అప్పుల బాధల్లో చిక్కుకొని, వ్యాపారంలో నష్టాల్లో కూరుకుపోయినవారికి ఇస్లామీయ సూచనలు [ఆడియో & టెక్స్ట్]

అప్పుల బాధల్లో చిక్కుకొని, వ్యాపారంలో నష్టాల్లో కూరుకుపోయినవారికి ఇస్లామీయ సూచనలు
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
https://youtu.be/U861e5h6_AE [10 నిముషాలు]

ఈ ప్రసంగంలో, ఇస్లామీయ దృక్పథంలో అప్పుల భారం, వ్యాపార నష్టాలు మరియు ఇతర ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడటానికి ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా ఆచరణాత్మక పరిష్కారాలు వివరించబడ్డాయి. పాపాల పట్ల పశ్చాత్తాపపడి అల్లాహ్‌ను క్షమాపణ వేడుకోవడం (ఇస్తిగ్ఫార్) యొక్క ప్రాముఖ్యత, హరామ్ సంపాదనకు, ముఖ్యంగా వడ్డీకి దూరంగా ఉండటం యొక్క ఆవశ్యకత నొక్కి చెప్పబడింది. అంతేకాకుండా, అప్పుల నుండి విముక్తి పొందటానికి మరియు సమృద్ధిని పొందటానికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నేర్పిన నిర్దిష్ట దుఆలు (ప్రార్థనలు) మరియు వాటిని పఠించవలసిన ప్రాముఖ్యత గురించి చర్చించబడింది.

అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహ్. అల్హమ్దులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్ అమ్మా బాద్.

అప్పుల బదల్లో చిక్కుకొని ఉన్నారు, దినదినానికి వ్యాపారంలో చాలా లాస్ జరుగుతుంది, ఇంకా అనేక రకాల ఇబ్బందులకు గురి అయి ఉన్నారని ఏదైతే తెలిపారో, దీని గురించి కొన్ని ఇస్లామీయ సూచనలు ఇవ్వండని అడిగారో, ఖురాన్ హదీస్ ఆధారంగా కొన్ని విషయాలు మీకు తెలియజేయడం జరుగుతున్నది.

అన్నిటికంటే ముందు మనమందరమూ కూడా అధికంగా, అధికంగా అల్లాహ్‌తో మన పాపాల గురించి క్షమాభిక్ష కోరుతూ ఉండాలి. అస్తగ్ఫిరుల్లాహ్, అస్తగ్ఫిరుల్లాహ్. ఒక్కొక్క సమావేశంలో, ఒక్కొక్కసారి ఎక్కడైనా కూర్చుంటామో, ఎక్కడైనా నడుస్తామో 100 సార్లు అంతకంటే ఎక్కువగా చదువుతూ ఉండాలి. ఎందుకంటే సూరత్ నూహ్, ఆయత్ 10 నుండి 12 వరకు ఒకసారి గమనించండి.

فَقُلْتُ اسْتَغْفِرُوا رَبَّكُمْ إِنَّهُ كَانَ غَفَّارًا ‎
[ఫకుల్తుస్ తగ్ఫిరూ రబ్బకుమ్ ఇన్నహూ కాన గఫ్ఫారా]
“మీ ప్రభువును క్షమాపణకై వేడుకోండి, నిశ్చయంగా ఆయన అమితంగా క్షమించేవాడు” అని చెప్పాను. (71:10)

يُرْسِلِ السَّمَاءَ عَلَيْكُم مِّدْرَارًا
[యుర్సిలిస్ సమా’అ అలైకుమ్ మిద్రారా]
“ఆయన మీపై ఆకాశం నుండి కుండపోతగా వర్షం కురిపిస్తాడు.” (71:11)

وَيُمْدِدْكُم بِأَمْوَالٍ وَبَنِينَ وَيَجْعَل لَّكُمْ جَنَّاتٍ وَيَجْعَل لَّكُمْ أَنْهَارًا
[వ యుమ్దిద్కుమ్ బి అమ్ వాలివ్ వ బనీన వ యజ్ అల్లకుమ్ జన్నతివ్ వ యజ్ అల్లకుమ్ అన్ హారా]
“ధనంతో, సంతానంతో మీకు సహాయం చేస్తాడు. మీ కోసం తోటలను ఏర్పాటు చేస్తాడు, కాలువలను ప్రవహింపజేస్తాడు.” (71:12)

నూహ్ అలైహిస్సలాం అంటున్నారు, నేను నా జాతితో చెప్పాను, మీరు అల్లాహ్‌తో అధికంగా ఇస్తిగ్ఫార్ చేయండి, అల్లాహ్‌తో అధికంగా మీ పాపాల గురించి క్షమాభిక్ష కోరండి. నిశ్చయంగా ఆయన పాపాలను క్షమించేవాడు. మీరు ఇలా ఇస్తిగ్ఫార్ అధికంగా చేస్తూ ఉంటే, ఆయన ఆకాశం నుండి మీపై కుండపోత వర్షం కురిపిస్తాడు, మీకు ధనము ప్రసాదిస్తాడు, సంతానము అధికం చేస్తాడు, మీకు మంచి తోటలు, ఉద్యానవనాలు ప్రసాదిస్తాడు, మీకు మంచి సెలయేళ్లు, మీ చుట్టుపక్కన ఉన్న వాగుల్లో, నదుల్లో నీళ్లు ప్రవహింపజేస్తాడు. మీ తోటల్లో, మీ చేనుల్లో శుభాలు, బర్కత్ ప్రసాదిస్తాడు. మీకు సంతానం ప్రసాదిస్తాడు, మీ ధనం అధికం చేస్తాడు. ఈ విధంగా ఎన్నో లాభాలు ఇస్తిగ్ఫార్ ద్వారా మనకు ప్రాప్తి అవుతూ ఉంటాయి. దీనికి సంబంధించి ఇంకా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీసులు కూడా అనేకం ఉన్నాయి.

అంతేకాకుండా, సాధ్యమైనంత వరకు పూర్తి ప్రయత్నం చేయాలి, హరామ్ నుండి దూరం ఉండి అన్ని రకాల నిషిద్ధ వస్తువులకు, పనులకు, ప్రత్యేకంగా హరామ్ సంపాదనకు దూరంగా ఉండాలి. ఇంకా ప్రత్యేకంగా వడ్డీ నుండి రక్షణ పొందే ప్రయత్నం చేయాలి. మాటిమాటికి అల్లాహ్‌తో దుఆ చేయాలి. ఒకవేళ అజ్ఞానంగా ఏదైనా వడ్డీ వ్యాపారాల్లో, వడ్డీ అప్పుల్లో చిక్కుకున్నా గానీ, అతి త్వరలో బయటపడే మార్గాలు వెతకాలి మరియు అల్లాహ్‌తో అధికంగా దుఆ చేయాలి.

దుఆ కేవలం ఇస్తిగ్ఫార్ వరకే కాదు, కొన్ని దుఆలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా మనకు నేర్పారు. అంతేకాకుండా మన భాషలో మనం, “ఓ అల్లాహ్, వడ్డీ ఇంత చెడ్డ పాపమని తెలిసింది, ఇక నుండి నేను దాని నుండి నేను తప్పించుకొని, దాని నుండి నేను ఎంత దూరం ఉండే ప్రయత్నం చేస్తానో, ఓ అల్లాహ్ నాకు ఈ భాగ్యం నీవు ప్రసాదించు” ఈ విధంగా మన భాషలో మనం ఏడుచుకుంటూ దుఆ అంగీకరింపబడే సమయాలు ఏవైతే ఉంటాయో, ఆ సమయాలను అదృష్టంగా భావించి, ఉదాహరణకు అజాన్ మరియు ఇకామత్ మధ్యలో, రాత్రి ఫజ్ర్ కంటే ముందు సమయంలో, ఇంకా నిద్ర నుండి ఎప్పుడు మేల్కొన్నా గానీ వెంటనే,

لَا إِلَهَ إِلَّا اللهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ، لَهُ الْمُلْكُ وَلَهُ الْحَمْدُ، وَهُوَ عَلَى كُلِّ شَيْءٍ قَدِيرٌ، الْحَمْدُ لِلَّهِ، وَسُبْحَانَ اللهِ، وَلَا إِلَهَ إِلَّا اللهُ، وَاللهُ أَكْبَرُ، وَلَا حَوْلَ وَلَا قُوَّةَ إِلَّا بِاللهِ
[లా ఇలాహ ఇల్లల్లాహు వహదహు లా షరీక లహు, లహుల్ ముల్కు వ లహుల్ హందు, వ హువ అలా కుల్లి షై’ఇన్ కదీర్. అల్హమ్దులిల్లాహ్, వ సుబ్ హా నల్లాహ్, వ లా ఇలాహ ఇల్లల్లాహు, వల్లాహు అక్బర్, వ లా హౌల వలా కువ్వత ఇల్లా బిల్లాహ్]

అని చదివి, ఆ తర్వాత అల్లాహుమ్మగ్ఫిర్లీ అని దుఆ చేసుకోవాలి, దుఆ అంగీకరింపబడుతుంది.

అయితే ఇక రండి, ప్రత్యేకంగా వ్యాపార నష్టాల నుండి దూరం ఉండి, అప్పుల బాధ నుండి త్వరగా బయటికి రావడానికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నేర్పిన ఈ దుఆలు తప్పకుండా చదవండి. సునన్ తిర్మిజీలో వచ్చి ఉంది ఈ దుఆ, హదీస్ నంబర్ 3563, షేక్ అల్బానీ రహమహుల్లాహ్ దీనిని హసన్ (అంగీకరింపబడే అటువంటి మంచి ప్రమాణం తో కూడిన హదీస్) అని చెప్పారు.

ఒక వ్యక్తి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి, అతడు బానిసత్వం నుండి విముక్తి పొందడానికి ఏదైతే ఒప్పందం చేసుకున్నాడో, దాని మూలంగా అతనిపై ఏదైతే ఒక అప్పు రూపంలో భారం పడిందో, దాని గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తో సహాయం అడిగినప్పుడు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు: “నేను నీకు ఒక విషయం నేర్పుతాను, నీపై ‘సిర్’ పర్వతం లాంటి అప్పు ఉన్నా గానీ, నువ్వు ఈ దుఆ చదువుతూ ఉంటే అల్లాహ్ తప్పకుండా నీ అప్పును నువ్వు అదా చేసే విధంగా సహాయపడతాడు.” దుఆ నాతోపాటు చదువుతూ నేర్చుకోండి:

اللَّهُمَّ اكْفِنِي بِحَلَالِكَ عَنْ حَرَامِكَ، وَأَغْنِنِي بِفَضْلِكَ عَمَّنْ سِوَاكَ
[అల్లాహుమ్మక్ఫినీ బిహలాలిక అన్ హరామిక్, వ అగ్నినీ బిఫద్లిక అమ్మన్ సివాక్]
“ఓ అల్లాహ్, నీవు హరామ్ నుండి నన్ను కాపాడి, హలాల్ నాకు సరిపోయే విధంగా చూసుకో. మరియు నీ యొక్క అనుగ్రహం, నీ యొక్క దయ తప్ప ప్రతీ ఒక్కరి నుండి నన్ను ఏ అవసరం లేకుండా చేసేయి.”

ఈ దుఆను పొద్దు, మాపు, పడుకునే ముందు, నిద్ర నుండి లేచినప్పుడు, దీనికి ఒక సమయం అని ఏమీ లేదు, ఇన్నిసార్లు ఇక్కడ కూర్చుని ఇట్లా ఏ పద్ధతి లేదు. కొందరు ఏదైతే తెలుపుతారో, దేనికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సంఖ్య అనేది తెలిపారో, మనం ఆ సున్నతును పాటించాలి సంఖ్య విషయంలో కూడా. ఎక్కడైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సంఖ్య అనేది ఏమీ తెలుపలేదో ఇన్నిసార్లు, అన్నిసార్లు చదవాలని, దాన్ని మనం ఎన్నిసార్లు చదివినా గానీ అభ్యంతరం లేదు. మరోసారి చదవండి:

اللَّهُمَّ اكْفِنِي بِحَلَالِكَ عَنْ حَرَامِكَ، وَأَغْنِنِي بِفَضْلِكَ عَمَّنْ سِوَاكَ
[అల్లాహుమ్మక్ఫినీ బిహలాలిక అన్ హరామిక్, వ అగ్నినీ బిఫద్లిక అమ్మన్ సివాక్]

ఈ దుఆ కాకుండా, ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరో సందర్భంలో మరొక దుఆ కూడా నేర్పారు. సహీహుత్ తర్గిబ్, హదీస్ నంబర్ 1821లో వచ్చి ఉంది. అనస్ రదియల్లాహు త’ఆలా అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ముఆద్ రదియల్లాహు త’ఆలా అన్హు వారికి ఇలా చెప్పారు: “నీకు ఒక దుఆ నేర్పుతాను, ఈ దుఆ నువ్వు చేస్తూ ఉండు, ఒకవేళ నీపై ఉహుద్ పర్వతానికి సమానమైన అప్పు ఉన్నా, అల్లాహ్ నీ వైపు నుండి దానిని తీర్చేస్తాడు.” ఏంటి ఆ దుఆ?

اللَّهُمَّ مَالِكَ الْمُلْكِ تُؤْتِي الْمُلْكَ مَن تَشَاءُ وَتَنزِعُ الْمُلْكَ مِمَّن تَشَاءُ وَتُعِزُّ مَن تَشَاءُ وَتُذِلُّ مَن تَشَاءُ ۖ بِيَدِكَ الْخَيْرُ ۖ إِنَّكَ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ.
رَحْمَانَ الدُّنْيَا وَالآخِرَةِ وَرَحِيمَهُمَا، تُعْطِيهِمَا مَنْ تَشَاءُ، وَتَمْنَعُ مِنْهُمَا مَنْ تَشَاءُ، ارْحَمْنِي رَحْمَةً تُغْنِينِي بِهَا عَنْ رَحْمَةِ مَنْ سِوَاكَ
[అల్లాహుమ్మ మాలికల్ ముల్కి తు’తిల్ ముల్క మన్ తషాఉ వ తన్జిఉల్ ముల్క మిమ్మన్ తషాఉ, వ తుఇజ్జు మన్ తషాఉ వ తుజిల్లు మన్ తషాఉ, బియదికల్ ఖైర్, ఇన్నక అలా కుల్లి షైఇన్ కదీర్. రహ్మానద్ దున్యా వల్ ఆఖిరతి వ రహీమహుమా, తు’తీహిమా మన్ తషాఉ, వ తమ్నఉ మిన్హుమా మన్ తషాఉ, ఇర్హమ్నీ రహ్మతన్ తుగ్నినీ బిహా అన్ రహ్మతి మన్ సివాక్]

“ఓ అల్లాహ్! సర్వసామ్రాజ్యాలకు అధిపతి! నువ్వు కోరిన వారికి సామ్రాజ్యాన్ని ప్రసాదిస్తావు. నువ్వు కోరిన వారి నుండి సామ్రాజ్యాన్ని లాగేసుకుంటావు. నువ్వు కోరిన వారికి గౌరవాన్ని ప్రసాదిస్తావు. నువ్వు కోరిన వారిని అవమానపరుస్తావు. మేలంతా నీ చేతిలోనే ఉంది. నిశ్చయంగా నువ్వు ప్రతి దానిపై శక్తిమంతుడవు.” (3:26). ఓ ఇహపరలోకాల కరుణామయుడా మరియు దయామయుడా, నువ్వు కోరినవారికి వాటిని ప్రసాదిస్తావు, నువ్వు కోరిన వారికి వాటిని నిరోధిస్తావు. నన్ను నీ నుండి లభించే కారుణ్యంతో కరుణించు, అది నీవు తప్ప ఇతరుల కరుణ అవసరం లేకుండా చేస్తుంది.

కొంచెం పొడుగ్గా ఏర్పడుతుంది, కానీ భయపడకండి. చూసి, రాసుకొని, మాటిమాటికి విని కంఠస్థం చేసుకొని దుఆ చేసే అవసరం లేదు. వింటూ వింటూ మీరు స్వయంగా పలుకుతూ ఉండండి లేదా ఒక కాగితంలో రాసుకొని చూసి చదువుతూ ఉండండి. మరోసారి విని దీన్ని మీరు గుర్తుంచుకోండి:

اللَّهُمَّ مَالِكَ الْمُلْكِ تُؤْتِي الْمُلْكَ مَن تَشَاءُ وَتَنزِعُ الْمُلْكَ مِمَّن تَشَاءُ وَتُعِزُّ مَن تَشَاءُ وَتُذِلُّ مَن تَشَاءُ ۖ بِيَدِكَ الْخَيْرُ ۖ إِنَّكَ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ.
رَحْمَانَ الدُّنْيَا وَالآخِرَةِ وَرَحِيمَهُمَا، تُعْطِيهِمَا مَنْ تَشَاءُ، وَتَمْنَعُ مِنْهُمَا مَنْ تَشَاءُ، ارْحَمْنِي رَحْمَةً تُغْنِينِي بِهَا عَنْ رَحْمَةِ مَنْ سِوَاكَ

ఇప్పుడు ఈ దుఆ ఏదైతే నేను రెండుసార్లు చదివానో, వాస్తవానికి సూరత్ ఆలి ఇమ్రాన్, సూర నంబర్ 3, ఆయత్ నంబర్ 26 ఏదైతే ఉందో, ఆ 26వ ఆయత్ యొక్క భాగం ఉంది మరియు చివరిలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నేర్పినటువంటి దుఆ కూడా ఉంది. అయితే తఫ్సీర్ అహ్సనుల్ బయాన్ మీరు విప్పి చూశారంటే, అల్లాహ్ దయతో అక్కడ ఈ దుఆ, దీని యొక్క వివరణ కూడా, దీని యొక్క అనువాదం కూడా చూడవచ్చు. అల్లాహ్ మనందరి ఇబ్బందులను, ఆపదలను దూరం చేయుగాక.


హదీత్ అంటే ఏమిటి? హదీత్ ఖుద్సీ అని దేన్ని అంటారు? [ఆడియో & టెక్స్ట్]

బిస్మిల్లాహ్

హదీత్ అంటే ఏమిటి? హదీత్ ఖుద్సీ అని దేన్ని అంటారు?
https://youtu.be/pTJRtR-ca8c [11:20 నిముషాలు ]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ఉపన్యాసం హదీథ్ మరియు దాని రకాల గురించి వివరిస్తుంది. హదీథ్ అంటే ఏమిటి మరియు హదీథ్-ఎ-ఖుద్సీకి మరియు హదీథ్-ఎ-నబవికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఇది స్పష్టం చేస్తుంది. హదీథ్-ఎ-నబవి మూడు రకాలుగా విభజించబడింది: ప్రవక్త యొక్క మాటలను సూచించే ‘ఖౌలీ’, ఆయన చర్యలను వివరించే ‘ఫిలీ’, మరియు ఆయన ఆమోదాన్ని సూచించే ‘తఖ్రీరీ’. ఉపన్యాసంలో ప్రతి రకానికి ఖురాన్ మరియు హదీథ్ నుండి ఉదాహరణలతో సహా వివరణ ఇవ్వబడింది. సున్నత్ అనే పదాన్ని హదీథ్ కు పర్యాయపదంగా ఎలా ఉపయోగిస్తారో కూడా చర్చించబడింది, ఇందులో ప్రవక్త యొక్క శారీరక స్వరూపం మరియు సత్ప్రవర్తన కూడా ఉంటాయి. చివరగా, హదీథ్-ఎ-ఖుద్సీ అనేది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా చెప్పబడిన అల్లాహ్ యొక్క మాటలు అని స్పష్టం చేయబడింది.

అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు. అల్ హందులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్ అమ్మా బాద్.

హదీథ్ అంటే ఏమిటి? హదీథ్-ఎ-ఖుద్సీ దేనిని అంటారు? దీనిని మనం కొన్ని ఉదాహరణలతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము.

హదీథ్ రెండు రకాలు. ఒకటి అల్ హదీథున్ నబవి అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీథ్. అల్ హదీథుల్ ఖుద్సీ అంటే, అల్లాహ్ చెబుతున్నాడు, అల్లాహ్ తెలిపాడు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన హదీథ్.

అల్ హదీథున్ నబవి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీథ్ అని ఎప్పుడైతే మనం అంటామో అది మూడు రకాలుగా ఉంటుంది.

  • అల్ ఖౌలీ (ప్రవచనం),
  • అల్ ఫిలీ (క్రియ, ఆచరణ),
  • తఖ్రీరీ (అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ముందు ఎవరైనా ఏదైనా మాట్లాడారు లేదా ఏమైనా చేశారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దానిని అంగీకరించారు లేదా దానిలో ఏదైనా సరిదిద్దుబాటు ఉండేది ఉంటే దానిని సరిచేశారు, సంస్కరించారు).

ఇక అల్ హదీథున్ నబవి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీథ్ లో ఈ మూడు రకాలు అని ఏదైతే మనం తెలుసుకున్నామో, ప్రతి ఒక్క దానికి ఒక దలీల్ ఉదాహరణగా మనం తెలుసుకుందాము.

మొదటిది ప్రవచనం, అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మాట, ఆయన ప్రవచనం, ఆయన చెప్పారు అని ఏదైతే వస్తుందో.

ఉదాహరణకు, సహీహ్ బుఖారీలో హదీథ్ నంబర్ 38, సహీహ్ ముస్లింలో హదీథ్ నంబర్ 760, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారని హజ్రత్ అబూ హురైరా రదియల్లాహు త’ఆలా అన్హు ఉల్లేఖించారు.

مَنْ صَامَ رَمَضَانَ إِيمَانًا وَاحْتِسَابًا غُفِرَ لَهُ مَا تَقَدَّمَ مِنْ ذَنْبِهِ
“ఎవరైతే విశ్వాసం మరియు పుణ్య ఫలాపేక్షతో రమదాన్ మాసమంతా ఉపవాసం ఉంటారో, వారి గత పాపాలన్నీ కూడా మన్నించబడతాయి.”

ఇక అల్ ఫిలీ, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏదైనా ఆచరించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క క్రియ గురించి సహాబీ చెబుతున్నాడు, ప్రవక్త ఇలా చేశారు అని.

దీని ఉదాహరణ, దీనికి దలీల్ సహీహ్ ముస్లిం, హదీథ్ నంబర్ 226, సహీహ్ ముస్లింలోని పదాలు తీసుకోవడం జరిగింది అందు గురించి దీని ఆధారం ముందు చెప్పడం జరుగుతుంది. ఈ భావం సహీహ్ బుఖారీలో కూడా వచ్చి ఉంది, హదీథ్ నంబర్ 196. ఉస్మాన్ ఇబ్నె అఫ్ఫాన్ రదియల్లాహు త’ఆలా అన్హు వుదూ కొరకు నీళ్ళు తెప్పించారని ఆయన బానిస హుమ్రాన్ చెప్పారు. ఆ తర్వాత ఉస్మాన్ రదియల్లాహు త’ఆలా అన్హు తమ రెండు అరచేతులను మూడుసార్లు కడిగారు మరియు పుక్కిలించారు, ముక్కులో నీళ్ళు ఎక్కించారు మరియు మూడు సార్లు ముఖం కడిగారు. మళ్ళీ మూడుసార్లు మోచేతుల వరకు కుడి చెయ్యి, ఆ తర్వాత మళ్ళీ ఎడమ చెయ్యి కడిగారు. మళ్ళీ తల యొక్క మసహ్ చేశారు. ఆ తర్వాత, రెండు కాళ్ళు ముందు కుడి కాలు, ఆ తర్వాత ఎడమ కాలు మూడుసార్లు కడిగారు చీలమండలాల వరకు. మళ్ళీ ఉస్మాన్ రదియల్లాహు త’ఆలా అన్హు చెప్పారు:

رَأَيْتُ رَسُولَ اللَّهِ صلى الله عليه وسلم تَوَضَّأَ نَحْوَ وُضُوئِي هَذَا
[ర’అయ్తు రసూలల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లమ తవద్ద్’అ నహ్వ వుదూ’ఈ హాదా]
“ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నేను ఎట్లా వుదూ చేశానో, అదే విధంగా వుదూ చేశారు.”

ప్రవక్త చేసిన ఒక పని గురించి ఉస్మాన్ ఇబ్నె అఫ్ఫాన్ తెలియజేశారు. ఇది హదీథ్-ఎ-ఫిలీ యొక్క ఉదాహరణ అయింది.

ఇక హదీథ్-ఎ-తఖ్రీరీ, దీని ఉదాహరణ అబూ దావూద్ లో వచ్చి ఉంది, హదీథ్ నంబర్ 334. అమ్ర్ ఇబ్నుల్ ఆస్ రదియల్లాహు త’ఆలా అన్హు చెప్పారు, విపరీతమైన చలి రాత్రి నాకు స్వప్నస్కలనం జరిగింది. అప్పుడు మేము దాతుస్సలాసిల్ అనే యుద్ధంలో ఉన్నాము. అయితే ఒకవేళ నేను స్నానం చేశానంటే ఈ చలిలో నన్ను నేను చంపుకున్నట్టు అవుతుంది, ఆత్మహత్య చేసుకున్నట్టు అవుతుంది. అందుకొరకు నేను తయమ్ముమ్ చేసి ఫజర్ నమాజ్ సహాబాలందరికీ చేయించాను, ఆ యుద్ధంలో ఎవరైతే ఆయన వెంట ఆ సందర్భంలో ఉన్నారో. అయితే మదీనా తిరిగి వచ్చిన తర్వాత సహాబాలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అమ్ర్ ఇబ్నుల్ ఆస్ రదియల్లాహు త’ఆలా అన్హు వారి యొక్క ఈ సంఘటన తెలియజేశారు.

అప్పుడు ప్రవక్త నన్ను మందలిస్తూ, “యా అమ్ర్, సల్లయ్ తబి అస్ హాబిక వ అంత జునుబ్?” (ఓ అమ్ర్, నీవు అశుద్ధ స్థితిలో ఉండి నీ మిత్రులకు, తోటి సహాబాలకు నమాజ్ చేయించావా?). “ఫ అఖ్ బర్ తుహూ బిల్ లదీ మన’అనీ మినల్ ఇగ్ తిసాల్” (స్నానం చేయడం నుండి నన్ను ఆపిన విషయం ఏమిటో, అంటే ఏ కారణం చేత నేను స్నానం చేయలేదో, పైన ఏదైతే మనం తెలుసుకున్నాము కదా, విపరీతమైన చలి ఉంది, ఆ చలిలో నేను స్నానం చేస్తే చనిపోతానన్నటువంటి భయం జరిగింది నాకు).

అయితే ఆ విషయాన్ని మొత్తం నేను ప్రవక్తకు వివరించాను. అంతేకాకుండా ఇంకా నేను చెప్పాను, ప్రవక్తా, నేను అల్లాహ్ యొక్క ఈ మాటను విన్నాను, అల్లాహ్ యొక్క ఈ ఆదేశం సూరతున్నిసా, ఆయత్ నంబర్ 29 లో:

وَلَا تَقْتُلُوا أَنفُسَكُمْ ۚ إِنَّ اللَّهَ كَانَ بِكُمْ رَحِيمًا
[వలా తఖ్ తులూ అన్ఫుసకుమ్, ఇన్నల్లాహ కాన బకుమ్ రహీమా]
“మిమ్మల్ని మీరు చంపుకోకండి. నిశ్చయంగా అల్లాహ్ మీపై చాలా కరుణించేవాడు.” (4:29)

అందుకొరకే, స్నానం చేస్తే చనిపోతానన్నటువంటి భయం కలిగింది గనక నేను స్నానం చేయలేదు మరియు తయమ్ముమ్ చేసి నమాజ్ చేయించాను. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నవ్వారు, ఏమీ అనలేదు. అయితే ఇక్కడ ఏం తెలిసింది? సహాబీ ఒక పని ఏదైతే చేశారో, అది బాగానే ఉంది అన్నట్లుగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంగీకరించారు. అందుకొరకే దీనిని హదీథ్-ఎ-తఖ్రీరీ అని అనడం జరిగింది.

ఇక హదీథ్ ను సున్నత్ అని కూడా అనడం జరుగుతుంది. అలాంటి సందర్భంలో ఇందులో మరో నాలుగో రకం కూడా చేరుతుంది. అదేమిటి? ప్రవక్త మహానీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఆకృతి, ఆయన ఎలా ఉన్నారు అన్న విషయం, అంతేకాకుండా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సత్ప్రవర్తనలు కూడా ఇందులో ప్రస్తావించబడతాయి.

ఉదాహరణకు సహీహ్ ఇబ్నె హిబ్బాన్, హదీథ్ నంబర్ 5676, ముస్నద్ అహ్మద్ 24903 లో ఉంది, ఆయిషా రదియల్లాహు త’ఆలా అన్హా వారిని ప్రశ్నించడం జరిగింది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంట్లో ఏమి చేస్తారు అని. అప్పుడు ఆమె చెప్పారు:

كَانَ يَخِيطُ ثَوْبَهُ، وَيَخْصِفُ نَعْلَهُ، وَيَعْمَلُ مَا يَعْمَلُ الرِّجَالُ فِي بُيُوتِهِمْ
“ప్రవక్త తమ దుస్తుల్లో ఎక్కడైనా ఏదైనా చినిగి ఉంటే అతుకు వేసుకునేవారు మరియు అలాగే చెప్పులు ఏదైనా కుట్టుకునే అవసరం వస్తే కుట్టుకునేవారు. ఇంకా సామాన్యంగా పురుషులు ఇంట్లో ఎలాగైతే పనులు చేసుకుంటారో, అలా చేసుకునేవారు.”

ఇక్కడి వరకు ప్రవక్త మహానీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీథ్, హదీథ్-ఎ-నబవి అని ఏదైతే అంటారో అందులో ఉన్నటువంటి నాలుగు రకాలు ఆధారాలతో సహా మనం తెలుసుకున్నాము. ఇక హదీథ్ రెండు రకాలు అని ముందు చెప్పాము కదా? ఒకటి హదీథ్-ఎ-నబవి, దాంట్లో నాలుగు రకాలు దాని వివరణ అయిపోయింది. రెండవది అల్ హదీథుల్ ఖుద్సీ. అల్ హదీథుల్ ఖుద్సీ అంటే అల్లాహ్ ఏదైనా మాట చెబుతున్నట్లుగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేయడం, ఉల్లేఖించడం. దీని యొక్క ఉదాహరణ సహీహ్ బుఖారీ, హదీథ్ నంబర్ 7405, సహీహ్ ముస్లిం 2675, అబూ హురైరా రదియల్లాహు త’ఆలా అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు:

يَقُولُ اللَّهُ تَعَالَى: أَنَا عِنْدَ ظَنِّ عَبْدِي بِي
[యఖూలుల్లాహు త’ఆలా: అన ఇన్ ద దన్ని అబ్ దీ బీ, వ అన మ’అహూ ఇదా కరనీ]
“అల్లాహు త’ఆలా ఇలా చెబుతున్నాడు: నేను నా దాసుని ఆలోచన, అతడు నా గురించి ఎలాంటి మంచి ఆశ ఉంచుకుంటాడో అదే విధంగా నేను అతనితో మసలుకుంటాను. మరియు అతడు ఒకవేళ నన్ను స్మరించాడంటే, నేను అతనికి తోడుగా ఉంటాను.”

ఇంకా హదీథ్ కొంచెం పొడుగ్గా ఉంది చివరి వరకు. అయితే ఇక్కడ ఈ హదీథ్ లో ఏమన్నారు ప్రవక్త గారు? అల్లాహ్ చెబుతున్నాడు అని. అయితే ఈ విధంగా హదీథ్ లో ఎక్కడైతే వస్తుందో, అక్కడ దానిని అల్ హదీథుల్ ఖుద్సీ అనడం జరుగుతుంది.

బహుశా హదీథ్ అంటే ఏమిటో కొంచెం అర్థమైంది అని భావిస్తున్నాను. అల్లాహ్ మనందరికీ ఖురాన్ హదీథ్ ప్రకారంగా ధర్మ విద్య నేర్చుకునే సద్భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్. వ ఆఖిరు ద’అవానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=9349

ఇతరములు:

ప్రశ్న: భర్త నమాజు చదవడం లేదు. తావీజు ధరిస్తున్నాడు. షిర్క్ చేస్తున్నాడు. ఇటువంటి సమయంలో విశ్వాసురాలైన భార్య ఏం చేయాలి! [ఆడియో]

బిస్మిల్లాహ్

ప్రశ్న- భర్త నమాజు చదవడం లేదు. తావీజు ధరిస్తున్నాడు. షిర్క్ చేస్తున్నాడు. ఇటువంటి సమయంలో విశ్వాసురాలైన భార్య ఏం చేయాలి!

ఇక్కడ వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి [7:00 నిముషాలు ]

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

తెలుగు ఇస్లామిక్ క్విజ్ : పార్ట్ 16 [ఆడియో]

బిస్మిల్లాహ్

Telugu Islamic Quiz (తెలుగు ఇస్లామిక్ క్విజ్) – పార్ట్ 16
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

ప్రశ్నల పత్రం – 16

1) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారిపై ఒక సారి దరూద్ పఠిస్తే కలిగే లాభాలు ఏమిటి?

A) ‘అల్లాహ్’ 10 కారుణ్యాలు కురిపిస్తాడు
B) 10 పాపాలు మన్నిస్తాడు
C) 10 గౌరవ స్థానాలను పెంచుతాడు
D) పైవన్నీ లభిస్తాయి

2) ఏ సురాహ్ ఒకసారి చదివితే ఖుర్ఆన్ 1/3 భాగం తో సమానం?

A) సురాహ్ ఫాతిహా
B) సురాహ్ యాసీన్
C) సురాహ్ ఇఖ్లాస్
D) సురాహ్ రహ్మాన్

3) ప్రళయదినాన తీర్పు కోసం మనం నిలబడవలసిన మైదానం పేరేమిటి?

