ఇస్లాం ఒక సంపూర్ణ జీవన విధానం
షేఖ్ హబీబుర్రహ్మాన్ జామిఈ హఫిజహుల్లాహ్
https://youtu.be/PmdImlJWjdo [50 నిముషాలు]
ఈ ప్రసంగంలో, షేఖ్ హబీబుర్రహ్మాన్ జామిఈ గారు “ఇస్లాం ఒక సంపూర్ణ జీవన విధానం” అనే అంశంపై ప్రసంగించారు. ఆయన ఇస్లాం కేవలం కొన్ని ఆచారాలు లేదా ప్రార్థనలకు మాత్రమే పరిమితం కాదని, అది మానవ జీవితంలోని ప్రతి అంశానికి – వ్యక్తిగత, సామాజిక, ఆర్థిక, రాజకీయ మరియు ఆధ్యాత్మిక – మార్గదర్శకత్వం వహించే ఒక సమగ్రమైన వ్యవస్థ అని వివరించారు. చార్లెస్ డార్విన్, సిగ్మండ్ ఫ్రాయిడ్ వంటి ప్రాపంచిక తత్వవేత్తల పరిమిత దృక్పథాలతో ఇస్లాం యొక్క సంపూర్ణతను పోల్చారు. “ఇస్లాం”, “ముస్లిం”, మరియు “అల్లాహ్” అనే పదాల యొక్క లోతైన అర్థాలను వివరిస్తూ, ఇస్లాం ఐదు మూలస్తంభాల (షహాదహ్, నమాజు, ఉపవాసం, జకాత్, హజ్) పై నిర్మించబడిందని తెలిపారు. ఇస్లాం మానవ సమస్యలన్నింటికీ సృష్టికర్త నుండి వచ్చిన పరిష్కారమని, ఇది కేవలం ముస్లింలకు మాత్రమే కాకుండా యావత్ మానవాళికి మార్గదర్శి అని ఆయన నొక్కిచెప్పారు. తన వాదనకు బలం చేకూరుస్తూ, జార్జ్ బెర్నార్డ్ షా, సరోజినీ నాయుడు వంటి పలువురు ముస్లిమేతర ప్రముఖుల ఇస్లాం గురించిన ప్రశంసలను కూడా ఆయన ఉటంకించారు.
అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.
أَلْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ
(అల్హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్)
సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కే సర్వస్తోత్రాలు.
وَالْعَاقِبَةُ لِلْمُتَّقِينَ
(వల్ ఆఖిబతు లిల్ ముత్తఖీన్)
చివరి విజయం దైవభక్తిపరులకే.
وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى سَيِّدِ الْأَنْبِيَاءِ وَالْمُرْسَلِينَ وَمَنْ تَبِعَهُمْ بِإِحْسَانٍ إِلَى يَوْمِ الدِّينِ، أَمَّا بَعْدُ
(వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ అంబియాఇ వల్ ముర్సలీన్, వమన్ తబిఅహుం బి ఇహ్సానిన్ ఇలా యౌమిద్దీన్, అమ్మాబాద్)
ప్రవక్తల నాయకుడైన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, ప్రళయదినం వరకు వారిని అనుసరించేవారిపై శాంతి మరియు శుభాలు వర్షించుగాక.
సర్వ స్తోత్రాలు, అన్ని విధాల పొగడ్తలు, అన్ని రకాల ప్రశంసలు సర్వలోక ప్రభువైన, పాలకుడైన, సృష్టికర్త అయిన అల్లాహ్ కే శోభిస్తాయి. అనంత కరుణా శుభాలు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, ఆయన కుటుంబీకులపై, ఆయన ప్రియ సహచరులపై అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తన అనుగ్రహాలను వర్షింపజేయుగాక.
ఇస్లాం ఒక సంపూర్ణ జీవన విధానం
హమ్ద్ మరియు సనా తర్వాత, అభిమాన సోదరులారా నేటి నా ప్రసంగాంశం ఇస్లాం ఒక సంపూర్ణ జీవన విధానం.
ఇస్లాం గురించి ముస్లిమేతర సోదరులలో అపార్థాలు కలిగి ఉన్నారు. అసలు జీవన విధానం అంటే ఏంటి? ధర్మం అంటే ఏమిటి? ఈ జీవన విధానం గురించి చర్చిస్తే, అన్వేషిస్తే, అనేకులు మానవ జీవిత శైలిని వివిధ కోణాల్లో, వివిధ రకాలుగా, తమ ఆలోచనా సరళిని బట్టి దాన్ని విశ్లేషిస్తున్నారు. కొందరు శాస్త్రవేత్తలు, చరిత్రకారులు, ఉదాహరణకు చార్లెస్ డార్విన్, సిగ్మండ్ ఫ్రాయిడ్, హెగెల్, కార్ల్ మార్క్స్ వంటి వారు మానవ జీవితాన్ని వివిధ కోణాల్లో నుంచి చూడటానికి ప్రయత్నించారు.
కొందరు మానవ ఆకృతిపై ఎక్కువగా నిర్భరపడ్డారు. కొందరు మనిషి యొక్క వృత్తిపై ధ్యానం ఇచ్చారు. కొందరైతే మనిషి కడుపే అన్నిటికీ కారణం అన్నారు. అన్ని సమస్యలకు కారణం మానవుని ఆకలే అని వారి ఆలోచన. ఆకలి సమస్యను పరిష్కరిస్తే అన్ని సమస్యలు అంతమైపోతాయని వారి వాదన. మరి కొందరైతే మానవ జీవితాన్ని శృంగారంతో కూడగట్టారు. శృంగారమే మానవ జీవిత ధ్యేయం అని వాదించారు కొందరు. శృంగారంపై ఉన్న పరిమితులను, నియంత్రణలను తీసివేస్తే అన్నీ సర్దుకుంటాయని వారి భావన. మరి కొందరు సన్యాసత్వానికి ప్రాధాన్యత ఇచ్చారు. మానవ శరీరాన్ని, దాని అవసరాలను త్రోసిపుచ్చారు.
కావున సృష్టికర్తను, దైవ వాణిని లెక్క చేయకుండా మానవ జీవితాన్ని విశ్లేషించేవారు గుడ్డివారితో సమానం. వారు విశ్లేషించినది పూర్తిగా అసంపూర్ణమైనది మరియు లోపాలతో కూడినవి అని స్పష్టంగా అర్థమవుతుంది.
