రుకూ, సజ్దా సరిగా నెరవేర్చని వ్యక్తి యొక్క ఉదాహరణ [తప్పక వినండి] [ఆడియో & టెక్స్ట్]

రుకూ, సజ్దా సరిగా నెరవేర్చని వ్యక్తి యొక్క ఉదాహరణ
https://youtu.be/Pj0-SewzPaA [6 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సరిగ్గా నమాజ్ చేయని వ్యక్తిని చూసి, అతనిని చాలా ఆకలితో ఉండి ఒకటి లేదా రెండు ఖర్జూరాలు మాత్రమే తిన్న వ్యక్తితో పోల్చారు. ఎలాగైతే ఆ కొద్దిపాటి ఆహారం ఆకలిని తీర్చదో, అలాగే అసంపూర్ణమైన రుకూ మరియు సజ్దాలతో చేసే నమాజ్ ఆత్మకు పోషణ ఇవ్వదని వివరించారు. నమాజ్ అనేది విశ్వాసుల హృదయాలకు ఆహారం లాంటిదని, దానిని సంపూర్ణంగా, ఉత్తమ రీతిలో చేయడం ద్వారానే ఆత్మకు, మనస్సుకు కావలసినంత పోషణ లభిస్తుందని తెలిపారు. సరిగ్గా నమాజ్ చేయని వ్యక్తి తన ఆత్మను పస్తులు ఉంచినట్లేనని, దానివల్ల ఆత్మ అనారోగ్యానికి గురై చివరకు “చనిపోతుందని” (ఆధ్యాత్మికంగా నిర్జీవమవుతుందని) హెచ్చరించారు. ఈ “ఆత్మ మరణం” అనేది భౌతిక మరణం కాదని, అల్లాహ్ స్మరణ, ఆరాధనల నుండి దూరం కావడం అని స్పష్టం చేశారు.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి ఒక వ్యక్తిని చూశారు, నమాజ్ చేస్తున్నది. కానీ ఆ వ్యక్తి ఎలా నమాజ్ చేస్తున్నాడు?

لَا يُتِمُّ رُكُوعَهُ وَلَا سُجُودَهُ
(లా యుతిమ్ము రుకూఅహూ వలా సుజూదహూ)
అతను రుకూ మరియు సజ్దాలను సరిగ్గా చేయడం లేదు.

يَنْقُرُ صَلَاتَهُ كَمَا يَنْقُرُ الْغُرَابُ
(యన్ఖురు సలాతహు కమా యన్ఖురుల్ గురాబ్)
కాకి ఎలా చుంచు కొడుతుందో విత్తనం ఎత్తుకోవడానికి, ఆ విధంగా అతను నమాజ్ చేస్తున్నాడు.

అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు:

إِنَّ مَثَلَ الَّذِي يُصَلِّي وَلَا يُتِمُّ رُكُوعَهُ وَلَا سُجُودَهُ
(ఇన్న మసలల్లదీ యుసల్లీ వలా యుతిమ్ము రుకూఅహూ వలా సుజూదహూ)
ఎవరైతే ఈ విధంగా నమాజ్ చేస్తున్నారో, అందులో రుకూ కూడా సరిగ్గా చేయడం లేదు, సజ్దా కూడా సరిగ్గా చేయడం లేదు,

كَمَثَلِ الَّذِي يَأْكُلُ التَّمْرَةَ وَالتَّمْرَتَيْنِ
(క మసలిల్లదీ య’కులుత్తమ్రత వత్తమ్రతైన్)
అతని ఉదాహరణ, దృష్టాంతం ఎలాంటిదంటే, చాలా ఆకలిగా ఉండి కేవలం ఒక్క ఖర్జూరము లేదా రెండు ఖర్జూరపు ముక్కలు తిన్న వాని మాదిరిగా,

لَا يُغْنِيَانِ عَنْهُ شَيْئًا
(లా యుగ్నియాని అన్హు షైఆ)
ఆ ఒక్క రెండు ఖర్జూరపు ముక్కలు అతని యొక్క ఆకలిని తీర్చవు.