A) కర్బలా మైదానం
B) హషర్ మైదానం
C) ఉహాద్ మైదానం
D) జన్నతుల్ బఖి మైదానం

క్విజ్ 16. సమాధానాలు, విశ్లేషణ ఇక్కడ వినండి /డౌన్లోడ్ చేసుకోండి [వ్యవధి 12:00]


ఇతరములు 

తెలుగు ఇస్లామిక్ క్విజ్ (ఆడియో సిరీస్) మెయిన్ పేజీ :
https://teluguislam.net/others/telugu-islamic-quiz

తెలుగు ఇస్లామిక్ క్విజ్ : పార్ట్ 15 [ఆడియో]

బిస్మిల్లాహ్

Telugu Islamic Quiz (తెలుగు ఇస్లామిక్ క్విజ్) – పార్ట్ 15
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

ప్రశ్నల పత్రం – 15

1) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారి తొలి కాలంలో ఖిబ్లా దిశ ఎటు వైపు ఉండేది?

A) మస్జిద్ ఏ నబవి (మదీనా)
B) మస్జిదుల్ అక్స (పాలస్తీనా)
C) మస్జిదుల్ హరామ్ (మక్కా)

2) ఖుర్ఆన్ లో ఉన్న ప్రవక్తల నుండి ఒక ప్రవక్త అతని తండ్రి – తాత – ముత్తాత కూడా ప్రవక్తలే .. అతను ఎవరు?

A) హజ్రత్ ఉజైర్(అలైహిస్సలాం)
B) హజ్రత్ యూసుఫ్ (అలైహిస్సలాం)
C) హజ్రత్ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం )

3) “అల్హందులిల్లాహ్” అనే పవిత్ర జిక్ర్ దేనిని నింపేస్తుంది?

A) త్రాసును (మీజాన్)
B) హృదయాన్ని
C) ఇంటిని నింపేస్తుంది

క్విజ్ 15. సమాధానాలు, విశ్లేషణ ఇక్కడ వినండి /డౌన్లోడ్ చేసుకోండి [వ్యవధి 12:00]


ఇతరములు 

తెలుగు ఇస్లామిక్ క్విజ్ (ఆడియో సిరీస్) మెయిన్ పేజీ :
https://teluguislam.net/others/telugu-islamic-quiz

తెలుగు ఇస్లామిక్ క్విజ్ : పార్ట్ 14 [ఆడియో]

బిస్మిల్లాహ్

Telugu Islamic Quiz (తెలుగు ఇస్లామిక్ క్విజ్) – పార్ట్ 14
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

ప్రశ్నల పత్రం – 14

1) నరకం యొక్క అట్టడుగుభాగం ఎవరి నివాసం?

A) కాఫిర్లు(అవిశ్వాసులు)
B) మునాఫిక్ లు (కపట విశ్వాసులు)
C) ముష్రిక్ లు(బహు దైవారాధకులు)

2) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారి యొక్క ఏ సహచరుని పేరు ఖుర్ఆన్ లో వచ్చింది?

A) ఉమర్ బిన్ ఖత్తాబ్ (రజియల్లాహు అన్హు)
B) అలీ బిన్ అబీ తాలిబ్ (రజియల్లాహు అన్హు)
C) జైద్ బిన్ హారిస్ (రజియల్లాహు అన్హు)

3) స్వర్గంలో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారికి అల్లాహ్ (సుబహానహు వ తఆలా) ప్రసాదించే సెలయేరు ఏది?

A) జమ్ జమ్
B) కౌసర్ సెలయేరు
C) సల్ సబీల్ సెలయేరు

క్విజ్ 14. సమాధానాలు, విశ్లేషణ ఇక్కడ వినండి /డౌన్లోడ్ చేసుకోండి [వ్యవధి 16:56]


ఇతరములు 

తెలుగు ఇస్లామిక్ క్విజ్ (ఆడియో సిరీస్) మెయిన్ పేజీ :
https://teluguislam.net/others/telugu-islamic-quiz

తెలుగు ఇస్లామిక్ క్విజ్ : పార్ట్ 13 [ఆడియో]

బిస్మిల్లాహ్

Telugu Islamic Quiz (తెలుగు ఇస్లామిక్ క్విజ్) – పార్ట్ 13
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

ప్రశ్నల పత్రం – 13

1) “నీవు నిలబడి ఉన్నప్పుడు ఆయన నిన్ను చూస్తూనే ఉంటాడు, సాష్టాంగ (సజ్దా) చేసే వారి మధ్య నీ కదలికలను కనిపెట్టుకుని ఉంటాడు” (ఖుర్ఆన్ 26:218-219). ఈ ఆయాత్ ఇస్లాంలోని ఏ స్థాయిని సూచిస్తుంది ?

A) మోమిన్
B) ఇహ్సాన్
C) ముస్లిం

2) ఎవరైనా అల్లాహ్ కొరకు తప్ప ఇతరుల కొరకు (ఖుర్భానీ) బలిదానం ఇస్తే ఏమి కలుగుతుంది ?

A) శాపం
B) షిర్క్
C) సిఫారసు

3) “సుబహానల్లాహి వబిహందిహి” జిక్ర్ 100 సార్లు చదివితే లాభం ఏమిటి?

A) హజ్ చేసినంత పుణ్యం
B) ఉమ్రా చేసినంత పుణ్యం
C) సముద్రపు నురుగంత పాపాలు కూడా క్షమించబడతాయి

క్విజ్ 13. సమాధానాలు, విశ్లేషణ ఇక్కడ వినండి /డౌన్లోడ్ చేసుకోండి [వ్యవధి 11:58]


ఇతరములు 

తెలుగు ఇస్లామిక్ క్విజ్ (ఆడియో సిరీస్) మెయిన్ పేజీ :
https://teluguislam.net/others/telugu-islamic-quiz

తెలుగు ఇస్లామిక్ క్విజ్ : పార్ట్ 12 [ఆడియో]

బిస్మిల్లాహ్

Telugu Islamic Quiz (తెలుగు ఇస్లామిక్ క్విజ్) – పార్ట్ 12
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

ప్రశ్నల పత్రం-12

1) ప్రతీ ప్రవక్త తమ జాతికి ఇచ్చిన ప్రధాన సందేశం ఏమిటి?

A) మద్యానికి, జూదానికి దూరంగా ఉండండి
B) వ్యభిచారం దరిదాపులకు పోకండి
C) అల్లాహ్ నే ఆరాధించండి మిథ్యాదైవాలకు దూరంగా ఉండండి

2) వీరిలో “ఖులఫా యే రాషిదీన్” (ప్రవక్త తర్వాత ఖలిఫాలు) ఎవరు ?

A) బిలాల్ (రజియల్లాహు అన్హు) – జుబేర్ (రజియల్లాహు అన్హు)
B) అబూబకర్ (రజియల్లాహు అన్హు) – ఉమర్ (రజియల్లాహు అన్హు) – ఉస్మాన్ (రజియల్లాహు అన్హు) – అలీ (రజియల్లాహు అన్హు)
C) హంజా (రజియల్లాహు అన్హు) –  అబూహురైరా (రజియల్లాహు అన్హు) –  ఇబ్నె మస్ఊద్  (రజియల్లాహు అన్హు)

3 ) నిఖా, జుమా మరియు పండుగల యొక్క మస్నూన్  ఖుత్బా లలో ప్రముఖంగా పఠించబడే మూడు ఖుర్ఆన్ అయతులలో ఉన్న  సమాంతర విషయం ఏమిటి?

A) నమాజ్
B) ఆఖిరత్
C) దైవభీతి (తఖ్వా)

క్విజ్ 12. సమాధానాలు, విశ్లేషణ ఇక్కడ వినండి/డౌన్లోడ్ చేసుకోండి [వ్యవధి 11:52]


ఇతరములు 

తెలుగు ఇస్లామిక్ క్విజ్ (ఆడియో సిరీస్) మెయిన్ పేజీ :
https://teluguislam.net/others/telugu-islamic-quiz

తెలుగు ఇస్లామిక్ క్విజ్ : పార్ట్ 11 [ఆడియో]

బిస్మిల్లాహ్

Telugu Islamic Quiz (తెలుగు ఇస్లామిక్ క్విజ్) – పార్ట్ 11
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

ప్రశ్నల పత్రం-11

1) ఇస్లాం ధర్మంలో స్థాయిలు ఎన్ని? అవి ఏవి?

A) అవి 1 – లా ఇలాహ ఇల్లల్లాహ్
B) అవి 3 – ఇస్లాం – ఈమాన్ -ఇహ్ సాన్
C) అవి 2  – ఇస్లాం – ఈమాన్

2) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారిని ఎవరికంటే  కూడా ఎక్కువగా ప్రేమించాలి?

A) భార్య బిడ్డలు కంటే ఎక్కువుగా
B) తల్లిదండ్రుల భార్య బిడ్డల సకల మానవుల మరియు సొంత ప్రాణం కంటే కూడా ఎక్కువుగా
C) ఇమామ్ ల అందరికంటే ఎక్కువుగా

3) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారి  ఉమ్మత్ (సమాజం) లో తొలి షహీద్ (అమరగతి) పొందినది ఎవరు?

A) ఉస్మాన్ (రజి అల్లాహు అన్హు)
B) ఉమర్ (రజి అల్లాహు అన్హు)
C) సుమయ్య  (రజి అల్లాహు అన్హ)

క్విజ్ 11. సమాధానాలు ఇక్కడ వినండి /డౌన్లోడ్ చేసుకోండి [వ్యవధి 9:46]


ఇతరములు 

తెలుగు ఇస్లామిక్ క్విజ్ (ఆడియో సిరీస్) మెయిన్ పేజీ :
https://teluguislam.net/others/telugu-islamic-quiz

తెలుగు ఇస్లామిక్ క్విజ్ : పార్ట్ 10 [ఆడియో]

బిస్మిల్లాహ్

Telugu Islamic Quiz (తెలుగు ఇస్లామిక్ క్విజ్) – పార్ట్ 10
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

ప్రశ్నల పత్రం -10

1) సమాధిలో అడిగే 3 ప్రశ్నలు ఏమిటి?

A) నీ పేరు ఏమిటి ? / నీ వంశం ఏమిటి ? /  నీ మతం ఏమిటి  ?
B) నీ నమాజు ఏది? / నీ ఉపవాసం ఏది ? / నీ జకాత్ ఏది ?
C) నీ ప్రభువు ఎవరు ? /నీ ధర్మం ఏమిటి ? / నీ ప్రవక్త ఎవరు ?

2) జిన్నాతులు దేనితో సృష్టించబడ్డాయి ?

A) మట్టితో
B) అగ్ని జ్వాలలతో
C) గాలితో

3) పుట్టే ప్రతీ శిశువు ఏ విశ్వాసంతో  పుడుతుంది?

A) ఏక దైవారాధనా  విశ్వాసం
B) తల్లిదండ్రుల యొక్క విశ్వాసం
C) బహు దైవారాధన యొక్క విశ్వాసం

క్విజ్ 10. సమాధానాలు ఇక్కడ వినండి /డౌన్లోడ్ చేసుకోండి [వ్యవధి 9:40]


ఇతరములు 

తెలుగు ఇస్లామిక్ క్విజ్ (ఆడియో సిరీస్) మెయిన్ పేజీ :
https://teluguislam.net/others/telugu-islamic-quiz