దుఆ ఇలా చేయండి – తప్పక ఫలిస్తుంది [పుస్తకం]

దుఆ ఇలా చేయండి - తప్పక ఫలిస్తుంది [పుస్తకం]
దుఆ ఇలా చేయండి – తప్పక ఫలిస్తుంది [పుస్తకం]

సులువైన, సంక్షిప్తమైన, సమగ్రమైన – దుఆ చేసే విధానం
దుఆ ఇలా చేయండి తప్పక ఫలిస్తుంది
[డౌన్లోడ్ బుక్] [PDF] [16 పేజీలు ]

దుఆ(ప్రార్థన) చేయవలసింది ఒకే ఒక్క అల్లాహ్ కు మాత్రమే. ఎందుకంటే, ప్రతిరోజూ మనం నమాజులో-

“ఓ అల్లాహ్ ! మేము నిన్ను మాత్రమే ఆరాధిస్తున్నాము. సహాయం కొరకు నిన్ను మాత్రమే వేడుకుంటాము” అని వాగ్దానం చేస్తున్నాం.(ఫాతిహా సూరా : 5)

కనుక వాగ్దానం ప్రకారం మనం అల్లాహ్ కు మాత్రమే దుఆ చేసుకోవాలి. ప్రార్థన (దుఆ) విషయంలో ఇతర మధ్యవర్తులను (అనగా ఉదాహరణకు పుణ్యాత్ములను, వలీలను) ఆశ్రయించటాన్ని కూడా అల్లాహ్ అస్సలు ఇష్టపడడు. తన తరఫున ప్రపంచ ప్రజలకు ఈ సందేశం అందజేయమని అల్లాహ్ తన ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)కు దివ్యఖుర్ఆన్లో ఈ విధంగాచెప్పాడు:

“(ఓ ప్రవక్తా!) నా దాసులు నా గురించి నిన్ను అడిగితే, నేను (వారికి) అత్యంత సమీపంలోనే ఉన్నాననీ, పిలిచేవాడు నన్ను ఎప్పుడు పిలిచినా నేను అతని పిలుపును ఆలకించి ఆమోదిస్తానని (నువ్వు వారికి చెప్పు). కాబట్టి వారు కూడా నా ఆదేశాన్ని శిరసావహించాలి, నన్ను విశ్వసించాలి (ఈ విషయం నీవువారికి తెలియజేయి). తద్వారానే వారు సన్మార్గభాగ్యం పొందగల్గుతారు.” (ఖుర్ఆన్ 2: 186)

మరోచోట ఆయన స్వయంగా ఇలా ప్రకటిస్తున్నాడు:

“మీరు నన్నే ప్రార్థించండి. నేను మీ ప్రార్థనలను ఆమోదిస్తాను. నా ఆరాధన (ఇబాదత్) పట్ల గర్వాహంకారాలు ప్రదర్శించేవారు త్వరలోనే అవమానితులైనరకంలో ప్రవేశించటం ఖాయం.” (ఖుర్ఆన్ 40: 60)

మానవులందరూ-వారు మంచివారైనా, పాపాత్ములైనా అందరూ నేరుగా అల్లాహ్ ప్రార్థిస్తూఉండాలి. ‘మేము పాపాత్ములము, అల్లాహ్ మా ప్రార్థనలను ఆమోదిస్తాడా?’ అని సందేహంలో ఉండిపోరాదు. ఎందుకంటే, పాపాత్ముల ప్రార్థనలను అల్లాహ్ ఆమోదించడన్న మాట ఎంత అవాస్తవమో పుణ్యాత్ముల ప్రతి వేడుకోలునూ అల్లాహ్ అంగీకరిస్తాడు అన్న భావన కూడా అంతే అసత్యం. నూహ్, ఇబ్రాహీమ్, ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) అంతటి గొప్ప దైవప్రవక్తలు చేసిన కొన్ని ప్రత్యేక ప్రార్థనలను కూడా అల్లాహ్ ఆమోదించలేదు. మరోవైపు బనీ ఇస్రాయీల్కాలంలో 100 హత్యలు చేసిన ఒక పాపాత్ముడు పశ్చాత్తాపం చెందగా అల్లాహ్ అతని పశ్చాత్తాపాన్ని ఆమోదించాడు. పశ్చాత్తాపం కూడా ఒక రకమైన ప్రార్థనే కదా! దీని ద్వారా తెలిసింది ఏమిటంటే, ప్రతిఒక్కరూ తప్పకుండా నేరుగా అల్లాహ్ ను ప్రార్థిస్తూఉండాలి. దాసులు కనబరిచే పశ్చాత్తాపాన్ని బట్టి అల్లాహ్ వారి ప్రార్థనలను అంగీకరిస్తాడు లేక తోసిపుచ్చుతాడు. అంతేగాని ప్రార్థించేవాడు పుణ్యాత్ముడా? పాపాత్ముడా? అని చూడడు. అనంత కరుణామయుడైన అల్లాహ్ ఆకాశాల నుంచి ఏమని ప్రకటిస్తున్నాడోచూడండి:

“ఓ నా దాసులారా! మీరు అల్లాహ్ కారుణ్యంపట్ల నిరాశ చెందకండి. నిశ్చయంగా అల్లాహ్ పాపాలన్నింటినీ క్షమిస్తాడు. నిజంగా ఆయన అమితంగాక్షమించేవాడు. అపారంగా కరుణించేవాడు.” (ఖుర్ఆన్ 39 : 53)

మీ దుఆలు స్వీకరించ బడటం లేదని నిరాశ చెందకండి. ఎందుకంటే, మీ దుఆలు క్రింది మూడు రూపాల్లోని బహుశా ఏదో ఒక రూపంలో స్వీకరించబడి ఉండవచ్చు.

(1) ప్రార్థన చేసిన వెంటనే (అంటే ఒక నెలలోనో, ఒక సంవత్సరంలోనో, సమీప కాలంలోనో, సుదీర్ఘకాలంలోనో ఎప్పుడైనా) అది తప్పక నెరవేరవచ్చు.

(2) లేక అల్లాహ్ ఆ ప్రార్థనను మీ పరలోక నిధిగా భద్రంగా దాచి ఉంచవచ్చు.

(3) లేక ఆ ప్రార్థన మూలంగా భవిష్యత్తులో మీపై రాబోయే ఆపదను తొలగించాలని నిర్ణయం చేసి ఉండవచ్చు.

ఏ ముస్లిం అయినా పాపం, బంధువులు విడిపోవటం లాంటి దురుద్దేశాలేవీ లేకుండా ప్రార్ధన చేస్తే అల్లాహ్ అతని కోసం పై మూడు వాటిల్లో ఏదో ఒకటి తప్పకుండా చేస్తాడని దైవప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రబోధించారు. (అహ్మద్)

(1) చిత్తశుద్ధి: ఒక్క అల్లాహ్ నే ప్రార్థించాలి. ఖుర్ఆన్ ఇలా అనబడింది: మీరు మీధర్మాన్ని (ఆరాధనను) అల్లాహ్ కొరకు ప్రత్యేకించుకొని ఆయన్ని వేడుకోండి.(ఖుర్ఆన్ 40: 65)

(2) ఏకాగ్రత: పూర్తి ఏకాగ్రతతో, మనసుని అల్లాహ్ మీద లగ్నం చేసుకొని ప్రార్థించాలి. “పరధ్యానంలో ఉంటూ చేసేవారి ప్రార్థనలను అల్లాహ్ ఆమోదించడు.”(బుఖారీ గ్రంథం)

(3) వినమ్రత, అణకువ: అల్లాహ్ సన్నిధిలో ప్రార్థించేటప్పుడు వినయ వినమ్రతలు, అణకువ భావాలు ఉట్టిపడాలి. దివ్యఖుర్ఆన్ ప్రబోధనం:“మీ ప్రభువును వేడుకోండి, విలపిస్తూనూ, గోప్యంగానూ.” (ఖుర్ఆన్ 7: 55)

ఖుర్ఆన్లో ఇలా చెప్పబడింది:

“పశ్చాత్తాపం చెంది, విశ్వసించి, సత్కార్యాలు చేసి, ఆపై సన్మార్గంపై స్థిరంగా ఉన్నవారిని నేను అమితంగా క్షమిస్తాను”.(ఖుర్ఆన్ 20: 82)

అంటే,

(1) మనిషి గతంలో తనవల్ల జరిగిన పాపాలపై మనస్ఫూర్తిగా పశ్చాత్తాపం చెందాలి. క్షమాభిక్షకై వేడుకోవాలి.
(2) అల్లాహ్ ను, ఆయన ప్రవక్తను, దైవగ్రంథాలను, పరలోక దినాన్ని హృదయ పూర్వకంగా విశ్వసించాలి.
(3) ఖుర్ఆన్ మరియు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)విధానానికి అనుగుణంగా ఆచరణలను సంస్కరించుకోవాలి.
(4) సత్కార్యాల మార్గంలో స్థయిర్యాన్ని,నిలకడను ప్రదర్శించాలి. అప్పుడే అతని ప్రార్థనస్వీకరించబడటానికి అవకాశం వుంటుంది.

(1) దుఆ చేసే వ్యక్తి వుజూ చేసుకొని ఉండటం ఉత్తమం. దుఆ చేసే చోటు కూడా పరిశుభ్రంగాఉంటే మంచిది.

(2) చేతులెత్తకుండా నయినా దుఆ చేయవచ్చు (ముస్లిం). కాని చేతులెత్తి దుఆ చెయ్యడం సున్నత్ (బుఖారి గ్రంథం).

(3) ఒకవేళ చేతులు ఎత్తి దుఆ చేస్తున్నట్లైతే భుజాలవరకు పైకెత్తి దుఆ చేయాలి. (తిర్మిజీ గ్రంథం)

(4) దుఆ చేసేటప్పుడు అరచేతులు ముఖం వైపుఉండాలి.(అబూదావూద్)

[1] ముందుగా అల్లాహ్ ను స్తుతించండి. తరువాత దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)పై దరూద్ పఠించండి. (తిర్మిజీ)

[2] అంతకు ముందు మీ వల్ల జరిగిన పాపాలను ప్రార్థనలో ఓసారి గుర్తుకు తెచ్చుకోండి. పశ్చాత్తాపపడండి. మీ వల్ల పాపం జరిగిందని అల్లాహ్ సన్నిధిలో సిగ్గుపడుతూ వినమ్రంగా ఒప్పుకోండి (హాకిమ్ గ్రంథం) (అయితే క్రైస్తవుల్లో మాదిరిగా మత గురువుల ముందు మీ పాపాలను బయటపెట్టుకొని అవమానం పాలుకావలసిన అవసరం లేదు.)

[3] పూర్తి నమ్మకంతో ప్రార్థించండి. (బుఖారి గ్రంథం)

[4] పరిపూర్ణ ఏకాగ్రతతో (అల్లాహ్ యందే మనసును లగ్నం చేసుకొని) ప్రార్థించండి. (తిర్మిజీ)

[5] అల్లాహ్ నుంచి మీరు కోరుకుంటున్న విషయంమీకు చాలా ముఖ్యమైనదయితే ప్రార్థనా వచనాలను మూడేసి సార్లు పలకండి. (ముస్లిం)

[6] ముందు మీ కోసం ప్రార్ధించుకోండి. తర్వాతమీ తల్లిదండ్రుల కోసం, సోదరీ సోదరుల కోసం,ముస్లిం సమాజం కోసం ప్రార్థించండి. (ముస్లిం)

[7] ప్రార్థనను మీ వరకే పరిమితం చేయకుండాపరులకోసం కూడా ప్రార్థించండి.(బుఖారి)

[8] సమగ్రమైన, మంచి భావం కలిగిన ప్రార్థనలుచేయండి. (అబూదావూద్ గ్రంథం) (అంటే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా నిరూపితమైన వేడుకోలు వచనాల ద్వారా ప్రార్థించటం ఎంతోఉత్తమం.)

[9] మీకు కావలసింది చాలా చిన్న వస్తువు కదా!అని అనుకోకండి. (ఎంత చిన్న అవసరమైనా అంతిమంగా దాన్ని తీర్చేవాడు అల్లాహ్ యే కనుక) ప్రతి అవసరం కోసం ఆయన్నే వేడుకోండి.(తిర్మిజీ)

[10] ప్రార్థన చివర్లో ‘ఆమీన్’ పలకటం మర్చిపోకండి.(ముస్లిం)

[11] చివర్లో కూడా మరో మారు దరూద్ పఠించండి.ఆ తర్వాత అల్లాహ్ ను మళ్ళీ స్తుతిస్తూ ప్రార్థన(దుఆ) ముగించండి. (ముస్లిం)

వీలైతే అల్లాహ్ యొక్క గొప్ప నామం (ఇస్మె ఆజం) కలిగిన ప్రార్థనా వచనాలు పలుకుతూ ప్రార్థన మొదలుపెట్టండి. ‘ఇస్మె ఆజం’ కలిగివుండే ప్రార్థనా వచనాలు ఉదాహరణకు కొన్ని ఇక్కడ ఇవ్వబడుతున్నాయి.

“అల్లాహుమ్మ! ఇన్నీ అలుక బిఅన్నక అంతల్లాహు, లా ఇలాహ ఇల్లా అంతల్ అహదుస్సమదుల్లజీ లమ్ యలిద్, వలమ్ యూలద్, వలమ్ యకుల్లహూ కుఫువన్ అహద్.”

(ఓ అల్లాహ్! అల్లాహ్ వు నీవే. కనుకనే నేను నిన్ను అర్థిస్తున్నాను. నీవు తప్ప మరో అరాధ్యుడు లేనేలేడు. అవసరాలు, అక్కరలు లాంటి లోపాలు లేనివాడవు నీవు. నీకు సంతానం లేదు. నీవు కూడా ఎవరి సంతానమూ కావు. నీకు సరి సమానులు ఎవరూ లేరు అటువంటి మహోన్నత అస్తిత్వం నీది.)-(ఇబ్నెమాజా – సహీహ్)

“లా ఇలాహ ఇల్లా అంత సుబహానక ఇన్నీ కుంతు మినజ్జాలిమీన్”(అహ్మద్, తిర్మిజీ – సహీహ్)

”యా జల్(zal) జలాలి వల్ ఇక్రామ్! యా హయ్యు! యా ఖయ్యూమ్!” (తిర్మిజీ)

అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మద్ వ అలా ఆలిముహమ్మద్ కమా సల్లైత అలా ఇబ్రాహీమ వ అలాఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుమ్ మజీద్ అల్లాహుమ్మబారిక్ అలా ముహమ్మద్ వ అలా ఆలి ముహమ్మద్ కమా బారక్త అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుమ్ మజీద్

ఉదాహరణకు ఒక ప్రార్థన:

అల్లాహుమ్మ ఇన్నక అ’ఫువ్వున్ తుహిబ్బుల్ అ’ఫ్వ’ఫా’ఫు (fafu) అన్నీ
(అల్లాహ్ ! నువ్వు క్షమించేవాడవు. క్షమను ఇష్టపడతావు. నన్ను క్షమించు.)

“రబ్బనా ఆతినా ‘ఫిద్దున్యా హసనతన్ వ’ఫిల్ ఆఖిరతి హసనతన్ వఖినా అజాబన్నార్.”
ప్రభూ! మాకు ఇహలోకంలోనూ, పరలోకంలోనూ మంచిని ప్రసాదించు. ఇంకా మమ్మల్ని అగ్నిశిక్ష నుండి రక్షించు.(ఖుర్ఆన్ 2 : 201)

‘రబ్బిరమ్ హుమా కమా రబ్బయానీ స’గీరా’
ఓ అల్లాహ్! వారిద్దరూ (నా తల్లిదండ్రులు) నన్నుఏ విధంగా ప్రేమగా పెంచారో అదే విధంగా నువ్వుకూడా వారిపై దయజూపు.

‘రబ్బి జిద్నీ ఇల్మ (ఖుర్ఆన్ 17:24)
ప్రభూ! నాకు మరింత జ్ఞానాన్ని ప్రసాదించు.(ఖుర్ఆన్ 20:114)

‘రబ్బనా హబ్ లనా మిన్ అజ్వాజినా వ జుర్రియ్యాతినా ఖుర్రత ఆయునిన్ వజ్ అల్నా లిల్ ముత్తఖీన ఇమామా’

ఓ మా ప్రభూ! నీవు మా భాగస్వాముల (నా భర్త లేక నా భార్య) ద్వారా, మా సంతానం ద్వారా మా కళ్లకు చల్లదనాన్ని ప్రసాదించు. మమ్మల్ని దైవభక్తిపరుల (ముత్తఖీన్) నాయకునిగా చేయి.(ఖుర్ఆన్ 25:74)

“అల్లాహుమ్మ ఇన్నీ అలుకల్ హుదా వత్తుఖా వల్ అ’ఫా’ఫ వల్ ‘గినా”
అల్లాహ్! నాకు సన్మార్గాన్నీ, దైవభీతినీ, శీలాన్నీ,నిరపేక్షా భావాన్నీ ప్రసాదించమని వేడుకుంటున్నాను.(ముస్లిం)

“అల్లాహుమ్మ ఇన్నీ అవూజుబిక మినల్ అర్బయి మిన్ యిల్మిన్ లా యన్ఫా, వ మిన్ ఖల్బిన్ ల యఖ్షా, వ మిన్ నఫ్సిన్ లా తష్బా, వమిన్ దుఆయిన్ లా యుస్మా.”

అల్లాహ్ ! నేను నాలుగు విషయాల నుండి నీ శరణు వేడుతున్నాను. (1) నిష్ప్రయోజనకరమైన విద్యనుండి (అంటే ఆచరణలేని విద్య) (2) దైవ భీతి లేని హృదయం నుండి (3) ఆత్రం తీరని మనస్సు నుండి (4) అంగీకరించబడని ప్రార్ధన నుండి (అహ్మద్)

“అల్లాహుమ్మ ఇన్నీ అవూజు బిక మినల్ హమ్మి వల్ హుజిని వల్ అజిజి వల్ కస్ లి వల్ బుఖ్ లి వల్ జుబ్ ని వ జలయిద్దయిని వ ‘గలబతిర్రిజాలి.”

అల్లాహ్! నేను దిగులు, దుఃఖం, బలహీనత, సోమరితనం, పిరికితనం, పిసినారితనం, రుణ భారం, ఇంకా ప్రజలు నాపై ఆధిక్యతను సంపాదించటం నుండి నీ శరణు వేడుతున్నాను. (నసాయి గ్రంథం)

ఇంకా మీకు ఏం ఏం కావాలో అన్నీ మీరు మాట్లాడే భాషలోనే ప్రార్ధించుకోండి. మీ ఇష్టం. కాని జాగ్రత్త! మీరు చనిపోవాలనిగాని లేక పరులకు హాని జరగాలని గాని శాపనార్ధాలు పెట్టకండి. అలా చేయటం పాపం.

ప్రార్థన చివర్లో ‘ఆమీన్’ అని పలకండి.

దరూద్ 11వ పేజీలో వుంది.

ఇలాగా: సుబహానల్లాహ్ వల్హమ్దులిల్లాహ్ వ లా ఇలాహ ఇల్లల్లాహ్ వల్లాహు అక్బర్ వలా హౌల వలాఖువ్వత ఇల్లా బిల్లాహ్.

దాసుల ప్రార్థనలను అల్లాహ్ ఎల్లవేళలా స్వీకరిస్తూనే ఉంటాడు. అయితే కొన్ని ప్రత్యేక ఘడియల్లో ఆ ప్రార్థనలు మరింత త్వరగా స్వీకరించ బడటానికి అవకాశం ఉంటుంది.

[1] అజాన్, ఇఖామత్ ల మధ్య సమయంలో (తిర్మిజీ)

[2] అల్లాహ్ సన్నిధిలో మోకరిల్లి (సజ్దాలో) ఉన్న స్థితిలో (ముస్లిం)

[3] ఫర్జ్ నమాజ్ తర్వాత ప్రార్థన స్వీకరించబడుతుంది.(తిర్మిజీ గ్రంథం)

[4] ఉపన్యాసకుడు (ఖతీబ్) వేదిక పైకెక్కి కూర్చున్నప్పటి నుండి (జుమా) నమాజ్ ముగిసే వరకు మధ్యలోని ఘడియలో దుఆ స్వీకరించబడుతుంది.(ముస్లిం గ్రంథం) అంటే రెండు ఖుత్బాల మధ్యన.

[5] జుమా రోజు ప్రార్థన స్వీకరించబడే ఘడియ ఒకటి ఉంది. ఆ సమయంలో చేయబడే ప్రార్థనస్వీకరించబడుతుంది.(బుఖారి గ్రంథం)

[6] ఉపవాస విరమణ (ఇఫ్తార్) సమయంలో (ముస్లిం)

[7] రమదాన్ నెలలోని ఘనమైన రేయి (లైలతుల్ ఖద్ర్)లో చేసే ప్రార్థన (తిర్మిజీ గ్రంథం)

[8] రాత్రి ఆఖరి జాము (తహజ్జుద్ సమయం)లో ప్రార్థన స్వీకరించ బడుతుంది. ఆ సమయంలో అల్లాహ్ కారుణ్యం మానవుల ప్రార్థనల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. (బుఖారి గ్రంథం)

[9] వర్షం కురిసేటప్పుడు.(హాకిమ్ గ్రంథం)

మీ దుఆల్లో మమ్మల్ని గుర్తుంచుకుంటారని ఆశిస్తూ…

ఏడు మానవీయ, నైతిక నియమాలు బోధించబడ్డ గొప్ప హదీసు – కలామే హిక్మత్

హజ్రత్ అబూహురైర (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు – మహాప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచించారు :

“ఎవరయితే విశ్వాసి యొక్క ఐహిక బాధల్లో ఏ బాధనయినా దూరం చేస్తాడో, అల్లాహ్ ప్రళయదినం నాడు అతని బాధల్లో నుండి ఏ బాధనయినా దూరం చేస్తాడు.”

”ఎవరయితే లేమికి గురైన వారి పట్ల సరళంగా వ్యవహరిస్తాడో అల్లాహ్ అతని ఇహపరాలను సులభతరం చేస్తాడు.”

