మహాప్రవక్త ﷺ జీవిత చరిత్ర – హునైన్ యుద్ధం
https://youtu.be/ZX1VhZjtLe8
వక్త:సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)
[క్రింది విషయం ఖురాన్ కథామాలిక అనే పుస్తకం నుండి తీసుకోబడింది]
హునైన్ యుద్ధం జరిగిన రోజున అల్లాహ్ మిమ్మల్ని ఆదుకున్నాడు. ఆ సందర్భంగా మీరు మీ అధిక సంఖ్యపై గర్వపడ్డారు. కాని ఆ సంఖ్యాబలం మీకే విధంగానూ ప్రయోజనం కలిగించలేదు. భూమి విశాలంగా ఉండి కూడా మీకోసం ఇరుకై పోయింది. అప్పుడు మీరు వెన్ను చూపి మరలిపోయారు. ఆ తరువాత అల్లాహ్ తన ప్రవక్తపై, విశ్వాసులపై తన తరపు నుంచి స్థిమితాన్ని అవతరింపజేశాడు. మీకు కానరాని సేనలను పంపించాడు. సత్య తిరస్కారులను శిక్షించాడు. (9:25,26)
తాయిఫ్ నగరానికి మాజీ నాయ కుడు జురైజ్. ఆయన వయోవృద్ధుడు, అంధుడు. యుద్ధతంత్రాల గురించి ఆయనకు బాగా తెలుసు. ఆయన, ఒక ఒంటె మీద కూర్చొని ఉన్నాడు. సేవకుడు ఒంటె తోలుకొని వెళ్తున్నాడు. ప్రస్తుతం తాము ఏ ప్రదేశంలో ఉన్నామని ఆయన తన సేవకుణ్ణి అడిగాడు. అది ఔతాస్ ప్రదేశమని సేవకుడు చెప్పాడు. అక్కడే విడిది చేయమని జురైజ్ తన ప్రజలకు సలహా ఇచ్చాడు. ఆ ప్రదేశం కొండలేవీ లేకుండా, మరీ సమతలంగాను కాకుండా చాలా అనుకూలంగా ఉంది.
అక్కడికి కొద్దిదూరంలో ఆయనకు స్త్రీల, పిల్లల శబ్దాలు, జంతువుల అరుపులు వినిపించాయి. అక్కడ ఎవరున్నారని ఆయన తన సేవకుల్ని అడిగాడు. “మన కొత్త నాయకుడు మాలిక్ ప్రజలను యుద్ధానికి సమాయత్తం చేస్తున్నాడు. ధనసంపదల్ని, భార్యాబిడ్డల్ని సైతం వెంటబెట్టు కొని ఒక చోట సమావేశం అవమని ఆయన ప్రజలకు ఆదేశించాడు” అని సేవకులు జురైజ్ కు తెలిపారు. తనను ఆ కొత్త నాయకుని వద్దకు తీసుకువెళ్ళమని జురైజ్ సేవకుల్ని కోరాడు. సేవకులు ఆయన్ని మాలిక్ దగ్గరికి తీసుకు వెళ్ళారు. జురైజ్, మాలిక్ ను “ఏం జరుగుతుందిక్కడ?” అని అడిగాడు. దానికి మాలిక్ బదులిస్తూ, “ముహమ్మద్ ఎటువంటి ప్రతిఘటన ఎదురుకాకుండానే నిక్షేపంగా మక్కాలోకి ప్రవేశించాడు. మక్కా తర్వాత పెద్ద నగరం మాదే. కనుక భవిష్యత్తులో ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) మనపై కూడా దాడి చేయవచ్చు. హవాజిన్, నస్ర్, జుషామ్, సఖీఫ్ మొదలగు తాయిఫ్ తెగలన్నీ కూడా ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) మీద మెరుపుదాడి చేయాలని నిశ్చయించాయి” అని చెప్పాడు. అది విని జురైజ్, “మరయితే ఇక్కడ పశువుల అరుపులు, చిన్న పిల్లల ఏడుపులు ఎందుకు వినపడుతున్నాయి?” అని అడిగాడు. దానికి సమాధానమిస్తూ మాలిక్, “మనవాళ్లు ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) సైన్యాన్ని చూసి బెదిరిపోయి యుద్ధం చేయకుండా ఉంటారేమోనని నాకు భయంగా ఉంది. అందుకని నేను వారి స్త్రీలను, పిల్లలను యుద్ధ మైదానానికి వెంట తీసుకొచ్చాను. తమ భార్యాబిడ్డల్ని, సిరిసంపదల్ని కాపాడుకోవటానికి అయినా మన సైనికులు తప్పకుండా యుద్ధం చేయవలసి ఉంటుంది” అని చెప్పుకొచ్చాడు. దానికి జురైజ్ తల అడ్డంగా ఆడిస్తూ, “ఈ విషయంలో నేను నీతో ఏకీభవించలేను. మీరు ఓడిపోతే మీ భార్యాబిడ్డల ముందే అవమానం పాలవుతారు. కాబట్టి వీళ్లను యుద్ధమైదానం నుంచి పంపేయండి” అని సలహా ఇచ్చాడు. కాని మాలిక్ మాత్రం తల పొగరుతో, “నీవు ముసలోడివై పోయావు. యుద్ధ తంత్రాలకు సంబంధించి నీ విద్యలకు కాలం చెల్లింది. ఈ విషయాలను నువ్వు పట్టించుకోకు. ‘నీ కన్నా సమర్థవంతులే ఈ వ్యవహారా లను పర్యవేక్షిస్తున్నారు” అన్నాడు.
మొత్తానికి వారు ముస్లింలపై మెరుపుదాడి చేయటానికి గట్టిగా నిశ్చయించుకున్నారు.
ఓటమి తీరంలో…
మక్కాను జయించి మదీనాకు బయలుదేరారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం). మార్గ మధ్యంలో ఆయనకు కొన్ని తెగలు తమ మీద దాడి చేయటానికి పూనుకున్నాయన్న వార్త అందింది. మదీనాకు చేరుకున్న తర్వాత ఆయన ముస్లింలకు, ఆయుధాలు దింపవద్దని ఆదేశించారు. ప్రస్తుతం విశ్రాంతి తీసుకోవటానికి అవకాశం లేదని చెప్పారు. అరేబియాలో అవిశ్వాసులకు గట్టి పట్టు ఉన్న చివరి ప్రాంతం తాయిఫ్. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ముస్లిం సైన్యాలను అటు వైపు నడిపించారు. తన తెల్లటి కంచర గాడిదపై స్వారీ చేస్తూ ఉన్నారాయన.
దాని పేరు దుల్ దుల్. ముస్లింలు సూర్యాస్తమయానికి ముందే తాయిఫ్ నగరానికి దగ్గర్లోని హునైన్ పర్వతాల వద్దకు చేరుకున్నారు. అయితే హఠాత్తుగా అవిశ్వాసులు అన్ని వైపుల నుంచి ముస్లింలపై దాడి చేశారు. ఆ హఠాత్పరిణామానికి ముస్లింలు కకావికలయ్యారు. ముస్లిం సైన్యం ఛిన్నాభిన్నమైపోయింది. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆందోళనకు గురయ్యారు. కలసికట్టుగా పోరాడమని ముస్లింలను పిలిచారు. కాని ఆ స్థితిలో ఆయన మాటల్ని ఎవరూ పట్టించుకోలేదు. వెనక్కి తిరిగి చూస్తే అబూబక్ర్, ఉమర్, అలీ, అబూ సుఫ్యాన్, ఇంకా తన వంశస్తులు మరికొంత మంది మాత్రమే ఆయనకు కనిపించారు. అబూ సుఫ్యాన్ (రదియల్లాహు అన్హు) తన భావాలను అణచుకోలేకపోయారు. బిగ్గరగా అరుస్తూ, “అల్లాహ్ సాక్షి! ఇక మనం ఓడిపోయినట్లే. అవిశ్వాస సైన్యాలను సముద్ర కెరటాలే ఆపగల్గుతాయి” అన్నారు.
అటు శత్రువుల వైపు నుంచి హంబల్ కుమారుడు కలాదా గట్టిగా అరుస్తూ, “నేటితో ముహమ్మద్ మంత్రజాలం అంతమైపోతుంది” అన్నాడు. అన్సార్లనందరినీ తిరిగి కూడగట్టమని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అబ్బాస్ (రదియల్లాహు అన్హు)కు ఆదేశించారు. అబ్బాస్ (రదియల్లాహు అన్హు), “ఓ అన్సార్లారా!, దైవప్రవక్త కోసం ప్రాణార్పణకు సిద్ధపడ్డ వీరుల్లారా!, శత్రువులకు వ్యతిరేకంగా తనకు సహాయపడమని ఆయన మిమ్మల్ని పిలుస్తున్నారు” అని ఎలుగెత్తి ప్రకటించారు. అబ్బాస్ (రదియల్లాహు అన్హు) పిలుపు తమ కర్ణపుటాలకు తాకగానే అన్సార్ యోధులు, పారిపోతున్న వారల్లా వెనక్కి తిరిగి, “లబ్బైక్ యా రసూలల్లాహ్, లబ్బైక్ (దైవప్రవక్తా! వచ్చేస్తున్నాం)” అంటూ పరుగెత్తుకొచ్చారు. క్షణాల్లో ముస్లిం సైన్యం బారులు తీరింది. దృఢచిత్తులైన యోధులతో ముస్లిం సైన్యం అవిశ్వాసులపై ఉవ్వెత్తున ఎగిసిపడింది. ముస్లింల ధైర్యం అవిశ్వాసులకు సముద్రంలో తుఫానులా అగుపించింది. భయంతో ప్రాణాలు అరచేతిలో పట్టుకొని, వెంటతెచ్చిన సామగ్రినంతటిని వదలి పెట్టేసి, యుద్ధమైదానం నుంచి పలాయనం చిత్తగించారు అవిశ్వాసులు. (చదవండి, ఖుర్ఆన్ 9: 25)
తాయిఫ్ ముట్టడి
హునైన్ యుద్ధమైదానం నుంచి పారిపోయిన బనూ సఖీఫ్ తెగ తాయిఫ్ నగరంలోకి జొరబడింది. ఈ నగరంలో పటిష్టమైన కోటలెన్నో ఉన్నాయి. రక్షణ నిమిత్తం నగరం చుట్టూ ఎన్నో ప్రాకారాలు నిర్మించబడి ఉన్నాయి.
ముస్లిం సైనికులు వారిని వెంబడించారు, కాని వారు అప్పటికే తమ కోటల్లోకి వెళ్ళి దాక్కున్నారు. ఒక యేడాదికి సరిపోయే ఆహారం కూడా వారు ముందే కోటలో సమకూర్చుకొని పెట్టుకున్నారు. ముస్లిం సైనికులు సాహసం చేసి ప్రహరీ గోడలు దూకి లోనికి ప్రవేశించారు. కాని అవిశ్వాసులు పైనుంచి వారిపై ధారాపాతంగా బాణాల వర్షం కురిపించారు. దాని వల్ల ఎంతో మంది ముస్లింలు ప్రాణాలు కోల్పోయారు. అయినా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ముట్టడిని ఆపలేదు. పగలు, రేయి ఇరవై రోజుల వరకూ ఈ యుద్ధం కొనసాగింది.
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఒక చెక్క ట్యాంకును తయారు చేసి దాన్ని బండి చక్రాలపై బిగించారు. ప్రపంచంలో మొట్టమొదటి యుద్ధ ట్యాంకుగా దీన్ని చెప్పుకోవచ్చు. కొంత మంది సైనికులు ఆ ట్యాంకులో కూర్చున్నారు. తర్వాత ఆ ట్యాంకును ప్రాకారంలోనికి నెట్టటం జరిగింది. అయితే ప్రతిఘటించేవారు కూడా బాగా తెలివైనవారే. ఇనుమును బాగా కాల్చి మండుతున్న ఆ ఇనుప ముక్కల్ని వారు చెక్క ట్యాంకులపై విసరివేయసాగారు. కాలుతున్న చెక్క ట్యాంకుల నుంచి బయటపడి, పారిపోతూ వున్న ముస్లిం సైనికుల్ని శత్రువులు బాణాలతో ఏరివేయటం ప్రారంభించారు.
