దైవ ప్రవక్త ﷺ మహత్యం , అద్భుతాలు మరియు ప్రత్యేకతలు | జాదుల్ ఖతీబ్

ఖత్బా యందలి ముఖ్యాంశాలు:

  • 1) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మహత్యం
  • 2) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) గారి పలు అద్భుతాలు
  • 3) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రత్యేకతలు

[ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి]
https://bit.ly/greatness-miracles-of-the-holy-prophet
[PDF [32 పేజీలు]

మొదటి ఖుత్బా 

ఇస్లామీయ సహోదరులారా! 

దైవప్రవక్తలలో శ్రేష్టులయిన దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇస్మాయీల్ బిన్ ఇబ్రాహీం (అలైహిస్సలాం) వంశంలో జన్మించారు. ఆయన అల్లాహ్ దాసులు మరియు అంతిమ దైవప్రవక్త. ప్రళయం వరకు రాబోయే మానవులందరి కోసం ఆయనను ప్రవక్తగా చేసి పంపడం జరిగింది. ఆయన రాకతో దైవప్రవక్తల పరంపర సమాప్తమయ్యింది. ఆయన ఇతర ప్రవక్తలపై విశిష్టత మరియు ఆధిక్యతను పొందివున్నారు. ఇలాగే ఆయన ఉమ్మత్ స్థాయి కూడా ఇతర ఉమ్మత్ (అనుచర సమాజం)ల కన్నా ఎక్కువగా వుంది. ఆయన విధేయతను అల్లాహ్ తప్పనిసరి చేశాడు. ఆయనకు గల ప్రత్యేకతలు ఇతర ప్రవక్తలకు లేవు. వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకొని రండి! మన ప్రియ దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) గారి మహత్యం, ఆయన అద్భుతాలు మరియు 

కొన్ని ప్రత్యేకతలను గూర్చి తెలుసుకొందాం. 

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) స్థాయి మరియు ఆయన విశిష్టత 

1) శ్రేష్ట వంశము 

తన వంశము (కుటుంబం) రీత్యా దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఎంతో ఉన్నత స్థానం కలిగి వున్నారు. 

ఈ విషయాన్నే వాయిలా బిన్ అసఖా (రదియల్లాహు అన్హు, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ద్వారా ఇలా ఉల్లేఖించారు: 

నిస్సందేహంగా అల్లాహ్, ఇస్మాయీల్ (అలైహిస్సలాం) సంతానంలో ‘కనాన’ ను ఎన్నుకున్నాడు. తదుపరి ‘కనాన’ నుండి ఖురైష్ ను, వారి నుండి బనూ హాషిమ్ ను ఎన్నుకున్నాడు. బనూ హాషిమ్ నుండి నన్ను ఎన్నుకున్నాడు.” (సహీ ముస్లిం : 2276) 

ఇలాగే, రోము చక్రవర్తి (హెరిక్లెస్), అబూసుఫ్యాన్ (అప్పటి వరకు ఆయన ఇంకా ముస్లిం కాలేదు)ను దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వంశావళిని గూర్చి అడగ్గా – ఆయన జవాబిస్తూ, “అతను మాలో ఎంతో ఉన్నతమైన వంశానికి చెందిన వ్యక్తి” అని అన్నారు. దీని పై హెరిక్లెస్ స్పందిస్తూ – దైవప్రవక్తలు (సాధారణంగా) తమ జాతుల్లోని ఉన్నత వంశానికి చెందినవారై వుంటారు అని అన్నాడు. (సహీ బుఖారీ : 7, సహీ ముస్లిం : 1773) 

2) మానవాళి కొరకు గొప్ప కటాక్షం 

వాస్తవానికి మానవాళి పై అల్లాహ్ ఉపకారాలు లెక్కలేనంతగా వున్నాయి. కానీ వాటిలో అన్నింటి కన్నా ప్రత్యేక ఉపకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆగమనం. ఈ విషయాన్ని అల్లాహ్ దివ్య ఖుర్ఆన్ లో ఇలా సెలవిచ్చాడు: 

“అల్లాహ్ విశ్వాసులకు చేసిన మహోపకారం ఏమిటంటే – ఆయన, వారిలోనుండే ఒక ప్రవక్తను ఎన్నుకొని వారి వద్దకు పంపాడు. అతడు వారికి ఆయన వాక్యాలను చదివి వినిపిస్తాడు, వారిని పరిశుద్దుల్ని చేస్తాడు. వారికి గ్రంథజ్ఞానాన్ని, వివేకాన్ని బోధిస్తాడు. నిశ్చయంగా అంతకు ముందు వాళ్ళు స్పష్టమైన అపమార్గానికి లోనై వున్నారు.” (ఆలి ఇమ్రాన్ : 164) 

ఈ ఆయత్ లో అల్లాహ్ సెలవిచ్చినట్లు, దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు దైవదౌత్య బాధ్యతలు అప్పగించబడ్డ సమయంలో మానవ జాతి స్పష్టమైన అపమార్గానికి లోనై అజ్ఞానపు అంధకార లోయలలో కొట్టుమిట్టాడుతోంది. ఈ తరుణంలో అల్లాహ్ వారి వద్దకు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను పంపి, వారిని అంధకారం నుండి బయటకు తీసి, ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ద్వారా వారిని రుజుమార్గం వైపునకు దారి చూపాడు. ఇలా, దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సర్వ మానవాళి కొరకు ఒక కారుణ్యంగా వున్నారు. 

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: 

“మేము నిన్ను సమస్త లోకవాసుల కోసం కారుణ్యంగా చేసి పంపాము.” (అంబియా : 107) 

అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు. 

“ప్రజలారా! నేను ప్రజల కొరకు (అల్లాహ్ తరఫు నుండి) బహుమానంగా పంపబడిన కారుణ్యాన్ని”

(హాకిమ్: 1/91 – సహీ) 

3. వెలుగును విరజిమ్మే దీపం 

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహివ సల్లం)ను అల్లాహ్ ‘వెలుగును విరజిమ్మే దీపం‘ గా ఖరారు చేశాడు. దీపం ద్వారా అంధకారం దూరమైనట్లే, ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ద్వారా షిర్క్ (బహుదైవారాధన) మరియు కుఫ్ (దైవ తిరస్కారం)ల అంధకారాలు దూరమవుతాయి. 

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: 

“ఓ ప్రవక్తా! మేమే నిన్ను (ప్రవక్తగా ఎన్నుకొని)సాక్ష్యమిచ్చే వానిగా, శుభవార్తలు వినిపించే వానిగా, హెచ్చరించే వానిగా చేసి పంపాము. ఇంకా, అల్లాహ్ ఆజ్ఞచే ఆయన వైపునకు పిలిచేవానిగా, వెలుగును విరజిమ్మే దీపంగా (చేసి పంపాము)”.  (అహిజాబ్ : 45-46) 

4) దయామయులు 

దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తన అనుచర సమాజానికి ఎంతో దయామయులు. అల్లాహ్ ఆయన గుణాలలో కొన్నిటిని గూర్చి వివరిస్తూ ఇలా సెలవిచ్చా డు: 

“మీ దగ్గరకు స్వయంగా మీలోనుంచే ఒక ప్రవక్త వచ్చాడు. మీకు కష్టం కలిగించే ప్రతీదీ అతనికి బాధ కలిగిస్తుంది. అతను మీ మేలును ఎంతగానో కోరుకుంటాడు. విశ్వాసుల యెడల అతను వాత్సల్యం కలవాడు, దయామయుడు.” (తౌబా : 128) 

ఈ ఆయత్ లో అల్లాహ్, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) గారి నాలుగు ఉత్తమ గుణాలను గూర్చి వివరించాడు. 

మొదటిది: ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఒక మనిషి.ఇంకో ఆయత్ లో ఇలా సెలవిచ్చాడు:

“(ఓ ప్రవక్తా!) వారికిలా చెప్పు: నేనూ మీలాంటి మానవ మాత్రుళ్లే. (కాకపోతే) “మీ అందరి ఆరాధ్యదైవం ఒకే ఆరాధ్యదైవం’ అన్న సందేశం (వక్త) నా వద్దకు పంపబడుతుంది.” (కహఫ్: 110) 

ఇంకా, ఇలా సెలవిచ్చాడు: 

“(ఓ ప్రవక్తా)! వారికి చెప్పు: నా ప్రభువు పవిత్రుడు. నేను ప్రవక్తగా పంపబడిన ఒక మానవమాత్రుణ్ణి మాత్రమే.” (బనీ ఇస్రాయీల్ : 93) 

రెండవది: మీకు కలిగే ప్రతి కష్టమూ ఆయనకు బాధ కలిగిస్తుంది. అందుకే ఆయన, ధర్మంలో సరళతను, సౌలభ్యాన్ని కోరుకునే వారు మరియు ఉమ్మతకు కష్టం కలుగుతుందేమో అని ఊహించిన విషయాలను విడిచి పెట్టేవారు. దీని గురించి ఎన్నో ఉదాహరణలు వున్నాయి. వాటిలో 

ఒకటి – మేరాజ్ యాత్రలో అల్లాహ్ 50 నమాజులను విధిగా ఖరారు చేసినప్పుడు, ఆయన అల్లాహ్ తో, దీని తగ్గింపుకై విన్నవించుకున్నారు. తత్ఫలితంగా కేవలం 5 నమాజులు విధిగా వుండిపోయాయి. 

రెండవది – ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) తరావీహ్ నమాజును మూడు రాత్రులు సామూహికంగా పాటించారు. నాలుగవ రాత్రి దాన్ని త్యజించి ఇలా సెలవిచ్చారు. ఇది (తరావీహ్ నమాజు) మీపై విధి (ఫర్జ్)గా ఖరారు చేయబడుతుందేమోనన్న అనుమానం నాకు కలిగింది. 

మూడవది: ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు: “ఒకవేళ నాకు, ఉమ్మత్ కష్టానికి గురవుతుందేమో అన్న అనుమానం కలగకపోయుంటే నేను ఉమ్మత్ కు, ప్రతి నమాజుకు పూర్వం మిస్వాక్ చేయమని ఆదేశించే వాడిని.” 

ఈ మూడు ఉదాహరణలు (ఇవేగాక ఇలాంటి ఎన్నో ఉదాహరణలు) ద్వారా రూఢీ అయ్యే విషయం ఏమిటంటే – దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కు తన ఉమ్మత్ కష్టాలకు గురికావడం అస్సలు ఇష్టం లేదు, ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా కూడా సెలవిచ్చారు: 

“నిశ్చయంగా ధర్మం సులభతరమైనది. ధర్మంలో కష్టం కలుగ జేసుకొనే వాడు తన శక్తికి మించి ఆరాధించడానికి ప్రయత్నిస్తాడు. కానీ, ధర్మం అతనిపై ప్రాబల్యం వహిస్తుంది. అందుకే మీరు మధ్యేమార్గాన్ని అనుసరించండి. ఒకవేళ ఏ ఆరాధన అయినా సంపూర్ణంగా చేయలేకపోతే, కనీసం దాని దరిదాపుల వరకైనా తప్పనిసరిగా చేయండి. ఆరాధనా ప్రతిఫలాన్ని గూర్చి సంతోషించండి. ఉదయం, సాయంత్రం మరియు రాత్రి చివరి ఘడియల్లో అల్లాహ్ ను ఆరాధించి ఆయన సహాయాన్ని అర్థించండి.” (సహీ బుఖారీ : 39) 

ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం), ముఆజ్, అబూ మూసా అష్ అరీ (రదియల్లాహు అన్హుమ్) లను ఇస్లామ్ సందేశ ప్రచార నిమిత్తం యమన్ వైపునకు పంపేటప్పుడు ఇలా ఉపదేశించారు: 

“ప్రజలకు సౌలభ్యం కలుగజేయండి, వారిని కష్టాలకు, బాధలకు గురి చెయ్యకండి. వారికి శుభవార్తలు యివ్వండి. ధర్మం పట్ల (వారిలో) ద్వేషాన్ని కలుగజేయకండి. ఇద్దరూ కలిసిమెలిసి శ్రమించండి. విభేధాలకు గురి కాకండి.” (సహీ బుఖారీ : 3038) 

మూడవ గుణం ఏమిటంటే: 

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)- మీ సన్మార్గం, ఇహపరలోక ప్రయోజనాలను కాంక్షిస్తారు మరియు మీరు నరకంలోకి వెళ్ళడం ఆయనకు సుతరామూ ఇష్టం లేదు. అందుకే దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు: 

“నిశ్చయంగా, ప్రజలు మరియు నన్ను గురించిన ఉదాహరణ ఎలాంటి వ్యక్తి లాంటిదంటే – ఆ వ్యక్తి అగ్ని రాజేసాడు, అది తన పరిసరాలన్నింటినీ ప్రకాశవంతం చేయగా ఆ అగ్నిలోకే దీపం పురుగులు, ఇతర కీటకాలు దూకుతుంటాయి. అగ్నిరాజేసిన వ్యక్తి మటుకు, వాటిని మంటల్లో పడకుండా దూరంగా తరుముతూ వుంటాడు. కానీ, అవి మాత్రం అతనిపై ప్రాబల్యం పొంది అగ్నిలోకి దూకుతాయి. ఇలా, నేను కూడా మీ నడుం పట్టి మిమ్మల్ని నరకాగ్ని నుండి దూరంగా లాగుతాను. కానీ, (మీరుమాత్రం నన్ను వదిలించుకొని) బలవంతంగా పోయి నరకాగ్నిలోకి ప్రవేశిస్తారు.” (సహీ బుఖారీ : 6483, సహీ ముస్లిం : 2284) 

నాల్గవ గుణం ఏమిటంటే: 

ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) అత్యంత దయామయులు. ఈ విషయంలో కూడా ఎన్నో ఉదాహరణలను పేర్కొనవచ్చు. ఇక్కడ మేము కేవలం మూడింటితో సరిపెడుతున్నాం: 

1) అనస్ (రదియల్లాహు అన్హు కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు: 

“నేను నమాజ్ కోసం నిలబడినప్పుడు నా సంకల్పం దానిని పొడిగించాలని వుంటుంది. కానీ ఏదైనా పిల్లవాడి ఏడుపు వినగానే నమాజ్ ను సంక్షిప్తం చేసేస్తాను. ఎందుకంటే – పిల్లవాడి ఏడుపు మూలంగా అతని తల్లి గాబరా పడుతుందని నాకు తెలుసు.” (సహీ బుఖారీ : 709, సహీ ముస్లిం : 470) 

2) ఆయెషా (రజి అల్లాహు అన్ష) కథనం ప్రకారం, కొంత మంది పల్లెవాసులు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సన్నిధికొచ్చి – మీరు మీ పిల్లలను ముద్దాడుతారా? అని అడిగా. దైవప్రవక్త మరియు ఆయన సహచరులు ‘అవును’ అని బదులిచ్చారు. దీనిపై వారు – ‘అల్లాహ్ సాక్షి! మేము మా పిల్లలను ముద్దాడము’ అని పలికారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) స్పందిస్తూ : అల్లాహ్ ఒకవేళ మీ హృదయాల్లో నుండి కారుణ్యాన్ని లాక్కుంటే దానికి నేనేం చేయను? అని అన్నారు. (సహీ బుఖారీ : 5998, సహీ ముస్లిం : 2317) 

3) అబ్దుల్లా బిన్ అమ్ బిన్ ఆస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహివ సల్లం), ఇబ్రాహీం (అలైహిస్సలాం) గురించి అల్లాహ్ అవతరింప జేసిన ఆయత్ “నా ప్రభూ! అవి (విగ్రహాలు) ఎంతో మందిని పెడదారి పట్టించాయి. కనుక నన్ను అనుసరించిన వాడే నావాడు, కానీ ఎవడైనా అవిధేయత చూపితే నువ్వు అమితంగా క్షమించేవాడవు, కనికరించేవాడవు.” (ఇబ్రాహీం : 36) 

మరియు ఈసా (అలైహిస్సలాం) గురించి అవతరింపజేసిన ఆయత్ “ఒకవేళ నీవు వారిని శిక్షించినట్లయితే, వారు నీ దాసులు. నీవు గనక వారిని క్షమించినట్లయితే నిశ్చయంగా నీవు సర్వాధిక్యుడవు, వివేచనాపరుడవు.” (మాయిదా : 118) లను పఠించి, తదుపరి తన చేతులను పైకెత్తి ఇలా ప్రార్థించారు: 

“ఓ అల్లాహ్! నా అనుచర సమాజం, నా అనుచర సమాజం!” తదుపరి ఏడ్వడం ప్రారంభించారు. 

దీనిపై అల్లాహ్, జిబ్రయీల్ (అలైహిస్సలాం)తో : ఓ జిబ్రాయీల్! వెళ్ళు – వెళ్ళి, ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను అడుగు, ఎందుకు ఏడుస్తున్నారో? అని ఆదేశించాడు. వాస్తవానికి నీ ప్రభువుకు బాగా తెలుసు, ఆయన ఎందుకు ఏడుస్తున్నారో. జిబ్రయీల్ (అలైహిస్సలాం) వచ్చి, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను “మీరెందుకు ఏడుస్తున్నారు?” అని అడిగారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆయనకు అంతా వివరించారు. అది తీసుకొని జిబ్రయీల్ (అలైహిస్సలాం) అల్లాహ్ కు తెలియజేశారు. వాస్తవానికి అల్లాహు అంతా తెలుసు. దీనిపై అల్లాహ్, జిబ్రయీల్ (అలైహిస్సలాం)ను ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం)వద్దకు ఈ సందేశం ఇచ్చి పంపించాడు. 

“మేము మీకు మీ అనుచరసమాజం విషయంలో సంతృప్తి పరుస్తాం మరియు మీకు కష్టాన్ని కలుగజేయం.” (సహీ ముస్లిం : 346) 

ఈ మూడు హదీసులు, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఎంతో దయామయులు అని అనడానికి ప్రబల నిదర్శనం. 

5) తౌరాత్ మరియు ఇంజీల్ లో దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) గుణగణాల వివరణ 

దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) గారి గుణ విశేషాలు కేవలం దివ్య ఖుర్ఆన్ లోనే కాదు, తౌరాత్, ఇంజీల్లో కూడా ఆయనను ప్రశంసించడం జరిగింది. 

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: 

“ఈ సందేశహరుణ్ణి, నిరక్షరాసి అయిన ఈ ప్రవక్తను అనుసరించేవారు (కరుణించబడతారు). అతని ప్రస్తావన వారికి తమ వద్ద ఉన్న తౌరాతు, ఇంజీలు గ్రంథాలలో లిఖితపూర్వంగా లభిస్తుంది. ఆ ప్రవక్త మంచిని చెయ్యమని వారికి ఆదేశిస్తాడు, చెడుల నుంచి వారిస్తాడు. పరిశుద్ధ వస్తువులను ధర్మసమ్మతంగా ప్రకటిస్తాడు. అశుద్ధమైన వాటిని నిషిద్ధంగా ఖరారు చేస్తాడు. వారిపై వున్న బరువులను దించుతాడు. వారికి వేయబడి వున్న సంకెళ్ళను (విప్పుతాడు). కనుక ఎవరు ఈ ప్రవక్తను విశ్వసించి అతనికి సహాయకులుగా నిలుస్తారో, తోడ్పాటునందిస్తారో, ఇంకా ఆయనతో పాటు పంపడిన జ్యోతిని అనుసరిస్తారో వారే సాఫల్యం పొందేవారు.” (ఆరాఫ్ : 157) 

6) ఇబ్రాహీం (అలైహిస్సలాం) ప్రార్థన మరియు ఈసా (అలైహిస్సలాం) ఇచ్చిన శుభవార్తల ఫలితము 

ఇబ్రాహీం (అలైహిస్సలాం) ప్రార్థన మరియు ఈసా (అలైహిస్సలాం) ఇచ్చిన శుభవార్తల ఫలితమే దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆగమనం. దీని గురించి ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు: 

“నేను ఇబ్రాహీం (అలైహిస్సలాం) ప్రార్థనను మరియు అందరికన్నా ఆఖరుగా నా ఆగమనాన్ని గూర్చి ఈసా (అలైహిస్సలాం) శుభవార్త నందించారు..”  (సహీ ఉల్ జామె అల్ బానీ : 1463) 

ఇబ్రాహీం (అలైహిస్సలాం) కాబా నిర్మాణం పూర్తి చేసిన తర్వాత ఎన్నో ప్రార్థనలు చేశారు. వాటిలో ఒకటి ఇది: 

“ఓ మా ప్రభూ! నీ వాక్యాలను వారికి చదివి వినిపించే, గ్రంథజ్ఞానాన్ని నేర్పించే, విజ్ఞతా వివేచనలను విడమరిచి చెప్పే, వారిని పరిశుద్ధ పరచే ఒక ప్రవక్తను స్వయంగా వారి జాతి నుంచే వారిలో ప్రభవింపజెయ్యి. నిస్సందేహంగా నీవు సర్వాధికుడవు, వివేకవంతుడువు.” (బఖర : 129) 

ఇబ్రాహీం (అలైహిస్సలాం) గారి ఈ ప్రార్ధనను అల్లాహ్ స్వీకరించి, ఇస్మాయీల్ (అలైహిస్సలాం) సంతానం (వంశం)లో ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ను ప్రభవింపజేశాడు. 

ఇక, ఈసా (అలైహిస్సలాం) గారిచ్చిన శుభవార్తను గూర్చి అల్లాహ్ ఇలా సెలవిచ్చా డు: 

“మర్యమ్ కుమారుడైన ఈసా, (తన జాతి వారితో) ఓ ఇస్రాయీలు సంతతివారలారా! నేను మీ వైపునకు అల్లాహ్ తరపున పంపబడిన ప్రవక్తను. నాకు పూర్వం వచ్చిన తౌరాతు గ్రంథాన్ని ధృవపరుస్తున్నాను మరియు నా తరువాత రాబోయే ఒక ప్రవక్తను గూర్చి శుభవార్తను ఇస్తున్నాను. అతని పేరు ‘అహ్మద్’ అని చెప్పినప్పటి సంగతి (కూడా స్మరించదగినదే).” (సఫ్: 6) 

ఒక కవి ఎంత చక్కగా వర్ణించాడో! 

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈసా (అలైహిస్సలాం) గారి శుభవార్త, కలీముల్లాహ్ మూసా (అలైహిస్సలాం) గారి హితోపదేశం, ఇబ్రాహీం (అలైహిస్సలాం) కాబా వద్ద చేసిన ప్రార్థన. ఇలా పూర్వకాలం నుండి ప్రవక్తలు, సందేశహరులందరూ ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను గురించి శుభవార్త ఇస్తూనే వచ్చారు. 

7) అల్లాహ్ సంస్మరణం తో పాటు ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) స్మరణం 

దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు అల్లాహ్ ఎంతో ఉన్నతమైన స్థానాన్ని ప్రసాదించాడు. అందుకే, అల్లాహ్ ను స్మరించేటప్పుడు దైవప్రవక్త – (సల్లల్లాహు అలైహి వ సల్లం) స్మరణం కూడా వస్తుంది. సద్వచన (కలిమా) సాక్ష్యం, అజాన్, ఇఖామత్, ఖుత్బా, తషహుద్ మరియు ఇతర ఎన్నో సందర్భాల్లో అల్లాహ్ పేరుతో పాటు ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) పేరు కూడా తీసుకోబడుతుంది. దైవప్రవక్తలు, దైవదూతలలో కూడా అల్లాహ్ ఆయనకు ఔన్నత్యాన్ని ప్రసాదించాడు. ఇహపరలోకాల్లో కూడా ఆయన పేరును చర్చించాడు. 

ఇవన్నీ ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) గొప్పతనానికి, ఔన్నత్యానికీ నిదర్శనాలు. 

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: 

“(ఓ ముహమ్మద్)! ఏమిటి, మేము నీ హృదయాన్ని నీ కోసం తెరవలేదా? ఇంకా నీ మీది నుంచి నీ భారాన్ని కూడా మేము దించేశాము. అది నీ వీపును విరిచేస్తూ వుండేది. ఇంకా – మేము నీ కీర్తిని ఉన్నతం చేశాము.” (అష్ షరహ్ : 1-4) 

హుస్సాన్ (రదియల్లాహు అన్హు) ఎంత గొప్పగా వర్ణించారో! 

అల్లాహ్, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) పేరును తన పేరుతో జత చేసేశాడు. ఇక, ముఅజ్జిన్ (అజాన్ పలికే వ్యక్తి) (ప్రతిరోజూ) ఐదు సార్లు అజాన్ పలుకుతూ “అష్ హదు” అని అంటాడు మరియు అల్లాహ్ తన పేరుతోపాటు ఆయన పేరును కలిపాడు, తద్వారా ఆయన్ను గౌరవించాలని. అందుకే అర్ద్ వాసుడు (అల్లాహ్) ‘మహమూద్’ అయితే, ఈయన ‘ముహమ్మద్’ (సల్లల్లాహు అలైహి వ సల్లం). 

8) దైవ ప్రవక్తల వాగ్దానం 

అల్లాహ్, దైవ ప్రవక్తలందరితో – ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను విశ్వసించాలని, ఆయనను బలపరిచి, సహాయపడాలని వాగ్దానం తీసుకున్నాడు. అందుకే, ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను, ఒకవేళ, వారి కాలంలో ప్రభవింపజేసి వుంటే, వారిక్కూడా ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు విధేయత చూపడం తప్ప మరో మార్గం వుండేది కాదు. 

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: 

“అల్లాహ్ (తన) ప్రవక్తల నుండి వాగ్దానం తీసుకున్నప్పుడు, మేము మీకు గ్రంథాన్ని, వివేకాన్ని ఇచ్చిన తరువాత, మీ వద్ద వున్న దాన్ని సత్యమని ధృవీకరించే ప్రవక్త మీ వద్దకు వస్తే మీరు తప్పకుండా అతణ్ణి విశ్వసించాలి, అతనికి సహాయపడాలి అని చెప్పాడు. తర్వాత ఆయన – ఈ విషయాన్ని మీరు ఒప్పుకుంటారా? నేను మీపై మోపిన బాధ్యతను స్వీకరిస్తున్నారా? అని ప్రశ్నించగా, ‘మేము ఒప్పుకుంటున్నాము’ అని అందరూ అన్నారు. ‘మరయితే దీనికి మీరు సాక్షులుగా వుండండి, మీతోపాటు నేను కూడా సాక్షిగా వుంటాను’ అని అల్లాహ్ అన్నాడు. దీని తర్వాత కూడా, ఎవరు తిరిగిపోతారో వారే పరమ అవిధేయులు.” (ఆలి ఇమ్రాన్ : 81 – 82) 

ఈ వాగ్దానం ద్వారానే, అల్లాహ్ ఇతర ప్రవక్తలపై ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఔన్నత్యాన్ని నిరూపించాడు. 

మేరాజ్ అద్భుతము 

అల్లాహ్, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు, ఇస్రా మరియు మేరాజ్ లాంటి మహత్తరమైన అద్భుతాన్ని ప్రసాదించాడు. ఎందుకంటే, దీని ద్వారా కూడా అల్లాహ్, ఇతర ప్రవక్తలపై దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఔన్నత్యాన్ని నిరూపించదలిచాడు. తదనుగుణంగా, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అఖ్సా మసీదులో దైవప్రవక్తల సమూహానికి (నమాజ్ నిమిత్తం) నాయకత్వం వహించారు. తదుపరి, ఆయన్ను ఆకాశాలపైకి, అల్లాహ్ కోరుకున్నంత వరకు తీసుకెళ్ళడం జరిగింది. ఈ శుభ ప్రయాణంలో ఆయనకు – (గత) దైవప్రవక్తలతో పరిచయం చేయించడం జరిగింది. స్వర్గంలో విహరింప జేయడం జరిగింది. ఆయనపై 5 పూటల నమాజు విధిగా విధించబడ్డాయి.ఈ ప్రయాణమంతా ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) గొప్పతనాన్ని, ప్రత్యేకతను, ఆయన ఔన్నత్యాన్ని సూచిస్తుంది. 

దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) గావించిన కొన్ని అద్భుతాలు 

తన స్థానాన్నీ, ఔన్నత్యాన్ని సూచించే ఎన్నో అద్భుతాలను అల్లాహ్ దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు ప్రసాదించాడు. వాటిలో అన్నింటి కన్నా ప్రధానమైన అద్భుతం – తనలోని సరళత, వక్తృత్వత, సమగ్రతల దృష్ట్యా సాహిత్యకారులు మరియు వాక్చతురులందరికీ ఒక సవాలును విసిరే గ్రంథం దివ్య ఖుర్ఆన్. అందుకే, యావత్తు మానవులు, జిన్నాతులు, – అందరూ కలిసినా, ప్రళయం వరకు దీని లాంటి ఒక్క సూరా కూడా రచించి తీసుకురాలేరు. 

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: 

“వారికి చెప్పు! ఒకవేళ సమస్త మానవులు, యావత్తు జిన్నులు కలిసి ఈ ఖుర్ఆన్ లాంటి గ్రంథాన్ని తేదలచినా – వారు పరస్పరం తోడ్పాటు అందజేసుకున్నా, ఇటువంటి దానిని తీసుకురావడం వారికి సాధ్యం కాని పని.” (బనీ ఇస్రాయీల్ : 88) 

ఇదేగాక, దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) గావించిన మరికొన్ని అద్భుతాలు కూడా వినండి: 

అనస్ (రజి అల్లాహు అన్హు) కథనం: ఓసారి, నమాజ్ కొరకు వేళకాగా, మస్జిద్ కు దగ్గరగా (ఇల్లు) వున్న వారు తమ ఇండ్లకు వెళ్ళి వుజూ చేసుకున్నారు. కానీ, వుజూ చేయకుండా చాలా మంది వుండిపోయారు. వుజూ కోసం వారి వద్ద నీళ్ళు లేవు. (ఆ సమయంలో) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వద్దకు ఒక రాతి పాత్రను తీసుకురావడం జరిగింది. దానిలో కొంచెం నీరు వుంది. ఆయన దానిలో తన చేతిని వేయడానికి ప్రయత్నించారు. కానీ, పాత్ర చిన్నగా వున్నందువల్ల వేయలేకపోయారు. అందుకే, ఆయన తన వ్రేళ్ళను జతచేసి దానిలో వేశారు. తదుపరి (అక్కడున్న) వారంతా వుజూ చేసుకున్నారు. ‘వారు ఎంతమంది వున్నారు?” అని అడగ్గా, ఆయన ’80 మంది’ అని జవాబిచ్చారు. (సహీ బుఖారీ : 3575, సహీ ముస్లిం : 2279) 

ఇలాంటిదే మరో అద్భుతం గురించి అనస్ (రదియల్లాహు అన్హు ఇలా సెలవిచ్చారు: దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మరియు ఆయన సహచరులు (ఓసారి) ‘జోరా’ వద్ద వున్నారు. ‘జోరా’, మదీనాలోని బజారులో మస్జిదు దగ్గరగా వున్న ఒక ప్రదేశం పేరు, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) నీళ్ళున్న ఒక పాత్రను తెప్పించారు. తదుపరి ఆయన తన చేతిని ఆ పాత్రలో వుంచారు. ఆయన వ్రేళ్ళ మధ్య భాగాల నుండి నీళ్ళు ఉబికి రావడం ప్రారంభమైంది. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సహచరులంతా వుజూ చేసుకున్నారు. హదీసు ఉల్లేఖకులు (ఖతాదా) ఇలా సెలవిచ్చారు. నేను అనస్ (రదియల్లాహు అన్హు తో – వారెంత మంది వున్నారని ప్రశ్నించాను. ఆయన జవాబిస్తూ – దాదాపు 300 మంది అని అన్నారు. (సహీ బుఖారీ : 3572, సహీ ముస్లిం : 2279) 

జాబిర్ బిన్ అబ్దుల్లా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం, హుదైబియా దినం నాడు ప్రజలకు తీవ్రమైన దాహం కలిగింది. కానీ, వారి దగ్గర త్రాగడానికి నీళ్ళు లేవు. కేవలం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ముందు ఒక నీళ్ళ పాత్ర వుంది. వాటితో ఆయన వుజూ చేయడం ప్రారంభించారు. ఈ స్థితిని చూసి ప్రజలు గాబరా పడుతూ దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వద్దకు విచ్చేశారు. ఆయన వారితో – ఏమయ్యింది మీకు? అని అడిగారు. ‘ప్రస్తుతం మా వద్ద త్రాగడానికి నీరు బొత్తిగా లేదు, కేవలం మీ దగ్గర వున్న పాత్రలో వున్న నీరే వుంది’ అని వారు విన్నవించుకున్నారు. దీనిపై దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తన చేతిని ఆ పాత్రలోనికి పోనిచ్చారు. ఫలితంగా ఆయన వ్రేళ్ళ మధ్య నుండి ఊటల్లాగా నీళ్ళు ఉబికి రావడం ప్రారంభమైంది. మేమంతా ఆ నీటితో వుజూ చేశాం. హదీసు ఉల్లేఖకులు, జాబిర్ బిన్ అబ్దుల్లాతో – అప్పుడు మీరు ఎంత మంది వున్నారు? అని అడగ్గా, ఆయన జవాబిస్తూ – ఒకవేళ మేం ఆ రోజు లక్షమంది వున్నా నీళ్ళు సరిపోయేవి, కాని మేమారోజు 1500 మంది దాకా వున్నాం. (సహీ బుఖారీ : 3576)

