తౌహీద్‌ ఘనత, అది పాపాల విమోచనానికి ఉత్తమ సాధనం – ఇమామ్ అస్-సాదీ

బిస్మిల్లాహ్

2వ అధ్యాయం
తౌహీద్‌ ఘనత, అది పాపాల విమోచనానికి ఉత్తమ సాధనం
అల్ ఖవ్లుల్ సదీద్ షర్హ్ కితాబ్ అత్ తౌహీద్ – ఇమామ్ అస్-సాదీ
The famous commentary of Shaykh as-Sa’di of the book Kitab at-Tawhid of Muhammad ibn Abdul Wahhab.


అల్లాహ్ ఆదేశం:

الَّذِينَ آمَنُوا وَلَمْ يَلْبِسُوا إِيمَانَهُم بِظُلْمٍ أُولَٰئِكَ لَهُمُ الْأَمْنُ وَهُم مُّهْتَدُونَ

“ఎవరయితే విశ్వసించి, తమ విశ్వాసాన్ని “జుల్మ్‌” (షిర్క్‌) తో కలుషితం చేయలేదో, వారికే శాంతి ఉంది. వారు మాత్రమే రుజుమార్గంపై ఉన్నవారు.”(అన్‌ ఆమ్‌ 6 : 82).

ఉబాద బిన్‌ సామిత్‌ (రది అల్లాహు అన్హు) కథనం: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు:

“(1) అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్యుడు లేడని, ఆయన ఒక్కడేనని, 2) ఆయనకు మరెవ్వరూ సాటిలేరని మరియు ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆయన దాసుడు, ప్రవక్త అని; (3) అలాగే ఈసా (అలైహిస్సలాం) కూడా అల్లాహ్ దాసుడు, ఆయన ప్రవక్త అని, కాకపోతే ఆయన హజ్రత్‌ మర్యం (గర్భం)లో అవతరించిన అల్లాహ్ వాక్కు, అల్లాహ్ యొక్క ఆత్మ అని; (4,5) స్వర్గ నరకాలు ఉన్నాయి అన్నది యదార్ధమని, ఎవడైతే సాక్ష్యమిస్తాడో ఆ వ్యక్తి కర్మలు ఎలాంటివయినా సరే అల్లాహ్ అతడ్ని స్వర్గంలో ప్రవేశింపజేస్తాడు”. (బుఖారి, ముస్లిం).

ఇత్బాన్ (రది అల్లాహు అన్హు) కథనం: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలాసెలవిచ్చారు:

“అల్లాహ్ సంతృప్తి కొరకు “లాఇలాహ ఇల్లల్లాహ్” చదివే వారిపై అల్లాహ్ నరకం నిషేధించాడు”. (బుఖారి, ముస్లిం).

అబూ సఈద్‌ ఖుద్రీ (రది అల్లాహు అన్హు) ఉల్లేఖించారు, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారని:

ప్రవక్త మూసా (అలైహిస్సలాం) అల్లాహ్ తో  ఇలా విన్నవించుకున్నారు: ‘ఓ అల్లాహ్!  నాకు కొన్ని వచనాలు నేర్పు. వాటితో నేను నిన్ను స్మరిస్తాను. నీతో అర్ధిస్తాను”. “ఓ మూసా! “లాఇలాహ ఇల్లల్లాహ్” పలుకు” అని అల్లాహ్ నేర్పాడు. మూసా (అలైహిస్సలాం) అన్నారు: “అల్లాహ్! నీ దాసులందరూ ఇదే వచనముతో స్మరిస్తారు?” “ఓ మూసా! ఏడు ఆకాశాలు, నేను తప్ప అందులో ఉన్న సృష్టి, ఇంకా ఏడు భూములను త్రాసు యొక్క ఒక పళ్లెంలో, “లాఇలాహ ఇల్లల్లాహ్” ను ఇంకొక పళ్లెంలో ఉంచితే “లాఇలాహ ఇల్లల్లాహ్” ఉన్న పళ్లెం క్రిందికి వంగిపోవును” అని అల్లాహ్ (దాని విలువను) తెలిపాడు.

(ఇబ్ను హిబ్బాన్‌ మరియు హాకిం సేకరించారు. హాకిం నిజపరిచారు).

అల్లాహ్ ఇలా సెలవిచ్చారని  ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పగా నేను విన్నాను అని అనస్ (రది అల్లాహు అన్హు) ఉల్లేఖించారు:

“ఓ మానవుడా! నీవు భూమి నిండా పాపాలు చేసినప్పటికీ నాతో మరెవ్వరినీ సాటి కల్పించకుండా (చనిపోయి) నాతో కలిసినప్పుడు, ‘నేను అంతే (భూమి నిండా) క్షమాపణలతో నీతో కలుస్తాను (నిన్ను క్షమిస్తాను).(తిర్మిజి. ఈ హదీసు హసన్‌).

ముఖ్యాంశాలు:

1.  అల్లాహ్ దయ, కరుణ చాలా విశాలమైనది.

2. తౌహీద్‌ యొక్క పుణ్యం అల్లాహ్ వద్ద చాలా ఎక్కువగా ఉంది.

3. దానితో పాటు అది పాపాలను తుడిచి వేయును.

4. సూరయే అన్‌ఆమ్‌ లోని ఆయతులో “జుల్మ్‌” అంటే షిర్క్‌ అని భావం.

5. ఉబాద బిన్‌ సామిత్‌ (రది అల్లాహు అన్హు) హదీసులో ఉన్న ఐదు విషయాల్ని గమనించండి.

6. ఉబాద హదీసు, ఇత్బాన్ హదీసు మరియు అబూ సఈద్‌ ఖుద్రీ (రది అల్లాహు అన్హుమ్) హదీసులను కలిపితే “లాఇలాహ ఇల్లల్లాహ్ ” యొక్క అసలు అర్ధం నీకు తెలుస్తుంది. మరియు దాని సరియైన భావాన్ని తెలుసు కొనక మోసబోయి తప్పులో పడియున్నవారి విషయం కూడా స్పష్టం అవుతుంది.

7. ఇత్బాన్ హదీసులో ఉన్న షరతు (అల్లాహ్ ఇష్టం కొరకు)పై చాలా శ్రద్ధ వహించాలి.

8. “లాఇలాహ ఇల్లల్లాహ్” ఘనత తెలుసుకునే అవసరం ప్రవక్తలకు సయితం ఉండేది.

9. “లాఇలాహ ఇల్లల్లాహ్” సర్వ సృష్టికన్నా ఎక్కువ బరువుగలదైనప్పటికీ, దాన్ని చదివేవారిలో చాలా మంది యొక్క త్రాసు తేలికగా (విలువలేనిదిగా) ఉండును.

10. ఆకాశాలు ఏడు ఉన్నట్లు భూములు కూడా ఏడు ఉన్నవని రుజువయింది.

11. అందులో కూడా నివసించువారున్నారు. (జీవించువారున్నారు).

12. అల్లాహ్ యొక్క అన్ని గుణగణాలను నమ్మాలని రుజువవుతుంది. కాని “అష్‌ ఆరీయ్యా” అను ఒక వర్గం వారు కొన్ని గుణగణాలను తిరస్కరిస్తారు.

13. అనస్ (రది అల్లాహు అన్హు) ఉల్లేఖించిన హదీసును నీవు అర్థం చేసుకుంటే, ఇత్బాన్ (రది అల్లాహు అన్హు) ఉల్లేఖించిన హదీసు: “అల్లాహ్ సంతృప్తి కొరకు “లాఇలాహ ఇల్లల్లాహ్ ” చదివే వారిపై అల్లాహ్ నరకం నిషేధించాడు” లో అది కేవలం నోటితో చదవటం కాదు షిర్కు వదులుకోవాలి అని కూడా అర్ధం చేసుకుంటావు.

14. ఉబాద (రది అల్లాహు అన్హు) హదీసులో ఈసా (అలైహిస్సలాం) మరియు ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇద్దరిని “అల్లాహ్ దాసులు, ప్రవక్తలు” అని చెప్పబడింది.

15. ప్రతీది అల్లాహ్ ఆజ్ఞ తోనే పుడుతుంది గనుక అది అల్లాహ్ వాక్కు. కాని ఇక్కడ ప్రత్యేకంగా ఈసా (అలైహిస్సలాం) ను అల్లాహ్ వాక్కు అని చెప్పబడింది .

16. (ఆత్మ అల్లాహ్ యొక్క సృష్టి అయినప్పటికీ) ప్రత్యేకంగా ఈసా (అలైహిస్సలాం) అల్లాహ్ యొక్క ఆత్మ అని చెప్పబడింది.

17. స్వర్గ నరకాలను విశ్వసించు ఘనత కూడా తెలిసింది.

18. ఉబాద హదీసులో “కర్మలు ఏలాంటివైనా సరే” అన్నదానితో (అతడు ఏక దైవోపాసకుడు అయి ఉండుట తప్పనిసరి అనే) భావం తెలుస్తుంది.

19. (ప్రళయదినాన కర్మలు తూకము చేయబడే) త్రాసుకు రెండు పళ్ళాలుండును అని తెలిసింది.

20. ఇత్బాన్ హదీసులో అల్లాహ్ కు “వజ్‌హ్” ఉంది అని వచ్చింది. దాని అర్ధం  “ముఖం” (Face).

తాత్పర్యం: (అల్లామా అల్ సాదీ) 

తౌహీద్ మానవులందరిపై విధిగా ఉన్నదని మొదటి అధ్యాయంలో తెలుపబడింది. ఇందులో దాని ఘనత, ఔన్నత్యం, దాని మంచి ప్రభావాన్ని మరియు దాని సత్ఫలితాన్ని తెలుపడం జరిగింది. తౌహీద్ లో ఉన్నటువంటి వివిధ ఘనతలు, మంచి ప్రభావాలు మరే దానిలో లేవు. ఇహపరాల మేళ్లు అన్నియూ తౌహీద్‌ ఫలితము, దాని ఘనత తోనే లభించును. పాపాల మన్నింపు, వాటి విమోచనం కూడా తౌహీద్‌ ఘనత వలనే. దానికి ఆధారం కూడా పైన తెలుపబడింది. (దాని అనేక ఘనతల్లో కొన్ని క్రింద చూడండి).

1. ఇహపరాల కష్టాలు, విపత్తులు దూరమగుటకు ఇది గొప్ప కారణం.

2.తౌహీద్‌ హృదయంలో ఆవగింజంత ఉన్నా, అది నరకాగ్నిలో శాశ్వతంగా ఉండకుండా కాపాడుతుంది.

3. అది సంపూర్ణంగా ఉంటే నరక ప్రవేశం నుండే కాపాడుతుంది.

4. తౌహీద్ గల వ్యక్తికి ఇహపర లోకాల్లో సంపూర్ణ సన్మార్గం, పూర్తి శాంతి ప్రాప్తి యగును.

5. అల్లాహ్ సంతృప్తి, దాని సత్ఫలితం పొందుటకు అది ఏకైక కారణం. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సిఫారసుకు అర్హుడయ్యే అదృష్టవంతుడు “లాఇలాహ ఇల్లల్లాహ్” నిర్మలమైన మనుస్సుతో చదివేవాడు.

6. బాహ్య, ఆంతర్య, సర్వ మాటల, కర్మల అంగీకారం, వాటి సంపూర్ణత, వాటి సత్ఫలితం తౌహీద్‌ పై ఆధారపడియుంది. తౌహీద్‌ లో ఎంత బలం, స్వచ్ఛత ఉంటే, అంతగా ఆ విషయాలు సంపూర్ణం అవుతాయి.

7.సత్కార్యాలు చేయడం, దుష్కార్యాల నుండి దూరముండడం తౌహీద్‌ మూలంగా సులభమగును. బాధ కలిగినప్పుడు తృప్తి లభించును. తౌహీద్‌, విశ్వాసంలో అల్లాహ్ కొరకు స్వచ్ఛత చూపేవాడు సత్కార్యాలపై సత్ఫలితం, అల్లాహ్ ప్రసన్నతను ఆశిస్తాడు. కనుక అవి అతనికి చాలా తేలికగా ఏర్పడుతాయి. దుష్కార్యాలపై ఉన్న శిక్షతో భయపడుతాడు కనుక అవి వదలుకోవడం కూడా అతనికిచాలా తేలికగా ఉంటుంది.

8.హృదయాంతరంలో తౌహీద్‌ సంపూర్ణమయితే అల్లాహ్ వారికి విశ్వాసం పట్ల ప్రేమను కలుగజేస్తాడు, దాన్ని మనోరంజకమైనదిగా చేస్తాడు.అవిశ్వాసం, దుర్మార్గం, అవిధేయతల పట్ల అసహ్యం కలిగేలా చేస్తాడు. అతన్ని సన్మార్గం పొందువారిలో చేర్చుతాడు.

9.ఏ దాసునిలో తౌహీద్‌, విశ్వాసం సంపూర్ణంగా ఉంటుందో అతడు అసహ్యమైన సంఘటనలను, కష్ట బాధలను ఎంతో విశాలమైన, సంతృప్తికరమైన మనుస్సుతో సహిస్తాడు. అల్లాహ్ వ్రాసి ఉంచిన అదృష్టంపై సంతోషంగా ఉంటాడు.

10) ఇంకా దాని ఘనత: అది మానవ దాస్యం నుంచి అతన్ని విముక్తి కలిగిస్తుంది. అతడు అల్లాహ్ తప్ప ఇతరుల పై ఆధారపడి, వారితో భయపడుతూ ఉండడు. వారి దయదాక్షిణ్యాల వైపు కన్నెత్తి చూడడు. అతడు చేసేది వారి కొరకూ కాదు. వాస్తవానికి ఇదే నిజమైన పరువు ప్రతిష్ట, మాన్యత. దీనితో పాటు అతడు అల్లాహ్ నే ఆరాధిస్తాడు. ఆయనకు తప్ప మరెవ్వరికి భయపడడు. మరెవ్వరితో కరుణను ఆశించడు. ఇలా అతడు సంపూర్ణ సాఫల్యం పొందుతాడు.

11. తౌహీద్‌ తప్ప ఇంకే దానికీ లభించని ఘనత: అతని మనసులో తౌహీద్‌, ఇఖ్లాసు తో కూడుకొని సంపూర్ణం అయితే, అతని చిన్న కర్మ కూడా అసంఖ్యాక ఫలితాన్ని పొందుతుంది. అతని మాటల, చేష్టల ఫలితం లెక్క లేకుండా పెరుగుతుంది. అబూ సయీద్ (రది అల్లాహు అన్హు) హదీసులో వచ్చిన ప్రకారం “ఇఖ్లాసుతో కూడుకున్న అతని ఆ సద్వచనం (లాఇలాహ ఇల్లల్లాహ్) భూమ్యాకాశాలు, (అల్లాహ్ తప్ప) అందులో ఉన్న సర్వం కన్నా బరువుగా ఉంటుంది”. ఇలాంటి విషయమే “హదీసుల్‌ బితాఖ” అన్న పేరుతో ప్రసిద్ది చెందిన హదీసులో కూడా ఉంది: “లాఇలాహ ఇల్లల్లాహ్” వ్రాసి ఉన్న చిన్న ముక్క తొంభై తొమ్మిది రిజిస్టర్ల (Records) కంటే ఎక్కువ బరువు గలదై పోతుంది. అందులో ప్రతీ ఒక్క రిజిస్టర్ దాని పొడవు, మనిషి దృష్టి ఎంత దూరము చేరుకుంటుందో అంత దూరముంటుంది. మరో  వైపు కొందరుంటారు; తౌహీద్‌, ఇఖ్లాసు మనసులో సంపూర్ణం లేనివారు. వారికి ఈ స్థానం, ఘనత ప్రాప్తి కాదు.

12) ఇహపరాల్లో తౌహీద్‌ వారలకు అల్లాహ్ విజయం, సహాయం, గౌరవం నొసంగుతాడు. సన్మార్గం ప్రసాదిస్తాడు. మంచి పనులు చేయుటకు సౌకర్యం కలుగజేస్తాడు. మాటలను, చేష్టలను సంస్కరించుకునే భాగ్యం ప్రసాదిస్తాడు.

13) విశ్వాసులైన  తౌహీద్‌ వారల నుండి ఇహపరాల బాధలను దూరము చేసి, శాంతి, సుఖ ప్రదమైన జీవితం అనుగ్రహిస్తాడు. దీని ఉదాహరణలు, సాక్ష్యాలు ఖుర్‌ ఆన్‌, హదీసులో చాలా ఉన్నవి.


నుండిఏకత్వపు బాటకు సత్యమైన మాట (అల్ ఖవ్లుల్ సదీద్ షర్హ్ కితాబ్ అత్ తౌహీద్)  – ఇమామ్ అస్-సాదీ [పుస్తకం]  

%d bloggers like this: