ఈ ప్రసంగంలో, వక్త సహాబాల విధానం (మన్హజ్) మరియు దాని ఆవశ్యకత గురించి వివరిస్తారు. సహాబీ అనే పదానికి అర్థం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను ఈమాన్ స్థితిలో కలుసుకుని, అదే స్థితిలో మరణించిన వారని నిర్వచించారు. సహాబాలు ముస్లిం సమాజంలో అత్యంత శ్రేష్ఠులని, వారి విశ్వాసం (ఈమాన్) మరియు అఖీదా ఖురాన్ ద్వారా ధృవీకరించబడిందని నొక్కి చెప్పారు. మన విశ్వాసం మరియు ఆచరణా విధానం సహాబాల వలె ఉండాలని, ఖురాన్ మరియు హదీసులను వారు అర్థం చేసుకున్న విధంగానే మనం అర్థం చేసుకోవాలని ఖురాన్ ఆయతుల ద్వారా స్పష్టం చేశారు. సహాబాల మార్గాన్ని విడిచిపెట్టడం నరకానికి దారితీస్తుందని హెచ్చరించారు. సహాబాల విధానాన్ని అనుసరించడమే నిజమైన సన్మార్గమని, వారి ఇత్తిబా (అనుసరణ) యొక్క ప్రాముఖ్యతను ఉదాహరణలతో వివరించారు.
وَالصَّلٰوةُ وَالسَّلَامُ عَلٰى سَيِّدِ الْاَنْۢبِيَآءِ وَالْمُرْسَلِيْنَ (వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ అంబియాయి వల్ ముర్సలీన్) ప్రవక్తల నాయకునిపై మరియు దైవప్రవక్తలపై శాంతి మరియు శుభాలు వర్షించుగాక.
وَمَنْ تَبِعَهُمْ بِاِحْسَانٍ اِلٰى يَوْمِ الدِّيْنِ اَمَّا بَعْدُ (వమన్ తబిఅహుమ్ బి ఇహ్సానిన్ ఇలా యౌమిద్దీన్ అమ్మా బఅద్) మరియు ప్రళయదినం వరకు వారిని ఉత్తమ రీతిలో అనుసరించేవారిపై కూడా (శాంతి మరియు శుభాలు వర్షించుగాక). ఆ తర్వాత…
رَبِّ اشْرَحْ لِيْ صَدْرِيْ وَيَسِّرْ لِيْٓ اَمْرِيْ وَاحْلُلْ عُقْدَةً مِّنْ لِّسَانِيْ يَفْقَهُوْا قَوْلِيْ (రబ్బిష్రహ్ లీ సద్రీ వ యస్సిర్ లీ అమ్ రీ వహ్ లుల్ ఉఖ్దతమ్ మిల్ లిసానీ యఫ్ఖహూ ఖవ్ లీ) “ఓ నా ప్రభూ! నా హృదయాన్ని విశాలపరచు. నా కార్యాన్ని నాకు సులభతరం చెయ్యి. నా నాలుకలోని ముడిని విప్పు. ప్రజలు నా మాటను అర్థం చేసుకోగలగాలి.” (20:25-28)
సహాబాల విధానం, దాని అవసరం
మన్హజుస్ సహాబా. సహాబా ఈ పదం సహాబీ పదానికి బహువచనం. ఉర్దూలో సహాబీ ఏకవచనం, సహాబా అనేది బహువచనం. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సహచరులు. ఈమాన్ స్థితిలో దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను కలుసుకొని, ఈమాన్ స్థితిలోనే మరణించిన వారంతా సహాబా, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహచరులు అనబడతారు. ఇది సహాబా లేదా సహాబీ అనే పదానికి అర్థం.
వారు ముస్లిం సమాజంలో అందరికన్నా శ్రేష్ఠులు. ఇస్లాం వైపు ముందంజ వేసినవారు. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహచర్య భాగ్యం పొందినవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో కలిసి జిహాద్ చేసినవారు. షరీఅత్ బాధ్యతలను మోయటమే గాక దానిని తమ తరువాతి తరాల వారికి అందించిన ధన్యజీవులు. ఈ కారణంగా వారు ప్రపంచంలోనే అత్యుత్తమ సమూహం అని మనం విశ్వసించటం వాజిబ్. తప్పనిసరి. అంటే సహాబాల గురించి ఇలా అఖీదా, విశ్వాసం మనం కలిగి ఉండాలి.
సహాబాల విధానం కంటే ముందు, ముందుమాటగా నేను రెండు మూడు విషయాలు, ఈ సహాబాల యొక్క ఔన్నత్యం గురించి చెప్పదలిచాను. సహాబాల గురించి ఖురాన్‌లో అలాగే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రవచనాలలో చాలా నొక్కి చెప్పడం జరిగింది. వారు ఎవరు, వారి విశ్వాసం ఏమిటి, వారి గొప్పతనం ఏమిటి అనేది. ఉదాహరణకు సూరా తౌబాలో ఆయత్ నెంబర్ 100.
“ముహాజిర్లలో, అన్సార్లలో ప్రప్రథమంగా ముందంజ వేసిన వారితోనూ, తర్వాత చిత్తశుద్ధితో వారిని అనుసరించిన వారితోనూ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రసన్నుడయ్యాడు. వారు అల్లాహ్ పట్ల ప్రసన్నులయ్యారు. క్రింద కాలువలు ప్రవహించే స్వర్గ వనాలను అల్లాహ్ వారి కోసం సిద్ధం చేసి ఉంచాడు. వాటిలో వారు కలకాలం ఉంటారు. గొప్ప సాఫల్యం అంటే ఇదే.” (9:100)
ఈ ఆయతులో మూడు వర్గాల గురించి చెప్పడం జరిగింది. ముహాజిర్లు ఒక వర్గం, అన్సార్లు ఒక వర్గం. అంటే సహాబాలలో ఇది రెండు వర్గాలు. ముహాజిర్లు, అన్సార్లు. మూడవది, వారి తర్వాత వారిని చిత్తశుద్ధితో అనుసరించేవారు. వారెవరు? కొంతమంది పండితులు తాబయీన్లు అయి ఉండవచ్చు అని చెప్పారు. కాకపోతే ప్రళయం వరకు వచ్చే విశ్వాసులందరూ దీనిలో వస్తారు. చిత్తశుద్ధితో వారిని అనుసరించేవారు. ఎవరిని? సహాబాలను. ముహాజిర్లను, సహాబాలను చిత్తశుద్ధితో అనుసరించేవారు కూడా ఈ కోవకి వస్తారు. ఇది సహాబాల యొక్క గొప్పతనం.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఈ ప్రసంగంలో, దుఆ (ప్రార్థన) యొక్క ప్రాముఖ్యత మరియు దానిని ఆచరించవలసిన సరైన పద్ధతి గురించి వివరించబడింది. దుఆ ఆరాధనలలో ఒక ముఖ్యమైన భాగమని, దానిని ఎలా చేయాలో అల్లాహ్ మరియు అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నేర్పించారని చెప్పబడింది. ప్రవక్త గారి జీవితం నుండి రెండు సంఘటనలను ఉదాహరణగా చూపిస్తూ, అల్లాహ్ ను స్తుతించకుండా మరియు ప్రవక్తపై దరూద్ పంపకుండా నేరుగా అభ్యర్థించడం తొందరపాటు అవుతుందని, అయితే అల్లాహ్ యొక్క ఉత్తమమైన నామాలు మరియు గుణగణాల ద్వారా వేడుకోవడం సరైన పద్ధతి అని స్పష్టం చేయబడింది. అల్లాహ్ యొక్క 99 పేర్ల ప్రాముఖ్యత మరియు వాటిని గణించడం అంటే కేవలం లెక్కించడం కాదని, వాటిని విశ్వసించి, అర్థం చేసుకుని, జీవితంలో ప్రతిబింబించేలా చేయాలని వివరించబడింది. ప్రార్థన చేయడానికి మధ్యవర్తి (వసీలా) అవసరమా అనే అంశం తదుపరి ప్రసంగంలో చర్చించబడుతుందని చెప్పబడింది.
అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ అంబియా ఇ వల్ ముర్సలీన్, వమన్ తబిఅహుమ్ బి ఇహ్సానిన్ ఇలా యౌమిద్దీన్, అమ్మా బాద్.
అభిమాన సోదరులారా! ధర్మ అవగాహనం అనే ఈ కార్యక్రమం లోకి మీ అందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను.
اَلسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ (అస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు) మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక.
ప్రియ వీక్షకులారా! ఈరోజు మనం ఈ కార్యక్రమంలో మనం అల్లాహ్ ను ఏ విధంగా వేడుకోవాలి అనే అంశం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మానవులను సృష్టించి వారికి సన్మార్గం చూపడానికి ప్రవక్తలను పంపాడు. దివ్యమైన ఆ పరంపరలో చివరి వారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఆయన ప్రతి సమస్య విషయంలో తన ఉమ్మత్ కు స్పష్టమైన మార్గదర్శనం ప్రసాదించారు. ఇతర ఆరాధనా పద్ధతులు తెలిపినట్లే, ప్రార్థించే విషయంలో కూడా, దుఆ చేసే విషయంలో కూడా మార్గదర్శులయ్యారు.
అభిమాన సోదరులారా! వేడుకోవటం, దుఆ చేయటం ఒక ముఖ్యమైన ఆరాధన.
దుఆ యొక్క ప్రాముఖ్యత
అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దుఆ గురించి ఇలా సెలవిచ్చారు,
اَلدُّعَاءُ هُوَ الْعِبَادَةُ (అద్దుఆ హువల్ ఇబాదహ్) దుఆ యే అసలైన ఆరాధన.
ఈ హదీస్ అహ్మద్ గ్రంథంలో ఉంది, తిర్మిజీ లో ఉంది, అబూ దావూద్ లో ఉంది, ఇంకా అనేక హదీస్ గ్రంథాలలో ఈ హదీస్ ఉంది.
దుఆ తప్పక చేయవలసిన ఆరాధన. కావున, దుఆ ముఖ్యమైన ఆరాధన కాబట్టి, తప్పనిసరిగా చేయవలసిన ఆరాధన కాబట్టి, ఆ దుఆ చేసే విధానం కూడా స్వయంగా ఖురాన్ గ్రంథంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తమ ప్రవచనాల ద్వారా మనల్ని దుఆ చేసే విధానం, పద్ధతి నేర్పించారు.
దుఆ చేసే సరైన పద్ధతి
అబూ దావూద్ లో ఒక హదీస్ ఉంది, ఫుజాలా బిన్ ఉబైద్ రదియల్లాహు తాలా అన్హు కథనం ప్రకారం అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మస్జిద్ లో ఉన్నారు, ఒక వ్యక్తి వచ్చాడు. నమాజ్ చేసుకున్న తర్వాత ఆ వ్యక్తి డైరెక్ట్ ఇలా దుఆ చేశాడు, ‘నాకు మోక్షం ఇవ్వు, ఓ అల్లాహ్ నన్ను కరుణించు’ అని డైరెక్ట్ గా దుఆ చేశాడు. ఇది విని అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, “మీరు తొందరపడ్డారు, ముందు అల్లాహ్ యొక్క ఘనతను కొనియాడు, ఆ తర్వాత నాపై దరూద్ పంపించు, ఆ తర్వాత నువ్వు ఏమి కోరుకుంటావో అది కోరుకో, నువ్వు చేసుకోదలచుకున్న దుఆ చేసుకో” అని అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు.
కాసేపటి తర్వాత ఇంకో వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి దుఆ చేసే విధానం ఇలా ఉండింది. ఆ వ్యక్తి తన అవసరాలను అడగక ముందు, తన అవసరాలను అల్లాహ్ ముందు పెట్టక ముందు, తన దుఆ ఈ విధంగా అతను ప్రార్థన చేశాడు:
“ఓ అల్లాహ్! నేను నిన్నే అర్థిస్తున్నాను. అల్లాహ్ నువ్వు మాత్రమే. సకల లోకాలకు ప్రభువు, పాలకుడు, పోషకుడు. ఆరాధ్య దైవం నువ్వు మాత్రమే. లా ఇలాహ ఇల్లా అంత్, నువ్వు తప్ప ఏ దేవుడూ లేడు. అల్ అహద్, నువ్వు ఒకే ఒక్కడివి. అస్సమద్, నిరపేక్షాపరుడివి, అవసరాలు, అక్కర్లు లేనివాడివి. నీకు తల్లిదండ్రులు గానీ, సంతానం గానీ లేరు. నీకు సరిసమానం ఎవ్వరూ లేరు.”
ఇలా అల్లాహ్ యొక్క ఘనతను కొనియాడి ఆ తర్వాత ఆ వ్యక్తి తాను చేసుకున్న దుఆ చేసుకున్నాడు. ఇది విని అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ వ్యక్తికి ఇలా బదులిచ్చారు:
لَقَدْ سَأَلْتَ اللّٰهَ بِالِاسْمِ الَّذِيْ إِذَا سُئِلَ بِهِ أَعْطٰى وَإِذَا دُعِيَ بِهِ أَجَابَ (లఖద్ సఅల్తల్లాహ బిల్ ఇస్మిల్లదీ ఇదా సుఇల బిహీ అఅతా వ ఇదా దుఇయ బిహీ అజాబ్) “ఏ పేరుతో అర్థిస్తే ఆయన ప్రసాదిస్తాడో, ఏ పేరు ద్వారా దుఆ చేస్తే ఆ దుఆ స్వీకరించబడుతుందో, ఆ పేరుతోనే నువ్వు అడిగావు.”
అంటే ఇక్కడ రెండు విషయాలు మన ముందుగా ఉన్నాయి ఈ హదీస్ లో. మొదటి వ్యక్తి డైరెక్ట్ గా అల్లాహ్ ఘనత లేకుండా, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై దరూద్ పఠించకుండా, పంపించకుండా డైరెక్ట్ దుఆ ప్రారంభం చేశాడు, ‘ఓ అల్లాహ్ నాకు అది ఇవ్వు, ఇది ఇవ్వు, కరుణించు, క్షమించు’ అని చెప్పి స్టార్ట్ చేసేశాడు. అందుకు ఆ వ్యక్తికి సమాధానం ప్రవక్త గారు ఏమి ఇచ్చారు? “ఓ నాయనా! నువ్వు తొందరపడ్డావు” అని చెప్పారు. మరో వ్యక్తికి అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చాలా మెచ్చుకున్నారు. “ఏ పేరుతో అర్థిస్తే ఆ అల్లాహ్ ప్రసాదిస్తాడో, ఏ పేరు ద్వారా దుఆ చేస్తే దుఆ స్వీకరించబడుతుందో ఆ పేరుతోనే నువ్వు అడిగావు” అని అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన్ని మెచ్చుకొని ఇలా సమాధానం ఇచ్చారు.
ప్రియ వీక్షకులారా! మనకు అర్థమైంది ఏమిటంటే, దుఆ ఒక ముఖ్యమైన ఆరాధన కాబట్టి, ఆ దుఆ చేసే విధానం స్వయంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూరా ఆరాఫ్, ఆయత్ 180 లో తెలియజేశాడు, ఏ విధంగా అల్లాహ్ ను వేడుకోవాలి అనటానికి.
وَلِلّٰهِ الْاَسْمَاۤءُ الْحُسْنٰى فَادْعُوْهُ بِهَاۖ (వలిల్లాహిల్ అస్మావుల్ హుస్నా ఫద్ ఊహు బిహా) అల్లాహ్ కు ఉత్తమమైన పేర్లు ఉన్నాయి. కాబట్టి మీరు ఆ పేర్లతోనే ఆయనను ప్రార్థించండి. (7:180)
అభిమాన సోదరులారా! బుఖారీ, కితాబుద్ దావాత్, అలాగే ముస్లిం గ్రంథం కితాబుద్ దికిర్ లో ఒక హదీస్ ఉంది. అల్లాహ్ కు 99 పేర్లు ఉన్నట్లు తెలియజేయబడింది. ఎవరైతే వాటిని గణిస్తూ ఉంటాడో అతడు స్వర్గంలో ప్రవేశిస్తాడు. అల్లాహ్ బేసి సంఖ్యలో ఉన్నాడు, బేసి సంఖ్యను ఆయన ఎంతో ఇష్టపడతాడు. ఈ హదీస్ బుఖారీ మరియు ముస్లిం గ్రంథంలో ఉంది ఈ హదీస్.
ఈ హదీస్ లో ముఖ్యంగా రెండు విషయాలు తెలియపరచాలనుకుంటున్నాను. మొదటి విషయం ఏమిటి ఈ హదీస్ లో? అల్లాహ్ కు 99 పేర్లు ఉన్నట్లు తెలియజేయబడింది. అంటే దీనికి అర్థము 99 మాత్రమే ఉన్నాయి అని కాదు, ఈ విషయం గమనించుకోండి. హదీస్ లో 99 పేర్లు తెలియజేయడం జరిగింది, దానికి అర్థం అల్లాహ్ కు 99 పేర్లు మాత్రమే ఉన్నాయి అని కాదు. అంటే ఈ పేర్ల ద్వారా గణిస్తే, లెక్కిస్తే, అడిగితే దుఆ స్వీకరించబడుతుంది అని అర్థం వస్తుంది కానీ, అల్లాహ్ కు 99 పేర్లు మాత్రమే ఉన్నాయి అని కాదు. అల్లాహ్ కు పేర్లు అసంఖ్యాకమైనవి, కొన్ని పేర్లు అది అల్లాహ్ యొక్క ఇల్మె గైబ్ లోనే ఉన్నాయి, మనకు తెలియవు. అందుకు 99 మాత్రమే కాదు అనే విషయం తెలుసుకోవాలి.
రెండవ విషయం ఈ హదీస్ లో, ఎవరైతే అల్లాహ్ యొక్క నామాలను గణిస్తూ ఉంటాడో అంటే, గణించటం అంటే అర్థం కేవలం లెక్కించటం అని భావం కాదు. గణించడంతో పాటు వాటిని దృఢంగా విశ్వసించాలి, చిత్తశుద్ధితో, భక్తితో ఈ నామాలను స్మరించాలి, ఒక్కో నామంలోని అంతరార్థాన్ని తెలుసుకోవాలి, వాటిని కంఠస్థం చేసుకోవాలి, ఆ గుణగణాలు తమ వ్యక్తిగత జీవితంలో ప్రతిబింబించేలా ప్రవర్తించాలి. ఇది భావం అల్లాహ్ యొక్క నామాలను లెక్కించడం అంటే, గణించడం అంటే.
అభిమాన సోదరులారా! అలాగే అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కూడా దుఆ చేసేవారు, అల్లాహ్ నామాలను గణించేవారు, లెక్కించేవారు, అల్లాహ్ యొక్క నామాల ద్వారా, గుణ విశేషాల ద్వారా కూడా అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వేడుకునేవారు. ఉదాహరణకు ఒక హదీస్ ఉంది, అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చేసే దుఆలలో ఒక దుఆ యొక్క ఒక్క భాగం ఇలా ఉంటుంది:
أَسْأَلُكَ بِكُلِّ اسْمٍ هُوَ لَكَ سَمَّيْتَ بِهِ نَفْسَكَ (అస్ అలుక బికొల్లి ఇస్మిన్ హువ లక సమ్మైత బిహీ నఫ్సక్) ఓ అల్లాహ్! నువ్వు నీ కోసం పెట్టుకున్న ప్రతి పేరు ద్వారా నేను నిన్ను పిలుస్తున్నాను.
అని అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వేడుకునేవారు. ప్రియ వీక్షకులారా! ఈ… ఇంతకీ నా మాటలకి సారాంశం ఏమిటంటే దుఆ చేయటం, అల్లాహ్ ను వేడుకోవటం, ఇది ముఖ్యమైన ఆరాధన కాబట్టి, దీని విధానం ఏమిటి? అల్లాహ్ యొక్క నామాల ద్వారా, ఆయన గుణ విశేషాల ద్వారా మనము అల్లాహ్ ను పిలవాలి, వేడుకోవాలి, దుఆ చేయాలి. ఆ, ఇది కొన్ని ముఖ్యమైన విషయాలు మనం అల్లాహ్ ను ఏ విధంగా వేడుకోవాలి అనే అంశం గురించి.
ప్రియ సోదరులారా! ఇక ఈ అంశానికి సంబంధించిన విషయమే, అల్లాహ్ ను వేడుకోవటానికి ఎవరి సహాయమైనా అవసరమా? అల్లాహ్ ను వేడుకోవటానికి, దుఆ చేయటానికి, ఆ దుఆ స్వీకరించబడటానికి ఎవరి సహాయమైనా అవసరమా? మధ్యవర్తి అవసరమా? సింపుల్ గా చెప్పాలంటే వసీలా అవసరమా? అసలు వసీలా అంటే ఏమిటి? వసీలా వాస్తవికత ఏమిటి? వసీలా ధర్మసమ్మతమా కాదా? వసీలా గురించి వివరాలు, వసీలా గురించి వాస్తవికత ఏమిటో ఇన్ షా అల్లాహ్ వచ్చే ఎపిసోడ్ లో తెలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. వ ఆఖిరు దావానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
శాంతిభద్రతల విలువ & ఐక్యత ప్రాముఖ్యత – జుమా ఖుత్బా ఖతీబ్ ఫజీలతుష్ షేక్ రాషిద్ బిన్ అబ్దుర్రహ్మాన్ అల్-బిదా హఫిజహుల్లాహ్ https://youtu.be/SnCZ5FgZV0U [22 నిముషాలు] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఈ ఖుత్బాలో ఇస్లాం ధర్మంలో శాంతి భద్రతల ప్రాముఖ్యతను, ముస్లిం పాలకుల పట్ల విధేయతను మరియు సామాజిక ఐక్యతను కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను ప్రస్తావించారు. హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) గారి వివేకవంతమైన నిర్ణయాన్ని ఉదహరిస్తూ, అంతర్యుద్ధం (ఫిత్నా) మరియు రక్తపాతాన్ని నివారించడానికి పాలకుల పట్ల విధేయత ఎంత ముఖ్యమో వివరించారు. సౌదీ అరేబియాలో నెలకొన్న శాంతిని అల్లాహ్ గొప్ప వరంగా పేర్కొంటూ, కృతజ్ఞతా భావం, దైవభీతి మరియు ఐక్యమత్యం ద్వారానే ఈ భద్రత రక్షించబడుతుందని, అనవసరమైన విభేదాలు మరియు ముఠా తగాదాలకు దూరంగా ఉండాలని ఖుర్ఆన్ మరియు హదీసుల ఆధారంగా హెచ్చరించారు.
అల్హమ్దులిల్లాహ్! ఓ అల్లాహ్ నీవు మా ఉపాధి విస్తృతం చేశావు, మాకు భద్రత ప్రసాదించావు, మా మధ్య ఐక్యత కలిగించావు. నీవు తప్ప సత్య ఆరాధ్యుడు ఎవడూ లేడని సాక్ష్యమిస్తున్నాను. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క దాసుడు, ప్రవక్త అని కూడా సాక్ష్యమిస్తున్నాను. అల్లాహ్, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై అనేక అనేక లెక్కలేనన్ని సలాతు సలామ్ మరియు శుభాలు, బర్కత్ లు పంపించు గాక.
ఈరోజు జుమా ఖుత్బా యొక్క అంశం మన ఐక్యత మరియు మన పాలకులు. మరొక రకంగా చెప్పాలంటే ఇస్లాంలో శాంతి భద్రతల విలువ మరియు ముస్లిం పాలకుల యొక్క విధేయత, ప్రాముఖ్యత మరియు ఐక్యతతో ఉండటంలోని లాభాలు ఏమిటో సంక్షిప్తంగా తెలుసుకోబోతున్నాము.
హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) వివేకం
విశ్వాసులారా! అల్లాహ్ మీపై కరుణించు గాక. మీ చావుకు ముందే అధికంగా సత్కార్యాల్లో ముందుగా ఉండండి. మీకు ఒక అర్థవంతమైన, బోధన కలిగించే సంఘటన వినిపిస్తాను. అది సహీహ్ బుఖారీలో ఉంది. వివేకవంతులైన సహాబీ, దృఢ విజ్ఞానులైన సహాబీ హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) గారి గురించి.
