ఇస్లాం ఒక సంపూర్ణ జీవన విధానం  – హబీబుర్రహ్మాన్ జామయి [వీడియో & టెక్స్ట్]

ఇస్లాం ఒక సంపూర్ణ జీవన విధానం
షేఖ్ హబీబుర్రహ్మాన్ జామిఈ హఫిజహుల్లాహ్
https://youtu.be/PmdImlJWjdo [50 నిముషాలు]

ఈ ప్రసంగంలో, షేఖ్ హబీబుర్రహ్మాన్ జామిఈ గారు “ఇస్లాం ఒక సంపూర్ణ జీవన విధానం” అనే అంశంపై ప్రసంగించారు. ఆయన ఇస్లాం కేవలం కొన్ని ఆచారాలు లేదా ప్రార్థనలకు మాత్రమే పరిమితం కాదని, అది మానవ జీవితంలోని ప్రతి అంశానికి – వ్యక్తిగత, సామాజిక, ఆర్థిక, రాజకీయ మరియు ఆధ్యాత్మిక – మార్గదర్శకత్వం వహించే ఒక సమగ్రమైన వ్యవస్థ అని వివరించారు. చార్లెస్ డార్విన్, సిగ్మండ్ ఫ్రాయిడ్ వంటి ప్రాపంచిక తత్వవేత్తల పరిమిత దృక్పథాలతో ఇస్లాం యొక్క సంపూర్ణతను పోల్చారు. “ఇస్లాం”, “ముస్లిం”, మరియు “అల్లాహ్” అనే పదాల యొక్క లోతైన అర్థాలను వివరిస్తూ, ఇస్లాం ఐదు మూలస్తంభాల (షహాదహ్, నమాజు, ఉపవాసం, జకాత్, హజ్) పై నిర్మించబడిందని తెలిపారు. ఇస్లాం మానవ సమస్యలన్నింటికీ సృష్టికర్త నుండి వచ్చిన పరిష్కారమని, ఇది కేవలం ముస్లింలకు మాత్రమే కాకుండా యావత్ మానవాళికి మార్గదర్శి అని ఆయన నొక్కిచెప్పారు. తన వాదనకు బలం చేకూరుస్తూ, జార్జ్ బెర్నార్డ్ షా, సరోజినీ నాయుడు వంటి పలువురు ముస్లిమేతర ప్రముఖుల ఇస్లాం గురించిన ప్రశంసలను కూడా ఆయన ఉటంకించారు.

బిద్అత్ అంటే? – హబీబుర్రహ్మాన్ జామయి [వీడియో & టెక్స్ట్]

బిద్అత్ అంటే?
https://youtu.be/YlU1aDZFcl0 [8 నిముషాలు]
వక్త: షేక్ హబీబుర్రహ్మాన్ జామయి (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, వక్త ‘బిద్అత్’ అనే పదం యొక్క అర్థాన్ని వివరిస్తారు. భాషాపరంగా, బిద్అత్ అంటే గతంలో ఉదాహరణ లేని ఒక కొత్త ఆవిష్కరణ అని ఆయన వివరిస్తారు. దీనిని స్పష్టం చేయడానికి ఖుర్ఆన్ నుండి సూరా అల్-బఖర (2:117) మరియు సూరా అల్-అహ్కాఫ్ (46:9) ఆయతులను ఉదాహరిస్తారు. తరువాత, ఆయన బిద్అత్‌ను రెండు రకాలుగా వర్గీకరిస్తారు: మొదటిది, ప్రాపంచిక విషయాలు మరియు అలవాట్లలోని ఆవిష్కరణలు (ఉదాహరణకు సాంకేతికత, దుస్తులు), ఇవి అనుమతించబడినవి. రెండవది, ధార్మిక (దీన్) విషయాలలో చేసే కొత్త ఆవిష్కరణలు, ఇవి నిషిద్ధం (హరామ్) మరియు తిరస్కరించబడినవి. ఈ విషయాన్ని ధృవీకరించడానికి ఆయన సహీహ్ బుఖారీ మరియు సహీహ్ ముస్లిం నుండి రెండు హదీసులను ఉదహరిస్తారు. ప్రసంగం యొక్క సారాంశం ఏమిటంటే, ప్రాపంచిక ఆవిష్కరణలు ఆమోదయోగ్యమైనప్పటికీ, ఇస్లాం ధర్మంలో కొత్త పద్ధతులను చేర్చడం తీవ్రమైన తప్పు.

అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వల్ ఆఖిబతు లిల్ ముత్తఖీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ అంబియాయి వల్ ముర్సలీన్, అమ్మా బాద్.

అభిమాన సోదరులారా, ధర్మ అవగాహనం అనే ఈ కార్యక్రమంలోకి మీ అందరికీ స్వాగతం. నా ఇస్లామీయ అభివాదం, అస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు.

ఈ రోజు మనం బిద్అత్ గురించి కొన్ని విషయాలు తెలుసుకోబోతున్నాం. బిద్అత్, దీనికి చాలా వివరాలు ఉన్నాయి. ఒక రెండు, మూడు ఎపిసోడ్ లలో దీనిని మనం తెలుసుకుందాం. ఈరోజు అయితే, బిద్అత్ అంటే అర్థం ఏమిటి? బిద్అత్ కి అర్థం తెలుసుకుందాం. తర్వాత ఒక రెండు, మూడు ఎపిసోడ్ లలో బిద్అత్ రకాలు, బిద్అత్ యొక్క ఆదేశాలు అవి తెలుసుకుందాం. ఈరోజు బిద్అత్ అంటే ఏమిటి?

నిఘంటువు ప్రకారం బిద్అత్ అంటే గత కాలపు ఉపమానం ఏదీ లేకుండానే, ఏదేని ఒక వస్తువును అపూర్వంగా, ప్రప్రథమంగా ఆవిష్కరించటం. ఇది బిద్అత్ పదానికి అర్థం. నిఘంటువు ప్రకారం.

ఉదాహరణకు, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖుర్ఆన్ లో సూర బఖర, ఆయత్ 117 లో ఇలా సెలవిచ్చాడు,

بَدِيعُ السَّمَاوَاتِ وَالْأَرْضِ
(బదీఉస్సమావాతి వల్ అర్ద్)
భూమ్యాకాశాలను ప్రప్రథమంగా సృష్టించినవాడు ఆయనే. (2:117)

ఇక్కడ బదీఅ అనే పదం ఉంది. దీని నుంచే బిద్అత్. అంటే భూమ్యాకాశాలను మొట్టమొదట సృష్టించినవాడు ఆయనే, అల్లాహ్ యే. అంటే పూర్వపు ఉపమానం ఏదీ లేకుండానే భూమ్యాకాశాలకు ఉనికిని ప్రసాదించాడు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా.

అలాగే సూర అహ్కాఫ్, ఆయత్ 9 లో, ఒక ఆయత్ ఇలా ఉంటుంది,

قُلْ مَا كُنتُ بِدْعًا مِّنَ الرُّسُلِ
(ఖుల్ మా కున్తు బిద్అమ్ మినర్రుసుల్)
(ఓ ముహమ్మద్!) వారికి చెప్పు : “నేను కొత్తగా వచ్చిన ప్రవక్తనేమీ కాను. (46:9)

అంటే, ఓ ప్రవక్తా, వారితో అను, నేను కొత్తగా వచ్చిన ప్రవక్తనేమీ కాను. అంటే, అల్లాహ్ తరఫున ప్రజలకు దైవ సందేశం అందజేసే మొట్టమొదటి వ్యక్తిని కాను. నాకు ముందు ఎందరో ప్రవక్తలు వచ్చారు.

అంటే ఈ రెండు ఆయత్ లలో బిద్అ అనే పదానికి అర్థం ఉంది. గత కాలపు ఉపమానం ఏదీ లేకుండానే ఏదైనా ఒక వస్తువును అపూర్వంగా, ప్రప్రథమంగా ఆవిష్కరించటం అన్నమాట.

“ఇబ్తద’అ ఫులానున్ బిద్అతన్” అని అరబీలో అంటారు. దానికి అర్థం ఏమిటి? అంటే అతను అంతకు ముందు లేని ఒక కొత్త పద్ధతిని సృష్టించాడు అని అర్థం.

ఇక, ఈ లేని కొత్త పద్ధతులు, ఆవిష్కరించటం, ఆరంభం అనేది రెండు రకాలుగా ఉంటుంది.

ఒకటి, అలవాట్లలో ఆవిష్కరణ. కొత్త కొత్త విషయాలు వెతకటం, కొత్త కొత్త విషయాలు తెలుసుకోవటం, ప్రారంభించటం. అలవాట్లలో. రెండవది, ధర్మం, దీన్ లో క్రొంగొత్త ఆవిష్కరణ.

అలవాట్లలో ఆవిష్కారం, ఉదాహరణకు దైనందిన జీవితం కొరకు అవసరమైన వాటిని కొత్తగా కనుగోవటం లేదా ఆవిష్కరించటం. ఇది ధర్మసమ్మతమే. ఎందుకంటే ఇది అలవాట్లకు సంబంధించినది. దుస్తులు, మనం వాడే వాహనాలు, అలాగే మన జీవితానికి, అలవాట్లకి సంబంధించిన అనేక విషయాలు, మొబైల్ ఉంది, కారు ఉంది. అలవాట్లకు సంబంధించిన విషయాలలో కొత్తది రావటం, కొత్త విధానాన్ని తెలుసుకోవటం, కొత్త విషయం ఆవిష్కరించటం ఇవన్నీ ధర్మసమ్మతమే.

రెండవ రకం, దీన్ లో, ధర్మంలో, ఇస్లాం లో క్రొంగొత్త ఆవిష్కరణ. అంటే ధర్మంలో నూతన విధానాలను, పనులను సృష్టించటం. ఇది నిషిద్ధం. దీనికి ఇస్లాంలో అనుమతి ఉండదు. ఎందుకంటే ధర్మావలంబన విషయంలో ఖుర్ఆన్ మరియు ప్రామాణిక హదీసుల ద్వారా రూఢీ అయిన విషయాల వరకే సరిపెట్టుకోవాలి. అందులో ఎలాంటి హెచ్చుతగ్గులు చేయకూడదు, చేయటం ధర్మసమ్మతం కాదు.

మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు,

مَنْ أَحْدَثَ فِي أَمْرِنَا هَذَا مَا لَيْسَ مِنْهُ فَهُوَ رَدٌّ
(మన్ అహదస ఫీ అమ్ రినా హాదా మా లైస మిన్హు ఫహువ రద్) (రవాహుల్ బుఖారీ వ ముస్లిం)
ఎవరైనా మా ఈ షరీఅత్ విషయంలో లేని వస్తువును సృష్టిస్తే అది త్రోసిపుచ్చదగుతుంది

అంటే ఎవరైనా మా ఈ షరీఅత్ విషయంలో – ప్రవక్త గారు “మా” అన్నారు, ఫీ అమ్ రినా – మా ఈ షరీఅత్ విషయంలో (ఫీ అమ్ రినా అంటే ధర్మం విషయంలో, దీన్ విషయంలో, షరీఅత్ విషయంలో) లేని వస్తువును సృష్టిస్తే అది త్రోసిపుచ్చదగుతుంది, అది రద్దు చేయబడుతుంది, ఫహువ రద్, రద్దు చేయబడుతుంది.

అలాగే ఇంకో హదీస్ లో మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు,

مَنْ عَمِلَ عَمَلًا لَيْسَ عَلَيْهِ أَمْرُنَا فَهُوَ رَدٌّ
(మన్ అమిల అమలన్ లైస అలైహి అమ్ రునా ఫహువ రద్) (రవాహు ముస్లిం)
ఎవడైనా మా షరీఅత్ కు అనుగుణంగా లేని ఆచరణ ఏదైనా చేస్తే అది త్రోసిపుచ్చదగినది, రద్దు చేయబడుతుంది.

అభిమాన సోదరులారా, సారాంశం ఏమిటంటే, బిద్అత్ అనే పదానికి అర్థం ఏమిటి? లేని విధానాన్ని సృష్టించటం. కొత్తగా, ప్రప్రథమంగా ఆవిష్కరించటం, ఆరంభం చేయటం. ఇది అలవాట్లలో అయితే ధర్మసమ్మతమే. ఇక రెండవది, దీన్ పరంగా. దీన్ లో కొత్త విధానం ఆవిష్కరించటం, ప్రారంభం చేయటం. ఇది ధర్మసమ్మతం కాదు.

ఈ బిద్అత్ యొక్క అర్థాన్ని మనం తెలుసుకున్నాం. బిద్అత్ యొక్క రకాలు, అవి ఇన్ షా అల్లాహ్ మనం వచ్చే ఎపిసోడ్ లో తెలుసుకుందాం. అప్పటి వరకు సెలవు.

వ ఆఖిరు ద’అవానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.
వస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=43296

బిద్అత్ (కల్పితాచారం) – Bidah (మెయిన్ పేజీ)
https://teluguislam.net/others/bidah/


ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) కుటుంబీకుల(అహ్లె-బైత్)ను గౌరవించడం – షేఖ్ మాజిద్ బిన్ సులైమాన్ [ఖుత్బా టెక్స్ట్]

ఖతీబ్: మాజిద్ బిన్ సూలైమాన్ అర్రస్సీ, జుబైల్, సౌదీ ఆరేబియ
అనువాదం: అబ్దుల్లాహ్ జామిఈ
ఇస్లామీయ జుమా ప్రసంగాలు’ అనే పుస్తకం నుండి – రచన: మాజిద్ బిన్ సులైమాన్ అర్రస్సీ

إنَّ الْحَمْدَ لِلهِ نَحْمَدُهُ وَنَسْتَعِينُهُ وَنَسْتَغْفِرُهُ، وَنَعُوذُ بِاللهِ مِنْ شُرُورِ أَنْفُسِنَا وَمِنْ سَيِّئَاتِ أَعْمَالِنَا، مَنْ يَهْدِهِ اللهُ فَلاَ مُضِلَّ لَهُ، وَمَنْ يُضْلِلْ فَلاَ هَادِىَ لَهُ، وَأَشْهَدُ أَنْ لاَ إِلَهَ إِلاَّ اللهُ وَحْدَهُ لاَ شَرِيكَ لَهُ، وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُه

يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ ٱتَّقُواْ ٱللَّهَ حَقَّ تُقَاتِهِۦ وَلَا تَمُوتُنَّ إِلَّا وَأَنتُم مُّسۡلِمُونَ١٠٢

يَٰٓأَيُّهَا ٱلنَّاسُ ٱتَّقُواْ رَبَّكُمُ ٱلَّذِي خَلَقَكُم مِّن نَّفۡسٖ وَٰحِدَةٖ وَخَلَقَ مِنۡهَا زَوۡجَهَا وَبَثَّ مِنۡهُمَا رِجَالٗا كَثِيرٗا وَنِسَآءٗۚ وَٱتَّقُواْ ٱللَّهَ ٱلَّذِي تَسَآءَلُونَ بِهِۦ وَٱلۡأَرۡحَامَۚ إِنَّ ٱللَّهَ كَانَ عَلَيۡكُمۡ رَقِيبٗا١

يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ ٱتَّقُواْ ٱللَّهَ وَقُولُواْ قَوۡلٗا سَدِيدٗا٧٠ يُصۡلِحۡ لَكُمۡ أَعۡمَٰلَكُمۡ وَيَغۡفِرۡ لَكُمۡ ذُنُوبَكُمۡۗ وَمَن يُطِعِ ٱللَّهَ وَرَسُولَهُۥ فَقَدۡ فَازَ فَوۡزًا عَظِيمًا٧١

స్తోత్రాలు మరియు దరూద్ తరువాత :

అన్నిటి కంటే ఉత్తమమైన మాట అల్లాహ్ మాట, మరియు అందరి కంటే ఉత్తమమైన పద్ధతి ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి పద్ధతి. అన్నిటి కంటే నీచమైనది ఇస్లాంలో కొత్తగా సృష్టించబడినవి, మరియు ఇస్లాంలో కొత్తగా సృష్టించబడిన ప్రతీ కార్యము బిద్అత్ క్రిందికే వస్తుంది మరియు ప్రతీ బిద్అత్ మార్గభ్రష్టత్వము మరియు ప్రతీ మార్గభ్రష్టత్వము నరకంలోకి తీసుకువెళ్ళేదే.    