فَأَتِمُّوا الرُّكُوعَ وَالسُّجُودَ
(ఫఅతిమ్ముర్రుకూఅ వస్సుజూద్)
మీరు నమాజులలో రుకూ సజ్దాలు పూర్తిగా చెయ్యండి, సంపూర్ణంగా చెయ్యండి, సరిగ్గా చెయ్యండి.

ఇమామ్ ముందిరి రహిమహుల్లాహ్ ఈ హదీథ్ ను హసన్ కోవకు చెందినది అని చెప్పారు. అయితే ఇమామ్ ఇబ్ను రజబ్ రహిమహుల్లాహ్ చెప్పారు, ఈ హదీథ్ లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏ ఉదాహరణ, దృష్టాంతం తెలియజేశారో అది చాలా గొప్పది, చాలా ఉత్తమ రీతిలో తెలియజేశారు.

ఎలాగైతే ఆకలి ఉన్న వానికి ఒక ఖర్జూరపు, రెండు ఖర్జూరపు ముక్కలు అతని ఆకలిని తీర్చలేవో, ఇలా రుకూ సజ్దాలు సరిగ్గా చేయకుండా నమాజును తొందరపాటుతో చేసేవాడు వాస్తవానికి అతడు నమాజ్ ఏదైతే విశ్వాసుల హృదయాలకు ఆహారంగా ఉందో, ఆ ఆహారం అతడు తీసుకోని వాడవుతాడు.

వాస్తవానికి నమాజ్ అల్లాహ్ యొక్క ధిక్ర్, అల్లాహ్ తో వేడుకోలు, అల్లాహ్ సాన్నిధ్యానికి చేరవేసే, అల్లాహ్ కు చాలా దగ్గరగా చేసే సత్కార్యాల్లో గొప్ప సత్కార్యం. ఇక ఎవరైతే ఈ నమాజ్ సంపూర్ణంగా, మంచి ఉత్తమ రీతిలో చేస్తారో అతడే తన ఆత్మకు, తన మనస్సుకు కావలసినంత ఆహారం ఇచ్చిన వాడవుతాడు. మరి ఎవరైతే నమాజ్ సరియైన రీతిలో చెయ్యడో, టక్కు టిక్కు మని, ఎక్స్ప్రెస్ నమాజ్, ఇలా చూసి అలా చూసేసరికి అల్లాహు అక్బర్ అని మొదలవుతుంది, అస్సలాము అలైకుం అని పూర్తయిపోతుంది, ఇలాంటి నమాజ్ ద్వారా అతడు తన హృదయ, తన మనస్సుకు కావలసిన, తన ఆత్మకు కావలసిన ఆహారాన్ని సరిగా ఇవ్వలేదు. ఇక ఎలాగైతే మనిషికి కావలసినంత ఆహారం దొరకకుంటే చనిపోతాడో, అనారోగ్యానికి గురవుతాడో అలాగే ఎప్పుడైతే హృదయానికి, ఆత్మకు, మనస్సుకు దాని ఆహారం దొరకదో అది కూడా అనారోగ్యానికి గురి అవుతుంది మరియు అది కూడా చనిపోతుంది. మనిషి యొక్క చావు అంత నష్టమైనది కాదు, ఆత్మ చనిపోయిందంటే అది చాలా పెద్ద నష్టం.

ఏమైనా అర్థమైందా అండీ మీకు ఇప్పుడు చెప్పిన మాటలతో?

ప్రశ్న మరియు జవాబు

ఆత్మ చనిపోవడం అంటే, ఇది ఒక ఉదాహరణగా. ఆత్మ చనిపోవడం అంటే ఆత్మకు కావలసిన ఆహారం ఇవ్వకపోవడం. ప్రాపంచిక పరంగా బ్రతికి ఉన్నప్పటికీ, అల్లాహ్ యొక్క ధిక్ర్ తో, అల్లాహ్ యొక్క ఆరాధనతో, అల్లాహ్ యొక్క స్మరణతో, ఖురాన్ యొక్క తిలావత్ తో దానికి ఏ ఆహారం అవసరం ఉంటుందో, అది దానికి చేరనీయకపోవడం. ఇక్కడ ఆత్మ చనిపోవడం అంటే మనం ఫిజికల్ గా, లేదా కొన్ని సందర్భాల్లో హాస్పిటల్ పరంగా ఏదైతే మాటలు మాట్లాడతారో ఇతని యొక్క మెదడు చనిపోయింది, ఆ మైండ్ డెత్ అని, ఆత్మ డెత్, ఇలాంటి విషయం ఇక్కడ కాదు. ఇక్కడ చనిపోవడం అంటే, “అరే ఏందిరా, నువ్వు జీవితం, ఏదైనా జీవితమా? నీదే బ్రతుకు, ఏదైనా బ్రతుకా? చనిపోయిన శవం కంటే అధ్వానం రా నువ్వు!” ఇలా మనం ఎప్పుడు అంటాము? ఆ మనిషి బ్రతికి కూడా సరియైన పనులు చేయకుంటే అంటాము కదా, ఆ విధంగా. ఇన్షా అల్లాహ్ మాట అర్థమైందని భావిస్తున్నాను.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=15701

క్విజ్: 77: ప్రశ్న 03: రుకు మరియు సజ్దాలో దువా [ఆడియో]

బిస్మిల్లాహ్

తెలుగులో ఇస్లామిక్ క్విజ్ 77వ భాగం 3వ ప్రశ్న సిలబస్:

البخاري 4967:- عَنْ عَائِشَةَ رَضِيَ اللَّهُ عَنْهَا قَالَتْ : مَا صَلَّى النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ صَلَاةً بَعْدَ أَنْ نَزَلَتْ عَلَيْهِ : { إِذَا جَاءَ نَصْرُ اللَّهِ وَالْفَتْحُ } إِلَّا يَقُولُ فِيهَا : ” سُبْحَانَكَ رَبَّنَا وَبِحَمْدِكَ، اللَّهُمَّ اغْفِرْ لِي “.

ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖించారు, ప్రవక్తపై సూర నస్ర్ అవతరించిన తరువాత రుకూ మరియు సజ్దా లో ఈ దుఆ చదివేవారు:

సుబ్ హానకల్లాహుమ్మ రబ్బనా వ బిహందిక అల్లాహుమ్మగ్ ఫిర్లీ
(ఓ అల్లా నీవు ఎంతో పరిశుద్ధునివి, పవిత్రునివి, ఓ మా ప్రభువా! నీకే సర్వ స్తోత్రములు, ఓ అల్లాహ్! నన్ను క్షమించు).

సర్వ సామాన్యంగా మనకు తెలిసిన దుఆలలో రుకూలో సుబ్ హాన రబ్బియల్ అజీం మరియు సజ్దా లో సుబ్ హాన రబ్బియల్ అఅలా చదువుతాము.కానీ ఈ ఒక్క దుఆ కాకుండా ఇంకా ఎన్నో దుఆలున్నాయి. మీరు మా చిన్న పుస్తకం ఎల్లవేళలలో మీ వెంట ఉంచుకోండి. దాని పేరు: రేయింబవళ్ళ ముఖ్యమైన దుఆలు

ఇక్కడ ఆడియో వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి (3:56 నిముషాలు)

ఆడియో విన్న తర్వాత క్రింది ప్రశ్న ట్రై చెయ్యండి

(3) దైవప్రవక్త (ﷺ) వారిపై సురహ్ నస్ర్ అవతరించినస్పటి నుండి రుకు మరియు సజ్దా లో ఏ దువా చదివేవారు?

A] సుబ్ హానకల్లాహుమ్మ రబ్బనా , వబిహందిక అల్లాహుమ్మగ్ ఫిర్లీ
B] సుబ్ హన రబ్బియల్ అజీం
C] సుబ్ హానల్లాహి వబి హందిహి

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

తెలుగు ఇస్లామిక్ క్విజ్ (ఆడియో సిరీస్) మెయిన్ పేజీ :
https://teluguislam.net/others/telugu-islamic-quiz

ఇంకా క్రింది పోస్టులు చదవండి:

ప్రశాంతంగా రుకూ చేయటం తప్పనిసరి (వాజిబ్‌)

బిస్మిల్లాహ్

రుకూ

ఖుర్‌ఆన్‌ పఠనం పూర్తయిన తర్వాత దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కాసేపు అలాగే మౌనంగా [303] నిలబడి ఉండేవారు. ఆ తర్వాత ఇంతకు ముందు ‘తక్బీరే తహ్రీమా’ అంశం క్రింద వివరించినట్టుగా చేతులు పైకెత్తేవారు (రఫయదైన్‌ చేసేవారు).[304] తదుపరి “అల్లాహు అక్బర్” [305] అంటూ రుకూలోకి వెళ్ళిపోయేవారు. [306]

నమాజ్‌ను సరిగా నెరవేర్చని వ్యక్తి“కి ఈ రెండు విషయాల గురించి ఆజ్ఞాపిస్తూ దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా అన్నారు:

“నమాజ్‌ చేసే వ్యక్తి ఎవరయినా ముందుగా అల్లాహ్‌ ఆదేశించినదాని ప్రకారం చక్కగా వుజూ చేసుకోవాలి. తర్వాత “అల్లాహు అక్బర్” అని చెబుతూ అల్లాహ్‌ను స్తుతించాలి, ఆయన పవిత్రతను కొనియాడాలి. ఆ తర్వాత ఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ తనకు నేర్పించిన దానిలో, తనకు అనుమతి ప్రసాదించిన దానిలో తనకు వీలు కలిగినంత పఠనం చేయాలి. ఆ తర్వాత “అల్లాహు అక్బర్‌” అంటూ రుకూ చేయాలి. దేహంలోని కీళ్ళన్నీ వాటి వాటి స్థానాల్లో కుదుటపడి, ప్రశాంతతను పొందే విధంగా రుకూలో రెండు చెతుల్ని మోకాళ్ల చిప్పలపై ఉంచాలి. ….(సశేషం) ఈ విధంగా చేయని వారెవరైనా, వారి నమాజు సంపూర్ణమైనదిగా భావించబడజాలదు.”” [307]

రుకూ చేసే పద్దతి

“రుకూ స్థితిలో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తన అరచేతుల్నిమోకాళ్ల మీద ఉంచేవారు”,[308] “అలా చేయమని ఆయన ప్రజలకు సయితం ఆదేశించేవారు”.[309] ఈ విధంగా చేయమని ఆయన “నమాజ్‌ సరిగా నెరవేర్చని వ్యక్తి“కి కూడా ఆజ్ఞాపించి ఉన్నారు. కొన్ని వాక్యాల క్రితమే ఈ విషయం గడిచింది.

“రుకూలో ఆయన తన రెండు చేతులతో మోకాళ్లను పట్టుకొని ఉన్నట్లుగా వాటిని గట్టిగా అదిమి ఉంచేవారు”[310] “ఆ సమయంలో చేతివేళ్లను విశాలంగా ఉంచుతారు”. [311] “నమాజ్‌ను సరిగా నెరవేర్చని వ్యక్తి”కి ఇలా చేయమని ఆజ్ఞాపిస్తూ ఆయన “రుకూ చేసినప్పుడు నీ అరిచేతుల్ని మోకాళ్ల మీద పెట్టుకో. చేతివ్రేళ్లను వదులుగానూ, విశాలంగానూ ఉంచు. ప్రతి అవయవం తన స్థానంలోకి వెళ్ళిపోయే వరకు అదే స్థితిలో ఉండు” అని పురమాయించారు.[312] రుకూ స్థితిలో ఆయన తన మోచేతుల్ని ప్రక్కలకు ఎడంగా ఉంచేవారు.[313] రుకూలో వీపును విశాలంగా,[314] నీళ్లు పోసినా అటూ ఇటూ జారిపోనంత తిన్నగా ఉంచేవారు.[315]

“రుకూ స్థితిలో నీ అరచేతుల్ని మోకాళ్ళ మీద పెట్టుకో. వీపును పొడుగ్గా ఉంచు. రుకూ స్థితికి బలాన్నివ్వు” అని ఆయన “నమాజును సరిగా నెరవేర్చని వ్యక్తి“కి సూచించారు.[316] రుకూలో తలను ఆయన వంచిగాని, పైకెత్తిగాని ఉంచేవారు కాదు.[317] పైగా ఆయన (రుకూ స్థితిలో) తన తలను వీపుకు సమాంతరంగా ఉంచేవారు. [318]

ప్రశాంతంగా రుకూ చేయటం తప్పనిసరి (వాజిబ్‌)

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఎంతో ప్రశాంతంగా రుకూ చేసేవారు. అలా చేయమని ఆయన “నమాజును సరిగా నెరవేర్చని వ్యక్తి“కి కూడా ఆదేశించి ఉన్నారు. గత అంశం ప్రారంభంలో దీని ప్రస్తావన వచ్చింది.

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా అంటుండేవారు: “మీరు రుకూ మరియు సజ్దాలు బాగా చేయండి. ఎవరి చేతిలో నా ప్రాణముందో ఆయన సాక్షిగా చెబుతున్నాను. మీరు రుకూ చేసినప్పుడు, సజ్దా చేసినప్పుడు నేను మిమ్మల్ని నా వెనుక వైపు నుంచి చూస్తూ ఉంటాను.” [319]

ఒకతను నమాజు చేస్తున్నాడు. కాని అతను రుకూ సరిగా చేయటం లేదు. సజ్దా కూడా చాలా తొందరతొందరగా చేస్తున్నాడు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అతన్ని చూసి, “ఒకవేళ ఇతనికి ఇదే స్థితిలో మరణం గనక వస్తే ఇతను ముహమ్మద్‌ ప్రవక్త ధర్మంపై మరణించినట్లు కాదు. (కాకి నెత్తురులో ముక్కు పొడిచినట్లు ఇతను చాలా వేగంగా నమాజ్‌ చేస్తున్నాడు). రుకూ సరిగ్గా నెరవేర్చకుండా సజ్దాలు కూడా సుడిగాలిలా చేసే వ్యక్తి బాగా ఆకలితో ఉండి, ఒకటి రెండు ఖర్జూర పండ్లు తిన్నప్పటికీ ఆకలి చల్లారని మనిషిలాంటివాడు” అని చెప్పారు. [320]

తన ముక్కును నేలకేసి పొడిచే కోడి లాగా నమాజులో తొందర చేయవద్దని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తనకు ఉపదేశించారనీ, నమాజులో నక్క లాగా కుడి ఎడమలు దిక్కులు చూడవద్దని తనను ఆదేశించారని, కోతి లాగా పిరుదుల్ని చేతులను నేలకు ఆనించి పెట్టి, పిక్కలను, తొడలను నిలబెట్టి కూర్చో రాదని కూడా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తనకు ఆదేశించారని అబూ హురైరా (రజిఅల్లాహు అన్హు)  తెలియజేశారు. [321]

“నమాజు నుండి దొంగిలించేవాడు అందరిలోకెల్లా చెడ్డ దొంగ” అని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అన్నారు. ఈ మాట విని ఆయన సహచరులు (ఆశ్చర్య పోయారు). “దైవవక్తా! అసలు ఎవరైనా నమాజులో నుండి ఎలా దొంగిలిస్తారు?” అని అడిగారు. దాని కాయన “అంటే అతను రుకూ, సజ్దాలు పూర్తిగా నెరవేర్చడు” అంటూ తన మాటకు అర్ధం చెప్పారు. [322]

