బ్రతికి ఉన్న పుణ్యాత్ములను అల్లాహ్ తో మనకోసం దుఆ చేయమని కోరడం | ధర్మసమ్మతమైన వసీలా – 3 https://youtu.be/KG8Iw4gwxAc [7:30 నిముషాలు] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఈ ప్రసంగంలో ‘వసీలా’ (అల్లాహ్‌కు సామీప్యం పొందడానికి ఒక సాధనం) అనే ఇస్లామీయ భావన గురించి వివరించబడింది. ఖురాన్ మరియు సున్నత్ ప్రకారం వసీలా యొక్క సరైన అవగాహనను, మరియు సాధారణ అపోహలను వక్త స్పష్టం చేశారు. వసీలా అంటే అల్లాహ్ యొక్క సామీప్యాన్ని ధర్మసమ్మతమైన మార్గాల ద్వారా వెతకడం అని ఆయన వివరించారు. ఈ ప్రసంగం ఆరు రకాల “ధర్మ సమ్మతమైన వసీలా”పై దృష్టి పెట్టింది: 1. అల్లాహ్ యొక్క అందమైన పేర్లు మరియు గుణగణాల ద్వారా. 2. ఒకరి విశ్వాసం (ఈమాన్) మరియు సత్కార్యాల ద్వారా. 3. తౌహీద్ (ఏకేశ్వరోపాసన) ద్వారా. 4. అల్లాహ్‌కు తమ అవసరాన్ని మరియు నిస్సహాయతను వ్యక్తపరచడం ద్వారా. 5. అల్లాహ్ ముందు తమ పాపాలను ఒప్పుకోవడం ద్వారా. 6. జీవించి ఉన్న ఒక పుణ్యాత్ముడిని తమ కోసం అల్లాహ్‌తో ప్రార్థించమని (దుఆ) కోరడం ద్వారా. మరణించిన ప్రవక్తలు, పుణ్యాత్ములు లేదా వారి సమాధుల ద్వారా వసీలాను వెతకడం ధర్మసమ్మతం కాదని వక్త నొక్కి చెప్పారు.
اَلْحَمْدُ لِلّٰهِ وَحْدَهُ (అల్ హందులిల్లాహి వహ్ దహు) అన్ని పొగడ్తలు ఏకైకుడైన అల్లాహ్ కే.
وَ الصَّلَاةُ وَ السَّلَامُ عَلَى مَنْ لَا نَبِيَّ بَعْدَهُ (వస్సలాతు వస్సలాము అలా మల్లా నబియ్య బ’అదహు) ఆయన తర్వాత ప్రవక్త ఎవరూ రారో, ఆయనపై శాంతి మరియు శుభాలు వర్షించుగాక.
అభిమాన సోదరులారా! ధర్మ అవగాహనం అనే ఈ కార్యక్రమం లోకి మీ అందరికీ నా ఇస్లామీయ అభివాదం.
أَلسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ (అస్సలాము అలైకుమ్ వ రహ్ మతుల్లాహి వ బరకాతుహు) మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక.
ప్రియ వీక్షకులారా! ఈరోజు మనం అల్లాహ్ ను వేడుకోవటానికి ఎవరి సహాయమైనా అవసరమా? అంటే మధ్యవర్తి అవసరమా? అల్లాహ్ ను దుఆ చేయటానికి, అర్థించటానికి, వేడుకోవటానికి లేదా మా దుఆలు స్వీకరింపబడటానికి మధ్యవర్తి అవసరమా? ఒకరి సహాయం అవసరమా? వసీలా అవసరమా? అనే విషయం గురించి ఈరోజు తెలుసుకుందాం.
అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్ లో వసీలా గురించి తెలియజేశాడు, కాకపోతే మన సమాజంలో ఒక వర్గం దానికి తప్పుడు అర్థం తీసుకుంటుంది. సహాబాలు, తాబయీన్లు, సజ్జనులు, పూర్వీకులు, ధర్మ పండితులు, ముహద్దసీన్లు, అయిమ్మాలు (ఇమాములు) తీసుకోలేని అర్థం వీళ్ళు తీసుకుంటున్నారు. దాని వాస్తవం ఏమిటి? ఇన్ షా అల్లాహ్ ఆధారంగా, ఖురాన్ మరియు ప్రామాణిక హదీసుల ఆధారంగా తెలుసుకుందాం.
అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూర మాయిదా, ఆయత్ 35 లో ఇలా తెలియజేశాడు:
وَابْتَغُوا إِلَيْهِ الْوَسِيلَةَ (వబ్తగూ ఇలైహిల్ వసీల) ఆయన సామీప్యాన్ని పొందే సాధనం వెతకండి. (5:35)
ఆయన సామీప్యాన్ని పొందే సాధనం వెతకండి అని అల్లాహ్ తెలియజేశాడు. ఈ ఆయత్ లో వసీలా అనే పదం ఉంది.
వసీలా అంటే ఏమిటి?
అసలు వసీలా అంటే అర్థం ఏమిటి? వసీలా అంటే ఏదేని ఆశయాన్ని సాధించటానికి, సామీప్యం పొందటానికి అవలంబించబడే మార్గం లేక సాధనం. ఇది వసీలా యొక్క అర్థం. సింపుల్ గా చెప్పాలంటే, అల్లాహ్ సామీప్యం కొరకు సృష్టితాలను సాధనంగా చేసుకోవటం.
అభిమాన సోదరులారా! అల్లాహ్ యొక్క సామీప్యాన్ని పొందే సాధనం వెతకండి అంటే ఆయనకు దగ్గర చేర్చే సత్కార్యాలను చేయమని అర్థం. కానీ కొంతమంది అసలు ఈ వసీలాను వదిలేసి, ఖురాన్ లో ఏ వసీలా గురించి చెప్పడం జరిగిందో, అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏ వసీలా గురించి చెప్పారో, దాని నిజమైన అర్థం ఏమిటి, వాస్తవమైన భావం ఏమిటి అది పక్కన పెట్టి, దర్గా, సమాధులను, పుణ్య పురుషులను, ప్రవక్తలను, దైవదూతలను, ఔలియాలను, చనిపోయిన వారిని సాధనంగా చేసుకుంటున్నారు. ఇది ముమ్మాటికీ ఖురాన్ కి, హదీసులకు లకు విరుద్ధం.
వసీలా రకాలు
అభిమాన సోదరులారా! ఇక, వసీలా రెండు రకాలు. ధర్మ సమ్మతమైన వసీలా, అధర్మమైన వసీలా.
ఈరోజు మనం ధర్మ సమ్మతమైన వసీలా గురించి తెలుసుకుందాం. ఏ వసీలా సమ్మతంగా ఉందో, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడో, అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మనకి తెలియజేశారో, ధర్మ సమ్మతమైన వసీలా ఏమిటి ఈరోజు మనము తెలుసుకుందాం, ఇన్ షా అల్లాహ్.
ధర్మ సమ్మతమైన వసీలా
ధర్మ సమ్మతమైన వసీలాలో ఒకటి, గత ఎపిసోడ్ లో మనం తెలుసుకున్నాం.
وَلِلَّهِ الْأَسْمَاءُ الْحُسْنَىٰ فَادْعُوهُ بِهَا (వలిల్లాహిల్ అస్మావుల్ హుస్నా ఫద్ ఊహు బిహా) అల్లాహ్ కు మంచి మంచి పేర్లు ఉన్నాయి, కాబట్టి మీరు ఆ పేర్లతో ఆయన్నే పిలవండి. (7:180)
మొదటి ధర్మ సమ్మతమైన వసీలా ఏమిటి? అల్లాహ్ నామాలను, గుణగణాలను సాధనంగా చేసుకోవటం. అల్లాహ్ నామాన్ని, అల్లాహ్ గుణాలను వసీలాగా తీసుకోవటం. ఇది సూర ఆరాఫ్ ఆయత్ నంబర్ 180. వలిల్లాహిల్ అస్మావుల్ హుస్నా ఫద్ ఊహు బిహా – అల్లాహ్ కు మంచి మంచి పేర్లు ఉన్నాయి, కాబట్టి మీరు ఆ పేర్లతో ఆయన్నే పిలవండి. ఇది గత ఎపిసోడ్ లో మనం తెలుసుకున్నాం, అంటే దుఆ చేసేటప్పుడు, వేడుకునేటప్పుడు, ప్రార్థించేటప్పుడు అల్లాహ్ నామాల ద్వారా, అల్లాహ్ గుణ విశేషణాల ద్వారా వేడుకోవటం, అల్లాహ్ యొక్క నామాలను, అల్లాహ్ యొక్క గుణాలను సాధనంగా చేసుకోవటం, వసీలాగా చేసుకోవటం. ఇది మొదటి విషయం.
ఆ తర్వాత రెండవది, విశ్వాసం మరియు సత్కర్మలను అల్లాహ్ సన్నిధిలో సాధనంగా చేయటం. విశ్వాసాన్ని, సత్కర్మలను. దీనికి ఉదాహరణ, బుఖారీ మరియు ముస్లిం గ్రంథంలో ఒక పేరు పొందిన ఒక హదీస్ ఉంది, ఫేమస్ హదీస్, గుహ వారి హదీస్. దీనికి ఒక ప్రబల తార్కాణం. ఆ వివరంగా ఉంది హదీస్, నేను కేవలం దాంట్లో యొక్క సారాంశం మాత్రమే చెప్తున్నాను.
ఆ ముగ్గురు వ్యక్తులు, బనీ ఇస్రాయీల్ లో, గుహలో తల దాచుకున్నారు. గాలుల మూలంగా, వర్షాల మూలంగా కొండరాయి విరిగి ఆ గుహ ముఖాన్ని మూసేసింది. ఆ ముగ్గురు వ్యక్తులు గుహ లోపల ఉండిపోయారు. బయటికి రావాలంటే కొండరాయి వచ్చి పడిపోయింది, ఆ ముఖ ద్వారం బంద్ అయిపోయింది. ఆ ముగ్గురు వ్యక్తులు బయటికి రాలేరు, శబ్దం బయటికి రాదు, అది ఊరు కాదు, ఎవరో సహాయం చేసే వారు ఎవరూ లేరు, మాట వినే వారు ఎవరూ లేరు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఏదో ఒక దారి చూపిస్తే తప్ప వారికి వేరే మార్గమే లేదు. అప్పుడు ఆ ముగ్గురు వ్యక్తులు ఏం చేశారు? ఆ ముగ్గురు తమ తమ జీవితంలో చేసుకొన్న సత్కర్మలను ఆధారంగా చేసుకుని దుఆ చేశారు. ఒక వ్యక్తి అయితే తమ అమ్మ నాన్నల పట్ల ఏ విధంగా వ్యవహరించాడో అది సాధనంగా చేసుకున్నాడు, అమ్మ నాన్నల పట్ల సత్ప్రవర్తన గురించి. ఇంకో వ్యక్తి దానధర్మాల గురించి, ఇంకో వ్యక్తి వేరే విషయం గురించి, ఆ ముగ్గురు వ్యక్తులు తమ తమ సత్కర్మలను, చేసుకొన్న పుణ్యాలను సాధనంగా చేసుకొని, ఆధారంగా చేసుకొని అల్లాహ్ ను వారు దుఆ చేశారు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వారి దుఆలను ఆలకించి, వారి ప్రార్థన స్వీకరించి, వారికి ఆ బండరాయిని తప్పించి, కొండరాయిని తప్పించారు. వారు ముగ్గురు అల్హందులిల్లాహ్ క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. అంటే దీంతో ఏం అర్థం అవుతుంది? విశ్వాసం మరియు సత్కర్మలను సాధనంగా, వసీలాగా చేసి వేడుకోవచ్చు. ఇది రెండో విషయం.
మూడో విషయము, అల్లాహ్ సన్నిధిలో ఆయన “తౌహీద్ ను ఆశ్రయించటం. అల్లాహ్ యొక్క తౌహీద్ ను ఆశ్రయించి దుఆ చేయటం, తౌహీద్ ను వసీలాగా చేసుకోవటం. ఇది యూనుస్ అలైహిస్సలాం ఇలా దుఆ చేశారు. సూర అంబియా ఆయత్ 21:87:
فَنَادَىٰ فِي الظُّلُمَاتِ أَن لَّا إِلَٰهَ إِلَّا أَنتَ سُبْحَانَكَ (ఫనాదా ఫిజ్జులుమాతి అల్ లా ఇలాహ ఇల్లా అంత సుబ్ హానక) అతను చీకట్లలో నుంచి, “అల్లాహ్! నీవు తప్ప మరో ఆరాధ్య దైవం లేడు. నీవు పవిత్రుడవు.” అని మొరపెట్టు కున్నాడు(21:87)
ఇది యూనుస్ అలైహిస్సలాం చేప కడుపులో చేసిన దుఆ ఇది. చీకట్లో, కటిక చీకట్లో, సముద్రం చీకటి, మళ్లా చేప కడుపు, ఆ చీకటి. కటిక చీకట్లో యూనుస్ అలైహిస్సలాం చేసిన దుఆ ఇది. చీకట్లో ఇలా మొరపెట్టుకున్నారు: “ఓ అల్లాహ్! నీవు తప్ప మరో ఆరాధ్య దైవం లేడు.” లా ఇలాహ ఇల్లా అంత – తౌహీద్ ని ఆశ్రయించారు. లా ఇలాహ ఇల్లా అంత సుబ్ హానక – “నీవు తప్ప మరో ఆరాధ్య దైవం లేడు, నీవు పవిత్రుడవు.” అంటే మూడో విషయం, అల్లాహ్ సన్నిధిలో ఆయన తౌహీద్ ని, ఏకత్వాన్ని ఆశ్రయించి దుఆ చేయటం.
నాలుగో విషయం, అల్లాహ్ వైపు మరలి తన అవసరాన్ని, నిస్సహాయ స్థితిని వ్యక్తపరచి దానిని సాధనంగా చేసుకోవటం. అవసరాన్ని, నిస్సహాయ స్థితిని వసీలాగా చేసుకొని అల్లాహ్ ను అడగటం, వేడుకోవటం. ఇది అయ్యూబ్ అలైహిస్సలాం చేసిన దుఆ. ఆయన అనారోగ్యానికి గురైనప్పుడు, దాదాపు 18 సంవత్సరాలు ఆయన అనారోగ్యానికి గురయ్యారు. ఎంత ఆయన సహనం, ఓర్పు, ఆయనకు వచ్చిన పరీక్ష. అభిమాన సోదరులారా! అయ్యూబ్ అలైహిస్సలాం అనారోగ్యానికి గురైనప్పుడు, ఆ ఆయన యొక్క నిస్సహాయ స్థితిని ఆయన వసీలాగా చేసుకొని అల్లాహ్ కు ప్రార్థించారు, వేడుకున్నారు. అయ్యూబ్ అలైహిస్సలాం చేసిన దుఆ ఏమిటి? సూర అంబియా ఆయత్ 83:
أَنِّي مَسَّنِيَ الضُّرُّ وَأَنتَ أَرْحَمُ الرَّاحِمِينَ (అన్నీ మస్సనియద్దుర్రు వ అంత అర్హముర్రాహిమీన్) “నాకు ఈ వ్యాధి సోకింది. నువ్వు కరుణించే వారందరిలోకీ అపారంగా కరుణించేవాడవు” (21:83)
అని దుఆ చేసుకున్నారు, వేడుకున్నారు. అంటే తన నిస్సహాయ స్థితిని సాధనంగా చేసుకున్నారు.
అభిమాన సోదరులారా, అలాగే ఐదవది, తమ పాపాలను అంగీకరిస్తూ దైవ సన్నిధిలో వాటిని సాధనంగా చేసుకోవటం, పాపాలను అంగీకరిస్తూ, ఒప్పుకుంటూ దానికి సాధనంగా చేసుకుని వేడుకోవటం. ఇది మూసా అలైహిస్సలాం దుఆ చేశారు. సూర ఖసస్, ఆయత్ 16లో:
قَالَ رَبِّ إِنِّي ظَلَمْتُ نَفْسِي فَاغْفِرْ لِي (ఖాల రబ్బీ ఇన్నీ జలంతు నఫ్సీ ఫగ్ ఫిర్లీ) “నా ప్రభూ! నాకు నేనే అన్యాయం చేసుకున్నాను. కనుక నన్ను క్షమించు.” (28:16)
అభిమాన సోదరులారా, ఇది ఐదవది.
ఆరవది ఏమిటంటే, ఇది చాలా గమనించి వినాలి, అపార్థం చేసుకోకూడదు. ఆరవది, బ్రతికి ఉన్న సత్పురుషుల దుఆలను అల్లాహ్ సన్నిధిలో సాధనంగా చేసుకోవటం. పరమపదించిన ఔలియాలు, పరమపదించిన ప్రవక్తలు, పరమపదించిన సత్పురుషులు కాదు. బ్రతికి ఉన్న సత్పురుషుల దుఆలను అల్లాహ్ సన్నిధిలో సాధనంగా చేసుకోవటం, వసీలాగా చేసుకోవటం.
దీనికి ఉదాహరణ ఏమిటి? సహాబాలు, అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో కరువు కాటకాలు వచ్చినప్పుడు, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమక్షంలో వెళ్లి ఇలా రిక్వెస్ట్ చేసుకునేవారు, విన్నవించుకునేవారు: “ఓ దైవప్రవక్త, వర్షం లేదు, కరువు వచ్చేసింది, మీరు దుఆ చేయండి.” అంతిమ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దుఆ చేసేవారు, అల్లాహ్ దుఆ స్వీకరించేవాడు, వర్షం వచ్చేది.
అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పరమపదించిన తర్వాత – ఈ హదీస్ బుఖారీ గ్రంథంలో ఉంది – అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పరమపదించిన తర్వాత సహాబాలు, మరి అంతిమ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను వసీలాగా చేసుకోవచ్చు కదా? లేకపోతే ఆయన సమాధి వారి దగ్గరే ఉంది కదా? మస్జిద్ లోనే, పక్కనే ఉంది కదా? మదీనాలోనే ఉంది కదా? ఆ సమాధి దగ్గరికి పోయి వసీలాగా అడగవచ్చు కదా? లేదు. అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పరమపదించిన తర్వాత, సహాబాలు ఆయన పినతండ్రి అబ్బాస్ రదియల్లాహు తాలా అన్హు దగ్గరికి పోయి దుఆ చేయమని కోరేవారు. ఇది చాలా గమనించే విషయం. సహాబాలు, అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పరమపదించిన తర్వాత, ప్రవక్త గారి పేరుతో వసీలాగా దుఆ చేయలేదు. ప్రవక్త గారి యొక్క సమాధి దగ్గరికి పోయి వసీలాగా చేసుకోలేదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉన్నంత కాలం, ప్రవక్త గారితో దుఆ చేయించేవారు. అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పరమపదించిన తర్వాత, సహాబాలు ఆయన పినతండ్రి అబ్బాస్ రదియల్లాహు తాలా అన్హు బ్రతికి ఉన్నారు కాబట్టి, ఆయన దగ్గరికి పోయి దుఆ చేయమని వేడుకునేవారు, అడిగేవారు, రిక్వెస్ట్ చేసుకునేవారు.
కావున, ఇవి నేను చెప్పిన ఆరు రకాలు, ఇవి మాత్రమే ధర్మ సమ్మతమైన వసీలా.
మొదటిది ఏమిటి? అల్లాహ్ యొక్క నామాలను, గుణాలను వసీలాగా చేసుకోవటం.
రెండవది, విశ్వాసం మరియు సత్కర్మలను అల్లాహ్ సన్నిధిలో సాధనంగా చేసుకోవటం, వసీలాగా చేసుకోవటం.
మూడవది, అల్లాహ్ సన్నిధిలో అల్లాహ్ యొక్క తౌహీద్ ను ఆశ్రయించటం.
నాలుగవది, అల్లాహ్ వైపు మరలి అవసరాన్ని, నిస్సహాయ స్థితిని వ్యక్తపరచి దానిని సాధనంగా చేసుకోవటం.
ఐదవది, తమ పాపాలను అంగీకరిస్తూ దైవ సన్నిధిలో వాటిని సాధనంగా చేసుకోవటం.
ఆరవది, బ్రతికి ఉన్న సత్పురుషులు, పుణ్యాత్ముల దగ్గరికి పోయి దుఆ చేయమని కోరటం. వారు కూడా దుఆ చేస్తారు.
ఈ విధంగా, ఇవి తప్ప ఇంకా ఇతర రకమైన వసీలా ధర్మ సమ్మతం కాదు. అది ధర్మ సమ్మతం కాని వసీలా, అధర్మమైన వసీలా. అది ఏమిటో, ఇన్ షా అల్లాహ్ వచ్చే ఎపిసోడ్ లో తెలుసుకుందాం. అప్పటివరకు సెలవు.
وَآخِرُ دَعْوَانَا أَنِ الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ (వ ఆఖిరు ద’అవానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్) మా ఆఖరి ప్రార్థన ఏమిటంటే, సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కే సర్వస్తోత్రాలు.
وَالسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ (వస్సలాము అలైకుమ్ వ రహ్ మతుల్లాహి వ బరకాతుహు) మరియు మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
స్త్రీలు ముసుగులో ఉండటం మరియు తమ అందచందాలను ప్రదర్శించే విధంగా అలంకరించుకోకుండా ఉండటం తప్పనిసరి.
తవాఫ్ చేసేటపుడు స్త్రీలు అత్తరు లేదా పెర్ఫ్యూమ్ పూసుకోవటం, తమ అందచందాలను ప్రదర్శించటం వంటి వాటికి దూరంగా ఉండటం అనివార్యం. ఇహ్రాం స్థితిలో ఉండి తవాఫ్ చేస్తున్నపుడు కూడా వారు పరాయి పురుషులకు తమ ముఖం కనబడకుండా మరియు తమ సౌందర్యం ప్రదర్శించకుండా జాగ్రత్త వహించవలెను. వారు పురుషులకు దగ్గరగా ఉన్నపుడు, స్త్రీపురుషులు ఒకేచోట కలిసిమెలిసి ఉండే చోట ఇలా జాగ్రత్ర పడటం మరీ ముఖ్యం. ఎందుకంటే స్త్రీల ఆకర్షణ పురుషులను ఉశికొలుపే ఒక ప్రధాన కారణం కావటం వలన స్త్రీలు ముఖంపై ముసుగు వేసుకోవటం ఆవశ్యకం. ఎందుకంటే స్త్రీల అందాన్ని ప్రధానంగా వారి ముఖం ప్రదర్శించటం వలన, పరాయి పురుషుల ముందు వారు తమ ముఖాన్ని ప్రదర్శించటం అనుమతించబడలేదు.
“… మరియు తమ భర్తల ముందు తప్ప తమ అందచందాలను వారు ప్రదర్శించరాదు” 24:31
ఒకవేళ హజ్రె అస్వద్ ను ముద్దాడే సమయంలో పురుషుల చూపు వారిపై ఉంటే, వారు తమ ముఖంపై ముసుగును తొలగించరాదు. ఒకవేళ హజ్రె అస్వద్ ను ముద్దాడే లేదా స్పర్శించే అవకాశం లేనంతగా అక్కడ జనం గుమిగూడి ఉండిన పరిస్థితిలో స్త్రీలు హజ్రె అస్వద్ ను ముద్దాడటానికి పురుషులతో పోటీపడకూడదు. స్త్రీలు తమ పురుషుల వెనుక నడుస్తూ, తవాఫ్ పూర్తి చేయవలెను. కాబా గృహానికి అతి దగ్గరలో నుండి తవాఫ్ చేసే వారిలో చొచ్చుకుని పోయి, రద్దీలో ఇబ్బంది పడే కంటే, కాబా గృహానికి కొంచెం దూరంలో నుండి ప్రశాంతంగా తవాఫ్ చేయటం మంచిది. పైగా దూరంలో నుండి తవాఫ్ చేయటంలో అడుగులు పెరగటం వలన ఎక్కువ పుణ్యాలు కూడా లభించే అవకాశం ఉంది. రమల్ మరియు ఇద్తిబాలను తవాఫ్ లో మాత్రమే పాటించాలి. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా చేరుకున్న తర్వాత చేసిన తన మొదటి తవాఫ్ లోనే రమల్ మరియు ఇద్తిబాలు చేసారు. అయితే స్త్రీలు రమల్ మరియు ఇద్తిబాలను చేయవలసిన అవసరం లేదు.
—
ఈ పోస్ట్ క్రింది పుస్తకం నుండి తీసుకోబడింది. హజ్, ఉమ్రహ్ & జియారహ్ – షేఖ్ అబ్దుల్ అజీజ్ బిన్ బాజ్ [పుస్తకం]
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
2:238 حَافِظُوا عَلَى الصَّلَوَاتِ وَالصَّلَاةِ الْوُسْطَىٰ وَقُومُوا لِلَّهِ قَانِتِينَ నమాజులను కాపాడుకోండి, ముఖ్యంగా మధ్యలో వున్న నమాజును. అల్లాహ్ సమక్షంలో వినమ్రులై నిలబడండి.
2:239 فَإِنْ خِفْتُمْ فَرِجَالًا أَوْ رُكْبَانًا ۖ فَإِذَا أَمِنتُمْ فَاذْكُرُوا اللَّهَ كَمَا عَلَّمَكُم مَّا لَمْ تَكُونُوا تَعْلَمُونَ పరిస్థితులు భయానకంగా ఉన్నప్పుడు నడుస్తూనో లేక వాహనంపై పోతూనో (నమాజు చేయండి). శాంతిభద్రతలు నెలకొన్న తరువాత అల్లాహ్ మీకు బోధించిన విధంగా ఆయన్ని ధ్యానించండి. దాని గురించి అంతకుముందు మీకు తెలీదు
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
నాలుక ఉపద్రవాలు – Dangers of the Tongue https://youtu.be/4_uBq6Qy5lM [20 నిముషాలు] వక్త: హబీబుర్ రహ్మాన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఈ ప్రసంగంలో, నాలుక వల్ల కలిగే ఐదు ప్రధాన ఉపద్రవాలు మరియు పాపాల గురించి వివరించబడింది. ఇస్లాంలో నాలుకను అదుపులో ఉంచుకోవడం యొక్క ప్రాముఖ్యతను హదీసుల వెలుగులో నొక్కి చెప్పబడింది. పరోక్ష నింద (గీబత్), చాడీలు చెప్పడం (నమీమత్), రెండు నాలుకల ధోరణి (జుల్ వజ్హైన్), అబద్ధం చెప్పడం (కజిబ్), మరియు అబద్ధపు ప్రమాణం చేయడం అనే ఐదు పాపాలు స్వర్గానికి దూరం చేసి నరకానికి దగ్గర చేస్తాయని ఖురాన్ మరియు హదీసుల ఆధారాలతో హెచ్చరించబడింది. ముస్లిం తన నాలుక మరియు చేతుల నుండి ఇతరులకు హాని కలగకుండా చూసుకున్నప్పుడే ఉత్తముడవుతాడని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బోధనల సారాంశం.
అభిమాన సోదరులారా, మీకందరికీ నా ఇస్లామీ అభివాదం, అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహ్.
ఈరోజు మనం నాలుక ఉపద్రవాల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.
ప్రియ సోదరులారా, మనిషి, ఒక ముస్లిం అవసరం మేరకే మాట్లాడాలి. అనవసరమైన మాటలు మాట్లాడేవారు, పిడి వాదాలకు దిగేవారు హదీసులో తీవ్ర పదజాలంతో హెచ్చరించబడ్డారు. అందుకే “నోరే నాకం (స్వర్గం), నోరే నరకం” అన్నారు పెద్దలు. నాలుకను సరిగ్గా ఉపయోగిస్తే అది స్వర్గానికి మార్గం సుగమం చేస్తుంది, దాన్ని దుర్వినియోగం చేస్తే నరకానికి గొనిపోతుంది అన్నమాట.
ముక్తికి మార్గం
ఒక హదీస్ తెలుసుకుందాం. తిర్మిజీలో హదీస్ ఉంది. ఉఖ్బా బిన్ ఆమిర్ రదియల్లాహు త’ఆలా అన్హు కథనం, ఆయన ప్రవక్త గారిని ఒక మాట అడిగారు. అది ఏమిటి?
“యా రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం,
مَنِ النَّجَاةُ؟ (మన్ నజాత్?)” “ముక్తికి మార్గం ఏది?”
ఓ దైవ ప్రవక్తా, ముక్తికి మార్గం ఏది? అని అడిగారు. చాలా ముఖ్యమైన ప్రశ్న ఇది. ముక్తికి మార్గం ఏది? దానికి సమాధానంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేశారు:
أَمْسِكْ عَلَيْكَ لِسَانَكَ، وَلْيَسَعْكَ بَيْتُكَ، وَابْكِ عَلَى خَطِيئَتِكَ (అమ్సిక్ అలైక లిసానక, వల్ యస’అక బైతుక, వబ్కి అలా ఖతీఅతిక) నీ నాలుకను అదుపులో ఉంచుకో.అలాగే నీ ఇల్లు నిన్ను ఇమిడ్చుకోవాలి. పాపాలను గుర్తు చేసుకుని, మనము చేసిన తప్పుల్ని గుర్తు చేసుకుని రోదించాలి
ఈ హదీస్ తిర్మిజీ గ్రంథంలో ఉంది. అంటే, ఉఖ్బా బిన్ ఆమిర్ రదియల్లాహు అన్హు అడిగిన ప్రశ్న మాట ఏమిటి? ముక్తికి మార్గం ఏది? సమాధానం ఏమిటి ప్రవక్త గారు చెప్పారు? నీ నాలుకను అదుపులో ఉంచుకో, పెట్టుకో. నీ నాలుకను కాపాడుకో. అలాగే నీ ఇల్లు నిన్ను ఇమిడ్చుకోవాలి, అంటే నీ తీరిక సమయం ఇంట్లో గడవాలి. అలాగే నీ పాపాలను, నీ బలహీనతలను గుర్తించుకుని రోదించు, కన్నీళ్లు కార్చు అన్నమాట.
అంటే ఈ హదీస్‌లో ఉఖ్బా బిన్ ఆమిర్ రదియల్లాహు అన్హు ఒక ముఖ్యమైన ప్రశ్న అడిగితే, ముక్తి పొందాలంటే ఎలా పొందగలము, ముక్తికి మార్గం ఏది అంటే, దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ మూడు విషయాలు చెప్పారు.
దాంట్లో మొదటిది ఏమిటి? నాలుకను అదుపులో పెట్టుకో. నాలుకను కాపాడుకో, రక్షించుకో. ఎందుకు? ఎందుకంటే నోరే నాకం, నోరే నరకం, ఇది గుర్తుపెట్టుకోవాలి, చాలా ముఖ్యమైన విషయం మాట ఇది పెద్దలు చెప్పిన మాట.
రెండవది, తీరిక సమయాన్ని, ఖాళీ సమయాన్ని వృధా చేయకుండా ఇంట్లో గడపాలి.
మూడవది, పాపాలను గుర్తు చేసుకుని, మనము చేసిన తప్పుల్ని గుర్తు చేసుకుని రోదించాలి, కన్నీళ్లు కార్చాలి.
నాలుక ప్రాముఖ్యత
ఇక ఇంకో హదీస్ తెలుసుకుందాం. అబూ సయీద్ రదియల్లాహు త’ఆలా అన్హు కథనం, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రబోధించారు. అదేమిటంటే, తెల్లవారజామున మనిషి శరీరంలోని అవయవాలన్నీ నాలుకను అత్యంత దీనంగా బతిమాలుతాయి. ఏమని బతిమాలుతాయి? “ఓ నాలుకా, నువ్వు మా విషయంలో అల్లాహ్‌కు భయపడి మసలుకో. ఎందుకంటే మా వ్యవహారం నీతో ముడిపడి ఉంది. నువ్వు సవ్యంగా ఉంటే మేము కూడా సవ్యంగా ఉండగలుగుతాం. నువ్వు వక్రతకు లోనైతే మేము కూడా వక్రతకు లోనైపోతాము.” ఈ విధంగా ప్రధాన పాత్ర వహిస్తుంది నాలుక. అది సవ్యంగా ఉంటే శరీర అవయవాలన్నీ సవ్యంగా ఉంటాయి. నాలుక వక్రతకు లోనైతే శరీర అవయవాలన్నీ వక్రతకు లోనైపోతాయి అన్నమాట.
ఇంకో హదీస్. మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు:
مَنْ وَقَاهُ اللَّهُ شَرَّ مَا بَيْنَ لَحْيَيْهِ وَشَرَّ مَا بَيْنَ رِجْلَيْهِ دَخَلَ الْجَنَّةَ (మన్ వఖాహుల్లాహు షర్ర మాబైన లహ్యైహి వ షర్ర మాబైన రిజ్లైహి దఖలల్ జన్నహ్) “ఎవరినైతే అల్లాహ్ అతని రెండు దవడల మధ్య ఉన్న దాని (నాలుక) చెడు నుండి మరియు రెండు కాళ్ళ మధ్య ఉన్న దాని (మర్మాంగం) చెడు నుండి కాపాడతాడో, అతను స్వర్గంలో ప్రవేశిస్తాడు.”
ఎవడైతే తన రెండు దవడల మధ్య ఉన్న నాలుకను రక్షించుకుంటాడో, కాపాడుకుంటాడో, అలాగే రెండు కాళ్ళ మధ్య ఉన్న మర్మాంగాన్ని కాపాడుకుంటాడో, దఖలల్ జన్నహ్, అటువంటి వ్యక్తి స్వర్గంలో ప్రవేశిస్తాడు. అంటే స్వర్గంలో ప్రవేశించడానికి రెండు ముఖ్యమైన విషయాలను మనం రక్షించుకోవాలి అన్నమాట. ఒకటి నాలుక, రెండవది మర్మాంగం.
ఇక ఇంకో హదీస్. అబూ మూసా రదియల్లాహు అన్హు దైవ ప్రవక్తకు ప్రశ్న అడిగారు, “ఖుల్తు యా రసూలల్లాహ్, నేను అడిగాను, ఓ దైవ ప్రవక్తా సల్లల్లాహు అలైహి వసల్లం,
ఓ దైవ ప్రవక్తా, ముస్లింలు చాలా మంది ఉన్నారు సమాజంలో, ప్రపంచంలో. శ్రేష్ఠమైన ముస్లిం ఎవరు? ముస్లింలలో ఉత్తమమైన ముస్లిము, శ్రేష్ఠమైన వాడు, గొప్పవాడు ఎవరు? దానికి సమాధానం ప్రవక్త గారు ఇలా ఇచ్చారు:
مَنْ سَلِمَ الْمُسْلِمُونَ مِنْ لِسَانِهِ وَيَدِهِ (మన్ సలిమల్ ముస్లిమూన మిన్ లిసానిహీ వ యదిహీ) “ఎవని నాలుక మరియు చేతి నుండి ఇతర ముస్లింలు సురక్షితంగా ఉంటారో (అతనే ఉత్తముడు).”
ఏ ముస్లిం నాలుక ద్వారా, చేతుల ద్వారా ఇతరులకి హాని జరగదో, కీడు జరగదో, అటువంటి ముస్లిం అందరికంటే శ్రేష్ఠుడు, ఉత్తముడు అని మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. ఈ హదీస్ బుఖారీ మరియు ముస్లిం గ్రంథంలో ఉంది. సారాంశం ఏమిటంటే, నోరే నాకం, నోరే నరకం. కావున, అభిమాన సోదరులారా, నాలుక ఉపద్రవాలలో ఐదు తెలుసుకోబోతున్నాం. అంటే నాలుకకి సంబంధించిన పాపాలలో ఐదు పాపాలు మనం తెలుసుకుందాం.
నాలుక ఉపద్రవాలు
మొదటిది, గీబత్, పరోక్ష నింద. గీబత్ అంటే ఏంటి? ఒక హదీస్ మనం తెలుసుకుంటే మనకు గీబత్ అర్థమవుతుంది. అబూ హురైరా రదియల్లాహు త’ఆలా అన్హు కథనం, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు,
أَتَدْرُونَ مَا الْغِيبَةُ؟ (అతద్రూన మల్ గీబహ్?) “గీబత్ (పరోక్ష నింద) అంటే ఏమిటో మీకు తెలుసా?”
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సంభాషణ శైలి సందర్భాన్ని బట్టి ఉంటుంది. ఒక్కొక్కసారి వాక్యం చెప్పేస్తారు, హదీస్. ఒక్కొక్కసారి ప్రశ్నోత్తరాల రూపంలో చెబుతారు. ఆ చెప్పబోయే మాట ఎంత ముఖ్యమైన ఉంటుందో ఆ విధంగా మాట్లాడే పద్ధతి ఉంటుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గీబత్ గురించి ఇలా ఆయనే అడుగుతున్నారు, “అతద్రూన మల్ గీబహ్? గీబత్ ఏంటో మీకు తెలుసా?”
సహాబాలు అన్నారు,
اللَّهُ وَرَسُولُهُ أَعْلَمُ (అల్లాహు వ రసూలుహూ అ’అలమ్) “అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తకే బాగా తెలుసు.”
సహాబాలు బదులిచ్చారు, “ఓ దైవ ప్రవక్తా, అల్లాహ్‌కు తెలుసు, అల్లాహ్ ప్రవక్తకు తెలుసు, మాకు తెలియదు” అని. అప్పుడు అన్నారు ప్రవక్త గారు,
ذِكْرُكَ أَخَاكَ بِمَا يَكْرَهُ (దిక్రుక అఖాక బిమా యక్రహ్) “నీ సోదరుని గురించి అతను ఇష్టపడని విధంగా ప్రస్తావించటమే (గీబత్).”
అంటే మీ సోదరుని గురించి అతను వింటే అసహ్యించుకునే విధంగా మాట్లాడటం. సోదరుడు లేనప్పుడు వీపు వెనుక అతను వింటే అసహ్యించుకుంటాడు, ఆ విధంగా అతని గురించి మాట్లాడటం, దానికి గీబత్ అంటారు అని ప్రవక్త గారు సమాధానం ఇచ్చారు. ఈ సమాధానం విని సహాబీ మళ్ళీ తన ఒక డౌట్‌ని ఇలా అడిగారు, వ్యక్తం చేశారు, అదేమిటి, ఖీల (అడగబడింది),
أَفَرَأَيْتَ إِنْ كَانَ فِي أَخِي مَا أَقُولُ؟ (అఫరఅయిత ఇన్ కాన ఫీ అఖీ మా అఖూల్?) “ఒకవేళ నేను చెప్పేది నా సోదరునిలో నిజంగానే ఉంటే అప్పుడేమిటి?”
“ఓ దైవ ప్రవక్తా, నా సోదరుని గురించి నేను చెప్పేది నిజంగానే అతనిలో ఉంది. ఏ లోపం గురించి నేను మాట్లాడుతున్నానో, ఏ తప్పు గురించి నేను మాట్లాడుతున్నానో నా సోదరుని గురించి, అది నిజంగానే అతనిలో ఉంది. అతనిలో లేనిది నేను చెప్పటం లేదు. అతనిలో ఉన్న విషయాన్నే నేను చెప్తున్నాను. అలాగైతే?” అని ఆయన తన అనుమానాన్ని వ్యక్తం చేశారు. దానికి విని ప్రవక్త గారు అన్నారు,
إِنْ كَانَ فِيهِ مَا تَقُولُ فَقَدِ اغْتَبْتَهُ (ఇన్ కాన ఫీహి మా తఖూలు ఫఖద్ ఇగ్తబ్తహు) “అతనిలో నువ్వు చెప్పేది ఉంటేనే నువ్వు గీబత్ చేసినట్లు.”
అంటే అతనిలో ఉండే తప్పులనే నువ్వు చెప్తున్నావు, అప్పుడే అది గీబత్ అయ్యేది. అతనిలో ఉండే లోపాలు, అతనిలో ఉండే తప్పులు, అతను లేనప్పుడు నువ్వు అతను అసహ్యించుకునేలా చెప్తున్నావు కదా, అదే గీబత్.
وَإِنْ لَمْ يَكُنْ فِيهِ فَقَدْ بَهَتَّهُ (వ ఇన్ లమ్ యకున్ ఫీహి ఫఖద్ బహత్తహు) “ఒకవేళ అతనిలో అది లేకపోతే, నువ్వు అతనిపై అభాండం (బుహతాన్) మోపినట్లు.”
అతనిలో లేనిది చెప్తే అది గీబత్ కాదు, బుహతాన్ అవుతుంది, అభాండాలు వేయటం అవుతుంది. గీబత్ (పరోక్ష నింద) వేరు, అభాండం వేయటం వేరు. ఒక వ్యక్తిలోని ఉండే లోపాలు, తప్పులు అతను లేనప్పుడు చెప్పుకోవటం గీబత్. అతను వింటే బాధపడతాడు, ఆ విధంగా చెప్పుకోవటం గీబత్, పరోక్ష నింద. అతనిలో లేని విషయాలు చెప్తే అది బుహతాన్, అభాండం వేయడం అవుతుంది.
కాకపోతే, సాక్ష్యం ఇచ్చేటప్పుడు, కోర్టులో, ఖాజీ దగ్గర, నిర్ణయాలు జరుగుతున్నాయి, పంచాయితీ జరుగుతూ ఉంది, సాక్ష్యం కోసం పిలిపించారు. అటువంటి సమయంలో అందరూ హాజరవుతారు. అటువంటప్పుడు ఉండేది ఉన్నట్టుగా, లేనిది లేనట్టుగా చెప్తే అది తప్పు లేదు. దీనికి చాలా వివరాలు ఉన్నాయి. సారాంశం ఏమిటంటే, గీబత్, పరోక్ష నింద అంటే వ్యక్తి లేనప్పుడు వీపు వెనుక అతను అసహ్యించుకునేలా అతని గురించి చెప్పుకోవటం. ఇది ఇస్లాంలో నిషిద్ధమైనది.
అభిమాన సోదరులారా, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూరహ్ హుజరాత్‌లో ఇలా తెలియజేశాడు:
…وَلَا يَغْتَب بَّعْضُكُم بَعْضًا ۚ أَيُحِبُّ أَحَدُكُمْ أَن يَأْكُلَ لَحْمَ أَخِيهِ مَيْتًا فَكَرِهْتُمُوهُ ۚ وَاتَّقُوا اللَّهَ ۚ إِنَّ اللَّهَ تَوَّابٌ رَّحِيمٌ “… ఒకరి దోషాలను ఒకరు వెతకకండి. మీలో ఒకరు మరొకరి గురించి చాడీలు చెప్పకండి. మీలో ఎవరయినా తన చనిపోయిన సోదరుని మాంసం తినడానికి ఇష్టపడతాడా? దానిని మీరు అసహ్యించుకుంటారు కదా! మీరు అల్లాహ్‌కు భయపడండి. నిశ్చయంగా, అల్లాహ్ పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడు, అపార కరుణాప్రదాత.” (49:12)
అల్లాహు అక్బర్! మీరు గీబత్ చేసుకోకండి. మీలో కొందరు కొందరి గురించి గీబత్ చేసుకోకండి. పరోక్ష నింద, వీపు వెనుక చాడీలు చెప్పుకోకండి. వీపు వెనుక, వెనుక చాడీలు చెప్పుకోకండి. మీలో ఎవరైనా చనిపోయిన మీ సోదరుని మాంసం తినడానికి ఇష్టపడతాడా? అల్లాహు అక్బర్! చనిపోయిన సోదరుడు, అంటే శవం మాంసం తినడానికి ఇష్టపడతారా? ఫకరిహ్ తుమూహ్, మీరు ఏవగించుకుంటున్నారు కదా, అసహ్యించుకుంటున్నారు కదా. వత్తఖుల్లాహ్. అలాగైతే, గీబత్ విషయంలో అల్లాహ్‌కు భయపడండి. ఇన్నల్లాహ తవ్వాబుర్ రహీమ్, నిశ్చయంగా అల్లాహ్ తౌబా స్వీకరించేవాడు, కనికరించేవాడు.
ఇది మొదటిది. నాలుక ఉపద్రవాలలో, నాలుకకు సంబంధించిన రోగాలలో ఒకటి, పాపాలలో ఒకటి గీబత్, పరోక్ష నింద.
రెండవది, చాడీలు చెప్పటం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు:
చాడీలు చెప్పేవాడు స్వర్గంలో ప్రవేశించడు, మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. ఈ హదీస్ బుఖారీ మరియు ముస్లిం గ్రంథంలో ఉంది. అలాగే ఒక హదీస్, మనందరికీ తెలిసిన విషయమే, నేను దాని ఆ హదీస్ యొక్క సారాంశం చెప్తున్నాను. మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి ఎక్కడో పోతుంటే మధ్యలో సమాధులు కనబడినాయి. ఆ సమాధులలో ఏం చెప్పారు? ఈ సమాధిలో ఉన్న వారికి శిక్ష పడుతుంది అని చెప్పాడు ప్రవక్త గారు. దేని మూలంగా? ఒక వ్యక్తికి చాడీల మూలంగా, చాడీలు చెప్పుకుంటూ తిరిగేవాడు ఒక వ్యక్తి, దాని మూలంగా సమాధిలో శిక్ష అనుభవిస్తున్నాడు. రెండో వ్యక్తి, మూత్రం పోసినప్పుడు ఒంటి మీద దాని తాలూకు తుంపరలు పడకుండా జాగ్రత్త పడేవాడు కాదు. కావున చాడీలు సమాజంలో కుటుంబాలను, జీవితాలను ఛిన్నాభిన్నం చేయటానికి ముఖ్యమైన పాత్ర వహిస్తుంది చాడీ. కావున చాడీల నుంచి మనం దూరంగా ఉండాలి. నాలుకకి సంబంధించిన ఉపద్రవాలలో రెండవది చాడీలు చెప్పటం.
మూడవది, జుల్ వజ్హైన్ (రెండు ముఖాల వాడు). రెండు నాలుకల ధోరణికి పాల్పడేవాడు. మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు, ఒక సుదీర్ఘమైన హదీస్ ఉంది, ఆ హదీస్‌లోని చివరి భాగం ఇది:
وَتَجِدُونَ شَرَّ النَّاسِ ذَا الْوَجْهَيْنِ الَّذِي يَأْتِي هَؤُلاَءِ بِوَجْهٍ وَهَؤُلاَءِ بِوَجْهٍ “ప్రజలలోకెల్లా చెడ్డవాడు రెండు ముఖాల వాడు అని మీరు గమనిస్తారు. అతను ఈ గుంపు వద్దకు ఒక ముఖంతో, ఆ గుంపు వద్దకు మరో ముఖంతో వెళ్తాడు.”
ముత్తఫఖున్ అలైహ్, బుఖారీ, ముస్లింలోని హదీస్. అంటే ప్రజలలో రెండు ముఖాల గలవారిని అత్యంత నీచులు అయినట్లు మీరు గమనిస్తారు. వాడు చేసే పని ఏమిటి? వారు కొందరి దగ్గరికి ఒక ముఖంతో, మరికొందరి దగ్గరికి ఇంకో ముఖంతో వెళ్తారు. అంటే అర్థం ఏమిటి? ఒక వర్గం దగ్గరికి ఒక ముఖంతో పోవటం, ఇంకో వర్గం దగ్గరికి ఇంకో ముఖంతో పోవటం, అర్థం ఏమిటి? ఒక వ్యక్తి దగ్గరికి పోయి, ఒక వర్గం దగ్గరికి పోయి, “నేను మీ శ్రేయోభిలాషిని, మీకు మిత్రుణ్ణి. మీకు ఎవరు శత్రువో వాడు నాకు కూడా శత్రువు.” అతని గురించి గొప్పలు చెప్పుకుని అతని శత్రువు గురించి చెడుగా చెప్పి వచ్చి, మళ్లీ అదే వ్యక్తి శత్రువు దగ్గరికి పోయి ఇదే మాట రిపీట్ చేయటం, “నేను నీకు మిత్రుణ్ణి, నేను నీకు శ్రేయోభిలాషిని, నీ శత్రువుకి నేను శత్రువుని.” ఈ విధంగా అతను రెండు ముఖాలు చూపించాడు. ఒక వర్గం ఇంకో వర్గానికి పడదు, ఈ వర్గానికి ఒక రకంగా మాట్లాడి అదే పద్ధతి ఆ వర్గం దగ్గరికి పోయి కూడా చెప్పటం. దీనిని అంటారు జుల్ వజ్హైన్, రెండు నాలుకల ధోరణి. ఇది చాలా చెడ్డది.
నాలుగవది, అబద్ధం చెప్పటం. మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు:
إِنَّ الصِّدْقَ يَهْدِي إِلَى الْبِرِّ وَإِنَّ الْبِرَّ يَهْدِي إِلَى الْجَنَّةِ… وَإِنَّ الْكَذِبَ يَهْدِي إِلَى الْفُجُورِ وَإِنَّ الْفُجُورَ يَهْدِي إِلَى النَّارِ “నిశ్చయంగా, సత్యం పుణ్యం వైపు దారి తీస్తుంది మరియు పుణ్యం స్వర్గం వైపు దారి తీస్తుంది… మరియు నిశ్చయంగా, అసత్యం పాపం వైపు దారి తీస్తుంది మరియు పాపం నరకం వైపు దారి తీస్తుంది…”
సత్యం అనేది, నిజం అనేది సదాచరణ వైపు తీసుకునిపోతుంది. వ ఇన్నల్ బిర్ర యహదీ ఇలల్ జన్నహ్. సదాచరణ, నిజాయితీ స్వర్గంలో తీసుకునిపోతుంది. వ ఇన్నర్ రజుల లయజ్దుకు. ఒక వ్యక్తి నిజం చెప్తూ ఉంటాడు, హత్తా యుక్తబ ఇందల్లాహి సిద్దీఖన్, చివరికి అల్లాహ్ వద్ద అతను నిజాయితీపరుడు అని అతని గురించి రాయడం జరుగుతుంది, లిఖించడం జరుగుతుంది. వ ఇన్నల్ కజిబ యహదీ ఇలల్ ఫుజూర్, అబద్ధం అనేది అవిధేయత వైపుకు తీసుకునిపోతుంది, పాపం వైపుకు తీసుకుని వెళ్తుంది. వ ఇన్నల్ ఫుజూర యహదీ ఇలన్నార్, ఈ అవిధేయత నరకానికి తీసుకునిపోతుంది. వ ఇన్నర్ రజుల లయక్దిబు, ఒక వ్యక్తి అబద్ధం చెబుతూనే ఉంటాడు, హత్తా యుక్తబ ఇందల్లాహి కజ్జాబన్, చివరికి అల్లాహ్ దగ్గర అతను అబద్ధీకుడుగా లిఖించబడతాడు.
ప్రియ సోదరులారా, సారాంశం ఏమిటంటే ఈ హదీస్‌లో, సత్యమే మాట్లాడితే నిజాయితీపరుడైపోతాడు, తత్కారణంగా స్వర్గంలోకి ప్రవేశిస్తాడు. అబద్ధం మాట్లాడుతూ ఉంటే అబద్ధీకుడు అని లిఖించబడతాడు, తత్కారణంగా నరకానికి పోతాడు. నాలుక ఉపద్రవాలలో ఇది అబద్ధం కూడా ఒకటి.
ఐదవది, అబద్ధపు ప్రమాణం చేయటం. సామాన్యంగా అబద్ధం చెప్పటం అది ఒక రకమైన ఉపద్రవం, తప్పు, చెడు. అబద్ధపు సాక్ష్యం ఇవ్వటం, ప్రమాణం చేయటం లేక ఒట్టు పెట్టుకోవటం అంటే వాస్తవానికి సాక్ష్యం ఇవ్వటం అన్నమాట. లేక ఒకరికి సాక్ష్యంగా పెట్టుకోవటం అన్నమాట. అల్లాహ్ పైన ప్రమాణం చేసి చెబుతున్నాడంటే అదెంత ముఖ్యమైనది, అసాధారణమైన విషయమో బాగా ఆలోచించుకోవాలి. ఎందుకంటే మనము చేసే ప్రమాణంపై అల్లాహ్‌ను కూడా మనము తీసుకునివస్తున్నాము, అల్లాహ్ పైన ప్రమాణం చేస్తున్నామంటే అల్లాహ్‌కు కూడా దీంట్లో మనము ఇది చేస్తున్నాం. కావున, అవసరం లేకపోయినప్పటికీ ప్రమాణం చేయటమే తప్పు. అవసరం పడితే, ముఖ్యావసరం అయితేనే ప్రమాణం చేయాలి. అవసరం లేకపోతే ప్రమాణం చేయటం తప్పు. దానికి తోడు అబద్ధపు ప్రమాణం చేయటం. సుబ్ హా నల్లాహ్! సత్యమైన, నిజంగానే ప్రమాణం చేయటం అనవసరమైన విషయాలలో చేయకూడదు, అవసరమైతేనే చేయాలి. ఇక ఒకటి అవసరం కాదు, రెండవది ప్రమాణం చేస్తున్నాము, అది కూడా అబద్ధం ప్రమాణం చేస్తున్నాము, అంటే ఇది తీవ్రమైన తప్పు.
అభిమాన సోదరులారా, దీని గురించి ఇస్లాం ధర్మంలో దీని వివరాలు ఎక్కువగా ఉన్నాయి. సారాంశం ఏమిటంటే, నాలుక ఉపద్రవాలలో చాలా ఉన్నాయి, వాటిలో నేను ఐదు విషయాలు నేను వ్యక్తం చేశాను, తెలియజేశాను. ఒకటి గీబత్, పరోక్ష నింద, రెండోది చాడీలు చెప్పటం, మూడవది జుల్ వజ్హైన్, రెండు నాలుకల ధోరణి, నాలుగవది అబద్ధం చెప్పటం, ఐదవది అబద్ధపు ప్రమాణం చేయటం. ఇవి నాలుకకి సంబంధించిన ఉపద్రవాలలో ముఖ్యమైనవి.
అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరినీ నాలుకకి సంబంధించిన ప్రతి ప్రమాదం నుండి, ప్రతి చెడు నుండి కాపాడు గాక. అల్లాహ్ మనందరికీ ప్రతి పాపం నుండి కాపాడు గాక. ఆమీన్.
వ ఆఖిరు ద’అవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహ్.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దైవ ప్రవక్త ﷺ ప్రేమ లో “గులూ” (అతిగా ప్రవర్తించడం, మితి మీరి పోవడం) [వీడియో] https://youtu.be/obwMyhfkPeM [10 నిముషాలు] వక్త: హబీబుర్ రహ్మాన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఈ ప్రసంగంలో ‘ఘులూ’ (غلو) అనే ఇస్లామీయ భావనను వివరించబడింది, అనగా అంతిమ ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పట్ల ప్రేమలో హద్దులు మీరడం లేదా అతిశయించడం. సూరహ్ అన్-నిసాలోని ఖుర్ఆన్ వాక్యం ఆధారంగా, మతంలో ‘ఘులూ’ చేయడం నిషిద్ధమని స్పష్టం చేయబడింది. ప్రవక్తకు దైవత్వపు గుణగణాలను ఆపాదించడం లేదా ఆయనను అల్లాహ్ యొక్క దాసుడు మరియు ప్రవక్త అనే స్థాయి నుండి దైవత్వపు స్థాయికి పెంచడం వంటివి ‘ఘులూ’కు ఉదాహరణలుగా పేర్కొనబడ్డాయి. క్రైస్తవులు మర్యం కుమారుడైన ఈసా (అలైహిస్సలాం)ను ప్రశంసించడంలో హద్దులు మీరినట్లు, తనను అలా అతిగా పొగడవద్దని ప్రవక్త స్వయంగా హెచ్చరించారు మరియు తనను “అల్లాహ్ దాసుడు మరియు ఆయన ప్రవక్త” అని మాత్రమే పిలవమని బోధించారు. అల్లాహ్ యొక్క ప్రత్యేక హక్కులకు మరియు ఆయన దాసుల హక్కులకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఇబ్నె ఖయ్యిమ్ పద్యం ద్వారా కూడా వివరించబడింది. ముగింపుగా, ప్రవక్తను అందరికంటే ఎక్కువగా ప్రేమించాలి కానీ అది అతిశయం అనే పాపంలోకి వెళ్లకుండా, ఇస్లాం యొక్క సమతుల్యమైన మధ్య మార్గాన్ని అనుసరించాలని నొక్కి చెప్పబడింది.
اِنَّ الْحَمْدَ لِلّهِ وَحْدَهُ وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى مَنْ لَا نَبِيَّ بَعْدَهُ، أَمَّا بَعْدُ. ఇన్నల్ హమ్దలిల్లాహి వహ్దహు, వస్సలాతు వస్సలాము అలా మన్ లా నబియ్య బఅదహు, అమ్మా బఅద్. నిశ్చయంగా, సర్వ స్తోత్రాలు ఏకైకుడైన అల్లాహ్‌కే శోభాయమానం. ఎవరి తర్వాత ఏ ప్రవక్తా రాబోరో, ఆయనపై శాంతి మరియు శుభాలు వర్షించుగాక. ఆ తర్వాత…
అభిమాన సోదరులారా! ధర్మ అవగాహనం అనే ఈ కార్యక్రమములోకి మీ అందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. أَلسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు. (మీకు అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు కలుగుగాక)
ఈరోజు మనం అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రేమలో ‘ఘులూ’ (غلو) చేయటం గురించి తెలుసుకుందాం. ‘ఘులూ’ ఇది అరబీ పదం. ‘ఘులూ’ అంటే ఒకరి ప్రేమలో మితిమీరి పోవటం. దీనిని షరీఅత్ పరిభాషలో ‘ఘులూ’ అంటారు. ఒకరి ప్రేమలో హద్దు దాటటం, మితిమీరి పోవటం. దీనిని ‘ఘులూ’ అంటారు. తెలుగులో అతిశయిల్లటం, అతిగా ప్రవర్తించటం అని చెప్పవచ్చు. అతిశయిల్లటం, అతిగా ప్రవర్తించటం. ఇది షరీఅత్ పరిభాషలో ‘ఘులూ’ అంటే.
అల్లాహ్ సుబ్ హానహు వ తఆలా సూరహ్ నిసా, ఆయత్ నెంబర్ 171లో ఇలా సెలవిచ్చాడు: لَا تَغْلُوا فِي دِينِكُمْ (లా తగ్‌లూ ఫీ దీనికుమ్) “మీరు మీ ధర్మం విషయంలో అతిశయించకండి, హద్దు మీరకండి, మితిమీరకండి” అని అల్లాహ్ సుబ్ హానహు వ తఆలా సెలవిచ్చాడు.
దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యెడల ‘ఘులూ’ చేయటం అంటే, అతిశయించడం అంటే ఏమిటి? ఉదాహరణకు, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క గొప్పతనాన్ని వర్ణించేటప్పుడు మితిమీరిపోవటం. సూటిగా చెప్పాలంటే, ఆయన్ని, అంటే అంతిమ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంని, దైవ దాస్యపు మరియు దైవ దౌత్యపు స్థానము నుండి మరింత పైకెత్తటం. ఇది ‘ఘులూ’ అంటే. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకి ఒక స్థానం ఉంది. దైవ దాస్యపు స్థానం ఉంది, దైవ దౌత్యపు స్థానం ఉంది. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంని ఆ స్థానం నుంచి పైకి ఎత్తటం. అంటే, దైవత్వపు కొన్ని గుణాలను ఆయనకు ఆపాదించటం. అల్లాహ్‌ను వదలి సహాయం కొరకు ఆయన్ని అర్థించటం, ఇవన్నీ ‘ఘులూ’ క్రిందికి వస్తాయి.
అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు. ఈ హదీస్ బుఖారీ మరియు ముస్లిం గ్రంథంలో ఉంది:
لَا تُطْرُونِي كَمَا أَطْرَتِ النَّصَارَى ابْنَ مَرْيَمَ، فَإِنَّمَا أَنَا عَبْدُهُ، فَقُولُوا عَبْدُ اللَّهِ وَرَسُولُهُ. లా తుత్రూనీ కమా అత్రతిన్ నసారబ్న మర్యమ, ఫ ఇన్నమా అన అబ్దుహు, ఫఖూలూ అబ్దుల్లాహి వ రసూలుహు. క్రైస్తవులు మర్యం కుమారుడిని (ఈసాని) పొగడడంలో హద్దులు మీరినట్లు మీరు నన్ను పొగడకండి. నిశ్చయంగా నేను ఆయన (అల్లాహ్) దాసుడిని మాత్రమే. కనుక నన్ను ‘అల్లాహ్ దాసుడు మరియు ఆయన ప్రవక్త’ అని అనండి.
“క్రైస్తవులు మర్యం కుమారుడగు ఈసా అలైహిస్సలామును పొగడటంలో మితిమీరినట్లు, మీరు నా ప్రశంసలో మితిమీరకండి. నేను దాసుడిని మాత్రమే. కనుక నన్ను దైవ దాసుడని, దైవ ప్రవక్త అని అనండి” అని అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు.
అభిమాన సోదరులారా! ఇంతకు ముందు ఎపిసోడ్‌లో మనం అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల ప్రేమ గురించి తెలుసుకున్నాం. అంతిమ దైవ ప్రవక్తను ప్రేమించాలి. అత్యధికంగా ప్రేమించాలి. అన్నిటికంటే ఎక్కువగా ప్రేమించాలి. అందరికంటే ఎక్కువగా ప్రేమించాలి. కాకపోతే, ఆ ప్రేమలో ‘ఘులూ’ చేయకూడదు. ‘ఘులూ’ అంటే ఏమిటో తెలుసుకున్నాం, అతిశయిల్లటం, అతిగా ప్రవర్తించడం, ప్రవక్త గారి స్థానాన్ని మించి పైకి ఎత్తటం. ఏ విధంగానైతే క్రైస్తవులు ఈసా అలైహిస్సలాంను ఆయనను పొగడే విషయంలో హద్దు మీరారు, అతిశయించారు, తత్కారణంగా ఏమైంది? దేవుని స్థానములో, దేవునికి సమానంగా నిలబెట్టారు ఈసా అలైహిస్సలాంని క్రైస్తవులు. ఆ విధంగా నాకు పొగడే విషయంలో, నా ప్రశంస విషయంలో మీరు ఆ విధంగా హద్దు మీరకండి, ‘ఘులూ’ చేయకండి, అతిశయించకండి అని అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మనల్ని బోధించారు, హెచ్చరించారు.
అభిమాన సోదరులారా! ఇబ్నె ఖయ్యిమ్ రహమతుల్లాహి అలైహి ఒక కవిత్వములో ఇలా తెలియజేశారు, ఖసీదా నూనియ్యాలో. ఖసీదా అంటే పద్యము. నూనియ్యా అంటే ఆయన ఒక అనేక పద్యాలు రాశారు, ఒక పద్యంలో ప్రతి అక్షరం ‘నూన్’తో ముగిస్తుంది. ఆ పద్యంలోని ప్రతి వాక్యంలో చివరి అక్షరం ‘నూన్’ ఉంటుంది. అందుకు ఆ పద్యం పేరే ఖసీదా నూనియ్యా అని పడిపోయింది. ఆ ఖసీదా నూనియ్యాలో ఒకచోట అల్లామా ఇబ్నె ఖయ్యిమ్ రహమతుల్లాహి అలైహి ఇలా అన్నారు, వ్యాఖ్యానించారు:
“అల్లాహ్ యొక్క ఒక హక్కు ఉంది, అది ఎవరికీ చెందదు, దైవ ప్రవక్తలకు కూడా చెందదు. అల్లాహ్‌కు ఒక హక్కు ఉంది, అది ఎవరికీ చెందదు. మరియు ఆయన దాసుని హక్కు ఒకటి ఉంటుంది, దాసునికి కూడా ఒక హక్కు ఉంటుంది. ఇవి రెండూ వేరు వేరు హక్కులు. అల్లాహ్ హక్కు వేరు, దాసుని హక్కు వేరు. కనుక, ఆ రెండు హక్కులను విచక్షణారహితంగా ఒకే హక్కుగా చేయకండి.”
ఆధారం లేకుండా, విచక్షణారహితంగా రెండు హక్కులను ఒకటిగా చేయకండి. అల్లాహ్ హక్కు, దాసుని హక్కు ఒకటి కాదు. అంటే, అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దాసుడే కదా. అల్లాహ్ సృష్టికర్త, మనమందరము సృష్టి. ఆ సృష్టిలో అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కూడా ఒక సృష్టి, దాసుడే. అందుకు అల్లాహ్ హక్కు, అల్లాహ్ దాసుని హక్కు సమానం కాజాలవు, ఒకటిగా అవ్వవు.
అభిమాన సోదరులారా! చెప్పటం ఏమిటంటే, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రేమలో ‘ఘులూ’ చేయకూడదు. అది అధర్మం, ఇస్లాంలో దానికి సమ్మతం లేదు, సమ్మతించబడలేదు ఇస్లాంలో. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకి ఒక స్థానం ఉంది. ఆ స్థానం నుంచి ఆయనకి పైకి తీసుకుని పోకూడదు, కింద దించకూడదు. ఇదే ఉమ్మతే వసత్. ఇస్లాం ధర్మం, దీనె వసత్. హద్దు మీరకూడదు, తక్కువ స్థాయికి దించకూడదు.
అభిమాన సోదరులారా! అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మానవుడే. అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ దాసులే. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క సృష్టిలో ఒక సృష్టి. అందరికంటే ప్రేమ అంతిమ దైవ ప్రవక్త పట్ల కలిగి ఉండాలి, అందరికంటే ఎక్కువ. కాకపోతే, హద్దు మీరకూడదు, అతిశయించకూడదు, మితిమీరకూడదు. ఆయన ప్రేమలో ‘ఘులూ’ ఉండకూడదు అని తెలుసుకున్నాము. కాకపోతే, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆయన మనిషి అయినప్పటికీ, దైవ దాసుడు అయినప్పటికీ, ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆ స్థానం ఏమిటి, ఆ ప్రత్యేకతలు ఏమిటి, ఇన్షా అల్లాహ్ మనం వచ్చే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. అప్పటి వరకు సెలవు.
وَآخِرُ دَعْوَانَا أَنِ الْحَمْدُ لِلهِ رَبِّ الْعَالَمِينَ. وَالسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ. వ ఆఖిరు దఅవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు. మా చివరి ప్రార్థన సర్వలోకాల ప్రభువైన అల్లాహ్‌కే సర్వ స్తోత్రాలు. మీకు అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు కలుగుగాక.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
జుబైర్ బిన్ ముత్ ఇమ్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వద్దకు ఒక గ్రామస్తుడు వచ్చి ‘ప్రజలు ఆపదలో ఉన్నారు, పిల్లలు ఆకలితో నకనకలాడుతున్నారు. తగినంత ధనం లేదు, పశువులు చనిపోతున్నాయి, వర్షం పడాలని మీరు మా కోసం అల్లాహ్ ను దుఆ చేయండి. అల్లాహ్ వద్ద మేము మిమ్మల్ని సిఫారసు దారుడ్ని చేయాలను కుంటున్నాము, మీ వద్ద అల్లాహ్ ను సిఫారసుదారుడ్ని చేయాలనుకుంటున్నాము‘ అని విన్నవించుకున్నాడు. అందుకు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం), అల్లాహ్ పరమ పవిత్రుడు! అల్లాహ్ పరమ పవిత్రుడు! అని చాలా సేపు అల్లాహ్ పవిత్రతను చాటారు. సహాబాల ముఖాలపై దాని ప్రభావం పడటం గమనించారు. తర్వాత ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రవచించారు: “అమాయకుడా! అల్లాహ్ ఎవరి వద్దా సిఫారసు చేయడు. ఆయన గొప్పతనం వారి కంటే గొప్పది, ఉన్నతమైంది. అమాయకుడా! అల్లాహ్ అంటే ఎవరో నీకు తెలుసా? ఆయన సింహాసనం ఆకాశంపై ఎలాగుందంటే (వేళ్లను గోపురం మాదిరిగాచేసి) ఆయన వల్ల అది విలవిలలాడుతుంది. ఒంటె వీపుపై ప్రయాణించే వాని భారం వల్ల పల్లకి విలవిలలాడినట్టు”. (హదీసు గ్రంథం అబూదావూద్, హదీస్ నెం.: 4726)
ఒకసారి అరేబియా దేశంలో క్షామం ఏర్పడింది. వర్షాలు పడటం ఆగిపోయాయి. ఒక గ్రామస్తుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వద్దకు వచ్చి ప్రజల దీనావస్థను వివరించాడు. అల్లాహ్ ను వేడుకోమని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ను కోరాడు. అక్కడితో ఆగకుండా ‘మీరు అల్లాహ్ వద్ద సిఫారసు చేయాలని, అల్లాహ్ మీ వద్ద సిఫారసు చేయాలని కోరుకుంటున్నాం‘ అన్నాడు. ఆ మాట విని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అల్లాహ్ భీతితో, భయంతో కంపించిపోయారు. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) నోటిపై అల్లాహ్ కీర్తి వచనాలు వెలువడ్డాయి. అల్లాహ్ ఔన్నత్యం వల్ల సభికుల ముఖాలపై వస్తున్న మార్పు స్పష్టంగా కనిపించింది. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆ గ్రామస్తుడికి అర్థమయ్యేలా వివరించారు: “అధికారమంతా అల్లాహ్ చేతుల్లోనే ఉంది. ఒకవేళ అల్లాహ్ ఎవరి సిఫారసు అయినా స్వీకరిస్తే అది ఆయన అనుగ్రహమే. కాని ప్రవక్త వద్ద అల్లాహ్ ను సిఫారసు దారునిగా చేయడం అంటే ప్రవక్తకు అధికారం అంటగట్టడం, అతన్నే యజమానిగా భావించడం అన్నమాట. కాని అది అల్లాహ్ గొప్పతనం. ఇక ముందు ఇలాంటి మాటలు మాట్లాడకు.”
అల్లాహ్ ఔన్నత్యం అద్వితీయం. ప్రవక్తలు, ఔలియాలు ఆయన ముందు చాలా చిన్నవారు. ఆయన సింహాసనం భూమ్యాకాశాలను ఆవరించి ఉంది. సింహాసనం అంత పెద్దదయినప్పటికీ అల్లాహ్ ఔన్నత్యం వల్ల దాన్ని మోయలేక విలవిలలాడుతుంది. ఆయన ఔన్నత్యం సృష్టితాలు ఊహకు కూడా అందదు. తమ భావాల ద్వారా ఆయన ఔన్నత్యాన్నీ వివరించలేరు. ఆయన పనిలో జోక్యం చేసుకోలేరు. ఆయన సామ్రాజ్యంలో కూడా జోక్యం చేసుకోలేరు. సైన్యం, మంత్రులు, అధికారులు లేకుండానే ఆయన కోటానుకోట్ల పనులు చేస్తాడు. అలాంటప్పుడు ఆయన ఒకరి వద్దకు వచ్చి సిఫారసు ఎందుకు చేస్తాడు? ఆయన ముందు అధికారం చేసే ధైర్యం ఎవరికుంది? అల్లాహ్ పరమ పవిత్రుడు!
ఒక సామాన్య గ్రామస్తుడి నోటి నుండి వెలువడిన మాటవల్ల మానవులందరిలో అత్యున్నతుడు అయిన మానవులు, అల్లాహ్ ప్రియ దాసులైన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) దైవభీతితో హడలెత్తి భూమ్యాకాశాల్లో ఉన్న అల్లాహ్ ఔన్నత్యాన్ని కీర్తించడం మొదలు పెట్టారు. అలాంటప్పుడు అల్లాహ్ తో స్నేహం, బంధుత్వం కలిపే వారి పరిస్థితిని, ఆలోచించకుండా మితిమీరి మాట్లాడేవారి గురించి ఏం చెప్పమంటారు? ఒకడు నేను దేవుణ్ణి ఒక రూపాయికి కొన్నాను అంటాడు, ఇంకొకడు నేను దేవుడికంటే రెండు సంవత్సరాలు పెద్దవాణ్ణి అంటాడు. నా దేవుడు నా కాలి రూపంలో కంటే వేరే రూపంలో వస్తే నేనెప్పుడూ అతణ్ణి చూడను అని మరొకడంటాడు. ఇంకొకడు నా హృదయం ముహమ్మద్ ప్రేమలో గాయమైంది. నేను నా ప్రభువుతో సాన్నిహిత్యాన్ని కలిగి వుంటాను అంటాడు. అల్లాహ్ ను ప్రేమించు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తో జాగ్రత్తగా ఉండు అని మరొకడు. ఇంకొందరయితే ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను దైవత్వం కంటే గొప్పగా చెబుతుంటారు.
అల్లాహ్ శరణు వేడుకుంటున్నాను. అల్లాహ్ శరణు వేడుకుంటున్నాను!! ఈ ముస్లిములకు ఏమయింది? పవిత్ర ఖుర్ఆన్ ఉన్నప్పటికీ వీరి బుద్ధులపై తెరలెందుకు పడ్డాయి? ఏమిటీ ఈ వక్ర మార్గాలు? అల్లాహ్ మమ్మల్ని అందర్నీ రక్షించుగాక. అల్లాహ్ మమ్మల్ని అందర్నీ రక్షించుగాక!! ఆమీన్.
ఎవరో చాలా చక్కగా పేర్కొన్నారు.
“మర్యాద ప్రసాదించమని మేము అల్లాహ్ ను కోరుతున్నాము. అమర్యాదస్థులు అల్లాహ్ అనుగ్రహాన్ని పొందలేరు”
కొందరు ఈ వాక్యం పలుకుతుంటారు. ” అబ్దుల్ ఖాదిర్ జీలానీ! అల్లాహ్ కోసం మా మొక్కుబడులను స్వీకరించు.” ఇలా అనడం స్పష్టమైన షిర్క్.
అల్లాహ్ ముస్లిములను ఇలాంటి వాటి నుండి రక్షించుగాక! ఆమీన్! షిర్క్ ప్రస్ఫుటమయ్యే, అమర్యాద కలిగించే మాటలు నోటి నుండి వెలువడనివ్వకండి. అల్లాహ్ ఎంతో గొప్పవాడు. నిత్యం ఉండే శక్తివంతుడైన చక్రవర్తి. చిన్న పొరపాటును పట్టుకోవడం లేదా క్షమించి వదలిపెట్టడం ఆయన చేతిలోనే ఉంది. అలాంటిది అమర్యాదగా మాట్లాడటం, ఆ తర్వాత అలా మాట్లాడలేదనడం చాలా పెద్ద తప్పు. ఎందుకంటే అల్లాహ్ పొడుపు కథలకు అతీతుడు. ఎవరయినా పెద్దవారితో పరాచి కాలాడితే ఎంత చెడుగా భావిస్తాం? చక్రవర్తితో పరిహాసమాడడం సమంజసమా?
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
అల్లాహ్ యేతరులపై ప్రమాణం చేయడం ధర్మ సమ్మతమేనా? https://youtu.be/FpPJtYzHKHQ [12 నిముషాలు] వక్త: హబీబుర్ రహ్మాన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఈ ఉపన్యాసంలో, ఇస్లాంలో ప్రమాణం (ఒట్టు) చేయడానికి సంబంధించిన నియమాలను ఖురాన్ మరియు హదీసుల వెలుగులో వివరించబడింది. అల్లాహ్ యేతరులపై, అంటే ప్రవక్తలు, తల్లిదండ్రులు, పిల్లలు, కాబా లేదా ఇతర సృష్టితాలపై ప్రమాణం చేయడం ఇస్లాంలో ఘోరమైన పాపం మరియు షిర్క్ (బహుదైవారాధన) అని స్పష్టం చేయబడింది. అవసరమైతే, కేవలం అల్లాహ్ పేరు మీద మాత్రమే నిజాయితీతో ప్రమాణం చేయాలని, లేకపోతే మౌనంగా ఉండాలని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధించినట్లు హదీసుల ద్వారా తెలియజేయబడింది. అబద్ధపు ప్రమాణాలు చేయడం, ముఖ్యంగా అల్లాహ్ పేరు మీద చేయడం కూడా మహా పాపమని హెచ్చరించబడింది. అంతిమంగా, ఈ షిర్క్ అనే పాపం నుండి దూరంగా ఉండాలని మరియు అల్లాహ్ బోధనలను మాత్రమే అనుసరించాలని ఉద్బోధించబడింది.
అల్ హందులిల్లాహ్, వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్, అమ్మా బాద్
అభిమాన సోదరులారా! “ధర్మ అవగాహనం” అనే ఈ ఎపిసోడ్ లో మీకందరికీ నా ఇస్లామీయ అభివాదం,
أَلسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ ٱللَّهِ وَبَرَكَاتُهُ (అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహ్) మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక!
ప్రియ వీక్షకులారా! ఈరోజు మనం దైవేతరులపై ప్రమాణం చేయడం ధర్మసమ్మతమా, కాదా? అనే విషయం గురించి తెలుసుకుందాం.
కొన్ని సందర్భాలలో మనకు ప్రమాణం చేసే అవసరం వస్తుంది. మనము చెప్పే మాట సత్యమని, నిజమని చెప్పటానికి, మనం చెప్పే మాటను బలపరచటానికి, లేదా అవతలి వ్యక్తి మా మాటను నమ్మటం లేదని వారిని నమ్మించటానికి, లేదా ఏదో ఒక సందర్భంలో గొడవపడితే, “నేను అలా చెప్పలేదు, ఇలా చెప్పాను, అలా చేయలేదు, ఇలా చేశాను” అని రుజువు చేయటానికి, లేదా ఏదో ఒక వాగ్దానం నెరవేర్చటానికి, బలపరచటానికి, “అల్లాహ్ సాక్షిగా నేను ఈ పని చేస్తాను” అని ఇలా కొన్ని కారణాల వల్ల మనిషి ప్రమాణం చేస్తాడు.
దైవేతరులపై ప్రమాణం చేయడం షిర్క్
మనం సమాజంలో చూస్తాము, కొంతమంది సృష్టిరాశుల మీద ప్రమాణం చేస్తారు. అది ప్రవక్తలు కావచ్చు, ప్రవక్త మీద ప్రమాణం, కాబతుల్లా మీద ప్రమాణం, మస్జిద్ సాక్షిగా మస్జిద్ మీద ప్రమాణం, దైవదూతల మీద ప్రమాణం, తాత ముత్తాతల మీద ప్రమాణం, ఆత్మల మీద ప్రమాణం, తల మీద ప్రమాణం, “నా తలపైన పెట్టి నేను ప్రమాణం చేస్తున్నాను,” “నా బిడ్డ తలపైన చెయ్యి పెట్టి ప్రమాణం చేస్తున్నాను,” “అమ్మ తలపైన పెట్టి ప్రమాణం చేస్తున్నాను,” ఫలానా సమాధి మీద ప్రమాణం చేస్తున్నాను, వారి నిజాయితీ మీద ప్రమాణం చేస్తున్నాను, ఇలా అనేక విధాలుగా సృష్టి రాశులపై, దైవేతరులపై, అల్లాహ్ పైన కాకుండా, అల్లాహ్ మీద కాకుండా అమ్మ, నాన్న, భార్య, పిల్లలు, గురువులు, సమాధులు, కాబా, మస్జిద్ ఏదైనా సరే దైవేతరుల మీద ప్రమాణం చేయటం ఇది ఇస్లాం పరంగా అధర్మం. ఇది ఘోరమైన పాపం, ఇది షిర్క్ అని మనకు తెలుస్తుంది ఖురాన్ మరియు హదీసులు పరిశీలిస్తే.
ప్రమాణం చాలా ముఖ్యమైన విషయం. ఇది ఎప్పుడైతే అప్పుడు, ఎవరి మీద అంటే వారి మీద చేయకూడదు, తప్పు, చాలా తప్పు.
అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు:
إِنَّ اللَّهَ تَعَالَى يَنْهَاكُمْ أَنْ تَحْلِفُوا بِآبَائِكُمْ فَمَنْ كَانَ حَالِفًا فَلْيَحْلِفْ بِاللَّهِ أَوْ لِيَصْمُتْ (ఇన్నల్లాహ త’ఆలా యన్ హాకుం అన్ తహ్లిఫూ బి ఆబాయికుం ఫమన్ కాన హాలిఫన్ ఫల్ యహ్లిఫ్ బిల్లాహి అవ్ లియస్ముత్) నిశ్చయంగా అల్లాహ్, మీరు మీ తండ్రి తాతల మీద ప్రమాణం చేయడాన్ని నిషేధించాడు. కనుక ఎవరైనా ప్రమాణం చేయదలిస్తే అల్లాహ్ మీదనే చేయాలి, లేకపోతే మౌనంగా ఉండాలి. (ముత్తఫకున్ అలై – బుఖారీ మరియు ముస్లిం)
ఈ హదీస్ బుఖారీ మరియు ముస్లిం గ్రంథములో ఉంది. అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు, “మీరు తాత ముత్తాతల మీద ప్రమాణం చేయటాన్ని అల్లాహ్ వారించాడు.” ఇన్నల్లాహ త’ఆలా యన్ హాకుం – అల్లాహ్ ఖండించాడు, అల్లాహ్ నిషేధించాడు, అల్లాహ్ వారించాడు మీరు మీ తాత ముత్తాతల మీద ప్రమాణం చేయటాన్ని, అంటే చేయవద్దండి అని అర్థం.
ఫమన్ కాన హాలిఫన్ – ఒకవేళ ప్రమాణం చేయదలచుకుంటే ఆ అవసరం వచ్చింది. ఏదో ఒక తగాదాలో, గొడవలో, ఏదో ఒక సందర్భంలో, విషయంలో తప్పనిసరిగా ప్రమాణం చేసే అవసరం వచ్చింది, ప్రమాణం చేయదలచుకుంటున్నారు, అటువంటి సమయంలో ఫల్ యహ్లిఫ్ బిల్లాహ్ – అల్లాహ్ మీద మాత్రమే ప్రమాణం చేయండి, అవ్ లియస్ముత్ – లేకపోతే ఊరుకోండి అని అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. అంటే, ప్రమాణం చేసే అవసరం వస్తే అల్లాహ్ మీదనే ప్రమాణం చేయాలి, లేకపోతే మౌనంగా ఉండాలి, ఊరుకుండాలి అని అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఆదేశం, యొక్క ప్రవచనం ఇది.
అలాగే ముస్లిం గ్రంథంలో ఇలా ఉంది, అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు:
لَا تَحْلِفُوا بِالطَّوَاغِي، وَلَا بِآبَائِكُمْ (లా తహ్లిఫూ బిత్తవాగీ వలా బి ఆబాయికుం) మీరు తాగూత్ (దైవేతర శక్తులు) మీద ప్రమాణం చేయకండి, మీ తండ్రి తాతల మీద కూడా ప్రమాణం చేయకండి.
మీరు మీ తాత ముత్తాతల మీద, మీరు మీ, మీరు విగ్రహాల మీద, దైవేతరుల మీద ప్రమాణం చేయకండి. “తవాగీ” ఇది బహువచనం తాగూత్ కి. తాగూత్ అంటే అల్లాహను తప్ప ఎవరిని ఆరాధిస్తున్నామో అది తాగూత్ అవుతుంది. అల్లాహ్ కాక ఎవరిని ఆరాధన దైవాలుగా భావించుకున్నారు, అది తాగూత్ కిందికి వస్తుంది. సమాధి పూజ చేస్తే సమాధి తాగూత్, ఒక చెట్టుకి పూజిస్తే ఆ చెట్టు తాగూత్. చనిపోయిన ప్రవక్తలను, ఔలియాలను, పుణ్య పురుషులను పూజిస్తే అది తాగూత్. అల్లాహ్ ను కాక ఎవరిని పూజిస్తే అది తాగూత్ అవుతుంది. అంటే, లా తహ్లిఫూ బిత్తవాగీకి అర్థం ఏమిటి? అల్లాహ్ తప్ప ఏ వస్తువు పైనా, ఏ వ్యక్తి పైనా, ఏ ఇతరుల మీద కూడా ప్రమాణం చేయకండి. వలా బి ఆబాయికుం – మీ తాత ముత్తాతల మీద కూడా ప్రమాణం చేయకండి అని అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు.
అభిమాన సోదరులారా, అంతేకాదు. అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు:
مَنْ حَلَفَ بِالْأَمَانَةِ فَلَيْسَ مِنَّا (మన్ హలఫ బిల్ అమానతి ఫలయ్స మిన్నా) ఎవరైతే అమానత్ (విశ్వసనీయత/నిజాయితీ) మీద ప్రమాణం చేస్తాడో, అతను మా పద్ధతిని అనుసరించిన వాడు కాదు.
ఎవరైతే నిజాయితీ మీద ప్రమాణం చేస్తాడో, వాడు ముస్లిం పద్ధతిని అనుసరించట్లేదు అని అర్థం. ఫలయ్స మిన్నా – మావాడు కాదు, మాలోని వాడు కాదు.
అభిమాన సోదరులారా, అంతే, ఇది ఎంత చిన్న విషయం కాదు. మనం చూస్తూ ఉంటాము మాటిమాటికీ, చీటికిమాటికి ప్రమాణం చేస్తూనే ఉంటాం. చిన్న చిన్న విషయాలకి ప్రమాణం చేసేస్తాం. అది కూడా దైవేతరుల పైన మీద – అమ్మ మీద ఒట్టు, నా బిడ్డ మీద ఒట్టు, నా తల మీద ఒట్టు, తలపైన చెయ్యి పెట్టుకొని, పిల్లలపైన చెయ్యి పెట్టుకొని. ఇది మహా పాపం. అధర్మం, అన్యాయం. అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఖండించారు.
చివరికి నిజాయితీ మీద కూడా ప్రమాణం చేయకూడదు. ఎందుకంటే అల్లాహ్ పేరు మరియు ఆయన గుణగణాల తప్ప, అల్లాహ్ మరియు అల్లాహ్ యొక్క గుణగణాల తప్ప ఇతర ఏ విషయం మీద కూడా ప్రమాణం చేయకూడదు. నిజాయితీ కూడా అల్లాహ్ యొక్క ఆదేశాలలో ఒక ఆదేశం అది. “నా నిజాయితీ మీద, నీ నిజాయితీ మీద, వారి నిజాయితీ మీద ఒట్టు, ప్రమాణం చేసి చెప్తున్నాను” అంటే నిజాయితీ ఏమిటి? అల్లాహ్ యొక్క ఆదేశాలలో ఒక ఆదేశం. మరి ఆ ఆదేశం మీద ఒట్టు, ప్రమాణం చేస్తే, అది అల్లాహ్ యొక్క గుణగణాలకి పోల్చినట్లు అవుతుంది.
అభిమాన సోదరులారా, ప్రమాణం అనేది, ఒట్టు అనేది దీనికి అరబీలో, ఉర్దూలో “ఖసమ్” అంటారు. ఇది కేవలం అల్లాహ్ మీదనే. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూరత్ తగాబున్, ఆయత్ 7లో ఇలా సెలవిచ్చాడు:
قُلْ بَلَىٰ وَرَبِّي لَتُبْعَثُنَّ (ఖుల్ బలా వ రబ్బీ లతుబ్’అసున్న) (ఓ ప్రవక్తా!) వారికి ఇలా చెప్పు: “నా ప్రభువు తోడు! మీరు తప్పకుండా మళ్ళి లేపబడతారు” (64:7)
అంటే చనిపోయిన జీవితం, మరణానంతర జీవితం, మీరు చనిపోతారు, చనిపోయిన తర్వాత మళ్ళీ నేను మీకు లేపుతాను, మీరు లేపబడతారు. ఆ విషయం చెప్పటానికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను ఉద్దేశించి ఇలా అన్నారు, ఖుల్ – ఓ ప్రవక్తా, ఇలా అను. బలా వ రబ్బీ – నా ప్రభువు సాక్షిగా. ఈ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనకు ఏం నేర్పించాడు? ప్రమాణం చేయగలిగితే, ఆ అవసరం పడితే, చేయాలనుకుంటే అల్లాహ్ మీదనే ప్రమాణం చేయాలి. ఖుల్ బలా వ రబ్బీ – ఓ ప్రవక్తా, వారితో ఇలా అను, “నా ప్రభువు సాక్షిగా లతుబ్’అసున్న – మీరు తప్పకుండా మళ్ళీ లేపబడతారు.” అంటే కొందరికి విశ్వాసం ఉండదు, మరణానంతర జీవితంపై. అది వేరే ముఖ్యమైన సబ్జెక్ట్ అది. మీరు చనిపోయిన తర్వాత లేపబడతారు. సుమ్మ లతునబ్బ’ఉన్న బిమా అమిల్తుం – మీరు ఏం చేశారో మీ కర్మలు, మంచి చెడు మొత్తం మీ ముందర ఉంచడం జరుగుతుంది. అల్లాహ్ చూపిస్తాడు, ఎప్పుడు, ఎక్కడ, ఏ విధంగా పాపం చేశాడా, పుణ్యం చేశాడా, తక్కువ, ఎక్కువ, న్యాయం, అన్యాయం మొత్తం మన జీవిత చరిత్ర అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనకు చూపిస్తాడు మరియు మన ఆ కర్మల పరంగానే మనకు తీర్పు జరుగుతుంది. ఆ విషయం గురించి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ వాక్యంలో తెలియజేశాడు. అంటే అల్లాహ్ మీద మాత్రమే ప్రమాణం చేయాలి. దైవేతరుల మీద, అల్లాహ్ యేతరుల మీద ప్రమాణం చేయకూడదు. చేస్తే ఏమవుతుంది? షిర్క్ అవుతుంది.
అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు:
مَنْ حَلَفَ بِغَيْرِ اللَّهِ فَقَدْ أَشْرَكَ (మన్ హలఫ బి గైరిల్లాహి ఫఖద్ అష్రక) ఎవరైతే అల్లాహ్ యేతరులపై ప్రమాణం చేశాడో, అతను షిర్క్ చేశాడు.
అల్లాహు అక్బర్! ప్రమాణం అనేది అంత పెద్దది. ఒక ముఖ్యమైన విషయంలో ప్రమాణం చేయాలనుకుంటే అల్లాహ్ మీద ప్రమాణం చేయాలి. అది కూడా ప్రమాణం నిజం ఉండాలి, సత్యం ఉండాలి. అబద్ధమైన ప్రమాణం అల్లాహ్ పైన కూడా చేయకూడదు. ఇతరులకి మోసం చేయటానికి కొందరు ఒక వస్తువు అమ్మటానికి అబద్ధమైన ప్రమాణం అల్లాహ్ పైన చేస్తారు. ఇది కూడా మహా పాపం. అబద్ధమైన ప్రమాణం అల్లాహ్ మీద కూడా చేయకూడదు. నీతి, నిజాయితీ, న్యాయం, సత్యం, ధర్మం అనే విషయంలో ప్రమాణం చేసే అవసరం వస్తే అల్లాహ్ మీద మాత్రమే ప్రమాణం చేయాలి.
అభిమాన సోదరులారా, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరినీ ప్రతి చిన్న, పెద్ద షిర్క్, కుఫ్ర్, బిద్అత్ నుండి కాపాడుగాక, రక్షించుగాక! అభిమాన సోదరులారా, మరిన్ని విషయాలు ఇన్ షా అల్లాహ్ వచ్చే ఎపిసోడ్ లో తెలుసుకుందాం. అప్పుడు వరకు సెలవు.
وَآخِرُ دَعْوَانَا أَنِ الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ (వ ఆఖిరు ద’వానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్) మా చివరి ప్రార్థన, సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కే సర్వస్తోత్రములు.
وَالسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ (వస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహ్) మరియు మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక!
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఈ ప్రసంగంలో, ఇస్లాంలో “రుఖ్ యా” (మంత్రించి ఊదడం) అనే అంశం గురించి వివరించబడింది. రుఖ్ యా అంటే, అనారోగ్యంతో లేదా ఇతర బాధలతో ఉన్న వ్యక్తిపై ఖుర్ఆన్ వచనాలు, అల్లాహ్ నామ-గుణాలు లేదా ప్రవక్త నేర్పిన దుఆలు పఠించి ఊదటం. రుఖ్ యాలో రెండు రకాలు ఉన్నాయి: ధర్మసమ్మతమైనది (రుఖ్ యా షరియా) మరియు నిషిద్ధమైనది (షిర్క్ తో కూడినది). ధర్మసమ్మతమైన రుఖ్ యాకు మూడు షరతులు ఉన్నాయి: అది అల్లాహ్ వాక్యాలు లేదా నామ-గుణాలతో ఉండాలి, అరబి భాషలో స్పష్టమైన అర్థంతో ఉండాలి, మరియు దాని ప్రభావం అల్లాహ్ యే కలుగజేస్తాడనే నమ్మకం ఉండాలి. దైవేతరుల సహాయం కోరే, షిర్క్ తో కూడిన రుఖ్ యా ఇస్లాంలో తీవ్రంగా నిషిద్ధం. సహాబాలు, సలఫ్ సాలెహీన్‌లు ఎవరూ రుఖ్ యాను వ్యాపారంగా లేదా జీవనోపాధిగా చేసుకోలేదని, ఈ విషయంలో జాగ్రత్త వహించాలని ప్రసంగీకులు హెచ్చరించారు.
أَلْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ وَالْعَاقِبَةُ لِلْمُتَّقِينَ وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى سَيِّدِ الْأَنْبِيَاءِ وَالْمُرْسَلِينَ وَمَنْ تَبِعَهُمْ بِإِحْسَانٍ إِلَى يَوْمِ الدِّينِ أَمَّا بَعْدُ సమస్త ప్రశంసలు సకల లోకాల ప్రభువైన అల్లాహ్ కు మాత్రమే శోభాయమానం. మరియు అంతిమ విజయం దైవభక్తిపరుల కొరకే. మరియు దైవ ప్రవక్తల నాయకునిపై మరియు ఆయనను అనుసరించిన వారిపై ప్రళయదినం వరకు శాంతి మరియు శుభాలు వర్షించుగాక!
ప్రియ వీక్షకుల్లారా! ధర్మ అవగాహనం అనే ఈ కార్యక్రమం లోకి మీ అందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను.
أَلسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ (అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు) మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక!
రుఖ్ యా అంటే ఏమిటి?
ప్రియ వీక్షకుల్లారా! ఈరోజు మనం ధర్మ అవగాహనం అనే ఈ కార్యక్రమంలో, రుఖ్ యా అంటే మంత్రించి ఊదటం అనే విషయం గురించి క్లుప్తంగా కొన్ని విషయాలు తెలుసుకుందాం.
అరబీ భాషలో, హదీస్ గ్రంథాలలో రుఖ్ యా ఇది ఏకవచనం, దానికి బహువచనం రుఖా. రుఖ్ యా అంటే తెలుగు అనువాదకులు రుఖ్ యా అనే దానికి మంత్రం, మంత్రించి ఊదటం అని అనువదించారు. ఇది షరియత్ పరిభాషలో అరబీలో రుఖ్ యా అంటారు. మంత్రించి ఊదటం.
ఈ విషయం గురించి షరియత్ లో దాని ఆదేశం ఏమిటి? అది తప్పా ఒప్పా అనే విషయం గురించి తెలుసుకుందాం.
అసలు రుఖ్ యా అంటే ఏమిటి, మంత్రించి ఊదటం అది ఏమిటో తెలుసుకుందాం ఇన్షా అల్లాహ్. రుఖ్ యా దానికి అర్థం ఏమిటంటే మానసికంగానైనా శారీరకంగానైనా బాధలో ఉన్న వ్యక్తిపై ఏదైనా పఠించి ఊదటం. జ్వరం, మూర్ఛ రోగం, మొదలుగైన బాధలు, కష్టాలు, సమస్యలు, అనారోగ్యంకి గురైన వారికి, రోగులపై ఏదైనా పఠించి ఊదటాన్ని రుఖ్ యా అంటారు, మంత్రించి ఊదటం అంటారు.
రుఖ్ యాలో రకాలు
ఇవి రెండు రకాలు.
1. ధర్మసమ్మతమైన రుఖ్ యా (రుఖ్ యా షరియా)
మొదటి విషయం, మొదటి రకం ఏమిటంటే షిర్క్ ప్రమేయం లేకుండా, షిర్క్ లేని మంత్రం, షిర్క్ లేని రుఖ్ యా. ఆ రుఖ్ యాలో, ఆ మంత్రంలో ఎటువంటి షిర్క్ లేదు. సూటిగా చెప్పాలంటే దివ్య ఖుర్ఆన్ లోని ఆయతులు లేదా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వాక్యాలు, ఆయన నామ గుణాలని పఠించి ఆ రోగిని, ఎవరిపైన ఊదుతున్నామో ఆయన్ని అల్లాహ్ రక్షణలో ఇవ్వటం.
ఈ రకమైన రుఖ్ యా, ఈ రకమైన మంత్రం ధర్మ సమ్మతమే. ఏ రుఖ్ యాలో షిర్క్ లేదో, బిద్అత్ లేదో, కొత్త విధానం లేదో, కేవలం అల్లాహ్ వాక్యాలు, అల్లాహ్ నామం, ఆయన గుణాలు మాత్రమే దాంట్లో ఉంటే ఇటువంటి రుఖ్ యా, ఇటువంటి మంత్రం ధర్మ సమ్మతమే. ఈ విధంగా అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా చేశారు, మరి అది ధర్మ సమ్మతం అని ఖరారు కూడా చేశారు.
దీనికి ఆధారం, ఒక సందర్భంలో ఔఫ్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు ఇలా అన్నారు: “ఓ దైవ ప్రవక్తా సల్లల్లాహు అలైహి వసల్లం, మేము అజ్ఞాన కాలంలో మంత్రించి ఊదే వారము. ఇప్పుడు మీరు దీని గురించి, ఈ రుఖ్ యా గురించి, ఈ మంత్రం గురించి ఏదైతే మేము అజ్ఞాన కాలంలో ఇలా మంత్రించి ఊదుతూ ఉన్నాము కదా, ఇప్పుడు మీరు ఆ విషయం గురించి ఏమంటారు, మీ అభిప్రాయం ఏమిటి?” అని ఔఫ్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను ప్రశ్నించారు.
దానికి సమాధానంగా అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు:
اعْرِضُوا عَلَىَّ رُقَاكُمْ لاَ بَأْسَ بِالرُّقَى مَا لَمْ يَكُنْ فِيهِ شِرْكٌ (ఇఅరిదూ అలయ్య రుఖాకుమ్, లా బ’స బిర్రుఖా మా లమ్ తకున్ షిర్కన్) “మీ మంత్రాలు ఏమిటో నా ముందు సమర్పించండి. షిర్క్ ప్రమేయం లేకుండా ఉన్నంత వరకు మంత్రించి ఊదటంలో అభ్యంతరం ఏమీ లేదు” (సహీహ్ ముస్లిం)
అభిమాన సోదరులారా! ఈ హదీస్ లో రెండు భాగాలు ఉన్నాయి, బాగా గమనించాలి. మొదటి భాగం ఏమిటి? “ఇఅరిదూ అలయ్య రుఖాకుమ్” అన్నారు. అంటే ఆలోచన చేయకుండా, అడగకుండా, ఏ మంత్రమైనా, ఎలాగైనా కరెక్టే అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కితాబు ఇవ్వలేదు, పర్మిషన్ ఇవ్వలేదు. “ఇఅరిదూ అలయ్య రుఖాకుమ్” – మీరు ముందు నాకు సమర్పించండి, చూపించండి. మీరు ఎటువంటి మంత్రం మీరు చేస్తారు, ఎలా ఊదుతారు, విధానం ఏమిటి, పదాలు ఏమిటి, వాక్యాలు ఏమిటి, అది నాకు ముందు చూపించండి, నా సమక్షంలో సమర్పించండి, నేను చూస్తాను అన్నారు.
ఆ తర్వాత రెండో భాగం ఏమిటి ఈ హదీస్ లో? “లా బ’స బిర్రుఖా మా లమ్ తకున్ షిర్కన్”. అంటే మీరు మంత్రించి ఊదటంలో ఎటువంటి షిర్క్ ఉండకూడదు. ఆ మంత్రంలో, ఆ రుఖ్ యాలో షిర్క్ లేనంత వరకు అది ధర్మ సమ్మతమే అని అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు.
ధర్మసమ్మతమైన రుఖ్ యాకు షరతులు
అభిమాన సోదరులారా! కావున, ఈ రుఖ్ యా గురించి మనము ఇంకా పరిశీలిస్తే, ఇది ధర్మ సమ్మతం అవటానికి మూడు షరతులు ఉన్నాయి. ఈ మూడు షరతులు అబ్దుర్రహ్మాన్ బిన్ హసన్ అత్తమీమీ రహ్మతుల్లాహి అలై తన పుస్తకం ‘ఫత్ హుల్ మజీద్ షరహ్ కితాబుత్ తౌహీద్‘ లో తెలియజేశారు ఈ మూడు షరతులు.
అంటే రుఖ్ యా ధర్మ సమ్మతం, జాయజ్, చేయవచ్చు అనటానికి ఆ మూడు షరతులు ఉన్నాయి.
మొదటి షరతు ఏమిటి? ఆ రుఖ్ యా దైవ వచనాల, దైవ నామాల ఆధారంగా మంత్రించి ఊదాలి. మొదటి షరతు ఇది. ఏదైతే మనము రుఖ్ యా చేస్తున్నామో, మొదటి షరతు ఏమిటి? దైవ వచనాలు, అల్లాహ్ ఆయతులు, ఖుర్ఆన్ లోని వాక్యాలు, అల్లాహ్ నామ గుణాలు ఆధారంగా మంత్రించి, పఠించి ఊదాలి. ఇది మొదటి కండిషన్.
రెండవ షరతు: ఆ రుఖ్ యా అనేది, ఆ పదాలు అనేవి అరబీ భాషలోనే ఉండాలి. దాని భావం కూడా స్పష్టంగా ఉండాలి. ఇది రెండవ కండిషన్.
మూడవ కండిషన్: ఆ మంత్రం, ఆ రుఖ్ యా, ఆ విధంగా మంత్రించి ఊదటం, అది అల్లాహ్ విధివ్రాత ప్రకారమే దాని ప్రభావం ఉంటుందని నమ్మకం కలిగి ఉండాలి.
ఈ మూడు కండిషన్లు ఉంటే అటువంటి రుఖ్ యా ధర్మ సమ్మతం, కరెక్టే, చేయవచ్చు. దానివల్ల ఇన్షా అల్లాహ్, అల్లాహ్ తలిస్తే ప్రయోజనం కలుగుతుంది, స్వస్థత కలుగుతుంది ఇన్షా అల్లాహ్ రోగికి. ఆ మూడు కండిషన్లు బాగా మనము గుర్తు పెట్టుకోవాలి.
మొదటి కండిషన్ ఏమిటి? అల్లాహ్ వచనాల, అల్లాహ్ నామాల ఆధారంగా మంత్రించి ఊదాలి. రెండవది అది అరబీ భాషలోనే ఉండాలి, దాని భావం స్పష్టంగా ఉండాలి. మూడవది, అది ఆ విధివ్రాత ప్రకారమే దాని ప్రభావం ఉంటుందని నమ్మకం కలిగి ఉండాలి. ఈ మూడు కండిషన్లు, ఈ మూడు షరతులు ఆ మంత్రంలో, ఆ రుఖ్ యాలో కలిగి ఉంటే, అటువంటి రుఖ్ యా, అటువంటి మంత్రం, అటువంటి మంత్రించి ఊదటం కరెక్టే, ధర్మ సమ్మతమే.
రుఖ్ యా చేసే విధానం
దాని విధానం ఏమిటంటే, మంత్రించే పద్ధతి ఏమిటంటే, నిర్దిష్ట దైవ వచనాలు, నిర్దిష్ట వాక్యాలు, ఖుర్ఆన్ వాక్యాలు పఠించి రోగిపై ఊదాలి. మొదటి విషయం ఏమిటి? స్వయంగా రోగి తన కోసం అది చేసుకోవాలి. ఆ రోగికి, ఆ బాధలో, సమస్యలో ఉన్న వ్యక్తికి ఆ వచనాలు, ఆ దుఆలు అవి రాని యెడల, వచ్చే వారు రోగిపై పఠించి ఊదవచ్చు. లేదా నీటిపై మంత్రించి దానిని రోగికి త్రాగించాలి. ఇది సరైన విధానం, రుఖ్ యా షరియా అనేది.
2. ధర్మసమ్మతం కాని రుఖ్ యా
రెండవ విధానం ధర్మ సమ్మతం కాదు, జాయజ్ కాదు, అధర్మం. అదేమిటి? షిర్క్ కు ప్రమేయం ఉన్నది. అంటే దైవేతరుల సహాయం అర్థించే మంత్ర తంత్రాలు. ఇందు నిమిత్తం దైవేతరులను మొరపెట్టుకోవటం, వారి సహాయం కోరటం, వారి శరణు కోరటం, జిన్నాతుల పేర్లతో, ప్రవక్తల పేర్లతో, దైవదూతల పేర్లతో, పుణ్య పురుషుల పేర్లతో మంత్రించి ఊదటం. ఇదంతా దైవేతరులను మొరపెట్టుకోవటం క్రిందికే వస్తుంది, కావున ఇది షిర్కే అక్బర్ అవుతుంది. ఇది ఎటువంటి పరిస్థితుల్లో ధర్మ సమ్మతం కాదు, హరాం.
అలాగే కొన్ని పదాలు, కొన్ని మంత్రాలు వాటిలో అవిశ్వాసంతో, షిర్క్ తో కూడిన వాక్యాలు కూడా ఉండవచ్చు. ఆ విషయం మనకు తెలియవచ్చు, తెలియకపోవచ్చు. ఈ విధమైన మంత్రాలు కూడా సమ్మతం కావు అని మనం బాగా తెలుసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి.
ముగింపు మరియు హెచ్చరిక
అభిమాన సోదరులారా! సారాంశం ఏమనగా చిన్న పిల్లలైనా, పెద్దవారైనా, ఎవరైనా సరే ఏదైనా రోగం వస్తే, అనారోగ్యానికి గురైతే, ఖుర్ఆన్ మరియు హదీస్ ఆధారంగా, ఖుర్ఆన్ లోని ఆయతులు, వాక్యాలు, అల్లాహ్ నామాలు, అల్లాహ్ గుణ గణాలను పఠించి ఊదవచ్చు. ఏదైతే ఖుర్ఆన్ లో వాక్యాలు ఉన్నాయో, ఏదైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనకు నేర్పించారో. అవి కూడా మూడు కండిషన్లు మనం తెలుసుకున్నాము. ఆ మూడు కండిషన్లతో సహా ఉంటే మనము ఈ రుఖ్ యా షరియా పఠించవచ్చు, పఠించి ఊదవచ్చు, మంత్రించవచ్చు, రుఖ్ యా చేయవచ్చు.
ఈ విషయంలో లాస్ట్ లో ఒక మాట చెప్పి నేను ముగిస్తున్నాను. అది ఏమిటంటే, ఈ కాలంలో కొందరు దీనిని వ్యాపారంగా చేసుకున్నారు. వారి జీవనోపాధికి కూడా ఇదే మంత్రం, రుఖ్ యా మాత్రమే అయిపోయింది. ఈ విషయం గురించి ఒకే ఒక్క మాట. రుఖ్ యా షరియాను, ఈ మంత్రించి ఊదటాన్ని సహాబాలు, ఆ తర్వాత తాబయీన్లు, తబే తాబయీన్లు, ముహద్దీసీన్లు, అయిమ్మాలు, మన పూర్వం సజ్జనులు, సలఫ్ సాలెహీన్లు ఎవ్వరూ కూడా ఈ రుఖ్ యాను, ఈ మంత్రించి ఊదటాన్ని వ్యాపారంగా, తన జీవన ఉపాధిగా ఎవ్వరూ, ఏ వ్యక్తి కూడా చేసుకోలేదు. ఇది గమనించాల్సిన విషయం. కావున, అవసరం రీత్యా మనము ఈ వ్యాపారం లేకుండా ఈ విధంగా మనము దీనిని రోగిపై పఠించి ఊదవచ్చు.
స్వస్థత కల్పించేవాడు, చికిత్స చేసేవాడు అల్లాహ్ మాత్రమే. ఆరోగ్యం ఇచ్చేవాడు, అనారోగ్యం ఇచ్చేవాడు అల్లాహ్ మాత్రమే. కావున ఇది రుఖ్ యా గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు.
తావీజుల ప్రస్తావన
అలాగే దీనికే సంబంధించిన విషయం ఒకటి ఉంది, అది తావీజు, తాయెత్తు. కొందరు తావీజులు, తాయెత్తులు కట్టుకుంటారు, మెడలో వేలాడదీసుకుంటారు, చేతికి కట్టుకుంటారు. ఇది ధర్మ సమ్మతమా కాదా? ఈ తావీజు యొక్క వాస్తవికత ఏమిటి? అది తప్పా ఒప్పా? అనే విషయం ఇన్షా అల్లాహ్ వచ్చే ఎపిసోడ్ లో తెలుసుకుందాం. అప్పటి వరకు సెలవు.
وَآخِرُ دَعْوَانَا أَنِ الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ (వ ఆఖిరు ద’వానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్) మా ఆఖరి పలుకు ఏమిటంటే, సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కే సర్వ స్తోత్రాలు.
وَالسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ (వస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు) మరియు మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక!
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
You must be logged in to post a comment.