ఓ ముస్లిం లారా! అల్లాహ్ యొక్క దైవభీతిని కలిగి ఉండండి, ఆయనకు విధేయత చూపండి, ఆయన అవిధేయత నుండి జాగ్రత్త వహించండి. మరియు తెలుసుకోండి! మహా ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారి హక్కులలో ఒక హక్కు మరియు అహ్లె సున్నత్ వల్ జమాఅత్ యొక్క అఖీదా ఏమిటంటే ఆయన కుటుంబ సభ్యులను (ఇంటి వారిని) గౌరవించాలి, ప్రేమించాలి మరియు వారి గురించి ప్రవక్త గారు చేసిన హితోపదేశానికి కట్టుబడి ఉండాలి.

ఈ ప్రాథమిక (అఖీదా)కి సంబంధించి అనేక ఆధారాలు ఉన్నాయి జైద్ బిన్ అర్ఖమ్ (రదియల్లాహు అన్హు) గారు ఉల్లేఖించారు మరియు ఈ విధంగా తెలియపరిచారు: ఒకసారి మహా ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు మక్కా మరియు మదీనా మధ్యలో ఉన్నటువంటి “ఖమ్” అనే నీటి ప్రదేశం వద్ద నిల్చుని ప్రసంగించసాగారు. మొదటగా ఆయన అల్లాహ్ కు పొగడ్తలు తెలిపారు, ఆయనను ప్రశంసించారు ఆతర్వాత ఉపదేశించారు; ఈ విధంగా అన్నారు – “ఓ ప్రజలారా! నేను కూడా మీలాంటి మనిషినే. అతి త్వరలోనే అల్లాహ్ యొక్క మరణ దూత కూడా నా వద్దకు రావచ్చు మరియు నేను దానిని స్వీకరించవచ్చు. కాబట్టి నేను మీ మధ్యన రెండు గొప్ప విషయాలను వదిలి వెళుతున్నాను. మొదటిది అల్లాహ్ యొక్క గ్రంథము ఖురాన్. ఇందులో సన్మార్గం మరియు నూర్ ఉంది. కాబట్టి మీరు అల్లాహ్ గ్రంధాన్ని దృఢంగా పట్టుకోండి. మరియు రెండవ విషయం నా కుటుంబీకులు వీరి విషయంలో నేను మీకు అల్లాహ్ ను గుర్తు చేస్తున్నాను”. ఈ విధంగా మూడు సార్లు అన్నారు.

హుస్సేన్ అన్నాడు, ఓ జైద్! మీలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం వారి (అహ్లె-బైత్) కుటుంబీకులు ఎవరు? ఇందులో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారి సతీమణులు లేరా? జైద్ అన్నారు “ప్రవక్త గారి సతీమణులు కూడా ఉన్నారు కానీ ఆయన కుటుంబీకులు ఎవరంటే జకాత్ నిషేధించబడిన వారు”. (ముస్లిం)

అబూబకర్ సిద్దిక్ (రదియల్లాహు అన్హు) ఇలా అన్నారు: “ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి కుటుంబీకులను రక్షించండి“. (బుఖారి)

ప్రవక్త కుటుంబం యొక్క సద్గుణాలకు సంబంధించిన అనేక హదీసులు ఉన్నాయి, అవి సహీహ్, సునన్, మసానిద్ హదీసు గ్రంథాలలో వివరంగా పేర్కొనబడ్డాయి.

ఇబ్న్ తైమియా (రహిమహుల్లాహ్) ఈ విధంగా తెలియపరిచారు: ఈ విషయంలో ఎటువంటి సందేహానికి తావు లేదు, అదేమిటంటే ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) యొక్క అహ్లె-బైత్‌కు ఉమ్మత్ పై హక్కు ఏమిటంటే అందులో వారికి భాగస్వాములు ఎవరూ లేరు. వీరిపై ఉన్న ప్రేమకు మరియు సంరక్షణకు మరెవరు అర్హులు కాలేరు అని నమ్మడం. ప్రేమ మరియు సంరక్షతత్వానికి వీరు అర్హులైనట్లుగా మరే తెగవారు అర్హులు కాజాలరు. అదేవిధంగా ప్రేమ మరియు సంరక్షణకు అరబ్బులు అర్హులైనట్లుగా మరే ఇతర ఆదం సంతతి అర్హులు కాజాలరు. మరియు పండితుల యొక్క ఏకాభిప్రాయం ఏమిటంటే ఇతర దేశాలపై అరబ్బులకు, ఇతర అరబ్ తెగల కంటే ఖురేష్‌లకు మరియు మొత్తం ఖురైష్‌లపై బను హాషిమ్‌కు గొప్ప ఆధిక్యత సంతరించి ఉంది. (మిన్ హాజ స్సున్నహ్)

ఆ తర్వాత ఆయన వాసిలా బిన్ సఖా గారి హదీసుని తెలియజేశారు. ఇది పైన పేర్కొన్న ఘనతను సూచిస్తుంది. హదీసులో ఈ విధంగా ఉంది: నేను ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు తెలియజేస్తుండగా విన్నాను; “నిశ్చయంగా అల్లాహ్ తఆలా ఇస్మాయిల్ యొక్క సంతతిలో కినానా నీ ఎంపిక చేశాడు, కినానా ఖురేష్ ని ఎన్నుకున్నాడు, మరియు ఖురైష్ నుండి బనూహాషిమ్ ను ఎంపిక చేసి, బనూహాషిమ్ నుండి నేను ఎన్నుకోబడ్డాను”. (ముస్లిం)

ఓ విశ్వాసులారా! ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి సతీమణులు ఆయన కుటుంబీకుల లోని వారే. అల్లాహ్ దివ్య ఖురాన్ లో ఇలా సెలవిచ్చాడు:

﴿إنما يريد الله ليذهب عنكم الرجس أهل البيت ويطهركم تطهيرا﴾
(ఓ ప్రవక్త ఇంటివారలారా! మీ నుండి (అన్ని రకాల) మాలిన్యాన్ని దూరం చేయాలన్నది, మిమ్మల్ని పూర్తిగా పరిశుద్ధపరచాలన్నది అల్లాహ్‌ అభిలాష)

ఇబ్నే కసీర్ (రహిమహుల్లాహ్) వారు ఇలా వ్రాసారు: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి సతీమణులు ఆయన కుటుంబీకులలోని వారే. దీనికి ఆధారం ఈ వాక్యం. ఇది ఆయన భార్యల గురించి వెల్లడి చేయబడింది.

ఓ ముస్లింలారా! ప్రవక్త (సల్లల్లాహు అలైహివ సల్లం) యొక్క కుటుంబం పై సదఖా మరియు జకాత్ నిషిద్ధం. అల్లాహ్ వారి స్థానం మరియు ఔన్నత్యాన్ని పరిగణనలోకి తీసుకుని వారిపై నిషేధించాడు. ఎందుకంటే సదఖా మరియు జకాత్ అనేది ఒక మలినం. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు ఇలా తెలియజేశారు: “ముహమ్మద్ కుటుంబీకుల కొరకు సదఖా అనుమతి లేదు. ఎందుకంటే ఇది ప్రజల సొమ్ము యొక్క మలినం.”

సదఖా మరియు జకాత్ నిషేధించబడిన ప్రవక్త (సల్లల్లాహు అలైహివ సల్లం) కుటుంబీకుల యొక్క రెండు తెగలు: బను హాషిమ్ బిన్ అబ్దే మునాఫ్ మరియు బనూ ముత్తలిబ్ బిన్ అబ్దే మునాఫ్.

ఓ విశ్వాసులారా! ప్రవక్త గారి కుటుంబీకుల ఘనతలో భాగంగా వారి గురించి ఉమ్మత్ కు ఆజ్ఞాపించబడినటువంటి విషయం ఏమిటంటే వారు తషహ్హుద్ లో ఈ దుఆ పటించాలి:

اللهم صل على محمد وعلى آل محمد كما صليت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد.
اللهم بارك على محمد وعلى آل محمد كما باركت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد.

