15వ అధ్యాయం
అల్ ఖవ్లుల్ సదీద్ షర్హ్ కితాబ్ అత్ తౌహీద్ – ఇమామ్ అస్-సాదీ
ఏ వస్తువునూ సృష్టించలేనివారిని వీరు అల్లాహ్ కు భాగస్వాములుగా చేస్తున్నారా?
[Do they make partners with that which has not created anything]
The famous commentary of Shaykh as-Sa’di (rahimahullaah) of the book Kitab at-Tawhid of Imam Muhammad ibn Abdul Wahhab (rahimahullaah)
అల్లాహ్ ఆదేశం:
أَيُشْرِكُونَ مَا لَا يَخْلُقُ شَيْئًا وَهُمْ يُخْلَقُونَ وَلَا يَسْتَطِيعُونَ لَهُمْ نَصْرًا وَلَا أَنفُسَهُمْ يَنصُرُونَ
“ఏ వస్తువునూ సృష్టించలేనివారిని, స్వయంగా తామే సృష్టింపబడ్డవారిని, ఎవరికీ సహాయం చేయలేనివారిని, స్వయంగా తమకు తామే సహాయం చేసుకోలేనివారిని వీరు అల్లాహ్ కు భాగస్వాములుగా చేస్తున్నారా?” (ఆరాఫ్ 7: 191, 192).
అల్లాహ్ ఆదేశం:
وَالَّذِينَ تَدْعُونَ مِن دُونِهِ مَا يَمْلِكُونَ مِن قِطْمِي
“అల్లాహ్ ను కాదని మీరు పిలిచే ఇతరులకు కనీసం ఖర్జూరం విత్తనం పై ఉండు పొర అంత అధికారం కూడా లేదు.” (ఫాతిర్ 35: 13).
అనస్ (రజియల్లాహు అన్హు) కథనం: ఉహద్ యుద్ధం నాడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) గాయపడ్డారు. అందులో ఆయన నాలుగు పళ్ళు విరిగాయి. అప్పుడు ఆయన అన్నారు: “తమ ప్రవక్తను గాయపరచిన జాతి సాఫల్యం ఎలా పొందగలదు?” అప్పుడే ఈ వాక్యం అవతరించింది. “(ప్రవక్తా!) నిర్ణయాధికారాలలో నీకు పాత్ర ఏదీ లేదు“. (ఆలె ఇమ్రాన్ 3:128).
అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) కథనం: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఫజ్ర్ నమాజులో, రెండవ రకాతులోని రుకూ నుండి తలెత్తి, “సమిఅల్లాహు లిమన్ హమిదహ్ రబ్బనా వలకల్ హందు” అన్న తరువాత “ఓ అల్లాహ్ ఫలాన, ఫలానను శపించు” అని అన్నది విన్నారు. అప్పుడే ఈ ఆయతు అవతరించింది: “(ప్రవక్తా!) నిర్ణయాధికారాలలో నీకు పాత్ర ఏదీ లేదు.” (ఆలె ఇమ్రాన్ 3:128). – (బుఖారి, నసాయీ).
మరో ఉల్లేఖనంలో ఉంది: సఫ్వాన్ బిన్ ఉమయ్యా, సుహైల్ బిన్ అమ్ర్, హారిస్ బిన్ హిషాంపై “బద్ దుఆ” చేస్తున్నప్పుడు (శపిస్తున్నప్పుడు) అవతరించింది: “(ప్రవక్తా!) నిర్ణయాధికారాలలో నీకు పాత్ర ఏదీలేదు.” (ఆలె ఇమ్రాన్ 3: 128). – (బుఖారి).
అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం: “నీ దగ్గరి బంధువులను భయపెట్టు.” (షుఅరా 26: 214). అన్న ఆయతు అవతరించిన తరువాత “ఓ ఖురైషులారా!” అని లేక ఇలాంటిదే ఒక పదముతో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అందరిని సమావేశపరచి ఇలా చెప్పారు: “మీ ప్రాణాలను మీరు నరకాగ్ని నుండి కాపాడుకోండి. అల్లాహ్ వద్ద నేను మీకు ఏ మాత్రం సహాయం చేయలేను. ఓ అబ్బాసు బిన్ అబ్దుల్ ముత్తలిబ్! అల్లాహ్ వద్ద నేను మీకు ఏ మాత్రం సహాయం చేయలేను. ప్రవక్త మేనత్త సఫియ్యా! నేను నీకు అల్లాహ్ వద్ద ఏ మాత్రం సహాయం చేయలేను. ముహమ్మద్ కుమార్తె ఫాతిమా! నీవు కోరినంత నా సొమ్ము అడుగు ఇచ్చేస్తా, కాని అల్లాహ్ వద్ద నేను నీకు ఏ మాత్రం సహాయం చేయలేను“. (బుఖారి).
ముఖ్యాంశాలు:
1. పై రెండు ఆయతుల భావం.
2. ఉహద్ యుద్ధం యొక్క సంఘటన.
3. సకల ప్రవక్తల నాయకులైన ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) “ఖునూత్ “లో దుఆ చేస్తు అంటున్నారు. (అలాంటి మహాపురుషులు తమ కష్ట కాలాల్లో అల్లాహ్ తో మొరపెట్టుకుంటే, సామాన్యులు తమ కష్ట కాలాల్లో అల్లాహ్ తో మొర పెట్టుకొనుట ఎక్కువ అవసరం).
4. ఎవరిని శపించబడినదో వారు అప్పుడు అవిశ్వాసులుగా ఉండిరి.
5. వీరు ఇతర అవిశ్వాసులు చేయని ఘోరకార్యాలు వారు చేశారు. ఉదా: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ను గాయపరిచారు. ఆయన్ను హతమార్చడానికి ప్రయత్నించారు. అమర వీరులైన (హత్యచేయబడిన విశ్వాసుల) అవయవాలను సయితం కోశారు. వీరు (విశ్వాసులు) వారి (అవిశ్వాసుల) తండ్రి సంబంధిత దగ్గరి బంధువులే.
6. ఇంత జరిగినందుకు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారిని శపించినప్పుడు పై వాక్యం “(ప్రవక్తా!) నిర్ణయాధికారాలలో నీకు పాత్ర ఏదీలేదు” ను అల్లాహ్ అవతరింపజేసాడు.
7. “వారిని క్షమించే, శిక్షించే అధికారం అల్లాహ్ కు మాత్రమే ఉంది“(ఆలె ఇమ్రాన్ 3:128). అన్న అల్లాహ్ ఆదేశం ప్రకారం, అల్లాహ్ వారిని క్షమించాడు. వారు ఇస్లాం స్వీకరించారు. .
8. ముస్లింపై కష్టకాలం దాపురించినప్పుడు “ఖునూత్ నాజిల” చేయవలెను.
9. ఎవరిని శపించబడుతుందో వారిని, వారి తండ్రుల పేరుతో కలిపి శపించ వచ్చును.
10. ఖునూత్ లో ప్రత్యేకించబడిన ఒక్కొక్క వ్యక్తిని పై ప్రవక్త శపించారు.
11. (షుఆరా:214) ఆయత్ అల్లాహ్ అవతరించినప్పుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అందరిని సమూహపరచి తౌహీద్ పిలుపు ఇచ్చిన విషయం తెలిసింది.
12. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తౌహీద్ ప్రచారం చేయునప్పుడు, “పిచ్చివాడు” అని అవిశ్వాసుల ద్వారా పిలువబడ్డారు. ఈ రోజుల్లో ఎవరైనా ముస్లిం అదే పని చేస్తుంటే వారి తో కూడా అలాగే ప్రవర్తిస్తున్నారు.
13. దగ్గరి, దూరపు బంధువులందరికి “నేను మీకు సహాయము చేయలేను” అని స్పష్టం చేశారు. స్వయం తమ కుమార్తె అయిన ఫాతిమాకు కూడా “ఓ ఫాతిమా! నేను నీకు సహాయము చేయలేను ” అని చెప్పారు. ఆయన ప్రవక్తల నాయకులై, స్త్రీల నాయకురాలైన ఫాతిమ (రజియల్లాహు అన్హా)కు ఏ మాత్రం పనికి రాను అని తెలిపారు. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) సత్యం తప్ప మరేది పలకరు అని అందరి విశ్వాసం. అయినా ఈ రోజుల్లో ఈ రోగం సామాన్య ప్రజలకే కాక విద్యావంతులు కూడా అర్థం చేసుకోలేకున్నారు. తౌహీద్ , ధర్మం వారి వద్ద ఎంత విచిత్రమైందో అగపడుతుంది.
తాత్పర్యం: (అల్లామా అస్-సాదీ) :
ఇక్కడి నుండి తౌహీద్ యొక్క నిదర్శనాలు ప్రారంభం అవుతున్నాయి. తౌహీద్ ను నిరూపించడానికి ఉన్నటువంటి గ్రాంధిక, జ్ఞాన సంబంధమైన నిదర్శనాలు మరేదానికి లేవు.
తౌహీద్ రుబూబియత్, ఉలూహియత్ స్వయంగా ఇవి రెండు పెద్ద నిదర్శనాలు. సృష్టి, నిర్వహణలో అద్వితీయుడైన, అన్ని విధాలుగా సర్వశక్తుడైన వాడే ఆరాధనలకు అర్హుడు. అతడు తప్ప మరెవ్వడూ ఆరాధనలకు అర్హుడు కాడు.
అదే విధంగా సృష్టిరాసుల గుణాలను పరిశీలిస్తే కూడా దాని నిదర్శనాలు కనబడుతున్నాయి. అల్లాహ్ యేతరులలో దైవదూత, మానవుడు, చెట్లు, గుట్టలు మొదలగు ఎవరెవరి పూజా చేయబడుతుందో వారందరూ/అవన్నియు అల్లాహ్ ఎదుట దీనులు, బలహీనులు, భిక్షకులు. లాభనష్టాలు చేకూర్చే రవ్వంత శక్తి కూడా లేనివారు. ఏ కొంచెమూ సృష్టించలేరు. వారే సృష్టింపబడ్డారు. లాభనష్టాలు, జీవన్మరణాలకు మరియు రెండవసారి పునరుత్తానానికి వారు అధికారులు కారు. అల్లాహ్ మాత్రమే సర్వ సృష్టికి సృష్టికర్త. పోషకుడు. నిర్వహకుడు. లాభనష్టాలు చేకూర్చే, కోరిన వారికి ప్రసాదించే, కోరనివారికి ప్రసాదించకుండా ఉండే అధికారం కలవాడు. సర్వశక్తి ఆయన చేతిలో ఉంది. ఇంతకు మించిన, మంచి నిదర్శనాలు ఇంకేం కావాలి. వీటి ప్రస్తావన అల్లాహు తఆలా, ఖుర్ఆన్ లో అనేక చోట్ల ప్రస్తావించాడు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అనేక సార్లు తెలిపారు. ఇది అల్లాహ్ ఒక్కడు, సత్యుడు, బహుదైవత్వం (షిర్క్) తుఛ్ఛం అనడానికి స్వాభావికమైన, జ్ఞాన సంబంధమైన నిదర్శనాలతో పాటు, గ్రాంధిక, ఎల్లవేళల్లో కనవినబడుతున్న నిదర్శనాలు కూడానూ.
సృష్టిలో కెల్ల అతి ఉన్నతుడైన ఒక మానవుడు (ప్రవక్త) స్వయం తన దగ్గరి బంధువునికి ఏ లాభం అందించలేక పోయినప్పుడు ఇతరులకు ఏమివ్వగలడు? ఇంతా తెలిసికూడా అల్లాహ్ తో షిర్క్ చేసినా, సృష్టిలో ఏ ఒక్కరిని అల్లాహ్ కు సమానంగా నిలబెట్టినవాడు నాశనమవుగాకా, అతడు ధర్మం కోల్పోయిన తరువాత, బుద్ధి జ్ఞానం కూడా కోల్పోయాడు.
అల్లాహ్ ను ఆ తరువాత సృష్టిని తెలుసుకున్నవాడు, అతని ఈ తెలివితో కేవలం అల్లాహ్ నే ఆరాధించాలి, ధర్మమును ఆయనకే ప్రత్యేకించాలి, ఆయన్ను మాత్రమే ప్రశంసించాలి, తన నాలుక, హృదయం, శరీరాంగాలతో ఆయనకే కృతజ్ఞత తెలుపాలి. సృష్టి రాసులతో భయం, ఆశ లాంటివేమి ఉండకూడదు.
నుండి: ఏకత్వపు బాటకు సత్యమైన మాట (అల్ ఖవ్లుల్ సదీద్ షర్హ్ కితాబ్ అత్ తౌహీద్) – ఇమామ్ అస్-సాదీ [పుస్తకం]. తెలుగు అనువాదం: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
You must be logged in to post a comment.