అధర్మమైన వసీలా (అల్లాహ్ సామీప్యాన్ని పొందే సాధనం) – హబీబుర్ రహ్మాన్ జామి’ఈ [వీడియో & టెక్స్ట్]

అధర్మమైన సమ్మతమైన వసీలా
https://youtu.be/mh_RqyUcea4 [13 నిముషాలు]
వక్త: హబీబుర్ రహ్మాన్ జామి’ఈ(హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, వక్త ‘వసీలా’ (అల్లాహ్‌కు సాన్నిహిత్యం కోరే సాధనం) అనే భావనను వివరిస్తున్నారు. ధర్మ సమ్మతమైన మరియు అధర్మమైన వసీలాల మధ్య వ్యత్యాసాన్ని ఆయన స్పష్టం చేశారు. ధర్మబద్ధమైన మార్గం కేవలం ఖురాన్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధనల ద్వారానే నిర్దేశించబడిందని నొక్కిచెప్పారు. ముఖ్యంగా, మరణించిన వారి ద్వారా, వారు ప్రవక్తలు లేదా పుణ్యాత్ములు అయినప్పటికీ, సహాయం కోరడం లేదా దుఆ చేయడం నిషిద్ధమని వివరించారు. ఆరాధన “ఎవరి కోసం” మరియు “ఎలా” అనే ఇబ్నె తైమియా సూత్రాన్ని ఉటంకించారు. ఉమర్ బిన్ ఖత్తాబ్ (రదియల్లాహు అన్హు) కాలంలో కరువు ఏర్పడినప్పుడు, వర్షం కోసం దుఆ చేయడానికి మరణించిన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను కాకుండా, జీవించి ఉన్న ప్రవక్త పినతండ్రి అబ్బాస్ (రదియల్లాహు అన్హు)ను వసీలాగా చేసుకున్న చారిత్రక ఉదాహరణను అందించారు. దీని ద్వారా జీవించి ఉన్న పుణ్యాత్ముల ద్వారా మధ్యవర్తిత్వం కోరవచ్చని, కానీ మృతుల ద్వారా కాదని స్పష్టం చేశారు. అలాగే, ‘ఇస్తిఆనత్’ (ప్రాపంచిక విషయాలలో అనుమతించబడిన సహాయం) మరియు ‘ఇస్తిగాసా’ (కేవలం అల్లాహ్ మాత్రమే చేయగల విషయాలలో సహాయం కోరడం) మధ్య తేడాను వివరిస్తూ, రెండోది అల్లాహ్ యేతరుల నుండి కోరడం హరామ్ అని తేల్చిచెప్పారు.

اَلْحَمْدُ لِلّٰهِ رَبِّ الْعَالَمِيْنَ، وَالْعَاقِبَةُ لِلْمُتَّقِيْنَ، وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى سَيِّدِ الْأَنْبِيَاءِ وَالْمُرْسَلِيْنَ، وَمَنْ تَبِعَهُمْ بِإِحْسَانٍ إِلَى يَوْمِ الدِّيْنِ، أَمَّا بَعْدُ.

(అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వల్ ఆఖిబతు లిల్ ముత్తఖీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ అంబియాయి వల్ ముర్సలీన్, వ మన్ తబిఅహుమ్ బి ఇహ్సానిన్ ఇలా యౌమిద్దీన్, అమ్మా బాద్.)

సర్వలోకాల ప్రభువైన అల్లాహ్‌కే సర్వస్తోత్రాలు. అంతిమ విజయం దైవభీతిపరులకే. ప్రవక్తల నాయకులు, దైవసందేశహరులందరిపై మరియు ప్రళయదినం వరకు వారిని సన్మార్గంలో అనుసరించేవారిపై అల్లాహ్ కారుణ్యం మరియు శాంతి కురుపించుగాక. ఆ తర్వాత…

అభిమాన సోదరులారా! ధర్మ అవగాహన అనే ఈ కార్యక్రమములోకి మీ అందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను.

اَلسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ
(అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు)
మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక.

అభిమాన సోదరులారా! గత ఎపిసోడ్లో మనం ధర్మ సమ్మతమైన వసీలా గురించి తెలుసుకున్నాం. అవి తప్ప వేరే ఇతర పద్ధతుల ద్వారా ఆశ్రయం పొందటం అది అధర్మమైన వసీలా అవుతుంది.

ప్రియ సోదరులారా! అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మన రుజుమార్గం కొరకు, సత్యమార్గం కొరకు ఒక మార్గాన్ని, ఒక దారిని, ఒక గీటురాయిని తెలియజేశాడు, చూపించాడు. సత్యం ఏమిటి? అసత్యం ఏమిటి? న్యాయం ఏమిటి? అన్యాయం ఏమిటి? ధర్మం ఏమిటి? అధర్మం ఏమిటి? స్వర్గానికి పోయే దారి ఏమిటి? నరకానికి పోయే దారి ఏమిటి? మన ఇహపర లోకాల సాఫల్యం కొరకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అంతిమ గ్రంథం, దివ్య గ్రంథం ఖురాన్ మజీద్ ని అవతరింపజేశాడు. అలాగే అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క బోధనలు, ప్రవచనాలు. ఖురాన్ మరియు ప్రామాణికమైన హదీసులలో మన జీవన విధానం, ఈ లోకంలో, ప్రపంచంలో, ఇహంలో మనము ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎలా ప్రార్థించాలి, ఎలా ప్రార్థన చేయకూడదు, అల్లాహ్ ను ఎలా వేడుకోవాలి, ఎలా వేడుకోకూడదు, ఇవన్నీ మనకు తెలియజేయడం జరిగింది ఖురాన్ లో మరియు హదీస్ లో.

అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త తప్ప ఇతర మార్గం ఎన్నుకుంటే, అది మన బుద్ధికి, మన తెలివికి సరైనది అని అనిపించినా, అది ఖురాన్ పరంగా, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం విధానం పరంగా లేకపోతే, అది ధర్మ సమ్మతం కాదు అని మనము స్పష్టంగా తెలుసుకోవాలి.

అందుకే షేఖుల్ ఇస్లాం ఇబ్నె తైమియా రహ్మతుల్లాహి అలై ఒక చక్కని సూత్రం చెప్పారు. అది ఏమిటంటే:

مَنْ تَعْبُدُ؟ كَيْفَ تَعْبُدُ؟
(మన్ త’అబుద్? కైఫ త’అబుద్?)
ఎవరిని ఆరాధించాలి? ఆ ఆరాధన ఎలా చేయాలి?

ఎవరిని ఆరాధించాలి? ఆరాధన ఎవరి కొరకు? కైఫ త’అబుద్, ఆ ఆరాధన ఎలా చేయాలి? సూటిగా చెప్పాలంటే, ఆరాధన, ఇబాదత్ ఎవరి కోసం? ఆ ఇబాదత్ ఎలా చేయాలి? రెండే రెండు విషయాలు. దీనికి సూటిగా చెప్పాలంటే చక్కని సమాధానం: ఆరాధన కేవలం అల్లాహ్ కొరకు మరియు ఆ ఆరాధన అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపిన విధానం ప్రకారమే.

అభిమాన సోదరులారా! కావున ఈ ధర్మ సమ్మతం కాని విషయాలలో, ధర్మ సమ్మతం కాని వసీలాలలో ఉదాహరణకు ఒకటి ఏమిటి? మృతులను దుఆ చేయమని కోరటం. మృతులను, పరమపదించిన వారిని దుఆ చేయమని కోరటం, వారిని వసీలాగా తీసుకోవటం, వాస్తాగా తీసుకోవటం, ఇది ఇస్లాంలో అధర్మం అని మనం తెలుసుకోవాలి.

అది ఎవరైనా సరే, పుణ్య పురుషులు కావచ్చు, ఔలియాలు కావచ్చు, అలాగే దైవ ప్రవక్తలు కూడా కావచ్చు. ఎవరైనా సరే, మరణించిన వారి సహాయం కోరటం, వారి వసీలాను కోరటం, వారి వసీలా ద్వారా దుఆ చేయటం ఇది ఇస్లాంలో సమ్మతం కాదు. ఎందుకంటే, ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు త’ఆలా అన్హు – ఇది ప్రామాణికమైన హదీస్, అనేక హదీస్ గ్రంథాలలో ఈ హదీస్ ఉంది, సహీహ్ హదీస్ ఇది, ప్రామాణికమైన హదీస్ ఇది.

ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు త’ఆలా అన్హు, ముఆవియా బిన్ అబూ సుఫ్యాన్ రదియల్లాహు అన్హులు వారు గానీ, ఇతర సహాబాలు గానీ, తాబయీన్లు గానీ, కరువు కాటకాలు వచ్చినప్పుడు, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పరమపదించిన తర్వాత వారి ద్వారా దుఆ చేయలేదు, వారి వసీలా తీసుకోలేదు. ఇది ముఖ్యమైన విషయం, గమనించాల్సిన విషయం ఇది. మనకంటే ఎక్కువ జ్ఞానం గలవారు, మనకంటే ఎక్కువ ఖురాన్, హదీస్ తెలిసినవారు, మనకంటే ఎక్కువ అల్లాహ్‌కు భయపడేవారు, మనకంటే ఎక్కువ దైవభీతి కలిగినవారు, మనకంటే ఎక్కువ అల్లాహ్‌ను ఆరాధించేవారు, మనకంటే ఎక్కువ ధర్మ జ్ఞానం కలిగినవారు, సహాబాలు, తాబయీన్లు, ధర్మ పండితులు, ముహద్దసీన్లు, వారు కరువు కాటకాలు వచ్చినప్పుడు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను వసీలాగా తీసుకున్నారా? తీసుకోలేదు.

ఇంకా, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉన్నంత కాలం, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా దుఆ చేసేవారు. పోయి, “ఓ దైవ ప్రవక్త! కరువు వచ్చింది, వర్షం లేదు, నీరు వలన మనుషులు, జంతువులు ఇబ్బందులు పడుతున్నారు. ఓ దైవ ప్రవక్త, దుఆ చేయండి” అని కోరేవారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దుఆ చేసేవారు. ఇది మనం గత ఎపిసోడ్లో తెలుసుకున్నాం.

కాకపోతే, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పరమపదించిన తర్వాత సహాబాలు, ఆ తర్వాత కాలానికి చెందిన వారు, వారెవరైనా ప్రవక్తల, మృతుల, చనిపోయిన పుణ్యాత్ముల వసీలా తీసుకునేవారా? కాదు. ఒక హదీస్ ఇలా ఉంటుంది.

ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు త’ఆలా అన్హు యొక్క వేడుక: “ఓ అల్లాహ్! గతంలో మేము మా ప్రవక్త ద్వారా నిన్ను అర్థించే వారము, నీవు వర్షం కురిపించి మా కరువు తీర్చే వాడివి. ఇప్పుడు మేము మా ప్రవక్త బాబాయి గారిని ఆశ్రయించి నిన్ను ప్రార్థిస్తున్నాము. కనుక మాపై వర్షం కురిపించు” అని ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు ప్రార్థించేవారు.

దీంట్లో స్పష్టంగా ఏముంది? స్పష్టంగా ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు తెలియజేస్తున్నారు. “ఓ అల్లాహ్, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉన్నంత వరకు ప్రవక్త ద్వారా నిన్ను అర్థించే వారము.” అంటే ఇప్పుడు మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం లేరు కాబట్టి, పరమపదించారు కాబట్టి, ఇప్పుడు మనము ప్రవక్త గారి బాబాయి అయిన, పినతండ్రి అయిన అబ్బాస్ రదియల్లాహు అన్హు గారిని ఆశ్రయించి, అబ్బాస్ గారి ద్వారా నిన్ను వేడుకుంటున్నాము, ప్రార్థిస్తున్నాము. ఎందుకంటే అప్పుడు అబ్బాస్ రదియల్లాహు త’ఆలా అన్హు బ్రతికి ఉన్నారు. ఇది గమనించాల్సిన విషయం.

అంటే దీని సారాంశం ఏమిటి అభిమాన సోదరులారా? అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బ్రతికి ఉన్నంత వరకు సహాబాలు ప్రవక్త ద్వారా ప్రార్థించేవారు. ఆయన పరమపదించిన తర్వాత కరువు వస్తే, ప్రవక్తగారి పినతండ్రి అబ్బాస్ రదియల్లాహు అన్హు ద్వారా దుఆ చేసేవారు. దీనితో అర్థం ఏమైందంటే, చనిపోయిన వారి ద్వారా దుఆ చేయకూడదు. వారిని వసీలాగా తీసుకోకూడదు. ఎవరైతే పుణ్యాత్ములు, దైవభీతిపరులు, తఖ్వా గలవారు బ్రతికి ఉన్నారో, వారి ద్వారా దుఆ చేయవచ్చుమని మనకు అర్థమవుతుంది.

అలాగే, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంతస్తు, వేరే ఇతరుల అంతస్తులను వసీలాగా కూడా చేసుకోకూడదు. ప్రవక్త గారి అంతస్తును, ఇతర వారి అంతస్తులను కూడా ఆసరాగా చేసుకోకూడదు, వసీలాగా చేసుకోకూడదు. ఒక్క హదీస్ ఉంది, ఆ హదీస్ కి కొందరు ఆధారంగా తీసుకుంటారు, అది సమంజసం కాదు. ఆ హదీస్ ఏమిటంటే:

“ఇదా సఅల్తుముల్లాహ ఫస్ అలూహు బిజాహీ, ఫ ఇన్న జాహీ ఇందల్లాహి అజీమ్”.

ఈ హదీస్, దీని అర్థం ఏమిటి? “మీరు అల్లాహ్ ను అడిగితే నా హోదాను, అంతస్తులను ఆసరాగా చేసుకుని అడగండి, ఎందుకంటే నా స్థాయి చాలా గొప్పది” అని ఇది ఆ ఒక ఉల్లేఖనం ఉంది. ఇది కాల్పనిక హదీస్, ‘మౌజూ’, ‘మన్ ఘడత్’. ఇది కాల్పనిక హదీస్, సత్యం లేశమైనా దీంట్లో లేదు అని గ్రహించాలి. ఈ హదీస్‌ను ఆధారంగా తీసుకోవటం కరెక్ట్ కాదు, సమ్మతం కాదు, న్యాయం కాదు. ఎందుకంటే ఇది ‘మౌజూ’, ‘మన్ ఘడత్’ హదీస్ ఇది.

అలాగే, సృష్టితాలలో ఏ ఒక్కరి అస్తిత్వాన్నైనా ఆధారంగా చేసుకోవటం ధర్మ సమ్మతం కాదు. ఎందుకంటే, ఎటువంటి ఆధారాలు ఖురాన్ లో గానీ, ప్రామాణికమైన హదీసులలో గానీ లేవు.

అభిమాన సోదరులారా! అలాగే సృష్టితాలను సహాయం చేయమని కోరటం రెండు రకాలు. ఒకటి ఇస్తిఆనత్, ఇది సమ్మతమే. ఇస్తిఆనత్ అంటే ఏమిటి? ఏదైనీ వ్యవహారములో సహాయం కోరటం. ఉదాహరణకు స్నేహితులు, అమ్మ నాన్న, భార్య, భర్త, సంతానము, పిల్లలు… బ్రతికి ఉన్నారు, వారితో మనం జీవిస్తున్నాము, ఒకరికొకరు సహాయం చేసుకోవటం, ఇచ్చు పుచ్చుకోవటం. ఇది సమ్మతమే. ఇంకా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్ లో ఇలా తెలియజేశాడు:

وَتَعَاوَنُوا عَلَى الْبِرِّ وَالتَّقْوَى
(వ తఆవనూ అలల్ బిర్రి వత్తఖ్వా)
పుణ్యకార్యాలలో, దైవభీతితో కూడిన విషయాలలో పరస్పరం సహకరించుకోండి. (సూరె మాయిదా: 2)

ఒకరి సహాయం కోరటము, “నాకు ఈ పని చేసి పెట్టండి, ఫలానా వస్తువు తీసుకొని రండి, ఇది వారికి ఇచ్చివేయండి”, అంటే ఇది ఇస్తిఆనత్. పరస్పరం ఇటువంటి విషయాలలో సహాయం చేసుకోవచ్చు. ఇది దాంట్లో రాదు.

సృష్టితాల సహాయంలో రెండవది ఏమిటి? ఇస్తిగాసా. ఇస్తిగాసా అంటే, అల్లాహ్ మాత్రమే చేయగలిగే పనులను, అల్లాహ్ మాత్రమే చేయగలిగే విషయాలను మృతులను కోరటం. ఏ పని అయితే అల్లాహ్ మాత్రమే చేస్తాడో, ఏది అయితే అల్లాహ్‌కు మాత్రమే సాధ్యమో, అటువంటివి సృష్టితాలతో కోరటం, ఇది కూడా అధర్మం కిందకి వస్తుంది. కేవలం అల్లాహ్‌కు సాధ్యమైన విషయాల కొరకు, బ్రతికి ఉన్న వారిని అర్థించటం ఇది కూడా ధర్మ సమ్మతం కాదు.

అభిమాన సోదరులారా! నా ఈ ప్రసంగానికి సారాంశం ఏమిటంటే, వసీలా రెండు రకాలు: ధర్మ సమ్మతం – గత ఎపిసోడ్లో తెలుసుకున్నాం. రెండవది అధర్మమైన వసీలా, అంటే మృతులను దుఆ చేయమని కోరటం, దైవ ప్రవక్త అంతస్తు లేదా ఇతరుల, పుణ్యాత్ముల అంతస్తులను వసీలాగా చేసుకోవటం, చనిపోయిన వారిని సహాయం కోరటం, ఇవన్నీ అధర్మమైన వసీలా. ఇది ఇస్లాం ధర్మంలో ముమ్మాటికీ కరెక్ట్ కాదు, నిషిద్ధము, ఇది తప్పు, అధర్మం, అన్యాయం, పాపం.

ఇక సహాయం వస్తే ఇది రెండు రకాలు. ఇస్తిఆనత్, పరస్పరం సహాయం చేసుకోవటం, వ్యవహారంలో ఏమైనా వస్తువులలో, లావాదేవీల్లో, తినే తాగే విషయాలలో ఇది ధర్మ సమ్మతమే. కాకపోతే ఇస్తిగాసా, ఏదైతే అల్లాహ్ మాత్రమే చేయగలుగుతాడో, కేవలం అల్లాహ్‌కు మాత్రమే సాధ్యమైన విషయాల కొరకు సృష్టితలతో కోరటం, ఇది అధర్మమైన వసీలాగా పరిగణిస్తుంది.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరికీ ఖురాన్ మరియు ప్రామాణికమైన హదీసుల పరంగా జీవించే సద్బుద్ధిని ప్రసాదించు గాక. ఆమీన్.

وَآخِرُ دَعْوَانَا أَنِ الْحَمْدُ لِلّٰهِ رَبِّ الْعَالَمِيْنَ، اَلسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ
(వ ఆఖిరు ద’అవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు)
“సర్వలోకాల ప్రభువైన అల్లాహ్‌కే సర్వస్తోత్రాలు” అన్నదే మా చివరి మాట. మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=43148

వసీలా , తవస్సుల్

తౌహీద్ & షిర్క్ (మెయిన్ పేజీ):
https://teluguislam.net/tawheed-shirk/


విశ్వాసం మరియు దాని గుణాలు – అబూబక్ర్ బేగ్ ఉమ్రీ [వీడియో & టెక్స్ట్]

విశ్వాసం మరియు దాని గుణాలు – అబూబక్ర్ బేగ్ ఉమ్రీ [వీడియో]
https://youtu.be/-OimV2FLPqw [63 నిముషాలు]

విశ్వాసంలో మాధుర్యాన్ని, తీపిని ఆస్వాదించాలన్న కోరిక మీకు ఉందా ? అయితే తప్పనిసరిగా ఈ మంచి వీడియో చూడండి మరియు మీ బంధుమిత్రులకు షేర్ చెయ్యండి, ఇన్ షా అల్లాహ్

తప్పకుండ వినాల్సిన వీడియో, డోంట్ మిస్, ఏకాంతంలో డిస్టర్బన్స్ లేకుండా ఏకాగ్రతగా వింటే, సంపూర్ణ లాభం పొందవచ్చు

ఈ ప్రసంగం ఇస్లాం ధర్మంలోని ‘ఈమాన్’ (విశ్వాసం) యొక్క ప్రాముఖ్యత మరియు దాని స్వభావాన్ని వివరిస్తుంది. అల్లాహ్ ఖురాన్‌లో విశ్వాసులను ఉద్దేశించి మళ్ళీ విశ్వసించమని కోరడంలోని అంతరార్థాన్ని, విశ్వాసం అనేది హృదయంలో స్థిరపడాల్సిన విషయమని వక్త వివరించారు. అబూ సుఫ్యాన్ మరియు హిరాక్లియస్ మధ్య జరిగిన సంభాషణ ద్వారా నిజమైన విశ్వాసం హృదయంలో చేరిన తర్వాత అది ఎప్పటికీ తొలగిపోదని తెలిపారు. ఉమర్ బిన్ ఖత్తాబ్ (రజిఅల్లాహు అన్హు) మరియు హంజలా (రజిఅల్లాహు అన్హు) వంటి సహాబాల జీవిత సంఘటనల ద్వారా ఈమాన్ యొక్క స్థాయిలను, అది పెరగడం మరియు తరగడం వంటి లక్షణాలను వివరించారు. చివరగా, ఈమాన్ యొక్క మాధుర్యాన్ని రుచి చూడటానికి అవసరమైన మూడు ముఖ్యమైన లక్షణాలను – అల్లాహ్ మరియు ప్రవక్తను అత్యధికంగా ప్రేమించడం, అల్లాహ్ కోసమే ఎవరినైనా ఇష్టపడటం, మరియు అవిశ్వాసాన్ని అసహ్యించుకోవడం – గురించి వివరిస్తూ ప్రసంగాన్ని ముగించారు.


అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు. అల్ హందులిల్లాహ్,

బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్.

అన్ని రకాల పొగడ్తలు, ప్రశంసలు, సకల ఆరాధనలు ఆ అల్లాహ్ కే అంకితము. ఎవరైతే ఈ సమస్త సృష్టిని సృష్టించి, తన అధికార పీఠాన్ని అధిష్టించి, ఆయన సృష్టించినటువంటి సృష్టరాశులన్నింటిలో కల్లా ఉన్నతమైనటువంటి జీవిగా మానవుడిని మలచాడు. మరియు వారి వైపునకు సందేశాన్ని ఇచ్చేటటువంటి ఉద్దేశంతో ప్రవక్తల యొక్క పరంపరను ప్రారంభించాడు. ఈ ప్రవక్తల యొక్క పరంపర హజ్రతే ఆదమ్ (అలైహిస్సలాం) నుంచి మొదలుకొని చిట్టచివరి ప్రవక్త, మహనీయుడైనటువంటి ప్రవక్త, ఆదర్శ మహామూర్తి, కారుణ్యమూర్తి, హృదయాల విజేత, జనాబే ముస్తఫా, అహ్మదే ముజ్తబా, ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారిపై అల్లాహ్ యొక్క కోటానుకోట్ల దరూద్ లు మరియు సలాములు, శుభాలు మరియు కారుణ్యాలు కురిపింపజేయుగాక. ఆమీన్.

సోదరీ సోదర మహాశయులారా! అల్లాహ్ యొక్క దయ మరియు ఆయన కారుణ్యంతో ఈరోజు మర్కజ్ మస్జిదే ఇబాదుర్రహ్మాన్ లో ధార్మిక శిక్షణ తరగతులు నిర్వహించాలనేటటువంటి ఉద్దేశంతో నిర్వహించబడినటువంటి ఈ సభకు హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తున్నాను.

అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఖురాన్ గ్రంథంలో విశ్వాసులను సంబోధిస్తూ 4వ సూరా, సూరా నిసా, 136వ వాక్యంలో అంటున్నాడు:

يا أَيُّهَا الَّذينَ آمَنوا آمِنوا بِاللَّهِ وَرَسولِهِ وَالكِتابِ الَّذي نَزَّلَ عَلى رَسولِهِ وَالكِتابِ الَّذي أَنزَلَ مِن قَبْلُ وَمَن يَكفُر بِاللَّهِ وَمَلائِكَتِهِ وَكُتُبِهِ وَرُسُلِهِ وَاليَومِ الآخِرِ فَقَد ضَلَّ ضَلالًا بَعيدًا

(యా అయ్యుహల్లజీన ఆమనూ ఆమినూ బిల్లాహి వ రసూలిహి వల్ కితాబిల్లజీ నజ్జల అలా రసూలిహి వల్ కితాబిల్లజీ అంజల మిన్ ఖబ్ల్, వ మన్ యక్ఫుర్ బిల్లాహి వ మలాయికతిహి వ కుతుబిహి వ రుసులిహి వల్ యౌమిల్ ఆఖిరి ఫఖద్ జల్ల జలాలమ్ బయీదా)

ఓ విశ్వసించిన వారులారా! అల్లాహ్‌ను, ఆయన ప్రవక్తను, ఆయన తన ప్రవక్తపై అవతరింపజేసిన గ్రంథాన్ని మరియు అంతకుముందు ఆయన అవతరింపజేసిన గ్రంథాలను విశ్వసించండి. అల్లాహ్‌ను, ఆయన దూతలను, ఆయన గ్రంథాలను, ఆయన ప్రవక్తలను మరియు అంతిమ దినాన్ని తిరస్కరించినవాడు మార్గభ్రష్టత్వంలో చాలా దూరం వెళ్ళిపోయాడు. (4:136)

ఇక్కడ అల్లాహ్ ఎవరితో సందేశం ఇస్తున్నాడండి? విశ్వాసులతో సందేశం ఇస్తున్నాడు. ఏమని ఆదేశించాడు? “విశ్వసించండి అల్లాహ్ ను, ఆయన ప్రవక్తను, ఆ ప్రవక్తపై అవతరింపజేయబడినటువంటి గ్రంథాన్ని” అని. నా ప్రశ్న ఏంటంటే అల్లాహ్ ఆదేశిస్తున్నది విశ్వాసులనైతే, తిరిగి ఎందుకు వారిని విశ్వసించండి అని అన్నాడు? అల్లాహ్ ను, ప్రవక్తను, ప్రవక్తపై అవతరించినటువంటి గ్రంథాన్ని. ఒకవేళ వాళ్ళు విశ్వాసులు కాకపోతే ‘ఓ విశ్వసించిన ప్రజలారా’ అని ఎందుకు పలకబడింది? ఆలోచించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అండి.

దాని గురించి మనం తెలుసుకునే ముందు ఇన్ షా అల్లాహ్, ఈ సభ కార్యక్రమం ముగించే లోపు దీని యొక్క జవాబు మీ నోటి ద్వారానే ఇన్ షా అల్లాహ్ విందాం. నబీ కరీం (సల్లల్లాహు అలైహి వసల్లం) వారికి బద్ధ శత్రువు మక్కా ఖురైష్ యొక్క నాయకుడు అబూ సుఫ్యాన్. ఈ అబూ సుఫ్యాన్ హిరాక్లియస్ అనేటటువంటి ఒక రాజుతో కలిశాడు. అతన్ని ఇంగ్లీష్ లో హెర్క్యులియస్ అని అంటూ ఉంటారు. ఈ హెర్క్యులియస్ రాజుతో కలిసినటువంటి సంఘటన సహీ అల్ బుఖారీ లో ఉంది. ఇందులో అబూ సుఫ్యాన్ ని హెర్క్యులియస్ రాజు ప్రశ్నిస్తున్నాడు. ఏమని ప్రశ్నిస్తున్నాడంటే: “ఇస్లాం లో ప్రవేశించిన తర్వాత ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవక్తను విశ్వసించిన తర్వాత, ఆయన అనుచర సమాజంలో ఏ ఒక్కడైనా ఇస్లాం లోకి ప్రవేశించిన తర్వాత, ఆయన ధర్మము నుంచి వైదొలగిపోయినవాడు, ధర్మ భ్రష్టతకు గురైనటువంటి వాడు, అవిశ్వాసపు పనికి పాల్పడినటువంటి వాడు ఎవరైనా ఉన్నారా?” అని అడుగుతున్నాడు.

అబూ సుఫ్యాన్ ముస్లింలకు బద్ధ శత్రువు, కావాలనుకుంటే అబద్ధం చెప్పొచ్చు. లేదు, ఆయన ఏం చెప్పాడంటే: “వారిలో ఏ ఒక్కడు విశ్వసించిన తర్వాత అవిశ్వాసానికి పాల్పడలేదు.” ఆ సమయంలో హిరాక్లియస్ చెప్పినటువంటి మాట, వాస్తవానికి విశ్వాసం అంటే అదే, ఒక్కసారి అది మనిషి హృదయంలో ప్రవేశిస్తే దాన్ని తీయడం ఎవరి వల్ల కాదు. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకున్నటువంటి విషయం ఏమిటంటే, విశ్వాసం అనే దాని ఆనవాళ్లు, దాని యొక్క లక్షణం ఏమిటి సోదర మహాశయులారా? అది ఎలా ఉంటుందంట? ఒక్కసారి గనుక అది మనిషి యొక్క హృదయంలో గనుక ప్రవేశిస్తే దానిని తీసివేయడం ఎవరి వల్ల కాదు.

అలాగే విశ్వాసం అన్నటువంటిది ప్రతి ఒక్కరిదీ ఒక్కో విధంగా ఉంటుంది. అందరి విశ్వాసము కూడా ఒకే స్కేల్ లో ఉండదు. హజ్రతే ఉమర్ ఇబ్నుల్ ఖత్తాబ్ (రజిఅల్లాహు అన్హు) గారి గురించి మహనీయ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు అంటున్నారు: “నేను కలలో చూశాను, స్వర్గంలో హజ్రతే ఉమర్ ఇబ్నుల్ ఖత్తాబ్ (రజిఅల్లాహు అన్హు) గారు తెల్లటి పొడవాటి వస్త్రాలు వేసుకొని తిరుగుతుండగా నేను చూశాను” అని అన్నారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి సహాబాలు అడిగారు: “ప్రవక్త! పొడవాటి వస్త్రాలు ధరించకూడదని మీరు అంటారు, ఉమర్ గారు స్వర్గంలో వేసుకొని తిరుగుతున్నారు, అక్కడ ఏదైనా రూల్స్ మారాయా?” అని అడిగారు. నబీ కరీం (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు అన్నారు: “లేదు, నాకు కలలో ఏదైతే స్వర్గంలో చూపించబడిందో, అది ఏదైతే పొడవాటి దుస్తులు తెల్లటి వెలుగు విరజిమ్ముతున్నటువంటి దుస్తులు, ఆయన విశ్వాసాన్ని దుస్తులతో పోల్చబడింది” అని అన్నారు మహనీయ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం). అంటే హజ్రతే ఉమర్ ఇబ్నుల్ ఖత్తాబ్ (రజిఅల్లాహు అన్హు) ఆయన విశ్వాసం ఎలాంటిదంటే సోదర మహాశయులారా, స్వర్గవాసులందరిలో కన్నా అత్యంత ఎక్కువ పొడవాటి తెల్లటి వెలుగుతో విరజిమ్ముతున్నటువంటి వస్త్రాలను చూశానంటే, ఇక్కడ విశ్వాసాన్ని ఆ వస్త్రాలతో పోల్చి అందరి కంటే ఎక్కువ విశ్వాసం ఉమర్ ది ఉండటాన్ని ఇక్కడ అల్లాహ్ తాలా యొక్క ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు తెలియజేస్తున్నారు.

ఆ ఉమర్, ఏ ఉమర్ గురించి అయితే ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు స్వయానా శుభవార్తని ఇచ్చారో: “నా తర్వాత ప్రవక్త పదవి అనేది అంతమొందించబడింది, ఒకవేళ మిగిలి ఉండి ఉంటే నా తర్వాత ఆ ప్రవక్త పదవికి అర్హుడు ఉమర్ అయ్యేవాడు. కానీ నా తర్వాత ప్రవక్త ఎవరూ రారు, నేను ప్రవక్తల యొక్క పరంపరను పరిసమాప్తి గావించినటువంటి వాడిని” అని అన్నారు. ఆ ఉమర్ మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి దగ్గర ముందు కూర్చొని ఉన్నాడు. నబీ కరీం (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు అన్నారు: “మీలో ఏ ఒక్కడు అప్పటి వరకు విశ్వాసి కాలేడు, ఎప్పటి వరకు అయితే నన్ను ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారిని మీ తల్లిదండ్రుల కన్నా, మీ ఆలుబిడ్డల కన్నా, మీ అందరి కన్నా కూడా ఎక్కువగా ప్రేమించనంత వరకు మీరు విశ్వాసులు కాలేరు” అని అన్నారు. ఉమర్ (రజిఅల్లాహు అన్హు) గారు అడిగారు: “ప్రవక్త! మీరు పలికినటువంటి మాట ప్రకారం నేను మిమ్మల్ని నా భార్య పిల్లల కన్నా, నా తల్లిదండ్రుల కన్నా ఎక్కువగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, కానీ నా ప్రాణం కన్నా, నా నఫ్స్ కన్నా ఎక్కువ కాదు ప్రవక్త” అని అన్నారు. “యా ఉమర్! లస్త మూమినా” – “ఓ ఉమర్! నువ్వు విశ్వాసివి కావు” అని అన్నారు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం). హజ్రతే ఉమర్ ఫారూఖ్ (రజిఅల్లాహు అన్హు) వారు అన్నారు: “ప్రవక్త! అయితే నేను మిమ్మల్ని నా ప్రాణం కంటే అధికంగా ప్రేమిస్తున్నాను ప్రవక్త.” ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు అన్నారు: “అల్ ఆన యా ఉమర్” – “ఉమర్! ఇప్పుడు నువ్వు విశ్వాసివయ్యావు.”

సోదర మహాశయులారా! హజ్రతే ఉమర్ ఫారూఖ్ (రజిఅల్లాహు అన్హు) గారి యొక్క విశ్వాసం గురించి మహనీయ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు చెప్పినటువంటి మాటలు మనం విన్నాం. 14వ సూరా, సూరా ఇబ్రాహీం, 46వ వాక్యం ఒకసారి చదవండి సోదరులారా. అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఇందులో ఇలా అంటున్నాడు:

وَقَد مَكَروا مَكرَهُم وَعِندَ اللَّهِ مَكرُهُم وَإِن كانَ مَكرُهُم لِتَزولَ مِنهُ الجِبالُ
(వ ఖద్ మకరూ మక్రహుమ్ వ ఇందల్లాహి మక్రుహుమ్, వ ఇన్ కాన మక్రుహుమ్ లితజూల మిన్హుల్ జిబాల్)

వారు తమ ఎత్తుగడలను వేసి చూసుకున్నారు. వారి ఎత్తుగడలన్నీ అల్లాహ్ దృష్టిలో ఉన్నాయి. వారి ఎత్తుగడలు పర్వతాలను కదిలించేటంతటి భీకరమైనవేమీ కావు. (14:46)

అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఇక్కడ సహాబాల విశ్వాసాలను కొండలతో పోల్చాడు. వారిపై ఏవైతే కుట్రలు పన్నటం జరిగిందో, అటువంటి కుట్రలే గనుక పన్ని ఉంటే పర్వతాలు కొండలు సైతం కూడా అవి తమ ప్రదేశం నుంచి కదిలిపోయేవేమో కానీ, సహాబాలు కొండల్లా నిలబడిపోయారు, వారి విశ్వాసంలో మార్పు రాలేదని అల్లాహ్ అంటున్నాడు. “ఉలాయికల్లజీనమ్ తహనల్లాహు ఖులూబహుమ్ లిత్తఖ్వా లహుమ్ మగ్ఫిరతున్ వ అజ్రున్ అజీమ్” (49:3) – అలాంటి వారి హృదయాలను అల్లాహ్ భయభక్తుల కొరకు పరీక్షించి ఉన్నాడు, వారికి క్షమాపణ మరియు గొప్ప ప్రతిఫలం ఉంటాయి. కాబట్టి సోదర మహాశయులారా, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా అన్నటువంటి వాక్యం, మళ్ళీ ఆ వాక్యం వైపునకు వద్దాము, 4వ సూరా సూరా నిసా 136వ వాక్యం.

సోదర మహాశయులారా! మహనీయ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు అంటున్నారు:

إِنَّ الْإِيمَانَ لَيَخْلَقُ فِي جَوْفِ أَحَدِكُمْ كَمَا يَخْلَقُ الثَّوْبُ فَاسْأَلُوا اللَّهَ تَعَالَى أَنْ يُجَدِّدَ الْإِيمَانَ فِي قُلُوبِكُمْ

(ఇన్ నల్ ఈమాన ల యఖ్లకు ఫీ జౌఫి అహదికుమ్ కమా యఖ్లకుస్ సౌబు ఫస్ ఆలల్లాహ త’ఆలా అన్ యుజద్దిదల్ ఈమాన ఫీ ఖులూబికుమ్)

“విశ్వాసం అన్నది ఎలాగైతే మీరు మీ యొక్క శరీరాలపై ధరించేటటువంటి దుస్తులు మాసిపోతూ ఉంటాయో, అలాగే విశ్వాసము కూడా మాసిపోతూ ఉంటుంది. కాబట్టి మీరు అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా తో దువా చేయండి, అల్లాహ్ మీ విశ్వాసాలను పునరుద్ధరింపజేయాలని.”

కాబట్టి ఇక్కడ ఒక సిద్ధాంతం మనకు తెలుస్తుంది, అదేమిటంటే సోదర మహాశయులారా: “అల్ ఈమాను యజీదు బిత్ తా అ వ యన్ ఖుసు బిల్ మాసియా” – అంటే విశ్వాసము పెరుగుతుంది మరియు విశ్వాసము తరుగుతుంది. విశ్వాసం ఎప్పుడు పెరుగుతుందండి? ఎప్పుడైతే మనిషి మంచి పనులు చేస్తాడో అప్పుడు విశ్వాసం పెరుగుతుంది, ఎప్పుడైతే మనిషి చెడు కర్మలు చేస్తాడో అప్పుడు విశ్వాసం తగ్గిపోతుంది. అల్లాహ్ అంటున్నాడు ఖురాన్ గ్రంథంలో: “ఇన్నమల్ ముమినూనల్లజీన ఇజా జుకిరల్లాహు వజిలత్ ఖులూబుహుమ్ వ ఇజా తులియత్ అలైహిమ్ ఆయాతుహు జాదత్ హుమ్ ఈమానా” (8:2) – విశ్వాసుల ముందు అల్లాహ్ యొక్క ప్రస్తావన వచ్చినప్పుడు అల్లాహ్ వారి హృదయాలు ప్రకంపిస్తాయి మరియు వారిపై ఎప్పుడైతే ఖురాన్ వాక్యాలు చదివి వినిపించబడతాయో ఆ సమయంలో వారి విశ్వాసం పెరుగుతుంది.

అలాగే నబీ కరీం (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు అంటున్నారు: “ఏ వ్యభిచారం చేసేటటువంటి వాడు వ్యభిచారం చేస్తాడో ఆ సమయంలో అతనిలో విశ్వాసం ఉండదు, తొలగిపోతుంది. ఎప్పుడైతే ఒక వ్యక్తి మద్యాన్ని సేవిస్తాడో ఆ సమయంలో అతనిలో విశ్వాసం ఉండదు, ఎప్పుడైతే ఒక వ్యక్తి దొంగతనము చేస్తాడో ఆ సమయంలో అతనిలో విశ్వాసం ఉండదు.” కాబట్టి ఈ హదీసు ద్వారా మనం తెలుసుకున్న విషయం ఏమిటంటే వ్యభిచరించేటటువంటి వాడు, అలాగే దొంగతనం చేసేటటువంటి వాడు, మద్యపానాన్ని సేవించేటటువంటి వాడు ఈ మూడు పనులు హరామ్ నిషేధించబడినటువంటి పనులు చేస్తున్నప్పుడు అతనిలో విశ్వాసము కోల్పోతాడు, తిరిగి ఎప్పుడైతే తోబా చేసుకుంటాడో అప్పుడే విశ్వాసాన్ని పొందుతాడు.

సహీ ముస్లిం లో హజ్రతే హంజలా (రజిఅల్లాహు అన్హు) గారి యొక్క ఒక సంఘటన మన ముందుకు వస్తుంది. ఎవరు ఈయన? హజ్రతే హంజలా. ఆ హంజలా ఎవరైతే వివాహం చేసుకున్నాడు, వివాహము చేసుకున్నటువంటి మొదటి రాత్రి తన భార్య దగ్గర ఉన్న సమయంలో ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి పిలుపు వినబడింది. వెళ్ళాడు, బయలుదేరాడు, ఉదయం అయ్యేపాటికి చనిపోయి షహదత్ పొందిన వారిలో ఇతని శవం కూడా బయటపడింది. నబీ కరీం (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు అన్నారు: “హంజలా గసీలుల్ మలాయిక” – హంజలా (రజిఅల్లాహు అన్హు) దైవదూతలచే గుసల్ స్నానం చేయించబడినటువంటి వాడు.

అటువంటి హంజలా ఒకరోజు అబూబక్ర్ (రజిఅల్లాహు అన్హు) గారి దగ్గరికి వెళ్లారు. అబూబక్ర్ అడిగారు “ఎలా ఉన్నావు హంజలా?” అని. హంజలా (రజిఅల్లాహు అన్హు) గారు అన్నారు: “నాఫఖ హంజలా” – హంజలా మునాఫిక్ అయిపోయాడు అని అన్నారు. సుబ్ హానల్లాహ్! నువ్వు మునాఫిక్ అయిపోయావా? ఇది ఎలా? హంజలా (రజిఅల్లాహు అన్హు) గారు అన్నారు: “మనం ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి దగ్గర ఉన్నప్పుడు ఆయన ముందు కూర్చొని ఉన్నప్పుడు ఆయన స్వర్గము మరియు నరకము గురించి ప్రస్తావన చేస్తూ ఉంటే మా విశ్వాసం ఉప్పొంగేది, మా గడ్డాలు తడిచిపోయేవి, మా కళ్ళ నుంచి కన్నీళ్లు కారేవి. కానీ ఎప్పుడైతే మేము ఇక్కడి నుంచి లేచి వెళ్ళిపోతున్నామో, మా భార్య పిల్లల విషయాల్లో, మా కుటుంబం యొక్క విషయాల్లో పడిపోయి ఆయన చెప్పిందంతా మరిచిపోయేటటువంటి వాళ్ళము. అందుకని నేను కపట విశ్వాసిని అయిపోయాను” అన్నాడు.

అబూబక్ర్ (రజిఅల్లాహు అన్హు) గారు విన్నారు: “నా పరిస్థితి కూడా ఇలాగే ఉందే!” అని ఇద్దరు కలిసి ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి దగ్గరికి వెళ్లారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు అన్నారు: “హంజలా! ఒకవేళ ఏ విధంగానైతే నా ముందు మీరు కూర్చున్నప్పుడు మీ పరిస్థితి ఉంటుందో, ఇలాగే గనుక మీరు సంపూర్ణంగా శాశ్వతంగా ఎల్లావేళలా ఇలాగే ఉండగలిగితే – అంటే దాని అర్థం ఏంటంటే ఉండటం ఎవరి వల్ల కానీ పని – ఒకవేళ మీరు ఇలా గనుక ఉండగలిగితే దైవదూతలు ఆకాశం నుంచి దిగి మీకు మీరు నడిచే మార్గాలలో మీరు పరుండే పడకలపై మీకు ముసాఫా కరచాలనం చేయడానికి దిగేవారు. ఓ హంజలా! కానీ విశ్వాసం అంటే అదే, ఒక్కొక్కసారి మనము విశ్వాసము పెరుగుతుండటాన్ని మనము అనుభవిస్తాము.” సోదర మహాశయులారా, ఉదాహరణకు చూసుకోండి ఇప్పుడు రంజాన్ నెల రానున్నది, రంజాన్ నెల వచ్చేస్తే మన విశ్వాసం ఎంతలా పెరుగుతుందో!

సహీ ముస్లిం లో అబ్బాస్ బిన్ అబ్దుల్ ముతలిబ్ (రజిఅల్లాహు అన్హు) ఉల్లేఖిస్తున్నారు: దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు అన్నారు: “జాఖ తామల్ ఈమాన్ మన్ రజియ బిల్లాహి రబ్బన్ వ బిల్ ఇస్లామి దీనన్ వ బి ముహమ్మదిన్ రసూలా” – ఆ వ్యక్తి విశ్వాసము యొక్క మాధుర్యాన్ని రుచి చూస్తాడు ఎవరైతే అల్లాహ్ ను తన ప్రభువుగా సంతృప్త పడ్డాడో, ఇస్లాం ను ధర్మంగా సంతృప్త పడ్డాడో, ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారిని ప్రవక్తగా సంతృప్త పడ్డాడో ఆ వ్యక్తి విశ్వాసం యొక్క మాధుర్యాన్ని చూడగలడు.

విశ్వాసానికి కూడా మాధుర్యం ఉంటుంది. నబీ కరీం (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు అంటున్నారు: మూడు లక్షణాలు ఉన్నాయి, ఎవరిలోనైనా ఈ మూడు గుణాలు గనుక పెంపొందించుకోగలిగితే వారు కూడా విశ్వాసం యొక్క మాధుర్యాన్ని రుచి చూడగలరు.

  1. అల్లాహ్ మరియు ప్రవక్త అందరికంటే ఎక్కువగా ప్రేమించాలి.
  2. ఏ వ్యక్తితో స్నేహం చేసినా అల్లాహ్ కోసమే స్నేహము, అల్లాహ్ కోసమే శత్రుత్వం చేసే గుణము ఉన్నటువంటి వాడు.
  3. విశ్వసించిన తర్వాత అవిశ్వాసపు పని చేయడానికి అగ్నిలో కాల్చి వేయడం కన్నా ఎక్కువగా అయిష్టపడాలి.

“ఖుల్ ఇన్ కున్తుమ్ తుహిబ్బూనల్లాహ ఫత్తబియూనీ యుహ్ బిబ్ కుముల్లాహు వ యగ్ఫిర్ లకుమ్ జునూబకుమ్ వల్లహు గఫూరుర్రహీమ్” (3:31) – ఒక వ్యక్తి అంటున్నాడు నాకు అల్లాహ్ అంటే ప్రేమ, ప్రవక్త అంటే ప్రేమ ఎలా? వాట్సాప్ లో స్టేటస్ పెట్టుకుంటాడు. ఆ మెసేజ్ పెడుతున్నప్పుడు అజాన్ అవుతుంది, నమాజ్ కు మాత్రం రాడు. అల్లాహ్ మరియు ప్రవక్త పట్ల ప్రేమ అందరికంటే ఎక్కువగా ఉండాలి. అంటే ఎవరికంటే ఎక్కువగా ఉండాలండి? భార్య కన్నా, పిల్లల కన్నా, బంధు మిత్రుల కన్నా, మీ అవసరాల కన్నా.

అల్లాహ్ అంటున్నాడు 9వ సూరా సూరా తౌబా 24వ వాక్యంలో:

قُل إِن كانَ آباؤُكُم وَأَبناؤُكُم وَإِخوانُكُم وَأَజవాజుకుమ్ وَعَشيرَتُكُم وَأَموالٌ اقتَرَفتُموها وَتِجارَةٌ تَخشَونَ كَسادَها وَمَساكِنُ تَرضَونَها أَحَبَّ إِلَيكُم مِنَ اللَّهِ وَرَسولِهِ وَجِهادٍ في سَبيلِهِ فَتَرَبَّصوا حَتّى يَأتِيَ اللَّهُ بِأَمرِهِ وَاللَّهُ لا يَهدي القَومَ الفاسِقينَ

(ఖుల్ ఇన్ కాన ఆబాఉకుమ్ వ అబ్నాఉకుమ్ వ ఇఖ్వానుకుమ్ వ అజ్వాజుకుమ్ వ అషీరతుకుమ్ వ అమ్వాలు నిఖ్ తరఫ్ తుమూహా వ తిజారతున్ తఖ్ షౌన కసాదహా వ మసాకిను తర్జౌనహా అహబ్బ ఇలైకుమ్ మినల్లాహి వ రసూలిహి వ జిహాదిన్ ఫీ సబీలిహి ఫతరబ్బసూ హత్తా యతియల్లాహు బి అమ్రిహి, వల్లహు లా యహ్దిల్ ఖౌమల్ ఫాసిఖీన్)

“ఓ ప్రవక్త!) వారితో ఇలా అను: “ఒకవేళ మీ తండ్రులు, మీ కుమారులు, మీ సోదరులు, మీ భార్యలు, మీ సమీప బంధువులు, మీరు సంపాదించిన సిరిసంపదలు, కుంటుపడుతుందేమోనని మీరు భయపడే మీ వర్తకం, మీకు ఎంతో ప్రియమైన మీ నివాస గృహాలు – మీకు అల్లాహ్ కన్నా, ఆయన ప్రవక్త కన్నా, ఆయన మార్గంలో సాగించే పోరాటం కన్నా ఎక్కువ ప్రియమైనవైతే, అల్లాహ్ తన తీర్పును తీసుకు వచ్చేవరకు వేచి చూడండి. అల్లాహ్ అవిధేయులకు మార్గదర్శకత్వం చేయడు.” (9:24)

విశ్వసించిన తర్వాత అవిశ్వాసపు పనిని మనం చేయకూడదు. 4వ సూరా సూరా నిసా 116వ వాక్యం ఒకసారి చదవండి. అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఇందులో ఏమంటున్నాడో చూడండి:

إِنَّ اللَّهَ لا يَغفِرُ أَن يُشرَكَ بِهِ وَيَغفِرُ మా దూన జాలిక లిమన్ యషావు
(ఇన్నల్లాహ లా యగ్ఫిరు అన్ యుష్రక బిహి వ యగ్ఫిరు మా దూన జాలిక లిమన్ యషౌ)

తనకు భాగస్వాములను కల్పించటాన్ని అల్లాహ్ ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించడు. షిర్క్ మినహా తాను కోరిన వారి మిగిలిన పాపాలను క్షమిస్తాడు. (4:116)

షిర్క్ కాకుండా ఏ పాపాలైతే మీరు చేశారో, ఆయన కోరిన వారిని ఆయన క్షమిస్తాడంట. షిర్క్ ఒక్కటే మహా పాపం అని కాదు, 70 కంటే ఎక్కువ ఉన్నాయి. అలాగే సూరా అల్ హుజరాత్ (49వ సూరా) 14వ వాక్యం:

قَالَتِ الْأَعْرَابُ آمَنَّا قُلْ لَمْ تُؤْمِنُوا وَلَكِنْ قُولُوا أَسْلَمْنَا وَلَمَّا يَدْخُلِ الْإِيمَانُ فِي قُلُوبِكُمْ
(ఖాలతిల్ అఅ్రాబు ఆమన్నా, ఖుల్ లమ్ తుమినూ వలాకిన్ ఖూలూ అస్లమ్నా వలమ్మా యద్ఖులిల్ ఈమాను ఫీ ఖులూబికుమ్)

“మేము విశ్వసించాము” అని పల్లెవాసులు అంటున్నారు. “మీరు ఇంకా విశ్వసించలేదు. కావున మేము ఇస్లాంను స్వీకరించాము (ముస్లింలమయ్యాము) అని మాత్రమే అనండి. విశ్వాసం (ఈమాన్) ఇంకా మీ హృదయాలలో ప్రవేశించలేదు” అని (ఓ ప్రవక్త!) వారితో చెప్పు. (49:14)

కాబట్టి సోదర మహాశయులారా! అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా చెబుతున్నటువంటి ఈ విషయాన్ని ఆలోచించినట్లయితే, మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నిజమైనటువంటి విశ్వాసులుగా పెంపొందించుకోవాలి. అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఎప్పటి వరకు అయితే మనకి జీవితాన్ని ప్రసాదించాడో అప్పటి వరకు ఖురాన్ హదీసు పై ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించు గాక. ఎప్పుడైతే మనం మరణిస్తామో ‘లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్’ అనే కలిమా సద్వచనాన్ని పఠిస్తూ విశ్వాస స్థితిలో మరణాన్ని పొందే మహదనుగ్రహాన్ని అల్లాహ్ మనందరికీ అనుగ్రహించు గాక. ఆమీన్.

సుబ్ హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్ వ సలామున్ అలల్ ముర్సలీన్ వల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.

ఈమాన్ (విశ్వాసం) – మెయిన్ పేజీ:
https://teluguislam.net/?p=621