సూరతుల్ కహఫ్ తఫ్సీర్ : 5వ భాగం : ఆయతులు 4 – 8 [వీడియో]

బిస్మిల్లాహ్

[35:40 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia.

18. సూరా అల్ కహఫ్ (ఆయతులు 4 – 8)

18:4  وَيُنذِرَ الَّذِينَ قَالُوا اتَّخَذَ اللَّهُ وَلَدًا

అల్లాహ్‌ సంతానం కలిగి ఉన్నాడని పలికేవారిని హెచ్చరించటానికి (ఈ గ్రంథం అవతరింపజెయ్యబడింది).

18:5  مَّا لَهُم بِهِ مِنْ عِلْمٍ وَلَا لِآبَائِهِمْ ۚ كَبُرَتْ كَلِمَةً تَخْرُجُ مِنْ أَفْوَاهِهِمْ ۚ إِن يَقُولُونَ إِلَّا كَذِبًا

యదార్థానికి వారికిగానీ, వారి తాత ముత్తాతలకుగానీ ఈ విషయం ఏమీ తెలియదు. వారి నోట వెలువడే ఈ మాట ఎంతో దారుణమైనది. వారు చెప్పేదంతా పచ్చి అబద్ధమే.

18:6  فَلَعَلَّكَ بَاخِعٌ نَّفْسَكَ عَلَىٰ آثَارِهِمْ إِن لَّمْ يُؤْمِنُوا بِهَٰذَا الْحَدِيثِ أَسَفًا

(ఓ ముహమ్మద్‌!) ఒకవేళ ఈ జనులు ఈ మాటను విశ్వసించకపోతే నువ్వు వారి వెనుక దుఃఖంతో కుమిలిపోతూ నీ ప్రాణాలు పోగొట్టుకుంటావా ఏమి?

18:7  إِنَّا جَعَلْنَا مَا عَلَى الْأَرْضِ زِينَةً لَّهَا لِنَبْلُوَهُمْ أَيُّهُمْ أَحْسَنُ عَمَلًا

జనులలో ఎవరు మంచి పనులు చేస్తారో పరీక్షించే నిమిత్తం మేము భూమండలంలో ఉన్న దాన్నంతటినీ భూమికి శోభాయమానంగా చేశాము.

18:8  وَإِنَّا لَجَاعِلُونَ مَا عَلَيْهَا صَعِيدًا جُرُزًا

దాని (భూమి)పై ఉన్న దానినంతటినీ మేము (నేలమట్టం చేసి) చదునైన మైదానంగా చేయనున్నాము.


సూరతుల్ కహఫ్ తఫ్సీర్ (వ్యాఖ్యానం) – మెయిన్ పేజీ. (అన్నీ పాఠాల కోసం)
https://teluguislam.net/tafsir-kahf/

ఖురాన్ మెయిన్ పేజీ
https://teluguislam.net/quran

సూరతుల్ కహఫ్ పారాయణం: సాద్ అల్-ఘమిడి | తెలుగు సబ్ టైటిల్స్: అహ్సనుల్ బయాన్ |వీడియో
https://teluguislam.net/2020/06/25/18-al-kahf

ఐదు విషయాల కంటే ఎంతో మేలైన, ఉత్తమ ఆ ఒక్క విషయమేమిటి? [వీడియో & టెక్స్ట్]

బిస్మిల్లాహ్

ఐదు విషయాల కంటే ఎంతో మేలైన, ఉత్తమ ఆ ఒక్క విషయమేమిటి?
https://youtu.be/w7ANEdrN2IU [6:53 నిమిషాలు ]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

ఈ ప్రసంగంలో యజమాని-దాసుడి సంబంధాన్ని ఉదాహరణగా తీసుకుని, మానవునికి మరియు సృష్టికర్త అయిన అల్లాహ్‌కు మధ్య ఉండవలసిన దాస్యత్వం గురించి వివరించబడింది. నిజమైన దాస్యత్వం అంటే ప్రతి క్షణం, ప్రతి స్థితిలో అల్లాహ్‌ను స్మరించుకోవడం (ధిక్ర్ చేయడం) మరియు ఆయనకు ఇష్టమైన పనులే చేయడం. అల్లాహ్ స్మరణ (ధిక్ర్) యొక్క గొప్పతనాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఒక హదీథ్ ద్వారా నొక్కిచెప్పబడింది. బంగారం, వెండి దానం చేయడం మరియు ధర్మయుద్ధంలో పాల్గొనడం కన్నా అల్లాహ్ స్మరణ ఎంతో ఉత్తమమైనదని, అది హోదాలను పెంచి, ప్రభువు వద్ద అత్యంత పరిశుద్ధమైనదిగా పరిగణించబడుతుందని ఈ హదీథ్ స్పష్టం చేస్తుంది.

అబూ దర్దా (రజియల్లాహు అన్హు) ఉల్లేఖించారు, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అడిగారు:

మీ సదాచరణాల్లో అత్యుత్తమమైనది, మీ చక్రవర్తి అయిన అల్లాహ్ వద్ద ఎంతో పరిశుద్ధమైనది, మీ స్థానాలను ఎంతో రెట్టింపు చేయునది, మరి మీరు వెండి బంగారాలు ఖర్చు పెట్టే దాని కంటే ఉత్తమమైనది మరియు మీరు మీ శత్రువులను కలిసి మీరు వారి మెడలను వారు మీ మెడలను నరుకుతూ ఉండే దానికంటే ఉత్తమమైనది తెలియజేయనా?” వారన్నారు ఎందుకు లేదు! తప్పకుండా తెలియజేయండి, అప్పుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) చెప్పారు: అల్లాహ్ స్మరణ

[సహీహ్ హదీథ్] [సునన్ ఇబ్నె మాజ 3790, మువత్త మాలిక్ 564, ముస్నద్ అహ్మద్ 21702,21704,27525]

سنن الترمذي أبواب الدعوات عن رسول الله صلى الله عليه وسلم | باب منه

3377 – عَنْ أَبِي الدَّرْدَاءِ رَضِيَ اللَّهُ عَنْهُ قَالَ : قَالَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ : ” أَلَا أُنَبِّئُكُمْ بِخَيْرِ أَعْمَالِكُمْ، وَأَزْكَاهَا عِنْدَ مَلِيكِكُمْ، وَأَرْفَعِهَا فِي دَرَجَاتِكُمْ، وَخَيْرٌ لَكُمْ مِنْ إِنْفَاقِ الذَّهَبِ وَالْوَرِقِ، وَخَيْرٌ لَكُمْ مِنْ أَنْ تَلْقَوْا عَدُوَّكُمْ، فَتَضْرِبُوا أَعْنَاقَهُمْ، وَيَضْرِبُوا أَعْنَاقَكُمْ “. قَالُوا : بَلَى. قَالَ : ” ذِكْرُ اللَّهِ تَعَالَى “.

حكم الحديث: صحيح
سنن ابن ماجه ( 3790 )، موطأ مالك ( 564 )، مسند أحمد ( 21702, 21704, 27525 ).

అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.

الْحَمْدُ لِلَّهِ وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى رَسُولِ اللَّهِ، أَمَّا بَعْدُ
(అల్ హందులిల్లాహి వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహి, అమ్మా బాద్)
సర్వస్తోత్రాలు అల్లాహ్ కే శోభాయమానం. అల్లాహ్ యొక్క ప్రవక్తపై శాంతి మరియు శుభాలు వర్షించుగాక. ఇక ఆ తర్వాత…

ప్రియ వీక్షకుల్లారా, యజమాని మరియు దాసుడు. వారిద్దరి మధ్యలో సంబంధం ఎలాంటిది ఉంటుంది? దాసుడు ఎల్లవేళల్లో చాలా చురుకుగా, ఎప్పుడు ఏ సమయంలో యజమాని ఆదేశం ఏముంటుంది, నేను దానిని పాటించాలి, ఆజ్ఞాపాలన చేయాలి అన్నటువంటి ధ్యానంలో ఉంటాడు. అలాంటి వారినే మనం మెచ్చుకుంటాము. అవునా కాదా?

అయితే ఈ రోజుల్లో మనం మన అసలైన యజమాని, సర్వ సృష్టికి సృష్టికర్త, ఈ సర్వ సృష్టికి పోషణకర్త అల్లాహ్, ఎంతటి గొప్పవాడు! ఆయనే సార్వభౌమాధికారుడు. ఆయనే చక్రవర్తి. సోదర మహాశయులారా, ఎల్లవేళల్లో మనం అల్లాహ్ యొక్క ధ్యానంలో ఉండటం, అల్లాహ్‌ను గుర్తు చేసుకుంటూ ఉండటం, అల్లాహ్ యొక్క స్మరణలో ఉండటం, మనం ఎక్కడ ఉన్నా ఏ సందర్భంలో ఉన్నా గానీ అక్కడ ఆ సందర్భంలో, ఆ స్థితిలో మన సృష్టికర్త అల్లాహ్ మనం ఎలా ఉండటం, మనం ఎలా మాట్లాడటం, మనం ఎలా చూడటం, మనం ఎలా వినడం ఇష్టపడతాడో, ఆయనకు ఇష్టమైనవే మనం చేసుకుంటూ ఉండటం, ఇదే అసలైన నిజమైన దాస్యత్వం. దీన్నే ఈ రోజుల్లో చాలా మంది మరిచిపోయి ఉన్నారు.

అయితే, ఇలాంటి స్మరణలో ఉంటూ ప్రత్యేకంగా ఆయన యొక్క గొప్పతనాలను కీర్తిస్తూ, ఆయన యొక్క పరిశుద్ధత, పవిత్రతలను కొనియాడుతూ, ఆయన యొక్క ప్రశంసలు, పొగడ్తలను మనం స్తుతిస్తూ,

سُبْحَانَ اللَّهِ
(సుబ్ హా నల్లాహ్)
అల్లాహ్ సర్వలోపాలకు అతీతుడు.

الْحَمْدُ لِلَّهِ
(అల్ హందులిల్లాహ్)
సర్వస్తోత్రాలు అల్లాహ్ కే శోభాయమానం.

اللَّهُ أَكْبَرُ
(అల్లాహు అక్బర్)
అల్లాహ్ యే గొప్పవాడు.

لَا إِلَهَ إِلَّا اللَّهُ
(లా ఇలాహ ఇల్లల్లాహ్)
అల్లాహ్ తప్ప మరో ఆరాధ్య దేవుడు లేడు.

ఇంకా ఇలాంటి పలుకులు పలుకుతూ ఉంటే, ఇహలోకంలో మనకు ఎంత లాభం కలుగుతుందో, పరలోకంలో దీని యొక్క సత్ఫలితం ఎంత గొప్పగా లభిస్తుందో మనం ఊహించలేము.

అల్లాహ్ స్మరణ (ధిక్ర్) యొక్క గొప్పతనం

రండి, ఒకే ఒక హదీథ్ వినిపిస్తాను. ఆ తర్వాత మీరు సెలవు తీసుకోవచ్చు. శ్రద్ధగా వినండి. హజ్రత్ అబూ దర్దా రదియల్లాహు తాలా అన్హు ఉల్లేఖించారు. సునన్ తిర్మిజీలో వచ్చిన హదీథ్, 3377 హదీథ్ నంబర్. షేఖ్ అల్బానీ రహిమహుల్లా దీనిని ప్రామాణికమైనదిగా చెప్పారు.

ఏంటి హదీథ్? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ స్మరణ గురించి, అల్లాహ్ ధ్యానంలో ఉండటం గురించి ఎంత గొప్ప శుభవార్త ఇస్తున్నారో మీరే గమనించండి. ఐదు రకాలుగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దీని గురించి ఎలా ప్రోత్సహిస్తూ చెబుతున్నారో గమనించండి.

أَلَا أُنَبِّئُكُمْ بِخَيْرِ أَعْمَالِكُمْ
(అలా ఉనబ్బిఉకుమ్ బి ఖైరి అఅమాలికుమ్)
మీ కర్మలలో అత్యుత్తమమైనది ఏమిటో మీకు తెలుపనా?

وَأَزْكَاهَا عِنْدَ مَلِيكِكُمْ
(వ అజ్కాహా ఇంద మలీకికుమ్)
మీ ప్రభువైన అల్లాహ్ వద్ద అత్యంత పరిశుద్ధమైనది,

وَأَرْفَعِهَا فِي دَرَجَاتِكُمْ
(వ అర్ఫఇహా ఫీ దరజాతికుమ్)
మీ హోదాలను అత్యున్నతంగా చేయునది,

وَخَيْرٌ لَكُمْ مِنْ أَنْ تُنْفِقُوا الذَّهَبَ وَالْوَرِقَ
(వ ఖైరుల్ లకుమ్ మిన్ అన్ తున్ఫికూ అజ్జహబ వల్ వరిఖ్)
మీరు వెండి బంగారాలు ఖర్చు పెట్టే దానికంటే కూడా ఉత్తమమైనది,

وَخَيْرٌ لَكُمْ مِنْ أَنْ تَلْقَوْا عَدُوَّكُمْ فَتَضْرِبُوا أَعْنَاقَهُمْ وَيَضْرِبُوا أَعْنَاقَكُمْ
(వ ఖైరుల్ లకుమ్ మిన్ అన్ తల్ ఖౌ అదువ్వకుమ్ ఫ తజ్రిబూ అఅనాఖహుమ్ వ యజ్రిబూ అఅనాఖకుమ్)
మరియు మీరు మీ యొక్క శత్రువులను ధర్మపరమైన యుద్ధంలో కలుసుకోవడం, వారు మీ మెడలను నరుకుతూ ఉండటం, మీరు వారి మెడలను నరుకుతూ ఉండటం, దీనికంటే కూడా ఎంతో ఉత్తమమైనది.

అల్లాహు అక్బర్! అల్లాహు అక్బర్! గమనించారా? ఎన్ని విషయాలు చెప్పారు ప్రవక్త? ఐదు విషయాలు. మీ సదాచరణల్లో అన్నిటికంటే ఉత్తమమైనది, మరియు ప్రభువు అల్లాహ్ వద్ద ఎంతో పరిశుద్ధమైనది, మరియు మీ యొక్క స్థానాలను ఉన్నతంగా చేయునది, మీరు వెండి బంగారాలు అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టే దానికంటే ఉత్తమమైనది, మీరు అల్లాహ్ మార్గంలో యుద్ధం చేయడానికి కంటే కూడా ఎంతో ఉత్తమమైనది, మీకు తెలుపనా? అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అడిగారు.

ఈ ఐదు విషయాల కంటే ఉత్తమమైన మరో విషయం మీకు తెలపాలా? అని ప్రశ్నించారు. సహాబాలు, ప్రవక్త సహచరులు ఇలాంటి విషయాలు తెలుసుకోవడానికి చాలా ఆతృత కలిగి ఉండేవారు. వారందరూ ఏకంగా అన్నారు,

بَلَى يَا رَسُولَ اللَّهِ
(బలా యా రసూలల్లాహ్)
తప్పకుండా, ఓ అల్లాహ్ ప్రవక్తా! ప్రవక్తా ఎందుకు తెలుపరు? తప్పకుండా తెలుపండి!

అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు:

ذِكْرُ اللَّهِ
(ధిక్రుల్లాహ్)
అల్లాహ్ యొక్క ధిక్ర్. అల్లాహ్ యొక్క స్మరణ.

చూశారా? గమనించారా? ఈ హదీథ్‌ను ఎల్లవేళల్లో మదిలో నాటుకోండి. ఇలాంటి ఈ ధిక్ర్ ద్వారా ఈ ఐదు రకాల మంచి విషయాల కంటే గొప్ప పుణ్యం పొందగలుగుతారు. అల్లాహ్ మనందరికీ ఎల్లవేళల్లో, అన్ని సమయ సందర్భాల్లో, అన్ని స్థితుల్లో కేవలం అల్లాహ్‌ను మాత్రమే గుర్తు చేసుకుంటూ ఉండేటువంటి సద్భాగ్యం ప్రసాదించుగాక. అన్ని రకాల షిర్క్‌ల నుండి, అన్ని రకాల బిద్అత్‌ల నుండి అల్లాహ్ మనల్ని దూరం ఉంచుగాక. ఆమీన్.

وَآخِرُ دَعْوَانَا أَنِ الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ
(వ ఆఖిరు దఅవానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్)
మా చివరి ప్రార్థన సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కే సర్వస్తోత్రాలు.

وَالسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللَّهِ وَبَرَكَاتُهُ
(వస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు)
మీపై శాంతి, అల్లాహ్ కారుణ్యం మరియు ఆయన శుభాలు వర్షించుగాక.

జిక్ర్ (అల్లాహ్ నామ స్మరణ)

అల్లాహ్ శిక్ష నుండి కాపాడే అత్యుత్తమ ఆచరణ అల్లాహ్ జిక్ర్ [వీడియో క్లిప్]

బిస్మిల్లాహ్

[30 సెకన్లు ]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

[జిక్ర్ ,దుఆ] – https://teluguislam.net/dua-supplications/

عَنْ مُعَاذِ بْنِ جَبَلٍ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُولُ اللهِ – صلى الله عليه وسلم -: «مَا عَمِلَ آدَمِيٌّ عَمَلاً قَطُّ أَنْجَى لَهُ مِنْ عَذَابِ اللهِ مِنْ ذِكْرِ اللهِ». (4) =صحيح

أحمد (22132)، تعليق الألباني “صحيح”، صحيح الجامع (5644).

ముఆజ్ బిన్ జబల్ (రజియల్లాహు అన్హు) ఉల్లేఖించారు, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారు :

మనిషి చేసే సత్కార్యాల్లో అతనిని అల్లాహ్ శిక్ష నుండి రక్షణ కల్పించేది అల్లాహ్ జిక్ర్ కంటే అత్యున్నతమైనది మరొకటీ లేదు.

[ముస్నద్ అహ్మద్ 22132. సహీహుల్ జామి 5644]

జిక్ర్ (అల్లాహ్ నామ స్మరణ)

మానవుని వద్దకు షైతాన్ వచ్చి “నీ ప్రభువును ఎవరు సృష్టించారు” అని దుష్ప్రేరణ కల్పిస్తే ఏమని పలకాలి [ఆడియో & టెక్స్ట్]

మానవుని వద్దకు షైతాన్ వచ్చి “నీ ప్రభువును ఎవరు సృష్టించారు” అని దుష్ప్రేరణ కల్పిస్తే ఏమని పలకాలి
https://www.youtube.com/watch?v=BCVDvQapoYA [9 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

1) మానవుని వద్దకు షైతాన్ వచ్చి “నీ ప్రభువును ఎవరు సృష్టించారు” అని దుష్ప్రేరణ కల్పిస్తే ఏమని పలకాలి ?

A)  అల్లాహ్ శరణు అర్జించాలి
B) “నేను అల్లాహ్ ను విశ్వసించాను” అని పలకాలి
C) పై రెండూ యదార్థమే

వివరణ:

షైతాన్ మన శత్రువు, శాశ్వతంగా శత్రువు. స్వయంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ విషయాన్ని ఖురాన్లో ఎంతో స్పష్టంగా తెలిపాడు.

إِنَّ الشَّيْطَانَ لَكُمْ عَدُوٌّ فَاتَّخِذُوهُ عَدُوًّا ۚ إِنَّمَا يَدْعُو حِزْبَهُ لِيَكُونُوا مِنْ أَصْحَابِ السَّعِيرِ (فاطر 35:6)
(ఇన్నష్ షైతాన లకుం అదువ్వున్ ఫత్తఖిజూహు అదువ్వా, ఇన్నమా యద్ఊ హిజ్బహు లియకూనూ మిన్ అస్ హాబిస్ సయీర్)

“నిశ్చయంగా షైతాను మీ శత్రువు. కనుక మీరు కూడా వాణ్ణి శత్రువుగానే పరిగణించండి. వాడు తన సమూహాన్ని, వారంతా నరకవాసులలో చేరిపోవటానికే పిలుస్తున్నాడు.” (35:6)

ఇక వాడు మనిషిని అల్లాహ్ నుండి దూరం చేయడానికి, తన వెంట నరకంలో తీసుకెళ్ళడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఒక సహీ హదీసులో వచ్చిన విధంగా, “ఇన్నష్ షైతాన యహ్దురు అహదకుం ఫీ కుల్లి షని,” షైతాన్ మీరు చేసే ప్రతీ పనిలో జోక్యం చేసుకుంటాడు, అక్కడ దానిని పాడుచేసే ప్రయత్నం చేస్తాడు.

అయితే చివరికి, అల్లాహ్ విషయంలో కూడా మనిషి యొక్క విశ్వాసాన్ని కదలింపజేసే, పాడు చేసే ప్రయత్నాల్లో ఒక ప్రయత్నం, ఈ ఆకాశాన్ని ఎవరు సృష్టించారు? ఈ భూమిని ఎవరు సృష్టించారు? ఈ విధంగా మనసులో ప్రశ్నల్ని ప్రేరేపిస్తాడు. మనిషి ప్రతిదానికి అల్లాహ్ అని అంటూ ఉంటాడు. చివరికి, అల్లాహ్ ను ఎవరు సృష్టించారు? అన్నటువంటి సందేహం కూడా, ప్రశ్న కూడా తీసుకొస్తాడు.

ఇలాంటి ప్రశ్న కొందరు కొన్ని సందర్భాల్లో అడిగారు కూడా. అలాంటి వారి గురించే మనకు అల్హందులిల్లాహ్, సుమ్మ అల్హందులిల్లాహ్, ఇస్లాంలో మంచి జవాబు కూడా ఇవ్వడం జరిగింది. అయితే సంక్షిప్తంగా ముందు, ఇలాంటి చెడు ఆలోచన వచ్చినప్పుడు ఏమి చేయాలి అన్నదానికి ఐదు విషయాలు తెలుపుతున్నాను. శ్రద్ధగా విని, వీటిని గుర్తుంచుకోండి. తరువాత, ఎక్కువ జ్ఞానం కలవారికి దలీల్ ఆధారాలు కూడా కొన్ని చూపడం జరుగుతుంది.

అయితే ఇప్పుడు మరోసారి మీరు వినండి. ఎప్పుడైనా షైతాన్ ఎవరి మదిలోనైనా ఇలాంటి ఆలోచన కలుగజేస్తే, అల్లాహ్ ను ఎవరు పుట్టించాడు అని, ఆ వెంటనే ఈ ఐదు పనులు చేయాలి.

1- ఆమంతు బిల్లాహ్ అనాలి, అంటే నేను అల్లాహ్ ను విశ్వసించాను, కనుక అల్లాహ్ గురించి ఇలాంటి ఆలోచనల్లో పడను.

2- అల్లాహు అహద్, అల్లాహుస్సమద్, లమ్ యలిద్, వలమ్ యూలద్, వలమ్ యకుల్లహూ కుఫువన్ అహద్ చదవాలి.
దీనిని మనం ఖుల్ హువల్లాహు అహద్ సూరా అని, లేదా సూరతుల్ ఇఖ్లాస్ అని అంటాము కదా, అదే సూరా ఇది. ఎందుకు? అందులో ఇలాంటి భావం ఉంది, అల్లాహ్ ఒకే ఒక్కడు, ఏకైకుడు, ఎవరి అవసరం లేని వాడు, ఎవరికీ జన్మించలేదు, మరియు అతడు కూడా ఎవరినీ జన్మ ఇవ్వలేదు, కనలేదు. మరియు అతనికి సరిసమానుడు ఎవ్వడూ లేడు.

3- ఎడమ ప్రక్కన మూడు సార్లు ఉమ్మి వేయాలి.
ఎడమ పక్కన, థూ థూ థూ ఈ విధంగా, పక్క మనిషిపై ఉమ్మడం కాదు, మన ఎడమ వైపున మనం తలతిప్పి, థూ థూ థూ అని ఉమ్మినట్టుగా చేస్తూ, కొంచెం తుంపరలు నోటి నుండి వెళ్ళే విధంగా.

4- షైతాన్ నుండి అల్లాహ్ శరణు కోరాలి.

5- ఇలాంటి సందేహాలు, అనుమానాలు, చెడు ఆలోచనలను మనస్సులో నుంచి తొలగించాలి. (సహీహా అల్బానీ 134).

ఈ ఐదు విషయాలు గుర్తొచ్చాయి కదా? మరోసారి సంక్షిప్తంగా చెప్తున్నాను. మొదటి పని “ఆమంతు బిల్లాహ్” అని చెప్పాలి. రెండవ పని, సూరతుల్ ఇఖ్లాస్ (కుల్ హువల్లాహు అహద్) సూరా చదవాలి. దాని అర్థభావాలను గ్రహిస్తూ. మూడవది, ఎడమ పక్కన థూ థూ థూ అనాలి. నాలుగవది, షైతాన్ నుండి అల్లాహ్ శరణు కోరాలి. ఐదవది, ఇలాంటి సందేహాలు, అనుమానాలు, చెడు ఆలోచనలను మనసులో నుండి తొలగించాలి.

ఈ ఐదు విషయాలు హదీసు ద్వారా రుజువైనవి :

షేఖ్ అల్బానీ రహీమహుల్లాహ్ “సహీహా” అనే గ్రంథంలో హదీస్ నెంబర్ 134వ వ్యాఖ్యానంలో ఈ విషయాలు ప్రస్తావించారు. మరి ఈ ఐదిట్లో ప్రతీ ఒక్కదానికి హదీసుల్లో ఆధారాలు ఉన్నాయి.

హజ్రత్ అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు:

“لَا يَزَالُ النَّاسُ يَتَسَاءَلُونَ حَتَّى يُقَالَ: هَذَا خَلَقَ اللهُ الْخَلْقَ، فَمَنْ خَلَقَ اللهَ؟ فَمَنْ وَجَدَ مِنْ ذَلِكَ شَيْئًا، فَلْيَقُلْ: آمَنْتُ بِاللهِ”
وفي رواية مسلم 134:- “يَأْتِي الشَّيْطَانُ أَحَدَكُمْ فَيَقُولَ: مَنْ خَلَقَ كَذَا وَكَذَا؟ حَتَّى يَقُولَ لَهُ: مَنْ خَلَقَ رَبَّكَ؟ فَإِذَا بَلَغَ ذَلِكَ، فَلْيَسْتَعِذْ بِاللهِ وَلْيَنْتَهِ”.
وفي رواية أبي داود 4722:- فَإِذَا قَالُوا ذَلِكَ فَقُولُوا: اللَّهُ أَحَدٌ اللَّهُ الصَّمَدُ لَمْ يَلِدْ وَلَمْ يُولَدْ وَلَمْ يَكُنْ لَهُ كُفُوًا أَحَدٌ ثُمَّ لِيَتْفُلْ عَنْ يَسَارِهِ ثَلَاثًا وَلْيَسْتَعِذْ مِنَ الشَّيْطَانِ“

ప్రజలు పరస్పరం ప్రశ్నించుకుంటారు, చివరికి ఈ సృష్టిని అల్లాహ్ సృష్టించాడు, అయితే అల్లాహ్ ను ఎవరు సృష్టించాడు అన్న వరకు పోతారు. ఇలాంటి విషయం ఎవరైనా చూసినప్పుడు వెంటనే ఆమంతు బిల్లాహ్ చదవాలి, అంటే నేను అల్లాహ్ ను విశ్వసించాను.

మరో ఉల్లేఖనంలో ఉంది:

“షైతాన్ మీలో ఎవరి వద్దకైనా వచ్చి దీనిని ఎవరు పుట్టించారు, ఫలానా దానిని ఎవరు పుట్టించారు అని ప్రేరణ కలిగిస్తాడు, చివరికి నీ ప్రభువుని ఎవరు పుట్టించాడు అని మాట వేస్తాడు, ఈ స్థితికి చేరుకున్నప్పుడు వెంటనే అల్లాహ్ శరణులోకి రావాలి, ఈ దురాలోచనను వీడాలి.”

అబూదావూద్ 4722లోని ఉల్లేఖనంలో ఉంది “… మరి అల్లాహ్ను ఎవరు సృష్టించారు?” అని చెప్పటం జరుగుతుంది. ప్రజలు ఇలా అన్నప్పుడు, మీరు “అల్లాహు అహద్, అల్లాహుస్ సమద్, లం యలిద్ వలం యలద్, వలం యకుల్లహు కుఫువన్ అహద్” (అల్లాహ్ ఒక్కడే, ఆయన అక్కర లేనివాడు, ఆయనకు సంతానం లేదు, ఆయన కూడా ఎవరి సంతానం కాడు, ఆయనకు సరిసమానుడెవడూ లేడు) అని పలికి, మూడుసార్లు ఎడమవైపు ఉమ్మి, షై’తాన్ కుతంత్రాల నుండి అల్లాహ్ ను శరణుకోరండి.’

అయితే సోదర మహాశయులారా, ఇక్కడ వరకు అయితే, ఇలాంటి దురాలోచన వస్తే, మనం ఈ ఐదు పనులు చేయాలి అని తెలుసుకున్నాము. వాటి ఆధారాలు కూడా తెలుసుకున్నాము. అయితే, మరొక విషయం తెలుసుకోవాల్సిన అవసరం మనకుంది. అదేమిటంటే, వాస్తవంగా అల్లాహ్ యే ప్రప్రథమంగా, ఆది నుండి, మొదటి నుండి ఉన్నవాడు, అతని కంటే ముందు ఎవడూ లేడు. అతన్ని ఎవడూ కూడా సృష్టించలేదు.

సహీ ముస్లిం 2713లో ఉంది: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు: మీలో ఎవరైనా నిద్రించేకి ముందు కుడి ప్రక్కన పడుకొని ఈ దుఆ చదవాలి:

«اللهُمَّ رَبَّ السَّمَاوَاتِ وَرَبَّ الْأَرْضِ وَرَبَّ الْعَرْشِ الْعَظِيمِ، رَبَّنَا وَرَبَّ كُلِّ شَيْءٍ، فَالِقَ الْحَبِّ وَالنَّوَى، وَمُنْزِلَ التَّوْرَاةِ وَالْإِنْجِيلِ وَالْفُرْقَانِ، أَعُوذُ بِكَ مِنْ شَرِّ كُلِّ شَيْءٍ أَنْتَ آخِذٌ بِنَاصِيَتِهِ، اللهُمَّ أَنْتَ الْأَوَّلُ فَلَيْسَ قَبْلَكَ شَيْءٌ، وَأَنْتَ الْآخِرُ فَلَيْسَ بَعْدَكَ شَيْءٌ، وَأَنْتَ الظَّاهِرُ فَلَيْسَ فَوْقَكَ شَيْءٌ، وَأَنْتَ الْبَاطِنُ فَلَيْسَ دُونَكَ شَيْءٌ، اقْضِ عَنَّا الدَّيْنَ، وَأَغْنِنَا مِنَ الْفَقْرِ»

”అల్లాహుమ్మ రబ్బి స్సమావాతి వ రబ్బల్ అర్’ది వ రబ్బ కుల్లి షయ్ఇన్ ఫాలిఖల్ ‘హబ్బి వన్నవా, వ మున్’జిల త్తౌరాతి వల్ ఇన్జీలి, వల్ ఖుర్ఆని. అ’ఊజు’బిక మిన్ షర్రి కుల్లి జీ’ షర్రిన్, అంత ఆ’ఖిజు’న్ బి నా’సియతిహీ.

అంతల్ అవ్వలు ఫలైస ఖబ్లక షైఉన్, వ అంతల్ ఆ’ఖిరు ఫలైస బ’అదక షయ్ఉన్, వ అంత ”జ్జాహిరు ఫలైస ఫౌఖక షయ్ఉన్ వ అంతల్ బా’తిను ఫలైస దూనక షయ్ఉన్ ఇఖ్’ది అన్నిద్దైన. వ అ’గ్నినీ మినల్ ఫఖ్రి!”

‘ఓ అల్లాహ్! సప్తాకాశాలకు భూమికి ప్రభువు నువ్వే అన్నిటికీ ప్రభువువీ, బీజాన్ని చీల్చేవాడా! గింజలను మొలకెత్తించే వాడా, తౌరాతు, ఇంజీలు, ఖుర్ఆన్ను అవతరింపజేసిన వాడా! నిన్ను నేను శరణుకోరు తున్నాను. ప్రతి చెడు వస్తువు యొక్క చెడు నుండి అంటే ప్రతి హాని తలపెట్టే వస్తువు నుండి. దాని నుదురు నీ చేతిలోనే ఉంది. నీవే అందరికంటే ముందు వాడవు. నీ కంటే ముందు ఏదీలేదు. నీవే అందరికంటే చివరి వాడవు. నీ తర్వాత ఏదీ లేదు. నీవు బహిర్గతుడవు, నీవు అంతర్గతుడవు. నీకంటే రహస్యమైనది ఏదీలేదు. నీవు నన్ను రుణం తీర్చివేయడంలో, దారిద్య్రం దూరం కావడంలో నాకు సహాయం చేయి”

ఇంకా, ఖురాన్లో సూరే హదీద్ లో కూడా, “హువల్ అవ్వలు వల్ ఆఖిరు” అని వచ్చి ఉంది. చెప్పే విషయం ఏంటంటే, అల్లాహ్ కంటే ముందు ఇంకా ఎవరూ లేరు. అల్లాహ్ ను పుట్టించిన వారు ఎవరూ లేరు. అందుకొరకు, ఇలాంటి చెడు ఆలోచనలను దూరం చేసుకోవాలి.


దైవప్రవక్త (ﷺ) వారు అల్లాహ్ ను చూసారా? [ఆడియో & టెక్స్ట్]

దైవప్రవక్త (ﷺ) వారు అల్లాహ్ ను చూసారా?
https://www.youtube.com/watch?v=085GXx38_nE
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్‌ను చూశారా? అనే ప్రశ్నకు ఈ ప్రసంగం సమాధానమిస్తుంది. ప్రవక్త అల్లాహ్‌ను చూడలేదని స్పష్టంగా చెప్పబడింది. ఈ వాదనను బలపరచడానికి, సహీహ్ ముస్లిం మరియు సహీహ్ బుఖారీ నుండి రెండు హదీసులు ఉదహరించబడ్డాయి. మొదటి హదీసులో, అబూ దర్ (రదియల్లాహు అన్హు) ప్రవక్తను నేరుగా అడిగినప్పుడు, “అతను కాంతి (నూర్), నేను ఎలా చూడగలను?” అని ప్రవక్త సమాధానమిచ్చారు. రెండవ హదీసులో, మస్రూక్ ఇదే ప్రశ్నను ఆయిషా (రదియల్లాహు అన్హా)ను అడిగినప్పుడు, ప్రవక్త అల్లాహ్‌ను చూశారని చెప్పేవారు అబద్ధం చెప్పినట్లేనని ఆమె తీవ్రంగా స్పందించి, ఖురాన్ ఆయత్‌ను ఉదహరించారు. అయితే, ప్రళయ దినాన స్వర్గంలో విశ్వాసులందరూ అల్లాహ్‌ను చూస్తారని కూడా వివరించబడింది.

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ ను చూశారా? సరైన సమాధానం చూడలేదు. అవును, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ ను చూడలేదు.కొందరు అనుకుంటారు మేరాజ్ పోయినప్పుడు చూశారు కదా అని. కానీ, ఇది సరైన మాట కాదు.

సహీహ్ ముస్లిం షరీఫ్ లో హదీస్ నెంబర్ 178, అబూ దర్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు.

سَأَلْتُ رَسُولَ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ، هَلْ رَأَيْتَ رَبَّكَ؟ قَالَ: نُورٌ أَنَّى أَرَاهُ
(స’అల్తు రసూలల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం, హల్ ర’అయిత రబ్బక్? ఖాల్: నూరున్ అన్నా అరాహు)

“నేను స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రశ్నించాను. ‘ప్రవక్తా, మీరు మీ ప్రభువును చూశారా?’ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ‘అతను సర్వమూ నూర్ (కాంతి). నేను ఎలా చూడగలుగుతాను?'”

అతను సర్వమూ నూర్, కాంతి, ప్రకాశం. నేను ఎలా చూడగలుగుతాను? అబూ దర్ రదియల్లాహు అన్హు స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అడిగితే ప్రవక్త ఇలా సమాధానం ఇచ్చారు.

అయితే మరొక హదీస్ చూడండి సహీహ్ బుఖారీలో వచ్చింది. హదీస్ నెంబర్ 4855. ఇంతకుముందు దీనిలోని ఒక భాగం మనం విని ఉన్నాము. అయితే ఇప్పుడు ఈ టాపిక్‌కు సంబంధించిన విషయం వినండి.

మస్రూక్ రహిమహుల్లాహ్, ఆయిషా రదియల్లాహు అన్హాతో ప్రశ్నించారు, “ఓ మాతృమూర్తి!,

هَلْ رَأَى مُحَمَّدٌ صلى الله عليه وسلم رَبَّهُ
(హల్ ర’ఆ ముహమ్మదున్ సల్లల్లాహు అలైహి వసల్లం రబ్బహు)
‘ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తమ ప్రభువుని చూశారా?'”

فَقَالَتْ لَقَدْ قَفَّ شَعْرِي مِمَّا قُلْتَ
(ఫఖాలత్ లఖద్ ఖఫ్ఫ ష’రీ మిమ్మా ఖుల్త్)
వినండి, ఆయిషా రదియల్లాహు అన్హా ఏమంటున్నారు, మస్రూక్ అంటున్నారు, ఫఖాలత్ (ఆయిషా రదియల్లాహు అన్హా చెప్పారు),

“నీవు చెప్పిన ఈ మాటతో నా రోమాలు నిక్కబొడుచుకున్నాయి.ఈ మూడు మాటల నుండి, విషయాల నుండి నువ్వు ఎక్కడున్నావు? తెలియకుండా ఇంకా ఎందుకున్నావు? ఎవరైతే నీతో చెబుతాడో, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తమ ప్రభువుని చూశారని, فَقَدْ كَذَبَ (ఫఖద్ కదబ్) “అతడు అబద్ధం పలికాడు.” అసత్యం మాట్లాడాడు.

మళ్ళీ ఆయిషా రదియల్లాహు తా’ఆలా అన్హా ఈ ఆయత్ ను పఠించారు:

لَا تُدْرِكُهُ الْأَبْصَارُ وَهُوَ يُدْرِكُ الْأَبْصَارَ وَهُوَ اللَّطِيفُ الْخَبِيرُ
(లా తుద్రికుహుల్ అబ్సారు వహువ యుద్రికుల్ అబ్సార వహువల్లతీఫుల్ ఖబీర్)

“ఎవరి చూపులు కూడా ఆయన్ని అందుకోజాలవు. ఆయన మాత్రం అందరి చూపులను అందుకోగలడు. ఆయన సూక్ష్మ దృష్టి కలవాడు, సర్వమూ తెలిసినవాడు.”

ఈ విధంగా ఈ రెండు హదీసులు మరియు ఖురాన్ ఆయత్ ద్వారా మనకు తెలిసిన బోధ ఏమిటంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మేరాజ్‌కు వెళ్ళినప్పుడు గానీ, ఈ లోకంలో జీవించి ఉన్నంత కాలం గానీ, ఎప్పుడూ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్‌ను చూడలేదు.

అయితే ప్రళయ దినాన స్వర్గంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కూడా అల్లాహ్‌ను చూస్తారు మరియు ఇన్ షా అల్లాహ్ విశ్వాసులందరూ కూడా తప్పకుండా చూస్తారు.

وُجُوهٌ يَوْمَئِذٍ نَاضِرَةٌ * إِلَى رَبِّهَا نَاظِرَةٌ
(వుజూహున్ యవ్‌మఇదిన్ నాదిరహ్, ఇలా రబ్బిహా నాదిరహ్)
“ఆ రోజు కొన్ని ముఖాలు కళకళలాడుతూ ఉంటాయి. తమ ప్రభువు వైపు చూస్తూ ఉంటాయి.”

ఇంకా వేరే ఎన్నో ఆయతులు, హదీసులు కూడా దీనికి దలీలుగా ఉన్నాయి.

జజాకుముల్లాహు ఖైరా, వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.

ఈ పోస్ట్ లింక్ : https://teluguislam.net/?p=11473

ఏ వస్తువునూ సృష్టించలేనివారిని వీరు అల్లాహ్ కు భాగస్వాములుగా చేస్తున్నారా? – ఇమామ్ అస్-సాదీ

బిస్మిల్లాహ్

15వ అధ్యాయం
అల్ ఖవ్లుల్ సదీద్ షర్హ్ కితాబ్ అత్ తౌహీద్ – ఇమామ్ అస్-సాదీ
ఏ వస్తువునూ సృష్టించలేనివారిని వీరు అల్లాహ్ కు భాగస్వాములుగా చేస్తున్నారా?
[Do they make partners with that which has not created anything]
The famous commentary of Shaykh as-Sa’di (rahimahullaah) of the book Kitab at-Tawhid of Imam Muhammad ibn Abdul Wahhab (rahimahullaah)


అల్లాహ్ ఆదేశం:

أَيُشْرِكُونَ مَا لَا يَخْلُقُ شَيْئًا وَهُمْ يُخْلَقُونَ وَلَا يَسْتَطِيعُونَ لَهُمْ نَصْرًا وَلَا أَنفُسَهُمْ يَنصُرُونَ

“ఏ వస్తువునూ సృష్టించలేనివారిని, స్వయంగా తామే సృష్టింపబడ్డవారిని, ఎవరికీ సహాయం చేయలేనివారిని, స్వయంగా తమకు తామే సహాయం చేసుకోలేనివారిని వీరు అల్లాహ్ కు భాగస్వాములుగా చేస్తున్నారా?” (ఆరాఫ్ 7: 191, 192).

అల్లాహ్ ఆదేశం:

وَالَّذِينَ تَدْعُونَ مِن دُونِهِ مَا يَمْلِكُونَ مِن قِطْمِي

అల్లాహ్ ను కాదని మీరు పిలిచే ఇతరులకు కనీసం ఖర్జూరం విత్తనం పై ఉండు పొర అంత అధికారం కూడా లేదు.” (ఫాతిర్ 35: 13).

అనస్ (రజియల్లాహు అన్హు) కథనం: ఉహద్ యుద్ధం నాడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) గాయపడ్డారు. అందులో ఆయన నాలుగు పళ్ళు విరిగాయి. అప్పుడు ఆయన అన్నారు: “తమ ప్రవక్తను గాయపరచిన జాతి సాఫల్యం ఎలా పొందగలదు?” అప్పుడే ఈ వాక్యం అవతరించింది. “(ప్రవక్తా!) నిర్ణయాధికారాలలో నీకు పాత్ర ఏదీ లేదు“. (ఆలె ఇమ్రాన్ 3:128).

అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) కథనం: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఫజ్ర్ నమాజులో, రెండవ రకాతులోని రుకూ నుండి తలెత్తి, “సమిఅల్లాహు లిమన్ హమిదహ్ రబ్బనా వలకల్ హందు” అన్న తరువాత “ఓ అల్లాహ్ ఫలాన, ఫలానను శపించు” అని అన్నది విన్నారు. అప్పుడే ఈ ఆయతు అవతరించింది: “(ప్రవక్తా!) నిర్ణయాధికారాలలో నీకు పాత్ర ఏదీ లేదు.” (ఆలె ఇమ్రాన్ 3:128). – (బుఖారి, నసాయీ).

మరో ఉల్లేఖనంలో ఉంది: సఫ్వాన్ బిన్ ఉమయ్యా, సుహైల్ బిన్ అమ్ర్, హారిస్ బిన్ హిషాంపై “బద్ దుఆ” చేస్తున్నప్పుడు (శపిస్తున్నప్పుడు) అవతరించింది: “(ప్రవక్తా!) నిర్ణయాధికారాలలో నీకు పాత్ర ఏదీలేదు.” (ఆలె ఇమ్రాన్ 3: 128). – (బుఖారి).

అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం: “నీ దగ్గరి బంధువులను భయపెట్టు.” (షుఅరా 26: 214). అన్న ఆయతు అవతరించిన తరువాత “ఓ ఖురైషులారా!” అని లేక ఇలాంటిదే ఒక పదముతో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అందరిని సమావేశపరచి ఇలా చెప్పారు: “మీ ప్రాణాలను మీరు నరకాగ్ని నుండి కాపాడుకోండి. అల్లాహ్ వద్ద నేను మీకు ఏ మాత్రం సహాయం చేయలేను. ఓ అబ్బాసు బిన్ అబ్దుల్ ముత్తలిబ్! అల్లాహ్ వద్ద నేను మీకు ఏ మాత్రం సహాయం చేయలేను. ప్రవక్త మేనత్త సఫియ్యా! నేను నీకు అల్లాహ్ వద్ద ఏ మాత్రం సహాయం చేయలేను. ముహమ్మద్ కుమార్తె ఫాతిమా! నీవు కోరినంత నా సొమ్ము అడుగు ఇచ్చేస్తా, కాని అల్లాహ్ వద్ద నేను నీకు ఏ మాత్రం సహాయం చేయలేను“. (బుఖారి).

ముఖ్యాంశాలు:

1. పై రెండు ఆయతుల భావం.

2. ఉహద్ యుద్ధం యొక్క సంఘటన.

3. సకల ప్రవక్తల నాయకులైన ముహమ్మద్  (సల్లల్లాహు అలైహి వ సల్లం) “ఖునూత్ “లో దుఆ చేస్తు అంటున్నారు. (అలాంటి మహాపురుషులు తమ కష్ట కాలాల్లో అల్లాహ్ తో మొరపెట్టుకుంటే, సామాన్యులు తమ కష్ట కాలాల్లో అల్లాహ్ తో మొర పెట్టుకొనుట ఎక్కువ అవసరం).

4. ఎవరిని శపించబడినదో వారు అప్పుడు అవిశ్వాసులుగా ఉండిరి.

5. వీరు ఇతర అవిశ్వాసులు చేయని ఘోరకార్యాలు వారు చేశారు. ఉదా: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ను గాయపరిచారు. ఆయన్ను హతమార్చడానికి ప్రయత్నించారు. అమర వీరులైన (హత్యచేయబడిన విశ్వాసుల) అవయవాలను సయితం కోశారు. వీరు (విశ్వాసులు) వారి (అవిశ్వాసుల) తండ్రి సంబంధిత దగ్గరి బంధువులే.

6. ఇంత జరిగినందుకు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారిని శపించినప్పుడు పై వాక్యం “(ప్రవక్తా!) నిర్ణయాధికారాలలో నీకు పాత్ర ఏదీలేదు”  ను అల్లాహ్ అవతరింపజేసాడు.

7. “వారిని క్షమించే, శిక్షించే అధికారం అల్లాహ్ కు మాత్రమే ఉంది“(ఆలె ఇమ్రాన్ 3:128). అన్న అల్లాహ్ ఆదేశం ప్రకారం, అల్లాహ్ వారిని క్షమించాడు. వారు ఇస్లాం స్వీకరించారు. .

8. ముస్లింపై కష్టకాలం దాపురించినప్పుడు “ఖునూత్ నాజిల” చేయవలెను.

9. ఎవరిని శపించబడుతుందో వారిని, వారి తండ్రుల పేరుతో కలిపి శపించ వచ్చును.

10. ఖునూత్ లో ప్రత్యేకించబడిన ఒక్కొక్క వ్యక్తిని పై ప్రవక్త శపించారు.

11. (షుఆరా:214) ఆయత్ అల్లాహ్ అవతరించినప్పుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)  అందరిని సమూహపరచి తౌహీద్ పిలుపు ఇచ్చిన విషయం తెలిసింది.

12. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తౌహీద్ ప్రచారం చేయునప్పుడు, “పిచ్చివాడు” అని అవిశ్వాసుల ద్వారా పిలువబడ్డారు. ఈ రోజుల్లో ఎవరైనా ముస్లిం అదే పని చేస్తుంటే వారి తో కూడా అలాగే ప్రవర్తిస్తున్నారు.

13. దగ్గరి, దూరపు బంధువులందరికి “నేను మీకు సహాయము చేయలేను” అని స్పష్టం చేశారు. స్వయం తమ కుమార్తె అయిన ఫాతిమాకు కూడా “ఓ ఫాతిమా! నేను నీకు సహాయము చేయలేను ” అని చెప్పారు. ఆయన ప్రవక్తల నాయకులై, స్త్రీల నాయకురాలైన ఫాతిమ (రజియల్లాహు అన్హా)కు ఏ మాత్రం పనికి రాను అని తెలిపారు. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) సత్యం తప్ప మరేది పలకరు అని అందరి విశ్వాసం. అయినా ఈ రోజుల్లో ఈ రోగం సామాన్య ప్రజలకే కాక విద్యావంతులు కూడా అర్థం చేసుకోలేకున్నారు. తౌహీద్ , ధర్మం వారి వద్ద ఎంత విచిత్రమైందో అగపడుతుంది.

తాత్పర్యం: (అల్లామా అస్-సాదీ) :

ఇక్కడి నుండి తౌహీద్ యొక్క నిదర్శనాలు ప్రారంభం అవుతున్నాయి. తౌహీద్ ను నిరూపించడానికి ఉన్నటువంటి గ్రాంధిక, జ్ఞాన సంబంధమైన నిదర్శనాలు మరేదానికి లేవు.

తౌహీద్ రుబూబియత్, ఉలూహియత్ స్వయంగా ఇవి రెండు పెద్ద నిదర్శనాలు. సృష్టి, నిర్వహణలో అద్వితీయుడైన, అన్ని విధాలుగా సర్వశక్తుడైన వాడే ఆరాధనలకు అర్హుడు. అతడు తప్ప మరెవ్వడూ ఆరాధనలకు అర్హుడు కాడు.

అదే విధంగా సృష్టిరాసుల గుణాలను పరిశీలిస్తే కూడా దాని నిదర్శనాలు కనబడుతున్నాయి. అల్లాహ్ యేతరులలో దైవదూత, మానవుడు, చెట్లు, గుట్టలు మొదలగు ఎవరెవరి పూజా చేయబడుతుందో వారందరూ/అవన్నియు అల్లాహ్  ఎదుట దీనులు, బలహీనులు, భిక్షకులు. లాభనష్టాలు చేకూర్చే రవ్వంత శక్తి కూడా లేనివారు. ఏ కొంచెమూ సృష్టించలేరు. వారే సృష్టింపబడ్డారు. లాభనష్టాలు, జీవన్మరణాలకు మరియు రెండవసారి పునరుత్తానానికి వారు అధికారులు కారు. అల్లాహ్ మాత్రమే సర్వ సృష్టికి సృష్టికర్త. పోషకుడు. నిర్వహకుడు. లాభనష్టాలు చేకూర్చే, కోరిన వారికి ప్రసాదించే, కోరనివారికి ప్రసాదించకుండా ఉండే అధికారం కలవాడు. సర్వశక్తి ఆయన చేతిలో ఉంది. ఇంతకు మించిన, మంచి నిదర్శనాలు ఇంకేం కావాలి. వీటి ప్రస్తావన అల్లాహు తఆలా, ఖుర్ఆన్ లో అనేక చోట్ల ప్రస్తావించాడు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అనేక సార్లు తెలిపారు. ఇది అల్లాహ్ ఒక్కడు, సత్యుడు, బహుదైవత్వం (షిర్క్) తుఛ్ఛం అనడానికి స్వాభావికమైన, జ్ఞాన సంబంధమైన నిదర్శనాలతో పాటు, గ్రాంధిక, ఎల్లవేళల్లో కనవినబడుతున్న నిదర్శనాలు కూడానూ.

సృష్టిలో కెల్ల అతి ఉన్నతుడైన ఒక మానవుడు (ప్రవక్త) స్వయం తన దగ్గరి బంధువునికి ఏ లాభం అందించలేక పోయినప్పుడు ఇతరులకు ఏమివ్వగలడు? ఇంతా తెలిసికూడా అల్లాహ్ తో షిర్క్ చేసినా, సృష్టిలో ఏ ఒక్కరిని అల్లాహ్ కు సమానంగా నిలబెట్టినవాడు నాశనమవుగాకా, అతడు ధర్మం కోల్పోయిన తరువాత, బుద్ధి జ్ఞానం కూడా కోల్పోయాడు.

అల్లాహ్ ను ఆ తరువాత సృష్టిని తెలుసుకున్నవాడు, అతని ఈ తెలివితో కేవలం అల్లాహ్ నే ఆరాధించాలి, ధర్మమును ఆయనకే ప్రత్యేకించాలి, ఆయన్ను మాత్రమే ప్రశంసించాలి, తన నాలుక, హృదయం, శరీరాంగాలతో ఆయనకే కృతజ్ఞత తెలుపాలి. సృష్టి రాసులతో భయం, ఆశ లాంటివేమి ఉండకూడదు.


నుండిఏకత్వపు బాటకు సత్యమైన మాట (అల్ ఖవ్లుల్ సదీద్ షర్హ్ కితాబ్ అత్ తౌహీద్)  – ఇమామ్ అస్-సాదీ [పుస్తకం]. తెలుగు అనువాదం: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

అల్లాహ్ అంటే ఎవరు? అల్లాహ్ ను మనం ఎలా గుర్తించాలి? [ఆడియో & టెక్స్ట్]

నిజ సృష్టికర్తను ఎలా గుర్తించాలి? ఆయన గుణగణాలేమిటి?
https://youtu.be/YXvC41kqzPw (8:34 నిముషాలు )
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

ఈ ప్రసంగంలో “అల్లాహ్ అంటే ఎవరు?” మరియు “అల్లాహ్‌ను మనం ఎలా గుర్తించాలి?” అనే రెండు ప్రాథమిక ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వబడ్డాయి. పొగను చూసి నిప్పును, వస్తువును చూసి దాని తయారీదారుని గుర్తించినట్లే, ఈ బ్రహ్మాండమైన సృష్టిని చూసి దాని వెనుక ఒక సృష్టికర్త ఉన్నాడని తార్కికంగా అర్థం చేసుకోవచ్చని వక్త వివరిస్తారు. ఆ సృష్టికర్త ఒక్కడేనని, ఆయనకు ఎవరూ సాటిలేరని స్పష్టం చేస్తారు. ఆయన ఏకత్వాన్ని, గొప్పతనాన్ని మరియు లక్షణాలను వివరించడానికి, వక్త దివ్య ఖురాన్‌లోని ‘సూరహ్ అల్-ఇఖ్లాస్’ మరియు ‘ఆయతుల్ కుర్సీ’లను వాటి తెలుగు అనువాదంతో సహా ఉదహరించారు. ఈ వచనాల ద్వారా అల్లాహ్ నిరపేక్షాపరుడని, సజీవుడని, సర్వజ్ఞుడని, మరియు ఆయనకు తల్లిదండ్రులు, సంతానం లేరని, ఆయనకు ఎవరూ సమానులు కారని నొక్కిచెప్పారు. సత్యాన్ని గ్రహించి, ఏకైక సృష్టికర్త అయిన అల్లాహ్‌ను ఆరాధించాలని ఈ ప్రసంగం పిలుపునిస్తుంది.

అల్హందులిల్లాహ్. అల్లాహ్ అంటే ఎవరు? అల్లాహ్‌ను మనం ఎలా గుర్తించాలి? ఈ రెండు ప్రశ్నలకు సంక్షిప్తంగా సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను. శ్రద్ధగా వింటారని ఆశిస్తున్నాను.

అల్లాహ్‌ను మనం ఎలా గుర్తించాలి? ఈ ప్రశ్నకు మనం లాజికల్‌గా కూడా సమాధానం పొందవచ్చు. అంటే, పొగను చూసి దూరంగా, పొగను చూసి అక్కడ అగ్ని మండుతున్నట్టుగా మనం అర్థం చేసుకుంటాము. ఒక టేబుల్‌ను, కట్టెతో చేయబడిన అల్మారీని చూసి, దీనిని తయారు చేసేవాడు ఒక కార్పెంటర్ అని, ఎక్కడైనా ఏదైనా మంచి డిజైన్‌ను చూసి ఒక మంచి ఆర్టిస్ట్ దీన్ని డిజైన్ చేశాడు అని, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నో ఉదాహరణలు మన ముందుకు వస్తాయి కదా.

అయితే, ఈ బ్రహ్మాండమైన సృష్టిని మన కళ్లారా మనం చూస్తూనే ఉన్నాము కదా. అయితే, వీటన్నిటినీ సృష్టించిన సృష్టికర్త ఒకడు ఉన్నాడు అని అట్లే మనకు తప్పకుండా తెలుస్తుంది. ఆ సృష్టికర్త ఒకే ఒక్కడు.

ఈ లోకంలో ఆ నిజమైన సృష్టికర్తను వదలి ఎంతోమంది ప్రజలు వేరే ఎవరెవరినైతే పూజిస్తున్నారో, ఆరాధిస్తున్నారో, ఒక్కసారి ప్రశాంతమైన మనసుతో మీరు ఆలోచించండి. ఆ ఆరాధ్యులలో, ఎవరినైతే ఆ నిజ సృష్టికర్తను వదిలి ఎవరినైతే ప్రజలు పూజిస్తున్నారో, ఆ పూజ్యులలో ఏ ఒక్కరైనా గానీ “మేము ఆకాశం సృష్టించామని, భూమిని మేము సృష్టించామని, వర్షాన్ని మేము కురిపిస్తున్నామని,” ఈ విధంగా ఏమైనా దావా చేసిన వారు ఉన్నారా? లేరు. ఉండరు కూడా.

అయితే, ఇంకా ఇలాంటి ఉదాహరణలతోనే మీకు సమాధానాలు ఇస్తూ ముందుకు పోవడం మంచిది కాదు. స్వయంగా ఆ సృష్టికర్త, మనందరి నిజ ఆరాధ్య దైవం, ఆయన యొక్క అంతిమ గ్రంథంలో సర్వ మానవాళిని ఉద్దేశించి, స్వయంగా ఆయన తన గురించి ఏ పరిచయం అయితే మనకి ఇచ్చాడో, ఒక్కసారి శ్రద్ధగా ఆలకిద్దాము.

قُلْ هُوَ اللَّهُ أَحَدٌ
ఖుల్ హువల్లాహు అహద్
اللَّهُ الصَّمَدُ
అల్లాహుస్ సమద్
لَمْ يَلِدْ وَلَمْ يُولَدْ
లమ్ యలిద్ వలమ్ యూలద్
وَلَمْ يَكُن لَّهُ كُفُوًا أَحَدٌ
వలమ్ యకుల్లహు కుఫువన్ అహద్

వారికీ ఇలా చెప్పు, అల్లాహ్ ఆయన ఒక్కడు, ఏకైకుడు. అల్లాహ్ నిరపేక్షాపరుడు, ఎవరి ఏ అవసరం లేని వాడు, సృష్టిలో ప్రతీ ఒక్కరి అవసరాన్ని తీర్చువాడు. ఆయన ఎవరిని కనలేదు అంటే, ఆయనకు భార్య, పిల్లలు ఎవరూ లేరు. ఇంకా, ఆయన కూడా ఎవరికీ పుట్టిన వాడు కాడు, అంటే ఆయనకు తల్లిదండ్రులు కూడా ఎవరూ లేరు. ఆయనకు సరి సమానుడు, పోల్చదగిన వాడు ఎవడూ లేడు.

ఇది దివ్య గ్రంథం, సర్వ మానవాళి కొరకు మార్గదర్శిగా పంపబడినటువంటి దివ్య గ్రంథం ఖురాన్‌లోని 112వ అధ్యాయం.

ఇక ఆ సృష్టికర్త అయిన అల్లాహ్, సూరతుల్ బఖరా, సూరహ్ నెంబర్ రెండు, ఆయత్ నెంబర్ 255లో తన గురించి ఎలా పరిచయం చేశాడో, చాలా శ్రద్ధగా ఆలకించండి.

ٱللَّهُ لَآ إِلَـٰهَ إِلَّا هُوَ ٱلْحَىُّ ٱلْقَيُّومُ ۚ لَا تَأْخُذُهُۥ سِنَةٌۭ وَلَا نَوْمٌۭ ۚ لَّهُۥ مَا فِى ٱلسَّمَـٰوَٰتِ وَمَا فِى ٱلْأَرْضِ ۗ مَن ذَا ٱلَّذِى يَشْفَعُ عِندَهُۥٓ إِلَّا بِإِذْنِهِۦ ۚ يَعْلَمُ مَا بَيْنَ أَيْدِيهِمْ وَمَا خَلْفَهُمْ ۖ وَلَا يُحِيطُونَ بِشَىْءٍۢ مِّنْ عِلْمِهِۦٓ إِلَّا بِمَا شَآءَ ۚ وَسِعَ كُرْسِيُّهُ ٱلسَّمَـٰوَٰتِ وَٱلْأَرْضَ ۖ وَلَا يَـُٔودُهُۥ حِفْظُهُمَا ۚ وَهُوَ ٱلْعَلِىُّ ٱلْعَظِيمُ ٢٥٥

ఆ నిజ సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క సుమారు పది గుణాలు ఈ ఆయతులో తెలుపబడ్డాయి. శ్రద్ధగా వినండి మరియు ఆయన తప్ప ఈ సృష్టిలో ఏ ఒక్కరిలోనైనా ఈ గుణాలు ఉన్నాయా గమనించండి. తద్వారా ఆయన ఏకైకుడు, ఆయనే ఒకే ఒక్కడు మన ఆరాధనలకు అర్హుడు అన్నటువంటి విషయాన్ని, సత్యాన్ని కూడా గ్రహించండి. ఇప్పుడు నేను మీ ముందు పఠించినటువంటి ఆయతి యొక్క తెలుగు అనువాదం:

అల్లాహ్, ఆయన తప్ప సత్య ఆరాధ్యుడు మరెవ్వడూ లేడు. ఆయన సజీవుడు, అన్నింటికీ మూలాధారం. ఆయనకు కునుకు గానీ నిద్ర గానీ పట్టదు. భూమ్యాకాశాలలో ఉన్న సమస్తమూ ఆయన ఆధీనంలో ఉన్నది. ఆయన అనుమతి లేకుండా ఆయన సమక్షంలో సిఫారసు చేయగలవాడెవడు? వారికి ముందు ఉన్న దానిని, వెనుక ఉన్న దానిని కూడా ఆయన ఎరుగును. ఆయన కోరినది తప్ప ఆయనకున్న జ్ఞానంలోని ఏ విషయమూ వారి గ్రాహ్య పరిధిలోకి రాదు. ఆయన కుర్సీ వైశాల్యం భూమ్యాకాశాలను చుట్టుముట్టి ఉంది. వాటిని రక్షించటానికి ఆయన ఎన్నడూ అలసిపోడు. ఆయన సర్వోన్నతుడు, చాలా గొప్పవాడు.

అల్లాహు అక్బర్. అధ్యాయం 112లో మీరు సుమారు నాలుగు Unique , సాటి లేని అటువంటి గుణాల గురించి తెలుసుకున్నారు. ఇప్పుడు చదివిన ఈ రెండవ అధ్యాయంలోని 255వ ఆయతులో సుమారు పది గుణాలు తెలుసుకున్నారు. నిశ్చింతగా, ఏకాంతంలో పరిశీలించండి. మరియు మన ఈ శరీరంలో నుండి ప్రాణం వీడకముందే సత్యాన్ని గ్రహించండి. ఆ నిజమైన సృష్టికర్త, ఏకైక ఆరాధ్యుడు అల్లాహ్ మనందరికీ సద్భాగ్యం ప్రసాదించు గాక.

అల్లాహ్ (త’ఆలా) – Main Page
https://teluguislam.net/allah/

అల్లాహ్ అంటే ఎవరు? ఇస్లాం అంటే ఏమిటి? [ఆడియో & టెక్స్ట్]

అల్లాహ్ అంటే ఎవరు? ఇస్లాం అంటే ఏమిటి?
https://youtu.be/e6YALKM5wwU [33 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, అల్లాహ్ యొక్క ఏకత్వం, ఆయన గుణగణాలు మరియు సృష్టిలో ఆయన పాత్ర గురించి వివరించబడింది. అల్లాహ్ యే ఈ సృష్టి అంతటికీ మూలాధారుడని, ఆయనే జీవన్మరణాలకు అధిపతి అని మరియు సర్వ మానవాళికి ఉపాధిని ప్రసాదించేవాడని ఖురాన్ ఆయతుల ద్వారా స్పష్టం చేయబడింది. మానవులకు మార్గదర్శకత్వం కోసం అల్లాహ్ ప్రవక్తలను పంపాడని, వారిలో చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అని చెప్పబడింది. ఇస్లాం అంటే అల్లాహ్ కు లొంగిపోవడమని, ఇది కేవలం ఒక మతవర్గానికి చెందినది కాదని, సర్వ మానవాళికి చెందిన సత్య ధర్మమని నొక్కి చెప్పబడింది. భారతదేశంలో ఇస్లాం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలోనే ప్రవేశించిందని, ఆది మానవుడు ఆదం అలైహిస్సలాం కూడా భారత ఖండంలోనే అవతరించారని చారిత్రక ఆధారాలతో వివరించబడింది. చివరగా, ఇస్లాంను కాదని మరో మార్గాన్ని అనుసరించేవారు పరలోకంలో నష్టపోతారని ఖురాన్ హెచ్చరికతో ప్రసంగం ముగించబడింది.

అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్, నబియ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహి వ సహ్బిహి అజ్మయీన్, అమ్మా బాద్.

అల్లాహ్ త’ఆలా ఈ సృష్టి అంతటికీ మూలాధారుడు. ఆది నుండి ఉన్నవాడు, అంతము వరకు ఉండేవాడు. సర్వ ప్రాణి, సర్వ సృష్టికి సమాప్తము, వినాశనము అనేది ఉంటుంది. కానీ అల్లాహ్, అతనికి ఎలాంటి మరణము గానీ, ఎలాంటి సమాప్తము గానీ లేదు.

అల్లాహ్, ఏ అస్తిత్వాన్ని, ఎవరినైతే మనం అల్లాహ్ అని అంటామో ఆయన గురించి ఖురాన్ దివ్య గ్రంథంలో ఎన్నో ఆయతులలో ఆయన యొక్క పరిచయం చాలా వివరంగా ఉంది.

اللَّهُ الَّذِي خَلَقَكُمْ ثُمَّ رَزَقَكُمْ ثُمَّ يُمِيتُكُمْ ثُمَّ يُحْيِيكُمْ
(అల్లాహుల్లదీ ఖలకకుమ్, సుమ్మ రజఖకుమ్, సుమ్మ యుమీతుకుమ్, సుమ్మ యుహ్యీకుమ్)
ఆయనే మిమ్మల్ని సృష్టించినవాడు. అల్లాహ్ ఆయనే మీ అందరికీ ఆహారం ప్రసాదించేవాడు. ఆ అల్లాహ్ యే మీ అందరికీ మరణం ప్రసాదిస్తాడు మరియు ఆ తర్వాత మరోసారి మిమ్మల్ని బ్రతికిస్తాడు, తిరిగి లేపుతాడు. (30:40)

ఈ విధంగా చూసుకుంటూ పోతే అల్లాహ్ గురించి ఖురాన్ గ్రంథంలో ప్రత్యేకంగా సూర రూమ్, ఇంకా వేరే కొన్ని సూరాలలో చాలా స్పష్టంగా ఆయతులు ఉన్నాయి. ఉదాహరణకు సూర ఆరాఫ్, ఆయత్ నంబర్ 54.

إِنَّ رَبَّكُمُ اللَّهُ الَّذِي خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ فِي سِتَّةِ أَيَّامٍ ثُمَّ اسْتَوَىٰ عَلَى الْعَرْشِ يُغْشِي اللَّيْلَ النَّهَارَ يَطْلُبُهُ حَثِيثًا وَالشَّمْسَ وَالْقَمَرَ وَالنُّجُومَ مُسَخَّرَاتٍ بِأَمْرِهِ ۗ أَلَا لَهُ الْخَلْقُ وَالْأَمْرُ ۗ تَبَارَكَ اللَّهُ رَبُّ الْعَالَمِينَ
నిస్సందేహంగా అల్లాహ్‌యే మీ ప్రభువు. ఆయన ఆకాశాలను, భూమిని ఆరు రోజులలో సృష్టించాడు. ఆ తరువాత సింహాసనంపై (అర్ష్‌పై) ఆసీనుడయ్యాడు. ఆయన రాత్రిని పగటిపై కప్పివేస్తాడు. అది దాన్ని వేగంగా వెంబడిస్తూ వస్తుంది. ఇంకా ఆయన సూర్యచంద్రులను, నక్షత్రాలను తన ఆజ్ఞకు కట్టుబడి ఉండే విధంగా సృష్టించాడు. వినండి! సృష్టి ప్రక్రియ ఆయన స్వంతం. ఆజ్ఞాపన ఆయన సొత్తు. సకల లోకాల ప్రభువైన అల్లాహ్‌ అపారమైన శుభాలు కలవాడు.(7:54)

ఆయనే రాత్రిని పగటిపై కప్పుతున్నాడు. మరియు ఈ పగలు అనేది రాత్రి వెంట పడుతుంది. మరియు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నీ కూడా ఆయన ఆజ్ఞకు లోబడి ఉన్నాయి. వినండి, ఈ లోకంలో ఆదేశం చెల్లేది, ఆజ్ఞ పాలన జరిగేది అల్లాహ్ ది మాత్రమే. సృష్టి ఆయనదే గనక ఆజ్ఞా పాలన కూడా ఆయనదే జరుగును. ఆ అల్లాహ్ సర్వ విశ్వ విశ్వాసాలకు, ఈ సర్వ లోకాలకు ప్రభువు, చాలా శుభము కలవాడు.

ఇంకా ఖురాన్ గ్రంథంలో మనం చూసినట్లయితే,

اللَّهُ الَّذِي رَفَعَ السَّمَاوَاتِ بِغَيْرِ عَمَدٍ تَرَوْنَهَا
(అల్లాహుల్లదీ రఫ అస్సమావాత్ బిగైరి అమదిన్ తరౌనహా)
స్తంభాలు లేకుండా (నే) ఆకాశాలను అంతేసి ఎత్తుకు లేపిన వాడే అల్లాహ్‌. దీన్ని మీరు చూస్తూనే ఉన్నారు. (13:2)

ఆ ఆకాశాలను ఎలాంటి పిల్లర్ లేకుండా ఏ ఒక్క పిల్లర్ లేకుండా పైకి లేపి నిలిపాడు, తరౌనహా, దీనికి ఏ ఒక్క పిల్లర్ లేని విషయం మీరు చూస్తున్నారు. మరోచోట సూర ఇబ్రాహీంలో,

اللَّهِ الَّذِي لَهُ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ
(అల్లాహుల్లదీ లహూ మా ఫిస్సమావాతి వ మా ఫిల్ అర్ద్)
ఆకాశాలలో, భూమిలో ఉన్న సమస్తమూ ఆ అల్లాహ్‌దే. (14:2)

وَوَيْلٌ لِلْكَافِرِينَ مِنْ عَذَابٍ شَدِيدٍ
(వ వైలున్ లిల్ కాఫిరీన మిన్ అదాబిన్ షదీద్)
తిరస్కారుల కొరకు కఠిన శిక్ష మూలంగా వినాశం ఉంది. (14:2)

మరి ఎవరైతే సత్యాన్ని తిరస్కరిస్తున్నారో, అల్లాహ్ ను తిరస్కరిస్తున్నారో అలాంటి వారికి వినాశనం ఉంది మరియు చాలా భయంకరమైన శిక్ష ఉంది. ఇంకా ఈ రకంగా చూసుకుంటే ఎన్నో ఆయతులు ఉన్నాయి. ఉదాహరణకు సూర ఇబ్రాహీం.

اللَّهُ الَّذِي خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ وَأَنزَلَ مِنَ السَّمَاءِ مَاءً فَأَخْرَجَ بِهِ مِنَ الثَّمَرَاتِ رِزْقًا لَّكُمْ ۖ وَسَخَّرَ لَكُمُ الْفُلْكَ لِتَجْرِيَ فِي الْبَحْرِ بِأَمْرِهِ ۖ وَسَخَّرَ لَكُمُ الْأَنْهَارَ
భూమ్యాకాశాలను సృష్టించి, ఆకాశాల నుండి వర్షాన్ని కురిపించి, తద్వారా మీ ఆహారం కోసం పండ్లు ఫలాలను ఉత్పన్నం చేసినవాడే అల్లాహ్‌. ఆయనే తన ఆజ్ఞతో సముద్రంలో నౌకలు నడవటానికి వాటిని మీకు లోబరచాడు. ఆయనే నదీ నదాలను మీ అధీనంలో ఉంచాడు. (14:32)

అయితే అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్, ఆ సృష్టికర్త, పోషణకర్త, జీవన్మరణాల ప్రధాత, ఈ సర్వ సృష్టికి మూలం ఆయనే. అయితే సర్వ సృష్టిని మన సేవ కొరకు, మనం వాటి ద్వారా లాభం పొందడానికి సృష్టించాడు. సూర బఖరాలోని మూడవ రుకూలో,

هُوَ الَّذِي خَلَقَ لَكُمْ مَا فِي الْأَرْضِ جَمِيعًا
(అల్లదీ ఖలక లకుమ్ మా ఫిల్ అర్ది జమీఆ)
భూమిలో ఉన్న సమస్తాన్ని మీ కొరకే సృష్టించినవాడు ఆయనే. (2:29)

ఆ అల్లాహు త’ఆలా ఈ భూమిలో ఉన్న సమస్తాన్ని, ఖలక లకుమ్ మా ఫిల్ అర్ది జమీఆ, సమస్తాన్ని మీ కొరకు పుట్టించాడు. కానీ మనల్ని కేవలం ఆయన్ని ఆరాధించుటకే పుట్టించాడు. ఆయన్ను ఎలా ఆరాధించాలి? అందుకొరకు ఆయన స్వయంగా ఏదైనా అవతారం ఎత్తి ఈ లోకంలో రాలేదు. ఎలాగైతే వేరే కొందరు తప్పుడు మార్గాల్లో ఉన్నారో, కొందరు ఏమనుకుంటారు, స్వయంగా అల్లాహ్ లేదా వారి వారి భాషల్లో వారు అల్లాహ్ ను దేవుడు అని, ఈశ్వరుడు అని ఏదైతే అనుకుంటారో వారి యొక్క తప్పుడు విశ్వాస ప్రకారం, ఆ సృష్టికర్త మానవులకు మార్గం చూపడానికి అవతారం ఎత్తి వస్తాడు అని, లేదా ఇద్దరు ముగ్గురు కలిసి ఒక దేవుడై వారిలో ఒకరిని మానవులకు మార్గం చూపడానికి పంపాడు అని, ఇవన్నీ కూడా తప్పుడు విశ్వాసాలు.

ఆ సృష్టికర్త అయిన అల్లాహ్ ఏం చేశాడు? ఆయన మానవుల్లోనే అతి ఉత్తమ నడవడిక గల మరియు మానవుల్లోనే అందరికీ తెలిసి ఉన్న ఒక మంచి వ్యక్తిని తనకు మరియు తన దాసులకు మధ్య ప్రవక్తగా, ఒక సందేశ దూతగా ఎన్నుకున్నాడు.

اللَّهُ يَصْطَفِي مِنَ الْمَلَائِكَةِ رُسُلًا وَمِنَ النَّاسِ
(అల్లాహు యస్తఫీ మినల్ మలాఇకతి రుసులన్ వ మినన్నాస్)
అల్లాహ్ తన సందేశహరులుగా దైవదూతలలో నుండి, మానవులలో నుండి ఎన్నుకుంటాడు. (22:75)

అల్లాహు త’ఆలా దైవదూతల్లో కూడా సందేశ దూతలను ఎన్నుకుంటాడు, అలాగే మానవుల్లో కూడా అల్లాహు త’ఆలా తనకిష్టమైన వారిని ప్రవక్తగా ఎన్నుకుంటాడు. ఎన్నుకొని అతని వద్దకు తన దూత ద్వారా గాని లేదా డైరెక్ట్ అతని హృదయ ఫలకం మీద తన యొక్క సందేశాన్ని అవతరింపజేస్తాడు. ఆ ప్రవక్త అల్లాహ్ యొక్క ఆ సందేశాన్ని తీసుకొని, స్వీకరించి, నేర్చుకొని, తర్వాత ప్రజలకు వినిపిస్తారు.

ఈ విధంగా ఖురాన్ లో అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ ఎన్నో సందర్భాల్లో ఈ విషయం తెలిపి ఉన్నాడు. అల్లాహు త’ఆలా తనకిష్టమైన ప్రజల్లోని ఒక వ్యక్తిని ఎన్నుకున్న తర్వాత ఆ ప్రవక్తగా చేసిన తర్వాత అతని వద్దకు దైవదూతను పంపి గానీ, అతని వద్దకు దివ్యవాణి పంపి గానీ, వహీ. మరి లేదా ఏదైనా పర్దా, హిజాబ్ అడ్డులో ఉండి మాట్లాడి గానీ అల్లాహు త’ఆలా తన యొక్క సందేశాన్ని అతని వద్దకు చేర్పిస్తాడు. ఈ విధంగా మానవులు ఎలా అల్లాహ్ ను ఆరాధించాలి, ఆ ఆరాధన మార్గాన్ని తన ప్రవక్తల ద్వారా వారికి నేర్పుతాడు.

ఇక ఎవరైతే వక్రమార్గంలో పడి, స్వాభావిక వారి యొక్క ఫిత్రత్, స్వాభావికం, ప్రకృతి విధానాన్ని వదిలేసి తప్పుడు ఆచారాల్లో, దురాచారాల్లో పడి ఉంటారో, వారు ఏమంటారు, ఈ మాలాంటి ఒక మనిషి మమ్మల్ని ఎందుకు మంచి గురించి చెప్పాలి? ఎందరో ప్రవక్త కాలాల్లో ప్రవక్తను తిరస్కరించినవారు,

أَبَشَرٌ يَهْدُونَنَا
(అ బషరున్ యహ్దూననా)
‘ఏమిటి, సాటి మానవులు మాకు మార్గదర్శకత్వం చేస్తారా?!’ (64:6)

మాలాంటి మనిషే కదా ఇతను, ఇతని మీదనే అల్లాహు త’ఆలా ఎందుకు వహీ పంపాడు? ఇతన్నే ప్రవక్తగా ఎందుకు ఎన్నుకున్నాడు? మాలో ఇంకా వేరే ఎవరు లేకుండేనా? అంటే దీని భావం ఏంటి? ఈ విధంగా వ్యతిరేకించడం మనిషిలో ఈ వ్యతిరేక గుణం మొదలైంది అంటే, ప్రతి దాన్ని, స్వయంగా తన తండ్రిని అనవచ్చు. నువ్వే నాకు ఎందుకు తండ్రిగా అయినావు? వేరే ఒకడు ఎందుకు కాలేదు? నువ్వే నాకు ఎందుకు తల్లిగా అయినావు? వేరే ఒకడు ఎందుకు కాలేదు? నువ్వే మాకు ఎందుకు రాజుగా ఉన్నావు? వేరే ఒకడు ఎందుకు కాలేదు? ఇతడే ఎందుకు మాకు ప్రవక్తగా వచ్చాడు అన్న విషయం, దాని గురించి అల్లాహు త’ఆలా ఒక సమాధానం ఏమి చెప్పాడు? అల్లాహ్ అతనిదే సృష్టి, అతనిదే ఆజ్ఞా పాలన జరుగును. అతడు తాను కోరిన వారిని ప్రవక్తగా ఎన్నుకుంటాడు. అల్లాహ్ యొక్క సృష్టిలో అల్లాహ్ ఎందుకు ఇలా చేస్తున్నాడు అని అడిగే హక్కు ఎవరికీ లేదు. ఎందుకంటే అల్లాహ్ చేసేది మానవుల మేలు కొరకు, అది ప్రకృతి సిద్ధంగా ఉంటుంది. కానీ ఎవరైతే ఇలాంటి అడ్డ ప్రశ్నలు వేస్తారో వారు ప్రకృతి సిద్ధాంతాలకు దూరమై వక్రమార్గంలో నడుస్తూ ఉంటారు.

మరికొందరు ఏమన్నారు? సరే, మాకు సన్మార్గం చూపడానికి అల్లాహ్ యొక్క ఇష్టం ఉండేది ఉంటే, ఏదైనా దైవదూతలను పంపే, పంపకపోయేదా? దైవదూతలను ఎందుకు పంపలేదు? అయితే సూర అన్ఆమ్ లో దాని యొక్క సమాధానం కూడా ఇవ్వడం జరిగింది. వలౌ జఅల్నాహు మలకన్, ఒకవేళ దైవదూతలను మేము వారి మధ్యలో ప్రవక్తగా చేసి పంపినా, వారిని ఆ దైవదూత రూపంలో ఉంచలేము. వారిని ఒక మనిషిగా చేసి వారికి ఎందుకంటే గమనించండి, మానవుల అవసరాలు దైవదూతల అవసరాలకు భిన్నంగా ఉంటాయి. అయితే మానవులకు సన్మార్గం చూపడానికి మానవుల్లోనే ఒక జ్ఞానం ఉన్న, మంచి నడవడిక గల, ఇతరులకు ఆదర్శంగా ఉండగలిగే అటువంటి వారినే అల్లాహు త’ఆలా ఎన్నుకుంటాడు.

అయితే సోదరులారా, చెప్పే విషయం ఏంటంటే, అల్లాహ్, ఆయన ఎలాంటి అవతారం ఎత్తడు. ఆయన ఒకరి ఏదైనా వేషంలో ఇహలోకంలోకి రాడు, మానవులకు మార్గం చూపడానికి. ఆయన సిద్ధాంతం ఏంటి? ఇంతకుముందు గ్రంథాల్లో కూడా ఆ విషయాల్ని తెలియబరిచాడు. చిట్టచివరి గ్రంథం ఖురాన్ లో కూడా స్పష్టపరిచాడు. అయితే మానవులకు మార్గం చూపడానికి అల్లాహు త’ఆలా ప్రవక్తల పరంపర ఏదైతే మొదలుపెట్టాడో ఆదం అలైహిస్సలాం నుండి, చిట్టచివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వరకు ఈ పరంపర సాగుతూ వచ్చింది. ముహమ్మద్ ప్రవక్త ద్వారా ఈ ప్రవక్తల పరంపరను అల్లాహు త’ఆలా అంతం చేశాడు. ఆయనను చివరి ప్రవక్తగా పంపాడు. మరియు ప్రళయం సంభవించే వరకు ఆ ప్రవక్తనే మనం ఆదర్శంగా, మనం అంటే సర్వ మానవులం, ఆదర్శంగా చేసుకొని అల్లాహ్ ఆయనపై పంపినటువంటి దివ్య ఖురాన్ గ్రంథాన్ని అర్థం చేసుకొని, ఆ దివ్య ఖురాన్ ను ప్రవక్త ముహమ్మద్ వారు ఎలా ఆచరించారో అలా ఆచరించే ప్రయత్నం చేయాలి అని అల్లాహ్ మనకు ఆదేశించాడు. అందు గురించి సూర ఇబ్రాహీం గానీ ఇంకా వేరే సూరాలు మనం చూసేది ఉంటే,

كِتَابٌ أَنْزَلْنَاهُ إِلَيْكَ لِتُخْرِجَ النَّاسَ مِنَ الظُّلُمَاتِ إِلَى النُّورِ
(కితాబున్ అన్జల్నాహు ఇలైక లితుఖ్రిజన్నాస మినజ్జులుమాతి ఇలన్నూర్)
(ఇది) ఒక గ్రంథం. దీనిని మేము నీపై అవతరింపజేశాము – నీవు ప్రజలను వారి ప్రభువు అనుమతితో చీకట్లలో నుంచి వెలుగులోకి తీసుకురావటానికి. (14:1)

సర్వ ప్రజల్ని మీరు చీకట్లలో నుండి తీసి వెలుతురులోకి, ప్రకాశంలోకి తీసుకురావాలి అని. అయితే ఈ రోజుల్లో ఎంతోమంది ఎవరైతే ఇస్లాం ధర్మాన్ని అర్థం చేసుకోలేదో, వారు ఏమనుకుంటారు, ఇస్లాం ధర్మం అన్నది ప్రవక్త ముహమ్మద్ ది. ఇది కేవలం ముస్లింల ప్రవక్త, కేవలం ముస్లింల ధర్మం మరియు ఖురాన్ ఇది కేవలం ముస్లింల ధర్మం. కానీ ఇది నిజమైన మాట కాదు.

స్వయంగా ఒకవేళ మనం ఖురాన్ లో చూసి ఉంటే, ఇక్కడ ఎన్నో సందర్భాల్లో అల్లాహు త’ఆలా ఖురాన్ గురించి, ప్రవక్త ముహమ్మద్ గురించి, ఇస్లాం ధర్మం గురించి, అల్లాహ్ గురించి, అల్లాహ్ అంటే అల్లాహ్ స్వయంగా తన గురించి, అల్లాహ్ అనే అతను ముస్లింల దేవుడే కాదు. సర్వ మానవుల దేవుడు. అందు గురించి ఖురాన్ స్టార్టింగ్ లోనే మొట్టమొదటి ఆదేశం అని అనబడుతుంది. రెండో రుకూ పూర్తయిన తర్వాత మూడో రుకూ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో,

يَا أَيُّهَا النَّاسُ اعْبُدُوا رَبَّكُمُ الَّذِي خَلَقَكُمْ وَالَّذِينَ مِنْ قَبْلِكُمْ لَعَلَّكُمْ تَتَّقُونَ
(యా అయ్యుహన్నాస్ ఉ’బుదూ రబ్బకుమ్)
ఓ ప్రజలారా! మిమ్మల్ని, మీకు పూర్వం గడిచిన వారిని సృష్టించిన మీ ప్రభువును ఆరాధించండి. తద్వారా మీరు దైవభీతిపరులు కాగలరు. (2:21)

ఓ ప్రజలారా, ముస్లింలారా, అరబ్బులారా, ఈ విధంగా అనబడలేదు. యా అయ్యుహన్నాస్, ఓ ప్రజలారా, ఉ’బుదూ రబ్బకుమ్, మీ ప్రభువుని మీరు ఆరాధించండి. ఎవరు ఆ ప్రభువు? అల్లదీ ఖలకకుమ్, ఎవరైతే మిమ్మల్ని పుట్టించాడో, వల్లదీన మిన్ కబ్లికుమ్, మీ కంటే ముందు ఉన్న వారిని, ముందు గతించిన వారిని పుట్టించాడో. లఅల్లకుమ్ తత్తకూన్, ఈ విధంగా మీరు నరకం నుండి తమకు తాము రక్షించుకోవచ్చు.

అయితే ఇక్కడ సర్వ ప్రజల్ని అల్లాహ్ ఉద్దేశించి కేవలం ఆ ఏకైక సృష్టికర్తను, అల్లాహ్ ను మాత్రమే పూజించాలి అని చెప్పడం జరుగుతుంది. అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి కూడా,

يَا أَيُّهَا النَّاسُ إِنِّي رَسُولُ اللَّهِ إِلَيْكُمْ جَمِيعًا
(యా అయ్యుహన్నాస్ ఇన్నీ రసూలుల్లాహి ఇలైకుం జమీఆ)
“ఓ మానవులారా! నేను మీ అందరి వైపునకు అల్లాహ్ పంపిన ప్రవక్తను.” (7:158)

ఓ జనులారా, ఓ మానవులారా, నేను మీ అందరి వైపునకు ప్రవక్తగా చేసి పంపబడ్డాను. నేను మీ అందరి వైపునకు ప్రవక్తగా చేసి పంపబడ్డాను. సందేశ దూతగా పంపబడ్డాను. ఎవరి వైపు నుండి? ఆ అల్లాహ్ వైపు నుండి,

الَّذِي لَهُ مُلْكُ السَّمَاوَاتِ وَالْأَرْضِ
(లహూ ముల్కుస్సమావాతి వల్ అర్ద్)
భూమ్యాకాశాల సామ్రాజ్యం ఆయనదే. (7:158)

ఈ సర్వ ఆకాశాల మరియు భూమిలో ఉన్న సర్వానికి అధికారి ఆయన మాత్రమే.

ఇక ఖురాన్ గ్రంథం, ఇంతకుముందు నేను సూర ఇబ్రాహీం ఒక ఆయత్ మీకు ముందు చదివాను, కితాబున్ అన్జల్నాహు ఇలైక లితుఖ్రిజన్నాస్. ఈ గ్రంథం ఏదైతే మీపై అవతరింపజేశామో, దీని ద్వారా మీరు ప్రజలను, అరబ్బులను అని అనలేదు, ప్రజలను మిమ్మల్ని చీకట్ల నుండి వెలుతురు వైపునకు తీయడానికి పంపాము. అంతేకాకుండా ఒక చాలా ప్రఖ్యాతి గాంచిన ఆయత్, సర్వసామాన్యంగా ఎందరో హిందువులకు కూడా ఇది తెలిసి ఉంటుంది కావచ్చు.

شَهْرُ رَمَضَانَ الَّذِي أُنْزِلَ فِيهِ الْقُرْآنُ هُدًى لِلنَّاسِ
(షహ్రు రమదాన్ అల్లదీ ఉన్జిల ఫీహిల్ ఖుర్ఆన్, హుదల్లిన్నాస్)
రమజాను నెల – ఆ నెలలోనే ఖుర్ఆన్ అవతరించింది. అది మానవులందరికీ మార్గదర్శకత్వం వహించేది. (2:185)

రమదాన్ మాసంలో ఖురాన్ అవతరించింది, హుదల్లిన్నాస్, ఈ ఖురాన్ సర్వ మానవాళికి మార్గదర్శకత్వం.

అయితే సోదరులారా, ఈ రోజుల్లో సర్వ మానవులు కేవలం అల్లాహ్ ను మాత్రమే విశ్వసించాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ని విశ్వసించాలి, ఖురాన్ గ్రంథాన్ని విశ్వసించాలి, తమ జీవితం అల్లాహ్ పంపిన ఈ గ్రంథం, అల్లాహ్ పంపిన చిట్టచివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆదర్శ ప్రకారంగానే గడపాలి.

కానీ, మన, సామాన్యంగా మనం, మన తెలుగు దేశంలో అనండి, తెలుగుదేశం అంటున్నాను, అంటే పార్టీ అనట్లే నేను, ఆంధ్ర, తెలంగాణ అని ఇక రెండు పేర్లు చెప్పేదానికి బదులుగా, లేక మొత్తం భారతదేశంలో అనండి, సామాన్యంగా ఏమంటారు, ఈ ఇస్లాం దేశం ఒక 700 సంవత్సరాల క్రితం, 1000 సంవత్సరాల క్రితం మన ఇండియాలోకి వచ్చింది. అంతకుముందు ఇస్లాం అనేది లేదు. అందు గురించి మధ్యంతరంలో పుట్టుకొచ్చిన విషయం ఇది, దీన్ని ఎందుకు మనం స్వీకరించాలి? మన తాత ముత్తాతలు పాతకాలం నుండి ఏ ఆచారం మీద ఉన్నారో, ఏ ధర్మం మీద ఉన్నారో అలాగే ఉండాలి అని ఒక మాట అంటారు. విన్నారు కదా ఎన్నోసార్లు.

అయితే దీంతో మనకు గొడవ అవసరం లేదు. ప్రేమపూర్వకంగా, బుద్ధిపూర్వకంగా, గ్రంథాల ఆధారంతో మీరు సత్యాన్ని తెలుసుకోండి అని వారికి నచ్చచెబుదాము. దానికి మనం ఏ పద్ధతిలో వారికి నచ్చ చెప్పాలి? మొట్టమొదటి విషయం ఏంటంటే, ఇస్లాం అంటే ఏంటి? దాని అర్థం, దాని భావం ఏంటో నచ్చచెప్పాలి. ఇస్లాం అంటే ఏదో కొత్త ధర్మం కాదు. ఇస్లాం అంటే ఒకరికి ఏదైనా శత్రుత్వం వహించే లేదా ఒకరి గురించి ఏదైనా చెడు చూపించేటువంటి విషయం కాదు. ఇస్లాం అన్నదానికి భావం, మనం మన సృష్టికర్తకు లొంగబడి ఆయన ముందు తలవంచి ఆయన ఇష్ట ప్రకారం జీవితం గడపడం. ఇంకా నేను వివరంలో లోతుగా వెళ్ళలేను, సలము నుండి ఒక భావం దీని గురించి లొంగిపోవట అని వస్తుంది. శాంతిని పొందుట అని కూడా వస్తుంది. ఈ రెండిటినీ కలిపితే, మీరు మీ సృష్టికర్తకు లొంగిపోయి ఇహపరలోకాల్లో శాంతిని పొందండి.

ఈ రకంగా చూసుకుంటే, సీన్, లామ్, మీమ్ అన్న ఈ మూడు అక్షరాలు మూల పదం ఏదైతే ఉందో ఇస్లాంకి, దానికి అనుగుణంగా ఈ పదం ఎన్నో రకాలుగా ఏదైతే వాడబడుతుందో, అస్లమ, యుస్లిము, యుస్లిమూన, ముస్లిమూన, ఈ విధంగా ఖురాన్ లో మీరు చూసి ఉంటే, ఒక సందర్భంలో అల్లాహ్ త’ఆలా ఏం చెప్పాడో గమనించండి.

أَفَغَيْرَ دِينِ اللَّهِ يَبْغُونَ
(అఫగైర దీనిల్లాహి యబ్గూన్)
ఏమిటి, వీరు అల్లాహ్ ధర్మాన్ని కాకుండా మరో ధర్మాన్ని అన్వేషిస్తున్నారా? (3:83)

ఏమైంది ఈ ప్రజలకు? అల్లాహ్ పంపినటువంటి సత్య ధర్మాన్ని మాకు వద్దు, మేము ఈ సత్య ధర్మాన్ని స్వీకరించమని అంటున్నారా, తిరస్కరిస్తున్నారా, ఇష్టం లేదు అని అంటున్నారా?

وَلَهُ أَسْلَمَ مَنْ فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ طَوْعًا وَكَرْهًا
(వలహూ అస్లమ మన్ ఫిస్సమావాతి వల్ అర్ది తౌఅన్ వ కర్హా)
వాస్తవానికి భూమ్యాకాశాలలోని సమస్త వస్తువులు – ఇష్టపూర్వకంగా గానీ, అయిష్టంగా గానీ – ఆయనకే విధేయత చూపుతున్నాయి. (3:83)

మీరు మానవులు, ఐదు ఫిట్ల మనిషి, నాలుగున్నర ఫిట్ల మనిషి, మీ సంగతేంటి? మీకంటే పెద్ద పెద్ద సృష్టి రాశులు, ఆకాశం, ఆకాశాల్లో ఉన్న సర్వము, భూమి, భూమిలో ఉన్న సర్వము, అవన్నీ కూడా అస్లమ, లొంగిపోయి ఉన్నాయి. విధేయత పాటిస్తున్నాయి. అల్లాహ్ ఆజ్ఞా పాలన చేస్తున్నాయి, వారికి ఇష్టమైనా, ఇష్టం కాకపోయినా. అస్లమ, వారందరూ ఇస్లాంలోకి వచ్చారు, అంటే ఏంటిది? ఈ సర్వ సృష్టి మనం చూస్తున్నాము, సూర్యుడిని అల్లాహ్ పుట్టించినప్పటి నుండి ఒక్కసారైనా దైవం, అంటే అల్లాహ్ యొక్క నిర్ణయం, అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ ఆ సూర్యుని గురించి నిర్ణయించిన దారిని, మార్గాన్ని ధిక్కరించి, వ్యతిరేకించి నడుస్తుందా? నడుస్తున్నాడా? అలా అయితే ఇప్పటివరకు ఎప్పుడో నాశనం అయిపోయేది.

సోదరులారా, ఈ ఒక్క విషయం చెప్పాను సూర్యుడని. ఇస్లాం ధర్మం అంటే ఏంటిది? ఇది ఏదో కొత్త 400 సంవత్సరాల క్రితం, 1400 సంవత్సరాల క్రితం, 700 సంవత్సరాల క్రితం వచ్చిన ధర్మం కాదు. ఆది మానవుడి నుండే కాదు, అంతకు ముందు నుండి ఉంది. ప్రతి సృష్టి అల్లాహ్ కు లొంగి ఉన్నది. అయితే మానవులను కూడా అల్లాహ్ పుట్టించింది ఆయన ఆదేశం పాటించి, ఆయనను మాత్రమే ఆరాధించుటకు.

అయితే చివరిగా ఈ సందేశం సంపూర్ణం చేయబడింది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద. అందుగురించే ఇప్పుడు ఇదియే ఇస్లాం, అంటే ఖురాన్, అల్లాహ్, ముహమ్మద్ ప్రవక్త. వీటిని ఈ ముగ్గురిని, మూడింటిని మనం స్వీకరించడం, అంగీకరించడం, ఒప్పుకోవడం ప్రకారంగా జీవితం గడపడం తప్పనిసరి.

ఇక ఏదైతే పుకారు ఉందో, వెయ్యి సంవత్సరాల క్రితమని, ఇది కూడా తప్పు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా నగరంలో ఉన్నప్పుడే భారత ఖండంలో ఇస్లాం ప్రవేశించింది. ఇస్లాం అంటే ఇక్కడ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క పరిచయం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తీసుకొచ్చిన సత్య ధర్మం అప్పుడే ఇండియాలో చేరింది. ఇప్పటికీ దాని యొక్క గుర్తులు, దాని యొక్క చిహ్నాలు కేరళ రాష్ట్రంలో ఉన్నాయి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరించిన సహాబాలు, వారిలో ఇద్దరి సమాధులు ఇప్పటికీ ఇండియాలో ఉన్నాయి. కానీ చరిత్ర నుండి కూడా దూరమై, కళ్ళు మూసుకొని లేదా తెలిసినప్పటికీ వాటి మీద ముసుగు వేసి సత్యాన్ని స్వీకరించకపోతే అది వేరే విషయం.

మరొక చారిత్రక విషయం, దాని గురించి ఖురాన్ లో, హదీస్ లో ఎలాంటి ప్రూఫ్ అనేది లేదు, కానీ చారిత్రకంగా ఒక విషయం చాలా ప్రఖ్యాతి గాంచి ఉంది. అదేమిటంటే ఆది మానవుడు అని ఎవరినైతే అనడం జరుగుతుందో, అంటే ఆదం అలైహిస్సలాం మరియు ఆయన యొక్క భార్య హవ్వా అలైహిస్సలాం, వీరిద్దరినీ అల్లాహు త’ఆలా స్వర్గం నుండి ఏదైతే దించాడో అప్పుడు ఆదం అలైహిస్సలాం ఆ కాలంలో ఇండియా, ఇప్పుడు ఉన్న ఇండియా, శ్రీలంక ఇదంతా కలిసి ఉండే, అయితే సరాందీప్ అనే ప్రాంతంలో వచ్చారు, దిగారు, తర్వాత అక్కడి నుండి నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్లి మక్కాలో చేరుకున్నారు అని కూడా చారిత్రకంగా ఒక మాట ఉంది. దీన్ని నిరాకరించడానికి ఇంతకంటే బలమైన ఏదైనా విషయం ఉండేది ఉంటే అది వేరే విషయం. కానీ ఈ మాట నేను ఎందుకు చెప్తున్నాను? అయితే మన భారత ఖండంలోనే ఆది మానవుడు అవతరించాడు. ఆ ఆది మానవుడు అల్లాహ్ యొక్క దాసుడు. అతను ముస్లిం. అతని నుండి వచ్చిన సర్వ సంతానము ఇస్లాం ధర్మ ప్రకారంగానే ఉంటుంది. అల్లాహ్ ఖురాన్ లో ఏమి చెప్పాడు?

فِطْرَتَ اللَّهِ الَّتِي فَطَرَ النَّاسَ عَلَيْهَا
(ఫిత్ రతల్లాహిల్లతీ ఫతరన్నాస అలైహా)
అల్లాహ్ మానవులను ఏ ప్రకృతిపై పుట్టించాడో దానినే అవలంబించు. (30:30)

మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, “కుల్లు మౌలూదిన్ యూలదు అలల్ ఫిత్రా.” పుట్టే ప్రతి పిల్లవాడు ఫిత్రత్, ప్రకృతి ధర్మం, స్వాభావిక ధర్మంపై పుడతాడు. కానీ అతనికి మాటలు రావు, ఇంకా ఏమీ అనుభవం ఉండదు గనక, ఫ అబవాహు యుహవ్విదానిహి. అతని యొక్క తల్లిదండ్రి యూదులైతే, అబ్బాయిని కూడా యూదునిగా చేసేస్తారు. తల్లిదండ్రులు ఒకవేళ అగ్ని పూజారులైతే, ఆ పిల్లవాడు కూడా అలాగే మారిపోతాడు. కానీ ఎప్పుడైతే అతడు పెరుగుతాడో, బుద్ధి జ్ఞానం గలవాడైతాడో, సత్యాన్ని తెలుసుకుంటాడో, ధర్మాన్ని వెతుకుతాడో, అతనికి సత్యం అనేది తెలిసి రావచ్చు. ఒకవేళ ఇహలోక ఏదైనా ఆశలు, ఇహలోక ఏవైనా భయాలు, లేదా హోదా, అంతస్తుల దురాశలు, ఇలాంటివి ఏవీ అడ్డు రాకుంటే, తప్పకుండా మనిషి సత్యం విన్న తర్వాత, అతనికి మాట అర్థమవుతుంది, స్వీకరించగలడు. ఎందుకంటే ఇహలోకంలో నేనే రాజుని అని కాదు, నేనే మీ ప్రభువుని, నా ముందే మీరు తలవంచాలి అన్నటువంటి గర్వానికి గురియై ఎంతో గర్వంతో విర్రవీగుతూ కొంతకాలం ప్రజల్ని తన ముందు, తమ ముందు వంచించుకున్న అలాంటి పెద్ద పెద్ద నాయకులు స్వయంగా వారి ప్రాణం పోయే సందర్భంలో ఏమన్నారు? ఫిరౌన్, అతని కంటే దుర్మార్గుడు, దౌర్జన్యుడు బహుశా ఇంకా వేరే ఒకడు రాలేదు. అతడు కూడా ఏమన్నాడు? మూసా మరియు హారూన్ ల యొక్క ప్రభువు ఎవరైతే ఉన్నారో, ఆ ప్రభువుని నేను విశ్వసిస్తున్నాను అన్నాడు.

మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంతిమ ప్రవక్త. ఆయన కాలంలో ఎవరైతే ప్రవక్తకు వ్యతిరేకంగా నాయకత్వం వహించారో, వారిలో ఒకరి పేరు అబూ జహల్. ప్రవక్త అతని గురించి ఏమన్నాడు ఒకసారి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అబూ జహల్ గురించి ఒకసారి ఏమన్నారు? ఈ అబూ జహల్ ఈ కాలానికి ఫిరౌన్ లాంటివాడు. కానీ అంతటి ఆ దుర్మార్గుడు దొంగచాటుగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఖురాన్ పఠించేటప్పుడు వినేవాడు. విన్నాడు. విని, సత్యం అతనికి తెలిసింది. అతని యొక్క దగ్గరి స్నేహితుడు, ప్రాణ స్నేహితుడు లాంటి వాడు, అతన్ని అడిగాడు కూడా, రాత్రి నేను కూడా ఖురాన్ విన్నాను, నువ్వు కూడా దొంగచాటుగా విన్నావు అంటే నేను వినలేదు అని ముందు అన్నాడు. తర్వాత చెప్పాడు, చెప్పే మాట అతనిది బాగానే అనిపిస్తుంది, కానీ ఇతడి వంశం, అబూ జహల్ యొక్క వంశం ముత్తాతల్లో ఒకరి వైపు నుండి వస్తుంది, మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అబ్దే మునాఫ్ నుండి వస్తారు. వీరి యొక్క వంశంలో వారు ఎలాంటి అన్ని మంచి కార్యాలు చేసుకుంటూ వచ్చారో, మనం కూడా చేసుకుంటూ వచ్చాము. కానీ ఈరోజు ఇతడు కొత్త ఏదో మాట మొదలు పెట్టాడు కదా, అలాంటి హోదా అంతస్తు మనకు దొరకదు కదా. అంటే కేవలం ప్రపంచ దురాశలకు లోనై సత్యాన్ని తిరస్కరించలేదు.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మదీనా వచ్చిన తర్వాత, మదీనా వలస వచ్చిన తర్వాత అక్కడ ప్రవక్తకు శత్రువుల్లో చాలా కఠినంగా వ్యతిరేకించిన వారిలో ఒకతని పేరు హుయై బిన్ అఖ్తబ్, యూదుడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క భార్యల్లో ఒక భార్య ఎవరు? సఫియ్యా రదియల్లాహు అన్హా. ఆ నాయకుని యొక్క కుమార్తె. ఆమె ఇస్లాం స్వీకరించింది. ప్రవక్తకు భార్యగా అయింది. ఆమె ఒక సందర్భంలో చెప్తుంది, నేను ఇంకా చాలా నా చిన్న వయసు నాది. ప్రవక్త ఆ రోజుల్లో మదీనాలో వచ్చే సందర్భంలో మా నాన్న మరియు మా చిన్న తండ్రి, చాచా, ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, అతడు వచ్చేసాడు మదీనాలో అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి. మరి ఏంటి ఉద్దేశం? అతని గురించి మన గ్రంథాల్లో కూడా వచ్చింది ఉంది కదా, చిట్టచివరి ప్రవక్త అని. ఇద్దరు ఆ సత్య విషయాలన్నీ తెలుసు వారికి. ఎందుకంటే యూద గ్రంథాల్లో కూడా ప్రవక్త ముహమ్మద్ గురించి వచ్చింది ఉంది ప్రస్తావన. కానీ వారు ఏమన్నారు? లేదు, లేదు, లేదు, మనం ప్రాణం ఉన్నంతవరకు అతన్ని వ్యతిరేకించి, అతనికి తిరుగుబాటుగా, ఎదురుగానే మనం ఉండాలి, అంటే ఈ రోజుల్లో ఏమనవచ్చు మనం, అపోజిషన్ పార్టీలోనే ఉండాలి, ఎప్పుడు కూడా వారితో కలవవద్దు.

అయితే ప్రపంచ దురాశాలకు గురై కూడా ఎందరో ఇలాంటి సత్యాన్ని తిరస్కరించిన వారు ఉన్నారు. అందు గురించి సోదరులారా, ఇవన్నీ మనకు ఇహలోకంలో కొద్ది రోజులు మాత్రమే పనికి వస్తే రావచ్చు, అందరికీ కూడా రావు. కానీ చివరికి చనిపోయే సందర్భంలో కూడా సత్యాన్ని తిరస్కరించడం, ధర్మాన్ని వ్యతిరేకించడం, ఏ మాట మనకు తెలిసిందో అల్లాహ్ మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వైపు నుండి దాన్ని అమలు చేయనందుకు, అమలు పరచనందుకు, తప్పకుండా దీని గురించి ప్రశ్నించబడుతుంది మరియు పరలోకంలోనైతే చాలా నష్టపోతాము. అందు గురించి ఖురాన్ లో అల్లాహ్ త’ఆలా ఏం చెప్పాడు?

وَمَنْ يَبْتَغِ غَيْرَ الْإِسْلَامِ دِينًا فَلَنْ يُقْبَلَ مِنْهُ وَهُوَ فِي الْآخِرَةِ مِنَ الْخَاسِرِينَ
(వ మన్ యబ్తగి గైరల్ ఇస్లామి దీనన్ ఫలన్ యుఖ్బల మిన్హు)
ఎవడైనా ఇస్లాంను కాదని మరో ధర్మాన్ని అవలంబించదలిస్తే, అది అతని నుండి ఎంతమాత్రం స్వీకరించబడదు. మరి అతను పరలోకంలో నష్టపోయే వారిలో చేరతాడు. (3:85)

ఎవరైతే ఇస్లాం ధర్మాన్ని కాకుండా మరో ధర్మాన్ని తనకు ధర్మంగా ఒప్పుకుంటాడో, దాన్ని స్వీకరించి బ్రతుకుతాడో, ఫలన్ యుఖ్బల మిన్హ్, అది అతని నుండి ఎన్నటికీ స్వీకరించబడదు. వహువ ఫిల్ ఆఖిరతి, ఇక్కడ ఒక విషయం గమనించండి. అల్లాహ్ ఏమంటున్నాడు? వహువ ఫిల్ ఆఖిరతి మినల్ ఖాసిరీన్. అతడు పరలోకంలో చాలా నష్టపోయే వారిలో కలుస్తాడు. ఇహలోకం గురించి చెప్పలేదు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో కొందరు తప్పుడు మార్గంలో ఉన్నప్పటికీ అల్లాహ్ తొందరగా పట్టి శిక్షించడు. కొంత వెసులుబాటుని ఇస్తూ ఉంటాడు. అందు గురించి ఇలాంటి వెసులుబాటుని పొంది తప్పుడు భావంలో పడకూడదు. అల్లాహు త’ఆలా మనందరికీ సన్మార్గం చూపుగాక. ఇస్లాం ధర్మం స్వయంగా అర్థం చేసుకొని ఇతరులకు దానిని అర్థం మంచిగా నచ్చచెప్పే భాగ్యం ప్రసాదించుగాక.

జజాకుముల్లాహు ఖైరన్, వస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహ్.

అల్లాహ్ పై విశ్వాసం యొక్క లాభాలు [వీడియో]

బిస్మిల్లాహ్

[ 15 నిముషాలు]

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia.

పుస్తకం మరియు మిగతా వీడియో భాగాలు కోసం క్రింద క్లిక్ చెయ్యండి
విశ్వాస మూల సూత్రాలు (Aqeedah)

ఇతరములు:

కరుణ చూపే వారిపై అల్లాహ్ కరుణ చూపుతాడు [వీడియో]

బిస్మిల్లాహ్

[సురక్షిత యూట్యూబ్ లింక్: https://safeYouTube.net/w/eu7r]
[30 నిమిషాల వీడియో]

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్) 
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia