తావీజులు, తాయత్తులు… !? – హబీబుర్ రహ్మాన్ జామి’ఈ [వీడియో & టెక్స్ట్]

తావీజులు, తాయత్తులు… !?
https://youtu.be/W9VBuoPiFfk [15 నిముషాలు]
వక్త: హబీబుర్ రహ్మాన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, తావీజు (తాయత్తులు) మరియు ఇస్లాంలో వాటి స్థానం గురించి వివరించబడింది. తావీజులు రెండు రకాలుగా విభజించబడ్డాయి: ఖుర్ఆన్ వచనాలు కలిగినవి మరియు ఇతర వస్తువులు (గవ్వలు, దారాలు మొదలైనవి) కలిగినవి. ఖుర్ఆన్ వచనాలు ఉన్న తాయత్తుల విషయంలో కూడా పండితుల మధ్య అభిప్రాయ భేదం ఉందని, అయితే మెజారిటీ పండితులు షిర్క్‌కు దారితీస్తుందనే భయంతో వాటిని కూడా నిషేధించారని ప్రసంగీకులు పేర్కొన్నారు. షిర్క్‌తో కూడిన రెండవ రకం తాయత్తులు పూర్తిగా హరామ్ అని స్పష్టం చేయబడింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధించిన విధంగా, తాయత్తులకు బదులుగా ఖుర్ఆన్ మరియు దుఆలను పఠించడం ద్వారా రక్షణ మరియు నివారణను వెతకాలని ముగింపులో ఉపదేశించబడింది.


إِنَّ الْحَمْدَ لِلَّهِ وَحْدَهُ، وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى مَنْ لَا نَبِيَّ بَعْدَهُ، أَمَّا بَعْدُ
(ఇన్నల్ హమ్దలిల్లాహి వహ్ద, వస్సలాతు వస్సలాము అలా మన్ లా నబియ్య బా’ద, అమ్మా బా’ద్)
నిశ్చయంగా సర్వ స్తోత్రాలు ఏకైక అల్లాహ్ కే శోభిస్తాయి. మరియు ఎవరి తర్వాత ప్రవక్త లేడో, ఆయనపై శాంతి మరియు శుభాలు కలుగుగాక. ఆ తర్వాత…

అభిమాన సోదరులారా! ధర్మ అవగాహనం అనే ఈ కార్యక్రమములోకి మీ అందరికీ ఇస్లామీయ అభివాదం.

اَلسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ
(అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు)
మీపై అల్లాహ్ యొక్క శాంతి, కరుణ మరియు శుభాలు వర్షించుగాక.

ప్రియ వీక్షకులారా! ఈ రోజు మనం తావీజు, తాయత్తుల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. మనం మన సమాజంలో చూస్తూ ఉంటాము, కొందరి మెడలో, చేతులో, నడుంకి తావీజులు, తాయత్తులు కట్టుకుంటారు. చిన్న పిల్లలకి దిష్టి తగలకుండా ఉండటానికి, పెద్దవారైనా సరే, ఎవరైనా సరే రోగానికి గురైనప్పుడు ఆ రోగం పోవాలని, నష్టానికి గురైనప్పుడు నష్టం రాకూడదని, కొందరు భయం కోసము, కొందరు ముందు జాగ్రత్త ఎప్పుడూ నష్టానికి, బాధకి లోను కాకూడదని ఏదేదో కారణాలతో, ఏదేదో ఉద్దేశాలతో తావీజులు కట్టుకుంటారు. ఇది కూడా సమాజంలో ఒక వర్గం దీనిని వ్యాపారంగా కూడా చేసుకున్నది. కాకపోతే, ఇస్లాం ధర్మంలో, షరీఅత్‌లో తావీజు యొక్క వాస్తవికత ఏమిటి? దీనికి అరబీలో ‘తమీమా‘ అంటారు, ‘త’అవీద్’. మామూలుగా తెలుగులో తావీజు, తాయత్తు అని చెప్తారు.

ఈ తాయత్తులు, ఈ తావీజులు రెండు రకాలు. షేఖ్ సాలెహ్ బిన్ ఫౌజాన్ అల్ ఫౌజాన్ (రహ్మతుల్లాహి అలై) ఒక పుస్తకం ఉంది ‘అఖీదతుత్ తౌహీద్‘, ఆ పుస్తకం ఆధారంగా ఈ తావీజు గురించి ఈ రెండు రకాలు నేను మాట్లాడుతున్నాను. తావీజు రెండు రకాలు ఈ తాయత్తులు.

మొదటి రకం ఏమిటి? ఖుర్ఆన్ ఆధారంగా కట్టే తావీజులు. ఆ తావీజులో ఎటువంటి షిర్క్ లేదు, బిద్అత్ లేదు, కొత్త విషయాలు లేవు. ఖుర్ఆన్ వాక్యాలు మాత్రమే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నేర్పిన వాక్యాలు మాత్రమే ఆ తావీజులో ఉన్నాయి. అంటే ఖుర్ఆన్ సూక్తులను లేదా అల్లాహ్ నామాలను, గుణాలను లిఖించి వ్యాధి నివారణ పొందే ఉద్దేశంతో తావీజు వేయటం. ఈ విషయం బాగా అర్థం చేసుకోండి. అల్లాహ్ సూక్తులను, అల్లాహ్ నామాలను, అల్లాహ్ గుణాలను లిఖించి ఆ వ్యాధి నివారణ పొందే ఉద్దేశంతో వేలాడదీయడం, వేయటం.

ఇటువంటి తావీజు ధర్మ సమ్మతమని కొంతమంది పండితుల అభిప్రాయం. అందరి అభిప్రాయం కాదు, కొంతమంది పండితుల అభిప్రాయం మాత్రమే. ఆధారం ఏమిటి? అటువంటి తావీజులో షిర్క్ లేదు, బిదాత్ లేదు, కొత్త విషయం ఏదీ లేదు. కేవలం అల్లాహ్ వాక్యం ఉంది, అల్లాహ్ నామం మాత్రమే ఉంది, అల్లాహ్ గుణగణాలు మాత్రమే ఉన్నాయి. ఉద్దేశం కూడా ఏమిటి? వ్యాధి నివారణ పొందే ఉద్దేశం. షిర్క్ లేదు కాబట్టి ఇది ధర్మ సమ్మతమే అని కొంతమంది పండితుల అభిప్రాయం.