(ఓ అల్లాహ్ నీవు ఎలాగైతే ప్రవక్త ఇబ్రాహీం, వారి సంతానాన్ని కనికరించావో అలాగే ప్రవక్త ముహమ్మద్, వారి సంతానాన్ని కనికరించు, నిశ్చయముగా నీవే పొగడ్తలకు అర్హుడవు, గొప్ప ఘనతలు కలవాడవు. ఓ అల్లాహ్ ఎలాగైతే నీవు ప్రవక్త ఇబ్రాహీం, వారి సంతానానికి శుభాన్ని ప్రసాదించావో అలాగే ప్రవక్త ముహమ్మద్, వారి సంతానంపై శుభాన్ని ప్రసాదించు, నిశ్చయముగా నీవే పొగడ్తలకు అర్హుడవు, గొప్ప ఘనతలు కలవాడవు.)

అల్లాహ్ ఖుర్ఆన్ యొక్క శుభాలను మనజీవితాలలో వర్షింప చేయుగాక. ఆయన వివేకంతో కూడిన సూచనల ద్వారా హితబోధ పొందే భాగ్యం ప్రసాదించుగాక. అల్లాహ్ మనందరిని క్షమించుగాక. మీరు కూడా అల్లాహ్ ను క్షమాపణ వేడుకోండి, నిశ్చయంగా ఆయన (తౌబా) పశ్చాత్తాపం చెందే వారిని తప్పక మన్నిస్తాడు.

స్తోత్రం మరియు దరూద్ తరువాత:

మీరు తెలుసుకోండి. అల్లాహ్ మీపై కరుణించు గాక! సలఫే సాలిహీన్ వారు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి కుటుంబీకుల యొక్క ఘనతలో గొప్ప ఉదాహరణలు తెలియపరిచారు.

అబూబకర్ సిద్దీఖ్ (రదియల్లాహు అన్హు) గారు ఈ విధంగా తెలియజేశారు: “ఎవరి చేతిలో నా ప్రాణం ఉందో ఆయన సాక్షి! నిశ్చయంగా నా బంధువుల పట్ల దయ చూపడం కంటే, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) గారి బంధువుల పట్ల దయ చూపటం నా వద్ద ఎంతో ప్రియమైనది“.(బుఖారి ముస్లిం)

ఓ ముస్లింలారా! విశ్వాసులు అహ్లెబైత్ ను తప్పక ప్రేమిస్తారు! అయితే రాఫిజీలు మరియు షియా వర్గీయులు మాత్రమే వారిని ప్రేమిస్తారు, మిగతా వారందరూ వారిని ద్వేషిస్తారు అనే వాదన సరి అయినది కాదు.

వాస్తవానికి రవాఫిజ్ మరియు షియా వర్గీయులు అహ్లె-బైత్‌ పై ఘోరమైన దౌర్జన్యానికి పాల్పడ్డారు. వారిని అవమానపరిచి వారిని మోసం చేశారు. అహ్లె బైత్ కి సంబంధించినటువంటి అనేక హదీసులు తిరస్కరణకు దారి తీసాయి, దీనికి గల కారణం ఏమిటంటే వీరు అహ్లె బైత్ పై అబద్దాలను మోపారు. మరియు రవాఫిజ్ అహ్లె బైత్ లో అందరినీ కాకుండా కొందరిని మాత్రమే ప్రేమిస్తారు. కానీ సున్నతుని ప్రేమించేవారు దానిపై స్థిరంగా ఉండేవారు (అహ్లె సున్నత్ వల్ జమాఅత్) అహ్లె బైత్ వారందరి ని ప్రేమిస్తారు.

మరియు ఇది కూడా తెలుసుకోండి. అల్లాహ్ ఆయనపై తన కారుణ్యాన్ని కురిపించు గాక అల్లాహ్ మీకు ఒక గొప్ప సత్కార్యం గురించి తెలియచేశాడు. అల్లాహ్ ఈ విధంగా ఆజ్ఞాపించాడు.

(إن اللَّهَ وَمَلَائِكَتَهُ يُصَلُّونَ عَلَى النَّبِيِّ يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا صَلُّوا عَلَيْهِ وَسَلِّمُوا تسليما)
(నిశ్చయంగా అల్లాహ్, ఆయన దూతలు కూడా దైవప్రవక్తపై కారుణ్యాన్ని పంపిస్తున్నారు. ఓ విశ్వాసులారా! మీరు కూడా అతనిపై దరూద్‌ పంపండి. అత్యధికంగా అతనికి ‘సలాములు’ పంపుతూ ఉండండి.)

ఓ అల్లాహ్! నీ దాసుడు మరియు నీ ప్రవక్త అయిన ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పై నీ కారుణ్యాన్ని అవతరింపచేయి. ఆయన ఖలీఫాలు, తాబయీనులను పూర్తి చిత్తశుద్దితో అనుసరించే వారిని ఇష్టపడు ప్రేమించు.

ఓ అల్లాహ్! ఇస్లాం, ముస్లింలకు గౌరవ మర్యాదలు ప్రసాదించు. షిర్క్, ముష్రిక్ లను అవమాన బరుచు. నీవు నీ ధర్మం అయిన ఇస్లాంకు శత్రువులు ఎవరైతే ఉన్నారో వారిని సర్వ నాశనం చేయి మరియు ఏకేశ్వరోపాశకులకు నీ సహాయాన్ని అందించు.

ఓ అల్లాహ్! మా దేశాలలో భద్రతను ప్రసాదించు. మా నేతల వ్యవహారాన్ని సరిదిద్దు, సన్మార్గం చూపే మరియు సన్మార్గము పై నడిచే వారీగా చేయి. ఓ అల్లాహ్! మా పరిపాలకులకు నీ గ్రంధానికి కట్టుబడి ఆజ్ఞాపాలన చేసే భాగ్యాన్ని ప్రసాదించు.

ఓ అల్లాహ్! మా పాపాలను మరియు మా ఆచరణలో ఏర్పడిన కొరతను క్షమించు, ఓ అల్లాహ్! మమ్ములను ఆ నరకాగ్ని నుంచి రక్షించు,మాకు మోక్షాన్ని ప్రసాదించు

ఓ అల్లాహ్! మాకు ఈ ప్రపంచంలో పుణ్యాన్ని పరలోకంలో సాఫల్యాన్ని ప్రసాదించు, నరక శిక్షల నుండి మమ్ములను కాపాడు.

سُبۡحَٰنَ رَبِّكَ رَبِّ ٱلۡعِزَّةِ عَمَّا يَصِفُونَ وَسَلَٰمٌ عَلَى ٱلۡمُرۡسَلِينَ وَٱلۡحَمۡدُ لِلَّهِ رَبِّ ٱلۡعَٰلَمِين

ఖతీబ్: మాజిద్ బిన్ సూలైమాన్ అర్రస్సీ, జుబైల్, సౌదీ ఆరేబియ
అనువాదం: అబ్దుల్లాహ్ జామిఈ
ఇస్లామీయ జుమా ప్రసంగాలు’ అనే పుస్తకం నుండి – రచన: మాజిద్ బిన్ సులైమాన్ అర్రస్సీ

క్రింది లింక్ కూడా చదవండి :
ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఇంటివారి ప్రాశస్త్యం, వారి హక్కులు – డా. సాలెహ్ బిన్ ఫౌజాన్ అల్ ఫౌజాన్ [PDF]

ప్రవక్త ముహమ్మద్ ﷺ జీవిత చరిత్ర (సీరత్ ) తెలుసుకోవడం ఎందుకు అవసరం? [వీడియో ]

ప్రవక్త ముహమ్మద్ ﷺ జీవిత చరిత్ర (సీరత్ ) తెలుసుకోవడం ఎందుకు అవసరం? [వీడియో ]
https://youtu.be/cXBur4cYoZE [37:50 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

అల్లాహ్ పట్ల విశ్వాసం – సలీం జామి’ఈ [వీడియో & టెక్స్ట్]

అల్లాహ్ పట్ల విశ్వాసం
వక్త: ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)
https://youtu.be/0Ud2-JK7Y7k [17 నిముషాలు]

