దైవభీతితో కన్నీరు పెట్టడం – సలీం జామి’ఈ [ఆడియో & టెక్స్ట్]

దైవ భీతితో కన్నీరు పెట్టడం (The Excellence Of Weeping Out Of The Fear Of Allah)
వక్త: ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)
https://youtu.be/NNoAU3lUlAs [26 నిముషాలు]

ఈ ప్రసంగంలో, దైవ భీతితో కన్నీరు కార్చడం అనే అంశంపై లోతైన వివరణ ఇవ్వబడింది. మానవునికి అల్లాహ్ నవ్వు మరియు ఏడుపు రెండింటినీ ప్రసాదించాడని ఖురాన్ ఆయతుతో ప్రసంగం ప్రారంభమవుతుంది. మానసిక నిపుణుల ప్రకారం, శారీరక గాయం, ప్రియమైనవారిని కోల్పోవడం, ఆనందం, మోసం మరియు డబ్బు కోసం వంటి వివిధ కారణాల వల్ల మానవులు ఏడుస్తారని వివరించబడింది. అయితే, అసలు ప్రాముఖ్యత దైవ భీతితో కార్చే కన్నీరుకే ఉందని స్పష్టం చేయబడింది. అల్లాహ్ భయంతో ఏడ్చే వ్యక్తి నరకంలోకి ప్రవేశించడం అసాధ్యమని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీసులను ఉటంకించారు. తీర్పు దినాన అల్లాహ్ సింహాసనం నీడలో చోటు పొందే ఏడు రకాల వ్యక్తులలో, ఏకాంతంలో అల్లాహ్ ను స్మరించుకుని కన్నీరు కార్చే వ్యక్తి కూడా ఒకరని చెప్పబడింది. అల్లాహ్ భయంతో కన్నీరు కార్చిన కళ్ళను నరకాగ్ని తాకదని, ఆ కన్నీటి చుక్క అల్లాహ్ కు అత్యంత ప్రియమైనదని వివరించబడింది. దైవదూతలు (మీకాయీల్ అలైహిస్సలాం), ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మరియు సహాబాల (ఉస్మాన్, ముఆద్, హసన్, అబూ హురైరా రదియల్లాహు అన్హుమ్) జీవితాల నుండి దైవ భీతితో వారు ఏ విధంగా కన్నీరు కార్చేవారో ఉదాహరణలతో వివరించబడింది. మన హృదయాలు కఠినంగా మారిపోయాయని, మరణాన్ని, సమాధిని స్మరించుకుంటూ, అనారోగ్యులను మరియు స్మశానాలను సందర్శిస్తూ, మన హృదయాలను మృదువుగా చేసుకుని అల్లాహ్ భయంతో కన్నీరు కార్చాలని ప్రసంగం ముగుస్తుంది.

ప్రశంసలన్నీ, పొగడ్తలన్నీ సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పరలోక దినానికి యజమాని అయిన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించు గాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై ఎల్లవేళలా వర్షించు గాక. ఆమీన్.

గౌరవనీయులైన ధార్మిక పండితులు, పెద్దలు మరియు అభిమాన సోదరులారా! ఈనాటి జుమా ప్రసంగంలో దైవ భీతితో కన్నీరు పెట్టడం అనే అంశంపై ఇన్షా అల్లాహ్ కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

అభిమాన సోదరులారా, మానవున్ని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సృష్టించాడు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇచ్చిన ఈ శరీరం ఒక హార్డ్వేర్ (hardware) అయితే, ఈ శరీరం లోపల అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనిషికి కొన్ని సాఫ్ట్వేర్ (software) లాంటి విషయాలను కూడా అమర్చాడు. మనం చూచినట్లయితే ఈ శరీరం కలిగిన మనిషికి బాధ కలుగుతుంది. ఈ శరీరం కలిగి ఉన్న మనిషికి సంతోషం కూడా కలుగుతుంది. మనిషికి ఆకలి వేస్తుంది, మనిషికి దాహం వేస్తుంది, మనిషి నవ్వుతాడు, మనిషి ఏడుస్తాడు. ఈ విధంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ శరీరంలో ఎన్నో విషయాలను పొందుపరిచి ఉన్నాడు. ఈరోజు మనం దైవ భీతితో మనిషి కన్నీరు కారుస్తాడు కదా, దాని గురించి ఇన్షా అల్లాహ్ తెలుసుకుందాం.

వాస్తవానికి మనం చూచినట్లయితే మనిషికి నవ్వించడం నేర్పించింది అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా. అలాగే మనిషికి బాధపడి కన్నీరు పెట్టడం నేర్పించింది కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాయే. ఖురాన్ లో మనం చూచినట్లయితే, సూర నజ్మ్ 43వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ విధంగా తెలియజేశాడు:

وَأَنَّهُ هُوَ أَضْحَكَ وَأَبْكَىٰ
(వ అన్నహూ హువ అద్’హక వ అబ్కా)
మరి ఆయనే నవ్విస్తున్నాడు, ఆయనే ఏడిపిస్తున్నాడు. (53:43)

అభిమాన సోదరులారా, మానసిక వైద్య నిపుణులు కొన్ని విషయాలు తెలియజేశారు. అవేమిటంటే, మనిషి ఎన్నో కారణాల వల్ల బాధపడి కన్నీరు కారుస్తాడంట. మనిషి కన్నీరు కార్చడానికి చాలా కారణాలు ఉన్నాయి అని మానసిక వైద్య నిపుణులు తెలియజేశారు. ఒక కారణం ఏమిటంటే, మనిషికి ఏదైనా గాయమైతే, ఆ బాధను ఓర్వలేక అతను కన్నీరు కారుస్తాడంట. అలాగే మనిషి ఎవరైనా దూరమైపోతుంటే, ఎవరినైతే అతను అభిమానించాడో, ప్రేమించాడో, వారు దూరమైపోతుంటే ఆ బాధ వల్ల కూడా మనిషి కన్నీరు కారుస్తాడట.

అలాగే, మనిషికి అనుకోకుండా ఒక పెద్ద సంతోషం కలిగితే, అప్పుడు కూడా పట్టరాని సంతోషంలో మనిషి కళ్ళ నుంచి కన్నీళ్లు కారుతాయంట. దానినే మనము ఆనంద భాష్పాలని కూడా అంటూ ఉంటాం. అలాగే అభిమాన సోదరులారా, కొంతమంది ఇతరులను మోసం చేయడానికి కూడా కన్నీరు కారుస్తారు. ముసలి కన్నీరు అని మనము అప్పుడప్పుడు సామెత పలుకుతూ ఉంటాం.

అలాగే, కొంతమంది అయితే డబ్బు తీసుకుని మరీ ఏడుస్తారట, కన్నీరు కారుస్తారట. దానిని ఇస్లామీయ పరిభాషలో నౌహా (శోకం) చేయడం అంటారు, మాతం చేయడం అంటారు. ఎవరైనా ఒక వ్యక్తి మరణించినచో, ఆ వ్యక్తి శవం వద్ద ఏడవడానికి కూలీ మీద కొంతమంది వచ్చి ఏడుస్తారు. ఇది ఇస్లాంలో నిషేధం. మనిషి మరణించిన తర్వాత అతని బంధువులైనా సరే, ఇతర వ్యక్తులైనా సరే అతని వద్ద వచ్చి నౌహా చేయడం, బిగ్గరగా కేకలు పెడుతూ ఏడ్చడం ఇస్లాంలో నిషేధం చేయబడింది.

అలాగే, దైవ భీతితో కూడా మనిషి కన్నీరు కారుస్తాడట. రండి ఇన్షా అల్లాహ్, ఈనాటి జుమా ప్రసంగంలో ఈ అంశం మీదే ఇన్షా అల్లాహ్ ఖురాన్ మరియు హదీసుల వెలుగులో మరియు సహాబాల జీవితాలకి సంబంధించిన విషయాలతో తెలిసిన కొన్ని విషయాలు తెలుసుకుందాం.

అభిమాన సోదరులారా! ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా తెలియజేశారు.

لَا يَلِجُ النَّارَ رَجُلٌ بَكَى مِنْ خَشْيَةِ اللَّهِ حَتَّى يَعُودَ اللَّبَنُ فِي الضَّرْعِ
“లా యలిజున్నార రజులున్ బకా మిన్ ఖశియతిల్లాహి హత్తా యఊదల్లబను ఫిద్దర్రా”
దీని అర్థం ఏమిటంటే “జంతువు పొదుగు నుండి పాలు పిండేసిన తర్వాత ఆ పాలు మళ్లీ ఆ జంతువు పొదుగులోకి తిరిగి వెళ్లిపోవడం ఎలాగైతే అసంభవమో దైవభీతితో కన్నీరు కార్చిన వ్యక్తి కూడా నరకంలో వెళ్లటం అసంభవం” అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు.

అల్లాహు అక్బర్ (ٱللَّٰهُ أَكْبَرُ)! దైవ భీతితో మానవుడు, భక్తుడు ఒక్కసారి ప్రపంచంలో కన్నీరు పెడితే ఆ వ్యక్తి నరకంలో వెళ్లడం, ఆ వ్యక్తి నరక ప్రవేశం చేయడం అసంభవం అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు అభిమాన సోదరులారా!

మరొక ఉల్లేఖనంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏడు మంది అదృష్టవంతుల గురించి తెలియజేశారు. రేపు పరలోకంలో లెక్కింపు రోజున సూర్యుడు చాలా సమీపంలో ఉంటాడు. ఆ రోజు ఎలాంటి నీడ ఉండదు. కేవలం అల్లాహ్ యొక్క సింహాసనం, అర్ష్ యొక్క నీడ మాత్రమే ఉంటుంది. ఆ రోజు ప్రజలు వేడికి తపిస్తూ అల్లాడుతూ ఉంటారు. ఆ రోజు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తన సింహాసనం యొక్క నీడలోకి ఏడు రకాల మనుషులను తీసుకుంటాడు. ఆ ఏడు రకాల మనుషులలో ఒక రకమైన మనిషి ఎవడంటే

(وَرَجُلٌ ذَكَرَ اللَّهَ خَالِيًا فَفَاضَتْ عَيْنَاهُ).
“వరజులున్ జకరల్లాహ ఖాలియన్ ఫఫాదత్ ఐనాహు”

ఏకాంతంలో ఉన్నప్పుడు భక్తుడు, మానవుడు అల్లాహ్ ను తలుచుకొని అల్లాహ్ ను గుర్తు చేసుకొని కన్నీరు కార్చితే అలాంటి భక్తునికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా రేపు పరలోకంలో లెక్కింపు రోజున ఆ మహ్షర్ మైదానంలో తన సింహాసనం నీడలోకి తీసుకుంటాడట.

మరో ఉల్లేఖనంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు. “రెండు రకాల కళ్లు ఉన్నాయి. ఆ రెండు రకాల కళ్లు ఎప్పటికీ నరకాగ్నిని చూడవు. నరకాగ్ని ఆ కళ్లకు కాల్చదు అన్నారు“. ఎవరు ఆ రెండు రకాల కళ్లు? నరకాగ్నిని చూడవట. నరకాగ్ని ఆ కళ్లను కాల్చదట. ఎవరు ఆ రెండు రకాల కళ్లు అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు,

(عَيْنٌ بَكَتْ مِنْ خَشْيَةِ اللهِ، وَعَيْنٌ بَاتَتْ تَحْرُسُ فِي سَبِيلِ اللهِ).
“ఐనన్ బకత్ మిన్ ఖశియతిల్లాహ్ వ ఐనున్ బాతత్ తహ్రుసు ఫీ సబీలిల్లాహ్”

ఒక రకమైన కళ్లు ఎవరివి అంటే ఏ వ్యక్తి అయితే అల్లాహ్ ను తలుచుకొని కన్నీరు పెట్టాడో ఆ వ్యక్తి కళ్లకి నరకము తాకదు. నరకాగ్ని ఆ కళ్లకు ముట్టుకోదు. అలాగే పూర్వం యుద్ధాలు జరిగేవి. ఆ యుద్ధాలు జరిగే సమయంలో రాత్రి పూట యుద్ధం ముగిసిన తరువాత సైనికులందరూ పడుకుని ఉంటే ఆ సైనికులకి కొంతమంది వ్యక్తులు కాపలా కాసేవారు. వాళ్ల ప్రాణానికి రక్షణగా వాళ్లు రాత్రి మొత్తం జాగారము చేసి కాపలా కాసేవారు. అలా దైవ మార్గంలో రాత్రి మొత్తం జాగారం చేసి కాపలా కాసిన ఆ కళ్లకు కూడా రేపు నరకపు అగ్ని ముట్టుకోదు, నరకము ఆ కళ్లకు కాల్చదు అన్నారు.

రండి అభిమాన సోదరులారా, మరొక ఉల్లేఖనంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎంత మంచి మాట చెప్పి ఉన్నారో చూడండి. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకి రెండు రకాల చుక్కలు చాలా ప్రియమైనవి అట. అలాగే రెండు గుర్తులు కూడా అల్లాహ్ కు చాలా ఇష్టమైనవి అట. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు,

“రెండు చుక్కలు అల్లాహ్ కు చాలా ప్రియమైనవి.” ఒక చుక్క ఏమిటంటే, “అల్లాహ్ ను తలచుకుని భక్తుడు ఎప్పుడైతే కళ్ళ నుంచి కన్నీరు కారుస్తాడో, ఆ కన్నీటి చుక్క అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు చాలా ప్రియమైనది.” అలాగే, “దైవ ధర్మ రక్షణ కొరకు ఎప్పుడైతే మానవుడు వెళ్లి శత్రువుని ఎదుర్కొంటాడో, ఆ ఎదుర్కొనే సమయంలో అతని శరీరానికి గాయమై, అతని శరీరం నుండి రక్తపు చుక్క కారుతుంది కదండీ, ఆ చుక్క కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు చాలా ప్రియమైనది.”

ఇక రెండు గుర్తుల గురించి కూడా తెలియజేశారు. “రెండు రకాల గుర్తులు అల్లాహ్ కు చాలా ప్రియమైనవి. అవేమిటంటే, ఒక గుర్తు, “అల్లాహ్ ధర్మ రక్షణ కొరకు పోరాటం చేస్తున్నప్పుడు అతని శరీరానికి ఎక్కడైనా గాయం అవుతుంది. ఆ గాయం మానిన తర్వాత అక్కడ అలాగే గుర్తు పడిపోతుంది. ఆ గుర్తు అల్లాహ్ కు చాలా ఇష్టమైనది.” రెండవ గుర్తు ఏమిటంటే, “అల్లాహ్ విధించిన ఒక విధిని పాటిస్తూ ఉన్నప్పుడు అతని శరీరం మీద గుర్తు పడిపోతుంది. ఆ గుర్తు కూడా అల్లాహ్ కు చాలా ప్రియమైనది.”

దీనికి ఉదాహరణగా మనం చూచినట్లయితే, ఒక వ్యక్తి నమాజ్ ఆచరిస్తూ ఉంటాడు. నమాజ్ చేయడం విధి, తప్పనిసరి. అల్లాహ్ తరపు నుంచి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రతీ ముస్లిం మీద నమాజ్ చేయడం తప్పనిసరి చేశాడు, విధి చేశాడు. మరి ఒక ముస్లిం, ఒక దైవ భక్తుడు నమాజ్ ఆచరిస్తూ ఉంటే, అతని నుదుట మీద గుర్తు పడిపోతుంది, అతని మోకాళ్ళ మీద గుర్తు పడిపోతాది. ఇలా దైవం విధించిన ఒక విధిని ఆచరిస్తున్నప్పుడు అతని శరీరం మీద ఏదైనా గుర్తు పడిపోయిందంటే, ఆ గుర్తు అల్లాహ్ కు చాలా ఇష్టమైనది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు.

అలాగే రండి అభిమాన సోదరులారా! అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమర్ రదియల్లాహు అన్హు వారు ఏమనేవారంటే “ల అన్ అద్మఅ మిన్ ఖష్యతిల్లాహ్ అహబ్బు ఇలయ్య మిన్ అన్ అతసద్దక బి అల్ఫి దీనార్” (لَأَنْ أَدْمَعَ مِنْ خَشْيَةِ اللَّهِ أَحَبُّ إِلَيَّ مِنْ أَنْ أَتَصَدَّقَ بِأَلْفِ دِينَارٍ). అల్ఫి దీనార్ అంటే మనందరికీ తెలుసు. వెయ్యి దీనార్లు. అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమర్ రదియల్లాహు అన్హు వారు తెలియజేస్తున్నారు. “నేను అల్లాహ్ మార్గంలో వెయ్యి దీనార్లు దానం చేయడము కంటే కూడా అల్లాహ్ ను తలుచుకొని ఒక్కసారి కన్నీరు పెట్టడం నాకు చాలా ప్రియమైనది, ఇష్టమైనది” అన్నారు. అంటే నేను అల్లాహ్ ను తలుచుకొని ఏడవటం, అల్లాహ్ ను తలుచుకొని కన్నీరు కార్చడం దైవమార్గంలో వెయ్యి దీనార్లు ఖర్చు చేయటం కంటే నాకు ఇష్టం అన్నారు.

ఇక రండి అభిమాన సోదరులారా, అల్లాహ్ ను తలచుకుని, అల్లాహ్ భీతితో ప్రవక్తలు ఏ విధంగా కన్నీరు కార్చేవారో, దూతలు ఏ విధంగా వణికిపోయేవారో, దైవ భక్తులు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి శిష్యులు ఏ విధంగా కన్నీరు పెట్టేవారో, అవి కూడా ఇన్షా అల్లాహ్ కొన్ని ఉదాహరణల ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ముందుగా దైవ దూతల గురించి తెలుసుకుందాం. ఒకసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జిబ్రయీల్ అలైహిస్సలాం వారితో మీకాయీల్ అలైహిస్సలాం వారి గురించి ప్రశ్నించారు. మీకాయీల్ అలైహిస్సలాం నలుగురు పెద్ద దైవ దూతలలో ఒక దైవదూత. ఆ దైవదూత గురించి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జిబ్రయీల్ అలైహిస్సలాం వారిని ప్రశ్నించారు. ఏమని ప్రశ్నించారంటే “మాలి లా అరా మీకాయీల దాహికన్ ఖత్తూ?” (مَا لِي لَا أَرَى مِيكَائِيلَ ضَاحِكًا قَطُّ؟). ఓ జిబ్రయీల్ అలైహిస్సలాం! ఏమిటండి నేను ఎప్పుడూ కూడా మీకాయీల్ని చిరునవ్వు నవ్వుతూ కూడా నేను చూడలేదు. ఆయన ఒక్కసారి కూడా నాకు చిరునవ్వు నవ్వుతూ కనిపించట్లేదు. ఎందుకలా అని అడిగాను. అప్పుడు జిబ్రయీల్ అలైహిస్సలాం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తెలియజేశారు “మా దహిక మీకాయీలు ముంజు ఖులికతిన్నార్” (مَا ضَحِكَ مِيكَائِيلُ مُنْذُ خُلِقَتِ النَّارُ). ఓ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం! అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా నరకాన్ని సృష్టించిన తర్వాత నుంచి మీకాయీల్ అలైహిస్సలాం ఒక్కసారి కూడా నవ్వలేదు అన్నారు.అభిమాన సోదరులారా, దైవదూతలు ఒక్క తప్పు కూడా వారితో దొర్లదు. అయినా గానీ నరకం సృష్టించబడిన తర్వాత వాళ్ళు నవ్వడమే మానేశారు.

అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మెరాజ్ యాత్రలో ఎప్పుడైతే అల్లాహ్ ను కలిసి మాట్లాడటానికి వెళ్లారో ఆ రోజు జిబ్రయీల్ అలైహిస్సలాం వారిని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చూశారు. ఆయన గురించి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, “వ జిబ్రయీలు కల్ హిల్సిల్ బాలి మిన్ ఖశియతిల్లాహ్” (وَجِبْرِيلُ كَالْحِلْسِ الْبَالِي مِنْ خَشْيَةِ اللَّهِ). మెరాజ్ యాత్రలో నేను చూశాను. దూతలకు రారాజు, దూతల నాయకుడు జిబ్రయీల్ అలైహిస్సలాం మలయే ఆలాలో పరుపులాగా అల్లాహ్ కు భయపడి నేలకు ఆనిపోయారు. అభిమాన సోదరులారా! దూతల నాయకుడు అల్లాహ్ ను తలుచుకొని, అల్లాహ్ భక్తితో, అల్లాహ్ భీతితో నేల మీద పరుపు లాగా పడిపోయి ఉన్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కళ్లారా వారిని చూశారు.

ఇక రండి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి కూడా తెలుసుకుందాం. అభిమాన సోదరులారా! ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒకరోజు నమాజు చేయడానికి నిలబడ్డారు. నమాజు చదువుతున్నారు. నమాజులోనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కన్నీరు కార్చడం మొదలెట్టేశారు. ఎంతగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దైవభీతితో కన్నీరు కారుస్తున్నారంటే చూసిన వాళ్లు ఆయన గురించి చెప్పారు, “వలి జౌఫిహీ అజీజున్ క అజీజిల్ మిర్జలి మినల్ బుకా'” (وَلِجَوْفِهِ أَزِيزٌ كَأَزِيزِ الْمِرْجَلِ مِنَ الْبُكَاءِ). ఎలాగైతే పొయ్యి మీద పెట్టిన ఒక కుండలో నీళ్లు బాగా వేడెక్కిన తర్వాత ఖత్ ఖత్ ఖత్ అని ఎలా శబ్దం వస్తుందో ఆ విధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నమాజుకు నిలబడి అల్లాహ్ ను తలుచుకొని లోలోపలే కన్నీరు కారుస్తున్నారు, బాధపడి ఏడుస్తున్నారు అభిమాన సోదరులారా!

అలాగే ఆయిషా రదియల్లాహు తాలా అన్హా వారు తెలియజేశారు. ఒక రోజు రాత్రి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నమాజు కోసం నిలబడ్డారు. నమాజులో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏడవటం మొదలెట్టారు. ఎంతగా ఏడ్చారంటే వారి గడ్డం తడిసిపోయింది. అయినా ఏడుపు ఆపట్లేదు. మళ్లీ ఏడుస్తున్నారు. ఆయన తొడిగిన బట్టలు కూడా నానిపోయాయి. అయినా ఏడుపు ఆపట్లేదు. ఏడుస్తూనే ఉన్నారు. ఎక్కడైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నమాజు చేస్తున్నారో ఆ భూమి కూడా తడిసిపోయింది. ఫజర్ అజాన్ ఇచ్చే సమయం వచ్చేసింది. బిలాల్ రదియల్లాహు అన్హు మస్జిద్లో అజాన్ ఇవ్వటానికి వచ్చి చూస్తే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏడుస్తున్నారు. అది చూసిన బిలాల్ రదియల్లాహు అన్హు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంతో అన్నారు, “ఓ దైవ ప్రవక్తా, అల్లాహ్ మీ పాపాలన్నింటినీ మన్నించేశాడు కదా? అయినా కూడా మీరు ఈ విధంగా ఏడవడం ఏంటి?” అని అడిగితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, “అఫలా అకూను అబ్దన్ శకూరా?” (أَفَلَا أَكُونُ عَبْدًا شَكُورًا؟). నేను దైవానికి కృతజ్ఞుడు చేసి తెలుసుకునే భక్తుని కావద్దా? అందుకోసమే దైవానికి కృతజ్ఞత, కృతజ్ఞతలు తెలుపుకునే భక్తుడు అవ్వటానికి ఏడుస్తున్నాను అన్నారు.

అభిమాన సోదరులారా! మన పరిస్థితి ఏమిటి? దైవదూతలు ఏడుస్తున్నారు. దూతల నాయకుడు జిబ్రయీల్ అలైహిస్సలాం వారు ఏడుస్తున్నారు. దైవప్రవక్తలు ఏడుస్తున్నారు. దైవ ప్రవక్తల నాయకుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కన్నీరు కారుస్తున్నారు. మన పరిస్థితి ఏమిటి అభిమాన సోదరులారా?

ఇక రండి. మరొక సందర్భంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం రెండు చేతులు ఎత్తి ఏడవడం ప్రారంభిస్తే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వెంటనే జిబ్రయీల్ అలైహిస్సలాం వారిని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు పంపించేశారు. జిబ్రయీల్ అలైహిస్సలాం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి ఓ దైవప్రవక్త మీరు కన్నీరు కారుస్తున్నారు, ఏడుస్తున్నారు. కారణం ఏమిటి? అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా నన్ను మీ వద్దకు పంపించాడు చెప్పండి అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసిన విషయం ఏమిటో తెలుసా అభిమాన సోదరులారా? ఎంత అదృష్టవంతులమో మనము ఒకసారి ఆలోచించండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి జిబ్రయీల్ అలైహిస్సలాం వారు వచ్చి మీరు ఎందుకు ఏడుస్తున్నారు అంటే ఆయన ఇచ్చిన సమాధానం ఏమిటంటే “అల్లాహుమ్మ ఉమ్మతీ, ఉమ్మతీ!” (اللَّهُمَّ أُمَّتِي أُمَّتِي!). ఓ అల్లాహ్! నా అనుచర సమాజాన్ని తలుచుకొని ఏడుస్తున్నాను. నా అనుచర సమాజం ఏమైపోతుందో అని తలుచుకొని ఏడుస్తున్నాను అన్నారు. అప్పుడు జిబ్రయీల్ అలైహిస్సలాం మళ్లీ అల్లాహ్ సన్నిధికి వెళ్లి తెలియజేయగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి శుభవార్త అందజేశాడు. అదేమిటంటే “ఇన్నా సనుర్దీక ఫీ ఉమ్మతిక వలా నసూఉక” (إِنَّا سَنُرْضِيكَ فِي أُمَّتِكَ وَلَا نَسُوءُكَ). ఓ ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం! మీ అనుచరుల విషయంలో మేము మీకు సంతృప్తి చెందేలా చేస్తాము. మీకు అసంతృప్తి అయ్యేలాగా చేయము అని చెప్పేశారు. అల్లాహు అక్బర్! అలాంటి ప్రవక్తకి మనము అనుచరులమైనందుకు మనము ఎంతో అదృష్టవంతులమని భావించాలి అభిమాన సోదరులారా!

ఇక రండి ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క శిష్యుల గురించి కూడా తెలుసుకుందాం. ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి ఇలాగే శిష్యులందరూ కూర్చుని ఉంటే శిష్యుల ముందర ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలాగే ఉపన్యాసం ఇవ్వడం ప్రారంభించారు. ఆ ఉపన్యాసంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమని తెలియజేశారంటే, “ఏమండీ నాకు స్వర్గం చూపబడింది. నాకు నరకము కూడా చూపబడింది. నేను చూసిన విషయాలు గనక మీరు చూసినట్లయితే మీరు నవ్వడం మానేసి ఏడవడం ప్రారంభించేస్తారు” అన్నారు. అది విన్న వెంటనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి శిష్యులందరూ తల మీద బట్ట వేసుకొని ముక్కు పట్టుకొని ఏడవడం ప్రారంభించేశారు అభిమాన సోదరులారా!

అలాగే హానీ, ఉస్మాన్ రదియల్లాహు తాలా అన్హు వారి యొక్క బానిస ,ఉస్మాన్ రదియల్లాహు అన్హు వారి గురించి ఆయన తెలియజేశారు. అదేమిటంటే ఉస్మాన్ రదియల్లాహు తాలా అన్హు వెళుతూ వెళుతూ స్మశానం దగ్గర ఆగిపోయి ఏడవడం ప్రారంభించేవారు. ఎంతగా కన్నీరు కార్చేవారంటే ఆయన గడ్డం మొత్తం తడిచిపోయేది. అది చూసిన ఆయన బానిస ఆయన వద్దకు వచ్చి ఏమని అడిగేవాడంటే, “ఏమండీ మీ దగ్గర స్వర్గం గురించి చర్చించబడినప్పుడు మీరు కన్నీరు కార్చరు. అలాగే మీ దగ్గర నరకం గురించి తెలియజేయబడినప్పుడు కూడా మీరు ఈ విధంగా కన్నీరు కార్చరు. కానీ స్మశానాన్ని, సమాధులను చూసి మీరు ఈ విధంగా కన్నీరు కారుస్తారు. కారణం ఏమిటి?” అని ఆయన అడిగినప్పుడు ఉస్మాన్ రదియల్లాహు తాలా అన్హు వారు తెలియజేసిన విషయం ఏమిటంటే, “ఇన్నల్ ఖబర అవ్వలు మంజిలిన్ మిన్ మనాజిలిల్ ఆఖిరహ్. ఫఇన్ నజా మిన్హు ఫమా బాఅదహు ఐసర్, వఇల్లం యంజ్ మిన్హు ఫమా బాఅదహు అషద్దు మిన్హు” (إِنَّ الْقَبْرَ أَوَّلُ مَنَازِلِ الْآخِرَةِ، فَإِنْ نَجَا مِنْهُ فَمَا بَعْدَهُ أَيْسَرُ، وَإِنْ لَمْ يَنْجُ مِنْهُ فَمَا بَعْدَهُ أَشَدُّ مِنْهُ). నేను సమాధిని చూసి ఎందుకు ఏడుస్తున్నాను అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. పరలోక ప్రయాణంలో సమాధి మొదటి స్టేజీ లాంటిది. ఇక్కడ ఏ వ్యక్తి అయితే పాస్ అయిపోతాడో అతను తర్వాత స్టేజీలలో కూడా పాస్ అయిపోతాడు. ఈ ఫస్ట్ స్టేజీలోనే ఏ వ్యక్తి అయితే ఇరుక్కుపోతాడో, నష్టపోతాడో ఆ తర్వాత వచ్చే స్టేజీలన్నీ కూడా అతనికి చాలా భయంకరమైనవిగా మారిపోతాయి. కాబట్టి నా మొదటి స్టేజీలో నా పరిస్థితి ఎలా ఉంటుందో అది తలుచుకొని నేను కన్నీరు కారుస్తున్నాను అని చెప్పేవారు.

అలాగే ముఆజ్ రదియల్లాహు తాలా అన్హు ఏడుస్తూ ఉంటే కొంతమంది వ్యక్తులు వెళ్లి ఏమండీ మీరు కన్నీరు కారుస్తున్నారు, కారణం ఏమిటి అని అడిగితే ఆయన చెప్పిన విషయం ఏమిటంటే “స్వర్గానికి వెళ్ళే వాళ్ల సమూహం ఏదో అల్లాహ్ కు బాగా తెలుసు. నరకానికి వెళ్లే సమూహం ఏదో అది కూడా అల్లాహ్ కు బాగా తెలుసు. నేను స్వర్గానికి వెళ్లే సమూహంలో ఉన్నానా లేదా నరకానికి వెళ్లే సమూహంలో ఉన్నానా? అది తలుచుకొని నేను కన్నీరు కారుస్తున్నాను” అన్నారు.

అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క మనవడు హసన్ రదియల్లాహు తాలా అన్హు ఏడుస్తూ ఉంటే కన్నీరు కారుస్తూ ఉంటే ప్రజలు వెళ్లి ఆయనను అడిగారు, “ఎందుకయ్యా మీరు ఏడుస్తున్నారు, కన్నీరు కారుస్తున్నారు?” అంటే ఆయన చెప్పిన విషయం ఏమిటంటే “నేను ప్రళయదినాన్ని తలుచుకొని కన్నీరు కారుస్తున్నాను. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తలుచుకుంటే నన్ను కూడా నరకంలో వేసేస్తాడు. అతనికి ఎలాంటి పర్వా లేకుండా పోతుంది. నేను ఎవరు, ఏంటి అనేది అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు ఏమి అవసరం ఉండదు. ఆయన తలుచుకుంటే నన్ను కూడా నరకంలో పడవేయగలడు కాబట్టి అది తలుచుకొని నేను ఏడుస్తున్నాను” అన్నారు.

అలాగే అభిమాన సోదరులారా! అబూ హురైరా రదియల్లాహు తాలా అన్హు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి శిష్యుల్లో గొప్ప శిష్యుడు. అబూ హురైరా రదియల్లాహు తాలా అన్హు వ్యాధిగ్రస్తునిగా ఉన్నప్పుడు ఏడుస్తూ ఉంటే ప్రజలు వెళ్లి ఏమయ్యా ఏడుస్తున్నారు మీరు అంటే ఆయన అన్నారు. “నేను మరణిస్తానేమో, ఈ ప్రపంచాన్ని నేను వదిలేసి వెళ్లిపోతున్నాను కదా అని నేను బాధపడట్లేదు. నేను బాధపడుతున్న విషయం ఏమిటంటే ఇక నా ప్రయాణం చాలా పెద్దదిగా ఉంది. కానీ అంత పెద్ద ప్రయాణంలో నేను సంపాదించుకుంది చాలా తక్కువ. ఇంత తక్కువ మొత్తంతో నేను అంత పెద్ద ప్రయాణాన్ని ఎలా చేయగలను అని తలుచుకొని నేను ఏడుస్తున్నాను” అన్నారు.

అలాగే అభిమాన సోదరులారా! అబ్దుల్లాహ్ ఇబ్నె రవాహా సతీమణి ఒడిలో పడుకొని ఉన్నారు. అక్కడే కన్నీరు కార్చడం మొదలెట్టేశారు. ఆయనను చూసి ఆయన భార్య కూడా కన్నీరు కార్చడం మొదలెట్టేసింది. ఆ తర్వాత ఏమయ్యా ఎందుకు మీరు కన్నీరు కారుస్తున్నారు అని ఆయనతో అడిగినప్పుడు ఆయన చెప్పిన విషయం ఏమిటంటే “రేపు ప్రతి వ్యక్తి స్వర్గానికి వెళ్లాలనుకునే ప్రతి వ్యక్తి నరకం మీద ఉంచిన పుల్సిరాత్ ని దాటుకుని స్వర్గానికి వెళ్లాల్సి ఉంటుంది. ఆ రోజు నేను పుల్సిరాత్ దాటుకుని స్వర్గానికి వెళ్తానా లేదా అని తలుచుకొని బాధపడుతున్నాను అన్నారు. ప్రతి వ్యక్తి ఆ మార్గం ద్వారానే దాటుకోవాల్సి ఉంటుంది. నరకాన్ని దాటుకోవాలంటే ఆ మార్గం మీద నుంచి నడిచి వెళ్ళాలి. ఆ తర్వాత మళ్లీ స్వర్గ ప్రవేశం ఉంటుంది. ఆ మార్గాన్ని నేను దాటుకోగలనా లేదా అని తలుచుకొని నేను కన్నీరు కారుస్తున్నాను” అన్నారు అభిమాన సోదరులారా.

ఈ విధంగా చూస్తే చాలామంది గురించి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఆఖరిలో ఒక్క విషయం చెప్పేసి నా మాట ముగిస్తున్నాను. అదేమిటంటే అభిమాన సోదరులారా! అల్లాహ్ ను తలుచుకొని ప్రతి భక్తుడు ఎప్పుడైనా సరే ఏదో ఒక సందర్భంలో తప్పనిసరిగా కన్నీరు కార్చాలి. ఎందుకంటే ఈ జీవితం శాశ్వతము కాదు. ఈ జీవితాన్ని స్వస్తి పలికి అల్లాహ్ పిలుపు రాగానే ప్రపంచాన్ని వదిలేసి మనం వెళ్లిపోవాలి. మన బంధువులు, మన మిత్రులు, మన స్నేహితులు, కుటుంబ సభ్యులు మూడు రోజులు కన్నీరు కార్చుకుంటారు. మళ్లీ వాళ్ల పనుల్లో వాళ్లు నిమగ్నమైపోతారు. ప్రయాణం చేయాల్సింది ఒంటరిగా మనమే. అక్కడ మనకు కాపాడాల్సింది ఒక అల్లాహ్ మాత్రమే. కాబట్టి అల్లాహ్ ను తలుచుకొని ప్రతి భక్తుడు కన్నీరు కార్చాలి. అల్లాహ్ తో క్షమాపణ వేడుకోవాలి.

కానీ మన పరిస్థితి ఎలా ఉందంటే మన హృదయాలు నల్ల రాయి లాగా గట్టిగా మారిపోయాయి. కారణం ఏమిటంటే మనలో దైవభీతి లేదు. ప్రపంచ వ్యామోహంలో పడిపోయి ఉన్నాం. డబ్బు డబ్బు, ఆస్తి ఆస్తి, బంగారు నగలూ అని చెప్పేసి దాని వెనకాల పరిగెడుతున్నాం అభిమాన సోదరులారా. ఇది శాశ్వతము కాదు. చావును తలుచుకోండి. సమాధిని తలుచుకోండి. నరకాన్ని తలుచుకోండి. పుల్సిరాత్ని తలుచుకోండి. లెక్కింపు రోజుని తలుచుకోండి. ఇది ఎంత ఎక్కువగా తలుచుకుంటే అంతగా హృదయం మెత్తబడుతుంది. అప్పుడు భక్తుడు దైవ భక్తితో, దైవ భీతితో కన్నీరు కారుస్తాడు. వీలైతే వ్యాధిగ్రస్తుల వద్దకు వెళుతూ వస్తూ ఉండండి. అప్పుడు కూడా మనసులు, హృదయాలు మెత్తబడతాయి. వీలైతే స్మశానానికి వెళుతూ వస్తూ ఉండండి. సమాధుల్ని చూసినప్పుడు కూడా హృదయాలు మెత్తబడతాయి.

కాబట్టి అభిమాన సోదరులారా! ప్రతి భక్తునికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా హృదయం, మెత్తని హృదయాన్ని ప్రసాదించి, దైవభీతితో కన్నీరు కార్చేలాగా, అల్లాహ్ తో చేసిన పాపాలకి క్షమాపణ కోరుతూ ఉండేలాగా సద్బుద్ధిని అల్లాహ్ ప్రసాదించుగాక.

أَقُولُ قَوْلِي هَٰذَا وَأَسْتَغْفِرُ اللَّهَ لِي وَلَكُمْ وَلِسَائِرِ الْمُسْلِمِينَ فَاسْتَغْفِرُوهُ ۚ إِنَّهُ هُوَ الْغَفُورُ الرَّحِيمُ
(అఖూలు ఖౌలీ హాజా వ అస్తగ్ ఫిరుల్లాహ లీ వలకుమ్ వలి సాయిరిల్ ముస్లిమీన ఫస్తగ్ ఫిరూహు ఇన్నహూ హువల్ గఫూరుర్ రహీమ్)

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=16913


ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్) – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0B6tOQhDiqrHO4E3Ou_IL7


స్వర్గానికి చేరటానికి “లా ఇలాహ ఇల్లల్లాహ్” సరిపోతుంది కదా? మరి మిగతా ఆచరణలు అవసరం లేదా? [వీడియో]

బిస్మిల్లాహ్

[4:37 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఇతరములు: [విశ్వాసము]

మేరాజ్ (గగణ ప్రయాణ) దృశ్యాలు [వీడియో & టెక్స్ట్]

ప్రవక్త మేరాజ్ (గగణ ప్రయాణాని)కి రజబ్ లోనే వెళ్ళారా?
ఈ సందర్భంగా తర్వాత రోజుల్లో షబె మేరాజ్ జరుపుకున్నారా? 

మేరాజ్ (గగణ ప్రయాణ) దృశ్యాలు
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
https://www.youtube.com/watch?v=Qmq6Oq7tJE0
36:38 నిమిషాలు, తప్పక వినండి

ఈ ప్రసంగంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవితంలోని ఒక కీలకమైన ఘట్టం, ఇస్రా మరియు మేరాజ్ (రాత్రి ప్రయాణం మరియు ఆరోహణ) గురించి వివరించబడింది. ప్రవక్త పదవి పొందిన తర్వాత మక్కాలో పది సంవత్సరాల పాటు ఆయన ఎదుర్కొన్న తీవ్రమైన శారీరక, మానసిక, మరియు సామాజిక కష్టాల గురించి ప్రస్తావించబడింది. ముఖ్యంగా తాయిఫ్‌లో ఆయనపై జరిగిన దాడి, ఆ తర్వాత ఆయన ప్రియమైన భార్య హజ్రత్ ఖదీజా మరియు పినతండ్రి అబూ తాలిబ్ మరణంతో కలిగిన దుఃఖం గురించి చెప్పబడింది. ఈ కష్టాల సమయంలో అల్లాహ్ తన ప్రవక్తకు ఓదార్పుగా ప్రసాదించిన అద్భుత ప్రయాణమే ఇస్రా మరియు మేరాజ్. ఈ ప్రయాణంలో జరిగిన సంఘటనలు, ఏడు ఆకాశాలలో ప్రవక్తలను కలవడం, స్వర్గ నరకాలను దర్శించడం, మరియు ముఖ్యంగా ముస్లిం సమాజానికి బహుమానంగా లభించిన ఐదు పూటల నమాజు, సూరహ్ బఖరా చివరి రెండు ఆయతులు, మరియు షిర్క్ చేయని వారి పాపాలు క్షమించబడతాయన్న శుభవార్త గురించి వివరించబడింది. ఈ ప్రయాణం యొక్క ప్రాముఖ్యతను తెలుపుతూ, దానిని స్మరించుకునే పేరుతో బిద్అత్ (నూతన ఆచారాలు) చేయకుండా, ప్రవక్త తెచ్చిన అసలైన బోధనలను, ముఖ్యంగా నమాజును మరియు తౌహీద్‌ను ఆచరించాలని నొక్కి చెప్పబడింది.

అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్, నబియ్యినా ముహమ్మద్ వ ఆలా ఆలిహి వ సహ్బిహి అజ్మయీన్, అమ్మా బాద్.

మహాశయులారా! ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నలభై సంవత్సరాల వయసు నిండిన తర్వాత ప్రవక్త పదవిని పొందారు. ఆ తర్వాత ఇంచుమించు పది సంవత్సరాల వరకు ప్రజలను అల్లాహ్ వైపునకు పిలుస్తూ కేవలం మనందరి సృష్టికర్త అయిన అల్లాహ్‌ను మాత్రమే మనం ఆరాధించాలి అని బోధిస్తూ ఎన్నో రకాల ఇబ్బందులను, ఎన్నో రకాల కష్టాలను కూడా భరించారు. ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై మనం ఊహించలేని, మనం పరస్పరం చెప్పుకోలేనటువంటి శారీరక, మానసిక, ఆర్థిక, సామాజిక అన్ని రకాల కష్టాలు వచ్చాయి. కానీ అల్లాహ్ కొరకు ఎంతో సహనం వహించారు.

పది సంవత్సరాలు గడిచిన తర్వాత మక్కా నగరం, దాని చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల వారు చాలా తక్కువ మంది ఇస్లాం స్వీకరించారు. అయితే మక్కా నగరానికి ఇంచుమించు ఒక 80, 90 కిలోమీటర్ల దూరంలో తాయిఫ్ ఒక పెద్ద నగరము. అక్కడ నివసించే వారికి ఇస్లాం బోధన చేద్దామని వెళ్లారు. కానీ అక్కడి నుండి కూడా వారు ఇస్లాం ధర్మాన్ని స్వీకరించి కేవలం అల్లాహ్‌ను ఆరాధించే వారు అయి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సంతోషం కలిగేకి బదులుగా వారు కేవలం నిరాకరించలేదు, పైగా ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై రాళ్ల వర్షం కురిపించారు. ఎంతగా అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి శరీరం నుండి రక్తం వెళ్లి పాదాల్లో ఏ బూట్లయితే వేసుకున్నారో, చెప్పులయితే వేసుకున్నారో అందులో రక్తం ఆగిపోయింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సొమ్మసిల్లిపోయారు, స్పృహ తప్పిపోయారు.

మక్కా నగరం తిరిగి వచ్చిన తర్వాత కొద్ది రోజులకు, 25 సంవత్సరాల వరకు అన్ని రకాలుగా సహాయం చేస్తూ, అన్ని రకాలుగా తోడ్పాటు అందిస్తూ, ఆమెకు ఒక ఉత్తమమైన భార్యగా నిలిచిన వారు హజ్రత్ ఖదీజా రదియల్లాహు త’ఆలా అన్హా కూడా చనిపోయారు. గమనించండి, కేవలం సామాన్య మనలాంటి మనుషులకే మన భార్య చనిపోయింది అంటే మనకు ఏడుపొస్తుంది. కానీ ఖదీజా రదియల్లాహు త’ఆలా అన్హా ఒక సామాన్య భార్య కాదు, ఒక సామాన్య స్త్రీ కాదు. ఆ చరిత్రలోకి వెళితే చాలా సమయం మనకు ఇది అయిపోతుంది. హజ్రత్ ఖదీజా రదియల్లాహు త’ఆలా అన్హా వారు చనిపోయాక కొద్ది రోజులకు వెన్నెముక లాంటి సహాయం అందించిన పినతండ్రి హజ్రత్ అబూ తాలిబ్ కూడా చనిపోతారు. ఆయన కేవలం చనిపోవడమే కాదు, ఇస్లాం ధర్మం స్వీకరించకుండా తాత ముత్తాతల ఆచారం మీద నేను చనిపోతున్నాను అని అనడం ప్రవక్త గారికి చెప్పలేనంత బాధ కలిగింది.

ఇన్ని బాధలను, ఇన్ని కష్టాలను, ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్న సమయంలో ఒక శుభ ఘడియ వచ్చింది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి. అదేమిటి? రాత్రిలోని కొన్ని క్షణాల్లోనే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు హజ్రత్ జిబ్రీల్ అలైహిస్సలాం వచ్చారు, బురాఖ్ అన్న ఒక జంతువు తీసుకొచ్చారు. ఆ జంతువు గురించి సహీహ్ హదీథ్ లో వచ్చిన ప్రస్తావన ఏమిటి? అది హైట్ లో గాడిద కంటే పెద్దగా మరియు కంచర గాడిద కంటే చిన్నగా మరియు దాని వేగం ఎక్కడివరకైతే దాని దృష్టి పడుతుందో అక్కడి వరకు అది ఒక గంతు వేస్తుంది. అంతటి వేగం గల ఒక జంతువును తీసుకుని వచ్చారు.

కానీ ఇక్కడ ఒక విషయం గమనించండి. ఈ రోజుల్లో మనం ఎన్నో క్యాలెండర్లలో, ఎన్నో ఫోటోలలో బురాఖున్ నబీ, ప్రవక్త వారికి గగన ప్రయాణం, మేరాజ్ ఏ వాహనంపై అయితే జరిగిందో దాని పేరు బురాఖ్ అని దానికి ఒక స్త్రీ ముఖం లాంటిది, ఇంకా వెనక ఒక తోక వేరే రకం లాంటిది, దాని కాళ్లు మరో జంతువు రకం లాంటివి, ఇలాంటి ఫోటోలు చూస్తాము. ఇవన్నీ కూడా అబద్ధము, అసత్యము, బూటకం. ఎందుకంటే ఆ జంతువు యొక్క చిన్నపాటి వర్ణన వచ్చింది కానీ అది, దాని ముఖం, దాని యొక్క ఇమేజ్, దాని యొక్క ఫోటో ఆ కాలంలో ఎవరూ తీయలేదు, దాని గురించి ఎలాంటి ప్రస్తావన హదీథుల్లో రాలేదు. ఇది మన యొక్క ధర్మంపై ఒక మహా అపనింద మనం వేసిన వాళ్ళం అవుతాము ఇలాంటి ఫోటోలను మనం ప్రచారం చేసి ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కా నుండి బైతుల్ మఖ్దిస్, బైతుల్ మఖ్దిస్ నుండి ఏడు ఆకాశాల పైకి వెళ్లినటువంటి బురాఖ్ అని చెప్పడం ఇది చాలా తప్పు విషయం.

అయితే సహీహ్ హదీథుల్లో వచ్చిన విషయం ఏంటి? ఆ జంతువు, దాని యొక్క వేగం మనం చెప్పలేము. దానిపై ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఎక్కించుకొని మక్కా నుండి బైతుల్ మఖ్దిస్, ఫలస్తీన్ కి వెళ్లారు. ఆ ప్రస్తావన సూరహ్ బనీ ఇస్రాయీల్ లోని మొదటి ఆయతులోనే ఉంది.

سُبْحَانَ الَّذِي أَسْرَىٰ بِعَبْدِهِ لَيْلًا مِّنَ الْمَسْجِدِ الْحَرَامِ إِلَى الْمَسْجِدِ الْأَقْصَى الَّذِي بَارَكْنَا حَوْلَهُ لِنُرِيَهُ مِنْ آيَاتِنَا

“ఆయన పరమ పవిత్రుడు. తన దాసుణ్ణి ఒక రాత్రి మస్జిద్-ఎ-హరామ్ నుండి మస్జిద్-ఎ-అఖ్సా వరకు తీసుకువెళ్లాడు. దాని పరిసరాలను మేము శుభప్రదంగా చేశాము. ఇది మేము మా సూచనలను అతనికి చూపించటానికి చేశాము.” (17:1)

ఆ ప్రభువు, అల్లాహ్ ఎంతో పరిశుద్ధుడు. అన్ని రకాల లోపాలకు, దోషాలకు అతీతుడు. ఆయనే రాత్రివేళ తన దాసునిని మస్జిద్-ఎ-హరామ్ నుండి బైతుల్ మఖ్దిస్, మస్జిద్-ఎ-అఖ్సా ఫలస్తీన్ వరకు తీసుకువెళ్లాడు. ఆ మస్జిద్-ఎ-అఖ్సా దాని చుట్టుపక్కల ప్రాంతమంతా కూడా మేము దానిని శుభకరమైనదిగా చేశాము. ఎందుకు తీసుకువెళ్ళాము? మా యొక్క సూచనలు, మా యొక్క మహిమలు ఆయనకు చూపించాలని. అయితే దీనిని ఇస్రా అని అంటారు. ఇస్రా అంటే ఏంటి? మక్కా నుండి బైతుల్ మఖ్దిస్ వరకు రాత్రివేళ ఏదైతే ప్రయాణం జరిగిందో దానిని ఇస్రా అని అంటారు. మరియు బైతుల్ మఖ్దిస్ నుండి ఏడు ఆకాశాల వైపునకు ఏ ప్రయాణం అయితే జరిగిందో దానిని మేరాజ్ అని అంటారు. దాని ప్రస్తావన ఖుర్ఆన్ లో సూరహ్ నజ్మ్ లో వచ్చి ఉంది.

అయితే ఈరోజు నేను చెప్పబోయే విషయం ఏమిటంటే, ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఇస్రా, మేరాజ్ ఈ ప్రయాణం ఏదైతే చేశారో ఇది వాస్తవం. ఖుర్ఆన్ లో దాని ప్రస్తావన ఉంది, సహీహ్ హదీథుల్లో దాని వివరాలు వచ్చి ఉన్నాయి. కానీ ఆ ప్రయాణంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఏమేమి జరిగినది? ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎక్కడెక్కడ ఏమేమి దర్శించారు? ఏ ఏ అద్భుత విషయాలు మనకు తెలియజేశారు? మన విశ్వాసానికి, ఆచరణకు సంబంధించిన బోధనలు అందులో ఏమున్నాయి? అవి మనం తెలుసుకోవాలి ఖుర్ఆన్ మరియు సహీహ్ హదీథుల ద్వారా మరియు వాటి ప్రకారంగా మనం ఆచరించాలి, వాటి ప్రకారంగా మన విశ్వాసం సరిచేసుకోవాలి.

అలా కాకుండా, ఈ రోజుల్లో ఏం జరుగుతుంది? జషన్, షబ్-ఎ-మేరాజ్, మేరాజున్ నబీ యొక్క ఉత్సవాలు అని జరుపుకుంటున్నారు. ఒక వ్యక్తి వాట్సాప్ లో ఒక సందర్భంలో ఏం రాశాడు? చేసుకునే వాళ్ళు చేసుకుంటారయ్యా, మీకేం నొస్తుంది? మీకేం బాధ కలుగుతుంది? అని బూతులు కూడా వదిలారు కొందరు. కానీ ఇక్కడ వారి మదిలో, వారి ఆలోచనలో ఏముందంటే, మేము ఏం చేసినా గానీ ప్రవక్త ప్రేమలో చేస్తున్నాము కదా, మేం ఏం చేసినా గానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఈ గగన ప్రయాణం, మేరాజ్ అయితే ఒక గొప్ప బహుమానంగా ఇవ్వబడినదో దానిని గుర్తు చేసుకుంటున్నాము కదా, ఇందులో తప్పేమిటి? ఇలాంటి కొన్ని మంచి ఆలోచనలు వారివి ఉంటాయి కావచ్చు. కానీ ఇక్కడ గమనించాలి. ఏంటి గమనించాలి? ఒకవేళ ఇలా చేయడం ధర్మం అయితే ఈ ధర్మాన్ని అల్లాహ్ మనకు నేర్పలేదు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలుపలేదు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సహాబాలు చేయలేదు, ఇమాములు చేయలేదు. అలాంటి కార్యం మనం చేస్తున్నాము అంటే మన ఆలోచన, మన ఉద్దేశం ఎంత ఉత్తమంగా, మంచిగా ఉన్నప్పటికీ అందులో మనకు పుణ్యం లభించదు, దాని వల్ల మనం బిద్అత్ లో పడిపోతాము, అది మహా ఘోరమైన పాపం అయిపోతుంది.

అందు గురించి మహాశయులారా! అలాంటి బిద్అత్ లకు, దురాచారాలకు మనం గురి కాకుండా ఈరోజు మీరు కొన్ని విషయాలు వింటారు ఇన్షా అల్లాహ్. ఏమిటి ఆ విషయాలు? ఈ గగన ప్రయాణంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఏ ఏ బహుమానాలు బహూకరించబడ్డాయి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏ దృశ్యాలను చూశారు? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఈ ప్రయాణం ఎలా జరిగింది? దానికి సంబంధించిన వివరాలు ఏమిటి?

అయితే పూర్తి వివరంగా చెప్పుకుంటూ పోతే గంటల తరబడి ప్రసంగం జరుగుతుంది. కానీ అలా కాకుండా టూ ద పాయింట్ హదీథుల ఆధారంగా నేను కొన్ని విషయాలు మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. దానిని మీరు శ్రద్ధగా ఆలకిస్తారు అని ఆశిస్తున్నాను.

మొదటి విషయం ఇక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి పట్ల జరిగినటువంటి గొప్ప మహిమ, ఒక అద్భుతం ఏమిటంటే ఈ ప్రయాణానికి బయలుదేరే ముందు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క చెస్ట్ ఆపరేషన్ అని అనండి మీరు, హార్ట్ ఆపరేషన్ అని అనండి, ఓపెన్ హార్ట్ సర్జరీ అని మీరు చెప్పుకోండి, చెప్పుకోవచ్చు. అది జరిగింది. వాస్తవం. హజ్రత్ అనస్ రదియల్లాహు త’ఆలా అన్హు చెప్తున్నారు, నేను స్వయంగా చూశాను ఆ కుట్లను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఛాతి చీల్చబడి, అందులో నుండి గుండెను బయటికి తీసి, జమ్ జమ్ నీళ్లతో దానిని కడిగి, అందులో ఈమాన్, విశ్వాసం, హిక్మత్, వివేకాలతో నింపబడినది. సహీహ్ బుఖారీ, హదీథ్ నంబర్ 3887 లో దీని ప్రస్తావన ఉంది.

ఇక ఏ వాహనం పైన అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రయాణం చేశారో నేను ఇంతకు ముందు తెలిపినట్లు గాడిద కంటే పెద్దది మరియు కంచర గాడిద కంటే చిన్నది, దాని పేరు ఏమిటి? బురాఖ్. దీని ప్రస్తావన సహీహ్ బుఖారీలోని ఈ హదీథ్ లోనే వచ్చి ఉంది. ఇంతకు ముందు నేను చెప్పిన నంబర్ 3887.

మరియు ఈ ప్రయాణం మస్జిద్-ఎ-హరామ్ మక్కా నుండి మొదలుకొని ఫలస్తీన్, ఫలస్తీన్ నుండి ఏడు ఆకాశాలు, ఏడు ఆకాశాల పైన అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ తో సంభాషించడం మరియు స్వర్గాన్ని చూడడం, నరకాన్ని చూడడం మధ్యలో ఇంకా ఎన్నో విషయాలు జరిగాయి. ఇవన్నీ కూడా ఎన్నో రోజులు, ఎన్నో గంటలు పట్టలేదు. لَيْلًا (లైలన్) రాత్రిలోని కొంత భాగం మాత్రమే. అది ఎలా? అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ సర్వశక్తిమంతుడు. అవునా లేదా? విశ్వాసం ఉందా లేదా? ఈ రోజు ఆ అల్లాహ్ ఇచ్చినటువంటి మేధ, బుద్ధి, జ్ఞానం, సైన్స్, విద్యతో రాకెట్లు తయారు చేస్తున్నారు. సామాన్యంగా ఇంతకు ముందు ఎవరైనా ఇక్కడి నుండి మక్కా నేను ఒక రోజులో పోయి వస్తాను అంటే ఎవరైనా నమ్ముతారా? ఇంచుమించు 1000 కిలోమీటర్లు. కానీ ఈ రోజుల్లో సాధ్యమా లేదా? నాలుగు సార్లు పోయి రావచ్చు కదా మక్కా. అదే రాకెట్ యొక్క వేగం ఎంత ఉన్నది? అయితే నేను ఈ విషయాలు మళ్ళీ విడమరిచి చెప్పడానికి వెళ్తే సమయం ఇంకా చాలా ఎక్కువ అవుతుంది. మన విశ్వాసులం, ఖుర్ఆన్ లో వచ్చిన విషయం, సహీహ్ హదీథ్ లో వచ్చిన విషయాన్ని మనం తూచా తప్పకుండా నమ్మాలి, ఎలాంటి అనుమానాలకు, సందేహాలకు గురి కాకూడదు.

అయితే మస్జిద్-ఎ-అఖ్సా లో చేరిన తర్వాత అక్కడ అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ ఆదమ్ అలైహిస్సలాం నుండి మొదలుకొని చిట్టచివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వరకు ఎంత మంది ప్రవక్తలు వచ్చారో వారందరినీ జమా చేశాడు. ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారందరికీ రెండు రకాతుల నమాజ్ చేయించారు. ఇమామత్, నమాజ్ చేయించే అటువంటి నాయకత్వం ఈ గొప్పతనం ఎవరికి లభించింది? ఎవరికీ? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి. అంటే ఇమాముల్ అంబియా అని అంటాము కదా మనం సామాన్యంగా ఉర్దూలో. ఇది వాస్తవ రూపంలో అక్కడ జరిగింది.

ఇంకా ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ప్రయాణంలో మొదటి ఆకాశం, రెండవ ఆకాశం, మూడవ ఆకాశం, ఏడు ఆకాశాలలో పైకి వెళ్లారైతే, మొదటి ఆకాశంలో హజ్రత్ ఆదమ్ అలైహిస్సలాం తో కలిశారు. రెండవ ఆకాశంలో ఈసా మరియు యహ్యా అలైహిముస్సలాం తో కలిశారు. మూడవ ఆకాశంలో యూసుఫ్ అలైహిస్సలాం తో కలిశారు. నాలుగవ ఆకాశంలో హజ్రత్ ఇద్రీస్ అలైహిస్సలాం తో కలిశారు. ఐదవ ఆకాశంలో హారూన్ అలైహిస్సలాం తో కలిశారు. మరియు ఆరవ ఆకాశంలో హజ్రత్ మూసా అలైహిస్సలాం తో కలిశారు. ఏడవ ఆకాశంలో హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాం తో కలిశారు.

ఈ విధంగా ఏడు ఆకాశాలకు పైన ఒక రేగు చెట్టు ఉంది. దానిని సిద్రతుల్ ముంతహా అని అంటారు. ఆ చెట్టు, రేగు పండు ఒక్కొక్క పండు పెద్ద పెద్ద కడవలు చూసి ఉంటారు. పల్లెటూర్లలో పాతకాలంలో గోధుమాలో లేదా వడ్లు వేయడానికి పెద్ద పెద్ద గుమ్మీలు వాడేవారు. ఒక్కొక్క దాంట్లో 300 కిలో, 500 కిలోలు కూడా అంత స్థలం ఉంటుంది. ఆ విధంగా పెద్ద పెద్ద ఒక్కొక్క పండు అంత పెద్దగా ఉంటుంది. మరియు దాని యొక్క ఆకులు ఏనుగుల చెవుల మాదిరిగా అంత పెద్దగా ఉంటాయి. అయితే ఇక్కడ ఒక విషయం గమనించండి. హదీథ్ లో వచ్చిన విషయం ఏంటంటే, హిజ్ర్ అని ఒక ప్రాంతం ఉంది, ఆ ప్రాంత వాసులు ఎలాంటి మట్టి నీళ్లు వేయడానికి బిందెలు లాంటివి, నీళ్లు పోసుకోవడానికి కడవల లాంటివి ఏదైతే ఉపయోగిస్తారో దానికి సమానమైన పండ్లు ఆ రేగు పండు ఒక్కొక్కటి మరియు దాని యొక్క ఆకు ఏనుగు చెవుల మాదిరిగా ఉంటాయి.

ఇంకా ఆ రేగు చెట్టు యొక్క వ్రేళ్లు ఆరవ ఆకాశంలో ఉన్నాయి మరియు దాని యొక్క కొమ్మలు ఏడు ఆకాశాలకు పైగా ఉన్నాయి. అక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఎన్నో విషయాలు చూపించడం జరిగింది, ఎన్నో విషయాలు అక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో జరిగాయి. ఉదాహరణకు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అక్కడే అల్లాహ్ యొక్క చాలా దగ్గరగా ఉండే అల్లాహ్ ఆదేశాలను రాస్తూ ఉండే దైవదూతల కలముల శబ్దం విన్నారు, సిద్రతుల్ ముంతహాలో.

జన్నతుల్ మఅవా అన్నది దానికి సమీపంలోనే ఉన్నది. అక్కడే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి మూడు విషయాలు బహుమానంగా ఇవ్వబడ్డాయి. ఎలా? మీకు ఏదైనా బహుమానం దొరికింది, ఏదైనా పెద్ద గిఫ్ట్ దొరికింది, ఒక షీల్డ్, క్రికెట్ లో మీరు కప్ గెలిచారు. దానిని తీసుకొచ్చి పారేస్తారా? ఏం చేస్తారు? కాపాడుతారు. గమనించండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అక్కడ లభించిన విషయాలు ఏమిటి? ఐదు పూటల నమాజులు, ఇక దాని వివరణలో వెళ్తాలేను, ముందు 50 ఉండే ఆ తర్వాత ఇలా తగ్గింది అనేది. రెండవ బహుమానం, సూరహ్ బఖరా లోని చివరి రెండు ఆయతులు, ఆమన రసూల్ బిమా ఉన్జిలా అక్కడ నుండి మొదలుకొని. మరియు మూడవ బహుమానం ఏమిటి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమాజంలో, వారిని అనుసరించే వారిలో ఎవరైతే షిర్క్ నుండి దూరం ఉంటారో అల్లాహ్ త’ఆలా వారి యొక్క ఘోరమైన పాపాలను కూడా మన్నిస్తాడు. అల్లాహు అక్బర్. ఈ మూడు పెద్ద బహుమానాలు.

సహీహ్ ముస్లిం షరీఫ్, హదీథ్ నంబర్ 173 లో వీటి ప్రస్తావన వచ్చి ఉంది. సిద్రతుల్ ముంతహా మరియు అక్కడ ఆ తర్వాత నుండి ఏదైతే విషయాలు చెప్పానో వాటి ప్రస్తావన. ఇక్కడ గమనించండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మేరాజ్ ప్రయాణంలో ప్రవక్తకు లభించినటువంటి గొప్ప బహుమానం ఏమిటి? ఏమిటి? చెప్పండి! ఐదు పూటల నమాజు. ఇంకా? సూరహ్ బఖరా లోని చివరి రెండు ఆయతులు. మరియు మూడో విషయం? షిర్క్ చేయని వారి యొక్క ఘోర పాపాలను కూడా అల్లాహ్ త’ఆలా క్షమిస్తాడు అని శుభవార్త.

ఈ రోజుల్లో మేరాజున్ నబీ అన్నటువంటి బిద్అత్ చేసి, ఇంకా అందులో ఎన్నో రకాల షిర్క్ పనులు చేసి, రజబ్ మాసంలో రజబ్ కే కూండే అన్న పేరు మీద ఎన్నో షిర్క్ పనులు చేసుకుంటూ మనం ప్రవక్త విధానానికి ఎంత వ్యతిరేకం చేస్తున్నాము. ఎంతో మంది ఎవరైతే జషన్-ఎ-మేరాజ్-ఉన్-నబీ అని ఈ మేరాజ్-ఉన్-నబీ పేరు మీద రాత్రి జాగారం చేస్తారో, సంవత్సరంలో ఎన్ని నమాజులు వారు చేస్తున్నారు? ఆ రోజు వచ్చి ఎన్నో నఫిల్‌లు చేస్తారు కావచ్చు కానీ, మహాశయులారా! గమనించండి. మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గొప్ప బహుమానంగా ఏ విషయాలు అయితే ఈ ప్రయాణంలో పొందారో వాటిని మనం గౌరవించాలి, వాటిని మనం పాటించాలి, వాటిని ఎప్పుడూ కూడా తూచా తప్పకుండా, అందులో ఎలాంటి అశ్రద్ధ చేయకుండా వాటిని మనం పాటించాలి.

ఇంకా మహాశయులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అక్కడ హజ్రత్ జిబ్రీల్ అలైహిస్సలాం వారిని రెండవ సారిగా అతని యొక్క అసలైన రూపంలో చూశారు.

అక్కడే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి మత్తుపానీయం మరియు పాలు మరియు తేనె మూడు విషయాలు ఇవ్వబడ్డాయి. ప్రవక్తా ఇదిగో తీసుకోండి, మీరు సేవించండి అన్నట్లుగా ఏ విషయాలు ఇవ్వబడ్డాయి? అల్లాహు అక్బర్! మత్తుపానీయం, మరియు పాలు, మరియు తేనె. ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం తీసుకున్నారు? పాలు తీసుకున్నారు. సహీహ్ బుఖారీ, హదీథ్ నంబర్ 3887 లో ఈ ప్రస్తావన ఉంది.

మరియు ఏడవ ఆకాశంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బైతుల్ మఅమూర్ అని చూశారు. బైతుల్ మఅమూర్ ఏంటి? ఇహలోకంలో మన కొరకు బైతుల్లాహ్ ఎలానైతే ఉందో, కాబతుల్లాహ్, అలాగే దానికి స్ట్రెయిట్ గా ఏడు ఆకాశాల పైన బైతుల్ మఅమూర్ ఉంది. దైవదూతలు అక్కడ నమాజ్ చేస్తారు, దాని యొక్క తవాఫ్ చేస్తారు. ఒక్కసారి 70,000 మంది దైవదూతలు అక్కడ తవాఫ్ చేస్తారు, నమాజ్ చేస్తారు. మరియు ఒక్కసారి ఎవరికైతే ఈ అవకాశం దొరికిందో ప్రళయం వరకు మళ్ళీ వారికి ఈ అవకాశం దొరకదు. గమనించండి దైవదూతల సంఖ్య ఎంత గొప్పగా ఉందో. దీని ప్రస్తావన సహీహ్ బుఖారీలో ఉంది, హదీథ్ నంబర్ 3207.

ఇంకా మహాశయులారా, ఈ ప్రయాణంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హజ్రత్ మూసా అలైహిస్సలాం వారిని కూడా చూశారు. అలాగే నరకం యొక్క కాపరి, మాలిక్ అతని పేరు, అతనిని కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చూశారు. ఈ ప్రయాణంలో ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం స్వర్గాన్ని కూడా చూశారు, అలాగే నరకాన్ని కూడా దర్శించారు. ఎప్పుడైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్వర్గం దర్శించారో అక్కడ చూశారు, వజ్రాలతో తయారు చేయబడినటువంటి అక్కడ గోపురాలు ఉన్నాయి. ఖైమా, ఇక్కడ ఏదైనా వాతావరణం చాలా సునాయాసంగా ఉండి, వేడి కూడా ఎక్కువ లేకుండా, చలి కూడా లేకుండా, మోసమ్-ఎ-రబీ అని ఏదైతే అంటారో మనం చూస్తాము కదా, ఎడారిలో డైరాలు వేసుకొని, ఖైమాలు వేసుకొని అక్కడ కొంత సమయం గానీ లేదా కొద్ది రోజులు గానీ గడుపుతారు. చూశారా కదా? అయితే అలాంటి ఖైమాలో వారికి ఎంత ఆనందం ఏర్పడుతుంది, అన్ని రకాల సౌకర్యాలు బహుశా అందులో ఉంటాయి కావచ్చు కానీ అస్తగ్ ఫిరుల్లాహ్, ఇది పోలిక కాదు స్వర్గంలో లభించే అటువంటి ఖైమాకు. కానీ అక్కడ ఒకే ఒక వజ్రం ఇంత పెద్దగా ఉంటుంది, ఆ ఒకే వజ్రంతో చాలా పెద్ద ఖైమాగా తయారు చేయబడుతుంది. మరియు అక్కడి యొక్క మట్టి కస్తూరి అని చెప్పడం జరిగింది. దీని యొక్క ప్రస్తావన బుఖారీ 349, అలాగే సహీహ్ ముస్లిం 163 లో వచ్చి ఉంది.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి స్వర్గంలో కౌథర్ అనేటువంటి ఒక పెద్ద వాగు ఏదైతే ప్రసాదించడం జరుగుతుందో దానిని కూడా చూసి వచ్చారు. అలాగే ఫిరౌన్ కూతురికి జడలు వేసే అటువంటి ఒక సేవకురాలు, ఆమె ఇస్లాం స్వీకరించింది, మూసా అలైహిస్సలాం ను విశ్వసించింది. దానికి బదులుగా ఫిరౌన్ ఆ దౌర్జన్యపరుడు, దుర్మార్గుడు ఏం చేశాడు? ఆమెను, ఆమె యొక్క నలుగురి సంతానాన్ని సలసల మసులుతున్న నూనెలో, వేడి నూనెలో వేసేశాడు. అయితే ఆమెకు స్వర్గంలో ఏ గొప్ప అక్కడ గృహం అయితే ప్రసాదించబడిందో, దానిని అక్కడి నుండి వస్తున్నటువంటి సువాసనను కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విషయం సహీహ్ ముస్నద్ అహ్మద్ లో వచ్చి ఉంది, జిల్ద్ 5, పేజ్ 30.

అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హజ్రత్ జిబ్రీల్ అలైహిస్సలాం వారిని మరొక రూపంలో చూశారు. అల్లాహ్ తో భయపడుతూ ఎంత కంపించిపోయారంటే అతని యొక్క పరిస్థితి ఒక చాలా మాసిపోయిన లేదా పాడైపోయిన తట్టు గుంత ఎలా ఉంటుందో అతనిని చూస్తే అలా ఏర్పడింది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలిపారు. షేఖ్ అల్బానీ రహిమహుల్లాహ్ ఈ హదీథ్ ను సహీహాలో ప్రస్తావించారు, 2289.

ఇంకా మహాశయులారా, హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వారిని కూడా ఈ ప్రయాణంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కలిశారు. ఇబ్రాహీం అలైహిస్సలాం ప్రవక్తతో కలిసి ఏం చెప్పారు? ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నీవు నా వైపు నుండి నీ అనుచర సంఘానికి సలాం తెలుపు. అల్లాహు అక్బర్. సల్లల్లాహు అలైహి వ ఆలా ఆలిహి వసల్లం. అల్లాహ్ త’ఆలా ఇబ్రాహీం అలైహిస్సలాం పై కూడా తన కరుణ, శాంతులు కురియజేయుగాక. గమనించండి. ఒకవేళ నేను, మీరు, మనందరము, ముస్లింలం అని అనుకునే వాళ్ళము, మేరాజ్-ఉన్-నబీ లాంటి బిదత్ పనులు, జషన్-ఎ-మేరాజ్ అని బిదత్ పనులు చేయకుండా నిజమైన ధర్మంపై, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తీసుకొచ్చిన ధర్మంపై ఉండి ఉంటే ఇబ్రాహీం అలైహిస్సలాం వారి యొక్క సలాం కూడా మనకు కలుగుతుంది. ఆయన ప్రత్యేకంగా సలాం పంపారు. ఇంకా ఏం చెప్పారు? ఓ ముహమ్మద్, నీ అనుచర సంఘానికి తెలుపు, ఈ స్వర్గం దీని యొక్క మట్టి ఇది చాలా మంచిది. ఇక్కడ విత్తనం వేసిన వెంటనే మంచి చెట్లు మరియు దానికి ఫలాలు వెంటనే అవుతూ ఉంటాయి. అట్లాంటి మట్టి ఇది. మరియు ఇక్కడి యొక్క నీరు కూడా చాలా మంచి నీరు. కానీ ఇప్పటివరకు అది ఎలాంటి చెట్టు లేకుండా ఉంది. అక్కడ చెట్టు మనకు కావాలంటే ఏం చేయాలి? నీ అనుచర సంఘానికి తెలుపు, సుబ్ హా నల్లాహ్, అల్హమ్దులిల్లాహ్, లా ఇలాహ ఇల్లల్లాహ్, అల్లాహు అక్బర్ అధికంగా చదువుతూ ఉంటే అల్లాహ్ వారి కొరకు స్వర్గంలో మంచి చెట్లు నాటుతాడు, పరలోకంలో స్వర్గంలో చేరిన తర్వాత వారికి ఆ చెట్లు ప్రసాదించబడతాయి. అల్లాహు అక్బర్. ఏమైనా కష్టమా ఆలోచించండి? సుబ్ హా నల్లాహ్, అల్హమ్దులిల్లాహ్, అల్లాహు అక్బర్, లా ఇలాహ ఇల్లల్లాహ్ చదవడం.

అలాగే మహాశయులారా, మరొక హదీథ్ లో ఉంది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఇబ్రాహీం అలైహిస్సలాం వారు చెప్పారు, లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్ అధికంగా చదువుతూ ఉండమని చెప్పండి. ఈ హదీథ్ లు తిర్మిజీ మరియు ముస్నద్ అహ్మద్ లో వచ్చి ఉన్నాయి. షేఖ్ అల్బానీ రహిమహుల్లాహ్ సహీహ్ అని చెప్పారు.

అలాగే నరకంని కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు దర్శించారు. నరకంలో ఏం చూశారు? నరకంలో ఒక చాలా భయంకరమైన దృశ్యం చూశారు. కొందరి యొక్క గోర్లు వారి యొక్క ఆ గోర్లు ఎలాంటివి? ఇత్తడివి. చాలా పొడుగ్గా ఉన్నాయి. వాటితో వారు తమ ముఖాలను, తమ శరీరాన్ని గీకుతున్నారు. తోలు బయటికి వచ్చేస్తుంది. వారి గురించి జిబ్రీల్ ను అడిగారు, ఈ పరిస్థితి వీరికి ఎందుకు జరుగుతుంది? అప్పుడు జిబ్రీల్ వీరికి తెలిపారు, వీరు ఎవరు తెలుసా? ప్రజల మానంలో, వారి యొక్క పరువులో చేయి వేసుకొని వారిని అవమానపరిచేవారు. అంటే పరోక్ష నిందలు, చాడీలు, గీబత్, చుగ్లీ, ఇంకా వాడు అలాంటి వాడు, వీడు ఇలాంటి వాడు అని వారిని నిందించడం, వారి యొక్క మానం, పరువులో జోక్యం చేసుకోవడం, ఇలా చేసుకునే వారికి ఈ శిక్ష జరుగుతుంది అని చెప్పడం జరిగింది. సునన్ అబూ దావూద్ లో హదీథ్ వచ్చి ఉంది, 4878 హదీథ్ నంబర్.

ఇంకా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ ప్రయాణంలో ఇంకా ఎన్నో రకాల దృశ్యాలు చూశారు కానీ మనకు సమయం అనేది సరిపోదు గనుక ఒక ముఖ్యమైన విషయం ఇక్కడ మీకు తెలియజేస్తున్నాను. అదేమిటి? షేఖ్ అల్బానీ రహిమహుల్లాహ్ సహీహాలో ప్రస్తావించారు, హదీథ్ నంబర్ 306.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గగన ప్రయాణం, ఈ మేరాజ్ ప్రయాణం నుండి తిరిగి వచ్చిన తర్వాత అక్కడి విషయాలు ప్రజలకు తెలుపుతున్నారు. ఎవరైతే సత్య విశ్వాసులో వారు తూచా తప్పకుండా నమ్మారు. కానీ అవిశ్వాసులు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని హేళన చేశారు. ఏమని? మేము మక్కా నుండి ఫలస్తీన్ కు ఒక నెల రోజులు పడుతుంది మాకు పోవాలంటే. నీవు కేవలం ఫలస్తీన్ వరకే కాదు, ఏడు ఆకాశాల పైకి రాత్రిలోని కొన్ని క్షణాల్లో, కొంత సమయంలోనే వెళ్లి వచ్చావు అంటున్నావు అని హేళన చేశారు. అంతే కాదు, కొందరు అవిశ్వాసులు అయితే ఒకవేళ నీవు వాస్తవంగా ఫలస్తీన్ వెళ్లి, మస్జిద్-ఎ-అఖ్సా చూసి వచ్చావంటే దాని యొక్క వివరణ మాకు తెలుపు అని ఎన్నో ప్రశ్నలు అడిగారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, ఆ సందర్భంలో ఎప్పుడైతే వారు అడిగారో నాకు దాని వివరణ ఏమీ తెలియదు. కానీ ఆ మస్జిద్-ఎ-అఖ్సా యొక్క దృశ్యం అల్లాహ్ నా ముందుకు తీసుకొచ్చాడు. వారు అడిగిన ప్రతి దానికి, ప్రతి ప్రశ్నకు నేను సమాధానం చెప్పుకొచ్చాను. అల్లాహు అక్బర్.

అక్కడ ఆ సమయంలో అబూ బకర్ రదియల్లాహు త’ఆలా అన్హు లేరు. ఎక్కడో దూరంగా ఏదో పని మీద ఉన్నారు. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి విషయాలు విన్న ఒక వ్యక్తి, “ఈరోజు అబూ బకర్, “ఎల్లవేళల్లో అబూ బకర్ ను చూశాము, ముహమ్మద్ చెప్పింది నిజమే, ముహమ్మద్ చెప్పింది నిజమే అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ముహమ్మద్ కు తోడుగా ఉన్నాడు కదా, ఈరోజు అబూ బకర్ కు వెళ్లి నేను తొందరగా ఈ విషయం తెలియజేస్తాను, అబూ బకర్ ఈ విషయాన్ని తిరస్కరిస్తాడు, అబద్ధం అని అంటాడు అన్నటువంటి నమ్మకంతో వెళ్లి, “అబూ బకర్! ఎవరైనా ఒక రాత్రిలో మక్కా నుండి ఫలస్తీన్ వెళ్లి వచ్చాడు అంటే నువ్వు నమ్ముతావా?” అంటే, “లేదు.” సంతోషం కలిగింది అతనికి. వెంటనే అన్నాడు, “మరి మీ స్నేహితుడు, మీ యొక్క గురువు ముహమ్మద్ అంటున్నాడు కదా?” సల్లల్లాహు అలైహి వసల్లం. అబూ బకర్ వెంటనే చెప్పారు, “నిజమా? ముహమ్మద్ ఈ మాట చెప్పారా?” సల్లల్లాహు అలైహి వసల్లం. అతను అన్నాడు, “అవును, ముహమ్మద్ ఈ మాట చెప్పాడు. అంతే కాదు, రాత్రిలోని కొంత భాగంలో ఫలస్తీన్ వరకే కాదు, మస్జిద్-ఎ-అఖ్సా కాదు, అక్కడి నుండి ఏడు ఆకాశాల పైకి కూడా వెళ్లారట.” వెంటనే అబూ బకర్ చెప్పారు, “ఒకవేళ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ మాట చెప్పి ఉంటే నూటికి నూరు పాళ్లు నిజం, ఇది సత్యం, ఇందులో ఏ మాత్రం అనుమానం లేదు.” అతడే, ప్రశ్న అడిగినవాడు, అబూ బకర్ గురించి ఏదో తప్పుగా ఆలోచించి వచ్చినవాడు చాలా ఆశ్చర్యపోతాడు. “ఎలా నీవు ఇది నిజం నమ్ముతున్నావు?” అని అంటే, “నీకు ఇందులో ఏం అనుమానం? ప్రవక్త చెప్తారు నాకు పొద్దున వహీ వస్తుంది, సాయంకాలం వహీ వస్తుంది, అల్లాహ్ నుండి దైవదూత వస్తున్నాడు, నాకు ఈ సందేశం ఇచ్చారు, మేము అన్ని విషయాలను నమ్ముతున్నాము. ఒకవేళ అల్లాహ్ త’ఆలా తలుచుకొని ప్రవక్తని అక్కడి వరకు తీసుకువెళ్లాడంటే ఇందులో మాకు నమ్మని విషయం ఏమిటి?” అప్పుడే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సిద్దీఖ్, సత్యవంతుడు అన్నటువంటి బిరుదు లభించినది. సత్యవంతుడు అని బిరుదు లభించినది.

అందుకు మహాశయులారా, గమనించండి. సిద్దీఖ్ అన్నటువంటి బిరుదు హజ్రత్ అబూ బకర్ కు ప్రవక్తను అనుసరిస్తే లభించిందా? ప్రవక్తను నమ్మితే లభించిందా? లేదా అనుసరణ, ఆచరణ అన్నిటినీ వదులుకొని కేవలం ప్రేమ, ప్రేమ, ప్రేమ అని కేవలం నోటికి చెప్పుకుంటే లభించిందా? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి పట్ల అబూ బకర్ కు ఉన్నంత ప్రేమ ఇంకా ఎవరికీ లేకుండే. కానీ ఆయన అంతే అనుసరించేవారు. ప్రవక్త మాటను ఆచరించేవారు. ఈ గుణపాఠం మనం కూడా నేర్చుకోవాలి. ఆచరణ అనేది ఉండాలి ప్రవక్త సున్నత్ ప్రకారంగా, దురాచారాన్ని వదులుకోవాలి, బిదత్ లను వదులుకోవాలి, షిర్క్ లను వదులుకోవాలి. మరియు ఏదైతే నమాజులను వదులుతున్నామో అది వదలకూడదు. ఎందుకు? ఇదే సామాన్య విషయమా నమాజ్? ఎక్కడ దొరికింది నమాజ్ ప్రవక్తకు? ఆకాశాల పైకి పిలువబడి ఇవ్వబడినది. ఇంతటి గౌరవమైన విషయాన్ని మనం ఎంత సునాయాసంగా, ఎంత ఈజీగా వదులుతున్నాము. అల్లాహ్ త’ఆలా మనందరికీ మేరాజ్ ప్రయాణంలో ప్రవక్త గారు ఏ ఏ విషయాలు చూశారో, ఏ ఏ బహుమానాలు పొందారో, దాని గురించి కొన్ని విషయాలు ఏదైతే విన్నామో వాటిని అర్థం చేసుకొని, వాటిని పాటించే భాగ్యం ప్రసాదించుగాక. స్వర్గంలో తీసుకెళ్ళేటువంటి సత్కార్యాలు చేసే భాగ్యం ప్రసాదించుగాక. మరియు నరకంలో తీసుకెళ్ళే విషయాల నుండి దూరం ఉండే అల్లాహ్ త’ఆలా భాగ్యం కూడా మనకు ప్రసాదించుగాక.

జజాకుముల్లాహు ఖైర్. అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=5801



స్వర్గంలో అల్లాహ్‌ దర్శనం

బిస్మిల్లాహ్

దైవ దర్శనం

ఇస్లాంకు చెందిన పలు ఇతర విషయాల వలె  సృష్టికర్త అయిన అల్లాహ్‌ను దర్శించడానికి సంబంధించిన విషయంలోనూ ముస్లింలకు చెందిన పలు వర్గాలు హెచ్చు తగ్గులకు గురయ్యారు.

ఒక వర్గమయితే ధ్యానం ద్వారా, ఆధ్యాత్మిక దివ్యజ్ఞానం ద్వారా ఇహలోకంలోనే అల్లాహ్‌ ను దర్శించవచ్చని ప్రకటించింది. మరొక వర్గం ఖుర్‌ఆన్‌ లోని “చూపులు ఆయనను అందుకోలేవు. కాని ఆయన చూపులను అందుకోగలడు.” (103 :6) అనే వాక్యాన్ని ఆధారంగా చేసుకొని ఇహలోకంలోనే కాకుండా పరలోకంలోనూ అల్లాహ్ ను చూడలేమని ప్రకటించింది.అయితే పవిత్ర ఖుర్‌ఆన్‌ ద్వారా, హదీసుల ద్వారా నిరూపించబడే విశ్వాసమేమిటంటే ఇహలోకంలో ఏ వ్యక్తయినా, చివరకు దైవప్రవక్త అయినా అల్లాహ్‌ను చూడడం సాధ్యం కాదు.

ఖుర్‌ఆన్‌లో దైవప్రవక్త హజ్రత్‌ మూసా (అలైహిస్సలాం) వృత్తాంతం ఎంతో వివరంగా పేర్కొనబడింది. హజ్రత్ మూసా (అలైహిస్సలాం) ఫిర్‌ఔన్‌ నుంచి విముక్తిని పొందిన తర్వాత ఇస్రాయీల్‌ సంతతిని వెంటబెట్టుకొని సీనా ద్వీపకల్పానికి చేరుకున్న తర్వాత సృష్టికర్త అయిన అల్లాహ్‌ ఆయనను తూర్‌ పర్వతం మీదకు పిలిచాడు. హజ్రత్ మూసా (అలైహిస్సలాం) నలభై రోజులు అక్కడ ఉన్న తర్వాత అల్లాహ్ ఆయనకు పలకలను అందజేసాడు. అప్పుడు హజ్రత్ మూసా (అలైహిస్సలాం)కు అల్లాహ్ ను దర్శించాలనే కోరిక కలిగింది. అప్పుడు హజ్రత్ మూసా (అలైహిస్సలాం) “ఓ నా ప్రభువా! నేను నిన్ను చూడగలిగేందుకై నాకు నిన్ను చూడగలిగే శక్తిని ప్రసాదించు.” అప్పుడు అల్లాహ్‌ ఈ విధంగా పేర్కొన్నాడు: “ఓ మూసా! నీవు నన్ను ఏ మాత్రం చూడలేవు. అయితే కొంచెం నీ ముందు ఉన్న కొండ వైపు చూడు. ఒకవేళ అది తన స్థానంలో స్థిరంగా ఉన్నట్లయితే నీవు కూడా నన్ను చూడగలవు.” అప్పుడు అల్లాహ్‌ తన తేజోమయ కాంతిని ఆ కొండపై ప్రసరింపజేయగా అది పిండి పిండి అయిపొయింది. అది చూసి హజ్రత్ మూసా (అలైహిస్సలాం) స్పృహ తప్పి పడిపోయారు. ఆ తర్వాత ఆయన (అలైహిస్సలాం) పశ్చాత్తాపంతో ఈ విధంగా అర్ధించారు: “నీ అస్తిత్వం పవిత్రమైనది. నేను నీ వైపుకు (నా కోరిక పట్ల పశ్చాత్తాపంతో) మరలుతున్నాను. అలాగే నేను అందరికంటే ముందు (అగోచర విషయాలను) విశ్వసించేవాడిని. (మరిన్ని వివరాల కొరకు ఖుర్‌అన్‌లోని ‘ఆరాఫ్‌ అధ్యాయపు 143వ వాక్యాన్ని పఠించండి). ఈ వృత్తాంతాన్ని బట్టి ఇహలోకంలో అల్లాహ్ ను చూడటమనేది సాధ్యం కాదని రుజువవుతోంది.

ఇక దైవప్రవక్త హజ్రత్ ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) మేరాజ్‌ ప్రయాణం విషయానికొస్తే ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) సతీమణి హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) “హజ్రత్ ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) తన ప్రభువును దర్శించారని పలికే వ్యక్తి అసత్యవాది” అని పేర్కొన్న విషయం కూడా దీనిని ధృవికరిస్తోంది. (బుఖారీ, ముస్లిమ్‌) ఇహలోకంలో దైవ ప్రవక్తలు సైతం అల్లాహ్‌ను చూడలేకపొయినప్పుడు మామూలు దాసులు అల్లాహ్‌ను తాము చూశామని పేర్కొనడం అసత్యం తప్ప మరేమి కాగలదు?

పవిత్ర ఖుర్‌ఆన్‌ ద్వారా, ప్రామాణికమైన హదీసుల ద్వారా పరలోకంలో స్వర్గలోకవాసులు సృష్టికర్త అయిన అల్లాహ్‌ ను దర్శిస్తారని రుజువవుతోంది. ఖుర్‌ఆన్‌లో యూనుస్‌ అనే అధ్యాయపు 26 వ వాక్యంలో అల్లాహ్‌ ఈ విధంగా పేర్కొన్నాడు : “మంచి పనులు చేసేవారి కొరకు మంచి ప్రతిఫలంతో పాటు ఇంకా మరొక వరం ప్రసాదించబడు తుంది.” ఈ వాక్యానికి వ్యాఖ్యానంగా హజ్రత్ సుహైబ్‌ రూమి (రదియల్లాహు అన్హు) ద్వారా పేర్కొనబడిన ఒక ఉల్లేఖనం ఈ విధంగా ఉంది : దైవప్రవక్త హజ్రత్ ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ వాక్యాన్ని పఠించిన తర్వాత ఈ విధంగా పేర్కొన్నారు: “స్వర్గ వాసులు స్వర్గంలోకి, నరకవాసులు నరకంలోకి ప్రవేశించిన తర్వాత ప్రకటించే ఒక వ్యక్తి ఈ విధంగా ప్రకటిస్తాడు :ఓ స్వర్గవాసులారా! అల్లాహ్‌ మీకు ఒక వాగ్దానం చేసి ఉన్నాడు. ఆ వాగ్దానాన్ని నేడు ఆయన నెరవేర్చాలని కోరుకుంటున్నాడు” అప్పుడు వారు ఇలా ప్రశ్నిస్తారు: “ఆ వాగ్దానం ఏది? అల్లాహ్ (తన కరుణ ద్వారా) మా ఆచరణలను (త్రాసులో) బరువైనవిగా మార్చివేయలేదా? అల్లాహ్‌ మమ్మల్ని నరకాగ్ని నుంచి రక్షించి స్వర్గంలోకి ప్రవేశింపజేయలేదా?” అప్పుడు వారికి, అల్లాహ్‌ కు నడుమ ఉన్న పరదా తొలగించబడుతుంది. అప్పుడు స్వర్గలోకవాసులకు అల్లాహ్‌ ను దర్శించే మహద్భాగ్యం ప్రాప్తమవుతుంది. (హజ్రత్ సుహైబ్‌ (రదియల్లాహు అన్హు) ఈ విధంగా పేర్కొంటున్నారు) ‘అల్లాహ్‌ సాక్షిగా! అల్లాహ్‌ దర్శనానికి మించి ప్రియమైనది, కనులకు ఆనందకరమైనది స్వర్గవాసులకు మరేదీ ఉండబోదు. (ముస్లిమ్‌)

ఖుర్‌ఆన్ లో మరొకచోట అల్లాహ్‌ ఈ విధంగా పేర్కొన్నాడు ; “అ రోజు ఎన్నో వదనాలు తాజాగా కళకళలాడుతూ ఉంటాయి, తమ ప్రభువు వైపు చూస్తూ ఉంటాయి. (ఖుర్‌ఆన్‌, ఖియామహ్‌ :22-23) ఈ ఆయతులో స్వర్గవాసులు అల్లాహ్‌ వైపు చూస్తూ ఉండటమనేది స్పష్టంగా పేర్కొనబడింది. హజ్రత్ జరీర్‌ బిన్‌ అబ్దుల్లాహ్ (రదియల్లాహు అన్హు) ఈ విధంగా ఉల్లేఖించారు: మేము దైవప్రవక్త హజ్రత్ ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధిలో హాజరయి ఉన్నాము. ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) పున్నమి నాటి చంద్రుని వైపు చూసి ఈ విధంగా పేర్కొన్నారు : “స్వర్గంలో మీరు నేడు ఈ చంద్రుని చూస్తున్న రీతిలోనే మీ ప్రభువును చూస్తారు. అల్లాహ్‌ ను చూడడం మీకు ఏమాత్రం కష్టం కాబోదు.” (బుఖారీ)

కనుక ఇహలోకంలోనే అల్లాహ్‌ను దర్శించవచ్చని ప్రకటించినవారు మార్గభ్రష్టులై పోయారు. అలాగే పరలోకంలోనూ అల్లాహ్‌ ను దర్శించడం అసాధ్యమని పేర్కొన్నవారూ మార్గభ్రష్టులై పోయారు. నిజమైన విశ్వాసమేమిటంటే ఇహలోకంలో అల్లాహ్‌ను దర్శించడం అసాధ్యం. అయితే స్వర్గంలో స్వర్గవాసులు అల్లాహ్‌ను చూస్తారు. ఆ విధంగా అల్లాహ్‌ సందర్శనమనే మహోన్నతమైన అనుగ్రహం ద్వారా స్వర్గలోకపు మిగిలిన వరానుగ్రహాల పరిపూర్తి జరుగుతుంది.


ఈ పోస్ట్ స్వర్గ సందర్శనం – ముహమ్మద్‌ ఇక్బాల్ కైలానీ అను పుస్తకం (పేజీ 17-19) నుండి  తీసుకోబడింది

స్వర్గ సందర్శనం [పుస్తకం]

బిస్మిల్లాహ్

స్వర్గ సందర్శనం (Swarga Sandarsanam)
కూర్పు : మౌలానా ముహమ్మద్‌ ఇఖ్‌బాల్‌ కైలానీ (Muhammad Iqbal Kailani)
అనువాదం : ముహమ్మద్‌ జీలాని (Muhammad Jeelani)
ప్రకాశకులు : హదీస్‌ పబ్లికేషన్స్‌. హైద్రాబాద్‌, ఏ.పి. ఇండియా

[ఇక్కడ చదవండి లేదా డౌన్లోడ్ చేసుకోండి]
https://bit.ly/swarga-sandarsanam-mobile
PDF (పిడిఎఫ్) – 176 పేజీలు మొబైల్ ఫ్రెండ్లీ బుక్

విషయ సూచిక