై మంది మాత్రమే ఇస్లాం స్వీకరించారు, వారిలో బిలాల్ రదియల్లాహు అన్హు వారు కూడా ఒకరున్నారు.

అభిమాన సోదరులారా, ఎప్పుడైతే బిలాల్ రదియల్లాహు అన్హు వారు ఇస్లాం స్వీకరించారో, ఆయన యజమాని ఉమయ్య బిన్ ఖల్ఫ్ కు వెంటనే ఆ విషయం తెలిసిపోయింది. యజమానికి ఆ విషయం తెలియగానే పట్టరాని కోపంతో యజమాని బిలాల్ రదియల్లాహు అన్హు వారిని కాళ్లు చేతులు బంధించేసి కొరడాలతో కొట్టాడు.

అభిమాన సోదరులారా, యజమాని అయిన కారణంగా అతని బానిస తాత ముత్తాతల ధర్మాన్ని వదిలేసి ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తీసుకువచ్చిన ధర్మాన్ని స్వీకరించాడనే కోపంతో హింస ప్రారంభించాడు. ముందుగా తను స్వయంగా కొట్టాడు, ఆ తర్వాత బిలాల్ రదియల్లాహు అన్హు వారి మెడలో తాడు కట్టేసి కుర్రాళ్ల చేతులకి ఇచ్చేసాడు. ఆ యువకులు, కుర్రాళ్లు బిలాల్ రదియల్లాహు అన్హు వారి మెడలో ఉన్న ఆ తాడుని పట్టుకొని ఈడ్చుకుంటూ కొండల్లో, రాళ్ల ప్రదేశంలో తిరిగేవారు. అభిమాన సోదరులారా, ఎలాగైతే ఒక జంతువుని ఈడ్చేవారో ఆ విధంగా బిలాల్ రదియల్లాహు అన్హు వారిని ఆ కుర్రాళ్లు ఈడ్చేవారు. బిలాల్ రదియల్లాహు అన్హు వారి శరీరానికి గాయాలైపోయేవి. ఆయన మెడ మీద తాడు కట్టేసిన కారణంగా గుర్తులు పడిపోయేవి.

అంతటితో యజమాని కోపం చల్లారలేదు. అతను ఏం చేసేవాడంటే తన కసి తీర్చుకోవడానికి బిలాల్ రదియల్లాహు అన్హు వారిని ఎండా కాలంలో మిట్ట మధ్యాహ్న సమయంలో బాగా ఎండ, వేడి తీవ్రంగా ఉన్నప్పుడు – మనకందరికీ తెలిసిన విషయమే మనం అరబ్బు దేశంలో ఇక్కడ ఎండను, ఎండ తీవ్రతను చూసినవాళ్ళమే. అలాంటి సమయంలో ఇక్కడి నేల ఎంతగా వేడెక్కిపోతుందో మన అందరికీ తెలుసు అభిమాన సోదరులారా. అలాంటి నేల మీద బిలాల్ రదియల్లాహు అన్హు వారిని వారి యజమాని ఉమయ్య బట్టలు తీసి పడుకోబెట్టేవాడు. ఆ తర్వాత ఎద మీద పెద్ద పెద్ద రాళ్లు ఉంచేసేవాడు. కింద నుంచి కూడా వేడి తగిలేది, పైన ఉంచిన రాయి వేడి కూడా ఆయనకు తగిలేది. అలాంటి పరిస్థితుల్లో బిలాల్ రదియల్లాహు అన్హు వారి చెవి దగ్గరికి వచ్చి యజమాని ఒకే మాట అనేవాడు – “ఓ బిలాల్! నీవు ముహమ్మద్ ప్రవక్త ధర్మాన్ని వదిలివేయి, నేను నిన్ను హింసించడం వదిలేస్తాను.” బిలాల్ రదియల్లాహు అన్హు అంత బాధను భరిస్తూ కూడా అల్లాహ్ యే ప్రభువు అద్వితీయుడు అహద్! అహద్! అని పలికేవారు.

అభిమాన సోదరులారా, యజమాని హింసిస్తూ హింసిస్తూ అలసిపోయాడు. కానీ బిలాల్ రదియల్లాహు అన్హు వారి నోటి నుండి ఒక్క పదము కూడా, ఒక్క మాట కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి వ్యతిరేకంగా ఆయన వినలేకపోయాడు. అభిమాన సోదరులారా, చరిత్రకారులు చెప్పిన విషయం ఏమిటంటే బిలాల్ రదియల్లాహు అన్హుతో పాటు ఇతర నవ ముస్లిములను కూడా మక్కా పెద్దలు పట్టుకొని హింసించారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి వ్యతిరేకంగా మాటలు మాట్లాడండి అని బలవంతం చేశారు. చాలామంది మాట్లాడేశారు కానీ బిలాల్ రదియల్లాహు అన్హు ఎట్టి పరిస్థితుల్లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు.

ఒకసారి అబూబకర్ రదియల్లాహు అన్హు మార్గం నుండి వెళ్తూ వెళ్తూ బిలాల్ రదియల్లాహు అన్హు వారికి ఇవ్వబడుతున్న శిక్షలు, బాధలు, హింసలు చూశారు. ఆ తర్వాత వెంటనే ఉమయ్య బిన్ ఖల్ఫ్ తో వచ్చి “ఓ ఉమయ్య! బిలాల్ కి నేను కొనాలనుకుంటున్నాను, నీవు వెంటనే అమ్మేయ్ నేను కొనేస్తాను” అన్నారు. అప్పుడు అతను ఉమయ్య ఏమన్నాడంటే “ఓ అబూబకర్! నేను బిలాల్ కి ఒక ఊకియా, అంటే ఇంచుమించు 70 దిర్హములు, ఆ రేటులో అమ్మాలనుకుంటున్నాను కొనగలవా?” అన్నాడు. అబూబకర్ రదియల్లాహు అన్హు వెంటనే ఆ ఒక ఊకియా (70 దిర్హములు) అతనికి ఇచ్చేసి బిలాల్ ను కొనేశారు. వ్యాపారం జరిగిపోయిన తర్వాత ఉమయ్య హేళన చేస్తూ, ఎగతాళి చేస్తూ అబూబకర్ రదియల్లాహు అన్హు తో అన్నాడు “ఓ అబూబకర్! నీవు బిలాల్ కి బదులుగా ఒక్క దిర్హమ్ మాత్రమే ఇస్తాను అని నీవు అడిగి ఉన్నా నేను ఇచ్చేసేవాడిని. నీవు ఇంత పెద్ద సొమ్ము ఇచ్చేసావే, చెల్లించేసావే” అని ఎగతాళి చేశాడు. కానీ అబూబకర్ రదియల్లాహు అన్హు ఏమని సమాధానం ఇచ్చారో తెలుసా? అబూబకర్ రదియల్లాహు అన్హు అన్నారు “ఓ ఉమయ్య! నేను ఎక్కువ ఇచ్చేసానని నీవు ఎగతాళి చేస్తున్నావు. వాస్తవం ఏమిటో తెలుసా? నీవు ఒక ఊకియా మాత్రమే అడిగావు. ఒకవేళ నీవు వంద ఊకియాలు అడిగి ఉన్నా గాని నేను చెల్లించడానికి సిద్ధంగానే ఉన్నాను” అన్నారు. అల్లాహు అక్బర్! ఆ తర్వాత అబూబకర్ రదియల్లాహు అన్హు బిలాల్ రదియల్లాహు అన్హు గారిని కొన్న తర్వాత ఆయనకు స్వతంత్రుని చేసేసారు. ఆ తర్వాత నుండి బిలాల్ రదియల్లాహు అన్హు వారు స్వతంత్రులయ్యారు.

ఆ తర్వాత రోజులు గడిచాయి. ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహాబాలకు, నవ ముస్లింలకు మక్కా నుండి మదీనాకు వలస వెళ్ళిపోవాలని ఆదేశించినప్పుడు బిలాల్ రదియల్లాహు అన్హు వారు కూడా మక్కా నుండి మదీనాకు వలస ప్రయాణం చేసి వెళ్ళిపోయారు. మదీనాకు వెళ్ళిన తర్వాత అక్కడ ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక మసీదును నిర్మించారు. ఆ మసీదు పేరు మస్జిదే నబవీ. మసీదు నిర్మించబడిన తర్వాత అల్లాహ్ తరఫు నుండి ప్రజలకు నమాజ్ కొరకు పిలవడానికి అజాన్ ఇవ్వాలని ఆదేశం వచ్చినప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రథమంగా, అందరికంటే ముందు అజాన్ పలుకులు పలికించడానికి బిలాల్ రదియల్లాహు అన్హు వారిని పిలిపించి “ఓ బిలాల్! నీవు అజాన్ పలుకులు పలుకు” అని ఆదేశించినప్పుడు ఇస్లాం లో అజాన్ పలుకులు పలికిన ప్రథమ వ్యక్తి బిలాల్ రదియల్లాహు అన్హు. అభిమాన సోదరులారా, ఆనాటి నుండి ఆయనకు ప్రజలు బిలాల్ ముఅజ్జిన్ అనే పేరుతో పిలవటం ప్రారంభించారు.

అభిమాన సోదరులారా, మదీనాలో ఉంటున్నప్పుడు బిలాల్ రదియల్లాహు అన్హు ఐదు పూటల నమాజులకు అజాన్ పలికేవారు. తర్వాత సమయంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సేవ చేసేవారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సతీమణులకు కావాల్సిన పనులు చేసి పెట్టేవారు. అభిమాన సోదరులారా, ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మదీనాలో ఉంటున్నప్పుడు మక్కా వాసులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మరియు విశ్వాసులను అక్కడి నుండి తరిమి కొట్టాలని ప్రయత్నించినప్పుడు యుద్ధాలు జరిగాయి. ఆ యుద్ధాలలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో పాటు బిలాల్ రదియల్లాహు అన్హు కూడా ప్రతి యుద్ధంలో పాల్గొన్నారు. అయితే ముఖ్యంగా హిజ్రీ శకం రెండవ సంవత్సరంలో మొదటి యుద్ధం జరిగింది ఆ యుద్ధం పేరు బద్ర్ సంగ్రామం. ఆ సంగ్రామంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో పాటు బిలాల్ రదియల్లాహు అన్హు యుద్ధ మైదానంలో వస్తే శత్రువులలో నుంచి ఉమయ్య వచ్చాడు. ఉమయ్య తెలుసు కదా బిలాల్ రదియల్లాహు అన్హు వారి యొక్క మాజీ యజమాని. మక్కాలో ఆయనకు హింసించిన వాడు, కొట్టినవాడు, బంధించినవాడు, జంతువులాగా ప్రవర్తించిన వాడు శత్రువుల సైన్యంలో వచ్చాడు. అభిమాన సోదరులారా, యుద్ధమైంది ఆ యుద్ధంలో బిలాల్ రదియల్లాహు అన్హు చేతికి చిక్కిపోయాడు. బిలాల్ రదియల్లాహు అన్హు ఆ రోజు అన్నారు “ఈ రోజు మిగిలితే ఈ భూమి మీద నేను మిగలాలి లేదంటే ఓ దైవ శత్రువా నీవైనా మిగలాలి లేదంటే నేనైనా మిగలాలి, నాతో తలపడు” అని చెప్పేసి బిలాల్ రదియల్లాహు అన్హు అతనితో ఎదుర్కొని అతన్ని హతమార్చేశారు.

అయితే అభిమాన సోదరులారా, మదీనాలో ఉన్నప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తరఫున ఇద్దరు అజాన్ పలుకులు పలికే వారు. ఒకరు బిలాల్ రదియల్లాహు అన్హు వారు అయితే రెండో వారు కళ్ళు లేని, కంటి చూపు లేని ఒక సహాబి ఆయన పేరు అబ్దుల్లా ఇబ్నే ఉమ్మే మఖ్తూమ్.

అభిమాన సోదరులారా, రోజులు గడిచాయి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మదీనాకు వెళ్లిన ఎనిమిదవ సంవత్సరంలో మక్కాని మళ్ళీ జయించేసారు. విజయం పొందిన తర్వాత విజేతల్లాగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు వారి శిష్యులు మక్కాలో ప్రవేశించారు. మక్కాలో ప్రవేశించిన తర్వాత మక్కాలోని మస్జిదే హరామ్ లో ఆ రోజుల్లో అవిశ్వాసులు అక్కడ ఉంచిన విగ్రహాలన్నింటిని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు శిష్యులు అందరూ కలిసి అక్కడి నుంచి తొలగించేశారు. తొలగించిన తర్వాత మళ్ళీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బిలాల్ రదియల్లాహు అన్హు వారిని పిలిచి “ఓ బిలాల్! కాబా పైకి ఎక్కి ఈరోజు నీవు అజాన్ పలుకులు పలుకు” అన్నారు. అల్లాహు అక్బర్! అభిమాన సోదరులారా, బిలాల్ రదియల్లాహు అన్హు ఆ రోజు మక్కా విజయం జరిగిన రోజు కాబా పైకి ఎక్కి అక్కడి నుండి అజాన్ పలుకులు పలికారు.

أَشْهَدُ أَنْ لَا إِلٰهَ إِلَّا اللهُ
(అష్ హదు అల్ లా ఇలాహ ఇల్లల్లాహ్)

أَشْهَدُ أَنَّ مُحَمَّدًا رَسُولُ اللهِ
(అష్ హదు అన్న ముహమ్మదుర్ రసూలుల్లాహ్)

బిలాల్ రదియల్లాహు అన్హు గారు ఈ పలుకులు నిర్మోహమాటంగా, ఎలాంటి భయం లేకుండా, ఎలాంటి వణుకు లేకుండా పలికారు. ఒకప్పుడు అదే నగరంలో అల్లాహ్ పేరు తలుచుకోవాలంటే, అల్లాహ్ పేరు పలకాలంటే హింసలు ఎదుర్కోవలసి వచ్చేవి. ఒక్కసారి అల్లాహ్ అని పలకాలంటే యజమానితో భయపడేవారు. ఒక్కసారి అల్లాహ్ అని పలకాలంటే ఆ ఊరి పెద్దలతో భయపడేవారు. కానీ కొద్ది సంవత్సరాల్లోనే వాతావరణం ఎలాగ మారిపోయిందంటే ఆ రోజు బిలాల్ రదియల్లాహు అన్హు కాబా మీద నిలబడి ఈ పలుకులు పలుకుతూ ఉంటే ఏ ఒక్కడు కూడా వచ్చి అడ్డు పడటానికి సాహసించలేకపోయాడు. అలా మారిపోయాయి.

ఆ తర్వాత అభిమాన సోదరులారా, రోజులు గడిచాయి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం 63 సంవత్సరాల వయసులో మరణించారు. ఎప్పుడైతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరణించారో, మరుసటి రోజు నుంచే బిలాల్ రదియల్లాహు అన్హు వారు అజాన్ పలకటం మానేశారు. ప్రజలు వచ్చి ఏమండీ ఎందుకు మీరు అజాన్ పలకటం మానేశారు అని అడిగితే ఆయన ఒకే మాట అన్నారు “అయ్యా అజాన్ పలికేటప్పుడు అష్ హదు అన్న ముహమ్మదుర్ రసూలుల్లాహ్ అని చెప్పిన తర్వాత నేను ఎవరి మొహం చూడాలయ్యా? ఆ పలుకు పలికేటప్పుడు నాకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు గుర్తుకు వస్తారు కాబట్టి ఆ పలుకు పలికిన తర్వాత మరి వేరే పలుకులు నేను పలకలేను” అన్నారు. ఆ తర్వాత నుంచి బిలాల్ రదియల్లాహు అన్హు వారి అజాన్ అక్కడి నుంచి ఆగిపోయింది.

ఆ తర్వాత అబూబకర్ రదియల్లాహు అన్హు విశ్వాసులకు నాయకులైనప్పుడు ఆయన ఏమన్నారంటే “ఓ అబూబకర్ రదియల్లాహు అన్హు! నాకు అనుమతి ఇవ్వండి, నేను ఇక్కడ ఉండలేను. నేను వెళ్లి సరిహద్దుల్లో శత్రువులతో పోరాడి వీరమరణం పొందాలనుకుంటున్నాను” అన్నారు. కానీ ఆయనకు అప్పుడే ఎక్కువ వయసు అయిపోయింది కాబట్టి అబూబకర్ రదియల్లాహు అన్హు అనుమతి ఇవ్వలేదు. అబూబకర్ రదియల్లాహు అన్హు తర్వాత ఉమర్ రదియల్లాహు అన్హు నాయకునిగా ఎన్నికైన తర్వాత ఉమర్ రదియల్లాహు అన్హు వద్దకు వచ్చి కూడా బిలాల్ రదియల్లాహు అన్హు వారు అనుమతి కోరితే ఉమర్ రదియల్లాహు అన్హు వారు కూడా వయసు ఎక్కువ అయిపోయింది అని అనుమతి ఇవ్వలేదు. కాకపోతే పట్టుబట్టి ఆయన అనుమతి పొందారు, ఆ తర్వాత సరిహద్దుల్లోకి వెళ్ళిపోయారు. సరిహద్దులో వెళ్ళినప్పుడు ఒక సందర్భంలో కొన్ని ముఖ్య కారణాల వల్ల ఉమర్ రదియల్లాహు అన్హు వారు కూడా సరిహద్దుకు వెళ్లాల్సి వచ్చింది. అక్కడ బిలాల్ రదియల్లాహు అన్హు తో ఉమర్ రదియల్లాహు అన్హు అన్నారు “ఓ బిలాల్! నా కోరిక మేరకు ఒక్కసారి అజాన్ పలకవయ్యా” అన్నారు. అప్పుడు బిలాల్ రదియల్లాహు అన్హు సరిహద్దుల్లో ఒక్కసారి అజాన్ పలికారు.

మరికొన్ని రోజుల తర్వాత బిలాల్ రదియల్లాహు అన్హు మదీనాకు వచ్చినప్పుడు మదీనాలో ఉంటున్న ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మనవలు హసన్ మరియు హుస్సేన్ మరియు ఇతర సహాబాలు కలిసి బిలాల్ రదియల్లాహు అన్హు ని అజాన్ కోరాలని ప్రాధేయపడినప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో మరి ఒక్కసారి ఆయన జీవితంలో చివరిసారి మదీనాలో బిలాల్ రదియల్లాహు అన్హు వారు అజాన్ పలికారు. అభిమాన సోదరులారా, ప్రజలు బిలాల్ రదియల్లాహు అన్హు వారి అజాను మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నమాజ్ చదివించడానికి ఎంతగా కనెక్ట్ అయిపోయారంటే చాలా గ్యాప్ తర్వాత, చాలా విరామం తర్వాత ఎప్పుడైతే బిలాల్ రదియల్లాహు అన్హు వారు మదీనాలో అజాన్ పలికారో, మదీనాలో ఆయన అజాన్ పలుకులతో వీధి వీధుల్లో శబ్దం మోగిందో ఇళ్లలో నివసిస్తున్న పిల్లల దగ్గరి నుండి మహిళల దగ్గర నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని తలుచుకొని కన్నీరు కార్చారు. అదే బిలాల్ రదియల్లాహు అన్హు జీవితంలో ఆయన ఇచ్చిన చివరి అజాన్. ఆ తర్వాత బిలాల్ రదియల్లాహు అన్హు దిమష్క్ అంటే ఈనాడు డెమస్కస్ అంటూ ఉంటారు ఆ నగరంలో 60 సంవత్సరాల కంటే ఎక్కువగా ఆయనకు వయసు అయిపోయిన సందర్భంలో ఆయన అక్కడే మరణం పొందారు. నేటికి కూడా ఆయన సమాధి ఆ నగరంలో ఉంది.

అయితే అభిమాన సోదరులారా, ఆయనకున్న ఘనతలను చెప్పేసి ఇన్ షా అల్లాహ్ నా మాటను ముగిస్తాను అదేమిటంటే ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మేరాజ్ యాత్ర సందర్భంలో అల్లాహ్ తో కలవడానికి ఆకాశాల పైకి వెళ్ళినప్పుడు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి స్వర్గాన్ని కూడా చూపించాడు, నరకాన్ని కూడా చూపించాడు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం స్వర్గాన్ని చూస్తున్నప్పుడు అక్కడ బిలాల్ రదియల్లాహు అన్హు నడుస్తున్నట్టుగా వారి కాళ్ళ చప్పుడుని విన్నారు. ఆ యాత్ర నుండి తిరిగి వచ్చిన తర్వాత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బిలాల్ రదియల్లాహు అన్హుతో ఒక ప్రశ్న అడిగారు అదేమిటంటే “ఓ బిలాల్! నేను స్వర్గంలో నీ అడుగుల చప్పుడు విన్నాను, నీవు ఏ సత్కార్యము చేస్తున్నావో నాకు కొంచెం తెలుపవా” అన్నారు. దానికి బదులుగా బిలాల్ రదియల్లాహు అన్హు అన్నారు “ఓ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం! నేను ఏదో ఒక పెద్ద సత్కారం ఏమి చేయట్లేదండి, కాకపోతే నా అలవాటు ఏమిటంటే నేను వుజూ చేసిన ప్రతిసారి రెండు రకాతుల నమాజ్ ఆచరిస్తాను. నా వుజూ భంగమైపోయిన వెంటనే మళ్ళీ నేను వుజూ చేసేస్తాను, వుజూ చేసిన వెంటనే మళ్ళీ నేను రెండు రకాతుల నమాజ్ ఆచరిస్తాను” అన్నారు. అభిమాన సోదరులారా, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆయన చేసిన ఆ సత్కార్యాన్ని మెచ్చుకున్నాడు కాబట్టి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అక్కడ బిలాల్ రదియల్లాహు అన్హు కాళ్ళ చప్పుడుని వినిపించాడు. ఒకరకంగా ఇక్కడ మనం మరొక విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలి అదేమిటంటే ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నోట అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా బిలాల్ రదియల్లాహు అన్హు కి స్వర్గ శుభవార్త కూడా తెలియజేసేశాడు ఒకరకంగా ఇక్కడ.

అలాగే బిలాల్ రదియల్లాహు అన్హు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సేవ చేస్తున్న రోజుల్లో ఒకసారి పండుగ రోజు వచ్చింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పురుషులకు ఖుత్బా వినిపించేసారు. ఆ తర్వాత మహిళల వద్దకు వెళ్లి మహిళలకు కూడా అల్లాహ్ వాక్యాలు వినిపించారు ఆ తర్వాత దానధర్మాలు చేయాలని ఆదేశించినప్పుడు, కోరినప్పుడు అక్కడ ఉన్న మహిళలందరూ వారు తొడిగిన నగలు తీసి విరాళంగా ఇచ్చేస్తున్నారు. అప్పుడు బిలాల్ రదియల్లాహు అన్హు కూడా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పక్కనే ఉన్నారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బిలాల్ రదియల్లాహు అన్హు చేయి పట్టుకొని అక్కడ మహిళలకు ఉపన్యాసం ఇచ్చారు. ఎప్పుడైతే మహిళలు విరాళాలు ఇచ్చారో బిలాల్ రదియల్లాహు అన్హు అక్కడ దుప్పట పరిచిన తర్వాత మహిళలందరూ అందులో విరాళాలు వేశారు.

ఇక చివరిగా మరొక విషయం ఏమిటంటే ఉమర్ రదియల్లాహు అన్హు బిలాల్ రదియల్లాహు అన్హు వారిని చూసినప్పుడల్లా ఒక మాట అనేవారు “అబూబకర్ సయ్యిదునా ఆతకా సయ్యిదనా” అంటే అబూబకర్ రదియల్లాహు అన్హు మాకు నాయకుడు, మా నాయకుడు మా నాయకుడైన బిలాల్ ని స్వతంత్రుని చేసేసారు అనేవారు. అంటే బిలాల్ రదియల్లాహు అన్హు వారిని చూసినప్పుడల్లా ఉమర్ రదియల్లాహు అన్హు వారు బిలాల్ రదియల్లాహు అన్హు వారిని “మా నాయకుడు మా నాయకుడు మా నాయకుడు” అని చెప్పేవారు. వాస్తవానికి ఆయన బానిసగా జీవించినవాడు. కానీ ఇస్లాం లో నల్ల వారికి, తెల్ల వారికి, బానిసకి, స్వతంత్రునికి ఎలాంటి భేదం లేదు అల్లాహ్ దృష్టిలో అందరూ సమానులే అని చెప్పటానికి ఇది ఒక మంచి ఉదాహరణ.

కాబట్టి అభిమాన సోదరులారా, ఇది బిలాల్ రదియల్లాహు అన్హు యొక్క విశిష్టత, ఆయన యొక్క క్లుప్తమైన జీవిత చరిత్ర.

చివరిగా నేను అల్లాహ్ తో దువా చేస్తున్నాను అల్లాహ్ మనకు కూడా బిలాల్ రదియల్లాహు అన్హు మాదిరిగా అలాగే ఇతర ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి శిష్యుల మాదిరిగా దృఢమైన విశ్వాసంతో జీవితం గడిపే భాగ్యాన్ని ప్రసాదించు గాక. ఇస్లాం పై నిలకడగా జీవితం గడిపే భాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ ప్రసాదించు గాక. ఎలాంటి కష్టనష్టాలు, బాధలు లేకుండా ఇస్లాం ధర్మాన్ని ఆచరించే భాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ ప్రసాదించు గాక.

أَقُولُ قَوْلِي هَذَا، وَأَسْتَغْفِرُ اللَّهَ لِي وَلَكُمْ وَلِسَائِرِ الْمُسْلِمِينَ، فَاسْتَغْفِرُوهُ إِنَّهُ هُوَ الْغَفُورُ الرَّحِيمُ
(అఖూలు ఖౌలీ హాజా, వ అస్తగ్ ఫిరుల్లాహ లీ వలకుమ్ వ లిసాయీరిల్ ముస్లిమీన్, ఫస్తగ్ ఫిరూహు ఇన్నహూ హువల్ గఫూరుర్ రహీమ్)
నేను ఈ మాట చెబుతూ, నా కోసం, మీ కోసం మరియు ముస్లిములందరి కోసం అల్లాహ్ క్షమాభిక్ష కోరుతున్నాను. కాబట్టి ఆయన వద్ద క్షమాపణలు వేడుకోండి, నిశ్చయంగా ఆయన క్షమించేవాడు, అత్యంత దయగలవాడు.

సహాబా (రదియల్లాహు అన్హుమ్) – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV1KN6AyXdv30x30ykoVkyVt

ప్రవక్తల జీవిత చరిత్ర (యూట్యూబ్ ప్లే లిస్ట్)
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV2_iYX30U89yPwY5LPGtir8

ఈద్ కు సంబంధించిన కొన్ని ముఖ్యమైన సూచనలు, సలహాలు [వీడియో]

బిస్మిల్లాహ్

[34 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

ఈద్ నమాజ్ & ఈద్ సున్నతులు – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0ZEOdAJlFpkageyWnxdFM_

ఈద్ పండుగ మరియు రక్త సంబంధాలు [వీడియో]

బిస్మిల్లాహ్

[34 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

ఈద్ నమాజ్ & ఈద్ సున్నతులు – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0ZEOdAJlFpkageyWnxdFM_

త్రాసును బరువు చేసే సత్కార్యాలు – జనాజ వెంట వెళ్ళడం, జనాజ నమాజు చేయడం [ఆడియో]

బిస్మిల్లాహ్

మరణాంతర జీవితం – పార్ట్ 24 నుండి తీసుకోబడింది
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

త్రాసు(మీజాన్)ను బరువు చేసే సత్కార్యాలు [పుస్తకం & ముందు వీడియో పాఠాలు ]
https://teluguislam.net/books/deeds-heavy-meezan

[6:43 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

త్రాసు(మీజాన్)ను బరువు చేసే సత్కార్యాలు – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://bit.ly/3xYzpbN

4వ కార్యం: జనాజ వెంట వెళ్ళడం, జనాజ నమాజు చేయడం

గొప్ప పుణ్య కార్యాల్లో ఒకటి; జనాజ వెంట వెళ్ళడం, జనాజ నమాజు చేయడం, దానిపై లభించే పుణ్యం బరువు మానవుని త్రాసులో ఉహద్ పర్వతం కంటే అధికిమించి ఉంటుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించారని ఉబై బిన్ కఅబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః

مَنْ تَبِعَ جَنَازَةً حَتَّى يُصَلَّى عَلَيْهَا، وَيُفْرَغَ مِنْهَا، فَلَهُ قِيرَاطَانِ، وَمَنْ تَبِعَهَا حَتَّى يُصَلَّى عَلَيْهَا، فَلَهُ قِيرَاطٌ، وَالَّذِي نَفْسُ مُحَمَّدٍ بِيَدِهِ لَهُوَ أَثْقَلُ فِي مِيزَانِهِ مِنْ أُحُدٍ

“ఎవరు నమాజు మరియు (ఖననం) అయ్యే వరకు జానాజ వెంట ఉంటాడో అతనికి రెండు ఖీరాతులు, మరెవరయితే కేవలం నమాజు అయ్యే వరకు దాని వెంట ఉంటాడో అతనికి ఒక ఖీరాతు లభిస్తుంది. నా ప్రాణం ఎవరి చేతిలో ఉందో ఆయన (అంటే అల్లాహ్) సాక్షి! ఒక్క ఖీరాత్ బరువు అల్లాహ్ వద్ద ఉన్న త్రాసులో ఉహద్ పర్వతంకంటే ఎక్కువ ఉండును”. (అహ్మద్ 5/ 131 ఇది సహీ హదీస్).

ప్రవక్త ﷺ తెలిపారని, అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః

مَنْ شَهِدَ الجَنَازَةَ حَتَّى يُصَلِّيَ، فَلَهُ قِيرَاطٌ، وَمَنْ شَهِدَ حَتَّى تُدْفَنَ كَانَ لَهُ قِيرَاطَانِ، قِيلَ: وَمَا القِيرَاطَانِ؟ قَالَ: مِثْلُ الجَبَلَيْنِ العَظِيمَيْنِ

“ఎవరు జనాజలో పాల్గొని నమాజు చేస్తాడో అతనికి ఒక ఖీరాత్, మరెవరయితే (నమాజు మరియు) ఖననం అయ్యే వరకు పాల్గొంటాడో అతనికి రెండు ఖీరాతులు లభించును”. రెండు ఖీరాతులంటే ఏమిటి? అని ప్రశ్న వచ్చినప్పుడు, ప్రవక్త చెప్పారుః “రెండు పెద్ద కొండల వంటివి”.

(బుఖారి 1325, ముస్లిం 945, తిర్మిజి 1040, నిసాయి 1940, ఇబ్ను మాజ 1539, అహ్మద్ 2/ 401, ఇబ్ను హిబ్బాన్ 3080)

ముస్లింలో ఉంది: ఇబ్ను ఉమర్ రజియల్లాహు అన్హు జనాజ నమాజు చేసుకొని వెళ్ళేవారు, ఎప్పుడయితే వారికి అబూహురైరా రజియల్లాహు అన్హు గారి ఈ హదీసు చేరిందో ‘వాస్తవానికి మనం అనేక ఖీరాతులు పోగుట్టుకున్నాము’ అని బాధ పడ్డారు.

ఇతర లింకులు:

త్రాసును బరువు చేసే సత్కార్యాలు – అల్లాహ్ కొరకు కోపాన్ని దిగమింగుట [ఆడియో]

బిస్మిల్లాహ్

మరణాంతర జీవితం – పార్ట్ 24 నుండి తీసుకోబడింది
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

త్రాసు(మీజాన్)ను బరువు చేసే సత్కార్యాలు [పుస్తకం & ముందు వీడియో పాఠాలు ]
https://teluguislam.net/books/deeds-heavy-meezan

[10 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

3వ కార్యం: అల్లాహ్ కొరకు కోపాన్ని దిగమింగుట

ప్రవక్త ﷺ ఉపదేశించారని అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః

مَا مِنْ جُرْعَةٍ أَعْظَمُ أَجْرًا عِنْدَ اللهِ، مِنْ جُرْعَةِ غَيْظٍ كَظَمَهَا عَبْدٌ ابْتِغَاءَ وَجْهِ اللهِ

“అల్లాహ్ వద్ద పుణ్యపరంగా అతి గొప్ప గుటక, అల్లాహ్ అభీష్ఠానికై దాసుడు మింగే కోపాగ్ని గుటక”.

(ఇబ్ను మాజ 4189, అహ్మద్ 2/ 128, అదబుల్ ముఫ్రద్ 1318, సహీహుత్తర్గీబ్: అల్బానీ 2752).

ఇలాంటి ఎన్ని సందర్భాలు మనకు ఎదురవుతాయి, అప్పుడు మనం ఈ హదీసును, ఈ గొప్ప పుణ్యఫలితాన్ని  గుర్తుకు తెచ్చుకుంటామా? అల్లాహ్ కొరకు మన కొపాన్ని మింగి పుణ్యాన్ని పొందుతామా?

అల్లాహ్ సుబ్ హానహు వతఆలా కోపం వచ్చినప్పుడు కోపం ప్రకారం ఆచరించడానికి శక్తి ఉండికూడా కోపాన్ని దిగమ్రింగేవారిని ప్రశంసించి, వారికి మన్నింపు, క్షమాపణ, స్వర్గప్రవేశ శుభవార్త ఇచ్చాడు.

الَّذِينَ يُنْفِقُونَ فِي السَّرَّاءِ وَالضَّرَّاءِ وَالكَاظِمِينَ الغَيْظَ وَالعَافِينَ عَنِ النَّاسِ وَاللهُ يُحِبُّ المُحْسِنِينَ * وَالَّذِينَ إِذَا فَعَلُوا فَاحِشَةً أَوْ ظَلَمُوا أَنْفُسَهُمْ ذَكَرُوا اللهَ فَاسْتَغْفَرُوا لِذُنُوبِهِمْ وَمَنْ يَغْفِرُ الذُّنُوبَ إِلَّا اللهُ وَلَمْ يُصِرُّوا عَلَى مَا فَعَلُوا وَهُمْ يَعْلَمُونَ * أُولَئِكَ جَزَاؤُهُمْ مَغْفِرَةٌ مِنْ رَبِّهِمْ وَجَنَّاتٌ تَجْرِي مِنْ تَحْتِهَا الأَنْهَارُ خَالِدِينَ فِيهَا وَنِعْمَ أَجْرُ العَامِلِينَ {آل عمران: 134-136}

“ఎవరు కలిమిలోనూ, లేమిలోనూ (అల్లాహ్ మార్గంలో) ఖర్చు చేస్తారో మరియు కోపాన్ని దిగమ్రింగుతారో ఇంకా ప్రజలను మన్నిస్తారో, (ఇలాంటి) సజ్జనులను అల్లాహ్ ప్రేమిస్తాడు. మరెవరైతే (వారి ద్వారా) ఏదైనా అశ్లీల పని జరిగితే లేదా వారు తమపై అన్యాయం చేసుకుంటే, వెంటనే అల్లాహ్ ను స్మరించి తమ పాపాల క్షమాపణకై వేడుకుంటారు. –నిజానికి అల్లాహ్ తప్ప పాపాలను క్షమించేవాడెవడున్నాడు?- వారి ద్వారా జరిగింది తప్పు అని తెలిసినప్పుడు దానిపై హటం చెయ్యరు (మంకుపట్టు పట్టరు). ఇలాంటి వారి ప్రతిఫలం, వారి ప్రభువు నుండి క్షమాభిక్ష మరియు క్రింద సెలయేళ్ళు ప్రవహించే స్వర్గవనాలు. వారక్కడ శాశ్వతంగా ఉంటారు. సత్కార్యాలు చేసే వారికి ఎంతో శ్రేష్ఠమైన ప్రతిఫలం ఉంది”. (ఆలె ఇమ్రాన్ 3:134-136).

ఈ ఘనమైన ఫలం పైన మరో ప్రతిఫలం ఏమిటంటే; అతనికిష్టమైన హూరె ఐన్ (అందమైన పెద్ద కళ్ళుగల స్వర్గపు సుందర కన్య)ను ఎన్నుకునే స్వేచ్ఛ ఇవ్వబడుతుంది. సహల్ బిన్ ముఆజ్ తన తండ్రితో ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారుః

مَنْ كَظَمَ غَيْظًا وَهُوَ قَادِرٌ عَلَى أَنْ يُنْفِذَهُ، دَعَاهُ اللهُ عَزَّ وَجَلَّ عَلَى رُءُوسِ الْخَلَائِقِ يَوْمَ الْقِيَامَةِ حَتَّى يُخَيِّرَهُ اللهُ مِنَ الْحُورِ الْعِينِ مَا شَاءَ

“ఎవరు తన కోపాన్ని దిగమింగుతాడో, అతను దానిని అమలు పరచడానికి శక్తి ఉండి కూడా (దిగమింగుతాడో), అల్లాహ్ ప్రళయదినాన అతనిని ప్రజల ఎదుట పిలుస్తాడు, అతనికిష్టమైన హూరె ఐన్ ను ఎన్నుకునే అధికారం ఇస్తాడు”.

(అబూదావూద్ 4777, తిర్మిజి 2493, ఇబ్నుమాజ 4186, అల్బానీ సహీహుత్తర్గీబ్ 2753లో హసన్ అని చెప్పారు).

ఏదైనా ప్రాపంచిక వృధాకార్యం కోసం నీవు ఇంతటి గొప్ప పుణ్యాన్ని వదులుకుంటావా? ప్రజల్ని ఓటమికి గురి చేసేవాడు శక్తిశాలి కాదు, తన కోపాన్ని దిగమ్రింగేవాడు అసలైన శక్తిశాలి. అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారుః

لَيْسَ الشَّدِيدُ بِالصُّرَعَةِ، إِنَّمَا الشَّدِيدُ الَّذِي يَمْلِكُ نَفْسَهُ عِنْدَ الغَضَب“

ఎదుటి వానిని చిత్తుచేసినవాడు శూరుడు కాదు, తాను ఆగ్రహానికి గురై నప్పుడు తన్ను తాను అదుపులో ఉంచుకున్నవాడే అసలైన శూరుడు”.

(బుఖారి 6114, ముస్లిం 2609, అహ్మద్ 2/ 236.).

ఇతర లింకులు:

త్రాసును బరువు చేసే సత్కార్యాలు – సత్ప్రవర్తన (Good Character) [ఆడియో]

బిస్మిల్లాహ్

మరణాంతర జీవితం – పార్ట్ 23 నుండి తీసుకోబడింది
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

త్రాసు(మీజాన్)ను బరువు చేసే సత్కార్యాలు [పుస్తకం & ముందు వీడియో పాఠాలు ]
https://teluguislam.net/books/deeds-heavy-meezan

[9 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

2వ కార్యం: సద్వర్తన

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సద్వర్తనను ప్రశంసించారు, త్రాసులో దాని గొప్ప పుణ్యాన్ని, ఘనతను స్పష్టంగా తెలిపారు. అందుకే ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం సద్వర్తన గురించి అల్లాహ్ ను అర్థించేవారు, దుష్ప్రవర్తన నుండి అల్లాహ్ శరణు కోరేవారు.

ప్రవక్త ﷺ ఇలా తెలియజేశారని, అబూ దర్దా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః

مَا شَيْءٌ أَثْقَلُ فِي مِيزَانِ المُؤْمِنِ يَوْمَ القِيَامَةِ مِنْ خُلُقٍ حَسَنٍ، وَإِنَّ اللهَ لَيُبْغِضُ الفَاحِشَ البَذِيءَ

“ప్రళయదినాన విశ్వాసి త్రాసులో సద్వర్తన కంటే బరువైన వస్తువు మరొకటి ఉండదు. నిశ్చయంగా అల్లాహ్ దుర్భాషలాడేవాడిని, బూతు పలికేవాడిని అసహ్యించుకుంటాడు”. (తిర్మిజి 2002, అబూదావూద్ 4799, ఇబ్నుహిబ్బాన్ 5693, బైహఖీ 20587, సహీహుల్ జామిః అల్బానీ 5632).

ఆయనే ఉల్లేఖించిన మరో ఉల్లేఖనం ఇలా ఉందిః

أَثْقَلُ شَيئٍ فِي الْـمِيزَانِ الخُلُقُ الحَسَن

“త్రాసులో అన్నిటికంటే బరువైన వస్తువు ఉత్తమ నడవడికయే”. (ఇబ్ను హిబ్బాన్ 481, అహ్మద్ 6/ 452, సహీహుల్ జామిః అల్బానీ 134).

మరో ఉల్లేఖనంలో ఉంది, ప్రవక్త ﷺ తెలిపారు:

مَنْ أُعْطِيَ حَظَّهُ مِنَ الرِّفْقِ فَقَدْ أُعْطِيَ حَظَّهُ مِنَ الْخَيْرِ، وَمَنْ حُرِمَ حَظَّهُ مِنَ الرِّفْقِ، فَقَدْ حُرِمَ حَظَّهُ مِنَ الْخَيْرِ، أَثْقَلُ شَيْءٍ فِي مِيزَانِ الْمُؤْمِنِ يَوْمَ الْقِيَامَةِ حُسْنُ الْخُلُقِ، وَإِنَّ اللَّهَ لَيُبْغِضُ الْفَاحِشَ الْبَذِيَّ

“ఎవరికి మెతకవైఖరిలోని కొంత భాగం ప్రాప్తమయిందో అతనికి మంచితనం, మేలు కొంత వరకు ప్రాప్తమయినట్లే. మరెవరైతే మెతకవైఖరిలోని కొంత భాగాన్ని కూడా నోచకోలేదో అతనికి అంత మేలు కూడా ప్రాప్తం కాలేదన్న మాట. ప్రళయదినాన విశ్వాసి త్రాసులో బరువుగల వస్తువు ఉత్తమ నడవడిక. నిశ్చయంగా అల్లాహ్ దుర్భాషలాడేవాడిని, బూతు పలికేవాడిని అసహ్యించుకుంటాడు”. (అదబుల్ ముఫ్రద్: బుఖారి 464, సహీ అదబుల్ ముఫ్రద్: అల్బానీ 361, బైహఖీ 20587, ఇబ్ను హిబ్బాన్ 5695).

ముల్లా అలీ ఖారీ రహిమహుల్లాహ్ చెప్పారుః అల్లాహ్ కు అసహ్యకరమైన ప్రతీది బరువు రహితంగా, విలువ లేనిది, అలాగే  అల్లాహ్ కు ఇష్టమైన, ప్రీతికరమైన ప్రతీది అతని వద్ద చాలా గొప్పది. అల్లాహ్ అవిశ్వాసుల, సత్యతిరస్కారుల విషయంలో ఇలా చెప్పాడుః “మేము ప్రళయదినాన వారి త్రాసును బరువుగా చేయము”. (కహఫ్ 18:105). ప్రఖ్యాతిగాంచిన ఓ హదీసులో ఇలా ఉందిః “రెండు పదాలున్నాయి, అవిః నాలుకపై చాలా సులభంగా, త్రాసులో బరువుగా ఉన్నాయి మరియు కరుణామయునికి చాలా ప్రియమైనవి కూడా. అవేః సుబ్ హానల్లాహి వబిహందిహీ సుబ్ హానల్లాహిల్ అజీం”. (మిర్ఖాతుల్ మఫాతీహ్ షర్హు మిష్కాతుల్ మసాబీహ్: ముల్లా అలీ ఖారీ 8/ 809).

ఉత్తమ నడవడిక అలవర్చుకొనుటకు అధికంగా దోహదపడే విషయాలు ఇవిః ఖుర్ఆన్ పారాయణం ఎక్కువగా చేయడం, వాటి భావార్థాలను గ్రహించడం, పుణ్యపురుషుల సన్నిధిలో ఉండడం, వారికి సన్నిహుతులుగా ఉండడం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హదీసులను పఠించడం, ఇంకా సద్వర్తన ప్రసాదించాలని అల్లాహ్ ను వేడుకోవడం.

ఇబ్ను మస్ఊద్ (రజియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం ) అద్దంలో చూసినప్పుడు ఇలా అనేవారుః

اللَّهُمَّ كَمَا حَسَّنْتَ خَلْقِي فَحَسِّنْ خُلُقِي
అల్లాహుమ్మ కమా హస్సంత ఖల్ఖీ ఫ హస్సిన్ ఖులుఖీ
“ఓ అల్లాహ్! నీవు నా సృష్టిని (ఆకారాన్ని) సరిదిద్దినట్లు నా నడవడికను కూడా సరిదిద్దు”.

(ఇబ్ను హిబ్బాన్ 959, అహ్మద్ 1/ 403, అబూ యఅలా 5075, సహీహుల్ జామిః అల్బానీ 1307. షేఖ్ అల్బానీ రహిమహుల్లాహ్ ఇర్వాఉల్ ఘలీల్74లో వ్రాసారు: అద్ధం చూస్తూ దుఆ చదవాలని వచ్చిన హదీసులన్నీ జఈఫ్, అయితే సామాన్య స్థితుల్లో చదవవచ్చును).

ప్రవక్త( సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా దుఆ చేసేవారని ఖుత్బా బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః

اللَّهُمَّ إِنِّي أَعُوذُ بِكَ مِنْ مُنْكَرَاتِ الأَخْلَاقِ، وَالأَعْمَالِ وَالأَهْوَاءِ

అల్లాహుమ్మ ఇన్నీ అఊజు బిక మిన్ మున్ కరాతిల్ అఖ్లాఖి వల్ అఅమాలి వల్ అహ్వా.

“ఓ అల్లాహ్! దుష్ ప్రవర్తన నుండి, దుష్కార్యాల నుండి మరియు చెడు కోరికల నుండి నీ శరణులోకి వస్తున్నాను”.

(తిర్మిజి 3591, ఇబ్ను హిబ్బాన్ 960, హాకిం 1949, సహీహుల్ జామిః అల్బానీ 1298).

తెలుసుకోండి! విశ్వాసుల్లో సంపూర్ణ విశ్వాసం గలవారు; తమ సద్వర్తనలో అతిఉత్తమంగా ఉన్నవారే. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారని అనస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః

أَكْمَلُ الْـمُؤْمِنِينَ إِيمَانًا أَحْسَنُهُمْ خُلُقًا، وَإِنَّ حُسْنَ الْـخُلُقِ لَيَبْلُغُ دَرَجَةَ الصَّوْمِ وَالصَّلَاةِ

“విశ్వాసుల్లో సంపూర్ణ విశ్వాసం గలవారు అతిఉత్తమ సద్వర్తన గలవారే, నిశ్చయంగా ఉత్తమ నడవడిక నమాజ్, ఉపవాసాల స్థానానికి చేరుకుంటుంది”. (సహీహుల్ జామిః అల్బానీ 1578, బజ్జార్ 7445, అబూయాలా 4166).

ఇతర లింకులు:

త్రాసును బరువు చేసే సత్కార్యాలు – 01| సంకల్పశుద్ధి [ఆడియో]

బిస్మిల్లాహ్

మరణాంతర జీవితం – పార్ట్ 23 నుండి తీసుకోబడింది
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

త్రాసు(మీజాన్)ను బరువు చేసే సత్కార్యాలు [పుస్తకం]
https://teluguislam.net/books/deeds-heavy-meezan

[12:25 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ముస్లిం తన పుణ్యాల అకౌంట్ పెరుగుతూ ఉండాలని చాలా కాంక్షిస్తాడు, అందుకు మరియు ప్రళయదినాన తన పుణ్యాల త్రాసు బరువుగా ఉండుటకు తన ఇహలోక జీవితంలో సాధ్యమైనంత వరకు అధికంగా పుణ్యాలు సమకూరుస్తూ ఉంటాడు. సాధ్యమైనంత వరకు తక్కువ పాపాలు చేస్తూ ఉంటాడు. ఎవరి పుణ్యాల త్రాసు బరువుగా ఉంటుందో వారే గొప్ప అదృష్టం పొందుతారు, ఆ తర్వాత ఎప్పుడూ అతనికి దురదృష్టం అనేది ఉండదు, తద్వారా మనసు మెచ్చిన విలాసవంతమైన జీవితం గడుపుతూ ఉన్నతమైన స్వర్గవనంలో ఉంటాడు. అల్లాహ్ ఇలా తెలిపాడుః

فَأَمَّا مَنْ ثَقُلَتْ مَوَازِينُهُ * فَهُوَ فِي عِيشَةٍ رَاضِيَةٍ * وَأَمَّا مَنْ خَفَّتْ مَوَازِينُهُ * فَأُمُّهُ هَاوِيَةٌ * وَمَا أَدْرَاكَ مَا هِيَهْ * نَارٌ حَامِيَةٌ

ఎవరి త్రాసు పళ్ళాలు బరువుగా ఉంటాయో అతను మనసు మెచ్చిన భోగభాగ్యాలతో కూడిన జీవితంలో ఉంటాడు. మరెవరి త్రాసు పళ్ళాలు తేలికగా ఉంటాయో అతని నివాస స్థానం ‘హావియా’ అవుతుంది, అదేమిటో (హావియా అంటేమిటో) నీకేం తెలుసు? అది దహించివేసే అగ్ని. (ఖారిఅహ్ 101:6-11).

అనేక మంది ఇహలోకంలో ధనవంతులు కావాలనుకుంటారు, అందుకోసం తమ సిరిసంపదల పెంపుదల మరియు త్వరగా ఐశ్వర్యవంతులు అయ్యే సూచనలు సూచించే పుస్తకాలు ఎన్నుకొని శ్రద్ధగా చదువుతూ ఉండడం చూస్తుంటాము. అలాంటప్పుడు మనం కూడా ఎన్నటికీ అంతం కాని, దోచుకోబడని ధనం గురించి తెలుసుకోవడం చాలా మంచిది, ధనం సమకూర్చ- డానికి కాంక్షించే విధంగా సత్కార్యాలు సమకూర్చడానికి కాంక్షించాలి. ఇహలోక సంపద అంతం అవుతుంది, సదా ఉండదు, పరలోక సంపద శాశ్వాతమైనది, అంతం కానిది. ఇహలోకంతో పాటు పరలోకంలో కూడా మనం ధనికులవడం ఏ మాత్రం పాపం కాదు. అల్లాహ్ గొప్ప నిరపేక్షాపరుడు, ధనవంతుడు, ఉదారుడు.

నీవు త్వరగా పరలోక దనవంతుడివి కాదలచుకుంటే త్రాసును బరువుగా చేసే సత్కార్యాల వెంట పడాలి. అల్లాహ్ దయతో ఈ పుస్తకం నీ త్రాసును బరువుగా చేసే సత్కార్యాల వైపునకు నీకు దారి చూపుతుంది.

అందుకు ప్రతి ముస్లిం, విద్యనభ్యసించడం మరియు అభ్యసించిన విద్యను ఆచరణలోకి తీసుకురావడంలో అలసటకు, అశ్రద్ధకు గురికాకూడదు. ఎంతో మంది నీ ముందు ఉన్న ఈ పుస్తకంలోని ఘనతల పట్ల అజ్ఞానంలో ఉన్నారు, వాటిని తెలుసుకునే ప్రయత్నం కూడా చేయరు, వాటి గురించి ప్రశ్నించే, వెతికే ప్రయత్నమూ చేయరు. అందుకు అల్లాహ్ యొక్క గొప్ప వరం; అల్లాహ్ మనకు ధర్మం, సత్యం నేర్పాడు, దాని వైపునకు మార్గం చూపాడు, ఇక ఆ ధర్మం, సత్యం పట్ల మనకు సంపూర్ణ ప్రేమ కలగాలని, అది మన హృదయాలకు శోభాయమానంగా అవ్వాలని వాటిని ఎల్లవేళల్లో ఆచరణలో ఉంచుటకు అల్లాహ్ తో దుఆ చేయాలి, ఇది మనకు ఆ రోజు తప్పకుండా లాభాన్నిస్తుంది ఏ రోజయితే దుర్మార్గుడు, విద్య నేర్చుకోనివాడు, మరియు ఆచరించనివాడు తన చేతులను కొరుకుతూ ఇలా అంటాడు: అయ్యో! నేనీ పరలోక జీవితం కోసం ముందుగానే సత్కార్యాలు చేసుకొని ఉంటే ఎంత బావుండేది? ఇది గంభీరమైన (Serious) విషయం, పరిహాసం (Joke) కాదు, శాశ్వతంగా స్వర్గంలో లేదా శాశ్వతంగా నరకంలో ఉండవలసి ఉంటుంది. అల్లాహ్ ఆ నరకం నుండి మనందరినీ రక్షించుగాక!

1వ కార్యం: మాటల్లో, చేతల్లో సంకల్పశుద్ధి

ప్రతి కార్యానికి పునాది సంకల్పశుద్ధి. ఏ కార్యం  ఎంత సంకల్ఫశుద్ధితో కూడుకొని ఉంటుందో త్రాసులో అంతే బరువుగా ఉంటుంది, అది కొంచమైనా సరే. ఒకవేళ చూపుగోలు, పేరు, ప్రఖ్యాతులతో సమ్మిళితమై ఉంటే త్రాసు తేలికగా ఉంటుంది, అది ఎంత ఎక్కువగా అయినప్పటికీ సూక్ష్మకణాలుగా, దుమ్ము, ధూళివలే అయిపోతుంది (అంటే రవ్వంత పుణ్యం లభించదు). అల్లాహ్ సుబ్ హానహు వతఆలా వద్ద కర్మల ఘనత, వాటిని చేసేవారి మనస్సులో ఉండే సంకల్పశుద్ధిని మరియు వారిలో ఉండే అల్లాహ్ పట్ల ప్రేమను బట్టి పెరుగుతూ, తరుగుతూ ఉంటుంది.

عَنْ أَبِي أُمَامَةَ الْبَاهِلِيِّ t، قَالَ: جَاءَ رَجُلٌ إِلَى النَّبِيِّ ﷺ، فَقَالَ: أَرَأَيْتَ رَجُلًا غَزَا يَلْتَمِسُ الْأَجْرَ وَالذِّكْرَ، مَالَهُ؟ فَقَالَ رَسُولُ اللَّهِ ﷺ: لَا شَيْءَ لَهُ فَأَعَادَهَا ثَلَاثَ مَرَّاتٍ، يَقُولُ لَهُ رَسُولُ اللَّهِ ﷺ: لَا شَيْءَ لَهُ ثُمَّ قَالَ: إِنَّ اللهَ لَا يَقْبَلُ مِنَ الْعَمَلِ إِلَّا مَا كَانَ لَهُ خَالِصًا، وَابْتُغِيَ بِهِ وَجْهُهُ

అబూ ఉమామహ్ బాహిలీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు ఓ మనిషి వచ్చి, ‘ఒక వ్యక్తి పుణ్యఫలం మరియు పేరుప్రఖ్యాతులనుద్దేశించి పోరాడుతుంటే అతనికి ప్రాప్తమయ్యేదేమిటి?’ అని అడిగాడు. “అతనికి ఏ పుణ్యమూ దక్కదు” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమాధానమిచ్చారు. ఆ మనిషి తిరిగి మూడు సార్లు అదే ప్రశ్న అడిగాడు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “అతనికి ఏ పుణ్యమూ దక్కదు” అని మూడు సార్లు జవాబిచ్చారు, మళ్ళీ ఆ తర్వాత ఇలా చెప్పారుః “అల్లాహ్ సంకల్పశుద్ధితో, ఆయన అభీష్టాన్ని కోరుతూ చేసిన సత్కార్యాన్ని మాత్రమే స్వీకరిస్తాడు”. (నిసాయి 3140, తబ్రానీ కబీర్ 7628, సహీహుల్ జామి 1856).

అబ్దుల్లాహ్ బిన్ ముబారక్ రహిమహుల్లాహ్ చెప్పారుః ‘ఒక చిన్న కార్యాన్ని సంకల్పం గొప్పదిగా, పెద్దదిగా చేయవచ్చు, ఒక పెద్ద కార్యాన్ని సంకల్పం చిన్నదిగా చేయవచ్చు’. (జామిఉల్ ఉలూమి వల్ హికం, రచయితః ఇబ్ను రజబ్ అల్ హంబలీ 1/71).

మైమూన్ బిన్ మహ్రాన్ రహిమహుల్లాహ్ చెప్పారుః ‘మీ ఆచరణలు ఉన్నవే చాలా తక్కువ, ఆ తక్కువవాటిని సంకల్పశుద్ధితో ఆచరించండి’. (హిల్ యతుల్ ఔలియా వ తబ్ ఖతుల్ అస్ఫియా, రచయితః అబూ నుఐమ్ 4/92).

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా బోధించారని అబూ సఈద్ ఖుద్రీ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః

الصَّلَاةُ فِي جَمَاعَةٍ تَعْدِلُ خَمْسًا وَعِشْرِينَ صَلَاةً فَإِذَا صَلَّاهَا فِي فَلَاةٍ فَأَتَمَّ رُكُوعَهَا وَسُجُودَهَا بَلَغَتْ خَمْسِينَ صَلَاةً

“సామూహికంగా చేసే నమాజు (ఒంటరిగా చేసే) పాతిక నమాజులకు సమానంగా ఉంటుంది. ఒకవేళ అతను అదే నమాజు ఏదైనా ఎడారి ప్రాంతంలో చేస్తూ, రుకూ, సజ్దాలు సంపూర్ణంగా చేస్తే యాబై నమాజులకు సమానంగా చేరుతుంది”. (అబూదావూద్ 560, ఇబ్ను హిబ్బాన్ 1749, హాకిం 753, సహీహుల్ జామిః అల్బానీ 3871).