ఏమిటి ఆ సంఘటన? అలీ (రదియల్లాహు అన్హు) మరియు ముఆవియా (రదియల్లాహు అన్హు) మధ్య యుద్ధం జరిగిన సమయంలో ప్రజలు విభేదాల్లో పడ్డారు. అయితే వారి విభేదాలను ముగించడానికి హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు) వైపు నుండి హజ్రత్ అబూ మూసా అషరీ (రదియల్లాహు అన్హు) మరియు హజ్రత్ అమీర్ ముఆవియా వైపు నుండి హజ్రత్ అమర్ ఇబ్నె ఆస్ (రదియల్లాహు అన్హు) హకమ్ – న్యాయ నిర్ణేతలుగా ముందుకు వచ్చారు. అయితే ఆ సమయంలో ముఆవియా (రదియల్లాహు అన్హు) ఒక ప్రసంగంలో ఇలా అన్నారు: “ఈ వ్యవహారం అంటే ఖిలాఫత్ గురించి ఎవరైనా మాట్లాడదలుచుకుంటే తన తల లేపి మాట్లాడాలి. ఎందుకంటే మేమే ఈ వ్యవహారానికి అతని కన్నా, అతని తండ్రి కన్నా ఎక్కువ అర్హులం.”
అప్పుడు ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) అన్నారు: “నేను నా దుస్తులను సరిచేసుకొని నిలబడి మాట్లాడి చెబుదాము అనుకున్నాను: “‘“నీకంటే ఎక్కువ అర్హుడు ఇస్లాం కోసం నీతో, నీ తండ్రితో యుద్ధం చేసిన వారే’ (అంటే మీరైతే ఫతహ్ మక్కా వరకు ఇస్లాంలో ప్రవేశించలేదు, కానీ హజ్రత్ అలీ రదియల్లాహు అన్హు అప్పటికే ముస్లిం గా ఉన్నారు మరియు ఫతహ్ మక్కా కంటే ముందు మీరు మరియు మీ తండ్రి అవిశ్వాసులుగా ఉన్నప్పుడు హజ్రత్ అలీ రదియల్లాహు అన్హు ఇస్లాం కొరకు మీతో పోరాడారు కదా)” అన్నటువంటి మాట చెబుదాము అని అనుకున్నాను. కానీ వెంటనే ఆలోచించాను. (హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ అంటున్నారు), వెంటనే ఆలోచించాను: ‘నేను ఇప్పుడే మాట్లాడితే, ఈ విషయాలు చెప్పబోతే ప్రజల్లో అల్లకల్లోలం ఏర్పడుతుంది. రక్తపాతం జరుగుతుంది. నా మాటలు తప్పుగా అర్థం చేసుకోవచ్చు. నేను చెప్పే పదాలకు నాది మంచి ఉద్దేశం ఎంతగా ఉన్నప్పటికీ ప్రజలు దానిని నా ఉద్దేశ్య ప్రకారంగా కాకుండా వేరుగా అర్థం చేసుకోవచ్చు.’ అయితే వెంటనే జన్నతులో, స్వర్గంలో ఓపిక సహనాలకు బదులుగా ఉన్న అల్లాహ్ వాగ్దానం గుర్తు వచ్చింది. నేను ఆ మాట చెప్పలేదు.”
అప్పుడే ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హు) కి దగ్గర ఉన్న వారిలో ఒకరు అన్నారు: “అల్లాహ్ నిన్ను రక్షించాడు. నీవు బహుదూరంగా ఈ ఫిత్నా నుండి తప్పించుకున్నావు. ఇది అల్లాహ్ దయ తర్వాత సరైన జ్ఞానం మరియు బలమైన విశ్వాసం నీ వద్ద ఉన్నందువల్ల.” ఎవరు చెప్పారు ? హజ్రత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హు) కు దగ్గరగా ఆ సమయంలో ఎవరైతే ఉన్నారో ఆయన ఈ మాట చెప్పారు.
అయితే ఇక్కడ గమనించండి. మనిషి దగ్గర బలమైన విశ్వాసంతో పాటు సరైన జ్ఞానం ఉండి, ఏ మాట ఎప్పుడు మాట్లాడాలో, అది కూడా అల్లాహ్ దయతో ప్రసాదించబడింది అంటే ఇది ఎంత గొప్ప వరం? సూరతుల్ ముజాదిల ఆయత్ నంబర్ 11 ద్వారా గమనించండి:
ఈ విధంగా హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) వారి యొక్క గౌరవం కూడా ఈ సందర్భంలో తెలిసి వచ్చింది. ఇప్పుడు మీరు విన్నటువంటి ఈ సంఘటన సహీహ్ బుఖారీలో ఉంది. గమనించారా! జ్ఞానం, వివేకం ఎలా శాంతి ఐక్యతకు దారి చూపుతుందో, మరియు అజ్ఞానం, మూర్ఖత్వం అశాంతి అలజడులకు దారి తీస్తుంది.
శాంతి భద్రతల ఆవశ్యకత
ఓ విశ్వాసులారా! అల్లాహ్ మన దేశం, దేశవాసులపై చాలా గొప్ప వరం అనుగ్రహించాడు.
[ఇది అరబ్బీ ఖుత్బా యొక్క అనువాదం కదా, సౌదియాలో జుమా రోజు (19 సెప్టెంబర్ 2025) కు జరిగినటువంటి జుమా ప్రసంగం ఇది. ఇక్కడి వారిని ప్రత్యేకంగా ఉద్దేశించి ఖతీబ్ ఫజీలతుష్ షేక్ రాషిద్ బిన్ అబ్దుర్రహ్మాన్ అల్-బిదా హఫిజహుల్లాహ్ జామియ బిన్ ఉసైమీన్ లో ప్రసంగించారు]
ఓ విశ్వాసులారా! అల్లాహ్ మన దేశం, దేశవాసులపై చాలా గొప్ప వరం అనుగ్రహించాడు. మనం ఖుర్ఆన్ సున్నత్ మార్గదర్శకత్వంలో మన నాయకులకు విధేయులుగా మరియు ఐక్యతతో ఉన్నాము. అల్లాహ్ మనల్ని పెద్ద ఫిత్నాల సంక్షోభాల నుండి కాపాడాడు. చుట్టుపక్కల్లో చూడండి పరిస్థితి ఎలా ఉంది?
مِنَ الَّذِينَ فَرَّقُوا دِينَهُمْ وَكَانُوا شِيَعًا ۖ كُلُّ حِزْبٍ بِمَا لَدَيْهِمْ فَرِحُونَ [మినల్లజీన ఫర్రఖూ దీనహుమ్ వ కానూ షియఅన్, కుల్లు హిజ్బిన్ బిమా లదైహిమ్ ఫరిహూన్] “వారు తమ ధర్మాన్ని ముక్కచెక్కలు చేసేశారు. వారు సయితం విభిన్న ముఠాలుగా చీలిపోయారు. ప్రతి ముఠా తన దగ్గర ఉన్న దానితోనే తెగ సంబరపడిపోతోంది.” (30:32)
విశ్వాసులారా! మన దేశం (అంటే సౌదీ అరేబియా) అలజడులు, విభేదాలు లేకుండా సురక్షితంగా ఉన్న ప్రాంతం. ఇది ఖుర్ఆన్ అవతరించిన భూమి కాదా? ఈమాన్ (విశ్వాస) గూడు కాదా? వీరుల జయాల ప్రదేశం మరియు విశ్వవ్యాప్తంగా ప్రజలకు మేలు చేకూర్చే అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించే దేశం కాదా? అవును తప్పకుండా. అల్లాహ్ అనుగ్రహాల్లో గొప్ప అనుగ్రహం మనం స్నేహభావం, శాంతి సంపదల మరియు ఉదార గుణాలతో జీవిస్తున్నాం. అల్హమ్దులిల్లాహ్!
ఏమిటి? మేము వారికి సురక్షితమైన, పవిత్రమైన చోట స్థిరనివాసం కల్పించలేదా? అక్కడ వారికి అన్ని రకాల పండ్లు ఫలాలు ఉపాధి రూపంలో మావద్ద నుంచి సరఫరా చేయబడలేదా? కాని వారిలోని చాలా మంది (ఈ యదార్థాన్ని) తెలుసుకోరు.(28:57)
ఇబ్రాహీం (అలైహిస్సలాం) దుఆ
వేలాది సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనను గుర్తుంచుకుందాం. అప్పుడు ఇబ్రాహీం (అలైహిస్సలాం) కాబా స్థలానికి వచ్చి, అది ఇంకా నిర్మించబడక ముందే ఇలా దుఆ చేశారు:
رَبِّ اجْعَلْ هَـٰذَا بَلَدًا آمِنًا [రబ్బిజ్ అల్ హాజా బలదన్ ఆమినా] “నా ప్రభూ! నీవు ఈ ప్రదేశాన్ని శాంతి నగరంగా చెయ్యి.“ (2:126)
ఇక్కడ గమనించండి దుఆలో ఉన్న పదాన్ని “రబ్బిజ్ అల్ హాజా ‘బలదన్’ ఆమినా” (నకిరా అంటారు). సూరతుల్ బకరాలోని ఆయత్ నంబర్ 126. ఆ తర్వాత ఆయన కాబాను నిర్మించారు. చుట్టూ ప్రజల హృదయాలు ఆకర్షితమయ్యే నగరం ఏర్పడినప్పుడు మళ్లీ ఇలా దుఆ చేశారు:
رَبِّ اجْعَلْ هَـذَا الْبَلَدَ آمِنًا [రబ్బిజ్ అల్ హాజల్ బలద ఆమినా] ““నా ప్రభూ! ఈ నగరాన్ని శాంతి భద్రతల నగరంగా చేయి!” (14:35)
ఇక్కడ “అల్-బలద” అని వచ్చి ఉంది. పైన ఏముంది? “బలదన్”. అంటే అప్పటికి అది ప్రజలు నివసించలేదు, అప్పుడు కూడా దుఆ చేశారు. ప్రజలు అక్కడ నివసించిన తర్వాత కూడా దుఆ చేశారు. ఏమని? “నా ప్రభు ఈ నగరాన్ని శాంతి భద్రతల నగరంగా చేయి” (సూరత్ ఇబ్రాహీం ఆయత్ నంబర్ 35). అంటే ఏం తెలిసింది? భద్రత, శాంతి, అమ్నో-అమాన్, పీస్ ఫుల్ లైఫ్ – ఇది నిర్మాణానికి ముందు అవసరం, నిర్మాణం తర్వాత కూడా అవసరమే.
అల్లాహు అక్బర్! ఇస్లాం ఎలా శాంతి భద్రతలకు ప్రాముఖ్యత ఇస్తుందో గమనించారా!
అల్లాహ్ అనుగ్రహం
ఇంకా గుర్తుంచుకుందాం. అరబ్ ద్వీపకల్పం దోపిడీలు, హత్యలు, లూటీలకు రంగస్థలంగా ఉన్న రోజుల్లో అల్లాహ్ మనపై చేసిన ఉపకారం గుర్తుంచుకుందాం.
“ఒకప్పటి మీ పరిస్థితిని కాస్త జ్ఞప్తికి తెచ్చుకోండి – అప్పట్లో మీరు అవనిలో అల్ప సంఖ్యలో ఉండేవారు. మరీ బలహీనులుగా పరిగణించబడేవారు. ప్రజలు మిమ్మల్ని మట్టుబెడతారేమోనని మీరు భయంతో బిక్కుబిక్కుమంటూ ఉండేవారు. అలాంటి పరిస్థితిలో అల్లాహ్ మీకు ఆశ్రయమిచ్చి, తన సహాయంతో మీకు బలిమిని ఇచ్చాడు. మీకు పరిశుభ్రమైన, పరిశుద్ధమైన ఆహార వస్తువులను ప్రసాదించాడు – మీరు కృతజ్ఞులై ఉండేందుకు.“ (8:26)
ఇప్పటి రోజుల్లో కూడా ప్రతి అంతర్జాతీయ, ప్రాంతీయ సంఘటన మన నాయకుల చుట్టూ మరియు జ్ఞానవంతుల చుట్టూ మనం ఏకతాటిపై ఉండాల్సిన అవసరాన్ని మళ్ళీ మళ్ళీ మనకు గుర్తు చేస్తుంది. భద్రత అనేది చర్చకు గురయ్యే అంశం కాదు అని మనం పూర్తిగా విశ్వసించాలి. ఎందుకంటే భద్రత పోయిన వెంటనే జీవితం తన అందాన్ని కోల్పోతుంది.
అందుకే సౌదీ అరేబియా రాజ్యం శక్తివంతంగా, గౌరవంగా నిలవాలి మరియు ప్రతి దురుద్దేశం మరియు కుతంత్రం నుంచి సురక్షితంగా ఉండాలి. ఇది మానవ సమాజం కోసం ప్రేమతో గమనించే కన్నుగా, సహాయం చేసే చేతిగా ఉండాలి.
మనం మన ప్రాంతంలో ఈ ప్రయత్నం చేయాలి. తౌహీద్, సున్నత్ కు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా అల్లాహుతాలా మనకు ఈ శాంతి భద్రతలు ప్రసాదిస్తాడు. సూరతుల్ నూర్ లో కూడా ఈ విషయాన్ని చూడవచ్చు. ఇక్కడికి మొదటి ఖుత్బా పూర్తయింది.
మన దేశ భద్రత మరియు అభివృద్ధిని కాపాడే విధంగా మన తరం పిల్లల్ని పెంపకం చేయడం అత్యంత ముఖ్యమైన బాధ్యతలలో ఒకటి. అలాగే అహ్లుస్ సున్నత్ యొక్క మన్హజ్ మరియు అఖీదాలోని ఒక కీలక విషయాన్ని కూడా వారికి (పిల్లలకు) నేర్పాలి. ఏమిటి అది? తమ నాయకుల మాట వినడం, వారికి విధేయత చూపడం విధిగా ఉంది అని, వారి నాయకత్వపు శపథాన్ని (బైఅతుల్ ఇమామ్) భంగపరచకుండా ఉండడం కూడా విధిగా ఉంది అని. అలాగే వారి (అంటే ముస్లిం నాయకుల) మేలు కోరుతూ అల్లాహ్ వారికి సద్భాగ్యం ప్రసాదించాలని దుఆ కూడా చేస్తూ ఉండాలి.
ఈ భావాన్ని బలపరిచే అర్థవంతమైన ఓ సంఘటన మీకు వినిపిస్తాను. ఇది కూడా ‘సహీహ్ బుఖారీ’లో ఉంది (7111 హదీథ్ నెంబర్). శ్రద్ధగా వినండి.
శాంతి భద్రతల గురించి, ముస్లిం నాయకుని పట్ల మనమందరము ఐక్యతగా ఉండడం ఎంత ముఖ్యమో ‘సహీహ్ బుఖారీ’లోని ఈ హదీథ్ ద్వారా తెలుస్తుంది. ఇక్కడ కూడా హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హుమా) వారి యొక్క సంఘటన వినండి.
మదీనాలో ప్రజలు యజీద్ బిన్ ముఆవియా బైఅతును విరమించుకున్నారు. అప్పుడు తెలివైన ఉపాధ్యాయుడైన హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హుమా) వారు ఏదైతే బైఅతును విరమించుకున్నారో దాని భయంకర ప్రమాదాన్ని మరియు చాలా ప్రమాదకరమైన అఖీదా లోపాన్ని గ్రహించారు. ఆయన మొదట తన సొంత కుటుంబాన్ని హెచ్చరించడం మొదలుపెట్టారు. తన సేవకుల్ని మరియు పిల్లల్ని కూర్చోబెట్టి ఇలా అన్నారు: “మేము ఈ వ్యక్తి (అంటే యజీద్) కి అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త ఆజ్ఞానుసారంగా బైఅతు ఇచ్చాము. మీలో ఎవరైనా ఈ నాయకుడిని బైఅతు నుండి తొలగిపోతే లేదా ఇంకెవరికైనా బైఅతు ఇస్తే అతనితో నా సంబంధం అంతే (ఇక తెగిపోతుంది). ఇక నా పక్షాన అతనికి ఏమీ ఉండదు.” అంటే ఆయన అలాంటి వారిని బహిష్కరిస్తారు, మాట్లాడరు కూడా. ఈ విధంగా హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) హెచ్చరించారు.
ఇబ్ను హజర్ (రహిమహుల్లాహ్) – సహీహ్ బుఖారీ వ్యాఖ్యానం రాసిన వారు – ఈ హదీస్ (7111) వ్యాఖ్యానంలో చెప్పారు: “ఈ సంఘటన సారాంశం ఏమిటంటే బైఅతు జరిగిన నాయకుడికి విధేయత చూపడం విధి. అతనిపై తిరుగుబాటు నిషిద్ధం (హరామ్). ఎంతవరకు హరామ్? ఆ నాయకుడు అన్యాయంగా వ్యవహరించినా సరే అతనికి తిరుగుబాటుగా ఉండడం ఇది న్యాయం కాదు. కేవలం అతని పాపాల కారణంగా అతని బైఅతును విరమించుకోవడం సరైన మాట కాదు” అని హాఫిజ్ ఇబ్ను హజర్ అస్ఖలానీ (రహిమహుల్లాహ్) తెలియజేశారు.
ఐక్యంగా ఉండాలన్న ఆజ్ఞ
సోదర మహాశయులారా! ఓ సౌదీ అరేబియా ముస్లిములారా! (ఖతీబ్ గారు అలా అంటున్నారు కనుక తెలుగులో అలా అనువదించడం జరిగింది. మనం ప్రతి దేశంలో ఉన్న ప్రతి ముస్లిం కి ఈ మాట చెబుతున్నాం). మన దేశంలో పాలకులు మరియు ప్రజల మధ్య ఉన్న ఐక్యత మరియు పరస్పర ప్రేమ శతాబ్దాలుగా కొనసాగుతుంది. ఇది కేవలం అల్లాహ్ యొక్క దయానుగ్రహం. ఆయన తాడును (అంటే ధర్మాన్ని) పట్టుకొని ఉండడమే గాక, నిలకడగా ఉన్న ఉలమా (అల్-ఉలమా ఉర్-రాసిఖూన్ – దృఢంగా నిలబడిన నాయకులు) మరియు ప్రజల శ్రేయోభిలాష మరియు వారి నిజమైన దుఆలు – వీటితో కూడి సాధ్యమైంది. ఇదే అల్లాహ్ ఆదేశం కూడా:
“అల్లాహ్ త్రాడును అందరూ కలసి గట్టిగా పట్టుకోండి. చీలిపోకండి. అల్లాహ్ మీపై కురిపించిన దయానుగ్రహాన్ని జ్ఞప్తికి తెచ్చుకోండి – అప్పుడు మీరు ఒండొకరికి శత్రువులుగా ఉండేవారు. ఆయన మీ హృదయాలలో పరస్పరం ప్రేమానురాగాలను సృజించాడు. దాంతో ఆయన అనుగ్రహం వల్ల మీరు ఒకరి కొకరు అన్నదమ్ములుగా మారారు. .” (3:103)
ముగింపు దుఆ
اللهم يا من حَفِظتَ بلادَنا طيلةَ هذهِ القرونِ، وكفيتَها شرَ العادياتِ الكثيراتِ المدبَّراتِ الماكراتِ، ఓ అల్లాహ్! నువ్వు ఈ శతాబ్దాలంతా మా దేశాన్ని కాపాడినవాడివి, అనేక plotting చేసిన శత్రువుల చెడునుండి దాన్ని రక్షించినవాడివి,
اللهم فأدِمْ بفضلِكَ ورحمتِكَ حِفْظَها من كل سوءٍ ومكروهٍ، وأدِمْ عليها نعمةَ الإخاءِ والرخاءِ. ఓ అల్లాహ్! నీ దయ మరియు కరుణతో మమ్మల్ని ప్రతి చెడు మరియు నష్టం నుండి ఎప్పటికీ కాపాడుతూ ఉండు, మరియు మాకు సోదరభావం, శాంతి ఆశీర్వాదాలు ప్రసాదించు.
• اللهم احفظْ دينَنا وأمنَنا، واحفَظْ أرجاءَنا وأجواءَنا، وحدودَنا وجنودَنا، واقتصادَنا وعتادَنا، واحفظْ مملكتَنا وخليجَنا، وسائرَ بلادِ المسلمينَ. ఓ అల్లాహ్! మా దీన్‌ను, మా భద్రతను, మా దేశపు అన్ని భాగాలనూ, వాతావరణాన్ని, సరిహద్దులనూ, సైనికులనూ, ఆర్థిక వ్యవస్థనూ, సమస్త సామాగ్రిని కాపాడు, మా రాజ్యమైన సౌదీ అరేబియాను మరియు గల్ఫ్ ప్రాంతాన్నీ, మరియు ముస్లింల దేశాలన్నిటినీ కాపాడు.
اللهم صُدَّ عنا غاراتِ أعدائِنا المخذولينَ وعصاباتِهِم المتخوِّنينَ. ఓ అల్లాహ్! మమ్మల్ని మా ఓడిపోయిన శత్రువుల దాడుల నుండి మరియు వాళ్ల కుట్రా గుంపుల నుండి కాపాడు.
اللهم اكفِنا شرَ طوارقِ الليلِ والنهارِ، إلا طارقًا يَطرقُ بخيرٍ يا رحمنُ. ఓ అల్లాహ్! రాత్రి, పగలు దుష్ట శత్రువుల చెడు నుండీ మమ్మల్ని కాపాడు – కేవలం మంచి వార్తలతో వచ్చే అతిథిని రానివ్వు – ఓ రహ్మాన్!
اللهم وانصرْ إخوانَنا بأكنافِ بيتِ المقدسِ، واهزِمْ إخوانَ القردةِ والخنازيرِ. ఓ అల్లాహ్! బైతుల్ మక్దిస్ పరిసరాల్లో ఉన్న మా సోదరులను నీవు గెలిపించు, వారికి సహాయం అందించు. మరియు కోతులు, పందులు వంటి వారిని ఓడించు.
اللهم وفِّقْ وليَ أمرِنا ووليَ عهدِه لهُداكَ. واجعلْ عمَلَهُما في رضاكَ. ఓ అల్లాహ్! మా నాయకుడిని మరియు ఆయన వారసుడిని నీ హిదాయత్ వైపు నడిపించు, వారి కార్యాలు నీ సంతోషానికి కారణమయ్యేలా చేయు.
اللهم سدِّدهُمْ في قراراتِهِمْ ومؤتمراتِهِمْ. ఓ అల్లాహ్! వారి నిర్ణయాలలోను, సమావేశాలలోను వారికి సరైన దారిని చూపు.
اَللَّهُمَّ صَلِّ وَسَلِّمَ عَلَى عَبْدِكَ وَرَسُولِكَ مُحَمَّدٍ. ఓ అల్లాహ్! నీ బానిస మరియు ప్రవక్త అయిన ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పైన శాంతి మరియు దీవెనలు వర్శించు గాక!
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
శీతాకాలం ఆదేశాలు, మర్యాదలు – జుమా ఖుత్బా https://youtu.be/94K03YKJMVg [14 నిముషాలు] ఖతీబ్ ( అరబీ భాష): షేఖ్ అబ్దుల్ అజీజ్ అల్ ఉలైవీ ﷾. అనువాదకులు: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ.
ఈ ఖుత్బాలో, షేఖ్ అబ్దుల్ అజీజ్ అల్ ఉలైవి శీతాకాలం యొక్క ప్రాముఖ్యత మరియు ఒక ముస్లిం జీవితంలో దాని స్థానం గురించి వివరించారు. రుతువుల మార్పు అల్లాహ్ యొక్క జ్ఞానానికి నిదర్శనమని, శీతాకాలం నరకంలోని చలిని మరియు స్వర్గంలోని అనుగ్రహాలను గుర్తు చేస్తుందని తెలిపారు. చలికాలంలో పేదలకు సహాయం చేయడం, ఉపవాసాలు ఉండటం మరియు రాత్రి నమాజులు చేయడం వంటి పుణ్యకార్యాల ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు. ఇది విశ్వాసికి ఒక వసంత కాలం లాంటిదని, ఈ సమయంలో చేసే ఆరాధనలు అల్లాహ్ కు చాలా ఇష్టమైనవని వివరించారు. అలాగే చలిలో వుదూ చేయడం, అనారోగ్యం పట్ల సరైన దృక్పథం కలిగి ఉండటం మరియు అల్లాహ్ అనుగ్రహాలను గుర్తుచేసుకోవడం వంటి విషయాలను కూడా ప్రస్తావించారు.
అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్, నబియ్యినా ముహమ్మద్ వ ఆలా ఆలిహి వ సహ్బిహి అజ్మయీన్, అమ్మా బాద్.
పదిహేనవ డిసెంబర్ 2023, జుమా రోజున ఫదీలతుష్ షేఖ్ అబ్దుల్ అజీజ్ అల్ ఉలైవి హఫిదహుల్లాహ్ ఇచ్చినటువంటి జుమా ఖుత్బా అనువాదం, “అష్షితా అహ్ కామ్ వ ఆదాబ్” – శీతాకాలం ఆదేశాలు మరియు మర్యాదలు. దీనినే మనం మరింత వివరంగా అర్థం కావడానికి “కాలాల మార్పులో గుణపాఠాలు” మరియు “శీతాకాలం విశ్వాసికి వసంతం” అన్నటువంటి పేర్లతో మీ ముందు తీసుకురావడం జరిగింది.
ఆకాశంలో బురుజులను నిర్మించి, అందులో ప్రజ్వలమైన దీపాన్ని, కాంతిమంతమైన చంద్రుణ్ణి ఆవిష్కరించినవాడు శుభకరుడు. ఆయనే రేయింబవళ్ళను ఒకదాని వెనుక ఒకటి వచ్చేలా చేశాడు.ఇదంతా గుణపాఠం నేర్చుకునే వాని కోసం, లేదా కృతజ్ఞతాపూర్వకంగా మసలుకోదలచిన వాని కోసం చేయబడింది. (ఫుర్ఖాన్ 25:61,62)
ఇప్పుడు ఈ శీతాకాలం తన చలితో మన ముందుకు వచ్చింది. ఇది అల్లాహ్ యొక్క స్పష్టమైన సూచనల్లో ఒకటి, ఆయన అద్భుతమైన జ్ఞానాన్ని మనకు గుర్తు చేస్తుంది. ఇంకా ఏమి గుర్తు చేస్తుంది!?
శీతాకాలం నరకంలోని చలిని గుర్తు చేస్తుంది
బుఖారీ 3260 మరియు ముస్లిం 617లో ఉంది: హజ్రత్ అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు: ప్రవక్త ﷺ ఇలా అన్నారు:
“నరకం తన ప్రభువుతో ఫిర్యాదు చేసింది: ‘ఓ ప్రభూ! నా కొంత భాగం మరొక భాగాన్ని తినేస్తోంది.’ అప్పుడు అల్లాహ్ దానికి రెండు శ్వాసల గురించి అనుమతించాడు: ఒకటి శీతాకాలంలో, మరొకటి వేసవిలో. అందువల్ల మీరు అనుభవించే అత్యంత వేడి దాని తీవ్రమైన వేడిలోనిది, మరియు మీరు అనుభవించే అత్యంత చలి దాని ‘జమ్ హరీర్’ లోనిది.”
జమ్ హరీర్ – నరకంలోని అత్యంత చలి ఉండే ప్రదేశం. దీనికి సంబంధించి మరికొన్ని విషయాలు వస్తున్నాయి, శ్రద్ధగా వింటూ ఉండండి.
స్వర్గంలోని అనుగ్రహాన్ని గుర్తు చేస్తుంది
అల్లాహ్ ఇలా తెలిపాడు:
مُتَّكِئِينَ فِيهَا عَلَى الْأَرَائِكِ لَا يَرَوْنَ فِيهَا شَمْسًا وَلَا زَمْهَرِيرًا (ముత్తకి’ఈన ఫీహా అలల్ అరాయికి లా యరౌన ఫీహా షమ్సన్ వలా జమ్ హరీరా) “వారక్కడ దిండ్లకు ఆనుకొని పీఠాలపై కూర్చుని ఉంటారు. అక్కడ వారు సూర్య తాపాన్ని గానీ, చలి తీవ్రతను గానీ చూడరు“. (ఇన్సాన్ 76:13).
చూశారా? సూరతుల్ ఇన్సాన్ సూర నెంబర్ 76 లోని ఈ 13 వ ఆయత్ లో “వలా జమ్ హరీరా” అని ఏదైతే ఉందో, చలి తీవ్రతను కూడా చూడరు అన్నటువంటి అనువాదం ఇక్కడ చేయడం జరిగింది.
ఇమాం ఇబ్ను కసీర్ రహిమహుల్లాహ్ ఇలా వ్యాఖ్యానించారు: “అంటే వారికి బాధాకరమైన వేడి కూడా లేదు, బాధాకరమైన చలి కూడా లేదు. ఇది శాశ్వతమైన సుఖమే.”
నరకవాసుల శిక్షను గుర్తు చేస్తుంది
అల్లాహ్ ఇలా చెప్పాడు:
هَذَا فَلْيَذُوقُوهُ حَمِيمٌ وَغَسَّاقٌ (హాజా ఫల్ యజూఖూహు హమీమున్ వ గస్సాఖ్) ఇదీ (వారి గతి)! దాన్ని వారు రుచి చూడాలి. మరిగే నీళ్లు, చీము నెత్తురు. (సాద్ 38:57).
ఇవి నరకంలో ఉన్న వారు ఎదుర్కొనే రెండు కఠిన శిక్షలు. తీవ్ర వేడి అంటే ఇక్కడ వేడి వేడి నీరు హమీమన్, మరియు గస్సాఖ్ అని ఏదైతే చెప్పడం జరిగిందో, తీవ్ర చలి అని కూడా వ్యాఖ్యానించడం జరిగింది.
అల్లాహ్ మనకు ప్రసాదించిన అనుగ్రహాలను గుర్తు చేస్తుంది
ఇళ్ల ఆశ్రయం, దుస్తులు, హీటర్లు, వెచ్చదనం ఇవన్నీ అల్లాహ్ దయ, అనుగ్రహాలు. అల్లాహ్ ఇలా తెలిపాడు:
وَاللَّهُ جَعَلَ لَكُم مِّن بُيُوتِكُمْ سَكَنًا (వల్లాహు జ’అల లకుమ్ మిన్ బుయూతికుమ్ సకనా) అల్లాహ్ మీ కొరకు మీ ఇండ్లను విశ్రాంతి స్థలాలుగా చేశాడు. (16:80)
وَجَعَلَ لَكُمْ سَرَابِيلَ تَقِيكُمُ الْحَرَّ وَسَرَابِيلَ تَقِيكُم بَأْسَكُمْ (వ జ’అల లకుమ్ సరాబీల తఖీకుముల్ హర్ర వ సరాబీల తఖీకుమ్ బ’సకుమ్) ఇంకా ఆయనే మీకోసం, మిమ్మల్ని వేడిమి నుంచి కాపాడే చొక్కాలను, యుద్ధ సమయాలలో మీకు రక్షణ కవచంగా ఉపయోగపడే చొక్కాలను కూడా చేశాడు. (నహ్ల్ 16:81)
మరియు పశువుల గురించి ఇలా తెలిపాడు:
وَلَكُمْ فِيهَا دِفْءٌ وَمَنَافِعُ (వలకుమ్ ఫీహా దిఫ్’ఉన్ వ మనాఫి’ఉ) వాటిలో మీ కొరకు వేడినిచ్చే దుస్తులు, ఇతరత్రా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. (నహ్ల్ 16:05).
అంటే వాటి ఉన్ని, వెంట్రుకలు, బొచ్చుతో మనం దుస్తులు, దుప్పట్లు తయారు చేస్తాము.
పేదల అవసరాలను తీర్చాలని గుర్తు చేస్తుంది
మన ఇళ్లల్లో హీటర్లు, దుప్పట్లు, వేడి దుస్తులు అదనంగా, అవసరానికి మించి ఉంటే మన చుట్టూ కొన్ని కుటుంబాలు తీవ్ర చలిలో వణుకుతున్నాయి. ఇది విశ్వాసుల బాధ్యత: పేదలను గమనించడం, సహాయం చేయడం.
హజ్రత్ ఉమర్ రజియల్లాహు అన్హువారి నసీహత్ గుర్తు చేస్తుంది
హజ్రత్ ఉమర్ రజియల్లాహు అన్హు ప్రజలకు ఇలా వ్రాసేవారు: “చలి శత్రువు లాంటిది. చలికి సిద్ధంగా ఉండండి. ఉన్నితో, సాక్స్‌లతో, దుప్పట్లతో మిమ్మల్ని మీరు కాపాడుకోండి అంటే వేడిగా ఉంచుకోండి. ఎందుకంటే చలి శరీరంలో త్వరగా ప్రవేశిస్తుంది, నెమ్మదిగా వెళ్తుంది.”
విశ్వాసి యొక్క వసంత కాలం అని గుర్తు చేస్తుంది
ప్రవక్త ﷺ అన్నారు:
«الغَنِيمَةُ البَارِدَةُ الصَّوْمُ فِي الشِّتَاءِ» (అల్ గనీమతుల్ బారిదతు అస్సౌము ఫిష్షితా) శీతకాలంలో ఉపవాసాలు కష్టం లేని యుద్ధ ఫలం లాంటిది. (తిర్మిజి 797. షేఖ్ అల్బానీ సహీ అన్నారు).
హజ్రత్ ఉమర్ రజియల్లాహు అన్హు చెప్పారు:
الشتاء غنيمةُ العابدينَ “అష్షితా ఉ గనీమతుల్ ఆబిదీన్” శీతాకాలం ఆరాధకులకు గొప్ప అదృష్ట సమయం.
హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ రజియల్లాహు అన్హు చెప్పారు:
مرحبًا بالشتاء تنزل فيه البركة، ويطول فيه الليل للقيام، ويقصر فيه النهار للصيام” “మర్ హబమ్ బిష్షితా ఇ తన్జిలు ఫీహిల్ బరక, వ యతూలు ఫీహిల్ లైలు లిల్ ఖియామ్, వ యఖ్ సురు ఫీహిన్ నహారు లిస్సియామ్” “శీతాకాలానికి స్వాగతం, అందులో బర్కత్ (శుభం) దిగుతుంది, తహజ్జుద్ కొరకు రాత్రి పొడుగ్గా ఉంటుంది, ఉపవాసం కొరకు పగలు చిన్నగా ఉంటుంది.”
ముఆజ్ బిన్ జబల్ రజియల్లాహు అన్హు మరణ సమయంలో ఏడుస్తూ చెప్పారు:
إنما أبكي على ظمأ الهواجر، وقيام ليل الشتاء، ومزاحمة العلماء بالركب عند حِلَق الذكر. “ఇన్నమా అబ్కీ అలా దమఇల్ హవాజిర్ వ ఖియామి లైలిష్ షితా వ ముజాహమతిల్ ఉలమా ఇ బిర్రుకబి ఇంద హిలఖిద్ దిక్ర్” “నేను మూడు వాటికోసమే ఏడుస్తున్నాను: వేసవి ఉపవాసంలోని దాహం, శీతాకాల రాత్రి ప్రార్థనలు, పండితులతో (నేర్చుకొనుటకు) కూర్చోవడం.”
చలిలో వుజూ చేసే ఘనతను గుర్తు చేస్తుంది
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందర్భంలో అడిగారు:
»ألا أدلُّكم على ما يمحو الله به الخطايا ويرفعُ به الدرجاتِ؟» قالوا: بلى يا رسول الله.قال: «إسباغُ الوضوءِ على المكارهِ«
“అల్లాహు తఆలా ఏ కారణంగా మీ పాపాలను తుడిచివేసి మీ స్థానాలను పెంచుతాడో తెలుపనా?” తప్పక తెలుపండి ప్రవక్తా! అని సహాబాలు అన్నారు. అప్పుడు ప్రవక్త ﷺ చెప్పారు: “అనుకూల సమయసందర్భం కాకపోయినా సంపూర్ణంగా వుజూ చేయడం“
తీవ్రమైన చలిలో వుజూ పూర్తి చేయడం పుణ్యం పెంచుతుంది, అయితే అవసరమైతే నీటిని వేడి చేయడం అనుమతే. చలి తీవ్రమై వుజూ చేయలేకపోతే తయ్యమ్ముమ్ కూడా అనుమతి ఉంది.
జ్వరాన్ని తిట్టరాదు అన్న ప్రవక్త ﷺ బోధను గుర్తు చేస్తుంది
ఉమ్ము సాయిబ్ రజియల్లాహు అన్హాకు తీవ్రమైన జ్వరం వచ్చి బాధపడుతున్నప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆమెను పరామర్శించి, ఇంతగా వణుకుతున్నావు ఏమిటి అని అడిగారు.
అందుకు ఆమె:
لَا بَارَكَ اللهُ فِيهَا “లా బారకల్లాహు ఫీహా” ‘అల్లాహ్ ఈ జ్వరంలో వృద్ధి కలుగుజేయకూడదు’ అని పలికింది.
అప్పుడు ప్రవక్త ﷺ చెప్పారు:
»لَا تَسُبِّي الْحُمَّى، فَإِنَّهَا تُذْهِبُ خَطَايَا بَنِي آدَمَ كَمَا يُذْهِبُ الْكِيرُ خَبَثَ الْحَدِيدِ« (లా తసుబ్బిల్ హుమ్మా, ఫఇన్నహా తుజ్హిబు ఖతాయా బనీ ఆదమ, కమా యుజ్హిబుల్ కీరు ఖబసల్ హదీద్) నీవు జ్వరాన్ని తిట్టకు (దూషించకు), ఎందుకంటే బట్టి ఇనుము తుప్పు (జంగు)ను దూరం చేసినట్లు ఈ జ్వరం ఆతం సంతతి పాపాలను దూరం చేస్తుంది. (ముస్లిం 2575).
ముగింపు దుఆ
ఓ అల్లాహ్ దాసులారా! అల్లాహ్‌కు భయపడండి — బహిర్గతంగా గానీ, అంతరంగంలో గానీ. అల్లాహ్ సూర బఖర 2:216లో ఇలా తెలిపాడు:
وَعَسَى أَن تَكْرَهُوا شَيْئًا وَهُوَ خَيْرٌ لَّكُمْ … وَاللَّهُ يَعْلَمُ وَأَنتُمْ لَا تَعْلَمُونَ వ ‘అసా అన్ తక్రహూ షై’అన్ వహువ ఖైరుల్ లకుమ్ వల్లాహు య’అలము వ అన్తుమ్ లా త’అలమూన్. ) మీరు దేన్ని ఇష్టపడటం లేదో అదే మీ పాలిట బహుశా శుభకరం కావచ్చు. … నిజ జ్ఞానం అల్లాహ్‌కు మాత్రమే ఉంది. మీకు ఆ విషయం తెలియదు.
అల్లాహ్ ఈ శీతాకాలాన్ని మనపై మరియు సమస్త ముస్లింలపై కరుణ, శాంతి, రక్షణతో నింపుగాక. మన సోదర సోదరీమణుల అవసరాలను తీర్చేలా మనందరిని ప్రేరేపించుగాక. ఆమీన్.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
చిన్న షిర్క్ (ప్రదర్శనాబుద్ధి) విషయంలో ఎక్కువగా భయపడండి | బులూగుల్ మరాం | హదీసు 1281 https://www.youtube.com/watch?v=ZodO3_eKB7c [5 నిముషాలు] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
1281. హజ్రత్ మహమూద్ బిన్ లబీద్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రవచించారు:
“మీ గురించి అన్నింటి కన్నా ఎక్కువగా నేను చిన్న షిర్క్ (షిర్కె అస్గర్) – అంటే ప్రదర్శనా బుద్ది విషయంలో భయపడుతున్నాను.” (ఇమామ్ అహ్మద్ దీనిని ‘హసన్ పరంపర నుండి సేకరించారు)
సారాంశం: ప్రదర్శనాబుద్ధి అనేది మనిషి మాటల్లోనూ, చేతల్లోనూ కూడా ఉంటుంది. మనిషి ఏదైనా మంచి పనిచేసి దాని ద్వారా అల్లాహ్ యేతరుల మెప్పు పొందగోరటమే ప్రదర్శనాబుద్ధి. ఈ ప్రదర్శనాబుద్ధి రెండు రకాలుగా ఉంటుంది. మనిషి తాను చేసిన గొప్ప పనిని ఎవరూ చూడక పోతే దాని గురించి నలుగురికీ చెప్పుకుంటూ లేక చూపించుకుంటూ తిరగటం ఒక రకం. ప్రతి పనినీ నలుగురికీ చూపిస్తూ చేయటం రెండవ రకం. ఇవి రెండూ సమ్మతం కావు. అల్లాహ్ మరియు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ ప్రదర్శనా భావాన్ని ఈసడించుకున్నారు. దీన్ని కపటత్వానికి నిదర్శనంగా కూడా ఖరారు చేశారు. ప్రదర్శనాబుద్ధితో కూడిన ఏ పుణ్యకార్యమూ అల్లాహ్ సమక్షంలో స్వీకరించబడదు. కాబట్టి అన్ని విధాలా – శాయశక్తులా – దీనికి దూరంగా ఉండేందుకు ప్రయత్నించాలి.
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన అనుచర సమాజం (ఉమ్మత్) గురించి అత్యధికంగా భయపడిన విషయం ‘షిర్కె అస్గర్’ (చిన్న షిర్క్) అని ఈ ప్రసంగం వివరిస్తుంది. ఈ చిన్న షిర్క్ అంటే ‘రియా’ – అనగా ఇతరుల మెప్పు, ప్రశంసలు పొందాలనే ఉద్దేశ్యంతో చేసే ప్రదర్శన బుద్ధి. ఇది ‘షిర్కె ఖఫీ’ (గుప్తంగా ఉండే షిర్క్) అని కూడా పిలవబడుతుంది. ప్రళయ దినాన, ప్రదర్శన బుద్ధి కోసం సత్కార్యాలు చేసిన వారిని అల్లాహ్, “మీరు ఎవరికోసం అయితే ఈ పనులు చేశారో, వారి వద్దకే వెళ్లి ప్రతిఫలం అడగండి” అని అంటాడని హదీసులో ఉంది. రియా వల్ల కలిగే నష్టాలు తీవ్రమైనవి: సత్కార్యాలు నిరర్థకం అవ్వడం, కపట విశ్వాసుల లక్షణాన్ని పోలి ఉండటం, మరియు తీవ్రమైన శిక్షకు గురికావడం. అందువల్ల, ప్రతి పనిని కేవలం అల్లాహ్ ప్రసన్నత కోసమే చేయాలని, ప్రదర్శన బుద్ధికి దూరంగా ఉండాలని ఈ ప్రసంగం నొక్కి చెబుతుంది.
وَعَنْ مَحْمُودِ بْنِ لَبِيدٍ رَضِيَ اللَّهُ تَعَالَى عَنْهُ، قَالَ: قَالَ رَسُولُ اللَّهِ صلى الله عليه وسلم: إِنَّ أَخْوَفَ مَا أَخَافُ عَلَيْكُمُ الشِّرْكُ الأَصْغَرُ హజ్రత్ మహమూద్ బిన్ లబీద్ రదియల్లాహు త’ఆలా అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు: “మీ గురించి అన్నింటి కన్నా ఎక్కువగా నేను చిన్న షిర్క్ (షిర్కె అస్గర్) – అంటే ప్రదర్శనా బుద్ది విషయంలో భయపడుతున్నాను“.
అల్లాహు అక్బర్. చూడడానికి ఈ హదీస్ చాలా చిన్నగా ఉన్నప్పటికీ, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి మన గురించి ఎంత రంది ఉండినదో తెలుస్తుంది, ఒక మాట. మనం ఏదైనా నష్టంలో పడిపోతామో, ఏదైనా పాపములో పడిపోతామో అని ప్రవక్త మన గురించి ఎంత భయం చెందేవారు. ఆ సందర్భంలో అలాంటి పరిస్థితిలో మనం ఏం చేయాలి అన్నది కూడా మనకు నేర్పేవారు.
షిర్కె అస్గర్ (చిన్న షిర్క్)
ఈ హదీస్ లో ఏం చెప్పారు ప్రవక్త వారు? షిర్కె అస్గర్. అంటే చిన్న షిర్క్ నుండి నేను మీ పట్ల చాలా భయపడుతున్నాను, మీరు దానికి పాల్పడతారని. షిర్కె అస్గర్ దేనిని అంటారు? రియా. మరొక హదీస్ ద్వారా తెలుస్తుంది, దీనినే,
الشِّرْكُ الْخَفِيُّ (అష్షిర్కుల్ ఖఫీ) దాగి ఉన్న, గుప్తమైన షిర్క్ అని కూడా అంటారు.
ఈ సందర్భంలో మరొక హదీస్ ను గనక మనం తెలుసుకుంటే, వాస్తవానికి మరొక హదీస్ కాదు వేరే ఉల్లేఖనాల్లో ఈ హదీస్ లోనే ఒక భాగం ఉంది. ఏంటి?
ఎవరైతే ఈ లోకంలో షిర్కె అస్గర్ కు, ప్రదర్శన బుద్ధికి పాల్పడతారో, ప్రళయ దినాన అల్లాహ్ వారితో అంటాడు – ఎప్పుడైతే అల్లాహు త’ఆలా ప్రజలందరికీ వారి కర్మల ప్రతిఫలం ప్రసాదిస్తాడో ఆ సమయంలో – ఏమంటాడు? “ఇహలోకంలో మీరు ఎవరి కొరకైతే మీరు మీ పనులు చేసేవారు – అంటే ప్రజలు మెచ్చుకోవాలి అని ప్రదర్శన బుద్ధితో చేశారు కదా ఈ లోకంలో – అయితే ఎవరు చూసి మిమ్మల్ని మెచ్చుకోవాలని మీరు ఆ కార్యాలు చేశారో, వారి వద్దకే వెళ్ళండి. వారు మీకు ఏదైనా ప్రతిఫలం ఇవ్వగలుగుతారా చూడండి.”
ఇస్తారా ఎవరైనా? ఇవ్వలేరు. అయితే ఏం తెలుస్తుంది మనకు? మనం ఏ మాట మాట్లాడినా, ఏ పని చేసినా, ఫలానా వారు చూసుకోవాలి, ఒరే మౌలసాబ్ ఎంత మంచిగా తఖ్రీర్ చేస్తున్నాడు అని మెచ్చుకోవాలి, అస్తగ్ ఫిరుల్లాహ్, అస్తగ్ ఫిరుల్లాహ్. నా తోటి వారు నేను ఎంత మంచిగా చదువుతున్నానో అని నన్ను మెచ్చుకోవాలి. ఇంకా ఏ పనులైనా గానీ, ఇక్కడ మనకు సంబంధించిన నేను ఉదాహరణలు ఒకటి రెండు ఇస్తున్నాను. అయితే ఇలా ప్రజలు చూసి మెచ్చుకోవాలన్నటువంటి భావనతో – ఈ మెచ్చుకోవడం రెండు రకాలు. ఒకటి, ఏదైనా పని చేయడం ప్రజలు మెచ్చుకోవాలని మన మనసులో ఉండడం. ఏదైనా మాట మాట్లాడడం లేదా ఏదైనా హోదా సంపాదించడం మరియు అక్కడ ప్రజల నోట ప్రశంసలు వెళ్ళాలి మన గురించి అని మనం అనుకోవడం. ఈ విధంగా ప్రదర్శన బుద్ధి, పేరు ప్రఖ్యాతుల కాంక్ష, ఇవన్నీ కూడా చాలా నష్టానికి పాల్పడతాయి, చాలా నష్టానికి మనల్ని గురిచేస్తాయి.
ప్రదర్శన బుద్ధి వల్ల కలిగే నష్టాలు
ఎలాంటి నష్టాలు? నంబర్ ఒకటి, మనం ఒక రకమైన షిర్క్ లో పడ్డవారమవుతాం. ఎందుకంటే మనం ప్రతీ కార్యం అల్లాహ్ ప్రసన్నత కొరకు చేయాలి. అంటే మనం అల్లాహ్ యేతరుల కొరకు చేసిన వాళ్ళం అవుతున్నాము. ఇక్కడ తప్పుడు భావములో పడకండి, పర్లేదులే చిన్న షిర్కే కదా అని. చిన్న చిన్న రాళ్లు కలిసే ఓ గుట్ట తయారవుతుంది. చిన్న చిన్న కట్టెలు కలిసే అన్నం వండుతారు, బిర్యానీలు వండుతారు. కదా? చిన్న చిన్న షిర్క్ కలిసి చాలా పెద్దగా అయిపోతే అది మరింత ఎక్కువ ప్రమాదకరమైపోతుంది.
రెండవ నష్టం, ఇది వంచకుల, కపట విశ్వాసుల, మునాఫికుల గుణం. సూరతున్నిసా ఆయత్ నంబర్ 142. అలాగే చివరి, ఖురాన్ యొక్క చివరి, ఆ సూరతుల్ మాఊన్ అని ఉంది కదా, చివరి చిన్న సూరాలలో, ఆ సూరాలో ఆయత్ నంబర్ నాలుగు నుండి ఏడు వరకు చదివి చూడండి.
మరియు అదే ఆయతులలో మూడవ నష్టం గురించి కూడా అల్లాహ్ మనకు తెలిపాడు. ఏంటి అది? వైల్ ఉన్నది, వారికి వినాశనం ఉన్నది, వారి కొరకు చాలా ఘోరమైన నరకంలో ఒక స్థానం ఉన్నది అని.
మరొక చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, ఎవరు ఏ సత్కార్యాలు చేస్తారో, అందులో ప్రదర్శన బుద్ధి కలిగి ఉంటారో, ఆ సత్కార్యం అన్నది అల్లాహ్ స్వీకరించడు, అల్లాహ్ దానికి ప్రతిఫలం అనేది ప్రసాదించడు.
ఈ విధంగా సోదర మహాశయులారా, ఈ ప్రదర్శన బుద్ధి అన్నది ఇహలోకంలో, పరలోకంలో మనకు చాలా నష్టంలో పడవేస్తుంది. వీటన్నిటికీ మనం దూరం ఉండాలి. అల్లాహు త’ఆలా మనందరికీ కూడా చిన్న, పెద్ద అన్ని రకాల షిర్కుల నుండి దూరం ఉంచుగాక. ఆమీన్.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
హజ్రత్ ఉమర్ రజియల్లాహు అన్హు సంక్షిప్త చరిత్ర https://youtu.be/r_3VWYO4FHI [జుమా ఖుత్బా: 25 నిముషాలు] షేఖ్ డా. అబ్దుల్ అజీజ్ అల్ ఉలైవీ (హఫిజహుల్లాహ్), జామె అల్ గన్నామ్, జుల్ఫీ, సఊదియ అనువాదం: షేఖ్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
ఈ ప్రసంగంలో ప్రవక్త సహచరుల జీవిత చరిత్రలను తెలుసుకోవడం వల్ల కలిగే ప్రాముఖ్యత, దానివల్ల విశ్వాసం ఎలా పెరుగుతుందో వివరించబడింది. ముఖ్యంగా, రెండవ ఖలీఫా అయిన హజ్రత్ ఉమర్ ఇబ్న్ అల్-ఖత్తాబ్ (రదియల్లాహు త’ఆలా అన్హు) యొక్క జీవిత చరిత్రపై దృష్టి సారించబడింది. ఆయన ఇస్లాం స్వీకరణ, ఆయన ధైర్యం, ఆయనకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇచ్చిన శుభవార్తలు, ఆయన పరిపాలన, మరియు ఆయన అమరత్వం (షహాదత్) వంటి ముఖ్య ఘట్టాలను హదీసుల ఆధారాలతో వివరించారు. ఉమర్ (రదియల్లాహు త’ఆలా అన్హు) యొక్క అభిప్రాయాలకు అనుగుణంగా ఖురాన్ ఆయతులు అవతరించిన సందర్భాలు, ఆయన జ్ఞానం, మరియు ఆయన నిరాడంబర జీవితం గురించి కూడా చర్చించబడింది. ఆయన జీవితం నుండి ముస్లింలు నేర్చుకోవలసిన పాఠాలను ఈ ప్రసంగం ఎత్తి చూపుతుంది.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఈ ప్రసంగంలో, నమాజు యొక్క ప్రాముఖ్యత మరియు దానిని సరిగ్గా, ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో ఎలా ఆచరించాలో వివరించబడింది. నమాజులో తొందరపాటు చూపడాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం “అతి చెడ్డ దొంగతనం”గా అభివర్ణించారని, ఇది ధనాన్ని దొంగిలించడం కంటే ఘోరమైనదని హదీసుల ద్వారా స్పష్టం చేయబడింది. అబ్దుల్లా బిన్ జుబైర్, ముస్లిం బిన్ యసార్, సయీద్ ఇబ్న్ ముసయ్యిబ్ వంటి సలఫె సాలిహీన్ (పూర్వపు సత్పురుషులు) తమ నమాజులలో ఎంతటి ఏకాగ్రత మరియు నిమగ్నతను కనబరిచేవారో ఉదాహరణలతో సహా వివరించారు. సరిగ్గా నమాజు చేయని వారిని చూసినప్పుడు వారికి హితబోధ చేయాల్సిన బాధ్యత మనపై ఉందని, మన నమాజు మన జీవితంపై మరియు పరలోకంపై చూపే ప్రభావాన్ని గురించి కూడా నొక్కి చెప్పబడింది.
మనుషుల్లో అత్యంత చెడ్డ దొంగ, తన నమాజ్ ను దొంగిలించే వాడు https://youtu.be/1qJu0BoGg-w [30 నిముషాలు] నమాజులో కదలిక, చలనం మరియు తొందరపాటు- 10 మంది సలఫె సాలిహీన్ నమాజుల ఉదాహరణ, అసలు ఖుత్బా అరబీలో: షేఖ్ రాషిద్ అల్ బిదాహ్, అనువాదం: నసీరుద్దీన్ జామిఈ
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
మానవుల కర్మల నమోదు – [మరణానంతర జీవితం – పార్ట్ 50] https://youtu.be/acqUQX3MOKQ [22 నిముషాలు] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఈ ప్రసంగంలో ప్రళయదినాన విశ్వాసులకు ప్రసాదించబడే ఒక గొప్ప వరం, “హౌదె కౌసర్” గురించి వివరించబడింది. తీర్పుదినం యొక్క భయంకరమైన పరిస్థితులలో, ప్రజలు తీవ్రమైన దాహంతో ఉన్నప్పుడు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అల్లాహ్ ద్వారా ఈ ప్రత్యేకమైన కొలను (హౌద్) ప్రసాదించబడుతుంది. దాని నీరు పాలకన్నా తెల్లగా, తేనెకన్నా తియ్యగా ఉంటుంది. ఎవరైతే దాని నుండి త్రాగుతారో వారు స్వర్గంలో ప్రవేశించే వరకు మళ్ళీ దాహం గొనరు. ఈ హౌద్ వద్దకు ప్రవక్త అనుచరులు మాత్రమే చేరగలుగుతారు, మరియు వారిని ప్రవక్త తమ చేతులతో నీరు త్రాగిస్తారు. అయితే, ప్రవక్త తర్వాత ధర్మంలో కొత్త విషయాలను కల్పించినవారు (బిద్అత్ చేసినవారు) మరియు ఆయన మార్గాన్ని అనుసరించని వారు ఈ గొప్ప భాగ్యానికి నోచుకోలేరు మరియు హౌద్ నుండి దూరంగా నెట్టివేయబడతారు. ధర్మంపై స్థిరంగా ఉండి, కష్టాలలో సహనం వహించిన వారికి ఈ భాగ్యం లభిస్తుందని హదీసుల ద్వారా స్పష్టం చేయబడింది.
అస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు. అల్హందులిల్లా వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లా అమ్మాబాద్. ఋజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం.
హౌదె కౌసర్ (కౌసర్ కొలను)
మహాశయులారా, ప్రళయ దినాన ఎంతటి భయంకరమైన స్థితి అలుముకుంటుంది, ప్రజలందరూ చెమటలో మునిగి, దీర్ఘకాలం వల్ల వేచి చూస్తూ వేచి చూస్తూ అలసిపోయి, సిఫారసు చేయడానికి ప్రవక్తలను సైతం విన్నవించుకొని నానా రకాల బాధలకు గురి అవుతూ ఉన్న ఆ సందర్భంలో, ఎన్నో ఘట్టాలు వారి ముందు దాటుతూ ఉంటాయి. లెక్కతీర్పు తీసుకోవడం జరుగుతుంది, అది కూడా చాలా క్లిష్ట పరిస్థితి. అటువైపున త్రాసులో తూకం చేయడం జరుగుతుంది. మరోవైపు కుడిచేతిలో కర్మపత్రాలు పొందే వారు కొందరు ఉంటే, ఎడమచేతిలో కర్మపత్రాలు పొందే వారు మరికొందరు అభాగ్యులు ఉంటారు.
ఇలాంటి ఈ సందర్భంలో సమయం చాలా గడిచిపోతూ ఉంటుంది, వారికి దాహం కూడా కలుగుతూ ఉంటుంది. కనీసం ఒక చుక్క బొట్టు నీళ్లు దొరికినా ఎంత బాగుండును అని వారికి ఆవేదన కలుగుతుంది. అలాంటి సందర్భంలో హౌదె కౌసర్ అన్నటువంటి ఒక పెద్ద గొప్ప వరం మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఇవ్వడం జరుగుతుంది.
ఆ సందర్భంలో ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు లభించే అతి గొప్ప వరం హౌదె కౌసర్. అంటే, అది ఒక మహా విశాలమైన హౌద్. ఒక నెల మీరు ప్రయాణం చేసినా దాని పొడుగు అనేది అంతము కాదు. వెడల్పు కూడా అలాగే ఉంటుంది. మరియు దాని యొక్క నీళ్లు పాలకంటే తెల్లగా, తేనెకంటే తీపిగా ఉంటాయి. ఆ హౌద్ లో వచ్చిపడే నీళ్లు స్వర్గంలో ఉన్నటువంటి నహరె కౌసర్ (కౌసర్ నది) నుండి వస్తాయి.
మహాశయులారా, దాని ప్రస్తావన ఇక్కడ ఎందుకు అంటే, దానిని విశ్వసించడం కూడా మరణానంతర జీవితాన్ని విశ్వసించడంలోని ఒక భాగం. మరియు ఆ హౌదె కౌసర్, దాని నుండి ఎవరికి కనీసం ఒక గ్లాస్ నీళ్లు ప్రాప్తమవుతాయో, వారు స్వర్గంలో వెళ్లే అంతవరకు వారికి దాహం కలగదు.
అయితే, ఆ హౌదె కౌసర్ నీరును పొందే అదృష్టవంతులు ఎవరో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ప్రతి ఒక్కరికీ అది ప్రాప్తించదు. హౌదె కౌసర్ వద్ద ఆ నీరు త్రాగడానికి ఏ పాత్రలైతే ఉంటాయో, వెండి బంగారపు పాత్రలు ఉంటాయి మరియు వాటి సంఖ్య ఆకాశంలో నక్షత్రాల్లాంటి సంఖ్య. అక్కడ ఆ హౌదె కౌసర్ వద్దకు రావడానికి ప్రతి ఒక్కరికీ పర్మిషన్, అనుమతి అనేది ఉండదు. మరియు అక్కడ ప్రతి ఒక్కరు తమిష్టానుసారం త్రాగలేరు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చేత, వారి యొక్క శుభ హస్తాలతో అది ఇవ్వడం జరుగుతుంది. వారి శుభ హస్తాలతో ఆ హౌదె కౌసర్ నీరు త్రాగే భాగ్యం అల్లాహ్ మనందరికీ ప్రసాదించు గాక.
సహీ బుఖారీ మరియు సహీ ముస్లింలో హజరత్ అబ్దుల్లా బిన్ అమర్ ఇబ్నిల్ ఆస్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించిన హదీద్, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు:
حَوْضِي مَسِيرَةُ شَهْرٍ، وَزَوَايَاهُ سَوَاءٌ (హౌదీ మసీరతు షహ్రిన్, వ జవాయాహు సవా) “నాకు అక్కడ ఇవ్వబడే హౌద్ దాని యొక్క పొడుగు ఒక నెల ప్రయాణం చేసే అంత దూరం ఉంటుంది మరియు దాని యొక్క వెడల్పు కూడా అంతే ఉంటుంది.”
مَاؤُهُ أَبْيَضُ مِنَ اللَّبَنِ، وَرِيحُهُ أَطْيَبُ مِنَ الْمِسْكِ (మాఉహు అభ్యదు మినల్లబన్, వ రీహుహు అత్‌యబు మినల్ మిస్క్) “దాని యొక్క రంగు పాలకంటే తెల్లగా మరియు దాని యొక్క సువాసన కస్తూరి కంటే ఎక్కువ సువాసన“
మరియు అక్కడ త్రాగడానికి పాత్రలు ఆకాశంలో నక్షత్రాలు ఉన్న విధంగా ఉంటాయి.
مَنْ يَشْرَبْ مِنْهَا فَلا يَظْمَأُ أَبَدًا (మన్ యష్రబ్ మిన్హా ఫలా యద్మఉ అబదా) “ఎవరైతే దాని నుండి త్రాగుతారో వారు ఎప్పటికీ దాహం గొనరు.”
మరి ఎవరైతే ఒకసారి ఆ హౌదె కౌసర్ నుండి త్రాగుతారో ప్రవక్త శుభ హస్తాలతో, వారికి ఆ తర్వాత ఎప్పుడూ దాహం ఏర్పడదు.
ఆ ప్రళయ దినం, అక్కడ ఆ దీర్ఘకాలం, ఒక మైల్ దూరాన ఉన్న సూర్యుడు, చెమటలతో, చెమటలు కారుతూ కారుతూ, దాహం పెరిగిపోతుంది. అక్కడ ఆ దాహం తీరడానికి కేవలం ఒకే ఒక మార్గం ఉంటుంది. అదే హౌదె కౌసర్.
అక్కడ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తమ శుభ హస్తాలతో విశ్వాసులకు ఆ నీరు త్రాగిస్తూ ఉంటారు. ఆ నీరును త్రాగిన వారే భాగ్యవంతులు. మరియు ఆ నీరు త్రాగడం నుండి తోయబడిన వారు, దూరం చేయబడిన వారే అభాగ్యులు. ఒకసారి ఈ హదీథును వినండి, భాగ్యవంతులు ఎవరో, అభాగ్యులు ఎవరో తెలుసుకొని భాగ్యవంతుల్లో చేరే ప్రయత్నం చేయండి. ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు:
إِنِّي فَرَطُكُمْ عَلَى الْحَوْضِ (ఇన్నీ ఫరతుకుమ్ అలల్ హౌద్) “నిశ్చయంగా, నేను హౌదె కౌసర్ పై మీ గురించి వేచి చూస్తూ ఉంటాను“
مَنْ مَرَّ بِي شَرِبَ (మన్ మర్ర బీ షరిబ్) “ఎవరైతే నా వద్దకు వస్తారో వారు త్రాగి ఉంటారు“
ఎవరైతే నా వద్దకు వస్తారో, వారు నా శుభ హస్తాలతో ఆ హౌదె కౌసర్ నీరు త్రాగి ఉంటారు.
وَمَنْ شَرِبَ لَمْ يَظْمَأْ أَبَدًا (వమన్ షరిబ లమ్ యద్మఅ అబదా) “మరి ఎవరైతే త్రాగుతారో, వారు ఆ తర్వాత ఎప్పుడూ కూడా దాహానికి గురి కారు.“
“హౌదె కౌసర్ వద్దకు నా దగ్గరికి కొందరు వస్తారు. నేను వారిని గుర్తుపడతాను, వారు నన్ను గుర్తుపడతారు. అంతలోనే నా మధ్యలో, వారి మధ్యలో ఒక అడ్డు వేయడం జరుగుతుంది. నేను అంటాను, వారు నా వారు, వారిని రానివ్వండి. అప్పుడు చెప్పడం జరుగుతుంది, నీకు తెలియదు నీ తర్వాత వీరు నీ సత్య ధర్మంలో ఎలాంటి మార్పులు చేసుకున్నారో. అప్పుడు నేను అంటాను, ఇలా నా ధర్మంలో మార్పు చేసుకున్న వారు నాకు దూరమే ఉండాలి, దూరమే ఉండాలి, దగ్గరికి రాకూడదు అని“
గమనించారా? హౌదె కౌసర్ ఆ రోజు లభించే ఆ నీరు మన కొరకు ఎంత శుభకరమైనది. కానీ అల్లాహ్ పంపిన సత్య ధర్మం, అల్లాహ్ పంపినటువంటి చిట్టచివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసించనందుకు, లేదా విశ్వసించి ఆయన అడుగుజాడలలో జీవితం గడపనందుకు, ఆయన తెచ్చిన సత్య ధర్మంలో ఇష్టానుసారం మార్పులు చేసుకొని, అవి కూడా ధర్మానికి సంబంధించిన విషయాలని భావించి జీవితం గడిపేవారు ఎంత దురదృష్టానికి గురవుతారు. మరియు ఇలాంటివారే అభాగ్యులు. ఆ రోజు ప్రవక్త శుభ హస్తాల ద్వారా హౌదె కౌసర్ నీరు నోచుకొని వారు.
ఈ హౌదె కౌసర్ గురించి మరికొన్ని వివరాలు ఉన్నాయి. మహాశయులారా, హౌదె కౌసర్ గురించి సహీ ముస్లిం షరీఫ్ లోని మరో ఉల్లేఖన వినండి. ఈ హదీథులో భాగ్యవంతులు, అభాగ్యులు ఇద్దరి ప్రస్తావన ఉంది.
ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు:
“నా వద్దకు హౌదె కౌసర్ దగ్గరికి అనేక మంది ప్రజలు వస్తారు. ఎలాగైతే ఒక వ్యక్తి ఒంటెల మందలో నుండి తన ఒంటెలను తన వైపునకు తీసుకొని వెళ్తాడో, ఆ విధంగా ప్రజలందరి మధ్యలో నుండి నా అనుచర సంఘాన్ని నేను తీసుకొని పక్కకు జరుపుతాను, హౌదె కౌసర్ వైపునకు తీసుకెళ్లడానికి. అప్పుడు సహాబాలు, సహచరులు అడిగారు, “ప్రవక్తా, తారిఫునా? ఆ రోజు అంత మందిలో, అంత పెద్ద సంఖ్యలో మీరు మమ్మల్ని గుర్తుపడతారా?” ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, “అవును, మీకంటూ ఓ ప్రత్యేక చిహ్నం, ఓ గుర్తు అనేది ఉంటుంది, అది మరెవరికీ ఉండదు.”
గమనించండి. మీకంటూ ఓ ప్రత్యేక చిహ్నం, గుర్తు అనేది ఉంటుంది, లైస లిఅహదిన్ గైరికుమ్. అది మీ తప్ప ఇంకా ఎవరికీ అలాంటి గుర్తింపు అనేది ఉండదు. అదేమిటి?
تَرِدُونَ عَلَىَّ غُرًّا مُحَجَّلِينَ مِنْ آثَارِ الْوُضُوءِ (తరిదూన అలయ్య గుర్రమ్ ముహజ్జలీన మిన్ ఆసారిల్ వుదూ) “మీరు వుదూ ఆనవాళ్ల వల్ల ప్రకాశవంతమైన ముఖాలు, కాళ్ళు మరియు చేతులతో నా వద్దకు వస్తారు.”
మీలో ఐదు వేళల నమాజులు చేస్తూ ఉన్నవారు, వారు నమాజు గురించి వుదూ చేస్తూ ఉంటారు, ఆ వుదూ చేయడం వల్ల వుదూ యొక్క అవయవాలు మెరుస్తూ ఉంటాయి. అదే సందర్భంలో,
وَلَيُصَدَّنَّ عَنِّي طَائِفَةٌ مِنْكُمْ (వల యుసద్దన్న అన్నీ తాయిఫతుమ్ మిన్కుమ్) “అయితే మీలోని ఒక వర్గం వారు నా నుండి అడ్డగించబడతారు.”
ఆ సందర్భంలో ఒక వర్గం వారిని నా వద్దకు రాకుండా ఆపడం, అటు తోయడం జరుగుతుంది. ఫలా యసిలూన్. వారు నా వరకు చేరుకోరు. ఫఅఖూల్, అప్పుడు నేను అంటాను,
يَا رَبِّ هُمْ مِنْ أَصْحَابِي (యా రబ్బి హుమ్ మిన్ అస్ హాబీ) “ఓ ప్రభూ! వీరు నా అనుచరులే.”
ఓ ప్రభువా, వీరు కూడా నన్ను విశ్వసించేవారు, నా వారు అని.
فَيُجِيبُنِي مَلَكٌ (ఫయుజీబునీ మలకున్) “అప్పుడు ఒక దైవదూత నాకు సమాధానమిస్తాడు.”
وَهَلْ تَدْرِي مَاذَا أَحْدَثُوا بَعْدَكَ (వహల్ తద్రీ మాదా అహదసూ బాదక్) “నీ తర్వాత వారు ఏమేమి కొత్తవి కల్పించారో నీకు తెలుసా?”
ప్రవక్తా, నీవు చనిపోయిన తర్వాత, నీ వెనుక వారు నీవు తెచ్చిన సత్య ధర్మంలో ఎలాంటి మార్పులు చేశారో నీకు తెలుసా? మరొక ఉల్లేఖనంలో ఉంది,
إِنَّهُمُ ارْتَدُّوا عَلَى أَدْبَارِهِمُ الْقَهْقَرَى (ఇన్నహు ముర్తద్దూ అలా అద్బారిహిముల్ ఖహ్ఖరా) “వారు నీ తర్వాత సత్య ధర్మాన్ని వదిలేసి వెనుదిరిగారు“
అయితే మహాశయులారా, ఈ హదీద్ ద్వారా మనకు తెలిసిన విషయాలు ఏమిటి?
ఒకటి, ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ రోజు ప్రజలందరి మధ్యలో తమ అనుచర సంఘాన్ని గుర్తుపడతారు.
రెండో విషయం మనకు తెలిసింది, ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మనల్ని గుర్తుపట్టి హౌదె కౌసర్ వైపునకు మనల్ని తీసుకెళ్లి తమ శుభ హస్తాలతో మనకు హౌదె కౌసర్ నీరు త్రాగించాలి అని మనం అనుకుంటే, తప్పకుండా వుదూ చేస్తూ ఉండాలి, నమాజ్ చేస్తూ ఉండాలి.
మూడో విషయం, నమాజ్, వుదూ ఇవన్నీ చేస్తూ ఉన్నప్పటికీ కూడా, ఇక నమాజు, వుదూ తర్వాత జీవితంలో మనం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదర్శాన్ని పాటించాలి. ఆయన తెచ్చిన ధర్మాన్ని మాత్రమే అనుసరించాలి. నమాజ్ అయితే చేస్తున్నాము కదా అని జీవిత ఇతర విషయాల్లో ప్రవక్త విధానానికి వ్యతిరేకంగా కొత్త కొత్త విషయాలు పుట్టించుకొని, మనకిష్టమైన ఆచారాలను ఆచరిస్తూ ప్రవక్త తెచ్చిన ధర్మాన్ని, ఆయన ఆదర్శాన్ని విడనాడడం ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం శుభ హస్తాలతో హౌదె కౌసర్ నీరు పొందకుండా ఉండడానికి కూడా కారణం కావచ్చు. ఏమన్నారు ప్రవక్త గారు? మిమ్మల్ని నేను వుదూ యొక్క అవయవాలు మెరుస్తుండడం వల్ల గుర్తుపడతాను, కానీ అదే సందర్భంలో మీలోని కొందరిని, మీలోని ఒక వర్గాన్ని నా వద్దకు రాకుండా, వారు నా వరకు చేరకుండా ఒక అడ్డు వేసి వారిని దూరం చేయడం జరుగుతుంది. అంటే, వారి యొక్క అవయవాలు మెరుస్తున్నాయి, కానీ వారిలో మరికొన్ని ఇతర చెడులు కూడా ఉన్నాయి.
అందుకు మహాశయులారా, ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఆదర్శం మన జీవిత వ్యవహారంలోని ప్రతీ విషయంలో పాటించాలి. ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అదేమిటంటే, ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ప్రళయ దినాన గొప్ప వరంగా బహుకరించబడే ఈ హౌద్, దీనిని తిరస్కరించడానికి ఏమాత్రం అవకాశం లేదు. ఎందుకంటే దీనికి సంబంధించిన హదీథులు చాలా ఉన్నాయి. హదీథ్ పరిభాషలో అహాదీథె ముతవాతిరా అని అంటారు. అంటే సంకోశానికి, అంటే అనుమానానికి, సందేహానికి ఏ తావు లేనటువంటి సంఖ్యలో అన్ని హదీథులు వచ్చి ఉన్నాయి అని భావం.
మరొక విషయం, ప్రళయ దినాన కేవలం మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఒక్కరికే కాదు, ఇతర ప్రవక్తలకు కూడా హౌద్ ఇవ్వబడుతుంది. వారి వారి అనుచర సంఘాలు వారి వద్దకు వచ్చి వారి శుభ హస్తాలతో కూడా వారు ఆ నీరు త్రాగుతారు. కానీ అతిపెద్ద సంఖ్యలో మన ప్రవక్త ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకే ప్రజలు హాజరవుతారు. వారిని అనుసరించిన వారి సంఖ్యనే అందరికంటే ఎక్కువగా ఉంటుంది. ఇలాగే ఎన్నో హదీథులు వచ్చి ఉన్నాయి. ఉదాహరణకు, తిర్మిదిలోని హదీథ్, షేఖ్ అల్బానీ రహమహుల్లా సహీహుల్ జామేలో ప్రస్తావించారు. హదీథ్ నెంబర్ 2156.
إِنَّ لِكُلِّ نَبِيٍّ حَوْضًا (ఇన్న లికుల్లి నబియ్యిన్ హౌదా) “నిశ్చయంగా, ప్రతి ప్రవక్తకు ఒక హౌద్ ఉంటుంది.”
మరో ఉల్లేఖనంలో ఉంది,
وَإِنَّ لِكُلِّ نَبِيٍّ حَوْضًا تَرِدُهُ أُمَّتُهُ (వ ఇన్న లికుల్లి నబియ్యిన్ హౌదన్ తరిదుహు ఉమ్మతుహు) “ప్రతి ప్రవక్తకు హౌద్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మరియు ఆ హౌద్ వద్దకు ఆ ప్రవక్త యొక్క అనుచర సంఘం హాజరవుతుంది“
ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం శుభ హస్తాలతో హౌదె కౌసర్ నీరు పొందడానికి మరొక గొప్ప అవకాశం ఎలాంటి వారికి లభిస్తుందంటే, ఎవరైతే ధర్మంపై స్థిరంగా ఉండి, ఏ కష్టాలు, ఏ ఆపదలు, ఏ ఇబ్బందులు, ఏ ఆటంకాలు ఎదురైనా సహనం వహిస్తూ ఉంటారో, అలాంటి వారు తప్పకుండా ఈ శుభ అవకాశాన్ని పొందుతారు.
గమనించండి ఈ హదీథును. సహీ బుఖారీ, సహీ ముస్లింలోని హదీథ్.
إِنَّكُمْ سَتَلْقَوْنَ بَعْدِي أَثَرَةً فَاصْبِرُوا حَتَّى تَلْقَوْنِي عَلَى الْحَوْضِ (ఇన్నకుమ్ సతల్ ఖౌన బాదీ అసరతన్, ఫస్బిరూ హత్తా తల్ ఖౌనీ అలల్ హౌద్) “నిశ్చయంగా, నా తర్వాత మీరు పక్షపాతాన్ని చూస్తారు. కనుక, మీరు నన్ను హౌద్ వద్ద కలిసే వరకు సహనం వహించండి.”
నా తర్వాత మీరు హక్కు గల వారికి ఇవ్వవలసిన హక్కు ఇవ్వకుండా, హక్కు లేని వారికి ఇవ్వడం, ఇలాంటి వ్యవహారాలు చూస్తూ ఉంటారు. అయితే మీరు సహనం వహిస్తూ ఉండండి. ఎంతవరకు సహనం వహించాలి? మరణం వచ్చేవరకు సహనము వహించండి, నా హౌద్ వద్దకు మీరు వచ్చేంతవరకు సహనం వహిస్తూ ఉండండి. ఈ విధంగా ఈ హదీథులో మనకు అల్లాహ్ ధర్మంపై స్థిరంగా ఉండడంలో, ప్రపంచంలోని ఏదైనా ఒక హక్కు మనకు లభించకున్నా, అందులో మనం ధర్మానికి వ్యతిరేకంగా ఏ కార్యం చేయకుండా, ప్రవక్త ఈ శుభవార్తను అందుకొని మనం ప్రవక్త ఆదర్శాన్ని పాటిస్తూ ఉండి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంతో ఆ పరలోకాన కలుసుకునే అంతవరకు మనం సహనం వహిస్తూ ఉంటే, తప్పకుండా ప్రవక్త శుభ హస్తాలతో ఆ నీరు మనం త్రాగవచ్చు.
అయితే మహాశయులారా, ప్రతి ప్రవక్తకు ఒక హౌద్ ఇవ్వడం జరుగుతుంది అని ఏదైతే చెప్పబడిందో, అందులో కూడా ఆ ప్రవక్తలను ఆ కాలంలో వారు అనుసరించి ఉంటేనే వారికి అది ప్రాప్తమవుతుంది. ఇది ఒక విషయం. రెండో విషయం, ఇక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చిన తర్వాత, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ని తిరస్కరించి, నేను గత ప్రవక్తలను నమ్ముతున్నాను అన్నంత మాత్రాన, వారికి ఆ ప్రవక్తల నుండి కూడా హౌదె కౌసర్, అంటే వారికి లభించే హౌద్ నుండి నీరు త్రాగే అవకాశం దొరుకుతుంది అని భావించవద్దు. ఎందుకంటే ప్రతి ప్రవక్త తమ వెనుక వచ్చే ప్రవక్త గురించి శుభవార్త ఇచ్చారు. తమ వెనుక వచ్చే ప్రవక్తను విశ్వసించాలి అని కూడా చెప్పారు. ఇదే విషయం మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కంటే ముందు ఉన్న ఏసుక్రీస్తు వారు, హజరత్ ఈసా అలైహిస్సలాం చెప్పారు,
يَأْتِي مِنْ بَعْدِي اسْمُهُ أَحْمَدُ (యాతీ మిమ్ బాదీ ఇస్ముహూ అహ్మద్) “నా తరువాత ఒక ప్రవక్త రాబోతున్నాడు. ఆయన పేరు అహ్మద్.” (అస్-సఫ్ఫ్ 61:6)
నా తర్వాత అహ్మద్ పేరు గల ఒక ప్రవక్త వస్తారు. ఆ ప్రవక్తను మీరు విశ్వసించండి. ఆ ప్రవక్తను మీరు నమ్మండి అని. మరియు బైబిల్ గ్రంథంలో ఆదరణకర్త అన్న పేరుతో కూడా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రస్తావన వచ్చి ఉంది.
అందుకొరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ని తిరస్కరించి, మనం మా ప్రవక్తలను నమ్ముతున్నాము, అందుగురించి పరలోకంలో మేము సాఫల్యం పొందుతాము, మా ప్రవక్తల ద్వారా మేము హౌద్ నీళ్ళను పొందుతాము, ఆ పరలోకంలోని ఘట్టాలను మేము చాలా సులభతరంగా దాటిపోతాము అన్నటువంటి భ్రమలో ఉండకూడదు. ఇది భ్రమగానే అయిపోతుంది. మరియు ఆ రోజు చాలా నష్టంలో పడవలసి ఉంటుంది. అల్లాహ్ మనందరినీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరించి, వారి ఆదర్శాన్ని పాటించి, ధర్మంపై స్థిరంగా ఉండి, ఆయన తెచ్చిన ధర్మంలో ఎలాంటి మార్పులు, చేర్పులు చేసుకోకుండా, ఆయన చూపిన మార్గాన్ని అవలంబిస్తూ జీవితం గడిపే భాగ్యం ప్రసాదించు గాక.
జజాకుముల్లాహు ఖైరా, వస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఈ ప్రసంగంలో, వక్త ప్రళయ దినం (యౌమ్ అల్-ఖియామా) మరియు మానవుల కర్మలను నమోదు చేసే వ్యవస్థ గురించి వివరిస్తున్నారు. ప్రతి వ్యక్తితో ఇద్దరు దైవదూతలు (కిరామన్ కాతిబీన్) ఉంటారని, వారు మాట్లాడే ప్రతి మాట, చేసే ప్రతి పని, మరియు వారి మనస్సులోని గట్టి సంకల్పాలను కూడా నమోదు చేస్తారని ఖురాన్ మరియు హదీసుల ఆధారాలతో స్పష్టం చేశారు. ఈ దైవదూతలు అత్యంత విశ్వసనీయులని, ఎలాంటి పక్షపాతం లేకుండా ఉన్నది ఉన్నట్లుగా రాస్తారని తెలిపారు. మంచి చేయాలనే సంకల్పానికి కూడా పుణ్యం లభిస్తుందని, కానీ చెడు చేయాలనే గట్టి నిశ్చయానికి కూడా పాపం నమోదు చేయబడుతుందని ప్రవక్త బోధనల ద్వారా వివరించారు. కర్మల నమోదు కేవలం మనతో ఉండే ఇద్దరు దూతలతోనే పరిమితం కాదని, జుమా నమాజ్ హాజరు లేదా ప్రత్యేక ప్రార్థనల వంటి సందర్భాలలో ఇతర దైవదూతలు కూడా నమోదు చేస్తారని ఉదాహరణలతో పేర్కొన్నారు. చివరగా, మన కర్మలన్నీ నమోదు చేయబడుతున్నాయనే భయంతో జాగ్రత్తగా జీవించాలని, మంచి పనుల వైపు మొగ్గుచూపి, చెడుకు దూరంగా ఉండాలని ఉద్బోధించారు.
అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హందులిల్లాహి కఫా, వస్సలాతు వస్సలాము అలా ఇబాదిల్లజీనస్తఫా, అమ్మాబాద్.. ఋజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం.
ప్రళయ దినం
మహాశయులారా! ప్రళయ దినం. ఆ మహా భయంకరమైన దినం. ఏ రోజైతే మనం సమాధుల నుండి లేపబడి, ఎక్కడెక్కడా ఎవరు ఏ స్థితిలో చనిపోయారో వారందరినీ కూడా సమీకరించి ఒక మహా మైదానంలో పోగు చేయడం జరుగుతుంది. అక్కడ చాలా దీర్ఘకాలం అది ఉంటుంది. అక్కడి ఒక రోజు ఇహలోకపు 50 వేల సంవత్సరాలకు సమానంగా ఉంటుంది. అక్కడ ప్రతి ప్రాణి పట్ల న్యాయం జరుగుతుంది. ఎవరికీ ఏ అణువంత అన్యాయం జరగదు. ప్రతి ఒక్కరు ఆ రోజు తనను తాను తప్ప మరెవరి గురించి ఆలోచించడు.
ఆ దీర్ఘకాలమున పాపాల వల్ల మరియు సూర్యుడు కేవలం ఒక మైల్ దూరాన ఉండి, అక్కడి ఏ గాంభీర్య పరిస్థితి ఉంటుందో దానిని అతి త్వరలో దాటిపోవాలని మనిషి ఎంతో ఆలోచిస్తాడు. కానీ ఎక్కడికీ పరుగెత్తి వెళ్ళలేడు. అక్కడి ఘట్టాల్లో ఒక ముఖ్యమైన ఘట్టం ప్రతి మనిషి ఇహలోకంలో తాను చేస్తున్న కర్మలు ఏదైతే రాయబడుతున్నాయో ఆ కర్మ పత్రాలు తన కుడి చేతిలో లేదా తన ఎడమ చేతిలో – అల్లాహ్ దీని నుండి మనందరినీ కాపాడుగాక – తీసుకోవలసింది ఉంటుంది. ఇది కూడా ఒక చాలా భయంకర స్థితి, ఎంతో ఆవేదన మరియు బాధతో కూడిన ఆ సమయం. దాని గురించే ఇన్ షా అల్లాహ్, ఈరోజు మరియు తర్వాత వచ్చే కార్యక్రమాలలో మనం కొన్ని సత్యాలు తెలుసుకుంటాము. చాలా శ్రద్ధగా విని మనలో ఒక మార్పు తీసుకొచ్చే ప్రయత్నం మనలోని ప్రతి వ్యక్తి చేయాలని ఆశిస్తున్నాను.
కర్మలను నమోదు చేసే దైవదూతలు
అయితే మహాశయులారా! ఇహలోకంలో మనం పుట్టిన తర్వాత మనలోని ప్రతి ఒక్కరితో ఇద్దరు దైవదూతలు మనం మాట్లాడే ప్రతి మాట, మనం చేసే ప్రతి కర్మ, చివరికి మనం ఏదైనా గట్టి నిర్ణయం మనసులో చేసుకుంటే అది కూడా రాయడానికి సిద్ధమై ఉన్నారు.
కుడి వైపున అటు ఎడమ వైపున సిద్ధంగా ఉండి మనిషితో జరిగే ప్రతి కార్యం రాయడానికి దైవదూతలు హాజరై ఉన్నారు. ఆ సందర్భంలో మన ఈ జీవితంలో మనం చేసినది ప్రతి ఒక్కటి రాయబడుతుంది. ఏ ఒక్క విషయం కూడా దైవదూతలు వదలకుండా రాస్తూ ఉంటారు. సత్కార్యాలైతే, సద్వచనాలైతే, మంచి ఆలోచనలైతే కుడి వైపున ఉన్న దైవదూత రాస్తూ ఉంటాడు. ఒకవేళ దుష్కర్మలు, దుశ్చేష్టలు మరియు చెడు సంభాషణ, ఇంకా చెడు ఆలోచన ఇవన్నీ ఎడమ వైపున ఉన్న దైవదూత రాస్తూ ఉంటాడు. అల్లాహు త’ఆలా ఈ విషయాన్ని ఖురాన్లో అనేక సందర్భాల్లో ప్రస్తావించాడు.
అయితే, మన ఈ కర్మలు రాయబడుతున్నాయి అనడానికి అల్లాహు త’ఆలా ఖురాన్లో ఎన్నో సాక్ష్యాధారాలు మనకు తెలిపాడు. ఎన్నో నిదర్శనాలు మనకు తెలిపాడు. ఆ నిదర్శనాలను, అంటే ఆ ఖురాన్ ఆయతులను, మనం గ్రహించి వాటిపై దృష్టి వహించి పారాయణం చేస్తే మనకు ఎన్నో విషయాలు బోధపడతాయి. కొన్ని సందర్భాల్లో ఆయతులు మనకు దైవదూతలు రాస్తున్నారు అని స్పష్టంగా కనబడతాయి. ఉదాహరణకు:
وَإِنَّ عَلَيْكُمْ لَحَافِظِينَ كِرَامًا كَاتِبِينَ (వ ఇన్న అలైకుమ్ లహాఫిజీన్. కిరామన్ కాతిబీన్) నిశ్చయంగా మీపై పర్యవేక్షకులు నియమితులై ఉన్నారు. వారు గౌరవనీయులైన వ్రాతగాళ్ళు. (82:10-11)
మీపై నిఘా వేసి, మీ రక్షణలో దైవదూతలు ఉన్నారు, గౌరవనీయులైన లేఖకులు వారు.
మరికొన్ని సందర్భాల్లో ఖురాన్లో ఆ దైవదూతలు నిఘా వేసి మరియు వారు సంసిద్ధంగా ఉండి మనిషి నోట వెళ్ళే ప్రతి మాట వెళ్ళడానికి ఆలస్యం కాకముందే తొందరగానే దానిని రాసుకుంటారు అని కూడా తెలపడం జరిగింది.
మరికొన్ని సందర్భాల్లో మానవులు చేసే కర్మలన్నీ కూడా స్వయంగా అల్లాహు త’ఆలా రాస్తాడు అన్నట్లు కూడా మనకు తెలియజేయడం జరిగింది. మరికొన్ని సందర్భాలలో ఎవరో ఉన్నారు రాసేవారు. వారు రాస్తున్నారు మీరు చేసే కర్మలను. వారెవరు? పేరు చెప్పి అక్కడ మనకు ఎలాంటి వివరణ ఇవ్వబడలేదు. ఈ విధంగా వివిధ రకాలు ఏదైతే అవలంబించడం జరిగిందో ఈ లేఖకుల పట్ల, మన కర్మలు నోట్ చేయడం జరుగుతున్నాయి అని ఒక భయం మనిషిలో ఏర్పడి ప్రతి మాట మాట్లాడే ముందు, ప్రతి కర్మ చేసే ముందు, ప్రతి ఆలోచన ఆలోచించే ముందు మనిషి దానిని నిర్ధారణ చేసుకోవాలి. ఇది చేయవచ్చా, చేయకూడదా? యోగ్యమా, కాదా? ధర్మసమ్మతమా, అక్రమ మార్గమా? అన్న విషయాలు తెలుసుకోవాలి.
కొన్ని సందర్భాల్లో మేము స్వయంగా రాస్తున్నాము అని అల్లాహ్ ఏదైతే తెలిపాడో, దీనివల్ల అల్లాహ్ యొక్క భయం ప్రజల్లో మరింత ఎక్కువ పెరగాలని కూడా, ఉదాహరణకు, యూదులు అల్లాహ్ పట్ల ఎన్నో దుర్భాషలాడేవారు. ఒక సందర్భంలో వారు, “మేము ఎక్కువ ధనవంతులం, అల్లాహ్ యే పేదవాడు” అన్నటువంటి మాటలు మాట్లాడారు. అల్లాహు త’ఆలా ఆ సందర్భంలో ఖురాన్ ఆయత్ ను అవతరింపజేసి:
لَّقَدْ سَمِعَ اللَّهُ قَوْلَ الَّذِينَ قَالُوا إِنَّ اللَّهَ فَقِيرٌ وَنَحْنُ أَغْنِيَاءُ ۘ سَنَكْتُبُ مَا قَالُوا ‘అల్లాహ్ పేదవాడు, మేము ధనవంతులం’ అని పలికిన వారి మాటను అల్లాహ్ విన్నాడు. వారి మాటను మేము వ్రాసి పెడ్తాము. (3:181)
ఎవరైతే మేము ధనవంతులము మరియు అల్లాహ్ నిరుపేద, బీదవాడు అని అన్నారో, వారి మాటలను అల్లాహు త’ఆలా విన్నాడు. మేము వారు చెప్పే మాటలు రాస్తూ ఉన్నాము.
మరికొన్ని సందర్భాల్లో మా లేఖకులైన దైవదూతలు రాస్తున్నారు అన్న విషయం అల్లాహు త’ఆలా ఏదైతే తెలిపాడో, అయితే ఆ దైవదూతలు ఎల్లవేళల్లో వారి వెంటే ఉన్నారు అన్నటువంటి భయం వారిలో కలగాలి అని అల్లాహు త’ఆలా ఈ విధంగా ఆ విషయాన్ని తెలియపరిచాడు.
أَمْ يَحْسَبُونَ أَنَّا لَا نَسْمَعُ سِرَّهُمْ وَنَجْوَاهُم ۚ بَلَىٰ وَرُسُلُنَا لَدَيْهِمْ يَكْتُبُونَ (అమ్ యహ్సబూన అన్నా లా నస్మ’ఉ సిర్రహుమ్ వ నజ్వాహుమ్, బలా వరుసులునా లదైహిమ్ యక్తుబూన్) ఏమిటి, వారు తమ రహస్యాలను, తమ గుసగుసలను మేము వినలేమని అనుకుంటున్నారా? ఎందుకు వినం? పైగా మా దూతలు వారి వద్దనే ఉంటూ అన్నీ వ్రాస్తున్నారు. (43:80)
ఏమీ? వారు రహస్యంగా, గుప్తంగా మరియు వారు గుసగుసలాడుకునే ఆ గుసగుసలాట మాకు ఏ మాత్రం తెలియదు అని భావిస్తున్నారా? ఇక్కడ గమనించండి, సిర్రహుమ్. సిర్ అంటే రహస్యంగా మాట్లాడుకునే విషయాలు. నజ్వాహుమ్ అంటే ఒకరి చెవిలో ఒకరు ఏ గుసగుసలాటనైతే జరుపుకుంటారో వాటిని అంటారు. అయితే అల్లాహ్ ఏమంటున్నాడు? ఇలా ఎవరికీ తెలియకుండా రహస్యంగా మాట్లాడుకునే విషయాలు, ఒకరి చెవిలో మరొకరు గుసగుసలాట జరుపుకునే ఈ సంఘటనలు, విషయాలన్నీ కూడా మాకు తెలియవు, మా జ్ఞాన పరిధిలో రావు అని వారు భావిస్తున్నారా? అలా భావించనవసరం లేదు. బలా! వరుసులునా లదైహిమ్ యక్తుబూన్. ఎందుకు లేదు? మేము వారి రహస్యాలు వింటాము. మేము వారి గుసగుసలను కూడా తెలిసి ఉన్నాము. అంతేకాదు, వరుసులునా లదైహిమ్ యక్తుబూన్. మా దైవదూతలు ఉన్నారు. వారి వద్దనే ఉన్నారు. వారు రాస్తూనే ఉన్నారు.
ఈ ఆయతులన్నింటిలో మనకు బోధపడే విషయాలు ఏమిటో వాటిని మనం తెలుసుకోవాలి. ఆ బోధపడే విషయాలు ఏమిటో మనం తెలుసుకునే ముందు, కొన్ని సందర్భాల్లో రాసేవారు ఎవరో పేరు చెప్పకుండా రాసేవారు ఉన్నారు అని ఏదైతే అల్లాహ్ చెప్పాడో, ఆ ఆయతులను కూడా మనం విందాము.
మహాశయులారా! కొన్ని సందర్భాలలో అల్లాహు త’ఆలా ఆ రాసేవారు ఎవరో వారి పేరు చెప్పకుండా రాసేవారు ఉన్నారు, రాస్తున్నారు, వారు చేసే చేష్టలు లిఖించబడుతున్నాయి అన్నట్లుగా తెలియజేస్తాడు. ఉదాహరణకు ఈ ఆయత్ చూడండి:
وَجَعَلُوا الْمَلَائِكَةَ الَّذِينَ هُمْ عِبَادُ الرَّحْمَٰنِ إِنَاثًا ۚ أَشَهِدُوا خَلْقَهُمْ ۚ سَتُكْتَبُ شَهَادَتُهُمْ وَيُسْأَلُونَ (వ జ’అలుల్ మలాఇకతల్లజీన హుమ్ ఇబాదుర్రహ్మాని ఇనాసా, అషహిదూ ఖల్కహుమ్, సతుక్తుబు షహాదతుహుమ్ వ యుస్’అలూన్) వారు కరుణామయుని దాసులైన దైవదూతలను స్త్రీలుగా ఖరారు చేశారు. ఏమయ్యా! వారి పుట్టుకను వీరు కళ్ళారా చూశారా? వారి సాక్ష్యం వ్రాసి పెట్టబడుతుంది. వారిని ప్రశ్నించటం జరుగుతుంది. (43:19)
వారు అంటే బహుదైవారాధకులు, రహ్మాన్ అయిన అల్లాహ్ యొక్క దాసులు, దైవదూతలు ఎవరైతే ఉన్నారో వారిని అల్లాహ్ కు కుమార్తెలుగా చేశారు. వారు స్త్రీలుగా, దేవతలుగా భావించి వారు పూజిస్తున్నారు. అషహిదూ ఖల్కహుమ్? ఆ బహుదైవారాధకులు అల్లాహు త’ఆలా ఆ దైవదూతల్ని సృష్టించే సందర్భంలో అక్కడ వారు హాజరై ఉన్నారా? వారు సాక్షులుగా ఉన్నారా? సతుక్తుబు షహాదతుహుమ్. అలా ఏమైనా ఉంటే, వారి యొక్క ఆ సాక్ష్యం అనేది లిఖించబడుతుంది. వ యుస్’అలూన్. మరియు వారిని ప్రశ్నించడం కూడా జరుగుతుంది. అంటే లిఖించడం జరుగుతుంది అని చెప్పడం జరుగుతుంది. అయితే ఆ లిఖించేవారు ఎవరో? దైవదూతలు. కానీ ఈ పద్ధతి ఎందుకు అవలంబించడం జరిగిందంటే, మానవుల్లో, ఆఁ ఉన్నారు, లిఖించేవారు ఉన్నారు అన్నటువంటి భయం కలగాలి.
అలాగే సత్కార్యాల విషయంలో కూడా సత్కార్యాలు చేసేవారు, మా సత్కార్యాలు వృధా అవుతున్నాయి అని భయపడే అవసరం లేదు.
إِلَّا كُتِبَ لَهُم بِهِ عَمَلٌ صَالِحٌ (ఇల్లా కుతిబ లహుమ్ బిహీ అమలున్ సాలిహున్) వారి తరఫున ఒక సత్కార్యం వ్రాయబడకుండా ఉండదు. (9:121)
అని సూరె తౌబాలో శుభవార్త ఇవ్వడం జరిగింది. వారు అల్లాహ్ మార్గంలో వెళ్ళినప్పుడు, ఏ దారిన నడిచినా, ఏ లోయలో దిగినా, ఎక్కడ ఏ స్థితిలో ఉన్నా, ఆకలితో దప్పులతో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా వారికి కుతిబ లహుమ్ బిహి అమలున్ సాలిహ్. వారు కష్టపడే ప్రతి కష్టానికి, ప్రతి అడుగుకు బదులుగా పుణ్యం అనేది రాయడం జరుగుతుంది. రాయబడుతుంది. అలాగే మరో సందర్భంలో, వారు ఏ కొంచెం దానం చేసినా అది లిఖించబడుతుంది అని చెప్పడం జరిగింది.
ఈ విధంగా మహాశయులారా, ఇహలోకంలో ఏ స్థితిలో ఉన్నా మనం, ఒక పెద్ద సమూహంలో ఉన్నా, ఒంటరిగా ఉన్నా, రాత్రిలో ఉన్నా, పగలులో ఉన్నా, స్త్రీలైనా, పురుషులైనా, వృద్ధులైనా, యువకులైనా ఎవరైనా సరే, ప్రతి ఒక్కరు మాట్లాడే మాట, వారు చేసే చేష్టలు, వారు చేసే కర్మలు మరియు ఆలోచించే వారి యొక్క ఊహాగానాలు కూడా, ఆలోచనలను కూడా వ్రాయడం జరుగుతుంది.
మహాశయులారా! ఇదే విషయాన్ని ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందర్భంలో ఇలా తెలిపారు. అల్లాహు త’ఆలా మానవులు చేసే కర్మల గురించి ఒక నిర్ణయం చేసి ఉంచాడు. అదేమిటంటే:
ఇదా హమ్మ అబ్దీ బి హసనతిన్. నా దాసుడు ఒక మంచి కార్యం చేయాలని నిశ్చయించుకున్నప్పుడు, ఆ నిశ్చయానికి, బలమైన సంకల్పానికి వారు పూనుకున్నప్పుడు, ఒక పుణ్యం రాయండి అని అల్లాహు త’ఆలా వారికి ఆదేశిస్తాడు. ఎప్పుడైతే వారు ఆ నిశ్చయించుకున్న, సంకల్పించుకున్న పుణ్యాన్ని ఆచరణ రూపంలో చేస్తారో వారికి ఆ సత్కార్యానికి బదులుగా ఒకటి నుండి పది వరకు, పది నుండి 700 వరకు, అంతకంటే ఎక్కువగా అల్లాహు త’ఆలా తలచిన వారికి పుణ్యాలు వ్రాయమని ఆదేశిస్తాడు.
అదే ఒకవేళ ఎవరైనా ఒక చెడు చేయాలని ఆలోచిస్తే, అల్లాహు త’ఆలా ఇప్పుడే ఏమీ రాయకండి అని వారిని పాపం గురించి లిఖించడం నుండి ఆపేస్తాడు. ఎప్పుడైతే మనిషి ఆ చెడు ఊహను, ఆలోచనను ఆచరణ రూపంలో తీసుకొస్తాడో, అతనికి అతని కర్మ పత్రంలో ఒక పాపం రాయండి అని చెప్తాడు. ఒకవేళ అతను దానిని ఆచరించకుండా ఆ చెడు ఆలోచనను వదులుకుంటే, అతడు చెడు ఆలోచనను వదులుకున్నాడు గనుక అతనికి ఒక పుణ్యం రాయండి అని అల్లాహు త’ఆలా ఆదేశిస్తాడు.
ఈ విధంగా అల్లాహు త’ఆలా మనపై ఎంత గొప్ప దయ తలచి ఉన్నాడో గమనించండి. కానీ ఇక్కడ ఒక విషయం గమనించాలి. అదేమిటంటే, కేవలం ఆలోచించుకోవడం, ఊహాగానాల వరకు ఉండడం అది వేరే విషయం. ఎవరైనా చెడు గురించి బలమైన రూపంలో సంకల్పించుకొని, దానికి సంబంధించిన సాధనాలు, అవసరాలు, కారణాలు సమకూరినప్పుడు, అవన్నీ కూడా అతనికి యోగ్యమైనప్పుడు, అతని ఆధీనంలో వచ్చినప్పుడు, తప్పకుండా అది చేస్తాడు ఆ పాపం అని పూనుకుంటే, అలాంటి గట్టి సంకల్పం కూడా కొన్ని సందర్భాల్లో రాయడం జరుగుతుంది.
ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ప్రపంచ విషయాన్ని ఒక సామెతగా తెలిపారు. తిర్మిజీ మరియు ముస్నద్ అహ్మద్ లోని హదీస్ ఇది.
ఈ ప్రపంచంలో ఉన్న మనుషులందరూ కూడా నాలుగు రకాల వారు. ఒకరు, అల్లాహు త’ఆలా అతనికి విద్య ప్రసాదించాడు మరియు ధనము ప్రసాదించాడు. అతడు ఆ విద్యతో ఆ ధనాన్ని అల్లాహ్ కు ఇష్టమైన మార్గంలో ఖర్చు పెడుతూ, సంబంధాలను పెంచుకుంటూ, అవసరం ఉన్నవారికి సహాయపడుతూ, తర్వాత అన్ని రకాల అల్లాహ్ కు ఇష్టమైన మంచి మార్గాల్లో ఖర్చు పెడుతూ ఉంటాడు. ఈ విధంగా అతనికి పుణ్యం రాయబడుతుంది, అతనికి పుణ్యం లభిస్తుంది.
రెండో వ్యక్తి, అతనికి విద్య అయితే ఉంది కానీ అతని వద్ద ధనము లేదు. ఆ వ్యక్తి ఈ మొదటి వ్యక్తిని చూసి, “నా వద్ద ఒకవేళ ధనము ఉంటే, నేను అతని కంటే ఎక్కువగా అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టేవాడిని” అని సంకల్పించుకుంటాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, పుణ్యంలో వీరిద్దరూ సమానులవుతారు.
మూడో వ్యక్తి, అతని వద్ద విద్య లేదు, అతని వద్ద కేవలం ధనం ఉన్నది. అతడు తన ధనంపై గర్వపడి, విశ్వాస మార్గాన్ని వదిలేసి, అల్లాహ్ కు ఆగ్రహం కలిగించే, ఇష్టం లేని మార్గాల్లో విచ్చలవిడిగా ఖర్చు పెడుతూ ఉన్నాడు. అందువల్ల అతనికి పాపం కలుగుతుంది.
ఇక నాలుగో మనిషి, నాలుగో రకం వ్యక్తి, అతని వద్ద విద్య లేదు, ధనము లేదు. కానీ అతనేమంటాడు, మూడో రకమైన వారిని చూసి, “నా వద్ద ఒకవేళ ధనం ఉంటే నేను వారికంటే ఎక్కువ పాపంలో, వారికంటే ఎక్కువగా ఆనందంలో, వారికంటే ఎక్కువగా నేను ఈ ధనం ఖర్చు పెడుతూ ఉంటాను.” ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, ఈ మూడో వ్యక్తి, నాలుగో వ్యక్తి, ఇద్దరూ కూడా పాపంలో సమానము అని.
ఇక్కడ మీరు గమనించారా? మనిషి వద్ద సౌకర్యాలు ఉంటే, వాటిని ఉపయోగించి పాపంలో దూకిపోతాను అని ఏదైతే నిశ్చయించుకుంటాడో, బలమైన సంకల్పం చేస్తాడో, దానివల్ల కూడా కొన్ని సందర్భాల్లో మనిషికి పాపం రాయబడుతుంది. అందుగురించే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం చేసే ఏ కర్మ కూడా, మనం చేసే ఏ పని కూడా, మనం మాట్లాడే ఏ మాట కూడా వృధా అవ్వడం లేదు. అది ఎక్కడో గాలిలో ఎగిరిపోతుంది అని మనం భావించకూడదు. అవన్నీ కూడా రాయడం జరుగుతుంది. ప్రళయ దినాన ఎప్పుడైతే మనం అల్లాహ్ వద్ద హాజరవుతామో, అక్కడ వీటన్నిటినీ మన ముందుకు తీసుకురావడం జరుగుతుంది.
బోధపడిన విషయాలు
మహాశయులారా! ఇంతవరకు తెలుసుకున్న విషయాలు, వాటిలో ఏ ఏ ఆధారాలైతే మన ముందుకు వచ్చాయో, వాటి ద్వారా మనకు బోధపడిన విషయాలు ఏమిటంటే:
(1) మనలోని ప్రతి వ్యక్తి వెంట ఇద్దరు దైవదూతలు కనీసం ఉన్నారు. వారు మనం మాట్లాడే ప్రతి మాట, మనం చేసే ప్రతి కర్మ, మనం ఊహించే ప్రతి ఊహ, వీటన్నిటినీ కూడా రాస్తూ ఉంటారు.
(2) రెండో విషయం, ఆ దైవదూతలు స్వచ్ఛతనీయులు, విశ్వసనీయులు. వారు ఎలాంటి అపహరణకు గురి కారు. వారికి మనుషుల్లో ఎవరు కూడా ఇతను నా వారు, అతను నా వాడు కాదు, ఇతను నాకు స్నేహితుడు, అతడు నాకు శత్రువు అన్నటువంటి ఏ భావాలు వారికి ఉండవు. ఎవరి పట్ల కూడా ఏ మాత్రం రియాయితీ లేకుండా, ఎలాంటి మినహాయింపు లేకుండా, ఎవరి పట్ల ఏ ప్రేమానుభావాలు చూపి వారు చేసే కర్మలు రాయకుండా, లేదా ఇంకెవరి పట్లనైనా ద్వేషం, కోపం, శత్రుత్వం చూపి వారు చేయనిది కూడా వారు చేశారు అన్నట్టుగా రాయడం, ఇలా ఎంతమాత్రం జరగదు. వారు విశ్వసనీయులు, స్వచ్ఛవంతులు. వారు అల్లాహ్ యొక్క ఆజ్ఞకు లోబడి ఉన్నారు. మానవులు ఎంత చేస్తారో, ఏం మాట్లాడతారో అది మాత్రమే రాస్తారు. ఎక్కువ కూడా రాయరు, రాయకుండా ఉండరు.
(3) మరో గమనార్హమైన విషయం ఏమిటంటే, ఆ దైవదూతలకు ఏ విషయమూ కూడా తెలియకుండా ఉండదు. మనం నిద్రలో ఉన్నా, మనం మేల్కొని ఉన్నా, ఎక్కడ ఏ స్థితిలో ఉన్నా గానీ, వారికి మనం చేసే ప్రతీది తెలుసు. ఏ ఒక్క విషయం కూడా వారికి దాగి ఉండదు.
ఈ విషయం మనకు మరింత స్పష్టంగా బోధపడాలని ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎన్నో వివిధ సందర్భాల్లో, ఎన్నో ఉదాహరణల ద్వారా కూడా మనకు తెలియపరిచారు.
అయితే, మన కర్మ పత్రాల్లో మనతో ఉన్న దైవదూతలు రాసే విషయాలే కాకుండా, వేరే కొన్ని సందర్భాల్లో కూడా కొందరు దైవదూతలు ఉంటారు. ఉదాహరణకు, జుమా నమాజ్, శుక్రవారం రోజున జుమా నమాజ్ కంటే ముందు కొందరు దైవదూతలు ప్రతి జుమా మస్జిద్ కు వస్తారు. అక్కడ ఎవరెవరు ఎంత ముందు మస్జిద్ కు వస్తూ ఉన్నారో వారి పేర్లు వారు రాసుకుంటూ ఉంటారు. మరి ఎవరైతే అజాన్ తర్వాత వస్తారో వారి హాజరు ఆ దైవదూతల యొక్క రిజిస్టర్ లో ఉండదు. ఎందుకంటే ఎప్పుడైతే ఇమామ్ మెంబర్ పై ఖుత్బా ఇవ్వడానికి ఎక్కుతాడో మరియు అటు ముఅద్దిన్ అజాన్ ప్రారంభం చేస్తాడో, దైవదూతలు తమ రిజిస్టర్ లన్నిటినీ కూడా మూసుకొని ఖుత్బా వినడానికి హాజరవుతారు.
అంతేకాకుండా, మరో సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నమాజ్ చేస్తూ ఉన్నారు. ఒక వ్యక్తి నమాజ్ లో “హమ్దన్ కసీరన్ తయ్యిబమ్ ముబారకన్ ఫీహ్” అని పలికాడు. నమాజ్ అయిన తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, “నీవు పలికిన ఈ పదాలను రాసుకోవడానికి 30 కంటే ఎక్కువ మంది దైవదూతలు నేను ముందు రాయాలంటే నేను ముందు రాయాలి అని ఒకరిపై ఒకరు పోటీ పడుతున్నారు” అని తెలిపారు.
ఈ విధంగా మహాశయులారా! ఇక్కడ మనకు మరొక విషయం కూడా బోధపడింది. అదేమిటంటే మన వెంట ఉన్న దైవదూతలే కాకుండా, వేరే వేరే సందర్భాల్లో, వివిధ సమయాల్లో కొందరు దైవదూతలు కొన్ని విషయాలు మంచివి కానీ చెడువి కానీ రాస్తూ ఉంటారు. అప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండి మంచి విషయాల్లో ఇంకా ముందుకు వెళ్తూ ఉండాలి, చెడు వాటి నుండి మనం దూరం ఉండాలి.
అయితే, ఈ కర్మలు ఏవైతే రాయబడుతున్నాయో, మనం ఆ ప్రళయ దినాన ఎక్కడైతే హాజరవుతామో, అక్కడ ఈ కర్మ పత్రాలన్నీ తెరవడం జరుగుతుంది. దాని యొక్క వివరాలు ఇన్ షా అల్లాహ్, తరువాయి భాగంలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. జజాకుముల్లాహు ఖైరా, వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
أسأل الله الكريمَ ، ربَّ العرش العظيم: أن يتولاّك في الدنيا والآخرة، وأن يجعلك مباركاً أينما كُنْتَ అస్అలుల్లాహల్ కరీమ్, రబ్బల్ అర్షిల్ అజీం అన్ యతవల్లాక ఫిద్దున్యా వల్ ఆఖిరహ్ (పరమదాత, మహోన్నత సింహాసనానికి ప్రభువైన అల్లాహ్ ను అర్థిస్తున్నాను: ఇహపరలోకాల్లో నిన్ను వలీ* గా చేసుకొనుగాక మరియు నీవు ఎక్కడ ఉన్నా నిన్ను శుభవంతుడిగా చేయుగాక)
وأن يجعلكَ مِمن إذا أعطي شَكَر، وإذا ابْتُلي صَبر، وإذا أذنب استغفر، فإن هذه الثلاث عنوانُ السعادة (వ అన్ యజ్అలక మిమ్మన్ ఇజా ఉ’తియ షకర్ వ ఇజబ్తులియ సబర్ వ ఇజా అజ్నబ ఇస్తగ్ఫర్) (ఇంకా ఏదైనా ప్రసాదించబడినప్పుడు కృతజ్ఞత చెల్లించే, పరీక్షకు గురైనప్పుడు సహనం వహించే, పాపం (పొరపాటు) జరిగినప్పుడు క్షమాపణ కోరుకునే వారిలో నిన్ను చేర్చుగాక. వాస్తవానికి ఈ మూడు గుణాల్లోనే సౌభాగ్యం, అదృష్టం ఉంది)
[*] వలీ అంటే అల్లాహ్ యొక్క సన్నిహితుడు, అతడికి అల్లాహ్ సన్మార్గం చూపుతాడు, సద్భాగ్యం ప్రసాదిస్తాడు, అతనికి సహాయసహకారాలు అందిస్తాడు.
ఈ ప్రసంగంలో, ఇమామ్ ముహమ్మద్ ఇబ్న్ అబ్దుల్ వహ్హాబ్ (రహిమహుల్లాహ్) రచించిన “అల్-ఖవాయిద్ అల్-అర్బా” (నాలుగు నియమాలు) అనే పుస్తకం యొక్క పరిచయం మరియు ప్రారంభ దుఆల గురించి వివరించబడింది. ఇస్లాం యొక్క పునాది అయిన ‘లా ఇలాహ ఇల్లల్లాహ్’ ప్రాముఖ్యతతో ప్రసంగం ప్రారంభమవుతుంది. తౌహీద్‌ను షిర్క్ నుండి వేరు చేయడానికి ఇమామ్ ఈ పుస్తకాన్ని రచించారని, మరియు పాఠకుల కోసం దుఆతో ప్రారంభించడం ఆయన పద్ధతి అని వక్త పేర్కొన్నారు. మూడు ముఖ్యమైన దుఆలు వివరించబడ్డాయి: 1) అల్లాహ్ ఇహపరలోకాలలో తన వలీ (మిత్రుడు)గా చేసుకోవాలని కోరడం. 2) ఎక్కడ ఉన్నా ముబారక్ (శుభవంతుడు)గా చేయమని ప్రార్థించడం. 3) అనుగ్రహం పొందినప్పుడు కృతజ్ఞత (షుక్ర్), పరీక్షకు గురైనప్పుడు సహనం (సబ్ర్), మరియు పాపం చేసినప్పుడు క్షమాపణ (ఇస్తిగ్ఫార్) కోరే వారిలో చేర్చమని వేడుకోవడం. ఈ మూడు గుణాలు సౌభాగ్యానికి మరియు సాఫల్యానికి ప్రతీకలని వక్త నొక్కిచెప్పారు.
అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు. అల్హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్ నబియ్యినా ముహమ్మద్ వ ఆలిహి వ సహ్బిహి అజ్మయీన్ అమ్మా బాద్.
ప్రియ వీక్షకులారా, అల్హందులిల్లాహి హందన్ కసీరా. ఇస్లాం ధర్మానికి పునాది అయినటువంటి కలిమ లా ఇలాహ ఇల్లల్లాహ్, దీనికి సంబంధించిన ఎన్నో వివరాలు ఉన్నాయి. అయితే 1115వ హిజ్రీ శకంలో జన్మించినటువంటి ఇమామ్ ముహమ్మద్ ఇబ్ను అబ్దుల్ వహ్హాబ్ రహిమహుల్లాహ్, ఆయన ఈ సౌదీ అరబ్‌లోని రియాద్ క్యాపిటల్ సిటీకి దగ్గర దిర్ఇయ్యాలో జన్మించారు. ఆయన ధర్మ విద్య నేర్చుకున్న తర్వాత ధర్మ ప్రచారం మొదలుపెట్టిన సందర్భంలో ఇక్కడ ఈ అరబ్ ప్రాంతంలో, వారి చుట్టుపక్కల్లో అనేక మంది ముస్లింలు చాలా స్పష్టమైన షిర్క్ చేస్తుంటే చూశారు. వారు చేస్తున్న ఆ షిర్క్ పనులు, వాటిని వారు షిర్క్ అని భావించడం లేదు. ఈ రోజుల్లో అనేక మంది ముస్లింలలో ఉన్నటువంటి మహా భయంకరమైన అజ్ఞానం అనండి, పొరపాటు అనండి, అశ్రద్ధ అనండి, వారు ఏ షిర్క్‌లో ఉన్నారో దానిని షిర్క్ అని భావించడం లేదు. అయితే ఇమామ్ ముహమ్మద్ ఇబ్ను అబ్దుల్ వహ్హాబ్ రహిమహుల్లాహ్ ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా వారి ముందు వారు చేస్తున్న ఆ పనులన్నిటినీ కూడా షిర్క్ అని స్పష్టపరిచారు. దానికై ఎన్నో సంవత్సరాలు చాలా కృషి చేశారు. ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొన్నారు.
అయితే ఈ దావా ప్రచారంలో ఆయన కేవలం చెప్పడం ద్వారానే కాదు, ప్రజల వద్ద ఆధారాలు స్పష్టంగా ఉండాలి, ఇంకా ముందు తరాల వారికి కూడా తెలియాలి అని కొన్ని చిన్న చిన్న రచనలు, పుస్తకాలు కూడా రచించారు. ఉసూల్ ఎ సలాసా, అల్-ఖవాయిద్ ఉల్-అర్బా, కష్ఫుష్ షుబహాత్ ఇంకా ఇలాంటి ఎన్నో పుస్తకాలు ఉన్నాయి.
అయితే ఇప్పుడు మనం చదవబోతున్నటువంటి పుస్తకం అల్-ఖవాయిద్ ఉల్-అర్బా. నాలుగు నియమాలు. నాలుగు మూల పునాది లాంటి విషయాలు. దేనికి సంబంధించినవి? ఈ నాలుగు నియమాలు వీటిని మనం తెలుసుకున్నామంటే తౌహీద్‌లో షిర్క్ కలుషితం కాకుండా ఉండే విధంగా మనం జాగ్రత్త పడగలుగుతాము.
అయితే ఇమామ్ ముహమ్మద్ ఇబ్ను అబ్దుల్ వహ్హాబ్ రహిమహుల్లాహ్ వారి అలవాటు ఏమిటంటే, ఆయన ఎక్కడ బోధ చేసినా గాని, ఏ పుస్తకాలు రచించినా గాని సర్వసామాన్యంగా పాఠకులకు, విద్యార్థులకు ముందు దీవిస్తారు, దుఆలు ఇస్తారు, ఆశీర్వదిస్తారు. అల్లాహ్‌తో వీరి గురించి ఎన్నో మేళ్ళను కోరుతారు. ఇది చాలా ఉత్తమమైన పద్ధతి. ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉత్తమ పద్ధతి ఇది.
అయితే రండి, ఏ ఆలస్యం లేకుండా మనం ఈ పుస్తకం చదవబోతున్నాము. మధ్యమధ్యలో నేను కొన్ని ముఖ్యమైన విషయాలు మీకు చూపిస్తాను కూడా. అయితే అసలు నాలుగు నియమాలు చెప్పేకి ముందు ఒక నాలుగు రకాల మంచి దుఆలు ఇస్తారు, ఆ తర్వాత తౌహీద్‌కు సంబంధించిన ఒక మూల విషయం తెలియజేస్తారు, ఆ తర్వాత ఆ నాలుగు నియమాలు చెప్పడం మొదలుపెడతారు. అయితే ఇది చాలా చిన్న పుస్తకం. మనం ఆ విషయాలను కొంచెం వివరంగా తెలుసుకుంటాము. మంచిగా అర్థం కావడానికి, మన సమాజంలో ఉన్నటువంటి షిర్క్‌ను మనం కూడా ఉత్తమ రీతిలో ఖండిస్తూ ప్రజలను ఈ షిర్క్ నుండి దూరం ఉంచడానికి.
ద్వారా పుస్తకం ప్రారంభిస్తున్నారు. మనకు తెలిసిన విషయమే ఖురాన్ గ్రంథం యొక్క ప్రారంభం కూడా బిస్మిల్లాహ్ నుండే అవుతుంది. ఏ పని అయినా మనం బిస్మిల్లాహ్, అల్లాహ్ యొక్క శుభ నామంతో మొదలుపెట్టాలి. అప్పుడే అందులో మనకు చాలా శుభాలు కలుగుతాయి. అల్లాహ్, ఇది మన అందరి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క అసలైన పేరు. ఆ తర్వాత రెండు పేర్ల ప్రస్తావన వచ్చింది, అర్-రహ్మాన్, అర్-రహీమ్. ఇందులో అల్లాహ్ యొక్క విశాలమైన కారుణ్యం, ప్రజలపై ఎడతెగకుండా కురుస్తున్నటువంటి కారుణ్యం గురించి చెప్పడం జరిగింది.
సోదర మహాశయులారా, సోదరీమణులారా దీని ద్వారా మనం గమనించాలి ఒక విషయం. అదేమిటంటే అల్లాహ్ త’ఆలా యొక్క పేర్లు, అల్లాహ్ యొక్క శుభ నామములు వాటిని సమయ సందర్భంలో దృష్టి పెట్టుకొని, ఎక్కడ ఎలాంటి పేరు ఉపయోగించాలి, ప్రత్యేకంగా దుఆ చేస్తున్నప్పుడు మనం అల్లాహ్‌తో ఏ విషయం కోరుతున్నాము, అడుగుతున్నాము, అర్ధిస్తున్నాము, దానికి తగిన అలాంటి భావం గల అల్లాహ్ యొక్క పేర్లు ఉపయోగించడం ద్వారా మనం చాలా లాభం పొందగలుగుతాము మరియు అలాంటి దుఆలు త్వరగా స్వీకరించబడతాయి కూడా.
ఇమామ్ గారి ప్రారంభ దుఆలు
ఇక ఆ తర్వాత ఇమామ్ ముహమ్మద్ ఇబ్ను అబ్దుల్ వహ్హాబ్ రహిమహుల్లాహ్ చెబుతున్నారు,
أسأل الله الكريمَ ، ربَّ العرش العظيم: أن يتولاّك في الدنيا والآخرة، وأن يجعلك مباركاً أينما كُنْتَ అస్అలుల్లాహల్ కరీమ్ రబ్బల్ అర్షిల్ అజీమ్ అన్ యతవల్లాక్ ఫిద్దున్యా వల్ ఆఖిరహ్. పరమదాత, మహోన్నత సింహాసనానికి ప్రభువైన అల్లాహ్‌ను అర్ధిస్తున్నాను, ఇహపరలోకాల్లో అల్లాహ్ నిన్ను వలీగా చేసుకొనుగాక.
సోదర మహాశయులారా, ఇక్కడ మీరు చూశారు, ఇమామ్ ముహమ్మద్ ఇబ్ను అబ్దుల్ వహ్హాబ్ రహిమహుల్లాహ్ అన్ యతవల్లాక ఫిద్దున్యా వల్ ఆఖిరహ్. అల్లాహ్ త’ఆలా నిన్ను ఇహపరలోకాలలో వలీగా చేసుకొనుగాక. మొదటి దుఆ ఇది. ఆ తర్వాత మరో రెండు దుఆలు కూడా ఉన్నాయి. ఈ దుఆ ప్రస్తావించేకి ముందు, అస్అలుల్లాహ్ అల్-కరీమ్ రబ్బల్ అర్షిల్ అజీమ్. అల్లాహ్ యొక్క రెండు పేర్లు, అల్లాహ్ యొక్క సృష్టిలో అత్యంత మహా పెద్దగా ఉన్నటువంటి ఆ సృష్టికి నీవు ప్రభువు అన్నటువంటి ఆ సృష్టి ప్రస్తావన ఇక్కడ చేశారు.
అల్-కరీమ్, అల్లాహ్ యొక్క పేరు. గత రమదాన్‌లో అల్హందులిల్లాహ్ అల్లాహ్ యొక్క శుభ నామముల గురించి దర్స్ ఇవ్వడం జరిగింది. నాYouTube ఛానల్లోమీరు చూడవచ్చు, అల్లాహ్ యొక్క ఎన్నో పేర్ల గురించి వివరం అక్కడ ఇవ్వడం జరిగింది. అల్-కరీమ్, ఎక్కువగా కరం చేసేవాడు, దాతృత్వ గుణం గలవాడు, ఎక్కువగా ప్రసాదించేవాడు. పరమదాత అని ఇక్కడ అనువాదం చేయడం జరిగింది. ధర్మవేత్తలు అంటారు అల్లాహ్ యొక్క ఈ పేరు అల్-కరీమ్‌లో మరెన్నో ఉత్తమ పేర్లు వచ్చేస్తాయి. ఎన్నో ఉత్తమ పేర్ల భావాలు ఇందులో వచ్చేస్తాయి.
ఆ తర్వాత రబ్. రబ్ అంటే మనం తెలుగులో సర్వసామాన్యంగా ప్రభువు అని అనువదిస్తాము. అయితే ఇమామ్ తబరీ రహిమహుల్లాహ్ చెప్పినట్లు, రబ్ అన్న ఈ పదం యొక్క భావంలో సృష్టించడం, పోషించడం, ఈ విశ్వ వ్యవస్థను నడిపించడం ఈ మూడు భావాలు తప్పనిసరిగా వస్తాయి. ఎవరిలోనైతే ఈ మూడు రకాల శక్తి, సామర్థ్యాలు, గుణాలు ఉన్నాయో, అలాంటివాడే రబ్ కాగలుగుతాడు. అతను ఎవరు? అల్లాహ్.
ఆ తర్వాత ఇక్కడ గమనించాల్సిన విషయం, అల్-అర్షిల్ అజీమ్. రబ్, ఎవరికి రబ్? సర్వమానవులకు రబ్. సర్వ జిన్నాతులకు రబ్. సర్వలోకాలకు రబ్ అల్లాహ్ మాత్రమే. కానీ ఇక్కడ దుఆ చేస్తూ అల్-అర్షిల్ అజీమ్ అని చెప్పడం జరిగింది. ధర్మవేత్తలు అంటారు, షేక్ అబ్దుర్రజాక్ అల్-బద్ర్ హఫిదహుల్లాహ్, షేక్ అబ్దుల్ ముహ్సిన్ అల్-ఖాసిమ్ మస్జిద్-ఎ-నబవీ యొక్క ఇమామ్ ఇంకా వేరే ఎందరో పెద్ద పెద్ద పండితులు అరబీలో ఈ పుస్తకాన్ని వివరించారు. వారు ఇక్కడ ఒక మాట ఏం చెబుతున్నారు? సర్వసృష్టిలో అల్లాహ్ యొక్క అర్ష్ చాలా పెద్దది, బ్రహ్మాండమైనది. అయితే అల్లాహ్ యొక్క గొప్ప తౌహీద్ విషయంలో ముందు కొన్ని ముఖ్య బోధనలు వస్తున్నాయి, అందుకు అల్లాహ్ యొక్క సృష్టిలో అత్యంత బ్రహ్మాండమైన, పెద్ద సృష్టికి నీవు ప్రభువు అని ఇక్కడ అర్ధించడం జరుగుతుంది.
ఖురాన్‌లో అర్ష్ యొక్క గుణంలో దానితోపాటు అల్-అర్షిల్ కరీమ్, అల్-అర్షిల్ అజీమ్, అల్-అర్షిల్ మజీద్ అన్నటువంటి ప్రస్తావన వచ్చి ఉంది. అయితే అర్ష్ ఎంత పెద్దగా ఉన్నది ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు త’ఆలా అన్హు వారి యొక్క హదీసులో కూడా వివరణ ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు కూడా మీరు విని ఉన్నారు, ఖురాన్ వ్యాఖ్యానాలలో, అలాగే ప్రత్యేకంగా ఆయతుల్ కుర్సీ యొక్క వ్యాఖ్యానంలో కూడా ఈ మొత్తం భూమ్యాకాశాలు, విశ్వం ఇదంతా ఒక చిన్న ఉంగరం మాదిరిగా కుర్సీ ముందు, ఆ కుర్సీ ఈ బ్రహ్మాండమైన విశ్వం లాంటిగా మనం భావిస్తే, దాని ముందు ఈ భూమ్యాకాశాలన్నీ కూడా కలిసి ఒక చిన్న ఉంగరం మాదిరిగా. అలాగే కుర్సీ, అర్ష్ ముందు ఎంత చిన్నదంటే అర్ష్‌ను మనం ఒక పెద్ద ఎడారిగా భావిస్తే అందులో కుర్సీ ఒక చిన్న ఉంగరం మాదిరిగా. అర్థమైందా? గమనించారా మీరు?
ఈ భూమ్యాకాశాలన్నీ మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ ఒక చిన్న ఉంగరం మాదిరిగా. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎలా ఉదాహరణ ఇస్తారంటే ఒక పెద్ద ఎడారి ఉంది, దాని మధ్యలో ఎక్కడైనా ఒక చిన్న ఉంగరం పడి ఉన్నది. అల్లాహ్ యొక్క అర్ష్ ఎడారి మాదిరిగా అయితే కుర్సీ ఆ ఉంగరం లాంటిది. కుర్సీ ఆ ఎడారి లాంటిదైతే ఈ భూమ్యాకాశాలు మొత్తం విశ్వం ఆ ఉంగరం లాంటిది. అంటే ఈ మొత్తం భూమ్యాకాశాల కంటే చాలా చాలా చాలా ఎన్నో రెట్లు పెద్దగా కుర్సీ. మరియు కుర్సీ కంటే ఎన్నో రెట్లు పెద్దగా అల్లాహ్ యొక్క అర్ష్.
అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ అర్ష్ పై ఆసీనుడై ఉన్నాడు, సింహాసనంపై అల్లాహ్ త’ఆలా ఇస్తివా అయి ఉన్నాడు. ఇక్కడ సలఫె సాలిహీన్ యొక్క మన్హజ్, వారి యొక్క విధానం ఏమిటంటే మనం అల్లాహ్ యొక్క అర్ష్‌ను విశ్వసించాలి, అర్ష్ అంటే ప్రభుత్వం, ఏదో కేవలం శక్తి అని నమ్మకూడదు. అల్లాహ్ యొక్క సృష్టి అది. అత్యంత పెద్ద సృష్టి. అల్లాహ్ త’ఆలా దానిపై ఇస్తివా అయి ఉన్నాడు, ఆసీనుడై ఉన్నాడు. కానీ ఎలా ఉన్నాడు? ఎటువైపులా ఉన్నాడు? ఈ వివరాల్లోకి మనం వెళ్ళకూడదు. అర్థమైంది కదా?
అస్అలుల్లాహల్ కరీమ్ రబ్బల్ అర్షిల్ అజీమ్. ఆ తర్వాత ఏం దుఆ చేస్తున్నారు? అన్ యతవల్లాక ఫిద్దున్యా వల్ ఆఖిరహ్. అల్లాహ్ త’ఆలా నిన్ను ఇహలోకంలో, పరలోకంలో వలీగా చేసుకొనుగాక.
సోదర మహాశయులారా, ఇది చాలా గొప్ప దుఆ. అల్లాహ్ మనల్ని వలీగా చేసుకోవడం, మనం అల్లాహ్‌కు వలీగా అయిపోవడం, అల్లాహ్ మన కొరకు వలీ అవ్వడం ఇది మహా గొప్ప అదృష్టం. ఎవరైతే అల్లాహ్‌కు వలీ అవుతారో, మరి ఎవరికైతే అల్లాహ్ వలీ అవుతాడో, అలాంటి వారికి ఏ బాధ, ఏ చింత ఉండదు. ఖురాన్‌లో అనేక సందర్భాల్లో అల్లాహ్ త’ఆలా తెలియజేశాడు,
జరిగిపోయిన భూతకాలం గురించి గాని, రాబోతున్న భవిష్యత్తు గురించి గాని ఎలాంటి భయము, ఎలాంటి చింత ఉండదు. ఎవరికి? అల్లాహ్ యొక్క వలీలకు. అంతేకాదు, ఎవరైతే అల్లాహ్ యొక్క వలీ అవుతారో అలాంటివారు మార్గభ్రష్టత్వంలో పడే, షిర్క్‌లో పడేటువంటి ప్రమాదం ఉండదు. అవును, సూరత్ ఆయతుల్ కుర్సీ వెంటనే ఆయత్ ఏదైతే ఉన్నదో ఒకసారి దాని తర్వాత ఆయతులు గమనించండి. ఆయతుల్ కుర్సీ తర్వాత లా ఇక్రహ ఫిద్దీన్, ఆ తర్వాత
اللَّهُ وَلِيُّ الَّذِينَ آمَنُوا يُخْرِجُهُم مِّنَ الظُّلُمَاتِ إِلَى النُّورِ అల్లాహు వలియ్యుల్లజీన ఆమనూ యుఖ్రిజుహుమ్ మినజ్జులుమాతి ఇలన్నూర్. విశ్వసించినవారి వలీ గా స్వయంగా అల్లాహ్ ఉంటాడు. ఆయన వారిని చీకట్ల నుంచి వెలుగు వైపుకు తీసుకుపోతాడు. (2:257).
అల్లాహ్ త’ఆలా విశ్వాసులకు వలీ. అల్లాహ్ తమ ఔలియాలను జులుమాత్‌ల నుండి వెలికితీసి నూర్ వైపునకు తీసుకొస్తాడు. జులుమాత్, అంధకారాలు, చీకట్లు. ఎలాంటివి? షిర్క్ యొక్క అంధకారం, బిదాత్ యొక్క అంధకారం, పాపాల అంధకారం నుండి బయటికి తీసి అల్లాహ్ త’ఆలా తౌహీద్ యొక్క వెలుతురులో, సున్నత్ యొక్క కాంతిలో మరియు పుణ్యాల యొక్క ప్రకాశవంతమైన మార్గంలో వేస్తాడు. గమనించారా?
మరియు ఈ గొప్ప అదృష్టాన్ని ఎలా పొందగలుగుతాము మనం? ఒకరు దుఆ ఇస్తారు. కానీ ఆ దుఆకు తగ్గట్టు మన ప్రయత్నం కూడా ఉండాలి కదా? నా కొడుకు పాస్ కావాలని దుఆ చేయండి. సరే మంచిది, చేస్తాము. కానీ కొడుకు అక్కడ ప్రిపరేషన్ కూడా మంచిగా చేయాలి కదా? నా కొడుకు ఆరోగ్యం బాగలేదు, మీరు అల్లాహ్ ఆరోగ్యం ప్రసాదించాలని దుఆ చేయండి. సరే మనం చేస్తాము. కానీ మందులు వాడడం గాని, డాక్టర్ వద్దకు తీసుకువెళ్లడం గాని ఇలాంటి ప్రయత్నాలు కూడా జరగాలి కదా? అలాగే మనం అల్లాహ్ యొక్క వలీ కావాలంటే ఏం చేయాలి?
సూరత్ ఫుస్సిలత్‌లో అల్లాహ్ త’ఆలా ఇచ్చినటువంటి శుభవార్త, ఆ శుభవార్త ఎవరికి ఇవ్వబడినది? ఆ పనులు మనం చేయాలి. అలాగే అలా ఇన్న ఔలియా అల్లాహి లా ఖవ్ఫున్ అలైహిమ్ వలాహుమ్ యహ్జనూన్ అనే ఆయత్ తర్వాత సూర యూనుస్‌లో వెంటనే అల్లాహ్ ఏమంటున్నాడు? ఎవరు వారు ఔలియా? అల్లజీన ఆమనూ వకాను యత్తఖూన్. (10:63). ఎవరైతే విశ్వసిస్తారో, తౌహీద్‌ను అవలంబిస్తారో, భయభీతి మార్గాన్ని అవలంబిస్తారో. ఇక ఫుస్సిలత్‌లో చూస్తే ఇన్నల్లజీన ఖాలూ రబ్బునల్లాహ్. “అల్లాహ్ యే మా ప్రభువు” అని పలికి, ఆ తరువాత దానికే కట్టుబడి ఉన్నవారిపై (41:30). ఎవరైతే మా యొక్క ప్రభువు అల్లాహ్ అని అన్నారో, సుమ్మస్తఖామూ. ఆ తౌహీద్ పై, ఆ విశ్వాసంపై, సత్కార్యాలపై స్థిరంగా ఉన్నారు. షిర్క్, బిదాత్‌లు, పాపకార్యాల యొక్క ఎలాంటి తుఫానీ గాలులు వచ్చినా గాని వారు ఏమాత్రం అటు ఇటు వంగకుండా, ఆ పాపాల్లో పడకుండా, తౌహీద్ పై, పుణ్యాలపై, సున్నత్ పై స్థిరంగా ఉండాలి. అల్లాహ్ త’ఆలా అల్లా తఖాఫూ వలా తహ్జనూ అని శుభవార్తలు ఇచ్చాడు. ఆ శుభవార్తలోనే ఒకటి ఏముంది? ఆ తర్వాత ఆయత్‌లో
نَحْنُ أَوْلِيَاؤُكُمْ فِي الْحَيَاةِ الدُّنْيَا وَفِي الْآخِرَةِ నహ్ను ఔలియా ఉకుమ్ ఫిల్ హయాతిద్దున్యా వ ఫిల్ ఆఖిరహ్. ప్రాపంచిక జీవితంలో కూడా మేము మీ నేస్తాలుగా ఉంటూవచ్చాము. పరలోకంలో కూడా ఉంటాము. (41:31).
మేము మీ ఇహలోక జీవితంలో కూడా మీకు ఔలియా. వ ఫిల్ ఆఖిరహ్, పరలోకంలో కూడా. చూశారా దుఆ? ఏమి ఇచ్చారు ఇమామ్ ముహమ్మద్ ఇబ్ను అబ్దుల్ వహ్హాబ్ రహిమహుల్లాహ్? అన్ యతవల్లాక ఫిద్దున్యా వల్ ఆఖిరహ్. అల్లాహ్ నిన్ను ఇహలోకంలో, పరలోకంలో వలీగా చేసుకొనుగాక.
ఇక సోదర మహాశయులారా, ఇంకా దీనికి సంబంధించిన వివరాలు ఇవ్వాలంటే ఎన్నో ఆయతులు, హదీసుల ఆధారంగా ఇవ్వవచ్చు. కానీ సమయం చాలా ఎక్కువగా అవుతుంది. కేవలం సహీ బుఖారీలో వచ్చిన ఒక హదీసు వినిపించి, ఆ తర్వాత ఇమామ్ ముహమ్మద్ ఇబ్ను అబ్దుల్ వహ్హాబ్ రహిమహుల్లాహ్ ఏం చెబుతున్నారో అది మనం విందాము, మరొక దుఆ ఏదైతే ఇచ్చారో అది కూడా మనం తెలుసుకుందాం. సహీ బుఖారీలో హదీసు ఏమిటి?
“ఎవరైతే అల్లాహ్ యొక్క వలీలతో శత్రుత్వం వహిస్తారో, నేను స్వయంగా వారితో యుద్ధానికి సిద్ధమవుతాను” అని అల్లాహ్ చెప్పినట్లు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. చూస్తున్నారా? ఎవరైతే అల్లాహ్‌కు వలీలుగా అవుతారో, వారు అల్లాహ్‌కు ఎంత ప్రియులు అవుతారు మరియు అల్లాహ్ వారి వైపు నుండి ఎలా పోరాడుతాడో. కానీ అల్లాహ్ యొక్క ఈ వలీ కావడానికి ఏంటి? అదే హదీసులో చెప్పడం జరిగింది. అదే హదీసులో చెప్పడం జరిగింది.
అల్లాహ్ ఏ విషయాలైతే మనపై విధిగావించాడో వాటిని మనం తూచా తప్పకుండా, పాబందీగా పాటిస్తూ ఉండాలి. ఇక అల్లాహ్ విధించిన వాటిలో అత్యుత్తమమైనది, అత్యున్నత స్థానంలో, మొట్టమొదటి స్థానంలో తౌహీద్. కదా? వలాకిన్నల్ బిర్ర మన్ ఆమన బిల్లాహ్. సూర బఖరా ఆయత్ నెంబర్ 187 కూడా చూడవచ్చు మనం.
ఆ తర్వాత అల్లాహ్ త’ఆలా విధిగావించిన విషయాలు పాటించిన తర్వాత నఫిల్ విషయాలు ఎక్కువగా పాటిస్తూ ఉండడం. ఇక్కడ నఫిల్ అంటే ఎంతో మంది కేవలం నమాజులు అనుకుంటారు, కాదు. నమాజులు, ఉపవాసాలు, దానధర్మాలు, హుకూకుల్లాహ్, అల్లాహ్ మరియు దాసులకు మధ్య సంబంధించిన విషయాల్లో, హుకూకుల్ ఇబాద్ మరియు మన యొక్క సంబంధాలు దాసులతో ఏమైతే ఉంటాయో అన్నిటిలో కూడా కొన్ని విధులు ఉన్నాయి, మరి కొన్ని నఫిల్‌లు ఉన్నాయి. ఆ నఫిల్‌లు కూడా అధికంగా చేస్తూ ఉండాలి. అప్పుడు అల్లాహ్ యొక్క వలీ కావడానికి మనం చాలా దగ్గరగా అవుతాము.
లేదా అంటే ఈ రోజుల్లో ఎందరో చనిపోయిన వారిని, ఎందరో సమాధులను ఔలియాల యొక్క సమాధులు అని, చనిపోయిన వారిని మాత్రమే వలీగా భావిస్తారు. అయితే ఇక్కడ ఒక నియమం తెలుసుకోండి. ఎవరైతే ఇహలోకంలో వలీ అవ్వడానికి కొంచెం కూడా ప్రయత్నం చేయలేదో, చనిపోయిన తర్వాత వారు వలీ కాజాలరు.
సోదర మహాశయులారా, అల్-ఖవాయిద్ ఉల్-అర్బా పుస్తకం మనం ప్రారంభించాము. ఇమామ్ ముహమ్మద్ ఇబ్ను అబ్దుల్ వహ్హాబ్ రహిమహుల్లాహ్ ఏదైతే దుఆ ఇచ్చారో, అస్అలుల్లాహల్ కరీమ్ రబ్బల్ అర్షిల్ అజీమ్ అన్ యతవల్లాక ఫిద్దున్యా వల్ ఆఖిరహ్. ఈ దుఆ ఒకటి ముందు మనం తెలుసుకున్నాము.
సోదర మహాశయులారా, అల్-ఖవాయిద్ ఉల్-అర్బా పుస్తకం మనం ప్రారంభించాము. ఇమామ్ ముహమ్మద్ ఇబ్ను అబ్దుల్ వహ్హాబ్ రహిమహుల్లాహ్ ఏదైతే దుఆ ఇచ్చారో, అస్అలుల్లాహల్ కరీమ్ రబ్బల్ అర్షిల్ అజీమ్ అన్ యతవల్లాక ఫిద్దున్యా వల్ ఆఖిరహ్. ఈ దుఆ ఒకటి ముందు మనం తెలుసుకున్నాము.
రెండవ దుఆ
وَأَنْ يَجْعَلَكَ مُبَارَكًا أَيْنَ مَا كُنْتَ (వ అన్ యజ్అలక ముబారకన్ అయ్న మా కున్త్) నీవు ఎక్కడ ఉన్నా నిన్ను శుభవంతుడిగా చేయుగాక.
ఇది చాలా గొప్ప విషయం. ముబారక్, కేవలం పేరు పెట్టుకుంటే ముబారక్ కాజాలరు.
సోదర మహాశయులారా, ఇది కూడా చాలా మంచి దుఆ, చాలా గొప్ప దుఆ. మరియు ప్రవక్తల గురించి అల్లాహ్ త’ఆలా తెలిపినటువంటి ఇది ఒక గొప్ప శుభవార్త. ఈసా అలైహిస్సలాం వారి యొక్క జీవిత చరిత్రలో మీరు విని ఉన్నారు,
وَجَعَلَنِي مُبَارَكًا أَيْنَ مَا كُنتُ وَأَوْصَانِي بِالصَّلَاةِ وَالزَّكَاةِ مَا دُمْتُ حَيًّا వ జఅలనీ ముబారకన్ అయ్న మా కున్తు వ అవ్సానీ బిస్సలాతి వజ్జకాతి మా దుమ్తు హయ్యా. “నేనెక్కడున్నాసరే ఆయన నన్ను శుభవంతునిగా చేశాడు.“ (19:31).
అల్లాహ్ త’ఆలా నన్ను ఎక్కడ ఉన్నా గాని ముబారక్, శుభవంతుడిగా చేశాడు అని ఈసా అలైహిస్సలాం చెప్పారు. ఇమామ్ హసన్ అల్-బస్రీ రహిమహుల్లాహ్ చెబుతున్నారు, అల్లాహ్ త’ఆలా నిన్ను ముబారక్ చేయుగాక, నిన్ను శుభవంతుడిగా చేయుగాక అంటే నీవు ధర్మంపై స్థిరంగా ఉండి ఇతరులకు మంచిని ఆదేశిస్తూ, ఇతరులను చెడు నుండి ఖండిస్తూ ఉండేటువంటి సద్భాగ్యం అల్లాహ్ నీకు ప్రసాదించుగాక. ఇంత గొప్ప విషయం చూస్తున్నారా? ఒకసారి ఆలోచించండి. మన జీవితాల్లో బర్కత్, శుభాలు రావాలంటే ఎలా వస్తాయి? స్వయంగా మనం ఆ బర్కత్, శుభాలు వచ్చేటువంటి విషయాలను పాటించడం మరియు మన చుట్టుపక్కల్లో ఎవరైతే దీనికి వ్యతిరేకంగా జీవిస్తున్నారో, వారికి కూడా ప్రేమగా బోధ చేస్తూ ఆ చెడుల నుండి దూరం చేస్తూ వారు కూడా శుభవంతులుగా అవ్వడానికి ప్రయత్నం చేయడం. ఒకసారి మీరు క్రింది ఈ ఆయత్‌ను గమనించండి, అల్లాహ్ త’ఆలా చెబుతున్నాడు:
وَلَوْ أَنَّ أَهْلَ الْقُرَىٰ آمَنُوا وَاتَّقَوْا لَفَتَحْنَا عَلَيْهِم بَرَكَاتٍ مِّنَ السَّمَاءِ وَالْأَرْضِ వలవ్ అన్న అహలల్ ఖురా ఆమనూ వత్తఖవ్ ల ఫతహ్నా అలైహిమ్ బరకాతిమ్ మినస్సమాఇ వల్ అర్ద్. ఈ బస్తీలో నివసించే వాళ్ళేగనక విశ్వసించి, భయభక్తులతో మెలగి ఉన్నట్లయితే మేము వాళ్ల కోసం భూమ్యాకాశాల శుభాల (ద్వారాల)ను తెరచేవాళ్ళం (7:96)
గమనిస్తున్నారా? బరకాత్ ఎలా వస్తాయి? ముబారక్ మనిషి ఎలా కాగలుగుతాడు? దానికి కొరకు ఉత్తమ మార్గం అల్లాహ్ త’ఆలా స్వయంగా తెలియజేశాడు. ఆ మార్గాలను మనం అవలంబించాలి, వాటిపై స్థిరంగా ఉండే ప్రయత్నం చేయాలి.
మూడవ దుఆ
ఇక రండి ఆ తర్వాత మూడవ దుఆ, ఇది కూడా చాలా ముఖ్యమైనది. ఏంటి మూడవ దుఆ? చెబుతున్నారు,
وأن يجعلكَ مِمن إذا أعطي شَكَر، وإذا ابْتُلي صَبر، وإذا أذنب استغفر (వ అన్ యజ్అలక మిమ్మన్ ఇజా ఉ’తియ షకర్ వ ఇజబ్తులియ సబర్ వ ఇజా అజ్నబ ఇస్తగ్ఫర్) ఇంకా ఏదైనా ప్రసాదించబడినప్పుడు కృతజ్ఞత చెల్లించే, పరీక్షకు గురైనప్పుడు సహనం వహించే, పాపం (పొరపాటు) జరిగినప్పుడు క్షమాపణ కోరుకునే వారిలో నిన్ను చేర్చుగాక.
మూడు విషయాల ప్రస్తావన ఇక్కడ ఉంది. ఇది మూడవ దుఆ. గమనిస్తున్నారా ఎంత మంచి ఉత్తమమైన దుఆ ఉంది ఇక్కడ? ఏముంది?
వ అన్ యజ్అలక మిమ్మన్ ఇజా ఉ’తియ షకర్. అల్లాహ్ వైపు నుండి మనకు ఏది ప్రసాదించబడినా, దానికి మనం కృతజ్ఞత చెల్లిస్తూ ఉండాలి. సోదర మహాశయులారా, ఇది చాలా గొప్ప అనుగ్రహం. కానీ మనలో చాలామంది ఏమనుకుంటారు? నాకేమున్నది? తిండికి మూడు పూటలు సరిగ్గా తిండి దొరుకుతలేదు. నాకు జాబ్ లేదు. నాకు ఉద్యోగం లేదు. నా పిల్లలు మంచిగా నా యొక్క అడుగుజాడల్లో లేరు. ఈ విధంగా మనం ఓ నాలుగు విషయాలు ఏదో మనకు నచ్చినవి లేవు, ఇక మనకు ఏ మేలూ లేదు అని అనుకుంటాము. తప్పు విషయం. మనం బ్రతికి ఉండడం ఇది అల్లాహ్ యొక్క చాలా గొప్ప వరం. మనం ఆరోగ్యంగా ఉండి ఈ శ్వాస పీల్చుకుంటూ ఉన్నాము, చూస్తున్నాము, వింటున్నాము, తింటున్నాము, తిరుగుతున్నాము, ఇవన్నీ గొప్ప వరాలు కావా? ఇంకా ఇస్లాం యొక్క భాగ్యం మనకు కలిగింది అంటే ఇంతకంటే ఇంకా ఎక్కువ గొప్ప వరం ఏమున్నది? మనం ఉన్న విషయాలను గనక ఒకవేళ ఆలోచిస్తే, వ ఇన్ తఉద్దూ ని’మతల్లాహి లా తుహ్సూహా. మీరు అల్లాహ్ అనుగ్రహాలను లెక్కించదలిస్తే లెక్కించలేరు. (16:18). వమా బికూమ్ మిన్ ని’మతిన్ ఫమినల్లాహ్. మీ వద్ద ఉన్న ప్రతి అనుగ్రహం అల్లాహ్ తరఫు నుంచే వచ్చినది. (16:53). అయితే మనం మనలో కృతజ్ఞత భావాన్ని పెంచాలి. ఎందుకంటే కృతజ్ఞత ద్వారా అనుగ్రహాలు పెరుగుతాయి. ల ఇన్ షకర్తుమ్ ల అజీదన్నకుమ్. అల్లాహ్ వాగ్దానంగా చెబుతున్నాడు, ఒకవేళ మీరు కృతజ్ఞత చూపిస్తే నేను మీకు మరింత అధికంగా ప్రసాదిస్తాను. (14:7). మీరు గనక కృతజ్ఞత చెల్లిస్తూ ఉంటే ల అజీదన్నకుమ్. ఇంకా అధికంగా నేను మీకు ప్రసాదిస్తాను, మీ యొక్క అనుగ్రహాలను ఇంకా పెంచుతూ పోతాను. అందుకొరకే మనం కృతజ్ఞత చెల్లిస్తూ ఉండాలి.
కృతజ్ఞత ఎలా చెల్లించాలి? కేవలం థాంక్స్ అంటే సరిపోతుందా? కాదు. ముందు విషయం, మనసా వాచా అన్ని అనుగ్రహాలు కేవలం అల్లాహ్ వైపు నుండే అన్నటువంటి భావన, నమ్మకం, నాలుకతో వాటి ప్రస్తావన ఉండాలి. అయ్యో ఆ గొట్ట కాడికి పోతేనే అయ్యా, మాకు దొరికిండు, మాకు లభించినది అని కొందరు అనుకుంటూ ఉంటారు. ఫలానా బాబా దగ్గరికి పోతేనే మాకు ఈ ఆరోగ్యం వచ్చింది అని అనుకుంటారు. అల్లాహు అక్బర్, అస్తగ్ఫిరుల్లాహ్. సంతానం ఇవ్వడం గాని, ఆరోగ్యాలు ఇవ్వడం గాని కేవలం ఒకే ఒక్కడు అల్లాహ్ మాత్రమే ఇచ్చేవాడు. వేరే ఎవరి శక్తిలో లేదు. ఈ అనుగ్రహాలను మనం అల్లాహ్ వైపునకు కాకుండా వేరే వారి వైపునకు అంకితం చేస్తే ఇది షిర్క్‌లో చేరిపోతుంది. కృతజ్ఞతకు వ్యతిరేకం ఇది.
ఇక కృతజ్ఞత నోటితో ఉంటుంది, ఆచరణతో కూడా ఉంటుంది. అల్లాహ్ ఏం చెప్పాడు? ఇ’మలూ ఆల దావూద షుక్రా. “ఓ దావూదు సంతతివారలారా! కృతజ్ఞతాపూర్వకంగా పనులు చేయండి.” (34:13). ఓ దావూదు సంతతివారలారా, మీరు ఇ’మలూ, అమల్ చేయండి షుక్ర్‌ను ఆచరణ రూపంలో చెల్లించండి, కృతజ్ఞత ఆచరణ పరంగా చెల్లించండి. కృతజ్ఞత ఆచరణ రూపంలో ఎలానండి? ఇలా అంటే ఏ ఏ అనుగ్రహం అల్లాహ్ వైపు నుండి మనకు లభించినదో దానిని కేవలం అల్లాహ్ యొక్క ప్రసన్నతలో, ఆయన యొక్క విధేయతలోనే ఆ అనుగ్రహాన్ని మనం ఉపయోగించాలి. చెవు, అల్లాహ్ ఎందుకు ఇచ్చాడు? కళ్ళు, అల్లాహ్ ఎందుకు ఇచ్చాడు? కాళ్ళు చేతులు, అల్లాహ్ ఎందుకు ఇచ్చాడు? అల్లాహ్ ఏ దేని కొరకైతే అవి ఇచ్చాడో వాటి ఆ ఉద్దేశంలోనే వాటిని ఉపయోగించాలి. నేను ఉదాహరణగా ఇవి చెప్పాను. ప్రతి అనుగ్రహం. ఎవరైతే ఈ షుక్రియా, కృతజ్ఞత భావం కలిగి, కృతజ్ఞత చెల్లిస్తూ ఉంటారో, అల్లాహ్ వారికి అనుగ్రహాలు పెంచడంతో పాటు వారి యొక్క పుణ్యాలు చాలా పెరుగుతూ ఉంటాయి. ఎందుకంటే అల్లాహ్ షకూర్. ఎవరైతే షుక్రియా అదా చేస్తారో, కృతజ్ఞత చెల్లిస్తారో, వారిని ఆదరణిస్తాడు, వారికి ఎంతో గౌరవం ప్రసాదిస్తాడు. షకూర్, అల్లాహ్ యొక్క దాసులు. అల్లాహ్ త’ఆలా తమ ప్రవక్తల్లో కొందరిని అబ్దన్ షకూరా, ఇతడు నా దాసుడు, కృతజ్ఞత చెల్లించేవాడు అని ప్రశంసించాడు. ఇంకా ఈ కృతజ్ఞత చెల్లిస్తూ ఉండడం ద్వారా అల్లాహ్ యొక్క ప్రియమైన, తక్కువ దాసులు ఎవరైతే ఉంటారో, వారిలో మనం చేరిపోతాము.
హజ్రత్ ఉమర్ రదియల్లాహు త’ఆలా అన్హు వారి గురించి వస్తుంది. ఒక సందర్భంలో ఆయన, ఓ అల్లాహ్ నీ యొక్క తక్కువ దాసులలో నన్ను చేర్చుకో అని దుఆ చేశారట. పక్కన ఎవరో విన్నవారు, ఏంటి ఇలా దుఆ చేస్తున్నారు మీరు అంటే, ఖురాన్‌లో అల్లాహ్ ఏమంటున్నాడు? వ ఖలీలుమ్ మిన్ ఇబాదియష్ షకూర్. నా యొక్క కృతజ్ఞత చెల్లించేవారు చాలా తక్కువ మంది ఉన్నారు. (34:13). అల్లాహ్ త’ఆలా ఆ కృతజ్ఞత చెల్లించేటువంటి భాగ్యం మనకు ప్రసాదించుగాక.
రెండవది ఏమిటి? ఇజబ్తులియ సబర్. ఉబ్తులియ. ఏదైనా బలా, ఆపద, కష్టం, పరీక్ష వచ్చింది, ఓపిక సహనం వహించాలి. సోదర
మహాశయులారా, షుక్ర్, సబ్ర్ ఇవి రెండు ఎంత పెద్ద అనుగ్రహాలో ఒకసారి ఆలోచించండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సహీ హదీసు ఉంది, ఇన్న అమ్ రల్ ము’మిని అజబ్. విశ్వాసుని యొక్క విషయమే చాలా వింతగా ఉంది. మరియు ఈ విశ్వాసునికి తప్ప ఇంకా వేరే ఎవరికీ లేదు. అతడు అన్ని స్థితుల్లో కూడా మేలు, ఖైర్, మంచినే పొందుతాడు. అల్లాహ్ అతనికి ఏదైనా అనుగ్రహించాడు, అసాబతుస్సర్రా, షకర్. అతను కృతజ్ఞత చెల్లిస్తాడు, ఫకాన ఖైరల్లహ్. అదే అతని కొరకు మేలు అవుతుంది. వ ఇజా అసాబతుద్దర్రా. ఒకవేళ అతనికి ఏదైనా కీడు, ఏదైనా నష్టం వాటిల్లింది, సబర్. అతను సహనం వహిస్తాడు, ఫకాన ఖైరల్లహ్. అతనికి మేలు జరుగుతుంది. ఈ మేలు విశ్వాసునికి తప్ప ఇంకా వేరే ఎవరికీ లేదు అని చెప్పారు.
సబ్ర్ అన్నది, సహనం అన్నది పుణ్య కార్యాలు చేస్తూ పాటించాలి. ఇది చాలా అవసరం. ఉదాహరణకు తౌహీద్ పై ఉండడం, ఇది గొప్ప పుణ్య కార్యం. నమాజు చేయడం, ఉపవాసాలు పాటించడం, ఇందులో కూడా సహనం అవసరం ఉంటుంది. పాపాల నుండి దూరం ఉండడానికి కూడా సహనం అవసరం ఉంటుంది. అవును, ఎలా? మనకు ఒక పాప కార్యం చాలా ఇష్టంగా ఉంటుంది, అది అల్లాహ్‌కు ఇష్టం లేదు. దాన్ని మనం వదులుకోవాలి. ఉదాహరణకు ఈ రోజుల్లో మన చేతుల్లో మొబైల్ ఉంటుంది. పాటలు వినడం గాని, ఏదైనా ఫిలిములు చూడడం గాని, నగ్న చిత్రాలు చూడడం గాని, ఎన్నెన్నో అనవసరమైన వీడియోలు వస్తూ ఉంటాయి, చూసుకుంటూ వెళ్తారు, టైం పాస్ చేసుకుంటూ ఉన్నాము అని అనుకుంటారు, కానీ అది వారి యొక్క టైం ఫెయిల్ అవుతుంది. వారి యొక్క కర్మ పత్రాల్లో పాపాలు రాయబడుతున్నాయి అన్న విషయాన్ని మనం గ్రహించాం. ఈ విధంగా పాపాల నుండి దూరం ఉండడానికి కూడా సహనం, ఓపిక చాలా అవసరం ఉంటుంది.
మూడవ విషయం, సబ్ర్, సహనం అన్నది అల్లాహ్ వైపు నుండి ఏవైనా ఆపదలు వచ్చేసాయి. అంటే అనారోగ్యానికి గురయ్యారా? పరీక్షలో ఫెయిల్ అయ్యారా? సంతానం ఏదైనా మీకు చాలా ఇబ్బందిలో పడవేస్తున్నారా? మీ యొక్క పంట పొలాలు గిట్ల ఏవైనా నష్టంలో పడ్డాయా? మీ యొక్క వ్యాపారం ఏదైనా మునిగిపోయిందా? అందులో ఏదైనా లాస్ వచ్చేసిందా? మీ యొక్క జాబ్ పోయిందా? ఏ ఆపద అయినా గాని, ఏ కష్టమైనా గాని తూఫానీ గాలి వచ్చింది, ఇల్లు పడిపోయింది. ఇలాంటి ఏ ఆపద అయినా గాని సహనం వహించాలి. సహనం అస్సబ్రు ఇంద సద్మతిల్ ఊలా. సహనం అన్నది కష్టం, ఆపద యొక్క ప్రారంభంలో నుండే మొదలవ్వాలి. రోజులు గడిచిన తర్వాత ఇక చేసేది ఏమీ లేక సరే మంచిది ఇక సహనం చేద్దాం, ఓపిక వహిద్దాం, ఇది సహనం అనబడదు. ఈ సహనం వల్ల కూడా అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ వద్ద స్థానాలు చాలా పెరుగుతాయి. ఇన్నమా యు వఫ్ఫస్సాబిరూన అజ్ రహూమ్ బిగైరి హిసాబ్. నిశ్చయంగా సహనం పాటించేవారికి లెక్కలేనంత ప్రతిఫలం ఇవ్వబడుతుంది. (39:10).
ఇక మూడవది ఇజా అజ్నబ ఇస్తగ్ఫర్. ఏదైనా పాపం జరిగితే ఇస్తిగ్ఫార్ చేయాలి, అల్లాహ్‌తో క్షమాపణ కోరుకోవాలి. అల్లాహు అక్బర్. సోదర మహాశయులారా, షుక్ర్, సబ్ర్, ఇస్తిగ్ఫార్. ప్రవక్తల యొక్క ఉత్తమ గుణాలు, పుణ్యాత్ముల యొక్క ఉత్తమ గుణాలు. ఇది మనం పాటించాలి. సూర ఆలి ఇమ్రాన్‌లో చూడండి అల్లాహ్ త’ఆలా ఏమంటున్నాడు?
وَالَّذِينَ إِذَا فَعَلُوا فَاحِشَةً أَوْ ظَلَمُوا أَنفُسَهُمْ ذَكَرُوا اللَّهَ فَاسْتَغْفَرُوا لِذُنُوبِهِمْ వల్లజీన ఇజా ఫఅలూ ఫాహిషతన్ అవ్ జలమూ అన్ఫుసహుమ్ జకరుల్లా ఫస్తగ్ఫరూ లి జునూబిహిమ్. మరియు వారు ఏదేని నీచ కార్యానికి పాల్పడినపుడు గానీ, తమ ఆత్మలకు అన్యాయం చేసుకున్నపుడు గానీ వెంటనే అల్లాహ్‌ను స్మరించి తమ పాపాల క్షమాపణ కొరకు వేడుకుంటారు. (3:135).
వారి నుండి ఏదైనా పొరపాటు జరిగింది, అశ్లీల కార్యం జరిగింది, ఏదైనా వారు తమపై అన్యాయం చేసుకున్నారు అంటే వెంటనే అల్లాహ్‌ను గుర్తు చేసుకొని అల్లాహ్‌తో క్షమాపణ కోరుకుంటారు. ఈ ఉత్తమ గుణం రావాలి.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎలాంటి పాపం చేయని వారు. అయినా ఒక్కొక్క సమావేశంలో వంద వంద సార్లు ఇస్తిగ్ఫార్ చేసేవారు. అంతే కాదు సహీ ముస్లిం, సహీ బుఖారీ లోని హదీసు, యాఅయ్యుహన్నాస్, ఓ ప్రజలారా తూబూ ఇలల్లాహి వస్తగ్ఫిరూ. అల్లాహ్ వైపునకు మరలండి, పాపాల నుండి క్షమాపణ కోరుకోండి. నేను అల్లాహ్‌తో 70 సార్ల కంటే ఎక్కువగా, (మరో ఉల్లేఖనంలో) 100 సార్ల కంటే ఎక్కువగా క్షమాపణ కోరుకుంటూ ఉంటాను. ప్రవక్తకు అవసరమే లేదు కదా? ఎందుకంటే ఆయన పాప రహితుడు, రసూలుల్లాహ్. అయినా గాని అంత క్షమాపణ కోరుతున్నారంటే మనకు ఈ అవసరం ఎంతగా ఉందో ఒకసారి ఆలోచించండి. అందుకొరకే అల్లాహ్ త’ఆలా పుణ్యాత్ముల యొక్క గుణం సూర నిసాలో ఏం తెలిపాడు? వారి నుండి ఏదైనా పొరపాటు జరిగింది అంటే వెంటనే క్షమాపణ కోరుకుంటారు. ఇన్నమత్తవ్బతు అలల్లాహి లిల్లజీన య’మలూ నస్సూఅ బిజహాలతిన్. ఏదో పొరపాటున, అశ్రద్ధగా, తెలియనందువల్ల. బిజహాలతిన్, పొరపాటు జరిగింది. వెంటనే ఫస్తగ్ఫరూ, వెంటనే వారు అల్లాహ్‌తో క్షమాపణ కోరుకుంటారు. అందుకు ఇక ఎవరైతే పొరపాట్లపై పొరపాట్లు, పాపాలపై పాపాలు చేసుకుంటూ పోతారో, అలాంటి వారిని నేను క్షమించను వ లైసతిత్తవ్బతు అని అల్లాహ్ త’ఆలా హెచ్చరిస్తున్నాడు.
అందుకొరకే షుక్ర్‌తో జీవితం గడపండి. ఆపద వస్తే సహనం వహించండి. మరియు ఎక్కడ ఏ పొరపాటు జరిగినా, ఎప్పుడు జరిగినా గాని, ఎంత పెద్దది జరిగినా గాని వెంటనే అల్లాహ్ వైపునకు మరలి క్షమాపణ కోరుతూ ఉండండి.
ఆ తర్వాత ఏమంటున్నారు ఇమామ్ ముహమ్మద్ ఇబ్ను అబ్దుల్ వహ్హాబ్ రహిమహుల్లాహ్?
ఫఇన్న హా ఉలాఇస్సలాస ఉన్వానుస్సఆదహ్ వాస్తవానికి నిశ్చయంగా ఈ మూడు గుణాల్లోనే సౌభాగ్యం, అదృష్టం ఉన్నది.
ఈ మూడు మనిషి యొక్క సౌభాగ్యానికి, అదృష్టానికి గొప్ప చిహ్నం, గొప్ప గుర్తు. అల్లాహు అక్బర్. అందుకొరకు మనం కూడా భాగ్యవంతుల్లో చేరాలి, మనం కూడా అదృష్టవంతుల్లో చేరాలి అంటే తప్పకుండా ఏం చేయాలి? షుక్ర్, సబ్ర్ మరియు ఇస్తిగ్ఫార్.
అయితే సోదర మహాశయులారా, ఇన్షాఅల్లాహ్ ఈ పాఠాలు ఇంకా ముందుకి మనం వింటూ ఉంటాము. మరియు ఇలాంటి పుస్తకాలు తప్పకుండా మీరు చదువుతూ ఉండండి. అల్లాహ్ యొక్క దయ గలిగితే ఈరోజే లేకుంటే రేపటి వరకు దీని యొక్క PDF కూడా మీకు పంపించడం జరుగుతుంది. అంతే కాదు అల్లాహ్ యొక్క దయ గలిగితే ఒక షార్ట్ వీడియో, మూలం, మతన్ అని ఏదైతే అంటారో ఇమామ్ ముహమ్మద్ ఇబ్ను అబ్దుల్ వహ్హాబ్ రహిమహుల్లాహ్ వారిది, అది కూడా మీకు పంపించే ప్రయత్నం ఇన్షాఅల్లాహ్ చేస్తాను. అయితే ఈనాటి పాఠంలోని మతన్, మూలం ఏమిటి?
وَأَنْ يَجْعَلَكَ مُبَارَكًا أَيْنَ مَا كُنْتَ (వ అన్ యజ్అలక ముబారకన్ అయ్న మా కున్త్) నీవు ఎక్కడ ఉన్నా నిన్ను శుభవంతుడిగా చేయుగాక.
وَأَنْ يَجْعَلَكَ مِمَّنْ إِذَا أُعْطِيَ شَكَرَ، وَإِذَا ابْتُلِيَ صَبَرَ، وَإِذَا أَذْنَبَ اسْتَغْفَرَ (వ అన్ యజ్అలక మిమ్మన్ ఇజా ఉ’తియ షకర్, వ ఇజబ్తులియ సబర్, వ ఇజా అజ్నబ ఇస్తగ్ఫర్, ఫఇన్న హా ఉలాఇస్సలాస ఉన్వానుస్సఆదహ్) ఇంకా ఏదైనా ప్రసాదించబడినప్పుడు కృతజ్ఞత చెల్లించే, పరీక్షకు గురైనప్పుడు సహనం వహించే, పాపం పొరపాటు జరిగినప్పుడు క్షమాపణ కోరుకునే వారిలో నిన్ను చేర్చుగాక. వాస్తవానికి నిశ్చయంగా ఈ మూడు గుణాల్లోనే సౌభాగ్యం, అదృష్టం ఉన్నది.
అర్థమైంది కదా? అల్లాహ్‌తో నేను అర్ధిస్తున్నాను. ఆ అల్లాహ్ యే పరమదాత మరియు మహోన్నత సింహాసనానికి ప్రభువు. ఏమని అర్ధిస్తున్నారు? నిన్ను ఇహపరలోకాల్లో వలీగా చేసుకొనుగాక. నీవు ఎక్కడా ఉన్నా నిన్ను శుభవంతుడిగా చేసుకొనుగాక. ఇంకా ఏదైనా నీతో, ఇంకా ఏదైనా ప్రసాదించబడినప్పుడు కృతజ్ఞత చెల్లించే, పరీక్షకు గురైనప్పుడు సహనం వహించే, పాపం జరిగినప్పుడు క్షమాపణ కోరుకునే వారిలో నిన్ను చేర్చుగాక. వాస్తవానికి నిశ్చయంగా ఈ మూడు గుణాల్లోనే సౌభాగ్యం, అదృష్టం ఉన్నది.
ఇక ఈ దుఆల యొక్క వివరణ నేను మీకు ఇచ్చాను ఈనాటి క్లాస్‌లో. ఇక రేపటి క్లాస్‌లో హనీఫియత్, మిల్లతి ఇబ్రాహీమీ అంటే ఏమిటి అది తెలుసుకుందాము. ఆ తర్వాత అల్లాహ్ యొక్క దయతో ఆ నియమాలు ఏమిటో అవి కూడా ఇన్షాఅల్లాహ్ ఇంకా ముందు క్లాసులో తెలుసుకుంటూ ఉందాము.
జజాకుముల్లాహు ఖైరా, వాఖిరు ద’వానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
You must be logged in to post a comment.