“ఎవరయితే ఒక ముస్లింలోని లోపాన్ని కప్పిపుచ్చుతాడో అల్లాహ్ అతని లోపాన్ని ఇహపర లోకాలలో దాచివేస్తాడు.”

”దాసుడు సాటి సోదరునికి సహాయంగా ఉన్నంతవరకూ అల్లాహ్ అతనికి సహాయంగా ఉంటాడు.”

“ఎవరయినా జ్ఞానాన్వేషణలో ఏ బాటపైనయినా బయలుదేరితే అల్లాహ్ అతని కోసం స్వర్గపు బాటను సుగమం చేస్తాడు.”

”ఎప్పుడయినా కొంతమంది అల్లాహ్ యొక్క ఏ గృహంలోనయినా అల్లాహ్ గ్రంథ పారాయణానికి సమావేశమైతే వారిపై ప్రశాంతత అవతరిస్తుంది. ఇంకా వారిపై కారుణ్యం అలుముకుంటుంది. దైవదూతలు వారిని ఆవరిస్తారు. అల్లాహ్ వారిని (ఆ దాసులను) తన దగ్గరి దూతల ముందు స్మరిస్తాడు.”

“ఎవరి ఆచరణైతే అతన్ని వెనుక ఉంచేస్తుందో అతని పారంపర్యం అతన్ని ముందుకు పోనివ్వదు.” (ముస్లిం)

(1) ఈ గొప్ప హదీసులో ఏడు మానవీయ, నైతిక నియమాలు బోధించబడ్డాయి. మొదట, ”విశ్వాసి పడే బాధల్లో దేన్నయినా దూరం చేస్తే….” అని చెప్పబడింది.

దీని భావం ఏమిటి? ఏ విశ్వాసినైనా అవసరానికి ఆదుకోవడం, ఏ విధంగానైనా అతనికి లాభం చేకూర్చడం, ఏ ఆపదనుండైనా అతనికి విముక్తిని కలిగించటం; ఈ పనిని మనిషి తన ధనం ద్వారానో, తన శ్రమ ద్వారానో, తన పలుకుబడి ద్వారానో, తన జ్ఞానం ద్వారానో చేయవచ్చు. ఇటువంటి పరోపకారిని అల్లాహ్ మెచ్చుకుంటాడు. తీర్పు దినంనాడు అతని యాతనను తగ్గిస్తాడు. అయితే మనిషి తాను ఏ పరోపకారం చేసినా అల్లాహ్ ప్రసన్నతను చూరగొనడమే అతని ప్రధాన ఉద్దేశ్యమై ఉండాలి.

(2) “కష్టాల్లో ఉన్నవాని పట్ల సరళంగా వ్యవహరించటం” అంటే భావం, రుణగ్రస్తుడికి రుణం తీర్చేందుకు మరింత గడువు నివ్వటం లేదా అతని రుణాన్ని పాక్షికంగానో, పూర్తిగానో మాఫీ చేయటం. అలా చేసిన వానికి ప్రపంచంలోనూ, పరలోకంలోనూ అల్లాహ్ మార్గాలు సుగమం చేస్తాడు. చేతిలో పైసలు లేని రుణగ్రస్తుడిని మన్నించివేయటం లేక గడువు నొసగటం అల్లాహ్ ఇచ్చే ప్రతిఫలానికి మంచి సాధనంగా ఉపయోగపడుతుంది, అయితే రుణగ్రస్తుడు రుణాన్ని తీర్చే తాహతును కలిగి వుండి కూడా ఉద్దేశ్యపూర్వకంగా దాటవేస్తూ ఉంటే మాత్రం అతన్ని క్షమించి వదలి వేయటం పుణ్యంగా పరిణమించదు.

(3) ఇక మూడవది, లోపాలను దాచిపెట్టడం గురించి – లోపం లేదా లొసుగు శారీరకమైనదీ కావచ్చు. మానసికమైనదీ కావచ్చు, నైతిక సంబంధమైనదీ కావచ్చు. ఏ ముస్లింలోని శారీరక వైకల్యాన్నయినా అకారణంగా బహిర్గతం చేయటం అతనికి బాధ కలిగిస్తుంది. అతను మనస్తాపానికి గురవుతాడు. ఇక నైతిక సంబంధమైన లోపాలంటే వాటి గురించి ఎంతో వివరణ ఉంది. ఏ ముస్లిములోనైనా నైతికంగా ఏదైనా బలహీనత వుంటే, దానికతను మాటిమాటికీ ఒడిగట్టకుండా ఉంటే అట్టి పరిస్థితిలో అతని బలహీనత గురించి ప్రజల ముందుగాని, పాలకుల ముందుగాని చెప్పుకోరాదని ఉలమాల (విద్వాంసుల) అభిప్రాయం. ఎందుకంటే అలా చెప్పటం వల్ల ఆ వ్యక్తి అవమానానికి గురవుతాడు. పరాభవం పాలవుతాడు. భవిష్యత్తులో ఆ లోపాన్ని సరిదిద్దుకుంటాడన్న నమ్మకం కూడా లేదు. అయితే ఎవరయినా అపరాధానికి, చెడు పనికి మాటిమాటికీ పాల్పడుతుంటే అతనికి నచ్చజెప్పాలి. నచ్చజెప్పినప్పటికీ అతనిలో దిద్దుబాటు కనబడకపోతే అప్పుడు అతని వ్యవహారాన్ని బాధ్యతాయుతులైన వారికి అప్పగించాలి. దానికిగాను అతనికి దండన లభించటం, అతనిలోని దుర్గుణాలను ప్రజలకు ఎరుకపరచటమే దీని ముఖ్యోద్దేశ్యం. అలా చేయటం వలన పరిసరాలలోని వారు అతని పట్ల అప్రమత్తంగా ఉంటారు. ఒకవేళ అతనిలోని లోపాలను ఉద్దేశ్య పూర్వకంగా ఉపేక్షించి వదలివేస్తే పరోక్షంగా చెడుపనుల్లో అతన్ని ప్రోత్సహించినట్లే అవుతుంది. ఇది ఎంతమాత్రం సమంజసం కాదు. దుర్మార్గుడి దుర్గుణాలను బాహాటం చేయటం చాడీగా పరిగణించబడదు. పైగా దాన్ని బహిర్గతం చేయడం అవసరం. ఈ నేపథ్యంలో దైవప్రవక్త ఏమని ప్రబోధించారంటే, ”మీలో ఎవరయినా, ఎప్పుడయినా ఏదయినా చెడును చూస్తే దాన్ని మీ చేత్తో సంస్కరించండి, ఇది సాధ్యపడకపోతే మీ నోటిద్వారా ఆ పని చెయ్యండి. అదీ వీలుపడకపోతే మీ మనసులోనయినా దాన్ని చెడుగా భావించండి. ఇది మీ విశ్వాసానికి ఆఖరి మెట్టు.”

ఇక తరచూ చెడుకు పాల్పడని మొదటి వ్యక్తిలోని లోపాన్ని బహిర్గతం చేయకుండా ఉండటం ఎంత అవసరమో అతనిలోని లోపాన్ని అతనికి తెలిసి వచ్చేలా నచ్చజెప్పటం కూడా అంతే అవసరం. తద్వారా అతను మున్ముందు ఆ విషయంలో జాగ్రత్తగా ఉండే అవకాశం ఉంది. “

(4) “దాసుడు తన సోదరుని సహాయంలో ఉన్నంత వరకు …. ప్రతి ముస్లింకు మరో ముస్లిం నుండి సహాయం కోరే హక్కు ఉంది. ధార్మిక వ్యవహారాలలోనూ, ప్రపంచంలోని మరే సమంజసమయిన సహాయం పొందే విషయంలోనూ వీలయినంత వరకు అల్లాహ్ దీని గురించి ఆదేశించాడు –

وَتَعَاوَنُوا عَلَى الْبِرِّ وَالتَّقْوَىٰ ۖ وَلَا تَعَاوَنُوا عَلَى الْإِثْمِ وَالْعُدْوَانِ ۚ وَاتَّقُوا اللَّهَ ۖ إِنَّ اللَّهَ شَدِيدُ الْعِقَابِ

”సత్కార్యాల్లో, భయభక్తుల విషయాల్లో ఒండొకరికి సహాయపడండి. చెడులు మరియు అన్యాయం విషయంలో మటుకు పరస్పరం సహకరించుకోబాకండి, అల్లాహ్ కు భయపడుతూ ఉండండి. నిశ్చయంగా అల్లాహ్ కఠినంగా శిక్షించేవాడు.” (అల్ మాయిదా 5:2)

(5) “అల్లాహ్ అతని కోసం స్వర్గపు బాటను సుగమం చేస్తాడు.” – స్వర్గానికి దారి అంత సులభమైనది కాదు. అది కష్టాలు, అవరోధాలతో నిండి ఉంది. మనిషి స్వతహాగా సులభమైన దాన్నే కోరుకుంటాడు. అందుకేనేమో స్వర్గానికి గొనిపోయే మార్గంలో చాలా కొద్దిమంది నడుస్తుంటారు. అయితే సత్య ప్రధానమైన జ్ఞానాన్వేషణలో బయలుదేరిన వ్యక్తికై అల్లాహ్ స్వర్గపు బాటను సులభతరం. చేసివేస్తాడని తెలుస్తోంది. ఎందుకంటే జ్ఞానాన్వేషణకై బయలుదేరిన వ్యక్తి లక్ష్యమే స్వర్గానికి చేరుకోవటంగా ఉంటుంది. అతను ఆ లక్ష్య సాధనలో ఎదురయ్యే కష్టాలను కష్టంగా తలపోయడు. సంతోషంగా వాటిని సహిస్తాడు. మరోవైపు అల్లాహ్ తన అపార కృపతో, అతను కష్టాల బారిన పడకుండా కాపాడుతూ ఉంటాడు. ప్రభువు అభీష్టమేదో దాసులకు తెలియపరచటం, ఆయన ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని వారికి వివరించటం నిజమయిన జ్ఞానం. అటువంటి జ్ఞానుల గురించి అల్లాహ్ తన గ్రంథంలో ఇలా ప్రస్తావించాడు:

 قُلْ هَلْ يَسْتَوِي الَّذِينَ يَعْلَمُونَ وَالَّذِينَ لَا يَعْلَمُونَ ۗ إِنَّمَا يَتَذَكَّرُ أُولُو الْأَلْبَابِ

“వారితో అనండి, తెలిసినవారు, తెలియనివారు ఇద్దరూ సమానులు అవగలరా? హితబోధను బుద్ధిమంతులే స్వీకరిస్తారు.” (అజ్జుమర్ 39 : 9)

(ధర్మ) విద్యలోని సుగుణం ఏమంటే అది తన విద్యార్థి విశ్వాసాన్ని, భావనలను సంస్కరిస్తుంది. నైతికతను పెంపొందిస్తుంది. అతని జీవితాన్ని తీర్చిదిద్దుతుంది. అతనిలో సంస్కారాన్ని అలవరుస్తుంది. అతను పరలోక సాఫల్యమే తన లక్ష్యంగా ఎంచుకుంటాడు. దానికోసం ఏ త్యాగమయినా అతనికి తేలికగానే కనిపిస్తుంది.

(6) “వారిపై ప్రశాంతత అవతరిస్తుంది. ఇంకా వారిపై కారుణ్యం అలుము కుంటుంది….. “

ఇక్కడ ప్రశాంతత అంటే భావం హృదయాలు నెమ్మదిస్తాయనీ, మనస్థయిర్యం ప్రాప్తమవుతుందనీ, మస్జిద్ అల్లాహ్ గృహం. అందులో ఖుర్ఆన్ను అర్థం చేసుకోవడానికి సమకూడటం పుణ్యప్రదమయిన పని అని ఈ హదీసు ద్వారా సుబోధకమవుతోంది. అరబీ లిపి నెరిగిన ప్రతి వ్యక్తి ఖుర్ఆన్ను చూచి చదవగలడు. అయితే దివ్య ఖుర్ఆన్ను మృదుమధురంగా పఠించే పఠిత ఉంటే అతని ద్వారా ఖుర్ఆన్, వినాలి. దాన్ని అర్థం చేసుకునే, దానిపై యోచించే కృషి చేయటం శుభప్రదం. ఖుర్ఆన్ అవగాహనకై మస్జిద్ లో సమావేశమవటం సున్నత్ కూడా. “

(7) ”అతని పరంపర అతన్ని ముందుకు పోనివ్వదు..” – ఇది అత్యంత ముఖ్యమయిన విషయం. సంతానంపై, వంశ పారంపర్యంపై చెందే గర్వాన్ని, అహంకారాన్ని ఈ వాక్యం అంతం చేస్తుంది. ప్రతి వ్యక్తి ఆచరణ అతని స్వయానికే ఉపకరిస్తుంది. తండ్రి చేసుకున్న సదాచరణ అల్లాహ్ సమక్షంలో కేవలం తండ్రి స్థాయినే పెంచుతుంది. కొడుకుకు మాత్రం దానివల్ల ఒరిగేదేమీ ఉండదు. ప్రపంచంలో మాదిరిగా పరలోకంలో వ్యక్తికి ఆస్తిపాస్తులు, అంతస్తుల ద్వారా గౌరవం లభించదు. అక్కడ ప్రతి వ్యక్తికి ఆదరణ లభించినా, పరాభవం చేకూరినా అది అతని కర్మల్ని బట్టి ఉంటుంది. ప్రతి వ్యక్తి తాను చేసుకున్న కర్మలకు తనే బాధ్యుడు. అల్లాహ్ తన పవిత్ర గ్రంథంలో సెలవిచ్చాడు –

وَأَن لَّيْسَ لِلْإِنسَانِ إِلَّا مَا سَعَىٰ وَأَنَّ سَعْيَهُ سَوْفَ يُرَىٰ ثُمَّ يُجْزَاهُ الْجَزَاءَ الْأَوْفَىٰ

“మానవుడు దేనికోసం ప్రయత్నిస్తాడో అదే అతనికి ప్రాప్తమవుతుంది. ఇంకా అతని ప్రయత్నం త్వరలోనే తెలిసిపోతుంది. మరి అతనికి పూర్తి ప్రతిఫలం ఇవ్వబడుతుంది.” (అన్నజమ్ 53: 39 – 41)

తేలిందేమంటే సదాచరణ చేయని వ్యక్తి అల్లాహ్ సమక్షంలో తన తాత ముత్తాతల పుణ్యకార్యాలను ఉదాహరించి తప్పుకోలేడు. తాత తండ్రుల మంచి పనుల మూలంగా అతనికి ఉన్నత స్థానం లభించబోదు.

[డౌన్లోడ్ PDF]

పుస్తకం నుండి :కలామే హిక్మత్ – 1 (వివేక వచనం)
రచన:సఫీ అహ్మద్ మదనీ
అనువాదం: ముహమ్మద్ అజీజుర్ రహ్మాన్
ప్రకాశకులు:జమీ అతే అహ్ లె హదీస్,ఆంధ్రప్రదేశ్

జుమా రోజు ప్రత్యేకతలు మరియు గొప్పతనం – షేఖ్ మాజిద్ బిన్ సులైమాన్ [ఖుత్బహ్]

అంశము: జుమా రోజు ప్రత్యేకతలు మరియు గొప్పతనం

إنَّ الْحَمْدَ لِلهِ نَحْمَدُهُ وَنَسْتَعِينُهُ وَنَسْتَغْفِرُهُ، وَنَعُوذُ بِاللهِ مِنْ شُرُورِ أَنْفُسِنَا وَمِنْ سَيِّئَاتِ أَعْمَالِنَا، مَنْ يَهْدِهِ اللهُ فَلاَ مُضِلَّ لَهُ، وَمَنْ يُضْلِلْ فَلاَ هَادِىَ لَهُ، وَأَشْهَدُ أَنْ لاَ إِلَهَ إِلاَّ اللهُ وَحْدَهُ لاَ شَرِيكَ لَهُ، وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُه

మొదటి ఖుత్బా :-

స్తోత్రాలు మరియు దరూద్ తరువాత :

ఓ ముస్లింలారా! అల్లాహ్ యొక్క దైవభీతిని కలిగి ఉండండి ఎల్లవేళలా ఆయన భయాన్ని కలిగి ఉండండి మరియు తెలుసుకోండి అల్లాహ్ ఈ సృష్టి ప్రదాత ఆయన ఎవరికి కోరుతాడో ఉన్నత స్థానాలను ప్రసాదిస్తాడు వారు మనుషులైనా లేక ప్రదేశమైన లేక ఏదైనా సందర్భం అయినా లేక ఏదైనా ఆరాధన అయిన అది ఆయన వివేకంపై ఆధారపడి ఉంది. అల్లాహ్ ఈ విధంగా అంటున్నారు:

وَرَبُّكَ يَخْلُقُ مَا يَشَاءُ وَيَخْتَارُ 
(నీ ప్రభువు తాను కోరిన దాన్ని సృష్టిస్తాడు, తాను కోరిన వారిని ఎంపిక చేసుకుంటాడు.) ( అల్ ఖసస్ 28:68)

అల్లాహ్ ప్రజలలో నుండి ప్రవక్తలను ఎన్నుకున్నాడు. మరియు ఆ ప్రవక్తలలో ఐదుగురు ఉన్నతమైనటువంటి వారు ఇబ్రహీం, నూహ్, మూసా, ఈసా, ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం). మరియు ఈ ఐదుగురిలో కూడా ఇద్దరినీ తన స్నేహితులుగా చేసుకున్నాడు. వారు ఇబ్రహీం మరియు ముహమ్మద్. మరియు ఆ ఇద్దరిలో నుండి కూడా అల్లాహ్ మహా ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారిని ఎన్నుకున్నాడు కనుక ఈయన ప్రవక్తల అందరిలో గొప్పవాడు.

అదేవిధంగా ప్రదేశాలలో ఘనత కలిగినటువంటిది మక్కా. అల్లాహ్ సమస్త భూమండలం నుండి మక్కాను పవిత్ర స్థలంగా ఎన్నుకున్నాడు. దాని తర్వాత మదీనా. ఈ రెండు మసీదులలో చదువుబడే నమాజుకు ఎన్నో రేట్ల పుణ్యఫలం లభిస్తుంది.

అదేవిధంగా సమయాలలో అల్లాహ్ జుమా రోజుని ఎన్నుకున్నాడు. ఈ జుమా రోజులన్నింటికీ సర్దార్. అల్లాహ్ ఈ జుమాకు ఎన్నో ప్రాధాన్యతలను ప్రసాదించాడు. కొన్ని కారణాల రీత్యా ఇతర దినాల కంటే జుమాకు ఎక్కువ ప్రాధాన్యత వొసగబడింది, వాటిలో కొన్ని మీకు తెలియజేయడం జరుగుతుంది.

1. ఆ రోజున పెద్ద పెద్ద సంఘటనలు సంభవించాయి. ఔస్ బిన్ ఔస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు; “మీ రోజులలో అతి ఉన్నతమైనటువంటి రోజు జుమా రోజు, ఆరోజున ఆదం అలైహి స్సలాం పుట్టించబడ్డారు మరియు అదే రోజున ఆయన మరణించారు మరియు అదే రోజున శంఖం పూరించడం జరుగుతుంది. మరియు అదే రోజున మైకం సంభవిస్తుంది”.(అబూ దావూద్)

అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)వారు ఇలా ప్రవచించారు: “సూర్యుడు ఉదయించే దినాల్లో అన్నిటికంటే శ్రేష్టమైనది జుమా రోజు, ఆ రోజున ఆదం అలైహి స్సలాం పుట్టించబడ్డారు మరియు అదే రోజున స్వర్గంలోనికి ప్రవేశించబడ్డారు మరియు అదే రోజున అక్కడి నుండి తొలగించబడ్డారు మరియు ప్రళయం కూడా జుమా రోజునే సంభవిస్తుంది”.(ముస్లిం)

2. జుమా యొక్క ప్రత్యేకత ఏమిటంటే; ఇది ప్రజలందరిని సమావేశపరిచే రోజు. అల్లాహ్ తఆల ప్రతి ఉమ్మత్ కొరకు వారంలో ఒక రోజుని ఆరాధన కొరకు నియమించాడు. ప్రజలు ఆరోజున ఆరాధన కొరకు తమను సిద్ధం చేసుకునేవారు. మరియు సృష్టి ప్రారంభం మరియు ముగింపు శిక్ష లేక ప్రతిఫలం గురించి తెలుసుకునేందుకు సమావేశం ఏర్పాటు చేసుకునేవారు. అయితే  ఇలా అతిపెద్ద సమావేశం అల్లాహ్ ముందు హాజరు అవుతుంది, కాబట్టి వారి యొక్క లక్ష్యాలను, ఉద్దేశాలను పూర్తి చేసుకోవడానికి అత్యంత అనుకూలమైన రోజు శుక్రవారం.

కావున అల్లాహ్ ఈ ఉమ్మత్ యొక్క గొప్పదనం దృష్ట్యా  ఆరాధన మరియు విధేయత కొరకు మరియు మానవ జీవిత లక్ష్యాన్ని తెలుసుకోవడం కొరకు ఈ ప్రపంచక జీవితం యొక్క వాస్తవికతను తెలుసుకొనుట కొరకు మరియు ఈ ఆకాశం మరియు భూమి ఒక రోజు అంతమైపోతుందన్నటువంటి విషయాన్ని గ్రహించడం కొరకు మరియు ప్రతి వస్తువు తిరిగి ఆ సృష్టికర్త వైపు మరలి వెళ్ళవలసింది అన్న విషయాన్ని తెలుసుకోవడం కొరకు అల్లాహ్ జుమా రోజును చట్టబద్ధం చేశాడు.

మరియు అదే విధంగా మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారు కూడా ఈ జుమా రోజున ఫజర్ నమాజులో (అలీఫ్ లామ్ మీమ్ సజ్దహ్) మరియు (సూరయే ఇన్సాన్) పారాయణం చేసేవారు ఎందుకంటే ఈ రెండు సూరాలలో సృష్టి ప్రారంభం మరియు అంతం గురించి, ప్రళయ దినం రోజున సమావేశం అవడం గురించి, సమాధుల నుండి లేవడం గురించి, స్వర్గ నరకాల గురించి ప్రస్తావించబడింది.