అబ్దుల్లా (రదియల్లాహు అన్హు) కథనం: మేము దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) గావించే అద్భుతాలను (మా కొరకు) శుభప్రదమని తలచే వాళ్ళం, మీరు మాత్రం అవి కేవలం తిరస్కారులను భయపెట్టేందుకే జరిగేవి అని అనుకొంటున్నారు. ఓసారి మేము దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)తో కలిసి ప్రయాణంలో వున్నాం. మా వద్ద నీరు కొంచెం మాత్రమే మిగిలి వుంది. (ఇది చూసి) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) – ‘ఆ మిగిలి వున్న నీటిని తీసుకురండి’ అని పురమాయించారు. సహచరులు ఆ నీటి పాత్రను తీసుకొచ్చారు. ఆయన, తన చేతిని దానిలోకి పోనిచ్చి, తదుపరి ఇలా అన్నారు: రండి! శుభప్రదమైన నీటి వైపుకు, శుభం మాత్రం అల్లాహ్ తరఫు నుండే వుంటుంది. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వ్రేళ్ళ మధ్య నుండి నీళ్ళు ఉబికి రావడం నా కళ్ళారా చూశాను. ఒక్కోసారి మేము భోజనం చేసేటప్పుడు దానిలో సంస్మరణ (తస్బీహ్) శబ్దాన్ని వినేవారం. (సహీ బుఖారీ : 3579)

అనస్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) కథనం : ఓసారి అబూ తల్హా (రదియల్లాహు అన్హు, ఉమ్మె సులైమ్ తో  : నేనీ రోజు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కంఠంలో బలహీనతను గమనించాను. బహుశా ఇది ఆకలి మూలంగా కావచ్చు. మరి నీ దగ్గర తినడానికేమైనా వుందా? అని అడిగారు. ‘వుంది’ అని ఆమె జవాబిచ్చి, కొన్ని యవల (జౌ)  రొట్టెలను తీసారు. తదుపరి వాటిని దుప్పటిలో ఒక భాగంలో కట్టి, దాన్ని నా చేతిలో పెట్టి, మిగతా భాగాన్ని నాపై కప్పి, నన్ను దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వద్దకు పంపించారు. నేను మస్జిద్ వద్దకు వెళ్ళగా, అక్కడ దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తోపాటు మరికొంతమంది వుండడం చూసి అక్కడకు వెళ్ళి (నిశ్శబ్దంగా) నిలబడ్డాను. ఇది చూసి, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) నాతో – నిన్ను అబూ తల్హా పంపించారా? అని అడిగారు. నేను అవునన్నాను. ఆయన తిరిగి – భోజనం ఇచ్చి పంపించారా? అని అడిగారు. నేను అవునని జవాబిచ్చాను. దీనిపై దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అక్కడున్న వారందరితో – లేచి నిలబడండి, తదుపరి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) , అందరినీ తీసుకొని నడవడం ప్రారంభించారు. నేను గలగబా నడుస్తూ వారికన్నా ముందుగా అబూ తల్హా వద్దకొచ్చి, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహివ సల్లం) మరియు ఆయన సహచరుల రాకను గూర్చి చెప్పాను. వెంటనే అబూ తల్హా – ఓ ఉమ్మె సులైమ్! దైవప్రవక్త (సల్లల్లాహు అలైహివ సల్లం) ప్రజలను తీసుకొని వచ్చేశారు, కానీ మన దగ్గర వారికి తినిపించడానికి ఏమీ లేదుగా మరి! అని అన్నారు. ఉమ్మె సులైమ్ జవాబిస్తూ – ‘అల్లాహ్ కు ఆయన ప్రవక్తకూ (మన స్థితిని గూర్చి) బాగా తెలుసు’ అని అన్నారు. తదుపరి అబూ తల్హా (రదియల్లాహు అన్హు) వెళ్ళి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కు స్వాగతం పలికి ఆయనను ఇతర సహచరులతో సహా అందరినీ తన ఇంటికి తీసుకువచ్చారు. (సహీ ముస్లింలోని ఒక ఉల్లేఖనంలో ఇలా ఉంది: అబూ తల్హా, దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహివ సల్లం) తో : ఓ దైవ ప్రవక్తా! భోజనం కొంచెం మాత్రమే వుంది అని విన్నవించుకోగా, దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆయనతో – (తినడానికి) ఏముందో అదే తీసుకురండి, అల్లాహ్ దానిలో శుభాన్ని ప్రసాదిస్తాడు అని అన్నారు. ఇంట్లోకి ప్రవేశించి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) – ‘ఓ ఉమ్మె సులైమ్! తినడానికి (నీ వద్ద) ఏముందో అది తీసుకురా’ అని అన్నారు. దీనిపై ఉమ్మె సులైమ్, ఆ రొట్టెలనే తీసుకు వచ్చారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆదేశానుసారం వాటిని ముక్కలుగా చేయడం జరిగింది. ఉమ్మె సులైమ్ వాటి మీద నెయ్యి పోశారు. ఆ నెయ్యే అప్పుడు కూర లాగా వుంది. తదుపరి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వాటిపై అల్లాహ్ తలచింది పఠించారు. (సహీ ముస్లింలోని ఒక ఉల్లేఖనంలో ఇలా వుంది: ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆ రొట్టె ముక్కలపై తన చేతిని వుంచి శుభం కొరకు ప్రార్థించారు).  ఆ తర్వాత, దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) – పది మందిని లోపలికి వచ్చే అనుమతి యివ్వండి అని (అబూ తల్హాతో) అన్నారు. ఆయన 10 మందిని లోపలికి పంపించారు. (సహీ ముస్లింలోని ఒక ఉల్లేఖనంలో ఇలా వుంది: బిస్మిల్లాహ్ పఠించి తినడం ప్రారంభించండి) వారంతా కడుపు నిండా భుజించి, లేచి బయటకు వెళ్ళారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) – మరో 10 మందిని లోపలికి వచ్చే అనుమతి యివ్వండి అని అన్నారు. ఆయన మరో 10 మందిని లోపలికి పంపించారు. వారు కూడా కడుపు నిండా భుజించి బయటకు వెళ్ళారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మళ్ళీ 10 మందిని లోపలి కొచ్చే అనుమతి యివ్వండి అని అన్నారు. ఆయన మరో 10 మందిని లోపలికి పంపించారు. వారు కూడా కడుపునిండా భుజించి బయటకు వెళ్ళిపోయారు. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మళ్ళీ – మరో 10 మందిని లోపలికొచ్చే అనుమతి యివ్వండి అని అన్నారు. ఆయన మరో 10 మందిని లోపలికి పంపించారు. ఇలా, అక్కడున్న వారంత కడుపునిండా భుజించారు. ఆ సమయంలో వారంతా దాదాపు 70 నుండి 80 దాకా వున్నారు. (సహీ ముస్లింలోని ఒక ఉల్లేఖనంలో ఇలా వుంది: (అందరూ భుజించిన తర్వాత, దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) , ఇంట్లో మిగిలిన వారితో కలిసి భోజనం చేసారు. ఇంకా భోజనం మిగిలి ఉంటే, ఇరుగు పొరుగు వారికి పంపించడం జరిగింది. (సహీ బుఖారీ : 3578, సహీ ముస్లిం : 2040)

జాబిర్ బిన్ అబ్దుల్లా (రదియల్లాహు అన్హు) కథనం : కందకం త్రవ్వే రోజుల్లో, నేను దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ను ఆకలితో వుండడం గమనించాను. వెంటనే నా భార్య దగ్గరికొచ్చి – నీ దగ్గర తినడానికేమైనా ఉందా? ఎందుకంటే – ఆకలి మూలంగా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) చతికిలబడడం నేను గమనించాను! అని అన్నారు. వెంటనే ఆమె ఒక సంచి తీసింది. దాంట్లో ఒక సా (దాదాపు 2.5 కేజీలు) యవలు(జొ) వున్నాయి. అంతేగాక, మా దగ్గర ఒక మేకపిల్ల కూడా వుంది. దానిని నేను జిబహ్ చేశాను. నా భార్య పిండి రుబ్బడం పూర్తి చేసి నా వద్దకొచ్చింది. నేనీలోగా మాంసాన్ని ముక్కలుగా కోసి వంట గిన్నెలో వేసి, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) దగ్గరికెళ్ళాను. వెళ్ళేటప్పుడు నా భార్య నాతో – (భోజనం తక్కువగా వుంది కనుక) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మరియు ఆయన సహచరుల ముందు నన్ను అవమానం పాలు చేయవద్దు’ అని అంది. దీనిపై, నేను దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) దగ్గరికెళ్ళి, మెల్లగా (ఎవ్వరూ వినకుండా) – ‘ఓ దైవప్రవక్తా! నా దగ్గర ఒక మేక పిల్ల వుండేది. దానిని నేను జిబహ్ చేశాను. నా భార్య ఒక ‘సా’ పిండిని తయారు చేసింది. కనుక మీరు, మీ సహచరులలో కొంతమందిని తీసుకొని మా ఇంటికి (భోజనానికి) విచ్చేయండి’ అని అన్నాను. ఇది విని, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) బిగ్గరగా – ‘ఓ కందకం వాసులారా! నిశ్చయంగా జాబిర్  మీ కొరకు భోజనం తయారు చేశారు. కనుక మీరంతా పదండి’ అని పలికారు. తదుపరి నా వైపు తిరిగి – ‘నేను వచ్చేంత వరకు వంట గిన్నెను పొయ్యి మీద నుండి క్రిందకు దించవద్దు మరియు రొట్టెలు తయారుచేయడం ప్రారంభించ కూడదు’ అని అన్నారు. నేను తిరిగి ఇంటికొచ్చేశాను. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కూడా ప్రజలను వెంటబెట్టుకొని వచ్చారు. నేను తిన్నగా నా భార్య దగ్గరకి వెళ్ళగా, ఆమె నాతో – ‘ఈ రోజు మీరే నవ్వుల పాలు అవుతారు’ అని అంది. నేనామెతో – ‘నేను నువ్వు చెప్పినట్లే చేశాను’ అని అన్నాను. తదుపరి నేను పిండిని తీసుకొని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) దగ్గరికొచ్చాను. ఆయన తన ఉమ్మిని దానిలో కలిపి శుభం కొరకు ప్రార్థించారు. తిరిగి మా వంట గిన్నె వైపుకు వచ్చి, దానిలో కూడా తన ఉమ్మిని కలిపి, శుభం కొరకు ప్రార్థించి ఇలా సెలవిచ్చారు. “మీతోపాటు రొట్టెలు చేయడానికి మరో స్త్రీని పిలుచుకోండి, మీ గిన్నె నుండి కూరను ప్లేట్లలో వేస్తూ ఉండండి, కానీ కూర గిన్నె మాత్రం (పొయ్యి మీద నుండి) క్రిందకు దించకండి.” ప్రజలు వేయి మంది దాకా వున్నారు. నేను ప్రమాణం చేసి మరీ చెబుతున్నా – అక్కడున్న వారంతా భోంచేశారు. అయినా ఇంకా భోజనం మిగిలి వుంది. వారు వెళ్ళి పోయేటప్పుడు కూడా వంటగిన్నెలో కూర అలాగే ఉడుకుతూ ఉంది మరియు రొట్టెలు కూడా చేస్తూనే ఉన్నారు. (అంటే కూర కూడా తగ్గలేదు, పిండి కూడా తగ్గలేదు. (సహీ బుఖారీ : 3070, సహీ ముస్లిం : 2039)

జాబిర్ బిన్ అబ్దుల్లా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) శుక్రవారం నాడు (ఖుత్బా ఇచ్చే నిమిత్తం) ఒక ఖర్జూరపు చెట్టు (కాండము)ను ఆనుకొని నిలబడే వారు. ఒక అన్సారీ స్త్రీ లేక పురుషుడో, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తో – మేము మీ కోసం ఒక మింబర్ (వేదిక)ను తయారు చేయవచ్చా? అని అడిగారు. దీనిపై దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)- ‘ఒకవేళ మీకిష్టమయితే అలాగే (కానివ్వండి)’ అని అన్నారు. తదుపరి, వారు ఆయన కొరకు ఒక మింబర్ ను తయారు చేశారు. మరుసటి శుక్రవారం, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఖుత్బా ఇవ్వదలిచి, ఆ మింబర్ వైపునకు నడిచారు. కానీ, ఆ ఖర్జూరపు చెట్టు(కాండం) చిన్న పిల్లవాడిలా ఏడ్వడం ప్రారంభించింది. ఇది చూసి, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) క్రిందికి దిగి దాన్ని హత్తుకున్నారు. తదుపరి దానికి నచ్చజెప్పేటప్పుడు, పిల్లవాడికి వెక్కిళ్ళు వచ్చినట్లు దానికి కూడా వెక్కిళ్ళు రాసాగాయి. తదుపరి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు : ఇది ఏడ్వడానికి కారణం – ఇంత వరకూ వింటూ వస్తున్న (నా) ఖుత్బాను ఇక మీదట వినలేదని. (సహీ బుఖారీ : 3584)

జాబిర్ బిన్ సముర (రదియల్లాహు అన్హు కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు: నిశ్చయంగా, దైవదౌత్యానికి ముందు మక్కాలో నాకు సలాం చేసే రాయి నాకు తెలుసు. ఇప్పుడు కూడా నేను దాన్ని గుర్తిస్తాను. {సహీ ముస్లిం:2277) 

మేము దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) గారి కొన్ని మహత్యాలను, అద్భుతాలను మాత్రమే వివరించాం. ఎందుకంటే – ఈ సంక్షిప్త ఖుత్బాలో, ఆయన మహత్యాలను, అద్భుతాలను పూర్తిగా వివరించడం సాధ్యం కాదు. 

(ఆఖరుగా) అల్లాహ్ ను వేడుకొనేదేమిటంటే – ఆయన మనందరినీ దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) గారి ఔన్నత్యాన్ని గుర్తించగలిగే సద్బుద్ధిని ప్రసాదించుగాక! ఆమీన్! 

రెండవ ఖుత్బా 

ప్రియ సోదరులారా! మన ప్రియతమ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) శ్రేష్టత, ఔన్నత్యాలను గురించి విన్న తర్వాత ఇక ఆయన ప్రత్యేతలను గూర్చి కూడా తెలుసుకుందాం. 

దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రత్యేకతలు 

దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వ సల్లం)కు ఇవ్వబడ్డ ప్రత్యేకతలు ఇతరు లెవ్వరికీ ఇవ్వబడలేదు. వాటిలో కొన్నింటిని గూర్చి మనం తెలుసుకుందాం. 

1) ఆఖరి ప్రవక్త 

ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రళయం వరకు రాబోయే ప్రజలందరి కొరకు నియమించబడ్డ దైవప్రవక్త మరియు సందేశహరులు. ఆయన తర్వాత ఇక ఏ ప్రవక్తా రాడు. కనుక ఆయనే సమస్త మానవ జాతికి రుజుమార్గం చూపించేవారు మరియు మార్గదర్శకులూను. 

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: 

“(ఓ ముహమ్మద్)! మేము నిన్ను సమస్త జనులకు శుభవార్తను అందజేసే వానిగా, హెచ్చరించేవానిగా చేసి పంపాము. అయితే జనులలో అధికులకు ఈ విషయం తెలియదు.” (సబా : 28) 

ఇంకా ఇలా సెలవిచ్చాడు: 

“(ఓ ముహమ్మద్)! వారికి చెప్పు: ఓ ప్రజలారా! నేను భూమ్యాకాశాల సామ్రాజ్యానికి అధిపతి అయిన అల్లాహ్ తరపున మీ అందరి వద్దకు పంపబడిన ప్రవక్తను.” (ఆరాఫ్ : 158) 

మరోచోట ఇలా సెలవిచ్చాడు: 

“(ప్రజలారా)! ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) మీ మగవారిలో ఎవరికీ తండ్రి కారు. అయితే ఆయన అల్లాహ్ యొక్క సందేశహరులు. ప్రవక్తల పరంపరను సమాప్తం చేసే (చివరి)వారు.” (అహ్ జాబ్ : 40)

అంటే – ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) తోనే దైవప్రవక్తల పరంపర సమాప్తం చేయబడింది. ఇక ఆయన తర్వాత – ‘నేను దైవప్రవక్తను” అని ఎవరు చాటిచెప్పుకున్నా అతడు అబద్దాల కోరుగా పరిగణించబడతాడు. 

దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు: నన్నూ, నాకు పూర్వం వచ్చిన ప్రవక్తలను ఈ విధంగా పోల్చవచ్చు. ఒక వ్యక్తి ఒక ఇల్లు కట్టించాడు. దాన్ని అన్ని విధాలా తీర్చిదిద్దాడు. కానీ ఓ మూలలో ఒక ఇటుక పట్టేంత ఖాళీ వదలిపెట్టాడు. ప్రజలు ఆ ఇంటిని నలువైపులా తిరిగి చూసి “(ఇంత అందమైన ఇంటికి) ఇక్కడ ఇటుక ఎందుకు పెట్టలేదు?” అని ఆశ్చర్యపోయారు. కనుక, ఆ ఆఖరి ఇటుకను నేనే. ఈ విధంగా నేను (అందరి కన్నా చివరిగా వచ్చిన) అంతిమ దైవప్రవక్తను. (బుఖారీ : 3535, ముస్లిం : 2286) 

ఈ హదీసు ద్వారా తెలిసిందేమిటంటే – దైవ దౌత్య గృహంలో ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆఖరి ఇటుక వంటివారు మరియు ఆయన ఆగమనం తర్వాత ఈ గృహంలో ఇక ఎలాంటి హెచ్చుకు అవకాశం లేదు. 

2) ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) అనుచర సమాజం అందరి కన్నా ఉత్తమ సమాజం 

దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అనుచర సమాజం (ఉమ్మత్) గడచిన అన్ని సమాజాల కన్నా ఉత్తమమైనది మరియు శ్రేష్టమైనది. 

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: 

అదే విధంగా మేము మిమ్మల్ని ఒక న్యాయశీల సమాజం (ఉమ్మతే వసత్)గా చేశాము. మీరు ప్రజలపై సాక్షులుగా, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మీపై సాక్షిగా ఉండటం కోసం (మేమిలా చేశాము).” (బఖర: 143) 

ఇంకా ఇలా సెలవిచ్చాడు: 

మానవుల కోసం ఉనికిలోనికి తీసుకురాబడిన శ్రేష్ట సమాజం మీరు. మీరు మంచి విషయాలకు ఆజ్ఞాపిస్తారు, చెడు నుండి ఆపుతారు, ఇంకా మీరు అల్లాహ్ ను విశ్వసిస్తారు.” (ఆలి ఇమ్రాన్ : 110) 

అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు: మీ గడువు కాలం, గడిచిన అనుచర సమాజాల గడువు కాలంతో పోలిస్తే అస్ర్ నమాజు, సూర్యాస్తమయాల మధ్యగల గడువు లాంటిది. ఇక, యూదులు, క్రైస్తవులు మరియు మీ పోలిక ఎలాంటిదంటే – ఒక వ్యక్తి కొంతమంది పనివాళ్ళను తీసుకొచ్చి ఇలా అడిగినట్లు: సూర్యోదయం నుండి మధ్యాహ్నం వరకు ఒక ఖిరాత్ (ఒక కొలత) కోసం ఎవరు పనిచేస్తారు? యూదులు ఒక ఖిరాత్ కోసం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు పని చేశారు. తదుపరి అతను – మధ్యాహ్నం నుండి అస్ర్ వేళ వరకు ఒక ఖిరాత్ కోసం ఎవరు పని చేస్తారు అని అడగ్గా, క్రైస్తవులు మధ్యాహ్నం నుండి అస్ర్ వేళ వరకు ఒక ఖిరాత్ కోసం పనిచేశారు. ఆ తర్వాత అతను అస్ర్ నుండి సూర్యాస్తమయం వరకు రెండు ఖిరాల కోసం ఎవరు పని చేస్తారు? అని అడిగాడు. 

(దీని గురించి ) దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వివరిస్తూ – బాగా వినండి! అస్ర్ నమాజు మొదలుకుని సూర్యాస్తమయం వరకు రెండు ఖిరాత్ కోసం పని చేసింది మీరే. బాగా గుర్తుంచుకోండి! మీకు లభించే పుణ్యఫలం రెండు రెట్లు. దీనిపై యూదులు మరియు క్రైస్తవులు ఆగ్రహంతో – మేము (సమయపరంగా) ఎక్కువగా శ్రమించినప్పటికీ మాకు తక్కువ ఫలం లభించింది అని అడగ్గా, అల్లాహ్ జవాబిస్తూ – “మీ మీద నేనేమైనా దౌర్జన్యం చేశానా లేక మీ హక్కును హరించానా?” అని అడిగాడు. దానికి వారు “లేదు” అని జవాబిచ్చారు. తదుపరి అల్లాహ్ – “వాస్తవమేమిటంటే, ఇది నా అనుగ్రహం. నేను కోరిన వారికి దీనిని ప్రసాదిస్తాను” అని వివరించాడు. (బుఖారీ : 3459) 

3) ఆరు ప్రత్యేకతలు 

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తన ప్రత్యేకతలలో కొన్నింటిని గూర్చి ఇలా వివరించారు. 

ఇతర ప్రవక్తలతో పోల్చితే నాకు ఆరు విషయాలలో శ్రేష్టత ఇవ్వబడింది. అందులో 

  • మొదటిది – నాకు సమగ్రవచనాలు యివ్వ బడ్డాయి. 
  • రెండవది – నాకు గాంభీర్యత మరియు ప్రాబల్యాల ద్వారా సహాయం చేయబడింది. 
  • మూడవది – నా కోసం యుద్ధప్రాప్తి (మాలె గనీమత్) ధర్మసమ్మతం (హలాల్) చేయబడింది. 
  • నాల్గవది – భూమి యావత్తూ నా కోసం పరిశుద్ధం మరియు ప్రార్థనా స్థలం (మస్జిద్)గా చేయబడింది. 
  • ఐదవది – నేను యావత్ మానవాళి కోసం ప్రవక్తగా చేసి పంపబడ్డాను. 
  • ఆరవది – నా ద్వారా దైవప్రవక్తల పరంపర సమాప్తం చేయబడింది. 

(ముస్లిం : 523) 

మరో ఉల్లేఖనంలో ఇలా వివరించారు: 

“నాకు పూర్వం ఏ దైవప్రవక్తకూ ప్రసాదించబడని ఐదు ప్రత్యేతలు నాకు ప్రసాదించబడ్డాయి.

  • (1) ఇతర దైవప్రవక్తలందరూ తమ తమ జాతుల కోసమే ప్రత్యేకించబడగా నేను మాత్రం (యావత్ మానవాళి కోసం) ప్రతి నల్ల, తెల్ల వారి కోసం పంపబడ్డాను. 
  • (2) నా కోసం యుద్ధప్రాప్తి ధర్మసమ్మతం చేయ బడింది, నాకు పూర్వం ఏ ప్రవక్తకూ ఇది ధర్మసమ్మతం చేయబడలేదు. 
  • (3) నా కోసం భూమి యావత్తూ పరిశుద్ధంగానూ, ప్రార్థనా స్థలం (మస్జిద్) గానూ చేయబడింది. కనుక, ఏ ప్రదేశంలో వున్నా, నమాజు వేళ అయితే అక్కడే నమాజు చేసుకోవాలి. 
  • (4) నేను శత్రువు నుండి ఒక నెల ప్రయాణపు దూరంలో వున్నప్పటికీ అల్లాహ్ నాకు సంబంధించిన భయ ప్రాబల్యాలను అతని హృదయంలో కలగుజేస్తాడు. (అంటే నేనంటే భయపడేలా చేస్తాడు) 
  • (5) ప్రళయం రోజు) నాకు సిఫారసు చేసే అనుమతి లభించింది.

(బుఖారీ:438, ముస్లిం: 521) 

4) దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు గల ప్రత్యేకతల్లో వున్న మరో విషయం ఏమిటంటే – 

ఆయనపై అసత్యం పలకడం. అంటే – ఏదైనా అసత్య విషయాన్ని లేదా ఆచరణను ఆయన వైపుకు మళ్ళించడం (అంటే – ఆయన చెప్పారని లేదా చేశారని చెప్పడం) మహా నేరం మరియు పెద్ద పాపం. అందుకే, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు: 

నా (పేరు) మీద అసత్యం పలకడం ఇతరుల వైపు నుండి అసత్యం పలకడం లాగా కాదు. ఎవరైనా ఉద్దేశ్యపూర్వకంగా నా (పేరు) మీద అసత్యం పలుకుతాడో అతను తన నివాసాన్ని నరకంలో ఏర్పాటు చేసుకోవాలి.” (బుఖారీ : 1291; ముస్లిం : 4) 

అందుకే- ఏదైనా హదీసును ఆయన వైపునకు మళ్ళించేటప్పుడు, దాని గురించి పరిశోధించడం తప్పనిసరి. ఒకవేళ అది ప్రామాణిక పరంపరతో రుజువు చేయబడితే, అప్పుడు దానిని ఉల్లేఖించవచ్చు. లేకపోతే దానిని ఉల్లేఖించకుండా ఊరుకోవాలి. ప్రత్యేకంగా ఈ రోజుల్లో అయితే దీని ప్రాధాన్యత ఇంకా పెరిగి పోయింది. ఎందుకంటే – కాల్పనిక, అసత్య హదీసులు ప్రజల నోళ్ళలో సర్వసాధారణమై పోయాయి. పరిస్థితి ఎంతగా దిగజారిందంటే – మిడి మిడి జ్ఞానం కలవాళ్ళు – ఆచరణల మహత్యం, ఔన్నత్యాల విషయంలో బలహీన, కాల్పనిక హదీసులను సయితం వివరించడం సబబే అని తలపోస్తూ వాటిని పబ్లిగ్గా అందరి ముందు ఉత్సాహంతో ఉల్లేఖిస్తుంటారు. 

5) పాప రహితులు

దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) పాప రహితులు మరియు దైవ దౌత్యం, సందేశ ప్రచారం – ఈ కార్యాలలో పొరపాట్ల నుండి పరిశుద్ధులు. 

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: 

“క్రింద పడేటప్పటి నక్షత్రం సాక్షిగా! మీ సహచరుడు (అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం) దారి తప్పనూ లేదు, పెడదారి పట్టనూ లేదు. అతను తన మనోవాంఛల ప్రకారం మాట్లాడటమూ లేదు. అది (అతను మాట్లాడేదంతా) అతని వద్దకు పంపబడే దైవవాణి (వక్త) తప్ప మరేమీ కాదు.” (నజ్మ్ : 1-4) 

ఈ ఆయత్ ద్వారా తెలిసిందేమింటే- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) దైవ దౌత్య బాధ్యత నిర్వహణలో పాప రహితులు. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ద్వారా ప్రామాణికంగా నిరూపించబడ్డ ఉల్లేఖనాలన్నీ కూడా దైవవాణే (వక్త) మరియు ఖుర్ఆన్ అనుసరణ ఎంత ముఖ్యమో వీటి అనుసరణ కూడా అంతే ముఖ్యం . 

అబ్దుల్లా బిన్ అమ్ర్ బిన్ ఆస్ (రదియల్లాహు అన్హు) కథనం : నేను దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) నోట విన్న ప్రతి హదీసునూ జ్ఞాపక ముంచుకోవడానికి గాను వ్రాసుకొనే వాణ్ణి. దీనికి, ఖురైష్ జాతివారు నన్ను వారిస్తూ – దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) నోట విన్న ప్రతి మాటనూ వ్రాస్తున్నావా? వాస్తవానికి ఆయన మానవమాత్రులు, కోపంలో, సంతోషంలో – రెండు స్థితుల్లోనూ సంభాషిస్తుంటారు – అని హితవు పలికారు. దానితో నేను వ్రాయడం మానేశాను. తదుపరి దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) దగ్గర ఈ విషయమై ప్రస్తావించాను. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తన చేతి వ్రేలితో నోటి వైపునకు సైగచేస్తూ – వ్రాస్తూ వుండు! నా ప్రాణం ఎవరి చేతిలో వుందో ఆ దైవం సాక్షిగా! దీని నుండి సత్యం తప్ప మరేదీ రాదు- అని ఉద్భోదించారు. (అహ్మద్ : 6510, 6802, అబూ దావూద్: 3646) 

6) ప్రళయ దినానికి సంబంధించిన దైవప్రవక్త (సల్లం) ప్రత్యేకతలు 

వీటికి సంబంధించిన కొన్ని హదీసులు విందాం. 

  1. అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు: 

ప్రళయం రోజు నేను యావత్ ఆదం సంతతికి నాయకుడిగా వుంటాను. అందరికన్నా ముందుగా నా సమాధి తెరువబడుతుంది. అందరికన్నా ముందుగా నేను సిఫారసు చేస్తాను మరియు అందరికన్నా ముందుగా నా సిఫారసు స్వీకరించబడుతుంది.” (ముస్లిం : 2278) 

  1. అబూ సయీద్ ఖుద్రి (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు: 

ప్రళయం రోజు నేను యావత్ ఆదం సంతతికి నాయకుడిగా వుంటాను, దీనికి నేను గర్వించను. నా చేతిలోనే అల్ హమ్ద్ (స్తోత్రం) జెండా వుంటుంది, దీనికి కూడా నేను గర్వించను. ఆ రోజు ఆదమ్ (అలైహిస్సలాం) మరియు ఇతర ప్రవక్తలందరూ నా జెండా క్రింద గుమిగూడుతారు. అందరికన్నా ముందు నేను సిఫారసు చేస్తాను మరియు అందరి కన్నా ముందు నా సిఫారసు స్వీకరించబడుతుంది, దీనికి కూడా నేను గర్వించను” (సహీఉల్ జామె : 1468) 

  1. అనస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు: 

ప్రళయం రోజు ఇతర ప్రవక్తల అనుయాయుల కన్నా నా అనుయాయులు ఎక్కువ సంఖ్యలో వుంటారు మరియు అందరికన్నా ముందుగా నేనే స్వర్గ ద్వారాన్ని తట్టుతాను.” (ముస్లిం : 196) 

7) మఖామె మహమూద్…. హష్ర్ వాసులందరి కొరకు సిఫారసు 

అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు: 

ప్రళయ దినాన నేను యావత్తు మానవులకు నాయకుణ్ణవుతాను. ఇది ఎలా అవుతుందో మీకు తెలుసా? ప్రళయ దినాన భూత, భవిష్యత్, వర్తమాన కాలాల మానవులంతా ఒకే మైదానంలో సమీకరించబడతారు. (ఆ మైదానం చదునుగా వుండటం వల్ల) పిలిచేవాడి పిలుపును అందరూ వినగలుగుతారు. అలాగే చూసేవారు. అందరినీ చూడగలుగుతారు. సూర్యుడు అతి దగ్గరగా వస్తాడు. (దాంతో ఒకవైపు తీక్షణమైన ఎండ, ఉక్కపోతల వల్ల, మరో వైపు ఇసుక పోస్తే రాలనంత అత్యధిక జనాభా కారణంగా) మానవులు తీవ్రమైన ఆందోళనతో ఉక్కిరిబిక్కిరి అవుతుంటారు. పరిస్థితి చాలా దుర్భరంగా ఉంటుంది. 

ఆ స్థితిలో వారు పరస్పరం మాట్లాడుకుంటూ, “సోదరులారా! మనం ఎలాంటి ఆపదలో చిక్కుకున్నామో గమనించారా?” అని అంటారు. కొందరు “ఎందుకు గమనించలేదు? మనల్ని గురించి మన ప్రభువు దగ్గర సిఫారసు చేసే వారెవరైనా దొరుకుతారేమో వెతుకుదాం పదండి” అని అంటారు. మరికొందరు ఆ తర్వాత పరస్పరం సంప్రదించుకుని ఆదం (అలైహిస్సలాం) దగ్గరికి వెళ్ళాలని నిర్ణయించుకుంటారు. 

నిర్ణయం ప్రకారం అందరూ ఆదం (అలైహిస్సలాం) దగ్గరకు వెళ్ళి- ” (మహానుభావా!) మీరు మానవులందరికీ తండ్రి. అల్లాహ్ మిమ్మల్ని తన స్వహస్తాలతో తయారుచేసి, మీ శరీరంలో తన ఆత్మను ఊదాడు. అంతేగాక దైవదూతలందర్నీ మీ ముందు మోకరిల్లమని ఆదేశించాడు. అందువల్ల మీరు (దయచేసి) మీ ప్రభువు దగ్గర మా గురించి కాస్త సిఫారసు చేయండి. మా పరిస్థితి చూడండి, మేమెలాంటి ఆపదలో చిక్కుకున్నామో! పరిస్థితి ఇలాగే వుంటే చివరికి మా గతేం కాను?” అని అంటారు. 

దానికి, ఆదం (అలైహిస్సలాం) సమాధానమిస్తూ – “ఈ రోజు నా ప్రభువు ఇదివరకు ఎన్నడూ లేనంత ఆగ్రహోదగ్రుడై వున్నాడు, ఇక ముందు కూడా ఎన్నడూ ఇంత ఉగ్రుడయిపోడు. అదీగాక, (నా వల్ల ఒక పొరపాటు జరిగి పోయింది) ఆయన నన్ను ఒక ప్రత్యేక వృక్షం దగ్గరికి వెళ్ళకూడదని 

ఆజ్ఞాపించాడు. కానీ, నేనా ఆజ్ఞను పాటించలేక పోయాను. నేనిప్పుడు స్వయంగా నా పరిస్థితి పట్ల ఆందోళన పడుతున్నాను. అందువల్ల మీరు మరొకరి దగ్గరికి వెళ్ళండి. మీరు నూహ్ (అలైహిస్సలాం) దగ్గరకు వెళ్ళండి. (నా దృష్టిలో ఆయన ఈ పని చేయగల సమర్థులు)” అని అంటారు. 

అప్పుడు మానవులంతా నూహ్ (అలైహిస్సలాం) దగ్గరకు వెళ్ళి, “ఓ నూహ్! మీరు యావత్ ప్రపంచంలో మొట్టమొదటి సందేశహరులు. అల్లాహ్ మీకు ‘కృతజ్ఞుడైన దాసుడు’ అని బిరుదు ఇచ్చాడు. అందువల్ల మీరు (దయచేసి) దేవుని సన్నిధిలో మా గురించి కాస్త సిఫారసు చేయండి. మేమెలా ఆపదలో పడిపోయామో చూస్తున్నారు కదా మీరు?” అని అంటారు. 

దానికి నూహ్ (అలైహిస్సలాం) – “ఈ రోజు నా ప్రభువు ఇదివరకెన్నడూ లేనంత ఆగ్రహోదగ్రుడై వున్నాడు. ఇకముందు కూడా ఎన్నడూ ఇంత ఉగ్రుడయిపోడు. అదీగాక నా వల్ల ఒక పొరపాటు జరిగిపోయింది). నేను నా జాతి ప్రజలను (తొందరపడి) శపించాను (తత్ఫలితంగా వారంతా సర్వనాశన మయ్యారు). ఏమైనప్పటికీ నేనిప్పుడు స్వయంగా నా పరిస్థితి పట్ల ఆందోళన పడుతున్నాను. అందువల్ల మీరు మరొకరి దగ్గరకు వెళ్ళండి. మీరు ఇబ్రాహీం సమర్థులు)” అని అంటారు. 

ప్రజలు అక్కడి నుండి ఇబ్రాహీం(అహిస్సలాం) దగ్గరికి వెళ్ళి – “ఓ ఇబ్రాహీం! మీరు దేవుని ప్రవక్త. యావత్ ప్రపంచములోనే దేవునికి (ప్రాణ) స్నేహితులు. కనుక మీరు (దయచేసి) మా గురించి దేవునికి సిఫారసు చేయండి. చూస్తున్నారు కదా మా స్థితి, మేమెలా ఆపదలో చిక్కుకున్నామో?” అని అంటారు. 

అది విని ఇబ్రాహీం (అలైహిస్సలాం) – “ఈ రోజు నా ప్రభువు ఇదివరకెన్నడూ లేనంత ఆగ్రహోదగ్రుడై ఉన్నాడు. ఇకముందు కూడా ఎన్నడూ ఇంత ఉగ్రుడయిపోడు. అదీగాక (నా వల్ల ఒక పొరపాటు జరిగిపోయింది). నేను మూడు సందర్భాలలో అబద్దమాడాను. ఏమైనా, నేనిప్పుడు స్వయంగా నా పరిస్థితి ఏమవుతుందోనని ఆందోళన పడుతున్నాను. అందువల్ల, మీరు మరొకరి దగ్గరకు వెళ్ళండి. మీరు మూసా (అలైహిస్సలాం)దగ్గరికి వెళ్ళండి. (ఆయన ఈ పని చేయగల సమర్థులు)” అని అంటారు. 

దాంతో ప్రజలు అక్కడి నుండి మూసా (అలైహిస్సలాం) దగ్గరకు వెళ్ళి – “ఓ మూసా! మీరు దేవుని సందేశహరులు. అల్లాహ్ మీతో ప్రత్యక్షంగా సంభాషించి, మిమ్మల్ని ప్రత్యేక ప్రవక్తగా నియమించాడు. దీనికి తోడు ఆయన మీకు మానవులందర్లో అత్యధిక గౌరవోన్నతులను ప్రసాదించాడు. అందువల్ల మీరు (దయచేసి) మా గురించి దేవుని దగ్గర సిఫారసు చేయండి. మా పరిస్థితి చూడండి, మేమెలా ఆపదలో పడి సతమతమవుతున్నామో!” అని అంటారు. 

మూసా (అలైహిస్సలాం) ఈ మాటలు విని – “ఈ రోజు నా ప్రభువు ఇదివరకెన్నడూ లేనంత ఆగ్రహోదగ్రుడయి వున్నాడు, ఇకముందు ఎన్నడూ ఇంత ఉగ్రుడయిపోడు. అదీగాక (నా వల్ల ఒక పొరపాటు జరిగిపోయింది) నాకెలాంటి ఆజ్ఞ లభించకపోయినా నేనొక వ్యక్తిని (తొందరపడి) హతమార్చాను, దీని కారణంగా నేనిప్పుడు స్వయంగా నా పరిస్థితి ఏమవుతుందోనని ఆందోళన పడుతున్నాను. అందువల్ల మీరు మరొకరి దగ్గరికి వెళ్ళండి. మీరు ఈసా (అలైహిస్సలాం) దగ్గరికి వెళ్ళండి. (ఆయన మీ పని చేసి పెట్టవచ్చు)” అని అంటారు. 

ప్రజలు (ఉసూరుమంటూ) అక్కడి నుండి ఈసా (అలైహిస్సలాం) దగ్గరకు వెళ్ళి – “ఓ ఈసా! మీరు అల్లాహ్ యొక్క ప్రవక్త, అల్లాహ్ వచనం కూడా. అల్లాహ్ దాన్ని మర్యమ్ వైపుకు వదిలేశాడు. మీరు దేవుని ఆత్మ(గా) కూడా (ప్రసిద్ధి చెందారు). మీరు శిశు దశ లోనే తల్లి ఒడి నుండి ప్రజలతో మాట్లాడారు. కనుక మీరు (దయచేసి) మా గురించి కాస్త దేవుని దగ్గర సిఫారసు చేయండి. చూస్తున్నారు కదా మా పరిస్థితి, మేమెలా ఆపదలో పడి సతమతమవుతున్నామో?” అని అంటారు. 

దీనికి ఈసా (అలైహిస్సలాం) సమాధానమిస్తూ- “సోదరులారా! ఈ రోజు నా ప్రభువు ఇదివరకెన్నడూ లేనంత అగ్రసూదగ్రుడై ఉన్నాడు. ఇకముందు ఎప్పుడూ ఇంత ఉగ్రుడయిపోడు.” అని అంటారు. ఈసా (అలైహిస్సలాం) తానేదైనా తప్పు చేసినట్లు ఇక్కడ ఎలాంటి ప్రస్తావన చేయరు. “(ఈ పరిస్థితిలో నేను మీకు ఎలాంటి సహాయం చేయలేను) స్వయంగా నేను నా పరిస్థితి ఏమవుతుందోనని భయపడి పోతున్నాను. మీరు మరొకరి దగ్గరికి వెళ్ళండి. మీరు ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) దగ్గరికి వెళ్ళండి. (ఆయనే మీకు సహాయం చేయగల సమర్థులు)” అని మాత్రమే అంటారు.

ఈ మాటలు విని ప్రజలు (నిరాశతో) అక్కడి నుండి బయలుదేరి నా దగ్గరకు వస్తారు. “ఓ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)! మీరు అల్లాహ్ ప్రవక్త. దైవప్రవక్తలందరిలోకెల్లా కట్ట కడపటి వారు. అల్లాహ్ మీ వెనుకటి, మునుపటి తప్పులన్నీ క్షమించేశాడు. కనుక (దయచేసి ) మీరు మా గురించి అల్లాహ్ దగ్గర సిఫారసు చేయండి. చూస్తున్నారు కదా మా పరిస్థితి, మేమెలా ఆపదలో చిక్కుకుని సతమతమవుతున్నామో?” అని అంటారు. 

అప్పుడు నేను బయలుదేరి  అల్లాహ్ సింహాసనం దగ్గరకు చేరుకుంటాను. అక్కడ నా ప్రభువు ముందు సాష్టాంగపడతాను. అప్పుడు అల్లాహ్ , స్తోత్రం కోసం కొన్ని విశేష వచనాలు నా మనసులో నాటుతాడు. అలాంటి స్తోత్ర వచనాలు ఇదివరకెన్నడూ ఎవరికీ నేర్పి వుండడు. ఆ తర్వాత అల్లాహ్ నన్ను సంభోదిస్తూ – “ముహమ్మద్! తలపైకెత్తు, నీవు అడగదలుచుకున్నదేమిటో అడుగు, నీ కోరిక తీరుస్తాను. ఏదైనా సిఫారసు చెయ్యాలనుకుంటే చెయ్యి, నేను నీ సిఫారసును ఆమోదిస్తాను.” అని అంటాడు. 

నేను తల పైకెత్తి – ప్రభూ! నా అనుచర సమాజం ; ప్రభూ! నా అనుచర సమాజం పాపాల్ని మన్నించు. ప్రభూ! నా అనుచర సమాజాన్ని నరకాగ్ని నుండి కాపాడు,” అని అంటాను. దానికి అల్లాహ్ – “ముహమ్మద్! వెళ్ళు, వెళ్ళి నీ అనుచర సమాజంలోని న్యాయ విచారణ పరిధి నుండి మినహాయించ బడిన వారందరినీ తీసుకుని, కుడివైపు ద్వారం గుండా స్వర్గం లోపలికి పంపించుకో, వారు ఇతర ద్వారాల గుండా కూడా రాకపోకలు నిరభ్యంతరంగా సాగించుకోవచ్చు” అని సమాధానమిస్తాడు. 

ఆ తర్వాత దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రమాణం చేస్తూ – 

“నా ప్రాణం ఎవరి అధీనంలో వుందో ఆ దేవుని సాక్షి! మక్కా హుమైర ల మధ్య లేదా మక్కా బస్రా ల మధ్య ఎంత దూరం వుంటుందో స్వర్గంలోని ఒక ద్వారం వెడల్పు అంత దూరం ఉంటుంది” అని వివరించారు”. (బుఖారీ : 7412, ముస్లిం : 194) 

ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హు కథనం : ప్రళయం రోజు ప్రజలు తమ మోకాళ్ళపై పడి వుంటారు. ప్రతి అనుచర సమాజం తన ప్రవక్త వెనుకకు వెళ్ళి – ఓ ఫలానా! (మా గురించి) సిఫారసు చేయి, ఓ ఫలానా! (మా గురించి) సిఫారసు చేయి అని వేడుకుంటూ వుంటుంది. చివరికి ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)ను సిఫారసు చేయమని చెప్పబడుతుంది. అల్లాహ్ ఆయనను ‘మఖామె మహమూద్’పై కూర్చోబెట్టేది ఆ రోజే. (బుఖారీ : 4718) 

అబూ సయీద్ ఖుద్రి (రదియల్లాహు అన్హు కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు.

“ ప్రజలు మూడుసార్లు మిక్కిలి భయాందోళనలకు గురవుతారు. వాళ్ళు ఆదమ్ (అలైహిస్సలాం) దగ్గరకు వచ్చి ఇలా అంటారు: మీరు మా అందరికీ తండ్రి. మీరు మా అందరి కోసం మీ ప్రభువు దగ్గర సిఫారసు చేయండి. దీనిపై ఆయన – “నేను చేసిన ఒక్క పాపానికి గాను నన్ను (స్వర్గం నుండి) భూమి మీదకు పంపడం జరిగింది. మీరంతా నూహ్ (అలైహిస్సలాం) దగ్గరకి వెళ్ళండి” అని అంటారు. (దీనితో వారంతా నూహ్ (అలైహిస్సలాం) దగ్గరికెళ్ళి సిఫారసు కొరకు వేడుకుంటారు. కానీ) ఆయన – నేను భూలోకవాసులను శపించిన కారణంగా వారిని నాశనం చేయడం జరిగింది. కనుక మీరు ఇబ్రాహీం (అలైహిస్సలాం) దగ్గరికి వెళ్ళండి – అని అంటారు. దీనికి వారు ఇబ్రాహీం (అలైహిస్సలాం) దగ్గరకు వస్తారు. (మరియు సిఫారసు చేయమని విన్నవించుకుంటారు). ఆయన – నేను మూడుసార్లు అబద్దమాడాను. కనుక మీరు మూసా (అలైహిస్సలాం) దగ్గరికి వెళ్ళండి” అని అంటారు. దీనితో వారంతా మూసా (అలైహిస్సలాం) దగ్గరికి వస్తారు. కానీ, ఆయన- నేనొక ప్రాణాన్ని హత్య చేశాను. కనుక మీరంతా ఈసా(అలైహిస్సలాం) దగ్గరికి వెళ్ళండి అని అంటారు. దీనితో, వారంతా ఈసా (అలైహిస్సలాం) దగ్గరికి వస్తారు. కానీ ఆయన – అల్లాహ్ ను వదిలి నన్ను ఆరాధించడం జరిగింది. కనుక మీరు ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) దగ్గరికి వెళ్ళండి అని అంటారు. దీనికి వారంతా నా దగ్గరకు వస్తారు. తదుపరి నేను వారితో కలిసి బయలుదేరుతాను, 

ఇబ్నె జదాన్ కథనం : అనస్ (రదియల్లాహు అన్హు) ఇలా పలికారు: నేను దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ను చూస్తూనే వున్నాను. ఆయన ఇలా వివరించసాగారు – నేను స్వర్గ ద్వారం దగ్గరికెళ్లి దాని తలుపు తట్టుతాను. ఎవరు? అని ప్రశ్నించబడుతుంది. ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) అని సమాధానం ఇవ్వబడుతుంది. దీనితో, వారు నా కోసం స్వర్గద్వారం తెరిచి, నాకు స్వాగతం పలుకుతారు. తదుపరి నేను అల్లాహ్ ముందు సాష్టాంగపడతాను (సజ్జా చేస్తాను). (ఆ సమయంలో) అల్లాహ్ నా మనస్సులో (ఆయన) పవిత్రతను, స్తోత్రానికి సంబంధించిన వచనాలను నాటుతాడు. (ఆ వచనాలతో నేను ఆయన స్తోత్రం చేస్తాను). తదుపరి నాతో ఇలా అనబడుతుంది – మీ తలను పైకెత్తండి మరియు అడగండి, మీకు ఇవ్వబడు తుంది. సిఫారసు చేయండి, మీ సిఫారసు స్వీకరించబడుతుంది మరియు మాట్లాడండి, మీ మాట వినడం జరుగుతుంది. దివ్య ఖుర్ఆన్ లోని ఆయత్ –“త్వరలోనే నీ ప్రభువు నిన్ను మఖామె మహమూద్ (ప్రశంసాత్మకమైన స్థానానికి) చేరుస్తాడు.” (బనీ ఇస్రాయీల్ : 79) లో అల్లాహ్ వివరించిన ‘మఖామె మహమూద్’ ఇదే. (తిర్మిజి : 3148 – సహీ అల్ బానీ) 

ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) సిఫారసుకు ఎక్కువ అర్హులు ఎవరు?

అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం : దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)తో నేను – ప్రజలలో ప్రళయం రోజు మీ సిఫారసు భాగ్యాన్ని పొందే అత్యంత అదృష్టంవంతుడెవరు? అని అడిగాను. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) జవాబిస్తూ – ఓ అబూ హురైరా! ఈ విషయం గురించి నువ్వే అడుగుతావని నేను నమ్మకంగా వున్నాను. ఎందుకంటే, ( నా నుండి) హదీసులు వినడానికి నువ్వు ఎల్లప్పుడూ ఆతృతతో వుంటావు. (కనుక) విను! ఎవరైతే హృదయాంతరాల నుండి (పైపైన కాదు) లా ఇలాహ ఇల్లల్లాహ్ పలుకుతారో వారు ప్రళయం రోజు నా సిఫారసుకు ఎక్కువ హక్కుదారులు అవుతారు.  (బుఖారీ: 99, 6570) 

8) దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సరస్సు 

దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు గల ఇంకో ప్రత్యేకత ఏమి టంటే – ప్రళయం రోజు ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు కౌసర్ సరస్సు ప్రసాదించబడుతుంది. దీనితో ఆయన తన అనుచర సమాజానికి నీళ్ళు త్రాగిస్తారు. 

అనస్ (రదియల్లాహు అన్హు) కథనం : ఒకరోజు దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మాతో కూర్చొని వున్నారు. అకస్మాత్తుగా ఆయన మీద నిద్ర మత్తు లాంటిది ఆవరించసాగింది. (దైవవాణి అవతరించ సాగింది). కాసేపటికి ఆయన నవ్వుతూ తల పైకెత్తారు. తదుపరి ఇలా సెలవిచ్చారు. ఇప్పుడే నా మీద ఒక సూరా అవతరించింది అని ఆయన ఇలా పఠించారు – “అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో – నిశ్చయంగా మేము నీకు కౌసర్ (సరస్సును, మరెన్నో వరాల)ను ప్రసాదించాము. కాబట్టి నువ్వు నీ ప్రభువు కోసమే నమాజు చెయ్యి, ఖుర్బానీ యివ్వు. ముమ్మాటికీ నీ శత్రువే నామరూపాల్లేకుండా పోయేవాడు. ”(కౌసర్ : 1-3) 

తదుపరి ఆయన – కౌసర్ అంటే ఏమిటో మీకు తెలుసా? అని అడిగారు. అల్లాహ్ కు, ఆయన ప్రవక్తకూ బాగా తెలుసు’ అని మేము బదులిచ్చాం . ఆయన వివరిస్తూ – అల్లాహ్ నాకు వాగ్దానం చేసిన ఒక కాలువ యిది. దీనిలో ఎంతో మంచి దాగి వుంది. ఇది ఎలాంటి సరస్సు అంటే -ప్రళయం రోజు నా అనుచర సమాజానికి చెందిన వారంతా ఇక్కడికి వస్తారు. దాని గిన్నెల సంఖ్య నక్షత్రాల సంఖ్యతో సమానం. కొందరిని (అక్కడి నుండి) వెనక్కు నెట్టడం జరుగుతుంది. నేనప్పుడు – ఓ నా ప్రభూ! వీరు నా అనుచర సమాజం వారే! అని పలుకుతాను. సమాధానంగా నాతో – మీ తదనంతరం, ధర్మంలో ఎలాంటి క్రొత్త విషయాలు వీరు ప్రవేశపెట్టారో మీకు తెలియదు – అని అనబడుతుంది. (ముస్లిం : 400) 

అబూజర్ (రదియల్లాహు అన్హు) కథనం : దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)తో నేను (కౌసర్) సరస్సు యొక్క గిన్నెల గురించి అడిగాను. దాని కాయన – 

ఎవరి చేతుల్లో నా ప్రాణం వుందో ఆ శక్తిమంతుని సాక్షి! దాని గిన్నెలు – చీకటి రాత్రిలో ఆకాశంలో మేఘాలేవీ లేనప్పుడు కనిపించే నక్షత్రాల కన్నా ఎక్కువగా వున్నాయి. అవే స్వర్గపు గిన్నెలు. వాటితో త్రాగిన వ్యక్తికి ఇక ఎప్పటికీ దాహం వేయదు. దానిలో రెండు స్వర్గపు పిల్ల కాలువలు (నీటి ధారలు) పారుతూ వుంటాయి. ఒక్కసారి ఆ నీటిని త్రాగిన వ్యక్తికి ఇక ఎప్పుడూ దాహం వేయదు. దాని వెడల్పు, దాని పొడవుతో సమానంగా వుంది. అమాన్ మరియు ఈలా (ప్రదేశాలు)ల మధ్య వున్న దూరం అంత. దాని నీరు పాలకన్నా తెలుపుగా మరియు తేనె కన్నా తియ్యగా వుంటుంది.” (ముస్లిం : 2300) 

అబ్దుల్లా బిన్ అమ్ర్ బిన్ ఆస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు: 

నా కొలను (సరస్సు) ఒక మాసపు ప్రయాణమంత పొడవుగా ఉంది. దాని అంచులు (హద్దులు) సమానంగా వున్నాయి. (అంటే దాని కొలతలు సమానంగా వున్నాయి). దాని నీరు వెండి కన్నా తెలుపుగా, దాని సువాసన కస్తూరి సువాసన కన్నా ఎక్కువగా వుంది. దాని గిన్నెలు ఆకాశ నక్షత్రాల లాగా చాలా ఎక్కువగా వున్నాయి. అక్కడికి వచ్చిన వ్యక్తి, ఒక్కసారి దాని(గిన్నె) తో త్రాగితే ఇక ఎప్పుడూ దాహార్తుడిగా వుండడు.” (బుఖారీ : 6579, ముస్లిం : 2292) 

ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు. 

అల్ కౌసర్ అనేది స్వర్గంలోని ఒక సెలయేరు (కాలువ), దాని అంచులు (హద్దులు) బంగారంతో, అది ప్రవహించే దారి ముత్యాలు మరియు యాఖూత్ (ఒక విధమైన రాయి)లతో వుంది. దాని మట్టి కస్తూరి కన్నా ఎక్కువ పరిమళం కలిగి ఉంది. దాని నీరు తేనె కన్నా తియ్యగా, మంచు కన్నా ఎక్కువ తెలుపుగా ఉంది.” (తిర్మిజి : 3361; సహీ – అల్బానీ) 

ఇవండీ! దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు సంబంధించిన కొన్ని ప్రత్యేకతలు. 

చివరిగా అల్లాహ్ ను వేడుకొనేదేమిటంటే – ప్రళయం రోజు ఆయన మనందరికీ దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) చేతుల మీదుగా కౌసర్ సరస్సు నీళ్ళు మరియు ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) సిఫారసును ప్రసాదించుగాక! ఆమీన్. 

ఈ ఖుత్బా క్రింది పుస్తకం నుండి తీసుకోబడింది.
జాదుల్ ఖతీబ్ (ఖుత్బాల సంగ్రహం) – మొదటి సంపుటం – ముహమ్మద్ ఇస్ హాఖ్ జాహిద్

ముహమ్మద్ (సల్లలాహు అలైహి వ సల్లం)  (మెయిన్ పేజీ)
https://teluguislam.net/muhammad/

%d bloggers like this: