బిద్అత్ అంటే? – హబీబుర్రహ్మాన్ జామయి [వీడియో & టెక్స్ట్]

బిద్అత్ అంటే?
https://youtu.be/YlU1aDZFcl0 [8 నిముషాలు]
వక్త: షేక్ హబీబుర్రహ్మాన్ జామయి (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, వక్త ‘బిద్అత్’ అనే పదం యొక్క అర్థాన్ని వివరిస్తారు. భాషాపరంగా, బిద్అత్ అంటే గతంలో ఉదాహరణ లేని ఒక కొత్త ఆవిష్కరణ అని ఆయన వివరిస్తారు. దీనిని స్పష్టం చేయడానికి ఖుర్ఆన్ నుండి సూరా అల్-బఖర (2:117) మరియు సూరా అల్-అహ్కాఫ్ (46:9) ఆయతులను ఉదాహరిస్తారు. తరువాత, ఆయన బిద్అత్‌ను రెండు రకాలుగా వర్గీకరిస్తారు: మొదటిది, ప్రాపంచిక విషయాలు మరియు అలవాట్లలోని ఆవిష్కరణలు (ఉదాహరణకు సాంకేతికత, దుస్తులు), ఇవి అనుమతించబడినవి. రెండవది, ధార్మిక (దీన్) విషయాలలో చేసే కొత్త ఆవిష్కరణలు, ఇవి నిషిద్ధం (హరామ్) మరియు తిరస్కరించబడినవి. ఈ విషయాన్ని ధృవీకరించడానికి ఆయన సహీహ్ బుఖారీ మరియు సహీహ్ ముస్లిం నుండి రెండు హదీసులను ఉదహరిస్తారు. ప్రసంగం యొక్క సారాంశం ఏమిటంటే, ప్రాపంచిక ఆవిష్కరణలు ఆమోదయోగ్యమైనప్పటికీ, ఇస్లాం ధర్మంలో కొత్త పద్ధతులను చేర్చడం తీవ్రమైన తప్పు.

అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వల్ ఆఖిబతు లిల్ ముత్తఖీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ అంబియాయి వల్ ముర్సలీన్, అమ్మా బాద్.

అభిమాన సోదరులారా, ధర్మ అవగాహనం అనే ఈ కార్యక్రమంలోకి మీ అందరికీ స్వాగతం. నా ఇస్లామీయ అభివాదం, అస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు.

ఈ రోజు మనం బిద్అత్ గురించి కొన్ని విషయాలు తెలుసుకోబోతున్నాం. బిద్అత్, దీనికి చాలా వివరాలు ఉన్నాయి. ఒక రెండు, మూడు ఎపిసోడ్ లలో దీనిని మనం తెలుసుకుందాం. ఈరోజు అయితే, బిద్అత్ అంటే అర్థం ఏమిటి? బిద్అత్ కి అర్థం తెలుసుకుందాం. తర్వాత ఒక రెండు, మూడు ఎపిసోడ్ లలో బిద్అత్ రకాలు, బిద్అత్ యొక్క ఆదేశాలు అవి తెలుసుకుందాం. ఈరోజు బిద్అత్ అంటే ఏమిటి?

నిఘంటువు ప్రకారం బిద్అత్ అంటే గత కాలపు ఉపమానం ఏదీ లేకుండానే, ఏదేని ఒక వస్తువును అపూర్వంగా, ప్రప్రథమంగా ఆవిష్కరించటం. ఇది బిద్అత్ పదానికి అర్థం. నిఘంటువు ప్రకారం.

ఉదాహరణకు, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖుర్ఆన్ లో సూర బఖర, ఆయత్ 117 లో ఇలా సెలవిచ్చాడు,

بَدِيعُ السَّمَاوَاتِ وَالْأَرْضِ
(బదీఉస్సమావాతి వల్ అర్ద్)
భూమ్యాకాశాలను ప్రప్రథమంగా సృష్టించినవాడు ఆయనే. (2:117)

ఇక్కడ బదీఅ అనే పదం ఉంది. దీని నుంచే బిద్అత్. అంటే భూమ్యాకాశాలను మొట్టమొదట సృష్టించినవాడు ఆయనే, అల్లాహ్ యే. అంటే పూర్వపు ఉపమానం ఏదీ లేకుండానే భూమ్యాకాశాలకు ఉనికిని ప్రసాదించాడు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా.

అలాగే సూర అహ్కాఫ్, ఆయత్ 9 లో, ఒక ఆయత్ ఇలా ఉంటుంది,

قُلْ مَا كُنتُ بِدْعًا مِّنَ الرُّسُلِ
(ఖుల్ మా కున్తు బిద్అమ్ మినర్రుసుల్)
(ఓ ముహమ్మద్!) వారికి చెప్పు : “నేను కొత్తగా వచ్చిన ప్రవక్తనేమీ కాను. (46:9)

అంటే, ఓ ప్రవక్తా, వారితో అను, నేను కొత్తగా వచ్చిన ప్రవక్తనేమీ కాను. అంటే, అల్లాహ్ తరఫున ప్రజలకు దైవ సందేశం అందజేసే మొట్టమొదటి వ్యక్తిని కాను. నాకు ముందు ఎందరో ప్రవక్తలు వచ్చారు.

అంటే ఈ రెండు ఆయత్ లలో బిద్అ అనే పదానికి అర్థం ఉంది. గత కాలపు ఉపమానం ఏదీ లేకుండానే ఏదైనా ఒక వస్తువును అపూర్వంగా, ప్రప్రథమంగా ఆవిష్కరించటం అన్నమాట.

“ఇబ్తద’అ ఫులానున్ బిద్అతన్” అని అరబీలో అంటారు. దానికి అర్థం ఏమిటి? అంటే అతను అంతకు ముందు లేని ఒక కొత్త పద్ధతిని సృష్టించాడు అని అర్థం.

ఇక, ఈ లేని కొత్త పద్ధతులు, ఆవిష్కరించటం, ఆరంభం అనేది రెండు రకాలుగా ఉంటుంది.

ఒకటి, అలవాట్లలో ఆవిష్కరణ. కొత్త కొత్త విషయాలు వెతకటం, కొత్త కొత్త విషయాలు తెలుసుకోవటం, ప్రారంభించటం. అలవాట్లలో. రెండవది, ధర్మం, దీన్ లో క్రొంగొత్త ఆవిష్కరణ.

అలవాట్లలో ఆవిష్కారం, ఉదాహరణకు దైనందిన జీవితం కొరకు అవసరమైన వాటిని కొత్తగా కనుగోవటం లేదా ఆవిష్కరించటం. ఇది ధర్మసమ్మతమే. ఎందుకంటే ఇది అలవాట్లకు సంబంధించినది. దుస్తులు, మనం వాడే వాహనాలు, అలాగే మన జీవితానికి, అలవాట్లకి సంబంధించిన అనేక విషయాలు, మొబైల్ ఉంది, కారు ఉంది. అలవాట్లకు సంబంధించిన విషయాలలో కొత్తది రావటం, కొత్త విధానాన్ని తెలుసుకోవటం, కొత్త విషయం ఆవిష్కరించటం ఇవన్నీ ధర్మసమ్మతమే.

రెండవ రకం, దీన్ లో, ధర్మంలో, ఇస్లాం లో క్రొంగొత్త ఆవిష్కరణ. అంటే ధర్మంలో నూతన విధానాలను, పనులను సృష్టించటం. ఇది నిషిద్ధం. దీనికి ఇస్లాంలో అనుమతి ఉండదు. ఎందుకంటే ధర్మావలంబన విషయంలో ఖుర్ఆన్ మరియు ప్రామాణిక హదీసుల ద్వారా రూఢీ అయిన విషయాల వరకే సరిపెట్టుకోవాలి. అందులో ఎలాంటి హెచ్చుతగ్గులు చేయకూడదు, చేయటం ధర్మసమ్మతం కాదు.

మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు,

مَنْ أَحْدَثَ فِي أَمْرِنَا هَذَا مَا لَيْسَ مِنْهُ فَهُوَ رَدٌّ
(మన్ అహదస ఫీ అమ్ రినా హాదా మా లైస మిన్హు ఫహువ రద్) (రవాహుల్ బుఖారీ వ ముస్లిం)
ఎవరైనా మా ఈ షరీఅత్ విషయంలో లేని వస్తువును సృష్టిస్తే అది త్రోసిపుచ్చదగుతుంది

అంటే ఎవరైనా మా ఈ షరీఅత్ విషయంలో – ప్రవక్త గారు “మా” అన్నారు, ఫీ అమ్ రినా – మా ఈ షరీఅత్ విషయంలో (ఫీ అమ్ రినా అంటే ధర్మం విషయంలో, దీన్ విషయంలో, షరీఅత్ విషయంలో) లేని వస్తువును సృష్టిస్తే అది త్రోసిపుచ్చదగుతుంది, అది రద్దు చేయబడుతుంది, ఫహువ రద్, రద్దు చేయబడుతుంది.

అలాగే ఇంకో హదీస్ లో మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు,

مَنْ عَمِلَ عَمَلًا لَيْسَ عَلَيْهِ أَمْرُنَا فَهُوَ رَدٌّ
(మన్ అమిల అమలన్ లైస అలైహి అమ్ రునా ఫహువ రద్) (రవాహు ముస్లిం)
ఎవడైనా మా షరీఅత్ కు అనుగుణంగా లేని ఆచరణ ఏదైనా చేస్తే అది త్రోసిపుచ్చదగినది, రద్దు చేయబడుతుంది.

అభిమాన సోదరులారా, సారాంశం ఏమిటంటే, బిద్అత్ అనే పదానికి అర్థం ఏమిటి? లేని విధానాన్ని సృష్టించటం. కొత్తగా, ప్రప్రథమంగా ఆవిష్కరించటం, ఆరంభం చేయటం. ఇది అలవాట్లలో అయితే ధర్మసమ్మతమే. ఇక రెండవది, దీన్ పరంగా. దీన్ లో కొత్త విధానం ఆవిష్కరించటం, ప్రారంభం చేయటం. ఇది ధర్మసమ్మతం కాదు.

ఈ బిద్అత్ యొక్క అర్థాన్ని మనం తెలుసుకున్నాం. బిద్అత్ యొక్క రకాలు, అవి ఇన్ షా అల్లాహ్ మనం వచ్చే ఎపిసోడ్ లో తెలుసుకుందాం. అప్పటి వరకు సెలవు.

వ ఆఖిరు ద’అవానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.
వస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=43296

బిద్అత్ (కల్పితాచారం) – Bidah (మెయిన్ పేజీ)
https://teluguislam.net/others/bidah/


సహాబాల విధానం & దాని అవసరం – హబీబుర్రహ్మాన్ జామిఈ [వీడియో & టెక్స్ట్]

సహాబాల విధానం & దాని అవసరం
https://youtu.be/nsxJhTZ1QP8 [45 నిముషాలు]
షేఖ్ హబీబుర్రహ్మాన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, వక్త సహాబాల విధానం (మన్హజ్) మరియు దాని ఆవశ్యకత గురించి వివరిస్తారు. సహాబీ అనే పదానికి అర్థం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను ఈమాన్ స్థితిలో కలుసుకుని, అదే స్థితిలో మరణించిన వారని నిర్వచించారు. సహాబాలు ముస్లిం సమాజంలో అత్యంత శ్రేష్ఠులని, వారి విశ్వాసం (ఈమాన్) మరియు అఖీదా ఖురాన్ ద్వారా ధృవీకరించబడిందని నొక్కి చెప్పారు. మన విశ్వాసం మరియు ఆచరణా విధానం సహాబాల వలె ఉండాలని, ఖురాన్ మరియు హదీసులను వారు అర్థం చేసుకున్న విధంగానే మనం అర్థం చేసుకోవాలని ఖురాన్ ఆయతుల ద్వారా స్పష్టం చేశారు. సహాబాల మార్గాన్ని విడిచిపెట్టడం నరకానికి దారితీస్తుందని హెచ్చరించారు. సహాబాల విధానాన్ని అనుసరించడమే నిజమైన సన్మార్గమని, వారి ఇత్తిబా (అనుసరణ) యొక్క ప్రాముఖ్యతను ఉదాహరణలతో వివరించారు.

اَلْحَمْدُ لِلّٰهِ رَبِّ الْعٰلَمِيْنَ
(అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్)
సర్వలోకాల ప్రభువైన అల్లాహ్‌కే సర్వస్తోత్రాలు.

وَالْعَاقِبَةُ لِلْمُتَّقِيْنَ
(వల్ ఆఖిబతు లిల్ ముత్తఖీన్)
శుభపరిణామం దైవభీతిపరులకే ప్రాప్తిస్తుంది.

وَلَا عُدْوَانَ اِلَّا عَلَى الظّٰلِمِيْنَ
(వలా ఉద్వాన ఇల్లా అలజ్జాలిమీన్)
అన్యాయం చేస్తోన్నవారిపైన మాత్రమే ప్రతిఘటన/పోరాటం అనుమతించబడింది

وَالصَّلٰوةُ وَالسَّلَامُ عَلٰى سَيِّدِ الْاَنْۢبِيَآءِ وَالْمُرْسَلِيْنَ
(వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ అంబియాయి వల్ ముర్సలీన్)
ప్రవక్తల నాయకునిపై మరియు దైవప్రవక్తలపై శాంతి మరియు శుభాలు వర్షించుగాక.

وَمَنْ تَبِعَهُمْ بِاِحْسَانٍ اِلٰى يَوْمِ الدِّيْنِ اَمَّا بَعْدُ
(వమన్ తబిఅహుమ్ బి ఇహ్సానిన్ ఇలా యౌమిద్దీన్ అమ్మా బఅద్)
మరియు ప్రళయదినం వరకు వారిని ఉత్తమ రీతిలో అనుసరించేవారిపై కూడా (శాంతి మరియు శుభాలు వర్షించుగాక). ఆ తర్వాత…

رَبِّ اشْرَحْ لِيْ صَدْرِيْ وَيَسِّرْ لِيْٓ اَمْرِيْ وَاحْلُلْ عُقْدَةً مِّنْ لِّسَانِيْ يَفْقَهُوْا قَوْلِيْ
(రబ్బిష్రహ్ లీ సద్రీ వ యస్సిర్ లీ అమ్ రీ వహ్ లుల్ ఉఖ్దతమ్ మిల్ లిసానీ యఫ్ఖహూ ఖవ్ లీ)
“ఓ నా ప్రభూ! నా హృదయాన్ని విశాలపరచు. నా కార్యాన్ని నాకు సులభతరం చెయ్యి. నా నాలుకలోని ముడిని విప్పు. ప్రజలు నా మాటను అర్థం చేసుకోగలగాలి.” (20:25-28)

మన్హజుస్ సహాబా. సహాబా ఈ పదం సహాబీ పదానికి బహువచనం. ఉర్దూలో సహాబీ ఏకవచనం, సహాబా అనేది బహువచనం. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సహచరులు. ఈమాన్ స్థితిలో దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను కలుసుకొని, ఈమాన్ స్థితిలోనే మరణించిన వారంతా సహాబా, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహచరులు అనబడతారు. ఇది సహాబా లేదా సహాబీ అనే పదానికి అర్థం.

వారు ముస్లిం సమాజంలో అందరికన్నా శ్రేష్ఠులు. ఇస్లాం వైపు ముందంజ వేసినవారు. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహచర్య భాగ్యం పొందినవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో కలిసి జిహాద్ చేసినవారు. షరీఅత్ బాధ్యతలను మోయటమే గాక దానిని తమ తరువాతి తరాల వారికి అందించిన ధన్యజీవులు. ఈ కారణంగా వారు ప్రపంచంలోనే అత్యుత్తమ సమూహం అని మనం విశ్వసించటం వాజిబ్. తప్పనిసరి. అంటే సహాబాల గురించి ఇలా అఖీదా, విశ్వాసం మనం కలిగి ఉండాలి.

సహాబాల విధానం కంటే ముందు, ముందుమాటగా నేను రెండు మూడు విషయాలు, ఈ సహాబాల యొక్క ఔన్నత్యం గురించి చెప్పదలిచాను. సహాబాల గురించి ఖురాన్‌లో అలాగే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రవచనాలలో చాలా నొక్కి చెప్పడం జరిగింది. వారు ఎవరు, వారి విశ్వాసం ఏమిటి, వారి గొప్పతనం ఏమిటి అనేది. ఉదాహరణకు సూరా తౌబాలో ఆయత్ నెంబర్ 100.

وَالسّٰبِقُوْنَ الْاَوَّلُوْنَ مِنَ الْمُهٰجِرِيْنَ وَالْاَنْصَارِ وَالَّذِيْنَ اتَّبَعُوْهُمْ بِاِحْسَانٍ ۙ رَّضِيَ اللّٰهُ عَنْهُمْ وَرَضُوْا عَنْهُ وَاَعَدَّ لَهُمْ جَنّٰتٍ تَجْرِيْ تَحْتَهَا الْاَنْهٰرُ خٰلِدِيْنَ فِيْهَآ اَبَدًا ۭذٰلِكَ الْفَوْزُ الْعَظِيْمُ

ముహాజిర్లలో, అన్సార్లలో ప్రప్రథమంగా ముందంజ వేసిన వారితోనూ, తర్వాత చిత్తశుద్ధితో వారిని అనుసరించిన వారితోనూ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రసన్నుడయ్యాడు. వారు అల్లాహ్ పట్ల ప్రసన్నులయ్యారు. క్రింద కాలువలు ప్రవహించే స్వర్గ వనాలను అల్లాహ్ వారి కోసం సిద్ధం చేసి ఉంచాడు. వాటిలో వారు కలకాలం ఉంటారు. గొప్ప సాఫల్యం అంటే ఇదే.” (9:100)

ఈ ఆయతులో మూడు వర్గాల గురించి చెప్పడం జరిగింది. ముహాజిర్లు ఒక వర్గం, అన్సార్లు ఒక వర్గం. అంటే సహాబాలలో ఇది రెండు వర్గాలు. ముహాజిర్లు, అన్సార్లు. మూడవది, వారి తర్వాత వారిని చిత్తశుద్ధితో అనుసరించేవారు. వారెవరు? కొంతమంది పండితులు తాబయీన్లు అయి ఉండవచ్చు అని చెప్పారు. కాకపోతే ప్రళయం వరకు వచ్చే విశ్వాసులందరూ దీనిలో వస్తారు. చిత్తశుద్ధితో వారిని అనుసరించేవారు. ఎవరిని? సహాబాలను. ముహాజిర్లను, సహాబాలను చిత్తశుద్ధితో అనుసరించేవారు కూడా ఈ కోవకి వస్తారు. ఇది సహాబాల యొక్క గొప్పతనం.

విశ్వాసుల మధ్య స్నేహం – షేక్ హబీబుర్రహ్మాన్ జామయి [వీడియో & టెక్స్ట్]

విశ్వాసులతో స్నేహం అంటే ఏమిటి?
https://youtu.be/VIPOLPgJOa4 [8 నిముషాలు]
వక్త: షేక్ హబీబుర్రహ్మాన్ జామయి (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగం ఇస్లాంలో విశ్వాసుల మధ్య స్నేహం యొక్క భావనను వివరిస్తుంది. ఈ స్నేహం ఏకేశ్వరోపాసన (తౌహీద్) కోసం పరస్పర ప్రేమ మరియు సహకారంపై ఆధారపడి ఉంటుందని ఇది నొక్కి చెబుతుంది. వక్త సూరా అత్-తౌబా, 71వ ఆయతును ఉటంకిస్తూ, విశ్వాసులను మంచిని ఆజ్ఞాపించే, చెడును నిషేధించే, నమాజ్ స్థాపించే, జకాత్ ఇచ్చే, మరియు అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తకు విధేయత చూపే పరస్పర మిత్రులుగా వర్ణించారు. ఇంకా, ఈ బంధాన్ని వివరించడానికి రెండు హదీసులు సమర్పించబడ్డాయి: మొదటిది విశ్వాసులను ఒక గోడలోని ఇటుకలతో పోలుస్తుంది, ప్రతి ఒక్కటి మరొకదాన్ని బలపరుస్తుంది, రెండవది విశ్వాసుల సమాజాన్ని సమిష్టిగా నొప్పిని అనుభవించే ఒకే శరీరంతో పోలుస్తుంది. విశ్వాసులు ఒకరికొకరు బలం, మద్దతు మరియు కరుణకు మూలంగా ఉండాలనేది ప్రధాన సందేశం.

ఇన్నల్ హమ్ దలిల్లాహి వహ్దహు, వస్సలాతు వస్సలాము అలా మల్లా నబియ్య బ’అదహు, అమ్మా బ’అద్.

ఆత్మీయ సోదరులారా, ధర్మ అవగాహనం అనే ఈ కార్యక్రమంలోకి మీ అందరికీ స్వాగతం. నా ఇస్లామీయ అభివాదం అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.

ఈరోజు మనం విశ్వాసులతో స్నేహం అంటే ఏమిటి? అనే విషయం గురించి తెలుసుకోబోతున్నాం.

విశ్వాసులతో స్నేహం అంటే, మువహ్హిదీన్‌లను అనగా ఏక దైవారాధకులైన విశ్వాసులను ప్రేమించడం, వారితో సహకరించడం అన్నమాట.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూరత్ తౌబా, ఆయత్ 71లో ఇలా సెలవిచ్చాడు.

وَالْمُؤْمِنُونَ وَالْمُؤْمِنَاتُ بَعْضُهُمْ أَوْلِيَاءُ بَعْضٍ ۚ يَأْمُرُونَ بِالْمَعْرُوفِ وَيَنْهَوْنَ عَنِ الْمُنكَرِ وَيُقِيمُونَ الصَّلَاةَ وَيُؤْتُونَ الزَّكَاةَ وَيُطِيعُونَ اللَّهَ وَرَسُولَهُ ۚ أُولَٰئِكَ سَيَرْحَمُهُمُ اللَّهُ ۗ إِنَّ اللَّهَ عَزِيزٌ حَكِيمٌ

విశ్వాసులైన పురుషులూ, విశ్వాసులైన స్త్రీలూ – వారంతా ఒండొకరికి మిత్రులుగా (సహాయకులుగా, చేదోడు వాదోడుగా) ఉంటారు. వారు మంచిని గురించి ఆజ్ఞాపిస్తారు. చెడుల నుంచి వారిస్తారు. నమాజులను నెలకొల్పుతారు, జకాత్‌ను చెల్లిస్తారు. అల్లాహ్‌కు, ఆయన ప్రవక్తకు విధేయులై ఉంటారు. అల్లాహ్‌ అతిత్వరలో తన కారుణ్యాన్ని కురిపించేది వీరిపైనే. నిస్సందేహంగా అల్లాహ్‌ సర్వాధిక్యుడు, వివేచనాశీలి.(9:71)

ఈ ఆయతులో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా విశ్వాసుల సద్గుణాల ప్రస్తావన చేశాడు. విశ్వాసుల యొక్క సద్గుణాలను ప్రస్తావించాడు. మొదటి సద్గుణం ఏమిటంటే వారు, అంటే విశ్వాసులు, పురుషులైనా, స్త్రీలైనా, విశ్వాసులు, విశ్వాసులైన పురుషులు, విశ్వాసులైన స్త్రీలు, వారు పరస్పరం స్నేహితులుగా మసులుకుంటారు. ఒండొకరికి సహాయ సహకారాలు అందించుకుంటారు. సుఖదుఃఖాలలో పాలుపంచుకుంటారు అన్నమాట.

మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు.

الْمُؤْمِنُ لِلْمُؤْمِنِ كَالْبُنْيَانِ يَشُدُّ بَعْضُهُ بَعْضًا
(అల్ ముఅమిను లిల్ ముఅమిని కల్ బున్యాన్, యషుద్దు బ’అదుహు బా’దా)
ఒక విశ్వాసి, సాటి విశ్వాసికి గోడ లాంటివాడు. ఆ గోడలోని ఒక ఇటుక, ఇంకో ఇటుకకు పుష్టినిస్తుంది. (బుఖారీ మరియు ముస్లిం)

అంటే ఒక విశ్వాసి, సాటి విశ్వాసికి గోడ లాంటివాడు. ఆ గోడలోని ఒక ఇటుక ఇంకో ఇటుకకు పుష్టినిస్తుంది. సుబ్ హా నల్లాహ్! అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక విశ్వాసికి మరో విశ్వాసికి మధ్య ఉండే సంబంధాన్ని ఈ హదీసులో వివరించారు. అల్ ముఅమిను లిల్ ముఅమిని కల్ బున్యాన్. కట్టడం లాంటివాడు. ఒక విశ్వాసి ఇంకో విశ్వాసికి కట్టడం లాంటివాడు, గోడ లాంటివాడు. ఎందుకంటే ఒక గోడలో ఒక ఇటుక, ఇంకో ఇటుకకు బలం ఇస్తుంది, పుష్టినిస్తుంది. విశ్వాసులు కూడా పరస్పరం అలాగే ఉంటారు, ఉండాలి అని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రస్తావించిన మాట. అలాగే, అంతిమ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంకో హదీసులో ఇలా సెలవిచ్చారు.

مَثَلُ الْمُؤْمِنِينَ فِي تَوَادِّهِمْ وَتَرَاحُمِهِمْ وَتَعَاطُفِهِمْ مَثَلُ الْجَسَدِ إِذَا اشْتَكَى مِنْهُ عُضْوٌ تَدَاعَى لَهُ سَائِرُ الْجَسَدِ بِالسَّهَرِ وَالْحُمَّى

(మసలుల్ ముఅమినీన ఫీ తవాద్దిహిమ్ వ తరాహుమిహిమ్ వ త’ఆతుఫిహిమ్ మసలుల్ జసద్, ఇజష్ తకా మిన్హు ఉద్వున్ తదాఆ లహూ సాయిరుల్ జసది బిస్సహరి వల్ హుమ్మా)

పరస్పర ప్రేమానురాగాలను పంచుకోవటంలో, ఒండొకరిపై దయ చూపటంలోనూ, విశ్వాసుల (ముఅమినీన్‌ల) ఉపమానం ఒక శరీరం లాంటిది. శరీరంలోని ఏదైనా ఒక అవయవం బాధకు గురైనప్పుడు, మొత్తం శరీరానికి నొప్పి కలుగుతుంది. శరీరమంతా వ్యాకులతకు లోనవుతుంది. (ముస్లిం)

ఈ హదీసులో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ప్రేమానురాగాల విషయంలో, దయ చూపే విషయంలో ఒండొకరికి ఒకరు సహాయం చేసుకునే విషయంలో, చేదోడు వాదోడుగా ఉండే విషయంలో, పరస్పరం కలిసిమెలిసి ఉండే విషయంలో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రపంచంలో ఉన్న విశ్వాసులందరూ ఒక శరీరం లాంటి వారు. శరీరంలోని ఒక భాగానికి బాధ అయితే, మొత్తం శరీరం బాధపడుతుంది. అదే ఉపమానం ఒక విశ్వాసిది అని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు.

అత్మీయ సోదరులారా, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరినీ నిజమైన విశ్వాసిగా జీవించే సద్బుద్ధిని అల్లాహ్ ప్రసాదించుగాక. ఆమీన్. మరిన్ని వివరాలు ఇన్ షా అల్లాహ్ వచ్చే ఎపిసోడ్ లో తెలుసుకుందాం. అప్పటివరకు సెలవు. వ ఆఖిరు ద’అవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=43226


అధర్మమైన వసీలా (అల్లాహ్ సామీప్యాన్ని పొందే సాధనం) – హబీబుర్ రహ్మాన్ జామి’ఈ [వీడియో & టెక్స్ట్]

అధర్మమైన సమ్మతమైన వసీలా
https://youtu.be/mh_RqyUcea4 [13 నిముషాలు]
వక్త: హబీబుర్ రహ్మాన్ జామి’ఈ(హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, వక్త ‘వసీలా’ (అల్లాహ్‌కు సాన్నిహిత్యం కోరే సాధనం) అనే భావనను వివరిస్తున్నారు. ధర్మ సమ్మతమైన మరియు అధర్మమైన వసీలాల మధ్య వ్యత్యాసాన్ని ఆయన స్పష్టం చేశారు. ధర్మబద్ధమైన మార్గం కేవలం ఖురాన్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధనల ద్వారానే నిర్దేశించబడిందని నొక్కిచెప్పారు. ముఖ్యంగా, మరణించిన వారి ద్వారా, వారు ప్రవక్తలు లేదా పుణ్యాత్ములు అయినప్పటికీ, సహాయం కోరడం లేదా దుఆ చేయడం నిషిద్ధమని వివరించారు. ఆరాధన “ఎవరి కోసం” మరియు “ఎలా” అనే ఇబ్నె తైమియా సూత్రాన్ని ఉటంకించారు. ఉమర్ బిన్ ఖత్తాబ్ (రదియల్లాహు అన్హు) కాలంలో కరువు ఏర్పడినప్పుడు, వర్షం కోసం దుఆ చేయడానికి మరణించిన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను కాకుండా, జీవించి ఉన్న ప్రవక్త పినతండ్రి అబ్బాస్ (రదియల్లాహు అన్హు)ను వసీలాగా చేసుకున్న చారిత్రక ఉదాహరణను అందించారు. దీని ద్వారా జీవించి ఉన్న పుణ్యాత్ముల ద్వారా మధ్యవర్తిత్వం కోరవచ్చని, కానీ మృతుల ద్వారా కాదని స్పష్టం చేశారు. అలాగే, ‘ఇస్తిఆనత్’ (ప్రాపంచిక విషయాలలో అనుమతించబడిన సహాయం) మరియు ‘ఇస్తిగాసా’ (కేవలం అల్లాహ్ మాత్రమే చేయగల విషయాలలో సహాయం కోరడం) మధ్య తేడాను వివరిస్తూ, రెండోది అల్లాహ్ యేతరుల నుండి కోరడం హరామ్ అని తేల్చిచెప్పారు.

اَلْحَمْدُ لِلّٰهِ رَبِّ الْعَالَمِيْنَ، وَالْعَاقِبَةُ لِلْمُتَّقِيْنَ، وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى سَيِّدِ الْأَنْبِيَاءِ وَالْمُرْسَلِيْنَ، وَمَنْ تَبِعَهُمْ بِإِحْسَانٍ إِلَى يَوْمِ الدِّيْنِ، أَمَّا بَعْدُ.

(అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వల్ ఆఖిబతు లిల్ ముత్తఖీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ అంబియాయి వల్ ముర్సలీన్, వ మన్ తబిఅహుమ్ బి ఇహ్సానిన్ ఇలా యౌమిద్దీన్, అమ్మా బాద్.)

సర్వలోకాల ప్రభువైన అల్లాహ్‌కే సర్వస్తోత్రాలు. అంతిమ విజయం దైవభీతిపరులకే. ప్రవక్తల నాయకులు, దైవసందేశహరులందరిపై మరియు ప్రళయదినం వరకు వారిని సన్మార్గంలో అనుసరించేవారిపై అల్లాహ్ కారుణ్యం మరియు శాంతి కురుపించుగాక. ఆ తర్వాత…

అభిమాన సోదరులారా! ధర్మ అవగాహన అనే ఈ కార్యక్రమములోకి మీ అందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను.

اَلسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ
(అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు)
మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక.

అభిమాన సోదరులారా! గత ఎపిసోడ్లో మనం ధర్మ సమ్మతమైన వసీలా గురించి తెలుసుకున్నాం. అవి తప్ప వేరే ఇతర పద్ధతుల ద్వారా ఆశ్రయం పొందటం అది అధర్మమైన వసీలా అవుతుంది.

ప్రియ సోదరులారా! అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మన రుజుమార్గం కొరకు, సత్యమార్గం కొరకు ఒక మార్గాన్ని, ఒక దారిని, ఒక గీటురాయిని తెలియజేశాడు, చూపించాడు. సత్యం ఏమిటి? అసత్యం ఏమిటి? న్యాయం ఏమిటి? అన్యాయం ఏమిటి? ధర్మం ఏమిటి? అధర్మం ఏమిటి? స్వర్గానికి పోయే దారి ఏమిటి? నరకానికి పోయే దారి ఏమిటి? మన ఇహపర లోకాల సాఫల్యం కొరకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అంతిమ గ్రంథం, దివ్య గ్రంథం ఖురాన్ మజీద్ ని అవతరింపజేశాడు. అలాగే అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క బోధనలు, ప్రవచనాలు. ఖురాన్ మరియు ప్రామాణికమైన హదీసులలో మన జీవన విధానం, ఈ లోకంలో, ప్రపంచంలో, ఇహంలో మనము ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎలా ప్రార్థించాలి, ఎలా ప్రార్థన చేయకూడదు, అల్లాహ్ ను ఎలా వేడుకోవాలి, ఎలా వేడుకోకూడదు, ఇవన్నీ మనకు తెలియజేయడం జరిగింది ఖురాన్ లో మరియు హదీస్ లో.

అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త తప్ప ఇతర మార్గం ఎన్నుకుంటే, అది మన బుద్ధికి, మన తెలివికి సరైనది అని అనిపించినా, అది ఖురాన్ పరంగా, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం విధానం పరంగా లేకపోతే, అది ధర్మ సమ్మతం కాదు అని మనము స్పష్టంగా తెలుసుకోవాలి.

అందుకే షేఖుల్ ఇస్లాం ఇబ్నె తైమియా రహ్మతుల్లాహి అలై ఒక చక్కని సూత్రం చెప్పారు. అది ఏమిటంటే:

مَنْ تَعْبُدُ؟ كَيْفَ تَعْبُدُ؟
(మన్ త’అబుద్? కైఫ త’అబుద్?)
ఎవరిని ఆరాధించాలి? ఆ ఆరాధన ఎలా చేయాలి?

ఎవరిని ఆరాధించాలి? ఆరాధన ఎవరి కొరకు? కైఫ త’అబుద్, ఆ ఆరాధన ఎలా చేయాలి? సూటిగా చెప్పాలంటే, ఆరాధన, ఇబాదత్ ఎవరి కోసం? ఆ ఇబాదత్ ఎలా చేయాలి? రెండే రెండు విషయాలు. దీనికి సూటిగా చెప్పాలంటే చక్కని సమాధానం: ఆరాధన కేవలం అల్లాహ్ కొరకు మరియు ఆ ఆరాధన అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపిన విధానం ప్రకారమే.

అభిమాన సోదరులారా! కావున ఈ ధర్మ సమ్మతం కాని విషయాలలో, ధర్మ సమ్మతం కాని వసీలాలలో ఉదాహరణకు ఒకటి ఏమిటి? మృతులను దుఆ చేయమని కోరటం. మృతులను, పరమపదించిన వారిని దుఆ చేయమని కోరటం, వారిని వసీలాగా తీసుకోవటం, వాస్తాగా తీసుకోవటం, ఇది ఇస్లాంలో అధర్మం అని మనం తెలుసుకోవాలి.

అది ఎవరైనా సరే, పుణ్య పురుషులు కావచ్చు, ఔలియాలు కావచ్చు, అలాగే దైవ ప్రవక్తలు కూడా కావచ్చు. ఎవరైనా సరే, మరణించిన వారి సహాయం కోరటం, వారి వసీలాను కోరటం, వారి వసీలా ద్వారా దుఆ చేయటం ఇది ఇస్లాంలో సమ్మతం కాదు. ఎందుకంటే, ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు త’ఆలా అన్హు – ఇది ప్రామాణికమైన హదీస్, అనేక హదీస్ గ్రంథాలలో ఈ హదీస్ ఉంది, సహీహ్ హదీస్ ఇది, ప్రామాణికమైన హదీస్ ఇది.

ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు త’ఆలా అన్హు, ముఆవియా బిన్ అబూ సుఫ్యాన్ రదియల్లాహు అన్హులు వారు గానీ, ఇతర సహాబాలు గానీ, తాబయీన్లు గానీ, కరువు కాటకాలు వచ్చినప్పుడు, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పరమపదించిన తర్వాత వారి ద్వారా దుఆ చేయలేదు, వారి వసీలా తీసుకోలేదు. ఇది ముఖ్యమైన విషయం, గమనించాల్సిన విషయం ఇది. మనకంటే ఎక్కువ జ్ఞానం గలవారు, మనకంటే ఎక్కువ ఖురాన్, హదీస్ తెలిసినవారు, మనకంటే ఎక్కువ అల్లాహ్‌కు భయపడేవారు, మనకంటే ఎక్కువ దైవభీతి కలిగినవారు, మనకంటే ఎక్కువ అల్లాహ్‌ను ఆరాధించేవారు, మనకంటే ఎక్కువ ధర్మ జ్ఞానం కలిగినవారు, సహాబాలు, తాబయీన్లు, ధర్మ పండితులు, ముహద్దసీన్లు, వారు కరువు కాటకాలు వచ్చినప్పుడు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను వసీలాగా తీసుకున్నారా? తీసుకోలేదు.

ఇంకా, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉన్నంత కాలం, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా దుఆ చేసేవారు. పోయి, “ఓ దైవ ప్రవక్త! కరువు వచ్చింది, వర్షం లేదు, నీరు వలన మనుషులు, జంతువులు ఇబ్బందులు పడుతున్నారు. ఓ దైవ ప్రవక్త, దుఆ చేయండి” అని కోరేవారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దుఆ చేసేవారు. ఇది మనం గత ఎపిసోడ్లో తెలుసుకున్నాం.

కాకపోతే, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పరమపదించిన తర్వాత సహాబాలు, ఆ తర్వాత కాలానికి చెందిన వారు, వారెవరైనా ప్రవక్తల, మృతుల, చనిపోయిన పుణ్యాత్ముల వసీలా తీసుకునేవారా? కాదు. ఒక హదీస్ ఇలా ఉంటుంది.

ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు త’ఆలా అన్హు యొక్క వేడుక: “ఓ అల్లాహ్! గతంలో మేము మా ప్రవక్త ద్వారా నిన్ను అర్థించే వారము, నీవు వర్షం కురిపించి మా కరువు తీర్చే వాడివి. ఇప్పుడు మేము మా ప్రవక్త బాబాయి గారిని ఆశ్రయించి నిన్ను ప్రార్థిస్తున్నాము. కనుక మాపై వర్షం కురిపించు” అని ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు ప్రార్థించేవారు.

దీంట్లో స్పష్టంగా ఏముంది? స్పష్టంగా ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు తెలియజేస్తున్నారు. “ఓ అల్లాహ్, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉన్నంత వరకు ప్రవక్త ద్వారా నిన్ను అర్థించే వారము.” అంటే ఇప్పుడు మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం లేరు కాబట్టి, పరమపదించారు కాబట్టి, ఇప్పుడు మనము ప్రవక్త గారి బాబాయి అయిన, పినతండ్రి అయిన అబ్బాస్ రదియల్లాహు అన్హు గారిని ఆశ్రయించి, అబ్బాస్ గారి ద్వారా నిన్ను వేడుకుంటున్నాము, ప్రార్థిస్తున్నాము. ఎందుకంటే అప్పుడు అబ్బాస్ రదియల్లాహు త’ఆలా అన్హు బ్రతికి ఉన్నారు. ఇది గమనించాల్సిన విషయం.

అంటే దీని సారాంశం ఏమిటి అభిమాన సోదరులారా? అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బ్రతికి ఉన్నంత వరకు సహాబాలు ప్రవక్త ద్వారా ప్రార్థించేవారు. ఆయన పరమపదించిన తర్వాత కరువు వస్తే, ప్రవక్తగారి పినతండ్రి అబ్బాస్ రదియల్లాహు అన్హు ద్వారా దుఆ చేసేవారు. దీనితో అర్థం ఏమైందంటే, చనిపోయిన వారి ద్వారా దుఆ చేయకూడదు. వారిని వసీలాగా తీసుకోకూడదు. ఎవరైతే పుణ్యాత్ములు, దైవభీతిపరులు, తఖ్వా గలవారు బ్రతికి ఉన్నారో, వారి ద్వారా దుఆ చేయవచ్చుమని మనకు అర్థమవుతుంది.

అలాగే, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంతస్తు, వేరే ఇతరుల అంతస్తులను వసీలాగా కూడా చేసుకోకూడదు. ప్రవక్త గారి అంతస్తును, ఇతర వారి అంతస్తులను కూడా ఆసరాగా చేసుకోకూడదు, వసీలాగా చేసుకోకూడదు. ఒక్క హదీస్ ఉంది, ఆ హదీస్ కి కొందరు ఆధారంగా తీసుకుంటారు, అది సమంజసం కాదు. ఆ హదీస్ ఏమిటంటే:

“ఇదా సఅల్తుముల్లాహ ఫస్ అలూహు బిజాహీ, ఫ ఇన్న జాహీ ఇందల్లాహి అజీమ్”.

ఈ హదీస్, దీని అర్థం ఏమిటి? “మీరు అల్లాహ్ ను అడిగితే నా హోదాను, అంతస్తులను ఆసరాగా చేసుకుని అడగండి, ఎందుకంటే నా స్థాయి చాలా గొప్పది” అని ఇది ఆ ఒక ఉల్లేఖనం ఉంది. ఇది కాల్పనిక హదీస్, ‘మౌజూ’, ‘మన్ ఘడత్’. ఇది కాల్పనిక హదీస్, సత్యం లేశమైనా దీంట్లో లేదు అని గ్రహించాలి. ఈ హదీస్‌ను ఆధారంగా తీసుకోవటం కరెక్ట్ కాదు, సమ్మతం కాదు, న్యాయం కాదు. ఎందుకంటే ఇది ‘మౌజూ’, ‘మన్ ఘడత్’ హదీస్ ఇది.

అలాగే, సృష్టితాలలో ఏ ఒక్కరి అస్తిత్వాన్నైనా ఆధారంగా చేసుకోవటం ధర్మ సమ్మతం కాదు. ఎందుకంటే, ఎటువంటి ఆధారాలు ఖురాన్ లో గానీ, ప్రామాణికమైన హదీసులలో గానీ లేవు.

అభిమాన సోదరులారా! అలాగే సృష్టితాలను సహాయం చేయమని కోరటం రెండు రకాలు. ఒకటి ఇస్తిఆనత్, ఇది సమ్మతమే. ఇస్తిఆనత్ అంటే ఏమిటి? ఏదైనీ వ్యవహారములో సహాయం కోరటం. ఉదాహరణకు స్నేహితులు, అమ్మ నాన్న, భార్య, భర్త, సంతానము, పిల్లలు… బ్రతికి ఉన్నారు, వారితో మనం జీవిస్తున్నాము, ఒకరికొకరు సహాయం చేసుకోవటం, ఇచ్చు పుచ్చుకోవటం. ఇది సమ్మతమే. ఇంకా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్ లో ఇలా తెలియజేశాడు:

وَتَعَاوَنُوا عَلَى الْبِرِّ وَالتَّقْوَى
(వ తఆవనూ అలల్ బిర్రి వత్తఖ్వా)
పుణ్యకార్యాలలో, దైవభీతితో కూడిన విషయాలలో పరస్పరం సహకరించుకోండి. (సూరె మాయిదా: 2)

ఒకరి సహాయం కోరటము, “నాకు ఈ పని చేసి పెట్టండి, ఫలానా వస్తువు తీసుకొని రండి, ఇది వారికి ఇచ్చివేయండి”, అంటే ఇది ఇస్తిఆనత్. పరస్పరం ఇటువంటి విషయాలలో సహాయం చేసుకోవచ్చు. ఇది దాంట్లో రాదు.

సృష్టితాల సహాయంలో రెండవది ఏమిటి? ఇస్తిగాసా. ఇస్తిగాసా అంటే, అల్లాహ్ మాత్రమే చేయగలిగే పనులను, అల్లాహ్ మాత్రమే చేయగలిగే విషయాలను మృతులను కోరటం. ఏ పని అయితే అల్లాహ్ మాత్రమే చేస్తాడో, ఏది అయితే అల్లాహ్‌కు మాత్రమే సాధ్యమో, అటువంటివి సృష్టితాలతో కోరటం, ఇది కూడా అధర్మం కిందకి వస్తుంది. కేవలం అల్లాహ్‌కు సాధ్యమైన విషయాల కొరకు, బ్రతికి ఉన్న వారిని అర్థించటం ఇది కూడా ధర్మ సమ్మతం కాదు.

అభిమాన సోదరులారా! నా ఈ ప్రసంగానికి సారాంశం ఏమిటంటే, వసీలా రెండు రకాలు: ధర్మ సమ్మతం – గత ఎపిసోడ్లో తెలుసుకున్నాం. రెండవది అధర్మమైన వసీలా, అంటే మృతులను దుఆ చేయమని కోరటం, దైవ ప్రవక్త అంతస్తు లేదా ఇతరుల, పుణ్యాత్ముల అంతస్తులను వసీలాగా చేసుకోవటం, చనిపోయిన వారిని సహాయం కోరటం, ఇవన్నీ అధర్మమైన వసీలా. ఇది ఇస్లాం ధర్మంలో ముమ్మాటికీ కరెక్ట్ కాదు, నిషిద్ధము, ఇది తప్పు, అధర్మం, అన్యాయం, పాపం.

ఇక సహాయం వస్తే ఇది రెండు రకాలు. ఇస్తిఆనత్, పరస్పరం సహాయం చేసుకోవటం, వ్యవహారంలో ఏమైనా వస్తువులలో, లావాదేవీల్లో, తినే తాగే విషయాలలో ఇది ధర్మ సమ్మతమే. కాకపోతే ఇస్తిగాసా, ఏదైతే అల్లాహ్ మాత్రమే చేయగలుగుతాడో, కేవలం అల్లాహ్‌కు మాత్రమే సాధ్యమైన విషయాల కొరకు సృష్టితలతో కోరటం, ఇది అధర్మమైన వసీలాగా పరిగణిస్తుంది.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరికీ ఖురాన్ మరియు ప్రామాణికమైన హదీసుల పరంగా జీవించే సద్బుద్ధిని ప్రసాదించు గాక. ఆమీన్.

وَآخِرُ دَعْوَانَا أَنِ الْحَمْدُ لِلّٰهِ رَبِّ الْعَالَمِيْنَ، اَلسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ
(వ ఆఖిరు ద’అవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు)
“సర్వలోకాల ప్రభువైన అల్లాహ్‌కే సర్వస్తోత్రాలు” అన్నదే మా చివరి మాట. మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=43148

వసీలా , తవస్సుల్

తౌహీద్ & షిర్క్ (మెయిన్ పేజీ):
https://teluguislam.net/tawheed-shirk/


మనం అల్లాహ్ ను ఏవిధంగా వేడుకోవాలి? – షేక్ హబీబుర్రహ్మన్ జామయి [వీడియో & టెక్స్ట్]

మనం అల్లాహ్ ను ఏవిధంగా వేడుకోవాలి?
https://youtu.be/51-0s5yKLYg [12 నిముషాలు]
షేక్ హబీబుర్రహ్మన్ జామయి

ఈ ప్రసంగంలో, దుఆ (ప్రార్థన) యొక్క ప్రాముఖ్యత మరియు దానిని ఆచరించవలసిన సరైన పద్ధతి గురించి వివరించబడింది. దుఆ ఆరాధనలలో ఒక ముఖ్యమైన భాగమని, దానిని ఎలా చేయాలో అల్లాహ్ మరియు అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నేర్పించారని చెప్పబడింది. ప్రవక్త గారి జీవితం నుండి రెండు సంఘటనలను ఉదాహరణగా చూపిస్తూ, అల్లాహ్ ను స్తుతించకుండా మరియు ప్రవక్తపై దరూద్ పంపకుండా నేరుగా అభ్యర్థించడం తొందరపాటు అవుతుందని, అయితే అల్లాహ్ యొక్క ఉత్తమమైన నామాలు మరియు గుణగణాల ద్వారా వేడుకోవడం సరైన పద్ధతి అని స్పష్టం చేయబడింది. అల్లాహ్ యొక్క 99 పేర్ల ప్రాముఖ్యత మరియు వాటిని గణించడం అంటే కేవలం లెక్కించడం కాదని, వాటిని విశ్వసించి, అర్థం చేసుకుని, జీవితంలో ప్రతిబింబించేలా చేయాలని వివరించబడింది. ప్రార్థన చేయడానికి మధ్యవర్తి (వసీలా) అవసరమా అనే అంశం తదుపరి ప్రసంగంలో చర్చించబడుతుందని చెప్పబడింది.

అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ అంబియా ఇ వల్ ముర్సలీన్, వమన్ తబిఅహుమ్ బి ఇహ్సానిన్ ఇలా యౌమిద్దీన్, అమ్మా బాద్.

అభిమాన సోదరులారా! ధర్మ అవగాహనం అనే ఈ కార్యక్రమం లోకి మీ అందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను.

اَلسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ
(అస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు)
మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక.

ప్రియ వీక్షకులారా! ఈరోజు మనం ఈ కార్యక్రమంలో మనం అల్లాహ్ ను ఏ విధంగా వేడుకోవాలి అనే అంశం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మానవులను సృష్టించి వారికి సన్మార్గం చూపడానికి ప్రవక్తలను పంపాడు. దివ్యమైన ఆ పరంపరలో చివరి వారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఆయన ప్రతి సమస్య విషయంలో తన ఉమ్మత్ కు స్పష్టమైన మార్గదర్శనం ప్రసాదించారు. ఇతర ఆరాధనా పద్ధతులు తెలిపినట్లే, ప్రార్థించే విషయంలో కూడా, దుఆ చేసే విషయంలో కూడా మార్గదర్శులయ్యారు.

అభిమాన సోదరులారా! వేడుకోవటం, దుఆ చేయటం ఒక ముఖ్యమైన ఆరాధన.

అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దుఆ గురించి ఇలా సెలవిచ్చారు,

اَلدُّعَاءُ هُوَ الْعِبَادَةُ
(అద్దుఆ హువల్ ఇబాదహ్)
దుఆ యే అసలైన ఆరాధన.

ఈ హదీస్ అహ్మద్ గ్రంథంలో ఉంది, తిర్మిజీ లో ఉంది, అబూ దావూద్ లో ఉంది, ఇంకా అనేక హదీస్ గ్రంథాలలో ఈ హదీస్ ఉంది.

దుఆ తప్పక చేయవలసిన ఆరాధన. కావున, దుఆ ముఖ్యమైన ఆరాధన కాబట్టి, తప్పనిసరిగా చేయవలసిన ఆరాధన కాబట్టి, ఆ దుఆ చేసే విధానం కూడా స్వయంగా ఖురాన్ గ్రంథంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తమ ప్రవచనాల ద్వారా మనల్ని దుఆ చేసే విధానం, పద్ధతి నేర్పించారు.

అబూ దావూద్ లో ఒక హదీస్ ఉంది, ఫుజాలా బిన్ ఉబైద్ రదియల్లాహు తాలా అన్హు కథనం ప్రకారం అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మస్జిద్ లో ఉన్నారు, ఒక వ్యక్తి వచ్చాడు. నమాజ్ చేసుకున్న తర్వాత ఆ వ్యక్తి డైరెక్ట్ ఇలా దుఆ చేశాడు, ‘నాకు మోక్షం ఇవ్వు, ఓ అల్లాహ్ నన్ను కరుణించు’ అని డైరెక్ట్ గా దుఆ చేశాడు. ఇది విని అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, “మీరు తొందరపడ్డారు, ముందు అల్లాహ్ యొక్క ఘనతను కొనియాడు, ఆ తర్వాత నాపై దరూద్ పంపించు, ఆ తర్వాత నువ్వు ఏమి కోరుకుంటావో అది కోరుకో, నువ్వు చేసుకోదలచుకున్న దుఆ చేసుకో” అని అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు.

కాసేపటి తర్వాత ఇంకో వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి దుఆ చేసే విధానం ఇలా ఉండింది. ఆ వ్యక్తి తన అవసరాలను అడగక ముందు, తన అవసరాలను అల్లాహ్ ముందు పెట్టక ముందు, తన దుఆ ఈ విధంగా అతను ప్రార్థన చేశాడు:

اَللّٰهُمَّ إِنِّيْ أَسْأَلُكَ بِأَنِّيْ أَشْهَدُ أَنَّكَ أَنْتَ اللّٰهُ لَا إِلٰهَ إِلَّا أَنْتَ الْأَحَدُ الصَّمَدُ الَّذِيْ لَمْ يَلِدْ وَلَمْ يُوْلَدْ وَلَمْ يَكُنْ لَّهُ كُفُوًا أَحَدٌ
(అల్లాహుమ్మ ఇన్నీ అస్ అలుక బిఅన్నీ అష్ హదు అన్నక అంతల్లాహు లా ఇలాహ ఇల్లా అంతల్ అహదుస్ సమద్, అల్లదీ లమ్ యలిద్ వలమ్ యూలద్, వలమ్ యకుల్లహు కుఫువన్ అహద్)

“ఓ అల్లాహ్! నేను నిన్నే అర్థిస్తున్నాను. అల్లాహ్ నువ్వు మాత్రమే. సకల లోకాలకు ప్రభువు, పాలకుడు, పోషకుడు. ఆరాధ్య దైవం నువ్వు మాత్రమే. లా ఇలాహ ఇల్లా అంత్, నువ్వు తప్ప ఏ దేవుడూ లేడు. అల్ అహద్, నువ్వు ఒకే ఒక్కడివి. అస్సమద్, నిరపేక్షాపరుడివి, అవసరాలు, అక్కర్లు లేనివాడివి. నీకు తల్లిదండ్రులు గానీ, సంతానం గానీ లేరు. నీకు సరిసమానం ఎవ్వరూ లేరు.”

ఇలా అల్లాహ్ యొక్క ఘనతను కొనియాడి ఆ తర్వాత ఆ వ్యక్తి తాను చేసుకున్న దుఆ చేసుకున్నాడు. ఇది విని అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ వ్యక్తికి ఇలా బదులిచ్చారు:

لَقَدْ سَأَلْتَ اللّٰهَ بِالِاسْمِ الَّذِيْ إِذَا سُئِلَ بِهِ أَعْطٰى وَإِذَا دُعِيَ بِهِ أَجَابَ
(లఖద్ సఅల్తల్లాహ బిల్ ఇస్మిల్లదీ ఇదా సుఇల బిహీ అఅతా వ ఇదా దుఇయ బిహీ అజాబ్)
“ఏ పేరుతో అర్థిస్తే ఆయన ప్రసాదిస్తాడో, ఏ పేరు ద్వారా దుఆ చేస్తే ఆ దుఆ స్వీకరించబడుతుందో, ఆ పేరుతోనే నువ్వు అడిగావు.”

అంటే ఇక్కడ రెండు విషయాలు మన ముందుగా ఉన్నాయి ఈ హదీస్ లో. మొదటి వ్యక్తి డైరెక్ట్ గా అల్లాహ్ ఘనత లేకుండా, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై దరూద్ పఠించకుండా, పంపించకుండా డైరెక్ట్ దుఆ ప్రారంభం చేశాడు, ‘ఓ అల్లాహ్ నాకు అది ఇవ్వు, ఇది ఇవ్వు, కరుణించు, క్షమించు’ అని చెప్పి స్టార్ట్ చేసేశాడు. అందుకు ఆ వ్యక్తికి సమాధానం ప్రవక్త గారు ఏమి ఇచ్చారు? “ఓ నాయనా! నువ్వు తొందరపడ్డావు” అని చెప్పారు. మరో వ్యక్తికి అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చాలా మెచ్చుకున్నారు. “ఏ పేరుతో అర్థిస్తే ఆ అల్లాహ్ ప్రసాదిస్తాడో, ఏ పేరు ద్వారా దుఆ చేస్తే దుఆ స్వీకరించబడుతుందో ఆ పేరుతోనే నువ్వు అడిగావు” అని అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన్ని మెచ్చుకొని ఇలా సమాధానం ఇచ్చారు.

ప్రియ వీక్షకులారా! మనకు అర్థమైంది ఏమిటంటే, దుఆ ఒక ముఖ్యమైన ఆరాధన కాబట్టి, ఆ దుఆ చేసే విధానం స్వయంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూరా ఆరాఫ్, ఆయత్ 180 లో తెలియజేశాడు, ఏ విధంగా అల్లాహ్ ను వేడుకోవాలి అనటానికి.

وَلِلّٰهِ الْاَسْمَاۤءُ الْحُسْنٰى فَادْعُوْهُ بِهَاۖ
(వలిల్లాహిల్ అస్మావుల్ హుస్నా ఫద్ ఊహు బిహా)
అల్లాహ్ కు ఉత్తమమైన పేర్లు ఉన్నాయి. కాబట్టి మీరు ఆ పేర్లతోనే ఆయనను ప్రార్థించండి. (7:180)

అభిమాన సోదరులారా! బుఖారీ, కితాబుద్ దావాత్, అలాగే ముస్లిం గ్రంథం కితాబుద్ దికిర్ లో ఒక హదీస్ ఉంది. అల్లాహ్ కు 99 పేర్లు ఉన్నట్లు తెలియజేయబడింది. ఎవరైతే వాటిని గణిస్తూ ఉంటాడో అతడు స్వర్గంలో ప్రవేశిస్తాడు. అల్లాహ్ బేసి సంఖ్యలో ఉన్నాడు, బేసి సంఖ్యను ఆయన ఎంతో ఇష్టపడతాడు. ఈ హదీస్ బుఖారీ మరియు ముస్లిం గ్రంథంలో ఉంది ఈ హదీస్.

ఈ హదీస్ లో ముఖ్యంగా రెండు విషయాలు తెలియపరచాలనుకుంటున్నాను. మొదటి విషయం ఏమిటి ఈ హదీస్ లో? అల్లాహ్ కు 99 పేర్లు ఉన్నట్లు తెలియజేయబడింది. అంటే దీనికి అర్థము 99 మాత్రమే ఉన్నాయి అని కాదు, ఈ విషయం గమనించుకోండి. హదీస్ లో 99 పేర్లు తెలియజేయడం జరిగింది, దానికి అర్థం అల్లాహ్ కు 99 పేర్లు మాత్రమే ఉన్నాయి అని కాదు. అంటే ఈ పేర్ల ద్వారా గణిస్తే, లెక్కిస్తే, అడిగితే దుఆ స్వీకరించబడుతుంది అని అర్థం వస్తుంది కానీ, అల్లాహ్ కు 99 పేర్లు మాత్రమే ఉన్నాయి అని కాదు. అల్లాహ్ కు పేర్లు అసంఖ్యాకమైనవి, కొన్ని పేర్లు అది అల్లాహ్ యొక్క ఇల్మె గైబ్ లోనే ఉన్నాయి, మనకు తెలియవు. అందుకు 99 మాత్రమే కాదు అనే విషయం తెలుసుకోవాలి.

రెండవ విషయం ఈ హదీస్ లో, ఎవరైతే అల్లాహ్ యొక్క నామాలను గణిస్తూ ఉంటాడో అంటే, గణించటం అంటే అర్థం కేవలం లెక్కించటం అని భావం కాదు. గణించడంతో పాటు వాటిని దృఢంగా విశ్వసించాలి, చిత్తశుద్ధితో, భక్తితో ఈ నామాలను స్మరించాలి, ఒక్కో నామంలోని అంతరార్థాన్ని తెలుసుకోవాలి, వాటిని కంఠస్థం చేసుకోవాలి, ఆ గుణగణాలు తమ వ్యక్తిగత జీవితంలో ప్రతిబింబించేలా ప్రవర్తించాలి. ఇది భావం అల్లాహ్ యొక్క నామాలను లెక్కించడం అంటే, గణించడం అంటే.

అభిమాన సోదరులారా! అలాగే అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కూడా దుఆ చేసేవారు, అల్లాహ్ నామాలను గణించేవారు, లెక్కించేవారు, అల్లాహ్ యొక్క నామాల ద్వారా, గుణ విశేషాల ద్వారా కూడా అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వేడుకునేవారు. ఉదాహరణకు ఒక హదీస్ ఉంది, అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చేసే దుఆలలో ఒక దుఆ యొక్క ఒక్క భాగం ఇలా ఉంటుంది:

أَسْأَلُكَ بِكُلِّ اسْمٍ هُوَ لَكَ سَمَّيْتَ بِهِ نَفْسَكَ
(అస్ అలుక బికొల్లి ఇస్మిన్ హువ లక సమ్మైత బిహీ నఫ్సక్)
ఓ అల్లాహ్! నువ్వు నీ కోసం పెట్టుకున్న ప్రతి పేరు ద్వారా నేను నిన్ను పిలుస్తున్నాను.

అని అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వేడుకునేవారు. ప్రియ వీక్షకులారా! ఈ… ఇంతకీ నా మాటలకి సారాంశం ఏమిటంటే దుఆ చేయటం, అల్లాహ్ ను వేడుకోవటం, ఇది ముఖ్యమైన ఆరాధన కాబట్టి, దీని విధానం ఏమిటి? అల్లాహ్ యొక్క నామాల ద్వారా, ఆయన గుణ విశేషాల ద్వారా మనము అల్లాహ్ ను పిలవాలి, వేడుకోవాలి, దుఆ చేయాలి. ఆ, ఇది కొన్ని ముఖ్యమైన విషయాలు మనం అల్లాహ్ ను ఏ విధంగా వేడుకోవాలి అనే అంశం గురించి.

ప్రియ సోదరులారా! ఇక ఈ అంశానికి సంబంధించిన విషయమే, అల్లాహ్ ను వేడుకోవటానికి ఎవరి సహాయమైనా అవసరమా? అల్లాహ్ ను వేడుకోవటానికి, దుఆ చేయటానికి, ఆ దుఆ స్వీకరించబడటానికి ఎవరి సహాయమైనా అవసరమా? మధ్యవర్తి అవసరమా? సింపుల్ గా చెప్పాలంటే వసీలా అవసరమా? అసలు వసీలా అంటే ఏమిటి? వసీలా వాస్తవికత ఏమిటి? వసీలా ధర్మసమ్మతమా కాదా? వసీలా గురించి వివరాలు, వసీలా గురించి వాస్తవికత ఏమిటో ఇన్ షా అల్లాహ్ వచ్చే ఎపిసోడ్ లో తెలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. వ ఆఖిరు దావానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు.


లంచగొండితనం – హబీబుర్రహ్మాన్ జామయి [వీడియో & టెక్స్ట్]

లంచగొండితనం
https://youtu.be/Oyxybndq8kM [23 నిముషాలు]
వక్త: హబీబుర్రహ్మాన్ జామయి (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో లంచగొండితనం అనే ఘోరమైన పాపం గురించి వివరించబడింది. లంచం అంటే అన్యాయంగా ఒక లక్ష్యాన్ని సాధించడానికి లేదా అక్రమమైన కోరికను నెరవేర్చుకోవడానికి అధికారికి ఏదైనా ఇవ్వడం అని ప్రవక్త నిర్వచించారు. ఇస్లాంకు ముందు కూడా ఈ అవినీతి యూదులలో ఉండేదని, వారు ప్రాపంచిక ప్రయోజనాల కోసం తమ గ్రంథాలను మార్చారని ఆయన వివరించారు. లంచాన్ని ఇస్లాం తీవ్రంగా నిషేధించిందని, సూరా అల్-బఖరా మరియు సూరా అల్-మాఇదాలోని వచనాలను ఉటంకిస్తూ, లంచం ఇచ్చేవారిని మరియు తీసుకునేవారిని ముహమ్మద్ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) శపించారని ఒక హదీసును ఉదహరించారు. ఒక వ్యక్తి యొక్క నిజమైన సంపద అతను తిన్నది, ధరించినది లేదా పరలోకం కోసం దానధర్మాలు చేసినది మాత్రమేనని, మిగిలినది వారసుల కోసం విడిచిపెట్టబడుతుందని ప్రవక్త స్పష్టం చేశారు. లంచం వంటి అక్రమ సంపాదన తినడం వల్ల ప్రార్థనలు (దుఆ) అంగీకరించబడవని మరియు అది దైవిక శిక్షకు దారి తీస్తుందని హెచ్చరించారు.

نَحْمَدُهُ وَنَسْتَعِينُهُ وَنَسْتَغْفِرُهُ
(నహ్మదుహు వ నస్త’ఈనుహు వ నస్తగ్ఫిరుహు)
మేము ఆయననే స్తుతిస్తున్నాము, ఆయన సహాయాన్నే అర్థిస్తున్నాము మరియు ఆయన క్షమాపణనే వేడుకుంటున్నాము.

وَنَعُوذُ بِاللَّهِ مِنْ شُرُورِ أَنْفُسِنَا وَمِنْ سَيِّئَاتِ أَعْمَالِنَا
(వ న’ఊదు బిల్లాహి మిన్ షురూరి అన్ఫుసినా వమిన్ సయ్యిఆతి అ’అమాయలినా)
మా ఆత్మల కీడు నుండి మరియు మా చెడు కార్యాల నుండి మేము అల్లాహ్ శరణు వేడుకుంటున్నాము.

مَنْ يَهْدِهِ اللَّهُ فَلَا مُضِلَّ لَهُ وَمَنْ يُضْلِلْ فَلَا هَادِيَ لَهُ
(మన్ యహ్దిహిల్లాహు ఫలా ముదిల్ల లహు వ మన్ యుద్లిల్ ఫలా హాదియ లహు)
అల్లాహ్ మార్గనిర్దేశం చేసిన వారిని ఎవరూ తప్పుదారి పట్టించలేరు, మరియు ఆయన తప్పుదారి పట్టించిన వారికి ఎవరూ మార్గనిర్దేశం చేయలేరు.

وَأَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللَّهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ
(వ అష్హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహు లా షరీక లహు)
మరియు నేను సాక్ష్యమిస్తున్నాను, అల్లాహ్ తప్ప మరెవరూ ఆరాధనకు అర్హులు కారని, ఆయన ఒక్కడే, ఆయనకు భాగస్వాములు లేరు.

وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ
(వ అష్హదు అన్న ముహమ్మదన్ ‘అబ్దుహు వ రసూలుహు)
మరియు నేను సాక్ష్యమిస్తున్నాను, నిశ్చయంగా ముహమ్మద్ ఆయన దాసుడు మరియు ఆయన ప్రవక్త అని.

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اتَّقُوا اللَّهَ حَقَّ تُقَاتِهِ وَلَا تَمُوتُنَّ إِلَّا وَأَنتُم مُّسْلِمُونَ
(యా అయ్యుహల్లదీన ఆమను త్తఖుల్లాహ హఖ్ఖ తుఖాతిహి వలా తమూతున్న ఇల్లా వ అన్తుమ్ ముస్లిమూన్)
“ఓ విశ్వాసులారా! అల్లాహ్‌కు భయపడవలసిన విధంగా భయపడండి. మరియు ముస్లింలుగా తప్ప మరణించకండి.” (3:102)

يَا أَيُّهَا النَّاسُ اتَّقُوا رَبَّكُمُ الَّذِي خَلَقَكُم مِّن نَّفْسٍ وَاحِدَةٍ وَخَلَقَ مِنْهَا زَوْجَهَا وَبَثَّ مِنْهُمَا رِجَالًا كَثِيرًا وَنِسَاءً ۚ وَاتَّقُوا اللَّهَ الَّذِي تَسَاءَلُونَ بِهِ وَالْأَرْحَامَ ۚ إِنَّ اللَّهَ كَانَ عَلَيْكُمْ رَقِيبًا

“మానవులారా! మీ ప్రభువుకు భయపడండి. ఆయన మిమ్మల్ని ఒకే ప్రాణి నుండి సృష్టించాడు. దాని నుండే దాని జతను కూడా సృష్టించాడు. మరి వారిద్దరి నుండి ఎంతోమంది పురుషులను, స్త్రీలను వ్యాపింపజేశాడు. మీరు ఎవరి పేరుతో ఒకరినొకరు కోరుకుంటారో ఆ అల్లాహ్‌కు భయపడండి. బంధుత్వ సంబంధాలను తెంచటానికి భయపడండి. నిశ్చయంగా, అల్లాహ్‌ మిమ్మల్ని సదా కనిపెట్టుకొని ఉన్నాడు.” (4:1)

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اتَّقُوا اللَّهَ وَقُولُوا قَوْلًا سَدِيدًا يُصْلِحْ لَكُمْ أَعْمَالَكُمْ وَيَغْفِرْ لَكُمْ ذُنُوبَكُمْ ۗ وَمَن يُطِعِ اللَّهَ وَرَسُولَهُ فَقَدْ فَازَ فَوْزًا عَظِيمًا

“ఓ విశ్వాసులారా! అల్లాహ్‌కు భయపడండి. మరియు సూటిగా, స్పష్టంగా మాట్లాడండి. ఆయన మీ కార్యాలను చక్కబరుస్తాడు. మరియు మీ పాపాలను క్షమిస్తాడు. ఇక అల్లాహ్‌ మరియు ఆయన ప్రవక్తకు విధేయత చూపినవాడు గొప్ప విజయాన్ని సాధించినట్లే.” (33:70-71)

أَمَّا بَعْدُ فَإِنَّ خَيْرَ الْحَدِيثِ كِتَابُ اللَّهِ وَخَيْرَ الْهَدْيِ هَدْيُ مُحَمَّدٍ صلى الله عليه وسلم وَشَرَّ الأُمُورِ مُحْدَثَاتُهَا وَكُلَّ مُحْدَثَةٍ بِدْعَةٌ وَكُلَّ بِدْعَةٍ ضَلالَةٌ وَكُلَّ ضَلالَةٍ فِي النَّارِ

ఇక ఆ తర్వాత, నిశ్చయంగా, మాటలలోకెల్లా ఉత్తమమైనది అల్లాహ్ గ్రంథం (ఖుర్‌ఆన్), మరియు మార్గాలలోకెల్లా ఉత్తమమైనది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మార్గం. కార్యాలలోకెల్లా చెడ్డవి కొత్తగా కల్పించబడినవి. ప్రతి కొత్తగా కల్పించబడినది బిద్అత్ (ధర్మంలో నూతన ఆచారం). ప్రతి బిద్అత్ మార్గభ్రష్టత్వం. మరియు ప్రతి మార్గభ్రష్టత్వం నరకానికి దారితీస్తుంది.

సర్వ స్తోత్రాలు, అన్ని విధాల పొగడ్తలు సర్వలోక ప్రభువైన, పాలకుడైన అల్లాహ్ కే శోభిస్తాయి. అనంత కరుణా శుభాలు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, ఆయన కుటుంబీకులపై, ఆయన ప్రియ సహచరులపై అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తన అనుగ్రహాలను వర్షింపజేయుగాక.

అభిమాన సోదరులారా! లంచగొండితనం అనే అంశంపై ఈరోజు మనం ఇస్లాం ధర్మం ఏమి చెబుతుంది అని కొన్ని విషయాలు తెలుసుకుందాం.

లంచం లేదా లంచగొండితనం అంటే అధర్మమైన ఏదైనా లక్ష్యాన్ని, ఏదైనా పనిని న్యాయ విరుద్ధమైన తన కోరికను నెరవేర్చుకోవడానికి ఎవరైనా అధికారికి లేక తత్సంబంధితమైన వ్యక్తికి ఎంతో కొంత ఇచ్చి ఆ పనిని చేయించుకోవటం లంచం. దీనిని కొందరు లాంఛనం అని, మరికొందరు దక్షిణం అని, ఇంకొందరు బహుమతి అని, గిఫ్ట్ అని అంటారు. ఏ పేరుతో పిలుచుకున్నా ఉద్దేశం మాత్రం దురుద్దేశమే కాబట్టి, పద్ధతి మాత్రం అక్రమ పద్ధతి కాబట్టి ఇది నూటికి నూరు శాతం లంచమే అవుతుంది.

ఖురాన్ అవతరణ పూర్వం, అలాగే మదీనాలోని యూదులలో కూడా ఈ గుణం ఉండేది. లంచగొండితనం అనేది ఉండేది. తౌరాతు గ్రంథంలో జరిగిన ప్రక్షిప్తాల (మార్పుల) వెనుక ఉన్న ప్రధాన కారణాల్లో ఒకటి ఈ లంచమే. అరేబియాలో యూదుల వ్యాజ్యాలపై వారి మతాధిపతులు, తెగల సర్దారులు తీర్పులు చేసేవారు. వారి స్వార్థ బుద్ధి కారణంగా న్యాయ సమత్వం లేకుండా పోయింది. అయిన వారికి ఆకులో, కాని వారికి కంచంలో అన్నట్లు యూద విద్వాంసులు ఆశ్రిత పక్షపాతం వహించేవారు. ఈ వ్యవహారంలో వారు తౌరాతు గ్రంథంలో ఉన్న ధర్మాదేశాలను కూడా కట్టిపుచ్చేవారు.

ఈ విషయాన్ని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్ సూరా బఖరా ఆయత్ 174లో ఇలా సెలవిచ్చాడు:

إِنَّ الَّذِينَ يَكْتُمُونَ مَا أَنزَلَ اللَّهُ مِنَ الْكِتَابِ وَيَشْتَرُونَ بِهِ ثَمَنًا قَلِيلًا ۙ أُولَٰئِكَ مَا يَأْكُلُونَ فِي بُطُونِهِمْ إِلَّا النَّارَ وَلَا يُكَلِّمُهُمُ اللَّهُ يَوْمَ الْقِيَامَةِ وَلَا يُزَكِّيهِمْ وَلَهُمْ عَذَابٌ أَلِيمٌ

“అల్లాహ్‌ తన గ్రంథంలో అవతరింపజేసిన విషయాలను దాచేవారు, వాటిని కొద్దిపాటి ధరకు అమ్ముకునేవారు వాస్తవానికి తమ పొట్టలను అగ్నితో నింపుకుంటున్నారు. ప్రళయ దినాన అల్లాహ్‌ వారితో అస్సలు మాట్లాడడు. వారిని పరిశుద్ధపరచడు. పైపెచ్చు వారికి బాధాకరమైన శిక్ష కలదు.” (2:174)

అంటే, అల్లాహ్ తన గ్రంథంలో అవతరింపజేసిన విషయాన్ని ఆ యూదులు, ఆ యూదుల ధర్మ పండితులు దాచిపెట్టేవారు. దానిని కొద్దిపాటి మూల్యానికి అమ్ముకునేవారు. తమ పొట్టలను అగ్నితో నింపుకునేవారు. ప్రళయ దినాన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వారితో మాట్లాడటం గానీ, వారిని పరిశుద్ధ పరచటం గానీ చేయడు. వారికి బాధాకరమైన శిక్ష ఉంటుంది. అంటే యూదులు లంచం తీసుకుని వారి గ్రంథాలలో ఉన్న విషయాలను దాచి పెట్టేవారని స్వయంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ ఆయత్లో తెలియజేశాడు. ఇంకా అల్లాహ్ సూరా మాఇదాలో ఇలా అన్నాడు:

وَتَرَىٰ كَثِيرًا مِّنْهُمْ يُسَارِعُونَ فِي الْإِثْمِ وَالْعُدْوَانِ وَأَكْلِهِمُ السُّحْتَ ۚ لَبِئْسَ مَا كَانُوا يَعْمَلُونَ

వారిలో చాలామందిని నీవు చూస్తావు, వారు పాపకార్యాల వైపుకు, దౌర్జన్యం వైపుకు, అధర్మమయిన సొమ్మును స్వాహా చేయటం వైపుకు ఎగబడుతూ ఉంటారు. వారు చేసే ఈ చేష్టలన్నీ పరమ చెడ్డవి. (5:62)

అంటే లంచం తీసుకుని వారు న్యాయం, అన్యాయం, పాపం, పుణ్యం పట్టించుకునేవారు కాదు.

లంచగొండితనం ఇస్లాంలో చాలా స్పష్టంగా నిషేధించబడినది. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూరా బఖరా ఆయత్ 188లో ఇలా సెలవిచ్చాడు:

وَلَا تَأْكُلُوا أَمْوَالَكُم بَيْنَكُم بِالْبَاطِلِ وَتُدْلُوا بِهَا إِلَى الْحُكَّامِ لِتَأْكُلُوا فَرِيقًا مِّنْ أَمْوَالِ النَّاسِ بِالْإِثْمِ وَأَنتُمْ تَعْلَمُونَ

ఒకరి సొమ్మును ఇంకొకరు అన్యాయంగా స్వాహా చేయకండి. బుద్ధిపూర్వకంగా, అక్రమమైన రీతిలో ఇతరుల ఆస్తిలో కొంతభాగం కాజేయటం కోసం అధికారులకు ముడుపులు చెల్లించకండి. అది (న్యాయం కాదన్న సంగతి) మీకూ తెలిసినదే. (2:188)

అంటే ఈ ఆయత్లో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా, మీరు ఒకరి సొమ్మును ఇంకొకరు అధర్మంగా తినకండి. ఇతరుల సొమ్ములోని కొంత భాగం అక్రమంగా స్వాహా చేసేందుకు ఆ వ్యవహారాన్ని అధికారుల వద్దకు తీసుకుపోకండి. అది అన్యాయం అన్న సంగతి స్వయంగా మీకు తెలుసు. అంటే లంచం ఇచ్చి, అధికారులకు లంచం ఇచ్చి అన్యాయంగా సొమ్ము కాజేయకండి అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ ఆయత్లో హెచ్చరించాడు.

అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు:

لَعَنَ رَسُولُ اللَّهِ صلى الله عليه وسلم الرَّاشِيَ وَالْمُرْتَشِيَ
(ల’అన రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లమ అర్రాషి వల్ ముర్తషి)
“లంచం పుచ్చుకునేవానిని మరియు లంచం ఇచ్చేవానిని దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం శపించారు.”

లంచం పుచ్చుకునే వానిని, లంచం ఇచ్చే వానిని పుచ్చుకునేవాడు ఇచ్చేవాడు వారిద్దరినీ మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ల’అనత్ చేశారు, వారి పైన శపించారు. అంటే, ఏ విషయం పైన అల్లాహ్ శాపం ఉంటుందో, దేని పైన ప్రవక్త గారి శాపం ఉంటుందో, అది ఘోరమైన పాపం అని అర్థం. దానికి తప్పనిసరిగా శిక్ష ఉంటుందని అర్థం. అంటే ఘోర పాపాలలో ఒక ఘోరమైన పాపం లంచం. మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం లంచం పుచ్చుకునే వానిని, లంచం ఇచ్చే వానిని శపించారు. ఎందుకంటే వారు అన్యాయంగా, అనైతికంగా సంపాదించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇతరుల సంపదను నిషిద్ధమైన పద్ధతిలో సొంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కనుక లంచం ద్వారా వచ్చే ఆ డబ్బు, లంచం ద్వారా వచ్చే ఆ ధనం, లంచం ద్వారా వచ్చే ఆ పదవి, ఆ వస్తువు ఏదైనా సరే అది అధర్మం, హరాం అని స్పష్టమవుతుంది.

అభిమాన సోదరులారా! ప్రతి చిన్న బాధ్యుడు, చిన్న పోస్ట్, పియాన్ నుంచి, ఫర్రాష్ నుంచి పెద్ద స్థాయి వరకు లంచం అనేది సర్వసామాన్యం అయిపోయింది సమాజంలో. అసలు లంచం ఇచ్చేవారు దానికి తప్పుగా అని కూడా భావించడం లేదు. ఇంత సర్వసామాన్యం అయిపోయింది. ఇది ఒక అమానత్. అల్లాహ్ మనకి ఇచ్చింది ప్రతీది అమానత్. అది మన శరీర అవయవాలు కావచ్చు, అతను తన ఇంట్లో యజమాని అయితే, తన అధీనంలో ఉన్న భార్యాపిల్లలు కావచ్చు. అల్లాహ్ ఏదైతే మనకి ఇచ్చాడో అది అమానత్, అప్పగింత. దానిని మనం అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మరియు మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశాల ప్రకారంగానే మనము జీవించాలి ప్రతి విషయంలో. వ్యవహారం కావచ్చు, వ్యాపారం కావచ్చు, వాణిజ్యం కావచ్చు, క్రయవిక్రయాలు కావచ్చు, లావాదేవీలు కావచ్చు, ఏదైనా సరే. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు సూరా నిసా ఆయత్ 58 లో:

إِنَّ اللَّهَ يَأْمُرُكُمْ أَن تُؤَدُّوا الْأَمَانَاتِ إِلَىٰ أَهْلِهَا
(ఇన్నల్లాహ య’మురుకుమ్ అన్ తుఅద్దుల్ అమానాతి ఇలా అహ్లిహా)
ఎవరి అమానతులను వారికి అప్పగించండి… ” అని అల్లాహ్‌ మిమ్మల్ని గట్టిగా ఆదేశిస్తున్నాడు (4:58)

ఈ ఆయత్లో అమానత్, విశ్వసనీయత ఇవి రెండు రకాలు.

ఒకటి, ఒకరు ఇంకొకరి వద్ద భద్రపరచమని పెట్టిన సొమ్ము. అది ఏదైనా కావచ్చు, డబ్బు రూపంలో కావచ్చు, కరెన్సీ రూపంలో కావచ్చు, వెండి, బంగారం రూపంలో కావచ్చు, భూమి కాగితాలు కావచ్చు, తినే వస్తువు ఏదైనా సరే భద్రపరచమని పెట్టిన సొమ్ము. ఆ సొమ్ము ఆ వ్యక్తి వచ్చి అడిగినప్పుడు ఎవరి సొమ్ముని వారికి తిరిగి ఇచ్చేయాలి. ఇది ఒక అమానత్.

రెండవ రకపు అమానతు పదవులకు సంబంధించినది. ఒకటి, అర్హత కలిగిన వారికే బాధ్యత అప్పగించాలి. రెండవది, బాధ్యత తీసుకున్న వారు తమ బాధ్యతను, తన డ్యూటీని న్యాయంగా, ధర్మంగా, షరియత్ పరంగా, అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త ఆదేశాల పరంగా అతను బాధ్యత వహించాలి. ఇది అమానత్. లంచం తీసుకుంటున్నాడు అంటే తన బాధ్యతలో లోపం జరుగుతుంది. అంటే డబ్బు తీసుకుని, సొమ్ము తీసుకుని అన్యాయంగా, అక్రమంగా, మోసపూరితంగా అతను తన బాధ్యత వహిస్తున్నాడు. సొమ్ము కాజేస్తున్నాడు. దీనినే లంచం అంటారు. అది ఒక పైసా కావచ్చు, కోట్లు కావచ్చు. ఒక్క పైసా హరాంతో కూడిన మన కడుపులోకి పోతే, దానివల్ల మన శరీరం ఎదుగుతుంది కదా, మాంసము, ఎముకలు, రక్తము ఇవన్నీ హరాంతో అవుతుంది. అటువంటి శరీరం స్వర్గంలో ప్రవేశించదని మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రవచనాలు ఉన్నాయి.

అభిమాన సోదరులారా! అసలు మనిషి అన్యాయంగా, అక్రమంగా డబ్బులు సంపాదిస్తాడు. కానీ ఆ డబ్బు వలన ఈ లోకములో అతనికి మనశ్శాంతి ఉండదు. పరలోకంలో శిక్ష ఉంటుంది. ఈ విషయం మరిచిపోతున్నాడు.

ఈ ధనం గురించి మన ప్రవక్తగారు ఏం చెప్పారో ఒక హదీస్ తెలుసుకుందాం. తిర్మిదిలో ఈ హదీస్ ఉంది.

عَنْ كَعْبِ بْنِ عِيَاضٍ، قَالَ سَمِعْتُ النَّبِيَّ صلى الله عليه وسلم يَقُولُ
(అన్ కా’బ్ ఇబ్ని ‘ఇయాదిన్, ఖాల సమీ’తు అన్నబియ్య సల్లల్లాహు అలైహి వసల్లమ యఖూలు)
కాబ్ బిన్ ఇయాజ్ రదియల్లాహు అన్హు కథనం: నేను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పగా విన్నాను:

إِنَّ لِكُلِّ أُمَّةٍ فِتْنَةً وَفِتْنَةُ أُمَّتِي الْمَالُ
(ఇన్న లికుల్లి ఉమ్మతిన్ ఫితనతున్, వ ఫితనతు ఉమ్మతీ అల్-మాల్)
“నిశ్చయంగా, ప్రతీ ఉమ్మత్ (సముదాయం) కొరకు ఒక ఫితనా (పరీక్ష) ఉంది. మరియు నా ఉమ్మత్ యొక్క ఫితనా ధనం.” (జామి అత్-తిర్మిది)

కాబ్ బిన్ ఇయాజ్ రదియల్లాహు అన్హు కథనం, మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెబుతుండగా నేను విన్నానని అంటున్నారు. ప్రవక్తగారు ఏం చెప్పారు? ప్రతి ఉమ్మత్ కి ఒక ప్రత్యేకమైన పరీక్ష ఉంటుంది. అలాగే నా అనుచర సమాజానికి పరీక్ష సంపద, డబ్బు, మాల్ అన్నారు. ఎందుకంటే రేపు ప్రళయ దినాన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆ ధనం గురించి ప్రశ్నిస్తాడు, లెక్క ఉంది. న్యాయంగా సంపాదించావా, అన్యాయంగా సంపాదించావా? లంచంతో సంపాదిస్తే అది అన్యాయం, అధర్మం, నిషిద్ధం, పాపం, నేరం అది. ఒక హదీస్లో ఇలా ఉంది:

అబూ బర్జా అల్-అస్లమీ రదియల్లాహు అన్హు కథనం ప్రకారం, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు:

لاَ تَزُولُ قَدَمَا عَبْدٍ يَوْمَ الْقِيَامَةِ حَتَّى يُسْأَلَ عَنْ عُمْرِهِ فِيمَا أَفْنَاهُ وَعَنْ عِلْمِهِ فِيمَا فَعَلَ وَعَنْ مَالِهِ مِنْ أَيْنَ اكْتَسَبَهُ وَفِيمَا أَنْفَقَهُ وَعَنْ جِسْمِهِ فِيمَا أَبْلاَهُ

“ప్రళయ దినాన ఒక దాసుడు నాలుగు విషయాల గురించి ప్రశ్నించబడే వరకు తన పాదాలను కదల్చలేడు: తన జీవితాన్ని దేనిలో గడిపాడని, తన జ్ఞానంతో ఏమి ఆచరించాడని, తన ధనాన్ని ఎక్కడి నుండి సంపాదించి ఎక్కడ ఖర్చు పెట్టాడని, మరియు తన శరీరాన్ని దేనిలో ఉపయోగించాడని.” (జామి అత్-తిర్మిది)

దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు:

لَا تَزُولُ قَدَمَا عَبْدٍ يَوْمَ الْقِيَامَةِ حَتَّى يُسْأَلَ عَنْ أَرْبَعٍ
(లా తజూలు ఖదమా అబ్దిన్ యౌమల్ ఖియామతి హత్తా యుస్అల అన్ అర్బ’ఇన్)
రేపు ప్రళయ దినాన నాలుగు ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా అల్లాహ్ దాసుడు ఒక అడుగు కూడా ముందుకు వేయలేడు.

ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేడు. ఎప్పుడు? నాలుగు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినంత వరకు. ఆ నాలుగు ప్రశ్నలు ఏమిటి?

  1. మొదటి విషయం, తన జీవితం, తన వయసు ఎలా గడిచింది. ధర్మంలోనా, అధర్మంలోనా? ధర్మపరంగా, అధర్మపరంగా? అల్లాహ్ కు, ఆయన ప్రవక్తకు విధేయతలోనా, అవిధేయతలోనా?
  2. రెండవ ప్రశ్న, వ’అన్ ‘ఇల్మిహి ఫీమా ఫ’అల్ (తన జ్ఞానం విషయంలో ఏమి ఆచరించాడు). జ్ఞానం గురించి. అతనికి అల్లాహ్ గురించి, అల్లాహ్ ప్రవక్త గురించి, ఖురాన్ గురించి, ఇస్లాం గురించి ఎంత వరకు జ్ఞానం ఉంది, ఆ జ్ఞానంలో అతను ఎంతవరకు ఆచరించాడు.
  3. మూడవది, వ’అన్ మాలిహి మిన్ ఐన ఇక్తసబహు వ ఫీమా అన్ఫఖహు (తన ధనాన్ని ఎక్కడి నుండి సంపాదించాడు మరియు దేనిలో ఖర్చు పెట్టాడు). ధనం గురించి, సొమ్ము గురించి, ఆస్తి గురించి, డబ్బు గురించి ఎలా సంపాదించావు, ఎలా ఖర్చు పెట్టావు. ఎలా వచ్చింది, అది కూడా, ఎలా పోయింది అది కూడా, రెండు కూడా. కొందరు కష్టంగా సంపాదిస్తారు, ధర్మ సమ్మతంగా సంపాదిస్తారు, న్యాయంగా సంపాదిస్తారు. కష్టార్జితమే, కానీ ఖర్చు పెట్టేది అధర్మం అవుతుంది. కావున ఈ ఎలా సంపాదించావు, న్యాయంగా, అన్యాయంగా, ధర్మంగా, అధర్మంగా, అలాగే ఎలా ఖర్చు పెట్టావు.
  4. నాలుగవది, వ’అన్ జిస్మిహి ఫీమా అబ్లాహ్ (తన శరీరాన్ని దేనిలో ఉపయోగించాడు). శరీరం గురించి. చేతులు, కాళ్లు, కళ్లు, హృదయం, కడుపు, పాదాలు, ఇవన్నీ, చెవులు వారికి ఎలా పోషించావు. నీ శరీరం ఎలా పెరిగింది? హరాం సొమ్ముతోనా, హలాల్ సొమ్ముతోనా? ఏ విధంగా ఖర్చు పెట్టావు? చెవులతో ఖురాన్ విన్నావా, న్యాయం విన్నావా, ఇంకేమైనా బూతులు, చెడు విషయాలు? ఇవన్నీ అల్లాహ్ అడుగుతాడు.

అందుకే ఒక విషయం, రెండు విషయాలు చెప్పి నేను ముగిస్తున్నాను. మొదటి విషయం ఏమిటంటే, అరఫా మైదానం. చాలాసార్లు విన్నాం మనం ఈ హదీస్. అరఫా మైదానం, ఇప్పుడు కూడా ఇన్ని సౌకర్యాలు ఉండి కూడా హజ్ చేస్తే చాలా ఇబ్బందికరంగానే ఉంటుంది, కష్టంగానే ఉంటుంది. ఇన్ని సౌకర్యాలు ఉండి, ఏసీ బస్సులు, విమానంలో ఏసీ, ఎయిర్ పోర్టులో ఏసీ, గుడారాలు, ఇంటి నుంచి తవాఫ్ వరకు, మినాకి, ముజ్దలిఫాకి అన్నిచోట్ల ప్రయాణ సౌకర్యాలు, సవారీలు అయినప్పటికీ చాలా ఇబ్బందులు పడతారు మనుషులు. కానీ ప్రవక్త గారి కాలంలో ఉన్నవారు ఒంటెల పైన, లేనివారు కాలి నడక పోయి హజ్ చేసేవారు. అటువంటి ఒక వ్యక్తి అరఫా మైదానంలో దుస్తులు సరిగా లేవు, తల వెంట్రుకలు గాలితో, దుమ్ముతో నిండిపోయినాయి. ఒకరకంగా ఉంది. ఆ వ్యక్తి అరఫా మైదానంలో చేతులు ఎత్తి ఏడ్చి ఏడ్చి కన్నీళ్లు కార్చి దుఆ చేస్తున్నాడు. ఆ వ్యక్తి గురించి ప్రవక్త గారు ఏమన్నారంటే, అతని దుఆ స్వీకరించబడదు అన్నారు. ఒక వ్యక్తి ఎన్నో వందల, వేల మైళ్ల దూరంతో ప్రయాణం చేసి హజ్ కోసం ప్రయాణం చేస్తే అరఫా మైదానంలో హదీస్ లో ఏముంది, అరఫా మైదానంలో చేయబడిన దుఆ రద్దు చేయబడదు అని ఉంది కదా. అల్-హజ్జు అరఫా అన్నారు ప్రవక్తగారు కదా. అయినా అరఫా మైదానంలో దుఆ చేస్తే ఆ దుఆ క్యాన్సిల్. ప్రవక్తగారు అన్నారు, ఎందుకు? దానికి వివరం ప్రవక్తగారు చెప్పారు. ఆ వ్యక్తి తినే సొమ్ము హరాం, తొడిగే దుస్తులు హరాం, తాగేది హరాం. అతని దుఆ ఎలా అల్లాహ్ స్వీకరిస్తాడు? అంటే ఇది చెప్పటం నా ఉద్దేశం ఏమిటంటే, లంచం హరాం. లంచం తీసుకునే వ్యక్తి యొక్క దుఆ ఎలా స్వీకరించబడుతుంది? దుఆ స్వీకరించబడదు. ఈ లోకంలో మనశ్శాంతి ఉండదు, పరలోకంలో కఠినమైన శిక్ష ఉంటుంది అని మనం తెలుసుకోవాలి.

అసలు ప్రవక్త గారు ఒక విషయం చెప్పారు. మనిషి సంపాదించే సంపాదనలో ఆ వ్యక్తి యొక్క వాటా ఎంత? వేరే వాళ్ళ వాటా కాదు. ఒక వ్యక్తి సంపాదిస్తాడు, తన వారసుల వాటా కాదు. ఒక వ్యక్తి చనిపోతే భార్యకు వాటా ఎంత, పిల్లలకి వాటా ఎంత, అమ్మానాన్నకి వాటా ఎంత దీని గురించి కాదు. ఒక వ్యక్తి కష్టార్జితం, కష్టంతో సంపాదిస్తున్నాడు. ఆ సంపదలో అతని వాటా ఎంత? ఇది ప్రాపంచిక యొక్క యదార్థం ఇది. తెలుసుకుందాం.

అబూ హురైరా రదియల్లాహు త’ఆలా అన్హు కథనం, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు, దాసుడు నా ధనము, నా ధనము అంటూ ఉంటాడు. ఎల్లప్పుడూ నా దాసుడు నా ధనము, నా సంపాదన, నా ధనము, నా విల్లా, నా బంగ్లా, నా సేవింగ్ అకౌంట్, నాది, నాది అంటాడు కదా. వాస్తవానికి సంపాదనలో, సంపాదించే వ్యక్తిలో మూడు భాగాలే ఉంటాయి. నాలుగో భాగం ఉండదు. మొదటి భాగం, మా అకల ఫ అఫ్నా (తిన్నాడు మరియు దానిని జీర్ణం చేసుకున్నాడు). తిన్నాడు, ఆ తర్వాత అది అరిగిపోయింది. అతను వాడాడు. తిన్నాడు, ఆ తిండి వలన తన శరీరంలో రక్తం వచ్చింది, మాంసం వచ్చింది, ఇది వచ్చింది. తిన్నాడు. ఆ తిన్నదే అతని వాటా. రెండవది, అవ్ లబిస ఫ అబ్లా (ధరించాడు మరియు దానిని పాతదిగా చేశాడు). తొడిగాడు, చించేసాడు. కొన్నాడు, బట్టలు కొన్నాడు, దుస్తులు కొన్నాడు, తొడుక్కున్నాడు, యూస్ చేశాడు. ఇది అతని వాటా. మూడవది, అవ్ అ’తా ఫఖ్తనా (ఇచ్చాడు మరియు దానిని పరలోకం కోసం దాచుకున్నాడు). అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టాడు. ఈ మూడే అతనికి వాటా. ఈ మూడింటిలో రెండు వాటాలు అతను అనుభవిస్తాడు, ప్రపంచంలోనే అయిపోతాయి. మూడో వాటా శాశ్వతంగా అతనికి మిగిలిపోతుంది. ఇవి కాక అతని ధనంలో, అతని సొమ్ములో, అతని ఆస్తిలో, అతని సంపదలో ఏదైనా మిగిలినా అది అతనిది కాదు. ఎందుకంటే అదంతా అతను విడిచిపెట్టి చనిపోతాడు. వేరేవాళ్లు అక్రమంగా తీసుకోవచ్చు, అధర్మంగా వెళ్ళిపోవచ్చు. ఎక్కడికి పోకపోయినా, తన సంతానము, బంధువులు అది తీసేసుకుంటారు. చివరికి ఒక ఉంగరమో, ఏదైనా రాకపోయినా కట్ చేసి తీసేసుకుంటారు కానీ వదలరు. మనిషి యొక్క సంపాదనలో ఇవి మూడే వాటాలు. ఇది మనం గ్రహించాలి.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరికీ హలాల్ సంపదను సంపాదించే కృషిని, సద్బుద్ధిని ప్రసాదించుగాక.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=43047

శాంతి భద్రతల ప్రాముఖ్యత, ముస్లిం పాలకుల పట్ల విధేయత & సామాజిక ఐక్యత [వీడియో & టెక్స్ట్]

శాంతిభద్రతల విలువ & ఐక్యత ప్రాముఖ్యత – జుమా ఖుత్బా
ఖతీబ్ ఫజీలతుష్ షేక్ రాషిద్ బిన్ అబ్దుర్రహ్మాన్ అల్-బిదా హఫిజహుల్లాహ్
https://youtu.be/SnCZ5FgZV0U [22 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ఖుత్బాలో ఇస్లాం ధర్మంలో శాంతి భద్రతల ప్రాముఖ్యతను, ముస్లిం పాలకుల పట్ల విధేయతను మరియు సామాజిక ఐక్యతను కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను ప్రస్తావించారు. హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) గారి వివేకవంతమైన నిర్ణయాన్ని ఉదహరిస్తూ, అంతర్యుద్ధం (ఫిత్నా) మరియు రక్తపాతాన్ని నివారించడానికి పాలకుల పట్ల విధేయత ఎంత ముఖ్యమో వివరించారు. సౌదీ అరేబియాలో నెలకొన్న శాంతిని అల్లాహ్ గొప్ప వరంగా పేర్కొంటూ, కృతజ్ఞతా భావం, దైవభీతి మరియు ఐక్యమత్యం ద్వారానే ఈ భద్రత రక్షించబడుతుందని, అనవసరమైన విభేదాలు మరియు ముఠా తగాదాలకు దూరంగా ఉండాలని ఖుర్ఆన్ మరియు హదీసుల ఆధారంగా హెచ్చరించారు.

అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహు.

إِنَّ الْحَمْدَ لِلَّهِ كَمَا بَسَطْتَ رِزْقَنَا، وَأَظْهَرْتَ أَمْنَنَا، وَجَمَعْتَ فُرْقَتَنَا. أَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللَّهُ وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ تَسْلِيمًا كَثِيرًا، أَمَّا بَعْدُ.
[ఇన్నల్ హమ్దలిల్లాహి కమా బసత్త రిజ్ కనా, వ అజ్ హర్త అమ్ననా, వజమఅ త ఫుర్ ఖతనా. అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు సల్లల్లాహు అలైహి వసల్లమ తస్లీమన్ కసీరా, అమ్మ బాద్.]

అల్హమ్దులిల్లాహ్! ఓ అల్లాహ్ నీవు మా ఉపాధి విస్తృతం చేశావు, మాకు భద్రత ప్రసాదించావు, మా మధ్య ఐక్యత కలిగించావు. నీవు తప్ప సత్య ఆరాధ్యుడు ఎవడూ లేడని సాక్ష్యమిస్తున్నాను. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క దాసుడు, ప్రవక్త అని కూడా సాక్ష్యమిస్తున్నాను. అల్లాహ్, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై అనేక అనేక లెక్కలేనన్ని సలాతు సలామ్ మరియు శుభాలు, బర్కత్ లు పంపించు గాక.

ఈరోజు జుమా ఖుత్బా యొక్క అంశం మన ఐక్యత మరియు మన పాలకులు. మరొక రకంగా చెప్పాలంటే ఇస్లాంలో శాంతి భద్రతల విలువ మరియు ముస్లిం పాలకుల యొక్క విధేయత, ప్రాముఖ్యత మరియు ఐక్యతతో ఉండటంలోని లాభాలు ఏమిటో సంక్షిప్తంగా తెలుసుకోబోతున్నాము.

విశ్వాసులారా! అల్లాహ్ మీపై కరుణించు గాక. మీ చావుకు ముందే అధికంగా సత్కార్యాల్లో ముందుగా ఉండండి. మీకు ఒక అర్థవంతమైన, బోధన కలిగించే సంఘటన వినిపిస్తాను. అది సహీహ్ బుఖారీలో ఉంది. వివేకవంతులైన సహాబీ, దృఢ విజ్ఞానులైన సహాబీ హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) గారి గురించి.

ఏమిటి ఆ సంఘటన? అలీ (రదియల్లాహు అన్హు) మరియు ముఆవియా (రదియల్లాహు అన్హు) మధ్య యుద్ధం జరిగిన సమయంలో ప్రజలు విభేదాల్లో పడ్డారు. అయితే వారి విభేదాలను ముగించడానికి హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు) వైపు నుండి హజ్రత్ అబూ మూసా అషరీ (రదియల్లాహు అన్హు) మరియు హజ్రత్ అమీర్ ముఆవియా వైపు నుండి హజ్రత్ అమర్ ఇబ్నె ఆస్ (రదియల్లాహు అన్హు) హకమ్ – న్యాయ నిర్ణేతలుగా ముందుకు వచ్చారు. అయితే ఆ సమయంలో ముఆవియా (రదియల్లాహు అన్హు) ఒక ప్రసంగంలో ఇలా అన్నారు: “ఈ వ్యవహారం అంటే ఖిలాఫత్ గురించి ఎవరైనా మాట్లాడదలుచుకుంటే తన తల లేపి మాట్లాడాలి. ఎందుకంటే మేమే ఈ వ్యవహారానికి అతని కన్నా, అతని తండ్రి కన్నా ఎక్కువ అర్హులం.”

అప్పుడు ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) అన్నారు: “నేను నా దుస్తులను సరిచేసుకొని నిలబడి మాట్లాడి చెబుదాము అనుకున్నాను: “నీకంటే ఎక్కువ అర్హుడు ఇస్లాం కోసం నీతో, నీ తండ్రితో యుద్ధం చేసిన వారే’ (అంటే మీరైతే ఫతహ్ మక్కా వరకు ఇస్లాంలో ప్రవేశించలేదు, కానీ హజ్రత్ అలీ రదియల్లాహు అన్హు అప్పటికే ముస్లిం గా ఉన్నారు మరియు ఫతహ్ మక్కా కంటే ముందు మీరు మరియు మీ తండ్రి అవిశ్వాసులుగా ఉన్నప్పుడు హజ్రత్ అలీ రదియల్లాహు అన్హు ఇస్లాం కొరకు మీతో పోరాడారు కదా)” అన్నటువంటి మాట చెబుదాము అని అనుకున్నాను. కానీ వెంటనే ఆలోచించాను. (హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ అంటున్నారు), వెంటనే ఆలోచించాను: ‘నేను ఇప్పుడే మాట్లాడితే, ఈ విషయాలు చెప్పబోతే ప్రజల్లో అల్లకల్లోలం ఏర్పడుతుంది. రక్తపాతం జరుగుతుంది. నా మాటలు తప్పుగా అర్థం చేసుకోవచ్చు. నేను చెప్పే పదాలకు నాది మంచి ఉద్దేశం ఎంతగా ఉన్నప్పటికీ ప్రజలు దానిని నా ఉద్దేశ్య ప్రకారంగా కాకుండా వేరుగా అర్థం చేసుకోవచ్చు.’ అయితే వెంటనే జన్నతులో, స్వర్గంలో ఓపిక సహనాలకు బదులుగా ఉన్న అల్లాహ్ వాగ్దానం గుర్తు వచ్చింది. నేను ఆ మాట చెప్పలేదు.”

అప్పుడే ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హు) కి దగ్గర ఉన్న వారిలో ఒకరు అన్నారు: “అల్లాహ్ నిన్ను రక్షించాడు. నీవు బహుదూరంగా ఈ ఫిత్నా నుండి తప్పించుకున్నావు. ఇది అల్లాహ్ దయ తర్వాత సరైన జ్ఞానం మరియు బలమైన విశ్వాసం నీ వద్ద ఉన్నందువల్ల.” ఎవరు చెప్పారు ? హజ్రత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హు) కు దగ్గరగా ఆ సమయంలో ఎవరైతే ఉన్నారో ఆయన ఈ మాట చెప్పారు.

అయితే ఇక్కడ గమనించండి. మనిషి దగ్గర బలమైన విశ్వాసంతో పాటు సరైన జ్ఞానం ఉండి, ఏ మాట ఎప్పుడు మాట్లాడాలో, అది కూడా అల్లాహ్ దయతో ప్రసాదించబడింది అంటే ఇది ఎంత గొప్ప వరం? సూరతుల్ ముజాదిల ఆయత్ నంబర్ 11 ద్వారా గమనించండి:

يَرْفَعِ اللَّهُ الَّذِينَ آمَنُوا مِنكُمْ وَالَّذِينَ أُوتُوا الْعِلْمَ دَرَجَاتٍ
[యర్ ఫఇల్లా హుల్లజీన ఆమనూ మిన్ కుమ్ వల్లజీన ఊతుల్ ఇల్మ దరజాత్]
మీలో విశ్వసించినవారి, జ్ఞానం ప్రసాదించబడినవారి అంతస్థులను అల్లాహ్ పెంచుతాడు” (58:11)

ఈ విధంగా హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) వారి యొక్క గౌరవం కూడా ఈ సందర్భంలో తెలిసి వచ్చింది. ఇప్పుడు మీరు విన్నటువంటి ఈ సంఘటన సహీహ్ బుఖారీలో ఉంది. గమనించారా! జ్ఞానం, వివేకం ఎలా శాంతి ఐక్యతకు దారి చూపుతుందో, మరియు అజ్ఞానం, మూర్ఖత్వం అశాంతి అలజడులకు దారి తీస్తుంది.

ఓ విశ్వాసులారా! అల్లాహ్ మన దేశం, దేశవాసులపై చాలా గొప్ప వరం అనుగ్రహించాడు.

ఓ విశ్వాసులారా! అల్లాహ్ మన దేశం, దేశవాసులపై చాలా గొప్ప వరం అనుగ్రహించాడు. మనం ఖుర్ఆన్ సున్నత్ మార్గదర్శకత్వంలో మన నాయకులకు విధేయులుగా మరియు ఐక్యతతో ఉన్నాము. అల్లాహ్ మనల్ని పెద్ద ఫిత్నాల సంక్షోభాల నుండి కాపాడాడు. చుట్టుపక్కల్లో చూడండి పరిస్థితి ఎలా ఉంది?

مِنَ الَّذِينَ فَرَّقُوا دِينَهُمْ وَكَانُوا شِيَعًا ۖ كُلُّ حِزْبٍ بِمَا لَدَيْهِمْ فَرِحُونَ
[మినల్లజీన ఫర్రఖూ దీనహుమ్ వ కానూ షియఅన్, కుల్లు హిజ్బిన్ బిమా లదైహిమ్ ఫరిహూన్]
వారు తమ ధర్మాన్ని ముక్కచెక్కలు చేసేశారు. వారు సయితం విభిన్న ముఠాలుగా చీలిపోయారు. ప్రతి ముఠా తన దగ్గర ఉన్న దానితోనే తెగ సంబరపడిపోతోంది.” (30:32)

విశ్వాసులారా! మన దేశం (అంటే సౌదీ అరేబియా) అలజడులు, విభేదాలు లేకుండా సురక్షితంగా ఉన్న ప్రాంతం. ఇది ఖుర్ఆన్ అవతరించిన భూమి కాదా? ఈమాన్ (విశ్వాస) గూడు కాదా? వీరుల జయాల ప్రదేశం మరియు విశ్వవ్యాప్తంగా ప్రజలకు మేలు చేకూర్చే అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించే దేశం కాదా? అవును తప్పకుండా. అల్లాహ్ అనుగ్రహాల్లో గొప్ప అనుగ్రహం మనం స్నేహభావం, శాంతి సంపదల మరియు ఉదార గుణాలతో జీవిస్తున్నాం. అల్హమ్దులిల్లాహ్!

أَوَلَمْ نُمَكِّن لَّهُمْ حَرَمًا آمِنًا يُجْبَىٰ إِلَيْهِ ثَمَرَاتُ كُلِّ شَيْءٍ رِزْقًا مِّن لَّدُنَّا وَلَٰكِنَّ أَكْثَرَهُمْ لَا يَعْلَمُونَ

ఏమిటి? మేము వారికి సురక్షితమైన, పవిత్రమైన చోట స్థిరనివాసం కల్పించలేదా? అక్కడ వారికి అన్ని రకాల పండ్లు ఫలాలు ఉపాధి రూపంలో మావద్ద నుంచి సరఫరా చేయబడలేదా? కాని వారిలోని చాలా మంది (ఈ యదార్థాన్ని) తెలుసుకోరు.(28:57)

వేలాది సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనను గుర్తుంచుకుందాం. అప్పుడు ఇబ్రాహీం (అలైహిస్సలాం) కాబా స్థలానికి వచ్చి, అది ఇంకా నిర్మించబడక ముందే ఇలా దుఆ చేశారు:

رَبِّ اجْعَلْ هَـٰذَا بَلَدًا آمِنًا
[రబ్బిజ్ అల్ హాజా బలదన్ ఆమినా]
నా ప్రభూ! నీవు ఈ ప్రదేశాన్ని శాంతి నగరంగా చెయ్యి. (2:126)

ఇక్కడ గమనించండి దుఆలో ఉన్న పదాన్ని “రబ్బిజ్ అల్ హాజా ‘బలదన్’ ఆమినా” (నకిరా అంటారు). సూరతుల్ బకరాలోని ఆయత్ నంబర్ 126. ఆ తర్వాత ఆయన కాబాను నిర్మించారు. చుట్టూ ప్రజల హృదయాలు ఆకర్షితమయ్యే నగరం ఏర్పడినప్పుడు మళ్లీ ఇలా దుఆ చేశారు:

رَبِّ اجْعَلْ هَـذَا الْبَلَدَ آمِنًا
[రబ్బిజ్ అల్ హాజల్ బలద ఆమినా]
“నా ప్రభూ! ఈ నగరాన్ని శాంతి భద్రతల నగరంగా చేయి!” (14:35)

ఇక్కడ “అల్-బలద” అని వచ్చి ఉంది. పైన ఏముంది? “బలదన్”. అంటే అప్పటికి అది ప్రజలు నివసించలేదు, అప్పుడు కూడా దుఆ చేశారు. ప్రజలు అక్కడ నివసించిన తర్వాత కూడా దుఆ చేశారు. ఏమని? “నా ప్రభు ఈ నగరాన్ని శాంతి భద్రతల నగరంగా చేయి” (సూరత్ ఇబ్రాహీం ఆయత్ నంబర్ 35). అంటే ఏం తెలిసింది? భద్రత, శాంతి, అమ్నో-అమాన్, పీస్ ఫుల్ లైఫ్ – ఇది నిర్మాణానికి ముందు అవసరం, నిర్మాణం తర్వాత కూడా అవసరమే.

అల్లాహు అక్బర్! ఇస్లాం ఎలా శాంతి భద్రతలకు ప్రాముఖ్యత ఇస్తుందో గమనించారా!

ఇంకా గుర్తుంచుకుందాం. అరబ్ ద్వీపకల్పం దోపిడీలు, హత్యలు, లూటీలకు రంగస్థలంగా ఉన్న రోజుల్లో అల్లాహ్ మనపై చేసిన ఉపకారం గుర్తుంచుకుందాం.

وَاذْكُرُوا إِذْ أَنتُمْ قَلِيلٌ مُّسْتَضْعَفُونَ فِي الْأَرْضِ تَخَافُونَ أَن يَتَخَطَّفَكُمُ النَّاسُ فَآوَاكُمْ وَأَيَّدَكُم بِنَصْرِهِ وَرَزَقَكُم مِّنَ الطَّيِّبَاتِ لَعَلَّكُمْ تَشْكُرُونَ

ఒకప్పటి మీ పరిస్థితిని కాస్త జ్ఞప్తికి తెచ్చుకోండి – అప్పట్లో మీరు అవనిలో అల్ప సంఖ్యలో ఉండేవారు. మరీ బలహీనులుగా పరిగణించబడేవారు. ప్రజలు మిమ్మల్ని మట్టుబెడతారేమోనని మీరు భయంతో బిక్కుబిక్కుమంటూ ఉండేవారు. అలాంటి పరిస్థితిలో అల్లాహ్‌ మీకు ఆశ్రయమిచ్చి, తన సహాయంతో మీకు బలిమిని ఇచ్చాడు. మీకు పరిశుభ్రమైన, పరిశుద్ధమైన ఆహార వస్తువులను ప్రసాదించాడు – మీరు కృతజ్ఞులై ఉండేందుకు. (8:26)

ఇప్పటి రోజుల్లో కూడా ప్రతి అంతర్జాతీయ, ప్రాంతీయ సంఘటన మన నాయకుల చుట్టూ మరియు జ్ఞానవంతుల చుట్టూ మనం ఏకతాటిపై ఉండాల్సిన అవసరాన్ని మళ్ళీ మళ్ళీ మనకు గుర్తు చేస్తుంది. భద్రత అనేది చర్చకు గురయ్యే అంశం కాదు అని మనం పూర్తిగా విశ్వసించాలి. ఎందుకంటే భద్రత పోయిన వెంటనే జీవితం తన అందాన్ని కోల్పోతుంది.

అందుకే సౌదీ అరేబియా రాజ్యం శక్తివంతంగా, గౌరవంగా నిలవాలి మరియు ప్రతి దురుద్దేశం మరియు కుతంత్రం నుంచి సురక్షితంగా ఉండాలి. ఇది మానవ సమాజం కోసం ప్రేమతో గమనించే కన్నుగా, సహాయం చేసే చేతిగా ఉండాలి.

మనం మన ప్రాంతంలో ఈ ప్రయత్నం చేయాలి. తౌహీద్, సున్నత్ కు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా అల్లాహుతాలా మనకు ఈ శాంతి భద్రతలు ప్రసాదిస్తాడు. సూరతుల్ నూర్ లో కూడా ఈ విషయాన్ని చూడవచ్చు. ఇక్కడికి మొదటి ఖుత్బా పూర్తయింది.

الْحَمْدُ لِلَّهِ الَّذِي هَدَانَا لِلْإِسْلَامِ وَالسُّنَّةِ، وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى مَنْ كَانَتْ بِعْثَتُهُ خَيْرَ مِنَّةٍ، أَمَّا بَعْدُ.
[అల్హమ్దులిల్లాహిల్ లజీ హదానా లిల్ ఇస్లామి వస్సున్న, వస్సలాతు వస్సలాము అల మన్ కానత్ బిఅ సతుహు ఖైర మిన్న, అమ్మ బాద్.]

మన దేశ భద్రత మరియు అభివృద్ధిని కాపాడే విధంగా మన తరం పిల్లల్ని పెంపకం చేయడం అత్యంత ముఖ్యమైన బాధ్యతలలో ఒకటి. అలాగే అహ్లుస్ సున్నత్ యొక్క మన్హజ్ మరియు అఖీదాలోని ఒక కీలక విషయాన్ని కూడా వారికి (పిల్లలకు) నేర్పాలి. ఏమిటి అది? తమ నాయకుల మాట వినడం, వారికి విధేయత చూపడం విధిగా ఉంది అని, వారి నాయకత్వపు శపథాన్ని (బైఅతుల్ ఇమామ్) భంగపరచకుండా ఉండడం కూడా విధిగా ఉంది అని. అలాగే వారి (అంటే ముస్లిం నాయకుల) మేలు కోరుతూ అల్లాహ్ వారికి సద్భాగ్యం ప్రసాదించాలని దుఆ కూడా చేస్తూ ఉండాలి.

ఈ భావాన్ని బలపరిచే అర్థవంతమైన ఓ సంఘటన మీకు వినిపిస్తాను. ఇది కూడా ‘సహీహ్ బుఖారీ’లో ఉంది (7111 హదీథ్ నెంబర్). శ్రద్ధగా వినండి.

శాంతి భద్రతల గురించి, ముస్లిం నాయకుని పట్ల మనమందరము ఐక్యతగా ఉండడం ఎంత ముఖ్యమో ‘సహీహ్ బుఖారీ’లోని ఈ హదీథ్ ద్వారా తెలుస్తుంది. ఇక్కడ కూడా హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హుమా) వారి యొక్క సంఘటన వినండి.

మదీనాలో ప్రజలు యజీద్ బిన్ ముఆవియా బైఅతును విరమించుకున్నారు. అప్పుడు తెలివైన ఉపాధ్యాయుడైన హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హుమా) వారు ఏదైతే బైఅతును విరమించుకున్నారో దాని భయంకర ప్రమాదాన్ని మరియు చాలా ప్రమాదకరమైన అఖీదా లోపాన్ని గ్రహించారు. ఆయన మొదట తన సొంత కుటుంబాన్ని హెచ్చరించడం మొదలుపెట్టారు. తన సేవకుల్ని మరియు పిల్లల్ని కూర్చోబెట్టి ఇలా అన్నారు: “మేము ఈ వ్యక్తి (అంటే యజీద్) కి అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త ఆజ్ఞానుసారంగా బైఅతు ఇచ్చాము. మీలో ఎవరైనా ఈ నాయకుడిని బైఅతు నుండి తొలగిపోతే లేదా ఇంకెవరికైనా బైఅతు ఇస్తే అతనితో నా సంబంధం అంతే (ఇక తెగిపోతుంది). ఇక నా పక్షాన అతనికి ఏమీ ఉండదు.” అంటే ఆయన అలాంటి వారిని బహిష్కరిస్తారు, మాట్లాడరు కూడా. ఈ విధంగా హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) హెచ్చరించారు.

ఇబ్ను హజర్ (రహిమహుల్లాహ్) – సహీహ్ బుఖారీ వ్యాఖ్యానం రాసిన వారు – ఈ హదీస్ (7111) వ్యాఖ్యానంలో చెప్పారు: “ఈ సంఘటన సారాంశం ఏమిటంటే బైఅతు జరిగిన నాయకుడికి విధేయత చూపడం విధి. అతనిపై తిరుగుబాటు నిషిద్ధం (హరామ్). ఎంతవరకు హరామ్? ఆ నాయకుడు అన్యాయంగా వ్యవహరించినా సరే అతనికి తిరుగుబాటుగా ఉండడం ఇది న్యాయం కాదు. కేవలం అతని పాపాల కారణంగా అతని బైఅతును విరమించుకోవడం సరైన మాట కాదు” అని హాఫిజ్ ఇబ్ను హజర్ అస్ఖలానీ (రహిమహుల్లాహ్) తెలియజేశారు.

సోదర మహాశయులారా! ఓ సౌదీ అరేబియా ముస్లిములారా! (ఖతీబ్ గారు అలా అంటున్నారు కనుక తెలుగులో అలా అనువదించడం జరిగింది. మనం ప్రతి దేశంలో ఉన్న ప్రతి ముస్లిం కి ఈ మాట చెబుతున్నాం). మన దేశంలో పాలకులు మరియు ప్రజల మధ్య ఉన్న ఐక్యత మరియు పరస్పర ప్రేమ శతాబ్దాలుగా కొనసాగుతుంది. ఇది కేవలం అల్లాహ్ యొక్క దయానుగ్రహం. ఆయన తాడును (అంటే ధర్మాన్ని) పట్టుకొని ఉండడమే గాక, నిలకడగా ఉన్న ఉలమా (అల్-ఉలమా ఉర్-రాసిఖూన్ – దృఢంగా నిలబడిన నాయకులు) మరియు ప్రజల శ్రేయోభిలాష మరియు వారి నిజమైన దుఆలు – వీటితో కూడి సాధ్యమైంది. ఇదే అల్లాహ్ ఆదేశం కూడా:

وَاعْتَصِمُوا بِحَبْلِ اللَّهِ جَمِيعًا وَلَا تَفَرَّقُوا ۚ وَاذْكُرُوا نِعْمَتَ اللَّهِ عَلَيْكُمْ إِذْ كُنتُمْ أَعْدَاءً فَأَلَّفَ بَيْنَ قُلُوبِكُمْ فَأَصْبَحْتُم بِنِعْمَتِهِ إِخْوَانًا

అల్లాహ్‌ త్రాడును అందరూ కలసి గట్టిగా పట్టుకోండి. చీలిపోకండి. అల్లాహ్‌ మీపై కురిపించిన దయానుగ్రహాన్ని జ్ఞప్తికి తెచ్చుకోండి – అప్పుడు మీరు ఒండొకరికి శత్రువులుగా ఉండేవారు. ఆయన మీ హృదయాలలో పరస్పరం ప్రేమానురాగాలను సృజించాడు. దాంతో ఆయన అనుగ్రహం వల్ల మీరు ఒకరి కొకరు అన్నదమ్ములుగా మారారు. .” (3:103)

 اللهم يا من حَفِظتَ بلادَنا طيلةَ هذهِ القرونِ، وكفيتَها شرَ العادياتِ الكثيراتِ المدبَّراتِ الماكراتِ،
ఓ అల్లాహ్‌! నువ్వు ఈ శతాబ్దాలంతా మా దేశాన్ని కాపాడినవాడివి, అనేక plotting చేసిన శత్రువుల చెడునుండి దాన్ని రక్షించినవాడివి,

اللهم فأدِمْ بفضلِكَ ورحمتِكَ حِفْظَها من كل سوءٍ ومكروهٍ، وأدِمْ عليها نعمةَ الإخاءِ والرخاءِ.
ఓ అల్లాహ్! నీ దయ మరియు కరుణతో మమ్మల్ని ప్రతి చెడు మరియు నష్టం నుండి ఎప్పటికీ కాపాడుతూ ఉండు, మరియు మాకు సోదరభావం, శాంతి ఆశీర్వాదాలు ప్రసాదించు.

• اللهم احفظْ دينَنا وأمنَنا، واحفَظْ أرجاءَنا وأجواءَنا، وحدودَنا وجنودَنا، واقتصادَنا وعتادَنا، واحفظْ مملكتَنا وخليجَنا، وسائرَ بلادِ المسلمينَ.
ఓ అల్లాహ్! మా దీన్‌ను, మా భద్రతను, మా దేశపు అన్ని భాగాలనూ, వాతావరణాన్ని, సరిహద్దులనూ, సైనికులనూ, ఆర్థిక వ్యవస్థనూ, సమస్త సామాగ్రిని కాపాడు, మా రాజ్యమైన సౌదీ అరేబియాను మరియు గల్ఫ్ ప్రాంతాన్నీ, మరియు ముస్లింల దేశాలన్నిటినీ కాపాడు.

 اللهم صُدَّ عنا غاراتِ أعدائِنا المخذولينَ وعصاباتِهِم المتخوِّنينَ.
ఓ అల్లాహ్! మమ్మల్ని మా ఓడిపోయిన శత్రువుల దాడుల నుండి మరియు వాళ్ల కుట్రా గుంపుల నుండి కాపాడు.

 اللهم اكفِنا شرَ طوارقِ الليلِ والنهارِ، إلا طارقًا يَطرقُ بخيرٍ يا رحمنُ.
ఓ అల్లాహ్! రాత్రి, పగలు దుష్ట శత్రువుల చెడు నుండీ మమ్మల్ని కాపాడు – కేవలం మంచి వార్తలతో వచ్చే అతిథిని రానివ్వు – ఓ రహ్మాన్!

 اللهم وانصرْ إخوانَنا بأكنافِ بيتِ المقدسِ، واهزِمْ إخوانَ القردةِ والخنازيرِ.
ఓ అల్లాహ్! బైతుల్ మక్దిస్ పరిసరాల్లో ఉన్న మా సోదరులను నీవు గెలిపించు, వారికి సహాయం అందించు. మరియు కోతులు, పందులు వంటి వారిని ఓడించు.

اللهم وفِّقْ وليَ أمرِنا ووليَ عهدِه لهُداكَ. واجعلْ عمَلَهُما في رضاكَ.
ఓ అల్లాహ్! మా నాయకుడిని మరియు ఆయన వారసుడిని నీ హిదాయత్‌ వైపు నడిపించు, వారి కార్యాలు నీ సంతోషానికి కారణమయ్యేలా చేయు.

 اللهم سدِّدهُمْ في قراراتِهِمْ ومؤتمراتِهِمْ.
ఓ అల్లాహ్! వారి నిర్ణయాలలోను, సమావేశాలలోను వారికి సరైన దారిని చూపు.

 اَللَّهُمَّ صَلِّ وَسَلِّمَ عَلَى عَبْدِكَ وَرَسُولِكَ مُحَمَّدٍ.
ఓ అల్లాహ్! నీ బానిస మరియు ప్రవక్త అయిన ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) పైన శాంతి మరియు దీవెనలు వర్శించు గాక!

سبحان ربك رب العزة عما يصفون وسلام على المرسلين والحمد لله رب العالمين

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=42824

సూరహ్ ఇఖ్లాస్ ప్రాముఖ్యత & ఏయే సందర్భాలలో చదవాలి? [వీడియో & టెక్స్ట్]

సూరహ్ ఇఖ్లాస్ ప్రాముఖ్యత & ఏయే సందర్భాలలో చదవాలి?
https://www.youtube.com/watch?v=Ja2OyufkHDQ [3 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో వక్త సూరా అల్-ఇఖ్లాస్ యొక్క గొప్పతనాన్ని మరియు వివిధ సందర్భాలలో దానిని పఠించడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఫజర్, మగ్రిబ్, విత్ర్ మరియు తవాఫ్ నమాజులలో ఈ సూరాను పఠించేవారని తెలిపారు. నిద్రపోయే ముందు ఈ సూరాను మువ్వజతైన్ (సూరా ఫలక్, సూరా నాస్)లతో కలిపి మూడు సార్లు చదివి శరీరంపై తుడుచుకోవడం వల్ల కీడుల నుండి రక్షణ లభిస్తుందని పేర్కొన్నారు. ఉదయం మరియు సాయంత్రం అజ్కార్‌లలో, అలాగే ప్రతి ఫర్జ్ నమాజు తర్వాత దీనిని పఠించడం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ, రోజుకు సుమారు 14 సార్లు ఈ సూరాను పఠించడం ద్వారా అల్లాహ్ ప్రసన్నతను పొందవచ్చని సూచించారు.

ఈ సూరాకు ఇంత గొప్ప ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఏదైతే ఉందో, దాని కారణంగానే ఒక్క రోజులోనే అనేక సందర్భాల్లో చదవడానికి చెప్పడం జరిగింది. ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఫజర్ నమాజులోని రెండవ రకాతు సున్నత్ లో ఈ సూరా చదివేవారు. తవాఫ్ చేసిన తర్వాత రెండు రకాతులు చేస్తారు కదా, అందులో రెండవ రకాతు సున్నత్ తర్వాత చదివేవారు. కొన్ని సందర్భాల్లో మగ్రిబ్ నమాజు లోని రెండవ రకాతులో కూడా చదివేవారు. విత్ర్ నమాజు లోని మూడవ రకాతులో కూడా ఈ సూరా చదువుతూ ఉండేవారు. ఇంకా అనేక సందర్భాలు ఉన్నాయి.

అలాగే ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ యొక్క సూరా ప్రతి ముస్లిం పడుకునే ముందు మూడు సార్లు చదవాలి. దీనితో పాటు సూరతుల్ ఫలక్ మరియు సూరతుల్ నాస్ కూడా చదవాలి అని చెప్పారు. ఇది మనం చదివి ఊదుకున్నామంటే, ఎక్కడి వరకు మన చెయ్యి చేరుతుందో తల పై నుండి, ముఖము మరియు శరీర భాగము, అక్కడ వరకు స్పర్శ చేసుకుంటూ, తుడుచుకుంటూ వెళ్ళాలి, మసాహ్ చేసుకుంటూ. ఈ విధంగా అన్ని రకాల చెడుల నుండి, కీడుల నుండి మనం కాపాడబడతాము అన్నటువంటి శుభవార్త కూడా మనకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు.

అలాగే ప్రతి ఫర్జ్ నమాజు తర్వాత ఒక్కసారి ఈ సూరా మరియు రెండు సూరాలు (ఫలక్, నాస్) కూడా చదవాలని చెప్పడం జరిగింది. అలాగే ఉదయం అజ్కార్ ఏవైతే ఉన్నాయో వాటిలో మూడేసి సార్లు, సాయంకాలం అజ్కార్ ఏవైతే ఉన్నాయో వాటిలో మూడేసి సార్లు చదవాలి. అబూ దావూద్ యొక్క సహీహ్ హదీథ్, “తక్ఫీక మిన్ కుల్లి షై” (నీవు ఉదయం, సాయంత్రం మూడేసి సార్లు ఈ మూడు సూరాలు చదివావంటే, అది నీకు అన్ని రకాల కీడుల నుండి కాపాడడానికి సరిపోతుంది).

ఈ విధంగా మీరు ఆలోచించండి, ఈ సూరా యొక్క ఘనత ఇంత గొప్పగా ఉంది గనక అల్హమ్దులిల్లాహ్, సుమ్మ అల్హమ్దులిల్లాహ్ ఇన్ని సార్లు… టోటల్ ఎన్ని సార్లు అయిందో ఒకసారి ఆలోచించారా మీరు. ప్రతి ఫర్జ్ నమాజు తర్వాత ఒక్కసారి (ఐదు), ఉదయం మూడు సార్లు, సాయంకాలం మూడు సార్లు, రాత్రి పడుకునే ముందు మూడు సార్లు. తొమ్మిది ప్లస్ ఐదు, పద్నాలుగు సార్లు ఈ సూరా మనం చదువుతున్నామా? మనలో ఎవరైనా చదువుతలేరంటే వారు ఎన్ని మేళ్లను కోల్పోతున్నారు? ఎన్ని రకాల శుభాలను కోల్పోతున్నారు? స్వయంగా వారే ఆలోచించుకోవాలి.

అల్లాహ్ యే మనందరికీ ఈ సూరా యొక్క ఘనతను, గొప్పతనాన్ని అర్థం చేసుకొని, దాని యొక్క అర్థ భావాలను మంచి రీతిలో అవగాహన చేసుకొని, దాని ప్రకారంగా మన విశ్వాసాన్ని దృఢపరచుకొని, ఆచరణకు సంబంధించిన విషయాలను సంపూర్ణంగా అల్లాహ్ యొక్క ప్రసన్నత కొరకు ఆచరించే అటువంటి సద్భాగ్యం ప్రసాదించుగాక. మరియు

قُلْ هُوَ اللَّهُ أَحَدٌ
[ఖుల్ హువల్లాహు అహద్]
(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు: “ఆయనే అల్లాహ్, అద్వితీయుడు (ఏకైకుడు).” (112:1)

చెప్పండి అని అల్లాహ్ ఏదైతే ఆదేశించాడో, అందరికీ చెప్పే, తెలియజేసే, ప్రచారం చేసే అటువంటి భాగ్యం కూడా అల్లాహ్ మనకు ప్రసాదించుగాక. ఆమీన్.

వ ఆఖిరు దఅవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.

సూరహ్ ఇఖ్లాస్ (Suratul Ikhlas) – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV3dePHBnlkeXpCe1NBDiPaA

మహ్రమ్ లేకుండా స్త్రీ ఒంటరిగా ప్రయాణించడం [వీడియో , టెక్స్ట్]

మహ్రమ్ లేకుండా స్త్రీ ఒంటరిగా ప్రయాణించడం
https://youtu.be/C3dCKJ4yoEo [5 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
ఇస్లామీయ  నిషిద్ధతలు మరియు జాగ్రత్తలు [పుస్తకం]

మహ్రమ్ (వివాహం నిషిద్ధమైన దగ్గరి బంధువు లేదా భర్త) లేకుండా స్త్రీలు ఒంటరిగా ప్రయాణించకూడదని ఇస్లాం స్పష్టంగా బోధిస్తోంది. అల్లాహ్ మరియు అంతిమ దినాన్ని విశ్వసించే స్త్రీలు తండ్రి, కొడుకు, సోదరుడు లేదా భర్త వంటి మహ్రమ్ తోడు లేకుండా చేయకూడదని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హెచ్చరించారు. ఇది హజ్ యాత్రకు కూడా వర్తిస్తుంది; భార్య హజ్ కు వెళ్తుంటే, భర్త జిహాద్ నుండి పేరు వెనక్కి తీసుకొని ఆమెతో వెళ్లాలని ప్రవక్త ఆదేశించారు. ఈ నిబంధన వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం స్త్రీల రక్షణ, గౌరవం మరియు భద్రత. విమాన ప్రయాణాలైనా, బస్సు ప్రయాణాలైనా, తోడు లేకుండా వెళ్లడం వల్ల అనుకోని ఆటంకాలు, పరాయి పురుషుల సాహచర్యం వంటి సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. మహ్రమ్ గా ఉండేవారికి ముస్లిం అయి ఉండటం, యుక్తవయసు, మానసిక స్థితి సరిగ్గా ఉండటం మరియు పురుషుడై ఉండటం అనే నాలుగు షరతులు తప్పనిసరి అని ఈ ప్రసంగం వివరిస్తుంది.

మహ్రమ్ లేకుండా స్త్రీ ఒంటరిగా ప్రయాణించడం. మహ్రమ్ అంటే ఎవరు? భర్త లేదా వివాహ నిషిద్ధమైన బంధువు. వివాహం ఏ స్త్రీ అయితే ఏ పురుషునితో వివాహం చేసుకోరాదో, అలాంటి పురుషుడు ఆ స్త్రీకి మహ్రమ్ అవుతాడు. ఉదాహరణకు తండ్రి, కొడుకు, సోదరుడు, పెదనాన్న, చిన్నాన్న ఈ విధంగా ఇలాంటి బంధువులు.

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారని హజ్రత్ అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు:

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారని అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః

لَا يَحِلُّ لِامْرَأَةٍ تُؤْمِنُ بِالله وَالْيَوْمِ الْآخِرِ تُسَافِرُ مَسِيرَةَ يَوْمٍ إِلَّا مَعَ ذِي مَحْرَمٍ
(లా యహిల్లు లిమ్ర అతిన్ తు’మిను బిల్లహి వల్ యౌమిల్ ఆఖిరి తుసాఫిరు మసీరత యౌమిన్ ఇల్లా మఅ జీ మహ్రమ్)

“అల్లాహ్ మరియు అంతిమ దినాన్ని విశ్వసించే ఏ స్త్రీ కూడా తనవెంట ఆమె మహ్రమ్ లేనిదే ఒక రోజు జరిగే ప్రయాణం చేయుట యోగ్యం కాదు”. (ముస్లిం 1339, బుఖారి 1088).

ఈ ఆదేశం అన్ని రకాల ప్రయాణాలకు వర్తిస్తుంది. చివరికి హజ్ ప్రయాణం అయినా సరే.

హజ్ కు సంబంధించిన హదీస్ కూడా చాలా ఫేమస్ గా ఉంది. హజ్ కు సంబంధించిన హదీస్ ఏమిటంటే, ఒక వ్యక్తి వచ్చి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తో అడుగుతారు, “ప్రవక్తా! నేను ఫలానా కొందరితో కలిసి జిహాద్ కొరకు వెళ్తున్నాను మరియు నా భార్య హజ్ కొరకు వెళ్తుంది.” అప్పుడు ప్రవక్త చెప్పారు, “ఆ ముజాహిదీన్ ల టీమ్ నుండి నీ యొక్క పేరును తీసేసి, వారికి చెప్పేసి, నీవు నీ భార్యతో పాటు కలిసి హజ్ కొరకు వెళ్ళు.” ఆమెను ఒంటరిగా వెళ్లనివ్వకు.

అదే విషయం, చివరికి హజ్ ప్రయాణం అయినా సరే, మహ్రమ్ లేకుండా స్త్రీ ప్రయాణం దుర్మార్గులను ఆమె పట్ల ప్రేరేపణకు గురి చేస్తుంది. అందుకు వారు ఆమెను ఎదుర్కొనే ప్రయత్నం చేస్తారు. మరియు ఆమె స్వాభావికంగా బలహీనురాలు గనుక వారి వలలో చిక్కుకుపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. అందువల్ల ఆమె తన అతి విలువైన గౌరవ మానాన్ని కోల్పోతుంది, కోల్పోయేటువంటి ప్రమాదం ఉంటుంది. లేదా కనీసం ఆమె పరువు ప్రతిష్ఠలపై ఒక మచ్చయినా పడవచ్చు.

అదే విధంగా విమానంలో ఒంటరిగా ప్రయాణం చేయకూడదు. ఒక వైపు మహ్రమ్ వీడ్కోలు తెలిపి మరో వైపు ఆమెను రిసీవ్ చేసుకోవడానికి మరో మహ్రమ్ వచ్చినా సరే. ఆమె పక్క సీటులో కూర్చునే వారు ఎవరై ఉంటారు? లేదా ఒకవేళ ఏదైనా ఆటంకం కలిగి విమానం వేరే విమానాశ్రయంలో దిగితే, లేదా ఆలస్యం అయి సమయం తప్పి వస్తే, ఆమె ఎలాంటి ఇబ్బందులకు గురవుతుందో ఆలోచించండి. ఇలా జరగవచ్చు అని కాదు, వాస్తవంగా జరిగిన ఎన్నో సంఘటనలు ఉన్నాయి. అందుకే వివాహ నిషిద్ధమైన ఏ బంధువైనా ఒకరు ఆమెకు తోడుగా ఉండాలి.

అయితే ఆ మహ్రమ్ లో ఈ నాలుగు షరతులు ఉండడం తప్పనిసరి:

  1. అతడు ముస్లిం అయి ఉండాలి.
  2. అతడు యుక్త వయసు గలవాడై ఉండాలి, పిల్లవాడు కాదు.
  3. జ్ఞాని అయి ఉండాలి, అజ్ఞానుడై (మతిస్థిమితం లేనివాడై) మొత్తానికే కాదు.
  4. పురుషుడు అయి ఉండాలి.

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) చెప్పారని అబూసఈద్ ఖుద్రీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః

لَا يَحِلُّ لِامْرَأَةٍ تُؤْمِنُ بِالله وَالْيَوْمِ الْآخِرِ أَنْ تُسَافِرَ سَفَرًا يَكُونُ ثَلَاثَةَ أَيَّامٍ فَصَاعِدًا إِلَّا وَمَعَهَا أَبُوهَا أَوْ ابْنُهَا أَوْ زَوْجُهَا أَوْ أَخُوهَا أَوْ ذُو مَحْرَمٍ مِنْهَا

(లా యహిల్లు లిమ్ర అతిన్ తు’మిను బిల్లహి వల్ యౌమిల్ ఆఖిర్ అన్ తుసాఫిర సఫరన్ యకూను సలాసత అయ్యామిన్ ఫ సాఇదన్ ఇల్లా వ మఅహా అబూహా ఔ ఇబ్నుహా ఔ జౌజుహా ఔ అఖూహా ఔ జూ మహ్రమిన్ మిన్ హా)

“అల్లాహ్ మరియు పరలోకదినాన్ని విశ్వసించే ఏ స్త్రీ అయినా మూడు, అంతకంటే ఎక్కువ రోజుల ప్రయాణం ఒంటరిగా చేయడం యోగ్యం కాదు. ఆమెతో అతని తండ్రి, లేదా కొడుకు, లేదా భర్త, లేదా సోదరుడు, లేదా మరెవరైనా మహ్రమ్ తప్పక ఉండాలి”. (ముస్లిం 1340).

అల్లాహ్ మరియు పరలోక దినాన్ని విశ్వసించే ఏ స్త్రీ అయినా.. (గమనించండి అల్లాహ్ ను మరియు పరలోక దినాన్ని.. ఇలాంటి మాట ఎన్నో సందర్భాల్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్తారు. అందుకొరకే మనం ఇలాంటి విషయాలకు వ్యతిరేకంగా చేస్తున్నామంటే ఈ విశ్వాసం మనది తగ్గిపోతుంది అని కూడా మనం గ్రహించాలి.)

ఇవన్నీ కూడా ఎందుకు మీరు గమనిస్తున్నారు కదా,

لا تَتَّبِعُوا خُطُواتِ الشَّيْطانِ
(లా తత్తబిఉ ఖుతువాతిష్ షైతాన్)
షైతాన్ అడుగుజాడలను అనుసరించకండి.

షైతాన్ అడుగుజాడలు ఇవన్నీ కూడా. ఒకవేళ వీటి నుండి మనం జాగ్రత్త పడకుంటే.., ఇలా మనం చూస్తూనే ఉన్నాము. చూడడానికి కాలేజీ మంచిది అయి ఉండవచ్చు, అక్కడ శిక్షణ ఇచ్చేవారు, టీచర్లు అందరూ చాలా మంచివారు అయి ఉండవచ్చు. పదిహేను నిమిషాలు, అరగంట ఇంటి నుండి అక్కడి వరకు బస్సులో, లేదా ఆటో లేదా చిన్న ఏదైనా బస్సులో వెళ్లడం రావడం, పోవడం రావడం పోవడం.. ఇలా ప్రయాణంలో ఎవరెవరు కలుస్తూ ఉంటారో, ప్రతి రోజు చూస్తూ ఉంటారు. ఈ విధంగా ఎన్ని చెడులకు దారి తీస్తుందో ఈ విషయం, గమనిస్తున్నారా?

తయమ్ముమ్ పద్దతి – హబీబుర్రహ్మాన్ జామయి [వీడియో, టెక్స్ట్]

తయమ్ముమ్ పద్దతి
https://youtu.be/Cc_1VB72Sak [9 నిముషాలు]
వక్త: హబీబుర్రహ్మాన్ జామయి (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, ఇస్లామీయ ఆచారమైన ‘తయమ్ముమ్’ (పొడి శుద్ధీకరణ) గురించి వివరించబడింది. ఇందులో తయమ్ముమ్ యొక్క అక్షరార్థం మరియు షరియత్ ప్రకారం దాని అర్థం, సూరహ్ అన్-నిసా మరియు సూరహ్ అల్-మాయిదా నుండి ఖురాన్ ఆధారాలు, నీరు అందుబాటులో లేనప్పుడు లేదా అనారోగ్యం వంటి నిర్దిష్ట పరిస్థితులలో తయమ్ముమ్ ఎప్పుడు అనుమతించబడుతుంది, ఏ పదార్థాలను (స్వచ్ఛమైన మట్టి మరియు దాని రకాలు) ఉపయోగించవచ్చు, దానిని ఆచరించే సరైన పద్ధతి మరియు దానిని చెల్లకుండా చేసే చర్యలు వివరించబడ్డాయి.

అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ అంబియాయి వల్ ముర్సలీన్ వమన్ తబిఅహుమ్ బిఇహ్సానిన్ ఇలా యౌమిద్దీన్ అమ్మా బాద్.

అభిమాన సోదరులారా! అస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు.

ఈ రోజు మనం తయమ్ముమ్ గురించి తెలుసుకోబోతున్నాం.

తయమ్ముమ్ అంటే సంకల్పించటం అని అర్థం. శాబ్దిక అర్థం.

షరియత్ పరిభాషలో తయమ్ముమ్ అంటే, ప్రయాణంలో ఉన్నప్పుడు గానీ, ప్రయాణికుడు స్థానికంగా గానీ, వుజూ ఘుసుల్ లో మాదిరి పరిశుద్ధతను పొందే ఉద్దేశంతో రెండు చేతుల్ని మట్టిపై కొట్టి ముఖాన్ని, చేతులను స్పర్శించుకోవడాన్ని కోవటం అని అర్థం.

ఈ తయమ్ముమ్ గురించి అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఖురాన్ లో సూర నిసా అలాగే సూర మాయిదాలో కూడా సెలవిచ్చాడు. తయమ్ముమ్ గురించి. సూర నిసాలో ఆయత్ ఇలా ఉంటుంది.

وَإِن كُنتُم مَّرْضَىٰ أَوْ عَلَىٰ سَفَرٍ أَوْ جَاءَ أَحَدٌ مِّنكُم مِّنَ الْغَائِطِ أَوْ لَامَسْتُمُ النِّسَاءَ فَلَمْ تَجِدُوا مَاءً فَتَيَمَّمُوا صَعِيدًا طَيِّبًا فَامْسَحُوا بِوُجُوهِكُمْ وَأَيْدِيكُمْ

(వ ఇన్ కున్ తుమ్ మర్దా అవ్ అలా సఫరిన్ అవ్ జాఅ అహదుమ్ మిన్ కుమ్ మినల్ గాఇతి అవ్ లామస్ తుమున్ నిసాఅ ఫలమ్ తజిదూ మాఅన్ ఫతయమ్మమూ సయీదన్ తయ్యిబన్ ఫమ్ సహూ బివుజూహికుమ్ వ అయ్దీకుమ్)

ఒకవేళ మీరు వ్యాధిగ్రస్తులైతే, లేక ప్రయాణంలో ఉంటే లేక మీలో ఎవరయినా మలమూత్ర విసర్జన చేసివస్తే లేక మీరు స్త్రీలతో సమాగమం జరిపి ఉంటే – అట్టి స్థితిలో మీకు నీరు లభ్యం కానిపక్షంలో పరిశుభ్రమైన మట్టి(ని ఉపయోగించే) సంకల్పం చేసుకోండి. (దాంతో) మీ ముఖాలను, చేతులను తుడుచుకోండి. నిశ్చయంగా అల్లాహ్‌ మన్నించేవాడు, క్షమాభిక్ష పెట్టేవాడు. (సూర నిసా 4:43)

మీరు ఎప్పుడైనా అస్వస్థులై అయి ఉంటే, అస్వస్థులైతే లేక ప్రయాణంలో ఉంటే, లేక మీలో ఎవరైనా మలమూత్ర విసర్జనం చేసి ఉంటే, లేక మీరు మీ స్త్రీలను తాకి ఉంటే అంటే సంభోగం చేసి ఉంటే, మీకు నీరు లభ్యం కాని పక్షంలో, కాలకృత్యాలు తర్వాత మలమూత్ర విసర్జన తర్వాత వుజూ తప్పనిసరి. సంభోగం తర్వాత ఘుసుల్ తప్పనిసరి. నీరు లభ్యం కాని పక్షంలో పరిశుభ్రమైన మట్టిని ఉపయోగించండి. దానితో మీరు మీ ముఖాలను చేతుల్ని స్పర్శించుకోండి అని అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఈ ఆయత్లో తెలియజేశాడు. అంటే అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఈ ఆయతులో ఘుసుల్ మరియు వుజూకి బదులు నీరు లేనప్పుడు తయమ్ముమ్ అనే అవకాశాన్ని, భాగ్యాన్ని, అనుమతిని అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మనలకి ప్రసాదించాడు.

ఇక తయమ్ముమ్ ఏ సందర్భాలలో అనుమతి ఉంది? వుజూ మరియు ఘుసుల్ కి బదులు తయమ్ముమ్. కాకపోతే దానికి కొన్ని కండిషన్లు ఉన్నాయి, నియమాలు ఉన్నాయి, కొన్ని సందర్భాలు ఉన్నాయి. ఆ సందర్భాలలోనే అనుమతి ఉంది.

ఒకటి, నీరు లేనప్పుడు. నమాజ్ కోసం తప్పనిసరిగా వుజూ చేయాలి, నీరు లేదు. తప్పనిసరిగా ఘుసుల్ చేయాలి, నీరు లేదు.

రెండవది, నీరు ఉన్నా త్రాగటానికి సరిపోతుంది. ఎంత నీరు ఉందంటే, తాగితే వుజూకి లేదు, వుజూ చేస్తే తాగటానికి లేదు. అలాంటప్పుడు. నీరు ఉన్నా తాగడానికి సరిపోయినప్పుడు.

మూడవది, నీటి ఉపయోగం మనిషికి హానికరం. అనారోగ్యం మూలంగా, ఏదో ఒక గాయం మూలంగా ఏదైనా సరే. నీటి ఉపయోగం మనిషికి హానికరం. అటువంటి సందర్భంలో.

నాలుగవది, ఒకవేళ నీరు మంచుగా, మంచులాగా చల్లగా ఉంది. వేడి చేసే అవకాశం కూడా లేదు. అటువంటి సందర్భంలో.

అలాగే ఐదవది, నీరు ఉన్నప్పటికీ నీటికి మనిషికి మధ్య ప్రాణ శత్రువు, అడవి మృగం, మరేదైనా ప్రాణాపాయం కలిగించే వస్తువు మధ్యలో ఉంది. అటువంటి సమయంలో తయమ్ముమ్ చేయవచ్చు.

ఈ ఐదు కారణాలు సందర్భాలలో వుజూ మరియు ఘుసుల్ కి బదులు తయమ్ముమ్ ఉంది.

ఏ వస్తువులతో తయమ్ముమ్ చేయాలి? పరిశుభ్రమైన మట్టితో గానీ లేదా మట్టి కోవకు చెందిన ఇతర వస్తువులతో తయమ్ముమ్ చేయాలి. ఉదాహరణకు ఇసుక, ఎండిపోయిన బూడిద, రాయి, కంకరరాళ్ళు మొదలగునవి.

అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఆయత్ లో చెప్పిన పదం ఏమిటి?

فَتَيَمَّمُوا صَعِيدًا طَيِّبًا
(ఫతయమ్మమూ సయీదన్ తయ్యిబా)

పరిశుభ్రమైన మట్టితో అన్నాడు అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా. అంటే సయీద్ అంటే ఏమిటి? సయీద్ అంటే భూమి ఉపరితల భాగం. అది మట్టి కావచ్చు, మట్టి లాంటి ఇతర వస్తువులు కూడా అవ్వచ్చు.

పరిశుద్ధతను పొందే ఉద్దేశంతో, సంకల్పంతో బిస్మిల్లా అని పఠించాలి. ఆ తర్వాత రెండు చేతుల్ని పరిశుభ్రమైన మట్టి మీద కొట్టాలి. ఆ తర్వాత చేతుల్ని ఒక్కసారి ఊదాలి. చేతుల్ని ఒకసారి ఊదుకొని ముఖం మీద స్పర్శించుకోవాలి. ఆ తర్వాత చేతుల్ని మణికట్టు వరకు రుద్దుకోవాలి. ఎడమ చేత్తో కుడి చెయ్యి పైన, కుడి చేతితో ఎడమ చెయ్యి పైన.

చేతుల్ని మణికట్ల వరకు రుద్దుకోవాలి. ఎడమ చేత్తో కుడి చేయి పైన, కుడి చేత్తో ఎడమ చేయి పైన. ఆ తర్వాత చివర్లో వుజూ చేసిన తర్వాత పఠించే దుఆ తయమ్ముమ్ తర్వాత కూడా పఠించాలి.

أَشْهَدُ أَنْ لَا إِلَٰهَ إِلَّا اللهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ، وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ. اللَّهُمَّ اجْعَلْنِي مِنَ التَّوَّابِينَ، وَاجْعَلْنِي مِنَ الْمُتَطَهِّرِينَ

(అష్ హదు అల్ లాఇలాహ ఇల్లల్లాహు వ అష్ హదు అన్న ముహమ్మదన్ అబ్దుహూ వ రసూలుహు. అల్లాహుమ్మ జ’అల్నీ మినత్ తవ్వాబీన వ జ’అల్నీ మినల్ ముతతహ్ హిరీన్.)

ఇది తయమ్ముమ్ చేసే పద్ధతి. చాలా సింపుల్ గా, సులభంగా ఉంటుంది.

పరిశుద్ధతను పొందే ఉద్దేశంతో, సంకల్పంతో బిస్మిల్లా అని పలకాలి. రెండు చేతుల్ని పరిశుభ్రమైన మట్టి మీద కొట్టాలి. చేతుల్ని ఒకసారి ఊదుకొని ముఖం మీద స్పర్శించుకోవాలి. ఆ తర్వాత ఎడమ చేత్తో కుడి చేయి పైన, కుడి చేత్తో ఎడమ చేయి పైన స్పర్శించుకోవాలి. ఆ తర్వాత వుజూ తర్వాత ఏ దుఆ పఠిస్తామో ఆ దుఆ పఠించాలి.

తయమ్ముమ్ దేని వల్ల భంగమైపోతుంది? ఏ కారణాల వల్ల తయమ్ముమ్ భంగమవుతుంది? తయమ్ముమ్ ని భంగపరిచే విషయాలు.

మొదటిది, ఏ కారణాల వల్ల వుజూ భంగం అవుతుందో అదే కారణాల వల్ల తయమ్ముమ్ కూడా భంగం అవుతుంది.

రెండవది, నీరు లభించినా లేదా నీరు ఉపయోగించే స్థితి ఏర్పడినా తయమ్ముమ్ భంగమైపోతుంది.

అభిమాన సోదరులారా! ఇది తయమ్ముమ్ గురించి కొన్ని విషయాలు. తయమ్ముమ్ అంటే శాబ్దిక అర్థం ఏమిటి, షరియత్ పరంగా తయమ్ముమ్ అంటే అర్థం ఏమిటి, ఏ సందర్భాలలో తయమ్ముమ్ చేయాలి, అలాగే ఏ వస్తువుతో తయమ్ముమ్ చేయాలి, తయమ్ముమ్ చేసే పద్ధతి ఏమిటి, తయమ్ముమ్ ని భంగం పరిచే విషయాలు ఇది మనం తెలుసుకున్నాం.

అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మనందరికీ ఖురాన్ మరియు హదీస్ కి సంబంధించిన జ్ఞానాన్ని ప్రసాదించు గాక. అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మనందరికీ ప్రతి విషయంలో మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ని అనుసరిస్తూ ఆయన సున్నత్ ని ధనాన్ని పాటించే సద్బుద్ధిని ప్రసాదించు గాక. ఆమీన్.

వ ఆఖిరు దావానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహ్.