3. జుమా యొక్క ప్రత్యేకత ఏమిటంటే; ఈ జుమా వారంలో ఒకసారి వచ్చేటువంటి పండుగ. హదీసులో ఈ విధంగా ఉంది. ఇబ్నే అబ్బాస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు ఇలా తెలియచేశారు: “నిశ్చయంగా ఇది ఒక పండుగ. అల్లాహ్ విశ్వాసుల కొరకు శుక్రవారం పండుగ దినంగా చేశాడు. కావున ఎవరైతే ఈ జుమాకు రావాలనుకుంటారో వారు తప్పక గుసుల్ చేసి మరియు సుగంధ పరిమళాలను పూసుకొని రావాలి. మరియు ఇలా అన్నారు మీరు మిస్వాక్ ను తప్పని సరి చేసుకోండి”. (ఇబ్నె మాజా)

4. జుమా యొక్క మరొక ప్రత్యేకత ఏమిటంటే; అల్లాహ్ అందరికంటే ఉత్తమ సమాజానికి ఈ జుమా యొక్క ఘనతను ప్రసాదించాడు. ఇది మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి ఉమ్మత్. వేరే ఇతర ఉమ్మతులకు దీనిని ప్రసాదించలేదు. అబూ హురైరా మరియు హుజైఫా వారి ఉల్లేఖనాల ప్రకారం ప్రవక్త వారు ఇలా తెలియచేశారు: “మనకంటే ముందు గతించిన వారిని అల్లాహ్ ఈ శుక్రవారం నాడు నుంచి తప్పించాడు, యూదుల కొరకు శనివారాన్ని మరియు క్రైస్తవుల కొరకు ఆదివారాన్ని ఇచ్చాడు మరియు అల్లాహ్ మన కొరకు ఈ ఘనత కలిగిన శుక్రవారాన్ని ప్రసాదించాడు”. (ముస్లిం)

5. జుమా యొక్క మరో ప్రత్యేకత ఏమిటంటే; ఆ రోజున ఫజర్ నమాజ్ జమాతుతో ఆచరించడం అన్ని నమాజుల కంటే ఉత్తమమైనది. ఇబ్నే ఉమర్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త గారు ఇలా ప్రవచించారు: “అల్లాహ్ వద్ద నమాజులన్నింటిలో కెల్లా ఘనత కలిగినటువంటిది జుమా రోజున ఫజర్ నమాజ్ జమాతుతో ఆచరించడం”. (సహీహుల్ జామె)

6. జుమా యొక్క మరో ప్రత్యేకత; జుమా రోజున ఫజర్ నమాజులో మొదటి రకాతులు (సూర సజ్దా) మరియు రెండవ రకాతులు (సూర ఇన్సాన్) పారాయణం చేయడం. అబూ హురైరా కథనం ప్రకారం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు జుమా రోజున ఫజర్ నమాజులో మొదటి రకాతులో “అలీఫ్ లామ్ మీమ్ తన్జీల్” మరియు రెండవ రకాతులు సుర ఇన్సాన్ పారాయణం చేసేవారు (బుఖారి, ముస్లిం)

షేఖుల్ ఇస్లాం ఇమామ్ ఇబ్నె తైమియా (రహిమహుల్లాహ్) ఈ విధంగా తెలియజేశారు; ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు జుమా యొక్క ఫజర్ నమాజులో ఈ రెండు సూరాల పారాయణం ఎందుకు చేసేవారు అంటే ఆ రోజున ఏదైతే జరిగిందో మరియు జరగబోతుందో దాని సమాచారం అందులో  ఉంది వాటిలో ఆదం అలైహిస్సలాం పుట్టుక పుట్టుక గురించి అంతిమ దినం గురించి మరణాంతర దినం గురించి ఇవన్నీ శుక్రవారం రోజునే సంభవించాయి మరియు సంభవిస్తాయి. కాబట్టి ఈ రెండు సూరాల ద్వారా ఉమ్మత్ వీటిని గుర్తు చేయడం జరుగుతుంది.

7. జుమా యొక్క మరో ప్రత్యేకత ఏమిటంటే ఆ రోజున ప్రత్యేకంగా సూరె కహఫ్ పారాయణం జరుగుతుంది. అబూ సయీద్ ఖుద్రి (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలియచేసారు: “ఏ వ్యక్తి అయితే జుమా రోజున సుర కహఫ్ పారాయణం చేస్తాడు అతని కొరకు రెండు జుమాల మధ్య (నూర్) ప్రసాదించబడుతుంది” (హాకిం)

8. జుమా యొక్క మరొక ప్రత్యేకత ఏమిటంటే; జుమా రోజున ఒక ప్రత్యేకమైన ఘడియ ఉంది, అందులో ఎవరైనా అల్లాహ్ తో దువా వేడుకుంటే అల్లాహ్ దాన్ని తప్పక స్వీకరిస్తాడు. హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) గారు చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఒకసారి జుమా గురించి చెబుతూ ఇలా అన్నారు: “ఆ రోజులో ఒక ఘడియ ఉంది. ఏ ముస్లిం దాసుడయినా ఆ ఘడియను పొంది, ఆ సమయంలో అతను నిలబడి నమాజు చేస్తూ అల్లాహ్ ను ఏదయినా అడిగితే అల్లాహ్హ్ తప్పకుండా ఇస్తాడు.” ఆ సమయం చాలా తక్కువగా ఉంటుందని ఆయన తన చేత్తో సంజ్ఞ చేసి చూపించారు”.(బుఖారి ముస్లిం)

9. జుమా యొక్క మరో ప్రత్యేకత ఏమిటంటే; ఎవరైనా జుమా రోజున రాత్రి లేక పగలు మరణిస్తారో అల్లాహ్ తఆల వారిని సమాధి విపత్తు నుండి రక్షిస్తాడు. అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారు ఇలా తెలియజేశారు: “ముస్లింలలో నుండి ఎవరైనా జుమా రోజు రాత్రి లేక పగలు మరణిస్తే అల్లాహ్ వారిని సమాధి విపత్తు నుంచి రక్షిస్తాడు”. (తిర్మిజి)

10. జుమా యొక్క మరొక ప్రత్యేకత ఏమిటంటే అందులో జుమా నమాజు జరుగుతుంది. అది అత్యంత ఘనత కలిగినటువంటి నమాజు అల్లాహ్ తఆల ఖురాన్ లో ప్రత్యేకంగా ఈ నమాజ్ కు పిలవడం గురించి ప్రస్తావన చేశాడు అల్లాహ్ ఇలా అంటున్నాడు:

(ఓ విశ్వాసులారా! శుక్రవారం నాడు నమాజు కొరకు అజాన్ (పిలుపు) ఇవ్వబడినప్పుడు, మీరు అల్లాహ్ ధ్యానం వైపు పరుగెత్తండి. క్రయవిక్రయాలను వదలి పెట్టండి. మీరు గనక తెలుసుకోగలిగితే ఇది మీ కొరకు ఎంతో మేలైనది.) (అల్ జుమా:9)

11. జుమా యొక్క మరొక ప్రత్యేకత ఏమిటంటే; ఆ రోజున చేయబడేటువంటి దానధర్మాల యొక్క పుణ్యఫలం రెట్టింపు చేయబడుతుంది అబ్దుల్ రజాక్ తమ పుస్తకం ముసన్నఫ్ లో కఆబ్ (రదియల్లాహు అన్హు) గారి ద్వారా ఉల్లేఖించారు ఆయన ఇలా అంటున్నారు, జుమా రోజున చేసేటువంటి దానధర్మాలు వేరే దినాలలో చేసేటువంటి దానధర్మాల కంటే ఉత్తమం

ఇబ్నె ఖయ్యిం (రహిమహుల్లాహ్) తెలియపరుస్తున్నారు; “జుమా రోజున చేసేటువంటి దానధర్మాలు వేరే ఇతర దినాలలో చేసేటువంటి దానధర్మాల కంటే ఎంతో ఉన్నతమైనవి, ఎందుకంటే వారంలోని దినాలన్నింటిలో కెల్లా జుమా రోజు దానం చేయడం యొక్క ఉపమానం వేరే ఇతర నెలల్లో దానధర్మాలు చేయడం కన్నా రంజాన్ మాసంలో దానధర్మాలు చేయడం లాంటిది

నేను షేఖుల్ ఇస్లాం ఇమామ్ ఇబ్నె తైమియా (రహిమహుల్లాహ్) ను గమనించాను, ఆయన జుమా రోజున నమాజ్ కొరకు ఇంటి వద్ద నుండి బయలుదేరేటప్పుడు ఇంట్లో ఉన్నటువంటి రొట్టెలను తీసుకొని వెళ్లేవారు మరియు దారి మధ్యలో వాటిని గుప్త దానం చేసేవారు.

12. జుమా రోజు యొక్క మరొక ప్రత్యేకత ఏమిటంటే; ఆ రోజున ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారిపై అతి ఎక్కువగా దరూద్ పంపడం అభిలాషనీయం. ఎందుకంటే ఆ రోజున పంపబడేటువంటి దరూద్ యొక్క ఘనత మరే ఇతర ఆచరణకు లేదు. అది ఎందుకంటే ఈ ఉమ్మత్ సమాజానికి ఇహపరలోకాలలో ఏవైతే మేళ్ళు మరియు లాభాలు చేకూరాయో, అవి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి ద్వారానే లభించాయి, కనుక ఆయనకు కృతజ్ఞత తెలుపుతూ ఆయన హక్కును నెరవేర్చాలి మరియు జుమా యొక్క రాత్రిలో మరియు పగటిపూట అతిగా దరూద్ పటిస్తూ ఉండాలి, మరియు అందులో ఉన్నటువంటి అర్ధాన్ని భావాన్ని తెలుసుకోవాలి.

ఇవి జుమా కు సంభందించినటువంటి కొన్ని ప్రత్యేకతలు. వీటి ద్వారానే జుమా కు అల్లాహ్ వద్ద మరియు విశ్వాసుల వద్ద గొప్ప ప్రాధాన్యతను సంతరించుకుంది.

అల్లాహ్ ఖురాన్ యొక్క శుభాలను మనజీవితాలలో వర్షింప చేయుగాక ,ఆయన వివేకం తో కూడిన సూచనల ద్వారా హితబోధ పొందే భాగ్యం ప్రసాదించుగాక ,అల్లాహ్ మనందరినీ క్షమించుగాక, మీరు కూడా అల్లాహ్ ను క్షమాపణ వేడుకోండి నిశ్చయంగా ఆయన (తౌబా)  పశ్చాత్తాపం చెందే వారిని తప్పక  మన్నిస్తాడు.  

రెండవ ఖుత్బా

స్తోత్రం మరియు దరూద్ తరువాత

ఈ విషయాన్ని కూడా తెలుసుకోండి, అల్లాహ్ మీ పై కరుణించుగాక! అల్లాహ్ మీకు ఒక పెద్ద ఆచరణకై  అజ్ఞాపించి ఉన్నాడని మీరు గుర్తుపెట్టుకోండి మరియు దైవదూతలకు కూడా ఇదే ఆజ్ఞాపించాడు అల్లాహ్ ఇలా అన్నాడు:

إِنَّ اللَّهَ وَمَلَائِكَتَهُ يُصَلُّونَ عَلَى النَّبِيِّ ۚ يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا صَلُّوا عَلَيْهِ وَسَلِّمُوا تَسْلِيمًا
(నిశ్చయంగా అల్లాహ్, ఆయన దూతలు కూడా దైవప్రవక్తపై కారుణ్యాన్ని పంపిస్తున్నారు. ఓ విశ్వాసులారా! మీరు కూడా అతనిపై దరూద్‌ పంపండి. అత్యధికంగా అతనికి ‘సలాములు’ పంపుతూ ఉండండి.) (అల్ అహ్ జాబ్ 33:56)

ఓ అల్లాహ్ నీ దాసుడు మరియు నీ ప్రవక్త అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లమ్ పై నీ కారుణ్యాన్ని అవతరింపచేయి. ఆయన ఖలీఫాలు,తాబయీనులను పూర్తి చిత్తశుద్ది తో అనుసరించే వారిని ఇష్టపడు మరియు ప్రేమించు. ఓ అల్లాహ్! ఇస్లాం ముస్లింలకు గౌరవ మర్యాదలు ప్రసాదించు. షిర్క్ ,ముష్రిక్ లను అవమానబరుచు. నీవు నీ ధర్మం అయిన ఇస్లాంకు శత్రువులు ఎవరైతే ఉన్నారో వారిని సర్వ నాశనం చేయి మరియు ఏకేశ్వరోపాశకులకు నీ సహాయాన్ని అందించు.

سُبۡحَٰنَ رَبِّكَ رَبِّ ٱلۡعِزَّةِ عَمَّا يَصِفُونَ وَسَلَٰمٌ عَلَى ٱلۡمُرۡسَلِينَ وَٱلۡحَمۡدُ لِلَّهِ رَبِّ ٱلۡعَٰلَمِين

రచన : మాజిద్ బిన్ సూలైమాన్ అర్రస్సీ
జుబైల్ పట్టణం, సౌదీ ఆరేబియ
అనువాదం: అబ్దుల్లాహ్ జామయి

పుస్తకం నుండి – ఇస్లామీయ జుమా ప్రసంగాలు – షేఖ్ మాజిద్ బిన్ సులైమాన్

ఖుర్ఆన్ తఫ్సీర్ (వ్యాఖ్యానం) తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఏమిటి? [వీడియో & టెక్స్ట్]

ఖుర్ఆన్ తఫ్సీర్ (వ్యాఖ్యానం) తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఏమిటి!? [వీడియో]
https://youtu.be/0XIBN4UbyVc [40 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, తఫ్సీరే ఖుర్ఆన్ (ఖుర్ఆన్ యొక్క వ్యాఖ్యానం) తెలుసుకోవలసిన ఆవశ్యకతపై దృష్టి సారించబడింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అల్లాహ్ ఖుర్ఆన్‌ను అవతరింపజేసి, దాని వివరణ బాధ్యతను కూడా తానే తీసుకున్నాడు. ఖుర్ఆన్‌ను కేవలం అనువదించి చదవడం సరిపోదు, ఎందుకంటే దాని యొక్క లోతైన భావాన్ని మరియు ఆదేశాలను అర్థం చేసుకోవడానికి తఫ్సీర్ అవసరం. సహాబాలు (ప్రవక్త అనుచరులు) అరబీ భాషలో ప్రావీణ్యం ఉన్నప్పటికీ, వారు కూడా కొన్ని ఆయతుల యొక్క వివరణ కోసం ప్రవక్తపై ఆధారపడేవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఖుర్ఆన్ ఆయతులను హదీసుల ద్వారా వివరించారు. ఉదాహరణకు, ఉపవాసానికి సంబంధించిన ఆయత్‌లోని “తెల్లని దారం, నల్లని దారం” అనే పదాన్ని మరియు విశ్వాసాన్ని పాడుచేసే “జుల్మ్” (అన్యాయం) అనే పదాన్ని ప్రవక్త ఎలా వివరించారో ఈ ప్రసంగంలో స్పష్టంగా చెప్పబడింది. సరైన మార్గదర్శకత్వం కోసం ఖుర్ఆన్, సహీ హదీసులు, మరియు సహాబాల అవగాహన ఆధారంగా తఫ్సీర్‌ను నేర్చుకోవాలని నొక్కి చెప్పబడింది.

అల్ హందులిల్లాహి వహ్దహు వస్సలాతు వస్సలాము అలా మన్ లా నబియ్య బ’అదహు అమ్మా బ’అద్.

ప్రియ విద్యార్థులారా!ఈ రోజు తఫ్సీర్ క్లాస్‌లో మన యొక్క అంశం, తఫ్సీరే ఖుర్ఆన్ తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఏమిటి?

సోదర మహాశయులారా! అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇంతకుముందు కాలాల్లో ఏ ప్రవక్తలైతే వచ్చారో ఆ ప్రవక్తలపై గ్రంథాలు అవతరింపజేసి వాటి యొక్క వివరణ స్వయంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలిపి ప్రజలకు మార్గదర్శకత్వం చేయాలన్నటువంటి బాధ్యత ప్రవక్తలకు అప్పగించాడు. ఆ పరంపరలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని చిట్టచివరి ప్రవక్తగా చేసి పంపాడు.

అయితే, ప్రవక్తలపై అల్లాహ్ అవతరింపజేసిన గ్రంథాల రీతిలో మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై కూడా ఖుర్ఆన్ గ్రంథాన్ని అవతరింపజేసి, ఖుర్ఆన్‌తో పాటు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి హదీసు కూడా ఇచ్చి, ప్రజలకు మార్గదర్శకత్వం చేయాలని చాలా స్పష్టంగా తెలిపాడు.

సూరతుల్ హదీద్, ఆయత్ నంబర్ 25లో,

لَقَدْ أَرْسَلْنَا رُسُلَنَا بِالْبَيِّنَاتِ وَأَنزَلْنَا مَعَهُمُ الْكِتَابَ وَالْمِيزَانَ لِيَقُومَ النَّاسُ بِالْقِسْطِ
(లఖద్ అర్సల్నా రుసులనా బిల్ బయ్యినాతి వ అన్జల్నా మ’అహుముల్ కితాబ వల్ మీజాన లియఖూమన్నాసు బిల్ ఖిస్త్)
వాస్తవానికి మేము మా ప్రవక్తలను స్పష్టమైన నిదర్శనాలతో పంపాము. ప్రజలు న్యాయంపై నిలబడాలని మేము వారితో పాటు గ్రంథాన్ని, త్రాసును అవతరింపజేశాము. (57:25)

అయితే, చిట్టచివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖుర్ఆన్ గ్రంథాన్ని అవతరింపజేశాడు, ఈ విషయం మనందరికీ తెలిసినదే. రమదాన్‌కు సంబంధించిన ఆయత్ ఏదైతే ఉందో, ‘షహ్రు రమదానల్లజీ ఉన్జిల ఫీహిల్ ఖుర్ఆను హుదల్లిన్నాసి వబయ్యినాతిమ్ మినల్ హుదా వల్ ఫుర్ఖాన్’. ఇంకా వేరే అనేక సందర్భాల్లో, సూరె ఆలి ఇమ్రాన్ ప్రారంభంలో అనేక సందర్భాల్లో ఆయతులు ఉన్నాయి. అయితే, ఖుర్ఆన్ గ్రంథాన్ని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సర్వ మానవాళి మార్గదర్శకత్వానికి ఇచ్చి పంపాడు. అయితే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై ఈ దివ్య ఖుర్ఆన్ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అవతరింపజేసి సర్వ మానవాళికి సన్మార్గం చూపాలని, తెలియజేయాలని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆదేశం ఇచ్చాడు. మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రజలకు ఈ ఖుర్ఆన్ బోధ చేస్తూ ఉండేవారు. మరియు ఈ ఖుర్ఆన్‌తో పాటు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి హదీసు కూడా ఇచ్చాడు. ఈ విషయం ఖుర్ఆన్‌లో అనేక సందర్భాల్లో ఉంది. సూరతుల్ బఖరాలో, సూరత్ ఆలి ఇమ్రాన్‌లో, సూరతుల్ జుముఆలో. ప్రత్యేకంగా దీని కొరకు “అల్ హిక్మ” అన్న పదం కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఉపయోగించాడు. మరియు ఇమామ్ ఇబ్ను కసీర్ రహిమహుల్లాహ్ దాని యొక్క వ్యాఖ్యానంలో, వ్యాఖ్యానకర్తల ఏకాభిప్రాయం తెలియజేశారు, అల్ హిక్మ అంటే ఇక్కడ అల్ హదీస్, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీసులు అని.

అయితే ఈ రోజు మన యొక్క ప్రసంగం అంశం, తఫ్సీరే ఖుర్ఆన్ తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఏమిటి? అయితే ఎప్పటివరకైతే మనం ఖుర్ఆన్ దాని యొక్క కేవలం అర్థం చదువుతామో, దాని యొక్క తఫ్సీర్, దాని యొక్క వ్యాఖ్యానం తెలుసుకోమో, చాలా విషయాలు మనకు అస్పష్టంగా ఉంటాయి. ఎందుకు? ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహాబాలకు, వారు అరబీ తెలిసినవారు, అరబీ భాషలో ఎంతో ప్రావీణ్యత, ఎంతో వారికి అనుభవం ఉన్నప్పటికీ, ఎన్నో ఆయతుల భావాన్ని, భావాలను స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విడమరిచి చెప్పాడు, విడమరిచి చెప్పారు.

అయితే, ఖుర్ఆన్ యొక్క తఫ్సీర్, ఇది వ్యాఖ్యానకర్తలు తమ ఇష్టప్రకారంగా చేస్తారు అన్నటువంటి ఒక తప్పుడు ఆలోచన కొందరిలో ఉన్నది. అయితే వాస్తవానికి ఇది తప్పుడు ఆలోచన, ఎందుకంటే మీరు ఖుర్ఆన్‌లో గనుక చూస్తే సూరతుల్ ఖియామాలో ఈ తఫ్సీర్ యొక్క బాధ్యత కూడా అల్లాహ్ యే అన్నట్లుగా స్వయంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా చాలా స్పష్టంగా తెలిపాడు. గమనించండి ఇక్కడ. సూరతుల్ ఖియామా, సూర నంబర్ 75, ఆయత్ నంబర్ 16 నుండి 19 వరకు చూస్తే, ప్రత్యేకంగా 19 లో ఈ విషయం చెప్పడం జరిగింది. అయితే రండి అనువాదం మనం చదువుతున్నాము.

“ఓ ప్రవక్తా! నీవు ఖుర్ఆన్‌ను తొందరగా కంఠస్థం చేసుకోవటానికి నీ నాలుకను వేగంగా కదిలించకు. దాన్ని సమకూర్చే, నీ చేత పారాయణం చేయించే బాధ్యత మాది.” సమకూర్చే అంటే నీ మనస్సులో, నీ హృదయంలో దాన్ని హిఫ్జ్ చేసే, దాన్ని భద్రంగా ఉండే ఉంచే అటువంటిది. “కాబట్టి మేము దానిని పఠించాక నువ్వు దాని పఠనాన్ని అనుసరించు.

ثُمَّ إِنَّ عَلَيْنَا بَيَانَهُ
(సుమ్మ ఇన్న అలైనా బయానహ్)
మరి దానిని విడమరచి చెప్పే బాధ్యత కూడా మా పైనే ఉంది.” (75:19)

దానిని విడమరచి చెప్పే బాధ్యత కూడా మా పైనే ఉన్నది. చూస్తున్నారా? ఖుర్ఆన్ అవతరింపజేసిన వాడు అల్లాహ్, దాని యొక్క వివరణ, ఎక్కడ ఎలాంటి వివరణ అవసరమో అక్కడ అలాంటి వివరణ ఇచ్చేటువంటి బాధ్యత కూడా మాదే అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా చాలా స్పష్టంగా తెలియబరిచాడు.

అయితే ఇక్కడ హజ్రత్ ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు తాలా అన్హు వారి యొక్క మాట మన కొరకు చాలా లాభదాయకంగా ఉంటుంది. ఇంతకుముందు కూడా వేరే కొన్ని క్లాసులలో ఈ విషయం ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు తాలా అన్హు గారి యొక్క ఈ మాట చెప్పడం జరిగింది. అయితే సంక్షిప్తంగా ఇప్పుడు అందులోనే ఒక విషయం చెబుతున్నాను గమనించండి. ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు తాలా అన్హు అంటున్నారు, ఖుర్ఆన్‌లోని ఆయతులు కొన్ని రకాలుగా ఉన్నాయి. అంటే ఏమిటి? కొన్ని ఒక రకమైన ఆయతులు ఎలాంటివి అంటే ప్రతి మనిషి ఎలాంటి వివరణ లేకుండా స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతాడు. ఎలాంటివి అవి? అవి ప్రత్యేకంగా అల్లాహ్ ఏకత్వం గురించి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి రిసాలత్ గురించి, మరియు పరలోకం రానున్నది, మళ్ళీ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తప్పకుండా పుట్టిస్తాడు, సర్వ మానవుల్ని మలిసారి బ్రతికిస్తాడు అన్నటువంటి అంశాలకు సంబంధించిన ఆయతులు ఎంతో స్పష్టంగా ఉన్నాయి. అందులో చాలా లోతైన వివరాలు ఏమీ అవసరం లేకుండానే కేవలం వాటిని తిలావత్ చేస్తూ, కొంతపాటి అరబీ భాష వచ్చినా గాని లేదా అనువాదం చదివినా గాని అర్థమైపోతుంది.

రెండో రకమైన కొన్ని ఆయతులు ఎలా ఉన్నాయి? అందులో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రజలకు అహ్కామ్, వారి జీవిత వ్యవహారాలకు సంబంధించిన ఎన్నో ఆదేశాలు ఇచ్చి ఉన్నాడు. అయితే ఇవి కొందరికి స్పష్టంగా అర్థమౌతే, ధర్మ జ్ఞానంలో ఎవరు ఎంత అధ్యయనం చేసి లోతు జ్ఞానంతో ఉన్నారో వారికి త్వరగా అర్థం కావచ్చు. కానీ సామాన్య ప్రజలకు కొన్ని విషయాలు అర్థం కాకపోవచ్చు. అయితే ఆ సామాన్య ప్రజలు ఏం చేస్తారు? ఆ విషయాలను ఆ ఉలమాలతో నేర్చుకునే ప్రయత్నం చేస్తారు. అలాంటి ఎన్నో ఆదేశాలు వాటి యొక్క వివరణ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా తెలియబరిచాడు. ఈ రెండవ రకానికి సంబంధించిన వాటిలోనే కొన్ని ఉదాహరణలు ఇప్పుడు మనం తెలుసుకుందాము. కానీ ఆ ఉదాహరణలు తెలుసుకునేకి ముందు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఒక నియమం ఏదైతే తెలిపాడో దాన్ని కూడా మీరు ఖుర్ఆన్ యొక్క ఈ ఆయత్ ద్వారా చాలా స్పష్టంగా గమనించండి. చూస్తున్నారా సూరత్ అన్నహల్, ఆయత్ నంబర్ 44.

وَأَنزَلْنَا إِلَيْكَ الذِّكْرَ لِتُبَيِّنَ لِلنَّاسِ مَا نُزِّلَ إِلَيْهِمْ
(వ అన్జల్నా ఇలైకజ్ జిక్ర లితుబయ్యిన లిన్నాసి మా నుజ్జిల ఇలైహిమ్)
“ప్రజల వద్దకు పంపబడిన దానిని నువ్వు వారికి స్పష్టంగా విడమరచి చెప్పేందుకు మేము అవతరింపజేశాము ఈ జ్ఞాపిక ఈ గ్రంథాన్ని.”
(16:44)

ఓ ప్రవక్త నీవు ప్రజలకు విడమరచి చెప్పడానికి. గమనించారా? అల్లాహ్ ఏ తఫ్సీర్ ప్రవక్తకు తెలుపుతాడో ప్రవక్త ఆ విషయాన్ని విడమరచి చెప్పేవారు. ఇదే భావం, ఇదే సూరత్ అన్నహల్ లోని మరోచోట ఆయత్ నంబర్ 64 లో ఉంది.

وَمَا أَنزَلْنَا عَلَيْكَ الْكِتَابَ إِلَّا لِتُبَيِّنَ لَهُمُ الَّذِي اخْتَلَفُوا فِيهِ ۙ وَهُدًى وَرَحْمَةً لِّقَوْمٍ يُؤْمِنُونَ
(వమా అన్జల్నా అలైకల్ కితాబ ఇల్లా లితుబయ్యిన లహుముల్లజీ ఇఖ్తలఫూ ఫీహి వహుదన్ వ రహ్మతన్ లిఖౌమిన్ యు’మినూన్)
వారు విభేదించుకునే ప్రతీ విషయాన్ని నువ్వు వారికి స్పష్టంగా విడమరచి చెప్పాలని మేము ఈ గ్రంథాన్ని నీపై అవతరింపజేశాము. విశ్వసించిన జనులకు ఇది మార్గదర్శకత్వం మరియు కారుణ్యం. (16:64)

చూశారా? అయితే ఈ విధంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖుర్ఆన్ అవతరింపజేయడంతో పాటు దీని యొక్క తఫ్సీర్‌ను కూడా అవతరింపజేశాడు. ప్రవక్తకు ఈ విషయాలు వివరంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా చెప్పేవాడు మరియు ప్రవక్త సహాబాలకు వివరించేవారు.

తఫ్సీర్ ఆవశ్యకతకు ఉదాహరణలు

దీనికి కొన్ని ఉదాహరణలు ధర్మవేత్తలు ఖుర్ఆన్ మరియు హదీసుల ఆధారంగా తెలిపి ఉన్నారు. ఉదాహరణకు, మీరు ఇదే ఖుర్ఆన్‌లో చూడవచ్చును. సూరతుల్ బఖరాలోని ఒక ఆయత్, ఉపవాసాలకు సంబంధించినది. ఆయత్ కొంచెం పెద్దగా ఉన్నది, కానీ ఇందులో ఒక ఆదేశం ఏమున్నది?

وَكُلُوا وَاشْرَبُوا حَتَّىٰ يَتَبَيَّنَ لَكُمُ الْخَيْطُ الْأَبْيَضُ مِنَ الْخَيْطِ الْأَسْوَدِ مِنَ الْفَجْرِ
(వ కులూ వష్రబూ హత్తా యతబయ్యన లకుముల్ ఖైతుల్ అబ్యదు మినల్ ఖైతిల్ అస్వది మినల్ ఫజ్ర్)
అల్లాహ్ ఏమంటున్నాడు ఇందులో?
తొలిజాములోని తెలుపు, నడిరేయి నల్లని చారలో నుంచి ప్రస్ఫుటం అయ్యే వరకు తినండి, త్రాగండి. (2:187)

ఉపవాసం గురించి అల్లాహ్ యొక్క ఆదేశం ఇది. రాత్రివేళ మనం తిన త్రాగవచ్చు, కానీ ఎప్పటివరకు? ఫజ్ర్ సమయం ప్రవేశించే వరకు అని సర్వసామాన్యంగా హదీసుల ఆధారంగా మనం చెబుతాము. కానీ ఖుర్ఆన్‌లో వచ్చినటువంటి విషయం ఏంటి? “హత్తా యతబయ్యన లకుముల్ ఖైతుల్ అబ్యద్”. అల్ ఖైతుల్ అబ్యద్, శాబ్దిక అర్థం ఏంటి ఇది? అల్ ఖైత్ అంటే దారం, అల్ అబ్యద్ అంటే తెల్లది, “మినల్ ఖైతిల్ అస్వద్” నల్లని దారం నుండి. అయితే ఒక సహాబీ ఏం చేశారు? ఈ ఆయత్ పదాలతో స్పష్టమై భావం ఏదైతే ఉందో, దాన్ని చూసి అతను తన మెత్త కింద ఒక నల్ల దారం, మరొక తెల్ల దారం పెట్టుకున్నారు. ఇక కొంత కొంత సేపటికి తీసి చూసేవారు. కానీ రాత్రి పూట, చీకటి పూట తెల్ల దారమా, నల్ల దారమా అది స్పష్టంగా కనబడుతుందా? కనబడదు. తెల్లారిన తర్వాత కనబడుతుంది. కదా? అయితే ఆ విషయం వచ్చి ప్రవక్తకు చెబితే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విడమరచి చెప్పారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విడమరచి చెప్పారు. నీ మెత్త, పిల్లో ఏదైతే నువ్వు పెట్టుకున్నావో, అది చాలా పెద్దగా ఉన్నట్టు ఉన్నది. అయితే, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ ఆయతులో ఏదైతే అల్ ఖైతుల్ అబ్యద్, తెల్లని దారం అని అంటున్నాడో, దాని ఉద్దేశం, నిజంగా ఏమైనా దారాలు తీసుకోండి అని మాత్రం భావం కాదు, భావం అది కాదు. దీని భావం ఏంటి? ఆకాశంలో, ఆకాశంలో ఈ భేదం అనేది కనబడుతుంది. దాన్ని గమనించి, ఇక్కడ అసలు ఉద్దేశం ఫజ్ర్ సమయ ప్రవేశం గురించి చెప్పడం జరిగింది అని సహీ బుఖారీలో కూడా ఈ హదీస్ వచ్చి ఉంది, హదీస్ నంబర్ 1916. ఇక్కడ మీరు చూస్తున్నట్లుగా. ఈ విధంగా సోదర మహాశయులారా, ఈ హదీస్ హజ్రత్ అదీ బిన్ హాతిమ్ రదియల్లాహు తాలా అన్హు ద్వారా ఉల్లేఖించడం జరిగింది.

గమనిస్తున్నారా మీరు? ఈ విధంగా కొన్ని ఆదేశాలు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖుర్ఆన్‌లో ఏదైతే తెలిపాడో, హదీసుల్లో వాటి వివరణ వచ్చి ఉంది. ఇక అందుకొరకే మనం తఫ్సీర్‌ను తెలుసుకోవడం, తఫ్సీర్‌ను నేర్చుకోవడం, ఖుర్ఆన్ యొక్క ఆయత్ కేవలం నాకు అరబీ వస్తుంది లేదా అనువాదం చదువుకొని ఆచరిస్తాను అంటే సరిపోదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ ఖుర్ఆన్ ఆయతుల, ఏ ఆయత్ యొక్క ఏ భావం ఎలా తెలిపారు? సహాబాలు ఎలా అర్థం చేసుకున్నారు? ఆ రీతిలో తెలుసుకోవడం, అర్థం చేసుకోవడం తప్పనిసరి. లేదా అంటే ఖవారిజ్‌ల మాదిరిగా, ఖదరియా ముర్జియాల మాదిరిగా, మోతజిలాల మాదిరిగా తప్పుడు విశ్వాసాల్లో, బిద్అతులలో పడిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు నేను కొన్ని పేర్లు ఏదైతే చెప్పానో, ఖవారిజ్, మోతజిలా, ఖదరియా, ముర్జియా, ఇవి గుమ్రాహ్ ఫిర్ఖాలు. చూడడానికి ముస్లింలే, ఖుర్ఆన్ ద్వారానే మేము ఆధారం తీసుకుంటాము అన్నటువంటి వాదన వాదిస్తారు. కానీ వాస్తవానికి వారు ఖుర్ఆన్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎలా నచ్చజెప్పారో, విడమరిచి చెప్పారో, వివరించి చెప్పారో, ఆ అలా సహాబాలు అర్థం చేసుకున్న రీతిలో వారు ఆచరించరు. అందుకొరకే వారు పెడమార్గాన పడిపోయారు. సన్మార్గం నుండి దూరమైపోయారు. మన పరిస్థితి అలా కాకూడదు. మన పరిస్థితి అలా కాకూడదు.

ఇప్పుడు నేను సూరతుల్ బఖరాలోని ఉపవాసాలకు సంబంధించిన ఒక ఆయత్ మరియు దాని యొక్క వివరణ తఫ్సీర్ సహీ బుఖారీలోని 1916 హదీస్ నంబర్‌తో తెలిపాను. ఇలాంటి ఇంకా ఎన్నో ఆధారాలు ఉన్నాయి. వాటి ద్వారా మనకు తెలుస్తున్నది ఏమిటి? మనం తప్పకుండా తఫ్సీర్ తెలుసుకోవాలి. దీనికి మనకు ఇంకా ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. ఉదాహరణకు, సహీ బుఖారీలోని హదీసే చూడండి. ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హజ్రత్ ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు తాలా అన్హు వారికి ఇచ్చినటువంటి దుఆ. దాని పూర్తి సంఘటన చెప్పలేను. సహీ బుఖారీలో ఇమాం బుఖారీ రహిమతుల్లాహ్ ఈ హదీసును ఎన్నో సందర్భాల్లో తీసుకొచ్చారు. సంక్షిప్త భావం ఏమిటి?

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి పవిత్ర భార్యల్లో ఒకరు హజ్రత్ మైమూనా రదియల్లాహు తాలా అన్హా. హజ్రత్ ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు తాలా అన్హు వారికి ఖాలా అవుతుంది. ఖాలా అంటే తెలుసు కదా, పిన్ని అంటారు, చిన్నమ్మ అంటారు. ఇబ్ను అబ్బాస్ యొక్క తల్లి మరియు మైమూనా రదియల్లాహు తాలా అన్హా ఇద్దరు సొంత అక్కచెల్లెళ్ళు. ఒక రాత్రి ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు తాలా అన్హు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్ద రాత్రి గడుపుతారు. అయితే రాత్రి ఎప్పుడైతే ప్రవక్త వారు మేల్కొంటారో, కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్తారో, ప్రవక్త తిరిగి వచ్చేవరకు ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు తాలా అన్హు ఏం చేస్తారు? ప్రవక్త ఉదూ చేసుకోవడానికి నీళ్లు సిద్ధం చేసి పెడతారు. ఉదూ నీళ్లు. ప్రవక్త వచ్చాక ఈ విషయాన్ని చూసి సంతోషపడి ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు తాలా అన్హు వారి గురించి దుఆ ఇస్తారు. ఏమని దుఆ ఇస్తారు? ఏమని దుఆ ఇస్తారు ఎవరైనా చెప్పగలుగుతారా? ఆ… తొందరగా! మన టాపిక్ ఏం నడుస్తుంది మీకు తెలుసు కదా. అందరి మైక్ ఆఫ్ ఉన్నదా ఏంటి? ఉంది. కానీ ఎవరు చెప్పడానికి ముందుకు రావట్లేదు. లేదా నా వాయిస్ ఎవరి వరకు చేరుతలేదా ఏంటి? ఆ వచ్చింది షేక్. ఖుర్ఆన్ యొక్క జ్ఞానాన్ని అల్లాహ్ మీకు ఇవ్వాలని దుఆ చేస్తారు. ఇంకా ఎవరైనా చెప్పగలుగుతారా? ఎందుకంటే ఇది నేను మొదటిసారిగా చెప్పడం లేదు. మిమ్మల్ని ఇంతకుముందు కూడా కొన్ని సందర్భాల్లో ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు తాలా అన్హు ఈ మాట చెప్పడం జరిగింది.

అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దుఆ చేశారు, ఓ అల్లాహ్, ఇబ్ను అబ్బాస్‌కి నీవు ఖుర్ఆన్ యొక్క విద్య, ఖుర్ఆన్ యొక్క వ్యాఖ్యానం, వివరణ జ్ఞానం ప్రసాదించు అని దుఆ చేశారు. ధర్మ అవగాహన, ఖుర్ఆన్ యొక్క జ్ఞానం, మరియు ఈ ఖుర్ఆన్ యొక్క త’వీల్, వివరణ, దాని యొక్క వ్యాఖ్యానం యొక్క జ్ఞానం ప్రసాదించు.

ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు తాలా అన్హు చిన్న వయసులో ఉన్నప్పటికీ, అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చనిపోయే సమయంలో, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చనిపోయే సమయంలో, ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు తాలా అన్హు 13 ఏళ్ల వయసు కూడా వరకు చేరలేదు. కానీ అల్ హందులిల్లాహ్, అల్లాహ్ యొక్క దయ, కరుణ, అతని యొక్క లెక్కలేనన్ని కరుణా కటాక్షాలు మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క దుఆ బరకత్, అల్లాహ్ కరుణా కటాక్షాలు, ప్రవక్త వారి దుఆ బరకత్ మరియు ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు తాలా అన్హు ఖుర్ఆన్ జ్ఞానం నేర్చుకోవడానికి పెద్ద పెద్ద సహాబాల తలుపుల ముందు కూర్చొని ఎండ తాపాన్ని భరించి, దుమ్ము ధూళిని భరించి, ఏదైతే కష్టపడి నేర్చుకున్నారో, ఆ ప్రకారంగా అల్లాహ్ వారికి ప్రసాదించాడు. మరియు సహాబాలలోనే హబ్రుల్ ఉమ్మ, ఖుర్ఆన్ సహాబాలలో ఖుర్ఆన్ యొక్క పెద్ద జ్ఞాని ఎవరు అంటే, ఒక వైపున అబ్దుల్లా బిన్ అబ్బాస్ రదియల్లాహు తాలా అన్హు పేరు వస్తుంది. మళ్ళీ ఆ తర్వాత హజ్రత్ అబ్దుల్లా బిన్ మస్ఊద్ రదియల్లాహు తాలా అన్హు వారి యొక్క పేరు వస్తుంది.

అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం మన అంశానికి సంబంధించింది, తఫ్సీరే ఖుర్ఆన్ తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఏమిటి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రత్యేకంగా కొందరు సహాబాలకు ఇలాంటి దుఆ ఇచ్చారు. మరియు అబ్దుల్లా బిన్ మస్ఊద్ రదియల్లాహు తాలా అన్హు వారి గురించి, అబ్దుల్లా ఇబ్ను ఉమర్ రదియల్లాహు అన్హు వారి గురించి, ఇంకా వేరే కొందరు సహాబాల గురించి, సూరతుల్ బఖరా దానిని కంఠస్థం చేయడం, దానిలో ఉన్నటువంటి జ్ఞానాన్ని, తఫ్సీర్‌ని నేర్చుకోవడంలో 8 నుండి 10 సంవత్సరాలు పట్టినది మాకు అని అంటున్నారు. సహాబాల విషయం చెబుతున్నానండి. తర్వాత వచ్చిన కాలాల్లోని తాబిఈన్, తబే తాబిఈన్, ఇంకా ఉలమాలు, అయిమ్మాల గురించి కాదు. సహాబాలు. సూరే బఖరా యొక్క వ్యాఖ్యానంలో మనకు ఒకచోట ఇమాం ఖుర్తుబీ రహిమహుల్లాహ్ ప్రస్తావించారు. ఒక హజ్ సందర్భంలో అబ్దుల్లా బిన్ అమర్ ఇబ్నుల్ ఆస్ గురించి ఉంది. మరికొన్ని ఉల్లేఖనాల్లో అబ్దుల్లా బిన్ అబ్బాస్ రదియల్లాహు అన్హు గురించి ఉంది. వారు సూరే బఖరా యొక్క తఫ్సీర్ ఎంతసేపు, ఎంత వివరంగా చెప్పారంటే, ఒకవేళ ఆ సందర్భంలో గనుక ఆ తఫ్సీర్‌ను యూదులు, క్రైస్తవులు విని ఉంటే ముస్లింలు అయిపోయేవారు అని ఉల్లేఖనకారులు అంటున్నారు. అంటే ఏమిటి విషయం? ఖుర్ఆన్‌ను దాని యొక్క తఫ్సీర్‌తో నేర్చుకోవడం, అర్థం చేసుకోవడం, ఇది సహాబాల యొక్క అలవాటు కూడా. అందుకొరకే సోదర మహాశయులారా, సోదరీమణులారా, ఇక రండి, సమయం సమాప్తం కావస్తుంది. ఈ అంశం మీకు మరింత మంచి రీతిలో అర్థం కావడానికి మరొక ఉదాహరణ నేను ఇస్తాను. ఈ ఆయతును మీరు గమనించండి ఖుర్ఆన్‌లో మరియు దీనికి సంబంధించిన సహీ హదీస్ ఏదైతే వచ్చి ఉందో, దాన్ని కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఏంటి ఆయత్ ఇక్కడ? సూరతుల్ అన్ఆమ్. చూస్తున్నారు కదా సూరతుల్ అన్ఆమ్. ఆయత్ నంబర్ 82.

الَّذِينَ آمَنُوا وَلَمْ يَلْبِسُوا إِيمَانَهُم بِظُلْمٍ أُولَٰئِكَ لَهُمُ الْأَمْنُ وَهُم مُّهْتَدُونَ
(అల్లజీన ఆమనూ వలమ్ యల్బిసూ ఈమానహుమ్ బి జుల్మిన్ ఉలాఇక లహుముల్ అమ్ను వహుమ్ ముహ్తదూన్)
ఎవరైతే విశ్వసించారో, తమ విశ్వాసాన్ని జుల్ముతో కలగాపులగం చేయకుండా ఉన్నారో, ఇక్కడ అరబీలో చూస్తున్నారు మీరు. “వలమ్ యల్బిసూ” కలగాపులగం చేయలేదు, కలుషితం కానివ్వలేదు. “ఈమానహుమ్” తమ విశ్వాసాన్ని, తమ యొక్క ఈమాన్‌ని దేనితో కలుషితం కానివ్వలేదు? “బి జుల్మిన్” జుల్ముతో. ఎవరైతే తమ విశ్వాసాన్ని జుల్ముతో కలుషితం కాకుండా కాపాడుకున్నారో, అలాంటి వారే “లహుముల్ అమ్న్” సురక్షితంగా ఉన్నవారు. వారికొరకే శాంతి, వారికొరకే పీస్ ఫుల్ లైఫ్. “వహుమ్ ముహ్తదూన్” మరియు వారే సన్మార్గంపై ఉన్నవారు కూడా.

ఇక ఈ ఆయత్ అవతరించిన వెంటనే సహాబాలు భయపడిపోయారు. సూరతుల్ అన్ఆమ్ ఆయత్ నంబర్ 82 గుర్తు ఉంది కదా. సహాబాలు భయపడిపోయారు. ఎందుకని? మాలో ప్రతి ఒక్క వ్యక్తి ఏదో ఒక చిన్న రీతిలో చిన్నపాటి జుల్మ్ జరుగుతూనే ఉంటుంది. ఇక మా విశ్వాసం బాగులేదా? మేము సన్మార్గంపై లేమా? మాకు నరకం నుండి సురక్షితం అనేది లభించదా? అన్నటువంటి భయం వారికి కలిగింది. అందుకొరకే సహీ బుఖారీలో ఉంది. హదీస్ నంబర్ 32. చూస్తున్నారు కదా ఇక్కడ మీరు? అబ్దుల్లా బిన్ మస్ఊద్ రదియల్లాహు తాలా అన్హు వారి యొక్క ఉల్లేఖనం. సహీ బుఖారీ ఎంత ప్రామాణిక గ్రంథమో మీ అందరికీ తెలుసున విషయమే. ఇంతకుముందే ఇప్పుడు ఇంతకుముందే మనం అబ్దుల్లా బిన్ మస్ఊద్ రదియల్లాహు అన్హు వారి పేరు కూడా చెప్పాము. తఫ్సీరే ఖుర్ఆన్‌లో ఆయన పేరు కూడా వస్తుంది. సూరే బఖరా నేర్చుకోవడంలో 8 సంవత్సరాలు వీరికి కూడా పట్టింది అని. ఇక ఖుర్ఆన్ తఫ్సీర్ యొక్క ఆవశ్యకత ఎంతగా ఉన్నదో అబ్దుల్లా బిన్ మస్ఊద్ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం ద్వారా సహీ బుఖారీలోని ఈ హదీస్ ద్వారా తెలుస్తుంది. హదీస్ నంబర్ 32. ఏమంటున్నారో గమనించండి. “లమ్మా నజలత్” ఎప్పుడైతే అవతరించిందో ఈ ఆయత్, “అల్లజీన ఆమనూ వలమ్ యల్బిసూ ఈమానహుమ్ బి జుల్మిన్ ఉలాఇక లహుముల్ అమ్ను వహుమ్ ముహ్తదూన్” (సూరతుల్ అన్ఆమ్, ఆయత్ నంబర్ 82). అందులో ఏమున్నది? ఈమాన్‌ను జుల్ముతో కలుషితం చేయని వారు. అబ్దుల్లా బిన్ మస్ఊద్ అంటున్నారు, “ఖాల అస్హాబు రసూలిల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం”, ప్రవక్త వారి యొక్క సహచరులు అప్పుడు చెప్పారు, ఏమని? “అయ్యునా లమ్ యజ్లిమ్?” మాలో ఎవరు ఏ మాత్రం జుల్మ్ చేయకుండా ఉండేవారు? అప్పుడు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూరత్ లుఖ్మాన్, ఆయత్ నంబర్ 13 తెలియబరిచాడు.

إِنَّ الشِّرْكَ لَظُلْمٌ عَظِيمٌ
(ఇన్నష్ షిర్క ల జుల్మున్ అజీమ్)
నిశ్చయంగా షిర్క్ అత్యంత ఘోరమైన జుల్మ్. (31:13)

ఇక సూరతుల్ అన్ఆమ్‌లో జుల్మ్ యొక్క పదం ఏదైతే వచ్చిందో ఆయత్ నంబర్ 82 లో, ఇక్కడ జుల్మ్ అంటే సామాన్యమైన జుల్మ్, ఒకరు మరొకరిని కొట్టడం గానీ, తిట్టడం గానీ, ఏదైనా సొమ్మును కాజేయడం గానీ, ఇవన్నీ కూడా జుల్మ్. కానీ ఇక్కడ ఈ ఆయతులో ఈ జుల్మ్ కాదు ఉద్దేశం. ఈ ఆయతులో జుల్మ్ అంటే షిర్క్ అని భావం.

అర్థమైంది కదా? ఈ విధంగా సోదర మహాశయులారా, ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఎన్నో హదీసుల ద్వారా మరియు స్వయంగా ఖుర్ఆన్ ద్వారా మనకు ఈ విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఖుర్ఆన్ తఫ్సీర్‌తో నేర్చుకోవడం, తెలుసుకోవడం చాలా అవసరం. అయితే ఏ ఉలమాలైతే, ఏ ఆలిములైతే, ఖుర్ఆన్ యొక్క తఫ్సీర్, ఖుర్ఆన్‌తో, సహీ హదీసులతో, ప్రవక్త సహాబాల యొక్క వ్యాఖ్యానాలతో తెలియజేస్తున్నారో, అలాంటి వారి ద్వారానే మీరు నేర్చుకునే ప్రయత్నం చేయండి. లేదా అంటే ఈ రోజుల్లో కొందరు సోషల్ మీడియాలో ముందుకు వస్తున్నారు, ఖుర్ఆన్ యొక్క తఫ్సీర్ చేస్తున్నారని. కానీ ఎలా? మాకు అరబీ భాష తెలుసు, అరబీ గ్రామర్ తెలుసు, ఖుర్ఆన్ ఈనాటి కాలంలో మన అందరి కొరకు సన్మార్గ గ్రంథం గనుక సైన్స్ టెక్నాలజీ యొక్క విషయాలు అందులో ఏవైతే వచ్చాయో, వాటి యొక్క వివరణలతో తెలుసుకుంటే మరింత మనం వేరే వాళ్లకు కూడా మంచిగా నచ్చజెప్పవచ్చు అని దానిపై మాత్రమే ఆధారపడి అలాంటి విషయాలను వెతికి… చూడండి ఖుర్ఆన్‌లో మానవులందరికీ ప్రళయం వరకు వచ్చే అటువంటి సర్వ మానవాళి కొరకు మార్గదర్శకత్వం ఉంది గనుక, ప్రజలకు లాభదాయకమయ్యే ప్రతీ విద్య మూలాలు ఇందులో ఉన్నాయి. అవును, సైన్స్ కు సంబంధించి, టెక్నాలజీ కి సంబంధించి, జాగ్రఫియా కు సంబంధించి, మెడికల్ కు సంబంధించి, ఇంకా ఎన్ని రకాల ప్రజలకు ఉపయోగపడే విద్యలు ఉన్నాయో, వాటన్నిటి గురించి, వాటన్నిటి గురించి మూల విషయాలు ఉన్నాయి. కానీ ఖుర్ఆన్ యొక్క అసలైన ఉద్దేశం ఏమిటి? ఖుర్ఆన్ యొక్క అసలైన ఉద్దేశం, మానవులు ఈ లోకంలో కేవలం అల్లాహ్ ను ఆరాధిస్తూ, అల్లాహ్ చెప్పిన ప్రకారంగా జీవితం గడిపి, ఎలా వారు నరకం నుండి రక్షణ పొంది స్వర్గం పొందగలుగుతారో, అల్లాహ్ యొక్క ఏకారాధన, అల్లాహ్ యొక్క ఆదేశాలన్నిటినీ పాటిస్తూ ప్రవక్త విధానంలో అల్లాహ్ ను ఆరాధిస్తూ, నరకం నుండి రక్షణ పొంది స్వర్గం ఎలా పొందాలి, దీనికి సంబంధించిన ముఖ్య ఉద్దేశం ఇది గనుక దీనిని మనం కరెక్ట్ గా ఫాలో అవుతూ, ఇంకా అన్ని రకాల వేరే లాభాలను కూడా మనం స్వయం పొందడం, ఇతరులకు లాభం చేకూర్చడం మంచి విషయమే. కానీ అసలైన ఉద్దేశం నుండి దూరం కాకూడదు.

అయితే ఈ కొన్ని ఆధారాలు, ఎగ్జాంపుల్స్, ఉపమానాల ద్వారా మీకు అర్థమైందని ఆశిస్తున్నాను. ఖుర్ఆన్ తప్పకుండా మనం దాని యొక్క వ్యాఖ్యానం, తఫ్సీర్‌తో చదివే, నేర్చుకునే, అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడే మంచి రీతిలో మనం ఆచరించగలుగుతాము. లేదా అంటే, ఒకవేళ తఫ్సీరే ఖుర్ఆన్ అవసరం లేదు అంటే, ఒక చిన్న ఉదాహరణ ఇలాంటి పొరపాటులో పడిపోతాము. ఒక రెండు చిన్న ఉదాహరణలు ఇచ్చి నేను సమాప్తం చేస్తాను. ఖుర్ఆన్‌లో ఇప్పుడు నేను చూపించుకుంటూ మళ్ళీ వస్తే సమయం చాలా పడుతుంది, అందుకొరకే రెండే రెండు ఎగ్జాంపుల్స్ తొందరగా చెప్పేస్తున్నాను, గమనించండి మీరు. ఖుర్ఆన్‌లో ఒకచోట కాదు, ఎక్కువ చోట్ల ఉంది, రక్తం నిషిద్ధం అని. కదా? ఈ ప్రకారంగా చూసుకుంటే, ఒక మేకనే అనుకోండి ఉదాహరణకు, మనం జిబహ్ చేసిన తర్వాత సున్నత్ ప్రకారంగా, రక్తం అంతా వెళ్ళిపోతుంది కదా. కానీ ఎప్పుడైతే మనం మాంసపు ముక్కలు కూడా చేసేస్తామో, లోపట దాని యొక్క నరాల్లో, మాంసం మధ్యలో చిన్నపాటి రక్తం అనేది, కొంతపాటి రక్తం అనేది కనబడుతుంది. అవునా కాదా? అయితే, ఖుర్ఆన్ ప్రకారంగా చూస్తే అది కూడా ఎక్కడా ఒక చిన్న చుక్క ఉండకుండా పూర్తిగా శుభ్రమైపోవాలి అన్నట్లుగా తెలుస్తుంది. కానీ ఆయిషా రదియల్లాహు త’ఆలా అన్హా వారి సహీ హదీస్ ఉన్నది, ప్రవహించే రక్తం ఏదైతే ఉంటుందో, అదంతా పోయింది. ఈ మాంసం మధ్యలో, చిన్న చిన్న నరాల మధ్యలో ఏదైతే కొంచెం ఆగి ఉన్నదో, అది అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మినహాయింపు ఇచ్చాడు. దానివల్ల మనకు నష్టం జరగదు, ఎందుకంటే అది చాలా ఇబ్బందితో కూడిన పని.

ఇక సోదర మహాశయులారా, ఇది ఇలా ఉంటే, ఎవరైతే హదీస్ అవసరం లేదు, మనకు తఫ్సీర్ అవసరం లేదు, ఖుర్ఆన్ యొక్క బాహ్యమైన ఈ ఆయతుల అనువాదాలు చూసి మనం ఆచరిస్తే సరిపోతుంది అంటారో, వాస్తవానికి వారి యొక్క నమాజులు కూడా సరియైనవి కావు, వారి యొక్క రోజువారి జీవితంలో వివాహ, పేరంటాలు ఇవి కూడా సరియైన సున్నత్ ప్రకారంగా జరగవు. ఎందుకు? అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రవక్త ద్వారా ఏ ఖుర్ఆన్‌ను విడమరచి హదీసు ద్వారా కూడా మనకు చెప్పారో, దాన్ని విడనాడినందుకు.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరికీ ఖుర్ఆన్‌ను, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎలా సహాబాకు నేర్పారో, సహాబాలు నేర్చుకున్నారో, అలా నేర్చుకునే భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్. వ ఆఖిరు ద’అవాన అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.

స్వర్గం కష్టాలతో చుట్టుముట్టబడి ఉంది మరియు నరకాగ్ని ప్రలోభాలతో చుట్టుముట్టబడి ఉంది – కలామే హిక్మత్

అనస్ బిన్ మాలిక్ (రజి అల్లాహు అన్హు) ఉల్లేఖనం ఇలా ఉంది ప్రవక్త మహనీయులు (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రవచించారు: “స్వర్గం కష్టాలతో చుట్టుముట్టబడి ఉంది మరియు నరకాగ్ని ప్రలోభాలతో చుట్టుముట్టబడి ఉంది..” (ముస్లిం)

పై హదీసు భావాన్ని గ్రహించాలంటే హజ్రత్ అబూహురైర (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించిన హదీసును పరిశీలించవలసి ఉంది. అబూహురైర (రదియల్లాహు అన్హు) ప్రకారం, మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ప్రవచనం ఇలా ఉంది :

అల్లాహ్ స్వర్గ నరకాలను నిర్మించిన తరువాత (తన దూత అయిన) జిబ్రయీల్ను స్వర్గం వైపునకు పంపాడు. ”దాన్ని చూసిరండి, నేను దాని నివాసుల కోసం, దాన్ని రూపొందించాను” అని అల్లాహ్ (జిబ్రయీల్తో) అన్నాడు. జిబ్రయీల్ స్వర్గం వద్దకు వచ్చారు. స్వర్గాన్ని, అందులో నివసించే వారి కొరకు అల్లాహ్ తరఫున సమకూర్చబడిన సామగ్రిని తిలకించారు. తరువాత ఆయన (అల్లాహ్) వైపునకు మరలారు. “(ప్రభూ!) నీ గౌరవ ప్రపత్తుల సాక్షిగా! దాన్ని గురించి ఎవరు విన్నా సరే తప్పకుండా అందులోకే ప్రవేశిస్తారు.” అప్పుడు అల్లాహ్ ఆజ్ఞతో అది ఇక్కట్లతో చుట్టుముట్టబడింది. తరువాత ఆదేశించాడు “అందులో ప్రవేశించదలిచే వారికై నేను ఏమేం (సృష్టించి) ఉంచానో వెళ్ళి చూడండి.” జిబ్రయీల్ (అలైహిస్సలాం) దాని వైపునకు వెళ్ళిచూస్తే, అది ఇక్కట్లతో చుట్టుముట్టబడి ఉంది. జిబ్రయీల్ మరలివచ్చారు. “(ప్రభూ!) నీ గౌరవం సాక్షిగా! అందులో ఎవరూ ప్రవేశించలేరేమోనని నాకు అనుమానంగా ఉంది” అని విన్నవించుకున్నారు. అప్పుడు అల్లాహ్ ఆదేశమయ్యింది: ”వెళ్ళి నరకాన్ని చూడండి. అందులో ఉండేవారి కొరకు నేను ఏం సిద్ధం చేసి ఉంచానో చూడండి”. వెళ్ళి చూస్తే, అందులో తీవ్రమైన నిప్పు సెగలు కానవచ్చాయి. (జిబ్రయీల్) మరలి వచ్చి విన్నవించుకున్నారు : “(ప్రభూ!) నీ గౌరవోన్నతుల సాక్షిగా! ఎవరు దాన్ని గురించి విన్నా అందులోకి పోరు.” అప్పుడు దైవాజ్ఞతో అది సుఖభోగాలతో చుట్టుముట్టబడింది. ఆజ్ఞ అయ్యింది : “దాని వైపునకు వెళ్ళి చూడండి” అని. అప్పుడు నరకం వైపునకు వెళ్ళిచూసి ఇలా అన్నారు – ”(ప్రభూ!) నీ గౌరవాదరణల సాక్షిగా చెబుతున్నాను. ఎవరూ దీని బారిన పడకుండా ఉండలేరు, అందులోనే పడిపోతారని నాకు అనుమానంగా ఉంది.” (తిర్మిజ)

“స్వర్గాన్ని ఇక్కట్లతో చుట్టుముట్టడం జరిగింది.” – అంటే శాశ్వత సుఖాలకు నిలయమయిన స్వర్గంలో స్థానం సంపాదించటం కొరకు కొన్ని విధ్యుక్త ధర్మాలను విధిగా నిర్వర్తించాలని అల్లాహ్ నిర్ధారించాడు. అలాగే కొన్ని రకాల పనులకు, విషయ లాలసకు దూరంగా ఉండాలని కూడా అల్లాహ్ నిర్ణయించాడు. అల్లాహ్ నిర్ణయించిన విధ్యుక్త ధర్మాలను సక్రమంగా పాటించడం, ఆయన పోవద్దన్న వాటి జోలికి పోకుండా మనోవాంఛలను అణచుకోవటం మనిషికి కాస్త శ్రమగానే ఉంటుంది. దీన్నే కష్టాలతో, ఇక్కట్లతో పోల్చటం జరిగింది.

“నరకాన్ని సుఖవిలాసాలతో చుట్టుముట్టడం జరిగింది.” అంటే అల్లాహ్ విధించిన హద్దులను అతిక్రమించి జాలీగా గడపటం, అల్లాహ్ హరామ్ (నిషేధించిన) చేసిన సొమ్ము తినటం, విషయ లాలసలో (భౌతిక కోరికలలో) లీనమవటం మనిషికి ఎంతో సులభసాధ్యం. పైగా ఈ మార్గంలో పడిన మనిషి తింటూ, త్రాగుతూ, అనుభవిస్తూ మస్తుగా ఉంటాడు. కాని పర్యవసానం – అల్లాహ్ ఆజ్ఞల్ని ధిక్కరించిన కారణంగా భయంకరంగా ఉంటుంది. నరకం సుఖ విలాసాలతో చుట్టుముట్టడం జరిగిందనే దానికి భావం ఇదే.

పై చర్చ ద్వారా తేలిందేమంటే మనిషి స్వర్గంలో చేరటం అతి సులువయిన విషయం కాదు. నిరంతరం సాధన చేయకుండా కష్టాలను సహించకుండా, బాధలను భరించకుండా మహోన్నత లక్ష్యం ప్రాప్తం కాదు. అల్లాహ్ తన పవిత్ర గ్రంథంలో ఇలా సెలవిచ్చాడు :

أَمْ حَسِبْتُمْ أَن تَدْخُلُوا الْجَنَّةَ وَلَمَّا يَأْتِكُم مَّثَلُ الَّذِينَ خَلَوْا مِن قَبْلِكُم ۖ مَّسَّتْهُمُ الْبَأْسَاءُ وَالضَّرَّاءُ وَزُلْزِلُوا حَتَّىٰ يَقُولَ الرَّسُولُ وَالَّذِينَ آمَنُوا مَعَهُ مَتَىٰ نَصْرُ اللَّهِ ۗ أَلَا إِنَّ نَصْرَ اللَّهِ قَرِيبٌ

ఏమిటీ, మీరు స్వర్గంలో ఇట్టే ప్రవేశించగలమని అనుకుంటున్నారా? వాస్తవానికి మీకు పూర్వం గతించిన వారికి ఎదురైనటువంటి పరిస్థితులు మీకింకా ఎదురు కానేలేదు. వారిపై కష్టాలు, రోగాలు వచ్చిపడ్డాయి. వారు ఎంతగా కుదిపి వేయబడ్డారంటే, (ఆ ధాటికి తాళలేక) “ఇంతకీ దైవసహాయం ఎప్పుడొస్తుంది?” అని ప్రవక్తలు, వారి సహచరులు ప్రశ్నించసాగారు. “వినండి! దైవ సహాయం సమీపంలోనే ఉంది” (అని వారిని ఓదార్చటం జరిగింది).(అల్ బఖర 2:214)

ఇకపోతే, అల్లాహ్ హరామ్ (నిషిద్ధం) గా ఖరారు చేసిన వస్తువులు! పైకి అవి ఎంతో ఆకర్షణీయంగా, విలాసవంతమైనవిగా అగుపిస్తాయి. వాటిలో ఎంతో ఆనందాను భూతి ఉంటుంది. ఆ తళుకు బెళుకుల, రంగు రంగుల లోకంలో మనిషి తన నిజ స్థానాన్ని, తన జీవన పరమార్థాన్ని కూడా విస్మరించి వాటికి దాసోహం అంటాడు. కాని ఆ రసాస్వాదన క్షణికమైనది. ఆ తరువాత ఎదర ఉన్నదంతా చీకటే. అప్పటి వరకు తన పాలిట ఎంతో తియ్యనైనదిగా, మధురమైనవిగా అగుపించినవన్నీ తరువాత అతని యెడల విషపూరితమైనవిగా పరిణమిస్తాయి. అల్లాహ్ ప్రబోధం :

“ప్రాపంచిక జీవితమైతే కేవలం మోసపుచ్చే సామగ్రి మాత్రమే.” (హదీద్ 57 : 20)

మహాప్రవక్త గారి ప్రవచనంపై ఉలమాలు చేసిన వ్యాఖ్యను ఇమామ్ నవవి (రహిమహుల్లాహ్) ఇలా ఉటంకించారు :

ఒక్క అల్లాహ్ నే విశ్వసిస్తూ, ఆయన్నే సేవిస్తూ ఆయన మార్గంలో నిరంతరం పాటుపడుతూ, చెడుల నుంచి తనను రక్షించుకుంటూ జీవితం గడపటం, క్రోధాన్ని జయించటం, క్షమాగుణాన్ని అలవరచుకోవటం, దానధర్మాలు చేయటం, తనకు అపకారం తలపెట్టేవారికి సయితం ఉపకారం చేయటం, మనో వాంఛలను అదుపులో పెట్టుకోవటం, సహన స్థయిర్యాలను కలిగి ఉండటం- ఇవన్నీ స్వర్గపు బాటలోని కష్టాలే. స్వర్గం కోరుకుంటున్న వారు అవసరమైతే వీటిని ఆహ్వానించి, భరించవలసిందే.

పోతే – మద్యపానం, జూదం, వ్యభిచారం, అపసవ్యమైన అనర్థదాయకమయిన విషయాలు, అసత్యం, చాడీలు, మనోవాంఛల దాస్యం, పదార్థపూజ, వంశం, కులం గోత్రాల ప్రాతిపదికపై అహంకారాన్ని ప్రదర్శించడం, దురాచారాలు, దుస్సంప్రదాయాలు — ఇవన్నీ సరకానికి గొనిపోయేవే.

అయితే సుఖాలు, విలాసాలు అధర్మమని కాదు – వాటిలో ధర్మసమ్మతమైనవి కూడా ఉంటాయి. అయితే మనోవాంఛలకు ఒకసారి దాసుడైపోయిన మనిషి, ధర్మసమ్మతమైన మార్గాల ద్వారా కోర్కెలు తీరకపోతే అడ్డమైన గడ్డినల్లా కరచి వాటిని పొందాలని ప్రయత్నిస్తాడు. మంచీ చెడుల విచక్షణా జ్ఞానాన్ని కోల్పోతాడు. మితిమీరిన ఈ కోర్కెల మూలంగా అతని ఆంతర్యంలో కాఠిన్యం తిష్ఠవేస్తుంది. మనసులో మలినం పేరుకుంటుంది. దైవదాస్య భావం, దైవ విధేయతా భావం పట్ల అలసత్వం లేక వైముఖ్యం ప్రదర్శిస్తాడు. కోర్కెల గుఱ్ఱాలను పోషించడానికి రేయింబవళ్ళు సంపాదనా యత్నంలోనే ఉండిపోతాడు.

ఈ హదీసు ద్వారా బోధపడే మరో విషయం ఏమిటంటే, స్వర్గ నరకాలు సృజించబడి ఉన్నాయి. అవి ఎక్కడో ఒకచోట నెలకొని ఉన్నాయి. మేరాజ్ రాత్రిన ప్రవక్త మహనీయులు స్వర్గ నరకాలను చూసి వచ్చారు.

ఈ హదీసు ద్వారా బోధపడే మరో విషయం; ఈ ప్రపంచం కేవలం సుఖాస్వాదనలకు నిలయం కాదు. ఈ లోకంలో ఏ సుఖమయినా, మరే ఆనందమయినా – అది ధర్మ సమ్మతంగా లభిస్తే, దాన్ని అల్లాహ్ అనుగ్రహంగా భావించి పొందవచ్చు. ఇలాంటి సుఖాలు పరలోక సాఫల్యానికి ఎలాంటి అవరోధం కాజాలవు.

అల్లాహ్ ఆజ్ఞలను పాలిస్తూ, ఆయన మోపిన విధ్యుక్త ధర్మాలను నిర్వర్తిస్తూ ఆయన వద్దన్న వాటి జోలికి పోకుండా గడపటం సాధారణ విషయం కాదు. నిజానికి అదొక పెద్ద పరీక్ష, మహాయజ్ఞం. అయితే చిత్తశుద్ధితో అల్లాహ్ మార్గాన పయనించాలని నిశ్చయించుకున్న వాని కోసం, అల్లాహ్ తన మార్గాన్ని సులభతరం చేస్తాడు. అంటే అల్లాహ్ కు భయపడుతూ, అల్లాహ్ మార్గంలో ఖర్చుచేస్తూ ప్రవక్తలను విశ్వసిస్తూ మంచిపనులు చేసిన వారికి అల్లాహ్ స్వర్గంలో సులువుగా ప్రవేశం కల్పిస్తాడు.

హరామ్ నుండి మనిషి తనను కాపాడుకోవటం మొదట్లో కాస్త కష్టంగా కనిపిస్తుంది. కాని అతను స్థిర చిత్తంతో, ఓపికతో ధర్మ మార్గానికి కట్టుబడి ఉంటే రాను రాను అతను ఎంత కాలితే అంతే కుందనంలా, మేలిమి బంగారంలా మెరిసిపోతాడు. క్రమక్రమంగా చెడులంటే, హరామ్ వస్తువులంటే అతను అసహ్యించుకోసాగుతాడు. ఇక అప్పుడతను చెడుల బారిన పడకుండా, వాటికి దూరంగా ఉండటం ఎంతో సులువు. ప్రవక్త సహచరుల నుద్దేశించి ఇలా సెలవియ్యబడింది :

وَكَرَّهَ إِلَيْكُمُ الْكُفْرَ وَالْفُسُوقَ وَالْعِصْيَانَ ۚ أُولَٰئِكَ هُمُ الرَّاشِدُونَ

“ఆయన మీ మనసుల్లో అవిశ్వాసం, అపసవ్యత, అవిధేయత పట్ల ఏహ్యభావాన్ని కలుగజేశాడు. ఇటువంటి వారే అల్లాహ్ కరుణానుగ్రహాలకు నోచుకున్నారు.” (అల్ హుజురాత్ 49 : 7)

పై విషయాల సారాంశం ఏమిటంటే, మానవుడు కష్టాలను ఎదుర్కోవలసి వచ్చినప్పటికీ అతను స్వర్గపు బాటపై నడవాలి. ధర్మసమ్మతం కాని, నరకానికి గొనిపోయే ఎన్ని సుఖభోగాలు తారసపడినా వాటి వలలో చిక్కకుండా తనను రక్షించుకోవాలి.

[డౌన్లోడ్ PDF]

పుస్తకం నుండి :కలామే హిక్మత్ – 1 (వివేక వచనం)
రచన:సఫీ అహ్మద్ మదనీ
అనువాదం: ముహమ్మద్ అజీజుర్ రహ్మాన్
ప్రకాశకులు:జమీ అతే అహ్ లె హదీస్,ఆంధ్రప్రదేశ్

ఇస్రా వ మేరాజ్ – జాదుల్ ఖతీబ్ [ఖుత్బా]

[డౌన్ లోడ్ PDF]

ఈ ఖుత్బా క్రింది పుస్తకం నుండి తీసుకోబడింది.
జాదుల్ ఖతీబ్ (ఖుత్బాల సంగ్రహం) – మొదటి సంపుటం – ముహమ్మద్ ఇస్ హాఖ్ జాహిద్

1) ఇస్రా వ మేరాజ్ ప్రాముఖ్యత
2) ఇస్రా వ మేరాజ్ తారీఖు
3) ఇస్రా వ మేరాజ్ లోని సంఘటనలు
4) ఇస్రా వ మేరాజ్ ఉద్దేశ్యము

ఇస్లామీయ సోదరులారా!

దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కు అల్లాహ్ ఎన్నో అద్భుతాలను ప్రసాదించాడు. వాటిలో ఒక ముఖ్యమైన అద్భుతం – ఇస్రా వ మేరాజ్. ఈ అద్భుతంలో రెండు ముఖ్యమైన భాగాలు వున్నాయి. ఒక భాగం – ఇస్రా అని పిలువబడే ‘మస్జిదుల్ హరామ్’ నుండి ‘మస్జిదె అఖ్సా’ వరకు సాగిన ప్రయాణానికి సంబంధించినది. ఇక రెండవ భాగం – ‘మస్జిదె అఖ్సా’ నుండి ఆకాశాల కన్నా పైకి, అల్లాహ్ కోరుకున్నంత వరకు సాగిన ప్రయాణం. దీనిలో ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) కు స్వర్గనరకాలతో పాటు, ఎన్నో అల్లాహ్ సూచనలు చూపించడం జరిగింది, ఎన్నో ప్రవక్తలను పరిచయం చేయడం జరిగింది మరియు ఐదు పూటల నమాజ్ విధి (ఫర్జ్) గా చేయబడ్డాయి – దీనినే ‘మేరాజ్‘ అని పిలుస్తారు.

ఇమామ్ తహావీ రహిమహుల్లాహ్ ఇలా పేర్కొన్నారు : మేరాజ్ అనేది సత్యం. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను మెలకువ స్థితిలో, శరీర సమేతంగా సంచరింపజేయడం జరిగింది మరియు ఆకాశాల వరకూ, ఇంకా వాటికన్నా పైకి అల్లాహ్ కోరుకున్నంత వరకు తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ అల్లాహ్ తాను కోరుకున్నట్లుగా ఆయనను గౌరవించి, తాను కోరుకున్న దానిని ఆయనకు ‘వహీ’ చేశాడు.

‘ఇస్రా’ గురించి అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు :

سُبْحَانَ الَّذِي أَسْرَىٰ بِعَبْدِهِ لَيْلًا مِّنَ الْمَسْجِدِ الْحَرَامِ إِلَى الْمَسْجِدِ الْأَقْصَى الَّذِي بَارَكْنَا حَوْلَهُ لِنُرِيَهُ مِنْ آيَاتِنَا ۚ إِنَّهُ هُوَ السَّمِيعُ الْبَصِيرُ

“తన దాసుణ్ణి రాత్రికి రాత్రే మస్జిదుల్ హరామ్ నుండి మస్జిదె అఖ్సా వరకు తీసుకునిపోయిన అల్లాహ్ పరిశుద్ధుడు. దాని పరిసరాలను మేము శుభవంతం చేశాము. ఎందుకంటే మేమతనికి మా (శక్తి సామర్థ్యాలకు సంబంధించిన) కొన్ని సూచనలను చూపదలిచాము. నిశ్చయంగా అల్లాహ్ మాత్రమే బాగా వినేవాడు, చూసేవాడు.” (బనీ ఇస్రాయీల్ 17:1)

ఈ ఆయత్ ‘సుబ్ హాన’ అన్న పదంతో అల్లాహ్ ప్రారంభించాడు. దీని శాబ్దిక అర్థం ఏమిటంటే – ఆయన (అల్లాహ్) అన్ని లోపాలకు అతీతుడు. కానీ, అరబ్బీ భాషలో దీనిని ‘ఆశ్చర్యాన్ని‘ వెలిబుచ్చే సందర్భాలలో కూడా ఉపయోగిస్తారు. ఇక్కడ కూడా అల్లాహ్ శక్తిసామర్థ్యాలకు గాను ఆశ్చర్యం ప్రకటించబడుతోంది – ఆ శక్తిసామర్థ్యాలు ఏమిటంటే – అల్లాహ్ తన దాసుణ్ణి, ఆ రోజుల్లో 40 రేయింబవళ్ళలో పూర్తి చేయగలిగే ప్రయాణాన్ని రాత్రికి రాత్రే పూర్తి చేయించాడు. దీనిని వెల్లడించిన శైలి కూడా – దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కు మెలకువతో, శరీర సమేతంగా మేరాజ్ చేయించడం జరిగిందని నిరూపిస్తోంది. ఎందుకంటే – ఒకవేళ నిద్ర స్థితిలో, ఆత్మరూపంలో ఈ ప్రయాణం జరిగి వుంటే, దాని కోసం ‘సుబ్ హాన’ పదాన్ని ఉపయోగించి ఆశ్చర్యం ప్రకటించాల్సిన అవసరం వుండేది కాదు.

ఇదేగాక, అల్లాహ్ దీనిలో అబ్ద్ (దాసుడు) పదాన్ని వాడాడు. అంటే ఆయన దాసుణ్ణి సంచారం గావించాడు. ఈ పదం కూడా ఆత్మ, శరీరం – రెండింటినీ కలిపి వాడబడుతుంది. కేవలం ఆత్మ కోసం కాదు. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు కలలో కాకుండా మెలకువతో శరీర సమేతంగా మేరాజ్ యాత్ర చేయించి గౌరవించడం జరిగిందనడానికి ఇది రెండవ ఆధారం.

ఇక దీని మూడవ ఆధారం ఏమిటంటే – ఒకవేళ ‘ఇస్రా వ మేరాజ్’ సంఘటన కలలో జరిగివుంటే, మరి దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తన కలను జనాలకు వివరించినప్పుడు వారు దానిని (నమ్మకుండా) తిరస్కరించేవారు కాదు. కనుక మక్కా అవిశ్వాసుల తిరస్కరణ ద్వారా మనకు తెలిసిందేమిటంటే – దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారితో తన కలను వివరించలేదు, వారితో స్పష్టంగా తనకు మెలకువ స్థితిలో, శరీర సమేతంగా ‘ఇస్రా వ మేరాజ్’ చేయించడం జరిగిందని చెప్పారు.అందుకే వారు- మక్కా నుండి ఏలియా (బైతుల్ మఖ్దిస్)కు మేము 40 రేయింబవళ్ళలో పూర్తి చేసే యాత్రను ఈయన రాత్రికి రాత్రే అక్కడికెళ్ళి తిరిగి వచ్చేశారు! అని ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ను పరిహసించారు.

నమాజ్ కొరకు త్వరపడటం యొక్క ప్రాముఖ్యత – షేఖ్ మాజిద్ బిన్ సులైమాన్ [ఖుత్బా]

إنَّ الْحَمْدَ لِلهِ نَحْمَدُهُ وَنَسْتَعِينُهُ وَنَسْتَغْفِرُهُ، وَنَعُوذُ بِاللهِ مِنْ شُرُورِ أَنْفُسِنَا وَمِنْ سَيِّئَاتِ أَعْمَالِنَا، مَنْ يَهْدِهِ اللهُ فَلاَ مُضِلَّ لَهُ، وَمَنْ يُضْلِلْ فَلاَ هَادِىَ لَهُ، وَأَشْهَدُ أَنْ لاَ إِلَهَ إِلاَّ اللهُ وَحْدَهُ لاَ شَرِيكَ لَهُ، وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُه

మొదటి ఖుత్బా :-

స్తోత్రాలు మరియు దరూద్ తరువాత :

ఓ ముస్లింలారా! అల్లాహ్ యొక్క భయాన్ని ఆయన దైవభీతిని కలిగి ఉండండి, ఆయనకు విధేయత చూపండి, అవిధేయత నుంచి దూరంగా ఉండండి. మరియు తెలుసుకోండి! నమాజ్ అతి ఉన్నతమైన ఆచరణలలో ఒకటి.  అల్లాహ్ ఇతర ఆరాధనల కంటే ఎక్కువగా దీనికి ఎంతో ప్రాముఖ్యతను ప్రసాదించాడు. నమాజ్ యొక్క ప్రత్యేకతలలో ఒక ప్రత్యేకత ఏమిటంటే; అల్లాహ్ దీనిని ఆకాశాలలో విధి గావించాడు ఇది చూడడానికి 5 నమాజులే కానీ పుణ్యఫలం పరంగా 50 నమాజుల పుణ్యఫలం లభిస్తుంది. నమాజ్ ద్వారా పాప ప్రక్షాళన జరుగుతుంది, నమాజ్ కొరకు మస్జిద్ వైపు వెళ్లడం మరియు తిరిగి రావడం కూడా ఆరాధనలోని భాగమే, అదే విధంగా దీని ప్రత్యేకతలలో ఒక ప్రత్యేకత ఏమిటంటే; ఈ నమాజు కొరకు పరిశుభ్రత పొందడం తప్పనిసరి.

ఓ విశ్వాసులారా! నమాజ్ యొక్క ఈ ప్రాధాన్యత దృష్ట్యా అల్లాహ్ దీని కొరకు త్వరపడమని ఆదేశిస్తున్నాడు, మరియు దీనికి సంబంధించి గొప్ప ప్రతిఫలాన్ని పెట్టాడు. అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు: “పురుషుల పంక్తుల్లో అత్యంత శ్రేష్ఠమైనది మొదటి పంక్తి. అత్యంత హీనమైనది చివరి పంక్తి. స్త్రీల పంక్తుల్లో అత్యంత శ్రేష్ఠమైనది చివరి పంక్తి. అత్యంత హీనమైనది మొదటి పంక్తి”. (ముస్లిం)

అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు: “తొలి పంక్తిలో చేరటానికి ఎంతటి ఘనత ఉందో ప్రజలకు  తెలిస్తే, దానిని పొందటానికి వారు తప్పకుండా లాటరీ వేసుకుంటారు”. (ముస్లిం)

అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు: “అజాన్ చెప్పటానికి, తొలి పంక్తిలో చేరటానికి ఎంతటి ఘనత ఉందో ప్రజలకు తెలిస్తే, దానిని పొందటానికి పరస్పరం లాటరీ వేసుకోవటం తప్ప గత్యంతరం లేదని భావిస్తే, వారు తప్పకుండా లాటరీ వేసుకుంటారు. మరియు నమాజ్ కొరకు త్వరపడడం వల్ల లభించే పుణ్యఫలం ఎంతో తెలిస్తే వారు ఒకరిని మించి ఒకరు పోటీపడతారు. అదేవిధంగా ఇషా మరియు ఫజ్ర్ నమాజులను సామూహికంగా చేయడంలో ఎంత పుణ్యముందో ప్రజలకు తెలిస్తే వాటి కోసం మోకాళ్ళు ఈడ్చుకుంటూ నడవవలసి వచ్చిన సరే వారు తప్పకుండా వస్తారు.” (బుఖారీ-ముస్లిం)

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి ఈ హదీసులో(ما في النداء) దీని అర్థం అజాన్ ఇచ్చే వారికి లభించే అటువంటి పుణ్యఫలం మరియు “ یستهموا” దీని అర్థం లాటరీ వేయడం మరియు” تهجير ” దీని అర్థం త్వరపడటం మరియు” عتمة” దీని అర్థం ఇషా నమాజ్.

బరా బిన్ ఆజిబ్ (రదియల్లాహు అన్హు) కథనం: దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అనేవారు: “నిస్సందేహంగా అల్లాహ్ తొలి పంక్తుల్లో ఉండేవారిపై కారుణ్యాన్ని కురిపిస్తాడు. మరియు దైవదూతలు వారి పాప క్షమాపణ కొరకు దువా చేస్తారు”. (అబూ దావుద్)

ప్రవక్త వారి ఈ ఆదేశంలో దైవదూతలు వారి కొరకు దువాలు చేస్తారు. దీని యొక్క అర్థం ఏమిటంటే దైవదూతలు మొదటి పంక్తిలో ఉండే వారి కొరకు పుణ్యం మరియు క్షమాపణ యొక్క దువా చేస్తారు ఎందుకంటే అరబ్బీలో సలాహ్ అంటే దుఆ అని అర్థం కూడా వస్తుంది.

ఇర్బాజ్ బిన్ సారియ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు మొదటి పంక్తి వారి కొరకు మూడుసార్లు మరియు రెండవ పంక్తి వారి కొరకు ఒకసారి మగ్ ఫిరత్ (పాప క్షమాపణ) దుఆ చేసేవారు.(నసాయి)

అబూ సయీద్ ఖుద్రీ (రదియల్లాహు అన్హు) కథనం: తన సహచరులు వెనుక (పంక్తుల్లో) ఉండిపోవటం చూసి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారిని మందలిస్తూ, “ముందుకు రండి, మీరు నన్ను అనుసరించండి. మీ తర్వాత వచ్చిన వారు మిమ్మల్ని అనుసరిస్తారు. (జాగ్రత్త!) ప్రజలు గనక ఎప్పుడూ వెనకే ఉంటే అల్లాహ్ కూడా వారిని వెనకబాటు తనానికి గురిచేస్తాడు” అని అన్నారు. (ముస్లిం)

ఆయిషా (రదియల్లాహు అన్హ) కథనం ప్రకారం మహా ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు తెలియజేశారు; “ఎవరైతే మొదటి పంక్తులకు దూరంగా ఉంటారో అల్లాహ్ తఆల వారిని తన కారుణ్యానికి కూడా దూరంగా ఉంచుతాడు”.(అబూ దావుద్)

అల్లాహ్ ఖురాన్ యొక్క శుభాలను మన జీవితాలలో వర్షింప చేయుగాక, ఆయన వివేకంతో కూడిన సూచనల ద్వారా హితబోధ పొందే భాగ్యం ప్రసాదించుగాక. అల్లాహ్ మనందరినీ క్షమించుగాక. మీరు కూడా అల్లాహ్ ను క్షమాపణ వేడుకోండి. నిశ్చయంగా ఆయన తౌబా (పశ్చాత్తాపం) చెందే వారిని తప్పక  మన్నిస్తాడు.  

స్తోత్రం మరియు దరూద్ తరువాత

మీరు తెలుసుకోండి! అల్లాహ్ మీపై కనికరించు గాక! ఇస్లాంలో నమాజుకు చాలా పెద్ద ప్రాధాన్యత ఉంది, ఇంత గొప్ప ప్రాధాన్యత మరి యే ఇతర ఆరాధనకు లేదు. ఇస్లాం యొక్క ముఖ్య మూల స్తంభాలలో ఒకటి. ఇది లేకుండా ధర్మం స్థిరంగా ఉండలేదు.

ముఆజ్ బిన్ జబల్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలియజేశారు; “ఏమిటి నేను మీకు ధర్మం యొక్క అసలు మరియు దాని మూల స్తంభం మరియు దాని యొక్క శిఖరం గురించి తెలియజేయనా?” అప్పుడు నేను ఇలా అన్నాను, ఎందుకు కాదు మహా ప్రవక్తా! తెలియజేయండి. ప్రవక్త వారు ఇలా అన్నారు: “ధర్మం యొక్క అసలు ఇస్లాం, దాని మూల స్తంభం నమాజ్, మరియు దాని శిఖరం అల్లాహ్ మార్గంలో పోరాడటం”. (తిర్మిజి)

దాసుడు మరియు అల్లాహ్ మధ్య ఇది సంభాషణకు ఒక సాధన, ఎందుకంటే నమాజులో అల్లాహ్ యొక్క పొగడ్త, ఆయన యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పడం జరుగుతుంది.  నమాజ్ ఆరాధన హృదయం, నాలుక మరియు శరీర అవయవాల పై ఆధారపడి ఉంది ఉదాహరణకు అల్లాహ్ యొక్క పొగడ్త, దువా చేయడం, ఖురాన్ పఠించడం, అల్లాహ్ ను స్తుతించడం, తక్బీర్ చెప్పడం, మరియు శరీర అవయవాలతో ఏకాగ్రచిత్తంతో ఆచరించడం మరియు రుకూ, సజ్దా చేయడం మరియు అందులో వినయ వినమ్రతలు కనబరుస్తూ తమ చూపుని కిందికి వాల్చుకొని అల్లాహ్ ముందు తలవంచి నిల్చోవడం.

إنَّ الصَّلَوَةَ تَنْهَى عَنِ الْفَحْشَاءِ وَالْمُنكَرِ وَلَذِكْرُ اللَّهِ أَكْبَرُ
నిశ్చయంగా నమాజ్‌ సిగ్గుమాలినతనం నుంచి, చెడు విషయాల నుంచి ఆపుతుంది. నిశ్చయంగా అల్లాహ్‌ స్మరణ చాలా గొప్ప విషయం (అన్న సంగతిని మరువరాదు). (29:45)

షేఖ్ సాది (రహిమహుల్లాహ్) పై ఆయత్ యొక్క వివరణలో ఇలా తెలియజేస్తున్నారు:- నమాజ్ యొక్క ఒక లక్ష్యం దాని కంటే గొప్పది అనగా హృదయం మరియు నాలుక మరియు శరీరంతో అల్లాహ్ యొక్క స్మరణ చేయడం. ఎందుకంటే అల్లాహ్ తన దాసులను దాని కొరకే పుట్టించాడు, దాసులవైపు నుంచి చేసేటువంటి ఆరాధనలలో అతి గొప్ప ఆరాధన నమాజ్. నమాజులో తప్ప మనిషి యొక్క శరీర అవయవాల ద్యారా ఇలాంటి ఆరాధన జరగదు. అందుకే అల్లాహ్ అంటున్నాడు (وَلَذِكْرُ اللَّهِ أَكْبَرُ) అల్లాహ్ స్మరణ అన్నింటి కంటే గొప్పది.

ఈ విషయాన్ని కూడా తెలుసుకోండి, అల్లాహ్ మీపై కరుణించుగాక! అల్లాహ్ మీకు ఒక పెద్ద ఆచరణకై  అజ్ఞాపించి ఉన్నాడని మీరు గుర్తుపెట్టుకోండి. అల్లాహ్ ఇలా అన్నాడు.

إِنَّ اللَّهَ وَمَلَائِكَتَهُ يُصَلُّونَ عَلَى النَّبِيِّ ۚ يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا صَلُّوا عَلَيْهِ وَسَلِّمُوا تَسْلِيمًا

నిశ్చయంగా అల్లాహ్, ఆయన దూతలు కూడా దైవప్రవక్తపై కారుణ్యాన్ని పంపిస్తున్నారు. ఓ విశ్వాసులారా! మీరు కూడా అతనిపై దరూద్‌ పంపండి. అత్యధికంగా అతనికి ‘సలాములు’ పంపుతూ ఉండండి. (అల్ అహ్ జాబ్ 33:56)

ఓ అల్లాహ్! నీ దాసుడు మరియు నీ ప్రవక్త అయిన ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పై నీ కారుణ్యాన్ని అవతరింపచేయి. ఆయన ఖలీఫాలు, తాబయీనులను పూర్తి చిత్తశుద్దితో అనుసరించే వారిని ఇష్టపడు, ప్రేమించు. ఓ అల్లాహ్! ఇస్లాం మరియు ముస్లింలకు గౌరవ మర్యాదలు ప్రసాదించు. షిర్క్, ముష్రిక్ లను అవమానబరుచు. నీవు మరియు నీ ధర్మం అయిన ఇస్లాంకు శత్రువులు ఎవరైతే ఉన్నారో వారిని సర్వ నాశనం చేయి. మరియు ఏకేశ్వరోపశకులకు నీ సహాయాన్ని అందించు.

سُبۡحَٰنَ رَبِّكَ رَبِّ ٱلۡعِزَّةِ عَمَّا يَصِفُونَ وَسَلَٰمٌ عَلَى ٱلۡمُرۡسَلِينَ وَٱلۡحَمۡدُ لِلَّهِ رَبِّ ٱلۡعَٰلَمِين

రచన : మాజిద్ బిన్ సూలైమాన్ అర్రస్సీ
జుబైల్ పట్టణం, సౌదీ ఆరేబియ
అనువాదం: అబ్దుల్లాహ్ జామయి

పుస్తకం నుండి – ఇస్లామీయ జుమా ప్రసంగాలు – షేఖ్ మాజిద్ బిన్ సులైమాన్

అల్లాహ్ తప్ప ఇతరులకు మొక్కు కొనుట షిర్క్ – ఏకత్వపు బాటకు సత్యమైన మాట [వీడియో]

అల్లాహ్ ఆదేశం:

يُوفُونَ بِٱلنَّذْرِ
వారు మొక్కుబడి చెల్లించేవారు” (76: దహ్ర్ : 7). 

మరోచోట:

وَمَآ أَنفَقْتُم مِّن نَّفَقَةٍ أَوْ نَذَرْتُم مِّن نَّذْرٍۢ فَإِنَّ ٱللَّهَ يَعْلَمُهُۥ
మీరేమి ఖర్చుపెట్టినదీ, మీరు మొక్కుబడి చేసుకున్నదీ, అంతా అల్లాహ్ కు తెలుసు“. (2: బఖర: 270). 

ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖనంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఆదేశించారు: “అల్లాహ్ కు విధేయత చూపాలని మొక్కుబడి చేసిన వ్యక్తి విధేయత చూపాలి. కాని ఎవరు అల్లాహ్ కు అవిధేయత చూపాలని మొక్కుబడి చేస్తాడో అతడు అవిధేయత చూపకూడదు”. (బుఖారి). 

1. మొక్కుబడి చేస్తే దాన్ని పూర్తి చేయాలి. 
2. మొక్కుబడి ఇబాదత్ (ఆరాధన) అని తెలిసింది, దాన్ని ఇతరుల కొరకు చేయుట షిర్క్.
3. పాపకార్యానికి, అవిధేయతకు మొక్కుబడి చేస్తే దాన్ని పూర్తి చేయకూడదు. 

నుండిఏకత్వపు బాటకు సత్యమైన మాట (అల్ ఖవ్లుల్ సదీద్ షర్హ్ కితాబ్ అత్ తౌహీద్)  – ఇమామ్ అస్-సాదీ [పుస్తకం].
తెలుగు అనువాదం: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

యూట్యూబ్ ప్లే లిస్ట్ (ఏకత్వపు బాటకు సత్యమైన మాట)
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0VrU7pg90uGfghChg9Bptl

అల్లాహ్ తప్ప ఇతరుల కొరకు జిబహ్ చేసే చోట, అల్లాహ్ కొరకు జిబహ్ చేయరాదు – ఏకత్వపు బాటకు సత్యమైన మాట [వీడియో]

11వ అధ్యాయం: అల్లాహ్  తప్ప ఇతరుల కొరకు జిబహ్ చేసే చోట, అల్లాహ్ కొరకు జిబహ్ చేయరాదు

అల్లాహ్ ఆదేశం: 

لَا تَقُمْ فِيهِ أَبَدًۭا
నీవు ఎన్నడూ అందులో నిలబడకు“. (9: తౌబా: 108). 

సాబిత్ బిన్ జహ్హాక్ రజియల్లాహు అన్హు కథనం: బువాన అనే స్థలంలో ఒక వ్యక్తి ఒంటె జిబహ్ చేయాలని మ్రొక్కుకున్నాడు. దాన్ని గురించి ప్రవక్త ﷺ తో ప్రశ్నించగా, “అక్కడ జాహిలియ్యత్ కాలంలోని విగ్రహాల్లో ఏదైనా విగ్రహం ఉందా? దాని పూజ జరుగుతూ ఉందా?” అని ఆయన అడిగారు. “లేదు” అని అతడు సమాధానం పలికాడు. “వారి పండుగలో (ఉర్సు, జాతరలలో) ఏదైనా పండుగ (ఉర్సు,జాతర) అక్కడ జరుగుతుందా?” అని అడిగారు. “లేదు” అని అతడు సమాధానం పలికాడు. అప్పుడు ప్రవక్త ﷺ చెప్పారు: “నీ మ్రొక్కుబడిని పూర్తి చేయు. అల్లాహ్ అవిధేయతకు గురి చేసే మ్రొక్కుబడిని పూర్తి చేయరాదు. మానవుడు తన శక్తికి మించిన దాన్ని మ్రొక్కుకుంటే అది కూడా పూర్తి చేయరాదు”. (అబూ దావూద్). 

1. ఇందులోని ఆయతు యొక్క వ్యాఖ్యానం. 

2. అల్లాహ్ విధేయత, అవిధేయత కొన్ని సందర్భాల్లో భూమి పై కూడా తన ప్రభావాన్ని చూపుతుంది. (అందుకే షిర్క్ జరిగే చోట జిబహ్ చేయవద్దు అని చెప్పబడింది). 

3. కఠిన సమస్యను నచ్చజెప్పెటప్పుడు సులభరీతిలో ఏలాంటి చిక్కు లేకుండా స్పష్టపడునట్లు చెప్పాలి. 

4. అవసర సందర్భంలో “ఫత్వా” ఇచ్చువారు వివరాన్ని కోరవచ్చు. 

5. ఎలాంటి ధార్మిక అడ్డు, ఆటంకం లేనప్పుడు ప్రత్యేక చోటును మ్రొక్కుబడి కొరకు నిర్ణయించవచ్చును. 

6. జాహిలియ్యత్ (మూఢవిశ్వాస) కాలంలో విగ్రహం ఉన్నచోట, దాన్ని తర్వాత తొలగించినప్పటికీ అచ్చట జిబహ్ చేయరాదు. 

7. వారి పండుగ (ఉర్సు, జాత్ర) జరుగుతున్న స్థలం, అది ఇప్పుడు జరగనప్పటికీ అక్కడ కూడా జిబహ్ చేయరాదు. 

8. ఇలాంటి స్థలాల్లో జిబహ్ చేయుటకు మ్రొక్కుకుంటే దానిని పూర్తి చే యకూడదు. అది పాపపు మ్రొక్కు అగును. 

9. ఉద్దేశపూర్వకంగా కానప్పటికీ ముస్లింలు ముష్రికుల పండుగ (ఉర్సు, జాత్ర)ల పోలికల నుండి జాగ్రత్తగా వహించాలి. 

10. అవిధేయతకు గురి చేసే మ్రొక్కుబడి చేయరాదు. 

11. మనిషి తన శక్తికి మించిన దాని మ్రొక్కు చేయకూడదు. 

దీనికి ముందు అధ్యాయం తరువాత, వెంటనే ఈ అధ్యాయాన్ని ప్రస్తావించడంలో ఉత్తమమైన ఔచిత్యం ఉంది. మొదటిది షిర్క్ అక్బర్ అయితే, ఇది దానికి వసీల (మార్గం, సాధనం). ఏ చోటనైతే అవిశ్వాసులు, ముష్రికులు తమ దేవతల (వలీల) సాన్నిధ్యం పొందుటకు అల్లాతో షిర్క్ చేస్తూ వారి కొరకు జిబహ్ చేస్తారో అవి షిర్క్ యొక్క చిహ్నాలు, గుర్తులు అయ్యాయి. అక్కడ ఎవరైనా ముస్లిం జిబహ్ చేస్తే, అతని ఉద్దేశం అల్లాహ్ కొరకే ఉన్నప్పటికీ అది బాహ్యంగా వారి విధంగనే ఏర్పడుతుంది. (అంటే చూసేవాళ్ళకు అల్లాహ్ యేతరలకు చేస్తున్నట్లే ఏర్పడుతుంది). ఇలా బాహ్య రూపంలో వారికి పోలిన పనులు చేస్తే, చివరికి ఆంతర్యం కూడా ఒకటి అయి పోయే భయం ఉంటుంది. (ఈ రోజుల్లో అయిపోయినట్లే కనబడుతుంది). 

అందుకే ఇస్లాం వారి (అవిశ్వాసులు, ముష్రికులు) పోలికల నుండి దూరముండాలని హెచ్చరించింది. అది వారి పండుగలు, వారి లాంటి కార్యాలు, వారి లాంటి దుస్తులు ఇంకా వారికి ప్రత్యేకించిన ప్రతీ దానితో ముస్లిం దూరముండాలి. వాస్తవానికి ఇది వారిలో కలసిపోవుటకు ఒక సాధనంగా మారుతుంది. ముష్రికులు అల్లాహ్ యేతరులకు సజ్దా చేసే సమయంలో, ముస్లింలు నఫిల్ నమాజు చేయుట నివారించబడింది. ఈ నివారణ వచ్చింది వారి పోలిక నుండి దూరముంచుటకే. 

నుండిఏకత్వపు బాటకు సత్యమైన మాట (అల్ ఖవ్లుల్ సదీద్ షర్హ్ కితాబ్ అత్ తౌహీద్)  – ఇమామ్ అస్-సాదీ [పుస్తకం].
తెలుగు అనువాదం: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

యూట్యూబ్ ప్లే లిస్ట్ (ఏకత్వపు బాటకు సత్యమైన మాట)
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0VrU7pg90uGfghChg9Bptl

అల్లాహ్ ఉనికిపై విశ్వాసం – షేఖ్ మాజిద్ బిన్ సులైమాన్ [ఖుత్బా]

إنَّ الْحَمْدَ لِلهِ نَحْمَدُهُ وَنَسْتَعِينُهُ وَنَسْتَغْفِرُهُ، وَنَعُوذُ بِاللهِ مِنْ شُرُورِ أَنْفُسِنَا وَمِنْ سَيِّئَاتِ أَعْمَالِنَا، مَنْ يَهْدِهِ اللهُ فَلاَ مُضِلَّ لَهُ، وَمَنْ يُضْلِلْ فَلاَ هَادِىَ لَهُ، وَأَشْهَدُ أَنْ لاَ إِلَهَ إِلاَّ اللهُ وَحْدَهُ لاَ شَرِيكَ لَهُ، وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ. يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اتَّقُوا اللَّهَ حَقَّ تُقَاتِهِ وَلَا تَمُوتُنَّ إِلَّا وَأَنْتُمْ مُسْلِمُونَ [آل عمران 102]. يَا أَيُّهَا النَّاسُ اتَّقُوا رَبَّكُمُ الَّذِي خَلَقَكُمْ مِنْ نَفْسٍ وَاحِدَةٍ وَخَلَقَ مِنْهَا زَوْجَهَا وَبَثَّ مِنْهُمَا رِجَالًا كَثِيرًا وَنِسَاءً وَاتَّقُوا اللَّهَ الَّذِي تَسَاءَلُونَ بِهِ وَالْأَرْحَامَ إِنَّ اللَّهَ كَانَ عَلَيْكُمْ رَقِيبًا [النساء 102]. يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اتَّقُوا اللَّهَ وَقُولُوا قَوْلًا سَدِيدًا * يُصْلِحْ لَكُمْ أَعْمَالَكُمْ وَيَغْفِرْ لَكُمْ ذُنُوبَكُمْ وَمَنْ يُطِعِ اللَّهَ وَرَسُولَهُ فَقَدْ فَازَ فَوْزًا عَظِيمًا [الأحزاب 70، 71].

స్తోత్రములు మరియు దరూద్ తరువాత:

అన్నిటి కంటే ఉత్తమమైన మాట అల్లాహ్ మాట, మరియు అందరి కంటే ఉత్తమమైన పద్ధతి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పద్ధతి. అన్నిటి కంటే నీచమైనది ఇస్లాంలో కొత్తగా సృష్టించబడినవి. మరియు ఇస్లాంలో కొత్తగా సృష్టించబడిన ప్రతీ కార్యము బిద్అత్ క్రిందికే వస్తుంది. మరియు ప్రతీ బిద్అత్ మార్గభ్రష్టత్వము. మరియు ప్రతీ మార్గభ్రష్టత్వము నరకంలోకి తీసుకువెళ్ళేదే.      

ఓ విశ్వాసులారా! అల్లాహ్ కు  భయపడండి. ఆయన ఎల్లప్పుడు మిమ్మల్ని చూస్తున్నాడనే భావన కలిగి ఉండండి. ఆయనను అనుసరించండి మరియు ఆయన అవిధేయత నుండి దూరంగా ఉండండి.

అల్లాహ్ పై విశ్వాసం కొరకు నాలుగు విషయాలపై విశ్వాసం తప్పనిసరి అని తెలుసుకోండి:
(1) అల్లాహ్ సుబ్ హానహు వతఆలా[1] యొక్క ఉనికి పై విశ్వాసం,
(2) ఆయన రుబూబియత్[2] అనే విషయం పై విశ్వాసం,
(3) ఆయన ఉలూహియత్[3] పై విశ్వాసం.
(4) ఆయన శుభ నామములు, ఉత్తమ గుణాలపై విశ్వాసం.

ఈ ఖుత్బాలో మనము కేవలం ఆయన ఉనికి, అస్ధిత్వం పై విశ్వాసం (ఈమాన్) గురించి చర్చించుకుందాము.

అల్లాహ్ సుబ్ హానహు వతఆలా ఉనికి పై విశ్వాసం కొరకు (నాలుగు రకాల) ఆధారాలున్నాయి:
(1) సహజ స్వభావికమైనవి,
(2) హేతు బద్ధమైనవి,
(3) ధర్మపరమైనవి మరియు
(4) ఇంద్రియజ్ఞాన పరమైనవి.

[1] సహజ స్వభావము అల్లాహ్ ఉనికిని నిరూపిస్తుంది అనే విషయానికొస్తే, ప్రతి సృష్టి ఎవరి నుండి ఏ నేర్పు, శిక్షణ మరియు ముందు ఆలోచన లేకుండా తన సృష్టికర్తను విశ్వసించే సహజగుణం పైనే పుడుతుంది. దివ్య ఖర్ఆన్ లో ఈ ఆయతు దీనికి ఆధారము.

وَإِذْ أَخَذَ رَبُّكَ مِنْ بَنِي آدَمَ مِنْ ظُهُورِهِمْ ذُرِّيَّتَهُمْ وَأَشْهَدَهُمْ عَلَى أَنْفُسِهِمْ أَلَسْتُ بِرَبِّكُمْ قَالُوا بَلَى شَهِدْنَا

(నీ ప్రభువు ఆదం సంతతి వీపుల నుండి వారి సంతానాన్ని తీసి స్వయంగా వారిని వారికే సాక్షులుగా పెట్టి “నేను మీ ప్రభువును కానా” అని అడిగినప్పుడు “ఎందుకు కావు? (నువ్వే మా ప్రభువు) ఈ విషయానికి మేమంతా సాక్షులుగా ఉన్నాం” అని వారు చెప్పారు.) (అల్ ఆరాఫ్:172)

మానవుడి సహజ స్వభావములో అల్లాహ్ అస్థిత్వము పై విశ్వాసము ఉందని చెప్పడానికి ఈ ఆయతు ఆధారము. ఇక ఏదైనా బయటి ప్రభావం వల్లనే ఈ సహజ గుణం నుండి వైదొలగిపోతాడు. ఎందుకంటే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: ప్రతీ పిల్లవాడు సహజ స్వభావము పైనే పుట్టించబడతాడు. కాని వాడి తల్లిదండ్రులు వాడిని యూదుడిగా, క్రైస్తవుడిగా, మజూసీ (అగ్నిపూజారి)గే మార్చి వేస్తారు[4].

దీని వల్లే మానవుడికి ఏదైనా నష్టం జరిగినప్పుడు తమ సహజ స్వభావ ప్రకారంగా (తమ భాషలో) “ఓ అల్లాహ్” అని అరుస్తాడు.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలోని అవిశ్వాసులు కూడా అల్లాహ్ ఉనికిని విశ్వసించేవారు, అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

وَلَئِن سَأَلْتَهُم مَّنْ خَلَقَهُمْ لَيَقُولُنَّ ٱللَّهُ

(మిమ్మల్ని పుట్టించినదెవరని నువ్వు గనక వారిని అడిగితే “అల్లాహ్” అని వారు తప్పకుండా అంటారు.) (లుఖ్మాన్:25).

ఈ విషయంలో అనేక ఆయతులున్నాయి.

[2] ఇక హేతుబద్ధమైన రీతిలో అల్లాహ్ అస్థిత్వాన్ని నిరూపించే విషయానికొస్తే వాస్తవం ఏమిటంటే ముందు మరియు తరువాత వచ్చే జీవులన్నింటిని సృష్టించినవాడు ఒకడు తప్పకుండా ఉన్నాడు, ఆ సృష్టికర్తయే వీటన్నింటినీ ‌సృష్టించాడు. ఎందుకంటే ఏదైనా వస్తువు తనను తాను ఉనికిలోకి తెచ్చుకోవడం అసాధ్యం. అస్థిత్వం లేనిది తనను తాను సృష్టించుకోలేదు’

అదే విధంగా సృష్టితాలు ఏ సృష్టికర్త లేకుండా అకస్మాత్తుగా ఉనికిలోకి రావటం, రెండు కారణాల వలన అసాధ్యం.

మొదటి కారణము: ఉనికిలో ఉన్న ప్రతీదానిని ఉనికిలోకి తెచ్చేవాడు ఒకడు ఉండటం తప్పనిసరి, దీనిని బుద్ది మరియు షరీఅత్ (ఇస్లాం ధర్మశాస్త్రం) రెండూ నిరూపిస్తున్నాయి. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

أَمْ خُلِقُوا مِنْ غَيْرِ شَيْءٍ أَمْ هُمُ الْخَالِقُونَ ( الطور 35)

(ఏమిటి వీరు సృష్టికర్త ఎవరూ లేకుండానే వారంతట వారే పుట్టుకు వచ్చారా? లేక వారే స్వయంగా సృష్టి కర్తలా? ) (అల్ తూర్:35)

రెండవ కారణం: అద్భుతమైన వ్యవస్థలో, పరస్పర సామరస్యముతో ఈ సృష్టి ఉనికిలోకి రావడం, ఎటువంటి ఢీ మరియు ఘర్షణ లేకుండా వాటి కారణాలు మరియు కారకుల మధ్య మరియు స్వయం సృష్టితాల్లో ఉన్న పరస్పర గాఢమైన సంబంధం ఏ సృష్టికర్త లేకుండా అకస్మాత్తుగా ఉనికిలోకి వచ్చేసాయి అన్న మాటని పూర్తిగా తిరస్కరిస్తున్నాయి, ఎందుకుంటే అకస్మాత్తుగా ఉనికిలోకి వచ్చినది అస్తవ్యస్తంగా ఉంటుంది, అలాంటప్పుడు తన మనుగడ మరియు అభివృద్ధిలో ఈవిధమైన అద్భుత నిర్వాహణను కలిగి ఎలా ఉంటుంది? ఇప్పుడు శ్రద్ధగా అల్లాహ్ యొక్క మాటను వినండి.