ఖర్జూర చెట్లను, ద్రాక్ష తోటల్ని నరికివేస్తామని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కోటలోని వారిని బెదిరించారు. దాని వల్ల మరుసటి యేడు శత్రువులకు ధాన్యపు గింజలు ఉండవు. అందుకు భయపడి శత్రువులు లొంగిపోతారేమోనని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆశించారు. అయితే బనూ సఖీఫ్ తెగవారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వద్దకు రాయబారం పంపించారు. చెట్లు రాతి నేలలో నాటబడి ఉన్నందున వాటిని గనక ఒకసారి ధ్వంసం చేస్తే మళ్లీ ఆ నేలలో చెట్లు పెరగవనీ, అలా చేయకుండా కేవలం పంట వరకు తీసుకోవలసిందని వారు దైవప్రవక్తను కోరారు. చెట్లు నరకటం వల్ల శాశ్వత నష్టం వాటిల్లుతుందని గ్రహించిన దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆ నిర్ణయం మానుకున్నారు.
తర్వాత దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మరో పద్ధతిలో దాడి చేయాలని నిర్ణయించారు. కోటపై నిప్పుల బాణాలు కురిపించి, మెరుపుదాడుల్లో తర్ఫీదైన సైనికుల్ని కోట పైకి వదలాలని అనుకున్నారు అయితే అంతలో ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు ఆ నగరంతో ప్రగాఢమైన అనుబంధం ఉంది, తాను ఒక నిస్సహాయ అనాధునిగా ఉన్నప్పుడు తనను పెంచి పోషించిన హలీమా దాది ఆ నగరంలోనే నివసించేవారు. ఆ విషయం గుర్తుకు రాగానే ఆయన మనసు ద్రవించిపోయింది.
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం), ఆయన సహచరులు ఇండ్ల నుంచి బయలుదేరి అప్పటికి రెండు మాసాలు గడిచిపోయాయి. త్వరలో జుల్ ఖాదా నెల కూడా ప్రారంభం కానుంది. ఆ నెలలో యుద్ధం చేయటం నిషిద్దం. అందుకని దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఒక నిర్ణయానికి వచ్చారు. శత్రువులకు ఓ సందేశం పంపిస్తూ తాము తాయిఫ్ ముట్టడిని ఎత్తివేస్తున్నామనీ, ఈ విషయమై చర్చించటానికి ఒక ప్రతినిధి బృందాన్ని పంపమని ఆ సందేశంలో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) శత్రువులను కోశారు. అక్కణ్ణుంచి బయలుదేరే ముందు శత్రువుల నగరంపై శాపం పెట్టమని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను సహచరులు కోరారు. కాని ఆయన మాత్రం, తాయిఫ్ వాసులకు సత్యాన్ని గ్రహించే సద్బుద్ధిని ప్రసాదించమని అల్లాహ్ ను ప్రార్థించారు.
ముస్లింలు మరుసటి సంవత్సరం తిరిగొచ్చి తమ చెట్లను నరికివేశారంటే ఇక తమకు చావు తప్పదని గ్రహించిన శత్రువులు, ముస్లింలపై దాడి చేయటం, వారిని ఎదిరించటం సముచితం కాదని భావించారు. ఇరువర్గాల మధ్య ఒక ఒప్పందం తీసుకువచ్చే విషయమై చర్చించేందుకు తమ ప్రతినిధి బృందాన్ని మదీనా పంపించారు. వారి రాక గురించి తెలుసుకొని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఎంతో సంతోషించారు.
బనూ సఖీఫ్ బృందం మదీనా నగరానికి చేరుకుంది. చూస్తే అక్కడి ప్రజలందరూ ముస్లింలుగా మారి ఉన్నారు. వారి మొండితనం మెత్తబడింది. ఇప్పుడిక తాము ముస్లింల ముందు లొంగిపోవటమే సముచిత మని భావించారు వారు. కాని ఒక షరతు మీద ఇస్లాంలోకి ప్రవేశించాలని వారు భావించారు. మూడు సంవత్సరాల వరకు తమ విగ్రహాలను పూజించుకోవటానికి అనుమతి ఇవ్వాలని వారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను కోరారు. కాని దైవప్రభక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారి ఈ షరతును అంగీకరించలేదు. కనీసం ఒక్క సంవత్సరమైనా పూజించు కోనివ్వాలని వారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను బ్రతిమాలారు. కాని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ససేమిరా అన్నారు. కనీసం ఆరు నెలల కోసమైనా అనుమతించండి దైవప్రవక్తా! అని విన్నవించుకున్నారు. అప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం), తౌహీద్ (ఏకదైవారాధన) విషయంలో ఎట్టి పరిస్థితిలోనూ తాను రాజీపడేదిలేదని, ఖరాకండిగా చెప్పేశారు. ఎట్టకేలకు తాయిఫ్ వాసులు లొంగిపోయారు.