ఈ ప్రసంగంలో, విశ్వాసంలోని ప్రాథమిక అంశాల గురించి వివరించబడింది. ముఖ్యంగా ‘అర్కానుల్ ఈమాన్’ (విశ్వాస మూలస్తంభాలు) లోని మొదటి అంశమైన అల్లాహ్ పట్ల విశ్వాసం గురించి వివరంగా చర్చించబడింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు జిబ్రీల్ అలైహిస్సలాం మధ్య జరిగిన సంభాషణ ద్వారా ఈమాన్ యొక్క ఆరు మూలస్తంభాలు వివరించబడ్డాయి: అల్లాహ్ ను విశ్వసించడం, ఆయన దైవదూతలను, గ్రంథాలను, ప్రవక్తలను, పరలోక దినాన్ని మరియు మంచి చెడు విధిరాతను విశ్వసించడం. అల్లాహ్ అస్తిత్వం, ఆయన సర్వాధికారాలు (తౌహీద్ అర్-రుబూబియ్య), ఆరాధనలకు ఆయన ఒక్కడే అర్హుడు (తౌహీద్ అల్-ఉలూహియ్య), మరియు ఆయన పవిత్ర నామాలు, గుణగణాలు (తౌహీద్ అల్-అస్మా వస్సిఫాత్) అనే మూడు ముఖ్య విషయాలను తెలుసుకోవడం ద్వారా అల్లాహ్ పై సంపూర్ణ విశ్వాసం కలుగుతుందని బోధించబడింది. ఖురాన్ ఆయతుల ఆధారాలతో ఈ అంశాలు స్పష్టంగా వివరించబడ్డాయి.

అల్హమ్దులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్ అమ్మా బాద్.

అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించు గాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించు గాక. ఆమీన్.

సోదర సోదరీమణులారా, మిమ్మల్ని అందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను, అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహు.

అర్కానుల్ ఈమాన్, విశ్వాస ముఖ్యాంశాలలోని మొదటి ముఖ్యాంశం, అల్లాహ్ పట్ల విశ్వాసం గురించి ఈ ప్రసంగంలో మనం తెలుసుకోబోతున్నాం.

చూడండి, దైవదూత జిబ్రీల్ అలైహిస్సలాం మానవ రూపంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమావేశంలో వచ్చి, “ఈమాన్ (విశ్వాసం) అంటే ఏమిటి? తెలుపండి” అన్నారు.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సమాధానమిస్తూ, “ఈమాన్ (విశ్వాసం) అంటే అల్లాహ్ ను విశ్వసించాలి, దైవదూతలను విశ్వసించాలి, దైవ గ్రంథాలను విశ్వసించాలి, దైవ ప్రవక్తలను విశ్వసించాలి, పరలోక దినాన్ని విశ్వసించాలి, మంచి చెడు విధివ్రాతను విశ్వసించాలి.” ఈ ఆరు విషయాలను విశ్వసించటాన్ని ఈమాన్, విశ్వాసం అంటారు అని చెప్పారు. దానికి దైవదూత జిబ్రీల్ అలైహిస్సలాం వారు, “అవును, మీరు చెప్పింది నిజమే” అన్నారు.

రండి ఈరోజు మనము విశ్వాస ముఖ్యాంశాలలోని మొదటి విషయం, అల్లాహ్ పై విశ్వాసం గురించి తెలుసుకుందాం.

అల్లాహ్ ను విశ్వసించడం అంటే అల్లాహ్ ఉన్నాడు అని, అల్లాహ్ సర్వాధికారాలు కలిగి ఉన్నాడు అని, అల్లాహ్ ఆరాధనలన్నింటికీ అర్హుడు అని, అల్లాహ్ కు గొప్ప నామాలు, పేర్లు ఉన్నాయి అని విశ్వసించటం. దీని క్లుప్తమైన వివరణ ఇప్పుడు మీ ముందర ఉంచడం జరుగుతూ ఉంది.

అల్లాహ్ ఉన్నాడు అని ప్రతి వ్యక్తి నమ్మాలి. ఇదే వాస్తవము కూడా. అల్లాహ్ ఉన్నాడు అని మనందరి ఆత్మ సాక్ష్యమిస్తుంది. సమస్యలు, బాధలు వచ్చినప్పుడు “దేవుడా” అని విన్నవించుకుంటుంది మన ఆత్మ. సృష్టిలో గొప్ప గొప్ప నిదర్శనాలు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఉంచి ఉన్నాడు. ఆ నిదర్శనాలను చూసి, అల్లాహ్ ఉన్నాడు, సృష్టికర్త అయిన ప్రభువైన అల్లాహ్ ఉన్నాడు అని మనము గుర్తించాలి. ఉదాహరణకు, భూమి, ఆకాశాలు, పర్వతాలు, సముద్రాలు, సూర్యచంద్రులు, ఇవన్నీ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సృష్టించినవి. అల్లాహ్ కాకుండా ప్రపంచంలోని ఏ సామ్రాజ్యంలో, ఏ ఫ్యాక్టరీలో ఇవన్నీ తయారు అవ్వవు. వీటన్నింటినీ సృష్టించిన వాడు గొప్ప శక్తిమంతుడు, ఆయనే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా. మానవుల ద్వారా భూమి, ఆకాశాలను, సముద్రాలను, వీటిని పుట్టించడమో, సృష్టించటమో వీలుకాని పని. కాబట్టి, ఇది మానవులు సృష్టించిన సృష్టి కాదు, సృష్టికర్త, ప్రభువు అల్లాహ్ సృష్టించిన సృష్టి అని ఈ సృష్టిలో ఉన్న నిదర్శనాలు చూసి మనము అల్లాహ్ ఉన్నాడు అని గుర్తించాలి.

ధార్మిక పండితులు తెలియజేసిన దాని ప్రకారము, ఒకవేళ సృష్టిలో ఉన్న నిదర్శనాలను చూసి మనము తెలుసుకోకపోయినా, మన శరీరంలో ఉన్న అవయవాలను బట్టి కూడా మనము మహాప్రభువు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఉన్నాడని తెలుసుకోవచ్చు. మన శరీరంలో ఉన్న అవయవాలలో నుంచి ఏ ఒక్క అవయవము పాడైపోయినా, అలాంటి అవయవము ప్రపంచంలోని ఏ సామ్రాజ్యంలో కూడా తయారు కాబడదు. మళ్ళీ అల్లాహ్ సృష్టించిన వేరే మనిషి శరీరం నుండి తీసుకుని మనము ఒకవేళ దాన్ని అతికించుకున్నా గానీ, అది అల్లాహ్ ఇచ్చిన అవయవం లాగా పని చేయదు. కాబట్టి మన శరీర అవయవాలే సృష్టికర్త అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా యొక్క గొప్పతనాన్ని మనకు సూచిస్తూ ఉన్నాయి. ఆ ప్రకారంగా మనము అల్లాహ్, సృష్టికర్త ఉన్నాడు అని మనం నమ్మాలి. ఇదే నిజమైన నమ్మకం.

చూడండి, ఖురాను గ్రంథం 52వ అధ్యాయం, 35వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు:

أَمْ خُلِقُوا مِنْ غَيْرِ شَيْءٍ أَمْ هُمُ الْخَالِقُونَ
(అమ్ ఖులిఖూ మిన్ ఘైరి షైఇన్ అమ్ హుముల్ ఖాలిఖూన్)
ఏమిటి, వీరు (పుట్టించేవాడు) ఎవరూ లేకుండానే వారంతట వారే పుట్టుకు వచ్చారా? లేక వారే స్వయంగా సృష్టికర్తలా?” (52:35)

అంటే, ఎవరికి వారు స్వయంగా సృష్టించబడలేదు, వారిని సృష్టించిన సృష్టికర్త ఒకడు ఉన్నాడు అని ఆలోచింపజేస్తున్నాడు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా.

అలాగే, ఖురాను గ్రంథం 51వ అధ్యాయం, 20 మరియు 21 వాక్యాలలో అల్లాహ్ తెలియజేశాడు:

وَفِي الْأَرْضِ آيَاتٌ لِّلْمُوقِنِينَ
(వఫిల్ అర్ది ఆయాతుల్ లిల్ మూఖినీన్)
నమ్మేవారికి భూమిలో పలు నిదర్శనాలున్నాయి.” (51:20)

وَفِي أَنفُسِكُمْ ۚ أَفَلَا تُبْصِرُونَ
(వఫీ అన్ఫుసికుమ్ అఫలా తుబ్సిరూన్)
స్వయంగా మీ ఆత్మల్లో (అస్తిత్వంలో) కూడా ఉన్నాయి. మరి మీరు పరిశీలనగా చూడటం లేదా?” (51:21)

చూశారా? మన శరీరంలోనే నిదర్శనాలు ఉన్నాయి. అవి చూసి అల్లాహ్ ను గుర్తుపట్టండి అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనకు తెలియజేసి ఉన్నాడు. మొత్తానికి, సృష్టికర్త అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఉన్నాడు. అదే విషయం మన ఆత్మ సాక్ష్యమిస్తుంది, అదే విషయం సృష్టిలో ఉన్న నిదర్శనాలు, సూచనలు మనకు సూచిస్తూ ఉన్నాయి.

ఇక, అల్లాహ్ ను పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మూడు విషయాలను బాగా అవగాహన చేసుకోవాలి. ఆ మూడు విషయాలు ఏమిటంటే:

మొదటి విషయం: అల్లాహ్ సర్వాధికారాలు కలిగి ఉన్నాడు అని నమ్మాలి. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సృష్టికర్త, వస్తువులన్నింటినీ ఆయనే సృష్టించాడు, అన్నింటికీ ఆయనే యజమాని, ఆయన వద్దే సర్వాధికారాలు ఉన్నాయి అని విశ్వసించాలి. దీనిని అరబీ భాషలో తౌహీద్ అర్-రుబూబియ్య అంటారు.

ఖురాను గ్రంథం 39వ అధ్యాయం, 62వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు:

اللَّهُ خَالِقُ كُلِّ شَيْءٍ
(అల్లాహు ఖాలిఖు కుల్లి షైఇన్)
అన్ని వస్తువులనూ సృష్టించినవాడు అల్లాహ్‌యే.”  (39:62)

జనన మరణాలను ప్రసాదించువాడు, ఉపాధి ప్రసాదించువాడు, లాభనష్టాలు కలిగించువాడు, సంతానము ప్రసాదించువాడు, వర్షాలు కురిపించువాడు, పంటలు పండించువాడు, సర్వాధికారాలు కలిగి ఉన్నవాడు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అని మనము తెలుసుకొని విశ్వసించాలి.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా గురించి తెలుసుకోవటానికి మరో రెండవ ముఖ్యమైన విషయం ఏమిటంటే, అల్లాహ్ ఒక్కడే ఆరాధనలన్నింటికీ అర్హుడు అని నమ్మాలి. దీనిని అరబీ భాషలో తౌహీద్ ఉలూహియ్య అంటారు.

ఆరాధనలు ప్రత్యక్షమైన ఆరాధనలు ఉన్నాయి, గుప్తమైన ఆరాధనలు ఉన్నాయి, చిన్న ఆరాధనలు ఉన్నాయి, పెద్ద ఆరాధనలు ఉన్నాయి. ఆరాధన ఏదైనా సరే, ప్రతి ఆరాధనకు అర్హుడు అల్లాహ్ ఒక్కడే అని మనము తెలుసుకొని నమ్మాలి. ఆ తర్వాత ప్రతి చిన్న, పెద్ద, బహిరంగమైనది, గుప్తమైనది ఆరాధన ఏదైననూ అల్లాహ్ కొరకు మాత్రమే చేయాలి, ఎందుకంటే ఆరాధనలకు అర్హుడు ఆయన ఒక్కడే కాబట్టి.

ప్రత్యక్ష ఆరాధనలు ఏవి? గుప్తమైన ఆరాధనలు ఏవి? అంటే నమాజు, ఉపవాసము, దుఆ, జంతుబలి, ఉమ్రా, హజ్, ఇవన్నీ ప్రత్యక్షంగా కంటికి కనిపించే ఆరాధనలు. గుప్తమైన ఆరాధనలు అంటే అల్లాహ్ పట్ల అభిమానం, అల్లాహ్ మీద నమ్మకం, అల్లాహ్ తో భయపడటం, ఇవి పైకి కనిపించని రహస్యంగా, గుప్తంగా ఉండే ఆరాధనలు. ఈ ఆరాధనలు అన్నీ కూడాను మనము కేవలం అల్లాహ్ కోసమే చేయాలి.

ఆరాధనల గురించి ఒక రెండు ముఖ్యమైన విషయాలు మీ ముందర ఉంచి నా మాటను ఇన్షా అల్లాహ్ ముందుకు కొనసాగిస్తాను. అసలు ఆరాధన ఎంత ముఖ్యమైన విషయం ఏమిటంటే, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మానవులను, జిన్నాతులను ఈ ఆరాధన కోసమే సృష్టించాడు అని తెలియజేసి ఉన్నాడు.

ఖురాను గ్రంథం 51వ అధ్యాయము, 56వ వాక్యంలో అల్లాహ్ తెలియజేశాడు:

وَمَا خَلَقْتُ الْجِنَّ وَالْإِنسَ إِلَّا لِيَعْبُدُونِ
(వమా ఖలఖ్తుల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లియ’బుదూన్)
“నేను జిన్నాతులను, మానవులను సృష్టించినది వారు నన్ను ఆరాధించటానికి మాత్రమే.” (51:56)

చూశారా? మానవులు మరియు జిన్నాతులు అల్లాహ్ ను ఆరాధించటానికి సృష్టించబడ్డారు. మరి ఏ విషయం కోసం అయితే మానవులు సృష్టించబడ్డారో, అదే విషయాన్ని విస్మరిస్తే ఎలాగ? కాబట్టి ఆరాధన ముఖ్యమైన విషయం, మన పుట్టుక అందుకోసమే జరిగింది కాబట్టి, అల్లాహ్ ను ఆరాధించుకుంటూ ఉండాలి.

అలాగే, ప్రవక్తలు పంపించబడినది మరియు దైవ గ్రంథాలు అవతరింపజేయబడినది కూడా మానవులు అల్లాహ్ ను ఆరాధించటం కోసమే. మానవులు షైతాను వలలో చిక్కి, ఎప్పుడైతే అల్లాహ్ ను మరిచిపోయారో, అల్లాహ్ ను ఆరాధించటం మానేశారో, అల్లాహ్ ను వదిలి బహుదైవారాధన, మిథ్యా దేవుళ్ళను ఆరాధించడం ప్రారంభించారో, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రజలను మళ్ళీ రుజుమార్గం పైకి తీసుకురావటానికి, అల్లాహ్ ను ఆరాధించే వారిలాగా చేయటానికి ప్రవక్తలను పంపించాడు, దైవ గ్రంథాలు అవతరింపజేశాడు.

చూడండి ఖురాను గ్రంథం 16వ అధ్యాయం, 36వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు:

وَلَقَدْ بَعَثْنَا فِي كُلِّ أُمَّةٍ رَّسُولًا أَنِ اعْبُدُوا اللَّهَ وَاجْتَنِبُوا الطَّاغُوتَ
(వలఖద్ బ’అస్నా ఫీ కుల్లి ఉమ్మతిర్ రసూలన్ అని’బుదుల్లాహ వజ్తనిబుత్ తాఘూత్)

మేము ప్రతి సముదాయంలోనూ ప్రవక్తను ప్రభవింపజేశాము. అతని ద్వారా (ప్రజలారా!) “అల్లాహ్‌ను మాత్రమే ఆరాధించండి. ఆయన తప్ప ఇతరత్రా మిథ్యా దైవాలకు దూరంగా ఉండండి” అని బోధపరచాము. గా ఉండండి” అని బోధపరచాము.” (16:36)

చూశారా? ప్రవక్తలు వచ్చింది ఎందుకోసం అంటే అల్లాహ్ ఒక్కడే ఆరాధనలకు అర్హుడు, ఆయననే ఆరాధించండి, మిథ్యా దేవుళ్ళను ఆరాధించకండి అని చెప్పటానికే వచ్చారు. అందుకోసమే గ్రంథాలు అవతరింపజేయబడ్డాయి. కాబట్టి ఆరాధన ముఖ్యమైనది. ఆరాధనలు మనము అల్లాహ్ కొరకు మాత్రమే చేయాలి.

ఇక, ఆరాధన స్వీకరించబడాలంటే రెండు ముఖ్యమైన షరతులు ఉంటాయండి. ఒక షరతు ఏమిటంటే అల్లాహ్ ప్రసన్నత కోసం మాత్రమే ఆరాధనలు చేయాలి, దీనిని అరబీ భాషలో ఇఖ్లాస్ లిల్లాహ్ అంటారు. రెండవ ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి విధానం ప్రకారమే ఆరాధనలు చేయాలి. అరబీ భాషలో దీనిని ముతాబి’అతు సున్నతి రసూలిల్లాహ్ అంటారు. ఆరాధన స్వీకరించబడాలంటే మనము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి అనుచర సమాజము కాబట్టి, ప్రతి ఆరాధన అల్లాహ్ ప్రసన్నత కోసం మాత్రమే చేయాలి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చేసి చూపించిన పద్ధతి ప్రకారము చేయాలి. అప్పుడే ఆ ఆరాధన స్వీకరించబడుతుంది.

ఇక, అల్లాహ్ ను కాకుండా ఇతరులను ఆరాధిస్తే, అది బహుదైవారాధన అనిపించుకుంటుంది, దానిని అరబీ భాషలో షిర్క్ అంటారో. బహుదైవారాధన, షిర్క్, పెద్ద నేరము, క్షమించరాని నేరము. ఎట్టి పరిస్థితిలో ఆ నేరానికి పాల్పడకూడదు అని తెలియజేయడం జరిగింది.

ఇక, అల్లాహ్ ను తెలుసుకోవటానికి మూడవ ముఖ్యమైన విషయం ఏమిటంటే, అల్లాహ్ కు పవిత్రమైన నామాలు, పేర్లు ఉన్నాయి, వాటిని ఉన్నది ఉన్నట్టుగానే విశ్వసించాలి. దీనిని అరబీ భాషలో తౌహీదుల్ అస్మా వస్సిఫాత్ అంటారు. ఈ పేర్లలో అల్లాహ్ యొక్క గుణాలు తెలియజేయడం జరిగి ఉంది. కాబట్టి అందులో ఎలాంటి వక్రీకరణ చేయకుండా, మన ఇష్టానుసారంగా అర్థాలు తేకుండా, ఏ విధంగా అయితే అల్లాహ్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకు తెలియజేసి ఉన్నారో, ఆ ప్రకారము ఉన్నది ఉన్నట్టుగానే విశ్వసించాలి.

ఉదాహరణకు, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు రహ్మాన్, రహీమ్ అని పేర్లు ఉన్నాయి. రహ్మాన్, రహీమ్ అంటే అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అని. అలాగే అల్లాహ్ కు సమీ’, బసీర్ అనే పేర్లు ఉన్నాయి. సమీ’ అంటే వినేవాడు, బసీర్ అంటే చూసేవాడు అని అర్థం. అలాగే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు రజ్జాఖ్, గఫూర్ అని పేర్లు ఉన్నాయి. రజ్జాఖ్ అంటే ఉపాధి ప్రదాత, గఫూర్ అంటే మన్నించేవాడు, క్షమించేవాడు. ఆ ప్రకారంగా, అల్లాహ్ యొక్క గుణాలను, అల్లాహ్ యొక్క లక్షణాలను తెలిపే చాలా పేర్లు ఉన్నాయి. అవి ఉన్నది ఉన్నట్టుగానే మనము విశ్వసించాలి.

ఇక, ఈ అల్లాహ్ యొక్క నామాల ద్వారా మనము అల్లాహ్ తో దుఆ చేస్తే, ఆ దుఆ తొందరగా స్వీకరించబడటానికి అవకాశం ఉంటుంది.

ఖురాను గ్రంథం 7వ అధ్యాయం, 180 వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు:

وَلِلَّهِ الْأَسْمَاءُ الْحُسْنَىٰ فَادْعُوهُ بِهَا
(వలిల్లాహిల్ అస్మాఉల్ హుస్నా ఫద్’ఊహు బిహా)
అల్లాహ్‌కు మంచి మంచి పేర్లున్నాయి. కాబట్టి మీరు ఆ పేర్లతో ఆయన్నే పిలవండి.” (7:180)

అల్లాహ్ కు ఉన్న పేర్లతో ఆయన్నే పిలవండి అని అల్లాహ్ చెప్పాడు కాబట్టి మనం ప్రార్థించేటప్పుడు, ఉదాహరణకు మనతో పాపము దొర్లింది, మన్నించమని మనం అల్లాహ్ తో వేడుకుంటున్నామంటే, “ఓ పాపాలను మన్నించే ప్రభువు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా, యా గఫూర్, ఓ పాపాలను మన్నించే ప్రభువా, ఓ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా, నీవు గఫూర్, పాపాలను మన్నించేవాడివి, నన్ను మన్నించు” అని వేడుకోవాలి. అలా వేడుకుంటే చూడండి, ప్రార్థనలో ఎంత విశిష్టత వస్తూ ఉందో చూశారా? ఆ ప్రకారంగా మనము వేడుకోవాలి.

ఇవి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాను పూర్తిగా విశ్వసించటానికి ఈ మూడు ముఖ్యమైన విషయాలు. అల్లాహ్ సర్వాధికారాలు కలిగి ఉన్నాడు అని, అల్లాహ్ ఒక్కడే ఆరాధనలన్నింటికీ అర్హుడు అని, అల్లాహ్ కు పేర్లు ఉన్నాయి అని, ఈ మూడు విషయాలను మనం అవగాహన చేసుకుంటే అల్లాహ్ మీద మనకు సంపూర్ణ విశ్వాసం కలుగుతుంది.

ఈ మూడింటిలో నుండి ఒక విషయాన్ని మనం తెలుసుకున్నాము, మిగతా రెండు విషయాలని మనము వదిలేశాము అంటే అప్పుడు మన విశ్వాసము అల్లాహ్ మీద సంపూర్ణము కాజాలదు. ఉదాహరణకు, మక్కా వాసులు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ప్రవక్త పదవి లభించే సమయానికి అల్లాహ్ గురించి తెలుసుకొని ఉన్నారు. ఒక విషయం మాత్రమే తెలుసుకున్నారు: సృష్టి మొత్తానికి అల్లాహ్ ఒక్కడే సృష్టికర్త, ఆయన వద్దే సర్వాధికారాలు ఉన్నాయని ఆ ఒక్క విషయాన్ని మాత్రమే వారు తెలుసుకున్నారు. కానీ ఆరాధనల విషయంలో మాత్రం వారు తప్పు చేసేవారు, విగ్రహాలను ఆరాధించేవారు. అల్లాహ్ కు గొప్ప గొప్ప పేర్లు ఉన్నాయన్న విషయాన్ని వారు విశ్వసించే వారు కాదు. కాబట్టి వారి విశ్వాసము అసంపూర్ణము అని చెప్పబడింది, వారు విశ్వాసులు కారు అని చెప్పబడింది. కాబట్టి, అల్లాహ్ మీద మన విశ్వాసము పూర్తి అవ్వాలంటే, అల్లాహ్ గురించి ఈ మూడు విషయాల అవగాహన చేసుకుని మనము నమ్మాలి, ఆచరించాలి.

అల్లాహ్ మీద విశ్వాసం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటంటే, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా, ఏ వ్యక్తి అయితే అల్లాహ్ ను తెలుసుకొని విశ్వసిస్తాడో అతనిని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆదుకుంటాడు, సహకరిస్తాడు, అతని కోరికలు తీరుస్తాడు, సమస్యలు పరిష్కరిస్తాడు. అలాగే, అల్లాహ్ ను విశ్వసించిన వ్యక్తి మంచి జీవితం గడుపుతాడు. మార్గభ్రష్టత్వానికి గురి అయ్యి పశువుల్లాగా, చాలామంది చేస్తున్న చేష్టలకు దూరంగా ఉంటాడు. అలాగే మనిషి అల్లాహ్ ను విశ్వసించటము ద్వారా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా యొక్క ప్రసన్నత పొందుతాడు.

ఇవి అల్లాహ్ పట్ల విశ్వాసం గురించి మనము తెలుసుకొనవలసిన ముఖ్యమైన విషయాలు. నేను అల్లాహ్ తో దుఆ చేస్తున్నాను, అల్లాహ్ మనందరికీ అన్న, విన్న విషయాల మీద ఆచరించే భాగ్యం ప్రసాదించు గాక. ఆమీన్.

అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=30628


అల్లాహ్ (త’ఆలా) – మెయిన్ పేజీ:
https://teluguislam.net/allah/

మన పై ముహమ్మద్ (సల్లలాహు అలైహి వ సల్లం) హక్కులు – సలీం జామి’ఈ [వీడియో]

మనపై ముహమ్మద్ (సల్లలాహు అలైహి వ సల్లం) హక్కులు – సలీం జామి’ఈ [వీడియో]
https://youtu.be/Eh9min90YQ8 [30 నిముషాలు]

1- ప్రవక్త ముహమ్మద్ (సల్లలాహు అలైహి వ సల్లం) ను విశ్వసించకపోతే జరిగే నష్టం ఏమిటి ?
2- సహాబాలు ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ను ఎలా గౌరవించేవారో అలనాటి ఒక అవిశ్వాసి ఇచ్చిన సాక్ష్యం ఏమిటి ?
3- ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ను అభిమానిస్తే ఎంత గొప్ప ప్రయోజనమో తెలుసా ?
4- ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ను ఎవరెవరు ఆదర్శంగా తీసుకోవాలి ?
5- ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ను అనుసరించటం ఎలాగో సహాబాలు చూపిన విధానం ఏమిటి ?
6- ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) కు ఈ రోజుల్లో మనం అండగా నిలబడటం అంటే ఏమిటి ?
7- ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) అనుచరులుగా మనమీద ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) వారి హక్కులు ఏమున్నాయో తెలుసుకొని నెరవేర్చాలి కదా?

కావున ఈ వీడియో చూసి తెలుసుకోండి మరియు బంధు మిత్రులకు షేర్ చేసి తెలియజేయండి

ముహమ్మద్ (సల్లలాహు అలైహి వ సల్లం) & కుటుంబం
https://teluguislam.net/muhammad/

“మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది”. మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కండి. మీ బంధుమిత్రులను చేర్పించండి, ఇన్ షా అల్లాహ్.
https://chat.whatsapp.com/JYb4QhZ4Hlu5Ek076Xx4fJ

మహా ప్రవక్త ముహమ్మద్ ﷺ ఉన్నత వ్యక్తిత్వాన్ని అగౌరవ పరుస్తున్న నేటి పరిస్థితులలో ముస్లింగా మన బాధ్యత [వీడియో]

మహా ప్రవక్త ముహమ్మద్ ﷺ ఉన్నత వ్యక్తిత్వాన్ని అగౌరవ పరుస్తున్న నేటి పరిస్థితులలో ముస్లింగా మన బాధ్యత [వీడియో]
https://youtu.be/2ZKt_5BKDM0 [53 నిముషాలు]
వక్త: షరీఫ్ మదని , వైజాగ్ (హఫిజహుల్లాహ్)
ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వినాల్సిన వీడియో , మీ బంధు మిత్రులకు షేర్ చెయ్యడం మర్చిపోవద్దు సుమా!

మహా ప్రవక్త ﷺ జీవిత చరిత్ర – సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్) – యూట్యూబ్ ప్లే లిస్ట్:
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV3A9nJQ26qTrl-iuvWeXrbO

సీరత్ పాఠాలు 12: ప్రవక్త ﷺ గురించి ముస్లిమేతరులు ఎవరేమన్నారు? [వీడియో]
https://teluguislam.net/2020/08/15/seerah-lessons-12/

ముస్లిమేతరులతో ముహమ్మద్ ﷺ ప్రవర్తన [వీడియో]

బిస్మిల్లాహ్
ముస్లిమేతరులతో ముహమ్మద్ ﷺ ప్రవర్తన – వక్త: ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)
[పార్ట్ 1] https://youtu.be/SYl9n2Egp38 [33 నిముషాలు]
[పార్ట్ 2] https://youtu.be/TKhvnUGmEaA [32 నిముషాలు]

పార్ట్ 1 :

పార్ట్ 2 :

వక్త: ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్) – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0B6tOQhDiqrHO4E3Ou_IL7

ప్రవక్త ﷺ పై అభిమానం, ప్రేమ & దాని నిబంధనలు [వీడియో]

బిస్మిల్లాహ్
ప్రవక్త ﷺ పై అభిమానం, ప్రేమ & దాని నిబంధనలు- వక్త: ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)
https://youtu.be/a8a3HwcPZIU

[36 నిముషాలు]
వక్త: ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)

  • 00:00 పరిచయం
  • 01:12 అల్లాహ్ మనకు ప్రసాదించిన గొప్ప అనుగ్రహాలలో ఒకటి – మనల్ని ముహమ్మద్ ﷺ ఉమ్మత్ లో పుట్టించడం
  • 02:49 ప్రవక్త ﷺ మీద మనకున్న భాద్యత – ప్రవక్త ﷺ ని అభిమానించడం, ప్రేమించడం
  • 03:05 వర్తకం, తల్లిదండ్రులు, భార్యా బిడ్డలు & అందరికంటే ప్రవక్త ﷺ ని ప్రేమించడం
  • 05:25 ఉమర్ (రదియల్లాహు అన్హు) సంఘటన – తన ప్రాణం కంటే కూడా ప్రవక్త ﷺ ని ప్రేమించడం సంపూర్ణ విశ్వాసం
  • 08:41 జైద్ (రదియల్లాహు అన్హు) ప్రవక్త ﷺ ని ఎంతగానో అభిమానించే సంఘటన
  • 13:29 సౌబాన్ (రదియల్లాహు అన్హు) స్వర్గంలో ప్రవక్త ﷺ గారి సాన్నిధ్యం లో ఉండాలనే కోరిక వెలిబుచ్చే సంఘటన
  • 17:20 ఒక పల్లెటూరి వాసి “ప్రళయ దినం ఎప్పుడు?” అని ప్రవక్త ﷺ ని అడిగినప్పుడు ..
  • 20:53 ప్రవక్త ﷺ పై అభిమానం, ప్రేమ లో ఉన్నటువంటి నిబంధనలు
  • 21:49 నిబంధన 1 – ప్రవక్త ﷺ తీసుకువచ్చిన ధర్మాన్ని మనసారా విశ్వసించి పాటించాలి – హంజా (రదియల్లాహు అన్హు) ఇస్లాం స్వీకరించే సంఘటన
  • 25:55 ప్రవక్త బాబాయి అబీతాలిబ్ ప్రవక్త ﷺ ని ఎంతో ప్రేమించారు, కానీ విశ్వసించలేదు – ఇది నిజమైన ప్రేమ కాదు
  • 28:51 నిబంధన 2 – ప్రవక్త ﷺ ను అనుసరించాలి. అంటే ప్రవక్త చెప్పింది చెయ్యడం, వద్దన్న పనులకు దూరంగా ఉండటం
  • 30:50 నిబంధన 2 ఉదాహరణ (1): బంగారపు ఉంగరం ధరించిన ఒక వ్యక్తి ప్రవక్త ﷺ దగ్గరకు వచ్చిన సంఘటన
  • 32:44 నిబంధన 2 ఉదాహరణ (2): ఇబ్నె మస్ ఊద్ (రదియల్లాహు అన్హు) మస్జిదులోకి ప్రవేశిస్తున్నపుడు సంఘటన
  • 34:26 క్లుప్త ముగింపు: ప్రవక్త గారి మీద అభిమానం మనల్ని ఏమి కోరుతుంది?

ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్) – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0B6tOQhDiqrHO4E3Ou_IL7

ధర్మ అవగాహనలో హదీసు ప్రాముఖ్యత [వీడియో]

బిస్మిల్లాహ్
ధర్మ అవగాహనలో హదీసు ప్రాముఖ్యత
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

[52 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

సున్నత్ (మెయిన్ పేజీ)
https://teluguislam.net/hadeeth

ముహమ్మద్ (సల్లలాహు అలైహి వ సల్లం) (మెయిన్ పేజీ)
https://teluguislam.net/muhammad

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు విధేయత చూపటం తప్పనిసరి
డా. సాలెహ్ అల్ ఫౌజాన్

ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) విధేయతే పరమావధి 
(Tafheem-us-Sunnah) – Following the Sunnah is Compulsory
అల్లామ అబ్దుల్లా బిన్ బాజ్ (రహమతుల్లా అలై) (ibn Baz)