రచయిత: ముహమ్మద్ సాలిహ్ అల్ – మునజ్జిద్
అనువాదం : ముహమ్మద్ కరీముల్లాహ్, రివ్యూ : నజీర్ అహ్మద్
ప్రశ్న: షాబాన్ నెల సగభాగం గడిచిన పోయిన తర్వాత ఉపవాసం పాటించ వచ్చునా? ఎందుకంటే షాబాన్ నెల సగభాగం తర్వాత ఉపవాసం ఉండటాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిషేధించారని విన్నాను.
అల్హందులిల్లాహ్ – సకల స్తోత్రములూ, కృతజ్ఞతలూ అల్లాహ్ కొరకే.
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పలుకులను అబూ దావూద్ (3237), అత్తిర్మిథీ (738) మరియు ఇబ్నె మాజాహ్ (1651) లలో నమోదు చేయబడిన ఒక హదీథులో అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఇలా ఉల్లేఖించినారు: “షాబాన్ నెల సగభాగం గడిచి పోయిన తరువాత ఉపవాసం ఉండవద్దు.” సహీహ్ అత్తిర్మిథీ, 590 లో దీనిని సహీహ్ హదీథుగా అల్బానీ వర్గీకరించినారు.
షాబాన్ నెల సగభాగం తరువాత అంటే షాబాన్ నెల 15వ తేదీ తరువాత ఉపవాసం పాటించటానికి అనుమతి లేదని ఈ హదీథు సూచిస్తున్నది.
అయితే, ఈ రోజులలో ఉపవాసం పాటించటం అనుమతించబడిందని మరికొన్ని హదీథులు సూచిస్తున్నాయి. ఉదాహరణకు:
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పలుకులను అల్ బుఖారీ (1914) మరియు ముస్లిం (1082) లలో నమోదు చేయబడిన ఒక హదీథులో అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఇలా ఉల్లేఖించినారు: “రమదాన్ నెల ప్రారంభానికి ఒకటి లేదా రెండు రోజుల ముందు ఉపవాసం ఉంటూ, రమదాన్ నెలారంభం కొరకు ఎదురు చూడకండి, అయితే ఎవరైనా వ్యక్తి అలవాటు ప్రకారం ఉపవాసం ఉంటున్నట్లయితే, అతను ఆ రోజులలో కూడా ఉపవాసం కొనసాగించవచ్చు.”
ప్రతి సోమవారం మరియు గురువారం ఉపవాసం పాటించటం, రోజు విడిచి రోజు ఉపవాసం పాటించటం వంటి అలవాట్లున్న వ్యక్తి కొరకు షాబాన్ నెల సగభాగం తరువాత కూడా ఉపవాసం కొనసాగించే అనుమతి ఉందని ఈ హదీథు సూచిస్తున్నది.
అల్ బుఖారీ (1970) మరియు ముస్లిం (1156) లలో నమోదు చేయబడిన ఒక హదీథులో ఆయెషా రదియల్లాహు అన్హా ఇలా ఉల్లేఖించినారు: “ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కొన్ని రోజులు తప్ప, షాబాన్ నెల మొత్తం ఉపవాసం పాటించేవారు.” ఇది ముస్లిం గ్రంథంలో ఉల్లేఖించబడిన హదీథు.
అన్నవవి ఇలా పలికినారు: వేరే పదాలలో, “ఆయన షాబాన్ నెల మొత్తం ఉపవాసం పాటించేవారు. ఆయన కొన్ని రోజులను తప్పించి, షాబాన్ నెల మొత్తం ఉపవాసం పాటించేవారు.” రెండవ పదసమూహం మొదటి దాన్ని వివరిస్తున్నది మరియు ఇక్కడ ‘మొత్తం’ అనే పదం ‘అధికభాగం’ అనే అర్ధాన్ని సూచిస్తున్నది.
ఈ హదీథు ద్వారా తెలుస్తున్న దేమిటంటే షాబాన్ నెల సగభాగం తరువాత కూడా ఉపవాసం పాటించటానికి అనుమతి ఉన్నది. అయితే ఇది ఎవరైతే షాబాన్ నెల మొదటి సగభాగమంతా ఉపవాసం పాటిస్తూ, తరువాత సగభాగంలో కూడా తమ ఉపవాసం కొనసాగించే వారి కొరకు మాత్రమే. ఈ హదీథులన్నింటినీ పరిశీలించిన తరువాత షఫా ఇలా అన్నారు:
క్రమం తప్పకుండా అలవాటుగా ఉపవాసం ఉంటున్న వారికి లేదా షాబాన్ నెల మొదటి సగభాగం ఉపవాసంలో గడిపి, తమ ఉపవాసాలను తరువాత సగభాగంలో కూడా కొనసాగిస్తున్నవారికి తప్ప, ఇతరుల కొరకు షాబాన్ నెల రెండో సగభాగంలో ఉపవాసం పాటించే అనుమతి లేదు.
మెజారిటీ పండితులు ‘అనుమతి లేదనటమంటే ఇక్కడ నిషేధించబడటం అంటే హరామ్’ అని అభిప్రాయ పడినారు.
అల్ మజ్మూఅ, 6/399-400; ఫతహ్ అల్ బారీ, 4/129
అల్ రుయానీ వంటి మరికొందరు పండితులు ‘అనుమతి లేదనటమంటే ఇక్కడ హరామ్ కాదని, కేవలం అయిష్టమైనదని అంటే మక్రూహ్’ అని అభిప్రాయ పడినారు.
రియాదుస్సాలెహీన్ లో అన్నవావీ ఇలా తెలిపారు:
“షాబాన్ నెల మొదటి సగభాగం ఉపవాసంలో గడిపి, తమ ఉపవాసాలను తరువాత సగభాగంలో కూడా కొనసాగించేవారి కొరకు లేదా ప్రతి సోమవారం మరియు గురువారం (లేదా రోజు విడిచి రోజు) ఉపవాసం ఉండే అలవాటు గలవారి కొరకు తప్ప, షాబాన్ నెల రెండో సగభాగంలో ఉపవాసం ఉంటూ, రమదాన్ కోసం ఎదురు చూడటంపై నిషేధం గురించిన అధ్యాయం.”
షాబాన్ నెల రెండో సగభాగంలో ఉపవాసం పాటించడాన్ని నిషేధిస్తున్న హదీథు దయీఫ్ అంటే బలహీనమైన హదీథని మెజారిటి పండితులు అభిప్రాయపడినారు. దీని ఆధారంగా షాబాన్ నెల రెండో సగభాగంలో ఉపవాసం పాటించటం మక్రూహ్ కాదని వారు తెలిపినారు.
అల్ హాఫిజ్ ఇలా అన్నారు: షాబాన్ నెల రెండో సగభాగంలో ఐచ్ఛిక ఉపవాసాలు కొనసాగించటానికి అనుమతి ఉందని మెజారిటీ పండితులు తెలిపినారు. దీనిని వ్యతిరేకిస్తున్న హదీథును దయీఫ్ అంటే బలహీనమైన హదీథుగా వారు పేర్కొన్నారు. అది మున్కర్ హదీథని అహ్మద్ మరియు ఇబ్నె మయీన్ తెలిపినారు (ఫతహ్ అల్ బారీ). ఆ హదీథును బలహీనమైన హదీథుగా వర్గీకరించిన వారిలో అల్ బైహఖీ మరియు అల్ తహావీ కూడా ఉన్నారు.
ఈ హదీథు గురించిన ఇమాం అహ్మద్ అభిప్రాయాన్ని తన అల్ ముగ్నీ గ్రంథంలో ఇబ్నె ఖుదామహ్ ఇలా తెలిపినారు:
ఈ హదీథు అంత ప్రామాణికమైనది (సహీహ్) కాదు. మేము అబ్దుర్రహ్మాన్ ఇబ్నె మహ్దీను దీని గురించి అడిగినాము. ఆయన దీనిని సహీహ్ హదీథుగా వర్గీకరించలేదు మరియు ఆయన దానిని నాకు ఉల్లేఖించనూ లేదు. ఆయన ఈ హదీథు గురించి చర్చించకుండా దాటవేసినారు. ఇంకా అహ్మద్ ఇలా అన్నారు, ‘అల్ అలా అనే ఆయన నిజాయితీపరుడు. ఈ ఒక్క హదీథు తప్ప ఆయన ఉల్లేఖించిన ఇతర హదీథులేవీ మున్కర్ కోవలోనికి రాలేదు’.
ఇక్కడ అల్ అలా అంటే అల్ అలా ఇబ్నె అబ్దుర్రహ్మాన్, ఆయన దీనిని తన తండ్రి అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు నుండి ఉల్లేఖించినారు.
ఈ హదీథును దయీఫ్ అంటే బలహీనమైనదిగా వర్గీకరించిన వారికి జవాబిస్తూ, ‘ముస్లిం నియమాలను అనుసరించి ఈ హదీథు సహీహ్ హదీథు’ అని తన తహ్దీబ్ అల్ సునన్ అనే గ్రంథంలో ఇబ్నె అల్ ఖయ్యిమ్ రహిమహుల్లాహ్ తెలిపినారు. కేవలం అల్ అలా మాత్రమే ఈ హదీథును ఉల్లేఖించినా, అది హదీథు ప్రామాణికతను తగ్గించదు, ఎందుకంటే ఆయన ‘థిక్కాహ్ అంటే హదీథుశాస్త్ర పరిభాషలో నిజాయితీగా హదీథులను ఉల్లేఖించేవాడు’. తన సహీహ్ గ్రంథంలో ముస్లిం ఆయన నుండి ఆయన తండ్రి అయిన అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు యొక్క అనేక హదీథులను నమోదు చేసినారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నుండి థిక్కాగా గురించబడిన ఒక వ్యక్తి నుండి అనేక సున్నతులు ఉల్లేఖించబడినాయి, సమాజం వాటిని స్వీకరించినది మరియు అనుసరిస్తున్నది కూడా.
ఆ తరువాత ఆయన ఇలా తెలిపినారు:
ఇక ఈ హదీథుకు మరియు షాబాన్ నెలలో ఉపవాసం పాటించవచ్చని తెలుపుతున్న వేరే హదీథులకు మధ్య వైరుధ్యం ఉందని భావిస్తున్న వారితో – వీటి మధ్య ఎలాంటి వైరుధ్యం లేదు (అని అంటున్నాను). ఆ హదీథులు షాబాన్ నెల మొదటి సగభాగం ఉపవాసంలో గడిపి, తమ ఉపవాసాలను తరువాత సగభాగంలో కూడా కొనసాగిస్తున్నవారిని లేదా అలవాటుగా ఉపవాసం ఉంటున్న వారిని గురించి తెలుపుతున్నాయి. అయితే, అల్ అలా తెలిపిన హదీథు కావాలని ఉద్దేశ్యపూర్వకంగా షాబాన్ నెల సగభాగం దాటిన తరువాత ఉపవాసం ప్రారంభించటం పై ఉన్న నిషేధం గురించి తెలుపుతున్నదే గాని, క్రమం తప్పకుండా ఉపవాసం ఉంటున్న వ్యక్తి గురించి లేదా షాబాన్ నెల మొదటి నుండి ఉపవాసం కొనసాగిస్తున్న వ్యక్తి గురించి కాదు.
షాబాన్ సగభాగం తరువాత ఉపవాసం ఉండకూడదని తెలుపుతున్న హదీథు గురించి షేఖ్ ఇబ్నె బాజ్ రహిమహుల్లాహ్ ను ప్రశ్నించగా, ఆయన ఇలా జవాబిచ్చినారు:
షేఖ్ నాసిరుద్దీన్ అల్ బానీ తెలిపినట్లుగా ఇది సహీహ్ హదీథు. షాబాన్ నెల మధ్యనుండి ఉపవాసం ప్రారంభించటానికి అనుమతిలేదనేది దీని అర్థం. కానీ ఒకవేళ ఎవరైనా వ్యక్తి షాబాన్ నెలలో అధికభాగం లేదా షాబాన్ నెల మొత్తం ఉపవాసం ఉంటున్నట్లయితే, అతను సున్నతును అనుసరిస్తున్నట్లే.
[మజ్మూఅ ఫతావా అల్ షేక్ ఇబ్నె బాజ్, 15/385].
రియాదుస్సాలేహీన్ పై వ్యాఖ్యానిస్తూ షేఖ్ ఇబ్నె ఉథైమిన్ ఇలా పలికినారు (3/394):
ఒకవేళ ఈ హదీథ్ సహీహ్ అయినా సరే, కొందరు పండితులు అర్థం చేసుకున్నట్లుగా దీనిలోని నిషేధం హరామ్ తరగతికి చెందినది కాదు, అది కేవలం మక్రూహ్ మాత్రమే. కానీ ఎవరికైతే క్రమం తప్పకుండా ఉపవాసం ఉండే అలవాటు ఉన్నదో, అలాంటి వారు షాబాన్ నెల సగం భాగం తరువాత కూడా తమ ఉపవాసాల్ని కొనసాగించాలి.
ముగింపు మాట:
అలవాటుగా (సోమవారం, గురువారం, రోజు విడిచి రోజు) ఉపవాసం ఉంటున్న వారి విషయంలో లేదా షాబాన్ నెల మొదటి నుండి ఉపవాసం కొనసాగిస్తున్న వారి విషయంలో తప్ప, రెండో సగభాగంలో ఉపవాసాలు ఉండటానికి అనుమతి లేదు, అది మక్రూహ్ లేదా హరామ్. అసలైన విషయం కేవలం అల్లాహ్ కే తెలుసు.
ఈ నిషేధానికి కారణం ఏమిటంటే, నిరంతరాయంగా ఉపవాసం ఉండటం వలన రమదాన్ ఉపవాసాలు ఉండలేనంతగా బలహీనపడిపోయే అవకాశం ఉంది.
ఒకవేళ షాబాన్ నెలారంభం నుండి ఉపవాసాలు ఉంటున్నట్లయితే, మరీ ఎక్కువగా బలహీన పడిపోవచ్చు కదా అని ఎవరైనా అంటే, దానికి జవాబు – షాబాన్ నెలారంభం నుంచి ఉపవాసాలు ఉంటున్న వ్యక్తికి, ఉపవాసం ఉండటం అలవాటై పోయి ఉంటుంది. కాబట్టి అతనికి ఉపవాసం కొనసాగించటం ఏమంత కష్టంగా అనిపించదు.
అల్ ఖారీ ఇలా పలికినారు: ఇక్కడ నిషేధం అంటే అయిష్టమైనది అంటే మక్రూహ్. అది సమాజం కొరకు ఒక అనుగ్రహం. ఎందుకంటే ఆ ఉపవాసాల వలన రమదాన్ నెల విధి ఉపవాసాలు మంచి శక్తితో ఉండలేనంతగా బలహీన పడిపోవచ్చు. కానీ, షాబాన్ నెల మొత్తం ఉపవాసం ఉంటున్న వారు, ఉపవాసానికి అలవాటు పడిపోయి ఉంటారు. కాబట్టి అది వారి కొరకు కష్టంగా ఉండదు.అసలైన విషయం కేవలం అల్లాహ్ కే తెలుసును.
—
షాబాన్ నెల (The Month of Shaban) – Main page
షాబాన్ నెలకు సంబంధించిన పుస్తకాలు , ఆడియో, వీడియో , ఖుత్బాలు ..అన్నీ
https://teluguislam.net/2023/02/22/the-month-of-shaban/