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తాయిఫ్ వాసుల పట్ల ఎంతో కరుణావాత్సల్యాలతో వ్యవహరించారు. హునైన్ యుద్ధంలో పట్టుబడిన వారి బందీలను విడుదల చేశారు. ఒకప్పుడు తాయిఫ్ వాసులు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను రాళ్లతో కొట్టి ఆయన రక్తం కళ్లచూశారు. తనకు సహాయం చేయమని కోరటానికి వెళితే అత్యంత పరాభవ స్థితిలో నగరం నుంచి వెడలగొట్టారు. అయినా కూడా ప్రస్తుతం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అవేవీ పట్టించుకోలేదు, బేషరతుగా వారి బందీలను విడిచి పెట్టారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అవలంబించిన ఉదార వైఖరి వారి మనసుల్ని చాలా ప్రభావితం చేసింది. వారి మనసులు ఇస్లాం వైపు మొగ్గాయి. వారందరూ దృఢమైన ముస్లింలుగా మారిపోయారు.
గ్రహించవలసిన పాఠాలు
విధ్వంసంతో కూడిన విజయం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆశయం కాదు. యుద్ధ సమయంలో ఆయన మనుషులనే కాదు, వృక్షజాతి సంక్షేమాన్ని కూడా దృష్టిలో పెట్టుకున్నారు. తాయిఫ్ నగరాన్ని చూడగానే ఆయనకు తన బాల్యం గుర్తుకు వచ్చింది. చిన్నతనంలో తనను అల్లారుముద్దుగా పెంచిన ‘హలీమా అమ్మ’ ఆ నగరంలోనే నివసించేదని గుర్తుకురాగానే ఆయన హృదయం ద్రవించిపోయింది. వెంటనే ఆయన యుద్ధ తంత్రంలో మార్పులు చేసుకున్నారు.
ప్రాణ శత్రువులను సైతం శపించకుండా, వారు సన్మార్గంపైకి రావాలని ప్రార్ధించటం ఆయన ఔదార్యాన్ని చాటిచెబుతోంది.
తౌహీద్ విషయంలో ఎన్నటికీ రాజీపడకూడదు.
శత్రువులు వ్యక్తిగతంగా తనను ఎంతో బాధపెట్టారు. అయినప్పటికీ దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారి మీద ప్రతీకారం తీర్చుకోలేదు. పైగా వారిపట్ల కరుణా వాత్సల్యాలతోనే వ్యవహరించారు. ఫలితంగా ప్రాణశత్రువులు సైతం ప్రాణ మిత్రులుగా మారి ఇస్లాంలో దృఢవిశ్వాసులుగా రాణించారు.
—
ఖురాన్ కథామాలిక – మూలం: షేఖ్ అబూబకర్ నజార్
Qur’an Katha Maalika – Selected Stories from Qur’an (Telugu)
తెలుగు అనువాదం: అబ్దుల్ వాహెద్ & హాఫిజ్ ఎస్. ఎమ్. రసూల్ షర్ఫీ
శాంతి మార్గం పబ్లికేషన్ ట్రస్ట్,హైదరాబాద్
https://teluguislam.net/2022/11/12/stories-from-the-quran/

![ఇస్లాం మెచ్చిన మహిళలు [పుస్తకం]
సంకలనం: మౌలానా ముహమ్మద్ తఖీయుద్దీన్(రహిమహుల్లాహ్)
అనువాదం: ఇఖ్బాల్ అహ్మద్
అల్ హఖ్ తెలుగు పబ్లికేషన్స్, హైదరాబాద్ -500059.](https://teluguislam.net/wp-content/uploads/2025/06/islam-mechina-mahilalu.jpg?w=713)
![కట్నం కోసం అమ్ముడుపోయే మగాళ్ళు [పుస్తకం] Dowry - Vara Katnam](https://teluguislam.net/wp-content/uploads/2025/06/vara-katnam-dowry.jpg?w=799)
You must be logged in to post a comment.