[డౌన్ లోడ్ PDF] [29 పేజీలు]
ఖుత్బా యందలి ముఖ్యాంశాలు
(1) ఉత్తమ అపరాధి ఎవరు?
(2) పాపభారం అనుభూతి
(3) విశ్వాసులకు తౌబా (పశ్చాత్తాపం) గురించి ఆదేశం.
(4) పశ్చాత్తాపం చెందటం దైవ ప్రవక్తల పద్ధతి.
(5) అల్లాహ్ కారుణ్యం విశాలత.
(6) పశ్చాత్తాపం స్వీకరించబడటానికి షరతులు.
(7) తౌబా, ఇస్తిగ్ ఫార్ ఫలాలు.
ఇస్లామీయ సోదరులారా!
మనలో ప్రతి వ్యక్తి అపరాధే మరియు పాపం చేసేవాడే. కానీ అపరాధుల్లో ఉత్తమమైన అపరాధులు ఎవరంటే, అత్యధికంగా పశ్చాత్తాపం చెందేవారు, అల్లాహ్ వైపునకు మరలేవారు మరియు హృదయ పూర్వకంగా మన్నింపును వేడుకొనేవారు.
అనస్ (రజియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు:
“ఆదమ్ (అలైహిస్సలాం) సంతానమంతా అపరాధులే. కానీ వారిలో ఉత్తమమైన అపరాధులెవరంటే, అందరికన్నా ఎక్కువగా పశ్చాత్తాపం చెందేవారు. (తిర్మిజీ, 2499, ఇబ్నె మాజ: 4251, హసన్ -అల్బానీ)
ఒక అపరాధి, తన పాపాల భారాన్ని అనుభూతి చెందినప్పుడే పశ్చాత్తాపం చెందుతాడు. ఇక నిజమైన విశ్వాసి ఎవరంటే, తన ద్వారా సృష్టికర్త అవిధేయత జరగగానే వెంటనే అతణ్ణి సంతృప్తి పరచడానికి ఉవ్విళ్లూరుతాడు మరియు క్షమాపణలు కోరుకుంటాడు.
అబ్దుల్లాహ్ బిన్ మసూద్ (రజియల్లాహు అన్హు) ఇలా వివరించారు:
“ఒక విశ్వాసి తన పాపాల గురించి ఎలా అనుకుంటాడంటే తను ఒక కొండ క్రింది భాగంలో కూర్చొని వుండి, ఆ కొండ నాపై విరుచుకుపడుతుంది (అంటే నన్ను తుదముట్టిస్తుంది). ఇక పాపాత్ముడు తన పాపాల గురించి ఎలా భావిస్తాడంటే, ఒక ఈగ ఎగురుతూ వచ్చి తన ముక్కు మీద కూర్చోగా, తను చేత్తో సైగ చేయగానే అది లేచి వెళ్ళిపోయింది”. (బుఖారీ: 6308)
ఇక మన పరిస్థితి ఎలా వుందంటే, మనం ఎన్నో పాపాలను చేస్తూ వుంటాం. కానీ వీటి ద్వారా అల్లాహ్ అవిధేయతకు ఒడిగడుతున్న విషయం కూడా గ్రహించం. అందుకే అతనికి క్షమాపణలు కోరుకొని, అతణ్ణి సంతృప్త పరచి, అతని శిక్ష నుండి తప్పించుకోవడానికి అంతగా ప్రయత్నించం.
ఎంతో మంది ముస్లిములు పెద్ద పాపాలు ఎన్నో చేస్తుంటారు. కానీ వీటి శిక్ష గురించి వారు ఏమాత్రం భయపడరు. ఉదాహరణకు దర్భారులు, మజార్ల వద్దకెళ్ళి సజ్దాలో పడిపోతారు, వారి పేరుతో మ్రొక్కుబడి చెల్లించు కుంటారు, వారిని తమ అవసరాలు తీర్చే వారిగా, కష్టాల నుండి గట్టెక్కించే వారుగా భావించి వేడుకుంటారు, వారిపై ప్రగాఢ నమ్మకం కలిగి వుంటారు లేదా వారిని అల్లాహ్ కోసం వసీలా (సాధనం) గా ఉపయోగించి వారిని వేడుకుంటారు…. ఇవన్నీ చేస్తూ కూడా, ఈ షిర్క్ కార్యాల ద్వారా అల్లాహ్ అనుగ్రహాన్నీ, అయిష్టతను కొనితెచ్చుకుంటున్నామన్న విషయాన్ని సైతం గ్రహించరు. ఒకవేళ దురదృష్టవశాత్తూ ఈ స్థితిలోనే గనక మరణం సంభవిస్తే నేరుగా నరకంలోకి ప్రవేశిస్తారు. (అల్లాహ్ శరణు).
దీనికి విరుద్ధంగా వారు, తమ కార్యాల గురించి పూర్తిగా సంతృప్తులై కనిపిస్తారు. ఒకవేళ మువాహిద్ (ఏకదైవారాధకుడు) ఎవరైనా వీరిని షిర్క్ గురించి హెచ్చరించి తౌహీద్ గురించి హితబోధ చేస్తే, వారు షిర్క్ ను త్యజించి, హృదయ పూర్వకంగా పశ్చాత్తాపపడి, తౌహీదును స్వీకరించడానికి బదులుగా అతనితో దుర్భాషలాడి అతని ఉపదేశం నమ్మదగినది కాదు అని భావిస్తారు.
అలాగే ఎంతో మంది ముస్లిములు నేడు ఎన్నో బిద్అత్ లలో ఎంతగా మునిగిపోయి వున్నారంటే, వాటిని ధర్మంలోని ఖచ్చితమైన అంతర్భాగాలు అని భావిస్తుంటారు. ఇక సున్నత్ పై నడిచే వారెవరైనా వీరిని దీని గురించి హెచ్చరించి, ధర్మంలో క్రొత్తగా సృష్టించబడి, ఖుర్ఆన్ మరియు హదీసులు మరియు సహాబాల ఆచరణ ద్వారా ఆధారం లభించని ప్రతి ఆచరణ బిద్అత్ అని, ప్రతి బిద్అత్ మార్గభ్రష్టతకు ఆనవాలు అని హితబోధ చేస్తే, పశ్చాత్తాపం చెందాల్సింది పోయి అతనితో- మేము చేసేది చెడు విషయమేమీ కాదు, పైగా ఇది సత్కార్యమే అని అంటూ వుంటారు. అంటే తమ బిద్అత్ లపై వారు పూర్తిగా సంతృప్తులై కనిపిస్తారు. వీటి ద్వారా వారు అల్లాహ్ సాన్నిధ్యానికి బదులుగా ఆయన అయిష్టతను కొని తెచ్చుకుంటున్నారన్న విషయం కూడా గ్రహించరు.
ఇక ప్రళయం రోజు వీరు కౌసర్ సరస్సు వైపునకు వెళుతూ వున్నప్పుడు, వీరిని లాగి వెనక్కి నెట్టడం జరుగుతుంది. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వీరి గురించి – నా ధర్మం స్వరూపాన్ని మార్చిన వారు దూరంగా వెళ్ళిపోవాలి- అని అంటారు.
షిర్క్ మరియు బిద్అత్ లతో పాటు ఇంకా ఎన్నో అపరాధాలు నేడు ముస్లిములలో దారుణంగా ప్రబలాయి. ముస్లిములు వాటికి ఎంతగా అలవాటు పడిపోయారంటే వాటిని నేడు అసలు పాపాలుగానే భావించరు. ఉదా॥కు ఐదు పూటలు నమాజ్ నెలకొల్పకపోవడం లేదా దానిలో అశ్రద్ధ చూపడం, ఫర్జ్ ఉపవాసాలు మరియు జకాత్ల నుండి దూరంగా వుండడం, స్థోమత వున్నప్పటికీ హజ్ యాత్రకు సాకులు వెతకడం, తల్లిదండ్రుల అవిధేయత, బంధువుల పట్ల అసభ్య ప్రవర్తన, ఇచ్చిపుచ్చుకొనే వ్యవహారాల్లో అబద్ధమాడడం, మోసం, దాగచేయడం, జూదమాడడం, లంచం తీసుకోవడం, వడ్డీ లావాదేవీలు కొనసాగించడం, ముస్లిముల పట్ల ఈర్ష్య కలిగి వుండడం, వారితో అసూయ చెందడం వగైరా…. ఈ పాపాలన్నింటినీ మామూలుగా భావించి వీటిని చేస్తూ వుంటారు. ఒకవేళ ఎవరైనా ఇవన్నీ తప్పు అని భావించి వీటి పాపభారాన్ని గ్రహించి, అల్లాహ్ పట్టు మరియు అతని ఆగ్రహానికి భయపడి, అతని వైపునకు మరలి, అతనికి క్షమాపణలు కోరుకుని అతణ్ణి సంతృప్తి పరిచి, తనకు తాను సంస్కరించుకుంటే అది వేరే విషయం!
అనస్ (రజియల్లాహు అన్హు) తన కాలపు ప్రజలలో ఇలా అనేవారు:
“నిశ్చయంగా మీరు, మీ వెంట్రుకల కన్నా సన్నగా వున్నాయని (మామూలుగా) భావించే పనులు చేస్తున్నారు. కానీ, దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కాలంలో మేము వాటిని నాశనం చేసే (తుదముట్టించే) పాపాలుగా భావించేవాళ్ళం”. (బుఖారీ: 6492)
ఇది సహాబాలు మరియు వారి ద్వారా సంస్కరించబడ్డబారు (తాబయీలు) బ్రతికున్న కాలం మాట. నిశ్చయంగా ఇది దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మరణం తర్వాత శ్రేష్టమైన కాలం. అప్పుడు పెద్దపాపాలు అసలు కనిపించేవే కావు, ఒకవేళ వున్నా అంతంత మాత్రమే. కానీ వీటినే నేడు అసలు పాపాలుగానే పరిగణించడం లేదు. ఒకవేళ పరిగణించినా, వాటిని మామూలుగా పరిగణించి బాహాటంగా చేస్తున్నారు.
అనస్ (రజియల్లాహు అన్హు) తన కాలంలో, మాములుగా ప్రజలు చేసే పాపాలను చూసి వారితో, మేము దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కాలంలో వీటిని నాశనం చేసే పాపాలుగా పరిగణించేవాళ్ళం అని అనేవారు. మరి ఆయనే గనక ఈ రోజు బ్రతికి వుండి, ప్రజలు – షిర్క్, బిద్అత్ , వ్యభిచారం, దొంగతనాలు, హత్యలు, వడ్డీ లావాదేవీలు, అశ్లీలత లాంటి పాపాల్లో మునిగి వుండడం చూస్తే ఏమనేవారో!
దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కాలం విషయానికొస్తే, కాలంలో ఏ ముస్లిం ద్వారానైనా ఏదైనా పెద్దపాపం జరిగిపోతే, వెంటనే పశ్చాత్తాపపడి, తనకు తానుగా శిక్ష కోసం సమర్పించుకోనంత వరకు శాంతించేవాడు కాడు, దీనికి సంబంధించిన మూడు సంఘటనలు మీకు వివరిస్తాం.
(1)ఇమ్రాన్ బిన్ హుసైన్ (రజియల్లాహు అన్హు) కథనం: వ్యభిచరించిన కారణంగా గర్భం దాల్చిన ‘జహీన’ తెగకు చెందిన ఒక స్త్రీ దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సన్నిధికి వచ్చి ఇలా అంది – ఓ దైవ ప్రవక్తా! నేను అల్లాహ్ విధించిన హద్దును కాలరాశాను. కనుక మీరు నాపై దానిని ఖాయం చేయండి (శిక్షించండి. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆమె సంరక్షకుణ్ణి పిలిచి, ఈమెను బాగా చూసుకో, ఈమె బిడ్డకు జన్మనిచ్చాక తిరిగి తీసుకురా అని చెప్పారు. ఆ వ్యక్తి అలాగే చేశాడు. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం), ఆమె వస్త్రాలను ఆమె శరీరానికి గట్టిగా చుట్టేసి, తదుపరి రజమ్ (రాళ్ళతో కొట్టి చంపడం) చేయమని ఆజ్ఞాపించారు. ఆమెను శిక్షించాక, ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆమె జనాజా నమాజు చేశారు. దీనిపై ఉమర్ (రజియల్లాహు అన్హు), ఓ దైవప్రవక్తా! మీరు వ్యభిచరించిన ఒక స్త్రీ జనాజా నమాజ్ చేస్తారా? అని అడిగారు. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) జవాబిస్తూ – ఆమె ఎంతగా పశ్చాత్తాపం చెందిందంటే, ఆమె పశ్చాత్తాపాన్ని గనక మదీనా వాసుల్లోని 70 మంది మధ్య పంపిణీ చేసినా అది వారికి సరిపోతుంది. ఆమె తన ప్రాణాన్నే అల్లాహ్ ను సంతృప్తి పరచడానికి ధారపోసింది. దీని కన్నా మెరుగైన పశ్చాత్తాపం ఏముంటుంది? అని అన్నారు. (ముస్లిం:1696)
(2) బరీరా (రజియల్లాహు అన్హా) కథనం: మాయిజ్ బిన్ మాలిక్ (రజియల్లాహు అన్హు) దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సన్నిధికి వచ్చి ఇలా విన్నవించుకున్నారు – ఓ దైవ ప్రవక్తా! నన్ను పరిశుద్ధుణ్ణి చేయండి. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) – నీ పాడు గాను, వెళ్ళి అల్లాహ్ ను క్షమాపణ వేడుకో మరియు పశ్చాత్తాపపడు అని అన్నారు. మాయిజ్ (రజియల్లాహు అన్హు) కొద్దిదూరం వెళ్ళి, తిరిగొచ్చి మళ్ళీ ఇలా అడిగారు – ఓ దైవ ప్రవక్తా! నన్ను పరిశుద్ధుణ్ణి చేయండి. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆయనకు మళ్ళీ ఇదే సమాధానం ఇచ్చారు. నాల్గవసారి ఆయన, దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను మళ్ళీ వేడుకోగా, ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) – నిన్ను ఏ విషయం నుండి పరిశుద్ధం చేయనూ? అని అడగ్గా, ఆయన – వ్యభిచారం నుండి అని అన్నారు.
తుదపరి, దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆయన మానసిక పరిస్థితి గురించి ప్రజలలో విచారించారు. ప్రజలంతా – ఆయన మనో స్థితి బాగానే వుందని జవాబిచ్చారు, ఆ తరువాత ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) – అతను ఏమైనా మద్యపానం చేసివున్నారా? అని అడిగారు. ప్రజల్లోంచి ఒక వ్యక్తి ఆయన వద్దకు వెళ్ళి ఆయన నోటి వాసన చూసి, ఆయన దగ్గర మద్యం వాసన రావడం లేదు అని సెలవిచ్చాడు. దీనిపై దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆయనతో, నువ్వు నిజంగానే వ్యభిచారానికి పాల్పడ్డావా? అని అడిగారు. ఆయన, అవునండి అని జవాబిచ్చారు.
దానితో, ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆయనకు ‘రజమ్’ శిక్షను అమలు పరిచారు. ఆ తర్వాత ప్రజలు రెండు వర్గాలుగా చీలిపోయారు. ఒక వర్గమేమో, మాయిజ్ నాశనమై పోయాడు, అతని పాపాలు అతణ్ణి చుట్టుముట్టాయి అని అనగా, రెండవ వర్గం, మాయిజ్ పశ్చాత్తాపం కన్నా మరెవరి పశ్చాత్తాపం కూడా మెరుగైనది కాదు. ఎందుకంటే అతనే స్వయంగా దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సన్నిధికొచ్చి, ఆయన చేతిలో చెయ్యివేసి తనపై రాళ్ళు రువ్వే శిక్ష కోసం అభ్యర్థించారు అని అనుకొంది.
తదుపరి మూడు రోజులు గడిచాక, దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సహాబాల సమూహం వద్దకు వచ్చి వారికి సలాం చేసే కూర్చుని ఇలా సెలవిచ్చారు: మాయిజ్ కోసం మనింపు ప్రార్ధన చేయండి, దీనితో సహాబాలు -ఓ అల్లాహ్ ! మాయిజ్ క్షమించు అని వేడుకున్నారు. తదుపరి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)- ఆయన ఎంతగా పశ్చాత్తాపపడ్డారంటే ఆయన పశ్చాత్తాపాన్ని గనక ఒక వర్గంలో పంపిణీ చేస్తే అది వారికి సరిపోతుంది.
బరీరా (రజియల్లాహు అన్హా) ) కథనం : తదుపరి, దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వద్దకు గామిదీ తెగకు చెందిన ఒక స్త్రీ వచ్చి, ఓ దైవప్రవక్తా! నన్ను పరిశుద్ధం చేయండి అని వేడుకుంది. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) – నీ పాడుగాను, వెళ్ళి అల్లాహ్ న్ను క్షమించమని వేడుకో మరియు పశ్చాత్తాపపడు అని చెప్పారు.
ఆమె మీరు నన్ను మాయిజ్ను పంపినట్లే పంపిస్తున్నారని నా కనిపిస్తోంది అని అంది. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం)- ఆయన (మాయిజ్) తో నీకేంటి సంబంధం? అని అడిగారు. ఆమె – ఆయన మూలం గానే నేను గర్భం దాల్చాను అంది.. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) – ఓహెూ, ఆ స్త్రీ నువ్వేనా? అని అన్నారు ఆమె – అవునండీ అని అంది. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) – (శిక్ష) ఇప్పుడే కాదు, బిడ్డ జన్మించాక అని అన్నారు.
బరీరా (రజియల్లాహు అన్హా) కథనం: ఒక అన్సారీ సహాబీ, ఆమె బిడ్డకు జన్మనిచ్చే వరకు ఆమె సంరక్షణ బాధ్యతను తీసుకున్నారు. ఆ తర్వాత, ఆయన దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సన్నిధికొచ్చి- స్త్రీ బిడ్డకు జన్మనిచ్చిందన్న విషయం తెలియజేశారు.
దీనిపై దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం): మేమిప్పుడే ఆమెపై ‘రజమ్’ శిక్షను అమలు పరచలేం. ఎందుకంటే ఆమె బిడ్డకు పాలు త్రాపించేవాడు ఎవడూ వుండడు కనుక అని అన్నారు. దీనిపై ఒక అన్సారీ – ఆ పిల్లవాడి పాల బాధ్యత నాది అని చెప్పగా దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆమెపై రజమ్ శిక్షను అమలుపరిచారు.
మరో ఉల్లేఖనంలో ఇలా వుంది: బిడ్డకు జన్మనిచ్చాక ఆ స్త్రీ వెంటనే దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సన్నిధికి వచ్చింది. తన పసికందును బట్టలో చుట్టి తనతోపాటు తీసుకొచ్చింది. ఇది చూసి, దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆమెతో వెళ్ళు, వెళ్ళి నీ బిడ్డకు తను పాలు మానేసే వరకు పాలు త్రాగించు అని అన్నారు. స్త్రీ అక్కడి నుండి వెళ్ళిపోయింది.
తర్వాత కొంత కాలం గడిచాక మరోసారి ఆమె (తనబిడ్డతో కలసి) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వద్దకు వచ్చింది. ఆ సమయంలో ఆమె బిడ్డ చేతిలో ఒక రొట్టె ముక్క వుంది. ఆమె – ఓ దైవ ప్రవక్తా! నా బిడ్డ పాలు మానేసాడు, అన్నం తినే స్థాయికి ఎదిగాడు అని అంది.
దీనితో దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆ బిడ్డను ఒక ముస్లింకు అప్పగించి, ఆమెను, ఛాతీ వరకు భూమిలో దించి, రజమ్ శిక్షను అమలు పరచమని ఆదేశించారు. ప్రజలు ఇలాగే చేసారు. ఈ తరుణంలో ఖాలిద్ బిన్ వలీద్ (రజియల్లాహు అన్హు) వచ్చి, ఒక రాయిని తీసుకుని ఆమె తలపై బాదారు. దీనితో ఆమె రక్తపు బొట్లు కొన్ని ఆయన ముఖంపై పడ్డాయి. ఆయన, ఆమె, గురించి చెడుగా మాట్లాడారు. దీనిని దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) విని – ఖాలిద్! ఆగు! ఎవరి చేతుల్లో నా ప్రాణం వుందో ఆ శక్తిమంతుని సాక్షి! ఆమె ఎంతగా పశ్చాత్తాపం చెందిందంటే, అలాంటి పశ్చాత్తాపాన్ని పన్నులు వసూలు చేసే దౌర్జన్యుడు చేసినా అతణ్ణి కూడా క్షమించవేయడం జరుగుతుంది అని అన్నారు. తదుపరి, ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆమె జనాజా నమాజు చేశారు. ఆ తర్వాత ఆమె ఖననం చేయబడింది. (ముస్లిం: 1695)
ఈ మూడు సంఘటనల ద్వారా తెలిసిందేమిటంటే, ఈ అనుచర సమాజపు ఆరంభకాలంలో అంటే అన్నింటి కన్నా శ్రేష్ఠమైన కాలంలో, ఒకవేళ ఏ ముస్లిం అయినా ఏదైనా పెద్ద పాపానికి ఒడిగడితే, అతను దానిని తనపై పెద్ద భారంగా తలపోసి, దాని నుండి పరిశుద్ధం కావడానికి తొందర పడేవాడు. ఇదీ అసలైన ముస్లిముల గుణ విశేషం మరి. తప్పు చేశాక వెంటనే హృదయ పూర్వకంగా పశ్చాత్తాప పడి, అల్లాహ్ ను సంతృప్తి పరచడానికి తొందరపడతాడు.
త్వరత్వరగా ఎన్నో సత్కార్యాలు చేసి, పాపపు మరకలు కడిగి వేయనంత వరకు అతని మనసు కుదుటపడదు.
అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
إِنَّ الْحَسَنَاتِ يُذْهِبْنَ السَّيِّئَاتِ
“నిశ్చయంగా పుణ్యకార్యాలు పాపకార్యాలను దూరం చేస్తాయి”. (హూద్ 11:114)
మరి, పాపాకార్యాలకు తమ కర్మల చిట్టా నుండి దూరం చేయడానికి చేయబడే మొట్టమొదటి సత్కార్యం తౌబా (పశ్చాత్తాపం) మరియు ఇస్తిగ్ ఫార్ (మన్నింపు ప్రార్థన).
విశ్వాసులకు తౌబా మరియు ఇస్తిగ్ ఫార్ గురించి ఆదేశం
అల్లాహ్, తన ప్రియ ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు మన్నింపు ప్రార్థన గురించి ఆదేశించాడు.
అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
وَاسْتَغْفِرِ اللَّهَ ۖ إِنَّ اللَّهَ كَانَ غَفُورًا رَّحِيمًا
“క్షమాభిక్షకై అల్లాహ్ ను వేడుకో. నిస్సందేహంగా అల్లాహ్ క్షమించేవాడు, కనికరించేవాడు”. (నిసా 4:106)
ఇలాగే అల్లాహ్; విశ్వాసులకు కూడా తౌబా చేయమని ఆదేశించాడు.
مَا يُخْفِينَ مِنْ زِينَتِهِنَّ وَتُوبُوا إِلَى اللهِ جَمِيعًا أَيُّهَ الْمُؤْمِنُونَ لَعَلَّكُمْ تُفْلِحُونَ
“ముస్లిములారా! మీరంతా కలసి అల్లాహ్ సన్నిధిలో పశ్చాత్తాపం చెందండి. తద్వారా మీరు సాఫల్యం పొందవచ్చు”. (నూర్ 24 :31)
అంటే, విశ్వాసులు గనక అల్లాహ్ వైపునకు మరలి, హృదయపూర్వకంగా అతణ్ణి క్షమించమని వేడుకుంటే, ఇహపరలోక సాఫల్యాలు వారికి సమకూరు తాయి.
అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
66:8 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا تُوبُوا إِلَى اللَّهِ تَوْبَةً نَّصُوحًا عَسَىٰ رَبُّكُمْ أَن يُكَفِّرَ عَنكُمْ سَيِّئَاتِكُمْ وَيُدْخِلَكُمْ جَنَّاتٍ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ يَوْمَ لَا يُخْزِي اللَّهُ النَّبِيَّ وَالَّذِينَ آمَنُوا مَعَهُ ۖ نُورُهُمْ يَسْعَىٰ بَيْنَ أَيْدِيهِمْ وَبِأَيْمَانِهِمْ يَقُولُونَ رَبَّنَا أَتْمِمْ لَنَا نُورَنَا وَاغْفِرْ لَنَا ۖ إِنَّكَ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ
“ఓ విశ్వాసులారా! అల్లాహ్ వైపునకు పశ్చాత్తాపంతో మరలండి. నిష్కల్మషమైన పశ్చాత్తాప భావంతో! మీ ప్రభువు మీ పాపాలను మీ నుండి దూరం చేయవచ్చు. క్రింద సెలయేళ్ళు ప్రవహించే (స్వర్గ) వనాలలో మీకు ప్రవేశం కల్పించవచ్చు. ఆ రోజు అల్లాహ్ ప్రవక్తనూ, అతని వెంటనున్న విశ్వాసులను అవమానపరచడు. వారి కాంతి వారి ముందూ, వారి కుడి వైపూ పరుగెడుతూ వుంటుంది. అప్పుడు వారిలా వేడుకుంటూ వుంటారు- మా ప్రభూ! మా కాంతిని మా కొరకు పరిపూర్ణం గావించు. మమ్మల్ని క్షమించు. నిశ్చయంగా నీవు అన్నింటిపై అధికారం కలవాడవు”. (తహ్రీమ్ 66:8)
ఈ ఆయత్లో అల్లాహ్ నిష్కల్మష పశ్చాత్తాపం యొక్క నాలుగు ప్రయోజనాలు వివరించాడు.
మొదటిది – పాపాల మన్నింపు.
రెండవది – క్రింద సెలయేళ్ళు ప్రవహించే స్వర్గ వనాలలో ప్రవేశం.
మూడవది – ఆ రోజు ప్రవక్తను, అతని వెంటనున్న విశ్వాసులను అవమాన పరచడు.
నాల్గవది – వారి కాంతి వారి ముందూ, వారి కుడి వైపూ పరుగెడుతూ వుంటుంది.
ఈ ఆయతులన్నింటి ద్వారా తెలిసిందేమిటంటే, విశ్వాసులు అల్లాహ్ ఆజ్ఞలకు బద్ధులు. వారు తమ పాపాలకు గాను పశ్చాత్తాపం చెందాలి మరియు ఆయన మన్నింపు వేడుకోవాలి.
తన మన్నింపును కోరుకొనే దాసులను ప్రశంసిస్తూ అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
الَّذِينَ يَقُولُونَ رَبَّنَا إِنَّنَا آمَنَّا فَاغْفِرْ لَنَا ذُنُوبَنَا وَقِنَا عَذَابَ النَّارِ الصَّابِرِينَ وَالصَّادِقِينَ وَالْقَانِتِينَ وَالْمُنفِقِينَ وَالْمُسْتَغْفِرِينَ بِالْأَسْحَارِ
“వారు ఇలా వేడుకుంటారు- మా ప్రభూ! మేము విశ్వసించాం. కనుక మా పాపాలను క్షమించు. ఇంకా మమ్మల్ని అగ్ని శిక్ష నుండి కాపాడు. వారు ఓర్పు వహిస్తారు. ఎల్లప్పుడూ సత్యమే పలుకుతారు. విధేయత చూపుతారు. అల్లాహ్ మార్గంలో ఖర్చు చేస్తారు. రాత్రి చివరి భాగంలో క్షమాభిక్షకై వేడుకుంటారు”. (ఆలి ఇమ్రాన్ 3:16-17)
దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు.
“ప్రజలారా! మీరు మీ ప్రభువు వైపునకు పశ్చాత్తాపంతో మరలండి. అల్లాహ్ సాక్షి! నేను రోజుకు 100 సార్లు అల్లాహ్ సన్నిధిలో పశ్చాత్తాప పడతాను”. (అహ్మద్ : 17880, ముస్లిం: 2702)
ప్రవక్తల నాయకులైవుండి, అల్లాహ్ – తన గత, రాబోయే పాపాలన్నింటినీ క్షమించినప్పటికీ, స్వయానా దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) రోజుకు 100 సార్లు పశ్చాత్తాప పడితే మరి ఆయన అనుచర సమాజం దాని కన్నా ఎక్కువగా పశ్చాత్తాప పడాలి.
తౌబా చేయడం ప్రవక్తల పద్ధతి
అవునండీ! పశ్చాత్తాపం చెందడం దైవప్రవక్తల పద్ధతి.
ఆదమ్ (అలైహిస్సలాం) మరియు ఆయన భార్య హవ్వాకు షైతాను ఉసిగొలిపినప్పుడు, తమకు వారించబడిన వృక్ష ఫలాల రుచి చూసినప్పుడు, తమ అపరాధాన్ని స్వీకరించి పశ్చాత్తాప పడుతూ వారు ఇలా వేడుకున్నారు:
قَالَا رَبَّنَا ظَلَمْنَا أَنفُسَنَا وَإِن لَّمْ تَغْفِرْ لَنَا وَتَرْحَمْنَا لَنَكُونَنَّ مِنَ الْخَاسِرِينَ
“మా ప్రభూ! మేము మా స్వయానికి ఎంతో అన్యాయం చేసుకున్నాము. ఇప్పుడు నీవు గనక మాకు క్షమాభిక్ష పెట్టి, మాపై దయ తలచకపోతే, నిశ్చయంగా మేము నష్టపోతాము”. (ఆరాఫ్ 7: 23)
నూహ్ (అలైహిస్సలాం) తన కొడుకును తుఫాను నీటి అలలలో మునిగి పోవడం చూసి మనస్సులోని ఆప్యాయతతో ప్రభావితులై అల్లాహ్ ను – ‘నా కొడుకు నా ఇంటిలోని వాడు మరియు నీ వాగ్దానం సత్యమైనది, నీవు పాలకులలో కెల్లా గొప్ప పాలకుడవు’ అని మొరపెట్టుకోగా, అల్లాహ్ ఆయనకు మందలిస్తూ– నీ కొడుకు విశ్వసించలేదు కాబట్టి నీ ఇంటిలోని వాడు కాజాలడని, నీకు తెలియని వాటి గురించి నన్ను అడిగి, అజ్ఞానులలో ఒకడివి కారాదని నేను నీకు ఉపదేశిస్తున్నాను అని సెలవిచ్చాడు.
అప్పుడు నూహ్ (అలైహిస్సలాం) వెంటనే అల్లాహు క్షమాపణలు తెలుపుకుంటూ ఇలా వేడుకున్నారు:
قَالَ رَبِّ إِنِّي أَعُوذُ بِكَ أَنْ أَسْأَلَكَ مَا لَيْسَ لِي بِهِ عِلْمٌ ۖ وَإِلَّا تَغْفِرْ لِي وَتَرْحَمْنِي أَكُن مِّنَ الْخَاسِرِينَ
“నా ప్రభూ! నాకు తెలియని దాని గురించి నిన్ను అర్థించటం నుండి నీ శరణు వేడుతున్నాను. నీవు గనక నన్ను క్షమించి దయ తలచకపోతే నేను నష్టపోయేవారిలో చేరిపోతాను”. (హూద్ 11: 47)
అలాగే, మూసా (అలైహిస్సలాం) కూడా ఒక వ్యక్తిని కొట్టినప్పుడు, అతను చనిపోగానే వెంటనే ఆయన అల్లాహ్ వైపునకు మరలి, తన అపరాధాన్ని ఒప్పుకొని అల్లాహ్ ను క్షమాభిక్షకై ఇలా వేడుకున్నారు:
قَالَ رَبِّ إِنِّي ظَلَمْتُ نَفْسِي فَاغْفِرْ لِي فَغَفَرَ لَهُ ۚ
“నా ప్రభూ! నాకు నేను అన్యాయం చేసుకున్నాను. నన్ను క్షమించు. అని మొరపెట్టుకున్నాడు. అప్పుడు అల్లాహ్ అతన్ని క్షమించాడు”. (ఖసస్ 28:16)
ఇక దావూద్ (అలైహిస్సలాం) పరీక్షింపబడినప్పుడు, నేను పరీక్షించ బడుతున్నానని ఆయన గ్రహించి, వెంటనే సాష్టాంగపడి, అల్లాహ్ ను క్షమించమని వేడుకున్నారు.
దీని గురించి అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు :
وَظَنَّ دَاوُودُ أَنَّمَا فَتَنَّاهُ فَاسْتَغْفَرَ رَبَّهُ وَخَرَّ رَاكِعًا وَأَنَابَ
“మేము అతన్ని పరీక్షిస్తున్నామన్న సంగతి దావూదు గ్రహించాడు. మరి తన ప్రభువు క్షమాభిక్ష కోరసాగాడు. కడుదీనంగా మోకరిల్లాడు. (ఏకాగ్రతతో తన ప్రభువు వైపునకు) మరలాడు”. (సాద్: 24)
ఇలాగే, యూనుస్ (అలైహిస్సలాం) కూడా చేప కడుపులో, తన తప్పిదాన్ని ఒప్పుకొని క్షమించమని అల్లాహ్ ను ఇలా వేడుకున్నారు:
لَّا إِلَٰهَ إِلَّا أَنتَ سُبْحَانَكَ إِنِّي كُنتُ مِنَ الظَّالِمِينَ
“అల్లాహ్ ! నీవు తప్ప మరో ఆరాధ్య దైవం లేదు. నీవు పవిత్రుడవు. నిజానికి నేనే దోషులలో చేరిన వాణ్ణి”. (అంబియా 21:87)
ఇక, ప్రవక్తల నాయకులైన ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) విషయానికొస్తే, ఆయన ఎంతగా తౌబా మరియు ఇస్తిగ్ ఫార్ చేసేవారంటే – ఒకే సమావేశంలో సహాబాలు ఆయన నోటి నుండి 100 సార్లు ఈ దుఆను వినేవారు.
“రబ్బిగ్ ఫిర్లీ వతుబ్ అలయ్య, ఇన్నక అంత తవ్వాబుల్ గఫూర్”
“నా ప్రభూ! నన్ను మన్నించు, నా పశ్చాత్తాపం స్వీకరించు. నిస్సందేహంగా నీవే పశ్చాత్తాపం స్వీకరించేవాడివి మరియు క్షమించేవాడివి”. (అస్సహీహ : 556)
ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) తన సహచరులు అబూ బక్ర్ సిద్దీఖ్ (రజి అల్లాహు అన్హు) కు తౌబా మరియు ఇస్తిగ్ ఫార్ గురించ ఒక దుఆ నేర్పి దానిని ప్రతి నమాజులో చదవమని ఆదేశించారు:
“ఓ అల్లాహ్ ! నాకు నేను అన్యాయం చేసుకున్నాను. నువ్వు తప్ప పాపాలను క్షమించేవారెవ్వరూ లేరు కనుక, దయతో నన్ను క్షమించు. నన్ను కరుణించు. నిస్సందేహంగా నీవే ఎక్కువగా క్షమించే వాడివి మరియు కరుణించే వాడివి.” (బుఖారీ: 834, ముస్లిం: 2705)
మరో విషయమేమిటంటే – తౌబా, ఇస్తిగ్ ఫార్ చేయటం కేవలం దైవ ప్రవక్తల పద్దతే కాదు. పైగా అల్లాహ్ దీనిని బుద్ధిమంతుల, విజ్ఞుల లక్షణంగా ఖరారు చేశాడు.
దీని గురించి అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
إِنَّ فِي خَلْقِ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَاخْتِلَافِ اللَّيْلِ وَالنَّهَارِ لَآيَاتٍ لِّأُولِي الْأَلْبَابِ الَّذِينَ يَذْكُرُونَ اللَّهَ قِيَامًا وَقُعُودًا وَعَلَىٰ جُنُوبِهِمْ وَيَتَفَكَّرُونَ فِي خَلْقِ السَّمَاوَاتِ وَالْأَرْضِ رَبَّنَا مَا خَلَقْتَ هَٰذَا بَاطِلًا سُبْحَانَكَ فَقِنَا عَذَابَ النَّارِ رَبَّنَا إِنَّكَ مَن تُدْخِلِ النَّارَ فَقَدْ أَخْزَيْتَهُ ۖ وَمَا لِلظَّالِمِينَ مِنْ أَنصَارٍ رَّبَّنَا إِنَّنَا سَمِعْنَا مُنَادِيًا يُنَادِي لِلْإِيمَانِ أَنْ آمِنُوا بِرَبِّكُمْ فَآمَنَّا ۚ رَبَّنَا فَاغْفِرْ لَنَا ذُنُوبَنَا وَكَفِّرْ عَنَّا سَيِّئَاتِنَا وَتَوَفَّنَا مَعَ الْأَبْرَارِ
“నిశ్చయంగా భూమ్యాకాశాల సృష్టిలో, రేయింబవళ్ళ రాకపోకలలో విజ్ఞులకు ఎన్నో సూచనలు ఉన్నాయి. వారు నిల్చుని, కూర్చుని, తమ పడకలపై ఒత్తిగిలి అల్లాహ్ ను స్మరిస్తూ ఉంటారు. భూమ్యాకాశాల సృష్టి గురించి యోచన చేస్తూ ఉంటారు. వారిలా అంటారు: మా ప్రభూ! నువ్వు ఈ సృష్టిని నిరర్థకంగా చేయలేదు. నువ్వు పవిత్రుడవు. మమ్మల్ని నరకాగ్ని శిక్ష నుండి కాపాడు. ఓ మా పోషకుడా! నువ్వెవరినైతే నరకాగ్నిలో పడవేస్తావో, వాణ్ణి నువ్వు పరాభవానికి, అవమానానికి గురి చేసినట్లే. యదార్థానికి దుర్మార్గులకు తోడ్పడే వారెవరూ ఉండరు. మా ప్రభూ! పిలిచే వాడొకడు విశ్వాసం (ఈమాన్) వైపునకు పిలవడం- ప్రజలారా! మీ ప్రభువును విశ్వసించండి అని పిలుపు నివ్వటం మేము విన్నాము. అంతే! మేము విశ్వసించాము. కనుక ఓ ప్రభూ! మా పాపాలను క్షమించు. మా చెడుగులను మా నుంచి దూరం చెయ్యి. సజ్జనులతో పాటు మరణం వొసగు”. (ఆలి ఇమ్రాన్ 3: 190–193)
అల్లాహ్ ఎంతగానో క్షమించేవాడు మరియు కరుణించేవాడు
మనిషికి అల్లాహ్ వైపునకు మాటిమాటికి మరలి అతన్ని క్షమించమని వేడుకోవడానికి ప్రేరేపించే విషయమేమిటంటే, అల్లాహ్ ఎంతగానో క్షమించేవాడు, కరుణించేవాడు (గపూరుర్రహీం కనుక పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడూ మరియు పశ్చాత్తాపం చెందే వారిని ప్రేమించేవాడూను.
అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
أَلَمْ يَعْلَمُوا أَنَّ اللَّهَ هُوَ يَقْبَلُ التَّوْبَةَ عَنْ عِبَادِهِ وَيَأْخُذُ الصَّدَقَاتِ وَأَنَّ اللَّهَ هُوَ التَّوَّابُ الرَّحِيمُ
“ఏమిటి, అల్లాహ్ యే తన దాసుల పశ్చాత్తాపాన్ని స్వీకరిస్తాడని, దాన ధర్మాలు ఆమోదిస్తాడని, పశ్చాత్తాపాన్ని అంగీకరించటంలోనూ, దయ చూపటంలోనూ అల్లాహ్ యే మేటి అనీ వారికి తెలియదా?” (అత్ తౌబా 9:104)
అలాగే ఇలా కూడా సెలవిచ్చాడు:
وَهُوَ الَّذِي يَقْبَلُ التَّوْبَةَ عَنْ عِبَادِهِ وَيَعْفُو عَنِ السَّيِّئَاتِ وَيَعْلَمُ مَا تَفْعَلُونَ
وَيَسْتَجِيبُ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ وَيَزِيدُهُم مِّن فَضْلِهِ ۚ وَالْكَافِرُونَ لَهُمْ عَذَابٌ شَدِيدٌ
“ఆయనే తన దాసుల పశ్చాత్తాపాన్ని స్వీకరిస్తాడు, వారి తప్పులను మన్నిస్తాడు. మీరు చేసేదంతా ఆయనకు తెలుసు. ఆయన విశ్వసించి సదాచరణ చేసే వారి (విన్నపాల)ని వింటాడు. తన కృపతో వారికి మరింతగా అనుగ్రహిస్తాడు. మరి అవిశ్వాసులకేమో చాలా కఠిన శిక్ష పడుతుంది”. (అష్ షూరా 42: 25-26)
అల్లాహ్ తన కారుణ్యం మరియు పాపాల మన్నింపు గురించి ప్రస్తావించి, అపరాధులైనా తన దాసులను సంబోధిస్తూ – రండి, నాతో క్షమాభిక్ష కోరుకోండి. నేను మీ పాపాలన్నింటినీ క్షమిస్తాను అని ఆహ్వానించాడు.
అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
قُلْ يَا عِبَادِيَ الَّذِينَ أَسْرَفُوا عَلَىٰ أَنفُسِهِمْ لَا تَقْنَطُوا مِن رَّحْمَةِ اللَّهِ ۚ إِنَّ اللَّهَ يَغْفِرُ الذُّنُوبَ جَمِيعًا ۚ إِنَّهُ هُوَ الْغَفُورُ الرَّحِيمُ
“(ఓ ప్రవక్తా! నా తరఫున వారికి ఇలా) చెప్పు: తమ ఆత్మలపై అన్యాయానికి ఒడిగట్టిన ఓ నా దాసులారా! మీరు అల్లాహ్ కారుణ్యం పట్ల నిరాశ చెందకండి. నిశ్చయంగా అల్లాహ్ పాపాలన్నింటినీ క్షమిస్తాడు. నిజంగా ఆయన అమితంగా క్షమించేవాడు, అపారంగా కరుణించే వాడు”. (జుమర్:53)
ఈ ఆయత్ అవతరించిన నేపథ్యం గురించి ఇబ్నె అబ్బాస్ (రజియల్లాహు అన్హుమా) ఇలా వివరించారు- ముష్రిక్కులలో ఎంతో మంది ఎన్నో హత్యలు, వ్యభిచారాలు చేసివున్నారు. వారంతా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)తో మీరు బోధించే విషయాలన్నీ బాగానే వున్నాయి. కానీ అల్లాహ్ వద్ద మా పశ్చాత్తాపం స్వీకరించబడుతుందా? అని అడిగారు. ఆ సందర్భంలో ఈ ఆయతును అల్లాహ్ అవతరింపజేశాడు. (తఫ్సీర్ ఖుర్తుబీ : 8వ సంపుటం, 228 పేజి)
దీని ద్వారా తెలిసిందేమిటంటే- ఒకవేళ ముష్రిక్కులూ, హత్యలు, వ్యభిచారానికి పాల్పడినవారు కూడా హృదయపూర్వకంగా పశ్చాత్తాపం చెందితే, అల్లాహ్ వారిని కూడా క్షమిస్తాడని నమ్మకం కలిగించాడు. అలాంటిది, అల్లాహ్ ఏకత్వాన్ని స్వీకరించి, ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను విశ్వసించిన ముస్లిములు అతని వైపునకు మరలి క్షమించమని వేడుకుంటే అల్లాహ్ ఖచ్చితంగా వారిని క్షమిస్తాడు.
పైగా – అల్లాహ్ ఈసా (అలైహిస్సలాం)ను అల్లాహ్ కొడుకుగా ఖరారు చేసి, అల్లాహ్ ను ముగ్గురిలో ఒక్కడుగా భావించే క్రైస్తవులకు కూడా తౌబా మరియు ఇస్తిగ్ ఫార్ గురించి ప్రేరేపిస్తూ ఇలా సెలవిచ్చాడు:
لَّقَدْ كَفَرَ الَّذِينَ قَالُوا إِنَّ اللَّهَ ثَالِثُ ثَلَاثَةٍ ۘ وَمَا مِنْ إِلَٰهٍ إِلَّا إِلَٰهٌ وَاحِدٌ ۚ وَإِن لَّمْ يَنتَهُوا عَمَّا يَقُولُونَ لَيَمَسَّنَّ الَّذِينَ كَفَرُوا مِنْهُمْ عَذَابٌ أَلِيمٌ أَفَلَا يَتُوبُونَ إِلَى اللَّهِ وَيَسْتَغْفِرُونَهُ ۚ وَاللَّهُ غَفُورٌ رَّحِيمٌ
“అల్లాహ్ ముగ్గురిలో ఒక్కడు అని అన్నవారు కూడా ముమ్మాటికీ తిరస్కారానికి (కుఫ్ర్ కు) పాల్పడినట్లే. వాస్తవానికి ఒక్కడైన అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యదైవం లేనే లేడు. ఒకవేళ వారు గనక తమ ఈ మాటలను మానుకోకపోతే, వారిలో తిరస్కార వైఖరిపై ఉండేవారికి బాధాకరమైన శిక్ష తప్పకుండా అంటుకుంటుంది. వారు అల్లాహ్ వైపునకు మరలరా? క్షమాపణ కోసం ఆయన్ని వేడుకోరా? అల్లాహ్ అపారంగా క్షమించేవాడు, అమితంగా కరుణించేవాడు కూడా”. (మాయిద 5 : 73, 74)
అల్లాహ్, అపరాధం చేసిన ప్రతి వ్యక్తికీ, అతను గనక ఇస్తిగ్ ఫార్ చేసి క్షమించమని వేడుకుంటే తను ‘గపూరుర్రహీం’ అని అతన్ని క్షమిస్తానని నమ్మకం కలిగిస్తాడు.
అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
وَمَن يَعْمَلْ سُوءًا أَوْ يَظْلِمْ نَفْسَهُ ثُمَّ يَسْتَغْفِرِ اللَّهَ يَجِدِ اللَّهَ غَفُورًا رَّحِيمًا
“ఎవరైనా ఏదైనా పాపకార్యం చేసి తనకు తాను అన్యాయం చేసుకొని, తదుపరి అల్లాహు క్షమాభిక్షకై వేడుకుంటే నిశ్చయంగా అతను అల్లాహ్ ను అత్యంత క్షమించేవాడిగా అనంతంగా కరుణించేవాడిగా పొందుతాడు.” (నిసా 4: 110)
ఒక హదీసే ఖుదసీలో ఇలా సెలవియ్యబడింది:
“ఓ ఆదం పుత్రుడా! నువ్వు గనక నన్నే వేడుకుంటూ, నన్నే నమ్ముకొని, నాతో సంబంధం పెట్టుకుంటే నీతో జరిగే పాపాలన్నింటినీ నేను క్షమిస్తాను. దీని గురించి నేను లెక్కచేయను. ఒకవేళ నీ పాపాలు ఆకాశం వరకు చేరుకున్నా, నువ్వు గనక నన్ను క్షమించమని వేడుకుంటే, నేను ఏ మాత్రం లెక్కచేయకుండా నీ పాపాలను క్షమించి వేస్తాను. ఒకవేళ నువ్వు భూమికి సమానంగా వున్న పాపాలను తీసుకొచ్చినా, షిర్క్ చేయని స్థితిలో గనక నన్ను కలిస్తే నేను కూడా నీకు అంతే మన్నింపును ప్రసాదిస్తాను”. (తిర్మిజి: 354, సహీహ్ – అల్బానీ)
అబూ మూసా (రజియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు:
“నిశ్చయంగా అల్లాహ్ రాత్రి వేళ తన కారుణ్య చేతిని చాపుతాడు, తద్వారా పగటి పూట పాపంచేసిన వాడు తౌబా చేయడానికి. అలాగే పగలు కూడా తన కారుణ్యచేతిని చాపుతాడు, తద్వారా రాత్రి పూట పాపం చేసిన వాడు పశ్చాత్తాపం చెందడానికి. ఇలా సూర్యుడు పడమర దిక్కునుండి ఉదయించే వరకు కొనసాగుతూ వుంటుంది”. (ముస్లిం: 2759)
అల్లాహ్ తన దాసుని పశ్చాత్తాపంపై ఎంతగానో సంతోషిస్తాడు. అనస్ బిన్ మాలిక్ (రజియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు:
“అల్లాహ్ దాసుడు పశ్చాత్తాపం చెందినప్పుడు అల్లాహ్ ఆ వ్యక్తి కన్నా ఎక్కువగా సంతోషిస్తాడు- ఆ వ్యక్తి ఎవరంటే, అతను ఒక ఎడారి ప్రాంతంలో ప్రయాణం చేస్తుండగా అతని వాహనం తప్పిపోయింది. దాని మీదే అతని ప్రయాణ సామగ్రి, భోజన సామగ్రి వుంది. అతను అటూ ఇటూ వెతికి చివరికి అలసిపోయి నిరుత్సాహంతో (ఖచ్చితంగా తనకు ఇక మరణమే శరణ్యం అనుకొని) చెట్టు క్రింద విశ్రమించగా, అకస్మాత్తుగా అతని వాహనం అతని ముందుకొచ్చి నిలబడి, అతను దాని త్రాడు పట్టుకొని ఆనందంతో ఇలా పలికాడు – ఓ అల్లాహ్! నువ్వు నా దాసుడివి, నేను నీ ప్రభువును, అంటే అమితానందంలో అతను తప్పుగా పలికాడు. ఆ వ్యక్తి తన వాహనం దొరికినప్పుడు ఎంతగా సంతోషించాడో, తన దాసులెవరైనా పశ్చాత్తాపం చెందినప్పుడు అల్లాహ్ కూడా దాని కన్నా ఎక్కువగా సంతోషిస్తాడు”. (ముస్లిం: 2747)
‘అల్లాహ్ పశ్చాత్తాపాన్ని ఎంతగా ఇష్టపడతాడంటే, ఆయన దాసులు గనక దానిని త్యజిస్తే, వారి స్థానంలో ఆయన పశ్చాత్తాపం చెందేవారిని తీసుకు వస్తాడు, తద్వారా వారిని క్షమించడానికి.
దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు:
“ఎవరి చేతుల్లో నా ప్రాణం వుందో ఆ శక్తిమంతునిసాక్షి! ఒకవేళ మీరు పాపాలు గనక చేయకుండా (మరియు అల్లాహ్ ను క్షమించమని వేడుకోకుండా) వుంటే, అల్లాహ్ మిమ్మల్ని తుదముట్టించి మీ స్థానంలో అల్లాహ్ మన్నింపు కోరేవారిని తీసుకువస్తాడు, తద్వారా తను వారిని క్షమించడానికి”. (ముస్లిం:2749)
* ఒక్కోసారి అల్లాహ్ నిజమైన పశ్చాత్తాపం సంకల్పానికే మనిషిని మన్నించి వేస్తాడు.
అబూ సయిద్ ఖుద్రీ (రజియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు:
“మీకు ముందు గతించిన అనుచర సమాజాల్లోని ఒక వ్యక్తి 99 వ్యక్తులను హత్య చేసాడు. తుదపరి అతను ప్రపంచంలోని గొప్ప విద్వాంసుని గురించి అడగ్గా, అతనికి ఒక పండితుని గురించి తెలుపబడింది. దానితో ఆ వ్యక్తి అతని వద్ద కెళ్ళి, నేను 99 మందిని హత్య చేసాను, మరి నాకు పశ్చాత్తాపం చెందడానికి ఏమైనా అవకాశం వుందా? అని అడిగాడు. ఆ పండితుడు ‘లేదు’ అని అన్నాడు. దీనితో ఆ వ్యక్తి ఆ పండితుణ్ని కూడా హత్య చేసి, తాను హత్య చేసిన సంఖ్య 100కు పెంచాడు. తదుపరి మళ్ళీ ఆ వ్యక్తి విద్వాంసులు గురించి అడగ్గా, అతనికి ఓ విద్వాంసుని గురించి తెలియజేయబడింది. ఆ వ్యక్తి, ఆ విద్వాంసునితో – నేను 100 మందిని హత్య చేశాను. మరి నేను పశ్చాత్తాపం చెందడానికి ఏమైనా అవకాశం వుందా? అని అడిగాడు. ఆ విద్వాసుడు- ‘వుంది’, పశ్చాత్తాపానికీ, నీకూ మధ్య ఎవరు అడ్డు రాగలరు? నువ్వు ఒక్క పని చెయ్యి. ఫలానా ప్రదేశానికి వెళ్ళిపో, అక్కడి ప్రజలు అల్లాహు ఆరాధిస్తారు. కనుక నువ్వు కూడా వారితో కలసి అల్లాహ్ ను ఆరాధిస్తూ వుండు. చూడు! నీ ప్రదేశానికి మళ్ళీ తిరిగి రావడానికి ప్రయత్నించకు, ఎందుకంటే అక్కడ చెడు ప్రజలు నివసిస్తున్నారు. దానితో అతను బయలుదేరి సగం దూరం వెళ్ళగానే మృతి చెందాడు. ఇతని గురించి కారుణ్య దేవదూతలు మరియు శిక్షించే దైవదూతల మధ్య గొడవ జరిగింది. కారుణ్య దైవదూతలు – ఇతను మనస్ఫూర్తిగా పశ్చాత్తాపం చెందడానికి బయలు దేరాడు, అల్లాహ్ వైపునకు మరలాడు అని అనగా, శిక్షించే దైవదూతలు- ఇతను తన జీవితంలో ఏ సత్కార్యమూ చేయలేదు అని అన్నారు. వీళ్ళిలా మాట్లాడుకుంటున్న తరుణంలోనే ఒక దైవదూత మానవా కారంలో అక్కడి కొచ్చాడు. దీనితో వారంతా అతన్ని తమ న్యాయనిర్ణేతగా స్వీకరించారు. అతను ప్రయాణించింది మరియు ఇంకా ప్రయాణించాల్సినది). మీరు రెండు దూరాలను కొలవండి (ఆ వ్యక్తి ఇలా, అతను దేనికి దగ్గరగా వుంటే, దాని కనుగుణంగా అతని గమ్యస్థానాన్ని నిర్ణయించండి అని అన్నాడు. తదుపరి, వారు రెండు దూరాలను కొలవగా, ఆ వ్యక్తి ఇంకా ప్రయాణించాల్సిన దూరం తక్కువగా వచ్చింది. దీనితో అతని ఆత్మను కారుణ్య దైవదూతలు తీసుకెళ్ళారు. (బుఖారీ: 3470, ముస్లిం: 2766)
సహీహ్ ముస్లిం లోని మరో ఉల్లేఖనంలో ఇలా వుంది: “అల్లాహ్ – ఆ వ్యక్తి ప్రయాణం చేసివున్న భూమిని పెరగమని మరియు ఇంకా ప్రయాణం చేయాల్సి వున్న భూమిని తగ్గిపోమని ఆదేశించాడు”.
కాస్త ఆలోచంచండి!
ఈ వ్యక్తి 100 మందిని హత్య చేసి వున్నాడు. తన జీవితంలో ఒక్క సత్కార్యం కూడా చేయలేదు. కానీ, మనస్ఫూర్తిగా పశ్చాత్తాపం చెందే సంకల్పంతో బయలు దేరాడు. అల్లాహ్ అతని సంకల్పాని కనుగుణంగానే అతని పశ్చాత్తాపాన్ని స్వీకరించి, అతని ఆత్మను కారుణ్య దూతలకు అప్పగించాడు.
* కేవలం మనస్ఫూర్తిగా పశ్చాత్తాపం చెందాలని సంకల్పించుకున్నప్పుడే కాకుండా, దాసుడు ఒకవైపు తన పాపాల గురించి చూస్తూ మరో వైపు హృదయంలో అల్లాహ్ శిక్షల గురించి భయాందోళనలు ప్రవేశిస్తే దానికి కూడా అల్లాహ్ అతన్ని క్షమిస్తాడు.
అబూ హురైరా (రజియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు:
“ఒక వ్యక్తి ఎన్నో పాపాలు చేసాడు, జీవితంలో ఒక్క సత్కార్యం కూడా చేయలేదు. అతని మరణ సమయం ఆసన్నమైనప్పుడు, తన కొడుకులను పిలిచి, నేను చనిపోయాక నన్ను కాల్చేయండి, తదుపరి నా బూడిదను సగం గాలిలో వదిలేయండి మరియు సగం సముద్రంలో వదిలేయండి. అల్లాహ్ సాక్షి! ఒకవేళ నా ప్రభువు గనక తలచుకుంటే నాకు, ఎవ్వరికీ విధించని శిక్షను విధిస్తాడు అని అన్నాడు. ఆయన కొడుకులు అతను చెప్పినట్లే చేసారు. తదుపరి అల్లాహ్, ఆ వ్యక్తి బూడిదను సమీకరించమని భూమినీ, సముద్రాన్ని ఆదేశించాడు. ఆ తర్వాత అతనికి జీవం పోసి అతనితో – నువ్వు ఇలా ఎందుకు చేశావు? అని అడిగాడు. అతను, నా ప్రభూ! కేవలం నీకు భయపడి నేనిలా చేసాను. ఇది నీకు బాగా తెలుసు అని విన్నవించుకున్నాడు. దీనితో అల్లాహ్ అతన్ని క్షమించి వేసాడు. (బుఖారీ: 7506, ముస్లిం: 2755)
* అల్లాహ్ ఎంతటి ‘గపూరుర్రహీమ్’ అంటే, చూడ్డానికి చిన్నగా అనిపించే సత్యార్యాలను చేసినా కూడా దాసులను ఇట్టే క్షమిస్తాడు.
అబూ హురైరా (రజి అల్లాహుఅన్ను) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు: “ఒక వ్యక్తి ఓ దారి గుండా వెళుతున్నాడు, దారిలో అతనికి ఒక ముళ్ళ కొమ్మ కనబడింది. అతను దానిని దారి నుండి తొలగించాడు. అల్లాహ్ అతని (ఈ చిన్న ఆచరణ)ని గౌరవించి అతన్ని మన్నించాడు”. (బుఖారీ: 652, ముస్లిం: 1914)
అబూ హురైరా (రజియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు:
“ఒక వ్యక్తి ఒక దారి గుండా వెళుతుండగా అతనికి ఎంతో దాహం వేసింది. అతనికి ఒక బావి కనిపించగా, అందులోకి దిగి తన దాహాన్ని తీర్చుకున్నాడు. బావి నుండి బయటి కొచ్చాక అతను ఒక కుక్క దాహంతో తటపటాయిస్తూ మన్ను నాకడం గమనించి, (మనస్సులో)-దాహం నా పరిస్థితిని మార్చినట్టుగానే ఈ కుక్క పరిస్థితిని కూడా మార్చేసింది అని అనుకొని, మళ్ళీ బావిలో దిగి తన మేజోళ్ళలో నీళ్ళు నింపి, వాటిని తన నోటితో అదిమి పట్టి, బయటకు తీసుకొచ్చి కుక్కకు నీళ్ళు త్రాగించాడు. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు: “అల్లాహ్ దీనిని గౌరవించి, అతణ్ణి మన్నించాడు.” (బుఖారీ: 2363, ముస్లిం: 2244)
సహీహైన్ లోని మరో ఉల్లేఖనంలో ఇలా వుంది:
వ్యభిచరించిన ఒక స్త్రీ – ఒక కుక్కను, మిక్కిలి ఎండగా వున్న ఒక రోజులో దాహం కొద్దీ ఒక బావి దగ్గర వెంపర్లాడడం చూసింది. ఆమె తన మేజోళ్ళను తీసి వాటి ద్వారా నీళ్ళను తీసి దానికి త్రాగించింది. ఆమె ఈ ఆచరణ మూలంగానే మన్నించబడింది. (బుఖారీ: 3467, ముస్లిం: 2244)
ఈ హదీసులన్నింటి ద్వారా తెలిసిందేమిటంటే, అల్లాహ్ ఎంతగానో గౌరవించేవాడు, అనంతంగా కరుణించేవాడు మరియు అమితంగా క్షమించే వాడు. తన దాసుల చిన్న చిన్న సత్యార్థ్యాలకు కూడా వారిని క్షమించి వేస్తాడు. దీనికి సంబంధించి మరిన్ని హదీసులు వినండి!
(1) అబూ హురైరా (రజియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు:
“ఒక దాసుడు ఒక పాపం చేశాడు, తదుపరి అతను ఇలా ప్రార్థించాడు. ఓ అల్లాహ్! నా పాపాన్ని క్షమించు. దీనిపై అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: “నా దాసుడు పాపానికి ఒడిగట్టాడు. తదుపరి అతని పాపాన్ని క్షమించే లేదా పట్టుకొనే ప్రభువు ఒకడు వున్నాడని గ్రహించాడు”. తర్వాత ఆ దాసుడు మరో పాపం చేసి, పశ్చాత్తాప పడుతూ ఇలా ప్రార్థించాడు- ‘నా ప్రభువా! నా పాపాన్ని క్షమించు’.
దీనిపై అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ‘నా దాసుడు పాపానికి ఒడిగట్టాడు. తదుపరి అతని పాపాన్ని క్షమించి లేదా పట్టుకొనే ప్రభువు ఒకడు వున్నాడని గ్రహించాడు’. ఆ తర్వాత ఆ దాసుడు ఇంకో పాపం చేసి, మన్నింపు కోసం ఇలా ప్రార్థించాడు : ‘నా ప్రభువా! నా పాపాన్ని క్షమించు’. దీనిపై అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: “నా దాసుడు పాపానికి ఒడిగట్టాడు. తదుపరి అతని పాపాన్ని క్షమించే లేదా పట్టుకొనే ప్రభువు ఒకడు వున్నాడని గ్రహించాడు. వెళ్ళు, వెళ్ళి నీకిష్టమైనది చేయి, నేను నిన్ను క్షమించేశాను”. (బుఖారీ: 7507, ముస్లిం: 2758)
దీని అర్థం ఏమిటంటే, ఒకవేళ మీరు మాటిమాటికీ పాపానికి ఒడిగడుతూ ప్రతి సారీ అల్లాహ్ ను క్షమించమని వేడుకుంటూ వుంటే అల్లాహ్ మిమ్మల్ని క్షమిస్తూ వుంటాడు. అంటే అల్లాహ్ క్షమాపణకు తౌబా మరియు అస్తగా ఫార్ షరతు అన్నమాట. అందుకే, ప్రతి ముస్లిం ఎల్లప్పుడూ మన్నించమని అల్లాహ్ ను వేడుకుంటూ వుండాలి. తద్వారా అతను మరణించే సమయంలో అతను తన ప్రభువు ద్వారా క్షమించబడి వుండాలి.
(2) అబ్దుల్లా బిన్ ఉమర్ (రజియల్లాహు అన్హుమా) కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు:
“ప్రళయం నాడు అల్లాహ్ విశ్వాసిని తనకు దగ్గరగా రప్పించి, అతన్ని పరదాతో కప్పేసి తదుపరి అతని పాపాలను ఒప్పుకొనేలా చేసి ఇలా అడుగుతాడు, నువ్వు ఫలానా పాపానికి ఒడిగట్టావన్న విషయం నీకు తెలుసా? అతను నిజమే నా ప్రభూ! (ఈ విషయం) నాకు తెలుసు అని విన్నవించుకుంటాడు. దీనిపై అల్లాహ్ – ఇహలోకంలో కూడా నేను నీపై (పాపాలపై) పరదా వేసి వుంచాను మరియు ఈ రోజు కూడా నిన్ను క్షమిస్తున్నాను అని అంటాడు. తదుపరి అతనికి పుణ్యాల కర్మల పత్రం ఇవ్వబడుతుంది. ఇక తిరస్కా రులు, కపట విశ్వాసుల విషయానికొస్తే, వీరి గురించి విశ్వాసులందరి ముందు ఇలా ప్రకటించబడుతుంది- ‘అల్లాహ్ పై అసత్యం పలికిన వారు వీళ్ళే!’. (బుఖారీ: 2441, ముస్లిం: 2768)
పశ్చాత్తాపం స్వీకరించబడటానికి షరతులు
ప్రియ సోదరులారా!
ఇది కూడా బాగా తెలుసుకోండి! నిజమైన పశ్చాత్తాపానికి కొన్ని షరతులు వున్నాయి. అవి నెరవేర్చకుంటే అల్లాహ్ సన్నిధిలో పశ్చాత్తాపం స్వీకరించబడదు. ఆ షరతులు ఇవి:
1) చిత్తశుద్ధి
– ఆరాధనలన్నింటి స్వీకరణకు కావాల్సిన మొదటి షరతు. కనుక పశ్చాత్తాపం చెందే వ్యక్తి కేవలం అల్లాహ్ సంతృప్తి కోసం పశ్చాత్తాపం చెందాలి. అంతేకానీ, ఏదైనా ప్రాపంచిక ప్రయోజనం కోసం కాకూడదు. ఎందుకంటే, ఒకవేళ అతను ఏదైనా ప్రాపంచిక ప్రయోజనాన్ని ఆశించి తౌబా చేస్తే, ఆ ప్రయోజనం తీరిపోగానే అల్లాహ్ ధర్మం నుండి ముఖం త్రిప్పుకుంటాడు. మరి ఇలాంటి పశ్చాత్తాపం అసత్య పశ్చాత్తాపం అనిపించుకుంటుంది, నిజమైన పశ్చాత్తాపం కాదు.
2) సిగ్గుతో తలవంచుకోవడం
– అంటే పశ్చాత్తాపం చెందే వ్యక్తి తన పాపాలను ఒప్పుకొని, అల్లాహ్ ముందు సిగ్గుతో తలవంచుకొని, వినయాన్ని వ్యక్తం చేయాలి. ఎందుకంటే, తన పాపాన్ని ఒప్పుకొని, సిగ్గుతో కుమిలిపోతూ వినయ విధేయతలతో అల్లాహ్ ను క్షమించమని వేడుకొనే వ్యక్తిని అల్లాహ్ ప్రేమిస్తాడు.
ఆయెషా (రజియల్లాహు అన్హా) పై అభాండం మోపబడినప్పుడు దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆమెకు ఇలా హితబోధ చేశారు: “ఓ ఆయెషా! నీకు సంబంధించిన ఒక విషయం నా దగ్గరికి చేరింది. ఒకవేళ నువ్వు ఏ పాపం ఎరుగక పోతే అల్లాహ్ యే దీనిని బట్టబయలు చేస్తాడు. కానీ, ఒకవేళ నీవు నిజంగానే పాపానికి ఒడిగట్టితే మటుకు అల్లాహ్ క్షమాపణ వేడుకో మరియు ఆయన సన్నిధిలో పశ్చాత్తాప పడు. ఎందుకంటే దాసులెవరైనా తన పాపాన్ని ఒప్పుకొని తదుపరి పశ్చాత్తాపం చెందితే అల్లాహ్ అతని పశ్చాత్తాపాన్ని స్వీకరిస్తాడు”. (ముస్లిం: 2770)
3) పాపాలను త్యజించడం
– అంటే పశ్చాత్తాపం చెందే వ్యక్తి పాపాన్ని త్యజించి అల్లాహ్ ను క్షమించమని వేడుకోవాలి. అంతేగానీ, ఒకవైపు పాపాలు చేస్తూ మరో వైపు అల్లాహ్ ను క్షమాపణకై వేడుకోకూడదు.
ఉదాహరణకు – ఒక వ్యక్తి మద్యాన్ని సేవిస్తూ ఒక్కో గుటక త్రాగుతూ, దానితో పాటు ‘అస్తగ్ ఫిరుల్లాహ్’ అని స్మరిస్తూ వుండడం లేదా ఒక వ్యక్తి ఒక నిశ్చితమైన లాభాన్ని పొందాలన్న ఉద్దేశ్యంతో తన సొమ్మును వడ్డీ ఇచ్చే బ్యాంకుల్లో జమ చేసి, దీనిపై అల్లాహ్ క్షమాపణ కూడా వేడుకోవడం!
ఇలాంటి వ్యక్తుల పశ్చాత్తాపం స్వీకరించబడదు. పైగా ఇది అల్లాహ్ పరిహాసమాడటమే. నోటితో అల్లాహ్ క్షమాపణ వేడుకుంటూ, ఏ కార్యాల పై క్షమాపణ వేడుకుంటున్నారో వాటినే ఆచరిస్తూ వుండడం.