ప్రియ వీక్షకులారా! ఏదైనా ఒక వస్తువు గురించి దాన్ని తయారు చేసిన వానికి బాగా తెలిసి ఉంటుంది ఆ వస్తువు గురించి. ఎందుకంటే ఆ వస్తువుని తయారు చేసింది ఆయనే కనుక అతనికి బాగా స్పష్టంగా జ్ఞానం కలిగి ఉంటుంది ఆ వస్తువు గురించి. ఉదాహరణకు, ఒక వాహనం తయారు చేసిన వానికి వాహనం అవసరాలు బాగా తెలిసి ఉంటాయి. ఆ వాహనం ఎటువంటిది, దాని అవసరం ఎటువంటిది, ఏ విధంగా అది నడుస్తుంది, ఆ వాహనానికి ఏది కరెక్ట్, ఏది మంచిది, ఏది మంచిది కాదు మొత్తం తెలిసి ఉంటాయి. ఆ వాహనపు చక్రాలలోని గాలి కూడా ఆ దానికి తయారు చేసిన వాడు ఎంత చెప్పాడో అంతే ఉంచాలి దానిలో గాలి. ఈ వాహనం నాది అని నేను నా ఇష్ట ప్రకారం వాహనానికి గాలి వేస్తే, ఆ వాహనానికి నష్టం జరుగుతుంది, ఆ వాహనంపై కూర్చున్న వారికి నష్టం జరుగుతుంది. ఈ విధంగా అందరూ నష్టపోతారు.
మన సృష్టికర్త, సకల లోకాలకు సృష్టించినవాడు, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా కు మనకోసం ఏది మంచో, ఏది చెడో అంతా బాగా తెలుసు. అతను దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జీవితం ద్వారా మనకు మార్గదర్శకత్వం చేశాడు. అల్లాహ్ చూపించిన రుజుమార్గం నుండి తప్పిపోయినచో కల్లోలం, ఫిత్నా, వినాశనం తప్పదు.
అభిమాన సోదరులారా! ఇస్లాం ధర్మం దైవ ధర్మం కావడం వలన ఇందులో, అంటే ఇస్లాం ధర్మంలో, జీవితానికి సంబంధించిన విషయాలన్నీ ఉన్నాయి. ఇస్లాం ధర్మంలో కేవలం ఏదో ఒక అంశం గురించి మాత్రమే కాదు, జీవితంలోని ఒక భాగం గురించి మాత్రమే కాదు, జీవితానికి సంబంధించిన ప్రతి విషయంలో, ప్రతి విషయానికి సంబంధించిన విషయాలు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా చూపించాడు, తెలియపరిచాడు. మన సృష్టికర్త అల్లాహ్ ఈ జీవిత విధానానికి ఇస్లాం అని పేరు పెట్టాడు. ఆయన అస్సలాం. ఆయన పెట్టిన ధర్మం పేరు ఇస్లాం.
అల్లాహ్ ఖుర్ఆన్ లో తెలియజేశాడు, సూరా ఆలి ఇమ్రాన్, సూరా నెంబర్ 3, ఆయత్ నెంబర్ 19 లో:
إِنَّ ٱلدِّينَ عِندَ ٱللَّهِ ٱلْإِسْلَٰمُ
(ఇన్నద్దీన ఇందల్లాహిల్ ఇస్లాం)
నిశ్చయంగా అల్లాహ్ వద్ద (ఆమోదయోగ్యమైన) ధర్మం కేవలం ఇస్లాం మాత్రమే. (3:19)
ఇస్లాం ఓ ధర్మం. కానీ పాశ్చాత్య దేశాల భావంలో కాదు. ఎందుకంటే పాశ్చాత్యుల ప్రకారం ధర్మం అంటే కేవలం మానవునికి, సృష్టికర్తకు, అల్లాహ్ కు మధ్య ఉన్న బంధం మాత్రమే. కానీ ఇస్లాం, ఇస్లాం ధర్మం మానవుని జీవితపు అన్ని రంగాలతో ఇస్లాం ధర్మానికి సంబంధం ఉంది. అది వ్యక్తిగతమైనా, సామాజికమైనా, ప్రాపంచికకరమైనా సరే.
ఇస్లాం సృష్టికర్త అయిన అల్లాహ్ తో, స్వయంగా మనతో, మన పిల్లలతో, బంధువులతో, పొరుగువారితో, అతిథులతో, ప్రపంచపు మానవాళితో సంబంధాలను కుదుర్చుతుంది ఇస్లాం ధర్మం. ఇస్లాం అందరితో హక్కులను స్పష్టపరుస్తుంది. ఎవరి హక్కు ఏమిటి అని. సమాజంలో వ్యాపారపరంగా, రాజకీయపరంగా, వ్యక్తిగతంగా, బంధుత్వపరంగా, అమ్మానాన్న, తల్లిదండ్రులు, భార్యాపిల్లలు, ఇరుగుపొరుగు వారు, సమీప బంధువులు, దూర బంధువులు, స్నేహితులు, మిత్రులు, శత్రువులు, జంతువులు, జీవులు, నిర్జీవులు, ప్రతి ఒక్కరితో సంబంధం విధులను స్పష్టపరుస్తుంది ఇస్లాం ధర్మం. ఇది కేవలం ఇస్లాంలో మాత్రమే మనకు కనబడుతుంది.
ఇస్లాం ఆరాధించే వ్యవస్థను, పౌర హక్కులను, వివాహ విడాకుల నియమాలను, వారసత్వపు చట్టాలను, వ్యవహరించే తీరును, ఏది త్రాగకూడదో, ఏది త్రాగాలో, ఏది ధరించాలో, ఏది ధరించకూడదో, అల్లాహ్ ను ఎలా ఆరాధించాలో, రాజ్యం ఎలా పాలించాలో, యుద్ధానికి మరియు శాంతికి సంబంధించిన చట్టాలు, ఎప్పుడు యుద్ధం చేయాలో, ఎప్పుడు శాంతిని అమలుపరచాలో, ఆర్థిక వ్యవస్థ చట్టాలు, అమ్మే కొనే నియమాలు, అన్నీ స్పష్టంగా వివరిస్తుంది ఇస్లాం ధర్మం.
ప్రతి సమస్యకి పరిష్కారం చూపుతుంది ఇస్లాం ధర్మం. అంటే ఈ విధంగా ఇస్లాం పూర్తి జీవిత వ్యవస్థను స్థాపిస్తుంది. సంపూర్ణ జీవన విధానాన్ని తెలియపరుస్తుంది. ఇస్లాం ధర్మం కేవలం మస్జిద్ కే పరిమితం కాదు. ఇది రోజువారీ జీవితంతో సంబంధించింది. సామాజికంగా, ఆర్థికపరంగా, రాజకీయంగా మొదలైన రంగాల్లో, ప్రతి రంగంలో, ప్రతి అంశంలో, ప్రతి విషయంలో, జీవితపు అన్ని కోణాల్లో ఇస్లాం మార్గం చూపుతుంది. ఇది ఇస్లాం యొక్క ప్రత్యేకత.