لَا الشَّمْسُ يَنْبَغِي لَهَا أَنْ تُدْرِكَ الْقَمَرَ وَلَا اللَّيْلُ سَابِقُ النَّهَارِ وَكُلٌّ فِي فَلَكٍ يَسْبَحُونَ (40)

(చంద్రుణ్ణి పట్టుకోవటం సూర్యుని తరం కాదు, పగటిని మించి పోవటం రాత్రి వల్ల కాదు. అవన్నీ (తమ తమ నిర్ధారిత) కక్ష్యల్లో తేలియాడుతున్నాయి.) (యాసీన్:40)

ఒక పల్లెవాసితో నువ్వు నీ ప్రభువుని ఎలా గుర్తించావు అని అడిగితే అతను ఇలా సమాధానం ఇచ్చాడు: పేడను బట్టి జంతువును గుర్తించవచ్చు, అడుగు జాడలు ప్రయాణికుడిని నిరూపిస్తాయి. అలాంటప్పుడు నక్షత్రాలతో అలంకరించబడిన ఆకాశం, విశాలమైన మార్గాలు గల భూమి, అలలు ఆడించే సముద్రం విని మరియు చూసే సృష్టికర్తను నిరూపించటం లేదా?

అల్లాహ్ యొక్క అద్భుతమైన సృష్టిరాసుల్లో ఒకటి దోమ. అల్లాహు తఆలా అందులో కూడా అనేక వివేకాలను సమకూర్చి ఉంచాడు, అల్లాహ్ దానిలో జ్ఞాపక శక్తి, గుర్తించే, గమనించే శక్తి, తాకే, చూసే మరియు వాసన పీల్చే శక్తులను మరియు ఆహార ప్రవేశ మార్గం అమర్చాడు. కడుపు, నరాలు, మెదడు మరియు ఎముకలను నియమించాడు. సరియైన అంచనా వేసి మార్గం చూపాడో  మరియ ఏ వస్తువును అనవసరంగా సృష్టించలేదో  ఆయన పరమ పవిత్రుడు, సర్వలోపాలకు అతీతుడు.

ఒక కవి[5] అల్లాహ్ ను పొగుడుతూ ఇలా వ్రాసాడు:

يا من يرى مدَّ البعوض جناحها
ویری مناط عروقها في نحرها
Žویری خرير الدم في أوداجها
ويرى وصول غذى الجنين ببطنها
ویری مكان الوطء من أقدامها
ويرى ويسمع حِس ما هو دونها
امنن علي بتوبة تمحو بها

في ظلمة الليل البهيم الأليل
والمخ من تلك العظام النحَّل
متنقلا من مفصل في مفصل
في ظلمة الأحشا بغير تمقَّل
في سيرها وحثيثها المستعجل
في قاع بحر مظلم متهوّل
ما كان مني في الزمان الأول

చిమ్మని చికిటిలో దోమ విప్పే రెక్కను చూసే ఓ అల్లాహ్! ఆ దోమ మెడలో ఉన్న నరాల సంగమాన్ని చూసేవాడా! మరియు దాని సన్నని ఎముకలపై ఉన్న మాంసాన్ని చూసేవాడా! దాని నరాలలో ఉన్న రక్తము, శరీర ఒక భాగము నుండి మరో భాగానికి చేరే రక్త ప్రవాహాన్ని చూసేవాడా! దోమ కడుపులో పోషించబడుతున్న పిండాన్ని, ప్రేగుల చీకటి లోంచి ఎటువంటి శ్రమ లేకుండా చూసేవాడా! అది నడుస్తున్నప్పుడు, వేగంగా పరిగెత్తేటప్పుడు దాని అడుగు జాడలను చూసేవాడా! చిమ్మని చీకటి మరియు భయంకరమైన సమద్రము లోతులో ఉన్న అతి సూక్షమైన జీవులను చూసేవాడా! నా తౌబా స్వీకరించు మరియు నా పూర్వ పాపాలన్నింటినీ క్షమించు.

సారాంశం ఏమిటంటే ఈ సృష్టితాలు తమను తాము సృష్టించుకోలేనప్పుడు మరియు అవి అకస్మాత్తుగా ఉనికిలోకి రాలేనప్పుడు దీనీ అర్థం: వీటిని సృష్టించిన సృష్టికర్త ఒకడున్నాడు, ఆయనే అల్లాహ్!.

అల్లాహు తఆలా ఈ హేతుబద్ధమైన మరియు ఖచ్చితమైన ఆధారాన్ని సూరే తూర్ లో ఇలా ప్రస్తావించాడు:

أَمْ خُلِقُوا مِنْ غَيْرِ شَيْءٍ أَمْ هُمُ الْخَالِقُونَ (35)

(ఏమిటి వీరు సృష్టికర్త ఎవరూ లేకుండానే వారంతట వారే పుట్టుకు వచ్చారా? లేక వారే స్వయంగా సృష్టి కర్తలా?) (అల్ తూర్:35).

అంటే వారూ ఏ సృష్టికర్త లేకుండా పుట్టలేదు మరియు వారు స్వయాన్నీ సృష్టించుకోలేదు, అలాంటప్పుడు వారి సృష్టికర్త అల్లాహు తబారక వతఆలా అని స్పష్టమయింది.

అందుకనే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సూరె తూర్ పఠిస్తుండగా జుబైర్ బిన్ ముత్ఇమ్ రజియల్లాహు అన్హు వింటున్నప్పుడు ప్రవక్త ఇదే ఆయత్ వద్దకు చేరుకున్నప్పుడు జుబైర్ బిన్ ముత్ఇమ్ రజియల్లాహు అన్హు అప్పుడు అవిశ్వాసి, కాని ఇలా అన్నారు:“నా గుండె ఆగిపోతుందేమొ అనిపించింది. అప్పుడే మొదటి సారిగా నా మనసులో ఇస్లాం చోటుచేసుకుంది”[6].

బారకల్లాహు లీ వలకుం ఫిల్ ఖుర్ఆనిల్ అజీం, వనఫఅనీ వఇయ్యాకుం బిమా ఫీహి మినల్ ఆయాతి వజ్జిక్రిల్ హకీం, అఖూలు ఖౌలీ హాజా, వఅస్తగ్ ఫిరుల్లాహ లీ వలకుం ఫస్తగ్ఫిరూహ్, ఇన్నహూ హువల్ గఫూరుర్ రహీం.

(అల్లాహ్ నాపై, మీ పై ఖుర్ఆన్ శుభాలను అవతరింపజేయుగాకా! నాకూ, మీకూ అందులో ఉన్న వివేకము, లాభము ద్వారా ప్రయోజనం చేకూర్చుగాక! నేను నా మాటను ముగిస్తాను. మరియు నా కొరకు, మీ కొరకు క్షమాపణ కోరుతున్నాను మీరు కూడా కోరండి. నిస్సందేహంగా అల్లాహ్ చాలా క్షమించేవాడూ మరియు కరుణించేవాడూ)

అల్ హందులిల్లాహ్, వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్! అమ్మాబాద్.

[3] ఓ ముస్లిముల్లారా! అల్లాహ్ ఉనికి పై షరీఅత్ పరమైన అధారాల విషయానికొస్తే ఆకాశ గ్రంధాలన్నియూ అల్లాహ్ ఉనికిని నిరూపిస్తాయి? ఎందుకంటే ఈ గ్రంధాలు జీవులకు ఇహ పరలోకాల ప్రయోజనాలు చేకూర్చే ఆదేశాలతో అవతరించాయి. కావున ఈ గ్రంధాలు వివేకవంతుడైన, జీవుల లాభ, ప్రయోజనాల జ్ఞానమున్న ప్రభువు తరఫున అవతరించబడ్డాయి అని నిరూపిస్తున్నాయి. అందులో ఉన్న విశ్వ సమాచారాన్ని ప్రస్తుత పరిస్థితులు ధృవీకరిస్తున్నాయి, ఆయన ఇచ్చిన సమాచారం ప్రకారం అన్ని వస్తువులను సృష్టించగల సమర్ధత ఉన్న ప్రభువు తరపున అవతరించబడ్డాయని ఇవి (దైవ గ్రంధాలు) నిరూపిస్తున్నాయి.

ఇదే విధంగా ఖుర్ఆన్ యొక్క పరస్పర సామరస్యము, అందులో పరస్పర విభేధాలు లేకపోవటం, దాని ఒక భాగం మరో భాగాన్ని ధృవీకరించడం వివేకవంతుడు, జ్ఞానవంతుడైన అల్లాహ్ తరుఫు నుండి వచ్చిందని చెప్పటానికి ఇది ఖచ్చితమైన ఆధారము. అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు.

أَفَلَا يَتَدَبَّرُونَ الْقُرْآنَ وَلَوْ كَانَ مِنْ عِنْدِ غَيْرِ اللَّهِ لَوَجَدُوا فِيهِ اخْتِلَافًا كَثِيرًا (82)

(ఏమిటి వారు ఖుర్ఆన్ గురించి యోచన చేయరా? ఒక వేళ ఇది గనక అల్లాహ్ తరఫున కాక ఇంకొకరి తరఫున వచ్చి ఉంటే అందులో వారికీ ఎంతో వైరుధ్యం కనపడేది.) (అల్ నిసా:82).

ఏ ప్రభువైతే ఖుర్ఆన్ ద్వారా మాట్లాడాడో ఆ ప్రభువు యొక్క ఉనికిని నిరూపించే ఆధారము ఆయనే అల్లాహ్.

[4] ఇక ఇంద్రియ జ్ఞానం అల్లాహ్ అస్థిత్వాన్ని నిరూపించే విషయానికొస్తే, ఈ విషయం రెండు రకాలుగా నిరూపించవచ్చును.

మొదటి రకం: అల్లాహు తఆలా తనను పిలిచే వారి పిలుపును వినటం, కష్టాలలో ఉన్న వారికి సహాయం చేయటమనేది మనము వింటూ, చూస్తూ ఉంటాం. ఇది అల్లాహ్ ఉనికిని నిరూపించే ధృఢమైన ఆధారము ఎందుకంటే దుఆ స్వీకరించబడటము ద్వారా ఆయనను పిలిచే పిలుపును వినే మరియు చేసే దుఆను స్వీకరించేవాడు ఒకడు ఉన్నాడని తెలుస్తుంది. అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:

وَنُوحًا إِذْ نَادَى مِنْ قَبْلُ فَاسْتَجَبْنَا لَهُ فَنَجَّيْنَاهُ وَأَهْلَهُ مِنَ الْكَرْبِ الْعَظِيمِ (76)

(అంతకు ముందు నూహ్ మొర పెట్టుకున్నప్పటి సమయాన్ని కూడా గుర్తు చేసుకోండి. మేము అతని మొరను ఆలకించి ఆమోదించాము). (అల్ అంబియా:76).

ఇదే విధంగా అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

إِذْ تَسْتَغِيثُونَ رَبَّكُمْ فَٱسْتَجَابَ لَكُمْ أَنِّى مُمِدُّكُم بِأَلْفٍۢ مِّنَ ٱلْمَلَـٰٓئِكَةِ مُرْدِفِينَ

(సహాయం కోసం మీరు మీ ప్రభువును మొరపెట్టుకున్న ఆ సందర్భాన్ని కూడా జ్ఞప్తికి తెచ్చుకోండి. మరియు అల్లాహ్ మీ మొరను ఆలకించాడు కూడా). (అల్ అన్ ఫాల్:9).

అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు: ఒక వ్యక్తి జుమా రోజు మింబర్ కి ఎదురుగా ఉన్న తలుపు నుండి మస్జిదె నబవీలోకి వచ్చాడు, మహా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిలబడి ఖుత్బా ఇస్తున్నారు, అతను ప్రవక్తకు ఎదురుగా నిలబడి అన్నాడు: వర్షాలు కురవక జంతువులు చనిపోయాయి, మార్గాలు మూత పడిపోయాయి, కావున మీరు వర్షాల కొరకు అల్లాహ్ తో దుఆ చేయండి, ఇది విన్న వెంటనే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం (దుఆ కొరకు) చేతులు ఎత్తి:

اللَّهُمَّ اسْقِنَا، اللَّهُمَّ اسْقِنَا، اللَّهُمَّ اسْقِنَا

ఓ అల్లాహ్ మాకు నీరు (వర్షం) కురిపించు, ఓ అల్లాహ్ మాకు నీరు (వర్షం) కురిపించు, ఓ అల్లాహ్ మాకు నీరు (వర్షం) కురిపించు.

అనస్ రజియల్లాహు అన్హు ఇలా అన్నారు: అల్లాహ్ సాక్షిగా! ఆకాశంలో దూర దూరం వరకు మేఘాలుగానీ, మేఘపు ముక్కగానీ లేదా మరే విషయం (అంటే వర్షానికి చిహ్నంగా గాలి మొదలుగునవి) ఇంకా మా మధ్య మరియు సల్అ కొండ మధ్య మబ్బు ఉన్నా కనిపించకపోవటానికి ఏ ఇల్లు కూడా లేదు, కొండ వెనుక నుండి ఢాలుకి సమానమైన మేఘాలు వస్తూ కనిపించాయి, ఆకాశానికి మధ్యలో చేరాయి, నలువైపులా క్రమ్ముకున్నాయి, వర్షం కురవటం మొదలైపోయింది, అల్లాహ్ సాక్షిగా! ఒక వారము వరకు మేము సూర్యుడ్ని చూడలేదు, తర్వాత జుమా రోజున ఆ/ఓ వ్యక్తి అదే తలుపు నుండి లోపలికి వచ్చాడు, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిలబడి ఖుత్బా ఇస్తున్నారు, ఆ వ్యక్తి నిలబడి మాట్లాడుతూ ఓ ప్రవక్తా! వర్షం ఎక్కువగా కురవడం వల్ల సంపద నాశనం అయిపోయింది, మార్గాలు మూతపడిపోయాయి, వర్షాలు ఆగిపోవాలని అల్లాహ్ తో దుఆ చేయండి. అప్పుడు మహాప్రవక్త చేతులెత్తి ఇలా దుఆ చేసారు:

اللهُمَّ حَوْلَنَا وَلَا عَلَيْنَا، اللهُمَّ عَلَى الْآكَامِ، وَالظِّرَابِ، وَبُطُونِ الْأَوْدِيَةِ، وَمَنَابِتِ الشَّجَرِ

ఓ అల్లాహ్! మాపై కాకుండా, మా చుట్టు ప్రక్కన వర్షం కురిపించు, దిబ్బల పై, పర్వతాలపై, కొండలపై, లోయల్లో మరియు తోటల్లో.

ఈ దుఆ తరువాత వర్షం ఆగిపోయింది, మేము ఎండలో బయటకు వచ్చాము.

ఎవరు స్వచ్ఛ మనస్సుతో అల్లాహ్ వైపునకు మరళి, దుఆ స్వీకరించబడే సాధనాలతో అల్లాహ్ ను అల్లాహ్ తో దుఆ చేస్తే, (అల్లాహ్ తప్పకుండా స్వీకరిస్తాడని, స్వీకరిస్తున్నాడని) ఈ రోజు కూడా దుఆ స్వీకరించబడే సందర్భాలను, అద్భుతాలు చూడవచ్చు.

ఇంద్రియ జ్ఞానం అల్లాహ్ ఉనికిని నిరూపించే రెండో రకం: ప్రవక్తలకు అల్లాహ్ ఇచ్చిన అద్భుతాలు. వాటిని ప్రజలు చూస్తూ వింటూ, ఉంటారు. ఇవి కూడా ప్రవక్తులను పంపిన అల్లాహ్ ఉనికిని నిరూపించే ఖచ్చిత ఆధారాలు. ఎందుకంటే ఇవి మానవుడితో సాధ్యమయ్యేవి కావు. అల్లాహ్ ప్రవక్తలకు మద్దతు పలుకుతూ వారికి (ఈ అద్భుతాలు) ప్రసాదిస్తాడు.

ఉదాహరణకు: మూసా అలైహిస్సలాం వారికి ప్రసాదించిన అద్భుతం: ఎప్పుడైతే అల్లాహ్ మూసా అలైహిస్సలాంకి తన లాఠీను సముద్రంపై కొట్టమని ఆజ్ఞాపించాడో, అప్పుడు ఆయన కొట్టారు, దాని వలన పన్నెండు పొడి మార్గాలు ఏర్పడి వారి ముందు నీరు కొండ మాదిరిగా నిలబడింది.

ఓ విశ్వాసులారా! అల్లాహ్ ఉనికిని విశ్వసించాలని సహజస్వభావము మరియు ఇంద్రియ జ్ఞానం నిరూపిస్తున్నాయి కాబట్టి ప్రవక్తలు తమ జాతి వారితో ఇలా అన్నారు:

أَفِي اللَّهِ شَكٌّ فَاطِرِ السَّمَاوَاتِ وَالْأَرْضِ ۖ

(ఏమిటీ? భూమ్యాకాశాల నిర్మాత అయిన అల్లాహ్‌పైనే మీకు అనుమానం ఉందా?) (ఇబ్రాహీం:10).

సారాంశం ఏమిటంటే అల్లాహ్ ఉనికి పై విశ్వాసం మానవుడి సహజ స్వభావములో స్థిరపడి ఉంది. బుద్ధి (తెలివి), ఇంద్రియ జ్ఞానం మరియు షరీఅత్ లో తెలిసిన విషయమే.

అల్లాహ్ మీపై కరుణించుగాక, తెలుసుకోండి! అల్లాహ్ మీకు ఒక గొప్ప సత్కార్యం గురించి ఆజ్ఞాపించాడు.

إِنَّ اللَّهَ وَمَلَائِكَتَهُ يُصَلُّونَ عَلَى النَّبِيِّ يَاأَيُّهَا الَّذِينَ آمَنُوا صَلُّوا عَلَيْهِ وَسَلِّمُوا تَسْلِيمًا (56)

(నిశ్చయంగా అల్లాహ్‌, ఆయన దూతలు కూడా దైవప్రవక్తపై సలాత్ (దరూద్) పంపిస్తున్నారు. ఓ విశ్వాసులారా! మీరు కూడా ఆయనపై దరూద్‌ పంపండి, అత్యధికంగా ఆయనపై సలాములు పంపండి.) (అల్ అహ్ జాబ్:56).

అల్లాహుమ్మ సల్లి వసల్లిమ్ అలా అబ్దిక వరసూలిక ముహమ్మద్, వర్ జ అన్ అస్ హాబిహిల్ ఖులఫా, వమన్ తబిఅహుమ్ బిఇహ్సానిన్ ఇలా యౌమిద్దీన్. అల్లాహుమ్మ అఇజ్జల్ ఇస్లామ వల్ ముస్లిమీన్, వఅజిల్లష్ షిర్క వల్ ముష్రికీన్, వదమ్మిర్ అఅదాఅక అఅదాఇద్దీన్, వన్సుర్ ఇబాదకల్ మువహ్హిదీన్.

ఓ అల్లాహ్ మా దేశాలలో భద్రతను ప్రసాదించు మా నేతల వ్యవహారాన్ని సరిదిద్దు, సన్మార్గం చూపే మరియు సన్మార్గంపై నడిచే వారీగాచేయి.

ఓ అల్లాహ్ మా పరిపాలకులకు నీ గ్రంధానికి కట్టుబడి ఆజ్ఞాపాలన చేసే భాగ్యాన్ని ప్రసాదించు. ఓ అల్లాహ్ మాపాపాలను మరియు మాఆచరణలో ఏర్పడిన కొరతను క్షమించు.

ఓ అల్లాహ్ మాకు ఈ ప్రపంచంలో పుణ్యాన్ని పరలోకంలో సాఫల్యాన్ని ప్రసాదించు, నరక శిక్షల నుండి మమ్ములను కాపాడు.

سبحان ربك رب العزة عما يصفون وسلام على المرسلين والحمد لله رب العالمين


[1] ‘సుబ్ హానహు’ అంటే అన్ని లోపాలకు అతీతుడు. ‘తఆలా’ అంటే మహోన్నతుడు.

[2] రుబూబియత్ అంటే పుట్టించడం, పోషించడం మరియు విశ్వ నిర్వహణ (నడపడం).

[3] ఉలూహియత్ అంటే అన్ని రకాల ఆరాధనలు, భక్తిభావంతో చేసే పూజలు.

[4] బుఖారీ1359లో అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖనం.

مَا مِنْ مَوْلُودٍ إِلَّا يُولَدُ عَلَى الْفِطْرَةِ، فَأَبَوَاهُ يُهَوِّدَانِهِ وَيُنَصِّرَانِهِ وَيُمَجِّسَانِهِ،

[5] షిహాబుద్దీన్ అహ్మద్ అల్ అబ్ షీహీ గారు తమ పుస్తకం “అల్ ముస్తత్రఫ్ ఫీ కుల్లి ఫన్నిమ్ ముస్తజ్రఫ్” లోని 62వ చాప్టర్ లో ఈ పద్యాలను ప్రస్తావించారు.

[6] ఇమాం బుఖారీ దీని భిన్నమైన భాగాలను వేర్వేరు స్థలాల్లో ఉల్లేఖించారు. 4023, 4853.

రచన : మాజిద్ బిన్ సూలైమాన్ అర్రస్సీ
జుబైల్ పట్టణం, సౌదీ ఆరేబియ
అనువాదం: అబ్దుల్లాహ్ జామయి

పుస్తకం నుండి – ఇస్లామీయ జుమా ప్రసంగాలు – షేఖ్ మాజిద్ బిన్ సులైమాన్