ఒకతను నమాజు చేస్తూ రుకూ, సజ్దాల్లో వీపుని తిన్నగా ఉంచటం లేదు (దగ్గర్లో) నమాజు చేస్తున్న దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తన క్రీగంట చూపులతో అతన్ని గమనించారు. నమాజు పూర్తయిన తర్వాత ఆయన అందర్ని ఉద్దేశించి “ముస్లింలారా! రుకూ, సజ్దాల్లో తమ వీపుల్ని తిన్నగా ఉంచని వారి నమాజు నెరవేరదు” అని హెచ్చరించారు. [323]

మరో హదీసు ప్రకారం ఆయన “రుకూ, సజ్దాల్లో వీపుని తిన్నగా ఉంచి చేయబడని నమాజు సరిపోదు” అని అన్నారు. [324]

 

హదీసు రెఫరెన్సులు:

[303]. అబూదావూద్‌, హాకిమ్‌ దీనిని సహీగా ఖరారు చేశారు, జహబీ దీనితో ఏకీభవించారు. ఈ మౌనం కేవలం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రశాంతంగా శ్వాస తీసుకోగలిగినంత పరిమాణంలో వుండేదని ఇబ్నె ఖయ్యూం (రహిమహుల్లాహ్‌) అభిప్రాయ పడ్డారు.

[304,305,306]. బుఖారీ, ముస్లిం.

ఈ రఫయదైన్‌ మరియు దీనితోపాటు రుకూ నుండి లేచేటప్పుడు చేసే రఫయదైన్‌ దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ద్వారా ఎన్నో పరంపరలతో నిరూపించబడి ఉంది. ముగ్గురు ఇమాములు, ఎంతో మంది హదీసువేత్తలు. ధార్మికజ్ఞానుల అభిమతం కూడా ఇదే. తారీఖ్‌ ఇబ్నె అసాకిర్‌ (15/78/2) నందు ఇమామ్‌ మాలిక్‌ జీవితాంతం దీనిపై ఆచరించారని వుంది. కొందరు హనఫీ ఉలమాలు కూడా దీనిని యిష్టపడ్డారు. వీరిలో ఇమామ్‌ అబూ యూసుఫ్‌ శిష్యులు ఇసామ్‌ బిన్‌ యూసుఫ్‌ ఖల్‌బీ (మరణం 210 హి.) కూడా ఒకరు. ఆయన గురించి యిది వరకే వివరించబడింది.

అబ్బుల్లా ఇబ్నె అహ్మద్‌ తన ‘మసాయల్’  – 60వ పేజీలో తన తండ్రి ద్వారా యిలా ఉల్లేఖించారు: ఉఖ్బా బిన్‌ ఆమిర్‌ (రజి అల్లాహు అన్హు) ద్వారా నమాజులో రఫయదైన్‌ గురించి యిలా ఉల్లేఖించబడింది: ఒక్కో రఫయదైన్‌కు బదులుగా పదిపుణ్యాలు దొరుకుతాయి.

నేను చెప్పేదేమిటంటే – ఉఖ్బా బీన్‌ ఆమిర్‌ మాట – బుఖారీ, ముస్లింలోని ఎవరైనా ఏదైనా సత్మార్యం చేయాలని సంకల్పించుకొని, తదుపరి దానిని పూర్తి చేస్తే దానికి బదులుగా అతనికి 10 నుంది 700 పుణ్యాలు దొరుకుతాయి అన్న హదీసుకు అనుగుణంగా వుంది. మరిన్ని వివరాల కోసం ‘సహీ అత్తర్‌గీబ్‌- 16వ పేజీ చూడగలరు.

[307]. అబూదావూద్‌,నసాయి. హాకిమ్‌ దీనిని సహీగా ఖరారు చేశారు మరియు జహబీ దీనితో ఏకీభవించారు.

[308]. బుఖారీ, అబూదావూద్‌.

[309]. బుఖారీ, ముస్లిం.

[310]. బుఖారీ, అబూ దావూద్‌.

[311]. హాకిమ్‌ దీనిని సహీగా ఖరారు చేశారు, జహబీ కూడా దీనితో ఏకీభవించారు. అబూదావూద్‌, తయాలిసీ కూడా దీనిని ఉల్లేఖించారు. దీని తఖ్రీజ్‌ – సహీ అబూదావూద్‌: 809 నందు చేయబడింది.

[312]. సహీ ఇబ్నె ఖుజైమా, సహీ ఇబ్నె హిబ్బాన్‌.

[313]. తిర్మిజి, ఇబ్నె ఖుజైమా దీనిని సహీగా ఖరారు చేశారు.

[314]. బైహఖీ – సహీ బుఖారీ పరంపరతో.

[315]. తబ్రానీ – మోజమిల్‌ కబీర్‌ వ సగీర్‌, జవాయెద్‌ ముస్నద్‌ అబ్దుల్లా  బిన్‌ అహ్మద్‌,ఇబ్నెమాజా.

[316]. అహ్మద్‌, అబూదావూద్‌ – సహీ పరంపరతో.

[317]. అబూదావూద్‌, బుఖారీ – జుజ్‌ అల్‌ ఖీరా ఖలఫుల్‌ ఇమామ్‌ – సహీ పరంపరతో

[318]. ముస్లిం, అబూ ఆవాన

[319]. బుఖారీ, ముస్లిం. నేను చెప్పదేమిటంటే – ఇలా చూడగలగడం ఒక వాస్తవం. యిది ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) అద్భుతాలలో ఒకటి. అయితే ఇది నమాజు కొరకే ప్రత్యేకం. ఇతర సందర్భాలలో దీనికి సంబంధించిన ఆధారమేదీ లేదు.

[320]. మున్నద్‌ అబూ యాలా (340, 349/1), ఆజూరీ- అర్బయీన్‌, బైహఖీ,  తబ్రానీ (1/192/1), జియా – అల్‌ మున్తఖా (276/1), ఇబ్నె అసాకిర్‌ (2/226/2, 414/1, 8/14/1,76/2) – హసన్‌ పరంపరతో. ఇబ్నె ఖుజైమా దీనిని సహీగా ఖరారు చేశారు (1/82/1). ఇబ్నె బత్తా, మొదటి భాగంలోని అదనపు పదజాలం లేకుందా దీనిని బలపర్చే ఒక ముర్సల్‌ హదీసును “అల్‌ ఇబానా” (5/43/1) నందు ఉల్లేఖించారు.

[321]. తయాలిసీ, అహ్మద్‌, ఇబ్నె అబీషైబా. ఇది హసన్‌ హదీసు. ఈ విషయం నేను హాఫిజ్‌ అబ్దుల్  హఖ్‌ ఇష్‌బిలీ – అల్‌ అహ్‌కామ్‌ – హదీసు నెం. 1348 పాద సూచికలో వివరించాను.

[322]. ఇబ్నె అబీ షైబా (1/89/2), తబ్రానీ, హాకిమ్‌ దీనిని సహీగా ఖరారు చేశారు, జహబీ కూడా దీనితో ఏకీభవించారు.


ఇది దైవ ప్రవక్త నమాజు స్వరూపం – షేఖ్ అల్ అల్బానీ (రహిమహుల్లా) (పుస్తకం) నుండి తీసుకో బడింది. (150-154 పేజీలు)

ఇతర లింకులు: 

ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) నమాజు విధానము – ఇమాం ఇబ్నె బాజ్ [పుస్తకం]

ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) నమాజు విధానము - షేఖ్ అబ్దుల్ అజీజ్ బిన్ అబ్దుల్లాహ్ బిన్ బాజ్ రహిమహుల్లాహ్ [పుస్తకం]

Prophet's Prayer - Imam Ibn Baz

ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) నమాజు విధానము
షేఖ్ అబ్దుల్ అజీజ్ బిన్ అబ్దుల్లాహ్ బిన్ బాజ్ (రహిమహుల్లాహ్)
[పుస్తకం డౌన్లోడ్ చేసుకోండి]
[PDF] [28 పేజీలు]