ఖుత్బా యందలి ముఖ్య అంశాలు:
- 1) రమజాన్ మాసాన్ని పొందడం గొప్పవరం.
- 2) రమజాన్ మాసపు ప్రత్యేకతలు.
- 3) రమజాన్ మాసంలో తప్పనిసరి ఆచరణలు ఉపవాసం మరియు దాని మహత్యం, ఖియాం, దాన ధర్మాలు, దివ్య ఖురాన్ పఠనం, దుఆలు, జిక్ర్ (స్మరణ), అస్తగ్ ఫార్ .
- 4) ఉపవాసం మర్యాదలు.
మొదటి ఖుత్బా
ఇస్లామీయ సోదరులారా!
అల్లాహ్ అనుగ్రహం మరియు కృప వల్ల శుభప్రద రమజాన్ మాసం ఆరంభమైనది. అందుకే మనమంతా మరోసారి మన జీవితంలో ఈ శుభప్రద మాసాన్ని ప్రసాదించినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలుపాలి. ఇది ఎలాంటి మాసమంటే – అల్లాహ్ దానిలో స్వర్గపు ద్వారాలు తెరుస్తాడు, నరక ద్వారాలను మూసివేస్తాడు, మానవులను ఇతర రోజుల్లోలాగా భ్రష్టు పట్టించకుండా షైతానును బంధిస్తాడు. ఇంకా, ఈ నెలలోనే అల్లాహ్ అత్యధికంగా తన దాసులను నరకాగ్ని నుండి విముక్తి అనే బహుమతిని ప్రసాదిస్తాడు, దీనిలోనే ఆయన తన దాసులను మన్నించి వారి పశ్చాత్తాపాన్ని, ప్రార్థనలను స్వీకరిస్తాడు. అందుకే ఇలాంటి మహత్తరమైన మాసాన్ని పొందటం నిజంగా అల్లాహ్ ప్రసాదించిన గొప్పవరం. ఈ మాసపు ప్రాధాన్యత, ఔన్నత్యాలను మనం సలఫుస్సాలిహీన్ (మొదటి మూడు తరాల సజ్జనులు)ల ఆచరణను బట్టి అంచనా వేయవచ్చు. వారు ఇలా ప్రార్థించేవారు:
“ఓ అల్లాహ్! మాకు శుభప్రద రమజాన్ మాసాన్ని ప్రసాదించు”. తదుపరి రమజాన్ మాసం గడిచాక వాళ్ళు ఇలా ప్రార్థించే వారు – “ఓ అల్లాహ్ ఈ నెలలో మేము చేసిన ఆరాధనలను స్వీకరించు”. ఎందుకంటే ఈ నెల ఎంత ముఖ్యమైనదో వారికి తెలుసు కాబట్టి. (లతాయెఫుల్ మారిఫ్: 280వ పేజీ)
అందుకే మనం కూడా ఈ మాసపు విశిష్టతను అర్థం చేసుకొని, దీనిలోని శుభాల ద్వారా ప్రయోజనం పొందాలి.
తల్హా బిన్ ఉబైదుల్లా (రదియల్లాహు అన్హు) కథనం:
ఇద్దరు వ్యక్తులు ఒకేసారి దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సన్నిధికి వచ్చి ఇస్లాం స్వీకరించారు. తదుపరి అందులో ఒక వ్యక్తి ఎక్కువగా ఆరాధనలు చేసేవాడు, అల్లాహ్ మార్గంలో యుద్ధం చేస్తూ వీరమరణం పొందాడు. ఇక రెండో వ్యక్తి, మొదటి వ్యక్తి కన్నా తక్కువగా ఆరాధించేవాడు, మొదటి వ్యక్తి మరణించిన 1 సం॥ తర్వాత మరణించాడు.
తల్హా (రదియల్లాహు అన్హు) కథనం: ఈ రెండవ వ్యక్తి, వీరమరణం పొందిన మొదటి వ్యక్తి కన్నా ముందుగా స్వర్గంలో ప్రవేశించడం నేను కలలో చూశాను. మరుసటి రోజు ఉదయం ఈ కలను నేను ప్రజల ముందు ప్రస్తావించగా వీరు దీనిపై ఆశ్చర్యానికి లోనయ్యారు. దీనిపై దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా వివరించారు: “ఆ రెండవ వ్యక్తి, మొదటి వ్యక్తి మరణించాక 1 సం॥ పాటు బ్రతికి లేడా? దానిలో అతను రమజాన్ మాసాన్ని పొందాడు, దాని ఉపవాసాలు పాటించాడు మరియు 1 సం॥ పాటు నమాజులు (అదనంగా) చదివాడు. అందుకే వీరిద్దరి మధ్య (స్వర్గంలో) దూరం- భూమ్యాకాశాల మధ్య వున్న దూరమంత వుంది”. (సహీ ఉల్ జామె అస్సగీర్ లిల్ అల్బానీ : 1316)
ఈ హదీసుపై కాస్త దృష్టి సారించండి!
ఇద్దరు వ్యక్తులు ఒకేసారి ఇస్లాం స్వీకరించారు. అందులో మొదటి వ్యక్తి రెండవ వ్యక్తి కన్నా ఎక్కువగా ఆరాధించేవాడు మరియు వీరమరణం పొందాడు. ఇక రెండవ వ్యక్తి – మొదటి వ్యక్తి కన్నా తక్కువగా ఆరాధించేవాడు మరియు సహజ మరణం పొందాడు. మరి ఇతను మొదటి వ్యక్తి కన్నా ముందుగా స్వర్గంలోకి ఎలా ప్రవేశిచగలిగాడు? దానికి కారణం ఏమిటంటే – ఇతను మొదటి వ్యక్తి వీరమరణం పొందాక 1 సం॥ పాటు బ్రతికి వున్నాడు. ఈ వ్యవధిలో ఇతనికి రమజాన్ మాసం ప్రాప్తించింది. అందులో ఇతను ఉపవాసాలు వున్నాడు మరియు సం॥ అంతా నమాజులు చదివాడు. ఇలా, ఉపవాసాలు మరియు నమాజుల కారణంగా వీర మరణం పొందిన వాని కన్నా ముందుగా స్వర్గంలో ప్రవేశించాడు…. దీని ద్వారా రూఢీ అయిన విషయమేమిటంటే శుభప్రద రమజాన్ మాసాన్ని పొంది, దానిలో ఉపవాసాలు పాటించడం అనేది అల్లాహ్ ఇచ్చే గొప్పవరం.
మీరు ఓ విషయం ఆలోచించండి! మన స్నేహితులలో, బంధువులలో ఎంతో మంది గత రమజాన్ మాసంలో మనతో కలిసివున్నారు. కానీ ఈ రమజాన్ మాసం రావడానికి ముందే వారు లోకం విడిచి వెళ్ళిపోయారు. వారికి ఈ శుభప్రదమాసం ప్రాప్తం కాలేదు. కానీ మనకు అల్లాహ్ – జీవితాన్ని మరియు ఆరోగ్యాన్నిచ్చి దానితోపాటు శుభప్రదమైన ఈ మాసాన్ని కూడా ప్రసాదించాడు. తద్వారా మనం చిత్త శుద్ధితో మన పాపాలకు గాను పశ్చాత్తాపం చెంది మన సృష్టికర్త, యజమాని అయిన అల్లాహ్ ను సంతృప్తి పరచుకోవచ్చు…. మరి ఇది అల్లాహ్ మనకు ప్రసాదించిన గొప్పవరం కాదా?
అలాగే – ఈ రమజాన్ మన జీవితపు ఆఖరి రమజాన్ కూడా కావచ్చు. మరుసటి రమజాన్ వచ్చే వరకు మనం కూడా ఈ లోకం విడిచి వెళ్ళిపోవచ్చు! అందుకే (అల్లాహ్ ప్రసాదించిన) ఈ సువర్ణావకాశాన్ని సద్వినియోగ పరుచుకొని దాని శుభాలను ప్రోగు చేసుకోవడానికి ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూ వుండాలి.
ఈ కారణం చేతనే – రమజాన్ మాసం ఆరంభం కాగానే దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సహాబాలకు – దీని రాకను గూర్చిన శుభవార్త ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేసేవారు.
అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) రమజాన్ మాసపు రాక గురించి శుభవార్త ఇస్తూ ఇలా సెలవిచ్చారు:
“మీ దగ్గరికి రమజాన్ మాసం వచ్చేసింది. ఇదెంతో శుభప్రదమైనది. అల్లాహ్ దీని ఉపవాసాలను మీపై విధిగా చేశాడు. దీనిలో (ఈ మాసంలో) స్వర్గపు ద్వారాలు తెరవబడతాయి మరియు నరక ద్వారాలు మూసి వేయబడతాయి. తలబిరుసు పైతానులు బంధించి వేయబడతారు. దీనిలో అల్లాహ్ రాత్రి ఒకటి వుంది. అది 1000 నెలల కన్నా శ్రేష్టమైనది. ఇక ఏ వ్యక్తి అయినా దానిలోని ‘మంచి’ని పొందలేక పోతే అతనే అసలైన దౌర్భాగ్యుడు”. (నసాయి: 2106, సహీహుల్ జామె అస్సగీర్ లిల్ అల్బానీ: 55)
రమజాన్ మాసపు ప్రత్యేకతలు
ఈ మాసానికి ఎన్నో ప్రత్యేకతలు వున్నాయి. ఈ కారణం వల్లే ఇది ఇతర మాసాలపై ఔన్నత్యాన్ని కలిగివుంది. దీని కొన్ని ప్రత్యేకతలు ఇవి:
1) దివ్య ఖురాను అవతరణ
అల్లాహ్- ఆకాశ గ్రంథాలలో అన్నింటి కన్నా ఉత్తమమైన గ్రంథాన్ని (ఖురాను) అన్నింటికన్నా శ్రేష్టమైన మాసంలో (రమజాన్ మాసం) అవతరింప జేశాడు. అంతేకాక, ఈ శుభప్రదమాసంలోని శ్రేష్టమైన రాత్రి (లైలతుల్ ఖద్ర్) యందు దీనిని ‘లౌహె మహ్ ఫ్యూజ్’ నుండి ఒక్కసారిగా ఇహలోకపు ఆకాశంపైకి అవతరింపజేసి ‘బైతుల్ ఇజ్జ’ (మొదటి ఆకాశం లోని ఒక ప్రదేశం) నందు పొందు పరచాడు.
అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
شَهْرُ رَمَضَانَ الَّذِي أُنزِلَ فِيهِ الْقُرْآنُ هُدًى لِّلنَّاسِ وَبَيِّنَاتٍ مِّنَ الْهُدَىٰ وَالْفُرْقَانِ ۚ
“రమాజాన్ నెల – ఖురాను అవతరింపజేయ బడిన నెల. అది మానవు లందరికీ మార్గదర్శకం. అందులో సన్మార్గంతో పాటు, సత్యా సత్యాలను వేరుపరచే స్పష్టమైన నిదర్శనాలు ఉన్నాయి”. (బఖర 2:185)
ఇంకా ఇలా సెలవిచ్చాడు.
إِنَّا أَنْزَلْنَهُ فِي لَيْلَةِ الْقَدْرِ
“నిశ్చయంగా మేము దీనిని (ఈ ఖురానును) ఘనమైన రాత్రి (లైలతుల్ ఖద్ర్) యందు అవతరింపజేశాము”. (ఖద్ర్: 1)
2) నరకాగ్ని నుండి విముక్తి
ఈ మాసపు రెండో విశిష్టత ఏమిటంటే, అల్లాహ్ – ఈ మాసంలో ఎంతో మంది దాసులను నరకాగ్ని నుండి విముక్తి కలిగిస్తాడు.
జాబిర్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు:
“నిశ్చయంగా అల్లాహ్ ప్రతి ఇఫ్తార్ సమయంలో ఎంతో మందిని నరకాగ్ని నుండి విముక్తుల్ని చేస్తాడు. ఇలా ప్రతి రోజూచేస్తాడు”. (ఇబ్నె మాజ: 1643, సహీహుల్ జామె అస్సగీర్, అల్బానీ:2170)
అబూ సయీద్ ఖుద్రీ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు:
“నిశ్చయంగా అల్లాహ్ (రమజాన్ మాసంలో) ప్రతి రోజూ, ప్రతి రాత్రి ఎంతో మందిని నరకాగ్ని నుండి విముక్తుల్ని చేస్తాడు మరియు ప్రతి రోజూ, ప్రతి రాత్రి ముస్లిం యొక్క ఒక ప్రార్థన (దుఆ) స్వీకరించబడుతుంది”. (బజ్జార్, సహీహ్ అత్తర్గీబ్ వత్ తర్హీబ్ లిల్ అల్బానీ:1002)
ఈ హదీసులను, దృష్టిలో వుంచుకొని మనం కూడా అల్లాహ్ ను – తను ఈ మాసంలో నరకాగ్ని నుండి విముక్తుల్ని చేసే అదృష్టవంతులలో మనల్నికూడా చేర్చమని ప్రత్యేకంగా ప్రార్థించాలి. ఎందుకంటే అసలైన సాఫల్యం ఇదే మరి.
దీని గురించి అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
فَمَن زُحْزِحَ عَنِ النَّارِ وَأُدْخِلَ الْجَنَّةَ فَقَدْ فَازَ ۗ وَمَا الْحَيَاةُ الدُّنْيَا إِلَّا مَتَاعُ الْغُرُورِ
“అప్పుడు ఎవడు నరకాగ్ని నుండి కాపాడబడి, స్వర్గంలో ప్రవేశం కల్పించబడతాడో అతడు నిశ్చయంగా సఫలీకృతుడయ్యాడు”. (ఆలి ఇమ్రాన్ : 185)
(3) స్వర్గ ద్వారాలు తెరవబడటం.
(4) నరక ద్వారాలు మూసివేయబడటం.
(5) తలబిరుసు షైతానులు బంధించి వేయబడటం.
ఈ మూడు ఆదేశాలు రమజాన్ మాసపు ప్రత్యేకతలలోనివి. అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు:
“రమజాన్ మాసపు మొదటి రాత్రి రాగానే షైతానులను, తలబిరుసు జిన్నాతులను బంధించి వేయడం జరుగుతుంది. నరక ద్వారాలు మూసివేయబడతాయి. దాని ఏ ద్వారమూ తెరచి వుండదు. స్వర్గ ద్వారాలు తెరవబడతాయి. దానిలో ఏ ద్వారమూ మూయబడి వుండదు. ప్రకటన చేసేవాడొకడు ఇలా ప్రకటిస్తాడు – ఓ మంచిని కాంక్షించేవాడా! ముందుకు సాగిపో. ఓ చెడును కాంక్షించేవాడా! ఇకనైనా ఆగిపో”. (తిర్మిజి, ఇబ్నె మాజ, సహీహ్ అత్ తర్గీబ్ వ తర్ హీబ్ లిల్ అల్బానీ: 998)
6) ఒక్క రాత్రి…. వెయ్యి నెలల కన్నా మేలైనది.
రమజాన్ మాసపు ప్రత్యేకతల్లో గల మరో ప్రత్యేకత ఏమిటంటే దీనిలో 1000 నెలల కన్నా మేలైన ఒక రాత్రి వుంది. దీని గురించి అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
“ఘనమైన రాత్రి (లైలతుల్ ఖద్ర్) వేయి నెలలకన్నా మేలైనది”. (ఖద్ర్ :3)
అనస్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) కథనం:
“రమజాన్ మాసం ఆరంభం కాగానే దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు – నిశ్చయంగా ఈ మాసం మీ దగ్గరికి వచ్చేసింది. దీనిలో వేయి నెలలకన్నా మేలైన ఒక రాత్రి వుంది. ఇక ఏ వ్యక్తి అయినా దానిని పొందలేకపోతే అతను యావత్ మేలును కోల్పోయాడు. వాస్తవానికి దీని ‘మేలు’ను నిజమైన దురదృష్ట వంతుడే కోల్పోతాడు”. (ఇబ్నెమాజ: 1644, సహీహ్ అత్తర్గీబ్ వత్ తర్హీబ్: 1000)
(7) రమజాన్ మాసంలో ఉమ్రా, హజ్ తో సమానం
ఎంతో మహోన్నతమైన ఈ మాసపు ఏడో ప్రత్యేకత ఏమిటంటే – దీనిలో ఉమ్రా చేయడం హజ్ తో సమానం.
అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు) కథనం:
దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఒక అన్సారీ స్త్రీతో – “రమజాన్ మాసం విచ్చేస్తే, దానిలో నువ్వు ఉమ్రా చెయ్యి. ఎందుకంటే దీనిలో (రమజాన్ మాసం) ఉమ్రా చేయడం హజ్ తో సమానం”. (బుఖారీ: 1782, ముస్లిం: 1256)
మరో ఉల్లేఖనంలో ఈ హదీసు పదాలు ఇలా వున్నాయి:
దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ‘ఉమ్మె సనాన్’ అని పిలువబడే ఒక అన్సారీ స్త్రీతో ‘నువ్వు మాతో కలిసి హజ్ ఎందుకు చేయలేదు?’ అని అడిగారు. దానికామె, వాహనం లేదన్న కారణాన్ని వెలిబుచ్చింది. దీనిపై దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)- మరైతే రమజాన్ మాసంలో ఉమ్రా చేయడం, నాతో చేసే హజ్జ్ కు ‘బదులు’. అంటే- ఏ వ్యక్తి అయినా నాతో (దైవ ప్రవక్త) పాటు హజ్ చేయలేకపోతే, అప్పుడతను రమజాన్ మాసంలో గనక ఉమ్రా చేస్తే అది నాతోపాటు హజ్ చేసినట్లుగా అవుతుంది అని వివరించారు.
రమజాన్ మాసంలోని తప్పనిసరి ఆచరణలు
రమజాన్ మాసపు కొన్ని ప్రత్యేకతలు గురించి వివరించాక, ఇక ఈ నెలలో పాటించమని ప్రత్యేకంగా ఆజ్ఞాపించబడ్డ ఆచరణల గురించి వివరిస్తాం.
1) ఉపవాసం
రమజాన్ మాసంలోని ప్రత్యేక ఆచరణలలో అతి విశిష్టమైనది ఉపవాసం. ఎందుకంటే, దీని ఉపవాసాలను అల్లాహ్, అర్హులైన ప్రతి ఒక్కరిపై విధిగా ఖరారు చేశాడు.
అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
يَايُّهَا الَّذِينَ آمَنُوا كُتِبَ عَلَيْكُمُ الصِّيَامُ كَمَا كُتِبَ عَلَى الَّذِيْنَ مِنْ قَبْلِكُمْ لَعَلَّكُمْ تَتَّقُونَ
“ఓ విశ్వసించిన వారలారా! ఉపవాసాలుండటం మీపై విధిగా నిర్ణయించ బడింది. మీ పూర్వీకులపై కూడా ఇదే విధంగా ఉపవాసం విధించ బడింది. దీని వల్ల మీలో భయభక్తులు పెంపొందే అవకాశం వుంది.” (బఖర : 183)
దైవ ప్రవక్త(సల్లల్లాహు అలైహి వ సల్లం) రమజాన్ మాసపు ఉపవాసాలను ఇస్లాం మౌలికాంశాలలో ఒక మౌలిక అంశంగా ఖరారు చేశారు. దీని గురించి ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు:
“ఇస్లాం పునాది ఐదు విషయాలపై వుంది. (అవేమంటే) లా ఇలాహ ఇల్లల్లాహ్, వ అన్న ముహమ్మదన్ అబ్దుహూ వ రసూలుహ్ అని సాక్ష్యమివ్వడం, నమాజ్ నెలకొల్పటం, జకాత్ చెల్లించడం, బైతుల్లాహ్ హజ్ చేయటం మరియు రమజాన్ మాసపు ఉపవాసాలుండటం”. (బుఖారీ, ముస్లిం)
ఈ ఆధారాల ద్వారా తెలిసిందేమిటంటే – రమజాన్ మాసపు ఉపవాసాలు అర్హులైన ప్రతి వ్యక్తిపై విధిగా చేయబడ్డాయి. వ్యాధిగ్రస్తులకు, ప్రయాణికులకు సడలింపు వుంది. ఒకవేళ వారు వ్యాధి, ప్రయాణాల మూలంగా ఈ నెలలో ఉపవాసాలు వుండలేకపోతే, వాటిని తరువాతి నెలలలో పూర్తి చేయాలి. దీని గురించి అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
فَمَنْ شَهِدَ مِنْكُمُ الشَّهْرَ فَلْيَصُبُهُ
“మీలో వ్యాధిగ్రస్తులుగానో, ప్రయాణికులుగానో ఉన్నవారు ఆ ఉపవాసాల లెక్క – ఇతర దినాలలో పూర్తిచేసుకోవాలి”. (బఖర 2: 184)
ఉపవాసం మహత్యాలు
దివ్య ఖురాను మరియు హదీసులలో ఉపవాసం మహత్యాలు ఎన్నో వివరించబడ్డాయి. మరి మీరు కూడా ఆ మహత్యాల గురించి శ్రద్ధగా వినండి!
1) మన్నింపు మరియు గొప్ప పుణ్యఫలం వాగ్దానం
అల్లాహ్ ఉపవాసం పాటించేవారికి మన్నింపు మరియు గొప్ప పుణ్యఫలం యొక్క వాగ్దానం చేశాడు.
إِنَّ الْمُسْلِمِينَ وَالْمُسْلِمَتِ وَالْمُؤْمِنِينَ وَالْمُؤْمِنتِ وَالْقَنِتِينَ وَالْقُنِتُتِ وَالصُّدِقِينَ وَالصدقتِ والصيرِينَ وَالصَّبِرَاتِ وَالْخَشِعِينَ وَالْخَشِعَتِ وَالْمُتَصَدِقِينَ وَالْمُتَصَدِقَتِ وَالصَّابِمِينَ وَالطَّبِيتِ وَالْحَفِظِينَ فُرُوجَهُمْ وَالْحَفِظتِ والتكرينَ اللهَ كَثِيرًا وَالثَّكِرَاتِ أَعَدَّ اللهُ لَهُمْ مَغْفِرَةً وَأَجْرًا عَظِيمًا
“నిశ్చయంగా ముస్లిం పురుషులు – ముస్లిం స్త్రీలు, విశ్వాసులైన పురుషులు – విశ్వాసులైన స్త్రీలు, విధేయులైన పురుషులు – విధేయులైన స్త్రీలు, సత్యసంధులైన పురుషులు- సత్యసంధులైన స్త్రీలు, సహనశీలురైన పురుషులు- సహన శీలురైన స్త్రీలు, అణకువ గల పురుషులు- అణకువ గల స్త్రీలు, ఉపవాసం ఉండే పురుషులు- ఉపవాసం ఉండే స్త్రీలు, తమ మర్మాంగాలను కాపాడుకొనే పురుషులు- కాపాడుకొనే స్త్రీలు, అల్లాహ్ ను అత్యధికంగా స్మరించే పురుషులు- స్మరించే స్త్రీలు – వీరందరి కోసం అల్లాహ్ (విస్తృతమైన) మన్నింపును, గొప్ప పుణ్యఫలాన్ని సిద్ధం చేసి వుంచాడు”. (అహ్ జాబ్: 35)
దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు:
“ఎవరైనా విశ్వాసంతో మరియు పుణ్యఫలాపేక్షతో రమజాన్ మాసంలో ఉపవాసాలుంటే, అతని గత పాపాలు మన్నించబడతాయి”. (బుఖారీ, ముస్లిం)
‘ఈమానవ్ వ ఇహ్ తిసాబన్’ అంటే – స్వచ్ఛమైన సంకల్పంతో, పూర్తి నమ్మకంతో, కేవలం అల్లాహ్ ను సంతృప్తి పరచడానికి, దాని పుణ్య ఫలాన్ని పొందటానికి, మనఃపూర్వక సంతోషంతో, ఉపవాసాలను భారంగా అనుకో కుండా, రమజాన్ మాసపు వ్యవధిని అదృష్టంగా భావించి ఉపవాసాలుండడం అన్నమాట. ఈ అనుభూతితో ఉపవాసాలుంటే అతని గత పాపాలు క్షమించ బడతాయి.
2) ఉపవాసం పుణ్యఫలం కేవలం అల్లాహ్ కు తెలుసు
అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు:
ఆదం సంతతి ప్రతి (సత్) కార్యం ఎన్నో రెట్లు పెంచబడుతుంది. ఒక సత్కార్యానికి 10 నుండి 700 రెట్ల వరకు పుణ్యఫలం పెంచబడుతుంది. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు –
“కేవలం ఉపవాసం తప్ప. ఎందుకంటే అది కేవలం నాకోసం (ప్రత్యేకం), కనుక నేనే దీని ప్రతిఫలం ఇస్తాను. ఎందుకంటే నా మూలంగా అతను తన కోరికలను, అన్నపానీయాలను త్యజిస్తాడు.”
‘కేవలం ఉపవాసం తప్ప. ఎందుకంటే అది నా కోసం’. అంటే – ఒక విశ్వాసి మిగతా ఆచరణలు – ఉదా|| నమాజ్, దానధర్మాలు, స్మరణ వగైరా|| లు (ఇతరులకు) కానవస్తాయి మరియు దైవదూతలు వాటిని నోట్ కూడా చేసు కుంటారు. కానీ, ఉపవాసం ఎలాంటి ఆచరణ అంటే – అది బయటికి కనిపిం చదు, కేవలం ఒక్క సంకల్పంతోనే మనిషి ఉపవాస స్థితిలోకి వెళ్ళిపోతాడు. మరి సంకల్పం జ్ఞానం అల్లాహ్ కు తప్ప మరెవరికీ వుండదు. చివరికి దైవదూతలకు కూడా వుండదు. అందుకే అల్లాహ్ దీని గురించి – ఉపవాసం నా కోసం మరియు నేనే దీనికి తగిన ప్రతిఫలం ఇస్తాను అని సెలవిచ్చాడు.
అబూ ఉమామా (రదియల్లాహు అన్హు) కథనం: నేను దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సన్నిధికి వచ్చి – ఓ దైవ ప్రవక్తా! ఆచరించడానికి నాకేదైనా ఆజ్ఞాపించండి, మరో ఉల్లేఖనంలో ఇలా వుంది – నాకు ప్రయోజనం చేకూర్చే ఆచరణ గూర్చి తెలియజేయండి, ఇంకో ఉల్లేఖనంలో ఇలా వుంది- నన్ను స్వర్గానికి చేర్చే ఆచరణ గూర్చి తెలపండి అని విన్నవించుకున్నాను. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) జవాబిస్తూ – “నువ్వు ఉపవాసం వుండు. దానికి సమానంగా ఏ ఆచరణ కూడా లేదు” అని హితబోధ చేసారు. (నసాయి: 222, ఇబ్నె ఖుజైమా: 1893, అస్సహీహ:1937)
అంటే – కోరికల్ని అదుపులో ఉంచి, చెడు వైపునకు ప్రేరేపించే మనసు మరియు షైతానుకు విరుద్ధంగా పోరాటం చేయడానికి మరియు పుణ్యఫలం రీత్యా ఉపవాసానికి సమానమైన ఆచరణ ఏదీ లేదు.
ఉపవాసం పుణ్యఫలం ఎంతో ఎక్కువగా వుండి దాని జ్ఞానం కేవలం అల్లాహ్ కే వుంది కనుక ఉపవాసం పాటించే వాడు ప్రళయం నాడు అల్లాహ్ ను కలసినప్పుడు, తనకు దొరికిన పుణ్యఫలానికి గాను ఎంతో సంతోషిస్తాడు.
దీని గురించి దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు. “ఉపవాసం పాటించే వాడు రెండు సార్లు సంతోషం చెందుతాడు. మొదటి సారి ఇఫ్తార్ సమయంలో, ఇక రెండవసారి అల్లాహ్ ను కలుసుకున్న సమయంలో.” (బుఖారీ:1904, ముస్లిం: 1151)
3) ఉపవాసం డాలు వంటిది
అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు:
“ఉపవాసం డాలు వంటిది. (అందుకే) మీలో ఎవరైనా ఉపవాసస్థితిలో వుంటే అనుచిత మాటలు మాట్లాడ కండి, గొడవలు, పొట్లాటల నుండి దూరంగా వుండండి, ఒకవేళ ఏ వ్యక్తి అయినా మీతో దుర్భాషలాడితే అతనితో – నేను ఉపవాసంలో వున్నాను అని చెప్పేయండి”. (బుఖారీ, 1904, ముస్లిం: 1151)
ఉపవాసం ‘డాలు’ వంటిది అంటే- ఇది కోరికల్ని అదుపులో వుంచు తుంది. పాపాల నుండి నిరోధిస్తుంది, అలాగే నరకాగ్ని నుండి రక్షిస్తుంది.
దీని గురించి దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు:
“యుద్ధంలో రక్షణ కొరకు ఉపయోగించే డాలు (రక్షణ కవచం)లాగే ఉపవాసం కూడా నరకాగ్నికి విరుద్ధంగా డాలు వంటిది“. (నసాయి : 2231, ఇబ్నెమాజ: 1639, సహీ అత్తర్బ్ వ తరీబ్:982)
4) అల్ రయ్యాన్ ద్వారం
స్వర్గంలోని ఒక ద్వారం పేరు ‘అల్ రయ్యాన్’. ఈ ద్వారం కేవలం ఉపవాసం పాటించేవారి కొరకు ప్రత్యేకించబడింది.
సహల్ బిన్ సాద్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు.
“నిశ్చయంగా స్వర్గంలో ఒక ద్వారం వుంది. దాని పేరు ‘అల్ రయ్యాన్’. ప్రళయం రోజు ఈ ద్వారం గుండా కేవలం ఉపవాసం పాటించినవారు ప్రవేశిస్తారు. వీరు తప్ప ఇతరులెవరూ దీని గుండా ప్రవేశించరు. ఇలా ఎలుగెత్తి చాటడం జరుగుతుంది- ఉపవాసం పాటించిన వారు ఎక్కడున్నారు? అప్పుడు వారంతా నిలబడతారు. వారు తప్ప ఇతరులెవరూ ఆ ద్వారం గుండా స్వర్గంలోకి ప్రవేశించలేరు. ఇలా ఉపవాసం పాటించిన వారంతా స్వర్గంలోకి వెళ్ళిపోయాక ఆ ద్వారాన్ని మూసివేయడం జరుగుతుంది”. (బుఖారీ:1896, ముస్లిం: 1152)
అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు: ఏ వ్యక్తి అయినా అల్లాహ్ మార్గంలో (ఏమిచ్చినా ఎల్లప్పుడూ ఒకటిగా కాకుండా జతగా) ఖర్చు పెడతాడో అతణ్ణి స్వర్గపు ద్వారాల నుండి కేకవేస్తూ ఇలా పిలవడం జరుగుతుంది – ఓ అల్లాహ్ దాసుడా! (ఈ ద్వారం) నీ కొరకు మేలైనది. ఇలా, నమాజ్ చదివేవారిని ‘బాబుస్సలాత్’ నుండి, అల్లాహ్ మార్గంలో పోరాడే యోధులను ‘బాబుల్ జిహాద్’ నుండి, ఉపవాసం పాటించిన వారిని ‘బాబుర్రయాన్’ నుండి మరియు దానధర్మాలు చేసేవారిని ‘బాబుస్సదఖ’ నుండి పిలవడం జరుగుతుంది.
దీనిపై అబూ బక్ర్ (రదియల్లాహు అన్హు) – ఓ దైవ ప్రవక్తా! నా తల్లిదండ్రులు మీ కర్పితం అవుగాక! ఏ వ్యక్తికైనా ఒకవేళ అన్ని ద్వారాల నుండి పిలవడం జరిగితే అతనికి ఇంకా ఏం కావాలి? మరి అలాంటి అదృష్ట వంతులు కూడా ఎవరైనా వుంటారా? అని అడిగారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) జవాబిస్తూ అవును, వుంటారు. మీరు వారిలోనే (ఆ అదృష్టవంతులలోనే) వుంటారని నేను ఆశిస్తున్నాను అని పలికారు. (బుఖారీ:1897, ముస్లిం:1027)
(5) ఉపవాసం సిఫారసు చేస్తుంది
ప్రళయం రోజు ఉపవాసం, తనను పాటించే వారి కొరకు సిఫారసు చేస్తుంది మరియు దాని సిఫారసు స్వీకరించబడుతుంది. దీని గురించి దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు:
“ఉపవాసం మరియు ఖురాన్ – ఈ రెండూ, దాసుల కొరకు ప్రళయం రోజు సిఫారసు చేస్తాయి. ఉపవాసం ఇలా అంటుంది. ఓ నా ప్రభూ! నేను ఇతణ్ణి అన్నపానీయాల నుండి, కోరికల నుండి ఆపి వుంచాను. అందుకే ఇతని కొరకు నా సిఫారసు స్వీకరించు. అలాగే దివ్య ఖురాన్ ఇలా అంటుంది – నేను ఇతణ్ణి రాత్రిళ్ళు నిద్ర నుండి ఆపి వుంచాను. అందుకే ఇతని కొరకు నా సిఫారసు స్వీకరించు. ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు – తదుపరి ఇద్దరి సిఫారసు స్వీకరించ బడుతుంది.” (అహ్మద్, హాకిమ్, సహీహ్ అత్తర్గీబ్ వత్ తర్హీబ్: 984)
6) ఉపవాసముండే వ్యక్తి నుండి వెలువడే వాసన అల్లాహ్ దృష్టిలో కస్తూరి కన్నా మంచిది.
అవునండీ! ఉపవాసముండే వ్యక్తి నోటి నుండి వెలువడే వాసన అల్లాహ్ దృష్టిలో కస్తూరి కన్నా మంచిది. దీని గురించి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు:
“ఎవరి చేతుల్లో ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రాణముందో, ఆ శక్తిమంతుని సాక్షి! ఉపవాసముండే వ్యక్తి నోటి నుండి వెలువడే వాసన అల్లాహ్ వద్ద కస్తూరి సువాసన కన్నా ఎంతో మంచిది”. (బుఖారీ:1904:, ముస్లిం: 1151)
7) ఉపవాస స్థితిలో మరణిస్తే నేరుగా స్వర్గ ప్రవేశం
హుదైఫా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు:
“ఎవరైనా ‘లాఇలాహ ఇల్లల్లాహ్ ‘ పఠించి దానిపైనే అతనికి మరణం సంభవిస్తే అతను నేరుగా స్వర్గంలోకి వెళ్తాడు, అలాగే ఏ వ్యక్తి అయినా అల్లాహ్ మెప్పు కొరకు ఒక రోజు ఉపవాసం ఉండి, ఈ స్థితిలోనే అతనికి మరణం సంభవిస్తే అతను కూడా నేరుగా స్వర్గంలోకి వెళతాడు. ఇంకా, ఏ వ్యక్తి అయినా అల్లాహ్ మెప్పు కొరకు దానం చేసే సమయంలోనే అతనికి మరణం సంభవిస్తే అతను కూడా నేరుగా స్వర్గంలోకి వెళతాడు” (అహ్మద్: 23324, సహీహ్ అత్ తర్గీబ్ వ తర్ హీబ్: 985)
8) ఉపవాసం – స్వర్గానికి తీసుకెళ్ళే ఆచరణలల్లో ఒకటి
అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం: ఒక పల్లెటూరి వ్యక్తి, దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సన్నిధికొచ్చి ఇలా అడిగాడు- ఓ దైవ ప్రవక్తా! నాకు స్వర్గానికి తీసుకెళ్ళే విషయం గూర్చి చెప్పండి?
దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) జవాబిస్తూ – నువ్వు అల్లాహ్ ను ఆరాధించు.ఆయనతోపాటు ఇతరులెవరినీ భాగస్వాములుగా చేర్చకు. ఫర్జ్ నమాజులను నెలకొల్పు, ఫర్జ్ జకాత్ను చెల్లించు మరియు రమజాన్ మాసపు ఉపవాసాలు పాటించు – అని హితబోధ చేశారు.
ఇది విని ఆ పల్లెటూరి వ్యక్తి – నా ప్రాణం ఎవరి చేతుల్లో వుందో ఆ శక్తిమంతుని సాక్షి! ఇక నేను ఎల్లప్పుడూ దీని కన్నా ఎక్కువగా గానీ, తక్కువగా గానీ చేయను అని పలికాడు. తదుపరి అతను వెళ్ళిపోయాక, దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)- ‘ ఎవరైనా స్వర్గవాసుల్లో ఎవరినైనా చూడాలనుకుంటే అతణ్ణి చూడండి‘ అని అన్నారు. (బుఖారీ:1397, ముస్లిం: 14)
ఉపవాసం పాటించనివారి పరిణామం
శుభప్రద రమజాన్ మాసపు ప్రత్యేకతలు, ఉపవాసం మహత్యాల గురించి విన్నాక ఇక రండి, షరీయత్తు పరమైన అడ్డంకి ఏమీ లేకుండా ఉపవాసం పాటించకపోవడం ఎంత పాపమో మరియు దాని శిక్ష ఏమిటో – వీటి గురించి కూడా కాస్త తెలుసుకోండి.
అబూ ఉమామ బాహిలి (రదియల్లాహు అన్హు) కథనం: నేను దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ను ఇలా సెలవిస్తుండగా విన్నాను –
“నేను నిద్రపోతున్నాను. కలలో ఇద్దరు వ్యక్తులు నా వద్ద కొచ్చి, నా ప్రక్కలను పట్టి నన్ను లేపి, ఎక్కడానికి ఎంతోకష్టంగా వున్న ఒక కొండ వద్దకు నన్ను తీసుకెళ్ళి దానిని ఎక్కమని చెప్పారు. నేను వారితో ‘నేను దీనిపైకి ఎక్కలేను’ అని అన్నాను. దీనిపై వారు, ‘మేము నీకోసం దీనిని తేలికగా చేస్తాం’ అన్నారు. తదుపరి నేను ఆ కొండ ఎక్కుతూ దాని శిఖరానికి చేరుకున్నాను. అక్కడ నేను అరిచే, పెడబొబ్బలు పెట్టే ధ్వనులు విన్నాను. నేను వారితో, ఈ అరుపులు ఏమిటి? అని అడిగాను. వారు, ఇవి నరకవాసుల అరుపులు అన్నారు. తదుపరి నన్ను వారు ముందుకు తీసుకెళ్ళారు. అక్కడ నేను కొందరిని, తలక్రిందులుగా వ్రేలాడదీయబడి, దవడలు చీల్చబడగా రక్తం కారుతుండడం చూసి, ఎవరు వీరు? అని అడిగాను. ‘ఉపవాస కాలంలో వీరు (దానిని పాటించకుండా) తినే వారు, త్రాగేవారు’ అని జవాబు ఇవ్వబడింది. (ఇబ్నె ఖుజైమా,ఇబ్న్ హిబ్బాన్, సహీహ్ అత్ తర్గీబ్ వ తర్ హీబ్: 1005)
2) రమజాన్ మాసపు ఖియాం (తరావీహ్ నమాజ్)
శుభప్రద రమజాన్ మాసంలో ప్రత్యేకంగా తాకీదు చేయబడిన ఆచరణలలో, దీని ఖియాం – అంటే తరావీహ్ నమాజ్ కూడా ఒకటి.
అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం: దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) రమజాన్ ఖియాం గురించి ఎంతగానో ప్రోత్సహించడమే కాక దీని గురించి గట్టిగా ఆజ్ఞాపించేవారు. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు:
“ఏ వ్యక్తి అయినా విశ్వాసంతో, అల్లాహ్ మెప్పు పొందాలన్న ఉద్దేశ్యంతో రమజాన్ మాసంలో ఖియాం చేస్తే అతని గత పాపాలు క్షమించబడతాయి”. (బుఖారీ:37, 2008, ముస్లిం: 759)
ఆయేషా (రదియల్లాహు అన్హా) కథనం: ఒక రాత్రి దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అర్థ రాత్రి సమయంలో మస్జిద్కు వెళ్ళి నమాజ్ చదివారు. ప్రజలు కూడా ఆయన నాయకత్వంలో నమాజు చదివారు. తెల్లవారిన తరువాత (ఈ నమాజ్ గురించి) ఒకరికొకరు చెప్పుకున్నారు. ఇలా మరుసటి రాత్రి, మొదటి రాత్రి కన్నా ఎక్కువగా ప్రజలు గుమిగూడారు మరియు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వెనుక నమాజ్ చేశారు. తెల్లవారిన తరువాత వీళ్ళు మరింత మందికి ఈ విషయం చెప్పారు. ఇక మూడో రాత్రి వచ్చేసరికి (నమాజ్ చేయడానికి వచ్చిన) ప్రజల సంఖ్య బాగా పెరిగి పోయింది. తదుపరి దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మస్జిద్ వద్దకు రాగా వారు ఆయన వెనుక నమాజ్ చేశారు. ఇలా నాలుగవ రాత్రి వచ్చే సరికి (నమాజ్ కోసం) ఎంత మంది వచ్చారంటే (వారి ముందు) మస్జిద్ చిన్నదిగా కనిపించసాగింది. కానీ ఆ రాత్రి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఫజర్ నమాజ్ అజాన్ అయ్యేంత వరకు మస్జిద్కు వెళ్ళలేదు. తదుపరి ఆయన ఫజర్ నమాజ్ చేయించి, ప్రజల వైపు తిరిగి ‘ఖుత్బా మస్నూన’ పఠించి ఇలా సెలవిచ్చారు – ప్రజలారా! రాత్రి మీరు మస్జిద్ లో వున్నారన్న సంగతి నాకు తెలియకుండా లేదు. కానీ (నేను మస్జిద్కు రాకపోవడానికి కారణమేమిటంటే) ఈ నమాజ్ మీ పై ఫర్జ్ (విధి) గావించబడి, తదుపరి మీరు దానిని ఆచరించడానికి కష్టపడతారేమో అని నాకు అనుమానం కలిగింది. (బుఖారీ:2012, ముస్లిం: 761)
ఇక తరావీహ్ నమాజ్ రకాతుల విషయానికి కొస్తే వాటికి సంబంధించిన కొన్ని హదీసులను వినండి.
(1) సహీహ్ బుఖారీలో ఇలా ఉల్లేఖించబడింది. – అబూ సల్మా బిన్ అబ్దుర్రహ్మాన్, ఆయెషా (రదియల్లాహు అన్హా) ను ఇలా అడిగారు: రమజాన్ మాసంలో దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) నమాజ్ ఎలా వుండేది? ఆమె జవాబిస్తూ- దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) రమజాన్ మాసంలోగానీ, ఇతర మాసాల్లో గానీ 11 రకాతుల కన్నా ఎక్కువగా చదివేవారు కాదు అని వివరించారు. (బుఖారీ:2013, ముస్లిం: 738)
(2) జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ (రదియల్లాహు అన్హు) కథనం: దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మాకు రమజాన్ లో 8 రకాతులు మరియు వితర్ నమాజు చేయించారు. మరుసటి రోజు రాత్రి మేమంతా మస్జిద్లో గుమిగూడి ఆయన(సల్లల్లాహు అలైహి వ సల్లం) బయటికొస్తారన్న నమ్మకంతో వేచి చూశాం. కానీ మేము తెల్లవారేదాక అలానే వేచి చూడాల్సి వచ్చింది. దీని గురించి దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ముందు ప్రస్తావించగా ఆయన, ఈ వితర్ మీపై విధి (ఫర్జ్) గావించ బడతుందేమోనని నేను సందేహించాను అని వివరించారు. (సహీహ్ ఇబ్నె ఖుజైమా: 170, ఇబ్నె హిబ్బాన్: 2409, 2415, అబూ యాలా:3/336 హసన్ -అల్బానీ)
(3) ఇమామ్ మాలిక్, సాయిబ్ బిన్ యజీద్ (రదియల్లాహు అన్హు) ద్వారా ఇలా ఉల్లేఖించారు: ఉమర్ (రదియల్లాహు అన్హు , ఉబై బిన్ కాబ్ (రదియల్లాహు అన్హు) మరియు తమీమ్ దారీ (రదియల్లాహు అన్హు) లకు 11 రకాతులు చదివించమని ఆజ్ఞాపించారు. (ముఅత్తా : 1/73, ఇబ్నె అదీ: 2/1391)
ఈ హదీసుల ద్వారా తెలిసిందేమిటంటే –
1) రమజాన్ మరియు ఇతర మాసాల్లోని రాత్రులలో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చదివింది 11 రకాతులే.
2) ఈ 11 రకాతులనే ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) తన సహాబాలకు సామూహికంగా చేయించారు.
3) తదుపరి, ఉమర్ (రదియల్లాహు అన్హు) కూడా తరావీహ్ నిమిత్తం ప్రజలను సమీకరించి, ఉబై బిన్ కాబ్ (రదియల్లాహు అన్హు) మరియు తమీమ్ దారీ (రదియల్లాహు అన్హు) లకు 11 రకాతులే చేయించమని ఆజ్ఞాపించారు. తరావీహ్ నమాజే రమజాన్ మాసంలో తహజ్జుద్ నమాజు
4) అబూ జర్ (రదియల్లాహు అన్హు) కథనం: మేము దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)తో పాటు రమజాన్ మాసపు ఉపవాసాలున్నాం. ఈ వ్యవధిలో కేవలం ఏడు రోజులు మిగిలివున్నంత వరకు ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) మాకు ఖియాం చేయించలేదు. తదుపరి ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) 23వ రాత్రి ఖియాం చేయగా మేము కూడా ఆయనతో పాటు ఖియాం చేశాం. దీనిలో ఆయన మూడింట ఒక వంతు రాత్రి గడిచే వరకు సుదీర్ఘంగా (ఖురాన్) పారాయణం చేశారు. తదుపరి 24వ రాత్రి ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) మాతో ఖియాం చేయలేదు. ఆ తర్వాత 25వ రాత్రి అర్థరాత్రి గడిచే వరకు ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) మాతో ఖియాం చేశారు. దీనితో నేను ఓ దైవ ప్రవక్తా! మీరు ఈ రోజు రాత్రంతా ఖియాం చేస్తే బాగుండేది! అని అన్నాను. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) జవాబిస్తూ – ఏ వ్యక్తి అయినా ఇమామ్ తన ఖియాం పూర్తి చేసుకొనే వరకు, అతనితోపాటు ఖియాం చేస్తే అతనికి రాత్రంతా ఖియాం చేసినంత పుణ్యఫలం లిఖించబడుతుంది అని వివరించారు. తదుపరి 26వ రాత్రి గడిచిపోయింది. ఆ రాత్రి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మాతో ఖియాం చేయలేదు. ఆ తర్వాత 27వ రాత్రి ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) మాతోపాటు ఖియాం చేశారు. తన సతీమణులకు కూడా (మస్జిద్కు) తీసుకొచ్చారు. (ఆ రాత్రి) ఆయన ఎంత సుదీర్ఘంగా ఖియాం చేసారంటే – సహరీ సమయం గడిచిపోతుందేమోనని మాకు అనుమానం కలిగింది. (తిర్మిజీ:806, అబూదావూద్:1375, నసాయి: 1605, ఇబ్నె మాజ: 1327, సహీహ్ – అల్బానీ)
ఈ హదీసు ద్వారా తెలిసిందేమిటంటే – దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) రమజాన్ మాసంలో తరావీహ్ తోనే సరిపెట్టుకొనేవారు. దాని తర్వాత తహజ్జుద్ చదవలేదు. ఎందుకంటే, సహరీ సమయం వరకు ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) తరావీహ్ నమాజ్ చేయిస్తూనే వున్నారు. ఒకవేళ దీనిలో, తహజ్జుద్ నమాజ్లో ఏదైనా తేడా వుంటే లేదా రెండు నమాజులు వేర్వేరు అయివుంటే, ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) తరావీహ్ నమాజు తర్వాత తహజ్జుద్ నమాజు చదివేవారు. (కానీ అలా చేయలేదు). కనుక తేలిందేమిటంటే తరావీహ్ నమాజే తహజ్జుద్ కూడాను.
ఇలా ఇతర మాసాల్లో తహజ్జుద్ నమాజుగా పిలువబడే నమాజు రమజాన్ మాసంలో తరావీహ్ నమాజుగా పిలువబడుతుంది. ఈ కారణం చేతనే హదీసు వేత్తలు ఆయెషా (రదియల్లాహు అన్న) హదీసును (మొదటి హదీసు) తరావీహ్ అధ్యాయంలో పేర్కొన్నారు. అందుకే దీనిని తహజ్జుద్ నమాజు అనుకొని, తదుపరి దీనిలో, తరావీహ్ నమాజులో తారతమ్యం చూపడం ఎంత మాత్రం సరికాదు.
ఉమర్ (రదియల్లాహు అన్హు) 20 రకాతులు చేయించమని ఆదేశించారా?
మేము ‘ముఅత్తా’ మరియు ‘ఇబ్నె అబి షైబా’ లోని సాయిబ్ బిన్ యజీద్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించిన హదీసు – ఉమర్ (రదియల్లాహు అన్హు) , ఉబై బిన్ కాబ్ (రదియల్లాహు అన్హు) మరియు తమీమ్ దారీ (రదియల్లాహు అన్హు) లకు 8 రకాతులు చదివించమని ఆజ్ఞాపించారు అని మీకు వివరించాం. ఇమామ్ మాలిక్ ఈ హదీసును ఉల్లేఖించిన తర్వాత వెంటనే మరో హదీసును కూడా తీసుకొచ్చారు. దాని పదాలు ఇలా వున్నాయి:
యజీద్ బిన్ రూమాన్ కథనం: ప్రజలు ఉమర్ (రదియల్లాహు అన్హు) పరిపాలనా కాలంలో, రమజాన్ మాసంలో 23 రకాతులు చదివేవారు. (ముఅత్తా:1/73)
కాని, ఇది పరంపర తెగిన (మున్ఖత) హదీసు, అంటే బలహీనమైనది, ఎందుకంటే దీని ఉల్లేఖకుడు యజీద్ బిన్ రూమాన్, ఉమర్ (రదియల్లాహు అన్హు) పరిపాలనా కాలాన్ని అసలు పొందనేలేదు. (అంటే ఆ సమయంలో జన్మించనే లేదు). ఒకవేళ దీనిని ‘సహీహ్’ అని భావించినా, రెండింటిలో మొదటి హదీసే సరైనది. ఎందుకంటే, దానిలో ఉమర్ (రదియల్లాహు అన్హు) సహాబాలకు 11 రకాతులు చదివించమని ఆజ్ఞాపించారు. రెండవ దానిలో ప్రజలు ఉమర్ (రదియల్లాహు అన్హు) పరిపాలనా కాలంలో 23 రకాతులు చదివేవారని ఉంది. కనుక, ఉమర్ (రదియల్లాహు అన్హు) దేని గురించైతే ఆజ్ఞాపించారో అదే సరైనది మరియు సున్నత్కు అనుగుణంగా వుంది.
3) దానధర్మాలు చేయటం, సత్కార్యాల్లో ఎక్కువగా పాలుపంచు కోవడం
శుభప్రదమైన రమజాన్ మాసంలో ఉపవాసం, ఖియాంలతో పాటు తమ శక్తి కొలది దాన ధర్మాలు కూడా చేయాలి. సత్కార్యాలు అధికంగా చేస్తూ వుండాలి. ఎందుకంటే దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ శుభప్రదమాసంలో మంచికి సంబంధించిన అన్ని కార్యాల్లో అందరికన్నా ముందుండేవారు.
ఇబ్న్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు) కథనం:
“దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రజలందరికన్నా ఎక్కువగా సత్కార్యాలు చేసేవారు. ఆయన, అన్నింటికన్నా ఎక్కువగా సత్కార్యాలను రమజాన్ మాసంలో చేసేవారు. జిబ్రయీల్ (అలైహిస్సలాం) వచ్చి ఆయనను కలిసేవారు. జిబ్రయీల్ (అలైహిస్సలాం) రమజాన్ మాసపు ప్రతి రాత్రి ఆయనను వచ్చి కలిసేవారు. అప్పుడు దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆయనకు ఖురానును వినిపించేవారు. జిబ్రయీల్ (అలైహిస్సలాం)ను కలిసాక, ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) సుడిగాలి కన్నా వేగంగా సత్కార్యాల వైపునకు పరుగెత్తేవారు“. (బుఖారీ:1902)
(ఈ సత్యార్యాల్లో) ప్రత్యేకించి ఉపవాసం ఉండేవారి కొరకు ఇఫ్తార్ ఏర్పాట్లు తప్పనిసరిగా చేయాలి. ఎందుకంటే, దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చి వున్నారు:
“ఏ వ్యక్తి అయినా ఉపవాసం పాటించే వానికి ఇఫ్తార్ చేయిస్తే – ఉపవాసం ఉన్న వ్యక్తికి దొరికినంత పుణ్యం ఇతని క్కూడా దొరుకుతుంది. ఉపవాసం పాటించిన వ్యక్తికి లభించే పుణ్యఫలంలో ఏవిధమైన తగ్గింపు రాదు.” (తిర్మిజి, నసాయి, ఇబ్నె మాజ, సహీహ్ అత్తర్గీబ్ వత్ తర్హీబ్:1078)
4) దివ్య ఖురాన్ పఠనం
శుభప్రదమైన రమజాన్ మాసంలో ఎక్కువగా చేయాల్సిన సత్యార్యాలలో ఖురాను పఠనం కూడా ఒకటి. ఎందుకంటే, దివ్య ఖురాన్లో అల్లాహ్ ఉపవాసాల విధిత్వం గురించి వివరించాక, దానితోపాటే రమజాన్ మాసపు ఈ ప్రత్యేకతను కూడా వివరించాడు. అదేమిటంటే, ప్రజలకు సన్మార్గం చూపే దివ్య ఖురాన్ ఈ నెలలోనే అవతరించింది అని, దీని ద్వారా తెలిసేదేమిటంటే, దివ్య ఖురాను, రమజాన్ మాసానికి మధ్య ఎంతో ప్రగాఢ సంబంధం వుంది. అందుకే ఈ నెలలో వీలైనంత ఎక్కువగా దివ్య ఖురాన్ను పఠించాలి. స్వయానా దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కూడా ఈ నెలలో ఈ విషయంలో ఎంతో శ్రద్ధ చూపేవారు మరియు ఈ నెలలో ప్రతి రాత్రి జిబ్రయీల్ (అలైహిస్సలాం) కు ఖురాన్ వినిపించేవారు.
సహీహ్ బుఖారీ హదీసు ఆధారంగా మేమీ విషయాన్ని మీకు ముందే వినిపించాం. ఇక దివ్య ఖురాను మహత్యాలను గూర్చి చెప్పాలంటే దీని ప్రతి అక్షరానికి బదులుగా 10 పుణ్యాలు దొరుకుతాయి అన్న మహత్యమే చాలు.
అబ్దుల్లా బిన్ మసూద్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు:
“ఏ వ్యక్తి అయినా అల్లాహ్ గ్రంథం (ఖురాన్) నుండి ఒక్క అక్షరం చదివినా అతనికి ఒక పుణ్యం దొరుకుతుంది. ఒక పుణ్యం, దాని లాంటి పది పుణ్యాలకు సమానమవుతుంది. ‘అలిఫ్ లామ్ మీమ్’ ఒక అక్షరమని నేను చెప్పను. పైగా, ‘అలిఫ్’ ఒక అక్షరం, ‘లామ్’ రెండో అక్షరం, ‘మీమ్’ మూడో అక్షరం“. (తిర్మిజీ: 2910, సహీహ్ – అల్బానీ)
గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే – దివ్య ఖురాను పారాయణం చేస్తున్నప్పుడు, పఠనంతో పాటు దాని గురించి ఆలోచన కూడా చేయాలి. దీనిని పఠించి, దాని గురించి ఆలోచించి, దానిని తమ జీవన శైలి లాగా మార్చుకోవడానికే ఈ గ్రంథం అంతరించింది.
అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
كتب أَنْزَلْنَهُ إِلَيْكَ مُبرَكَ ليد بروا التِهِ وَلِيَتَذَكَرَ أُولُوا الْأَلْبَابِ
“ఇదొక శుభప్రదమైన గ్రంథం. ప్రజలు దీని వాక్యాలపై చింతన చేసేటందుకు బుద్ధి జీవులు దీని ద్వారా గుణపాఠం నేర్చుకొనేందుకు మేము దీనిని నీవైపునకు పంపాము”. (సాద్: 29)
5) దుఆ, స్మరణ (జిక్ర్) మరియు అస్తగ్ ఫార్
శుభప్రద రమజాన్ మాసంలోని ముఖ్యమైన ఆచరణలలో, ఉపవాసం పాటించిన వ్యవధిలో వీలైనంత ఎక్కువగా దుఆ, అస్తగ్ ఫార్ మరియు అల్లాహ్ స్మరణ (జిక్ర్) చేయడం కూడా వుంది. ఎందుకంటే అల్లాహ్ వద్ద స్వీకరించబడే దుఆ లలో ఉపవాసం పాటించే వ్యక్తి దుఆ కూడా వుంది.
దీని గురించి దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు:
“మూడు దుఆలు రద్దు గావించబడవు. అవేమిటంటే తన సంతానం కోసం తండ్రి చేసే దుఆ, ఉపవాసం పాటించే వ్యక్తి దుఆ మరియు ప్రయాణికుని దుఆ”. (సహీహుల్ జామె అస్సగీర్ అల్ అల్బానీ: 3032)
మరో ఉల్లేఖనంలో ఇలా వుంది :
“మూడు దుఆలు రద్దు గావించబడవు. ఉపవాసం పాటించే వ్యక్తి దుతి, పీడితుని దుఆ మరియు ప్రయాణికుని దుఆ”. (సహీహుల్ జామె అస్సగీర్ లిల్ అల్బానీ: 3030)
ప్రత్యేకించి, ఇఫ్తార్ సమయంలో తప్పనిసరిగా దుఆ చేయాలి. ఎందుకంటే, ఆ సమయం దుఆ స్వీకరించబడే సమయాల్లో ఒకటి. దీని గురించి దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు.
“నిశ్చయంగా ఉపవాసం పాటించే వ్యక్తి ఇఫ్తార్ సమయంలో చేసే దుఆలో, రద్దు గావించబడని ఒక దుఆ వుంటుంది”. (ఇబ్నె మాజ : 1753)
అల్లాహ్ ను వేడుకొనేదేమిటంటే, ఆయన మనందరికీ ఈ మాసపు శుభాల ద్వారా ప్రయోజనం పొందే సద్బుద్ధిని ప్రసాదించుగాక! అమీన్!!
రెండవ ఖుత్బా
మొదటి ఖుత్బాలో మేము శుభప్రదమైన రమజాన్ మాసపు ప్రాముఖ్యత, మహత్యం మరియు దానిలోని ప్రత్యేక ఆచరణలను గూర్చి వివరించాము. రండి! ఇక ఉపవాసానికి సంబంధించిన కొన్ని మర్యాదలు మరియు వివరాలు కూడా కాస్త వినండి!
1) ఉపవాసం సంకల్పం
ఫర్జ్ ఉపవాసాలకు సంకల్పం (నియ్యత్) ఫజర్ ఆరంభానికి ముందుగా చేసుకోవడం తప్పనిసరి. దీని గురించి దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు:
“ఎవరైనా ఫజర్ ఆరంభానికి ముందుగా ఉపవాస సంకల్పం చేసుకోకపోతే అతని ఉపవాసం నెరవేరదు”. (సహీహుల్ జామె అస్సగీర్ అల్బానీ: 6534)
కానీ నఫిల్ ఉపవాసం సంకల్పం మాత్రం ఫజర్ ఆరంభం తరువాత జొహర్ ముందు వరకు కూడా చేసుకోవచ్చు. కానీ షరతు ఏమిటంటే, ఫజర్ ఆరంభమైన తర్వాత ఏమీ తినకుండా, త్రాగకుండా వుండాలి.
గుర్తుంచుకోవలసిన విషయమేమిటంటే, సంకల్పం హృదయానికి సంబంధించినది. అందుకే ఉపవాస సంకల్పం హృదయంలోనే చేసుకోవాలి. ఇక సంకల్పం గురించి ఉచ్చరించబడే ‘వబి సామి గదిన్ నవైతు మిన్ షహ్ రి రమజాన్’ అన్న పదాల గురించి చెప్పాలంటే, ఇవి ఏ హదీసు ద్వారా గూడా నిర్ధారించబడిలేవు.
2) సహ్రీ భుజించడం
అనస్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు:
“సహ్రీ తినండి, ఎందుకంటే సహ భుజించడంలో శుభం వుంది“. (బుఖారీ:1923, ముస్లిం: 1095)
మరో ఉల్లేఖనంలో ఇలా సెలవిచ్చారు:
“సహ్రీ అంతా శుభకరమే అందుకే దానిని త్యజించకండి. కనీసం ఒక గుటక నీళ్ళు త్రాగి అయినా సరే (సహ చేయండి). ఎందుకంటే సహ్రీ భుజించే వారిపై అల్లాహ్ తన కారుణ్యాన్ని పంపుతాడు మరియు ఆయన దూతలు వారికోసం ప్రార్థిస్తారు”. (అహ్మద్, సహీహ్ అత్ తర్గీబ్ వ తర్ హీబ్ అల్బానీ: 1070)
సహ్రీ ఆలస్యంగా చేయడం ఉత్తమం
సహల్ బిన్ సాద్ (రదియల్లాహు అన్హు) కథనం: “నేను మా ఇంటి వారితో కలిసి సహ్రీ భుజించేవాణ్ణి. తదుపరి దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)తో కలిసి నమాజు చేయడానికి త్వరత్వరగా (మస్జిదు) వచ్చే వాణ్ణి”. (బుఖారీ: 1920)
జైద్ బిన్ సాబిత్ (రదియల్లాహు అన్హు) కథనం: మేము దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తో కలిసి సహ్రీ తినే వాళ్ళం. తదుపరి ఆయన నమాజు వైపుకు వెళ్ళేవారు. అనస్ (రదియల్లాహు అన్హు) కథనం: నేనిలా అడిగాను; అజాన్ మరియు సహ్రీ ల మధ్య ఎంత సమయం వుండేది? ఆయన జవాబిస్తూ, 50 ఆయతులు పఠించగలిగే అంత అని అన్నారు. (బుఖారీ: 1921)
ఒకవేళ రాత్రి ఉసవాసం సంకల్పం చేసుకొని నిద్రపోయి, సహ్రీ కోసం మేల్కోనకపోతే, ఇలాంటి స్థితిలో ఏమి తిని త్రాగకుండానే ఉపవాసం పూర్తి చేస్తే, ఆ ఉపవాసం నెరవేరుతుంది. ఒకవేళ స్నానం చేయాల్సిన పరిస్థితి వుండి, సహ్రీ కోసం సమయం తక్కువగా వుంటే, ఇలాంటి స్థితిలో వుజూ చేసి ముందుగా సహ్రీ భుజించాలి. తదుపరి స్నానం చేసి నమాజు చదవాలి. దీని గురించి, ఉమ్మె సలమా (రదియల్లాహు అన్న మరియు ఆయెషా (రదియల్లాహు అన్హా) లు ఇలా వివరించారు: “ఒక్కోసారి దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) (నిద్ర నుండి) మేల్కొన్నప్పుడు తన ఇంటి వారి మూలంగా ఆయన అపరిశుద్ధ స్థితిలో వుండేవారు. అప్పుడు ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) స్నానం చేసేవారు మరియు ఆ దినపు ఉపవాసం కూడా పాటించేవారు.” (బుఖారీ: 1925)
3) అసత్యం పలకడం, నిందలు మోపటం, చాడీలు చెప్పడం, దుర్భాషలాడటం మరియు శపించటం ఇలాంటి పనులకు దూరంగా వుండడం
ఉపవాసం ఉన్న సమయంలో ఈ విషయాలన్నింటికీ దూరంగా వుండడం తప్పనిసరి. దీని గురించి దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు:
“ఏ వ్యక్తి అయినా అసత్యం పలకడం, దానిపై ఆచరించడం త్యజించడో అలాంటి వ్యక్తి అన్నపానీయాలు వదులుకోవడం అల్లాహ్ కు ఏమాత్రం అవసరం లేదు”. (బుఖారీ:1903)
అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు:
“ఉపవాసం అంటే కేవలం అన్నపానీయాలు త్యజించడం కాదు. పైగా ఉపవాస స్థితిలో సిగ్గుమాలిన పనులను త్యజించడం కూడా దీనిలోని ఒక భాగమే. అందుకే (ఉపవాస స్థితిలో) మీతో ఎవరైనా దుర్భాషలాడితే లేదా అసభ్యంగా ప్రవర్తిస్తే మీరు ఇలా అనండి, నేనైతే ఉపవాస స్థితిలో వున్నాను, నేనైతే ఉపవాస స్థితి వున్నాను”. (ఇబ్నె ఖుజైమా, ఇబ్న్ హిబ్బాన్, సహీహ్ అత్తర్గీబ్ వత్ తర్హీబ్ : 1082)
4) ఇఫ్తార్
సూర్యాస్తమయం కాగానే ఉపవాస విరమణ (ఇఫ్తార్) చేయాలి మరియు దానిలో ఆలస్యం చేయకూడదు. ఎందుకంటే, దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు:
“ప్రజలు ఇఫ్తార్ను తొందరగా చేస్తున్నంత వరకు, మంచిని కలిగి వుంటారు“. (బుఖారీ: 1957, ముస్లిం: 1098)
తాజా ఖర్జూరాలతో ఇఫ్తార్ చేయడం మంచిది. ఒకవేళ తాజా ఖర్జూరాలు లభ్యం కాకాపోతే అలాంటి స్థితిలో పాత ఖర్జూరాలతో ఇఫ్తార్ చేసుకోవాలి. ఒకవేళ పాత ఖర్జూరాలు కూడా లభ్యం కాని స్థితిలో నీళ్ళతో ఇఫ్తార్ చేయవచ్చు.
అనస్ (రదియల్లాహు అన్హు) కథనం: దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) నమాజ్ (మగ్రిబ్)కు ముందు తాజా ఖర్జూరాలతో ఇఫ్తార్ చేసేవారు, ఒకవేళ తాజా ఖర్జూరాలు లభ్యం కాకపోతే, పాత ఖర్జూరాలతో (ఇఫ్తార్) చేసేవారు. ఒకవేళ పాత ఖర్జూరాలు కూడా లభ్యం కాకపోతే, కొన్ని నీళ్ళ గుటకల ద్వారా ఇఫ్తార్ పూర్తి చేసేవారు, (అబూ దావూద్:2356, సహీ అత్తర్బ్ వ తర్బ్ : 1077)
ఇఫ్తార్ దుఆ:
ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హు) కథనం: దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇఫ్తార్ ముగించాక ఇలా దుఆ చేసేవారు
“దాహం తీరింది, నరాలు చల్లబడ్డాయి (సేదతీరాయి), ఇన్షా అల్లాహ్ పుణ్యఫలం కూడా నిర్ధారించబడింది”. (అబూ దావూద్: 2357, హసన్-అల్బానీ)
ఆఖరుగా అల్లాహ్ ను వేడుకొనేదేమంటే, ఆయన మనందరినీ ఈ శుభప్రదమైన మాసంలో వీలైనంత ఎక్కువగా తన ఆరాధన చేసే సద్బుద్ధిని ప్రసాదించుగాక! మరియు తాను మన్నించి, నరకాగ్ని నుండి స్వేచ్ఛను ప్రసాదించే అదృష్టవంతులలో మనల్ని కూడా చేర్చుగాక! ఆమీన్!!
—
రమదాన్ (మెయిన్ పేజీ):
https://teluguislam.net/five-pillars/ramadhan-telugu-islam/