తయమ్ముమ్ పద్దతి – హబీబుర్రహ్మాన్ జామయి [వీడియో, టెక్స్ట్]

తయమ్ముమ్ పద్దతి
https://youtu.be/Cc_1VB72Sak [9 నిముషాలు]
వక్త: హబీబుర్రహ్మాన్ జామయి (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, ఇస్లామీయ ఆచారమైన ‘తయమ్ముమ్’ (పొడి శుద్ధీకరణ) గురించి వివరించబడింది. ఇందులో తయమ్ముమ్ యొక్క అక్షరార్థం మరియు షరియత్ ప్రకారం దాని అర్థం, సూరహ్ అన్-నిసా మరియు సూరహ్ అల్-మాయిదా నుండి ఖురాన్ ఆధారాలు, నీరు అందుబాటులో లేనప్పుడు లేదా అనారోగ్యం వంటి నిర్దిష్ట పరిస్థితులలో తయమ్ముమ్ ఎప్పుడు అనుమతించబడుతుంది, ఏ పదార్థాలను (స్వచ్ఛమైన మట్టి మరియు దాని రకాలు) ఉపయోగించవచ్చు, దానిని ఆచరించే సరైన పద్ధతి మరియు దానిని చెల్లకుండా చేసే చర్యలు వివరించబడ్డాయి.

అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ అంబియాయి వల్ ముర్సలీన్ వమన్ తబిఅహుమ్ బిఇహ్సానిన్ ఇలా యౌమిద్దీన్ అమ్మా బాద్.

అభిమాన సోదరులారా! అస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు.

ఈ రోజు మనం తయమ్ముమ్ గురించి తెలుసుకోబోతున్నాం.

తయమ్ముమ్ అంటే సంకల్పించటం అని అర్థం. శాబ్దిక అర్థం.

షరియత్ పరిభాషలో తయమ్ముమ్ అంటే, ప్రయాణంలో ఉన్నప్పుడు గానీ, ప్రయాణికుడు స్థానికంగా గానీ, వుజూ ఘుసుల్ లో మాదిరి పరిశుద్ధతను పొందే ఉద్దేశంతో రెండు చేతుల్ని మట్టిపై కొట్టి ముఖాన్ని, చేతులను స్పర్శించుకోవడాన్ని కోవటం అని అర్థం.

ఈ తయమ్ముమ్ గురించి అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఖురాన్ లో సూర నిసా అలాగే సూర మాయిదాలో కూడా సెలవిచ్చాడు. తయమ్ముమ్ గురించి. సూర నిసాలో ఆయత్ ఇలా ఉంటుంది.

وَإِن كُنتُم مَّرْضَىٰ أَوْ عَلَىٰ سَفَرٍ أَوْ جَاءَ أَحَدٌ مِّنكُم مِّنَ الْغَائِطِ أَوْ لَامَسْتُمُ النِّسَاءَ فَلَمْ تَجِدُوا مَاءً فَتَيَمَّمُوا صَعِيدًا طَيِّبًا فَامْسَحُوا بِوُجُوهِكُمْ وَأَيْدِيكُمْ

(వ ఇన్ కున్ తుమ్ మర్దా అవ్ అలా సఫరిన్ అవ్ జాఅ అహదుమ్ మిన్ కుమ్ మినల్ గాఇతి అవ్ లామస్ తుమున్ నిసాఅ ఫలమ్ తజిదూ మాఅన్ ఫతయమ్మమూ సయీదన్ తయ్యిబన్ ఫమ్ సహూ బివుజూహికుమ్ వ అయ్దీకుమ్)

ఒకవేళ మీరు వ్యాధిగ్రస్తులైతే, లేక ప్రయాణంలో ఉంటే లేక మీలో ఎవరయినా మలమూత్ర విసర్జన చేసివస్తే లేక మీరు స్త్రీలతో సమాగమం జరిపి ఉంటే – అట్టి స్థితిలో మీకు నీరు లభ్యం కానిపక్షంలో పరిశుభ్రమైన మట్టి(ని ఉపయోగించే) సంకల్పం చేసుకోండి. (దాంతో) మీ ముఖాలను, చేతులను తుడుచుకోండి. నిశ్చయంగా అల్లాహ్‌ మన్నించేవాడు, క్షమాభిక్ష పెట్టేవాడు. (సూర నిసా 4:43)

మీరు ఎప్పుడైనా అస్వస్థులై అయి ఉంటే, అస్వస్థులైతే లేక ప్రయాణంలో ఉంటే, లేక మీలో ఎవరైనా మలమూత్ర విసర్జనం చేసి ఉంటే, లేక మీరు మీ స్త్రీలను తాకి ఉంటే అంటే సంభోగం చేసి ఉంటే, మీకు నీరు లభ్యం కాని పక్షంలో, కాలకృత్యాలు తర్వాత మలమూత్ర విసర్జన తర్వాత వుజూ తప్పనిసరి. సంభోగం తర్వాత ఘుసుల్ తప్పనిసరి. నీరు లభ్యం కాని పక్షంలో పరిశుభ్రమైన మట్టిని ఉపయోగించండి. దానితో మీరు మీ ముఖాలను చేతుల్ని స్పర్శించుకోండి అని అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఈ ఆయత్లో తెలియజేశాడు. అంటే అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఈ ఆయతులో ఘుసుల్ మరియు వుజూకి బదులు నీరు లేనప్పుడు తయమ్ముమ్ అనే అవకాశాన్ని, భాగ్యాన్ని, అనుమతిని అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మనలకి ప్రసాదించాడు.

ఇక తయమ్ముమ్ ఏ సందర్భాలలో అనుమతి ఉంది? వుజూ మరియు ఘుసుల్ కి బదులు తయమ్ముమ్. కాకపోతే దానికి కొన్ని కండిషన్లు ఉన్నాయి, నియమాలు ఉన్నాయి, కొన్ని సందర్భాలు ఉన్నాయి. ఆ సందర్భాలలోనే అనుమతి ఉంది.

ఒకటి, నీరు లేనప్పుడు. నమాజ్ కోసం తప్పనిసరిగా వుజూ చేయాలి, నీరు లేదు. తప్పనిసరిగా ఘుసుల్ చేయాలి, నీరు లేదు.

రెండవది, నీరు ఉన్నా త్రాగటానికి సరిపోతుంది. ఎంత నీరు ఉందంటే, తాగితే వుజూకి లేదు, వుజూ చేస్తే తాగటానికి లేదు. అలాంటప్పుడు. నీరు ఉన్నా తాగడానికి సరిపోయినప్పుడు.

మూడవది, నీటి ఉపయోగం మనిషికి హానికరం. అనారోగ్యం మూలంగా, ఏదో ఒక గాయం మూలంగా ఏదైనా సరే. నీటి ఉపయోగం మనిషికి హానికరం. అటువంటి సందర్భంలో.

నాలుగవది, ఒకవేళ నీరు మంచుగా, మంచులాగా చల్లగా ఉంది. వేడి చేసే అవకాశం కూడా లేదు. అటువంటి సందర్భంలో.

అలాగే ఐదవది, నీరు ఉన్నప్పటికీ నీటికి మనిషికి మధ్య ప్రాణ శత్రువు, అడవి మృగం, మరేదైనా ప్రాణాపాయం కలిగించే వస్తువు మధ్యలో ఉంది. అటువంటి సమయంలో తయమ్ముమ్ చేయవచ్చు.

ఈ ఐదు కారణాలు సందర్భాలలో వుజూ మరియు ఘుసుల్ కి బదులు తయమ్ముమ్ ఉంది.

ఏ వస్తువులతో తయమ్ముమ్ చేయాలి? పరిశుభ్రమైన మట్టితో గానీ లేదా మట్టి కోవకు చెందిన ఇతర వస్తువులతో తయమ్ముమ్ చేయాలి. ఉదాహరణకు ఇసుక, ఎండిపోయిన బూడిద, రాయి, కంకరరాళ్ళు మొదలగునవి.

అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఆయత్ లో చెప్పిన పదం ఏమిటి?

فَتَيَمَّمُوا صَعِيدًا طَيِّبًا
(ఫతయమ్మమూ సయీదన్ తయ్యిబా)

పరిశుభ్రమైన మట్టితో అన్నాడు అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా. అంటే సయీద్ అంటే ఏమిటి? సయీద్ అంటే భూమి ఉపరితల భాగం. అది మట్టి కావచ్చు, మట్టి లాంటి ఇతర వస్తువులు కూడా అవ్వచ్చు.

పరిశుద్ధతను పొందే ఉద్దేశంతో, సంకల్పంతో బిస్మిల్లా అని పఠించాలి. ఆ తర్వాత రెండు చేతుల్ని పరిశుభ్రమైన మట్టి మీద కొట్టాలి. ఆ తర్వాత చేతుల్ని ఒక్కసారి ఊదాలి. చేతుల్ని ఒకసారి ఊదుకొని ముఖం మీద స్పర్శించుకోవాలి. ఆ తర్వాత చేతుల్ని మణికట్టు వరకు రుద్దుకోవాలి. ఎడమ చేత్తో కుడి చెయ్యి పైన, కుడి చేతితో ఎడమ చెయ్యి పైన.

చేతుల్ని మణికట్ల వరకు రుద్దుకోవాలి. ఎడమ చేత్తో కుడి చేయి పైన, కుడి చేత్తో ఎడమ చేయి పైన. ఆ తర్వాత చివర్లో వుజూ చేసిన తర్వాత పఠించే దుఆ తయమ్ముమ్ తర్వాత కూడా పఠించాలి.

أَشْهَدُ أَنْ لَا إِلَٰهَ إِلَّا اللهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ، وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ. اللَّهُمَّ اجْعَلْنِي مِنَ التَّوَّابِينَ، وَاجْعَلْنِي مِنَ الْمُتَطَهِّرِينَ

(అష్ హదు అల్ లాఇలాహ ఇల్లల్లాహు వ అష్ హదు అన్న ముహమ్మదన్ అబ్దుహూ వ రసూలుహు. అల్లాహుమ్మ జ’అల్నీ మినత్ తవ్వాబీన వ జ’అల్నీ మినల్ ముతతహ్ హిరీన్.)

ఇది తయమ్ముమ్ చేసే పద్ధతి. చాలా సింపుల్ గా, సులభంగా ఉంటుంది.

పరిశుద్ధతను పొందే ఉద్దేశంతో, సంకల్పంతో బిస్మిల్లా అని పలకాలి. రెండు చేతుల్ని పరిశుభ్రమైన మట్టి మీద కొట్టాలి. చేతుల్ని ఒకసారి ఊదుకొని ముఖం మీద స్పర్శించుకోవాలి. ఆ తర్వాత ఎడమ చేత్తో కుడి చేయి పైన, కుడి చేత్తో ఎడమ చేయి పైన స్పర్శించుకోవాలి. ఆ తర్వాత వుజూ తర్వాత ఏ దుఆ పఠిస్తామో ఆ దుఆ పఠించాలి.

తయమ్ముమ్ దేని వల్ల భంగమైపోతుంది? ఏ కారణాల వల్ల తయమ్ముమ్ భంగమవుతుంది? తయమ్ముమ్ ని భంగపరిచే విషయాలు.

మొదటిది, ఏ కారణాల వల్ల వుజూ భంగం అవుతుందో అదే కారణాల వల్ల తయమ్ముమ్ కూడా భంగం అవుతుంది.

రెండవది, నీరు లభించినా లేదా నీరు ఉపయోగించే స్థితి ఏర్పడినా తయమ్ముమ్ భంగమైపోతుంది.

అభిమాన సోదరులారా! ఇది తయమ్ముమ్ గురించి కొన్ని విషయాలు. తయమ్ముమ్ అంటే శాబ్దిక అర్థం ఏమిటి, షరియత్ పరంగా తయమ్ముమ్ అంటే అర్థం ఏమిటి, ఏ సందర్భాలలో తయమ్ముమ్ చేయాలి, అలాగే ఏ వస్తువుతో తయమ్ముమ్ చేయాలి, తయమ్ముమ్ చేసే పద్ధతి ఏమిటి, తయమ్ముమ్ ని భంగం పరిచే విషయాలు ఇది మనం తెలుసుకున్నాం.

అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మనందరికీ ఖురాన్ మరియు హదీస్ కి సంబంధించిన జ్ఞానాన్ని ప్రసాదించు గాక. అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మనందరికీ ప్రతి విషయంలో మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ని అనుసరిస్తూ ఆయన సున్నత్ ని ధనాన్ని పాటించే సద్బుద్ధిని ప్రసాదించు గాక. ఆమీన్.

వ ఆఖిరు దావానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహ్.

1.6 బహిష్టు ప్రకరణం | మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు

మహా ప్రవక్త మహితోక్తులు (అల్-లూలు వల్ మర్జాన్) (Al-Lulu-wal-Marjaan) .  
బహిస్టు ప్రకరణం [PDF]

168 – حديث عَائِشَةَ، قَالَتْ: كَانَتْ إِحْدَانَا إِذَا كَانَتْ حَائِضًا، فَأَرادَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ أَنْ يُبَاشِرَهَا، أَمَرَهَا أَنْ تَتَّزِرَ فِي فَوْرِ حَيْضَتِهَا، ثُمَّ يُبَاشِرُهَا قَالَتْ: وَأَيُّكُمْ يَمْلِك إِرْبَهُ كَمَا كَانَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يَمْلِكُ إِرْبَهُ
__________
أخرجه البخاري في: 6 كتاب الحيض: 5 باب مباشرة الحائض

168. విశ్వాసుల మాతృమూర్తి హజ్రత్ అయిషా (రదియల్లాహు అన్హా) కథనం:- “మాలో ఎవరైనా బహిష్టు అయినప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆమె దేహానికి దేహం ఆనించ దలచుకుంటే, ఆమెను (లంగోటి లాంటి) లోఉడుపును కట్టుకోమని ఆదేశించేవారు. ఆ తరువాత ఆమె దేహానికి దేహం ఆనించేవారు… లైంగికవాంఛపై దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కున్న ఇంతటి నిగ్రహశక్తి మీలో ఎవరికైనా ఉందా?” అని హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) అన్నారు.

[సహీహ్ బుఖారీ : 6వ ప్రకరణం – హైజ్, 5వ అధ్యాయం – ముబాషిరతిల్ హాయిజ్]

169 – حديث مَيْمُونَةَ، قَالَتْ: كَانَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ إِذَا أَرَادَ أَنْ يُبَاشِرَ امْرَأَةً مِنْ نِسَائِهِ، أَمَرَهَا فَاتَّزَرَتْ وَهِيَ حَائِضٌ
__________
أخرجه البخاري في: 6 كتاب الحيض: 5 باب مباشرة الحائض

169. విశ్వాసుల మాతృమూర్తి హజ్రత్ మైమూన (రదియల్లాహు అన్హా) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తన భార్యలలో ఎవరితోనైనా దేహానికి దేహం ఆనించ దలచుకున్నప్పుడు, * ఆమె బహిష్టు అయి ఉంటే, (లంగోటిలాంటి) లో ఉడుపు కట్టుకోమని ఆమెను ఆదేశించేవారు.

[సహీహ్ బుఖారీ : 6వ ప్రకరణం, – హైజ్, 5వ అధ్యాయం]

* ఇక్కడ మూలభాషలో ‘ముబాషిరత్‘ అనే పదం వచ్చింది. అంటే శరీరంతో శరీరం కలపడం అని అర్థం. అంతేగాని ఇక్కడ సందర్భాన్ని బట్టి లైంగిక సంపర్కం అనే భావం రాదు. ఎందుకంటే దివ్యఖుర్ఆన్ఆ “రుతుస్రావం గురించి ఆజ్ఞ ఏమిటని అడుగుతున్నారు వారు, ఆదొక అపరిశుద్ధావస్థ అనీ, ఆ స్థితిలో భార్యలకు దూరంగా ఉండాలని, వారు (స్నానం చేసి) పరిశుభ్రం కానంత వరకు వారి దగ్గరకు వెళ్ళకూడదని చెప్పెయ్యి” అని ఉంది. (2:222)

స్త్రీ సుగంధం (సెంట్) పూసుకొని బైటికి వెళ్ళుట [వీడియో| టెక్స్ట్]

https://youtu.be/kfJHzMYHTnE [7 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఇస్లామీయ  నిషిద్ధతలు మరియు జాగ్రత్తలు [పుస్తకం]

ఈ ప్రసంగంలో, ఒక స్త్రీ సుగంధం పూసుకుని బయటికి వెళ్లడం ఇస్లాంలో తీవ్రంగా పరిగణించబడే పాపమని హెచ్చరించబడింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీసుల ప్రకారం, పురుషులు తన సువాసనను ఆఘ్రాణించాలని బయటికి వెళ్లే స్త్రీ వ్యభిచారిణిగా పరిగణించబడుతుందని చెప్పబడింది. ఇంట్లో సుగంధం పూసుకున్న స్త్రీ మస్జిద్ వంటి పవిత్ర స్థలానికి వెళ్లాలనుకున్నా సరే, బయటికి వెళ్లే ముందు తప్పనిసరిగా జనాబత్ స్నానం (సంపూర్ణ స్నానం) చేయాలని, లేకపోతే ఆమె నమాజ్ అంగీకరించబడదని స్పష్టం చేయబడింది. ఆధునిక కాలంలో వివాహాలు, పండుగలు, బజార్లకు, చివరకు రమదాన్‌లో తరావీహ్ నమాజ్‌కు కూడా మహిళలు బలమైన పరిమళాలను ఉపయోగించడం పట్ల విచారం వ్యక్తం చేయబడింది. ఈ చర్యల యొక్క తీవ్రతను అర్థం చేసుకుని, పురుషులు తమ కుటుంబంలోని స్త్రీలకు మార్గనిర్దేశం చేయాలని మరియు స్త్రీలు స్వయంగా ఈ నిషిద్ధతలకు దూరంగా ఉండాలని ఉపదేశించబడింది.

స్త్రీ సుగంధం పూసుకొని బయటికి వెళ్లుట

నేను ఆఫీసులో జాబ్ చేస్తున్నానండీ. నేను ఫలానా కంపెనీలో జాబ్ చేస్తున్నాను, ఫలానా ఫ్యాక్టరీలో పెద్ద మంచి పోస్ట్ ఉంది నాది. అక్కడికి వెళ్ళేటప్పుడు నేను కనీసం ఏదైనా సువాసన పూసుకోకుంటే ఎలా? నేను ఇప్పుడు ఫంక్షన్లో వెళ్లాలి. ఇలాంటి ఎన్నో ప్రశ్నలు వస్తాయి కదా. శ్రద్ధగా వినండి.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎంతో కఠినంగా హెచ్చరించినప్పటికీ స్త్రీలు సువాసనలు పూసుకొని ఇంటి బయటికి వెళ్లుట, పురుషుల ముందు నుండి దాటుట ఈ కాలంలో చాలా ప్రబలిపోతుంది. ప్రవక్త వారి ఆదేశం ఏంటి?

أَيُّمَا امْرَأَةٍ اسْتَعْطَرَتْ ثُمَّ مَرَّتْ عَلَى الْقَوْمِ لِيَجِدُوا رِيحَهَا فَهِيَ زَانِيَةٌ
“ఏ స్త్రీ అయితే సువాసన పూసుకొని ఆమె సువాసన పురుషులు ఆఘ్రాణించాలని వారి ముందు నుండి దాటుతుందో ఆమె వ్యభిచారిణి “ (ముస్నద్‌ అహ్మద్‌ 4/418, సహీహుల్‌ జామి 105).

అవూదుబిల్లాహ్, అవూదుబిల్లాహ్. వింటున్నారా? చూస్తున్నారా?

కొందరు స్త్రీలు నిర్లక్ష్యపు భావనతో దీనిని చాలా చిన్న విషయం అనుకొని డ్రైవర్, సేల్స్‌మేన్ మరియు పాఠశాలల వాచ్‌మేన్‌ల ముందు నుండి వెళ్తారు, అయితే సువాసన పూసుకున్న స్త్రీ బయటికి వెళ్లదలచినప్పుడు, ఆ బయటికి వెళ్లడం మస్జిద్ లాంటి పవిత్ర స్థలానికైనా సరే, అర్థమవుతుందా?

ఒక స్త్రీ సువాసన పూసుకొని ఉంది, ఇంట్లో ఉంది. కొంతసేపటి తరవాత అచానక్, యేకాయేక్యిగా బయటికి వెళ్లాలనిపించింది ఏదైనా పని మీద గానీ, లేదా జుమా నమాజ్ సమయం అయితుంది లేదా జుమా ఈరోజు మస్జిద్లో ఏదో పెద్ద ఆలిమ్ వచ్చి ప్రసంగిస్తున్నారు, అక్కడ స్త్రీలకు కూడా పర్దా ఏర్పాటు ఉంది, అయితే మస్జిద్కు వెళ్లాలనుకుంటుంది. ఏ స్త్రీ అయితే సువాసన పూసుకొని ఉన్నదో, ఆ తర్వాత ఆమె బయటికి వెళ్లాలనుకుంటుందో, చివరికి ఆమె మస్జిదుకు వెళ్లాలి అని కోరినా, అక్కడికి వెళ్లేకి ముందు, బయటికి వెళ్లేకి ముందు గుస్లే జనాబత్ చెయ్యాలి. గుస్లే జనాబత్ అంటే పెద్దవారికి తెలిసిన విషయమే. స్వప్న స్థలనం వల్ల లేదా భార్యాభర్తలు కలుసుకోవడం వల్ల ఏ స్థితిలో మనిషి ఉంటాడో దానిని జనాబత్, అశుద్ధత, నాపాకీ అంటారు. దాని వల్ల స్నానం చేయడం విధి అవుతుంది. దానికి స్నానం ఎలా చేయాలి? ఒక ప్రత్యేక పద్ధతి ఉంది. ఆ రీతిలో స్నానం చేయనంతవరకు ఆమె బయటికి వెళ్లకూడదు. కఠినంగా దీని గురించి ఆదేశం వచ్చింది. శ్రద్ధగా వినండి.

أَيُّمَا امْرَأَةٍ تَطَيَّبَتْ ثُمَّ خَرَجَتْ إِلَى الْمَسْجِدِ لِيُوجَدَ رِيحُهَا لَمْ يُقْبَلْ مِنْهَا صَلَاةٌ حَتَّى تَغْتَسِلَ اغْتِسَالَهَا مِنْ الْجَنَابَةِ
“ఏ స్త్రీ అయితే సువాసన పూసుకొని అక్కడ ఉన్నవారు ఆమె సువాసన ఆఘ్రాణించాలని మస్టిద్‌ వస్తుందో, ఆమె జనాబత్‌ వల్ల చేసే విధంగా స్నానం చేసిరానంత వరకు ఆమె నమాజు అంగీకరింపబడదు”. (ముస్నద్‌ అహ్మద్‌ 2/444, సహీహుల్‌ జామి 2703).

అల్లాహు అక్బర్. నమాజ్ ఎందువల్ల అంగీకరింపబడదు? ఎవరైనా స్త్రీ సువాసన పూసుకొని బయటికి వస్తుంది, పురుషులు ఉంటారు, వారు కూడా ఆ సువాసన పీలుస్తారు, ఇవన్నీ తెలిసి కూడా, స్త్రీ వాటి నుండి జాగ్రత్తపడి రాకుంటే ఎంత భయంకరమైన విషయమో గమనించండి.

ఈ రోజుల్లో స్త్రీలు ఉపయోగించే సుగంధాలు ఏవైతే కొన్ని రకాలు తెలపడం జరుగుతున్నాయో, ఈ సుగంధాల విషయంలో ఇక అల్లాహ్ తోనే మొరపెట్టుకోవాలి. అల్లాహ్, మా ఈ స్త్రీలకు హిదాయత్ ఇవ్వు అని ఇలా దుఆ చేసుకోవాలి. ఆయనే మనకు మార్గం చూపువాడు. ఎందుకనగా, ఈనాటి స్త్రీలు పెళ్లిళ్లలో, ఉత్సవాల్లో వెళ్లేముందు ఉపయోగించే సాంబ్రాణి ధూపములు, అదేవిధంగా బజారుల్లో, వాహనాల్లో అందరూ ఏకమై కలిసేచోట, చివరికి రమదాన్ మాసంలో తరావీహ్‌ల కొరకు ఏదైతే మస్జిదులో వస్తారో, ఇతర రోజుల్లో మస్జిదులో వెళ్లేటప్పుడు కూడా చాలా సేపటి వరకు మరియు దూరం వరకు ఆఘ్రాణించగల, పీల్చబడే అటువంటి సుగంధములు వాడుతూ ఉంటారు. అయితే ఈ సందర్భాలు ఏవైతే ఇప్పుడు తెలపబడ్డాయో, ఇలాంటి సందర్భాల్లో అలాంటి సువాసనలు వాడడం నిషిద్ధం అని వారు తెలుసుకోవడం లేదు.

ధర్మపరంగా స్త్రీలు ఉపయోగించవలసిన పరిమళాలు ఎలా ఉండాలి? వాటి రంగు కానరావాలి. కానరావాలి అంటే పర పురుషులకు కాదు. ఇంట్లో ఉన్న స్త్రీలకు లేదా భర్తకు. కానీ సువాసన రాకూడదు. అల్లాహ్, మాలోని కొందరు మూర్ఖ ప్రజలు చేసిన తప్పుల వల్ల మాలోని పుణ్యాత్ములను శిక్షించకు, మా అందరికీ సన్మార్గం ప్రసాదించు ఓ అల్లాహ్. ఆమీన్.

విషయం అర్థమైందా? మనం మన స్త్రీలను జాగ్రత్తలో, వారి యొక్క అన్ని రకాల పరువు మానాలు భద్రంగా ఉండేందుకు, వారి యొక్క విశ్వాసం కూడా బలంగా ఉండేందుకు, ఇలాంటి నిషిద్ధతలకు పాల్పడకుండా జాగ్రత్తగా ఉంచే ప్రయత్నం మనం పురుషులము, భర్తలము చేయాలి, తండ్రులము చేయాలి. మరియు స్త్రీలు కూడా స్వయంగా ఇంట్లో ఉన్నటువంటి పెద్దలు, భర్తలు గానీ, తండ్రులు గానీ, సోదరులు గానీ మాటిమాటికి చెప్పే అటువంటి పరిస్థితి రానివ్వకూడదు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=5314

ఇస్లామీయ  నిషిద్ధతలు మరియు జాగ్రత్తలు [పుస్తకం]