ఇది సృష్టికర్త అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూచించిన ధర్మం. ధర్మ పండితులు, మేధావులు, రాజకీయ నాయకులు ఊహించుకుని రాసిన ధర్మం, పెట్టుకున్న నియమాలు కాదు ఇస్లాం ధర్మం. సకల లోకాలకు సృష్టికర్త అయిన నిజ ఆరాధ్య దేవుడైన, సర్వాన్ని సృష్టించిన ఆయన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూచించిన ధర్మం కాబట్టి ఇందులో, ఇస్లాంలో పూర్తి జీవన విధానం ఇమిడి ఉంది. దీనివల్ల ముస్లింలు తమ ధర్మమైన ఇస్లాం గురించి ఎలాంటి సంకోచంలో ఉండరు, సందేహంలో ఉండరు. ఇస్లాం తార్కిక, హేతుబద్ధమైన ధర్మం. ఇస్లాం మానవ నైజానికి అనుగుణంగా ఉంటుంది, వ్యతిరేకంగా ఉండదు. ఇందులో మతాధికారత్వం, బ్రహ్మచర్యం ఉండవు. ఇస్లాం మానవుని పూర్తి జీవన విధానం.
అభిమాన సోదరులారా, ఇక మనం ఈ ప్రపంచం గురించి కాస్త అన్వేషిస్తే, నేటి ఈ పోటీతత్వ ప్రపంచం భౌతికవాద దృక్పథాలపై ఆధారపడి ఉంది. తనకు నచ్చిన జీవన, సామాజిక, ఆర్థిక, రాజకీయ విధానాలను అనుసరిస్తూ అదే సంపూర్ణ విధానాలనే భ్రమలో కూరుకుపోయింది. ప్రపంచ జనాభాలో దాదాపు 66 శాతం మంది రోజుకు 700 కంటే తక్కువ జీతానికి పని చేస్తున్నారు. ప్రతి ఏట, ప్రతి సంవత్సరం సుమారు 90 లక్షల మంది ఆకలి చావులకి గురవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా సంవత్సరానికి 8 లక్షల మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రపంచంలో, పూర్తి ప్రపంచంలో ఉన్న సంపదలో 44 శాతం సంపదకి కేవలం ఒక్క శాతం మనుషుల వద్దనే ఉంది. 2 లక్షల 50 వేల బలాత్కారానికి సంబంధించిన కేసులు ప్రతి సంవత్సరం నమోదవుతున్నాయి. ఎందుకు? ఇలా ఎందుకు జరుగుతా ఉంది? ఈ అసమానత ఏమిటి? ఈ అవినీతి ఏమిటి? ఈ సామాజిక రుగ్మత ఏమిటి? ఈ అన్యాయాలు ఏమిటి? ఇలా ఎందుకు జరుగుతా ఉంది? దానికి పరిష్కారం ఎందుకు లేదు?
వాటన్నిటికీ పరిష్కారం చూపుతుంది ఇస్లాం ధర్మం. ఈ ప్రపంచపు విధానాలకి భిన్నంగా, ఇస్లాం ఒక ఉన్నతమైన జీవన విధానాన్ని, సామాజిక, రాజకీయ మరియు ఉన్నతమైన న్యాయ వ్యవస్థను ప్రపంచానికి పరిచయం చేసింది ఇస్లాం ధర్మం. మానవ సమస్యలకు ఉత్తమమైన పరిష్కారం ప్రపంచానికి పరిచయం చేసి, కేవలం పరిచయం మాత్రమే కాదు ఆచరించి చూపించింది ఇస్లాం ధర్మం. దీనికి స్వయంగా చరిత్రయే సాక్షి.
అభిమాన సోదరులారా! మరి ఇటువంటి ఉన్నతమైన ఇస్లాం ధర్మం, అసలు ఇస్లాం అంటే ఏమిటి? చాలామంది ఉద్దేశపూర్వకంగా ఇస్లాం ధర్మానికి విరుద్దంగా దుష్ప్రచారం చేస్తున్నారు. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, అన్ని అవసరాలను, అన్ని మాధ్యమాలను ఉపయోగించుకొని ఉద్దేశపూర్వకంగా ఇస్లాంను మరియు ముస్లింల గురించి దుష్ప్రచారం చేసి ఇస్లాం గురించి చెడుగా ప్రచారం చేస్తున్నారు. కానీ వాస్తవం ఏమిటి? అసలు ఇస్లాం అంటే దానికి అర్థం ఏమిటి? శాంతి, సమర్పణ. ఇస్లాం తప్ప ప్రపంచంలో ఏ ఏ మతాలు ఉన్నాయో, ఆ మతానికి సంబంధించిన పేరుకి, దానిలో అర్థానికి సంబంధాలు ఉండవు. వ్యక్తి పేరుతో, ప్రాంతం పేరుతో, ఏదో ఒక పేరుతో అది ఉంటుంది. కానీ ఇస్లాం అల్లాహ్ పెట్టిన ధర్మం. దానికి అర్థం ఏమిటి? శాంతి, సమర్పణ, విధేయత, ఆజ్ఞాపాలన.
ఇస్లాం ధర్మం అంటే మనందరి సృష్టికర్త అయిన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తన చిట్టచివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా అవతరింపజేసిన ఆదేశాలను మరియు మార్గదర్శకత్వాన్ని పూర్తిగా అంగీకరించటం, స్వీకరించటం, ఆమోదించటం మరియు సమ్మతించటం. ఇది ఇస్లాం.
ముస్లిం అంటే మనస్ఫూర్తిగా, పేరుకు మాత్రమే కాదు, మనస్ఫూర్తిగా అల్లాహ్ ను, సకల లోకాలకు ఏకైక సృష్టికర్త, ఆరాధనకు ఏకైక ప్రభువు అయిన అల్లాహ్ ను విశ్వసించేవాడు ముస్లిం అంటే. తన ఇష్టాన్ని అల్లాహ్ యొక్క అభిష్టానికి సమర్పించుకున్నవాడు ముస్లిం అంటే. అల్లాహ్ అవతరింపజేసిన దివ్య ఖుర్ఆన్ మార్గదర్శకత్వం మరియు ఆయన అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ధర్మోపదేశాల అనుగుణంగా తన జీవిత విధానాన్ని పూర్తిగా సరిదిద్దుకోవటానికి శాయశక్తులా ప్రయత్నించేవాడు ముస్లిం. వీటి ఆధారంపై మానవ సమాజ నిర్మాణం కొరకు పనిచేసేవాడు ముస్లిం.
అల్లాహ్ అంటే ఏమిటి? ఇస్లాం అర్థం తెలుసుకున్నాం, ముస్లిం అంటే ఎవరో తెలుసుకున్నాం, ఇక అల్లాహ్ అనే పదానికి వస్తే, అల్లాహ్ ఆరాధ్య దైవం. అంటే అరబీ భాషలో సృష్టికర్తకి అసలు పేరును సూచించే దివ్యమైన పదం అల్లాహ్. ఇది ఒక అపూర్వమైన, అసమానమైన, అద్వితీయమైన, ఏకైక పదం అల్లాహ్. ఎందుకంటే ఈ పదానికి బహువచన రూపం లేదా స్త్రీలింగ రూపం లేదు. ప్రపంచంలో ఏ మతానికి చెందిన వారైనా సరే ఇస్లాం మతం తప్ప, ఇస్లాం ధర్మం తప్ప ఏ జాతి వారైనా, ఏ మతానికి చెందిన వారైనా సరే, వారు ఎవరిని పెట్టుకున్నారో దేవుళ్ళుగా అని, ఆ పేరుకి బహువచనము వస్తుంది, స్త్రీలింగము వస్తుంది. దేవుడు, దీనికి బహువచనం ఏమిటి? దేవుళ్ళు. స్త్రీలింగ రూపం ఏమిటి? దేవత. అలాగే గాడ్, బహువచనం గాడ్స్, స్త్రీలింగ రూపం గాడెస్. కానీ అల్లాహ్ కు బహువచనము, అలాగే స్త్రీలింగ రూపము లేదు. ఇది ఒక అపూర్వమైన, అసమానమైన, అద్వితీయమైన ఏకైక పదం అల్లాహ్.
అభిమాన సోదరులారా! ఇస్లాం ఒక నూతన ధర్మం కాదు, కొత్త ధర్మం కాదు ఇస్లాం. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తన ప్రవక్తలందరికీ పంపిన అదే దివ్య సందేశం మరియు మార్గదర్శకత్వం ఇస్లాం. అయితే చిట్టచివరి ప్రవక్త, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై అవతరించిన ఈ ఇస్లాం సందేశం ప్రత్యేకత ఏమిటంటే, అది తన యొక్క సమగ్రమైన, సంపూర్ణమైన మరియు అంతిమ రూపంలో ఆయనపై అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై అవతరించింది.
అభిమాన సోదరులారా! ఇస్లాం ధర్మం యొక్క కీలక భాగాలు, మౌలిక అంశాలు అవి ఐదు ఉన్నాయి. దానికి వివరణలో పోకుండా కేవలం క్లుప్తంగా మొదటిది సాక్ష్య ప్రకటన, సాక్ష్య వచనం. ఆరాధింపబడే అర్హత గలవారు ఎవ్వరూ లేరు అల్లాహ్ తప్ప. అంటే అల్లాహ్ తప్ప నిజ ఆరాధ్య దేవుడు, నిజ ఆరాధ్య దైవం ఎవ్వరూ లేరు. మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క సందేశహరుడు మరియు దాసుడు అని సాక్ష్యం ఇవ్వటం. దీనినే షరీఅత్ పరిభాషలో, అరబీలో అష్షహాద అంటారు.
ఇక రెండవ మౌలిక అంశం అస్సలాహ్, నమాజ్, ఆరాధనలు. అల్లాహ్ కొరకు మన బాధ్యతగా భావిస్తూ ప్రతిరోజు ఐదు పూటల నమాజులు చేయడం. అవి అల్లాహ్ పై విశ్వాసాన్ని మరియు సామీప్యాన్ని ధృడపరుస్తాయి. అంత మాత్రమే కాదు, ఈ నమాజ్, సలాహ్ అనేది మనిషిని ఉత్తమ సంస్కారాల వైపు ప్రోత్సహిస్తాయి, హృదయాన్ని పరిశుద్ధ పరుస్తాయి, చెడు నుండి ఆపుతుంది. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూరా అన్కబూత్, ఆయత్ 45లో ఇలా సెలవిచ్చాడు:
إِنَّ ٱلصَّلَوٰةَ تَنْهَىٰ عَنِ ٱلْفَحْشَآءِ وَٱلْمُنكَرِ
(ఇన్నస్సలాత తన్హా అనిల్ ఫహ్షాఇ వల్ మున్కర్)
నిశ్చయంగా నమాజ్ అశ్లీలతల నుండి, నిషిద్ధ కార్యాల నుండి ఆపుతుంది. (29:45)
అది హృదయాన్ని పరిశుద్ధ పరుస్తాయి. మంచిని, ఉత్తమ సంస్కారాల వైపుకు ప్రోత్సహిస్తుంది. అలాగే చెడు నుండి, మున్కర్ నుండి, తప్పు నుండి, కీడు నుండి, పాపం నుండి, అవినీతి నుండి, దగా నుండి, మోసం నుండి, ప్రతి చెడు నుండి ఆపుతుంది. ఇది నమాజ్ యొక్క ప్రత్యేకత.
అలాగే మూడవ అంశం రమదాన్ మాసంలో ఉపవాసం, అస్సౌమ్. రమదాన్ మాసంలో తెల్లవారు జామున నుండి సూర్యాస్తమయం వరకు ముస్లింలు అన్నపానీయాల నుండి మరియు దాంపత్య సుఖము నుండి దూరంగా ఉండటమే కాకుండా, అంటే కేవలం ఆకలి దప్పులతో మాత్రమే కాదు, చెడు ఆలోచనల నుండి మరియు చెడు కోరికల నుండి కూడా దూరంగా ఉంటారు. అది ప్రేమ, చిత్తశుద్ధి మరియు భక్తిని నేర్పుతుంది, తఖ్వాని నేర్పుతుంది. అంతేగాక సామాజిక విచక్షణ, సహనం, నిస్వార్థం మరియు సంకల్ప బలాన్ని పెంపొందిస్తుంది ఉపవాసం.
అలాగే నాలుగవ అంశం జకాత్. సంవత్సరం పాటు నిల్వ ఉన్న తమ ధనము నుండి రెండన్నర శాతం ధనాన్ని ధార్మిక కర్తవ్యంగా, ఉపకారంగా కాదు, ధార్మిక కర్తవ్యంగా మరియు పాప ప్రక్షాళన కోసం సమాజంలోని బీద వారికి, అవసరార్థులకు, లేని వారికి దానం ఇవ్వడం. ఇది జకాత్ వ్యవస్థ.
ఐదవ అంశం హజ్. మంచి ఆరోగ్యంతో, ఆర్థికంగా భరించగలిగే స్థితిలో ఉన్నప్పుడు జీవితంలో ఒక్కసారి మక్కా వెళ్లి కాబతుల్లా హజ్ చేయాలి.
అభిమాన సోదరులారా! ఈ ఐదు మూలాంశాలు మాత్రమే కాకుండా, అల్లాహ్ మెప్పు కోసం ఆరాధన అంటే ఏమిటి? ఏదో ఒక సందర్భంలో, రోజుకి ఒక్కసారి, వారానికి ఒక్కసారి, నెలకి ఒక్కసారి, సంవత్సరానికి ఒక్కసారి, ప్రత్యేక సమయంలో, ప్రత్యేక సందర్భంలో ఏదో మస్జిద్ కి పోయామా, అల్లాహ్ ను తలచుకున్నామా, కాదు. ఆరాధన అంటే ఇస్లాం ధర్మంలో, ఇస్లాం సంపూర్ణ జీవన విధానం కదా, ఇది సత్యం. ఇది కేవలం మాటపరంగా కాదు, ఆచరణపరంగా. ఆరాధన అంటే షరీయత్ పరిభాషలో హాఫిద్ ఇబ్నె హజర్ రహమతుల్లాహి అలై ఆరాధన యొక్క నిర్వచనం ఇలా తెలియజేశారు:
اسم لما يحبه الله ويرضاه من الأقوال والأفعال والأعمال الظاهرة والباطنة
(ఇస్మున్ లిమా యుహిబ్బుహుల్లాహు వ యర్దాహు మినల్ అఖ్వాలి వల్ అఫ్ఆలి వల్ అఅమాలి అజ్జాహిరతి వల్ బాతిన)
అల్లాహ్ ఇష్టపడే మరియు ఆయనకు సంతోషం కలిగించే మాటలు, చేతలు, మరియు బాహ్య, అంతర్గత కర్మలన్నిటికీ (ఇబాదత్) పేరు.
దీనికి సారాంశం ఏమిటంటే, అల్లాహ్ మెప్పు కోసం, అల్లాహ్ ప్రసన్నత కోసం, అల్లాహ్ ఇష్ట ప్రకారం చిత్తశుద్ధితో చేసే ప్రతి మంచి పని, ప్రతి మంచి కార్యం, అది కనపడినా కనపడకపోయినా, మాటల రూపంలో, ఆచరణ రూపంలో, హృదయపూర్వకంగా, సంకల్పంలో, చూసే విషయాలు, చూడని విషయాలు, కనపడే విషయాలు, కనపడని విషయాలు, ఊహించేది, మాట్లాడేది, సహాయం చేసే ప్రతిదీ అల్లాహ్ ప్రసన్నత కోసం, అల్లాహ్ మెప్పు కోసం చిత్తశుద్ధితో చేసే ప్రతి మంచి పని ఆరాధనే అవుతుంది. అంటే అల్లాహ్ ప్రసన్నత కోసం ఒకరికి సహాయం చేసినా అది ఇస్లాం ధర్మంలో ఆరాధన. అల్లాహ్ ప్రసన్నత కోసం ఒకరిని క్షమించినా అది ఆరాధన.
అభిమాన సోదరులారా! అల్లాహ్ యొక్క ఏకత్వాన్ని, అద్వితీయత్వాన్ని మరియు సార్వభౌమత్వాన్ని విశ్వసించమని ఇస్లాం ఆదేశిస్తుంది. తద్వారా మనిషి విశ్వాసాన్ని మరియు విశ్వంలోని తన స్థానాన్ని అర్థం చేసుకోగలుగుతాడు. ఈ నమ్మకం అల్లాహ్ యొక్క ఉనికిని మరియు ఆయన హక్కును అతడికి గుర్తు చేస్తూ, అన్ని రకాల పిచ్చి భయాల మరియు భ్రమల నుండి, గుడ్డి నమ్మకాల నుండి, మూఢ విశ్వాసాల నుండి విముక్తి చేస్తుంది ఇస్లాం ధర్మం.
ఇస్లాం సంపూర్ణ జీవన విధానం. కేవలం మనసులో విశ్వసిస్తే సరిపోదు. ఎందుకు? ఇది ఇతర మతాల పరంగా కేవలం మాట రూపంలోనే కాదు ఇది, కేవలం విశ్వసిస్తే సరిపోదు. అది మాటలలో మరియు చేతలలో కూడా కనపడాలి మరియు రుజువు కావాలి. కాబట్టి మన ఏక దైవత్వ విశ్వాసం ఇస్లాం యొక్క ఐదు మూల అంశాల ద్వారా బహిర్గతం అవుతుంది. మనందరి సృష్టికర్త మరియు పోషణకర్త, విశ్వప్రభువు ఆరాధించే ఒక కుటుంబంగా మొత్తం మానవజాతిని చూడమని, ఏక దైవత్వ విశ్వాసం నిర్దేశిస్తుంది. అవతార పురుషుల మరియు దైవాంశ సంభూతుల సిద్ధాంతాన్ని ఇస్లాం తిరస్కరిస్తుంది. కేవలం స్వచ్ఛమైన ఏక దైవత్వ విశ్వాసం మరియు మంచి పనుల వలన మాత్రమే స్వర్గ ప్రవేశం లభించగలదని చెబుతుంది ఇస్లాం ధర్మం. తద్వారా ఎలాంటి మధ్యవర్తులు, పూజారులు, సిఫారసు చేసేవాళ్ళు లేకుండా సృష్టికర్తను తిన్నగా ఆరాధించవచ్చు మరియు వేడుకోవచ్చు. ఇది ఇస్లాం చూపే విధానం, ఇస్లాం ధర్మం చూపించే మార్గం.
ఖుర్ఆన్ మరియు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సున్నతులలో బోధించబడిన అల్లాహ్ యొక్క ధర్మశాసనం మాత్రమే అన్నిటికంటే ఉత్తమమైనది. ధర్మ పండితులు, మేధావులు, రాజకీయ నాయకులు, పలుకుబడిదారులు, వారు చెప్పే మాటలు శాసనాలు కావు. ఎందుకు? ఇస్లాం సంపూర్ణ జీవన విధానం. అంటే అల్లాహ్ ఆదేశం, అల్లాహ్ ప్రవక్త విధానం. దీనికి అన్నిటికంటే ఉత్తమమైనది. అది సమాజంలో ఉన్నత వంశస్థులపై మరియు అధమ స్థానంలోని ప్రజలపై, ధనికులపై మరియు బీదవారిపై సమానంగా వర్తిస్తుంది. అలాగే పాలకులపై మరియు పామరులపై కూడా.
ఖుర్ఆన్. ఇది అల్లాహ్ యొక్క అంతిమ దివ్యవాణి. ఇస్లామీయ బోధనల మరియు ధర్మశాసనాల యొక్క ప్రాథమిక మూలాధారం. దైవ విశ్వాసం, సంస్కారం, మానవజాతి చరిత్ర, ఆరాధన, జ్ఞానం, వివేకం, సమస్త విషయాలలో సృష్టికర్త మరియు సృష్టి మధ్య పరస్పరం మానవుల మధ్య ఉండవలసిన సంబంధాల గురించి స్పష్టంగా చర్చిస్తుంది. సామాజిక న్యాయం, ఆర్థిక, రాజకీయ, చట్ట, న్యాయ, శాస్త్ర, అంతర్జాతీయ అంశాల గురించి సమగ్ర ముఖ్య్యాంశాలు ఇస్లాం ధర్మంలో ఉన్నాయి. ఇటువంటి ధర్మం ప్రపంచంలో ఎక్కడా కనపడదు. ఎందుకంటే ఇది సృష్టికర్త నియమించిన ధర్మం. సంపూర్ణ జీవన విధానం.
హదీసులు అంటే తన సహచరులచే చాలా జాగ్రత్తగా నమోదు చేయబడిన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఉపదేశాలు, ప్రవచనాలు, పలుకులు మరియు ఆచరణలు. ఖుర్ఆన్ వచనాలను మరింత స్పష్టంగా వివరిస్తుంది మరియు విశదీకరిస్తుంది హదీస్.
అభిమాన సోదరులారా! ఇస్లాం కేవలం ఆచార కర్మలను గుడ్డిగా చేయమని బోధించదు. గుడ్డి విశ్వాసం కాదు ఇస్లాం. మూఢ నమ్మకం కాదు ఇస్లాం. ఇస్లాం కేవలం ఆచార కర్మలను గుడ్డిగా చేయమని బోధించదు మరియు సమ్మతించదు. అది వాటి సంకల్పం మరియు ఆచరణల ఆవశ్యకతను గట్టిగా నొక్కి చెబుతుంది. దైవాన్ని, అల్లాహ్ ను, సృష్టికర్తను ఆరాధించడం అంటే ఆయనను గ్రహించడం, ప్రేమించడం, తన జీవితంలోని ప్రతి అడుగు ఆయన ఆదేశాలకు అనుగుణంగా వేయడం. ఇది ఇస్లాం ధర్మం.
మంచి పనులు చేయమని ఆదేశిస్తుంది. చెడు పనులు చేయవద్దని, దౌర్జన్యం చేయవద్దని నిరోధిస్తుంది. దానధర్మాలు చేయమని, న్యాయంగా జీవించమని, తోటి మానవులకు సేవ చేయడం ద్వారా అల్లాహ్ కు సేవ చేయడం అని ఇస్లాం తెలుపుతుంది, బోధిస్తుంది. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూరా బఖరా, సూరా నెంబర్ 2, ఆయత్ 177లో ఇలా సెలవిచ్చాడు, సదాచరణ అంటే ఏమిటి? పుణ్యం అంటే ఏమిటి?
لَّيْسَ الْبِرَّ أَن تُوَلُّوا وُجُوهَكُمْ قِبَلَ الْمَشْرِقِ وَالْمَغْرِبِ وَلَٰكِنَّ الْبِرَّ مَنْ آمَنَ بِاللَّهِ وَالْيَوْمِ الْآخِرِ وَالْمَلَائِكَةِ وَالْكِتَابِ وَالنَّبِيِّينَ وَآتَى الْمَالَ عَلَىٰ حُبِّهِ ذَوِي الْقُرْبَىٰ وَالْيَتَامَىٰ وَالْمَسَاكِينَ وَابْنَ السَّبِيلِ وَالسَّائِلِينَ وَفِي الرِّقَابِ وَأَقَامَ الصَّلَاةَ وَآتَى الزَّكَاةَ وَالْمُوفُونَ بِعَهْدِهِمْ إِذَا عَاهَدُوا ۖ وَالصَّابِرِينَ فِي الْبَأْسَاءِ وَالضَّرَّاءِ وَحِينَ الْبَأْسِ ۗ أُولَٰئِكَ الَّذِينَ صَدَقُوا ۖ وَأُولَٰئِكَ هُمُ الْمُتَّقُونَ
“మీరు మీ ముఖాలను తూర్పు దిక్కుకో, పడమర దిక్కుకో తిప్పటమే సదాచరణ కాదు. సదాచరణ అంటే వాస్తవానికి అల్లాహ్‌ను, అంతిమ దినాన్నీ, దైవదూతలనూ, దైవగ్రంథాన్నీ, దైవ ప్రవక్తలనూ విశ్వసించటం. ధనప్రీతి ఉన్నప్పటికీ సమీప బంధువులకు, అనాధలకు, అగత్యపరులకు, బాటసారులకు, యాచించే వారికి (ధనాన్ని) ఇవ్వటం, బానిసలకు విముక్తి నొసగటం, నమాజును నెలకొల్పటం, జకాతును చెల్లిస్తూ ఉండటం, ఇచ్చిన మాటను నిలుపుకోవటం, లేమిలో కష్టకాలంలో, యుద్ధ సమయాలలో సహన స్థయిర్యాలను కనబరచటం- ఇవన్నీ కలిగి వున్నవారే వాస్తవానికి సత్యమూర్తులు. భయభక్తులు కలవారు కూడా వీరే.” (2:177)
ఈ విధంగా సూరా బఖరా ఆయత్ నెంబర్ 177 అంటే అల్-బిర్ అంటే, సదాచరణ అంటే, పుణ్యం అంటే, నేకీ అంటే, మంచి పని అంటే కేవలం తూర్పు దిక్కుకో, పడమర దిక్కుకో ముఖం తిప్పుకోవటం కాదు. దైవభక్తి, ధర్మ నిష్ఠాపరత్వం మరియు అల్లాహ్ పట్ల విధేయత చూపే ప్రతి పని, అంటే కేవలం మీ ముఖాలను తూర్పు దిశకో లేదా పడమర దిశకో త్రిప్పుకొనుట కాదు. కానీ అల్-బిర్ అంటే, పుణ్యం అంటే, నేకీ అంటే, సదాచరణ అంటే అల్లాహ్ ను, అంతిమ దినాన్ని, దైవదూతలను, దివ్య గ్రంథాలను, అల్లాహ్ యొక్క సందేశహరులను ప్రవక్తలను విశ్వసించడం. మరియు సంపదపై ప్రేమ ఉన్నప్పటికీ, దగ్గరి బంధువులకు, అనాథలకు, అక్కర గలవారికి, బాటసారులకు, అర్ధించే వారికి మరియు బానిసల విముక్తి కొరకు ఖర్చు చేయడం. మరియు నమాజును స్థాపించడం, జకాతు చెల్లించడం. వాగ్దానం చేసినప్పుడు దానిని పూర్తి చేయడం. అలాగే కష్టాలలో, పేదరికంలో, యుద్ధ సమయాలలో సహనం వహించడం. ఎవరైతే వీటిని ఆచరిస్తారో, అలాంటి వారే సత్యవంతులు మరియు అలాంటి వారే అల్లాహ్ పట్ల, సృష్టికర్త పట్ల భయభక్తులు కలిగి ఉన్నారు అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖుర్ఆన్ లో ఆదేశించాడు.
అంటే ఒక మనిషి యొక్క, విశ్వాసి యొక్క, ముస్లిం యొక్క జీవన విధానాన్ని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూచించాడు ఈ ఆయత్లో. బంధువుల పట్ల ఎలా ఉండాలి, బాటసారుల పట్ల, పేదవారి పట్ల, లేని వారి పట్ల ఏ విధంగా మెలగాలి, ఎలా ఆరాధన చేయాలి, ఇది అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు.
అభిమాన సోదరులారా, జీవితంలోని ప్రతి అడుగు ఎలా వేయాలనే విషయం గురించి నిర్దిష్టమైన మార్గదర్శకత్వాన్ని ఇస్లాం మానవులందరికీ అందజేస్తుంది. జీవితంలోని ప్రతి కోణములో, ప్రతి విషయంలో, ప్రతి అడుగు, ఒక మనిషి తన జీవితంలో ప్రతి అడుగు ఎలా వేయాలా, దీనికి నిర్ధారిస్తుంది ఇస్లాం ధర్మం. అది అందించే మార్గదర్శకత్వం సమగ్రమైనది. అందులో మానవ జీవితానికి సంబంధించిన సామాజిక, ఆర్థిక, రాజకీయ, సంస్కార మరియు ఆధ్యాత్మిక అంశాలన్నీ ఉన్నాయి. భూమిపై తన జీవిత పరమార్థం మరియు స్వయంగా తనపై, భార్యా బిడ్డలపై, సమాజం, తోటి మానవులు మరియు సృష్టికర్తపై ఉన్న తన బాధ్యతలు మరియు విధులు ఏమిటో మానవుడికి జ్ఞాపకం చేస్తుంది. తన జీవిత ఉద్దేశం గురించి మానవుడికి అవసరమైన మార్గం చూపుతుంది.
సత్యాన్వేషణలో చిత్తశుద్ధితో పరిశోధిస్తున్న వారి కొరకు ఇస్లాం ధర్మం స్పష్టంగా మరియు సూటిగా సత్యాన్ని ముందంచడం అనేది ఏ ధర్మంలోనూ కనపడని ఒక బ్రహ్మాండమైన విషయం. మానవ జీవితపు సమస్యలన్నింటికీ ఇది పరిష్కారం. మానవ జీవితపు సమస్యలన్నీ, కి పరిష్కారం ఇస్లాం ధర్మం. ప్రతి దశలో మనందరి సృష్టికర్త, ప్రభువైన అల్లాహ్ ను ప్రశంసిస్తూ, ఉన్నతమైన మరియు సంపూర్ణమైన జీవితం వైపు దారి చూపే ఒక అద్భుత మార్గదర్శకత్వం ఇస్లాం ధర్మం. ఒక సంపూర్ణ జీవన విధానం.
అభిమాన సోదరులారా, ఇస్లాం ఆధునిక సమస్యల పరిష్కారం. ఎందుకు? ఎందుకంటే అది సంపూర్ణ జీవన విధానం. సౌభ్రాతృత్వం, సోదరత్వం ఇది నేర్పుతుంది ఇస్లాం. ఆధునిక దేశాలు మనం చెప్పుకుంటున్నాము ఆధునిక డెవలప్మెంట్, ఏం డెవలప్మెంట్? ఆధునిక దేశాలు చంద్రుడిపై, అంగారక గ్రహంపై మానవుడినైతే పంపించగలిగాయి. మనిషి చంద్ర మండలంలోకి వెళ్ళిపోయాడు, ఎక్కడికో వెళ్ళిపోయాడు. కానీ తోటి మానవుడిని అసహ్యించుకోకుండా, పొట్లాడకుండా ఆపలేకపోతున్నాయి. అయితే ఇస్లాం ధర్మం 1400 సంవత్సరాల క్రితమే జాత్యాహంకారాన్ని ఎలా రూపుమాపాలో ఆచరణాత్మకంగా, ప్రాక్టికల్ గా చూపించింది. హజ్ యాత్రలో ప్రతి సంవత్సరం అన్ని జాతుల మరియు దేశస్థుల మధ్య ఆచరణాత్మకంగా నెలకొన్న సోదరత్వపు అసలు ఇస్లామీయ మహిమను ప్రతి ఒక్కరూ కళ్లారా చూడవచ్చు.
మానవజాతి వద్దకు రెండు పద్ధతులలో దివ్యవాణి వచ్చింది. మొదటిది, దివ్య గ్రంథాల రూపంలో సూటిగా అవతరించిన అల్లాహ్ పలుకులు ఖుర్ఆన్లో. రెండోది, తను ఎంచుకున్న ప్రవక్తల బోధనలు. ఇవి రెండూ ఏకకాలంలో జరిగేవి కాబట్టి వీటిలో ఏదో ఒక దానిని పట్టుకొని రెండో దానిని వదిలిపెట్టి అల్లాహ్ యొక్క సందేశాన్ని గ్రహించేందుకు ప్రయత్నించడం అనేది నిస్సందేహంగా మార్గభ్రష్టత్వం వైపుకు దారి తీస్తుంది. ఈ మాట ఎందుకు చెప్పానంటే, ఒక వర్గం వారు తమ వైపు పంపబడిన ప్రవక్తలను నిర్లక్ష్యం చేసి, కేవలం వారి గ్రంథాలపై మాత్రమే దృష్టి కేంద్రీకరించారు. మార్పులు చేర్పులకు గురై అవి పజిల్ గా మారిపోయాయి. కాలక్రమంలో చివరికి వాటిని కూడా మొత్తంగా పోగొట్టుకున్నారు ఒక వర్గం వారు.
ఇక క్రైస్తవం విషయానికి వస్తే, వారు తమ వైపు పంపబడిన అల్లాహ్ యొక్క గ్రంథాన్ని పూర్తిగా ఉపేక్షించి, నిర్లక్ష్యం చేసి, మొత్తం ప్రాధాన్యతను కేవలం జీసస్ కే ఇచ్చారు. ఆయనకు దైవత్వాన్ని ఆపాదించడమే కాకుండా బైబిలులోని అసలు ఏక దైవత్వ భావాన్నే, అంటే తౌహీద్ నే పోగొట్టుకున్నారు. దీనికి భిన్నంగా చిట్టచివరి దివ్యావతరణ ఖుర్ఆన్ అవతరించిన దాని అసలు రూపంలోనే నేటికీ భద్రపరచబడి ఉంది. అల్లాహ్ అంటున్నాడు ఖుర్ఆన్ లో:
إِنَّا نَحْنُ نَزَّلْنَا ٱلذِّكْرَ وَإِنَّا لَهُۥ لَحَٰفِظُونَ
(ఇన్నా నహ్ను నజ్జల్నజ్జిక్ర వ ఇన్నా లహూ లహాఫిజూన్)
మేమే ఈ ఖుర్‌ఆన్‌ను అవతరింపజేశాము. మరి మేమే దీనిని రక్షిస్తాము. (15:9)
ఇది దీనిని ఖుర్ఆన్ ని మేమే పంపాము, దీనిని మేమే భద్రపరుస్తాము. అల్లాహ్ బాధ్యత తీసుకున్నాడు. ఎలా అవతరించిందో అలాగే యథాతథంగా ఒక పొల్లు కూడా మార్పు లేకుండా ఉంది ప్రళయం వరకు ఉంటుంది ఇన్షా అల్లాహ్.
దివ్యవాణి అవతరించిన పూర్వ ధర్మాలన్నింటి ఉత్తర భాగం మరియు ఉత్కృష్ట స్థానమే ఇస్లాం ధర్మం. కాబట్టి ఇది అన్ని కాలాలకు మరియు ప్రజలందరికీ వర్తిస్తుంది. అన్ని కాలాలకు, అన్ని ప్రాంతాలకు, అన్ని ప్రజలకు వర్తిస్తుంది. ఖుర్ఆన్ తప్ప అవతరించిన తన అసలు రూపంలో మరియు మార్పులు చేర్పులకు గురి కాకుండా ఏ దివ్య గ్రంథము ఈనాడు అందుబాటులో లేదు.
మానవ జీవితపు ప్రతి అడుగులో అన్ని కాలాలలో మరియు మొత్తం మానవాళికి మార్గదర్శకత్వం వహించే నిశ్చయమైన దావా ఏ ధర్మంలోనూ కనపడదు. కానీ ఇస్లాం ధర్మం మొత్తం మానవజాతిని బహిరంగంగా సంబోధిస్తుంది.
అభిమాన సోదరులారా! ఇక నేను ఇస్లాం సంపూర్ణ జీవన విధానం, ఇటువంటి ఇస్లాం ధర్మం గురించి చాలా మంది పేరు పొందిన వారు, ప్రఖ్యాత చెందిన వారు, ప్రముఖులు చాలా విషయాలు చెప్పారు. వాటిలో కొందరి గురించి ఉదాహరణకు, కానన్ టేలర్, ఈయన “పేపర్ రీడ్ బిఫోర్ ద చర్చ్ కాంగ్రెస్ అట్” అనే ఒక పుస్తకంలో 1987 ఆయన ఇలా అంటున్నాడు: “ఇస్లాం సన్యాసి సంబంధమైన ప్రవర్తన చోట సహజ మానవ ప్రవర్తనను నెలకొల్పింది. బానిసలలో ఆశలు చిగురింపజేసింది. మానవ జాతికి సహోదరత్వాన్ని ఇచ్చింది. మానవ స్వభావపు ప్రాథమిక వాస్తవాలను గుర్తి చేసింది ఇస్లాం ధర్మం”.
అలాగే సరోజినీ నాయుడు ఏమన్నారంటే, “ఇస్లాం యొక్క అత్యద్భుత ఆదర్శాలలో ఒకటి న్యాయబుద్ధి. ఇది న్యాయ, సమానత్వం ఇస్లాంలో తప్ప ఎక్కడా మనకు కనపడదు. ఎందుకంటే నేను ఖుర్ఆన్ చదివి కొద్దీ అందులో రోజువారీ జీవితపు చైతన్యవంతమైన నియమ నిబంధనలు కనుగొంటూ పోయాను. అవి విశ్వవ్యాప్తంగా వర్తించే ప్రతి దిన ఆదర్శవంత జీవితంలోని ఆచరణాత్మక నైతిక విలువులే కానీ భావావేశభరిత అనుభూతివాదం ఎంత మాత్రం కాదు“.
అలాగే జార్జ్ బెర్నార్డ్ షా ఏమన్నాడంటే, “ద జెన్యూన్ ఇస్లాం” లో “నేనెప్పుడూ ముహమ్మద్ యొక్క ధర్మాన్ని దాని యొక్క సజీవత్వం వలన ఉన్నతంగా చూశాను. నా దృష్టిలో ఈ ధర్మం మాత్రమే కాలానుగుణంగా మారుతున్న పరిస్థితులను తనలో కలుపుకునే శక్తి సామర్థ్యం కలిగి ఉంది. ప్రతి కాలంలోనూ స్వయంగా ఇతరులను ఆకర్షిస్తుంది. నేను ఆయన గురించి చదివాను, (అంటే ప్రవక్త గురించి). ఆశ్చర్యకరమైన వ్యక్తి. నా అభిప్రాయంలో ఆయన క్రీస్తు విరోధి పోలికలకు బహు దూరం మరియు ఆయనను మానవజాతి సంరక్షకుడు అనే పేరుతో తప్పకుండా పిలవాలి. ఒకవేళ అలాంటి వ్యక్తి ఆధునిక ప్రపంచ నాయకత్వం వహిస్తే, అతడు సర్వదా శాంతి మరియు ఆనందం వ్యాపించేలా దాని సమస్యలను పూర్తిగా పరిష్కరిస్తాడని నేను నమ్ముతున్నాను. నేటి యూరప్ ముహమ్మద్ యొక్క ధర్మాన్ని స్వీకరించడం మొదలుపెట్టినట్లుగా రేపటి రోజున మొత్తం యూరప్ దానిని స్వీకరిస్తుందని నేను భవిష్యవాణి పలుకుతున్నాను” అని జార్జ్ బెర్నార్డ్ షా అన్నారు.
అభిమాన సోదరులారా! ఈ విధంగా ఎంతోమంది మేధావులు చాలా గొప్ప విషయాలు ఇస్లాం ధర్మం గురించి తెలియజేశారు. ఉదాహరణకి చాలామంది ఉన్నారు. చివరిలో ఒక విషయం చెప్పి నేను ముగిస్తున్నాను. అదేమిటంటే, హెర్బర్ట్ అనే వ్యక్తి, జర్మనీ దౌత్యవేత్త, క్రైస్తవ బోధకుడు మరియు సామాజిక కార్యకర్త, ప్రపంచంలోని వివిధ దేశాలలో జర్మనీ రాయబార కార్యాలయాలలో పనిచేసిన ఒక మంచి వివేకవంతుడు. ఆయన 1441లోనే ఇస్లాం స్వీకరించాడు ఆ వ్యక్తి. ఆయన అంటున్నాడు, “నేను వివిధ సంస్కృతుల మధ్య జీవించాను. వివిధ సిద్ధాంతాలను అధ్యయనం చేసే అవకాశం నాకు లభించింది. చివరిగా ఇస్లాం అంత పరిపూర్ణమైన, సంపూర్ణమైన జీవన విధానం, జీవన వ్యవస్థ మరేదీ లేదనే అభిప్రాయానికి వచ్చాను. పవిత్ర జీవితం యొక్క పూర్తి నియమావళి ఏ వ్యవస్థలోనూ లేదు, కేవలం ఇస్లాంలో మాత్రమే అది ఉంది. అందువలననే మంచి వ్యక్తులు ఇస్లాం స్వీకరిస్తున్నారు. ఇస్లాం కేవలం సైద్ధాంతికపరమైనది మాత్రమే కాదు, ఆచరణాత్మకమైనది కూడా. ఇస్లాం అంటే సర్వలోక సృష్టికర్తకు పూర్తిగా సమర్పించుకోవడం” అని హెర్బర్ట్ హోబోహం తెలియజేశాడు.
అభిమాన సోదరులారా! ఇది కొన్ని విషయాలు. ఇస్లాం సంపూర్ణ జీవన విధానం. ఎందుకంటే ఇది అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సకల లోకాలకు సృష్టికర్త అయిన అల్లాహ్ ఇది చూపించిన మార్గం.
అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా నాకు చెప్పటం కంటే ఎక్కువ, మీకు వినటం కంటే ఎక్కువ ఇస్లాం ధర్మాన్ని అర్థం చేసుకొని, ఆచరించే సద్బుద్ధిని ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరినీ ఇహపరలోకాలలో సాఫల్యం ప్రసాదించుగాక. ఆమీన్. వ ఆఖిరు దఅవాన అనిల్హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ ఈ సోదరులందరికీ ధన్యవాదాలు, శుక్రియా చెప్పుకుంటున్నాను. జజాకుముల్లాహు ఖైర్. వస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.
ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=43431