జకాత్ ఆదేశాలు – 1: వెండి, బంగారం, డబ్బు, వ్యాపార సామాగ్రి మరియు షేర్స్ యొక్క జకాతు [వీడియో]

బిస్మిల్లాహ్

[19:09 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia.
జకాత్ ఆదేశాలు [పుస్తకం] ఆధారంగా ఈ వీడియో చెప్పబడింది

జకాత్ ఆదేశాలు (أحكام الزكاة)

ఇస్లామీయ పరిభాషలో జకాత్ అంటే: అల్లాహ్ యొక్క ఆరాధన ఉద్దేశ్యంతో నిర్ణీత ధన, ధాన్యాలు ధర్మవిధిగా నిర్ణీత ప్రజలకు చెల్లించవలసిన హక్కు.

జకాత్ ఇస్లాం మూల స్తంభాల్లో మూడవది. ఏ ముస్లిం ‘నిసాబ్‘ (అంటే జకాత్ విధింపుకు అవసరమై నిర్ణీత పరిమాణాని)కు అధికారి అయ్యాడో అతనిపై జకాత్ విధి అవుతుంది. అల్లాహ్ ఆదేశం చదవండిః

నమాజు స్థాపించండి. జకాత్ ఇవ్వండి“. (బఖర 2: 43).

జకాత్ ను ధర్మపరంగా విధిగావించడంలో అనేక లాభాలు, మేల్లున్నాయి. వాటిలో కొన్ని ఇవి:

1- ఆత్మశుద్ధి కలుగుతుంది. మనస్సులో నుండి దురాశ, పిసినారి తత్వాలు దూరమవుతాయి.

2- ముస్లిం భక్తుడు దాతృత్వం లాంటి సద్గుణ సంపన్నుడవుతాడు.

3- ధనవంతుని మరియు పేదవాని మధ్య ప్రేమ సంబంధాలు బల పడతాయి. ఎలా అనగా ఉపకారుని పట్ల ఆత్మ ఆకర్షితమవుతుంది మరియు ప్రేమిస్తుంది.

4- బీద ముస్లిముల అవసరాలు తీరుతాయి. వారు ఒకరి ముందు తమ చెయ్యి చాపకుండా ఉంటారు.

5- జకాత్ చెల్లించే మానవుడు పాపాల నుండి పరిశుద్ధుడు అవుతాడు. అంటే జకాత్ వల్ల అతని స్థానం ఉన్నతమై, అతని పాపాలు మన్నించ- బడతాయి.

ఏ వస్తువుల్లో జకాత్ విధిగా ఉంది

బంగారం, వెండి, వ్యాపార సామాగ్రి, పెంపుడు జంతువులు మరియు పంటలు, ఫలాలు మరియు లోహాలు, ధాతువులు.

బంగారం, వెండి జకాత్

బంగారం, వెండి ఏ రూపంలో ఉన్నా వాటిపై జకాత్ విధిగా ఉంది. అది ‘నిసాబ్’ కు అధికారి అయిన వ్యక్తిపై మాత్రమే.

బంగారం నిసాబ్: 20 దీనారులు. ఈ నాటి లెక్క ప్రకారం 85 గ్రాములు.

వెండి నిసాబ్: 200 దిర్హములు. ఈ నాటి లెక్క ప్రకారం 595 గ్రాములు.

పై లెక్క ప్రకారం ఏ వ్యక్తి నిసాబ్ కు అధికారి అయ్యాడో, అది అతని వద్ద ఉండి సంవత్సరం పూర్తి అయిందో, అతను అందులో నుండి (2.5%) రెండున్నర శాతం జకాతుగా చెల్లించాలి.

వాటి జకాత్, డబ్బు రూపంలో ఇవ్వదలుచు- కున్న వ్యక్తి, అతను వాటికి అధికారి అయినప్పటి నుండి ఒక సంవత్సరం పూర్తయినప్పుడు మార్కెట్లో ఒక గ్రాము బంగారం లేదా వెండి యొక్క ధర ఎంత ఉందో తెలుసుకొని, తన వద్ద ఉన్న మొత్తం బంగారం లేదా వెండి మూల్యం ఎంతవుతుందో లెక్కేసి అందులో నుండి రెండున్నర శాతం డబ్బు జకాతుగా ఇవ్వాలి. (మేము డబ్బు అని వ్రాసాము అయితే ఎవరు ఏ దేశంలో ఉన్నారో అక్కడ వారి కరెన్సీ పేరేముందో దాన్ని బట్టి వారు లెక్కించుకోవాలి).

దీని ఉదాహరణ: ఒక వ్యక్తి వద్ద 100 గ్రాముల బంగారం ఉంది అనుకుందాం. అతని వద్ద ఉండి సంవత్సరం పూర్తి అయింది కూడాను. అందుకు అతనిపై జకాత్ విధి అయింది. ఇక అతను రెండున్నర గ్రాముల బంగారం జకాతుగా ఇవ్వాలి. ఒకవేళ అతను దాని జకాత్ డబ్బు రూపంలో ఇవ్వదలుచుకుంటే, 100 గ్రాముల బంగారం ధర తెలుసుకోవాలి. (దాని ధర ప్రస్తుత భారత కరెన్సీ ప్రకారం ఒక లక్ష అని తెలిసిందనుకుందాం) అతను అందులో రెండున్నర శాతం జకాత్ ఇవ్వాలి. (అంటే (2,500) రెండు వేల అయిదు వందల రూపాలు). ఇదే విధంగా వెండి జకాతు ఇవ్వాలి.

ఇలాగే కరెన్సీలో కూడా జకాతు విధి అవుతుంది, నిసాబ్ కు అధికారి అయి, దానిపై సంవత్సరం గడచిన వెంటనే. ఎవరి వద్ద 595 గ్రాముల వెండి ధరకు సమానమైన లేదా అంతకంటే ఎక్కువ కరెన్సీ ఉందో అతనిపై జకాత్ విధిగా ఉంది. అతను తన వద్ద ఉన్న మొత్తం డబ్బులో నుండి రెండున్నర శాతం జకాత్ గా ఇవ్వాలి.

ఏ ముస్లిం వద్ద కరెన్సీ (డబ్బు) ఉండి, సంవత్సరం దాటిందో అతను 595 గ్రాముల వెండి ధర తెలుసుకోవాలి, అతని వద్ద ఉన్న డబ్బు 595 గ్రాములవెండి ధరకు చేరుకుంటే జకాత్ ఇవ్వాలి, ఒకవేళ అతని వద్ద ఉన్న డబ్బు దాని ధరకు తక్కువ ఉంటే అతనిపై జకాత్ విధిగా లేదు.

ఉదాహరణ: ఒక వ్యక్తి వద్ద భారత కరెన్సీ ప్రకారం రూ. 80 వేలున్నాయనుకుందాం. అతని వద్ద ఉండి సంవత్సరం పూర్తి అయ్యింది కూడా. ప్రస్తుతం మార్కెట్లో 595 గ్రాముల వెండికి ఎంత ధర ఉందో తెలుసుకోవాలి. దాని ధర ఎనభై ఐదు వేలు అని తెలిస్తే అతనిపై జకాత్ విధిగా లేదు. ఎందుకనగా అతను నిసాబ్ కు అధికారి కాలేదు. నిసాబ్ కు అధికారి కావడానికి అతని వద్ద ఎనభై ఐదు వేల రూపాలుండాలి. ఏ దేశంలోనైనా వారి కరెన్సీ వెల వెండితో పోల్చబడితే వారు తమ కరెన్సీ జకాత్ వెండి లెక్కతో ఇవ్వాలి. అంటే 595 గ్రాముల వెండికి విలువగల డబ్బు ఉన్నప్పుడే అతనిపై జకాత్ విధి అగును.

వ్యాపార సామాగ్రి యొక్క జకాత్

సంపద కలిగి, దానిని వ్యాపారంలో ఉపయోగించే ముస్లిం వర్తకునిపై ప్రతి సంవత్సరం జకాత్ విధిగా ఉంది. ఇది అల్లాహ్ ప్రసాదించిన అనుగ్రహానికి కృతజ్ఞత మరియు అతనిపై ఉన్న తన పేదసోదరుల హక్కు అని తను భావించాలి. లాభోద్దేశంతో క్రయవిక్రయించే ప్రతీ వస్తువు వ్యాపార సామాగ్రి అనబడుతుంది; భూములు, ఇండ్లు, స్థిరాస్థులు (real estate), పశువులు, తినుత్రాగు పదార్థాలు మరియు వాహనాలు వగైరా. అవి నిసాబ్ కు చేరి ఉండాలి. అంటే పైన తెలిపిన 85 గ్రాముల బంగారం ధరకు లేదా 595 గ్రాముల వెండి ధరకు సమానంగా ఉండాలి. అందులో రెండున్నర శాతం జకాతుగా ఇవ్వాలి.

ఉదాహరణః ఒక వ్యక్తి వద్ద ఒక లక్ష రూపాయల విలువ గల వ్యాపార సామాగ్రి ఉంటే, అందులో నుండి రూ. 2500/- జకాత్ చెల్లించాలి. వ్యాపారస్తులు ప్రతి సంవత్సరం ఆరంభంలో తమ వద్ద ఉన్న మొత్తం సరుకును లెక్కించుకొని జకాత్ చెల్లించాలి. ఎవరైనా వ్యాపారి సంవత్సరం పూర్తి అయ్యేకి పది రోజుల ముందు ఏదైనా సరుకు కొనుగోళు జేస్తే దాని జకాత్ కూడా ముందు నుండే ఉన్న సరుకుతో కలపివ్వాలి. వ్యాపారం ప్రారంభించిన మొదటి రోజు సంవత్సరం యొక్క ఆరంభమగును. ఇలా ప్రతి సంవత్సరం జకాత్ చెల్లించాలి.

కంచెలోకి పంపకుండా పశువుశాలలో, ఇంటి వద్ద ఉంచి మేత ఇవ్వబడే పశువులు వ్యాపారం కోసం పెంచితే వాటి మీద జకాత్ విధి అవుతుంది. అవి నిసాబ్ కు చేరుకున్నా, చేరుకోకపోయినా వాణిజ్య సరుకులాగా దాని వెల నిసాబ్ కు చేరుకుంటే అందులో నుండి జకాత్ చెల్లించాలి.

షేర్స్ యొక్క జకాత్

రియల్ ఎస్టేట్ (Real estate) తదితర విషయాల్లో షేర్స్ ఈ రోజుల్లో ఓ పరిపాటి విషయం అయింది. (ధర్మసమ్మతమైన షేర్స్ కొనుట, అమ్ముట యోగ్యమే. కాని ధర్మసమ్మతం కాని వాటిలో ముస్లిం పాల్గొనుట ఎంత మాత్రం యోగ్యం కాదు). అందులో డిపాజిట్ చేసి ఉన్న డబ్బు కొద్ది సంవత్సరాల్లో పెరగవచ్చు, తరగనూవచ్చు. షేర్స్ లో ఉన్న డబ్బుపై జకాత్ ఉంది. ఎందుకనగా అది కూడా వాణిజ్య సరుకు లాంటిదే. షేర్స్ లో పాల్గొన్న ప్రతి ముస్లిం ప్రతి సంవత్సరం తన షేర్స్ ధర చూస్తూ ఉండాలి. జకాత్ చెల్లిస్తూ ఉండాలి.


%d bloggers like this: