తౌబా మరియు ఇస్తిగ్ ఫార్ – ప్రయోజనాలు, ఫలాలు | జాదుల్ ఖతీబ్

[డౌన్ లోడ్ PDF] [29 పేజీలు]

ఖుత్బా యందలి ముఖ్యాంశాలు 

(1) ఉత్తమ అపరాధి ఎవరు?
(2) పాపభారం అనుభూతి
(3) విశ్వాసులకు తౌబా (పశ్చాత్తాపం) గురించి ఆదేశం.
(4) పశ్చాత్తాపం చెందటం దైవ ప్రవక్తల పద్ధతి.
(5) అల్లాహ్ కారుణ్యం విశాలత.
(6) పశ్చాత్తాపం స్వీకరించబడటానికి షరతులు.
(7) తౌబా, ఇస్తిగ్ ఫార్  ఫలాలు. 

ఈ రమజాన్ మన జీవితపు ఆఖరి రమజాన్ కావచ్చు

తల్హా బిన్ ఉబైదుల్లా (రదియల్లాహు అన్హు) కథనం: 

ఇద్దరు వ్యక్తులు ఒకేసారి దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సన్నిధికి వచ్చి ఇస్లాం స్వీకరించారు. తదుపరి అందులో ఒక వ్యక్తి ఎక్కువగా ఆరాధనలు చేసేవాడు, అల్లాహ్  మార్గంలో యుద్ధం చేస్తూ వీరమరణం పొందాడు. ఇక రెండో వ్యక్తి, మొదటి వ్యక్తి కన్నా తక్కువగా ఆరాధించేవాడు, మొదటి వ్యక్తి మరణించిన 1 సం॥ తర్వాత మరణించాడు. 

తల్హా (రదియల్లాహు అన్హు) కథనం:  ఈ రెండవ వ్యక్తి, వీరమరణం పొందిన మొదటి వ్యక్తి కన్నా ముందుగా స్వర్గంలో ప్రవేశించడం నేను కలలో చూశాను. మరుసటి రోజు ఉదయం ఈ కలను నేను ప్రజల ముందు ప్రస్తావించగా వీరు దీనిపై ఆశ్చర్యానికి లోనయ్యారు. దీనిపై దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా వివరించారు: “ఆ రెండవ వ్యక్తి, మొదటి వ్యక్తి మరణించాక 1 సం॥ పాటు బ్రతికి లేడా? దానిలో అతను రమజాన్ మాసాన్ని పొందాడు, దాని ఉపవాసాలు పాటించాడు మరియు 1 సం॥ పాటు నమాజులు (అదనంగా) చదివాడు. అందుకే వీరిద్దరి మధ్య (స్వర్గంలో) దూరం- భూమ్యాకాశాల మధ్య వున్న దూరమంత వుంది”. (సహీ ఉల్ జామె అస్సగీర్ లిల్ అల్బానీ : 1316) 

ఈ హదీసుపై కాస్త దృష్టి సారించండి! 

ఇద్దరు వ్యక్తులు ఒకేసారి ఇస్లాం స్వీకరించారు. అందులో మొదటి వ్యక్తి రెండవ వ్యక్తి కన్నా ఎక్కువగా ఆరాధించేవాడు మరియు వీరమరణం పొందాడు. ఇక రెండవ వ్యక్తి – మొదటి వ్యక్తి కన్నా తక్కువగా ఆరాధించేవాడు మరియు సహజ మరణం పొందాడు. మరి ఇతను మొదటి వ్యక్తి కన్నా ముందుగా స్వర్గంలోకి ఎలా ప్రవేశిచగలిగాడు? దానికి కారణం ఏమిటంటే – ఇతను మొదటి వ్యక్తి వీరమరణం పొందాక 1 సం॥ పాటు బ్రతికి వున్నాడు. ఈ వ్యవధిలో ఇతనికి రమజాన్ మాసం ప్రాప్తించింది. అందులో ఇతను ఉపవాసాలు వున్నాడు మరియు సం॥ అంతా నమాజులు చదివాడు. ఇలా, ఉపవాసాలు మరియు నమాజుల కారణంగా వీర మరణం పొందిన వాని కన్నా ముందుగా స్వర్గంలో ప్రవేశించాడు…. దీని ద్వారా రూఢీ అయిన విషయమేమిటంటే శుభప్రద రమజాన్ మాసాన్ని పొంది, దానిలో ఉపవాసాలు పాటించడం అనేది అల్లాహ్ ఇచ్చే గొప్పవరం. 

మీరు ఓ విషయం ఆలోచించండి! మన స్నేహితులలో, బంధువులలో ఎంతో మంది గత రమజాన్ మాసంలో మనతో కలిసివున్నారు. కానీ ఈ రమజాన్ మాసం రావడానికి ముందే వారు లోకం విడిచి వెళ్ళిపోయారు. వారికి ఈ శుభప్రదమాసం ప్రాప్తం కాలేదు. కానీ మనకు అల్లాహ్ – జీవితాన్ని మరియు ఆరోగ్యాన్నిచ్చి దానితోపాటు శుభప్రదమైన ఈ మాసాన్ని కూడా ప్రసాదించాడు. తద్వారా మనం చిత్త శుద్ధితో మన పాపాలకు గాను పశ్చాత్తాపం చెంది మన సృష్టికర్త, యజమాని అయిన అల్లాహ్ ను  సంతృప్తి పరచుకోవచ్చు…. మరి ఇది అల్లాహ్ మనకు ప్రసాదించిన గొప్పవరం కాదా? 

అలాగే – ఈ రమజాన్ మన జీవితపు ఆఖరి రమజాన్ కూడా కావచ్చు. మరుసటి రమజాన్ వచ్చే వరకు మనం కూడా ఈ లోకం విడిచి వెళ్ళిపోవచ్చు! అందుకే (అల్లాహ్ ప్రసాదించిన) ఈ సువర్ణావకాశాన్ని సద్వినియోగ పరుచుకొని దాని శుభాలను ప్రోగు చేసుకోవడానికి ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూ వుండాలి. 

ఈ పోస్ట్ క్రింది ఖుత్బా నుండి తీసుకోబడింది:
శుభప్రద రమజాన్ మాసం – పుణ్యాల వసంతం | జాదుల్ ఖతీబ్

దివ్య ఖుర్ఆన్ మహత్యాలు | జాదుల్ ఖతీబ్

[డౌన్ లోడ్ ఖుత్బా PDF] [26 పేజీలు]

ఖుత్బాయందలి ముఖ్యాంశాలు 

1) రమజాన్ మాసం మరియు దివ్య ఖురాన్. 
2) దివ్య ఖురాన్ విశిష్టత మరియు ఔన్నత్యం.
3) దివ్య ఖురాన్ కొన్ని మహత్యాలు. 
4) దివ్య ఖురాన్ ఎందుకు అవతరించబడింది?
5) దివ్య ఖురాన్ ప్రభావాలు. 
6) దివ్య ఖురాన్ ను గట్టిగా పట్టుకోమని ఆదేశం. 

మొదటి ఖుత్బా 

ఇస్లామీయ సోదరులారా! 

అల్లాహ్, ఆకాశ గ్రంథాలలో అన్నింటికన్నా ఉత్తమమైన గ్రంథాన్ని (ఖురాను) అన్నింటికన్నా శ్రేష్టమైన మాసంలో (రమజాన్ మాసం) అవతరింప జేశాడు. అంతేకాక, ఈ శుభప్రదమాసంలోని శ్రేష్టమైన రాత్రి (లైలతుల్ ఖద్ర్) యందు దీనిని ‘లౌహే మహ్ ఫూజ్ ‘ నుండి ఒక్కసారిగా ఇహలోకపు ఆకాశంపైకి అవతరింపజేసి ‘బైతుల్ ఇజ్జ’ (మొదటి ఆకాశంలోని ఒక ప్రదేశం) నందు పొందుపరిచాడు. 

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: 

شَهْرُ رَمَضَانَ الَّذِي أُنزِلَ فِيهِ الْقُرْآنُ هُدًى لِّلنَّاسِ وَبَيِّنَاتٍ مِّنَ الْهُدَىٰ وَالْفُرْقَانِ

“రమజాన్ నెల, ఖురాను అవతరింపజేయబడిన నెల. ఇది మానవు లందరికీ మార్గదర్శకం. అందులో సన్మార్గంతో పాటు, సత్కార్యాలను వేరుపరచే స్పష్టమైన నిదర్శనాలు వున్నాయి”. (బఖర 2:185) 

ఇంకా ఇలా సెలవిచ్చాడు: 

إِنَّا أَنزَلْنَاهُ فِي لَيْلَةِ الْقَدْرِ

“నిశ్చయంగా మేము దీనిని (ఈ ఖురానును) ఘనమైన రాత్రి (లైలతుల్ ఖద్ర్) నందు అవతరింపజేశాము.” (ఖద్ర్ 97 :1) 

దీని ద్వారా తెలిసిందేమిటంటే, దివ్య ఖురాన్ కు రమజాన్ మాసంతో ప్రగాఢ సంబంధం వుంది. అందుకే ఈ మాసంలో వీలైనంత ఎక్కువగా దివ్య ఖురాన్ పారాయణం చెయ్యాలి. స్వయానా దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కూడా దీని గురించి తగు జాగ్రత్త వహించేవారు. 

శుభప్రద రమజాన్ మాసం ప్రతి రాత్రి ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) జిబ్రయీల్ (అలైహిస్సలాం)కు ఖురాన్ వినిపించేవారు. సహీహ్ బుఖారీ లోని ఒక హదీసులో అబ్దుల్లా బిన్ అబ్బాస్ (రజియల్లాహు అన్హుమా) కథనం ఇలా వుంది: 

“దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రజలందరి కన్నా ఎక్కువగా సత్కార్యాలు చేసేవారు. ఆయన, అన్నింటికన్నా ఎక్కువగా సత్కార్యాలను రమజాన్ మాసంలో చేసేవారు. జిబ్రయీల్ (అలైహిస్సలాం) వచ్చి ఆయనను కలిసేవారు. జిబ్రయీల్ (అలైహిస్సలాం) రమజాన్ మాసపు ప్రతి రాత్రి ఆయనను కలిసేవారు. అప్పుడు దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆయనకు ఖురాన్ ను వినిపించేవారు. జిబ్రయీల్ (అలైహిస్సలాం) ను కలిసాక, ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) సుడిగాలి కన్నా వేగంగా సత్కార్యాల వైపునకు పరుగెత్తేవారు”. (బుఖారీ: 1902) 

ఇక రండి! ఎంతో మహోన్నతమైన ఈ గ్రంథం మహత్యాలను విని మన విశ్వాసాన్ని మరింత తాజాగా చేసుకుందాం! 

అన్నదానం ఇస్లాంలో – సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)

అన్నదానం ఇస్లాంలో – సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)
https://youtu.be/uwgWP1aKcjs [39 నిముషాలు]

76:5 إِنَّ الْأَبْرَارَ يَشْرَبُونَ مِن كَأْسٍ كَانَ مِزَاجُهَا كَافُورًا
నిశ్చయంగా సజ్జనులు (విశ్వాసులు) ‘కాఫూర్’ కలుపబడిన మధుపాత్రలను సేవిస్తారు.

76:6 عَيْنًا يَشْرَبُ بِهَا عِبَادُ اللَّهِ يُفَجِّرُونَهَا تَفْجِيرًا
అదొక సరోవరం. దైవదాసులు దాన్నుండి (తనివి తీరా) త్రాగుతారు. (తాము కోరిన చోటికి) దాని పాయలు తీసుకుపోతారు.

76:7 يُوفُونَ بِالنَّذْرِ وَيَخَافُونَ يَوْمًا كَانَ شَرُّهُ مُسْتَطِيرًا
వారు తమ మొక్కుబడులను చెల్లిస్తుంటారు. ఏ రోజు కీడు నలువైపులా విస్తరిస్తుందో ఆ రోజు గురించి భయపడుతుంటారు.

76:8 وَيُطْعِمُونَ الطَّعَامَ عَلَىٰ حُبِّهِ مِسْكِينًا وَيَتِيمًا وَأَسِيرًا
అల్లాహ్ ప్రీతికోసం నిరుపేదలకు, అనాధులకు, ఖైదీలకు అన్నం పెడుతుంటారు.

76:9 إِنَّمَا نُطْعِمُكُمْ لِوَجْهِ اللَّهِ لَا نُرِيدُ مِنكُمْ جَزَاءً وَلَا شُكُورًا
(పైగా వారిలా అంటారు) : “మేము కేవలం అల్లాహ్ ప్రసన్నత కోసమే మీకు తినిపిస్తున్నాము. అంతేగాని మీ నుండి మేము ఎలాంటి ప్రతిఫలాన్ని గానీ, ధన్యవాదాలను గానీ ఆశించటం లేదు.”

76:10 إِنَّا نَخَافُ مِن رَّبِّنَا يَوْمًا عَبُوسًا قَمْطَرِيرًا
“నిశ్చయంగా మేము మా ప్రభువు తరఫున సంభవించే అత్యంత కఠినమైన, సుదీర్ఘమైన రోజు గురించి భయపడుతున్నాము.”

90:13 فَكُّ رَقَبَةٍ
ఏ (బానిస లేక బానిసరాలి) మెడనైనా (బానిసత్వం నుండి) విడిపించటం.

90:14 أَوْ إِطْعَامٌ فِي يَوْمٍ ذِي مَسْغَبَةٍ
లేదా ఆకలిగొన్న నాడు అన్నం పెట్టడం –

90:15 يَتِيمًا ذَا مَقْرَبَةٍ
బంధుత్వంగల ఏ అనాధకు గాని,

90:16 أَوْ مِسْكِينًا ذَا مَتْرَبَةٍ
మట్టిలో పడిఉన్న ఏ నిరుపేదకు గానీ (అన్నం పెట్టడం)!

90:17 ثُمَّ كَانَ مِنَ الَّذِينَ آمَنُوا وَتَوَاصَوْا بِالصَّبْرِ وَتَوَاصَوْا بِالْمَرْحَمَةِ
అటుపిమ్మట, విశ్వసించి పరస్పరం సహనబోధ చేసుకుంటూ, ఒండొకరికి దయాదాక్షిణ్యాల గురించి తాకీదు చేసుకునేవారైపోవాలి.

90:18 أُولَٰئِكَ أَصْحَابُ الْمَيْمَنَةِ
వీళ్ళే కుడిపక్షం వారు (భాగ్యవంతులు).

69:31 ثُمَّ الْجَحِيمَ صَلُّوهُ
“మరి వాణ్ణి నరకంలోకి త్రోసివేయండి.

69:32 ثُمَّ فِي سِلْسِلَةٍ ذَرْعُهَا سَبْعُونَ ذِرَاعًا فَاسْلُكُوهُ
“మరి వాణ్ణి డెభ్భై మూరల పొడవు గల సంకెళ్ళతో బిగించి కట్టండి.

69:33 إِنَّهُ كَانَ لَا يُؤْمِنُ بِاللَّهِ الْعَظِيمِ
“వాడు మహోన్నతుడైన అల్లాహ్ ను విశ్వసించేవాడూ కాదు,

69:34 وَلَا يَحُضُّ عَلَىٰ طَعَامِ الْمِسْكِينِ
“నిరుపేదకు అన్నం పెట్టమని (కనీసం) ప్రోత్సహించేవాడూ కాదు.

శుభప్రద రమజాన్ మాసం – పుణ్యాల వసంతం | జాదుల్ ఖతీబ్

[డౌన్ లోడ్ PDF]

ఖుత్బా యందలి ముఖ్య అంశాలు:
 

  • 1) రమజాన్ మాసాన్ని పొందడం గొప్పవరం. 
  • 2) రమజాన్ మాసపు ప్రత్యేకతలు. 
  • 3) రమజాన్ మాసంలో తప్పనిసరి ఆచరణలు ఉపవాసం మరియు దాని మహత్యం, ఖియాం, దాన ధర్మాలు, దివ్య ఖురాన్ పఠనం, దుఆలు, జిక్ర్ (స్మరణ), అస్తగ్ ఫార్ . 
  • 4) ఉపవాసం మర్యాదలు. 

మొదటి ఖుత్బా 

ఇస్లామీయ సోదరులారా! 

అల్లాహ్ అనుగ్రహం మరియు కృప వల్ల శుభప్రద రమజాన్ మాసం ఆరంభమైనది. అందుకే మనమంతా మరోసారి మన జీవితంలో ఈ శుభప్రద మాసాన్ని ప్రసాదించినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలుపాలి. ఇది ఎలాంటి మాసమంటే – అల్లాహ్ దానిలో స్వర్గపు ద్వారాలు తెరుస్తాడు, నరక ద్వారాలను మూసివేస్తాడు, మానవులను ఇతర రోజుల్లోలాగా భ్రష్టు పట్టించకుండా షైతానును బంధిస్తాడు. ఇంకా, ఈ నెలలోనే అల్లాహ్ అత్యధికంగా తన దాసులను నరకాగ్ని నుండి విముక్తి అనే బహుమతిని ప్రసాదిస్తాడు, దీనిలోనే ఆయన తన దాసులను మన్నించి వారి పశ్చాత్తాపాన్ని, ప్రార్థనలను స్వీకరిస్తాడు. అందుకే ఇలాంటి మహత్తరమైన మాసాన్ని పొందటం నిజంగా అల్లాహ్ ప్రసాదించిన గొప్పవరం. ఈ మాసపు ప్రాధాన్యత, ఔన్నత్యాలను మనం సలఫుస్సాలిహీన్ (మొదటి మూడు తరాల సజ్జనులు)ల ఆచరణను బట్టి అంచనా వేయవచ్చు. వారు ఇలా ప్రార్థించేవారు: 

ఓ అల్లాహ్! మాకు శుభప్రద రమజాన్ మాసాన్ని ప్రసాదించు”. తదుపరి రమజాన్ మాసం గడిచాక వాళ్ళు ఇలా ప్రార్థించే వారు – “ఓ అల్లాహ్ ఈ నెలలో మేము చేసిన ఆరాధనలను స్వీకరించు”. ఎందుకంటే ఈ నెల ఎంత ముఖ్యమైనదో వారికి తెలుసు కాబట్టి. (లతాయెఫుల్ మారిఫ్: 280వ పేజీ) 

అందుకే మనం కూడా ఈ మాసపు విశిష్టతను అర్థం చేసుకొని, దీనిలోని శుభాల ద్వారా ప్రయోజనం పొందాలి. 

షాబాన్ నెల సగభాగం గడిచి పోయిన తరువాత ఉపవాసం ఉండటం నిషేధం

రచయిత: ముహమ్మద్ సాలిహ్ అల్ – మునజ్జిద్
అనువాదం : ముహమ్మద్ కరీముల్లాహ్, రివ్యూ : నజీర్ అహ్మద్

ప్రశ్న: షాబాన్ నెల సగభాగం గడిచిన పోయిన తర్వాత ఉపవాసం పాటించ వచ్చునా? ఎందుకంటే షాబాన్ నెల సగభాగం తర్వాత ఉపవాసం ఉండటాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిషేధించారని విన్నాను.

అల్హందులిల్లాహ్ – సకల స్తోత్రములూ, కృతజ్ఞతలూ అల్లాహ్ కొరకే.

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పలుకులను అబూ దావూద్ (3237), అత్తిర్మిథీ (738) మరియు ఇబ్నె మాజాహ్ (1651) లలో నమోదు చేయబడిన ఒక హదీథులో అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఇలా ఉల్లేఖించినారు: “షాబాన్ నెల సగభాగం గడిచి పోయిన తరువాత ఉపవాసం ఉండవద్దు.” సహీహ్ అత్తిర్మిథీ, 590 లో దీనిని సహీహ్ హదీథుగా అల్బానీ వర్గీకరించినారు.

షాబాన్ నెల సగభాగం తరువాత అంటే షాబాన్ నెల 15వ తేదీ తరువాత ఉపవాసం పాటించటానికి అనుమతి లేదని ఈ హదీథు సూచిస్తున్నది.

అయితే, ఈ రోజులలో ఉపవాసం పాటించటం అనుమతించబడిందని మరికొన్ని హదీథులు సూచిస్తున్నాయి. ఉదాహరణకు:

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పలుకులను అల్ బుఖారీ (1914) మరియు ముస్లిం (1082) లలో నమోదు చేయబడిన ఒక హదీథులో అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఇలా ఉల్లేఖించినారు: “రమదాన్ నెల ప్రారంభానికి ఒకటి లేదా రెండు రోజుల ముందు ఉపవాసం ఉంటూ, రమదాన్ నెలారంభం కొరకు ఎదురు చూడకండి, అయితే ఎవరైనా వ్యక్తి అలవాటు ప్రకారం ఉపవాసం ఉంటున్నట్లయితే, అతను ఆ రోజులలో కూడా ఉపవాసం కొనసాగించవచ్చు.”

ప్రతి సోమవారం మరియు గురువారం ఉపవాసం పాటించటం, రోజు విడిచి రోజు ఉపవాసం పాటించటం వంటి అలవాట్లున్న వ్యక్తి కొరకు షాబాన్ నెల సగభాగం తరువాత కూడా ఉపవాసం కొనసాగించే అనుమతి ఉందని ఈ హదీథు సూచిస్తున్నది.

అల్ బుఖారీ (1970) మరియు ముస్లిం (1156) లలో నమోదు చేయబడిన ఒక హదీథులో ఆయెషా రదియల్లాహు అన్హా ఇలా ఉల్లేఖించినారు: “ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కొన్ని రోజులు తప్ప, షాబాన్ నెల మొత్తం ఉపవాసం పాటించేవారు.” ఇది ముస్లిం గ్రంథంలో ఉల్లేఖించబడిన హదీథు.

అన్నవవి ఇలా పలికినారు: వేరే పదాలలో, “ఆయన షాబాన్ నెల మొత్తం ఉపవాసం పాటించేవారు. ఆయన కొన్ని రోజులను తప్పించి, షాబాన్ నెల మొత్తం ఉపవాసం పాటించేవారు.” రెండవ పదసమూహం మొదటి దాన్ని వివరిస్తున్నది మరియు ఇక్కడ ‘మొత్తం’ అనే పదం ‘అధికభాగం’ అనే అర్ధాన్ని సూచిస్తున్నది.

ఈ హదీథు ద్వారా తెలుస్తున్న దేమిటంటే షాబాన్ నెల సగభాగం తరువాత కూడా ఉపవాసం పాటించటానికి అనుమతి ఉన్నది. అయితే ఇది ఎవరైతే షాబాన్ నెల మొదటి సగభాగమంతా ఉపవాసం పాటిస్తూ, తరువాత సగభాగంలో కూడా తమ ఉపవాసం కొనసాగించే వారి కొరకు మాత్రమే. ఈ హదీథులన్నింటినీ పరిశీలించిన తరువాత షఫా ఇలా అన్నారు:

క్రమం తప్పకుండా అలవాటుగా ఉపవాసం ఉంటున్న వారికి లేదా షాబాన్ నెల మొదటి సగభాగం ఉపవాసంలో గడిపి, తమ ఉపవాసాలను తరువాత సగభాగంలో కూడా కొనసాగిస్తున్నవారికి తప్ప, ఇతరుల కొరకు షాబాన్ నెల రెండో సగభాగంలో ఉపవాసం పాటించే అనుమతి లేదు.

మెజారిటీ పండితులు ‘అనుమతి లేదనటమంటే ఇక్కడ నిషేధించబడటం అంటే హరామ్’ అని అభిప్రాయ పడినారు.

అల్ మజ్మూఅ, 6/399-400; ఫతహ్ అల్ బారీ, 4/129

అల్ రుయానీ వంటి మరికొందరు పండితులు ‘అనుమతి లేదనటమంటే ఇక్కడ హరామ్ కాదని, కేవలం అయిష్టమైనదని అంటే మక్రూహ్’ అని అభిప్రాయ పడినారు.

రియాదుస్సాలెహీన్ లో అన్నవావీ ఇలా తెలిపారు:

“షాబాన్ నెల మొదటి సగభాగం ఉపవాసంలో గడిపి, తమ ఉపవాసాలను తరువాత సగభాగంలో కూడా కొనసాగించేవారి కొరకు లేదా ప్రతి సోమవారం మరియు గురువారం (లేదా రోజు విడిచి రోజు) ఉపవాసం ఉండే అలవాటు గలవారి కొరకు తప్ప, షాబాన్ నెల రెండో సగభాగంలో ఉపవాసం ఉంటూ, రమదాన్ కోసం ఎదురు చూడటంపై నిషేధం గురించిన అధ్యాయం.”

షాబాన్ నెల రెండో సగభాగంలో ఉపవాసం పాటించడాన్ని నిషేధిస్తున్న హదీథు దయీఫ్ అంటే బలహీనమైన హదీథని మెజారిటి పండితులు అభిప్రాయపడినారు. దీని ఆధారంగా షాబాన్ నెల రెండో సగభాగంలో ఉపవాసం పాటించటం మక్రూహ్ కాదని వారు తెలిపినారు.

అల్ హాఫిజ్ ఇలా అన్నారు: షాబాన్ నెల రెండో సగభాగంలో ఐచ్ఛిక ఉపవాసాలు కొనసాగించటానికి అనుమతి ఉందని మెజారిటీ పండితులు తెలిపినారు. దీనిని వ్యతిరేకిస్తున్న హదీథును దయీఫ్ అంటే బలహీనమైన హదీథుగా వారు పేర్కొన్నారు. అది మున్కర్ హదీథని అహ్మద్ మరియు ఇబ్నె మయీన్ తెలిపినారు (ఫతహ్ అల్ బారీ). ఆ హదీథును బలహీనమైన హదీథుగా వర్గీకరించిన వారిలో అల్ బైహఖీ మరియు అల్ తహావీ కూడా ఉన్నారు.

ఈ హదీథు గురించిన ఇమాం అహ్మద్ అభిప్రాయాన్ని తన అల్ ముగ్నీ గ్రంథంలో ఇబ్నె ఖుదామహ్ ఇలా తెలిపినారు:

ఈ హదీథు అంత ప్రామాణికమైనది (సహీహ్) కాదు. మేము అబ్దుర్రహ్మాన్ ఇబ్నె మహ్దీను దీని గురించి అడిగినాము. ఆయన దీనిని సహీహ్ హదీథుగా వర్గీకరించలేదు మరియు ఆయన దానిని నాకు ఉల్లేఖించనూ లేదు. ఆయన ఈ హదీథు గురించి చర్చించకుండా దాటవేసినారు. ఇంకా అహ్మద్ ఇలా అన్నారు, ‘అల్ అలా అనే ఆయన నిజాయితీపరుడు. ఈ ఒక్క హదీథు తప్ప ఆయన ఉల్లేఖించిన ఇతర హదీథులేవీ మున్కర్ కోవలోనికి రాలేదు’.

ఇక్కడ అల్ అలా అంటే అల్ అలా ఇబ్నె అబ్దుర్రహ్మాన్, ఆయన దీనిని తన తండ్రి అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు నుండి ఉల్లేఖించినారు.

ఈ హదీథును దయీఫ్ అంటే బలహీనమైనదిగా వర్గీకరించిన వారికి జవాబిస్తూ, ‘ముస్లిం నియమాలను అనుసరించి ఈ హదీథు సహీహ్ హదీథు’ అని తన తహ్దీబ్ అల్ సునన్ అనే గ్రంథంలో ఇబ్నె అల్ ఖయ్యిమ్ రహిమహుల్లాహ్ తెలిపినారు. కేవలం అల్ అలా మాత్రమే ఈ హదీథును ఉల్లేఖించినా, అది హదీథు ప్రామాణికతను తగ్గించదు, ఎందుకంటే ఆయన ‘థిక్కాహ్ అంటే హదీథుశాస్త్ర పరిభాషలో నిజాయితీగా హదీథులను ఉల్లేఖించేవాడు’. తన సహీహ్ గ్రంథంలో ముస్లిం ఆయన నుండి ఆయన తండ్రి అయిన అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు యొక్క అనేక హదీథులను నమోదు చేసినారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నుండి థిక్కాగా గురించబడిన ఒక వ్యక్తి నుండి అనేక సున్నతులు ఉల్లేఖించబడినాయి, సమాజం వాటిని స్వీకరించినది మరియు అనుసరిస్తున్నది కూడా.

ఆ తరువాత ఆయన ఇలా తెలిపినారు:

ఇక ఈ హదీథుకు మరియు షాబాన్ నెలలో ఉపవాసం పాటించవచ్చని తెలుపుతున్న వేరే హదీథులకు మధ్య వైరుధ్యం ఉందని భావిస్తున్న వారితో – వీటి మధ్య ఎలాంటి వైరుధ్యం లేదు (అని అంటున్నాను). ఆ హదీథులు షాబాన్ నెల మొదటి సగభాగం ఉపవాసంలో గడిపి, తమ ఉపవాసాలను తరువాత సగభాగంలో కూడా కొనసాగిస్తున్నవారిని లేదా అలవాటుగా ఉపవాసం ఉంటున్న వారిని గురించి తెలుపుతున్నాయి. అయితే, అల్ అలా తెలిపిన హదీథు కావాలని ఉద్దేశ్యపూర్వకంగా షాబాన్ నెల సగభాగం దాటిన తరువాత ఉపవాసం ప్రారంభించటం పై ఉన్న నిషేధం గురించి తెలుపుతున్నదే గాని, క్రమం తప్పకుండా ఉపవాసం ఉంటున్న వ్యక్తి గురించి లేదా షాబాన్ నెల మొదటి నుండి ఉపవాసం కొనసాగిస్తున్న వ్యక్తి గురించి కాదు.

షాబాన్ సగభాగం తరువాత ఉపవాసం ఉండకూడదని తెలుపుతున్న హదీథు గురించి షేఖ్ ఇబ్నె బాజ్ రహిమహుల్లాహ్ ను ప్రశ్నించగా, ఆయన ఇలా జవాబిచ్చినారు:

షేఖ్ నాసిరుద్దీన్ అల్ బానీ తెలిపినట్లుగా ఇది సహీహ్ హదీథు. షాబాన్ నెల మధ్యనుండి ఉపవాసం ప్రారంభించటానికి అనుమతిలేదనేది దీని అర్థం. కానీ ఒకవేళ ఎవరైనా వ్యక్తి షాబాన్ నెలలో అధికభాగం లేదా షాబాన్ నెల మొత్తం ఉపవాసం ఉంటున్నట్లయితే, అతను సున్నతును అనుసరిస్తున్నట్లే.

[మజ్మూఅ ఫతావా అల్ షేక్ ఇబ్నె బాజ్, 15/385].

రియాదుస్సాలేహీన్ పై వ్యాఖ్యానిస్తూ షేఖ్ ఇబ్నె ఉథైమిన్ ఇలా పలికినారు (3/394):

ఒకవేళ ఈ హదీథ్ సహీహ్ అయినా సరే, కొందరు పండితులు అర్థం చేసుకున్నట్లుగా దీనిలోని నిషేధం హరామ్ తరగతికి చెందినది కాదు, అది కేవలం మక్రూహ్ మాత్రమే. కానీ ఎవరికైతే క్రమం తప్పకుండా ఉపవాసం ఉండే అలవాటు ఉన్నదో, అలాంటి వారు షాబాన్ నెల సగం భాగం తరువాత కూడా తమ ఉపవాసాల్ని కొనసాగించాలి.

ముగింపు మాట:

అలవాటుగా (సోమవారం, గురువారం, రోజు విడిచి రోజు) ఉపవాసం ఉంటున్న వారి విషయంలో లేదా షాబాన్ నెల మొదటి నుండి ఉపవాసం కొనసాగిస్తున్న వారి విషయంలో తప్ప, రెండో సగభాగంలో ఉపవాసాలు ఉండటానికి అనుమతి లేదు, అది మక్రూహ్ లేదా హరామ్. అసలైన విషయం కేవలం అల్లాహ్ కే తెలుసు.

ఈ నిషేధానికి కారణం ఏమిటంటే, నిరంతరాయంగా ఉపవాసం ఉండటం వలన రమదాన్ ఉపవాసాలు ఉండలేనంతగా బలహీనపడిపోయే అవకాశం ఉంది.

ఒకవేళ షాబాన్ నెలారంభం నుండి ఉపవాసాలు ఉంటున్నట్లయితే, మరీ ఎక్కువగా బలహీన పడిపోవచ్చు కదా అని ఎవరైనా అంటే, దానికి జవాబు – షాబాన్ నెలారంభం నుంచి ఉపవాసాలు ఉంటున్న వ్యక్తికి, ఉపవాసం ఉండటం అలవాటై పోయి ఉంటుంది. కాబట్టి అతనికి ఉపవాసం కొనసాగించటం ఏమంత కష్టంగా అనిపించదు.

అల్ ఖారీ ఇలా పలికినారు: ఇక్కడ నిషేధం అంటే అయిష్టమైనది అంటే మక్రూహ్. అది సమాజం కొరకు ఒక అనుగ్రహం. ఎందుకంటే ఆ ఉపవాసాల వలన రమదాన్ నెల విధి ఉపవాసాలు మంచి శక్తితో ఉండలేనంతగా బలహీన పడిపోవచ్చు. కానీ, షాబాన్ నెల మొత్తం ఉపవాసం ఉంటున్న వారు, ఉపవాసానికి అలవాటు పడిపోయి ఉంటారు. కాబట్టి అది వారి కొరకు కష్టంగా ఉండదు.అసలైన విషయం కేవలం అల్లాహ్ కే తెలుసును.

షాబాన్ నెల (The Month of Shaban) – Main page
షాబాన్ నెలకు సంబంధించిన పుస్తకాలు , ఆడియో, వీడియో , ఖుత్బాలు ..అన్నీ
https://teluguislam.net/2023/02/22/the-month-of-shaban/

షాబాన్ నెల 15వ తేదీ రాత్రి అల్లాహ్ వీరిని తప్ప అందరినీ క్షమిస్తాడు [ఆడియో]

షాబాన్ నెల 15వ తేదీ రాత్రి అల్లాహ్ వీరిని తప్ప అందరినీ క్షమిస్తాడు [ఆడియో]
https://youtu.be/x7jC5awKexI [10 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

రమదాన్ లో, నెలసరిలో ఉన్న స్త్రీ ఫజర్ కంటే కొన్ని నిముషాల ముందే పరిశుద్దురాలైతే.. – షేఖ్ ఉసైమీన్

ప్రశ్న-2 : నెలసరిలో ఉన్న స్త్రీ (ఫజర్ కంటే ముందు) పరిశుద్దురాలైంది. ఫజర్ తరువాత స్నానము చేసి నమాజ్ కూడా చేసింది. ఆ రోజు ఉపవాసాన్ని కూడా పూర్తి చేసింది. అయితే ఆమె ఆ రోజు పాటించిన ఉపవాసానికి బదులుగా మరలా ఉపవాసం పాటించాలనే విధి వుందా?’. ఒక సోదరి. 

జవాబు: ‘ఫజర్’ కంటే ఒక్క నిమిషం ముందు నెలసరిలో ఉన్న స్త్రీ పరిశుద్ధురాలైనా తన పరిశుద్ధత గురించి పూర్తిగా నమ్మకం కలిగివుంటే మరింకా అది రమజాన్ మాసమే అయితే ఆమె పై ఆరోజు ఉపవాసాన్ని పాటించడం విధిగా పరిగణించబడుతుంది. కనుక అమె ఆరోజు పాటించే ఉపవాసం శ్రేయస్కరంగానే భావించబడుతుంది. దానికి బదులు (ఖజా) ఉపవాసం పాటించవలసిన అవసరం ఉండదు. ఎందుకంటే ఆమె పరిశుభ్రతలోనే ఉపవాసం (‘సహరి’ చేసింది) పాటించింది. ఆమె ఒకవేళ ‘ఫజర్’ తరువాత స్నానం చేసినా సరే. ఇందులో ఎలాంటి సందేహాలకు తావులేదు. దీనికి ఉదాహరణ ఏమిటంటే పురుషుడు కామక్రియల వల్ల లేదా వీర్యస్ఖలనానికి గురై (‘సహ్రి’ చేసుకుని) ఫజర్ తరువాత స్నానము చేసినా అతని ఉపవాసం శ్రేయస్కరంగానే పరిగణించ బడుతుంది. 

దీనికి సంబంధించిన మరొక విషయయాన్ని ప్రస్తావించ దలచుచున్నాను : అదేమిటంటే, ‘ఆమె ఉపవాసం పూర్తి చేసుకుని ఇఫ్తార్ చేసిన తరువాత, ఇషా కంటే ముందు ఋతుస్రావానికి గురైతే ఆమె ఆ రోజు ఉపవాసం వృధా అయిపోతుందని’ కొందరు స్త్రీలు భావిస్తున్నారు. ఇది ఎంత మాత్రం సరి కాదు. అంతే కాకుండా ఒక వేళ సూర్యాస్తమయం తరువాత ఒక క్షణం తరువాత ఋతస్రావం ప్రారంభమైనా కూడ ఆమె ఉపవాసం పరిపూర్ణమవుతుంది. 

ఈ ఫత్వా క్రింది పుస్తకం నుండి తీసుకోబడింది. లింక్ క్లిక్ చేసి పూర్తి పుస్తకం చదవండి లేదా డౌన్లోడ్ చేసుకోండి

ఋతుకాలం – సందేహాలు & సమాధానాలు
మూల రచయిత (అరబీ): షేఖ్ ముహమ్మద్ బిన్ సాలిహ్ అల్ ఉసైమీన్ (రహిమహుల్లాహ్)
తెలుగు అనువాదం: హాఫిజ్ అబ్దుల్ గఫ్ఫార్ ఉమ్రి హఫిజహుల్లాహ్
మర్కజ్ దారుల్ బిర్ర్ పబ్లికేషన్స్

రండి! షబె బరాత్ ఇలా జరుపుకుందాం [ఆడియో & టెక్స్ట్]

రండి❗షబె బరాత్ ఇలా జరుపుకుందాం
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
https://youtu.be/yJX3ZOTXNJw [11 నిముషాలు]

ఈ ప్రసంగంలో, షబే బరాత్ యొక్క వాస్తవికత, దాని గురించిన మూడు రకాల అభిప్రాయాలు మరియు హదీసుల వెలుగులో సరైన ఆచరణ పద్ధతులు వివరించబడ్డాయి. మొదటి అభిప్రాయం ప్రకారం, దీనికి సంబంధించిన హదీసులు ప్రామాణికం కానందున ఇది ఒక సాధారణ రాత్రి. రెండవ అభిప్రాయం, అతిగా వెళ్ళి, ప్రత్యేక ప్రార్థనలు, అలంకరణలు, కొత్త బట్టలు మరియు కొన్ని మూఢనమ్మకాలతో దీనిని జరుపుకుంటారు. మూడవ మరియు సరైన అభిప్రాయం ప్రకారం, షాబాన్ 15వ రాత్రి అల్లాహ్ తన సృష్టిని చూసి, బహుదైవారాధన (షిర్క్) చేసేవారు, ద్వేషం పెంచుకున్నవారు, మరియు ఇతర పెద్ద పాపాలు చేసేవారు తప్ప అందరినీ క్షమిస్తాడు. కాబట్టి, ఈ రాత్రి చేయవలసిన అసలైన పని ప్రత్యేక ఉత్సవాలు కాదు, బదులుగా మన విశ్వాసాన్ని (తౌహీద్) శుద్ధి చేసుకోవడం, ఇతరులపై ఉన్న ద్వేషాన్ని, కక్షను తొలగించుకోవడం, మనం చేసిన అన్యాయాలను సరిదిద్దుకోవడం, మరియు పాపాల నుండి దూరంగా ఉండటం. ఈ విధంగా మన హృదయాలను శుభ్రపరుచుకుని పడుకుంటే అల్లాహ్ యొక్క క్షమాపణను పొందుతామని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బోధించారు.

أَلْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ، وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى سَيِّدِ الْمُرْسَلِينَ، نَبِيِّنَا مُحَمَّدٍ وَعَلَى آلِهِ وَصَحْبِهِ أَجْمَعِينَ، أَمَّا بَعْدُ.
(అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్, నబియ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహి వ సహ్బిహి అజ్మయీన్, అమ్మా బఅద్)
సకల లోకాల ప్రభువైన అల్లాహ్ కే సర్వ స్తోత్రాలు. ప్రవక్తల నాయకుడైన మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై, ఆయన కుటుంబ సభ్యులపై, ఆయన సహచరులపై అల్లాహ్ యొక్క శాంతి మరియు శుభాలు వర్షించుగాక. ఆ తర్వాత…

రండి, షబే బరాత్ ఇలా జరుపుకుందాము.

ఈ అంశంపై ఈ రోజు సంక్షిప్తంగా కొన్ని విషయాలు మీకు తెలియజేస్తున్నాను. శ్రద్ధగా వింటారని ఆశిస్తున్నాను.

ఇస్లామీయ క్యాలెండర్ షాబాన్, ఎనిమిదవ నెల, 13వ తారీఖు ఈరోజు పూర్తయిపోయింది. రేపు మగ్రిబ్ తర్వాత 14వ రోజు పూర్తి అయ్యి 15వ రోజు మొదలవుతుంది. అయితే ఎన్నో ప్రాంతాల్లో, ఎంతో మంది షబే బరాత్, బడోంకీ ఈద్, ముర్దోంకీ ఈద్ అన్న పేరుతో, పెద్దల పండుగ అని కూడా కొందరు అంటారు కొన్ని ప్రాంతాల్లో, ఇలా రేపటి రాత్రిని జరుపుకుంటారు. దీని గురించి వాస్తవం ఏమిటి?

అయితే ఆ వాస్తవాన్ని మీకు తెలియజేయడానికి, రండి షబే బరాత్ ఇలా జరుపుకుందాము అన్నటువంటి ఒక టాపిక్, ఒక అంశం, హెడ్లైన్ పెట్టాను. మీకు స్పష్టంగా, సులభంగా అర్థం కావడానికి మూడు విషయాలు గుర్తుంచుకోండి. షబే బరాత్ విషయంలో మూడు అభిప్రాయాలు, మూడు రకాల మనుషులు ఉన్నారు.

కొందరు ఏమంటారు, షబే బరాత్ కు సంబంధించి ఎన్ని హదీసులైతే వచ్చాయో, ఏ ఒక్కటీ సహీ లేదు గనక, వేరే సామాన్య రోజులు ఎలాగైతే ఉన్నాయో, అలాంటిదే ఆ 15వ రాత్రి షబే బరాత్.

రెండో వర్గం వారు, షబే బరాత్ గురించి చాలా హదీసులు వచ్చాయి అని, ఆ రోజు రాత్రి జాగారం చేయడం, మస్జిదులను అలంకరించుకోవడం, కొత్త బట్టలు ధరించడం, సమాధులను సందర్శించడం, ప్రత్యేకమైన కొన్ని వంటకాలు వండుకోవడం, అంతేకాదు, గత షబే బరాత్ నుండి ఇప్పటివరకు మన బంధువుల్లో ఎవరెవరైతే చనిపోయారో వారి ఆత్మలు వచ్చి శాంతి పొందుతాయి, మనం వండినటువంటి వంటలను తింటారు కూడా అన్నటువంటి మూఢనమ్మకాలు కూడా కొందరిలో ఉన్నాయి.

అయితే ఈ రెండు అభిప్రాయాలు కూడా సత్యానికి, ధర్మానికి, ఖురాన్, హదీస్ ఏదైతే చెబుతుందో దానికి దూరంగా ఉన్నారు. ఈ రెండు వర్గాల వారు కూడా సత్యానికి, ధర్మానికి దూరంగా ఉన్నారు.

మూడవ, సత్యమైన అభిప్రాయం, మూడవ మాట ఏదైతే ఖురాన్, హదీసులకు ఆధారంగా మనకు కనబడుతుందో అది ఏమిటంటే, షాబాన్ 15వ రాత్రి, ‘లయలతున్ నిస్ఫి మిన్ షాబాన్’ అని పదాలు వస్తాయి అరబీలో హదీసులో. దానినే సర్వసామాన్యంగా షబే బరాత్ అంటారు. షబే బరాత్ అన్న పేరు ఇది సరైనది కాదు. ఎందుకు? దాని రీజన్ టైం ఉంటే తర్వాత చెబుతాను. కానీ హదీసులో వచ్చిన పదాలు ఏంటి? మీరు కనీసం అల్-మక్తబతుష్ షామిలా లేదా ఇంగ్లీష్ తెలిసిన వారు మన ఎంతో మంది యువకులు ఉన్నారు, స్టూడెంట్స్, sunnah.com అని చూస్తే సుమారు తొమ్మిది, పది హదీసు గ్రంథాలు అరబీలో, ఇంగ్లీష్లో ఉన్నాయి. దాంట్లో గనక మీరు ‘లయలతన్ నిస్ఫి మిన్ షాబాన్’ అని రాస్తే మీకు దానికి సంబంధించిన ఎన్నో హదీసులు కనబడతాయి.

షబే బరాత్ సరైన పదం కాదు, దాని రీజన్ టైం ఉంటే వివరంగా తర్వాత చెబుదాము. కానీ మన అసలైన మాట, షబే బరాత్ అని ఏ రాత్రిని అనుకుంటున్నారో దాని గురించి హదీసులో వచ్చిన పదాలు, ‘లయలతన్ నిస్ఫి మిన్ షాబాన్’. తెలుగు అనువాదం ఏమవుతుంది? షాబాన్ యొక్క సగం. ‘నిస్ఫ్’ అంటే సగం. షాబాన్, షాబాన్. ‘లయలా’ రాత్రి. అంటే ఏమిటి? సర్వసామాన్యంగా మనం సులభంగా అర్థం కావడానికి 15వ షాబాన్ రాత్రి అని అంటాము.

15వ షాబాన్ రాత్రి గురించి కొన్ని హదీసులు వచ్చాయి. ఆ హదీసుల్లో ఉన్న మాట ఏంటి? దాన్ని సరియైన రీతిలో అర్థం చేసుకోకుండా కొందరు లేదు అని, ఇదొక మితవాదం, మరికొందరు హదీసులు ఉన్నాయి అని, ఉన్న భావాన్ని, అందులో ఉన్నటువంటి అర్థాన్ని తెలుసుకోకుండా ఆ ప్రకారంగా ఆచరించకుండా దానికి వ్యతిరేకంగా, భిన్నంగా మరికొన్ని రకాల బిద్అత్ లకు పాల్పడుతున్నారు.

అయితే హదీసుల్లో వచ్చిన విషయం, ఆ హదీసులు మీకు వినిపిస్తాను. శ్రద్ధగా మీరు వింటారని ఆశిస్తున్నాను. ఇందులో ఒక హదీస్ షేఖ్ అల్బానీ రహీమహుల్లాహ్ వారు ‘సహీహుత్ తర్ఘీబ్’లో ప్రస్తావించారు. హదీస్ నెంబర్ 54. నిశ్చయంగా అల్లాహ్ త’ఆలా, బిద్అత్ చేసే వ్యక్తి తన బిద్అత్ ను వదులుకొనంత వరకు అతని నుండి తౌబాను ఆపుకొని ఉంటాడు.

ఈ హదీస్ నేను ముందు వినిపించాను. అసలు టాపిక్ కు కొంచెం భిన్నంగా కనబడుతుంది. కానీ ఇక్కడ ఉద్దేశం ఏంటంటే, లేనిపోని విషయాలు, ఇస్లాం తెలుపని విషయాలు మనం చెప్పుకుంటే, చేస్తే దాని ప్రమాదం చాలా భయంకరంగా ఉంటుంది. అందుకొరకు చాలా మనం జాగ్రత్తగా ఉండాలి. అయితే హదీసులో వచ్చిన విషయం ఏంటి?

‘ఇదా కానత్ లయలతున్ నిస్ఫి మిన్ షాబాన్’, ఎప్పుడైతే షాబాన్ యొక్క 15వ రాత్రి ఉంటుందో, ‘ఇత్తలఅల్లాహ్’ (అల్లాహ్ చూస్తాడు). అల్లాహ్ త’ఆలా తన సృష్టి రాశులను చూస్తాడు. ఫయఘ్ఫిర్ (క్షమిస్తాడు). అల్లాహ్ త’ఆలా అందరినీ క్షమించేస్తాడు. ఒకవేళ క్షమించకుంటే ఎవరెవరిని క్షమించడు? ఎవరైతే షిర్క్ చేస్తారో, ద్వేషాలు పెంచుకుంటారో, ఎవరైతే దౌర్జన్యం చేస్తారో, ఎవరైతే వ్యభిచారం చేస్తారో, ఇలాంటి కొన్ని విషయాలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రస్తావించారు. ఇప్పుడు నేను చెప్పిన ఈ మూడు, నాలుగు విషయాలు ఏవైతే ఉన్నాయో, వేరువేరు హదీసుల్లో వచ్చిన విషయం.

వాటి సారాంశం ఏమిటంటే, మనిషి సామాన్య రాత్రుల మాదిరిగా, ఈ 15వ షాబాన్ రాత్రి ప్రత్యేకించుకొని ఏదైనా ఉత్సవం మాదిరిగా, పండుగ మాదిరిగా, కొత్త బట్టలు ధరించడం, మస్జిదులను అలంకరించుకోవడం, ఇండ్లను అలంకరించుకోవడం, ఇవన్నీ ఏమీ చేయకుండా తన యొక్క విశ్వాసాన్ని శుద్ధిపరుచుకొని, అన్ని రకాల షిర్క్, బహుదైవారాధనలకు దూరంగా ఉండే విధంగా చూసుకొని, తాను పడుకునేకి ముందు అందరి పట్ల అతనికి మనసులో ఏదైతే ద్వేషం, కపటం ఉందో వాటన్నిటి నుండి క్షమాపణ కోరుకొని, అందరినీ మాఫీ చేసేసి, ఎవరిపైన ఏదైనా దౌర్జన్యం చేసి ఉంటే, అతని వైపు నుండి ఒకరిపై ఏదైనా అన్యాయం జరిగి ఉంటే, ఆ అన్యాయం వేరే వారి యొక్క ధనంలో గానీ, పరువు, మానంలో గానీ, వారి యొక్క ఆర్థికంగా గానీ, ఇంకా ఏ రకంగానైనా, దాని విషయం లో ఆ హక్కు వారికి చెల్లించి, అల్లాహ్ తో క్షమాపణ కోరుకొని, ఇంకా మన కళ్ళను, మన చెవులను, మన చేతులను, మన కాళ్ళను, మన శరీర అవయవాలను అన్ని రకాల వ్యభిచారాలకు దూరంగా ఉంచుకొని, శుభ్రమైన మనస్సుతో, తౌహీద్ పై, సున్నత్ పై ఆ రాత్రి పడుకున్నామంటే మనం అల్లాహ్ యొక్క క్షమాపణ, అల్లాహ్ యొక్క మన్నింపు పొందగలం.

ఇది అసలు పని మనం చేయవలసింది. ఇక్కడ షబే ఖదర్ అని ఏదైతే రమదాన్ చివరి రాత్రుల్లో ఉంటుందో, జాగారం చేసి, ఎక్కువ ఖురాన్ చదవడం, లేదా నఫిల్ నమాజులు చేయడం, అలాంటి ఏ పనీ ఈ 15వ షాబాన్ రాత్రి, దేనినైతే షబే బరాత్ అని అనుకుంటున్నారో, ఆ రాత్రి చేయడానికి ఏ ఒక్క సహీ హదీసు లేదు. చేయవలసిన పని, దేని గురించి అయితే హదీసులు సపోర్ట్ చేస్తున్నాయో నేను చెప్పేశాను. మన తౌహీద్, సున్నత్, మరియు మన యొక్క మనస్సు కల్మషం లేకుండా, మనం ఎవరిపై ఎలాంటి, ఎవరికీ హాని కలిగించకుండా, మనం శుభ్రంగా ఉన్నామంటే అల్లాహ్ యొక్క మన్నింపు, క్షమాపణ పొందగలుగుతాము.

ఇక చివరిలో ఒక క్షణం, ఒక నిమిషం, రెండు నిమిషాల్లో, షబే బరాత్ ఇది సరైనది కాదు అని ఏదైతే చెప్పానో, కొంచెం ఆలోచించండి. ఇస్లాం ధర్మం అరబీ భాషలో ఉంది. ఇది మనందరికీ తెలిసిన విషయం. ‘షబ్’ ఇది ఫార్సీ భాష. రాత్రి అన్న భావంలో వస్తుంది. ‘బరాఅత్’ అరబీ పదం. ‘షబ్’ ఫార్సీ పదం, ‘బరాఅత్’ సూరతుల్ బరాఅ, తౌబా అని ఏదైతే ఉందో, క్రమంలో తొమ్మిదో సూరా, సూరతుత్ తౌబా, దానిని సూరతుల్ బరాఅ అని కూడా అంటారు. ఎందుకంటే దాని ప్రారంభం:

بَرَاءَةٌ مِّنَ اللَّهِ وَرَسُولِهِ إِلَى الَّذِينَ عَاهَدتُّم مِّنَ الْمُشْرِكِينَ
(బరాఅతుమ్ మినల్లాహి వ రసూలిహి…)
(మీరు ఒప్పందాలు కుదుర్చుకున్న ముష్రిక్కులతో ఇక మీదట ఎలాంటి సంబంధాలుండబోవని అల్లాహ్‌ తరఫున, ఆయన ప్రవక్త తరఫున ప్రకటించబడుతోంది) (9:1)

అని మొదలవుతుంది. ‘బరాఅత్’ అరబీ పదం, ‘షబ్’ ఫార్సీ పదం. ఈ రెండు కలిసి మొదలయ్యాయి. దీని వెనక ఎవరైతే బిద్అత్ పనులు చేస్తారో వారి యొక్క కొన్ని రకాల మూఢనమ్మకాలు కూడా ఉన్నాయి. అదంతా ఏమీ ఇస్లాం ప్రకారంగా కాదు. అందుకొరకు మనం సహీ హదీసుల ఆధారంగా ఏ విషయం అయితే వచ్చిందో దానిని నేను చెప్పేశాను. అది మనం చేసుకొని ఉన్నాము అంటే అల్లాహ్ వద్ద మన యొక్క క్షమాపణ, మన్నింపు, భాగ్యం మనకు లభిస్తుంది. అల్లాహ్ అన్ని రకాల బిద్అత్, దురాచారాల నుండి మనల్ని కాపాడుగాక. ఆమీన్.

وَآخِرُ دَعْوَانَا أَنِ الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ.
(వ ఆఖిరు దఅవానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్)
(మా ఆఖరి మాట, సకల లోకాల ప్రభువైన అల్లాహ్ కే సర్వ స్తోత్రాలు).

అస్సలాము అలైకుమ్.

షాబాన్ నెల (The Month of Shaban):
https://teluguislam.net/2023/02/22/the-month-of-shaban/

రమజాన్ లో ఫజర్ తర్వాత స్త్రీ పరిశుద్ధురాలైతే ఏమి తినకుండా ఉపవాసం ఉండాలా? – షేఖ్ ఉసైమీన్

ప్రశ్న-1: ఒక వేళ స్త్రీ ఫజర్ పిమ్మటే (తరువాత) పరిశుద్ధురాలైతే అన్నపానియాలు మరి ఇతరాత్రా ఆహార వస్తువులు తినకుండా ఆ రోజు ఉపవాసం వుండాలా? మరి ఆమె పాటించే ఆ రోజు ఉపవాసాన్ని లెక్కించబడడం జరుగుతుందా? లేక ఆమె దానికి బదులుగా మరలా ఉపవాసం పాటించవలసి వుంటుందా? 

జవాబు : ఒక వేళ స్త్రీ ఫజర్ పిమ్మటే పరిశుద్ధురాలైతే ఆ రోజు అన్న పానియాలు మరి ఇతరాత్రా ఆహార వస్తువులు తినకుండా వుండటం గురించి ఇస్లామీయ ధార్మిక విద్వాంసుల్లో రెండు అభిప్రాయాలు వున్నాయి. 

1-ఆ రోజు ఆమె ఏమి తినకుండా ఆగిపోవాలి. కాని ఆ రోజు ఉపవాసం లెక్కింపబడదు. దానికి బదులు ఉపవాసం ఉండ వలసి ఉంటుంది.

(ఇమాం అహ్మద్-రహిమహుల్లాహ్ వెల్లడించిన ప్రఖ్యాత అభిప్రాయం) 

2-ఆమెకు ఆ రోజు ఏమి తినకుండా ఉండవలసిన అవసరం లేదు. ఆమె ఆ రోజు ఉపవాసం పాటించడం సరికాదు. ఎందుకంటే ఆ రోజు ఉపవాస ప్రారంభ దశలో ఆమె ఋతుకాలం (సమయం ) లోనే వుంది. అలాంటప్పుడు ఉపవాసం పాటించడం సరికాదు. ఉపవాసమే సరికానప్పుడు అన్న పానియాలకు దూరంగా ఉండటంలో ఎలాంటి ప్రయోజనం లేదు. మరియు ఆ ఆ సమయంలో దాని పవిత్రత, గౌరవాన్ని పాటించవలసిన నిబంధన ఆమెపై లేదు. ఎందుకంటే ఆ రోజు ప్రారంభ దశలో ఆమె ఉపవాసానికి అనర్హురాలు. అంతే కాకుండా ఆ పరిస్థితుల్లో ఆమెపై ఉపవాసం నిషేధించ బడింది. షరీఅత్ ప్రకారం ఉపవాసం గురించి మాకు తెలిసిన విషయం ఏమంటే అల్లాహ్ ఆరాధన సంకల్పంతో ‘ఫజర్’ నుండి సూర్యస్తమయం (మగ్రిబ్) వరకు అన్నపానియాలు, ఇతరాత్రా తినే, త్రాగే వస్తూవుల నుండి ఆగిపోవాలి. 

దీనిలో రెండో అభిప్రాయం మొదటి కంటే ఉత్తమమైనది. ఏదేమైనా ఈ రెండు అభిప్రాయాల వెలుగులో ఆ రోజు ఉపవాసానికి బదులు (ఖజా*) పాటించవలసి వుంటుంది.

[*] ఖజా: ఏదైన నమాజ్ లేక ఉపవాసం లాంటివి వాటి నిర్ణీత సమయం దాటిపోయి నంతరం మరలా దానిని పాటించడాన్ని అంటారు.

ఈ ఫత్వా క్రింది పుస్తకం నుండి తీసుకోబడింది. లింక్ క్లిక్ చేసి పూర్తి పుస్తకం చదవండి లేదా డౌన్లోడ్ చేసుకోండి

ఋతుకాలం – సందేహాలు & సమాధానాలు
మూల రచయిత (అరబీ): షేఖ్ ముహమ్మద్ బిన్ సాలిహ్ అల్ ఉసైమీన్ (రహిమహుల్లాహ్)
తెలుగు అనువాదం: హాఫిజ్ అబ్దుల్ గఫ్ఫార్ ఉమ్రి హఫిజహుల్లాహ్
మర్కజ్ దారుల్ బిర్ర్ పబ్లికేషన్స్