ఇబ్నె అబ్బాస్ (రజియల్లాహు అన్హుమా) కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు:
“పాపాలను ఆచరిస్తూ, వాటిపై స్థిరంగా వుండి, వాటిని క్షమించమని అల్లాహ్ ను వేడుకొనేవాడు తన ప్రభువుతో పరిహాసమాడుతున్న వ్యక్తి లాంటి వాడు”. (అద్దయీఫా: 616)
ఈ హదీసు, పరంపర రీత్యా బలహీనమైనప్పటికీ భావం రీత్యా సరైనది. అల్లాహ్ యొక్క ఈ ఆదేశం ద్వారా దీనికి బలం చేకూరుతుంది:
وَالَّذِينَ إِذَا فَعَلُوا فَاحِشَةً أَوْ ظَلَمُوا أَنْفُسَهُمْ ذَكَرُوا اللهَ فَاسْتَغْفَرُوا لِذُنُوبِهِمْ مَد وَمَنْ يَغْفِرُ الذُّنُوبَ إِلَّا اللهُ وَلَمْ يُصِرُّوا عَلَى مَا فَعَلُوا وَهُمْ يَعْلَمُونَ
“తమ ద్వారా ఏదైనా నీతి బాహ్యమైన పని జరిగిపోతే లేదా తమ ఆత్మలకు వారు ఏదైనా అన్యాయం చేసుకుంటే వెంటనే అల్లాహ్ ను తలచుకుని, తమ పాపాల క్షమాపణకై వేడుకుంటారు… నిజానికి అల్లాహ్ తప్ప పాపాలను క్షమించే వాడెవడున్నాడు? వారు తమ వల్ల జరిగింది తప్పు అని తెలిసినప్పుడు దానిపై హటం చెయ్యరు”. (ఆలి ఇమ్రాన్: 135)
అంటే, వారి ద్వారా ఏదైనా పాపం జరిగిపోయినప్పుడు, అది చిన్నదైనా, పెద్దదైనా, వారు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా అల్లాహ్ ను, ఆయన శిక్షను గుర్తుకు తెచ్చుకొని వెంటనే ఆయనకు క్షమాభిక్షకై వేడుకుంటారు. ఎందుకంటే ఆయన తప్ప క్షమాభిక్షను వేడుకోవడానికి అర్హులెవరూ లేరు. వారు తమపాపాల గురించి మొండిగా వాదించరు, పైగా వాటిని త్యజించి తమ స్వీయ సంస్కరణ చేసుకుంటారు.
తదుపరి అల్లాహ్ వీరికి దొరకబోయే ప్రతి ఫలాన్ని గురించి వివరిస్తూ ఇలా సెలవిచ్చాడు:
أُولَٰئِكَ جَزَاؤُهُم مَّغْفِرَةٌ مِّن رَّبِّهِمْ وَجَنَّاتٌ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ خَالِدِينَ فِيهَا ۚ وَنِعْمَ أَجْرُ الْعَامِلِينَ
“తమ ప్రభువు తరఫు నుంచి క్షమాభిక్ష, క్రింద కాలువలు ప్రవహించే స్వర్గవనాలు ప్రతిఫలంగా లభించేది ఇటువంటి వారికే. వాటిలో వారు ఎల్లకాలం వుంటారు. ఈ సత్కార్యాలు చేసే వారికి లభించే పుణ్యఫలం ఎంత చక్కనిది”. (ఆలి ఇమ్రాన్ 3: 136)
అలాగే, ఇలా కూడా సెలవిచ్చాడు:
ثُمَّ إِنَّ رَبَّكَ لِلَّذِينَ عَمِلُوا السُّوءَ بِجَهَالَةٍ ثُمَّ تَابُوا مِن بَعْدِ ذَٰلِكَ وَأَصْلَحُوا إِنَّ رَبَّكَ مِن بَعْدِهَا لَغَفُورٌ رَّحِيمٌ
“మరి ఎవరైనా అజ్ఞానం వల్ల దురాగతాలకు పాల్పడి, ఆపైన పశ్చాత్తాపం చెందితే, దిద్దుబాటు కూడా చేసుకుంటే అప్పుడు నిశ్చయంగా నీ ప్రభువు అపారంగా క్షమించేవాడు, అమితంగా కనికరించేవాడు”. (నహల్ 16: 119)
ఈ ఆయతుల ద్వారా తెలిసిందేమిటంటే, పాపాలను వదిలిపెట్టి, స్వీయ సంస్కరణ చేసుకోవడం నిజమైన పశ్చాత్తాపానికి షరతులు. అందుకే ఫజైల్ బిన్ అయ్యాజ్ రహిమహుల్లాహ్, పాపాలను త్యజించకుండా చేసే అస్తగా ఫారు అబద్ధాలకోరుని పశ్చాత్తాపంగా ఖరారు చేస్తూ ఇలా అనేవారు:
“పాపాలను త్యజించకుండా అస్తగ్ ఫార్ చేయడం అనేది అసత్యవాదులు తౌబా చేయడం లాంటిది”.
4) భవిష్యత్తులో అల్లాహ్ అవిధేయతకు దూరంగా వుంటామని గట్టిగా నిర్ధారించుకోవడం.
అంటే- పశ్చాత్తాపం చెందే వ్యక్తి, పశ్చాత్తాపం చెందేటప్పుడు, భవిష్యత్తులో ఇలాంటి పాపాలకు దూరంగా వుంటానని, అల్లాహ్ సన్నిధిలో గట్టిగా నిర్ధారించు కోవాలి. కేవలం నిర్ధారించుకోవడమే కాక, దీనిపై అల్లాహ్ సహాయాన్ని కూడా అర్థించాలి. ఎందుకంటే, ఆయన సద్బుద్ధిని ప్రసాదిస్తే తప్ప అతను ఏ చెడు నుండి కూడా దూరంగా వుండలేడు.
అందుకే దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రార్థించేవారు:
“ఓ అల్లాహ్ ! నేను నిన్ను – సత్కార్యాలు చేసే, చెడు కార్యాలను త్యజించే, బీదవారిని ప్రేమించే సద్బుద్ధిని ప్రసాదించమని అర్థిస్తున్నాను. (ఓ అల్లాహ్!) నన్ను క్షమించు, నాపై కరుణించు. ఒకవేళ నీవు ప్రజలను ఏదైనా పరీక్షకు గురిచేస్తే, నన్ను దాని నుండి తప్పించి మరణాన్ని కలుగజెయ్యి. నేను నీతో, నీ ప్రేమను, నిన్ను ప్రేమించేవారి ప్రేమను, నీకు దగ్గరగా చేర్చే ఆచరణలపై ప్రేమను అర్థిస్తున్నాను”. (తిర్మిజి: 3235, సహీహ్ – అల్బానీ)
అలాగే ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా కూడా ప్రార్థించేవారు:
“ఓ అల్లాహ్ ! నువ్వు నన్ను అన్నింటి కన్నా గొప్ప సత్కార్యాలు చేసే మరియు అత్యుత్తమ నైతిక విలువలు, సత్ప్రవర్తన కలిగి వుండే సద్బుద్ధిని ప్రసాదించు. ఎందుకంటే నీవు తప్ప వీటిని ప్రసాదించే వారెవరూ లేరు. (ఓ అల్లాహ్ ! ) నన్ను చెడు కార్యాల నుండి, చెడు గుణగణాల నుంచి కాపాడు. ఎందుకంటే నీవు తప్ప వాటి నుండి కాపాడేవారు ఎవరూ లేరు”. (నసాయి: 896, సహీహ్ -అల్బానీ)
5) పశ్చాత్తాపం చెందే వ్యక్తి ‘తౌబా ద్వారం’ మూసివేయబడటానికి ముందుగా తౌబా చేయాలి.
మేము ఈ ఖుత్బా ఆరంభంలోనే ఈ విషయం వివరించాం. ఒక ముస్లిం ఏదైనా పాపానికి ఒడిగడితే, వెంటనే అతను అల్లాహ్ వైపునకు తిరిగి మన్నించమని వేడుకోవాలి. తౌబా చేయడంలో ఆలస్యం చేయకూడదు. ఎందుకంటే, ఏ వ్యక్తి కూడా ఎప్పటి వరకు జీవించి వుంటాడో అన్న గ్యారంటీ లేదు. మరణం అతనికి ఎప్పుడైనా రావచ్చు. కనుక మరణానికి ముందే అల్లాహ్ శిక్షకు భయపడుతూ వెంటనే తౌబా చేసుకోవాలి. తౌబా ద్వారం అతని కోసం మూసి వేయబడ్డ తర్వాత తౌబా చేసి అల్లాహ్ అతని తౌబాను తిరస్కరించే పరిస్థితి ఎవరికీ రాకూడదు.
దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు: “నిశ్చయంగా అల్లాహ్ – దాసుని తౌబాను, అతని ప్రాణం గొంతుకలోకి వచ్చి ఆగే వరకు స్వీకరిస్తాడు”. (తిర్మిజి: 3537, సహీహ్ – అల్బానీ)
ఈ హదీసు ద్వారా తెలిసిందేమిటంటే,దాసునికి మృత్యుదూత కనిపిస్తూ, తుది శ్వాస గొంతుకలోకి వచ్చి ఆగే సమయంలో గనక తౌబా చేస్తే, దాని ద్వారా ఏ ప్రయోజనం వుండదు.
అచ్చంగా ఇదే విషయాన్ని ఖురాన్లో అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
إِنَّمَا التَّوْبَةُ عَلَى اللهِ لِلَّذِيْنَ يَعْمَلُونَ السُّوءَ بِجَهَالَةٍ ثُمَّ يَتُوبُونَ مِنْ قَرِيبٍ فَأُولَبِكَ يَتُوبُ اللهُ عَلَيْهِمْ وَكَانَ اللهُ عَلِيمًا حَكِيمًا وَلَيْسَتِ الثَّوْبَةُ لِلَّذِينَ يَعْمَلُونَ السَّيَاتِ وَهُمْ كُفَارُه أُولَيكَ
حَتَّى إِذَا حَضَرَ أَحَدَهُمُ الْمَوْتُ قَالَ إِنِّي تُبْتُ اللهَ وَلَا الَّذِينَ يَمُوتُونَ وَهُم اعْتَدْنَا لَهُمْ عَذَابًا أَلِيمًا
“అవివేకం వల్ల ఏదైనా చెడు కార్యానికి పాల్పడి, వెనువెంటనే తప్పు తెలుసుకొని పశ్చాత్తాపం చెందేవారి పశ్చాత్తాపాన్ని స్వీకరించే బాధ్యత మాత్రమే అల్లాహ్ పై వుంది. అటువంటి వారి పశ్చాత్తాపాన్ని అల్లాహ్ సీకరిస్తాడు. అల్లాహ్ మహాజ్ఞాని, గొప్ప వివేకవంతుడు. నిరంతరం పాపకార్యాలకు పాల్పడుతూ, తీరా మరణ ఘడియలు సమీపించాక, ‘ఇప్పుడు నేను పశ్చాత్తాప పడుతున్నాను’ అని అనేవారి పశ్చాత్తాపం ఆమోదించబడదు. అలాగే అవిశ్వాసస్థితిలో ప్రాణం విడిచే వారి పశ్చాత్తాపం కూడా స్వీకరించబడదు. ఇలాంటి వారి కోసమే మేము వ్యధాభరితమైన శిక్షను సిద్ధం చేసివుంచాము”. (నిసా: 17, 18)
ఈ కారణంగానే ఫిరౌను సముద్రంలో మునికిపోతూ పశ్చాత్తాపం చెంది నప్పుడు, అల్లాహ్ అతని పశ్చాత్తాపాన్ని తిరస్కరిస్తూ ఇలా జవాబిచ్చాడు:
“ఇప్పుడా విశ్వసించేది?! ఇంతకు ముందు తలబిరుసు తనాన్ని ప్రదర్శిస్తూ, కల్లోల జనకులలో చేరి ఉండేవాడివి కదా!” (యూనుస్: 91)
సారాంశమేమింటే – పశ్చాత్తాపం స్వీకరించబడడానికి గల షరతులలో ఒక షరతు ఏమిటంటే, పశ్చాత్తాపం చెందే వ్యక్తి తౌబా (పశ్చాత్తాపం) ద్వారం మూసివేయబడడానికి ముందుగా పశ్చాత్తాపపడాలి.
దీని ఒక స్థితి ఏమిటంటే, మరణాన్ని తన కళ్ళ ముందు చూస్తూ ప్రాణం గొంతులోకి వచ్చి ఆగినప్పుడు, ఇక రెండవ స్థితి ఏమిటంటే, సూర్యుడు పడమర దిక్కున ఉదయించినప్పుడు. ప్రళయానికి ముందు సూర్యుడు పడమర దిక్కున ఉదయిస్తాడు. ఆ తర్వాత అల్లాహ్ ఎవరి పశ్చాత్తాపాన్ని కూడా ఆమోదించడు (స్వీకరించడు).
దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు:
“ఏ వ్యక్తి అయినా సూర్యుడు పడమర దిక్కున ఉదయించడానికి ముందుగా గనక పశ్చాత్తాపం చెందితే, అల్లాహ్ అతని పశ్చాత్తాపాన్నిస్వీకరిస్తాడు”. (ముస్లిం: 2703)
6) దాసుల హక్కులను నెరవేర్చటం
ఒకవేళ పాపాలు గనక దాసుల హక్కులతో ముడిపడి వుంటే, అవి క్షమించబడానికి షరతు ఏమిటంటే, ఆ హక్కులను నెరవేర్చాలి లేదా వారి ద్వారా వాటిని క్షమింపజేసుకోవాలి.
ఆఖరుగా అల్లాహ్ ను వేడుకునేదేమిటంటే, ఆయన మనకు మనస్ఫూర్తిగా పశ్చాత్తాపం చెందే సద్బుద్ధిని ప్రసాదించుగాక! మరియు మనందరి పాపాలను మన్నించుగాక!
రెండవ ఖుత్బా
ఇస్తిగ్ ఫార్ మరియు నిజమైన తౌబా ప్రయోజనాలు ఎన్నో వున్నాయి. వీటిలో కొన్నింటిని మీకు క్లుప్తంగా వివరిస్తాం:
1) తౌబా మరియు ఇస్టిగ్ ఫార్ తో పాపపు మచ్చలు కడిగి వేయబడ తాయి మరియు మనిషి పాపాల నుండి పరిశుద్ధుడవుతాడు.
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు:
“విశ్వాసి ఏదైనా తప్పు చేస్తే అతని హృదయంలో ఒక నల్లటి మచ్చ ఏర్పడుతుంది. తదుపరి అతను పశ్చాత్తాపం చెంది, ఆ పాపకార్యాన్ని త్యజించి, మన్నించమని వేడుకుంటే అతని హృదయాన్ని శుభ్రం చేయడం జరుగుతుంది. అలా కాక, అతను ఒక తప్పు తర్వాత మరో తప్పు చేస్తూ పోతే, నల్లటి మచ్చ కూడా పెరుగుతూ పోయి, చివరికి హృదయాన్నంతటినీ కప్పి వేస్తుంది. ఖుర్ఆన్లో అల్లాహ్ వివరించిన ‘హృదయానికి త్రుప్పు పట్టడం’ అంటే ఇదే”. (తిర్మిజీ: 3334, ఇబ్నె మాజ: 4244, హసన్- అల్బానీ)
2) కేవలం నల్లటి మచ్చలే కాదు, పశ్చాత్తాపం చెందే వ్యక్తి పాపాలను అల్లాహ్ పుణ్యాలుగా మారుస్తాడు.
దీని గురించి అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
إِلَّا مَن تَابَ وَآمَنَ وَعَمِلَ عَمَلًا صَالِحًا فَأُولَٰئِكَ يُبَدِّلُ اللَّهُ سَيِّئَاتِهِمْ حَسَنَاتٍ ۗ وَكَانَ اللَّهُ غَفُورًا رَّحِيمًا
“అయితే (ఈ పాపకార్యాల తరువాత) ఎవరు పశ్చాత్తాపం చెంది, విశ్వసిస్తారో, సదాచరణ చేస్తారో, అలాంటి వారి పాపాలను అల్లాహ్ పుణ్యాలుగా మార్చి వేస్తాడు. అల్లాహ్ క్షమాభిక్ష పెట్టేవాడు. కరుణాకరుడు”. (అల్ ఫుర్ఖాన్ 25: 70)
3) ఎక్కువగా పశ్చాత్తాపం చెందే వ్యక్తి అల్లాహ్ కు ప్రియమైనవాడు.
అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
إِنَّ اللَّهَ يُحِبُّ التَّوَّابِينَ وَيُحِبُّ الْمُتَطَهِّرِينَ
“అల్లాహ్ పశ్చాత్తాప పడేవారిని, పారిశుద్ధ్యాన్ని అవలంబించే వారిని ఇష్టపతాడు”. (బఖర 2: 222)
4) పశ్చాత్తాపం చెందే వారిని అల్లాహ్ ఇష్టపడతాడు. కాబట్టి వారికి సుఖసంతోషాలు కలుగు జేస్తాడు. వారికి సంతానాన్ని, సంపదను అనుగ్రహించి వారిపై తన కారుణ్యాన్ని అవతరింపజేస్తాడు.
దీని గురించి అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
فَقُلْتُ اسْتَغْفِرُوا رَبَّكُمْ إِنَّهُ كَانَ غَفَّارًا
يُرْسِلِ السَّمَاءَ عَلَيْكُم مِّدْرَارًا
وَيُمْدِدْكُم بِأَمْوَالٍ وَبَنِينَ وَيَجْعَل لَّكُمْ جَنَّاتٍ وَيَجْعَل لَّكُمْ أَنْهَارًا
“నేను (నూహ్ అలైహిస్సలాం) ఇలా అన్నాను- క్షమాపణకై మీరు మీ ప్రభువును వేడుకోండి. నిశ్చయంగా ఆయన అమితంగా క్షమించేవాడు. ఆయన ఆకాశం నుంచి మీపై ధారాపాతంగా వర్షం కురిపిస్తాడు. మీ సిరిసంపదల్లోనూ, పుత్ర సంతతి లోనూ వృద్ధిని కలుగజేస్తాడు. మీ కొరకు తోటలను ఉత్పన్నం చేస్తాడు. ఇంకా మీ కోసం కాలువలను ప్రవహింపజేస్తాడు”. (నూహ్: 10 – 12)
5) అస్తగ్ ఫార్ మూలంగా అల్లాహ్ తన శిక్షను ఆపుతాడు.
అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
وَمَا كَانَ اللَّهُ مُعَذِّبَهُمْ وَهُمْ يَسْتَغْفِرُو
“వారు క్షమాపణకై వేడుకుంటూ ఉండగా కూడా అల్లాహ్ వారిని శిక్షించడు”. (అల్ అన్ ఫాల్ 8: 33)
6) తౌబా, ఇస్తిగ్ ఫార్ చేసే వారి కోసం దైవదూతలు కూడా ప్రార్థిస్తారు.
అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
الَّذِينَ يَحْمِلُونَ الْعَرْشَ وَمَنْ حَوْلَهُ يُسَبِّحُونَ بِحَمْدِ رَبِّهِمْ وَيُؤْمِنُونَ بِهِ وَيَسْتَغْفِرُونَ لِلَّذِينَ آمَنُوا رَبَّنَا وَسِعْتَ كُلَّ شَيْءٍ رَّحْمَةً وَعِلْمًا فَاغْفِرْ لِلَّذِينَ تَابُوا وَاتَّبَعُوا سَبِيلَكَ وَقِهِمْ عَذَابَ الْجَحِيمِ
“అర్ష్ (అల్లాహ్ సింహాసనం)ను మోసేవారు, దాని చుట్టూ ఉన్నవారు (దైవదూతలు) స్తోత్ర సమేతంగా తమ ప్రభువు పవిత్రతను కొనియాడు తున్నారు. వారు ఆయన్ని విశ్వసిస్తున్నారు. విశ్వాసుల మన్నింపు కొరకు ప్రార్థిస్తూ వారు ఇలా అంటారు- మా ప్రభూ! నీవు ప్రతి వస్తువునూ నీ దయానుగ్రహంతో, పరిజ్ఞానంతో ఆవరించి వున్నావు. కనుక పశ్చాత్తాపం చెంది, నీ మార్గాన్ని అనుసరించిన వారిని నీవు క్షమించు. ఇంకా వారిని నరక శిక్ష నుంచి కూడా కాపాడు”. (మోమిన్: 7)
(7) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు:
“ఏ వ్యక్తి కర్మల పత్రంలో ‘ఇస్తిగ్ ఫార్ ‘ అధికంగా వుందో, అతనికి శుభవార్త వుంది”. (సహీహుల్ జామె: 3930)
అందుకే మనం కూడా మన కర్మల పత్రంలో ఎక్కువగా, ‘ఇస్తిగ్ ఫార్ ‘ను లిఖింప జేసుకోవాలి. (అంటే ఎక్కువగా ఇస్తిగ్ ఫార్ చేస్తూ వుండాలి).
ఇక ఇస్తిగ్ ఫార్ గురించిన అత్యుత్తమ పదాలు ఏవంటే, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ‘సయ్యదుల్అస్తగా ఫార్’ గా ఖరారు చేసిన పదాలు. అవి ఇవి:
“ఓ అల్లాహ్! నువ్వు నా ప్రభువు. నీవు తప్ప మరో నిజమైన ఆరాధ్య దైవం లేడు. నీవే నన్ను సృష్టించావు. నేను నీ దాసుణ్ణి మరియు నా శక్తి కొలది నీ వాగ్దానంపై వున్నాను. నేను చేసిన దాంట్లోని చెడు గురించి నీ శరణు కోరుతాను. నేను నీ అనుగ్రహాలను స్వీకరిస్తూ నా తప్పులను కూడా ఒప్పు కుంటాను. కనుక నన్ను క్షమించు. ఎందుకంటే, నీవు తప్ప పాపాలను క్షమించే వారెవ్వరూ లేరు”. (బుఖారీ: 6306, 6323)
దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు:
“ఏ వ్యక్తి అయినా దీనిని పూర్తి నమ్మకంతో సాయంత్రం పూట పఠిస్తే, అదే రాత్రి గనక అతనికి మరణం సంభవిస్తే, అతను నేరుగా స్వర్గంలోకి వెళతాడు. అలాగే ఎవరైనా దీనిని పూర్తి నమ్మకంతో ఉదయం పూట పఠిస్తే, అదే రోజు గనక అతను మరణిస్తే అతను నేరుగా స్వర్గంలోకి వెళతాడు.”
దీనితో పాటు ఈ పదాలు కూడా ఎంతో ప్రయోజనకరమైనవి.
‘అస్తగ్ ఫిరుల్లాహ్, అల్లజీ లా ఇలాహ ఇల్లాహు వల్ హయ్యుల్ ఖయ్యూం వ అతూబు ఇలైహి“.
దీని గురించి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు:
“ఏ వ్యక్తి అయినా ఈ దుఆ (తను తప్ప మరో నిజమైన ఆరాధ్య దైవం లేని అల్లాహ్ ను క్షమాపణ కోరుతున్నాను. ఆయన సజీవుడు, అన్నింటికీ మూలాధారం, నేను ఆయన వైపునకు పశ్చాత్తాపంతో మరలుతాను”ను గనక పఠిస్తే, ఒకవేళ అతను యుద్ధ మైదానం నుండి పారిపోయి వచ్చినప్పటికీ అతన్ని క్షమించడం జరుగుతుంది.”
అల్లాహ్ ను వేడుకునే దేమిటంటే, ఆయన మనందరినీ క్షమించుగాక! మరియు మన పశ్చాత్తాపాన్ని స్వీకరించుగాక! అమీన్!!
—
ఈ ఖుత్బా క్రింది పుస్తకం నుండి తీసుకోబడింది:
జాదుల్ ఖతీబ్ (ఖుత్బాల సంగ్రహం) – మొదటి సంపుటం – ముహమ్మద్ ఇస్ హాఖ్ జాహిద్