సమాధుల చుట్టూ ప్రదక్షిణ (తవాఫ్) & సమాధుల వైపు నమాజ్ చెయ్యడం https://youtu.be/mtb-SmruW8E [6 నిముషాలు] షేఖ్ హబీబుర్రహ్మాన్ జామిఈ హఫిజహుల్లాహ్
ఈ ప్రసంగంలో, సమాధుల చుట్టూ ప్రదక్షిణ (తవాఫ్) చేయడం మరియు వాటి వైపు తిరిగి నమాజ్ చేయడం ఇస్లాంలో నిషేధించబడినవని స్పష్టంగా వివరించబడింది. తవాఫ్ అనేది మక్కాలోని కాబతుల్లాహ్‌కు మాత్రమే ప్రత్యేకమైన ఆరాధన అని ఖురాన్ మరియు హదీసుల ఆధారాలతో నొక్కి చెప్పబడింది. ప్రవక్తల సమాధులను ఆరాధనా స్థలాలుగా మార్చుకున్న వారిని అల్లాహ్ శపించాడని, మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన సమాధిని పూజించే స్థలంగా మార్చవద్దని ప్రార్థించారని ఉల్లేఖించబడింది. ప్రవక్త యొక్క మస్జిద్ (మస్జిదె నబవి) ఎంతో పవిత్రమైనదైనప్పటికీ, దాని చుట్టూ కూడా తవాఫ్ చేయడానికి అనుమతి లేనప్పుడు, ఇతర సమాధులు లేదా దర్గాల చుట్టూ తిరగడం ఘోరమైన పాపం (షిర్క్) అవుతుందని హెచ్చరించబడింది. ముస్లింలు ఇలాంటి షిర్క్ మరియు బిద్అత్ (మతంలో నూతన కల్పనలు)లకు దూరంగా ఉండాలని ప్రసంగం ముగిసింది.
ఇన్నల్ హమ్ దలిల్లాహి వహ్ దహు వస్సలాతు వస్సలాము అలా మల్లా నబియ బ’అదహు అమ్మా బ’అద్. అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు.
అభిమాన సోదరులారా! ధర్మ అవగాహనం అనే ఈ 12వ ఎపిసోడ్లో, సమాధుల ప్రదక్షిణం చేయటం, దాని వాస్తవికత ఏమిటో తెలుసుకుందాం. సోదరులారా, మన సమాజంలో కొందరు అమాయకులు, అజ్ఞానం వల్లో అలాగే ఇస్లాం గురించి సరైన అవగాహనం లేనందువల్ల సమాధుల వద్ద పోయి పూజిస్తున్నారు, సమాధుల తవాఫ్ (ప్రదక్షిణం) చేస్తున్నారు.
ఈ భూమండలంలో కాబతుల్లాహ్ తవాఫ్ తప్ప ఇతరుల తవాఫ్‌కి అనుమతి లేదు. అది ఎంత పవిత్రమైన స్థలమైనా సరే, కాబతుల్లాహ్ తప్ప మరేదానిని తవాఫ్ చేయకూడదు.
అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇలా తెలియజేశాడు,
وَلْيَطَّوَّفُوا بِالْبَيْتِ الْعَتِيقِ (వల్ యత్తవ్వఫూ బిల్ బైతిల్ అతీఖ్) వారు ఆ ప్రాచీన గృహానికి (కాబతుల్లాహ్కు) ప్రదక్షిణ చేయాలి. (22:29)
అంటే ఆ కాబతుల్లాకి తవాఫ్ చేయాలి. అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేశారు, ఈ హదీస్ ఇబ్నె మాజాలో ఉంది, ఎవరైతే ఆ కాబతుల్లాకి చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేస్తాడో, తవాఫ్ చేస్తాడో, ఆ తర్వాత రెండు రకాత్ నమాజులు పాటిస్తాడో, ఆ వ్యక్తికి ఒక బానిసను విముక్తి ప్రసాదించే అంత పుణ్యం లభిస్తుంది.
సమాధుల వైపు నమాజ్ చేయడం
అభిమాన సోదరులారా, సమాధుల వైపునకు ముఖాన్ని త్రిప్పి నమాజ్ చేయడం అది అధర్మము, అసత్యము, అది హరామ్ అవుతుంది. కొందరు మదీనాలో అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సమాధి వైపు తిరిగి ప్రార్థనలు చేస్తారు, వేడుకుంటారు, దుఆ చేస్తారు, నమాజ్ చేస్తారు, ఇది అధర్మం. ఈ విషయం గురించి అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చాలా కఠినంగా ఖండించారు.
అంతిమ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేశారు,
لَعَنَ اللَّهُ الْيَهُودَ وَالنَّصَارَى اتَّخَذُوا قُبُورَ أَنْبِيَائِهِمْ مَسَاجِدَ (ల’అనల్లాహుల్ యహూద వన్ నసారా ఇత్తఖదూ ఖుబూర అంబియా’ఇహిమ్ మసాజిదా) అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా యూదుల పైన మరియు క్రైస్తవుల పైన శపించుగాక! ఎందుకంటే వారు ప్రవక్తల సమాధులను సజ్దాగా(ఆరాధన స్థలాలు) చేసుకున్నారు. (ముత్తఫకున్ అలైహ్)
అంటే మస్జిద్ గా చేసుకున్నారు. అంటే సజ్దా అల్లాహ్ కోసమే చేయాలి. అది మనము నమాజ్ ఎక్కడ చేస్తాము? మస్జిద్ కి పోయి చేస్తాము. కాకపోతే యోధులు మరియు క్రైస్తవులు ప్రవక్తల సమాధులను మస్జిదులుగా మార్చేశారు, మస్జిదులుగా ఖరారు చేసుకున్నారు.
అలాగే అంతిమ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేశారు,
اللَّهُمَّ لَا تَجْعَلْ قَبْرِي وَثَنًا يُعْبَدُ (అల్లాహుమ్మ లా తజ్’అల్ ఖబ్రీ వసనన్ యు’బద్) ఓ అల్లాహ్, నా సమాధిని ప్రార్థనాలయంగా మార్చకు.
అంటే, ఓ అల్లాహ్, నేను చనిపోయిన తర్వాత నా సమాజంలో, నా ఉమ్మత్ లో కొంతమంది రావచ్చు, వచ్చి నా సమాధి వైపు తిరగవచ్చు, ప్రదక్షిణం చేయవచ్చు, కాకపోతే ఓ అల్లాహ్ నువ్వు నా సమాధిని ప్రార్థనాలయంగా మార్చవద్దు.
ఆ జాతి పైన అల్లాహ్ యొక్క క్రోధం కఠినంగా మారిపోతుంది, ఏ జాతి పైన?
“ఏ జాతి వారు, ఏ వర్గం వారు ఎవరైతే ప్రవక్తల సమాధులను ప్రదక్షిణం చేస్తారో, ప్రవక్తల సమాధులను ఆరాధన స్థలంగా మార్చుకుంటారో, అటువంటి జాతి పైన అల్లాహ్ యొక్క క్రోధం కఠినంగా మారిపోతుందని” అంతిమ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ హదీస్ లో తెలియజేశారు.
అభిమాన సోదరులారా, అలాగే సమాధుల వైపునకు ముఖాన్ని త్రిప్పి నమాజ్ చేయకూడదు. ఎటువైపు త్రిప్పి నమాజ్ చేయాలి? అది కేవలం కాబతుల్లాహ్ వైపు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇలా తెలియజేశాడు సూరతుల్ బఖరాలో,
అభిమాన సోదరులారా, అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేశారు, “మీరు సమాధుల పై గానీ, సమాధుల వైపునకు గానీ ముఖాలను త్రిప్పి నమాజు చేయకండి.”
అభిమాన సోదరులారా, ఇక్కడ గమనించే విషయం ఏమిటంటే, ఈ భూమండలంలో కాబతుల్లాహ్ తర్వాత, మస్జిదె హరామ్ తర్వాత పవిత్రమైన స్థలాలు రెండు ఉన్నాయి. ఒకటి మస్జిదె నబవి, రెండవది మస్జిదె అఖ్సా.
మస్జిదె హరామ్, మస్జిదె నబవి, మస్జిదె అఖ్సా – ఈ మూడు మస్జిదులకు నమాజ్ చేసే ఉద్దేశంతో ప్రయాణం చేయవచ్చు. మస్జిదె నబవిలో ఒక నమాజ్ చేస్తే వెయ్యి నమాజుల పుణ్యం అంత లభిస్తుంది. అంటే అది హరమ్ అది. ఏ విధంగా మస్జిదె హరామ్ హరమ్ కిందికి వస్తుందో, అలాగే మస్జిదె నబవి కూడా హరమ్ లో వస్తుంది. అయినప్పటికీ, ఆ మస్జిదె నబవి యొక్క ప్రదక్షిణం చేయటం కూడా ధర్మసమ్మతం కాదు, మరి మనం దర్గాలకు, దర్గాల వైపు తిరుగుతున్నాము, సమాధుల వైపు తిరుగుతున్నాము, బాబాలని, పీర్లని, ఔలియాలని… మన ప్రవక్త కంటే పెద్ద వలీ ఎవరండీ?
కాకపోతే ఈ కాబతుల్లా తవాఫ్ తప్ప, కాబతుల్లా ప్రదక్షిణం తప్ప ప్రపంచంలో, ఈ భూమండలంలో దేనిని ప్రదక్షిణం చేసినా అది అధర్మం అవుతుంది. ఈ విషయం గురించి ఎన్నో వందలాది హదీసులు అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించారు.
అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరినీ షిర్క్ నుండి, బిద్ఆ నుండి, ఖురాఫాతు నుండి కాపాడుగాక. ఇస్లాం పట్ల సరైన అవగాహనను అల్లాహ్ మనకు ప్రసాదించుగాక. ఆమీన్.
వ ఆఖిరు ద’అవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
అల్లాహ్ యేతరులపై ప్రమాణం చేయడం ధర్మ సమ్మతమేనా? https://youtu.be/FpPJtYzHKHQ [12 నిముషాలు] వక్త: హబీబుర్ రహ్మాన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఈ ఉపన్యాసంలో, ఇస్లాంలో ప్రమాణం (ఒట్టు) చేయడానికి సంబంధించిన నియమాలను ఖురాన్ మరియు హదీసుల వెలుగులో వివరించబడింది. అల్లాహ్ యేతరులపై, అంటే ప్రవక్తలు, తల్లిదండ్రులు, పిల్లలు, కాబా లేదా ఇతర సృష్టితాలపై ప్రమాణం చేయడం ఇస్లాంలో ఘోరమైన పాపం మరియు షిర్క్ (బహుదైవారాధన) అని స్పష్టం చేయబడింది. అవసరమైతే, కేవలం అల్లాహ్ పేరు మీద మాత్రమే నిజాయితీతో ప్రమాణం చేయాలని, లేకపోతే మౌనంగా ఉండాలని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధించినట్లు హదీసుల ద్వారా తెలియజేయబడింది. అబద్ధపు ప్రమాణాలు చేయడం, ముఖ్యంగా అల్లాహ్ పేరు మీద చేయడం కూడా మహా పాపమని హెచ్చరించబడింది. అంతిమంగా, ఈ షిర్క్ అనే పాపం నుండి దూరంగా ఉండాలని మరియు అల్లాహ్ బోధనలను మాత్రమే అనుసరించాలని ఉద్బోధించబడింది.
అల్ హందులిల్లాహ్, వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్, అమ్మా బాద్
అభిమాన సోదరులారా! “ధర్మ అవగాహనం” అనే ఈ ఎపిసోడ్ లో మీకందరికీ నా ఇస్లామీయ అభివాదం,
أَلسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ ٱللَّهِ وَبَرَكَاتُهُ (అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహ్) మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక!
ప్రియ వీక్షకులారా! ఈరోజు మనం దైవేతరులపై ప్రమాణం చేయడం ధర్మసమ్మతమా, కాదా? అనే విషయం గురించి తెలుసుకుందాం.
కొన్ని సందర్భాలలో మనకు ప్రమాణం చేసే అవసరం వస్తుంది. మనము చెప్పే మాట సత్యమని, నిజమని చెప్పటానికి, మనం చెప్పే మాటను బలపరచటానికి, లేదా అవతలి వ్యక్తి మా మాటను నమ్మటం లేదని వారిని నమ్మించటానికి, లేదా ఏదో ఒక సందర్భంలో గొడవపడితే, “నేను అలా చెప్పలేదు, ఇలా చెప్పాను, అలా చేయలేదు, ఇలా చేశాను” అని రుజువు చేయటానికి, లేదా ఏదో ఒక వాగ్దానం నెరవేర్చటానికి, బలపరచటానికి, “అల్లాహ్ సాక్షిగా నేను ఈ పని చేస్తాను” అని ఇలా కొన్ని కారణాల వల్ల మనిషి ప్రమాణం చేస్తాడు.
దైవేతరులపై ప్రమాణం చేయడం షిర్క్
మనం సమాజంలో చూస్తాము, కొంతమంది సృష్టిరాశుల మీద ప్రమాణం చేస్తారు. అది ప్రవక్తలు కావచ్చు, ప్రవక్త మీద ప్రమాణం, కాబతుల్లా మీద ప్రమాణం, మస్జిద్ సాక్షిగా మస్జిద్ మీద ప్రమాణం, దైవదూతల మీద ప్రమాణం, తాత ముత్తాతల మీద ప్రమాణం, ఆత్మల మీద ప్రమాణం, తల మీద ప్రమాణం, “నా తలపైన పెట్టి నేను ప్రమాణం చేస్తున్నాను,” “నా బిడ్డ తలపైన చెయ్యి పెట్టి ప్రమాణం చేస్తున్నాను,” “అమ్మ తలపైన పెట్టి ప్రమాణం చేస్తున్నాను,” ఫలానా సమాధి మీద ప్రమాణం చేస్తున్నాను, వారి నిజాయితీ మీద ప్రమాణం చేస్తున్నాను, ఇలా అనేక విధాలుగా సృష్టి రాశులపై, దైవేతరులపై, అల్లాహ్ పైన కాకుండా, అల్లాహ్ మీద కాకుండా అమ్మ, నాన్న, భార్య, పిల్లలు, గురువులు, సమాధులు, కాబా, మస్జిద్ ఏదైనా సరే దైవేతరుల మీద ప్రమాణం చేయటం ఇది ఇస్లాం పరంగా అధర్మం. ఇది ఘోరమైన పాపం, ఇది షిర్క్ అని మనకు తెలుస్తుంది ఖురాన్ మరియు హదీసులు పరిశీలిస్తే.
ప్రమాణం చాలా ముఖ్యమైన విషయం. ఇది ఎప్పుడైతే అప్పుడు, ఎవరి మీద అంటే వారి మీద చేయకూడదు, తప్పు, చాలా తప్పు.
అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు:
إِنَّ اللَّهَ تَعَالَى يَنْهَاكُمْ أَنْ تَحْلِفُوا بِآبَائِكُمْ فَمَنْ كَانَ حَالِفًا فَلْيَحْلِفْ بِاللَّهِ أَوْ لِيَصْمُتْ (ఇన్నల్లాహ త’ఆలా యన్ హాకుం అన్ తహ్లిఫూ బి ఆబాయికుం ఫమన్ కాన హాలిఫన్ ఫల్ యహ్లిఫ్ బిల్లాహి అవ్ లియస్ముత్) నిశ్చయంగా అల్లాహ్, మీరు మీ తండ్రి తాతల మీద ప్రమాణం చేయడాన్ని నిషేధించాడు. కనుక ఎవరైనా ప్రమాణం చేయదలిస్తే అల్లాహ్ మీదనే చేయాలి, లేకపోతే మౌనంగా ఉండాలి. (ముత్తఫకున్ అలై – బుఖారీ మరియు ముస్లిం)
ఈ హదీస్ బుఖారీ మరియు ముస్లిం గ్రంథములో ఉంది. అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు, “మీరు తాత ముత్తాతల మీద ప్రమాణం చేయటాన్ని అల్లాహ్ వారించాడు.” ఇన్నల్లాహ త’ఆలా యన్ హాకుం – అల్లాహ్ ఖండించాడు, అల్లాహ్ నిషేధించాడు, అల్లాహ్ వారించాడు మీరు మీ తాత ముత్తాతల మీద ప్రమాణం చేయటాన్ని, అంటే చేయవద్దండి అని అర్థం.
ఫమన్ కాన హాలిఫన్ – ఒకవేళ ప్రమాణం చేయదలచుకుంటే ఆ అవసరం వచ్చింది. ఏదో ఒక తగాదాలో, గొడవలో, ఏదో ఒక సందర్భంలో, విషయంలో తప్పనిసరిగా ప్రమాణం చేసే అవసరం వచ్చింది, ప్రమాణం చేయదలచుకుంటున్నారు, అటువంటి సమయంలో ఫల్ యహ్లిఫ్ బిల్లాహ్ – అల్లాహ్ మీద మాత్రమే ప్రమాణం చేయండి, అవ్ లియస్ముత్ – లేకపోతే ఊరుకోండి అని అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. అంటే, ప్రమాణం చేసే అవసరం వస్తే అల్లాహ్ మీదనే ప్రమాణం చేయాలి, లేకపోతే మౌనంగా ఉండాలి, ఊరుకుండాలి అని అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఆదేశం, యొక్క ప్రవచనం ఇది.
అలాగే ముస్లిం గ్రంథంలో ఇలా ఉంది, అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు:
لَا تَحْلِفُوا بِالطَّوَاغِي، وَلَا بِآبَائِكُمْ (లా తహ్లిఫూ బిత్తవాగీ వలా బి ఆబాయికుం) మీరు తాగూత్ (దైవేతర శక్తులు) మీద ప్రమాణం చేయకండి, మీ తండ్రి తాతల మీద కూడా ప్రమాణం చేయకండి.
మీరు మీ తాత ముత్తాతల మీద, మీరు మీ, మీరు విగ్రహాల మీద, దైవేతరుల మీద ప్రమాణం చేయకండి. “తవాగీ” ఇది బహువచనం తాగూత్ కి. తాగూత్ అంటే అల్లాహను తప్ప ఎవరిని ఆరాధిస్తున్నామో అది తాగూత్ అవుతుంది. అల్లాహ్ కాక ఎవరిని ఆరాధన దైవాలుగా భావించుకున్నారు, అది తాగూత్ కిందికి వస్తుంది. సమాధి పూజ చేస్తే సమాధి తాగూత్, ఒక చెట్టుకి పూజిస్తే ఆ చెట్టు తాగూత్. చనిపోయిన ప్రవక్తలను, ఔలియాలను, పుణ్య పురుషులను పూజిస్తే అది తాగూత్. అల్లాహ్ ను కాక ఎవరిని పూజిస్తే అది తాగూత్ అవుతుంది. అంటే, లా తహ్లిఫూ బిత్తవాగీకి అర్థం ఏమిటి? అల్లాహ్ తప్ప ఏ వస్తువు పైనా, ఏ వ్యక్తి పైనా, ఏ ఇతరుల మీద కూడా ప్రమాణం చేయకండి. వలా బి ఆబాయికుం – మీ తాత ముత్తాతల మీద కూడా ప్రమాణం చేయకండి అని అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు.
అభిమాన సోదరులారా, అంతేకాదు. అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు:
مَنْ حَلَفَ بِالْأَمَانَةِ فَلَيْسَ مِنَّا (మన్ హలఫ బిల్ అమానతి ఫలయ్స మిన్నా) ఎవరైతే అమానత్ (విశ్వసనీయత/నిజాయితీ) మీద ప్రమాణం చేస్తాడో, అతను మా పద్ధతిని అనుసరించిన వాడు కాదు.
ఎవరైతే నిజాయితీ మీద ప్రమాణం చేస్తాడో, వాడు ముస్లిం పద్ధతిని అనుసరించట్లేదు అని అర్థం. ఫలయ్స మిన్నా – మావాడు కాదు, మాలోని వాడు కాదు.
అభిమాన సోదరులారా, అంతే, ఇది ఎంత చిన్న విషయం కాదు. మనం చూస్తూ ఉంటాము మాటిమాటికీ, చీటికిమాటికి ప్రమాణం చేస్తూనే ఉంటాం. చిన్న చిన్న విషయాలకి ప్రమాణం చేసేస్తాం. అది కూడా దైవేతరుల పైన మీద – అమ్మ మీద ఒట్టు, నా బిడ్డ మీద ఒట్టు, నా తల మీద ఒట్టు, తలపైన చెయ్యి పెట్టుకొని, పిల్లలపైన చెయ్యి పెట్టుకొని. ఇది మహా పాపం. అధర్మం, అన్యాయం. అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఖండించారు.
చివరికి నిజాయితీ మీద కూడా ప్రమాణం చేయకూడదు. ఎందుకంటే అల్లాహ్ పేరు మరియు ఆయన గుణగణాల తప్ప, అల్లాహ్ మరియు అల్లాహ్ యొక్క గుణగణాల తప్ప ఇతర ఏ విషయం మీద కూడా ప్రమాణం చేయకూడదు. నిజాయితీ కూడా అల్లాహ్ యొక్క ఆదేశాలలో ఒక ఆదేశం అది. “నా నిజాయితీ మీద, నీ నిజాయితీ మీద, వారి నిజాయితీ మీద ఒట్టు, ప్రమాణం చేసి చెప్తున్నాను” అంటే నిజాయితీ ఏమిటి? అల్లాహ్ యొక్క ఆదేశాలలో ఒక ఆదేశం. మరి ఆ ఆదేశం మీద ఒట్టు, ప్రమాణం చేస్తే, అది అల్లాహ్ యొక్క గుణగణాలకి పోల్చినట్లు అవుతుంది.
అభిమాన సోదరులారా, ప్రమాణం అనేది, ఒట్టు అనేది దీనికి అరబీలో, ఉర్దూలో “ఖసమ్” అంటారు. ఇది కేవలం అల్లాహ్ మీదనే. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూరత్ తగాబున్, ఆయత్ 7లో ఇలా సెలవిచ్చాడు:
قُلْ بَلَىٰ وَرَبِّي لَتُبْعَثُنَّ (ఖుల్ బలా వ రబ్బీ లతుబ్’అసున్న) (ఓ ప్రవక్తా!) వారికి ఇలా చెప్పు: “నా ప్రభువు తోడు! మీరు తప్పకుండా మళ్ళి లేపబడతారు” (64:7)
అంటే చనిపోయిన జీవితం, మరణానంతర జీవితం, మీరు చనిపోతారు, చనిపోయిన తర్వాత మళ్ళీ నేను మీకు లేపుతాను, మీరు లేపబడతారు. ఆ విషయం చెప్పటానికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను ఉద్దేశించి ఇలా అన్నారు, ఖుల్ – ఓ ప్రవక్తా, ఇలా అను. బలా వ రబ్బీ – నా ప్రభువు సాక్షిగా. ఈ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనకు ఏం నేర్పించాడు? ప్రమాణం చేయగలిగితే, ఆ అవసరం పడితే, చేయాలనుకుంటే అల్లాహ్ మీదనే ప్రమాణం చేయాలి. ఖుల్ బలా వ రబ్బీ – ఓ ప్రవక్తా, వారితో ఇలా అను, “నా ప్రభువు సాక్షిగా లతుబ్’అసున్న – మీరు తప్పకుండా మళ్ళీ లేపబడతారు.” అంటే కొందరికి విశ్వాసం ఉండదు, మరణానంతర జీవితంపై. అది వేరే ముఖ్యమైన సబ్జెక్ట్ అది. మీరు చనిపోయిన తర్వాత లేపబడతారు. సుమ్మ లతునబ్బ’ఉన్న బిమా అమిల్తుం – మీరు ఏం చేశారో మీ కర్మలు, మంచి చెడు మొత్తం మీ ముందర ఉంచడం జరుగుతుంది. అల్లాహ్ చూపిస్తాడు, ఎప్పుడు, ఎక్కడ, ఏ విధంగా పాపం చేశాడా, పుణ్యం చేశాడా, తక్కువ, ఎక్కువ, న్యాయం, అన్యాయం మొత్తం మన జీవిత చరిత్ర అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనకు చూపిస్తాడు మరియు మన ఆ కర్మల పరంగానే మనకు తీర్పు జరుగుతుంది. ఆ విషయం గురించి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ వాక్యంలో తెలియజేశాడు. అంటే అల్లాహ్ మీద మాత్రమే ప్రమాణం చేయాలి. దైవేతరుల మీద, అల్లాహ్ యేతరుల మీద ప్రమాణం చేయకూడదు. చేస్తే ఏమవుతుంది? షిర్క్ అవుతుంది.
అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు:
مَنْ حَلَفَ بِغَيْرِ اللَّهِ فَقَدْ أَشْرَكَ (మన్ హలఫ బి గైరిల్లాహి ఫఖద్ అష్రక) ఎవరైతే అల్లాహ్ యేతరులపై ప్రమాణం చేశాడో, అతను షిర్క్ చేశాడు.
అల్లాహు అక్బర్! ప్రమాణం అనేది అంత పెద్దది. ఒక ముఖ్యమైన విషయంలో ప్రమాణం చేయాలనుకుంటే అల్లాహ్ మీద ప్రమాణం చేయాలి. అది కూడా ప్రమాణం నిజం ఉండాలి, సత్యం ఉండాలి. అబద్ధమైన ప్రమాణం అల్లాహ్ పైన కూడా చేయకూడదు. ఇతరులకి మోసం చేయటానికి కొందరు ఒక వస్తువు అమ్మటానికి అబద్ధమైన ప్రమాణం అల్లాహ్ పైన చేస్తారు. ఇది కూడా మహా పాపం. అబద్ధమైన ప్రమాణం అల్లాహ్ మీద కూడా చేయకూడదు. నీతి, నిజాయితీ, న్యాయం, సత్యం, ధర్మం అనే విషయంలో ప్రమాణం చేసే అవసరం వస్తే అల్లాహ్ మీద మాత్రమే ప్రమాణం చేయాలి.
అభిమాన సోదరులారా, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరినీ ప్రతి చిన్న, పెద్ద షిర్క్, కుఫ్ర్, బిద్అత్ నుండి కాపాడుగాక, రక్షించుగాక! అభిమాన సోదరులారా, మరిన్ని విషయాలు ఇన్ షా అల్లాహ్ వచ్చే ఎపిసోడ్ లో తెలుసుకుందాం. అప్పుడు వరకు సెలవు.
وَآخِرُ دَعْوَانَا أَنِ الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ (వ ఆఖిరు ద’వానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్) మా చివరి ప్రార్థన, సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కే సర్వస్తోత్రములు.
وَالسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ (వస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహ్) మరియు మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక!
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఈ ప్రసంగంలో, తావీజు (తాయత్తులు) మరియు ఇస్లాంలో వాటి స్థానం గురించి వివరించబడింది. తావీజులు రెండు రకాలుగా విభజించబడ్డాయి: ఖుర్ఆన్ వచనాలు కలిగినవి మరియు ఇతర వస్తువులు (గవ్వలు, దారాలు మొదలైనవి) కలిగినవి. ఖుర్ఆన్ వచనాలు ఉన్న తాయత్తుల విషయంలో కూడా పండితుల మధ్య అభిప్రాయ భేదం ఉందని, అయితే మెజారిటీ పండితులు షిర్క్‌కు దారితీస్తుందనే భయంతో వాటిని కూడా నిషేధించారని ప్రసంగీకులు పేర్కొన్నారు. షిర్క్‌తో కూడిన రెండవ రకం తాయత్తులు పూర్తిగా హరామ్ అని స్పష్టం చేయబడింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధించిన విధంగా, తాయత్తులకు బదులుగా ఖుర్ఆన్ మరియు దుఆలను పఠించడం ద్వారా రక్షణ మరియు నివారణను వెతకాలని ముగింపులో ఉపదేశించబడింది.
إِنَّ الْحَمْدَ لِلَّهِ وَحْدَهُ، وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى مَنْ لَا نَبِيَّ بَعْدَهُ، أَمَّا بَعْدُ (ఇన్నల్ హమ్దలిల్లాహి వహ్ద, వస్సలాతు వస్సలాము అలా మన్ లా నబియ్య బా’ద, అమ్మా బా’ద్) నిశ్చయంగా సర్వ స్తోత్రాలు ఏకైక అల్లాహ్ కే శోభిస్తాయి. మరియు ఎవరి తర్వాత ప్రవక్త లేడో, ఆయనపై శాంతి మరియు శుభాలు కలుగుగాక. ఆ తర్వాత…
అభిమాన సోదరులారా! ధర్మ అవగాహనం అనే ఈ కార్యక్రమములోకి మీ అందరికీ ఇస్లామీయ అభివాదం.
اَلسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ (అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు) మీపై అల్లాహ్ యొక్క శాంతి, కరుణ మరియు శుభాలు వర్షించుగాక.
ప్రియ వీక్షకులారా! ఈ రోజు మనం తావీజు, తాయత్తుల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. మనం మన సమాజంలో చూస్తూ ఉంటాము, కొందరి మెడలో, చేతులో, నడుంకి తావీజులు, తాయత్తులు కట్టుకుంటారు. చిన్న పిల్లలకి దిష్టి తగలకుండా ఉండటానికి, పెద్దవారైనా సరే, ఎవరైనా సరే రోగానికి గురైనప్పుడు ఆ రోగం పోవాలని, నష్టానికి గురైనప్పుడు నష్టం రాకూడదని, కొందరు భయం కోసము, కొందరు ముందు జాగ్రత్త ఎప్పుడూ నష్టానికి, బాధకి లోను కాకూడదని ఏదేదో కారణాలతో, ఏదేదో ఉద్దేశాలతో తావీజులు కట్టుకుంటారు. ఇది కూడా సమాజంలో ఒక వర్గం దీనిని వ్యాపారంగా కూడా చేసుకున్నది. కాకపోతే, ఇస్లాం ధర్మంలో, షరీఅత్‌లో తావీజు యొక్క వాస్తవికత ఏమిటి? దీనికి అరబీలో ‘తమీమా‘ అంటారు, ‘త’అవీద్’. మామూలుగా తెలుగులో తావీజు, తాయత్తు అని చెప్తారు.
తావీజులలో రకాలు
ఈ తాయత్తులు, ఈ తావీజులు రెండు రకాలు. షేఖ్ సాలెహ్ బిన్ ఫౌజాన్ అల్ ఫౌజాన్ (రహ్మతుల్లాహి అలై) ఒక పుస్తకం ఉంది ‘అఖీదతుత్ తౌహీద్‘, ఆ పుస్తకం ఆధారంగా ఈ తావీజు గురించి ఈ రెండు రకాలు నేను మాట్లాడుతున్నాను. తావీజు రెండు రకాలు ఈ తాయత్తులు.
మొదటి రకం ఏమిటి? ఖుర్ఆన్ ఆధారంగా కట్టే తావీజులు. ఆ తావీజులో ఎటువంటి షిర్క్ లేదు, బిద్అత్ లేదు, కొత్త విషయాలు లేవు. ఖుర్ఆన్ వాక్యాలు మాత్రమే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నేర్పిన వాక్యాలు మాత్రమే ఆ తావీజులో ఉన్నాయి. అంటే ఖుర్ఆన్ సూక్తులను లేదా అల్లాహ్ నామాలను, గుణాలను లిఖించి వ్యాధి నివారణ పొందే ఉద్దేశంతో తావీజు వేయటం. ఈ విషయం బాగా అర్థం చేసుకోండి. అల్లాహ్ సూక్తులను, అల్లాహ్ నామాలను, అల్లాహ్ గుణాలను లిఖించి ఆ వ్యాధి నివారణ పొందే ఉద్దేశంతో వేలాడదీయడం, వేయటం.
ఇటువంటి తావీజు ధర్మ సమ్మతమని కొంతమంది పండితుల అభిప్రాయం. అందరి అభిప్రాయం కాదు, కొంతమంది పండితుల అభిప్రాయం మాత్రమే. ఆధారం ఏమిటి? అటువంటి తావీజులో షిర్క్ లేదు, బిదాత్ లేదు, కొత్త విషయం ఏదీ లేదు. కేవలం అల్లాహ్ వాక్యం ఉంది, అల్లాహ్ నామం మాత్రమే ఉంది, అల్లాహ్ గుణగణాలు మాత్రమే ఉన్నాయి. ఉద్దేశం కూడా ఏమిటి? వ్యాధి నివారణ పొందే ఉద్దేశం. షిర్క్ లేదు కాబట్టి ఇది ధర్మ సమ్మతమే అని కొంతమంది పండితుల అభిప్రాయం.
కాకపోతే, అత్యధిక శాతం, ఎక్కువ మంది ధర్మ పండితులు ఇటువంటి తావీజు కూడా ధర్మ సమ్మతం కాదు అని అంటారు. ఆ లిఖించటంలో, ఆ తావీజులో, ఆ కాగితంలో ఖుర్ఆన్ ఆయత్ మాత్రమే ఉన్నప్పటికిని అది ధర్మ సమ్మతం కాదు అని అంటారు అత్యధిక మంది ధర్మ పండితులు. ఉదాహరణకు, అబ్దుల్లా బిన్ మస్ఊద్ (రదియల్లాహు త’ఆలా అన్హు) పెద్ద సహాబీ, మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క పినతండ్రి కుమారుడు అబ్దుల్లా బిన్ అబ్బాస్ (రదియల్లాహు త’ఆలా అన్హు), హుజైఫా (రదియల్లాహు త’ఆలా అన్హు), ఉఖ్బా బిన్ ఆమిర్ (రదియల్లాహు త’ఆలా అన్హు) ఇలా, అబ్దుల్లా బిన్ మస్ఊద్ (రదియల్లాహు అన్హు) యొక్క శిష్యులు, ఒక ఉల్లేఖనం ప్రకారం ఇమామ్ అహ్మద్ బిన్ హంబల్ (రహ్మతుల్లాహి అలై), అలాగే వారి శిష్యులు, తర్వాతి తరాల వారు కూడా దీనినే కట్టుబడ్డారు, అంటే ఇది కూడా ఇటువంటి తావీజు కూడా ధర్మ సమ్మతం కాదు. అత్యధిక మంది పండితుల అభిప్రాయం ఇదే. ఆధారం ఏమిటి?
అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు,
إِنَّ الرُّقَى وَالتَّمَائِمَ وَالتِّوَلَةَ شِرْكٌ (ఇన్నర్రుఖా వత్తమాఇమ్ వత్తివలా షిర్కున్) “నిశ్చయంగా మంత్రాలు (షిర్క్ తో కూడినవి), తాయత్తులు మరియు తివలా (ఒక రకమైన క్షుద్ర విద్య) షిర్క్.” (ఇబ్ను మాజా)
అంటే ఈ విధంగా మంత్రించటం, తాయత్తులు వేయటం, తివలా, ఇది ఒక రకమైన చేతబడి, క్షుద్ర విద్య, షిర్కుతో కూడుకున్నది అని అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు.
అభిమాన సోదరులారా! కేవలం అల్లాహ్ నామాలు మాత్రమే, అల్లాహ్ గుణాలు మాత్రమే ఉన్నప్పటికీ అది ధర్మ సమ్మతం కాదు అని ఎందుకు అంటున్నారంటే మూడు కారణాల వల్ల అటువంటి తావీజు కూడా ధర్మ సమ్మతం కాదు అని అంటున్నారు. అది మూడు కారణాలు. ఒకటి ఏమిటి? సర్వసాధారణంగా తాయత్తులు కట్టడం పట్ల వారింపు ఉంది. సర్వసాధారణంగా తాయత్తులు కట్టరాదు, తావీజు వేయరాదు అని వాక్యాలు ఉన్నాయి, ప్రవచనాలు ఉన్నాయి. కావున ఈ సర్వసాధారణకి ప్రత్యేకంగా చేసే ఆధారం ఏదీ లేదు. ఒక విషయం సర్వసాధారణంగా ఉంది, దానికి ప్రత్యేకంగా ఏమైనా రుజువు కావాలి, ఆధారం కావాలి. ఆధారం లేకపోతే అది ధర్మ సమ్మతం అవ్వదు. అంటే మొదటి రకం, మొదటి విషయం ఏమిటి? సర్వసాధారణంగా తాయత్తులు కట్టడం వల్ల వారింపు ఉంది. ఈ సర్వసాధారణమును ప్రత్యేకంగా చేసే ఆధారం ఏదీ లేదు కనుక.
అలాగే రెండవ కారణం ఏమిటి? దీనిని ధర్మ సమ్మతం చేస్తే షిర్క్ ద్వారాలు తెరుస్తాయి. షిర్క్ ద్వారాలను మూసివేయటంలో ఈ వారింపు ఉపయుక్తంగా ఉన్నది కాగా తావీజులు వ్రేలాడదీయవచ్చన్న ఫతవా అనే ఇస్తే, షిర్కుతో కూడుకున్న తావీజును ప్రోత్సహించేందుకు ఆస్కారం ఉంది. అది ఏ విధంగానూ సమ్మతం కాదు. ఇది రెండో కారణం.
మూడోది ఏమిటి? ఖుర్ఆన్ ఆయతులను తావీజుగా చేసి మెడలో, చేతులు వేసుకుంటే తప్పకుండా వాటి పట్ల అమర్యాదకరంగా ప్రవర్తిస్తారు. తప్పనిసరిగా అవుతుంది అది. ఎందుకంటే తావీజు వేసుకొని బాత్రూంకి పోవాలి, కాలకృత్యాలు పూర్తి చేసుకోవాలి, మనిషి ఒకసారి జునుబీ స్థితిలో ఉంటాడు, అశుద్ధ స్థితిలో ఉంటాడు, వివాహం అయిన వారు సంభోగించుకుంటారు భార్యాభర్తలు. మరి మెడలో ఖుర్ఆన్ వాక్యాలు, అల్లాహ్ నామము, చేతిలో అల్లాహ్ వాక్యాలు, ఖుర్ఆన్ వాక్యాలు, అల్లాహ్ నామాలు, అల్లాహ్ పేరు, అల్లాహ్ గుణ విశేషాలు ఇవి మన శరీరంలో పెట్టుకొని మనము బాత్రూం కి పోవటం ఏమిటి? కాలకృత్యాలు తీసుకోవటం ఏమిటి? జునుబీ స్థితిలో ఉండటం ఏమిటి? ఈ విధంగా చాలా కారణాలు ఉన్నాయి, అమర్యాద అవుతుంది ఆ ఈ ఖుర్ఆన్ వాక్యాల విషయంలో. కావున ఈ మూడు కారణాల వల్ల ఆ తావీజులో ఖుర్ఆన్ వాక్యాలు మాత్రమే ఉన్నప్పటికిని అది ధర్మ సమ్మతం కాదు అని పండితుల అత్యధిక మంది పండితుల అభిప్రాయం ఇది.
ముగింపు మరియు సరైన పద్ధతి
అభిమాన సోదరులారా! ఇప్పుడు వరకు నేను చెప్పిన మాటల్లో సారాంశం రెండు రెండు విషయాలు. ఒకటి, ధర్మ సమ్మతమైన తావీజు, దాంట్లో ఎటువంటి షిర్క్ పదాలు ఉండకూడదు. కేవలం అల్లాహ్ వాక్యాలు, అల్లాహ్ నామం, అల్లాహ్ గుణాలు మాత్రమే ఉండాలి. అటువంటి తావీజు ధర్మ సమ్మతమని కొంతమంది మాత్రమే ధర్మ సమ్మతం అంటున్నారు. కాకపోతే, రెండో విషయం ఏమిటి? అత్యధిక మంది ధర్మ పండితులు అటువంటి తావీజు కూడా ధర్మ సమ్మతం కాదు. ఎందుకంటే ఈ మూడు కారణాలు. మొదటి కారణం ఏమిటి? సాధారణంగా అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రతీ తావీజు షిర్క్ అన్నారు. దానికి ప్రత్యేకం చేయటానికి ఆధారం లేదు. ఇది మొదటి కారణం. రెండో కారణం ఏమిటి? ఇది షిర్క్‌కి దారి తీస్తుంది. రెండో కారణం. మూడో కారణం ఏమిటి? అల్లాహ్ వాక్యాల పట్ల, అల్లాహ్ నామం పట్ల, అల్లాహ్ గుణ విశేషాల పట్ల అమర్యాద కలుగుతుంది, అగౌరవం కలుగుతుంది. ఈ కారణాల వల్ల రుజువు లేదు కాబట్టి అటువంటి తావీజు కూడా ధర్మ సమ్మతం కాదు అని అత్యధిక మంది పండితుల అభిప్రాయం.
కావున, మనము తావీజు కట్టుకోకుండా, తావీజు వ్రేలాడదీసుకోకుండా అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క విధానాన్ని అనుసరించి మనము మంత్రించి ఊదుకోవాలి, అది ఆధారం ఉంది కదా! ఆరోగ్యం బాగాలేదు, ప్రవక్త గారు కొన్ని దుఆలు, కొన్ని వాక్యాలు నేర్పించారు. ఖుర్ఆన్ వాక్యాలు ఉన్నాయి, అల్లాహ్ నామాలు ఉన్నాయి, అల్లాహ్ గుణాలు ఉన్నాయి. అవి మంత్రించి, పఠించి ఊదుకోవచ్చు. రోగిపై పఠించి ఊదవచ్చు. నీళ్ళపై మంత్రించి ఆ నీళ్ళు తాగవచ్చు, త్రాపించవచ్చు. ఈ విధానం ఉంది కదా. లేని విధానాన్ని, దాంట్లో షిర్క్ అనే అనుమానం ఉంది, అటువంటి విధానాన్ని ఎన్నుకోవడం కరెక్ట్ కాదు.
ఇక తావీజు విషయంలో రెండో రకం, రెండో కోవకు చెందిన తావీజు, ఇప్పుడు అది ఒక వ్యాపారంగా మారిపోయింది. అది ఎటువంటి పరిస్థితుల్లో ధర్మ సమ్మతం కాదు, అధర్మం, షిర్క్ మరియు హరామ్. అంటే, ఖుర్ఆన్ సూక్తులు ఆధారం కాని, ఆధారం లేని తావీజులు. అంటే గవ్వలు, పూసలు, దారాలు, వెంట్రుకలు, చిప్పలు, భూత పిశాచాల పేర్లు ఇత్యాదివి. ఇలాంటివి చాలా ఉన్నాయి. ఈ రకమైన తావీజులు ముమ్మాటికి నిషిద్ధం, హరామ్, ధర్మ సమ్మతం కాదు, షిర్క్. అవి ఖచ్చితంగా షిర్క్ కిందికి వస్తాయి. ఎందుకంటే ఈ రకమైన వస్తువులలో అల్లాహ్ నామాల, వాక్యాల బదులు వాటిని ఇతరత్రా వాటితో ముడిపెట్టడం జరుగుతుంది, దైవేతరులను ఆశ్రయించడం జరుగుతుంది. కాగా హదీసులో ఇలా ఉంది, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు:
مَنْ تَعَلَّقَ شَيْئًا وُكِّلَ إِلَيْهِ (మన్ త’అల్లఖ షై’అన్ వుకిల ఇలైహి) “ఎవరైతే ఏదైనా వస్తువుతో (రక్షణ కోసం) సంబంధం పెట్టుకుంటాడో, అతను దానికే అప్పగించబడతాడు.” (తిర్మిజి)
ఎవరైనా ఏదైనా వస్తువుతో సంబంధం ఏర్పరుచుకుంటే అతను దాని పరమే చేయబడతాడు, అతని నమ్మకం దాని పైనే ఉంటుంది, అల్లాహ్ పైన నమ్మకం ఉండదు. అల్లాహ్ అతనికి పట్టించుకోడు. కావున ఇది షిర్క్ అవుతుంది. ప్రస్తుతం సమాజంలో చాలామంది అది ఒక వ్యాపారంగా చేసుకున్నారు. మీరు దాని గురించి అనుభవం చేసి చూడండి. కొన్ని తావీజులు ఓపెన్ చేసి చూస్తే, కొన్ని అక్షరాలు ఉంటాయి, అర్థం కాని అక్షరాలు ఉంటాయి. అరబీ భాష కావచ్చు, అరబీ భాష కాకపోవచ్చు, అర్థం కాని భాష ఉంటుంది, అర్థం కాని అక్షరాలు ఉంటాయి. కొన్ని తావీజులలో అడ్డంగా, దిడ్డంగా గీతలు ఉంటాయి. కొన్ని తావీజులలో లెక్కలు ఉంటాయి. ఇదన్నీ ఎవరు నేర్పించారు? ఇవన్నీ హరామ్, ఇవన్నీ షిర్క్ కిందికి వస్తుంది, అధర్మం.
కావున, మనం అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నేర్పించిన విధానాన్నే అనుసరించాలి. రోగానికి గురైనప్పుడు ప్రవక్త గారు మనకి ఏం నేర్పించారు? పిల్లలకి దిష్టి తగలకుండా ఉండాలంటే ప్రవక్త గారు నేర్పించారు. జ్వరం వస్తే ఏం చేయాలి? బాధకి గురైతే ఏం చేయాలి? నష్టానికి గురైతే ఏం చేయాలి? భయంలో ఏం చేయాలి? ప్రయాణంలో ఏం చేయాలి? అల్హమ్దులిల్లాహ్! అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మనకి ప్రతీ విధానం నేర్పించారు. ప్రతీ విషయంలో, ప్రతీ సమయంలో, ప్రతీ సబ్జెక్టులో మనకు నేర్పించారు. వివాహంలో, సంభోగం సమయంలో, దుస్తులు వేసుకునేటప్పుడు, ఇంట్లో ప్రవేశించేటప్పుడు, ఇంటి నుంచి బయటికి పోయేటప్పుడు, ఉదయం సాయంత్రం దుఆలు, అజాన్‌కి ముందు అజాన్ తర్వాత, మస్జిద్‌కి పోయేటప్పుడు బయటికి వచ్చేటప్పుడు, బాధ కలిగినప్పుడు, భయం ఉన్నప్పుడు, టెన్షన్‌లో ఉన్నప్పుడు, అప్పులో ఉన్నప్పుడు, అప్పులు తీర్చేటప్పుడు ప్రతీ సమస్యకి, ప్రతీ రోగానికి, ప్రతీ కష్టానికి అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మనకు ఒక పద్ధతి నేర్పించారు, ఒక విధానం నేర్పించారు.
మరి మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనకి ఏం నేర్పించినా,
وَمَا يَنطِقُ عَنِ الْهَوَىٰ إِنْ هُوَ إِلَّا وَحْيٌ يُوحَىٰ (వమా యంతిఖు అనిల్ హవా, ఇన్ హువ ఇల్లా వహ్యున్ యూహా) అతను తన మనోభిరామం ప్రకారం మాట్లాడటమూ లేదు. అది (అతను మాట్లాడేదంతా) అతని వద్దకు పంపబడే దైవవాణి (వహీ) తప్ప మరేమీ కాదు. (53:3-4)
అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మనకు అల్లాహ్ తరఫు నుంచే నేర్పుతారు. కావున, మనము ప్రతీ చిన్న పెద్ద షిర్క్ నుండి దూరంగా ఉండాలి. షిర్క్ చాలా ఘోరమైన నేరం, డేంజర్ విషయం అది. షిర్క్ చాలా ఘోరం. కావున, ఈ తావీజు కూడా షిర్క్ కిందికి వస్తుంది. కావున మనం ఈ షిర్క్ నుండి దూరంగా ఉండాలి, ఈ తావీజులు, తాయత్తులతో దూరంగా ఉండాలి. సమాజంలో ఈ బాబాలు, పీర్లు, వీళ్ళు దీనిని ఒక వ్యాపారంగా చేసుకున్నారు. ఇస్లాంలో ఎటువంటి దీనికి స్థానం లేదు. ఇది ధర్మ సమ్మతం కాదు. ఇది గుర్తుంచుకోండి. ఒకవేళ మనకి రోగం వచ్చినా, మన పిల్లలకి రోగాలు వచ్చినా, వారికి దిష్టి తగలకుండా ఉండాలన్నా ప్రవక్త గారు నేర్పించారు. కావున మీరు దుఆల పుస్తకం ఆధారంగా ఉన్న ప్రామాణికమైన హదీసుల పరంగా దుఆలు మనకు ఉన్నాయి, ఆ దుఆలు పఠించండి, ప్రవక్త గారి విధానాన్ని అనుసరించండి. ఇన్షా అల్లాహ్ ఇహపర లోకాలలో సాఫల్యం దక్కుతుంది ఇన్షా అల్లాహ్.
అభిమాన సోదరులారా! కావున ఇంతటితో నేను నా మాటలను ముగిస్తూ, ఇన్షా అల్లాహ్ మరిన్ని విషయాలు వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. అప్పటివరకు సెలవు.
وَآخِرُ دَعْوَانَا أَنِ الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ (వ ఆఖిరు ద’వానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్) మా చివరి ప్రార్థన ఏమిటంటే, సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కే సర్వ స్తోత్రాలు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net