తౌహీద్‌ ఘనత, అది పాపాల విమోచనానికి ఉత్తమ సాధనం – ఇమామ్ అస్-సాదీ| ఏకత్వపు బాటకు సత్యమైన మాట [వీడియో]

2వ అధ్యాయం
తౌహీద్‌ ఘనత, అది పాపాల విమోచనానికి ఉత్తమ సాధనం
అల్ ఖవ్లుల్ సదీద్ షర్హ్ కితాబ్ అత్ తౌహీద్ – ఇమామ్ అస్-సాదీ
The famous commentary of Shaykh as-Sa’di of the book Kitab at-Tawhid of Muhammad ibn Abdul Wahhab.

యూట్యూబ్ ప్లే లిస్ట్ (ఏకత్వపు బాటకు సత్యమైన మాట)
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0VrU7pg90uGfghChg9Bptl


అల్లాహ్ ఆదేశం:

الَّذِينَ آمَنُوا وَلَمْ يَلْبِسُوا إِيمَانَهُم بِظُلْمٍ أُولَٰئِكَ لَهُمُ الْأَمْنُ وَهُم مُّهْتَدُونَ

“ఎవరయితే విశ్వసించి, తమ విశ్వాసాన్ని “జుల్మ్‌” (షిర్క్‌) తో కలుషితం చేయలేదో, వారికే శాంతి ఉంది. వారు మాత్రమే రుజుమార్గంపై ఉన్నవారు.”(అన్‌ ఆమ్‌ 6 : 82).

ఉబాద బిన్‌ సామిత్‌ (రది అల్లాహు అన్హు) కథనం: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు:

“(1) అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్యుడు లేడని, ఆయన ఒక్కడేనని, 2) ఆయనకు మరెవ్వరూ సాటిలేరని మరియు ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆయన దాసుడు, ప్రవక్త అని; (3) అలాగే ఈసా (అలైహిస్సలాం) కూడా అల్లాహ్ దాసుడు, ఆయన ప్రవక్త అని, కాకపోతే ఆయన హజ్రత్‌ మర్యం (గర్భం)లో అవతరించిన అల్లాహ్ వాక్కు, అల్లాహ్ యొక్క ఆత్మ అని; (4,5) స్వర్గ నరకాలు ఉన్నాయి అన్నది యదార్ధమని, ఎవడైతే సాక్ష్యమిస్తాడో ఆ వ్యక్తి కర్మలు ఎలాంటివయినా సరే అల్లాహ్ అతడ్ని స్వర్గంలో ప్రవేశింపజేస్తాడు”. (బుఖారి, ముస్లిం).

ఇత్బాన్ (రది అల్లాహు అన్హు) కథనం: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలాసెలవిచ్చారు:

“అల్లాహ్ సంతృప్తి కొరకు “లాఇలాహ ఇల్లల్లాహ్” చదివే వారిపై అల్లాహ్ నరకం నిషేధించాడు”. (బుఖారి, ముస్లిం).

అబూ సఈద్‌ ఖుద్రీ (రది అల్లాహు అన్హు) ఉల్లేఖించారు, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారని:

ప్రవక్త మూసా (అలైహిస్సలాం) అల్లాహ్ తో  ఇలా విన్నవించుకున్నారు: ‘ఓ అల్లాహ్!  నాకు కొన్ని వచనాలు నేర్పు. వాటితో నేను నిన్ను స్మరిస్తాను. నీతో అర్ధిస్తాను”. “ఓ మూసా! “లాఇలాహ ఇల్లల్లాహ్” పలుకు” అని అల్లాహ్ నేర్పాడు. మూసా (అలైహిస్సలాం) అన్నారు: “అల్లాహ్! నీ దాసులందరూ ఇదే వచనముతో స్మరిస్తారు?” “ఓ మూసా! ఏడు ఆకాశాలు, నేను తప్ప అందులో ఉన్న సృష్టి, ఇంకా ఏడు భూములను త్రాసు యొక్క ఒక పళ్లెంలో, “లాఇలాహ ఇల్లల్లాహ్” ను ఇంకొక పళ్లెంలో ఉంచితే “లాఇలాహ ఇల్లల్లాహ్” ఉన్న పళ్లెం క్రిందికి వంగిపోవును” అని అల్లాహ్ (దాని విలువను) తెలిపాడు.

(ఇబ్ను హిబ్బాన్‌ మరియు హాకిం సేకరించారు. హాకిం నిజపరిచారు).

అల్లాహ్ ఇలా సెలవిచ్చారని  ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పగా నేను విన్నాను అని అనస్ (రది అల్లాహు అన్హు) ఉల్లేఖించారు:

“ఓ మానవుడా! నీవు భూమి నిండా పాపాలు చేసినప్పటికీ నాతో మరెవ్వరినీ సాటి కల్పించకుండా (చనిపోయి) నాతో కలిసినప్పుడు, ‘నేను అంతే (భూమి నిండా) క్షమాపణలతో నీతో కలుస్తాను (నిన్ను క్షమిస్తాను).(తిర్మిజి. ఈ హదీసు హసన్‌).

ముఖ్యాంశాలు:

1.  అల్లాహ్ దయ, కరుణ చాలా విశాలమైనది.

2. తౌహీద్‌ యొక్క పుణ్యం అల్లాహ్ వద్ద చాలా ఎక్కువగా ఉంది.

3. దానితో పాటు అది పాపాలను తుడిచి వేయును.

4. సూరయే అన్‌ఆమ్‌ లోని ఆయతులో “జుల్మ్‌” అంటే షిర్క్‌ అని భావం.

5. ఉబాద బిన్‌ సామిత్‌ (రది అల్లాహు అన్హు) హదీసులో ఉన్న ఐదు విషయాల్ని గమనించండి.

6. ఉబాద హదీసు, ఇత్బాన్ హదీసు మరియు అబూ సఈద్‌ ఖుద్రీ (రది అల్లాహు అన్హుమ్) హదీసులను కలిపితే “లాఇలాహ ఇల్లల్లాహ్ ” యొక్క అసలు అర్ధం నీకు తెలుస్తుంది. మరియు దాని సరియైన భావాన్ని తెలుసు కొనక మోసబోయి తప్పులో పడియున్నవారి విషయం కూడా స్పష్టం అవుతుంది.

7. ఇత్బాన్ హదీసులో ఉన్న షరతు (అల్లాహ్ ఇష్టం కొరకు)పై చాలా శ్రద్ధ వహించాలి.

8. “లాఇలాహ ఇల్లల్లాహ్” ఘనత తెలుసుకునే అవసరం ప్రవక్తలకు సయితం ఉండేది.

9. “లాఇలాహ ఇల్లల్లాహ్” సర్వ సృష్టికన్నా ఎక్కువ బరువుగలదైనప్పటికీ, దాన్ని చదివేవారిలో చాలా మంది యొక్క త్రాసు తేలికగా (విలువలేనిదిగా) ఉండును.

10. ఆకాశాలు ఏడు ఉన్నట్లు భూములు కూడా ఏడు ఉన్నవని రుజువయింది.

11. అందులో కూడా నివసించువారున్నారు. (జీవించువారున్నారు).

12. అల్లాహ్ యొక్క అన్ని గుణగణాలను నమ్మాలని రుజువవుతుంది. కాని “అష్‌ ఆరీయ్యా” అను ఒక వర్గం వారు కొన్ని గుణగణాలను తిరస్కరిస్తారు.

13. అనస్ (రది అల్లాహు అన్హు) ఉల్లేఖించిన హదీసును నీవు అర్థం చేసుకుంటే, ఇత్బాన్ (రది అల్లాహు అన్హు) ఉల్లేఖించిన హదీసు: “అల్లాహ్ సంతృప్తి కొరకు “లాఇలాహ ఇల్లల్లాహ్ ” చదివే వారిపై అల్లాహ్ నరకం నిషేధించాడు” లో అది కేవలం నోటితో చదవటం కాదు షిర్కు వదులుకోవాలి అని కూడా అర్ధం చేసుకుంటావు.

14. ఉబాద (రది అల్లాహు అన్హు) హదీసులో ఈసా (అలైహిస్సలాం) మరియు ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇద్దరిని “అల్లాహ్ దాసులు, ప్రవక్తలు” అని చెప్పబడింది.

15. ప్రతీది అల్లాహ్ ఆజ్ఞ తోనే పుడుతుంది గనుక అది అల్లాహ్ వాక్కు. కాని ఇక్కడ ప్రత్యేకంగా ఈసా (అలైహిస్సలాం) ను అల్లాహ్ వాక్కు అని చెప్పబడింది .

16. (ఆత్మ అల్లాహ్ యొక్క సృష్టి అయినప్పటికీ) ప్రత్యేకంగా ఈసా (అలైహిస్సలాం) అల్లాహ్ యొక్క ఆత్మ అని చెప్పబడింది.

17. స్వర్గ నరకాలను విశ్వసించు ఘనత కూడా తెలిసింది.

18. ఉబాద హదీసులో “కర్మలు ఏలాంటివైనా సరే” అన్నదానితో (అతడు ఏక దైవోపాసకుడు అయి ఉండుట తప్పనిసరి అనే) భావం తెలుస్తుంది.

19. (ప్రళయదినాన కర్మలు తూకము చేయబడే) త్రాసుకు రెండు పళ్ళాలుండును అని తెలిసింది.

20. ఇత్బాన్ హదీసులో అల్లాహ్ కు “వజ్‌హ్” ఉంది అని వచ్చింది. దాని అర్ధం  “ముఖం” (Face).

తాత్పర్యం: (అల్లామా అల్ సాదీ) 

తౌహీద్ మానవులందరిపై విధిగా ఉన్నదని మొదటి అధ్యాయంలో తెలుపబడింది. ఇందులో దాని ఘనత, ఔన్నత్యం, దాని మంచి ప్రభావాన్ని మరియు దాని సత్ఫలితాన్ని తెలుపడం జరిగింది. తౌహీద్ లో ఉన్నటువంటి వివిధ ఘనతలు, మంచి ప్రభావాలు మరే దానిలో లేవు. ఇహపరాల మేళ్లు అన్నియూ తౌహీద్‌ ఫలితము, దాని ఘనత తోనే లభించును. పాపాల మన్నింపు, వాటి విమోచనం కూడా తౌహీద్‌ ఘనత వలనే. దానికి ఆధారం కూడా పైన తెలుపబడింది. (దాని అనేక ఘనతల్లో కొన్ని క్రింద చూడండి).

1. ఇహపరాల కష్టాలు, విపత్తులు దూరమగుటకు ఇది గొప్ప కారణం.

2.తౌహీద్‌ హృదయంలో ఆవగింజంత ఉన్నా, అది నరకాగ్నిలో శాశ్వతంగా ఉండకుండా కాపాడుతుంది.

3. అది సంపూర్ణంగా ఉంటే నరక ప్రవేశం నుండే కాపాడుతుంది.

4. తౌహీద్ గల వ్యక్తికి ఇహపర లోకాల్లో సంపూర్ణ సన్మార్గం, పూర్తి శాంతి ప్రాప్తి యగును.

5. అల్లాహ్ సంతృప్తి, దాని సత్ఫలితం పొందుటకు అది ఏకైక కారణం. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సిఫారసుకు అర్హుడయ్యే అదృష్టవంతుడు “లాఇలాహ ఇల్లల్లాహ్” నిర్మలమైన మనుస్సుతో చదివేవాడు.

6. బాహ్య, ఆంతర్య, సర్వ మాటల, కర్మల అంగీకారం, వాటి సంపూర్ణత, వాటి సత్ఫలితం తౌహీద్‌ పై ఆధారపడియుంది. తౌహీద్‌ లో ఎంత బలం, స్వచ్ఛత ఉంటే, అంతగా ఆ విషయాలు సంపూర్ణం అవుతాయి.

7.సత్కార్యాలు చేయడం, దుష్కార్యాల నుండి దూరముండడం తౌహీద్‌ మూలంగా సులభమగును. బాధ కలిగినప్పుడు తృప్తి లభించును. తౌహీద్‌, విశ్వాసంలో అల్లాహ్ కొరకు స్వచ్ఛత చూపేవాడు సత్కార్యాలపై సత్ఫలితం, అల్లాహ్ ప్రసన్నతను ఆశిస్తాడు. కనుక అవి అతనికి చాలా తేలికగా ఏర్పడుతాయి. దుష్కార్యాలపై ఉన్న శిక్షతో భయపడుతాడు కనుక అవి వదలుకోవడం కూడా అతనికిచాలా తేలికగా ఉంటుంది.

8.హృదయాంతరంలో తౌహీద్‌ సంపూర్ణమయితే అల్లాహ్ వారికి విశ్వాసం పట్ల ప్రేమను కలుగజేస్తాడు, దాన్ని మనోరంజకమైనదిగా చేస్తాడు.అవిశ్వాసం, దుర్మార్గం, అవిధేయతల పట్ల అసహ్యం కలిగేలా చేస్తాడు. అతన్ని సన్మార్గం పొందువారిలో చేర్చుతాడు.

9.ఏ దాసునిలో తౌహీద్‌, విశ్వాసం సంపూర్ణంగా ఉంటుందో అతడు అసహ్యమైన సంఘటనలను, కష్ట బాధలను ఎంతో విశాలమైన, సంతృప్తికరమైన మనుస్సుతో సహిస్తాడు. అల్లాహ్ వ్రాసి ఉంచిన అదృష్టంపై సంతోషంగా ఉంటాడు.

10) ఇంకా దాని ఘనత: అది మానవ దాస్యం నుంచి అతన్ని విముక్తి కలిగిస్తుంది. అతడు అల్లాహ్ తప్ప ఇతరుల పై ఆధారపడి, వారితో భయపడుతూ ఉండడు. వారి దయదాక్షిణ్యాల వైపు కన్నెత్తి చూడడు. అతడు చేసేది వారి కొరకూ కాదు. వాస్తవానికి ఇదే నిజమైన పరువు ప్రతిష్ట, మాన్యత. దీనితో పాటు అతడు అల్లాహ్ నే ఆరాధిస్తాడు. ఆయనకు తప్ప మరెవ్వరికి భయపడడు. మరెవ్వరితో కరుణను ఆశించడు. ఇలా అతడు సంపూర్ణ సాఫల్యం పొందుతాడు.

11. తౌహీద్‌ తప్ప ఇంకే దానికీ లభించని ఘనత: అతని మనసులో తౌహీద్‌, ఇఖ్లాసు తో కూడుకొని సంపూర్ణం అయితే, అతని చిన్న కర్మ కూడా అసంఖ్యాక ఫలితాన్ని పొందుతుంది. అతని మాటల, చేష్టల ఫలితం లెక్క లేకుండా పెరుగుతుంది. అబూ సయీద్ (రది అల్లాహు అన్హు) హదీసులో వచ్చిన ప్రకారం “ఇఖ్లాసుతో కూడుకున్న అతని ఆ సద్వచనం (లాఇలాహ ఇల్లల్లాహ్) భూమ్యాకాశాలు, (అల్లాహ్ తప్ప) అందులో ఉన్న సర్వం కన్నా బరువుగా ఉంటుంది”. ఇలాంటి విషయమే “హదీసుల్‌ బితాఖ” అన్న పేరుతో ప్రసిద్ది చెందిన హదీసులో కూడా ఉంది: “లాఇలాహ ఇల్లల్లాహ్” వ్రాసి ఉన్న చిన్న ముక్క తొంభై తొమ్మిది రిజిస్టర్ల (Records) కంటే ఎక్కువ బరువు గలదై పోతుంది. అందులో ప్రతీ ఒక్క రిజిస్టర్ దాని పొడవు, మనిషి దృష్టి ఎంత దూరము చేరుకుంటుందో అంత దూరముంటుంది. మరో  వైపు కొందరుంటారు; తౌహీద్‌, ఇఖ్లాసు మనసులో సంపూర్ణం లేనివారు. వారికి ఈ స్థానం, ఘనత ప్రాప్తి కాదు.

12) ఇహపరాల్లో తౌహీద్‌ వారలకు అల్లాహ్ విజయం, సహాయం, గౌరవం నొసంగుతాడు. సన్మార్గం ప్రసాదిస్తాడు. మంచి పనులు చేయుటకు సౌకర్యం కలుగజేస్తాడు. మాటలను, చేష్టలను సంస్కరించుకునే భాగ్యం ప్రసాదిస్తాడు.

13) విశ్వాసులైన  తౌహీద్‌ వారల నుండి ఇహపరాల బాధలను దూరము చేసి, శాంతి, సుఖ ప్రదమైన జీవితం అనుగ్రహిస్తాడు. దీని ఉదాహరణలు, సాక్ష్యాలు ఖుర్‌ ఆన్‌, హదీసులో చాలా ఉన్నవి.


నుండిఏకత్వపు బాటకు సత్యమైన మాట (అల్ ఖవ్లుల్ సదీద్ షర్హ్ కితాబ్ అత్ తౌహీద్)  – ఇమామ్ అస్-సాదీ [పుస్తకం]  

సహాబాలు – వారి గొప్పతనం, వారి గురించి మనకు ఉండ వలసిన అఖీదా (విశ్వాసము) [ఆడియో & టెక్స్ట్]

సహాబా : ‘సహాబీ‘కి బహువచనం ‘సహాబా‘. విశ్వాస (ఈమాన్‌) స్థితిలో దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం)ను కలుసుకుని, విశ్వాసస్థితిలో తనువు చాలించిన వారంతా సహాబా (సహచరులు- రది అల్లాహు అన్హుమ్) అనబడతారు.

వారు ముస్లిం సమాజంలో అందరికన్నా శ్రేష్టులని, ఇస్లాం వైపు ముందంజవేసిన వారని, ప్రవక్త సహచర్య భాగ్యం పొందినవారని, ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం)తో కలిసి జిహాద్‌ చేసినవారని, షరీయత్‌ బరువు బాధ్యతలను మోయటమే గాకుండా దానిని తమ తరువాతి తరాల వారికి అందించిన ధన్యజీవులని, ఈ కారణంగా వారు ప్రపంచంలోనే అత్యుత్తమ సమూహం అని మనం విశ్వసించటం తప్పనిసరి (వాజిబ్‌). – [నుండి: సహాబా అంటే ఎవరు? వారి గురించి ఎటువంటి నమ్మకం కలిగి ఉండాలి? – డా. సాలెహ్ అల్ ఫౌజాన్]


వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

భాగం 01: సహాబా అంటే ఎవరు? (2:06నిముషాలు)

భాగం 02: సహాబా యొక్క ప్రాముఖ్యత  (1:11నిముషాలు)

భాగం 03: ఇస్లాంలో సహాబాల గొప్పతనం (1:43నిముషాలు)

భాగం 04: తౌరాతు మరియు ఇంజీలు గ్రంధాలలో సహాబాల ప్రస్థావన (3:28నిముషాలు)

భాగం 05: సహాబాల గురించి ప్రవక్త గారు ఏమి చెప్పారు? (1:48 నిముషాలు)

భాగం 06: మన మీద సహాబాల హక్కులు ఏమిటి? (2:05 నిముషాలు)

భాగం 07: సహాబాల గురించి ఖురాన్ ఏమి చెబుతుంది? (0:49నిముషాలు)

భాగం 08: సహాబాల స్వర్ణయుగపు రోజులు (1:31నిముషాలు)

భాగం 09: సలఫ్ సాలిహీన్ దృష్టిలో సహాబాల గొప్పతనం (3:21 నిముషాలు)

భాగం 10: సహాబాలను ప్రేమించడం విశ్వాసంలో ఒక భాగం (2:04నిముషాలు)

భాగం 11: ఇమాం అహ్మద్ సహాబాల గురుంచి ఏమి చెప్పారు? (1:09నిముషాలు)

పూర్తి ఆడియో క్రింద వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి 

సహాబా : పూర్తి ఆడియో (21:21నిముషాలు)

ఈ ప్రసంగంలో, సహాబాల (ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనుచరులు) యొక్క నిర్వచనం, వారి ఉన్నత స్థానం మరియు ప్రాముఖ్యత వివరించబడింది. వారి జీవిత చరిత్రను తెలుసుకోవడం ఎందుకు ముఖ్యమో హజ్రత్ అబ్దుల్లా బిన్ మస్ఊద్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనతో స్పష్టం చేయబడింది. సహాబాల యొక్క సద్గుణాలను మరియు వారి పట్ల అల్లాహ్ యొక్క ప్రసన్నతను సూరతుల్ ఫతహ్ వంటి ఖుర్ఆన్ ఆయతుల ద్వారా వివరించారు. సహాబాలను దూషించడాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తీవ్రంగా ఖండించిన హదీసులు, వారి పట్ల విశ్వాసులు నిర్వర్తించాల్సిన బాధ్యతలు మరియు వారి మధ్య ఉన్న వివిధ స్థాయిల గురించి చర్చించబడింది. సలఫె సాలెహీన్ (పూర్వపు సత్పురుషులు) సహాబాలను ఎలా గౌరవించేవారో అబ్దుల్లా బిన్ ఉమర్ మరియు అబ్దుల్లా ఇబ్నుల్ ముబారక్ వంటి వారి ఉదాహరణలతో వివరించబడింది. సహాబాలను దూషించే వారి పట్ల ఇమామ్ అహ్మద్ వంటి ఇస్లామీయ పండితుల కఠినమైన వైఖరిని కూడా ఈ ప్రసంగం స్పష్టం చేస్తుంది.

సోదర సోదరీమణులారా, సహాబీ ఇది ఏకవచనం, సహాబా ఇది బహువచనం. సహాబియా ఇది ఏకవచనం, స్త్రీలను అంటారు. సహాబియాత్ ఇది బహువచనం, స్త్రీలను అంటారు. ఏ స్త్రీలు? ఏ పురుషులు? సహాబీ అంటే ఎవరైతే విశ్వాస స్థితిలో ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని చూసి, కలిసి, విశ్వాస స్థితిలోనే చనిపోయారో వారిని సహాబీ అంటారు. ఇక ఒక్కరు పురుషులైతే సహాబీ, ఇద్దరు పురుషులైతే సహాబియాన్, అంతకంటే ఎక్కువ వారిని సహాబా లేదా అస్హాబు ముహమ్మద్, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క మిత్రులు అని అనబడుతుంది. ఒక స్త్రీ అయ్యేది ఉంటే, ప్రవక్త సల్లల్లహు అలైహి వసల్లం వారిని చూసి, ప్రవక్త సల్లల్లహు అలైహి వసల్లం వారిపై విశ్వసించి, విశ్వాస స్థితిలో చనిపోయిన స్త్రీ సహాబియా, సహాబియతాన్, సహాబియాత్.

అయితే సోదర సోదరీమణులారా, వారి జీవిత గాథ తెలుసుకోవడం, వారి జీవిత విషయాలు తెలుసుకోవడం ఎందుకు ముఖ్యము అన్నటువంటి ఒక ప్రశ్న మీరు అడగవచ్చు. అయితే సమాధానం చాలా శ్రద్ధగా వినండి. ఈ సమాధానం నేను నా ఇష్టంతో, నేను నా ఆలోచనతో చెప్పేది కాదు. హజ్రత్ అబ్దుల్లా బిన్ మస్ఊద్ రదియల్లాహు తాలా అన్హు, ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మిత్రులలో, సహాబాలలో ఒక గొప్ప సహాబీ. ఆయన తెలుపుతున్నారు. ఏమన్నారు ఆయన?

“అల్లాహు తాలా మానవుల హృదయాల పట్ల దృష్టి వేశాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హృదయాన్ని అందరి హృదయాల కంటే ఎంతో ఉత్తమంగా చూశాడు. ఆయన్ని ప్రవక్తగా ఎన్నుకున్నాడు. ఆ తర్వాత, అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ ప్రజల హృదయాలను వెతికాడు, చూశాడు. సహాబాల హృదయాలను ఎంతో పరిశుద్ధంగా పొందాడు. అల్లాహ్ ఆ సహాబాలను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి స్నేహితులుగా, అండదండగా, వారికి వారి ఈ ప్రచార కార్యక్రమంలో దోహదపడేవారుగా ఎన్నుకున్నాడు

ఈ సహాబాలు ఎంత గొప్పవారు, ఎంత గొప్ప శ్రేణికి చెందినవారు. అల్లాహు తాలా స్వయంగా ప్రళయ దినం వరకు సురక్షితంగా ఉండేటటువంటి సత్య గ్రంథం, దివ్య గ్రంథం ఖుర్ఆన్ లో వంద కంటే పైగా ఆయతులలో వారిని ప్రశంసించాడు. వారి యొక్క ఉన్నత గుణాలను ప్రస్తావించాడు. వారి యొక్క ఎన్నో మంచి విషయాలను ప్రళయం వరకు వచ్చే ప్రజలందరి కొరకు ఒక మంచి ఆదర్శంగా ఉంటాయని కూడా తెలిపాడు.

ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసించిన ఈ సహాబాలు, వారిని విశ్వసించడం మన విశ్వాసంలోని ఒక ముఖ్యమైన భాగం. మనం అల్లాహ్ ను విశ్వసిస్తున్నాము, అల్లాహ్ యొక్క ప్రవక్తలను, వారిలో ప్రత్యేకంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసిస్తాము. ఇంకా విశ్వాసానికి సంబంధించిన ఏ ఏ విషయాలు ఉన్నాయో, వాటిలో ఒక ముఖ్యమైన విషయం సహాబాలను కూడా విశ్వసించడం.

హజ్రత్ అబ్దుల్లా బిన్ మస్ఊద్ రదియల్లాహు తాలా అన్హు చెప్పిన ఒక విషయాన్ని గమనించండి,

أَبَرُّ هَذِهِ الْأُمَّةِ قُلُوبًا
(అబర్రు హాదిహిల్ ఉమ్మతి ఖులూబా)
సహాబాలు సర్వ విశ్వాసులలో, సర్వ విశ్వాసులలో అతి పరిశుద్ధమైన హృదయాలు గలవారు.

وَأَعْمَقُهَا عِلْمًا
(వ అ’మఖుహా ‘ఇల్మా)
చాలా లోతుగల జ్ఞానం, విద్య గలవారు.

وَأَقَلُّهَا تَكَلُّفًا
(వ అఖల్లుహా తకల్లుఫా)
చాలా తక్కువగా వారు ఏదైనా పని చేయడంలో వారి నుండి కావాలని ఏదీ పొరపాటు జరిగేది కాదు మరియు కావాలని ఎలాంటి బాధలలో చిక్కుకునే ప్రయత్నం చేసేవారు కారు.

وَأَقْوَمُهَا هَدْيًا
(వ అఖ్వముహా హద్యా)
సన్మార్గంపై, సన్మాగంపైన అందరికంటే ఎక్కువగా ఉత్తమంగా నడిచేవారు.

وَأَحْسَنُهَا حَالًا
(వ అహ్సనుహా హాలా)
అందరికంటే ఉత్తమ స్థితిలో జీవితం గడిపేవారు.

اخْتَارَهُمُ اللَّهُ لِصُحْبَةِ نَبِيِّهِ وَلِإِقَامَةِ دِينِهِ
(ఇఖ్తారహుముల్లాహు లిసుహబతి నబియ్యిహి వలి ఇఖామతి దీనిహి)
అల్లాహు తాలా వారిని తన ప్రవక్తకు స్నేహితులుగా ఎన్నుకున్నాడు మరియు తన ఈ ధర్మాన్ని స్థాపించబడటానికి వారిని ఎన్నుకున్నాడు

గమనించారా? అబ్దుల్లా బిన్ మస్ఊద్ రదియల్లాహు తాలా అన్హు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మక్కాలో ఉండగానే విశ్వసించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తో ఇంచుమించు ఒక 20 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ జీవితం గడిపారు. తొలి రోజుల్లో ఇస్లాం స్వీకరించిన సహాబాలను చూశారు. మదీనా వలస వచ్చిన తర్వాత సహాబాలను చూశారు. ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి చివరి దశలో ఇస్లాం స్వీకరించిన వారిని కూడా చూశారు. అయితే గమనించండి, వారు సహాబాల గురించి ఎంత గొప్ప విషయం తెలిపారు.

సూరతుల్ ఫతహ్ లో:

مُّحَمَّدٌ رَّسُولُ اللَّهِ ۚ وَالَّذِينَ مَعَهُ أَشِدَّاءُ عَلَى الْكُفَّارِ رُحَمَاءُ بَيْنَهُمْ ۖ تَرَاهُمْ رُكَّعًا سُجَّدًا يَبْتَغُونَ فَضْلًا مِّنَ اللَّهِ وَرِضْوَانًا ۖ سِيمَاهُمْ فِي وُجُوهِهِم مِّنْ أَثَرِ السُّجُودِ ۚ ذَٰلِكَ مَثَلُهُمْ فِي التَّوْرَاةِ ۚ وَمَثَلُهُمْ فِي الْإِنجِيلِ كَزَرْعٍ أَخْرَجَ شَطْأَهُ فَآزَرَهُ فَاسْتَغْلَظَ فَاسْتَوَىٰ عَلَىٰ سُوقِهِ يُعْجِبُ الزُّرَّاعَ لِيَغِيظَ بِهِمُ الْكُفَّارَ ۗ وَعَدَ اللَّهُ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ مِنْهُم مَّغْفِرَةً وَأَجْرًا عَظِيمًا

ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం అల్లాహ్ ప్రవక్త. ఆయన సల్లల్లాహు అలైహివ సల్లం వెంట ఉన్నవారు అవిశ్వాసులకు కొరుకుడు పడనివారు. ఒండొకరి పట్ల మాత్రం దయార్ద్ర హృదయులు. దైవకృపను, దైవప్రసన్నతను చూరగొనే ప్రయత్నంలో వారు (దైవ సన్నిధిలో) వినమ్రులై వంగటాన్ని, సాష్టాంగపడటాన్ని నీవు చూస్తావు. వారి సాష్టాంగ ప్రణామాల ప్రత్యేక ప్రభావం వారి ముఖారవిందాలపై తొణకిస లాడుతూ ఉంటుంది. వీరికి సంబంధించిన ఈ ఉపమానమే తౌరాతులో ఉంది. ఇంజీలులో (కూడా) వారి ఉపమానం ఉంది. అది ఒక పంటపొలం వంటిది. అది తన మొలకను మొలకెత్తించింది. తరువాత దానిని బలపరిచింది. ఆ తరువాత అది లావు అయింది. ఆ పైన అది తన కాండంపై నిటారుగా నిలబడింది, రైతులను అలరించసాగింది – వారి ద్వారా అవిశ్వాసులను మరింత ఉడికించాలని! వారిలో విశ్వసించి, సత్కార్యాలు చేసిన వారికి మన్నింపును, గొప్ప ప్రతిఫలాన్ని ప్రసాదిస్తానని అల్లాహ్ వాగ్దానం చేసి ఉన్నాడు. (48:29)

గమనించండి, ఈ రోజుల్లో ఎవరైతే సహాబాలను అగౌరవపరుస్తున్నారో, సహాబాలలో ఏ ఒక్కరి ప్రస్తావన వచ్చినా వారి పట్ల అసంతృప్తి వ్యక్తపరుస్తున్నారో, ఒకసారి ఈ ఖుర్ఆన్ ఆయత్ ల పట్ల శ్రద్ధ వహించాలి. అల్లాహ్ వారిని ప్రశంసిస్తున్నాడు. వారిలో ఉన్నటువంటి ఉత్తమ గుణాలను ప్రస్తావిస్తున్నాడు. వారి యొక్క ఈ ఉత్తమ గుణాలు కేవలం ఖుర్ఆన్ లోనే కాదు, ఖుర్ఆన్ కంటే ముందు గ్రంథాలు ఏవైతే ఉన్నాయో తౌరాత్ మరియు ఇంజీల్, వాటిలో కూడా వీరి ఉత్తమ గుణాలు ఉన్నాయి అని స్వయంగా అల్లాహ్ సాక్ష్యం పలుకుతున్నాడో, అలాంటి వారిని మనం దూషించడం, అలాంటి వారి గురించి మనం చెడుగా ఆలోచించడం, అలాంటి వారి పట్ల మనం ఏదైనా దుర్భాషలాడటం, ఇది మన విశ్వాసంలో కొరత, మన విశ్వాసానికి చాలా భయంకరమైన ముప్పు కలుగజేస్తుంది.

అల్లాహ్ తాలా వారిని ప్రశంసిస్తూ ఇస్లాం మరియు ఇస్లాం స్వీకరించిన వారి పట్ల ఎంత మృదువుగా, ఎంత ఆప్యాయతతో, కరుణా కటాక్షాలతో వారు జీవితం గడుపుతారంటే, అవిశ్వాసానికి సంబంధించిన విషయాలు మరియు సత్య ధర్మమైన ఇస్లాంకు వ్యతిరేకమున్న విషయాలు వారికి ఏమాత్రం ఇష్టం ఉండవు. నీవు వారిని రుకూ చేస్తూ, సజ్దా చేస్తూ చూస్తూ ఉంటావు. వారు అల్లాహ్ యొక్క కారుణ్యాన్ని, అల్లాహ్ యొక్క సంతృప్తిని కోరుతూ ఉంటారు. మరియు వారి యొక్క సజ్దా గుర్తులు, చిహ్నాలు వారి ముఖాలపై ఎంతో స్పష్టంగా కనబడుతూ ఉంటుంది. ఆ తర్వాత ఏమన్నాడో గమనించండి అల్లాహు తాలా,

تَرَاهُمْ رُكَّعًا سُجَّدًا يَبْتَغُونَ فَضْلًا مِّنَ اللَّهِ وَرِضْوَانًا ۖ سِيمَاهُمْ فِي وُجُوهِهِم مِّنْ أَثَرِ السُّجُودِ ۚ ذَٰلِكَ مَثَلُهُمْ فِي التَّوْرَاةِ

ఇదంతా వారి గురించి ప్రస్తావించి, ప్రశంసించి, “వారి ఈ ఉపమానం తౌరాతులో ఉంది.” ఈ ఉదాహరణలు, ఈ పోలికలు, ఈ ఉత్తమ గుణాలు వారి గురించి ఏవైతే ప్రస్తావించబడ్డాయో, ఇవన్నీ కూడా తౌరాతులలో కూడా ఉన్నాయి. అంటే వీరి గుణాలు ఇలా ఉంటాయి, ఎవరైతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసిస్తారో, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సహాబాలు ఎవరైతే ఉన్నారో, వారి యొక్క ఈ ఉత్తమ గుణాలు అని తౌరాత్ లో ప్రస్తావన వచ్చి ఉంది. అంతే కాదు, ఇంజీల్ లో ఎలా ఉంది?

وَمَثَلُهُمْ فِي الْإِنجِيلِ كَزَرْعٍ أَخْرَجَ شَطْأَهُ فَآزَرَهُ فَاسْتَغْلَظَ فَاسْتَوَىٰ عَلَىٰ سُوقِهِ يُعْجِبُ الزُّرَّاعَ لِيَغِيظَ بِهِمُ الْكُفَّارَ ۗ وَعَدَ اللَّهُ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ مِنْهُم مَّغْفِرَةً وَأَجْرًا عَظِيمًا

ఇంజీలులో (కూడా) వారి ఉపమానం ఉంది. అది ఒక పంటపొలం వంటిది. అది తన మొలకను మొలకెత్తించింది. తరువాత దానిని బలపరిచింది. ఆ తరువాత అది లావు అయింది. ఆ పైన అది తన కాండంపై నిటారుగా నిలబడింది, రైతులను అలరించసాగింది – వారి ద్వారా అవిశ్వాసులను మరింత ఉడికించాలని! వారిలో విశ్వసించి, సత్కార్యాలు చేసిన వారికి మన్నింపును, గొప్ప ప్రతిఫలాన్ని ప్రసాదిస్తానని అల్లాహ్ వాగ్దానం చేసి ఉన్నాడు“.” (48:29)

ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎంతో స్పష్టంగా తెలిపారు:

لَا تَسُبُّوا أَصْحَابِي
(లా తసుబ్బూ అస్ హాబీ)
నా సహాబాలను మీరు దూషించకండి.

అంతేకాదు, వారి యొక్క స్థానం ఎంత గొప్పదో అది కూడా ఇదే హదీసులో తెలియబరిచారు. అదేమిటి?

“లవ్ అన్ఫఖ అహదు మిన్కుమ్ మిస్ల ఉహుదిన్ జహబా, మా బలగ ముద్ద అహదిహిమ్ వలా నసీఫహు.”
మీలో ఎవరైనా ఉహద్ పర్వతం ఎంత పెద్దగా ఉందో అంత బంగారం అల్లాహ్ మార్గంలో ఖర్చు చేసినా, సహాబాలు సామాన్యంగా ఏదైనా విషయం, ఏదైనా వస్తువు, వారు ఒక ముప్పావు కిలో, 600 గ్రాములు, లేదా 300 గ్రాముల వరకు ఏదైతే ఖర్చు పెట్టారో దానికి సమానం కూడా కాజాలదు. అల్లాహు అక్బర్.

గమనించండి సోదరులారా. ఉహద్ పర్వతం ఎంత పెద్దదో తెలుసా? ఇంచుమించు 7 నుండి 8 కిలోమీటర్ల పొడవు, 2 నుండి 3 కిలోమీటర్ల వెడల్పు మరియు 700 మీటర్ల ఎత్తు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, మీలో ఎవరైనా ఉహద్ పర్వతం అంత బంగారం ఖర్చు పెట్టినా, సహాబాలు ఒక 300 గ్రాముల వరకు లేదా ఒక 600, 650 గ్రాముల వరకు ఏదైనా వస్తువు ఖర్చు పెట్టి ఉంటే, మీ ఈ ఉహద్ పర్వతం లాంటి బంగారం అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టడం సహాబాలు చేసిన ఈ పుణ్యానికి, దానానికి సమానంగా కాజాలదు. సహాబాల స్థానంలో, మీ స్థానంలో ఇంత పెద్ద గొప్ప వ్యత్యాసం ఉంది. మీరు ఏ నోట వారిని దూషిస్తారు? ఏ నోట వారిని మీరు చెడుగా ప్రస్తావిస్తారు?

మొదటి హక్కు సహాబాల గురించి మనపై ఉన్నది ఏమిటి? అల్లాహు తాలా లేదా చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి ఏ ఘనతలు తెలిపారో వాటిని నమ్మడం. వారిలో ఎంతో గొప్ప స్థానంలో, వారి స్థానాల్లో హెచ్చుతగ్గులు కూడా ఉన్నాయి. ఉదాహరణకు, మొట్టమొదటి స్థానంలో హజ్రత్ అబూబకర్, రెండవ స్థానంలో హజ్రత్ ఉమర్, మూడవ స్థానంలో హజ్రత్ ఉస్మాన్, నాలుగో స్థానంలో హజ్రత్ అలీ రదియల్లాహు అన్హుమ్ వరద్వు అన్. ఇక ఈ నలుగురి తర్వాత, ఇహలోకంలో ఏ పది మంది గురించైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్వర్గం యొక్క శుభవార్త ఇచ్చారో వారిలో ఈ నలుగురు వస్తారు, మిగిలిన ఆరుగురు, ఆ తర్వాత బద్ర్ లో పాల్గొన్నవారు. కానీ మొట్టమొదటి హక్కు ఏమిటి? ఎవరి గురించి ఏ ఏ ఘనతలు ఖుర్ఆన్ లో లేదా హదీసుల్లో వచ్చి ఉన్నాయో వాటిని మనం నమ్మాలి. వాటిలో ఏ ఒక్కటిని కూడా తిరస్కరించకూడదు.

ఎందుకో తెలుసా? ఉదాహరణకు, హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు తాలా అన్హు గారి యొక్క ఘనతలో ఖుర్ఆన్ లో కొన్ని ఆయతులు అవతరింపజేయబడ్డాయి. స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎన్నో హదీసుల్లో ఆయన గురించి ఎన్నో గొప్ప విషయాలు చెప్పారు. వాటిలో ఏ ఒక్కటినీ కూడా మనం తిరస్కరిస్తే, ఇందులో అబూబకర్ స్థానంలో ఏ కొరత ఏర్పడదు. కానీ మనం ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మాటలు తిరస్కరించిన వారిలో, అల్లాహ్ యొక్క ఆయతులను తిరస్కరించిన వారిలో అయిపోతాము. ఎప్పుడైతే మనం వారికి ఏ స్థానం ఇవ్వబడినదో దానిని మనం విశ్వసిస్తున్నామో, నమ్ముతున్నామో, అక్కడే వారిలోని ఏ ఒక్కరి పట్ల కూడా మన మనసులో ఏ కీడు కానీ, ఏ కపటం గానీ, ఎలాంటి దోషం కానీ ఉండకూడదు. మన హృదయంలో ఎలాంటి కపటము, ద్వేషము, జిగస్సు ఏదీ కూడా ఉండకూడదు. మన హృదయం వారి గురించి ఎంతో తేటతెల్లగా, స్పష్టంగా ఉండాలి. ఎలాంటి కీడు లేకుండా ఉండాలి.

సూరతుల్ అహ్జాబ్, ఆయత్ నంబర్ 58లో అల్లాహు తాలా తెలిపాడు:

وَالَّذِينَ يُؤْذُونَ الْمُؤْمِنِينَ وَالْمُؤْمِنَاتِ بِغَيْرِ مَا اكْتَسَبُوا فَقَدِ احْتَمَلُوا بُهْتَانًا وَإِثْمًا مُّبِينًا

ఎవరైతే విశ్వాస స్త్రీ పురుషులను వారి ఏ పాపం లేకుండా, ఏ కారణం లేకుండా వారిని బాధ పెడతారో, వారికి హాని కలుగజేస్తారో, వారు చాలా భయంకరమైన పాపాన్ని మరియు ఒక భయంకరమైన అపనిందను, స్పష్టమైన పాపాన్ని తమ మెడకు కట్టుకున్నవారైపోతారు.

అందు గురించి అలాంటి వారు భయపడాలి. ఇక్కడ సామాన్యంగా విశ్వాసుల పదం ఏదైతే వచ్చిందో, ఎవరో విశ్వాసులని అనుకోకండి. విశ్వాసుల్లో మొట్టమొదటి స్థానంలో సహాబాలు వస్తారు అన్న విషయం మరవకండి.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమంటున్నారు? సహీ బుఖారీ, సహీ ముస్లిం ఇంకా వేరే హదీస్ గ్రంథాల్లో ఈ హదీస్ ఉంది:

خَيْرُ النَّاسِ قَرْنِي ثُمَّ الَّذِينَ يَلُونَهُمْ ثُمَّ الَّذِينَ يَلُونَهُمْ
(ఖైరున్నాసి ఖర్నీ, సుమ్మల్లజీన యలూనహుమ్, సుమ్మల్లజీన యలూనహుమ్)
అన్ని కాలాల్లో అతి ఉత్తమమైన కాలం నాది, మళ్లీ ఆ తర్వాత వచ్చే కాలం, మళ్లీ ఆ తర్వాత వచ్చే కాలం.

అల్లాహు అక్బర్. గమనించండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ ఆ కాలాన్ని అన్ని కాలాల్లో అతి శ్రేష్టమైనదని తెలుపుతున్నారు. ఎందుకు? ఎందుకంటే ప్రజలు తిరస్కరించినప్పుడు ఈ సహాబాలు ఇస్లాంను స్వీకరించారు, విశ్వాస మార్గాన్ని అవలంబించారు. ఎప్పుడైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని వదిలేశారో, చివరికి స్వయంగా వారి కుటుంబంలోని కొందరు, అప్పుడు ఈ సహాబాలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి చేరువుగా అయ్యారు, దగ్గరగా అయ్యారు. ఎప్పుడైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని తమ ఇంటి నుండి వెళ్లగొట్టారో, అప్పుడు ఈ సహాబాలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సహాయమందజేసి, తమకు దగ్గరగా తీసుకున్నారు. ఈ విధంగా ఇస్లాం పట్ల సహాబాల త్యాగాలు ఇంతా అంతా కావు, ఎంతో గొప్పమైనవి.

మన సలఫె సాలెహీన్ రహిమహుముల్లాహ్ సహాబాలను ఎలా గౌరవించేవారు? సహాబాల గురించి వారి యొక్క విశ్వాసం, వారి యొక్క ప్రేమ, వారి యొక్క గౌరవ మర్యాదలు ఎలా ఉండేవి? వాటిని కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాము.

హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ రదియల్లాహు అన్హు, హజ్రత్ ఉమర్ రదియల్లాహు అన్హు గారి యొక్క కుమారుడు. ఒక సందర్భంలో అతను తెలిపాడు, “ప్రజలారా, సహాబాలను దూషించకండి. సహాబాలు కొంతసేపు, ఒక చిన్నపాటి గడియ, వారు ఏదైతే అల్లాహ్ ఆరాధనలో గడిపారో, మీరు మీ జీవితాంతం చేసే మీ ఆరాధన వారి ఆ గడియపాటు ఆరాధనకు చేరుకోదు.” వారి స్థానం అంత గొప్పది కనుక మీరు వారిని దూషించకండి.

అబ్దుల్లా ఇబ్నుల్ ముబారక్ రహిమహుల్లాహ్, చాలా గొప్ప ముహద్దిస్, ఒక వ్యక్తి అతని వద్దకు వచ్చాడు. వచ్చి, ముఆవియా రదియల్లాహు తాలా అన్హు ఎక్కువ ఘనత గలవారా, లేకుంటే ఉమర్ బిన్ అబ్దుల్ అజీజా అని ప్రశ్నించాడు. అబ్దుల్లా ఇబ్నుల్ ముబారక్ ఏం సమాధానం చెప్పారు? దానికంటే ముందు ఒక విషయం తెలుసుకోండి. ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ సహాబీ కాదు, తాబియీన్లలో వస్తారు. ఆయన చాలా ఉత్తమమైన వారు, ఆయన ఒక ఖలీఫా, వారిని ఐదవ ఖలీఫా అని అంటారు. కానీ ముఆవియా రదియల్లాహు తాలా అన్హు ఆయనకు ఎన్నో ఘనతలు ఉన్నాయి. అట్టి ముఖ్యమైన ఘనత ఏమిటి? సహాబీ. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని తమ కళ్లారా చూశారు, విశ్వసించారు, విశ్వాస స్థితిలో మరణించారు. అంతేకాదు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై ఏ వహీ వచ్చేదో దానిని రాసేవారు ఏ సహాబాలైతే ఉన్నారో, కాతిబీనె వహీ, వారిలో ఒకరు. అంతేకాదు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి బావమరిది. అంటే, హజ్రత్ అమీరె ముఆవియా రదియల్లాహు తాలా అన్హు గారి యొక్క సోదరి ఉమ్మె హబీబా రదియల్లాహు తాలా అన్హా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క పవిత్ర భార్య. విశ్వాసం మరియు సహాబీ కావడం తో పాటు ఇన్ని రకాల ఇంకా మరెన్నో ఘనతలు కూడా ఉన్నాయి. అయితే అతి ముఖ్యమైన విషయం అతను సహాబీ. ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ చాలా ఉత్తమమైన వారు కానీ సహాబీ కాదు.

అయితే ఒక వ్యక్తి వచ్చి ఏమడుగుతున్నాడు అబ్దుల్లా ఇబ్నుల్ ముబారక్ తో? అమీరె ముఆవియా ఎక్కువ ఘనత గలవారా లేకుంటే ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ ఎక్కువ ఘనత గలవారా? అప్పుడు అబ్దుల్లా ఇబ్నుల్ ముబారక్ రహిమతుల్లాహి అలైహి చెప్పారు, “ముఆవియా రదియల్లాహు తాలా అన్హు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తో ఉండగా, ఆయన ముక్కులో పోయినటువంటి దుమ్ము, ధూళి, దాని స్థానానికి కూడా ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ చేరుకోడు, నీవేం మాట్లాడుతున్నావు?

అల్లాహు అక్బర్. ఇక్కడ గమనించండి, ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ రహిమతుల్లాహి అలైహి గారికి ఉన్న ఘనత, వారికి ఉన్న విద్య, ఆయన ఒక ఖలీఫా, ఆ విషయాల్లో మనం ఏ కొరత చూపి ఆయన్ని అవమానించడం కాదు. సహాబాల ఘనత ఎంత గొప్పదో అది తెలియజేస్తున్నాము. ఇది మనమే కాదు, మనకంటే ముందు పూర్వీకులు సలఫె సాలెహీన్ రహిమహుల్లాహ్, వారిలో అబ్దుల్లా ఇబ్నుల్ ముబారక్ ఎలాంటి ముహద్దిస్ అంటే, ఎందరో ముహద్దిసులు చెప్పారు, ఈయనపై ఎలాంటి దోషం లేని, జరహ్ లేని ముహద్దిస్ అని.

సహాబాల యొక్క స్థానం, వారి యొక్క ఘనత విషయంలో సహీ ముస్లిం షరీఫ్ లో వచ్చి ఉంది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు:

اللَّهَ اللَّهَ فِي أَصْحَابِي ، اللَّهَ اللَّهَ فِي أَصْحَابِي
(అల్లాహ అల్లాహ ఫీ అస్హాబీ, అల్లాహ అల్లాహ ఫీ అస్హాబీ)
నా సహాబాల ప్రస్తావన వచ్చినప్పుడు నేను మిమ్మల్ని అల్లాహ్ ను గుర్తు చేస్తున్నాను, మీరు అల్లాహ్ తో భయపడండి. నా సహాబాల ప్రస్తావన వచ్చినప్పుడు నేను మిమ్మల్ని అల్లాహ్ ను గుర్తు చేస్తున్నాను, మీరు అల్లాహ్ తో భయపడండి.

ఆ తర్వాత చెప్పారు, “మీరు వారిలో ఏ ఒక్కరిని కూడా తమ మనోవాంఛల కొరకు, తమ మనసులోని చెడు కోరికల కొరకు ఒక సాకుగా తీసుకోకండి”

فَمَنْ أَحَبَّهُمْ فَبِحُبِّي أَحَبَّهُمْ، وَمَنْ أَبْغَضَهُمْ فَبِبُغْضِي أَبْغَضَهُمْ
(ఫమన్ అహబ్బహుమ్ ఫబిహుబ్బీ అహబ్బహుమ్, వమన్ అబ్గదహుమ్ ఫబిబుగ్దీ అబ్గదహుమ్)
ఎవరైతే వారి పట్ల ప్రేమగా ఉంటాడో అతడు నా పట్ల ప్రేమగా ఉన్నట్లు. మరియు ఎవరైతే వారి పట్ల ద్వేషంగా ఉంటాడో, అతడు నా పట్ల ద్వేషంగా ఉన్నట్లు

وَمَنْ آذَاهُمْ فَقَدْ آذَانِي، وَمَنْ آذَانِي فَقَدْ آذَى اللَّهَ، وَمَنْ آذَى اللَّهَ يُوشِكُ أَنْ يَأْخُذَهُ
(వమన్ ఆదాహుమ్ ఫఖద్ ఆదానీ, వమన్ ఆదానీ ఫఖద్ ఆదల్లాహ తబారక వ తాలా)
ఎవరైతే నా సహాబాలను హాని కలిగించాడో, వారికి కీడు కలుగజేశాడో, అతడు నాకు కీడు కలుగజేసినట్లు, నాకు బాధ కలుగజేసినట్లు. మరి ఎవరైతే నన్ను బాధ పెట్టాడో, అతడు అల్లాహ్ ను బాధ పెట్టినవాడవుతాడు.

గమనించారా? సహాబాల యొక్క స్థానం ఎంత గొప్పగా ఉందో? వారిని ప్రేమించడం, వారి పట్ల ద్వేషంగా ఉండకుండా ప్రేమగా ఉండడం ఎంత ముఖ్యమో మన జీవితంలో, అర్థమవుతుంది కదా ఈ హదీసుల ద్వారా?

మరొక హదీస్, హజ్రత్ ఇబ్నె అబ్బాస్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పినట్లు, షేఖ్ అల్బానీ రహిమహుల్లాహ్ సహీహాలో ప్రస్తావించారు దీనిని:

مَنْ سَبَّ أَصْحَابِي فَعَلَيْهِ لَعْنَةُ اللَّهِ وَالْمَلائِكَةِ وَالنَّاسِ أَجْمَعِينَ
(మన్ సబ్బ అస్హాబీ ఫఅలైహి ల’నతుల్లాహి వల్ మలాఇకతి వన్నాసి అజ్మయీన్)
ఎవరైతే నా సహాబాలను దూషిస్తాడో, అతనిపై అల్లాహ్ యొక్క శాపం, దైవదూతల శాపం మరియు సర్వ ప్రజల యొక్క శాపం పడుగాక.

ఇమామ్ అహ్మద్ రహిమతుల్లాహి అలైహి, నాలుగు ఇమాములలో ఒక గొప్ప ఇమాం కదా. ఆయన ఏమన్నారో తెలుసా? సహాబాల విషయంలో, “నీవు ఎప్పుడైనా ఏదైనా వ్యక్తిని చూశావు, అతడు సహాబాలలో ఏ ఒక్కరినైనా దూషిస్తున్నాడు అంటే, అతడు నిజమైన ముస్లిమో కాదో అని శంకించవలసి వస్తుంది, అనుమాన పడే అటువంటి పరిస్థితి వస్తుంది.”

ఇలాంటి మాట ఎందుకు చెప్పారు ఇమామ్ అహ్మద్ రహిమతుల్లాహి అలైహి? ఎందుకంటే నిజమైన ముస్లిం, ఖుర్ఆన్ మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సహీ హదీసుల జ్ఞానం ఉన్న ముస్లిం, ఏ సహాబీని కూడా దూషించడు.

ఇంకా మరో సందర్భంలో హజ్రత్ ఇమామ్ అహ్మద్ ఇబ్నె హంబల్ రహిమహుల్లాహ్ తెలిపారు, “ఏ వ్యక్తికి కూడా సహాబాలను దూషించడం దూరం, సహాబాలను అగౌరవంగా ప్రస్తావించడం కూడా తగదు. ఎవరైనా అలా చేశాడంటే ఆ వ్యక్తి కాలంలో, ఆ వ్యక్తి ఉన్నచోట ఏ ముస్లిం నాయకుడు ఉన్నాడో అతడు అలాంటి వ్యక్తికి శిక్ష ఇవ్వాలి. ఎందుకంటే సహాబాలను దూషించడం ఇది చిన్నపాటి పాపం కాదు, ఘోర పాపాల్లో లెక్కించబడుతుంది

ఇతరములు:

సహాబా అంటే ఎవరు? వారి గురించి ఎటువంటి నమ్మకం కలిగి ఉండాలి? – డా. సాలెహ్ అల్ ఫౌజాన్

తాహీదె అస్మా వ సిఫాత్‌ (అల్లాహ్ నామాలు, గుణ గుణాలలో ఏకత్వం) – డా. సాలెహ్ బిన్ ఫౌజాన్ అల్ ఫౌజాన్

బిస్మిల్లాహ్

 తౌహీదె అస్మావ సిఫాత్‌ (దైవ నామాలు, దైవగుణాలలో ఏకత్వం)

ఈ విషయం క్రింది అంశాలతో కూడుకుని ఉంది.

  • మొదటిది: దైవ నామాలు, గుణగణాలకు సంబంధించి ఖుర్‌ఆన్‌, హదీసుల వెలుగులో ఆధారాలు, బుద్ధి పరమైన నిదర్శనాలు.
  • రెండవది: అల్లాహ్‌ పేర్లు గుణగణాల గురించి అహ్లే సున్నత్‌ వల్‌ జమాఅత్‌ విధానం.
  • మూడవది: అల్లాహ్‌ నామాలను, గుణగణాలను లేదా వాటిలో కొన్నింటిని నిరాకరించే వారి ధోరణిని ఖండించటం.

మొదటిది: దైవనామాలు, గుణాల గురించి ఖుర్‌ఆన్‌, హదీసుల ఆధారాలు, బుద్ధిపరమైన ఆధారాలు.

(అ) ఖుర్‌ఆన్‌ హదీసుల ఆధారాలు :

ఇంతకుముందు మేము తౌహీదె ఉలూహియత్‌, తౌహీదె రుబూబియత్‌, తౌహీదె అస్మా వ సిఫాత్‌ అనే మూడు రకాలను గురించి ప్రస్తావించి ఉన్నాము. వాటిలో మొదటి రెండింటి ఆధారాలను, నిదర్శనాలను గురించి కూడా చర్చించాము. ఇప్పుడు తౌహీద్‌ మూడవ రకమయిన ‘అస్మా వ సిఫాత్‌’ (దైవనామాలు, గుణగణాల)ను రూఢీచేసే ఆధారాలను తెలుసుకుందాము.

(1) దివ్య ఖుర్‌ఆన్‌ ద్వారా కొన్ని ఆధారాలు

وَلِلَّهِ الْأَسْمَاءُ الْحُسْنَىٰ فَادْعُوهُ بِهَا ۖ وَذَرُوا الَّذِينَ يُلْحِدُونَ فِي أَسْمَائِهِ ۚ سَيُجْزَوْنَ مَا كَانُوا يَعْمَلُونَ

“అల్లాహ్‌కు మంచి పేర్లున్నాయి. కాబట్టి మీరు ఆయన్ని ఆ పేర్లతోనే పిలవండి. ఆయన పేర్ల విషయంలో వక్రంగా వాదించే వారిని వదలిపెట్టండి. వారు చేస్తూ ఉండిన దానికి వారు తప్పకుండా శిక్షించబడతారు.” (అల్‌ ఆరాఫ్‌ 7:180)

ఈ సూక్తి ద్వారా అల్లాహ్ తనకు కొన్ని పేర్లున్నాయని, అవి అత్యుత్తమమయిన పేర్లని తెలియజేస్తున్నాడు. ఆ పేర్లతోనే తనను పిలవమని కూడా ఆదేశించాడు. ఉదాహరణకు : ఓ రహ్మాన్‌ (ఓ దయాకరా!), ఓ రహీమ్‌ (ఓ కృపాశీలుడా!), ఓ హై (ఓ సజీవుడా!), ఓ ఖయ్యూమ్‌ (ఓ ఆధారభూతుడా!), ఓ రబ్బిల్‌ ఆలమీన్‌ (ఓ లోకేశ్వరుడా!) మొదలగునవి. తన నామాల విషయంలో వక్రవైఖరి అవలంబించే వారిని, నిరాకరించేవారి గురించి హెచ్చరించాడు. ఎందుకంటే వారు అల్లాహ్‌ పేర్ల విషయంలో సత్యం నుండి తొలగిపోతారు లేదా అల్లాహ్‌కు గల పేర్లను పూర్తిగా నిరాకరిస్తారు. లేదా వాటి అర్ధాలను వక్రీకరిస్తారు లేదా నాస్తికతకు సంబంధించిన మరేదైనా దారి తెరుస్తారు. అలాంటి వారికి, తమ స్వయంకృతానికి తగిన శిక్ష లభిస్తుందని కూడా అల్లాహ్‌ హెచ్చరించాడు.

అల్లాహ్‌ ఇలా సెలవిచ్చాడు :

اللَّهُ لَا إِلَٰهَ إِلَّا هُوَ ۖ لَهُ الْأَسْمَاءُ الْحُسْنَىٰ

“ఆయనే అల్లాహ్‌. ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేడు. సుందరమైన పేర్లన్నీ ఆయనవే.” (తాహా 20:8)

هُوَ اللَّهُ الَّذِي لَا إِلَٰهَ إِلَّا هُوَ ۖ عَالِمُ الْغَيْبِ وَالشَّهَادَةِ ۖ هُوَ الرَّحْمَٰنُ الرَّحِيمُ هُوَ اللَّهُ الَّذِي لَا إِلَٰهَ إِلَّا هُوَ الْمَلِكُ الْقُدُّوسُ السَّلَامُ الْمُؤْمِنُ الْمُهَيْمِنُ الْعَزِيزُ الْجَبَّارُ الْمُتَكَبِّرُ ۚ سُبْحَانَ اللَّهِ عَمَّا يُشْرِكُونَ هُوَ اللَّهُ الْخَالِقُ الْبَارِئُ الْمُصَوِّرُ ۖ لَهُ الْأَسْمَاءُ الْحُسْنَىٰ ۚ يُسَبِّحُ لَهُ مَا فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ ۖ وَهُوَ الْعَزِيزُ الْحَكِيمُ

“ఆయనే అల్లాహ్‌. ఆయన తప్ప మరో ఆరాధ్య దేవుడు లేడు – గోప్యంగా ఉన్నవాటికి, బహిర్గతమై ఉన్నవాటిని ఎరిగినవాడు. ఆయన కరుణామయుడు, ఆయనే అల్లాహ్‌ – ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేడు. ఆయనే రాజాధిరాజు, పరమ పవిత్రుడు, లోపాలన్నింటికి అతీతుడు, శాంతిప్రదాత, పర్యవేక్షకుడు, సర్వశక్తుడు, బలపరాక్రమాలు గలవాడు, పెద్దరికం గలవాడు. ప్రజలు (ఆయనకు) కల్పించే భాగస్వామ్యాల నుండి అల్లాహ్‌ పవిత్రంగా ఉన్నాడు. ఆయనే అల్లాహ్‌ – సృష్టికర్త, ఉనికిని ప్రసాదించేవాడు, రూపకల్పన చేసేవాడు. అత్యుత్తమమైన పేర్లన్నీ ఆయనకే ఉన్నాయి. భూమ్యాకాశాలలో ఉన్న ప్రతి వస్తువూ ఆయన పవిత్రతను కొనియాడుతోంది. ఆయనే  సర్వాధికుడు, వివేకవంతుడు.” (అల్‌ హషర్ 59 : 22 – 24)

(2) మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తుల వెలుగులో దైవ నామాలకు సంబంధించిన ఆధారాలు :

హజ్రత్‌ అబూ హురైరా (రది అల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త మహనీయులు (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు :

“అల్లాహ్‌కు 99 పేర్లున్నాయి – ఒకటి తక్కువ వంద పేర్లు. ఇవి ఎటువంటి నామాలంటే, వాటిని (జ్ఞానపరంగానూ, క్రియాత్మకం గానూ) గ్రహించినవాడు స్వర్గంలో ప్రవేశిస్తాడు.”(ముత్తఫఖున్‌ అలై)

అల్లాహ్‌ యొక్క అత్యుత్తమ నామాలు కేవలం ఈ సంఖ్య (99)కే పరిమితం కావు. దీనికి ఆధారం హజ్రత్‌ అబ్దుల్లాహ్‌ బిన్‌ మస్‌ఊద్‌ (రది అల్లాహు అన్హు) గారి ఈ ఉల్లేఖనం:

మహనీయ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా వేడుకున్నారు:

“(ఓ అల్లాహ్‌!) నేను నీకు గల ప్రతి నామం ఆధారంగా నిన్ను అర్థిస్తున్నాను – దేని  ద్వారానయితే నిన్ను నీవు పిలుచుకున్నావో! లేదా నీ గ్రంథంలో అవతరింపజేశావో! లేదా నీ సృష్టితాలలో ఎవరికయినా నేర్పావో! లేదా దానిని నీ వద్దనే – అగోచర జ్ఞానంలో భద్రపరచి ఉంచావో! అలాంటి ప్రతి నామం ఆధారంగా నిన్ను వేడుకుంటున్నాను (ప్రభూ!) మహత్తరమైన ఖుర్‌ఆన్‌ను నా హృదయ వసంతం గావించు!”

(ఈ హదీసును ఇమాం అహ్మద్ తన ముస్నద్ – 3528 లో పొందుపరిచారు. ఇబ్నె హిబ్బాన్ దీనిని ప్రామాణికమైన హదీసుగా ఖరారు చేశాడు. అల్లాహ్ పేర్లు కేవలం 99 కే  పరిమితమై లేవని ఈ హదీసు నిరూపిస్తోంది. కనుక ఈ హదీసు ద్వారా విదితమయ్యేదేమిటంటే – నిజము దేవుడెరుగు – ఈ 99 పేర్లను నేర్చుకున్నవాడు, వాటి ఆధారంగా అర్థించినవాడు, వాటి ఆధారంగా దైవారాధన చేసినవాడు స్వర్గంలో ప్రవేశిస్తాడు. ఈ విశిష్టత ఈ పేర్లకే స్వంతం – సహీహుల్ జామి – 2622)

అల్లాహ్‌ యొక్క ప్రతి నామం ఆయన గుణగణాలలోని ఒకానొక గుణాన్ని సూచిస్తోంది. ఉదాహరణకు : ‘అలీమ్‌‘ అనే నామం ఆయనలోని ఇల్మ్ (జ్ఞానం) గుణానికి నిదర్శనంగా ఉంది. అలాగే ‘హకీమ్‌‘ అనే పేరు ఆయనలోని హిక్మత్‌ (యుక్తి, వివేకం)ను సూచిస్తోంది. ‘సమీ” అనే పేరు ఆయన ‘సమ్‌అ’ (వినే) గుణానికి తార్కాణంగా ఉంది. ‘బసీర్‌‘ అనే ఆయన నామం ఆయనలోని ‘బసర్‌’ (చూసే, గమనించే) గుణానికి నిదర్శనంగా ఉంది. ఇదేవిధంగా ప్రతి పేరు అల్లాహ్‌ గుణ విశేషాలలో ఏదో ఒక గుణానికి ఆధారంగా ఉన్నది.

అల్లాహ్‌ ఈ విధంగా సెలవిచ్చాడు :

قُلْ هُوَ اللَّهُ أَحَدٌ اللَّهُ الصَّمَدُ لَمْ يَلِدْ وَلَمْ يُولَدْ وَلَمْ يَكُن لَّهُ كُفُوًا أَحَدٌ

(ఓ ముహమ్మద్‌!) వారికి చెప్పు : “ఆయన అల్లాహ్‌ (నిజ ఆరాధ్యుడు) ఒకే ఒక్కడు. అల్లాహ్‌ నిరపేక్షాపరుడు (ఏ అక్కరా లేనివాడు). ఆయన (ఎవరినీ) కనలేదు. ఆయన (కూడా) ఎవరికీ పుట్టినవాడు కాడు. ఆయనకు సరిసమానుడు (సరితూగేవాడు, పోల్చదగినవాడు) ఎవడూ లేడు.” (అల్‌ ఇఖ్లాస్‌ : 1 – 4)

హజ్రత్‌ అనస్‌ (రది అల్లాహు అన్హు) కథనం : ఒక అన్సారీ వ్యక్తి మస్జిదె ఖుబాలో వారికి ఇమామత్‌ చేసేవాడు (వారి సామూహిక నమాజుకు సారథ్యం వహించేవాడు). అతనెప్పుడు నమాజ్‌ చేయించినా (ఫాతిహా సూరా అనంతరం) ‘ఖుల్‌హు వల్లాహు అహద్‌” సూరా పారాయణం మొదలెట్టేవాడు. ఆ తరువాత ఏదైనా మరో సూరా పఠించేవాడు. అతను ప్రతి రకాత్‌లో అలాగే చేసేవాడు. సహాబా (సహచరు)లలో ఇది చర్చనీయాంశం అయింది. వారంతా కలసి అతనితో మాట్లాడారు. “నీవు ఇదే సూరాతో ఖిరాత్‌ మొదలెడుతున్నావు. పోనీ దీంతో సరిపెట్టుకుంటావా అంటే అదీ లేదాయె. దీంతో పాటు మరో సూరా కూడా పఠిస్తున్నావు. నీవు పఠిస్తే ఈ ఒక్క సూరాయే పఠించు. లేదంటే దీనిని వదిలేసి వేరే సూరా ఏదన్నా పఠించు” అని అతన్ని కోరారు. దానికతను ఇలా జవాబిచ్చాడు : “నేను ఈ సూరాను వదలనుగాక వదలను. మీకిష్టముంటే నేనిలాగే ఇమామత్‌ చేస్తాను. ఇలా చేయటం ఇష్టం లేదనుకుంటే చెప్పండి, మీ సారథ్య బాధ్యతలు వదలుకుంటాను.” కాని వారంతా ఆ వ్యక్తిని తామందరిలోకెల్లా ఉత్తమునిగా పరిగణించేవారు. కనుక అతను తప్ప వేరొక వ్యక్తి తమకు ఇమామత్‌ చేయటం వారికిష్టం లేదు. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తమ వద్దకు ఏతెంచినపుడు, పరిస్థితుల స్వరూపాన్ని క్షుణ్ణంగా వివరించారు. అప్పుడాయన (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆ వ్యక్తినుద్దేశించి,

“ఓ ఫలానా వ్యక్తీ! నీ సహచరులు అడుగుతున్నట్లుగా మసలుకోవటంలో నీకు వచ్చిన చిక్కేమిటీ? అంటే ప్రతి రకాతులో ఇదే సూరా పఠించటానికి నిన్ను ప్రేరేపిస్తున్నదేది?” అని ప్రశ్నించారు.

దానికా వ్యక్తి, “నేనీ సూరాను ప్రగాఢంగా ఇష్టపడుతున్నాను” అన్నాడు.

“ఈ సూరాపట్ల నీకు గల ప్రేమ నిన్ను స్వర్గానికి చేరుస్తుంది” అని మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పారు. (సహీహ్‌ బుఖారీ)

హజ్రత్‌ ఆయిషా (రది అల్లాహు అన్హా) కథనం ఇలా ఉంది : దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఒక వ్యక్తిని ఓ చిన్న సైనిక బృందానికి అమీర్‌ (నాయకుని)గా నియమించి పంపారు. ఆ వ్యక్తి తన బృందానికి నమాజ్‌ చేయించేవాడు. ఈ సందర్భంగా ఖిరాత్‌ చివర్లో ఎలాగయినాసరే “ఖుల్‌హు వల్లాహు అహద్‌” సూరా చదివేవాడు. ఆ బృందంలోని సభ్యులు తిరిగి వచ్చాక, ఈ సంగతిని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ముందు ప్రస్తావించగా,

“అతనలా ఎందుకు చేసేవాడో అతన్నే అడగండి” అని ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) సూచించారు.

జనులు ఈ విషయమై అతన్ని దర్యాప్తు చేయగా అతనిలా అన్నాడు : “ఈ సూరా పారాయణం అంటే నాకెంతో ఇష్టం.” ఇది విని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు :

“అల్లాహ్‌ అతన్ని ఇష్టపడుతున్నాడని అతనికి తెలియజేయండి.” (సహీహ్‌ బుఖారీ).

అంటే: ఈ సూరా కరుణామయుడైన అల్లాహ్‌ గుణగణాలతో కూడుకుని ఉంది.

తనకు ముఖం కూడా ఉందని అల్లాహ్‌ తెలియజేశాడు. దీనికి నిదర్శనం ఈ ఆయత్ :

وَيَبْقَىٰ وَجْهُ رَبِّكَ ذُو الْجَلَالِ وَالْإِكْرَامِ

“ఎప్పటికీ మిగిలి ఉండేది వైభవోపేతుడైన, గౌరవనీయుడైన నీ ప్రభువు ముఖారవిందమే.” (అర్‌ రహ్మాన్‌ 55: 27)

అలాగే – అల్లాహ్‌కు రెండు చేతులున్నాయి :

خَلَقْتُ بِيَدَيَّ

“నేనతన్ని (ఆదమును) నా రెండు చేతులతో సృష్టించాను.” (సాద్‌ 38 : 75)

بَلْ يَدَاهُ مَبْسُوطَتَانِ

“వాస్తవానికి అల్లాహ్‌ చేతులు రెండూ తెరచుకుని ఉన్నాయి.” (అల్‌ మాయిద 5: 64)

ఇంకా – అల్లాహ్‌ సంతోషిస్తాడు, ప్రేమిస్తాడు, కినుక వహిస్తాడు, ఆగ్రహిస్తాడు – ఇవన్నీ ఆయన లక్షణాలే. ఇవిగాక మరెన్నో లక్షణాలున్నాయి. వాటిని గురించి ఆయన స్వయంగా చెప్పుకున్నాడు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచనాల ద్వారా కూడా ఆయన లక్షణాలు తెలుస్తున్నాయి –

(ఆ) అల్లాహ్‌ నామాలను, లక్షణాలను నిరూపించే బుద్ధిపరమయిన ఆధారాలు

అల్లాహ్ నామాలు, గుణగణాలకు సంబంధించి షరీయత్‌ పరమయిన ఆధారాలున్నట్లే బుద్ధిపరమయిన ఆధారాలు, నిదర్శనాలు కూడా ఉన్నాయి :

1. రకరకాల సృష్టితాలు అసంఖ్యాకంగా ఉనికిలోనికి రావటం. తమ సృష్టికి వెనుక ఉన్న పరమార్థాలను నెరవేర్చటంలో అవి పకడ్బందీగా పనిచేయటం, తమ కొరకు నిర్ధారించబడిన కక్ష్యలో – పరిధిలో – ఉండి మరీ తమ కర్తవ్యాన్ని నిర్వర్తించటం, ఇవన్నీ అల్లాహ్ ఘనత్వానికి, శక్తికి, యుక్తికి, జ్ఞానానికి, ఆయన ఇచ్చకు నిలువుటద్దంగా ఉన్నాయి.

2. అనుగ్రహించటం, మేలు చేయటం, కష్టాలను, ఆపదలను తొలగించటం – ఇవన్నీ దైవకారుణ్యానికి, ఉదాత్త గుణానికి నిదర్శనంగా ఉన్నాయి.

3. అవిధేయులను శిక్షించటం, ధిక్కారులపై ప్రతీకారం తీర్చుకోవటం – ఇది దైవాగ్రహ గుణానికి తార్కాణం.

4. విధేయులను, విశ్వాసపాత్రులను సత్కరించటం, కటాక్షించటం, వారికి పుణ్యఫలం ప్రసాదించటం – ఇవి రెండూ దైవ ప్రసన్నతకు, ప్రేమైక గుణానికి దర్పణంగా ఉన్నాయి.

రెండవది : దైవనామాలు, దైవగుణాల విషయంలో అహ్లే సున్నత్‌ వల్‌ జమాఅత్‌ విధానం :

అహ్లే సున్నత్‌ వల్‌ జమాఅత్‌ వారు, సలఫె సాలెహ్‌  కోవకు చెందినవారు, వారి అనుయాయులు – అల్లాహ్‌ నామాలు, గుణగణాల విషయంలో వీరందరి విధానం ఒక్కటే. దైవగ్రంథంలో, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సున్నత్‌లో తెలుపబడినట్లుగా వారు వాటిని యధాతథంగా విశ్వసిస్తారు. వారి పద్ధతి క్రింది నిబంధనలను అనుసరించి ఉంటుంది.

(1) వీరు దైవనామాలను, గుణగణాలను దైవగ్రంథానుసారం, ప్రవక్త విధానానుసారం నమ్ముతారు. తదనుగుణంగానే వాటిని రూఢీ చేస్తారు. వాటి బాహ్య స్వరూపానికి విరుద్ధంగా అర్థాలు తీయరు. వాటిని మార్చే ప్రయత్నం కూడా చేయరు.

(2) ఆయన నామాలను, లక్షణాలను సృష్టితాల లక్షణాలతో పోల్చి చెప్పటాన్ని వ్యతిరేకిస్తారు. ఉదాహరణకు : అల్లాహ్‌ సెలవిచ్చినట్లు:

 لَيْسَ كَمِثْلِهِ شَيْءٌ ۖ وَهُوَ السَّمِيعُ الْبَصِيرُ

“ఆయన్ని పోలిన వస్తువేదీ లేదు. ఆయన వినేవాడు, చూసేవాడు.” (అష్‌ షూరా 42 : 11)

(3) దైవనామాలను, దైవిక గుణాలను రుజువు చేయటానికి ఏ ఏ ఆధారాలు, నిదర్శనాలు ఖుర్‌ఆన్‌, హదీసులలో ఇవ్వబడ్డాయో, వాటిని సుతరామూ ఉల్లంఘించరు.అల్లాహ్, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఏ ఏ ఆధారాలను, రుజువులను చూపారో, వాటిని ఖచ్చితంగా అంగీకరిస్తారు.అల్లాహ్, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తోసిపుచ్చిన వాటిని వీరు కూడా త్రోసిరాజంటారు. ఏ విషయాలపై అల్లాహ్, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మౌనం వహించారో వాటిపై వీరు కూడా మౌనం వహిస్తారు.

(4) దైవనామాలు, గుణగణాలకు సంబంధించిన దైవసూక్తులను వీరు తిరుగులేనివిగా, స్పష్టమైనవి (ముహ్కమాత్)గా విశ్వసిస్తారు. వాటి భావార్థాన్ని గ్రహించవచ్చునని, వాటిని గురించి కూలంకషంగా విడమరచి చెప్పటం సాధ్యమేనని భావిస్తారు. ఈ ఆయతులను వారు అస్పష్టమైనవిగా, నిగూఢమైనవి (ముతషాబిహాత్‌) గా పరిగణించరు. అందుకే వారు – అభినవ రచయితలు కొంతమంది లాగా తప్పుడు ప్రకటనలు ఇవ్వటంగానీ, విషయాన్ని దృష్టి మళ్లించే ప్రయత్నం చేయటం గానీ చేయరు. మొత్తానికి వీరి వ్యవహారం ఈ విషయంలో నిర్దిష్టంగా, నిర్ధ్వంధ్వంగా, సూటిగా ఉంటుంది.

(5) గుణగణాల వైనం ఎలా ఉంటుంది? అన్న ప్రశ్న జనించినపుడు ఆ జ్ఞానం అల్లాహ్ కే ఉందని చెబుతారు. ఈ విషయంలో వితండ వాదనకు దిగరు. అనవసరంగా విషయాన్ని సాగదీయరు.

మూడవది : మొత్తం పేర్లను, గుణగణాలను లేదా వాటిలో కొన్నింటిని నిరాకరించే వారి ధోరణిని ఖండించటం:

దైవ నామాలను, గుణగణాలను నిరాకరించే వారిలో మూడు రకాల వారున్నారు.

1. జహ్‌మియా వర్గం: వీరు జహమ్‌ బిన్‌ సఫ్వాన్‌ అనుయాయులు. వీళ్లు అల్లాహ్ పేర్లన్నింటినీ, గుణగణాలన్నింటినీ నిరాకరిస్తారు.

2. మోతజిలా వర్గం: వీళ్లు వాసిల్‌ బిన్‌ అతా అనుయాయులు. వాసిల్‌ ఇమామ్‌ హసన్‌ బస్రీ సమావేశాల నుండి వేరైపోయారు. వీరు కేవలం అల్లాహ్‌ నామాలను మాత్రమే రూఢీ చేస్తారు. అయితే ఆ నామాలు కేవలం పదాలేనని, వాటికి అర్ధం అనేది ఏమీ లేదని వాదిస్తారు. ఇక అల్లాహ్ గుణగణాల విషయానికివస్తే, ఆసాంతం వాటీని నిరాకరిస్తారు.

3. అషాఅరా [1] , మాతరీదీయ [2] వర్గీయులువారి అనుయాయులు: వీరు దైవనామాలు, గుణగణాలలో కొన్నింటిని అంగీకరిస్తారు. కొన్ని గుణాలను మాత్రం నిరాకరిస్తారు.

[1] వీరు అబుల్ హసన్ అష్అరీ అభిమతాన్ని అనునరించేవారు . అయితే అబుల్ హసన్ తరువాతి కాలంలో తన విధానానికి స్వస్తి పలికి అహఁలే సున్నత్‌ అభిమతాన్ని అవలంబించాడు. కాని అతని అనుయాయులు మరలి రాలేదు. కాబట్టి వీళ్లను అబుల్ హసన్ అష్అరీ వర్గీయులని  అనటం నరికాదు.

[2] వీరు అబూ మన్సూర్‌ మాతురీదీ అనుయాయులు.

వీరి అభిమతానికి పునాది ఇది :

అల్లాహ్‌ను ఆయన సృష్టితాలతో పోల్చే చేష్ట నుండి తాము సురక్షితంగా ఉండాలి. ఎందుకంటే ప్రాణులలో కొందరున్నారు. వారు తమను అల్లాహ్ నామాలతో పిలుచుకుంటున్నారు. అల్లాహ్ గుణాలలో కొన్ని గుణాలను తమ కొరకు ప్రత్యేకించుకుంటున్నారు. ఇది సరైనది కాదు. ఎందుకంటే దీనివల్ల పేర్లు, గుణగణాల విషయంలో సృష్టికర్త – సృష్టితాలు కలగాపులగం అవుతున్నాయి. తత్కారణంగా ఆ రెండింటి వాస్తవికతలో కూడా “భాగస్వామ్యానికి” తావు ఏర్పడుతున్నది. ఆ విధంగా సృష్టితాలను కూడా సృష్టికర్తతో పోల్చేందుకు ఆస్కారం కలుగుతోంది – ఇదీ వారి వాదన. అందువల్ల వారు క్రింద పేర్కొనబడిన రెండు విషయాలలో ఏదో ఒకదానిని మాత్రమే అవలంబిస్తారు.

(అ) వారు అల్లాహ్ నామాలు, అల్లాహ్ గుణాలకు సంబంధించిన ‘మూలాల’ను వాటి బాహ్యార్థాల ద్వారా గ్రహిస్తారు. ఉదాహరణకు : (అల్లాహ్) ‘ముఖము’ను ‘అల్లాహ్  అస్తిత్వం’ అనే అర్థంలో తీసుకుంటారు. (అల్లాహ్) ‘చేతులు’ను ‘అల్లాహ్ అనుగ్రహం’ అన్న భావంలో తీసుకుంటారు.

(ఆ) లేదా ఈ ‘మూలాల’  భావార్ధాన్ని అల్లాహ్‌కే వదలివేస్తారు. అదేమంటే, వాటి అర్ధం అల్లాహ్ కే తెలుసు అంటారు. ఈ నామాలు మరియు గుణాలు వాటి బాహ్యార్ధంలో లేవని కూడా నమ్ముతారు.

అల్లాహ్‌ ఇలా సెలవిచ్చాడు :

“(ఓ ముహమ్మద్‌!) ఇదేవిధంగా మేము నిన్ను ఈ సమాజం లోకి పంపాము – ఇంతకు మునుపు ఎన్నో సమాజాలు గతించాయి – మా తరఫున నీపై అవతరించిన వాణిని వారికి వినిపించటానికి! వారు కరుణామయుని (అల్లాహ్‌ను) తిరస్కరిస్తున్నారు.” (అర్‌ రాద్‌ 13:20)

ఈ సూక్తి అవతరణ వెనుక గల నేపథ్యం ఇది :

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కరుణామయుని (రహ్మాన్‌) ప్రస్తావన తీసుకువచ్చినప్పుడు, వారు దానిని స్పష్టంగా త్రోసిపుచ్చారు. అప్పుడు అల్లాహ్‌ వారి గురించి  “వారు కరుణామయుని (అల్లాహ్‌ను) తిరస్కరిస్తున్నారు” అనే ఆయతును అవతరింపజేశాడు.

ఇది హుదైబియా ఒడంబడిక సందర్భంగా ఎదురైన సంఘటన అని అల్లామా ఇబ్నె జరీర్‌ అభిప్రాయపడ్డారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు అరబ్బు ముష్రికులకు మధ్య జరిగిన ఒడంబడికను లిఖించటానికి పూనుకున్నప్పుడు, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్‌” అని వ్రాయించారు. దానికి ఖురైషులు అభ్యంతరం తెలుపుతూ “రహ్మాన్‌ ఎవరో మాకు తెలీదు” అన్నారు.

ఇబ్నె జరీర్‌ గారు హజ్రత్‌ ఇబ్నె అబ్బాస్‌ (రది అల్లాహు అన్హు) ఉల్లేఖనాన్ని ఈ సందర్భంగా ఉదాహరించారు. దీని ప్రకారం మహాప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) సజ్దా  స్థితిలో దుఆ చేస్తూ “యా రహ్మాన్‌! యా రహీమ్‌!” అనేవారు. అది విన్న ముష్రిక్కులు, ‘ఈయన గారు ఒక ఆరాధ్య దైవాన్ని మొర పెట్టుకుంటున్నట్టు భావిస్తున్నాడు. కాని ఆయన మొరపెట్టుకునేది ఇద్దరు ఆరాధ్యులను’ అని ఎద్దేవా చేశారు. అప్పుడు అల్లాహ్‌ ఈ సూక్తిని అవతరింపజేశాడు.

قُلِ ادْعُوا اللَّهَ أَوِ ادْعُوا الرَّحْمَٰنَ ۖ أَيًّا مَّا تَدْعُوا فَلَهُ الْأَسْمَاءُ الْحُسْنَىٰ

వారికి చెప్పు : “అల్లాహ్‌ను అల్లాహ్‌ అని పిలిచినా, రహ్మాన్‌ అని పిలిచినా – ఏ పేరుతో పిలిచినా-మంచి పేర్లన్నీ ఆయనవే.” (అల్‌ ఇస్రా 17 : 110)

అల్‌ ఫుర్ఖాన్‌ సూరాలో అల్లాహ్‌ ఇలా సెలవిస్తున్నాడు :

وَإِذَا قِيلَ لَهُمُ اسْجُدُوا لِلرَّحْمَٰنِ قَالُوا وَمَا الرَّحْمَٰنُ

“కరుణామయునికి సాష్టాంగపడండి” అని వారితో అన్నప్పుడు, “కరుణామయుడంటే ఏమిటి? (ఇంతకీ ఆయనెవరు?) అని వారంటారు. (అల్‌ ఫుర్ఖాన్‌ 25 : 60)

కనుక అల్లాహ్ నామాలను, అల్లాహ్ గుణాలను – ఏ విధంగానయినా నిరాకరించే ఈ ముష్రిక్కులు, జహ్‌మియా వర్గీయులు, మోతజిలా వర్గీయులు, అషాఅరా అనుంగు అనుచరులు, ఇంకా ఈ ధోరణిని అనుసరించే వారి పూర్వీకులు – వీరంతా నిరసించదగిన వారు.

దైవనామాలను, గుణగణాలను నిరాకరించేవారి ధోరణి క్రింది పద్ధతుల ద్వారా ఖండించబడుతుంది –

మొదటి పద్ధతి :

మొదటి పద్ధతి ఏమిటంటే అల్లాహ్‌ తన కొరకు నామాలను, గుణాలను రూఢీ చేశాడు. ఆయన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కూడా ఆయనకు పేర్లు, గుణాలున్నాయని రుజువు చేశాడు. కనుక అల్లాహ్‌ నామాలను, గుణాలను పూర్తిగాగానీ, పాక్షికంగా గానీ నిరాకరించటమంటే అల్లాహ్‌ మరియు ఆయన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నిరూపించిన వాటిని ఏకంగా త్రోసిపుచ్చటమే అవుతుంది. ఆ విధంగా ఇది అల్లాహ్ తోనూ, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తోనూ వ్యతిరేకతను, శత్రుత్వాన్ని కొనితెచ్చుకునే చేష్టే.

రెండవ పద్ధతి:

రెండవ పద్ధతి ఏమిటంటే; మనుషులలో అల్లాహ్ లోని సుగుణాలు కానవచ్చినంత మాత్రాన లేదా మనుషులలో కొందరికి అల్లాహ్‌ పేర్లున్నంతమాత్రాన సృష్టికర్తకు – సృష్టితాలకు (అల్లాహ్ కు – మనుషులకు) మధ్య సామ్యం, పోలిక ఉండాల్సిన ఆవశ్యకత ఏమీ లేదు. ఎందుకంటే అల్లాహ్ నామాలు, గుణ విశేషాలు అల్లాహ్ కే స్వంతం. అల్లాహ్ కే పరిమితం, ప్రత్యేకం. మనుషులకు గల పేర్లు, గుణాలు మనుషులకే పరిమితం. ఏ విధంగానయితే అల్లాహ్‌ అస్థిత్వం ఇతర సృష్టితాల అస్థిత్వంతో పోలిక కలిగిలేదో, అదేవిధంగా అల్లాహ్‌ నామాలు, గుణగణాలు కూడా సృష్టితాల పేర్లతో, గుణాలతో పోలిక కలిగి లేవు. అల్లాహ్ పేరు – మనుషుల పేరు ఒకటై ఉన్నంత మాత్రాన వారికి భాగస్వామ్యం ఉన్నట్లు లెక్క కాదు. ఉదాహరణకు : అల్లాహ్‌కు అలీమ్‌, హకీమ్‌ అనే పేర్లున్నాయి. అయితే ఆయన తన దాసుల్లో కొందరికి ‘అలీమ్‌’ అనే పేరు పెట్టాడు.

وَبَشَّرُوهُ بِغُلَامٍ عَلِيمٍ

“వారు (దైవదూతలు) అతని (ఇబ్రాహీమ్‌)కి జ్ఞాన సంపన్నుడైన అబ్బాయి పుడతాడని శుభవార్త వినిపించారు.” (అజ్‌ జారియాత్‌ 51 : 28)

ఇక్కడ ‘అలీమ్‌’ అంటే ఇస్‌హాఖ్‌ (రది అల్లాహు అన్హు) అన్నమాట. మరొక దాసునికి ‘హలీమ్‌’ అనే నామకరణం చేశాడు :

فَبَشَّرْنَاهُ بِغُلَامٍ حَلِيمٍ

“అందువల్ల మేమతనికి, సహనశీలుడైన ఒక అబ్బాయి గురించిన శుభవార్త వినిపించాము” (అస్‌ సాఫ్ఫాత్‌ 37 : 101)

ఇక్కడ ‘హలీమ్‌” అంటే ఇస్మాయీల్‌ (రది అల్లాహు అన్హు) అని భావం. అయితే ఈ ‘అలీమ్‌” గానీ, ‘హలీమ్‌’గానీ అల్లాహ్‌కు గల పేర్ల (అలీమ్‌, హలీమ్‌) వంటివి కావు.

అలాగే అల్లాహ్‌ తనకు సమీ, బసీర్‌ అనే పేర్లు పెట్టుకున్నాడు. ఆయన తన గురించి ఇలా చెప్పుకున్నాడు:

إِنَّ اللَّهَ كَانَ سَمِيعًا بَصِيرًا

“నిశ్చయంగా అల్లాహ్‌ అంతా వింటున్నాడు, అంతా చూస్తున్నాడు.” (అన్‌ నిసా 4 : 58)

అయితే ఆయన తన దాసుల్లో కూడా కొందరిని సమీగా, బసీర్‌గా అభివర్ణించాడు.

ఉదాహరణకు ఒకచోట మనిషిని గురించి ఇలా సెలవిచ్చాడు :

إِنَّا خَلَقْنَا الْإِنسَانَ مِن نُّطْفَةٍ أَمْشَاجٍ نَّبْتَلِيهِ فَجَعَلْنَاهُ سَمِيعًا بَصِيرًا

“నిశ్చయంగా మేము మానవుణ్ణి పరీక్షించడానికి  ఒక మిశ్రమ బిందువుతో పుట్టించాము. మరి  మేము అతన్ని వినేవాడుగా, చూసేవాడుగా చేశాము.” (అల్‌ ఇన్సాన్‌ 76 : 2)

అయితే ఒక వినేవాడు (సమీ) మరో వినేవాని (సమీ) వంటివాడు కాడు. ఒక చూసేవాడు (బసీర్‌) మరో చూసేవాని (బసీర్‌) వంటివాడు కాడు.

ఇంకా చెప్పాలంటే అల్లాహ్ తనకు రవూఫ్‌, రహీమ్‌ అనే పేర్లు పెట్టుకున్నాడు. ఉదాహరణకు : ఆయన ఒకచోట ఇలా సెలవిచ్చాడు.

إِنَّ اللَّهَ بِالنَّاسِ لَرَءُوفٌ رَّحِيمٌ

“నిశ్చయంగా అల్లాహ్‌ మనుషుల యెడల మృదుత్వం గలవాడు, జాలిచూపేవాడు.” (అల్‌ హజ్జ్‌ 22 : 65)

అయితే అల్లాహ్  తన దానుల్లో కూడా కొందరిని రవూఫ్‌గా, రహీమ్‌గా వ్యవహరించాడు. ఉదాహరణకు : ఒక చోట ఇలా సెలవిచ్చాడు :

لَقَدْ جَاءَكُمْ رَسُولٌ مِّنْ أَنفُسِكُمْ عَزِيزٌ عَلَيْهِ مَا عَنِتُّمْ حَرِيصٌ عَلَيْكُم بِالْمُؤْمِنِينَ رَءُوفٌ رَّحِيمٌ

“మీ దగ్గరకు స్వయంగా మీలో నుండే ఒక ప్రవక్త వచ్చాడు. మీకు కష్టం కలిగించే ప్రతిదీ అతనికి బాధ కలిగిస్తుంది. అతను మీ మేలును ఎంతగానో కోరుకుంటున్నాడు. విశ్వాసుల యెడల అతను మృదు స్వభావి (రవూఫ్‌), దయాశీలి (రహీమ్‌).” (అత్‌ తౌబా 9 : 128)

అయితే ఒక “రవూఫ్‌” మరో “రవూఫ్‌” వంటివాడు కాడు. ఒక “రహీమ్‌” మరో “రహీమ్‌” వంటివాడు కాడు.

అలాగే అల్లాహ్‌ తనకు ఎన్నో గుణ విశేషాలున్నాయని చెప్పుకున్నాడు. దాంతో తన దాసులలో కూడా అలాంటి గుణగణాలున్నాయని పేర్కొన్నాడు. ఉదాహరణకు : ఒకచోట ఈ విధంగా సెలవీయబడింది :

وَلَا يُحِيطُونَ بِشَيْءٍ مِّنْ عِلْمِهِ إِلَّا بِمَا شَاءَ

“ఆయనకున్న జ్ఞానంలోని ఏ విషయమూ వారి గ్రాహ్య పరిధిలోకి రాదు” (అల్‌ బఖర 2 : 255)

ఈ సూక్తిలో ఆయన తనలోని జ్ఞాన విశేషాన్ని గురించి చెప్పుకున్నాడు. దాంతో పాటే తన దాసుల జ్ఞాన విశేషాన్ని గురించి కూడా ప్రస్తావించాడు. ఈ విధంగా సెలవిచ్చాడు:

وَمَا أُوتِيتُم مِّنَ الْعِلْمِ إِلَّا قَلِيلًا

“మీకు ఒసగబడిన జ్ఞానం బహు స్వల్పం.” (అల్‌ ఇస్రా 17 : 85)

మరోచోట ఇలా సెలవిచ్చాడు :

 وَفَوْقَ كُلِّ ذِي عِلْمٍ عَلِيمٌ

“ప్రతి జ్ఞానినీ మించిన జ్ఞాని ఒకడున్నాడు.” (యూసుఫ్‌ 12 : 76)

వేరొకచోట ఇలా అనబడింది:

.. وَقَالَ الَّذِينَ أُوتُوا الْعِلْمَ

“అప్పుడు (ధర్మ) జ్ఞానం వొసగబడినవారు వారికి ఇలా బోధపరచ సాగారు ….” (అల్‌ ఖసస్‌ : 80)

అలాగే అల్లాహ్‌ తనకు గల శక్తి గుణాన్ని గురించి చెప్పుకున్నాడు.

إِنَّ اللَّهَ لَقَوِيٌّ عَزِيزٌ

“నిశ్చయంగా అల్లాహ్‌ మహాబలుడు, సర్వాధిక్యుడు.” (అల్‌ హజ్జ్‌ 22:40)

ఈ విధంగా కూడా చెప్పుకున్నాడు :

إِنَّ اللَّهَ هُوَ الرَّزَّاقُ ذُو الْقُوَّةِ الْمَتِينُ

“అల్లాహ్‌యే స్వయంగా అందరికీ ఉపాధిని సమకూర్చేవాడు. ఆయన మహాశక్తిశాలి, మహాబలుడు.” (అజ్‌ జారియాత్‌ : 58)

దాంతోపాటే తన దాసుల శక్తిని గురించి ఆయన ఇలా విశ్లేషించాడు :

اللَّهُ الَّذِي خَلَقَكُم مِّن ضَعْفٍ ثُمَّ جَعَلَ مِن بَعْدِ ضَعْفٍ قُوَّةً ثُمَّ جَعَلَ مِن بَعْدِ قُوَّةٍ ضَعْفًا وَشَيْبَةً

“అల్లాహ్‌ – ఆయనే మిమ్మల్ని బలహీన స్థితిలో పుట్టించాడు. మరి ఈ బలహీనత తరువాత (మీకు) బలాన్ని ఇచ్చాడు. ఈ బలం తరువాత మళ్లీ మీకు బలహీనతను ఇచ్చాడు. (మిమ్మల్ని) వృద్ధాప్యానికి చేర్చాడు.” (అర్‌ రూమ్‌ 30 : 54)

దీనిద్వారా తెలిసిందేమిటంటే అల్లాహ్‌ నామాలు, గుణాలు ఆయనకే స్వంతం. ఆయనకే శోభాయమానం. మనుషుల పేర్లు గుణాలు వారికే ప్రత్యేకం, వారికే అవి తగినవి. పేర్లు, గుణాలు ఒకేవిధంగా కనిపించినంతమాత్రాన వాస్తవంలో అవి ఒకటి కావు. రెండింటి మధ్య ఎలాంటి సామ్యంగానీ, పోలికగానీ లేదు. ఇది చాలా స్పష్టమయిన విషయం. సర్వస్తోత్రాలు అల్లాహ్‌కే శోభాయమానం.

మూడవ పద్ధతి 

ఎవరయితే గుణగణాల రీత్యా పరిపూర్ణుడు కాడో అతనికి ఆరాధ్య దేవుడయ్యే అర్హత లేదు. అందుకే దైవప్రవక్త హజ్రత్‌ ఇబ్రాహీం ( అలైహిస్సలాం) తన తండ్రితో ఇలా అన్నారు:

يَا أَبَتِ لِمَ تَعْبُدُ مَا لَا يَسْمَعُ وَلَا يُبْصِرُ

“(ఓ నాన్నా!) వినలేని, కనలేని వాటిని మీరు ఎందుకు పూజిస్తారు?” (మర్యమ్‌ : 42)

ఆవు దూడను పూజించే వారి చర్యను ఖండిస్తూ అల్లాహ్‌ ఇలా సెలవిచ్చాడు :

أَلَمْ يَرَوْا أَنَّهُ لَا يُكَلِّمُهُمْ وَلَا يَهْدِيهِمْ سَبِيلًا ۘ

“అది తమతో మాట్లాడలేదనీ, తమకు ఏ దారీ చూపదన్న సంగతిని గురించి వారు ఆలోచించలేదా?” (అల్‌ ఆరాఫ్‌ 7 : 148)

నాల్గవ పద్దతి:

గుణాలను రూఢీ చేయటం పరిపూర్ణతకు చిహ్నం. నిరాకరించటం లోపానికి ఆనవాలు. ఎందుకంటే గుణములు లేనివాడు నశించినవానితో సమానం లేదా లోపభూయిష్టతకు తార్కాణం. అల్లాహ్‌ ఈ రెండింటికీ అతీతుడు, పవిత్రుడు.

ఐదవ పద్ధతి:

దైవగుణాలకు మనం మనవైన భాష్యాలు చెప్పటానికి ఎలాంటి ఆధారం లేదు. పైగా ఈ ధోరణి ఒక మిథ్య. వాటి అర్ధాలను అల్లాహ్ కే అప్పగించటం కూడా సరైనది కాదు. ఇలా చేస్తే, ఖుర్‌ఆన్‌లో మనకు ఏమీ తెలియని విషయాల గురించి అల్లాహ్‌ మనకు ఆజ్ఞలు జారీచేసినట్లవుతుంది. కాగా; తనను తన పేర్లతోనే పిలవమని అల్లాహ్‌ మనల్ని ఆదేశించాడు. మరి మనకు అర్థమే తెలియనపుడు ఎలా పిలిచేది? మరోవైపు అల్లాహ్‌ ఖుర్‌ఆన్‌లో అనేకచోట్ల ఆజ్ఞాపిస్తున్నాడు – ఖుర్‌ఆన్‌పై చింతన చేయమని! మనకు భావార్దాలే తెలియనపుడు వాటిపై మనం చింతన ఎలా చేయగలుగుతాము?

కనుక బోధపడేదేమిటంటే అల్లాహ్‌ యొక్క నామాలను, ఆయన గుణగణాలను మనుషులతో పోల్చకుండా యధాతథంగా అంగీకరించటం అనివార్యం. ఎందుకంటే ఆయన నామాలు, ఆయన గుణగణాలు ఆయన స్టాయికి, వైభవానికి తగినట్లుగానే ఉన్నాయి. ఉదాహరణకు : అల్లాహ్‌ ఇలా సెలవిచ్చాడు :

 لَيْسَ كَمِثْلِهِ شَيْءٌ ۖ وَهُوَ السَّمِيعُ الْبَصِيرُ

“ఆయన్ని పోలిన వస్తువేదీ లేదు. ఆయన వినేవాడు, చూసేవాడు.” (అష్‌ షూరా 42 : 11)

ఈ ఆయతులో అల్లాహ్ తనను ఏ వస్తువుతోనయినా సరే పోల్చటాన్ని త్రోసిపుచ్చాడు. అలాగే తనలోని వినే, చూచే గుణాలను రుజువు చేశాడు. దీన్నిబట్టి విదితమయ్యేదేమిటంటే దైవగుణాలను అంగీకరించటం వల్ల వాటికి పోలికలను ఆపాదించినట్టు అర్థం కాదు. పోలికలను త్రోసిపుచ్చటంతో పాటు, గుణగణాలను అంగీకరించటం అవశ్యమని కూడా దీనిద్వారా అవగతమవుతోంది. అల్లాహ్ నామాల, గుణాల విషయంలో అహఁలే  సున్నత్‌ వల్‌ జమాఅత్‌ చెప్పేదొక్కటే : “పోలికలతో నిమిత్తం లేకుండా వీటిని ఒప్పుకోవాలి. కాదు, కూడదు అని అనకుండా వాటిని స్వచ్చమైనవిగా ఖరారు చేయాలి.”


ఇది అఖీదా-తౌహీద్ (దేవుని ఏకత్వం) – డా. సాలెహ్ అల్ ఫౌజాన్ [పుస్తకం] నుండి తీసుకోబడింది (75 – 87పేజీలు)

దుఆ స్వీకరించబడే సమయంలో ఏ దుఆ చేయడం మంచిది? [ఆడియో]

బిస్మిల్లాహ్

(5:29 నిముషాలు)
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

జుము’ఆ (శుక్రవారం) రోజున మన బాధ్యతలు, పుణ్య మార్గాలు. ఇక్కడ ఆడియో వీడియో ఆర్టికల్స్ పొందుతారు ఇన్ షా అల్లాహ్. తప్పక ఈ పేజీని దర్శించండి, ఫార్వర్డ్ చేయండి
https://teluguislam.net/five-pillars/salah-namaz-prayer/friday/

తౌహీదును రక్షించుటకు, షిర్క్‌ వరకు చేర్చించే ప్రతి దారిని మూసి వేయుటకు ప్రవక్త చేసిన కృషి

బిస్మిల్లాహ్

22 వ అధ్యాయం
తౌహీదును రక్షించుటకు, షిర్క్‌ వరకు చేర్చించే ప్రతి దారిని మూసి వేయుటకు ప్రవక్త చేసిన కృషి.
అల్ ఖవ్లుల్ సదీద్ షర్హ్ కితాబ్ అత్ తౌహీద్ – ఇమామ్ అస్-సాదీ
The famous commentary of Shaykh as-Sa’di of the book Kitab at-Tawhid of Muhammad ibn Abdul Wahhab.


అల్లాహ్ ఆదేశం చూడండి:

لَقَدْ جَاءَكُمْ رَسُولٌ مِّنْ أَنفُسِكُمْ عَزِيزٌ عَلَيْهِ مَا عَنِتُّمْ حَرِيصٌ عَلَيْكُم بِالْمُؤْمِنِينَ رَءُوفٌ رَّحِيمٌ

“నిశ్చయంగా మీ వద్దకు ఒక ప్రవక్త వచ్చాడు. ఆయన స్వయంగా మీలోనివాడే. మీరు నష్టానికి గురికావటం అనేది ఆయనకు బాధ కలిగిస్తుంది.” (తౌబా 9:128).

అబూ హురైరా (రది అల్లాహు అన్హు) కథనం: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా చెప్పారు:

“మీరు మీ ఇళ్ళను సమాధులుగా మార్చకండి. నా సమాధిని పండుగ కేంద్రం (ఉర్సు, జాతరగా) చేయకండి. నా కోసం దరూద్‌ చదవండి. మీరు ఎక్కడా ఉన్నా మీ దరూద్‌ నా వరకు చేరుతుంది”. (అబూ దావూద్).

అలీ బిన్‌ హుసైన్‌ కథనం: ఒక వ్యక్తి గోడలో ఉన్న ఒక రంద్రం నుండి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సమాధి వద్దకు వచ్చి అక్కడ దుఆ చేస్తుండగా, చూసి అతనిని  నివారించారు. ఇంకా ఇలా చెప్పారు. నేను నీకు ఒక హదీసు వినిపిస్తాను, అది నేను నా తండ్రి (హుసైన్‌ రది అల్లాహు అన్హు)తో, అతను తన తండ్రి (అలీ రది అల్లాహు అన్హు)తో, అతను ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)తో విన్నాడు. ప్రవక్త చెప్పారు:

“నా సమాధిని పండుగ కేంద్రంగా (ఉర్సు, జాతర) చేయకండి. మీరు మీ ఇళ్ళను సమాధులుగా మార్చకండి (నఫిల్‌ నమాజులు చదవకుండా). మీరు ఎక్కడ ఉండి నాపై సలాం పంపినా అది నా వరకు చేరుతుంది”. (రవాహు ఫిల్‌ ముఖ్ తార్ ).

ముఖ్యాంశాలు:

1. సూరయే  తౌబా ఆయతు యొక్క భావం.

2. షిర్క్‌ దరిదాపులకు కూడా చేరకుండా దూరముండాలని ప్రవక్త యొక్క తాకీదు.

3. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మనపై చాలా కనికరం, కారుణ్యం గలవారు. మన రుజుమార్గాన్ని అధికంగా కోరుకునేవారు.

4. ఆయన సమాధి దర్శనకు వెళ్ళుట ప్రత్యేకంగా నివారించారు. ఆయన సమాధి దర్శనం (అక్కడ ఉన్నవారికి ధర్మం పరిదిలో ఉండి చేయుట) చాలా పుణ్య కార్యం.

5. (అక్కడ నివసించే వారైనప్పటికీ) మాటికి మాటికి దర్శించుటను నివారించారు.

6. నఫిల్‌ నమాజులు ఇంట్లో చదవాలని ప్రోత్సహించారు.

7. స్మశానంలో నమాజ్‌ చదవకూడదన్పది సహాబాల (సహచరుల) వద్ద స్పష్టమయిన విషయం.

8. దరూద్, సలాం దూరంగా ఉండి పంపినా, ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) వరకు చేరుతుంది. అలాంటపుడు ప్రత్యేకంగా ఈ ఉద్దేశంతో అక్కడికి వెళ్ళే అవసరం లేదు.

9. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సమాధి జీవితం (బర్‌ జఖ్‌)లో ఉన్నారు. ఆయన వరకు తన అనుచర సంఘం కర్మల నుండి కేవలం దరూద్‌, సలాం మాత్రమే చేర్చించ బడుతాయి.

తాత్పర్యం: (అల్లామా అల్ సాదీ) 

ఈ అధ్యాయంలో ప్రస్తావించబడిన వాక్యాలపై శ్రద్ధ చూపినవారు ఇందులో తౌహీద్‌ను బలపరిచే విషయాలపై ఆచరించాలని పోత్సహించబడింది. అల్లాహ్  వైపునకే మరలాలని, భయమూ మరియు ఆశతో అల్లాహ్ పై మాత్రమే నమ్మకం ఉంచాలని, ఆయన దయను కాంక్షించి, దాన్ని పొందే ప్రయత్నం చేయాలని, సృష్టి బానిసత్వ శృంఖలాలను తెంచేసి, ముక్తి పొందాలని, సృష్టిలో ఎవరి గురించి కూడా గులువ్వు (అతిశయోక్తి) చేయకూడదని, సర్వ బాహ్యాంతర కార్యాలు సంపూర్ణంగా నిర్వహించి, ప్రత్యేకంగా ఇబాదత్‌ కు ప్రాణమయినటువంటి చిత్తశద్ధి (ఇఖ్లాసు) ప్రతికార్యంలో ఉంచే ప్రయత్నం చేయాలని ప్రోత్సహించబడింది.

సృష్టరాసుల విషయంలో గులువ్వు (అతిశయోక్తి) అయ్యే ముష్రికులను పోలిన మాటలు, చేష్టలు చేయుట నివారించబడింది. ఇది వారిలో కలిసిపోవుటకు కూడా కారణం కావచ్చు. తౌహీద్‌ భద్రతకై షిర్క్‌ లోయలో పడవేసే మాటలు, చేష్టల నుండి కూడా నివారించబడింది. విశ్వాసులు ఏ ఉద్దేశంతో పుట్టించబడ్డారో దానిపై వారు స్థిరంగా ఉండుటకు ఇది వారిపై ఓ కరుణ, దయ. వారి సాఫల్యం కూడా అందులొనే ఉంది.


ఇది ఏకత్వపు బాటకు సత్యమైన మాట – ఇమామ్ అస్-సాదీ అనే పుస్తకం నుండి తీసుకోబడింది. తెలుగు అనువాదం: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్). ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు అన్హు) సిగ్గు, బిడియం [ఆడియో & టెక్స్ట్]

హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు అన్హు) సిగ్గు, బిడియం
https://youtu.be/dZZa0Z0Oh8Y (3 నిముషాలు)
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, ఉస్మాన్ (రజియల్లాహు అన్హు) వారి యొక్క అత్యుత్తమ గుణమైన సిగ్గు, బిడియం (హయా) గురించి వివరించబడింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్వయంగా ఉస్మాన్ (రజియల్లాహు అన్హు) వద్ద దేవదూతలు కూడా సిగ్గుపడతారని తెలిపిన ఒక సంఘటనను పేర్కొన్నారు. అబూబక్ర్ (రజియల్లాహు అన్హు), ఉమర్ (రజియల్లాహు అన్హు) వచ్చినప్పుడు సాధారణ స్థితిలో ఉన్న ప్రవక్త, ఉస్మాన్ (రజియల్లాహు అన్హు) రాకతో తమ వస్త్రాలను సరిచేసుకుని కూర్చోవడం ఆయన పట్ల గల గౌరవాన్ని, ఆయన సిగ్గు యొక్క స్థాయిని తెలియజేస్తుంది. అంతేకాకుండా, ఇస్లాం స్వీకరించిన నాటి నుండి తన కుడి చేతిని మర్మాంగాలకు తాకించలేదని ఉస్మాన్ (రజియల్లాహు అన్హు) స్వయంగా చెప్పిన విషయం ఆయన పవిత్రతకు నిదర్శనం. ఆయన అధికంగా ఖుర్ఆన్ పారాయణం చేసేవారని, చివరికి హంతకుల చేతిలో హత్యకు గురయ్యే సమయంలో కూడా ఖుర్ఆన్ పారాయణంలోనే నిమగ్నమై ఉన్నారని వివరించబడింది.

సోదర సోదరీమణులారా! ఉస్మాన్ రజియల్లాహు అన్హు వారి యొక్క ఉత్తమ గుణం, బిడియం, సిగ్గు, లజ్జ దీని గురించి మనం తెలుసుకుంటున్నాము. అందరికంటే ఎక్కువ హయా ఉస్మాన్ రజియల్లాహు అన్హు గలవారని స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సాక్ష్యం పలికారు.

ఒక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ ఇంట్లో కూర్చుని ఉన్నారు. ఒక మెత్తకు ఇలా ఆనుకొని, తన ఈ మోకాళ్ళను ఇలా నిలబెట్టి ఉన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏ లుంగీ లేదా వస్త్రం అయితే ధరించి ఉన్నారో అది ఇంచుమించు మోకాళ్ళకు దగ్గరగా వచ్చి పిక్క కనబడుతూ ఉన్నది. ఈ స్థితిలో కూర్చుండి ఉన్నారు. కొంతసేపట్లో హజరత్ అబూబకర్ సిద్దీఖ్ రజియల్లాహు అన్హు వచ్చారు. లోపలికి రావడానికి అనుమతి కోరారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అదే స్థితిలో కూర్చుండి ఉన్నారు, అబూబకర్ రావడానికి అనుమతి ఇచ్చారు. అబూబకర్ వచ్చి ఒక పక్కన కూర్చున్నారు.

మరికొంత సేపటికి హజరత్ ఉమర్ వచ్చారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అదే స్థితిలో కూర్చుని ఉన్నారు, హజరత్ ఉమర్ అనుమతి కోరారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అనుమతి ఇచ్చారు. హజరత్ ఉమర్ లోపలికి వచ్చి ఓ పక్కన కూర్చున్నారు, ప్రవక్త అలాగే ఉన్నారు. మరికొంత సమయం గడిచిన తర్వాత హజరత్ ఉస్మాన్ వచ్చారు. లోపలికి రావడానికి అనుమతి కోరారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ వస్త్రాన్ని మరింత కిందికి దించుతూ, ఒక సరియైన రీతిలో కూర్చుండి, ఉస్మాన్ కు రావడానికి అనుమతి ఇచ్చారు.వచ్చారు, మాట్లాడారు, వెళ్ళిపోయారు.

ఆ తర్వాత ఇంట్లో ఈ విషయాన్ని గమనించిన భార్య, అబూబకర్ వచ్చినప్పుడు మీరు అలాగే కూర్చుండి ఉన్నారు, ఉమర్ వచ్చినప్పుడు మీరు అలాగే కూర్చుండి ఉన్నారు, కానీ ఉస్మాన్ ఎప్పుడైతే వచ్చి అనుమతి కోరాడో మీరు మీ వస్త్రాన్ని సరిచేసుకుంటూ, మరి కిందికి దించుకుంటూ, మీ కూర్చుండే స్థితిని మార్చి, మరి మీరు అనుమతించారు, ఎందుకు ఇలా అని అడిగినప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, “ఏ ఉస్మాన్ తోనైతే దేవదూతలు సిగ్గు పడుతున్నారో ఆ ఉస్మాన్ తో నేను సిగ్గుపడనా?

అయితే ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే ఉస్మాన్ రజియల్లాహు అన్హు సహాబాలలో అందరికంటే ఎక్కువగా సిగ్గు, బిడియం గలవారు. మరియు స్వయంగా ఆయన ఒక సందర్భంలో తెలిపారు, “ఎప్పటి నుండి అయితే నేను నా ఈ కుడి చేతితో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చేతిలో చెయ్యి వేసి శపథం చేశానో, ఇస్లాం స్వీకరించానో, బయఅత్ చేశానో, అప్పటినుండి నేను ఈ కుడి చెయ్యిని నా మర్మాంగానికి తాకనివ్వలేదు”

హజరత్ ఉస్మాన్ రజియల్లాహు అన్హు వారిలో ఎన్నో రకాల ఉత్తమ గుణాలు ఉండినవి. ఆయన ఖుర్ఆన్ యొక్క పారాయణం చాలా అధికంగా చేసేవారు. చాలా అధికంగా చేసేవారు. మరియు చివరి సమయంలో, ఏ సమయంలోనైతే దుండగులు ఆయన్ని హతమార్చడానికి ప్రయత్నం చేశారో, ఆ సమయంలో కూడా ఆయన ఖుర్ఆన్ పారాయణం చేస్తూ ఉన్నారు, అదే స్థితిలో ఆ దుష్టులు, దుర్మార్గులు వచ్చి ఆయన్ని హతమార్చారు.


ఇతరములు:

స్వలింగ సంపర్కం (లవాతత్)! దాని పర్యవసానం! [వీడియో]

బిస్మిల్లాహ్

(HomoSexuality and its Evil effects)

[41 నిముషాలు]

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా


స్వలింగ సంపర్కము అనగా ఇద్దరు పురుషుల మధ్య లేదా ఇద్దరు స్త్రీల మధ్య ఉండే లైంగిక సంబంధము. ఒకే లింగ జాతికి చెందిన వ్యక్తుల మధ్య రతి సంబంధాన్ని స్వలింగ సంపర్కం (హోమో సెక్సువల్స్) అంటారు. అనగాఒక స్త్రీ మరొక స్త్రీతో అలాగే ఒక పురుషుడు మరొక పురుషునితో సంభోగించటం.

దైవ ప్రవక్త లూత్ అలైహిస్సలాం జాతివారు ప్రపంచంలోనే అందరికన్న ముందుగా స్వలింగ సంపర్కమనే అత్యంత నీచమైన చేష్టకు పాల్పడ్డారు. ఆ ముదనపు జాతి పేరు మీదగానే స్వలింగ సంపర్కాన్ని ‘లవాతత్‘ అని పేర్కొనటం జరుగుతుంది.

[క్రింది భాగం అహ్సనుల్ బయాన్ నుండి తీసుకోబడింది]

ఖుర్ఆన్ లో అల్లాహ్ ఇలా ఉపదేశించాడు:

وَلُوطًا إِذْ قَالَ لِقَوْمِهِۦٓ أَتَأْتُونَ ٱلْفَٰحِشَةَ مَا سَبَقَكُم بِهَا مِنْ أَحَدٍۢ مِّنَ ٱلْعَٰلَمِينَ إِنَّكُمْ لَتَأْتُونَ الرِّجَالَ شَهْوَةً مِّن دُونِ النِّسَاءِ ۚ بَلْ أَنتُمْ قَوْمٌ مُّسْرِفُونَ وَمَا كَانَ جَوَابَ قَوْمِهِ إِلَّا أَن قَالُوا أَخْرِجُوهُم مِّن قَرْيَتِكُمْ ۖ إِنَّهُمْ أُنَاسٌ يَتَطَهَّرُونَ

మేము లూతు (అలైహిస్సలామ్‌)ను పంపాము. అతను తన జాతివారిని ఉద్దేశించి, ”మీరు ఇంత సిగ్గుమాలిన చేష్టకు పాల్పడుతున్నారేమిటి? మీకు పూర్వం లోకంలో ఎవరూ ఇలాంటి పాడు పని చెయ్యలేదే!”అయ్యో! మీరు స్త్రీలను వదలి [96], పురుషులతో కామవాంఛ తీర్చుకుంటున్నారా?! [97] అసలు మీరు మరీ బరితెగించి వ్యవహరిస్తున్నారు” [98] అని అన్నారు. దానికి అతని జాతి వారు ఇచ్చిన జవాబు ఇదే: ”వీళ్లను మీ బస్తీ నుంచి వెళ్లగొట్టండి. మహా పవిత్రులట వీళ్ళు. [99](Quran – 7 : 80-82)

[96] అంటే మీరు స్త్రీలను వదిలి లైంగిక కోర్కేల్ని తీర్చుకోవటానికి ప్రకృతి ధర్మానికి విరుద్దంగా సిగ్గులేకుండా మగవాళ్ళు దగ్గరికి పోతారా?! మీరు ఒడిగడుతున్న ఈ చేష్ట అత్యంత హేయమైనది, విరుద్దమైనది. జంతువుల్లో సయితం లేని ఈ పాడు బుద్ది మీకెలా పుట్టిందీ?

[97] మగవారి లైంగిక వాంఛల పరిపూర్తికై, వారి తృప్తికై, సౌఖ్యానికై దేవుడు ఆడవారిని పట్టించాడు. కాని ఈ దుర్మార్గుల స్వభావమే చెడిపోయింది. మీరు స్త్రీలను వదిలి పురుషుల మల విసర్జనా మార్గాన్ని వాడుకోసాగారు.

[98] ప్రకృతి విరుద్ధమైన ఈ పని బరితెగించిన చేష్టగా, దైవాదేశాల అతిక్రమణగా పేర్కొనబడింది. అయితే నాగరికతా ధ్వజవాహకులమని చెప్పుకునే పాశ్చత్య దేశాల వారు నేడు ఈ సిగ్గుమాలిన పనిని చట్టబద్దంగా చేసుకుంటున్నారు. పైగా ఈ లతుకోరు పనిని ‘ప్రాధమిక హక్కు’ (fundamental right) గా ఖరారు చేసుకుంటున్నారు. అంటే పాశ్చాత్య దేశాల వారి దృష్టిలో ఇప్పుడది నేరమూ కాదు. చెడు పని కూడా కాదు. ఎందుకంటే వారి నాగరికత బాగా ‘ముదిరి’పోయింది.

[99] నీతిబాహ్యత, దుర్మార్గం, సామాజిక రుగ్మతలు వ్రేళ్లూనుకుపోయిన సమాజంలో సజ్జనుల హితబోధలు ఒక్కోసారి వింతగా తోస్తాయి. దైవప్రవక్త హజ్రత్ లూత్ అలైహిస్సలాం మరియు ఆయన వెంటనున్న కొద్దిమంది సౌశీల్యవంతులు ఆ దుర్మార్గుల కంటికి వింత మనుషుల్లా కనిపించారు. తమ సొసైటిలో ఈ పవిత్రులకు చోటు లేదు అని తెగేసి చెప్పే దుస్సాహసానికి పాల్పడ్డారు. కామంతో కళ్ళు మూసుకుపోయిన వానికి సిగ్గూ ఉండదు, భయమూ ఉండదు అన్న దానికి ఇదొక నిదర్శనం.మంచి వైపుకు, సౌశీల్యం పారిశుద్ద్యాల వైపుకు ఆహ్వానించే వారు వారి దృష్టికి అధములుగా కనిపిస్తారు. మంచివారినే వారు చులకన చేస్తారు.

ఖుర్ఆన్ లో అల్లాహ్ ఇలా ఉపదేశించాడు:

وَلَمَّا جَاءَتْ رُسُلُنَا لُوطًا سِيءَ بِهِمْ وَضَاقَ بِهِمْ ذَرْعًا وَقَالَ هَٰذَا يَوْمٌ عَصِيبٌ وَجَاءَهُ قَوْمُهُ يُهْرَعُونَ إِلَيْهِ وَمِن قَبْلُ كَانُوا يَعْمَلُونَ السَّيِّئَاتِ ۚ قَالَ يَا قَوْمِ هَٰؤُلَاءِ بَنَاتِي هُنَّ أَطْهَرُ لَكُمْ ۖ فَاتَّقُوا اللَّهَ وَلَا تُخْزُونِ فِي ضَيْفِي ۖ أَلَيْسَ مِنكُمْ رَجُلٌ رَّشِيدٌ قَالُوا لَقَدْ عَلِمْتَ مَا لَنَا فِي بَنَاتِكَ مِنْ حَقٍّ وَإِنَّكَ لَتَعْلَمُ مَا نُرِيدُ قَالَ لَوْ أَنَّ لِي بِكُمْ قُوَّةً أَوْ آوِي إِلَىٰ رُكْنٍ شَدِيدٍ

మేము పంపిన దూతలు లూత్‌ వద్దకు చేరుకున్నప్పుడు వారి రాకపై అతను దుఃఖవదనుడయ్యాడు. లోలోపలే కుంచించుకు పోతూ, ”ఇది చాలా గడ్డురోజు” [125] అని అన్నాడు. (మరో వైపునుంచి) అతని జాతి వారు పరుగులు తీస్తూ అతని వద్దకు వచ్చారు. వారు మొదటినుంచే ఇటువంటి నీచపు పనులు చేస్తుండేవారు.[126] ”నా జాతి ప్రజలారా! ఇదిగో, నా కూతుళ్ళు [127] ఉన్నారు. మీ కొరకు వీరు పరిశుద్ధులు. మీరు అల్లాహ్‌కు భయపడండి. నా అతిథుల విషయంలో నన్ను నవ్వులపాలు చెయ్యకండి. ఏమిటీ, మీలో ఒక్కడైనా మంచివాడు లేడా?’‘ [128] అని లూతు నచ్చజెప్పాడు. ”నీ కూతుళ్ళపై మాకెలాంటి హక్కు లేదన్న సంగతి నీకు బాగా తెలుసు. మాకిష్టమైనది ఏదో కూడా నీకు తెలుసు కదా!” [129] అని వారు సమాధానమిచ్చారు.”(అయ్యో!)మిమ్మల్ని ప్రతిఘటించే బలం నాకుంటే ఎంత బావుండేది! లేదా నేను ఆశ్రయం పొందటానికి ఏదైనా దృఢమైన ఆధారం ఉంటే ఎంత బావుండేది!” [130] అని లూత్‌ అన్నాడు. అప్పుడు దైవదూతలు “ఓ లూత్‌! మేము నీ ప్రభువు తరఫున పంపబడిన వారము. వారు నీ దాకా రాలేరు. కాబట్టి నువ్వు నీ ఇంటివారిని తీసుకుని కొంత రాత్రి ఉండగానే బయలుదేరు. మీలో ఎవరూ వెనుతిరిగి చూడకూడదు. అయితే నీ భార్య; వారందరికీ పట్టే గతే ఆవిడకూ పట్టనున్నది. వారికోసం ఉదయ సమయం నిశ్చయించబడింది. ఏమిటీ, ఉదయ సమయం దగ్గరలో లేదా?” [131] అని పలికారు. మరి మా ఉత్తర్వు(ను అమలుపరచే సమయం) రాగానే ఆ బస్తీని తల క్రిందు లుగా చేసేసి, వారిపై నిరాఘాటంగా గులకరాళ్ళను కురిపించాము. అవి నీ ప్రభువు తరపున గుర్తు వేయ బడినవి. అవి ఈ దుర్మార్గులకు ఎంతో దూరాన లేవు. [132](సూరా హూద్  11 :77 – 83)

[125] హజ్రత్‌ లూత్‌ (అలైహిస్సలాం) అంతగా మనస్తాపం చెందడానికి కారణం ఏమిటంటే దైవదూతలు మీసాలు కూడా మొలవని నవయువకుల రూపంలో వచ్చారు. తన జాతి పురుషుల సిగ్గుమాలిన చేష్టల గురించి ఆయనకు తెలుసు కాబట్టి  పొంచివున్న ప్రమాదాన్ని పసిగట్టి ఆయన వ్యాకులతకు లోనయ్యారు. వచ్చిన ఆ అందమైన నవయువకులు అతిథులు కానేకారనీ, వారు దైవశాసనాన్ని అమలు పరచడానికి వచ్చిన దైవదూతలని ఆయనకు తెలీదు.

[126] లూత్‌ ఇంటికి అందమైన కొందరు యువకులు వచ్చి ఉన్నారని తెలియగానే ఆ స్వలింగ సంపర్క రోగగ్రస్తులు ఉండబట్టలేక పరుగెత్తుకుని వచ్చారు. ఆ యువకులను తమ తమ ఇళ్లకు తీసుకుపోయి వాళ్ళను ఆ పాడుపని కోసం ఉపయోగించు కోవాలనుకున్నారు.

[127] అంటే – లైంగిక కోర్కెల్ని తీర్చుకోవాలన్నదే మీ ఉద్దేశ్యమైతే అందుకోసం ‘నా కూతుళ్లు ఉన్నారు. వారిని వివాహమాడండి. మీ కోర్కెల్ని ధర్మబద్ధంగానూ, సహజపద్ధతిలోనూ తీర్చుకోండి. ఇదే మీ కొరకు అన్ని విధాలా శ్రేయస్కరం అని లూత్‌ చెప్పదలిచారు. ఇక్కడ ‘కూతుళ్లు’ అంటే ఎవరు? తన జాతికి చెందిన మహిళలను ఆయన కూతుళ్లుగా చెప్పుకున్నారని చాలామంది వ్యాఖ్యాతలు అభిప్రాయపడ్డారు. ఎందుకంటే దైవప్రవక్త తన జాతివారి కొరకు పితామహుడు వంటివాడు. అలా చెప్పటంలోని ఆయన ఆంతర్యం ఏమిటంటే సమాజంలో ఇంతమంది ఆడపిల్లలు ఉండగా మీకేం పోయే రోగం వచ్చింది? మీరు ఆ అమ్మాయిలను పెళ్లి చేసుకుని మీ సహజ కోరికల్ని తీర్చుకోవచ్చుకదా! (ఇబ్నె కసీర్‌).

[128] ఏమిటీ? నా ఇంటికి వచ్చిన అతిథులతో దుర్వవహారం చేసి నన్ను అవమానాలపాలు చేస్తారా? మీలో ఆ మాత్రం అర్ధం చేసుకునే వారు లేరా? అతిథి మర్యాదకు కళంకం తెస్తారా? మీ దుష్ట బుద్ధిని అడ్డుకునే సజ్జనుడు మీలో ఒక్కడూ లేడా? దైవప్రవక్త లూత్‌ ఇంతగా కలత చెందడానికి కారణం అప్పటివరకూ ఆయన ఆ అతిథులను మానవ మాత్రులుగా తలపోయటమే. ఆ వచ్చిన వారు మనుషులు కారనీ, దుర్మార్గుల భరతం పట్టడానికి దివి నుంచి భువికి దిగివచ్చిన దైవదూతలని ఆయనకు తెలీదు. వారు దైవదూతలన్న సంగతి ఆయనకు ముందు నుంచే తెలిసి ఉంటే కలవరం చెందేవారు కారు. దైవప్రవక్తలకు రహస్య విషయాల జ్ఞానం ఉండదని చెప్పడానికి ఇది కూడా ఒక ప్రబల తార్మాణమే.

[129] అంటే ఆ దుర్మార్గులు సహజమైన, ధర్మసమ్మతమైన ఒక వద్ధతిని ్రోసివుచ్చి అసహజమైన, అహేతుకమైన, అధర్మమైన చేష్టను అవలంబించారు. పరమ జుగుప్సాకరమైన ఈ పనిలో లూత్‌ జాతివారు ఎంత ముందుకు వెళ్ళిపోయారో, వారి కళ్లు ఎలా మూసుకుపోయాయో దీన్నిబట్టి బోధపడుతోంది.

[130] “బలం” అంటే బాహుబలం, ఒనరులు, సంతానబలం అని భావం. “దృథఢమైన ఆధారం” అంటే తనను సమర్థించే తెగగానీ, వంశంగానీ ఉంటే వారిని ఆశ్రయించే వాడినే! అన్నది ఆయన ఆవేదన. ఎంతటి నిస్సహాయస్థితిలో ఆయన ఈ మాటలన్నారో అర్థమవుతోంది. నన్ను ఆదుకునేవారు, నా తరఫున మాట్లాడేవారు ఈ రోజు ఉండి ఉంటే అతిథుల విషయంలో నేను అవమానం పాలు కాకుండా ఉండేవాడినే! అని ఆందోళన చెందారు. దైవప్రవక్త హజత్‌ లూత్‌ (అలైహిస్సలాం) గారి ఈ ఆకాంక్ష దైవంపై భారం మోపే విషయానికి విరుద్ధం కాజాలదు. ప్రాపంచికంగా మనిషి తన రక్షణ కోసం తీసుకోవలసిన జాగ్రత్తలన్నీ తీసుకుని ఆ పైన దైవంపై భారం వేయాలి. ఇదే సరైనది. అంతేగాని చేతులు ముడుచుకు కూర్చుని, అన్నింటికీ దేవుడే ఉన్నాడు అంటే అసలుకే నష్టం వాటిల్లుతుంది. కాబట్టి హజ్రత్‌ లూత్‌ (అలైహిస్సలాం) పలుకుల్లో విపరీతమైన అంశం ఏమీ లేదు. ఈ సంఘటన ద్వారా విదితమయ్యే మరో ముఖ్య విషయం ఏమిటంటే దైవప్రవక్తలకు అగోచర జ్ఞానం ఉండదు. అలాగే వారు సర్వాధికారాలు కలిగి ఉండరు. దైవప్రవక్తలకు సర్వాధికారాలు ఉండి ఉంటే ఈ సందర్భంగా హజ్రత్‌ లూత్‌ అత్యంత దీనంగా ఇలా చెప్పుకుని ఉండేవారు కారు. ఈ రోజుల్లో కొందరు దైవప్రవక్త (స)కు సర్వాధికారాలుండేవని నమ్ముతున్నారు. ఈ నమ్మకం సరైనది కాదు. పై ఆయతు వారి ఈ నమ్మకాన్ని ఖండిస్తున్నది.

[131] ఒకవైపు లూత్‌ గారి దీనావస్థను, మరోవైపు ఆ జాతిజనుల విశ్చంఖలత్వాన్ని గమ నించిన దైవదూతలు జోక్యం చేసుకోవలసిన తరుణం వచ్చేసింది. “ఓ లూత్‌! మీరు ఆందోళన చెందనవసరం లేదు. వాళ్లు మా దాకా కాదుకదా, కనీసం మీ దాకా కూడా రాలేరు. రాత్రి పొద్దుపోయాక మీ మనుషులను వెంటబెట్టుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. తెల్లవారగానే ఈ పట్టణవాసులు నాశనం చేయబడతారు” అని వారు ధైర్యం చెప్పారు.

[132]“అవి” అంటే ఏవి? ఆయా ఊళ్లను ధ్వంసం చేయటానికి వాటిపై విసరబడిన “రాళ్ళు’ అని కొంతమంది వ్యాఖ్యాతలు అభిప్రాయపడగా, ఈ ఆయతులో “అవి” అనే సర్వనామం నాశనమైన ఆ ‘ఊళ్ళ’నే సూచిస్తున్నదని మరికొంతమంది అభిప్రాయ పడ్డారు. ఆ ఊళ్లు సిరియా-మదీనాల మధ్య ఉండేవి. “దుర్మార్గులు” అంటే మక్కాకు చెందిన సత్యతిరస్కారులు. వెనుకటి జాతులకు పట్టిన దుర్గతే మీకూ పడుతుంది జాగ్రత్త! అని హెచ్చరించటం ఈ వాక్యాల ప్రధాన ఉద్దేశం.

ప్రవక్త లూత్ అలైహిస్సలాం జాతివారు స్వలింగ సంపర్కంమనే అత్యంత నీచమైన చేష్టకు పాల్పడటంతో వారిపై దేవుడి శిక్షలు దాపురించాయి!.

ఖుర్ఆన్ లో అల్లాహ్ ఇలా ఉపదేశించాడు:

وَلَمَّآ أَن جَآءَتْ رُسُلُنَا لُوطًۭا سِىٓءَ بِهِمْ وَضَاقَ بِهِمْ ذَرْعًۭا وَقَالُوا۟ لَا تَخَفْ وَلَا تَحْزَنْ ۖ إِنَّا مُنَجُّوكَ وَأَهْلَكَ إِلَّا ٱمْرَأَتَكَ كَانَتْ مِنَ ٱلْغَٰبِرِينَ

మరి మా దూతలు లూత్‌ (అలైహిస్సలాం) వద్దకు చేరుకున్నప్పుడు, అతను వారిని చూసి ఆందోళన చెందాడు. లోలోపలే కుమిలిపోయాడు [49]. అప్పుడు వారిలా అన్నారు: “నువ్వు భయపడకు. కలత చెందకు. మేము నీ భార్యను తప్ప [50] – నిన్నూ, నీ పరివారాన్నీ కాపాడుతాము. ఎందుకంటే ఆమె (శిక్షను అనుభవించటానికి) వెనుక ఉండిపోయే వారితో చేరుతుంది.” “మేము ఈ పట్టణవాసులపై, వారి తిరుగుబాటు ధోరణి కారణంగా ఆకాశం నుంచి శిక్షను అవతరింపజేయనున్నాము.[51] (ఆ విధంగా) మేము ఆ పట్టణాన్ని బుద్ధి జీవుల కోసం స్పష్టమైన గుణపాఠ సూచనగా [53] చేసాము(సూరా అంకబూత్ 29 : 33 – 35)

[50] హజ్రత్ లూత్ అలైహిస్సలాం పరిస్దితిని అర్ధం చేసుకున్న దైవదూతలు భీతి చెందరాదని, దుఃఖించరాదని ఆయన్ని ఓదార్చారు. తాము దుష్టులను శిక్షించటానికి పంపబడిన దైవదూతలం అని తెలిపారు. అయితే దగాకోరుగా వ్యవహరించిన ఆయన భార్యకు సయితం శిక్షపడటం ఖాయమని ఆ సందర్భంగా దైవదూతలు స్పష్టం చేశారు.

[51] ఆకాశం నుంచి అవతరించిన ఆ శిక్ష ఎటువంటిదంటే దైవదూత జిబ్రయీల్ అలైహిస్సలాం వారి నివాస స్ధలాలను భూమినుంచి పెళ్ళగించి, ఆకాశం దాకా ఎత్తుకెళ్ళి అమాంతం క్రింద పడేశారు. ఆ తరువాత వారిపై కంకర రాళ్ళ వర్షం కురిపించబడింది. ఆ స్ధలాన్ని దుర్వాసన వచ్చే జలసంధి (మృత సముద్రం)గా మార్చివేయటం జరిగింది. (ఇబ్నె కసీర్)

[53] ఒకవైపు నుంచి రాళ్ళ వర్షం, మరో వైపు నుంచి ఇళ్ళు తలక్రిందులవటం, ఆ తరువాత ఆ ప్రదేశం అంతా దుర్వాసనతో కంపుకొట్టడం ఇదంతా ఒక గుణపాఠ సూచనే. ఆ ప్రదేశం మృత సముద్రంగా వ్యవహరించబడుతోంది. కాని విజ్ఞులు మాత్రమే ఇలాంటి ఘటనల నుండి గుణపాఠం గ్రహిస్తారు.

فَأَخَذَتْهُمُ ٱلصَّيْحَةُ مُشْرِقِينَ فَجَعَلْنَا عَالِيَهَا سَافِلَهَا وَأَمْطَرْنَا عَلَيْهِمْ حِجَارَةً مِّن سِجِّيلٍ إِنَّ فِي ذَٰلِكَ لَآيَاتٍ لِّلْمُتَوَسِّمِينَ

సూర్యోదయం అవుతున్న సమయంలో ఒక భయంకరమైన ప్రేలుడు వారిని ముట్టడించింది [46].చివరికి మేము ఆ నగరాన్ని తలక్రిందులుగా చేసివేశాము [47]. వారిపై కంకర రాళ్ల వర్షం కురిపించాము [48]. నిస్సందేహంగా యోచన చేసేవారి కొరకు [49] ఇందులో ఎన్నో సూచనలున్నాయి. ఈ పట్టణం (జనులు) వచ్చిపోయే రహదారిపైనే ఉంది  [50] (సూరా అల్ హిజ్ర్ – 15 :73 – 75)

[46] సూర్యుని లేలేత కిరణాలు పడుతున్న సమయంలో ఒకే ఒక్క శబ్దం వచ్చింది. అత్యంత భయంకరమైన ఈ కేక హజ్రత్‌ జిబ్రీల్‌ (అలైహిస్సలాం)దని కొంతమంది అభిప్రాయపడ్డారు.

[47] వారి నివాస స్థలాలు భూమి నుంచి ఆకాశానికి ఎత్తి, వాటిని తలక్రిందులుగా చేసి విసిరివేయటం జరిగిందని అనబడుతోంది. ఆ విధంగా వారు తమ ఇల్లూ వాకిలి సమేతంగా తలక్రిందులుగా చేసివేయబడ్డారు. అయితే కేవలం పై కప్పులతో సహా ఇళ్లు కూలిపోవటం మాత్రమే దీని భావమని మరికొందరంటారు.

[48] ఆ తర్వాత వారిపై ఒక ప్రత్యేక రకమైన కంకర రాళ్లు కూడా కురిపించబడ్డాయి. ఈ విధంగా వారు మూడు రకాల శిక్షలకు గురిచేయబడ్డారు. భావితరాల కొరకు ఇదొక గుణపాఠం అయ్యేలా చేయబడింది.

[49] ఆయతులో ‘ముతవస్సిమీన్‌” అని వుంది. నిశిత దృష్టితో విషయాన్ని పరికించే వారిని, యోచన చేసేవారిని ‘ముతవస్సిమీన్‌’ అంటారు. అలాంటి వారి కోసం ఇందులో గుణపాఠం ఉంది.

[50] అంటే ప్రధాన రహదారి అని భావం. మదీనా నుంచి సిరియాకు వెళ్ళే మార్గంలో శిథిలావస్థలో ఉన్న లూత్‌ (అలైహిస్సలాం) జాతి ప్రజల పట్టణాలు కానవస్తాయి. అటువైపు వచ్చేపోయే వారంతా ఆ దారి గుండా సాగవలసిందే. అవి మొత్తం అయిదు పేటలు. 1. సద్దూమ్‌ (ముఖ్యపట్టణం) 2. సాబ 3. సావహ్‌ 4. అస్‌ర 5. దూమా. వీటిని నాశనం చేసిన తీరు గురించి ఒక కథనం ఈ విధంగా ఉంది : హజత్‌ జిబ్రీల్‌ (అలైహిస్సలాం) తన రెక్కలపై ఈ పేటలను ఎత్తుకుని నింగికేసి సాగిపోయారు. ఆకాశాన ఉన్నవారు కూడా వారి కుక్కలు మొరగటాన్ని, కోళ్లు కూతవేయటాన్ని విన్నారు. ఆ తరువాత వారిని నేలకేసి గిరాటు కొట్టారని అనబడుతోంది (ఇబ్నె కసీర్‌). అయితే ఈ కథనానికి ప్రామాణికమైన అధారాలు లేవు.

సూరతుల్ ఫాతిహా వ్యాఖ్యానం – అహ్సనుల్ బయాన్

సూరతుల్ ఫాతిహా వ్యాఖ్యానం  (تفسير سُورةُ الفاتحة)

అహ్సనుల్ బయాన్

సూరహ్ అల్ ఫాతిహా (ప్రారంభం)

మూలం: అహసనుల్ బయాన్, First Edition February 2009, శాంతి మార్గం పబ్లికేషన్స్ ట్రస్ట్, హైదరాబాద్:

పరిచయం:

సంకలనం రీత్యా దివ్యఖుర్ఆన్ లో ఇది మొట్టమొదటి సూరా. ఈ సూరాలో తౌహీద్ (అంటే ఏకదైవారాధన) ప్రధానంగా కనబడుతుంది. దేవుని పట్ల విశ్వాసం, దైవారాధన, దేవుణ్ణి సహాయం కోసం వేడుకోవడం, దేవుని ప్రార్థించడం గురించి ఇందులో ముఖ్యంగా నొక్కి చెప్పడం జరిగింది. ఈ సూరాలో ఏడు ఆయతులున్నాయి. అల్లాహ్ మాత్రమే ఆరాధనలకు, స్తోత్రాలకు, అభ్యర్థనలకు  యోగ్యుడనీ, అల్లాహ్ మాత్రమే పరిపూర్ణుడనీ, ఇహలోకానికి, పరలోకానికి అల్లాహ్ మాత్రమే ప్రభువనీ, ఆయనే సృష్టికర్త అనీ ఈ ఏడు ఆయతులలో నిర్దిష్టంగా చెప్పడం జరిగింది.

ఈ సూరాకు ‘అల్ ఫాతిహా’ (ప్రారంభం) అని పేరు పెట్టడం జరిగింది. ఎందుకంటే, ఇది దివ్యఖుర్ఆన్ కు ప్రారంభ అధ్యాయం. ఈ సూరా దివ్య ఖుర్ఆన్ కు తల్లివంటిదనీ, దివ్య ఖుర్ఆన్ సారం ఇందులో ఉందని కూడా చెప్పడం జరిగింది.

ముస్లిములు చేసే నమాజుల్లో తప్పనిసరిగా చదువవలసిన సూరా ఇది. రోజూ చేసే అయిదు పూటల నమాజు కాని, లేక స్వచ్ఛందంగా చేసే ఐచ్ఛికమైన నమాజుల్లో కాని ప్రతి నమాజులో ఈ సూరాను పఠించటం తప్పనిసరి. ప్రారంభ సూరా చదువకపోతే ముస్లిములు చేసే ఏ నమాజూ స్వీకరించ బడదని ముస్లిం ధర్మవేత్తలు ఖచ్చితంగా చెప్పారు.

ధర్మవేత్తల అభిప్రాయం ప్రకారం, ఈ ప్రారంభ సూరా (అల్ ఫాతిహా), పూర్తి ఖుర్ఆన్ కు సారాంశం వంటిది. ఈ సూరా పూర్తి ఖుర్ఆన్ కు సారాంశం అని ఎందుకు చెప్పడం జరిగిందంటే, ఇస్లాంకు సంబంధించిన ప్రధానమైన భావనలను, నియమాలను అన్నింటినీ ఈ సూరా క్లుప్తంగా తెలియజేస్తుంది. మౌలికమైన ఇస్లామీయ భావనలు, ప్రధానమైన ఇస్లామీయ విశ్వాసాలు, అంటే దేవుని ఏకత్వం (దేవుడు ఒక్కడే అని విశ్వసించడం, దేవునికి భాగస్వాములు ఎవరూ లేరని విశ్వసించడం, దేవునికి సాటి ఎవరూ లేరని విశ్వసించడం), దేవుని గుణగణాలను గురించి ఈ సూరా సరళంగా, సూటిగా, సంక్షిప్తంగా మనిషికి తెలియజేస్తుంది. ముస్లిములు అల్లాహ్ ను, అంటే ఒకే ఒక్క ఆరాధ్యుడిని తప్ప మరెవ్వరినీ అర్థించరాదనీ, ఎవరి ముందూ చేతులు చాపరాదనీ, మనిషి సాటి మనిషికి దాస్యం చేయరాదనీ, కేవలం దేవునికి మాత్రమే తన ఆరాధనను అంకితం చేసుకొని, ఆయన ముందు మాత్రమే తలవంచాలని బోధిస్తుంది. దేవునికి మానవ గుణగణాలు ఆపాదించడాన్ని ఖండిస్తుంది. అల్లాహ్ కు ఎవరూ సమానులు కారు. అల్లాహ్ వంటి వారు మరెవ్వరూ లేరు. మనిషి ఆయన్ను విశ్వసించాలి. విశ్వాసంతో ఆయన్నే ఆరాధించాలి.

ఈ సూరా రెండు సమాన భాగాలుగా ఉన్నట్లు కనబడుతుంది. మొదటి భాగంలో అల్లాహ్, ఆయన గుణగణాల గురించి ఉంది. రెండవ భాగంలో మనిషి గురించి, మనిషికి దేవునితో ఉన్న అవసరం గురించి ఉంది.

అల్ ఫాతిహా సూరా వ్యాఖ్యానం:

అల్ ఫాతిహా సూరా దివ్య ఖుర్ఆన్ లోని మొట్ట మొదటి సూరా. హదీసుల ద్వారా కూడా దీని మహత్తు తెలుపబడింది. ఫాతిహ అంటే ఆరంభించటం, మొదలు పెట్టడం అని అర్థం. అందుకే దీనిని ఫాతిహతుల్ కితాబ్ అంటే పుస్తకారంభం అని పిలవటం జరిగింది. ఈ సూరాకు మరిన్ని పేర్లు కూడా ఉన్నట్లు హదీసుల ద్వారా రూఢీ అవుతోంది. ఉదాహరణకు:

  • (1) ఉమ్ముల్ ఖుర్ఆన్, (ఖురాన్ కు తల్లి వంటిది)
  • (2) అస్సబ్ వుల్ మసానీ, (7 చాలా పునరావృత అయతులు)
  • (3) అల్ ఖుర్ఆనుల్ అజీమ్,
  • (4) అష్షిఫా,
  • (5) అర్రుఖ్యతు (ఊదటం),

ఇంకా అనేక పేర్లు ఈ సూరాకు ఉన్నాయి.