కాకపోతే, అత్యధిక శాతం, ఎక్కువ మంది ధర్మ పండితులు ఇటువంటి తావీజు కూడా ధర్మ సమ్మతం కాదు అని అంటారు. ఆ లిఖించటంలో, ఆ తావీజులో, ఆ కాగితంలో ఖుర్ఆన్ ఆయత్ మాత్రమే ఉన్నప్పటికిని అది ధర్మ సమ్మతం కాదు అని అంటారు అత్యధిక మంది ధర్మ పండితులు. ఉదాహరణకు, అబ్దుల్లా బిన్ మస్ఊద్ (రదియల్లాహు త’ఆలా అన్హు) పెద్ద సహాబీ, మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క పినతండ్రి కుమారుడు అబ్దుల్లా బిన్ అబ్బాస్ (రదియల్లాహు త’ఆలా అన్హు), హుజైఫా (రదియల్లాహు త’ఆలా అన్హు), ఉఖ్బా బిన్ ఆమిర్ (రదియల్లాహు త’ఆలా అన్హు) ఇలా, అబ్దుల్లా బిన్ మస్ఊద్ (రదియల్లాహు అన్హు) యొక్క శిష్యులు, ఒక ఉల్లేఖనం ప్రకారం ఇమామ్ అహ్మద్ బిన్ హంబల్ (రహ్మతుల్లాహి అలై), అలాగే వారి శిష్యులు, తర్వాతి తరాల వారు కూడా దీనినే కట్టుబడ్డారు, అంటే ఇది కూడా ఇటువంటి తావీజు కూడా ధర్మ సమ్మతం కాదు. అత్యధిక మంది పండితుల అభిప్రాయం ఇదే. ఆధారం ఏమిటి?

అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు,

إِنَّ الرُّقَى وَالتَّمَائِمَ وَالتِّوَلَةَ شِرْكٌ
(ఇన్నర్రుఖా వత్తమాఇమ్ వత్తివలా షిర్కున్)
“నిశ్చయంగా మంత్రాలు (షిర్క్ తో కూడినవి), తాయత్తులు మరియు తివలా (ఒక రకమైన క్షుద్ర విద్య) షిర్క్.” (ఇబ్ను మాజా)

అంటే ఈ విధంగా మంత్రించటం, తాయత్తులు వేయటం, తివలా, ఇది ఒక రకమైన చేతబడి, క్షుద్ర విద్య, షిర్కుతో కూడుకున్నది అని అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు.

అభిమాన సోదరులారా! కేవలం అల్లాహ్ నామాలు మాత్రమే, అల్లాహ్ గుణాలు మాత్రమే ఉన్నప్పటికీ అది ధర్మ సమ్మతం కాదు అని ఎందుకు అంటున్నారంటే మూడు కారణాల వల్ల అటువంటి తావీజు కూడా ధర్మ సమ్మతం కాదు అని అంటున్నారు. అది మూడు కారణాలు. ఒకటి ఏమిటి? సర్వసాధారణంగా తాయత్తులు కట్టడం పట్ల వారింపు ఉంది. సర్వసాధారణంగా తాయత్తులు కట్టరాదు, తావీజు వేయరాదు అని వాక్యాలు ఉన్నాయి, ప్రవచనాలు ఉన్నాయి. కావున ఈ సర్వసాధారణకి ప్రత్యేకంగా చేసే ఆధారం ఏదీ లేదు. ఒక విషయం సర్వసాధారణంగా ఉంది, దానికి ప్రత్యేకంగా ఏమైనా రుజువు కావాలి, ఆధారం కావాలి. ఆధారం లేకపోతే అది ధర్మ సమ్మతం అవ్వదు. అంటే మొదటి రకం, మొదటి విషయం ఏమిటి? సర్వసాధారణంగా తాయత్తులు కట్టడం వల్ల వారింపు ఉంది. ఈ సర్వసాధారణమును ప్రత్యేకంగా చేసే ఆధారం ఏదీ లేదు కనుక.

అలాగే రెండవ కారణం ఏమిటి? దీనిని ధర్మ సమ్మతం చేస్తే షిర్క్ ద్వారాలు తెరుస్తాయి. షిర్క్ ద్వారాలను మూసివేయటంలో ఈ వారింపు ఉపయుక్తంగా ఉన్నది కాగా తావీజులు వ్రేలాడదీయవచ్చన్న ఫతవా అనే ఇస్తే, షిర్కుతో కూడుకున్న తావీజును ప్రోత్సహించేందుకు ఆస్కారం ఉంది. అది ఏ విధంగానూ సమ్మతం కాదు. ఇది రెండో కారణం.

మూడోది ఏమిటి? ఖుర్ఆన్ ఆయతులను తావీజుగా చేసి మెడలో, చేతులు వేసుకుంటే తప్పకుండా వాటి పట్ల అమర్యాదకరంగా ప్రవర్తిస్తారు. తప్పనిసరిగా అవుతుంది అది. ఎందుకంటే తావీజు వేసుకొని బాత్రూంకి పోవాలి, కాలకృత్యాలు పూర్తి చేసుకోవాలి, మనిషి ఒకసారి జునుబీ స్థితిలో ఉంటాడు, అశుద్ధ స్థితిలో ఉంటాడు, వివాహం అయిన వారు సంభోగించుకుంటారు భార్యాభర్తలు. మరి మెడలో ఖుర్ఆన్ వాక్యాలు, అల్లాహ్ నామము, చేతిలో అల్లాహ్ వాక్యాలు, ఖుర్ఆన్ వాక్యాలు, అల్లాహ్ నామాలు, అల్లాహ్ పేరు, అల్లాహ్ గుణ విశేషాలు ఇవి మన శరీరంలో పెట్టుకొని మనము బాత్రూం కి పోవటం ఏమిటి? కాలకృత్యాలు తీసుకోవటం ఏమిటి? జునుబీ స్థితిలో ఉండటం ఏమిటి? ఈ విధంగా చాలా కారణాలు ఉన్నాయి, అమర్యాద అవుతుంది ఆ ఈ ఖుర్ఆన్ వాక్యాల విషయంలో. కావున ఈ మూడు కారణాల వల్ల ఆ తావీజులో ఖుర్ఆన్ వాక్యాలు మాత్రమే ఉన్నప్పటికిని అది ధర్మ సమ్మతం కాదు అని పండితుల అత్యధిక మంది పండితుల అభిప్రాయం ఇది.

అభిమాన సోదరులారా! ఇప్పుడు వరకు నేను చెప్పిన మాటల్లో సారాంశం రెండు రెండు విషయాలు. ఒకటి, ధర్మ సమ్మతమైన తావీజు, దాంట్లో ఎటువంటి షిర్క్ పదాలు ఉండకూడదు. కేవలం అల్లాహ్ వాక్యాలు, అల్లాహ్ నామం, అల్లాహ్ గుణాలు మాత్రమే ఉండాలి. అటువంటి తావీజు ధర్మ సమ్మతమని కొంతమంది మాత్రమే ధర్మ సమ్మతం అంటున్నారు. కాకపోతే, రెండో విషయం ఏమిటి? అత్యధిక మంది ధర్మ పండితులు అటువంటి తావీజు కూడా ధర్మ సమ్మతం కాదు. ఎందుకంటే ఈ మూడు కారణాలు. మొదటి కారణం ఏమిటి? సాధారణంగా అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రతీ తావీజు షిర్క్ అన్నారు. దానికి ప్రత్యేకం చేయటానికి ఆధారం లేదు. ఇది మొదటి కారణం. రెండో కారణం ఏమిటి? ఇది షిర్క్‌కి దారి తీస్తుంది. రెండో కారణం. మూడో కారణం ఏమిటి? అల్లాహ్ వాక్యాల పట్ల, అల్లాహ్ నామం పట్ల, అల్లాహ్ గుణ విశేషాల పట్ల అమర్యాద కలుగుతుంది, అగౌరవం కలుగుతుంది. ఈ కారణాల వల్ల రుజువు లేదు కాబట్టి అటువంటి తావీజు కూడా ధర్మ సమ్మతం కాదు అని అత్యధిక మంది పండితుల అభిప్రాయం.

కావున, మనము తావీజు కట్టుకోకుండా, తావీజు వ్రేలాడదీసుకోకుండా అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క విధానాన్ని అనుసరించి మనము మంత్రించి ఊదుకోవాలి, అది ఆధారం ఉంది కదా! ఆరోగ్యం బాగాలేదు, ప్రవక్త గారు కొన్ని దుఆలు, కొన్ని వాక్యాలు నేర్పించారు. ఖుర్ఆన్ వాక్యాలు ఉన్నాయి, అల్లాహ్ నామాలు ఉన్నాయి, అల్లాహ్ గుణాలు ఉన్నాయి. అవి మంత్రించి, పఠించి ఊదుకోవచ్చు. రోగిపై పఠించి ఊదవచ్చు. నీళ్ళపై మంత్రించి ఆ నీళ్ళు తాగవచ్చు, త్రాపించవచ్చు. ఈ విధానం ఉంది కదా. లేని విధానాన్ని, దాంట్లో షిర్క్ అనే అనుమానం ఉంది, అటువంటి విధానాన్ని ఎన్నుకోవడం కరెక్ట్ కాదు.

ఇక తావీజు విషయంలో రెండో రకం, రెండో కోవకు చెందిన తావీజు, ఇప్పుడు అది ఒక వ్యాపారంగా మారిపోయింది. అది ఎటువంటి పరిస్థితుల్లో ధర్మ సమ్మతం కాదు, అధర్మం, షిర్క్ మరియు హరామ్. అంటే, ఖుర్ఆన్ సూక్తులు ఆధారం కాని, ఆధారం లేని తావీజులు. అంటే గవ్వలు, పూసలు, దారాలు, వెంట్రుకలు, చిప్పలు, భూత పిశాచాల పేర్లు ఇత్యాదివి. ఇలాంటివి చాలా ఉన్నాయి. ఈ రకమైన తావీజులు ముమ్మాటికి నిషిద్ధం, హరామ్, ధర్మ సమ్మతం కాదు, షిర్క్. అవి ఖచ్చితంగా షిర్క్ కిందికి వస్తాయి. ఎందుకంటే ఈ రకమైన వస్తువులలో అల్లాహ్ నామాల, వాక్యాల బదులు వాటిని ఇతరత్రా వాటితో ముడిపెట్టడం జరుగుతుంది, దైవేతరులను ఆశ్రయించడం జరుగుతుంది. కాగా హదీసులో ఇలా ఉంది, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు:

مَنْ تَعَلَّقَ تَمِيمَةً فَقَدْ أَشْرَكَ
(మన్ త’అల్లఖ తమీమతన్ ఫఖద్ అష్రక్)
ఎవరైతే తాయత్తు వేలాడదీసుకున్నాడో, అతను షిర్క్ చేశాడు.” (ముస్నద్ అహ్మద్)

ఇంకో హదీసులో ఉంది:

مَنْ تَعَلَّقَ شَيْئًا وُكِّلَ إِلَيْهِ
(మన్ త’అల్లఖ షై’అన్ వుకిల ఇలైహి)
ఎవరైతే ఏదైనా వస్తువుతో (రక్షణ కోసం) సంబంధం పెట్టుకుంటాడో, అతను దానికే అప్పగించబడతాడు.” (తిర్మిజి)

ఎవరైనా ఏదైనా వస్తువుతో సంబంధం ఏర్పరుచుకుంటే అతను దాని పరమే చేయబడతాడు, అతని నమ్మకం దాని పైనే ఉంటుంది, అల్లాహ్ పైన నమ్మకం ఉండదు. అల్లాహ్ అతనికి పట్టించుకోడు. కావున ఇది షిర్క్ అవుతుంది. ప్రస్తుతం సమాజంలో చాలామంది అది ఒక వ్యాపారంగా చేసుకున్నారు. మీరు దాని గురించి అనుభవం చేసి చూడండి. కొన్ని తావీజులు ఓపెన్ చేసి చూస్తే, కొన్ని అక్షరాలు ఉంటాయి, అర్థం కాని అక్షరాలు ఉంటాయి. అరబీ భాష కావచ్చు, అరబీ భాష కాకపోవచ్చు, అర్థం కాని భాష ఉంటుంది, అర్థం కాని అక్షరాలు ఉంటాయి. కొన్ని తావీజులలో అడ్డంగా, దిడ్డంగా గీతలు ఉంటాయి. కొన్ని తావీజులలో లెక్కలు ఉంటాయి. ఇదన్నీ ఎవరు నేర్పించారు? ఇవన్నీ హరామ్, ఇవన్నీ షిర్క్ కిందికి వస్తుంది, అధర్మం.

కావున, మనం అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నేర్పించిన విధానాన్నే అనుసరించాలి. రోగానికి గురైనప్పుడు ప్రవక్త గారు మనకి ఏం నేర్పించారు? పిల్లలకి దిష్టి తగలకుండా ఉండాలంటే ప్రవక్త గారు నేర్పించారు. జ్వరం వస్తే ఏం చేయాలి? బాధకి గురైతే ఏం చేయాలి? నష్టానికి గురైతే ఏం చేయాలి? భయంలో ఏం చేయాలి? ప్రయాణంలో ఏం చేయాలి? అల్హమ్దులిల్లాహ్! అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మనకి ప్రతీ విధానం నేర్పించారు. ప్రతీ విషయంలో, ప్రతీ సమయంలో, ప్రతీ సబ్జెక్టులో మనకు నేర్పించారు. వివాహంలో, సంభోగం సమయంలో, దుస్తులు వేసుకునేటప్పుడు, ఇంట్లో ప్రవేశించేటప్పుడు, ఇంటి నుంచి బయటికి పోయేటప్పుడు, ఉదయం సాయంత్రం దుఆలు, అజాన్‌కి ముందు అజాన్ తర్వాత, మస్జిద్‌కి పోయేటప్పుడు బయటికి వచ్చేటప్పుడు, బాధ కలిగినప్పుడు, భయం ఉన్నప్పుడు, టెన్షన్‌లో ఉన్నప్పుడు, అప్పులో ఉన్నప్పుడు, అప్పులు తీర్చేటప్పుడు ప్రతీ సమస్యకి, ప్రతీ రోగానికి, ప్రతీ కష్టానికి అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మనకు ఒక పద్ధతి నేర్పించారు, ఒక విధానం నేర్పించారు.

మరి మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనకి ఏం నేర్పించినా,

وَمَا يَنطِقُ عَنِ الْهَوَىٰ إِنْ هُوَ إِلَّا وَحْيٌ يُوحَىٰ
(వమా యంతిఖు అనిల్ హవా, ఇన్ హువ ఇల్లా వహ్యున్ యూహా)
అతను తన మనోభిరామం ప్రకారం మాట్లాడటమూ లేదు. అది (అతను మాట్లాడేదంతా) అతని వద్దకు పంపబడే దైవవాణి (వహీ) తప్ప మరేమీ కాదు. (53:3-4)

అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మనకు అల్లాహ్ తరఫు నుంచే నేర్పుతారు. కావున, మనము ప్రతీ చిన్న పెద్ద షిర్క్ నుండి దూరంగా ఉండాలి. షిర్క్ చాలా ఘోరమైన నేరం, డేంజర్ విషయం అది. షిర్క్ చాలా ఘోరం. కావున, ఈ తావీజు కూడా షిర్క్ కిందికి వస్తుంది. కావున మనం ఈ షిర్క్ నుండి దూరంగా ఉండాలి, ఈ తావీజులు, తాయత్తులతో దూరంగా ఉండాలి. సమాజంలో ఈ బాబాలు, పీర్లు, వీళ్ళు దీనిని ఒక వ్యాపారంగా చేసుకున్నారు. ఇస్లాంలో ఎటువంటి దీనికి స్థానం లేదు. ఇది ధర్మ సమ్మతం కాదు. ఇది గుర్తుంచుకోండి. ఒకవేళ మనకి రోగం వచ్చినా, మన పిల్లలకి రోగాలు వచ్చినా, వారికి దిష్టి తగలకుండా ఉండాలన్నా ప్రవక్త గారు నేర్పించారు. కావున మీరు దుఆల పుస్తకం ఆధారంగా ఉన్న ప్రామాణికమైన హదీసుల పరంగా దుఆలు మనకు ఉన్నాయి, ఆ దుఆలు పఠించండి, ప్రవక్త గారి విధానాన్ని అనుసరించండి. ఇన్షా అల్లాహ్ ఇహపర లోకాలలో సాఫల్యం దక్కుతుంది ఇన్షా అల్లాహ్.

అభిమాన సోదరులారా! కావున ఇంతటితో నేను నా మాటలను ముగిస్తూ, ఇన్షా అల్లాహ్ మరిన్ని విషయాలు వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. అప్పటివరకు సెలవు.

وَآخِرُ دَعْوَانَا أَنِ الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ
(వ ఆఖిరు ద’వానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్)
మా చివరి ప్రార్థన ఏమిటంటే, సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కే సర్వ స్తోత్రాలు.

వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=24530

మంత్రించి ఊదటం, తావీజులు కట్టటం – డా. సాలెహ్ అల్ ఫౌజాన్ [PDF] [4పేజీలు]

ఆపద దూరమగుటకు, లేదా అది రాకుండా తాయత్తులు, పూసలు మరియు గవ్వలు వేసుకోకు – ధర్మపరమైన నిషేధాలు [వీడియో] [6 నిముషాలు]

దిష్టి తగలకుండా బుగ్గకి నల్ల చుక్క లేదా కాళ్ళకి నల్ల దారం కట్టవచ్చా? [వీడియో]

తౌహీద్ & షిర్క్ (మెయిన్ పేజీ):
https://teluguislam.net/tawheed-shirk/

నమాజ్ లో సుత్రా నిబంధన [వీడియో & టెక్స్ట్]

నమాజ్ చదివేటప్పుడు మనిషి తన ముందు ఏదైనా అడ్డంకిని పెట్టుకోవడాన్ని సుత్రా (తెర) అంటారు

నమాజ్ లో సుత్రా నిబంధన
https://youtu.be/jZgcgvh3Aho [8 నిముషాలు]
వక్త: ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, నమాజు చేసేటప్పుడు ప్రార్థన చేసే వ్యక్తికి ముందు ఉంచే అడ్డంకి అయిన ‘సుత్రా’ యొక్క ప్రాముఖ్యత వివరించబడింది. సుత్రా అంటే ఏమిటి, దాని ఉద్దేశ్యం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సున్నత్ (విధానం)లో దాని స్థానం మరియు దాని సరైన పరిమాణం గురించి చర్చించబడింది. వ్యక్తిగత మరియు సామూహిక నమాజులో సుత్రాను ఎలా ఉపయోగించాలో కూడా వివరించబడింది; సామూహిక ప్రార్థనలో, ఇమామ్ యొక్క సుత్రా జమాఅత్ మొత్తానికి సరిపోతుంది. నమాజు చేస్తున్న వ్యక్తి ముందు నుండి నడిచి వెళ్లడం యొక్క తీవ్రమైన పాపం గురించి మరియు ప్రార్థన చేసే వ్యక్తికి వారిని ఆపడానికి ఉన్న హక్కు గురించి కూడా ప్రసంగంలో హెచ్చరించబడింది. ఇరుకైన ప్రదేశాలలో ప్రార్థన చేసే సందర్భంలో, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితం నుండి ఉదాహరణలతో పాటు, కొన్ని మినహాయింపులు కూడా చర్చించబడ్డాయి.

أَلْحَمْدُ لِلّٰهِ
(అల్ హందులిల్లాహ్)
సర్వ స్తోత్రాలు అల్లాహ్ కే

وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى رَسُولِ اللّٰهِ
(వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్)
మరియు అల్లాహ్ యొక్క శాంతి మరియు శుభాలు ఆయన ప్రవక్తపై వర్షించుగాక

అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడైన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించుగాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించుగాక. (ఆమీన్)

సోదర సోదరీమణులారా మీ అందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను.

اَلسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ
(అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు)
మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక

ఈనాటి ప్రసంగంలో మనం సుత్రా గురించి తెలుసుకుందాం.

సుత్రా అంటే ఏమిటి? ఒక వ్యక్తి నమాజు ఆచరిస్తున్నప్పుడు ఖిబ్లా వైపు నిలబడి నమాజు ఆచరిస్తున్న ప్రదేశంలో ఎంత దూరం వరకు అయితే అతను సజ్దా చేయగలుగుతాడో, అంత దూరపు ప్రదేశానికి కొంచెం ముందర ఒక వస్తువుని ఉంచుకోవటాన్ని సుత్రా అని అంటారు.

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి బోధనా విధానాలలో ఇది కూడా ఒక సున్నతు, ఒక బోధనా విధానము. నమాజు ఒక వ్యక్తి ఒక విశాలమైన ప్రదేశంలో ఆచరించుకుంటూ ఉంటే అతను అతని ముందర ఖిబ్లా దిశలో ఒక వస్తువుని ఏదైనా, అది కర్ర కావచ్చు లేదా కుర్చీ కావచ్చు లేదా ఇంకేదైనా కావచ్చు, ఒక వస్తువుని అక్కడ ఉంచుకోవాలి.

అది ఒక రకంగా అటూ ఇటూ ఎవరైనా నడిచే వారికి ఒక సూచన లాంటిది. ఇంతటి ప్రదేశం వరకు నేను నమాజు చేస్తున్న ప్రదేశము, దీని పక్క నుంచి మీరు వెళ్ళండి, దీని లోపల అయితే నేను నమాజు చేస్తున్న ప్రదేశము అనేటట్టుగా ఒక సూచన ఉంటుంది. చూసే వ్యక్తి కూడా ఆ, ఆ ప్రదేశం వరకు అతను నమాజ్ చేసుకుంటున్నాడు అని దాని పక్క నుంచి దూరంగా వెళ్ళే ప్రయత్నం చేస్తాడు. దీనిని సుత్రా అంటారు.

మరి ఆ సుత్రా ఎంతటి వస్తువు ఉండాలి అంటే హదీసు గ్రంథాలలో తెలుపబడిన విషయం, పల్లకి వెనుక భాగంలో ఉన్న వస్తువు అంత అయితే సరిపోతుంది అని తెలుపబడింది. ధార్మిక పండితులు దాన్ని వివరిస్తూ ఏమన్నారంటే, ఒక మూర కంటే కొంచెం చిన్నదైనా సరే సరిపోతుంది అని చెప్పారు. మూర కంటే తక్కువ ఎత్తు గల వస్తువు అయినా సరే దానిని ఉంచుకొని మనిషి నమాజ్ ఆచరించుకోవాలి.

మరి సుత్రా పెట్టుకోవటం ఇది సున్నత్ అని కూడా ధార్మిక పండితులు వివరించి ఉన్నారు.

సుత్రా ఉంచుకున్న విషయాలలో మనం చూసినట్లయితే వ్యక్తిగతంగా ఒక వ్యక్తి నమాజ్ ఆచరించుకుంటూ ఉంటే అతను ప్రత్యేకంగా అతని కోసము సుత్రా ఉంచుకోవాలి. ఒకవేళ సామూహికంగా మనిషి నమాజ్ ఆచరించుకుంటూ ఉన్నట్లయితే ఇమామ్ ముందర సుత్రా ఉంచుకుంటే సరిపోతుంది, వెనుకల నిలబడిన ప్రతి వ్యక్తి ముందర సుత్రా ఉంచుకోవాల్సిన అవసరం లేదు. ఇమామ్ ముందర ఉంచుకోబడిన సుత్రాయే అతని వెనుక, ఆయన వెనుక నిలబడిన ముక్తదీలందరికీ కూడా సరిపోతుంది అని కూడా ధార్మిక పండితులు తెలియజేశారు.

అలాగే నమాజ్ ఆచరిస్తున్న వ్యక్తి అతని ముందర వేరే వ్యక్తి, పురుషుడైనా, మహిళ అయినా పడుకొని ఉంటే స్థలం లేని సందర్భంలో వారి వెనుక కూడా నిలబడి నమాజ్ ఆచరించుకోవచ్చు. మస్జిదులో మనం చూస్తూ ఉంటాం. కొందరు వ్యక్తులు కూర్చొని ఉంటారు. వారి వెనుక మనము కూడా నిలబడి నమాజ్ ఆచరించుకోవచ్చు. అలాగే ఇరుకైన గది ఉంటే అక్కడ సతీమణి ఎవరైనా కూర్చొని ఉన్నా లేదా పడుకొని ఉన్నా, మిగిలిన కొద్ది స్థలంలోనే వ్యక్తి నిలబడి నమాజ్ ఆచరించుకోవాలంటే ఆచరించుకోవచ్చు.

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితాన్ని చూడండి, ఆయిషా రజియల్లాహు తాలా అన్హా వారు తెలియజేశారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రాత్రిపూట తహజ్జుద్ నమాజు కోసం లేచి నిలబడినప్పుడు, నేను ఖిబ్లా దిశలో పడుకొని ఉంటాను, మిగిలిన ప్రదేశంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నిలబడి నమాజ్ ఆచరించుకునేవారు. ఒక్కొక్కసారి అనుకోకుండా నా కాలు ఆయన సజ్దా చేసే స్థితికి వెళ్ళిపోతే ఆయన సజ్దా చేసేటప్పుడు అలా తట్టి నాకు సైగ చేస్తే నేను వెంటనే కాలు ముడుచుకునే దానిని అని కూడా తెలియజేశారు. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఆయిషా రజియల్లాహు తాలా అన్హా ఖిబ్లా దిశలో పడుకొని ఉంటే నమాజ్ ఆచరించుకునేవారు, పూర్తి నమాజ్ అయిపోయాక వితర్ నమాజ్ ఆచరించుకునే సమయానికి ఆమెకు కూడా లేపి వారు ఇద్దరూ కలిసి చివరిలో వితర్ నమాజు కలిసి ఆచరించుకునేవారు అని తెలియజేశారు. కాబట్టి పురుషుడు గాని మహిళ గాని ఖిబ్లా దిశలో పడుకొని ఉన్నా మిగిలిన ప్రదేశంలో వ్యక్తి నిలబడి నమాజ్ ఆచరించుకోవాలంటే కూడా ఆచరించుకోవటానికి అనుమతి ఉంది.

ఇక్కడ రెండు విషయాలు మనము బాగా గుర్తుంచుకోవాలి. అదేమిటంటే, నమాజ్ ఆచరిస్తున్న వ్యక్తి అతను సజ్దా చేసే ప్రదేశం ఎంత దూరం వరకు అయితే ఉంటుందో, ఆ లోపు నుంచి దాటుకునే ప్రయత్నం చేయరాదు. అది ఒక పాపంగా పరిగణించబడుతుంది. దాని నష్టం ఎంత పెద్దది అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ఒక వ్యక్తి 40 రోజులు లేదా 40 వారాలు లేదా 40 నెలలు లేదా 40 సంవత్సరాలు ఒంటి కాలు మీద నిలబడిపోవడానికైనా సరే సిద్ధపడిపోతాడు గానీ ఆ పాపం చేయటానికి సిద్ధపడడు. అంత కఠినమైనది ఆ తప్పు అని చెప్పారు. కాబట్టి నమాజ్ ఆచరిస్తున్న వ్యక్తి ముందర నుంచి, అతను సజ్దా చేసే ప్రదేశం ఎంతవరకు అయితే ఉంటుందో, దాని లోపలి నుంచి దాటుకునే ప్రయత్నం ఎప్పటికీ చేయరాదు. అది ఒక కఠినమైన తప్పుగా మనము తెలుసుకొని దాని నుంచి దూరంగా ఉండాలి.

రెండో విషయం ఏమిటంటే, తెలియక, చూడకుండా ఎవరైనా ఒక వ్యక్తి అక్కడి నుంచి దాటుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే, నమాజ్ ఆచరించే వ్యక్తికి ఆ వ్యక్తిని చేతితో అడ్డుకునే అనుమతి ఉంది. అతను చేతితో అడ్డుకోవాలి. అతను మూర్ఖంగా ముందుకే సాగటానికి ప్రయత్నం చేస్తే ప్రతిఘటించి అతన్ని పక్కకు జరిపే ప్రయత్నం చేయాలి, వదలకూడదు అని కూడా తెలియజేయడం జరిగింది.

ఏది ఏమైనప్పటికిని మనిషి ఒక గోడ వెనుక గాని లేదా ఏదైనా వస్తువు వెనుక గాని సుత్రాగా ఏర్పరచుకొని నమాజ్ ఆచరించుకోవాలి. ఇది ఒక విధానము, ఒక సున్నత్ విధానము మనకు తెలుపబడింది. అల్లాహ్ తో నేను దుఆ చేస్తున్నాను, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మమ్మల్ని అందరినీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసిన విధానాలన్నీ తెలుసుకొని ఒక్కొక్కటిగా అర్థం చేసుకొని ఆచరించే భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్.

اَلسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ
(అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు)
మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక

క్రింది విషయం “దైవ ప్రవక్త నమాజు స్వరూపం – షేఖ్ అల్ అల్బానీ (రహిమహుల్లాహ్)”  అనే పుస్తకం నుండి తీసుకోబడింది (పేజీలు: 100-104)

సుత్రా మరియు, దాన్ని పాటించటం విధి అన్న విషయం గురించి:

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సుత్రాకు ఎంత దగ్గరగా నిలబడే వారంటే ఆయనకు – గోడ (సుత్రా)కు మధ్య మూడు చేతుల దూరం మాత్రమే ఉందేది.[38] ఆయన సజ్దా చేసే చోటికి – గోడ (సుత్రా)కు మధ్య ఒక మేక దూరి పోయేంత స్థలం మాత్రం ఉందేది. [39]

ఆయన ఇలా ప్రబోధించేవారు: “మీరు సుత్రా లేకుండా నమాజ్‌ చేయకండి.”

“మీ ముందు నుంచి ఎవర్నీ నడచి వెళ్ళనివ్వకండి. ఒకవేళ అతను అందుకు ఒప్పుకోక పోతే అతనితో తలపడండి. ఎందుకంటే అతనితోపాటు షైతాన్‌ ఉంటాడు.” [40]

ఆయన ఇంకా ఇలా అంటుండేవారు: “మీలో ఎవరైనా (ఎదుట) సుత్రా పెట్టుకుని నమాజ్‌ చేస్తున్నట్లయితే అతను దానికి దగ్గరగా ఉండాలి. షైతాన్‌ తన నమాజును చెడగొట్టకుండా ఉండాలంటే అతను అలా చెయ్యాలి మరి!”[41]

కొన్ని సార్లు ఆయన తన మస్జిద్ లోని  స్తంభం దగ్గర నమాజ్‌ చేయటానికి ప్రయత్నించేవారు. [42]

అడ్డు (సుత్రా)గా ఏ వస్తువూ లేనటవంటి విశాల మైదానంలో నమాజ్‌ చేయాలనుకున్నప్పుడల్లా ఆయన తన ఎదుట ఒక బరిసెను పాతుకునేవారు. దాని వైపు తిరిగి నమాజ్‌ చేసేవారు. ఆయన వెనుక జనం బారులు తీరేవారు. [43] అప్పుడప్పుడూ తన ఆడ ఒంటెను ఎదుట అడ్డంగా నిలబెట్టి దాని వైపు తిరిగి నమాజ్‌ చేసేవారు.[44] ఈ విధంగా నమాజ్‌ చేయటం అనేది ఒంటెల కొట్టంలో నమాజ్‌ చేయటం వంటిది కాదు. ఎందుకంటే ఆయన అసలు “ఆ ప్రదేశంలో నమాజ్‌ చేయటాన్నే వారించారు.”[45] కొన్నిసార్లు ఆయన ఒంటె అంబారీ నిటారుగా నిలబెట్టి దాని వెనుక భాగాన్ని అడ్డంగా ఉంచి నమాజ్‌ చేసేవారు [46] మరియు ఇలా అంటుండేవారు;

“మీలో ఎవరైనా తన ఎదుట ఒంటె అంబారీ వెనుక భాగపు కర్ర వంటిది ఏదయినా పెట్టుకొని నమాజ్‌ చేస్తున్నట్లయితే ఆ కర్రకు ఆవల నుంచి ఏ వస్తువు నడిచి వెళ్ళనా ఇక దాన్ని అతను పట్టించుకోవాల్సిన అవసరం లేదు” [48]

ఒకసారి ఆయన ఒక చెట్టు వైపు తిరిగి నమాజ్‌ చేశారు. (అంటే ఆ చెట్టుని సుత్రాగా పెట్టుకొని నమాజ్‌ చేశారు). [49] కొన్నిసార్లు ఆయన మంచానికి ఎదురుగా నిలబడి నమాజ్‌ చేసేవారు. ఆ సమయంలో ఆయేషా (రజిఅల్లాహు అన్హ) మంచం మీద తన దుప్పట్లో పడుకొని ఉండేవారు. [50]

తనకూ – తన సుత్రాకు మధ్య నుంచి ఏ వస్తువునీ వెళ్ళనిచ్ఛేవారు కాదు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం). ఒకసారి ఏమయిందంటే, ఆయన నమాజ్‌ చేస్తున్నారు. అప్పుడే ఒక మేక పరుగెత్తుకుంటూ వచ్చి ఆయన ముందు నుంచి వెళ్ళబోయింది. కాని ఆయన కూడా తొందరగా ముందుకుపోయి [51] ఉదరభాగంతో గోడకు ఆనుకున్నారు. దాంతో ఆ మేక పిల్ల ఆయన వెనుక నుంచి దాటి వెళ్ళిపోయింది. [52]

ఒకసారి ఆయన ఫర్జ్ నమాజ్‌ చేస్తున్నారు. (నమాజ్‌లోనే) పిడికిలి బిగించారు. నమాజ్‌ ముగిసిన తర్వాత ప్రజలు “దైవప్రవక్తా! నమాజులో ఏదైనా కొత్త విషయం జరిగిందా?” అని అడిగారు. అందుకాయన “కొత్త విషయం ఏమీ లేదుగాని షైతాన్‌ నా ముందు నుంచి దాటి వెళ్ళబోయాడు. దాంతో నేను వాడి గొంతు పిసికాను. అప్పుడు నా చేతికి వాడి నాలుక చల్లదనం కూడా తగిలింది. దైవంసాక్షి నా సోదరుడు సులైమాన్‌ నా కంటే ముందు ప్రార్ధన చేసి ఉండకపోతే ఆ పైతాను మస్జిద్ లోని ఏదో ఒక స్తంభానికి కట్టబడి ఉండేవాడు. మదీనా నగర పిల్లలు సయితం వాణ్ని చూసుండేవారు. (కనుక నేను చెప్పేది ఏమంటే) తనకూ-ఖిబ్లాకు మధ్య నుంచి ఎవర్నీ వెళ్ళకుండా ఆపగలిగే వీలున్నవాడు తప్పకుండా అలా చేయాలి. ” [53]

ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా చెబుతుండేవారు: “మీలో ఎవరైనా ఏదైనా వస్తువును అడ్డుగా పెట్టుకొని నమాజ్‌ చేస్తున్నప్పటికీ ఇంకెవరైనా అతని ముందు నుంచి వెళ్ళగోరితే వాణ్ణి గొంతుపట్టుకొని వెనక్కి నెట్టాలి. వీలైనంత వరకు వాణ్ణి ఆపటానికి ప్రయత్నం చేయాలి. (మరో ఉల్లేఖనంలో రెండోసారి కూడా వాణ్ణి ఆపాలి అని ఉంది. ) అప్పటికి వాడు వినకపోతే ఇక వాడితో తలపడాలి. ఎందుకంటే వాడు షైతాను” [54]

ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇంకా ఇలా అంటుండేవారు: “నమాజు చేస్తున్న వ్యక్తి ముందు నుంచి వెళ్ళటం ఎంత పాపమో తెలిస్తే ఆ వ్యక్తి నమాజ్‌ చేస్తున్న వాని ముందు నుంచి వెళ్లటం కంటే నలభై వరకు అక్కడే ఎదురుచూస్తూ ఉండిపోవటం తన కొరకు శ్రేయస్కరం అనుకుంటాడు.” (హదీసు ఉల్లేఖకులు అబూ నద్ర్‌ కథనం: నలభై అంటే దైవప్రవక్త రోజులు, నెలలు, సంవత్సరాలలో దేనిని సెలవిచ్చారో నాకు గుర్తులేదు. – అనువాదకులు) [55]

హదీసు రిఫరెన్సులు & అల్బానీ వ్యాఖ్యలు :

[38] బుఖారీ, అహ్మద్‌

[39] బుఖారీ, ముస్లిం

[40] సహీ ఇబ్నె ఖుజైమా (1/93/1) – మంచి పరంపరతో.

[41] అబూదావూద్‌, జవాయెద్‌ బజ్జార్‌ – 54 పేజీ, హాకిమ్‌ – తను దీనిని సహీగా ఖరారు చేశారు. జహబీ, నవవీ దీనితో ఏకీభవించారు.

[42] నేను చెప్పేదేమిటంటే – ఇమామ్‌ అయినా, ఒంటరిగా నమాజ్‌ చేసే వ్యక్తి అయినా, ఒకవేళ మస్జిద్ పరిమాణం పెద్దదైనప్పటికీ, అందరికోసం ‘సుత్రా’ తప్పనిసరి. ఇబ్నె హానీ తన గ్రంథం ‘మసాయల్‌ ఇమామ్‌ అహ్నద్‌”-1/66 నందు యిలా పేర్కొన్నారు: అబూ అబ్దుల్లా అంటే ఇమామ్‌ అహ్మద్‌ ఓ రోజు నన్ను, సుత్రా లేకుండా నమాజు చేయడం చూసి ‘దేనినయినా సుత్రాగా ఉపయోగించుకో‘ అని ఉపదేశించారు. తదుపరి నేను ఒక వ్యక్తిని సుత్రాగా ఉపయోగించుకున్నాను.

నేను చెప్పేదేమిటంటే – ఇమామ్‌ అహ్మద్‌ తన మాటల ద్వారా – మస్జిద్ పరిమాణం పెద్దదైనా, చిన్నదైనా – సుత్రా ఉపయోగించడంలో వ్యత్యాసం చూపకూడదు అన్న విషయం సూచించారు. ఇదే సత్యం కూడాను.

నేను సందర్శించిన దేశాలలో గమనించిందేమిటంటే – సాధారణంగా నమాజీలు – వారు ఇమాములైనా లేదా సాధారణ వ్యక్తులైనా, సుత్రా విషయంలో తగిన శ్రద్ధ వహించడం లేదు. ఈ దేశాల్లో సౌది అరేబియా కూడా చేరి ఉంది. అక్కడికి నేను 1410 హి. రజబ్‌ మాసంలో వెళ్లాను.

అందుకే, ఉలమాలపై వున్న బాధ్యత ఏమిటంటే – వారు ఈ విషయం గురించి ప్రజలకు హెచ్చరించాలి మరియు సుత్రాకు సంబంధించిన అన్ని వివరాలను వారికి తెలియజేయాలి. సుత్రా ఆజ్ఞల విషయంలో మస్జిదె హరాం మరియు మస్జిదె నబవి కూడా చేరి వున్నాయన్న విషయం వారికి బోధపరచాలి.

[43] బుఖారీ, ముస్లిం, ఇబ్నె మాజా

[44][45] బుఖారీ, అహ్మద్‌

[46] ముస్లిం, ఇబ్నె ఖుజైమా – 2/92, అహ్మద్‌

[47] అంబారీ వెనుకభాగంలో వుండే కర్రను ‘మోఖిరా’ అంటారు.

[48] ముస్లిం, అబూదావూద్‌

[49] నసాయి, అహ్మద్‌ – సహీ పరంపరతో

[50] బుఖారీ,ముస్లిం, అబూ యాలా – 3/107 – తఫ్సీర్ అల్‌ మక్తబతుల్‌ ఇస్లామీ 

[51] హదీసులో ‘సా ఆహా’ అన్న పదం వచ్చింది. అంటే “ఇతరులను మించిపోవడం” అన్నమాట.

[52] సహీ ఇబ్నె ఖుజైమా (1/95/1), తటబ్రానీ (3/140/3), హాకిమ్‌ దీనిని సహీగా ఖరారు చేశారు, జహబీ దీనితో ఏకీభవించారు.

[53] అహ్మద్‌, దారెఖు,త్నీ  తబ్రానీ – సహీ పరంపరతో.

ఈ అర్ధాన్ని స్ఫురించే ఉల్లేఖనాలు బుఖారీ, ముస్లింలలో వున్నాయి. అంతేకాక, సహాబాల ఒక సమూహం ద్వారా కూడా ఈ అర్ధంతో కూడుకున్న ఉల్లేఖనాలు ఇతర గ్రంథాల్లో వచ్చాయి.

ఖాదియానీలు తిరస్కరించే హదీసులలో ఇదొకటి. ఎందుకంటే ఖురాను, హదిసులలో వివరించబడ్డ జిన్నుల లోకాన్ని వారు విశ్వసించరు. షరీయత్తులోని స్పష్టమైన ఆధారాలను వారు తిరస్కరించడం అనేది ఎవరికీ తెలియని విషయం కాదు. ఒకవేళ ఆధారం ఖుర్‌ఆన్‌లో వుంటే – వారు దాని అర్ధాన్నే మార్చిస్తారు. ఉదాహరణకు : “ఓ ప్రవక్తా! జిన్నాతుల సమూహం ఒకటి (శ్రద్ధగా విని, ఆ తర్వాత …… (జిన్న్‌: 1) ఆయత్‌లో ‘జిన్నును మానవ జిన్న్‌గా తలపోన్తారు మరియు ‘జిన్న్’ పదాన్ని మానవమాత్రులుగా ఖరారు చేస్తారు.

ఇలా, ఈ విషయంలో వారు నిఘంటువు మరియు షరియత్తుల నుండి దూరం వెళ్ళి పోయారు. ఒకవేళ ఆధారాలు గనక హదీసుల్లో ఉంటే-వీలయితే వాటి అసలు అర్ధాన్నే మార్చేస్తారు లేదా అతి తేలికగా వాటిని అసత్యమని ఖరారు చేశారు. ఇలా, హదీసువేత్తలు, వారి వెనుక మొత్తం అనుచర సమాజం వాటి ప్రామాణికతపై ఏకాభిప్రాయం కలిగి వున్నప్పటికీ వీరు వాటిని తిరస్కరిస్తారు. అల్లాహ్‌ వారికి సన్మార్గం ప్రసాదించుగాక!

54, బుఖారీ, ముస్లిం.

55. బుఖారీ, ముస్లిం. ఈ ఉల్లేఖనం ఇబ్నె ఖుజైమా (1/94/1)లో వుంది.

నమాజు – మెయిన్ పేజీ
https://teluguislam.net/five-pillars/salah-namaz-prayer/

ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్) – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0B6tOQhDiqrHO4E3Ou_IL7

వుజూ విధానం (బుక్ & ఆడియో, టెక్స్ట్)

wudhu-steps

[ఇక్కడ చదవండి] [ఇక్కడ బుక్ డౌన్లోడ్ చేసుకోండి[ఆడియో వినండి
వక్త :- ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ

ఈ ఆడియో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చూపిన విధానంలో ‘వుదూ’ (శుద్ధి) ఎలా చేసుకోవాలో వివరిస్తుంది. మొదటగా, ఆదేశించబడిన రీతిలో వుదూ మరియు నమాజు చేయడం వల్ల కలిగే గొప్ప ఫలితాన్ని, అంటే పూర్వ పాపాలు మన్నించబడతాయని హదీసుల ద్వారా తెలియజేశారు. వుదూ చేయడానికి గల ముఖ్య గమనికలైన సంకల్పం (నియ్యత్), వరుస క్రమం, నీటి ఆదా మరియు ఒక అవయవం ఆరకముందే మరొకటి కడగడం (కంటిన్యూటీ) గురించి వివరించారు. అనంతరం బిస్మిల్లాహ్ తో మొదలుపెట్టి కాళ్లు కడగడం వరకు వుదూ యొక్క పూర్తి పద్ధతిని స్టెప్-బై-స్టెప్ గా విపులకరించారు. చివరగా, వుదూ తర్వాత చదవాల్సిన దుఆ మరియు దాని వల్ల స్వర్గపు ఎనిమిది ద్వారాలు తెరుచుకుంటాయనే శుభవార్తను తెలియజేశారు.

السلام عليكم ورحمة الله وبركاته، حامدا ومصليا أما بعد
[అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు, హామిదన్ వ ముసల్లియన్ అమ్మ బాద్]

వుదూ విధానం: ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎలా వుదూ చేశారో, అలాగే వుదూ చేయడం తప్పనిసరి. ప్రవక్త ఆదేశం:

مَنْ تَوَضَّأَ كَمَا أُمِرَ وَصَلَّى كَمَا أُمِرَ غُفِرَ لَهُ مَا قَدَّمَ مِنْ عَمَلٍ
[మన్ తవద్దఅ కమా ఉమిర వసల్ల కమా ఉమిర, ఘుఫిర లహు మా ఖద్దమ మిన్ అమల్]

ఎవరు ఆదేశించబడిన రీతిలో వుదూ చేసి, ఎవరు ఆదేశించబడిన రీతిలో నమాజు చేస్తారో, అతని పూర్వ చిన్న పాపాలు మన్నించబడతాయి. (సునన్ నసాయి: 144, ఇబ్నె మాజా: 1396).

మరో ఉల్లేఖనంలో ఉంది:

مَنْ تَوَضَّأَ نَحْوَ وُضُوئِي هَذَا
[మన్ తవద్దఅ నహ్వ వుదూఈ హాజా]
ఎవరు నా ఈ పద్ధతిలో వుదూ చేస్తారో (సహీహ్ బుఖారీ: 159).

  1. వుదూ నియ్యత్ అంటే సంకల్పం నోటితో పలకకుండా మనసులోనే చేయాలి. ఒక పని చేయుటకు మనసులో నిర్ణయించుకోవడమే నియ్యత్.
  2. రెండవ గమనిక: వుదూ క్రమంగా చేయాలి, క్రమం తప్పకూడదు.
  3. మూడవ గమనిక: వుదూ చేయునప్పుడు సాధ్యమైనంత వరకు నీళ్లు దుబారా అంటే వృధా ఖర్చు కాకుండా జాగ్రత్త పడాలి.
  4. నాలుగవ గమనిక: వుదూ చేయునప్పుడు ఒక అవయవం కడిగిన తర్వాత మరో అవయవం కడగడంలో ఆలస్యం చేయకూడదు.

వుదూ పద్ధతి ఇలా ఉంది:

ప్రారంభంలో “బిస్మిల్లాహ్” అనాలి.

తర్వాత రెండు అరచేతులను మణికట్ల వరకు మూడు సార్లు కడగాలి (ఫిగర్స్ చూడండి).

మూడు సార్లు నోట్లో నీళ్లు తీసుకొని పుక్కిలించి, ముక్కులో నీళ్లు ఎక్కించి శుభ్రం చేసుకోవాలి.

ఆ తర్వాత మూడు సార్లు ముఖం కడగాలి. అడ్డంలో కుడి చెవి నుండి ఎడమ చెవి వరకు, నిలువులో నుదుటి మొదటి భాగం నుండి గడ్డం కింది వరకు. ఇక దట్టమైన గడ్డం గలవారు తమ గడ్డంలో ఖిలాల్ చేయాలి. అయితే గడ్డాన్ని షేవ్ చేయడం గాని, కట్ చేయడం గాని ప్రవక్త విధానానికి వ్యతిరేకం.

ఆ తర్వాత రెండు చేతులు మూడేసి సార్లు కడగాలి. వేలు మొదటి భాగము నుండి మోచేతుల వరకు. ముందు కుడి చెయ్యి తర్వాత ఎడమ చెయ్యి.

ఆ తర్వాత ఒకసారి తల మసాహ్ చేయాలి. అంటే రెండు చేతులను తడి చేసి తల మొదటి భాగము నుండి వెనక మెడ వరకు తీసుకెళ్లి, మళ్లీ వెనక నుండి మొదటి వరకు తలను స్పర్శిస్తూ తీసుకురావాలి.

ఒకసారి రెండు చెవుల మసాహ్ చేయాలి. అంటే రెండు చూపుడు వేళ్లతో చెవి లోపలి భాగాన్ని, బొటన వేలితో పై భాగాన్ని స్పర్శించాలి.

ఆ తర్వాత రెండు కాళ్లు వేళ్ల నుండి చీలమండల వరకు మూడేసి సార్లు కడగాలి. ముందు కుడి కాలు తర్వాత ఎడమ కాలు.

చివరిలో ఈ దుఆ చదవాలి:

أَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللَّهُ وَأَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ
[అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్, వ అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు]

వుదూ చేసిన తర్వాత ఎవరైతే ఈ దుఆ చదువుతారో వారి కొరకు స్వర్గపు ఎనిమిది ద్వారాలు తెరువబడతాయి. అల్లాహు అక్బర్! ఎంత గొప్ప అదృష్టం అండి. ఈ దుఆ ప్రస్తావన సహీహ్ ముస్లిం షరీఫ్ లో వచ్చి ఉంది (హదీథ్ నెంబర్: 234).

ఈ పూర్తి వుదూ విధానం ఏదైతే మీరు విన్నారో సహీహ్ బుఖారీ (హదీథ్ నెంబర్: 159) మరియు అబూ దావూద్ (హదీథ్ నెంబర్: 108) లో ఉన్నది.

అల్లాహ్ యే ప్రవక్త పద్ధతిలోనే మనందరికీ వుదూ చేసే అటువంటి సద్భాగ్యం ప్రసాదించు గాక.

وآخِرُ دَعْوانا أَنِ الْحَمْدُ لِلَّهِ، وَالسَّلامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكاتُهُ.
[వ ఆఖిరు దావానా అనిల్ హం దులిల్లాహి, వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు]