పరలోకం పట్ల విశ్వాసం – సలీం జామి’ఈ [వీడియో & టెక్స్ట్]

పరలోకం పట్ల విశ్వాసం – సలీం జామి’ఈ
https://youtu.be/NsqbSZr8XQI [14 నిముషాలు]

ఈ ప్రసంగంలో, ఇస్లామీయ విశ్వాసంలోని ఐదవ ముఖ్యమైన అంశమైన పరలోక జీవితంపై విశ్వాసం గురించి వివరించబడింది. పరలోకం అంటే ఏమిటి, దాని ఉనికికి ఖురాన్ మరియు హదీసుల నుండి ఆధారాలు, మరియు ప్రపంచంలో జరిగే అన్యాయాలకు అంతిమ న్యాయం జరగాల్సిన ఆవశ్యకత వంటి విషయాలు చర్చించబడ్డాయి. పరలోకంలో జరిగే ముఖ్య సంఘటనలైన హషర్ మైదానం (సమావేశ స్థలం), కర్మపత్రాల పంపిణీ, మీజాన్ (త్రాసు), జహన్నం (నరకం), మరియు జన్నత్ (స్వర్గం) గురించి కూడా ప్రస్తావించబడింది. చివరగా, పరలోకంపై విశ్వాసం ఒక వ్యక్తిని దైవభీతితో జీవించేలా, పుణ్యకార్యాల వైపు ప్రేరేపించేలా మరియు పాపాలకు దూరంగా ఉంచేలా ఎలా చేస్తుందో, తద్వారా సమాజంలో శాంతి ఎలా నెలకొంటుందో వివరించబడింది.

అల్ హందులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్.

అన్ని రకాల ప్రశంసలు, పొగడ్తలు సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీదనూ, ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించు గాక. ఆమీన్.

సోదర సోదరీమణులారా, మిమ్మల్ని అందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను, అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.

అర్కానుల్ ఈమాన్, విశ్వాస ముఖ్యాంశాలు మనము తెలుసుకుంటూ ఉన్నాం. ఈ ప్రసంగంలో, విశ్వాస ముఖ్యాంశాలలోని ఐదవ ముఖ్యాంశం పరలోకం పట్ల విశ్వాసం గురించి తెలుసుకుందాం.

పరలోకం అంటే ఏమిటి? పరలోకాన్ని విశ్వసించడానికి మన వద్ద ఉన్న ఆధారాలు ఏమిటి? పరలోకంలో జరగబోయే కొన్ని ముఖ్యమైన విషయాలు ఏమిటి? పరలోకాన్ని విశ్వసిస్తే మనిషికి కలిగే ప్రయోజనము ఏమిటి? ఇవన్నీ ఇన్ షా అల్లాహ్ ఈ ప్రసంగంలో వస్తాయి.

ఆ హదీస్ మరొక్కసారి మనము విందాం. జిబ్రీల్ అలైహిస్సలాం వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి, ఓ దైవ ప్రవక్తా, ఈమాన్ అంటే ఏమిటి అని ప్రశ్నించారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సమాధానం ఇస్తూ, అల్లాహ్ ను విశ్వసించటం, దూతలను విశ్వసించటం, గ్రంథాలను విశ్వసించటం, ప్రవక్తలను విశ్వసించటం, పరలోకాన్ని విశ్వసించటం, విధివ్రాతను విశ్వసించటం అని సమాధానం ఇచ్చినప్పుడు, జిబ్రీల్ అలైహిస్సలాం వారు నిజమే అని ధ్రువీకరించారు కదండీ. ఆ ప్రకారంగా ఈమాన్ (విశ్వాసం) అంటే ఆరు విషయాలను విశ్వసించవలసి ఉంది కదండీ. అందులోని ఐదవ విషయం, పరలోకం పట్ల విశ్వాసం. ఈ పరలోకం పట్ల విశ్వాసం గురించి ఇప్పుడు కొన్ని విషయాలు మీ ముందర ఉంచుతున్నాను. ఇన్ షా అల్లాహ్, శ్రద్ధగా విని ఆచరించే ప్రయత్నము చేయండి.

ముందుగా, పరలోకం అంటే ఏమిటి తెలుసుకుందాం. పరలోకం అంటే, మానవులందరూ కూడా మరణించిన తర్వాత, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మానవులందరినీ ఒక రోజు మళ్ళీ బ్రతికిస్తాడు. ఆ రోజు వారి కర్మల లెక్కింపు జరుగుతుంది. ఎవరైతే సత్కార్యాలు ఎక్కువగా చేసి ఉంటారో, విశ్వసించి ఉంటారో, వారికి బహుమానాలు ఇవ్వబడతాయి. ఎవరైతే పాపాలు ఎక్కువగా చేసి ఉంటారో, తిరస్కరించి ఉంటారో, వారికి శిక్షలు విధించటం జరుగుతుంది. ఇలా జరిగే దినాన్ని పరలోక దినం, లెక్కింపు దినం అని కూడా అంటూ ఉంటారు.

పరలోకం ఉంది అని నమ్మటానికి ఆధారాలు మనము ఇప్పుడు చూచినట్లయితే, ఖురాన్ గ్రంథంలో అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా పదేపదే పరలోకం గురించి మరియు పరలోకంలో జరగబోయే విషయాల గురించి మనకు తెలియపరిచి ఉన్నాడు. హదీసులలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉల్లేఖనాలలో కూడా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి నోట పరలోకము మరియు పరలోకంలో జరగబోయే విషయాల ప్రస్తావన మనకు కనబడుతూ ఉంటుంది. ఒక ఉదాహరణ మీ ముందర ఉంచుతున్నాను చూడండి. ఖురాన్ గ్రంథము 23వ అధ్యాయము 15, 16 వాక్యాలలో అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఈ విధంగా తెలియజేశాడు:

ثُمَّ اِنَّكُمْ بَعْدَ ذٰلِكَ لَمَيِّتُوْنَ ثُمَّ اِنَّكُمْ يَوْمَ الْقِيٰمَةِ تُبْعَثُوْنَ
ఆ తరువాత మీరంతా తప్పకుండా మరణిస్తారు. మరి ప్రళయ దినాన మీరంతా నిశ్చయంగా లేపబడతారు. (23:15-16)

ఈ రెండు వాక్యాలలో ప్రళయ దినం ప్రస్తావన కూడా వచ్చి ఉంది. మనిషి మరణించిన తర్వాత మళ్ళీ బ్రతికించబడతారు అనే ప్రస్తావన కూడా వచ్చి ఉంది. ఇలా చాలా వాక్యాలు ఉన్నాయి, చాలా హదీసులు, ఉల్లేఖనాలు ఉన్నాయి. తద్వారా, పరలోకము తప్పనిసరిగా ఉంది అని గ్రంథాల ద్వారా స్పష్టమవుతూ ఉంది. ప్రతి విశ్వాసి కూడా పరలోకాన్నే విశ్వసించటం తప్పనిసరి.

ఇక ప్రపంచంలో జరుగుతున్న సంఘటనలు కూడా మనం దృష్టిలో పెట్టుకుంటే, పరలోకం సంభవిస్తుంది అని కూడా మనకు తెలుస్తుంది. అది ఎలాగంటే, మనం చూస్తూ ఉంటాం. చాలా చోట్ల ప్రపంచంలో, బలవంతులు, దౌర్జన్యపరులు నిరుపేదలపై, బలహీనులపై దౌర్జన్యాలు చేస్తూ ఉంటారు. హత్యలు చేస్తూ ఉంటారు, అత్యాచారాలు చేస్తూ ఉంటారు, ప్రాణాలు తీసేసి ఇది ప్రమాదము అని చిత్రీకరిస్తూ ఉంటారు, అరాచకాలు సృష్టిస్తూనే ఉంటారు, కబ్జాల మీద కబ్జాలు చేసుకుంటూ పోతూ ఉంటారు. ఇదంతా జరుగుతూ ఉంటే, మనం చూస్తూ ఉంటాం. బలహీనులు న్యాయం కావాలి అని ఎదురు చూస్తూనే ఉంటారు, కానీ వారికి ఎక్కడ కూడా న్యాయం దొరకదు, చివరికి వారు అలాగే బాధపడుతూనే మరణించి ప్రపంచాన్ని వదిలేసి వెళ్ళిపోతారు. బలవంతుల్లో కొందరు, రాజకీయ నాయకుల, అధికారుల అండదండలతో, ధనముతో తప్పించుకుని తిరుగుతూ ఉంటారు. వారు చేసిన అరాచకాలకు శిక్షలు పడవు. ఏదో ఒక రకంగా పలుకుబడి ద్వారా వారు తప్పించుకుని తిరుగుతూ ఉంటారు. చివరికి వారు కూడా ప్రపంచాన్ని వదిలేసి వెళ్ళిపోతారు.

ప్రశ్న ఏమిటంటే, మరి అన్యాయానికి గురి అయిన ఈ పీడితులకు, దేవుడు కూడా న్యాయం చేయడా? అన్యాయము చేసి, అరాచకాలు సృష్టించిన ఈ దుర్మార్గులకు, దేవుడు కూడా, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా కూడా శిక్షించడా? అంటే, దానికి ఇస్లాం ఇచ్చే సమాధానం ఏమిటంటే, తప్పనిసరిగా అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ప్రతి హక్కుదారునికి అతని హక్కు ఇప్పిస్తాడు, మరియు అతనికి న్యాయం చేస్తాడు. అలాగే ప్రతి నేరస్తునికి అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా అతని నేరానికి సరిపడేటట్టుగానే శిక్షిస్తాడు. ఎంతటి నేరము ఉంటుందో అంతటి కఠినమైన శిక్ష కూడా విధిస్తాడు. దీనికి సరైన ప్రదేశము పరలోకము.

పరలోకంలో నిరుపేద, ధనికుడు, బలహీనుడు, బలవంతుడు, రాజకీయ అండదండలు, ధనము, పలుకుబడి ఇవన్నీ ఏమీ గానీ ఉండవు, పనికిరావు కూడా. అక్కడ అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ప్రతి హక్కుదారునికి అతని హక్కు ఇప్పిస్తాడు మరియు ప్రతి నేరస్తునికి అతని నేరానికి తగినంత శిక్ష కూడా విధిస్తాడు. ఆ రోజు న్యాయము స్థాపించబడుతుంది. ఆ ప్రకారంగా పరలోకము తప్పనిసరిగా సంభవిస్తుంది అని మనకు స్పష్టమవుతుంది మిత్రులారా.

పరలోకంలో ఏమేమి ఉంటాయి అనే విషయాలు మనం చూచినట్లయితే, చాలా విషయాలు అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకు తెలియపరిచి ఉన్నారు. కొన్ని విషయాలు మాత్రమే ఈ ప్రసంగంలో చెబుతున్నాను. ఇన్ షా అల్లాహ్, పరలోకంలో ఏమి జరుగుతుంది అనే ప్రసంగం వినండి, అందులో వివరాలు ఇన్ షా అల్లాహ్ మీకు దొరుకుతాయి. ఇక రండి, కొన్ని ముఖ్యమైన విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

పరలోకంలో హషర్ మైదానము ఉంది. హషర్ మైదానము అంటే ఏమిటి? ప్రళయం సంభవించిన తర్వాత, యుగాంతము సంభవించిన తర్వాత, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మళ్ళీ భూమి ఆకాశాలను సృష్టిస్తాడు. ఆ రోజు భూమి ఏ విధంగా ఉంటుంది అంటే, ఒక చదరపు మైదానములా, పాన్పు లాగా ఉంటుంది. ఆ మైదానంలో ఒక చెట్టు గానీ, ఒక గుట్ట గానీ, ఒక భవనము గానీ ఉండదు. ఆ మైదానంలో, ఆది మానవుడైన ఆదమ్ అలైహిస్సలాం వద్ద నుండి యుగాంతం సంభవించినంత వరకు ఎంతమంది మానవులైతే జన్మించి, మరణించారో వారందరినీ అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మళ్ళీ బ్రతికించి నిలబెడతాడు.

