అయిదు రకాల అమరగతులు

1247. హజ్రత్ అబూహురైరా (రధి అల్లాహు అన్హు) కధనం :- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు:

“ఒక వ్యక్తి దారిన నడుస్తుంటే ఒక చోట దారిలో ఒక ముళ్ళ కంప పడి ఉండటం కన్పించింది. అతనా ముళ్ళకంపను తీసి దారి పక్కన దూరంగా పారేశాడు. అతడు చేసిన ఈ సత్కార్యాన్ని ప్రతిఫలంగా దేవుడు అతని పాపాలను క్షమించాడు.”
ఆ తరువాత దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు: “అమరగతుల్లో (షుహదా) అయిదు రకాల వాళ్ళుంటారు.
(1) ప్లేగు వ్యాధి వల్ల చనిపోయిన వారు,
(2) ఉదరవ్యాధితో చనిపోయిన వారు,
(3) నీటిలో మునిగి చనిపోయినవారు,
(4) ఏదైనా బరువు క్రింద నలిగి చనిపోయిన వారు,
(5) దైవమార్గంలో పోరాడుతూ వధింప బడినవారు.”

[సహీహ్ బుఖారీ : 10 వ ప్రకరణం – అజాన్, 32 వ అధ్యాయం – ఫజ్లిత్తహ్ జీరి ఇలజ్జుహ్రి]

పదవుల ప్రకరణం : 51 వ అధ్యాయం – అమరగతులు
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-2
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

Read English Version of this Hadeeth

అల్లాహ్ రెట్టింపు పుణ్యఫలం ప్రసాదించే ముగ్గురు వ్యక్తులు

94. హజ్రత్ అబూ మూసా (రధి అల్లాహు అన్హు) కధనం :- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలిపారు,

“మూడు విధాల వ్యక్తులకు దేవుడు రెట్టింపు పుణ్యఫలం ప్రసాదిస్తాడు.

  1. గ్రంధ ప్రజలకు చెందిన వాడు. (యూదుడు లేక క్రైస్తవుడు అయి ఉండి తమ దైవప్రవక్త (హజ్రత్ మూసా లేక హజ్రత్ ఈసా) తో పాటు, ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ను కూడా విశ్వసించే వ్యక్తి.
  2. అటు దేవుని హక్కుల్ని, ఇటు తన యజమాని హక్కుల్ని కూడా నిర్వర్తించే బానిస.
  3. ఒక మహిళా బానిసను కలిగి వుండి, ఆమెకు మంచి విద్యాబుద్దులు గరిపి, తరువాత ఆమెను బానిసత్వం నుంచి విముక్తి కలిగించి తన భార్యగా చేసుకునే వ్యక్తి. అతనికి కూడా రెట్టింపు పుణ్యఫలం లభిస్తుంది.”

[సహీహ్ బుఖారీ : 3 వ ప్రకరణం – ఇల్మ్, 31 వ అధ్యాయం – తాలిమిర్రజులి ఉమ్మత్]

విశ్వాస ప్రకరణం : 68 వ అధ్యాయం – మహనీయ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి అసల్లం) యావత్తు మానవాళి కోసం వచ్చిన దైవప్రవక్త
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) Vol. 1
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

Read English Version of this Hadeeth

జనాజా నమాజులో పాల్గొనడం వల్ల పుణ్యం ‘రెండు కొండల పరిమాణం’

551. హజ్రత్ అబూహురైరా (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు :-

“జనాజా (శవ ప్రస్థానం)లో పాల్గొని జనాజా నమాజు అయ్యేవరకు శవంతో పాటు ఉండే వ్యక్తికి ఒక యూనిట్ పుణ్యం లభిస్తుంది. శవ ఖననం అయ్యే వరకు ఉండే వ్యక్తికి రెండు యూనిట్ల పుణ్యం లభిస్తుంది.” రెండు యూనిట్లు అంటే ఏమిటని అడగ్గా ‘రెండు కొండల పరిమాణం’ అని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలియజేశారు.

[సహీహ్ బుఖారీ : 23 వ ప్రకరణం – జనాయెజ్, 59 వ అధ్యాయం – మనిన్ తంజిర హత్తా తద్ ఫిన్]

జనాయెజ్ ప్రకరణం : 17 వ అధ్యాయం – జనాజా నమాజులో పాల్గొనడం వల్ల పుణ్యం
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-1
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

Read English Version of this Hadeeth

ప్రతి ముస్లిం విధిగా దానం చేయాలి

589. హజ్రత్ అబూ మూసా అష్ అరీ (రధి అల్లాహు అన్హు) కధనం :-

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తన అనుచరులతో మాట్లాడుతూ “ప్రతి ముస్లిం విధిగా దానం చేయాలి” అన్నారు.
అనుచరులు అది విని “మరి ఎవరి దగ్గరైనా దానం చేయడానికి ఏమీలేకపోతే ఎలా? అని అడిగారు.
“అప్పుడు ఆ వ్యక్తి కష్టపడి సంపాదించి తానూ అనుభవించాలి, దాన్ని (పేదలకు) దానం కూడా చేయాలి” అన్నారు ధైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం).

“ఒకవేళ అలా చేసే శక్తి కూడా లేకపోతే? లేదా అలా కూడా చేయకపోతే?” అని మళ్ళీ అడిగారు అనుయాయులు.
“అప్పుడు ఎవరైనా అగత్యపరుడు ఏదైనా ఆపదలో చిక్కుకుంటే అతడ్ని ఆదుకోవాలి” అన్నారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం).

“అది కూడా చేయలేకపోతేనో?” అడిగారు అనుయాయులు తిరిగి,
“(అదీ చేయలేకపోతే) మేలు చేయాలని లేక సత్కార్యాలు చేయాలని ఇతరులకు సలహా లివ్వాలి” అన్నారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం).

“మరి అదీ చేయలేకపోతే” అడిగారు అనుయాయులు మళ్ళీ.
“(అలాంటి పరిస్థితిలో కనీసం) తాను స్వయంగా చెడుపనులు
చేయకుండా, ఇతరులకు చెడు తలపెట్టకుండా ఉండాలి. ఇది కూడా దానం క్రిందకే వస్తుంది” అన్నారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం).

[సహీహ్ బుఖారీ : 78 వ ప్రకరణం – అదబ్, 33 వ అధ్యాయం – కుల్లు మారూఫిన్ సదఖాతున్]

జకాత్ ప్రకరణం : 16 వ అధ్యాయం – ప్రతి సత్కార్యం దానమే (సదఖాయే)
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-1
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

Read English Version of this Hadeeth

ప్రతిరోజు అయిదుసార్లు స్నానం చేస్తూ ఉంటే, ఇక అతని శరీరం మీద మలినం ఉంటుందా?

389. హజ్రత్ అబూ హురైరా (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా అన్నారు :-

“ఒక వ్యక్తి ఇంటి ముందు ఒక నది ప్రవహిస్తూ ఉండి, అతనా నదిలో ప్రతిరోజు అయిదుసార్లు స్నానం చేస్తూ ఉంటే, ఇక అతని శరీరం మీద మలినం ఉంటుందా? దీనిపై మీ అభిప్రాయం ఏమిటి?” దానికి ప్రవక్త అనుచరులు “అతని శరీరం మీద ఎలాంటి మలినం మిగిలి ఉండదు” అని అన్నారు ముక్తకంఠం తో.
అప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం), “రోజుకు అయిదుసార్లు నమాజు చేసే మనిషి పరిస్థితి కూడా  అలాగే ఉంటుంది. అయిదు వేళలా నమాజు చేయడం వల్ల దాసుని పాపాలను అల్లాహ్ క్షమిస్తాడు” అని బోధించారు.

[సహీహ్ బుఖారీ : 9 వ ప్రకరణం – మవాఖియతుస్సలాత్, 6 వ అధ్యాయం – అస్సలవాతుల్ ఖమ్సి కఫ్ఫారా]

ప్రార్ధనా స్థలాల ప్రకరణం – 51 వ అధ్యాయం – నమాజు కోసం ముస్జిదుకు వెళ్తే పాపాలు క్షమించబడతాయి
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-1
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

Read English Version of this Hadeeth

నమాజు చేస్తున్న వ్యక్తి ముందు నుంచి వెళ్తే ఎంత పాపమో తెలిసి ఉంటే

284. హజ్రత్ బసర్ బిన్ సయీద్ (రహ్మతుల్లా అలై) కధనం :- జైద్ బిన్ ఖాలిద్ నన్ను హజ్రత్ అబూ జుహైమ్ (రధి అల్లాహు అన్హు) దగ్గరకు పంపించి, నమాజీ ముందు నుంచి వెళ్ళే వ్యక్తి గురించి ఆయన దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నోట ఏం విన్నారో తెలుసుకొని రమ్మన్నారు. హజ్రత్ అబూ జుహైమ్ (రధి అల్లాహు అన్హు) దగ్గరికి వెళ్తే ఆయన ప్రవక్త ప్రవచనాన్ని ఈ విధంగా తెలిపారు :-

నమాజు చేస్తున్న వ్యక్తి ముందు నుంచి వెళ్తే ఎంత పాపమో తెలిసి ఉంటే, మనిషి అలాంటి చర్యకు పాల్పడడానికి బదులు నలభై (సంవత్సరాలు, నెలలు, రోజుల పాటు – ఉల్లేఖకునికి ఎంత కాలమో సరిగా గుర్తులేదు) వరకు నిలబడి ఉండటం ఎంతో మేలని భావిస్తాడు.

[సహీహ్ బుఖారీ : 8 వ ప్రకరణం – సలాత్, 101 వ అధ్యాయం – ఇస్ముల్ మర్రిబైన యదయిల్ ముసల్లీ]

నమాజు ప్రకరణం – 48 వ అధ్యాయం – నమాజు చేస్తున్న వారి ముందు నుండి వెళ్ళకూడదు
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-1
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

మనిషి పేరాశ కడుపు (సమాధి) మట్టితో మాత్రమే నిండుతుంది

623. హజ్రత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు:-

మానవునికి సిరిసంపదలతో నిండిన ఓ పెద్ద అరణ్యం లభించినప్పటికీ, అలాంటి మరో అరణ్యం దొరికితే బాగుండునని భావిస్తాడు. అతని పేరాశ కడుపు (సమాధి) మట్టితో మాత్రమే నిండుతుంది. అయితే ప్రాపంచిక వ్యామోహం వదలి పశ్చాత్తాప హృదయంతో దేవుని వైపుకు మరలితే అలాంటి వ్యక్తిని దేవుడు మన్నిస్తాడు. అతని పశ్చాత్తాపాన్ని స్వీకరిస్తాడు (అతనికి ఆత్మ సంతృప్తి భాగ్యం ప్రసాదిస్తాడు).

[సహీహ్ బుఖారీ : 81 వ ప్రకరణం – రిఖాఖ్, 10 వ అధ్యాయం – మాయత్తఖా మిన్ ఫిత్నతిల్ మాల్]

జకాత్ ప్రకరణం : 39 వ అధ్యాయం – మానవునికి బంగారు లోయలు రెండు లభించినా మూడో దానికోసం అర్రులు చాచుతాడు
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-1
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

Read English Version of this Hadeeth

సర్వనాశనం చేసే ఘోరాతి ఘోరమైన ఏడు పాపాలు

56. హజ్రత్ అబూ హురైరా (రధి అల్లాహు అన్హు) కధనం :- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అనుచరుల్ని ఉద్దేశించి,

” మిమ్మల్ని సర్వనాశనం చేసే పనులకు దూరంగా ఉండండని” హెచ్చరించారు. ” ఆ పనులేమిటి ధైవప్రవక్తా?” అని అడిగారు అనుచరులు. అప్పుడాయన ఇలా సెలవిచ్చారు –

(1) అల్లాహ్ కి సాటి కల్పించటం;
(2) చేతబడి చేయటం;
(3) ధర్మయుక్తంగా తప్ప అల్లాహ్ హతమార్చకూడదని నిషేధించిన ప్రాణిని హతమార్చడం;
(4) వడ్డీ సొమ్ము తినడం;
(5) అనాధ సొమ్మును హరించి వేయడం;
(6) ధర్మయుద్దంలో వెన్నుజూపి పారిపోవడం;
(7) ఏ పాపమెరుగని అమాయక ముస్లిం స్త్రీలపై అపనిందలు మోపడం.

[సహీహ్ బుఖారీ : 55 వ ప్రకరణం – అల్ వసాయా, 23 వ అధ్యాయం – ఖౌలిల్లాహ్ …. ఇన్నల్లజీనయాకులూన అమ్వాలల్ యతామాజుల్మా]

విశ్వాస ప్రకరణం : 36 వ అధ్యాయం – ఘోరపాపాలు, ఘోరాతి ఘోరమైన పాపాలు
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) Vol. 1
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

Read English Version of this Hadeeth

సజ్జనులతో సహవాసం చేయడం, దుర్జనులకు దూరంగా ఉండటం

1687. హజ్రత్ అబూ మూసా అష్ అరీ (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు :-

మంచి మిత్రుడ్ని – చెడ్డ స్నేహితుడ్ని, కస్తూరి అమ్మే వాడితో – కొలిమి ఊదే వాడితో పోల్చవచ్చు. కస్తూరీ అమ్మేవాడునీకు కస్తూరీని కానుకగానయినా ఇస్తాడు లేదా నీవతని దగ్గర దాన్ని కొననయినా కొంటావు. లేదా కనీసం అతని దగ్గర్నుంచి నీకు సువాసనయినా వస్తుంది. కాని కొలిమి ఊదేవాడు (నిప్పు రవ్వలు ఎగరేసి) నీ బట్టలను  కాలుస్తాడు లేదా అతని దగ్గర్నుంచి నీకు దుర్వాసన అయినా వస్తుంది (నీ స్నేహితుల సంగతి కూడా అంతే).

[సహీహ్ బుఖారీ : 72 వ ప్రకరణం – అజ్జిబాయి వస్సైద్, 31 వ అధ్యాయం – అల్ మిస్క్]

సామాజిక మర్యాదల ప్రకరణం – 45 వ అధ్యాయం
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-2
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

Read English Version of this Hadeeth

ఆవులించడం మంచిది కాదు

1885. హజ్రత్ అబూ హురైరా (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు :-

ఆవులింత షైతాన్ తరఫు నుండి వస్తుంది. కనుక మీలో ఎవరికైనా ఆవులింత వస్తే అతను వీలైనంత వరకు దాన్ని ఆపుకోవడానికి ప్రయత్నించాలి.(*)

(*) ఆవులింత షైతాన్ తరుఫు నుండి వస్తుంది అంటే, మనిషి విలువైన ఆహారాన్ని హద్దు మీరి తినడం వల్ల ఉదర భారంతో ఆవులిస్తాడు. ఇక్కడ హద్దు మీరి తినడాన్ని షైతాన్ చేష్ట గా వర్ణించటం జరిగింది. ఆవులింత అవసరానికి మించి తినడాన్ని సూచిస్తుంది. ఆవులింతను ఆపడం అంటే, ఆవులింతకు కారణభూతమయ్యే పనులను మానుకోవాలని అర్ధం. ఉదాహరణకు మితిమీరి తినడం, అతిగా విశ్రాంతికి అలవడటం ఇత్యాదివి. వీలైనంతవరకు ఆవులింత రాకుండా ఆపుకోవడం అని కూడా అర్ధం వస్తుంది. ఒకవేళ ఆవులింత ఆగకపోతే ఆ సమయంలో షైతాన్ ఆశయం నెరవేరకుండా, అంటే వాడు నోట్లో దూరి మనిషి ముఖాన్ని చెడగొట్టనీకుండా నోటి మీద చెయ్యి పెట్టుకోవాలి. (సంకలన కర్త)

[సహీహ్ బుఖారీ : 59 వ ప్రకరణం – బదయిల్ ఖల్ఖ్ , 11 వ అధ్యాయం – సిఫతి ఇబ్లీస వ జునూదిహీ]

ప్రేమైక వచనాల ప్రకరణం : 9 వ అధ్యాయం
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-2
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

Read English Version of this Hadeeth