భర్త నమాజు చదవడం లేదు, తావీజు ధరిస్తున్నాడు, షిర్క్ చేస్తున్నాడు, ఇటువంటి సమయంలో విశ్వాసురాలైన భార్య ఏమి చెయ్యాలి? https://youtu.be/HORMsPWKEDQ [7 నిముషాలు] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఈ ప్రసంగంలో, భర్త నమాజుకు ప్రాముఖ్యత ఇవ్వకుండా, మెడలో తాయెత్తులు వేసుకుంటూ, దర్గాల వద్దకు వెళ్తూ షిర్క్ చేస్తున్నప్పుడు, తౌహీద్ మరియు సున్నత్ ప్రకారం జీవించాలనుకునే భార్య అతని నుండి ఖులా (విడాకులు) తీసుకోవచ్చా అనే ప్రశ్నకు సమాధానం ఇవ్వబడింది. దర్గాలకు వెళ్లడం, తాయెత్తులు ధరించడం వంటివి షిర్క్ వరకు తీసుకెళ్లే తీవ్రమైన పాపాలని, ఖురాన్ ఆయతుల ఆధారంగా వివరించబడింది. ముఖ్యంగా అల్లాహ్ ను కాకుండా ఇతరులను ప్రార్థించడం, ఇతరులకు సజ్దా చేయడం స్పష్టమైన షిర్క్. అలాగే, నమాజును నిర్లక్ష్యం చేయడం లేదా వదిలివేయడం కూడా చాలా పెద్ద పాపమని, అది కుఫ్ర్ వరకు వెళ్ళవచ్చని హెచ్చరించబడింది. భర్త ఈ పాపాలనుండి పశ్చాత్తాపపడకపోతే, భార్య ఖులా తీసుకోవడం ధర్మసమ్మతమని పండితులు అభిప్రాయపడతారని, అయితే ఓపికతో అతనికి నచ్చజెప్పే ప్రయత్నం కూడా చేయవచ్చని, కానీ పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకోవాలని సలహా ఇవ్వబడింది.
ప్రశ్న: షిర్క్ చేసే భర్త నుండి ఖులా తీసుకోవచ్చా?
భర్త ఏ మాత్రం నమాజుకు ప్రాముఖ్యత ఇవ్వకుండా, మెడలో తాయీజులు వేసుకుంటూ దర్గాల వద్దకు వెళ్తూ ఉంటాడు. భార్య ఇస్లాం యొక్క ప్రేమికురాలు, తౌహీద్ మరియు సున్నత్ ప్రకారంగా జీవితం గడపాలనుకుంటుంది. అయితే ఆ భర్త, ఆ భర్త నుండి ఖులా తీసుకోవడానికి, వేరుకోవడానికి ఇస్లాంలో ఏదైనా అనుమతి ఉందా అని మీరు అడిగారు.
దర్గాలు మరియు తాయెత్తులు: షిర్క్ వైపు దారితీసే పనులు
వాస్తవానికి చూసేది ఉంటే, మనిషి దర్గాలకు వెళ్లి అక్కడ అల్లాహ్ కు చేయబడే అటువంటి కొన్ని ఆరాధనలు అక్కడ చేస్తున్నాడు, తాయీదులు వేసుకుంటున్నాడు, ఇవి రెండూ కూడా షిర్క్ వరకు తీసుకెళ్లే పాపాలు.
దర్గా కాడికి వెళ్లి డైరెక్ట్ దర్గా వారితో దుఆ చేస్తే, దర్గా వారికి సజ్దా చేస్తే, అల్లాహ్ అలాంటి పరిస్థితి నుండి మనందరినీ కాపాడుగాక, షిర్క్ చేసినవాడైపోతాడు. అల్లాహ్ త’ఆలా చాలా స్పష్టంగా చెప్పాడు.
وَاسْجُدُوا لِلَّهِ الَّذِي خَلَقَهُنَّ (వస్ జుదూ లిల్లా హిల్లాజి ఖలకహున్) వాటిని సృష్టించిన అల్లాహ్‌కే సాష్టాంగపడండి. (41:37)
భూమి ఆకాశాలు, సూర్య చంద్రాలు ఇంకా ఈ సృష్టి అంతటినీ సృష్టించిన ఆ ఏకైక అల్లాహ్ కు మాత్రమే మీరు సజ్దా చేయండి.
وَقَالَ رَبُّكُمُ ادْعُونِي أَسْتَجِبْ لَكُمْ (వ కాల రబ్బుకుముద్ ఊని అస్తజిబ్ లకుం) మీ ప్రభువు అంటున్నాడు: “నన్నే ప్రార్థించండి. నేను మీ ప్రార్థనలను ఆమోదిస్తాను. (40:60)
మీ ప్రభువు మీతో చాలా స్పష్టంగా చెప్పాడు, మీరు నన్ను మాత్రమే అర్థించండి, నాతో మాత్రమే దుఆ చేయండి, నేను మీ దుఆలను అంగీకరిస్తాను.
ఇంత స్పష్టమైన ఆయతులు ఉన్నప్పటికీ మనిషి దర్గాల కాడికి వెళ్లి ఇలాంటి పనులు చేస్తున్నాడంటే స్పష్టమైన షిర్క్ కు గురి అవుతున్నాడు. ఇక ఆ మనిషి అల్లాహ్ ను నమ్ముతూ, ప్రవక్తను నమ్ముతూ, పరలోక దినాన్ని నమ్ముతూ నమాజులు చేస్తూ ఇదే పెద్దలు చేసిన్లు మా ఊర్లో, నేను ఎక్కడా ఇంకా బయటికి వెళ్ళలేదు ఏమీ వేరేది చూడలేదు, దీనినే నిజమైన ఆరాధన అనుకుంటున్నాను అన్నటువంటి భ్రమలో ఉండి ఉంటే, అల్లాహ్ అలాంటి వ్యక్తితో ఎలా మసులుకుంటాడో కరుణాకటాక్షాలతో లేదా ఇంకా వేరే ఏదైనా పరీక్ష తీసుకుంటాడా అది వేరే విషయం. కానీ ఈనాటి కాలంలో నెట్ ద్వారా, మొబైల్ ల ద్వారా సత్యం అనేది ఎంత ప్రస్ఫుటమవుతుంది, అయినా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయకుండా ఇలాంటి షిర్క్ పనికి లోనవుతూ ఉంటే ఇది చాలా భయంకరమైన విషయం.
భార్య వాస్తవానికి ఇస్లాం ప్రకారంగా జీవితం గడపాలనుకుంటుంది అంటే ముందు భర్తను ఇలాంటి షిర్క్ పనుల గురించి ప్రేమగా, మంచి విధంగా, ఆధారాలు చూపుతూ ఇవి తప్పు అని తప్పకుండా తెలియజేస్తూ ఉండాలి.
దీనిపై ఇంకా తాయీదులు వేసుకుంటున్నారు అంటే ఈ రోజుల్లో దర్గాల వద్ద నుండి వేరే కొందరు మౌల్సాబుల నుండి ఏదైతే తాయీదులు ఇవ్వడం జరుగుతున్నాయో, సర్వసాధారణంగా ప్రజలు ఆ తాయీదుల మీదనే మొత్తం నమ్మకం ఉంచుతున్నారు. చివరికి ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే ఎందరితోనో మనం మాట్లాడి, ఎంతో ప్రేమగా దీని గురించి చెప్పి తీయించాలని ప్రయత్నం చేస్తే, అయ్యో వద్దండి వద్దండి ఇది తీసేస్తుంటే ఖలాస్ ఇక నా ప్రాణం పోతది, లేదు నాకు మళ్లీ కడుపునొప్పి మొదలైపోతది, ఇక ఇది తీసేది ఉంటే నేను మళ్ళీ అనారోగ్యానికి గురైపోతాను అన్నటువంటి మాటలు మాట్లాడుతున్నారు. అంటే ఇది కేవలం ఒక చిన్న సబబుగా అల్లాహ్ యే షఫా ఇచ్చేవాడు అన్నటువంటి సంపూర్ణ నమ్మకం లేదు. దీనిమీదనే, ఈ తాయీదుల మీదనే నమ్మకం ఉన్నది. మరి ఇలాంటి ఈ నమ్మకాన్ని కూడా పెద్ద షిర్క్ లో పడవేసేది అని ఖురాన్ హదీస్ ఆయతుల ద్వారా ధర్మ పండితులు చెప్పి ఉన్నారు.
నమాజును విస్మరించడం యొక్క తీవ్రత
దీనికంటే కరేలా నీమ్ చడా అన్నట్టుగా ఇంకా ఘోరమైన విషయం మీరు తెలిపింది ఏమిటంటే ఆ భర్త నమాజుకు ప్రాముఖ్యత ఏమీ ఇవ్వడం లేదు. ఇక్కడ ఒక విషయం గమనించాల్సి ఉంటుంది. అదేమిటంటే నమాజుకు ఏదైనా ఎప్పుడైనా బద్ధకంతో వెళ్లకపోతే అదే చాలా ప్రమాదకరమైన విషయం అని ఖురాన్ హదీసులో చెప్పడం జరిగింది.
ఉదాహరణకు మీరు గమనించండి, ఒక చిన్న సూరాలో అంటే సూరతుల్ మాఊన్ లో అల్లాహ్ త’ఆలా తెలిపాడు,
فَوَيْلٌ لِلْمُصَلِّينَ (ఫ వైలుల్ లిల్ ముసల్లీన్) వయిల్ (అధోలోకం) ఉన్నది ఆ నమాజీల కొరకు, (107:4)
الَّذِينَ هُمْ عَنْ صَلَاتِهِمْ سَاهُونَ (అల్లజీనహుం అన్ సలాతిహిం సాహూన్) ఎవరయితే తమ నమాజుల పట్ల ఏమరుపాటుగా ఉంటారో, (107:5)
ఎవరైతే నమాజు బద్ధకంగా చేస్తున్నారో, టైం యొక్క సమయపాలన లేకుండా, రుకున్ వాజిబాత్ ఇంకా సున్నత్ ప్రకారంగా చేయకుండా, ఇష్టం వచ్చినప్పుడు చేస్తున్నాడు లేదా అంటే వదిలేస్తున్నాడు, ఇలా బద్ధకంగా చేసే వారి గురించే వినాశకరమైన వైల్ ఉన్నది అని అల్లాహ్ త’ఆలా హెచ్చరిస్తున్నాడు. అలాంటప్పుడు ఎవరైతే దానికి ప్రాముఖ్యతనే ఇవ్వరో, అయ్యో నమాజ్ చదవాలి అన్నటువంటి మనసులో ఒక తపన లేనే లేదో వారు ఇంకా ఎంత భయంకరమైన పాపములో పడి ఉన్నారో గమనించండి.
భార్యకు ఇస్లామీయ తీర్పు మరియు సలహా
అయితే ఇలాంటి భార్య అతని నుండి ఆ భర్త నుండి ఖులా తీసుకోవచ్చా? ఎంతోమంది ధర్మపండితులు చెప్పే విషయం ఏమిటంటే ఇలాంటి షిర్క్ మరియు నమాజును వదిలేటువంటి కుఫ్ర్ పని నుండి అతను తోబా చేయకుంటే తప్పకుండా భార్య ఖులా తీసుకోవాలి.
కానీ మన చోట ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఒకవేళ భార్య ఇంకా దావత్ ఇస్తూ, భర్తకు నచ్చజెప్పుతూ ఓపిక కొంచెం వహించింది అంటే ఒకరకంగా మంచిది కావచ్చు. కానీ అలాగే ఉండిపోవడం, ఆ భర్త అంటే ఆమె పిల్లల యొక్క తండ్రి యొక్క శిక్షణలో ఈ పిల్లలు ఎలా ఎదుగుతారు అనే విషయంలో భార్య తప్పకుండా భయపడాలి. అల్లాహ్ తో అధికంగా దుఆ చేయాలి, అధికంగా దుఆ చేయాలి. అల్లాహ్ మనందరికీ సన్మార్గం ప్రసాదించుగాక. ఇస్లాంపై స్థిరంగా ఉండే సద్భాగ్యం ప్రసాదించుగాక.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఈ ప్రసంగంలో, తావీజు (తాయత్తులు) మరియు ఇస్లాంలో వాటి స్థానం గురించి వివరించబడింది. తావీజులు రెండు రకాలుగా విభజించబడ్డాయి: ఖుర్ఆన్ వచనాలు కలిగినవి మరియు ఇతర వస్తువులు (గవ్వలు, దారాలు మొదలైనవి) కలిగినవి. ఖుర్ఆన్ వచనాలు ఉన్న తాయత్తుల విషయంలో కూడా పండితుల మధ్య అభిప్రాయ భేదం ఉందని, అయితే మెజారిటీ పండితులు షిర్క్‌కు దారితీస్తుందనే భయంతో వాటిని కూడా నిషేధించారని ప్రసంగీకులు పేర్కొన్నారు. షిర్క్‌తో కూడిన రెండవ రకం తాయత్తులు పూర్తిగా హరామ్ అని స్పష్టం చేయబడింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధించిన విధంగా, తాయత్తులకు బదులుగా ఖుర్ఆన్ మరియు దుఆలను పఠించడం ద్వారా రక్షణ మరియు నివారణను వెతకాలని ముగింపులో ఉపదేశించబడింది.
إِنَّ الْحَمْدَ لِلَّهِ وَحْدَهُ، وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى مَنْ لَا نَبِيَّ بَعْدَهُ، أَمَّا بَعْدُ (ఇన్నల్ హమ్దలిల్లాహి వహ్ద, వస్సలాతు వస్సలాము అలా మన్ లా నబియ్య బా’ద, అమ్మా బా’ద్) నిశ్చయంగా సర్వ స్తోత్రాలు ఏకైక అల్లాహ్ కే శోభిస్తాయి. మరియు ఎవరి తర్వాత ప్రవక్త లేడో, ఆయనపై శాంతి మరియు శుభాలు కలుగుగాక. ఆ తర్వాత…
అభిమాన సోదరులారా! ధర్మ అవగాహనం అనే ఈ కార్యక్రమములోకి మీ అందరికీ ఇస్లామీయ అభివాదం.
اَلسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ (అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు) మీపై అల్లాహ్ యొక్క శాంతి, కరుణ మరియు శుభాలు వర్షించుగాక.
ప్రియ వీక్షకులారా! ఈ రోజు మనం తావీజు, తాయత్తుల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. మనం మన సమాజంలో చూస్తూ ఉంటాము, కొందరి మెడలో, చేతులో, నడుంకి తావీజులు, తాయత్తులు కట్టుకుంటారు. చిన్న పిల్లలకి దిష్టి తగలకుండా ఉండటానికి, పెద్దవారైనా సరే, ఎవరైనా సరే రోగానికి గురైనప్పుడు ఆ రోగం పోవాలని, నష్టానికి గురైనప్పుడు నష్టం రాకూడదని, కొందరు భయం కోసము, కొందరు ముందు జాగ్రత్త ఎప్పుడూ నష్టానికి, బాధకి లోను కాకూడదని ఏదేదో కారణాలతో, ఏదేదో ఉద్దేశాలతో తావీజులు కట్టుకుంటారు. ఇది కూడా సమాజంలో ఒక వర్గం దీనిని వ్యాపారంగా కూడా చేసుకున్నది. కాకపోతే, ఇస్లాం ధర్మంలో, షరీఅత్‌లో తావీజు యొక్క వాస్తవికత ఏమిటి? దీనికి అరబీలో ‘తమీమా‘ అంటారు, ‘త’అవీద్’. మామూలుగా తెలుగులో తావీజు, తాయత్తు అని చెప్తారు.
తావీజులలో రకాలు
ఈ తాయత్తులు, ఈ తావీజులు రెండు రకాలు. షేఖ్ సాలెహ్ బిన్ ఫౌజాన్ అల్ ఫౌజాన్ (రహ్మతుల్లాహి అలై) ఒక పుస్తకం ఉంది ‘అఖీదతుత్ తౌహీద్‘, ఆ పుస్తకం ఆధారంగా ఈ తావీజు గురించి ఈ రెండు రకాలు నేను మాట్లాడుతున్నాను. తావీజు రెండు రకాలు ఈ తాయత్తులు.
మొదటి రకం ఏమిటి? ఖుర్ఆన్ ఆధారంగా కట్టే తావీజులు. ఆ తావీజులో ఎటువంటి షిర్క్ లేదు, బిద్అత్ లేదు, కొత్త విషయాలు లేవు. ఖుర్ఆన్ వాక్యాలు మాత్రమే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నేర్పిన వాక్యాలు మాత్రమే ఆ తావీజులో ఉన్నాయి. అంటే ఖుర్ఆన్ సూక్తులను లేదా అల్లాహ్ నామాలను, గుణాలను లిఖించి వ్యాధి నివారణ పొందే ఉద్దేశంతో తావీజు వేయటం. ఈ విషయం బాగా అర్థం చేసుకోండి. అల్లాహ్ సూక్తులను, అల్లాహ్ నామాలను, అల్లాహ్ గుణాలను లిఖించి ఆ వ్యాధి నివారణ పొందే ఉద్దేశంతో వేలాడదీయడం, వేయటం.
ఇటువంటి తావీజు ధర్మ సమ్మతమని కొంతమంది పండితుల అభిప్రాయం. అందరి అభిప్రాయం కాదు, కొంతమంది పండితుల అభిప్రాయం మాత్రమే. ఆధారం ఏమిటి? అటువంటి తావీజులో షిర్క్ లేదు, బిదాత్ లేదు, కొత్త విషయం ఏదీ లేదు. కేవలం అల్లాహ్ వాక్యం ఉంది, అల్లాహ్ నామం మాత్రమే ఉంది, అల్లాహ్ గుణగణాలు మాత్రమే ఉన్నాయి. ఉద్దేశం కూడా ఏమిటి? వ్యాధి నివారణ పొందే ఉద్దేశం. షిర్క్ లేదు కాబట్టి ఇది ధర్మ సమ్మతమే అని కొంతమంది పండితుల అభిప్రాయం.
కాకపోతే, అత్యధిక శాతం, ఎక్కువ మంది ధర్మ పండితులు ఇటువంటి తావీజు కూడా ధర్మ సమ్మతం కాదు అని అంటారు. ఆ లిఖించటంలో, ఆ తావీజులో, ఆ కాగితంలో ఖుర్ఆన్ ఆయత్ మాత్రమే ఉన్నప్పటికిని అది ధర్మ సమ్మతం కాదు అని అంటారు అత్యధిక మంది ధర్మ పండితులు. ఉదాహరణకు, అబ్దుల్లా బిన్ మస్ఊద్ (రదియల్లాహు త’ఆలా అన్హు) పెద్ద సహాబీ, మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క పినతండ్రి కుమారుడు అబ్దుల్లా బిన్ అబ్బాస్ (రదియల్లాహు త’ఆలా అన్హు), హుజైఫా (రదియల్లాహు త’ఆలా అన్హు), ఉఖ్బా బిన్ ఆమిర్ (రదియల్లాహు త’ఆలా అన్హు) ఇలా, అబ్దుల్లా బిన్ మస్ఊద్ (రదియల్లాహు అన్హు) యొక్క శిష్యులు, ఒక ఉల్లేఖనం ప్రకారం ఇమామ్ అహ్మద్ బిన్ హంబల్ (రహ్మతుల్లాహి అలై), అలాగే వారి శిష్యులు, తర్వాతి తరాల వారు కూడా దీనినే కట్టుబడ్డారు, అంటే ఇది కూడా ఇటువంటి తావీజు కూడా ధర్మ సమ్మతం కాదు. అత్యధిక మంది పండితుల అభిప్రాయం ఇదే. ఆధారం ఏమిటి?
అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు,
إِنَّ الرُّقَى وَالتَّمَائِمَ وَالتِّوَلَةَ شِرْكٌ (ఇన్నర్రుఖా వత్తమాఇమ్ వత్తివలా షిర్కున్) “నిశ్చయంగా మంత్రాలు (షిర్క్ తో కూడినవి), తాయత్తులు మరియు తివలా (ఒక రకమైన క్షుద్ర విద్య) షిర్క్.” (ఇబ్ను మాజా)
అంటే ఈ విధంగా మంత్రించటం, తాయత్తులు వేయటం, తివలా, ఇది ఒక రకమైన చేతబడి, క్షుద్ర విద్య, షిర్కుతో కూడుకున్నది అని అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు.
అభిమాన సోదరులారా! కేవలం అల్లాహ్ నామాలు మాత్రమే, అల్లాహ్ గుణాలు మాత్రమే ఉన్నప్పటికీ అది ధర్మ సమ్మతం కాదు అని ఎందుకు అంటున్నారంటే మూడు కారణాల వల్ల అటువంటి తావీజు కూడా ధర్మ సమ్మతం కాదు అని అంటున్నారు. అది మూడు కారణాలు. ఒకటి ఏమిటి? సర్వసాధారణంగా తాయత్తులు కట్టడం పట్ల వారింపు ఉంది. సర్వసాధారణంగా తాయత్తులు కట్టరాదు, తావీజు వేయరాదు అని వాక్యాలు ఉన్నాయి, ప్రవచనాలు ఉన్నాయి. కావున ఈ సర్వసాధారణకి ప్రత్యేకంగా చేసే ఆధారం ఏదీ లేదు. ఒక విషయం సర్వసాధారణంగా ఉంది, దానికి ప్రత్యేకంగా ఏమైనా రుజువు కావాలి, ఆధారం కావాలి. ఆధారం లేకపోతే అది ధర్మ సమ్మతం అవ్వదు. అంటే మొదటి రకం, మొదటి విషయం ఏమిటి? సర్వసాధారణంగా తాయత్తులు కట్టడం వల్ల వారింపు ఉంది. ఈ సర్వసాధారణమును ప్రత్యేకంగా చేసే ఆధారం ఏదీ లేదు కనుక.
అలాగే రెండవ కారణం ఏమిటి? దీనిని ధర్మ సమ్మతం చేస్తే షిర్క్ ద్వారాలు తెరుస్తాయి. షిర్క్ ద్వారాలను మూసివేయటంలో ఈ వారింపు ఉపయుక్తంగా ఉన్నది కాగా తావీజులు వ్రేలాడదీయవచ్చన్న ఫతవా అనే ఇస్తే, షిర్కుతో కూడుకున్న తావీజును ప్రోత్సహించేందుకు ఆస్కారం ఉంది. అది ఏ విధంగానూ సమ్మతం కాదు. ఇది రెండో కారణం.
మూడోది ఏమిటి? ఖుర్ఆన్ ఆయతులను తావీజుగా చేసి మెడలో, చేతులు వేసుకుంటే తప్పకుండా వాటి పట్ల అమర్యాదకరంగా ప్రవర్తిస్తారు. తప్పనిసరిగా అవుతుంది అది. ఎందుకంటే తావీజు వేసుకొని బాత్రూంకి పోవాలి, కాలకృత్యాలు పూర్తి చేసుకోవాలి, మనిషి ఒకసారి జునుబీ స్థితిలో ఉంటాడు, అశుద్ధ స్థితిలో ఉంటాడు, వివాహం అయిన వారు సంభోగించుకుంటారు భార్యాభర్తలు. మరి మెడలో ఖుర్ఆన్ వాక్యాలు, అల్లాహ్ నామము, చేతిలో అల్లాహ్ వాక్యాలు, ఖుర్ఆన్ వాక్యాలు, అల్లాహ్ నామాలు, అల్లాహ్ పేరు, అల్లాహ్ గుణ విశేషాలు ఇవి మన శరీరంలో పెట్టుకొని మనము బాత్రూం కి పోవటం ఏమిటి? కాలకృత్యాలు తీసుకోవటం ఏమిటి? జునుబీ స్థితిలో ఉండటం ఏమిటి? ఈ విధంగా చాలా కారణాలు ఉన్నాయి, అమర్యాద అవుతుంది ఆ ఈ ఖుర్ఆన్ వాక్యాల విషయంలో. కావున ఈ మూడు కారణాల వల్ల ఆ తావీజులో ఖుర్ఆన్ వాక్యాలు మాత్రమే ఉన్నప్పటికిని అది ధర్మ సమ్మతం కాదు అని పండితుల అత్యధిక మంది పండితుల అభిప్రాయం ఇది.
ముగింపు మరియు సరైన పద్ధతి
అభిమాన సోదరులారా! ఇప్పుడు వరకు నేను చెప్పిన మాటల్లో సారాంశం రెండు రెండు విషయాలు. ఒకటి, ధర్మ సమ్మతమైన తావీజు, దాంట్లో ఎటువంటి షిర్క్ పదాలు ఉండకూడదు. కేవలం అల్లాహ్ వాక్యాలు, అల్లాహ్ నామం, అల్లాహ్ గుణాలు మాత్రమే ఉండాలి. అటువంటి తావీజు ధర్మ సమ్మతమని కొంతమంది మాత్రమే ధర్మ సమ్మతం అంటున్నారు. కాకపోతే, రెండో విషయం ఏమిటి? అత్యధిక మంది ధర్మ పండితులు అటువంటి తావీజు కూడా ధర్మ సమ్మతం కాదు. ఎందుకంటే ఈ మూడు కారణాలు. మొదటి కారణం ఏమిటి? సాధారణంగా అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రతీ తావీజు షిర్క్ అన్నారు. దానికి ప్రత్యేకం చేయటానికి ఆధారం లేదు. ఇది మొదటి కారణం. రెండో కారణం ఏమిటి? ఇది షిర్క్‌కి దారి తీస్తుంది. రెండో కారణం. మూడో కారణం ఏమిటి? అల్లాహ్ వాక్యాల పట్ల, అల్లాహ్ నామం పట్ల, అల్లాహ్ గుణ విశేషాల పట్ల అమర్యాద కలుగుతుంది, అగౌరవం కలుగుతుంది. ఈ కారణాల వల్ల రుజువు లేదు కాబట్టి అటువంటి తావీజు కూడా ధర్మ సమ్మతం కాదు అని అత్యధిక మంది పండితుల అభిప్రాయం.
కావున, మనము తావీజు కట్టుకోకుండా, తావీజు వ్రేలాడదీసుకోకుండా అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క విధానాన్ని అనుసరించి మనము మంత్రించి ఊదుకోవాలి, అది ఆధారం ఉంది కదా! ఆరోగ్యం బాగాలేదు, ప్రవక్త గారు కొన్ని దుఆలు, కొన్ని వాక్యాలు నేర్పించారు. ఖుర్ఆన్ వాక్యాలు ఉన్నాయి, అల్లాహ్ నామాలు ఉన్నాయి, అల్లాహ్ గుణాలు ఉన్నాయి. అవి మంత్రించి, పఠించి ఊదుకోవచ్చు. రోగిపై పఠించి ఊదవచ్చు. నీళ్ళపై మంత్రించి ఆ నీళ్ళు తాగవచ్చు, త్రాపించవచ్చు. ఈ విధానం ఉంది కదా. లేని విధానాన్ని, దాంట్లో షిర్క్ అనే అనుమానం ఉంది, అటువంటి విధానాన్ని ఎన్నుకోవడం కరెక్ట్ కాదు.
ఇక తావీజు విషయంలో రెండో రకం, రెండో కోవకు చెందిన తావీజు, ఇప్పుడు అది ఒక వ్యాపారంగా మారిపోయింది. అది ఎటువంటి పరిస్థితుల్లో ధర్మ సమ్మతం కాదు, అధర్మం, షిర్క్ మరియు హరామ్. అంటే, ఖుర్ఆన్ సూక్తులు ఆధారం కాని, ఆధారం లేని తావీజులు. అంటే గవ్వలు, పూసలు, దారాలు, వెంట్రుకలు, చిప్పలు, భూత పిశాచాల పేర్లు ఇత్యాదివి. ఇలాంటివి చాలా ఉన్నాయి. ఈ రకమైన తావీజులు ముమ్మాటికి నిషిద్ధం, హరామ్, ధర్మ సమ్మతం కాదు, షిర్క్. అవి ఖచ్చితంగా షిర్క్ కిందికి వస్తాయి. ఎందుకంటే ఈ రకమైన వస్తువులలో అల్లాహ్ నామాల, వాక్యాల బదులు వాటిని ఇతరత్రా వాటితో ముడిపెట్టడం జరుగుతుంది, దైవేతరులను ఆశ్రయించడం జరుగుతుంది. కాగా హదీసులో ఇలా ఉంది, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు:
مَنْ تَعَلَّقَ شَيْئًا وُكِّلَ إِلَيْهِ (మన్ త’అల్లఖ షై’అన్ వుకిల ఇలైహి) “ఎవరైతే ఏదైనా వస్తువుతో (రక్షణ కోసం) సంబంధం పెట్టుకుంటాడో, అతను దానికే అప్పగించబడతాడు.” (తిర్మిజి)
ఎవరైనా ఏదైనా వస్తువుతో సంబంధం ఏర్పరుచుకుంటే అతను దాని పరమే చేయబడతాడు, అతని నమ్మకం దాని పైనే ఉంటుంది, అల్లాహ్ పైన నమ్మకం ఉండదు. అల్లాహ్ అతనికి పట్టించుకోడు. కావున ఇది షిర్క్ అవుతుంది. ప్రస్తుతం సమాజంలో చాలామంది అది ఒక వ్యాపారంగా చేసుకున్నారు. మీరు దాని గురించి అనుభవం చేసి చూడండి. కొన్ని తావీజులు ఓపెన్ చేసి చూస్తే, కొన్ని అక్షరాలు ఉంటాయి, అర్థం కాని అక్షరాలు ఉంటాయి. అరబీ భాష కావచ్చు, అరబీ భాష కాకపోవచ్చు, అర్థం కాని భాష ఉంటుంది, అర్థం కాని అక్షరాలు ఉంటాయి. కొన్ని తావీజులలో అడ్డంగా, దిడ్డంగా గీతలు ఉంటాయి. కొన్ని తావీజులలో లెక్కలు ఉంటాయి. ఇదన్నీ ఎవరు నేర్పించారు? ఇవన్నీ హరామ్, ఇవన్నీ షిర్క్ కిందికి వస్తుంది, అధర్మం.
కావున, మనం అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నేర్పించిన విధానాన్నే అనుసరించాలి. రోగానికి గురైనప్పుడు ప్రవక్త గారు మనకి ఏం నేర్పించారు? పిల్లలకి దిష్టి తగలకుండా ఉండాలంటే ప్రవక్త గారు నేర్పించారు. జ్వరం వస్తే ఏం చేయాలి? బాధకి గురైతే ఏం చేయాలి? నష్టానికి గురైతే ఏం చేయాలి? భయంలో ఏం చేయాలి? ప్రయాణంలో ఏం చేయాలి? అల్హమ్దులిల్లాహ్! అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మనకి ప్రతీ విధానం నేర్పించారు. ప్రతీ విషయంలో, ప్రతీ సమయంలో, ప్రతీ సబ్జెక్టులో మనకు నేర్పించారు. వివాహంలో, సంభోగం సమయంలో, దుస్తులు వేసుకునేటప్పుడు, ఇంట్లో ప్రవేశించేటప్పుడు, ఇంటి నుంచి బయటికి పోయేటప్పుడు, ఉదయం సాయంత్రం దుఆలు, అజాన్‌కి ముందు అజాన్ తర్వాత, మస్జిద్‌కి పోయేటప్పుడు బయటికి వచ్చేటప్పుడు, బాధ కలిగినప్పుడు, భయం ఉన్నప్పుడు, టెన్షన్‌లో ఉన్నప్పుడు, అప్పులో ఉన్నప్పుడు, అప్పులు తీర్చేటప్పుడు ప్రతీ సమస్యకి, ప్రతీ రోగానికి, ప్రతీ కష్టానికి అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మనకు ఒక పద్ధతి నేర్పించారు, ఒక విధానం నేర్పించారు.
మరి మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనకి ఏం నేర్పించినా,
وَمَا يَنطِقُ عَنِ الْهَوَىٰ إِنْ هُوَ إِلَّا وَحْيٌ يُوحَىٰ (వమా యంతిఖు అనిల్ హవా, ఇన్ హువ ఇల్లా వహ్యున్ యూహా) అతను తన మనోభిరామం ప్రకారం మాట్లాడటమూ లేదు. అది (అతను మాట్లాడేదంతా) అతని వద్దకు పంపబడే దైవవాణి (వహీ) తప్ప మరేమీ కాదు. (53:3-4)
అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మనకు అల్లాహ్ తరఫు నుంచే నేర్పుతారు. కావున, మనము ప్రతీ చిన్న పెద్ద షిర్క్ నుండి దూరంగా ఉండాలి. షిర్క్ చాలా ఘోరమైన నేరం, డేంజర్ విషయం అది. షిర్క్ చాలా ఘోరం. కావున, ఈ తావీజు కూడా షిర్క్ కిందికి వస్తుంది. కావున మనం ఈ షిర్క్ నుండి దూరంగా ఉండాలి, ఈ తావీజులు, తాయత్తులతో దూరంగా ఉండాలి. సమాజంలో ఈ బాబాలు, పీర్లు, వీళ్ళు దీనిని ఒక వ్యాపారంగా చేసుకున్నారు. ఇస్లాంలో ఎటువంటి దీనికి స్థానం లేదు. ఇది ధర్మ సమ్మతం కాదు. ఇది గుర్తుంచుకోండి. ఒకవేళ మనకి రోగం వచ్చినా, మన పిల్లలకి రోగాలు వచ్చినా, వారికి దిష్టి తగలకుండా ఉండాలన్నా ప్రవక్త గారు నేర్పించారు. కావున మీరు దుఆల పుస్తకం ఆధారంగా ఉన్న ప్రామాణికమైన హదీసుల పరంగా దుఆలు మనకు ఉన్నాయి, ఆ దుఆలు పఠించండి, ప్రవక్త గారి విధానాన్ని అనుసరించండి. ఇన్షా అల్లాహ్ ఇహపర లోకాలలో సాఫల్యం దక్కుతుంది ఇన్షా అల్లాహ్.
అభిమాన సోదరులారా! కావున ఇంతటితో నేను నా మాటలను ముగిస్తూ, ఇన్షా అల్లాహ్ మరిన్ని విషయాలు వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. అప్పటివరకు సెలవు.
وَآخِرُ دَعْوَانَا أَنِ الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ (వ ఆఖిరు ద’వానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్) మా చివరి ప్రార్థన ఏమిటంటే, సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కే సర్వ స్తోత్రాలు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఈ ప్రసంగంలో షిర్క్ (బహుదైవారాధన) ఇస్లాంలో అత్యంత ఘోరమైన పాపం మరియు నేరం అనే అంశంపై దృష్టి సారించారు. సాధారణంగా ప్రజలు హత్య లేదా అత్యాచారం వంటి నేరాలను అతిపెద్దవిగా భావిస్తారని, కానీ ఖురాన్ మరియు హదీసుల ప్రకారం, అల్లాహ్‌కు భాగస్వాములను కల్పించడమే (షిర్క్) అన్నింటికన్నా పెద్ద పాపమని వక్తవివరిస్తారు. షిర్క్ యొక్క తీవ్రమైన పరిణామాలను, అంటే చేసిన మంచి పనులన్నీ వృధా కావడం, స్వర్గం నిషేధించబడటం మరియు నరకంలో శాశ్వత శిక్ష వంటి వాటిని ఖురాన్ ఆయతుల ద్వారా ఉటంకిస్తారు. ఇంకా, షిర్క్ రెండు రకాలుగా ఉంటుందని వివరిస్తారు: షిర్క్-ఎ-అక్బర్ (పెద్ద షిర్క్), ఇది ఇస్లాం నుండి బహిష్కరిస్తుంది, మరియు షిర్క్-ఎ-అస్గర్ (చిన్న షిర్క్). చిన్న షిర్క్‌లో అల్లాహ్ తప్ప ఇతరుల మీద ప్రమాణం చేయడం, తాయెత్తులు కట్టడం, మరియు రియా (ప్రదర్శన కోసం ఆరాధనలు చేయడం) వంటివి ఉంటాయని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీసుల ద్వారా తెలియజేస్తారు. ప్రతి ముస్లిం ఈ ఘోరమైన పాపం నుండి దూరంగా ఉండాలని, తన ఆరాధనలను కేవలం అల్లాహ్ ప్రసన్నత కోసమే చేయాలని వక్త ప్రబోధిస్తారు.
అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, అన్ని రకాల పూజలకు ఏకైక అర్హుడైన అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించు గాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించుగాక, ఆమీన్.
رَبِّ اشْرَحْ لِي صَدْرِي وَيَسِّرْ لِي أَمْرِي وَاحْلُلْ عُقْدَةً مِّن لِّسَانِي يَفْقَهُوا قَوْلِي [రబ్బిష్రహ్ లీ సద్రీ, వ యస్సిర్ లీ అమ్ రీ, వహ్ లుల్ ఉఖ్ దతమ్ మిల్ లిసానీ, యఫ్ ఖహూ ఖౌలీ] (ఓ నా ప్రభూ! నా హృదయాన్ని నా కొరకు విశాలపరచు. నా కార్యాన్ని నాకు సులభతరం చెయ్యి. నా నాలుకలోని ముడిని విప్పు. ప్రజలు నా మాటను సులభంగా అర్థం చేసుకునేటట్లు చెయ్యి.) (20:25-28)
షిర్క్ – ఒక పెద్ద నేరం
గౌరవనీయులైన ధార్మిక పండితులు, పెద్దలు మరియు ఇస్లామీయ సోదరులారా! ఈనాటి నా జుమా ప్రసంగ అంశం, షిర్క్ ఒక పెద్ద నేరం.
అభిమాన సోదరులారా, సాధారణంగా నేరాలన్నింటిలో పెద్ద నేరం ఏమిటి? పాపాలన్నింటిలో పెద్ద పాపం ఏమిటి? అని ప్రశ్నించినప్పుడు, ధర్మజ్ఞానము లేని వారు లేదా అంతంత మాత్రమే ధర్మజ్ఞానం ఉన్నవారు నేరాలన్నింటిలో పెద్ద నేరం అంటే, ప్రజల ప్రాణాలు హరించటం పెద్ద నేరం అని సమాధానం ఇస్తారు. మరి కొంతమంది అయితే అమ్మాయిలపై బలాత్కారాలు చేయటం, అత్యాచారాలు చేయటం పెద్ద నేరం అండి అని కొంతమంది సమాధానం ఇస్తారు. అలాగే మరికొంతమంది ప్రజల సొమ్ము దోచేయటం, లూటీలు చేయటం పెద్ద నేరం అండి అని ఈ విధంగా రకరకాల సమాధానాలు ఇస్తూ ఉంటారు.
నిజం ఏమిటంటే, ఇవన్నీ పెద్ద నేరాలే. కానీ వీటన్నింటికంటే కూడా ఒక పెద్ద నేరం ఉంది. అది బలాత్కారాలు చేయడం కంటే కూడా పెద్ద నేరము, లూటీలు దోపిడీలు చేయటం కంటే కూడా పెద్ద నేరము, ప్రజల ప్రాణాలు హరించటము కంటే కూడా పెద్ద నేరము. ఆ నేరం గురించి మాత్రము ఎక్కువ మందికి తెలియదు, చాలా తక్కువ మంది మాత్రమే ఆ దాని గురించి తెలుసుకొని ఉన్నారు. ఆ అంత పెద్ద నేరం ఏమిటి ఆ పెద్ద నేరం అంటే అభిమాన సోదరులారా, షిర్క్! బహుదైవారాధన. అల్లాహ్‌కు ఇతరులను సాటి కల్పించటం. ఇది పాపాలన్నింటిలో, నేరాలన్నింటిలో పెద్ద నేరము, పెద్ద పాపము.
అరే! అది అంత పెద్ద పాపం అని మీరు ఎలా చెప్పగలరండీ అని మీరు ప్రశ్నిస్తారేమో? ఇది నా మాట కాదు. నేను నా తరఫున ప్రకటిస్తున్న విషయము కాదు. అల్లాహ్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం షిర్క్ బహుదైవారాధన పెద్ద నేరము అని పాపాలన్నింటిలో నేరాలన్నింటిలో పెద్ద నేరము అని ప్రకటించి ఉన్నారు.
మనం చూసినట్లయితే, సూరా లుఖ్మాన్‌లోని 13వ వాక్యంలో ఈ విధంగా అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా తెలియజేసి ఉన్నాడు:
అలాగే ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి ఒక వ్యక్తి ఈ విధంగా ప్రశ్నించాడు. యా రసూలల్లాహ్, అయ్యు జంబి అక్బరు ఇందల్లాహ్? అల్లాహ్ దృష్టిలో పెద్ద నేరము ఏమిటి? అల్లాహ్ దృష్టిలో పెద్ద పాపము ఏమిటి? అని ఆ వ్యక్తి ప్రశ్నించగా, ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ వ్యక్తికి ఈ విధంగా సమాధానం ఇచ్చారు, అన్ తజ్ అల లిల్లాహి నిద్దన్ వహువ ఖలఖక. నీకు పుట్టించిన ప్రభువైన అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా తో ఇతరులను సాటి కల్పించడం, సహవర్తులుగా నిలబెట్టడం, ఇది నేరాలన్నింటిలో, పాపాలన్నింటిలో పెద్ద నేరము, పెద్ద పాపము అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ వ్యక్తికి సమాధానం ఇచ్చారు.
అలాగే మరొక సందర్భంలో శిష్యుల వద్ద ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా ప్రశ్నించారు. ఏమన్నారంటే, అలా ఉనబ్బిఉకుం బి అక్బరిల్ కబాయిర్? ఏమండీ నేను మీకు పాపాలలోనే పెద్ద పాపము, ఘోరాలలోనే పెద్ద ఘోరము, నేరాలలోనే పెద్ద నేరము దాని గురించి మీకు తెలుపనా అని తెలియజేశారు. శిష్యులు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో అన్నారు, బలా యా రసూలల్లాహ్. ఓ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, తప్పనిసరిగా దాని గురించి మాకు మీరు తెలియజేయండి అనగా, అప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మొదటిగా ప్రస్తావించిన విషయం ఏమిటంటే, అల్ ఇష్రాకు బిల్లాహ్. అల్లాహ్‌తో ఇతరులను సాటి కల్పించటం, అల్లాహ్‌కు సహవర్తులుగా ఇతరులను నిలబెట్టటం, ఇది పెద్ద పాపాలలోనే పెద్ద పాపము, పెద్ద నేరము అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ సందర్భంలో ప్రకటించారు.
అలాగే మరొక సందర్భంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనుచర సమాజానికి ఏడు ప్రాణాంతకమైన విషయాల గురించి హెచ్చరించి ఉన్నారు. ఆయన ఏమన్నారంటే, ఇజ్తనిబుస్ సబ్అల్ మూబిఖత్. ఏడు ప్రాణాంతకమైన విషయాల నుండి మీరు దూరంగా ఉండండి, మిమ్మల్ని మీరు కాపాడుకోండి అన్నారు. ఆ ఏడు విషయాలు ఏమిటంటే అందులోని మొదటి విషయం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అష్షిర్కు బిల్లాహ్. అల్లాహ్‌తో ఇతరులను సహవర్తులుగా నిలబెట్టడం, షిర్క్ చేయటం, ఇది ఏడు ప్రాణాంతకమైన పాపాలలో మొదటి పాపము అన్నారు.
అభిమాన సోదరులారా! అటు అల్లాహ్ వాక్యము ద్వారా, ఇటు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పలుకుల ద్వారా మనకు ఒక విషయం మాత్రము స్పష్టంగా అర్థమైపోయింది, అది ఏమిటంటే షిర్క్ చేయటం, బహుదైవారాధన చేయటం, అల్లాహ్‌తో ఇతరులను సాటి కల్పించటం, ఇది ఘోరమైన నేరం, పెద్ద పాపము అని స్పష్టమయ్యింది.
షిర్క్ యొక్క పరిణామాలు
ఇక రండి, ఈ షిర్క్ చేస్తే, ఈ పాపానికి ఎవరైనా ఒడిగడితే అతనికి జరిగే పరిణామం ఏమిటి? అతనికి జరిగే నష్టం ఏమిటి? అది కూడా మనము ఇన్షా అల్లాహ్ ఖురాన్ మరియు హదీసు గ్రంథాల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
షిర్క్ చేసే వ్యక్తికి కలిగే ఒక నష్టం ఏమిటంటే, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఆ వ్యక్తికి స్వర్గం నుండి దూరంగా ఉంచేస్తాడు. ఎవరైతే షిర్క్‌కు పాల్పడతారో వారి కోసము స్వర్గం నిషేధించబడుతుంది. వారి నివాసం నరకమైపోతుంది. మనం చూసినట్లయితే ఖురాన్‌లోని సూరా మాయిదా 72వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఈ విధంగా తెలియజేస్తున్నాడు:
అలాగే అభిమాన సోదరులారా, షిర్క్ చేసే వానికి కలిగే మరొక నష్టం ఏమిటంటే, అతని సత్కార్యాలు అన్నీ, అతని కర్మలన్నీ, అతని పుణ్యాలు అన్నీ తుడిచివేయబడతాయి. ఖురాన్‌లోని సూరా జుమర్ 65వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని హెచ్చరిస్తూ ఈ విధంగా తెలియజేస్తున్నాడు:
وَلَقَدْ أُوحِيَ إِلَيْكَ وَإِلَى الَّذِينَ مِن قَبْلِكَ لَئِنْ أَشْرَكْتَ لَيَحْبَطَنَّ عَمَلُكَ وَلَتَكُونَنَّ مِنَ الْخَاسِرِينَ (ఓ ప్రవక్తా!) నిశ్చయంగా నీ వద్దకు, నీ పూర్వీకులైన ప్రవక్తల వద్దకు పంపబడిన సందేశం (వహీ) ఇది : “ఒకవేళ నువ్వు గనక బహుదైవారాధనకు పాల్పడితే నువ్వు చేసుకున్నదంతా వృధా అయిపోతుంది. మరి నిశ్చయంగా నువ్వు నష్టపోయినవారిలో చేర్తావు.” (39:65)
అల్లాహు అక్బర్. స్వయంగా ప్రవక్తలలో గొప్ప ప్రవక్త, అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా తాకీదు చేస్తున్నాడు, ఒకవేళ నీవు గనుక షిర్క్‌కు పాల్పడినట్లయితే, నీ కర్మలన్నీ వృధా చేయబడతాయి అని అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఆయనకే, అంత గొప్ప వ్యక్తికే అంత గొప్ప మహా ప్రవక్తకే అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా తాకీదు చేస్తున్నాడంటే, మీలాంటి, నాలాంటి, మనలాంటి సామాన్యమైన ప్రజల పరిస్థితి ఏమిటి అభిమాన సోదరులారా ఒక్కసారి ఆలోచించండి.
కాబట్టి ఇదే విషయము ఖురాన్‌లోని సూరా అన్ఆమ్ 88వ వాక్యంలో మనం చూచినట్లయితే అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా అక్కడ కూడా ఇదే విషయాన్ని తెలియజేస్తున్నాడు:
ذَٰلِكَ هُدَى اللَّهِ يَهْدِي بِهِ مَن يَشَاءُ مِنْ عِبَادِهِ ۚ وَلَوْ أَشْرَكُوا لَحَبِطَ عَنْهُم مَّا كَانُوا يَعْمَلُونَ ఇదీ అల్లాహ్ మార్గదర్శకత్వం. ఆయన తన దాసులలో తాను కోరిన వారిని ఈ మార్గంపై నడిపింపజేస్తాడు. ఒకవేళ వీరు సైతం, దైవత్వంలో భాగస్వామ్యానికి (షిర్కుకు) ఒడిగట్టి ఉంటే, వారు చేసుకున్న కర్మలన్నీ కూడా వృధా అయిపోయేవి. (6:88)
ఇక్కడ అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా కొంతమంది ప్రవక్తల ప్రస్తావన చేసి చివరికి ఏమంటున్నారంటే, ఇలాంటి ప్రవక్తలు కూడా ఒకవేళ షిర్క్‌కు పాల్పడినట్లయితే, బహుదైవారాధనకు గురైనట్లయితే, అల్లాహ్‌తో ఇతరులను సాటి కల్పించినట్లయితే, వారి సత్కార్యాలన్నీ వృధా అయిపోతాయి అంటున్నాడు. కాబట్టి దీని ద్వారా మనకు ఒక విషయం మాత్రము స్పష్టమవుతుంది, అదేమిటంటే అభిమాన సోదరులారా, ఏ వ్యక్తి అయితే షిర్క్ చేస్తాడో, ఏ వ్యక్తి అయితే అల్లాహ్‌తో ఇతరులను సహవర్తులుగా, సాటిగా నిలబెడతాడో, అతని సత్కార్యాలు అన్నీ అతని కర్మలన్నీ వృధా చేయబడతాయి.
అలాగే అభిమాన సోదరులారా, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఒక్క విషయం మాత్రం చాలా స్పష్టంగా మనకు తెలియజేసి ఉన్నాడు. చాలా జాగ్రత్తగా ఆ విషయం మనము జీవితంలో ప్రతివేళ గుర్తు చేసుకుంటూ ఉండాలి. అదేమిటంటే సూరా నిసాలోని 48వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా స్పష్టంగా ఈ విషయాన్ని తెలియజేసి ఉన్నాడు:
إِنَّ اللَّهَ لَا يَغْفِرُ أَن يُشْرَكَ بِهِ وَيَغْفِرُ مَا دُونَ ذَٰلِكَ لِمَن يَشَاءُ తనకు భాగస్వామిగా మరొకరిని కల్పించటాన్ని (షిర్కును) అల్లాహ్ సుతరామూ క్షమించడు. ఇది తప్ప ఆయన తాను కోరిన వారి ఇతర పాపాలను క్షమిస్తాడు. (4:48)
అంటే తనకు భాగస్వామిగా మరొకరిని కల్పించటాన్ని షిర్క్‌ను అల్లాహ్ సుతరాము క్షమించడు. ఇది తప్ప ఆయన తాను కోరిన వారి ఇతర పాపాలను క్షమిస్తాడు. అంటే షిర్క్ తప్ప ఇతర పాపాలు మనిషి చేసి ఉంటే అల్లాహ్ తలిస్తే వాటిని క్షమించగలడేమో గానీ, షిర్క్‌ను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా క్షమించడు అని ఈ వాక్యంలో స్పష్టంగా మనకు తెలియజేసి ఉన్నాడు. కాబట్టి, అభిమాన సోదరులారా, షిర్క్ పెద్ద నేరము అని, షిర్క్ క్షమించరాని నేరము అని, షిర్క్ వల్ల మనిషి స్వర్గానికి దూరమైపోతాడు, నరకానికి చేరుకుంటాడని, అతని కర్మలన్నీ వృధా చేయబడతాయని ఇంతవరకు విన్న విషయాలలో మనము అర్థం చేసుకున్నాము.
షిర్క్ రకాలు
ఇక రండి, షిర్క్ గురించి మనం తెలుసుకోవాల్సిన మరొక విషయం ఉంది అదేమిటంటే, షిర్క్ రెండు రకాలు అభిమాన సోదరులారా. ఒకటి షిర్కె అక్బర్, రెండవది షిర్కె అస్గర్. షిర్కె అక్బర్ అంటే ఇప్పటివరకు మనం విన్నాము కదా, అల్లాహ్ దగ్గర చేయవలసిన కార్యాలు అల్లాహ్ వద్ద కాకుండా ఇతరుల వద్ద చేస్తే, అల్లాహ్‌కు ఇతరులను సాటి కల్పిస్తే అది షిర్కె అక్బర్ అవుతుంది. మరి షిర్కె అస్గర్ అంటే ఏమిటి? అభిమాన సోదరులారా, ఆ విషయము కూడా మనకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చాలా స్పష్టంగా తెలియజేసి ఉన్నారు.
షిర్కె అస్గర్ రెండు రకాలు. చిన్న షిర్క్ రెండు రకాలు. ఒకటి బహిర్గతంగా కనిపించే షిర్క్, రెండవది కనిపించకుండా రహస్యంగా ఉండే షిర్క్.
బహిర్గతంగా కనిపించే చిన్న షిర్క్ ఏమిటి అంటే అభిమాన సోదరులారా, ఒకటి అల్లాహ్‌ను కాకుండా ఇతరుల మీద ప్రమాణం చేయటం. అల్లాహ్‌ను వదిలేసి ఇతరుల మీద ప్రమాణం చేయటం. మనం చూస్తూ ఉంటాం, ఏదైనా సందర్భంలో ఏదైనా ఒక మాట స్పష్టంగా ప్రజలకు నమ్మ జెప్పాలంటే చాలామంది ఏమంటుంటారంటే, నా తల్లి మీద నేను ప్రమాణం చేస్తున్నాను, నా తల్లి సాక్షిగా, నా బిడ్డల మీద నేను ప్రమాణం చేస్తున్నాను, నా బిడ్డల సాక్షిగా, నేను నడుపుతున్న బండి మీద నేను ప్రమాణం చేస్తున్నాను, ఈ బండి సాక్షిగా అని రకరకాల విషయాల మీద వాళ్లు ప్రమాణం చేస్తూ ఉంటారు. అయితే అభిమాన సోదరులారా, ఇలా చేయటం ధర్మ సమ్మతము కాదు. ఒకవేళ మనిషికి ప్రమాణం చేయటం తప్పనిసరి అయితే అతను కేవలం అల్లాహ్ పేరు మీద మాత్రమే ప్రమాణం చేయాలే గానీ ఇతరుల పేరు మీద ప్రమాణం చేయకూడదు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ఒకవేళ ఎవరైనా అల్లాహ్ పేరు మీద కాకుండా ఇతరుల పేరు మీద ప్రమాణం చేస్తే ఆ వ్యక్తి కూడా షిర్క్ చేసినట్లు అవుతుంది, చిన్న షిర్క్‌కు పాల్పడినట్లు అవుతుంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పలుకులు వినండి, ఆయన తెలియజేశారు: మన్ హలఫ బిగైరిల్లాహి ఫఖద్ కఫర ఔ అష్రక. ఎవరైతే అల్లాహ్ కాకుండా ఇతరుల మీద ప్రమాణం చేస్తాడో అతను కుఫ్రుకు పాల్పడినట్లు లేదా షిర్క్‌కు పాల్పడినట్లు.
అలాగే అభిమాన సోదరులారా, చిన్న షిర్క్ యొక్క కనిపించే రెండో విషయం ఏమిటంటే, తాయెత్తులు వేలాడదీయటం. చాలామంది చేతుల్లో, మెడలలో, నడుము మీద, కాళ్ళ మీద తాయెత్తులు కట్టుకొని ఉంటారు. అభిమాన సోదరులారా, తాయెత్తులు కట్టటము కూడా ధర్మ సమ్మతము కాదు, నిషేధమైన కార్యము. ఎవరైనా వ్యక్తి తాయెత్తులు కట్టినట్లయితే అతను కూడా షిర్క్‌కు పాల్పడినట్లు అవుతుంది, అతను కూడా చిన్న షిర్క్ చేసినట్లు అవుతుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మన్ అల్లఖ తమీమతన్ ఫఖద్ అష్రక. ఎవరైతే తాయెత్తులు కట్టాడో అతను కూడా షిర్క్‌కు పాల్పడినట్లే.
ఇది చిన్న షిర్క్‌లో బహిర్గతంగా కనిపించే షిర్క్.
ఇక రండి అభిమాన సోదరులారా, చిన్న షిర్క్‌లో కనిపించకుండా రహస్యంగా ఉండే ఒక షిర్క్ ఉంది, అదేమిటంటే రియా అని తెలుగులో అంటారు, ప్రదర్శనా బుద్ధితో చేసే సత్కార్యాలు అని తెలుగులో అంటారు. ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, నేను ఎక్కువగా ఈ షిర్కె అస్గర్ గురించి భయపడుతూ ఉన్నాను అన్నారు. శిష్యులు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ప్రశ్నించారు, ఓ దైవ ప్రవక్త, ఈ చిన్న షిర్క్ అంటే ఏమిటండీ, దీని గురించి మీరు కంగారు పడుతున్నారు అని ప్రశ్నించగా అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఆయన పలుకులు వినండి, అఖ్వఫు మా అఖాఫు అలైకుం అష్షిర్కుల్ అస్గర్. ఖాలూ యా రసూలల్లాహ్ వమష్షిర్కుల్ అస్గర్? ఖాల అర్రియా. అంటే మీ విషయంలో నాకు అన్నిటికన్నా అధికంగా షిర్కె అస్గర్ చిన్న షిర్క్ గురించి భయమేస్తుంది. దైవ ప్రవక్త ఆ షిర్కె అస్గర్ అంటే ఏమిటి అని శిష్యులు అడిగినప్పుడు ఆయన అన్నారు, ప్రదర్శనా బుద్ధితో పని చేయటం.
అభిమాన సోదరులారా, ఒక వ్యక్తి నమాజు చేస్తున్నాడు, ఉపవాసాలు పాటిస్తున్నాడు, దానధర్మాలు చేస్తున్నాడు, జకాతు చెల్లిస్తున్నాడు, ఉమ్రా హజ్జులు ఆచరిస్తున్నాడు, అయితే అతను అల్లాహ్ ప్రసన్నత కోసం ఈ విషయాలన్నీ చేయట్లేదు గానీ ప్రజల దృష్టిలో నేను ఉత్తముడ్ని, భక్తుడ్ని అని నాకు పేరు ప్రతిష్టలు రావాలి అనే బుద్ధితో ఆ సంకల్పంతో అతను ఈ విషయాలు చేస్తే దీనినే రియా అంటారు, ప్రదర్శనా బుద్ధితో చేసిన సత్కార్యాలు అంటారు. ఇలా చేస్తే అభిమాన సోదరులారా, షిర్క్‌కు పాల్పడినట్లు అవుతుంది. ఎందుకంటే సత్కార్యాలు, ఆరాధనలు కేవలం అల్లాహ్ ప్రసన్నత కొరకు మాత్రమే చేయాలి గానీ ప్రదర్శనా బుద్ధితో చేయరాదు. ఎవరైనా ప్రదర్శనా బుద్ధితో చేస్తున్నట్టే అతను అల్లాహ్ ప్రసన్నత కోరుకోవట్లేదు గానీ ప్రజల ప్రసన్నత కోరుకుంటున్నాడు కాబట్టి అతను కూడా షిర్క్‌కు పాల్పడినట్లు అవుతుంది అభిమాన సోదరులారా.
అయితే మన బాధ్యత ఏమిటి? ఇప్పటివరకు మనం షిర్క్ గొప్ప షిర్క్ పెద్ద నేరమని తెలుసుకున్నాము. షిర్క్ రెండు రకాలు, షిర్క్ పెద్దది ఒకటి, చిన్నది ఒకటి అని తెలుసుకున్నాము. అలాగే పెద్ద షిర్క్‌కి, చిన్న షిర్క్‌కి ఉన్న తేడా ఏమిటో కూడా తెలుసుకోవాలి. అదేమిటంటే అభిమాన సోదరులారా, పెద్ద షిర్క్ చేసిన వారికి నరకశిక్ష విధించబడుతుంది, వారు స్వర్గం నుంచి దూరమైపోతారు, వారి సత్కార్యాలన్నీ వృధా చేయబడతాయి. అయితే చిన్న షిర్క్‌కు పాల్పడిన వారి సత్కార్యాలు మాత్రం వృధా చేయబడవు, వారికి అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా తాత్కాలిక శిక్షలు వేసి మళ్లీ శిక్షలు ముగిసిన తర్వాత స్వర్గానికి పంపించడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ప్రదర్శనా బుద్ధితో ఏ ఏ సత్కార్యాలు ఆరాధనలు వారు చేసి ఉంటారో కేవలం ఆ సత్కార్యాలు, ఆ ఆరాధనలు మాత్రమే వృధా చేయబడతాయి.
కాబట్టి అభిమాన సోదరులారా, ఒక భక్తునిగా మనందరి బాధ్యత ఏమిటంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము షిర్క్‌కి పాల్పడకూడదు. అందుకోసమే మనం చూచినట్లయితే గొప్ప గొప్ప భక్తులు ఎవరైతే గతించారో, వారు మరణించే ముందు వారి సంతానాన్ని పిలిచి షిర్క్‌కు పాల్పడవద్దు అని తాకీదు చేసి మరీ మరణించారు.
ఖురాన్‌లో లుక్మాన్ అలైహిస్సలాం వారి గురించి అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ప్రస్తావించి ఉన్నాడు. సూరా లుక్మాన్‌లో లుక్మాన్ అలైహిస్సలాం ఆయన కుమారుని పిలిచి ఏమంటున్నారంటే, “ఓ కుమారా, నీవు షిర్క్‌కు పాల్పడవద్దు. ఎందుకంటే షిర్క్ పెద్ద నేరము, ఘోరమైన పాపము కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నీవు షిర్క్‌కు పాల్పడవద్దు” అని తెలియజేశారు.
అదేవిధంగా ప్రవక్తలు, ఇతర గొప్ప గొప్ప భక్తులు వారి సంతానానికి, అనుచర సమాజానికి తెలియజేసిన విషయం ఏమిటంటే, ఎట్టి పరిస్థితుల్లో మీరు అల్లాహ్‌ను వదిలి ఇతరులను ఆరాధించకండి, అల్లాహ్‌కు ఇతరులను సహవర్తులుగా సాటిగా కల్పించకండి, మీకు నిలువునా చీల్చేసేసినా సరే, మీకు సజీవంగా దహనం చేసేసినా సరే మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బహుదైవారాధన, షిర్క్ చేయవద్దు, చేయవద్దు, చేయవద్దు అని తెలియజేసి ఉన్నారు.
కాబట్టి అభిమాన సోదరులారా, మనందరి బాధ్యత ఏమిటంటే మనం కేవలం అల్లాహ్‌నే ఆరాధించాలి, అల్లాహ్ మీదే నమ్మకం ఉంచాలి, ఆయన ప్రసన్నత కోసం మాత్రమే సత్కార్యాలు చేయాలి. అల్లాహ్‌తో నేను దుఆ చేస్తున్నాను, అల్లాహ్ మనందరికీ షిర్క్ నుండి కాపాడి, అల్లాహ్ ప్రసన్నత కోసం అల్లాహ్ ఆరాధనలు చేయడానికి మల్లా మనందరికీ భాగ్యము కల్పించు గాక.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
Telugu Islamic Quiz (తెలుగు ఇస్లామిక్ క్విజ్) – పార్ట్ 69
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
(1) “ఎవరు విశ్వసించి, వలసపోయారో, అల్లాహ్ మార్గంలో తమ ధనప్రాణాల ద్వారా పోరాడారో వారూ, వారికి ఆశ్రయమిచ్చి సహాయపడినవారూ – వారంతా ఒండొకరికి మిత్రులు” (8:72 ) దీనిలో ప్రఖ్యాతిగా ఎవరిని గూర్చి తెల్పబడింది?
A) అన్సారుల గూర్చి
B) ముహాజిర్ ల గూర్చి
C) ముహాజిర్ మరియు అన్సారుల గూర్చి
(2) భార్య – భర్తల మధ్య ప్రేమ పెరుగుటకు చేసే చేతబడిని ఏమంటారు?
A) అర్రుఖా
B) తివల
C) తమాయిమ్
(3) తావీజు వేసుకోవడం ఎలాంటి కార్యం అవుతుంది?
A) షిర్క్ (బహుదైవారాధన)
B) బిదాత్ (కల్పితాచారం)
C) పుణ్య కార్యం
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
7 వ అధ్యాయం కష్టం తొలగిపోవుటకు, లేక రాకుండా ఉండుటకు కడాలు, దారాలు, వాటి లాంటివి ధరించుట షిర్క్ [Wearing bracelets and cords etc., To remove Afflictions or to seek protection is a form of shirk] అల్ ఖవ్లుల్ సదీద్ షర్హ్ కితాబ్ అత్ తౌహీద్ – ఇమామ్ అస్-సాదీ The famous commentary of Shaykh as-Sa’di of the book Kitab at-Tawhid of Muhammad ibn Abdul Wahhab.
“ఒక వేళ అల్లాహ్ నాకేదైనా నష్టాన్ని కలిగించగోరితే, మీరు అల్లాహ్ ను కాదని వేడుకునే దేవతలు, ఆయన కలిగించే నష్టం నుండి నన్ను కాపాడగలరా?”(జుమర్ 39: 38).
ఇమ్రాన్ బిన్ హుసైన్ కథనం: ఒక వ్యక్తి చేతిలో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) రాగి కడం (bracelet) చూసి, “ఇది ఏమిటి?” అని అడిగారు. “వాహిన” [*] దూరము కావడానికి వేసుకున్నాను అని అతడు చెప్పాడు. అప్పుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) “దాన్ని తీసివేయి. అది నీ “వాహిన” పెరుగుటకే కారణమవుతుంది. ఒక వేళ అది నీవు ధరించి ఉన్నప్పుడు మరణించావంటే ఎన్నటికీ సాఫల్యం పొందవు” అని హెచ్చరించారు. (అహ్మద్).
[*] భుజములోని ఒక నరం ఉబ్బి రోగము వస్తుంది. అది దూరము కావడానికి వారు అలాంటివి వేసుకునేవారు
ఉఖ్బా బిన్ ఆమిర్ కథనం: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆదేశం: “తాయత్తు వేసుకున్నవారి ఉద్దేశాన్ని అల్లాహ్ పూర్తి చేయకుండుగాక. గవ్వ (సీపి) వేసుకున్న వానికి కూడా అల్లాహ్ స్వస్థత ప్రసాదించకుండా ఉండుగాక “. (అహ్మద్). మరో ఉల్లేఖనంలో ఉంది: “తాయత్తు వేసుకున్న వారు షిర్క్ చేయువారు“.
ఇబ్ను అబి హాతింలో ఉంది: హుజైఫా ఒక వ్యక్తి చేతిలో జ్వరం దూరం కావడానికి వేసుకున్న దారాన్ని చూసి తెంచారు. తరువాత ఈ ఆయతు చదివారు. “వారిలో చాలామంది అల్లాహ్ను విశ్వసిస్తూ కూడా ఆయనతో పాటు ఇతరులను భాగస్వాములుగా నిలబెడుతున్నారు.” (యూసూఫ్ 12 : 106).
2.”అతను అదే స్థితిలో చనిపోతే సఫలుడు కాడు” అన్న దానితో షిర్క్ అస్గర్ (చిన్న షిర్క్), కబీర గునాహ్ లో (ఘోర పాపాల్లో) పెద్దది అని తెలుస్తుంది.
3. తెలియక పోవడము ఒక సాకుగా పరిగణింపబడలేదు.
4. దాని వలన లాభం కలగదు. ప్రవక్త ఆదేశానుసారం: ‘దాని వలన “వహన్” ఇంకా పెరుగుతుంది.’
5. ఇలాంటి పని చేసిన వారిని కఠినంగా హెచ్చరించబడింది.
6. ఇలాంటివి వేసుకున్నవారు దాని వైపే అప్పగించబడుతారు.
7. తాయత్తు వేసుకున్న వారు షిర్క్ చేయువారు అని స్పష్టం అయింది.
8. జ్వరం దూరం కావడానికి దారం వేసుకొనుట కూడా ఇందులోనే పరిగణించబడుతుంది.
9. హుజైఫా పఠించిన ఆయతుతో తెలిసిందేమిటంటే; ప్రవక్త సహచరులు పెద్ద షిర్క్ ప్రస్తావించబడిన ఆయతులతో చిన్న షిర్క్ గురించి ప్రమాణంగా ప్రస్తావించేవారు. సూరె బఖర వాక్యంలో ఇబ్నె అబ్బాసు (రదియల్లాహు అన్హు) ఇలాగే తెలిపారు.
10. దిష్టి తగలకుండా గవ్వ (సీపి) వేసుకొనుట కూడా షిర్క్ అవుతుంది.
11. తాయత్తు వేసుకున్న వారిని, గవ్వ వేసుకున్న వారిని శపించబడింది. అంటే అల్లాహ్ వారిని తన సంరక్షణలో ఉంచడు.
తాత్పర్యం: (అల్లామా అల్ సాదీ) :
నష్టం, కష్టం దూరం కావడానికి, లేక రాకుండా ఉండడానికి ఉపయోగించే సాధనాల (జరియ, అస్బాబ్)లో ఏవి యోగ్యం, ఏవి నిషేధం తెలుసుకొనటానికి, సాధనాల (జరీయ, అస్బాబ్)కు సంబంధించిన ఆదేశాల్ని తెలుసుకొనుట ఎంతయినా అవసరం. ఇందులో మూడు విషయాల్ని తెలుసుకొనుట చాలా ముఖ్యం.
1. ధార్మికంగా లేక శాస్త్రీయంగా లాభకరమయిన సాధనం అని రుజువైన వాటినే సాధనంగా ఉపయోగించాలి.
2. వాటిని ఉపయోగించే వ్యక్తి ఆధారం, భరోసా వాటిపై ఉండ కూడదు. వాటిని సాధనంగా చేసిన అల్లాహ్ పై నమ్మకం ఉండాలి.
3. సాధనాలు ఎంత గొప్పవి, శక్తి గలవైనా అల్లాహ్ వ్రాసి ఉంచిన విధి, (తఖ్ దీర్)కి అవి లోబడి ఉంటాయి. దానిని తప్పించుకోలేవు. అల్లాహ్ తాను కోరినట్లు వాటిలో మార్పు చేస్తాడు. అల్లాహ్ కోరితే అందులోని గుణాన్ని అలాగే ఉంచుతాడు. ఆయన దాసులు వాటిని తెలుసుకొని, ఉపయోగించి వాటిలో ఉన్నటువంటి అల్లాహ్ తత్వాన్ని గమనించగలరనీ. అతను కోరితే అందులోని గుణాన్ని మార్చనూవచ్చు. ఇలా దాసులు వాటిపైనే నమ్మకం ఉంచకూడదనీ, అల్లాహ్ శక్తిని అర్థం చేసుకోగలరనీ. మార్పు చేయు సర్వశక్తి, సర్వ ఇష్టం ఒకే ఒక్క అల్లాహ్ కు మాత్రమే ఉంది.
పై ముఖ్య విషయం తెలుసుకున్న తరువాత, ఇక వచ్చిన కష్టం తొలగడానికి, లేక కష్టం రాకుండా జాగ్రత్త పడడానికి దారం లేక కడం లాంటివి వేసుకున్న వాడు షిర్క్ చేసినట్లే కదా? ఎలా అనగా; అది కష్టం రాకుండా, లేక వచ్చిన తరువాత కాపాడునది అని విశ్వసిస్తే ఇది పెద్ద షిర్క్ అవుతుంది. అతడు అల్లాహ్ను గాక ఇతరులను స్వస్థత ఇచ్చేవాడుగా నమ్మినందుకు ఇది రుబూబియత్ కు సంబంధించిన షిర్క్. ఇంకా అతడు అందులో స్వస్థత ఉంది అని దానిపై భరోసా, నమ్మకం, ఆశ ఉంచినందుకు, ఇది ఉలూహియత్ కు సంబంధించిన షిర్క్ అవుతుంది.
ఒక వేళ అతడు అల్లాహ్ యే కష్టనష్టాలు రాకుండా, లేక వచ్చిన తరువాత కాపాడువాడు అని విశ్వసించి, అవి కేవలం సాధనం అని నమ్మినవాడు, ధార్మికంగా, శాస్త్రీయంగా సాధనం లేని దానిని సాధనంగా నమ్మినవాడవుతాడు. ఇది నిషిద్ధం (హరాం). మరియు ఇస్లాం పై, వైద్య శాస్త్రంపై ఒక అబద్దం మోపినవాడవుతాడు. ఎలా అనగా; ఇస్లామీయ ధర్మం దీనిని చాలా కఠినంగా నివారించింది. అది నివారించినవి లాభాన్నిచ్చేవి కావు. శాస్త్రీయంగా కూడా ఇవి ఆమోదం పొందినవి కావు. లాభం చేకూర్చే ఔషదాల్లో లెక్కించబడవు.
అందుకే ఇవి షిర్క్ వైపునకు లాక్కొని వెళ్ళే సాధనాలు. వాటిని వేసుకున్న వాని మనుస్సు వాటిపై లగ్నం అయి ఉంటుంది. అందుకే అది షిర్క్ భాగాల్లో ఒక భాగం. లేక సాధనాల్లో ఒక సాధనం.
ఇది ధార్మికంగా, శాస్త్రీయంగా సాధనం కాదని తెలిసినప్పుడు, విశ్వాసుడు తన విశ్వాసం సంపూర్ణమగుటకు దానిని వదిలి వేయాలి. అతని తౌహీద్ సంపూర్ణం అయిందంటే నివారించబడిన వాటిపై అతని మనుస్సు లగ్నం కాదు. లాభం లేని వాటిపై మనుస్సు లగ్నం కావడం బుద్ధిహీనతకు నిదర్శనం. ఎలా అనగా మనిషి తనకు లాభం లేని వాటిని ఉపయోగించడు. అందులో నష్టమే ఉంది.
ఈ సత్య ధర్మం యొక్క పునాది: “ప్రజల నుండి విగ్రహారాధనను, సృష్టి రాసుల పైనుండి నమ్మకాన్ని దూరము చేసి, వారి ధర్మాన్ని దురాచారాల, దుష్చేష్టల నుండి దూరం చేసి వారి బుద్ధి జ్ఞానాలను సంపూర్ణం చేయుట. బుద్ధిని అభివృద్ధి పరిచే, ఆత్మలను పరిశుద్ధపరిచే, ధార్మిక, ప్రాపంచిక స్థితిగతులను సంస్కరించే లాభదాయకమయిన విషయాల గురించి కృషి చేయుట.”
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్) ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
You must be logged in to post a comment.