1.6 బహిష్టు ప్రకరణం | మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు

మహా ప్రవక్త మహితోక్తులు (అల్-లూలు వల్ మర్జాన్) (Al-Lulu-wal-Marjaan) .  
బహిస్టు ప్రకరణం [PDF]

168 – حديث عَائِشَةَ، قَالَتْ: كَانَتْ إِحْدَانَا إِذَا كَانَتْ حَائِضًا، فَأَرادَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ أَنْ يُبَاشِرَهَا، أَمَرَهَا أَنْ تَتَّزِرَ فِي فَوْرِ حَيْضَتِهَا، ثُمَّ يُبَاشِرُهَا قَالَتْ: وَأَيُّكُمْ يَمْلِك إِرْبَهُ كَمَا كَانَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يَمْلِكُ إِرْبَهُ
__________
أخرجه البخاري في: 6 كتاب الحيض: 5 باب مباشرة الحائض

168. విశ్వాసుల మాతృమూర్తి హజ్రత్ అయిషా (రదియల్లాహు అన్హా) కథనం:- “మాలో ఎవరైనా బహిష్టు అయినప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆమె దేహానికి దేహం ఆనించ దలచుకుంటే, ఆమెను (లంగోటి లాంటి) లోఉడుపును కట్టుకోమని ఆదేశించేవారు. ఆ తరువాత ఆమె దేహానికి దేహం ఆనించేవారు… లైంగికవాంఛపై దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కున్న ఇంతటి నిగ్రహశక్తి మీలో ఎవరికైనా ఉందా?” అని హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) అన్నారు.

[సహీహ్ బుఖారీ : 6వ ప్రకరణం – హైజ్, 5వ అధ్యాయం – ముబాషిరతిల్ హాయిజ్]

169 – حديث مَيْمُونَةَ، قَالَتْ: كَانَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ إِذَا أَرَادَ أَنْ يُبَاشِرَ امْرَأَةً مِنْ نِسَائِهِ، أَمَرَهَا فَاتَّزَرَتْ وَهِيَ حَائِضٌ
__________
أخرجه البخاري في: 6 كتاب الحيض: 5 باب مباشرة الحائض

169. విశ్వాసుల మాతృమూర్తి హజ్రత్ మైమూన (రదియల్లాహు అన్హా) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తన భార్యలలో ఎవరితోనైనా దేహానికి దేహం ఆనించ దలచుకున్నప్పుడు, * ఆమె బహిష్టు అయి ఉంటే, (లంగోటిలాంటి) లో ఉడుపు కట్టుకోమని ఆమెను ఆదేశించేవారు.

[సహీహ్ బుఖారీ : 6వ ప్రకరణం, – హైజ్, 5వ అధ్యాయం]

* ఇక్కడ మూలభాషలో ‘ముబాషిరత్‘ అనే పదం వచ్చింది. అంటే శరీరంతో శరీరం కలపడం అని అర్థం. అంతేగాని ఇక్కడ సందర్భాన్ని బట్టి లైంగిక సంపర్కం అనే భావం రాదు. ఎందుకంటే దివ్యఖుర్ఆన్ఆ “రుతుస్రావం గురించి ఆజ్ఞ ఏమిటని అడుగుతున్నారు వారు, ఆదొక అపరిశుద్ధావస్థ అనీ, ఆ స్థితిలో భార్యలకు దూరంగా ఉండాలని, వారు (స్నానం చేసి) పరిశుభ్రం కానంత వరకు వారి దగ్గరకు వెళ్ళకూడదని చెప్పెయ్యి” అని ఉంది. (2:222)

లైలతుల్ ఖద్ర్ ఘనతకు సంబందించిన సహీ బుఖారి లో వచ్చిన హదీసుల యొక్క అనువాదం & వివరణ [వీడియో]

లైలతుల్ ఖద్ర్ ఘనతకు సంబందించిన సహీ బుఖారి లో వచ్చిన హదీసుల యొక్క అనువాదం & వివరణ
https://youtu.be/aAqiOFQV6_4 [53 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

మా యూట్యూబ్ ఛానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి ఇన్ షా అల్లాహ్:
http://www.youtube.com/user/teluguislam?sub_confirmation=1

దైవప్రవక్త (ﷺ) వారు అల్లాహ్ ను చూసారా? [ఆడియో & టెక్స్ట్]

దైవప్రవక్త (ﷺ) వారు అల్లాహ్ ను చూసారా?
https://www.youtube.com/watch?v=085GXx38_nE
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్‌ను చూశారా? అనే ప్రశ్నకు ఈ ప్రసంగం సమాధానమిస్తుంది. ప్రవక్త అల్లాహ్‌ను చూడలేదని స్పష్టంగా చెప్పబడింది. ఈ వాదనను బలపరచడానికి, సహీహ్ ముస్లిం మరియు సహీహ్ బుఖారీ నుండి రెండు హదీసులు ఉదహరించబడ్డాయి. మొదటి హదీసులో, అబూ దర్ (రదియల్లాహు అన్హు) ప్రవక్తను నేరుగా అడిగినప్పుడు, “అతను కాంతి (నూర్), నేను ఎలా చూడగలను?” అని ప్రవక్త సమాధానమిచ్చారు. రెండవ హదీసులో, మస్రూక్ ఇదే ప్రశ్నను ఆయిషా (రదియల్లాహు అన్హా)ను అడిగినప్పుడు, ప్రవక్త అల్లాహ్‌ను చూశారని చెప్పేవారు అబద్ధం చెప్పినట్లేనని ఆమె తీవ్రంగా స్పందించి, ఖురాన్ ఆయత్‌ను ఉదహరించారు. అయితే, ప్రళయ దినాన స్వర్గంలో విశ్వాసులందరూ అల్లాహ్‌ను చూస్తారని కూడా వివరించబడింది.

