మొహర్రం నెల మరియు ఆషూరా ఉపవాసం గొప్పతనం  – షేఖ్ మాజిద్ బిన్ సులైమాన్ [ఖుత్బహ్]     

ఖతీబ్: మాజిద్ బిన్ సూలైమాన్ అర్రస్సీ, జుబైల్, సౌదీ అరేబియ
అనువాదం: అబ్దుల్లాహ్ జామిఈ
ఇస్లామీయ జుమా ప్రసంగాలు’ అనే పుస్తకం నుండి – రచన: మాజిద్ బిన్ సులైమాన్ అర్రస్సీ

إنَّ الْحَمْدَ لِلهِ نَحْمَدُهُ وَنَسْتَعِينُهُ وَنَسْتَغْفِرُهُ، وَنَعُوذُ بِاللهِ مِنْ شُرُورِ أَنْفُسِنَا وَمِنْ سَيِّئَاتِ أَعْمَالِنَا، مَنْ يَهْدِهِ اللهُ فَلاَ مُضِلَّ لَهُ، وَمَنْ يُضْلِلْ فَلاَ هَادِىَ لَهُ، وَأَشْهَدُ أَنْ لاَ إِلَهَ إِلاَّ اللهُ وَحْدَهُ لاَ شَرِيكَ لَهُ، وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُه 

يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ ٱتَّقُواْ ٱللَّهَ حَقَّ تُقَاتِهِۦ وَلَا تَمُوتُنَّ إِلَّا وَأَنتُم مُّسۡلِمُونَ١٠٢ 

يَٰٓأَيُّهَا ٱلنَّاسُ ٱتَّقُواْ رَبَّكُمُ ٱلَّذِي خَلَقَكُم مِّن نَّفۡسٖ وَٰحِدَةٖ وَخَلَقَ مِنۡهَا زَوۡجَهَا وَبَثَّ مِنۡهُمَا رِجَالٗا كَثِيرٗا وَنِسَآءٗۚ وَٱتَّقُواْ ٱللَّهَ ٱلَّذِي تَسَآءَلُونَ بِهِۦ وَٱلۡأَرۡحَامَۚ إِنَّ ٱللَّهَ كَانَ عَلَيۡكُمۡ رَقِيبٗا١ 

يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ ٱتَّقُواْ ٱللَّهَ وَقُولُواْ قَوۡلٗا سَدِيدٗا٧٠ يُصۡلِحۡ لَكُمۡ أَعۡمَٰلَكُمۡ وَيَغۡفِرۡ لَكُمۡ ذُنُوبَكُمۡۗ وَمَن يُطِعِ ٱللَّهَ وَرَسُولَهُۥ فَقَدۡ فَازَ فَوۡزًا عَظِيمًا٧١ 

స్తోత్రాలు మరియు దరూద్ తరువాత : 

అన్నిటి కంటే ఉత్తమమైన మాట అల్లాహ్ మాట. మరియు అందరి కంటే ఉత్తమమైన పద్ధతి ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి పద్ధతి. అన్నిటి కంటే నీచమైనది ఇస్లాంలో కొత్తగా సృష్టించబడినవి. మరియు ఇస్లాంలో కొత్తగా సృష్టించబడిన ప్రతీ కార్యమూ బిద్అత్ క్రిందికే వస్తుంది. మరియు ప్రతీ బిద్అత్ మార్గభ్రష్టత్వము మరియు ప్రతీ మార్గభ్రష్టత్వము నరకంలోకి తీసుకువెళ్ళేదే.    

ఓ ముస్లింలారా! అల్లాహ్ దైవభీతి కలిగి ఉండండి మరియు ఆయనకు విధేయత చూపండి. అవిధేయత నుండి జాగ్రత్త వహించండి. మరియు తెలుసుకోండి – అల్లాహ్ కొన్నింటిపై కొన్నింటికి ప్రాధాన్యతను ప్రసాదించాడు. ఉదాహరణకు ఆయన కొన్ని సమయాలను ఎంచుకున్నాడు. వాటికి ఇతర సమయాల పై ప్రాధాన్యతను ఆధిక్యతను ప్రసాదించాడు, ఈ సమయాలలో మొహర్రం నెల కూడా ఉంది. ఇది ఎంతో ఉన్నతమైన నెల మరియు ఇది హిజ్రీ సంవత్సరం యొక్క మొదటి నెల అలాగే గౌరవప్రదమైన నెలలలో ఇది కూడా ఒకటి అల్లాహ్ దీని గురించి ఇలా సెలవిస్తున్నాడు:  

(إِنَّ عِدَّةَ الشُّهُورِ عِنْدَ اللَّهِ اثْنَا عَشَرَ شَهْرًا فِي كِتَابِ اللَّهِ يَوْمَ خَلَقَ السَّمَوَاتِ وَالْأَرْضَ مِنْهَا أَرْبَعَةٌ حُرُمٌ ذَلِكَ الدِّينُ الْقَيِّمُ فَلَا تَظْلِمُوا فِيهِنَّ أَنْفُسَكُمْ

నిశ్చయంగా నెలల సంఖ్య అల్లాహ్‌ దగ్గర – అల్లాహ్‌ గ్రంథంలో పన్నెండు మాత్రమే. ఆయన ఆకాశాలను, భూమిని సృష్టించిన రోజునుంచీ (ఈ లెక్క ఇలాగే సాగుతున్నది). వాటిలో నాలుగు మాసాలు నిషిద్ధమైనవి (గౌరవ ప్రదమైనవి.) ఇదే సరైన ధర్మం. కాబట్టి ఈ మాసాలలో మీకు మీరు అన్యాయం చేసుకోకండి. 

(మీరు ఈ మాసాలలో మీపై అన్యాయం చేసుకోకండి) అనగా ఈ గౌరవప్రదమైన నెలలలో అని అర్థం. ఎందుకంటే వీటిలో చెడు మరియు అవిధేయతల పాపం పెరుగుతుంది.  

(మీరు ఈ మాసాలలో మీపై అన్యాయం చేసుకోకండి) ఈ వాక్యం యొక్క వివరణలో ఇబ్నే అబ్బాస్ (రదియల్లాహు అన్హు) ఈ విధంగా తెలియజేశారు:

అల్లాహ్ దౌర్జన్యాన్ని, అన్యాయాన్ని సంవత్సరపు పన్నెండు మాసాల్లోనూ నిషేధించాడు మరియు ముఖ్యంగా అందులో నాలుగు మాసాలను వాటిలో ప్రత్యేకంగా ఖరారు చేశాడు. ఎందుకంటే ఇందులో చేసేటువంటి పాపకార్యాలు మరియు అవిధేయత యొక్క పాపం పెరుగుతుంది. అదేవిధంగా సత్కార్యాలు, సదాచరణల పుణ్యం కూడా ఎన్నో రెట్లు పెరుగుతుంది. 

అదేవిధంగా (మీరు ఈ మాసాలలో మీపై అన్యాయం చేసుకోకండి) ఈ వాక్యం యొక్క వివరణలో ఖతాదా (రదియల్లాహు అన్హు) ఇలా తెలియజేశారు:

ఈ పవిత్రమైన మాసాలలో చేసేటువంటి దౌర్జన్యపు పాపం యొక్క తీవ్రత ఇతర నెలల్లో చేసేటువంటి పాపం యొక్క తీవ్రత కంటే అతి ఎక్కువగా ఉంటుంది.

ఇంకా ఇలా అన్నారు:

అల్లాహ్ తన సృష్టిలో నుండి కొందరిని ఎన్నుకున్నాడు. దైవదూతలలో కొందరిని దైవ సందేశారులుగా మరియు మానవులలో నుండి కొందరిని ప్రవక్తలుగా ఎన్నుకున్నాడు. అదేవిధంగా ఈ భూమండలంపై ఉన్న మస్జిద్ లలో నుండి కొన్నింటిని ఎన్నుకున్నాడు, మాసాలలోనుండి రమజాన్ మాసంతో పాటు నాలుగు గౌరవప్రదమైన నెలలను కూడా ఎన్నుకున్నాడు, రోజులలో నుండి శుక్రవారంను, రాత్రులలో లైలతుల్ ఖద్ర్ రాత్రిని ఎన్నుకున్నాడు. కాబట్టి అల్లాహ్ వేటినైతే గొప్పదిగా భావించాడో మనం కూడా తప్పక వాటిని గొప్పదిగా భావించాలి.  

అబూబకర్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు ఇలా తెలియచేశారు:

“సంవత్సరం 12 నెలలు కలిగి ఉంది. వీటిలో నాలుగు నిషిద్ధ మాసాలు ఉన్నాయి వాటిలో నుండి మూడు ఒకదాని తరువాత మరొకటి వస్తాయి. అవి జిల్ ఖా, జిల్ హిజ్జా మరియు మొహర్రం కాగా నాలుగవది జమాదిస్సానీ మరియు షాబాన్ మాసాల మధ్య వచ్చే రజబ్ నెల” (బుఖారి, ముస్లిం) 

ముహర్రం మాసానికి ఈ పేరు ఎందుకంటే ఇది పవిత్రమైన మాసం, దాని పవిత్రత మరియు గొప్పతనాన్ని నొక్కి చెబుతుంది. 

రజబ్ ముజిర్ నెల అని పిలవడానికి గల కారణం ఏమిటంటే; ముజిర్ సంతతి వారు ఈ నెలను తన స్థానం నుంచి తరలించేవారు కాదు. కానీ కొందరు అరబ్బు తెగలవారు ఈ నిషిద్ధ మాసాలను వాటి సమయాల్లో కాకుండా వారికి అనుకూలంగా మార్చుకునే వారు “ఈ ప్రక్రియను అల్ నసీ అని పిలుస్తారు.” 

అల్లాహ్ తఆలా ఈ మాసాలకు ఎంతో ఔన్నత్యాన్ని, గొప్పదనాన్ని ప్రసాదించాడు.  కనుక మనం వీటిని గుర్తించి ఈ మాసాలలో వారించబడిన విషయాలకు దూరంగా ఉండాలి. ఉదాహరణకు ఈ మాసాలలో యుద్ధాలు చేయడం నిషేధించబడింది మరియు పాపకార్యాలకు దూరంగా ఉండమని వారించబడింది.  

ఓ ముస్లిం లారా! మొహర్రం నెలలో అత్యధికంగా నఫీల్ ఉపవాసాలు పాటించడం ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా బోధించారు: “రంజాన్ ఉపవాసాల తర్వాత అన్నింటికన్నా శ్రేష్టమైన ఉపవాసాలు అల్లాహ్ మాసము అయిన మొహర్రం నెల ఉపవాసాలు”. (ముస్లిం) 

ఓ విశ్వాసులారా! ఈ సృష్టిలో అల్లాహ్ యొక్క రుబూబియత్ యొక్క రుజువు ఏమిటంటే ఆయన కొన్ని దినాలను ఎన్నుకున్నాడు, ఇందులో చేయబడేటువంటి ఆరాధనలకు ఇతర దినాలలో చేసే ఆరాధనలపై ప్రాధాన్యతను ప్రసాదించాడు అందులో నుండి ఆషూరా దినము (మొహర్రం నెల 10వ తారీకు) కూడా ఉంది. ఇస్లామియా క్యాలెండర్ ప్రకారం హిజ్రీ సంవత్సరం యొక్క 10వ రోజు, ఈరోజుకు గల గొప్పదనానికి ఒక ఆసక్తి కరమైన నేపథ్యం కూడా ఉంది, అదేమిటంటే  అల్లాహ్ తన ప్రవక్త అయినటువంటి మూసా అలైహిస్సలాం మరియు ఆయన సమాజానికి ముక్తి కలిగించి ఫిర్ఔన్ మరియు అతని జాతిని సముద్రంలో ముంచి వేశాడు.  ఈ కారణంగా మూసా అలైహిస్సలాం వారు అల్లాహ్ కు కృతజ్ఞతతో మొహర్రం నెల పదవ తారీకున ఉపవాసాన్ని పాటించేవారు ఆ తరువాత గ్రంథవహులు అనగా (యూదులు మరియు నస్రానీలు) కూడా ఈ ఉపవాసం పాటించేవారు. అలాగే అజ్ఞాన కాలపు అరబ్ జాతుల వారు కూడా ఉపవాసం పాటించేవారు వీరు గ్రంథవహులు కాదు విగ్రహారాధకులు. కాబట్టి ఖురేష్ జాతి వారు కూడా ఈ ఉపవాసాన్ని పాటించేవారు.

ఎప్పుడైతే మహా ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు హిజ్రత్ చేసి మదీనా వచ్చారో అక్కడి యూదులను ఉపవాసం పాటించడం చూసి మీరెందుకు ఈ దినం నాడు ఉపవాసం పాటిస్తారు? అని ప్రశ్నించారు. వారు ఆయనతో ఈరోజు ఎంతో విశిష్టమైనది ఈ రోజే అల్లాహ్ మూసా ప్రవక్తకు మరియు ఆయన సహచరులకు ఫిరోన్ నుండి ముక్తిని ప్రసాదించాడు. అందుకే’ మూసా అలైహిస్సలాం అల్లాహ్ కు కృతజ్ఞతలు తెలిపేందుకు ఈరోజు ఉపవాసం ఉండేవారు. అందుకే మేము కూడా ఈరోజు ఉపవాసం పాటిస్తున్నాము అని అన్నారు. ఇది విని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు: మూసా అలైహిస్సలాం కు మీకన్నా మేము దగ్గర వాళ్ళము.” ఆ తర్వాత దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం వారు స్వయంగా తాను కూడా ఈరోజు ఉపవాసం ఉండేవారు మరియు తన సహచరులకు కూడా దీని గురించి ఆదేశించేవారు.(బుఖారి, ముస్లిం) 

అంతేకాదు యూదులు ఆ రోజున తమ స్త్రీలకు ఆభరణాలు మరియు అందమైన దుస్తులు ధరింపజేసి వారిని అలంకరించేవారు. (ముస్లిం) 

అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు) ఇలా తెలియజేశారు:
యూదులు మరియు నస్రానీలు ఆషూరా దినాన్ని గౌరవించేవారు“.(ముస్లిం) 

ఆయిషా (రదియల్లాహు అన్హా) ఇలా తెలియజేశారు:

అజ్ఞాన కాలంలో ఖురైషులు ఆషూరా దినం నాడు ఉపవాసం వుండేవారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కూడా ఆ రోజు ఉపవాసం వుండేవారు. ఆ తరువాత ఆయన మదీనా కు విచ్చేసిన తర్వాత కూడా ఆ రోజు ఉపవాసం పాటించేవారు మరియు తన సహచరులకు కూడా దీని గురించి ఆదేశించేవారు. ఆ తర్వాత రమజాన్ మాసపు ఉపవాసాలు ఫర్జ్ అయ్యాయి. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) (ఆషూరా దినపు ఉపవాసం) నిర్ణయాన్ని ప్రజలపై వదిలేస్తూ ఇలా సెలవిచ్చారు: “మీలో ఇష్టమైవారు ఆ రోజు ఉపవాసం వుండవచ్చు ఇష్టంలేని వారు త్యజించ వచ్చు.” (బుఖారి, ముస్లిం) 

ఆయిషా (రదియల్లాహు అన్హా) ఇలా తెలియజేశారు: ఇదే రోజున ఖురైషులు కాబా గృహం మీద (ఘిలాఫ్) నల్లటి వస్త్రాన్ని ధరింప చేసేవారు. (బుఖారి) 

ఎప్పుడైతే అల్లాహ్ తఆలా రంజాన్ ఉపవాసాలను విధిగావించాడో అప్పుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు ఇలా అన్నారు: మీలో ఇష్టమైనవారు ఆ రోజు ఉపవాసం ఉండవచ్చు ఇష్టం లేనివారు త్యగించవచ్చు. అనగా ఈ ఆషూరా ఉపవాసం రంజాన్ ఉపవాసాల మాదిరిగా విధి కాదు. కేవలం ఇది అభిలాష నియమైనది.కాబట్టి ఉపవాసం పాటించిన వారు తప్పకుండా గొప్ప పుణ్యఫలాన్ని పొందుతారు.  

ఒక వ్యక్తి ప్రవక్త వారిని ఈ విధంగా ప్రశ్నించాడు. మీరు ఏ విధంగా ఉపవాసాలు పాటిస్తారు? అప్పుడు ప్రవక్త వారు ఇలా అన్నారు “ప్రతి నెలలో మూడు రోజులు మరియు రంజాన్ నెల ఉపవాసాలు ఇవి ఎల్లప్పుడూ ఉపవాసం ఉండటంతో సమానం, అరఫా ఉపవాసం గురించి నాకు అల్లాహ్ పై నమ్మకం ఉంది. దీని ద్వారా గతించిన ఒక సంవత్సరం మరియు రాబోయే ఒక సంవత్సరం యొక్క పాప క్షమాపణ కలుగుతుంది. మరియు ఈ విషయంలో కూడా అల్లాహ్ పై నాకు నమ్మకం ఉంది. ఆషూరా ఉపవాసం వలన గతించిన ఒక సంవత్సరం యొక్క పాప క్షమాపణ కలుగుతుంది. (ముస్లిం) 

అయితే గతించిన ఒక సంవత్సరంలో మనిషి ద్వారా జరిగినటువంటి చిన్న చిన్న పాపాలను ఆ రోజు ఉపవాసం పాటించడం ద్వారా అల్లాహ్ క్షమిస్తాడు. ఇది అల్లాహ్  యొక్క అపారమైన కారుణ్యము, ఆయన ఒకరోజు ఉపవాసం ద్వారా ఒక సంవత్సరం యొక్క పాపాలను క్షమిస్తున్నాడు. ఇక పెద్ద పాపాల విషయానికొస్తే ఇది కేవలం స్వచ్ఛమైన పశ్చాత్తాపం ద్వారా మాత్రమే క్షమించబడతాయి, అల్లాహ్ ఎంతో గొప్పవాడు మరియు కరుణామయుడు. 

ఓ ముస్లిం లారా! ఆషూరా ఉపవాసం యొక్క ఔన్నత్యం ఏమిటంటే మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు ఈ ఉపవాసం గురించి చాలా జాగ్రత్త వహించేవారు.  అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు) గారు ఇలా తెలియజేశారు: నేను మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారిని, ఆషూరా ఉపవాసము మరియు రంజాన్ మాసం యొక్క ఉపవాసాలు పాటించినంతగా ఇతర ఉపవాసాలు పాటించడాన్ని నేను చూడలేదు. (బుఖారి) 

సలఫె స్వాలిహీన్ యొక్క ఒక సమూహం దీని ఘనతను కోల్పోకుండా ఉండటానికి  ప్రయాణంలో కూడా అషురాలో ఉపవాసం ఉండేవారు.ఇబ్న్ రజబ్ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: ఇబ్నే అబ్బాస్, అబూ ఇస్ హాఖ్, జోహ్రీ, లాంటి సలఫ్ యొక్క ఒక జమాత్ ప్రయాణంలో కూడా ఆషూరా ఉపవాసాన్ని పాటించేవారు. 

జోహ్రీ ఇలా అనే వారు: రంజాన్ లో విడిచిపెట్టబడిన ఉపవాసాలు ఇతర దినాలలో (ఖజా) ద్వారా తిరిగి పాటించవచ్చు కానీ ఆషూరా పుణ్యఫలాన్ని విడిచిపెడితే మాత్రం దానిని (ఖజా) చేయడం కుదరదు. (బైహఖీ) 

ఇమామ్ అహ్మద్ బిన్ హంబల్ (రహిమహుల్లాహ్) గారు ప్రయాణంలో కూడా ఆషూరా ఉపవాసం పాటించవచ్చు అనే విషయాన్ని స్పష్టపరిచారు. 

సహాబాలు తమ పిల్లలకు ఉపవాసాన్ని అలవాటు చేయడానికి గాను ఈ ఆషూరా ఉపవాసాన్ని పెట్టించేవారు. రబీ బిన్తె ముఅవ్విజ్ (రదియల్లాహు అన్హా) కథనం: దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మదీనా చుట్టుప్రక్కల నివసించే బస్తీలలో “ఆషూరా దినం నాడు ఉపవాసం వుండండి” అన్న సందేశాన్ని పంపించారు. ఈ మేరకు, స్వయంగా మేము కూడా ఆ రోజు ఉపవాసం వుండేవాళ్ళం మరియు మా చిన్న పిల్లల చేత కూడా ఉపవాసం పాటింపజేసేవాళ్ళం. ఒకవేళ పిల్లలు భోజనం కోసం అల్లరి చేస్తే మేము వారికి ఇఫ్తార్ సమయం వరకు కాలం వెళ్ళబుచ్చటానికి ఆటబొమ్మలను ఇచ్చి శాంతింపజేసేవాళ్ళం.(బుఖారి ముస్లిం)  

అల్లాహ్ దాసులారా! ఆషూరా ఉపవాసం యొక్క సున్నత్ విధానం ఏమిటంటే దానితోపాటు నెల 9వ తేదీన ఉపవాసం కూడా ఉండాలి. దీని ఆధారం హదీసులో ఇలా ఉంది మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు ఇలా అన్నారు: ఒకవేళ నేను వచ్చే సంవత్సరం కూడా జీవించి ఉంటే’ నేను 10 వ తేదీతో పాటు 9వ తేదిన కూడా ఉపవాసం ఉంటాను, కానీ తదుపరి సంవత్సరం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారు లేరు.(ముస్లిం) 

ఓ ప్రజలారా! 10వ తేదీతో పాటు 9వ తేదీ ఉపవాసం ఉండడానికి గల కారణం ఏమిటంటే ముస్లింలు యూదులకు వ్యతిరేకంగా వ్యవహరించమని ఆదేశించబడింది. యూదులు పదవ తేదీన ఉపవాసం పాటిస్తారు కావున ప్రవక్త వారు దీనిని ఇష్టపడలేదు కాబట్టి ఈ సారూప్యతను తొలగించడానికి మహాప్రవక్త (సల్లలాహు అలైహి వసల్లం) వారు 10వ తేదీతో పాటు తొమ్మిదవ తేదీన ఉపవాసం ఉండమని మార్గ నిర్దేశం చేశారు. ఇది ఇస్లాం యొక్క ప్రత్యేకతలలో ఒకటి 

ఒకవేళ ఎవరైనా కేవలం పదవ తేదీన ఉపవాసం పాటించాలా? అని ప్రశ్నిస్తే దానికి సమాధానం, “అవును”  కానీ ఉత్తమం ఏమిటంటే 10వ తేదీతో పాటు దాని కంటే ఒకరోజు ముందు కూడా ఉపవాసం ఉండాలి. ఇది ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి ద్వారా వెలువడినటువంటి సాంప్రదాయము. 

అల్లాహ్ ఖుర్ఆన్  యొక్క శుభాలను మనజీవితాలలో వర్షింప చేయుగాక ,ఆయన వివేకం తో కూడిన సూచనల ద్వారా హితబోధ పొందే భాగ్యం ప్రసాదించుగాక ,అల్లాహ్ మనందరిని క్షమించుగాక, మీరు కూడా అల్లాహ్ ను క్షమాపణ వేడుకోండి నిశ్చయంగా ఆయన (తౌబా)  పశ్చాత్తాపం చెందే వారిని తప్పక  మన్నిస్తాడు.    

స్తోత్రం మరియు దరూద్ తరువాత 

ఓ ముస్లిం లారా! అల్లాహ్ ఆలా తన గొప్ప వివేకంతో ఈ రాత్రి పగటిని తయారు చేశాడు. అదేమిటంటే సదాచరణ చేసేవారు ఎవరు? అని పరీక్షించడానికి. 

అల్లాహ్ ఈ విధంగా సెలవిస్తున్నాడు: 

(وَهُوَ الَّذِي جَعَلَ اللَّيْلَ وَالنَّهَارَ خِلْفَةً لِمَنْ أَرَادَ أَنْ يَذَّكَّرَ أَوْ أَرَادَ شُكُورا

(ఆయనే రేయింబవళ్ళను ఒకదాని వెనుక ఒకటి వచ్చేలా చేశాడు. ఇదంతా గుణపాఠం నేర్చుకునే వాని కోసం, లేదా కృతజ్ఞతాపూర్వకంగా మసలుకోదలచిన వాని కోసం చేయబడింది.) 

మరొకచోట ఇలా అంటున్నాడు:  

(الذي خلق الموت والحياة ليبلوكم أيكم أحسن عملا

(మీలో మంచి పనులు చేసేవారెవరో పరీక్షించే నిమిత్తం ఆయన చావుబతుకులను సృజించాడు.) 

అబూ బరజ అస్లమీ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారు ఇలా తెలియజేశారు: “తీర్పుదినం రోజున ఐదు విషయాల గురించి విచారించనంత వరకు మానవుని పాదాలు కదల లేవు. అతని వయస్సు ఎక్కడ ఖర్చు చేశాడు, జ్ఞానం గురించి విద్య నేర్చుకుని ఆచరించాడా లేదా, అతని ధనం గురించి దానిని ఎక్కడి నుంచి సంపాదించాడు మరియు ఎక్కడ ఖర్చు చేశాడు, మరియు అతని యవ్వనం గురించి దాన్ని ఎక్కడ ఖర్చు చేశాడు”. (తిర్మీజి) 

ఓ విశ్వాసులారా! ఈ రోజుల్లో మనం గత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ, కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నాము కాబట్టి ఎవరైనా గత సంవత్సరం (తమ లెక్కల పత్రంలో) మనం ఏ సత్కార్యాన్ని నమోదు చేసామో ఎవరైనా నాకు చెప్పగలరా? మరియు కొత్త సంవత్సరంలో మేము ఏ చర్యలను స్వాగతించబోతున్నాం? సంవత్సరాలు చాలా వేగంగా గడిచిపోతున్నాయి, ఈ సంవత్సరం చూడండి, ఇలా గడిచిపోయింది. ఒక రోజు ఒక గంట గడిచిపోయినట్లుగా గడిచింది, కాబట్టి మన గురించి మనం పరిగణనలోకి తీసుకోవాలి, ఈ సంవత్సరంలో స్వర్గం పొందడం కొరకు మరియు నరకం నుండి ముక్తి పొందడానికి ఎం చేసుకున్నాము? అల్లాహ్ కు విధేయత చూపడంలో మనం ఎంత చురుకుదనం చూపించాం? గడిచిన పూర్తి సంవత్సరంలో ఎన్ని నఫీల్ నమాజులు చదివాము? ఎన్ని నఫీల్ ఉపవాసాలు పాటించాము? ఎన్ని దానధర్మాలు చేశాము? ఎంత సమయాన్ని అల్లాహ్ మార్గంలో గడిపాము? ఎన్నిసార్లు మొదటి సమయంలో మస్జిద్ కి వెళ్ళాము? ఎన్నిసార్లు మనల్ని మనం పాపాల నుండి కాపాడు కొన్నాము? అల్లాహ్ నిషేధించబడిన విషయాలను చూడటం నుండి మన కంటిని ఎంతవరకు రక్షించుకున్నాం? మన నాలుకను ఎంతవరకు అదుపులో ఉంచుకున్నాము?  మనం మన హృదయాలను కుళ్ళు కుతంత్రాల నుండి ఈర్షద్వేషాల నుండి పరిశుభ్రపరచుకున్నామా? మనం మన బంధుమిత్రులతో, ఇరుగుపొరుగుతో మన బంధుత్వాన్ని మెరుగుపరుచుకున్నామా? ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలకు ఎన్నిసార్లు పరదా గురించి బోధించాము? ఒకసారి ఆలోచించండి!  

మొదటిది: తనకు జీవితంలో మరో అవకాశం ఇచ్చినందుకు అల్లాహ్ కు ధన్యవాదాలు. 

రెండవది: మునుపటి నెల మరియు సంవత్సరం వెలుగులో స్వీయ పరిశీలన. 

మూడవది: మిగిలిన రోజులలో మనల్ని మనం ఎలా సంస్కరించుకోవాలి. 

ఉమర్ (రదియల్లాహు అన్హు) గారు ఇలా అన్నారు:

మీ లెక్క తీసుకోబడక ముందే మీ లెక్క చూసుకోండి, మీకు మీరే మీ కర్మలను తూకం వేసుకోండి, దీని ద్వారా మీ లెక్క సులభతరం అవుతుంది, మరియు తీసుకోబోయేటువంటి ఆ పెద్ద లెక్క కొరకు మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి. ఓ ముస్లింలారా! మృత్యువు జీవితాన్ని ఢీ కొట్టకముందే మీ పగలు మరియు రాత్రిని మంచి పనులతో నింపుకోండి. 

మరియు ఇది కూడా తెలుసుకోండి అల్లాహ్ ఆయనపై తన కారుణ్యాన్ని కురిపించు గాక. అల్లాహ్ మీకు ఒక గొప్ప విషయం గురించి తెలియచేశాడు. అల్లాహ్ ఈ విధంగా ఆజ్ఞాపించాడు. 

(إن اللَّهَ وَمَلَائِكَتَهُ يُصَلُّونَ عَلَى النَّبِيِّ يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا صَلُّوا عَلَيْهِ وَسَلِّمُوا تسليما) 

(నిశ్చయంగా అల్లాహ్, ఆయన దూతలు కూడా దైవప్రవక్తపై కారుణ్యాన్ని పంపిస్తున్నారు. ఓ విశ్వాసులారా! మీరు కూడా అతనిపై దరూద్‌ పంపండి. అత్యధికంగా అతనికి ‘సలాములు’ పంపుతూ ఉండండి.) 

ఓ అల్లాహ్! నీ దాసుడు మరియు నీప్రవక్త అయిన ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పై నీ కారుణ్యాన్ని అవతరింపచేయి ఆయన ఖలీఫాలు,తాబయీనులను పూర్తి చిత్తశుద్ది తో అనుసరించే వారిని ఇష్టపడు ప్రేమించు.  

ఓ అల్లాహ్! ఇస్లాం మరియు ముస్లింలకు గౌరవ మర్యాదలు ప్రసాదించు. షిర్క్ ,ముష్రిక్ లను అవమాన బరుచు. నీవు నీ ధర్మం అయిన ఇస్లాం కు శత్రువులు ఎవరైతే ఉన్నారో వారిని సర్వ నాశనం చేయి మరియు ఏకేశ్వరోపశకులకు నీ సహాయాన్ని అందించు.  

ఓ అల్లాహ్! మా దేశాలలో భద్రత ను ప్రసాదించు. మా నేతల వ్యవహారాన్ని సరిదిద్దు, సన్మార్గం చూపే మరియు సన్మార్గము పై నడిచే వారీగా చేయి.ఓ అల్లాహ్! మా పరిపాలకులకు నీ గ్రంధానికి కట్టుబడి ఆజ్ఞాపాలన చేసే భాగ్యాన్ని ప్రసాదించు.  

ఓ అల్లాహ్! మా పాపాలను మరియు మా ఆచరణలో ఏర్పడిన కొరతను క్షమించు.

ఓ అల్లాహ్! మాకు ఈ ప్రపంచంలో పుణ్యాన్ని పరలోకం లో సాఫల్యాన్ని ప్రసాదించు. నరక శిక్షల నుండి మమ్ములను కాపాడు.   

ఓ అల్లాహ్! మేము నీతో స్వర్గం గురించి ప్రాధేయపడుతున్నాము మరియు ఆ స్వర్గం లోకి ప్రవేశించేటువంటి ఆచరణని మాకు ప్రసాదించమని వేడుకుంటున్నాము.  మరియు ఆ నరకం నుండి నీ శరణు వేడుకుంటున్నాము. మరియు  నరకానికి దగ్గర చేసేటువంటి ప్రతి పని నుండి  నీ శరణు కోరుకుంటున్నాము.  

ఓ అల్లాహ్ దాసులారా! అల్లాహ్ న్యాయం గురించి, బందువుల హక్కులు నెరవేర్చడం గురించి అజ్ఞాపిస్తున్నాడు. అశ్లీలం దౌర్జన్యం నుండి ఆపుతున్నాడు. ఆయన మనకు హితోపదేసిస్తున్నాడు, కనుక మనం ఎల్ల వేళలా ఆయనను స్మరిస్తూ ఉండాలి, ఆయన ప్రసాదించిన అనుగ్రహాల పట్ల కృతజ్ఞత చూపాలి. అల్లాహ్ స్మరణ అన్నిటి కంటే గొప్పది. అల్లాహ్ మనం చేసే ప్రతి పనిని గమనిస్తున్నాడు. 

سُبۡحَٰنَ رَبِّكَ رَبِّ ٱلۡعِزَّةِ عَمَّا يَصِفُونَ وَسَلَٰمٌ عَلَى ٱلۡمُرۡسَلِينَ وَٱلۡحَمۡدُ لِلَّهِ رَبِّ ٱلۡعَٰلَمِين 

ఖతీబ్: మాజిద్ బిన్ సూలైమాన్ అర్రస్సీ, జుబైల్, సౌదీ ఆరేబియ
అనువాదం: అబ్దుల్లాహ్ జామిఈ
ఇస్లామీయ జుమా ప్రసంగాలు’ అనే పుస్తకం నుండి – రచన: మాజిద్ బిన్ సులైమాన్ అర్రస్సీ

జుమా ఖుత్బా సందర్భంలో మౌనంగా ఉండుట తప్పనిసరి [ఆడియో, టెక్స్ట్]

[8 నిముషాలు]
https://youtu.be/cRqGXyIpURs
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగం శుక్రవారం ఖుత్బా (ప్రసంగం) సమయంలో నిశ్శబ్దం పాటించడం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తుంది. ఖుత్బా జరుగుతున్నప్పుడు ఇతరులను నిశ్శబ్దంగా ఉండమని చెప్పడం కూడా నిషేధించబడినదని, అలా చేయడం శుక్రవారం నమాజ్ యొక్క పుణ్యాన్ని కోల్పోయేలా చేస్తుందని హదీసుల ద్వారా స్పష్టం చేయబడింది. శుక్రవారం నాడు త్వరగా వచ్చి, స్నానం చేసి, నఫిల్ నమాజ్ చేసి, మౌనంగా ఖుత్బా విన్నవారికి పది రోజుల పాపాలు క్షమించబడతాయని చెప్పబడింది. ఖుత్బా వినడం అనేది అజాన్‌కు సమాధానం ఇవ్వడం కంటే ముఖ్యమైనదని, ఆలస్యంగా వచ్చినవారు కూడా సంక్షిప్తంగా రెండు రకాతుల నమాజ్ చేసి ఖుత్బా వినడంలో నిమగ్నం కావాలని ఈ ప్రసంగం బోధిస్తుంది.

السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله والصلاة والسلام على رسول الله، أما بعد.
(అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు. అల్హందులిల్లాహ్, వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్, అమ్మా బాద్.)
(అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు మీపై వర్షించుగాక. సర్వస్తోత్రాలు అల్లాహ్‌కే శోభాయమానం. అల్లాహ్ యొక్క ప్రవక్తపై శాంతి మరియు శుభాలు కలుగుగాక.)

باب الإنصات للخطبة يوم الجمعة
(బాబుల్ ఇన్సాతి లిల్ ఖుత్బతి యౌమల్ జుమా)
(శుక్రవారం రోజు ఖుత్బాకు మౌనంగా వినడం అనే అధ్యాయం.)

జుమా రోజు ఖుత్బా జరుగుతున్న సమయంలో మౌనం వహించడం, గమ్మున ఉండడం.

عن أبي هريرة رضي الله عنه أن رسول الله صلى الله عليه وسلم قال: إذا قلت لصاحبك يوم الجمعة أنصت والإمام يخطب، فقد لغوت
(అన్ అబీ హురైరత రదియల్లాహు అన్హు అన్న రసూలల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లమ ఖాల్: ఇదా ఖుల్త లిసాహిబిక యౌమల్ జుముఅతి అన్‌సిత్ వల్ ఇమాము యఖ్తుబు, ఫఖద్ లగౌత)

అబూ హురైరా రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు: “జుమా రోజు ఇమామ్ ఖుత్బా ఇస్తున్న సందర్భంలో నీవు నీ పక్కన ఉన్న సోదరునితో ‘మౌనం వహించు’ అని అంటే, నీవు ఒక లగ్వ్ (వ్యర్థమైన) పని చేసినవానివి అవుతావు.”

ఈ హదీస్ ద్వారా మనకు బోధపడే విషయాలు ఎన్నో ఉన్నాయి. ఒకటి, ఇమామ్ ఖుత్బా ఇస్తున్న సందర్భంలో, జుమా రోజు, మనం సైలెంట్‌గా ఉండాలి, మౌనం వహించాలి. ఏ కార్యకలాపాలు చేయకూడదు, ఏ మాట మాట్లాడకూడదు.

రెండో బోధ మనకిందులో, మన పక్కన ఎవరినైనా మనం చూస్తున్నాము, కొందరు మాట్లాడుకుంటున్నారు, ఏదైనా వృధా కార్యకలాపాల్లో ఉన్నారు, వారికి కూడా మనం చెప్పకూడదు. “అరే ఇలా చేయకు,” “ఓ బాయ్, ఖామోష్ రహో,” “మౌనం వహించు,” “ప్లీజ్ సైలెంట్‌గా ఉండు” అని మనం చెప్పకూడదు. ఇది ఇమామ్ యొక్క బాధ్యత, ఇమామ్ చెప్పాలి.

ఇక అతి ముఖ్యమైన విషయం ఇందులో మనకు తెలిసింది మరొకటి ఏమిటంటే, ఒకవేళ మనం ఇమామ్ ఖుత్బా ఇస్తున్న సందర్భంలో వేరే ఎవరితోనైనా, “మీరు గమ్మున ఉండండి,” “మాట్లాడకండి,” “ప్లీజ్ సైలెంట్” అని మనం చెప్పామంటే, మనం లగ్వ్ చేసిన వాళ్ళం అయ్యాము అని ఇక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు హెచ్చరించారు.

లగ్వ్ అంటే ఇక్కడ ఏంటి? లగ్వ్ అంటే ఇక్కడ పనికిమాలిన, వృధా మాట. అయితే, చూడటానికి ఇక్కడ గమనించండి, గమనించండి, చూడటానికి మనం ఒక మంచి పని చేశామని అనిపిస్తుంది కదా? ఒక ఇద్దరు మాట్లాడుకుంటే, “ష్, సైలెంట్ ప్లీజ్” ఈ విధంగా మెల్లగా చెప్పేశాము. మనం ఒక మంచి పని చేశాము అనే భావన మనకు ఏర్పడింది. కానీ ప్రవక్త ఏమంటున్నారు? فقد لغوت (ఫఖద్ లగౌత) – “నీవు ఒక లగ్వ్ పని చేశావు” అని. మరియు ఇక్కడ లగ్వ్ అన్నదానికి భావం, ఇమామ్ హాఫిజ్ ఇబ్నె హజర్ అస్కలానీ రహ్మతుల్లా అలై తెలిపినట్లు,

خبت من الأجر
(ఖిబ్త మినల్ అజ్ర్)
నీవు జుమా యొక్క పుణ్యాన్ని కోల్పోయావు.

بطلت فضيلة جمعتك
(బతలత్ ఫజీలతు జుముఅతిక్)
జుమాకు సంబంధించిన ఏ ఘనత, ఏ గొప్పతనం అయితే ఉందో దాన్ని నీవు కోల్పోయావు అని భావం. అల్లాహు అక్బర్.

حرم فضيلة الجمعة
(హురిమ ఫజీలతల్ జుమా)
జుమా యొక్క ఫజీలత్ ఏదైతే ఉందో దాని నుండి అతడు మహ్రూమ్ అయిపోయాడు

అందుకొరకు సోదర మహాశయులారా, కొన్ని ప్రాంతాల్లో మనం ఏం చూస్తూ ఉన్నాము, ప్రత్యేకంగా అరబ్ ప్రాంతాల్లో, అనేకమంది మన సోదరులు, మిత్రులు ఖుత్బా అరబీలో జరుగుతుంది, మనకేం అర్థమవుతుంది అది అని చిన్నపాటిగా గుంపులుగా చేసుకొని ఇద్దరు, ముగ్గురు, నలుగురు వెనుక కూర్చుండి పరస్పరం మాట్లాడుకుంటూ ఉంటారు. అల్లాహు అక్బర్, ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్. ఇది ఇంకా మహా ఘోరమైన విషయం.

గమనించండి ఇక్కడ. ఇద్దరు మాట్లాడుకునే వారిని, “మీరు సైలెంట్‌గా ఉండండి” అని చెప్పడంలోనే పాపం ఉన్నది, జుమా యొక్క సవాబ్ (పుణ్యం) కోల్పోతున్నారంటే, ఇక ఎవరైతే మాట్లాడుతున్నారో వారు ఎంత ఘోరమైన పాపంలో ఉన్నారో గమనించండి. ఈ హదీస్ ఏదైతే మీకు వినిపించానో, సహీ బుఖారీలో ఉంది, హదీస్ నంబర్ 934, అలాగే సహీ ముస్లిం, హదీస్ నంబర్ 851.

ఇక సంక్షిప్తంగా మరొక హదీస్ కూడా మనం విందాము.

عن أبي هريرة رضي الله عنه أن النبي صلى الله عليه وسلم قال: من اغتسل ثم أتى الجمعة، فصلى ما قدر له، ثم أنصت حتى يفرغ من خطبته، ثم يصلي معه، غفر له ما بينه وبين الجمعة الأخرى، وفضل ثلاثة أيام

(అన్ అబీ హురైరత రదియల్లాహు అన్హు అన్న నబియ్య సల్లల్లాహు అలైహి వసల్లమ ఖాల్: మనిగ్తసల సుమ్మ అతల్ జుముఅత, ఫసల్లా మా ఖుద్దిర లహు, సుమ్మ అన్‌సత హత్తా యఫ్రుగ మిన్ ఖుత్బతిహి, సుమ్మ యుసల్లీ మఅహు, గుఫిర లహు మా బైనహు వ బైనల్ జుముఅతిల్ ఉఖ్రా, వ ఫద్లు సలాసతి అయ్యామ్)

ఎవరైతే మంచి రీతిలో స్నానం చేశారో, జుమా నమాజు కొరకు హాజరయ్యారో మరియు ఖుత్బా కంటే ముందు వచ్చి అల్లాహ్ అతని అదృష్టంలో రాసినన్ని రకాతులు చేశాడో (ఇది జుమా ఖుత్బా కంటే ముందు, సామాన్యంగా వీటిని మనం నఫిల్ అంటాము. జుమా కంటే ముందు ఇన్ని రకాతులు అని ఫిక్స్ లేదు. కనీసం రెండు రకాతులు, కానీ అంతకంటే ఎక్కువగా ఎన్నైనా చదవవచ్చు. ఇమామ్ ఖుత్బా స్టార్ట్ చేసేకి ముందు వరకు), ఆ తర్వాత, ఎప్పుడైతే ఇమామ్ ఖుత్బా మొదలు పెడతాడో అప్పటి నుండి ఖుత్బా పూర్తి అయ్యే వరకు అన్‌సత (أنصت) – సైలెంట్‌గా ఉన్నాడు, మౌనం వహించాడు, గమ్మున ఉండిపోయాడు. ఆ తర్వాత ఇమామ్‌తో నమాజ్ చేశాడు. ఇలాంటి వ్యక్తికి ఈ జుమా నుండి మళ్ళీ వచ్చే జుమా వరకు, అంతకంటే మూడు రోజులు ఇంకా అదనంగా, అంటే మొత్తం పది రోజుల పాపాలు అల్లాహ్‌తాలా మన్నిస్తాడు. అల్లాహు అక్బర్.

గమనించండి, పది రోజుల పాపాలు జుమా రోజు నమాజుకు హాజరై, త్వరగా వచ్చి ఎన్ని రకాతులు అంటే అన్ని చేసుకొని, ఇమామ్‌తో ఖుత్బా వినడంలో శ్రద్ధ వహించడం, మౌనం వహించడం, అలాంటి వారి కొరకు ఈ గొప్ప ఘనత ఉంది. అంటే దీని ద్వారా తెలిసింది ఏమిటి? ఒకవేళ ఎవరైనా మాట్లాడారో, మధ్యలో ఏదైనా వృధా కార్యకలాపాలు చేశారో అంటే వారు జుమా యొక్క సవాబును కోల్పోయారు.

ఇక కొందరు ఒక ప్రశ్న అడుగుతారు. వచ్చేసరికి ఏదైనా ఆలస్యం అయిపోయింది, మేము మస్జిద్‌లోకి వచ్చాము, ఇమామ్ అజాన్ ఇస్తున్నాడు. ఆ సందర్భంలో ఏం చేయాలి? రెండు రకాతులు సున్నతులు చేసుకోవాలా? లేకుంటే అజాన్ అయ్యేవరకు మేము వేచి ఉండాలా, అజాన్ యొక్క జవాబు ఇవ్వడానికి? అయితే సోదర మహాశయులారా, అజాన్ యొక్క జవాబు ఇవ్వడం చాలా పుణ్యకార్యం, కానీ ఇమామ్ యొక్క ఖుత్బా వినడం అనేది అజాన్ యొక్క జవాబు కంటే ఎక్కువ ప్రాముఖ్యత గలది గనక, సంక్షిప్తంగా రెండు రకాతులు చేసుకొని కూర్చోవాలి, ఇమామ్ యొక్క ఖుత్బా శ్రద్ధగా వినాలి.

అల్లాహ్ మనందరికీ మన జీవితంలోని ప్రతీ సమస్యలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చూపినటువంటి పరిష్కారాన్ని స్వీకరించి ఆచరించే భాగ్యం ప్రసాదించుగాక.


494. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు :-

“శుక్రవారం రోజు ఇమామ్ జుమా ప్రసంగం చేస్తున్నప్పుడు, మీరు గనక మీ (ప్రక్కన కూర్చున్న) సహచరునితో ‘నిశ్శబ్దంగా’ ఉండు అని అంటే మీరొక పనికిమాలిన పనికి పాల్పడినవారవుతారు.”

[సహీహ్ బుఖారీ : 11 వ ప్రకరణం – జుమా, 36 వ అధ్యాయం – అల్ ఇన్సాతి యౌముల్ జుమా వల్ ఇమాము యఖ్తుబ్]

జుమా ప్రకరణం – 3 వ అధ్యాయం – జుమా ప్రసంగం చేస్తున్నప్పుడు నిశ్శబ్దంగా ఉండాలి
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు (Al-Loolu Wal Marjan ) Vol. 1
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్


ఇతరములు:

జుము’ఆ (శుక్రవారం) రోజున మన బాధ్యతలు, పుణ్య మార్గాలు. ఇక్కడ ఆడియో వీడియో ఆర్టికల్స్ పొందుతారు ఇన్ షా అల్లాహ్. తప్పక ఈ పేజీని దర్శించండి, ఫార్వర్డ్ చేయండి

జుమా (శుక్ర వారం)
https://teluguislam.net/five-pillars/salah-namaz-prayer/friday/

జుమా రోజు స్నానం చేయడం, సువాసన పూసుకోవడం ధర్మం [ఆడియో, టెక్స్ట్]

జుమా రోజు స్నానం చేయడం, సువాసన పూసుకోవడం ధర్మం
https://youtu.be/S94_5Yq3hOA [8 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) జుమా రోజు ఆచరించాల్సిన పలు సున్నతుల గురించి వివరించారు. ముఖ్యంగా, జుమా రోజు స్నానం చేయడం యొక్క ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు. కొన్ని హదీసుల ప్రకారం ఇది ప్రతి ప్రౌఢ వయస్సుకు చేరిన వ్యక్తిపై విధిగా (వాజిబ్) ఉండగా, మరికొన్ని హదీసుల ప్రకారం ఇది అత్యంత ఉత్తమమైన (అఫ్దల్) చర్య. స్నానంతో పాటు, శుభ్రమైన దుస్తులు ధరించడం, అందుబాటులో ఉన్న సువాసన లేదా నూనె రాసుకోవడం, మస్జిద్‌కు తొందరగా వెళ్లడం, ఇతరులను ఇబ్బంది పెట్టకుండా దొరికిన చోట కూర్చోవడం, మరియు ఇమామ్ ప్రసంగాన్ని (ఖుత్బా) శ్రద్ధగా, మౌనంగా వినడం వంటివి కూడా వివరించబడ్డాయి. ఈ నియమాలను పాటించిన వ్యక్తి యొక్క ఒక జుమా నుండి మరో జుమా మధ్య జరిగిన పాపాలు మరియు అదనంగా మరో మూడు రోజుల పాపాలు క్షమించబడతాయని శుభవార్త ఇవ్వబడింది.

అల్హమ్దులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లా అమ్మాబాద్.

జుమాకు సంబంధించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి పవిత్ర సూక్తులు, హదీసుల తెలుగు అనువాదం మనం వింటూ ఉన్నాము. ఇప్పుడు జుమా రోజు స్నానం చేసే ఆదేశంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపిన హదీసులు విందాము.

عَنْ عَبْدِ اللَّهِ بْنِ عُمَرَ ـ رضى الله عنهما ـ أَنَّ رَسُولَ اللَّهِ صلى الله عليه وسلم قَالَ ‏ “‏ إِذَا جَاءَ أَحَدُكُمُ الْجُمُعَةَ فَلْيَغْتَسِلْ ‏”‌‏
అన్ అబ్దుల్లా హిబ్ని ఉమర రదియల్లాహు అన్హు అన్న రసూలల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లమ ఖాల, “ఇదా జాఅ అహదుకుముల్ జుముఅత ఫల్ యగ్తసిల్”.
(అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమర్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పారు: “మీలో ఎవరు జుమాకు హాజరవుతున్నారో, వారు స్నానం చేయాలి”.)
(సహీహ్ బుఖారీ 877, సహీహ్ ముస్లిం 844)

عَنْ أَبِي سَعِيدٍ الْخُدْرِيِّ ـ رضى الله عنه ـ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ ‏ “‏ الْغُسْلُ يَوْمَ الْجُمُعَةِ وَاجِبٌ عَلَى كُلِّ مُحْتَلِمٍ ‏”‌‏
అన్ అబీ సయీదినిల్ ఖుద్రీ రదియల్లాహు అన్హు అనిన్నబియ్యి సల్లల్లాహు అలైహి వసల్లమ ఖాల, “అల్ గుస్లు యౌమల్ జుముఅతి వాజిబున్ అలా కుల్లి ముహ్తలిం”.
(అబూ సయీద్ ఖుద్రీ రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు: “జుమా రోజు స్నానం చేయడం, ప్రాజ్ఞ వయస్సుకు చేరిన ప్రతి ఒక్కరిపై విధిగా ఉంది”.) (సహీహ్ బుఖారీ 858, సహీహ్ ముస్లిం 846)

عَنْ سَمُرَةَ بْنِ جُنْدَبٍ، قَالَ قَالَ رَسُولُ اللَّهِ صلى الله عليه وسلم ‏ “‏ مَنْ تَوَضَّأَ يَوْمَ الْجُمُعَةِ فَبِهَا وَنِعْمَتْ وَمَنِ اغْتَسَلَ فَالْغُسْلُ أَفْضَلُ ‏”‏
అన్ సమురతబ్ని జుందుబిన్ రదియల్లాహు అన్హు ఖాల ఖాల రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం, “మన్ తవద్దఅ యౌమల్ జుముఅతి ఫబిహా వనిఅమత్, వ మనిగ్తసల ఫహువ అఫ్దల్”.

(సముర బిన్ జుందుబ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “ఎవరైతే జుమా రోజు వుదూ చేసుకున్నారో, చాలా మంచి పని చేశాడు అతను. మరెవరైతే స్నానం చేశారో, ఈ స్నానం చేయడం అన్నది చాలా ఉత్తమం”.) (అబూ దావూద్ 354, తిర్మిది 497, నిసాయి 1379, దారిమి 1581. ఇది హసన్ కోవకు చెందిన హదీస్).

عَنْ أَبِي هُرَيْرَةَ، أَنَّ رَسُولَ اللَّهِ صلى الله عليه وسلم قَالَ مَنْ تَوَضَّأَ فَأَحْسَنَ الْوُضُوءَ ثُمَّ أَتَى الْجُمُعَةَ فَدَنَا وَاسْتَمَعَ وَأَنْصَتَ غُفِرَ لَهُ مَا بَيْنَهُ وَبَيْنَ الْجُمُعَةِ وَزِيَادَةُ ثَلاَثَةِ أَيَّامٍ وَمَنْ مَسَّ الْحَصَى فَقَدْ لَغَا

అన్ అబీ హురైరత రదియల్లాహు అన్హు ఖాల్, ఖాల రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం, “మన్ తవద్దఅ ఫ అహ్సనల్ వుదూఅ సుమ్మ అతల్ జుముఅత ఫదనా వస్తమఅ వఅన్సత గుఫిర లహు మాబైనహు వబైనల్ జుముఅ వజియాదతు సలాసతి అయ్యామ్, వమన్ మస్సల్ హసా ఫఖద్ లగా”.

(అబూ హురైరా రదియల్లాహు తాలా అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు: “ఎవరైతే మంచి రీతిలో, ఉత్తమ రీతిలో ప్రవక్త చెప్పినట్లు, చూపినట్లు వుదూ చేశారో, మళ్ళీ జుమాకు హాజరయ్యాడో, మొదటి పంక్తులలో ఇమామ్‌కు చాలా దగ్గరగా కూర్చొని జుమా ప్రసంగం (ఖుత్బా) చాలా శ్రద్ధగా, మౌనంగా విన్నాడో, అలాంటి వ్యక్తికి రెండు జుమాల మధ్యలో, అంటే మొత్తం ఏడు రోజులు, ఇంకా అదనంగా మూడు రోజులు, అంటే మొత్తం పది రోజుల పాపాలు మన్నించబడతాయి. అయితే ఎవరైతే ఈ జుమా ఖుత్బా ప్రసంగం సందర్భంలో కంకర రాళ్లు కూడా ముట్టుకుంటాడో, అతని యొక్క జుమా పుణ్యమంతా కూడా వృధా అయిపోతుంది”.) (అబూ దావూద్ 1050, తిర్మిది 498. హదీస్ సహీహ్).

ఈ నాలుగు హదీసులలో మనకు తెలిసిన సారాంశం ఏమిటంటే, జుమా రోజు స్నానం చేయడం చాలా ఉత్తమమైన విషయం. సహీహ్ బుఖారీ, ముస్లిం హదీసుల ఆధారంగా కొందరు విధి అని కూడా అంటారు, ‘వాజిబున్’ అన్న పదం వచ్చింది గనక. కానీ అబూ దావూద్, తిర్మిది, నసాయి ఇంకా వేరే హదీసు గ్రంథాలలో వచ్చిన హదీసు ఆధారంగా ‘అఫ్దల్’ అన్న పదం వచ్చింది గనుక, విధి కాదు. కానీ మనిషికి అవకాశం ఉండి, సౌకర్యాలు ఉన్నప్పుడు దీనిని ఏమాత్రం వదలకూడదు.

మరొక ముఖ్య విషయం మనం గమనించాల్సింది, సామాన్యంగా మనం జుమా రోజు స్నానం చేసినప్పుడు పరిశుభ్రత కొరకు, స్నానం చేయాలి, ఈ రోజు జుమా అన్నటువంటి ఆలోచనలు, ఇరాదా, నియ్యతులు ఉంటాయి. కానీ వీటితో పాటు అతి ముఖ్యమైనది, జుమా రోజు స్నానం చేయడం విధి లేదా అతి ఉత్తమం అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు గనక, ప్రవక్త ఈ ఆదేశాన్ని మనం పాటిస్తున్నాము అన్నటువంటి నియ్యత్ మనసులో ఉండేది ఉంటే, ఈ స్నానం చేయడం ద్వారా కూడా మనకు పుణ్యాలు లభిస్తాయి. ఈ విషయం మనకు నాలుగో హదీసులో కూడా చాలా స్పష్టంగా తెలిసింది. అల్లాహు తఆలా దీనికి బదులుగా ఇంకా వీటితో పాటు మరికొన్ని పుణ్య కార్యాలు ఏదైతే తెలుపబడ్డాయో, తొందరగా రావడం, ముందు పంక్తుల్లో కూర్చోవడం, ఎలాంటి వృధా కార్యకలాపాలు చేయకుండా ఉండడం, శ్రద్ధగా ఖుత్బా వినడం, వీటి ద్వారా అల్లాహు తఆలా పది రోజుల పాపాలు మన్నిస్తాడు.

ఇక జుమా రోజు సువాసన పూసుకోవడం కూడా ఒక పుణ్య కార్యం. అయితే, దీనికి సంబంధించిన ఒక హదీసు విందాము.

عَنْ سَلْمَانَ الْفَارِسِيِّ، قَالَ قَالَ النَّبِيُّ صلى الله عليه وسلم ‏ “‏ لاَ يَغْتَسِلُ رَجُلٌ يَوْمَ الْجُمُعَةِ، وَيَتَطَهَّرُ مَا اسْتَطَاعَ مِنْ طُهْرٍ، وَيَدَّهِنُ مِنْ دُهْنِهِ، أَوْ يَمَسُّ مِنْ طِيبِ بَيْتِهِ، ثُمَّ يَخْرُجُ فَلاَ يُفَرِّقُ بَيْنَ اثْنَيْنِ، ثُمَّ يُصَلِّي مَا كُتِبَ لَهُ، ثُمَّ يُنْصِتُ إِذَا تَكَلَّمَ الإِمَامُ، إِلاَّ غُفِرَ لَهُ مَا بَيْنَهُ وَبَيْنَ الْجُمُعَةِ الأُخْرَى ‏”‌‏

అన్ సల్మానల్ ఫారిసీ రదియల్లాహు అన్హు ఖాల్, ఖాలన్నబియ్యు సల్లల్లాహు అలైహి వసల్లం, “లా యగ్తసిలు రజులున్ యౌమల్ జుముఅ, వ యతతహ్హరు మస్తతాఅ మిన్ తుహ్రిన్, వ యద్దహిను మిన్ దుహ్నిహి, అవ్ యమస్సు మిన్ తీబి బైతిహి, సుమ్మ యఖ్రుజు ఫలా యుఫర్రిఖు బైనస్నైన్, సుమ్మ యుసల్లీ మా కుతిబ లహు, సుమ్మ యున్సితు ఇదా తకల్లమల్ ఇమాము, ఇల్లా గుఫిర లహు మా బైనహు వబైనల్ జుముఅతిల్ ఉఖ్రా”.

సల్మాన్ ఫార్సీ రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు: “జుమా రోజు ఎవరైతే స్నానం చేస్తారో, మంచి విధంగా తన శక్తి ప్రకారం పరిశుభ్రత పాటిస్తాడో, మంచి దుస్తులు ధరించుకుంటాడో మరియు తన వద్ద ఉన్నటువంటి నూనె తలకు పూసుకుంటాడో మరియు అలాగే ఇంట్లో ఉన్న సువాసన కూడా పూసుకుంటాడో, ఇంకా మస్జిద్‌కు వెళ్లి మస్జిద్లో ఇద్దరి మధ్యలో విడదీయకుండా, ఎక్కడ అతనికి స్థలం దొరికిందో అక్కడ, అల్లాహ్ అతని అదృష్టంలో రాసినన్ని రకాతుల నమాజులు చేస్తాడో, మళ్ళీ ఇమామ్ ప్రసంగం ఇచ్చినప్పుడు, జుమా ఖుత్బా ఇచ్చినప్పుడు శ్రద్ధగా, మౌనంగా ఖుత్బా వింటాడో, అల్లాహు తఆలా ఈ జుమా నుండి వచ్చే జుమా వరకు ఈ మధ్యలో జరిగిన అతని పాపాలను మన్నిస్తాడు”. (సహీహ్ బుఖారీ 883).

ఈ హదీసులో తెలిపినటువంటి జుమాకు సంబంధించిన ప్రత్యేక కార్యాలు చేసిన వారికి ఎంత గొప్ప శుభవార్త ఇవ్వడం జరిగిందో గమనించండి. కానీ ఈ శుభవార్త ఎవరి కొరకు ఉంది? ఈ హదీసులో తెలుపబడినటువంటి ఈ జుమాకు సంబంధించిన ప్రత్యేక కార్యాలు చేసిన వారికి.

అల్లాహ్ మనందరికీ జుమా యొక్క ఘనతను దృష్టిలో ఉంచుకొని, అల్లాహ్ యొక్క సంతృప్తి కొరకు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విధానంలో జుమా కోసం సంసిద్ధతలు, తయారీలు చేసేటువంటి సద్భాగ్యం ప్రసాదించు గాక. ఆ రోజు చదవవలసిన సూర కహఫ్ ఇంకా వేరే పుణ్య కార్యాలు చేసేటువంటి సద్భాగ్యం కూడా ప్రసాదించు గాక. ఆమీన్.

జుము’ఆ (శుక్రవారం) రోజున మన బాధ్యతలు, పుణ్య మార్గాలు.
ఇక్కడ ఆడియో వీడియో ఆర్టికల్స్ పొందుతారు ఇన్ షా అల్లాహ్. తప్పక ఈ పేజీని దర్శించండి, ఫార్వర్డ్ చేయండి
https://teluguislam.net/five-pillars/salah-namaz-prayer/friday/

అజాన్ తర్వాత చేసే రెండు దుఆల ఘనత [వీడియో & టెక్స్ట్]

అజాన్ తర్వాత చేసే రెండు దుఆల ఘనత (فضل الذكر بعد الآذان)
https://www.youtube.com/watch?v=IUyKck4lvfI [ 2 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

అజాన్ తర్వాత చెదివే ఈ రెండు దుఆల ఘనత చాలా గొప్పగా ఉంది
ప్రతి అజాన్ తర్వాత చదవండి, అనేకానేక పుణ్యాలు, లాభాలు పొందండి

ఈ వీడియో లో చెప్పబడిన దుఆలు ఇక్కడ నేర్చుకోవచ్చు: అజాన్ తర్వాత చేయు దుఆలు 

ఈ ప్రసంగంలో అజాన్ తర్వాత పఠించవలసిన రెండు ముఖ్యమైన దువాల గురించి వివరించబడింది. మొదటి దువా సహీహ్ ముస్లిం నుండి ఉల్లేఖించబడింది, దీనిని పఠించడం ద్వారా గత పాపాలు క్షమించబడతాయి. రెండవ దువా సహీహ్ బుఖారీ నుండి తీసుకోబడింది, దీనిని పఠించిన వారికి ప్రళయ దినాన ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి సిఫారసు లభిస్తుంది. ఈ రెండు దువాల యొక్క ప్రాముఖ్యత మరియు వాటి ద్వారా లభించే గొప్ప ప్రయోజనాలను వక్త నొక్కి చెప్పారు.

మహాశయులారా, ఇప్పుడు మనం అజాన్ తర్వాత రెండు రకాల దువాలు మనకు మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నేర్పారు. ప్రతీ ఒక్క దువాలో మన గురించి ఎంతో గొప్ప లాభం ఉంది.

మొదటి హదీస్ సహీహ్ ముస్లిం లోనిది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారని సాద్ బిన్ అబీ వక్కాస్ రదియల్లాహు త’ఆలా అన్హు గారు ఉల్లేఖించారు, ఎవరైతే అజాన్ విన్న తర్వాత, అజాన్ కు సమాధానం చెబుతూ అజాన్ పూర్తిగా విన్న తర్వాత

أَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللهُ، وَحْدَهُ لَا شَرِيكَ لَهُ، وَأَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ، رَضِيتُ بِاللهِ رَبًّا، وَبِمُحَمَّدٍ رَسُولًا، وَبِالْإِسْلَامِ دِينًا

(అష్ హదు అల్ లా ఇలాహ ఇల్లల్లాహ్, వహ్ దహూ లా షరీక లహూ, వ అన్న ముహమ్మదన్ అబ్దుహూ వ రసూలుహూ, రదీతు బిల్లాహి రబ్బన్, వబి ముహమ్మదిన్ రసూలన్, వబిల్ ఇస్లామి దీనా)

“అల్లాహ్ తప్ప మరెవ్వరూ ఆరాధ్య దేవుడు లేడని నేను సాక్ష్యమిస్తున్నాను, ఆయన ఏకైక దేవుడు, ఆయనకు భాగస్వాములు లేరు మరియు ముహమ్మద్ ఆయన దాసుడు మరియు ఆయన ప్రవక్త అని కూడా నేను సాక్ష్యమిస్తున్నాను. నేను అల్లాహ్ ను ప్రభువుగా, ముహమ్మద్ ను ప్రవక్తగా మరియు ఇస్లాంను నా ధర్మంగా స్వీకరించాను.”

అని చదువుతారో,

غُفِرَ لَهُ ذَنْبُهُ
(గుఫిర లహూ దన్బుహూ)

వారి యొక్క పాపాలు క్షమించబడతాయి, మన్నించబడతాయి అని శుభవార్త ఇవ్వడం జరిగింది.

ఇది ఒక దువా. మరోసారి విని మీరు దీన్ని జ్ఞాపకం ఉంచుకునే ప్రయత్నం చేయండి. సామాన్యంగా మనం దీనిలో సగ భాగం అంతకంటే ఎక్కువగా నేర్చుకునే ఉంటాము ఇంతకుముందు.

ఇక రెండవ దువా, సహీహ్ బుఖారీలోని పదాలు ఈ విధంగా ఉన్నాయి. జాబిర్ రదియల్లాహు త’ఆలా అన్హు గారు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఎవరైతే అజాన్ విన్న తర్వాత ఈ దువా చదువుతారో, ప్రళయ దినాన వారికి నా సిఫారసు తప్పకుండా లభిస్తుంది. అల్లాహు అక్బర్! ఎంత గొప్ప అదృష్టమో గమనించండి. ప్రళయ దినాన ప్రవక్తలు సిఫారసు చేయాలి అని మనం తహతహలాడుతూ ఉంటాము. ఆ రోజు మనకు ఈ సిఫారసు పొందడానికి ఈ రోజు ఐదు పూటల నమాజులు చేయాలి. అజాన్ విన్నప్పుడు, అజాన్ అయిన తర్వాత దువా మనం చదవాలి.

اللَّهُمَّ رَبَّ هَذِهِ الدَّعْوَةِ التَّامَّةِ، وَالصَّلَاةِ الْقَائِمَةِ، آتِ مُحَمَّدًا الْوَسِيلَةَ وَالْفَضِيلَةَ، وَابْعَثْهُ مَقَامًا مَحْمُودًا الَّذِي وَعَدْتَهُ

(అల్లాహుమ్మ రబ్బ హాదిహి ద్దావతి త్తామ్మ, వస్సలాతిల్ ఖాయిమ, ఆతి ముహమ్మదన్ అల్ వసీలత వల్ ఫదీల, వబ్ అత్ హు మఖామమ్ మహ్మూదన్ అల్లదీ వ అత్తహ్)

“ఓ అల్లాహ్! ఈ సంపూర్ణ పిలుపునకు మరియు స్థాపించబడిన నమాజుకు ప్రభువా! ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)కు మధ్యవర్తిత్వం మరియు శ్రేష్టతను ప్రసాదించు. మరియు నీవు వాగ్దానం చేసిన ప్రశంసనీయమైన ఉన్నత స్థానానికి ఆయనను చేర్చు.”

అల్లాహ్ త’ఆలా ఈ దువాలను ప్రతీ అజాన్ తర్వాత చదువుతూ ఉండే భాగ్యం ప్రసాదించుగాక. వీటి యొక్క బరకత్ లో, శుభంలో అల్లాహ్ మన పాపాలను మన్నించి ప్రళయ దినాన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సిఫారసు మనకు ప్రాప్తి చేయుగాక.

ఈ పోస్ట్ లింక్: https://teluguislam.net/?p=5568