దివ్య ఖుర్ఆన్ మహత్యాలు | జాదుల్ ఖతీబ్

[డౌన్ లోడ్ ఖుత్బా PDF] [26 పేజీలు]

ఖుత్బాయందలి ముఖ్యాంశాలు 

1) రమజాన్ మాసం మరియు దివ్య ఖురాన్. 
2) దివ్య ఖురాన్ విశిష్టత మరియు ఔన్నత్యం.
3) దివ్య ఖురాన్ కొన్ని మహత్యాలు. 
4) దివ్య ఖురాన్ ఎందుకు అవతరించబడింది?
5) దివ్య ఖురాన్ ప్రభావాలు. 
6) దివ్య ఖురాన్ ను గట్టిగా పట్టుకోమని ఆదేశం. 

మొదటి ఖుత్బా 

ఇస్లామీయ సోదరులారా! 

అల్లాహ్, ఆకాశ గ్రంథాలలో అన్నింటికన్నా ఉత్తమమైన గ్రంథాన్ని (ఖురాను) అన్నింటికన్నా శ్రేష్టమైన మాసంలో (రమజాన్ మాసం) అవతరింప జేశాడు. అంతేకాక, ఈ శుభప్రదమాసంలోని శ్రేష్టమైన రాత్రి (లైలతుల్ ఖద్ర్) యందు దీనిని ‘లౌహే మహ్ ఫూజ్ ‘ నుండి ఒక్కసారిగా ఇహలోకపు ఆకాశంపైకి అవతరింపజేసి ‘బైతుల్ ఇజ్జ’ (మొదటి ఆకాశంలోని ఒక ప్రదేశం) నందు పొందుపరిచాడు. 

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: 

شَهْرُ رَمَضَانَ الَّذِي أُنزِلَ فِيهِ الْقُرْآنُ هُدًى لِّلنَّاسِ وَبَيِّنَاتٍ مِّنَ الْهُدَىٰ وَالْفُرْقَانِ

“రమజాన్ నెల, ఖురాను అవతరింపజేయబడిన నెల. ఇది మానవు లందరికీ మార్గదర్శకం. అందులో సన్మార్గంతో పాటు, సత్కార్యాలను వేరుపరచే స్పష్టమైన నిదర్శనాలు వున్నాయి”. (బఖర 2:185) 

ఇంకా ఇలా సెలవిచ్చాడు: 

إِنَّا أَنزَلْنَاهُ فِي لَيْلَةِ الْقَدْرِ

“నిశ్చయంగా మేము దీనిని (ఈ ఖురానును) ఘనమైన రాత్రి (లైలతుల్ ఖద్ర్) నందు అవతరింపజేశాము.” (ఖద్ర్ 97 :1) 

దీని ద్వారా తెలిసిందేమిటంటే, దివ్య ఖురాన్ కు రమజాన్ మాసంతో ప్రగాఢ సంబంధం వుంది. అందుకే ఈ మాసంలో వీలైనంత ఎక్కువగా దివ్య ఖురాన్ పారాయణం చెయ్యాలి. స్వయానా దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కూడా దీని గురించి తగు జాగ్రత్త వహించేవారు. 

శుభప్రద రమజాన్ మాసం ప్రతి రాత్రి ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) జిబ్రయీల్ (అలైహిస్సలాం)కు ఖురాన్ వినిపించేవారు. సహీహ్ బుఖారీ లోని ఒక హదీసులో అబ్దుల్లా బిన్ అబ్బాస్ (రజియల్లాహు అన్హుమా) కథనం ఇలా వుంది: 

“దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రజలందరి కన్నా ఎక్కువగా సత్కార్యాలు చేసేవారు. ఆయన, అన్నింటికన్నా ఎక్కువగా సత్కార్యాలను రమజాన్ మాసంలో చేసేవారు. జిబ్రయీల్ (అలైహిస్సలాం) వచ్చి ఆయనను కలిసేవారు. జిబ్రయీల్ (అలైహిస్సలాం) రమజాన్ మాసపు ప్రతి రాత్రి ఆయనను కలిసేవారు. అప్పుడు దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆయనకు ఖురాన్ ను వినిపించేవారు. జిబ్రయీల్ (అలైహిస్సలాం) ను కలిసాక, ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) సుడిగాలి కన్నా వేగంగా సత్కార్యాల వైపునకు పరుగెత్తేవారు”. (బుఖారీ: 1902) 

ఇక రండి! ఎంతో మహోన్నతమైన ఈ గ్రంథం మహత్యాలను విని మన విశ్వాసాన్ని మరింత తాజాగా చేసుకుందాం! 

దివ్య ఖురాన్ అల్లాహ్ వాక్కు 

ప్రియమైన సోదరులారా! 

దివ్య ఖురాన్ ఎంతో మహోన్నతమైన గ్రంథం. దీని ఔన్నత్యం గురించి చెప్పాలంటే కేవలం ఈ ఒక్క విషయం చాలు. అదేమిటంటే, దివ్య ఖురాన్ అల్లాహ్ తరఫు నుండి అవతరించబడిన, అతని స్పష్టమైన వాక్కు. స్వయానా అల్లాహ్ యే దీని ఔన్నత్యం గురించి వివిధ రకాలుగా సెలవిచ్చాడు: 

وَإِنَّهُ لَتَنزِيلُ رَبِّ الْعَالَمِينَ نَزَلَ بِهِ الرُّوحُ الْأَمِينُ عَلَىٰ قَلْبِكَ لِتَكُونَ مِنَ الْمُنذِرِينَ بِلِسَانٍ عَرَبِيٍّ مُّبِينٍ وَإِنَّهُ لَفِي زُبُرِ الْأَوَّلِينَ

“నిశ్చయంగా ఇది (ఈ ఖురాన్) సకల లోకాల ప్రభువు అవతరింప జేసినది. విశ్వసనీయుడైన దైవదూత దీనిని తీసుకొచ్చాడు. (ఓ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం)! నువ్వు హెచ్చరించే వారిలోని వాడవు కావటానికి ఇది నీ హృదయంపై అవతరించింది. ఇది సుస్పష్టమైన అరబీ భాషలో వుంది. పూర్వీకుల గ్రంథాలలో కూడా దీని (ఖురాన్) ప్రస్తావన ఉంది.” (అష్ షుఅరా 26: 192-196) 

మరో చోట ఇలా సెలవిచ్చాడు : 

تَبَارَكَ الَّذِي نَزَّلَ الْفُرْقَانَ عَلَىٰ عَبْدِهِ لِيَكُونَ لِلْعَالَمِينَ نَذِيرً

“సమస్త లోకవాసులను హెచ్చరించే వానిగా ఉండటానికి గాను ఈ దాసునిపై గీటురాయిని అవతరిం జేసిన అల్లాహ్ గొప్ప శుభకరుడు”. (అల్ ఫుర్ఖాన్ 25:1) 

మరోచోట నక్షత్రాలు రాలిపడటం పై ప్రమాణంచేసి ఈ గ్రంథాన్ని గౌరవ ప్రదమైన గ్రంథంగా ఖరారు చేస్తూ ఇలా సెలవిచ్చాడు: 

فَلَا أُقْسِمُ بِمَوَاقِعِ النُّجُومِ وَإِنَّهُ لَقَسَمٌ لَّوْ تَعْلَمُونَ عَظِيمٌ إِنَّهُ لَقُرْآنٌ كَرِيمٌ فِي كِتَابٍ مَّكْنُونٍ لَّا يَمَسُّهُ إِلَّا الْمُطَهَّرُونَ تَنزِيلٌ مِّن رَّبِّ الْعَالَمِينَ

“అదికాదు, నక్షత్రాలు రాలి పడటం పై నేను ప్రమాణం చేస్తున్నాను. మీరు గనక తెలుసుకోగలిగితే ఇది చాలా పెద్ద ప్రమాణం. నిశ్చయంగా ఈ ఖుర్ఆన్ చాలా గౌరవప్రదమైనది. అదొక సురక్షితమైన గ్రంథంలో (నమోదై) వుంటుంది. పరిశుద్ధులు మాత్రమే దాన్ని ముట్టుకోగలరు. ఇది స్వర్గలోకాల ప్రభువు తరఫున అవతరించింది.” (వాఖిఅహ్ 56: 75-80) 

అల్లాహ్ ఈ గ్రంథాన్ని ఒకచోట ‘అల్ కితాబుల్ ముబీన్,’ మరో చోట ‘అల్ కితాబుల్ హకీం’ ఇంకో చోట ‘తన్జలుల్ కితాబి మినల్లాహిల్ అజీజిల్ హకీమ్‘ అని, మరో చోట దీని ప్రమాణం చేసి ఇలా సెలవిచ్చాడు : ‘హామీమ్, వల్ కితాబిల్ ముబీన్, ఇన్నా అన్జల్నాహు ఖుర్ఆనన్ అరబియ్యన్ లఅల్లకుమ్ తాఖిలూన్‘ అని మరో చోట, ‘యాసీన్ వల్ ఖురానిల్ హకీమ్‘ అని, ఇంకో చోట ‘సాద్, వల్ ఖుర్ఆని దిల్ జిక్ర్‘- ఇలా, అల్లాహ్ దాని వేర్వేరు గుణగణాలను వివరించి, వాటి ప్రమాణం చేసి దీని ఔన్నత్యాన్ని విశదపరిచాడు. తద్వారా, దీనిని విశ్వసించే వాళ్ళు కూడా హృదయపూర్వకంగా దీని గౌరవోన్నత్యాలను గుర్తించి దానిని తమ జీవన శైలిగా చేసుకోవడానికి (ఇలా చేశాడు). 

దివ్య ఖుర్ఆన్ – పోలిక లేని గ్రంథం 

దివ్య ఖుర్ఆన్ అల్లాహ్ గ్రంథాలలో అన్నింటి కన్నా శ్రేష్టమైనది. వక్తృత్వం మరియు సాహిత్యపరంగా ఈ గ్రంథం ఏమాత్రం పోలిక లేనిది. అందుకే ఈ గ్రంథం వాక్చాతుర్యులను, సాహితీ వేత్తలను, అందరూ కలిసి – కనీసం దీని లాంటి ఒక్క సూరానైనా (రచించి) తీసుకురమ్మని ఛాలెంజ్ చేస్తుంది. అంతేగాక, జిన్నాతులు, మానవులు- అందరూ ఏకమైనా ఇలాంటి ఖురాన్  ను  తీసుకురాలేరు అని బాహాటంగా ప్రకటిస్తుంది. 

దీని గురించి అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: 

قُل لَّئِنِ اجْتَمَعَتِ الْإِنسُ وَالْجِنُّ عَلَىٰ أَن يَأْتُوا بِمِثْلِ هَٰذَا الْقُرْآنِ لَا يَأْتُونَ بِمِثْلِهِ وَلَوْ كَانَ بَعْضُهُمْ لِبَعْضٍ ظَهِيرًا

“వారికి చెప్పు: ఒకవేళ సమస్త మానవులు, యావత్తు జిన్నాతులు అందరూ కలసి ఈ ఖురానులాంటి గ్రంథాన్ని తేదలచినా – వారు ఒకరికొకరు  తోడ్పాటును అందజేసుకున్నా ఇటువంటి దానిని తీసుకురావటం వారి వల్ల కాని పని”. (బనీ ఇస్రాయీల్ 17: 88) 

దివ్య ఖుర్ఆన్ సన్మార్గాన్ని చూపిస్తుంది 

దివ్య ఖుర్ఆన్ మనిషికి ఇహలోక, పరలోక సాఫల్యాల వైపునకు మార్గం చూపుతుంది. అతనికి స్వర్గం వైపునకు తీసుకెళ్లే స్పష్టమైన సన్మార్గాన్ని, రుజుమార్గాన్ని చూపిస్తుంది. 

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: 

 إِنَّ هَٰذَا الْقُرْآنَ يَهْدِي لِلَّتِي هِيَ أَقْوَمُ وَيُبَشِّرُ الْمُؤْمِنِينَ الَّذِينَ يَعْمَلُونَ الصَّالِحَاتِ أَنَّ لَهُمْ أَجْرًا كَبِيرًا

“నిశ్చయంగా ఈ ఖుర్ఆన్ అన్నింటికంటే సత్యమైన మార్గాన్ని చూపిస్తుంది. మంచి పనులు చేసే విశ్వాసులకు గొప్ప పుణ్యఫలం ఉందన్న శుభవార్తను ఇది వినిపిస్తుంది”. (బనీ ఇస్రాయీల్ 17:9) 

ఇంకా ఇలా సెలవిచ్చాడు: 

قَدْ جَاءَكُم مِّنَ اللَّهِ نُورٌ وَكِتَابٌ مُّبِينٌ يَهْدِي بِهِ اللَّهُ مَنِ اتَّبَعَ رِضْوَانَهُ سُبُلَ السَّلَامِ وَيُخْرِجُهُم مِّنَ الظُّلُمَاتِ إِلَى النُّورِ بِإِذْنِهِ وَيَهْدِيهِمْ إِلَىٰ صِرَاطٍ مُّسْتَقِيمٍ

అల్లాహ్ తరఫు నుంచి మీ వద్దకు జ్యోతి వచ్చేసింది. అంటే స్పష్టమైన గ్రంథం వచ్చేసింది. దాని ద్వారా అల్లాహ్ తన ప్రసన్నతను అనుసరించే వారికి శాంతి మార్గాలను చూపుతాడు. తన అనుమతి మేరకు వారిని చీకట్లలో నుంచి వెలికి తీసి, కాంతి (వెలుగు) వైపునకు తీసుకువస్తాడు. రుజుమార్గం వైపునకు వారికి మార్గదర్శకత్వం వహిస్తాడు”. (మాయిద 5: 15,16) 

దివ్య ఖుర్ఆన్ అసత్యాల మిశ్రణ నుంచి అత్యంత పరిశుద్ధంగా చేయబడ్డ, అనుమానాలకు ఏ మాత్రం తావులేని గ్రంథం

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: 

 إِنَّ الَّذِينَ كَفَرُوا بِالذِّكْرِ لَمَّا جَاءَهُمْ ۖ وَإِنَّهُ لَكِتَابٌ عَزِيزٌ لَّا يَأْتِيهِ الْبَاطِلُ مِن بَيْنِ يَدَيْهِ وَلَا مِنْ خَلْفِهِ ۖ تَنزِيلٌ مِّنْ حَكِيمٍ حَمِيدٍ

“తమ వద్దకు హితోపదేశం (ఖుర్ఆన్) వచ్చేసినప్పటికీ, దాన్ని త్రోసిపుచ్చిన వారు (కూడా మా నుండి దాగి లేరు). ఇదొక ప్రతిష్ఠాత్మకమైన గ్రంథం. అసత్యం దీని దరిదాపుల్లోకి కూడా – దీని ముందు నుండి గానీ, దీని వెనుక నుండి గానీ రాజాలదు. ఎందుకంటే ఇది మహా వివేకవంతుడు, ప్రశంసనీయుడైన అల్లాహ్ తరఫు నుండి అవతరింపజేయబడింది”. (హామీమ్ అస్ సజ్దహ్ 41: 41, 42) 

అలాగే, ఇలా సెలవిచ్చాడు: 

ذَٰلِكَ الْكِتَابُ لَا رَيْبَ ۛ فِيهِ

ఈ గ్రంథం (అల్లాహ్ గ్రంథం అన్న విషయం)లో ఎంత మాత్రం సందేహం లేదు”. (బఖర 2:2)

దివ్య ఖుర్ఆన్ సంరక్షణ బాధ్యతను అల్లాహ్ స్వయంగా తీసుకున్నాడు.

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

إِنَّا نَحْنُ نَزَّلْنَا الذِّكْرَ وَإِنَّا لَهُ لَحَافِظُونَ

(నిశ్చయంగా) మేమే ఈ ఖుర్ఆన్ ను అవతరింపజేశాము. మరి మేమే దీనిని రక్షిస్తాము“. (హిజ్ర్ 15 : 9) 

ఇలా, అల్లాహ్ తన దాసుడైన జిబ్రయీల్ (అలైహిస్సలాం) ద్వారా ఖుర్ఆన్ ను అవతరింప జేసేవాడు. ఆయన (జిబ్రయీల్) ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధికి వచ్చి దాని ఆయతులను పఠించి వినిపించేవారు. తాను వాటిని మరిచిపోతానేమోనన్న అనుమానంతో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం), జిబ్రయీల్ (అలైహిస్సలాం) పఠించే సమయంలో, ఆయనతో పాటు పఠించడం మొదలు పెట్టేవారు. 

దానిపై అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు : 

لَا تُحَرِّكْ بِهِ لِسَانَكَ لِتَعْجَلَ بِهِ إِنَّ عَلَيْنَا جَمْعَهُ وَقُرْآنَهُ فَإِذَا قَرَأْنَاهُ فَاتَّبِعْ قُرْآنَهُ ثُمَّ إِنَّ عَلَيْنَا بَيَانَهُ

“ఓ దైవప్రవక్తా! నీవు ఖుర్ఆన్ ను తొందరగా కంఠస్తం చేసుకోవడానికి నీ నాలుకను వేగంగా కదిలించకు. దీనిని సమకూర్చే, (నీ చేత) పారాయణం చేయించే బాధ్యత మాది. కాబట్టి మేము దీనిని పఠించాక, నువ్వు దీని పఠనాన్ని అనుసరించు. మరి దీనిని విడమరచి చెప్పే బాధ్యత కూడా మాపైనే వుంది”. (ఖియామహ్ 65: 16-19) 

ఈ విధంగా దివ్య ఖుర్ఆన్, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) హృదయ ఫలకంపై సురక్షితం కాబడేది. తదుపరి ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) జిబ్రయీల్ (అలైహిస్సలాం) దగ్గర దీని పున:పారాయణం చేసేవారు. దీని గురించి మేము ఈ ఖుత్బా ఆరంభంలోనే సహీహ్ బుఖారీ లోని ఒక హదీసు ద్వారా వివరించాం. 

ఇలాగే దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) దివ్య ఖుర్ఆన్ ఆయతులను తన సహాబాలకు కూడా వినిపించేవారు. వారు కూడా వాటిని విన్న తరువాత తమ హృదయాల్లో నిక్షిప్తం చేసుకొనేవారు. అంతేకాక, సహాబాలలో ఈ దైవవాణి (వహీ)ని సంగ్రహించే బాధ్యతను అప్పగించి వారిని, దీనిని వ్రాసి పొందుపరచమని ఆదేశించేవారు కూడా. 

ఇలా ఈ ఖుర్ఆన్ ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) జీవితంలోనే వ్రాయబడి వుంది మరియు సహాబాల హృదయాలలో కూడా నిక్షిప్తమై వుంది. తదుపరి అబూ బక్ర్ (రజియల్లాహు అన్హు) ఆదేశానుసారం జైద్ బిన్ సాబిత్ (రజియల్లాహు అన్హు) వేర్వేరు వస్తువులపై లిఖించి వున్న ఖుర్ఆన్ ను సమీకరించి, క్రమపద్ధతిలో లేని కొన్ని పుస్తకాల రూపంలో చేర్చారు. ఆ తర్వాత ఉస్మాన్ (రజియల్లాహు అన్హు) – వేర్వేరు పుస్తకాల రూపంలో వున్న వాటిని ఒక గ్రంథం రూపంలో క్రమపద్ధతిలో చేర్చి తదుపరి దాని కాపీలను యావత్ ఇస్లామీయ ప్రదేశాలకు వ్యాపింప జేశారు. ఈ రోజు కూడా ప్రపంచంలోని అన్ని ప్రదేశాల్లోనూ ఈ ఖుర్ఆనే లభ్యమవుతుంది. (ప్రపంచ దేశాల్లోని) తూర్పు నుండి ఒక ఖుర్ఆన్ ను, పడమర నుంచి మరో ఖుర్ఆనును నేడు తీసుకొని రెండింటిలోని తేడాను గనక ఎవరైనా చూడదలిస్తే పదాల తేడా అటుంచి, కనీసం ఒక అక్షరం తేడా కూడా అతను పొందలేడు. అంతేగాక, ఈ రోజు ప్రపంచంలో ఎంతో మంది ఖుర్ఆన్ కంఠస్తులు (హాఫిజ్ లు) కూడా వున్నారు. ఖుర్ఆన్ కంఠస్తం కోసం ముస్లిములు చూపించే ఉత్సాహం, శ్రద్ధ, ప్రపంచంలోని ఏ ఇతర గ్రంథం విషయంలోనూ కనిపించదు. తల్లిదండ్రులు తమ పిల్లలకు ఖురాన్ కంఠస్తం చేయించడాన్ని ఎంతో గౌరవంగా భావిస్తారు. మస్జిద్ లలో ఖుర్ఆన్ కంఠస్తం కొరకు ప్రత్యేక ఏర్పాట్లు చేయబడతాయి. రేయింబవళ్ళు అల్లాహ్ గృహాలలో దీని పారాయణం జరుగుతూ వుంటుంది మరియు కంఠస్తం కూడా చేయడం జరుగుతూ వుంటుంది. పిల్లలతో పాటు వయస్సు మీరిన పెద్దలు కూడా ఖుర్ఆన్ కంఠస్తులు (హాఫిజ్) కాకపోయినప్పటికీ, దానిని కంఠస్తం చేయడానికి ఉత్సాహ పడుతూ వుంటారు. ఇలా దివ్య ఖుర్ఆన్ పట్ల ముస్లిములు చూపే శ్రద్ధ మరియు ఉత్సాహం, అల్లాహ్ దీని సంరక్షణ బాధ్యతను తీసుకున్న దాని ఫలితమే. ఆయన తన దాసులు ద్వారానే దీనిని సంరక్షిస్తూ వుంటాడు. 

దివ్య ఖుర్ఆన్లో స్వస్థత వుంది

అవునండీ! దివ్య ఖుర్ఆన్ హృదయ విశ్వాస పరమైన రోగాలైన కుఫ్ర్, షిర్క్, కపటత్వం ల నుండి మరియు నైతిక రోగాలైన ఈర్ష్య, అసూయ, అత్యాశల నుండి స్వస్థత చేకూర్చుతుంది. 

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: 

يَا أَيُّهَا النَّاسُ قَدْ جَاءَتْكُم مَّوْعِظَةٌ مِّن رَّبِّكُمْ وَشِفَاءٌ لِّمَا فِي الصُّدُورِ وَهُدًى وَرَحْمَةٌ لِّلْمُؤْمِنِينَ

“ప్రజలారా! మీ ప్రభువు తరఫు నుంచి మీ దగ్గరకు హితోపదేశం వచ్చింది. అది హృదయాలలో ఉన్న వ్యాధుల నుంచి స్వస్థత నొసగేది, నమ్మే వారి కోసం మార్గదర్శకం, కారుణ్యం”. (యూనుస్ 10: 57) 

అలాగే ఇలా సెలవిచ్చాడు: 

 قُلْ هُوَ لِلَّذِينَ آمَنُوا هُدًى وَشِفَاءٌ

(ఓ ప్రవక్తా!) నువ్వు వారికి ఇలా చెప్పు: ఇది విశ్వసించిన వారి కోసం మార్గదర్శిని, ఆరోగ్య ప్రదాయిని”. (హామీమ్ అస్ సజ్దహ్ 41 :44)

ఇంకా ఇలా సెలవిచ్చాడు: 

 وَنُنَزِّلُ مِنَ الْقُرْآنِ مَا هُوَ شِفَاءٌ وَرَحْمَةٌ لِّلْمُؤْمِنِينَ ۙ وَلَا يَزِيدُ الظَّالِمِينَ إِلَّا خَسَارًا

మేము అవతరింపజేసే ఈ ఖుర్ఆన్ విశ్వాసుల కొరకు ఆసాంతం స్వస్థత, కారుణ్య ప్రదాయిని. అయితే దుర్మార్గులకు (దీని వల్ల) నష్టం కలగటం తప్ప మరే వృద్ధి జరుగదు”. (బనీ ఇస్రాయీల్ 17:82) 

గుర్తుంచుకోవాల్సిన మరో విషయం ఏమిటంటే, దివ్య ఖుర్ఆన్ హృదయ విశ్వాస, నైతిక పరమైన వ్యాధులకు స్వస్థత చేకూర్చడంతోపాటు శారీరక వ్యాధులకు కూడా చికిత్స. అందుకే దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తను వ్యాధిగ్రస్తులైనప్పుడు ముఅవ్విజాత్ సురాలు పఠించి తనపై ఊదుకునే వారు. 

ఆయెషా (రజియల్లాహు అన్హా) కథనం: దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వ్యాధి గ్రస్తులైనప్పుడు తనపై ముఅవ్విజాత్ సూరాలు పఠించి ఊదుకునేవారు. ఆయన వ్యాధి తీవ్రరూపం దాల్చినప్పుడు, నేను వాటిని పఠించేదాన్ని. తదుపరి ఆయన చేతులను, శుభాన్ని ఆశిస్తూ, ఆయన శరీరంపై నిమిరేదాన్ని. (బుఖారీ: 5016) 

ముఅవ్విజాత్ సూరాలు పఠించి ఊదడానికి ఈ హదీసు ఆధారం. ఇలాగే ఫాతిహా సూరా కూడా పఠించి వ్యాధిగ్రస్తులపై ఊదితే, అల్లాహ్ స్వస్థత చేకూరుస్తాడు. 

అబూ సయీద్ ఖుద్రీ (రజియల్లాహు అన్హు) కథనం: దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సహాబాలలో కొందరు అరబ్బు జాతులలోని ఒక జాతి వద్దకు వెళ్ళగా వారు వీరికి ఆతిథ్యమివ్వలేదు. ఈలోగా, వారి నాయకునికి ఒక త్రేలు కుట్టింది. వాళ్ళు అతనికి అన్ని రకాల చికిత్సలు చేయించారు, కానీ ఏమాత్రం లాభం కలగలేదు. ఆఖరికి వాళ్లు సహాబాల దగ్గరికి వచ్చి – మా నాయకునికి తేలు కాటేసింది. మీలో ఎవరైనా దీనికి చికిత్స చేసే వారున్నారా? అని అడిగారు. వారిలో (సహాబాలలో) ఒకరు – నేను మంత్రించి ఊదుతాను, కానీ మీరు మాకు ఆతిథ్యమే ఇవ్వలేదు, అందుకే మీరు మాకు పరిహారం చెల్లించనంత వరకు నేనీపని చేయను అని అన్నారు. ఆ ఊరివాళ్ళు – సరే, మేము మీకు కొన్ని మేకలను పరిహారం రూపంలో చెల్లిస్తాం అని అన్నారు. 

తదుపరి ఆ సహాబీ అతని వద్దకెళ్ళి, అతనిపై ఫాతిహా సూరా పఠించి, తేలు కాటేసిన చోట కొద్దిగా ఉమ్మేసారు. దీనితో అతను పూర్తిగా స్వస్థత పొందాడు. ఆ వూరి వాళ్ళు కూడా మాట ప్రకారం వీరికి మేకలను ఇచ్చివేశారు. 

ఆ తర్వాత, సహాబాలు ఒకరికొకరు, మేము ఈ మేకలను పంచుకుంటే ఎలా వుంటుంది? అని ప్రశ్నించుకోగా, మంత్రించి ఊదిన సహాబీ – లేదు, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) దగ్గరికెళ్ళేంత వరకు వీటి గురించి మనమేమీ చేయకూడదు అని అన్నారు. తదుపరి వారంతా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సన్నిధికొచ్చి జరిగిన వృత్తాంతమంతా వివరించారు. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) మాట్లాడుతూ- ఫాతిహా సూరా మంత్రించి ఊదవచ్చని నీకెలా తెలుసు! అని అడిగి, నువ్వు సరిగా చేశావు. కనుక మీరు ఈ మేకలను పంచుకోండి మరియు దీనిలో నా వాటాను కూడా తీయండి అని అన్నారు. (బుఖారీ: 2276, 5736) 

ఈ హదీసు ద్వారా తెలిసిందేమిటంటే, వ్యాధిగ్రస్తులపై ఫాతిహా సూరా కనుక పఠించి ఊదితే అల్లాహ్ ఆజ్ఞతో అతనికి స్వస్థత చేకూరుతుంది. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) గారి ఈ చికిత్స పద్ధతితో మనం కూడా ప్రయోజనం పొందాలి. 

అల్లామా ఇబ్నుల్ ఖయ్యూం రహిమహుల్లాహ్ ఇలా పేర్కొన్నారు: (అల్లాహ్) దాసులెవరైనా ఫాతిహా సూరాతో తన వ్యాధికి చికిత్స గనక చేస్తూ వుంటే, ఎంతో ఆశ్చర్యకరమైన ప్రభావాన్ని అతను చూడగలగుతాడు. ఆయన ఇలా పేర్కొన్నారు- నేనొకసారి మక్కాలో కొన్ని రోజులు బస చేశాను. ఈ వ్యవధిలో నాకు వేర్వేరు వ్యాధులు సోకాయి. వీటి కోసం సరియైన డాక్టర్ను గానీ, చికిత్సను కానీ నేను పొందలేక పోయాను. దీనితో నేను ఫాతిహా సూరాతో చికిత్స చేయడం ప్రారంభించగా, ఎంతో ఆశ్చర్యకరమైన ప్రభావాన్ని (ఉపశమనాన్ని) పొందాను. తదుపరి నేను ఈ చికిత్స గురించి ఎంతోమందికి చెప్పాను. వాళ్ళు కూడా నొప్పి వగైరా లాంటి సమస్యలకు ఈ చికిత్సను పయోగించి, ఎంతో మంది స్వస్థత పొందారు. (అల్ జవాబుల్ కాఫీ: 16వ పేజీ) 

ఇలా ఎందుక్కాదు మరి! ఫాతిహా సూరానే దివ్య ఖుర్ఆన్ యొక్క మహోన్నత సూరా అయినప్పుడు. 

అబూ సయీద్ అల్ ముఆలి (రజియల్లాహు అన్హు) కథనం: నేనొక సారి మస్జిద్ లో నమాజ్ చదువుతూ వుండగా, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) నా దగ్గరి నుండి వెళుతూ నన్ను పిలిచారు. కానీ నేను వెంటనే జవాబివ్వక, నమాజ్ పూర్తి చేసుకొని ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) దగ్గరికెళ్లాను. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) నా దగ్గరికి రానీయకుండా ఏ విషయం నిన్ను ఆపి వుంచింది? అని అడిగారు. నేను, ఓ దైవప్రవక్తా! నేను నమాజ్ చదువుతూ వున్నాను అని విన్నవించుకున్నాను. దీనిపై ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) – అల్లాహ్ ఇలా సెలవియ్యలేదా? 

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اسْتَجِيبُوا لِلَّهِ وَلِلرَّسُولِ إِذَا دَعَاكُمْ لِمَا يُحْيِيكُمْ

ఓ విశ్వాసులారా! మీకు జీవితాన్నిచ్చే వస్తువు వైపునకు ప్రవక్త మిమ్మల్ని పిలిచినప్పుడు మీరు అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త పిలుపుకు అనుకూలంగా స్పందించండి”. (8: 24) 

తదుపరి ఆయన – నువ్వు మస్జిద్ నుండి బయటికెళ్ళే ముందు ఖుర్ఆన్ లోని మహెూన్నత సూరా గురించి నీకు చెప్పనా? అని అన్నారు. (కాసేపటికి) మేము మస్జిద్ నుండి బయటికి రాబోతుండగా నేను, ఓ దైవప్రవక్తా! మీరు నాతో ఖుర్ఆన్ లోని మహోన్నత సూరా గురించి వివరిస్తానని చెప్పారు అన్నాను. ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) నాతో “అది ఫాతిహా సూరా. దీని ఏడు ఆయతులు మాటిమాటికీ తిరగేయడం జరుగుతూ వుంటుంది. నాకివ్వబడిన ఖురాన్లోని మహోన్నతమైన సూరా ఇదే”. (బుఖారీ: 4647, 5006)

దివ్య ఖుర్ఆన్ పారాయణం మహత్యం

ఈ ప్రపంచంలో అత్యధికంగా పారాయణం చెయ్యబడి, దాని ప్రతి అక్షరానికి 10 పుణ్యాలు లభించే ఒకే ఒక్క అల్లాహ్ గ్రంథం దివ్య ఖుర్ఆన్, 

అబ్దుల్లా బిన్ మసూద్ (రజియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు: 

“ఏ వ్యక్తి అయినా అల్లాహ్ గ్రంథం (ఖుర్ఆన్) నుండి ఒక్క అక్షరం చదివినా అతనికి ఒక పుణ్యం దొరుకుతుంది. ఒక పుణ్యం, దానిలాంటి పది పుణ్యాలకు సమానమవుతుంది. ‘అలిఫ్’, ‘లామ్’, ‘మీమ్’ ఒక అక్షరమని నేను చెప్పను. పైగా ‘అలిఫ్’ ఒక అక్షరం ‘లామ్’ రెండో అక్షరం మరియు ‘మీమ్’ మూడో అక్షరం”. (తిర్మిజీ: 2910, సహీహ్ అల్బానీ) 

దివ్య ఖుర్ఆన్ తనను పఠించే వారికి సిఫారసు చేస్తుంది

అబూ హురైరా (రజియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు: 

మీరు ఖుర్ఆన్ పారాయణం చేస్తూ వుండండి. ఎందుకంటే అది తనను పఠించేవారి కొరకు (మరియు ఆచరించే వారి కొరకు) ప్రళయం నాడు సిఫారసు చేస్తుంది“. (ముస్లిం:1337) 

ఖుర్ఆన్ పారాయణం వల్ల షైతాన్ ఇంటి నుండి పారిపోతాడు 

అబూ హురైరా (రజియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు: 

మీరు మీ ఇండ్లను స్మశాన వాటికలుగా చేయకండి. నిశ్చయంగా బఖర సూరా పారాయణం చెయ్యబడే ఇంటి నుండి షైతాన్ పారిపోతాడు“. (ముస్లిం:780) 

ఖుర్ఆన్ ను నేర్పేవారు, నేర్చుకునేవారు అందరి కన్నా శ్రేష్ఠులు

ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ (రజియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు: 

మీలో ఖుర్ఆన్ ను స్వయంగా నేర్చుకొని, ఇతరులకు నేర్పేవారే అందరికన్నా శ్రేష్ఠమైనవారు”. (బుఖారీ: 5027) 

మరో ఉల్లేఖనంలో ఇలా వుంది: 

నిశ్చయంగా మీలో ఖుర్ఆన్ ను స్వయంగా నేర్చుకొని, ఇతరులకు నేర్పేవారే ఉత్తమమైన వ్యక్తి”. (బుఖారీ: 5028) 

నాఫె బిన్ అబ్దుల్ హారిస్ కథనం: నన్ను పవిత్ర మక్కాకు గవర్నర్ గా నియమిస్తూ వచ్చిన ఉమర్ (రజియల్లాహు అన్హు) ను ఓ సారి నేను ‘అస్ఫాన్’ (ప్రదేశం)లో కలిసాను. నేనాయనతో ప్రస్తుతం మక్కా గవర్నర్ గా మీరు ఎవరిని నియమించారు? అని అడగ్గా ఆయన ‘ఇబ్నె అబజీ’ అని అన్నారు. నేను, ఆయనెవరు? అని అడిగాను. ఆయన-అతను నేను స్వేచ్ఛ ప్రసాదించిన ఒక బానిస అని అన్నారు. నేను – స్వేచ్ఛ నొసగిన ఒక బానిసను మక్కా గవర్నర్గా నియమించారా? అని అడిగాను. ఆయన- నిశ్చయంగా అతను ఖారీ (ఖుర్ఆన్ ను దాని శైలిలో, మధురంగా పారాయణం చేసేవాడు) మరియు వారసత్వ విషయాల విద్వాంసుడు కూడా అని అన్నారు. తదుపరి ఆయన, జాగ్రత్త! మీ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చి వున్నారు : “నిశ్చయంగా అల్లాహ్ ఈ గ్రంథం ద్వారా కొందరిని శిఖరానికి చేర్చుతాడు మరియు కొందరిని అధోగతికి చేర్చుతాడు.” (ముస్లిం: 817) 

ఖుర్ఆన్ పారాయణం చేసి దాని ప్రకారం ఆచరించే వారు అల్లాహ్ ప్రత్యేక దాసులు 

అనస్ (రజియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు: “నిశ్చయంగా ప్రజలలో కొందరు అల్లాహ్ ప్రత్యేక దాసులు అని అనగా, సహాబాలు ఓ దైవ ప్రవక్తా! వాళ్ళు ఎవరు? అని అడిగారు. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) జవాబిస్తూ:

 
“ఖుర్ఆన్ ను పారాయణం చేసి దాని ప్రకారం ఆచరించే వారు అల్లాహ్ స్నేహితులు మరియు ప్రత్యేక దాసులు”. (ఇబ్నె మాజ : 215, సహీహ్ -అల్బానీ) 

హాఫిజ్ – ఏ – ఖుర్ఆన్ (ఖుర్ఆన్ కంఠస్తం చేసినవారు) మహత్యం 

దివ్య ఖుర్ఆన్ ఎలాంటి మహోన్నతమైన గ్రంథం అంటే, దీనిని కంఠస్తం చేసేవారు మరియు దీని ప్రకారం ఆచరించే వారికి కూడా ఎంతో ఔన్నత్యం ప్రసాదించ బడింది. 

దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు: ఖుర్ఆన్ వారిని (ఖుర్ఆన్ కంఠస్తం చేసి దాని ప్రకారం ఆచరించేవారు) ఇలా అనబడుతుంది- “ఖుర్ఆన్ పఠిస్తూ వుండు, (స్వర్గపు మెట్లను) ఎక్కుతూ వుండు, ఇహలోకంలో ఎలాగైతే ఆగి ఆగి సుమధురంగా పఠించేవాడివో, అలాగే ఇక్కడ కూడా పఠించు. (ఇలా పఠిస్తూ, ఎక్కుతూ) ఆఖరి ఆయత్ ఎక్కడైతే పఠిస్తావో అదే (స్వర్గంలో) నీ స్థానం”. (అబూ దావూద్: 1464, తిర్మిజీ: 2914, హసన్ సహీహ్ అల్బానీ) 

అలాగే ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా కూడా సెలవిచ్చారు: 

“(మీలో) ఏ వ్యక్తి అయినా ఖుర్ఆన్ నిపుణుడైతే (ఖుర్ఆన్ కంఠస్తం చేసి దానిని సుమధురంగా పారాయణం చేస్తూ దాని ప్రకారం ఆచరించేవాడు) అతను గౌరవనీయులైన దైవదూతలతో పాటు వుంటాడు. (అంటే ప్రళయం రోజు గౌరవనీయులైన దైవదూతలు వుండే స్థానాల్లో వారితో పాటు వుంటాడు) ఏ వ్యక్తి అయినా ఖుర్ఆన్ పఠించబడడంలో కష్టాన్ని చవిచూస్తూ వుంటాడో అతనికి రెండు పుణ్యాలు వున్నాయి. అంటే, ఒక పుణ్యం పఠించినందుకు, మరో పుణ్యం, దానిని మాటిమాటికీ తిరగేసినందుకు. ఈ హదీసు అర్థం- బలహీన కంఠస్తునికి, బలమైన కంఠస్తునికన్నా ఎక్కువ పుణ్యం లభిస్తుంది అని ఎంత మాత్రం కాదు. బలమైన కంఠస్తులైతే ప్రళయం రోజు గౌరవనీయులైన దైవదూతలతో వుంటారు. ఇక వారి పుణ్యం ఫలం విషయానికొస్తే, అల్లాహ్ వారిని ఎంతగా అనుగ్రహిస్తాడో ఆయనకే తెలుసు. 

నమాజులో ఖుర్ఆన్ పారాయణం మహత్యం 

అబూ హురైరా (రజియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు: 

మీరు మీ ఇంటికి తిరిగి వెళ్ళినప్పుడు అక్కడ మీకు మూడు గర్భవతులైన ఒంటెలు దొరకడం మీలో ఎవరు ఇష్టపడతారు?” అని అడిగారు. మేము- అవునండి, (మేమంతా ఇష్ట పడతాము) అని అన్నాం. ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం)- “మీలో ఏ వ్యక్తి అయినా నమాజులో మూడు ఆయతులు గనక పఠిస్తే, అవి అతనికి మూడు గర్భవతులైన (సూడి) ఒంటెలు దొరకడం కన్నా ఉత్తమం” అని అన్నారు. (ముస్లిం: 802) 

ఉఖ్బా బిన్ ఆమిర్ (రజియల్లాహు అన్హు) కథనం: మేమొకసారి ‘సపా’ వద్ద కూర్చొని వుండగా, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అక్కడికి విచ్చేశారు. ఆయన “మీలో ఎవరైనా, ప్రతి రోజూ ఉదయాన్నే ‘బతేన్’ లేదా ‘అఫీఖ్’ (ప్రదేశాలు) కు వెళ్లి అక్కణ్ణుంచి, దౌర్జన్యం, పాపం ఏమీ చేయకుండా రెండు బలమైన, ఆరోగ్యమైన ఒంటెలను తీసుకురావడానికి ఇష్టపడతారా?” అని అడిగారు. మేమంతా, ఓ దైవప్రవక్తా! మేమంతా దానికి ఇష్టపడతాం అని అన్నాం. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) మాట్లాడుతూ “మరి మీలో ఎవరైనా ఉదయం పూట మస్జిద్ కు వెళ్ళరా? వెళ్ళి అల్లాహ్ గ్రంథం నుండి రెండు ఆయతుల గురించి తెలుసుకొని దానిని పఠిస్తే ఇది అతనికి రెండు ఒంటెలకన్నా ఉత్తమమైనది. అలాగే మూడు ఆయతులు మూడు ఒంటెలకన్నా, నాలుగు ఆయతులు నాలుగు ఒంటెల కన్నా ఉత్తమమైనవి. అలాగే, ప్రతి ఆయత్ ఒక ఒంటెకన్నా ఉత్తమమైనది.” (ముస్లిం: 803) 

నమాజులో ఎక్కువగా ఖుర్ఆన్ పారాయణం చేసే వ్యక్తిపై ఈర్ష్య పడవచ్చు 

అబ్దుల్లా బిన్ ఉమర్ (రజియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు: 

కేవలం ఇద్దరు వ్యక్తుల విషయంలోనే ఈర్ష్య చెందవచ్చు. అందులో ఒకరు ఎవరంటే, అల్లాహ్ అతనికి ఖుర్ఆన్ (కంఠస్తం చేసే సద్బుద్ధిని) ఇవ్వగా, దానిని రేయింబవళ్లూ పారాయణం చేస్తూ ఖియాం చేస్తాడు (నమాజ్ చదువుతాడు). ఇక, రెండవ వ్యక్తి ఎవరంటే, అల్లాహ్ అతనికి సంపదను ప్రసాదించగా, దానిని రేయింబవళ్లూ (అల్లాహ్ మార్గంలో) ఖర్చు చేస్తూ వుంటాడు.” (బుఖారీ: 5025, ముస్లిం: 815) 

ఖుర్ఆన్ పారాయణ సమయంలో అల్లాహ్ కారుణ్యం అవతరిస్తుంది

బరా (రజియల్లాహు అన్హు) అ కథనం: ఒక వ్యక్తి కహఫ్ సూరా పారాయణం చేస్తున్నాడు. అతనికి దగ్గరగానే అతని గుర్రం రెండు త్రాళ్ళతో కట్టబడి వుంది. అకస్మాత్తుగా ఒక మేఘం వచ్చి అతనిపై కమ్మేసింది. తదుపరి అది కదులుతూ మెల్లగా అతని వైపునకు రాసాగింది. ఇది చూసి గుర్రం భయంతో ఎగరడం మొదలు పెట్టింది. తెల్లవారిన తర్వాత ఆ వ్యక్తి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) దగ్గరికొచ్చి జరిగిన వృత్తాంతమంతా వివరించాడు. ఇది విని, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)- “అది అల్లాహ్ కారుణ్యం, ఖుర్ఆన్ కోసం అవతరించింది” అని వివరించారు. (బుఖారీ: 5011, ముస్లిం: 795) 

ఇమామ్ నవవీ రహిమహుల్లాహ్ ‘అల్ సకీనత్‘ గురించి వివరిస్తూ, ఇలా పేర్కొన్నారు. దీనికి ఎన్నో అర్థాలు వున్నాయి. అన్నింటి కన్నా మేలైనది ఇది – ఇది అల్లాహ్ యొక్క ఎలాంటి సృష్టితం అంటే, దీనిలో ఊరట, కారుణ్యం మరియు దైవదూతలు వుంటారు. అంటే, ఖుర్ఆన్ పారాయణం చేస్తున్నప్పుడు దైవదూతలు అల్లాహ్ కారుణ్యం తీసుకొని అవతరిస్తారు, తద్వారా పారాయణం చేసే వారికి ఒక ప్రత్యేకమైన ఊరట లభిస్తుంది. 

ఉసైద్ బిన్ హుజైర్ (రజియల్లాహు అన్హు) కథనం: 

నేనొక రాత్రి (నమాజ్ లో) బఖర సూరా పఠిస్తున్నాను. నాకు దగ్గరగా నా గుర్రం కట్టేసి వుంది. అకస్మాత్తుగా గుర్రం ఎగరడం ప్రారంభించింది. (ఇది చూసి) నేను మౌనంగా వున్నాను. నేను మౌనంగా వుండే సరికి అది కూడా శాంతించింది. తదుపరి నేను పారాయణాన్ని పున:ప్రారంభించగా, అది మొదటిలాగే మళ్ళీ ఎగరడం ప్రారంభించింది. నేను మౌనం వహించగానే అది కూడా శాంతించింది. తిరిగి నేను ప్రారంభించగానే అది కూడా ఎగరడం ప్రారంభించింది. అటు, నా కొడుకు ‘యహ్యా’ కూడా అక్కడే (పడుకొని) వున్నాడు. అది (ఎగురుతూ) నా కొడుకును త్రొక్కేస్తుందేమోనని నేను భయపడి వెంటనే సలాం త్రిప్పి (నమాజ్ ముగించి) కొడుకు వద్దకొచ్చి గుర్రాన్ని కొడుకు వద్ద నుండి దూరంగా చేసాను. తదుపరి నేను ఆకాశం వైపు చూడగా, గొడుగు లాగా ఒక వస్తువు కనిపించింది. దానిలో దీపాలలాగా వెలుగులు వున్నాయి. ఈ గొడుగు లాంటి వస్తువు మెల్లమెల్లగా ఆకాశం వైపునకు వెళుతూ నా కళ్ల నుండి కనుమరుగయ్యింది. తెల్లవారిన తర్వాత, నేను దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సన్నిధికి వెళ్ళి జరిగిన వృత్తాంతమంతా వివరించాను. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) – “ఓ ఇబ్నె హుజైర్! నువ్వు నీ పారాయణాన్ని ఆపకుండా వుంటే బాగుండేది” అని అన్నారు. నేను – ఓ దైవ ప్రవక్తా! నేను నా కొడుకు గురించి భయాందోళనకు గురయ్యాను. అందుకే త్వరగా నమాజ్ ముగించాను. తర్వాత నేను ఆకాశం వైపు చూసేసరికి ఒక గొడుగు లాంటి వస్తువు, దీపాలతో వెలుగుతూ వుంది మరియు మెల్లగా ఆకాశం వైపునకు వెళ్ళిపోయింది అని అన్నాను. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) “అవి దైవదూతలు. నీ కంఠస్వరాన్ని విని నీ దగ్గరికి విచ్చేశారు. ఒకవేళ నువ్వు పారాయణం ఆపకపోయివుంటే, తెల్లవారాక ఇతర ప్రజలు కూడా వాళ్ళను చూడగలిగేవారు. వారు (దైవదూతలు) ప్రజలకు కనబడకుండా దాక్కోలేక పోయేవారు.” (బుఖారీ: 5018, ముస్లిం: 796) 

ఇవండీ, ఖుర్ఆన్ కు సంబంధించిన కొన్ని మహత్యాలు. 

ఇక తలెత్తే మరో ప్రశ్న ఏమిటంటే, ఈ మహోన్నతమైన గ్రంథాన్ని అల్లాహ్ ఎందుకు అవతరింపజేసాడు? 

ఖుర్ఆన్ ఎందుకు అవతరింపజేయబడింది? 

(1) ఎందుకంటే, దీనిని విశ్వసించేవారు, దీని హక్కుకు అనుగుణంగానే దీనిని పారాయణం చెయ్యాలని. 

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

الَّذِينَ آتَيْنَاهُمُ الْكِتَابَ يَتْلُونَهُ حَقَّ تِلَاوَتِهِ أُولَٰئِكَ يُؤْمِنُونَ بِهِ ۗ وَمَن يَكْفُرْ بِهِ فَأُولَٰئِكَ هُمُ الْخَاسِرُونَ

మేము ఎవరికి గ్రంథం వొసగామో వారు దానిని పారాయణం చేయవలసిన రీతిలో పారాయణం చేస్తారు. (అంతేకాదు) వారు ఈ గ్రంథాన్ని విశ్వసిస్తారు. ఇక దీని పట్ల తిరస్కార వైఖరిని అవలంబించిన వారే నష్టపోయేది”. (బఖర 2: 121) 

పారాయణం హక్కు ఏమిటంటే – ఖుర్ఆన్ ను, అది ఎలాగైతే ఆకాశం నుండి అవతరించిందో, ఎలాగైతే జిబ్రయీల్ (అలైహిస్సలాం) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కు వినిపించారో, ఎలాగైతే దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తన సహాబాలకు నేర్పారో అలాగే పారాయణం చెయ్యాలి. 

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: 

وَقُرْآنًا فَرَقْنَاهُ لِتَقْرَأَهُ عَلَى النَّاسِ عَلَىٰ مُكْثٍ وَنَزَّلْنَاهُ تَنزِيلًا

నువ్వు నెమ్మది నెమ్మదిగా ప్రజలకు వినిపించడానికి వీలుగా మేము ఖుర్ఆను గ్రంథాన్ని కొద్దికొద్దిగా చేసి అవతరింపజేశాము. మేము దీనిని అంచెల వారీగా అవతరింపజేశాము”. (బనీ ఇస్రాయీల్ 17:106) 

అలాగే ఇలా సెలవిచ్చాడు: 

وَرَتِّلِ الْقُرْآنَ تَرْتِيلًا

ఖుర్ఆన్ ను మాత్రం బాగా, ఆగి ఆగి నింపాదిగా (స్పష్టంగా) పఠించు”. (ముజ్జమ్మిల్ 73:4) 

అందుకే ఖుర్ఆన్ ను మెల్లమెల్లగా దాని పదాలను సరిగా ఉచ్చరిస్తూ పఠించాలి. పదాల ఉచ్చారణ సవ్యంగా వుండాలి. అలా కాని పక్షంలో పదాలు వేరయిపోయి వాటి అర్థం కూడా మారిపోతుంది. ఇలా ఖుర్ఆన్ ఆయతులకు వేరే అర్థాన్ని ఆపాదించినట్లవుతుంది. నమాజ్ లో ప్రత్యేకించి, అది ఫర్జ్ నమాజ్ అయినా, నఫిల్ నమాజ్ అయినా, ఖుర్ఆన్ ను  మెల్లమెల్లగా పారాయణం చెయ్యాలి. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కూడా ఇలాగే మెల్లమెల్లగా పారాయణం చేసేవారు. 

ఉమ్మె సలమా (రజియల్లాహు అన్హా) కథనం: దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఒక్కో ఆయతును వేరు చేసి పఠించేవారు. ‘అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్’ అని పఠించి ఆగేవారు. ‘అర్రహ్మనిర్రహీం’ అని పఠించి మళ్ళీ ఆగేవారు. తదుపరి ‘మాలికి యౌమిద్దీన్’ అని పఠించేవారు. (తిర్మిజీ: 2927, అబూ దావూద్: 4001, సహీహ్ – అల్బానీ) 

ఖతాదా రహిమహుల్లాహ్ కథనం: అనస్ బిన్ మాలిక్ (రజియల్లాహు అన్హు)ను – దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఖిరాత్ (పారాయణం) ఎలా వుండేది? అని అడగబడింది. ఆయన జవాబిస్తూ – ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఎంతో సాగదీసి పఠించేవారు. తదుపరి ఆయన ‘బిస్మిల్లా హిర్రహ్మానిర్రహీమ్’ చదివినప్పుడు, ‘బిస్మిల్లాహ్’ ను సాగదీసారు, ‘అర్రహ్మాన్’ ను కూడా సాగదీసారు మరియు ‘అర్రహీం’ ను కూడా సాగదీసి పఠించారు. అంటే ఈ పదాలలో ‘దీర్ఘం’ ఎక్కడ వచ్చినా అక్కడ సాగదీసి పఠించారు. (బుఖారీ: 5046) 

ఖుర్ఆన్ పారాయణాన్ని ఇలాగే సాగదీస్తూ సుమధుర కంఠంతో చేయాలి. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కూడా ఇలాగే పఠించేవారు. 

అబూ హురైరా (రజియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు: “అల్లాహ్ తన ప్రవక్త సుమధుర కంఠంతో ఖుర్ఆన్ పారాయణం చేస్తుండగా శ్రద్ధగా విన్నట్లు మరే విషయాన్నీ అంత శ్రద్ధగా వినడు“. (బుఖారీ: 5023, ముస్లిం: 792) 

దీని అర్థం ఏమిటంటే దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కంఠస్వరం ఎంతో అందంగా వుండేది. ఆయన సుమధుర కంఠంతో ఖుర్ఆన్ పారాయణం చేసేవారు. ఈ హదీసులో ఖుర్ఆన్ ను  మాధుర్యంగా పఠించేవారి మహత్యం వివరించబడింది. అల్లాహ్ అతణ్ణి తన దగ్గరకు చేరుస్తాడు మరియు గొప్ప పుణ్య ఫలాన్ని ప్రసాదిస్తాడు. 

అలాగే, దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా కూడా సెలవిచ్చారు. 

“మీరు ఖుర్ఆన్ ను మీ కంఠస్వరాల ద్వారా మరింతగా అలంకరించండి”. (అబూ దావూద్: 1468, సహీహ్ -అల్బానీ) 

పైగా, ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చివున్నారు: 

“ఖుర్ఆన్ ను సుమధుర కంఠంతో పారాయణం చెయ్యనివాడు మాలోని వాడు కాదు”.  (బుఖారీ: 7527) 

అందుకే, మనిషి ఈ విషయంలో అశ్రద్ధ చూపకండా ఖుర్ఆన్ ను  సుమధుర కంఠంతో పారాయణం చెయ్యాలి. 

(2) ఖుర్ఆన్ పారాయణంతో పాటు, దాని (ఆయతుల) వైపు దృష్టి సారించి, ఆలోచించాలి. 

ఎందుకంటే దీని అవతరణ ఉద్దేశ్యమే ఇది – దీనిని పఠించి తదుపరి దీనిపై ఆలోచించి ఆపై తమ జీవన శైలిని దీనికనుగుణంగా మార్చుకోవాలి. 

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: 

كِتَابٌ أَنزَلْنَاهُ إِلَيْكَ مُبَارَكٌ لِّيَدَّبَّرُوا آيَاتِهِ وَلِيَتَذَكَّرَ أُولُو الْأَلْبَابِ

“ఇదొక శుభప్రదమైన గ్రంథం. ప్రజలు దీని వ్యాఖ్యలపై చింతన చేసేటందుకు, బుద్ధిజీవులు దీని ద్వారా గుణపాఠం నేర్చుకొనేందుకు మేము దీనిని నీ వైపునకు పంపాము”. (సాద్ 38 : 29) 

అలాగే ఇలా సెలవిచ్చాడు: 

 أَفَلَا يَتَدَبَّرُونَ الْقُرْآنَ أَمْ عَلَىٰ قُلُوبٍ أَقْفَالُهَا

“ఏమిటి, వారు ఖుర్ఆన్ గురించి లోతుగా ఆలోచించరా? లేక వారి హృదయాలపై తాళాలు పడివున్నాయా?”. (ముహమ్మద్ 47: 24) 

అందుకే, మనపై విధి (ఫర్జ్)గా వున్న విషయమేమిటంటే, స్వయంగా మనం కూడా ఖుర్ఆన్ ను నేర్చుకొని మన సంతానానిక్కూడా దీనిని నేర్పించాలి. స్వయంగా కూడా దీనిపై ఆలోచన చేయాలి మరియు పిల్లలకు కూడా ఖుర్ఆన్ కంఠస్తం చేయించడంతో పాటు, దాని అనువాదాన్ని, విశ్లేషణను నేర్పించాలి. తద్వారా వారు గుణపాఠం నేర్చుకోగలరు. ఎందుకంటే, ఖుర్ఆన్ అనువాదం, విశ్లేషణ గురించి తెలియకుండా గుణపాఠాన్ని గ్రహించడం అసాధ్యం. 

దివ్య ఖుర్ఆన్ ప్రభావం

గుర్తుంచుకోవాల్సిన ఒక విషయమేమిటంటే, ఖుర్ఆన్ పారాయణం చేస్తూ, దీనిపై చింతన జరిపితే, ఇది పఠించే వారికి, దీనితో పాటు వినేవారికి ఎంతో ప్రభావం చూపుతుంది. 

ఖుర్ఆన్ ప్రభావాన్ని గురించి అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: 

اللَّهُ نَزَّلَ أَحْسَنَ الْحَدِيثِ كِتَابًا مُّتَشَابِهًا مَّثَانِيَ تَقْشَعِرُّ مِنْهُ جُلُودُ الَّذِينَ يَخْشَوْنَ رَبَّهُمْ ثُمَّ تَلِينُ جُلُودُهُمْ وَقُلُوبُهُمْ إِلَىٰ ذِكْرِ اللَّهِ ۚ ذَٰلِكَ هُدَى اللَّهِ يَهْدِي بِهِ مَن يَشَاءُ ۚ وَمَن يُضْلِلِ اللَّهُ فَمَا لَهُ مِنْ هَادٍ

“అల్లాహ్ అత్యుత్తమమైన విషయాన్ని అవతరింపజేశాడు. అది పరస్పరం పోలిక కలిగి వుండే, పదే పదే పునరావృతం అవుతూ వుండే ఆయతులతో కూడిన గ్రంథం రూపంలో వుంది. దీని వల్ల తమ ప్రభువుకు భయపడే వారి శరీరాలపై రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఆ తర్వాత వారి శరీరాలు హృదయాలు అల్లాహ్ స్మరణ పట్ల మెత్తబడి పోతాయి. ఇదీ అల్లాహ్ మార్గ దర్శకత్వం. దాని ద్వారా ఆయన తాను కోరిన వారిని సన్మార్గానికి తెస్తాడు. మరి అల్లాహ్ ఎవరిని మార్గం నుండి తప్పిస్తాడో అతనికి మార్గం చూపేవాడెవడూ వుండదు”. (జుమర్ 39: 23) 

ఈ ఆయత్ ద్వారా తెలిసిందేమిటంటే – వాస్తవానికి ఎవరైతే అల్లాహ్ కు భయపడతారో, ఎవరైతే ప్రశాంతంగా ఖుర్ఆన్ పారాయణం చేస్తూ దానిపై చింతన చేస్తారో, వారు ఖుర్ఆన్ పారాయణం చేస్తున్నప్పుడు వారి రోమాలు నిక్కబొడుచుకుంటాయి మరియు వారి హృదయాలు భయంతో కంపించి పోతాయి. తద్వారా వారికి అల్లాహ్ స్మరణ వైపునకు మరింత ప్రోత్సాహం దొరుకుతుంది. 

అబ్దుల్లాహ్ బిన్ మసూద్ (రజియల్లాహు అన్హు) కథనం: దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఓ సారి నాతో – నాకు ఖుర్ఆన్ చదివి వినిపించు అని అన్నారు. నేను-నేను మీకు చదివి వినిపించాలా? అది మీ పైనే అవతరించిందిగా? అన్నాను. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం)- నిజమే, కానీ ఇతరుల ద్వారా ఖుర్ఆన్ వినడం నేను ఇష్టపడతాను అని అన్నారు. తదుపరి నేను నిసా సూరా పఠించడం మొదలు పెట్టను. చివరికి నేను ‘(ఓ ముహమ్మద్!) మేము ప్రతి సమాజం నుండి ఒక సాక్షిని తెచ్చి, వారిపై నిన్ను సాక్షిగా పెట్టినప్పుడు పరిస్థితి ఎలా వుంటుంది?‘ అన్న ఆయతుకు చేరుకుని, దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను చూడగా ఆయన కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి. (బుఖారీ: 4582, ముస్లిం: 800) 

ఖుర్ఆన్ ప్రభావం ఎంత తీవ్రంగా వుంటుందంటే, దీనిని గనక పర్వతంపై అవతరింపజేస్తే అది భయంతో తునాతునకలైపోతుంది. 

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: 

 لَوْ أَنزَلْنَا هَٰذَا الْقُرْآنَ عَلَىٰ جَبَلٍ لَّرَأَيْتَهُ خَاشِعًا مُّتَصَدِّعًا مِّنْ خَشْيَةِ اللَّهِ ۚ وَتِلْكَ الْأَمْثَالُ نَضْرِبُهَا لِلنَّاسِ لَعَلَّهُمْ يَتَفَكَّرُونَ

“ఒక వేళ మేము ఈ ఖుర్ఆన్ ను  ఏ పర్వతం మీదనో దింపివుంటే, అది అల్లాహ్ భీతితో అణగారి, తునాతునకలైపోవడటాన్ని నీవు చూసి వుండేవాడివి. ప్రజలు యోచన చేయడానికి గాను మేము ఈ దృష్టాంతా లను వారికి వివరిస్తున్నాము”. (అల్ హష్ర్ 59:21) 

కానీ, నేడు మన హృదయాలు పాషాణం కన్నా కఠినమైపోయాయి. ఖుర్ఆన్ పారాయణం చేసిన తరువాత లేదా విన్న తరువాత అవి అల్లాహ్ భీతితో కంపించవు. తద్వారా అల్లాహ్ స్మరణ వైపునకు కూడా ఎక్కువగా మరలవు. అందుకే ఖుర్ఆన్ ప్రభావం మన పై అంతగా వుండదు. ఎన్నో సార్లు మనం ఖుర్ఆన్ సంపూర్ణంగా పారాయణం చేస్తాం, కానీ మన విశ్వాసంలో ఏ మాత్రం వృద్ధి జరుగదు. ఖుర్ఆన్ పారాయణం చేసినప్పటికీ అది ఖరారు చేసిన హద్దులకు లోబడి మనం ఉండం, పైగా హద్దులు మీరుతూ వుంటాము. ఖుర్ఆన్ పఠిస్తూ వుంటాం, కానీ దానికనుగుణంగా ఆచరించం. దాని పదాల నైతే ఉచ్చరిస్తాం కానీ దానిలో అల్లాహ్ నిషేధించిన విషయాలలో జాగ్రత్త వహించం. ఖుర్ఆన్లో గత కాలానికి చెందిన వేర్వేరు జాతుల వృత్తాంతాలు చదువుతాం. కానీ వాటి ద్వారా గుణపాఠం నేర్చుకోం! 

మరి చూడబోతే, ఖుర్ఆన్ ప్రభావం ఎంత తీవ్రమైనదంటే దీని శత్రువులు కూడా దీని ప్రభావితులు కాకుండా వుండలేకపోయారు. ఇస్లాం స్వీకరణకు ముందు సహాబాలకు ఎదురైన సంఘటనలు దీనికి మంచి ఉదాహరణ. ఇస్లాం స్వీకరణకు ముందు వాళ్ళు దీనికి బద్ధ శత్రువులు. కానీ ఖుర్ఆన్ ను  విన్న తరువాత వారి హృదయాలు మెత్తబడి, తద్వారా వారు ఇస్లాం స్వీకరించారు. 

ఉదాహరణకు, ఉమర్ బిన్ ఖత్తాబ్ (రజియల్లాహు అన్హు) వృత్తాంతం. ఆయన మొదట్లో ఇస్లాంకు బద్ద విరోధి. ఈ శత్రుత్వం తోనే ఆయన ఓ సారి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను హత్య చేసే నిమిత్తం ఇంటి నుండి బయలు దేరారు. దారిలో నయీమ్ బిన్ అబ్దుల్లా కలిశారు. ఆయన – ఓ ఉమర్! ఇవ్వాళ ఎక్కడికి బయలు దేరారు? అని అడిగారు. ఉమర్ (రజియల్లాహు అన్హు) – ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను తుదముట్టించడానికి అని జవాబిచ్చారు. ఆయన – ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను హత్య చేసి, బనూ హాషిం, బనూ జుహ్రా నుండి తప్పించుకోగలవా? అని అడిగారు. ఉమర్ (రజియల్లాహు అన్హు) – బహుశా నువ్వు కూడా ధర్మభ్రష్టుడై పోయావు అని అన్నారు. ఆయన – నేను నీకు దీని కన్నా ఆశ్చర్యం కలిగించే విషయాన్ని చెప్పనా? మీ అక్క మరియు బావ కూడా (నీ ప్రకారం) ధర్మభ్రష్టులైపోయారు. నీ ధర్మాన్ని త్యజించారు అని అన్నారు. ఉమర్(రజియల్లాహు అన్హు) తిన్నగా వారి ఇంటికెళ్ళి చూస్తే ఆ సమయంలో ఖబ్బాబ్ (రజియల్లాహు అన్హు) వారిద్దరికీ తాహా సూరా వినిపిస్తున్నారు. క్లుప్తంగా వివరించే దేమిటంటే, ఉమర్ (రజియల్లాహు అన్హు) ముందుగా తన బావను కొట్టి తదుపరి తన అక్కను గాయపరిచారు. ఆ తర్వాత (తాను చేసిన పనికి) సిగ్గు పడి, మీరు చదివేది నాక్కూడా ఇవ్వండి, నేను కూడా చదువుతాను అని అడిగారు. ఆయన అక్క – నువ్వు అపరిశుద్ధుడివి. ముందు స్నానం చెయ్యి అని అంది. దీనిపై ఆయన స్నానం చేసి రాగానే ఆ పుస్తకాన్ని ఆయన చేతిలో పెట్టింది. ఉమర్ (రజియల్లాహు అన్హు) తాహా సూరా పఠించడం మొదలు పెట్టారు. కేవలం, ఆరంభంలోని కొన్ని ఆయతులు పఠించగానే – ఇది ఎంతో గౌరవప్రదమైన వాక్కు! అని పలికారు. తదుపరి ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) సన్నిధికి వచ్చి ఇస్లాం స్వీకరించారు. (అర్రహీఖుల్ మఖ్తూమ్: 102, 103 పేజీలు) 

ఇదండీ ఖుర్ఆన్ ప్రభావం! 

ఇదే విధంగా, హిజ్రత్ కు ముందు ముసైబ్ బిన్ ఉమైర్ (రజియల్లాహు అన్హు) మదీనాలో ధార్మిక ప్రచార కార్యాన్ని చేపట్టి వున్నారు. ఓసారి ఆయన ఉస్అద్ బిన్ జరార (రజియల్లాహు అన్హు) తో కలిసి సాద్ బిన్ ముఆజ్ మరియు ఉసైద్ బిన్ హుజైర్ దగ్గరికి వెళ్ళారు. వారిద్దరూ అప్పటి వరకు ఇస్లాం స్వీకరించలేదు. వారిద్దరూ ముసైబ్ బిన్ ఉమైర్ మరియు ఉస్అద్ బిన్ జరార లను హెచ్చరిస్తూ – మీరిద్దరూ ఇక్కణ్ణుంచి వెళ్ళిపోండి, లేకపోతే మేము మిమ్మల్ని తుదముట్టిస్తాం అని అన్నారు. దీనిపై, ముసైబ్ బిన్ ఉమైర్ (రజియల్లాహు అన్హు) వారితో – ఒక్క సారి మా మాటను వినండి, ఒకవేళ మీకిష్టమైతే దానిని స్వీకరించండి, లేకపోతే మేము తిరిగి వెళ్ళిపోతాం అని అన్నారు. దీనికి వారు ఒప్పుకున్నారు. ముసైబ్ బిన్ ఉమైర్ (రజియల్లాహు అన్హు) వారికి ఇస్లాం గురించి వివరించారు. ఖుర్ఆన్ పఠించి వినిపించారు. చివరికి వారిద్దరూ ఇస్లాం స్వీకరించారు. దీనితో, వారి తెగల్లోని వారంతా ఇస్లాం స్వీకరించారు. (అర్రహీఖుల్ మఖ్తూమ్: 144, 145 పేజీలు) 

ఇదేకాక, ఇలాంటి ఎన్నో ఉదాహరణలున్నాయి. ఈ ఖుర్ఆన్ తన శత్రువులను కూడా ఎంతగానో ప్రభావితం చేసిందని చెప్పటానికి. అందుకే ముస్లిములు కూడా, దీని వైపునకు తిరిగి, దీనిని పఠిస్తూ, దీనిపై చింతన చేస్తూ వుంటే వారు కూడా దీనితో ప్రభావితులు కావచ్చు. గుర్తుంచుకోవాల్సిన మరో విషయం ఏమిటంటే, దృష్టితో పాటు మనస్సును కూడా కేంద్రీకరించి, పూర్తి శ్రద్ధతో, ఏకాగ్రతతో ఖుర్ఆన్ పఠించిన వ్యక్తి పైనే దాని ప్రభావం వుంటుంది. 

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: 

إِنَّ فِي ذَٰلِكَ لَذِكْرَىٰ لِمَن كَانَ لَهُ قَلْبٌ أَوْ أَلْقَى السَّمْعَ وَهُوَ شَهِيدٌ

“హృదయాన్ని కలిగి వుండి లేదా శ్రద్ధగా ఆలకించి, సావధానంగా మసలుకునే ప్రతి వ్యక్తికీ ఇందులో హితబోధ కలదు”. (50: 37) 

(3) ఖుర్ఆన్ పారాయణం, దానిపై చింతన చేయడంతోపాటు దానికనుగుణంగా ఆచరిస్తూ మన జీవన శైలిని దానికనుగుణంగా మార్చుకొని, దాని వెలుగులో జీవితం కొనసాగించాలి. దీనిలో అల్లాహ్ ఇచ్చిన ఆదేశాలను పాటిస్తూ, ఆయన నిషేధించిన వాటికి దూరంగా వుండాలి. దీనిలో వివరించబడ్డ గత కాలానికి చెందిన జాతుల వృత్తాంతాలను చదివి, వాటి ద్వారా నేర్చుకొని, అల్లాహ్ అవిధేయతకు దూరంగా వుండాలి. దీనిలో నైతికత, సత్ప్రవర్తనకు సంబంధించి వివరించబడ్డ విషయాలకనుగుణంగా మనల్ని మనం సంస్కరించుకోవాలి. 

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: 

 وَهَٰذَا كِتَابٌ أَنزَلْنَاهُ مُبَارَكٌ فَاتَّبِعُوهُ وَاتَّقُوا لَعَلَّكُمْ تُرْحَمُونَ

ఇది (ఈ ఖుర్ఆన్) మేము అవతరింపజేసిన ఒక శుభప్రదమైన గ్రంథం. కాబట్టి మీరు దీనిని అనుసరించండి. భయభక్తులతో మెలగండి. తద్వారా మీరు కరుణించబడే అవకాశం వుంది”.(అన్ ఆమ్ 6:155) 

అల్లాహ్ మనందరినీ ఖుర్ఆన్ ను ఆధారంగా చేసుకునే సద్బుద్ధిని ప్రసాదించుగాక! 

రెండవ ఖుత్బా 

అల్లాహ్ గ్రంథాన్ని గట్టిగా పట్టుకోమని ఆదేశం 

అల్లాహ్ మనందరినీ ఖుర్ఆన్ ను  గట్టిగా పట్టుకోమని ప్రోత్సహిస్తూ దీనిని గట్టిగా పట్టుకొనే వారికి తన కారుణ్యంలోకి ప్రవేశింపజేసి, రుజుమార్గం వైపునకు మరలుస్తానని శుభవార్తనందించాడు. 

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: 

يَا أَيُّهَا النَّاسُ قَدْ جَاءَكُم بُرْهَانٌ مِّن رَّبِّكُمْ وَأَنزَلْنَا إِلَيْكُمْ نُورًا مُّبِينًا فَأَمَّا الَّذِينَ آمَنُوا بِاللَّهِ وَاعْتَصَمُوا بِهِ فَسَيُدْخِلُهُمْ فِي رَحْمَةٍ مِّنْهُ وَفَضْلٍ وَيَهْدِيهِمْ إِلَيْهِ صِرَاطًا مُّسْتَقِيمًا

ఎవరు అల్లాహ్ ను విశ్వసించి, ఆయనతో తమ సంబంధాన్ని పటిష్టం చేసుకుంటారో వారిని ఆయన తన కారుణ్యంలోకి, అనుగ్రహంలోకి తీసుకుంటాడు. వారికి తనవైపునకు తెచ్చే రుజుమార్గం చూపుతాడు”. (నిసా 4: 174, 175) 

అలాగే, దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అరాఫాత్ మైదానంలో ‘హజ్జతుల్ విదా’ సందర్భంగా చేసిన ప్రసంగంలో వివరించిన ముఖ్యాంశాలలో – అల్లాహ్ గ్రంథాన్ని (ఖుర్ఆన్ ను) గట్టిగా పట్టుకోమని, తద్వారా మార్గభ్రష్టతకు దూరంగా వుండవచ్చన్న అంశం కూడా వుంది. 

దీని గురించి ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు: “(బాగా గుర్తుంచుకోండి!) నేను మీ మధ్య ఒకదాన్ని విడిచి వెళుతున్నాను. దానిని గనక మీరు గట్టిగా పట్టుకుంటే ఎప్పుడూ మార్గభ్రష్టుల్వరు. అదే అల్లాహ్ గ్రంథం”. (ముస్లిం: 1218) 

మరో ఉల్లేఖనంలో పదాలు ఇలా వున్నాయి:

“ప్రజలారా! నా మాటలను జాగ్రత్తగా వినండి. నిస్సందేహంగా నేను అల్లాహ్ ధర్మాన్ని మీ దాకా చేరవేసాను. మీ మధ్య నేను రెండింటిని విడిచి వెళుతున్నాను. ఒకవేళ మీరు గనక వాటిని గట్టిగా పట్టుకొంటే ఎప్పుడూ మార్గభ్రష్టులవ్వరూ. అవేమిటంటే, అల్లాహ్ గ్రంథం మరియు ఆయన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సున్నత్”. (అస్సున్నహ్ లిల్ మరోజీ : 68వ పేజీ) 

దీని ద్వారా తెలిసిందేమిటంటే, అల్లాహ్ గ్రంథం మరియు దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సున్నత్ – ఈ రెండూ సన్మార్గానికి ఆధారాలు. వీటిని గనక గట్టిగా పట్టుకుంటే ఎల్లప్పుడూ మార్గభ్రష్టతకు దూరంగా వుండవచ్చు. 

అలాగే ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా కూడా సెలవిచ్చారు : 

ఈ ఖుర్ఆన్ ఒక బలమైన త్రాడు లాంటిది. దాని ఒక కొన అల్లాహ్ చేతిలో వుండి మరొక కొన మీ చేతుల్లో వుంది. కనుక, మీరు దీనిని గట్టిగా పట్టుకుంటే ఎప్పుడూ నాశనమవ్వరూ మరియు మార్గభ్రష్టులవ్వరు”. (అస్సహీహ: 713) 

తల్హా కథనం: 

నేను అబ్దుల్లా బిన్ అబూ ఊఫీ (రజియల్లాహు అన్హు) ను – దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వసీయతు (వీలునామా) ఏమైనా వ్రాశారా? అని అడిగాను. ఆయన – లేదు అని అన్నారు. నేను – ప్రజలకు వీలునామా వ్రాయడం విధిగా చేయబడింది, మరి ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) వీలునామా వ్రాయలేదా? అని అడిగాను. దీనిపై ఆయన – దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అల్లాహ్ గ్రంథం గురించి మాత్రమే వసీయతు చేశారు అని అన్నారు. (బుఖారీ: 5022) 

మరి ఇంత తీవ్రమైన హితబోధ దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) చేసినప్పటికీ, నేడు ఆయన అనుచర సమాజం ఖుర్ఆన్ నుండి దూరంగా వుండటం ఎంతో దురదృష్టకరమైన విషయం. ఎంతో మందికి అసలు ఖుర్ఆన్ చదవడమేరాదు. ఇక ఎవరైతే చదువుతారో వారు మొత్తం ఖుర్ఆన్ అటుంచి, ఫాతిహా సూరా అర్థం కూడా వివరించలేరు. (నేడు) ఖుర్ఆన్ కంఠస్తులైతే మాషా అల్లాహ్ చాలా మంది వున్నారు. కానీ, దానిపై ఆచరిస్తూ దానిని తమ జీవన శైలిగా మార్చుకున్నవారు చాలా తక్కువగా వున్నారు. 

ముస్లిములారా! 

ఖుర్ఆన్ విషయంలో మన వ్యవహార సరళిని మార్చుకొనే అవసరం నేడు ఎంతయినా వుంది. ఖుర్ఆనన్ను నేర్చుకొని, చదివి, దానిపై చింతన చేస్తూ, దాని ప్రకారం ఆచరించాలి. ఒకవేళ మనం మన వ్యవహార సరళిని గనక మార్చుకోకపోతే, ప్రళయం రోజు ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) అల్లాహ్ ముందు మన గురించి ఇలా సెలవిస్తారు: 

وَقَالَ الرَّسُولُ يَا رَبِّ إِنَّ قَوْمِي اتَّخَذُوا هَٰذَا الْقُرْآنَ مَهْجُورًا

నా ప్రభూ! నిశ్చయంగా నా జాతివారు ఈ ఖుర్ఆన్ ను వదలిపెట్టారు”. (ఫుర్ఖాన్ 25 : 30) 

అల్లామా ఇబ్నుల్ ఖయ్యూం రహిమహుల్లాహ్ “వదిలిపెట్టడం“ను విశ్లేషిస్తూ ఇలా పేర్కొన్నారు. ఈ హిజ్ర్ (ఖుర్ఆన్ ను వదలిపెట్టడం) అనేది పలు రకాలుగా వుంటుంది. అందులో 

  1. మొదటిది- ఖుర్ఆన్ ను ఏకాగ్రతతో విని, దానిని విశ్వసించకపోవడం. 
  2. రెండవది, దానిని చదివి, విశ్వసించి, దాని ప్రకారం ఆచరించడాన్ని వదిలిపెట్టడం మరియు దీని హరామ్, హలాల్ హద్దుల వద్ద ఆగకపోవడం. 
  3. మూడవది, దీనిని న్యాయనిర్ణేతగా స్వీకరించకపోవడం మరియు ధార్మిక ప్రధానాంశాలు, వాటి శాఖల విషయంలో దీని ద్వారా తీర్పు పొందకపోవడం మరియు ‘దీని ఆధారాలు కేవలం గ్రాంథికమైనవి, వాస్తవిక ప్రయోజనాన్ని అంతగా కలిగించవు’ అన్న దృష్టి కోణం కలిగి వుండటం. 
  4. నాలుగవది, దీనిపై చింతన చేయడం వదలిపెట్టడం, తద్వారా అల్లాహ్ చెప్పదలుచుకున్న దేమిటో తెలుసుకోవటానికి ప్రయత్నించకపోవటం. 
  5. ఐదవది, హృదయ వ్యాధులన్నింటినీ దీనితో చికిత్స చేయకుండా వదలిపెట్టడం. ఈ ఐదు రకాలు కూడా, అల్లాహ్ వాక్కు “నిశ్చయంగా నా జాతి వారు ఈ ఖుర్ఆన్ ను వదలిపెట్టారు” లో ఇమిడి వున్నాయి. (అల్ ఫవాయెద్: 82 పేజీ) 

ఆఖరుగా అల్లాహ్ ను వేడుకొనేదేమిటంటే ఆయన మనందరికీ ఖుర్ఆన్ పారాయణం, దాని కంఠస్తంతో పాటు దానిపై చింతన చేసే సద్భుద్దిని మరియు దాని ప్రకారం ఆచరించే సద్బుద్ధిని ప్రసాదించుగాక! ఆమీన్!! 

ఈ ఖుత్బా క్రింది పుస్తకం నుండి తీసుకోబడింది:
జాదుల్ ఖతీబ్ (ఖుత్బాల సంగ్రహం) – మొదటి సంపుటం – ముహమ్మద్ ఇస్ హాఖ్ జాహిద్

%d bloggers like this: