అల్లాహ్ ను సిఫారసుదారునిగా చేయకండి

జుబైర్ బిన్ ముత్ ఇమ్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వద్దకు ఒక గ్రామస్తుడు వచ్చి ‘ప్రజలు ఆపదలో ఉన్నారు, పిల్లలు ఆకలితో నకనకలాడుతున్నారు. తగినంత ధనం లేదు, పశువులు చనిపోతున్నాయి, వర్షం పడాలని మీరు మా కోసం అల్లాహ్ ను దుఆ చేయండి. అల్లాహ్ వద్ద మేము మిమ్మల్ని సిఫారసు దారుడ్ని చేయాలను కుంటున్నాము, మీ వద్ద అల్లాహ్ ను సిఫారసుదారుడ్ని చేయాలనుకుంటున్నాము‘ అని విన్నవించుకున్నాడు. అందుకు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం), అల్లాహ్ పరమ పవిత్రుడు! అల్లాహ్ పరమ పవిత్రుడు! అని చాలా సేపు అల్లాహ్ పవిత్రతను చాటారు. సహాబాల ముఖాలపై దాని ప్రభావం పడటం గమనించారు. తర్వాత ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రవచించారు: “అమాయకుడా! అల్లాహ్ ఎవరి వద్దా సిఫారసు చేయడు. ఆయన గొప్పతనం వారి కంటే గొప్పది, ఉన్నతమైంది. అమాయకుడా! అల్లాహ్ అంటే ఎవరో నీకు తెలుసా? ఆయన సింహాసనం ఆకాశంపై ఎలాగుందంటే (వేళ్లను గోపురం మాదిరిగాచేసి) ఆయన వల్ల అది విలవిలలాడుతుంది. ఒంటె వీపుపై ప్రయాణించే వాని భారం వల్ల పల్లకి విలవిలలాడినట్టు”. (హదీసు గ్రంథం అబూదావూద్, హదీస్ నెం.: 4726) 

ఒకసారి అరేబియా దేశంలో క్షామం ఏర్పడింది. వర్షాలు పడటం ఆగిపోయాయి. ఒక గ్రామస్తుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వద్దకు వచ్చి ప్రజల దీనావస్థను వివరించాడు. అల్లాహ్ ను వేడుకోమని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ను కోరాడు. అక్కడితో ఆగకుండా ‘మీరు అల్లాహ్ వద్ద సిఫారసు చేయాలని, అల్లాహ్ మీ వద్ద సిఫారసు చేయాలని కోరుకుంటున్నాం‘ అన్నాడు. ఆ మాట విని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అల్లాహ్ భీతితో, భయంతో కంపించిపోయారు. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) నోటిపై అల్లాహ్ కీర్తి వచనాలు వెలువడ్డాయి. అల్లాహ్ ఔన్నత్యం వల్ల సభికుల ముఖాలపై వస్తున్న మార్పు స్పష్టంగా కనిపించింది. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆ గ్రామస్తుడికి అర్థమయ్యేలా వివరించారు: “అధికారమంతా అల్లాహ్ చేతుల్లోనే ఉంది. ఒకవేళ అల్లాహ్ ఎవరి సిఫారసు అయినా స్వీకరిస్తే అది ఆయన అనుగ్రహమే. కాని ప్రవక్త వద్ద అల్లాహ్ ను సిఫారసు దారునిగా చేయడం అంటే ప్రవక్తకు అధికారం అంటగట్టడం, అతన్నే యజమానిగా భావించడం అన్నమాట. కాని అది అల్లాహ్ గొప్పతనం. ఇక ముందు ఇలాంటి మాటలు మాట్లాడకు.”

అల్లాహ్ ఔన్నత్యం అద్వితీయం. ప్రవక్తలు, ఔలియాలు ఆయన ముందు చాలా చిన్నవారు. ఆయన సింహాసనం భూమ్యాకాశాలను ఆవరించి ఉంది. సింహాసనం అంత పెద్దదయినప్పటికీ అల్లాహ్ ఔన్నత్యం వల్ల దాన్ని మోయలేక విలవిలలాడుతుంది. ఆయన ఔన్నత్యం సృష్టితాలు ఊహకు కూడా అందదు. తమ భావాల ద్వారా ఆయన ఔన్నత్యాన్నీ వివరించలేరు. ఆయన పనిలో జోక్యం చేసుకోలేరు. ఆయన సామ్రాజ్యంలో కూడా జోక్యం చేసుకోలేరు. సైన్యం, మంత్రులు, అధికారులు లేకుండానే ఆయన కోటానుకోట్ల పనులు చేస్తాడు. అలాంటప్పుడు ఆయన ఒకరి వద్దకు వచ్చి సిఫారసు ఎందుకు చేస్తాడు? ఆయన ముందు అధికారం చేసే ధైర్యం ఎవరికుంది? అల్లాహ్ పరమ పవిత్రుడు!

