అల్లాహ్ (తన) కారుణ్యాన్ని వంద భాగాలు చేశాడు

1750. హజ్రత్ అబూ హురైరా (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ఉద్బోధించారు :-

అల్లాహ్ (తన) కారుణ్యాన్ని వంద భాగాలు చేసి, అందులో తొంభైతొమ్మిది భాగాలు తన దగ్గర పెట్టుకొని ఒక్క భాగం మాత్రమే భూమిపై అవతరింపజేశాడు. ఆ ఒక్క భాగం కారుణ్యం కారణంగానే మానవులు, ఇతర జీవరాసులు ఒకరి పట్ల మరొకరు కారుణ్యం, కనికరాలతో మసులుకుంటున్నారు. చివరికి (ఈ కారుణ్యం మూలంగానే) గుర్రం తన పిల్ల (కు కాస్త కూడా నష్టం వాటిల్ల కూడదని, దాని) పై నుండి తన కాలిగిట్టను ఎత్తుకుంటుంది.

[సహీహ్ బుఖారీ : 78 వ ప్రకరణం – అదబ్, 19 వ అధ్యాయం – జఅలల్లాహుర్రహ్మత మిఅత జుజ్ యిన్]

పశ్చాత్తాప ప్రకరణం : 4 వ అధ్యాయం – అల్లాహ్ ఆగ్రహం కన్నా అనుగ్రహమే అధికం
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-2
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

Read English Version of this Hadeeth

రోగి మీద ‘ముఅవ్విజాత్’ పఠించి ఊదడం

1415. హజ్రత్ ఆయిషా (రధి అల్లాహు అన్హ) కధనం :-

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఎప్పుడైనా జబ్బుపడితే ముఅవ్విజాత్ ( ఖుల్ అవూజు బిరబ్బిల్ ఫలఖ్; ఖుల్ అవూజు బిరబ్బిన్నాస్) సూరాలు పఠించి తమపై ఊదుకునేవారు. (కొన్నాళ్ళకు) ఆయన (ప్రాణ సంకట వ్యాధికి గురయ్యారు) వ్యాధి తీవ్రరూపం దాల్చినప్పుడు, నేనే ముఅవ్విజాత్ సూరాలు పఠించి, ఆయన చేతిలో ఊది ఆ చేత్తోనే శ్రేయోశుభాల కోసం ఆయన శరీరాన్ని స్పృశింప జేస్తుండేదాన్ని.

[సహీహ్ బుఖారీ : వ ప్రకరణం – ఫజాయిలె ఖుర్ ఆన్, వ అధ్యాయం – అల్ ముఅవ్విజాత్]

వ్యాధులు – వైద్యం : వ అధ్యాయం – రోగి మీద ‘ముఅవ్విజాత్’ పఠించి ఊదడం
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-2
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

Read English Version of this Hadeeth

అల్లాహ్ తన దాసుని పశ్చాత్తాపం (తౌబా) పట్ల చెందే ఆనందం

1747. హజ్రత్ అబ్దుల్లా బి న్ మస్ వూద్ (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ఉద్బోధించారు –

ఒక వ్యక్తి ప్రాణాపాయముండే ప్రదేశంలో దిగుతాడు. అతని ఒంటె మీద అన్న పానీయాల సామాగ్రి ఉంటుంది. అతనా ప్రదేశంలో దిగి (ప్రయాణ బడలిక వల్ల) కాస్సేపు పడుకుంటాడు. కాని మేల్కొన్న తరువాత చూస్తే ఆ ఒంటె కన్పించక ఎక్కడికోపోతుంది. (అతను ఎంత వెతికినా అది కన్పించదు) చివరకి ఎండ తీవ్రమయిపోయి దప్పికతో అతను తల్లడిల్లిపోతాడు. ఇలాంటి పరిస్థితిలో ఎదురయ్యే బాధలన్నీ అతనికి ఎదురయ్యాయి. అతను (తిరిగి తిరిగి విసిగి వేసారిపోయి) ఇక లాభం లేదు, తాను తన విడిదికి చేరుకోవాలి అని భావించి ఆ ప్రదేశానికి తిరిగొస్తాడు. అలసిపోయి కాస్సేపు పడుకుంటాడు. మేల్కొన్న తరువాత తలపైకెత్తి చూస్తే అతని ఒంటె అతని ఎదురుగా నిలబడి ఉండటం కన్పిస్తుంది. దాన్ని చూసి అతను పరమానంద భరితుడవుతాడు. అయితే అల్లాహ్ తన దాసుని పశ్చాత్తాపం (తౌబా) పట్ల చెందే ఆనందం ఈ బాటసారి చెందిన ఆనందానికి మించి ఉంటుంది.

[సహీహ్ బుఖారీ : 80 వ ప్రకరణం – అధ్దావాత్, 4 వ అధ్యాయం – అత్తౌబా]

పశ్చాత్తాప ప్రకరణం : 1 వ అధ్యాయం – పశ్చాత్తాప ప్రేరణ, పశ్చాత్తాపం ద్వారా దైవప్రసన్నత
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-2
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

Read English Version of this Hadeeth

అయిదు రకాల అమరగతులు

1247. హజ్రత్ అబూహురైరా (రధి అల్లాహు అన్హు) కధనం :- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు:

“ఒక వ్యక్తి దారిన నడుస్తుంటే ఒక చోట దారిలో ఒక ముళ్ళ కంప పడి ఉండటం కన్పించింది. అతనా ముళ్ళకంపను తీసి దారి పక్కన దూరంగా పారేశాడు. అతడు చేసిన ఈ సత్కార్యాన్ని ప్రతిఫలంగా దేవుడు అతని పాపాలను క్షమించాడు.”
ఆ తరువాత దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు: “అమరగతుల్లో (షుహదా) అయిదు రకాల వాళ్ళుంటారు.
(1) ప్లేగు వ్యాధి వల్ల చనిపోయిన వారు,
(2) ఉదరవ్యాధితో చనిపోయిన వారు,
(3) నీటిలో మునిగి చనిపోయినవారు,
(4) ఏదైనా బరువు క్రింద నలిగి చనిపోయిన వారు,
(5) దైవమార్గంలో పోరాడుతూ వధింప బడినవారు.”

[సహీహ్ బుఖారీ : 10 వ ప్రకరణం – అజాన్, 32 వ అధ్యాయం – ఫజ్లిత్తహ్ జీరి ఇలజ్జుహ్రి]

పదవుల ప్రకరణం : 51 వ అధ్యాయం – అమరగతులు
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-2
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

Read English Version of this Hadeeth

సమావేశాల్లో చోటుంటే మధ్యలో, లేకుంటే వెనుక కూర్చోవాలి

1405. హజ్రత్ అబూ వాఖిద్ లైసీ (రధి అల్లాహు అన్హు) కధనం :-

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మస్జిద్ లో కూర్చొని ఉన్నారు. ప్రజలు కూడా ఆయన దగ్గర (కూర్చొని) ఉన్నారు. అంతలో ముగ్గురు వ్యక్తులు వచ్చారు. ఇద్దరు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వైపుకు వచ్చారు. ఒకతను వెళ్ళిపోయాడు. వారిద్దరూ దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) దగ్గరికొచ్చి నిల్చున్నారు. వారిలో ఒకతనికి సమావేశం మధ్యలో ఖాళీ స్థలం కన్పించింది. వెంటనే అతనా స్థలంలో కూర్చున్నాడు. రెండవ వ్యక్తి సమావేశం చివరికెళ్ళి కూర్చున్నాడు. కాని మూడో వ్యక్తి తిరిగి వెళ్ళిపోయాడు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సమావేశం ముగిసిన తరువాత ఇలా అన్నారు  : “నేను మీకు ముగ్గురు మనుషులను గురించి చెప్పనా? వారిలో ఒకడు అల్లాహ్ శరణు కోరాడు. అల్లాహ్ అతనికి శరణు (రక్షణ) ప్రసాదించాడు. మరొకడు సిగ్గుపడ్డాడు. అల్లాహ్ కూడా అతని వల్ల సిగ్గుపడ్డాడు. మూడో వ్యక్తి ముఖం చాటేసి వెళ్ళిపోయాడు. అల్లాహ్ కూడా అతని వైపు నుండి ముఖం తిప్పుకున్నాడు. ( అంటే అతని వైఖరి పట్ల ఆగ్రహం చెందాడు).”

[సహీహ్ బుఖారీ : 3 వ ప్రకరణం – ఇల్మ్, 8 వ అధ్యాయం – మన్ ఖాద హైసు యన్తహి బిహిల్ మజ్లిస్]

సలాం ప్రకరణం : 10 వ అధ్యాయం – సమావేశాల్లో చోటుంటే మధ్యలో, లేకుంటే వెనుక కూర్చోవాలి
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-1
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

Read English Version of this Hadeeth

అల్లాహ్ రెట్టింపు పుణ్యఫలం ప్రసాదించే ముగ్గురు వ్యక్తులు

94. హజ్రత్ అబూ మూసా (రధి అల్లాహు అన్హు) కధనం :- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలిపారు,

“మూడు విధాల వ్యక్తులకు దేవుడు రెట్టింపు పుణ్యఫలం ప్రసాదిస్తాడు.

  1. గ్రంధ ప్రజలకు చెందిన వాడు. (యూదుడు లేక క్రైస్తవుడు అయి ఉండి తమ దైవప్రవక్త (హజ్రత్ మూసా లేక హజ్రత్ ఈసా) తో పాటు, ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ను కూడా విశ్వసించే వ్యక్తి.
  2. అటు దేవుని హక్కుల్ని, ఇటు తన యజమాని హక్కుల్ని కూడా నిర్వర్తించే బానిస.
  3. ఒక మహిళా బానిసను కలిగి వుండి, ఆమెకు మంచి విద్యాబుద్దులు గరిపి, తరువాత ఆమెను బానిసత్వం నుంచి విముక్తి కలిగించి తన భార్యగా చేసుకునే వ్యక్తి. అతనికి కూడా రెట్టింపు పుణ్యఫలం లభిస్తుంది.”

[సహీహ్ బుఖారీ : 3 వ ప్రకరణం – ఇల్మ్, 31 వ అధ్యాయం – తాలిమిర్రజులి ఉమ్మత్]

విశ్వాస ప్రకరణం : 68 వ అధ్యాయం – మహనీయ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి అసల్లం) యావత్తు మానవాళి కోసం వచ్చిన దైవప్రవక్త
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) Vol. 1
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

Read English Version of this Hadeeth

జనాజా నమాజులో పాల్గొనడం వల్ల పుణ్యం ‘రెండు కొండల పరిమాణం’

551. హజ్రత్ అబూహురైరా (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు :-

“జనాజా (శవ ప్రస్థానం)లో పాల్గొని జనాజా నమాజు అయ్యేవరకు శవంతో పాటు ఉండే వ్యక్తికి ఒక యూనిట్ పుణ్యం లభిస్తుంది. శవ ఖననం అయ్యే వరకు ఉండే వ్యక్తికి రెండు యూనిట్ల పుణ్యం లభిస్తుంది.” రెండు యూనిట్లు అంటే ఏమిటని అడగ్గా ‘రెండు కొండల పరిమాణం’ అని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలియజేశారు.

[సహీహ్ బుఖారీ : 23 వ ప్రకరణం – జనాయెజ్, 59 వ అధ్యాయం – మనిన్ తంజిర హత్తా తద్ ఫిన్]

జనాయెజ్ ప్రకరణం : 17 వ అధ్యాయం – జనాజా నమాజులో పాల్గొనడం వల్ల పుణ్యం
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-1
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

Read English Version of this Hadeeth

ప్రతి ముస్లిం విధిగా దానం చేయాలి

589. హజ్రత్ అబూ మూసా అష్ అరీ (రధి అల్లాహు అన్హు) కధనం :-

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తన అనుచరులతో మాట్లాడుతూ “ప్రతి ముస్లిం విధిగా దానం చేయాలి” అన్నారు.
అనుచరులు అది విని “మరి ఎవరి దగ్గరైనా దానం చేయడానికి ఏమీలేకపోతే ఎలా? అని అడిగారు.
“అప్పుడు ఆ వ్యక్తి కష్టపడి సంపాదించి తానూ అనుభవించాలి, దాన్ని (పేదలకు) దానం కూడా చేయాలి” అన్నారు ధైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం).

“ఒకవేళ అలా చేసే శక్తి కూడా లేకపోతే? లేదా అలా కూడా చేయకపోతే?” అని మళ్ళీ అడిగారు అనుయాయులు.
“అప్పుడు ఎవరైనా అగత్యపరుడు ఏదైనా ఆపదలో చిక్కుకుంటే అతడ్ని ఆదుకోవాలి” అన్నారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం).

“అది కూడా చేయలేకపోతేనో?” అడిగారు అనుయాయులు తిరిగి,
“(అదీ చేయలేకపోతే) మేలు చేయాలని లేక సత్కార్యాలు చేయాలని ఇతరులకు సలహా లివ్వాలి” అన్నారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం).

“మరి అదీ చేయలేకపోతే” అడిగారు అనుయాయులు మళ్ళీ.
“(అలాంటి పరిస్థితిలో కనీసం) తాను స్వయంగా చెడుపనులు
చేయకుండా, ఇతరులకు చెడు తలపెట్టకుండా ఉండాలి. ఇది కూడా దానం క్రిందకే వస్తుంది” అన్నారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం).

[సహీహ్ బుఖారీ : 78 వ ప్రకరణం – అదబ్, 33 వ అధ్యాయం – కుల్లు మారూఫిన్ సదఖాతున్]

జకాత్ ప్రకరణం : 16 వ అధ్యాయం – ప్రతి సత్కార్యం దానమే (సదఖాయే)
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-1
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

Read English Version of this Hadeeth

కేవలం దేవుని ప్రసన్నత కోసం ఎవరైనా మస్జిదు నిర్మిస్తే అతని కోసం దేవుడు అలాంటిదే ఒక ఇల్లు స్వర్గంలో నిర్మిస్తాడు

309. హజ్రత్ ఉబైదుల్లా ఖూలానీ (రధి అల్లాహు అన్హు) కధనం :-

హజ్రత్ ఉస్మాన్ (రధి అల్లాహు అన్హు) మస్జిదె నబవి (ప్రవక్త మస్జిదు) ని పునర్నిర్మించినపుడు ప్రజలు ఆయన్ని ఏవేవో మాటలు అన్నారు. హజ్రత్ ఉస్మాన్ (రధి అల్లాహు అన్హు) ఆ మాటలు విని ఇలా అన్నారు. “మీరు లేనిపోని మాటలు అంటున్నారు గాని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఏమన్నారో తెలుసా? ‘కేవలం దేవుని ప్రసన్నత కోసం ఎవరైనా మస్జిదు నిర్మిస్తే అతని కోసం దేవుడు అలాంటిదే ఒక ఇల్లు స్వర్గంలో నిర్మిస్తాడు’ అని అన్నారాయన.”

[సహీహ్ బుఖారీ  : 8 వ ప్రకరణం – సలాత్, 65 వ అధ్యాయం – మన్ బనా మస్జిద్]

ప్రార్ధనా స్థలాల ప్రకరణం – 4 వ అధ్యాయం – మస్జిదుల నిర్మాణం పట్ల ప్రోత్సాహం. మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-1. సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

Read English Version: Whoever built a masjid, with the intention of seeking Allaah’s pleasure ..

ఉపవాసము ఒక డాలు వంటిది

706. హజ్రత్ అబూ హురైరా (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు :-

ఉపవాసము ఒక డాలు వంటిది. (కాబట్టి) ఉపవాసి అశ్లీలమైన పలుకులు పలకడం గానీ, మూర్ఖుల్లా, అజ్ఞానుల్లా ప్రవర్తించడం గాని చేయకూడదు. ఎవరైనా అతనితో జగడానికి దిగితే లేదా దూషిస్తే అతనావ్యక్తితో తాను ఉపవాసం ఉన్నానని రెండుసార్లు చెప్పాలి

(ఆయన ఇంకా ఇలా అన్నారు):

నా ప్రాణం ఎవరి అధీనంలో ఉందో ఆ శక్తి స్వరూపుని సాక్ష్యంగా చెబుతున్నాను, ఉపవాసి నోటి వాసన అల్లాహ్ దృష్టిలో కస్తూరి సువాసన కన్నా ఎంతో శ్రేష్ఠమైనది. అల్లాహ్ ఇలా అంటున్నాడు – ఉపవాసి నా (ప్రసన్నత) కోసం ఆహారపానీయాలు, లైంగిక వాంచలు త్యజిస్తున్నాడు. ఉపవాసం ప్రత్యేకంగా నా కోసం పాటించబడుతుంది. అందవల్ల స్వయంగా నేనే దాని పుణ్యఫలాన్ని (ఉపవాసికి) ప్రసాదిస్తాను. ఒక సత్కార్యానికి పదింతల పుణ్యం లభిస్తుంది

[సహీహ్ బుఖారీ : 30 వ ప్రకరణం – సౌమ్, 2 వ అధ్యాయం – ఫజ్లిస్సౌమ్]

ఉపవాస ప్రకరణం – 29 వ  ప్రకరణం – ఉపవాసకుడు నోరు పారేసుకోరాదు. మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-1. సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

English Version : As-Siyaam (fasting) is Junnah (protection or shield or a screen or a shelter from the Hell-fire)