ఖతీబ్: మాజిద్ బిన్ సూలైమాన్ అర్రస్సీ, జుబైల్, సౌదీ ఆరేబియ అనువాదం: అబ్దుల్లాహ్ జామిఈ ‘ఇస్లామీయ జుమా ప్రసంగాలు’ అనే పుస్తకం నుండి – రచన: మాజిద్ బిన్ సులైమాన్ అర్రస్సీ
ఖుత్బా అంశము: ప్రవక్త ముహమ్మద్(సల్లల్లాహు అలైహి వసల్లం)యొక్క హక్కు ఆయన సహాబాలను గౌరవించడం
అన్నిటి కంటే ఉత్తమమైన మాట అల్లాహ్ మాట, మరియు అందరి కంటే ఉత్తమమైన పద్ధతి ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి పద్ధతి. అన్నిటి కంటే నీచమైనది ఇస్లాంలో కొత్తగా సృష్టించబడినవి, మరియు ఇస్లాంలో కొత్తగా సృష్టించబడిన ప్రతీ కార్యము బిద్అత్ క్రిందికే వస్తుంది మరియు ప్రతీ బిద్అత్ మార్గభ్రష్టత్వము మరియు ప్రతీ మార్గభ్రష్టత్వము నరకంలోకి తీసుకువెళ్ళేదే.
ఓ ముస్లింలారా! అల్లాహ్ కు భయపడండి. మరియు ప్రతిక్షణం అల్లాహ్ యొక్క దైవభీతి మనసులో ఉంచండి. ఆయనకు విధేయత చూపండి. మరియు అవిధేయత నుండి జాగ్రత్త వహించండి.
మరియు మీరు ఈ విషయాన్ని గ్రహించండి. అహ్లే సున్నత్ వల్ జమాఅత్ యొక్క ప్రాథమిక హక్కులలో ఒకటి దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి సహచరులను గౌరవించడం. మరియు వారిని అనుసరించటం, వారికి విధేయత చూపటం, వారి హక్కులను తెలుసుకొని వాటిపై అమలు చేయడం, వారిని విశ్వసించడం, వారి కొరకు అల్లాహ్ ను క్షమాభిక్ష కోరడం, వారి యొక్క అంతర్గత విభేదాల గురించి మౌనం వహించటం, వారి శత్రువులతో శత్రుత్వం వహించటం, మరియు సహబాలలో ఎవరి గురించి అయినా తప్పటి ఆరోపణలు చరిత్రలో లిఖించబడినా, లేదా ఎవరైనా తప్పుడు రాతలు రాసినా, లేదా కవులు వారి గురించి తప్పుగా కవిత్వాలలో రాసిన వాటిపై అఇష్టత చూపాలి. ఎందుకంటే వారి స్థానాన్ని బట్టి వారిని గౌరవించాలి. వారి గురించి చెడు ప్రస్తావన చేయరాదు, వారి ఏ పనిలో తప్పులు వెతకరాదు, వారి గురించి మంచి ప్రస్తావన చేయాలి. వారి పుణ్య కార్యాల గురించి ప్రస్తావించాలి తప్ప వారి తప్పు ఒప్పుల విషయం గురించి మౌనం వహించాలి.
ఇస్లాం ధర్మ అత్యుత్తమ పండితులు ఇమామ్ ఇబ్నె తైమియా (రహిమహుల్లాహ్) గారు ఇలా తెలియజేస్తున్నారు: అహ్లే సున్నత్ వల్ జమాఅత్ యొక్క ప్రాథమిక సూత్రాలలో ఇది కూడా ఉంది. అది ఏమిటంటే వారి హృదయం మరియు నాలుక సహబాల పట్ల ఎంతో ఉత్తమంగా, పరిశుభ్రంగా ఉంటాయి. ఈ విషయం గురించి అల్లాహ్ ఇలా తెలియజేస్తున్నాడు:
వారి తరువాత వచ్చినవారు (వారికీ ఈ సొమ్ము వర్తిస్తుంది), వారిలా వేడుకుంటారు : “మా ప్రభూ! మమ్మల్ని క్షమించు. మాకన్నా ముందు విశ్వసించిన మా సోదరులను కూడా క్షమించు. విశ్వాసుల యెడల మా హృదయాలలో ఎలాంటి ద్వేషభావాన్ని కలిగించకు. మా ప్రభూ! నిశ్చయంగా నీవు మృదు స్వభావం కలిగినవాడవు, కనికరించేవాడవు.” (59:10)
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ (రదియల్లాహు అన్హు) మహాప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రాణస్నేహితులు. ఇస్లాం స్వీకరించక పూర్వం ఆయన పేరు అబ్దుల్ కాబ్. ఇస్లాం స్వీకరించాక మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆయనకు అబ్దుల్లాహ్ అని నామకరణం చేశారు. అబూ బకర్ అనేది ఆయన పేరు కాదు. అది ఆయన మారు పేరు. కాని ఆయన తన మారు పేరుతోనే ప్రసిద్ధిగాంచారు.
ఖురైష్ ఓ పెద్ద తెగ. అది మక్కా మరియు దాని చుట్టు ప్రక్కల ప్రాంతాల్లో శాఖోపశాఖలుగా వ్యాపించి ఉండేది. అందులోని ఓ శాఖ బనీ తమీమ్, హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) బనీ తమీమ్ కు చెందినవారు. ఆయన తండ్రిపేరు ఉస్మాన్, మారు పేరు అబూ ఖహాఫా.
ఆ రోజుల్లో తేదీలను నిర్ధారించే పద్ధతి ఏదీ ఉండేది కాదు. ఖురైషులు ఏదైనా విశిష్టమైన సంఘటన ద్వారా పుట్టిన మరియు మరణించిన తేదీలను లెక్కకట్టేవారు. సంవత్సరాలు కూడా ఇలాగే నిర్ధారించబడేవి. ప్రజలు ప్రముఖమైన సంఘటనల ద్వారా తేదీలను లెక్కించేవారు. ఈ విధంగా సంవత్సరాలు నిర్ధారించబడేవి. ఆ రోజుల్లో ఖురైషులు ‘ఫీల్‘ సంఘటన ద్వారా తేదీలను నిర్ధారించేవారు. అరబీ భాషలో ‘ఫీల్’ అంటే ఏనుగు అని అర్థం. ఓ నీగ్రో రాజు (అబ్రహా) ఏనుగులను తీసుకొని అల్లాహ్ గృహమయిన కాబాను పడగొట్టడానికి మక్కా నగరంపైకి దండెత్తి వచ్చాడు. కాని మక్కా చేరుకోగానే అతని సైన్యం మరియు ఏనుగులపై అల్లాహ్ ఆగ్రహం విరుచుకుపడింది. వారందరూ నాశనమయ్యారు. హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) ఈ సంఘటన జరిగిన రెండున్నర సంవత్సరాలకు జన్మించారు. హజ్రత్ అబూబకర్ (రదియల్లాహు అన్హు) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కన్నా వయస్సులో రెండు సంవత్సరాలు చిన్నవారు.
ఇస్లాం స్వీకరించక పూర్వం కూడా హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) ఓ గౌరవనీయులైన వ్యక్తిగా పరిగణింపబడేవారు. ఖురైష్ మరియు ఇతర అరబ్ తెగలు స్వతంత్రంగా ఉండేవి. వారిని ఎవరూ శాసించే వారు కాదు. కాని వారు తమ ప్రాంతపు అవసరాలకనుగుణంగా వివిధ పనులను వివిధ తెగలకు అప్పగించారు. ఖురైషీయులలో పది పెద్ద పెద్ద శాఖలుండేవి. ప్రతి శాఖకు ఓ పని అప్పగించబడేది. ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే వీరందరూ పరస్పరం సంప్రదించుకునేవారు. బనీ హాషిమ్ అంటే దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వంశస్థులు. వారు హజ్ సమయంలో యాత్రీకులకు నీరు త్రాసేవారు. బనూ ఉమయ్యా వారి దగ్గర ఖురేషీ ధ్వజం ఉండేది. ఆ వంశపు నాయకుడు యుద్ధ సమయంలో ధ్వజం ఎత్తుకొని సైన్యానికి ముందుండేవాడు. హజ్రత్ అబూబకర్ (రదియల్లాహు అన్హు) వంశం న్యాయ శాఖను పర్యవేక్షించేది. హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) వంశస్థులు సివిల్ మరియు క్రిమినల్ కేసులను విచారించి తీర్పిచ్చేవారు. ఏదైనా వ్యాజ్యంలో తీర్పివ్వడం కష్టమైతే ప్రజలను సమావేశపరచి సంప్రదించేవారు.
హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) గారి వృత్తి వ్యాపారం. ఆయన సిరియా మరియు యమన్ నుండి బట్టలుకొని తెచ్చి మక్కాలో అమ్మేవారు. వర్తకం నిమిత్తం మొదటిసారి ప్రయాణం చేసినప్పుడు ఆయన వయస్సు 18 సంవత్సరాలు. తరువాత వర్తకం నిమిత్తం ఆయన ఎన్నోసార్లు ప్రయాణం చేశారు. వర్తకం మూలంగా అరేబియాలోని పలు ప్రాంతాల ప్రజలు ఆయన్ని గుర్తించేవారు. మంచితనం, నిజాయితీ మూలంగా ఆయన్ని ప్రజలు గౌరవించేవారు.
ఆనాడు అరబ్బుల్లో అనేక దుర్గుణాలు ఉండేవి. పబ్లిక్ గా తాగి తందనాలాడేవారు. జూదం, మట్కా వారి హాబీలు. కొన్ని అరబ్బు తెగలైతే దారిన పోయేవారిని దోచుకున్నది గాక తమ ఈ చెడు చేష్టపై గర్వ పడేవి. హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) మొదట్నుంచీ ధర్మ పరాయణులు, దైవభీతి గలవారు. ఆయన కష్టపడి, చెమటోడ్చి తన జీవన భృతిని సంపాదించేవారు. బీదవారికి, అగత్యపరులకు సహాయపడేవారు. ఇస్లాం స్వీకరించక పూర్వం కూడా ఆయన ఎన్నడూ మద్యం సేవించలేదు. ఇస్లాం స్వీకరించాక ఆయన జీవితమే పూర్తిగా మారిపోయింది. పూర్వం ఆయన కవితలు చెప్పేవారు. ఆయన్ని మంచి కవుల్లో ఒకరిగా లెక్కించేవారు. ఇస్లాం స్వీకరించాక కవితలు చెప్పడం కూడా మానేశారు.
ఇస్లాం స్వీకరించాక
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు 40 సంవత్సరాల వయస్సులో దైవ దౌత్యం లభించింది. ఆ సమయంలో హజ్రత్ అబూబకర్ (రదియల్లాహు అన్హు) వయసు 38 సంవత్సరాలు. అప్పట్లో ఆయన వ్యాపారం బావుంది. వ్యాపార నిమిత్తం తరచూ ఆయన సిరియా, యమన్ దేశాలకు వెళ్ళేవారు. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారితో ఆయనకు చాలా కాలంగా పరిచయమైతే ఉంది గాని దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవక్తగా నియుక్తులవడానికి ఒక సంవత్సరం మునుపు నుండి వారిరువురి మధ్య సాన్నిహిత్యం మరింత పెరిగింది. హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వద్దకు రావడం మొదలెట్టారు. ఓసారి అబూబకర్ (రదియల్లాహు అన్హు) సిరియా నుండి తిరిగి రాగానే అబూతాలిబ్ గారి అనాథ భాతృజుడు తనను ప్రవక్తగా ప్రకటించుకున్నాడని ప్రజలన్నారు.
వెంటనే హజ్రత్ అబూబకర్(రదియల్లాహు అన్హు) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సమక్షంలో హాజరయ్యారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆయన్ని ఇస్లాం స్వీకరించమని కోరిన వెంటనే ఆయన ఇస్లాం స్వీకరించారు.
అలా ఇస్లాం స్వీకరించిన పురుషులలో హజ్రత్ అబూబకర్ (రదియల్లాహు అన్హు) ప్రథములు. స్త్రీలలో ఇస్లాం స్వీకరించిన మొదటి మహిళ హజ్రత్ ఖదీజా (రదియల్లాహు అన్హ), పురుషుల్లో హజ్రత్ అబూబకర్ (రదియల్లాహు అన్హు), పిల్లల్లో హజ్రత్ అలీ(రదియల్లాహు అన్హు)మరియు బానిసల్లో హజ్రత్ జైద్ బిన్ హారిస్ (రదియల్లాహు అన్హు). వీరు నలుగురూ ఒకే కాలంలో ఇస్లాం స్వీకరించారు. వీరిలో అందరికంటే ముందు హజ్రత్ ఖదీజా(రదియల్లాహు అన్హు) ఇస్లాం స్వీకరించారు. మిగిలిన ముగ్గురిలో ఎవరు ముందు ఇస్లాం స్వీకరించారో ఖచ్చితంగా చెప్పడం కష్టమే. చాలా కాలం వరకు హజ్రత్ అబూబకర్ (రదియల్లాహు అన్హు) తల్లిదండ్రులు ఇస్లాం స్వీకరించలేదు. ఆయన తండ్రి అబూఖహాఫ కొడుకు ఇస్లాం స్వీకరించిన 21 సంవత్సరాలకు అంటే మక్కా విజయ సందర్భంలో, 90 ఏళ్ళ వయస్సులో ఇస్లాం స్వీకరించారు.
అనేక మంది మక్కా వాసులు హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) గారి వెంటవచ్చి దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సమక్షంలో ఇస్లాం స్వీకరించారు. వారిలో హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు అన్హు), హజ్రత్ జుబైర్ (రదియల్లాహు అన్హు), హజ్రత్ తల్హా(రదియల్లాహు అన్హు), హజ్రత్ అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ (రదియల్లాహు అన్హు), హజ్రత్ సాద్ బిన్ అబీ వఖ్ఖాస్ (రదియల్లాహు అన్హు) లాంటి వారున్నారు. వీరంతా సత్య ధర్మం కోసం ఎన్నో కష్టాలను ఎదుర్కొని, కఠిన పరీక్షల్లో నెగ్గుకువచ్చారు.
హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) ఇస్లాం స్వీకరించే నాటికి ఆయన వద్ద నలభై వేల దిర్హములు ఉండేవి. అందులో నుంచి కేవలం ఐదు వేల దిర్హములు తన కోసం ఉంచుకుని మిగిలినదంతా ఇస్లాం (దైవధర్మం) కోసం అర్పించారాయన.
ఇస్లాం స్వీకరించిన వారిని అవిశ్వాసులు వేధించేవారు. స్వతంత్రులు మరియు పెద్ద కుటుంబాలకు చెందిన విశ్వాసులపై చెయ్యి చేసుకునే ధైర్యం ఎవరికీ ఉండేది కాదు. కాని విశ్వాస భాగ్యాన్ని పొందిన బానిసలపై కష్టాల కొండలు విరుచుకుపడేవి. అలాంటి బాధితులలో ఓ నీగ్రో బానిస కూడా ఉన్నారు. ఆయన పేరు హజ్రత్ బిలాల్ (రదియల్లాహు అన్హు). ఆయన హృదయాన్ని ఇస్లాం జ్యోతిర్మయం చేసింది. ఆయన యజమాని ఆయన్ని కొడుతూ కొడుతూ అలసిపోతే, మిట్టమధ్యాహ్నం కాలుచున్న ఇసుకపై ఆయన్ని నగ్నంగా పడుకోబెట్టి గుండెపై బండపెట్టేవాడు. కాని ఆయన ఈ పరిస్థితిలో కూడా ‘అహద్ అహద్’ (అల్లాహ్ ఒక్కడే, అల్లాహ్ ఒక్కడే) అని అనేవారు. దీనిపై ఆయన యజమాని ఆగ్రహంతో ఊగిపోతూ ఆయన్ని తుంటరి బాలురకు అప్పగించేవాడు. వారు ఆయన మెడలో త్రాడు వేసి లాక్కెళ్ళేవారు. అప్పుడు మక్కా వీధులు, ‘అల్లాహ్ ఒక్కడే. అల్లాహ్ ఒక్కడే’ అన్న నినాదాలతో ప్రతిధ్వనించేవి. ఈ వేధింపులను చూడలేక హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) ఆయన్ని కొని స్వాతంత్ర్యం ప్రసాదించారు. ఈ విధంగా ఇస్లాం స్వీకరించిన ఏడుగురు బానిసలకు అబూబకర్ (రదియల్లాహు అన్హు) స్వాతంత్ర్యం ప్రసాదించారు. ఇది చూసి ఆయన తండ్రి అబూ ఖహాఫా “నీకు బానిసలు కొనాలనే అంత ఇదిగా ఉంటే మంచి దేహదారుఢ్యం గల వారిని కొనాల్సింది. వారు నీ అవసరానికి పని కొచ్చేవారు. రెండడుగులు కూడా సరిగా నడవలేని ఈ బలహీనులైన బానిసలను ఎందుకు కొన్నావు?” అని అన్నారు. “ఈ పని నేను ఎలాంటి లాభాన్ని ఆశించి చేయలేదు. ఇది నేను కేవలం అల్లాహ్ ప్రసన్నత కోసమే చేశాను.” అని జవాబిచ్చారు హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు).
హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) చేత విముక్తి పొందిన బానిస హజ్రత్ బిలాల్ (రదియల్లాహు అన్హు) ఎంత గొప్ప వారంటే హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) హజ్రత్ బిలాల్ (రదియల్లాహు అన్హు)ను ‘ఓ మా సర్దార్!’ అని అనేవారు: ఓ సారి హజ్రత్ బిలాల్ (రదియల్లాహు అన్హు) గారి ప్రస్తావన వస్తే హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) ఇలా అన్నారు. “హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) మా నాయకులు. ఎందుకంటే ఆయన మా నాయకునికి (హజ్రత్ బిలాల్ రదియల్లాహు అన్హుకు) స్వాతంత్ర్యం ప్రసాదించారు.”
మొదటి మూడు సంవత్సరాలు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ధర్మప్రచారం బహిరంగంగా చేయలేదు. ఇస్లాం నిశ్శబ్దంగానే విస్తరించ సాగింది. చాలా మంది ఇస్లాం స్వీకరించారు. నాలుగవ ఏట నుండి దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ధర్మ ప్రచారం బహిరంగంగా చేయసాగారు. దీనిపై ప్రజలు ఆగ్రహం చెంది విశ్వాసులపై కఠినంగా వ్యవహరించసాగారు. ఆ కాలంలో ఓ రోజు ఖురైష్ పెద్దలందరూ కాబా గృహంలో సమావేశమై దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గురించి మాట్లాడసాగారు. అదే సమయంలో దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అక్కడికి చేరుకున్నారు. ఒకతను లేచి ” మా దేవుళ్లను కించపరచేది నీవేనా?” అని అడిగారు. “నిస్సందేహంగా నేనే” అని జవాబిచ్చారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం). ఇది విని అవిశ్వాసులు ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) పై విరుచుకుపడ్డారు. అంతలో ఎవరో వచ్చి హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) గారితో మీ స్నేహితుడిని కాపాడండి అని అన్నారు. ఇది విని హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) పరుగెత్తుకుంటూ అక్కడికి చేరుకున్నారు. అవిశ్వాసులను తోసుకుంటూ దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) దగ్గరికి చేరుకుని “కడు శోచనీయం! మీరు ఈయన్ని ‘తన ప్రభువు అల్లాహ్’ అని అన్నంత మాత్రానికే కొడుతున్నారా.” అని ఆవేశంతో ప్రశ్నించారు.
ఈ విషయంలో ఆయన జోక్యం చేసుకోవడం అవిశ్వాసులకు నచ్చలేదు. అందరూ ఆయనపై విరుచుకుపడి తల పగిలేలా కొట్టారు. అవిశ్వాసుల అత్యాచారాలు నానాటికీ పెరిగి పోయి ఈ విధంగా బ్రతుకు గగనమై పోగా చాలా మంది విశ్వాసులు అబీసీనియాకు వలస వెళ్ళారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారిని విడిచి వెళ్లడానికి హజ్రత్ అబూబకర్ (రదియల్లాహు అన్హు) గారి మనసొప్పలేదు. కాని విధిలేక ఆయన కూడా యమన్ దారిన అబిసీనియాకు వలస వెళ్లారు. దారిలో ఐదు చోట్ల ఇబ్నుల్ రగ్నా అనే వ్యక్తిని కలిశారు. ఎక్కడికి వెళుతున్నారు? అని అతను అడిగాడు. హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) జవాబిస్తూ “నా దేశస్థులు నన్ను తరిమేశారు. అందువలన నేను వేరే దేశానికెళ్ళి అల్లాహ్ ఆరాధన చేయాలనుకుంటున్నాను” అని అన్నారు.
“మీ లాంటి అతిధి మర్యాద చేసేవారిని, బీదలు – అగత్యపరులను ఆదుకునే వారిని మక్కా నుండి ఎలా తీసివేస్తారు. మీ బాధ్యత తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. పదండి, మక్కా వెళదాం. అక్కడే అల్లాహ్ ఆరాధన చేయండి” అని అన్నాడు ఇబ్నుల్ రగ్న. అతను హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు)ను తీసుకొని వచ్చి ఖురైష్ నాయకులతో మాట్లాడాడు. హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) అల్లాహ్ ఆరాధన చేయదలిస్తే ఇంట్లోనే చేసుకోవాలి అనే షరతుపై వారు ఇబ్నుల్ రగ్న మాటను ఒప్పుకున్నారు.
ఇబ్నుల్ రగ్నా హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు)తో “వారు ఈ విషయాన్ని ఒప్పుకున్నారు” అని అన్నాడు. కొన్ని రోజుల వరకూ ఆయన ఇంట్లోనే నమాజ్ చేయడం, ఖుర్ఆన్ చదవడం చేయసాగారు. ఆ తరువాత ఆయన తన ఇంటి సరిహద్దులోనే ఓ మస్జిద్ నిర్మించారు. అక్కడే నమాజ్ చేయడం, ఖుర్ఆన్ చదవడం మొదలెట్టారు. ఆయన మృదు స్వభావులు కావడం చేత ఖుర్ఆన్ పారాయణం చేసేటప్పుడు దాని ప్రభావం వల్ల ఏడ్వనారంభించే వారు. ఆయన ఏడుపు శబ్దం విని దారిన పోయే ప్రజలు ఆగి వినసాగారు. వారిలో స్త్రీలు, పిల్లలు కూడా ఉండేవారు. స్త్రీలు మరియు పిల్లలు ఎక్కడ విశ్వాసులయిపోతారో అని ఖురైషులు భయపడసాగారు. ఇబుల్ రగ్నాకు ఫిర్యాదు కూడా చేశారు. అతను హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) దగ్గర కొచ్చి జరిగినదంతా వివరించాడు. అప్పుడు హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) “ఇక నీవు నా బాధ్యత తీసుకోకు. నన్ను నా అల్లాహ్ పై వదిలిపెట్టు” అని అన్నారు..
హిజ్రత్ (వలస)
మక్కా నుండి 200 మైళ్ళ దూరంలో మదీనా అనే పురము ఉంది. ఆ రోజుల్లో దాన్ని ‘యస్రిబ్‘ అనేవారు. అక్కడి వారు కొందరు మక్కా వచ్చారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను కలిశారు. ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) నోట దివ్య ఖుర్ఆన్ వచనాలు విన్నారు. మదీనా వెళ్ళి ఇతరులతో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గురించి ప్రస్తావించారు. ఇలా మొదటి సంవత్సరం ఆరుగురు, రెండో సంవత్సరం పన్నెండు మంది, మూడో సంవత్సరం డెబ్భై రెండు మంది మదీనా నుండి మక్కాకు వచ్చి ముస్లిములయ్యారు. వారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ను మదీనాకు రమ్మని ఆహ్వానించసాగారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) స్వయంగా వెళ్ళలేదు గాని సహచరులు (సహాబా)కు అనుమతినిచ్చారు. వారు (సహాబా) ఒక్కొక్కరూ మదీనా వెళ్ళసాగారు. హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) కూడా మదీనా వెళ్ళడానికి అనుమతి అడిగారు. కాని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు)ను ఆపుతూ ఇలా అన్నారు-“నీవు కాస్త ఆగు. బహుశా అల్లాహ్ ఆదేశం ప్రకారం నేను కూడా మదీనా వెళ్ళవచ్చు”. అప్పటి నుండే హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) మదీనా వెళ్ళడానికి సన్నాహాలు చేయసాగారు. తన ఒంటెలకు తుమ్మ ఆకులు తినిపించసాగారు.
ఓ రోజు మధ్యాహ్నం అబూ బకర్ (రదియల్లాహు అన్హు) తమ ఇంట్లో కూర్చుని ఉండగా ఒకతను వచ్చి దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వస్తున్నారని తెలియజేశాడు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆ సమయంలో అంతకు ముందెన్నడూ హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) ఇంటికి రాలేదు. ఏదో అత్యవసర పనిమీదే దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ సమయంలో ఇక్కడకు వస్తున్నారని ఊహించారు హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు). అంతలో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అక్కడికి చేరుకున్నారు. ఇంట్లో ప్రవేశించగానే “ఇక్కడున్న ఇతరులను బయటకు పంపండి” అని అన్నారు. “ఇక్కడ పరాయి వారెవరూ లేరు. నా ఇద్దరు కుమార్తెలు మాత్రమే ఉన్నారు” అని అన్నారు హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు). “నాకు హిజ్రత్ చేసే (వలసవెళ్ళే) అనుమతి లభించింది” అని సెలవిచ్చారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం). “నాకు కూడా మీతో పాటు వలస వెళ్ళే అనుమతి ఉందా?” అని ప్రశ్నించారు హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు). “ఔను” అని జవాబిచ్చారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం).
హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) గారి కుమార్తె అస్మా (రదియల్లాహు అన్హ) ప్రయాణ ఏర్పాట్లు చేశారు. భోజనం కట్టారు, తోలుసంచిలో నీళ్ళు నింపారు. చీకటి పడగానే దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు)ను వెంట బెట్టుకొని ఎవరికీ తెలీకుండా ఒంటెలపై బయలుదేరి నూర్ గుహ వద్దకు చేరుకున్నారు. వారిద్దరూ మూడు రోజులు ఆ కొండ గుహలోనే గడిపారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఎక్కడున్నారో హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) ఇంటి వారికి తప్ప మరెవరికీ తెలియదు. హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) గారి కుమారులు అబ్దుల్లాహ్ సాయంత్రం కొండ గుహకు చేరుకొని రాత్రి అక్కడే గడిపేవారు. ఉదయం పూట మక్కా చేరుకొని ఖురైషులు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గురించి ఏమంటున్నారో వినేవారు. ఈ రహస్యం ఎరిగిన ఇంకో వ్యక్తి పూర్వం ఓ బానిస. అతని పేరు ఆమిర్ బిన్ ఫహీరహ్. హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) ఆయన్ని కొని విముక్తి కలిగించారు. పగలంతా ఆయన హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) ఒంటెను మేపేవారు. రాత్రి పూట ఎవరికీ కనబడకుండా దాన్ని గుహ ద్వారం వద్ద తీసుకొచ్చి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మరియు హజ్రత్ అబూబకర్ (రదియల్లాహు అన్హు)కు దాని పాలు త్రాగించేవారు. తెల్లవారక ముందే దాన్ని బహు దూరంగా తోలుకెళ్ళేవారు.
ఖురైషులు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కు బద్ద విరోధులైపోయారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మక్కా నుండి సురక్షితంగా బయటపడటం వారు సహించలేకపోయారు. అందువల్ల వారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ను వెదకడానికి తమ మనుషుల్ని హుటాహుటిన నలువైపులా పంపారు. స్వయంగా అబూ జహల్ మరియు ఇతర ఖురైషీ నాయకులు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ను వెదుకుతూ అటూ ఇటూ తిరిగారు. ఓ సారి అయితే వీరు నూర్ గుహ వద్దకు రానే వచ్చారు. కాని వారు ఎలాంటి ఏమరుపాటుకు గురయ్యారంటే బయటినుండే వెళ్ళిపోయారు. వారి అడుగుల చప్పుడు విని హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) ఎంతో కలవరం చెందారు. కానీ దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ధైర్యంతో ఇలా అన్నారు: “భయపడకండి. అల్లాహ్ మనతో ఉన్నాడు.”
నాలుగో రోజు గుహనుండి బయటకు వచ్చి ఒంటెలపై ప్రయాణం సాగించారు. ఇలా మధ్యాహ్నం వరకు ప్రయాణించారు. మిట్ట మధ్యాహ్నం సూర్యుడు నెత్తి మీదికొచ్చాక విశ్రాంతి కొరకు ఆగారు. ఆ ఎడారిలో చెట్టు ఎక్కడుంటుంది? ఓ రాతి కనుమ అంచున నీడ కనిపించింది. హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) నీడ ఉన్న చోటును శుభ్రపరిచారు. అక్కడ తోలు దుప్పటి పరచి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)తో “ఇక మీరు విశ్రాంతి తీసుకోండి. నేను కాపలా కాస్తాను” అని అభ్యర్థించారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నిద్రపోయారు. హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) నేలను శుభ్రపరచసాగారు. కాని శత్రుభయం ఆయన్ని వెంటాడసాగింది. ఖురైషులు ఎక్కడ వెంటాడుతున్నారో అని నలువైపులా చూడసాగారు. ఇంతలో ఓ గొర్రెల కాపరి గొర్రెలను తోలుకు వస్తూ కనిపించాడు. అతను దగ్గరి కొచ్చాక పాలున్నాయా అని అడిగారు హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు). అతను ఔనన్నాడు. మేక పొదుగు శుభ్రపరచి ఓ గిన్నెలో పాలు పితికాడు. హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) తోలు సంచిలోని నీళ్ళు అందులో కాస్త కలిపారు. అంతలో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మేల్కొన్నారు. ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) పాలు త్రాగి ‘ఇక వెళదామా!’ అని అడిగారు, ‘కాస్సేపట్లో బయలుదేరదాం’ అని అన్నారు హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు). సూర్య తాపం తగ్గాక వారిద్దరూ తమ ప్రయాణం కొనసాగించారు.
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను పట్టిచ్చిన వారికి ఖురైషులు బహుమతి ప్రకటించారు. గుర్రాలపై, ఒంటెలపై వెళ్ళి చాలా మంది దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను వెదక సాగారు. తమ తెగలో అత్యంత పరాక్రమశాలిగా పేరు పొందిన సురఖా అనే వ్యక్తి కొందరు వ్యక్తులు తీరంవెంబడి వెళ్ళడం గమనించాడు. వారే దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మరియు ఆయన మిత్రులు హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు)లు అయి ఉంటారని భావించాడు. వెంటనే సాయుధుడై గుర్రంపై స్వారీ అయ్యాడు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) దగ్గరికి చేరుకోగానే గుర్రం కాళ్లు రెండూ నేలలోకి దిగబడిపోయాయి. సురాఖా క్రింద పడిపోయాడు. మళ్ళీ గుర్రంపై ఎక్కి ఈటెను గురిపెట్టి వారిని వెంబడించసాగాడు. కాని గుర్రం కాళ్ళు మళ్లీ భూమిలో కూరుకుపోయాయి. ఇలాంటి పుణ్యాత్ములను బంధించే ప్రయత్నం చేస్తున్నందుకే తనకీ శాస్త్రి జరుగుతోందని తలిచాడు. వెంటనే దీనంగా క్షమాపణ వేడుకొని వెనుతిరిగాడు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారిని వెదుకుతూ వస్తున్న కొందరు దారిలో అతన్ని కలిస్తే వారితో “మీరు ఇటువైపు ఎందుకు వెళుతున్నారు? నేను ఇప్పటి దాకా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మరియు హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు)ను వెదికాను. బహుశా వారు మరో వైపు వెళ్ళి ఉంటారు. మదీనా వైపు మాత్రం పోలేదు” అని అన్నాడు.
ఇటు మదీనాలో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వస్తున్నారని అందరికీ తెలిసిపోయింది. పెందలాడే ప్రజలు పట్టణం బయటికొచ్చి ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) కోసం ఎదురుచూసి, ఎండ తీవ్రయమ్యాక వెనుతిరిగేవారు. ఓ రోజు ఇలాగే చాలా సేపు ఎదురు చూసి వెనుతిరుగుతున్న సమయంలో ఒకతను దూరం నుంచే దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను చూసి “ఎవరికోసం మీరు నిరీక్షిస్తున్నారో ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) వస్తున్నారు” అని అరిచాడు. ఇది విని అందరూ ఆగిపోయారు. క్షణాల్లో ఈ విషయం అందరికీ తెలిసి పోయింది. తహతహ లాడుతూ ప్రజలందరూ తమ ఇండ్ల నుండి బయటికొచ్చారు.
అప్పటికి హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) వయస్సు 49 సంవత్సరాల 6 నెలలు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వయస్సులో ఆయన కన్నా రెండున్నర సంవత్సరాలు పెద్దవారు, అంటే అప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వయస్సు 52 సంవత్సరాలు. కాని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి గడ్డం, తలవెంట్రుకలు నల్లగా ఉండేవి. హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) గారి గడ్డం, తల వెంట్రుకలు అప్పటికే చాలా వరకు నెరసిపోయాయి. హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) వ్యాపార నిమిత్తం మదీనా వస్తూ పోతూ ఉండటం వల్ల ప్రజలు ఆయన్ని సునాయాసంగా గుర్తుపట్టారు. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇంటి బయటకు చాలా తక్కువగా వెళ్ళేవారు, అందువల్ల ప్రజలు ఆయన్ని గుర్తు పట్టలేక పోయారు. కాని హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) గారితో రావడం చూసి అందరు ఆయనే దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అయి ఉంటారని ఊహించారు. మరికొందరు సందిగ్ధంలో పడిపోయారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ముఖారవిందంపై పడుతున్న ఎండకు హజ్రత్ అబూబకర్ (రదియల్లాహు అన్హు) నీడ పట్టడానికి ప్రయత్నించినప్పుడు అందరి అనుమానాలు దూరమైపోయాయి.
మదీనా నుండి మూడు మైళ్ళ దూరంలో ఖుబా అనే ప్రాంతం ‘ఉంది. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అక్కడే పధ్నాలుగు రోజులు ఆగారు. అక్కడ ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) ఓ మస్జిదుకు పునాది వేసి పదిహేనో రోజు అక్కడి నుండి బయలుదేరి మదీనా చేరుకున్నారు. తమ ఇల్లూ వాకిలి వదిలి మక్కా నుండి మదీనాకు వలస వెళ్ళిన వారిని ‘ముహాజిరీన్‘ అని అంటారు. అలాగే మదీనాలో వారిని ఆదుకొన్న వారిని ‘అన్సార్లు‘ గా వ్యవహరిస్తారు. అన్సార్లు అంటే సహాయపడిన వారు అని అర్థం. ముహాజరుల వద్ద తలదాచుకునేందుకు చోటులేదు, కొందరికైతే అవిశ్వాసులు ఏమీ తెచ్చుకోనివ్వలేదు. మదీనా చేరాక దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ముహాజిర్లను, అన్సార్లను సమావేశపరచి వారిలో ఇద్దరిని అనగా ఓ అన్సార్ ను, ఓ ముహాజిర్ ను పిలిచి “ఈ రోజు నుండి మీరిద్దరూ సోదరులు” అని అనసాగారు. అన్సారులు ప్రదర్శించిన సోదర భావాన్ని అనుబంధాన్ని సొంత సోదరులు కూడా చూపలేరు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) హజ్రత్ ఖారిజా బిన్ జైద్ అన్సారి గారిని హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) గారికి సోదరునిగా చేశారు. ఆయన మదీనాలోని సుఖ్ అనే పేటలో నివసించేవారు. మొదట హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) అక్కడే ఉండసాగారు. భార్యాపిల్లలను పిలుచుకున్నారు. వారు మదీనా వచ్చినప్పుడు వారి దగ్గర ఐదువేల దిర్హమ్ లు ఉండేవి. ఆ డబ్బుతో ఆయన మదీనాలో వ్యాపారం మొదలెట్టారు. అల్లాహ్ ఆయన వర్తకంలో సమృద్ధి నొసగాడు. ఆయన మరియు ఆయన వంశం వారు నిశ్చింతగా జీవితాన్ని గడపసాగారు.
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మదీనాలో హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) ఇంట్లో ఏడు నెలలు ఉన్నారు. ఆ ఇంటికి దగ్గరలోనే భూమి కొని మస్జిదు నిర్మించారు. వలసపోయి వచ్చిన అనుచరుల (సహాబాల) ఇండ్లు చాలావరకు ఆ మస్జిద్కు చుట్టు ప్రక్కల్లోనే నిర్మించబడ్డాయి. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) స్వయాన మస్జిద్కు ఆనుకుని ఉన్న ఏడు కుటీరాలలో ఉండేవారు. పొరుగునే హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) గారి ఇల్లుండేది. కాని హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) సుఖ్ లోని నివాసంలోనే ఎక్కువగా ఉండేవారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మరణం తర్వాత పూర్తిగా ఈ నివాసానికి తరలి వచ్చేశారు.
మస్జిద్ మరియు దాని ఇరు ప్రక్కల గల ఇళ్ళు పచ్చి ఇటుకతో నిర్మితమైనవి. ఖర్జూరపు బొద్దులు, ఆకులతో నిర్మితమైన కప్పు. ఆ కప్పు ఎత్తు చాలా తక్కువ. నిలబడి చేయి చాపితే కప్పు తగిలేది.
హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) తల్లిదండ్రులు అప్పటికి ముస్లిములు (విశ్వాసులు) కాలేదు. అందువల్ల వారు మక్కాలోనే ఉండిపోయారు. పెద్ద కుమారుడు అబ్దుర్రహ్మాన్ మరియు ఆయన తల్లి కూడా ఇస్లాం స్వీకరించకపోవడం వల్ల మక్కాలోనే ఉండిపోయారు. కాని రెండవ కుమారులైన అబ్దుల్లాహ్ మరియు ఇద్దరు పుత్రికలు హజ్రత్ అస్మా (రదియల్లాహు అన్హ). హజ్రత్ ఆయిషా(రదియల్లాహు అన్హ) ఇస్లాం స్వీకరించి మదీనా వచ్చేశారు.
వలస (హిజ్రత్) అనంతరం
మదీనాలో స్థిరపడుతుండగానే ఖురైషులతో యుద్ధాలు ప్రారంభమయ్యాయి. ముందు చిన్న చిన్న పోరాటాలు, ఆ తరువాత పెద్ద యుద్ధాలు అనేకం జరిగాయి. ఆ యుద్ధాలలో హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) కూడా పాల్గొన్నారు. మొదటి యుద్ధం ఎలా జరిగిందంటే మక్కా సర్దారులలో ఒకడైన అబూ సుఫ్యాన్ సిరియా నుండి వర్తక సామగ్రి తీసుకొని వస్తున్నాడని విశ్వాసులకు సమాచారం అందింది. వారు అతణ్ణి ఆపడానికి ప్రయత్నించారు. సహాయం కోసం అబూ సుఫ్యాన్ తన దూతను మక్కాకు పంపాడు. సమాచారం అందగానే ఖురైషులు వెయ్యిమంది సైనికులను మదీనాపై దండయాత్రకై పంపారు. ఇటు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కూడా మూడు వందల పదమూడు మంది యోధులను వెంటబెట్టుకొని మదీనా నుండి బయలుదేరారు. మదీనా నుండి కాస్త దూరంలో బద్ర్ అనే ఓ చిన్న పల్లెటూరు ఉంది. రెండు సేనలూ అక్కడ ముఖాముఖి అయ్యాయి.
మదీనా నుండి బయలుదేరే ముందు దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అనుచరులందరినీ సమాలోచన కొరకు ఒకచోట సమావేశపరచారు. అందరి కంటే ముందు హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) ఉద్వేగంతో ఉపన్యసించారు. దాని తరువాత అన్సారులలో నుండి సాద్ బిన్ ముఆజ్ లేచి “అల్లాహ్ సాక్షి! దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆదేశిస్తే మేము సముద్రంలో దూకడానికయినా సిద్ధంగా ఉన్నాం” అని అన్నారు. ముస్లిములు (విశ్వాసులు) బద్ర్ వైపు బయలుదేరారు. పూర్తి సైన్యంలో రెండే రెండు గుర్రాలు. ఎవరి వద్దనూ సరైన ఆయుధాలు లేవు. తుప్పుపట్టిన ఖడ్గాలు, పాతబడిన ఒరలు. ప్రవక్త ప్రియసహచరులు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కూర్చోడానికి రణభూమిలోని ఓ మూలన పందిరి వేశారు. హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) ఖడ్గం చేతబూని దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కు కాపలా కాయసాగారు. యుద్ధం ప్రారంభమయింది. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కూడా యుద్ధంలో పాల్గొన్నారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కు కుడివైపు ఉన్న సైనికుల అధికారిగా హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) ఉండగా, ఎడమవైపు సైనికులకు హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు) అజమాయిషీ చేశారు.
హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) కుమారులు అబ్దుర్రహ్మాన్ అప్పటికి ఇంకా ఇస్లాం స్వీకరించలేదు. దైవ తిరస్కారుల సైన్యంతో పాటు యుద్ధానికి వచ్చారు. అబ్దుర్రహ్మాన్ చాలా కాలం తరువాత ఇస్లాం స్వీకరించారు. వారు ఓ రోజు తమ తండ్రిగారితో “బద్ర్ యుద్ధంలో మీరు ఓ సారి నా ఖడ్గం క్రిందికి వచ్చారు, కాని నేను మీపై ఖడ్గం ఝుళిపించలేదు” అని అన్నారు. దానికి హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) – “కాని నీవే గనక నా ఖడ్గం క్రిందికి వచ్చి ఉంటే మటుకు నేను నిన్ను విడిచి పెట్టేవాడ్ని కాను” అని అన్నారు. వాస్తవానికి బద్ర్ యుద్ధం ధర్మానికి- అధర్మానికీ మధ్య జరిగిన కీలకమయిన పోరు. కొడుకు తండ్రి ముందు ఖడ్గం తీసుకొని నిలబడ్డాడు, సోదరులు ఒకరికి విరుద్ధంగా మరొకరు పోరాడసాగారు. అల్లాహ్ కృప వల్ల విశ్వాసులకు విజయం లభించింది. ఇస్లాంకు బద్ద విరోధి అయిన అబూ జహల్ తో సహా అవిశ్వాసుల అనేక మంది నాయకులు ఈ యుద్ధంలో మరణించారు.
బద్ర్ యుద్ధానికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఖురైషులు మరుసటి సంవత్సరమే మూడు వేల మంది సైనికులను వెంట బెట్టుకొని మదీనా పై దండెత్తి వచ్చారు. మదీనా దగ్గర ఉహద్ అనే ఓ పర్వతం ఉంది. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఏడు వందల మంది ముస్లిం యోధులను వెంటబెట్టుకొని అవిశ్వాసులను ఆ పర్వతం వద్దనే ప్రతిఘటించారు. ఉహద్ పర్వతం ముస్లిం సైనిక దళానికి వెనుక ఉంది. అవిశ్వాసులు వెనుక నుండి దాడి చేయకుండా ఉండేందుకు యాభై మంది విలుకాండ్రులను పర్వతపు కనుమపై నియమించటం జరిగింది. ఈ యుద్ధం ఆ పర్వతం పేరుతోనే ‘ఉహద్ యుద్ధం’ గా ప్రసిద్ధి చెందింది.
మొదట్లో ఉహద్ యుద్ధంలో కూడా విశ్వాసులదే పై చేయి అయింది. అవిశ్వాసులు పరాజయం పాలవసాగారు. కాని పర్వతపు లోయ వద్ద మొహరించబడిన విలకాండ్రు పెద్ద పొరపాటు చేశారు. ఖురైషులను వెంబడించడానికి వారు తమ స్థానాల్ని వదిలారు. ఈ అవకాశం కోసమే ఎదురు చూస్తున్న శత్రుసైనికుల జట్టు అటు వైపు నుంచి మెరుపు దాడి చేసింది. పరాక్రమశాలి అయిన దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి చిన్నాన హజ్రత్ హమ్జా (రదియల్లాహు అన్హు) ఈ పోరాటంలో అబిసీనియా బానిస చేతిలో అమరగతి నొందారు. స్వయంగా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కూడా గాయపడ్డారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తమ మధ్య కనిపించకపోవడం వల్ల విశ్వాసుల నమ్మకం సడలింది. ఇలాంటి సమయంలో హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) అందరికన్నా ముందు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సమక్షంలో హాజరయ్యారు. ఆ తరువాత ఇతర అనుచరులు కూడా హాజరయ్యారు. విశ్వాసులు పంక్తులు సరిచేసుకొని యుద్ధానికి మళ్ళీ తయారవసాగారు. కాని అవిశ్వాసులకు మరోసారి విశ్వాసుల్ని ఎదిరించే ధైర్యం లేకపోయింది. వారు ఆ కాస్త విజయానికే తృప్తి చెంది వెనుదిరిగారు.
హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) పెద్దకుమారులైన అబ్దుర్రహ్మాన్ విశ్వాసులకు వ్యతిరేకంగా ఈ పోరాటంలో కూడా పాల్గొన్నారు. రణరంగంలో నాకు వ్యతిరేకంగా ఎవరొస్తారని ఆయన అరచినప్పుడు హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) ఖడ్గం చేతబూని బయలుదేరారు. కాని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆయన్ని ఆపారు.
ఉహద్ తర్వాత సుప్రసిద్ధ కందక యుద్ధం జరిగింది. ఖురైషులు పదివేల మంది సైనికులతో మదీనాపై యుద్ధానికి వచ్చారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మదీనా చుట్టూ గోతి తవ్వించారు. దీన్నే కందకం లేక అగడ్త అని అంటారు. అందుకే ఈ యుద్ధాన్ని కందక యుద్ధం అంటారు. శత్రువులు నెల రోజులపాటు మదీనాను ముట్టడించి ఉన్నారు. అడపాదడపా దాడులు కూడా చేశారు. కాని ప్రతి సారీ ఓటమి చవిచూశారు. ఈ పోరాటంలో హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) ఓ సైనిక దళాన్ని వెంటబెట్టుకొని కందకాన్ని రక్షించసాగారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆ సమయంలో హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు)ను నియమించిన స్థానంలో ఓ మస్జిద్ నిర్మితమైంది. అది మస్జిదె సిద్దీఖ్ అనే పేరుతో ప్రసిద్ధి చెందింది. ప్రస్తుతం ఈ మస్జిదు అక్కడ లేదు.
ఖైబర్ యుద్ధం మరియు హుదైబియా ఒప్పందం సమయంలో కూడా హజ్రత్-అబూ బకర్ (రదియల్లాహు అన్హు) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు తోడుగా ఉన్నారు. హుదైబియా ఒప్పందం ఎలా జరిగిందంటే- వలస వెళ్ళిన ఆరో సంవత్సరం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఉమ్రా సంకల్పం చేశారు. ఈ ప్రయాణంలో 1400 మంది సహచరులు ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) వెంట ఉన్నారు. యుద్ధం చేసే ఆలోచన లేనందువల్ల ఆయుధాలు వెంట బెట్టుకుని వెళ్ల లేదు. ఖురైషులకు ఈ సంగతి తెలియగానే కలవరపడి ప్రతిఘటనకు సిద్ధమవసాగారు. ఇటు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మక్కాకు కొంత దూరాన గల ‘హుదైబియా’ అనే ప్రాంతం వద్ద ఆగిపోయారు. ఖురైషుల తరపు నుంచి మాట్లాడటానికి ఒక దూత వచ్చాడు. అతనెంతో అసభ్యంగా మాట్లాడాడు. ఈ సంభాషణ వల్ల ఎలాంటి ఫలితమూ లేకపోయింది. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) దూతగా హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు అన్హు)ను మక్కా పంపారు. ఖురైషులు ఆయన్ని బంధించారు. అంతలోనే హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు అన్హు) అమరగతి నొందారన్న వార్త దావానలంలా వ్యాపించింది. ఈ వార్త విని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తీవ్రంగా కలత చెందారు. ఓ తుమ్మ వృక్షం క్రింద కూర్చొని విశ్వాసుల చేత ‘హజ్రత్ ఉస్మాన్’ (రదియల్లాహు అన్హు) హత్యకు ప్రతీకారం తీర్చుకోవడానికి మేము మా ప్రాణాలను అర్పిస్తాం’ అన్న ప్రతిజ్ఞ చేయించారు.
ముస్లింలు దాడికి సిద్ధంగా ఉన్నారని తెలుసుకొని ఖురైషులు ఈ సంవత్సరం తిరిగి వెళ్ళిపోండి, వచ్చే సంవత్సరం ఉమ్రా చేయండి అన్న సందేశాన్ని పంపించారు. హుదైబియాలో ఇద్దరి మధ్య ఒడంబడిక జరిగింది. ఈ ఒడంబడికలోని షరతులను బట్టి అవిశ్వాసులు తమ పంతంలో నెగ్గారని పైకి స్పష్టమయ్యేది. సంధి షరతులు హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు)ను వ్యాకులతకు లోను చేశాయి. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ముందు బిగ్గరగా మాట్లాడారు. తరువాత హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు)ను కలిసి అదే మాట ఆయనతో కూడా అన్నారు.
హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మాటను ఎట్టి పరిస్థితిలోనూ జవదాటేవారు కాదు. కించిత్ సందేహం కూడా కలిగేదికాదు. హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) మాటలు విని హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) ఇలా అన్నారు. “ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) దైవప్రవక్త. అల్లాహ్ ఆయనకు తోడ్పడతాడు. మీరు ఆయనను వెన్నంటి ఉండండి. ఆయన్నే అనుసరించండి. అల్లాహ్ సాక్షి! ఆయన సత్యం పై ఉన్నారు.”
హజ్రత్ అబూబకర్ (రదియల్లాహు అన్హు) హృదయం విశ్వాసపు గనిలాంటిది. అల్లాహ్ మార్గంలో ఆయన అడుగు ఎన్నడూ తొట్రు పడలేదు. ఇస్లాం వాస్తవికత గురించి ఆయన మనసులో ఎన్నడూ లేశమయినా అనుమానం రాలేదు. ఈ సుగుణం వల్లనే ఆయనకు ‘సిద్దీఖ్‘ అనే బిరుదు లభించింది. హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) హుదైబియా ఒప్పందం సమయంలో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ముందు హెచ్చుస్వరంతో మాట్లాడారు కాని దాన్ని తలచుకుని జీవితాంతం పశ్చాత్తాపం చెందారు. పరిహారంగా ఉపవాసాలు పాటించారు, దానాలు చేశారు, తరచూ అల్లాహ్ ను దీనంగా ఆ అపరాధానికి గాను క్షమాపణ వేడుకునే వారు. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మూడు రోజులు హుదైబియాలో ఉన్నారు. నాలుగో రోజు తిరిగి వెళుతున్నప్పుడు దారిలో “మేము నీకు విజయాన్ని ప్రసాదించాము” అన్న ‘వహీ’ అవతరించింది. హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) “ఇది విజయమా?” అని ప్రశ్నించారు. “ఔను” అని జవాబిచ్చారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం). ఇది విని హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) సంతృప్తి చెందారు. వాస్తవానికి హుదైబియా ఒప్పందం ఖురైషులు విజయం కాదు, విశ్వాసుల విజయం అని తరువాతి సంఘటనలు నిరూపించాయి. ఎందుకంటే ఈ ఒడంబడిక ద్వారా విశ్వాసులకు, అవిశ్వాసులకు మధ్య సత్సంబంధాలు, సదవగాహన పెంపొందాయి. దీని మూలంగా ఇస్లాం స్వీకరించడానికి అప్పటి వరకూ సంకోచిస్తున్న అనేక మంది ఇస్లాం స్వీకరించారు.
హుదైబియా నుండి తిరిగొచ్చాక యూదుల బెడదను వదిలించుకునే నిమిత్తం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఖైబర్ వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ అనేక యూదుల కోటలు ఉన్నాయి. అవి ఒక్కొక్కటీ ముస్లింల వశమైనాయి. మరుసటి సంవత్సరం ఖురైషులు హుదైబియా ఒప్పందాన్ని ఉల్లంఘించారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పదివేల మంది సైనికులతో మక్కా వైపుకు వచ్చారు. ఖురైషులకు వారిని ఎదుర్కొనే ధైర్యం లేకపోయింది. శరణు కోరగా అందరినీ క్షమించారు కారుణ్యమూర్తి (సల్లల్లాహు అలైహి వసల్లం). హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు)తన తండ్రి అబూ ఖుహాఫాను దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సమక్షంలో తీసుకొచ్చారు. ఆ సమయంలో ఆయన తండ్రి గారి వయసు 90 సంవత్సరాలు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు)తో “పెద్ద మనిషిని ఎందుకు కష్టపెట్టావు? ఆయన్ని ఇంటి వద్దనే ఉంచితే నేనే స్వయంగా వచ్చి కలిసే వాడిని” అని అన్నారు. హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) “ఓ దైవప్రవక్తా! ఆయనే మీ వద్దకు రావాలి” అని అన్నారు. అబూ ఖుహాఫా సద్వచనం (కలిమా) పలికి విశ్వాసులైపోయారు.
మక్కా విజయం తరువాత ఖురైషుల పొగరు అణగిపోయింది. కాని కొన్ని ఇతర తెగలు కయ్యానికి సిద్ధంగా ఉన్నాయి. హునైన్ లోయలో వారితో తలపడడం జరిగింది. విశ్వాసుల సైన్యంలో మక్కా వాసులు కూడా చేరారు. శత్రువుల విలుకాండ్రు వదిలిన బాణాలకు వీరు (మక్కా వాసులు) పరుగెత్తసాగారు. వీరు పరుగెత్తడం చూసి సైన్యంలోని మిగతావారు కలవరం చెందారు. ఆ సమయంలో హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు), హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు) మరియు ఇతర సన్నిహిత సహచరులు (సహాబా) తప్ప అందరూ దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ను విడిచి పారిపోయారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కుడివైపు తిరిగి “ఓ అన్సారులారా!” అని పిలిచారు. “మేము సిద్ధంగా ఉన్నాము” అని జవాబు వచ్చింది. తరువాత ఎడమవైపు తిరిగి పిలిచారు. అటువైపు నుండి కూడా మేమూ సిద్ధమే” అనే జవాబు వచ్చింది. ఇలా విశ్వాసులందరూ శత్రువులపై ఒక్కసారిగా విరుచుకు పడగానే వారు ఓటమి పాలయ్యారు.
ఆ రోజుల్లో ఇతర రాజ్యాలు కూడా ముస్లిములతో కయ్యానికి కాలుదువ్వాయి. క్రైస్తవుల ఆధీనంలో గల సిరియా వాటిల్లో అందరికన్నా ముందు ఉండేది. మక్కా విజయానికి పూర్వం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) క్రైస్తవులను ఎదిరించడానికి సైన్యాన్ని పంపారు. ఈ చిన్న పాటి సైన్యం లక్ష మందితో కూడిన క్రైస్తవుల భారీ సైన్యంతో మువత్తా అనే ప్రదేశంలో తలపడింది. అందరి కన్నా ముందు ఇస్లాం స్వీకరించిన వారిలో ఒకరైన జైద్ బిన్ హారిస్ (రదియల్లాహు అన్హు), దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చిన్నన కుమారులైన జాఫర్ తయార్ (రదియల్లాహు అన్హు) లాంటి సహచరులు (సహాబా) ఈ పోరాటంలో అమరగతి నొందారు. మక్కా విజయం తరువాత క్రైస్తవులు మదీనాపై మళ్ళీ దాడి చేయజూస్తున్నారని తెలిసింది. వారిని మదీనా దాకా రానీయటం ఉచితంకాదని తలచి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) యుద్ధ సన్నాహాలు మొదలెట్టారు. కాని ఆ సంవత్సరం అరేబియాలో దుర్భిక్షం సంభవించింది. విశ్వాసులందరూ తమ తమ స్థోమతకు తగ్గట్టుగా ఒంటెలు, గుర్రాలు, నగదును తెచ్చి ఇచ్చారు. హజ్రత్ అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ నలభై వేల దిర్హం లు సమర్పించారు. హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు అన్హు) వంద గుర్రాలు, తొమ్మిది వందల ఒంటెలు, ఒక వెయ్యి దీనార్లు సమర్పించారు. హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) తన వంతు సామగ్రి తీసుకు వచ్చినప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆయనతో “ఉమర్ ! భార్యా పిల్లల కోసం ఏమి ఉంచావు?” అని అడిగారు. దానికి హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) “ఇంట్లో ఉన్న దాంట్లో నుంచి సగం తీసుకువచ్చాను” అని జవాబిచ్చారు. కాని హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) ఇంట్లో ఉన్నదంతా తీసుకు వచ్చేశారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “అబూ బకర్! భార్యా పిల్లల కోసం ఏం వదలిపెట్టావు?” అని అడిగారు. “అల్లాహ్ మరియు దైవప్రవక్తను” అని జవాబిచ్చారు హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు). ఇదీ ఈ ‘సిద్దీఖ్’ విశిష్ఠత!
ఆ సైనిక దళంలో ముఫ్ఫైవేల మంది సైనికులు ఉన్నారు. విశ్వాసులు అంతకు ముందెన్నడూ అంత పెద్ద సైనిక దళాన్ని తయారు చేయలేదు. సైనిక దళం ఏర్పాట్లన్నీ హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) గారికి అప్పగించడం జరిగింది. ఆ సైన్యానికి సేనాధిపతి స్వయంగా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం). సిరియా పొలిమేరల్లో “తబూక్” అనే పురము ఉంది. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అక్కడి దాకా వెళ్ళి తిరిగి వచ్చేశారు. క్రైస్తవులు పోరాటానికి రాలేదు. తబూక్ నుండి తిరగొచ్చాక హజ్ సమయం సమీపించింది. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) స్వయంగా హజ్ కు వెళ్ళలేదు కాని మూడు వందల మందితో కూడిన ఓ బృందాన్ని మక్కాకు పంపారు. ఆ హజ్ యాత్రీకుల సమూహానికి హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) సారథిగా నియమించ బడ్డారు. మరుసటి సంవత్సరం (అనగా హిజ్రత్ చేసిన 10వ సంవత్సరం) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) స్వయంగా హజ్ కొరకు వెళ్ళారు. ఇది “హజ్జతుల్ విదా” (వీడ్కోలు హజ్)గా ప్రసిద్ధి చెందింది. ఇది మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి చివరి హజ్. ఈ ప్రయాణంలో కూడా హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వెంట ఉన్నారు.
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మరణం
అంతిమ హజ్ యాత్ర నుండి తిరిగొచ్చాక అంటే హిజ్రత్ చేసిన పదకొండవ సంవత్సరం సఫర్ మాసంలో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అస్వస్థతకు లోనయ్యారు. హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) గారి కుమార్తె హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హ) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సతీమణి. వ్యాధిగ్రస్తులైన కాలంలో ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హ) గారి కుటీరంలో ఉండేవారు. మొదట్లో ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) గారే నమాజ్ చేయించేవారు. కాని జబ్బు పెరిగాక హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు)ను నమాజ్ చేయించమని అన్నారు. ఆ రోజు నుంచి హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) నమాజ్ చేయించసాగారు. ఓ రోజు జబ్బు కాస్త నయమనిపిస్తే సహచరుల సహాయంతో మస్జిదుకు వచ్చారు. హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) నమాజ్ చేయించసాగారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆయన దగ్గర కూర్చున్నారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను చూసి హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) వెనక్కి జరగబోయారు. కాని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) జరగవద్దని సైగ చేశారు.
ఓ రోజు ముస్లింలు ఉదయం పూట నమాజు కోసం నిలబడుతుండగా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి గది తెర లేవడం కనిపించింది. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) స్వయంగా నమాజు చేయించటానికి వస్తారేమో అని భావించి హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) తన స్థానం నుండి జరిగారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) హజ్రత్ అబూబకర్ (రదియల్లాహు అన్హు)ను, తన స్థానంలో వెళ్ళి నమాజు చేయించమని సైగ చేశారు. హజ్రత్ అబూబకర్ (రదియల్లాహు అన్హు) నమాజు మొదలెట్టగానే దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెర దించివేశారు. ఆ రోజు సాయంత్రానికి కాస్త ముందు ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) అంతిమ శ్వాస వదిలారు. హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) గారికి సుఖ్ (ఓ ప్రాంతం) లో కూడా ఓ ఇల్లు ఉండేది. కొద్ది సేపటి కోసం ఆ రోజు ఆయన అక్కడి కెళ్ళారు. తిరిగొచ్చాక మస్జిద్ నుండి నేరుగా హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హ) కుటీరాని కెళ్ళారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) భౌతికకాయంపై దుప్పటి కప్పబడి ఉంది. దాన్ని జరిపి ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) ముఖాన్ని చుంబించారు. తరువాత దు:ఖిస్తూ “నా తల్లిదండ్రుల్ని మీకు అర్పింతుగాక! మీ జీవితం మరియు మరణం రెండూ పవిత్రమైనవి. మీకు రావలసిన మృత్యువు వచ్చేసింది. ఇక మీకు ఎన్నడూ మరణం అన్నది ఉండదు” అని అన్నారు.
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మరణవార్త విని ముస్లిములందరూ దిగ్భ్రాంతి చెందారు. ఎక్కడి వారు అక్కడే ఉండిపోయారు. సర్వత్రా కాస్సేపు నిశ్శబ్దం రాజ్యమేలింది. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మరణించారంటే సహచరులకు (సహాబా) నమ్మకం కలగలేదు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మరణించారని ఎవరయినా అంటే వాడి తల నరికేస్తానని చెబుతూ హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) చేతిలో ఖడ్గం పట్టుకొని ఆవేశంతో సంచరించ సాగారు. హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హ) కుటీరం నుండి మస్జిదులోకి ప్రవేశించినప్పుడు హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) ప్రమాణం చేసి ప్రజలతో ఇలా అంటున్నారు: “దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మరణించలేదు. తొందర్లోనే ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) లేచి కపట విశ్వాసులను శిక్షిస్తారు”. అప్పుడు హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) అయన్నుద్దేశించి ‘కూర్చొండి’ అని అన్నారు. హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు)ను చుట్టుముట్టి ఉన్న ప్రజలందరూ హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) వద్దకు చేరుకున్నారు.
హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) వారితో ఇలా అన్నారు: “ప్రజలారా! మీరు దైవప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)ను పూజించేవారైతే ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) మరణించారని తెలుసుకోండి (ఇన్నా లిల్లాహివ ఇన్నా ఇలైహి రాజిపూన్). “అల్లాహ్ ను ఆరాధించేవారైతే అల్లాహ్ జీవించి ఉన్నాడని తెలుసుకోండి. అల్లాహ్ ఎన్నడూ మరణించడు.” తరువాత, ‘ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) దైవప్రవక్త మాత్రమే. ఆయన కన్నా ముందు ఎందరో ప్రవక్తలు గతించారు’ అన్న ఖుర్ఆన్ సూక్తిని పఠించారు. ఇది విన్న తరువాత దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ‘మరణం పట్ల హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు)కు విశ్వాసం కలిగింది. కాని ఈ ఆఘాతానికి తట్టుకోలేక మూర్ఛపోయి క్రిందపడి పోయారు.
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మరణం తరువాత అన్సారులందరూ ఓ ప్రదేశంలో గుమికూడి-విశ్వాసులు నాయకునిగా ఎవరిని ఎన్నుకోవాలి? అనే విషయంపై చర్చించుకోవటం మొదలెట్టారు? ఈ విషయం తెలియగానే హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) మరియు మరో ప్రముఖులైన సహాబి (ప్రవక్త అనుచరులు) హజ్రత్ ఉబైదా బిన్ జర్రాహ్ (రదియల్లాహు అన్హు)లను వెంటబెట్టుకొని అక్కడికి చేరుకున్నారు. ఆ సమయంలో ముస్లిముల్లో నాయకత్వ సమస్యపై చీలిక ఏర్పడే ప్రమాదం కానవచ్చింది. కాని హజ్రత్ అబూబకర్ (రదియల్లాహు అన్హు) ఈ సమస్యను చాలా తెలివిగా పరిష్కరిస్తూ ‘ఉమర్ ను గానీ, అబూ ఉబైదాను గాని తమ నాయకునిగా ఎన్నుకోండి’ అని సూచించారు. కాని హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) ముందుకొచ్చి “మేము మిమ్మల్నే మా నాయకునిగా ఎన్నుకుంటాం” అని ప్రమాణం చేశారు. తరువాత ఇతరులు కూడా ముందుకు వచ్చి ప్రమాణం చేశారు. ఈ విధంగా హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) విశ్వాసుల నాయకునిగా అంటే ఖలీఫాగా ఎన్నుకోబడ్డారు.
హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) పరిపాలన
సుమారు 61 సంవత్సరాల వయస్సులో హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) ఖలీఫా (ప్రతినిధి)గా ఎన్నికయ్యారు. ఆ సమయంలో ఆయన బక్క పలుచగా ఉండేవారు. తెలుపు రంగు, వంగిన నడుము, కళ్లు కాస్త లోపలికిపోయి ఉండేవి. వంకీలు తిరిగిన జుత్తు. తల ముందలి భాగంలో వెంట్రుకలు ఉండేవి కావు. మదీనా వచ్చినప్పుడే హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) గారి గడ్డం పాక్షికంగా నెరసిపోయింది. కాని మదీనా వచ్చాక ఆయన నెరసిన వెంట్రుకలకు రంగు వేయడం మొదలెట్టారు. దాని మూలంగా ఆయన గడ్డం ఎర్రగా మారింది. స్వతహాగా ఆయన మితభాషి. ఏది చెప్పినా చాలా ఆలోచించి చెప్పేవారు. చాలా మృదు స్వభావి. ఇస్లాం స్వీకరించక పూర్వం కూడా ఆయన దానశీలిగా, ఉపకారిగా, దైవ పరాయణులుగా ఖ్యాతి చెందారు.
ఖిలాఫత్ బాధ్యతలకు పూర్వం హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) వ్యాపారం చేసేవారు. దుప్పట్లను భుజాలపై మోసుకెళ్ళి బజారులో అమ్మేవారు. ఖలీఫా అయ్యాక కూడా ఇదే పద్ధతిని పాటించేవారు. కాని పరిపాలనా బాధ్యతల వల్ల వ్యాపారం చేయడం కష్టతరం అవగా సహాబా (అనుచరులు) ఆయన కోసం ఉపకారవేతనాన్ని నిర్ణయించారు. ఆ ఉపకార వేతనం కూడా చాలా కొద్దిగా ఉండేది. తన సంసారం నడపగలిగేటంతటి కొద్ది సొమ్ము మాత్రమే ఆయనకు లభించేది. ఓ సారి ఆయన సతీమణి మిఠాయి తినిపించమని కోరారు. తన వద్ద ఏమీ లేదని అన్నారు హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు). అప్పుడు ఆయన భార్య రోజువారి ఖర్చులో నుంచి కొంత సొమ్ము కూడబెట్టడం మొదలెట్టారు. కాస్త పెద్ద మొత్తం జమ అయ్యాక మిఠాయి తీసుకు రమ్మని ఆయనకిచ్చారు. “నా అవసరానికి మించిన వేతనం నాకు లభిస్తుందని దీని ద్వారా వెల్లడవుతుంది” అని అన్నారు హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు). కూడబెట్టబడిన ఆ ధనాన్ని ప్రభుత్వ నిధిలో జమచేసి తన వేతనాన్ని తగ్గించారు.
ఖలీఫా అవక మునుపు మదీనా సమీపంలో గల సుఖ్ అనే చిన్న ప్రాంతంలో నివసించేవారు. సుఖ్ లోని ఆయన ఇల్లు ఒంటె రోమాలు కంబళ్ళతో నిర్మించబడిన ఓ చిన్న గుడారం ఖలీఫా అయ్యాక కూడా ఆరు నెలల దాకా ఆ ఇంట్లోనే నివసించారు. ఆ తరువాత మస్జిద్ నబవీ (ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మస్జిదు) లోని ఓ గదిలోకి వచ్చేశారు.
మానవత్వం, పరోపకారగుణం ఆయనలో నిండి ఉండేవి. వితంతువుల, అనాథల బాగోగులు చూసేవారు. తన పనుల్ని పక్కనబెట్టి రోగులను పరామర్శించడానికి వెళ్ళేవారు. రేయింబవళ్ళు వారి సేవలో నిమగ్నులయిపోయేవారు. సుఖ్ ప్రాంతానికి వెళ్ళినప్పుడు పిల్లలు ఆయన్ని ‘బాబా బాబా’ అని పిలిచేవారు. బాలికలు మేకల పాలు పితకమంటే పాలు పితికేవారు. అవసరమైతే వారి మేకలను మేపుకొచ్చేవారు.
ఏ మాట అయినా ఖుర్ఆన్ కు కాస్త అటూ ఇటూ ఉండకుండా చూసుకునేవారు. ఏ నిర్ణయమైనా ఖుర్ఆన్ ప్రకారమే చేసే వారు. ఏ విషయం గురించి అయినా ఖుర్ఆన్లో స్పష్టమైన ఆదేశం లేని పక్షంలో ఆ విషయం గురించి దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమని ఆదేశించారు? అని ప్రజలను అడిగేవారు. ఏదేని విషయంలో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆదేశం కూడా లభించని పక్షంలో సహాబా (రదియల్లాహు అన్హుమ్)ను సమావేశపరచి వారితో సంప్రదించి వారిచ్చిన సలహాపై అమలుచేసేవారు. ఆయన ఆదేశించినదేదీ ఖుర్ఆన్, హదీసులకు విరుద్ధంగా ఉండేది కాదు. సహాబా (రదియల్లాహు అన్హుమ్)ను సంప్రదించకుండా ఆయన ఏనాడూ తన స్వంత నిర్ణయం గైకొనేవారు కాదు.
అంతర్గత కలహాలు
చాలా క్లిష్టమయిన పరిస్థితుల్లో హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) పరిపాలనా బాధ్యతల్ని స్వీకరించారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) జీవిత కాలంలోనే సిరియాతో యుద్ధాలు మొదలయ్యాయి. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మరణానికి కొన్ని రోజుల ముందు సిరియాపై దండెత్తడానికి సైన్యాన్ని పంపదలిచారు. ఆ సైనిక దళానికి నవయువకులైన ఉసామా బిన్ జైద్ (రదియల్లాహు అన్హు) గారిని సేనాపతిగా నియమించారు. ఆ సైనిక దళం మదీనా పాలిమేరలు దాటక ముందే దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పరమపదించారు. ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) మరణానికి కొన్నాళ్ళ క్రిందటే ఇస్లాం స్వీకరించిన కొన్ని తెగలు ఇస్లాం పట్ల విముఖులయ్యాయనీ, కొన్ని తెగలు జకాత్ ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయని సమాచారం అందింది. అదే సమయంలో రాజ్యాధికారాన్ని కాంక్షించే కొందరు దుర్మార్గులు తమను ప్రవక్తగా ప్రకటించుకుని అనేక తెగలను మార్గభ్రష్టతకు లోను చేయసాగారు. పరిస్థితులు ఈ స్వరూపాన్ని దృష్టిలో పెట్టుకొని చాలా మంది సహాబా (ప్రవక్త అనుచరులు) “మదీనాపై దాడి జరిగిన పక్షంలో సులువుగా ఎదుర్కొనేందుకుగాను ఉసామా (రదియల్లాహు అన్హు)ను సిరియాకు పంపించకుండా ఉండటం మంచిద”ని హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) గారికి సలహా ఇచ్చారు. అప్పుడు హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) “దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సిరియాపై దండెత్తడానికి పంపదలచిన సైన్యాన్ని నేనెలా ఆపగలను?” అని జవాబిచ్చారు.
ఆ సమయంలో హజ్రత్ ఉసామా (రదియల్లాహు అన్హు) గారి వయసు 17 సంవత్సరాలు. అందువల్ల కొందరు హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) గారితో “సరే, సైన్యాన్ని సిరియా పంపదలిస్తే, పంపండి. కాని, ఉసామా (రదియల్లాహు అన్హు)కు బదులు అనుభవజ్ఞులైన వారెవరినైనా సేనాపతిగా నియమించండి” అని అన్నారు. ఇది విని హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) మండి పడుతూ “మీరెలాంటి మాట మాట్లాడుతున్నారు? దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సేనాపతిగా నియమించిన వ్యక్తిని ఎవరు తీయగలరు?” అని అన్నారు. హజ్రత్ అబూబకర్ (రదియల్లాహు అన్హు)లోని విధేయతాభావానికి, రుజువర్తనకు ఇది ఓ ప్రబల తార్కాణం.
ఉసామా (రదియల్లాహు అన్హు) ప్రయాణానికి బయలుదేరినప్పుడు ఆయన్ని వదిలి పెట్టడానికి హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) చాలా దూరం వెళ్ళారు. ఉసామా (రదియల్లాహు అన్హు) గుర్రంపై కూర్చుని ఉండగా హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) ఆయనతో పాటు కాలి నడకన వెళ్ళసాగారు. “మీరైనా గుర్రంపై ఎక్కండి లేదా నన్నయినా మీతో పాటు కాలినడకన రానివ్వండి” అని అన్నారు ఉసామా (రదియల్లాహు అన్హు), ‘నేను గుర్రం ఎక్కనూ, నిన్ను గుర్రం నుండి దిగనివ్వను’ అని అన్నారు హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు). ఇస్లామీయ (విశ్వాసుల) సైన్యానికి వీడ్కోలు పలుకుతూ హజ్రత్ అబూబకర్ (రదియల్లాహు అన్హు) ఇలా సెలవిచ్చారు:
“ప్రజలారా! కాస్త ఆగండి… నేను మీకు కొన్ని ఉపదేశాలు చేయదలిచాను. వాటిని బాగా అర్థం చేసుకోండి. నమ్మక ద్రోహం చేయకండి. సొమ్మును స్వాహా చేయకండి. విశ్వాస ఘాతుకానికి పాల్పడకండి. యుద్ధంలో శత్రువుల శరీరావయవాలు కోయకండి. వృద్ధులపై, పిల్లలపై, స్త్రీలపై చేయి చేసుకోకండి. ఫలమిచ్చే వృక్షాలను కోయకండి. ప్రపంచాన్ని విడిచి ధ్యానంలో నిమగ్నులయి ఉన్న ఇతర మతస్థుల జోలికి వెళ్ళకండి.”
ఈ సైన్యం సిరియా సరిహద్దుల్లో అనేక దాడులుచేసి విశ్వాసులు పరాక్రమాన్ని క్రైస్తవులను చాటి తిరిగొచ్చింది. కాని ఉసామా (రదియల్లాహు అన్హు) సిరియా సరిహద్దుల్లో పోరాడుతున్న సమయంలోనే మదీనా సమీపంలో గల ఇస్లాంను (విశ్వాసం) తిరస్కరించిన అనేక తెగలు మదీనాపై దాడి చేశాయి. ఈ తెగల ప్రజలు ప్రాపంచిక వ్యామోహంలో మునిగిపోయారు. “మేము నమాజ్ చేస్తాము, రోజా పాటిస్తాము కాని జకాత్ ఇవ్వము” అని మొండికేశారు. ఆ సమయంలో చాలా మంది సహాబా (అనుచరులు) “నజద్ మరియు యమన్ లోని అనేక తెగలు ఇస్లాంను విడిచిపెడుతున్న దృష్ట్యా వారితో కాస్త సడలింపుల వైఖరిని అవలంబించండి” అని హజ్రత్ అబూబకర్ (రదియల్లాహు అన్హు) గారికి సలహాఇచ్చారు. కాని ఆయన ససేమిరా అన్నారు. “ధర్మంలో హెచ్చుతగ్గులు చేసే అధికారం ఎవరికీ లేదు. వీరు జకాత్ చెల్లించనంత వరకూ నేను వారితో పోరాడుతూనే ఉంటాను. మీరు నాకు తోడ్పడక పోయినా సరే, నేను ఒంటరిగా వీరితో పోరాడుతాను. నాలో ప్రాణం ఉన్నంతవరకూ నేను పోరాడుతూనే ఉంటాను” అని చెప్పి మదీనా నుండి బయలుదేరారు. బదర్ మరియు హునైన్ యుద్ధాలలో పాల్గొన్న ప్రముఖ సహాబా (అనుచరులు) అందరూ ఆయనకు తోడుగా వచ్చారు. రెండు మూడు పెద్ద దాడులు జరిగాయి. హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) ఆ తలబిరుసులను ఓడించి ధర్మాన్ని రక్షించారు. తరువాత మదీనా తిరిగొచ్చి పదకొండు మంది సర్దారులకు సైన్యాలనిచ్చి సంక్షోభం గల ప్రాంతాలకు పంపారు. వాస్తవానికి అది ఇస్లాంకు సంక్లిష్ట సమయం. మదీనాలోని సైన్యాన్ని తీసుకొని ఉసామా (రదియల్లాహు అన్హు) సిరియా సరిహద్దువైపు వెళ్ళగా మదీనాలో మిగిలిపోయిన ఆ కొద్ది మంది ముహాజిరులు మరియు అన్సారులతో శత్రువులను ఎదుర్కోవడం చాలా కష్టం. కాని హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) గారి ధైర్యం చూడండి- ఆ కొద్ది సైన్యంతోనే ఆయన యుద్ధానికి సిద్ధమయ్యారు. ఒకవేళ ఆ సమయంలో హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) శత్రువుల ఒత్తిడికి తలఒగ్గి వారికి జకాత్ (ఇస్లామీయ ధర్మపు ఓ మూలస్తంభం) నుండి మినహాయింపు ఇస్తే ధర్మంలో ప్రతి రోజు తూట్లు పడుతుండేవి. కొందరు ఉపవాసం పాటించము అని, మరికొందరు తాము నమాజు చేయము అని అనడం ప్రారంభించేవారు. అల్లాహ్ పాటించమని ఆదేశించిన వాటిని నేను ఎలా మినహాయించగలను అని హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) సూటిగా అనేవారు. ఆయన గారు కనబరచిన ధైర్యం మరియు పట్టుదల వల్ల తిరుగుబాటు ధోరణులు అణగారిపోయాయి. దీని ద్వారా దైవధర్మంలో ఎలాంటి హెచ్చుతగ్గులకు తావులేదని అందరికీ సుస్పష్టం అయిపోయింది.
అరబ్ తెగలలో బనీ తమీమ్ ఓ సుప్రసిద్ధ తెగ. ఆ తెగ నాయకులు కూడా జకాత్ చెల్లించడానికి నిరాకరించారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సైఫుల్లాహ్ (దైవఖడ్గం) అని బిరుదునిచ్చిన హజ్రత్ ఖాలిద్ బిన్ వలీద్ (రదియల్లాహు అన్హు) వారిపై దాడికెళ్ళారు. బనీ తమీమ్ వారికి ఇది తెలియగానే భయపడి వారు తమ అభిప్రాయాన్ని మార్చుకున్నారు. పోరాడటానికి సిద్ధపడిన కొందరు యుద్ధంలో తమ ప్రాణాలను కోల్పోయారు.
అరేబియాకు దక్షిణాన గల యమన్ లో ముసైలిమా అనే వ్యక్తి ఉండేవాడు. వాడు ఓ సరికొత్త ఉపద్రవాన్ని సృష్టించాడు. తాను దైవప్రవక్తనని అతను చెప్పేవాడు. ఎక్కడెక్కడినుంచో అరువు తెచ్చుకున్న కొన్ని వాక్యాలను ప్రజలకు వినిపించి ఇది తనపై అవతరించిన ‘దైవవాణి’ అని అనేవాడు. నిజమైన విశ్వాసులు ఇలాంటి దుర్మార్గుల మాటలకు మోసపోయే వారు కాదు. కాని అప్పుడప్పుడే ఇస్లాం స్వీకరించి ఇంకా ఇస్లాం గురించి అంతగా అవగాహన లేని కొన్ని తెగలు మాత్రం అతని వలలో పడ్డాయి.
వాస్తవానికి ఆ సమయంలో తిరుగుబాటు చేసినవారు అనగా ముసైలిమా మరియు ఇతర బూటకపు ప్రవక్తలను విశ్వసించిన వారు లేదా జకాత్ చెల్లించడానికి నిరాకరించినవారు ఇస్లాం స్వీకరించి కొన్నాళ్ళే అయింది. ఇస్లాం బోధనలు వారి మనస్సుల్లో ఇంకా వేళ్లూనుకోలేదు.
ఆ రోజుల్లో సజాహ్ అనే స్త్రీ కూడా తాను ప్రవక్తనని ప్రకటించుకుంది. ఆమె తన తెగ ప్రజలను వెంట బెట్టుకొని మదీనాపై దాడికై బయలుదేరింది. దారిలో ముసైలిమా సైన్యంతో యుద్ధం జరిగింది. ముసైలిమా జిత్తుల మారి. యుద్ధంలో సజాహ్ సైన్యాన్ని ఓడించడం కష్టం అని గ్రహించిన వెంటనే ఆమెపై ప్రేమ వల పన్ని ఆమెను పెండ్లాడాడు. ఈ విధంగా ఆమె సైన్యపు చాలా భాగాన్ని తన వైపుకు లాక్కున్నాడు. దీని వల్ల అతని బలం పెరిగిపోయింది. ముస్లిం సైన్యం ఒకానొక ముట్టడిలో అనుకోని విధంగా ముసైలిమా సైన్యం చేతిలో ఓటమిపాలైంది. దాంతో ముసైలిమా మరింతగా పేట్రేగిపోయాడు. అతని వద్ద నలభైవేల మంది సైనికులు పోగయ్యారు.
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మరణానికి పూర్వం అస్వద్ అనే ఓ యమన్ సర్దారు తాను ప్రవక్తనని ప్రకటించుకుని మరో వివాదాన్ని సృష్టించాడు. కాని ఓ వ్యక్తి అతణ్ణి హత్య చేశాడు. కొన్నాళ్ళ తర్వాత బనీ అసద్ నాయకుడైన తలైహా పెద్ద ఉపద్రవాన్ని సృష్టించాడు. ఇతను కూడా తాను ప్రవక్తనని ప్రకటించుకున్నాడు. చాలా మంది అతణ్ణి విశ్వసించారు. హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) గారు హజ్రత్ ఖాలీద్ బిన్ వలీద్(రదియల్లాహు అన్హు)కు సైన్యాన్నిచ్చి తలైహా వద్దకు పంపారు. అతను ఓటమిపాలయ్యాడు. ఏళ్ళ తరబడి అటూ ఇటూ తిరిగాడు. తలదాచుకోవడానికి ఎక్కడా చోటు దొరకకపోవడం చేత చివరికి మదీనా చేరి ఇస్లాం స్వీకరించాడు. ఈ తలైహా బహు పరాక్రమాశాలి. సిరియా మరియు ఈరాన్ యుద్ధాలలో అతను తన పరాక్రమంతో ఇస్లాంకు తోడ్పడ్డాడు.
తలైహాను ఓడించాక హజ్రత్ ఖాలీద్ బిన్ వలీద్ ముసైలిమాతో యుద్ధానికి సంకల్పించారు. యమామా అనే ప్రదేశంలో ఉఖబా అనే గ్రామం ఉంది. రెండు సైన్యాలూ అక్కడ ఎదురయ్యాయి. ముసైలిమా వద్ద నలభై వేల మంది సైనికులున్నారు. స్వయంగా అతను మధ్యలో ఉండి పేరుగాంచిన సైనికులను తనకు ఇరువైపుల మోహరించాడు. ఇస్లామీయ సైన్యాన్ని అతని సైన్యాలతో పోలిస్తే ఏవిధంగానూ సరిపోదు. యుద్ధం ప్రారంభంలో ముసైలిమా సైనికుల దాడికి విశ్వాసులు బెదిరిపోయారు. విశ్వాసులు వెనక్కి జరుగుతూ జరుగుతూ హజ్రత్ ఖాలిద్ (రదియల్లాహు అన్హు) గుడారం దాకా చేరుకున్నారు. అప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అనుచరులైన హజ్రత్ ఖైస్ బిన్ సాబిత్ (రదియల్లాహు అన్హు) మరియు జైద్ బిన్ ఖత్తాబ్ (రదియల్లాహు అన్హు) విశ్వాసులను “ఓ విశ్వాసులారా! ఎక్కడికెళ్తున్నారు?” అంటూ రోషం తెప్పించారు. వారు స్వయంగా యుద్ధం చేస్తూ వీరమరణం పొందారు. వారి ధైర్యాన్ని చూసి ముస్లిం సైన్యంలో ఉత్తేజం కలిగింది. వారు ఇరువైపుల నుండి శత్రుసైన్యంపై విరుచుకుపడ్డారు. దీంతో ముసైలిమా సైనిక పంక్తుల్లో కలకలం రేగింది.
ముసైలిమా సైన్యానికి వెనుక వైపు ఓ పెద్ద తోట ఉంది. విశ్వాసులు శత్రు సైన్యాన్ని తరుముకుంటూ ఆ తోట దాకా తీసుకెళ్ళారు. చేసేదేమి లేక ముసైలిమా తన సైన్యాన్ని తోటలోకి తీసుకెళ్ళి తోట తలుపులు మూసేసుకున్నాడు. హజ్రత్ బరా బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) గొప్ప పరాక్రమశాలి. ఆయన సోదరులైన హజ్రత్ అనస్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) జీవితాంతం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కు సేవ చేశారు. తత్కారణంగా హజ్రత్ బరా బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) గారికి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సేవలో హాజరయ్యే అవకాశం తరచూ లభించేది. అందువల్ల ప్రజలందరూ ఆయన్ని గౌరవించేవారు. ముసైలిమా తోట తలుపుల్ని మూసేసుకోవడంతో హజ్రత్ బరా బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) తనను గోడపైకి ఎక్కించమని తన సహచరులతో అన్నారు. గోడ పైకి చేరుకొని లోపల దూకారు. శత్రుసైన్యం ఓ వైపు బాణాల వర్షం కురిపిస్తున్నా దూసుకుపోయి తలుపులు తెరిచారు. వెంటనే ఇస్లామీయ సైన్యం తోట లోపల ప్రవేశించింది. లోపల భీకర పోరు జరిగింది. ముసైలిమా సైన్యానికి మధ్యలో నిలబడి సైనికులను ఉత్తేజపరచసాగాడు. తన సైన్యం ఓటమి పాలవడం చూసి “ప్రస్తుతం ప్రాణాల్ని రక్షించుకుందాం. తరువాత చూసుకోవచ్చు” అని మనసులో భావించాడు. ఉహద్ యుద్ధంలో దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చిన్నాన్న హజ్రత్ హమ్జా (రదియల్లాహు అన్హు) ను హతమార్చిన అబిసీనియా బానిస వహ్షీ ముసైలిమాను వెదకసాగాడు. ముసైలిమా పారిపోయే ప్రయత్నంలో ఉండగానే వహ్షీ అతనిపై ఒక్క వేటు వేశాడు. అంతటితో ముసైలిమా కథ కంచికి చేరింది.
అతని సహచరులు పరుగెత్తి దగ్గరలోని కోటలలో దాక్కున్నారు. కాని చివరికి దారిలేక ఆయుధాలను పడవేసి ప్రాణాలను కాపాడుకున్నారు.
తిరుగుబాటుదారుల అహంకారం అణచడానికి హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) పదకొండు సైనిక జట్లను పంపారు. జకాత్ ఇవ్వడానికి నిరాకరించిన అనేక తెగలకు ఆ సైన్యం బుద్ధి చెప్పింది. తమ తమ ప్రాంతాలలో తమ రాజ్యాన్ని ఏర్పాటు చేయదలుస్తున్న వేర్పాటు వాదుల ప్రయత్నాలను కూడా విఫలం చేశారు. వారిలో అందరికంటే పెద్ద సమూహం ముసైలిమాది, పెద్ద యుద్ధం యమామా యుద్ధం. తమ జీవితాన్ని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సేవలో గడిపిన, దివ్య ఖుర్ఆన్ను కంఠస్థం చేసిన అనేక మంది ప్రవక్త సహచరులు (సహాబా) ఈ యుద్ధంలో అమరగతినొందారు.
దివ్యఖుర్ఆన్ దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) జీవితంలోనే వ్రాయబడింది. కాని కొన్ని అధ్యాయాలు కాగితంపై, కొన్ని తోలుపై, కొన్ని ఖర్జూరపు ఆకులపై, కొన్ని రాళ్లపై లిఖించబడ్డాయి. దివ్య ఖుర్ఆన్ ను కంఠస్థం చేసిన అనేక మంది ప్రవక్త సహచరులు (సహాబా) రదియల్లాహు అన్హుమ్ – అమరగతినొందడం చూసి హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) దివ్యఖుర్ఆన్ ను ఓ చోట వ్రాయించుకున్నారు. ఆ తరువాత పూర్తి ఖుర్ఆన్ కంఠస్థం చేసిన వారిని పిలిపించి వ్రాయించబడిన ఆ ఖుర్ఆన్లోని భాగాలను సరిపోల్చుకుని ఎక్కడా తప్పులు దొర్లకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.
రోము మరియు ఈరాన్ యుద్ధాలు
అరేబియాలో కల్లోలం సృష్టించిన సమూహాలను అణచివేసే పని తొమ్మిది, పది నెలల్లో ముగిసింది. తరువాత హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) రోమ్ మరియు ఈరాన్తో యుద్ధ సంకల్పం చేశారు. ఆ రెండు సామ్రాజ్యాల సరిహద్దులు అరేబియాకు ఆనుకుని ఉండేవి. రోము చాలా పెద్ద సామ్రాజ్యం. అది ఆసియా, ఐరోపా, ఆఫ్రికా లాంటి మూడు ఖండాలలో విస్తరించి ఉండేది. ఆసియాలో సిరియా, పాలస్తీనా, ఆఫ్రికాలో ఈజిప్టుతో పాటు ఉత్తర ఆఫ్రికాలోని పెద్ద ప్రాంతం రోము అధీనంలో ఉండేది. ఈరాన్ కూడా చాలా బలోపేతమైన రాజ్యం. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) జీవితంలో ఆ రెండు సామ్రాజ్యాల మధ్య యుద్ధాలు కూడా జరిగాయి. ఓ సారి ఈరానీయులు పెద్దదాడి చేసి సిరియా, పాలస్తీనా ప్రాంతాలను దాటుకుంటూ జెరూసలేం వరకూ చేరుకున్నారు. ప్రతీకారంగా కొన్నేళ్ళ తరువాత రోమనులు ఈరానుపై దాడి చేసి ఇస్ఫహాన్ (జోర్డాన్) ను నాశనం చేసి విజయ దుందుభి మ్రోగిస్తూ వెనుదిరిగారు.
తమ జీవితపు చివరి దశలో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చుట్టు ప్రక్కల గల రాజ్యాల రాజులకు ఉత్తరాల ద్వారా ఇస్లాం సందేశాన్ని అందజేశారు. ఈరాన్ రాజు ఖుస్రో పర్వేజ్ రాజ్యాధికారపు అహంకారంలో ఆ ఉత్తరాన్ని చించేసి, మదీనావెళ్ళి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను బంధించి తీసుకు రావలసిందిగా తన గవర్నరును ఆజ్ఞాపించాడు. కాని అల్లాహ్ లీల చూడండి! అటు అతను ఈ అపరాధం చేసిన కొన్నాళ్ళకే ఇటు అతని కొడుకు అధికార దాహంతో తండ్రిని హతమార్చాడు. ఆ తరువాత ఈరానీయులు తమ అంత: కలహాలలో ఇరుక్కుపోయారు. ఇక వారికి అరబ్బులపై దాడి చేసే తీరికే లేకపోయింది. అవకాశం దొరకగానే వారు తప్పకుండా తమపై దాడి చేస్తారని ముస్లిముల మనసులో మెదిలేది. ఇక రోమనులతో యుద్ధం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) హయాంలోనే ప్రారంభమయింది. రోమనులు మదీనాపై దండెత్తి వస్తున్నారనే పుకార్లు పదేపదే వినవచ్చేవి. ఆ రోజుల్లో ఈరాన్ రాజు తరఫున హుర్మజ్ అనే వ్యక్తి ఇరాఖ్ ను గవర్నరుగా పాలించేవాడు. ఇతను అరబ్బులకు బద్ద విరోధి. ఇరాఖ్ సరిహద్దుల్లో గల అరబ్బుతెగల పై అతను నిరంతరం దౌర్జన్యం చేసేవాడు. అతనీ గురించి తెలియగానే హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) ఇరాఖ్ పై దాడికి హజ్రత్ ఖాలిద్ బిన్ వలీద్ (రదియల్లాహు అన్హు)ను పంపించాలనుకున్నారు. తక్షణం ఇరాఖైపై దాడి చేయాలన్న హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) ఆదేశం హజ్రత్ ఖాలిద్ బిన్ వలీద్ (రదియల్లాహు అన్హు)కి యమామాలోనే లభించింది. అప్పటికే ఈరానీయులతో ముస్లింలు అనేక యుద్ధాలు చేసి ఉన్నారు. వాటిలో అన్నిటికంటే పెద్దది ‘సలాసిల్ యుద్ధం‘ అంటే ‘సంకెళ్ళ పోరాటం’ అని అర్థం. ఈ యుద్ధంలో హుర్మజ్ పెద్ద పెద్ద యోధులు గల ఓ సైనిక జట్టును యుద్ధభూమి నుండి పారిపోకుండా సంకెళ్ళతో బంధించాడు. ఈ యుద్ధం నజ్మా అనే ప్రాంతం దగ్గర జరిగింది. ఈరానీయులు ముస్లిముల కంటే చాలా అధికంగా ఉన్నారు. యావత్తు ఈరాన్లో తన శౌర్యపు ముద్ర వేసిన హుర్మజ్ స్వయంగా తన సైన్యానికి నాయకత్వం వహించాడు. వాస్తవానికి అతను ఇరాఖ్ గవర్నర్ అయినప్పటికీ రాజులా కిరీటాన్ని ధరించేవాడు. అతని కిరీటం లక్ష రూపాయల వ్యయంతో తయారయింది. అందులో కళ్ళు మిరుమిట్లు గొలిపే రత్నాలు పొదగబడి ఉండేవి.
రెండు సైన్యాలూ పంక్తులు సరిదిద్దుకుని యుద్ధానికి సిద్ధ మయ్యాయి. అంతలో స్వయంగా హుర్మజ్ గుర్రంపై యుద్ధరంగానికి వచ్చి ప్రాణులను చంపితే ఏం లాభం? ముస్లిముల నాయకుడు నాతో స్వయంగా పోరాడితే యుద్ధ నిర్ణయం జరిగిపోతుంది” అని సవాలు విసిరాడు. అటు నుండి హజ్రత్ ఖాలీద్ బిన్ వలీద్ (రదియల్లాహు అన్హు) స్వయంగా అతనితో పోరాడటానికి సిద్ధమయ్యారు. కాని హుర్మజ్ మనసులో దురుద్దేశ్యం ఉంది. విశ్వాసులు నాయకునిది పైచేయి అయిన పక్షంలో అతనిపై విరుచుకు పడటానికి కొందరిని అతడు కనబడకుండా దాచి ఉంచాడు. నాయకులిద్దరూ ముఖాముఖి అవగానే హజ్రత్ ఖాలిద్ (రదియల్లాహు అన్హు) ఖడ్గంతో హుర్మజ్ పై దాడిచేశారు. ఆయన ఖడ్గం హుర్మజ్ ఇనుప కవచం పై పడి వేరయిపోయింది. ఈసారి హుర్మజ్ హజ్రత్ ఖాలిద్ (రదియల్లాహు అన్హు) పై ఖడ్గం ఝళిపించాడు.
హజ్రత్ ఖాలిద్ (రదియల్లాహు అన్హు) ఇనుప కవచం తొడగని పక్షంలో ఆ దాడికి ప్రాణాలు కోల్పోయేవారేమో! హజ్రత్ ఖాలిద్ (రదియల్లాహు అన్హు) ఖడ్గాన్ని విసిరేసి హుర్మాజ్ నడుం పట్టి అతణ్ణి పైకెత్తారు. ఇది చూసి దాగి ఉన్న అతని సైనికులు బయటకొచ్చారు. ఇటు నుండి బనీ తమీమ్ యొక్క ప్రసిద్ధ అశ్వరూఢుడయిన ఖాఖా బిన్ అమ్ర్ (రదియల్లాహు అన్హు) హజ్రత్ ఖాలిద్ (రదియల్లాహు అన్హు) కు మద్దతుగా రంగ ప్రవేశం చేసి ఈరానీ సైనికులను నిలువరించారు. హజ్రత్ ఖాలిద్ (రదియల్లాహు అన్హు) అదను చూసి హుర్మజ్ ను నేలపై వేసి కొట్టారు. అతని శిరస్సును ఖండించి యుద్ధ రంగంలో విసిరేశారు. ఇది చూసి ఈరానీయులు ధైర్యసాహసాలు నీరుగారిపోయాయి. అయినా వారి నాయకులు మాత్రం వారిని ప్రేరేపిస్తూ నగారాలు వాయించుతూ ముస్లింలపై దాడి చేశారు. కొంతసేపు భీకర యుద్ధం జరిగింది. చివరికి ఈరానీయులు పారిపోయారు.
ఇరాఖ్ సరిహద్దు ప్రాంతంలో కొత్తగా ఇస్లాం స్వీకరించిన ముసన్నా బిన్ హారిస్ పెద్ద ధనికుడు. ఆయన ఈ యుద్ధాల్లో వీరోచితంగా పోరాడాడు. యుద్ధ రంగం నుండి పారిపోతున్న ఈరానీయులను వెంటాడటానికి హజ్రత్ ఖాలిద్ బిన్ వలీద్ (రదియల్లాహు అన్హు) ముసన్నాను పంపారు. హుర్మజ్ కు కుమ్మక్కుగా వస్తున్న ఈరానీ సైనిక దళం ముసన్నాను అడ్డుకుంది. ఈ సమాచారం అందగానే ఖాలిద్ బిన్ వలీద్ (రదియల్లాహు అన్హు) సైన్యాన్ని తీసుకొని అక్కడికి చేరుకున్నారు. ఇక్కడ కూడా ఈరానీయులు అపజయం పాలయ్యారు. విశ్వాసులకు విజయం లభించింది.
ఈ పరాజయ పరంపర గురించి విని ఇరానీ నాయకులు అరబ్బులతో పోరాడటానికి అరబ్బు సైన్యాన్నే పంపాలని తలచారు. ఎందుకంటే వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి. క్రైస్తవ మతాన్ని ఆచరించే కొన్ని అరబ్బు తెగలు ఈరానీయుల పాలనలో ఉండేవి. వారిని సమీకరించి ఓ సైన్యం తయారు చేయబడింది. ఓ ఈరానీ నాయకుడు దానికి సేనాపతిగా నియమించబడ్డాడు. ఆ ప్రాంతపు రెండు నదులు దజ్లా మరియు ఫరాత్ -కలిసే చోట రెండు సైన్యాలూ ముఖాముఖీ అయ్యాయి. హజ్రత్ ఖాలిద్ బిన్ వలీద్ (రదియల్లాహు అన్హు) సైన్యాన్ని మూడు భాగాలుగా విభజించారు. ఓ భాగాన్ని స్వయంగా తానే తీసుకొని ముందుకెళ్ళారు. మిగతా రెండు భాగాలకు ముసన్నా బిన్ హారిస్ మరియు ఖాఖా బిన్ అమ్ర్ ను నాయకులుగా నియమించి అక్కడే వదిలారు. యుద్ధం భీకరరూపం దాల్చిన సమయంలో ముసన్నా ఉల్లాసభరితమయిన సైనికులను తీసుకొని కుడివైపు నుండి ఈరానీయులపై విరుచుకుపడ్డారు. ఈ దెబ్బతో ఈరానీయులు ఓటమి అంచుకు చేరుకున్నారు. కాని నాయకులు ప్రోత్సహించి వారిని సంభాళించారు. అంతలోనే ఖాఖా బిన్ అమ్ర్ తన సైన్యంతో ఈరానీయులపై ఎడమవైపు నుంచి మెరుపు దాడి చేశారు. దీంతో ఈరానీయుల ఆశలు అడియాసలయ్యాయి. ఇరానీయులు ఎవరిపై అపారమయిన నమ్మకంతో యుద్ధానికి వచ్చారో వారే- క్రైస్తవ అరబ్బులే రణరంగం వదిలి పారిపోయారు.
ఇలాంటి అనేక చిన్న పెద్ద యుద్ధాల అనంతరం హజ్రత్ ఖాలిద్ బిన్ వలీద్ (రదియల్లాహు అన్హు) ‘హీర’ పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ యుద్ధాలలో జోన్ నదీ యుద్ధం అతి పెద్దది. దీంట్లో ఈరానీయులు శక్తి నంతటినీ కూడదీసుకుని పోరాడారు, కాని ఇక్కడా పరాభవమే మిగిలింది. వారి సైనికులు వేల సంఖ్యలో మరణించారు. ‘హీర’ పాత నగరం చాలా అందంగా ఉండేది. వాస్తవానికి అది ఇరానీయుల అధీనంలో గల ఓ అరబ్బు రాజ్యానికి రాజధాని. ‘హీర’ యొక్క ఓ అరబ్బు రాజు ఫరాత్ నదీ తీరాన ఓ బ్రహ్మాండమైన భవనాన్ని నిర్మించాడు. ఈ భవన నిర్మాణంలో రోమ్ మరియు ఈరాన్ కళాకారుల వాస్తు కళానైపుణ్యం ఉట్టి పడ్డుతుంది. దీని నిర్మాణంలో ‘హీర’ రాజు తన సర్వస్వాన్ని వెచ్చించాడు. ప్రస్తుతం అక్కడ ‘కూఫా’ అనే పట్టణం ఉంది. హీర పాత నగరం ఇక్కడ్నుంచి సుమారు మూడు మైళ్ళ దూరంలో ఉండేది. హీర రాజులు వంశపారం పర్యంగా అరబ్బులైనప్పటికీ క్రైస్తవమతాన్ని పాటించేవారు. వీరు అగ్నిపూజారులైన ఈరానీ రాజులకు పన్ను చెల్లించేవారు.
కొన్నాళ్ళ తర్వాత హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) ఈరాన్ ని జయించే పనిని ముసన్నా బిన్ హారిస్కు వదిలి సిరియా వెళ్ళమని హజ్రత్ ఖాలీద్ బిన్ వలీద్ (రదియల్లాహు అన్హు) గారికి ఆజ్ఞాపించారు. ఎందుకంటే అక్కడ క్రైస్తవులు చాలా బలం కూడగట్టుకున్నారు. దాని తరువాత ఈరాన్లో అనేక పెద్ద పెద్ద యుద్ధాలు జరిగాయి. ఆ యుద్దాల్లో అగ్ని పూజారులైన ఈరానీయుల వెన్ను విరిగింది. చివరికి ఈరాన్ ముస్లింల వశమయ్యింది. కాని ఈ సంఘటనలు హజ్రత్ అబూబకర్ (రదియల్లాహు అన్హు) తర్వాత కాలం- అనగా హజ్రత్ ఉమర్ ఫారూఖ్ (రదియల్లాహు అన్హు) హయాంలో సంభవించాయి. వాటిని ఇక్కడ ప్రస్తావించడం సబబుకాదు.
మరణం
హిజ్రీ పదమూడవ సంవత్సరం జమాది ఉల్ ఆఖిర్ నెల ఏడవ తేదీన హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) అస్వస్థతకు గురయ్యారు. చల్లని గాలులు వీస్తున్న సమయంలో హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) చన్నీళ్ల స్నానం చేశారు. చలి వల్ల జ్వరం వచ్చింది. పదిహేను రోజుల దాకా జ్వరం పట్టి పీడించింది. ఆయన స్థానంలో హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) మస్జిదులో నమాజ్ చేయించసాగారు. ఆయన పొరుగునే హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు అన్హు) ఉండేవారు. అందుచేత హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) జబ్బు పడ్డ కాలంలో హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు అన్హు) ఎల్లప్పుడూ ఆయన సేవలో ఉండేవారు.
జబ్బు తీవ్రతరమైనప్పుడు హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) గారికి తన ఉత్తరాధికారిగా నియమించాలనే ఆలోచన కలిగింది. తన స్థానంలో హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) గారిని ఖలీఫాగా నియమించాలని ఆయన నిర్ణయించారు. సహాబా (అనుచరుల) ను సంప్రదించారు. మీ ఎంపిక సరైనదని కొందరంటే, హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) గారికి ఆవేశం ఎక్కువ అని మరికొందరు అభిప్రాయపడ్డారు. ఇది విని హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) “ఉత్తరాధికారపు బాధ్యత భుజస్కంధాలపై పడగానే ఆయన మారిపోతారు. నాకు కోపం వచ్చినప్పుడు ఆయన నన్ను శాంతపరుస్తారు. ఏదైనా విషయంలో నేను మెత్తగా వ్యవహరిస్తే ఆయన నన్ను కఠినంగా వ్యవహరించమని సలహా ఇచ్చేవారు. ఇది నా అనుభవం ”అని అన్నారు.
హజ్రత్ ఖాలిద్ బిన్ వలీద్ (రదియల్లాహు అన్హు) గారి స్థానంలో ఇరాఖ్ సైన్యానికి సేనాధిపతిగా నియుక్తులైన హజ్రత్ ముసన్నా బిన్ హారిస్ (రదియల్లాహు అన్హు) మదీనా చేరుకున్న రోజు హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) గారి జీవితపు ఆఖరి రోజు, ఆయన్ని పిలిపించి ఇరాఖ్ స్థితిగతుల గురించి వాకబు చేశారు. “ఈరాన్ రాజు కొత్త సైన్యాన్ని పంపాడు. నా వద్ద చాలా కొద్ది సైన్యం ఉంది “అని అన్నారు. హజ్రత్ ముసన్నా బిన్ హారిస్ (రదియల్లాహు అన్హు). వెంటనే హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) గారిని పిలిపించి “నా ప్రాణం ఉదయం పోతే సాయంత్రానికల్లా, రాత్రి పోతే ఉదయానికల్లా ముసన్నాకు సైనిక సహాయం చెయ్యండి ” అని అన్నారు.
వ్యాధిగ్రస్తులైన కాలంలో ఓ రోజు “బైతుల్ మాల్ (కోశాగారము) నుండి నాకు ఇప్పటి వరకు మొత్తం ఎంత వేతనం లభించింది?” అని అడిగారు. లెక్క గట్టి ఆరు వేల దిర్హములు (పదిహేను వందల రూపాయలు) అని తెలియ జేయబడింది. “నా భూమి అమ్మి ఈ సొమ్మును వాపసు చేయండి” అని అన్నారు. ఆ తరువాత మళ్ళీ ‘నేను ఖలీఫాగా నియుక్తుణ్ణయ్యాక నా సిరిసంపదల్లో ఎంత వృద్ధి జరిగింది?’ అని అడిగారు. “ఏముందీ? ఓ అబిసీనియా బానిస ఉన్నాడు. అతడు విశ్వాసుల ఖడ్గాలకు పట్టిన తుప్పును వదిలిస్తాడు. ఇంట్లో పనులు చేస్తాడు. నీళ్ళు తేవడానికి ఉపయోగించే ఓ ఒంటె ఉంది. రూపాయి పావలా ఖరీదు చేసే ఓ దుప్పటి ఉంది” అని అన్నారు ఇంటివారు. “నా మరణం తర్వాత ఈ మూడింటినీ హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) వద్దకు పంపేయండి” అని అన్నారు. మరణానికి ముందు ప్రియపుత్రిక హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హ) గారి నుద్దేశ్యించి “దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి కఫన్ (అంత్యక్రియల వస్త్రము)లో ఎన్ని వస్త్రాలు వాడారు” అని అడిగారు. “మూడు వస్త్రాలు” అని జవాబిచ్చారు హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హ). “నా కఫన్ (శవవస్త్రము)లో కూడా మూడు వస్త్రాలే ఉండాలి. నేను ప్రస్తుతం వాడుతున్న ఈ రెండు దుప్పట్లు. వీటిని కాస్త ఉతికించండి. ఒక వస్త్రం కొత్తది తీసుకోండి” అని అన్నారు. ఇది విని హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హ) “నాన్నగారూ! మీ అంత్యక్రియల కోసం కొత్త వస్త్రం కూడా కొనలేనంత దీన స్థితిలో ఉన్నామా మనం?” అని అడిగారు. అది కాదమ్మా! “చనిపోయే వారికన్నా జీవించి ఉన్న వారికి కొత్త బట్టల అవసరం ఎక్కువ”అని అన్నారు. తరువాత మళ్ళీ “ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఏ రోజు మరణించారు?” అని అడిగారు. “సోమవారం” అని జవాబిచ్చారు హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హ). “ఈ రోజు సోమవారం. నేను కూడా ఈ రోజే మరణిస్తానని ఆశిస్తున్నాను. నా సమాధి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సమాధి ప్రక్కన ఉండేలా చూడండి” అని అన్నారు.
హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) జుమాది ఉల్ ఆఖిర్ నెల 22వ తేదీన మగ్రిబ్ మరియు ఇషా మధ్య సమయంలో మరణించారు. హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) జనాజా నమాజ్ చేయించారు. అదే రోజు రాత్రి హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హ) గారి గదిలో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సమాధి ప్రక్కన ఆయన అంత్యక్రియలు జరిగాయి. ఆయన ఖలీఫాగా 2 సంవత్సరాల, 3 నెలల, 11 రోజులు పరిపాలించారు.
మరణించేనాటికి ఆయన వయస్సు 63 సంవత్సరాలు. ఆయనకు ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు గలరు. పెద్ద కొడుకు అబ్దుర్రహ్మాన్. ఆయన చాలా కాలం వరకు ఇస్లాం స్వీకరించక అవిశ్వాసుల పక్షాన విశ్వాసులతో పోరాడారు. రెండో కొడుకు అబ్దుల్లాహ్. ఆయన ఇస్లాంకు ఎంతో సేవ చేశారు. హిజ్రత్ సందర్భంలో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మరియు హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) నూర్ గుహలో ఉన్నప్పుడు ఆయన ఉదయం పూట మక్కాలో గడిపి ఖురైషులు ఎత్తుగడల గురించి తెలుసుకొని రాత్రి వేళ సూర్ గుహకు చేరుకునేవారు. తాయఫ్ యుద్ధంలో ఆయన కాలికి బాణం తగిలి గాయం అయింది. ఆ బాధతో ఆయన మరణించారు. మూడవ కుమారుడు ముహమ్మద్. ఆయన మదీనాలో జన్మించారు. హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) గారి పెద్ద కుమార్తె పేరు హజ్రత్ అస్మా (రదియల్లాహు అన్హ). ఆమె పెళ్ళి చాలా మర్యాదస్తులైన సహాబి (అనుచరులు) జుబైర్ బిన్ అవామ్ (రదియల్లాహు అన్హు) గారితో జరిగింది. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి సతీమణులలో ఒకరైన హజ్రత్ ఆయిషా సిద్దీఖా (రదియల్లాహు అన్హ) ఆయన గారి రెండవ పుత్రిక. మూడవ కుమార్తె పేరు ఉమ్మెకుల్సుమ్ (రదియల్లాహు అన్హు). అబ్దుల్లాహ్ (రదియల్లాహు అన్హు) గారికి సంతానం కలుగలేదు. అందుచేత హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) గారి వంశపరంపర అబ్దుర్రహ్మాన్ (రదియల్లాహు అన్హు) మరియు ముహమ్మద్ (రదియల్లాహు అన్హు) గారి సంతానం ద్వారా కొనసాగింది.
హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)తో పరిచయం అయిన కాలంలో ఇంకా మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు దైవదౌత్యం అందలేదు. “అల్లాహ్ నన్ను తన ప్రవక్తగా ఎన్నుకొని, ప్రజలకు హితబోధచేసే పనిని అప్పగించాడు” అని దైవప్రవక్త హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) గారితో అనగానే ఆయన ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా “మీరు దైవప్రవక్తగా ఎన్నుకో బడ్డారనే విషయాన్ని ” నేను విశ్వసిస్తున్నాను” అని అన్నారు. ఆయన వృద్ధాప్యంలో ఖలీఫా అయ్యారు. ఆ సమయంలో ఆయన వయస్సు 61 సంవత్సరాలు. కాని ప్రజలు జకాత్ ఇవ్వడానికి నిరాకరించి, అరబ్బులోని 24 తెగలు యుద్ధానికి సయితం సన్నద్ధమైనప్పుడు ఆయన చూపిన ధైర్యసాహసాలకు అందరూ ఆశ్చర్యచకితులయ్యారు. సహాబా (ప్రవక్త సహచరులు)లలో కొందరు – ‘ఎవరైతే జకాత్ ఇవ్వడానికి నిరాకరించారో వారిని జకాత్ నుండి మినహాయించండి’ అని సలహా ఇచ్చారు. హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) దానికి సుతరామూ ఒప్పుకోలేదు. “ఒకవేళ మీరు వారితో యుద్ధం చేయక పోయినా నేను ఒక్కడినే వారితో పోరాడుతాను” అని తేల్చి చెప్పారు. ఆ తరువాత సహచరులను వెంట బెట్టుకుని మదీనా నుండి బయలుదేరారు. మదీనాపై దాడి చేయడానికి పెద్ద పెద్ద సైన్యాలతో వచ్చిన వారందరినీ వరుసగా ఓడిస్తూ పోయారు.
హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) గారి హృదయం విశ్వాస (ఈమాన్) గని లాంటిది. ఆయన మనస్సు అల్లాహ్ ప్రేమతో, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రేమతో నిండి ఉండేది. ఆయన కేవలం రెండు సంవత్సరాల కన్నా కాస్త ఎక్కువ కాలం ఖలీఫాగా ఉన్నారు. అయితేనేం, దశాబ్దాలలో సయితం నెరవేర్చలేని ఘనకార్యాలు ఆ స్వల్ప వ్యవధిలోనే చాలా సమర్ధవంతంగా నిర్వహించారు హజ్రత్ అబూ బకర్ సిద్దీఖ్ (రదియల్లాహు అన్హు).
కారుణ్య ప్రభువు ఆయనతో ప్రసన్నుడవుగాక!
(సమాప్తం)
హజ్రత్ అబూబక్ర్ సిద్దీఖ్ (రదియల్లాహు అన్హు) అంతిమ దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కు ప్రాణ స్నేహితులు. తాను నమ్మిన ధర్మం కోసం సర్వస్వాన్ని ధారబోసిన త్యాగశీలి. మితభాషి, మృదుస్వభావి, అల్లాహ్ కు భయపడి ప్రజలకు నాయకత్వం వహించిన ప్రప్రథమ మార్గదర్శక ఖలీఫా. మానవత్వం, పరోపకార భావం ఆయనలో మెండుగా ఉండేవి. అనాథల, అగత్యపరుల పట్ల అమితమైన జాలి చూపేవారు. రోగుల పరామర్శ, బాధితుల సేవ అంటే ఆయనకెంతో ఇష్టం. స్వతహాగా మృదుస్వభావి అయినప్పటికీ ధర్మాదేశాలను ప్రవేశపెట్టే విషయంలో చాలా ఖచ్చితంగా వ్యవహరించేవారు. అబూబక్ర్ బ్రతికి ఉండగా ధర్మావలంబనలో హెచ్చుతగ్గులకు ఆస్కారం ఉండబోదని సూటిగా చెప్పారు. ఏ విషయమైనా ఖుర్ఆన్ కు కాస్త అటూ ఇటూగా ఉంటే సహించేవారుకారు. ఏ నిర్ణయం గైకొన్నా దివ్య ఖుర్ఆన్ ప్రకారమే గైకొనేవారు. తన పరిపాలనా కాలంలో “జకాత్”ను ఎగ్గొట్టడానికి ప్రయత్నించిన వారి మెడలు వంచి, ధర్మాన్ని రక్షించిన ధర్మ ఖలీఫా ఆయన. -రదియల్లాహు అన్హు –
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
విశ్వాసం & విశ్వాస మాధుర్యం (Emaan & Halawatul Emaan) [34 నిముషాలు] వక్త: ముహమ్మద్ అబూబక్ర్ బేగ్ ఉమ్రీ (ఏలూరు) – Speaker : Muhammad Abubaker Baig Omeri (Eluru) https://youtu.be/nGEEpqhFH9c
విశ్వాసం (ఈమాన్) యొక్క లక్షణాలు, విశ్వాస మాధుర్యాన్ని రుచి చూసేందుకు అవసరమైన మూడు గుణాల గురించి ఈ ప్రసంగం వివరిస్తుంది. విశ్వాసం ఒకసారి హృదయంలో ప్రవేశించాక స్థిరంగా ఉంటుందని, కానీ మంచి పనులు మరియు పాపాలను బట్టి అది హెచ్చుతగ్గులకు లోనవుతుందని సహాబాల ఉదాహరణలతో వివరించబడింది. విశ్వాస మాధుర్యాన్ని రుచి చూడాలంటే అల్లాహ్‌ను, ఆయన ప్రవక్తను అన్నిటికంటే ఎక్కువగా ప్రేమించడం; కేవలం అల్లాహ్ కొరకే ఒకరినొకరు ప్రేమించడం మరియు ద్వేషించడం; మరియు విశ్వసించిన తర్వాత అవిశ్వాసం వైపు తిరిగి వెళ్లడాన్ని అగ్నిలో పడవేయబడటమంత తీవ్రంగా ద్వేషించడం అనే మూడు లక్షణాలు అవసరమని చెప్పబడింది. హజ్రత్ అబూబక్ర్, ఉమర్, బిలాల్, మరియు హంజలా (రదియల్లాహు అన్హుమ్) వంటి సహాబాల జీవితాల నుండి ఉదాహరణలు వారి ప్రేమ, త్యాగం మరియు విశ్వాస స్థిరత్వాన్ని తెలియజేస్తాయి.
అల్ హమ్దులిల్లాహి వహ్దహ్, వస్సలాతు వస్సలాము అలా మల్లా నబియ్య బఅద, అమ్మా బఅద్. ఫ అవూజు బిల్లాహిస్సమీయిల్ అలీమ్ మినష్షైతానిర్రజీమ్ మిన్ హమ్దిహీ వ నఫ్ఖిహీ వ నఫ్సిహీ, బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్.
يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اتَّقُوا اللَّهَ حَقَّ تُقَاتِهِ وَلَا تَمُوتُنَّ إِلَّا وَأَنْتُمْ مُسْلِمُونَ [యా అయ్యుహల్లజీన ఆమనుత్తఖుల్లాహ హఖ్ఖ తుఖాతిహీ వలా తమూతున్న ఇల్లా వ అన్తుమ్ ముస్లిమూన్] (ఓ విశ్వాసులారా! అల్లాహ్‌కు భయపడవలసిన విధంగా భయపడండి. మరియు మీరు ముస్లింలుగా తప్ప మరణించకండి.)
سُبْحَانَكَ لَا عِلْمَ لَنَا إِلَّا مَا عَلَّمْتَنَا ۖ إِنَّكَ أَنْتَ الْعَلِيمُ الْحَكِيمُ [సుబ్ హా నక లా ఇల్మ లనా ఇల్లా మా అల్లమ్తనా ఇన్నక అన్తల్ అలీముల్ హకీమ్] (ఓ అల్లాహ్! నీవు పవిత్రుడవు. నీవు మాకు నేర్పినది తప్ప మాకు మరే జ్ఞానమూ లేదు. నిశ్చయంగా, నీవే సర్వజ్ఞానివి, వివేకవంతుడవు.)
رَبِّ اشْرَحْ لِي صَدْرِي وَيَسِّرْ لِي أَمْرِي وَاحْلُلْ عُقْدَةً مِّن لِّسَانِي يَفْقَهُوا قَوْلِي [రబ్బిష్రహ్ లీ సద్రీ వ యస్సిర్ లీ అమ్ రీ వహ్ లుల్ ఉఖ్దతమ్ మిల్లిసానీ యఫ్ఖహూ ఖౌలీ] (ఓ నా ప్రభూ! నా హృదయాన్ని నా కోసం విశాలపరచు. మరియు నా కార్యాన్ని నాకు సులభతరం చేయి. మరియు నా నాలుకలోని ముడిని విప్పు, తద్వారా వారు నా మాటను అర్థం చేసుకోగలరు.)
اللهم رب زدني علما [అల్లాహుమ్మ రబ్బి జిద్నీ ఇల్మా] (ఓ అల్లాహ్, ఓ నా ప్రభూ, నా జ్ఞానాన్ని వృద్ధి చేయి).
ప్రియ సోదరులారా, తొలగింప బడిన షైతాన్ యొక్క కీడు నుండి రక్షింపబడుటకై అల్లాహ్ యొక్క శరణు వేడుకుంటూ, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, ప్రతిఫల దినానికి యజమాని అయినటువంటి అల్లాహ్ తబారక వ తఆలా యొక్క శుభనామముతో ప్రారంభిస్తున్నాను. అన్ని రకాల పొగడ్తలు, ప్రశంసలు, సకల స్తోత్రములు అల్లాహ్ తబారక వ తఆలాకే అంకితము. ఎవరైతే ఈ సమస్త సృష్టిని సృష్టించి తన అధికార పీఠాన్ని అధిష్టించి, ఆయన సృష్టించినటువంటి సృష్టిరాశులన్నింటిలో కల్లా ఉన్నతమైనటువంటి జీవిగా మానవుడిని మలిచాడు.
వారి వైపునకు సందేశాన్ని జారీ చేసేటటువంటి ఉద్దేశముతో ప్రవక్తల యొక్క పరంపరను ప్రారంభించాడు. ఈ ప్రవక్తల యొక్క పరంపర హజ్రత్ ఆదం అలైహిస్సలాతు వస్సలాం నుంచి మొదలుకొని చిట్టచివరి ప్రవక్త, మహనీయుడైనటువంటి ప్రవక్త, ఆదర్శ మహామూర్తి, హృదయాల విజేత, జనాబె ముస్తఫా, అహ్మదే ముజ్తబా, ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై తన దైవదౌత్యాన్ని పరిసమాప్తం గావించాడు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ ధరణిపై ఎంతమంది దైవ ప్రవక్తలనైతే ప్రభవింపజేశాడో వారందరిపై కూడా అల్లాహ్ తబారక వ తఆలా యొక్క కారుణ్యాలు కురిపింపజేయుగాక. ముఖ్యంగా, చిట్టచివరి ప్రవక్త, మహనీయుడైనటువంటి ప్రవక్త, ముహమ్మదే అక్రం సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అల్లాహ్ తబారక వ తఆలా యొక్క కోటానుకోట్ల దరూద్‌లూ సలాములూ, శుభాలూ మరియు కారుణ్యాలూ కురిపింపజేయుగాక, ఆమీన్.
సోదర మహాశయులారా, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్ గ్రంథంలో మూడో సూరా, సూరా ఆలి ఇమ్రాన్ 102వ వాక్యంలో ఈ విధంగా ప్రస్తావిస్తున్నాడు:
يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اتَّقُوا اللَّهَ حَقَّ تُقَاتِهِ وَلَا تَمُوتُنَّ إِلَّا وَأَنْتُمْ مُسْلِمُونَ [యా అయ్యుహల్లజీన ఆమనుత్తఖుల్లాహ హఖ్ఖ తుఖాతిహీ వలా తమూతున్న ఇల్లా వ అన్తుమ్ ముస్లిమూన్] ఓ విశ్వాసులారా! అల్లాహ్‌కు ఎంతగా భయపడాలో అంతగా భయపడండి. ముస్లింలుగా తప్ప మరణించకండి.
ఓ విశ్వసించినటువంటి ప్రజలారా! సోదర మహాశయులారా, ఎక్కడైతే అల్లాహ్ తబారక వ తఆలా ఈ పదాలను వినియోగిస్తున్నాడో, యా అయ్యుహల్లజీన ఆమనూ, దాని అర్థము ఓ విశ్వసించినటువంటి ప్రజలారా అని. అల్లాహ్ తబారక వ తఆలా అంటున్నాడు, “ఓ విశ్వసించినటువంటి ప్రజలారా, మీరు అల్లాహ్ తబారక వ తఆలాకు ఆ విధంగా భయపడండి, ఏ విధంగానైతే ఆయనకు భయపడాల్సినటువంటి హక్కు ఉన్నదో. వలా తమూతున్న ఇల్లా వ అన్తుమ్ ముస్లిమూన్, మరియు మీరు విశ్వాసులుగా తప్ప, అవిశ్వాసులుగా మీరు మరణించకండి. సోదర మహాశయులారా, ఈ వాక్యంలో ప్రస్తావించబడినటువంటి విషయము విశ్వాసుల గురించి, విశ్వాసం గురించి.
విశ్వాసం (ఈమాన్) యొక్క లక్షణాలు
అయితే, విశ్వాసానికి ఉన్నటువంటి లక్షణాల్లో ఒక ముఖ్యమైనటువంటి లక్షణం ఏమిటంటే, విశ్వాసం ఎప్పుడైతే ఒకరిలో ప్రవేశిస్తుందో, దానిని వారి మనసుల నుంచి తీయటము, అది ఎవరి తరం కానటువంటి పని అయిపోతుంది. అబూ సుఫియాన్‌ను హిరకల్ అనేటటువంటి రాజు ఈ విధంగా ప్రశ్నిస్తున్నాడు:
ఎవరైతే ఆయనను విశ్వసించారో, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని, ఇస్లాంను స్వీకరించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో, అందులో ప్రవేశించిన తర్వాత, అందులో ఉన్నటువంటి వారు ఎవరైనా గాని, వారు వెనక్కు మరలారా? లేకపోతే దాన్ని వదిలివేశారా?
అంటే అబూ సుఫియాన్, ఇస్లాంకు బద్ధశత్రువు అయినప్పటికీ కూడా ఆ రోజుల్లో, ఆ కాలంలో, ఇంకా ఇస్లాం స్వీకరించనప్పుడు, జవాబు పలుకుతూ అంటున్నాడు, “లా”, వారిలో ఏ ఒక్కరూ కూడా వారు విశ్వసించిన తర్వాత అవిశ్వాస వైఖరికి పాల్పడలేదు, వారు ఏ విధంగా కూడా ఇర్తిదాద్‌కు పాల్పడలేదు, ధర్మభ్రష్టతకు పాల్పడలేదు అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. అప్పుడు హిరకల్ రాజు అంటున్నాడు, “కధాలికల్ ఈమాన్ హీన తుఖాలితు బషాషతుహుల్ ఖులూబ్.” విశ్వాసం అంటే ఇదే, అది ఎప్పుడైతే మనిషి యొక్క హృదయంలో ప్రవేశిస్తుందో, దానిని హృదయంలో ఎలా నాటుకుంటుందంటే, దాన్ని తీయటం ఎవరివల్లా కాదు.
అదే విధంగా, విశ్వాసం యొక్క మరొక లక్షణం ఏమిటంటే సోదరులారా, విశ్వాసం అన్నటువంటిది ప్రతి వ్యక్తిలోనూ ఒకే స్థాయిలో ఉండదు. కొందరిలో ఉచ్చ స్థాయికి చెంది ఉంటే, మరికొందరిలో అతి తక్కువ స్థాయికి చెందినదై కూడా ఉండవచ్చు. సహాబాల యొక్క విశ్వాసం ఎంత గొప్ప విశ్వాసం అంటే, వారిపై ఎన్ని కుతంత్రాలు, ఎన్ని కుట్రలు చేసినా కూడా, వారిని వారి విశ్వాసం నుంచి ఏ విధంగా ఎవరూ తొలగింపలేకపోయారన్నటువంటి విషయాన్ని అల్లాహ్ సూరా ఇబ్రాహీం, 14వ సూరా, 46వ వాక్యంలో ఈ విధంగా ప్రస్తావిస్తున్నాడు:
وَقَدْ مَكَرُوا مَكْرَهُمْ وَعِندَ اللَّهِ مَكْرُهُمْ وَإِن كَانَ مَكْرُهُمْ لِتَزُولَ مِنْهُ الْجِبَالُ [వ ఖద్ మకరూ మక్రహుమ్ వ ఇందల్లాహి మక్రుహుమ్ వ ఇన్ కాన మక్రుహుమ్ లితజూల మిన్హుల్ జిబాల్] వాళ్ళు తమ ఎత్తుల్ని తాము వేసి చూసుకున్నారు. వారి ఎత్తుగడలన్నీ అల్లాహ్ దృష్టిలో ఉన్నాయి. వారి ఎత్తుగడలు పర్వతాలను కదిలించేటంతటి భీకరమైనవేమీ కావు.
అల్లాహ్ తబారక వ తఆలా అంటున్నాడు, వారు ఎన్ని కుట్రలు పన్నారంటే, వారు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా కూడా ఈ పర్వతాలను, కొండలను వారి స్థాయి నుంచి, వారి ప్రదేశం నుంచి వారు కదపలేకపోయారన్నటువంటి విషయాన్ని అల్లాహ్ ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. కాబట్టి సోదరులారా, ఇక్కడ కొండలు, పర్వతాలు అన్నటువంటి విషయాన్ని సహాబాల యొక్క విశ్వాసంతో పోల్చటం జరిగింది. అదే విధంగా అల్లాహ్ తబారక వ తఆలా సూరతుల్ హుజరాత్, 49వ సూరా, మూడో వాక్యంలో ఈ విధంగా ప్రస్తావిస్తున్నాడు:
أُولَٰئِكَ الَّذِينَ امْتَحَنَ اللَّهُ قُلُوبَهُمْ لِلتَّقْوَىٰ ۚ لَهُم مَّغْفِرَةٌ وَأَجْرٌ عَظِيمٌ [ఉలాయికల్లజీనమ్ తహనల్లాహు ఖులూబహుమ్ లిత్తఖ్వా లహుమ్ మగ్ఫిరతున్ వ అజ్రున్ అజీమ్] వారే వీరు, వీరి హృదయాలను అల్లాహ్ తబారక వ తఆలా తఖ్వా, భయభక్తుల కొరకు పరీక్షించి ఉంచాడు, వారికి క్షమాపణ మరియు గొప్ప ప్రతిఫలం ఉన్నాయి.
విశ్వాసం యొక్క మరొక లక్షణం ఏమిటంటే, విశ్వాసము పెరగటము మరియు తరగటము. అంటే సోదరులారా, విశ్వాసము ఒక్కొక్కసారి మనిషి చేసేటటువంటి ఆచరణకు అది పెరుగుతూ ఉంటుంది. మరి అదే విధంగా, మనిషి చేసేటటువంటి పాప కార్యాలకు గాను విశ్వాసము తరుగుతూ ఉంటుందన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం గ్రహించవలసినటువంటి అవసరము ఎంతైనా ఉన్నది.
అందుకనే, ఖురాన్ గ్రంథంలో ఎన్నోసార్లు, పలుసార్లు అల్లాహ్ తబారక వ తఆలా మన యొక్క విశ్వాసాన్ని పునఃపరిశీలన చేసుకోవలసిందిగా మనకు సెలవిస్తూ, ఖురాన్‌లో సూరా నిసా, నాలుగవ సూరా, 136వ వాక్యంలో ఈ విధంగా అల్లాహ్ తబారక వ తఆలా ప్రస్తావిస్తున్నాడు:
يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا آمِنُوا بِاللَّهِ وَرَسُولِهِ وَالْكِتَابِ الَّذِي نَزَّلَ عَلَىٰ رَسُولِهِ وَالْكِتَابِ الَّذِي أَنزَلَ مِن قَبْلُ ۚ وَمَن يَكْفُرْ بِاللَّهِ وَمَلَائِكَتِهِ وَكُتُبِهِ وَرُسُلِهِ وَالْيَوْمِ الْآخِرِ فَقَدْ ضَلَّ ضَلَالًا بَعِيدًا ఓ విశ్వాసులారా! అల్లాహ్‌ను, ఆయన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను, ఆయన తన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం))పై అవతరింపజేసిన గ్రంథాన్నీ, అంతకు మునుపు ఆయన అవతరింపజేసిన గ్రంథాలన్నిటినీ విశ్వసించండి. ఎవడు అల్లాహ్‌ను, ఆయన దూతలను, ఆయన గ్రంథాలను, ఆయన ప్రవక్తలను, అంతిమ దినాన్ని తిరస్కరించాడో వాడు మార్గం తప్పి చాలాదూరం వెళ్ళిపోయాడు.
ఓ విశ్వసించినటువంటి ప్రజలారా, మీరు వాస్తవానికి విశ్వాసులే అయితే, ఏ విధంగానైతే అల్లాహ్ తబారక వ తఆలాపై విశ్వసించాలో, ఆ విధంగా విశ్వసించండి. మరియు ఆ గ్రంథంపై విశ్వసించండి ఏదైతే మీ ప్రవక్తపై అవతరింపజేయబడిందో.
కాబట్టి సోదర మహాశయులారా, అల్లాహ్ తబారక వ తఆలా ఖురాన్‌లో పలుసార్లు మన యొక్క విశ్వాసాన్ని పునఃపరిశీలించుకోవలసిందిగా ఈ విధంగా సెలవిస్తున్నాడంటే, మూడో సూరా 102వ వాక్యం ఏ విధంగానైతే ఈ అంశంలో ప్రారంభంలో పఠించడం జరిగిందో, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ వాక్యంలో అంటున్నాడు:
ఓ విశ్వసించినటువంటి ప్రజలారా, మీరు అల్లాహ్ తబారక వ తఆలాకు ఆ విధంగా భయపడండి ఏ విధంగానైతే భయపడాలో, మరియు అవిశ్వాసులుగా మీరు మరణించకండి, విశ్వాస స్థితిలోనే మీరు మరణించండి సుమా అన్నటువంటి విషయాన్ని అల్లాహ్ ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు.
తబరానీలో దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పినటువంటి ఈ మాటను ఉల్లేఖించడం జరిగింది:
దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఏ విధంగానైతే మీ ఒంటిపై, మీ శరీరంపై దుస్తులు ఏ విధంగానైతే మాసిపోతూ ఉంటాయో, అదే విధంగా మీ విశ్వాసము కూడా మాసిపోతూ ఉంటుంది. కాబట్టి మీరు అల్లాహ్ తబారక వ తఆలాకు దుఆ చేస్తూ ఉండండి, ప్రార్థిస్తూ ఉండండి, “అన్ యుజద్దిదల్ ఈమాన ఫీ ఖులూబికుమ్,” అల్లాహ్ తబారక వ తఆలా మీ హృదయాలలో ఉన్నటువంటి విశ్వాసాన్ని పునరుద్ధరింపజేయవలసిందిగా మీరు అల్లాహ్ తబారక వ తఆలాకు వేడుకోండి అని దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు. ఈ హదీసును ఇమామ్ అల్బానీ రహిమహుల్లాహ్ గారు సహీ అల్-జామియాలో సహీ హదీసుగా ధృవీకరించారు.
సహీ ముస్లింలో హదీస్ నెంబర్ 6966లో మనం చూసినట్లయితే, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సహచరులలో ఒక సహచరుడైనటువంటి, ఒక అగ్రగణ్యుడైనటువంటి సహచరుడు హజ్రత్ హంజలా రదియల్లాహు తలా అన్హు వారి యొక్క ఒక ప్రస్తావన వస్తుంది. ఎవరండీ ఈ హంజలా అంటే? ఆ హంజలాయే ఎవరి గురించైతే దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారో, “హంజలా గసీలుల్ మలాయికా” (హంజలాను దైవదూతలు స్నానం చేయించారు). ఏ రోజైతే హంజలా రదియల్లాహు తలా అన్హు వారికి వివాహము జరిగిందో, అదే రోజు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రకటించినటువంటి యుద్ధ ప్రకటనకు జవాబిస్తూ ఆయన అందులో పాల్గొని మరణించగా, షహాదత్ పొందగా, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, “మీరు హంజలాకు శవస్నానము చేయించవలసిన అవసరము లేదు, గుసుల్ స్నానం చేయించిన అవసరము లేదు ఎందుకంటే హంజలా గసీలుల్ మలాయికా, ఎందుకంటే హంజలాకు దైవదూతలే స్వయానా గుసుల్ ఇచ్చి ఉన్నారు అని.”
అటువంటి హంజలా రదియల్లాహు తలా అన్హు వారు అంటున్నారు, దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సహాబీ అయినటువంటి అబూబక్ర్ నిస్సిద్దీఖ్ రదియల్లాహు తలా అన్హు వారితో కలిసినప్పుడు,
لَقِيَنِي أَبُو بَكْرٍ فَقَالَ كَيْفَ أَنْتَ يَا حَنْظَلَةُ అబూబక్ర్ రదియల్లాహు తలా అన్హు వారు నాతో కలిశారు, కలిసిన తర్వాత ఆయన నాతో అడిగారు, “ఓ హంజలా, నీవు ఎలా ఉన్నావు?” అని.
قَالَ قُلْتُ نَافَقَ حَنْظَلَةُ అప్పుడు హంజలా రదియల్లాహు తలా అన్హు వారు అంటున్నారు, నేను హజ్రత్ అబూబక్ర్ సిద్దీఖ్ రదియల్లాహు తలా అన్హు గారితో అన్నాను, “హంజలా కపటవిశ్వాసి అయిపోయాడు” అని.
قَالَ سُبْحَانَ اللَّهِ مَا تَقُولُ “ఓ హంజలా, ఏమంటున్నావ్? అల్లాహ్ తలా యొక్క పవిత్రతను నేను కొనియాడుతున్నాను. నీవు మునాఫిక్ అయిపోవటం ఏమిటి?” అప్పుడు హంజలా రదియల్లాహు తలా అన్హు వారు అన్నారు,
قُلْتُ نَكُونُ عِنْدَ رَسُولِ اللَّهِ صلى الله عليه وسلم يُذَكِّرُنَا بِالنَّارِ وَالْجَنَّةِ حَتَّى كَأَنَّا رَأْىَ عَيْنٍ فَإِذَا خَرَجْنَا مِنْ عِنْدِ رَسُولِ اللَّهِ صلى الله عليه وسلم عَافَسْنَا الأَزْوَاجَ وَالأَوْلاَدَ وَالضَّيْعَاتِ فَنَسِينَا كَثِيرًا
మనము దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్ద కూర్చుని ఉండగా, ఆయన సమక్షంలో ఉన్నప్పుడు, ఆయన మనకు పరలోకం గురించి హితబోధ చేస్తున్న సమయంలో, స్వర్గము మరియు నరకము గురించి ఆయన హితబోధ చేస్తున్న సమయంలో, మా కళ్ళ నుంచి కన్నీళ్లు కారేవి, మా హృదయాలలో మా విశ్వాసము ఉవ్వెళ్లూరుతూ ఉండేటటువంటిది. కానీ, ఎప్పుడైతే మేము అక్కడి నుంచి కదిలి మా ఇళ్లకు వచ్చేసేటటువంటి వాళ్ళమో, మా యొక్క ఇళ్లలో ప్రవేశించేటటువంటి వాళ్ళం, మా భార్య, పిల్లలు, ఇంటివారు ఇందులో పడిపోయే, ఫనసీనా కసీరా (మేము చాలా వరకు మర్చిపోయాము). ఆయన చెప్పినటువంటి మాటల్లో అత్యధికంగా వాటిని మేము మర్చిపోయేటటువంటి వారము. కాబట్టి, మా ఈ పరిస్థితిని గమనించి, నేను అనుకుంటున్నాను నేను మునాఫిక్‌నై పోయాను అని అబూబక్ర్ సిద్దీఖ్ రదియల్లాహు తలా అన్హు వారితో హంజలా రదియల్లాహు తలా అన్హు వారు అన్నారు.
అబూబక్ర్ సిద్దీఖ్ రదియల్లాహు తలా అన్హు వారు హంజలా రదియల్లాహు తలా అన్హు వారిని తీసుకుని, ఇలా అయితే మరి మా పరిస్థితి ఏమిటి అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు తీసుకొచ్చారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అడుగుతున్నారు, “ఓ హంజలా, ఏమయ్యింది?” అని చెప్పేసి అంటే, అప్పుడు హంజలా రదియల్లాహు తలా అన్హు వారు అన్నారు, “నాఫఖ హంజలా యా రసూలల్లాహ్,” ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, హంజలా మునాఫిక్ అయిపోయాడు, కపటవిశ్వాసి అయిపోయాడు అని. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, “అదేమిటి? అలా ఎందుకు జరిగింది?” అంటే, హంజలా రదియల్లాహు తలా అన్హు వారు ఆ జరిగినదంతా దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తెలియజేశారు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు హంజలా రదియల్లాహు తలా అన్హు వారికి జవాబు పలుకుతూ అంటున్నారు:
“ఆ అల్లాహ్ తబారక వ తఆలా యొక్క సాక్షి, ఎవరి చేతిలో అయితే నా ప్రాణాలు ఉన్నాయో, నేను అల్లాహ్ తబారక వ తఆలాపై ప్రమాణం చేస్తూ అంటున్నాను, మీరు ఏ విధంగానైతే నా సమక్షంలో ఉన్నప్పుడు మీ విశ్వాసం ఏ విధంగా ఉందో, అదే విధంగా గనక ఎల్లప్పుడూ మీరు ఉండగలిగితే, దైవదూతలు మీరు నడిచేటటువంటి మార్గాలలోనూ, మీరు పరుండేటటువంటి మీ పడకల పైనను వారు వచ్చి మీతో కరచాలనం చేయాలనుకునేటటువంటి వారు. కానీ ఓ హంజలా, ఈ విశ్వాసము యొక్క స్థితి ఒక్కొక్కసారి అది ఎలా ఉంటుందంటే, అది ఒక్కొక్కసారి ఉవ్వెళ్లూరుతూ ఉంటుంది ఎప్పుడైతే దాని గురించి ప్రస్తావన జరుగుతూ ఉంటుందో.”
కాబట్టి ఈ హదీస్ ద్వారా మనకు తెలిసినటువంటి విషయం ఏమిటంటే, విశ్వాసం అన్నటువంటిది ఎప్పుడూ నిలకడగా ఉండదు, అది ఒక్కొక్కసారి, ఎప్పుడైతే మనం విశ్వాసం గురించి ప్రస్తావించుకుంటామో ఆ సమయాల్లో మన యొక్క విశ్వాసము ఉచ్చ స్థాయికి చెందుకుంటుంది, మరి అదే విధంగా ఒక్కొక్కసారి ఆ విశ్వాసము మనము చేసేటటువంటి పాప కార్యాల వల్ల కూడా అది తరుగుతూ ఉంటుందన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు.
విశ్వాస మాధుర్యాన్ని రుచి చూచుటకు మూడు లక్షణాలు
విశ్వాసం యొక్క మరొక లక్షణం ఏమిటంటే, విశ్వాసము యొక్క మాధుర్యాన్ని ఆస్వాదించటం. విశ్వాసం యొక్క మాధుర్యం ఏమిటా అని మీరు ఆలోచించినట్లయితే, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా ప్రస్తావిస్తున్నారు:
عَنِ الْعَبَّاسِ بْنِ عَبْدِ الْمُطَّلِبِ، أَنَّهُ سَمِعَ رَسُولَ اللَّهِ صلى الله عليه وسلم يَقُولُ “ ذَاقَ طَعْمَ الإِيمَانِ مَنْ رَضِيَ بِاللَّهِ رَبًّا وَبِالإِسْلاَمِ دِينًا وَبِمُحَمَّدٍ رَسُولاً ” (సహీ అల్-ముస్లిం, కితాబుల్ ఈమాన్, హదీస్ నెంబర్ 34).
దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో అబ్బాస్ బిన్ అబ్దుల్ ముత్తలిబ్ రదియల్లాహు తలా అన్హు వారు ఈ విధంగా ఉల్లేఖిస్తున్నారు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, “ఆ వ్యక్తి విశ్వాసము యొక్క మాధుర్యాన్ని రుచి చూడగలడు, ఎవరైతే అల్లాహ్‌ను తన దైవంగా, ఇస్లామును తన ధర్మంగా మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని తన ప్రవక్తగా అంగీకరించి నడుచుకున్నటువంటి వాడు, తన ఆచరణాత్మకంగా తన జీవితాన్ని గడుపుకున్నటువంటి వాడు కచ్చితంగా విశ్వాసం యొక్క మాధుర్యాన్ని, విశ్వాసం యొక్క రుచిని అతను ఆస్వాదించగలడు” అని దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు.
సోదర మహాశయులారా, ఎలాగైతే మనము తినేటటువంటి రుచిని ఆస్వాదించగలుగుతున్నామో, ఏదైనా ఒక తియ్యటి పదార్థాన్ని తిని మనం దాని యొక్క తియ్యదనాన్ని రుచి చూడగలుగుతున్నాము. మరి అదే విధంగా, మనము సుగంధ ద్రవ్యాలను కూడా వాసన ద్వారా మనము వాటిని ఆస్వాదించగలుగుతున్నామో, వాటి యొక్క రుచిని మనం ఆస్వాదించగలుగుతున్నాము. మరి అదే విధంగా, ఒక తియ్యటి పలుకులను విని వింటూ కూడా మనము ఆ పలుకులలో ఉన్నటువంటి రుచిని కూడా ఆస్వాదించగలుగుతున్నామో, అదే విధంగా విశ్వాసానికి కూడా ఒక లక్షణం ఉంది, అదేమిటంటే వాస్తవానికి మనం విశ్వాసులమైతే, వాస్తవానికి మనలో ఈ లక్షణాలు ఉంటే, ఏదైతే దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిస్తున్నారో, మనం కచ్చితంగా, తప్పకుండా విశ్వాసము యొక్క మాధుర్యాన్ని కూడా రుచి చూడగలము అని దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ హదీసులో సెలవిస్తున్నారు.
అయితే, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, విశ్వాసము యొక్క మాధుర్యాన్ని రుచి చూడాలి అని అనుకుంటే, మనలో ఏ లక్షణాలు ఉంటే మనం విశ్వాసము యొక్క మాధుర్యాన్ని రుచి చూడగలము? ఏ స్థాయికి మన విశ్వాసము చేరుకుంటే మనం విశ్వాసము యొక్క తియ్యదనాన్ని, మాధుర్యాన్ని రుచి చూడగలము? అనేటటువంటి ప్రశ్న మీ మనసులలో కలుగుతుంది కాబట్టి, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక హదీసులో ఈ విధంగా ప్రస్తావిస్తున్నారు:
عَنْ أَنَسٍ ـ رضى الله عنه ـ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ “ ثَلاَثٌ مَنْ كُنَّ فِيهِ وَجَدَ حَلاَوَةَ الإِيمَانِ
మూడు లక్షణాలు ఉన్నాయి, మూడు లక్షణాలు, మూడు గుణాలు ఉన్నాయి. ఒకవేళ మీలో గనుక ఈ మూడు లక్షణాలను మీరు పెంపొందించుకోగలిగితే, ఒకవేళ మీలో ఈ మూడు లక్షణాలు గనక ఉంటే, మీరు కచ్చితంగా విశ్వాసము యొక్క మాధుర్యాన్ని రుచి చూడగలరు అని దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు. ఆ మూడు లక్షణాలు ఏమిటి?
ఒకటి, ఆ మూడు లక్షణాల్లో మొట్టమొదటి లక్షణం ఏమిటంటే:
أَنْ يَكُونَ اللَّهُ وَرَسُولُهُ أَحَبَّ إِلَيْهِ مِمَّا سِوَاهُمَا [అన్ యకూనల్లాహు వ రసూలుహూ అహబ్బ ఇలైహి మిమ్మా సివాహుమా] అల్లాహ్ మరియు ప్రవక్త వారి వద్ద అందరికంటే ఎక్కువ ప్రియతములై ఉండాలి అనేది మొదటి లక్షణం.
మరియు ఒక వ్యక్తి తన తోటివారితో అల్లాహ్ తబారక వ తఆలా కొరకు మాత్రమే ప్రేమించగలిగినప్పుడు, అల్లాహ్ తబారక వ తఆలా కోసము ప్రేమించటము, అల్లాహ్ తబారక వ తఆలా కోసమే ద్వేషించటం అన్నటువంటిది రెండవ లక్షణంగా దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిస్తున్నారు.
మూడవ లక్షణం గురించి దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రస్తావిస్తూ అంటున్నారు:
وَأَنْ يَكْرَهَ أَنْ يَعُودَ فِي الْكُفْرِ كَمَا يَكْرَهُ أَنْ يُقْذَفَ فِي النَّارِ ” [వ అన్ యక్రహ అన్ యఊద ఫిల్ కుఫ్రి కమా యక్రహు అన్ యుఖ్దఫ ఫిన్నార్] ఎలాగైతే విశ్వసించిన తర్వాత అవిశ్వాసానికి పాల్పడటము అతనికి అంత అయిష్టకరంగా ఉండాలి, ఎలాగైతే ఒక వ్యక్తిని అగ్నిగుండంలో పడవేయటం ఎంత అయిష్టంగా ఉంటుందో.
(ఈ హదీసు సహీ అల్-బుఖారీ, కితాబుల్ ఈమాన్, బాబు హలావతిల్ ఈమాన్‌లో దీనిని ఇమామ్ బుఖారీ రహిమహుల్లాహ్ గారు అనస్ బిన్ మాలిక్ రదియల్లాహు తలా అన్హు వారి యొక్క ఉల్లేఖనం ద్వారా ఈ విధంగా పేర్కొనటం జరిగింది).
దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ హదీసులో తెలియజేసినటువంటి మూడు లక్షణాలు గనక మనలో మనం పెంపొందించుకోగలిగితే, కచ్చితంగా మనము విశ్వాసము యొక్క మాధుర్యాన్ని రుచి చూడగలము అని దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు. అందులో, మొదటి లక్షణాన్ని మనం గమనించినట్లయితే, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, అల్లాహ్ మరియు ప్రవక్త అతని వద్ద అత్యధికంగా అందరికంటే ఎక్కువగా ప్రియతములై ఉండాలి అన్నటువంటి విషయాన్ని దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మొట్టమొదటి లక్షణంగా పేర్కొన్నారు.
అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా, తొమ్మిదవ సూరా, సూరా తౌబా, 24వ వాక్యంలో ఈ విధంగా ప్రస్తావిస్తున్నాడు:
(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు: “ఒకవేళ మీ తండ్రులు, మీ కుమారులు, మీ సోదరులు, మీ భార్యలు, మీ సమీప బంధువులు, మీరు సంపాదించిన సిరిసంపదలు, కుంటుపడుతుందేమోనని మీరు భయపడే మీ వర్తకం, మీకెంతో ప్రియమైన మీ గృహాలు మీకు అల్లాహ్ కన్నా, ఆయన ప్రవక్త కన్నా, ఆయన మార్గంలో సలిపే పోరాటం కన్నా ఎక్కువ ప్రియమైనవైతే అల్లాహ్ తీసుకువచ్చే తీర్పు (శిక్ష) కొరకు ఎదురుచూడండి. అల్లాహ్ అవిధేయులకు సన్మార్గం చూపడు.
అల్లాహ్ ఈ వాక్యంలో ఈ విధంగా ప్రస్తావిస్తున్నాడు: వారితో ఇలా అను, మీ తాతలు, తండ్రులు, కుమారులు, మీ భార్యాపిల్లలు మరియు మీరు సంపాదించేటటువంటి సంపద, మీరు ఎక్కడ నష్టపోతారనుకునేటటువంటి మీ వ్యాపారాలు, అదే విధంగా మీరు ఎంతగానో ఇష్టపడేటటువంటి మీ స్వగృహాలు, ఇవన్నీ కూడా మీకు అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త కన్నా, ఆయన మార్గములో పోరాటం కన్నా ఇవన్నీ కూడా మీకు అత్యధికమైనప్పుడు, అల్లాహ్ తన తీర్పును బహిర్గతం చేసే వరకు నిరీక్షించండి. మరియు అల్లాహ్ అవిధేయులైనటువంటి జాతికి సన్మార్గముని చూపడు అని అల్లాహ్ తబారక వ తఆలా ఈ వాక్యంలో ఈ విధంగా సెలవిస్తున్నాడు.
అల్లాహ్ తబారక వ తఆలా విశ్వాసులు అల్లాహ్ తబారక వ తఆలాను ఎంతగా ప్రేమిస్తారన్నటువంటి విషయాన్ని సెలవిస్తూ సూరా అల్-బఖరా, రెండవ సూరా, 165వ వాక్యంలో ఈ విధంగా ప్రస్తావిస్తున్నాడు:
وَمِنَ النَّاسِ مَن يَتَّخِذُ مِن دُونِ اللَّهِ أَندَادًا يُحِبُّونَهُمْ كَحُبِّ اللَّهِ ۖ وَالَّذِينَ آمَنُوا أَشَدُّ حُبًّا لِّلَّهِ కాని అల్లాహ్‌ను కాదని ఆయనకు సహవర్తులుగా ఇతరులను నిలబెట్టి, అల్లాహ్‌ను ప్రేమించవలసిన విధంగా వారిని ప్రేమించేవారు కూడా ప్రజలలో కొందరు ఉన్నారు. అయితే విశ్వసించినవారు అల్లాహ్‌ను అంతకంటే ప్రగాఢంగా (అధికంగా) ప్రేమిస్తారు.
ఈ మానవులలో కొందరు ఇతరులను అల్లాహ్‌కు సాటి కల్పించుకుని, అల్లాహ్‌ను ప్రేమించవలసిన విధంగా వారిని ప్రేమిస్తున్నారు. కానీ విశ్వాసులు అత్యధికంగా అల్లాహ్ తబారక వ తఆలాను ప్రేమిస్తారు అన్నటువంటి విషయాన్ని అల్లాహ్ తబారక వ తఆలా ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. కాబట్టి ఈ వాక్యం ద్వారా మనకు తెలిసిన విషయం ఏమిటంటే, అల్లాహ్ తబారక వ తఆలాను ఒక విశ్వాసి అయినటువంటి వాడు అత్యధికంగా ప్రేమిస్తాడు.
అదే విధంగా దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు హదీసులో ఈ విధంగా ప్రస్తావిస్తున్నారు:
عَنْ أَنَسٍ قَالَ قَالَ النَّبِيُّ صلى الله عليه وسلم “ لاَ يُؤْمِنُ أَحَدُكُمْ حَتَّى أَكُونَ أَحَبَّ إِلَيْهِ مِنْ وَالِدِهِ وَوَلَدِهِ وَالنَّاسِ أَجْمَعِينَ ”
దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, “మీలో ఏ వ్యక్తి కూడా అప్పటివరకు విశ్వాసి కాలేరు, ఎప్పటివరకైతే నన్ను మీరు అత్యధికంగా ప్రేమించరో, మీ ఆలుబిడ్డల కన్నా, మీ బంధుమిత్రుల కన్నా, సమస్త మానవాళి కన్నా అత్యధికంగా మీరు ఎప్పటివరకైతే నేను మీకు ప్రియతముణ్ణి కానో, అప్పటివరకు మీరు విశ్వాసులు కారు” అన్నటువంటి విషయాన్ని దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. (సహీ బుఖారీ, హదీస్ నెంబర్ 15).
దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు హజ్రత్ ఉమర్ రదియల్లాహు తలా అన్హు వారితో కలిసి ఉన్నప్పుడు, హజ్రత్ ఉమర్ రదియల్లాహు తలా అన్హు వారు ఈ హదీసు విన్న తర్వాత అంటున్నటువంటి మాట ఏమిటంటే, “యా రసూలల్లాహ్, మీరు అన్నట్లుగానే నేను మిమ్మల్ని సమస్త మానవాళి కన్నా, బంధుమిత్రుల కన్నా, తల్లిదండ్రుల కన్నా అత్యధికంగా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, కానీ ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నా మనసు, నా ఆత్మ, నా ప్రాణం కన్నా అధికంగా కాదు” అని హజ్రత్ ఉమర్ రదియల్లాహు తలా అన్హు వారు అన్నారు.
فَقَالَ النَّبِيُّ صلى الله عليه وسلم ” لاَ وَالَّذِي نَفْسِي بِيَدِهِ حَتَّى أَكُونَ أَحَبَّ إِلَيْكَ مِنْ نَفْسِكَ ”. فَقَالَ لَهُ عُمَرُ فَإِنَّهُ الآنَ وَاللَّهِ لأَنْتَ أَحَبُّ إِلَىَّ مِنْ نَفْسِي. فَقَالَ النَّبِيُّ صلى الله عليه وسلم ” الآنَ يَا عُمَرُ ”.
అప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, “ఓ ఉమర్, నీవు ఎప్పటివరకైతే నీ ప్రాణం కంటే అధికంగా నన్ను మీరు ప్రేమించినటువంటి వారు కారో, అప్పటివరకు కూడా మీరు పూర్తి విశ్వాసి కాలేరు” అని దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటే, హజ్రత్ ఉమర్ రదియల్లాహు తలా అన్హు వారు అంటున్నారు, “ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఇప్పుడు నేను మిమ్మల్ని నా ప్రాణం కంటే కూడా అధికంగా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను” అని హజ్రత్ ఉమర్ రదియల్లాహు తలా అన్హు వారు అన్నారు. దానికి దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, “అల్ ఆన యా ఉమర్,” ఓ ఉమర్ రదియల్లాహు తలా అన్హు, ఇప్పుడు మీరు పూర్తిగా విశ్వాసి అయ్యారు” అని దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేయడం జరిగింది.
చూశారా సోదర మహాశయులారా, హజ్రత్ ఉమర్ రదియల్లాహు తలా అన్హు వారికి దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పినటువంటి మాటని బట్టి మనం తెలుసుకోవలసినటువంటి విషయం ఏమిటంటే, అన్నిటికంటే ముందు ఒక విశ్వాసి అత్యధికంగా అల్లాహ్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పట్ల ప్రేమను అత్యధికంగా కలిగి ఉండాలి. అల్లాహ్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇతరుల కంటే అత్యధికంగా ప్రియతములు కానంత వరకు ఏ వ్యక్తి కూడా విశ్వాసి కాలేడు, మరి అదే విధంగా ఏ వ్యక్తి కూడా విశ్వాసము యొక్క మాధుర్యాన్ని రుచి చూడలేడు అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకోవచ్చు.
సోదర మహాశయులారా, తబూక్ యుద్ధంలో దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాహ్ తబారక వ తఆలా యొక్క మార్గంలో అల్లాహ్ తబారక వ తఆలా కొరకు తమ యొక్క దానాలను తమ స్తోమత మేరకు అర్పించవలసిందిగా కోరినప్పుడు, ఎంతోమంది సహాబాలు తమ తమ స్తోమత మేరకు అల్లాహ్ తబారక వ తఆలా యొక్క మార్గంలో తమ తమ దానమును అర్పిస్తున్నటువంటి సమయంలో హజ్రత్ అబూబక్ర్ అస్స్సిద్దీఖ్ రదియల్లాహు తలా అన్హు వారు దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ముందు తమ ఇంటిలో ఉన్నటువంటి సమస్తాన్ని కూడా ఊడ్చి, ఆయన ముందు సమర్పించుకుంటూ, దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ముందు తీసుకొచ్చి పెట్టగా, దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అడుగుతున్నారు, “ఓ అబూబక్ర్, నీ ఇంటి వారి కొరకు నీ ఇంటిలో ఏమైనా వదిలి పెట్టావా?” అంటే, హజ్రత్ అబూబక్ర్ నిస్సిద్దీఖ్ రదియల్లాహు తలా అన్హు వారు అంటున్నారు, “నేను అల్లాహ్ మరియు ఆయన యొక్క ప్రవక్తను నా ఇంట్లో వదిలిపెట్టి వచ్చాను” అని హజ్రత్ అబూబక్ర్ సిద్దీఖ్ రదియల్లాహు తలా అన్హు వారు జవాబు పలికారు.
సోదరీ సోదర మహాశయులారా, అల్లాహ్ తబారక వ తఆలా మరియు ఆయన యొక్క ప్రేమ, సహచరుల యొక్క జీవితాల్లో మనం చూసుకున్నట్లయితే, ఇటువంటి సంఘటనలు మనకు వేల కొద్దీ దొరుకుతాయి సోదర మహాశయులారా. అదే విషయాన్ని దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఎవరిలో అయితే మూడు లక్షణాలు ఉంటాయో వారు అల్లాహ్ తబారక వ తఆలా యొక్క దయతో విశ్వాసము యొక్క మాధుర్యాన్ని రుచి చూడగలరు. అందులో మొదటి విషయాన్ని ఇప్పుడు మనం ప్రస్తావించుకున్నాము, అదేమిటంటే అల్లాహ్ మరియు ఆయన యొక్క ప్రవక్త పట్ల ప్రేమ, మిగతా వారందరికన్నా కూడా ఎక్కువగా ప్రియతములై ఉండటము.
అయితే సోదర మహాశయులారా, మనం అల్లాహ్ తబారక వ తఆలాను మరియు దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రేమిస్తున్నామని నోటితో ఎన్నిసార్లు మనం ప్రకటించినా కూడా, అది కేవలం నోటి మాటే అవుతుంది గానీ, అప్పటివరకు అది నిజం కాదు, ఎప్పటివరకైతే వారు చూపించినటువంటి మార్గంలో మనం నడవమో. అల్లాహ్ తబారక వ తఆలా ఖురాన్ గ్రంథంలో, మూడవ సూరా, 31వ వాక్యంలో ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ అంటున్నాడు:
قُلْ إِن كُنتُمْ تُحِبُّونَ اللَّهَ فَاتَّبِعُونِي يُحْبِبْكُمُ اللَّهُ وَيَغْفِرْ لَكُمْ ذُنُوبَكُمْ ۗ وَاللَّهُ غَفُورٌ رَّحِيمٌ (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు : ”మీకు నిజంగానే అల్లాహ్ పట్ల ప్రేమ ఉంటే మీరు నన్ను అనుసరించండి. (తత్ఫలితంగా) అల్లాహ్ మిమ్మల్ని ప్రేమిస్తాడు. మీ పాపాలను మన్నిస్తాడు. ఆయన అమితంగా క్షమించేవాడు, అపారంగా కనికరించేవాడు.”
ఇలా అను, మీకు నిజంగా అల్లాహ్ తబారక వ తఆలా పట్ల ప్రేమే ఉన్నట్లయితే, మీరు నాకు విధేయత చూపవలసిందిగా వారికి ఆజ్ఞాపించు. అల్లాహ్ తబారక వ తఆలా వారి పాపాలను క్షమిస్తాడు మరియు నిస్సందేహంగా అల్లాహ్ తబారక వ తఆలా ఎంతో క్షమాశీలి మరియు అనంత కరుణామయుడు అన్నటువంటి విషయాన్ని అల్లాహ్ తబారక వ తఆలా ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. కాబట్టి, నిజంగానే మనం అల్లాహ్ తబారక వ తఆలా మరియు ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పట్ల ప్రేమ కలిగి ఉన్నటువంటి వాళ్ళమే అయితే, అల్లాహ్ తబారక వ తఆలాను మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అత్యధికంగా ప్రేమించేటటువంటి వాళ్ళమే అయితే, ఆయన చూపినటువంటి మార్గములో మనం నడుస్తూ మన జీవితాన్ని గడుపుకోవలసినటువంటి అవసరం మనకు ఎంతైనా ఉన్నది.
సోదర మహాశయులారా, అల్లాహ్ తబారక వ తఆలా యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పినటువంటి హదీస్ ఆధారంగా, అందులో మొట్టమొదటి విషయము అల్లాహ్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మిగతా వారందరికన్నా కూడా ఎక్కువ ప్రియతములై ఉండటము.
ఇక రెండవ విషయానికి వచ్చినట్లయితే, దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా ప్రస్తావిస్తున్నారు, ఒక వ్యక్తి తనతో ఉన్నటువంటి వారిని కూడా అల్లాహ్ కొరకు ప్రేమించేటటువంటి వారై ఉండాలి. అదే విధంగా, అల్లాహ్ కొరకే ద్వేషించేటటువంటి వారై ఉండాలి. అల్లాహ్ తబారక వ తఆలా యొక్క ప్రేమ కారణంగానే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మనం ప్రేమిస్తున్నాము. అదే విధంగా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రేమ కారణంగానే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క అనుచరులతో మనం ప్రేమిస్తున్నాము. అల్లాహ్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రేమ కారణంగానే సమస్త మానవాళి విశ్వాసులతో కూడా మనం ప్రేమిస్తున్నాము. ఇదే విషయాన్ని దైవం ప్రస్తావిస్తూ, దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రస్తావిస్తూ ఒక హదీసులో ఈ విధంగా సెలవిస్తున్నారు:
“ఎవరైతే అల్లాహ్ తబారక వ తఆలా కొరకు ప్రేమిస్తారో మరియు అల్లాహ్ తబారక వ తఆలా కొరకే ద్వేషిస్తారో మరియు అల్లాహ్ తబారక వ తఆలా కొరకే ప్రసాదిస్తారో మరియు అల్లాహ్ తబారక వ తఆలా కొరకే నిషేధిస్తారో, వీరు వాస్తవానికి తమ విశ్వాసాన్ని పరిపూర్ణం చేసుకున్నటువంటి వారు” అని దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పినటువంటి మాట అబూ దావూద్‌లో ఈ విధంగా ప్రస్తావించబడింది.
కాబట్టి దీని ద్వారా తెలిసిన విషయం ఏమిటంటే, సహాబాలు ఏ విధంగా అల్లాహ్ తబారక వ తఆలాను మరియు ఆయన యొక్క ప్రవక్తను ప్రేమించేటటువంటి వారు మరియు వారి యొక్క ప్రేమ, వారి యొక్క ద్వేషము అల్లాహ్ కొరకు మరియు అల్లాహ్ యొక్క మార్గంలోనే ఉండేటటువంటిది అన్నటువంటి విషయాన్ని ఇక్కడ గమనించవచ్చు.
సోదర మహాశయులారా, ఇక మూడో విషయానికి వస్తే, మూడో లక్షణానికి వస్తే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా అంటున్నారు, “మరి విశ్వసించిన తర్వాత అవిశ్వాసానికి పాల్పడటం అన్నటువంటిది వారికి ఎంత అయిష్టకరమైనదై ఉండాలంటే ఎలాగైతే వారిని అగ్నిగుండంలో పడవేయటం అయిష్టకరమై ఉంటుందో ఆ విధంగానే అవిశ్వాసానికి పాల్పడటం వారికి అయిష్టకరమై ఉంటుంది” అని దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు.
ఈ విషయంలో హజ్రత్ బిలాల్ రదియల్లాహు తలా అన్హు గారిని చూసుకున్నట్లయితే, హజ్రత్ బిలాల్ రదియల్లాహు తలా అన్హు గారు ఎప్పుడైతే ఆయన విశ్వసించారో, ఆయన విశ్వసించిన తర్వాత మలమల మాడేటటువంటి మండుటెండల్లో ఆయనను ఈడ్చి, రాళ్లమయమైనటువంటి ప్రదేశంపై ఆయన్ని ఈడ్చుకుంటూ తీసుకువెళ్లి, ఆయన యొక్క గుండెలపై ఒక పెద్ద బండరాయిని పెట్టి, దేవుడు ఒక్కడే అన్నటువంటి విశ్వాసాన్ని నీవు విడనాడుతావా? ఇప్పుడైనా ఒప్పుకుంటావా దేవుడు ఒక్కడు కాదు అని అన్నప్పుడు, అప్పటికీ కూడా ఆయన హజ్రత్ బిలాల్ రదియల్లాహు తలా అన్హు గారు “అల్లాహు అహద్, అల్లాహు అహద్, అల్లాహు ఒక్కడే, అల్లాహు ఒక్కడే, ఆయన తప్ప మరొక ఆరాధ్య దైవం ఎవరూ లేరు, నేను ఇస్లాంను వదిలిపెట్టను, నా విశ్వాసాన్ని విడనాడను” అని హజ్రత్ బిలాల్ రదియల్లాహు తలా అన్హు గారు ఏ విధంగానైతే నిలబడిపోయారో విశ్వాసంపై, ఆ విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు.
అదే విధంగా హజ్రత్ సుమయ్య రదియల్లాహు తలా అన్హా, అదే విధంగా హజ్రత్ ఖబ్బాబ్ బిన్ అర్ద్ రదియల్లాహు తలా అన్హు, వీరు చేసుకున్నటువంటి త్యాగాలు మరియు వీరు ఏ విధంగా ఇస్లాంపై నిలకడగా ఉన్నారో, ఎలాగైతే వారు విశ్వసించిన తర్వాత అవిశ్వాసానికి పాల్పడటం వారికి ఎంత అయిష్టకరంగా ఉండిందంటే, ఎలాగైతే వారికి జీవించి ఉండటంలోనే వారిని అగ్నిగుండంలో పడవేయటం కంటే ఎక్కువగా వారు అయిష్టకరంగా భావించేటటువంటి వారు.
కాబట్టి సోదర మహాశయులారా, ఈ విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత మనకు తెలుస్తున్నటువంటి విషయం ఏమిటంటే, విశ్వాసము యొక్క లక్షణాలలో ఒక లక్షణము, విశ్వాసము యొక్క మాధుర్యాన్ని రుచి చూడటము. అయితే ఈ విశ్వాసము యొక్క మాధుర్యాన్ని అప్పుడే మనం ఆస్వాదించగలము, అప్పుడే మనం రుచి చూడగలము, ఎప్పుడైతే మనలో ఈ మూడు లక్షణాలు కూడా ఉంటాయో, ఈ మూడు గుణాలు కూడా మనలో ఉంటాయో. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఎవరిలో అయితే ఈ మూడు లక్షణాలు ఉంటాయో, ఈ మూడు గుణాలు ఉంటాయో, వారు అల్లాహ్ తబారక వ తఆలా యొక్క దయతో విశ్వాసము యొక్క ఉచ్చ స్థాయికి చేరుకోగలరు, విశ్వాసము యొక్క ఉచ్చ స్థాయికి చేరుకున్నవారు విశ్వాసము యొక్క మాధుర్యాన్ని రుచి చూడగలరు అని దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు.
అందులో మొట్టమొదటిది, అల్లాహ్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అందరికంటే ఎక్కువ ప్రియతములై ఉండాలి. ఇక రెండవ విషయము, ఎవరిని ప్రేమించినా కూడా అల్లాహ్ కొరకే ప్రేమించేటటువంటి వారై ఉండాలి, అల్లాహ్ కొరకే ద్వేషించేటటువంటి వారై ఉండాలి. మరి అదే విధంగా మూడో విషయాన్ని, విశ్వసించిన తర్వాత అవిశ్వాసానికి పాల్పడటం అన్నటువంటిది ఎంత అయిష్టకరంగా ఉండాలంటే, ఎలాగైతే నిజ జీవితంలోనే వారిని అగ్నిగుండంలో పడవేయటం కంటే బాధగా, అగ్నిగుండంలో పడవేయటం కంటే అయిష్టమైనదిగా ఉండాలి అన్నటువంటి ఈ మూడు లక్షణాల్ని కూడా దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు హలావతుల్ ఈమాన్, విశ్వాసము యొక్క మాధుర్యాన్ని గురించి తెలియజేస్తూ పలికినటువంటి పలుకులు ఈరోజు మనం తెలియజేసుకున్నాము.
కాబట్టి అల్లాహ్ తబారక వ తఆలాతో దుఆ ఏమనగా, ఏ విధంగానైతే ఇప్పటి వరకు కూడా మనం మాట్లాడుకున్నామో విశ్వాసము గురించి, విశ్వాసము యొక్క లక్షణాల గురించి, విశ్వాసము యొక్క రుచిని ఆస్వాదించడం గురించి, అల్లాహ్ తబారక వ తఆలా మనకు వీటన్నిటిపై ఆచరించేటటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ తబారక వ తఆలా మనలో విశ్వాసాన్ని పెంపొందించుకునేటటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగాక, ఆమీన్.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఈ ప్రసంగంలో, ఉస్మాన్ (రజియల్లాహు అన్హు) వారి యొక్క అత్యుత్తమ గుణమైన సిగ్గు, బిడియం (హయా) గురించి వివరించబడింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్వయంగా ఉస్మాన్ (రజియల్లాహు అన్హు) వద్ద దేవదూతలు కూడా సిగ్గుపడతారని తెలిపిన ఒక సంఘటనను పేర్కొన్నారు. అబూబక్ర్ (రజియల్లాహు అన్హు), ఉమర్ (రజియల్లాహు అన్హు) వచ్చినప్పుడు సాధారణ స్థితిలో ఉన్న ప్రవక్త, ఉస్మాన్ (రజియల్లాహు అన్హు) రాకతో తమ వస్త్రాలను సరిచేసుకుని కూర్చోవడం ఆయన పట్ల గల గౌరవాన్ని, ఆయన సిగ్గు యొక్క స్థాయిని తెలియజేస్తుంది. అంతేకాకుండా, ఇస్లాం స్వీకరించిన నాటి నుండి తన కుడి చేతిని మర్మాంగాలకు తాకించలేదని ఉస్మాన్ (రజియల్లాహు అన్హు) స్వయంగా చెప్పిన విషయం ఆయన పవిత్రతకు నిదర్శనం. ఆయన అధికంగా ఖుర్ఆన్ పారాయణం చేసేవారని, చివరికి హంతకుల చేతిలో హత్యకు గురయ్యే సమయంలో కూడా ఖుర్ఆన్ పారాయణంలోనే నిమగ్నమై ఉన్నారని వివరించబడింది.
ఉస్మాన్ (రజియల్లాహు అన్హు) వారి బిడియం, సిగ్గు (హయా)
సోదర సోదరీమణులారా! ఉస్మాన్ రజియల్లాహు అన్హు వారి యొక్క ఉత్తమ గుణం, బిడియం, సిగ్గు, లజ్జ దీని గురించి మనం తెలుసుకుంటున్నాము. అందరికంటే ఎక్కువ హయా ఉస్మాన్ రజియల్లాహు అన్హు గలవారని స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సాక్ష్యం పలికారు.
ఒక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ ఇంట్లో కూర్చుని ఉన్నారు. ఒక మెత్తకు ఇలా ఆనుకొని, తన ఈ మోకాళ్ళను ఇలా నిలబెట్టి ఉన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏ లుంగీ లేదా వస్త్రం అయితే ధరించి ఉన్నారో అది ఇంచుమించు మోకాళ్ళకు దగ్గరగా వచ్చి పిక్క కనబడుతూ ఉన్నది. ఈ స్థితిలో కూర్చుండి ఉన్నారు. కొంతసేపట్లో హజరత్ అబూబకర్ సిద్దీఖ్ రజియల్లాహు అన్హు వచ్చారు. లోపలికి రావడానికి అనుమతి కోరారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అదే స్థితిలో కూర్చుండి ఉన్నారు, అబూబకర్ రావడానికి అనుమతి ఇచ్చారు. అబూబకర్ వచ్చి ఒక పక్కన కూర్చున్నారు.
మరికొంత సేపటికి హజరత్ ఉమర్ వచ్చారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అదే స్థితిలో కూర్చుని ఉన్నారు, హజరత్ ఉమర్ అనుమతి కోరారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అనుమతి ఇచ్చారు. హజరత్ ఉమర్ లోపలికి వచ్చి ఓ పక్కన కూర్చున్నారు, ప్రవక్త అలాగే ఉన్నారు. మరికొంత సమయం గడిచిన తర్వాత హజరత్ ఉస్మాన్ వచ్చారు. లోపలికి రావడానికి అనుమతి కోరారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ వస్త్రాన్ని మరింత కిందికి దించుతూ, ఒక సరియైన రీతిలో కూర్చుండి, ఉస్మాన్ కు రావడానికి అనుమతి ఇచ్చారు.వచ్చారు, మాట్లాడారు, వెళ్ళిపోయారు.
ఆ తర్వాత ఇంట్లో ఈ విషయాన్ని గమనించిన భార్య, అబూబకర్ వచ్చినప్పుడు మీరు అలాగే కూర్చుండి ఉన్నారు, ఉమర్ వచ్చినప్పుడు మీరు అలాగే కూర్చుండి ఉన్నారు, కానీ ఉస్మాన్ ఎప్పుడైతే వచ్చి అనుమతి కోరాడో మీరు మీ వస్త్రాన్ని సరిచేసుకుంటూ, మరి కిందికి దించుకుంటూ, మీ కూర్చుండే స్థితిని మార్చి, మరి మీరు అనుమతించారు, ఎందుకు ఇలా అని అడిగినప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, “ఏ ఉస్మాన్ తోనైతే దేవదూతలు సిగ్గు పడుతున్నారో ఆ ఉస్మాన్ తో నేను సిగ్గుపడనా?“
ఉస్మాన్ (రజియల్లాహు అన్హు) వారి వ్యక్తిగత పవిత్రత మరియు ఖుర్ఆన్ పారాయణం
అయితే ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే ఉస్మాన్ రజియల్లాహు అన్హు సహాబాలలో అందరికంటే ఎక్కువగా సిగ్గు, బిడియం గలవారు. మరియు స్వయంగా ఆయన ఒక సందర్భంలో తెలిపారు, “ఎప్పటి నుండి అయితే నేను నా ఈ కుడి చేతితో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చేతిలో చెయ్యి వేసి శపథం చేశానో, ఇస్లాం స్వీకరించానో, బయఅత్ చేశానో, అప్పటినుండి నేను ఈ కుడి చెయ్యిని నా మర్మాంగానికి తాకనివ్వలేదు”
హజరత్ ఉస్మాన్ రజియల్లాహు అన్హు వారిలో ఎన్నో రకాల ఉత్తమ గుణాలు ఉండినవి. ఆయన ఖుర్ఆన్ యొక్క పారాయణం చాలా అధికంగా చేసేవారు. చాలా అధికంగా చేసేవారు. మరియు చివరి సమయంలో, ఏ సమయంలోనైతే దుండగులు ఆయన్ని హతమార్చడానికి ప్రయత్నం చేశారో, ఆ సమయంలో కూడా ఆయన ఖుర్ఆన్ పారాయణం చేస్తూ ఉన్నారు, అదే స్థితిలో ఆ దుష్టులు, దుర్మార్గులు వచ్చి ఆయన్ని హతమార్చారు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
You must be logged in to post a comment.