వారందరూ కూడా ఆ మైదానంలో నిలబడినప్పుడు, వారి వారి చేతికి కర్మపత్రాలు ఇవ్వబడతాయి. ఎవరైతే సత్కార్యాలు చేసి ఉంటారో, విశ్వసించి ఉంటారో, కుడిచేతిలో వారికి కర్మపత్రాలు ఇవ్వబడతాయి. వారు వారి కర్మలను, వారి సత్కార్యాలను చూసి, చదివి సంతోషిస్తూ ఉంటారు, వారి మొహము ప్రకాశిస్తూ ఉంటుంది. మరి ఎవరైతే పాపాలు ఎక్కువగా చేసి ఉంటారో, తిరస్కరించి ఉంటారో, అరాచకాలు సృష్టించి ఉంటారో, ఎడమ చేతిలో వారికి కర్మపత్రాలు ఇవ్వబడతాయి. వారు చేసుకున్న పాపాలన్నీ వారు ఆ రోజు చదువుకుంటూ, ఏడుస్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు, భయపడుతూ ఉంటారు. వారి మొహం ఆ రోజు నల్లబడిపోతుంది. ఇది ఎక్కడ జరుగుతుంది అంటే, దానిని హషర్ మైదానము అని అంటారు.

అలాగే పరలోకంలో ఏముంది అని మనం చూచినట్లయితే, పరలోకంలో అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మీజాన్ ఉంచి ఉన్నాడు. మీజాన్ అంటే ఏమిటి? త్రాసు అని అర్థం. ఆ త్రాసులో ఏమి తూంచబడుతుంది అంటే, ప్రజల పుణ్యాలు, పాపాలు తూచబడతాయి. ఎవరి పుణ్యాలు అయితే ఎక్కువగా ఉంటాయో, వారు విజేతలుగా నిలబడతారు. ఎవరి పాపాలు అయితే ఎక్కువగా ఉంటాయో, వారు దోషులుగా నిలబడతారు. ఆ రోజు తుది నిర్ణయం అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలాదే. అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఎవరిని మన్నించాలనుకుంటాడో వారిని మన్నిస్తాడు. మరి ఎవరినైతే శిక్షించాలనుకుంటాడో వారిని శిక్షిస్తాడు. నిర్ణయం అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా చేతిలోనే ఉంటుంది. కాకపోతే, విశ్వాసం ప్రామాణికమైనది అవుతుంది కాబట్టి మిత్రులారా, ఆ రోజు రానున్నది. ప్రపంచంలోనే విశ్వసించండి, సత్కార్యాలు చేయండి అని మనకు తెలపబడింది. మొత్తానికి పరలోకంలో త్రాసు ఉంది, అందులో ప్రజల కర్మలు తూచబడతాయి.

అలాగే, పరలోకంలో అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా జహన్నం సిద్ధం చేసి ఉంచాడు. జహన్నం అంటే నరకం అని అర్థం. నరకంలో ఏముంది అంటే, అది ఒక పెద్ద బావి, దాని నిండా అగ్ని ఉంది. ఎవరైతే పాపాలు ఎక్కువగా చేసి ఉంటారో, తిరస్కారానికి పాల్పడి ఉంటారో, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా అలాంటి వారిని శిక్షించడానికి నరకంలో పడవేస్తాడు. ఎవరు ఎన్ని ఘోరమైన నేరాలు, పాపాలు చేసి ఉంటారో, వారికి నరకంలో అంత కఠినమైన శిక్ష కూడా విధించబడుతుంది. అల్లాహ్ మన అందరికీ దాని నుండి, దాని శిక్షల నుండి రక్షించుగాక, ఆమీన్.

అలాగే, పరలోకంలో అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా జన్నహ్, ఉర్దూలో జన్నత్, తెలుగులో స్వర్గం సిద్ధం చేసి ఉన్నాడు. స్వర్గంలో ఏమున్నాయి అంటే, అందులో అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా అనుగ్రహాలు అన్నీ ఉంచి ఉన్నాడు. ఆ అనుగ్రహాలు ఎవరికి దక్కుతాయి అంటే, ఎవరైతే విశ్వసించి, సత్కార్యాలు, పుణ్యాలు ఎక్కువగా చేసుకుని ఉంటారో, వారికి అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఆ స్వర్గము ప్రసాదిస్తాడు. ఎవరు ఎన్ని ఎక్కువ పుణ్యాలు చేసుకొని ఉంటారో, వారు స్వర్గంలో అంత ఉన్నతమైన స్థానాలలో చేరుకుంటారు. స్వర్గంలో ఉన్నవారు, ప్రశాంతంగా, ఎలాంటి బాధ లేకుండా, ఎలాంటి భయము లేకుండా, సంతోషంగా జీవించుకుంటూ ఉంటారు. అలాంటి స్వర్గం అల్లాహ్ మన అందరికీ ప్రసాదించుగాక. ఆమీన్.

పరలోకంలో ఇంకా ఏమి ఉంటాయి అంటే, పరలోకంలో హౌదె కౌసర్ ఉంది, పరలోకంలో పుల్ సిరాత్ ఉంది, ఇలా చాలా విషయాలు ఉన్నాయి. అవన్నీ మీరు పరలోకంలో ఏమి జరుగుతుంది, పరలోక విశేషాలు అనే ప్రసంగాలు వినండి, ఇన్ షా అల్లాహ్ తెలుస్తుంది. సమయం ఎక్కువ అవుతుంది కాబట్టి, ఇక చివరులో మనము…

పరలోకాన్ని విశ్వసిస్తే కలిగే ప్రయోజనం ఏమిటి అనేది ఇన్ షా అల్లాహ్ తెలుసుకొని మాటను ముగిద్దాం. పరలోకాన్ని విశ్వసిస్తే కలిగే ప్రయోజనం ఏమిటట? మనిషి పరలోకాన్ని విశ్వసించటం వలన దైవభీతితో జీవిస్తాడు. పుణ్యాలు బాగా చేసి, పరలోక అనుగ్రహాలు పొందాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. పాపాలు చేస్తే పరలోకంలో శిక్షలు తప్పవు అని భయపడుతూ ఉంటాడు. మరియు అలా భయపడటం వలన, అతను అన్యాయాలకు, అక్రమాలకు పాల్పడకుండా జాగ్రత్త పడుతూ ఉంటాడు. అలా చేయటం వలన సమాజంలో శాంతి నెలకొంటుంది.

ఒకసారి ఆలోచించి చూడండి. ప్రతి వ్యక్తి పరలోకాన్ని విశ్వసించి, పరలోకంలో ఉన్న అనుగ్రహాలను విశ్వసించి, పరలోకంలో ఉన్న శిక్షలను కూడా విశ్వసించి, వాటిని దృష్టిలో పెట్టుకుని జీవిస్తున్నప్పుడు, సత్కార్యాలు చేసుకుందాం, పుణ్యాలు సంపాదించుకుని స్వర్గానికి చేరుకుందాం అనుకుంటూ ఉంటే, అలాగే పాపాలు చేయవద్దు, చేస్తే నరకానికి వెళ్లి శిక్షలు అనుభవించవలసి ఉంటుంది కాబట్టి, వద్దు అయ్యా పాపాలు, నేరాలు అని దానికి దూరంగా ఉంటూ ఉంటే, ప్రతి వ్యక్తి ఆ విధంగా విశ్వసించి జీవించుకుంటే, అలాంటి సమాజము శాంతియుతంగా ఉంటుంది అని చెప్పటానికి ఇంకేమి కావాలి మిత్రులారా.

కాబట్టి, నేను అల్లాహ్ తో దుఆ చేస్తున్నాను, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మన అందరికీ సంపూర్ణ విశ్వాసులుగా జీవించే భాగ్యం ప్రసాదించుగాక. నరక శిక్షల నుండి అల్లాహ్ మమ్మల్ని కాపాడి, స్వర్గవాసులుగా మమ్మల్ని అందరినీ స్వర్గానికి చేర్చుగాక. ఆమీన్. వ జజాకుముల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=30634

పరలోకం (The Hereafter) – మెయిన్ పేజీ
https://teluguislam.net/hereafter/

అల్లాహ్ శుభ నామము: “అల్ – బసీర్” (సర్వం చూసేవాడు) యొక్క వివరణ – నసీరుద్దీన్ జామిఈ [వీడియో & టెక్స్ట్]

అల్లాహ్ శుభ నామము: “అల్ – బసీర్” యొక్క వివరణ
షేఖ్ ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ
https://youtu.be/tiiX0QbTzyk [35 నిముషాలు]

ఈ ప్రసంగంలో, అల్లాహ్ యొక్క 99 పేర్లలో ఒకటైన “అల్-బసీర్” (సర్వం చూసేవాడు) అనే పేరు యొక్క లోతైన అర్థం మరియు ప్రాముఖ్యత వివరించబడింది. అల్లాహ్ యొక్క దృష్టి ఎంత సూక్ష్మమైనదో, చీకటి రాత్రిలో నల్లని బండపై నడిచే నల్ల చీమను కూడా ఆయన చూడగలడని వివరించబడింది. ఈ పేరును అర్థం చేసుకోవడం ద్వారా, అల్లాహ్ మనల్ని అన్ని సమయాల్లోనూ, అన్ని పరిస్థితుల్లోనూ చూస్తున్నాడనే బలమైన నమ్మకం (ఇహ్సాన్) మనలో కలుగుతుంది. ఈ నమ్మకం మనల్ని పాపాలకు దూరంగా ఉంచి, పుణ్యకార్యాల వైపు ప్రేరేపిస్తుంది. ఖురాన్‌లోని పలు ఆయతులలో “అల్-బసీర్” అనే పదం వచ్చిన సందర్భాలను ఉదాహరిస్తూ, అల్లాహ్ తన దాసుల స్థితిగతులను, వారి చర్యలను, వారి అవసరాలను పూర్తిగా ఎరిగి ఉన్నాడని, దాని ప్రకారమే వారికి జీవనోపాధిని ప్రసాదిస్తాడని మరియు ప్రళయదినాన తీర్పు ఇస్తాడని స్పష్టం చేయబడింది. అల్లాహ్ మనల్ని చూస్తున్నాడనే స్పృహ మన జీవితాలను ఎలా మార్చగలదో ఈ ప్రసంగం శక్తివంతంగా తెలియజేస్తుంది.

అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.

అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్, నబియ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహి వ సహ్బిహి అజ్మయీన్ అమ్మా బాద్.

ప్రియ వీక్షకుల్లారా! అల్లాహ్ ఎంత గొప్పవాడో అతని యొక్క శుభనామములు, ఉత్తమ గుణాలు అంతే గొప్పవి. అల్లాహ్ ను మనం మంచి రీతిలో తెలుసుకోవాలంటే ఆయన యొక్క నామాలు, గుణాల ద్వారానే తెలుసుకోగలుగుతాము. అందుకొరకే అల్లాహ్ త’ఆలా ఖురాన్లో అనేక సందర్భాలలో తన శుభ నామాల గురించి స్వయం తెలిపాడు. ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా అల్లాహ్ యొక్క నామాల గురించి ఎన్నో విషయాలు తెలియజేసి, అల్లాహ్ గొప్పతనాన్ని తెలుసుకునే విధంగా మనకు మంచి మార్గం నేర్పారు.

అయితే ఈరోజు మీరు చూస్తున్నట్లు అల్లాహ్ యొక్క గొప్ప పేరు అల్-బసీర్ గురించి మనం తెలుసుకోబోతున్నాము. ఇంతకుముందు దర్సులో అల్లాహ్ యొక్క పేరు అస్-సమీ’ (సంపూర్ణంగా వినేవాడు) అన్న వివరణలో కూడా కొన్ని సందర్భాల్లో అల్-బసీర్ పేరు వచ్చింది. అల్-బసీర్ అంటే ప్రతీదీ అల్లాహ్ త’ఆలా ప్రతిదానిని చూస్తూ ఉన్నాడు. అల్లాహ్ యొక్క చూపు నుండి ఏదీ కూడా మరుగు లేదు, దాగి లేదు. అది ఎంతటి చిన్న, సన్నటి, సూక్ష్మమైన విషయమైనా, వస్తువు అయినా అల్లాహ్ త’ఆలా దానిని చూస్తున్నాడు.

షేఖ్ అబ్దుర్రజాఖ్ బిన్ అబ్దుల్ ముహ్సిన్ అల్ బద్ర్ హఫిజహుల్లాహ్, ఫిఖ్హుల్ అస్మాఇల్ హుస్నా అనే తన రచనలో అల్లాహ్ యొక్క పేరు అల్-బసీర్ గురించి తెలియజేస్తూ,

فَيُبْصِرُ دَبِيبَ النَّمْلَةِ السَّوْدَاءِ عَلَى الصَّخْرَةِ الصَّمَّاءِ فِي اللَّيْلَةِ الظَّلْمَاءِ
(ఫ యుబ్సిరు దబీబన్ నమ్లతి అస్సౌదాఇ ‘అలస్సఖ్రతిస్సమ్మాఇ ఫిల్లాఇలతిజ్జల్మా)
నునుపైన రాయిపై, చిమ్మచీకటి అమావాస్య రాత్రిలో నల్లని చీమ పాకడాన్ని ఆయన చూస్తాడు.

وَيَرَى مَجَارِي الْقُوتِ فِي أَعْضَائِهَا
(వ యరా మజారిల్ ఖూతి ఫీ అ’జాఇహా)
ఆ చీమ యొక్క అవయవాల్లో (లోపట కడుపులో) ఆహారం ఎలా జారుతుందో దానిని కూడా చూస్తాడు.

وَيَرَى جَرَيَانَ الدَّمِ فِي عُرُوقِهَا
(వ యరా జరయాన ద్దమి ఫీ ‘ఉరూఖిహా)
చీమ యొక్క నరాలలో ప్రవహించే రక్తం, దానిని కూడా చూస్తాడు.

وَيُبْصِرُ مَا تَحْتَ الْأَرْضِينَ السَّبْعِ كَمَا يُبْصِرُ مَا فَوْقَ السَّمَاوَاتِ السَّبْعِ
(వ యుబ్సిరు మా తహ్తల్ అర్దీనస్సబ్’ఇ కమా యుబ్సిరు మా ఫౌఖస్సమావాతిస్సబ్’ఇ)
ఏడు ఆకాశాలు, వాటి పైన ఉన్న దానిని ఎలా చూస్తున్నాడో అలాగే ఏడు భూములు, వాటి కింద ఉన్న వాటిని కూడా చూస్తూ ఉంటాడు.

وَيَرَى تَبَارَكَ وَتَعَالَى تَقَلُّبَاتِ الْأَجْفَانِ وَخِيَانَاتِ الْعُيُونِ
(వ యరా తబారక వ త’ఆలా తఖల్లుబాతిల్ అజ్ఫాని వ ఖియానాతిల్ ఉయూన్)
ఆయన (ప్రభువైన తబారక వ త’ఆలా) కనురెప్పల కదలికలను మరియు కళ్ళ దొంగచూపులను చూస్తాడు.

అతను ప్రతి కన్ను, కళ్ళల్లో ఉండే ఆ గుడ్లు ఏవైతే ఉంటాయో వాటి యొక్క కదలికను కూడా అల్లాహ్ చూస్తూ ఉంటాడు. ఎవరి కళ్ళు చూస్తున్నాయి ఒక వైపున, దొంగ చూపులు చూస్తున్నాయి మరో వైపున, ఏ ఎవరి ఏ ఉద్దేశాలు ఉన్నాయి, ఏ చెడు ఉద్దేశాలు ఉన్నాయి అవన్నీ కూడా చూస్తూ ఉన్నాడు, తెలుసుకుంటూ ఉన్నాడు. అంతటి సూక్ష్మమైన చూపు గల, జ్ఞానం గల, చూడగల, వినగల ఆ అల్లాహ్ అతని యొక్క చూపు నుండి మనం చీకటి రాత్రుల్లో కూడా ఎక్కడా దాగి ఉండలేము, వెలుతురులోనైతే ఉండనేలేము.

సోదర మహాశయులారా! ఇమాం ఇబ్నుల్ ఖయ్యిమ్ రహిమహుల్లాహ్ అల్-బసీర్ గురించి మరిన్ని వివరాలు చాలా స్పష్టంగా తెలియజేసి ఉన్నారు. ఇంతటి సూక్ష్మంగా చూసే ఆ గొప్పవాడైన అల్లాహ్ ఖురాన్లో మరియు హదీథులో వచ్చిన దాని ప్రకారం అతడు చూస్తూ ఉన్నాడు, అతనికి కళ్ళు ఉన్నాయి అని కూడా మనం విశ్వసించాలి. ఎందుకంటే సూరతుత్ తూర్ ఆయత్ నంబర్ 48, సూరతుల్ ఖమర్ ఆయత్ నంబర్ 14 లో అల్లాహ్ త’ఆలాకు కళ్ళు ఉన్నాయి అన్నటువంటి ప్రస్తావన ఉన్నది. అలాగే సూరత్ తాహా ఆయత్ నంబర్ 39 లో కూడా ఈ ప్రస్తావన ఉన్నది.

అలాగే సహీ బుఖారీ మరియు సహీ ముస్లింలో కూడా దజ్జాల్ గురించి చెబుతున్నప్పుడు, అతను ఒంటి కన్నువాడు, మీ యొక్క సత్యమైన ప్రభువు ఒంటి కన్నువాడు కాదు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్పష్టంగా తెలిపారు. అయితే ఇక్కడ మనం అల్లాహ్ గురించి విశ్వసించాల్సిన విషయం ఏమిటంటే, అల్లాహ్ కు కళ్ళు ఉన్నాయి కానీ ఎలా ఉన్నాయి? ఎంత పెద్దగా ఉన్నాయి? ఇలాంటి ఏ ఆలోచనల్లోకి వెళ్ళకూడదు. ఏ వివరణ, ఎలాంటి ఉపమానం ఇవ్వకూడదు. ఉన్నాయి అని నమ్మాలి. అవి అతనికి తగిన రీతిలో. ‘అలల్ వజ్ హిల్లాఇఖి బిహ్.

ఇమాం ఇబ్ను ఖుజైమా రహిమహుల్లాహ్ చెప్పారు, మా యొక్క విశ్వాసం, దాన్ని మేము ప్రకటిస్తాము. మా ప్రభువుకు రెండు కళ్ళు ఉన్నాయి. వాటి ద్వారా అల్లాహ్ చూస్తాడు అని మేము నమ్ముతాము. మట్టి కింద ఉన్నది, ఏడు భూముల కింద ఉన్నది అంతా చూస్తూ ఉన్నాడు. ఆకాశాలలో ఉన్నది, ఆకాశాల భూమిల మధ్యలో ఉన్నది, చిన్నదైనా పెద్దదైనా అతనికి ఏదీ కూడా మరుగుగా లేదు. సముద్రాల లోతుల్లో దాని యొక్క అంధకారమైన చీకట్లలో కూడా అల్లాహ్ త’ఆలా ఎంతో స్పష్టంగా చూస్తూ ఉన్నాడు. ఇమాం ఇబ్ను ఖుజైమా రహిమహుల్లాహ్ వారి ఈ మాట కితాబుత్ తౌహీద్ లో ఆయన రచించిన కితాబుత్ తౌహీద్ లో వచ్చి ఉంది.

ఈ విధంగా సోదర మహాశయులారా, అల్లాహ్ యొక్క పేరు యొక్క అర్థ భావాలు, అల్లాహ్ అల్-బసీర్ దాని గురించి విశ్వాసం మనది ఎలా ఉండాలి తెలుసుకున్న తర్వాత, ఇంకా మనం తెలుసుకోవలసిన ఈ పేరు గురించి ముఖ్య విషయాల్లో అతి ముఖ్యమైనది ఏమిటంటే, అల్లాహ్ ఇంత గొప్పగా చూసేవాడు, ఇంత సూక్ష్మమైన వాటిని కూడా చూసేవాడంటే నేను ఎక్కడా ఏమి చేస్తున్నానో, నేను అంటే మనలో ప్రతి ఒక్కడూ అనుకోవాలి, నమ్మాలి, నేను ఎక్కడ ఏమి చేసినా, ఎలా ఉన్నా, ఏ మాట్లాడినా, ఏ నా కదలిక అన్నిటినీ కూడా అల్లాహ్ త’ఆలా చూస్తూ ఉన్నాడు గనక నేను ఏ క్షణంలో కూడా ఆయనకు ఇష్టం లేని చోట ఉండను. ఆ అల్లాహ్ కు ఇష్టం లేని ఏ పని చేయను. అల్లాహ్ కు ఇష్టం లేని ఏ కార్యం కూడా నాతో జరగకుండా ఉంటుంది అన్నటువంటి ధైర్యంతో, విశ్వాసంతో ఉండాలి. ఎందుకంటే అల్లాహ్ చూస్తూ ఉన్నాడు అని తెలిసి కూడా, విశ్వాసం ఉండి కూడా అతని యొక్క అవిధేయత చేయడం, అతని యొక్క మాటను ధిక్కరించడం, అతడు వారించిన వాటికి పాల్పడడం ఇది అతని యొక్క మర్యాదకు ఎంతో వ్యతిరేకం.

అయితే అల్లాహ్ త’ఆలా 40 కంటే ఎక్కువ ఆయతుల చివరిలో బసీర్ అన్న తన ఈ పేరును ప్రస్తావిస్తున్నాడు. అంటే ఆ పేరు కంటే ముందు ఆయత్లో ఏ విషయాలు చెప్పాడో, ఆ విషయాలకు ఈ పేరుకు అక్కడ ఒక సంబంధం ఉంటుంది. దానిని మంచి రీతిలో గమనించాలి మనం.

ఉదాహరణకు, సూరతుల్ హజ్ ఆయత్ నంబర్ 61 గనక చూస్తే:

ذَٰلِكَ بِأَنَّ اللَّهَ يُولِجُ اللَّيْلَ فِي النَّهَارِ وَيُولِجُ النَّهَارَ فِي اللَّيْلِ وَأَنَّ اللَّهَ سَمِيعٌ بَصِيرٌ
(ధాలిక బి అన్నల్లాహ యూలిజుల్ లైల ఫిన్నహారి వ యూలిజున్నహార ఫిల్ లైలి వ అన్నల్లాహ సమీ’ఉన్ బసీర్)

ఇదంతా ఎందుకంటే, అల్లాహ్‌ యే రాత్రిని పగటిలో ప్రవేశింపజేస్తాడు, పగటిని రాత్రిలో ప్రవేశింపజేస్తాడు. నిశ్చయంగా అల్లాహ్‌ అంతా వినేవాడు, అంతా చూసేవాడు. (22:61)

ఇప్పుడు ఇక్కడ రాత్రి, పగలు యొక్క ప్రస్తావనను తీసుకొచ్చిన తర్వాత సమీ’, బసీర్ అన్న పేరు ప్రస్తావించాడంటే అల్లాహ్ త’ఆలా మన కొరకు ఈ రాత్రి పగటిని పుట్టించాడు కానీ, మనం రాత్రి చీకటిలో చూడలేము, పగటిలోనే చూడగలుగుతాము, ఎప్పుడైతే మన కంటిలో చూసే శక్తి ఉంటుందో, కానీ అల్లాహ్ త’ఆలా కొరకు రాత్రి, పగలు అన్నటువంటి ఏ అవసరం లేకుండా ఆయన మానవులు చేసే వారి చేష్టలు, వారి కదలికలు, వారి యొక్క ఏ సమయంలోనైనా ఎలాంటి స్థితిలో వారు మారినా అన్ని సందర్భాలలో అల్లాహ్ త’ఆలా వారిని చూస్తూ ఉన్నాడు, గమనిస్తూ ఉన్నాడు.

అలాగే సూరతుష్ షూరా ఆయత్ నంబర్ 27 గనక మనం గమనిస్తే:

وَلَوْ بَسَطَ اللَّهُ الرِّزْقَ لِعِبَادِهِ لَبَغَوْا فِي الْأَرْضِ وَلَٰكِن يُنَزِّلُ بِقَدَرٍ مَّا يَشَاءُ ۚ إِنَّهُ بِعِبَادِهِ خَبِيرٌ بَصِيرٌ
(వలౌ బసతల్లాహుర్రిజ్ఖ లి’ఇబాదిహీ లబగౌ ఫిల్ అర్ది వలాకిన్ యునజ్జలు బిఖదరిమ్ మా యషాఉ, ఇన్నహూ బి’ఇబాదిహీ ఖబీరుమ్ బసీర్)

ఒకవేళ అల్లాహ్‌ గనక తన దాసులందరికీ సమృద్ధిగా జీవనోపాధిని ప్రసాదించి ఉంటే, వారు భూమిలో అరాచకాన్ని సృష్టించేవారు. కాని ఆయన తాను కోరినంత పరిమాణంలో (ఉపాధిని) అవతరింపజేస్తాడు. నిశ్చయంగా ఆయన తన దాసుల గురించి బాగా తెలిసినవాడు, అంతా చూసేవాడు. (42:27)

ఆయత్ యొక్క అనువాదం విన్నారు, చివరిలో బసీర్ అన్న పేరు వచ్చింది. దీని ద్వారా మనకు ఏం తెలుస్తుందంటే అల్లాహ్ త’ఆలా వారి అన్ని స్థితులను, ఎవరు ఎంత పేదరికంగా ఉన్నారు, ఎవరు ఎంత ధనికులుగా ఉన్నారు, ఎవరు ఏ మాధ్యమ మార్గంలో ఉన్నారు, ఎవరు ఎలా సంపాదిస్తున్నారు, ఎవరి ఏ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, అన్నీ విషయాలు అల్లాహ్ త’ఆలా మంచి రీతిలో చూస్తూ ఉన్నాడు. అయితే అందరికీ వారికి తగిన రీతిలో మార్గదర్శకత్వం చేసేవాడు అల్లాహ్. ఎవరికి ఏది బాగుంటుందో దాని ప్రకారంగానే అల్లాహ్ వారికి ప్రసాదిస్తాడు మరియు ఎవరు అల్లకల్లోలం జరిపేవారో వారి యొక్క స్థితిని గురించి కూడా అల్లాహ్ చాలా స్పష్టంగా తెలిసి ఉన్నాడు.

సూరతుత్ తగాబున్ చూడండి, ఆయత్ నంబర్ రెండు:

هُوَ الَّذِي خَلَقَكُمْ فَمِنكُمْ كَافِرٌ وَمِنكُم مُّؤْمِنٌ ۚ وَاللَّهُ بِمَا تَعْمَلُونَ بَصِيرٌ
(హువల్లధీ ఖలఖకుమ్ ఫమిన్కుమ్ కాఫిరువ్ వ మిన్కుమ్ ము’మిన్, వల్లాహు బిమా త’అమలూన బసీర్)

ఆయనే మిమ్మల్ని పుట్టించాడు. మరి మీలో కొందరు తిరస్కారులున్నారు, మరి కొందరు విశ్వాసులున్నారు. మీరు చేసేదంతా అల్లాహ్‌ చూస్తున్నాడు. (64:2)

అల్లాహ్ చూస్తూ ఉన్నాడు. అల్లాహ్ త’ఆలా సూరత్ ఫుస్సిలత్ ఆయత్ నంబర్ 40 లో ఈ విధంగా తెలియజేశాడు:

إِنَّ الَّذِينَ يُلْحِدُونَ فِي آيَاتِنَا لَا يَخْفَوْنَ عَلَيْنَا ۗ أَفَمَن يُلْقَىٰ فِي النَّارِ خَيْرٌ أَم مَّن يَأْتِي آمِنًا يَوْمَ الْقِيَامَةِ ۚ اعْمَلُوا مَا شِئْتُمْ ۖ إِنَّهُ بِمَا تَعْمَلُونَ بَصِيرٌ
(ఇన్నల్లధీన యుల్ హిదూన ఫీ ఆయాతినా లా యఖ్ఫౌన ‘అలైనా, అఫమన్ యుల్ఖా ఫిన్నారి ఖైరున్ అమ్మన్ య’అతీ ఆమినన్ యౌమల్ ఖియామతి, ఇ’అమలూ మా షి’తుమ్, ఇన్నహూ బిమా త’అమలూన బసీర్)

నిశ్చయంగా మా ఆయతుల విషయంలో వక్రమార్గాన్ని అవలంబించేవారు మాకు అగోచరంగా ఏమీ లేరు. చెప్పండి! నరకంలో పడవేయబడేవాడు మేలా? లేక ప్రళయదినాన సురక్షితంగా హాజరయ్యేవాడు మేలా? మీరు కోరినది చేసుకోండి. నిశ్చయంగా ఆయన మీరు చేసేదంతా చూస్తున్నాడు. (41:40)

నిశ్చయంగా ఎవరైతే మా యొక్క ఆయతులలో పెడమార్గం చూపుతారో, వారు మాకు దాగిలేరు. మేము వారిని చూస్తూ ఉన్నాము. అయితే ఒక మాట చెప్పండి, ఎవరైతే నరకంలో విసిరివేయబడతాడో అతడు మేలా లేకుంటే ప్రళయ దినాన ఎవరైతే సుఖశాంతులతో హాజరవుతాడో అతడు మేలా? సరే మీ ఇష్ట ప్రకారంగా మీరు ఆచరిస్తూ ఉండండి. నిశ్చయంగా అల్లాహ్ మిమ్మల్ని చూస్తూ ఉన్నాడు, మీరు చేసే చేష్టలన్నిటినీ కూడా చూస్తూ ఉన్నాడు.

ఇక్కడ గమనించండి, ఎవరైతే అల్లాహ్ యొక్క ఆయతులలో తప్పుడు విషయాలు వెతుకుతూ ప్రజలలో పెడమార్గాన్ని ప్రబలిస్తూ ఉంటారో, అలాంటి వారిని చూస్తూ ఉన్నాడు అని అల్లాహ్ ఏదైతే అంటున్నాడో భావం ఏంటి? ప్రళయ దినాన వారి యొక్క ఆ పాపాలకు శిక్ష అనేది అల్లాహ్ వారికి ఇస్తాడు. ఇలాంటి ఆయతులు ఎక్కడెక్కడ మనం చదివినా గానీ, అంటే అల్లాహ్ యొక్క పేరు బసీర్ ఎక్కడ వస్తుందో, దాని కంటే ముందు ఏ విషయాలను అల్లాహ్ త’ఆలా తెలియజేస్తున్నాడో వాటిని మనం మంచి రీతిలో అర్థం చేసుకోవాలి. ఏ పుణ్యాల గురించి ప్రోత్సహించడం జరుగుతుందో వాటిని మనం చేస్తూ ఉండాలి, ఏ పాపాల నుండి హెచ్చరిస్తూ, భయపెడుతూ, వాటి యొక్క శిక్ష గురించి హెచ్చరిస్తూ అల్లాహ్ నేను చూస్తూ ఉన్నాను అని అన్నాడో, అక్కడ అలాంటి పాపాల నుండి మనం దూరం ఉండాలి.

ఉదాహరణలు, ఉపమానాలు కొన్ని సందర్భాల్లో మనం కొన్ని సామెతలు చెబుతూ ఉంటాము. ఇది మనకు విషయం అర్థం కావడానికి. అల్లాహ్ కొరకు ఎలాంటి సామెత, ఉపమానం అనేది లేదు. ఎలాగైతే కొన్ని సందర్భాల్లో, ఒరేయ్ నేను చూస్తున్నాను రా బిడ్డా అని ఒక పెద్ద మనిషి తన పని మనిషిని లేదా ఒక అధికారి తన కింద ఉన్న వారిని బెదిరిస్తాడో, అక్కడ ఉద్దేశం ఏముంటుంది నేను చూస్తూ ఉన్నాను అంటే, నీవు ఏదైతే పొరపాటుకు పాల్పడుతున్నావో, చేయని పని నీవు చేస్తున్నావో, ఏదైతే చట్టానికి విరుద్ధంగా మసులుకుంటున్నావో నిన్ను మేము కనిపెట్టుకుంటూ ఉన్నాము, నిన్ను రెడ్ హ్యాండ్ గా పట్టి శిక్షిస్తాము అన్నటువంటి ఉద్దేశం ఉంటుంది.

అలాగే మనిషి అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ యొక్క గ్రంథం నుండి ఈ ఆయతులు చదువుతూ, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హదీథులను వింటూ అల్లాహ్ ఎల్లవేళల్లో అన్ని స్థితుల్లో చూస్తూ ఉంటాడు. మనం పడుకుంటాము, మనం నిద్రపోతాము, కానీ అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ కు కునుకు కూడా రాదు. అల్లాహ్ త’ఆలా ఈ విశ్వంలో ఎక్కడ ఏం జరుగుతుందో, ప్రత్యేకంగా దాసుల్లో ప్రతి ఒక్కని గురించి, ప్రతి ఒక్కని గురించి సూక్ష్మంగా, డీటెయిల్ గా అన్ని వివరాలతో చూస్తూ ఉన్నాడు గనక మనం అతనికి విరుద్ధంగా, వ్యతిరేకంగా నడవకూడదు. అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ యొక్క ఆదేశాలను ధిక్కరించకూడదు.

షేఖ్ అబ్దుర్రజాఖ్ అల్ బద్ర్ హఫిజహుల్లాహ్ ఇక్కడ ఒక మంచి మాట మనకు తెలిపారు. మంచి ఉపదేశం ఇందులో ఉంది. అల్లాహ్ త’ఆలా యొక్క పేరు బసీర్ దీనికి సంబంధించిన ఎన్నో ఉపమానాలు, అంటే ఎన్నో హదీథులు, ఆయతులు విన్న తర్వాత, దీని ద్వారా మనకు కలగవలసిన ఒక గొప్ప లాభం ఏమిటంటే అల్లాహ్ త’ఆలా ఏ పుణ్యాల గురించి మనకు ప్రోత్సహిస్తున్నాడో, ఏ పాపాల నుండి మనల్ని హెచ్చరిస్తున్నాడో వాటిని మంచి రీతిలో అర్థం చేసుకోవాలి.

మనిషి ఎంత మంచి రీతిలో అల్లాహ్ ను ఆరాధిస్తాడో, ప్రవక్త యొక్క విధేయత విధానాన్ని పాటిస్తాడో, సత్కార్యాల్లో ముందుకు వెళ్తాడో అల్లాహ్ త’ఆలా అన్ని చూసి మెచ్చుకుంటాడు, ప్రేమిస్తాడు, తన కరుణాకటాక్షాలకు అర్హుడిగా చేస్తాడు, అల్లాహ్ తన యొక్క రక్షణ ఛాయలో అతన్ని తీసుకుంటాడు, అల్లాహ్ త’ఆలా అతన్ని కాపాడుతాడు, అల్లాహ్ త’ఆలా అతని కొరకు సమాధిలో కూడా ఎన్నో రకాల సుఖశాంతులు ఏర్పాటు చేస్తాడు. సమాధిలో నుండి లేపబడే రోజు ఎంత గాంభీర్యం, కఠినత్వం, ఎన్ని అక్కడ ఇబ్బందులు, సమస్యలు ఏర్పడతాయో, ఇలాంటి పుణ్యాత్ములకు అల్లాహ్ త’ఆలా అక్కడ సమాధుల నుండి లేపే సందర్భంలో కూడా శాంతిని ప్రసాదిస్తాడు. ఈ విధంగా పుణ్యాలు చేస్తూ ఇంతటి గొప్ప మంచి ఆశయాలు మనం ఉంచుకోవాలి.

అందుకొరకు అల్లాహ్ చూస్తూ ఉన్నాడు. ఈ పేరులో రెండే రెండు చిన్న మాటలు తెలుసుకొని మనం సమాప్తం చేద్దాము. ఒకటి, దీని యొక్క మూడు లెవెల్లు ఉన్నాయి. దీన్ కే తీన్ దరజాత్ హై, స్థానాలు ఉన్నాయి. ఈమాన్, ఇస్లాం, ఇహసాన్. హదీథె జిబ్రీల్ లో ప్రస్తావన వచ్చింది కదా?

అల్లాహ్ చూస్తున్నాడు అన్నటువంటి విశ్వాసం, నమ్మకం ఇహసాన్ లో వస్తుంది. ఒక రకంగా ఈమాన్ ఇస్లాంలో కూడా వచ్చేస్తుంది, కానీ ఇహసాన్ లో ఇది ప్రత్యేకంగా ఉంది. ఎలా? ఎప్పుడైతే ఇహసాన్ గురించి ప్రశ్న వచ్చిందో, సమాధానం ఏం వచ్చింది?

أَنْ تَعْبُدَ اللَّهَ كَأَنَّكَ تَرَاهُ، فَإِنْ لَمْ تَكُنْ تَرَاهُ فَإِنَّهُ يَرَاكَ
(అన్ త’అబుదల్లాహ క అన్నక తరాహు, ఫ ఇన్ లమ్ తకున్ తరాహు ఫ ఇన్నహూ యరాక్)

నీవు అల్లాహ్‌ను ఆరాధించు, నీవు ఆయన్ని చూస్తున్నావన్నట్లుగా. ఒకవేళ నువ్వు ఆయన్ని చూడలేకపోతే, నిశ్చయంగా ఆయన నిన్ను చూస్తున్నాడు.

అంతటి భావం నీలో కలగకుంటే కనీసం అల్లాహ్ నిన్ను చూస్తూ ఉన్నాడు, ఈ కనీస భావమైనా ప్రతి క్షణంలో మనం మన మదిలో నాటుకొని ఉండాలి.

ఎంతో కరడుగట్టిన పాపాత్ముడు, పాషాణ హృదయుడైన దుష్టుడు, నీచుడు అని ఎవరినైతే మనం అనగలుగుతామో అలాంటి వారు కూడా తమ ఆ తప్పుడు మార్గాన్ని వదిలి పుణ్యాల్లో రావడానికి ఒక గొప్ప సబబు ఏముండిందో తెలుసా? అల్లాహ్ నన్ను చూస్తూ ఉన్నాడు అన్నటువంటి భయం వారిలో, విశ్వాసం వారిలో, ప్రగాఢమైన నమ్మకం వారిలో కుదిరింది, వారి రూట్ ఛేంజ్ అయిపోయింది. వారి చెడ్డ రోడ్, మంచి రోడ్లో మారిపోయింది.

సహీ బుఖారీలో గుహలో చిక్కుకున్న వారి యొక్క సంఘటనలో కూడా ఈ విషయం మీరు చూస్తారు కదా? అందుకొరకు అల్లాహ్ నన్ను చూస్తూ ఉన్నాడు అన్నటువంటి మాట మదిలో ఎల్లవేళల్లో ఫ్రెష్ గా ఉండడం తప్పనిసరి. ఎప్పుడైతే ఒక విద్యార్థి, ఆ టీచర్ చూస్తున్నాడు అని అనుకుంటాడో నకలు కొట్టడు. క్లాస్ రూంలో ఎలాంటి చిచోరా పనులు చేయడు. నాన్నగారు నన్ను చూస్తున్నారు అని ఎక్కడైతే కొడుకు భయంతో ఉంటాడో, నాన్నగారి దృష్టిలో చెడుగా కనబడకుండా ఏ తప్పులకు కూడా పాల్పడకుండా జాగ్రత్తగా ఉంటాడు. అల్లాహు అక్బర్. అల్లాహ్ మన తండ్రుల కంటే, మన టీచర్ల కంటే లెక్కలేనన్ని రెట్లు ఎంతో గొప్పవాడు. అతని పట్ల మనం ఈ విశ్వాస భావం కలిగి అతని పట్ల కావలసిన మర్యాద పాటించడం ఎంత అవసరం ఉంది.

ఇబ్ను రజబ్ రహిమహుల్లాహ్ చాలా గొప్ప ఇమాం, బుఖారీ యొక్క వ్యాఖ్యానం రాసిన వారు. లతాయిఫుల్ మఆరిఫ్ ఆయనది ఒక చాలా ప్రఖ్యాతి గాంచిన పుస్తకం. ఇమాం ఇబ్ను రజబ్ రహిమహుల్లాహ్ ఒక చిన్న సంఘటన పేర్కొన్నారు.

ఒక వ్యక్తి రాత్రివేళ ఒక ఎడారిలో ఒక స్త్రీని కలిశాడంట. పాపం వైపునకు ఆహ్వానించాడంట. కానీ ఆ స్త్రీ పుణ్యాత్మురాలై అతని యొక్క ఆహ్వానాన్ని తిరస్కరించింది. ఆ మనిషి చెప్పాడంట, ఈ రాత్రిలో, చీకటి రాత్రిలో, ఈ ఎడారిలో ఎవరూ కూడా లేరు కదా! ఈ చుక్కలు, నక్షత్రాలు తప్ప మనల్ని ఎవరూ చూడటం లేదు. వెంటనే ఆ స్త్రీ:

فَأَيْنَ مُكَوْكِبُهَا
(ఫ ఐన ముకౌకిబుహా?)
మరి వాటిని (నక్షత్రాలను) సృష్టించినవాడు ఎక్కడ ఉన్నాడు?

అని అడిగిందంట.

అందుకొరకే సూరత్ అల్-అలఖ్, ఖురాన్లోని మొట్టమొదటి సూరా అని అంటాము కదా మనం. అందులో 14వ ఆయత్ చూడండి మీరు:

أَلَمْ يَعْلَم بِأَنَّ اللَّهَ يَرَىٰ
(అలమ్ య’అలమ్ బి అన్నల్లాహ యరా)
అల్లాహ్‌ చూస్తున్నాడని వాడికి తెలియదా? (96:14)

అబూ జహల్ యొక్క ప్రస్తావన అని కొందరు వ్యాఖ్యానకర్తలు అంటారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఆ దుష్టుడు నమాజు నుండి ఆపేవాడు. నమాజ్ ప్రవక్త చేస్తూ ఉంటే కాబతుల్లాహ్ వద్ద అడ్డుకునేవాడు. ఆ ఆయతుల మధ్యలో, ఆ ప్రస్తావన యొక్క సందర్భంలో అల్లాహ్ ఈ మాట చెప్పాడు: “ఆ పాపాత్ముడు, ఆ దుష్టుడు, అతనికి తెలియదా అల్లాహ్ చూస్తున్నాడని? అతడు చేస్తున్నది ఏమిటో అల్లాహ్ అతన్ని చూస్తున్నాడు అని?” ఏ విధంగా గద్దిస్తున్నాడో అల్లాహ్ త’ఆలా గమనించండి.

అల్లాహ్ త’ఆలా నాకు, మీకు, మనందరికీ అల్లాహ్ యొక్క ఈ శుభమైన పేరు అల్-బసీర్ గురించి బలమైన నమ్మకం కలిగి, దాని ప్రకారంగా మన జీవితాన్ని మార్చుకునేటువంటి సద్భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్. వా ఆఖిరు ద’వానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.


అల్లాహ్ (త’ఆలా):
https://teluguislam.net/allah/

అల్లాహ్ శుభ నామాల వివరణ – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0tSV7A9HKJzSeM0aIAiYcb

దైవభీతితో కన్నీరు పెట్టడం – సలీం జామి’ఈ [ఆడియో & టెక్స్ట్]

దైవ భీతితో కన్నీరు పెట్టడం (The Excellence Of Weeping Out Of The Fear Of Allah)
వక్త: ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)
https://youtu.be/NNoAU3lUlAs [26 నిముషాలు]

ఈ ప్రసంగంలో, దైవ భీతితో కన్నీరు కార్చడం అనే అంశంపై లోతైన వివరణ ఇవ్వబడింది. మానవునికి అల్లాహ్ నవ్వు మరియు ఏడుపు రెండింటినీ ప్రసాదించాడని ఖురాన్ ఆయతుతో ప్రసంగం ప్రారంభమవుతుంది. మానసిక నిపుణుల ప్రకారం, శారీరక గాయం, ప్రియమైనవారిని కోల్పోవడం, ఆనందం, మోసం మరియు డబ్బు కోసం వంటి వివిధ కారణాల వల్ల మానవులు ఏడుస్తారని వివరించబడింది. అయితే, అసలు ప్రాముఖ్యత దైవ భీతితో కార్చే కన్నీరుకే ఉందని స్పష్టం చేయబడింది. అల్లాహ్ భయంతో ఏడ్చే వ్యక్తి నరకంలోకి ప్రవేశించడం అసాధ్యమని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీసులను ఉటంకించారు. తీర్పు దినాన అల్లాహ్ సింహాసనం నీడలో చోటు పొందే ఏడు రకాల వ్యక్తులలో, ఏకాంతంలో అల్లాహ్ ను స్మరించుకుని కన్నీరు కార్చే వ్యక్తి కూడా ఒకరని చెప్పబడింది. అల్లాహ్ భయంతో కన్నీరు కార్చిన కళ్ళను నరకాగ్ని తాకదని, ఆ కన్నీటి చుక్క అల్లాహ్ కు అత్యంత ప్రియమైనదని వివరించబడింది. దైవదూతలు (మీకాయీల్ అలైహిస్సలాం), ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మరియు సహాబాల (ఉస్మాన్, ముఆద్, హసన్, అబూ హురైరా రదియల్లాహు అన్హుమ్) జీవితాల నుండి దైవ భీతితో వారు ఏ విధంగా కన్నీరు కార్చేవారో ఉదాహరణలతో వివరించబడింది. మన హృదయాలు కఠినంగా మారిపోయాయని, మరణాన్ని, సమాధిని స్మరించుకుంటూ, అనారోగ్యులను మరియు స్మశానాలను సందర్శిస్తూ, మన హృదయాలను మృదువుగా చేసుకుని అల్లాహ్ భయంతో కన్నీరు కార్చాలని ప్రసంగం ముగుస్తుంది.

ప్రశంసలన్నీ, పొగడ్తలన్నీ సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పరలోక దినానికి యజమాని అయిన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించు గాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై ఎల్లవేళలా వర్షించు గాక. ఆమీన్.

గౌరవనీయులైన ధార్మిక పండితులు, పెద్దలు మరియు అభిమాన సోదరులారా! ఈనాటి జుమా ప్రసంగంలో దైవ భీతితో కన్నీరు పెట్టడం అనే అంశంపై ఇన్షా అల్లాహ్ కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

అభిమాన సోదరులారా, మానవున్ని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సృష్టించాడు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇచ్చిన ఈ శరీరం ఒక హార్డ్వేర్ (hardware) అయితే, ఈ శరీరం లోపల అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనిషికి కొన్ని సాఫ్ట్వేర్ (software) లాంటి విషయాలను కూడా అమర్చాడు. మనం చూచినట్లయితే ఈ శరీరం కలిగిన మనిషికి బాధ కలుగుతుంది. ఈ శరీరం కలిగి ఉన్న మనిషికి సంతోషం కూడా కలుగుతుంది. మనిషికి ఆకలి వేస్తుంది, మనిషికి దాహం వేస్తుంది, మనిషి నవ్వుతాడు, మనిషి ఏడుస్తాడు. ఈ విధంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ శరీరంలో ఎన్నో విషయాలను పొందుపరిచి ఉన్నాడు. ఈరోజు మనం దైవ భీతితో మనిషి కన్నీరు కారుస్తాడు కదా, దాని గురించి ఇన్షా అల్లాహ్ తెలుసుకుందాం.

వాస్తవానికి మనం చూచినట్లయితే మనిషికి నవ్వించడం నేర్పించింది అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా. అలాగే మనిషికి బాధపడి కన్నీరు పెట్టడం నేర్పించింది కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాయే. ఖురాన్ లో మనం చూచినట్లయితే, సూర నజ్మ్ 43వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ విధంగా తెలియజేశాడు:

وَأَنَّهُ هُوَ أَضْحَكَ وَأَبْكَىٰ
(వ అన్నహూ హువ అద్’హక వ అబ్కా)
మరి ఆయనే నవ్విస్తున్నాడు, ఆయనే ఏడిపిస్తున్నాడు. (53:43)

అభిమాన సోదరులారా, మానసిక వైద్య నిపుణులు కొన్ని విషయాలు తెలియజేశారు. అవేమిటంటే, మనిషి ఎన్నో కారణాల వల్ల బాధపడి కన్నీరు కారుస్తాడంట. మనిషి కన్నీరు కార్చడానికి చాలా కారణాలు ఉన్నాయి అని మానసిక వైద్య నిపుణులు తెలియజేశారు. ఒక కారణం ఏమిటంటే, మనిషికి ఏదైనా గాయమైతే, ఆ బాధను ఓర్వలేక అతను కన్నీరు కారుస్తాడంట. అలాగే మనిషి ఎవరైనా దూరమైపోతుంటే, ఎవరినైతే అతను అభిమానించాడో, ప్రేమించాడో, వారు దూరమైపోతుంటే ఆ బాధ వల్ల కూడా మనిషి కన్నీరు కారుస్తాడట.

అలాగే, మనిషికి అనుకోకుండా ఒక పెద్ద సంతోషం కలిగితే, అప్పుడు కూడా పట్టరాని సంతోషంలో మనిషి కళ్ళ నుంచి కన్నీళ్లు కారుతాయంట. దానినే మనము ఆనంద భాష్పాలని కూడా అంటూ ఉంటాం. అలాగే అభిమాన సోదరులారా, కొంతమంది ఇతరులను మోసం చేయడానికి కూడా కన్నీరు కారుస్తారు. ముసలి కన్నీరు అని మనము అప్పుడప్పుడు సామెత పలుకుతూ ఉంటాం.

అలాగే, కొంతమంది అయితే డబ్బు తీసుకుని మరీ ఏడుస్తారట, కన్నీరు కారుస్తారట. దానిని ఇస్లామీయ పరిభాషలో నౌహా (శోకం) చేయడం అంటారు, మాతం చేయడం అంటారు. ఎవరైనా ఒక వ్యక్తి మరణించినచో, ఆ వ్యక్తి శవం వద్ద ఏడవడానికి కూలీ మీద కొంతమంది వచ్చి ఏడుస్తారు. ఇది ఇస్లాంలో నిషేధం. మనిషి మరణించిన తర్వాత అతని బంధువులైనా సరే, ఇతర వ్యక్తులైనా సరే అతని వద్ద వచ్చి నౌహా చేయడం, బిగ్గరగా కేకలు పెడుతూ ఏడ్చడం ఇస్లాంలో నిషేధం చేయబడింది.

అలాగే, దైవ భీతితో కూడా మనిషి కన్నీరు కారుస్తాడట. రండి ఇన్షా అల్లాహ్, ఈనాటి జుమా ప్రసంగంలో ఈ అంశం మీదే ఇన్షా అల్లాహ్ ఖురాన్ మరియు హదీసుల వెలుగులో మరియు సహాబాల జీవితాలకి సంబంధించిన విషయాలతో తెలిసిన కొన్ని విషయాలు తెలుసుకుందాం.

అభిమాన సోదరులారా! ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా తెలియజేశారు.

لَا يَلِجُ النَّارَ رَجُلٌ بَكَى مِنْ خَشْيَةِ اللَّهِ حَتَّى يَعُودَ اللَّبَنُ فِي الضَّرْعِ
“లా యలిజున్నార రజులున్ బకా మిన్ ఖశియతిల్లాహి హత్తా యఊదల్లబను ఫిద్దర్రా”
దీని అర్థం ఏమిటంటే “జంతువు పొదుగు నుండి పాలు పిండేసిన తర్వాత ఆ పాలు మళ్లీ ఆ జంతువు పొదుగులోకి తిరిగి వెళ్లిపోవడం ఎలాగైతే అసంభవమో దైవభీతితో కన్నీరు కార్చిన వ్యక్తి కూడా నరకంలో వెళ్లటం అసంభవం” అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు.

అల్లాహు అక్బర్ (ٱللَّٰهُ أَكْبَرُ)! దైవ భీతితో మానవుడు, భక్తుడు ఒక్కసారి ప్రపంచంలో కన్నీరు పెడితే ఆ వ్యక్తి నరకంలో వెళ్లడం, ఆ వ్యక్తి నరక ప్రవేశం చేయడం అసంభవం అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు అభిమాన సోదరులారా!

మరొక ఉల్లేఖనంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏడు మంది అదృష్టవంతుల గురించి తెలియజేశారు. రేపు పరలోకంలో లెక్కింపు రోజున సూర్యుడు చాలా సమీపంలో ఉంటాడు. ఆ రోజు ఎలాంటి నీడ ఉండదు. కేవలం అల్లాహ్ యొక్క సింహాసనం, అర్ష్ యొక్క నీడ మాత్రమే ఉంటుంది. ఆ రోజు ప్రజలు వేడికి తపిస్తూ అల్లాడుతూ ఉంటారు. ఆ రోజు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తన సింహాసనం యొక్క నీడలోకి ఏడు రకాల మనుషులను తీసుకుంటాడు. ఆ ఏడు రకాల మనుషులలో ఒక రకమైన మనిషి ఎవడంటే

(وَرَجُلٌ ذَكَرَ اللَّهَ خَالِيًا فَفَاضَتْ عَيْنَاهُ).
“వరజులున్ జకరల్లాహ ఖాలియన్ ఫఫాదత్ ఐనాహు”

ఏకాంతంలో ఉన్నప్పుడు భక్తుడు, మానవుడు అల్లాహ్ ను తలుచుకొని అల్లాహ్ ను గుర్తు చేసుకొని కన్నీరు కార్చితే అలాంటి భక్తునికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా రేపు పరలోకంలో లెక్కింపు రోజున ఆ మహ్షర్ మైదానంలో తన సింహాసనం నీడలోకి తీసుకుంటాడట.

మరో ఉల్లేఖనంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు. “రెండు రకాల కళ్లు ఉన్నాయి. ఆ రెండు రకాల కళ్లు ఎప్పటికీ నరకాగ్నిని చూడవు. నరకాగ్ని ఆ కళ్లకు కాల్చదు అన్నారు“. ఎవరు ఆ రెండు రకాల కళ్లు? నరకాగ్నిని చూడవట. నరకాగ్ని ఆ కళ్లను కాల్చదట. ఎవరు ఆ రెండు రకాల కళ్లు అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు,

(عَيْنٌ بَكَتْ مِنْ خَشْيَةِ اللهِ، وَعَيْنٌ بَاتَتْ تَحْرُسُ فِي سَبِيلِ اللهِ).
“ఐనన్ బకత్ మిన్ ఖశియతిల్లాహ్ వ ఐనున్ బాతత్ తహ్రుసు ఫీ సబీలిల్లాహ్”

ఒక రకమైన కళ్లు ఎవరివి అంటే ఏ వ్యక్తి అయితే అల్లాహ్ ను తలుచుకొని కన్నీరు పెట్టాడో ఆ వ్యక్తి కళ్లకి నరకము తాకదు. నరకాగ్ని ఆ కళ్లకు ముట్టుకోదు. అలాగే పూర్వం యుద్ధాలు జరిగేవి. ఆ యుద్ధాలు జరిగే సమయంలో రాత్రి పూట యుద్ధం ముగిసిన తరువాత సైనికులందరూ పడుకుని ఉంటే ఆ సైనికులకి కొంతమంది వ్యక్తులు కాపలా కాసేవారు. వాళ్ల ప్రాణానికి రక్షణగా వాళ్లు రాత్రి మొత్తం జాగారము చేసి కాపలా కాసేవారు. అలా దైవ మార్గంలో రాత్రి మొత్తం జాగారం చేసి కాపలా కాసిన ఆ కళ్లకు కూడా రేపు నరకపు అగ్ని ముట్టుకోదు, నరకము ఆ కళ్లకు కాల్చదు అన్నారు.

రండి అభిమాన సోదరులారా, మరొక ఉల్లేఖనంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎంత మంచి మాట చెప్పి ఉన్నారో చూడండి. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకి రెండు రకాల చుక్కలు చాలా ప్రియమైనవి అట. అలాగే రెండు గుర్తులు కూడా అల్లాహ్ కు చాలా ఇష్టమైనవి అట. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు,

“రెండు చుక్కలు అల్లాహ్ కు చాలా ప్రియమైనవి.” ఒక చుక్క ఏమిటంటే, “అల్లాహ్ ను తలచుకుని భక్తుడు ఎప్పుడైతే కళ్ళ నుంచి కన్నీరు కారుస్తాడో, ఆ కన్నీటి చుక్క అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు చాలా ప్రియమైనది.” అలాగే, “దైవ ధర్మ రక్షణ కొరకు ఎప్పుడైతే మానవుడు వెళ్లి శత్రువుని ఎదుర్కొంటాడో, ఆ ఎదుర్కొనే సమయంలో అతని శరీరానికి గాయమై, అతని శరీరం నుండి రక్తపు చుక్క కారుతుంది కదండీ, ఆ చుక్క కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు చాలా ప్రియమైనది.”

ఇక రెండు గుర్తుల గురించి కూడా తెలియజేశారు. “రెండు రకాల గుర్తులు అల్లాహ్ కు చాలా ప్రియమైనవి. అవేమిటంటే, ఒక గుర్తు, “అల్లాహ్ ధర్మ రక్షణ కొరకు పోరాటం చేస్తున్నప్పుడు అతని శరీరానికి ఎక్కడైనా గాయం అవుతుంది. ఆ గాయం మానిన తర్వాత అక్కడ అలాగే గుర్తు పడిపోతుంది. ఆ గుర్తు అల్లాహ్ కు చాలా ఇష్టమైనది.” రెండవ గుర్తు ఏమిటంటే, “అల్లాహ్ విధించిన ఒక విధిని పాటిస్తూ ఉన్నప్పుడు అతని శరీరం మీద గుర్తు పడిపోతుంది. ఆ గుర్తు కూడా అల్లాహ్ కు చాలా ప్రియమైనది.”

దీనికి ఉదాహరణగా మనం చూచినట్లయితే, ఒక వ్యక్తి నమాజ్ ఆచరిస్తూ ఉంటాడు. నమాజ్ చేయడం విధి, తప్పనిసరి. అల్లాహ్ తరపు నుంచి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రతీ ముస్లిం మీద నమాజ్ చేయడం తప్పనిసరి చేశాడు, విధి చేశాడు. మరి ఒక ముస్లిం, ఒక దైవ భక్తుడు నమాజ్ ఆచరిస్తూ ఉంటే, అతని నుదుట మీద గుర్తు పడిపోతుంది, అతని మోకాళ్ళ మీద గుర్తు పడిపోతాది. ఇలా దైవం విధించిన ఒక విధిని ఆచరిస్తున్నప్పుడు అతని శరీరం మీద ఏదైనా గుర్తు పడిపోయిందంటే, ఆ గుర్తు అల్లాహ్ కు చాలా ఇష్టమైనది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు.

అలాగే రండి అభిమాన సోదరులారా! అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమర్ రదియల్లాహు అన్హు వారు ఏమనేవారంటే “ల అన్ అద్మఅ మిన్ ఖష్యతిల్లాహ్ అహబ్బు ఇలయ్య మిన్ అన్ అతసద్దక బి అల్ఫి దీనార్” (لَأَنْ أَدْمَعَ مِنْ خَشْيَةِ اللَّهِ أَحَبُّ إِلَيَّ مِنْ أَنْ أَتَصَدَّقَ بِأَلْفِ دِينَارٍ). అల్ఫి దీనార్ అంటే మనందరికీ తెలుసు. వెయ్యి దీనార్లు. అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమర్ రదియల్లాహు అన్హు వారు తెలియజేస్తున్నారు. “నేను అల్లాహ్ మార్గంలో వెయ్యి దీనార్లు దానం చేయడము కంటే కూడా అల్లాహ్ ను తలుచుకొని ఒక్కసారి కన్నీరు పెట్టడం నాకు చాలా ప్రియమైనది, ఇష్టమైనది” అన్నారు. అంటే నేను అల్లాహ్ ను తలుచుకొని ఏడవటం, అల్లాహ్ ను తలుచుకొని కన్నీరు కార్చడం దైవమార్గంలో వెయ్యి దీనార్లు ఖర్చు చేయటం కంటే నాకు ఇష్టం అన్నారు.

ఇక రండి అభిమాన సోదరులారా, అల్లాహ్ ను తలచుకుని, అల్లాహ్ భీతితో ప్రవక్తలు ఏ విధంగా కన్నీరు కార్చేవారో, దూతలు ఏ విధంగా వణికిపోయేవారో, దైవ భక్తులు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి శిష్యులు ఏ విధంగా కన్నీరు పెట్టేవారో, అవి కూడా ఇన్షా అల్లాహ్ కొన్ని ఉదాహరణల ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ముందుగా దైవ దూతల గురించి తెలుసుకుందాం. ఒకసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జిబ్రయీల్ అలైహిస్సలాం వారితో మీకాయీల్ అలైహిస్సలాం వారి గురించి ప్రశ్నించారు. మీకాయీల్ అలైహిస్సలాం నలుగురు పెద్ద దైవ దూతలలో ఒక దైవదూత. ఆ దైవదూత గురించి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జిబ్రయీల్ అలైహిస్సలాం వారిని ప్రశ్నించారు. ఏమని ప్రశ్నించారంటే “మాలి లా అరా మీకాయీల దాహికన్ ఖత్తూ?” (مَا لِي لَا أَرَى مِيكَائِيلَ ضَاحِكًا قَطُّ؟). ఓ జిబ్రయీల్ అలైహిస్సలాం! ఏమిటండి నేను ఎప్పుడూ కూడా మీకాయీల్ని చిరునవ్వు నవ్వుతూ కూడా నేను చూడలేదు. ఆయన ఒక్కసారి కూడా నాకు చిరునవ్వు నవ్వుతూ కనిపించట్లేదు. ఎందుకలా అని అడిగాను. అప్పుడు జిబ్రయీల్ అలైహిస్సలాం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తెలియజేశారు “మా దహిక మీకాయీలు ముంజు ఖులికతిన్నార్” (مَا ضَحِكَ مِيكَائِيلُ مُنْذُ خُلِقَتِ النَّارُ). ఓ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం! అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా నరకాన్ని సృష్టించిన తర్వాత నుంచి మీకాయీల్ అలైహిస్సలాం ఒక్కసారి కూడా నవ్వలేదు అన్నారు.అభిమాన సోదరులారా, దైవదూతలు ఒక్క తప్పు కూడా వారితో దొర్లదు. అయినా గానీ నరకం సృష్టించబడిన తర్వాత వాళ్ళు నవ్వడమే మానేశారు.

అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మెరాజ్ యాత్రలో ఎప్పుడైతే అల్లాహ్ ను కలిసి మాట్లాడటానికి వెళ్లారో ఆ రోజు జిబ్రయీల్ అలైహిస్సలాం వారిని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చూశారు. ఆయన గురించి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, “వ జిబ్రయీలు కల్ హిల్సిల్ బాలి మిన్ ఖశియతిల్లాహ్” (وَجِبْرِيلُ كَالْحِلْسِ الْبَالِي مِنْ خَشْيَةِ اللَّهِ). మెరాజ్ యాత్రలో నేను చూశాను. దూతలకు రారాజు, దూతల నాయకుడు జిబ్రయీల్ అలైహిస్సలాం మలయే ఆలాలో పరుపులాగా అల్లాహ్ కు భయపడి నేలకు ఆనిపోయారు. అభిమాన సోదరులారా! దూతల నాయకుడు అల్లాహ్ ను తలుచుకొని, అల్లాహ్ భక్తితో, అల్లాహ్ భీతితో నేల మీద పరుపు లాగా పడిపోయి ఉన్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కళ్లారా వారిని చూశారు.

ఇక రండి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి కూడా తెలుసుకుందాం. అభిమాన సోదరులారా! ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒకరోజు నమాజు చేయడానికి నిలబడ్డారు. నమాజు చదువుతున్నారు. నమాజులోనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కన్నీరు కార్చడం మొదలెట్టేశారు. ఎంతగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దైవభీతితో కన్నీరు కారుస్తున్నారంటే చూసిన వాళ్లు ఆయన గురించి చెప్పారు, “వలి జౌఫిహీ అజీజున్ క అజీజిల్ మిర్జలి మినల్ బుకా'” (وَلِجَوْفِهِ أَزِيزٌ كَأَزِيزِ الْمِرْجَلِ مِنَ الْبُكَاءِ). ఎలాగైతే పొయ్యి మీద పెట్టిన ఒక కుండలో నీళ్లు బాగా వేడెక్కిన తర్వాత ఖత్ ఖత్ ఖత్ అని ఎలా శబ్దం వస్తుందో ఆ విధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నమాజుకు నిలబడి అల్లాహ్ ను తలుచుకొని లోలోపలే కన్నీరు కారుస్తున్నారు, బాధపడి ఏడుస్తున్నారు అభిమాన సోదరులారా!

అలాగే ఆయిషా రదియల్లాహు తాలా అన్హా వారు తెలియజేశారు. ఒక రోజు రాత్రి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నమాజు కోసం నిలబడ్డారు. నమాజులో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏడవటం మొదలెట్టారు. ఎంతగా ఏడ్చారంటే వారి గడ్డం తడిసిపోయింది. అయినా ఏడుపు ఆపట్లేదు. మళ్లీ ఏడుస్తున్నారు. ఆయన తొడిగిన బట్టలు కూడా నానిపోయాయి. అయినా ఏడుపు ఆపట్లేదు. ఏడుస్తూనే ఉన్నారు. ఎక్కడైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నమాజు చేస్తున్నారో ఆ భూమి కూడా తడిసిపోయింది. ఫజర్ అజాన్ ఇచ్చే సమయం వచ్చేసింది. బిలాల్ రదియల్లాహు అన్హు మస్జిద్లో అజాన్ ఇవ్వటానికి వచ్చి చూస్తే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏడుస్తున్నారు. అది చూసిన బిలాల్ రదియల్లాహు అన్హు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంతో అన్నారు, “ఓ దైవ ప్రవక్తా, అల్లాహ్ మీ పాపాలన్నింటినీ మన్నించేశాడు కదా? అయినా కూడా మీరు ఈ విధంగా ఏడవడం ఏంటి?” అని అడిగితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, “అఫలా అకూను అబ్దన్ శకూరా?” (أَفَلَا أَكُونُ عَبْدًا شَكُورًا؟). నేను దైవానికి కృతజ్ఞుడు చేసి తెలుసుకునే భక్తుని కావద్దా? అందుకోసమే దైవానికి కృతజ్ఞత, కృతజ్ఞతలు తెలుపుకునే భక్తుడు అవ్వటానికి ఏడుస్తున్నాను అన్నారు.

అభిమాన సోదరులారా! మన పరిస్థితి ఏమిటి? దైవదూతలు ఏడుస్తున్నారు. దూతల నాయకుడు జిబ్రయీల్ అలైహిస్సలాం వారు ఏడుస్తున్నారు. దైవప్రవక్తలు ఏడుస్తున్నారు. దైవ ప్రవక్తల నాయకుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కన్నీరు కారుస్తున్నారు. మన పరిస్థితి ఏమిటి అభిమాన సోదరులారా?

ఇక రండి. మరొక సందర్భంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం రెండు చేతులు ఎత్తి ఏడవడం ప్రారంభిస్తే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వెంటనే జిబ్రయీల్ అలైహిస్సలాం వారిని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు పంపించేశారు. జిబ్రయీల్ అలైహిస్సలాం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి ఓ దైవప్రవక్త మీరు కన్నీరు కారుస్తున్నారు, ఏడుస్తున్నారు. కారణం ఏమిటి? అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా నన్ను మీ వద్దకు పంపించాడు చెప్పండి అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసిన విషయం ఏమిటో తెలుసా అభిమాన సోదరులారా? ఎంత అదృష్టవంతులమో మనము ఒకసారి ఆలోచించండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి జిబ్రయీల్ అలైహిస్సలాం వారు వచ్చి మీరు ఎందుకు ఏడుస్తున్నారు అంటే ఆయన ఇచ్చిన సమాధానం ఏమిటంటే “అల్లాహుమ్మ ఉమ్మతీ, ఉమ్మతీ!” (اللَّهُمَّ أُمَّتِي أُمَّتِي!). ఓ అల్లాహ్! నా అనుచర సమాజాన్ని తలుచుకొని ఏడుస్తున్నాను. నా అనుచర సమాజం ఏమైపోతుందో అని తలుచుకొని ఏడుస్తున్నాను అన్నారు. అప్పుడు జిబ్రయీల్ అలైహిస్సలాం మళ్లీ అల్లాహ్ సన్నిధికి వెళ్లి తెలియజేయగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి శుభవార్త అందజేశాడు. అదేమిటంటే “ఇన్నా సనుర్దీక ఫీ ఉమ్మతిక వలా నసూఉక” (إِنَّا سَنُرْضِيكَ فِي أُمَّتِكَ وَلَا نَسُوءُكَ). ఓ ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం! మీ అనుచరుల విషయంలో మేము మీకు సంతృప్తి చెందేలా చేస్తాము. మీకు అసంతృప్తి అయ్యేలాగా చేయము అని చెప్పేశారు. అల్లాహు అక్బర్! అలాంటి ప్రవక్తకి మనము అనుచరులమైనందుకు మనము ఎంతో అదృష్టవంతులమని భావించాలి అభిమాన సోదరులారా!

ఇక రండి ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క శిష్యుల గురించి కూడా తెలుసుకుందాం. ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి ఇలాగే శిష్యులందరూ కూర్చుని ఉంటే శిష్యుల ముందర ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలాగే ఉపన్యాసం ఇవ్వడం ప్రారంభించారు. ఆ ఉపన్యాసంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమని తెలియజేశారంటే, “ఏమండీ నాకు స్వర్గం చూపబడింది. నాకు నరకము కూడా చూపబడింది. నేను చూసిన విషయాలు గనక మీరు చూసినట్లయితే మీరు నవ్వడం మానేసి ఏడవడం ప్రారంభించేస్తారు” అన్నారు. అది విన్న వెంటనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి శిష్యులందరూ తల మీద బట్ట వేసుకొని ముక్కు పట్టుకొని ఏడవడం ప్రారంభించేశారు అభిమాన సోదరులారా!

అలాగే హానీ, ఉస్మాన్ రదియల్లాహు తాలా అన్హు వారి యొక్క బానిస ,ఉస్మాన్ రదియల్లాహు అన్హు వారి గురించి ఆయన తెలియజేశారు. అదేమిటంటే ఉస్మాన్ రదియల్లాహు తాలా అన్హు వెళుతూ వెళుతూ స్మశానం దగ్గర ఆగిపోయి ఏడవడం ప్రారంభించేవారు. ఎంతగా కన్నీరు కార్చేవారంటే ఆయన గడ్డం మొత్తం తడిచిపోయేది. అది చూసిన ఆయన బానిస ఆయన వద్దకు వచ్చి ఏమని అడిగేవాడంటే, “ఏమండీ మీ దగ్గర స్వర్గం గురించి చర్చించబడినప్పుడు మీరు కన్నీరు కార్చరు. అలాగే మీ దగ్గర నరకం గురించి తెలియజేయబడినప్పుడు కూడా మీరు ఈ విధంగా కన్నీరు కార్చరు. కానీ స్మశానాన్ని, సమాధులను చూసి మీరు ఈ విధంగా కన్నీరు కారుస్తారు. కారణం ఏమిటి?” అని ఆయన అడిగినప్పుడు ఉస్మాన్ రదియల్లాహు తాలా అన్హు వారు తెలియజేసిన విషయం ఏమిటంటే, “ఇన్నల్ ఖబర అవ్వలు మంజిలిన్ మిన్ మనాజిలిల్ ఆఖిరహ్. ఫఇన్ నజా మిన్హు ఫమా బాఅదహు ఐసర్, వఇల్లం యంజ్ మిన్హు ఫమా బాఅదహు అషద్దు మిన్హు” (إِنَّ الْقَبْرَ أَوَّلُ مَنَازِلِ الْآخِرَةِ، فَإِنْ نَجَا مِنْهُ فَمَا بَعْدَهُ أَيْسَرُ، وَإِنْ لَمْ يَنْجُ مِنْهُ فَمَا بَعْدَهُ أَشَدُّ مِنْهُ). నేను సమాధిని చూసి ఎందుకు ఏడుస్తున్నాను అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. పరలోక ప్రయాణంలో సమాధి మొదటి స్టేజీ లాంటిది. ఇక్కడ ఏ వ్యక్తి అయితే పాస్ అయిపోతాడో అతను తర్వాత స్టేజీలలో కూడా పాస్ అయిపోతాడు. ఈ ఫస్ట్ స్టేజీలోనే ఏ వ్యక్తి అయితే ఇరుక్కుపోతాడో, నష్టపోతాడో ఆ తర్వాత వచ్చే స్టేజీలన్నీ కూడా అతనికి చాలా భయంకరమైనవిగా మారిపోతాయి. కాబట్టి నా మొదటి స్టేజీలో నా పరిస్థితి ఎలా ఉంటుందో అది తలుచుకొని నేను కన్నీరు కారుస్తున్నాను అని చెప్పేవారు.

అలాగే ముఆజ్ రదియల్లాహు తాలా అన్హు ఏడుస్తూ ఉంటే కొంతమంది వ్యక్తులు వెళ్లి ఏమండీ మీరు కన్నీరు కారుస్తున్నారు, కారణం ఏమిటి అని అడిగితే ఆయన చెప్పిన విషయం ఏమిటంటే “స్వర్గానికి వెళ్ళే వాళ్ల సమూహం ఏదో అల్లాహ్ కు బాగా తెలుసు. నరకానికి వెళ్లే సమూహం ఏదో అది కూడా అల్లాహ్ కు బాగా తెలుసు. నేను స్వర్గానికి వెళ్లే సమూహంలో ఉన్నానా లేదా నరకానికి వెళ్లే సమూహంలో ఉన్నానా? అది తలుచుకొని నేను కన్నీరు కారుస్తున్నాను” అన్నారు.

అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క మనవడు హసన్ రదియల్లాహు తాలా అన్హు ఏడుస్తూ ఉంటే కన్నీరు కారుస్తూ ఉంటే ప్రజలు వెళ్లి ఆయనను అడిగారు, “ఎందుకయ్యా మీరు ఏడుస్తున్నారు, కన్నీరు కారుస్తున్నారు?” అంటే ఆయన చెప్పిన విషయం ఏమిటంటే “నేను ప్రళయదినాన్ని తలుచుకొని కన్నీరు కారుస్తున్నాను. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తలుచుకుంటే నన్ను కూడా నరకంలో వేసేస్తాడు. అతనికి ఎలాంటి పర్వా లేకుండా పోతుంది. నేను ఎవరు, ఏంటి అనేది అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు ఏమి అవసరం ఉండదు. ఆయన తలుచుకుంటే నన్ను కూడా నరకంలో పడవేయగలడు కాబట్టి అది తలుచుకొని నేను ఏడుస్తున్నాను” అన్నారు.

అలాగే అభిమాన సోదరులారా! అబూ హురైరా రదియల్లాహు తాలా అన్హు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి శిష్యుల్లో గొప్ప శిష్యుడు. అబూ హురైరా రదియల్లాహు తాలా అన్హు వ్యాధిగ్రస్తునిగా ఉన్నప్పుడు ఏడుస్తూ ఉంటే ప్రజలు వెళ్లి ఏమయ్యా ఏడుస్తున్నారు మీరు అంటే ఆయన అన్నారు. “నేను మరణిస్తానేమో, ఈ ప్రపంచాన్ని నేను వదిలేసి వెళ్లిపోతున్నాను కదా అని నేను బాధపడట్లేదు. నేను బాధపడుతున్న విషయం ఏమిటంటే ఇక నా ప్రయాణం చాలా పెద్దదిగా ఉంది. కానీ అంత పెద్ద ప్రయాణంలో నేను సంపాదించుకుంది చాలా తక్కువ. ఇంత తక్కువ మొత్తంతో నేను అంత పెద్ద ప్రయాణాన్ని ఎలా చేయగలను అని తలుచుకొని నేను ఏడుస్తున్నాను” అన్నారు.

అలాగే అభిమాన సోదరులారా! అబ్దుల్లాహ్ ఇబ్నె రవాహా సతీమణి ఒడిలో పడుకొని ఉన్నారు. అక్కడే కన్నీరు కార్చడం మొదలెట్టేశారు. ఆయనను చూసి ఆయన భార్య కూడా కన్నీరు కార్చడం మొదలెట్టేసింది. ఆ తర్వాత ఏమయ్యా ఎందుకు మీరు కన్నీరు కారుస్తున్నారు అని ఆయనతో అడిగినప్పుడు ఆయన చెప్పిన విషయం ఏమిటంటే “రేపు ప్రతి వ్యక్తి స్వర్గానికి వెళ్లాలనుకునే ప్రతి వ్యక్తి నరకం మీద ఉంచిన పుల్సిరాత్ ని దాటుకుని స్వర్గానికి వెళ్లాల్సి ఉంటుంది. ఆ రోజు నేను పుల్సిరాత్ దాటుకుని స్వర్గానికి వెళ్తానా లేదా అని తలుచుకొని బాధపడుతున్నాను అన్నారు. ప్రతి వ్యక్తి ఆ మార్గం ద్వారానే దాటుకోవాల్సి ఉంటుంది. నరకాన్ని దాటుకోవాలంటే ఆ మార్గం మీద నుంచి నడిచి వెళ్ళాలి. ఆ తర్వాత మళ్లీ స్వర్గ ప్రవేశం ఉంటుంది. ఆ మార్గాన్ని నేను దాటుకోగలనా లేదా అని తలుచుకొని నేను కన్నీరు కారుస్తున్నాను” అన్నారు అభిమాన సోదరులారా.

ఈ విధంగా చూస్తే చాలామంది గురించి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఆఖరిలో ఒక్క విషయం చెప్పేసి నా మాట ముగిస్తున్నాను. అదేమిటంటే అభిమాన సోదరులారా! అల్లాహ్ ను తలుచుకొని ప్రతి భక్తుడు ఎప్పుడైనా సరే ఏదో ఒక సందర్భంలో తప్పనిసరిగా కన్నీరు కార్చాలి. ఎందుకంటే ఈ జీవితం శాశ్వతము కాదు. ఈ జీవితాన్ని స్వస్తి పలికి అల్లాహ్ పిలుపు రాగానే ప్రపంచాన్ని వదిలేసి మనం వెళ్లిపోవాలి. మన బంధువులు, మన మిత్రులు, మన స్నేహితులు, కుటుంబ సభ్యులు మూడు రోజులు కన్నీరు కార్చుకుంటారు. మళ్లీ వాళ్ల పనుల్లో వాళ్లు నిమగ్నమైపోతారు. ప్రయాణం చేయాల్సింది ఒంటరిగా మనమే. అక్కడ మనకు కాపాడాల్సింది ఒక అల్లాహ్ మాత్రమే. కాబట్టి అల్లాహ్ ను తలుచుకొని ప్రతి భక్తుడు కన్నీరు కార్చాలి. అల్లాహ్ తో క్షమాపణ వేడుకోవాలి.

కానీ మన పరిస్థితి ఎలా ఉందంటే మన హృదయాలు నల్ల రాయి లాగా గట్టిగా మారిపోయాయి. కారణం ఏమిటంటే మనలో దైవభీతి లేదు. ప్రపంచ వ్యామోహంలో పడిపోయి ఉన్నాం. డబ్బు డబ్బు, ఆస్తి ఆస్తి, బంగారు నగలూ అని చెప్పేసి దాని వెనకాల పరిగెడుతున్నాం అభిమాన సోదరులారా. ఇది శాశ్వతము కాదు. చావును తలుచుకోండి. సమాధిని తలుచుకోండి. నరకాన్ని తలుచుకోండి. పుల్సిరాత్ని తలుచుకోండి. లెక్కింపు రోజుని తలుచుకోండి. ఇది ఎంత ఎక్కువగా తలుచుకుంటే అంతగా హృదయం మెత్తబడుతుంది. అప్పుడు భక్తుడు దైవ భక్తితో, దైవ భీతితో కన్నీరు కారుస్తాడు. వీలైతే వ్యాధిగ్రస్తుల వద్దకు వెళుతూ వస్తూ ఉండండి. అప్పుడు కూడా మనసులు, హృదయాలు మెత్తబడతాయి. వీలైతే స్మశానానికి వెళుతూ వస్తూ ఉండండి. సమాధుల్ని చూసినప్పుడు కూడా హృదయాలు మెత్తబడతాయి.

కాబట్టి అభిమాన సోదరులారా! ప్రతి భక్తునికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా హృదయం, మెత్తని హృదయాన్ని ప్రసాదించి, దైవభీతితో కన్నీరు కార్చేలాగా, అల్లాహ్ తో చేసిన పాపాలకి క్షమాపణ కోరుతూ ఉండేలాగా సద్బుద్ధిని అల్లాహ్ ప్రసాదించుగాక.

أَقُولُ قَوْلِي هَٰذَا وَأَسْتَغْفِرُ اللَّهَ لِي وَلَكُمْ وَلِسَائِرِ الْمُسْلِمِينَ فَاسْتَغْفِرُوهُ ۚ إِنَّهُ هُوَ الْغَفُورُ الرَّحِيمُ
(అఖూలు ఖౌలీ హాజా వ అస్తగ్ ఫిరుల్లాహ లీ వలకుమ్ వలి సాయిరిల్ ముస్లిమీన ఫస్తగ్ ఫిరూహు ఇన్నహూ హువల్ గఫూరుర్ రహీమ్)

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=16913


ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్) – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0B6tOQhDiqrHO4E3Ou_IL7


అన్నదానము మహా పుణ్యకార్యము [ఆడియో]

బిస్మిల్లాహ్
అన్నదానము మహా పుణ్యకార్యము – వక్త: ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)
Feeding the Poor is a great virtuous act

[24 నిముషాలు]
వక్త: ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్) – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0B6tOQhDiqrHO4E3Ou_IL7

జకాతు & సదఖా (మెయిన్ పేజీ)
https://teluguislam.net/five-pillars/zakah

రమజాన్ తర్వాత ధర్మం పై నిలకడ, సత్కార్యాల సంరక్షణ [ఆడియో]

బిస్మిల్లాహ్
రమజాన్ తర్వాత సత్కార్యాల సంరక్షణ – వక్త: ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)

[30 నిముషాలు]
వక్త: ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ఆడియో వినటంతో పాటు క్రింది ఈద్ ఖుత్బా కూడా తప్ప చదవండి.
ఆడియో లో చెప్పిన చాలా విషయాలు , క్రింది ఖుత్బా లో చాలా చక్కగా వివరించబడ్డాయి

ఈదుల్ ఫిత్ర్ ఖుత్బా – జాదుల్ ఖతీబ్

ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్) – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0B6tOQhDiqrHO4E3Ou_IL7

సమాజ సంస్కరణ ఎలా జరుగుతుంది? [ఆడియో]

బిస్మిల్లాహ్
సమాజ సంస్కరణ ఎలా జరుగుతుంది?- వక్త: ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)

[24 నిముషాలు]
వక్త: ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్) – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0B6tOQhDiqrHO4E3Ou_IL7