అతను (ఎడారిలో) ఒంటరిగా ఎందుకు నమాజు చేశాడు? నమాజు గురించి అతనికి గుర్తు చేయడానికి ఏ ముఅజ్జిన్ యొక్క అజాన్ మరియు తోటి స్నేహితుడు అంటూ లేడు? రుకూ, సజ్దాలు సంపూర్ణంగా, ఎంతో హుందాతనంతో, తృప్తిగా నమాజు చేశాడు? ఎందుకనగా అతడు సంకల్ఫశుద్ధితో, అల్లాహ్ కొరకు మాత్రమే చేశాడు, అల్లాహ్ అతడ్ని కనిపెట్టి ఉన్నాడన్న భావన కలిగి ఉన్నాడు అందుకే అతనికి అధిక రెట్లు ప్రతిఫలం లభించింది.

అందుకే సలమా బిన్ దీనార్ రహిమహుల్లాహ్ చెప్పారు: “నీవు నీ పాపాలను ఎంత గుప్తంగా చేస్తావో అంతకంటే ఎక్కువ గుప్తంగా పుణ్యకార్యాలు చేయు.” (హిల్యతుల్ ఔలియా వ తబ్ ఖతుల్ అస్ఫియాః అబూ నుఐమ్ 3/240).

అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారుః

بَيْنَمَا كَلْبٌ يُطِيفُ بِرَكِيَّةٍ، كَادَ يَقْتُلُهُ العَطَشُ، إِذْ رَأَتْهُ بَغِيٌّ مِنْ بَغَايَا بَنِي إِسْرَائِيلَ، فَنَزَعَتْ مُوقَهَا فَسَقَتْهُ فَغُفِرَ لَهَا بِهِ

“మరణావస్థకు చేరబోతున్న ఓ కుక్క ఒక బావి చుట్టూ తిరగసాగింది, ఇస్రాఈల్ సంతతికి చెందిన వ్యభిచారిణిల్లో ఒకామె ఆ కుక్కను చూసింది, వెంటనే తన కాలిజోడులో నీళ్ళు నింపి ఆ కుక్కకు త్రాగించింది. అందుకై ఆమెను మన్నించడం జరిగింది”. (బుఖారి పదాలు 3467, ముస్లిం 2245).

ఇబ్ను తైమియ రహిమహుల్లాహ్ ఇలా చెప్పారు: “స్వచ్ఛమైన విశ్వాసంతో ఆమె కుక్కకు త్రాగించింది. అందుకని క్షమించబడింది. అలా అని కుక్కకు నీళ్ళు త్రాగించే ప్రతి వ్యక్తి మన్నింపు జరగదు“. (మిన్ హాజ్…3/ 183, మదారిజ్…1/ 332).

పూర్తి భాగాలు క్రింద వినండి 

ప్రళయదినాన త్రాసులో తూకం చేయబడేటివి ఏమిటి? [మరణానంతర జీవితం – పార్ట్ 21 & 22] [ఆడియో & టెక్స్ట్]

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]

మరణాంతర జీవితం – పార్ట్ 21 & 22 [ఆడియో] [43:19 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

అస్సలాము అలైకుమ్ రహమతుల్లాహి వబరకాతుహు. అల్హందులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్ అమ్మాబాద్.. ఋజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం. మహాశయులారా, ఈనాటి శీర్షిక ప్రళయ దినాన త్రాసులో తూకం చేయబడేటివి ఏమిటి?

దీనికి సంబంధించిన ఖురాన్ ఆయతులు మరియు హదీసులను పరిశీలిస్తే, అందులో తూకం చేయబడేటివి మూడు విషయాలు అని మనకు తెలుస్తున్నాయి. మొదటిది, స్వయంగా మనిషిని కూడా తూకం చేయడం జరుగుతుంది. రెండవది, మనిషి యొక్క కర్మలను తూకం చేయడం జరుగుతుంది. మూడవది, మనిషి కర్మ పత్రాలు, వాటిని కూడా తూకం చేయడం జరుగుతుంది.

ఈ విషయాలు తెలుసుకోవడం ద్వారా మనకు లాభం ఏమిటి? లాభం ఏమిటంటే, ఈ మూడిటిలో ఏ ఒకటైనా గాని లేదా ఈ మూడిటిని కూడా తూకం చేయబడే సందర్భంలో, ఇంతకుముందే కొంచెం మనం తెలుసుకున్నట్లు, విశ్వాసం మరియు సత్కార్యాలు ఉన్నప్పుడే మన పల్యాలు బరువుగా ఉంటాయి. మరియు ఎవరి పల్యాలు బరువుగా ఉంటాయో వారే సాఫల్యం పొందుతారు. మరి ఎవరి పల్యాలు తేలికగా ఉంటాయో వారు నరకంలో చేరుతారు.

దీని గురించి ఆయతులు సూరె అన్ఆమ్ లో, సూరె అంబియాలో, సూరతుల్ ముఅ్‌మినూన్ లో మరియు అల్ ఖారిఆ సూరాలో ఉన్నాయి:

فَاَمَّا مَنْ ثَقُلَتْ مَوَازِيْنُهٗ فَهُوَ فِيْ عِيْشَةٍ رَّاضِيَةٍ
“ఎవరి కర్మ పళ్ళాలు బరువుగా ఉంటాయో అతను తనకు నచ్చిన, మెచ్చిన జీవితం గడుపుతూ ఉంటాడు స్వర్గంలో.”

وَاَمَّا مَنْ خَفَّتْ مَوَازِيْنُهٗ فَاُمُّهٗ هَاوِيَةٌ
“మరియు ఎవరి కర్మ పళ్ళాలు తేలికగా ఉంటాయో అతని స్థానం హావియా ఉంటుంది.”

وَمَآ اَدْرٰىكَ مَا هِيَهْ
“ఆ హావియా అంటే ఏమి తెలుసు నీకు?”

نَارٌ حَامِيَةٌ
“అది భగభగ మండే నరకాగ్ని.”

అల్లాహు అక్బర్. అల్లాహ్ మనందరినీ దాని నుండి రక్షించు గాక. ఇలాంటి విషయాలు తెలుసుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే ఒక దొంగ, ఇక్కడే దగ్గర ఎక్కడో కెమెరాలు ఉన్నాయి, పోలీసు వాళ్ళు కూడా తిరుగుతూ ఉన్నారు అని అర్థం అవుతుందో, అతడు దొంగతనానికి మరీ ప్రయత్నం చేస్తాడా? చేయడు కదా. అలాగే ఎల్లప్పుడూ ఆ సృష్టికర్త మనల్ని చూస్తూ ఉన్నాడు, కర్మ పత్రాల్లో మనం చేసే ప్రతి పని రాయబడుతూ ఉన్నది, రేపటి రోజు వీటన్నిటినీ కూడా తూకం చేయడం జరుగుతుంది—ఇలాంటి భయం ఎంత మనకు ఎక్కువగా ఉంటుందో, ఇలాంటి విషయాలు ఎంత మనకు ఎక్కువగా గుర్తుకు వస్తూ ఉంటాయో, అంతే మనం పాపాల నుండి దూరం ఉండి పుణ్యాలు చేయగలుగుతాము. ఈ పరలోకానికి సంబంధించిన, మరణానంతర జీవితానికి సంబంధించిన ఈ సబ్జెక్టులన్నీ కూడా ఇన్ని ఎపిసోడ్లు మీ ముందు తెలియజేయడానికి ముఖ్య కారణం కూడా ఏంటి? ఇహలోక జీవితం మనకు ఒకేసారి లభిస్తుంది. దీన్ని గనక మనం సద్వినియోగం చేసుకొని విశ్వాస మార్గం అవలంబించి సత్కార్యాలలో ఇంకా ముందుకు ఎగసిపోతూ ఉంటేనే మనకు లాభం ఉంటుంది లేదా అంటే మనం చాలా నష్టంలో పడిపోతాము.