
[10 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
ఈ వీడియో క్లిప్ క్రింది వీడియో నుండి తీసుకోబడింది
జకాత్ ఆదేశాలు – 2: భూసంపద, పశువుల జకాత్, జకాత్ హక్కుదారులు [వీడియో] [28:03 నిముషాలు]
జకాత్ హక్కుదారులు
జకాత్ హక్కుదారులెవరనేది స్వయంగా అల్లాహ్ ఇలా తెలిపాడు:
إِنَّمَا الصَّدَقَاتُ لِلْفُقَرَاءِ وَالْمَسَاكِينِ وَالْعَامِلِينَ عَلَيْهَا وَالْمُؤَلَّفَةِ قُلُوبُهُمْ وَفِي الرِّقَابِ وَالْغَارِمِينَ وَفِي سَبِيلِ اللَّهِ وَابْنِ السَّبِيلِ ۖ فَرِيضَةً مِّنَ اللَّهِ ۗ وَاللَّهُ عَلِيمٌ حَكِيمٌ – 9:60
“ఈ జకాత్ నిధులు అసలు కేవలం నిరుపేదలకు, అక్కరలు తీరని వారికి, జకాత్ వ్యవహారాలకై నియుక్తులైన వారికీ, ఇంకా ఎవరి హృదయాలను గెలుచుకోవటం అవసరమో వారికీ, ఇంకా బానిసల విముక్తికీ, ఋణగ్రస్తుల సహాయానికీ, అల్లాహ్ మార్గంలో నూ, బాటసారులకూ వినియోగించటం కొరకు, ఇది అల్లాహ్ తరఫు నుండి నిర్ణయించబడిన ఒక విధి. అల్లాహ్ అన్నీ ఎరిగినవాడూ వివేకవంతుడూ”. (తౌబా 9: 60).
పై ఆయతులో అల్లాహ్ ఎనిమిది రకాలు తెలిపాడు. వారిలో ప్రతి ఒక్కడు జకాత్ తీసుకునే అర్హత గలవాడు. ఇస్లాం ధర్మంలో జకాత్ సమాజములోని అర్హులకే ఇవ్వబడుతుంది. ఇతర ధర్మం లో ఉన్నట్లు కేవలం పండితులకివ్వబడదు. జకాత్ హక్కుదారులు వీరుః
1- నిరుపేద (ఫఖీర్) అంటే తనకు సరిపడు ఖర్చులో సగము కన్నా తక్కువ పొందేవాడు.
2- అక్కరతీరనివాడు (మిస్కీన్) అంటే తనకు సరిపడు ఖర్చులో సగముకన్న ఎక్కువ పొందుతాడు, కాని అది అతనికి సరిపడదు. అందుకు అతనికి సరిపడునంత కొన్ని నెలలు, ఒక సంవత్సరం వరకు జకాత్ సొమ్ము ఇవ్వవచ్చును.
3- జకాత్ వసూలు చేసే ఉద్యోగి అంటే జకాత్ వసూలు చేయడానికి ముస్లిం అధికారి తరఫున నియమింపబడిన ఉద్యోగులు. వారు ధనికులైనప్పటికీ, వారి పనికి తగ్గట్టు జీతంగా వారికి జకాత్ నుండి ఇవ్వవచ్చును.
4- హృదయాలు గెలుచుకొనుటకు అంటే అవిశ్వాసుల్లో తమ వంశం, గోత్రంలో నాయకులుగా ఉన్నవారు ఇస్లాంలో ప్రవేశించే ఆశ ఉన్నచో వారికి, లేదా వారి కీడు ముస్లింలకు కలగకుండా జకాత్ సొమ్ము ఖర్చు చేయవచ్చును. అలాగే కొత్తగా ఇస్లాం స్వీకరించినవారిలో వారి అవసరార్థం, వారు స్థిరంగా ఇస్లాంపై ఉండుటకు జకాత్ ధనం ఖర్చు చేయవచ్చును.
5- బానిసలను స్వతంత్రులుగా చెయ్యటానికి మరియు శత్రవుల నుంచి ముస్లిం ఖైదీలను విడిపించుటకు జకాత్ సొమ్ము ఖర్చు పెట్టవచ్చును.
6- ఋణగ్రస్తులు అంటే అప్పులపాలైనవారు. ఇలాంటి వారికి జకాత్ నుండి ఖర్చు చేయవచ్చును. కాని క్రింది షరతులు వారిలో ఉండాలి:
- A: ముస్లిం అయి యుండాలి.
- B: స్వయంగా చెల్లించగల ధనికుడు కాకూడదు.
- C: ఆ అప్పు ఏ పాప కార్యానికో చేసి ఉండ కూడదు.
- D: అది ఆ సమయంలోనే చెల్లించుట తప్పనిసరి అయి యుండాలి.
7- అల్లాహ్ మార్గంలో అంటే జీతం తీసుకోకుండా పుణ్యాపేక్షతో ధర్మయుద్ధం చేయు వీరులు, వారి స్వంత ఖర్చుల కొరకు, లేదా ఆయుధాలకు జకాత్ డబ్బు ఇవ్వచ్చును. జిహాదులో ధర్మవిద్య అభ్యసించడం కూడా వస్తుంది. ఎవరైనా విద్యభ్యాసనలో నిమగ్నులైనట్లయితే, అతని విద్యకు సరిపడు ఖర్చులు జకాత్ నుండి ఇవ్వవచ్చును.
8- బాటసారి అంటే ప్రయాణికుడు. గృహజీవనంలో ఎంత ఆనందంగా ఉన్నా సరే ప్రయాణంలో ఏదైనా ఆర్థిక ఇబ్బందులకు గురయితే అతను తన గ్రామం చేరుకొనుటకు సరిపడు ఖర్చులు జకాత్ నుండి ఇవ్వవచ్చును.
మస్జిదుల నిర్మణాలకు, దారులు సరి చేయడానికి జకాత్ సొమ్ము ఉపయోగించరాదు.
జకాతు & సదఖా ( మెయిన్ పేజీ)
https://teluguislam.net/five-pillars/zakah
You must be logged in to post a comment.