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ ను చూశారా? సరైన సమాధానం చూడలేదు. అవును, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ ను చూడలేదు.కొందరు అనుకుంటారు మేరాజ్ పోయినప్పుడు చూశారు కదా అని. కానీ, ఇది సరైన మాట కాదు.

సహీహ్ ముస్లిం షరీఫ్ లో హదీస్ నెంబర్ 178, అబూ దర్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు.

سَأَلْتُ رَسُولَ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ، هَلْ رَأَيْتَ رَبَّكَ؟ قَالَ: نُورٌ أَنَّى أَرَاهُ
(స’అల్తు రసూలల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం, హల్ ర’అయిత రబ్బక్? ఖాల్: నూరున్ అన్నా అరాహు)

“నేను స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రశ్నించాను. ‘ప్రవక్తా, మీరు మీ ప్రభువును చూశారా?’ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ‘అతను సర్వమూ నూర్ (కాంతి). నేను ఎలా చూడగలుగుతాను?'”

అతను సర్వమూ నూర్, కాంతి, ప్రకాశం. నేను ఎలా చూడగలుగుతాను? అబూ దర్ రదియల్లాహు అన్హు స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అడిగితే ప్రవక్త ఇలా సమాధానం ఇచ్చారు.

అయితే మరొక హదీస్ చూడండి సహీహ్ బుఖారీలో వచ్చింది. హదీస్ నెంబర్ 4855. ఇంతకుముందు దీనిలోని ఒక భాగం మనం విని ఉన్నాము. అయితే ఇప్పుడు ఈ టాపిక్‌కు సంబంధించిన విషయం వినండి.

మస్రూక్ రహిమహుల్లాహ్, ఆయిషా రదియల్లాహు అన్హాతో ప్రశ్నించారు, “ఓ మాతృమూర్తి!,

هَلْ رَأَى مُحَمَّدٌ صلى الله عليه وسلم رَبَّهُ
(హల్ ర’ఆ ముహమ్మదున్ సల్లల్లాహు అలైహి వసల్లం రబ్బహు)
‘ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తమ ప్రభువుని చూశారా?'”

فَقَالَتْ لَقَدْ قَفَّ شَعْرِي مِمَّا قُلْتَ
(ఫఖాలత్ లఖద్ ఖఫ్ఫ ష’రీ మిమ్మా ఖుల్త్)
వినండి, ఆయిషా రదియల్లాహు అన్హా ఏమంటున్నారు, మస్రూక్ అంటున్నారు, ఫఖాలత్ (ఆయిషా రదియల్లాహు అన్హా చెప్పారు),

“నీవు చెప్పిన ఈ మాటతో నా రోమాలు నిక్కబొడుచుకున్నాయి.ఈ మూడు మాటల నుండి, విషయాల నుండి నువ్వు ఎక్కడున్నావు? తెలియకుండా ఇంకా ఎందుకున్నావు? ఎవరైతే నీతో చెబుతాడో, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తమ ప్రభువుని చూశారని, فَقَدْ كَذَبَ (ఫఖద్ కదబ్) “అతడు అబద్ధం పలికాడు.” అసత్యం మాట్లాడాడు.

మళ్ళీ ఆయిషా రదియల్లాహు తా’ఆలా అన్హా ఈ ఆయత్ ను పఠించారు:

لَا تُدْرِكُهُ الْأَبْصَارُ وَهُوَ يُدْرِكُ الْأَبْصَارَ وَهُوَ اللَّطِيفُ الْخَبِيرُ
(లా తుద్రికుహుల్ అబ్సారు వహువ యుద్రికుల్ అబ్సార వహువల్లతీఫుల్ ఖబీర్)

“ఎవరి చూపులు కూడా ఆయన్ని అందుకోజాలవు. ఆయన మాత్రం అందరి చూపులను అందుకోగలడు. ఆయన సూక్ష్మ దృష్టి కలవాడు, సర్వమూ తెలిసినవాడు.”

ఈ విధంగా ఈ రెండు హదీసులు మరియు ఖురాన్ ఆయత్ ద్వారా మనకు తెలిసిన బోధ ఏమిటంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మేరాజ్‌కు వెళ్ళినప్పుడు గానీ, ఈ లోకంలో జీవించి ఉన్నంత కాలం గానీ, ఎప్పుడూ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్‌ను చూడలేదు.

అయితే ప్రళయ దినాన స్వర్గంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కూడా అల్లాహ్‌ను చూస్తారు మరియు ఇన్ షా అల్లాహ్ విశ్వాసులందరూ కూడా తప్పకుండా చూస్తారు.