ఈ సూరాకు గల ఇంకొక పేరు అస్సలాత్. హదీసె ఖుద్ సీ లో అల్లాహ్ ఈ విధంగా సెలవిచ్చారు: ఖసమ్ తు స్సలాత బైనీ వ బైన అబ్దీ (సహీహ్ ముస్లిం : కితాబుస్సలాత్) – అంటే “నేను సలాత్ (నమాజు)ను నాకు – నా దాసునికి మధ్య విభజించాను” అని భావం. అంటే ఫాతిహా సూరా నన్నమాట! ఈ సూరాలోని సగభాగంలో దైవ స్తోత్రం చేయబడింది. ఆయన దయాదాక్షిణ్యాలు, పోషణ, న్యాయశీలం, విశ్వ సామ్రాజ్యాధికారం అభివర్ణించబడ్డాయి. మిగిలిన సగభాగంలో దైవసన్నిధిలో దాసుడు చేసుకునే విన్నపాలు, అభ్యర్థనలు వివరించబడ్డాయి.

ఈ హదీసులో ఫాతిహా సూరాను నమాజు గా అభివర్ణించడం జరిగింది. దీన్ని బట్టి నమాజులో ఈ సూరాను పఠించటం చాలా అవసరమని స్పష్టమవుతోంది. మహనీయ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి ప్రవచనాల ద్వారా ఈ విషయం పదే పదే స్పష్టపరచటం జరిగింది: ఉదాహరణకు: – లా సలాత లిమన్ ల్లమ్ యఖ్ రఅ బి ఫాతిహతిల్ కితాబ్ (సహీహ్ బుఖారీ, సహీహ్ ముస్లిం). అర్థం: ఫాతిహా సూరా పఠించని వ్యక్తి నమాజు నెరవేరదు. ఈ హదీసులోని అరబీ మూలంలో వచ్చిన ‘మన్’ అనే పదం సర్వసాధారణమైనది. నమాజు చేసే ప్రతి వ్యక్తికీ ఇది వర్తిస్తుంది. వ్యక్తిగత స్థాయిలో నమాజు చేసినా, సామూహికంగా నమాజు చేసినా, నమాజు చేయించే ఇమాము అయినా, ఇమామును అనుసరించే వారయినా – అందరూ ఈ సూరాను చదవవలసిందే. నెమ్మదిగా చేసే (సిర్రీ) నమాజులోనయినా, బిగ్గరగా చేసే (జహ్రీ) నమాజులోనయినా, విధిగా చేయవలసిన (ఫర్జ్) నమాజులోనయినా, స్వచ్ఛందంగా చేసుకునే (నఫిల్) నమాజులోనయినా – నమాజు చేసే ప్రతి ఒక్కరూ ఈ సూరాను చదవటం తప్పనిసరి. క్రింద పేర్కొనబడిన హదీసు ద్వారా కూడా ఈ విషయానికి సమర్థన లభిస్తోంది:

ఒకసారి ఫజ్ర్ (ఉదయం) నమాజులో మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)తో పాటు ఆయన సహచరులు (రదియల్లాహు అన్హుమ్) కూడా ఖుర్ఆన్ పారాయణం చేయసాగారు. తత్కారణంగా నమాజులో ఖుర్ఆన్ పఠించడానికి ఆయన (సల్లల్లాహ్ అలైహి వసల్లం) ఇబ్బందిని ఎదుర్కోవలసి వచ్చింది. నమాజును ముగించిన తరువాత ఆయన (సల్లల్లాహ్ అలైహి వసల్లం) తన సహచరుల నుద్దేశ్యించి, “ఏమిటీ? మీరు కూడా (నా వెనకాల) ఖుర్ఆన్ పఠించారా?” అని అడిగారు. దానికి సహచరులు “అవున”ని చెప్పారు. అప్పుడు ఆయన (సల్లల్లాహ్ అలైహి వసల్లం) ఇలా ఉపదేశించారు: “మీరిలా చేయకండి – నాతో పాటు పఠించకండి – అయితే ఫాతిహా సూరా ను మాత్రం తప్పక పఠించాలి. ఎందుకంటే దాన్ని పఠించనిదే నమాజు నెరవేరదు” (అబూ దాఊద్, తిర్మిథీ, నసాయి).

అలాగే మరో హదీసు – హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం అంతిమ దైవప్రవక్త (సల్లల్లాహ్ అలైహి వసల్లం) ఇలా ప్రబోధించారు: మన్ సల్లా సలాతన్ లమ్ యఖ్రఅ ఫీహా బి ఉమ్మిల్ ఖుర్ఆని ఫహియ ఖిదాజున్ సలాతున్ ఘైరు తమామ్: (ఎవరయితే ఫాతిహా సూరా లేకుండానే నమాజు చేశాడో అతని నమాజు లోపభూయిష్టమైనదవుతుంది – అది పరిపూర్ణమైన నమాజు కాబోదు). దైవప్రవక్త (సల్లల్లాహ్ అలైహి వసల్లం) మూడుసార్లు ఈ మాటన్నారు. “మేము ఇమాము వెనుక కూడా నమాజు చేస్తాము కదా! మరప్పుడేం చేయాలి?” అని కొంతమంది హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ను ప్రశ్నించగా, “ఇమాము వెనుక ఉన్నప్పుడు (అంటే సామూహిక నమాజు చేస్తున్నప్పుడు) మీరు మనసులోనే – లోలోపలే – ఫాతిహా సూరా పఠించండి” అని ఆయన (రదియల్లాహు అన్హు) సమాధానమిచ్చారు. (సహీహ్ ముస్లిం)

పై రెండు హదీసుల ద్వారా స్పష్టమయ్యేదేమిటంటే, దివ్య ఖుర్ఆన్ లో సెలవీయబడినట్లు, “దివ్య ఖుర్ఆన్ మీ ముందు పఠించబడుతూ ఉన్నప్పుడు దాన్ని శ్రద్ధగా వినండి, మౌనంగా ఉండండి” (అల్ అరాఫ్ – 204). అలాగే హదీథులో చెప్పబడినట్లు – “సామూహిక నమాజుకు సారధ్యం వహించే వ్యక్తి (ఇమాము), గ్రంథ పారాయణం చేస్తున్నప్పుడు మౌనంగా ఉండండి.” దీని భావం ఏమిటంటే బిగ్గరగా చేయించే నమాజులలో వెనుక నిలబడివున్న నమాజీలు (ముక్తదీలు) ఫాతిహా సూరా తరువాత మిగిలిన పారాయణమంతటినీ మౌనంగా వినాలి. ఇమాముతో పాటే ఖుర్ఆన్ పారాయణం చేయకూడదు. లేదంటే, ఇమాము, తన వెనుకనున్న అనుయాయులు కూడా సహీహ్ హదీథుల కనుగుణంగా ఫాతిహా సూరాను పఠించడానికి వీలుగా ఫాతిహా సూరా ఆయతులను బాగా ఆగి ఆగి పారాయణం చేయాలి. లేదా ఫాతిహా సూరా ముగించిన తరువాత తన అనుయాయుల (ముక్తదీల) సౌకర్యార్థం ఇమాము చాలినంత వ్యవధిని ఇవ్వాలి. అలా చేస్తే ముఖ్తదీలు ఫాతిహా సూరా వాక్యాలను లోలోపలే చదవుకుంటారు. ఇలా చేయటం ఖుర్ఆన్ హదీథుల దృష్ట్యా ఆక్షేపణీయం కూడా కాదు. పైగా ఖుర్ఆన్, హదీథు – రెండింటి ఆదేశాలను పాటించినట్లవుతుంది. దీనికి భిన్నంగా ఫాతిహా సూరా పఠనాన్ని వారించటం వల్ల అనవసరంగా కొన్ని లేనిపోని సంశయాలకు తావిచ్చినట్లవుతుంది. ఉదా:- దివ్యఖుర్ఆన్ మరియు ప్రామాణిక హదీథులు పరస్పరం సమన్వయం చెందటం లేదనీ, వాటి మధ్య వైరుద్ధ్యం ఉందనీ, ఆ రెంటిలో ఏదో ఒకటి మాత్రమే ఆచరణయోగ్యమైనదనీ, ఏక కాలంలో రెండింటినీ అనుసరించటం దుస్సాధ్యమనీ (దైవం మన్నించుగాక) కుంటిసాకులు వెతికే వారిని వెన్నుతట్టి ప్రోత్సహించినట్లవుతుంది. మరిన్ని వివరాలకై అల్ అరాఫ్ 204వ ఆయతుకు ఇవ్వబడిన వివరణను కూడా చూడండి. (ఈ విషయానికి సంబంధించిన పూర్తి వివరాలు కావాలంటే మౌలానా అబ్దుర్రహ్మాన్ ముబారక్ పూరి గారి ‘తహ్ కీకుల్ కలామ్’ పుస్తకం, ఇంకా మౌలానా ఇర్షాదుల్ హఖ్ అథ్రీ గారి పుస్తకాలు చదవండి). ఇక్కడ మరో విషయం కూడా గమనార్హం. ముక్తదీ గనక ఇమామ్ చేసే ఖుర్ఆన్ పారాయణం వింటున్నట్లయితే ఫాతిహా సూరా పఠించరాదనీ, ఒకవేళ వినని సందర్భంలో మాత్రం తప్పకుండా ఫాతిహా సూరా పఠించాల్సిందేనని ‘సలఫ్’లో (ఈ పదం వివరణ కోసం దయచేసి గ్రంథం చివరిలో ఇవ్వబడిన పద విశ్లేషణ చదవండి) అత్యధికమంది తెలిపినట్లు ఇమామ్ ఇబ్నె తైమియా అభిప్రాయపడ్డారు. (మజ్మూయె ఫతావా ఇబ్నె తైమియా 23/265).

ఇది మక్కీ సూరా. అంటే ఈ సూరా మక్కాలో అవతరించిందన్నమాట! మక్కా లేక మదీనాలో అవతరించిందంటే భావం: మహాప్రవక్త (సల్లల్లాహ్ అలైహి వసల్లం) హిజ్రత్ చేయక మునుపు (మదీనాకు వలస పోక పూర్వం) అవతరించిన సూరాలన్నీ మక్కీ సూరాలనబడతాయి. మరి ఆ సూరాలన్నీ పవిత్ర మక్కా నగరంలోనే అవతరించి ఉండనవసరం లేదు. సమయం సందర్భాలను బట్టి మక్కా చుట్టుప్రక్కల ప్రాంతాలలో అవతరించి ఉన్నప్పటికీ అవి మక్కీ సూరాలుగానే పరిగణించబడతాయి. అలాగే హిజ్రత్ (దైవదౌత్య అందిన 13 ఏండ్ల తరువాత జరిగిన మదీనా వలస ప్రయాణం) అనంతరం అవతరించిన సూరాలు – అవి మదీనాలో అవతరించినా లేక మదీనా పొలిమేరల్లో అవతరించినా లేక మదీనా నగరానికి బహుదూరాన అవతరించినా – అవన్నీ మదనీ సూరాలుగానే వ్యవహరించబడతాయి. ఆఖరికి అవి మక్కాలో లేక మక్కా చుట్టుప్రక్కల ప్రాంతాల్లో అవతరించి ఉన్నాసరే!

“బిస్మిల్లాహ్” విషయంలో భిన్నాభిప్రాయాలున్నాయి. ఇది ప్రతి సూరాకు మొదట్లో వచ్చే ప్రత్యేకమైన వచనమా? లేక ప్రతి సూరాలో అంతర్భాగమా? లేక ఫాతిహా సూరాలోని ఒక ఆయతా? లేక ఏ సూరాలోనూ అంతర్భాగం కాని అదనపు వచనమా? అంటే కేవలం ఒక సూరాను మరొక సూరా నుంచి విడదీయడానికి సూచనగా ప్రయోగించబడిన వాక్యమా? – అన్న విషయంపై మీమాంస ఉంది. దీన్ని ఫాతిహా సూరా సమేతంగా అన్ని సూరాలలో అంతర్భాగంగా మక్కా మరియు కూఫా ఖుర్ఆన్ పఠితలు (ఖుర్రాలు) ఖరారు చేశారు. కాగా; ఇది ఒక ఆయతుగా ఏ సూరాలోనూ అంతర్భాగం కాదని మదీనా, బస్రా, సిరియా పారాయణకర్తలు అన్నారు. కాకపోతే నమల్ సూరాలోని 30వ వచనంలో వచ్చిన ‘బిస్మిల్లాహ్’ ను మాత్రం అందరూ ఏకాభిప్రాయంతో ఆయతుగా శిరసావహించారు. అలాగే బిగ్గరగా పఠించే నమాజులలో ‘బిస్మిల్లాహ్’ ను బిగ్గరగా చదివే అంశంపై కూడా భిన్నాభిప్రాయాలున్నాయి. బిగ్గరగా చదవాలని కొందరు భావిస్తుండగా, నెమ్మదిగా పఠించాలని మరికొంతమంది తలపోస్తున్నారు (ఫతహుల్ ఖదీర్). అధిక సంఖ్యాక విద్వాంసులు మాత్రం నెమ్మదిగా పఠించాలన్న విషయానికే ప్రాధాన్యతనిచ్చారు. అంతమాత్రం చేత బిగ్గరగా పఠించటం విపరీతం కాదు – బిగ్గరగా పఠించటం కూడా ధర్మసమ్మతమే.

బిస్మిల్లాహ్ అంటే ‘అల్లాహ్ పేరుతో’ అని మాత్రమే అర్థం వస్తుంది. కనుక దానికి ముందు అఖ్రవు (నేను చదువుతున్నాను), అబ్ దవు (నేను ప్రారంభిస్తున్నాను), అత్ లూ (నేను పారాయణం చేస్తున్నాను) – లాంటిది ఏదో ఒక పదం ఉన్నట్లు భావించవలసి ఉంటుంది. అంటే అల్లాహ్ పేరుతో మొదలెడుతున్నాను, అల్లాహ్ పేరుతో అధ్యయనానికి ఉపక్రమిస్తున్నాను అని భావం. ప్రతి పనికి ముందు బిస్మిల్లాహ్ పలకమని గట్టిగా తాకీదు చేయబడింది. భోజనం చేసేటప్పుడు, జంతువును జిబహ్ చేసేటప్పుడు, ఉదూ చేయ సంకల్పించినప్పుడు, ఆఖరికి సంభోగానికి ముందు కూడా బిస్మిల్లాహ్ పఠించాలని ఆదేశించబడింది. ఖుర్ఆన్ పారాయణం మొదలెడుతున్నప్పుడు బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్ ను పఠించటం అనివార్యమైనప్పటికీ, దానికి ముందు అవూదు బిల్లాహి మినష్షయితానిర్రజీమ్ ను పఠించడం కూడా ఎంతో అవసరమే. ఎందుకంటే ఫయిదా ఖరతుల్ ఖుర్ఆన ఫస్తయిజ్ బిల్లాహి మినష్షయితా నిర్రజీమ్ (మీరు ఖుర్ఆన్ పఠనానికి ఉపక్రమించినప్పుడు శాపగ్రస్తుడైన షైతాన్ బారి నుండి అల్లాహ్ శరణు వేడుకోండి – సూరా అన్నహ్ల్:98) అన్న ఆదేశం విస్మరించరానిది.


అల్ ఫాతిహా సూరా
అవతరణ: మక్కా  – ఆయతులు : 7

  1. బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీం
    అపార కరుణామయుడు, పరమ కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో.
  2. అల్ హమ్దు లిల్లాహి రబ్బిల్ ఆలమీన్
    ప్రశంసలు, పొగడ్తలన్నీ అల్లాహ్ కు మాత్రమే శోభిస్తాయి [1]. ఆయన సమస్త లోకాలకు పోషకుడు [2].
  3. అర్రహ్మా నిర్రహీం
    అపార కరుణామయుడు, పరమ కృపాశీలుడు [3].
  4. మాలికి యౌమిద్దీన్
    ప్రతిఫల దినానికి (అంటే ప్రళయదినానికి) యజమాని [4].
  5. ఇయ్యాక నఅఁబుదు వ ఇయ్యాక నస్తఈఁన్
    మేము నిన్నే ఆరాధిస్తున్నాము, సహాయం కోసం నిన్ను మాత్రమే అర్థిస్తున్నాము [5].
  6. ఇహ్దినశ్శిరాతల్ ముస్తఖీం
    మాకు ఋజుమార్గం (సన్మార్గం) చూపించు [6].
  7. శిరాతల్లదీన అన్ అమ్ త అలైహిమ్, గైరిల్ మగ్దూబి అలైహిమ్ వలద్దాల్లీన్
    నీవు అనుగ్రహించిన వారి మార్గం [7], నీ ఆగ్రహానికి గురికాని వారి, అపమార్గానికి లోనుకాని వారి మార్గం (చూపు) [8].

[1]. అల్ హమ్దు: ఇందులో అల్ అనే పదం ప్రత్యేకతను, సమీకృతాన్ని సూచిస్తోంది. సమస్త స్తోత్రములు అల్లాహ్ కు మాత్రమే శోభిస్తాయనీ, అవి ఆయనకే ప్రత్యేకమనీ భావం. ఎందుకంటే ప్రశంసలకు అసలు అర్హుడు అల్లాహ్ యే. ఎవరిలోనయినా ఏదైనా ప్రత్యేకత, సద్గుణం, నేర్పు ఉంటే అది కూడా అల్లాహ్ సృజించినదే. అందుచేత స్తోత్రానికి అర్హుడు కూడా ఆయనే. అల్లాహ్: ఇది అల్లాహ్ నామం. వేరొకరి కోసం ఈ నామాన్ని ఉపయోగించటం సమ్మతం కాదు. అల్ హమ్దులిల్లాహ్ : ఇది కృతజ్ఞతా పూర్వకమయిన పలుకు. హదీథుల ద్వారా ఈ వచనం అత్యంత మహత్ పూర్వకమైనదని వెల్లడవుతోంది. లా ఇలాహ ఇల్లల్లాహ్ : శ్రేష్ఠమయిన వేడుకోలు అని ఒక హదీథులో ఉంది (సుననె తిర్మిథీ). అల్ హమ్దులిల్లాహ్ తమ్ లవుల్ మీజాన్ –  ‘అల్ హమ్దులిల్లాహ్ త్రాసును నింపేస్తుంది’ అని మరొక హదీథులో అనబడింది. (సహీహ్ ముస్లిం).  అందుకే దాసుడు తినే, త్రాగే ప్రతిసారీ అల్లాహ్ కు కృతజ్ఞతలు తెలుపుకోవటాన్ని అల్లాహ్ అమితంగా ఇష్టపడతాడని వేరొక హదీథులో చెప్పబడింది (సహీహ్ ముస్లిం).

[2]. రబ్బ్ : అల్లాహ్ యొక్క ఉత్తమ నామాలలో ఇదొకటి. రబ్బ్ అంటే ప్రతి వస్తువును సృష్టించటంతో పాటు దాని అవసరాలు, అక్కరలను తీర్చి, దానికి పరిపూర్తి నొసగేవాడు అని అర్థం. ఈ పదాన్ని ఈ భావంలో వేరొకరికై ఉపయోగించటం సమ్మతం కాదు. ఒకవేళ ఇతరులను ఈ పేరుతో సంబోధించదలిస్తే దానికి ముందుగాని వెనుకగాని మరో పదం వాడాలి. ఉదా: అబ్దుర్రబ్ (ప్రభువు యొక్క దాసుడు). అంతేగాని కేవలం ‘రబ్’ అని ఇతరులెవరినీ పిలువకూడదు. ఆలమీన్ అనే పదం ఆలమ్ అనే పదానికి బహువచనం. ఆ మాటకొస్తే సమస్త సృష్టిరాసుల సముదాయాన్ని ఆలమ్ గా వ్యవహరిస్తారు. అందుకే సాధారణంగా ఈ పదాన్ని బహువచనంలోకి తీసుకోరు. అయితే దేవుని పరిపూర్ణ పోషకత్వాన్ని, సమగ్ర ప్రభుతను వెల్లడించే ఉద్దేశ్యంతో  ఆలమీన్ అనే బహువచనాన్ని తీసుకురావటం విశేషం. సృష్టిరాసుల్లోని వేర్వేరు రకాలను, కోవలను గురించి ఇక్కడ తెలియజెప్పటం ముఖ్యోద్ధేశ్యం అన్నమాట! ఉదాహరణకు: జిన్నుల జగతి, మానవ జగతి, దైవదూతల లోకం, పశుపక్షాదుల ప్రపంచం ఇత్యాదివి. ఈ సృష్టితాలన్నింటి అవసరాలు వేరు. తీరుతెన్నులు వేరు. అయితే రబ్బిల్ ఆలమీన్ (సమస్త లోకాలను పోషించేవాడు) మాత్రం వాటి స్వరూప స్వభావాలను, అవసరాలను, స్థితిగతులను దృష్టియందుంచుకుని వాటికి కావలసినవన్నీ సమకూరుస్తున్నాడు.

[3]. రహ్మాన్: రహ్మాన్, రహీమ్ – ఇవి రెండూ అధిక అర్థాలనిచ్చే పదాలే. ఈ రెండింటిలోనూ అధికమైన, అనంతమైన, అపారమైన అనే భావం తొణకిసలాడుతోంది. అంటే అల్లాహ్ అపారంగా కనికరించేవాడు. ఆయనలోని ఈ గుణం ఇతర గుణగణాల మాదిరిగా శాశ్వతమైనది, స్థిరమైనది. కొంతమంది పండితులు ఈ సందర్భంగా ఏమంటారంటే; రహీమ్ కన్నా రహ్మాన్ అనే పదంలో విస్తృత భావం ఉంది. అందుకే రహ్మానద్దునియా వల్ ఆఖిరతి అని అనబడుతుంది. అంటే ఇహపర లోకాల్లోనూ కరుణించేవాడని అర్థం. ప్రపంచంలో ఆయన దయాదాక్షిణ్యాలు సర్వ సాధారణం. విశ్వాసులు – అవిశ్వాసులన్న విచక్షణ లేకుండా అందరూ ఈ ప్రపంచంలో ఆయన దయాదాక్షిణ్యాలకు నోచుకుంటున్నారు. కాని పరలోకంలో ఆయన కేవలం రహీమ్ గా మాత్రమే ఉంటాడు. అంటే అక్కడ ఆయన దయానుగ్రహాలు కేవలం విశ్వాసులకు మాత్రే పరిమితం అయి ఉంటాయి. “నేను ఆ కారుణ్యాన్ని నాకు భయపడేవారి కొరకూ, జకాత్ ఇచ్చే వారి కొరకూ, మా ఆయతులను విశ్వసించే వారి కొరకు తప్పకుండా వ్రాస్తాను” (అల్ అరాఫ్ – 156). అల్లాహుమ్మజ్ అల్నా మిన్ హుమ్. (అల్లాహ్! మమ్మల్ని కూడా ఆ భాగ్యవంతులలో చేర్చుగాక).

[4]. మనిషి ప్రపంచంలోనూ తాను చేసిన కర్మలకు ప్రతిఫలం కొంతవరకు అనుభవించినప్పటికీ పరలోకంలోనే అసలు సిసలు ఫలితం బయటపడుతుంది. సంపూర్ణమైన ప్రతిఫలం అక్కడే ఉనికిలోనికి వస్తుంది. ప్రతి వ్యక్తికీ అతను చేసిన మంచి లేక చెడు పనులను బట్టి అల్లాహ్ అతనికి బహుమానం ఇవ్వటమో, శిక్ష విధించటమో జరిగి తీరుతుంది. ఇదే విధంగా ప్రపంచంలో కూడా తాత్కాలికంగా అనేకమందికి కొన్ని అధికారాలుంటాయి. కాని పరలోకంలో మాత్రం అధికారాలన్నీ అల్లాహ్ హస్తగతం అవుతాయి. తీర్పుదినాన ఆయన తిరుగులేని సార్వభౌమాధికారిగా ఉంటాడు. రోజు విశ్వసామ్రాజ్యాధికారం ఎవరిదో చెప్పండి?” అంటూ ఆనాడాయన ప్రశ్నిస్తాడు. తిరుగులేని వాడు, ఏకైకుడైన అల్లాహ్ దే అంటూ ఆయనే సమాధానం కూడా ఇస్తాడు (అల్ మోమిన్ – 16) “ఆనాడు, ఏ మనిషీ ఎవరికొరకైనా ఏదన్నా చెయ్యగలగటమన్నది అసంభవం, ఆ రోజు అధికారమంతా అల్లాహ్ చేతుల్లోనే ఉంటుంది.” (ఇన్ ఫితార్ – 19) – అదీ తీర్పుదినమంటే!

[5]. ఇబాదత్ అంటే ఒకరి ప్రసన్నతను చూరగొనెందుకు అత్యంత అణుకువను, అశక్తతను, వినయ వినమ్రతలను అభివ్యక్తం చేయటం అని భావం. ఇబ్నె కథీర్ మాటల్లోనే చెప్పాలంటే, “షరిఅత్ లో సంపూర్ణమైన ప్రేమ, అభిమానం, భయము, భక్తీ – వీటన్నింటి సమ్మేళనమే ఇబాదత్.” అంటే ఎవరిపట్లనయితే ప్రేమాభిమానాలు కలిగి ఉంటామో, ఆయన శక్తియుక్తుల ముందు తమ నిస్సహాయ స్థితినీ, దైన్యస్థితినీ వ్యక్త పరచాలి. ఆ శక్తిమంతుడు తమను నిలదీసి అడుగుతాడన్న భీతి కూడా ఆ దాస్యంలో తొణకిసలాడుతూ ఉండాలి. విషయాన్ని సాదాసీదా చెప్పవలసి ఉంటే నా బుదుక, నస్తయీనుక (మేము నిన్ను ఆరాధిస్తాము, సహాయం కొరకు నిన్ను అర్థిస్తాము) అని అనబడేది. కాని, అల్లాహ్ ఇక్కడ ఇయ్యాక నాబుదు ఇయ్యాక నస్తయీన్ అని నొక్కి వక్కాణించి ఈ వాక్యానికి ప్రత్యేకతను, వైశిష్ఠ్యాన్ని కల్పించాడు – అంటే దీని అర్థం: “ఓ అల్లాహ్! మేము నిన్నే ఆరాధిస్తున్నాము. సహాయం కోసం నిన్ను మాత్రమే అర్థిస్తున్నాము” అని.

దీని ప్రకారం అల్లాహ్ ను గాక వేరొకరిని పూజించటం గానీ, సహాయం కొరకు వేరేతరులను మొరపెట్టుకోవటం గానీ ధర్మసమ్మతం కాదు. ఈ పదాల ద్వారా షిర్క్ (అల్లాహ్ కు భాగస్వాముల్ని నిర్ణయించటం) నిర్ద్వంద్వంగా ఖండించబడింది. కాని హృదయాలలో షిర్క్ రోగం తిష్ఠవేసి ఉన్నవారు ఈ మూలాంశాన్ని విస్మరించి, అపోహలో పడిపోయి, భ్రమలకు లోనై పిడివాదానికి దిగుతారు. మనం జబ్బుపడినప్పుడు డాక్టరు సహాయం పొందటం లేదా? ఇల్లాలి సేవల్ని పొందటం లేదా? ఇరుగు పొరుగువారి తోడ్పాటును, డ్రైవరు సాయాన్ని పొందటం లేదా? అని దబాయిస్తారు. ఈ విధంగా వాళ్లు, అల్లాహ్ గాక వేరితరుల సహాయాన్ని అర్థించటం కూడా సమ్మతమేనని మీరు ఒప్పుకునేలా చేయటానికి ప్రయత్నిస్తారు. నిజానికి కారకాలకు లోబడి ఒండొకరి సహాయాన్ని కోరటం, సహాయపడటం షిర్క్ కానే కాదు. ఇదైతే దేవుడు సమ్మతించి ఆమోదించిన వ్యవస్థ. ఆ వ్యవస్థలోని పనులన్నీ బాహ్యకారకాలకు అనుగుణంగానే జరుగుతాయి. కడకు దైవప్రవక్తలు సయితం మనుషుల సహాయసహకారాలను పొందుతూ ఉంటారు. దైవప్రవక్త హజ్రత్ ఈసా అలైహిస్సలాం తన జాతి జనులనుద్దేశించి, ‘అల్లాహ్ (ధర్మం) కొరకు నాకు సహాయపడేవారు మీలో ఎవరున్నారు?’ అని అడిగారు (అస్సఫ్ – 14). అల్లాహ్ స్వయంగా విశ్వాసుల నుద్దేశించి, “సత్కార్యం, దైవభక్కికి సంబంధించిన విషయాలలో ఒకరికొరకు సహకరించండి” అని సెలవిచ్చాడు. (అల్ మాయిదా: 2)

మరి ఇటువంటి సహాయసహకారాలు నిషేధించబడటంగానీ, షిర్క్ గా అభివర్ణించబడటం గానీ జరగలేదు. పైగా ఇలాంటి పనులు జరగాలని ప్రోత్సహించటమైంది. ఇలాంటి సత్కార్యాలు ప్రశంసనీయంగా పేర్కొనబడ్డాయి. వాస్తవమైన షిర్క్ తో దీనికి ఎటువంటి సంబంధమూ లేదు. బాహ్యపరమైన కారకాల రీత్యా సహాయం చేయటం ఏమాత్రం చేతకాని వానిని, సహాయం చేయజాలని వానిని “సహాయం చెయ్యి” అని అర్థించటమే అసలు షిర్క్. ఉదాహరణకు: చనిపోయిన ఒకానొక వ్యక్తిని సహాయం కోసం మొరపెట్టుకోవటం, అతడు కష్టాల నుండి గట్టెక్కిస్తాడనీ, అక్కరలు తీరుస్తాడని తలపోయటం, లాభనష్టాలు అతని అధీనంలో ఉన్నాయని ఊహించటం, దగ్గరున్నవారు పిలిచినా, దూరమున్నవారు మొరపెట్టుకున్నా, ప్రతి ఒక్కరి మొరలను ఆలకించే ‘శక్తి’ అతనిలో ఉందని నమ్మటం – ఇదంతా దైవానికి వేరొకరిని సహవర్తులుగా నిలబెట్టడంగా, భాగస్వామ్యం కల్పించటంగా, దేవుని లక్షణాలను వేరొకరికి  ఆపాదించటంగా పరిగణించబడుతుంది. ఇదే షిర్క్! దురదృష్టవశాత్తూ ముస్లిం దేశాలలో సయితం ఇటువంటి షిర్క్ వర్థిల్లుతోంది. మహనీయుల (ఔలియాల) పట్ల ప్రేమ కలిగి ఉండటం అవసరం మరి! అంటూ ముస్లింలు ఈ ప్రేమాభిమానంలో అతిశయిల్లి రాగానపడి షిర్కుకు ఒడిగడుతున్నారు. ఇటువంటి పోకడలబారి నుంచి అల్లాహ్ మనల్ని కాపాడుగాక!

తౌహీద్ (ఏకదైవోపాసన) మూడు రకాలు. ఈ సందర్భంగా ఏకదైవోపాసనకు సంబంధించిన ఈ మూడు రకాలను, క్లుప్తంగా నయినా సరే వివరించటం సమంజసం అనిపిస్తోంది. అవేమంటే – 1. తౌహీదె రుబూబియత్ 2. తౌహీదె ఉలూహియత్ 3. తౌహీదె అస్మా వ సిఫ్పాత్.

1.తౌహీదె రుబూబియత్ అంటే భావం: ఈ మొత్తం విశ్వానికి సృష్టికర్త, యజమాని, పోషకుడు, కనిపెట్టుకుని ఉన్నవాడు, వ్యూహ రచయిత కేవలం అల్లాహ్ మాత్రమే. నాస్తికులు మినహా మిగిలిన వారంతా ఈ తౌహీద్ ను అంగీకరిస్తారు. ఆఖరికి బహుదైవోపాసకులు సయితం ఈ దృక్పథాన్ని ఒప్పుకున్నారు. ఒప్పుకుంటున్నారు. మక్కాకు చెందిన బహుదైవారాధకుల (ముష్రిక్కుల) ఒప్పుకోలును గురించి ఖుర్ఆన్ ఇలా అభివర్ణించింది:

“ఓ ప్రవక్తా! వారిని అడగండి: ఆకాశం నుంచీ, భూమి నుంచీ మీకు ఉపాధినొసగే వాడు ఎవడు? (మీ) వినేశక్తీ, చూసే శక్తీ ఎవరి అధీనంలో ఉన్నాయి? నిర్జీవమైన దాన్నుంచి జీవమున్న దాన్ని, జీవమున్న దాన్నుంచి జీవము లేని దాన్ని తీసే వాడెవడు? అసలీ విశ్వవ్యవస్థను నడుపుతున్న వాడెవడు?  ‘అల్లాహ్’ అని వారు ఠకీమని అంటారు” (యూసుఫ్ – 31)

మరొకచోట ఇలా అనబడింది:

“భూమ్యాకాశాలను సృష్టించిన వాడెవడు? అని వారినడిగితే, ‘అల్లాహ్’ అని వాళ్లు చెబుతారు”(అజ్జుమర్-38)

వేరొకచోట సెలవీయబడింది:

“ఈ భూమి, భూమిలో ఉన్నదంతా ఎవరిదో మీకు తెలిస్తే చెప్పండి?” అని వారిని అడుగు. ‘అల్లాహ్ దే’ అని వారు చెబుతారు. మరలాంటప్పుడు మీరు ఎందుకు గ్రహించటం లేదు? అని వారితో అను. ఇంకా సప్తాకాశాలకూ, మహోన్నతమైన సింహాసనానికి అధిపతి ఎవరని కూడా వారిని ప్రశ్నించు. ‘అల్లాహ్’ అని వారు తడబడకుండా సమాధానమిస్తారు. మరి అటువంటప్పుడు మీరు ఆయనకు ఎందుకు భయపడటం లేదు? అని వారిని నిలదియ్యి” (అల్ మోమినూన్ : 84 – 89)

2.తౌహీదె ఉలూహియత్: అంటే భావం అన్ని రకాల ఆరాధన (ఇబాదల్) లకు, దాస్యాలకు, వేడుకోళ్ళకు అర్హుడు అల్లాహ్ మాత్రమే. ఎవరైనా ఒక ప్రత్యేక వ్యక్తి మెప్పుకోసం లేక అతని అప్రసన్నతకు గురవుతామేమెనన్న భయం కొద్దీ చేసే ప్రతి పనీ ఆరాధన (ఇబాదత్) గానే భావించబడుతుంది. అందుచేతనే నమాజ్, ఉపవాసం, హజ్, జకాత్ వంటి క్రియలు మాత్రమే ఆరాధనలు కావు – ఒకానొక ప్రత్యేక అస్తిత్వం ఎదుట అభ్యర్థించుకోవటం, అతని పేర మొక్కకోవటం, మొక్కుబడులు తీర్చుకోవటం, అతని ఎదుట బుద్ధిగా చేతులు కట్టుకుని నిలబడటం, అతని చుట్టూ ప్రదక్షిణ చేయటం, అతని సమక్షంలో భయభక్తులను ప్రదర్శించటం, అతను తమకేదైనా అనుగ్రహిస్తాడేమోనని ఆశగా నిరీక్షించటం – ఇత్యాదులన్నీ ఆరాధన (ఇబాదత్) గానే పరిగణించబడతాయి. మరి ఇటువంటి పనులన్నీ ఒక్కడైన అల్లాహ్ కోసమే చేయాలి. ఇదే తౌహీదె ఉలూహియత్ (అయితే బాహ్య కారకాల కనుగుణంగా బ్రతికి ఉన్న మనుషుల వద్దకు వెళ్ళి, వారి నుండి ఏదైనా ఆశించటం, వారి యెడల వినయ వినమ్రతలను కలిగి ఉండటం మాత్రం ‘తౌహీద్’ కు విరుద్ధం కాదు). సమాధి పూజ వ్యాధికి లోనయిన సామాన్యులు, ప్రముఖులు ఈ తౌహీదె ఉలూహియత్ లో షిర్క్ కు ఒడిగడు తుంటారు. ఇటువంటి ఆరాధనలను వారు సమాధులలో ఖననం చేయబడినవారి నుద్దేశించి చేస్తుంటారు. ఇది ముమ్మాటికీ షిర్కే!

3.తౌహీదె అస్మా సిఫ్పాత్ : అంటే భావం ఖుర్ఆన్ మరియు హదీథులలో అల్లాహ్ గురించి చెప్పబడిన గుణగణాలను, లక్షణాలను ఏమాత్రం వక్రీకరించకుండా, వాటిలో ఎలాంటి మార్పులు చేర్పులు చేయకుండా – యథాతథంగా అంగీకరించటం. అంటే ఆ గుణగణాలు వేరొకరిలో కూడా ఉన్నాయన్న భావనకు సుతరామూ తావీయకూడదు.

ఉదాహరణకు: అగోచర జ్ఞానం అల్లాహ్ గుణం, లేదా దూరాన ఉన్నవారు మొరపెట్టుకున్నా, చేరువలో ఉన్నవారు ఫిర్యాదు చేసినా – అందరి గోడునూ ఆయన వింటాడు అనేది ఇంకొక గుణం. విశ్వమండలంలో ఏదైనా సరే చేయగల అధికారం ఆయనకు ఉంది అనేది ఇంకొకటి. ఇలాంటివే అనేకానేక గుణగణాలు ఆయన సొంతం. మరి అటువంటి గుణగణాలలో ప్రవక్తనో, వలీనో, సజ్జనులనో చేర్చరాదు. ఒకవేళ వారిని కూడా సహవర్తులుగా చేర్చి, ఆ మహనీయులకు కూడా అటువంటి గుణాలే ఉన్నాయని భావిస్తే అది ముమ్మాటికీ ‘షిర్కే’ అవుతుంది.

[6]. హిదాయత్: అంటే మార్గదర్శకత్వం వహించటం, తిన్నని త్రోవలో నడపటం, గమ్యస్థానానికి చేర్చటం అని భావం. ఇదే అరబీలో సద్భుద్ధి, సత్ప్రేరణ, నిదర్శనంగా కూడా అభివర్ణించబడింది. అంటే మాకు ఋజుమార్గం వైపు దర్శకత్వం వహించు! ఆ మార్గంపై నడిచే సద్భుద్ధి నొసగు!! ఆ మార్గంపై కు సహన స్థయిర్యాలను ప్రసాదించు !! తద్వారానే మేము నీ ప్రసన్నతను చూరగొనగలము అన్నది దీని మతలబు. మరి ఈ ఋజుమార్గం కేవలం మనిషి బుద్ధీజ్ఞానాల వల్ల, అతని తెలివితేటల వల్ల ప్రాప్తించదు. దానికి దైవకటాక్షం ఎంతో అవసరం. ఈ ఋజుమార్గమే ఇస్లాం. ఆ మార్గాన్నే అంతిమ దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) లోకానికి విడమర్చి చెప్పారు. ఆ మార్గాన్ని పొందటమెలాగో ఖుర్ఆన్ మరియు హదీథులు పూసగుచ్చినట్లుగా మనకు వివరిస్తున్నాయి.

[7]. దైవకటాక్షం పొందినవారు: ఈ కోవకు చెందిన వారెవరో ఖుర్ఆన్ ఖుద్దుగా వివరించింది. అన్నిసా సూరాలో పేర్కొనబడినట్లుగా – “ఎవరయితే అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తకు విధేయులై ఉంటారో వారు (ప్రళయదినాన) దైవకటాక్షం పొందిన వారితో ఉంటారు. అంటే దైవప్రవక్తలు, సత్యసంధులు, అమరగతులు, సద్వర్తనులు. అటువంటి వారి సహచర్యం ఎంతో మంచిది కదా!” (అన్నిసా : 69)

దైవానుగ్రహానికి పాత్రులైన వారి ఈ మార్గం దైవవిధేయత మరియు ప్రవక్త విధేయతల మార్గమే తప్ప వేరొక మార్గం కాదన్న సంగతి కూడా ఈ ఆయతులో స్పష్టంగా చెప్పబడింది.

[8]. ఆగ్రహానికి గురైన వారు, అపమార్గానికి లోనైనవారు: ఆగ్రహానికి గురైనవారంటే యూదులు, అపమార్గానికి లోనైన వారంటే క్రైస్తవులని భావం. ఈ విషయంలో ఖుర్ఆన్ వ్యాఖ్యాతల మధ్య ఎలాంటి అభిప్రాయభేదం లేదని ఇబ్నె అబీ హాతిమ్ అంటున్నారు. (ఫతహుల్ ఖదీర్). అందుకే ఋజుమార్గాన నడవాలని కోరుకునేవారు యూదులు, క్రైస్తవుల మార్గవిహీనతకు దూరంగా మసలు కోవటం ఎంతో అవసరం. యూదుల మార్గభ్రష్టతకు తార్కాణం ఏమిటంటే, వాళ్ల తెలిసి కూడా – ఉద్దేశ్యపూర్వకంగా – సన్మార్గాన నడిచేవారు కారు. దైవవాక్కులలో ప్రక్షిప్తాలు చేసేవారు. ప్రతి దానికీ వంకలు పెట్టేవారు. ఉజైర్ ను వారు దేవుని కుమారునిగా నిలబెట్టారు.       ఏదేని విషయాన్ని ధర్మం  (హలాల్) గానో, అధర్మం (హరాం) గానో ఖరారు చేసే అధికారాన్ని వారు తమ ఆచార్యులకు, మతాధికార్లకు కట్టబెట్టారు. ఇక క్రైస్తవులు చేసిన ఘోరమైన తప్పిదం ఏమిటంటే, వాళ్ళు దైవప్రవక్త హజ్రత్ ఈసా అలైహిస్సలాం ప్రేమలో అతిశయిల్లారు. ఆయన్ని దేవుని కుమారునిగా ఖరారు చేశారు. ‘త్రిత్వం’ (మూడు దైవాల భావన) ను సృష్టించి గందరగోళ స్థితికి కారకులయ్యారు. అత్యంత శోచనీయమైన విషయం ఏమిటంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనుచర సమాజంలో సయితం ఇటువంటి అయోమయావస్థ నెలకొంటున్నది. ప్రవక్త పట్ల ప్రేమాతిశయంతో కొందరు మహానుభావులు తమదైన శైలిలో తొక్కే పుంతలు మార్గభ్రష్టతకు దారి తీసేలా పరిణమిస్తున్నాయి. ఈ కారణంగానే వారు ఇహలోకంలోనే పరాభవానికి గురవుతున్నారు. అల్లాహ్ వారిని ఈ మార్గభ్రష్టతల లోయల్లోనుంటి బయట పడవేయుగాక!

ఫాతిహా సూరా చివర్లో ఆమీన్ పలకటం అత్యంత మహత్పూర్వకమని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పదే పదే తాకీదు చేయటం గమనార్హం. అందుకే (నమాజులో) ఇమామ్, ముఖ్తదీలు ప్రతి ఒక్కరూ ‘ఆమీన్’ పలకాలి. “బిగ్గరగా చేసే నమాజులలో దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హెచ్చు స్వరంతో ‘ఆమీన్’ పలికేవారు. ప్రియ సహచరులు కూడా బిగ్గరగా ఆమీన్ పలికే సరికి మస్జిద్ ఆమీన్ శబ్ధంతో ప్రతిధ్వనించేది”. (ఇబ్నె మాజా, ఇబ్నె కథీర్). ఆమీన్ బిగ్గరగా పలకటం సున్నత్ (దైవప్రవక్త సంప్రదాయం). ఇది ప్రవక్త ప్రియసహచరుల ఆచరణ కూడా. ఆమీన్ కు పలు అర్ధాలు ఇవ్వబడ్డాయి. ‘ఆమీన్’ అంటే తథాస్తు అనీ, ‘ఓ అల్లాహ్! మా ప్రార్థనను స్వీకరించు’ అనీ, ‘మా ఆశను అడియాశ చేయకు’ అనీ భావం.

కొత్తపదాలు – వాటి అర్థాలు

ఔలియా ‘వలీ’ అన్న పదానికి బహువచనం; సన్నిహితులు, ప్రియతములు అని అర్థం; ఔలియాను దివ్యఖుర్ఆన్ లో అల్లాహ్ ఈ విధంగా నిర్వచించాడు: “వారు విశ్వాసులై ఉంటారు. అల్లాహ్ పట్ల భయభక్తులు కలిగి ఉంటారు” (యూసుఫ్ : 63); సాధారణంగా జనం వలీలంటే “బాబాలు” అని అనుకుంటారు. కాని నిజానికి వలీలంటే బాబాలనబడేవారు కాదు. మంచివారైన విశ్వాసులందరూ, ప్రవక్తల అనుచరులందరూ అల్లాహ్ వలీలుగానే భావించబడతారు. ఈ పదానికి వేరితర అర్థాలు కూడా ఉన్నాయి. ఉదా: సంరక్షకుడు, సహాయకుడు.
ఖుర్రా ‘ఖారి’ అనే పదానికి బహువచనం; ఖుర్ఆన్ పారాయణ విద్యలో పండితులు అని అర్థం.
జహ్రీ నమాజులు ఖుర్ఆన్ పారాయణం బిగ్గరగా జరిగే నమాజులు(ఫజ్ర్, మగ్రిబ్, ఇషా)
జిన్నులు/జిన్నాతులు అగ్నితో సృష్టించబడిన, మనుషుల కంటికి కనిపించని మరో జాతి ప్రాణులు.
ముక్తదీలు ఇమాము వెనుక, అతనిని అనుసరిస్తూ నమాజు చేసేవారిని “ముక్తదీలు” అంటారు. నమాజుకు సారధ్యం వహించే వ్యక్తి ‘ఇమాము’ అని పిలువబడతాడు;
లాఇలాహ ఇల్లల్లాహ్ “అల్లాహ్ తప్ప వేరొక ఆరాధ్యుడు లేడు.”
షిర్క్ అల్లాహ్ ఆరాధన (ఉలూహియత్)లో గాని, ఆయన సార్వభౌమత్వం (రుబూబియత్) లో గాని, ఆయన దివ్య నామ, గుణగణాల (అస్మా వసిఫ్ఫాత్)లో గాని వేరొకరికి భాగస్వామ్యం కల్పించటం. ఇది ఘోరమైన పాపం. ఈ పాపానికి పాల్పడేవారిని ‘ముష్రికులు’ అంటారు అంటే అల్లాహ్ తో పాటు వేరొకరికి భాగస్వామ్యం కల్పించే వారన్నమాట.
సలఫ్ పూర్వీకులు; ఇస్లాంలో తొలి మూడు తరాలకు చెందిన నికార్సయిన ముస్లింలు.
సిర్రీ నమాజులు ఖుర్ఆన్ పారాయణం నిశ్శబ్దంగా జరిగే నమాజులు (జుహర్, అస్ర్)
బిద్అతీలు ఖుర్ఆన్ మరియు హదీథులకు, వాటి  స్ఫూర్తికి విరుద్ధమైన కొత్త అర్ధాలు చెప్పేవారు; ధర్మంలో కొత్తపుంతలు తొక్కేవారు; ఈ తరహా పోకడలు ఘోరపాపాలుగా భావింపబడతాయి. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వీటిని తీవ్రంగా ఖండించారు.
హదీథె ఖుద్ సీ అల్లాహ్ మాటలను ప్రవక్త తన నోటితో అల్లాహ్ ఇలా ఆదేశించాడని చెప్పటం; మామూలు హదీథుకు – హదీథె ఖుద్సీకు మధ్య భేదాన్ని మనం ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా అల్లాహ్ ప్రేరణతో దైవప్రక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పేవన్నీ మామూలు హదీథులు అవుతాయి. అయితే దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏదయినా హదీథులో నేరుగా అల్లాహ్ ఇలా అంటున్నాడని గాని, ఇలా ఆదేశించాడని గాని చెప్పినట్లయితే అటువంటి హదీథులు ‘హదీథె ఖుద్స్’ గా భావించబడతాయి.
ప్రక్షిప్తాలు లేనివి కల్పించబడటం.

ఇతరములు:

తిన్న తర్వాత, త్రాగిన తర్వాత అల్‌హందు లిల్లాహ్‌ అనండి

తిన్నత్రాగిన తర్వాత అల్‌ హందులిల్లాహ్‌ అనండి: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలిపారని అనస్‌ బిన్‌ మాలిక్‌ ఈ ఉల్లేఖించారు: “మానవుడు ఏదైనా తిన్న తర్వాత లేదా ఏదైనా త్రాగిన తర్వాత అల్‌ హందు లిల్లాహ్‌ అనడం అల్లాహ్‌కు చాలా ఇష్టం. (ముస్లిం 2734). [పుణ్యఫలాలు| ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, జుల్ఫీ].

చిన్న దానికి అయినా సరే అల్లాహ్ నుండి సహాయం కోరడం మర్చిపోవద్దు

షేఖ్ ముహమ్మద్ బిన్ సాలీహ్ అల్-ఉతైమీన్ [రహిమహుల్లాహ్ ] ఇలా అన్నారు: "చాలా చిన్న దానికి అయినా సరే అల్లాహ్ నుండి సహాయం కోరడం మర్చిపోవద్దు." [రియాద్ అస్-సాలీహీన్ వ్యాఖ్యానం, (1/273) | ఇంగ్లిష్ అనువాదం: అబ్బాస్ అబూ యాహ్యా హఫిజహుల్లాహ్]