జకాతు (విధి దానము) పై  సంక్షిప్త సందేశం – ఇమాం ఇబ్నె బాజ్ (రహిమహుల్లాహ్)

بِسْمِ اللهِ الرَّحْمَنِ الرَّحِيمِ
అనంత కరుణాప్రదాత మరియు అపార కృపాశీడైన అల్లాహ్ పేరుతో

అల్ హమ్ దు లిల్లాహి వహ్ దహ్, వస్సలాతు వస్సలాం అలా మన్ లా నబియ్య బఅదహ్, వఅలా ఆలిహీ వసహబిహి, అమ్మా బాద్ 

(సకల స్తోత్రములు, కృతజ్ఞతలు ఏకైకుడైన అల్లాహ్ కే శోభిస్తాయి, ఎవరి తరువాత అయితే మరే ప్రవక్తా రాడో, ఆ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై, ఆయన కుటుంబంపై, ఆయన సహచరులపై అల్లాహ్ అనేక దీవెనలు కురిపించుగాక, ఇక ఆ తరువాత):

జకాతు (విధి దానము) చెల్లించుట గురించి ప్రోత్సహించడం మరియు జ్ఞాపకం చేయడమే ఈ సందేశం వ్రాయడానికి అసలు ప్రేరణ. ఎందుకంటే చాలా మంది ముస్లింలు దానిని నిర్లక్ష్యం చేసి, దానిని సరైన విధంగా చెల్లించుట లేదు. దాని ఘనత మరియు అది ఇస్లాం యొక్క ఐదు మూలస్థంభాలలో ఒకటిగా ఉండటం మొదలైన కారణాల వలన, దాని మీద ఇస్లాం ధర్మం నిలబడి ఉన్నది;

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:

(بُنِيَ الإِسْلَامُ عَلَى خَمْسٍ : شَهَادَةِ أَنْ لَا إِلَهَ إِلَّا اللَّهُ وَأَنَّ مُحَمَّدًا رَسُولُ اللَّهِ وَإِقَامِ الصَّلَاةِ وَإِيتَاءِ الزَّكَاةِ وَصَوْمِ رَمَضَانَ وَحَجَ البَيْتِ))

“ఇస్లాం ఐదు విషయములపై నిర్మితమై ఉన్నది: అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్యుడు లేడని మరియు ముహమ్మద్ అల్లాహ్ యొక్క సందేశహరుడని సాక్ష్యమిచ్చుట, నమాజు స్థాపించుట, జకాత్ ఇచ్చుట, రమదాన్ ఉపవాసములు పాటించుట, అల్లాహ్ గృహము యొక్క హజ్ చేయుట.” ఈ హదీథు యొక్క ప్రామాణికత ఆమోదించబడింది.

ముస్లిములపై జకాతు విధి దానము విధించబడటం అనేది ఇస్లాం యొక్క అద్భుతమైన సుగుణాలలో ఒకటి, మరియు తన అనుచరుల అవసరాలను చూసుకోవటంలో ఇస్లాం ధర్మం యొక్క శ్రద్ధను ప్రతిబింబిస్తుంది; ఎందుకంటే జకాతు విధి దానము యొక్క ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి మరియు ముస్లిం పేదలకు దాని అవసరం ఎంతో ఉన్నది.

[1] జకాతు ప్రయోజనాలలో ఒకటి: ధనవంతుల మరియు పేదల మధ్య ప్రేమానుబంధాలను స్థిరపరుచడం: ఎందుకంటే మనకు ఉపకారం చేసిన వారిని ప్రేమించటానికి, అభిమానించటానికి ప్రకృతి సహజంగా మన మనస్సులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి

[2] జకాతు ప్రయోజనాలలో మరొకటి: మనస్సును శుద్ధి చేయుట మరియు మనస్సును పిసినారితనం, ఇంకా అలాంటి ఇతర దుష్ట గుణాలకు దూరంగా ఉంచడం, దీని గురించి పవిత్ర ఖుర్ఆన్ లో ఇలా పేర్కొనబడింది:

خُذْ مِنْ أَمْوَالِهِمْ صَدَقَةً تُطَهِّرُهُمْ وَتُزَكِّيهِم بِهَا …. [التوبة]
” (కావున ఓ ప్రవక్తా!) నీవు వారి సంపదల నుండి దానం తీసుకొని, దానితో వారిని పాపవిమోచనం చేయి మరియు వారిని …” [9:103]

[3] జకాతు ప్రయోజనాలలో మరొకటి: ముస్లింలో దాతృత్వం, ఉదారత, మరియు అక్కరగల వారిపై దయ చూపే స్వభావాన్ని పెంపొందించడం.

[4] జకాతు ప్రయోజనాలలో మరొకటి: అల్లాహ్ నుండి శుభాలు, సంపదలో వృద్ధి మరియు ప్రతిఫలం పొందడం. అల్లాహ్ ప్రకటన:

… وَمَا أَنفَقْتُم مِّن شَيْءٍ فَهُوَ يُخْلِفُةٌ، وَهُوَ خَيْرُ الرَّازِقِينَ ) [سبا]
“మరియు మీరు (ఆయన మార్గంలో) ఖర్చు పెట్టేదంతా ఆయన మీకు తిరిగి ఇస్తాడు. మరియు ఆయనే సర్వశ్రేష్ఠుడైన జీవనోపాధి .” [34:39]

ప్రామాణిక హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: అల్లాహ్ ఇలా అంటున్నాడు:

((يَا ابْنَ آدَمَ أَنفِقْ نُنفِقَ عَلَيْكَ…))
ఓ ఆదమ్ కుమారుడా! ఖర్చు చేయి (దానం చేయి), మేము నీపై ఖర్చు చేస్తాము.” 

ఇవే కాకుండా, లెక్కించలేనన్ని మరెన్నో ప్రయోజనాలు ఉన్నాయి.

మరియు జకాతు చెల్లించుటలో పిసినారితనం చూపే లేదా దానిని ఇవ్వటంలో నిర్లక్ష్యం వహించే వారి పట్ల కఠినమైన హెచ్చరిక కూడా ఉన్నది. అల్లాహ్ ప్రకటన:

… وَالَّذِينَ يَكْذِرُونَ الذَّهَبَ وَالْفِضَّةَ وَلَا يُنفِقُونَهَا فِي سَبِيلِ اللَّهِ فَبَشِّرْهُم بِعَذَابٍ أَلِيمٍ يَوْمَ يُحْمَى عَلَيْهَا فِي نَارِ جَهَنَّمَ فَتُكْوَى بِهَا جِبَاهُهُمْ وَجُنُوبُهُمْ وَظُهُورُهُمْ هَذَا مَا كَنَرْتُمْ لِأَنفُسِكُمْ فَذُوقُوا مَا كُنتُمْ تَكْنِزُونَ ) [التوبة]

మరియు ఎవరైతే వెండి, బంగారాన్ని కూడ బెట్టి, దానిని అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టరో, వారికి బాధారకమైన శిక్ష గలదనే వార్తను వినిపించు. ఆ దినమున దానిని (జకాతు చెల్లించని ధనాన్ని/వెండి, బంగారాలను) నరకాగ్నిలో కాల్చి దానితో వారి నుదుటి మీద, ఇరు ప్రక్కల మీద మరియు వీపుల మీద వాతలు వేయబడతాయి. (అప్పుడు వారితో ఇలా అనబడుతుంది): “ఇదంతా మీరు మీ కొరకు కూడ బెట్టుకున్నదే. కావున ఇప్పుడు మీరు కూడబెట్టుకున్న దానిని చవి చూడండి” ” [9:34-35]

జకాతు విధి దానము చెల్లించబడని ప్రతిదీ ఒక నిధిగా పరిగణించబడుతుంది, దాని యజమాని ప్రళయదినాన దానితో శిక్షించబడతాడు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దీని గురించి తెలిపిన సహీహ్ హదీథు:

((مَا مِنْ صَاحِبِ ذَهَبٍ وَلَا فِضَّةٍ لَا يُؤَدِّى حَقَّهَا إِلَّا إِذَا كَانَ يَوْمُ القِيَامَةِ صُفِحَتْ لَهُ صَفَابِحُ مِنْ نَارٍ فَأُحْمِيَ عَلَيْهَا فِي نَارِ جَهَنَّمَ فَيُكْوَى بِهَا جَنْبُهُ وَجَبِينُهُ وَظَهْرُهُ كُلَّمَا بَرَدَتْ أُعِيدَتْ لَهُ فِي يَوْمٍ كَانَ مِقْدَارُهُ خَمْسِينَ أَلْفَ سَنَةٍ حَتَّى يُقْضَى بَيْنَ العِبَادِ فَيَرَى سَبِيلَهُ : إِمَّا إِلَى الْجَنَّةِ وَإِمَّا إِلَى النَّارِ))

బంగారం మరియు వెండి యజమానులు ఎవరైతే దాని హక్కు ‘జకాతు’ చెల్లించరో, తీర్పు దినమున అవి అగ్ని పలకలుగా మార్చబడి, నరకాగ్నిలో బాగా వేడి చేయబడి, వాటితో అతని పక్కలపై, నుదుటిపై, వీపుపై వాతలు పెట్టడం జరుగుతుంది. అవి చల్లారితే వాటిని తిరిగి ఎర్రగా కాల్చడం జరుగుతుంది. ఆనాటి ఒక్కో దినము యాభై వేల సంవత్సరాలంత సుదీర్ఘంగా ఉంటుంది, అల్లాహ్ తన దాసుల మధ్య తీర్పు చెప్పే వరకు (ఇలా జరుగుతూ ఉంటుంది). ఆ తరువాత అతను తన మార్గం స్వర్గం వైపునకో లేక నరకం వైపునకో చూసుకుంటాడు.”

తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒంటెలు, ఆవులు మరియు మేకలు / గొర్రెలు కలిగి ఉన్న ఆసామి ఎవరైనా వాటిపై జకాతు విధి దానాన్ని చెల్లించకపోతే, పునరుత్థాన దినమున వాటి ద్వారా అతడు శిక్షించబడతాడని తెలియజేసినారు. రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:

((مَنْ آتَاهُ اللَّهُ مَالًا فَلَمْ يُؤَدِّ زَكَاتَهُ مُثَلَ لَهُ شَجَاعًا أَقْرَعَ لَهُ زَبِيبَتَانِ يُطَوِّقُهُ يَوْمَ القِيَامَةِ ثُمَّ يَأْخُذُ بِلَهْزِمَتَيْهِ يَعْنِي شِدْقَيْهِ ثُمَّ يَقُولُ : أَنَا مَالُكَ أَنَا كَنْزُكَ))

“అల్లాహ్ ఎవరికైతే సంపద ప్రసాదించాడో మరియు దానిపై వారు జకాతు చెల్లించలేదో, తీర్పు దినమున అది రెండు బొడిపెలు కలిగిన బట్టతల పాము రూపంలో వారి మెడ చుట్టు చుట్టబడు తుంది, ఆ తరువాత అది వారి బుగ్గలపై కాటువేస్తుంది, మరియు ఇలా చెబుతుంది: ‘నేనే నీ సంపదను, నేనే నీ నిధిని”

ఆ తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఈ అల్లాహ్ వాక్కు పఠించారు:

وَلَا يَحْسَبَنَّ الَّذِينَ يَبْخَلُونَ بِمَا آتَاهُمُ اللَّهُ مِن فَضْلِهِ هُوَ خَيْرًا لَّهُم ۖ بَلْ هُوَ شَرٌّ لَّهُمْ ۖ سَيُطَوَّقُونَ مَا بَخِلُوا بِهِ يَوْمَ الْقِيَامَةِ ۗ

అల్లాహ్ తన అనుగ్రహంతో ప్రసాదించిన దానిలో లోభం వహించే వారు, తమకదే (లోభమే) మేలైనదని భావించరాదు, వాస్తవానికి అది వారి కొరకు ఎంతో హానికరమైనది. వారు తమ లోభత్వంతో కూడబెట్టినదంతా, తీర్పు దినమున వారి మెడల చుట్టూ చుట్టబడుతుంది.” [3:180]

జకాతు విధి దానము నాలుగు రకాలుగా విభజించబడింది: (1) భూమి నుండి ఉత్పత్తి అయ్యే ఆహార ధాన్యాలు మరియు పండ్లుఫలాలు, (2) పశుసంపద, (3) బంగారం మరియు వెండి, మరియు (4) వ్యాపార లావాదేవీలు.

ఈ నాలుగు వర్గాలలో ప్రతి దానికీ ఒక నిర్దిష్ట నిసాబ్ (పరిమాణం) ఉంది. దాని కంటే తక్కువగా ఉన్నప్పుడు జకాతు దానం విధి కాదు.

ధాన్యాలు మరియు పండ్ల నిసాబ్: ఐదు వసఖ్ లు, ఒక వసఖ్ అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సాతో అరవై సాలు (ఒక సా అంటే ఒక మనిషి నాలుగు దోసెళ్ళు నిండినంత). ఖర్జూరం, ద్రాక్ష, గోధుమలు, బియ్యం, యవము మరియు అలాంటి వాటికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సాతో మూడు వందల సాలు.

అందులో ఉష్ర్ (పది శాతం) విధిగావించబడింది, సాగు నీటి కొరకు ఖర్చు పెట్టే అవసరం లేకుండా (స్వాభావికంగా) వర్షం, నదులు, ప్రవహించే ఊటలు మొదలైనవాటి ద్వారా సాగు చేయబడిన ఖర్జూరం మరియు ఇతర పంటలపై ఇస్లామీయ నియమం ప్రకారం ‘ఉష్ర్ ‘ (పది శాతం) జకాతు దానము విధిగావించబడింది. ఒకవేళ నీటిని సవానీలు, నీటిని పైకి లేపే యంత్రాలు మరియు ఇలాంటి ఇతర ఖర్చుతో కూడిన పద్ధతుల ద్వారా పండిస్తే, దానిపై వాజిబ్ అయిన జకాతు పది శాతంలో సగం అంటే ఐదు శాతం మాత్రమే. ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క హదీథుల ద్వారా స్పష్టం అవుతుంది.

సాయిమా (మేతమేసే) జంతువులైన ఒంటెలు, ఆవులు, గొర్రెల జకాతు పరిమాణం గురించి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నుండి వచ్చిన సహీహ్ హదీథుల్లో స్పష్టమైన వివరణ ఉంది. దీని గురించి మరింతగా తెలుసు కోవాలనుకునే వారు పండితులను అడిగి తెలుసుకోవచ్చు. సంక్షిప్తత కోసం మేము దీన్ని ఇక్కడ పూర్తిగా ప్రస్తావించడం లేదు.

వెండి యొక్క నిసాబ్ వందకు నలభై మిస్ట్రాల్ (ఇది ఒక ఇస్లామీయ పరిమాణం), మరియు అది దాదాపు సౌదీ అరేబియా కరెన్సీలలో యాభై ఆరు రియాల్ (నేటి మార్కెటు రేటు ప్రకారం లెక్కించవలెను)

బంగారము యొక్క నిసాబ్ ఇరవై మిస్ ఖాల్ (ఒక ఇస్లామీయ పరిమాణం), మరియు సౌదీ గిన్నీలలో అది పదకొండు గిన్నీలు మరియు మూడు ఏడవ వంతుల గిన్నీ, మరియు గ్రాములలో తొంభై రెండు గ్రాములు, మరియు వాటిలో (బంగారం మరియు వెండి) లేదా వాటిలో ఒకదానిలో నిసాబ్ పరిమాణం కంటే ఎక్కువ కలిగి ఉన్నవారు, మరియు అది ఒక సంవత్సరం మొత్తం వారి వద్ద ఉంటే, దానిపై వారు నలభైవ భాగము అంటే 2.5% జకాతు విధి దానము చెల్లించ వలెను.

లాభం మూలాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి దానిని లెక్కించుట కొరకు కొత్త సంవత్సర ఆరంభం యొక్క అవసరం లేదు, అలాగే పశువుల ఉత్పత్తి కూడా దాని మూలాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి దాని మూలం నిసాబ్ చేరుకుంటే కొత్త సంవత్సరం అవసరం లేదు.

నేటి ప్రజలు ఉపయోగించే కరెన్సీ నోట్లకు బంగారం మరియు వెండి యొక్క హుకుం వర్తిస్తుంది, అవి దిర్హమ్, దీనార్, డాలర్ లేదా ఇతర పేర్లతో పిలవబడినా. వాటి విలువ వెండి లేదా బంగారం యొక్క నిసాబ్ కు చేరినప్పుడు మరియు వాటిపై వారి ఆధీనం ఒక సంవత్సరం గడిచినప్పుడు, వాటిపై జకాత్ విధిగా చెల్లించ వలెను.

మహిళల నగదు, బంగారం లేదా వెండి ఆభరణాలు, ముఖ్యంగా నిసాబ్ లెక్కకు చేరుకున్నప్పుడు మరియు సంవత్సర మంతా వారి వద్ద ఉన్నప్పుడు, వాటిపై జకాతు ఉంటుంది, అవి వినియోగం కోసం లేదా అప్పుగా ఉంచబడినప్పటికీ, ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క మామూలు హదీథు ప్రకారం:

((مَا مِنْ صَاحِبِ ذَهَبٍ أَوْ فِضَّةٍ لَا يُؤَدِّى زَكَاتَهَا إِلَّا إِذَا كَانَ القِيَامَةُ صُفِحَتْ لَهُ يَوْمَ صَفَابِحَ مِنْ نَارٍ…))

“బంగారం లేదా వెండి కలిగి ఉన్న వారు ఎవరైనా వాటిపై జకాతు చెల్లించక పోతే, తీర్పు దినమున అతని కోసం అగ్ని పలకలు తయారు చేయబడతాయి…” పైన పేర్కొన్న హదీథు చివరి వరకు.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక స్త్రీ చేతిలో బంగారు గాజులు చూసినప్పుడు ఇలా అన్నారు:

((أَتُعْطِينَ زَكَاةَ هَذَا؟)) قَالَتْ : لَا ، قَالَ: ((أَيَسُرُّكِ أَنْ يُسَوِّرَكِ اللَّهُ بِهِمَا يَوْمَ القِيَامَةِ سِوَارَيْنِ مِنْ نَارٍ!)) فَأَلْقَتْهُمَا، وَقَالَتْ: ((هُمَا لِلَّهِ وَلِرَسُولِهِ))

“‘దీనిపై జకాతు చెల్లిస్తున్నావా?’ అని అడిగారు. ఆమె ‘లేదు’ అని చెప్పింది. ‘పరలోక దినాన అల్లాహ్ నీకు ఈ రెండింటిని నిప్పు గాజులుగా చేయడం నిన్ను సంతోషపరుస్తుందా?’ అని అడిగారు. ఆమె వాటిని విసిరేసి, ‘ఇవి అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తకు (దానం చేస్తున్నాను)’ అని చెప్పింది.”  (దీనిని అబూ దావూద్ మరియు నసాయి సనద్ హసన్ లతో నమోదు చేసినారు.)

ఉమ్మె సల్మా రదియల్లాహు అన్హా ఉల్లేఖన: ఆమె బంగారు ఆభరణాలు ధరించేవారు. ఆమె వాటి గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఇలా అడిగారు: ‘ఇది ధనసంపత్తి కింద వస్తుందా?’ దానికి ఆయన ఇలా సమాధానమిచ్చారు:

(( مَا بَلَغَ أَنْ يُزَكَّى فَرُكَ فَلَيْسَ بِكَنْزِ))

“ఏదైనా వస్తువు జకాతు ఇవ్వడానికి అర్హత పొందినప్పుడు దానిపై జకాతు ఇవ్వబడితే అది నిధి కాదు.” ఇలాంటి అనేక ఇతర హదీథులు కూడా ఉన్నాయి.

అయితే అమ్మకానికి సిద్ధం చేసిన వస్తువులు (వాణిజ్య వస్తువులు), అవి సంవత్సరాంతంలో లెక్కించబడతాయి మరియు వాటి విలువలో రుబ్ ఉల్ ఉమ్ (2.5%) చెల్లించబడుతుంది, అవి వాటి ధరతో సమానమైనా, ఎక్కువైనా, తక్కువైనా; సమురా ఉల్లేఖించిన ఈ హదీథు ప్రకారం:

(( كَانَ رَسُولُ اللَّهِ ﷺ يَأْمُرُنَا أَنْ تُخْرِجَ الصَّدَقَةَ مِنَ الَّذِي نُعِدُّهُ لِلْبَيْعِ))

“ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లమ్ అమ్మకానికి ఉంచిన వస్తువుల నుండి సదకా (జకాతు విధి దానం) ఇవ్వమని మాకు ఆదేశించేవారు” దీనిని అబూ దావూద్ నమోదు చేసినారు.

అమ్మకానికి సిద్ధం చేసిన భూములు (రియల్ ఎస్టేట్లు), భవనాలు, కార్లు, నీటిని పైకి లేపే యంత్రాలు మరియు అమ్మకానికి సిద్ధం చేసిన ఇతర వస్తువులు ఇందులో చేరతాయి.

అమ్మకానికి కాకుండా అద్దెకు సిద్ధం చేసిన భవనాలపై, వాటి అద్దెపై సంవత్సర కాలం గడిస్తే జకాతు ఉంటుంది, కానీ వాటి మూలస్వరూపంపై జకాత్ ఉండదు; ఎందుకంటే అవి అమ్మకానికి సిద్ధం చేయబడలేదు. అలాగే, వ్యక్తిగత మరియు అద్దె కార్లపై కూడా జకాతు ఉండదు, అవి అమ్మకానికి సిద్ధం చేయబడకపోతే, వాటిని యజమాని ఉపయోగం కోసం కొనుగోలు చేశాడు.

ఒక టాక్సీ యజమాని వద్ద లేదా ఇతరుల వద్ద నిసాబ్ కు చేరుకున్న డబ్బు ఉంటే, అది ఒక సంవత్సరం గడిస్తే దానిపై జకాత్ విధి అవుతుంది, అది ఖర్చు కోసం, వివాహం కోసం, ఆస్తి కొనుగోలు కోసం, లేదా అప్పు తీర్చడానికి, లేదా ఇతర ఉద్దేశ్యాల కోసం సిద్ధం చేసినా సరే; ఇలాంటి వాటిపై జకాత్ విధి తప్పనిసరి అని ధర్మశాస్త్ర సాక్ష్యాలు సూచిస్తున్నాయి.

ముందుగా చెప్పినట్లుగా, ధర్మం జకాతును నిరోధించదని పండితుల సరిగా చెప్పినారు.

మరియు అదే విధంగా అనాథల మరియు మతి స్థిమితం లేని వారి డబ్బుపై కూడా జకాతు విధి అవుతుంది, ఇది నిసాబ్ కు చేరినప్పుడు మరియు సంవత్సరం గడిచినప్పుడు, వారి సంరక్షకులు వారి తరపున సంవత్సరం పూర్తయినప్పుడు దానిని జకాతు ఉద్దేశ్యంతో ఇవ్వటం తప్పనిసరి: సాధారణ సాక్ష్యాల ప్రకారం, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముఆద్ రదియల్లాహు అన్హు ను యెమెన్ ప్రజల వద్దకు పంపినప్పుడు చెప్పిన హదీథులో ఇలా ఉంది:

((إِنَّ اللَّهَ افْتَرَضَ عَلَيْهِمْ صَدَقَةً فِي أَمْوَالِهِمْ تُؤْخَذُ مِنْ أَغْنِيَابِهِمْ وَتُرَدُّ فِي فُقَرَابِهِمْ))

అల్లాహ్ వారి సంపదలపై దానము విధించినాడు; అది వారి సంపన్నుల నుండి తీసుకుని, వారి పేదవారికి తిరిగి ఇవ్వబడుతుంది.”

జకాతు విధి దానము అల్లాహ్ హక్కు, దానిని పక్షపాతంతో అర్హులైన వారికి కాకుండా ఇతరులకు ఇవ్వడం అనుమతించ బడలేదు, లేదా దానితో వ్యక్తిగత ప్రయోజనం పొందడం లేదా హాని నుండి తప్పించుకోవడం అనుమతించబడదు, లేదా దానితో తన సంపదను రక్షించడం లేదా తనపై నిందను తొలగించడం అనుమతించబడదు. ముస్లింలు తమ జకాతును అర్హులైన వారికి మాత్రమే చెల్లించాలి, ఇతర ఉద్దేశ్యాల కోసం కాదు, దానిని ఇష్టపూర్వకంగా, అల్లాహ్ కోసం నిష్కపటంగా, చిత్తశుద్ధితో దానం చేయాలి; తద్వారా తమ బాధ్యత నుండి విముక్తి పొందుతారు, మరియు గొప్ప ప్రతిఫలం మరియు దానికి బదులు పొందటానికి అర్హత పొందుతారు.

అల్లాహ్ తన పవిత్ర గ్రంథంలో జకాతు పొందేందుకు అర్హులైన ప్రజల గురించి స్పష్టంగా తెలియజేసినాడు, అల్లాహ్ ప్రకటన:

إِنَّمَا الصَّدَقَاتُ لِلْفُقَرَاءِ وَالْمَسَاكِينِ وَالْعَامِلِينَ عَلَيْهَا وَالْمُؤَلَّفَةِ قُلُوبُهُمْ وَفِي الرِّقَابِ وَالْغَارِمِينَ وَفِي سَبِيلِ اللَّهِ وَابْنِ السَّبِيلِ ۖ فَرِيضَةً مِّنَ اللَّهِ ۗ وَاللَّهُ عَلِيمٌ حَكِيمٌ

“నిశ్చయంగా విధి దానాలు కేవలం యాచించు నిరుపేదలకు మరియు యాచించని పేదవారికి, (జకాతు) వ్యవహారాలపై నియుక్తులైన వారికి మరియు ఎవరి హృదయాలనైతే (ఇస్లాం వైపుకు) ఆకర్షిస్తున్నాయో వారికి, బానిసల విముక్తి కొరకు, ఋణగ్రస్తులైన వారి కొరకు, అల్లాహ్ మార్గంలో శ్రమించేవారి కొరకు మరియు బాటసారుల కొరకు. ఇది అల్లాహ్ నిర్ణయించిన ఒక విధి. మరియు అల్లాహ్ సర్వజ్ఞుడు, మహా వివేకవంతుడు.” [9:60]

ఈ పవిత్ర ఆయతు ముగింపులో ఈ రెండు మహానామాలతో (సర్వజ్ఞుడు మరియు మహావివేకవంతుడు) అల్లాహ్ తన దాసులకు ఒక హెచ్చరికను అందిస్తున్నాడు. ఆయన తన దాసుల పరిస్థితి ఎరిగినవాడు -ఎవరు దానము తీసుకునేందుకు అర్హులో మరియు ఎవరు అర్హులు కారో బాగా ఎరిగినవాడు. ఆయన తన శాసనంలో మరియు నిర్ణయంలో మహావివేకవంతుడు, కాబట్టి ఆయన ప్రతిదానినీ వాటికి తగిన స్థలాల్లో మాత్రమే ఉంచుతాడు, అయినప్పటికీ కొంతమంది వ్యక్తులకు ఆయన విజ్ఞత యొక్క రహస్యాలు తెలియకపోవచ్చు; దాసులు ఆయన శాసనంపై నమ్మకాన్ని కలిగి ఉండటానికి మరియు ఆయన నిర్ణయానికి సమర్పించుకోవటానికి ఒక మార్గదర్శకము.

మరియు అల్లాహ్ మాకు మరియు ముస్లిములకు ఆయన ధర్మములో అవగాహన కల్పించమని, ఆయన పట్ల నిష్కపటతను, చిత్తశుద్ధిని కలిగించమని, ఆయన ప్రీతిప్రసన్నత కొరకు పనులు చేయుటలో ముందుకు సాగించమని మరియు ఆయన క్రోధానికి కారణమయ్యే వాటి నుండి రక్షించమని మేము వేడుకుంటున్నాము నిస్సందేహంగా ఆయన వినేవాడును మరియు మనకు అతి సమీపంగా ఉండేవాడు!

అల్లాహ్ తన దాసుడైన, తన ప్రవక్త అయిన ముహమ్మద్ పై, ఆయన కుటుంబముపై, ఆయన సహచరులపై శుభాలను, శాంతిని కురిపించుగాక.

ఈ పోస్ట్ క్రింది పుస్తకం నుండి తీసుకోబడింది:

జకాతు విధిదానము మరియు రమదాను ఉపవాసాలపై రెండు సంక్షిప్త సందేశాలు
అబ్దుల్ అజీజ్ బిన్ అబ్దుల్లాహ్ బిన్ బాజ్ [డైరెక్ట్ PDF]

జకాత్ & సదఖా (మెయిన్ పేజీ):
https://teluguislam.net/five-pillars/zakah/

మేము మస్జిద్ నిర్మాణం కొరకు దానం చేసాము, కానీ వారు సొంత ఖర్చులకు వాడుకుంటే మాకు పుణ్యం లభిస్తుందా? [వీడియో]

బిస్మిల్లాహ్

[7 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

జకాతు & సదఖా మెయిన్ పేజీ
https://teluguislam.net/five-pillars/zakah/

ఎవరి పై ఖర్చు చెయ్యడం మనపై విధిగా, తప్పనిసరిగా ముఖ్యమైనదిగా ఉంది? [వీడియో]

బిస్మిల్లాహ్

[40 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

జకాతు & సదఖా మెయిన్ పేజీ
https://teluguislam.net/five-pillars/zakah/

జకాతు ఆదేశాలు ( పుస్తకం & వీడియో పాఠాలు)

తాకట్టులో ఉన్న బంగారం మీద జకాతు చెల్లించాలా? [వీడియో]

బిస్మిల్లాహ్

[ 1నిముషం]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia.
జకాత్ ఆదేశాలు [పుస్తకం] ఆధారంగా ఈ వీడియో చెప్పబడింది

వెండి, బంగారం మరియు డబ్బు మీద జకాత్ [వీడియో] [25 నిముషాలు]


ముస్లిమేతరులకు జకాతు ఇవ్వవచ్చా? [వీడియో]

బిస్మిల్లాహ్

[1:45 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

జకాతు & సదఖా మెయిన్ పేజీ
https://teluguislam.net/five-pillars/zakah/

జకాతు ఆదేశాలు ( పుస్తకం & వీడియో పాఠాలు)

జకాత్ ఆదేశాలు – 2: భూసంపద, పశువుల జకాత్, జకాత్ హక్కుదారులు [వీడియో]

బిస్మిల్లాహ్

[28:03 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia.
జకాత్ ఆదేశాలు [పుస్తకం] ఆధారంగా ఈ వీడియో చెప్పబడింది

భూ సంబంధ ఉత్పత్తులపై జకాత్

నిల్వ మరియు తూకము చేయుగల ఖర్జూరం, ఎండిన ద్రాక్ష, గోధుమ, జొన్న, బియ్యం లాంటి ఆహారధాన్యాల, ఫలాలపై జకాత్ విధిగా ఉంది. కాని పండ్లు, కూరగాయలపై జకాత్ విధిగా లేదు. పై వాటిలో జకాత్ విధి కావడానికి అవి నిసాబ్ కు చేరి ఉండాలి. వాటి నిసాబ్ 612 కిలోలు. వాటిపై ఒక సంవత్సరం గడవాలన్న నిబంధన లేదు. కోతకు వచ్చినప్పుడు వాటిలో నుండి ఈ క్రింది పద్ధతిలో జకాత్ చెల్లించాలిః

ప్రకృతి పరమైన వర్షాలు, నదుల మూలంగా పండిన పంటల్లో పదవ వంతు జకాత్ చెల్లించాలి. కృత్రిమ కాలువలు, బావుల మూలంగా పండిన పంటల్లో ఇరవయ్యో వంతు జకాత్ చెల్లించాలి.

ఉదాః ఒక వ్యక్తి తన భూమిలో గోధుమ విత్తనం వేశాడు. అతనికి 800 కిలోల పంట పండింది. ఇప్పుడు అతనిపై జకాత్ విధిగా ఉంది. ఎందుకనగా దీని నిసాబ్ 612 కిలోలు, అయితే దీనికంటే ఎక్కువగా పండింది. ఇక ఆ పంట వర్షంతో పండితే అందులో పదో వంతు అంటే 80 కిలోల జకాత్ చెల్లించాలి. ఒకవేళ కృత్రిమ కాలువల, బావుల ఆధారంగా పండితే అందులో ఇరవయ్యో వంతు అంటే 40 కిలోలు జకాత్ చెల్లించాలి.

పశువుల జకాత్

ఇక్కడ పశువులు అంటేః ఆవు, మేక, గొర్రె మరియు ఒంటె లని భావం. వీటి జకాతు కొరకు ఈ క్రింది నిబంధనలు వర్తిస్తాయిః

1- నిసాబ్ కు చేరి ఉండాలి. ఒంటెల నిసాబ్ 5. మేకలు, గొర్రెల నిసాబ్ 40. ఆవుల నిసాబ్ 30. వీటికి తక్కువ ఉన్నవాటిలో జకాత్ లేదు.

2- వాటి యజమాని వద్ద అవి సంవత్సరమెల్లా ఉండాలి.

3- అవి ‘సాయిమా’ అయి ఉండాలి. అంటే సంవత్సరంలో అధిక శాతం పచ్చిక మైదానాల్లో మేసేవి అయి ఉండాలి. శాలలో ఒక చోట ఉండి తమ ఆహారం తినునవి, లేదా వాటి యజమాని వాటి కొరకు మేత ఖరీదు చేసి, లేదా స్టోర్ చేసి ఉంచేవాడైతే వాటిలో జకాత్ లేదు.

4- పరివహణ సాధనంగా, లేదా వ్యవసాయ పరంగా పని చేయునవై ఉండకూడదు.

ఒంటెల జకాత్

ఒంటెల జకాత్ యొక్క నిసాబ్ 5 ఒంటెలు. ఏ ముస్లం వ్యక్తి నిసాబ్ కు అధికారి అయ్యాడో, అవి అతని వద్ద ఉండి సంవత్సరం పూర్తయిందో అతను ఈ విధంగా జకాత్ చెల్లించాలి.

  •  5 నుండి 9 వరకుంటే 1 మేక.
  • 10 నుండి 14 వరకుంటే రెండు మేకలు.
  • 15 నుండి 19 వరకుంటే మూడు మేకలు.
  • 20 నుండి 24 వరకుంటే నాలుగు మేకలు.
  • 25 నుండి 35 వరకుంటే ఏడాది వయసున్న ఒక ఆడ ఒంటె. అది గనక లేకుంటే రెండేళ్ళ మగ ఒంటె.
  • 36 నుండి 45 వరకుంటే రెండేళ్ళ ఒక ఆడ ఒంటె.
  • 46 నుండి 60 వరకుంటే మూడేళ్ళ ఒక ఆడ ఒంటె.
  • 61 నుండి 75 వరకుంటే నాలుగేళ్ళ ఒక ఒంటె.
  • 76 నుండి 90 వరకుంటే రెండేళ్ళ రెండు ఒంటెలు.
  • 91 నుండి 120 వరకుంటే మూడెళ్ళ రెండు ఆడ ఒంటెలు.
  • 120 ఒంటెలకు మించిపోతే ప్రతి నలభై ఒంటెలపై రెండేళ్ళ ఒక ఆడ ఒంటె. ప్రతి 50 ఒంటెలపై మూడేళ్ళ ఒక ఆడ ఒంటె.

వీటికంటే ఎక్కువ ఉన్నప్పుడు ప్రతి 40లో రెండేళ్ళ ఒక ఆడ ఒంటె, ప్రతి 50లో మూడేళ్ళ ఒక ఆడ ఒంటె జకాత్ గా ఇవ్వాలి.

ఆవుల జకాత్

 ఆవులు, ఎద్దులు అన్నిటి లెక్క ఒకటే. 1 నుండి 29 వరకుంటే జకాత్ లేదు

  • ఏ వ్యక్తి ఆధీనంలో 30 నుండి 39 వరకున్నాయో (వాటిపై సంవత్సరం గడిసిందో) అందులో ఏడాది వయస్సుగల ఒక ఆడ లేదా మగ దూడ జకాత్ గా ఇవ్వాలి.
  • 40 నుండి 59 వరకుంటే రెండేళ్ళ దూడ.
  • 60 నుండి 69 వరకుంటే ఏడాది వయస్సు గల రెండు దూడలు.
  • 70 నుండి 79 వరకుంటే ఏడాది వయసుగల 1 దూడ, రెండేళ్ళ వయస్సుగల మరొక దూడ.

ఆ తరువాత వాటి సంఖ్య ఎంత పెరిగినా ప్రతి 30లో ఏడాది వయస్సుగల ఒక దూడ, ప్రతి 40లో రెండేళ్ళ వయస్సుగల ఒక దూడ జకాత్ గా ఇవ్వాలి.

మేకల జకాత్

(మేకలు, గొర్రెలు, పొట్టేలు అన్నిటి నిసాబ్ ఒకటే. అవి 1 నుండి 39  వరకుంటే జకాత్ విధిగా లేదు). ఏ వ్యక్తి  ఆధీనంలో 40 నుండి 120 వరకు మేకలున్నాయో అతను అందులో నుండి ఒక మేక జకాత్ గా ఇవ్వాలి.

  • 121 నుండి 200 వరకుంటే రెండు మేకలు.
  • 201 నుండి 399 వరకుంటే మూడు మేకలు.
  • 400 నుండి 499 వరకుంటే నాలుగు మేకలు.
  • 500 నుండి 599 వరకుంటే ఐదు మేకలు.
  • ఆ తర్వాత వాటి సంఖ్య ఎంత పెరిగినా ప్రతి 100లో ఒక మేక జకాత్ గా ఇవ్వాలి.

జకాత్ హక్కుదారులు

జకాత్ హక్కుదారులెవరనేది స్వయంగా అల్లాహ్ ఇలా తెలిపాడు:

ఈ జకాత్ నిధులు అసలు కేవలం నిరుపేదలకు, అక్కరలు తీరని వారికి, జకాత్ వ్యవహారాలకై నియుక్తులైన వారికీ, ఇంకా ఎవరి హృదయాలను గెలుచుకోవటం అవసరమో వారికీ, ఇంకా బానిసల విముక్తికీ, ఋణగ్రస్తుల సహాయానికీ, అల్లాహ్ మార్గంలో నూ, బాటసారులకూ వినియోగించటం కొరకు, ఇది అల్లాహ్ తరఫు నుండి నిర్ణయించబడిన ఒక విధి. అల్లాహ్ అన్నీ ఎరిగినవాడూ వివేకవంతుడూ. (తౌబా 9: 60).

పై ఆయతులో అల్లాహ్ ఎనిమిది రకాలు తెలిపాడు. వారిలో ప్రతి ఒక్కడు జకాత్ తీసుకునే అర్హత గలవాడు. ఇస్లాం ధర్మంలో జకాత్ సమాజములోని అర్హులకే ఇవ్వబడుతుంది. ఇతర ధర్మం లో ఉన్నట్లు కేవలం పండితులకివ్వబడదు. జకాత్ హక్కుదారులు వీరుః

1- నిరుపేద (ఫఖీర్) అంటే తనకు సరిపడు ఖర్చులో సగము- కన్నా తక్కువ పొందేవాడు.

2- అక్కరతీరనివాడు (మిస్కీన్) అంటే తనకు సరిపడు ఖర్చులో సగముకన్న ఎక్కువ పొందు- తాడు, కాని అది అతనికి సరిపడదు. అందుకు అతనికి సరిపడునంత కొన్ని నెలలు, ఒక సంవత్సరం వరకు జకాత్ సొమ్ము ఇవ్వవచ్చును.

3- జకాత్ వసూలు చేసే ఉద్యోగి అంటే జకాత్ వసూలు చేయ డానికి ముస్లిం అధికారి తరఫున నియమింపబడిన ఉద్యోగులు. వారు ధనికులై- నప్పటికీ, వారి పనికి తగ్గట్టు జీతంగా వారికి జకాత్ నుండి ఇవ్వవచ్చును.

4- హృదయాలు గెలుచుకొనుటకు అంటే అవిశ్వాసుల్లో తమ వంశం, గోత్రంలో నాయకులుగా ఉన్నవారు ఇస్లాంలో ప్రవేశించే ఆశ ఉన్నచో వారికి, లేదా వారి కీడు ముస్లింలకు కలగకుండా జకాత్ సొమ్ము ఖర్చు చేయవచ్చును. అలాగే కొత్తగా ఇస్లాం స్వీకరించినవారిలో వారి అవసరార్థం, వారు స్థిరంగా ఇస్లాంపై ఉండుటకు జకాత్ ధనం ఖర్చు చేయవచ్చును.

5- బానిసలను స్వతంత్రులుగా చెయ్యటానికి మరియు శత్రవుల నుంచి ముస్లిం ఖైదీలను విడిపించుటకు జకాత్ సొమ్ము ఖర్చు పెట్టవచ్చును.

6- ఋణగ్రస్తులు అంటే అప్పులపాలైనవారు. ఇలాంటి వారికి జకాత్ నుండి ఖర్చు చేయవచ్చును. కాని క్రింది షరతులు వారిలో ఉండాలిః

  • A: ముస్లిం అయి యుండాలి.
  • B: స్వయంగా చెల్లించగల ధనికుడు కాకూడదు.
  • C: ఆ అప్పు ఏ పాప కార్యానికో చేసి ఉండ కూడదు.
  • D: అది ఆ సమయంలోనే చెల్లించుట తప్పనిసరి అయి యుండాలి.

7- అల్లాహ్ మార్గంలో అంటే జీతం తీసుకోకుండా పుణ్యాపేక్షతో ధర్మయుద్ధం చేయు వీరులు, వారి స్వంత ఖర్చుల కొరకు, లేదా ఆయుధాలకు జకాత్ డబ్బు ఇవ్వచ్చును. జిహాదులో ధర్మవిద్య అభ్యసించడం కూడా వస్తుంది. ఎవరైనా విద్యభ్యాసనలో నిమగ్నులైనట్లయితే, అతని విద్యకు సరిపడు ఖర్చులు జకాత్ నుండి ఇవ్వవచ్చును.

8- బాటసారి అంటే ప్రయాణికుడు. గృహజీవనంలో ఎంత ఆనందంగా ఉన్నా సరే ప్రయాణంలో ఏదైనా ఆర్థిక ఇబ్బందులకు గురయితే అతను తన గ్రామం చేరుకొనుటకు సరిపడు ఖర్చులు జకాత్ నుండి ఇవ్వవచ్చును.

మస్జిదుల నిర్మణాలకు, దారులు సరి చేయడానికి జకాత్ సొమ్ము ఉపయోగించరాదు.

నోట్స్:

1-  సముద్రం నుండి లభించే ముత్యాలు, పగడాలు మరియు చేపల్లో జకాత్ లేదు. వాణిజ్యసరుకుగా ఉన్నప్పుడు పైన తెలిపిన ప్రకారంగా జకాత్ చెల్లించాల్సి ఉంటుంది.

2- అద్దెకివ్వబడిన బిల్డింగులు, ఫ్యాక్టరీల పై జకాత్ లేదు. కాని వాటి నుండి పొందుతున్న పైకం నిసాబ్ కు చేరుకొని, సంవత్సరం గడిస్తే అందులో జకాత్ విధిగా ఉంది.


జకాత్ ఆదేశాలు – 1: వెండి, బంగారం, డబ్బు, వ్యాపార సామాగ్రి మరియు షేర్స్ యొక్క జకాతు [వీడియో]

బిస్మిల్లాహ్

[19:09 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia.
జకాత్ ఆదేశాలు [పుస్తకం] ఆధారంగా ఈ వీడియో చెప్పబడింది

జకాత్ ఆదేశాలు (أحكام الزكاة)

ఇస్లామీయ పరిభాషలో జకాత్ అంటే: అల్లాహ్ యొక్క ఆరాధన ఉద్దేశ్యంతో నిర్ణీత ధన, ధాన్యాలు ధర్మవిధిగా నిర్ణీత ప్రజలకు చెల్లించవలసిన హక్కు.

జకాత్ ఇస్లాం మూల స్తంభాల్లో మూడవది. ఏ ముస్లిం ‘నిసాబ్‘ (అంటే జకాత్ విధింపుకు అవసరమై నిర్ణీత పరిమాణాని)కు అధికారి అయ్యాడో అతనిపై జకాత్ విధి అవుతుంది. అల్లాహ్ ఆదేశం చదవండిః

నమాజు స్థాపించండి. జకాత్ ఇవ్వండి“. (బఖర 2: 43).

జకాత్ ను ధర్మపరంగా విధిగావించడంలో అనేక లాభాలు, మేల్లున్నాయి. వాటిలో కొన్ని ఇవి:

1- ఆత్మశుద్ధి కలుగుతుంది. మనస్సులో నుండి దురాశ, పిసినారి తత్వాలు దూరమవుతాయి.

2- ముస్లిం భక్తుడు దాతృత్వం లాంటి సద్గుణ సంపన్నుడవుతాడు.

3- ధనవంతుని మరియు పేదవాని మధ్య ప్రేమ సంబంధాలు బల పడతాయి. ఎలా అనగా ఉపకారుని పట్ల ఆత్మ ఆకర్షితమవుతుంది మరియు ప్రేమిస్తుంది.

4- బీద ముస్లిముల అవసరాలు తీరుతాయి. వారు ఒకరి ముందు తమ చెయ్యి చాపకుండా ఉంటారు.

5- జకాత్ చెల్లించే మానవుడు పాపాల నుండి పరిశుద్ధుడు అవుతాడు. అంటే జకాత్ వల్ల అతని స్థానం ఉన్నతమై, అతని పాపాలు మన్నించ- బడతాయి.

ఏ వస్తువుల్లో జకాత్ విధిగా ఉంది

బంగారం, వెండి, వ్యాపార సామాగ్రి, పెంపుడు జంతువులు మరియు పంటలు, ఫలాలు మరియు లోహాలు, ధాతువులు.

బంగారం, వెండి జకాత్

బంగారం, వెండి ఏ రూపంలో ఉన్నా వాటిపై జకాత్ విధిగా ఉంది. అది ‘నిసాబ్’ కు అధికారి అయిన వ్యక్తిపై మాత్రమే.

బంగారం నిసాబ్: 20 దీనారులు. ఈ నాటి లెక్క ప్రకారం 85 గ్రాములు.

వెండి నిసాబ్: 200 దిర్హములు. ఈ నాటి లెక్క ప్రకారం 595 గ్రాములు.

పై లెక్క ప్రకారం ఏ వ్యక్తి నిసాబ్ కు అధికారి అయ్యాడో, అది అతని వద్ద ఉండి సంవత్సరం పూర్తి అయిందో, అతను అందులో నుండి (2.5%) రెండున్నర శాతం జకాతుగా చెల్లించాలి.

వాటి జకాత్, డబ్బు రూపంలో ఇవ్వదలుచు- కున్న వ్యక్తి, అతను వాటికి అధికారి అయినప్పటి నుండి ఒక సంవత్సరం పూర్తయినప్పుడు మార్కెట్లో ఒక గ్రాము బంగారం లేదా వెండి యొక్క ధర ఎంత ఉందో తెలుసుకొని, తన వద్ద ఉన్న మొత్తం బంగారం లేదా వెండి మూల్యం ఎంతవుతుందో లెక్కేసి అందులో నుండి రెండున్నర శాతం డబ్బు జకాతుగా ఇవ్వాలి. (మేము డబ్బు అని వ్రాసాము అయితే ఎవరు ఏ దేశంలో ఉన్నారో అక్కడ వారి కరెన్సీ పేరేముందో దాన్ని బట్టి వారు లెక్కించుకోవాలి).

దీని ఉదాహరణ: ఒక వ్యక్తి వద్ద 100 గ్రాముల బంగారం ఉంది అనుకుందాం. అతని వద్ద ఉండి సంవత్సరం పూర్తి అయింది కూడాను. అందుకు అతనిపై జకాత్ విధి అయింది. ఇక అతను రెండున్నర గ్రాముల బంగారం జకాతుగా ఇవ్వాలి. ఒకవేళ అతను దాని జకాత్ డబ్బు రూపంలో ఇవ్వదలుచుకుంటే, 100 గ్రాముల బంగారం ధర తెలుసుకోవాలి. (దాని ధర ప్రస్తుత భారత కరెన్సీ ప్రకారం ఒక లక్ష అని తెలిసిందనుకుందాం) అతను అందులో రెండున్నర శాతం జకాత్ ఇవ్వాలి. (అంటే (2,500) రెండు వేల అయిదు వందల రూపాలు). ఇదే విధంగా వెండి జకాతు ఇవ్వాలి.

ఇలాగే కరెన్సీలో కూడా జకాతు విధి అవుతుంది, నిసాబ్ కు అధికారి అయి, దానిపై సంవత్సరం గడచిన వెంటనే. ఎవరి వద్ద 595 గ్రాముల వెండి ధరకు సమానమైన లేదా అంతకంటే ఎక్కువ కరెన్సీ ఉందో అతనిపై జకాత్ విధిగా ఉంది. అతను తన వద్ద ఉన్న మొత్తం డబ్బులో నుండి రెండున్నర శాతం జకాత్ గా ఇవ్వాలి.

ఏ ముస్లిం వద్ద కరెన్సీ (డబ్బు) ఉండి, సంవత్సరం దాటిందో అతను 595 గ్రాముల వెండి ధర తెలుసుకోవాలి, అతని వద్ద ఉన్న డబ్బు 595 గ్రాములవెండి ధరకు చేరుకుంటే జకాత్ ఇవ్వాలి, ఒకవేళ అతని వద్ద ఉన్న డబ్బు దాని ధరకు తక్కువ ఉంటే అతనిపై జకాత్ విధిగా లేదు.

ఉదాహరణ: ఒక వ్యక్తి వద్ద భారత కరెన్సీ ప్రకారం రూ. 80 వేలున్నాయనుకుందాం. అతని వద్ద ఉండి సంవత్సరం పూర్తి అయ్యింది కూడా. ప్రస్తుతం మార్కెట్లో 595 గ్రాముల వెండికి ఎంత ధర ఉందో తెలుసుకోవాలి. దాని ధర ఎనభై ఐదు వేలు అని తెలిస్తే అతనిపై జకాత్ విధిగా లేదు. ఎందుకనగా అతను నిసాబ్ కు అధికారి కాలేదు. నిసాబ్ కు అధికారి కావడానికి అతని వద్ద ఎనభై ఐదు వేల రూపాలుండాలి. ఏ దేశంలోనైనా వారి కరెన్సీ వెల వెండితో పోల్చబడితే వారు తమ కరెన్సీ జకాత్ వెండి లెక్కతో ఇవ్వాలి. అంటే 595 గ్రాముల వెండికి విలువగల డబ్బు ఉన్నప్పుడే అతనిపై జకాత్ విధి అగును.

వ్యాపార సామాగ్రి యొక్క జకాత్

సంపద కలిగి, దానిని వ్యాపారంలో ఉపయోగించే ముస్లిం వర్తకునిపై ప్రతి సంవత్సరం జకాత్ విధిగా ఉంది. ఇది అల్లాహ్ ప్రసాదించిన అనుగ్రహానికి కృతజ్ఞత మరియు అతనిపై ఉన్న తన పేదసోదరుల హక్కు అని తను భావించాలి. లాభోద్దేశంతో క్రయవిక్రయించే ప్రతీ వస్తువు వ్యాపార సామాగ్రి అనబడుతుంది; భూములు, ఇండ్లు, స్థిరాస్థులు (real estate), పశువులు, తినుత్రాగు పదార్థాలు మరియు వాహనాలు వగైరా. అవి నిసాబ్ కు చేరి ఉండాలి. అంటే పైన తెలిపిన 85 గ్రాముల బంగారం ధరకు లేదా 595 గ్రాముల వెండి ధరకు సమానంగా ఉండాలి. అందులో రెండున్నర శాతం జకాతుగా ఇవ్వాలి.

ఉదాహరణః ఒక వ్యక్తి వద్ద ఒక లక్ష రూపాయల విలువ గల వ్యాపార సామాగ్రి ఉంటే, అందులో నుండి రూ. 2500/- జకాత్ చెల్లించాలి. వ్యాపారస్తులు ప్రతి సంవత్సరం ఆరంభంలో తమ వద్ద ఉన్న మొత్తం సరుకును లెక్కించుకొని జకాత్ చెల్లించాలి. ఎవరైనా వ్యాపారి సంవత్సరం పూర్తి అయ్యేకి పది రోజుల ముందు ఏదైనా సరుకు కొనుగోళు జేస్తే దాని జకాత్ కూడా ముందు నుండే ఉన్న సరుకుతో కలపివ్వాలి. వ్యాపారం ప్రారంభించిన మొదటి రోజు సంవత్సరం యొక్క ఆరంభమగును. ఇలా ప్రతి సంవత్సరం జకాత్ చెల్లించాలి.

కంచెలోకి పంపకుండా పశువుశాలలో, ఇంటి వద్ద ఉంచి మేత ఇవ్వబడే పశువులు వ్యాపారం కోసం పెంచితే వాటి మీద జకాత్ విధి అవుతుంది. అవి నిసాబ్ కు చేరుకున్నా, చేరుకోకపోయినా వాణిజ్య సరుకులాగా దాని వెల నిసాబ్ కు చేరుకుంటే అందులో నుండి జకాత్ చెల్లించాలి.

షేర్స్ యొక్క జకాత్

రియల్ ఎస్టేట్ (Real estate) తదితర విషయాల్లో షేర్స్ ఈ రోజుల్లో ఓ పరిపాటి విషయం అయింది. (ధర్మసమ్మతమైన షేర్స్ కొనుట, అమ్ముట యోగ్యమే. కాని ధర్మసమ్మతం కాని వాటిలో ముస్లిం పాల్గొనుట ఎంత మాత్రం యోగ్యం కాదు). అందులో డిపాజిట్ చేసి ఉన్న డబ్బు కొద్ది సంవత్సరాల్లో పెరగవచ్చు, తరగనూవచ్చు. షేర్స్ లో ఉన్న డబ్బుపై జకాత్ ఉంది. ఎందుకనగా అది కూడా వాణిజ్య సరుకు లాంటిదే. షేర్స్ లో పాల్గొన్న ప్రతి ముస్లిం ప్రతి సంవత్సరం తన షేర్స్ ధర చూస్తూ ఉండాలి. జకాత్ చెల్లిస్తూ ఉండాలి.


విధి దానం పుస్తకం (కితాబుల్ జకాత్) | మిష్కాతుల్‌ మసాబీహ్‌ [హదీసులు]

బిస్మిల్లాహ్

క్రింద ఇచ్చిన లింక్ క్లిక్ చేసి మీరు పుస్తకం చదవండి లేదా డౌన్లోడ్ చేసుకోండి

06. విధి దానం పుస్తకం (కితాబుల్ జకాత్) (63 పేజీలు)
[హదీసులు] [PDF] [41 పేజీలు]
మూలం: మిష్కాతుల్ మసాబీహ్ నుండి

సంకలనం: ముహమ్మద్ బిన్ అబ్దుల్లాహ్ అల్ ఖతీబ్ అత్ తబ్రీజీ
హదీసుల పరిశీలన: షేఖ్ ముహమ్మద్ నసీరుద్దీన్ అల్ – అల్బానీ
తెలుగు అనువాదం: డా. అబ్దుర్రహీమ్ బిన్ ముహమ్మద్ మౌలానా

విషయ సూచిక

1. జకాత్‌ ను విధిచేసే విషయాలు – హదీస్ 1794| పేజీ 565
2. ఫి’త్ర దానం – హదీస్ 1815 | పేజీ 573
3. సదఖహ్‌ కు అర్హులు కాని వారు – హదీస్ 1821 | పేజీ  575
4. అర్ధించడానికి అర్హులు, అనర్హులు – హదీస్ 837 | పేజీ  579
5. ఖర్చు చేయడం మరియు పిసినారితనం – హదీస్ 1850 | పేజీ  585
6. దానధర్మాల గొప్పదనం – హదీస్ 1888 | పేజీ  596
7. అత్యుత్తమ దానం (సదఖహ్‌) – హదీస్ 1020 | పేజీ  608
8. భర్త ధనం నుండి భార్య చేసే ఖర్చు – హదీస్ 1047 | పేజీ  613
9. సదఖహ్‌ ఇచ్చి, తిరిగి తీసుకోరాదు – హదీస్ 1054 | పేజీ  614

క్రింద మీరు పూర్తి పుస్తకం చదవవచ్చు