وُجُوهٌ يَوْمَئِذٍ نَاضِرَةٌ * إِلَى رَبِّهَا نَاظِرَةٌ
(వుజూహున్ యవ్‌మఇదిన్ నాదిరహ్, ఇలా రబ్బిహా నాదిరహ్)
“ఆ రోజు కొన్ని ముఖాలు కళకళలాడుతూ ఉంటాయి. తమ ప్రభువు వైపు చూస్తూ ఉంటాయి.”

ఇంకా వేరే ఎన్నో ఆయతులు, హదీసులు కూడా దీనికి దలీలుగా ఉన్నాయి.

జజాకుముల్లాహు ఖైరా, వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.

ఈ పోస్ట్ లింక్ : https://teluguislam.net/?p=11473

జుమా ఖుత్బా సందర్భంలో మౌనంగా ఉండుట తప్పనిసరి [ఆడియో, టెక్స్ట్]

[8 నిముషాలు]
https://youtu.be/cRqGXyIpURs
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగం శుక్రవారం ఖుత్బా (ప్రసంగం) సమయంలో నిశ్శబ్దం పాటించడం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తుంది. ఖుత్బా జరుగుతున్నప్పుడు ఇతరులను నిశ్శబ్దంగా ఉండమని చెప్పడం కూడా నిషేధించబడినదని, అలా చేయడం శుక్రవారం నమాజ్ యొక్క పుణ్యాన్ని కోల్పోయేలా చేస్తుందని హదీసుల ద్వారా స్పష్టం చేయబడింది. శుక్రవారం నాడు త్వరగా వచ్చి, స్నానం చేసి, నఫిల్ నమాజ్ చేసి, మౌనంగా ఖుత్బా విన్నవారికి పది రోజుల పాపాలు క్షమించబడతాయని చెప్పబడింది. ఖుత్బా వినడం అనేది అజాన్‌కు సమాధానం ఇవ్వడం కంటే ముఖ్యమైనదని, ఆలస్యంగా వచ్చినవారు కూడా సంక్షిప్తంగా రెండు రకాతుల నమాజ్ చేసి ఖుత్బా వినడంలో నిమగ్నం కావాలని ఈ ప్రసంగం బోధిస్తుంది.

السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله والصلاة والسلام على رسول الله، أما بعد.
(అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు. అల్హందులిల్లాహ్, వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్, అమ్మా బాద్.)
(అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు మీపై వర్షించుగాక. సర్వస్తోత్రాలు అల్లాహ్‌కే శోభాయమానం. అల్లాహ్ యొక్క ప్రవక్తపై శాంతి మరియు శుభాలు కలుగుగాక.)

باب الإنصات للخطبة يوم الجمعة
(బాబుల్ ఇన్సాతి లిల్ ఖుత్బతి యౌమల్ జుమా)
(శుక్రవారం రోజు ఖుత్బాకు మౌనంగా వినడం అనే అధ్యాయం.)

జుమా రోజు ఖుత్బా జరుగుతున్న సమయంలో మౌనం వహించడం, గమ్మున ఉండడం.

عن أبي هريرة رضي الله عنه أن رسول الله صلى الله عليه وسلم قال: إذا قلت لصاحبك يوم الجمعة أنصت والإمام يخطب، فقد لغوت
(అన్ అబీ హురైరత రదియల్లాహు అన్హు అన్న రసూలల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లమ ఖాల్: ఇదా ఖుల్త లిసాహిబిక యౌమల్ జుముఅతి అన్‌సిత్ వల్ ఇమాము యఖ్తుబు, ఫఖద్ లగౌత)

అబూ హురైరా రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు: “జుమా రోజు ఇమామ్ ఖుత్బా ఇస్తున్న సందర్భంలో నీవు నీ పక్కన ఉన్న సోదరునితో ‘మౌనం వహించు’ అని అంటే, నీవు ఒక లగ్వ్ (వ్యర్థమైన) పని చేసినవానివి అవుతావు.”

ఈ హదీస్ ద్వారా మనకు బోధపడే విషయాలు ఎన్నో ఉన్నాయి. ఒకటి, ఇమామ్ ఖుత్బా ఇస్తున్న సందర్భంలో, జుమా రోజు, మనం సైలెంట్‌గా ఉండాలి, మౌనం వహించాలి. ఏ కార్యకలాపాలు చేయకూడదు, ఏ మాట మాట్లాడకూడదు.

రెండో బోధ మనకిందులో, మన పక్కన ఎవరినైనా మనం చూస్తున్నాము, కొందరు మాట్లాడుకుంటున్నారు, ఏదైనా వృధా కార్యకలాపాల్లో ఉన్నారు, వారికి కూడా మనం చెప్పకూడదు. “అరే ఇలా చేయకు,” “ఓ బాయ్, ఖామోష్ రహో,” “మౌనం వహించు,” “ప్లీజ్ సైలెంట్‌గా ఉండు” అని మనం చెప్పకూడదు. ఇది ఇమామ్ యొక్క బాధ్యత, ఇమామ్ చెప్పాలి.

ఇక అతి ముఖ్యమైన విషయం ఇందులో మనకు తెలిసింది మరొకటి ఏమిటంటే, ఒకవేళ మనం ఇమామ్ ఖుత్బా ఇస్తున్న సందర్భంలో వేరే ఎవరితోనైనా, “మీరు గమ్మున ఉండండి,” “మాట్లాడకండి,” “ప్లీజ్ సైలెంట్” అని మనం చెప్పామంటే, మనం లగ్వ్ చేసిన వాళ్ళం అయ్యాము అని ఇక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు హెచ్చరించారు.

లగ్వ్ అంటే ఇక్కడ ఏంటి? లగ్వ్ అంటే ఇక్కడ పనికిమాలిన, వృధా మాట. అయితే, చూడటానికి ఇక్కడ గమనించండి, గమనించండి, చూడటానికి మనం ఒక మంచి పని చేశామని అనిపిస్తుంది కదా? ఒక ఇద్దరు మాట్లాడుకుంటే, “ష్, సైలెంట్ ప్లీజ్” ఈ విధంగా మెల్లగా చెప్పేశాము. మనం ఒక మంచి పని చేశాము అనే భావన మనకు ఏర్పడింది. కానీ ప్రవక్త ఏమంటున్నారు? فقد لغوت (ఫఖద్ లగౌత) – “నీవు ఒక లగ్వ్ పని చేశావు” అని. మరియు ఇక్కడ లగ్వ్ అన్నదానికి భావం, ఇమామ్ హాఫిజ్ ఇబ్నె హజర్ అస్కలానీ రహ్మతుల్లా అలై తెలిపినట్లు,

خبت من الأجر
(ఖిబ్త మినల్ అజ్ర్)
నీవు జుమా యొక్క పుణ్యాన్ని కోల్పోయావు.

بطلت فضيلة جمعتك
(బతలత్ ఫజీలతు జుముఅతిక్)
జుమాకు సంబంధించిన ఏ ఘనత, ఏ గొప్పతనం అయితే ఉందో దాన్ని నీవు కోల్పోయావు అని భావం. అల్లాహు అక్బర్.

حرم فضيلة الجمعة
(హురిమ ఫజీలతల్ జుమా)
జుమా యొక్క ఫజీలత్ ఏదైతే ఉందో దాని నుండి అతడు మహ్రూమ్ అయిపోయాడు

అందుకొరకు సోదర మహాశయులారా, కొన్ని ప్రాంతాల్లో మనం ఏం చూస్తూ ఉన్నాము, ప్రత్యేకంగా అరబ్ ప్రాంతాల్లో, అనేకమంది మన సోదరులు, మిత్రులు ఖుత్బా అరబీలో జరుగుతుంది, మనకేం అర్థమవుతుంది అది అని చిన్నపాటిగా గుంపులుగా చేసుకొని ఇద్దరు, ముగ్గురు, నలుగురు వెనుక కూర్చుండి పరస్పరం మాట్లాడుకుంటూ ఉంటారు. అల్లాహు అక్బర్, ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్. ఇది ఇంకా మహా ఘోరమైన విషయం.

గమనించండి ఇక్కడ. ఇద్దరు మాట్లాడుకునే వారిని, “మీరు సైలెంట్‌గా ఉండండి” అని చెప్పడంలోనే పాపం ఉన్నది, జుమా యొక్క సవాబ్ (పుణ్యం) కోల్పోతున్నారంటే, ఇక ఎవరైతే మాట్లాడుతున్నారో వారు ఎంత ఘోరమైన పాపంలో ఉన్నారో గమనించండి. ఈ హదీస్ ఏదైతే మీకు వినిపించానో, సహీ బుఖారీలో ఉంది, హదీస్ నంబర్ 934, అలాగే సహీ ముస్లిం, హదీస్ నంబర్ 851.

ఇక సంక్షిప్తంగా మరొక హదీస్ కూడా మనం విందాము.

عن أبي هريرة رضي الله عنه أن النبي صلى الله عليه وسلم قال: من اغتسل ثم أتى الجمعة، فصلى ما قدر له، ثم أنصت حتى يفرغ من خطبته، ثم يصلي معه، غفر له ما بينه وبين الجمعة الأخرى، وفضل ثلاثة أيام

(అన్ అబీ హురైరత రదియల్లాహు అన్హు అన్న నబియ్య సల్లల్లాహు అలైహి వసల్లమ ఖాల్: మనిగ్తసల సుమ్మ అతల్ జుముఅత, ఫసల్లా మా ఖుద్దిర లహు, సుమ్మ అన్‌సత హత్తా యఫ్రుగ మిన్ ఖుత్బతిహి, సుమ్మ యుసల్లీ మఅహు, గుఫిర లహు మా బైనహు వ బైనల్ జుముఅతిల్ ఉఖ్రా, వ ఫద్లు సలాసతి అయ్యామ్)

ఎవరైతే మంచి రీతిలో స్నానం చేశారో, జుమా నమాజు కొరకు హాజరయ్యారో మరియు ఖుత్బా కంటే ముందు వచ్చి అల్లాహ్ అతని అదృష్టంలో రాసినన్ని రకాతులు చేశాడో (ఇది జుమా ఖుత్బా కంటే ముందు, సామాన్యంగా వీటిని మనం నఫిల్ అంటాము. జుమా కంటే ముందు ఇన్ని రకాతులు అని ఫిక్స్ లేదు. కనీసం రెండు రకాతులు, కానీ అంతకంటే ఎక్కువగా ఎన్నైనా చదవవచ్చు. ఇమామ్ ఖుత్బా స్టార్ట్ చేసేకి ముందు వరకు), ఆ తర్వాత, ఎప్పుడైతే ఇమామ్ ఖుత్బా మొదలు పెడతాడో అప్పటి నుండి ఖుత్బా పూర్తి అయ్యే వరకు అన్‌సత (أنصت) – సైలెంట్‌గా ఉన్నాడు, మౌనం వహించాడు, గమ్మున ఉండిపోయాడు. ఆ తర్వాత ఇమామ్‌తో నమాజ్ చేశాడు. ఇలాంటి వ్యక్తికి ఈ జుమా నుండి మళ్ళీ వచ్చే జుమా వరకు, అంతకంటే మూడు రోజులు ఇంకా అదనంగా, అంటే మొత్తం పది రోజుల పాపాలు అల్లాహ్‌తాలా మన్నిస్తాడు. అల్లాహు అక్బర్.

గమనించండి, పది రోజుల పాపాలు జుమా రోజు నమాజుకు హాజరై, త్వరగా వచ్చి ఎన్ని రకాతులు అంటే అన్ని చేసుకొని, ఇమామ్‌తో ఖుత్బా వినడంలో శ్రద్ధ వహించడం, మౌనం వహించడం, అలాంటి వారి కొరకు ఈ గొప్ప ఘనత ఉంది. అంటే దీని ద్వారా తెలిసింది ఏమిటి? ఒకవేళ ఎవరైనా మాట్లాడారో, మధ్యలో ఏదైనా వృధా కార్యకలాపాలు చేశారో అంటే వారు జుమా యొక్క సవాబును కోల్పోయారు.

ఇక కొందరు ఒక ప్రశ్న అడుగుతారు. వచ్చేసరికి ఏదైనా ఆలస్యం అయిపోయింది, మేము మస్జిద్‌లోకి వచ్చాము, ఇమామ్ అజాన్ ఇస్తున్నాడు. ఆ సందర్భంలో ఏం చేయాలి? రెండు రకాతులు సున్నతులు చేసుకోవాలా? లేకుంటే అజాన్ అయ్యేవరకు మేము వేచి ఉండాలా, అజాన్ యొక్క జవాబు ఇవ్వడానికి? అయితే సోదర మహాశయులారా, అజాన్ యొక్క జవాబు ఇవ్వడం చాలా పుణ్యకార్యం, కానీ ఇమామ్ యొక్క ఖుత్బా వినడం అనేది అజాన్ యొక్క జవాబు కంటే ఎక్కువ ప్రాముఖ్యత గలది గనక, సంక్షిప్తంగా రెండు రకాతులు చేసుకొని కూర్చోవాలి, ఇమామ్ యొక్క ఖుత్బా శ్రద్ధగా వినాలి.

అల్లాహ్ మనందరికీ మన జీవితంలోని ప్రతీ సమస్యలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చూపినటువంటి పరిష్కారాన్ని స్వీకరించి ఆచరించే భాగ్యం ప్రసాదించుగాక.


494. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు :-

“శుక్రవారం రోజు ఇమామ్ జుమా ప్రసంగం చేస్తున్నప్పుడు, మీరు గనక మీ (ప్రక్కన కూర్చున్న) సహచరునితో ‘నిశ్శబ్దంగా’ ఉండు అని అంటే మీరొక పనికిమాలిన పనికి పాల్పడినవారవుతారు.”

[సహీహ్ బుఖారీ : 11 వ ప్రకరణం – జుమా, 36 వ అధ్యాయం – అల్ ఇన్సాతి యౌముల్ జుమా వల్ ఇమాము యఖ్తుబ్]

జుమా ప్రకరణం – 3 వ అధ్యాయం – జుమా ప్రసంగం చేస్తున్నప్పుడు నిశ్శబ్దంగా ఉండాలి
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు (Al-Loolu Wal Marjan ) Vol. 1
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్


ఇతరములు:

జుము’ఆ (శుక్రవారం) రోజున మన బాధ్యతలు, పుణ్య మార్గాలు. ఇక్కడ ఆడియో వీడియో ఆర్టికల్స్ పొందుతారు ఇన్ షా అల్లాహ్. తప్పక ఈ పేజీని దర్శించండి, ఫార్వర్డ్ చేయండి

జుమా (శుక్ర వారం)
https://teluguislam.net/five-pillars/salah-namaz-prayer/friday/

అజాన్ తర్వాత చేసే రెండు దుఆల ఘనత [వీడియో & టెక్స్ట్]

అజాన్ తర్వాత చేసే రెండు దుఆల ఘనత (فضل الذكر بعد الآذان)
https://www.youtube.com/watch?v=IUyKck4lvfI [ 2 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

అజాన్ తర్వాత చెదివే ఈ రెండు దుఆల ఘనత చాలా గొప్పగా ఉంది
ప్రతి అజాన్ తర్వాత చదవండి, అనేకానేక పుణ్యాలు, లాభాలు పొందండి

ఈ వీడియో లో చెప్పబడిన దుఆలు ఇక్కడ నేర్చుకోవచ్చు: అజాన్ తర్వాత చేయు దుఆలు 

ఈ ప్రసంగంలో అజాన్ తర్వాత పఠించవలసిన రెండు ముఖ్యమైన దువాల గురించి వివరించబడింది. మొదటి దువా సహీహ్ ముస్లిం నుండి ఉల్లేఖించబడింది, దీనిని పఠించడం ద్వారా గత పాపాలు క్షమించబడతాయి. రెండవ దువా సహీహ్ బుఖారీ నుండి తీసుకోబడింది, దీనిని పఠించిన వారికి ప్రళయ దినాన ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి సిఫారసు లభిస్తుంది. ఈ రెండు దువాల యొక్క ప్రాముఖ్యత మరియు వాటి ద్వారా లభించే గొప్ప ప్రయోజనాలను వక్త నొక్కి చెప్పారు.

మహాశయులారా, ఇప్పుడు మనం అజాన్ తర్వాత రెండు రకాల దువాలు మనకు మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నేర్పారు. ప్రతీ ఒక్క దువాలో మన గురించి ఎంతో గొప్ప లాభం ఉంది.

మొదటి హదీస్ సహీహ్ ముస్లిం లోనిది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారని సాద్ బిన్ అబీ వక్కాస్ రదియల్లాహు త’ఆలా అన్హు గారు ఉల్లేఖించారు, ఎవరైతే అజాన్ విన్న తర్వాత, అజాన్ కు సమాధానం చెబుతూ అజాన్ పూర్తిగా విన్న తర్వాత

أَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللهُ، وَحْدَهُ لَا شَرِيكَ لَهُ، وَأَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ، رَضِيتُ بِاللهِ رَبًّا، وَبِمُحَمَّدٍ رَسُولًا، وَبِالْإِسْلَامِ دِينًا

(అష్ హదు అల్ లా ఇలాహ ఇల్లల్లాహ్, వహ్ దహూ లా షరీక లహూ, వ అన్న ముహమ్మదన్ అబ్దుహూ వ రసూలుహూ, రదీతు బిల్లాహి రబ్బన్, వబి ముహమ్మదిన్ రసూలన్, వబిల్ ఇస్లామి దీనా)

“అల్లాహ్ తప్ప మరెవ్వరూ ఆరాధ్య దేవుడు లేడని నేను సాక్ష్యమిస్తున్నాను, ఆయన ఏకైక దేవుడు, ఆయనకు భాగస్వాములు లేరు మరియు ముహమ్మద్ ఆయన దాసుడు మరియు ఆయన ప్రవక్త అని కూడా నేను సాక్ష్యమిస్తున్నాను. నేను అల్లాహ్ ను ప్రభువుగా, ముహమ్మద్ ను ప్రవక్తగా మరియు ఇస్లాంను నా ధర్మంగా స్వీకరించాను.”

అని చదువుతారో,

غُفِرَ لَهُ ذَنْبُهُ
(గుఫిర లహూ దన్బుహూ)

వారి యొక్క పాపాలు క్షమించబడతాయి, మన్నించబడతాయి అని శుభవార్త ఇవ్వడం జరిగింది.

ఇది ఒక దువా. మరోసారి విని మీరు దీన్ని జ్ఞాపకం ఉంచుకునే ప్రయత్నం చేయండి. సామాన్యంగా మనం దీనిలో సగ భాగం అంతకంటే ఎక్కువగా నేర్చుకునే ఉంటాము ఇంతకుముందు.

ఇక రెండవ దువా, సహీహ్ బుఖారీలోని పదాలు ఈ విధంగా ఉన్నాయి. జాబిర్ రదియల్లాహు త’ఆలా అన్హు గారు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఎవరైతే అజాన్ విన్న తర్వాత ఈ దువా చదువుతారో, ప్రళయ దినాన వారికి నా సిఫారసు తప్పకుండా లభిస్తుంది. అల్లాహు అక్బర్! ఎంత గొప్ప అదృష్టమో గమనించండి. ప్రళయ దినాన ప్రవక్తలు సిఫారసు చేయాలి అని మనం తహతహలాడుతూ ఉంటాము. ఆ రోజు మనకు ఈ సిఫారసు పొందడానికి ఈ రోజు ఐదు పూటల నమాజులు చేయాలి. అజాన్ విన్నప్పుడు, అజాన్ అయిన తర్వాత దువా మనం చదవాలి.

اللَّهُمَّ رَبَّ هَذِهِ الدَّعْوَةِ التَّامَّةِ، وَالصَّلَاةِ الْقَائِمَةِ، آتِ مُحَمَّدًا الْوَسِيلَةَ وَالْفَضِيلَةَ، وَابْعَثْهُ مَقَامًا مَحْمُودًا الَّذِي وَعَدْتَهُ

(అల్లాహుమ్మ రబ్బ హాదిహి ద్దావతి త్తామ్మ, వస్సలాతిల్ ఖాయిమ, ఆతి ముహమ్మదన్ అల్ వసీలత వల్ ఫదీల, వబ్ అత్ హు మఖామమ్ మహ్మూదన్ అల్లదీ వ అత్తహ్)

“ఓ అల్లాహ్! ఈ సంపూర్ణ పిలుపునకు మరియు స్థాపించబడిన నమాజుకు ప్రభువా! ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)కు మధ్యవర్తిత్వం మరియు శ్రేష్టతను ప్రసాదించు. మరియు నీవు వాగ్దానం చేసిన ప్రశంసనీయమైన ఉన్నత స్థానానికి ఆయనను చేర్చు.”

అల్లాహ్ త’ఆలా ఈ దువాలను ప్రతీ అజాన్ తర్వాత చదువుతూ ఉండే భాగ్యం ప్రసాదించుగాక. వీటి యొక్క బరకత్ లో, శుభంలో అల్లాహ్ మన పాపాలను మన్నించి ప్రళయ దినాన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సిఫారసు మనకు ప్రాప్తి చేయుగాక.

ఈ పోస్ట్ లింక్: https://teluguislam.net/?p=5568

నమాజు చేస్తున్న వారి ముందు నుండి వెళ్ళకూడదు

283. హజ్రత్ అబూ సాలిహ్ సమ్మాన్ (రహ్మతుల్లాహి అలై) కధనం :-

హజ్రత్ అబూ సయీద్ ఖుదరీ (రధి అల్లాహు అన్హు) ఓసారి శుక్రవారం నాడు జనావాసానికి దూరంగా వెళ్లి ఒక వస్తువుని ఆసరాగా చేసుకొని ఒంటరిగా నమాజు చేస్తుంటే నేను చూశాను. అంతలో అబూ ముయీత్ సంతానంలో ఒక యువకుడు ఆయన ముందు నుంచి వెళ్ళడానికి ప్రయత్నించాడు. అయితే హజ్రత్ అబూ సయీద్ (రధి అల్లాహు అన్హు) అతని ఛాతి మీద చేత్తో ఓ దెబ్బ చరిచారు. ఆ యువకుడు (అటూ ఇటూ) చూశాడు. కాని హజ్రత్ అబూ సయీద్ (రధి అల్లాహు అన్హు) ముందు నుంచి వెళ్లడం తప్ప మరో మార్గం కన్పించకపోవడంతో అతను మరోసారి ఆయన ముందు నుండి వెళ్ళడానికి ప్రయత్నించాడు. అప్పుడు హజ్రత్ అబూ సయీద్ (రధి అల్లాహు అన్హు) అతని ఛాతి మీద అంతకు ముందుకంటే గట్టిగా చరిచి వెనక్కి నెట్టారు. దాంతో ఆ యువకుడు హజ్రత్ అబూ సయీద్ (రధి అల్లాహు అన్హు) మీద మండి పడి ఏవేవో కూశాడు.

ఆ తరువాత అతను (మదీనా గవర్నర్) మర్వాన్ దగ్గరికెళ్ళి దీన్ని గురించి ఫిర్యాదు చేశాడు. హజ్రత్ అబూ సయీద్ (రధి అల్లాహు అన్హు) కూడా అతని వెనకాలే బయలుదేరి మర్వాన్ దగ్గరికు చేరుకున్నారు. మర్వాన్ ఆయన్ని చూడగానే “మీకు, మీ సోదరుని కొడుకు మధ్య ఈ గొడవేమిటి?” అని అడిగారు. దానికి హజ్రత్ అబూ సయీద్ (రధి అల్లాహు అన్హు) ఇలా సమాధానమిచ్చారు :-

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈవిధంగా ప్రవచించారు : “ఒక వ్యక్తి ఏదైనా వస్తువుని ఆసరాగా చేసుకొని నమాజు చేస్తున్నప్పుడు ఇతరులెవరైనా అతని ముందు నుంచి వెళ్ళడానికి ప్రయత్నిస్తే అతడ్ని నమాజు చేసే వ్యక్తి (చేత్తో) కొట్టి నెట్టివేయాలి. అయినా అతను తన వైఖరి మార్చుకోకపోతే అతను షైతాన్ అని గ్రహించి అతనితో పోరాడాలి.”

[సహీహ్ బుఖారీ : 8 వ ప్రకరణం – సలాత్, 100 వ అధ్యాయం – యరద్దుల్ ముసల్లీ మ మ్మర్ర బైనయదైహి]

నమాజు ప్రకరణం – 48 వ అధ్యాయం – నమాజు చేస్తున్న వారి ముందు నుండి వెళ్ళకూడదు
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-1
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఏనాడూ తన స్వవిషయంలో ఎవరిపైనా ప్రతీకారం తీర్చుకోలేదు

1502. హజ్రత్ ఆయిషా (రధి అల్లాహు అన్హ) కధనం :-

రెండు విషయాల్లో ఒకదాన్ని అవలంబించే స్వేచ్చ ఇవ్వబడినప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆ రెండింటిలో సులభమైన విషయాన్నే ఎంచుకునేవారు. అయితే ఆ విషయం పాపకార్యం అయి ఉండరాదు. ఒకవేళ ఆ సులభమైన విషయం పాపకార్యమైతే అందరికంటే ఆయనే దానికి దూరంగా ఉంటారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఏనాడూ తన స్వవిషయంలో ఎవరిపైనా ప్రతీకారం తీర్చుకోలేదు. కాని దైవాజ్ఞల పట్ల అపచారం జరిగితే మాత్రం ఆయన తప్పకుండా ప్రతీకారం తీర్చుకునేవారు.

[సహీహ్ బుఖారీ : 61 వ ప్రకరణం – మనాఖిబ్, 23 వ అధ్యాయం – సిఫతిన్నబియ్యి (సల్లల్లాహు అలైహి వసల్లం) ]

ఘనతా విశిష్ఠతల ప్రకరణం : 20 వ అధ్యాయం – దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సొంత వ్యవహారంలో ప్రతీకారం తీర్చుకోరు
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-2
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

మనస్సులో దుష్ట ఆలోచనలు వచ్చినప్పుడు ఏమి చేయాలి?

82. హజ్రత్ అబూ హురైరా (రధి అల్లాహు అన్హు) కధనం : దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సెలవిచ్చారు,

“ఒక్కోసారి షైతాన్ మీలో ఒకరి దగ్గరకు వచ్చి, దీన్నెవరు సృష్టించారు, దాన్నెవరు సృష్టించారు? అని అడుగుతాడు. చివరికి నీ ప్రభువుని ఎవరు సృష్టించారని కూడా దుష్టాలోచనలు కలిగిస్తాడు. అందువల్ల ఇలాంటి దుష్టాలోచనలు మనసులో రేకెత్తినప్పుడు (వెంటనే) మీరు (వాటి కీడు నుంచి) అల్లాహ్ శరణుకోరండి. మీరు స్వయంగా ఇలాంటి పైశాచిక ఆలోచనలకు మనస్సులో తావీయకండి.”

[సహీహ్ బుఖారీ : 59 వ ప్రకరణం – బదాయిల్ ఖల్ఖ్, 11 వ అధ్యాయం – సిఫతి ఇబ్లీస్ వ జునూదిహీ]

విశ్వాస ప్రకరణం – 58 వ అధ్యాయం – మనస్సులో దుష్ట ఆలోచనలు వచ్చినప్పుడు ఏమి చేయాలి?
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) Vol. 1
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

నీరు, పాలు, తదితర పదార్ధాల పంపిణీ కుడివైపు నుండి ఆరంభించాలి

1318. హజ్రత్ అనస్ బిన్ మాలిక్ (రధి అల్లాహు అన్హు) కధనం :-

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఓసారి మా ఇంటికి వచ్చారు. అప్పుడు ఆయన మంచినీళ్ళు అడిగితే మేము ఒక మేక నుండి పాలు పితికి అందులో కొంచెం బావినీళ్ళు కలిపి ఆయనకు ఇచ్చాము. ఆ సమయంలో హజ్రత్ అబూబకర్ (రధి అల్లాహు అన్హు) ఆయనకు ఎడమ వైపున, హజ్రత్ ఉమర్ (రధి అల్లాహు అన్హు) ముందు వైపున, ఒక పల్లెవాసి కుడి వైపున కూర్చొని ఉన్నారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆ పాలలో కొంత త్రాగి వదిలి పెట్టిన తరువాత “దాన్ని అబూబకర్ (రధి అల్లాహు అన్హు) కు ఇచ్చేయండి” అని హజ్రత్ ఉమర్ (రధి అల్లాహు అన్హు) అన్నారు . కాని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆ పాలగిన్నెను (తన కుడివైపున కూర్చున్న) గ్రామీణవ్యక్తికి ఇచ్చారు. తరువాత ఆయన ఇలా అన్నారు : “మొదట కుడివైపున్న వాడికి .., మొదట కుడివైపున్న వాడికి ఇవ్వాలి గుర్తుంచుకోండి. ఎల్లప్పుడూ కుడివైపు నుండి ప్రారంభించాలి”.

మరి హజ్రత్ అనస్ (రధి అల్లాహు అన్హు) మూడుసార్లు ఇలా పలికారు. “కుడివైపు నుండి ప్రారంభించడం సంప్రదాయం, కుడివైపు నుండి ప్రారంభించడం సంప్రదాయం, కుడివైపు నుండి ప్రారంభించడం సంప్రదాయం”.

[సహీహ్ బుఖారీ : 51 వ ప్రకరణం – హిబా, 4 వ అధ్యాయం – మనిస్ తస్ఖా]

పానీయాల ప్రకరణం : 17 వ అధ్యాయం – నీరు, పాలు, తదితర పదార్ధాల పంపిణీ కుడివైపు నుండి ఆరంభించాలి.
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) Vol. 1
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

మూడు మస్జిద్ లు తప్ప ఇతర పుణ్యస్థలాల దర్శనార్ధం ప్రయాణ సంకల్పం నిషిద్ధం

882. హజ్రత్ అబూ హురైరా (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు :-

మూడు మస్జిద్ ల దర్శనం కోసం తప్ప మరే పుణ్యస్థల దర్శనం కోసమూ ప్రయాణం చేయకూడదు.
(1) మస్జిదుల్ హరాం (మక్కాలోని కాబా మస్జిద్)
(2) మస్జిదె నబవి (మదీనాలోని ప్రవక్త మస్జిద్)
(3) బైతుల్ మఖ్దిస్ లోని మస్జిదె అఖ్సా

[సహీహ్ బుఖారీ : 20 వ ప్రకరణం – ఫజ్లిస్సలాతి ఫీ మస్జిద్ మక్కా వ మదీనా – 1 వ అధ్యాయం – ఫజ్లిస్సలాతి ఫీ మస్జిద్]

హజ్ ప్రకరణం – 95 వ అధ్యాయం – మూడు మస్జిద్ లు తప్ప ఇతర పుణ్యస్థలాల దర్శనార్ధం ప్రయాణ సంకల్పం నిషిద్ధం
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) Vol. 1
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్