ఒక సామాన్య గ్రామస్తుడి నోటి నుండి వెలువడిన మాటవల్ల మానవులందరిలో అత్యున్నతుడు అయిన మానవులు, అల్లాహ్ ప్రియ దాసులైన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) దైవభీతితో హడలెత్తి భూమ్యాకాశాల్లో ఉన్న అల్లాహ్ ఔన్నత్యాన్ని కీర్తించడం మొదలు పెట్టారు. అలాంటప్పుడు అల్లాహ్ తో స్నేహం, బంధుత్వం కలిపే వారి పరిస్థితిని, ఆలోచించకుండా మితిమీరి మాట్లాడేవారి గురించి ఏం చెప్పమంటారు? ఒకడు నేను దేవుణ్ణి ఒక రూపాయికి కొన్నాను అంటాడు, ఇంకొకడు నేను దేవుడికంటే రెండు సంవత్సరాలు పెద్దవాణ్ణి అంటాడు. నా దేవుడు నా కాలి రూపంలో కంటే వేరే రూపంలో వస్తే నేనెప్పుడూ అతణ్ణి చూడను అని మరొకడంటాడు. ఇంకొకడు నా హృదయం ముహమ్మద్ ప్రేమలో గాయమైంది. నేను నా ప్రభువుతో సాన్నిహిత్యాన్ని కలిగి వుంటాను అంటాడు. అల్లాహ్ ను ప్రేమించు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తో జాగ్రత్తగా ఉండు అని మరొకడు. ఇంకొందరయితే ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను దైవత్వం కంటే గొప్పగా చెబుతుంటారు.

అల్లాహ్ శరణు వేడుకుంటున్నాను. అల్లాహ్ శరణు వేడుకుంటున్నాను!! ఈ ముస్లిములకు ఏమయింది? పవిత్ర ఖుర్ఆన్ ఉన్నప్పటికీ వీరి బుద్ధులపై తెరలెందుకు పడ్డాయి? ఏమిటీ ఈ వక్ర మార్గాలు? అల్లాహ్ మమ్మల్ని అందర్నీ రక్షించుగాక. అల్లాహ్ మమ్మల్ని అందర్నీ రక్షించుగాక!! ఆమీన్.

ఎవరో చాలా చక్కగా పేర్కొన్నారు.

“మర్యాద ప్రసాదించమని మేము అల్లాహ్ ను కోరుతున్నాము. అమర్యాదస్థులు అల్లాహ్ అనుగ్రహాన్ని పొందలేరు”

కొందరు ఈ వాక్యం పలుకుతుంటారు. ” అబ్దుల్ ఖాదిర్ జీలానీ! అల్లాహ్ కోసం మా మొక్కుబడులను స్వీకరించు.” ఇలా అనడం స్పష్టమైన షిర్క్.

అల్లాహ్ ముస్లిములను ఇలాంటి వాటి నుండి రక్షించుగాక! ఆమీన్! షిర్క్ ప్రస్ఫుటమయ్యే, అమర్యాద కలిగించే మాటలు నోటి నుండి వెలువడనివ్వకండి. అల్లాహ్ ఎంతో గొప్పవాడు. నిత్యం ఉండే శక్తివంతుడైన చక్రవర్తి. చిన్న పొరపాటును పట్టుకోవడం లేదా క్షమించి వదలిపెట్టడం ఆయన చేతిలోనే ఉంది. అలాంటిది అమర్యాదగా మాట్లాడటం, ఆ తర్వాత అలా మాట్లాడలేదనడం చాలా పెద్ద తప్పు. ఎందుకంటే అల్లాహ్ పొడుపు కథలకు అతీతుడు. ఎవరయినా పెద్దవారితో పరాచి కాలాడితే ఎంత చెడుగా భావిస్తాం? చక్రవర్తితో పరిహాసమాడడం సమంజసమా?

ఈ పోస్ట్ క్రింది పుస్తకం నుండి తీసుకోబడినది:
విశ్వాస ప్రదాయిని (తఖ్వియతుల్ ఈమాన్) – షాహ్ ఇస్మాయీల్ [పుస్తకం]

%d bloggers like this: